Real Teachers Vs. Teachers for the Suffering of Pupils
బాధ గురువులు Vs. బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు)
బాధ గురువులు Vs. బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు)
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 4 - పుస్తక పాండిత్య దాస్యం, పాండిత్యం : యథార్థ ప్రయోజనం, 163)*
ఏవో దోషాలనీ, మూడాఛారాలనీ పలుకుతూ కొందరు తమ పాండిత్యం పట్ల గర్విస్తూ ఉంటారు. కాని నిజమైన భక్తుడు తనకెప్పుడూ దయామయుడైన భగవంతుడే చేయూత ఇవ్వటానికి సిద్ధంగా వున్నాడని తెలుసుకుంటాడు. కొంతకాలం ఆతడు తప్పుత్రోవన పోతున్నా, మరేం ఫర్వాలేదు. అతడికి ఏదీ ఆవశ్యకమో భగవంతుడు ఎరుగును. భగవంతుడే భక్తుడి అభీష్టాన్ని సిద్దిపచేస్తాడు.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 4 - పుస్తక పాండిత్య దాస్యం, పాండిత్యం : యథార్థ ప్రయోజనం, 164)*
ఇద్దరు మిత్రులు ఒక తోటలోకి వెళ్లారు. వారిలో లోక జ్ఞానం అధికంగా వున్నవ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించనారంభించాడు. అంతేగాక చెట్టుచెట్టుకూ ఎన్ని కాయలున్నాయో, మొత్తం మీద తోట ఎంత కిమ్మత్తు చేస్తుందో అంచనా కట్టసాగాడు. అతడి మిత్రుడు తోట యజమాని వద్దకెళ్లి, అతడితో మెల్లగా స్నేహం చేసుకుని ఒక చెట్టును సమీపించాడు; యజమాని అనుమతి పొంది పళ్ళుకొసి తినసాగాడు. వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు? మామిడి పళ్ళను తింటే నీ ఆకలి తీరుతుంది. అంతేగాని చెట్లను, ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభం ఏమిటి? శుష్కపండితుడు సృష్టి, ఉత్పత్తి క్రమాలను కనుగొనే యత్నంలో వ్యర్థకాలయాపన చేస్తాడు. కాని వినమ్రుదువు, విజ్ఞానీ అయిన వ్యక్తి సృష్టికర్తతో చెలిమి సముపార్జించి, ఆతడి సాంగత్యంలో లభించే బ్రహ్మానందనాన్ని అనుభవిస్తాడు.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 4 - పుస్తక పాండిత్య దాస్యం, పాండిత్యం : యథార్థ ప్రయోజనం, 165)*
ప్రజ్ఞాన స్వరూపిణి అయిన నా జగజ్జనని కటాక్షవీక్షణం ఒక్కసారి ప్రసరిస్తే చాలు, మహాపండితాగ్రేసరుణ్ణి సైతం పడగొట్టి నేలమీద పాకే నీచ క్రిమి తుల్యుడిగా కానిపించేలా చేస్తుంది.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 5 - పుస్తక పాండిత్య దాస్యం, పాండిత్యం : యథార్థ ప్రయోజనం, 166)*
'గీతా' అనే పదాన్ని వేగంగా 'గీ-తా-గీ-తా-గీ-తా' అని పదిసార్లు ఉచ్చరించు. అప్పుడు అది 'తాగీ, తాగీ' అని ఉచ్చరింప బడుతుంది గదా? తాగి లేక త్యాగి అంటే భగవంతుణ్ణి పొందటానికి సర్వం త్యజించిన వాడని అర్థం. ఇలా ఒక్క మాటలో గీత ఇలా బోధిస్తోంది. "ఓ సంసారులారా! త్యాగం చేయండి! అన్నిటినీ త్యజించి భగవంతుడి మీదికి బుద్ధి మరల్చండి."
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 5 - పుస్తక పాండిత్య దాస్యం, పాండిత్యం : యథార్థ ప్రయోజనం, 167)*
చైతన్యమహాప్రభు దక్షిణ దేశంలో తీర్థయాత్రలు చేస్తూ, గీతను చదివే ఒక పండితుడి మ్రోల కన్నీరు కారుస్తూ కూర్చున్న ఒక భక్తుడిని చూశారు.
