వచనం

బిడ్డవైనా ... తండ్రివై పాఠాలు నేర్పావ్!

నువ్వు పుడుతున్నప్పుడు మీ అమ్మ పడ్డ బాధ తలుచుకుని ఏడ్చాను

నాకు కూడా ఆ బాధలో పాలుపంచుకునే శక్తి ఉంటే బాగుండును అని అనుకున్నాను

ప్రకృతి నాకు ఆ అవకాశం ఇవ్వలేదు అని తెలుసుకున్నాను

అప్పుడే, నువ్వు పుట్టినప్పుడే, నాకు అర్ధం అయింది, మా అమ్మ నన్ను కన్నప్పుడు ఎంత కష్టపడిందో అని ...

ప్రసవం భార్యకే అయినా వేదన దంపతులిద్దరిదీ అని అప్పుడు అర్ధం అయింది

ఆ రోజే, నా తల్లిపైనా, నీ తల్లిపైనా, నాకుండే ప్రేమని తెలిసొచ్చేలా చేసావ్

ఆ రోజే, నువ్వు నాకు బిడ్డవైనా ... తండ్రివై పాఠాలు నేర్పావ్!

--- చైతన్య శర్మ 04-Sep-2016

మా నాన్న

అప్పుడు, నాన్న అంటే భయం.

అల్లరి చేస్తే కొడతాడు. ఇంటికి వస్తే టీవీ కడతాడు. నాన్నకి నేను ఆడుకోవటం ఇష్టం ఉండదు. నాన్నకి నన్ను ప్రేమగా చూసుకోవడం తెలియదు.

తరువాత, నాన్న అంటే గౌరవం.

మా అందరి కోసం తానొక్కడే కష్టపడతాడు. మా చదువులు పాడవకూడదని, రోజుకి 200 kmలు ప్రయాణం చేస్తాడు. అలసిపోయి వచ్చినా, మరో గంట జాతకాలు చెప్పి పది రూపాయలు కూడపెట్టాలనే పిసినారి అతను. పోస్ట్ఆఫీస్ లో RD లకు, LIC లో policy లకు మాత్రమే తెలుసు, ఆ కష్టం మా కోసం అని.

ఇప్పుడు, నాన్న అంటే ఒక సంపూర్ణ జీవితం.

ఒక ఆదివారం, రోజంతా వేసిన జాతకాలవల్ల వచ్చిన డబ్బుని, ఆఖరున వచ్చిన వ్యక్తి జాతకం బాగోలేదని, అతనికే ఆ డబ్బంతా ఇచ్చేసిన అమాయకత్వం ... మా నాన్న

ఎదిగిన కొడుకు ఇంట్లో కూర్చుని తింటుంటే ... తనకు తాను సర్దిచెప్పుకునే ఓపిక ... మా నాన్న

అల్లుడిపై ఎందరు ఎన్ని చెప్పినా, రాముడు చూపిన సంబంధం తప్పుకాదనే నమ్మకం ... మా నాన్న

మేము ఎదగాలని తన జీవితాన్నే ఎరువుగా చేసాడు ... మా నాన్న

ఎదిగిన ఆ చెట్లు వేరొకరి ఇంటికి నీడను ఇస్తుంటే ... తాను పెంచిన చెట్టు పచ్చగా ఉందని ఆనందించే తత్త్వం ... మా నాన్న

చేతికందిన పంట .. వేరొకరి కంచంలో అన్నం అయినప్పుడు ... ఆకలేసినా ఆశపడని రైతు .. మా నాన్న

కోరికలు లేని కుబేరుడు ... మా నాన్న ... నడుస్తున్న కర్మ యోగి ... మా నాన్న !

--- చైతన్య శర్మ 04-Sep-2016

ఇది న్యాయమా ప్రియా ?

నీ నడుము చేసే నాట్యాన్ని చూసి నా కన్ను చప్పట్లు కొడితే ... నే కన్ను గీటానని నిందిస్తావా ప్రియా..

--- చైతన్య శర్మ 02-Oct-2013

కోపం

కోపమనే శత్రువును హృదయమనే కుహురంలో నిలుపుకుంటే,

స్నేహంలో ఉండే మాధుర్యాన్ని,

నిజం అనే ఖనిజాన్ని చూడలేరు

--- చైతన్య శర్మ. 2012

నా తలపులలో నువ్వు నాకు ఏమవుతావ్ ?

