ఉగాది కవితలు మాటలు

నాల్గవ సమావేశం:

"వసంతంలా... వచ్చిపోవా ఇలా... నిరీక్షించే ... కంటికే పాపలా..." అని ఎవరో పాడుతున్న పాట వినపడి ఇలా మీ వైపు వచ్చాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా ??

నేనండీ ... మీ ఉగాదిని! అచ్చంగా మీ చేతుల్లో మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగో వసంతంలో అడుగిడబోతున్నాను. నా కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? లేకపోతే మీ మీ పనుల్లో పడి నన్ను పూర్తిగా మరచిపోయారా? ఆ... ఆ...మీ సమాధానాన్ని తరువాత సావధానంగా వింటానుగానీ ...ముందు ఈ విషయం చెప్పండి.

ఈ సారి నా కోసం ఏమేమి పిండివంటలు చేస్తున్నారు? క్రిందటిసారి అయితే అంతా లొట్టలేసుకుని మరీ తిన్నారుగా అరిసెలు... ఆ మీరే....మరిచిపోయాననుకుంటున్నారా? మరి ఈసారి కూడా అరిసెలేనా లేక .. ఇంకేమైనా ఆలోచించారా ? ఆ.. ఆలోచించే ఉంటారులెండి!

ఇంతకీ ఈసారి నా favourite పచ్చడి ఎవరు చేస్తున్నారు? ఎవరు చేసినా సరే నా పచ్చడి ఎలా ఉండాలంటే, " అమ్మ ప్రేమలో ఉన్న మధురము, అనుభందాల లవణము, వగరు వంటి అహంకారము, పుల్లగా తట్టే చమత్కారము, విషాద చాయల చేదుదనము, రౌద్ర భంగిమంత కారము",కలగలిపి కావాలి నా పచ్చడి షడ్రుచుల సమ్మేళనము.

అన్నట్టు ఈ సారయినా ఉగాదికి కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నరా ? మీ ఆట, పాటలతో పాటు అది కూడా చూడాలని బాగా ముచ్చట పడుతున్నాను. కవులారా, రండి! మీ కవిత ఝురిలో నన్ను మురిపించి మైమరిపించండి!!

ఏమిటో నాపాటికి నేను ప్రశ్నలు అడుగుతూనే పోతున్నాను...మీరు మాత్రం జవాబులు చెప్పట్లేదు! :( ఏమిటి? ఏమిటో వినపటంలేదు ?? ఓహో! అలాగా! సరే..అయితే..అంతా కలసి, 26-03-2013 ,అనగా Tuesday రాత్రి 9.00 గంటలకు, చంద్రయ్య canteen లో చెప్తారన్న మాట. సరే అలకానివ్వండి!

---చైతన్య శర్మ 25-Feb-2013

మూడవ సమావేశం:

"శిశిరానికింక - "see-you"లు చెప్పి, "welcome"లు నాకు - పలకలేదేమని!", వయ్యారి వసంతం - వన్నెల్లు పోతోంది.

"రుచులు మరచిన మన - JNC నాల్కలకు, తెలుగుభోజనం రుచి - చూపిస్త నేనంటూ !", అందాల ఆవకాయ్ - ఆరాట పడుతోంది .

"తిథులు తెలియని మన - అతిథులు అందరికీ - తెలుగు తియ్యందనం నే - తెలియ-జేస్తానంటూ ! ", పంచాంగ బలమంత - పరిగెట్టుకొస్తోంది.

"మాసిపోయిన-ముఖంతో- బోసిపోయిన నన్ను - ముస్తాబు చెయ్యడం - మరచినారా ???అని ", కమ్యూనిటీ హాలు - కలవరం పడుతోంది.

"మీలోని కళలను - మీకున్న ప్రతిభనూ - ప్రతి-బింబింప చేయ - ఉన్నాను నేనంటూ !", వాడైన వేదిక - వేడిక్కిపోతోంది.

పైనున్నవన్ని- ఒకమారు చదివితే - ఘనమైన ఉగాది - గుర్తుకొస్తుంది! నేనేమి చెయ్యాలి? - అని మీ బుర్ర అడిగితే !!! - చదవండి క్రిందది - బహు శ్రద్ధ గాను !!!

గత రెండు సంవత్సరాల ఉగాది వేడుకలు మనకు పంచిన అనుభవాలను పునాదులుగా చేసుకొని, ఈ సంవత్సరపు వేడుకలను మరింత గొప్పగా జరపడానికి మీ సలహాలు తెలుసుకొనుటకు, మీతో సంప్రదించుటకు మనమంతా ఒకసారి కలవాలి. మీ అమూల్యమైన సమయం నుండి కొంత సమయాన్ని ఈ ఉగాది కొరకు కేటాయించి ఈ తొలి సమావేశానికి హాజరు అవుతారని ఆశిస్తూ....

