2.3.1.
అనుష్టుప్.
తేషామంజలి పద్మాని
ప్రగృహీతాని సర్వశః।
ప్రతిగృహ్యాబ్రవీద్రాజా
తేభ్యః ప్రియహితం వచః ‘‘॥
టీక:-
 తేషామ్ = వారి యొక్క; అంజలి = దోసిళ్ళు అను; పద్మాని = పద్మములు; ప్రగృహీతాని– గ్రహించబడిన; సర్వశః = అన్ని విధములుగ; ప్రతిగృహ్య = గైకొని; అబ్రవీత్ = పలికెను; రాజా = రాజు; తేభ్యః = వారికి; ప్రియహితం = ఇష్టమగునది, నచ్చునది; వచః = మాట.
భావం;-
 ఈ విధముగా పలికి ఆ పౌర, జానపద శ్రేష్ఠులు పద్మముల వంటి దోసిళ్లతో దశరథునకు నమస్కరించిరి. అతడు ఆ నమస్కారములను స్వీకరించెను. వారికి ప్రియమైన, హితమైన వాక్యములతో ఇలా పలికెను.
2.3.2.
అనుష్టుప్.
“అహోఽస్మి పరమప్రీతః
ప్రభావశ్చాతులో మమ।
యన్మే జ్యేష్ఠం ప్రియం పుత్రమ్
యౌవరాజ్యస్థ మిచ్ఛథః”॥
టీక:-
 అహో = ఓ; అస్మి = అయి ఉంటిని; పరమ = అత్యంతముగా; ప్రీతః = సంతోషించినవాడను; ప్రభావః = పెంపు; చ = కూడా; అతులః = సాటిలేనిది; మమ = నా యొక్క; యత్=ఎందులకు; మే=నాయొక్క; జ్యేష్ఠం = ప్రథముడును; ప్రియమ్ = ప్రీతిపాత్రుడను; పుత్రమ్ = కుమారుని; యౌవరాజ్యస్థమ్ = యువరాజస్థానములో ఉన్నవానిగా; ఇచ్ఛథః = కోరుచుంటిరి.
భావం;-
 “నాకు మిక్కిలి ప్రీతిగల నా పెద్ద కుమారుడు యౌవరాజ్యాభిషిక్తుడు కావలెనని మీరు సకలురు కోరుచున్నందులకు మిక్కిలి సంతోషించుచుంటిని. నా భాగ్యము సాటిలేనిదని భావించుచుంటిని.”
2.3.3.
అనుష్టుప్.
ఇతి ప్రత్యర్చ్య తాన్రాజా
బ్రాహ్మణా నిదమబ్రవీత్।
వసిష్ఠం వామదేవం చ
తేషామేవోపశృణ్వతామ్॥
టీక:-
 ఇతి = ఈ విధముగా; ప్రతి = తిరిగి, మారు; అర్చ్య = గౌరవించి; తాన్ = వారిని; రాజా = రాజు; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను గూర్చి; ఇదమ్ = ఈ మాటలను; అబ్రవీత్ = పలికెను; వసిష్ఠమ్ = వశిష్ఠునిగూర్చి; వామదేవమ్ = వామదేవునిగూర్చి; చ = ఇంకను ఉన్న; తేషామ్ = వారందరు; ఏవ=అటుల; ఉపశృణ్వతామ్ = వినుచుండగా.
భావం;-
 దశరథమహారాజు పురజనులను, జానపదులను తిరిగి గౌరవించెను. పిమ్మట వారు వినుచుండగా వసిష్ఠ వామదేవులు మున్నగు బ్రాహ్మణులతో ఇట్లు పలికెను.
2.3.4.
అనుష్టుప్.
“చైత్రశ్శ్రీమానయం మాసః
పుణ్యః పుష్పితకాననః।
యౌవరాజ్యాయ రామస్య
సర్వమే వోపకల్ప్యతామ్”॥
టీక:-
 చైత్రః = చైత్ర మాసము; శ్రీమాన్ = సంపద్కరమైనది; అయం = ఈ; మాసః = నెల; పుణ్యః = పుణ్యమైనది; పుష్పిత = పుష్పించిన; కాననః = వనములు కలది; యౌవరాజ్యాయ = యౌవరాజ్యము కొరకు; రామస్య = రాముని యొక్క; సర్వమ్ + ఏవ = అన్నియును; ఉపకల్ప్యతామ్ = సిద్ధపరుచబడుగాక/
భావం;-
 “నెలలు అన్నింటిలోనూ అడవులు పుష్పించు చైత్రమాసము సంపద్కరమైనదియు. అప్పటికి యువరాజుగా రాముని పట్టాభిషేకము కొరకు ఏర్పాట్లు అన్నియు చేయించండి” అనెను.
