శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
ఎపిసోడ్ 02 - భాగం 01
(వీడియోలో ని|| 28.45 వరకు)
దివ్యసౌందర్య దివ్య స్వరూపం శ్రీ రామచంద్రమూర్తి, పునర్వసు నక్షత్రం, చైత్ర శుద్ధం, విలంబి నామ సంవత్సరం, శ్వేతకల్పం, అందులో వైవశ్వత మన్వంతరం, అందులో త్రేతాయుగ ద్వాపర సంధి సన్ని కాలం, 12 వేల సంవత్సరాలు సుమారుగా, కాల ప్రకాశిక జ్యోతిష గ్రంథాలను మనం ఈ దృష్టితో పరిశోధిస్తే కనబడుతుంది, ఈ దృష్టితో చూస్తే సరిగ్గా విళంబి నామ సంవత్సరం - ఎలా చెబుతున్నారంటే కాల ప్రకాశికను బట్టి, బృహస్పతి మారిన గడిని బట్టి సంవత్సరాన్ని నిర్ణయించవచ్చు .
విళంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి - అష్టమ్యుపరి నవమి. దీన్ని కూడా చక్కగా వివరించారు. అందుకనే అష్టమి తర్వాత నవమే ముఖ్యమనుకోకూడదు. అష్టమి తర్వాత తగిలినా సాయంకాలం "సూర్యే అస్తంగతే యా తిథి: ప్రోక్తా సా సకలేషు సకార్యేష్వపి, (సూర్యుడు అస్తమించిన తరువాత వచ్చిన తిథిని కూడా అన్ని మంచి పనులకు ప్రధానంగానే పరిగణించాలి) అని ప్రత్యేకమైన నియమం. సాయంత్రానికి తిథి తగిలినా అది ఆ రోజు కింద లెక్క. [1]నవమ్యాం ఉచ్చస్తే గ్రహ పంచకే సుర గురౌ సేందౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసు యుతే మేషంగతే పూషణి నిర్దగ్ధుం నిఖిలా పలాశ సమిధః మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమ్, అభూతపూర్వం అపరం యత్కికించిదేకం మహ :|| వరేణ్యం భర్గః దివ్య తేజస్సు అయోధ్య అనే అరణి నుండి ఆవిర్భవించింది. ఎందుకని ? పలాశ సమిధం నిర్దగ్ధుం అగ్ని మోదుగ సమిధలను తగల బెట్టాలి,ఈ అగ్ని, ఈ చైతన్యం, పలాశ- పలం అశనం యేషాం తే పలాశాః, రాక్షసాః సర్వ రాక్షస సంహారం చేయటం కోసం, ధర్మ స్థాపన కోసం, జగదుద్దరణ కోసం గ్రహపంచకం ఉచ్చస్తమై ఉండగా నవమి నాడు పునర్వసు నక్షత్రంలో స్వామి అవతరించారు. మర్నాడే పుష్యమి నక్షత్రంలో భరతుడు ఉదయించాడు కైకమ్మకు. ఆశ్లేషా నక్షత్రంలో, రెండో రోజన్నమాట కవల పిల్లలు కనక లక్ష్మణ శత్రుఘ్నులు అవతరించారు.
రామః జ్యేష్ఠ: రామ అని పేరు పెట్టారు, కౌసల్యాజనయద్రామం సర్వ లక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకు వర్ధనం(1.18.11), భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్య పరాక్రమ: సాక్షాత్ విష్ణోః చతుర్భాగః సర్వై: సముదితో గుణైః (1.18.13). అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా అజనయత్ సుతౌ(1.18.14), పుష్యే జాతస్తు భరతో మీన లగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ చ సౌమిత్రీ కులీరే అభ్యుదితే రవౌ(1.18.15). రామచంద్ర ప్రభువు వారి జననం, వశిష్ఠుల వారు నామకరణం చేయడం, విద్యాభ్యాసం, శస్త్రాస్త్ర ప్రయోగ-ఉపసంహార సర్వ కళా కోవిదత్వం ఇవన్నీ వర్ణించి, బాలకాండ 18వ సర్గలోనే విశ్వామిత్రులు కూడా వచ్చాడన్నారు. కనుక రామావతారం సీతమ్మతో సంబంధించినదే.
