బాల కాండ
1.1.1.
అనుష్టుప్.
* తపః స్వాధ్యాయ నిరతం
తపస్వీ వాగ్విదాం వరమ్ ।
నారదం పరిపప్రచ్ఛ
వాల్మీకి ర్మునిపుంగవమ్ ॥
టీక:-
తపః = తపస్సునందును; స్వాధ్యాయ = వేదములను స్వయముగ అధ్యయనము చేయుట యందును; నిరతమ్ = నిరంతరాయంగా, మిక్కిలి అనురక్తి గలవాడయిన; తపస్వీ = తపస్వి అయిన; వాగ్విదాం = వాక్చతురులలో; వరమ్ = శ్రేష్ఠుడు; నారదం = నారద మహర్షిని గురించి; పరిపప్రచ్ఛ = ప్రశ్నించెను; వాల్మీకిః = వాల్మీకి మహర్షి; మునిపుంగవమ్ = మునులలో శ్రేష్ఠుడు.
భావము:-
ఎల్లప్పుడు తపస్సు, వేదాధ్యయనములయందు మిక్కిలి అనురక్తి కలవాడును, తాపసియు, శ్రేష్ఠమైన వాక్చతురు డును, అయిన నారద మహర్షిని మునిశ్రేష్ఠుడు వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను.
గమనిక:-
1) తపస్సు- వ్యు, తప- దాహే+ అచ్, తప+అసున్, కృ.ప్ర., మనస్సును ఇంద్రియములను ఏకాగ్రముగా ఉంచుటచే తపింపజేయునది, తపస్సు; 2) నారదుడు- వ్యు. నరతీతి నరః ప్రోక్త పరమాత్మా సనాతనః, నర+అణ్- నారమ్- నారసంబంధి నారం, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, నార+దా+క, కృ.ప్ర., నర అనగా పరమాత్మ, నారం ఆత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఒసగు వాడు, గొప్ప దేవర్షి, నారదుడు బ్రహ్మదేవుని ఊరువు నుండి ఆవిర్భంవించిన బ్రహ్మమానస పుత్రుడు. పోతెభా 3-377-సీ. నిత్యం నారాయణ స్మరణతో వీణ మహతిపై వాయిస్తూ ముల్లోకాలు సంచరిస్తుంటాడు; 3) వాల్మీకి- వ్యుత్పత్తి. వల్మీక+అణ్- పృష్ఠో, త.ప్ర., పుట్టంబుట్టువు, పుట్టలో పుట్టినవాడు; వాల్మీక కులంలో పుట్టినవాడు; వాల్మీకి మహర్షి, ఆదికావ్యమైన రామాయణ రచయిత; శ్లోకమనే ప్రక్రియ కనుగొన్నవాడు; పోతన తెలుగు భాగవతము 6-507-వ. ప్రకారం కశ్యపుడు అదితీల పుత్రులైన ఆదిత్యులలో తొమ్మిదవ వాడు వరుణుడు. వరుణునకు భార్య చర్షిణి వలన పూర్వం బ్రహ్మకుమారుడైన భృగువును, వల్మీకం నుండి పుట్టిన వాల్మీకిని కన్నాడు. వాల్మీకి తపస్సులో ఉండగా చుట్టూ పుట్ట పెరిగి పోయింది. తపస్సు చాలించినప్పుడు పుట్టను చీల్చుకుని బయటకు వచ్చాడు అని పాఠ్యంతరం. 4 ముని- వ్యు. మన, అవబోధనే + ఇన్- వృషో, ఉత్వమ్, కృ.ప్ర., ఆంధ్రశబ్దరత్నాకరము, తెలుసుకున్న వాడు, మౌనవ్రతము కలవాడు. ఋషి. 5. ఈ సర్గను సంక్షేప రామాయణము అంటారు. సంక్షేపము అనగా సారాంశము. ఆంధ్రశబ్దరత్నాకరము. తృతీయ సర్గ కథా సంగ్రహము అనగా సంక్షిప్తము చేసి చెప్పినది.
1.1.2.
అనుష్టుప్.
* “కోన్వస్మిన్ సాంప్రతం లోకే
గుణవా న్కశ్చ వీర్యవాన్ ।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ
సత్యవాక్యో దృఢవ్రతః ॥
టీక:-
కః = ఎవడు; ను = నిజముగా; అస్మిన్ = ఈ; సాంప్రతం = ఇప్పుడు; లోకే = లోకములో; గుణవాన్ = సద్గుణ సంపన్నుడు; కః = ఎవరు; చ; వీర్యవాన్ = వీర్యవంతుడు; ధర్మజ్ఞః = ధర్మము తెలిసివాడు; చ; కృతజ్ఞః = కృతజ్ఞత కలిగినవాడు; చ; సత్యవాక్యః = నిజమునే పలుకువాడు / ఆడిన మాట తప్పని వాడు; దృఢవ్రతః = నిశ్చలమైన సంకల్పము కలవాడు.
భావము:-
” ఓ నారద మహర్షి! ఈ భూలోకములో ఇప్పుడు సద్గుణ సంపన్నుడు, వీర్యవంతుడు, ధర్మము లన్నియు తెలిసినవాడును, కృతజ్ఞత కలిగినవాడు, ఎల్లప్పుడు సత్యమునే వచించువాడు, ఆడినమాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము కలవాడు ఎవడు?
గమనిక:-
కృతజ్ఞడు- కృత- చేసిన మేలు+ జ్ఞత- జ్ఞప్తి, చేసినమేలు గుర్తు ఉంచుకొనువాడు.
1.1.3.
అనుష్టుప్.
* చారిత్రేణ చ కో యుక్తః
సర్వభూతేషు కో హితః ।
విద్వాన్కః కః సమర్థశ్చ
కశ్చైక ప్రియదర్శనః ॥
టీక:-
చారిత్రేణ = సదాచారముతో; చ; కః = ఎవడు; యుక్తః = కూడినటువంటివాడు; సర్వ = అన్ని; భూతేషు = ప్రాణుల యందు; కః = ఎవడు; హితః = మేలు కోరువాడు; విద్వాన్ = విద్వాంసుడు; కః = ఎవడు; కః = ఎవడు; సమర్థః = సర్వకార్యములలో సమర్థత కలిగిన వాడు; చ; కః = ఎవడు; చ; ఏక = అసమానమైన, ఆంధ్ర శబ్దరత్నాకరము; ప్రియదర్శనః = తన దర్శనముచే ఆనందమును కలిగించువాడు.
భావము:-
సదాచార సంపన్నుడు, సమస్త ప్రాణికోటికి హితము చేయువాడు; సర్వ శాస్త్రములలో విద్వాంసుడు, అన్ని కార్యములు చేయుటలో సామర్థ్యము కలిగినవాడు, తన సందర్శన భాగ్యముచే అసమాన ఆనందము కలిగించువాడును ఎవ్వడు?
1.1.4.
అనుష్టుప్.
* ఆత్మవాన్ కో జితక్రోధో
ద్యుతిమాన్ కోఽ నసూయకః ।
కస్య బిభ్యతి దేవాశ్చ
జాతరోషస్య సంయుగే ॥
టీక:-
ఆత్మవాన్ = ధైర్యశాలి; కః = ఎవడు; జితక్రోధః = కోపమును జయించినవాడు; ద్యుతిమాన్ = తేజోవంతుడు; కః = ఎవడు; అనసూయకః = అసూయలేనివాడు; కస్య = ఎవరికి; బిభ్యతి = భయపడుదురు; దేవాః = దేవతలు; చ; జాత = కలిగినచో; రోషస్య = కోపము; సంయుగే = యుద్దములో.
భావము:-
ధైర్యశాలి, కోపమును జయించినవాడు, తేజోవంతుడు; అసూయలేనివాడు ఎవడు? ఎవరి పరాక్రమునకు యుద్దములో దేవతలు సహితము భయపడుదురో అట్టి వాడెవ్వడు?
1.1.5.
అనుష్టుప్.
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం
పరం కౌతూహలం హి మే ।
మహర్షే! త్వం సమర్థోఽ సి
జ్ఞాతుమేవంవిధం నరమ్ ॥"
టీక:-
ఏతత్ = దీనిని; ఇచ్ఛామి = కోరుచున్నాను; అహం = నేను; శ్రోతుమ్ = వినుటకు; పరం = మిక్కిలి; కౌతూహలం = కుతూహలము; హి; మే = నేను; మహర్షే = ఓ నారద మహర్షీ; త్వం = నీవు; సమర్థః = సమర్థత గలవాడవు; అసి = త్వమర్థకము; జ్ఞాతుం = తెలిసికొనుటకు; ఏవం = ఈ; విధం = విధమైన; నరమ్ = నరుని గూర్చి."
భావము:-
ఈ విషయములను వినుటకు నేను మిక్కిలి కుతూహలపడుచుంటిని. ఓ నారదమహర్షీ! అట్టి మహాపురుషుని గురించి చెప్పుటకు సమర్థులైన తమరుచెప్పండి”
గమనిక:-
వాల్మీకి అడిగినవాని సద్గుణములు 17, అవి. 1. సద్గుణ సంపన్నుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మజ్ఞుడు, 4. కృతజ్ఞుడు, 5. సత్యవాది, 6. ఆడినమాట తప్పనివాడు, 7. నిశ్చలసంకల్పుడు, 8. సదాచార సంపన్నుడు, 9. లోక హితకారి, 10. సర్వ శాస్త్రజ్ఞుడు, 11. సర్వ సమర్థుడు, 12. ప్రియదర్శనుడు, 13. ధైర్యశాలి, 14. జితక్రోధుడు, 15. తేజశ్శాలి, 16. అసూయరహితుడు, 17. యుద్దభూమి ఎదురైన దేవతలకు సహితము భయంకరుడు.
1.1.6.
అనుష్టుప్.
శ్రుత్వా చైత త్త్రిలోకజ్ఞో
వాల్మీకే ర్నారదో వచః ।
శ్రూయతామితి చామంత్ర్య
ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ॥
టీక:-
శ్రుత్వా = విని; చ; ఏతత్ = ఈ; త్రిలోకజ్ఞః = ముల్లోకములు తెలిసినవాడు; వాల్మీకేః = వాల్మీకితో; నారదః = నారదుడు; వచః = చెప్పెను; శ్రూయతాం = వినబడును; ఇతి = అని; చ; అమంత్ర్య = పిలిచి; ప్రహృష్టః = గొప్ప సంతోషము కలిగినవాడై; వాక్యం = వాక్యమును; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ముల్లోకములను బాగుగాఎఱిగిన నారదుడు వాల్మీకి మాటలను (ప్రశ్నలను) వినినంతనే మిక్కిలి సంతోషముతో, "లోకమున వినబడును" అని పలికి ఇట్లు చెప్పనారంభించెను.
1.1.7.
అనుష్టుప్.
* “బహవో దుర్లభాశ్చైవ
యే త్వయా కీర్తితా గుణాః ।
మునే! వక్ష్యామ్యహం బుద్ధ్వా
తైర్యుక్తః శ్రూయతాం నరః ॥
టీక:-
బహవః = బహువిధములుగ; దుర్లభాః = దుర్లభములైన; చ; ఏవ = అటువంటి; యే = ఏ; త్వయా = నీచేత; కీర్తితా = కీర్తింపబడిన; గుణాః = గుణములు; మునే = వాల్మీకి మునీ; వక్ష్యామి = చెప్పెదను; అహం = నేను; బుద్ధ్వా = బుద్ధిచే గ్రహించి; తైః = వాటిచే(ఆ గుణములచే); యుక్తః = కూడినటువంటి; శ్రూయతాం = వినబడును గాక; నరః = నరుడు.
భావము:-
"ఓ వాల్మీకిమునీ! నీవు అడిగిన ఆ సుగుణములు అన్నీ ఏవిధంగా చూసిన దుర్లభములు. ఆ సద్గుణములు కల మహాపురుషుని ఆలోచించి చెప్పెదను, వినుము.
1.1.8.
అనుష్టుప్.
ఇక్ష్వాకువంశ ప్రభవో
రామో నామ జనైః శ్రుతః ।
నియతాత్మా మహావీర్యో
ద్యుతిమాన్ ధృతిమాన్వశీ ॥
టీక:-
ఇక్ష్వాకు = ఇక్ష్వాకు; వంశ = వంశమునందు; ప్రభవః = జన్మించిన వాడు; రామః = రాముడు; నామ = పేరు కలిగిన; జనైః = జనులచే; శ్రుతః = వినబడినవాడు; నియతాత్మా = మనోనిగ్రహము కలిగినవాడు; మహావీర్యః = అమిత పరాక్రమవంతుడు; ద్యుతిమాన్ = కాంతివంతుడు; ధృతిమాన్ = ధైర్యము కలిగినవాడు; వశీ = ఇంద్రియములను తన వశములో ఉంచినవాడు.
భావము:-
ఇక్ష్వాకు వంశమునందు అవతరించినవాడు. తన పేరే రాముడు అనగా రమింపజేయువాడు, అతడు జగత్ప్రసిద్దుడు. మనోనిగ్రహము కలిగినవాడు, అమిత పరాక్రమవంతుడు, గొప్ప తేజస్సుతో వెలుగొందువాడు. ధైర్యశాలి మఱియు జితేంద్రియుడు.
గమనిక:-
రామః- వ్యుత్పత్తి. రమ- క్రీడాయామ్ + ఘఞ్, కృ.ప్ర., అందఱను ఆవందింపజేయువాడు.
1.1.9.
అనుష్టుప్.
బుద్ధిమా న్నీతిమా న్వాగ్మీ
శ్రీమా న్శత్రునిబర్హణః ।
విపులాంసో మహాబాహుః
కంబుగ్రీవో మహాహనుః ॥
టీక:-
బుద్ధిమాన్ = బుద్ధిమంతుడు; నీతిమాన్ = నీతిమంతుడు; వాగ్మీ = సకలవిద్యా పారంగతుడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; శత్రుః = శత్రువులను; నిబర్హణః = నాశనము చేయువాడు; విపుల = ఎత్తయిన; అంసః = మూపురములు కలిగినవాడు; మహా = గొప్ప; బాహుః = బాహువులు కలవాడు; కంబు = శంఖమువంటి; గ్రీవః = కంఠము కలిగినవాడు; మహా = గొప్ప; హనుః = దవడలు కలిగినవాడు.
భావము:-
శ్రీరాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల విద్యాపారంగతుడు, శ్రీమంతుడు. శత్రువులను నాశనము చేయువాడు. ఎత్తయినమూపురములు కలవాడు. గొప్ప బాహువులు కలవాడు. శంఖము వంటి కంఠము గలవాడు,ఎత్తైన చెక్కిళ్ళు కలవాడు.
1.1.10.
అనుష్టుప్.
మహోరస్కో మహేష్వాసో
గూఢజత్రు రరిందమః ।
ఆజానుబాహుః సుశిరాః
సులలాటః సువిక్రమః ॥
టీక:-
మహా = విశాలమైన; ఉరస్కః = వక్షస్థలము కలవాడు; మహా = గొప్ప; ఇష్వాసః = విలుకాడు; గూఢ = గూఢమైన; జత్రుః = బాహువు శరీరాల సంధి ఎముకలు; అరిందమః = శత్రువులను నిగ్రహించువాడు; ఆజానుబాహుః = ఆజానుబాహుడు; సుశిరాః = అందమైన మఱియు శుభలక్షణములు కలిగిన శిరస్సు గలవాడు; సులలాటః = శుభలక్షణములు కలిగిన నుదురు కలవాడు; సువిక్రమః = చక్కని శౌర్యము కలవాడు.
భావము:-
ఆ శ్రీరాముడు విశాల వక్షస్థలము కలవాడు, గొప్ప విలుకాడు, గూఢమైన బాహువుల సంధి ఎముకలు కలిగినవాడు, శత్రువులను నిగ్రహించువాడు, ఆజానుబాహుడు, చక్కని శుభలక్షణములు కల తల, నుదురు కలిగినవాడు, చక్కని శౌర్యము కలవాడు.
గమనిక:-
ఆజానుబాహుడు- మోకాళ్ళవరకు పొడవైన చేతులు కలవాడు.
1.1.11.
అనుష్టుప్.
సమః సమవిభక్తాంగః
స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీనవక్షా విశాలాక్షో
లక్ష్మీవా న్శుభలక్షణః ॥
టీక:-
సమః = సమానమైన దేహము {పొడవునకు తగిన లావు కల దేహము}కలవాడ; సమ = చక్కగా; విభక్త = అమరిన; అంగః = అవయవములు కలవాడు; స్నిగ్ధవర్ణః = మెరిసెడి; వర్ణః = దేహఛాయ కలవాడు; ప్రతాపవాన్ = గొప్ప పరాక్రమశాలి; పీన = బలమైన; వక్షాః = వక్షస్థలము కలవాడు; విశాల = పెద్ద; అక్షః = కన్నులు కలవాడు; లక్ష్మీవాన్ = ఐశ్వర్యవంతుడు; శుభ = మంగళము లైన; లక్షణః = లక్షణములు కలవాడు.
భావము:-
శ్రీరాముడు, పొడవుకు తగిన లావుతో సమానమైన దేహము కలవాడు, చక్కగా అమరిన అవయవములు కలవాడు, ప్రకాశవంతమైన దేహఛాయ కలవాడు, గొప్ప పరాక్రమశాలి, బలమైన వక్షస్థలము కలవాడు, విశాల నేత్రములు కలవాడు, ఐశ్వర్యవంతుడు, మంగళప్రదమైన దేహము కలవాడు.
1.1.12.
అనుష్టుప్.
ధర్మజ్ఞః సత్యసంధశ్చ
ప్రజానాం చ హితేరతః ।
యశస్వీ జ్ఞానసంపన్నః
శుచి ర్వశ్యః సమాధిమాన్ ॥
టీక:-
ధర్మజ్ఞః = ధర్మమును తెలిసినవాడు; సత్యసంధః = సత్యసంధుడు మాట తప్పనివాడు; చ; ప్రజానాం = ప్రజలకు; చ; హితే = మేలు చేయుటయందు; రతః = అనురక్తి కలవాడు; యశస్వీ = గొప్ప కీర్తి కలవాడు; జ్ఞాన = జ్ఞానము; సంపన్నః = సమృద్ధిగా కలవాడు; శుచిః = పవిత్రుడు; వశ్యః = వినయము ఇంద్రియనిగ్రహము కలవాడు; సమాధిమాన్ = మనో నిబ్బరము కలవాడు.
భావము:-
శ్రీరాముడు, ధర్మము తెలిసినవాడు, సత్యసంధుడు, ఆడినమాట తప్పనివాడు, ఎల్లప్పుడు ప్రజలకు హితమొనర్చుటయందు అనురక్తి కలవాడు, గొప్ప కీర్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు, పవిత్రుడు, ఇంద్రియ నిగ్రహము కలాడు, వినయము కలవాడు, మనో నిబ్బరము కలవాడు.
1.1.13.
అనుష్టుప్.
* ప్రజాపతిసమః శ్రీమాన్
ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య
ధర్మస్య పరిరక్షితా ॥
టీక:-
ప్రజాపతి = ప్రజాపతులతో; సమః = సాటివచ్చు వాడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; ధాతా = భరించువాడు; రిపు = శత్రువులను; నిషూదనః = పరిమార్చువాడు; రక్షితా = రక్షించువాడు; జీవలోకస్య = ప్రాణీకోటిని; ధర్మస్య = ధర్మమును; పరిరక్షితా = రక్షించువాడు.
భావము:-
శ్రీరాముడు ప్రజాపతులతో సాటివచ్చు వాడు; శ్రీమంతుడు; ప్రజల బాధ్యతలు భరించువాడు; శత్రువులను సంహారించు వాడు; ప్రాణికోటిని కాపాడువాడు; ధర్మమును రక్షించువాడు.
1.1.14.
అనుష్టుప్.
* రక్షితా స్వస్య ధర్మస్య
స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాంగ తత్త్వజ్ఞో
ధనుర్వేదే చ నిష్ఠితః ॥
టీక:-
రక్షితా = రక్షించువాడు; స్వస్య = తనయొక్క; ధర్మస్య = ధర్మమును; స్వజనస్య = తనను ఆశ్రయించినవారిని; చ; రక్షితా = రక్షించువాడు; వేదః = చతుర్వేదములు; వేదాంగ = వేదాంగములు{వేదాంగములు - వీటినే షడంగములు అని కూడ అంటారు, 1) శిక్ష, 2) వ్యాకరణము, 3) ఛందస్సు, 4) నిరుక్తము, 5) జ్యోతిష్యము, 6) కల్పము}; తత్వ = తత్త్వశాస్త్రము; జ్ఞః = ఎఱిగినవాడు; ధనుర్వోదే = ధనుర్వేదమునందు; చ; నిష్ఠితః = నిష్ణాతుడు.
భావము:-
శ్రీరాముడు తన యొక్క ధర్మమును, తనవారిని రక్షించువాడు; వేదవేదాంగములు తత్వశాస్త్రములు ఎఱిగినవాడు; ధనుర్వేదములో నిష్ణాతుడు.
గమనిక:-
(1) చతుర్వేదములు – 1. ఋగ్వేదం · 2. యజుర్వేదం · 3. సామవేదం · 4. అధర్వణ వేదం; వేదాంగములు (2) షడంగములు -1) శిక్ష, 2) వ్యాకరణము, 3) ఛందస్సు, 4) నిరుక్తము, 5) జ్యోతిష్యము, 6) కల్పము.
1.1.15.
అనుష్టుప్.
సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞః
స్మృతిమా న్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధుః
అదీనాత్మా విచక్షణః ॥
టీక:-
సర్వ = సకల; శాస్త్ర = శాస్త్రముల; అర్థ = అర్థములు; తత్త్వజ్ఞః = తత్వములు తెలిసినవాడు; స్మృతిమాన్ = మిక్కిలి జ్ఞాపక శక్తి కలిగినవాడు; ప్రతిభానవాన్ = సమయ స్పూర్తి కల ప్రతిభాశాలి; సర్వ = సమస్తమైన; లోక = లోకస్థులకు; ప్రియః = ఇష్టుడు; సాధుః = సాధుస్వభావము కలవాడు; అదీనాత్మా = ధైర్యశాలి {అదీన - దీన కాని}; విచక్షణః = సదసద్వివేకి.
భావము:-
శ్రీరాముడు, సకల శాస్త్రముల అర్థ, తత్వములు తెలిసినవాడు; మిక్కిలి జ్ఞాపకశక్తి కలిగినవాడు; సమయస్ఫూర్తి కల ప్రతిభాశాలి; సకల లోకస్థులకు ప్రియమైనవాడు; సాధుస్వభావి; ధైర్యశాలి; సదసద్వివేకి.
గమనిక:-
శాస్త్రములు - ధర్మ, పురాణ, నీతి, న్యాయ, మీమాంస, సాంఖ్య, వైశేషిక, యోగాది; అదీన - దీన కాని.
1.1.16.
అనుష్టుప్.
సర్వదాఽ భిగతః సద్భిః
సముద్ర ఇవ సింధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ
సదైక ప్రియదర్శనః ॥
టీక:-
సర్వదా = ఎల్లప్పుడు; అభిగతః = పొందబడువాడు; సద్భిః = సత్పురుషులచే; సముద్రః = సముద్రుడు; ఇవ = వలె; సింధుభిః = నదులు; ఆర్యః = పూజ్యుడు; సర్వసమః = జాతి వర్ణాది తారత్మ్యము లోక సకల జీవుల ఎడలను సమానముగా ప్రవర్తించువాడు; చ; ఏవ = ఇంకనూ; సదా = ఎల్లప్పుడును; ఏక = ముఖ్యమైన; ప్రియ = ప్రీతికరమైన; దర్శనః = దర్శనమిచ్చువాడు.
భావము:-
నదులు ఏ విధముగా సముద్రములో చేరుచుండునో అట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరెదరు; ఆయన అందరికి పూజ్యుడు; అందఱిని సమభావముతో చూచువాడు; ఆయన ఎల్లప్పుడు ముఖ్యమైన ఇష్టుడుగనే కనబడును.
1.1.17.
అనుష్టుప్.
స చ సర్వగుణోపేతః
కౌస ల్యానంద వర్ధనః ।
సముద్ర ఇవ గాంభీర్యే
ధైర్యేణ హిమవానివ ॥
టీక:-
సః = ఆ శ్రీరాముడు; చ; సర్వ = సకల; గుణ = సద్గుములు; ఉపేతః = కలవాడు; కౌసల్య = కౌసల్యాదేవికి; ఆనంద = ఆనందమును; వర్ధనః = పెంపొందించువాడు; సముద్రః = సముద్రము; ఇవ = వలె; గాంభీర్యే = గాంభీర్యము కలవాడు; ధైర్యేణ = ధైర్యములో {ధైర్యము - బెదురుటకు కారణమున్నను బెదరకుండు శక్తి}; హిమవాన్ = హిమవత్పర్వతము; ఇవ = వంటివాడు.
భావము:-
ఆ శ్రీరాముడు సర్వసద్గుగుణములు కలవాడు; కౌసల్య మాతకు ఆనందము కలిగించువాడు; గాంభీర్యములో సముద్రమువంటివాడు; ధైర్యములో హిమవత్పర్వతము వంటివాడు.
గమనిక:-
గాంభీర్యము - లోతు, తన మనసులోని విషయాలు బైటకు తెలియకుండా నిగ్రహించు శక్తి; ధైర్యము - బెదురుటకు కారణమున్నను బెదరకుండు శక్తి.
1.1.18.
అనుష్టుప్.
విష్ణునా సదృశో వీర్యే
సోమవ త్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే
క్షమయా పృథివీసమః ॥
టీక:-
విష్ణునా = శ్రీ మహావిష్ణువుతో; సదృశః = సమానుడుమ వీర్యే = పరాక్రమమునందు; సోమవత్ = చంద్రునివలె ప్రియదర్శనః = ఆహ్లాదకరమైన దర్శనమిచ్చువాడు; కాలాగ్ని = ప్రళయకాలాగ్నితో; సదృశః = సమానుడు; క్రోధే = కోపములో; క్షమయా = సహనమునందు; పృథివీ = భూదేవితో; సమః = సమానుడు.
భావము:-
ఆ శ్రీరామచంద్రమార్తి, పరాక్రమములో శ్రీమహావిష్ణువు; ఆహ్లాదకరమైన దర్శనమిచ్చుటలో చంద్రుడు; క్రోధము చూపునప్పుడు భయంకరమైన ప్రళయాగ్ని; సహనంలో భూదేవి వంటివాడు.
గమనిక:-
వీర్యము - తనను తాను క్షతము (దెబ్బ) తినకుండ, ఇతరులను వణికించు శక్తి.
1.1.19.
అనుష్టుప్.
ధనదేన సమ స్త్యాగే
సత్యే ధర్మ ఇవాపరః ।
తమేవం గుణసంపన్నం
రామం సత్యపరాక్రమమ్ ॥
టీక:-
ధనదేన = కుబేరునితో; సమః = సమానుడు; త్యాగే = త్యాగమునందు; సత్యే = సత్యపాలనయందు; ధర్మః = ధర్ముడు; ఇవ = వలె; అపరః = మరొక; తమ్ = ఆ; ఏవం = ఇటువంటి; గుణసంపన్నమ్ = సుగుణాలరాశి యగు; రామం = శ్రీరాముడును; సత్యపరాక్రమమ్ = తిరుగులేని పరాక్రమము కలిగినవాడు.
భావము:-
ఆ శ్రీరాముడు త్యాగమునందు (దానముచేయుటలో) కుబేరుడు; సత్యపాలనలో అపర ధర్ముడు; ఈ విషయములలో రామునికిమించిన వారెవ్వరు లేరు; ఆయన ఇటువంటి సుగుణములతో, తిరుగులేని పరాక్రమముతో ఒప్పుచుండెడివాడు.
గమనిక:-
వ్యాసులవారు 17 సుగుణములతో పురుషుని అడిగితే, 75 సుగుణముల వానిని శ్రీరాముని చెప్పెను. చూ. వివరములు.
1.1.20.
అనుష్టుప్.
జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం
ప్రియం దశరథస్సుతమ్ ।
ప్రకృతీనాం హితైర్యుక్తం
ప్రకృతి ప్రియకామ్యయా ॥
టీక:-
జ్యేష్ఠం = పెద్దకుమారుడు; శ్రేష్ఠః = ఉత్తమములైన; గుణైః = గుణములతో; యుక్తమ్ = కలవాడు; ప్రియం = తనకు ప్రియమైన; దశరథః = దశరథమహారాజు; సుతమ్ = కుమారుని; ప్రకృతీనాం = తనకు తనవారికి , సప్త పౌర అంగములు; హితైః = నచ్చెడి; యుక్తం = విధము; ప్రకృతి = జగమునకు; ప్రియ = ప్రియము; కామ్యయా = చేయవలెనన్న కోరికచే.
భావము:-
ఇలా ఉండగ ఒకనాడు ఎల్లప్పుడును జగమునకు ప్రియము కలిగించువాడయిన అయోధ్యా మహీపతి తన వారు అందరికి హితము చెయవలెనను కోరికతో, తన పెద్దకుమారునకు (శ్రీరామునకు), ఉత్తమగుణములు కలిగినవానికి, తనకు ఎంతో ప్రీతిపాత్రుడైన వానికి యువరాజ్యపట్టాభిషేకము చేయవలెనని సంకల్పించెను.
గమనిక:-
సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము; అష్ట ప్రకృతులు - పంచభూతములు (5), 6. మనస్సు, 7. బుద్ధి, 8. అహంకారము.
1.1.21.
అనుష్టుప్.
యౌవరాజ్యేన సంయోక్తుమ్
ఐచ్ఛత్ప్రీత్యా మహీపతిః ।
తస్యాభిషేక సంభారాన్
దృష్ట్వా భార్యాఽ థ కైకయీ ॥
టీక:-
యౌవరాజ్యేన = యువరాజ పదవితో; సంయోక్తుమ్ = కూర్చుటకు; ఐచ్ఛత్ = సిద్ధపడెను; ప్రీత్యా = ప్రీతితో; మహీపతిః = మహారాజు; తస్య = ఆ శ్రీరాముని యొక్క; అభిషేక = యువరాజ పట్టాభిషేకము; సంభారాన్ = ఏర్పాట్లను; దృష్ట్వా = చూచి; భార్యా = భార్య అయిన; అథ = అటుపిమ్మట; కైకయీ = కైకేయి.
భావము:-
శ్రీరామునకు యువరాజ్య పట్టాభిషేక ఏర్పాట్లు సిద్ధ మగుచున్నవి. అటుపిమ్మట, శ్రీరాముని పట్టాభిషేకపు ఏర్పాట్లను చూచిన దశరథమహారాజు భార్యలలో ఒకరైన కైకేయి..
1.1.22.
అనుష్టుప్.
పూర్వం దత్తవరా దేవీ
వరమేన మయాచత ।
వివాసనం చ రామస్య
భరత స్యాభిషేచనమ్ ॥
టీక:-
పూర్వం = పూర్వము; దత్త = ఇవ్వబడిన; వరా = వరములు గలది; దేవీ = కైకేయి మహారాణి; వరమ్ = ఆ వరములను; ఏనమ్ = ఇతనిని (దశరథుని); ఆయాచత = యాచించెను; వివాసనం = బహిష్కరణను; చ = మఱియు; రామస్య = శ్రీరాముని; భరతస్య = భరతుని; అభిషేచనమ్ = పట్టాభిషేకమును.
భావము:-
కైకేయి మహారాణి పూర్వం శంబరాసురుని జయించిన సందర్భమున దశరథమహారాజు ఇచ్చిన రెండు వరములు ఉండుటచే, శ్రీరాముని రాజ్యబహిష్కరణుని చేసి వనవాసమునకు పంపవలెనని మెదటి వరమును, భరతునికి రాజ్య పట్టాభిషేకము చేయవలెనని రెండవ వరమును కోరెను.
గమనిక:-
దశరథుడు శంబరాసురుని జయించు సందర్భంలో, దశరథుని రథ చక్రము శీల ఊడిపోయెను. అంత, మహారాణి కైక తన వేలును శీల స్థానమున ఉంచి ప్రమాదము తప్పించెను. కైక, అప్పుడు దశరథుడు ఇస్తానన్న వరములు అని చెప్పి, ఇప్పుడు రామునికి రాజ్యబహిష్కరణ, భరతునికి పట్టాభిషేకము అను రెండు వరములు కోరెను.
1.1.23.
అనుష్టుప్.
స సత్యవచనా ద్రాజా
ధర్మపాశేన సంయతః ।
వివాసయామాస సుతం
రామం దశరథః ప్రియమ్ ॥
టీక:-
సః = ఆ; సత్యవచనాత్ = సత్యవచనముచే; రాజా = మహారాజు; ధర్మపాశేన = ధర్మము అనే త్రాడుచే; సంయతః = కట్టబడినవాడై; వివాసయామాస = బహిష్కరించెను (వనములకు పంపెను); సుతమ్ = కుమారుని; రామం = శ్రీరాముని; దశరథః = దశరథుడు; ప్రియమ్ = ప్రియమైన.
భావము:-
సత్యసంధుడైన ఆ దశరథమహారాజు ధర్మము సత్యపాలనకు కట్టుబడి తనకు ప్రియపుత్రుడైన శ్రీరాముని అడవులకు పంపెను.
1.1.24.
అనుష్టుప్.
స జగామ వనం వీరః
ప్రతి జ్ఞా మనుపాలయన్ ।
పితుర్వచన నిర్దేశాత్
కైకేయ్యాః ప్రియకారణాత్ ॥
టీక:-
సః = అతడు (శ్రీరాముడు); జగామ = వెళ్ళెను; వనం = వనమునకు; వీరః = వీరుడు; ప్రతిజ్ఞామ్ = తన ప్రతిజ్ఞను; అనుపాలయన్ = పాలించుట కొఱకు; పితుః = తండ్రియొక్క; వచన = మాట; నిర్దేశాత్ = ఆజ్ఞ ప్రకారము; కైకేయ్యాః = కైకేయికి; ప్రియకారణాత్ = ప్రియము కలిగించుటకు.
భావము:-
మహావీరుడైన శ్రీరాముడు, (పితృవాక్య పరిపాలన అనెడి) తన ప్రతిజ్ఞను అనుసరించి తండ్రి ఆజ్ఞ పాటించుటకు మఱియు కైకేయికి సంతోషము కలిగించుటకు, వనములకు వెళ్ళెను.
1.1.25.
అనుష్టుప్.
తం వ్రజంతం ప్రియో భ్రాతా
లక్ష్మణోఽ నుజగామ హ ।
స్నేహాద్వినయ సంపన్నః
సుమి త్రానంద వర్ధనః ॥
టీక:-
తం = ఆ; వ్రజంతం = ప్రయాణమగుచున్న వానిని; ప్రియః = ప్రియమైన; భ్రాతా = (శ్రీరాముని) సోదరుడు; లక్ష్మణః = లక్ష్మణుడు; అనుజగామ = అనుగమించెను; హ = పాదపూరణం; స్నేహాత్ = స్నేహముతో; వినయ = వినయము; సంపన్నః = సమృద్దిగా కలవాడు; సుమిత్ర = సుమిత్రాదేవికి; ఆనంద = ఆనందమును; వర్ధనః = వృద్ధి చేయువాడు.
భావము:-
సుమిత్రానంద వర్ధనుడైన లక్ష్మణుడు శ్రీరామునికి ప్రియసోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రామునిపై అమితమైన భ్రాతృప్రేమ కలిగినవాడై వనముల కేగుచున్న శ్రీరాముని వెంట తాను కూడ బయలుదేరెను.
1.1.26.
అనుష్టుప్.
భ్రాతరం దయితో భ్రాతుః
సౌభ్రాత్ర మనుదర్శయన్ ।
రామస్య దయితా భార్యా
నిత్యం ప్రాణసమా హితా ॥
టీక:-
భ్రాతరం = సోదరుని; దయితః = ఇష్టుడు; భ్రాతుః = సోదరుడు; సౌభ్రాత్రమ్ = సోదరప్రేమను; అనుదర్శయన్ = చూపెను; రామస్య = శ్రీరామునకు; దయితా = ప్రియమైన; భార్యా = భార్యయు; నిత్యం = ఎల్లప్పుడు; ప్రాణసమా = ప్రాణ సమానమైనదియు; హితా = హితము కలిగించునదియు.
భావము:-
లక్ష్మణుడు తన సోదరుడు శ్రీరాముని ఎడ చిక్కటి సోదరప్రేమను చూపెను. శ్రీరామునికి నిత్యం ప్రాణము వలె ప్రేమను చూపు, మేలు కోరు, ప్రియ భార్య, సీతాదేవి,
1.1.27.
అనుష్టుప్.
జనకస్య కులే జాతా
దేవమాయేవ నిర్మితా ।
సర్వలక్షణ సంపన్నా
నారీణా ముత్తమా వధూః ॥
టీక:-
జనకస్య = జనక మహీపతి; కులే = వంశమందు; జాతా = జన్మించినదియు; దేవమాయ = దేవమాయ (విష్ణుమూర్తి మోహిని అవతరము); ఏవ = వలె ఉన్నదియు; నిర్మితా = సృష్టించబడినదియు; సర్వ = సకల; లక్షణ = శుభలక్షణములు; సంపన్నా = సమృద్ధిగా కలదియు; నారీణామ్ = స్త్రీమూర్తులలో; ఉత్తమా = ఉత్తమురాలు; వధూః = దశరథుని కోడలు.
భావము:-
జనకమహీపతి వంశములో పుట్టినదియు, మోహినీ అవతారిణి వంటి అందగత్తెయు, సకల శుభలక్షణములు సమృద్ధిగా కలదియు, ఉత్తమురాలును ఐన సీత దశరథుని కోడలు.
1.1.28.
అనుష్టుప్.
సీతా ప్యనుగతా రామం
శశినం రోహిణీ యథా ।
పౌరైరనుగతో దూరం
పిత్రా దశరథేన చ ॥
టీక:-
సీత = సీత; అపి = కూడ; అనుగతా = అనుసరించినది; రామమ్ = శ్రీరాముడిని; శశినం = చంద్రుని; రోహిణీ = రోహిణి; యథా = వలె; పౌరైః = పౌరులు; అనుగతః = అనుసరించ బడెను; దూరమ్ = చాలా దూరము వరకు; పిత్రా = తండ్రి; దశరథేన = దశరథుని చేతను; చ.
భావము:-
లక్ష్మణుడే కాక, సీతాదేవికూడ శ్రీరాముని కూడా బయలుదేరెను. శ్రీరాముని తండ్రి అయిన దశరథుడు, అయోధ్యాపురములో నివసించు పౌరులు చాలా దూరము వరకు రాముని అనుసరించిరి.
1.1.29.
అనుష్టుప్.
శృంగిబేరపురే సూతం
గంగాకూలే వ్యసర్జయత్ ।
గుహమాసాద్య ధర్మాత్మా
నిషాదాధిపతిం ప్రియమ్ ॥
టీక:-
శృంగిబేరపురే = శృంగిబేరము అనే పురమునందు; సూతమ్ = రథసారథిని; గంగాకూలే = గంగాతీరమందు; వ్యసర్జయత్ = విడిచెను; గుహమ్ = గుహుని; ఆసాద్య = చేరి; ధర్మాత్మా = ధర్మాత్ముడైన రాముడు; నిషాద = బోయలకు; అధిపతిం = ప్రభువయిన; ప్రియమ్ = తన యందు ప్రీతి కలిగిన.
భావము:-
ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమందు కల శృంగిబేర పురములో తన సారథిని విడిచెను. నిషాదులకు ప్రభువు తన భక్తుడు ఐన గుహుని కలుసుకొనెను.
గమనిక:-
శృంగిబేర పురము అనగా విగ్రహవాక్యము శృంగిణాం బేరాణి యస్మిన్ తత్ శృంగిబేరమ్. శృంగి అనగా జింక, లేడి మొదలగు కొమ్ములు గల జంతువులు. బేరము అనగా శరీరము, చర్మము. పురము అనగా ఊరు, పట్టణము, కనుక శృంగిబేరపురము అనగా జింక చర్మాదులు లభించు పట్టణము.
1.1.30.
అనుష్టుప్.
గుహేన సహితో రామో
లక్ష్మణేన చ సీతయా ।
తే వనేన వనం గత్వా
నదీస్తీర్త్వా బహూదకాః ॥
టీక:-
గుహేన = గుహునిచే; సహితః = సహితముగ; రామః = శ్రీరాముడు; లక్ష్మణేన = లక్ష్మణునితో; చ = మఱియు; సీతయా = సీతాదేవితో; తే = ఆయొక్క; వనేన = వనమునుండి; వనం = మఱొక వనమునకు; గత్వా = వెళ్ళిరి; నదీః = నదిని; తీర్త్వా = దాటుచు; బహు = అధిక మైన; ఉదకాః = జలములు ఉన్నటువంటి.
భావము:-
ఆ గుహుడు సీతాదేవి, లక్ష్మణస్వామి సమేతుడైన శ్రీరాముని గంగ దాటించెను. వారు (లక్ష్మణ సమేత సీతారాములు) ఎక్కువ నీటితో ఉన్న అనేక నదులను అడలికి వెళ్ళిరి.
1.1.31.
అనుష్టుప్.
చిత్రకూట మనుప్రాప్య
భరద్వాజస్య శాసనాత్ ।
రమ్యమావసథం కృత్వా
రమమాణా వనే త్రయః ॥
టీక:-
చిత్రకూటమ్ = చిత్రకూట పర్వతప్రాంతమును; అనుప్రాప్య = చేరుకొనిరి; భరద్వాజస్య = భరద్వాజ మహర్షి యొక్క; శాసనాత్ = ఆదేశానుసారము; రమ్యమ్ = పర్ణశాలను; అవసథం = పర్ణశాలను; కృత్వా = నిర్మించుకుని; రమమాణా = క్రీడించుచు; వనే = వనమునందు; త్రయః = ముగ్గురు.
భావము:-
చిత్రకూట పర్వత ప్రాంతమును చేరుకొనిరి, భరద్వాజమహర్షి ఆదేశానుసారం అచట సీతారామలక్ష్మణులు ఒక అందమైన పర్ణశాలను నిర్మించుకుని దేవగంధర్వులవలె సుఖముగా నివసించిరి.
1.1.32.
అనుష్టుప్.
దేవగంధర్వ సంకాశాః
తత్ర తే న్యవసన్ సుఖమ్ ।
చిత్రకూటం గతే రామే
పుత్రశోకాతుర స్తథా ॥
టీక:-
దేవ = దేవతలతో; గంధర్వ = గంధర్వులతో; సంకాశాః = సమానముగా; తత్ర = అచట; తే = వారు; న్యవసన్ = నివసించిరి; సుఖమ్ = సుఖముగా; చిత్రకూటం = చిత్రకూట పర్వత ప్రాంతమునకు; గతే = వెళ్ళిన; రామే = రామునియందు; పుత్రశోక = పుత్రవిరహ శోకముచే; ఆతురః = పీడింపబడినవాడై; తథా = అట్లు రాజు.
భావము:-
అచట చిత్రకూటమున వారు దేవతలు గంధర్వులతో సమానంగా సుఖముగా నివసించారు. చిత్రకూటం వెళ్లిన రామునియెడ బెంగ పెట్టుకున్న దశరథమహారాజు సుతుని గురించి చింతించుచు స్వర్గస్తులైరి.
1.1.33.
అనుష్టుప్.
రాజా దశరథః స్వర్గం
జగామ విలప న్సుతమ్ ।
గతే తు తస్మి న్భరతో
వసిష్ఠప్రముఖై ర్ధ్విజైః ॥
టీక:-
దశరథః = దశరథ మహారాజు; స్వర్గమ్ = స్వర్గమును; జగామ = చేరెను; విలపన్ = చింతించుచు; సుతమ్ = సుతుని గూర్చి; గతే = మరణించగా; తు; తస్మిన్ = అప్పుడు; భరతః = భరతుడు; వసిష్ఠ = వసిష్ఠుడు; ప్రముఖైః = మున్నగువారు; ద్విజైః = బ్రాహ్మణులచేత.
భావము:-
సుతుని పై బెంగతో దశరథమహారాజు మరణించిన పిదప వసిష్ఠుడు మున్నగువారు బ్రాహ్మణులు అందరు భరతుని రాజ్యపాలన చేయుమని ఆజ్ఞాపించిరి.
1.1.34.
అనుష్టుప్.
నియుజ్యమానో రాజ్యాయ
నైచ్ఛద్రాజ్యం మహాబలః ।
సజగామ వనం వీరో
రామపాద ప్రసాదకః ॥
టీక:-
నియుజ్యమానః = నియోగింపబడినను; రాజ్యాయ = రాజ్యమును పాలించుటకు; న = లేదు; ఇచ్ఛత్ = ఇష్టపడ; రాజ్యం = రాజ్యమును; మహాబలః = మిక్కిలి బలశాలి ఐన భరతుడు; సః = అతడు; జగామ = వెళ్ళెను; వనం = వనమునకు; వీరః = వీరుడు; రామ = రాముని యొక్క; పాద = పాదములను ఆశ్రయించు; ప్రసాదకః = వరముకొఱకు.
భావము:-
వసిష్ఠాదులు రాజ్యపాలన చేయుమని ఆజ్ఞాపించినను ఆ మహాబలశాలి ఐన భరతుడు అంగీకరించ లేదు. ఆ వీరుడైన భరతుడు శ్రీరాముని పాదములను ఆశ్రయించు వరము పొందుటకై వనమునకు వెళ్ళెను.
1.1.35.
అనుష్టుప్.
గత్వా తు స మహాత్మానం
రామం సత్యపరాక్రమమ్ ।
అయాచ ద్భ్రాతరం రామమ్
ఆర్యభావ పురస్కృతః ॥
టీక:-
గత్వా = వెళ్ళి; తు; సః = అతడు భరతుడు; మహాత్మానమ్ = మహాత్ముడైన; రామం = శ్రీరాముని; సత్యపరాక్రమమ్ = మంచిపరాక్రమశాలి ఐన; అయాచత్ = వేడుకొనెను; భ్రాతరం = సోదరుడైన; రామమ్ = రాముని; ఆర్యభావ = పూజ్యభావము; పురస్కృతః = కూడిన వాడు.
భావము:-
ఆ భరతుడు మంచిపరాక్రమశాలి, మహాత్ముడు ఐన రాముని వద్దకు వెళ్ళెను. పూజ్యభావ పూర్వకముగా సోదరుడు శ్రీరాముని ఇలా వేడుకొనెను.
1.1.36.
అనుష్టుప్.
త్వమేవ రాజా ధర్మజ్ఞ
ఇతి రామం వచోఽ బ్రవీత్ । “
రామోఽ పి పరమోదారః
సుముఖః సుమహాయశాః ॥
టీక:-
త్వం = నీవు; ఏవ = మాత్రమే; రాజా = రాజువు; ధర్మజ్ఞ = సకల ధర్మములనెఱింగిన వాడవు; ఇతి = అని; రామం = రామునితో; వచః = అభిప్రాయమును; అబ్రవీత్ = చెప్పెను; రామః = జగదానందకారకుడు; అపి = అయినప్పటికి; పరమ = మిక్కిలి; ఉదారః = ఔదార్యము; సుముఖః = ప్రసన్నతలు ఉండుటచే; సు = చక్కటి; మహా = గొప్ప; యశాః = కీర్తికలిగినవాడు.
భావము:-
" సకల ధర్మములను ఎఱిగిన నీవు మాత్రము రాజు కాదగినవాడవు" అని శ్రీరాముడిని వేడుకొనెను. శ్రీరాముడు మిక్కిలి ఔదార్యము, ప్రసన్నతలు వలన చక్కటి గొప్ప పేరుపొందిన వాడు అయినను.
గమనిక:-
నీవే అర్హుడవు అనుటచే, జ్యేష్ఠుడు ఉండగా, చిన్నవాడు రాజ్యార్హుడు కాడు అను రాజ ధర్మమును కూడ భరతుడు సూచిస్తున్నాడు. అలా రాజ్యం చేపట్టిన వాడిని పరివేత్త అంటారు. (పోతన తెలుగు భాగవతంలో 9-663-వ.). 2. మహాయశాః అనుటలో విష్ణుపురాణంలో చెప్పిన న హ్యార్థినః కర్యవశాదుపేతా కకుత్థ్స వంశే విముఖాః ప్రయాస్తి అనగా కార్యమొకటి కోరి కకుత్థ్స వంశమువారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు అన్నది సూచితము.
1.1.37.
అనుష్టుప్.
న చైచ్ఛ త్పితురాదేశాత్
రాజ్యం రామో మహాబలః ।
పాదుకే చాస్య రాజ్యాయ
న్యాసం దత్త్వా పునః పునః ॥
టీక:-
న = లేదు; చ; ఇచ్ఛత్ = ఇష్టపడుట; పితుః = తండ్రి యొక్క; ఆదేశాత్ = ఆదేశము వలన; రాజ్యం = రాజ్యమేలుటకు; రామః = శ్రీరాముడు; మహాబలః = మహాబలశాలి; పాదుకే = పాదుకలను; చ; అస్య = వీనికి (భరతునకు); రాజ్యాయ = (రాజ ప్రతినిధిగా) రాజ్యము చేయుట కొఱకు; న్యాసం = వాడుటకు; దత్త్వా = ఇచ్చి; పునఃపునః = మాటిమాటికి.
భావము:-
పితృ ఆదేశమునకు బద్ధుడై రాజ్యమును (14 సంవస్తరములు) స్వీకరించుటకు ఇష్టపడలేదు. అటుపిమ్మట శ్రీరాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా (ఉంచుటకు) భరతునకు ఇచ్చి, అనేక విధములుగా నచ్చజెప్పి తిరిగి అయోధ్యకు పంపెను.
1.1.38.
అనుష్టుప్.
నివర్తయామాస తతో
భరతం భరతాగ్రజః ।
స కామ మనవాప్యైవ
రామపాదా వుపస్పృశన్ ।
టీక:-
నివర్తయామాస = మరలించెను; తతః = అటుపిమ్మట; భరతం = భరతుని; భరతాగ్రజః = భరతుని అన్న(శ్రీరాముడు); సః = అతడు(భరతుడు); కామమ్ = కోరిక; అనవాప్యైవ = నెరవేఱకున్నను; రామపాదౌ = రాముని పాదుకలను; ఉపస్పృశన్ = సేవించెను.
భావము:-
అలా నచ్చజెప్పి తిరిగి అయోధ్యకు పంపగా, భరతుడు శ్రీరాముని తనవెంట తీసుకువెళ్ళవలెనను కోరిక నెరవేఱకున్నను.
1.1.39.
అనుష్టుప్.
నందిగ్రామేఽ కరో ద్రాజ్యం
రామాగమన కాంక్షయా ॥
గతేతు భరతే శ్రీమాన్
సత్యసన్ధో జితేంద్రియః ॥
టీక:-
నందిగ్రామే = నందిగ్రామమునందు; అకరోత్ = చేసెను; రాజ్యమ్ = రాజ్యపాలన; రామాగమన = రామ+అగమన, శ్రీరాముడు తిరిగి రావాలనే; కాఙ్క్షయా = ఆకాంక్షతో; గతే = వెళ్ళిన పిమ్మట; తు; భరతే = భరతుడు; శ్రీమాన్ = ప్రశస్తమైన కాంతి కలిగినవాడు; సత్యసంధః = సత్యసంధుడు; జితేంద్రియః = ఇంద్రియములను జయించినవాడు.
భావము:-
శ్రీరామపాదుకలను సేవించుచు వాటిని సింహాసనముపై ప్రతిష్ఠించెను భరతుడు అలా వెళ్ళిన పిదప సత్యసంధుడు, జితేంద్రియుడు ఐన రాముడు.
1.1.40.
అనుష్టుప్.
రామస్తు పునరాలక్ష్య
నాగరస్య జనస్య చ ।
తత్రాగమన మేకాగ్రో
దండకాన్ ప్రవివేశ హ ॥
టీక:-
రామః = శ్రీరాముడు; తు; పునః = మఱల; ఆలక్ష్య = తెలిసి, ఊహించి; నాగరస్య = అయోధ్యా నగరము యొక్క; జనస్య = జనులు యొక్క; చ; తత్ర = అక్కడకు; ఆగమనమ్ = వచ్చుట, రాక; ఏకాగ్రః = అవశ్యము, తప్పక; దండకాన్ = దండకారణ్యమును; ప్రవివేశ = ప్రవేశించెను; హ.
భావము:-
శ్రీరామచంద్రుడు అచటకు అయోధ్యానగర పౌరుల రాక తప్పదని ఊహించి, దండకారణ్యమునకు వెళ్ళెను.
1.1.41.
అనుష్టుప్.
ప్రవిశ్య తు మహారణ్యం
రామో రాజీవలోచనః ।
విరాధం రాక్షసం హత్వా
శరభంగం దదర్శ హ ॥
టీక:-
ప్రవిశ్య = ప్రవేశించిన పిదప; తు; మహారణ్యమ్ = దండక మహారణ్యమును; మః = శ్రీరాముడు; రాజీవలోచనః = పద్మములవంటి నేత్రములు కలవాడు; విరాధమ్ = విరాధుడు అను; రాక్షసమ్ = రాక్షసుని; హత్వా = వధించి; శరభంగమ్ = శరభంగ మహర్షిని; దదర్శ = దర్శించెను; హ.
భావము:-
రాజీవలోచనుడు అయిన శ్రీరామచంద్రమూర్తి, దండకవనములో ప్రవేశించిన పిదప విరాధుడు అనే రాక్షసుడిని వధించెను; అటు పిమ్మట శరభంగ మహర్షిని దర్శించెను
1.1.42.
అనుష్టుప్.
సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ
అగస్త్యభ్రాతరం తథా ।
అగస్త్య వచనాచ్చైవ
జగ్రాహైంద్రం శరాసనమ్ ॥
టీక:-
సుతీక్ష్ణమ్ = సుతీక్ష్ణ మహర్షిని; చ; అపి = కూడ; అగస్త్యమ్ = అగస్త్య మహర్షిని; చ; అగస్త్యభ్రాతరమ్ = అగస్త్యుని సోదరుని; తథా = అటులనే (దర్శించెను); అగస్త్య = అగస్త్యమహర్షి; వచనాత్ = ఆదేశములను; చ; ఏవ = ప్రకారమే; జగ్రాహ = గ్రహించెను; ఐంద్రమ్ = ఐంద్రము అను; శరాసనమ్ = ధనుస్సును.
భావము:-
సుతీక్ష్ణ, అగస్త్య మహర్షులను మఱియు అగస్త్యుని సోదరుని కూడ దర్శించెను. ఐంద్రము అనే విల్లును గ్రహించను.
గమనిక:-
అగస్త్యభ్రాత - అగస్త్యమహర్షి సోదరుని పేరు "సుదర్శనుడు" అని సనత్కుమార సంహితలో ఉన్నది.
1.1.43.
అనుష్టుప్.
ఖడ్గం చ పరమప్రీతః
తూణీ చాక్షయసాయకౌ ।
వసతస్తస్య రామస్య
వనే వనచరైః సహ ॥
టీక:-
ఖడ్గమ్ = ఖడ్గమును; చ = కూడ; పరమ = మిక్కిలి; ప్రీతః = ప్రీతితో; తూణీ = అమ్ములపొదులు; చ; అక్షయసా = తరుగని; సాయకౌ = బాణములు జంటను; వసతః = నివసించువాడు; తస్య = ఆ; రామస్య = శ్రీరాముడి; వనే = అరణ్యము నందు; వనచరైః = ఆ వనములో ఉండెడి వారు; సహ = కూడి.
భావము:-
శ్రీరామచంద్రమూర్తి ఆ ఖడ్గమును మఱియు బాణములు అక్షయంగా ఉండే అమ్ముల పొదుల జంటను పరమ ప్రీతితో స్వీకరించెను. వారు దండకారణ్యములో నివసించుచుండగా, ఆయన వద్దకు అచటి ప్రజలు, ఋషులు అందఱు కలిసి వచ్చిరి.
1.1.44.
అనుష్టుప్.
ఋషయోఽ భ్యాగమన్ సర్వే
వధాయాసుర రక్షసామ్ ।
స తేషాం ప్రతిశుశ్రావ
రాక్షసానాం తదా వనే ॥
టీక:-
ఋషయః = ఋషులు; అభ్యాగమన్ = వచ్చినవారు; సర్వే = అందరు; వధాయ = వధించు; అసుర = అసురులను; రక్షసామ్ = రాక్షసులను; సః = ఆ శ్రీరాముడు; తేషామ్ = వారి; ప్రతిశుశ్రావ = విని అంగీకరించెను; రాక్షసానామ్ = రాక్షసుల; తథా = ఆ విన్నపమును; వనే = వనమునందు.
భావము:-
వచ్చిన ఋషులు అందరు రాక్షసులను వధించమని కోరుటకు వచ్చిరి. వారి ప్రార్థనను శ్రీరాముడు అంగీకరించెను.
1.1.45.
అనుష్టుప్.
ప్రతిజ్ఞాతశ్చ రామేణ
వధః సంయతి రక్షసామ్ ।
ఋషీణా మగ్నికల్పానాం
దండకారణ్య వాసినామ్ ॥
టీక:-
ప్రతిజ్ఞాతః = ప్రతిజ్ఞబూనబడెను; చ; రామేణ = రామునిచేత; వధః = వధించెదనని; సంయతి = యుద్ధమునందు; రక్షసామ్ = రాక్షసులను; ఋషీణామ్ = ఋషులకు; అగ్నికల్పానామ్ = అగ్నితుల్యులైన; దండకారణ్య = దండకారణ్యములోని; వాసినామ్ = ప్రజలకు.
భావము:-
వారి ప్రార్థనను అంగీకరించి, అగ్నితుల్యులైన ఆ మునీశ్వరుల ఎదుట, దండకారణ్యమిలోని ఎదుట "యుద్ధములో రాక్షసులను వధించెదను" అని ప్రతిజ్ఞబూనెను.
1.1.46.
అనుష్టుప్.
తేన తత్రైవ వసతా
జనస్థాన నివాసినీ ।
విరూపితా శూర్పణఖా
రాక్షసీ కామరూపిణీ ॥
టీక:-
తేన = వానిచే (శ్రీరామునిచే); తత్ర = అక్కడ (దండకారణ్యము నందు); ఏవ = మాత్రమే; వసతా = నివసించుచున్నది; జనస్థానృ = జనస్థానమునందు; నివాసినీ = నివసించునది; విరూపితా = వికృతరూపిగ చేయబడినది; శూర్పణఖా = శూర్పణఖ అను; రాక్షసీ = రాక్షసి; కామరూపిణీ = కోరిన రూపము ధరించగలిగినది.
భావము:-
శ్రీరాముడు ఆ దండకారణ్యములో నివసించుచుండగా, అదే వనమునందు జనస్థానములో ఉంటున్న రాక్షస స్త్రీ, కామరూపిణి అయిన శూర్పణఖను (లక్ష్మణస్వామిచే ముక్కు చెవులు కోయించి) విరూపిగా చేసెను.
గమనిక:-
జనస్థానము అనునది దండకవనములో జనులు నివసించు ఒక ప్రదేశము. శూర్పణఖ అననగా చుప్పనాతి, రావణుని చెల్లెలు. దీని మగఁడు విద్యుజ్జిహ్వుఁడు; కొడుకు జంబుకుమారుఁడు. రాముఁడు దండకారణ్యమున ఉండునపుడు ఒకనాడు ఈశూర్పణఖ అతనిపర్ణశాలకు వచ్చి అతఁడు తన్ను పెండ్లాడవలయును అను తలఁపున సీతాదేవిని మ్రింగపోఁగా లక్ష్మణుఁడు దీని ముక్కుచెవులుకోసి తఱిమెను. అంతట ఇది జనస్థానమునందు ఉన్న తన సోదరులగు ఖరుఁడు దూషణాదులతో తన అవమానపాటు చెప్పుకోఁగా ఆ రక్కసులు రామునితో పెనుయుద్ధము సలిపిరి. అందు వారితోపాటు పదునాలుగు వేల మంది రక్కసులు మడిసిరి. ఆవల శూర్పణఖ లంకకు పోయి రావణునికి తన భంగపాటు తెలిపి సీతమీఁద కామము కలుగ బోధించి ఆసీతను వాఁడు ఎత్తుకొని పోవునట్లు చేసెను.
1.1.47.
అనుష్టుప్.
తతః శూర్పణఖావాక్యాత్
ఉద్యుక్తా న్సర్వరాక్షసాన్ ।
ఖరం త్రిశిరసం చైవ
దూషణం చైవ రాక్షసమ్ ॥
టీక:-
తతః = అటుపిమ్మట; శూర్పణఖా = శూర్పణఖయొక్క; వాక్యాత్ = మాటల వలన; ఉద్యుక్తాన్ = యుద్దమునకు ఉద్యుక్తులైన; సర్వ = అందరు; రాక్షసాన్ = రాక్షసులను; ఖరమ్ = ఖరుడిని, త్రిశిరసమ్ = త్రిశిరసుని; చ; ఏవ = ఇంకా; దూషణమ్ = దూషణుడను; రాక్షసమ్ = రాక్షసులను; చ; ఏవ.
భావము:-
అటుపిమ్మట శూర్పణఖ మాటలచేత రెచ్చగొట్టబడిన ఖరుడు, త్రిశిరసుడు, దూషణుడు యుద్దమునకు ఉద్యుక్తులై రాగా, ఆ దండకారణ్యములో నివసించుచున్న శ్రీరాముడు జనస్థాన నివాసులయిన ఖర, దూషణ, త్రిశిరసులను. ఇంకా
1.1.48.
అనుష్టుప్.
నిజఘాన రణే రామః
తేషాం చైవ పదానుగాన్ ।
వనే తస్మి న్నివసతా
జనస్థాన నివాసినామ్ ॥
టీక:-
నిజఘాన = వధించెను; రణే = రణములో; రామః = శ్రీరాముడు; తేషామ్ = వారి యొక్క; చ; ఏవ = మఱియు; పదానుగాన్ = అనుచరులను; వనే = దండకారణ్యము నందు; తస్మిన్ = అక్కడ; నివసతా = నివసించుచున్న; జనస్థాన = జనస్థానములో; నివాసినామ్ = నివసించే.
భావము:-
అక్కడ ఉండి యుద్దములో వారి అనుచరులను సంహరించెను. ఆ జనస్థానములో నివసించేవారు.
1.1.49.
అనుష్టుప్.
రక్షసాం నిహతాన్యాసన్
సహస్రాణి చతుర్దశ ।
తతో జ్ఞాతివధం శ్రుత్వా
రావణః క్రోధమూర్ఛితః ॥
టీక:-
రక్షసామ్ = రాక్షసులు; నిహతాని = నిహతులు; అసన్ = అయిరి; సహస్రాణి = వేలు; చతుర్దశ = పదునాలుగు; తతః = అనంతరం; జ్ఞాత = దాయాదుల; వధమ్ = మరణము; శ్రుత్వా = విని; రావణః = రావణుడు; క్రోధమూర్ఛితః = కోపముతో ఉద్రిక్తుడాయెను.
భావము:-
అలా పదునాలుగువేలమంది రాక్షసులు మరణించారు. అనంతరము దాయాదుల మరణవార్త విన్న రావణుడు మిక్కిలి క్రోధోద్రిక్తుడాయెను.
1.1.50.
అనుష్టుప్.
సహాయం వరయామాస
మారీచం నామ రాక్షసమ్ ।
వార్యమాణః సుబహుశో
మారీచేన స రావణః ॥
టీక:-
సహాయమ్ = సహాయము; వరయామాస = అడిగెను; మారీచమ్ = మారీచుడను; నామ = నామముగల రాక్షసమ్ = రాక్షసుని; వార్యమాణః = వారించినవాడు; సుబహుశః = పెక్కుమార్లు; మారీచేన = మారీచునిచే; సః = అతడు; రావణః = రావణుడు;
భావము:-
సీతాదేవిని అపహరించుటకు, మారీచుడను రాక్షసుని సహాయము అడిగెను. మారీచుడు పెక్కుమార్లు ఆ రావణుడిని వారించెను.
1.1.51.
అనుష్టుప్.
న విరోధో బలవతా
క్షమో రావణ తేన తే" ।
అనాదృత్య తు తద్వాక్యమ్
రావణః కాలచోదితః ॥
టీక:-
న = కాదు; విరోధః = విరోధము; బలవతా = బలవంతుడు; క్షమః = తగినది; రావణ = ఓ రావణ; తేన = వానితో (శ్రీరామునితో); తే = నీకు; అనాదృత్య = అనాదరించెను; తు; తత్ = ఆ; వాక్యమ్ = మాటలను; రావణః = రావణుడు; కాలచోదితః = మృత్యువుచే ప్రేరేపించబడి.
భావము:-
"ఓ రావణ, శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు, అతనితో నీకు విరోధము తగదు" అని వారించెను. ఆయువు తీరిన రావణుడు మారిచుని మాటలను అనాదరించెను.
1.1.52.
అనుష్టుప్.
జగామ సహ మారీచః
తస్యాశ్రమపదం తదా ।
తేన మాయావినా దూరమ్
అపవాహ్య నృపాత్మజౌ ॥
టీక:-
జగామ = వెళ్ళెను; సహ = కూడి; మారీచః = మారీచునితో; తస్య = ఆ రాముని; ఆశ్రమ = ఆశ్రమ; పదమ్ = స్థానమునకు; తదా = అప్పుడు; తేన = వానిచే (మారీచునిచే); మాయావినా = మాయావి అయిన; దూరమ్ = దూరముగా; అపవాహ్య = పంపించెను; నృపాత్మజౌ = రాజకుమారులను ఇద్దరిని (శ్రీరామ లక్ష్మణులను).
భావము:-
అతనిని వెంట తీసుకుని శ్రీరాముని ఆశ్రమమునకు వెళ్ళెను. మాయావి అయిన మారీచునిచే శ్రీరామలక్ష్మణులను దూరముగా పంపించెను.
1.1.53.
అనుష్టుప్.
జహార భార్యాం రామస్య
గృధ్రం హత్వా జటాయుషమ్ ।
గృధ్రం చ నిహతం దృష్ట్వా
హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ॥
టీక:-
జహార = అపహరించెను; భార్యామ్ = భార్యను; రామస్య = రాముని; గృధ్రమ్ = గ్రద్దను; హత్వా = వధించెను; జటాయుషమ్ = జటాయువను; గృధ్రం చ = జటాయువును; చ; నిహతమ్ = కూల్చబడిన; దృష్ట్వా = చూచి; హృతామ్ = అపహరించబడినది అని; శ్రుత్వా = విని; చ; మైథిలీమ్ = మైథిలిని.
భావము:-
రావణుడు శ్రీరాముని భార్య సీతాదేవిని అపహరించెను. మార్గములో అడ్డువచ్చిన జటాయువును వధించెను. శ్రీరాముడు రావణునిచే పడగొట్టబడి అవసాన దశలో ఉన్న జటాయువు ద్వారా రావణుడు సీతను అపహరించెనని తెలుసుకునెను.
1.1.54.
అనుష్టుప్.
రాఘవః శోకసంతప్తో
విలలా పాకులేంద్రియః ।
తతస్తేనైవ శోకేన
గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ॥
టీక:-
రాఘవః = రాఘవుడు; శోకసంతప్తః = శోకముతో తపింపబడినవాడై; విలలాప = విలపించెను; ఆకులేంద్రియః = వ్యాకులపాటుతో; తతః = పిమ్మట; తేన ఏవ = ఆ శ్రీరాముడు; శోకేన = శోకముతో; గృధ్రమ్ = గ్రద్దను; దగ్ధ్వా = దహనము చేసెను (అంతిమ సంస్కారములు జరిపెను); జటాయుషమ్ = జటాయువును.
