గుణ శోడశి

రచన : కంభంపాటి కృష్ణాదిత్య

1) గుణవాన్

ఎవరివీవు గుణోత్తమా! ఎన్నగరాదిల మాకు

ప్రవచింపగ నీ తత్త్వము, రామా వశమా నరులకు॥



సుందరమౌ నీ చరితము, రూపము, నామము రుచి గొని!

కొందరు రమణీయ సాధుగుణ సీమవు అందురు॥



వేదాదులు స్తుతియించెడి ఆది బ్రహ్మముగ ఎంచి

కొందరు నిను నిరాకార నిర్గుణునిగ తలతురు॥



ఇందరు వీరుల మదులకు సందేహము కలిగించెడి

ఇందీవర శ్యామ నిన్ను ఏమని నే వర్ణింతును॥



2) వీర్యవాన్

నవ నీరద శ్యామ వర్ణమున మెరిసెడి శ్రీరామా

భవదాహవ పాండిత్యము సదా మమ్ము కాచు గాత!



మౌని వరులు కాపాడగ దానవులను ఖండించి!

దీనజనావనమునందు ధీరత్వము చూపినట్టి ॥ ॥



దశ చెడిన సురల గావ దశకంఠుని దునిమాడి!

దశదిశలకు క్షేమమ్మను భావమ్మును స్థిరపరచిన ॥॥



సకల లోక జాలమ్ముకు ప్రభువై భయమును బాపగ

శ్రీ కోదండము కరమున సతతము దీక్షగ దాల్చెడి



3) ధర్మజ్ఞ

శ్రీరాముని ధర్మ బలము, జగముననుపమానము

ధారుణి నరులకునదియె, నిరతము సంపూజ్యము॥



వంశ కీర్తి ప్రకాశింప, రాజ్యపు సింహాసనమును

తోసిరాజని తాను తరలిపోవ కాననముకు॥



సీమను పాలింపమనిన, భ్రాతృని అభ్యర్థనను!

ధీమతియై తిరస్కరింప, పితృ వాక్యపాలనకై॥



సతిని వెతుకు క్రమమ్మున, వికర్షణకు లోనుగాక

సత్కపియౌ సుగ్రీవుని, స్నేహము నభిలాషించిన॥



అరియైనను పదముల పడి శరణాగతి కోరినపుడు

పరుడను భావమును వీడి, వానికాశ్రయమునిడిన॥



4) కృతజ్ఞః

రాణ కెక్కిన జగమున రామచంద్రు చరితము

అణువణువున తాను కృతజ్ఞత చూపిన వైనము॥



సాదర స్వాగతమిడి, స్నేహ భావమాధురిచే

హృదయమునకు శాంతమిడిన ప్రియ గుహుడిని హత్తుకొనగ॥



తన సతికై పోరు సలిపి, వీరునిగా ప్రాణమొదిలి

అనర్హ త్యాగము చూపిన, అండజునికి శ్రార్ధమిడగ॥



తన తరపున రాజ్యమేలి, వినయమ్మును ప్రకటించిన

ఉన్నతుడౌ భరతుశ్రేష్ఠునెన్ని అక్కున జేర్చగ॥



జానకి జాడను తెలిపి, తన జీవము నిలిపినట్టి

హనుమ బుద్ధి కుశలతకు, హర్షాలింగన మివ్వగ॥



5) సత్య వాక్యః



రామ విభుని సత్యనిష్ఠ, తన నడతకు పరాకాష్ఠ!

స్వామి చరితమరయగాను, కానరావు ఏ దొసగులు ॥



తండ్రి మాటపాలింపగ, తన స్వార్థము చూసుకొనక!

తమ్మునికై రాజ్య సుఖము త్యాగమునొనరించినట్టి॥



కపి స్నేహము నిలుపుకొనగ, కటువగు బాణమునెత్తి

పాపియైన వాలినెంతో అవలీలగ వధియించిన॥



ఏ యుగమైనను ఏమి? నయముగ శరణాగతులకు!