అందుకే మాయా మానవ అవతారం అన్నారు. అవతారం జననం చెప్పిన సర్గలోనే కల్యాణం ప్రసంగం ఎందుకు? కల్యాణంతో గాని పరిపుష్టం కాదు. ఏమిటి కారణం? మనకు ప్రవృత్తి నివృత్తి అని రెండు ఉన్నాయి. ప్రవృత్తి నిష్ఠ రామావతారం, నివృత్తి నిష్ఠ కృష్ణావతారం. ఏ సంగమూ ఏ సంబంధమూ ఉండదు కృష్ణవతారస్వరూపం. శుద్ధమైన లీలా మానవ అవతారం.
విశ్వామిత్రుడు వచ్చాడనేటప్పటికే ఎదురు వెళ్లి స్వాగతమిచ్చి మర్యాద చేసి అర్ఘ్య పాద్యాది విధులతో పూజించి, "స్వామీ ! ఊరికే వస్తారా మహానుభావులు? "కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః," మీరేం కోరికతో ఇక్కడికి వచ్చారో చెప్తే హర్షితః నిస్సందేహంగా, సంతోషంగా, సంబరంగా ఆ పని చేస్తాను," అన్నాడు. చెప్పండి. మీరు మాకు పరమ పూజ్యులు. ఎందుకంటే మొదలు మా క్షత్రియ రాజర్షులుగా చలామణి అయినారు. విశ్వ విశ్వంభరావలయాన్ని పరిపాలించారు. తపస్సుతో బ్రహ్మ ఋషిత్వం సాధించారు. పరమ పూజ్యులు మీరు," అని స్తుతించాడు దశరథుడు. సదృశం రాజశార్దూల తవ ఏతత్ భువి న అన్యథా మహా వంశ ప్రసూతస్య వశిష్ఠవ్యపదేశినః||(1.19.2) "రాజా! నీ వంశానికి, నీ గుణగణాలకు, నీ హోదాకు తగినట్లు మాట్లాడావు. చాలా సంతోషం. నీవన్నట్లు ఒక పని మీద వచ్చాను, నా మనస్సులో ఒక కోరికతో వచ్చాను. ఆ కార్యము యొక్క నిశ్చయం నీవు చేయాలి. ముందు చేస్తానని తర్వాత తప్పుకోకూడదు సుమా! సత్యప్రతిశ్రవాః, సత్య ప్రతిజ్ఞాశాలివై నా కోరిక తీర్చాలి. ఏమిటి కోరిక? చాలా మార్లు నేను ఒక వ్రతం మొదలు పెట్టాను. షడ్రాత్రం - ఆరు రోజుల వ్రతం - అది యజ్ఞం. ఆగమ-నిగమ, ఆగమాల్లో వ్రతాలంటారు. నిగమాల్లో యజ్ఞాలంటారు. అంతే తేడా. ఎన్ని సార్లు మొదలు పెట్టినా మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ సమాంస రుధిరౌఘేణ వేదిం తాం అభ్యవర్షతాం|(1.19.5). మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు రక్త మాంస వర్షంతో ఆ వేదికను తడిపి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు.
రాక్షసులైతేనే యజ్ఞానికి విఘ్నాలు కలిగించుతారు. హవిర్భుక్కులు దేవతలు కనుక వారికి విరుద్ధమైన కార్యాచరణమే రాక్షసులకు పని కనుక, "అసుర" అన్నారు. అసుర అంటే ఏమిటి? అసుభిః యే వర్తంతే స ఏవ అస అసురః. ఇంద్రియములతో క్రీడించే విషయలంపటులు, ప్రాపంచకులు, ప్రావృత్తికులు వీళ్ళని అసురులంటారు.