ఈ భక్తుడికి ఓనమాలైనా రావు. గీతలోని ఒక్క శ్లోకానికైనా పండితుడు చెబుతున్న అర్థం ఏమిటో గ్రహించే స్థితిలో లేదు. కాని కన్నీరు కారుస్తూ ఉండటానికి కారణం ఏమిటని చైతన్యులు ప్రశ్నించగా అతడిలా అన్నాడు: "గీతలోని ఒక్కమాట కూడా నాకు తెలియదని మాట నిజం. కాని గీతా పఠనం జరుగుతున్నంత సేపూ కురుక్షేత్రంలో రథం మీద, అర్జునుడి ముందు కూర్చుని గీతలోని ఈ దివ్యతత్వాల నన్నింటిని ఉపదేశిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని సుందరరూపం నా అంతఃదృష్టికి అగుపడుతోంది. కాబట్టి ఆయన పట్ల భక్తితోను, ఆనందంతోను నా కళ్ళు భాష్పాలతో నిండాయి."
అతడు ఓనమాలైనా నేర్వకున్న్నా బ్రహ్మజ్ఞాని, నిర్మల భక్తితో భగవత్సాక్షాత్కారం పొందగలిగిన భక్తివరుడు.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 168)*
ఓ ఆచార్యుడా! బోధించటానికి నీ వద్ద అధికార చిహ్నం ఉందా? రాజు చేత అధికారముద్ర పొందితే ఎంతటి అల్పసేవకుడి మాటలనైనా జనం భయభక్తులతో వింటారు. అతడు తన దవ్వాలు బిళ్లను చూపించి ఎంతటి అల్లరినైనా అణచివెయ్యగలుగుతాడు. అలాగే నువ్వును మొట్ట మొదట ఈశ్వరాజ్ఞను పొంది ఈశ్వరప్రేరితుడవు కావాలి. ఈ ఈశ్వరాదేశ చిహ్నం నీ వద్దా లేకుంటే జీవితకాలమంతా నువ్వు ధర్మోపన్యాసాలు చేసినా, వట్టి కంఠశోషే గాని మరేమి ప్రయోజనం ఉండబోదు.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 169)*
భక్తిసాగరంలో మునగటానికి ఎవరికీ అభిలాషగాని, ఓర్పుగాని లేవు. వివేక వైరాగ్యాలను గాని, సాధనాలను గాని ఎవరూ లక్ష్యపెట్టనే పెట్టరు. ఏ పుస్తకం నుంచో నాలుగు ముక్కలు నేర్వగానే ఇక ఉపన్యాసాలు చెయ్యాలనీ, పరులకు ధర్మోపదేశం చెయ్యాలనీ ప్రతివ్యక్తికి తహతహ, అందుకై పరుగు! ఎంత విచిత్రం! ఇతరులకు బోధించటమంటే
అంత తేలికా? కష్టాత్కష్టతరం.
ఈశ్వరసాక్షాత్కారాన్ని పొంది, ఈశ్వరాదేశాన్న్ని పొందినవాడే బోధించగలడు!
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 170)*
మంచివక్తా, బోధకుడూ అయివుండీ ఆత్మవికాసం లేనివాడు ఎలాంటివాడో తెలుసా? అతగాడు తన వద్ద కుదువబెట్టిన పరుల ద్రవ్యాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి వంటివాడు. ఇతరులకు అతడు ధారాళంగా ఉపదేశిస్తాడు. దాని వాళ్ళ తనకేం నష్టం? అతడు బోధించే భావాలు ఎరవు సొమ్ములు గదా!
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 171)*
సుప్రసిద్ధుడైన ఒక వక్త ఒకరోజు హరిసభలో ప్రసంగిస్తున్నాడు. ప్రసంగం మధ్యలో అతడిలా అన్నాడు: "భగవంతుడు కేవలం రస విహీనుడు, మన స్వభావంలో రసం ఒసగి అతన్ని మనం రసమయుణ్ణి చెయ్యాలి. "రసమంటే ప్రేమ, భగవంతుడివని చెప్పబడే ఇతర గుణాలు అని అతడి భావం, ఈ మాటలు విన్నప్పుడు నా కొక బాలుడి సంగతి జ్ఞాపకం వచ్చింది. వాడు తన మామకు చాలాగుర్రాలు వున్నాయని చెబుతూ, వినేవారిని నమ్మించే ప్రయత్నంలో తన మామ ఇంట్లో ప్రత్యేకంగా ఒక గోశాల అంతా గుర్రాలతో నిండి ఉందని చెప్పాడు. గోశాలలు గుర్రాల కోసం కట్టబడినవి కావని, బాలుడు చెప్పేది అసత్యమని, గుర్రాలను గురించి వాడి కెలాంటి అనుభవం లేదని వివేకవంతులు వెంటనే గ్రహించి ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు.