భయము దీర్చి బ్రోచెదనని నేయమ్మగు మాటిచ్చిన॥



ప్రజలమాటలాలించి, పరమ భేదమొందినపుడు

భూజాతను త్యజించుటే కర్తవ్యమనెంచినట్టి॥



6) దృఢవ్రతః

దృఢవ్రతుడౌ రాఘవుండు దయనే వర్షించునపుడు

ఈడేరును మన జీవనమింపుగొలుపు రీతియందు॥



మౌనుల శోకము తీర్చగ, దానవకుల మర్దనకై!

కాననంబుల చరించి, కాని తోవలను తొక్కిన॥



తమ్ముని ప్రేమకు లోబడి తిరిగి రాజ్యముకు వెడలక

తమ పితృని వచనముకు తగు ప్రాధాన్యతనిచ్చిన॥



జలధి బంధనము సేయగ, జలనిధి తాఁ చలము సేయ

అలుకబూని సాగరునికి తగు పాఠము నేర్పించిన॥



తన ప్రజలను తనయులవలె, అధికముగా ప్రేమించుచు

వాని బాగు తన బాగుగ పాలనమును సాగించిన॥



7) చారిత్రః

మచ్చనెరుగనట్టి మంజు చారిత్రుడు దాశరథి

సచ్చీలమునకు సొబగును దిద్దునా దయా శరథి॥



దివిజుల మొరలాలించి భువికి దిగగ సుధామయుడు

ప్రవహించెను వారి ఎదల ఆనందపు నిర్హరులు

సవనము జరిపిన రాజుకు దివ్యఫలముగా జనించి

సవరించెను మది వీణను అనురాగపు రాగముచే॥



జన్నము కాపాడుటకు అర్జించిన మహామునికి

తను ఛాత్రురూపమున సమర్పించుకున్నాడు.

చెన్ను మీరు శివధనువును చేతబట్టి లీల కూల్చి

అన్నులమిన్నగు సీతకు నోములపంటైనాడు॥



అవలీలగ రాజపదవి తండ్రికొఱకు త్యజియించి

భువనమ్ముల ప్రతిలేనిది సత్యమ్మని చాటాడు

తవ దాసోహమన్న మునుల ప్రార్థననాలించాడు.

ఆవహమును సలిపి రిపుల ప్రాణాలాహరించాడు.



8) భూత హితః

భూతదయాభరణముగా వరలు సరస సుందరుడు

ఆతతమాదిత్యనుతులు గొను రఘుకుల సోముడు॥



కీశకులేశ్వరుడినతడు కపినాథునిగా చేసెను

ఆశుగ సంభవునికి తాఁ భావి బ్రహ్మపదవొసగెను

పాషణమ్మొకదానిని పావన సుదతిగ మలచెను

ఆశవదులుకొ న్నేకాక్షికి శరణమునిచ్చేను॥



నడయాడిన వనమునకు జీవకళలలను అద్దెను

అడగకున్ననొక లేడికి ఆత్మోన్నతినిచ్చేను

కడు దయచే గృధ్రమునకు సంస్కారములొనర్చెను

తడిమి ఉడతనొకదానిని ప్రేమను ప్రకటించెను॥



9) విద్వాన్

జ్ఞాన మణిగ వెలుగొందే విద్వదార్యుడీ రాముడు

వేనవేల భక్తులకు ముక్తి గురువాయెనతడు॥



తల్లి కొఱకు ఆత్మబోధ చేసి ప్రశాంతము కూర్చి

కల్లయుగానీక మాట కర్తవ్యము నెరపెను॥



తమ్మునికై తగు రీతిన క్రియా యోగ విధానమును

నెమ్మనమున నాటుకొనెడి విధమున బోధించేను॥



పతిని బాసి దుఃఖముతో ప్రణమిల్లిన తారకు

వెత తొలగగ మూలతత్త్వ వివేచనము జరిపెను॥



తనను చూడ ఆత్రముతో తపియించిన శబరమ్మను

అనునయించి నవవిధమగుభక్తి సాధనలు తెలిపేను.



