About Radhu MR DAP
శ్రీ మాత్రే నమః
మాతృదేవి చివరి తమ్ముడు అభయచరణ్ కుమార్తె రాధు. అభయ్ కలకత్తాలో వైద్యశాస్త్రం చదువుతున్నప్పుడు, 1899 వ సం॥లో హఠాత్తుగా కలరా వ్యాధి సోకి మరణించాడు. అప్పుడు అతడి భార్య సురబాల(M/o.Radhu) గర్భిణి. మరణశయ్యపై అభయ్ తన భార్యను, పుట్టబోయే బిడ్డను చూసుకోమని మాతృదేవి చేతులు పట్టుకుని విలపిస్తూ అభ్యర్థించాడు.
ఇతర సోదరల కన్నా మాతృదేవికి అభయ్ పై ఎక్కువ ప్రేమ. అందువల్ల తమ్ముని అభ్యర్థనను అంగీకరించారు.
సురబాలకు ఏర్పడిన ఈ విపరీతం చూసి ఆమెను పెంచిన అమ్మమ్మ, అత్త ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. వరుసగా ఇన్ని దుఃఖాలకు గురియైన సురబాల స్థిమితంగా ఉండలేకపోయింది. ఆమెకు మతి చలించింది. ఈ పరిస్థితిలో 1900 ఫిబ్రవరిలో ఆమె ఒక ఆడ శిశువును ప్రసవించింది. ఆమె పేరు రాధారాణి. ముద్దుగా 'రాధూ' అని పిలిచేవారు.
జీవితంలో అత్యంత ముఖ్యమయిన సమయంలో భర్తను, తర్వాత తమ అమ్మమ్మను, అత్తను కోల్పోయిన దుఃఖంలో సురబాల దాదాపు పిచ్చిదయిపోయింది.
పిచ్చి దానికి పుట్టిన బిడ్డను ఎవరు పోషిస్తారనేది పెద్ద సమస్య అయింది. మరణ సమయంలో తమ్ముడి కిచ్చిన మాటా, ప్రస్తుతం ఆతని భార్య అనాథగా పిచ్చిదానిగా తిరుగుతూ ఉండడమూ, ఆమెకు పుట్టిన బిడ్డను చూసుకొనేవారు లేకపోవడాన్ని మాతృదేవి చూశారు. తమపైబడ్డ కొత్త బాధ్యతను గ్రహించారు.
***
శ్రీ మాత్రే నమః
ఒక భక్తురాలు ఇలా అన్నారు :
రాదూ బిడ్డకు అన్నం పెట్టాలి. ఇంకా సమయం కాలేదు. అయినా ఆ బిడ్డ ఏడుస్తూ ఉండడం వలన అప్పుడే అన్నం పెట్టాలని రాధూ అనుకొన్నది. వద్దంటూ వారించారు మాతృదేవి. దాంతో రాధూ అమిత కోపంతో మాతృదేవిని తిట్టడం ప్రారంభించింది. “నువ్వు చచ్చిపో! నీ కాష్టానికి నేనే కొరివిపెడతాను" అంటూ నానారీతుల దుర్భాషలాడసాగింది. ఇదంతా వినడానికి మాకు ఎంతో బాధ కలిగింది.
మాతృదేవి అనారోగ్యంతో అప్పటికే ఎంతో బాధను అనుభవిస్తున్నారు. ఈ సమయంలో అలా తిట్టిపోయడమా! రాధూ ఇంకా తిడుతూనే ఉంది. ఇలా అప్పుడప్పుడు జరగడం కద్దు.
మాతృదేవి సహనానికి హద్దుల్లేవు. అన్నింటినీ సహిస్తూ ప్రశాంతంగా ఉండేవారు. కానీ దీర్ఘకాల వ్యాధి ప్రకోపంతో ఈ రోజు మాతృదేవి కూడా కాస్త కోపంతో, "అవును, నేను పోయాక నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో! ఎన్ని తన్నులు, చీపురుకట్ట దెబ్బలు నీ కోసం రాసిపెట్టి ఉన్నాయో తెలియదు” అన్నారు. ఇది విన్న రాధూ అవధులు లేని కోపంతో తిట్టిన తిట్లను వ్రాయడం సభ్యత కాదు
***
శ్రీ మాత్రే నమః
సురబాల (మాతృదేవి తమ్ముడి భార్య) తన నగలను, రాధూ నగలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. డబ్బు పిచ్చి పట్టిన ఆమె తండ్రి నగలను గుంజుకొని ఆమెను తరిమే శాడు. నగలు పోగొట్టుకున్న సురబాల తిన్నగా సింహవాహిని ఆలయానికి వెళ్లి, “నా నగలను ఇవ్వు" అంటూ దేవిని మొరపెట్టుకుని రోదించసాగింది.