భావము:-
రఘురాముడు శోకముతో తపిస్తూ వ్యాకులపాటుకులోనై విలపించెను. పిమ్మట, రాముడు జటాయునకు శోకముతోడనే దహనసంస్కారములు చేసెను.
1.1.55.
అనుష్టుప్.
మార్గమాణో వనే సీతాం
రాక్షసం సందదర్శ హ ।
కబన్ధం నామ రూపేణ
వికృతం ఘోరదర్శనమ్ ॥
టీక:-
మార్గమాణః = అన్వేషించుచున్నవాడు; వనే = అడవిలో; సీతామ్ = సీతాదేవి కొఱకు; రాక్షసమ్ = రాక్షసుని; సందదర్శ = చూచెను; హ; కబంధమ్ = కబంధుడు అను; నామ = పేరుగల; రూపేణ = రూపములో; వికృతమ్ = వికృతమైన; ఘోర = భయంకరుని; దర్శనమ్ = భయంకరుని,
భావము:-
శ్రీరామచంద్రమూర్తి వనములో సీతాదేవిని అన్వేషించుచుండగా కబంధుడను పేరు కలిగిన, వికృతాకరముతో చూచుటకు భయంకరుడైన రాక్షసుని చూచెను.
గమనిక:-
కబంధుడు- దండకారణ్యము నందలి ఒక రాక్షసుడు. వీనికి కాళ్ళు లేవు . యోజనము పొడవు చేతులు రలవు. పొట్టలోనికి ముఖము అణిగిపోయి ఉంటుంది. పరమ భీకరుడు. పూర్వజన్మలో దనువు అను గంధర్వుడు, ఋషి శాపము వలన ఈ రూపు రొందెను.
1.1.56.
అనుష్టుప్.
తం నిహత్య మహాబాహుః
దదాహ స్వర్గతశ్చ సః ।
స చాస్య కథయామాస
శబరీం ధర్మచారిణీమ్ ॥
టీక:-
తమ్ = ఆ, రాక్షనుడిని; నిహత్య = వధించి; మహా = గొప్ప, బాహుః = భుజశక్తియుతుని, శ్రీరాముడు; దదాహ = కాల్చెను; స్వర్గతః = స్వర్గమును పొందెను; చ; సః = అతడు (jరాముడు); సః = అతడు (కబంధుడు); చ; అస్య = అతనికి (ఆ శ్రీరామునికి); కథయామాస = చెప్పెను; శబరీమ్ = శబరిని గూర్చి; ధర్మచారిణీమ్ = ధర్మములను ఆచరించునామెను.
భావము:-
గొప్పబాహువులు కలిగిన రాముడు ఆ రాక్షసుడిని వధించి దహన సంస్కారములు చేసెను. శ్రీరామునిచే దహనసంస్కారములు పొందుటచే ఆ రాక్షసునికి స్వర్గప్రాప్తి కలిగెను. కబంధుడు స్వర్గమునకు వెళ్ళుచు, శ్రీరామునితో ఇలా చెప్పెను "ఓ రాఘవ! దగ్గరలో ధర్మాత్మురాలైన శబరి కలదు
1.1.57.
అనుష్టుప్.
శ్రమణీం ధర్మనిపుణాం
అభిగచ్ఛేతి రాఘవ!" ।
సోఽ భ్యగచ్ఛ న్మహాతేజాః
శబరీం శత్రుసూదనః ॥
టీక:-
శ్రమణీమ్ = సన్న్యాసియును; ధర్మ = ధర్మాచరమణలో; నిపుణామ్ = నైపుణ్యము కలిగినదియును; అభిగచ్ఛ = వెళ్ళుము; ఇతి = తప్పక; రాఘవ = ఓ రాఘురా; సః = అతడు (శ్రీరాముడు); అభ్యగచ్ఛత్ = వెళ్ళెను; మహా = మహా; తేజాః = తేజశ్శాలి; శబరీమ్ = శబరి వద్దకు; శత్రుసూదనః = శత్రువులను సంహరించువాడు.
భావము:-
ఓ రామా! ధర్మం బాగా తెలిసిన శబరి వద్దకు తప్పక వెశ్శు.” మహాతేజశ్వి, శత్రువులను సంహరించువాడు అయిన ఆ శ్రీరామచంద్రమూర్తి శబరి వద్దకు వెళ్ళెను.
1.1.58.
అనుష్టుప్.
శబర్యా పూజితః సమ్యక్
రామో దశరథాత్మజః ।
పంపాతీరే హనుమతా
సంగతో వానరేణ హ ॥
టీక:-
శబర్యా = శబరిచేత; పూజితః = పూజింపబడెను; సమ్యక్ = చక్కగా; రామః = రాముడు; దశరథాత్మజః = దశరథ మహారాజు పుత్రుడైన; పంపా = పంపానది; తీరే = తీరమందు; హనుమతా = హనుమంతుడు అను; సంగతః = కలుసుకొనెను; వానరేణ = వానరుని; హ.
భావము:-
శబరి దశరథుని కుమారుడైన రాముని భక్తితో చక్కగా పూజించెను. శ్రీరాముడు, పంపాసరస్సుతీరమందు హనుమంతుడను వానరుని కలుసుకొనెను.
1.1.59.
అనుష్టుప్.
హనుమ ద్వచనాచ్చైవ
సుగ్రీవేణ సమాగతః ।
సుగ్రీవాయ చ తత్సర్వం
శంసద్రామో మహాబలః ॥
టీక:-
హనుమత్ = హనుమంతుని; వచనాత్ = మాటల; చ; ఏవ = వలన; సుగ్రీవేణ = సుగ్రీవుడిని; సమాగతః = కలుసుకొనెను; సుగ్రీవాయ = సుగ్రీవునకు; చ; తత్ = ఆ; సర్వమ్ = సమస్తమును; శంసత్ = వివరించెను; రామః = శ్రీరాముడు; మహా = మహా; బలః = బలశాలి అయిన.
భావము:-
ఆ హనుమంతుని మాటలవలన సుగ్రీవుడిని కలుసుకొనెను. మహాబలశాలి ఐన శ్రీరాముడు, తన వృత్తాంతమునంతటిని సుగ్రీవునకు జరిగినది జరిగినట్లుగా వివరించెను.
1.1.60.
అనుష్టుప్.
ఆదితస్తద్యథా వృత్తం
సీతాయాశ్చ విశేషతః ।
సుగ్రీవశ్చాపి తత్సర్వం
శ్రుత్వా రామస్య వానరః ॥
టీక:-
ఆదితః = మొదటినుండి; తత్ = దానిని; యథా = యథాతథంగా; వృత్తమ్ = వృత్తాంతమును; సీతాయాః = సీతాదేవి గురించి; చ; విశేషతః = విశేషించి; సుగ్రీవః = సుగ్రీవుడు; చ; అపి = కూడా; తత్ = ఆ; సర్వమ్ = సర్వమును (వృత్తాంత మంతయును); శ్రుత్వా = విని; రామస్య = శ్రీరాముని; వానరః = వానరుడైన.
భావము:-
మొదటినుండి సర్వం విశేషించి సీతాపహరణం గురించి తెలిపెను. వానరుడైన సుగ్రీవుడు శ్రీరాముని వృత్తాంతము అంతటిని వినిన తరువాత.
1.1.61.
అనుష్టుప్.
చకార సఖ్యం రామేణ
ప్రీతశ్చై వాగ్నిసాక్షికమ్ ।
తతో వానరరాజేన
వైరానుకథనం ప్రతి ॥
టీక:-
చకార = చేసెను; సఖ్యమ్ = మైత్రిని; రామేణ = శ్రీరామునితో; ప్రీతః = ప్రీతితో; చ = మఱియి; ఏవ = ఆసక్తితో; అగ్నిసాక్షికమ్ = అగ్నిసాక్షిగా; తతః = అటుపిమ్మట; నరరాజేన = వాలితో {వానరరాజు- వానరః (వానరులకు) రాజు, వాలి}; వైర = శతృత్వము; అనుకథనం = వృత్తాంతమును తెలుపమనెను; ప్రతి = గురించి.
భావము:-
ప్రీతితో అగ్నిసాక్షిగా ఆ రామచంద్రునితో మైత్రి చేసుకొనెను. అటుపిమ్మట శ్రీరాముడు వానరరాజైన వాలితో కలిగిన శతృత్వము గురంచి సుగ్రీవుని ప్రశ్నించెను.
1.1.62.
అనుష్టుప్.
రామాయావేదితం సర్వం
ప్రణయా ద్దుఃఖితేన చ ।
ప్రతిజ్ఞాతం చ రామేణ
తదా వాలివధం ప్రతి ॥
టీక:-
రామాయ = శ్రీరాముని కొఱకు; ఆవేదితం = తెలుపబడెను; సర్వమ్ = అంతయును; ప్రణయాత్ = మిత్రభావముతో; దుఃఖితేన = దుఃఖితుడై; చ; ప్రతిజ్ఞాతమ్ = ప్రతిజ్ఞ చేయబడెను; చ; రామేణ = శ్రీరామునిచే; తదా = అప్పుడు; వాలి = వాలిని; వధమ్ = వధించుట; ప్రతి = గురించి.
భావము:-
సుగ్రీవుడు దుఃఖితుడై శ్రీరామునికి జరిగిన వృత్తాంతము అంతటిని తెలిపెను. అనంతరము శ్రీరామచంద్రమూర్తి వాలిని సంహరించెదనని ప్రతిజ్ఞ చేసెను.
1.1.63.
అనుష్టుప్.
వాలినశ్చ బలం తత్ర
కథయామాస వానరః ।
సుగ్రీవః శంకితశ్చాసీత్
నిత్యం వీర్యేణ రాఘవే ॥
టీక:-
వాలినః = వాలియొక్క; చ; బలమ్ = బలమును; తత్ర = అక్కడ; కథయామాస = విపులముగా చెప్పెను; వానరః = వానరుడు (సుగ్రీవుడు); సుగ్రీవః = సుగ్రీవుడు; శఙ్కితఃచ = శంకిచుచున్నవాడు; చ = ఐ; ఆసీత్ = ఉండెను; నిత్యమ్ = ఎల్లపుడు; వీర్యేణ = పరాక్రమమునందు; రాఘవే = శ్రీరాముని.
భావము:-
అంతట సుగ్రీవుడు వాలియొక్క బలపరాక్రములగూర్చి విపులముగా వివరించెను. సుగ్రీవుడు, శ్రీరాముని బలపరాక్రమములను ఎప్పుడు సందేహించుచుండెను.
1.1.64.
అనుష్టుప్.
రాఘవప్రత్యయార్థం తు
దున్దుభేః కాయముత్తమమ్ ।
దర్శయామాస సుగ్రీవో
మహాపర్వత సన్నిభమ్ ॥
టీక:-
రాఘవ = శ్రీరాముని బలము; ప్రత్యయ = విశ్వాసనీయత తెలియుట; అర్థం = కొఱకు; తు; దున్దుభేః = దుందుభి; కాయమ్ = కాయమును; ఉత్తమమ్ = ఉత్తమమైన; దర్శయామాస = చూపించెను; సుగ్రీవః = సుగ్రీవుడు; మహా = పెద్ద; పర్వతః = కొండ; సన్నిభమ్ = వంటిదానిని.
భావము:-
సుగ్రీవుడు శ్రీరాముని శక్తి సామర్థ్యాల విశ్సనీయత తెలుసుకొనుట కొఱకు (వాలిచే వధింపబడిన) మహాపర్వతము వలెనున్న దుందుభి అను రాక్షసుని కళేబరమును చూపెను.
1.1.65.
అనుష్టుప్.
ఉత్స్మయిత్వా మహాబాహుః
ప్రేక్ష్య చాస్థి మహాబలః ।
పాదాంగుష్ఠేన చిక్షేప
సంపూర్ణం దశయోజనమ్ ॥
టీక:-
ఉత్ = సాలోచన, ఆంధ్రవాచస్పతము; స్మయిత్వా = మందహాసముతో; మహా = గొప్ప; బాహుః = భుజశక్తి కలిగిన; ప్రేక్ష్య = చూసి; చ; అస్థిః = అస్థిపంజరమును; మహాబలః = మహాబలశాలి; పాద = కాలి; అంగుష్ఠేన = బొటనవ్రేలితో; చిక్షేప = విసరివేసెను, తన్నెను; సంపూర్ణమ్ = పూర్తిగా; దశ = పది; యోజనమ్ = యోజనముల దూరమున.
భావము:-
మహాబాహువు, మహాబలశాలి అయిన శ్రీరాముడు సాలోచనపూర్వక మందహాసముతో ఆ కాయమును చూసి, తన కాలిబొటకనవ్రేలితో అస్థిపంజరమును పది యోజనముల దూరము పడునట్లు తన్నెను.
గమనిక:-
యోజనము- పురాతన దూరమానములోని కొలత. దీని విలువ ప్రాంతీయబేధాలు బట్టి మారుట ఉండెడిది. నిర్దిష్టమైన విలువ ఇప్పుడు అందుబాటులో లేదు. సుమారు 8 కిమీ అనీ 16 కిమీ అని వినబడుతోంది.
1.1.66.
అనుష్టుప్.
బిభేద చ పునస్సాలాన్
సప్తైకేన మహేషుణా ।
గిరిం రసాతలం చైవ
జనయ న్ప్రత్యయం తదా ॥
టీక:-
బిభేద = భేదించెను; చ; పునః = మఱల; సాలాన్ = మద్దిచెట్లను; సప్త = ఏడు; ఏకేన = ఒకేఒక్క; మహా = గొప్ప; ఇషుణా = బాణముతో; గిరిమ్ = కొండను; రసాతలమ్ = రసాతలమును; చైవ; జనయన్ = కలిగించుట కొఱకు; ప్రత్యయమ్ = విశ్వాసము; తదా = అప్పుడు ॥
భావము:-
శ్రీరాముడు సుగ్రీవునకు నమ్మకము కలిగించుటకు ఒకేఒక్క బాణముతో ఏడు సాలవృక్షములను, కొండను, రసాతలమును భేదించెను.
1.1.67.
అనుష్టుప్.
తతః ప్రీతమనాస్తేన
విశ్వస్తస్స మహాకపిః ।
కిష్కింధాం రామసహితో
జగామ చ గుహాం తదా ॥
టీక:-
తతః = అటుపిమ్మట; ప్రీతమనాః = సంతసించిన మనస్సు కలవాడు; తేన = దానిచేత (ఆ కార్యముతో); విశ్వస్తః = విశ్వాసము కూడా కలిగినవాడై; చ; సః = అతడు; మహాకపిః = గొప్ప వానరుడు అయిన సుగ్రీవుడు; కిష్కింధాం= కిష్కింధకు; రామ సహితః = శ్రీరామచంద్రునితో కూడి; జగామ చ = వెళ్ళెను; చ; గుహామ్ = గుహ యందున్న; తదా = అప్పుడు.
భావము:-
శ్రీరామచంద్రుని పరాక్రమమును కన్నులారా చూచిన మహావానరుడైన సుగ్రీవుడు ఎంతో సంతోషించెను. మిక్కిలి విశ్వాసము కలవాడై గుహలోనున్న కిష్కింధానగరమునకు శ్రీరామునితో కూడి వెళ్ళెను.
1.1.68.
అనుష్టుప్.
తతోఽ గర్జద్ధరివరః
సుగ్రీవో హేమపింగలః ।
తేన నాదేన మహతా
నిర్జగామ హరీశ్వరః ॥
టీక:-
తతః = అటుపిమ్మట; అగర్జత్ = గర్జించెను; హరివరః = వానరశ్రేష్ఠుడు; సుగ్రీవః = సుగ్రీవుడు; హేమపింగలః = బంగారపు గోరోజనపు వర్ణము కలిగినవాడు; తేన = ఆ; నాదేన = శబ్దముచే; మహతా = గొప్పదైన; నిర్జగామ = బయటకు వచ్చెను; హరీశ్వరః = వానరప్రభువైన వాలి.
భావము:-
అటుపిమ్మట, గోరోజనపు వర్ణము కలిగిన వానరశ్రేష్ఠుడు సుగ్రీవుడు గర్జించెను, ఆ గొప్పనాదమును విని వానరప్రభువు వాలి బయటకు వచ్చెను.
1.1.69.
అనుష్టుప్.
అనుమాన్య తదా తారాం
సుగ్రీవేణ సమాగతః ।
నిజఘాన చ తత్రైనం
శరేణైకేన రాఘవః ॥
టీక:-
అనుమాన్య = ఒప్పించి; తదా = అప్పుడు; తారామ్ = తారను; సుగ్రీవేణ = సుగ్రీవునితో; సమాగతః = కలిసెను (తలపడెను); నిజఘాన = వధించెను; చ; తత్ర = అక్కడ; ఏనమ్ = వానిని (వాలిని); శరేణ = ఒక్క బాణముచే; ఏకేన = ఒకే దానితో; రాఘవః = రాఘవుడు.
భావము:-
అప్పుడు (వారించుచున్న) తన భార్య తారను ఒప్పించి వాలి సుగ్రీవునితో తలపడెను. అంతట శ్రీరాముడు ఒకే బాణముతో వాలిని వధించెను.
1.1.70.
అనుష్టుప్.
తతః సుగ్రీవవచనాత్
హత్వా వాలిన మాహవే ।
సుగ్రీవమేవ తద్రాజ్యే
రాఘవః ప్రత్యపాదయత్ ॥
టీక:-
తతః = అటుపిమ్మట; సుగ్రీవ = సుగ్రీవుని; వచనాత్ = కోరికను అనుసరించి; హత్వా = వధించి; వాలినమ్ = వాలిని; ఆహవే = యుద్ధములో; సుగ్రీవమ్ = సుగ్రీవుడిని; ఏవ = మాత్రమే; తత్ = ఆ; రాజ్యే = రాజ్యమునకు; రాఘవః = రాఘవుడు; ప్రత్యపాదయత్ = ప్రతిష్ఠించెను.
భావము:-
శ్రీరామచంద్రుడు సుగ్రీవుని కోరిన ప్రకారం వాలిని వధించి, ఆ రాజ్యమునకు సుగ్రీవుడిని రాజుగా ప్రతిష్ఠించెను.
1.1.71.
అనుష్టుప్.
స చ సర్వాన్సమానీయ
వానరా న్వానరర్షభః ।
దిశః ప్రస్థాపయామాస
దిదృక్షు ర్జనకాత్మజామ్ ॥
టీక:-
సః = అతడు; చ; సర్వాన్ = అందఱిని; సమానీయ = రప్పించి; వానరాన్ = వానరులను; వానరర్షభః = వానర+ఋషభః, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు; దిశః = దిక్కులకు; ప్రస్థాపయామాస = పంపెను; దిదృక్షుః = చూచుటకు; జనకాత్మజామ్ = జనకమహారాజ పుత్రిక సీతాదేవిని.
భావము:-
వానరప్రభువైన సుగ్రీవుడు వానరులందఱిని రప్పించి సీతాదేవిని అన్వేషించుటకు అన్ని దిక్కులకు పంపెను.
1.1.72.
అనుష్టుప్.
తతో గృధ్రస్య వచనాత్
సంంపాతేర్హనుమాన్బలీ ।
శతయోజన విస్తీర్ణం
పుప్లువే లవణార్ణవమ్ ॥
టీక:-
తతః = అటుపిమ్మట; గృధ్ర = గ్రద్ద; అస్య = యొక్క; వచనాత్ = వచనములను అనుసరించి; సంపాతేః = సంపాతి అను; హనుమాన్ = హనుమంతుడు; బలీ = బలవంతుడు అయిన; శత = వంద; యోజన = యోజనముల; విస్తీర్ణమ్ = విస్తీర్ణము గల; పుప్లువే = దాటెను; లవణార్ణవమ్ = లవణ సముద్రమును.
భావము:-
జటాయువు సోదరుడైన సంపాతి అను పక్షిరాజు వచనములను అనుసరించి మహాబలసంపన్నుడైన ఆంజనేయుడు నూరు యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రమును దాటెను.
గమనిక:-
(1) సంపాతి- జటాయువు సోదరుడు సంపాతి. అనూరుని పెద్దకొడుకు. తల్లి శ్యేని. తమ్ముఁడు జటాయువు. కొడుకు సుపార్వ్శుఁడు. ఒకప్పుడు ఇతఁడును ఇతని తమ్ముఁడు అగు జటాయువును తమతమ శక్తి కొలఁదిని ఎఱుఁగ కోరి అంతరిక్షమునకు ఎగసి పైకిపోవుచు సూర్యమండలమును సమీపింపఁగా జటాయువు సూర్యుని వేఁడిమికి తాళచాలక క్రిందికి ఒఱగఁగా ఇతఁడు తన ఱెక్కలచేత అతనిని కప్పెను. అపుడు సూర్యకిరణముల వేఁడిమిచే ఇతని ఱెక్కలు కాలిపోయెను. అంతట మింట నిలువ నేరక ఇతఁడు సముద్రమునను, జటాయువు దండకారణ్యమునందలి జనస్థానమునను పడిరి. పిమ్మట ఇతఁడు హనుమదాదులకు సీత లంకలో ఉండు వృత్తాంతమును తెలిపి ఆసుకృతాతిశయముచే మరల ఱెక్కలు మొలవఁగా తన ఉనికిపట్టు అగు హిమవంతమునకు పోయి చేరెను. పురాణనామచంద్రిక. (2) సంపాతము అంటే పట్టి వాలుట. కనుక, సంపాతి అంటే వాలుటలో నేర్పరి అనవచ్చును.?
1.1.73.
అనుష్టుప్.
తత్ర లంకాం సమాసాద్య
పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయన్తీమ్
అశోకవనికాం గతామ్ ॥
టీక:-
తత్ర = అచట; లంకాం = లంకను; సమ = చక్కగా; ఆసాద్య = చేరి; పురీం = లంకాపురమును; రావణ = రావణుడిచే; పాలితామ్ = పాలింపబడుచున్న దానిని; దదర్శ = చూచెను; సీతాం = సీతాదేవిని; ధ్యాయన్తీం = ధ్యానములోనున్నామెను; అశోకవనికాం = అశోకవనములో; గతామ్ = ఉన్నామెను
భావము:-
హనుమంతుడు రావణునిచే పాలింపబడుచున్న లంకాపురమునకు చక్కగా చేరెను. అచట ఆశోకవనములో ధ్యానించుచున్న సీతాదేవిని దర్శించెను.
1.1.74.
అనుష్టుప్.
నివేదయిత్వాఽ భిజ్ఞానం
ప్రవృత్తిం వినివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం
మర్దయామాస తోరణమ్ ॥
టీక:-
నివేదయిత్వా = సమర్పించెను; అభిజ్ఞానమ్ = ఆనవాలు (రాముడిచ్చిన ఉంగరము); ప్రవృత్తిం = వృత్తాంతమును, సమాచారాము; వినివేద్య = విన్నవించెను; చ; సమాశ్వస = ఓదార్చుట; అస్య = చేసెను; చ = మఱియు; వైదేహీమ్ = సీతాదేవిని; మర్దయామాస = ధ్వంసము చేసెను; తోరణమ్ = తోరణమును.
భావము:-
అంతట ఆంజనేయస్వామి శ్రీరాముడు ఆనవాలుగా తనకు ఇచ్చిన ఉంగరమును సీతాదేవికు సమర్పించి, రామ సమాచారము వివరించెను. సీతాదేవిని ఓదార్చెను. తదుపరి ఆశోకవన ప్రవేశ ద్వారమును ధ్వంసము చేసెను.
1.1.75.
అనుష్టుప్.
పంచ సేనాగ్రగాన్హత్వా
సప్త మంత్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య
గ్రహణం సముపాగమత్ ॥
టీక:-
పంచ = ఐదుగురు; సేనాగ్రగాన్ = సేనానాయకులను; హత్వా = వధించి; సప్త = ఏడుగురు; మంత్రి = మంత్రులయొక్క; సుతాన్ = పుత్రులను; అపి = కూడా; శూరమ్ = శూరుడైన; అక్షం = అక్షకుమారుని; చ; నిష్పిష్య = చూర్ణముచేసెను; గ్రహణం = బంధనము; సముపాగమత్ = పొందెను.
భావము:-
హనుమంతుడు పంచసేనాగ్రనాయకులను, ఏడుగురు మంత్రి పుత్రులను వధించెను. రావణాసురుని పుత్రుడైన శూరుడు అక్షకుమారుని కూడా చూర్ణం చేసెను. అనంతరము (ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు) కట్టుబడెను.
గమనిక:-
రావణుని తండ్రి విశ్వవసు, తల్లి కైకసి. పితామహుడు బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు. మాతామహుడు సుమాలి. కుబేరుడు సవితిసోదరుడు, సోదరులు సోదరీమణులు. 1) విభీషణుడు, 2) కుంభకర్ణుడు.3) ఖరుడు, 4) దూషణుడు 5) అహిరావణుడు, 6) కుంభిని, 7) శూర్పణక. పుత్రులు ఏడుగురు, 1) ఇంద్రజిత్తు, 2) ప్రహస్థుడు, 3) అతికాయుడు, 4) అక్షకుమారుడు, 5) దేవాంతకుడు, 6) నరాంతకుడు, 7) త్రిశిరుడు.
1.1.76.
అనుష్టుప్.
అస్త్రేణోన్ముక్త మాత్మానం
జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్ రాక్షసాన్వీరో
యంత్రిణస్తాన్య దృచ్ఛయా ॥
టీక:-
అస్త్రేణ = అస్త్రముచే; ఉన్ముక్తమ్ = విముక్తిచెందినవానిగా; ఆత్మానమ్ = తనను; జ్ఞాత్వా = తెలుసుకుని; పైతామహాత్ = బ్రహ్మదేవుడు ఇచ్చిన; వరాత్ = వరము ప్రభావముచే; మర్షయన్ = సహించుచు; రాక్షసాన్ = రాక్షసులను; వీరః = వీరుడు; యంత్రిణః = త్రాళ్ళతో కట్టిన; తాన్ = ఆ; యదృచ్ఛయా = అనుకోకుండా.
భావము:-
ఇంతకు పూర్వం బ్రహాదేవుడు ఇచ్చిన వర ప్రభావముచే అనుకోకుండా వచ్చిన బ్రహ్మాస్త్రమునుండి తాను విముక్తిపొందినప్పటికి, త్రాళ్ళతో కట్టబడిన ఆ మహావీరుడైన ఆంజనేయుడు (రావణునితో మాట్లాడుటకు) రాక్షసులు పెడుతున్న బాధలను సహించుచు (రావణసభలోనికి వెళ్ళెను).
1.1.77.
అనుష్టుప్.
తతో దగ్ధ్వా పురీం లంకాం
ఋతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం
పునరాయాన్ మహాకపిః ॥
టీక:-
తతః = అటు పిమ్మట; దగ్ధ్వా = తగులపెట్టి; పురీం = పురమును; లఙ్కాం = లంక అనెడి; ఋతే = తప్పించి; సీతాం = సీతాదేవి; చ = అయిన; మైథిలీమ్ = మిథిల రాకుమారి; రామాయ = శ్రీరామునకు; ప్రియమ్ = ప్రియమైన ఈ విషయమును; ఆఖ్యాతుమ్ = చెప్పుటకు; పునః = మళ్ళీ; ఆయాత్ = వచ్చెను; మహాకపిః = గొప్ప వానరుడు (హనుమంతుడు).
భావము:-
అటుపిమ్మట (రావణ ఆజ్ఞానుసారమై తోకకు నిప్పు పెట్టగా, ఆ నిప్పుతో) సీతాదేవి ఉన్న ప్రదేశము తప్పించి మిగిలిన లంకా పట్టణమును తగులపెట్టెను. శ్రీరామునికి ప్రీతిగొలిపే ఈ విషయము తెలుపుటకు మళ్ళీ రామునికడకు వచ్చెను.
1.1.78.
అనుష్టుప్.
సోఽ ధిగమ్య మహాత్మానం
కృత్వా రామం ప్రదక్షిణమ్ ।
న్యవేదయ దమేయాత్మా
దృష్టా సీతేతి తత్త్వతః ॥
టీక:-
సః = అతడు (హనుమంతుడు); అధిగమ్య = చేరుకొనబడెను; మహాత్మానాం = మహాత్మునిచే; కృత్వా = చేసి; రామం = శ్రీరామునకు; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణ పూర్వక నమస్కారము; న్యవేదయత్ = నివేదించెను; అమేయాత్మా = మహాబుద్ధిశాలి అయిన {అమేయాత్మా- అమేయ+ఆత్మ, అపరిమితమైన బుద్ధి కలవాడు, మహాబుద్ధిశాలి}; "దృష్టా సీతేతి" = చూడబడెను సీత; తత్త్వతః = ఉన్నది ఉన్నట్టుగా.
భావము:-
అపరిమితబుద్ధిశాలి అయిన ఆంజనేయుడు శ్రీరాముని కడకు చేరుకుని, ఆయనకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి "చూసాను సీతాదేవిని" అని చెప్పి, జరిగినదంతా ఉన్నది ఉన్నట్లుగా వివరించెను.
1.1.79.
అనుష్టుప్.
తతః సుగ్రీవసహితో
గత్వా తీరం మహోదధేః ।
సముద్రం క్షోభయామాస
శరై రాదిత్య సంనిభైః ॥
టీక:-
తతః = అటుపిమ్మట; సుగ్రీవ = సుగ్రీవునితో; సహితః = కూడినవాడై; గత్వా = చేరి; తీరం = తీరమును; మహోదధేః = మహాసముద్రము యొక్క; సముద్రం = సముద్రమును; క్షోభయామాస = క్షోభింపజేసెను; శరైః = బాణములచే; ఆదిత్య = సూర్యకిరణములతో; సన్నిభైః = సమానమైన.
భావము:-
అనంతరము శ్రీరామచంద్రుడు సుగ్రీవసహితుడై మహాసముద్రతీరమునకు చేరెను. (సముద్రుడు సహకరించకపోవుటచే క్రుద్ధుడైన శ్రీరాముడు) సూర్యకిరణములతో సమాన తీక్షణములైన బాణములచే సముద్రమును క్షోభింపజేసెను.
1.1.80.
అనుష్టుప్.
దర్శయామాస చాత్మానం
సముద్రస్సరితాం పతిః ।
సముద్రవచనాచ్చైవ
నలం సేతుమకారయత్ ॥
టీక:-
దర్శయామాస = దర్శింపజేసెను; చ = తన; ఆత్మానమ్ = నిజరూపమును; సముద్రః = సముద్రుడు; సరితాం = నదులకు; పతిః = భర్త; సముద్ర = సముద్రుని; వచనాత్ = వచనముల; చ; ఏవ = ప్రకారము; నలం = నలునిచే; సేతుమ్ = సేతువును; అకారయత్ = చేయించెను (నిర్మింపజేసెను).
భావము:-
అంతట నదులకు పతి అయిన సముద్రుడు తన నిజరూపమున సాక్షాత్కరించెను. ఆ సముద్రుని మాటలను అనుసరించి శ్రీరాముడు నలునిచే వారధిని నిర్మింపజేసెను.
1.1.81.
అనుష్టుప్.
తేన గత్వా పురీం లంకాం
హత్వా రావణ మాహవే ।
రామః సీతామనుప్రాప్య
పరాం వ్రీడా ముపాగమత్ ॥
టీక:-
తేన = ఆ వారధిని; గత్వా = దాటి; పురీం = పురమును; లంకామ్ = లంక అనెడి; హత్వా = వధించెను; రావణమ్ = రావణుని; ఆహవే = యుద్ధమునందు; రామః = శ్రీరాముడు; సీతామ్ = సీతాదేవిని; అనుప్రాప్య = పొంది; పరాం = అధికమైన; వ్రీడామ్ = సిగ్గును; ఉపాగమత్ = పొందెను.
భావము:-
శ్రీరాముడు ఆ వారధి దాటి లంకాపురమును చేరి యుద్ధమునందు రావణుని వధించెను. సీతను పొంది (పరగృహమందున్న భార్యను ఎలా స్వీకరించవలెను అని) మిక్కిలి సిగ్గుపడెను.
1.1.82.
అనుష్టుప్.
తామువాచ తతో రామః
పరుషం జనసంసది ।
అమృష్యమాణా సా సీతా
వివేశ జ్వలనం సతీ ॥
టీక:-
తామ్ = ఆమెతో (సీతాదేవితో); ఉవాచ = చెప్పెను; తతః = అటుపిమ్మట; రామః = శ్రీరాముడు; పరుషం = పరుషముగా; జన = జనుల; సంసది = సమక్షములో; అమృష్యమాణా = సహింపలేక; సా = ఆ; సీతా = సీతాదేవి; వివేశ = ప్రవేశించెను; జ్వలనం = అగ్నిలోనికి; సతీ = సాధ్వియైన.
భావము:-
అటుపిమ్మట శ్రీరాముడు అందఱి సమక్షములో సీతాదేవితో పరుషముగా మాట్లాడెను. పరమసాధ్వీమణి అయిన ఆ సీతాదేవి ఆ పరుషవాక్కులను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను.
గమనిక:-
శ్రీరాముడు సీతాదేవిను ఎక్కడా అనుమానించలేదు, అగ్నిపరీక్ష కోరలేదు. సీతాదేవి తనంత తానుగా అగ్నిలోనికి ప్రవేశించినది. శ్రీరామునికి సీతమ్మను అగ్ని ఏమి చేయలేదని తెలుసు గనుక అజ్ఞానుల కళ్ళు తెఱిపించుట కొఱకు అట్లు పలికి సీతమ్మ పాతివ్రత్యమును లోకమునకు చాటిచెప్పెను. సుందరకాండ 55వ సర్గ 23 అథవా చారుసర్వాఙ్గీ రక్షితా స్వేన తేజసా । న నశిష్యతి కల్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే ॥ హనుమస్వామి లంకాపురిని కాల్చిన తరువాత సీతాదేవి గూర్చి చింతించుచు ఇలా అనుకున్నారు "అగ్నిని అగ్ని దహించలేదు కదా." హనుమస్వామికి తెలిసిన ఈ విషయము శ్రీరామచంద్రునికి తెలియదు అనుకొనుట అజ్ఞానము.)
1.1.83.
అనుష్టుప్.
తతోఽ గ్నివచనా త్సీతాం
జ్ఞాత్వా విగతకల్మషామ్ ।
బభౌ రామః సంప్రహృష్టః
పూజితః సర్వదైవతైః ॥
టీక:-
తతః = అటుపిమ్మట; అగ్నివచనాత్ = అగ్నిదేవుని మాటలచే; సీతామ్ = సీతాదేవిని; జ్ఞాత్వా = తెలిసికొని; విగతకల్మషామ్ = దోషరహితయని; బభౌ = ప్రకాశించెను; రామః = శ్రీరామచంద్రుడు; సంప్రహృష్టః = సంతోషించిన వాడై; పూజితః = పూజింపబడెను; సర్వ = సమస్త; దైవతైః = దేవతలచే.
భావము:-
అప్పుడు సీతాదేవి ఎట్టి కళంకములు లేనట్టి మహాపతివ్రత యని అగ్నిదేవుడు ప్రకటించగా శ్రీరాముడు గ్రహించెను. అంత సంతోషించిన శ్రీరాముని సకల దేవతలు పూజింపగా ప్రకాశించెను.
1.1.84.
అనుష్టుప్.
కర్మణా తేన మహతా
త్రైలోక్యం సచరాచరమ్ ।
స దేవర్షిగణం తుష్టం
రాఘవస్య మహాత్మనః ॥
టీక:-
కర్మణా = కర్మచేత; తేన = ఆ; మహతా = గొప్పదైన; త్రైలోక్యం = ముల్లోకములు; స = కూడిన; చరాచరమ్ = సకల చరాచరములతోను; స = కూడిన; దేవర్షి = దేవర్షుల; గణం = సమూహములతోను; తుష్టమ్ = సంతోషము పొందెను; రాఘవ = శ్రీరాముని; అస్య = ఆ యొక్క; మహాత్మనః = మహాత్ముడు.
భావము:-
మహాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి కార్యానికి దేవతలు, ఋషులు, సకల చరాచరములతో కూడిన ముల్లోకములు సంతోషము పొందెను.
1.1.85.
అనుష్టుప్.
అభిషిచ్య చ లంకాయాం
రాక్షసేంద్రం విభీషణమ్ ।
కృతకృత్యస్తదా రామో
విజ్వరః ప్రముమోద హ ॥
టీక:-
అభిషిచ్యృ = అభిషేకము; చ = చేసి; లంకాయామ్ = లంకయందు; రాక్షస = రాక్షసుల; ఇంద్రం = రాజుగా; విభీషణమ్ = విభీషణుని; కృతకృత్యః = కృతకృత్యుడయ్యెను; తదా = అప్పుడు; రామః = శ్రీరామచంద్రుడు; వి = విగత; జ్వరః = క్షోభ కలవాడై; ప్రముమోద = సంతోషించెను; హ.
భావము:-
శ్రీరాముడు (ఒకసారి సుగ్రీవుని కిష్కిందకు, మఱియొకసారి) విభీషణుని రాక్షసరాజుగా లంకానగరములో అభిషిక్తునిచేసి కృతకృత్యుడయ్యెను. తన ప్రతిజ్ఞ నిలుపుకున్నందుకు క్షోభ వీడి సంతసించెను.
1.1.86.
అనుష్టుప్.
దేవతాభ్యో వరం ప్రాప్య
సముత్థాప్య చ వానరాన్ ।
అయోధ్యాం ప్రస్థితో రామః
పుష్పకేణ సుహృద్వృతః ॥
టీక:-
దేవతాభ్యః = దేవతలనుండి; వరం = వరమును; ప్రాప్య = పొంది; సముత్థాప్య = లేపి (పునర్జీవితులను చేసి); చ; వానరాన్ = వానరములను; అయోధ్యాం = అయోధ్యకు; ప్రస్థితః = ప్రయాణమాయెను. రామః = శ్రీరామచంద్రుడు; పుష్పకేణ = పుష్పక విమానములో; సుహృత్ = మిత్రుల; వృతః = సమూహములతో కూడి.
భావము:-
శ్రీరాముడు దేవతలనుండి వరము పొంది, రణరంగములో విగతజీవులైన వానరులందఱిని పునర్జీవుతులుగ చేసెను. మిత్రులతో పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు బయలుదేరెను.
1.1.87.
అనుష్టుప్.
భరద్వాజాశ్రమం గత్వా
రామః సత్యపరాక్రమః ।
భరతస్యాంతికం రామో
హనూమంతం వ్యసర్జయత్ ॥
టీక:-
భరద్వాజ = భరద్వాజుని; ఆశ్రమం = ఆశ్రమమునకు; గత్వా = వెళ్ళి; రామః = శ్రీరామచంద్రుడు; సత్యపరాక్రమః = సత్య పరాక్రముడు {వ్యర్థముకాని పరాక్రమము కలిగినవాడు}; భరత = భరతుని; అస్య = కి; అంతికం = దగ్గరకు; రామః = శ్రీరామచంద్రుడు; హనూమంతం = హనుమస్వామిని; వ్యసర్జయత్ = పంపెను.
భావము:-
పిమ్మట సత్యపరాక్రముడు శ్రీరామచంద్రమూర్తి భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. భరతుని వద్దకు ఆంజనేయుడిని పంపెను.
1.1.88.
అనుష్టుప్.
పునరాఖ్యాయికాం జల్పన్
సుగ్రీవ సహితశ్చ సః ।
పుష్పకం తత్సమారుహ్య
నందిగ్రామం యయౌ తదా ॥
టీక:-
పునః = మరల; అఖ్యాయికాం = జరిగిన వృత్తాంతమును; జల్పన్ = చెప్పుచు; సుగ్రీవ = సుగ్రీవునితో; సహితః = కూడినవాడై; చ; సః = అతడు (శ్రీరాముడు); పుష్పకం = పుష్పక విమానమును; తత్ = పిమ్మట; సమారుహ్య = అధిరోహించి; నందిగ్రామం = నందిగ్రామమునకు; యయౌ = చేరెను; తదా = అప్పుడు.
భావము:-
అటుపిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు (భరద్వాజాశ్రమము నుండి) తిరిగి సుగ్రీవ సహితుడై పుష్పకవిమానమును అధిరోహించి, మార్గమునందు పూర్వ వృత్తాంతములను చెప్పుచు నందిగ్రామమునకు చేరెను.
గమనిక:-
పుష్పకవిమానము- గాలిలో ఎగరగలిగే వాహనము. ఎందరు ఎక్కినా ఇంకొకరికి ఇందులో చోటు ఉంటుంది. మణులతోనూ, వజ్రములతోనూ చిత్రితమైన విచిత్ర దివ్య విమానము. దేవశిల్పి విశ్వకర్మ నిర్మితము. బ్రహ్మదేవుని నుండి కుబేరుడు పొందాడు. కుబోరుని నుండి దీనిన రావణుడు తీసుకనెను.
1.1.89.
అనుష్టుప్.
నందిగ్రామే జటాం హిత్వా
భ్రాతృభిః సహితోఽ నఘః ।
రామః సీతా మనుప్రాప్య
రాజ్యం పున రవాప్తవాన్ ॥
టీక:-
నందిగ్రామే = నందిగ్రామమునందు; జటాం = జటను; హిత్వా = విడిచి; భ్రాతృభిః = సోదరులతో; సహితః = కలిసి; అనఘః = పాపరహితుడు; రామః = శ్రీరామచంద్రమూర్తి; సీతామ్ = సీతాదేవిని; అనుప్రాప్య = పొంది; రాజ్యం = రాజ్యమును; పునః = మఱల; అవాప్తవాన్ = పొందెను.
భావము:-
పాపరహితుడు శ్రీరామచంద్రమూర్తి సోదరులతో కూడి జటలను విడిచెను. సీతాదేవిను తిరిగి పొందిన ఆ శ్రీరాముడు కోసల రాజ్యాధికారము పొందెను.
1.1.90.
అనుష్టుప్.
ప్రహృష్టముదితో లోకః
తుష్టః పుష్టః సుధార్మికః ।
నిరామయో హ్యరోగశ్చ
దుర్భిక్ష భయవర్జితః ॥
టీక:-
ప్రహృష్టః = సంతోషముతో; ముదితః = పొంగిపోయినవి; లోకః = లోకములు; తుష్టః = సంతృప్తి చెందినవి; పుష్టః = వృద్ధి పొందినవి; సుధార్మికః = ధార్మికముగా నడుచుకున్నవి; నిరామయః = పీడలులేనివి; హ; అరోగః = వ్యాధులు లేనివి; చ; దుర్భిక్ష = కఱవు కాటకముల; భయ = భయము; వర్జితః = తొలగినవి.
భావము:-
శ్రీరాముడు అయోధ్య రాజ్య పట్టాభిషిక్తుడు అయినందుకు లోకములన్నియు సంతోషముతో పొంగిపోయెను. ఆ శ్రీరామ పాలనలో ప్రజలు ఎల్లప్పుడు సంతృప్తి చెందినవారై, వృద్ధిపొందుచు, ధర్మమును ఆచరించుచు, పీడలు మఱియు వ్యాధులులేనివారై, కఱవు కాటకములచే భయము తొలగినవారై ఆనందముగా జీవించిరి.
1.1.91.
అనుష్టుప్.
న పుత్రమరణం కించిత్
ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ ।
నార్య శ్చావిధవా నిత్యం
భవిష్యంతి పతివ్రతాః ॥
టీక:-
న = లేదు; పుత్ర = పుత్రుడు; మరణం = మరణించుట; కించిత్ = కొంచెమైనను; ద్రక్ష్యంతి = చూచుట; పురుషాః = పురుషులు; క్వచిత్ = ఎక్కడను; నార్యః = స్త్రీలు; చ; అవిధవా = వైధవ్యమును లేనివారై; నిత్యమ్ = ఎల్లప్పుడు; భవిష్యంతి = కాగలరు; పతివ్రతాః = పతివ్రతలు.
భావము:-
రామరాజ్యములో ఎక్కడా తండ్రి ఉండగా పుత్రుడు మరణించుట సంభవించదు. స్త్రీలు వైధవ్యమును పొందరు, వారు ఎల్లప్పుడు పతివ్రతలై జీవించెదరు.
1.1.92.
అనుష్టుప్.
న చాగ్నిజం భయం కించిత్
నాప్సు మజ్జంతి జంతవః ।
న వాతజం భయం కించిత్
నాపి జ్వరకృతం తథా ॥
టీక:-
న = లేవు; చ; అగ్ని = అగ్నివలన; జం = కలుగు; భయం = భయములు; కించిత్ = కొంచెమైనను; న = జరుగదు; అప్సు = నీటిలో; మజ్జంతి = మునిగి మరణించుట; జంతవః = ప్రాణులు; న = లేవు; వాత = వాయువు వలన; జం = కలుగు; భయం = భయములు; కించిత్ = కొంచెమైనను; న = లేవు; అపి = కూడా; జ్వర = వ్యాధులు; కృతం = కలిగెడివి; తథా = అలాగే.
భావము:-
శ్రీరాముని రాజ్యములో అగ్ని, జలము, వాయువు, వ్యాధుల వలన కలుగు ప్రమాదములు ఏవీ లేవు.
1.1.93.
అనుష్టుప్.
న చాపి క్షుద్భయం తత్ర
న తస్కరభయం తథా ।
నగరాణి చ రాష్ట్రాణి
ధనధాన్య యుతాని చ ॥
టీక:-
న = లేవు; చ; అపి = కూడ; క్షుత్ = ఆకలి వలన; భయం = భయములు; తత్ర = అక్కడ; న = లేవు; తస్కర = దొంగల; భయం = భయములును; తథా = అలాగే; నగరాణి = నగరములు; చ = మఱియు; రాష్ట్రాణి = దేశములో భాగములు రాష్ట్రములు; ధన = సంపదలు; ధాన్య = ఆహారపదార్థాలు; యుతాని = కూడుకున్నవి; చ.
భావము:-
శ్రీరాముడు రాజ్యము చేయుచుండగా, ఆకలి భయములు కాని, దొంగల భయములు కాని లేవు. నగరములు ఇంకా అన్ని ప్రాంతములు కూడ ధన ధాన్యములతో తులతూగుచుండెడివి.
1.1.94.
అనుష్టుప్.
నిత్యం ప్రముదితాస్సర్వే
యథా కృతయుగే తథా ।
అశ్వమేధశతైరిష్ట్వా
తథా బహుసువర్ణకైః ॥
టీక:-
నిత్యం = ఎల్లప్పుడు; ప్రముదితాః = ఆనందముతో ఉండిరి; సర్వే = అందఱు; యథా = ఏవిధముగా; కృతయుగే = కృతయుగము; తథా = ఆ విధముగా; అశ్వమేధ = అశ్వమేధయాగములు; శతైః = వందలాది; ఇష్ట = యాజ్ఞములు; వ; తథా = అదేవిధముగా; బహుసువర్ణకైః = బహుసువర్ణక యాగములు.
భావము:-
రామరాజ్యములో కృతయుగములో వలె ప్రజలందఱు సంతోషంతో జీవించిరి. శ్రీరామచంద్రుడు వందలకొలది అశ్వమేధయాగములు, అనేక సువర్ణక యాగములను ఆచరించెను.
గమనిక:-
బహుసువర్ణక యజ్ఞములు- శ్లో. సుబహూని సువర్ణాని। యత్రోపరణానిత్వతః। విందతో స క్రతుస్సద్భిః । స్మృతో బహు సువర్ణకైః॥ బంగారు ఉపకరణములు అత్యధిక సంఖ్యలో వినియోగించినది బహుసువర్ణక యాగము అందురు.
1.1.95.
అనుష్టుప్.
గవాం కోట్యయుతం దత్త్వా
బ్రహ్మలోకం ప్రయాస్యతి ।
అసంఖ్యేయం ధనం దత్త్త్వా
బ్రాహ్మణేభ్యో మహాయశాః ॥
టీక:-
గవాం = గోవులను; కోటిః = కోట్లుసంఖ్యలు; యుతం = కలవాటిని; దత్త్వా = దానముగా ఇచ్చి; బ్రహ్మలోకం = బ్రహ్మలోకమునకు; ప్రయాస్యతి = వెళ్ళగలడు; అసఙ్ఖ్యేయం = లెక్కకట్టలేని; ధనం = ధనమును; దత్త్వా = దానముగా ఇచ్చి; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు; మహాయశాః = గొప్ప కీర్తిని.
భావము:-
శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులకు కోట్లకొలది ఆవులను లెక్కకట్టలేని ధనములను దానము చేసి బ్రహ్మలోకమును, గొప్పకీర్తిని పొందగలడు.
1.1.96.
అనుష్టుప్.
రాజవంశా న్శతగుణాన్
స్థాపయిష్యతి రాఘవః ।
చాతుర్వర్ణ్యం చ లోకేఽ స్మిన్
స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ॥
టీక:-
రాజవంశాన్ = రాజ వంశములను; శతగుణాన్ = నూరురెట్లు; స్థాపయిష్యతి = స్థాపించగలడు; రాఘవః = రాఘురాముడు; చాతుర్వర్ణ్యం = నాలుగు వర్ణముల వారిని; చ; లోకే = లోకమందు; అస్మిన్ = దీనిలో; స్వే స్వే = తమ తమ; ధర్మే = ధర్మములందు; నియోక్ష్యతి = ప్రవర్తింపజేయగలడు.
భావము:-
శ్రీరామచంద్రుడు క్షత్రియ వంశములను నూరురెట్లు వృద్ధిపఱచగలడు. నాలుగు వర్ణములవారిని వారి వారి వర్ణధర్మములందు నడిపించగలడు.
గమనిక:-
చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు నాలుగు.
1.1.97.
అనుష్టుప్.
* దశవర్ష సహస్రాణి
దశవర్ష శతాని చ ।
రామో రాజ్యముపాసిత్వా
బ్రహ్మలోకం గమిష్యతి ॥
టీక:-
దశ = పది; వర్ష = సంవత్సరముల; సహస్రాణి = వేలు; దశ = పది; వర్ష = సంవత్సరముల; శతాని = వందలు; చ = మఱియు; రామః = శ్రీరాముడు; రాజ్యమ్ = రాజ్యమును; ఉపాసిత్వా = సేవించి; బ్రహ్మలోకం = పరబ్రహ్మ లోకమును; గమిష్యతి = పొందగలడు.
భావము:-
శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరములు ప్రజారంజకముగా పరిపాలనచేసి పరబ్రహ్మలోకమైన వైకుంఠమును చేరగలడు.
1.1.98.
అనుష్టుప్.
* ఇదం పవిత్రం పాపఘ్నం
పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠే ద్రామచరితం
సర్వపాపైః ప్రముచ్యతే ॥
టీక:-
ఇదం = ఈ శ్రీరామచరితము; పవిత్రం = పవిత్రమొనర్చునది; పాప = పాపములను; ఘ్నమ్ = తొలగించునది; పుణ్యం = పుణ్యమును చేకూర్చునది; వేదైః = వేదములతో; చ; సమ్మితమ్ = సమానమయినది; యః = ఎవడు; పఠేత్ = పఠించునో; రామచరితమ్ = శ్రీరామ చరితమును; సర్వ = సమస్త; పాపైః = పాపములనుండి; ప్రముచ్యతే = విముక్తుడగును.
భావము:-
రామాయణము అను ఈ శ్రీరామచరితము ప్రజలను పవిత్రమొనర్చును, పాపములను తొలగించును, పుణ్యము చేకూర్చును. వేదములతో సమానమయినది. ఈ శ్రీరామ చరితమును పఠించెడి వారు సర్వపాపముల నుండి విముక్తు లగుదురు.
1.1.99.
అనుష్టుప్.
* ఏత దాఖ్యాన మాయుష్యం
పఠన్ రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః
ప్రేత్య స్వర్గే మహీయతే ॥
టీక:-
ఏతత్ = ఈ; ఆఖ్యానమ్ = వాస్తవమైన కథ; ఆయుష్యమ్ = ఆయుష్యాభివృద్ధి కలిగించునది; పఠన్ = పఠించిన; రామాయణం = శ్రీరామాయణమును; నరః = మానవుడు; స = కూడా ఉన్న; పుత్ర = కొడుకులతో; పౌత్రః = మనుమలతో; స = కూడి ఉన్న; గణః = పరివారముతో; ప్రేత్య = మరణానంతరము; స్వర్గే = స్వర్గమునకు; మహీయతే = ఎక్కగలడు.
భావము:-
శ్రీమద్రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, మరణానంతరం పుత్రపౌత్రాదులతోను, పరివారముతోను స్వర్గ సౌఖ్యములు పొందెదరు.
1.1.100.
జగతి.
* పఠన్ ద్విజో వాగృషభత్వ మీయాత్
స్యాత్క్షత్రియో భూమిపతిత్వ మీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వ మీయాత్
జనశ్చ శూద్రోఽ పి మహత్త్వ మీయాత్" ॥
టీక:-
పఠన్ = పఠనము; ద్విజః = బ్రాహ్మణులు; వాక్ = సంభాషణా; ఋషభత్వమ్ = పరిపక్వత; ఈయాత్ = పొందగలరు; స్యాత్ = అయితే; క్షత్రియః = క్షత్రియులు; భూమి = రాజ్యమునకు; పతిత్వమ్ = ప్రభుత్వము; ఈయాత్ = పొందగలరు; వణిగ్జనః = వైశ్యులు; పణ్యఫలత్వమ్ = లాభమును (పణ్య వ్యాపారమునకు ఫలమ్ ఫలితము లాభము); ఈయాత్ = పొందగలరు; జనః = జనులు; చ; శూద్రః = శూద్రులు; అపి = ఐనచో; మహత్త్వమ్ = గొప్పదనము; ఈయాత్ = పొందగలరు.
భావము:-
శ్రీమద్రామాయణ పఠణము వలన బ్రాహ్మణులు సంభాషణా పరిపక్వతను, క్షత్రియులు రాజ్యాధికారమును, వైశ్యులు వ్యాపారములో లాభములను, శూద్రులు ఘనతను పొందగలరు.”
1.1.101.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
శ్రీమద్రామాయణకథాసంక్షేపో నామ ప్రథమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషి సంప్రదాయమూ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణము అంతర్గత మైన; బాలకాండే = బాలకాండ లోని; సంక్షిప్తః = సంక్షిప్తము చేయబడిన; రామాయణ = రామాయణము అను; ప్రథమః [1] = మొదటి; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా ఇతిహాసాంతర్గత, బాలకాండలోని సంక్షేప రామాయణము అను (1) మొదటి సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.2.1.
అనుష్టుప్.
నారదస్య తు తద్వాక్యం
శ్రుత్వా వాక్యవిశారదః ।
పూజయామాస ధర్మాత్మా
సహశిష్యో మహామునిమ్ ॥
టీక:-
నారద = నారదుని; అస్య = యొక్క; తు; తత్ = ఆ; వాక్యం = పలుకులను; శ్రుత్వా = వినినంతనే; వాక్య విశారదః = నైపుణ్యముగా మాట్లాడువాడు; పూజయామాస = పూజించెను ధర్మాత్మా = ధర్మ బద్దమైన శీలము గల వాడు; సహ = సహితంగా; శిష్యః = తన శిష్యులతో; మహామునిమ్ = మహాముని, నారదుని.
భావము:-
వాల్మీకి మహాముని చక్కగా మాట్లాడు నైపుణ్యము, ధర్మశీలము కలవాడు. నారదుని యొక్క మాటలు (సంక్షేప రామాయణము దాని వేదాంతార్థమును గ్రహించి) విన్న పిమ్మట తన శిష్యులతో సహా నారద మునీశ్వరుని పూజించెను.
గమనిక:-
నారదుడు- నరతీతీ నరః ప్రోక్తం పరమాత్మా సనాతన. నర సంబంధి నారమ్. నారమ్ దదాతీతి నారదః, సమాతనమైన పరమాత్మ నర అనబడును. ఆ నరునికి సంబంభించినది నారమ్ బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్యను ఇచ్చువాడు నారదుడు.
1.2.2.
అనుష్టుప్.
యథావ త్పూజితస్తేన
దేవర్షి ర్నారదస్తదా ।
ఆపృష్ట్వై వాభ్యనుజ్ఞాతః
స జగామ విహాయసమ్ ॥
టీక:-
యథావత్ = యోగ్యతాయుక్తముగా; పూజితః = పూజించ బడినవాడై; తేన = ఆ, వాల్మీకి మహాముని చేత; దేవర్షిః = దేవలోకపు ఋషి; నారదః = నారదుడు; తథా = ఆవిధముగా; ఆపృష్ట్వః = ప్రశ్నలు అడగకుండుట; ఏవ = నిశ్చయముగా, వావిళ్ళ నిఘంటువు; అభ్యనుజ్ఞాతః = సెలవు తీసుకొని; స = వారు; జగామ = వెడలెను; విహాయసమ్ = ఆకాశమార్గమున.
భావము:-
దేవర్షి అయిన నారదుడు వాల్మీకిచే యథావిధిగా సత్కరింపబడెను. వాల్మీకి సంశయములు అన్నీ తీరినవి అని నిశ్చయించుకుని, సెలవు తీసుకొని ఆకాశమార్గమున తిరిగి వెడలెను.
1.2.3.
అనుష్టుప్.
స ముహూర్తం గతే తస్మిన్
దేవలోకం మునిస్తదా ।
జగామ తమసాతీరం
జాహ్నవ్యా స్త్వవిదూరతః ॥
టీక:-
స = ఆ; ముహూర్తం = క్షణము; గతే = వెళ్ళగా; తస్మిన్ = ఆ నారదుడు; దేవలోకం = దేవలోకానికి; మునిః = ముని; తదా = అప్పుడు; జగామ = వెడలెను; తామసృ = తమసా నదీ; తీరం = తీరమునకు; జాహ్నవ్యాః = గంగా నదికి; తు; అవిదూరతః = సమీపాన ఉన్న.
భావము:-
ఆ వాల్మీకి నారద మహర్షి దేవలోకం వెడలిన పిమ్మట గంగానదికి సమీపాన ఉన్న తమసా నదీ తీరానికి వెడలెను.
గమనిక:-
1) జాహ్నవి – వ్యు. జహ్నుకస్య, జహ్నోః ఇయమ్- జహ్ను+అణ్ జిప్, త. ప్ర, జహ్నుమహర్షి కూతురు కనుక జాహ్నవి, గంగానది; 2) జహ్ను మహర్షి, గంగ తన యజ్ఞవాటికను ముంచెత్తుటచే కుపితుడై, గంగానదిని పీల్చివేసెను. పిమ్మట దేవతలు, ఋషులు ప్రార్థింపగా, తన చెవులనుండి ఆ నదిని విడిచిపుచ్చెను. అందువలన గంగకు, జహ్ను మహర్షి తండ్రి వంటివాడు. కావున, గంగకు జాహ్నవి అను వ్యవహార నామము కలిగెను. 3. పురూరవుని తరువాత ఐదవ (5వ) తరం వాడు గంగని పుక్కిట పట్టిన జహ్నుడు; జహ్నునకు పిమ్మట ఐదవ (5వ) తరం వాడు గాధి, (పోతెభా. 9-422-వ.). 4. తమసా నది- తమసము నల్లరంగు.
1.2.4.
అనుష్టుప్.
స తు తీరం సమాసాద్య
తమసాయా మునిస్తదా ।
శిష్యమాహ స్థితం పార్శ్వే
దృష్ట్వా తీర్థమకర్దమమ్ ॥
టీక:-
స = ఆ; తు; తీర్థమ్ = రేవును; సమాసాద్య = చేరుకుని; తమసాయా = తమసానది యొక్క; మహామునిః = వాల్మీకి మహాముని; శిష్యమ్ = శిష్యునితో; ఆహ = పలికెను; స్థితమ్ = ఉన్న; పార్శ్వే = పక్కనే; దృష్ట్వా = చూసి; తీర్థమ్ = రేవును; అకర్దమమ్ = బురదలేని దానిని.
భావము:-
వాల్మీకి మహాముని తమసా రేవు చేరుకుని; నిర్మలమైన; నిష్కల్మషమైన ఆ తీరమును చూసి పక్కనే ఉన్న శిష్యుడు భరద్వాజునితో ఇలా పలికెను.
1.2.5.
అనుష్టుప్.
“అకర్దమమిదం తీర్థం
భరద్వాజ! నిశామయ ।
రమణీయం ప్రసన్నాంబు
సన్మనుష్యమనో యథా ॥
టీక:-
అకర్దమం = అమలినమైనది; ఇదం = ఈ; తీర్థమ్ = రేవుని; భరద్వాజ = భరధ్వాజుడా; నిశామయ = గమనించుము; రమణీయం = చక్కనిది; ప్రసన్న = నిర్మలమైన; అంబు = జలము కలది; సన్మనుష్య = సత్పురుషుని; మనః = మనస్సు; యథా = వలె.
భావము:-
“ఓ శిష్యా! భరధ్వాజుడా! సత్పురుషుని మనస్సు వలె నిర్మలమై, నిష్కల్మషమై, మనోహరమైనటువంటి ఈ రేవుని చూడుము.
1.2.6.
అనుష్టుప్.
న్యస్యతాం కలశస్తాత
దీయతాం వల్కలం మమ ।
ఇదమే వావగాహిష్యే
తమసాతీర్థ ముత్తమమ్" ॥
టీక:-
న్యస్య = క్రింద ఉంచుము; కలశః = కలశమును; తాత = నాయనా; దీయతామ్ = ఈయుము; వల్కలమ్ = నారబట్టలు; మమ = నాకు; ఇదమ్ = ఇక్కడ; ఏవ = మాత్రమే; అవగాహిష్యే = స్నానము ఆచరించెదను; తమసా తీర్థమ్ = తమసా నదీ రేవు; ఉత్తమమ్ = శ్రేష్ఠమైనది.
భావము:-
నాయనా! కలశమును క్రింద ఉంచుము. నాకు నారచీర ఇమ్ము, శ్రేష్ఠమైన ఈ తమసా రేవులోనే నేను స్నానమాచరించెదను.”
గమనిక:-
వల్కలము- వల్క నార, వల్కతో నేసినది వల్కలము, వల్+కలమ్ చుట్టుకొనునది, నారచీర, నారవస్త్రము.
1.2.7.
అనుష్టుప్.
ఏవముక్తో భరద్వాజో
వాల్మీకేన మహాత్మనా ।
ప్రాయచ్ఛత మునేస్తస్య
వల్కలం నియతో గురోః ॥
టీక:-
ఏవమ్ = ఈ విధంగా; ఉక్త = చెప్పిన తరువాత; భరధ్వాజః = భరధ్వాజుడు; వాల్మీకేన = వాల్మీకి అను; మహాత్మనా = గొప్ప మనస్సు కలవాని చేత; ప్రాయచ్ఛత = ఇచ్చెను; మునేః = ముని వాల్మీకికి; తస్య = ఆ; వల్కలం = నార చీరలను; నియతః = విధేయుడైన; గురోః = గురువునకు.
భావము:-
మహాత్ముడైన వాల్మీకి చెప్పిన వచనములు విని, గురువునకు విధేయుడైన భరధ్వాజుడు, ఆ మహామునికి నారచీరలు అందించెను.
1.2.8.
అనుష్టుప్.
స శిష్యహస్తాదాదాయ
వల్కలం నియతేంద్రియః ।
విచచార హ పశ్యంస్తత్
సర్వతో విపులం వనమ్ ॥
టీక:-
స = ఆ వాల్మీకి; శిష్య = శిష్యుని; హస్తాత్ = చేతినుండి; ఆదాయ = తీసుకుని; వల్కలమ్ = నారచీరలను; నియతేంద్రియః = ఇంద్రియనిగ్రహం గలిగిన వాడు; విచచార = సంచరించెను; హ; పశ్యమ్ = చూచుచూ; తత్ = అక్కడ; సర్వతః = అంతటను; విపులమ్ = విశాలమైన; వనమ్ = వనమును.
భావము:-
ఇంద్రియ నిగ్రహము గల ఆ వాల్మీకి తన శిష్యుడు ఇచ్చిన నారచీరలు ధరించి, విశాలమైన వనము అంతటినీ పరికిస్తూ సంచరించెను.
1.2.9.
అనుష్టుప్.
తస్యాభ్యాశే తు మిథునం
చరంత మనపాయినమ్ ।
దదర్శ భగవాన్ స్తత్ర
క్రౌంచయో శ్చారునిఃస్వనమ్ ॥
టీక:-
తస్య = ఆ రేవుకు; అభ్యాశే = చేరువలోనే; తు; మిథునం = జంట; చరంతమ్ = తిరుగుచున్న; అనపాయినమ్ = ఎడబాటులేనివి; దదర్శః = చూచెను; భగవాన్ = భగవత్స్వరూపమైన ఆ వాల్మీకి మహర్షి; తత్ర = ఆ ప్రదేశములో; క్రౌంచయోః = రాగిరంగు తల ఉండే కొంగ జాతికి చెందిన క్రౌంచ పక్షుల జంటను; చారు = చక్కటి; నిస్వనమ్ = ధ్వని చేయువానిని / కూయువానిని.
భావము:-
అక్కడ ఆ వనమునందు ఆ రేవుకు చేరువలో భగవత్స్వరూపుడైన ఆ వాల్మీకి మహర్షి, చక్కగా కూయుచూ సంచరిస్తున్న ఎన్నడూ ఎడబాయని ఒక క్రౌంచ పక్షుల జంటను చూచెను.
1.2.10.
అనుష్టుప్.
తస్మాత్తు మిథునాదేకం
పుమాంసం పాపనిశ్చయః ।
జఘాన వైరనిలయో
నిషాదస్తస్య పశ్యతః ॥
టీక:-
తస్మాత్ = ఆ; మిథునాత్ = మిథునం నుండి; ఏకమ్ = ఒకటైన; పుమాంసం = పురుష పక్షిని; పాప = పాపముచేయుటకు; నిశ్చయః = నిర్ణయించుకున్న వాడు; జఘాన = చంపెను; వైర = విద్వేమునకు; నిలయః = స్థానమైన వాడు అయిన; నిషాదః = ఒక బోయవాడు; తస్య = ఆ వాల్మీకి మహాముని; పశ్యతః = చూస్తుండగానే.
భావము:-
పాపిష్టివాడు, విద్వేష పూరితుడు అయిన ఒక బోయవాడు ఆ వాల్మీకి ముని చూస్తుండగా ఆ జంటపక్షులలోని పురుష పక్షిని చంపెను.
1.2.11.
అనుష్టుప్.
తం శోణితపరీతాంగం
వేష్టమానం మహీతలే ।
భార్యా తు నిహతం దృష్ట్వా
రురావ కరుణాం గిరమ్ ॥
టీక:-
తమ్ = ఆ మగ పక్షిని; శోణిత = రక్తముతో; పరీతః = తడిసిన; అంగం = శరీరాంగములు కలిగిన; వేష్టమానమ్ = విలవిలలాడుచు పొరలుతూ; మహీతలే = భూమిపైన; భార్యః = ఆడపక్షి; తు; నిహతమ్ = చంపబడినదానిని; దృష్ట్వా = చూచి; రురావ = రోదించెను; కరుణామ్ = జాలి కలిగించు; గిరమ్ = వాక్కుతో.
భావము:-
ఆ నిషాదునిచే కొట్టబడి మగ క్రౌంచము రక్తముతో తడిసి నేలపై విలవిల కొట్టుకుని చచ్చిపోయింది. అది చూచిన, దాని జత ఆడ క్రౌంచపక్షి దీనముగా రోదించుచుండెను.
1.2.12.