10) సమర్థః

నీవంటి సామర్థ్యము భువినెవరిది రామయ్య

నావంటి అసమర్థుని బాగుచేయ పూనుటకు॥



గ్రావమునొక మునికాంతగ ఆనాడే మలచావు

అవలీలగ అలవికాని శివధనువును వంచావు॥



వేల రక్కసులను ముహుర్త కాలములో చంపావు

రాలను నీ మహిమ చేత నీటిపైన తేల్చావు॥



చంచలమగు వానరముకు బ్రహ్మ పదవినొసగావు

అచ్చెరమున అరి తమ్ముకు మహాభక్తినిచ్చావు॥



11) ప్రియ దర్శనః

కనకన రుచియని త్యాగయ పొగిడిన

ఘన సుందరుని నే కాంచితి నేడు

అనఘుడైన రఘురాముని అందము

అనుపమానమౌ అద్భుత విషయము॥



సుదతి సీత వామాంకమునమరగ

సుధామతులైన తమ్ములు కొలువగ

పద పంకజములు ప్రేమతో పట్టుచు

చిదానందమును మారుతి పొందగ॥॥



మునుల సంఘములు పరివేష్టించి

అనయముపనిషద్బోధలు పొందుచు |

అనురాగముచే ఆదిత్యనుతున్ని

అనర్ఘ యశమును గానము చేయగ॥॥



12) ఆత్మవాన్

ధర ధర్మము తప్పనపుడు ఏరికి తలగుట వలదని

ఎరిగించిన ఆత్మవంతుడా రఘుకుల తిలకుడు॥



నిండు సభన నీలకంఠచాపమెదుట నిలబడి

మెండుగు ధైర్యము తోడుత విల్లును తాఁ వ్రేల్చాడు.

చండ భాస్కరుడై అగ్ని జ్వాలలెగజిమ్ముచు

అడ్డుపడిన భార్గవుడిని ఆదరమున గెలిచాడు॥



ధీయుతులౌ మునులప్రేమ మిక్కిలిగా తాను పొంది

భయముగొల్పు దానవులను అవలీలగ చెందాడు.

గుణ శోడశి

రచన : కంభంపాటి కృష్ణాదిత్య

1) గుణవాన్

ఎవరివీవు గుణోత్తమా! ఎన్నగరాదిల మాకు

ప్రవచింపగ నీ తత్త్వము, రామా వశమా నరులకు॥



సుందరమౌ నీ చరితము, రూపము, నామము రుచి గొని!

కొందరు రమణీయ సాధుగుణ సీమవు అందురు॥



వేదాదులు స్తుతియించెడి ఆది బ్రహ్మముగ ఎంచి

కొందరు నిను నిరాకార నిర్గుణునిగ తలతురు॥



ఇందరు వీరుల మదులకు సందేహము కలిగించెడి

ఇందీవర శ్యామ నిన్ను ఏమని నే వర్ణింతును॥



2) వీర్యవాన్

నవ నీరద శ్యామ వర్ణమున మెరిసెడి శ్రీరామా

భవదాహవ పాండిత్యము సదా మమ్ము కాచు గాత!



మౌని వరులు కాపాడగ దానవులను ఖండించి!

దీనజనావనమునందు ధీరత్వము చూపినట్టి ॥ ॥



దశ చెడిన సురల గావ దశకంఠుని దునిమాడి!

దశదిశలకు క్షేమమ్మను భావమ్మును స్థిరపరచిన ॥॥



సకల లోక జాలమ్ముకు ప్రభువై భయమును బాపగ

శ్రీ కోదండము కరమున సతతము దీక్షగ దాల్చెడి



3) ధర్మజ్ఞ

శ్రీరాముని ధర్మ బలము, జగముననుపమానము

ధారుణి నరులకునదియె, నిరతము సంపూజ్యము॥



వంశ కీర్తి ప్రకాశింప, రాజ్యపు సింహాసనమును

తోసిరాజని తాను తరలిపోవ కాననముకు॥



సీమను పాలింపమనిన, భ్రాతృని అభ్యర్థనను!