2.3.5.
అనుష్టుప్.
రాజ్ఞస్తూపరతే వాక్యే
జనఘోషో మహానభూత్।
శనైస్తస్మిన్ప్రశాంతే చ
జనఘోషే జనాధిపః॥
టీక:-
 రాజ్ఞః = రాజుయొక్క; తు; ఉపరతే = పూర్తి అవుచున్నతరుణంలో; వాక్యే = మాట; జనఘోషః = ప్రజల ధ్వానములు; మహాన్ = గొప్పదైన; అభూత్ = అయ్యెను; శనైః = నెమ్మదిగా; తస్మిన్ = ఆ; ప్రశాంతే = ప్రశాంతించుచుండగా; చ; జనఘోషే = ప్రజాస్పందనల ధ్వని; జనాధిపః = రాజు.
భావం;-
 దశరథమహారాజు మాటలు పూర్తి అగుచునే ప్రజలు గొప్పగా హర్షధ్వానములు చేసిరి. ఆ హర్షధ్వానములు మెల్లగా శాంతించాక దశరథుడు.
2.3.6.
అనుష్టుప్.
వసిష్ఠం మునిశార్దూలమ్
రాజా వచనమబ్రవీత్।
“అభిషేకాయ రామస్య
యత్కర్మ సపరిచ్ఛదమ్॥
టీక:-
 వసిష్ఠం = వశిష్ఠునిగూర్చి; ముని శార్దూలమ్ = మునులలో శ్రేష్ఠునిగురించి; రాజా = రాజు; వచనమ్ = వచనమును; అబ్రవీత్ = పలికెను; అభిషేకాయ = అభిషేకము కొరకు; రామస్య = రాముని యొక్క; యత్కర్మ = ఏమి చేయవలయునో ఆ పనులు; స = కూడా; పరిచ్ఛదమ్ = పరివారములతో.
భావం;-
 మునిశ్రేష్ఠుడైన వసిష్ఠునితో ఇట్లు పలికెను, “పూజ్యుడా! రామ పట్టాభిషేకమునకు కావలసిన పనులను పరివారమునకు పురమాయించండి.
2.3.7.
అనుష్టుప్.
తదద్య భగవన్ సర్వమ్
ఆజ్ఞాపయితు మర్హసి”।
తచ్ఛ్రుత్వా భూమిపాలస్య
వసిష్ఠో ద్విజసత్తమః॥
టీక:-
 తత్ = దానిని ; అద్య = ఇప్పుడు; భగవన్ = పూజ్యుడా !; సర్వమ్ = మొత్తమును; ఆజ్ఞాపయితుమ్ = ఆదేశించుటకు; అర్హసి = అర్హుడవై యుంటివి; తత్ = దానిని; శ్రుత్వా = విని; భూమిపాలస్య = మహారాజు యొక్క; వశిష్ఠః = వశిష్ఠుడు; ద్విజసత్తమః = విప్రులలో శ్రేష్ఠుడు.
భావం;-
 పూజ్యుడా ! ఓ వశిష్ఠమహర్షీ! ఇక అవన్నియును సిద్దపరుచమని ఆదేశించండి” విప్రులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుడు ఆ పలుకులు విని..
2.3.8.
అనుష్టుప్.
ఆదిదేశాగ్రతో రాజ్ఞః
స్థితాన్యుక్తాన్ కృతాంజలీన్।
“సువర్ణాదీని రత్నాని
బలీన్ సర్వౌషధీరపి॥
టీక:-
 ఆదిదేశ = ఆజ్ఞాపించెను; అగ్రతః = ఎదుటనున్న; రాజ్ఞః = మహారాజు; స్థితాన్ = ఉన్నవారిని; యుక్తాన్ = అధికారులను; కృతాంజలీన్ = నమస్కరిస్తున్నవారిని, కృత + అంజలీన్, చేతులుజోడించి ఉన్నవారిని; సువర్ణః = బంగారము; ఆదీని = మొదలైనవానిని; రత్నాని = రత్నములను; బలీన్ = పూజాద్రవ్యములను; సర్వ = సకల; ఔషధీః = ఔషదములను; అపి = కూడ.
