నా కవితలు

నా ప్రతి కదలికలో ... నువ్వే ...

రవి గాంచని దృశ్యమై నువ్వు విహరిస్తూనే ఉన్నావు ... నా స్వప్న సౌధాలలో ...

నేల తాకని నీరువై నువ్వు ప్రవహిస్తూనే ఉన్నావు ... నా హృదయ మైదానాలలో

వాయువంటని వాసనై నువ్వు పరిమళాలు వెదజల్లుతునే ఉన్నావు ... నా ఊహల విరితోట లో ...

చెవిని చేరని శబ్ధమై నువ్వు ఆలపిస్తూనే ఉన్నావు ... నా మౌన రాగాలలో

చేయి కందని ద్రాక్షవై నువ్వు తీపినందిస్తునే ఉన్నావు ... నా మధురానుభూతులలో ...

రేయి చూడని కాంతివై నువ్వు వెలుగును ప్రసరిస్తునే ఉన్నావు ... నా జ్ఞాపకాల బాటలలో

నను మనువాడిన తరుణివై నువ్వు కనిపిస్తునే ఉన్నావు ... నా ప్రతి కదలికలో

10-Apr -2016

"నువు"లు:

కనువారల కనులెప్పుదు ధనువులవలె విచ్చుకొనెడి తనువులుగల తరుణులార వినుడీమాట

మీ తనువున గల అణువణువును దర్శించెడి భాగ్యంబును అనువుగ ప్రతి మగవానికి ఇవ్వద్దండి

తనువున సగ భాగమై చనువుగ మిము చేరగలుగు మనువాడెడి మగని కొరకు అది ఉంచండి

క్రమముగా పలు "నువు"లు చేర్చి చనువుగ నే చెప్పినట్టి ఈ మాటలను

భ్రమరము మధువును దాచెడి విధముననే దాచుకొనక తరలించండి (అంటే Share చెయ్యండి)

15 Aug 2014.

మనం ... మౌనం:

నువ్వు నేను ... మనం

నాలో నీలో ... మౌనం

May 2014

పాణి "గ్రహణం":

అప్పుడు ... నాలో "ఆనందం అనే చంద్రుడు" వెలుగుతున్నప్పుడు ... అది నీ వల్లే అని అన్నారు

ఇప్పుడు ... ఆ చంద్రుడు ... కనపడకపోయే సరికి ... రాహువు నువ్వని ... నా చంద్రుణ్ణి తిన్నావని అంటున్నారు

సూర్యుడిని నేనని ... నా ఆనందానికి అప్పుడు వెలుగు నిచ్చింది ... ఇప్పుడు అడ్డు వచ్చింది నేనేనని ఎంత చెప్పినా వీళ్ళు వినరేం ??

26 APR 2014

హెచ్చరిక: ఈ కవిత్వానికి నా జీవితానికి ఏ సంబంధమూ లేదు

పిలుపొచ్చింది

ఓ పడతి నీ ప్రేమలో నే పడతిని ...నా ప్రేమ నిను చేరాలని పరుగు తీసింది

హలుపొస్తుందేమో అని భయపడ్డా ...నీ పిలుపొచ్చింది.

08 Oct 2013.

మేము అంధులం... అయినా.. ఎక్కగలం అందలం

చూడగలిగి కూడా నువు మన్ను, మిన్ను

చూడవేమి ఒకలాగ నిన్ను, నన్ను.

కనులు లేకపోవటం కాదె అది నా లొపమ్.

అందుకె లేదేమో నాపై నాకే కోపం.

అవును! నే చూడలేను ఏనాడు ఏ ఉదయమ్.

కానీ... ఉన్నది నాక్కూడా స్పందించే ఓ హృదయం.

బాధలేదు మీరంతా పోతుంటే ఎడంగా ..

నిలిచిపోను మీవలె నేనేడుస్తూ జడంగా..

ఉండగలదా? ఏ చీకటి ఒక్కరోజు పూర్తిగా?

వెలుగునిచ్చు వరదాతై భానుడుండ స్పూర్తిగా!!

ఉండలేదు ఈ చీకటి నా తోడై ఆసాంతం

జ్ఞానమనే వెలుగుతో నే చూస్తా దీనంతం .

(నేను) అడగబోను ఏనాడు చెయ్యి జాచి ఆర్తిగా.

నా అడుగులతో జయిస్తాను జీవితాన్ని పూర్తిగా .

2012

నీ కలలో ... నా కలని ...

చెప్పాలని వొక కథని

చూపాలని నీ జతని

దోచాలని నీ మదిని

చేర్చినాను నా కలని... నీ కలలో... (ఓ రాణి...)

చూడాలని వేకువని

కవ్వించే (నీ) కన్నులని

ఆపి చూడు నా కలని... నీ కలలో... (నా రాణి)

---చైతన్య శర్మ 23-Mar-2010

ఉగాది మొదటి పిలుపు

రండి రండి కదలి రండి

కళలతోడ కదలి రండి

కథలతోడ కలపి రండి

జతులతోడ జతగ రండి

వ్యథలనన్ని వదల రండి.

తలపులతో తరలి రండి

మలుపులలో మరలి రండి

తెలుగుతనం తెలుప రండి

మంచితనం మరువకండి .

---చైతన్య శర్మ 03-Mar-2010