ఐతే

నీ తోటివారందరూ తమను తాము కోల్పోయి 

నిన్ను నిందిస్తున్నా నీవు నీవుగా నిలువగలిగితే

ఎందరు నిన్ను శంకిస్తున్నా నిన్ను నీవు నమ్మగలిగితే

వేచి వేచి ఎంత వేచినా వేసర పడక

నీ పై కల్లల వల పన్నినా నీవు మాత్రం కల్లలాడక 

ద్వేషించబడినా నీవు ద్వేషమొందక

అతి మంచిగా లేక అతి తెలివిగా కాక


కలలు కనగలిగీ కలలకు బానిసవు కాక  

ఊహించ గలిగీ ఊహలే నీ గెలుపు కాక  

గెలుపోటములను చవిచూసి 

ఆ రెంటినీ ఒకే లాగ  గ్రహించి;  

నీవు పలికిన నిజము ఒడుపరుల  

నోట నలిగి బేలలకు ఎగ మారినపుడు, 

నీ కొకు నీవు నెఱకూర్చుకున్నదంతా

కూలిపోయినా, ఒరిగిన సాములతో తిరిగి పేర్చుకోగలిగితే


నీ గెలుపులన్నింటినీ పేర్చి   

ఒక్క సారిగ జూదంలో చేజార్చి

నీ మొగలు నుంచీ మొదల్చి

ఓడి విడనాడిన వాటి గూర్చి పెదవి జార్చక;  

నీ గుండెనూ, నెత్తుటినీ, కండలనూ 

మరొక తెవుకై నియోగించి - 

తరుణం మించిపోయినా, 

సత్తువ నశించిపోయినా,

తపన తప్ప మరేమీ మిగలకపోయినా!


చిరులతో తిరుగాడీ నీ నడత నిలుపగలిగితే     

దొరలతో నడయాడీ చిరులను మరువక నిలువగలిగితే 

అరులైనా విరులైనా నువ్వు నొవ్వక     

అందరికీ మచ్చికై, ఏ ఒక్కరికీ ఎక్కవ కాక;     

నిన్ను మన్నించని ఒక ఘడియను 

అరవై అరవైల లిప్తల నిడివిగ తలచగలిగితే

ఈ నేల నీదిరా, అందున్నదంతా నీదేరా, 

అంతకు మించి, నువ్వు మగాడివి రా, నా కొడక!