సంస్కృత సంధులు

సంస్కృత సంధులు


సవర్ణదీర్ఘ సంధి :
అ ఇ ఉ ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వానికి దీర్ఘములు ఆదేశమగును

ఉదా :

రామ + ఆలయము = రామాలయము

ధరణి + ఈశుడు = ధరణీశుడు

భాను + ఉదయము = భానూదయము

పితృ + ఋణము = పితృూణము



గుణసంధి :

అకారమునకు ఇ ఉ ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ ఓ అర్ లు ఏకాదేశమగును.

ఉదా :

నర + ఇంద్రుడు = నరేంద్రుడు

పరమ + ఈశ్వరుడు = పరమేశ్వరుడు

గుణ + ఉన్నతుడు = గుణోన్నతుడు

దేవ + ఋషి = దేవర్షి


వృద్ధిసంధి :

అకారమునకు ఏ ఐ లు పరమగునపుడు ఐ కారము, ఓ ఔ లు పరమగునపుడు ఔ కారము ఆదేశమగును.

ఏక + ఏక = ఏకైక

దేశ + ఐక్యత = దేశైక్యత

సకల + ఐశ్వర్యములు = సకలైశ్వర్యములు

గంగా + ఓఘము = గంగౌఘము

వన + ఓషధి = వనౌషధి

దివ్య + ఔషధము = దివ్యౌషధము



యణాదేశసంధి :

ఇ ఉ ఋ లకు అసవర్ణములైన ( ఇతర ) అచ్చులు పరమగునపుడు వానికి య- - - లు ఆదేశమగును.

ఉదా :

అతి + అద్భుతము = అత్యద్భుతము ( ఇ కి ‘య‘ వచ్చినది )

ప్రతి + అక్షము = ప్రత్యక్షము

గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ. ( ఉ కు ‘వ’ వచ్చినది )

పితృ + ఆర్జితము = పిత్రార్జితము ( ృ కు ‘ర’ కారము వచ్చినది )



జశ్త్వసంధి

ఈ సం ధిని నేను సంస్కృత సరళాదేశసంధి గా గుర్తు పెట్టుకొంటాను.

క చ ట త ప లకు వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు , అచ్చులు, హయవరలు పరమగునపుడు వాటికి గ జ డ ద బ లు ఆదేశమగును.

ఉదా :

దిక్ + అంతము = దిగంతము

దిక్ + గజము = దిగ్గజము

వాక్ + అనుశాసనుడు = వాగనుశాసనుడు

అచ్ + అంతము = అజంతము

రాట్ + గణము = రాడ్గణము

జగత్ + ఈశ్వర = జగదీశ్వర

చిత్ + రూపము = చిద్రూపము

కకుప్ + అంతము = కకుబంతము



పూర్వసవర్ణసంధి :

క చ ట త ప లకు హ కారము పరమైనపుడు ఘ ఝ ఢ ధ భ లు వైకల్పికముగా వచ్చును

ఉదా :

వాక్ + హరి = వాగ్ఘరి , వాగ్హరి ( జశ్త్వసంధి )

జగత్ + హితము = జగద్ధితము, జగద్హితము ( జశ్త్వసంధి )



శ్చుత్వసంధి :

స కార త వర్గములకు శ కార చ వర్గములతో యోగము ( కలయిక ) కలిగినపుడు శ కార చవర్గములు ఆదేశమగును.