ధీమతియై తిరస్కరింప, పితృ వాక్యపాలనకై॥



సతిని వెతుకు క్రమమ్మున, వికర్షణకు లోనుగాక

సత్కపియౌ సుగ్రీవుని, స్నేహము నభిలాషించిన॥



అరియైనను పదముల పడి శరణాగతి కోరినపుడు

పరుడను భావమును వీడి, వానికాశ్రయమునిడిన॥



4) కృతజ్ఞః

రాణ కెక్కిన జగమున రామచంద్రు చరితము

అణువణువున తాను కృతజ్ఞత చూపిన వైనము॥



సాదర స్వాగతమిడి, స్నేహ భావమాధురిచే

హృదయమునకు శాంతమిడిన ప్రియ గుహుడిని హత్తుకొనగ॥



తన సతికై పోరు సలిపి, వీరునిగా ప్రాణమొదిలి

అనర్హ త్యాగము చూపిన, అండజునికి శ్రార్ధమిడగ॥



తన తరపున రాజ్యమేలి, వినయమ్మును ప్రకటించిన

ఉన్నతుడౌ భరతుశ్రేష్ఠునెన్ని అక్కున జేర్చగ॥



జానకి జాడను తెలిపి, తన జీవము నిలిపినట్టి

హనుమ బుద్ధి కుశలతకు, హర్షాలింగన మివ్వగ॥



5) సత్య వాక్యః



రామ విభుని సత్యనిష్ఠ, తన నడతకు పరాకాష్ఠ!

స్వామి చరితమరయగాను, కానరావు ఏ దొసగులు ॥



తండ్రి మాటపాలింపగ, తన స్వార్థము చూసుకొనక!

తమ్మునికై రాజ్య సుఖము త్యాగమునొనరించినట్టి॥



కపి స్నేహము నిలుపుకొనగ, కటువగు బాణమునెత్తి

పాపియైన వాలినెంతో అవలీలగ వధియించిన॥



ఏ యుగమైనను ఏమి? నయముగ శరణాగతులకు!

భయము దీర్చి బ్రోచెదనని నేయమ్మగు మాటిచ్చిన॥



ప్రజలమాటలాలించి, పరమ భేదమొందినపుడు

భూజాతను త్యజించుటే కర్తవ్యమనెంచినట్టి॥



6) దృఢవ్రతః

దృఢవ్రతుడౌ రాఘవుండు దయనే వర్షించునపుడు

ఈడేరును మన జీవనమింపుగొలుపు రీతియందు॥



మౌనుల శోకము తీర్చగ, దానవకుల మర్దనకై!

కాననంబుల చరించి, కాని తోవలను తొక్కిన॥



తమ్ముని ప్రేమకు లోబడి తిరిగి రాజ్యముకు వెడలక

తమ పితృని వచనముకు తగు ప్రాధాన్యతనిచ్చిన॥



జలధి బంధనము సేయగ, జలనిధి తాఁ చలము సేయ

అలుకబూని సాగరునికి తగు పాఠము నేర్పించిన॥



తన ప్రజలను తనయులవలె, అధికముగా ప్రేమించుచు

వాని బాగు తన బాగుగ పాలనమును సాగించిన॥



7) చారిత్రః

మచ్చనెరుగనట్టి మంజు చారిత్రుడు దాశరథి

సచ్చీలమునకు సొబగును దిద్దునా దయా శరథి॥



దివిజుల మొరలాలించి భువికి దిగగ సుధామయుడు

ప్రవహించెను వారి ఎదల ఆనందపు నిర్హరులు

సవనము జరిపిన రాజుకు దివ్యఫలముగా జనించి

సవరించెను మది వీణను అనురాగపు రాగముచే॥



జన్నము కాపాడుటకు అర్జించిన మహామునికి

తను ఛాత్రురూపమున సమర్పించుకున్నాడు.

