సిగ్గు-సిగ్గు

సిగ్గులేని జాతి మనది

దిక్కు మాలిన రీతి మనది

రోషం లేని జీవితం మనది

వేషం నేర్చిన జీవనం మనది

దిటవు లేని గుండె మనది

ఎముక లేని వెన్ను మనది

నెత్తురు లేని మేను మనది

పిడికిలి లేని చేతులు మనవి

మనమంతా బానిసలం

సేవకులం కూలీలం

పర పంచన భిక్షకులం

నయవంచన శిక్షితులం

అదో కులం ఇదో మతం

కులాల మధ్య కలకలం

మతాల మధ్య రణరంగం

ప్రాంతాల మధ్య చదరంగం

గతమెంతో ఘనమైనా

గతించిన గొప్పలనిప్పుడు

చీకట్లోనైనా చెప్పుకునేందుకు

చెప్పరాని సిగ్గు మనకు

అసలు మనమేమిటో మనకు తెలియదు

వేరెవడో చెప్పినదే మనం నమ్ముతాము

వస్తువైనా వాచ్యమైనా మనది కానిదే మనకు ముద్దు

మనదంటూ ఒక తత్వం మనకంటూ ఒక లక్ష్యం,

మనమంతా ఒక కుటుంబమని ఏనాటికి నమ్మం

మన సంస్కృతి సంప్రదాయాల కంటే

పరాయి వికృతి విపర్యాయాల మీదనే

మనకు మక్కువ ఎక్కువ

ఇందు నీకు నాకని భేదం లేదు

అందరం అందు విందు పొందే వాళ్ళమే

మన జాతి భవితవ్యం కంటే

విదేశీ ఊసుల పైనే

మనకు ఆసక్తి, ఆశ కూడాను

మన పిల్లలకు చదువు నేర్పేది

దేశం వదిలి పోవటానికే కదా

పుట్టి పెరిగిన నేలంటే అభిమానం లేదు

మాట నేర్చిన భాషంటే మమకారం లేదు

బంధాలు బాంధవ్యాల సంగతి సరే

కూడు పెట్టకుంటే తల్లి కూడా తాకట్టే మరి

ఎటు పోదాం ఏం చేద్దాం

ఒక్కుమ్మడి ఇబ్బడి ముబ్బడిగా

భూగోళం మీది దేశాలన్నింటికి

వీసా పట్టుకు పారిపోదామంటే

ఎన్నో దేశాలు మనకంటే అధ్వాన్నంగా వున్నాయంటూ

కొన్ని దేశాలలో మన విలాసాలు చెల్లవంటూ

కేవలం కొన్ని దేశాలు మాత్రమే మనకు అనుకూలమంటూ

ఎవడి అదృష్టాన్ని వాడు పరీక్షించుకుంటూ

అనాధ శరణాలయం లోని పిల్లల మల్లె

ఏ అమ్మ కరుణిస్తుందో ఏ అయ్య ఆధరిస్తాడో

అంటూ దేబిరిస్తూన్న...

సిగ్గులేని జాతి మనది

దిక్కుమాలిన రీతి మనది

/-హరిణి