అనుష్టుప్.
వియుక్తా పతినా తేన
ద్విజేన సహచారిణా ।
తామ్రశీర్షేణ మత్తేన
పత్రిణా సహితేన వై ॥
టీక:-
వియుక్తా = వేరుపడినదైన; పతినా = భర్త; తేన = ఆ; ద్విజేన = పక్షిని; సహచారిణా = తనతో కూడా తిరుగునది; తామ్ర శీర్షేణ = రాగిరంగు కల తల కలిగినది; మత్తేన = మదించి ఉన్నది; పత్రిణా = రెక్కలు కలిగినది; సహితేనవై = కలది.
భావము:-
ఎఱ్ఱని తల, కామముతో మదించిన అందమైన రెక్కలు కలిగి తనతో కలిసి మెలిగే భర్తతో వియోగము పొందిన ఆ ఆడ క్రౌంచ పక్షిని.
1.2.13.
అనుష్టుప్.
తథా తు తం ద్విజం దృష్ట్వాం
నిషాదేన నిపాతితమ్ ।
ఋషే ర్ధర్మాత్మనస్తస్య
కారుణ్యం సమపద్యత ॥
టీక:-
తథా = అప్పుడు; తు; తం = తను; ద్విజమ్ = పక్షిని; దృష్ట్వా = చూచి; నిషాదేన = బోయవానిచే; నిపాతితమ్ = పడగొట్టబడినదానిని; ఋషే = ఋషికి; ధర్మాత్మనః = ధర్మస్వభావుడైన వానికి; తస్య = ఆ; కారుణ్యమ్ = జాలి; సమపద్యత = కలిగెను.
భావము:-
అపుడు ఆ బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగానే, ధర్మాత్ముడైన ఆ వాల్మీకి మహర్షికి మిక్కిలి జాలి కలిగెను.
1.2.14.
అనుష్టుప్.
తతః కరుణవేదిత్వాత్
అధర్మోఽ యమితి ద్విజః ।
నిశామ్య రుదతీం క్రౌంచీమ్
ఇదం వచనమబ్రవీత్ ॥
టీక:-
తతః = అటు పిమ్మట; కరుణ = జాలి; వేదిత్వాత్ = వేదన కలిగినవాడై; అధర్మః = ధర్మము కాని; అయమ్ = ఆయొక్క; ద్విజః = వాల్మీకి మహర్షి; నిశామ్య = చూచి; రుదతీమ్ = ఏడ్చుచున్న; క్రౌంచీమ్ = ఆడక్రౌంచపక్షిని; ఇదం = ఈ; వాక్యమ్ = పలుకులు; అబ్రవీత్ = పలికెను
భావము:-
వాల్మీకి మహర్షి ఆ అధర్మమమును చూచి కరుణాపూరిత వేదన పొందెను. రతి భంగమై పతి వియోగ దుఃఖముతో, ఏడ్చుచున్న ఆ ఆడక్రౌంచ పక్షిని చూచి ఇట్లనెను.
1.2.15.
అనుష్టుప్.
* “మా నిషాద! ప్రతిష్ఠాం త్వం
అగమ శ్శాశ్వతీః సమాః ।
యత్క్రౌంచ మిథునాదేకమ్
అవధీః కామమోహితమ్" ॥
టీక:-
మా = అగుగాక, తప్పదు; నిషాద = ఓ బోయవాడా; ప్రతిష్ఠామ్ = ఉండుటను; త్వమ్ = నీవు; అగమః = పొందలేవు; శాశ్వతీః = చాలాకాలము, స్థిరములైన; సమాః = కాలము; యత్ = ఏ కారణము వలన; క్రౌంచ = క్రౌంచ పక్షుల; మిథునాత్ = జంటనుండి; కామ = కామమునందు; మోహితమ్ = మోహము చెందియున్న; ఏకమ్ = ఒకదానిని; అవధీః = చంపినావో; (తత్ = అదే కారణము వలన).
భావము:-
“ఓ బోయవాడా! నీవు క్రౌంచపక్షి దంపతులనుండి; రతిపరవశమైన ఒక దానిని చంపినావు. కావున నీవు చాల కాలము జీవించకుందువు గాక.”
గమనిక:-
అనుకోకుండా వాల్మీకి మహర్షి నోటినుండి వచ్చిన ఇది ఆది శ్లోకము అను పేర ఆవిష్కరణ పొంది, బహుళ ప్రసిద్ధి పొందినది.
1.2.16.
అనుష్టుప్.
తస్యైవం బ్రువతశ్చింతా
బభూవ హృది వీక్షతః ।
“శోకాఽఽర్తేనాస్య శకునేః
కిమిదం వ్యాహృతం మయా" ॥
టీక:-
తస్య = అది; ఏవమ్ = అంతా; బ్రువతః = పలికిన పిమ్మట; చింతా = ఆలోచన; బభూవ = కలిగెను; హృది = హృదయమునందు; వీక్షతః = పరిశీలించగా; శోకాః = శోకముచే; ఆర్తేన = ఆర్తిని పొందిన; అస్య = అతడు; శకునేః = పక్షి కొఱకు; కిం = ఏమి; ఇదమ్ = ఈ వాక్యము; వ్యాహృతమ్ = పలుకబడిన; మయా = నా చేత.
భావము:-
ఈ విధముగా శాపమువంటి పలుకులు పలికిన వాల్మీకి మహాముని, తన మనసులో “ఆహా!! ఏమి ఇది? ఈ పక్షిని చూసిన శోక ఆర్తులతో ఇలా పలికితిని ఏమిటి?” అని ఆలోచించసాగెను.
1.2.17.
అనుష్టుప్.
చింతయన్ స మహాప్రాజ్ఞః
చకార మతిమాన్ మతిమ్ ।
శిష్యం చైవాబ్రవీద్వాక్యమ్
ఇదం స మునిపుంగవః ॥
టీక:-
చింతయన్ = ఆలోచించుతూ; స = ఆ వాల్మీకి; మహా ప్రాజ్ఞః = గొప్ప ప్రజ్ఞాశాలి; చ = ఇలా; కార = నిశ్చయించుకొనెను; మతిమాన్ = జ్ఞాని; మతిం = మనసులో; శిష్యమ్ = శిష్యుని; చ = తో; ఇవాం = ఇలా; అబ్రవీత్ = చెప్పెను; వాక్యమ్ = మాటలను; ఇదమ్ = వీటిని; స = ఆ; ముని పుంగవః = ముని శ్రేష్టుడు.
భావము:-
మహా జ్ఞాని, పండితుడు అయిన ఆ వాల్మీకి మునిపుంగవుడు నిశ్చయము చేసుకొని తన శిష్యులతో ఈ విధముగా చెప్పెను.
1.2.18.
అనుష్టుప్.
* “పాదబద్ధోఽ క్షరసమః
తంత్రీలయ సమన్వితః ।
శోకాఽఽర్తస్య ప్రవృత్తో మే
శ్లోకో భవతు నాన్యథా" ॥
టీక:-
పాదబద్ధః = నాలుగు పాదములతో కూర్చబడినది; అక్షరసమః = సమానమైన అక్షరములు కలది; తంత్రీ = వీణాతంత్రులపై; లయ = కూర్చుటకు తగిన లయతో; సమన్వితః = కూడినది అయిన; శోకా౭౭ర్తస్య = శోకముతో; ఆర్తస్య = ఆర్తిచెందినవాడనై ఉండగా; ప్రవృత్తః = అప్రయత్నముగా పలికిన పలుకు; మే = నానుండి; శ్లోకః = శ్లోకముగా; భవతు = అగుగాక; న = కాదు; అన్యథా = మరొకవిధముగా.
భావము:-
“శోకార్తుడనై ఉండగా నేను అప్రయత్నంగా పలికినట్టిది, సమానమైన అక్షరములు గల నాలుగు పాదములలో కూర్చబడినది. వీణపై లయతో కూర్చి పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున ఇది శ్లోకము అను పేరుతో మాత్రమే ప్రసిద్ధి కావలెను.
గమనిక:-
1) చూ. శ్లోకము వాల్మీకీయము- ఛందస్సు వ్యాసము లింకు. 2) నిషాదుడు కొట్టిన క్రౌంచ పక్షిని వాల్మీకిమహర్షి కనిన సంఘటన ఎంతో బలీయమైనది. కావ్యము అనే ప్రక్రియను ప్రేరేపించి అద్భుతమైన ఆదికావ్యం వెలువరింప చేసినది.
1.2.19.
అనుష్టుప్.
శిష్యస్తు తస్య బ్రువతో
మునే ర్వాక్య మనుత్తమమ్ ।
ప్రతిజగ్రాహ సంతుష్టః
తస్య తుష్టోఽ భవద్గురుః ॥
టీక:-
శిష్య స్తు = శిష్యుడును; తస్య = ఈవిధముగా; బ్రువతః = పలుకుచున్న; మునేః = వాల్మీకి ముని యొక్క; వాక్యమ్ = పలుకు; అనుత్తమమ్ = అత్యుత్తమమైనదానిని; ప్రతి జగ్రాహ = స్వీకరించెను; సం = మిక్కిలి; హృష్ట = సంతోషించినవాడై; తస్య = అతని విషయమున; తుష్టః = సంతోషించినవాడు; ఆభవత్ = ఆయెను; గురుః = గురువు.
భావము:-
వాల్మీకి మాటలు వినిన శిష్యుడు కూడ అత్యుత్తమమైన ఆ ‘మా నిషాద’ ఇత్యాది వాక్యమును మిక్కిలి సంతోషమతో స్వీకరించెను. అనగా దానిని కంఠస్థము చేసెను. శిష్యుని విషయమున గురువు వాల్మీకి సంతోషించెను
1.2.20.
అనుష్టుప్.
సోఽ భిషేకం తతః కృత్వా
తీర్థే తస్మిన్ యథావిధి ।
తమేవ చింతయన్నర్థమ్
ఉపావర్తత వై మునిః ॥
టీక:-
సః = ఆ; అభిషేకమ్ = స్నానమును; తతః = అటు పిమ్మట; కృత్వా = ఆచరించి (చేసి); తీర్థే = రేవు; తస్మిన్ = దానియందు; యథావిధి = పద్దతి ప్రకారము; తమ్ = తన; ఏవ = లోనే; చింతయన్ = ఆలోచించుచు; అర్థమ్ = విషయమును; ఉపావర్తత వై = ఆశ్రమము వైపు వెనుదిరిగెను; మునిః = ఆ వాల్మీకి మహర్షి.
భావము:-
పిమ్మట వాల్మీకి మహాముని ఆ రేవు యందు యాథావిధి స్నానమాచరించి అక్కడ జరిగిన సంఘటన గురించి ఆలోచించుచు ఆశ్రమము వైపు మరలెను.
1.2.21.
అనుష్టుప్.
భరద్వాజస్తతః శిష్యో
వినీతః శృతవా న్మునేః ।
కలశం పూర్ణమాదాయ
పృష్ఠతోఽ నుజగామ హ ॥
టీక:-
భరధ్వాజః = భరధ్వాజుడు; తతః = అప్పుడు; శిష్యః = శిష్యుడు కూడా; వినీతః = వినయవంతుడు అయిన; శ్రుతవాన్ = శాస్త్రములు ఎరిగినవాడు; మునిః = ముని; పూర్ణమ్ = నిండిన; కలశమ్ = కలశమును; ఆదాయ = గ్రహించి; పృష్టతః = వెనుక; అనుజగామ = వాల్మీకి మునిని అనుసరించెను.
భావము:-
అప్పుడు, శాస్త్రపారంగతుడు, మననశీలుడు, వినయవంతుడు అయిన శిష్యుడు భరధ్వాజుడు, జలపూర్ణమైన కలశమును తీసుకొని వాల్మీకి మునిని అనుసరించెను.
1.2.22.
అనుష్టుప్.
స ప్రవిశ్యాశ్రమపదం
శిష్యేణ సహ ధర్మవిత్ ।
ఉపవిష్టః కథాశ్చాన్యాః
చకార ధ్యానమాస్థితః ॥
టీక:-
స = ఆ వాల్మీకి; ప్రవిశ్య = ప్రవేశించి; ఆశ్రమ = ఆశ్రమ; పదమ్ = స్థానమును; శిష్యేణ = శిష్యునితో; సహ = సాటి; ధర్మవిత్ = ధర్మవేత్త; ఉపవిష్టః = కూర్చున్నవాడై; కథాః = ఏవిధముగా జరిగెనో; చ = అవి; అన్యాః = ఇతరములైనవి; చ = కూడ; చకార = చేయుచూ; ధ్యానమ్ = స్మరించుచు; ఆస్థితః = ఉండేను.
భావము:-
ఆ వాల్మీకి మహాముని తోటి ధర్మవేత్త ఐన శిష్యునితో గూడ ఆశ్రమము ప్రవేశించి, కూర్చొని, అంతకు మునుపు జరిగిన పక్షి వృత్తాంతమూ ఇతర విషయమలు స్మరించుచు ముచ్చటించెను.
1.2.23.
అనుష్టుప్.
ఆజగామ తతో బ్రహ్మా
లోకకర్త్తా స్వయం ప్రభుః ।
చతుర్ముఖో మహాతేజా
ద్రష్టుం తం మునిపుంగవమ్ ॥
టీక:-
ఆజగామ = వచ్చెను; తతః = అటు పిమ్మట; బ్రహ్మా = బ్రహ్మదేవుడు {బ్రహ్మ- వ్యు. బృహి- బృంహ, వృద్ధౌ + మనిన్, కృప్ర., ప్రజలను వర్థిల్లజేయువాడు. నలువ, హిరణ్యగర్భుడు బ్రహ్మదేవుడు}; లోక = లోకములను; కర్తా = సృజించువాడును; స్వయమ్ = స్వయముగా; ప్రభుః = లోకములకు అధిపతియు; చతుర్ముఖః = నలువ, నాలుగు ముఖములు కలవాడును; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కలవాడును; ద్రష్టుమ్ = చూచుటకు; తమ్ = ఆ వాల్మీకి; మునిపుంగవమ్ = మునులలో శ్రేష్ఠుడైనవానిని.
భావము:-
అప్పుడు లోక సృష్టికర్తయు, అధిపతియును, నాలుగు ముఖములు కలవాడును, మహాతేజశ్శాలియు అగు బ్రహ్మదేవుడు, ముని శ్రేష్టుడైన ఆ వాల్మీకిని చూచుటకు స్వయముగా విచ్చెసెను.
గమనిక:-
లోకము- వ్యు. లుక, గతౌ, పరిభ్రమణే + ఘఞ్, కృ.ప్ర. నిత్యమూ పరిభ్రమించు నవి. భూలోకాది. ముల్లోకములు, చతుర్దశలోకములు.
1.2.24.
అనుష్టుప్.
వాల్మీకిరథ తం దృష్ట్వా
సహసోత్థాయ వాగ్యతః ।
ప్రాంజలిః ప్రయతో భూత్వా
తస్థౌ పరమవిస్మితః ॥
టీక:-
వాల్మీకిః = వాల్మీకి; అథ = పిమ్మట; తమ్ = ఆతనిని; దృష్ట్వా = చూచిన; సహసః = వెంటనే; ఉత్థాయ = లేచి; వాగ్యతః = మౌనము వహించినవాడై; ప్రాంజలిః భూత్వా = చేతులు ముకుళించి; ప్రయతః = అప్రమత్తకల; భూత్వా = వాడై; తస్థౌ = నిలబడెను; పరమవిస్మితః = ఎంతో ఆశ్చర్యము చెందినవాడై.
భావము:-
ఆ వాల్మీకిమహర్షి; బ్రహ్మను చూసి, ఆశ్చర్యచకితుడై వెంటనే లేచి దోసిలి జోడించి అప్రమత్తతో మౌనముగా నిలబడెను.
1.2.25.
అనుష్టుప్.
పూజయామాస తం దేవం
పాద్యార్ఘ్యాసన వందనైః ।
ప్రణమ్య విధివచ్చైనం
పృష్ట్వా చైవ నిరామయమ్ ॥
టీక:-
పూజయామాస = పూజించెను; తమ్ = ఆయొక్క; దేవమ్ = దేవుని, బ్రహ్మదేవుని; పాద్య = పాదముల కొఱకు నీరు; అర్ఘ్య = చేతుల కొఱకు నీరు; ఆసన = ఆసనము; వందనైః = నమస్కారములచే; ప్రణమ్య = మిక్కిలి వంగినవాడై, వినమృడై; విధివత్ = విధిపూర్వకముగా; ఏనామ్ = వారిని; పృష్ట్వా = అడిగి; చ; ఇవ = గురించి; నిరామయమ్ = కుశలము.
భావము:-
వాల్మీకి ఆ బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము, ఆసనము, వందనములు సమర్పించి పూజించెను. యథావిధిగా వినమ్రుడై, క్షేమసమాచారములు అడిగెను.
1.2.26.
అనుష్టుప్.
అథోపవిశ్య భగవాన్
ఆసనే పరమార్చితే ।
వాల్మీకియే చ ఋషయే
సందిదేశాసనం తతః ॥
టీక:-
అథ = పిమ్మట; ఉపవిశ్య = కూర్చుని; భగవాన్ = పూజ్యనీయుడైన, బ్రహ్మదేవుడు; ఆసనమ్ = ఆసనమున; పరిమార్చితే = మిక్కిలి పూజించబడినట్టి; వాల్మీకియే = వాల్మీకితో; చ; ఋషయే = మహర్షియైన; సందిదేశ = చూపెను; ఆసనమ్ = ఆసనమును; తతః = అచ్చట ఉన్నదానిని.
భావము:-
భగవంతుడైన బ్రహ్మదేవుడు పరమపూజితమగు ఉత్తమాసనముపై కూర్చుండి “నీవు కూడా ఈ ఆసనము గ్రహించుము” అని వాల్మీకితో చెప్పెను.
1.2.27.
అనుష్టుప్.
బ్రహ్మణా సమనుజ్ఞాతః
సోఽ ప్యుపావిశదాసనే ।
ఉపవిష్టే తదా తస్మిన్
సాక్షాల్లోకపితామహే ॥
టీక:-
బ్రహ్మణా = బ్రహ్మచేత; సమనుజ్ఞాత = అనుజ్ఞ ఇవ్వబడినవాడై; సః = అతడు; అపి = కూడా; ఉపావిశత్ = కూర్చుండెను. ఆసనే = ఆసనమునందు; ఉపవిష్టే = కూర్చుండగా; తదా = అప్పుడు; తస్మిన్ = ఆ బ్రహ్మదేవుడు; సాక్షాత్ = ప్రత్యక్షముగా; లోకపితామహే = బ్రహ్మదేవుడు.
భావము:-
వాల్మీకి బ్రహ్మదేవుని అనుజ్ఞతో ఆసనముపై కూర్చుండెను. అట్లు బ్రహ్మదేవుని ఎదురుగా కూర్చున్న వాల్మీకి మహర్షి ఆ క్రౌంచపక్షి గురించి ఆలోచించసాగెను.
1.2.28.
అనుష్టుప్.
తద్గతేనైవ మనసా
వాల్మీకి ర్ధ్యానమాస్థితః ।
పాపాత్మనా కృతం కష్టం
వైరగ్రహణ బుద్ధినా ॥
టీక:-
తత్ = ఆ; గతేనైవ = ఆ జరిగిన దానినే; మనసా = మనస్సులో; వాల్మీకిః = వాల్మీకి; ధ్యానమ్ = చింతించుటను; ఆస్థితః = అవలంబించెను; పాపాత్మనా = ఆ పాపాత్మునిచే; కృతమ్ = చేయబడినది; కష్టమ్ = బాధించుకార్యము; వైర = వైరముచే; గ్రహణ = పట్టుకొనవలెనను; బుద్ధినా = ఆలోచనతో.
భావము:-
జరిగినది తలుచుకుంటూ, “ఆ పాపాత్ముడు వైరముచే దానిని పట్టుకొనుటకు ఎంతటి ఘోరకార్యము చేసినాడు.” అని ఆలోచించసాగెను.
1.2.29.
అనుష్టుప్.
యస్తాదృశం చారురవం
క్రౌంచం హన్యాదకారణాత్" ।
శోచన్నేవ ముహుః క్రౌంచీమ్
ఉపశ్లోకమిమం పునః ॥
టీక:-
యః = ఆ బోయవాడు; తాదృశమ్ = అట్టి; చారురవమ్ = మధురధ్వని గల; క్రౌంచం = క్రౌంచ పక్షిని; హన్యాత్ = చంపెనుకదా; అకారణాత్ = కారణము లేకుండ; శోచన్ = దుఃఖించుచు; ఇవ = వలె; ముహుః = మరల; క్రౌంచీమ్ = క్రౌంచ పక్షిని గూర్చిన; ఉప = చిన్న; శ్లోకమ్ = శ్లోకమును; ఇమమ్ = దానిని; పునః = మరల.
భావము:-
“చక్కగా కూసే ఆ క్రౌంచ పక్షిని నిష్కారణముగ బోయవాడు చంపివేసినాడు” అని తలచుచు మరల మరల మా నిషాది శ్లోకమును గానము చేసెను.
1.2.30.
అనుష్టుప్.
జగావంతర్గతమనా
భూత్వా శోకపరాయణః ।
తమువాచ తతో బ్రహ్మా
ప్రహస న్మునిపుంగవమ్ ॥
టీక:-
జగౌ = గానముచేయుచు; అంతర్గతమనాః = తన మనస్సులో; భూత్వా = ఆయెను; శోకపరాయణః = దుఃఖపరవశుడు; తమ్ = అతనిని (వాల్మీకిని) గూర్చి; ఉవాచ = పలికెను; తతః = పిమ్మట; బ్రహ్మా = బ్రహ్మ; ప్రహసన్ = నవ్వుచు; మునిపుంగవమ్ = ముని శ్రేష్ఠునితో.
భావము:-
మరల మరల మానిషాది శ్లోకమును గానము చేయుచూ మనసులో దుఃఖపరవశు డాయెను. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుచు, వాల్మీకితో ఇలా పలికెను.
1.2.31.
అనుష్టుప్.
శ్లోక ఏవాస్త్వయం బద్ధో
నాత్ర కార్యా విచారణా ।
మచ్ఛందాదేవ తే బ్రహ్మన్!
ప్రవృత్తేయం సరస్వతీ ॥
టీక:-
శ్లోకః = శ్లోకముగ; ఏవ = మాత్రమే; అస్తు = అగుగాక; అయమ్ = ఇది; బద్ధః = కూర్చబడినది; న = లేదు; అత్ర = అందు; కార్యా = చేయవలసిన; విచారణా = ఆలోచన; మత్ = నా యొక్క; ఛందాత్ = ఇచ్ఛ ప్రకారము; ఏవ = మాత్రమే; తే = నీకు; బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ; ప్రవృత్తా = పుట్టినది; ఇయమ్ = ఈ; సరస్వతీ = వాక్కు;
భావము:-
“ఓ బ్రహ్మర్షీ! ఇది శ్లోకముగనే కూర్చబడు గాక. నా ఇచ్ఛను అనుసరించి మాత్రమే ఈ వాక్కు నీయందు కలిగినది.
1.2.32.
అనుష్టుప్.
రామస్య చరితం కృత్స్నం
కురు త్వమృషిసత్తమ!।
ధర్మాత్మనో గుణవతో
లోకే రామస్య ధీమతః ॥
టీక:-
రామస్య = రాముని యొక్క; చరితమ్ = చరిత్రమును; కృత్స్నమ్ = సర్వమూ; కురు = రచింపుము, కూర్చుము; త్వమ్ = నీవు; ఋషిసత్తమ = ఓ ఋషిశ్రేష్ఠుడా; ధర్మాత్మనః = ధర్మస్వభావుడును; గుణవతః = ప్రశస్తగుణములు కలవాడును; లోకే = లోకమంతటిలోనూ; రామస్య = రాముడే; ధీమతః = బుద్ధిమంతుడును.
భావము:-
ఓ వాల్మీకి మహర్షీ! శ్రీరాముని చరిత్రము సమస్తమును నీవు రచింపుము. ధర్మస్వభావుడు, ప్రశస్తములైన గుణములు కలవాడు, బుద్ధిమంతుడును, ధైర్యశాలియును లోకంలో రాముడే.
1.2.33.
అనుష్టుప్.
వృత్తం కథయ ధీరస్య
యథా తే నారదాచ్ఛ్రుతమ్ ।
రహస్యం చ ప్రకాశం చ
యద్వృత్తం తస్య ధీమతః ॥
టీక:-
వృత్తం = వృత్తాంతము; (ఆ విధముగా) కథయ = చెప్పుము ధీరస్య = బుద్ధశాలి; యథా = ఏవిధముగా; తే = నీచేత; నారదాత్ = నారదునివలన; శ్రుతమ్ = వినబడెనో; రహస్యమ్ = రహస్యమైనది; చ; ప్రకాశమ్ = దీప్తిమంతము; చ; యత్ = ఏ; వృత్తమ్ = చరితము కలదో; తస్య = అది; ధీమతః = ప్రజ్ఞావంతమైనది.
భావము:-
రాముని వృత్తాంతమును, నారదుని నుండి నీవు వినినట్లు చెప్పుము. ఈ వృత్తాంతము రహస్యమైనది; ప్రకాశమైనది; ప్రజ్ఞావంతమైనది.
గమనిక:-
*- రహస్యమ్ - రహః (ఏకాంతముగా / ఏకాగ్రముగా) స్యమ్ (శబ్దము చేయుట / పలుకుట). మననము చేయదగ్గది.
1.2.34.
అనుష్టుప్.
రామస్య సహసౌమిత్రేః
రాక్షసానాం చ సర్వశః ।
వైదేహ్యాశ్చైవ యద్వృత్తం
ప్రకాశం యది వా రహః ॥
టీక:-
రామస్య = ఆ రామునిగురించి; సహ = దానితో పాటు; సౌమిత్రేః = లక్ష్మణునిగురించి; రాక్షసానామ్ = రాక్షసులయొక్క; చ; సర్వశః = మొత్తమంతా; వైదేహ్యాః = సీతాదేవిగురించి; ఇవ = వంటివి; యత్ = ఏదైతే ఉందో ఆ; వృత్తమ్ = చరితము; ప్రకాశమ్ = తెలిసినది; యది వా = పక్షాంతరమున లేదా; రహః = తెలియనిది.
భావము:-
లక్ష్మణ సహితుడైన రాముడు గురించి, సీత గురించి, రాక్షసులు గురించి వీరందరి చరితములు తెలిసినవి, ఇంకా తెలియనివి.
1.2.35.
అనుష్టుప్.
తచ్చాప్యవిదితం సర్వం
విదితం తే భవిష్యతి ।
న తే వాగనృతా కావ్యే
కాచిదత్ర భవిష్యతి ॥
టీక:-
తత్ = అదియు; చ; అపి = కూడ; అవిదితమ్ = తెలియనిదైనను; విదితమ్ = తెలిసినదిగా; తే = నీకు; భవిష్యతి = కాగలదు. న = కాదు; తే = నీయొక్క; వాక్ = వాక్కు; అనృతా = అసత్యమైనది; కావ్యే = కావ్యములో; కాచిత్ = ఒక్కటియు; అత్ర = దానిలో; భవిష్యతి = కలుగదు;
భావము:-
నీకింతవరకు తెలియనిది కూడా ఇప్పుడు, బాగుగా తెలియగలదు. ఈ కావ్యములో నీవు చెప్పిన ఒక్క మాటయు ఎప్పటికీ అసత్యము కానేరదు.
1.2.36.
అనుష్టుప్.
* కురు రామకథాం పుణ్యాం
శ్లోకబద్ధాం మనోరమామ్ ।
యావత్స్థాస్యంతి గిరయః
సరితశ్చ మహీతలే ।
తావ ద్రామాయణకథా
లోకేషు ప్రచరిష్యతి ॥
టీక:-
కురు = చేయుము; రామకథామ్ = రాముని కథను; పుణ్యామ్ = పుణ్యమైనదిగా; శ్లోక = శ్లోకములలో; బద్ధామ్ = కూర్చబడినదిగా; మనోరమామ్ = మనోహరమైనదిగా; యావత్ = ఎంతవరకు; స్థాస్యంతి = ఉండగలవో; గిరయః = పర్వతములును; సరితః = నదులును; చ; మహీతలే = భూతలమునందు; తావత్ = అంతవరకు; రామయణకథా = రామాయణ కథ; లోకేషు = లోకములందు; తావత్ = అంతవరకు; రామాయణకథా = రామాయణము; లోకేషు = లోకములో; ప్రచరిష్యతి = ప్రవర్తింపగలదు;
భావము:-
రామకథను పుణ్యప్రదముగను, మనోహరంజకముగనూ, శ్లోకములలో కూర్చబడినదిగను రచింపుము. లోకంలో పర్వతాలు, నదులూ ఉండు నంతవరకూ, లోకంలో రామాయణము ప్రచారములో ఉండును.
1.2.37.
అనుష్టుప్.
* యావద్రామస్య చ కథా
త్వత్కృతా ప్రచరిష్యతి ।
తావదూర్ధ్వమధశ్చ త్వమ్
మల్లోకేషు నివత్స్యసి"।
ఇత్యుక్త్వా భగవాన్బ్రహ్మా
తత్రై వాంతరధీయత॥
టీక:-
యావత్ = ఎంతవరకు; రామస్య = రాముని; చ = యొక్క; కథా = వృత్తాంతము; త్వత్ = నీచేత; కృతా = రచింపబడినది; ప్రచరిష్యతి = ప్రచారంలో ఉండునో; తావత్ = అంతవరకుకు; ఊర్థ్వమ్ = మీదిదిని; అథ = ఇంకను; త్వమ్ = నీవు; మత్ = నా; లోకేషు = లోకములోనే; నివత్స్యసి = నివసించగలవు; ఇతి = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; భగవాన్ = భగవంతుడైన; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; తత్రైవ = అచటనే; అంతరధీయత = అంతర్ధానము పొందెను.
భావము:-
నీవు రచించిన రామాయణ కథ ప్రచారములో ఉన్నంత కాలము, నీవు నా సత్యలోకములో ఉండెదవు.” అని నిర్దేశించి బ్రహ్మదేవుడు అదృశ్యమాయెను.
1.2.38.
అనుష్టుప్.
తస్య శిష్యాస్తతః సర్వే
జగుశ్శ్లోకమిమం పునః ।
ముహుర్ముహుః ప్రీయమాణాః
ప్రాహుశ్చ భృశవిస్మితాః ॥
టీక:-
తస్య = అతని; శిష్యాః = శిష్యులు; తతః = అటు పిమ్మట; సర్వే = అందరు; జగుః = గానము చేసిరి; శ్లోకమ్ = శ్లోకము; ఇమమ్ = దీనిని; పునః = మరల; ముహుః ముహుః = మాటిమాటికి; ప్రీయమాణాః = సంతోషించుచున్నవారై; ప్రాహుః = పరస్పరము చెప్పుకొనిరి; చ; భృశ = మిక్కిలి; విస్మితాః = ఆశ్చర్యము పొందినవారై.
భావము:-
పిమ్మట; ఈ శ్లోకమును అతని శిష్యులు అందరూ గానము చేసిరి. మిక్కిలి ఆశ్చర్యము పొందినవారై సంతోషించుచు మరల మరల ఒకరికొకరు చెప్పుకొనిరి.
1.2.39.
అనుష్టుప్.
* సమాక్షరైశ్చతుర్భిర్యః
పాదైర్గీతో మహర్షిణా ।
సోఽ నువ్యాహరణా ద్భూయః
శ్లోకః శ్లోకత్వమాగతః ॥
టీక:-
సమ = సమానసంఖ్యగల, చక్కటి; అక్షరైః = అక్షరములతో కలదై; చతుర్భిః = నాలుగు; యః = ఏది; పాదైః = పాదములతో; గీతః = పాడబడినదో, చెప్పబడినదో; మహర్షిణా = మహర్షిచే; సః = అది; అనువ్యాహరణాత్ = మారల మరల పఠించుటవలన; భూయః = మరింతగా; శ్లోకః = శ్లోకము; శ్లోకత్వమ్ = కీర్తి, వావిళ్ళ నిఘంటువు; ఆగతః = పొందినది.
భావము:-
సమానమైన సంఖ్య గల చక్కటి అక్షరములతో, నాలుగు పాదములతో మహర్షి గానము చేసిన శ్లోకము, మాటిమాటికి గానము చేయుటచే ఇంకను ప్రసిద్దము ఆయెను.
1.2.41.
అనుష్టుప్.
తస్య బుద్ధిరియం జాతా
మహర్షేర్భావితాత్మనః ।
కృత్స్నం రామాయణం కావ్యమ్
ఈదృశైః కరవాణ్యహమ్" ॥
టీక:-
తస్య = ఆ; బుద్ధిః = ఆలోచన; ఇయమ్ = ఇలా; జాతా = కలుగగా; మహర్షేః = వాలీకి మహర్షి; భావిత = నిశ్చయించుకొనెను; ఆత్మనః = మనసునందు; కృత్స్నమ్ = సమస్తమైన; రామాయణమ్ = రామాయణము అను{రామాయణము- రామ+ ఆయనము- చరితము, జీవనము, రామాయణము}; కావ్యమ్ = కావ్యమును; ఈదృశైః = ఇట్టి శ్లోకములతో; కరవాణి = చేసెదను; అహమ్ = నేను.
భావము:-
ఆ ఆలోచన తట్టగానే, వాల్మీకి మహర్షి “రామాయణమును సంపూర్ణముగా ఈ శ్లోకవృత్తములలో రచించెదను” అని మనసులో నిశ్చయించుకొనెను.
1.2.42.
జగతి.
ఉదారవృత్తార్థపదై ర్మనోరమైః
తదాస్య రామస్య చకార కీర్తిమాన్ ।
సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో
యశస్కరం కావ్య ముదారదర్శనః ॥
టీక:-
ఉదార = గొప్పవైన; వృత్త = ఛందోబద్ధములు; అర్థ = అర్థములు; పదైః = శబ్దములు గల; మనోరమైః = మనోరంజకములు అయిన; తదా = అప్పుడు; అస్య = ఆ; రామస్య = రాముని కథను; చ; కార = రచించెను; కీర్తిమాన్ = కీర్తివంతుడు; సమ = సమాన సంఖ్య, చక్కని; అక్షరైః = అక్షరములు గల; శ్లోక = శ్లోకములు; శతైః = వందలకొలది కలది; యశస్వినః = కీర్తిమంతుడు; యశస్కరమ్ = కీర్తిని కలిగించు; కావ్యమ్ = కావ్యమును; ఉదార = ఉత్తమమైన; దర్శనమ్ = ధర్మశాస్త్రమును
భావము:-
కీర్తిమంతుడైన వాల్మీకి మహర్షి విరచించిన రామచరిత మను కావ్యము గొప్ప ఛందోబద్దమైనది. అర్థగాంభీర్య కలితము, శబ్దసౌందర్య శోభితము, మనోరంజకము, సమాన సంఖ్యలో చక్కని అక్షరములు కల వందలకొలది శ్లోకములు కలది, కీర్తిప్రదము మఱియు గొప్ప ధర్మశాస్త్రము వంటిది.
1.2.43.
జగతి.
తదుపగతసమాస సంధియోగం
సమమధురోపనతార్థ వాక్యబద్ధమ్ ।
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్ ॥
టీక:-
తత్ = ఆ; ఉపగత = యుక్తమైన; సమాస = సమాసములు; సంధి = సంధులు; యోగం = కూడినది; సమ = చక్కటి; మధుర = మధురమైన; ఉపనత = పొందికైన; అర్థ = అర్థవంతములైన; వాక్య = వాక్యములతో; బద్ధమ్ = కూర్చబడినది; రఘు = రాఘవరాముని; వర = శ్రేష్టమైన; చరితమ్ = ఇతిహాసము; ముని = ఋషి వాల్మీకి చే; ప్రణీతమ్ = రచించబడినది; దశశిరసః = రావణుని; వధం = వధను; చ; నిశామ = చూడుడు,(వినుడు; యత్ = దీనిని; త్వమ్ = మీరు.
భావము:-
మహర్షి వాల్మీకి కృతము అయిన శ్రేష్టమైన శ్రీరాముని ఇతిహాసము యుక్తమైన చక్కటి మధురమైన సంధి సమాసములు కలది. పొందికైన అర్థవంతములైన మాటలతో కూర్చబడినది. ఇంకా రావణ సంహారము కలది. దీనిని చదవండి లేదా వినండి.
1.2.44.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్వితీయః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షసంప్రదాయే = ఋషి సంప్రదాయమూ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణ అంతర్గత మైన; బాలకాండే = బాలకాండ లోని; ద్వితీయ [2] = రెండవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [2] రెండవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.3.1.
అనుష్టుప్.
శ్రుత్వా వస్తు సమగ్రం తత్
ధర్మార్థసహితం హితమ్।
వ్యక్తమన్వేషతే భూయో
యద్వృత్తం తస్య ధీమతః ॥
టీక:-
శ్రుత్వా = విని; వస్తు = (రామ కథ అను) వస్తువు; సమగ్రమ్ = పూర్తిగా; తత్ = ఆ; ధర్మ = ధర్మములు; అర్థః = ప్రయోజనములు; సంహితమ్ = కలది; హితమ్ = మేలుకలిగించునది; వ్యక్తమ్ = అర్థమగునట్లు; అన్వేషతే = శోధించెను; భూయః = మఱల; యద్వృత్తమ్ = ఆ వృత్తాంతమును; తస్య = అతని యొక్క; ధీమతః = బుద్ధిశాలి.
భావము:-
సమగ్రమూ, ధర్మార్థములతో కూడినది, మేళ్ళు కలిగించెడిది ఐన ఆ రామకథా వస్తువును విని, ఆ బుద్ధిశాలి యైన నారదుడు చెప్పిన ఆవృత్తాంతమంతటిని మఱల మఱల వ్యక్తమగునట్లు వాల్మీకి మహర్షి శోధించెను.
1.3.2.
అనుష్టుప్.
ఉపస్పృశ్యోదకం సమ్యక్
మునిః స్థిత్వా కృతాంజలిః ।
ప్రాచీనాగ్రేషు దర్భేషు
ధర్మేణాన్వేషతే గతిమ్ ॥
టీక:-
ఉపస్పృశ్య = ఆచమనము చేసి; ఉదకమ్ = నీటిని; సమ్యక్ = బాగుగా; మునిః = వాల్మీకి ముని; స్థిత్వా = కూర్చునియుండి; కృతాంజలిః = నమస్కారము చేయుచు; ప్రాచీన = తూర్పు; అగ్రేషు = వైపుగా కొసలు ఉండునట్లు; దర్భేషు = దర్భలపై; ధర్మేణా = తపోబలముచే; అన్వేషతే = వెదకెను; గతిమ్ = రామకథా రీతిని.
భావము:-
తూర్పు దిశగా కొసలుండునట్లు పరచియున్న దర్భాసనముపై వాల్మీకి మహర్షి కూర్చుండి; ఆచమనము చేసి; నమస్కార ముద్ర ధరించి; తన దివ్య దృష్టితో రామకథను గూర్చి బాగుగా ఆలోచించెను.
1.3.3.
అనుష్టుప్.
రామ లక్ష్మణ సీతాభిః
రాజ్ఞా దశరథేన చ ।
సభార్యేణ సరాష్ట్రేణ
యత్ప్రాప్తం తత్ర తత్త్వతః ॥
టీక:-
రామ = రాముడు; లక్ష్మణ = లక్ష్మణుడు; సీత = సీత; అభిః = ఇంకా; రాజ్ఞా = రాజైన; దశరథేన చ = దశరథుడు; చ; స = కూడి ఉన్న; భార్యేణ = భార్యలు కలవాడు; స = కూడియున్న; రాష్ట్రేణ = రాష్ట్ర ప్రజలు కలవాడు; యత్ = ఏదైతే; ప్రాప్తమ్ = పొందబడినదో; తత్ర = ఆ విషయమునందు; తత్త్వతః = యధార్థముగ.
భావము:-
తపస్సంపన్నుడైన వాల్మీకి మహర్షి. రాముడు లక్ష్మణుడు సీత రాజు దశరథుడు వారి భార్యలు, రాష్ట్ర ప్రజలు ఏమేమి పొందిరో. యథార్థముగా తెలుసుకొన జాలెను.
1.3.4.
అనుష్టుప్.
హసితం భాషితం చైవ
గతిర్యా యచ్చ చేష్టితమ్ ।
తత్సర్వం ధర్మవీర్యేణ
యథావ త్సంప్రపశ్యతి ॥
టీక:-
హసితమ్ = నవ్వులను; భాషితమ్ = సంభాషణలను; చ; ఇవ = వంటివి; గతిః = వర్తనలను; యా = మఱియు; యచ్చ = వారి; చేష్టితమ్ = పనులను; తత్ = అవి; సర్వమ్ = అన్నియు; ధర్మ = ధర్మాచరణ యొక్క; వీర్యేణ = ప్రభావముచే; యథావత్ = యథార్థముగా; సంప్రపశ్యతి = చూసెను.
భావము:-
వారి హాస్యాలు. సంభాషణలు. నడవడికలు తదితర విషయములను తన ధర్మాచరణ యందు నిష్ఠ యొక్క ప్రభావము వలన వాల్మీకి మహర్షి తెలుసుకొనెను.
1.3.5.
అనుష్టుప్.
స్త్రీతృతీయేన చ తథా
యత్ప్రాప్తం చరతా వనే ।
సత్యసంధేన రామేణ
తత్సర్వం చాన్వవేక్షతమ్ ॥
టీక:-
స్త్రీ = భార్య; తృతీయేన = మూడవదిగా గల (తానొకటి భార్య రెండు మూడు లక్ష్మణుడు, సీతారామలక్ష్మణులలో మూడవ వాడు.); చ; తథా = అట్లే; యత్ = దేనిని; ప్రాప్తమ్ = పొందగలిగెనో; చరతా = సంచరించుచున్న; వనే = వనమునందు; సత్యసంధేన = సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు; రామేణ = రామునిచేత; తత్ = అది; సర్వమ్ = అంతయు; చ = కూడ; అన్వవేక్షితమ్ = చూడబడెను.
భావము:-
సత్యసంధుడైన రాముడు సీతాలక్ష్మణులు ముగ్గురు కలసి అడవిలో సంచరించుచున్నప్పుడు జరిగిన విషయము లన్నియు వాల్మీకి మహర్షి గ్రహించెను.
1.3.6.
అనుష్టుప్.
తతః పశ్యతి ధర్మాత్మా
తత్సర్వం యోగమాస్థితః ।
పురా యత్తత్ర నిర్వృత్తం
పాణావామలకం యథా ॥
టీక:-
తతః = తరువాత; పశ్యతి = చూసెను; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; తత్ = దానిని; సర్వ మ్ = దానినంతటిని; యోగమ్ = యోగమును; ఆస్థితః = పొందిన వాడై; పురా = పూర్వము; యత్ = ఏది; తత్ర = అక్కడ; నిర్వృత్తమ్ = జరిగినదో; పాణౌవా = అరచేతిలోని; అమలకమ్ = ఉసిరికాయ; యథా = వలె.
భావము:-
వాల్మీకి మహర్షి యోగసిద్ధి పొందిన వాడు, ధర్మాత్ముడు. అట్టి మహర్షి సీతారామలక్ష్మణుల గురించి అక్కడ జరిగినదంతా, అరచేతిలోని ఉసిరిక వలె, ముంజేతి కంకణము వలె స్పష్టముగా దర్శించెను.
1.3.7.
అనుష్టుప్.
తత్సర్వం తత్త్వతో దృష్ట్వా
ధర్మేణ స మహాద్యుతిః ।
అభిరామస్య రామస్య
చరితం కర్తుముద్యతః ॥
టీక:-
తత్ = అది; సర్వమ్ = అంతయు; తత్త్వతః = యథాతథముగా; దృష్ట్వా = చూసి; ధర్మేణ = ధర్మానుష్టానబలముచే {ధర్మము- శ్రుతి స్తృత్యాది కృత్యము, ఇది దశ విధము, శ్లో. ధృతిః క్షమా దయోఽస్తేయం। శౌచ మింద్రియనిగ్రహః। ధీర్విద్యా, సత్య మక్రోధో। దశకం ధర్మ లక్షణమ్॥, వావిళ్ళ నిఘంటువు}; సః = అతను; మహాద్యుతిః = గొప్ప తేజోవంతుడు; అభిరామస్య = లోకాభిరాముడైన; రామస్య = రాముని యొక్క; చరితమ్ = చరిత్రను; కర్తుమ్ = రచించుటకు; ఉద్యతః = పూనుకొనెను.
భావము:-
వాల్మీకి మహర్షి సీతారామలక్ష్మణుల ఆయా జీవిత విశేషములు సర్వం తన ధర్మానుష్టాన బలముతో దర్శించెను. పిమ్మట, లోకాభిరాముడైన శ్రీరాముని చరితమును రచించుటకు పూనుకొనెను.
గమనిక:-
ధర్మము- శ్రుతి స్తృత్యాది కృత్యము, ఇది దశ విధము, శ్లో. ధృతిః క్షమా దయోఽస్తేయం। శౌచ మింద్రియనిగ్రహః। ధీర్విద్యా, సత్య మక్రోధో। దశకం ధర్మ లక్షణమ్॥, వావిళ్ళ నిఘంటువు
1.3.8.
అనుష్టుప్.
* కామార్థగుణసంయుక్తం
ధర్మార్థగుణవిస్తరమ్ ।
సముద్రమివ రత్నాఢ్యం
సర్వశ్రుతి మనోహరమ్ ॥
టీక:-
కామ = కామము; అర్థ = సంపద; గుణ = లక్షణములతో / పురుషార్థములతో; సంయుక్తమ్ = కూడుకుని యున్నది; ధర్మః = ధర్మమే; అర్థ = ప్రయోజనముగా గల; గుణః = గుణములను; విస్తరమ్ = విస్తారముగా గలిగినది; సముద్రమ్ = సముద్రము; ఇవ = వలె; రత్న = రత్నములతో / మిక్కిలి విలువైన సమాచారములతో; ఆఢ్యమ్ = నిండినది; సర్వ = సమస్తము; శ్రుతి = వీనులకు / వేదసారముతో; మనోహరమ్ = మనోజ్ఞమైనది.
భావము:-
తాత్పర్యము:- పురుషార్థములు ధర్మాకామ మొక్షములు. అందు ధర్మమే ప్రయోజనముగా గల గుణముల గురించి సమృద్ధిగా కలది, కామార్థములకు సంబంధించిన లక్షణములు కలది, ఎవరికైనను వినుటకు ఇంపైనది, సకల వేద సారమైనది, రత్నాకరమైన సముద్రము వలె మిక్కిలి విలువైన సమాచారాలు సమృద్ధిగా కలది ఐన గ్రంథము రచించుటకు వాల్మీకి మహర్షి పూనుకొనెను.
1.3.9.
అనుష్టుప్.
స యథా కథితం పూర్వం
నారదేన మహర్షిణా ।
రఘువంశస్య చరితం
చకార భగవానృషిః ॥
టీక:-
సః = ఆయనకు; యథా = ఏవిధముగా; కథితమ్ = చెప్పబడినదో; పూర్వమ్ = పూర్వము; నారదేన = నారదుడను; మహర్షిణా = మహర్షి చేత; రఘువంశః = రఘువంశజుడైన రాముని; అస్య = యొక్క; చరితమ్ = చరిత్రను; చకార = రచించెను; భగవాన్ = భగవత్సమానుడైన; ఋషిః = వాల్మీకి మహాఋషి.
భావము:-
భగవత్సమానుడైన వాల్మీకి మహర్షి, నారద మహర్షి తెలిపిన విధముగ ఆ రఘురాముని వృత్తాంతము సర్వం రచించెను.
1.3.10.
అనుష్టుప్.
జన్మ రామస్య సుమహత్
వీర్యం సర్వానుకూలతామ్ ।
లోకస్య ప్రియతాం క్షాంతి
సౌమ్యతాం సత్యశీలతామ్ ॥
టీక:-
జన్మ = జననమును; రామస్య = రాముని యొక్క; సుమహత్ = శ్రేష్ఠమైన; వీర్యమ్ = పరాక్రమమును; సర్వ = సర్వులకూ; అనుకూలతామ్ = అనుకూలముగా ఉండుటను; లోక = లోకమునకు; అస్య; ప్రియతామ్ = ప్రియమైనట్లు ఉండుటను; క్షాంతిమ్ = క్షమను; సౌమ్యతామ్ = ఔదార్యమును; సత్యశీలతామ్ = సత్య గుణమును.
భావము:-
రాముని జన్మ వృత్తాంతమును, పరాక్రమమును, అందరికిని సానుకూలముగాను ప్రియమైనవానిగా ఉండుటను, క్షమాగుణమును, ఔదార్యమును, సత్యశీలతను వాల్మీకి మహర్షి వర్ణించెను.
1.3.11.
అనుష్టుప్.
నానా చిత్రకథాశ్చాన్యాః
విశ్వామిత్ర సమాగమే ।
జానక్యాశ్చ వివాహం చ
ధనుషశ్చ విభేదనమ్ ॥
టీక:-
నానా = అనేకమైన; చిత్ర = విచిత్రమైన; కథాః = కథలను; చ; అన్యః = తుల్య , సర్వశబ్దసంబోధిని; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; సమాగమే = కలియుట; జానక్యాః = సీతాదేవితో; వివాహమ్ = కల్యాణమును; చ = ఇంకా; ధనుషః = శివ ధనుస్సును; చ; విభేదనమ్ = విరుచుటను.
భావము:-
రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలియుట, రాముడు శివధనస్సును విరచుట, సీతారాముల కల్యాణము వంటి అనేక విచిత్రమైన సంఘటనలను వాల్మీకి వర్ణించెను.
గమనిక:-
*- ధనుస్- నాలుగు మూరలు కొలది గల విల్లు, బాణమునకు విల్లము (ఆవాసము, ఆధారము, ఆలవాలము)
1.3.12.
అనుష్టుప్.
రామరామ వివాదం చ
గుణాన్ దాశరథేస్తథా ।
తథాఽ భిషేకం రామస్య
కైకేయ్యా దుష్టభావతామ్ ॥
టీక:-
రామ = పరశురామునికి; రామ = దశరథరామునికి; వివాదం = జరిగిన వివాదమును; చ; గుణాన్ = గుణములను; దాశరథేః = దశరథరాముని యొక్క; తథా = మఱియు; అభిషేకమ్ = పట్టాభిషేకము; రామ = రాముని; అస్య = యొక్క; కైకేయ్యాః = కైకేయి యొక్క; దుష్టభావతామ్ = దుష్టచింతన.
భావము:-
పరశురామునికి దశరథరామునితో జరిగిన వివాదమును, రాముని యొక్క సుగుణములను, రాముని యువరాజ పట్టాభిషేక ప్రయత్నమును, కైకేయి దుష్టచింతనను వర్ణించెను.
1.3.13.
అనుష్టుప్.
విఘాతం చాభిషేకస్య
రాఘవస్య వివాసనమ్ ।
రాజ్ఞః శోకవిలాపం చ
పరలోకస్య చాశ్రయమ్ ॥
టీక:-
విఘాతమ్ = ఆటంకమును; చ; అభిషేకః = యువరాజ పట్టాభిషేకము; అస్య = యొక్క; రాఘవ = రాముని; అస్య = యొక్క; వివాసనమ్ = అరణ్యమునకు పంపుట; రాజ్ఞః = రాజు యొక్క; శోక = దుఃఖముతో; విలాపమ్ = విలపించుటను; పరలోక = స్వర్గలోకము; అస్య = యొక్క; చ; ఆశ్రయమ్ = ఆశ్రయించుటను.
భావము:-
రాముని యువరాజపట్టాభిషేకమునకు కలిగిన ఆటంకమును; సీతారామలక్ష్మణులు అడవికి చనుటను; దశరథుని శోక విలాపమును; అనంతరము దశరథుడు స్వర్గస్తుడగుటను వాల్మీకి వర్ణించెను.
1.3.14.
అనుష్టుప్.
ప్రకృతీనాం విషాదం చ
ప్రకృతీనాం విసర్జనమ్ ।
నిషాదాధిప సంవాదం
సూతోపావర్తనం తథా ॥
టీక:-
ప్రకృతీనామ్ = సప్తప్రకృతులకు, {రాజుకు సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము); విషాదమ్ = పరితపించుటను; ప్రకృతీనాం = సప్తప్రకృతులనూ; విసర్జనమ్ = వదిలి వెళ్ళుటను; నిషాదాధిప = నిషాద ప్రభువు గుహునితో; సంవాదమ్ = జరిగిన సంభాషణమును; సూతః = సారథి; ఉపావర్తనమ్ = మరలి వచ్చుటను.
భావము:-
సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అడవికి వెళ్ళుట చూసి మంత్రులు, బంధుమిత్రులు, కోశాధికారి, సైన్యం, అయోధ్యావాసులు అందరూ దుఃఖించుటను, రాముడు వారిని వదిలి వెళ్ళుటను. గుహునితో రాముని సంభాషణమును, రథసారథి సీతారామ లక్ష్మణులను అడవిలో విడచి మరలి వెళ్ళుటను వర్ణించెను.
గమనిక:-
*- ప్రకృతులు- రాజ్యమునకు సప్త ప్రకృతులు స్వామ్యాది - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము
1.3.15.
అనుష్టుప్.
గంగాయాశ్చాపి సంతారం
భరద్వాజస్య దర్శనమ్ ।
భరద్వా జాభ్యనుజ్ఞానాత్
చిత్రకూటస్య దర్శనమ్ ॥
టీక:-
గంగాయాః = గంగానదిని; చ; అపి = కూడా; సంతారమ్ = దాటుటను; భరద్వాజ = భరద్వాజ మహామునిని; అస్య; దర్శనమ్ = దర్శించుటను; భరద్వాజ = భరద్వాజునియొక్క; అభ్యనుజ్ఞానాత్ = ఆజ్ఞవలన; చిత్రకూటస్య = చిత్రకూట పర్వతము యొక్క; దర్శనమ్ = దర్శనమును.
భావము:-
సీతారామలక్ష్మణులు గంగానదిని దాటుటను, భరద్వాజ మహర్షిని సందర్శించుటను, భరద్వాజుని ఆజ్ఞతో చిత్రకూట పర్వతమును చూచుటను వర్ణించెను.
1.3.16.
అనుష్టుప్.
వాస్తుకర్మ నివేశం చ
భరతాగమనం తథా ।
ప్రసాదనం చ రామస్య
పితుశ్చ సలిలక్రియామ్ ॥
టీక:-
వాస్తుకర్మ = పర్ణశాల నిర్మాణమును; నివేశం = నివసించుటను; చ; భరతాగమనం = భరతుడు యేతెంచుటను; తథా = అలాగే; ప్రసాదనం = ప్రసన్నము చేసుకొనుటను; చ; రామః = రాముని; అస్య = యొక్క; పితుః = తండ్రి; చ = కి; సలిలక్రియామ్ = తర్పణము లిచ్చుటను.
భావము:-
సీతారామలక్ష్మణులు అడవిలో పర్ణశాల నిర్మాణము చేసుకొనుటను, అందు నివసించుటను, భరతుడు వచ్చి రాముని ప్రసన్నము చేసుకొనుటను, రామలక్ష్మణులు దశరథునికి పితృతర్పణము చేయుటను వర్ణించెను.
1.3.17.
అనుష్టుప్.
పాదుకాగ్ర్యాభిషేకం చ
నందిగ్రామ నివాసనమ్ ।
దండకారణ్య గమనమ్
విరాధస్య వధం తథా ॥
టీక:-
పాదుక = పాదుకలు; అగ్రః = శ్రేష్ఠములైనవానికి; అభిషేకం = పట్టాభిషేకము చేయుటను; చ; నందిగ్రామ = నందిగ్రామములో; నివాసనమ్ = నివాసమును; దండకారణ్య = దండకారణ్యమునకు; గమనమ్ = వెళ్ళుటను; ; విరాధ = విరాధుని; అస్య = యొక్క; వధం తథా = సంహరించుటను; తథా = మున్నగునవి.
భావము:-
భరతుడు రామపాదుకులకు పట్టాభిషేకము చేయుటను నందిగ్రామములో నివసించుటను, సీతారామలక్ష్మణులు దండకారణ్యమునకు వెడలుట, అక్కడ విరాధుని వధించుటను వర్ణించెను.
గమనిక:-
*- దండకారణ్యము- దక్షిణ భారతంలో ఒకప్పుడు మహారణ్యం. రామాయణంలో ప్రాముఖ్యం వహించిన ప్రదేశం. వింధ్యకు దక్షిణమున తూర్పు దక్షిణ నడుమ ప్రదేశము మఱియు గంగా కృష్ణానదుల పరివాహక ప్రదేశము నందు గల అటవీ ప్రాంతము. ఇక్ష్వాకు పుత్రుఁడు అగు దండుఁడు అసురకృత్యములచే జననిందితుఁడు అగుటవలన తండ్రిచే వింధ్యశైలమునకు పంపఁబడి అందు మధుమంతము అను పట్టణము ఒకటి నిర్మాణము చేసికొని అసురులతో కలిసి అసురగురువైన శుక్రాచార్యులకు శిష్యుఁడు అయి ఆపురమును ఏలుచు ఉండెను. ఒకనాడు అతఁడు శుక్రాచార్యుని ఆశ్రమమునకు పోయి అచట తపము ఆచరించుచు ఉన్న అతని పెద్దకొమార్తె అగు అరజ అను దానిని కని మోహించి అది అయుక్తము అని ఆమె ఎంత చెప్పినను వినక బలాత్కారముగా ఆమెను కూడి వెడలిపోయెను. పిదప దానివిని శుక్రుఁడు మిగుల ఆగ్రహించి ఆదండుఁడు సపరివారముగ నేలపాలు అగునట్లును, ఆ మధుమంతముచుట్టు ఏఁడుదినములు మట్టి వాన కురియునట్లును జనశూన్యము అగునట్లును శాపము ఇచ్చెను. జనస్థానము.
1.3.18.
అనుష్టుప్.
దర్శనం శరభంగస్య
సుతీక్ష్ణే నాభిసంగమమ్ ।
అనసూయాసహాస్యాం చ
అంగరాగస్య చార్పణమ్ ॥
టీక:-
దర్శనం = దర్శనం; శరభంగ = శరభంగ మహర్షిని; అస్య; సుతీక్ష్ణేన = సుతీక్ష్ణ మహర్షిని; సమాగమమ్ = కలుసుకొనుటను; అనసూయా = అనసూయదేవితో; సహాస్యామ్ = సంభాషణ; అపి = ఇంకా; అంగరాగమ్ = ఒంటికి పూసుకొను లేపనము; అస్య; అర్పణం = ఇచ్చుటను; చ.
భావము:-
సీతారామలక్ష్మణులు శరభంగ మహర్షిని; సుతీక్ష్ణ మహర్షిని కలుసుకొనుట; అత్రిమహాముని భార్య ఐన అనసూయతో సీత సంభాషించుట; ఒంటికి పూసుకొను లేపనమును అనసూయ సీతకు ఇచ్చుటను వర్ణించెను.
గమనిక:-
*- శరభంగమహర్షి- దండకారణ్యమున, జాహ్నవీ నదీతీరమున ఆశ్రమము కట్టుకుని ఉండిన ఋషి. దేవతలు స్వర్గమునకు పిలువగా రాముడు తన ఆశ్రమమునకు రాగా దర్శనం చేసుకొనెను. పిమ్మటనే స్వర్గస్థుడు ఆయెను. పురాణనామచంద్రిక
1.3.19.
అనుష్టుప్.
అగస్త్యదర్శనం చైవ
జటాయో రభిసంగమమ్ ।
పంచవట్యాశ్చ గమనం
శూర్పణఖ్యాశ్చ దర్శనం।
శూర్పణఖ్యాచ సంవాదమ్
విరూపకరణం తథా ॥
టీక:-
అగస్త్య = అగస్త్య మహామునిన; దర్శనం = దర్శించుటను; చైవ = ఇంకనూ; జటాయోః = జటాయువును; అభిసంగమమ్ = కలయుటను; పంచవటాః = పంచవటికి; చ; గమనమ్ = వెళ్ళుటను; శూర్పణఖ్యాః = శూర్పణఖ అను పేరు గలామెను; చ; దర్శనమ్ = చూచుటను; శూర్పణఖ్యాః = శూర్పణఖ అను పేరు గలామెను; చ; సంవాదమ్ = మాట్లాడుట; విరూప = విరూపిణిగా; కరణం = చేయుటను; తథా = మున్నగునవి.
భావము:-
అగస్త్య మహామునిని దర్శించుటను, జటాయువును కలయుటను, పంచవటికి వెళ్ళుటను, శూర్పణఖను చూచుటను, శూర్పణఖతో సంవాదము, ఆమెను విరూపిణిగా చేయుటను మున్నగునవి.
గమనిక:-
*- 1) అగ్సస్త్య మహర్షి- పులస్త్యునికి హవిర్భుక్కుల పుత్రుడు. పోతెభా 4-26-వ., వింద్యపర్వతము మితిమీరి ఎదుగుతుండెను. అంత వాని గురువు దక్షిణానికి వాని దాటి పోవుటకు ఒదిగెను. వాతాపి ఇల్వలుల నశింపజేసెను. నహుషుడు ఇంద్రపదవి పొంది గర్వించగా ఊసరవెల్లి కమ్మని శపించెను. శ్రీకృష్ణ స్పర్శతో శాప విముక్తి అని అనుగ్రహించెను. 2) వినతాకశ్యపుల కొడుకైన అనూరునికి భార్య శ్యని యందు సంపాతి, జటాయువు పుట్టిరి. సీతను ఎత్తుకుపోవు రావణుని ఎదిరించి అతనిచే వధింపబడి క్రింద పడెను. శ్రీరామునికి సీతను రావణుడు దక్షిణానికి కొనిపోయెనని చెప్పి కొన ప్రాణమునుకూడ విడిచెను.
1.3.20.
అనుష్టుప్.
వధం ఖరత్రిశిరసోః
ఉత్థానం రావణస్య చ ।
మారీచస్య వధం చైవ
వైదేహ్యా హరణం తథా ॥
టీక:-
వధమ్ = వధించుటను; ఖర = ఖరుడు; త్రిశిరసోః = త్రిశిరస్కులను; ఉత్థానమ్ = ప్రయత్న ప్రారంభమును; రావణ = రావణుని; అస్య = యొక్క; మారీచ = మారీచుని; అస్య = యొక్క; వధం = వధించుటను; చ; ఇవ = వంటివి; చ; వైదేహ్యః = వైదేహిని; హరణం = అపహరించుటను; తథా = మున్నగునవి.
భావము:-
ఖర; త్రిశిరస్కులు అను రాక్షసులను రాముడు వధించుటను, రామునికి అపకారము చేయుటకు రావణుని ప్రయత్నమును, రాముడు మారీచుని వధించుటను, సీతాపహరణమును వర్ణించెను.
1.3.21.
అనుష్టుప్.
రాఘవస్య విలాపం చ
గృధ్రరాజనిబర్హణమ్ ।
కబంధదర్శనం చాపి
పంపాయాశ్చాపి దర్శనమ్ ॥
టీక:-
రాఘవ = రాముడు; అస్య = యొక్క; విలాపమ్ = రాముడు విలపించుటను; గృధ్రరాజ = జటాయువును; నిబర్హణమ్ = సంహరించుటను; కబంధ = కబంధుని; దర్శనం = చూచుటను; చ; ఇవ = మొదలగునవి; పంపాయాః = పంపానదిని; చ; అపి = ఇంకా; పంపాయాః దర్శనమ్ = చూచుటను.
భావము:-
జటాయు సంహరమును, రాముడు దుఃఖపడుటను, రాముడు కబంధుని చూచుటను, పంపానదిని చేరుటను వర్ణించెను.
1.3.22.
అనుష్టుప్.
శబర్యా దర్శనం చైవ
ఫలమూలాశనం తథా।
ప్రలాపం చైవ పంపాయం
హనూమద్దర్శనం తథా॥
టీక:-
శబర్యః = శబరిని; దర్శనమ్ = దర్శించుటను; చ; ఇవ = ఇంకా; ఫల = పండ్లు; మూల = దుంపలు; అశనం = తినుట; ప్రలాపం = ఆక్రందించుట; పంపాయాం = పంపవద్ద; హనుమత్ = హనుమంతుని; దర్శనం = చూచుటను; తథా = మఱియును.
భావము:-
శబరీ దర్శనము, పండ్లు దుంపలు తినుటను, పంపమవద్ద ఆక్రందించుట మఱియు హనుమంతుని చూచుటను కూడ వివరించెను.
1.3.23.
అనుష్టుప్.
ఋశ్యమూకస్య గమనం
సుగ్రీవేణ సమాగమమ్ ।
ప్రత్యయోత్పాదనం సఖ్యం
వాలిసుగ్రీవ విగ్రహమ్ ॥
టీక:-
ఋశ్యమూక = ఋశ్యమూక పర్వతము; అస్య = కొఱకు; గమనమ్ = వెళ్ళుటను; సుగ్రీవేణ = సుగ్రీవునితో; సమాగమమ్ = కలుసుకొనుటను; ప్రత్యయః = తన శక్తిపై నమ్మకము; ఉత్పాదనమ్ = కలిగించుటను; సఖ్యమ్ = స్నేహమును; వాలిసుగ్రీవ విగ్రహమ్ = వాలిసుగ్రీవుల యుద్ధమును; వాలి = వాలి; సుగ్రీవ = సుగ్రీవుల; విగ్రహమ్ = యుద్ధమును.
భావము:-
సీతారామలక్ష్మణులు పంపాసరోవర తీరమందున్న ఋశ్యమూక పర్వతమునకు వెళ్ళుటను, అక్కడ సుగ్రీవుని కలియుట, రాముడు అతనికి తనయందు నమ్మకము కలిగించుటను, అతనితో స్నేహము చేయుటను, వాలీ సుగ్రీవుల యుద్ధమును వర్ణించెను.
గమనిక:-
*- ఋశ్యమూకము- ఋశ్యల (మనుబోతు అను లేళ్ళ) పర్వతము.
1.3.24.
అనుష్టుప్.
వాలిప్రమథనం చైవ
సుగ్రీవ ప్రతిపాదనమ్ ।
తారావిలాపం సమయం
వర్షరాత్ర నివాసనమ్ ॥
టీక:-
వాలి = వాలిని; ప్రమథనం = వధించుటను; చ; ఇవ = ఇంకా; సుగ్రీవ = సుగ్రీవునకు; ప్రతిపాదనమ్ = రాజ్యము ఇచ్చుటను; తారా = తార యొక్క; విలాపమ్ = దుఃఖము; సమయమ్ = ఒప్పందము; వర్ష = వర్షారాలపు; రాత్ర = రాత్రులలో; నివాసనమ్ = నివాసమును.
భావము:-
రాముడు వాలిని వధించుటను, సుగ్రీవుని రాజును చేయుటను, తారా విలాపమును, రామసుగ్రీవుల ఒప్పందము, వర్షాకాలపు రాత్రుల యందు రామలక్ష్మణుల నివాసమును వాల్మీకి వర్ణించెను.
1.3.25.
అనుష్టుప్.
కోపం రాఘవసింహస్య
బలానా ముపసంగ్రహమ్ ।
దిశః ప్రస్థాపనం చైవ
పృథివ్యాశ్చ నివేదనమ్ ॥
టీక:-
కోపమ్ = కోపమును; రాఘవసింహ = రఘువంశమునకు సింహము వంటి వాడైన రాముని; అస్య = యొక్క; బలానామ్ = వానర సైన్యమును; ఉపసంగ్రహమ్ = సమకూర్చుటను; దిశః = నలు దిక్కులకు; ప్రస్థాపనమ్ చ; ఇవ = ఇంకా; పృథివ్యాః = భూమి; చ = యొక్క; నివేదనమ్ = వివరించుటను.
