ఎటువైపు

ఒక జాతి ఒక నీతి ఒక మాట ఒక బాట

నేటికీ నెఱపని మన భిన్నత్వానికి గర్వపడదామా

జాతి జెండాను కూడ వంతులవారి

పంచుకున్న తంతు తెలిసి మురిసిపోదామా

వర్ణ వైషమ్యాలు వర్గ పోరాటాలు

మత మౌఢ్యాలూ ప్రాంతీయ విద్వేషాలు

అడుగడున అడ్డుగోడలై పొడగడుతుంటే

బెంజ్ కారులూ మిడ్నైటు పబ్బులొకవైపు

గంజినీళ్ళు కారపు మెతుకులొకవైపు

ఆకలి కలకలాన్ని కన్నీళ్ళతో చల్లార్చుకుంటున్న కథలింకొకవైపు

ఆశ చావక తగినంత అందక నడుమ తల్లడిల్లు 'సామాన్యుడు' మరొకవైపు

నేను నాది నా బందువులు

నాదు వర్గమూ, వర్ణమూ

అంటూ అందిన మేర పందికొక్కులై

దిగమ్రింగు అధికారులమాత్యులనేకులన్నివైపులా

జేరి రామరాజ్యాన్ని రాబందుల భోజ్యం గావిస్తున్నా

మనకు చీమయినా కుట్టదదేమో చోద్యం మరి

సస్యశ్యామల భారతావనిలో ఆకలి కేకలకు కఱువు లేదు

ప్రజ్వలిస్తున్న క్రాంతి వెనుక రైతుల చావులకు తెఱపి లేదు

ప్రబలుతున్న ప్రగతి క్రింద నలుగుతున్న సామాన్యుని వెతలకంతులేదు

నేటి నవీన నాగరికపు సమాజములో 'ఎవరెటుపోతే మనకేం!'

మన పనులు మాత్రం సమయానికి సవ్యంగా జరిగిపోవాలి

ఎన్ని తప్పులు చేశామెందరిని నొప్పించామన్నది

ఎప్పటికప్పుడప్రస్తుతమే 'ఓ స్త్రీ రేపు రా' కథ లాగున.

కళ్ళకెదురుగ కన్నీరేరులై పారుతున్నా

కించిత్ చలనం కలుగదు మనలో--స్థిత:ప్రజ్ఞులం మరి

చుట్టూ చిమ్మచీకట్లు రాజ్యమేలుతున్నా మనకు మాత్రం

వెలుగురేఖలు స్పష్టంగా కనపడుతాయి--ఆశావాదులం కదా

రేఖకవతలేమున్నదనే ఊహకూడా వ్యర్ధమంటారు మనలోని కొందఱు

ఏదేని ఉన్నప్పటికీ పెద్దగా ఒరిగేదుండదని

అటువైపు చూపు ఆదిలోనే విరముంచుకుంటారింకొందరు

కన్నీరు ఉప్పగా ఉంటుందనీ వెచ్చగా ఉంటుందనీ

అలాగే వదిలేస్తే అది మున్నీరై తమనే ముంచేస్తుందనీ

భయంతో బెంబేలెత్తి కొండకచో కొందఱు కొంత మొసలి కన్నీరు కారుస్తారేమో

జాతి సంపదంతా కొద్దిమంది చేతులలో తిరుగుతుంటే

ప్రజాస్వామ్యం ధనస్వామ్యమై సామాన్యుని సమాధికి పాటుపడుతుంటే

కడుపులు కాలి గుండెలు మండి కుర్రాళ్ళు కొందఱు

ఉగ్రులై ఉద్యమాల బాటపట్టి ఆయుధాలు చేతబట్టి

ధనమధాధికారాన్ని ధిక్కరించి తమవాళ్ళ కేదో మేలు చేద్దామని

ఆశయాల వంతెనపై తప్పటడుగులేస్తూ త్రోవేదో తెలియక

తమవాళ్ళ తూటాలకె తనువులర్పిస్తున్నా ఎవడు

వీడెవరికోసమెందుకు చచ్చాడని వారలువీరలెవరున్నూ

ఒక్క చిన్న కన్నీటి చుక్క రాల్చరయ్యె

ఏదెటుపోయినా...

ఈ పండిన పంట పదిమందికి పంచుటెపుడొ

ఈ దీప శిఖ అందరికొక దారిచూపుటెపుడొ

ఈ అభ్యుదయ రధాన్ని 'నేను సైతం' అధిరోహించెదెపుడో

అని మరల మరల అడుగుతోంది సామాన్యుని గుండె చప్పుడు

/- హరిణి