చెన్ను మీరు శివధనువును చేతబట్టి లీల కూల్చి

అన్నులమిన్నగు సీతకు నోములపంటైనాడు॥



అవలీలగ రాజపదవి తండ్రికొఱకు త్యజియించి

భువనమ్ముల ప్రతిలేనిది సత్యమ్మని చాటాడు

తవ దాసోహమన్న మునుల ప్రార్థననాలించాడు.

ఆవహమును సలిపి రిపుల ప్రాణాలాహరించాడు.



8) భూత హితః

భూతదయాభరణముగా వరలు సరస సుందరుడు

ఆతతమాదిత్యనుతులు గొను రఘుకుల సోముడు॥



కీశకులేశ్వరుడినతడు కపినాథునిగా చేసెను

ఆశుగ సంభవునికి తాఁ భావి బ్రహ్మపదవొసగెను

పాషణమ్మొకదానిని పావన సుదతిగ మలచెను

ఆశవదులుకొ న్నేకాక్షికి శరణమునిచ్చేను॥



నడయాడిన వనమునకు జీవకళలలను అద్దెను

అడగకున్ననొక లేడికి ఆత్మోన్నతినిచ్చేను

కడు దయచే గృధ్రమునకు సంస్కారములొనర్చెను

తడిమి ఉడతనొకదానిని ప్రేమను ప్రకటించెను॥



9) విద్వాన్

జ్ఞాన మణిగ వెలుగొందే విద్వదార్యుడీ రాముడు

వేనవేల భక్తులకు ముక్తి గురువాయెనతడు॥



తల్లి కొఱకు ఆత్మబోధ చేసి ప్రశాంతము కూర్చి

కల్లయుగానీక మాట కర్తవ్యము నెరపెను॥



తమ్మునికై తగు రీతిన క్రియా యోగ విధానమును

నెమ్మనమున నాటుకొనెడి విధమున బోధించేను॥



పతిని బాసి దుఃఖముతో ప్రణమిల్లిన తారకు

వెత తొలగగ మూలతత్త్వ వివేచనము జరిపెను॥



తనను చూడ ఆత్రముతో తపియించిన శబరమ్మను

అనునయించి నవవిధమగుభక్తి సాధనలు తెలిపేను.



10) సమర్థః

నీవంటి సామర్థ్యము భువినెవరిది రామయ్య

నావంటి అసమర్థుని బాగుచేయ పూనుటకు॥



గ్రావమునొక మునికాంతగ ఆనాడే మలచావు

అవలీలగ అలవికాని శివధనువును వంచావు॥



వేల రక్కసులను ముహుర్త కాలములో చంపావు

రాలను నీ మహిమ చేత నీటిపైన తేల్చావు॥



చంచలమగు వానరముకు బ్రహ్మ పదవినొసగావు

అచ్చెరమున అరి తమ్ముకు మహాభక్తినిచ్చావు॥



11) ప్రియ దర్శనః

కనకన రుచియని త్యాగయ పొగిడిన

ఘన సుందరుని నే కాంచితి నేడు

అనఘుడైన రఘురాముని అందము

అనుపమానమౌ అద్భుత విషయము॥



సుదతి సీత వామాంకమునమరగ

సుధామతులైన తమ్ములు కొలువగ

పద పంకజములు ప్రేమతో పట్టుచు

చిదానందమును మారుతి పొందగ॥॥



మునుల సంఘములు పరివేష్టించి

అనయముపనిషద్బోధలు పొందుచు |

అనురాగముచే ఆదిత్యనుతున్ని

అనర్ఘ యశమును గానము చేయగ॥॥



12) ఆత్మవాన్

ధర ధర్మము తప్పనపుడు ఏరికి తలగుట వలదని

ఎరిగించిన ఆత్మవంతుడా రఘుకుల తిలకుడు॥



నిండు సభన నీలకంఠచాపమెదుట నిలబడి

మెండుగు ధైర్యము తోడుత విల్లును తాఁ వ్రేల్చాడు.