భావము:-
సుగ్రీవుడు ఆలస్యము చేయుటచే రఘురామునకు వచ్చిన కోపమును, సుగ్రీవుడు వానరసేనలను పిలిచుట, నలు దిక్కులకు వెళ్ళు డని ఆజ్ఞాపించుట, భూమిపై నలు దిశల నున్న వివిధ ప్రదేశములను వానరసేనకు సుగ్రీవుడు వివరించుటను వాల్మీకి వర్ణించెను.
1.3.26.
అనుష్టుప్.
అంగులీయకదానం చ
ఋక్షస్య బిలదర్శనమ్ ।
ప్రాయోపవేశనం చాపి
సంపాతేశ్చాపి దర్శనమ్ ॥
టీక:-
అంగులీయక = ఉంగరమును; దానం = ఇచ్చుటను; చ; ఋక్ష = ఋక్షుని; అస్యృ = యొక్క; బిల = బిలమును; దర్శనమ్ = చూచుటను; ప్రాయోపవేశనమ్ = ఆత్మత్యాగమునకు సిద్ధపడుటను; చ; అపి = మఱియు; సంపాతేః = సంపాతిని; చ; అపి = కూడా; దర్శనమ్ = చూచుటను.
భావము:-
రాముడు హనుమంతునికి తన ఉంగరమును ఇచ్చుటను, వానరులు ఋక్షగుహను చూచుటను, సీత కనపడక పోవుటచే వానరులు ఆత్మార్పణమునకు సిద్ధపడుటను, సంపాతి అను పక్షిని వానరులు దర్శించుటను వర్ణించెను.
1.3.27.
అనుష్టుప్.
పర్వతారోహణం చైవ
సాగరస్య చ లంఘనమ్ ।
సముద్ర వచనాచ్చైవ
మైనాకస్య చ దర్శనమ్ ॥
టీక:-
పర్వత = పర్వతము మహేంద్రగిరిని; ఆరోహణం = అధిరోహించుటను; చైవ = అలాగే; సాగరస్య = సముద్రమును; చ; లంఘనమ్ = దాటుటను; సముద్ర = సముద్రుని; వచనాత్ = మాటలు; చ; ఇవ = వలన; మైనాక = మైనాక; అస్య = అను; చ; దర్శనమ్ = దర్శనమును.
భావము:-
ఆంజనేయస్వామి మహేంద్రగిరిని అధిరోహించి సముద్రమును దాటుటను, సముద్రుని మాటను మన్నించి సముద్రము మధ్యనుంచి పైకి వచ్చు మైనాక పర్వతమును హనుమంతుడు చూచుటను వర్ణించెను.
1.3.28.
అనుష్టుప్.
రాక్షసీతర్జనం చైవ
చ్ఛాయాగ్రాహస్య దర్శనమ్ ।
సింహికాయాశ్చ నిధనం
లంకా మలయ దర్శనమ్॥
టీక:-
రాక్షసీ = రాక్షసి ఛాయాగ్రాహి యొక్క; తర్జనం = బెదిరించుట; చ = చ; ఇవ = అలాగే; చ్ఛాయాగ్రాహస్య = ఛాయాగ్రాహి అను నీడనుపట్టిలాక్కొను రాక్షసి; దర్శనమ్ = చూచుటను; సింహికాయాః = సింహిక యొక్క; చ; నిధనమ్ = మరణమును; లంకా = లంకలోని; మలయ = మలయ పర్వతమును; దర్శనమ్ = చూచుటను.
భావము:-
సాగర లంఘనం చేస్తున్న హనుమను ఛాయాగ్రాహి అను రాక్షసి బెదిరించుటను, ఆ ఛాయాగ్రాహి చూచుటను, సింహిక మరణమును, లంకలోని మలయపర్వతమును హనుమంతుడు చూచుటను వర్ణించెను.
గమనిక:-
*- సింహిక - హిరణ్యకశిపుని కూతురు, కుమారుడు స్వర్భాను, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు ఆ రెండు ముక్కలు రాహువు కేతువులుగా గ్రహాలు అయ్యారు, నీడను బట్టే ఆ సింహికను హనుమంతుడు సంహరించాడు.
1.3.29.
అనుష్టుప్.
రాత్రౌ లంకాప్రవేశం చ
ఏకస్య చ విచింతనమ్।
దర్శనం రావణస్యాపి
పుష్పకస్య చ దర్శనమ్ ॥
టీక:-
రాత్రౌ = రాత్రివేళ; లంకా = లంక లోనికి; ప్రవేశం = ప్రవేశించుటను; చ; ఏకస్యా = ఒంటరిగా; చ; విచింతనమ్ = ఆలోచన చేయుటను; దర్శనం = చూచుట; రావణ = రావణుని; అస్య = యొక్క; అపి = మఱియును; పుష్పకస్య = పుష్పక విమానమును; చ; దర్శనమ్ = చూచుటను.
భావము:-
ఆంజనేయస్వామి రాత్రి వేళ లంక లోనికి ప్రవేశించుటను; ఒంటరిగా ఆలోచించుకొనుటను; రావణుని మఱియు అతని పుష్పక విమానమును చూచుటను వాల్మీకి మహర్షి వర్ణించెను.
1.3.30.
అనుష్టుప్.
ఆపానభూమిగమనమ్
అవరోధస్య దర్శనమ్।
అశోకవనికాయానం
సీతాయాశ్చపి దర్శనమ్॥
టీక:-
ఆపానభూమి = పానశాలకు; గమనమ్ = వెళ్ళుటను; అవరోధ = అంతఃపురము; అస్య = యొక్క; దర్శనమ్ = చూచుటను; అశోక = అశోక అను; వనికా = వనమునకు; యానమ్ = వెళ్ళుటను; సీతాయాః = సీతాదేవిని; చ; అపి = అలాగే; దర్శనమ్ = దర్శించుటను.
భావము:-
పానశాలను అంతఃపురమును చూచుటను, అశోక వనము లోనికి హనుమంతుడు ప్రవేశించి సీతాదేవిని దర్శించుటను మహర్షి వర్ణించెను.
1.3.31.
అనుష్టుప్.
అభిజ్ఞానప్రదానం చ
రావణస్య చ దర్శనమ్।
రాక్షసీతర్జనం చైవ
త్రిజటాస్వప్నదర్శనమ్ ॥
టీక:-
అభిజ్ఞానః = ఆనమాలు ఉంగరమును; ప్రదానం = ఇచ్చుటను; చ; రావణస్య = రావణుని యొక్క; చ; దర్శనమ్ = చూచుటను; రాక్షసీ = రాక్షస స్త్రీల; తర్జనం = హెచ్చరికలను; చ; ఏవ = అలాగ; త్రిజటా = త్రిజట యొక్క; స్వప్న దర్శనమ్ = స్వప్నమును.
భావము:-
రాముని గుర్తు ఐన ఉంగరమును సీతకు ఇచ్చుటను; తరువాత రావణుని చూచుటను; రాక్షస స్త్రీలు సీతను హెచ్చరించుటను; త్రిజట తను చూసిన స్వప్న వృత్తాంతమును సీతాదేవికి వివరించుటను కూడ వాల్మీకి వర్ణించెను.
గమనిక:-
*- త్రిజట- విభీషణుని కూతురు. అశోకవనమున సీతకు కాపలాగా ఉన్న రాక్షసలో ఒకతె.
1.3.32.
అనుష్టుప్.
మణిప్రదానం సీతాయాః
వృక్షభంగం తథైవ చ।
రాక్షసీవిద్రవం చైవ
కింకరాణాం నిబర్హణమ్ ॥
టీక:-
మణి = చూడామణిని; ప్రదానమ్ = ఇచ్చుటను; సీతాయాః = సీతాదేవి యొక్క; వృక్ష = అశోకవనంలోని వృక్షములను; భంగమ్ = ధ్వంసమొనర్చుటను; రాక్షసీ = రాక్షస స్త్రీలు; విద్రవం = పారిపోవుటను; చ; ఇవ = అలాగే; కింకరాణామ్ = భటులను; నిబర్హణమ్ = సంహరించుటను.
భావము:-
సీత తన చూడామణిని హనుమంతునికి ఇచ్చుటను, హనుమంతుడు అశోక వనములోని వృక్షములను ధ్వంసము చేయుటను, రాక్షస స్త్రీలు భయపడి పారిపోవుటను, రావణుని భటులను హనుమంతుడు సంహరించుటను వర్ణించెను.
1.3.33.
అనుష్టుప్.
గ్రహణం వాయుసూనోశ్చ
లంకాదా హాభిగర్జనమ్ ।
ప్రతిప్లవన మేవాథ
మధూనాం హరణం తథా ॥
టీక:-
గ్రహణం = పట్టుబడుటను; వాయుసూనః = వాయుపుత్రుడైన హనుమంతుడు; చ; లంకా = లంకను; దాహ = కాల్చుచు; అభి = గట్టిగా; గర్జనమ్ = గర్జించుటను; ప్రతిప్లవనమ్ = తిరిగి సముద్రమును దాటుటను; ఏవ = అలాగే; అథ = తరువాత; మధూనామ్ = మథువనంలో తేనెలను; హరణమ్ = త్రాగుటను; తథా = మున్నగునవి.
భావము:-
ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు వాయుపుత్రుడైన హనుమంతుడు పట్టుబడుటను, తరువాత లంకను కాల్చుచు గర్జన చేయుటను, హనుమంతుడు తిరిగి సముద్రమును దాటి వెనుకకు వచ్చుటను, వానురులందరును సంతోషముగా మధువనంలో తేనెలను త్రాగుటను వర్ణించెను.
1.3.34.
అనుష్టుప్.
రాఘవాశ్వాసనం చైవ
మణినిర్యాతనం తథా ।
సంగమం చ సముద్రేణ
నలసేతోశ్చ బంధనమ్ ॥
టీక:-
రాఘవ = రఘురాముని; ఆశ్వాసనమ్ = స్వాంతన పరచుటను; చ; ఇవ = అలాగే; మణి = చూడామణిని; నిర్యాతనమ్ = అప్పగించుటను; సంగమం = చేరుకొనుటను; చ; సముద్రేణ = సముద్రతీరమునకు; నల = నలునిచే; సేతుః = వంతెన, కట్ట; చ; బంధనం = కట్టబడుటను.
భావము:-
హనుమంతుడు రామునికి సీత జాడ తెలిపి ఓదార్చుటను, సీత ఇచ్చిన చూడామణిని రామునికి అప్పగించుటను, రామలక్ష్మణులు సముద్రమును చేరుటను, నలుడు సేతువును నిర్మించుటను వాల్మీకి వర్ణించెను.
1.3.35.
అనుష్టుప్.
ప్రతారం చ సముద్రస్య
రాత్రౌ లంకావరోధనమ్।
విభీషణేన సంసర్గం
వధోపాయ నివేదనమ్ ॥
టీక:-
ప్రతారం = దాటుటును; చ; సముద్రస్య = సముద్రమును; రాత్రౌ = రాత్రి వేళ; లంకా = లంకను; అవరోధనమ్ = ముట్టడించుటను; విభీషణేన = విభీషణునిచే; సంసర్గమ్ = కూడుట; వధ = వధించు; ఉపాయ = ఉపాయమును; నివేదనమ్ = తెలుపుటను.
భావము:-
రామసేతువు పైనుండి వానర సైన్యముతో సహా అందరు సముద్రమును దాటుటను, రాత్రివేళ లంకను ముట్టడించుటను, విభీషణు రామునితో కూడుటను, రావణుని వధించు ఉపాయము రామునికి నివేదించుటను వాల్మీకి వర్ణించెను.
1.3.36.
అనుష్టుప్.
కుంభకర్ణస్య నిధనం
మేఘనాదనిబర్హణమ్ ।
రావణస్య వినాశం చ
సీతావాప్తిమరేః పురే ॥
టీక:-
కుంభకర్ణ = కుంభకర్ణుని; అస్య = యొక్క; నిధనమ్ = వధించుటను; మేఘనాద = ఇంద్రజిత్తుని; నిబర్హణమ్ = వధను; రావణ = రావణుని; అస్య = యొక్క; వినాశం = వినాశనమును; చ; సీత = సీతను; అవాప్తిమ్ = పొందుటను; అరేః = శత్రువులయొక్క; పురే = పురములో.
భావము:-
కుంభకర్ణ మేఘనాదులను వధించుటను, రావణ వధను, రావణుని లంకలో రామునికి సీతాదేవి పునః ప్రాప్తించుటను రామాయణంలో వర్ణించెను.
1.3.37.
అనుష్టుప్.
విభీషణాభిషేకం చ
పుష్పకస్య చ దర్శనమ్।
అయోధ్యాయాశ్చ గమనం
భరద్వాజ సమాగమమ్॥
టీక:-
విభీషణ = విభీషణుని; అభిషేకం = పట్టాభిషేకమును; చ; పుష్పక = పుష్పక విమానము; అస్య = యొక్క; చ; దర్శనమ్ = చూచుటను; అయోధాః = అయోధ్యకు; చ; గమనమ్ = వెళ్ళుటను; భరద్వాజ = భరద్వాజ మహర్షిని; సమాగమనమ్ = కలిసికొనుట;
భావము:-
లంకకు విభీషణుని పట్టాభిషిక్తుని చేయుటను, పుష్పకవిమానమును దర్శించుటను, సీతారామలక్ష్మణులు అయోధ్యకు బయలుదేరుటను, దారిలో భరద్వాజాశ్రమం చేరి భరద్వాజమహర్షిని కలియుటను రామాయణములో వర్ణించెను.
1.3.38.
అనుష్టుప్.
ప్రేషణం వాయుపుత్రస్య
భరతేన సమాగమమ్ ।
రామాభిషే కాభ్యుదయ
సర్వసైన్య విసర్జనమ్ ।
స్వరాష్ట్ర రంజనం చైవ
వైదేహ్యాశ్చ విసర్జనమ్ ॥
టీక:-
ప్రేషణం = పంపించుట; వాయుపుత్రస్య = హనుమను; భరతేన = భరతుని; సమాగమమ్ = కలుసుకొనుటను; రామ = రాముని యొక్క; అభిషేక = పట్టాభిషేకము యొక్క; అభ్యుదయమ్ = మహోత్సవమును; సర్వ = సమస్తమైన; సైన్య = సైన్యములను; విసర్జనమ్ = వెనుకకు పంపించుటను; స్వ = తన; రాష్ట్ర = దేశ ప్రజలను; రంజనమ్ = సంతసింప జేయుటను; వైదేహియాః = సీతను; చ; విసర్జనమ్ = విడచుటను.
భావము:-
తమ రాక తెలుపమని హనుమను భరతుని వద్దకు పంపుటను, శ్రీరామాదులు భరతుని కలసుకొనుటను, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును, వానరాది సకల సైన్యములను వెనుకకు పంపించివేయుటను, తన ప్రజలను రంజింప జేయుచు రాముడు రాజ్యపాలన చేయుటను, సీతను ఎడబాయుటను వాల్మీకి మహర్షి ఈ రామాయణములో వర్ణించెను.
గమనిక:-
*- వాయుపుత్రః – వాయుః (వాయుదేవుని) అనుగ్రహంతో కలిగిన పుత్రః (కుమారుడు); హనుమ
1.3.39.
అనుష్టుప్.
అనాగతం చ యత్కించిత్
రామస్య వసుధాతలే ।
తచ్చకారోత్తరే కావ్యే
వాల్మీకిర్భగవానృషిః ॥
టీక:-
అనాగతం = భవిష్యత్తులో జరుగవలసిన దానిని; చ; యత్కించిత్ = ఏ ఏ విషయము; రామస్య = రాముని; వసుధాతలే = రాజ్యములోని; తత్ = దానిని; చకార = రచించెను; ఉత్తరే = తన రచనాకాలమునకు పిమ్మట జరుగు; కావ్యే = కావ్యము / కాండ నందు; వాల్మీకిః = వాల్మీకి మహర్షి; భగవాన్ = భగవత్ స్వరూపుడు; ఋషిః = మహర్షి; వాల్మీకిః = వాల్మీకి.
భావము:-
భగవాన్ వాల్మీకి మహర్షి, తన రచనాకాలానికి భవిష్యత్తులో రాముని పాలనలో మున్ముందు జరుగబోవు విషయములను ఉత్తరకాండలో రచించెను.
గమనిక:-
*- మొదటి ఆరు కాండలలోను జరిగినది జరిగినట్లు వ్రాసిన ఇతిహాసము. ఏడవసర్గ తన రచనాకాలానికి భవిష్యత్తు దర్శించి వ్రాసినది కావున కావ్యము.
1.3.40.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
తృతీయః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; తృతీయ [3] = మూడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [3] మూడవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.4.1.
అనుష్టుప్.
* ప్రాప్తరాజ్యస్య రామస్య
వాల్మీకి ర్భగవానృషిః ।
చకార చరితం కృత్స్నం
విచిత్రపద మాత్మవాన్ ॥
టీక:-
ప్రాప్త = ప్రాప్తించిన; రాజ్య = రాజ్యము; అస్య = కల; రామ = రాముని; అస్య = యొక్క; వాల్మీకిః = వాల్మీకి; భగవాన్ = మహత్మ్యము కలవాడును; ఋషిః = జ్ఞానాధికుడు, విద్వాంసుడు, శాస్త్ర కావ్యాదులు సృష్టించువాడు, మంత్రద్రష్ట; చకార = రచించెను; చరితం = చరిత్రమును; కృత్స్నమ్ = సమస్తమైన; విచిత్ర = ఆశ్చర్య జనకము లైన, బాగుగా చిత్రించిన, అందమైన; పదమ్ = పదములతో; ఆత్మ వాన్ = బుద్ధి శాలి అయిన
భావము:-
భగవంతుడు, కావ్యరచన చేయు ఋషియు, బహుబుద్ధిశాలియు నైన వాల్మీకి, శ్రీరాముడు రాజ్యము పొందిన పిదప ఆయన రాముని చరితము మొత్తము చక్కటి పదములతో రచించెను.
1.4.2.
అనుష్టుప్.
* చతుర్వింశ త్సహస్రాణి
శ్లోకానాముక్తవా నృషిః ।
తథా సర్గశతాన్ పంచ
షట్కాండాని తథోత్తరమ్ ॥
టీక:-
చతుర్వింశత్ సహస్రాణి = ఇరవై నాలుగు వేల; శ్లోకానామ్ = శ్లోకములను; ఉక్తవాన్ = చెప్పెను; ఋషిః = వాల్మీకి మహర్షి; తథా = మఱియు; సర్గ = సర్గల; శతాన్ = వందలు; పంచ = ఐదు; షట్ = ఆరు; కాండాని = కాండలను; తథా = మఱియు; ఉత్తరమ్ = ఉత్తర కాండను.
భావము:-
వాల్మీకి మహర్షి రామాయణమును ఇరువది నాలుగు వేల శ్లోకములతో ‘ఐదువందల సర్గలుగా’, ఆరు కాండములు మఱియు ఉత్తర కాండము మొత్తము ఏడు కాండలలో రచించెను.
గమనిక:-
ప్రస్తుతం లభ్యమగుచున్న పాఠ్యములలో సర్గల సంఖ్య 647 {బాల కాండ: 77; అయోధ్య కాండ: 119; అరణ్య కాండ: 75; కిష్కింధ కాండ: 67; సుందర కాండ: 68; యుద్ధ కాండ: 131; ఉత్తర కాండ: 110; మొత్తం ఏడు కాండలు: 647.
1.4.3.
అనుష్టుప్.
కృత్వాపి తన్మహాప్రాజ్ఞః
సభవిష్యం సహోత్తరమ్ ।
చింతయామాస "కో న్వేతత్
ప్రయుంజీయాదితి ప్రభుః" ॥
టీక:-
కృత్వ = రచించి; అపి = కూడా; తత్ = ఆ; మహా = గొప్ప; ప్రాఙ్ఞః = జ్ఞాని అయిన; స = కూడి ఉన్న; భవిష్యమ్ = భవిష్యత్తుకలది; సహ = సహితమైన; ఉత్తరం = ఉత్తర కాండ, పట్టాభిషేక అనంతర కథ; చింతయామాస = ఆలోచించెను; కః = ఎవడు; ను = నిజముగా; ఏతత్ = దీనిని; ప్రయుంగియాత్ = ప్రయోగించును; ఇతి = అని; ప్రభుః = సమర్థుడైన వాల్మీకి.
భావము:-
గొప్ప ప్రజ్ఞాశాలి; సమర్థుడు అయిన వాల్మీకి పట్టాభిషేకానంతరకథ ఐన ఉత్తరాకాండ రచించిన పిమ్మట దీనిని యుక్తమైన రీతిలో పఠించగలవారు ఎవరు ఉన్నారని యోచించెను.
1.4.4.
అనుష్టుప్.
తస్య చింతయమానస్య
మహర్షే ర్భావితాత్మనః ।
అగృహ్ణీతాం తతః పాదౌ
మునివేషౌ కుశీలవౌ ॥
టీక:-
తస్య = ఆ; చింతయమానస్య = ఆలోచించుచున్న; మహర్షేః = మహర్షి; భావిత = భావించుచున్న; ఆత్మనః = మనసున; అగృహ్ణీతాం = గ్రహించిరి; తతః = అటుపిమ్మట; పాదౌ = పాదద్వయములను; ముని = మునుల; వేషౌ = వేషధారులిద్దరు; కుశీలవౌ = కుశలవులు ఇద్దరు.
భావము:-
అంతట మనసులో ఆలోచించుకుంటున్న వాల్మీకి పాదములకు ముని వేషధారులైన కుశలవులు ప్రణామములు చేసిరి.
1.4.5.
అనుష్టుప్.
కుశీలవౌ తు ధర్మజ్ఞౌ
రాజపుత్రౌ యశస్వినౌ ।
భ్రాతరౌ స్వరసంపన్నౌ
దద ర్శాశ్రమవాసినౌ ॥
టీక:-
కుశీలవౌ = కుశలవులు ఇద్దరను; తు; ధర్మజ్ఞౌ = ధర్మము తెలిసినవారును; రాజపుత్రౌ = రాకుమారులును; యశస్వినౌ = కీర్తిమంతులను; భ్రాతరౌ = అన్నదమ్ములిద్దరిని; స్వర = సుస్వరము; సంపన్నౌ = బాగా ఉన్నవారిని; దదర్శః = చూచెను; ఆశ్రమవాసినౌ = ఆశ్రమములో నివసించువారిని.
భావము:-
ఆ వాల్మీకి మహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు,తన ఆశ్రమవాసులు, సుస్వర సంపన్నత కలవారు ఐన కుశలవులను చూసెను.
1.4.6.
అనుష్టుప్.
స తు మేధావినౌ దృష్ట్వా
వేదేషు పరినిష్ఠితౌ ।
వేదోపబృంహ ణార్థాయ
తావగ్రాహయత ప్రభుః ॥
టీక:-
సః = ఆ వాల్మీకి; తు = వారిని; మేధావినౌ = మేధావులను; దృష్ట్వా = చూచి; వేదేషు = వేదములలో; పరినిష్ఠితౌ = దృఢజ్ఞానము కలవారిని; వేదః = వేదములను; ఉపబృంహణ = పరిపుష్టము; అర్థాయ = చేయుటకై; తౌ = వారిచే; అగ్రాహయత = గ్రహింపజేసెను రామాయణమును; ప్రభుః = ప్రభావశాలి యైన వాల్మీకి.
భావము:-
ప్రభావశాలి ఐన వాల్మీకి సాంగోపాంగంగా వేదాధ్యయనము చేసిన ఆ కుశలవులకు వేదార్థము పరిపుష్ఠము ఒనరించుటకు రామాయణమును ఉపదేశించెను.
1.4.7.
అనుష్టుప్.
* కావ్యం రామాయణం కృత్స్నం
సీతాయాశ్చరితం మహత్ ।
పౌలస్త్యవధ మిత్యేవ
చకార చరితవ్రతః ॥
టీక:-
కావ్యం = కావ్యమును; రామాః = రాముని; అయణమ్ = పోక; కృత్స్నమ్ = సమస్త మైన; సీతాయాః = సీత యొక్క; చరితం = చరితము; మహత్ = గొప్పదైన; పౌలస్త్య = పులస్యబ్రహ్మ వంశస్థుడు, రావణుని యొక్క; వధం = సంహారము; ఇత్యేవ = అనునట్టి పేర్లతో; చకార = రచించెను; చరిత = ఆచరించిన; వ్రతః = ఉత్తమ వ్రతములు కల వాడు.
భావము:-
ఉత్తమ వ్రతధారి ఐనట్టి వాల్మీకి ఆ మొత్తం కావ్యమును ‘రామాయణము’, ‘సీతాయాశ్చరితము’, ‘పౌలస్త్యవధము’ అను పేర్లతో రచించెను.
గమనిక:-
*- 1. బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు- పులస్త్యుఁడు / పులస్త్యబ్రహ్మ, భార్య కర్దమ ప్రజాపతి కూతురు అగు హవిర్భుక్కు నందు కొడుకులు ఇద్దరు- అగస్త్యుఁడును విశ్రవస్సును. 2. విశ్రవసుఁడు- భార్యలు నలుగురు. మొదటిభార్య తృణబిందువు కూఁతురు అగు ఇలబిల యందు కుబేరుఁడు పుట్టెను. రెండవభార్య సుమాలి కూఁతురు అగు కైకసి యందు కొడుకులు ముగ్గురు- రావణ కుంభకర్ణ విభీషణులు పుట్టిరి. మూఁడవ భార్య కైకసిచెల్లెలు అగు పుష్పోత్కట. దానియందు మహోదరమహాపార్శ్వాదులు జనించిరి. నాలవభార్య కైకసి రెండవచెల్లెలు అగు రాక. ఆపె ఖర దూషణ త్రిశిరులను కనెను.
1.4.8.
అనుష్టుప్.
* పాఠ్యే గేయే చ మధురం
ప్రమాణైస్త్రిభి రన్వితమ్ ।
జాతిభిః సప్తభిర్బద్ధం
తంత్రీలయ సమన్వితమ్ ॥
టీక:-
పాఠ్యే = పఠించుటకును; గేయే = గానము చేయుటకును; చ = కూడా; మధురమ్ = మధురమైనదై; ప్రమాణైః = సంగీతంలోని ప్రమాణములు / కాలములు; త్రి = మూటితో; భి = సహితంగా; అన్వితమ్ = కూడినదై; జాతిభిః = స్వరజాతులతో; భి = సహితము, కూడ; బద్ధమ్ = కూర్చబడినదై; తంత్రీ = తంత్రీ వాయిద్యముల; లయ = లయబద్దత; సమన్వితమ్ = కూడినదై {తంత్రీలయ సమన్వితము అంటే శృతితో కలపగలది}.
భావము:-
ఆ రామాయణ కావ్యము పఠించుటకు, గానము చేయుటకు ఎంతో మధురముగా ఉంన్నది. అంతే కాక సంగీత విశేషములైన దృత, మధ్యమ, విలంబిత మూడు ప్రమాణములు కలది. ఇంకా సరిగమపనిస అను సప్త స్వరములకు అనుగుణమైనది. మఱియు తంత్రీ వాయిద్యములపై లయ బద్ధముగా పాడుటకు అనువుగా కూడ ఉన్నది.
గమనిక:-
సంగీత శాస్త్రములో 1) ప్రమాణములు / మూడు కాలములు : త్రికాలము : ప్రథమ, ద్వితీయ, తృతీయ / విళంబిత, మధ్య, దృత; 2) మూడు స్థాయిలు : స్థాయి : త్రిస్థాయిలు : మంద్ర, మధ్య, తార; 3) మూడు తాళాంగములు : తాళాంగములు : : అనుద్రుతము (అరసున్న ‘ఁ’), ద్రుతము (సున్న ‘ం), లఘువు (నిలువు గీత ‘।’); ఇందు లఘువునందు మాత్రము జాతి భేదములు ఉన్నవి, అవి త్రిశ్ర జాతి 13; చతురశ్ర జాతి 14; ఖండజాతి 15; మిశ్రజాతి 17; సంకీర్ణ 19;
1.4.9.
అనుష్టుప్.
* రసైః శృంగారకారుణ్య
హాస్య వీర భయానకైః ।
రౌద్రాదిభిశ్చ సంయుక్తం
కావ్యమే తదగాయతామ్ ॥
టీక:-
రసైః = రసములతోడను; శృంగార = శృంగారము; కారుణ్య = కరుణ; హాస్య = హాస్యము; వీర = వీర; భయానకైః = భయానకములు; రౌద్రాదిభిః = రౌద్రము; భిః = తో కూడా; చ; సంయుక్తమ్ = కూడిన; కావ్యమ్ = కావ్యమును; ఏతత్ = ఈ; అగాయతామ్ = గానము చేసిరి.
భావము:-
1. శృంగార, 2. కారుణ్య, 3. హాస్య, 4. వీర, 5. భయానక, 6. రౌద్రరసములతో కూడినదియును అగు ఆ రామాయణము అనే కావ్యమును లవకుశులు గానము చేసిరి.
గమనిక:-
ఈ శ్లోకములో నవరసములు తొమ్మిదిలోని అద్భుతం. భీభత్సం, శాంతం చెప్పబడలేదు.
1.4.10.
అనుష్టుప్.
తౌ తు గాంధర్వతత్త్వజ్ఞౌ
మూర్చ నాస్థానకోవిదౌ ।
భ్రాతరౌ స్వరసంపన్నౌ
గంధర్వావివ రూపిణౌ ॥
టీక:-
తౌ = వారు లవకుశులు; తు = విశేషముగ; గాంధర్వ = గాంధర్వ విద్య, సంగీతము; తత్త్వజ్ఞౌ = శాస్త్రము తెలిసిన వారు; మూర్చనా = స్వర మూర్ఛనల యొక్క; స్థాన = స్థానములు {స్వరముల ఉనికి}; కోవిదౌ = తెలిసిన వారును; భ్రాతరౌ = ఆ సోదరులు ఇరువుకు; స్వర = స్వరజ్ఞానము; సంపన్నౌ = సమృద్ధిగా కలవారు; గంధర్వః = గంధర్వులు; ఇవ = వలె; రూపిణౌ = నిరూపణ చేయగలవారు.
భావము:-
ఆ లవకుశులు చక్కని సంగీత శాస్త్రజ్ఞానము, స్వరసంపన్నత, మూర్ఛనా స్వర స్థానముల వంటి సంగీత విశేష సామర్ధ్యములు దండిగా కలిగినవారు; వాటిని గంధర్వుల వలె కనబరచు నేర్పు కలవారు.
గమనిక:-
మూర్చన - క్రమముగ సప్తస్వరముల ఆరోహణ అవరోహణములు; స్వరజ్ఞానము - పాడిన రాగమము స్వరపరచగలుగుట, వ్రాసిన రాగము పాడగలుగుట; రూపణ - నిరూపించుట, కనబరచుట.
1.4.11.
అనుష్టుప్.
రూపలక్షణ సంపన్నౌ
మధురస్వర భాషిణౌ ।
బిమ్బాదివోత్థితౌ బిమ్బౌ
రామదేహా త్తథా పరౌ ॥
టీక:-
రూప = ఉత్తమ రూప; లక్షణ = ఉత్తమ లక్షణములు; సంపన్నౌ = సమృద్ధిగా కలిగిన వారు; మధుర = తీయని; స్వర = కంఠరస్వరముతో; భాషిణౌ = సంభాషించువారు; బిమ్బాత్ = ప్రతిబింబమునుండి; ఇవ = వలె; ఉత్థితౌ = ఉత్పన్న మైన; బిమ్బౌ = బింబములు; రామ = రాముని; దేహాత్ = శరీరము నుండి; తథా = అలా; అపరౌ = ఇతరము కానివారు,
భావము:-
*గమనిక:-{తండ్రి తానై పుత్రునిగా జన్మిస్తాడు అన్న సూత్రం ప్రకారం పుత్రుడు తండ్రి నుండి భిన్నమైన వాడు కాదు కనుక అపరుడు. పైగా కుశలవులిద్దరూ కవలలు}.
1.4.12.
అనుష్టుప్.
తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన
ధర్మ్యమాఖ్యాన ముత్తమమ్ ।
వాచోవిధేయం తత్సర్వం
కృత్వా కావ్యమనిందితౌ ॥
టీక:-
తౌ = వారు; రాజపుత్రౌ = రాకుమారులు; కార్త్స్న్యేన = సంపూర్ణంముగా; ధర్మ్యమ్ = ధర్మ ప్రతిపాదకమైన; ఆఖ్యానమ్ = ఇతిహాసము; ఉత్తమమ్ = ఉత్తమము మైన దానిని; వాచః విధేయమ్ = కంఠస్థముచేసి; తత్ = దానిని; సర్వమ్ = అంతా; కృత్వా = గానము చేసిరి; కావ్యమ్ = కావ్యమును; అనిందితౌ = తప్పు పట్టుటకు వీలులేనివిధముగా.
భావము:-
ఆ రాజకుమారులైన కుశలవులు ధర్మ ప్రతిపాదకమైన ఆ ఉత్తమ కావ్యమును సంపూర్ణముగా కంఠస్థము చేసికొని, దోషరహితముగా గానము చేసిరి.
1.4.13.
అనుష్టుప్.
ఋషీణాం చ ద్విజాతీనామ్
సాధూనాం చ సమాగమే ।
యథోపదేశం తత్త్వజ్ఞౌ
జగతుస్తౌ సమాహితౌ ॥
టీక:-
ఋషీణాం = ఋషుల యొక్కయు; చ = మఱియు; ద్విజాతీనామ్ = ద్విజుల యొక్కయు; సాధూనాం = సజ్జనుల యొక్కయు; చ; సమాగమే = సమావేశములందు; యథః = యథావిధముగా; ఉపదేశం = ఉపదేశించ బడినది; తత్త్వజ్ఞౌ = తత్వమును బాగుగా తెలుసుకొనిన వారై; జగతుః = గానము చేసిరి; సు = మంచి; సమాహితౌ = సావధాన చిత్తులై.
భావము:-
ఆ కుశలవులు సావధాన చిత్తులై, ఆ కావ్యము యొక్క తత్వమును బాగుగా తెలిసికొని, వాల్మీకిచేత తమకు ఉపదేశింపబడిన రీతిలో ఋషులు, ద్విజులు, ఇతర సత్పురుషులు ఉన్న సమావేశములలో గానము చేసిరి.
1.4.14.
అనుష్టుప్.
మహాత్మానౌ మహాభాగౌ
సర్వలక్షణ లక్షితౌ ।
తౌ కదాచి త్సమేతానాం
ఋషీణాం భావితాత్మనామ్ ॥
టీక:-
మహాత్మానౌ = మహాత్ములైన; మహా = గొప్ప; భాగౌ = భాగ్యవంతులైన; సర్వ = సమస్తమైన; లక్షణ = ఉత్తమ లక్షణములతో; లక్షితౌ = గుర్తింబడువారు; తౌ = వారు ఇద్దరు; కదాచిత్ = ఒకసారి; సమేతానాం = ఒక చోట కూడియున్న; ఋషీణాం = ఋషుల యొక్క; భావిత = పవిత్రమైన; ఆత్మనామ్ = హృదయములు గల వారిని.
భావము:-
మహాబుద్ధిశాలురు; మహాభాగ్యవంతులు; సర్వ సులక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు పవిత్రహృదయులైన కొందరు మునీశ్వరులుతో ఒకనాడు సమావేశమైనారు.
1.4.15.
అనుష్టుప్.
ఆసీనానాం సమీపస్థౌ
ఇదం కావ్యమగాయతామ్ ।
తచ్ఛ్రుత్వా మునయః సర్వే
బాష్పపర్యాకులేక్షణాః ॥
టీక:-
ఆసీనానాం = కూర్చుని ఉన్న; సమీప = సమీపము నందు; అస్థౌ = ఉన్న వారై; ఇదం = ఈ; కావ్యమ్ = కావ్యమును; అగాయతామ్ = గానము చేసిరి; తత్ = ఆకావ్యమును; శ్రుత్వా = విని మునయః = మునులు; సర్వే = అందరు; బాష్ప = కన్నీరు; పర్యాకుల = పూర్తిగా నిండిన; ఈక్షణాః = కన్నులతో.
భావము:-
వారు ఒకచోట కూర్చుని ఉండగా వారి ఎదుట కుశలవులు ఈ రామాయణ కావ్యమును గానము చేసిరి. ఆ కుశలవుల గానము విన్న మును లందరును ఆనంద బాష్పములు నిండిన కన్నులతో.
1.4.16.
అనుష్టుప్.
సాధు సాధ్వితి తావూచుః
పరం విస్మయమాగతాః ।
తే ప్రీతమనసః సర్వే
మునయో ధర్మవత్సలాః ॥
టీక:-
సాధు సాధు = బాగు బాగు; ఇతి = అని; తా = వారిని; ఊచుః = పలికిరి; పరం = గొప్ప; విస్మయమ్ = ఆశ్చర్యము; ఆగతాః = కలుగుట వలన; తే = ఆ; ప్రీత = సంతసము చెందిన; మనసః = మనసుకలవారు; సర్వే = అందరు; మునయః = మునులును; ధర్మ = ధర్మమును; వత్సలాః = ఆపేక్ష కలవారు.
భావము:-
కుశలవులను ‘బాగు బాగ’ని ప్రశంసించిరి, ధర్మమునందు ఆపేక్ష కలిగిన ఆ మునులందరు సంతోషించిరి.
1.4.17.
అనుష్టుప్.
ప్రశశంసుః ప్రశస్తవ్యౌ
గాయమానౌ కుశీలవౌ ।
“అహో గీతస్య మాధుర్యం
శ్లోకానాం చ విశేషతః॥
టీక:-
ప్రశశంసుః = ప్రశంసించిరి; ప్రశస్తవ్యౌ = ప్రశంసార్హులైన; గాయమానౌ = గానము చేయుచున్న; కుశీలవౌ = కుశలవులను; అహో = ఆహా; గీతస్య = గానము యొక్క; మాధుర్యమ్ = మాధుర్యము; శ్లోకానాం = శ్లోకములను; చ; విశేషతః = విశేషమైనవి.
భావము:-
ఆ కావ్యగానము చేయుచున్న ప్రశంసార్హులైన ఆ కుశలవులను పొగిడిరి. “ఆహా ! గానము మధురము. శ్లోకములు అంతకంటె విశేషమైనవి.
1.4.18.
అనుష్టుప్.
చిరనిర్వృత్తమప్యేతత్
ప్రత్యక్షమివ దర్శితమ్ ।
ప్రవిశ్య తావుభౌ సుష్ఠు
తదా భావమగాయతామ్”॥
టీక:-
చిర = చాలా కాలము క్రితము; నిర్వృత్తం = జరిగినది; అపి = ఐనను; ఏతత్ = ఇది; ప్రత్యక్షం = కన్నుల కెదురుగా జరుగుచున్నది; ఇవ = అన్నట్లు; దర్శితమ్ = చూపబడినది; ప్రవిశ్య = ప్రవేశించి; తా = ఆ; ఉభౌ = ఉభయులు; సుష్ఠు = బాగుగా; తదా = ఆ; భావమ్ = భావమును; అగాయతామ్ = గానము చేసిరి.
భావము:-
చాలాకాలము క్రితము జరిగినదైను ఈ గాథ కళ్ళకు కట్టినట్లుగా చూపబడినది అని మునులు కుశలవులను ప్రశంసించిరి. ఆ కుశలవులు ఇరువురును సభలో ప్రవేశించి బాగుగా భావపరి పుష్టముగా గానము చేసిరి.”
1.4.19.
అనుష్టుప్.
సహితౌ మధురం రక్తం
సంపన్నం స్వరసంపదా।
ఏవం ప్రశస్యమానౌ తౌ
తపఃశ్లాఘ్యైర్మహాత్మభిః ॥
టీక:-
సహితౌ = ఇద్దరుకలిసి; మధురం = మధురముగా; రక్తమ్ = మనోరంజకముగా; సంపన్నం = సంపన్నముగా; స్వరసంపదా = స్వరజ్ఞతతో; ఏవమ్ = ఆవిధముగా; ప్రశస్యమానౌ = ప్రశంసించ బడుచున్నవారై; తౌ = వారు; తపః = తపస్సుచేత; శ్లాఘ్యైః = కొనియాడదగిన; మహాత్మభిః = ఆ మహాత్ములైన వారిచేత.
భావము:-
కలిసిన గొంతుకలతో మధురముగా; సుస్వర సంపన్నముగా; మనోరంజకముగా మహాతపస్సుచే కొనియాడదగిన మహాత్ములు తమను అట్లు కొనియాడుచుండ కుశలవులు ఇద్దరూ ఆ కావ్యమును గానము చేసిరి.
1.4.20.
అనుష్టుప్.
సంరక్తతర మత్యర్థం
మధురం తావగాయతామ్ ।
ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం
సంస్థితః కలశం దదౌ॥
టీక:-
సంరక్తతరమ్ = అత్యంత మనోహరముగా; అత్యర్థమ్ = అతిశయించిన,; మధురం = మధురముగా; అగాయతామ్ = గానము చేసిరి; ప్రీతః = సంతసించిన వాడైన; కశ్చిత్ = ఒకానొక; మునిః = ముని పుంగవుడు; తాభ్యామ్ = వారికి; సంస్థితః = లేచినవాడై; కలశం = కలశమును; దదౌ = ఇచ్చెను.
భావము:-
కలిసి అర్థాతిశయముగా మధురముగా గానము చేసిన ఆ కుశలవుల గానము విన్న ఒకానొక ముని సంతసించిన వాడై వారికి ఒక కలశమును బహుమతిగా ఇచ్చెను.
గమనిక:-
(1) సంరక్తమ్- సంరక్తతరమ్- సంరక్తతమమ్; (2) అత్యర్థ- వ్యు. అతి+అర్థ, అతిక్రాంతం అర్థం, మించిన అర్థము; అనురూపం స్వరూపమ్, అతిశయము; కలశ- వ్యుత్పత్తి- శు = గతౌ, కల+శు+డ, కృ.ప్ర., నీటిచే ఇంపుగా ధ్వనించునది.
1.4.21.
అనుష్టుప్.
ప్రసన్నో వల్కలే కశ్చిత్
దదౌ తాభ్యాం మహాయశాః।;
అన్యః కృష్ణాజినం ప్రాదాత్
మౌంజీమన్యో మహామునిః ॥;
టీక:-
ప్రసన్నః = ప్రసన్నుడైన; వల్కలమ్ = నారచీరలను; కశ్చిత్ = ఒకానొక; ముని; దదౌ = ఇచ్చెను; తాభ్యాం = వారికి; మహాయశాః = గొప్ప కీర్తి గలిగిన; అన్యః = మరొకరు; కృష్మాజినం = కృష్ణాజినం, నల్లజింకచర్మం; ప్రాదాత్ = ప్రసాదించారు; మౌంజీమ్ = మౌజిలను; అన్యః = ఇతర; మహామునిః = గొప్పముని;
భావము:-
ప్రసన్నుడైన మరియొక ముని వారిద్దరికి నారచీరలను బహూకరించెను. మఱొకరు కృష్ణాజినం, మఱొక మహాముని మౌంజీలు ప్రసాదించారు.
గమనిక:-
మౌంజి - ముంజ (తాటి) గడ్డితో ముప్పేటగా నేసిన నడికట్టు.
1.4.22.
అనుష్టుప్.
కశ్చిత్ కమండలుం ప్రాదాత్
యజ్ఞసూత్రం తథాపరః।
ఔదంబరీం బ్రుసీమన్యో
జపమాలామ్ అభాపరః॥
టీక:-
కశ్చిత్ = ఒకానొకరు; కమండలుం = కమండలమును; ప్రాదాత్ = ప్రసాదించెను; యజ్ఞసూత్రం = యజ్ఞోపవీతము; తథా = మఱియు; అపరః = ఇతరులు; ఔదంబరీం = మేడి పీఠమును; బ్రుసీమ్ = తపస్సుకైన ఆసనమును; అన్యః = ఇంకొకరు; జపమాలామ్ = జపమాలను; అభా = అలాగే; పరః = మఱొకరు.
భావము:-
ఒకరు కమండలమును; మరొకరు యజ్ఞోపవీతమును; ఇకొకరు మేడి పీఠమును, తపస్సు చేసుకొను ఆసనమును; మరొకొకరు జపమాలను ఇచ్చారు.
గమనిక:-
కమండలము- క-నీరు+ మండమ్- శోభ+ పొందునది, ఋషులు, బ్రహ్మచారులు వాడు జలపాత్ర; బ్రుసీ- వ్యుత్పత్తి. బృ+సర+డ-జీష్, కృ.ప్ర., మంత్రానుష్ఠానముచేయ కూర్చుండునది.
1.4.23.
అనుష్టుప్.
బ్రుసీమన్యత్ తదా ప్రాదాత్
కౌపీనం అపరోముని।
తాభ్యాం దదౌ తదాహృష్టః
కుఠారమపరో మునిః ॥
టీక:-
బ్రుసీమ్ = ఆసనము; అన్యత్ = ఇంకొకటి; తదా = అలాగే; ప్రాదాత్ = ఇచ్చెను; కౌపీనం = గోచీగుడ్డ; అపరః = ఇతర; ముని = ముని; తాభ్యాం = వారిద్దరికి; దదౌ = ఇచ్చారు; తదా = అలాగే; హృష్టః = సంతోషించినవారు; కుఠారమ్ = గొడ్డలిని; అపరః = వేరే; మునిః = ముని.
భావము:-
ఇంకొక ఆసనమును వేరేవారు; అలాగే; గోచీగుడ్డ ఇతర ముని; సంతోషించిన మరో ముని గొడ్డలిని వారిద్దరికి ఇచ్చారు,
గమనిక:-
కౌపీనము- వ్యు. కూపే పతనమ్ అర్హసి- కూప+ ఖణ్, త.ప్ర., గోచీ.
1.4.24.
అనుష్టుప్.
కాషాయమపరో వస్త్రం
చీరమన్యో దదౌ మునిః।
జటాబంధన మవ్యస్తు
కాష్ఠరజ్జుమ్ ముదాన్వితః ॥
టీక:-
కాషాయమ్ = కాషాయము, కావిరంగు బట్ట; అపరః = ఇంకొకరు; వస్త్రం = బట్టను; చీరమ్ = అంగవస్త్రమును; అన్యమ్ = మరొటి; దదౌ = ఇచ్చారు; మునిః = ముని; జటాబంధనమ్ = జటాబంధనమును, రిబ్బను?; అవ్యస్తు = అపరిమితమైన; కాష్ఠరజ్జుమ్ = సమిధలు కట్టుకొను త్రాడు; ముదాన్వితః = సంతోషించినవారు.
భావము:-
ఒకరు కాషాయము బట్టను; అంగవస్త్రమును మరొక ముని; జటాబంధనమును, సమిధలు కట్టుకొను పెద్ద త్రాడు సంతోషించిన ముని ఒకరు ఇచ్చారు.
1.4.25.
అనుష్టుప్.
యజ్ఞభాండమ్ ఋషి కశ్యిత్
కాష్ఠభారం తథాపరః।
ఆయుష్య మపరే స్రాహుః
ముదా తత్రమహర్షయః ॥
టీక:-
యజ్ఞభాండమ్ = యజ్ఞపాత్రను; ఋషి = ఋషి; కశ్యిత్ = ఒకరు; కాష్ఠభారం = సమిధలను; తథ = అలాగే; అపరః = ఇంకొకరు; ఆయుష్యమ్ = ఆశీర్వాదము; అపరే = మరొకరు; స్రాహుః = సమర్పించిరి; ముదాత్ = ఇష్టంగా; అత్రమ్ = అక్కడ ఉన్నవారు; హర్షయః = సంతోషముతో.
భావము:-
యజ్ఞపాత్రను ఒక ఋషి; సమిధలను ఇంకొకరు; ఆశీర్వాదము మరొకరు; ఇష్టంగా అక్కడ ఉన్నవారు అందరు సంతోషముతో ఇచ్చారు.
1.4.26.
అనుష్టుప్.
దదుశ్చైవ వరాన్ సర్వే
మునయః సత్యవాదినః।
ఆశ్చర్య మిదం గీతం
సర్వగీతేషు కోవిదౌః ॥
టీక:-
దదౌ = ఇచ్చిరి; చైవ; వరాన్ = వరములను; సర్వే = అందరు; మునయః = మునులు; సత్యవాదినః = సత్యసంధులు; ఆశ్చర్యమ్ = అద్భుతము; ఇదం = ఈ యొక్క; గీతం = పాడబడినది; సర్వ = సకల; గీతేషు = గానరీతులలోను; కోవిదౌః = ఇద్దరు పండితులు.
భావము:-
సత్యసంధులు మునులు అందరు వరములను ఇచ్చిరి. గానరీతులు అన్నింటిలోను నిష్ణాతులైన వీరిద్దరు పండితులు. వీరు పాడిన ఈ గీతం అద్భుతము అనిరి.
గమనిక:-
1) గీతమనగా గానమని తాత్పర్యము సప్తతాళములు 2) ధ్రువము అంగములు 1011, మిగతావి మధ్య, రూపక, ఝంప, త్రిపుట, అట, ఏక. సంగీతశాస్త్ర వాచకములు. (అ) ధ్రువాది బద్ద సంగీతము నకు గీతము అని పేరు. (ఆ) ధ్రువము పద్నాలుగు అక్షరములు గల తాళ విశేషము. ఆంధ్రవాచస్పతము.
1.4.27.
అనుష్టుప్.
* ఆశ్చర్యమిదమాఖ్యానం
మునినా సంప్రకీర్తితమ్ ।
పరం కవీనామాధారం
సమాప్తం చ యథాక్రమమ్ ॥
టీక:-
ఆశ్చర్యమ్ = అద్భుతము; ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = గ్రంథము; మునినా = వాల్మీకి మునిచేత; సమ్ = చక్కగా; ప్రకీర్తితమ్ = బాగుగా గానము చేయబడినది; పరం = భవిష్యత్తు; కవీనామ్ = కవులకు; ఆధారమ్ = ఆధారమై; సమాప్తం = పూర్తి కావించబడినది; చ = కూడా; యథాక్రమమ్ = పద్దతిప్రకారము.
భావము:-
వాల్మీకి మహామునిచే రచింపబడిన ఈ రామాయణ కావ్యము భవిష్యత్తు కవులకు అందరికీ ఆదర్శప్రాయమైనది అగునట్లు పద్దతిగా సుసంపూర్ణం చేయబడినది.
1.4.28.
అనుష్టుప్.
* అభిగీతమిదం గీతం
సర్వగీతేషు కోవిదౌ ।
ఆయుష్యం పుష్టిజనకం
సర్వశ్రుతిమనోహరమ్ ॥
టీక:-
అభిగీతమ్ = చక్కగా పాడబడినదైన; ఇదం = ఈ; గీతమ్ = గీతము; సర్వ = అన్ని విధములైన; గీతేషు = గానరీతు లందును; కోవిదౌ = ప్రావీణ్యము కలవారైన; ఆయుష్యం = ఆయుష్యమును వృద్ధి చేయునది; పుష్టి = పుష్టిని; జనకమ్ = కలిగించునది; సర్వ = అందరి; శ్రుతి = చెవులకు; మనోహరమ్ = వినసొంపయినది.
భావము:-
ఆయుస్సును వృద్ధి చేయునది; పుష్టిని కలిగించునది అందరి వీనులకు వినసొంపైనది అగు ఈ గీతమును ఇద్దరు నిష్ణాతులు అద్భుతముగా గానము చేసిరి.
1.4.29.
అనుష్టుప్.
ప్రశస్యమానౌ సర్వత్ర
కదాచిత్తత్ర గాయకౌ ।
రథ్యాసు రాజమార్గేషు
దదర్శ భరతాగ్రజః ॥
టీక:-
ప్రశస్యమానౌ = ప్రశంసించబడుతున్న వారైన; సర్వత్ర = అంతటను; కదాచిత్ = ఒకానొక సందర్భములో; తత్ర = అక్కడ; గాయకౌ = గాయకులను; రథ్యాసు = వీధు కూడళ్ళ యందు, వావిళ్ళ నిఘంటువు; రాజమార్గేషు = రాజమార్గములందు; దదర్శ = చూసెను; భరతాగ్రజః = భరతుని అన్నగారు రాముడు.
భావము:-
పెక్కు వీధులు కలియు కూడళ్ళ యందు. రాజ మార్గములందును, సర్వత్రా మధురముగా గానము చేయుచు అందరిచే ప్రశంసించబడుచున్న ఆ కుశలవులను భరతాగ్రజుడైన రాముడు అక్కడ చూసెను.
గమనిక:-
భరతాగ్రజుడు అనగా భరతుని అన్నగారు అనే కాకుండా, భరత బాధ్యతవహించువాడు, అగ్రజుడు అనగా ముందున్నవాడు, సిద్ధపడువాడు అని గ్రహించిన, రాబోవుకాలమున లవకుశుల బాధ్యత వహించుటకు రాముడు సిద్దపడుచున్నాడని స్పురించును.
1.4.30.
అనుష్టుప్.
స్వవేశ్మ చానీయ తతో
భ్రాతరౌ చ కుశీలవౌ ।
పూజయామాస పూజార్హౌ
రామః శత్రునిబర్హణః ॥
టీక:-
స్వృ = తన; వేశ్మ = గృహమునకు; చ, ఆనీయ = కూడ తీసుకుని వచ్చెను. తతః = అప్పుడు; భ్రాతరౌ = సోదరులైన; చ, కుశీలవౌ = కుశలవులను; పూజయామాస = గౌరవించెను; పూజార్హౌ = గౌరవించతగిన వారైన; రామః = రాముడు; శత్రునిబర్హణః = శత్రువులను సంహరించు వాడు.
భావము:-
శత్రుసంహరము చేయు మహనీయుడు రాముడు గౌరవించదగిన సోదరులైన ఆ కుశలవులను తన గృహమునకు తీసుకుని వచ్చి గౌరవించెను.
1.4.31.
అనుష్టుప్.
ఆసీనః కాంచనే దివ్యే
స చ సింహాసనే ప్రభుః ।
ఉపోపవిష్టః సచివైః
భ్రాతృభిశ్చ పరంతపః ॥
టీక:-
ఆసీనః = ఆసీనుడైన; కాంచనే = బంగారముతో చేయబడిన; దివ్యే = దివ్యమైన; సః = ఆ; చ = సింహాసనే = సింహాసనము పైన; ప్రభుః = రాజు; ఉపోపవిష్టః = చుట్టూ పరివేష్టింపబడినవాడై; సచివైః = మంత్రులు చేతను; భ్రాతృభిశ్చ = సోదరులచేతను; పరంతపః = శత్రువులను పీడించెడి.
భావము:-
శత్రుతపనుడు అగు ఆ రామచంద్ర ప్రభువు సోదరులు; సచివులు పరివేష్టించి ఉండగా బంగారముతో చేయబడిన తన దివ్య సింహాసనముపై ఆసీనుడై ఉండెను.
గమనిక:-
సచివ- వ్యు. సచి+వా+క, సచి- సమవాయః తథా సన్ వాతి, మంత్రి
1.4.32.
అనుష్టుప్.
దృష్ట్వా తు రూపసంపన్నౌ
తావుభౌ నియతస్తదా ।
ఉవాచ లక్ష్మణం రామః
శత్రుఘ్నం భరతం తథా ॥
టీక:-
దృష్ట్వా = చూచి; తు = చూచి; రూపసంపన్నౌ = బహుసుందరులైన; తౌ = ఆ; ఉభౌ = ఇరువురినీ; నియత = నియమవంతులైన; తదా = అప్పడు; ఉవాచ = పలికెను; లక్ష్మణం = లక్ష్మణుని గురించి; రామః = రాముడు; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుడిని గురించి; భరతం = భరతుని గురించి; తథా = మఱియు.
భావము:-
తాత్పర్యము:- రూపసంపన్నులు నియమవంతులైన ఆ కుశలవులను చూచి అప్పుడు రాముడు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో ఇట్లు పలికెను.
1.4.33.
అనుష్టుప్.
"శ్రూయతామిదమాఖ్యానమ్
అనయోః దేవవర్చసోః ।
విచిత్రార్ధ పదం సమ్యక్"
గాయికౌ తావచోదయత్" ॥
టీక:-
శ్రూయతామ్ = వినబడుగాక; ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = కథనము; అనయోః = వీరి యొక్క; దేవవర్చసోః = దేవతల వంటి వర్చస్సు కలిగిన; విచిత్ర = చిత్రమైన; అర్థ = అర్థములు; పదం = పదములు; సమ్యక్ = బాగుగా; గాయికౌ = పాడువారిని; తౌ = వారిరువురను; వచోదయత్ = ప్రేరేపించెను.
భావము:-
తాత్పర్యము:- "దివ్యమైన వర్చస్సు కలిగిన ఈ కుశ లవులు గానము చేయు చిత్ర విచిత్ర పదములతో చక్కని భావముతో కూడిన ఈ కథనమును వినుడు" అని తన సోదరులతో పలికి రాముడు ఆ గాయకులను పాడుటకు ప్రేరేపించెను.
1.4.34.
అనుష్టుప్.
తౌచాపి మధురం రక్తమ్
స్వంచితాయతనిస్వనమ్ ।
తంత్రీలయవదత్యర్థమ్
విశ్రుతార్థమగాయతామ్ ॥
టీక:-
తౌ చ = వారిరువురును; అపి = కూడా; మధురం = మధురముగను; రక్తమ్ = రాగయుక్తముగాను; స్వంచ్ = కలిసిన; ఇత = పొదికగా, ఒప్పైన; ఆయత = దీర్ఘమైన, విస్తారమైన; నిస్వనమ్ = ధ్వనితోను; తంత్రీ = వాయిద్యముల తంత్రుల; లయవత్ = లయకు అనుగుణముగను; అత్యర్థమ్ = మిక్కిలి; విశ్రుత = విస్తృతమైన; అర్థమ్ = అర్ధము కలుగునట్లుగను; అగాయతామ్ = గానము చేసిరి.
భావము:-
తాత్పర్యము:- ఆ కుశలవులు మధురముగను, తంత్రీ వాయిద్యముల శ్రుతి లయలకు అనుగుణముగా రాగయుక్తమైన చక్కని విస్తారమైన స్వరంతో చక్కగా ఒప్పిన కంఠము కలియునట్లు గానము చేసిరి. వారి గానము నందు అర్ధము విస్త్రుతముగ స్పురించు చుండెను.
1.4.35.
అనుష్టుప్.
హ్లాదయత్ సర్వగాత్రాణి
మనాంసి హృదయాని చ ।
శ్రోత్రాశ్రయసుఖం గేయమ్
తద్బభౌ జనసంసది ॥
టీక:-
హ్లాదయత్ = ఆహ్లాదము కలిగించేది; సర్వ = సమస్తమైన; గాత్రాణి = మానవుల, జీవుల; మనాంసి = మనస్సులకు; హృదయాని = హృదయములకు; చ = కూడ; శ్రోత్రా = వీనులకు; ఆశ్రయ = కలిగించునదై; సుఖం = సుఖానుభూతి; గేయమ్ = గీతము; తత్ = ఆ; బభౌ = భాసించినది; జనృ = ప్రజా; సంసది = సభ యందలి.
భావము:-
తాత్పర్యము:- ఆ కుశలవుల గానము సకల సభాసదుల వీనులకు విందుగా ఉండి సుఖానుభూతిని కలిగించుచు, మనస్సులను, హృదయములను రంజింపజేసెను.
1.4.36.
జగతి.
* "ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
కుశీలవౌ చైవ మహాతపస్వినౌ ।
మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే
మహానుభావం చరితం నిబోధత" ॥
టీక:-
"ఇమౌ = వీరిద్దఱును; మునీ = మునులు; పార్థివలక్షణ = క్షత్రియలక్షణములు; ఆన్వితౌ = కలిగిన వారై; కుశీలవౌ = కుశలవులని నామములు కలవారు / గాయకులు ఇద్దఱు; చైవ = మఱియు; మహా = గొప్ప; తపస్వినౌ = తపస్వులు; మమాపి = నాతో కూడ; తత్ = ఆ; భూతికరం = అనుభూతి కలిగించెడి; ప్రవక్ష్యతే = చెప్పెడిది; మహ = గొప్ప; అనుభావమ్ = ప్రభావవంతమైన; చరితం = ఆ చరిత్రము; నిబోధత = శ్రద్ధగా ఆలకింపుడు.
భావము:-
తాత్పర్యము:-"గొప్ప తపశ్శాలులు, క్షత్రియలక్షణాన్వితులు ఐన ఈ మునికుమారులు కుశలవులు అని గాయకులు. అనుభూతి కలిగేలా వీరు చెప్పెడి ఈ గొప్ప ప్రభావవంతమైన చరిత్రము నాతోపాటు శ్రద్ధగా ఆలకింపుడు" అని రాముడు సోదరులకు చెప్పెను.
1.4.37.
జగతి.
తతస్తు తౌ రామవచః ప్రచోదితౌ
అగాయతాం మార్గవిధానసంపదా ।
స చాపి రామః పరిషద్గతః శనై
ర్బుభూషయా సక్తమనా బభూవ హ ॥
టీక:-
ప్రతిపదార్థము :- తతః = అటు పిమ్మట; తౌ = వారిద్దరు; రామ = శ్రీరాముని; వచః = ఆజ్ఞ చేత; ప్రచోదితౌ = నిర్దేశింపబడినవారై; అగాయతామ్ = గానము చేసిరి; మార్గవిధాన = సంగీతంలోని మార్గవిధానము; సంపదా = సమృద్దిగ; సః = ఆ; చాపి = కూడ; రామః = రాముడు; పరిషత్ = సభలో; గతః = ఉన్నవారు; శనైః = శాంత చిత్తులు; బుభూషయా = అభిలాషతో; సక్త = ఆసక్తి గల / లగ్నమైన; మనాః = మనస్సుకలవారు; బభూవ = ఆయెను; హ.
భావము:-
తాత్పర్యము:- అటుపిమ్మట రాముని ఆజ్ఞ ప్రకారము ఆ కుశలవులు మార్గ, దేశీ గాన విధానములలో స్వచ్ఛమైన మార్గ విధైనములో గానము చేసిరి. రామునితో సహితంగా సభాసదులు అందఱు కూడ. ప్రీతితో లగ్నమైన మనసులతో, శాంతచిత్తులైరి.
గమనిక:-
మార్గవిధానము- సంగీతము మార్గము, దేశ్యము అని రెండు విధములు. మార్గము- ఈశ్వర ప్రణీతమై భరతఋషితే ప్రకటింపబడినది. దేశ్యము ఆయా దేశాముల యందు వాడుక గలిగి మనోహరమైనది ఆంధ్రశబ్దరత్నాకరము. 2) షణ్మార్గములు- 1. దక్షిణము, 2. వార్తికము, 3. చిత్రము, 4. చిత్రతరము, 5. చిత్రతమము, 6. అతిచిత్రతమము. సంకేతపదకోశము, రవ్వాశ్రీహరి
1.4.38.
గద్యము.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుర్థః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్థ [4] = నాలుగవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [3] నాలుగవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.4.1.
అనుష్టుప్.
* ప్రాప్తరాజ్యస్య రామస్య
వాల్మీకి ర్భగవానృషిః ।
చకార చరితం కృత్స్నం
విచిత్రపద మాత్మవాన్ ॥
టీక:-
ప్రాప్త = ప్రాప్తించిన; రాజ్య = రాజ్యము; అస్య = కల; రామ = రాముని; అస్య = యొక్క; వాల్మీకిః = వాల్మీకి; భగవాన్ = మహత్మ్యము కలవాడును; ఋషిః = జ్ఞానాధికుడు, విద్వాంసుడు, శాస్త్ర కావ్యాదులు సృష్టించువాడు, మంత్రద్రష్ట; చకార = రచించెను; చరితం = చరిత్రమును; కృత్స్నమ్ = సమస్తమైన; విచిత్ర = ఆశ్చర్య జనకము లైన, బాగుగా చిత్రించిన, అందమైన; పదమ్ = పదములతో; ఆత్మ వాన్ = బుద్ధి శాలి అయిన
భావము:-
భగవంతుడు, కావ్యరచన చేయు ఋషియు, బహుబుద్ధిశాలియు నైన వాల్మీకి, శ్రీరాముడు రాజ్యము పొందిన పిదప ఆయన రాముని చరితము మొత్తము చక్కటి పదములతో రచించెను.
1.4.2.
అనుష్టుప్.
* చతుర్వింశ త్సహస్రాణి
శ్లోకానాముక్తవా నృషిః ।
తథా సర్గశతాన్ పంచ
షట్కాండాని తథోత్తరమ్ ॥
టీక:-
చతుర్వింశత్ సహస్రాణి = ఇరవై నాలుగు వేల; శ్లోకానామ్ = శ్లోకములను; ఉక్తవాన్ = చెప్పెను; ఋషిః = వాల్మీకి మహర్షి; తథా = మఱియు; సర్గ = సర్గల; శతాన్ = వందలు; పంచ = ఐదు; షట్ = ఆరు; కాండాని = కాండలను; తథా = మఱియు; ఉత్తరమ్ = ఉత్తర కాండను.
భావము:-
వాల్మీకి మహర్షి రామాయణమును ఇరువది నాలుగు వేల శ్లోకములతో ‘ఐదువందల సర్గలుగా’, ఆరు కాండములు మఱియు ఉత్తర కాండము మొత్తము ఏడు కాండలలో రచించెను.
గమనిక:-
ప్రస్తుతం లభ్యమగుచున్న పాఠ్యములలో సర్గల సంఖ్య 647 {బాల కాండ: 77; అయోధ్య కాండ: 119; అరణ్య కాండ: 75; కిష్కింధ కాండ: 67; సుందర కాండ: 68; యుద్ధ కాండ: 131; ఉత్తర కాండ: 110; మొత్తం ఏడు కాండలు: 647.
1.4.3.
అనుష్టుప్.
కృత్వాపి తన్మహాప్రాజ్ఞః
సభవిష్యం సహోత్తరమ్ ।
చింతయామాస "కో న్వేతత్
ప్రయుంజీయాదితి ప్రభుః" ॥
టీక:-
కృత్వ = రచించి; అపి = కూడా; తత్ = ఆ; మహా = గొప్ప; ప్రాఙ్ఞః = జ్ఞాని అయిన; స = కూడి ఉన్న; భవిష్యమ్ = భవిష్యత్తుకలది; సహ = సహితమైన; ఉత్తరం = ఉత్తర కాండ, పట్టాభిషేక అనంతర కథ; చింతయామాస = ఆలోచించెను; కః = ఎవడు; ను = నిజముగా; ఏతత్ = దీనిని; ప్రయుంగియాత్ = ప్రయోగించును; ఇతి = అని; ప్రభుః = సమర్థుడైన వాల్మీకి.
భావము:-
గొప్ప ప్రజ్ఞాశాలి; సమర్థుడు అయిన వాల్మీకి పట్టాభిషేకానంతరకథ ఐన ఉత్తరాకాండ రచించిన పిమ్మట దీనిని యుక్తమైన రీతిలో పఠించగలవారు ఎవరు ఉన్నారని యోచించెను.
1.4.4.
అనుష్టుప్.
