రోమపాద ఋశ్యశృంగుల కథ

రోమపాద ఋశ్యశృంగుల కథ

రోమపాదునకు చిత్రరథుడు, లోమపాదుడు అను పేర్లతో కూడ కలవు.

“యయాతి వంశస్థుడైన “శిబి”కి పుత్రులు నలుగురు వృషదర్ప, సువీర, మద్ర, కేకయులు. అందు “సువీరున”కు “సత్యరథుడు”; సత్యరథునకు “దివిరథుడు”; దివిరథునికి “ధర్మరథుడు”, ధర్మరథునికి “రోమపాదుడు” కలుగుతారు. (పోతన తెలుగు భాగవతం 9-683-వ.)

ధర్మరధునికి మిత్రుడు యాదవరాజైన “విదర్భుడు తన కనిష్ఠపుత్రుడైన “చిత్రరథుని ధర్మరథునికి దత్తత ఇచ్చాడు. ఈ ధర్మరథుని పుత్రుడు చిత్రరథుడు “రోమపాదుడు అని ప్రసిద్ధుడు అయ్యాడు. ఈయనకు “లోమపాదుడు అను పేరు కూడ కలదు. ధర్మపాదుని పిమ్మట “అంగ రాజ్యాన్ని రోమపాదుడు చేపట్టాడు. రోమపాదునికి భార్య కోసల రాజ్యరాకుమారి “వర్షిణి. వర్షిణికి చెల్లెలు “శ్రీరాముని తల్లి, దశరథుని భార్య “కౌసల్యాదేవి. అయోధ్యాధిపతి అయిన ఈ “దశరథుడు రోమపాదుడు బాల్యస్నేహితులు. రోమపాదునకు పిల్లలు కలుగక పోవుటచేత, దశరథుడు తన మొదటి సంతానాన్ని దత్తతగా ఇస్తాను అన్నాడు. ఆ ప్రకారం దశరథుడు తనకు కౌసల్య యందు పుట్టిన పుత్రిక “శాంతను రోమపాదునకు దత్తత ఇచ్చాడు. రోమపాదుని వద్దకు ఒకమారు “శుభతీర్థుడు అను బ్రాహ్మణుడు దానం కావాలని వచ్చాడు. రాజు సాయంకాలం మరల రమ్మన్నాడు. ఆ ప్రకారం వచ్చిన ఆ బ్రాహ్మణుని, తన కూతురు శాంతాదేవితో మాట్లాడుకుంటూ, పట్టించుకోలేదు. ఆ బ్రాహ్మణుడు అసంతృప్తితో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దీనితో దేవేంద్రునికి కోపం వచ్చింది. అంగరాజ్యంలో భీకరమైన కరువు పట్టి ఏళ్ళ తరబడి విడుచుట లేదు. అంత రోమపాదునికి విజ్ఞులైన విప్రుల ఋశ్యశృంగ మహర్షిని తన రాజ్యానికి తీసుకు వస్తే ఇబ్బందులు తీరతాయని చెప్పారు. ఆ ఉపాయం మేరకు రోమపాదుడు వేశ్యలను ఋశ్యశృంగుని ఆకర్షించి తీసుకురమ్మని చెప్తాడు. వారిలో “వైశాలి అనునామె పని సాధిస్తుంది. అలా “ఋశ్యశృంగుని అంగరాజ్యానికి తీసుకువస్తారు. వర్షాలు పడి రాజ్యం సుభిక్షం అవుతుంది. (en.wikipedia)

“కశ్యపుని పుత్రుడు “విభాడక మహర్షి, ఒకదినమున సంధ్యావందనము చేసుకుంటుంటే ఆకాశమార్గాన పోతున్న అప్సరస “ఊర్వశి కనబడింది. వివశుడైన విభాండక మహర్షి తన వీర్యాన్ని సరోవరంలో విడుస్తారు. ఆ వీర్యాన్ని త్రాగిన జింక గర్భం ధరించి, కొమ్ముగల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కనుక ఆ బాలునికి విభాండక మహర్షి ఋశ్యశృంగుడు అని పేరు పెట్టి పెంచుతాడు. తండ్రి వద్ద సకల వేద విద్యలు నేర్చిన ఋశ్యశృంగుడు బహు నిష్ఠగా పెరుగుతాడు. ఆయనకు ఉపనయనం అయింది “ప్రతిత్వము అను “బ్రహ్మచారిగా బహు నిష్ఠగా ఉంటాడు. ఋష్యశృంగుడు ఆశ్రమం దాటి ఎప్పుడూ వెళ్ళలేదు. ఆయనకు తండ్రి, మునులు, ఆ వనంలో చరించే వారు తప్ప ఇతరులు ఎవరూ తెలియదు. నాగరిక స్త్రీలను ఎప్పుడూ చూడలేదు, స్త్రీ పురుష సంబంధ విషయాలు తెలియవు. (te.wikipedia)

రోమపాదుడు తన రాజ్యానికి తీసుకువచ్చిన ఋశ్యశృంగునికి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేసి తన వద్దే ఉంచుకుంటాడు. దశరథ మహారాజుకు పుత్రులు కలుగక పోవుటచే అశ్వమేధ యాగం చేసి పుత్రులను పొందాలని అనుకుంటాడు. దీని నిర్వాహణకు ఋశ్యశృంగుని ఎంచుకున్నాడు. ఋశ్యశృంగుడు తను కన్నకూతురు శాంతకు భర్తగా అల్లుడే అయినను, అంగ రాజ్యానికి తన మిత్రుడు రోమపాదుని వద్దకు వెళ్ళి, ఆయన ద్వారా ఋశ్యశృంగుని ఒప్పించి అయోధ్యకు తీసుకు వస్తాడు. ఆ అశ్వమేధ యాగం పిమ్మట శ్రీరామాదులు జన్మించారు. దశరథునికి కోసల దేశ రాకుమారి కౌసల్యా దేవి యందు శ్రీరాముడు; శిబి పుత్రుడు కేకయుడు స్తాపించిన కేకయ దేశ రాకుమారి కైక యందు భరతుడు, లక్ష్మణుడు; కాశీరాజ్యపు రాకుమారి యందు సుమిత్ర శత్రుఘ్నుడు; అని నలుగురు కొడుకులు కలిగారు. (వాల్మీకి తెలుగు రామాయణం) .