ఉదా:

మనస్ + శాంతి = మనశ్శాంతి

తపస్ + శక్తి = తపశ్శక్తి

మనస్ + చలనము = మనశ్చలనము

సత్ + జనులు = సజ్జనులు

సత్ + చరిత్రుడు = సచ్చరిత్రుడు



ఛత్వసంధి :

క చ ట త ప లకు శ వర్ణము పరమగునపుడు ఛ కారము వికల్పముగా వచ్చును

ఉదా:

వాక్ + శరము = వాక్ఛరము , వాక్శరము

రాట్ + శాసనము = రాట్ఛాసనము , రాట్శాసనము

త్వక్ + శోభ = త్వక్ఛోభ , త్వక్శోభ

విద్యుత్ + శక్తి = విద్యుత్ + ఛక్తి ( ఛత్వసంధి )

విద్యుత్ + ఛక్తి = విద్యుచ్ఛక్తి ( శ్చుత్వసంధి )



ష్టుత్వసంధి :

స కార త వర్గములకు ష కార ట వర్గములతో యోగము కలిగినపుడు ష కార ట వర్గములు ఆదేశమగును

ఉదా:

చతుస్ + షష్టి = చతుష్షష్టి

ధనుస్ + టంకారము = ధనుష్టంకారము

తత్ + టీకా = తట్టీకా



పరసవర్ణసంధి ( లా దేశసంధి ) :

త కారమునకు ల కారము పరమగునపుడు ల కారము ఆదేశమగును



ఉదా :

సుహృత్ + లాభము = సుహృల్లాభము

తత్ + లయము = తల్లయము

విద్యుత్ + లత = విద్యుల్లత

సత్ + లాపము = సల్లాపము



అనునాసికసంధి :

క చ ట త ప లకు అనునాసికములు ( , , , , మ లు )లు పరమగునపుడు ఆ వర్గపు అనునాసికములు వికల్పికముగా వచ్చును.

ఉదా:

వాక్ + మయము = వాఙ్మయము

రాట్ + మయము = రాణ్మయము

జగత్ + మాత = జగన్మాత

చిత్ + మయము = చిన్మయము


తుగాగమసంధి :

పదాంతములో హ్రస్వాచ్చునకు ఛ కారము పరమయిన తుగామము నిత్యము గాను, దీర్ఘాచ్చునకు ఛ కారము పరమగునపుడు తుగామము వికల్పికముగాను వచ్చును.

ఆపై శ్చుత్వసంధి జరుగుతుంది.

ఉదా:

వృక్ష + ఛాయ = వృక్షత్ + ఛాయ ( తుగాగమ సంధి )

వృక్షత్ + ఛాయ = వృక్షచ్ఛాయ ( శ్చుత్వసంధి )

తరు + ఛాయ = తరుత్ + ఛాయ ( తుగాగమ సంధి )

తరుత్ + ఛాయ = తరుచ్ఛాయ ( శ్చుత్వసంధి )

లక్షీ + ఛాయ = లక్ష్మీచ్ఛాయ , లక్ష్మీఛాయ



విసర్గసంధులు :

1. విసర్గలకు క ఖ ప ఫ లు పరమగునపుడు విసర్గలకు లోపము రాదు.

ఉదా:

తపః + ఫలము = తపఃఫలము

మనః + కమలము = మనఃకమలము

అంతః + పురము = అంతఃపురము

తేజః + కీర్తి = తేజఃకర్తి


2. విసర్గలకు చ ఛ లు పరమగునపుడు శ కారము, ట ఠ లు పరమగునపుడు ష కారము, త థ లు పరమగునపుడు స కారము వచ్చును.

ఉదా:

తపః + చర్య = తపశ్చర్య

తపః + చరణ = తపశ్చరణ

ధనుః + టంకారము = ధనుష్టంకారము

మనః + తాపము + మనస్తాపము


3. విసర్గలకు స శ ష లు పరమగునపుడు స శ ష లు వచ్చును.

ఉదా :

మనః + సాక్షి = మనస్సాక్షి

తపః + సాధనము = తపస్సాధనము

మనః + శాంతి = మనశ్శాంతి

చతుః + షష్టి = చతుష్షష్టి


4. విసర్గాంత శబ్దములకు అచ్చులు, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములు, హయవరలు పరమగునపుడు రేఫము ఆదేశమగును.