తస్య చింతయమానస్య
మహర్షే ర్భావితాత్మనః ।
అగృహ్ణీతాం తతః పాదౌ
మునివేషౌ కుశీలవౌ ॥
టీక:-
తస్య = ఆ; చింతయమానస్య = ఆలోచించుచున్న; మహర్షేః = మహర్షి; భావిత = భావించుచున్న; ఆత్మనః = మనసున; అగృహ్ణీతాం = గ్రహించిరి; తతః = అటుపిమ్మట; పాదౌ = పాదద్వయములను; ముని = మునుల; వేషౌ = వేషధారులిద్దరు; కుశీలవౌ = కుశలవులు ఇద్దరు.
భావము:-
అంతట మనసులో ఆలోచించుకుంటున్న వాల్మీకి పాదములకు ముని వేషధారులైన కుశలవులు ప్రణామములు చేసిరి.
1.4.5.
అనుష్టుప్.
కుశీలవౌ తు ధర్మజ్ఞౌ
రాజపుత్రౌ యశస్వినౌ ।
భ్రాతరౌ స్వరసంపన్నౌ
దద ర్శాశ్రమవాసినౌ ॥
టీక:-
కుశీలవౌ = కుశలవులు ఇద్దరను; తు; ధర్మజ్ఞౌ = ధర్మము తెలిసినవారును; రాజపుత్రౌ = రాకుమారులును; యశస్వినౌ = కీర్తిమంతులను; భ్రాతరౌ = అన్నదమ్ములిద్దరిని; స్వర = సుస్వరము; సంపన్నౌ = బాగా ఉన్నవారిని; దదర్శః = చూచెను; ఆశ్రమవాసినౌ = ఆశ్రమములో నివసించువారిని.
భావము:-
ఆ వాల్మీకి మహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు,తన ఆశ్రమవాసులు, సుస్వర సంపన్నత కలవారు ఐన కుశలవులను చూసెను.
1.4.6.
అనుష్టుప్.
స తు మేధావినౌ దృష్ట్వా
వేదేషు పరినిష్ఠితౌ ।
వేదోపబృంహ ణార్థాయ
తావగ్రాహయత ప్రభుః ॥
టీక:-
సః = ఆ వాల్మీకి; తు = వారిని; మేధావినౌ = మేధావులను; దృష్ట్వా = చూచి; వేదేషు = వేదములలో; పరినిష్ఠితౌ = దృఢజ్ఞానము కలవారిని; వేదః = వేదములను; ఉపబృంహణ = పరిపుష్టము; అర్థాయ = చేయుటకై; తౌ = వారిచే; అగ్రాహయత = గ్రహింపజేసెను రామాయణమును; ప్రభుః = ప్రభావశాలి యైన వాల్మీకి.
భావము:-
ప్రభావశాలి ఐన వాల్మీకి సాంగోపాంగంగా వేదాధ్యయనము చేసిన ఆ కుశలవులకు వేదార్థము పరిపుష్ఠము ఒనరించుటకు రామాయణమును ఉపదేశించెను.
1.4.7.
అనుష్టుప్.
* కావ్యం రామాయణం కృత్స్నం
సీతాయాశ్చరితం మహత్ ।
పౌలస్త్యవధ మిత్యేవ
చకార చరితవ్రతః ॥
టీక:-
కావ్యం = కావ్యమును; రామాః = రాముని; అయణమ్ = పోక; కృత్స్నమ్ = సమస్త మైన; సీతాయాః = సీత యొక్క; చరితం = చరితము; మహత్ = గొప్పదైన; పౌలస్త్య = పులస్యబ్రహ్మ వంశస్థుడు, రావణుని యొక్క; వధం = సంహారము; ఇత్యేవ = అనునట్టి పేర్లతో; చకార = రచించెను; చరిత = ఆచరించిన; వ్రతః = ఉత్తమ వ్రతములు కల వాడు.
భావము:-
ఉత్తమ వ్రతధారి ఐనట్టి వాల్మీకి ఆ మొత్తం కావ్యమును ‘రామాయణము’, ‘సీతాయాశ్చరితము’, ‘పౌలస్త్యవధము’ అను పేర్లతో రచించెను.
గమనిక:-
*- 1. బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు- పులస్త్యుఁడు / పులస్త్యబ్రహ్మ, భార్య కర్దమ ప్రజాపతి కూతురు అగు హవిర్భుక్కు నందు కొడుకులు ఇద్దరు- అగస్త్యుఁడును విశ్రవస్సును. 2. విశ్రవసుఁడు- భార్యలు నలుగురు. మొదటిభార్య తృణబిందువు కూఁతురు అగు ఇలబిల యందు కుబేరుఁడు పుట్టెను. రెండవభార్య సుమాలి కూఁతురు అగు కైకసి యందు కొడుకులు ముగ్గురు- రావణ కుంభకర్ణ విభీషణులు పుట్టిరి. మూఁడవ భార్య కైకసిచెల్లెలు అగు పుష్పోత్కట. దానియందు మహోదరమహాపార్శ్వాదులు జనించిరి. నాలవభార్య కైకసి రెండవచెల్లెలు అగు రాక. ఆపె ఖర దూషణ త్రిశిరులను కనెను.
1.4.8.
అనుష్టుప్.
* పాఠ్యే గేయే చ మధురం
ప్రమాణైస్త్రిభి రన్వితమ్ ।
జాతిభిః సప్తభిర్బద్ధం
తంత్రీలయ సమన్వితమ్ ॥
టీక:-
పాఠ్యే = పఠించుటకును; గేయే = గానము చేయుటకును; చ = కూడా; మధురమ్ = మధురమైనదై; ప్రమాణైః = సంగీతంలోని ప్రమాణములు / కాలములు; త్రి = మూటితో; భి = సహితంగా; అన్వితమ్ = కూడినదై; జాతిభిః = స్వరజాతులతో; భి = సహితము, కూడ; బద్ధమ్ = కూర్చబడినదై; తంత్రీ = తంత్రీ వాయిద్యముల; లయ = లయబద్దత; సమన్వితమ్ = కూడినదై {తంత్రీలయ సమన్వితము అంటే శృతితో కలపగలది}.
భావము:-
ఆ రామాయణ కావ్యము పఠించుటకు, గానము చేయుటకు ఎంతో మధురముగా ఉంన్నది. అంతే కాక సంగీత విశేషములైన దృత, మధ్యమ, విలంబిత మూడు ప్రమాణములు కలది. ఇంకా సరిగమపనిస అను సప్త స్వరములకు అనుగుణమైనది. మఱియు తంత్రీ వాయిద్యములపై లయ బద్ధముగా పాడుటకు అనువుగా కూడ ఉన్నది.
గమనిక:-
సంగీత శాస్త్రములో 1) ప్రమాణములు / మూడు కాలములు : త్రికాలము : ప్రథమ, ద్వితీయ, తృతీయ / విళంబిత, మధ్య, దృత; 2) మూడు స్థాయిలు : స్థాయి : త్రిస్థాయిలు : మంద్ర, మధ్య, తార; 3) మూడు తాళాంగములు : తాళాంగములు : : అనుద్రుతము (అరసున్న ‘ఁ’), ద్రుతము (సున్న ‘ం), లఘువు (నిలువు గీత ‘।’); ఇందు లఘువునందు మాత్రము జాతి భేదములు ఉన్నవి, అవి త్రిశ్ర జాతి 13; చతురశ్ర జాతి 14; ఖండజాతి 15; మిశ్రజాతి 17; సంకీర్ణ 19;
1.4.9.
అనుష్టుప్.
* రసైః శృంగారకారుణ్య
హాస్య వీర భయానకైః ।
రౌద్రాదిభిశ్చ సంయుక్తం
కావ్యమే తదగాయతామ్ ॥
టీక:-
రసైః = రసములతోడను; శృంగార = శృంగారము; కారుణ్య = కరుణ; హాస్య = హాస్యము; వీర = వీర; భయానకైః = భయానకములు; రౌద్రాదిభిః = రౌద్రము; భిః = తో కూడా; చ; సంయుక్తమ్ = కూడిన; కావ్యమ్ = కావ్యమును; ఏతత్ = ఈ; అగాయతామ్ = గానము చేసిరి.
భావము:-
1. శృంగార, 2. కారుణ్య, 3. హాస్య, 4. వీర, 5. భయానక, 6. రౌద్రరసములతో కూడినదియును అగు ఆ రామాయణము అనే కావ్యమును లవకుశులు గానము చేసిరి.
గమనిక:-
ఈ శ్లోకములో నవరసములు తొమ్మిదిలోని అద్భుతం. భీభత్సం, శాంతం చెప్పబడలేదు.
1.4.10.
అనుష్టుప్.
తౌ తు గాంధర్వతత్త్వజ్ఞౌ
మూర్చ నాస్థానకోవిదౌ ।
భ్రాతరౌ స్వరసంపన్నౌ
గంధర్వావివ రూపిణౌ ॥
టీక:-
తౌ = వారు లవకుశులు; తు = విశేషముగ; గాంధర్వ = గాంధర్వ విద్య, సంగీతము; తత్త్వజ్ఞౌ = శాస్త్రము తెలిసిన వారు; మూర్చనా = స్వర మూర్ఛనల యొక్క; స్థాన = స్థానములు {స్వరముల ఉనికి}; కోవిదౌ = తెలిసిన వారును; భ్రాతరౌ = ఆ సోదరులు ఇరువుకు; స్వర = స్వరజ్ఞానము; సంపన్నౌ = సమృద్ధిగా కలవారు; గంధర్వః = గంధర్వులు; ఇవ = వలె; రూపిణౌ = నిరూపణ చేయగలవారు.
భావము:-
ఆ లవకుశులు చక్కని సంగీత శాస్త్రజ్ఞానము, స్వరసంపన్నత, మూర్ఛనా స్వర స్థానముల వంటి సంగీత విశేష సామర్ధ్యములు దండిగా కలిగినవారు; వాటిని గంధర్వుల వలె కనబరచు నేర్పు కలవారు.
గమనిక:-
మూర్చన - క్రమముగ సప్తస్వరముల ఆరోహణ అవరోహణములు; స్వరజ్ఞానము - పాడిన రాగమము స్వరపరచగలుగుట, వ్రాసిన రాగము పాడగలుగుట; రూపణ - నిరూపించుట, కనబరచుట.
1.4.11.
అనుష్టుప్.
రూపలక్షణ సంపన్నౌ
మధురస్వర భాషిణౌ ।
బిమ్బాదివోత్థితౌ బిమ్బౌ
రామదేహా త్తథా పరౌ ॥
టీక:-
రూప = ఉత్తమ రూప; లక్షణ = ఉత్తమ లక్షణములు; సంపన్నౌ = సమృద్ధిగా కలిగిన వారు; మధుర = తీయని; స్వర = కంఠరస్వరముతో; భాషిణౌ = సంభాషించువారు; బిమ్బాత్ = ప్రతిబింబమునుండి; ఇవ = వలె; ఉత్థితౌ = ఉత్పన్న మైన; బిమ్బౌ = బింబములు; రామ = రాముని; దేహాత్ = శరీరము నుండి; తథా = అలా; అపరౌ = ఇతరము కానివారు,
భావము:-
*గమనిక:-{తండ్రి తానై పుత్రునిగా జన్మిస్తాడు అన్న సూత్రం ప్రకారం పుత్రుడు తండ్రి నుండి భిన్నమైన వాడు కాదు కనుక అపరుడు. పైగా కుశలవులిద్దరూ కవలలు}.
1.4.12.
అనుష్టుప్.
తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన
ధర్మ్యమాఖ్యాన ముత్తమమ్ ।
వాచోవిధేయం తత్సర్వం
కృత్వా కావ్యమనిందితౌ ॥
టీక:-
తౌ = వారు; రాజపుత్రౌ = రాకుమారులు; కార్త్స్న్యేన = సంపూర్ణంముగా; ధర్మ్యమ్ = ధర్మ ప్రతిపాదకమైన; ఆఖ్యానమ్ = ఇతిహాసము; ఉత్తమమ్ = ఉత్తమము మైన దానిని; వాచః విధేయమ్ = కంఠస్థముచేసి; తత్ = దానిని; సర్వమ్ = అంతా; కృత్వా = గానము చేసిరి; కావ్యమ్ = కావ్యమును; అనిందితౌ = తప్పు పట్టుటకు వీలులేనివిధముగా.
భావము:-
ఆ రాజకుమారులైన కుశలవులు ధర్మ ప్రతిపాదకమైన ఆ ఉత్తమ కావ్యమును సంపూర్ణముగా కంఠస్థము చేసికొని, దోషరహితముగా గానము చేసిరి.
1.4.13.
అనుష్టుప్.
ఋషీణాం చ ద్విజాతీనామ్
సాధూనాం చ సమాగమే ।
యథోపదేశం తత్త్వజ్ఞౌ
జగతుస్తౌ సమాహితౌ ॥
టీక:-
ఋషీణాం = ఋషుల యొక్కయు; చ = మఱియు; ద్విజాతీనామ్ = ద్విజుల యొక్కయు; సాధూనాం = సజ్జనుల యొక్కయు; చ; సమాగమే = సమావేశములందు; యథః = యథావిధముగా; ఉపదేశం = ఉపదేశించ బడినది; తత్త్వజ్ఞౌ = తత్వమును బాగుగా తెలుసుకొనిన వారై; జగతుః = గానము చేసిరి; సు = మంచి; సమాహితౌ = సావధాన చిత్తులై.
భావము:-
ఆ కుశలవులు సావధాన చిత్తులై, ఆ కావ్యము యొక్క తత్వమును బాగుగా తెలిసికొని, వాల్మీకిచేత తమకు ఉపదేశింపబడిన రీతిలో ఋషులు, ద్విజులు, ఇతర సత్పురుషులు ఉన్న సమావేశములలో గానము చేసిరి.
1.4.14.
అనుష్టుప్.
మహాత్మానౌ మహాభాగౌ
సర్వలక్షణ లక్షితౌ ।
తౌ కదాచి త్సమేతానాం
ఋషీణాం భావితాత్మనామ్ ॥
టీక:-
మహాత్మానౌ = మహాత్ములైన; మహా = గొప్ప; భాగౌ = భాగ్యవంతులైన; సర్వ = సమస్తమైన; లక్షణ = ఉత్తమ లక్షణములతో; లక్షితౌ = గుర్తింబడువారు; తౌ = వారు ఇద్దరు; కదాచిత్ = ఒకసారి; సమేతానాం = ఒక చోట కూడియున్న; ఋషీణాం = ఋషుల యొక్క; భావిత = పవిత్రమైన; ఆత్మనామ్ = హృదయములు గల వారిని.
భావము:-
మహాబుద్ధిశాలురు; మహాభాగ్యవంతులు; సర్వ సులక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు పవిత్రహృదయులైన కొందరు మునీశ్వరులుతో ఒకనాడు సమావేశమైనారు.
1.4.15.
అనుష్టుప్.
ఆసీనానాం సమీపస్థౌ
ఇదం కావ్యమగాయతామ్ ।
తచ్ఛ్రుత్వా మునయః సర్వే
బాష్పపర్యాకులేక్షణాః ॥
టీక:-
ఆసీనానాం = కూర్చుని ఉన్న; సమీప = సమీపము నందు; అస్థౌ = ఉన్న వారై; ఇదం = ఈ; కావ్యమ్ = కావ్యమును; అగాయతామ్ = గానము చేసిరి; తత్ = ఆకావ్యమును; శ్రుత్వా = విని మునయః = మునులు; సర్వే = అందరు; బాష్ప = కన్నీరు; పర్యాకుల = పూర్తిగా నిండిన; ఈక్షణాః = కన్నులతో.
భావము:-
వారు ఒకచోట కూర్చుని ఉండగా వారి ఎదుట కుశలవులు ఈ రామాయణ కావ్యమును గానము చేసిరి. ఆ కుశలవుల గానము విన్న మును లందరును ఆనంద బాష్పములు నిండిన కన్నులతో.
1.4.16.
అనుష్టుప్.
సాధు సాధ్వితి తావూచుః
పరం విస్మయమాగతాః ।
తే ప్రీతమనసః సర్వే
మునయో ధర్మవత్సలాః ॥
టీక:-
సాధు సాధు = బాగు బాగు; ఇతి = అని; తా = వారిని; ఊచుః = పలికిరి; పరం = గొప్ప; విస్మయమ్ = ఆశ్చర్యము; ఆగతాః = కలుగుట వలన; తే = ఆ; ప్రీత = సంతసము చెందిన; మనసః = మనసుకలవారు; సర్వే = అందరు; మునయః = మునులును; ధర్మ = ధర్మమును; వత్సలాః = ఆపేక్ష కలవారు.
భావము:-
కుశలవులను ‘బాగు బాగ’ని ప్రశంసించిరి, ధర్మమునందు ఆపేక్ష కలిగిన ఆ మునులందరు సంతోషించిరి.
1.4.17.
అనుష్టుప్.
ప్రశశంసుః ప్రశస్తవ్యౌ
గాయమానౌ కుశీలవౌ ।
“అహో గీతస్య మాధుర్యం
శ్లోకానాం చ విశేషతః॥
టీక:-
ప్రశశంసుః = ప్రశంసించిరి; ప్రశస్తవ్యౌ = ప్రశంసార్హులైన; గాయమానౌ = గానము చేయుచున్న; కుశీలవౌ = కుశలవులను; అహో = ఆహా; గీతస్య = గానము యొక్క; మాధుర్యమ్ = మాధుర్యము; శ్లోకానాం = శ్లోకములను; చ; విశేషతః = విశేషమైనవి.
భావము:-
ఆ కావ్యగానము చేయుచున్న ప్రశంసార్హులైన ఆ కుశలవులను పొగిడిరి. “ఆహా ! గానము మధురము. శ్లోకములు అంతకంటె విశేషమైనవి.
1.4.18.
అనుష్టుప్.
చిరనిర్వృత్తమప్యేతత్
ప్రత్యక్షమివ దర్శితమ్ ।
ప్రవిశ్య తావుభౌ సుష్ఠు
తదా భావమగాయతామ్”॥
టీక:-
చిర = చాలా కాలము క్రితము; నిర్వృత్తం = జరిగినది; అపి = ఐనను; ఏతత్ = ఇది; ప్రత్యక్షం = కన్నుల కెదురుగా జరుగుచున్నది; ఇవ = అన్నట్లు; దర్శితమ్ = చూపబడినది; ప్రవిశ్య = ప్రవేశించి; తా = ఆ; ఉభౌ = ఉభయులు; సుష్ఠు = బాగుగా; తదా = ఆ; భావమ్ = భావమును; అగాయతామ్ = గానము చేసిరి.
భావము:-
చాలాకాలము క్రితము జరిగినదైను ఈ గాథ కళ్ళకు కట్టినట్లుగా చూపబడినది అని మునులు కుశలవులను ప్రశంసించిరి. ఆ కుశలవులు ఇరువురును సభలో ప్రవేశించి బాగుగా భావపరి పుష్టముగా గానము చేసిరి.”
1.4.19.
అనుష్టుప్.
సహితౌ మధురం రక్తం
సంపన్నం స్వరసంపదా।
ఏవం ప్రశస్యమానౌ తౌ
తపఃశ్లాఘ్యైర్మహాత్మభిః ॥
టీక:-
సహితౌ = ఇద్దరుకలిసి; మధురం = మధురముగా; రక్తమ్ = మనోరంజకముగా; సంపన్నం = సంపన్నముగా; స్వరసంపదా = స్వరజ్ఞతతో; ఏవమ్ = ఆవిధముగా; ప్రశస్యమానౌ = ప్రశంసించ బడుచున్నవారై; తౌ = వారు; తపః = తపస్సుచేత; శ్లాఘ్యైః = కొనియాడదగిన; మహాత్మభిః = ఆ మహాత్ములైన వారిచేత.
భావము:-
కలిసిన గొంతుకలతో మధురముగా; సుస్వర సంపన్నముగా; మనోరంజకముగా మహాతపస్సుచే కొనియాడదగిన మహాత్ములు తమను అట్లు కొనియాడుచుండ కుశలవులు ఇద్దరూ ఆ కావ్యమును గానము చేసిరి.
1.4.20.
అనుష్టుప్.
సంరక్తతర మత్యర్థం
మధురం తావగాయతామ్ ।
ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం
సంస్థితః కలశం దదౌ॥
టీక:-
సంరక్తతరమ్ = అత్యంత మనోహరముగా; అత్యర్థమ్ = అతిశయించిన,; మధురం = మధురముగా; అగాయతామ్ = గానము చేసిరి; ప్రీతః = సంతసించిన వాడైన; కశ్చిత్ = ఒకానొక; మునిః = ముని పుంగవుడు; తాభ్యామ్ = వారికి; సంస్థితః = లేచినవాడై; కలశం = కలశమును; దదౌ = ఇచ్చెను.
భావము:-
కలిసి అర్థాతిశయముగా మధురముగా గానము చేసిన ఆ కుశలవుల గానము విన్న ఒకానొక ముని సంతసించిన వాడై వారికి ఒక కలశమును బహుమతిగా ఇచ్చెను.
గమనిక:-
(1) సంరక్తమ్- సంరక్తతరమ్- సంరక్తతమమ్; (2) అత్యర్థ- వ్యు. అతి+అర్థ, అతిక్రాంతం అర్థం, మించిన అర్థము; అనురూపం స్వరూపమ్, అతిశయము; కలశ- వ్యుత్పత్తి- శు = గతౌ, కల+శు+డ, కృ.ప్ర., నీటిచే ఇంపుగా ధ్వనించునది.
1.4.21.
అనుష్టుప్.
ప్రసన్నో వల్కలే కశ్చిత్
దదౌ తాభ్యాం మహాయశాః।;
అన్యః కృష్ణాజినం ప్రాదాత్
మౌంజీమన్యో మహామునిః ॥;
టీక:-
ప్రసన్నః = ప్రసన్నుడైన; వల్కలమ్ = నారచీరలను; కశ్చిత్ = ఒకానొక; ముని; దదౌ = ఇచ్చెను; తాభ్యాం = వారికి; మహాయశాః = గొప్ప కీర్తి గలిగిన; అన్యః = మరొకరు; కృష్మాజినం = కృష్ణాజినం, నల్లజింకచర్మం; ప్రాదాత్ = ప్రసాదించారు; మౌంజీమ్ = మౌజిలను; అన్యః = ఇతర; మహామునిః = గొప్పముని;
భావము:-
ప్రసన్నుడైన మరియొక ముని వారిద్దరికి నారచీరలను బహూకరించెను. మఱొకరు కృష్ణాజినం, మఱొక మహాముని మౌంజీలు ప్రసాదించారు.
గమనిక:-
మౌంజి - ముంజ (తాటి) గడ్డితో ముప్పేటగా నేసిన నడికట్టు.
1.4.22.
అనుష్టుప్.
కశ్చిత్ కమండలుం ప్రాదాత్
యజ్ఞసూత్రం తథాపరః।
ఔదంబరీం బ్రుసీమన్యో
జపమాలామ్ అభాపరః॥
టీక:-
కశ్చిత్ = ఒకానొకరు; కమండలుం = కమండలమును; ప్రాదాత్ = ప్రసాదించెను; యజ్ఞసూత్రం = యజ్ఞోపవీతము; తథా = మఱియు; అపరః = ఇతరులు; ఔదంబరీం = మేడి పీఠమును; బ్రుసీమ్ = తపస్సుకైన ఆసనమును; అన్యః = ఇంకొకరు; జపమాలామ్ = జపమాలను; అభా = అలాగే; పరః = మఱొకరు.
భావము:-
ఒకరు కమండలమును; మరొకరు యజ్ఞోపవీతమును; ఇకొకరు మేడి పీఠమును, తపస్సు చేసుకొను ఆసనమును; మరొకొకరు జపమాలను ఇచ్చారు.
గమనిక:-
కమండలము- క-నీరు+ మండమ్- శోభ+ పొందునది, ఋషులు, బ్రహ్మచారులు వాడు జలపాత్ర; బ్రుసీ- వ్యుత్పత్తి. బృ+సర+డ-జీష్, కృ.ప్ర., మంత్రానుష్ఠానముచేయ కూర్చుండునది.
1.4.23.
అనుష్టుప్.
బ్రుసీమన్యత్ తదా ప్రాదాత్
కౌపీనం అపరోముని।
తాభ్యాం దదౌ తదాహృష్టః
కుఠారమపరో మునిః ॥
టీక:-
బ్రుసీమ్ = ఆసనము; అన్యత్ = ఇంకొకటి; తదా = అలాగే; ప్రాదాత్ = ఇచ్చెను; కౌపీనం = గోచీగుడ్డ; అపరః = ఇతర; ముని = ముని; తాభ్యాం = వారిద్దరికి; దదౌ = ఇచ్చారు; తదా = అలాగే; హృష్టః = సంతోషించినవారు; కుఠారమ్ = గొడ్డలిని; అపరః = వేరే; మునిః = ముని.
భావము:-
ఇంకొక ఆసనమును వేరేవారు; అలాగే; గోచీగుడ్డ ఇతర ముని; సంతోషించిన మరో ముని గొడ్డలిని వారిద్దరికి ఇచ్చారు,
గమనిక:-
కౌపీనము- వ్యు. కూపే పతనమ్ అర్హసి- కూప+ ఖణ్, త.ప్ర., గోచీ.
1.4.24.
అనుష్టుప్.
కాషాయమపరో వస్త్రం
చీరమన్యో దదౌ మునిః।
జటాబంధన మవ్యస్తు
కాష్ఠరజ్జుమ్ ముదాన్వితః ॥
టీక:-
కాషాయమ్ = కాషాయము, కావిరంగు బట్ట; అపరః = ఇంకొకరు; వస్త్రం = బట్టను; చీరమ్ = అంగవస్త్రమును; అన్యమ్ = మరొటి; దదౌ = ఇచ్చారు; మునిః = ముని; జటాబంధనమ్ = జటాబంధనమును, రిబ్బను?; అవ్యస్తు = అపరిమితమైన; కాష్ఠరజ్జుమ్ = సమిధలు కట్టుకొను త్రాడు; ముదాన్వితః = సంతోషించినవారు.
భావము:-
ఒకరు కాషాయము బట్టను; అంగవస్త్రమును మరొక ముని; జటాబంధనమును, సమిధలు కట్టుకొను పెద్ద త్రాడు సంతోషించిన ముని ఒకరు ఇచ్చారు.
1.4.25.
అనుష్టుప్.
యజ్ఞభాండమ్ ఋషి కశ్యిత్
కాష్ఠభారం తథాపరః।
ఆయుష్య మపరే స్రాహుః
ముదా తత్రమహర్షయః ॥
టీక:-
యజ్ఞభాండమ్ = యజ్ఞపాత్రను; ఋషి = ఋషి; కశ్యిత్ = ఒకరు; కాష్ఠభారం = సమిధలను; తథ = అలాగే; అపరః = ఇంకొకరు; ఆయుష్యమ్ = ఆశీర్వాదము; అపరే = మరొకరు; స్రాహుః = సమర్పించిరి; ముదాత్ = ఇష్టంగా; అత్రమ్ = అక్కడ ఉన్నవారు; హర్షయః = సంతోషముతో.
భావము:-
యజ్ఞపాత్రను ఒక ఋషి; సమిధలను ఇంకొకరు; ఆశీర్వాదము మరొకరు; ఇష్టంగా అక్కడ ఉన్నవారు అందరు సంతోషముతో ఇచ్చారు.
1.4.26.
అనుష్టుప్.
దదుశ్చైవ వరాన్ సర్వే
మునయః సత్యవాదినః।
ఆశ్చర్య మిదం గీతం
సర్వగీతేషు కోవిదౌః ॥
టీక:-
దదౌ = ఇచ్చిరి; చైవ; వరాన్ = వరములను; సర్వే = అందరు; మునయః = మునులు; సత్యవాదినః = సత్యసంధులు; ఆశ్చర్యమ్ = అద్భుతము; ఇదం = ఈ యొక్క; గీతం = పాడబడినది; సర్వ = సకల; గీతేషు = గానరీతులలోను; కోవిదౌః = ఇద్దరు పండితులు.
భావము:-
సత్యసంధులు మునులు అందరు వరములను ఇచ్చిరి. గానరీతులు అన్నింటిలోను నిష్ణాతులైన వీరిద్దరు పండితులు. వీరు పాడిన ఈ గీతం అద్భుతము అనిరి.
గమనిక:-
1) గీతమనగా గానమని తాత్పర్యము సప్తతాళములు 2) ధ్రువము అంగములు 1011, మిగతావి మధ్య, రూపక, ఝంప, త్రిపుట, అట, ఏక. సంగీతశాస్త్ర వాచకములు. (అ) ధ్రువాది బద్ద సంగీతము నకు గీతము అని పేరు. (ఆ) ధ్రువము పద్నాలుగు అక్షరములు గల తాళ విశేషము. ఆంధ్రవాచస్పతము.
1.4.27.
అనుష్టుప్.
* ఆశ్చర్యమిదమాఖ్యానం
మునినా సంప్రకీర్తితమ్ ।
పరం కవీనామాధారం
సమాప్తం చ యథాక్రమమ్ ॥
టీక:-
ఆశ్చర్యమ్ = అద్భుతము; ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = గ్రంథము; మునినా = వాల్మీకి మునిచేత; సమ్ = చక్కగా; ప్రకీర్తితమ్ = బాగుగా గానము చేయబడినది; పరం = భవిష్యత్తు; కవీనామ్ = కవులకు; ఆధారమ్ = ఆధారమై; సమాప్తం = పూర్తి కావించబడినది; చ = కూడా; యథాక్రమమ్ = పద్దతిప్రకారము.
భావము:-
వాల్మీకి మహామునిచే రచింపబడిన ఈ రామాయణ కావ్యము భవిష్యత్తు కవులకు అందరికీ ఆదర్శప్రాయమైనది అగునట్లు పద్దతిగా సుసంపూర్ణం చేయబడినది.
1.4.28.
అనుష్టుప్.
* అభిగీతమిదం గీతం
సర్వగీతేషు కోవిదౌ ।
ఆయుష్యం పుష్టిజనకం
సర్వశ్రుతిమనోహరమ్ ॥
టీక:-
అభిగీతమ్ = చక్కగా పాడబడినదైన; ఇదం = ఈ; గీతమ్ = గీతము; సర్వ = అన్ని విధములైన; గీతేషు = గానరీతు లందును; కోవిదౌ = ప్రావీణ్యము కలవారైన; ఆయుష్యం = ఆయుష్యమును వృద్ధి చేయునది; పుష్టి = పుష్టిని; జనకమ్ = కలిగించునది; సర్వ = అందరి; శ్రుతి = చెవులకు; మనోహరమ్ = వినసొంపయినది.
భావము:-
ఆయుస్సును వృద్ధి చేయునది; పుష్టిని కలిగించునది అందరి వీనులకు వినసొంపైనది అగు ఈ గీతమును ఇద్దరు నిష్ణాతులు అద్భుతముగా గానము చేసిరి.
1.4.29.
అనుష్టుప్.
ప్రశస్యమానౌ సర్వత్ర
కదాచిత్తత్ర గాయకౌ ।
రథ్యాసు రాజమార్గేషు
దదర్శ భరతాగ్రజః ॥
టీక:-
ప్రశస్యమానౌ = ప్రశంసించబడుతున్న వారైన; సర్వత్ర = అంతటను; కదాచిత్ = ఒకానొక సందర్భములో; తత్ర = అక్కడ; గాయకౌ = గాయకులను; రథ్యాసు = వీధు కూడళ్ళ యందు, వావిళ్ళ నిఘంటువు; రాజమార్గేషు = రాజమార్గములందు; దదర్శ = చూసెను; భరతాగ్రజః = భరతుని అన్నగారు రాముడు.
భావము:-
పెక్కు వీధులు కలియు కూడళ్ళ యందు. రాజ మార్గములందును, సర్వత్రా మధురముగా గానము చేయుచు అందరిచే ప్రశంసించబడుచున్న ఆ కుశలవులను భరతాగ్రజుడైన రాముడు అక్కడ చూసెను.
గమనిక:-
భరతాగ్రజుడు అనగా భరతుని అన్నగారు అనే కాకుండా, భరత బాధ్యతవహించువాడు, అగ్రజుడు అనగా ముందున్నవాడు, సిద్ధపడువాడు అని గ్రహించిన, రాబోవుకాలమున లవకుశుల బాధ్యత వహించుటకు రాముడు సిద్దపడుచున్నాడని స్పురించును.
1.4.30.
అనుష్టుప్.
స్వవేశ్మ చానీయ తతో
భ్రాతరౌ చ కుశీలవౌ ।
పూజయామాస పూజార్హౌ
రామః శత్రునిబర్హణః ॥
టీక:-
స్వృ = తన; వేశ్మ = గృహమునకు; చ, ఆనీయ = కూడ తీసుకుని వచ్చెను. తతః = అప్పుడు; భ్రాతరౌ = సోదరులైన; చ, కుశీలవౌ = కుశలవులను; పూజయామాస = గౌరవించెను; పూజార్హౌ = గౌరవించతగిన వారైన; రామః = రాముడు; శత్రునిబర్హణః = శత్రువులను సంహరించు వాడు.
భావము:-
శత్రుసంహరము చేయు మహనీయుడు రాముడు గౌరవించదగిన సోదరులైన ఆ కుశలవులను తన గృహమునకు తీసుకుని వచ్చి గౌరవించెను.
1.4.31.
అనుష్టుప్.
ఆసీనః కాంచనే దివ్యే
స చ సింహాసనే ప్రభుః ।
ఉపోపవిష్టః సచివైః
భ్రాతృభిశ్చ పరంతపః ॥
టీక:-
ఆసీనః = ఆసీనుడైన; కాంచనే = బంగారముతో చేయబడిన; దివ్యే = దివ్యమైన; సః = ఆ; చ = సింహాసనే = సింహాసనము పైన; ప్రభుః = రాజు; ఉపోపవిష్టః = చుట్టూ పరివేష్టింపబడినవాడై; సచివైః = మంత్రులు చేతను; భ్రాతృభిశ్చ = సోదరులచేతను; పరంతపః = శత్రువులను పీడించెడి.
భావము:-
శత్రుతపనుడు అగు ఆ రామచంద్ర ప్రభువు సోదరులు; సచివులు పరివేష్టించి ఉండగా బంగారముతో చేయబడిన తన దివ్య సింహాసనముపై ఆసీనుడై ఉండెను.
గమనిక:-
సచివ- వ్యు. సచి+వా+క, సచి- సమవాయః తథా సన్ వాతి, మంత్రి
1.4.32.
అనుష్టుప్.
దృష్ట్వా తు రూపసంపన్నౌ
తావుభౌ నియతస్తదా ।
ఉవాచ లక్ష్మణం రామః
శత్రుఘ్నం భరతం తథా ॥
టీక:-
దృష్ట్వా = చూచి; తు = చూచి; రూపసంపన్నౌ = బహుసుందరులైన; తౌ = ఆ; ఉభౌ = ఇరువురినీ; నియత = నియమవంతులైన; తదా = అప్పడు; ఉవాచ = పలికెను; లక్ష్మణం = లక్ష్మణుని గురించి; రామః = రాముడు; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుడిని గురించి; భరతం = భరతుని గురించి; తథా = మఱియు.
భావము:-
తాత్పర్యము:- రూపసంపన్నులు నియమవంతులైన ఆ కుశలవులను చూచి అప్పుడు రాముడు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో ఇట్లు పలికెను.
1.4.33.
అనుష్టుప్.
"శ్రూయతామిదమాఖ్యానమ్
అనయోః దేవవర్చసోః ।
విచిత్రార్ధ పదం సమ్యక్"
గాయికౌ తావచోదయత్" ॥
టీక:-
శ్రూయతామ్ = వినబడుగాక; ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = కథనము; అనయోః = వీరి యొక్క; దేవవర్చసోః = దేవతల వంటి వర్చస్సు కలిగిన; విచిత్ర = చిత్రమైన; అర్థ = అర్థములు; పదం = పదములు; సమ్యక్ = బాగుగా; గాయికౌ = పాడువారిని; తౌ = వారిరువురను; వచోదయత్ = ప్రేరేపించెను.
భావము:-
తాత్పర్యము:- "దివ్యమైన వర్చస్సు కలిగిన ఈ కుశ లవులు గానము చేయు చిత్ర విచిత్ర పదములతో చక్కని భావముతో కూడిన ఈ కథనమును వినుడు" అని తన సోదరులతో పలికి రాముడు ఆ గాయకులను పాడుటకు ప్రేరేపించెను.
1.4.34.
అనుష్టుప్.
తౌచాపి మధురం రక్తమ్
స్వంచితాయతనిస్వనమ్ ।
తంత్రీలయవదత్యర్థమ్
విశ్రుతార్థమగాయతామ్ ॥
టీక:-
తౌ చ = వారిరువురును; అపి = కూడా; మధురం = మధురముగను; రక్తమ్ = రాగయుక్తముగాను; స్వంచ్ = కలిసిన; ఇత = పొదికగా, ఒప్పైన; ఆయత = దీర్ఘమైన, విస్తారమైన; నిస్వనమ్ = ధ్వనితోను; తంత్రీ = వాయిద్యముల తంత్రుల; లయవత్ = లయకు అనుగుణముగను; అత్యర్థమ్ = మిక్కిలి; విశ్రుత = విస్తృతమైన; అర్థమ్ = అర్ధము కలుగునట్లుగను; అగాయతామ్ = గానము చేసిరి.
భావము:-
తాత్పర్యము:- ఆ కుశలవులు మధురముగను, తంత్రీ వాయిద్యముల శ్రుతి లయలకు అనుగుణముగా రాగయుక్తమైన చక్కని విస్తారమైన స్వరంతో చక్కగా ఒప్పిన కంఠము కలియునట్లు గానము చేసిరి. వారి గానము నందు అర్ధము విస్త్రుతముగ స్పురించు చుండెను.
1.4.35.
అనుష్టుప్.
హ్లాదయత్ సర్వగాత్రాణి
మనాంసి హృదయాని చ ।
శ్రోత్రాశ్రయసుఖం గేయమ్
తద్బభౌ జనసంసది ॥
టీక:-
హ్లాదయత్ = ఆహ్లాదము కలిగించేది; సర్వ = సమస్తమైన; గాత్రాణి = మానవుల, జీవుల; మనాంసి = మనస్సులకు; హృదయాని = హృదయములకు; చ = కూడ; శ్రోత్రా = వీనులకు; ఆశ్రయ = కలిగించునదై; సుఖం = సుఖానుభూతి; గేయమ్ = గీతము; తత్ = ఆ; బభౌ = భాసించినది; జనృ = ప్రజా; సంసది = సభ యందలి.
భావము:-
తాత్పర్యము:- ఆ కుశలవుల గానము సకల సభాసదుల వీనులకు విందుగా ఉండి సుఖానుభూతిని కలిగించుచు, మనస్సులను, హృదయములను రంజింపజేసెను.
1.4.36.
జగతి.
* "ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
కుశీలవౌ చైవ మహాతపస్వినౌ ।
మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే
మహానుభావం చరితం నిబోధత" ॥
టీక:-
"ఇమౌ = వీరిద్దఱును; మునీ = మునులు; పార్థివలక్షణ = క్షత్రియలక్షణములు; ఆన్వితౌ = కలిగిన వారై; కుశీలవౌ = కుశలవులని నామములు కలవారు / గాయకులు ఇద్దఱు; చైవ = మఱియు; మహా = గొప్ప; తపస్వినౌ = తపస్వులు; మమాపి = నాతో కూడ; తత్ = ఆ; భూతికరం = అనుభూతి కలిగించెడి; ప్రవక్ష్యతే = చెప్పెడిది; మహ = గొప్ప; అనుభావమ్ = ప్రభావవంతమైన; చరితం = ఆ చరిత్రము; నిబోధత = శ్రద్ధగా ఆలకింపుడు.
భావము:-
తాత్పర్యము:-"గొప్ప తపశ్శాలులు, క్షత్రియలక్షణాన్వితులు ఐన ఈ మునికుమారులు కుశలవులు అని గాయకులు. అనుభూతి కలిగేలా వీరు చెప్పెడి ఈ గొప్ప ప్రభావవంతమైన చరిత్రము నాతోపాటు శ్రద్ధగా ఆలకింపుడు" అని రాముడు సోదరులకు చెప్పెను.
1.4.37.
జగతి.
తతస్తు తౌ రామవచః ప్రచోదితౌ
అగాయతాం మార్గవిధానసంపదా ।
స చాపి రామః పరిషద్గతః శనై
ర్బుభూషయా సక్తమనా బభూవ హ ॥
టీక:-
ప్రతిపదార్థము :- తతః = అటు పిమ్మట; తౌ = వారిద్దరు; రామ = శ్రీరాముని; వచః = ఆజ్ఞ చేత; ప్రచోదితౌ = నిర్దేశింపబడినవారై; అగాయతామ్ = గానము చేసిరి; మార్గవిధాన = సంగీతంలోని మార్గవిధానము; సంపదా = సమృద్దిగ; సః = ఆ; చాపి = కూడ; రామః = రాముడు; పరిషత్ = సభలో; గతః = ఉన్నవారు; శనైః = శాంత చిత్తులు; బుభూషయా = అభిలాషతో; సక్త = ఆసక్తి గల / లగ్నమైన; మనాః = మనస్సుకలవారు; బభూవ = ఆయెను; హ.
భావము:-
తాత్పర్యము:- అటుపిమ్మట రాముని ఆజ్ఞ ప్రకారము ఆ కుశలవులు మార్గ, దేశీ గాన విధానములలో స్వచ్ఛమైన మార్గ విధైనములో గానము చేసిరి. రామునితో సహితంగా సభాసదులు అందఱు కూడ. ప్రీతితో లగ్నమైన మనసులతో, శాంతచిత్తులైరి.
గమనిక:-
మార్గవిధానము- సంగీతము మార్గము, దేశ్యము అని రెండు విధములు. మార్గము- ఈశ్వర ప్రణీతమై భరతఋషితే ప్రకటింపబడినది. దేశ్యము ఆయా దేశాముల యందు వాడుక గలిగి మనోహరమైనది ఆంధ్రశబ్దరత్నాకరము. 2) షణ్మార్గములు- 1. దక్షిణము, 2. వార్తికము, 3. చిత్రము, 4. చిత్రతరము, 5. చిత్రతమము, 6. అతిచిత్రతమము. సంకేతపదకోశము, రవ్వాశ్రీహరి
1.4.38.
గద్యము.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుర్థః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్థ [4] = నాలుగవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [3] నాలుగవ సర్గ సుసంపూర్ణము.
1.5.1.
అనుష్టుప్.
సర్వాపూర్వమియం యేషాం
ఆసీత్కృత్స్నా వసుంధరా ।
ప్రజాపతిముపాదాయ
నృపాణాం జయశాలినామ్ ॥
టీక:-
సర్వా = అన్నిటికన్నా; పూర్వమ్ = పూర్వమునుండి; ఇయమ్ = ఈ; ఏషామ్ = ఏ; ఆసీత్ = ఉండెడిదో; కృత్స్నా = సమస్తమైన; వసుంధరా = భూమండలము, వసుధ; ప్రజాపతిమ్ = మను ప్రజాపతి; ఉపాదాయ = మొదలుకొని; నృపాణామ్ = రాజులకు సంబంధించినదిగా; జయశాలినామ్ = విజయశీలురైనవారికి
భావము:-
పూర్వమునుండి ఈ భూమండలమంతా, మను ప్రజాపతి మొదలుకొని, విజయశీలురైన ఏ రాజుల ఆధీనములో ఉండెడిదో.
గమనిక:-
*(1) వసుంధర- వ్యు. వసు (బంగారము రత్నాలు మొగలగునవి) +ధృ+ఖచ్-ముమ్- టాప్ కృ.ప్ర., బంగారము రత్నాలు మున్నగునవి వసువులు అంటారు, వసువులను ధరించునది గాన వసుంధర. (2) నృప- వ్యు. నరులను పాలించువాడు, రాజు.
1.5.2.
అనుష్టుప్.
యేషాం స సగరో నామ
సాగరో యేన ఖానితః ।
షష్టిః పుత్రసహస్రాణి
యం యాంతం పర్యవారయన్ ॥
టీక:-
ఏషామ్ = ఏ రాజులలో; సః = అటువంటి; సగరః = సగరుడు; నామ = అను పేరుగలవాడు; సాగరః = సముద్రము; యేన = ఎవరిచే; ఖానితః = త్రవ్వింపబడినదో; షష్టిః పుత్ర సహస్రాణి = అరవై వేల మంది కొడుకులు; యమ్ = ఎవరిని; యాంతమ్ = యుద్ధమునకు వెళ్ళుచున్నప్పుడు; పర్యవారయన్ = చుట్టూ ఉండెడివారో
భావము:-
సగరు డను చక్రవర్తి ఈ సముద్రమును తవ్వించెను. కనుకనే అది సాగరము అనబడును. సగరుడు చేసిన ప్రతి యుద్ధము లోను అతనికి తన అరవై వేల మంది కొడుకులు తోడుగ నుండెడి వారు. అట్టి సగరుడనబడే చక్రవర్తి ఏ రాజులలో ఉండెడి వాడో..
1.5.3.
అనుష్టుప్.
* ఇక్ష్వాకూణా మిదం తేషాం
రాజ్ఞాం వంశే మహాత్మనామ్ ।
మహదుత్పన్న మాఖ్యానం
రామాయణమితి శ్రుతమ్ ॥
టీక:-
ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకు వంశములోని; ఇదమ్ = ఈ; తేషామ్ = అటువంటి; రాజ్ఞామ్ = రాజులయొక్క; వంశే = వంశములలో; మహాత్మానామ్ = మహాత్ములైన; మహత్ = గొప్పగా; ఉత్పన్నమ్ = జన్మించిన; ఆఖ్యానమ్ = ఆఖ్యానము, పూర్వము జరిగినదానిని చెప్పుట; రామాయణమ్ = రామాయణము; ఇతి = అని; శ్రుతమ్ = వినుతికెక్కినది
భావము:-
అట్టి మహాత్ములైన రాజులు కల వంశాలలో ఇక్ష్వాకు రాజవంశము కలదు. అందు, రామాయణముగా ప్రసిద్ధి చెందిన ఈ మహాచరిత్ర (ఇతిహాసము) పుట్టినది.
1.5.4.
అనుష్టుప్.
* తదిదం వర్తయిష్యామి
సర్వం నిఖిలమాదితః ।
ధర్మకామార్థ సహితం
శ్రోతవ్య మనసూయయా ॥
టీక:-
తత్ = అటువంటి; ఇదమ్ = దీనిని; వర్తయిష్యామి = ప్రచారము చేసెదను; సర్వమ్ = అంతా; నిఖిలమ్ = పూర్తిగా; ఆదితః = మొదటినుంచి; ధర్మకామార్థ = పురుషార్థములు, ధర్మ అర్థ కామ అనబడే పురుషార్థములు; సహితమ్ = కలిగియున్నదానిని; శ్రోతవ్యమ్ = వినుము; అనసూయయా = అసూయ లేకుండ
భావము:-
అటువంటి ఈ రామాయణమును లోకమంతటా ప్రచారము చేసెదను. ధర్మార్థకామము లనెడి పురుషార్థములు కలిగియున్న ఈ రామాయణమును మొదటినుంచి పూర్తిగా అసూయ లేకుండా వినుము.
1.5.5.
అనుష్టుప్.
కోసలో నామ ముదితః
స్ఫీతో జనపదో మహాన్ ।
నివిష్టః సరయూతీరే
ప్రభూత ధనధాన్యవాన్ ॥
టీక:-
కోసలః = కోసల; నామః = అనబడు; ముదితః = సంతోషభరితమైన; స్ఫీతః = విశాలమైన; జనపదః = దేశము; మహాన్ = శ్రేష్ఠమైనది; నివిష్టః = ఉన్నది; సరయూ = సరయూ నది; తీరే = తీరమునందు; ప్రభూత = సమృద్ధిగా; ధనధాన్యవాన్ = ధనధాన్యములతో.
భావము:-
కోసల అను విశాలమైన దేశము సరయూ నదీ తీరములో ఉన్నది. అది ధనధాన్య సమృద్ధితోను, నిత్యసంతుష్టులైన ప్రజలతోను విరాజిల్లుతున్నది.
1.5.6.
అనుష్టుప్.
అయోధ్యా నామ నగరీ
తత్రాసీల్లోక విశ్రుతా ।
మనునా మానవేంద్రేణ
యా పురీ నిర్మితా స్వయమ్ ॥
టీక:-
అయోధ్యా = అయోధ్య అని; నామ = పిలవబడే; నగరీ = నగరము; తత్ర = అక్కడ; ఆసీత్ = ఉండెడిది; లోక = లోకములో; విశ్రుతా = ప్రసిద్ధిగాంచినది; మనునా = మను చక్రవర్తి అను; మానవేంద్రేణ = రాజశ్రేష్ఠునిచే; యా = ఆ; పురీ = పట్టణము; నిర్మితా = నిర్మింపబడెను; స్వయమ్ = స్వయముగా.
భావము:-
ఆ కోసల దేశమందు అయోధ్య అనే నగరము ఉండెడిది. రాజశ్రేష్ఠుడైన మనుచక్రవర్తి స్వయముగా అయోధ్యను నిర్మించెను.
గమనిక:-
*- అయోధ్య- అ(కానిది) యోద్ధుంశక్యా (యోధ్య), న. త,, యుద్ధంచేసి జయింప శక్యం కానిది, ఇది సరయూ తీరమున గల నగరము, ఇక్ష్వాకుల రాజధాని.
1.5.7.
అనుష్టుప్.
ఆయతా దశ చ ద్వే చ
యోజనాని మహాపురీ ।
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా
సువిభక్త మహాపథా ॥
టీక:-
ఆయతా = విశాలమైన; దశ చ ద్వే = పన్నెండు; చ; యోజనాని = యోజనముల; మహాపురీ = మహా నగరము; శ్రీమతీ = శోభాయమానమైన; త్రీణి = మూడు (యోజనములు); విస్తీర్ణా = వెడల్పైనది; సువిభక్త = చక్కగా విభాగింపబడినట్టి; మహాపథా = పెద్ద రాజ మార్గములు కలది.
భావము:-
విశాలమైన అయోధ్యా నగరము పన్నెండు యోజనముల పొడవైనది, మూడు యోజనముల వెడల్పైనది, వాహనాది ప్రకారం చక్కగా విభాగించిన దారులు రాజమార్గములు కలవి అయి ఉండెను.
1.5.8.
అనుష్టుప్.
రాజమార్గేణ మహతా
సువిభక్తేన శోభితా ।
ముక్తపు ష్పావకీర్ణేన
జలసిక్తేన నిత్యశః ॥
టీక:-
రాజమార్గేణ = రాజమార్గములు; మహతా = సువిశాలమైనవి; సువిభక్తేన = చక్కగా వాహనములను బట్టి విభాగించబడి; శోభితా = శోభాయమానమైనది; ముక్తా = తొలగించిన; పుష్పా = పుష్పములు; అవకీర్ణేన = పాడైనవి; జలసిక్తేన = నీటితో తడుపబడినది; నిత్యశః = నిత్యమూ.
భావము:-
అయోధ్యా నగరములోని రాజమార్గములు విశాలమైనవి. బాటసారి, వాహానాదులను బట్టి దారులు విభాగించబడి తీరుగా ఉండునవి. నిత్యము రాలి ఎండిన పువ్వులు తొలగించబడి, కళ్లాపితో తడుపబడినవి.
1.5.9.
అనుష్టుప్.
తాం తు రాజా దశరథో
మహారాష్ట్ర వివర్దనః ।
పురీ మావాసయామాస
దివం దేవపతిర్యథా ॥
టీక:-
తాం = ఆ; తు = యొక్క; రాజా దశరథః = దశరథ మహారాజు; మహా = గొప్ప; రాష్ట్ర = దేశమును; వివర్ధనః = వృద్ధి చేసెను; పురీమ్ = నగరమును; ఆవాసయామాస = నివసించుటకు వీలుగా; దివం = స్వర్గమును; దేవపతి = దేవేంద్రుడు; యథా = వలె.
భావము:-
దశరథ మహారాజు సువిశాలమైన ఆ రాజ్యమును నివసించుటకు వీలుగా, దేవేంద్రుడు స్వర్గమును వృద్ధిచేసినట్లు అభివృద్ధి చేసెను.
1.5.10.
అనుష్టుప్.
కవాట తోరణవతీం
సువిభ క్తాంతరాపణామ్ ।
సర్వ యంత్రాయుధవతీం
ఉపేతాం సర్వశిల్పిభిః ॥
టీక:-
కవాట = ద్వారములు; తోరణ = తోరణములు; వతీమ్ = కలది; సువిభక్తా = చక్కగా విభాగించిన; అంతర = మధ్యలోని ప్రదేశములు; ఆపణామ్ = అంగడులకు; సర్వ = వివిధ; యంత్రా = యంత్రములు; ఆయుధ = ఆయుధములు; వతీమ్ = కలది; ఉపేతామ్ = కూడియున్నది; సర్వ = వివిధ; శిల్పిభిః = శిల్పులు (స్థపతులు) కూడ.
భావము:-
అయోధ్యా నగరము ద్వారములు తోరణాలు కలది. అంగళ్ళు మధ్య ప్రదేశములతో చక్కగా విభాగములు చేయబడినది. సమస్తమైన యంత్రములు, ఆయుధములు కలది. అన్ని రకముల శిల్పులు, స్థపతులు కలది.
గమనిక:-
*- (1) యంత్రము- పనిభారము తగ్గించు తైలయంత్రాది సాధనము. (2) ఆయుధము- వ్యు. ఆ+యుధ్+ఘఞ్ (కరణే) ఆయుధ్యతే అనేన,
1.5.11.
అనుష్టుప్.
సూతమాగధ సమ్బాధాం
శ్రీమతీ మతులప్రభామ్ ।
ఉచ్చాట్టాల ధ్వజవతీం
శతఘ్నీశత సంకులామ్ ॥
టీక:-
సూత = రథములు తోలు వారు, శౌర్యపరాక్రమములు వర్ణించువారు; మాగధ = రాజవంశావళి ప్రశంసించెడి వారు; సంబాధామ్ = క్రిక్కిరిసి యున్నది; శ్రీమతీమ్ = సమృద్ధి; అతుల = అసమానమైన; ప్రభామ్ = వెలుగుచున్న; ఉత్ = ఉన్నతమైన; అట్టాల = కోటబురుజులు; ధ్వజ = పతాకములు; వతీమ్ = కలది; శతఘ్నీ = వందల మందిని పడగొట్టు ఆయుధములు, ఫిరంగి, నాలుగు మూరల ఇనుప ముండ్ర కఱ్ఱ, శబ్దరత్నాకరము; శత = వందలు; సంకులామ్ = కలిగియున్నది.
భావము:-
అయోధ్యా నగరము స్తోత్రములు చేయు సారథుల చేతను, రాజ వంశ ప్రశస్తిని కీర్తించు వారి చేతను, అసమానమైన సమృద్ధితో శోభిల్లునది. ఉన్నతమైన బురుజులును, పతాకములును కలది. వందల కొలది శతఘ్నులు ఉన్నది.
1.5.12.
అనుష్టుప్.
వధూనాటక సంఘైశ్చ
సంయుక్తాం సర్వతః పురీమ్ ।
ఉద్యానా మ్రవనోపేతాం
మహతీం సాలమేఖలామ్ ॥
టీక:-
వధూః = స్త్రీలు; నాటక = నటీనటులు; సంఘైః = సంఘములతో; చ; సంయుక్తామ్ = కూడియున్నది; సర్వతః = నలువైపుల; పురీమ్ = నగరము; ఉద్యాన = ఉద్యాన వనములు; ఆమ్ర = మామిడి; వన = తోటలతో; ఉపేతామ్ = కూడినది; మహతీమ్ = గొప్పది; సాల = చావళ్ళు; మేఖలామ్ = చుట్టూ కలది.
భావము:-
అయోధ్యా నగరము ఎందరో స్త్రీలు నటీనటులు కలది. నగరము నలువైపుల ఉద్యానవనములు, మామిడి తోటలు కలది. చుట్టూ గొప్ప సావిళ్ళు కలది.
1.5.13.
అనుష్టుప్.
దుర్గగంభీర పరిఘాం
దుర్గామన్యై ర్దురాసదామ్ ।
వాజివారణ సంపూర్ణాం
గోభిరుష్ట్రైః ఖరైస్తథా ॥
టీక:-
దుర్గ = ప్రవేశించడానికి వీలుకాని; గంభీర = భయంకరమైన; పరిఘామ్ = అగడ్తలు కలది; దుర్గామ్ = కోటలు; అన్యైః = శత్రువుల వలన; దురాసదామ్ = ఆక్రమించుటకు వీలుకానివి; వాజి = గుఱ్ఱములు; వారణ = ఏనుగులు; సంపూర్ణామ్ = నిండియున్నది; తథా = మఱియు; గోభిః = ఆవులతో; ఉష్ట్రైః = ఒంటెలతో; ఖరైః = గాడిదలతో
భావము:-
ఆ నగరము చుట్టూ కల లోతైన అగడ్తలతో ప్రవేశించడానికి వీలుకానివి. కోటలు శత్రువులు దండెత్తుటకు వీలు పడనివి. గుఱ్ఱములు, ఏనుగులు, ఆవులు, ఒంటెలు, గాడిదలతో నిండి ఉన్నవి.
1.5.14.
అనుష్టుప్.
సామంతరాజ సంఘైశ్చ
బలికర్మభి రావృతామ్ ।
నానాదేశ నివాసైశ్చ
వణిగ్భి రుపశోభితామ్ ॥
టీక:-
సామంతరాజ = సామంత రాజుల; సంఘైః చ = సమూహములతో; బలికర్మభిః = కప్పము, సుంకము ఇత్యాది చెల్లించునట్టి; ఆవృతామ్ = నిండియున్నది; నానాదేశ = పెక్కు దేశముల; నివాసైః చ = నివసించు; వణిగ్భిః = వ్యాపారులచే; ఉపశోభితామ్ = విరాజిల్లుతున్నది.
భావము:-
ఆ నగరము కప్పము, సుంకము వంటి చెల్లింపులు చేయుటకు వచ్చిన సామంతరాజులతో నిండి ఉన్నది. వివిధదేశాలకు చెందిన ఎందరో వ్యాపారులతో విరాజిల్లుచున్నది.
1.5.15.
అనుష్టుప్.
* ప్రాసాదై రత్నవికృతైః
పర్వతైరివ శోభితామ్ ।
కూటాగారైశ్చ సంపూర్ణాం
ఇంద్రస్యే వామరావతీమ్ ॥
టీక:-
ప్రసాదైః = మిద్దెలతో; రత్న = రత్నములు; వికృతైః = అలంకరింపబడిన; పర్వతైః = క్రీడా పర్వతములతో; ఉపశోభితామ్ = చక్కగా అలంకరింపబడినవి; కూటాగారైః చ = బహుళ అంతస్తుల మేడలతో; సంపూర్ణామ్ = నిండియున్నది; ఇంద్రస్య = ఇంద్రుని యొక్క; ఇవ = వలె; అమరావతీ = అమరావతి (ఇంద్రుని యొక్క ముఖ్యపట్టణము).
భావము:-
ఆ నగరము రత్నములు పొదిగిన మిద్దెలతోనూ, ఆహ్లాదకరమైన పర్వతములతోనూ, బహుళ అంతస్తుల మేడలతోను నిండి ఉండి, ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిల్లుచుండెను.
1.5.16.
అనుష్టుప్.
చిత్రామ ష్టాపదాకారాం
వరనారీగణై ర్యుతామ్ ।
సర్వరత్న సమాకీర్ణాం
విమాన గృహ శోభితామ్ ॥
టీక:-
చిత్రామ్ = అచ్చెరువొందించు; అష్టాపద = పాచికలతో (అష్టాచమ్మా) ఆడు గడియలున్న పీట వంటిది, బంగారపు; ఆకారమ్ = ఆకారము గలది; వర = శ్రేష్ఠమైన; నారీ = స్త్రీల; గణైః = సమూహము; యుతామ్ = కలిగియున్నది; సర్వ = అన్ని రకముల; రత్న = రత్నములతో; సమాకీర్ణాం = నిండి ఉన్నది; విమాన = రాజసౌధముల వంటి; గృహ = మేడలతో; శోభితామ్ = ప్రకాశిస్తున్నది.
భావము:-
ఆ నగరము పాచికలాడు పీట వంటి ఆకారముతో / బంగారపు రూపుతో ఆశ్చర్యకరముగా ఉన్నది. శ్రేష్ఠమైన స్త్రీలతో నిండి ఉన్నది. అన్ని రకముల రత్నములు సమృద్ధిగా కలది. రాజసౌధాలవంటి మేడలతో శోభిల్లుచున్నది.
1.5.17.
అనుష్టుప్.
గృహగాఢా మవిచ్ఛిద్రాం
సమభూమౌ నివేశితామ్ ।
శాలితండుల సంపూర్ణామ్
ఇక్షుకాండ రసోదకామ్ ॥
టీక:-
గృహ = గృహములు; గాఢామ్ = దట్టముగా కలది; అవిచ్ఛిద్రామ్ = లోపములు లేనిది; సమభూమౌ = ఎత్తు పల్లములుగా కాకుండా సమతలమైన నేల కలది; నివేశితామ్ = జన నివాసము బాగా కలది; శాలి = వరి; తండుల = ధాన్యముతో; సంపూర్ణామ్ = నిండియున్నది; ఇక్షుకాండ = చెఱుకు రసము వంటి; రసోదకామ్ = తియ్యనైన త్రాగునీరు కలది.
భావము:-
ఆ నగరములో నేలంతా ఎత్తుపల్లములు లేని సమస్థలమ, ఏ లోపములు లేని చాలా గృహములు, మంచి జన సాంద్రత, వరిబియ్యము సమృద్ధిగా పండుట మఱియు చెఱుకు రసము వలె తియ్యటి త్రాగునీరు కలిగి ఉండెను.
1.5.18.
అనుష్టుప్.
దున్దుభీభి ర్మృదంగైశ్చ
వీణాభిః పణవైస్తథా ।
నాదితాం భృశమత్యర్థం
పృథివ్యాం తామనుత్తమామ్ ॥
టీక:-
దున్దుభీభిః = భేరీలతోను; మృదంగైః చ = మృదంగములతోను; వీణాభిః = వీణలతోను; పణవైః = తప్పెటలతోను; తథా = మఱియు; నాదితామ్ = వాద్యవాయింపులు కలది; భృశమ్ = మిక్కిలి; అత్యర్థమ్ = అధికముగా; పృథీవ్యామ్ = భూమిపై; తామ్ = ఆ నగరము; అనుత్తమామ్ = శ్రేష్ఠమైనది.
భావము:-
అత్యుత్తమమైన ఆ అయోధ్యానగరములో భేరీలు, మృదంగములు, వీణలు, తప్పెట్లు మొదలైన వాయిద్యములొ అధికముగా వినిపించును.
గమనిక:-
*- (1) దుందుభి- దుం దుం అను శబ్దముతో శోభించు బాగా పెద్ద ఢంకా, భేరీ, https://te.wiktionary.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Musical_instruments_in_the_Yunnan_Nationalities_Museum_-_DSC03870.JPG . (2) మృదంగము- వ్యు. మృద్+అంగచి, మృజతే ఆహన్యతే అసౌ, వాయించబడునది, మద్దెలలో విశేషము, https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Mridangam_transparent.png . (3) పణవము- చిన్న తప్పెట, ఉడుక,
1.5.19.
అనుష్టుప్.
విమానమివ సిద్ధానాం
తపసాధిగతం దివి ।
సునివేశిత వేశ్మాంతాం
నరోత్తమ సమావృతామ్ ॥
టీక:-
విమానమ్ = విమానము; ఇవ = వలె; సిద్ధానామ్ = సిద్ధులయొక్క; తపసా = తపస్సుచే; అధిగతమ్ = పొందబడిన; దివి = స్వర్గము; సునివేశిత = చక్కగా నివసించుటకు; వేశ్మాంతామ్ = గృహ వసతి కలది; నరోత్తమ = ఉత్తమ జనులతో; సమావృతామ్ = నిండియుండెడిది.
భావము:-
ఆ నగరము, సిద్ధులు తమ తపోబలముతో స్వర్గమునుండి పొందబడిన విమానములవంటి చక్కటి నివాస గృహ సముదాయములు కలిగి, ఉత్తములైన జనవాసముతో నిండి యున్నది.
1.5.20.
అనుష్టుప్.
యే చ బాణై ర్నవిధ్యంతి
వివిక్త మపరాపరమ్ ।
శబ్దవేధ్యం చ వితతం
లఘుహస్తా విశారదాః ॥
టీక:-
ఏ = ఎవరును; బాణైః = బాణములతో; నవిద్యంతి = కొట్టరో; వివిక్తమ్ = ఒంటరిగా ఉన్నవానిని; అపరాపరమ్ = ముందు వెనుక తోడులేని వానిని; శబ్ద వేధ్యమ్ చ = శబ్దమును బట్టి కొట్టుటకు వీలుగానున్న వానిని; చ; వితతమ్ = వెనుతిరిగి పారిపోతున్న వానిని; లఘుహస్తాః = నేర్పరులైన విలుకాండ్రు; విశారదాః = నైపుణ్యము గలవారు;
భావము:-
ఒంటరివానిని, అనాథలను, శబ్దము వలన గ్రహించి కొట్టుటకు వీలున్న వానిని, పారిపోవుచున్న వానిని, అక్కడి మహారథులు నేర్పరులైన విలుకాండ్రు మంచి నైపుణ్యము కలవారు ఐనను, ఎవరూ బాణములతో కొట్టరు.
1.5.21.
అనుష్టుప్.
సింహ వ్యాఘ్ర వరాహాణాం
మత్తానాం నర్దతాం వనే ।
హంతారో నిశితైః శస్త్రైః
బలా ద్బాహుబలై రపి ॥
టీక:-
సింహ = సింహములు; వ్యాఘ్ర = పులులు; వరాహాణాం = పందులు; మత్తానాం = మదించిన; నర్దతామ్ = గర్జిస్తున్న; వనే = అడవిలో; హంతారః = చంపువారు; నిశితైః = వాడియైన; శస్త్రైః = ఆయుధములచే; బలాత్ = బలమైన; బాహుబలైః = భుజబలముచే; అపి = ఐనను.
భావము:-
సింహములు, పులులు, అడవి పందులు మొదలైన క్రూర మృగములను ఆ నగర మహారథులు నిశితమైన అస్త్రాలతో లేదా తమ భుజ బలముతో చంపుదరు.
1.5.22.
అనుష్టుప్.
తాదృశానాం సహస్రైస్తాం
అభిపూర్ణాం మహారథైః ।
పురీ మావాసయామాస
రాజా దశరథస్తదా ॥
టీక:-
తాదృశానామ్ = అటువంటివారు; సహస్రైః = వేలకొలది; తామ్ = తాము; అభిపూర్ణామ్ = నిండియున్న; మహారథైః = మహారథులతో; పురీమ్ = ఆ నగరమును; ఆవాసయామాస = నివాసముగా; రాజా దశరథః = దశరథ మహారాజు; తదా = అప్పుడు.
భావము:-
అటువంటి మహారథులు వేలకొలది ఉండెడి ఆ మహానగరమును దశరథ మహారాజు తన రాజధానిగా చేసుకుని అక్కడ నివసించెడివాడు.
గమనిక:-
మహారథి - పదునొకండువేలమంది విలుకాండ్రతో, తన్ను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరెడు యోధుఁడు.
1.5.23.
జగతి.