భావం;-
 అచట రాజు ఎదుట చేతులుజోడించి ఉన్నఅధికారులతో వసిష్ఠుడు ఇలా ఆజ్ఞాపించెను. “పూజ చేయుటకు బంగారమును, వజ్రములు, రకరకముల ఓషధులను మొదలగువాటిని మఱియు ఇతర పూజాద్రవ్యములను అన్నింటినీ తీసుకురండి. ఇంకా
2.3.9.
అనుష్టుప్.
శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ
పృథక్చ మధుసర్పిషీ।
అహతాని చ వాసాంసి
రథం సర్వాయుధాన్యపి॥
టీక:-
 శుక్ల = తెల్లని; మాల్యామ్ = పూలమాలలను; చ = కూడ; లాజామ్ = పేలాలను; చ = కూడ; పృథక్ = ప్రత్యేకముగ; చ; మధు = తేనె; సర్పిషీ = నేయి; అహతాని = నూతన; వాసాంసి = వస్త్రములను; చ = కూడ; రథం = రథము; సర్వ = సమస్త; ఆయుధాన్ = ఆయుధములను; అపి = సహితము.
భావం;-
 తెల్లని పూలమాలలు, పేలాలు, ప్రత్యేకముగా తేనె నెయ్యి, నూతన వస్త్రములు, రథము, సకల ఆయుధములను. ఇంకనూ
2.3.10.
అనుష్టుప్.
చతురంగబలం చైవ
గజం చ శుభలక్షణమ్।
చామరవ్యజనే శ్వేతే
ధ్వజం ఛత్రం చ పాండురమ్॥
టీక:-
 చతురంగబలంమ్ = చతురంగబలములను {చతురంగబలములు- రథ, గజ, తురగ, పదాతిదళ సహిత సైన్యము}; చ; ఏవ = ముఖ్యముగ; గజం = ఏనుగులను; చ = ఇంకా; శుభలక్షణమ్ = శుభసూచకములు గల; చామరవ్యజనే = చమరీ మృగ చర్మముతో తయారయిన వింజామరలను; శ్వేతే = తెల్లనైన; ధ్వజం = పతాకమును; ఛత్రం = గొడుగును; పాండురమ్ = తెల్లని
భావం;-
 రథగజహయపదాతిదళ సైన్యమైన చతురంగ బలాలను, శుభలక్షణములు గల ఏనుగులను, చమరీమృగచర్మముతో చేసిన తెల్లని వింజామరలను, తెల్లని గొడుగును, ధ్వజమును. మఱియును.
2.3.11.
అనుష్టుప్.
శతం చ శాతకుంభానాం
కుంభానా మగ్నివర్చసామ్।
హిరణ్యశృంగ మృషభమ్
సమగ్రం వ్యాఘ్రచర్మ చ॥
టీక:-
 శతమ్ = వందసంఖ్యలో; చ = ఇంకా; శాత = బంగారపు; కుంభానామ్ = కుండలను; అగ్నిః = అగ్నివలె; వర్చసామ్ = ప్రకాశించుచున్నవానిని; హిరణ్యశృంగమ్ = బంగారు కొమ్ములు కలిగినవానిని; వృషభమ్ = ఎద్దును; సమగ్రం = పూర్తిగా ఉన్న; వ్యాఘ్రచర్మ చ = పులిచర్మమును
భావం;-
 నిప్పుకణికలవలె తళతళ మెఱిసే బంగారపు కుండలను వందలకొలదియును, బంగారు తొడుగుల కొమ్ములు కలిగిన వృషభమును, సమగ్రమైన పులిచర్మమును (పూర్తిగా ఉన్నది) మున్నగు.
2.3.12.
అనుష్టుప్.
ఉపస్థాపయత ప్రాతః
అగ్న్యగారం మహీపతేః।
యచ్చాన్యత్కించిదేష్టవ్యం
తత్సర్వముపకల్ప్యతామ్॥
టీక:-
 ఉపస్థాపయత = సమీకరించి చేర్చుడు; ప్రాతః = తెల్లవారుసమయమున; అగ్న్యగారం = అగ్ని + ఆగారం, హోమశాలను; మహీపతేః = రాజు యొక్క; యత్ = ఏది; చ = ఇంకను; అన్యత్ = మఱియొకటి; న = లేదు; కించిత్ = కొంచెము; ఏష్టవ్యమ్ = ఆపేక్షింపబడెనో; తత్ = అది; సర్వమ్ = అంతయు; ఉపకల్ప్యతామ్ = సిద్ధముచేయబడుగాక!