భగవంతుడు రసవిహీనుడనటం కేవలం అసంగతం, (శాస్త్రానికి, అనుభవానికి, యుక్తికీ కుడా) విరుద్ధం. ఆ వక్తకు తన మాటల అర్థం ఏమిటో తనకే బొత్తిగా తెలియదన్నమాట. సచ్చిదానందమూర్తి అయిన భగవంతుణ్ణి అతడెన్నడూ దర్శించలేదని భగవదానుభవాన్ని చవిచూడలేదని అతడి మాటల వైఖరే చెప్పక చెబుతోంది.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 172)*
నేటి మతబోధకుల విధానాలు ఎలాంటివో మీకు తెలుసా? ఒక్కడికీ మాత్రమె సరిపోయే అన్నం ఉండగా నూరుమందిని విందుకు ఆహ్వానించటం లాంటిది. అనుమాత్రమైన ఆత్మానుభవం ఉందొ లేదో, కేవలం మహాధర్మోపదేష్టలుగా నటిస్తూ ఉంటారు.
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 173)*
మొదట నీ హృదయాలయంలో భగవంతున్ని ప్రతిష్ఠించు, మొదట ఆయన సాక్షాత్కారం పొందు. భగవంతుణ్ణి చూశాకా ప్రసంగాలు, బోధలు, ఉపన్యాసాలు మొదలైనవి ఎన్ని చేసినా చెయ్యవచ్చు. అంతేగాని అంతకుముందు కాదు. విసయలోలురై వుందీ జనం భగవంతుణ్ని గురించీ బ్రహ్మాన్ని గురించీ ప్రసంగాలు సాగిస్తూఉంటారు. ఆలయంలో దేవుడు లేకుండా ఆరాధన కోసం శంఖం వూదాడట!
*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*
*శ్రీరామకృష్ణ బోధామృతం (అధ్యాయము 6 - బాధ గురువులు : బోధ గురువులు(గురుత్వంలోని ప్రమాదాలు - బోధ గురువులు), గురుత్వంలోని ప్రమాదాలు, 174)*
ఒకరోజు నేను పంచవటి నుండి పోతూవుంటే ఒక కప్పు భయంకరంగా బెకబెకమనటం విన్నాను, దాన్ని పాము పట్టుకొని ఉంటుందని వూహించాను. చాలా సేపయ్యాక ఆ దారినే వస్తూ, తిరిగి ఆ శబ్దాన్నే విన్నాను. పొదల నుండి తొంగిచూస్తే ఒక బురదపాము కప్పను పట్టుకొని వుంది. దాన్ని అది మింగనూ లేకా విడువనూ లేకా వుంది. పాపం ఆ కప్పు దురవస్థ చెప్పనలవి కాకుంది. అప్పుడు నేనిలా అనుకొన్నాను: "అదే తాచుపాము అయివుంటే రెండుమూడు కూతలతో ఆ కప్పు పని ముగిసిపోయేది(అంతటితో కప్పకు పాముకు కూడా బాధ నివర్తించేది). కాని ఇక్కడ పాము బాధా కప్పు బాధా ఇంచుమించుగా సరిసమానంగా వున్నాయి. అలాగే ఆత్మజ్ఞాన హీనుడు అహంకరించి మరొకణ్ణి తరిమ్పచేసే బాధ్యతకు పూనుకొంటే ఇద్దరి బాధకూ అంతం ఉండదు. శిష్యుడి అహంకారంగాని, అతడి సంసారబంధాలు గాని తొలగవు. అనర్హుణ్ణి ఆశ్రయిస్తే శిష్యుడెన్నడు తరించబోదు; కాని సమర్థుడైన గురువును ఆశ్రయించి జీవుడి అహంకారమో, మూడు బెక బేకలతో సరి.
"*ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ!!!*