తామగ్ని మద్భిర్గుణ వద్భిరావృతాం
ద్విజోత్తమై ర్వేదషడంగ పారగైః ।
సహస్రదైః సత్యరతై ర్మహాత్మభిః
మహర్షి కల్పైర్ ఋషిభిశ్చ కేవలైః ॥
టీక:-
తామ్ = దానిని; అగ్నిమద్భిః = అహితాగ్నులును; గుణవద్భిః = సుగుణవంతులును; ఆవృతాం = నిండియున్న; ద్విజోత్తమైః = బ్రాహ్మణ శ్రేష్ఠులచేత; వేద = ఋగ్యజుస్సామాథర్వ వేదముల యందు; షడంగ = వేదాంగములైన శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పముల సహితముగా; పారగైః = సంపూర్ణ పాండిత్యము కలవారును; సహస్ర = వేలకొలది; దైః = దానము చేయువారును; సత్యరతైః = సత్య నిరతులును; మహాత్మభిః = గొప్ప మనసు కలవారును; మహర్షి = మహర్షులతో; కల్పై = సమానులును; ఋషిభిః = ఋషులును; చ; కేవలైః = కేవలము.
భావము:-
అయోధ్యానగరములోని ద్విజులు అందరును అహితాగ్నులు, సద్గుణవంతులు, వేదవేదాంగ ఉద్దండులు, వేలకొలది దానము చేయువారు, సత్యనిరతులు, మహామనస్కులు, మహర్షుల వంటివారు, కేవలము ఋషులు. ఆ నగరమును దశరథుడు నివాసముగా చేసుకొని పరిపాలించెను.
1.5.24.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచమః సర్గః
టీక:-
ప్రతిపదార్థము : ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచమ [5] = ఐదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [5] ఐదవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.6.1.
అనుష్టుప్.
తస్యాం పుర్యా మయోధ్యాయాం
వేదవిత్ సర్వసంగ్రహః ।
దీర్ఘదర్శీ మహాతేజాః
పౌర జానపద ప్రియః ॥
టీక:-
తస్యాం = ఆ యొక్క; పుర్యామ్ = పట్టణము; అయోధయాయామ్ = అయోధ్యయందు; వేదవిత్ = వేదములు బాగుగా తెలిసిన వారిని; సర్వః = అందరిని; సంగ్రహః = కూడగట్టుకున్నవాడు; దీర్ఘదర్శీ = భావిపరిణామాలు ముందుగా గుర్తించు వాడు; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కలవాడు; పౌర = పురజనులకు; జానపద = గ్రామస్తులకు; ప్రియః = ఇష్టుడు;
భావము:-
ఆ అయోధ్యానగరంలో (వసించే ధశరథ మహారాజు) వేదార్థములను బాగుగా తెలిసినవారిని అందరినీ కూడగట్టుకొనువాడు, బాగా భావిపరిణామాలు ముందుగా గుర్తించు వాడు, గొప్ప తేజశ్శాలి, ఆ నగర పౌరులకు, గ్రామస్తులకు ఇష్టుడు,
1.6.2.
అనుష్టుప్.
ఇక్ష్వాకూణా మతిరథో
యజ్వా ధర్మరతో వశీ ।
మహర్షికల్పో రాజర్షిః
త్రిషు లోకేషు విశ్రుతః ॥
టీక:-
ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశపు రాజులలో; అతిరథః = అతిరథుడు; యజ్వః = యజ్ఞములు చేయువాడు; ధర్మరతః = ధర్మము నందు నిరతుడు; వశీ = జనులను తన అదుపులో ఉంచుకొనువాడు; మహర్షిః = మహర్షుల; కల్పో = వంటివాడు; రాజర్షిః = రాజర్షి; త్రిషు = మూడు; లోకేషు = లోకములందు; విశ్రుతః = సుప్రసిద్ధుడు,
భావము:-
ఇక్ష్వాకువంశజులలో అతిరథుడు, యజ్ఞములను చేయువాడు, ధర్మకార్యముల యందు నిరతుడు, జనులను తన అదుపులో ఉంచుకొనువాడు, మహర్షితుల్యుడు, రాజర్షి, ముల్లోకముల యందును సుప్రసిద్ధుడు,
గమనిక:-
అతిరథి - అనేక ధన్వి యోద్ధా, పెక్కండ్రు రథికులతో పోరెడు యోథుడు. మహారథి - పదునొకండువేలమంది విలుకాండ్రతో, తన్ను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరెడు యోధుఁడు. సమరథి- ఒకరథికునితో పోరెడు యోధుడు, అర్థరథి- సమరథికన్న తక్కువవాడు, రథి- రథమునెక్కి యుద్దము చేయువాడు.
1.6.3.
అనుష్టుప్.
బలవాన్ నిహతామిత్రో
మిత్రవాన్ విజితేంద్రియః ।
ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః
శక్ర వైశ్రవ ణోపమః ॥
టీక:-
బలవాన్ = చతురంగబలాన్వితుడు; హత = సంహరించిన; అమిత్రః = శత్రువులు కలవాడు; మిత్వవాన్ = మంచిమిత్రులు కలవాడు; విజిత = జయించిన; ఇంద్రియాన్ = ఇంద్రియములు కలవాడు; ధనైః = సంపదలను; చ = కూడ; సంగ్రహైః = కూడబెట్టినవాడు; చ =; సైన్యైః = సేనలను; శక్ర = ఇంద్రుడు; వైశ్రవణః = కుబేరులతో; ఉపమః = సరిపోలువాడు.
భావము:-
చతురంగ బలములు, శత్రుసంహారములు, మంచి మిత్రులు, ఇంద్రియ జయము కలవాడు, ధనకనక వస్తువాహనముల, సేనల సంగ్రహములో ఇంద్రునితో, కుబేరునితో సమానుడు,
1.6.4.
అనుష్టుప్.
యథా మనుర్మహాతేజా
లోకస్య పరిరక్షితా ।
తథా దశరథో రాజా
వసన్ జగదపాలయత్ ॥
టీక:-
యథా = ఎలాగైతే; మనుః = మనువు; మహాతేజా = మహా తేజోవంతుడు; లోకస్య = సకలలోకములను; పరిరక్షితా = చక్కగా కాపాడునో; తథా = ఆలాగుననే; దశరథో = దశర్థుడు అనెడి; రాజా = రాజు; వసన్ = తన నివాసమైన కోసల రాజ్యమను; జగత్ = లోకమును; అపాలయత్ = పరిపాలించెను.
భావము:-
మహాతేజశ్శాలి ఐన మనువు ఎలాగైతే లోకాలను పరిరక్షస్తాడో, అలాగే తన కోసల రాజ్యమును పరిపాలించెను.
1.6.5.
అనుష్టుప్.
తేన సత్యాభిసంధేన
త్రివర్గ మనుతిష్ఠతా ।
పాలితా సా పురీ శ్రేష్ఠా
ఇంద్రేణే వామరావతీ ॥
టీక:-
తేన = అతడు; సత్య = సత్యమునందు; అభిసంధేన = నిబద్దుడు; త్రివర్గః = ధర్మ అర్థ కామము లను మూడు; అనుతిష్ఠతా = ఆచరించువాడు; పాలితా = పరిపాలించును; సా = ఆయొక్క; పురీః = పట్టణమును; శ్రేష్ఠా = ప్రశస్తముగా; ఇంద్రణాః = ఇంద్రుడు; ఏవాన్ = ఏవిధముగా నైతే; = అమరావతీ = అమరావతీని దేవరాజధానిని.
భావము:-
సత్యసంధుడును, ధర్మ అర్థ కామములను మూడింటిని ఆచరించువాడును ఐన దశరథుడు ఇంద్రుడు అమరావతిని పాలించునట్లు అయోధ్యను పాలించెను.
1.6.6.
అనుష్టుప్.
తస్మిన్ పురవరే హృష్టా
ధర్మాత్మానో బహుశ్రుతాః ।
నరాస్తుష్టా ధనైః స్వైః స్వైః
అలుబ్ధాః సత్యవాదినః ॥
టీక:-
తస్మిన్ = ఆయొక్క; పుర = నగరము; వరే = శ్రేష్ఠమైన దాని యందు; హృష్టా = సంతుష్టులు; ధర్మాత్మానో = ధర్మాత్ములు; బహుః = అనేకరకముల; శ్రుతాః = ప్రసిద్ధులు; నరాః = మానవులు; తుష్టాః = తృప్తిచెంది ఉంటారు; ధనైః = సంపాదనలతో; స్వైఃస్వైః = ఆ యా; అలుబ్ధాః = లోభము లేనివారు; సత్యవాదినః = సత్యమును మాత్రమే మాట్లాడు వారు.
భావము:-
శ్రేష్ఠమైన ఆ అయోధ్యానగరమునందలి జనులు సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు. అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు. తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిగా ఉండువారు, లోభగుణము లేనివారు, సత్యమును పలికెడువారు.
1.6.7.
అనుష్టుప్.
నాల్పసన్నిచయః కశ్చిత్
ఆసీత్తస్మిన్ పురోత్తమే ।
కుటుంభీ యో హ్యసిద్ధార్థః -
గవాశ్వ ధనధాన్యవాన్ ॥
టీక:-
న = లేరు; అల్ప = తక్కువ; సత్ = బాగా; నిచయః = సంపాదించిన వారు; కశ్చిత్ = ఏ ఒక్కరును; నాసీత్ = లేరు; తస్మిన్ = ఆయొక్క; పుర = నగరము; ఉత్తమే = శ్రేష్ఠమైన దాని యందలి; కుటుంభీ = గృహస్తులు; యః = ఎవరునూ; అసిద్ధ = స్వచ్ఛము కాని; అర్థః = సంపదలు గలవారు; అ = వ్యతిరేకార్ఠం; గవావాన్ = గోవులు గలవారు; అశ్వలాన్ = గుఱ్ఱములు కలవారు; ధనధాన్యవాన్ = ధనధాన్యములు కలవారు.
భావము:-
ఆ మహానగరమునందలి గృహస్థులలో ప్రతి ఒక్కరును (1) సంపన్నులే, తమ సంపదలను ధర్మకార్యములకును, ధర్మబద్ధముగా అర్థ, కామపురుషార్థములను సాధించుటకును వినియోగించెడి వారే; గోవులు, అశ్వములు, ధనధాన్య సమృద్ధియు గలవారే.
1.6.8.
అనుష్టుప్.
కామీ వా న కదర్యో వా
నృశంసః పురుషః క్వచిత్ ।
ద్రష్టుం శక్య మయోధ్యాయాం
నావిద్వాన్న చ నాస్తికః ॥
టీక:-
కామీ = కాముకుడు; వా = కానీ; న = లేరు; కదర్యః = కక్కుర్తి కృపణ = ఏతరి పిసినిగొట్టు పీనుగు; వా = కాని; నృశంసః = క్రూరుడు; పురుష = పురుషులు; క్వచిత్ = ఎక్కడనూ; ద్రష్టుం = చూడగలుగుట; శక్యం = సాధ్యం; అయోధ్యాయామ్ = అయోధ్యలో; న = కాదు; అవిద్వాన్ = పండితుడు కానివాడు; చ = మఱియు; నాసికః = నాస్తికుడు.
భావము:-
ఆ పురము నందలి జనులలో కామాతురుడుగాని, పిసిని గొట్టువాడు గాని, క్రూరుడుగాని, విద్యా హీనుడుగాని, నాస్తికుడు గాని ఎంతగా వెదికినను కానరాడు.
1.6.9.
అనుష్టుప్.
సర్వే నరాశ్చ నార్యశ్చ
ధర్మశీలాః సుసంయతాః ।
ఉదితాః శీలవృత్తాభ్యాం
మహర్షయ ఇవామలాః ॥
టీక:-
సర్వే = అందరు; నరః = పురుషులు; చ =; నారీః = స్త్రీలు; చ =; ధర్మశీలాః = ధర్మబద్దమైన శీలము గలవారు; సుసంయుతాః = చక్కటి ఇంద్రియ నిగ్రహము కలవారు; ఉదితాః = చెప్పదగ్గ; శీల = మంచిస్వభావముతో; వృత్తాభ్యామ్ = మెలిగెడి వారు; మహర్షయా = మహర్షుల; ఇవ = వలె; అమలాః = నిర్మలమైనవారు;
భావము:-
అయోధ్య యందలి స్త్రీ పురుషులు ధర్మవర్తనులు, ఇంద్రియనిగ్రహులు, సత్స్వభావులు, చెప్పుకోదగ్గ సచ్ఛీలులు, మహర్షులవలె నిర్మలహృదయులు.
1.6.10.
అనుష్టుప్.
నాకుండలీ నామకుటీ
నాస్రగ్వీ నాల్పభోగవాన్ ।
నామృష్టో నానులిప్తాంగో
నాసుగంధశ్చ విద్యతే ॥
టీక:-
న = లేరు; అకుండలీ = కర్ణకుడలములు / లోలకులు ధరించనివారు; న = కానివారు; అమకుటీ = కిరీటము ధరించనివారు; న = లేరు; అస్రగ్వీ = పూలమాలలు ధరించనివారు; న = లేరు; అల్ప = తక్కువ; భోగవాన్ = భోగములు కలవారు; న = లేరు; అమృష్టః = శుభ్రంగా ఉండనివారు; న = లేరు; అనులిప్తాంగః = ఛందనాదులు అలదుకొననివారు; న = లేరు; అసుగంధః = కస్తూరీ మున్నగు సుగంధములు ధరించనివారు; చ = మాత్రమే; విద్యతే = కనబడతారు.
భావము:-
ఆ అయోధ్యలో కర్ణకుండల (లోలకులు) ధారులు, కిరీటధారులు, మహా భోగులు, పరిశుభ్రంగా ఉండువారు, చందనాదికములను అలదుకొనువారు, కస్తూరీ మున్నగు సుగంధములు ధరించువారు మాత్రమే కనబడతారు.
1.6.11.
అనుష్టుప్.
నామృష్టభోజీ నాదాతా
నాప్యనంగద నిష్కధృక్ ।
నాహస్తాభరణో వాపి
దృశ్యతే నాప్యనాత్మవాన్ ॥
టీక:-
నా = లేరు; అమృష్ట భోజి = కడుపునిండా శుబ్రమైన తిండిలేనివారు; న = లేరు; అదాతా = దాత కానివారు; న = లేరు; అపి = నిశ్చయంగా; అన = లేనివారు; అంగద = భుజకీర్తులు, వంకీలు వంటి భుజమున ధరించు భూషణములు; నిష్క = మాడలతో కాసులపేరు వంటి కంఠాభరణములు; ధృక్ = ధరించుట; న = లేరు; అహస్తాభరణః = చేతులకు ధరించు గాజులు, కంకణములు, ఉంగరముల వంటివి ధరించని వారు; వా = అలాగే; అపి = నిశ్చయంగా; దృశ్యతే = కనబడుట; న = జరగదు; అనాత్మవాన్ = జితేంద్రియుడు కానివాడు.
భావము:-
ఆ అయోధ్య యందు కడుపునిండా తినడానికి లేనివారు కాని. దానబుద్ధి లేనివారు కాని. భుజాలకు భుజకీర్తులు, కంఠానికి కాసుల పేర్లు, చేతులకు కంకణములను, ఉంగరములను వంటి సకలాభరణాలు ధరించనివారు కాని, అంతఃకరణ శుద్ధి లేనివారు కాని చూద్దామన్నా కనబడరు.
1.6.12.
అనుష్టుప్.
నానాహితాగ్నిః నాయజ్వా
న క్షుద్రో వా న తస్కరః ।
కశ్చిదాసీ దయోధ్యాయాం
న చ నిర్వృత్తసంకరః ॥
టీక:-
న = లేరు; నహితాగ్ని = అగ్నిచయనము చేయనివారు; నయజ్వా = యాగము చేయనివారు; న = లేరు; క్షుద్రః = నీచులు; న = లేరు; తస్కరః = దొంగలు; కశ్చిత్ = ఒక్కడు కూడా; న+ఆసీత్ = లేకుండెను; అయోధ్యాయామ్ = అయోధ్య యందు; న = లేరు; చ; నిర్వృత్తసంకరః = నిర్వృత్త (నెఱవేరిన)+సంకరః, వర్ణసంకరులు.
భావము:-
ఆ అయోధ్యానగరమునందు అగ్నికార్యములను చేయని వారుగాని, యాగము చేయని వారుగాని, నీచులు గాని, దొంగలు కాని. వర్ణసంకరులు అచట లేనేలేరు.
గమనిక:-
*- అహితాగ్ని , అగ్నిచయనము- అగ్నిని మంత్రపూర్వకముగ నిలుపుట.
1.6.13.
అనుష్టుప్.
స్వకర్మనిరతా నిత్యం
బ్రాహ్మణా విజితేంద్రియాః ।
దానాధ్యయన శీలాశ్చ
సంయతాశ్చ ప్రతిగ్రహే ॥
టీక:-
స్వ = తనయొక్క; కర్మ = ధర్మమునందు; నిరత = లగ్నమైన వారు; బ్రాహ్మణా = బ్రాహ్మణులు; విజితేంద్రియాః = ఇంద్రియనిగ్రహము కలవారు; దాన = దానము చేయు; అధ్యయన = వేదాధ్యయనము చేయు; శీలాః = స్వభావము కలవారు; చ = ఇంకా; సంయతాః = నియమము కలవారు; పరిగ్రహే = దానము స్వీకరించుట యందు.
భావము:-
అయోధ్యయందలి బ్రాహ్మణులు సర్వదా విధ్యుక్తములైన స్వధర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించినవారు, దానశీలురు, వేదాధ్యయనము చేసెడి స్వభావముగల వారు, అపరిగ్రహులు.
1.6.14.
అనుష్టుప్.
న నాస్తికో నానృతకో
న కశ్చి దబహుశ్రుతః ।
నాసూయకో న వాశక్తో
నావిద్వాన్ విద్యతే తదా ॥
టీక:-
న = లేరు; నాస్తికః = నాస్తికులు; న = లేరు; అనృతకః = అబద్దాలాడు వారు; న = లేడు; కశ్చిత్ = ఒక్కడుకూడా; అబహుశృత = ఎక్కువ చదువుకోనివారు; న = లేరు; అసూయకః = అసూయాపరులు; న = లేరు; వ = కూడా; అశక్తః = శక్తిహీనులు; న = జరగదు; అవిద్వాన్ = పండితులు కానివారు; విద్యతః = కనబడుట; తదా = అక్కడ;
భావము:-
దశరథునిపరిపాలనకాలమునందు నాస్తికులు గాని, అసత్యవాదులుగాని, అనేక శాస్త్రములను అభ్యసింపనివారుగాని మఱియు అసూయాపరులుగాని ఒక్కడు కూడా లేరు. పండితులు కాని వారైతే కనబడను కూడా కనబడరు.
1.6.15.
అనుష్టుప్.
నాషడంగ విదత్రాసీత్
నావ్రతో నాసహస్రదః ।
న దీనః క్షిప్తచిత్తో వా
వ్యథితో వాపి కశ్చన ॥
టీక:-
న = ఉండదు; షఢంంగ = వేదాంగములు ఆరు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము; అవిదథ్ = తెలియనివారు; ఆసీత్ = ఉండుట; న = లేరు; అవ్రతో = చాంద్రాయణాది వ్రతములు చేయనివారు; న = లేరు; అసహస్రదః = వేలకొలది దానములు చేయనివారు; న = లేరు; దీనః = దీనులూ; క్షిప్రచిత్తః = వ్యాకుల మనసు కలవారూ; వా = కాని; వ్యథితః = బాధాతప్తులూ; వా = కాని; అపి = ఇంక; కశ్చన = ఎవరూవారు.
భావము:-
ఆ నగరమున వేదాంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము ఆరు తెలియనివాడు గాని, వ్రతములను ఆచరింపనివాడుగాని లేడు. వేలకొలది ద్రవ్యములను దానము చేయనివాడుగాని, దీనుడుగాని, వ్యాకులచిత్తుడుగాని, బాధాతప్తులు కాని ఇంకా అలాంటి వారెవరూకూడ లేరు.
1.6.16.
అనుష్టుప్.
* కశ్చిన్నరో వా నారీ వా
నాశ్రీమాన్ నాప్యరూపవాన్ ।
ద్రష్టుం శక్య మయోధ్యాయా
నాపి రాజన్యభక్తిమాన్ ॥
టీక:-
కశ్చిన = అందరు; నరః = పురుషులు; వా = కాని; నారీ = స్త్రీలు; వా = కాని; న = లేరు; అశ్రీమాన్ = సంపదహీనులు; అపి = మఱియు; అరూపవాన్ = సౌందర్యవిహీనులు; ద్రష్టుం = కనుగొనుట; శక్యమ్ = సాధ్యము; అయోధ్యాయామ్ = అయోధ్యానగరంలో; న = కాదు; అపి = అంతేకాకుండా; రాజని = రాజు యందు; అభక్తిమాన్ = భక్తిలేనివారు;
భావము:-
అచటి స్త్రీలలో కాని పురుషులలో కాని ఐశ్వర్యహీనులు కానీ, సౌందర్యహీనులు కాని, రాజభక్తివిహీనులు గాని మచ్చుకైనను కనబడరు.
1.6.17.
అనుష్టుప్.
వర్ణేష్వగ్ర్య చతుర్థేషు
దేవతాతిథి పూజకాః ।
కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ
శూరా విక్రమసంయుతాః ॥
టీక:-
వర్ణేషు = వర్ణస్తులు; అగ్ర్యః = ముఖ్యంగా; చతుర్దేషు = నలుగురునూ; దేవతా = దేవతలను; అతిథి = అతిథులును; పూజకాః = పూజించువారు; కృతజ్ఞాః = చేసినమేలుమరువనివారు; వదాన్యాః = దాతలు; చ = ఇంకా; శూరాః = పండితులు; విక్రమ = పరాక్రమము; సంయుతాః = కలవారు;
భావము:-
ఆ నగరమునందలి చాతుర్వర్ణములవారు దేవతలను, అతిథులను పూజించువారే. వారు చేసిన మేలు మఱువనివారు, దానములను చేసెడివారు, శూరులు, పరాక్రమవంతులు.
1.6.18.
అనుష్టుప్.
దీర్ఘాయుషో నరాః సర్వే
ధర్మం సత్యం చ సంశ్రితాః ।
సహితాః పుత్రపౌత్రైశ్చ
నిత్యం స్త్రీభిః పురోత్తమే ॥
టీక:-
దీర్ఘాయుషో = దీర్ఘాయుష్మంతులు; నరాః = మానవులు; సర్వే = అందరు; ధర్మం = ధర్మమును; సత్యం = సత్యమును; సంశ్రితాః = లేరు; సహితాః = కలిగిఉన్న; పుత్రపౌత్రః = పుత్రపౌత్రులు కలవారు; చ; నిత్యం = ఎల్లప్పుడు; స్త్రీభిః = స్త్రీలు కూడా; పురః = నగరములలో; ఉత్తమే = శ్రేష్టమైనది, అయోధ్య;
భావము:-
అయోధ్యాపురిలోని పురుషులు, స్త్రీలు అందరు నిత్యం దీర్ఘాయుష్మంతులు, ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించి ఉండువారు. పుత్రపౌత్రులు కలవారు.
1.6.19.
అనుష్టుప్.
క్షత్రం బ్రహ్మముఖం చాసీత్
వైశ్యాః క్షత్రమనువ్రతాః ।
శూద్రాః స్వధర్మనిరతాః
త్రీన్వర్ణా నుపచారిణః ॥
టీక:-
క్షత్రం = క్షత్రియులు; బ్రహ్మ = బ్రాహ్మణులను; ముఖం = అనుసరించుచు; చ; ఆసీత్ = ఉందురు; వైశ్యాః = వైశ్యులు; క్షత్రం = క్షత్రియులను; అనువ్రతాః = అనుసరించువారు; శూద్రాః = శూద్రులు; స్వధర్మ = వారి ధర్మమునందు, స్వీయ వృత్తి ధర్మములు; నిరతాః = లగ్నమై ఉండువారు; త్రీన్ = మూడు; వర్ణాః = వర్ణములను వారిని; ఉపచారిణః = సేవించుచుండిరి;
భావము:-
క్షత్రియులు బ్రాహ్మణులయెడ గౌరవముగలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు, వైశ్యులు క్షత్రియుల గౌరవిము కలిగి తమ వ్యవసాయ వ్యాపారాలు చేసుకొనెడివారు, శూద్రులు తమతమ వృత్తి ధర్మముల నాచరించుచు ఈ మూడు వర్ణములవారిని సేవించుచుండెడివారు.
1.6.20.
అనుష్టుప్.
సా తేనేక్ష్వాకునాథేన
పురీ సుపరిరక్షితా ।
యథా పురస్తాన్మనునా
మానవేంద్రేణ ధీమతా ॥
టీక:-
సా = ఆయొక్క; తేన = అతను; ఇక్ష్వాకేనా = ఇక్ష్వాకు వంశపు; నాధేన = మహారాజు; పూరీ = పట్టణం అయోధ్యను; సు = చక్కగా; పరిరక్షితా = పరిపాలించెను; యథా = ఎలాగంటే అలా; పురాః = పూర్వకాలంలో; తాన్ = తను; మనునా = మనువుచేత వలె; మానవేంద్రణ = మానవులకు ప్రభువు; ధీమతా = ప్రతిభామూర్తి.
భావము:-
ఇక్ష్వాకువంశజుడైన దశరథమహారాజు ఆ అయోధ్యా నగరమును పూర్వము ప్రతిభామూర్తియు, మానవేంద్రుడును ఐన మనువువలె చక్కగా రక్షించుచుండెను.
1.6.21.
అనుష్టుప్.
యోధానా మగ్నికల్పానాం
పేశలానా మమర్షిణామ్ ।
సంపూర్ణా కృతవిద్యానాం
గుహా కేసరిణామివ ॥
టీక:-
యోధానామ్ = యోధులు అందరూ; అగ్నికల్పానామ్ = అగ్ని దేవుని సమానులు; పేశలానామ్ = శరీరము దాచుకోని బంట్లు; అమర్షిణామ్ = రోషము కలవారు; సమపూర్ణా = నిండి ఉంది; కృత = నేర్చిన; విద్యానామ్ = విద్యలు కలవారు; గుహా = గుహయందలి; కేసరిణామ్ = సింహాల; ఇవ = వలె.
భావము:-
అగ్నిదేవతుల్యులు, శరీరము దాచుకోకుండా పరాక్రమం చూపే వారు. పౌరుషవంతులు, విద్యలు నేర్చినవారు, అయినట్టి యోధులచే నిండి, ఆ నగరము సింహములతో నిండిన గుహవలె దుర్భేద్యమై యుండెను.
1.6.22.
అనుష్టుప్.
కాంభోజవిషయే జాతైః
బాహ్లీకైశ్చ హయోత్తమైః ।
వనాయుజైర్నదీజైశ్చ
పూర్ణా హరిహయోత్తమైః ॥
టీక:-
కాంభోజ = కాంభోజ; విషయే = దేశానికి చెందిన; జాతై = జాతికి చెందినవి; బాహ్లీకైః = బాహ్లీక దేశపు; చ; హయః = అశ్వములు; ఉత్తమై = ఉత్తమమైనవి; వనయూజైః = పారశీక దేశమున; జై = పుట్టినవి; చ = ఇంకా; నదీః = సింధుదేశమున; జై = పుట్టినవి; పూర్ణా = నిండి ఉండెను; హరి = ఇంద్రుని; హయ = గుఱ్ఱము ఉచ్ఛైశ్రవము వలె; ఉత్తమై = ఉత్తమమైనవి.
భావము:-
ఉచ్ఛైశ్రవము వలె ఉత్తమైనవి అయిన కాంభోజ, బాహ్లిక, పారశీక, సింధూ దేశములలో పుట్టిన జాతులకు చెందిన ఉత్తమాశ్వాశములు ఆ అయోధ్య నిండా తిరుగుచు ఉండెను.
1.6.23.
అనుష్టుప్.
విన్ధ్యపర్వతజై ర్మత్తైః
పూర్ణా హైమవతైరపి ।
మదాన్వితై రతిబలైః
మాతంగైః పర్వతోపమైః ॥
టీక:-
విన్ధ్యపర్వత = వింధ్యపర్వతప్రాంతమున; జైః = పుట్టినవి; మత్తైః = మదించినవి; పూర్ణా = నిండి ఉండెను; హైమవతైః = హిమాలయ పర్వతాలలో పుట్టినవి; అపి = ఇంకా; మద = మదముతో; ఆన్వితైః = కూడి ఉన్నవి; అతి = మిక్కిలి; బలైః = బలముకలవి; మాతంగైః = ఏనుగులు; పర్వతోపమైః = పర్వతముల వంటివి;
భావము:-
వింధ్యపర్వతములలో పుట్టిన మదపుటేనుగులు, హిమాలయాలలో జన్మించిన మహాగజములు, బాగా బలిష్ఠమైని, మిక్కిలి మదించి, పర్వతముల వలెనున్న మాతంగములు అయోధ్య నిండా ఉండెను,
1.6.24.
అనుష్టుప్.
ఐరావత కులీనైశ్చ
మహాపద్మ కులైస్తథా ।
అంజనాదపి నిష్పన్నైః
వామనాదపి చ ద్విపైః ॥
టీక:-
ఐరావత = తూర్పు దిగ్గజమైన ఐరావతము యొక్క; కులీనైః = వంశానికి చెందినవి; చ = ఇంకా; మహాపద్మ = ఈశాన్య దిగ్గజమైన పుడరీకము యొక్క; కులైః = కులమున వుట్టినవి; తథా = మఱియును; అంజనాత్ = పడమర దిగ్గజమైన అంజనావతి నుండి; నిష్పన్నైః = ఉద్భవించినవి; వామనాత్ = దక్షిణ దిగ్గజమైన వామనము నుండి; అపి = అట్టిది; చ = కూడా; ద్విపైః = ఏనుగులు
భావము:-
ఇంద్రుని గజమూ తూర్పు దిగ్గజమూ నైన ఐరావత వంశమున జన్మించి నట్టివియు, అగ్నిదేవుని గజమూ, ఆగ్నేయ దిగ్గజమూ నైన పుండరీకమను పేరుగల మహాపద్మజాతికి చెందినవియు, వరుణ దిగ్గజమూ పడమర దిగ్గజమూ నైన అంజనవతి జాతికి చెందినవియు, యముని గజమూ దక్షిణ దిగ్గజమూ నైన వామనము జాతిలో ఉద్భవించినవియు అగు అనేక గజములు ఆ పురము నిండా ఉండెను.
గమనిక:-
(1) ఐరావతః పుండరీకో వామనః కుముదోఽఞ్జనః, పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః, ఐరావతము, పుండరీకము, వామనము కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనునవి ఎనిమిదియును అష్టదిగ్గజములు. ఇవి క్రమముగా తూర్పు ఈశాన్యము మొదలగు దిక్కులయందు ఉండును. దిగ్గజముల వంశములో పుట్టినవి అనగా అత్యుత్తమమైనవి అని సూచన. (2) ద్విపము- నీటిని రెండుసార్లు త్రాగునది, ఏనుగు
1.6.25.
అనుష్టుప్.
భద్రైః మన్ద్రైర్మృగైశ్చైవ
భద్రమంద్రమృగై స్తథా ।
భద్రమన్ద్రైః భద్రమృగైః
మృగమన్ద్రైశ్చ సా పురీ ।
నిత్యమత్తైః సదా పూర్ణా
నాగై రచలసన్నిభైః ॥
టీక:-
భద్రైః = భద్రమను జాతి గజము; మన్ద్రైః = మంద్రమను గజము; మృగైః = మృగమనుగజము; చ; ఇవ = ఇంకా; భద్రమంద్రమృగైః = భద్రమంద్రమృగము; తథా = అలాగే; భద్రమన్ద్రైః = భద్రమంద్రము; భద్రమృగైః = భద్రమృగము; మృగమన్ద్రైః = మృగమంద్రము; చ; సా = ఆ యొక్క; పురీ = అయోధ్య నగరములో; నిత్యమత్తైః = నిత్యము మదించి ఉండునవి; సదా = ఎల్లప్పుడు; పూర్ణా = నిండియుండును; నాగః = ఏనుగులు / గజములు; అచల = పర్వతములతో; సన్నిభైః = సదృశమైనవి.
భావము:-
ఆ యొక్క అయోధ్య నగరము నిండా భద్ర జాతిగజము; మంద్ర జాతిగజము; మృగ జాతిగజము; భద్రమంద్రమృగము; భద్రమంద్రము; భద్రమృగము; మృగమంద్రము వంటి సకల జాతుల ఏనుగులు పర్వతములతో సదృశమైనవి నిత్యము మదించి ఉండును.
గమనిక:-
చతుర్విధ గజములు- (అ) 1. భద్రములు, రాజు ఎక్కుటకు, ఉత్సవములకు యోగ్యము, 2. మంద(ద్ర) ములు, యుద్దమున వాడుటకు యోగ్యము, 3. మృగములు అడవిలో తిరుగునవి, 4. మిశ్రమములు. (ఆ) దమ్యములు (శిక్షణను పొందుచున్నట్టివి), 2. సాన్నాహ్యములు (యుద్ధమునందుపయోగింపబడునవి), 3. ఔపవాహ్యమలు (స్వారికి ఉపయోగింపబడునవి), 4. వ్యాలములు (క్రూరస్వభావము గలవి). (కౌటిలీయార్థశాస్త్రము)
1.6.26.
అనుష్టుప్.
* సా యోజనే చ ద్వే భూయః
సత్యనామా ప్రకాశతే ।
యస్యాం దశరథో రాజా
వసన్ జగదపాలయత్ ॥
టీక:-
సా = అది; యోజనః = యోజనములు; ద్వే = రెండు; భూయః = వ్యాపించి ఉండును; సత్యనామః = తగిన పేరుతో, సార్థకమైన నామముతో, (యోద్ధుం అశక్యా, జయించుటకు సాధ్యముగానిది, అయోధ్య); ప్రకాశతే = మిక్కిలి ప్రసిద్ధమైనది; యస్యాం = దానిలో; దశరథః = దశరథు డను; రాజా = రాజు; వసన్ = నివసిస్తూ; జగత్ = రాజ్యమును; ఆపాలయత్ = పరిపాలించెను;
భావము:-
ఆ నగరము రెండుయోజనముల మేరకు వ్యాపించియుండెను. సార్థకనామధేయము గల ఆ అయోధ్యలో (యోద్ధుం అశక్యా అయోధ్యాః, జయించుటకు సాధ్యముగానిది అయోధ్య) నివసిస్తూ దశరథమహారాజు తన కోసల దేశమును పరిపాలించుచుండెను.
గమనిక:-
*- యోజనము - రకరకములుగా చెప్తారు ఉదా. 1) 4 క్రోసుల దూరము, 2) ఆమడ, 3) సుమారు 8/9/10 మైళ్ళు. ప్రాంతీయ బేధములతో అటుల ఉండి ఉండవచ్చును.
1.6.27.
అనుష్టుప్.
తాం పురీం స మహాతేజా
రాజా దశరథో మహాన్ ।
శశాస శమితామిత్రో
నక్షత్రాణీవ చంద్రమాః ॥
టీక:-
తాం = ఆ; పురీం = ఆ నగరమును; స = కలిగిన; మహా = గొప్ప; తేజా = తేజశ్శాలి ఐన; రాజా = రాజు; దశరథః = దశరథుడు; మహాన్ = గొప్పవాడు; శశాస = పరిపాలించెను; శమిత = శాంతింపజేసిన; అమితః = శత్రువులు కలవాడు; నక్షత్రాణి = నక్షత్రములను; ఇవ = వలె; చంద్రమాః = చందమామ.
భావము:-
మహాతేజశ్శాలి ఐన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములనువలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను.
1.6.28.
జగతి.
తాం సత్యనామాం దృఢతోరణార్గలాం
గృహైర్విచిత్రై రుపశోభితాం శివామ్ ।
పురీ మయోధ్యాం నృసహస్ర సంకులాం
శశాస వై శక్రసమో మహీపతిః ॥
టీక:-
తాః = ఆయొక్క; సత్యనామాం = సార్థక నామధేయము కలది {అయోధ్య అనగా యుద్దముచేయ పోరానిది, యోద్ధాం అశక్తః, అను అర్థమునకు తగినది అయోధ్యానగరము}; దృఢ = దృఢమైన, బలమైన; తోరణ = తోరణములు; అర్గళాం = తలుపుల అడ్డగడియలు; గృహైః = ఇళ్ళు; విచిత్ర = చిత్రములు రచించిన గోడలతో; ఉపశోభితాం = ప్రాశించుచుండెను; శివామ్ = మంగళప్రద మైనది; పురీం = ఆ నగరము; అయోధ్యాం = అయోధ్య; నృ = నరులు, ప్రజలు; సహస్ర = వేలకొలది; సంకులం = సమ్మర్ధమైనది; శశాస = పరిపాలించెను; వై ; శక్రసమో = ఇంద్రునితో సాటివచ్చువాడు; మహీపతిః = మహారాజు దశరథుడు.
భావము:-
దేవేంద్రుని వంటి మహారాజు దశరథుడు పాలించెడి పుట్టడింప శక్యము కాని ఆ అయోధ్య, సార్థకనామధేయము కలది. దృఢమైన తోరణములు, తలుపులకు అడ్డగడియలు కల ఇళ్ళతో, వేల సంఖ్యలో జనసమ్మర్ధమై, కళకళలాడుతూ అద్భుతముగా శోభిల్లుతూ ఉన్నది.
1.6.29.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
షష్ఠః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్ష సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షష్ఠ [6] = ఆరవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [6] ఆరవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.7.1.
అనుష్టుప్.
తస్యామాత్యా గుణైరాసన్
ఇక్ష్వాకోస్తు మహాత్మనః ।
మంత్రజ్ఞా శ్చేంగితజ్ఞాశ్చ
నిత్యం ప్రియహితే రతాః ॥
టీక:-
తస్య = ఆ; ఆమాత్యాః = మంత్రులు; గుణైః = ప్రజ్ఞాది గుణముల చేత; ఆసన్ = ఉండిరి; ఇక్ష్వాకః = ఇక్ష్వాకువంశమునందు పుట్టిన దశరథ మహారాజునకు; అస్తు = కలరు; మహాత్మనః = గొప్పబుద్ధి కలవారు; మంత్రజ్ఞాః = మంత్రాంగము ఆలోచించ గలవారు; చ = మఱియు; ఇంగితజ్ఞాః = ఎదుటవారి మనసులోని భావము గ్రహించగలవారు; చ = మఱియు; నిత్యం = ఎల్లప్పుడు; ప్రియహితే = రాజునకు ప్రియము హితకరము అయిన కార్యమునందు; రతాః = ఆసక్తికలవారును అగు.
భావము:-
ఇక్ష్వాకు వంశజుడు, మిక్కిలి ప్రజ్ఞ కలవాడు అయిన దశరథ మహారాజునకు కార్య విచారణలో దక్షులు, ఇతరుల మనోభిప్రాయములు గుర్తించగల సమర్థులు, ఎల్లప్పుడు రాజునకు ప్రియము, హితము గూర్చుటలో నిరతులు, సద్గుణ సంపన్నులు అయిన మంత్రులు గలరు.
1.7.2.
అనుష్టుప్.
అష్టౌ బభూవు ర్వీరస్య
తస్యామాత్యా యశస్వినః ।
శుచయ శ్చానురక్తాశ్చ
రాజకృత్యేషు నిత్యశః ॥
టీక:-
అష్టౌ = ఎనిమిది మంది; బభూవుః = ఉండిరి; వీరస్య = వీరుడైన; తస్య = ఆతనికి; అమాత్యాః = మంత్రులు; యశస్వినః = కీర్తిమంతునికి; శుచయః = వ్యవహారములలో పరిశుద్ధులును; చ = మఱియు; అనురక్తాః = అనురక్తి కలవారును; చ = మఱియు; రాజకృత్యేషు = రాచకార్యములందు పరాయణులును; నిత్యశః = ఎల్లప్పుడు.
భావము:-
వీరుడును, గొప్ప కీర్తిప్రతిష్టలు గలవాడగు ఆ దశరథ మహారాజు ఆస్థానము నందు సర్వదా వ్యవహారములందు ఎట్టి దోషములకు తావీయని వారును, రాచకార్య పరాయణులును అగు ఎనిమిదిమంది మంత్రులు గలరు.
1.7.3.
అనుష్టుప్.
ధృష్టిర్జయన్తో విజయః
సిద్ధార్థో హ్యర్థసాధకః ।
అశోకో మంత్రపాలశ్చ
సుమంత్రశ్చాష్టమోఽ భవత్ ॥
టీక:-
ధృష్టిః = ధృష్టి (చారుల, దేశకాల మంత్రాంగము); జయంత = జయంతుడు (పౌర పాలన భద్రతల జయకర నిర్వహణ); విజయః = విజయుడు (యుద్దతంత్రముల విజయవంత నిర్వహణ); సిద్ధార్థః = సిద్ధార్థుడు (కోశాగార, సంపదల నిర్వహణ); అర్థసాధకః = అర్ధసాధకుడు (ఆదాయ సాధనా నిర్వహణ); అశోకః = అశోకుడు (విపత్కాల నిర్వహణ); మంత్రపాలః = మంత్రపాలుడును (రాజకీయ కార్యనిర్వహణ); చ; సుమన్త్రః = సుమంత్రుడు (ధర్మము, అంతఃపురపాలన); చ; అష్టమః = ఎనిమిదవ మంత్రిగా; అభవత్ = ఉండెను.
భావము:-
ధృష్ఠి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అను ఎనిమిదిమంది మంత్రులు ఉండిరి
గమనిక:-
రామాయణ కాలంలోని అష్టమంత్రులు- ధృష్టి- చారుల, దేశకాల మంత్రాంగము; జయంతుడు- పౌర పాలన భద్రతల జయకర నిర్వహణ; విజయుడు- యుద్దతంత్రముల విజయవంతముగ నిర్వహణ; సిద్ధార్థుడు- కోశాగార, సంపదల నిర్వహణ; అర్ధసాధకుడు- ఆదాయ సాధనా నిర్వహణ; అశోకుడు- విపత్కాల నిర్వహణ; మంత్రపాలుడు- రాజకీయ కార్యనిర్వహణ; సుమంత్రుడు- ధర్మము, అంతఃపురపాలన
1.7.4.
అనుష్టుప్.
ఋత్విజౌ ద్వావభిమతౌ
తస్యాస్తామృషిసత్తమౌ ।
వసిష్ఠో వామదేవశ్చ
మంత్రిణశ్చ తథాఽ పరే ॥
టీక:-
ఋత్విజౌ = ఋత్విక్కులు; ద్వౌ = ఇద్దరు; అభిమతౌ = ఎక్కువగా ఇష్టులైనవారు; తస్య = ఆ దశరథునకు; ఆస్తామ్ = ఉండిరి; ఋషి = ఋషులలో; సత్తమౌ = శ్రేష్ఠులు; వసిష్ఠః = వశిష్ఠుడు; వామదేవః = వామదేవుడును అను; చ; మంత్రిణః = మంత్రులును; చ; తథా = మఱియు; అపరే = మరికొందరు.
భావము:-
వశిష్ఠుడు, వామదేవుడు అను మహాఋషులు ఇద్దరు ఆస్థానములో ప్రధాన ఋత్విక్కులుగా ఉండిరి. శ్రేష్ఠులైన మంత్రులు మరికొందరు కూడా ఉండిరి.
1.7.5.
అనుష్టుప్.
సుయజ్ఙోఽ ప్యథ జాబాలిః
కాష్యపోఽ ప్యథ గౌతమః ।
మార్కండేయస్తు దీర్ధాయుః
తథా కాత్యాయనే ద్విజః ॥
టీక:-
సుయజ్ఙః = సుయజ్ఞ మహర్షి; అపి = ఇంకా; అథ = అలాగే; జాబాలిః = ఋషి జాబాలి; కాష్యపః = కశ్యపవంశపు ముని; అపి = ఇంకా; అథ = అలాగే; గౌతమః = గౌతముడు; మార్కండేయః = మార్కండేయుడు; అస్తు = ఐన; దీర్ధాయుః = దీర్ఘాయువు; తథా = అటులనే; కాత్యాయనే = కాత్యాయడను; ద్విజః = విప్రుడు.
భావము:-
ఇంకా మంత్రులుగా సుయజ్ఞుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు అను మునులూ, కాత్యాయనుడను విప్రుడు ఉండిరి.
1.7.6.
అనుష్టుప్.
ఏతై ర్వ్ర బ్రహ్మర్షిభీః నిత్యమ్
ఋత్విజస్తస్య పౌర్వకాః ।
విద్యావినీతా హ్రీమంత
కుశలా నియతేంద్రియాః ॥
టీక:-
ఏతైః = ఇటువంటి; వ్రత్ = పూజ్య; బ్రహ్మర్షిభీః = బ్రహ్మర్షులతో; నిత్యమ్ = ఎల్లప్పుడు; ఋత్విజః = ఋత్విక్కులు; అస్య = ఐన; పౌర్వకాః = వృద్దులు; విద్యా = సకల విద్యలయందు; వినీతః = శిక్షితులు; హ్రీమంత = చేయదగని కార్యము చేయుటకు సిగ్గు పడువారు; కుశలా = నేర్పరులు; నియతేంద్రియాః = ఇంద్రియ నిగ్రహము కలవారు.
భావము:-
దశరథ మహారాజు వారి మంత్రులు అందరు ఇటువంటి నిత్య పూజ్య బ్రహ్మర్షులు, ఋత్విక్కులు, పెద్దలు, సకల విద్యలలోను సుశిక్షితులు, చేయదగని కార్యములు చేయుటకు సిగ్గు పడువారు, నేర్పరులు, ఇంద్రియ నిగ్రహము కలవారు.
1.7.7.
అనుష్టుప్.
శ్రీమంతశ్చ మహాత్మానః
శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః ।
కీర్తిమంత ప్రణిహితా
యథావచన కారిణః॥
టీక:-
శ్రీమంతశ్చ = ఐశ్వర్యవంతులు; చ; మహాత్మానః = బుద్ధిమంతులు; శాస్త్రజ్ఞాః = శాస్త్రములు తెలిసినవారు; దృఢ = దృఢమైన; విక్రమాః = పరాక్రమము కలవారు; కీర్తిమంత = సత్కీర్తి గలవారు; ప్రణిహితాః = సావధానమైన చిత్తము గలవారు; యథావచన = చెప్పినవిధముగా; కారిణః = చేయువారు.
భావము:-
ఇంకనూ ఐశ్వర్య వంతులు, శాస్త్రపరిజ్ఞానము కలవారు, దృఢమైన పరాక్రమము కలవారు. కీర్తిమంతులు, కార్యనిర్వాహణ యందు ఏకాగ్ర చిత్తము కలవారు, నిర్ణయించిన విధముగా కార్యములు చేయువారు.
1.7.8.
అనుష్టుప్.
తేజః క్షమాయశః ప్రాప్తాః
స్మితపూ ర్వాభిభాషిణః।
క్రోధా త్కామార్థ హేతోర్వా
న బ్రూయు రనృతం వచః ॥
టీక:-
తేజః = తేజస్సును; క్షమా = ఓర్పును; యశః = కీర్తిని; ప్రాప్తాః = పొందినవారు; స్మిత = చిరునవ్వు; పూర్వా = ముందుగాగల / తోబాటు; అభిభాషిణః = మాటలాడువారు; క్రోధాత్ = కోపమువలన; కామార్థ = భోగవస్తువుల; హేతోః = కొఱకు; వా = కాని; న = చేయరు; బ్రూయుః = పలుకుట; అనృతమ్ = అసత్యమైన; వచః = వాక్కును.
భావము:-
ఇంకనూ తేజస్సు, ఓర్పు, క్షమ, కీర్తి గలవారు, చిరునవ్వు పూర్వకముగ మాట్లాడువారు. కోపమువలన గాని, భోగ వస్తువులకొఱకు గాని అసత్యము పలుకని వారు.
1.7.9.
అనుష్టుప్.
తేషా మవిదితం కించిత్
స్వేషు నాస్తి పరేషు వా ।
క్రియమాణం కృతం వాపి
చారేణాపి చికీర్షితమ్ ॥
టీక:-
తేషామ్ = వారికి; అవిదితం = తెలియనిది; కిఞ్చిత్ = కొంచెము కూడా; స్వేషు = తమవారిలో కాని; నాస్తి = లేదు; పరేషువా = శత్రువులలో కాని; క్రియమాణం = చేయబడుచున్నది; కృతం = చేయబడినది; వా = కాని; అపి = ఇంకను; చారేణ = గూఢచారుల వలన; వా = కాని; అపి = ఇంకను; చికీర్షితమ్ = చేయదలపెట్టినది.
భావము:-
మఱియు, తమవారి విషయం కాని, శత్రువుల విషయం కాని వారికి తెలియనిది లేనివారు. ఆ మంత్రులు వ్యవహారములందు సమర్థులు. వారు ప్రతి ఒక్కరు చేయుచున్న, చేయబడిన, చేయదలపెట్టిన సకల విషయములు గూఢచారుల ద్వారా తెలుసుకొనెడివారు.
1.7.10.
అనుష్టుప్.
కుశలా వ్యవహారేషు
సౌహృదేషు పరీక్షితాః ।
ప్రాప్తకాలం తు తే దణ్డం
ధారయేయుః సుతేష్వపి ॥
టీక:-
కుశలాః = సమర్థులు; వ్యవహారేషు = వ్యవహారములందు; సౌహృదేషు = స్నేహము విషయములో; పరీక్షితాః = నమ్మదగినవారు; ప్రాప్తకాలం = సరియైన; తు; తే = ఆ; దండమ్ = దండనమును; ధారయేయుః = విధించెడి వారు; సుతేషు = కుమారులయందు; అపి = కూడ.
భావము:-
ఆ మంత్రులు సమస్త వ్యవహారములందు సమర్థులు, స్నేహా విషయములో నమ్మదగినవారు. అపరాధులు తమ పుత్రలైనను నిష్పక్షపాతముగ శిక్షించువారు.
1.7.11.
అనుష్టుప్.
కోశసంగ్రహణే యుక్తా
బలస్య చ పరిగ్రహే ।
అహితం వాపి పురుషం
న విహిం స్యురదూషకమ్ ॥
టీక:-
కోశ = ధనాగారమును; సంగ్రహణే = చక్కగా నింపుట యందును; యుక్తా = తగినవారు; బలస్య = సైన్యమును; చ = సహితము; పరిగ్రహే = సమకూర్చుటయందు; అహితం = శత్రువు; వ = నిశ్చయము; అపి = ఐనా; పురుషమ్ = వ్యక్తిని; న = వికల్పః, చేయరు; విహింస్యుః = బాధించుట; అదూషకమ్ = అపరాధము చేయనివారు.
భావము:-
ఇంకను ఆ మంత్రులందరు, ధనాగారము చక్కగా నింపుటయందు, చతురంగబలముల సైన్యములను సమకూర్చుటయందు మిక్కిలి సమర్థులు. మఱియు ఏ వ్యక్తి ఐనా అపరాధము చేయనిచో శత్రువు ఐనప్పటికి బాధింపనివారు.
1.7.12.
అనుష్టుప్.
వీరాశ్చ నియతోత్సాహా
రాజశాస్త్ర మనుష్ఠితాః ।
శుచీనాం రక్షితారశ్చ
నిత్యం విషయవాసినామ్ ॥
టీక:-
వీరాః = వీరులు; చ = కూడా; నియతః = నియమయుక్త; ఉత్సాహా = ఉత్సాహము కలవారు; రాజశాస్త్రమ్ = రాజనీతి; అనుష్ఠితాః = అనుసరించి ప్రవర్తించు వారు; శుచీనాం = సత్పురుషులకు; రక్షితాః = రక్షకులు; చ; నిత్యమ్ = ఎల్లప్పుడు; విషయ = దేశమునందు; వాసినామ్ = నివసించువారు.
భావము:-
వీరులు, క్రమశిక్షణాపూరిత ఉత్సాహులు, రాజనీతి శాస్త్రానుసారులు. సత్పురుషులను కాపాడువారు, ఆ దేశ శాశ్వత పౌరులు.
1.7.13.
అనుష్టుప్.
బ్రహ్మక్షత్ర మహింసంత
తే కోశం సమపూరయన్ ।
సుతీక్ష్ణదణ్డాః సమ్ప్రేక్ష్య
పురుషస్య బలాబలమ్ ॥
టీక:-
బ్రహ్మ = బ్రాహ్మణజాతిని; క్షత్రమ్ = క్షత్రియజాతిని; అ హింసంత = హింసించని వారై; తే = వారు; కోశం = ధనాగారమును; సమపూరయన్ = నింపిరి; సు = మంచి, చాలా; తీక్ష్ణ = తీక్షణముగ; దణ్డాః = శిక్షించు వారు; సమ్ప్రేక్ష్య = చూసి; పురుషస్య = అపరాధి యొక్క; బలాః = బలములను; అబలమ్ = బలహీనతలను.
భావము:-
ఆ మంత్రులు బ్రాహ్మణులను, క్షత్రియులను బాధించకుండ ధనాగారము నింపువారు. అపరాధి శక్తి సామర్థ్యములు, బలహీనతలు పరీక్షించి తగిన కఠినశిక్షలు విధించువారు.
1.7.14.
అనుష్టుప్.
శుచీనా మేకబుద్ధీనాం
సర్వేషాం సంప్రజానతామ్ ।
నాసీత్పురే వా రాష్ట్రే వా
మృషావాదీ నరః క్వచిత్ ॥
టీక:-
శుచీనామ్ = పరిశుద్ధ వర్తన కలవారు; ఏక = ఐకమత్యముతో; బుద్ధీనామ్ = ప్రవర్తించు వారు అగు; సర్వేషాం = ఆ అందరు మంత్రులును; సంప్రజానతామ్ = రాజ్యతంత్రము విచారించుచుండగా; నాసీత్ = లేడు; పురేః = పట్టణమందు; వా = కాని; రాష్ట్రేః = దేశము నందు; వా = కాని; మృషావాదీ = అసత్యము పలికెడి; నరః = మనుష్యుడు.
భావము:-
పరిశుద్ధమైన నడవడిక గల ఆ మంత్రులందరు ఐకమత్యముతో రాజ్యకార్యములను విచారింతురు. ఆ పురమునందు గాని, రాజ్యమునందు కాని అసత్యము పలికెడి మనుష్యుడు లేడు.
1.7.15.
అనుష్టుప్.
కశ్చిన్న దుష్టస్తత్రాసీత్
పరదారరతో నరః ।
ప్రశాంతం సర్వమేవాసీత్
రాష్ట్రం పురవరం చ తత్ ॥
టీక:-
కశ్చిత్ = ఒక్కడును; న = లేడు; దుష్టః = చెడ్డవాడు; తత్ర = అక్కడ; నాసీత్ = లేడు; పర = పరుల; దార = భార్యల యందు; రతః = ఆసక్తి కల; నరః = మనుష్యుడు; ప్రశాంతం = ప్రశాంతము; సర్వమ్ = సమస్తము; ఏవ = ఐన; ఆసీత్ = ఉండెను; రాష్ట్రం = రాష్ట్రము; పురవరం = శ్రేష్ఠ మైనపట్టణ అయోధ్య; చ; తత్ = ఆ.
భావము:-
ఇంకను ఆరాజ్యమందు చెడ్డవాడు కాని, పరుల భార్యలయందు ఆసక్తి కలవాడు కాని ఒక్కడును లేడు. ఆ దేశము, ఆ పురము అయోధ్య సమస్తము ప్రశాంతంగా ఉండెను.
1.7.16.
అనుష్టుప్.
సువాససః సువేషాశ్చ
తే చ సర్వే సుశీలినః ॥
హితార్థం చ నరేంద్రస్య
జాగ్రతో నయచక్షుషా ।
టీక:-
సు = మంచి; వాససః = వస్త్రధారణ కలవారూ; సు = మంచి; వేషాః = మంచి అలంకరణ /ఆహార్యము కలవారు; చ; తే = వారు, చ; మంత్రులు; సర్వే = అందరు; సు = మంచి; శీలినః = శీలము కలవారూ; హితాః = మేలు జరుగుట; అర్థం = కొఱకు; చ = మఱియు; నరేంద్రస్య = రాజుయొక్క; జాగ్రతః = అవస్థాత్రయములోని మొదటి అవస్థ / హెచ్చరికతో యుండెడివారు, అప్రమత్తులు {అవస్థాత్రయము- జాగృతి, స్వప్నము, సుషుప్తి}; నయ = నీతి యనెడు; చక్షుషా = నేత్రముతో.
భావము:-
మఱియు, మంత్రి వర్యులందరు మంచి నడవడికలు, చక్కచి వస్త్రాధరణ, సొగసైన అలంకరించుకొనుట కల సొగసరులు. వారు రాజ్యముయొక్క, రాజుయొక్క మేలు కోసము న్యాయదృక్పథంతో, అప్రమత్తులై హెచ్చరికతో ఉండువారు.
1.7.17.
అనుష్టుప్.
గురౌ గుణగృహీతాశ్చ
ప్రఖ్యాతాశ్చ పరాక్రమే ।
విదేశేష్వపి విజ్ఞాతాః
సర్వతో బుద్ధినిశ్చయాత్ ॥
టీక:-
గురౌ = తల్లిదండ్రులు, గురువులు మున్నగు పెద్దలందు; గుణ = సుగుణములను మాత్రమే; గృహీతాహః = గ్రహించువారు; ప్రఖ్యాతాః = ప్రసిద్ధిపొందినవారు; చ = మఱియు; పరాక్రమే = పరాక్రమములో; విదేశేషు = విదేశములలో; అపి = కూడా; విజ్ఞాతాః = ప్రసిద్ధులు; సర్వతః = అన్నిటి అందును; బుద్ధి = బుద్ధి యొక్క; నిశ్చయాత్ = స్థిరత్వము వలన.
భావము:-
దశరథుని మంత్రిలర్యులు, పెద్దల యందు సద్గుణములనే గుర్తింతురు, దోషములు గుర్తింపరు; మఱియు ప్రసిద్ధిగాంచిన పరాక్రమవంతులు. వారు సర్వకాల సర్వావస్థలందు స్థిరమైన బుద్ధి కలవారు అగుటచే విదేశములలో కూడా ప్రసిద్ధులు.
1.7.18.
అనుష్టుప్.
అభితో గుణవంతశ్చ
న చాసన్గుణవర్జితాః ।
సంధివిగ్రహ తత్త్వజ్ఞాః
ప్రకృత్యా సంపదాన్వితాః ॥
టీక:-
అభితః = సమీపమున ఉండువారు; గుణవంత = సుగుణశీలులకు; చ = మఱియు; న = ఉండరు; చ = కూడా; అసద్ = దూరములో; గుణవర్జితాః = దుర్గుణులకు; సంధివిగ్రహతత్త్వజ్ఞాః = సంధి చేసుకొనుట, యుద్ధము సలుపుటలలో తత్వము నెఱిగినవారు; ప్రకృత్యా = సహజముగా; సంపదా = సంపదతో; అన్వితాః = కూడినవారు.
భావము:-
సుగుణశీలులకు దగ్గరగా ఉందురు, దుశ్శీలురకు బహుదూరముగా ఉందురు. యద్ధతంత్రములందు సంధి, యుద్దములను సందర్భానుసారం ప్రయోగించు నేర్పు కలవారు. సహజముగా ఐశ్వర్యవంతులు.
గమనిక:-
సంధి విగ్రహము రెండు పంచ తంత్రములలోనివి, సంధి (ఇది త్రివిధము- కోశప్రధానహేతుకము, దండ ప్రధాన హేతుకము, భూమి ప్రధాన హేతుకము), విగ్రహము (ఇది త్రివిధము- 1. ప్రకాశ యుద్ధము, 2. కూట యుద్ధము, 3. పార్ష్ణియుద్ధము) శబ్దరత్నాకరము
1.7.19.
అనుష్టుప్.
మంత్రసంవరణే శక్తాః
శ్లక్ష్ణాస్సూక్ష్మాసు బుద్ధిషు ।
నీతిశాస్త్ర విశేషజ్ఞాః
సతతం ప్రియవాదినః ॥
టీక:-
మంత్ర = మంత్రాంగము, తంత్రము, పన్నాగము, పథకము; సంవరణే = రహస్యములను దాచుటయందు; శక్తాః = సమర్థులు; శ్లక్ష్ణః = అల్పంగా ఉండే; సూక్ష్మాసు = దురవగాహ మైనవాటిని; బుద్ధిషు = గ్రహించు తెలివి కలవారు; నీతిశాస్త్రవిశేషజ్ఞాః = నీతుల; శాస్త్ర = ధర్మ శాస్త్రముల యందు; విశేష = మిక్కిలిగా; జ్ఞాః = తెలిసినవారు; సతతం = ఎల్లప్పుడు; ప్రియవాదినః = ప్రియముగా సంభాషణ చేసెడివారు.
భావము:-
ఆ దశరథుని మంత్రులు మంత్ర తంత్ర రహస్యములను కాపాడుట యందు సమర్థులు. దురవగాహమైన విషయములందును సూక్ష్మమైన బుద్ధి కలవారు. నీతులను, ధర్మములను బాగా తెలిసిన వారు. ఎల్లప్పుడు ప్రియముగ సంభాషణ చేయువారు.
1.7.20.
అనుష్టుప్.
ఈదృశై స్తైరమాత్యైశ్చ
రాజా దశరథోఽ నఘః ।
ఉపపన్నో గుణోపేతైః
అన్వశాసద్వ సుంధరామ్ ॥
టీక:-
ఈదృశైః = ఇట్టి; తైః = ఆ; అమాత్యైః చ = మంత్రులతో; చ; రాజా = రాజు; దశరథః = దశరథుడు; అనఘః = ఎట్టిదోషములు లేనివాడు; ఉపపన్నః = కూడిన; గుణః = సద్గుణములు; ఉపేతైః = కలవారు; అన్వశాసత్ = పరిపాలించెను; వసుంధరామ్ = భూమిని.
భావము:-
ఇలా వివరించినట్టివారు మఱియు మంచిగుణములు గల వారు ఐన మంత్రుల సహాయముతో దోషరహితుడైన దశరథ మహారాజు భూమండలమును పరిపాలించెను.
1.7.21.
అనుష్టుప్.
అవేక్షమాణ శ్చారేణ
ప్రజా ధర్మేణ రంజయన్ ।
ప్రజానాం పాలనం కుర్వన్
అధర్మం పరివర్జయన్ ॥
టీక:-
అవేక్షమాణః = గమనించును; చారేణ = గూఢచారుల ద్వారా; ప్రజా = ప్రజలను; ధర్మేణ = ధర్మముచేత; రంజయన్ = సంతోష పెట్టును; ప్రజానాం = ప్రజల యొక్క; పాలనం = పరిపాలనను; కుర్వన్ = చేయును; అధర్మం = అధర్మమును; పరివర్జయన్ = విసర్జించును.
భావము:-
ఆ దశరథమహారాజు, గూఢచారుల ద్వారా సకల దేశ వ్యవహారములు గమనిస్తూ ఉండును. ప్రజలను తన ధర్మానుసరణతో సంతోషపెట్టుచు ఉండును. అధర్మము లేకుండా ప్రజాపరిపాలన చేయును.
1.7.22.
అనుష్టుప్.
విశ్రుతస్త్రిషు లోకేషు
వదాన్యః సత్యసంగరః ।
స తత్ర పురుషవ్యాఘ్రః
శశాస పృథివీమిమామ్ ॥
టీక:-
విశ్రుతః = ప్రసిద్ధుడై; త్రిషు = మూడు; లోకేషు = లోకములలో; వదాన్యః = ఉదారుడు; సత్య = సత్యమునందు; సంగరః = సంధత కలవాడు; సః = ఆ దశరథ మహారాజు; తత్ర = అక్కడ; పురుష = పురుషులలో; వ్యాఘ్రః = శ్రేష్ఠుడు; శశాస = పరిపాలించెను; పృథివీమ్ = భూమిని; ఇమామ్ = ఈ.
భావము:-
ఆ మహారాజు దశరథు, ఉదారుడు, సత్య నిష్ఠ కలవాడు అని ముల్లోకములలోను ప్రసిద్ధుడై ఆ పురుషులలో శ్రేష్ఠుడు, దశరథ మహారాజు ఈ భూమిని పరిపాలించెను.
1.7.23.
అనుష్టుప్.
నాద్యగచ్చద్విశిష్టం వా
తుల్యం వా శత్రుమాత్మనః ।
మిత్రవాన్న తసామస్తః
ప్రతాపహతకంటకః ।
స శశాస జగద్రాజా
దివం దేవపతిర్యథా ॥
టీక:-
న = లేదు; అధ్యగచ్ఛత్ = పొందుట; విశిష్టం వా = గొప్పవాడు; వా = ఐన; తుల్యం = సమానుడు; వా = ఐన; శత్రుమ్ = శత్రువును; ఆత్మనః = తనకంటె; మిత్రవాన్ = నెయ్యులు కలవాడు; నత = లొంగి ఉన్న; సామంత = సామంతులు కలవాడు; ప్రతాపః = ప్రతాపము చేత; హత = చంపబడిన; కణ్టకః = శత్రువులు కలవాడు; సః = ఆ; శశాస = పరిపాలించెను; జగత్ = జగత్తును; రాజా = రాజు; దివం = స్వర్గమును; దేవపతిః = దేవేంద్రుడు; యధా = వలె.
భావము:-
దశరథ మహారాజునకు అతనికంటే పరాక్రమవంతుడు కాని, సరి సమానుడు కాని శత్రువు ఎవడును లేడు. పెక్కు మంది మిత్రులు ఉండిరి. సామంత రాజులందఱు అతనికి లొంగి ఉండిరి. అతడు తన పరాక్రమముతో తనను బాధించు శత్రువులను రూపుమాపెను. ఇంద్రుడు దేవలోకమును పాలించునట్లు దశరథ మహరాజు భూలోకముమును పరిపాలించుచుండెను.
1.7.24.
త్రిష్టుప్.
తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తైః
వృతోఽనురక్తైః కుశలైః సమర్థః ।
స పార్థివో దీప్తిమవాప యుక్తః
తేజోమయైర్గోభి రివోదితోఽర్కః ॥
టీక:-
తైః = ఆ; మంత్రిభిః = మంత్రులుతో; మంత్ర = తంత్రరచనలో; హితే = మేలు అందు; నియుక్తైః = లగ్నమైనవారును; వృతః = కూడిన; అనురక్తైః = అనురాగము కలవారును; కుశలైః = బుద్ధి కౌశలము కలవారులును; సమర్థైః = సమర్థులును; సః = ఆ; పార్థివః = రాజు; దీప్తిమ్ = ప్రకాశించుటను; అవాప = పొందెను; యుక్తః = కూడిన; తేజోమయైః = ప్రకాశవంతమైన; గోభిః = కిరణములతో; ఇవ = వలె; ఉదితః = ఉదయించిన; అర్కః = సూర్యుడు.
భావము:-
తంత్రరచనయందు, దేశక్షేమమందు కూడిన ఆసక్తి సమర్థత బుద్ది కౌశల్యము కల మంత్రులతో కూడినవాడు అగు దశరథ మహారాజు తేజోవంతమైన కిరణములుతో ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించెను.
1.7.25.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
సప్తమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తమః = ఏడవ [7]; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [7] ఏడవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.8.1.
అనుష్టుప్.