భావం;-
 సకల సామగ్రిని సమీకరించండి. వాటిని ప్రభాతసమయమునకు రాజుగారి హోమశాలలో చేర్చండి. కావలసిన వస్తువులు ఏమాత్రము లోటురాకుండా సిద్ధము చేయండి.
2.3.13.
అనుష్టుప్.
అంతఃపురస్య ద్వారాణి
సర్వస్య నగరస్య చ।
చందన స్రగ్భిరర్చ్యంతామ్
ధూపైశ్చ ఘ్రాణహారిభిః॥
టీక:-
 అంతఃపురస్య = అంతఃపురముయొక్క; ద్వారాణి = ద్వారములు; సర్వస్య = అన్నిటియొక్క; నగరస్య = నగరముయొక్క; చ = మఱియు; చందనః = చందనముతోను; స్రగ్భిః = పూలదండలతోను; అర్చ్యంతామ్ = అలంకరింపబడుగాక; ధూపైః = ధూపములతోనూ; చ = ఇంకను; ఘ్రాణహారిభిః = ఘ్రాణేంద్రియములను ఆకర్షించు సుగంధ పరిమళములతోను
భావం;-
 అంతఃపుర ద్వారములను నగర ద్వారములను అన్నింటిని చందనము పూతలతోనూ, పూలదండలతోనూ అలంకరించండి. మనోజ్ఞమైన సువాసనలు వెదజల్లే ధూపములు వేయించండి.
2.3.14.
అనుష్టుప్.
ప్రశస్తమన్నం గుణవత్
ధధిక్షీరోపసేచనమ్।
ద్విజానాం శతసాహస్రే
యత్ప్రకామమలం భవేత్॥
టీక:-
 ప్రశస్తమ్ = తాళింపు పెట్టినది, ఆంధ్రవాచస్పతము; అన్నమ్ = అన్నము; గుణవత్ = కమ్మని, ఆంధ్రవాచస్పతము; దధి = పెరుగు; క్షీరః = పాలు; ఉపసేచనమ్ = ద్రవములతో కలుపబడినది; ద్విజానామ్ = బ్రాహ్మణుల యొక్క; శతసాహస్రే = వంద వేలకు; యత్=ఏది; ప్రకామమ్ = కోరినంతగా; అలమ్ భవేత్ = సరిపోవునట్లుండుగాక
భావం;-
 తాళింపు (పోపు) పెట్టించి పాలు పెరుగు మిళాయించిన మంచి కమ్మని అన్నములు వండించవలెను. వేలకొలది బ్రాహ్మణులకు సమృద్ధిగా సరిపడవలెను.
2.3.15.
అనుష్టుప్.
సత్కృత్య ద్విజముఖ్యానామ్
శ్వఃప్రభాతే ప్రదీయతామ్।
ఘృతం దధి చ లాజాశ్చ
దక్షిణాశ్చాపి పుష్కలాః॥
టీక:-
 సత్కృత్య = గౌరవించి; ద్విజముఖ్యానామ్ = బ్రాహ్మణ ప్రముఖులకు; శ్వః = రేపు; ప్రభాతే = ప్రొద్దున; ప్రదీయతామ్ = ఇవ్వబడుగాక; ఘృతం = నెయ్యి; దధి = పెరుగు; చ=మఱియు; లాజాః = పేలాలు; చ=మఱియు; దక్షిణాః = దక్షిణలను; చాపి = మఱియు; పుష్కలాః = సమృద్ధిగా
భావం;-
 ఆ అన్నము, నెయ్యి, పెరుగు, పేలాలు, పుష్కలముగ దక్షిణలు రేపు ప్రాతఃకాలమున బ్రాహ్మణ ప్రముఖులకు గౌరవముతో, సత్కారపూర్వకముగా ఇవ్వవలెను.
2.3.16.
అనుష్టుప్.
సూర్యేఽభ్యుదితమాత్రే శ్వో
భవితా స్వస్తివాచనమ్।
బ్రాహ్మణాశ్చ నిమంత్రయంతాం
కల్ప్యంతా మాసనాని చ; ॥
టీక:-
 సూర్యః = సూర్యుడు; అభి + ఉదితమాత్ర = ఉదయించగనే; శ్వః = రేపు; భవితా = జరుగుగాక; స్వస్తి వాచనమ్ = శుభము కలిగించు వచనములు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులును; చ=మఱియు; నిమంత్రయంతాం = ఆహ్వానింపబడుదురు గాక; కల్ప్యంతామ్ = సిద్ధము చేయబడునుగాక; ఆసనాని = ఆసనములు; చ= కూడ.