ఇద్దరు రాక్షసులు, పరివారంతో వచ్చి ధ్వంసం చేస్తున్నారు. అయితే మీరు తపశ్శాలులు కదా! కోపంతో శాపం పెట్టొచ్చు కదా! కోపమనేది పొందడానికి వీల్లేదన్నారు. చూడండి! విశ్వామిత్రుడికి రామయ్య ఎప్పుడు దొరికాడు? కోపం అనేది పనికి రాదన్నపుడు దొరికాడు. శాంతునికైనా దాంతునికైనా శాంతము లేనిదే సౌఖ్యము లేదు, దాంతునికైనా వేదాంతునికైనా (త్యాగరాజస్వామి). ఇంద్రియ సంయమనంలో ఉన్నాను. నాకు శాపం పెట్టాలంటే కోపం రావడం లేదు. అందుకని నిన్ను యాచించడానికి వచ్చాను. నీ కుమారుడు, "రామం సత్య పరాక్రమం. కాకపక్షధరం, శూరం, జ్యేష్ఠం మే దాతుమర్హసి|(1.19.8) నీ జ్యేష్ఠ పుత్రుడు గుణాభిరాముడు, లోకాభిరాముడు, ఆ శ్రీరామ మూర్తి సత్య పరాక్రమశాలి, రామః సత్య పరాక్రమః, ఎందుకని? ఆ బాణం అమోఘం. రామబాణం అంటే అమోఘం, అద్వితీయం. అట్టి పరాక్రమము రామచంద్ర ప్రభువు వారిది. ఆయనను నాకు యజ్ఞ రక్షణకు పంపించమని అడిగారు. రాజా! పిల్లవాడు ఒంటరిగా రాలేడు, అందునా అరణ్యాలకు అనుకుంటావేమో! అహం వేద్మి మహాత్మానాం రామం సత్య పరాక్రమం| వసిష్ఠోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః ||(1.19.14) నీ రామయ్య సంగతి నాకు తెలుసన్నాడు. నీ కుర్ర వాడనుకున్న ఆయన్ని నేను బాగా గుర్తించిన వాడిని. ఎలా? మహాత్మానం, సమస్త దేవతలు సర్వ జగత్తును నియమించగలిగిన మహత్తర శక్తివంతుడైన మహానుభావుడుగా నాకు తెలుసు. సందేహ పడబోకు. నా పని కోసం చెపుతున్నాను కనుక నాకు తెలుసంటే నమ్మక పోతావేమో? మీ గురువు గారికి నాకు స్నేహం తక్కువని నీకు తెలుసుగా! మీ వశిష్ఠులవారు వారిని అడగండి. ఓహో! ఇద్దరు విరుద్ధమైన వ్యక్తులను ఇక్కడ సాక్ష్యానికి చెప్పుకుంటే ఇద్దరు లోపాయికారిగా ఏదో కలుపుకోలుతనంగా ఏదో స్టడీ చేసుకొని వచ్చివుంటారు అని అనుమానం రావచ్చు. "యే చ ఇమే తపసి స్థితాః!" రాముణ్ణి తెల్సుకోవాలంటే "[2]తమేతం బ్రాహ్మణా వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనశకేన”
పరమాత్మను తెలుసుకోవాలంటే సాధనమేమిటి? "తపః". మహారాజా! నీకు ధర్మలాభం కావాలంటే, యశస్సు కావాలంటే "రామం మే దాతు మర్హసి|" రామమూర్తిని నాకు ఇవ్వమన్నారు. ఎలా ఇవ్వాలి? "అభిప్రేతం అసంసక్తం ఆత్మజం దాతు మర్హసి"|(1.19.17). నీకు పరమప్రియుడైన వాడిని అసంసక్తం-ఏమి దిగులు, బెంగ పెట్టుకోకుండా ఇవ్వాలి, ఊరికే అలా ఇస్తే నేను కూడా తీసుకోను. ఇంకొక మాట అసంసక్తం. పదహారేళ్ల వయస్సయ్యా! పదహారో ఏడు నడుస్తున్నది రామమూర్తి వారికి. పదహారేళ్ల వయసు వాడు అసంసక్తం తల్లి తండ్రి అంటూ బెంగ పడాల్సిన వయసు కాదు. శుద్ధ బుద్ధ పరబ్రహ్మ స్వరూపమే నీ కుమారుడు. అలా ఇచ్చేసేయ్ నాకు. ఎన్నాళ్ళు? దశరాత్రం హి యజ్ఞస్య, అసలు యజ్ఞం ఆరు రోజులే. రాక పోక కలుపుకుంటే ఇంకో నాలుగు రోజు లు,మొత్తం పది రోజులు. ఆ తర్వాత నీ పిల్లవాడు నీ దగ్గరుంటాడు, అన్నారు. దశరథుడికి పుత్రభాగ్యం ఉంది. కాని జ్ఞాన భాగ్యం లేదు. ఎందుకని? మరొక జన్మతో గాని ఆయనకు జ్ఞానం రాదు.
వసుదేవుడికి రెండూ ఉన్నాయి. [3]మాం పునః పుత్ర భావేన బ్రహ్మ భావేన చ అసకృత్, పుత్రభావంతో బ్రహ్మ భావంతో మీరు కృతార్థులు కండి అని స్వామి వాళ్ళని చెరసాలలోనే అనుగ్రహించారు.