తస్య త్వేవ ంప్రభావస్య
ధర్మజ్ఞస్య మహాత్మనః ।
సుతార్థం తప్యమానస్య
నాసీద్వంశకర స్సుతః ॥
టీక:-
తస్యత్ = ఆ దశరథునిక; ఏవం = ఇంతటి; ప్రభావ = ప్రభావము కలవాడు; అస్య; ధర్మజ్ఞ = ధర్మమును తెలిసిన వాడు; అస్య; మహాత్మనః = గొప్ప గుణములు కల వాడు; సుతః = పుత్రుల; అర్థం = కొరకు; తప్య = పరితపించుచున్న; మానః = మనసు కల వాడు; అస్య; నాసిత్ = కలుగ లేదు; వంశకరః = వంశమును నిలుపు నట్టి; సుతః = పుత్రుడు.
భావము:-
ఇంతటి గొప్ప ప్రభావశాలి; ధర్మజ్ఞుడు; గొప్ప గుణవంతుడు అయిన ఆ దశరథ మహారాజు తన వంశమును నిలబెట్టు పుత్రులు కలుగకుండుటచే మనస్సులో పరితపించు చుండెను.
1.8.2.
అనుష్టుప్.
చింతయానస్య తస్యైవం
బుద్ధిరాసీ న్మహాత్మనః ।
సుతార్థీ వాజిమేధేన
కిమర్థం న యజామ్యహమ్" ॥
టీక:-
చింతయాన్ = పుతుల కొరకు చింతించు చున్న వాడు; అస్య; తస్య = అతనికి; ఏవమ్ = ఈ విధముగా; బుధ్ధిః = ఆలోచన; ఆసిత్ = కలిగెను; మహాత్మనః = ఆ మహాత్మునకు; సుతాః = పుత్రుల; అర్ధమ్ = కోసము; హయమేధేన = అశ్వమేధ యాగమును; కిమర్ధమ్ = ఎందువలన; న యజామి = చేయకూడదు; అహమ్ = నేను.
భావము:-
పుత్రుల లేమిచే చింతించుచున్న ఆ మహాత్ముడు దశరథ మహారాజునకు "నేను పుత్రుల కొరకు అశ్వమేధ యాగమును ఎందుకు చేయకూడదు." అను తలపు కలిగెను.
1.8.3.
అనుష్టుప్.
స నిశ్చితాం మతిం కృత్వా
యష్టవ్యమితి బుద్ధిమాన్ ।
మంత్రిభిస్సహ ధర్మాత్మా
సర్వైరేవ కృతాత్మభిః ॥
టీక:-
స = దానిని; నిశ్చితామ్ = నిశ్చయముగా; మతిమ్ = మనసులో; కృత్వా = చేసుకుని; యష్టవ్యమ్ = యాగమును చేయవలెను; ఇతి = అను తలపు; బుధ్ధిమాన్ = విజ్ఞుడు; మంత్రిభిః = మంత్రులతో; సహ = కలసి; ధర్మాత్మా = ధర్మాత్ములైన; సర్వైః = సమస్తమైనవారు; ఏవ = ఐన; కృతాత్మభిః = పరిశుద్ధ మనస్కులు.
భావము:-
విజ్ఞుడైన దశరథ మహారాజు తన మంత్రులు. ధర్మాత్ములు మఱియు పరిశుద్ధమనస్కులు అందరితో సంప్రదించి యాగము చేయవలెను అని నిశ్చయించెను.
1.8.4.
అనుష్టుప్.
తతోఽ బ్రవీదిదం రాజా
సుమంత్రం మంత్రిసత్తమమ్ ।
“శీఘ్రమానయ మే సర్వాన్
గురూంస్తాన్ సపురోహితాన్" ॥
టీక:-
తతః = ఆ తరువాత; అబ్రవీత్ = పలికెను; ఇదమ్ = ఈ విధముగా; రాజా = రాజా దశరథులవారు; సుమంత్రమ్ = సుమంత్రుడు అనెడి; మంత్రి = మంత్రి; సత్తమమ్ = శ్రేష్ఠునితో; శీఘ్రమ్ = త్వరగా; ఆనయ = తీసుకుని రమ్ము; మే = నా; సర్వాన్ = సమస్తమైన; గురూన్ = గురువులను; తాన్ = ఆ; స = సహా; పురోహితాన్ = పురోహితులతో.
భావము:-
పిమ్మట దశరథ మహారాజు తన మంత్రి శ్రేష్ఠుడైన సుమంత్రునితో "మా గురువులు, పురోహితులు అందరినీ త్వరగా తోడ్కొని రమ్ము" అని పలికెను.
1.8.5.
అనుష్టుప్.
తత స్సుమంత్రస్త్వరితం
గత్వా త్వరితవిక్రమః ।
సమానయత్ స తాన్ సర్వాన్
సమస్తాన్ వేదపారగాన్ ॥
టీక:-
తతః = అప్పుడు; సుమన్త్రః = సుమంత్రుడు; త్వరితమ్ = త్వరగా; గత్వా = వెడలి; త్వరిత = వేగవంతమైన; విక్రమః = గమనములతో; సమానయత్ = తీసుకుని వచ్చెను; సః = అతడు; తాన్ = వారిని; సర్వాన్ = అందరిని; సమస్తాన్ = సమస్త మైన; వేద పారగాన్ = వేదనిష్ణాతులను
భావము:-
అటు పిమ్మట సుమంత్రుడు వేగముగా వెళ్ళి వారందరిని వేద నిష్ణాతులను త్వరగా తీసుకుని వచ్చెను.
1.8.6.
అనుష్టుప్.
సుయజ్ఞం వామదేవం చ
జాబాలిమథ కాశ్యపమ్ ।
పురోహితం వసిష్ఠం చ
యే చాన్యే ద్విజసత్తమాః ॥
టీక:-
సుయజ్ఞమ్ = సుయజ్ఞుని; వామదేవమ్ = వామదేవుని; చ = కూడా; జాబాలిమ్ = జాబాలిని; అథ = మఱియు; కాశ్యపమ్ = కశ్యపుని పుత్రుడైన విభాండకుని; పురోహితమ్ = పురోహితుడైన; వశిష్ఠమ్ = వశిష్ఠుని; చ = కూడా; యే చ = కూడా; అన్యే = ఇతరులైన; ద్విజ = బ్రాహ్మణ; ఉత్తమః = శ్రేష్ఠులు
భావము:-
సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, విభాండకుని, పురోహితుడైన వశిష్ఠుని ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులను తీసుకువచ్చెను .
1.8.7.
అనుష్టుప్.
తా న్పూజయిత్వా ధర్మాత్మా
రాజా దశరథస్తదా ।
ఇదం ధర్మార్థసహితం
వాక్యం శ్లక్ష్ణమథాబ్రవీత్ ॥
టీక:-
తాన్ = వారిని; పూజాయిత్వా = సత్కరించి; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; రాజా = రాజు; దశరథః = దశరథుడు; తదా = అప్పుడు; ఇదమ్ = ఈ; ధర్మ = ధర్మబద్ధత; అర్థ = అర్థవంతము; సహితమ్ = కూడిన; శ్లక్ష్ణమ్ = మృదువైన; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
వారిని పూజించి ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు ధర్మ బద్ధమైన, అర్థవంతమైన, మృదువైన పలుకులతో ఇలా పలికెను.
1.8.8.
అనుష్టుప్.
మమ లాలప్యమానస్య
పుత్రార్థం నాస్తి వై సుఖమ్ ।
తదర్థం హయమేధేన
యక్ష్యామీతి మతిర్మమ ॥
టీక:-
మమ = నాకు; లాలప్యమాన = బాధ పడుచున్న; అస్య; పుత్రార్థమ్ = పుత్రుల కొరకు; న అస్తి = లేదు; వై = నిశ్చయముగా; సుఖమ్ = సుఖము; తత్ = ఆ; అర్థం = కారణము చేత; హయమేధేన = అశ్వమేధమను యాగము; యక్ష్యామి = చేసెదను; ఇతి = అని; మతిః = తలపు; మమ = నాది.
భావము:-
“పుత్రులు లేరని మనసు వ్యాకుల పడుతున్న నాకు సుఖం లేదు. అందువలన అశ్వమేధ యాగము ఆచరించవలెనని తలచుచున్నాను.
1.8.9.
అనుష్టుప్.
తదహం యష్టుమిచ్ఛామి
శాస్త్రదృష్టేన కర్మణా ।
కథం ప్రాప్స్యామ్యహం కామం
బుద్ధిరత్రవిచార్యతామ్" ॥
టీక:-
తత్ = ఆ కారణము వలన; అహమ్ = నేను; యష్టుమ్ = యాగము చేయుటకు; ఇచ్ఛామి = ఇష్టపడుచుంటిని; శాస్త్ర దృష్టేన = శాస్త్రముల లో చెప్పబడిన విధముగా; కర్మణా = కర్మ చేత; కథమ్ = ఎట్లు; ప్రాప్యస్యామి = పొందగలను; అహమ్ = నేను; కామమ్ = కోరికను; బుద్ధిః = ఉపాయమును; అత్ర = ఆ విషయమున; విచార్యతామ్ = ఆలోచించవలసినది.
భావము:-
అందు వలన నేను శాస్త్రములలో చెప్పిన విధంగా యాగమును చేయదలచితిని. నా కోరికను తీర్చుకొనుటకు తగిన ఉపాయము ఎట్లో ఆలోచింపుడు." అని దశరథ మహారాజు పలికెను.
1.8.10.
అనుష్టుప్.
తతః సాధ్వితి తద్వాక్యం
బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ ।
వసిష్ఠప్రముఖాః సర్వే
పార్థివస్య ముఖాచ్చ్యుతమ్ ॥
టీక:-
తతః = అప్పుడు; సాధ్వితి = సాధు+ఇతి = చాలా బాగున్నది అని; తత్ = ఆ; వాక్యమ్ = వాక్యము; బ్రాహ్మణః = బ్రాహ్మణులు; ప్రత్యపూజయన్ = తిరిగి గౌరవించిరి, అభినందించిరి; వసిష్ఠ = వసిష్ఠుల వారు; ప్రముఖః = మొదలగు ప్రముఖులు; సర్వే = అందరు; పార్థివ = రాజు దశరథుని; అస్య = యక్క; ముఖః = నోరు నుండి; చ్యుతమ్ = వెలువడినవి;
భావము:-
అంతట వసిష్ఠ మహాముని తదితర బ్రాహ్మణ ప్రముఖులు రాజు దశరథుని నోటి నుండి వెలువడిన పలుకులు “చాలా బాగున్న”వని అభినందించిరి.
1.8.11.
అనుష్టుప్.
ఊచుశ్చ పరమప్రీతాః
సర్వే దశరథం వచః ।
“సంభారాః సంబ్రియంతాం తే
తురంగశ్చ విముచ్యతామ్ ॥
టీక:-
ఊచుః = బదులిచ్చిరి; చ; పరమ = మిక్కిలి; ప్రీతాః = సంతోషముతో; సర్వే = అందరునూ; దశరథమ్ = దశరథుని; వచః = వాక్కునకు; సంభారాః = సంభారములు; సమ్ర్భియంతామ్ = సమకూర్చ బడుగాక; తే = మీ యొక్క; తురగః = గుఱ్ఱము; చ; విముచ్యతామ్ = విడువబడును గాక
భావము:-
వారందరు మిక్కిలి సంతోషముతో దశరథునికి ఇలా బదులిచ్చారు “యాగమునకు కావలసిన సంభారములను సమకూర్చుడు; తమ యొక్క యజ్ఞాశ్వమును విడువుడు.
1.8.12.
అనుష్టుప్.
సర్వథా ప్రాప్స్యసే పుత్రాన్
అభిప్రేతాంశ్చ పార్థివ ।
యస్య తే ధార్మికీ బుద్ధిః
ఇయం పుత్రార్థమాగతా" ॥
టీక:-
సర్వథా = తప్పనిసరిగా; ప్రాప్స్యసే = నీకు కలుగుదురు; పుత్రాన్ = పుత్రులు; అభిప్రేతామ్ = ఇష్టపడినట్లు / కోరినట్లు; చ; పార్థివ = ఓ రాజా; యస్య = ఏ; తే = మీకు; ధార్మికీ = ధర్మ సమ్మతమైన; బుద్ధిః = బుద్ధి; ఇయం = ఈ విధముగా; పుత్ర = పుత్రులను; అర్థం = పొందుట; ఆగతా = జరుగును.
భావము:-
ఓ రాజా! మీరు కోరుకుంటున్నట్లు అవశ్యం పుత్రులను పొందగలరు. మీకు ధర్మబద్ధమైన తలపు ఎలా కలిగిందో ఆ విధముగా పుత్రులను పొందుట జరుగును.”
1.8.13.
అనుష్టుప్.
తతః ప్రీతోఽ భవద్రాజా
శ్రుత్వైతద్ద్విజభాషితమ్ ।
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా
హర్షపర్యాకులేక్షణః ॥
టీక:-
తతః = అటు పిమ్మట; ప్రీతః = సంతసించినవాడు; అభవత్ = ఆయెను; రాజా = రాజు; శ్రుత్వా = విని; తత్ = ఆ; ద్విజ = బ్రాహ్మణుల; భాషితమ్ = మాటను; అమాత్యాన్ = మంత్రులతో; చ; అబ్రవీత్ = పలికెను; రాజా = రాజు; హర్షః = ఆనందము వలన; పర్యాకుల = నిండిన; ఈక్షణః = చూపులు కల వాడై.
భావము:-
అటు పిమ్మట బ్రాహ్మణుల మాటలకు సంతసించిన ఆ దశరథ మహారాజు ఆనంద పొంగిపొరలే చూపులతో మంత్రులకు ఇట్లు చెప్పెను.
1.8.14.
అనుష్టుప్.
“సంభారాస్సంబ్రియంతాం మే
గురూణాం వచనాదిహ ।
సమర్థాధిష్ఠితశ్చాశ్వః
సోపాధ్యాయో విముచ్యతామ్ ॥
టీక:-
సంభారాః = యజ్ఞ సామగ్రి; సంబ్రియంతాం = సమకూర్చ బడు గాక; మే = మా; గురూణాం = గురువుల చేత; వచనాత్ = చెప్ప బడిన; ఇహ = ఇచట; సమర్థహః = సమర్థులచే; అధిష్ఠితః = అధిష్టింపబడిన; చ = మఱియు; అశ్వః = గుఱ్ఱమును; సః కూడిన; ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతో; విముచ్యతామ్ = విడువబడు గాక.
భావము:-
“మా గురువులు చెప్పిన మాట ప్రకారము సంభారములను సమకూర్చుడు. ఇచట సమర్థులైన యోధులు ఎక్కిన గుఱ్ఱమును, దాని వెంట ఉపాధ్యాయులతో కూడా విడిచి పెట్టుడు.
1.8.15.
అనుష్టుప్.
సరయ్వా శ్చోత్తరే తీరే
యజ్ఞభూమి ర్విధీయతామ్ ।
శాంతయ శ్చాభివర్ధంతాం
యథాకల్పం యథావిధి ॥
టీక:-
సరయ్వాః = సరయూ నది యొక్క; చ = మఱియు; ఉత్తరే = ఉత్తరపు; తీరే = ఒడ్డునందు; యజ్ఞభూమిః = యజ్ఞశాలను; విధీయతామ్ = ఏర్పరుచుడు; శాంతయః = శాంతి; చ = కూడా; అభివర్ధంతామ్ = వృద్ధి పొందునట్లుగా; యథాకల్పమ్ = కల్పోక్త ప్రకారముగా; యథావిథి = నియమానుసారము
భావము:-
సరయూ నది ఉత్తర తీరమందు యజ్ఞశాలను ఏర్పరుచుడు. శాంతి వృద్ధిచెందు కార్యములను కల్పోక్త ప్రకారముగా నియమానుసారముగా జరిపించుడు.
1.8.16.
అనుష్టుప్.
శక్యః ప్రాప్తుమయం యజ్ఞః
సర్వేణాపి మహీక్షితా ।
నాపరాధో భవేత్కష్టో
యద్యస్మిన్ క్రతుసత్తమే ॥
టీక:-
శక్యః = సాధ్యమైనట్లయితే; ప్రాప్తుమ్ = సాధించుటకు; అయం = ఈ; యజ్ఞః = యజ్ఞము; సర్వేః = అందరి చేత; అపి = సహా; మహీక్షితా = రాజులతో; న = జరగకూడదు; అపరాథః = తప్పు; భవేత్ = జరుగుట; కష్టః = కష్టము; యది = ఒక వేళ; అస్మిన్ = దీని యందు; క్రతు = యజ్ఞ విధానము; సత్తమే = శ్రేష్ఠమైనది
భావము:-
రాజులు అందరికి, ఈ శ్రేష్ఠమైన యజ్ఞ కార్యము సాధించుట సాధ్యం కాదు. ఈ మహాయజ్ఞలో ఏ అపరాధము కష్టము కలుగరాదు. ఒకవేళ జరిగితే. .
1.8.17.
అనుష్టుప్.
ఛిద్రం హి మృగయంతేఽ త్ర
విద్వాంసో బ్రహ్మరాక్షసా ।
నిహతస్య చ యజ్ఞస్య
సద్యః కర్తా వినశ్యతి ॥
టీక:-
ఛిద్రం = లోపములను; హి; మృగయంతే = వెదుకుచుందురు; అత్ర = అక్కడ; విద్వాంసః = విద్వాంసులు; బ్రహ్మరాక్షసా = బ్రహ్మ రాక్షసులు; నిహతస్య = చనిపోయినచో; చ; యజ్ఞస్య = యజ్ఞము యొక్క; సద్యః = వెంటనే; కర్తా = కర్త; వినశ్యతి = నశించును.
భావము:-
యజ్ఞము జరుగుచున్నపుడు విద్వాంసులైన అయిన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యము నందు దోషములను వెదుకుచుందురు. యాగాశ్వము మరణించినచో యజమాని నశించును.
గమనిక:-
*- బ్రహ్మరాక్షసుడు- బ్రహ్మణుడు అయి దుష్టకర్మలచే రాక్షసుడు అయిన వాడు. శబ్దరత్నారము, అకృత ప్రాయశ్చిత్తాః, అప్రతిగ్రాహగ్రాహ్యాః, అయాజ్యయాజ వాది, పాపైః రాక్షసత్వం ప్రాప్తాః, బ్రాహ్మణాః బ్రహ్రారాక్షసాః॥ గోవిందరాజీయ వ్యాఖ్య, యజ్ఞకార్యముల యందు మంత్రలోప క్రియాలోపములకు ప్రాయశ్చిత్వము లను చేసుకొనని వారు, గ్రహింపరానివి దానముగా గ్రహించువారు, అనర్హులచే యజ్ఞము చేయించువారు ఐన బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు అగుదురు.
1.8.18.
అనుష్టుప్.
తద్యథా విధిపూర్వం మే
క్రతురేష సమాప్యతే ।
తథా విధానం క్రియతాం
సమర్థాః కరణేష్విహ” ॥
టీక:-
తత్ = అందు వలన; యథా = ఎట్లు; విధిపూర్వమ్ = పద్ధతి ప్రకారము; మే = నా యొక్క; క్రతుః = యజ్ఞము; ఏష = ఈ; సమాప్యతే = సమాప్తము అగునో; తథా = అట్టి; విధానమ్ = విధముగ; క్రియతాం = చేయబడుగాక; సమర్థాః = సమర్థులచే; కరణేషు = కార్యముల యందు; ఇహ = ఇచట.
భావము:-
"అందువలన నా యొక్క ఈ యజ్ఞము శాస్త్రవిధి పూర్వకముగా ఎట్లు పరిసమాప్త మగునో, అట్టి విధంగా ఇక్కడి కార్యములు సమర్థులచే నిర్వహింపబడు గాక"
1.8.19.
అనుష్టుప్.
తథేతి చాబ్రువన్ సర్వే
మంత్రిణః ప్రత్యపూజయన్ ।
“పార్థివేంద్రస్య తద్వాక్యం
యథాజ్ఞప్తం నిశమ్య తే" ॥
టీక:-
తథేతి = అటులనే; చ = కూడా; అబ్రువన్ = పలికెను; సర్వే = అందరు; మంత్రిణః = మంత్రులు; ప్రత్యపూజయన్ = అభినందించిరి; పార్థివేంద్రస్య = ఆ రాజేంద్రుడు అయిన దశరథుని యొక్క; తత్ = ఆ; వాక్యమ్ = వాక్యమును; యథా = ఎటులైతే; ఆజ్ఞప్తమ్ = ఆజ్ఞాపింపబడినదో; నిశమ్యతే = వినుట చేత
భావము:-
మంత్రులు అందరు అభినందించుచు, “అటులనే అగుగాక” అని మఱియు “రాజేంద్రులు ఎట్లు ఆజ్ఞాపించిరో అట్లే నిర్వహించెదము” అని పలికిరి.
1.8.20.
అనుష్టుప్.
తథా ద్విజాస్తే ధర్మజ్ఞా
వర్దయన్తో నృపోత్తమమ్ ।
అనుజ్ఞాతాస్తతః సర్వే
పునర్జగ్ము ర్యథాగతమ్ ॥
టీక:-
తథా = అటుపిమ్మట; ద్విజాః = బ్రాహ్మణులు; తే = వారు; ధర్మజ్ఞా = ధర్మము తెలిసిన; వర్థయంత = వృద్ధిపొందించుచు; నృపోత్తమమ్ = ఆ రాజ శ్రేష్ఠుడైన దశరథుని; అనుజ్ఞాతాః = అనుజ్ఞ పొందినవారై; తతః = అప్పుడు; సర్వే = అందరును; పునః = తిరిగి; జగ్ముః = వెళ్లిరి; యథాగతమ్ = వచ్చినట్లుగా
భావము:-
అటుపిమ్మట ఆ రాజశ్రేష్ఠుడైన దశరథుని ధర్మము తెలిసిన ఆ బ్రాహ్మణ పండితులు వృద్ధి పొందమని ఆశీర్వదించి అతని వద్ద సెలవు తీసుకుని వచ్చిన దారిలో తిరిగి వెడలిరి.
1.8.21.
అనుష్టుప్.
విసర్జయిత్వా తాన్ విప్రాన్
సచివానిదమబ్రవీత్ ।
“ఋత్విగ్భి రుపదిష్టోఽ యం
యథావత్ క్రతురాప్యతామ్" ॥
టీక:-
విసర్జయిత్వా = పంపించి వేసి; తాన్ = ఆ; విప్రాన్ = విప్రులను; సచివాన్ = మంత్రులను గురించి; ఇదమ్ = ఈ రీతిగా; అబ్రవీత్ = పలికెను; ఋత్విగ్భిః = ఋత్విక్కులచే; ఉపదిష్టః = ఉపదేశించబడిన; అయం = ఈ; యథావత్ = యథావిధిగా; క్రతుః = యజ్ఞము; అప్యతామ్ = నిర్వహింపబడు గాక.
భావము:-
ఆ బ్రాహ్మణ పండితులను పంపివేసిన పిమ్మట ఆ రాజు తన మంత్రులతో “ఋత్విక్కులు చెప్పిన రీతిలో యథావిధిగా ఈ యజ్ఞమును నిర్వహించవలెను” అని పలికెను.
1.8.22.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా నృపశార్దూలః
సచివాన్ సముపస్థితాన్ ।
విసర్జయిత్వా స్వం వేశ్మ
ప్రవివేశ మహాద్యుతిః ॥
టీక:-
ఇతి = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; నృపశార్థూల = ఆ రాజశ్రేష్ఠుడు; సచివాన్ = మంత్రులను ఉద్దేశించి; సముపస్థితాన్ = తన దగ్గర ఉన్నవారిని; విసర్జయిత్వా = వారిని పంపించి వేసి; స్వమ్ = తనదైన; వేశ్మ = మందిరమును; ప్రవివేశ = ప్రవేశించెను; మహాద్యుతిః = గొప్ప ప్రకాశము గల వాడైన
భావము:-
గొప్పతేజస్సు కలిగిన ఆ రాజశ్రేష్ఠుడు తన వద్ద ఉన్న మంత్రులకు అట్లు చెప్పి; వారిని పంపించివేసి తన మందిరము లోనికి ప్రవేశించెను.
1.8.23.
అనుష్టుప్.
తతస్స గత్వా తాః పత్నీః
నరేంద్రో హృదయప్రియాః ।
ఉవాచ "దీక్షాం విశత
యక్ష్యేఽ హం సుతకారణాత్" ॥
టీక:-
తతః = అటుపిమ్మట; సః = ఆయన; గత్వా = సమీపించి; తాః = ఆ; పత్నీః = భార్యలను; నరేంద్రః = రాజేంద్రుడు; హృదయప్రియాః = హృదయమునకు ప్రియులైన; ఉవాచ = పలికెను; దీక్షామ్ = దీక్షలోనికి; విశత = ప్రవేశించండి; యక్ష్యే = యాగము చేయగలవాడను; అహం = నేను; సుతకారణాత్ = సుతుల కొరకు
భావము:-
అటుపిమ్మట ఆ రాజేంద్రుడు తన ప్రియపత్నులవద్దకు వెళ్ళి వారితో "సుతులకొరకు యజ్ఞమును చేయుచున్నాను. అందువలన మీరు కూడా దీక్ష స్వీకరింపుడు." అని పలికెను.
1.8.24.
అనుష్టుప్.
తాసాం తేనాతికాంతేన
వచనేన సువర్చసామ్ ।
ముఖపద్మాన్యశోభంత
పద్మానీవ హిమాత్యయే ॥
టీక:-
తాసామ్ = ఆ దశరథ పత్నుల; తేన = ఆ; అతి = మిక్కిలి; కాంతేన = మనోహరమగు; వచనేన = మాటలవలన; సు = మంచి; వర్చసామ్ = వర్చసు కలిగిన; ముఖ = ముఖములు అను; పద్మాని = పద్మములు; అశోభంత = మిక్కిలి శోభించినవి; పద్మాన్ = పద్మముల; ఇవ = వలె; హిమాత్యయే = పైన కురిసిన మంచు కరిగిన పిమ్మట
భావము:-
మిక్కిలి మనోహరమైన ఆ మాటలు వినినంతనే దశరథ మహారాజు భార్యల తేజస్సుతో కూడిన ముఖ పద్మములు మంచు తొలగిన పిమ్మట తామర పూలవలె మరింతగా ప్రకాశించాయి.
1.8.25.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
అష్టమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టమ [8] = ఎనిమిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [8] అష్టమ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.9.1.
అనుష్టుప్.
ఏతచ్ఛ్రుత్వా రహః సూతో
రాజాన మిదమబ్రవీత్ ।
“ఋత్విగ్భి రుపదిష్టోఽ యం
పురావృత్తో మయా శ్రుతః ॥
టీక:-
ఏతత్ = ఈ విషయమును; శ్రుత్వా = విని; రహః = ఏకాంతముగా; సూతః = రథసారథి సుమంత్రుడు; రాజానమ్ = రాజు దశరథులవారితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను; ఋత్విగ్భిః = ఋత్విక్కులచేత; ఉపదిష్టః = నిర్దేశించబడిన; అయమ్ = ఇది (ఉపాయము); పురా = పూర్వము; వృత్తః = జరిగినది; మయా = నాచే; శ్రుతః = వినబడినది;
భావము:-
ఈ విషయమును విన్న సుమంత్రుడు, దశరథునితో ఏకాంతముగా ఇట్లు పలికెను “ఋత్విక్కుల చేత ఉపదేశింపబడిన ఈ ఉపాయము పూర్వము చర్చించబడగా నేను వింటిని.
గమనిక:-
*- దశరథుడు - శ్రీరాముని తండ్రి, అజమహారాజు పుత్రుడు, పృథుశ్రవుని పౌత్రుడు, రఘువు ప్రపౌత్రుడు. అంగరాజు రోమపాదుని బాల్యస్నేహితుడు.
1.9.2.
అనుష్టుప్.
సనత్కుమారో భగవాన్
పూర్వం కథితవాన్ కథామ్ ।
ఋషీణాం సన్నిధౌ రాజన్!
తవ పుత్రాగమం ప్రతి ॥
టీక:-
సనత్కుమారః = సనత్కుమారుడు; భగవాన్ = భగవత్స్వరూపుడైన; పూర్వమ్ = పూర్వము; కథితవాన్ = చెప్పెను; కథామ్ = కథను; ఋషీణామ్ సన్నిధౌ = ఋషుల సన్నిధిలో; రాజన్ = రాజా; తవ = మీ యొక్క; పుత్ర = పుత్రసంతానము; ఆగమమ్ = ప్రాప్తిని; ప్రతి = గురించి.
భావము:-
ఓ దశరథ మహారాజా! నీకు కలుగు పుత్రప్రాప్తి గురించి, పూర్వము భగవంతుని స్వరూపమగు సనత్కుమారుడు ఋషులతో కథగా ఇట్లు చెప్పెను.
1.9.3.
అనుష్టుప్.
కాశ్యపస్య చ పుత్రోఽ స్తి
విభండక ఇతి శ్రుతః ।
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతః
తస్య పుత్రో భవిష్యతి ॥
టీక:-
కాశ్యపస్య = కశ్యపునకు; పుత్రః = పుత్రుడు; అస్తి = ఉన్నాడు; విభండకః = విభండకుడు; ఇతి = అను; శ్రుతః = పేరుగాంచిన; ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు; ఇతి = అను; ఖ్యాతః = ప్రసిద్ధుడైన; తస్య = అతనికి; పుత్రః = పుత్రుడు; భవిష్యతి = జన్మించును;
భావము:-
కశ్యపునకు విభండకుడు అను పేరుగల పుత్రుడు కలడు. విభండకునకు ఋశ్యశృంగుడని ప్రసిద్ధుడగు పుత్రుడు జన్మించును.
గమనిక:-
*- 1. ఋశ్యశృంగుడు- ఋశ్య (మనుబెంటి అనులేడి / మృగి)} శృంగి (శృంగము, కొమ్ము కలవాడు). 2. కశ్యపుని కొడుకు. ఇతఁడు అఖండిత బ్రహ్మచర్యమున తపముసలుపుచు ఒకనాడు ఒక మడుఁగున స్నానము చేయుచున్న సమయమున ఊర్వసిని చూచి ఇతనికి రేతస్సు స్ఖలితము అయ్యెను. దానితో మిశ్రమైన జలమును ఒక్క మనుబోతు అను పెంటిమృగము త్రావి గర్భము తాల్చి ఋశ్యశృంగుఁడు అను కొమారుని కనియెను. పురాణ నామ చంద్రిక.
1.9.4.
అనుష్టుప్.
స వనే నిత్యసంవృద్ధో
ముని ర్వనచరః సదా ।
నాన్యం జానాతి విప్రేంద్రో
నిత్యం పిత్రనువర్తనాత్ ॥
టీక:-
సః = అతను; వనే = వనమునందు; నిత్య = నిత్యము; సంవృద్ధః = పెరుగుచున్న వాడై; మునిః = ముని; వనచరః = అడవిలో జీవించు వారు; సదా = ఎప్పుడు; న = ఉండలేదు; అన్యమ్ = (తప్ప) ఇతరులను ఎవరిని; జానాతి = తెలిసి; విప్రేన్ద్రః = బ్రాహ్మణోత్తముడైన; నిత్యమ్ = నిత్యము; పిత్రః = తండ్రిని; అనువర్తనాత్ = అనుసరించి ఉండుట వలన.
భావము:-
ఆ ఋశ్యశృంగుడు వనములోనే పెరుగుచు తన తండ్రికూడానే ఉండుట వలన అతను మునులను, వనచరులను తప్పించి వేరెవరిని ఎరుగడు.
1.9.5.
అనుష్టుప్.
ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య
భవిష్యతి మహాత్మనః ।
లోకేషు ప్రథితం రాజన్
విప్రైశ్చ కథితం సదా ॥
టీక:-
ద్వైవిధ్యమ్ = రెండు విధములైన; బ్రహ్మచర్య = బ్రహ్మచర్యము; అస్య = కలవని; భవిష్యతి = కాగలదు; మహాత్మనః = మహాత్ములచే; లోకేషు = లోకములయందు; ప్రథితమ్ = ప్రసిద్ధమైనది; రాజన్ = రాజా; విప్రైః చ = బ్రాహ్మణులచే; కథితమ్ = చెప్పబడిన; సదా = నిర్దేశించి;
భావము:-
ఓ రాజా! బ్రాహ్మణులచే నిర్దేశింపబడినది ఐన బ్రహ్మచర్యము నందు ప్రతిత్వము ప్రాజాపత్యము అని ద్వివిధములైనవి లోకములో ప్రిద్ధములు.
గమనిక:-
బ్రహ్మచర్యము రెండు విధములు. 1. ప్రతిపత్యము - వివాహత్పూర్వము మేఖలాజిన (మొలకట్టు జింకచర్మపు) దండాదులను ధరించుచు నియమ జీవనము నడపుట, 2. ప్రాజాపత్యము - వివాహానంతరము నిషిద్ధ దినములలో భార్యతో కలియకుండుట.}
1.9.6.
అనుష్టుప్.
తస్యైవం వర్తమానస్య
కాలః సమభివర్తత ।
అగ్నిం శుశ్రూషమాణస్య
పితరం చ యశస్వినమ్ ॥
టీక:-
తస్య = అతనికి; ఏవమ్ = ఈ విధముగా; వర్తమాన = ప్రస్తుతపుది; అస్య = ఐన; కాలః = కాలము; సమభివర్తత = గడపగలడు; అగ్నిమ్ = అగ్నిని; శుశ్రూషమాణ = సేవచేయుచున్న; అస్య; పితరమ్ = తండ్రిని; చ; యశస్వినమ్ = యశఃశాలి యగు;
భావము:-
అగ్నిని మఱియు కీర్తిమంతుడైన తన తండ్రిని సేవించుచున్న ఋశ్యశృంగుడు, ప్రతిత్వము ప్రాజాపత్యము అను బ్రహ్మచర్యములలో ప్రతిత్వమును ఇప్పటివలె పాటించగలడు.
1.9.7.
అనుష్టుప్.
ఏతస్మిన్నేవ కాలే తు
రోమపాదః ప్రతాపవాన్ ।
అంగేషు ప్రథితో రాజా
భవిష్యతి మహాబలః ॥
టీక:-
ఏతస్మిన్ = ఈ యొక్క; ఏవ = మాత్రమే; కాలే = కాలమునందే; రోమపాదః = రోమపాదుడను రాజు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; అంగేషు = అంగదేశము నందు; ప్రథితః = ప్రసిద్ధుడైన; భవిష్యతి = ఉండును; మహాబలః = మహాబలశాలి;
భావము:-
రాజా! ఈ కాలమునందే అంగదేశములో ప్రతాపవంతుడు మహాబలశాలి ఐన రోమపాదుడను రాజు ఉండును.
గమనిక:-
రోమపాదుడు - యాదవ రాజు యయాతి వంశపు ధర్మరథుని దత్త పుత్రుడు, దివిరథుని పౌత్రుడు. ఇతని పేరు చిత్రరథుడు రోమపాదుడని ప్రసిద్దుడు.
1.9.8.
అనుష్టుప్.
తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో
భవిష్యతి సుదారుణా ।
అనావృష్టిః సుఘోరా వై
సర్వభూత భయావహా ॥
టీక:-
తస్య = ఆ; వ్యతిక్రమాత్ = ధర్మ విరుద్ధము వలన; రాజ్ఞః = రాజు యొక్క; భవిష్యతి = సంభవించును; సుదారుణా = మహాదారుణమైన; అనావృష్టిః = కరువు; సుఘోరా = చాలా ఘోరామైనది; వై; సర్వ = సకల; భూత = ప్రాణులకు; భయ = భయమును; ఆవహ = కలిగించునది.
భావము:-
ఆ రోమపాదుడు ఒకమారు ధర్మము తప్పుట వలన అతని రాజ్యములో చాలా దారుణమైన, భయంకరమైన, సర్వ జీవాలకు భయము కలిగించు కరువు ఏర్పడును.
1.9.9.
అనుష్టుప్.
అనావృష్ట్యాం తు వృత్తాయాం
రాజా దుఃఖసమన్వితః ।
బ్రాహ్మణాన్ శ్రుతవృద్ధాంశ్చ
సమానీయ ప్రవక్ష్యతి ॥
టీక:-
అనావృష్ట్యామ్ = కరువు; తు; వృత్తాయామ్ = ఏర్పడినప్పుడు; రాజా = రాజు; దుఃఖసమన్వితః = దుఃఖభరితుడై; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; శ్రుతవృద్ధాంశ్చ = వేదపండిత్యము వలన వృద్ధులగు; సమానీయ = పిలిపించి; ప్రవక్ష్యతి = పలుకును
భావము:-
రాజ్యములో కరువు ఏర్పడినప్పుడు రాజు దుఃఖితుడై; వేదపండితోత్తములైన బ్రాహ్మణులను పిలిపించి వారితో ఇట్లు పలుకును;
1.9.10.
అనుష్టుప్.
భవంత శ్రుతధర్మాణో
లోకచారిత్ర వేదినః ।
సమాదిశంతు నియమం
ప్రాయశ్చిత్తం యథా భవేత్" ॥
టీక:-
భవంత = మీరందరును; శ్రుత = వేద; ధర్మాణః = ధర్మము నెరిగిన వారు; లోకచారిత్ర = లోకాచారము; వేదినః = ఎరిగిన వారు; సమాదిశంతు = తెలియజేయండి; నియమమ్ = ఏర్పాటును; ప్రాయశ్చిత్తమ్ = పరిహారము; యథా = ఏ విధముగా; భవేత్ = అగునో;
భావము:-
“మీరు లోక ధర్మాచారముల నెరిగిన వారు; ఈ కరువునకు కారణమైన పాపము తొలగిపోవుటకు పరిహారము నిర్దేశింపుడు.“
1.9.11.
అనుష్టుప్.
వక్ష్యంతి తే మహీపాలం
బ్రాహ్మణా వేదపారగాః ।
విభండకసుతం రాజన్
సర్వోపాయై రిహానయ ॥
టీక:-
వక్ష్యంతి = పలుకగలరు; తే మహీపాలమ్ = ఆ రాజుతో; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; వేదపారగాః = వేదపండితులు; విభండక = విభాండక మహర్షి; సుతమ్ = కుమారుని {విభాండక ఋషి పుత్రుడు -ఋశ్యశృంగుడు}; రాజన్ = రాజా; సర్వ = ఏవైనా సరే; ఉపాయైః = ఉపాయముల చేతను; ఇహ = ఇక్కడికి; ఆనయ = తీసుకొని రమ్ము;
భావము:-
వేదపండితులైన ఆ బ్రాహ్మణులు రాజుతో ఇట్లు పలుకుదురు “రాజా! ఏ ఉపాయములను ఉపయోగించి అయినా సరే విభండకుని కుమారుడైన ఋశ్యశృంగుని ఇచటకు రప్పింపుము.
1.9.12.
అనుష్టుప్.
ఆనాయ్య చ మహీపాల
ఋశ్యశృంగం సుసత్కృతమ్ ।
ప్రయచ్ఛ కన్యాం శాంతాం వై
విధినా సుసమాహితః" ॥
టీక:-
ఆనాయ్య = రప్పించి; చ; మహీపాల = ఓ రాజా; ఋశ్యశృంగమ్ = ఋశ్యశృంగుని; సుసత్కృతమ్ = ఘనముగా సత్కరించి; ప్రయచ్ఛ = ఇమ్ము; కన్యామ్ = కన్యయైన; శాంతామ్ = శాంతను; విధినా = శాస్త్రయుక్తముగా; సుసమాహితః = బాగుగా శ్రద్ధ కలవాడవై;
భావము:-
ఓ రాజా! ఋశ్యశృంగుని ఇచటకు రప్పించి, అతనిని ఘనముగా సత్కరించి, నీ కుమార్తె ఐన శాంతను అతనికి ఇచ్చి శ్రద్ధగా శాస్త్రప్రకారముగా వివాహము చేయుము.
1.9.13.
అనుష్టుప్.
తేషాం తు వచనం శ్రుత్వా
రాజా చింతాం ప్రపత్స్యతే ।
కేనోపాయేన వై శక్యమ్
ఇహానేతుం స వీర్యవాన్ ॥
టీక:-
తేషామ్ = వారి యొక్క; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; రాజా = రాజు; చింతామ్ = చింతను; ప్రపత్స్యతే = పొందును; కేన = ఏ; ఉపాయేన = ఉపాయముచే; వై; శక్య = సాధ్యము; ఇహ = ఇచటకు; ఆనేతుమ్ = తీసుకొని వచ్చుటకు; సః = అతనిని; వీర్యవాన్ = ఇంద్రియ నిగ్రహము గలవాడు.
భావము:-
వారి మాటలను విని రాజు, ఇంద్రియ నిగ్రహము గల ఋశ్యశృంగుని తీసుకొని వచ్చుటకు తగు ఉపాయము గురించి చింతించగలడు.
1.9.14.
అనుష్టుప్.
తతో రాజా వినిశ్చిత్య
సహ మంత్రిభిరాత్మవాన్ ।
పురోహిత మమాత్యాంశ్చ
తతః ప్రేష్యతి సత్కృతాన్ ॥
టీక:-
తతః = తరువాత; రాజా = రాజా; వినిశ్చిత్య = నిశ్చయించి; సహ = సహితంగా; మంత్రిభిః = మంత్రులతో; ఆత్మవాన్ = బుద్ధిమంతుడైన; పురోహితమ్ = పురోహితుని; అమాత్యాంశ్చ = మంత్రులను; తతః = అప్పుడు; ప్రేష్యతి = ప్రేరేపించగలడు; సత్కృతాన్ = సత్కరింపబడిన;
భావము:-
తరువాత బుద్ధికుశలుడైన ఆ రాజు మంత్రులతో సమాలోచన చేసి నిశ్చయించుకొని, ఋశ్యశృంగుని తీసుకొని వచ్చుటకు పురోహితుని మఱియు మంత్రులను సత్కరించి ప్రేరేపించును.
1.9.15.
అనుష్టుప్.
తే తు రాజ్ఞో వచః శ్రుత్వా
వ్యథితా వినతాననాః ।
న గచ్ఛేమ ఋషేర్భీతా
అనునేష్యంతి తం నృపమ్! ॥
టీక:-
తే = వారును; తు; రాజ్ఞః = రాజు యొక్క; వచః = మాటను; శ్రుత్వా = విని; వ్యథితాః = బాధపడుచున్న వారై; వినత = వంచిన; ఆననః = ముఖములు కలవారై; న గచ్ఛేమ = వెళ్ళలేము; ఋషేః = ఋషికి; భీతాః = భయపడినవారై; అనునేష్యంతి = వేడుకొనగలరు; తమ్ = ఆ; నృపమ్ = రాజును;
భావము:-
వారు రాజుయొక్క మాటలు విని, వంచిన తలలు కలవారై, విభండకమునికి భయపడినవారై, బాధతో "మేము అచటికి వెళ్ళజాలము" అని ఆ రాజును వేడుకొనెదరు;
1.9.16.
అనుష్టుప్.
వక్ష్యంతి చింతయిత్వా తే
తస్యోపాయాంశ్చ తత్క్షమాన్ ।
ఆనేష్యామో వయం విప్రం
న చ దోషో భవిష్యతి" ॥
టీక:-
వక్ష్యంతి = చెప్పెదరు; చింతయిత్వా = ఆలోచించి; తే = వారు; తస్య = అతనికి; ఉపాయాన్ = ఉపాయములను; చ; తత్క్షమాన్ = వెంటనే / తక్షణమే; ఆనేష్యామః = తీసుకొని వచ్చెదము; వయమ్ = మేము; విప్రమ్ = ఆ ఋశ్యశృంగుని; న = ఉండదు; చ; దోషః = దోషములు; భవిష్యతి = ఉండగలదు.
భావము:-
తరువాత వారు ఋశ్యశృంగుని తీసుకొని వచ్చుటకు తగిన ఆలోచన చేసి; "రాజా! ఎటువంటి దోషము కలుగనట్లు ఆ ఋశ్యశృంగుని తీసుకొని వచ్చెదము" అని చెప్పగలరు.
1.9.17.
అనుష్టుప్.
ఏవ మంగాధిపే నైవ
గణికాభిః ఋషేః సుతః ।
ఆనీతోఽ వర్షయద్దేవః
శాంతా చాస్మై ప్రదీయతే ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగ; అంగాధిపేన = అంగదేశపు రాజైన రోమపాదునిచే; ఏవ = అట్లు; గణికాభిః = వేశ్యల సహాయముతో; ఋషేఃసుతః = విభాండక ఋషి కుమారుడు, ఋశ్యశృంగుడు; ఆనీతః = తీసుకొని రాబడును; ఆవర్షయత్ = వర్షము కురియును; దేవః = దేవుడు; శాంతా = శాంతయును; చ; అస్మై = అతనికి; ప్రదీయతే = ఇవ్వబడును.
భావము:-
రోమపాదుడు వేశ్యల సహాయముతో ఋశ్యశృంగుని తీసుకొనిరాగా, దేవుడు వర్షములను కురిపింపించును. అప్పుడు రాజు తన కుమార్తె శాంతను ఋశ్యశృంగునకు ఇచ్చును.
1.9.18.
అనుష్టుప్.
ఋశ్యశృంగస్తు జామాతా
పుత్రాన్ తవ విధాస్యతి ।
సనత్కుమార కథితమ్
ఏతావ ద్వ్యాహృతం మయా ॥
టీక:-
ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడును; తు; జామాతా = అల్లుడు; పుత్రాన్ = పుత్రులను; తవ = నీకు; విధాస్యతి = కలుగునట్లు చేయును; సనత్కుమార = సనత్కుమారునిచే; కథితమ్ = చెప్పబడినది; ఏతావత్ = ఇంతవరకు; వ్యాహృతమ్ = తెలియజేయబడినది; మయా = నాచేత;
భావము:-
అల్లుడైన ఋశ్యశృంగుడు నీకు పుత్రులు కలుగునట్లు చేయును, ఈ విషయమును సనత్కుమారుడు చెప్పగా విని నేను నీకు తెలుపుచున్నాను.
గమనిక:-
దశరథుని కన్నకూతురు మఱియు రోమపాదుని దత్తపుత్రిక ఐన శాంతాదేవికి భర్త ఋశ్యశృంగుడు కనుక అతను దశరథునికి కూడ అల్లుడే.
1.9.19.
అనుష్టుప్.
అథ హృష్టో దశరథః
సుమంత్రం ప్రత్యభాషత ।
యథర్శ్యశృంగ స్త్వానీతో
విస్తరేణ త్వయోచ్యతామ్ ॥
టీక:-
అథ = తరువాత; హృష్టః = సంతోషించిన; దశరథః = దశరథుడు; సుమంత్రం ప్రతి = సుమంత్రునితో; ఆభాషత = పలికెను; యథా = ఏ విధముగా; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; ఆనీతః = తీసుకొని రాబడెనో; విస్తరేణ = వివరముగ; త్వయా = నీ చే; ఉచ్యతామ్ = చెప్పబడుగాక;
భావము:-
సంతోషించిన దశరథుడు ఆ ఋశ్యశృంగుని తీసుకొనివచ్చిన విధమును వివరముగ తెలియ జెప్పుమని సుమంత్రుని అడిగెను,
1.9.20.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
నవమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; నవమ [9] = తొమ్మిదవ; సర్గః = సర్గ. సర్గః ,
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [9] తొమ్మిదవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.10.1.
అనుష్టుప్.
సుమంత్ర శ్చోదితో రాజ్ఞా
ప్రోవాచేదం వచస్తథా ।
“యథర్శ్యశృంగస్త్వానీతః
శృణు మే మంత్రిభిః స హ ॥
టీక:-
సుమన్త్రః = సుమంత్రుడు; చ; చోదితః = ప్రేరేపించబడినవాడై; రాజ్ఞా = రాజు చేత; ప్రోవాచ = పలికెను; ఇదమ్ వచః = ఈ వాక్యమును; తథా = ఆ విధముగ; యథా = ఏ విధముగ; ఋశ్యశృంగః = ఋష్యశృంగః తు = ఋష్యశృంగుడు; అనీతః = రప్పించిన రీతి; శృణు = వినుము; మే = నేను; మంత్రిభిః = మంత్రులు; స = ఆ యొక్క; హ.
భావము:-
దశరథ మహారాజు అలా ప్రశ్నింపగా, సుమంత్రుడు ఇట్లు పలికెను.”ఆ మంత్రులు ఋష్యశృంగుని ఎట్లు రప్పించితిరో చెప్పెదను. వినుము.
1.10.2.
అనుష్టుప్.
రోమపాదమువాచేదం
సహామాత్యః పురోహితః ।
ఉపాయో నిరపాయోఽ యమ్
అస్మాభిరభిచింతితః ॥
టీక:-
రోమపాదమ్ = రోమపాదుని గూర్చి; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈ; సహ = కూడి ఉన్న; ఆమాత్యః = మంత్రులతో; పురోహితః = పురోహితులు; ఉపాయః = ఉపాయము; నిరపాయః = అపాయము లేనిది; అయం = ఈ; అస్మభిః = మా చేత; అభిచింతితః = ఆలోచించబడినది.
భావము:-
పురోహితులు మంత్రులతో కలసి రోమపాదునితో ఇట్లు పలికెను. “మేము అపాయము లేని ఈ ఉపాయమును ఆలోచించితిమి.
1.10.3.
అనుష్టుప్.
ఋశ్యశృంగో వనచరః
తపఃస్వాధ్యాయనే రతః ।
అనభిజ్ఞః స నారీణాం
విషయాణాం సుఖస్య చ ॥
టీక:-
ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; వనచరః = వనములో తిరుగువాడు; తపః = తపస్సులోను; స్వాధ్యాయనే = స్వాధ్యాయము లందే; రతః = ఆసక్తి కలవాడు; అనభిజ్ఞః = ఎఱుగనివాడు; సః = అతడు; నారీణామ్ = స్త్రీలగురించి; విషయాణామ్ = విషయ భోగముల గురించి; సుఖస్య = స్త్రీ సుఖముల గురించి; చ = కూడా.
భావము:-
ఋశ్యశృంగుడు అడవులలో తిరుగువాడు. తపస్సు, స్వాధ్యాయనము లందే ఆసక్తి గలవాడు. స్త్రీల గురించి కాని, విషయసుఖముల గురించి కాని, స్త్రీసౌఖ్యముల గురించి కాని ఎఱుగనివాడు.
1.10.4.
అనుష్టుప్.
ఇంద్రియార్థైరభిమతైః
నరచిత్తప్రమాథిభిః ।
పురమానాయయిష్యామః
క్షిప్రం చాధ్యవసీయతామ్ ॥
టీక:-
ఇంద్రియార్థైః = ఇంద్రియ భోగములందు; అభిమతైః = ఇచ్చ గల; నర = మనుజుల; చిత్త = చిత్తములను; ప్రమాథిభిః = క్షోభపెట్టు; పురమ్ = పట్టణమునకు; ఆనాయయిష్యామః = రప్పించెదము; క్షిప్రమ్ చ = శీఘ్రముగా; అధ్యవసీయతామ్ = నిశ్చయింపబడుగాక
భావము:-
మనుజుల మనస్సులను క్షోభపెట్టు ఇంద్రియసుఖములందలి ఇచ్చతో ప్రలోభపెట్టి, ఋశ్యశృంగుని పట్టణమునకు రప్పించెదము. శీఘ్రముగా నిర్ణయించుము.
1.10.5.
అనుష్టుప్.
గణికాస్తత్ర గచ్ఛంతు
రూపవత్యః స్వలంకృతాః ।
ప్రలోభ్య వివిధోపాయైః
ఆనేష్యన్తీహ సత్కృతాః" ॥
టీక:-
గణికాః = వేశ్యలు; తత్ర = అక్కడకు; గచ్ఛంతు = వెళ్ళెదరు (గాక); రూపవత్యః = సౌందర్యవంతులు; స్వలంకృతాః = బాగుగా అలంకరింపబడినవారు; ప్రలోభ్య = ప్రలోభపెట్టి; వివిధః = అనేక; ఉపాయైః = ఉపాయములచేత; ఆనేష్యంతి = తీసుకొనిరాగలరు; ఇహ = ఇచటకు; సత్కృతాః = సత్కరించబడినవారై
భావము:-
చక్కగా అలంకరించుకొన్న రూపవతులైన వేశ్యలను సత్కరించి పంపెదము. వారు ఋశ్యశృంగుని అనేక ఉపాయములతో ప్రలోభపెట్టి ఇక్కడకు తీసుకురాగలరు.”
1.10.6.
అనుష్టుప్.
శ్రుత్వా తథేతి రాజా చ
ప్రత్యువాచ పురోహితమ్ ।
పురోహితో మంత్రిణశ్చ
తథా చక్రుశ్చ తే తదా ॥
టీక:-
శ్రుత్వా = విని; తథా = అటులనే; ఇతి = అని; రాజా = రాజుగారు; చ = కూడ; ప్రత్యువాచ = సమాధానము పలికెను; పురోహితమ్ = పురోహితులతో; పురోహితః = పురోహితులును; మంత్రిణః = మంత్రులును; చ; తథా = అటులనే; చక్రుః = చేసిరి; చ; తే = రప్పించుట; తదా = అప్పుడు.
భావము:-
రాజు రోమపాదుడు పురోహితుల ఆలోచనకు అనుమతి ఒసగెను. అపుడు వారు ఆ విధముగ ఋశ్యశృంగుని తెప్పించు ఏర్పాట్లు చేసిరి.
1.10.7.
అనుష్టుప్.
వారముఖ్యాస్తు తచ్ఛ్రుత్వా
వనం ప్రవివిశుర్మహత్ ।
ఆశ్రమస్యావిదూరేఽ స్మిన్
యత్నం కుర్వంతి దర్శనే ॥
టీక:-
వార = వేశ్యలలో; ముఖ్యాః = ప్రముఖులు; తు; తత్ = అది; శ్రుత్వా = విని; వనమ్ = అడవిని; ప్రవివిశుః = ప్రవేశించిరి; మహత్ = గొప్పదైన; ఆశ్రమస్య = ఆశ్రమము యొక్క; అవిదూరే = సమీపమునందు; అస్మిన్ = ఈ; యత్నమ్ = ప్రయత్నమును; కుర్వంతి = చేయుచుండిరి; దర్శనే = చూచుటలో.
భావము:-
ఆ వాక్యము విని ప్రముఖ వేశ్యాస్త్రీలు ఆ మహారణ్యములోనికి ప్రవేశించిరి. ఆ ఆశ్రమ సమీపమున ఋష్యశృంగుని కనుగొను ప్రయత్నము చేయసాగిరి.
1.10.8.
అనుష్టుప్.
ఋషిపుత్రస్య ధీరస్య
నిత్యమాశ్రమవాసినః ।
పితుః స నిత్యసంతుష్టో
నాతిచక్రామ చాశ్రమాత్ ॥
టీక:-
ఋషిపుత్రస్య = విభండక మహర్షి కుమారుడు ఋశ్యశృంగుడు; ధీరస్య = పండితుడు మఱియు తెగువ కలవాడు; నిత్యమ్ = ఎల్లవేళల; ఆశ్రమవాసినః = ఆశ్రమములో నివసించువాడు; పితుః = తండ్రితో; స = సహా/కలిసి; నిత్య = ఎల్లపుడును; సంతుష్టః = సంతృప్తితో మసలెడివాడు; న = లేదు; అతిచక్రామ = దాటి; చ; ఆశ్రమాత్ = ఆశ్రమమును.
భావము:-
ఋశ్యశృంగుడు పండితుడూ సాహసుడూ. ఎల్లపుడు తన తండ్రితోపాటు ఆశ్రమములోనే నిత్యసంతుష్టితో నివసించేవాడు. ఆ ఆశ్రమము దాటి బయటకు వెళ్ళలేదు.
1.10.9.
అనుష్టుప్.
న తేన జన్మప్రభృతి
దృష్టపూర్వం తపస్వినా ।
స్త్రీ వా పుమాన్ వా యచ్చాన్యత్
సర్వం నగరరాష్ట్రజమ్ ॥
టీక:-
న = లేదు; తేన = అతనిచేత; జన్మ = పుట్టినది; ప్రభృతి = మొదలు; దృష్టపూర్వమ్ = పూర్వము ఎప్పుడును చూడబడుట; తపస్వినా = తపశ్శాలి ఋశ్యశృంగునిచే; స్త్రీ = స్త్రీ; వా = కాని; పుమాన్ = పురుషుడు; వా = కాని; యత్ = ఏ; చ; అన్యాత్ = ఇతరము; సర్వమ్ = అన్నియును; నగర = నగరములందును; రాష్ట్ర = రాష్ట్రములందును; జమ్ = పుట్టినవాదిని.
భావము:-
ఆ తాపసి ఋశ్యశృంగుడు పుట్టినది మొదలు ఎన్నడును నాగరిక దేశాల స్త్రీలను కాని, పురుషులను కాని, మరింక ఎవరిన కాని చూడలేదు.
1.10.10.
అనుష్టుప్.
తతః కదాచిత్తం దేశమ్
ఆజగామ యదృచ్ఛయా ।
విభండకసుత స్తత్ర
తాశ్చాపశ్య ద్వరాంగనాః ॥
టీక:-
తతః = అటుపిమ్మట; కదాచిత్ = ఒక దినమున; తం = ఆ; దేశమ్ = ప్రదేశమునకు; అజగామ = వచ్చి; యదృచ్ఛయా = దైవవశమున; విభండకసుతః = విభండకుని కుమారుడైన ఋశ్యశృంగుడు; తత్ర = అచట; తాః = వారిని; చ; అపశ్యత్ = చూచెను; వరాంగనాః = శ్రేష్ఠమైన వేశ్యాస్త్రీలను
భావము:-
దైవాధీనముగ అటుపై ఒకదినమున, విభండకసుతుడైన ఋశ్యశృంగుడు ఆ ప్రదేశమునకు వచ్చి ఆ వేశ్యాస్త్రీలను చూచెను.
1.10.11.
అనుష్టుప్.
తా శ్చిత్రవేషాః ప్రమదా
గాయన్త్యో మధురస్వరాః ।
ఋషిపుత్ర ముపాగమ్య
సర్వా వచన మబ్రువన్ ॥
టీక:-
తాః = వారు; చిత్రః = నానవర్మముల; వేషాః = వస్త్రభూషణాది ధారులు; ప్రమదాః = స్త్రీలు; గాయన్త్యః = పాటలు పాడుచున్నవారు; మధుర = మధురమైన; స్వరాః = కంఠస్వరము కలవారు; ఋషిపుత్రమ్ = ఋషికుమారుడైన ఋశ్యశృంగుని; ఉపాగమ్య = దగ్గఱకు వచ్చి; సర్వాః = అందఱును; వచనమ్ = మాట; అబ్రువన్ = పలికిరి.
భావము:-
ఆ స్త్రీలు అందఱు రంగురంగుల వస్త్రభూషణాది ధరించి, మధురమైన స్వరములతో పాటలు పాడుచు ఉన్నారు. వారు ఋశ్యశృంగుని సమీపించి ఇట్లు అడిగిరి.
1.10.12.
అనుష్టుప్.
"కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్!
జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ ।
ఏకస్త్వం విజనే ఘోరే
వనే చరసి శంస నః" ॥
టీక:-
కః = ఎవ్వడవు; త్వం = నీవు; కిమ్ = ఎచ్చట; వర్తసే = నివసించెదవు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా!; జ్ఞాతుమ్ = తెలుసుకొనుటకు; ఇచ్ఛామహే = కోరుకొనుచున్నాము; వయమ్ = మేము; ఏకః = ఒంటరిగా; త్వమ్ = నీవు; విజనే = జనశూన్యమైన; ఘోరే = భయంకరమైన; వనే = అటవిలో; చరసి = తిరుగుచున్నావు; శంస = చెప్పుము; నః = మాకు
భావము:-
“ఓ బ్రాహ్మణుడా! ఎవరు నీవు? ఎచట నివసించెదవు? నిర్జనమైన ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు సంచరించున్నావు చెప్పు? మేము తెలుసుకొన గోరుచుంటిమి.”
1.10.13.
అనుష్టుప్.
అదృష్టరూపాః తాస్తేన
కామ్యరూపా వనే స్త్రియః ।
హార్దాత్తస్య మతిర్జాతా
వ్యాఖ్యాతుం పితరం స్వకమ్ ॥
టీక:-
అదృష్ట = గతములో చూడబడని; రూపాః = రూపములు కలవారు; తాః = వారు; తేన = అతనిచేత; కామ్యరూపాః = కోరదగిన రూపములు కల; వనే = అడవిలో; స్త్రియః = స్త్రీలు; హార్ధాత్ = స్నేహభావ; తస్య = అతనికి; మతిః = అభిప్రాయము; జాతా = కలిగినది; వ్యాఖ్యాతుమ్ = చెప్పుటకు; పితరమ్ = తండ్రిని గుఱించి; స్వకమ్ = తన యొక్క
భావము:-
ఋశ్యశృంగుడు ఇంతకు ముందెప్పుడూ ఆ అడవిలో ఇంత మనోహరమైన, ఆకర్షణీయమైన ఆ అందగత్తెలను చూడలేదు. ఆ సౌందరీమణులపై స్వేహభావము కలిగెను. కనుక వారికి ‘తన తండ్రిని గుఱించి చెప్పవలెను’ అను భావము కలిగెను.
1.10.14.
అనుష్టుప్.
“పితా విభండకోఽ స్మాకం
తస్యాహం సుత ఔరసః ।
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతం
నామ కర్మ చ మే భువి ॥
టీక:-
పితా = తండ్రి; విభండకః = విభండకుడు; అస్మాకమ్ = మా యొక్క; తస్య = అతనికి; అహమ్ = నేను; సుత = కుమారుడను; ఔరసః = ధర్మపత్నికి పుట్టినవాడను; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; ఇతి = అని; ఖ్యాతమ్ = తెలియబడు; నామ = పేరు; కర్మ = కర్మయును; చ; మే = నేను; భువి = భూమియందు
భావము:-
“మా తండ్రి విభండకుడు. నేను వారి స్వంత (ఔరస) పుత్రుడను. ఋశ్యశృంగుడను సార్థక నామధేయుడను.
గమనిక:-
*- ఋశ్య అనగా మనుబోతు అని లేడి జాతి జంతువు. శృంగ అనగా గుఱుతే కాకుండా కామోద్రేకము అను అర్థం కూడ ఉన్నది.
1.10.15.
అనుష్టుప్.
ఇహాశ్రమపదోఽ స్మాకం
సమీపే శుభదర్శనాః! ।
కరిష్యే వోఽ త్ర పూజాం వై
సర్వేషాం విధిపూర్వకమ్" ॥
టీక:-
ఇహ = ఇచట; ఆశ్రమ = ఆశ్రమము; పదః = స్థానమున; అస్మాకమ్ = మా యొక్క; సమీపే = సమీపమున గలదు; శుభదర్శనాః = మంగళప్రదలారా; కరిష్యే = చేయగలను; వః = మీ; అత్ర = అచట; పూజామ్ = పూజలను; వై = నిశ్చయముగ; సర్వేషామ్ = అందరికి; విధిపూర్వకమ్ = శాస్త్రములో చెప్పబడినట్లు
భావము:-
మంగళప్రదులారా ! మా ఆశ్రమము ఇచటకు సమీపములోనే ఉన్నది. రండి. అక్కడ మీ అందఱికి చక్కటి గౌరవ సత్కారములు చేసెదను.”
1.10.16.
అనుష్టుప్.
ఋషిపుత్రవచః శ్రుత్వా
సర్వాసాం మతిరాస వై ।
తదాశ్రమపదం ద్రష్టుం
జగ్ముః సర్వాశ్చ తేన తాః ॥
టీక:-
ఋషిపుత్ర వచః = ఋషికుమారుని పలుకులు; శ్రుత్వా = వినిన; సర్వాసామ్ = అందఱికీ; మతిః = మనసున; ఆస వై = ఇచ్చ; వై = కలిగినది; తత్ = ఆ; ఆశ్రమపదమ్ = ఆ ఆశ్రమమును; ద్రష్టుమ్ = చూచుటకు; జగ్ముః = వెళ్ళిరి; సర్వాః = వారందఱును; చ; తేన = అతనితో; తాః = వారు
భావము:-
ఋశ్యశృంగుని ఆహ్వానము వినిన ఆ స్త్రీలందరికి మనసులో ఆ ఆశ్రమమును చూడవలెనను కోరిక కలిగినది. వారు ఆశ్రమము చూచుటకు అతనితో వెళ్ళిరి.
1.10.17.
అనుష్టుప్.
ఆగతానాం తతః పూజామ్
ఋషిపుత్రశ్చకార హ ।
ఇదమర్ఘ్యమిదం పాద్యమ్
ఇదం మూలమిదం ఫలమ్" ॥
టీక:-
ఆగతానామ్ = వచ్చినవారికొఱకు; = అటుపిమ్మట; పూజామ్ = సత్కారములను; ఋషిపుత్రః = ఋషికుమారుడు ఋశ్యశృంగుడు; చ; చకార = చేసెను; హ; ఇదమ్ = ఇది; అర్ఘ్యము = పూజాద్రవ్యము; ఇదమ్ = ఇది; పాద్యమ్ = పాదముల కొఱకు నీరు; ఇదమ్ = ఇది; మూలమ్ = కందమూలము; ఇదమ్ = ఇది; ఫలమ్ = ఫలము.
భావము:-
పిమ్మట వచ్చిన వారకాంతలకు ఋశ్యశృంగుడు అర్ఘ్య పాద్యములూ, దుంపలూ ఫలములూ అందించి గౌరవ సత్కారములు చేసెను.
గమనిక:-
అర్ఘ్యము - అష్టార్ఘ్యములు, పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గఱిక, నువ్వులు, దర్భలు, పుష్పములు అను పూజాద్రవ్యములు.
1.10.18.
అనుష్టుప్.
ప్రతిగృహ్య తు తాం పూజాం
సర్వా ఏవ సముత్సుకాః ।
ఋషేర్భీతాస్తు శీఘ్రం తా
గమనాయ మతిం దధుః ॥
టీక:-
ప్రతిగృహ్య = స్వీకరించిరి; తు; తాం = ఆ; పూజామ్ = సత్కారములను; సర్వాః = అందఱు; ఏవ = కూడ; సముత్సుకాః = ఉత్సాహము కలవారై; ఋషేః = ఋషి విభండకుని వలన; భీతాః = భయము చెందినవారై; తు; శీఘ్రమ్ = వడిగా; తాః = వారు; గమనాయ = తిరిగి వెళ్ళుటకు; మతిమ్ = భావమును, తలపును; దధుః = ధరించిరి
భావము:-
ఆ వేశ్యస్త్రీలు ఉత్సాహముతో ఋష్యశృంగుని సత్కారములన్నీ గైకొనిరి. విభండకఋషికి కనబడతామని భయపడి, వడిగా మఱలి పోవలెనని తలచిరి.
1.10.19.
అనుష్టుప్.
“అస్మాకమపి ముఖ్యాని
ఫలానీమాని వై ద్విజ! ।
గృహాణ ప్రతి భద్రం తే
భక్షయస్వ చ మా చిరమ్" ॥
టీక:-
అస్మాకమ్ = మావి; అపి = కూడా; ముఖ్యాని = ముఖ్యమైన; ఫలాని = ఫలములను; ఇమాని = క్షేమకరమైనవి; వై = నిశ్చయముగ; ద్విజ = బ్రాహ్మణుడా; గృహాణ = తీసికొనుము; ప్రతి = ప్రతి ఒక్కటి/ అన్నిటిని; భద్రమ్ = క్షేమము అగుగాక; తే = నీకు; భక్షయస్వ = తినుము; చ; మా = వలదు; చిరమ్ = ఆలస్యము.
భావము:-
“ఓ విప్రుడా! నీవు ఈ మా మంచి పండ్లను కూడా తీసికొని, అన్నింటిని భుజింపుము. నీకు క్షేమము అగుగాక! జాగు చేయకుము.