భావం;-
 రేపు సూర్యోదయము కాగానే స్వస్తి వాచనము పలుకవలెను. బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తగు ఆసనములు ఏర్పాటుచేయవలెను.
2.3.17.
అనుష్టుప్.
ఆబధ్యంతాం పతాకాశ్చ
రాజమార్గశ్చ సిచ్యతామ్।
సర్వే చ తాళావచరా
గణికాశ్చ స్వలంకృతాః।
టీక:-
 పురమునందు పతాకములు కట్టించి రాజవీథులను కళ్ళాపి జల్లవలెను. తాళములు వేయు నటులు, బాగుగా అలంకరించుకున్న వేశ్యాంగనలు, రాజప్రాసాదము నందలి రెండవ అంతస్తులో వచ్చియుండు ఏర్పాటు చేయండి.
భావం;-
 తిష్ఠంతు నృపవేశ్మనః॥
2.3.18.
అనుష్టుప్.
దేవాయతనచైత్యేషు
సాన్నభక్షాః సదక్షిణాః।
ఉపస్థాపయిత వ్యాస్సు్యః
మాల్యయోగ్యాః పృథక్పృథక్॥
టీక:-
 దేవాయతనః = దేవాలయములు; చైత్యేషు = చతుష్పథమున నుండు మండపములు, గ్రామాదులకు ఎల్లగా కట్టిన కట్టడములు అందును, ఆంధ్రశబ్ధరత్నాకరము; స = సహితముగ; అన్న = ఆహారములతో; భక్షాః = పిండివంటలతో; స = సహితముగ; దక్షిణాః = దక్షిణలతో; ఉపస్థాపయితవ్యాస్స్యుః = సిద్ధపరచబడుదురు; మాల్య = మాలలకు; యోగ్యాః = అర్హమైన; ప్రథక్ పృథక్ = విడివిడిగా
భావం;-
 దేవతల పూజల కోసం దేవాలయములందును, నాలుగురోడ్ల మొగ మఱియు ఎల్లల మండపములందును వేటికి వాటికి తగిన పూలమాలలు, ఆహారములు, భక్ష్యములు, దక్షిణలు సంసిద్ధంగా ఉండునట్లు ఏర్పాటు చేయవలెను.
2.3.19.
అనుష్టుప్.
దీర్ఘాసిబద్ధా యోధాశ్చ
సన్నద్ధా మృష్టవాససః।
మహారాజాంగణం సర్వే
ప్రవిశంతు మహోదయమ్॥
టీక:-
 దీర్ఘాః = పెద్దపెద్ద; అసిః = కత్తులు; బద్ధాః = బెత్తములు, వేత్రములతో; యోధాః = వీరులు; చ = మఱియు; సన్నద్ధాః = సిద్ధముగా ఉన్నవారు; మృష్ట = పరిశుభ్రమైన; వాససః = వస్త్రములు ధరించినవారు; మహారాజాంగణం = రాజప్రాసాదానికి ముందు భాగమును, ముంగిలిని; సర్వే = అందరు; ప్రవిశస్తు = ప్రవేశించెదరుగాక; మహా = మిక్కలి; ఉదయమ్ = పొడవైన, శబ్దరత్నాకరము.
భావం;-
 యోధులందరును పరిశుభ్రమైన వస్త్రములు ధరించి, పెద్దపెద్ద బెత్తములు మఱియు కత్తులతో సిద్దమై రావలెను. మహారాజప్రాసాదపు ముంగిలి బాగా పొడవైనది. అక్కడకు వచ్చి సర్వసిద్దంగా ఉండవలెను.”
2.3.20.
అనుష్టుప్.
ఏవం వ్యాదిశ్య విప్రౌ తౌ
క్రియాస్తత్ర సునిష్ఠితౌ।
చక్రతుశ్చైవ యచ్ఛేషమ్
పార్థివాయ నివేద్య చ॥
టీక:-
 ఏవమ్ = ఈ విధముగా; వ్యాదిశ్య = ఆదేశించి; విప్రౌ = జ్ఞానులిరువురుని; తౌ = వారిని; క్రియాః = చేయవలసిన పనులు; తత్ర = అక్కడ; సునిష్ఠితౌ = నిబద్ధత గలవారు; చక్రతుః = చేసిరి; చ + ఏవ = స్థిరముగ; యత్ =ఏది; శేషమ్ = మిగిలినదానిని; పార్థివాయ = మహారాజు కొరకు; నివేద్య = నివేదించిరి; చ.