చండ భాస్కరుడై అగ్ని జ్వాలలెగజిమ్ముచు

అడ్డుపడిన భార్గవుడిని ఆదరమున గెలిచాడు॥



ధీయుతులౌ మునులప్రేమ మిక్కిలిగా తాను పొంది

భయముగొల్పు దానవులను అవలీలగ చెందాడు.

మాయలు పెక్కుగ పన్ని జాయను గొనిపోయినట్టి

హేయుడైన రక్కసిని రంగము నెదిరించాడు.



13) జితక్రోధః

తన కోపమె తన శత్రువుయన్న నుడిని పాటించుచు

అనువుగ వర్తిల్లె రామూడమిత బుద్ధి కౌశలమున॥



పతినే నిర్బంధించి సత్యపాశముల తోడ

కుతంత్రమున తన కొమరుని రాజు సేయ బూనినట్టి

ఘాతుకమౌ చర్యకును పాలుపడిన కైక దరిన

మాతయనెడి ఆదరమున శాంతభావమును చూపెను॥



చిత్రకూట నివాసమున రాముని సేవకునిగనున్న

భ్రాతృడైన లక్ష్మణుండు కైకపుత్రుడాశ్రయింప

శతృభావమును వహించి బంధమ్మును విస్మరింప

ఆతృత విడమని చెప్పి భరతుని నిజస్థితి తెలిపెను॥



రక్కసుడను పంతంబున సీతను అరీడపహరించి.

టక్కులెన్నో ప్రయోగించి దురమున గెలువగ చూచి

మిక్కుటమౌ మదముతోడ పోరి చచ్చినట్టి పిదప

ఎక్కుడైన గౌరవమును సోదరునిగ ఒసగినాడు.



14) ద్యుతిమాన్

వెలుగులు చిమ్మెడి వేద స్వరూపుడు

కలుగగ జేయును సుఖశాంతులను

తలుపగా తనదు మంగళాకృతిని

తెలియని పరవశమేదో చుట్టు మదిని॥



భాసమానమౌ భానుని తేజము

దాసిలి చేయును తనకు ఊడిగము

నీ సమానమెవరని చంద్ర ద్యుతులు

న్యాసమొంది రామునిలో చేరెను॥



జ్వలించుచుండె హుతాశనుండు

లలితమౌ రామ వర్చస్సునకు

తలొంచెను సకల భువన జాలములు

తలచి మదిలోన స్వామి విభవమును॥



15) అనసూయకః

సాటెవరూ లేని రాముకసూయనునదుండునా?

తోటి వారి ఎడల భూరి దయాభావమే గానీ!!



అకళంకపు సత్య ప్రభల అనవరతము వెలుగుటందు

సకల భూతజాలము కడ సరస కరుణ చూపుటందు॥



యోచనచే సర్వ కార్య సాఫల్యమునొందుటందు

ప్రాచీనపు పల్కులనియె ప్రాణముగా నడచుటందు॥



సమరరంగ మధ్యమందు భుజశౌర్యము చాటుటందు

విమల రూప సౌందర్యపు కాంతుల జిగిమించుటందు॥



16) బిభ్యతి దేవాః జాత రోషస్య సంయుగే

దేవతలను వణికించెడి వర విక్రమము

పావన రాముని విభవము జగమునతులము॥



కూకటి ప్రాయమునాడే కూసింతైనా జంకక

కాకలు తీరిన అసురులు కూలజేసి నిలచెను

కాకి పైన గడ్డిపరక బుద్ది తెలుప సంధింపగ

ఏకాక్షిని ఆదుకొనగ జగములన్ని జంకెను॥



హెచ్చరికగ ధనువు మీటి కన్నులెర్రజేయగా

మచ్చరమును విడి జలధి మచ్చికతానాయెను

అచ్చంగా ఆటవోలె ఇంపును గోల్పోకుండా

వచ్చిన వేలాది దనుజులాటలుకట్టించెను॥



17) జై శ్రీరామ

ఇతి శ్రీరాముల వారి షోడశ గుణావళి!

