కృష్ణశాస్త్రి

శ్వేచ్చాగానము

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు

నా యిచ్చయే గాక నా కేటి వెరపు

కలవిహంగమ పక్షముల దేలియాడి

తారక మణులలో తారనై మెరసి

మాయ మయ్యెదను నా మధురగానమున!

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

మొయిలు దోనెలలోన పయనంబొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి

పడుచు చినుకునై పడిపోదు నిలకు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాలనాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

శికరంబులతోడ చిరుమీలతోడ

నవముక్తికములతో నాట్యమ్ములాడి

జలధి గర్భమ్ము లోపల మునిగిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

పరువెత్తి పరువెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయ రహశ్యాలు పల్కుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

అలరుపడంతి జక్కిలిగింత వెట్టి

విరిచేదే పులకింప సరసను బడి

మరియొక్క ననతోడ మంతనంబాడి

వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు

పూవు పువునకును పోవుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

పక్షినయ్యెద చిన్ని వ్రుక్షమయ్యేదను

మధుపమయ్యెద చందమామనయ్యెదను

మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను

అలరునయ్యెద చిగురాకునయ్యెదను

పాటనయ్యెద కొండవాగునయ్యెదను

పవనమయ్యెద వార్ధి భంగమయ్యేదను

ఏలకో ఎప్పుడో యెటులనో గానీ

మాయమయ్యెద నేను మారిపోయెదను.

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?

/-- కృష్ణపక్షం నుంచి

తేటివలపు

మలయ సమీరనోర్మికల మాలికలం బ్రణయార్ద్ర గితికల్

మలయుచు నాట్యమాడవు, సుమ ప్రమాదమని పులకరింప , నో

యళివర , తేనెలానవు , వనాంతరమంతయు సిన్నవోయే ; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

అలరు పడంతులెల్లరు హిమాంబువులన్ నవమల్లికా సతిన్

జలకము లార్చినారు, వనజాత పరాగ మలందినారు , మేల్

జిలుగు హొరంగు పొందళుకు చీరలు గట్టిరి పెండ్లికంచు ; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

అలరుచు మల్లికాపరినయంబని వచ్చిరి పూవుబోండ్లు, కో

యిల సవరించె గొంతు, తమ యేలికకై విరిదేనెపానకం

బళితతి గూర్చె , పుప్పొడుల నత్తరులం బవనుండు చేర్చె; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

వలపు హరించినాడవట, స్వాదు మరందము గ్రోలితంట , మై

పులకలు పుట్టగా మధురమోహన గానము జేసితంట , మా

లలన యమాయికాత్మ భ్రమరా ! తగునా వగ వాడ జేయ ; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

వలపులు గ్రుమ్మరింపదు , నవప్రణయోదయ హాస్యచంద్రికల్

చిలుకదు, తోడి చిన్ని విరిచేదేలతో జతగూడి నాట్యముల్

సలుపదు , మంచుముత్యములు , షట్పద! తాల్పదు , మల్లికాంబ ; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

జలజల రాల్చు దుర్భరవిషాదమునన్ దుహినాశ్రు బిందువుల్ ,

వెలెవెలె పోవు మారుతము వీచిన పాదపపత్ర సంతతిన్ ,

తలిరుల విన్నపోయి యేదో తప్పొనరించిన రితి నక్కు; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

లలితా మనోజ్ఞామూర్తి , యళిరాజు , మనోహర గాన సత్కళా

విలసితు , దార్ద్రచిత్తుడని బేల వరించెను నిన్ను మల్లికా

లలన, యెరుంగదింత యనురాగము తేనెలతేట కంచు ; కో

మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో!

తేనేలన్గూర్చి వలపుల దేటపరచి

ధన్యురాలయ్యె మీ చెలి తలిరుబోణి !

కానీ నిరతంబు మల్లికా కడనె యుండి

ముదము గూర్పగా మాకొక్క పూవే చెపుమ!

/-- కృష్ణపక్షం నుంచి

ఏల ప్రేమింతును?

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల ?