1.10.20.
అనుష్టుప్.
తతస్తాస్తం సమాలింగ్య
సర్వా హర్షసమన్వితాః ।
మోదకాన్ ప్రదదుస్తస్మై
భక్షాంశ్చ వివిధాన్ శుభాన్ ॥
టీక:-
తతః = పిమ్మట; తాః = వారు; తమ్ = అతనిని; సమాలింగ్య = కౌగలించుకొని; సర్వాః = అందఱు; హర్ష = సంతోషము; సమన్వితాః = కలవారై; మోదకాన్ = కుడుములు, లడ్డూలు; ప్రదదుః = ఇచ్చిరి; తస్మై = అతనికి; భక్ష్యాంశ్చ = తినుభండారములు; వివిధాన్ = అనేకములను; శుభాన్ = మంగళకరమైనవాటిని.
భావము:-
ఆపైవారందఱు ఋశృశృంగుని అనందంగా కౌగలించుకొనిరి. లడ్డూలు, రకరకముల చక్కని తినుబండారములను భుజించమని ఇచ్చిరి.
1.10.21.
అనుష్టుప్.
తాని చాస్వాద్య తేజస్వీ
ఫలానీతి స్మ మన్యతే ।
అనాస్వాదితపూర్వాణి
వనే నిత్యనివాసినామ్ ॥
టీక:-
తాని = వాటిని; చ; ఆస్వాద్య = తిని; తేజస్వీ = తేజోవంతుడు ఋశ్యశృంగుడు; ఫలాని = ఫలములే; ఇతి = ఇవి; స్మ = సుమా అని; మన్యతే = తలచెను; అనాస్వాదిత = భుజింపబడనివి; పూర్వాణి = గతములో; వనే = అడవిలోనే; నిత్య = ఎప్పుడు; నివాసినామ్ = నివసించువారు.
భావము:-
బ్రహ్మతేజస్సుతో ఉట్టిపడు ఋశ్యశృంగుడు ఆ స్త్రీలు ఇచ్చిన ఫలములు తిని ‘వనవాసలమైన మేము ఎన్నడూ తిని ఎఱుగని ఫలము లివి’ అని తలచెను.
1.10.22.
అనుష్టుప్.
ఆపృచ్ఛ్య తు తదా విప్రం
వ్రతచర్యాం నివేద్య చ ।
గచ్ఛంతి స్మాపదేశాత్తాః
భీతాస్తస్య పితుః స్త్రియః ॥
టీక:-
అపృచ్ఛ్య = అడిగి; తు; తదా = అప్పుడు; విప్రమ్ = బ్రాహ్మణుని; వ్రతచర్యామ్ = నిత్యకర్మల అనుష్ఠానమును; నివేద్య = తెలుపబడిరి; చ; గచ్ఛంతి = వెడలిపోయిరి; స్మ; అపదేశాత్ = (కర్మానుష్ఠాన మనే) నెపముతో; తాః = వారు; భీతాః = భయపడినవారై; తస్య = అతని; పితుః = తండ్రి వలన; స్త్రియః = స్త్రీలు.
భావము:-
అప్పుడు ఆ వేశ్యలు ఋశ్యశృంగుని నిత్యకర్మల అనుష్ఠానము గుఱించి తెలిసికొనిరి. విభండకునికి ఎదురపడతామని బెదిరి. అనుష్టాలని వంకపెట్టి సెలవు తీసుకొని వెళ్ళిపోయిరి.
1.10.23.
అనుష్టుప్.
గతాసు తాసు సర్వాసు
కాశ్యపస్యాత్మజో ద్విజః ।
అస్వస్థ హృదయ శ్చాసీత్
దుఃఖం స్మ పరివర్తతే ॥
టీక:-
గతాసు = వెళ్ళిపోయిన వారు అగుచుండ; తాసు = వారు; సర్వాసు = అందఱు; కాశ్యపస్య = కశ్యపకుమారుడైన విభండకుని; ఆత్మజః = సుతుడైన; ద్విజః = బ్రాహ్మణుడు/ ఋశ్యశృంగుడు; అస్వస్థ హృదయః = మానసిక ఆరోగ్యము కోల్పోయినవాడు; చ; ఆసీత్ = అయ్యెను; దుఃఖాత్ = దుఃఖము వలన; స్మ; పరివర్తతే = సంచరించుచుండెను.
భావము:-
వేశ్యస్త్రీలు అందఱు వెళ్ళిపోయిన పిదప ఋశ్యశృంగుడు మానసిక స్వస్థత కోల్పోయి దుఃఖితుడై సంచరించుచుండెను.
1.10.24.
అనుష్టుప్.
తతోఽ పరేద్యుస్తం దేశమ్
ఆజగామ స వీర్యవాన్ ।
మనోజ్ఞా యత్ర తా దృష్టా
వారముఖ్యాః స్వలంకృతాః ॥
టీక:-
తతః = పిదప; అపరేద్యుః = మరునాడు; తం = ఆ; దేశమ్ = ప్రదేశమునకు; ఆజగామ = వచ్చెను; సః = అతడు; వీర్యవాన్ = శక్తివంతుడు; మనోజ్ఞాః = మనోహరమైనవారు; యత్ర = ఎచట; తాః = వారు; దృష్టాః = చూడబడిరో; వారముఖ్యాః = వేశ్యామణులు; స్వలంకృతాః = బాగుగా అలంకరించుకొన్నవారు
భావము:-
మరునాడు శక్తిశాలి ఆన ఋశ్యశృంగుడు అలంకారలతో మెరిసిపోయే మనోహరమైన వేశ్యామణులను తాను చూసిన ఆ ప్రదేశమునకు వచ్చెను.
1.10.25.
అనుష్టుప్.
దృష్ట్వైవ తాస్తదా విప్రమ్
ఆయాంతం హృష్టమానసా ।
ఉపసృత్య తతః సర్వాః
తాస్తమూచు రిదం వచః ॥
టీక:-
దృష్ట్వా = చూడగనే; ఏవ = అలా; తాః = వారు; తదా = అప్పుడు; విప్రమ్ = బ్రాహ్మణుని; ఆయాంతమ్ = వచ్చుచున్న; హృష్టమానసా = సంతోషించిన మనస్సులు కలవారై; ఉపసృత్య = సమీపించిన; తతః = తరువాత; సర్వాః = అందఱు; తాః = వారు; తమ్ = అతనితో; ఊచుః = పలికిరి; ఇదం = ఈ; వచః = పలుకులు.
భావము:-
వచ్చుచున్న ఋశ్యశృంగుని చూడగనే ఆ వేశ్యామణులు అందఱు సంతోషహృదయులైరి. పిమ్మట అతని దర్గఱకు వెళ్ళి ఇట్లు పలికిరి.
1.10.26.
అనుష్టుప్.
“ఏహ్యాశ్రమపదం సౌమ్య
హ్యస్మాకమితి చాబ్రువన్ ।
తత్రాప్యేష విధిః శ్రీమాన్
విశేషేణ భవిష్యతి" ॥
టీక:-
ఏహి = రమ్మ; ఆశ్రమ; పదమ్ = ప్రదేశమునకు; సౌమ్య = ఓ సౌమ్యుడా; హ్యః = పాత; అస్మాకమ్ = మా యొక్క; ఇతి = అని; చ; అబ్రువన్ = పలికిరి; తత్ర = అచట; అపి = కూడ; ఏషః = ఈ; విధిః = కార్యక్రమము (అతిథి సత్కారము); శ్రీమాన్ = శోభాయుక్తముగ; విశేషేణ = ఎక్కువగా; భవిష్యతి = జరుగగలదు.
భావము:-
“ఓ సౌమ్యుడా! ఋశ్యశృంగా ! నీవు కూడ మా ఆశ్రమ ప్రదేశమునకు రమ్ము. నీకు కూడ ఇటులనే చక్కటి అతిథి సత్కారములు బాగుగా చేసెదము” అని ఆహ్వానించిరి.
1.10.27.
అనుష్టుప్.
శ్రుత్వా తు వచనం తాసాం
సర్వాసాం హృదయంగమమ్ ।
గమనాయ మతిం చక్రే
తం చ నిన్యుస్తదా స్త్రియః ॥
టీక:-
శ్రూత్వా = విని; తు; వచనమ్ = పలుకులను; తాసామ్ = వారి; సర్వాసామ్ = అందఱి; హృదయంగమమ్ = మనోజ్ఞమైన; గమనాయ = వెళ్ళవలెనను; మతిమ్ = ఆలోచన; చక్రే = చేసెను; తమ్ = అతనిని; చ; నిన్యుః = తీసుకొని వెళ్ళిరి; తదా = అప్పుడు; స్త్రియః = స్త్రీలు
భావము:-
ఋశ్యశృంగుడు వారి మనోహరమైన ఆహ్వానము మన్నించెను. ఆ స్త్రీలతో వెళ్ళుటకు అంగీకరించెను. అప్పుడు వేశ్యామణులు వానిని తమతో తీసుకొని వెళ్ళిరి.
1.10.28.
అనుష్టుప్.
తత్ర చానీయమానే తు
విప్రే తస్మిన్ మహాత్మని ।
వవర్ష సహసా దేవో
జగత్ ప్రహ్లాదయం స్తదా ॥
టీక:-
తత్ర = అచటకు; చ; ఆనీయమానే = తీసుకొని రాబడుచుండగా; తు; విప్రే = బ్రాహ్మణుని; తస్మిన్ = ఆ; మహాత్మని = మహాత్ముడైన; వవర్ష = వర్షించిరి; సహసా = వెనువెంటనే; దేవః = దేవతలు; జగత్ = లోకమునకు; ప్రహ్లాదయమ్ = సంతోషింపజేయునది; తదా = అప్పుడు.
భావము:-
మహాత్ముడు ఋశ్యశృంగుడు అంగదేశమునకు తీసుకొని రాగానే వర్షాధిదేవత యైన పర్జన్యుడు అచట అందరికీ ఆనందకరమైన వర్షమును కురిపించెను.
1.10.29.
అనుష్టుప్.
వర్షేణైవాగతం విప్రం
విషయం స్వం నరాధిపః ।
ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః
శిరసా చ మహీం గతః ॥
టీక:-
వర్షేణ = వర్షముతో; ఏవ = కూడ; ఆగతమ్ = చేరిన; విప్రమ్ = బ్రాహ్మణునికి; విషయమ్ = విషయమును; స్వం = స్వయంగా; నరాధిపః = రాజు; ప్రత్యుద్గమ్య = ఎదురు వెళ్ళి; మునిమ్ = మునికి; ప్రహ్వః = వంగినవాడై; శిరసా చ = శిరస్సుతో; మహీమ్ = భూమిని; గతః = పొందెను.
భావము:-
వర్షముతో పాటు తన దేశమునకు వచ్చిన ఋశ్యశృంగునికి రోమపాద మహారాజు ఎదురువెళ్ళెను. శిరసు వంచి నమస్కరించెను.
1.10.30.
అనుష్టుప్.
అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై
న్యాయతః సుసమాహితః ।
వవ్రే ప్రసాదం విప్రేన్ద్రాత్
మా విప్రం మన్యురావిశత్ ॥
టీక:-
అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; చ; ప్రదదౌ = ఇచ్చెను; తస్మై = అతనికి; న్యాయతః = శాస్త్రోక్తముగ; సుసమాహితః = ఏకాగ్రచిత్తుడై; వవ్రే = కోరెను; ప్రసాదమ్ = అనుగ్రహమును; విప్రేన్ద్రాత్ = బ్రాహ్మణునినుండి; మా = వలదు; విప్రమ్ = బ్రాహ్మణుని; మన్యుః = కోపము; ఆవిశత్ = ప్రవేశము
భావము:-
రోమపాదుడు శాస్త్రోక్తముగా శ్రద్ధగా ఋశ్యశృంగునకు అర్ఘ్యము సమర్పించెను. ఇలా తీసుకువచ్చి నందులకు కోపించక అనుగ్రహించమని కోరెను.
1.10.31.
అనుష్టుప్.
అంతపురం ప్రవిశ్యాస్మై
కన్యాం దత్త్వా యథావిధి ।
శాంతాం శాంతేన మనసా
రాజా హర్షమవాప సః ॥
టీక:-
అంతపురమ్ = అంతఃపురమును; ప్రవిశ్య = ప్రవేశించి అస్మై = తన యొక్క; కన్యామ్ = కన్యను; దత్వా = ఇచ్చి; యథావిధి = శాస్త్రోక్తముగా; శాంతామ్ = శాంతను; శాంతేన = ప్రశాంతమైన; మనసా = మనస్సుతో; రాజా = రాజు; హర్షమ్ = ఆనందమును; అవాప = పొందెను; సః = అతడు
భావము:-
రోమపాద మహారాజు అంతఃపురములోనికి ఋశ్యశృంగుని తీసుకెళ్ళి అతనికి తన కుమార్తె శాంతను ఇచ్చి యథావిధిగా వివాహము చేసి ప్రశాంతమైన మనస్సుతో ఆహ్లాదము పొందెను.
1.10.32.
అనుష్టుప్.
ఏవం స న్యవసత్తత్ర
సర్వకామైః సుపూజితః ।
ఋశ్యశృంగో మహాతేజాః
శాంతయా సహ భార్యయా" ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; సః = అతడు; న్యవసత్ = నివసించెను; తత్ర = అచట; సర్వకామైః = సకల భోగములచే; సుపూజితః = బాగుగా సత్కరింపబడెను; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; మహాతేజాః = మిక్కిలి తేజోవంతుడు; శాంతయా = శాంతతో; సహ = కూడ; భార్యయా = భార్యతో
భావము:-
ఈ విధముగా మహాతేజోవంతుడైన ఋశ్యశృంగుడు తన భార్య శాంతతో సకలభోగములను అనుభవించుచు, బాగుగా గౌరవ సత్కారములను అందుకొనుచు అంగరాజ్యములో నివసించెను.
1.10.33.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
దశమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; దశమః [10] = పదవ; సర్గః = సర్గ.
భావము:-
:- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండ లోని [10] పదవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.11.1.
అనుష్టుప్.
భూయ ఏవ చ రాజేంద్ర!
శృణు మే వచనం హితమ్ ।
యథా స దేవప్రవరః
కథాయామేవ మబ్రవీత్ ॥
టీక:-
భూయః = మరల; ఏవ = ఇలాగ; చ; రాజేంద్ర = ఓ మహారాజా; శృణు = వినుము; మే = నాయొక్క; హితమ్ = మంగళకరమైన; వచనమ్ = పలుకు; యథా = ఏవిధముగా; సః = ఆ; దేవప్రవరః = దేవతలలో శ్రేష్ఠుడైన సనత్కుమారుడు; కథాయామ్ = తొల్లిటివృత్తాంతాలు; ఏవమ్ = ఈవిధముగ; అబ్రవీత్ = చెప్పెను
భావము:-
సుమంతుడు ఇలా చెప్తున్నాడు. “ఓ దశరథ మహారాజా! మరల నేను చెప్పెడి ఈ మంగళకరమైన నా పలుకులు వినుము. సనత్కుమారుడు చెప్పిన పూర్వ వృత్తాంతములు చెప్పుచుంటిని.
1.11.2.
అనుష్టుప్.
ఇక్ష్వాకూణాం కులే జాతో
భవిష్యతి సుధార్మికః ।
రాజా దశరథో నామ
శ్రీమాన్ సత్యప్రతిశ్రవః ॥
టీక:-
ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజుల; కులే = వంశమునందు; జాతః భవిష్యతి = పుట్టగలడు; సుధార్మికః = గొప్ప ధార్మికుడు అయిన వాడు; రాజా = రాజు; దశరథః = దశరథుడను; నామ = పేరు కలవాడును; శ్రీమాన్ = సర్వ శుభ లక్షణ వంతుడును; సత్యవ్రతి = సత్యసంధుడని; శ్రవః = ప్రసిద్ధుడును.
భావము:-
శ్రీమంతుడును, సత్యసంధుడును, పరమధార్మికుడును, అని ప్రసిద్ధుడుగు దశరథుడను పేరు గల రాజు ఇక్ష్వాకు వంశములో పుట్టగలడు.
1.11.3.
అనుష్టుప్.
అంగరాజేన సఖ్యం చ
తస్య రాజ్ఞో భవిష్యతి ।
కన్యా చాస్య మహాభాగా
శాంతా నామ భవిష్యతి ॥
టీక:-
అంగరాజేన = అంగరాజుతో; సఖ్యం = స్నేహము; చ = కూడ; తస్య = ఆ; రాజ్ఞః = రాజునకు; భవిష్యతి = కాగలదు; కన్యా = కుమార్తె; చ = చ; అస్య = ఆ దశరథునకు; మహాభాగా = గొప్ప అదృష్టవంతురాలు; శాంతా = శాంత యనెడు; నామ = పేరు గలది; భవిష్యతి = పుట్టగలదు.
భావము:-
ఆ దశరథునకు రోమపాదుడను అంగరాజుతో స్నేహమేర్పడును. ఆయనకు గొప్ప అదృష్టవంతురాలైన శాంతయనెడు కుమార్తె పుట్టగలదు.
గమనిక:-
*- యయాతి తరువాత తరాలలోని ధర్మరథుని కొడుకు చిత్రరథుడు. రోమపాదుడని ప్రసిద్దుడైన ఆ చిత్రరథునికి, శ్రీరాముని తండ్రి దశరథుడు తన కూతురు శాంతను దత్తత ఇచ్చాడు.
1.11.4.
అనుష్టుప్.
పుత్రస్త్వంగస్య రాజ్ఞస్తు
రోమపాద ఇతి శ్రుతః ।
అంగరాజం దశరథో
గమిష్యతి మహాయశాః ॥
టీక:-
పుత్ర = పుత్రుడు; అస్తు = అయి ఉన్న; అంగస్య = అంగదేశపు; రాజ్ఞస్తు = రాజునకు; రోమపాద = రోమపాదుడు; ఇతి = అని; శ్రుతః = ప్రసిద్ధుడు(కాగలడు); అంగరాజం = అంగరాజైన ఆ రోమపాదు వద్దకు; దశరథః = దశరథుడు; గమిష్యతి = వెళ్ళగలడు; మహాయశాః = గొప్ప కీర్తిగల వాడు.
భావము:-
ఆ అంగరాజకుమారుడైన రోమపాదుడు వద్దకు. గొప్ప కీర్తిగల ఆ దశరథమహారాజు వెళ్ళగలడు.
1.11.5.
అనుష్టుప్.
“అనపత్యోఽ స్మి ధర్మాత్మన్!
శాంతాభర్తా మమ క్రతుమ్ ।
ఆహరేత త్వయాఽఽ జ్ఞప్తః
సంతానార్థం కులస్య చ" ॥
టీక:-
అనపత్యః = సంతానము లేనివాడనై; అస్మి = ఉన్నాను; ధర్మాత్మన్ = ఓ ధర్మాత్ముడా; శాంతా = శాంతయొక్క; భర్తా = భర్తను; త్వయా = నీచేత; ఆజ్ఞప్తః = ఆజ్ఞాపింపబడినవాడై; మమ = నాయొక్క; కులస్య = వంశాభివృద్ధికొఱకు; చ; సంతానార్థమ్ = పుత్రసంతానమునకై; క్రతుమ్ = యజ్ఞమును; ఆహరేత = నిర్వహించుగాక.
భావము:-
“ఓ ధర్మాత్ముడా। నాకు పుత్రులు కలుగలేదు, అందుచేత శాంతభర్త ఐన ఋష్యశృంగుని నీవు పంపితే, నా వంశాభివృద్ధి కొఱకు పుత్రులు కలుగుటకు క్రతువును చేయించును." అని దశరథుడు రోమపాదుని అడుగును.
1.11.6.
అనుష్టుప్.
శ్రుత్వా రాజ్ఞోఽ థ తద్వాక్యం
మనసా స విచిన్త్య చ ।
ప్రదాస్యతే పుత్రవంతం
శాంతాభర్తార మాత్మవాన్ ॥
టీక:-
శ్రుత్వా = విని; రాజ్ఞః = ఆ రాజుయొక్క; అథ = అటుపిమ్మట; తత్ = ఆ; వాక్యమ్ = వాక్యమును; మనసా = మనస్సు; స = పూర్తిగా; విచిన్త్య = ఆలోచించి; చ = మరీ; ప్రదాస్యతే = ఇవ్వగలడు; పుత్రవంతమ్ = పుత్రులు కలుగునట్లు చూచువాడు; శాన్తాః = శాంతయొక్క; భర్తారమ్ = భర్త; ఆత్మవాన్ = బుద్ధిశాలి అగు ఆ రోమపాదుడు.
భావము:-
రోమపాదుడు దశరథుని మాటలు విని, బాగుగా ఆలోచించి, తపోమహిమచే ఇతరులకు పుత్రులను అనుగ్రహింపగల, శాంత భర్త ఐన ఋష్యశృంగుని పంపును.
1.11.7.
అనుష్టుప్.
ప్రతిగృహ్య చ తం విప్రం
స రాజా విగతజ్వరః ।
ఆహరిష్యతి తం యజ్ఞం
ప్రహృష్టే నాంతరాత్మనా ॥
టీక:-
ప్రతిగృహ్య = స్వీకరించి (తన వెంటబెట్టుకొని); చ; తమ్ = ఆ; విప్రమ్ = బ్రాహ్మణుని; సః = ఆ; రాజా = దశరథ మహారాజు; విగత = తొలగిపోయిన; జ్వరః = మనోవ్యథ కలవాడై; ఆహరిష్యతి = అనుష్ఠింపగలడు; తం = ఆ; యజ్ఞమ్ = యజ్ఞమును; ప్రహృష్టేన = సంతోషించిన; అంతరాత్మనా = హృదయముతో.
భావము:-
మనోవ్యథ శాంతించిన దశరథుడు ఋష్యశృంగుని కూడా తీసుకువెళ్ళి, సంతసించిన మనస్సుతో ఆ యజ్ఞము చేయగలడు.
1.11.8.
అనుష్టుప్.
తం చ రాజా దశరథో
యష్టుకామః కృతాంజలిః ।
ఋశ్యశృంగం ద్విజశ్రేష్ఠం
వరయిష్యతి ధర్మవిత్ ॥
టీక:-
తం = అప్పుడు; చ; యష్టు = యాగము చేయవలెనను; కామః = కోరిక కలవాడును; నరేశ్వరః = నరులకుప్రభువును అయిన; రాజా దశరథః = దశరథమహారాజు; కృతాంజలిః = దోసిలి ఒగ్గినవాడై; ధర్మవిత్ = ధర్మము ఎరిగిన వాడును; ద్విజశ్రేష్ఠమ్ = ద్విజులలో శ్రేష్ఠుడైన; ఋష్యశృంగమ్ = ఋష్యశృంగుని; వరయిష్యతి = కోరగలడు.
భావము:-
ఆ దశరథుడు యాగము చేయవలెనని కోరి, దోసిలి ఒగ్గి ఆ ధర్మవేత్తయైన ఋష్యశృంగుని ప్రార్థించును.
1.11.9.
అనుష్టుప్.
యజ్ఞార్థం ప్రసవార్థం చ
స్వర్గార్థం చ జనేశ్వరః!।
లభతే చ స తం కామం
విప్రముఖ్యా ద్విశాంపతిః ॥
టీక:-
యజ్ఞార్థమ్ = యజ్ఞముకొరకును; ప్రసవార్థం = సంతానముకొరకును; చ; స్వర్గార్థం = స్వర్గప్రాప్తి కొరకును; చ; సః = ఆ; జనేశ్వర = రాజు; ద్విజ = ఆ బ్రాహ్మణుడు ఋశ్యశృంగుని; ముఖ్యాత్ = వలన; తం = ఆ; కామమ్ = కోరికను; లభతే = పొందును; చ = కూడ; విశాంపతిః = రాజు.
భావము:-
తనకు సంతానము, స్వర్గము కూడ కలుగునట్లు యజ్ఞము చేయించ మని ప్రార్థించును. ఆ బ్రాహ్మణోత్తముడైన ఋశ్యశృంగుని వలన దశరథుడుఆ కోరికలను పొందును.
1.11.10.
అనుష్టుప్.
పుత్రాశ్చాస్య భవిష్యంతి
చత్వారోఽ మితవిక్రమాః ।
వంశ ప్రతిష్ఠానకరాః
సర్వలోకేషు విశ్రుతాః ॥
టీక:-
పుత్రాః = పుత్రులు; చ; అస్య = అతనికి; భవిష్యంతి = పుట్టగలరు; చత్వారః = నలుగురు; అమిత = మిక్కిలి; విక్రమాః = పరాక్రమము కలవారును; వంశ = వంశమునకు; ప్రతిష్ఠాన్ = గౌరవమును; అకరాః = బాగుగ కలిగించువారును; సర్వ = సకల; లోకేషు = లోకములందును; విశ్రుతాః = ప్రసిద్ధులును అగుదురు.
భావము:-
ఆ దశరథునకు అమితపరాక్రమవంతులు, వంశప్రతిష్ఠ పెంచు వారును, సర్వలోకములందు ప్రసిద్ధులును అగు నలుగురు పుత్రులు కలుగెదరు.
1.11.11.
అనుష్టుప్.
ఏవం స దేవప్రవరః
పూర్వం కథితవాన్ కథామ్ ।
సనత్కుమారో భగవాన్
పురా దేవయుగే ప్రభుః ॥
టీక:-
దేవప్రవరః = దేవతలలో శ్రేష్ఠుడును; భగవాన్ = మాహాత్మ్యము కలవాడును; ప్రభుః = సమర్థుడును అగు; సః = ఆ; సనత్కుమారః = సనత్కుమారుడు; పురా = పూర్వమునందు; దేవయుగే = కృతయుగము నందు; కథామ్ = వృత్తాంతమును; ఏవమ్ = ఈవిధముగా; కథితవాన్ = చెప్పెను.
భావము:-
పూర్వము కృతయుగములో దేవతాశ్రేష్ఠుడైన సనత్కుమారుడు ఈవిధముగా జరుగునని చెప్పెను.
1.11.12.
అనుష్టుప్.
స త్వం పురుషశార్దూల
తమానయ సుసత్కృతమ్ ।
స్వయమేవ చ రాజేంద్ర
గత్వా సబలవాహనః ॥"
టీక:-
సః = అట్టి; త్వమ్ = నీవు; పురుషశార్దూల = పురుషశ్రేష్ఠుడవైన; మహారాజ = ఓ మహారాజా; స = కూడిన వాడవై; బల = సైన్యముతోడను; వాహనః = వాహనములతోడను; స్వయం = స్వయముగానే; ఏవ = మాత్రమే; గత్వా = వెళ్ళి; సు = చక్కగా; సత్కృతమ్ = గౌరవించబడినవానిని; తమ్ = అతనిని; ఆనయ = తీసుకొని రమ్ము.
భావము:-
పురుషశ్రేష్ఠుడవైన ఓ మహారాజా। నీవే స్వయముగా సైన్యవాహనాదులతో వెళ్ళి చక్కగా గౌరవపూర్వకంగా ఋష్యశృంగుని తీసుకొని రమ్ము.”
1.11.13.
అనుష్టుప్.
అనుమాన్య వసిష్ఠం చ
సూతవాక్యం నిశమ్య చ ।
సాంతపురః సహామాత్యః
ప్రయయౌ యత్ర స ద్విజః ॥
టీక:-
అనుమాన్య = అంగీకరింపచేసి; వసిష్ఠం = వసిష్ఠుని; చ = కూడ; సూత = రథసారథి సుమంత్రుని; వాక్యమ్ = మాటలను; నిశమ్య = విని; చ; సా = కూడిన వాడై; అంతపురః = రాణులతో; సహా = తోకూడిన; అమాత్యః = అమాత్యులు కల వాడై; సః = ఆ; ద్విజః = బ్రాహ్మణుడు శృష్యశృంగుడు; యత్ర = ఉన్నచోటికి; ప్రయయౌ = బయలుదేరెను.
భావము:-
సుమంత్రుని మాటలు వినిన దశరథుడు, వసిష్ఠుని అనుమతి కూడా గైకొని, అంతఃపురపు రాణులతో కూడి ఆమాత్యాదులతో కలిసి ఆ ఋష్యశృంగుడు ఉన్నచోటికి బయలుదేరెను.
1.11.14.
అనుష్టుప్.
వనాని సరితశ్చైవ
వ్యతిక్రమ్య శనైః శనైః ।
అభిచక్రామ తం దేశ
యత్ర వై మునిపుంగవః ॥
టీక:-
వనాని = వనములను; సరితః = నదులను; చ; ఇవ = మొదలగునవి; వ్యతిక్రమ్య = దాటి; శనైః శనైః = మెల్లమెల్లగా; మునిపుంగవః = మునిశ్రేష్ఠుడు ఋష్యశృంగుడు; యత్ర = ఎచటనుండెనో; తం = ఆ; దేశమ్ = దేశమును; అభిచక్రామ = చేరెను.
భావము:-
వనములు నదులు మున్నగునవి మెల్లమెల్లగా దాటుచూ, ఆ ఋష్యశృంగుడున్న దేశము చేరెను.
1.11.15.
అనుష్టుప్.
ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం
రోమపాద సమీపగమ్ ।
ఋషిపుత్రం దదర్శాదౌ
దీప్యమాన మివానలమ్ ॥
టీక:-
ఆసాద్య = సమీపించి; తం = ఆ; ద్విజశ్రేష్ఠమ్ = బ్రాహ్మణశ్రేష్ఠుని; రోమపాద = రోమపాదుని; సమీపగమ్ = సమీపమునందున్న వానిని; ఋషిపుత్రమ్ = ఋషికుమారుడు ఋష్యశృంగుని; దదర్శ = చూచెను; ఆదౌ = ఎదుట; దీప్యమానమ్ = ప్రజ్వలించుచున్న; ఇవ = సరపోలు; అనలమ్ = అగ్ని ఐనవాడునిని.
భావము:-
ఆ నగరము చేరగనే దశరథుడు, రోమపాదుని సమీపమున ఉన్న ద్విజశ్రేష్ఠుడైన ప్రజ్వలించుచున్న అగ్నివంటివానిని ఋష్యశృంగుని చూచెను.
1.11.16.
అనుష్టుప్.
తతో రాజా యథాన్యాయం
పూజాం చక్రే విశేషతః ।
సఖిత్వాత్తస్య వై రాజ్ఞః
ప్రహృష్టే నాంతరాత్మనా ॥
టీక:-
తతః = పిమ్మట; రాజా = రోమపాదుడు; యథాన్యాయమ్ = పద్ధతిప్రకారము; పూజామ్ = పూజను; చక్రే = చేసెను; విశేషతః = అధికముగను; సఖిత్వాత్ = స్నేహితైన; తస్య = ఆ; వై = యొక్క; రాజ్ఞః = రాజు దశరథుని; ప్రహృష్టేన = మిక్కిలి సంతోషంతో; అంతరాత్మనా = హృదయములో.
భావము:-
రోమపాదుడు సంతోషభరిత హృదయముతో పద్ధతి ప్రకారముగను, విశేషముగను, మిత్రుడైమ ఆ దశరథునికి ఆదర సత్కారములు చేసెను.
1.11.17.
అనుష్టుప్.
రోమపాదేన చాఖ్యాతం
ఋషిపుత్రాయ ధీమతే ।
సఖ్యం సమ్బంధకం చైవ
తదా తం ప్రత్యపూజయత్ ॥
టీక:-
రోమపాదేన = రోమపాదుని చేత; ఆఖ్యాతమ్ = చెప్పబడినది; ఋషిపుత్రాయ = ఋషికుమారుడు ఋష్యశృంగునకు; ధీమతే = బుద్ధిమంతుడైన; సఖ్యమ్ = స్నేహము; సంబంధకం చైవ = సంబంధము; చ; ఇవ = గురించి; తదా = అప్పుడు; తమ్ = ఆ దశరథుని; వ్రత్యపూజయత్ = పూజించెను.
భావము:-
రోమపాదుడు తనకు దశరథునితో ఉన్న స్నేహబాంధవ్యములను గూర్చి ఋష్యశృంగునకు చెప్పగా అతడు దశరథుని గౌరవించెను.
1.11.18.
అనుష్టుప్.
ఏవం సుసత్కృతస్తేన
సహోషిత్వా నరర్షభః ।
సప్తాష్టదివసాన్ రాజా
రాజాన మిదమబ్రవీత్ ॥
టీక:-
ఏవమ్ = ఈవిధముగా; సు = చక్కగా; సత్కృతః = సత్కరింపబడిన; తేన = అతనితో; తేన = అతనితో; సహ = కలిసి; ఉషిత్వా = ఉండెను; నరర్షభః = నరశ్రేష్ఠుడైన దశరధుడు; సప్తాష్ట = ఏడెనిమిది; దివసాన్ = దివసములపాటు; రాజా = దశరథుడు; రాజానమ్ = రోమపాదునితో; ఇదమ్ = ఈవిధముగ; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ఈవిధముగా నరశ్రేష్ఠుడగు దశరథుడు రోమపాదుడు చేసిన సత్కారముల నందుకొని, ఏడెనిమిది దినములు అతని అతిథిగా ఉండెను, రాజా దశరథుడు రాజా రోమపాదునితో ఇట్లనెను.
1.11.19.
అనుష్టుప్.
శాంతా తవ సుతా రాజన్
సహ భర్త్రా విశాంపతే ।
మదీయం నగరం యాతు
కార్యం హి మహదుద్యతమ్" ॥
టీక:-
శాంతా = శాంతను; తవ = నీ; సుతా = కుమార్తెని; సహభర్త్రా = తోపాటు; భర్త్రా = భర్తకలామెను; విశాంపతే = ప్రజలకు ప్రభువైన రోమపాద; మదీయ = నా; నగరమ్ = పట్టణమునకు; యాతు = వెళ్ళుగాక. కార్యమ్ = పని; హి; మహత్ = గొప్పof; ఉద్యతమ్ = ప్రారంభింపబడినది.
భావము:-
“ఓ రాజా। నేనొక గొప్ప కార్యము తలపెట్టితిని. నీ కుమార్తె శాంతను, ఆమె భర్తను నా నగరమునకు పంపుము.”
1.11.20.
అనుష్టుప్.
తథేతి రాజా సంశ్రుత్య
గమనం తస్య ధీమతః ।
ఉవాచ వచనం విప్రం
గచ్ఛ త్వం సహ భార్యయా ॥
టీక:-
తథా = అటులనే; ఇతి = అటులనే అగుగాక అని; రాజా = రాజు రోమపాదుడు; సంశ్రుత్య = చక్కగా అంగీకారం తెలిపెను; గమనమ్ = వెళ్ళుటకు; తస్య = ఆ; ధీమతః = బుద్ధిశాలియైన రోమపాదుడు; ఉవాచ = పలికెను; వచనమ్ = ఆజ్ఞాను; విప్రమ్ = బ్రాహ్మణుడు ఋష్యశృంగునితో; గచ్ఛ = వెళ్ళుము; త్వమ్ = నీవు; సహ = కలిసి; భార్యయా = భార్యతో.
భావము:-
రోమపాదుడు, ధీమంతుడైన ఋష్యశృంగుడు అయోధ్య వెళ్ళుటకు అంగీకరించి, “నీవు భార్యతో అయోధ్యకు వెళ్ళుము’ అని ఋష్యశృంగునితో పలికెను.
1.11.21.
అనుష్టుప్.
ఋషిపుత్రః ప్రతిశ్రుత్య
తథేత్యాహ నృపం తదా ।
స నృపేణాభ్యనుజ్ఞాతః
ప్రయయౌ సహ భార్యయా ॥
టీక:-
ఋషిపుత్రః = ఋషికుమారుడు; ప్రతిశ్రుత్య = అంగీకరించి; తథా = అటులనే; ఇతి = చేసెదను అని; ఆహ = పలికెను; నృపమ్ = రాజు రోమపాదునితో; తదా = అప్పుడు; సః = పిమ్మట; నృపేణ = రాజుయొక్క; అభ్యనుజ్ఞాతః = అనుజ్ఞకలవాడై; ప్రయయౌ = బయలుదేరెను; సహ = కలిసి; భార్యయా = భార్య శాంతతో.
భావము:-
ఋష్యశృంగుడు అందులకు అంగీకరించి, అటులనే చేసెదనని పలికి, రోమపాదుని అనుజ్ఞ గైకొని భార్యాసమేతుడై బయలుదేరెను.
1.11.22.
అనుష్టుప్.
తావన్యోన్యాంజలిం కృత్వా
స్నేహా త్సంశ్లిష్య చోరసా ।
ననందతు ర్దశరథో
రోమపాదశ్చ వీర్యవాన్ ॥
టీక:-
తౌ = వారిద్దరు; అన్యోన్య = పరస్పరము; ఆంజలిమ్ = దోసిలి; కృత్వా = చేసి; స్నేహాత్ = స్నేహము వలన; సంశ్లిష్య = కౌగలించుకొని; చ; ఉరసా = వక్షస్థలముచే; ననందతు = సంతోషించిరి; దశరథః = దశరథుడును; రోమపాదశ్చ = రోమపాదుడును; చ; వీర్యవాన్ = పరాక్రమశాలురు.
భావము:-
వారిద్దరును ఒకరికొకరు దోసిలి ఒగ్గి నమస్కారము చేసుకొని, వక్షస్థలములు కలియునట్లు కౌగలించుకొని సంతోషించిరి పరాక్రమశాలురు దశరథ రోమపాదులు.
1.11.23.
అనుష్టుప్.
తతః సుహృదమా పృచ్ఛ్య
ప్రస్థితో రఘునందనః ।
పౌరేభ్యః ప్రేషయామాస
దూతాన్ వై శీఘ్రగామినః ॥
టీక:-
తతః = పిమ్మట; సుహృదమ్ = మిత్రుని; ఆపృచ్ఛ్య = వీడ్కొని; ప్రస్థితః = ప్రయాణమై; రఘునందనః = దశరథుడు; పౌరేభ్యః = పౌరులకు; ప్రేషయామాస = పంపెను; దూతాన్ = దూతలను; శీఘ్రగామినః = శీఘ్రముగా వెళ్ళగలిగిన.
భావము:-
మిత్రునివద్ద సెలవు తీసుకొని దశరథుడు బయలుదేరెను. అయోధ్యా పౌరులకు తమ రాక తెలుపుటకు శీఘ్రముగా వెళ్ళగలిగిన దూతలను పంపెను.
1.11.24.
అనుష్టుప్.
క్రియతాం నగరం సర్వం
క్షిప్రమేవ స్వలంకృతమ్ ।
ధూపితం సిక్తసమ్మృష్టం
పతాకాభి రలంకృతమ్" ॥
టీక:-
క్రియతామ్ = చేయబడుగాక; నగరమ్ = నగరము; సర్వమ్ = సమస్తము; క్షిప్రమేవ = శీఘ్రముగా; స్వలంకృతమ్ = బాగుగా అలంకరింపబడినది గాను; ధూపితమ్ = ధూపము వేయబడినది గాను; సిక్త = తడిపినది / కళ్ళాపిజల్లి; సంమృష్టమ్ = తుడవబడినది గాను; పతాకాభిః = జెండాలచేత; అలంకృతమ్ = అలంకరింపబడినది గాను.
భావము:-
దశరథుడు అయోధ్యాపౌరుల కీ విధముగా కబురుపంపెను. “నగరము నంతను వెంటనే చక్కగా అలంకరింపుడు. ధూప సుగంధములను వ్యాపింపచేయుడు. మార్గములు కళ్ళాపి నీళ్ళు చల్లుడు. పతాకలు ఎగురవేయుడు”.
1.11.25.
అనుష్టుప్.
తతః ప్రహృష్టాః పౌరాస్తే
శ్రుత్వా రాజానమాగతమ్ ।
తథా ప్రచక్రుస్తత్సర్వం
రాజ్ఞా యత్ప్రేషితం తదా ॥
టీక:-
తతః = పిమ్మట; ప్రహృష్టాః = సంతసించిన వారై; పౌరాః = పౌరులు; తే = వారు; శ్రుత్వా = విని; రాజానమ్ = రాజు యొక్క; ఆగతమ్ = రాకను; తథా = అట్లే; ప్రచక్రుః = చేసిరి; సర్వమ్ = అంతను; రాజ్ఞా = రాజుచేత; యత్ = ఆ విధంగా; ప్రేషితమ్ = సందేశం పంపబడినట్లు0000; తదా = అప్పుడు.
భావము:-
రాజు ఆగమన వార్త వినిన పౌరులు చాలా సంతసించి, ఆయన ఆజ్ఞాపించిన విధమున నగరాలంకారములు సంపూర్ణంగా చేసిరి.
1.11.26.
అనుష్టుప్.
తతః స్వలంకృతం రాజా
నగరం ప్రవివేశ హ ।
శంఖదున్దుభి ర్నిర్ఘోషైః
పురస్కృత్య ద్విజర్షభమ్ ॥
టీక:-
తతః = ఆ; స్వ = తన; అలంకృతమ్ = అలంకరింపబడిన; రాజా = దశరథుడు; నగరమ్ = నగరమును; ప్రవివేశ = ప్రవేశించెను; హ; శంఖః = శంఖముల; దున్దుభిః = దుందుభుల; నిర్ఘోషైః = ధ్వనులతో; పురస్కృత్య = ఎదుట ఉంచుకొని; ద్విజర్షభమ్ = ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు ఋష్యశృంగుని.
భావము:-
అలంకరింపబడిన తన అయోధ్యానగరమును దశరథుడు శంఖదుందుభి మంగళధ్వనులతో, ఋష్యశృంగునితోపాటు ప్రవేశించెను.
1.11.27.
అనుష్టుప్.
తతః ప్రముదితాః సర్వే
దృష్ట్వా తం నాగరా ద్విజమ్ ।
ప్రవేశ్యమానం సత్కృత్య
నరేంద్రేణేంద్ర కర్మణా ॥
టీక:-
తతః = పిమ్మట; ప్రముదితాః - సంతోషించిరి; సర్వే = సమస్తము; దృష్ట్వా = చూచి; తమ్ = ఆ; నాగరాః = పౌరులు; ద్విజమ్ = బ్రాహ్మణుని; ప్రవేశ్యమానమ్ = ప్రవేశపెట్టబడుచున్న; సత్కృత్య = సత్కరించి; నరేంద్రేణ = రాజుచేత; ఇంద్రకర్మణా = ఇంద్రునివంటి కర్మగలవాడు.
భావము:-
పిమ్మట దేవేంద్రునితో సమానుడైన దశరథమహారాజుచే సత్కృతుడై అయోధ్యలో ప్రవేశించుచున్న ఋష్యశృంగుని చూచి పౌరులెల్లరు సంతోషించిరి.
1.11.28.
అనుష్టుప్.
అంతపురం ప్రవేశ్యైనమ్
పూజాం కృత్వా విధానతః ।
కృతకృత్యం తదాఽఽ త్మానం
మేనే తస్యోపవాహనాత్ ॥
టీక:-
అంతపురం = అంతఃపురములో; ఏనమ్ = ఋష్యశృంగుని; ప్రవేశ్యైనమ్ = ప్రవేశింపజేసి / తీసుకువెళ్ళి; పూజాం = పూజను; కృత్వా = చేసి; విధానతః = విధివిధానంగా; కృతకృత్యమ్ = కృతకృత్యునిగా; తదా = అప్పుడు; ఆత్మానామ్ = తనను; మేనే = తలచెను; తస్య = అతనిని; ఉపవాహనాత్ = తీసుకొని వచ్చుటవలన.
భావము:-
దశరథుడా ఋష్యశృంగుని అంతఃపురములోనికి తీసుకొని వెళ్ళి, పద్ధతి ప్రకారము పూజించెను. అతనిని తీసుకొని వచ్చుటచే, తను కృతార్థుడు ఐనట్లు సంతసించెను.
1.11.29.
అనుష్టుప్.
అంతపురస్త్రియః సర్వాః
శాంతాం దృష్ట్వా తథాఽఽ గతామ్ ।
సహ భర్త్రా విశాలాక్షీం
ప్రీత్యాఽఽ నందముపాగమన్ ॥
టీక:-
అంతపురః = అంతఃపురములోని; స్త్రియః = స్త్రీలు; సర్వాః = అందరును; శాంతామ్ = శాంతను; దృష్ట్వా = చూచి; తథా = ఆవిధముగా; ఆగతామ్ = వచ్చిన; సహ = కూడ ఉన; భర్త్రా = భర్తకలామ; విశాలాక్షీమ్ = విశాలములైన కన్నులు గలామెనప; ప్రీత్యా = ప్రేమతో; ఆనందమ్ = ఆనందమును; ఉపాగమన్ = పొందిరి.
భావము:-
అంతఃపురస్త్రీ లందరును భర్తతోకలిసి అలా ఏతెంచిన పెద్ద పెద్ద కళ్ళున్న శాంతను చూచి, ప్రేమతో ఆనందభరితులైరి.
1.11.30.
అనుష్టుప్.
పూజ్యమానా చ తాభిః సా
రాజ్ఞా చైవ విశేషతః ।
ఉవాస తత్ర సుఖితా
కంచిత్కాలం సహర్త్విజా ॥
టీక:-
పూజ్యమానా = పూజింపబడుచున్నదై; చ; తాభిః = వారి చేతను; సా = ఆమె; రాజ్ఞా = రాజుచేతను; చ; ఇవ = కూడ; విశేషతః = విశేషముగా; ఉవాస = నివసించెను తత్ర = అచట; సుఖితా = సుఖవంతురాలై; కంచిత్కాలమ్ = కొంతకాలము; సహ = కలిసి ఉన్న; ఋత్విజా = ఋత్విక్కు ఋశ్యశృంగుని తోపాటు.
భావము:-
అంతఃపురస్త్రీలును, దశరథుడును ఆమెను బంధుమర్యాలతో ఆదరించిరి. శాంతాదేవి యాగంచేయ వచ్చిన ఋష్యశృంగునితో కొంతకాలము అయోధ్యలో సుఖముగా ఉండెను.
1.11.31.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకాదశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకాదశ [11] = పదకొండవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [11] పదకొండవ సర్గ సుసంపూర్ణము .
బాల కాండ
1.12.1.
అనుష్టుప్.
తతః కాలే బహుతిథే
కస్మింశ్చిత్సుమనోహరే ।
వసంతే సమనుప్రాప్తే
రాజ్ఞో యష్టుం మనోఽ భవత్ ॥
టీక:-
తతః = తరువాత; కాలే = కాలములో; బహుతిథే = చాలా దినముల పిమ్మట; కస్మింశ్చిత్ = ఒకానొక; సుమనోహరే = మిక్కిలి మనోహరమైన; వసంతే = వసంతకాలము; సమనుప్రాప్తే = రాగా; రాజ్ఞః = రాజునకు; యష్టుమ్ = యాగము చేయుటకు; మనః = కోరిక; అభవత్ = కలిగెను.
భావము:-
ఈవిధముగా చాలా దినములు గడచిన పిదప, మనోహరమైన వసంతఋతువు వచ్చెను. అప్పుడు యజ్ఞము చేయవలెనని దశరథునకు అభిలాష కలిగెను.
1.12.2.
అనుష్టుప్.
తతః ప్రసాద్య శిరసా
తం విప్రం దేవవర్ణినమ్ ।
యజ్ఞాయ వరయామాస
సంతానార్థం కులస్య వై" ॥
టీక:-
తతః = పిమ్మట; ప్రసాద్య = అనుగ్రహింపచేసుకొని; శిరసా = శిరస్సు వంచి నమస్కరించుటచే; తం = ఆ; విప్రమ్ = బ్రాహ్మణుని; దేవ = దేవతలచే; వర్ణితమ్ = కీర్తింపబడువానిని; యజ్ఞాయ = యజ్ఞము చేయించుటకై; వరయామాస = వరించెను; సంతానార్థమ్ = పుత్ర సంతానార్థం; కులస్య = వంశాభివృద్ధికై; వై = కూడా; .
భావము:-
అంతట దశరథుడు దేవతలు కీర్తించు ఋష్యశృంగునికి నమస్కరించి, అనుగ్రహింపచేసుకొని, “నా వంశమునకు పుత్రపౌత్రాద్యభివృద్ధి కలుగునట్లు యజ్ఞము చేయింపుము” అని పలికి, ఆతనిని ఋత్విక్కుగా వరించెను.
1.12.3.
అనుష్టుప్.
తథేతి చ స రాజానం
ఉవాచ చ సుసత్కృతః ।
“సంభారాః సంబ్రియంతాం తే
తురగశ్చ విముచ్యతామ్" ॥
టీక:-
తథః = అటులనే; ఇతి = అగుగాక అని; చ; సః = అతడు ఋష్యశృంగుడు; రాజానమ్ = రాజుతో; ఉవాచ = పలికెను. సుసత్కృతః = బాగుగా సత్కరింపబడినవాడు; సంభారాః = సంభారములు; సంభ్రియంతామ్ = ఏర్పరచబడుగాక; తే = నీయొక్క; తురగః = అశ్వము; చ; విముచ్యతాం = విడువబడుగాక.
భావము:-
బాగుగా ఆదరింపబడిన ఋష్యశృంగుడు “అటులనే చేయించెదను. యజ్ఞ సంభారము లన్నియు సమకూర్చుము. యజ్ఞాశ్వమును విడువుము” అని పలికెను.
1.12.4.
అనుష్టుప్.
తతో రాజాబ్రవీద్వాక్యం
సుమంత్రం మంత్రిసత్తమమ్ ।
సుమంత్రావాహయ క్షిప్రమ్
ఋత్విజో బ్రహ్మవాదినః ॥
టీక:-
తతః = అటుపిమ్మట; రాజా = రాజు; అబ్రవీత్ = పలికెను; వాక్యమ్ = ఆజ్ఞను; మంత్రిసత్తమమ్ = మంత్రిశ్రేష్ఠుడైన; సుమంత్ర = ఓ సుమంత్రుడా; ఆవాహయ = ఆహ్వానించుము; క్షిప్రమ్ = శీఘ్రముగా; ఋత్విజః = ఋత్విక్కులను; బ్రహ్మవాదినః = వేదవిదులైనవారిని.
భావము:-
అంత దశరథుడు మంత్రిశ్రేష్ఠుడైన సుమంత్రునితో - “సుమంత్రా। తొందరగా పిలుపించు బ్రహ్మవాదులైన ఋత్విక్కులను. . . .
1.12.5.
అనుష్టుప్.
సుయజ్ఞం వామదేవం చ
జాబాలిమథ కాశ్యపమ్ ।
పురోహితం వసిష్ఠం చ
యే చాప్యన్యే ద్విజాతయః" ॥
టీక:-
సుయజ్ఞమ్ = సుయజ్ఞుని; వామదేవం = వామదేవుని; చ = ఇంకా; జాబాలిమ్ = జాబాలిని; అథ = మఱియు; కాశ్యపమ్ = కాశ్యపుని; పురోహితమ్ = పురోహితుడైన; వసిష్ఠం = వసిష్ఠుని; చ = కూడ; యః = ఆయొక్క; చ; అపి = కూడ; అన్యః = ఇతరులు; ద్విజాతాయః = విప్రులను.
భావము:-
సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుని, పురోహితుడైన వసిష్ఠుని, ఇతర బ్రాహ్మణోత్తములను” అని పలికెను.
1.12.6.
అనుష్టుప్.
తతః సుమంత్రస్త్వరిత
గత్వా త్వరితవిక్రమః ।
సమానయత్స తాన్ సర్వాన్
సమర్థాన్ వేదపారగాన్ ॥
టీక:-
తతః = పిమ్మట; సుమన్త్రః = సుమంత్రుడు; త్వరితమ్ = శీఘ్రముగా; గత్వా = వెళ్ళి; త్వరిత = శీఘ్రమైన; విక్రమః = గమనము గలవాడు; సమానయత్ = తీసుకొని వచ్చెను; తాన్ = వారిని; సర్వాన్ = అందరినీ; సఃమర్థాన్ = సమర్థులైన; వేదపారగాన్ = వేదపండితులను.
భావము:-
అనంతరము శీఘ్ర గమనము గల సుమంత్రుడు త్వరత్వరగా వెళ్ళి, వేదపారంగతులైన ఆ బ్రాహ్మణోత్తములను అందరిని తీసుకొని వచ్చెను.
1.12.7.
అనుష్టుప్.
తాన్ పూజయిత్వా ధర్మాత్మా
రాజా దశరథస్తదా ।
ధర్మార్థసహితం యుక్తం
శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ॥
టీక:-
తాన్ = వారిని; పూజయిత్వా = పూజించి; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; దశరథః రాజా = దశరథమహారాజు; తదా = అప్పుడు; ధర్మ = ధర్మముబద్ధం; అర్థ = చక్కటి అర్థములు; సహితమ్ = తోకూడిన; యుక్తం = సందర్భానికి తగిన విధమైన; శ్లక్ష్ణమ్ = మృదువైన; ఇదం = ఈవిధమైన; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ధర్మాత్ముడైన ఆ దశరథమహారాజు వారిని ధర్మబద్దమై, అర్థవంతమై తగినట్టి మధురమైన పలుకులతో ఆదరించెను.
1.12.8.
అనుష్టుప్.
మమ లాలప్యమానస్య
పుత్రార్థం నాస్తి వై సుఖమ్ ।
తదర్థం హయమేధేన
యక్ష్యామీతి మతిర్మమ ॥
టీక:-
మమ = నాకు; లాలప్యమానస్య = బాధపడుచున్న; పుత్రార్థమ్ = పుత్రులకొరకు; నాస్తి = లేదు; వై = ఏమాత్రం; సుఖమ్ = సుఖము; తత్ = దాని; అర్థం = కోసము; హయమేథేన = అశ్వమేధయాగము; యక్ష్యామి = చేయుదును; ఇతి = అని; మతిః = అభిప్రాయము; మమ = నా.
భావము:-
"పుత్రులు లేరని బాధపడుచున్న నాకు సుఖమనునది లేదు. అందుచే అశ్వమేధయాగము చేయవలెనని నా ఉద్దేశము.
1.12.9.
అనుష్టుప్.
తదహం యష్టుమిచ్ఛామి
శాస్త్రదృష్టేన కర్మణా ।
ఋషిపుత్ర ప్రభావేన
కామాన్ ప్రాప్స్యామి చాప్యహమ్" ॥
టీక:-
తత్ = ఆ కారణము వలన; అహం = నేను; యష్టుమ్ = యాగమును; ఇచ్ఛామి = చేయవలెనని కోరుచున్నాను; శాస్త్రదృష్టేన = శాస్త్రవిహితమైన; కర్మణా = వేదకర్మల వలన; ఋషిపుత్ర = ఋషిపుత్రుడైన ఋశ్యశృంగుని; ప్రభావేనః = ప్రభావము వలన; కామాన్ = పుతులు కావాలను కోరికలను; ప్రాప్యామి = పొందగలను; చ = కూడా; అపి = నిశ్చయంగా; అహం = నేను.
భావము:-
అందుచే యథావిధిగా యాగము చేయాలనుకుంటున్నాను. శాస్త్రబద్దమైన యాగాకర్మల వలన, ఋషిపుత్రుడైన ఈ ఋష్యశృంగుని ప్రభావము వలన నా కోరికలు తప్పక తీరును."
1.12.10.
అనుష్టుప్.
తతః సాధ్వితి తద్వాక్యం
బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ ।
వసిష్ఠప్రముఖాః సర్వే
పార్థివస్య ముఖాచ్చ్యుతమ్ ॥
టీక:-
తతః = అటుపిమ్మట; సాధు = చాలా బాగున్నది; ఇతి = అని; తత్ = ఆ; వాక్యమ్ = పలుకులను; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; ప్రత్యపూజయన్ = అభినందించిరి; వసిష్ఠప్రముఖాః = వసిష్ఠుడు మొదలైన; సర్వే = అందరు కూడా; పార్థివస్య = రాజుయొక్క; ముఖాత్ = నోటి నుండి; చ్యుతమ్ = వెలువడిన వాటిని.
భావము:-
దశరథుని నిర్ణయము చాలా బాగున్నదని ఆ బ్రాహ్మణులు అభినందింతురు. దశరథ మహారాజు పలికిన పలుకులను వసిష్ఠుడు మొదలైనవారందరూ కూడా అభినందితురు.
1.12.11.
అనుష్టుప్.
ఋశ్యశృంగ పురోగాశ్చ
ప్రత్యూచుః నృపతిం తదా ।
సంభారాః సంబ్రియంతాం తే
తురగశ్చ విముచ్యతామ్" ॥
టీక:-
ఋష్యశృంగః = ఋష్యశృంగుడు; పురోగాః = మొదలైన వారు; చ; ప్రత్యూచుః = పలికిరి; నృపతిమ్ = రాజుతో; తదా = అప్పుడు; సంభారాః = యజ్ఞ సంభారములు; సంభ్రియంతామ్ = సమకూర్చబడుగాక; తే = నీయొక్క; తురగః = అశ్వము; చ; విముచ్యతాం = విడువబడుగాక.
భావము:-
ఋష్యశృంగాదులు రాజుతో ఇలా అన్నారు “యజ్ఞసంభారములను సమకూర్చుము, అశ్వమును విడువుము”.
1.12.12.
అనుష్టుప్.
సర్వథా ప్రాప్స్యసే పుత్రాన్
చతురోఽ మితవిక్రమాన్ ।
యస్య తే ధార్మికీ బుద్ధిః
ఇయం పుత్రార్థమాగతా ॥
టీక:-
సర్వథా = తప్పక; ప్రాప్స్యసే = పొందగలవు; పుత్రాన్ = పుత్రులను; చతురః = నలుగురు; అమిత = అనంతమైన; విక్రమాన్ = పరాక్రమవంతులైనవారిని; యస్య = ఏ; తే = నీకు; పుత్రార్థమ్ = పుత్రులకొరకై; ఇయమ్ = ఈ; ధార్మికీ = ధార్మికమైన; బుద్ధిః = బుద్ధి; ఆగతా = కలిగినదో, అట్టి నీవు.
భావము:-
పుత్రులకొరకై ధర్మసమ్మతమైన బుద్ధి జనించినట్టి, నీవు తప్పక అనంత పరాక్రమవంతులు అగు నలుగురు పుత్రులను పొందగలవు.
1.12.13.
అనుష్టుప్.
తతః ప్రీతోఽ భవద్రాజా
శ్రుత్వా తు ద్విజభాషితమ్ ।
అమాత్యాం శ్చాబ్రవీద్రాజా
హర్షేణేదం శుభాక్షరమ్ ॥
టీక:-
తతః = అటుపిమ్మట; ప్రీతః = సంతోషించినవాడు; అబవత్ = అయి; రాజా = రాజు దశరథుడు; శ్రుత్వా = విని; తు; ద్విజ = బ్రాహ్మణుల; భాషితమ్ = పలుకులను; అమాత్యాం = మంత్రుల; చ = కూడ; అబ్రవీత్ = పలికెను; రాజా = రాజు దశరథుడు; హర్షేణ = సంతోషముతో; శుభాక్షరమ్ = మంచి అక్షరములు గలదానిని.
భావము:-
ఆ బ్రాహ్మణుల అమాత్యుల మాటలకు సంతసించిన దశరథుడు ఇట్లు పలికెను.
1.12.14.
అనుష్టుప్.
గురూణాం వచనాచ్ఛీఘ్రం
సంభారాః సంబ్రియంతు మే ।
సమర్థాధిష్ఠిత శ్చాశ్వః
సోపాధ్యాయో విముచ్యతామ్ ॥
టీక:-
గురూణామ్ = గురువుల; వచనాత్ = మాట ప్రకారము; శీఘ్రః = వెంటనే; సంభారాః = యజ్ఞ సామగ్రి; సంభ్రియంతు = సమకూర్చబడుగాక; మే = నా; సమర్థాః = సమర్థులైన వీరులచే; అధిష్ఠితః = రక్షింపబడిన; చ; అశ్వః = అశ్వము; స = కూడ ఉండు; ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతో; విముచ్యతామ్ = విడువబడుగాక.
భావము:-
మా గురువులు చెప్పిన విధముగా వెంటనే యజ్ఞసామగ్రి సమస్తము సమకూర్చుడు. సమర్థులైన వీరుల రక్షణలో అశ్వమును విడిచి, కూడా ఉపాధ్యాయులను పంపుడు.
1.12.15.
అనుష్టుప్.
సరయ్వాశ్చోత్తరే తీరే
యజ్ఞభూమి ర్విధీయతామ్ ।
శాంతయ శ్చాభివర్దంతాం
యథాకల్పం యథావిధి ॥
టీక:-
సరయ్వాః = సరయూనదియొక్క; ఉత్తరే = ఉత్తరమువైపు; తీరే = తీరము నందు; యజ్ఞభూమిః = యాగశాల; విధీయతామ్ = నిర్మింపబడుగాక; యథాకల్పమ్ = వేదాంగవిధి ప్రకారం; యథావిధి = పద్ధతి ప్రకారముగా; శాంతయశ్చ = శాంతులు కూడా; అభివర్ధంతామ్ = వృద్ధిపొందుగాక.
భావము:-
సరయూనది ఉత్తరతీరమున యజ్ఞభూమిని ఏర్పాటు చేయుడు. శాస్త్రోక్త ప్రకారముగా, నియమబద్ధముగా శాంతి కార్యముల సహితముగ జరిపించుడు.
గమనిక:-
*- కల్పము - షడంగాలలోని వేద విహిత కర్మల విధివిధానాలను తెలియజేసే శాస్త్రం, కల్పసూత్రము, మానవుల విధులను తెలియజేయునది శిక్షా గ్రంథము.
1.12.16.
అనుష్టుప్.
శక్యః కర్తుమయం యజ్ఞః
సర్వేణాపి మహీక్షితా ।
నాపరాధో భవేత్కష్టో
యద్యస్మిన్ క్రతుసత్తమే ॥
టీక:-
శక్యః = సాధ్యమైనది; కర్తుం = చేయుదురు; అయం = ఈ; సర్వేణా = అందరు; అపి = కూడ; మహీక్షితా = రాజు; న = లేకుండుట; అపరాధః = అపాయములు; భవేత్ = కలుగుట; కష్టః = ఇబ్బందులు; యది = అయినచో; అస్మిన్ = ఈ; క్రతు = యజ్ఞము; సత్తమే = శ్రేష్ఠము నందు.
భావము:-
ఈ అశ్వమేధయాగములో అపాయములు, ఇబ్బందులు ఏమీ లేకపోతే అందరు రాజులు దీనిని చేయదురు.
1.12.17.
అనుష్టుప్.
ఛిద్రం హి మృగయంతేఽ త్ర
విద్వాంసో బ్రహ్మరాక్షసా ।
విఘ్నితస్య హి యజ్ఞస్య
సద్యః కర్తా వినశ్యతి ॥
టీక:-
ఛిద్రమ్ = అపరాధము, లోపము; హి = కోసమే; మృగయంత = వెతుకుతుందురు; తె = వారు; అత్ర = అక్కడ; విద్వాంసః = పండితులైన; బ్రహ్మరాక్షసా = బ్రహ్మరాక్షసులు; విఘ్నితః = భంగమైనదా; అస్య; యజ్ఞస్య = యాగముయొక్క; కర్తా = యజమాని; సద్యః = వెంటనే; వినశ్యతి = నశించును.
భావము:-
అక్కడ విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు అపరాధము జరుగుతుందేమో అని వెతుకుతుంటారు. ఒకవేళ యజ్ఞం భంగమైనచో వెంటనే యజమాని నశించును.
1.12.18.
అనుష్టుప్.
తద్యథా విధిపూర్వం మే
క్రతురేష సమాప్యతే ।
తథా విధానం క్రియతాం
సమర్థాః కరణేష్విహ ॥
టీక:-
తత్ = ఆ కారణము వలన; యథా = ఏవిధముగ; విధిపూర్వమ్ = శాస్త్రపద్దతి ప్రకారముగ; మే = నాయొక్క; క్రతుః = యజ్ఞము; ఏషః = ఈ; సమాప్యతే = సుసంపూర్ణ మగునో; తథా = అటువంటి; విధానమ్ = ఏర్పాటు; క్రియతామ్ = చేయబడుగాక, ఇహ = ఇచట (మీరు); కరణేషు = కార్యములయందు; సమర్థాః = సమర్థులు; హ = కదా.
భావము:-
అందుచే, ఈ క్రతువు శాస్త్రప్రకారము పూర్తియగునట్లు చూడుడు. మీరందరును కార్యములయందు ఆరితేరినవారే కదా।"
1.12.19.
అనుష్టుప్.
తథేతి చ తతః సర్వే
మంత్రిణః ప్రత్యపూజయన్ ।
పార్థివేంద్రస్య తద్వాక్యం
యథాఽఽ జ్ఞప్త మకుర్వత ॥
టీక:-
తథేతి = అటులనే చేయగలము అని; చ; తతః = పిమ్మట; మంత్రిణః = మంత్రులు; సర్వే = అందరును; ప్రత్యపూజయన్ = గౌరవించిరి; పార్థివేంద్రస్య = రాజశ్రేష్ఠునియొక్క; తత్ = ఆ; వాక్యమ్ = పలుకులను; యథా = తగినట్లు; జ్ఞప్తమ్ = ఆజ్ఞాపించినదానికి; అకుర్వత = చేసిరి.
భావము:-
“అటులనే అగుగాక” అని మంత్రులందరును దశరథుని మాటలను గౌరవించిరి. అతడు ఆజ్ఞాపించిన విధముగా చేసిరి.
1.12.20.
అనుష్టుప్.
తతో ద్విజాస్తే ధర్మజ్ఞం
అస్తువన్ పార్థివర్షభమ్ ।
అనుజ్ఞాతాస్తతః సర్వే
పునర్జగ్ముర్యథాఽఽ గతమ్ ॥
టీక:-
తతః = పిమ్మట; ద్విజాః = బ్రాహ్మణులు; తే = ఆ; ధర్మజ్ఞమ్ = ధర్మమునెరిగినవాడైన; అస్తువన్ = స్తుతించిరి; పార్థివర్షభమ్ = రాజశ్రేష్ఠుని; అనుజ్ఞాతాః = అనుజ్ఞ ఈయబడిన వారై; తతః = అచటినుండి; సర్వే = అందరు; పునః = మరల; జగ్ముః = వెళ్ళిరి; యథాగతమ్ = వచ్చిన విధముననే.
భావము:-
పిమ్మట ఆ బ్రాహ్మణులు ధర్మజ్ఞుడైన దశరథుని కొనియాడి, అతని అనుజ్ఞ గైకొని, స్వస్థానములకు తిరిగి వెళ్ళిరి.
1.12.21.
అనుష్టుప్.
గతేష్వథ ద్విజాగ్ర్యేషు
మంత్రిణస్తాన్నరాధిపః ।
విసర్జయిత్వా స్వం వేశ్మ
ప్రవివేశ మహాద్యుతిః ॥
టీక:-
గతేషు = వెళ్ళగానే; అథ = అటు పిమ్మట; ద్విజాగ్ర్యేషు = బ్రాహ్మణశ్రేష్ఠులు; మంత్రిణః = మంత్రులను; తాన్ = ఆ; నరాధిపః = రాజు; విసర్జయిత్వా = పంపివేసి; స్వం = తన; వేశ్మ = గృహమును; ప్రవివేశ = ప్రవేశించెను మహాద్యుతిః = గొప్పకాంతిగల.
భావము:-
బ్రాహ్మణులు వెడలిపోయిన పిమ్మట, తేజశ్శాలి యగు దశరథుడు మంత్రులను కూడ పంపించి తన గృహమును ప్రవేశించెను.
1.12.22.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్వాదశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్వాదశ [12] = పన్నెండవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [12] పన్నెండవ సర్గ సుసంపూర్ణము