భావం;-
 జ్ఞానులైన వశిష్ఠుడు, వామదేవుడు ఇరువురు సావధాన చిత్తములతో అచట చేయవలసిన కార్యములన్నింటిని ఆదేశములు ఇచ్చిరి. దశరథునకు తెలిపి మిగతాపనులన్నీ కూడా నిర్వర్తించిరి.
2.3.21.
అనుష్టుప్.
కృతమిత్యేవ చాబ్రూతామ్
అభిగమ్య జగత్పతిమ్।
యథోక్తవచనం ప్రీతౌ
హర్షయుక్తౌ ద్విజర్షభౌ॥
టీక:-
 కృతమ్ = చేయబడినవి; ఇతి = అని; ఏవమ్ = అన్నియు; చ = మఱియు; అబ్రూతామ్ = పలికిరి; అభిగమ్య = సమీపించి; జగత్పతిమ్ = జగత్ + పతిమ్, ప్రపంచ ప్రభువుని, మహారాజుని; యథోక్త = యథాప్రకారము; వచనమ్ = చెప్పినవిధముగ; ప్రీతౌ = సంతృప్తిపొందిన (ఇరువురు) వారై; హర్షయుక్తౌ = ఆనందముతో కూడుకొన్న (ఇరువురు); ద్విజర్షభౌ = బ్రాహ్మణశ్రేష్ఠులు (ఇరువురు),
భావం;-
 తమ ఆదేశాల ప్రకారము అన్నియు జరుగుచున్నందులకు సంతృప్తి చెంది, ఆనందించిన వసిష్ఠవామదేవులు ఇరువురు దశరథమహరాజుని సమీపించి, “నీవు చెప్పిన విధముగ అన్నికార్యములు జరుగుచున్నవి” అని చెప్పిరి.
2.3.22.
అనుష్టుప్.
తత స్సుమంత్రం ద్యుతిమాన్
రాజా వచనమబ్రవీత్।
రామః కృతాత్మా భవతా
శీఘ్ర మానీయతామితి॥
టీక:-
 తతః = పిమ్మట; సుమంత్రమ్ = సుమంత్రుని గూర్చి; ద్యుతిమాన్ = ప్రకాశవంతుడు; రాజా = రాజు; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; రామః = రాముడు; కృతాత్మా = శిక్షితమైన బుద్ధి కలవాడు; భవతా = నీచే; శీఘ్రమ్ = వేగముగా; ఆనీయతామ్ = తీసుకొని రాబడునుగాక;ఇతి = అని
భావం;-
 పిమ్మట దశరథుడు సుమంత్రునితో “తేజశ్శాలి, సకల విద్యాభ్యాసములతో పరిశుద్ధుడైన రాముని శీఘ్రముగా కొనిరమ్ము” అని పలికెను.
2.3.23.
అనుష్టుప్.
స ‘‘తథేతి’’ ప్రతిజ్ఞాయ
సుమంత్రో రాజశాసనాత్।
రామం తత్రానయాంచక్రే
రథేన రథినాం వరమ్॥
టీక:-
 సః = ఆతడు; తథ = అటులనే; ఇతి = అని; ప్రతిజ్ఞాయ = మాటిచ్చి; సుమన్త్రః = సుమంత్రుడు; రాజ = మహారాజు; శాసనాత్ = ఆజ్ఞవలన; రామమ్ = రాముని; తత్ర = అక్కడ; ఆనయామ్ = తీసుకుని వచ్చుట; చక్రే = చేసెను; రథేన = రథముతో; రథినామ్ = రథికులలో; వరమ్ = శ్రేష్ఠుని
భావం;-
 సుమంత్రుడు దశరథ మహారాజు ఆజ్ఞానుసారము, రథికులలో శ్రేష్ఠుడైన రాముని రథముపై అచటికి తీసికొని వచ్చెను.
గమనిక:-
 రథి- రథమునెక్కి యుద్దము చేయువాడు, రథికులలో రకములు మహారథుడు, అతిరథుడు, సమరథుడు, అర్థరథుడు https://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=mahaaratha .
2.3.24.
అనుష్టుప్.