పరుల తనయించుతకో? తన బాగు కొరకో

గానమొనరింపక బ్రతుకు గడవబోకో?

/-- కృష్ణపక్షం నుంచి

నా కుగాదులు...

నా కుగాదులు లేవు

నా కుషస్సులు లేవు

నేను హేమంత కృ

ష్ణానంత శర్వరిని .

నాకు కాలమ్మొక్క

టే కారురూపు, నా

సోకమ్మువలెనే, నా

బ్రతుకువలె ,

నా వలెనే.

/-- ప్రవాసి నుంచి

--------------------------------------------------------------------------------------------------------------------

ఆకులో ఆకునై పూవులో పూవునై

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ యడవి దాగిపోనా

నిచటనే యాగిపోనా?

గల గలని వీచు చిరుగాలిలో కెరటమై

జల జలని పారు సెలపాటలో తేటనై

ఈ యడవి దాగిపోనా

ఎటులైన

నిచటనే యాగిపోనా?

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై

ఈ యడవి దాగిపోనా

ఎటులైన

నిచటనే యాగిపోనా?

తరు లెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల

చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఈ యడవి దాగిపోనా

ఎటులైన

నిచటనే యాగిపోనా?

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ కరణి వెర్రినై యేకతమా తిరుగాడ

ఈ యడవి దాగిపోనా

ఎటులైన

నిచటనే యాగిపోనా

/- మేఘ సందేశం నుంచి

------------------------------------------------------------------

నా హృదయమందు

నా హృదయమందు …

నా హృదయమందు …

నా హృదయమందు విశ్వవీణాగళమ్ము

భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు;

దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె

నంగి చుక్కలమెట్లపై వంగి వంగి

నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు.

వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ

కురియు జడులు జడులు గాగ, పొరలి పారు

కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ;

కలదు నాలోన క్షీరసాగరము నేడు!

దారిదొరకని నా గళద్వారసీమ

తరగహస్తాల పిలుపుతొందర విదల్చు!

మోయలేనింక లోకాలతీయదనము!

ఆలపింతు నానందతేజోంబునిధుల!

ప్రేయసి! చలియింపని నీ

చేయి చేయి కీలింపుము

చలియించెడు నా కంఠము

నిలిచి నిలిచి పాడగా!

ఊర్వశి! ఊర్వశి! నాతో

ఊహాపర్ణాంచలముల

వెర పెరుగని కను మూయుము!

తిరుగురాని దొరకబోని

శీతాచల శిఖరోజ్వల

హిమపీఠాగ్రమున కెగసి

శిరములెత్తి కరములెత్తి

కురియింతమొ, వినిపింతమొ,

మేలుకొనిన శ్రుతులనంత

కాలమె వికసించి వినగ,

గంగా పవిత్రకాంతుల!

యమునా శీతలమధువుల!

“ఊర్వశి” నుంచి

-----------------------------------------------------------------

నా నోట నీ మాట

నా నోట నీ మాట గానమయ్యే వేళ

నా గుండె నీ వుండి మ్రోగింపవా వీణ?

రాగ మెరుగని వీణ,రక్తి నెరుగని వీణ

తీగపై నీ చేయి తీయకే ఘడియేని !

అంతరాంతరము నీ అమృత వీణే యైన

మాట కీర్తన మౌను, మనికి నర్తన మౌను !

ఈ అనంత పథాన ఏ చోటి కా చోటు

నీ ఆలయ మ్మౌను, నీ ఓలగ మ్మౌను!

అడు గడుగునకు స్వామి అడుగు సవ్వడి వినిన

ఎడద లోలోన ఎల్లెడల విశ్వము లోన

ఈ యాత్ర ముగియునో ఏ వేల దిగుదునో,

హాయిగా చల్లగా సాగిపోవుదు నంతె!

దేవదేవా !మహాదేవ !లోకేశ్వరా!

దీనబంధూ !దయాసింధూ! ప్రాణేశ్వరా!

ఘడియేని నీ వియోగము సహింపగలేను

విడిపోని నీ చెల్మివిధ మేమొ శెలవిమ్ము !

