కొండ

ఆ కొండని చూసినప్పుడల్లా నా గుండె మ్రోగుతుంది

బాల్యం నా కళ్ళ ముందు ప్రత్యక్శమౌతుంది

ఎన్ని వేల ఏళ్ళ చరితకు సాక్షిగా నిలిచిందో

నాకైతే తెలియదు కానీ నా ఈ చిన్ని బ్రతుకులో

ఎన్నెన్ని ఘటనలకు గురుతుగా మిగిలిందో

అది కేవలం బండ మాత్రమే కాదు

నా గుండె లోతుల నెరిగిన ఆత్మీయ నేస్తం

అందరు వుండీ నేనొంటరినయినపుడు

నన్ను ఆదరించి అక్కున జేర్చుకున్న

ఏకైక నేస్తం ఆ కొండ

ఎన్నెన్ని ఊసులో ఎన్నెన్ని బాసలో

ఎన్నెన్ని గాధలో ఎందరి గురుతులో

శెలవు దొరికితే చాలు ఆ కొండ పై ప్రత్యక్షం మా దళం

ఏ వేడుకైనా వేదనైనా ఆ కొండ మీదనే మాకు వేదిక

నెలకొక్క తడవైన ఆ కొండనెక్కనిదే

మనసు మాట వినదు గుండె బరువు దిగదు

ఈ నేస్తాన్ని నా పిల్లలకు పరిచయం చేయాలని

దానితో నేను పంచుకున్న మధురానుభూతులని

పెంచుకున్న గాఢానుబంధాన్ని వారికి తెలియజెప్పాలని

నేనెన్నో కలలు కనేవాడిని

కానీ...

ఎవరికో కళ్ళు కుట్టాయి

రాయి కోసం, మట్టి కోసం

ఆ కొండను నిలువెల్లా పెకలించేస్తున్నారు

పగులుతున్నది కొండ కాదు నా గుండె లాగున్నది

ఎంత బాధ పడితే మాత్రం ఏం లాభం

నేనొంటరినై వాళ్ళని ఆపలేక పోయినపుడు?

ఈ రోజు నా నేస్తాన్ని చూడటానికి వెళ్తున్నాను

బహుశా ఇదే కడపటి చూపు కావచ్చు

గుండె అధురుతోంది మనసు బెదురుతోంది

ఎవరైనా నాకు తోడొస్తారా?

/- హరిణి