దశరథునికి కేవలం పుత్ర భావమే ఉన్నది బ్రహ్మ భావం లేదు. కనుక దుఃఖ పడ్డాడు. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచనః| న యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః||(1.20.2) పదహారేళ్ళన్నా నిండలేదు. అంటే ఇంకా కొన్ని నెలలు నడుస్తున్నాయన్నమాట.
పదహారేళ్ళైనా నిండలేదన్న దానికి అర్థం చెప్పారు పన్నెండేళ్ళు అని. అది న్యాయం కాదు. ఎందుకంటే పదహారేళ్ళకు తక్కువంటే పదిహేను కావాలి కానీ పన్నెండవుతుందా? ఎక్కడైనా. ఒక రూపాయి చిల్లర ఉందాండి, అంటే కొంచం తగ్గిందన్నాడు, ఎంత అంటే పావలా ఉందన్నాడు. పావలా ఉందంటే మూడు పావలాలు నువ్వు కలుపుకుంటే చిల్లర అవుతుందా? కాబట్టి అది యుక్తికి పనికి రాదు పద్ధతికి పనికిరాదు. రెండవది, షోడశ వర్ష ప్రాప్తి కలిగితే కాని క్షత్రియులకు యుద్ధం చేసే అర్హత రాదు. యుద్ధం చేసే అర్హత రాని రాముడిని కోరడానికి తెలివి తక్కువ వాడా విశ్వామిత్రుడు? రామయ్యను కోరుతున్నాడంటేనే యుద్ధ యోగ్యత వచ్చిందనే అర్థం. పదహారేళ్లైతే గాని యుద్ధానికి రాకూడదు. దీనికి దృష్టాంతం మనకి మహాభారతంలో అభిమన్యుడే, పద్మవ్యూహంలో వెళ్ళటానికి పదహారేళ్లు వచ్చాయనే వెళ్ళనిచ్చారు, గేట్ పాస్ ఇచ్చారు. అభిమన్యుడి పదహారో ఏటనే యుద్ధం జరిగింది మహాభారతంలో. కనుక షోడశ వర్షములు నిండలేదు కానీ నడుస్తున్నవి.
స్వామీ! మీకు రావలసింది యజ్ఞం జరగటమేగా! ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః |అనయా సంవృతో గత్వా యోద్ధామి, (యోద్ధాహం తైః నిశాచరైః 1.20.3) స్వామీ! అక్షౌహిణి సైన్యం ఉంది నాదగ్గర, మాంచి బలవంతులు. వారందర్నీ తీసుకొని నేను బయలుదేరుతాను. నేను బయలుదేరుతాను అంటే దశరథుడు వట్టి చవట అనుకునేరు సుమా! దశరథ! పది మంది అతిరథుల కిమ్మతు ఆయన కెపాసిటీ. దశ రథ! దశ దిక్కులకు నిర్వక్రంగా వెళ్ళగలిగే రథమట ఆయనది. అది ఏ దిక్కైనా వెళుతుందట. ఎన్నోసార్లు ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేసినవాడు, అసురుల్ని గెలిచిన వాడు, ఇంద్రుడి యొక్క మెప్పు పొందిన వాడు దశరథుడు. నేనొస్తానన్నాడు యజ్ఞ రక్షణకు.
ఇక్కడ తమాషా ఏమిటంటే ఆంతర్యం - విశ్వామిత్రుడు మహాతపస్వి, అఖండమైన జ్ఞానం సంపాదించాడు, బ్రహ్మత్వం సాధించాడు. అది ఇతరులు సాధించగల్గేదా? ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. పంచాక్షరికి వామదేవ ఋషిః, రామమంత్రానికి వశిష్ఠ ఋషిః, ఇలా ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. మంత్రార్ధ ద్రష్టాః మహర్షయ: అని. విశ్వామిత్రుని ఆ గొప్పతనాన్ని మనసులో పెట్టుకొనే తన చరిత్ర కూడా ఏమీ వ్రాసుకోని వాల్మీకి, తన రామాయణంలో సుమారు నలభై సర్గలు విశ్వామిత్రుణ్ణి గురించి వ్రాసారు. విశ్వామిత్ర చరిత్రను బాగా ప్రస్ఫుటంగా వివరించారు వాల్మీకి. కారణం? రామచంద్ర మూర్తికి అస్త్ర శస్త్ర గురువు. రెండవది, విశ్వామిత్రుడే గాయత్రికి ద్రష్ట. అటువంటి మహత్తరమైన మహానుభావుడు. ఇపుడు చూడండి, రాగ ద్వేషాలు పోయాయి. వశిష్ఠ అంటే ఏమిటి? కామశ్చ క్రోధశ్ఛ వశే తిష్ఠత ఇతి వశిష్ఠ| కామ క్రోధాలు ఎవరి పాదారవిందాలకు సేవ చేస్తూ స్వాధీనమై ఉంటాయో ఆయనే వశిష్ఠుడంటే! వశిష్ఠుడితో పోటీ పెట్టుకున్న విశ్వామిత్రుడు ఆ రెండింటినీ గెలిచాడు. రంభ దగ్గర క్రోధం గెలిచాడు, మేనక దగ్గర కామం గెలిచాడు. కామక్రోధాదులను గెలిస్తే గాని ధర్మ దేవత సాక్షాత్కరించలేదు.
