InternationYouthDay11Aug2023@GDC@BHELhyderabad
అంతర్జాతీయ యువజన దినోత్సవం తేదీ: 11 - 08 - 2023
అంతర్జాతీయ యువజన దినోత్సవం తేదీ: 11 - 08 - 2023
24వ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని BHEL టౌన్ షిప్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలనందు అంతర్జాతీయ యువజన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య K. చంద్ర శేఖరయ్య (JNTU) విచ్చేశారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖిత్ అంజుమ్ ఈ అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆచార్య చంద్రశేఖరయ్య విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఐక్యరాజ్యసమితి వారు 2000వ సంవత్సరము నుండి ఆగస్టు 12వ తారీఖునాడు ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు" అని అన్నారు. "ఈ సంవత్సరం 'యువతకు పచ్చదనపు నైపుణ్యాలు' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం నేటి యువతరానికి బాధ్యతలు గుర్తు చేసేందుకు, యువతకు గల శక్తిని చాటి చెప్పేందుకు మరియు యువతకు దశ, దిశ నిర్దేశించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశమని" అన్నారు. "యువత మంచి భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకోవాలి. డబ్బు సంపాదించాలి. మంచి ప్రేమను పొందాలి మరియు పంచాలి. మంచి స్నేహితులను కలిగి ఉండాలి. సమాజంలో వస్తున్న క్రొత్త క్రొత్త మార్పులను తెలుసుకుని తదనుగుణంగా నేర్చుకోవడం చేయాలి. యువకులుగా ఉన్నప్పుడే ఎక్కువ కష్టపడితే మధ్య వయసులో జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయి. మీ భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా యువత గుట్కా, ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ వచ్చినప్పటినుండి యువత తీరే మారిపోయింది. ఆన్ లైన్ గేములకు, డేటింగ్ సైట్లకు అలవాటు పడి పోతున్నారు. కేవలం కమ్యూనికేషన్ కొరకు ఉపయోగించ వలసిన మోబైలును జీవితంలో ప్రధాన భాగం చేసుకుంటున్నారు. నిత్యం వీడియోలు, టిక్ టాక్ వంటి యాపులతో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మనసును, మెదడును చురుకుగా, ప్రభావవంతంగా మార్చే పుస్తకాలను చదవడం ఎప్పుడో మానివేశారు. రోజులో కనీసం ఒక గంటైనా మహనీయులు వ్రాసిన పుస్తకాలు చదవడం వలన అవి మీలో ఎంతో మార్పును కలిగిస్తాయి" అని అన్నారు. "నేటి యువతే రేపటి భవిత. యువతకు గల శక్తి అంతులేనిది, అపారమైనది. దేశ ఉన్నతికి, ఔన్నత్యానికి యువశక్తిని జోడించితే అన్నీ విజయాలే. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు, సామాజికమైనవి. తద్వారా జాతీయము, అంతర్జాతీయమైనవి. యువశక్తి ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో పయనించాలి. యువశక్తి దేశానికి ఎంతో మేలు చేస్తుంది. గతి తప్పితే అంతకంటే ఎక్కువ కీడు చేస్తుంది. ప్రపంచమంతా యువత దూసుకుపోయి యువశక్తిని చాటాల"ని అన్నారు. ఓ కలా, ఓ ఆశయం, ఓ పట్టుదల, ఓ ప్రయత్నం, ఓ విజయం ఇవన్నీ యువత స్వంతం. వారే డ్రైవింగ్ ఫోర్స్. నేటి యువతే రేపటి లీడర్లు. యువత బాధ్యతతో ఉండి తమ కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలి" అని అన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయినా యువత మీదే ఆధారపడి ఉన్నది. యువశక్తి అధికంగా ఉన్న భారతదేశం కూడా అగ్రరాజ్యాల సరసన ఉండాలంటే యువత సమాజంలో, టెక్నాలజీలో రోజురోజుకూ వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని తదనుగుణంగా వినియోగించుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలి" అని అన్నారు. యువత సేవాభావం అలవరుచుకోవడంతో పాటు మానవత, నైతిక విలువలతో జీవనం గడపాలి. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే నిత్యము వ్యాయామం, నడక, ధ్యానం చేయడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలి. నేటి యువత స్వామి వివేకానంద, డాక్టర్ A.P.J. కలాం, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువుల లాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని సర్వతోముఖాభివృద్ధి చెంది ఈ దేశాభివృద్ధిలో పాలుపంచుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మాతృదేశానికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు వన్నె తెచ్చే విధంగా, ఉత్తమ పౌరులుగా మెలగాల"ని కోరారు. భారత ప్రభుత్వం వారు కూడా 'మేరీ మిట్టీ - మేరీ దేశ్' పేరుతో ఈ నెలలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా స్వచ్ఛ పర్యావరణం, మొక్కలు నాటే కార్యక్రమం,యువత సాధికారత తదితర అంశాలలో ప్రచారం చేస్తుంది. నేటి సమాజంలో సైబర్ క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయి ఉంది. కావున నేటి యువత సైబర్ లాస్ కోర్సులు చేసి సమాజంలో సైబర్ నేరాలను అరికట్టడానికి కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో సుూర్యప్రకాష్ రావు (శ్రీ రామకృష్ణ వివేకానంద భావజాల ప్రచార కమిటీ, తెలంగాణ అధ్యక్షుడు) ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి C. జ్యోతి, అధ్యాపకులు జానయ్య, మురళీకృష్ణ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణప్రసాద్, జనార్ధన్, అమ్మయ్య చౌదరి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.