నా జీవితం ఒక answer sheet అయితే నువ్వు నా Hall-ticket number వి.

అంకితం --- అజ్జరపు శ్రీనివాస్ గారికి.

--- చైతన్య శర్మ 04-Aug-2013


నిప్పు

Boss:: నిప్పు లేనిదే పొగ రాదు

నేను:: నిజమే కాని మీరు చూస్తోంది కేవలం పొగని మాత్రమే నిప్పుని (నన్ను) కాదు !!

(మా బాస్ కి చెప్దామనుకున్నా మీకు చెప్తున్నా)!

--- చైతన్య శర్మ 01-Mar-2012

గంగ

గంగ పార్వితికి మాత్రమే అర్ధభాగం ఇస్తావా అని అలిగిందని కాబోలు,

శివుడు తన శరీరంలో క్రింది సగభాగాన్ని గంగకు ఇచ్చేసాడు!!!

అయినా ఆలిని పక్కన పెట్టుకోక,

నెత్తినెక్కిస్తే ఇలా బ్రతుకు గంగ పాలు కావలసినదే,

అది శివుడికి అయినా సరే !!!

----చైతన్య శర్మ 22-Dec-2011

QUANTUM కన్నె

ఈ కన్నె ముసలిని సంతృప్తి పరచిన మగాడే లేడట! దమ్ముందా అని ఎగిసి పడుతోంది! అందుకే ఆ కన్నెపై ఓ కన్నేసా. మీరు వీలైతే వెయ్యండి ఓ కన్ను. ఇంతకి ఆ కన్నె ఎవరో చెప్పలేదు కదూ మీకు సుపరిచితమైన 'QUANTUM MECHANICS'. వెయ్యండి చూద్దాం దాని అంతు.అన్నట్టు దీని వయసు 100 ఏళ్ళ పై మాటే.అయినా ఇది కన్నే!!!!!

---చైతన్య శర్మ 04-Jun-2010

భారతమాత! మారునా నా రాత?

మొట్టమొదటి సారిగా నాలో భారత మాతకు ఏదో ఒక మంచి పని చేసి ఆనంద పడాలని కోరిక కలిగింది. ఎందుకో ఎంత ప్రయత్నించినా నిద్ర చేరువ అవ్వలేదు. రాత్రి ౨.౦౦ వరకు నిద్ర రాలేదు. నాలో మేల్కాంచిన జ్యోతి నన్ను నిదుర పోనివ్వటం లేదు. గమ్యం , మార్గం ఏమిటో నాకు తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే నా మనసు మారింది. ప్రజలకు ఏదో చెయ్యాలనే తపన నాలో కలిగింది. భారతమాత ఇచ్చే డబ్బుతో విలాసవంతంగా జీవిస్తూ తిరిగి ఏమీ ఇవ్వలేకపోతున్నాననే బాధ నాలో కలిగింది. ఈ రోజే నా దగ్గర ఉన్న డబ్బును "నోట్ బుక్ డ్రైవ్ " కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. గొప్పవాడిగా కనపడాలని కాదు , ఇచ్చే డబ్బుతో చదివిన వారిలో ఒక్కడయినా మనిషిగా మారితే , ఈ సమాజంలో ఒక్కడయినా చక్కగా చదువుకుంటే , నే సంపాదించిన సంపదకు అర్ధం , సంపాదిస్తున్న దానికి పరమార్ధం. కూడా పెట్టే డబ్బు విలాసాలకు కాక పిల్లల వికాసానికి ఖర్చు పెట్టడమే న్యాయమని అనిపిస్తోంది.

నేడే పరిశోధనా కార్యక్రమానికి నాంది పలకబోతున్నాను. పుట్టిన్చినందుకు విధాత, కన్నందుకు మాత, పెంచినందుకు తాత, తీర్చిదిద్దినందుకు పిత, నా భారాన్ని మోస్తున్నందుకు భూమాత, పోషిస్తున్నందుకు భారతమాత గర్వించేలా శోధించాలని, శోధించి ప్రజలకు శాంతిని ప్ర"సాధించాలని" దీవించండి మిత్రులారా!!! దేవతలారా!! నా గురువులారా!!

--- చైతన్య శర్మ 10-May-2010