అందుకని "న చ మే క్రోధ ముత్స్రష్టుం బుద్ధిః భవతి పార్థివ! నాకు కోపం రాదయ్యా, అన్నాడు. ప్రశాంతుడైనాడు. క్రోధాన్ని గెలిచి ప్రశాంతుడైనప్పుడే రామమూర్తి యొక్క సాన్నిధ్యం దొరికింది ఆయనకు. వశిష్ఠుడితో పోరాడి గెలిచాడు. ఎక్కడ గెలిచాడు? రామయ్యకు వేదవేదాంగాలకు గురువు వశిష్ఠుడు, ధనుర్విద్యకు కూడా. కానీ, రహస్య శస్త్రాస్త్ర ప్రయోగ-ఉపసంహారాలకు గురువు విశ్వామిత్రుడు. ఇద్దరికి సమాన స్థితి ఇక్కడ. దశరథుడు మోహంతో ఉన్నాడు. పాపం, పుత్ర మమకారం, పంపించలేను, అన్నాడు. నేనొస్తానన్నాడు. పిల్లవాడు. బాలః అకృత విద్యః నచ వేత్తి బలాబలం. న చ అస్త్ర బల సంయుక్త: న చ యుద్ధ విశారదః|(1.20.8) మా వాడికి అంత అనుభవం లేదే యుద్ధాలలో. శస్త్రాస్త్రములు తెలియవే! మరి ఆయన్ని ఎలా పంపించను? నేనొస్తానన్నాడు. విశ్వామిత్రుడు గుర్తించాడు. దశరథుడు ఒక మాట అడిగాడు. అసలు మారీచ సుబాహులు వచ్చారన్నారే, మరి వాళ్ళను పంపిస్తున్నవాడెవడు? అని. ఏ పేరు చెబితే ఈయన గుండె పగులుతుందో ఆ పేరు చెప్పాడు. పౌలస్త్య వంశ ప్రభవః రావణో నామ రాక్షసః.... మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం కరిష్యతః|(1.20.17-19) మారీచుడు సుబాహు అని ఉన్నారు మాయావులైన రాక్షసులు. వాళ్ళను పంపిస్తున్న అసలు అధినాయకుడు రావణుడనే రాక్షసరాజు. రవయత ఇతి రావః, లోకాన్ రవయతీతి లోకాన్ని భయపెట్టి బాధించేవాడు రావణుడన్నారు. రావణుడి పేరు ఎప్పుడు చెప్పాడో అప్పుడే గుండె పగిలింది ముసలాయనకి. అయ్యా, క్షమించండి నేనూ రాను, మా సైన్యమూ రాదు, మా అబ్బాయి అసలు రాడు అన్నాడు. ముందు ఇస్తానన్నావు, నేనడగకుండా నువ్వే ఏం కావాలో చెప్పమన్నావు, తప్పకుండా ఇస్తానన్నావు, తీరా చెప్పిన తరువాత ఇవ్వను అంటున్నావు. ఇది రఘువంశం వారికి మర్యాదేనా? అని కొంచెం గడ్డం ఊపి కళ్ళెర్ర చేసి, "నీకిది మర్యాదైతే చూడవయ్యా!" వెళ్ళొస్తా అన్నాడు. అనేటప్పటికే ఈయన గుండె పగిలింది, శాపం పెడతాడేమో లేనిపోనిది. మహానుభావులకు అపచారం చేస్తే అది ఊరుకుంటుందా? మహా ఉపద్రవం వస్తుంది. వెంటనే కనపడదు కాని. తెలుసు కనక భయపడ్డాడు. అప్పుడు గురువు గారి వైపు చూచాడు. అంతవరకూ గురువుగారి వైపు చూడలేదు. వశిష్ఠుడు చెప్పారు, "ఏష విగ్రహవాన్ ధర్మః, దశరథా! భయపడబోకు. శరీరం ధరించిన ధర్మ స్వరూపుడయ్యా ఈయన. ఈయన అంటే ఎవరు? రామయ్య అని. కాని దశరథుడికి విశ్వామిత్రుడని అర్థమైంది. ఎవరి భాష వాళ్ళది. "ఏష బుద్ధ్యా అధికో లోకే తపసశ్చ పరాయణం| సర్వ తపశ్శక్తి కలవాడు ఈయన. (ఇక్కడ ఈయన అంటే విశ్వామిత్రులే)