అప్పుడు మాతృదేవి ఇంట్లో కూర్చొనివున్నారు. ఆమె ప్రక్కన ఉన్నవారికి వినబడని ఆ విలాపం మాతృదేవికి వినబడింది, "నేను వెళ్లాలి, నేను వెళ్లాలి. ఆ పిచ్చిది సింహ వాహినిని హింస పెడుతూవుంది. పాపం! ఆమెకు నేను తప్ప ఇంకెవరున్నారు?” అంటూ తహతహతో ఆలయానికి పరుగున వెళ్లారు. ఆమెను ఊరడించి ఇంటికి తోడ్కొనివచ్చారు.
కానీ సురబాల మాతృదేవినే నిందిస్తూ, "నువ్వే నా నగలను కాజేశావు" అంటూ కేకలు పెట్టసాగింది. అందుకు మాతృదేవి, "అవి చెత్త. అవి నా వద్ద వుంటే ఎప్పుడో పారేసివుండేదానను" అన్నారు. ఎలాగో సురబాల నుండి సంగతి తెలుసుకున్న తర్వాత ఆమె తండ్రిని పిలిపించి నగలను తిరిగి
ఇవ్వమని ఎంతగానో బ్రతిమిలాడారు. ఆ వృద్ధుడు ఇచ్చేటట్లుగా కనిపించలేదు. చివరకు కలకత్తా నుండి వచ్చిన మాతృదేవి శిష్యుడొకరు కొందరు పోలీసులతో వెళ్లి నగలను విడిపించుకుని వచ్చాడు.
ప్రతి రోజు ఈ పిచ్చామె వలన కలిగే వేదనను భరించలేక మాతృదేవి, “నేను పరమేశ్వరుని ముళ్లతో కూడిన బిల్వ పత్రాలతో పూజించానేమో! అందుకే వీరందరూ నన్ను ముళ్లుగా గుచ్చుతున్నారు” అనేవారు.
***
శ్రీ మాత్రే నమః
శిష్యుడు ఇలా అన్నారు. :
ఒక రోజు రాధూ అనారోగ్య కారణంగా చీకాకుగా ఉండడం మాతృదేవి గమనించి, “ఆమెను కాస్త చూడు నాయనా" అన్నారు నాతో. నాకు నాడి చూడడం కూడా తెలియదు. కాని మాతృదేవి తృప్తి కోసం, రాధూ నాడిని పరీక్షించినట్లుగా చూసి మాతృదేవితో, “పెద్దగా ఏమీ లేదు, కాస్త బలహీనత తప్ప. కాసిని పాలు ఇవ్వండి చాలు" అని చెప్పాను. చిన్నపిల్ల వంటి స్వభావం గల మాతృదేవి, వెంటనే రాధూకు పాలు తెచ్చి ఇచ్చారు.
ఇంతలో సురబాల వచ్చి రాధూ పక్కన కూర్చుంది. సొంతతల్లి అయినా ఆమె తన పక్కన కూర్చోవడం రాధూకు నచ్చదు. అందువలన రాధూ చికాకు ఎక్కువయింది. వెంటనే మాతృదేవి, సురబాలను కాస్త దూరంగా ఉండమన్నారు. అప్పుడు మాతృదేవి చేతులు పొరపాటుగా సురబాల కాళ్లకు తగిలాయి. అంతే! తొట్రుపాటుతో, "నా కాళ్లను తాకావు. నాకేం కాబోతోందో!" అంటూ కేకలు పెట్టింది. అది చూసి మాతృదేవి నవ్వు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న రాస్ బీహారి మహరాజ్ గారు, మాతృదేవిని ఇలా అడిగారు:
"అమ్మా! చూడండి. ఒక వైపు పిచ్చిదానిలా ఉంది, మిమ్మల్ని తిడుతుంది. కొట్టబోతుంది. కానీ మీ చేతులు ఆమె కాళ్లను తాకాయని ఇంతగా భయపడుతుందేమిటి?
మాతృదేవి : నాయనా! రాముడు సాక్షాత్తు నారాయణుడనీ, సీత ఆదిపరాశక్తి అనీ, రావణుడికి తెలియదా ఏమిటి? అయినప్పటికీ తనకంటూ కేటాయించిన భూమికను అతడు పోషించాడు. ఈమెకు కూడా నే నెవరో తెలియదా ఏమిటి? దీన్ని నిర్వర్తించడానికే ఆమె వచ్చింది.