---చైతన్య శర్మ 27-Feb-2012

రెండవ సమావేశం:

ప్రతి మదిని పలకరించి, ప్రతి హృదిని పులకరించి, వెళ్లినదొక వసంతం, ఆ స్మృతులొక అనంతం !

ఆసాంతం మన తోడై, నిలువలేని ఆ వసంతం, పంచెను తన ఆనందం, పెంచెను మన అనుబంధం, మరువలేనిదీబంధం!!

లేలేతని చిగురులతో, కోకిలమ్మ కూతలతో, వస్తోన్నది వసంతం,ఇక కావలది మన సొంతం!!!

ఈ వసంత అందాలను చవిచూసే ముందు గత వసంత స్మృతుల మకరందాన్ని వొకసారి పంచుకుందాం .....

సమావేశాలలో కలసి,

సమ ఆవేసలతో కదిలి,

పనులన్నీ మనవి అంటూ,

పద పద పద పదమంటూ,

మొదలెట్టాం మనమంతా!!!

అలంకరణతో ఆరంభించి, ఉగాది పచ్చడి రుచి చూపించి, పచ్చని తోరణాల నడుమ జగజ్జననిని స్మరించి, పంచాంగ శ్రవణాన్ని ఆలకించి, మగధీరలో పంచెవన్నెల రామ(చరణ) చిలకని తిలకించి, సాంస్కృతిక కార్యక్రమాలలో తెలుగు తనాన్ని రంగరించి, పసందైన తెలుగు భోజనాన్ని రుచి చూపించి, మన తెలుగు వెలుగులు అంబరాన్ని తాకాయ అని అన్నట్టుగా జరిగాయి గత ఉగాది సంబరాలు.

గత ఉగాదిని పునాదిగా మలచుకొని అంతకంటే ఘనంగా ఈ ఉగాదిని అంగరంగ వైభవంగా జరిపిద్దాం.

మరిన్ని వివరాలు త్వరలో....!!!

---చైతన్య శర్మ 10-Mar-2011

మొదటి సమావేశం:

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వసంతం రానే వస్తోంది. వస్తూనే తనతోపాటు మనందరికీ ఇష్టమైన ఉగాదిని తనతో తెస్తోంది . ఉగాది అనగానే మీ మదిలోకి వచ్చే ఉంటుంది ... అదేనండి మన ఉగాది పచ్చడి. అదేమిటి ముఖాన్ని అలా మార్చారు ??? వేపపువ్వు గుర్తుకువచ్చిందా ??? ఆ చేదు ముఖాన్ని ఇక మీ నుండి శాశ్వతంగా తీసెయ్యడానికి ఈ ఉగాది మీకో తియ్యటి కబురును తీసుకొచ్చింది .. కాదు కాదు ... మోసుకొచ్చింది ఏమయ్యుంటుందబ్బా?? అని ఆలోచిస్తున్నారా........ లేకపోతే ఈ గజిబిజి బ్రతుకుల్లో తీపి కబురు కూడానా అని వాపోతున్నారా!! మీరేమన్నా .. ఏమిఅనుకున్నా .... ఇది నిజంగా తియ్యటి తీపి కబురేనండి ....

ఏ సంస్క్రుతితోనైతే దేశవిదేశాలలో సైతం ఆంధ్రులు అంటే అదుర్స్ అని అనిపించుకున్నామో ఆ సంస్కృతినీ , సంప్రదాయాన్నీ మన విజ్ఞాన సంస్థలో కూడా అమలుపరచడానికి వొక వేదికని ఏర్పరిచామండి ......ఏం చేస్తారు అని అడుగుతున్నారా??? దాని సమాధానం చెప్పాల్సింది మీరేనండి . ...మేమా.!!! అని మళ్ళా ప్రశ్నించుకోవద్దు? మీరే! అనాదిగా వస్తున్న ఈ "యుగాది "(ఉగాది) మన వేదిక ప్రారంభానికి పునాది . మీ ఆలోచనలు, అభిప్రాయాలు ; సలహాలు, సందేహాలు ; ప్రశ్నలు, ప్రభోదాలు ; ఇవే మన వేదిక అభివృద్ధికి మీరిచ్చే అమూల్యమైన నిధులు ...

కథలు, కవితలు, కళలు;

హాస్యం ,లాస్యం ,జోస్యం;

ఆట, పాట అవి ఇవి అని కాదుకానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే మీలో ఉండే తెలుగు తనాన్ని సంపూర్ణంగా వెలికి తీయండి .... దేనికంటారా ...మన వేదికని అలంకరించడానికి

---చైతన్య శర్మ 03-Mar-2010