ఏమయ్యా నీకిది తగునా? విశ్వామిత్రుడన్నాడు. "[4]ప్రాకట ధర్మమూర్తివి అతి బంధుర సత్య యశోధనుండవు, ఇక్ష్వాకు కుల ప్రసూతుడవు, సమ్మతి నిచ్చెదనంచు పల్కి నీచాకృతి నీకు బొంకుటదియర్హమే? బొంకిన సర్వధర్మముల్ వే కడతేరిపోవె? విశ్రుతకీర్తియు మాసిపోవదే?" అధర్మాలన్నీ నశిస్తాయి. జాగ్రత్త," అన్నాడు విశ్వామిత్రుడు.
వశిష్ఠుడు చెప్పాడు ఉపదేశం, "నీ కుమారుడికి ఏమీ భయంలేదు. పంపించవయ్యా!" కుమారుడిని పిలిచాడు.
యత్ర రామః తత్ర లక్ష్మణః,రామ అని పిలుస్తే చాలు. కూడే ఉంటాడు లక్షణుడు కూడా. లక్ష్మణుణ్ణి వేరే పిలువనక్కర్లేదు. రామా అని పిలవండి. లక్ష్మణుడుంటాడు వెంట. నిత్యం ప్రాణః బహిశ్చరః లక్ష్మణః శుభలక్షణః. లక్ష్మణుడి దగ్గర తెలుసుకోవలసింది పరమాత్మ యొక్క సేవ, అనుసరణ, అనుచరత్వం. లక్ష్మణుడి ఏకైకమైన కైంకర్య స్థితి.
స పుత్రం మూర్ధ్ని ఉపాఘ్రాయ, వారిని కౌగిలించుకొని ఆశీర్వదించి, కుమారులను ఇచ్చి పంపించాడు. విశ్వామిత్రుడు బయలుదేరి పిల్లవాళ్ళని తీసుకువెళ్తున్నాడు.
కోరకుండానే శిష్యత్వం చేసుకున్నాడు. ఆయన శిష్యుడు కావాలనే ఈయన కోరిక. "తపమేమి చేసెనో విశ్వామిత్రుడు," అంటారు త్యాగరాజస్వామి. ఏం తపస్సు? ఆ తపస్సంతటికి సార్థకత ఏమిటి? పరమాత్మానుసరణ.
సరయూ నది దగ్గరికి వచ్చారు. అబ్బాయి! కొంచం ఆచమనం చేయి, నీకు రెండు విద్యలిస్తున్నాను, బల, అతిబల. ఆకలి దప్పులుండవు. ఏ విధమైన బాధలుండవు. సంకటాలు రావు. అనారోగ్యం కలగదు, ఓహ్! ఇవి తీసుకోమన్నారు. సర్వ శస్త్రాస్త్రాల ఉపదేశానికి ముందు కావలసిన అర్హత ఇది. తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళుతున్నారు. భయంకరమైన తాటకా వనానికి వెళ్లి, "న హి తే స్త్రీ వధ కృతే ఘృణా కార్యా పరంతప! అది దుర్మార్గురాలు, సర్వ జగత్తును నాశనం చేస్తున్నది, ఇది రాజుకు ధర్మం. ఎవరైతే సర్వ జగత్తుకు అపకారం చేసి ఘోరమైన పనులు చేస్తారో వారిని శిక్షించాలి. ఇది ఆర్య ధర్మం కనక ప్రభు ధర్మాన్ని గుర్తు పెట్టుకో. గురువాజ్ఞ అనుకో, చేసేయ్యి, అని తాటకవధ చేయమన్నారు. స్త్రీ అని కొంచెం సందేహించాడు రాముడు. కానీ "అలం తే ఘృణయా రామ పాపా ఏషా దుష్టచారిణీ, యజ్ఞ విఘ్నకరీ యక్షీ పురా వర్ధతి మాయయా|(1.26.21)" అస్తమనం ఐతే పెరుగుతుంది దాని మాయ. దాన్ని సంహరించడం ముఖ్యం. త్వరపడు, సంహరించు, అన్నారు. రాములవారు సంహరించారు.
