యాగములు

యాగములు / హోమములు / యజ్ఞములు

యజ్ఞము : దేవతాప్రీతిగా చేయు అగ్నిహోత్ర కార్యము. ఇది ఇరువదియొక్క విధము. అవి సప్త పాకయజ్ఞములు, సప్త హర్యజ్ఞములు, సప్త సోమసంస్థలు అనఁబడును. అందు స్మార్తాగ్నియందు చేయఁబడు యజ్ఞములు పాక యజ్ఞములు. స్మార్తాగ్నియు, ఔపాసనాగ్ని హవిర్యజ్ఞములును, సోమ సంస్థలురెండును శ్రౌతాగ్నియందు చేయఁబడునవి. సోమరహితములు అయినవి హవిర్యజ్ఞములు. ఈయజ్ఞములు నిత్యములు. అనఁగా అకరణప్రత్యవాయ జనకములు. ఇదికాక అశ్వమేధము, రాజసూయము, పౌండరీకము, బృహస్పతిసవము మొదలయిన అభ్యుదయక యజ్ఞములు అనేకములు కలవు. యజ్ఞవిధాన వివరణము ఆపస్తంబసూత్రమునందు చెప్పఁబడి ఉండును. మఱియు బ్రాహ్మణుఁడు నియతముగా చేయవలసిన యజ్ఞములు అయిదు కలవు. వానిని పంచమహాయజ్ఞములు అని చెప్పుదురు. అవి దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అనఁబడును. దేవయజ్ఞము అనఁగా ఔపాసనము. ఇందు సూర్యాగ్నులు అర్చింపఁబడుదురు. పితృయజ్ఞము అనఁగా శ్రాద్ధతర్పణములు. ఇందు పితృదేవతలు అర్చితులు అగుదురు. పితరులు వసురుద్రాదిత్యరూపులుగ ఉందురు కావున దాని వలన పితృదేవతలకును, దేవతలకును ప్రీతి అగును. భూతయజ్ఞము బలిరూపముగ ఉండును. మనుష్య యజ్ఞము అన ఎవ్వరికైనను భోజనము పెట్టుట. బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనము. ఒక్క ఋక్కు అయినను బ్రాహ్మణుఁడు ప్రతిదినము పఠింపవలయును.


1. జ్యోతిష్టోమ యాగము - – 1. స్వర్గ కాముడు చేయవలసిన ఒక యజ్ఞము, 2. సోమయాగము. వ్యు. జ్యోతీస్ = త్రివృదాదయః - స్తోమాః అస్య - జ్యోతిస్ + స్తోమ – షత్వమ్ బ.వ్రీ., విశే. జ్యోతిస్సులనగా సామవేదము నందలి స్తోత్రరూపములైన సామలు. అట్టి స్తోత్రములు విశేషముగా కలది కావున ఈ యజ్ఞమును జ్యోతిష్టోమము అని పేరు, ఆంధ్రశబ్దరత్నాకరము., ఇది 16 ఋత్విక్కులు వుండు యజ్ఞము.

2. ఆయుష్ హోమము - ఆయుషీ - ఆయుర్వృద్ధి కరమగు హోమకార్యము, ఆంధ్రశబ్దరత్నాకరము.

3. అతిరాత్ర యాగము – అతిరాత్రి అంటే అర్ధరాత్రి, జ్యోతిష్టోమము నందలి ఒక యాగము

4. అభిజిత్ యాగము – సోమయాగ విశేషము.

5. విశ్వజిత్ యాగము; – సమస్త సంపదలను దక్షిణగా ఇచ్చే ఒక యాగం. (ఈ యాగానికి ఫలం స్వర్గం)

6. ఆప్తోర్యామ - {ఆప్తోర్యామి - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు};

7. అశ్వమేధయాగము - అశ్వము - గుఱ్ఱము, మేధ - యజ్ఞము. అశ్వమును మేధృ పశువుగా ఏర్పరఛి సార్వభౌముడు చేయు యజ్ఞము. విశే. అశ్వమేధయాగములు నూరు కావించినవాడు ఇంద్రపదవి పొందునని శాస్త్రము. వ్యు. మేధృ : హింసాయామ్ – అశ్వ + మేధ్ + ఘఞ, కృ.ప్ర., ఇందు అశ్వము పశువుగా బలివ్వబడును, ఆంధ్రశబ్దరత్నాకరము

8. ఉక్థ్యము – సోమయాగ విశేషము.