అథ తత్ర సమాసీనాః
తదా దశరథం నృపమ్।
ప్రాచ్యోదీచ్యాః ప్రతీచ్యాశ్చ
దాక్షిణాత్యాశ్చ భూమిపాః॥
టీక:-
 అథ = అటు పిమ్మట (సుమంత్రుడు నిష్క్రమించిన తరువాత); తత్ర = అక్కడ; సమాసీనాః = ఆసీనులైనవారు; తదా = ఆ విధముగా; దథరథమ్ = దశరథుని; నృపమ్ = రాజును; ప్రాచ్యః = తూర్పు దిక్కువారు; ఉదీచ్యాః = ఉత్తర దిక్కువారు; ప్రతీచ్యాః = పడమర దిక్కువారు; చ = మఱియును; దాక్షిణాత్యః = దక్షిణ దిక్కువారు; చ = మఱియును; భూమిపాః = రాజులు
భావం;-
 సుమంత్రుడు రాముని తీసుకొని వచ్చుటకు వెళ్లిన పిదప, తూర్పు, ఉత్తర, పడమటి, దక్షిణ దేశముల రాజులు అందరూ..
2.3.25.
అనుష్టుప్.
మ్లేచ్ఛాశ్చార్యాశ్చ యే చాన్యే
వనశై లాంతవాసినః।
ఉపాసాంచక్రిరే సర్వే
తం దేవా ఇవ వాసవమ్॥
టీక:-
 మ్లేచ్ఛాః = మ్లేచ్ఛ దేశపువారు; చ = మఱియును; ఆర్యాః = ఆర్యావర్తమువారు; చ = మఱియును; యే చ = ఎవరు ఉంటిరో; అన్యే = ఇతరులు; వనే = వనములలో; శైలాంత వాసినః = పర్వత ప్రాంతములలో నివసించువారు; ఉపాసామ్ = సేవించుటలు; చ; చక్రిరే = చేసిరి; సర్వే = అందరు; తమ్ = ఆతని; దేవాః = దేవతలు; ఇవ = వలె; వాసవమ్ = దేవేంద్రుని.
భావం;-
 మ్లేచ్ఛదేశ రాజులు, ఆర్యావర్త దేశ రాజులు; వన, పర్వత ప్రాంత పాలకులు అయినవారందరూ, దేవతలు దేవేంద్రుని సేవించునట్లు దశరథుని సేవించిరి.
గమనిక:-
 మ్లేచ్ఛాః- మ్లేచ్చులు- వ్యు. మ్లేచ్ఛ- అపశబ్దే+ ఘఞ్, కృ.ప్ర., అపశబ్దభాషి, శిష్టాచారహీనుడు, గోమాంస భక్షకుడు. మ్లేచ్ఛులు ఉండు కామరూపాది దేశముల వారు. ఆంధ్రశబ్దరత్మాకరము
2.3.26.
అనుష్టుప్.
తేషాం మధ్యే స రాజర్షిః
మరుతామివ వాసవః।
ప్రాసాదస్థో రథగతమ్
దదర్శాయాంత మాత్మజమ్॥
టీక:-
 తేషామ్ = వారియొక్క; మధ్యే = మధ్యలో; సః = అతడు; రాజర్షిః = రాజులయందు ఋషి; మరుతామ్ = దేవతల మధ్యలో; వాసవః = దేవేంద్రుని; ఇవ = వలె; ప్రాసాదస్థః = ప్రాసాదముపైన ఉన్నవాడు; రథగతమ్ = రథమునందున్న; దదర్శః = చూచెను; ఆయాంతమ్ = వచ్చుచున్న; ఆత్మజమ్ = తన కుమారుని
భావం;-
 దేవతల మధ్యమునందున్న దేవేంద్రుని వలె రాజర్షి దశరథుడు ఆ రాజుల మధ్య తన రాజప్రసాదముపై ఆసీనుడై ప్రకాశించుచుండెను. అక్కడనుండి రథములో వచ్చుచున్న తన కుమారుడైన రాముని చూచెను.
2.3.27.
అనుష్టుప్.
గంథర్వరాజ ప్రతిమం
లోకే విఖ్యాత పౌరుషమ్।
దీర్ఘబాహుం మహాసత్త్వం
మత్తమాతంగ గామినమ్॥
టీక:-
 గంథర్వరాజ = గంధర్వ రాజుతో; ప్రతిమమ్ = సరిపోలువాని; లోకే = లోకములో; విఖ్యాత = ప్రఖ్యాతి పొందిన; పౌరుషమ్ = పౌరుషము కలవానిని; దీర్ఘబాహుమ్ = పొడవైన బాహువులు కలవాని; మహాసత్త్వమ్ = బహుమిక్కిలి బలవంతుని; మత్తమాతంగ = మదపుటేనుగు యొక్క; గామినమ్ = నడకగలవానిని
భావం;-
 రాముడు గంధర్వరాజులతో సరిపోలి ఉండును. అతని పౌరుషము జగత్ప్రసిద్ధమైనది. దీర్ఘబాహువులు కలవాడై, మహాబలవంతుడై, మదపుటేనుగు వంటి నడకతో ఏతెంచుచుండెను. అట్టి రాముని దశరథమహారాజు చూచెను. ఇంకా
2.3.28.