ఇక్కడ రామచంద్ర చరిత్రలో ప్రతీదీ మనం సూక్ష్మంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. పితృ వాక్యమేమిటి? "నాయనా! ఈ మహర్షివారు చెప్పినట్టు నీవు చేయి. వారి ఆజ్ఞ పరిపాలించు. ఇది గురువుగారి ఆజ్ఞ, తండ్రి - ప్రథమ గురువు తండ్రి అన్నారు. ఇప్పుడు కొలువై ఉన్నవారు విశ్వామిత్రులు. గురువాజ్ఞ కలిగింది, చేసేయవచ్చు. తండ్రి ఆజ్ఞాపించాడు. పితృ వాక్య పరిపాలన అన్నిటికంటే గొప్పది. రామాయణంలో నేర్చుకోవలసిన ఫండమెంటల్ ప్రధానమైన విషయం ఏమిటంటే పితృ వాక్య పరిపాలన. ఆ పితృ వాక్య పరిపాలనలోనే సర్వం ఉన్నది. పితృ వాక్య పరిపాలన కోసమే రామయ్య సర్వమూ త్యజించాడు. "[5]ఋషిణా కండునా ప్రజాపి విపశ్చితా గౌర్హతా జానతా ధర్మం" || కండు అనే మహర్షిని ఆయన తండ్రి గోవును కొట్టమన్నాడు. ఆయన కొట్టేసాడు, చచ్చింది అది. తల్లిని నరకమని తండ్రి చెబితే పరుశురాముడు నరికేశాడు.
తర్వాత విశ్వామిత్రుడు రామయ్యను గంగానదీ తీరంలో కూర్చోబెట్టి- "నాయనా! కూర్చో, ఆచమనం చేయి. ఇక్కడ నీకు సర్వ శస్త్ర అస్త్రాలు ఇస్తున్నాను, అన్నాడు.
ఇన్ని శస్త్రాస్త్రాలు ఒక్క విశ్వామిత్రుడికే తెలుసు,ఈ అస్త్రాలన్నీ ఎవ్వరికీ తెలియవు. ఆయనకు ఎలా తెలిసాయి? అదే భగవన్నిర్ణయం. ఒక పని నీ చేత చేయిస్తున్నాడంటే నీకేదో ఒక శుభం కలిగించడానికో, నీ ద్వారా ఇంకొకరికి ఉపకారం చేయించడానికో లేక నిన్ను బాగు చేయడానికో చేయిస్తాడు పరమాత్మ, ఆయన బుద్ధి ప్రేరకుడు కనుక. వశిష్ఠుణ్ణి చంపుదామని విశ్వామిత్రుడు మొండి తపస్సు చేసాడు శంకరుడి కోసం. ఏం కావాలన్నారు? అపుడే అడగవచ్చుగా బ్రహ్మఋషిత్వం కావాలని, అడగలేదు. నీకున్న శస్త్రాస్త్రాలు అన్నీ ఇవ్వమన్నాడు. శస్త్రాస్త్రాలన్నీ ఎక్కడుంటాయి? మహేశ్వరుడి దగ్గరుంటాయి. విద్యలన్నీ ఎక్కడుంటాయి? శంకరుడి దగ్గరుంటాయి. మంత్రాలన్నీ ఎక్కడుంటాయి? శంకరుడి దగ్గరుంటాయి. హృదయాలు, మంత్రాలు, మాలలు అన్నీ భగవంతుడు శంకరుడే. పార్వత్యువాచ, ఈశ్వర ఉవాచ, అమ్మవారు అడుగుతుంది, అయ్యవారు చెపుతాడు. ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వర స్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః, బ్రహ్మణః వేదస్య అధిపతిః, సమస్త మంత్ర, యంత్ర, శస్త్రాస్త్ర సర్వ ప్రయోగాలు పరమేశ్వరుడి దగ్గరే ఉంటాయి. ఆయన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసారు విశ్వామిత్రుడికి. ఈయన ఎందుకు అడిగి తెచ్చుకున్నాడు? ఈ వశిష్ఠుడి బుర్ర పగల కొడదామని. ఇంత కష్టపడి ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ అస్త్రాలన్నీ తెచ్చి, వేయబోతే ఈయన తన బ్రహ్మ తేజస్సనే దండం అక్కడ పెట్టి వేసుకోమన్నాడు. వేసినవన్నీ దీనిలో పడ్డాయి. కృష్ణార్పణం!! లయమైపోయాయి. "ధిక్ బలం క్షత్రియ బలం, బ్రహ్మ తేజోబలం బలం", బలం అంటే బ్రహ్మ తేజస్సు కాని క్షత్రియత్వం కాదు. నాయనా, ఇప్పటికి బుద్ధి వచ్చింది నాకు. అనుకొని బ్రహ్మర్షిని కావాలని బయలుదేరాడు. ఇంత కష్టపడి సంపాదించిన అస్త్రాలివి. శంకరుడు ఎందుకు ఇచ్చాడు? రామయ్యకు ఇవ్వడానికి ముందు ఇట్లా ైచ్చారు, వయా విశ్వామిత్ర, విశ్వామిత్రుడి ద్వారా రామయ్యకు ఇప్పించడానికే. విశ్వామిత్రుడికి ఇవన్నీ ఇపుడు ఇస్తే రేపు ఆయన అక్కడ ఇస్తాడు. అందుకని ఇవి ఉపయోగపడ్డాయి.
శస్త్రాలు, అస్త్రాలు, ప్రయోగాలు, ఉపసంహారాలు, రహస్యాలు, కీలకాలు, మంత్రాలు అన్ని చెప్పేసాడు రామయ్యకు. విశ్వామిత్రుడు ఇపుడు భారరహితుడైనాడు. శస్త్రాస్త్ర భారరహితుడై, నిష్కల్మషుడై, సమచిత్తుడై, నిర్వికారుడైనాడు. సిద్ధాశ్రమానికి వెళ్లారు. అద్య ప్రభృతి షడ్రాత్రం, ఇది మొదలు ఆరు రోజులు మౌనం. మాట్లాడరు. దీక్షలో ఉంటారు. అయ్యా! రామలక్ష్మణులారా! మీరే ఈ యజ్ఞాన్ని రక్షించాలి. ఆరు రోజులు ధనుర్బాణ పాణులై రాత్రింబగళ్లు తిరిగుతూ కాపలా కాసారు. సుబాహు అనే వాడికి ఆగ్నేయాస్త్రం ప్రయోగం చేస్తే వాడు భస్మమైనాడు. మారీచుణ్ణి అలా వేయలేదు. వాయవ్యాస్త్ర సంయుక్తమైన అస్త్రం ప్రయోగిస్తే వాడు వెళ్లి సముద్రంలో పడ్డాడు. ఇంకా ఆ కాండిడేట్ తో పని ఉందిగా రామయ్యకు. అపుడే పోతే ఎట్లా? వాడి పని మళ్ళీ ఉంది ఇంకోసారి.
నాటకంలో చూడండి. వాడి పాత్ర మొదటి సీనులో అయిపోయినా రెండు సీనులయ్యాక వాడు మళ్ళీ రావాల్సి ఉంటుంది. అందుకని వాడు రంగు కడుక్కోకుండా కూర్చుంటాడు అక్కడ. పరమేశ్వరుడి విధానం అదే. ఎవ్వరిని ఎందుకుంచుతాడో తెలియదు. మనకు తెలియక అయ్యో ఉన్నామేమిటి అనుకుంటాము. ఉండాలిరా నువ్వు కొన్నాళ్ళు, నీతో కొన్ని పనులుంటాయి, మారీచుణ్ణి అలా ఉంచారు స్వామి.
[1] భోజరాజు రచించిన "చంపూ రామాయణం, బాలకాండ, 29వ శ్లోకం
[2] బృహదారణ్యక ఉపనిషద్ (4.4.22)
[3] చిన్తయన్తౌ కృతస్నేహౌ యాస్యేథే మద్గతిం పరాం| (భాగవతం 10.3.45)
[4] భాస్కర రామాయణం
[5] ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా | గౌర్హతా జానతా ధర్మం కణ్డునాఽపి విపశ్చితా|| (2.21.30)