కలిత గుణ షోడశి సుసంపూర్ణం!

- కంభంపాటి కృష్ణాదిత్య॥




మాయలు పెక్కుగ పన్ని జాయను గొనిపోయినట్టి

హేయుడైన రక్కసిని రంగము నెదిరించాడు.



13) జితక్రోధః

తన కోపమె తన శత్రువుయన్న నుడిని పాటించుచు

అనువుగ వర్తిల్లె రామూడమిత బుద్ధి కౌశలమున॥



పతినే నిర్బంధించి సత్యపాశముల తోడ

కుతంత్రమున తన కొమరుని రాజు సేయ బూనినట్టి

ఘాతుకమౌ చర్యకును పాలుపడిన కైక దరిన

మాతయనెడి ఆదరమున శాంతభావమును చూపెను॥



చిత్రకూట నివాసమున రాముని సేవకునిగనున్న

భ్రాతృడైన లక్ష్మణుండు కైకపుత్రుడాశ్రయింప

శతృభావమును వహించి బంధమ్మును విస్మరింప

ఆతృత విడమని చెప్పి భరతుని నిజస్థితి తెలిపెను॥



రక్కసుడను పంతంబున సీతను అరీడపహరించి.

టక్కులెన్నో ప్రయోగించి దురమున గెలువగ చూచి

మిక్కుటమౌ మదముతోడ పోరి చచ్చినట్టి పిదప

ఎక్కుడైన గౌరవమును సోదరునిగ ఒసగినాడు.



14) ద్యుతిమాన్

వెలుగులు చిమ్మెడి వేద స్వరూపుడు

కలుగగ జేయును సుఖశాంతులను

తలుపగా తనదు మంగళాకృతిని

తెలియని పరవశమేదో చుట్టు మదిని॥



భాసమానమౌ భానుని తేజము

దాసిలి చేయును తనకు ఊడిగము

నీ సమానమెవరని చంద్ర ద్యుతులు

న్యాసమొంది రామునిలో చేరెను॥



జ్వలించుచుండె హుతాశనుండు

లలితమౌ రామ వర్చస్సునకు

తలొంచెను సకల భువన జాలములు

తలచి మదిలోన స్వామి విభవమును॥



15) అనసూయకః

సాటెవరూ లేని రాముకసూయనునదుండునా?

తోటి వారి ఎడల భూరి దయాభావమే గానీ!!



అకళంకపు సత్య ప్రభల అనవరతము వెలుగుటందు

సకల భూతజాలము కడ సరస కరుణ చూపుటందు॥



యోచనచే సర్వ కార్య సాఫల్యమునొందుటందు

ప్రాచీనపు పల్కులనియె ప్రాణముగా నడచుటందు॥



సమరరంగ మధ్యమందు భుజశౌర్యము చాటుటందు

విమల రూప సౌందర్యపు కాంతుల జిగిమించుటందు॥



16) బిభ్యతి దేవాః జాత రోషస్య సంయుగే

దేవతలను వణికించెడి వర విక్రమము

పావన రాముని విభవము జగమునతులము॥



కూకటి ప్రాయమునాడే కూసింతైనా జంకక

కాకలు తీరిన అసురులు కూలజేసి నిలచెను

కాకి పైన గడ్డిపరక బుద్ది తెలుప సంధింపగ

ఏకాక్షిని ఆదుకొనగ జగములన్ని జంకెను॥



హెచ్చరికగ ధనువు మీటి కన్నులెర్రజేయగా

మచ్చరమును విడి జలధి మచ్చికతానాయెను

అచ్చంగా ఆటవోలె ఇంపును గోల్పోకుండా

వచ్చిన వేలాది దనుజులాటలుకట్టించెను॥



17) జై శ్రీరామ

ఇతి శ్రీరాముల వారి షోడశ గుణావళి!

కలిత గుణ షోడశి సుసంపూర్ణం!

- కంభంపాటి కృష్ణాదిత్య॥