ఉదా :

అంతః + ఆత్మ = అంతరాత్మ

చతుః + భుజుడు = చతుర్భుజుడు

చతుః + వేదములు = చతుర్వేదములు

ధనుః + విద్య = ధనుర్విద్య

ధనుః + బాణములు = ధనుర్బాణములు

పునః + దర్శనము = పునర్దర్శనము



హ్రస్వ అకారము మీద విసర్గకు వర్గ తృతీయ చతుర్థ, పంచమాక్షరములు, హయవరలు పరమగునపుడు ఓకారము ఆదేశముగా వచ్చును.

ఉదా:

తపః + వనము = తపోవనము

మనః + రథము = మనోరథము

శిరః + రత్నము = శిరోరత్నము

వచః + లావణ్యము = వచోలావణ్యము

మనోవేగము, తపోధనము, మనోనేత్రము మొదలగునవి ఇట్టి పదములే.


సకారాంతసంధులు :

1. సకారాంత పదములకు క ఖ ప ఫ లు పరమగునపుడు సకారమునకు విసర్గము వచ్చును.

మనస్ + కంజము = మనఃకంజము

తపస్ + ఫలము = తపఃఫలము

ఉరస్ + ఖేదము = ఉరఃఖేదము



2. సకారాంత పదములకు ట ఠ లు పరమగునపుడు విసర్గకు ష కారము వచ్చును.

ధనుస్ + టంకారము = ధనుష్టంకారము


3 సకారాంతపదములకు త థ లు పరమగునపుడు సకారమునకు మార్పు రాదు

మనస్ + తిమిరము = మనస్తిమిరము


4. సకారాంత పదములకు శ ష లు పరమగునపుడు శ ష లు గాని విసర్గ గాని వచ్చును

మనస్ + శాంతి = మనశ్శాంతి ; మనఃశాంతి

చతుస్ + షష్టి = చతుష్షష్టి; చతుఃషష్టి


5. అస్ అంతము గల పదములకు వర్గ ప్రథమ , ద్వితీయాక్షరాలు, శ ష స లు కాక మిగిలిన హల్లులు పరమగునపుడు ఓ కారము వచ్చును.

మనస్ + నేత్రము = మనోనేత్రము

తపస్ + ధనము = తపోధనము


6. అస్ అంతము గల పదములకు అకారము పరమగునపుడు ఆ రెంటికి ఓ కారము వచ్చును.

మనస్ + అబ్జము = మనోబ్జము

అప్సరస్ + అంగన = అప్సరోంగన

యశస్ + అబ్ధి = యశోబ్ధి


7. ఇస్, ఉస్ అంతము గల పదములకు క ఖ ప ఫ లు పరమగునపుడు షకారము వచ్చును.

నిస్ + కారణము = నిష్కారణము

నిస్ + ఫలము = నిష్ఫలము

చతుస్ + పదము = చతుష్పదము


8. కొన్ని సకారాంత పదములకు అచ్చులు, వర్గ తృతీయ చతుర్థ, పంచమాక్షరములు, హయవరలు పరమగునపుడు రేఫము ఆదేశమగును.

దుస్ + అంతము = దురంతము



అయ్ అవ్ ఆయ్ ఆవ్ ల ఆదేశసంధి :


ఏ ఓ ఐ ఔ లకు అచ్చులు పరమగునపుడు అయ్, అవ్, ఆయ్, ఆవ్ లు క్రమముగా ఆదేశమగును.

హరే + = హరయే

విష్ణో + = విష్ణవే

నై + అకః = నాయకః

పౌ+ అకః = పావకః


గో శబ్దములో ఓ కారమునకు అచ్చులు పరమగునపుడు అవ శబ్దము ఆదేశమగును.

గో + అధ్యక్షుడు = గవాధ్యక్షుడు

గో + అక్షము= గవాక్షము

గో + ఇంద్రుడు = గవేంద్రుడు