------------------------------------------------------------------

నా కేల ఒక జోలె

నా కేల ఒక జోలె,

నాలో అమృత వీణ

ఉంచి నను లె మ్మందువా !

దేవ

ఊరకే పొమ్మందువా !

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గమ్ములో

ప్రతి ఇంటి మోసాల ఆగనా !

దేవ

ప్రతి గుండె మోసాల మ్రోగనా !

పాడి పాడీ, నృత్య

మాడి ఆడీ, నిన్ను

వేడి వేడీ పొరలనా !

ప్రతి గుండె

తోడ కూడీ తరలనా !

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గ మ్మంత

గంధర్వ సీమగా చేయనా !

దేవ

గాన సౌధమ్ముగా చేయనా !

విరిసి విరిసీ, తేనె

కురిసి కురిసీ దెనల

దరిసి దరిసీ పొరలనా !

ప్రతి గుండె

నొరసి యొరసీ తరలనా!

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గ మ్మంత

పూల పందిరి చేయనా !

దేవ

బృందావనము చేయనా !

తేలి తేలీ, అలల

తూలి తూలీ, చదల

సోలి సోలీ పొరలనా !

ప్రతి గుండె

మాల లల్లీ తరలనా !

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గ మ్మంత

పాల కదలిగ చేయనా !

దేవ

పండు పున్నమి చేయనా !

తలపు తలపూ జ్యోతి,

పలుకు పలుకూ గీతె,

పనులన్ని ప్రణయముగ చేయనా !

దేవ !

ప్రతి గుండె నీ గాథ పోయనా !

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గ మ్మంత

మూల మూలల నడుతునా

నా దేవ

వేల వేలల విడుతునా !

న న్నొక్క జోలెగా,

న న్నమృత వీణగా

తడయ కిక రమ్మందువా !

ప్రతి గుండె

విడియగా తెమ్మందువా !

నాలుగూ దిక్కులా

నడిమి స్వర్గమ్ముతో

గంగలా కడలిలో దూకనా !

దేవ

పొంగుతూ అడుగులా తాకనా !

-------------------------------------------------------------------

ఆకలి మంటల కాగలేక నీ

వాకిట ఒకనాడు నుంచునీ

అరిచానే అన్నమో , అన్నమో అని

మరిచావే ఈ దీనురాలిని

అరిచావే, వాకిలి మూసుకుని, నీవు

కరిచావే పోవే పొమ్మని

మండేటి ఎండలో నోరెండి నిప్పు

చెన్డేటి వేసంగి వచ్చానే

పచ్చినీటి చుక్క అడిగానే నువ్వు

వెచ్చని పాయసం తాగుతూ నన్ను

అరిచావే దొంగా పోమ్మనీ నువ్వు

మరిచావే ఈ దీనురాలినీ

దిక్కుమాలిన పేదకుక్కలా దారి

పక్క నా ఒళ్లెల్ల చీముతో కుళ్ళి

నక్కిన నిర్భాగ్య రాగినీ నన్ను ......

పోరా పోరా నీకా స్వర్గం, క్రూరస్వార్థ పిశాచీ

పేదల సాదల రక్తం పీల్చిన ద్వేషివి,రాకాశీ,

చల్లని తీయని ప్రేమావాసం, చక్కని స్వర్గనివాసం

పోరా అదిగో రౌరవనరకం , ఘోరమైన నరకం.

-------------------------------------------------------------------

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు మూగ అయ్యాక దైవాన్ని ఉద్దేశించి "మాట

తీసుకుని నాకు మౌనమ్ యిచ్చావు " అన్నారు . సాటిలేని పాటలు మనకిచ్చి ఆయన

మౌని అయిపోయారు

"ముసలితనంలో మూగతనం భయంకరం. శిథిలమందిరంలో అంధకారం

లాగున.

ఏదో తోసేస్తున్నాను బ్రతుకు- `దినములు పరస్పర ప్రతిధ్వనులులాగా'

- ఆనాటి మా వేదుల లాగున"