అనుష్టుప్.
చంద్రకాంతాననం రామమ్
అతీవ ప్రియదర్శనమ్।
రూపౌదార్యగుణైః పుంసాం
దృష్టిచిత్తాపహారిణమ్॥
టీక:-
 చంద్రకాంత = చంద్రకాంతివలె కమనీయమైన, వావిళ్ళవారి సంస్కృత నిఘంటువు; ఆననమ్ = ముఖము కలిగినవానిని; రామమ్ = రాముని; అతీవ = అధికమైన; ప్రియదర్శనమ్ = చూచుటకు మనోహరముగ కనిపించువానిని; రూప = రూపముతోను; ఔదార్య = ఔదార్యముతోను; గుణైః = సద్గుణములతోను; పుంసాం = పురుషులయొక్క; దృష్టి = చూపును; చిత్త = మనసును; అపహారిణమ్ = అపహరించువానిని.
భావం;-
 చంద్రునివలె కమనీయమైన ముఖముతో చూచుటకు మనోహరముగానుండి, రూపముచేతను, ఔదార్యముచేతను, ఇతర సద్గుణములచేతను సత్పురుషుల చూపులను మనస్సులను ఆకర్షించుచున్న రాముని దశరథుడు చూచెను.
గమనిక:-
 ఔదార్యము- శోభ, కాంతి, దీప్తి, మాధుర్యము, ప్రగల్భత, ఔదార్యము, ధైర్యము అను నాయక సహజ గుణములలో ఒకటి. వస్త్రభూషణాది ప్రయుక్తమైన కాంతి.
2.3.29.
అనుష్టుప్.
ఘర్మాభితప్తాః పర్జన్యం
హ్లాదయంతమివ ప్రజాః।
న తతర్ప సమాయాంతం
పశ్యమానో నరాధిపః॥
టీక:-
 ఘర్మాః = వేసవి వేడిమిచే; అభి = మిక్కిలి; తప్తాః = తపించినవానికి; పర్జన్యమ్ = మేఘము; ఇవ = వలె; హ్లాదయంతమ్ = సంతోషము కలిగించు; ప్రజాః = ప్రజలు; న తతర్ప = తనివితీరక; సమాయాంతమ్ = వచ్చుచున్న; పశ్యమానః = చూచుచున్న; నరాధిపః = దశరథ మహారాజు
భావం;-
 వేసవి వేడిమిచే తపింపబడిన ప్రజలకు ఆహ్లాదము కలిగించు మేఘము వలె రాముడు దశరథునకు కనిపించెను. ఆ రాముని ఎంత చూచినను దశరథునకు తనివితీరుట లేదు.
2.3.30.
అనుష్టుప్.
అవతార్య సుమంత్రస్తం
రాఘవం స్యందనోత్తమాత్।
పితుస్సమీపం గచ్ఛంతం
ప్రాంజలిః పృష్ఠతోఽన్వగాత్॥
టీక:-
 అవతార్య = దింపి; సుమన్త్రః = సుమంత్రుడు; తమ్ =ఆతని; రాఘవమ్ = రాఘవుని; స్యందనః = రథము; ఉత్తమాత్ = ఉత్తమమైనదానినుండి; పితుః = తండ్రియొక్క; సమీపం = చేరువను గూర్చి, సమీపమునకు; గచ్ఛంతమ్ = వెళ్లుచున్న; ప్రాంజలిః = చేతులుజోడించిన; పృష్ఠతః = వెనుక; అన్వగాత్ = అనుసరించెను
భావం;-
 సుమంత్రుడు రాముని ఆ గొప్పరథమునుండి దింపెను. తండ్రి దగ్గరకు వెళ్ళుచున్న రాముడి వెనుక సుమంత్రుడు కూడ చేతులు జోడించి వెళ్ళెను.
2.3.31.
అనుష్టుప్.
స తం కైలాస శృంగాభం
ప్రాసాదం నరపుంగవః।
ఆరురోహ నృపం ద్రష్టుం
సహ సూతేన రాఘవః॥
టీక:-
 సః = అతడు; తమ్ = ఆ; కైలాసః = కైలాస పర్వత; శృంగాభమ్ = శిఖరమువంటి ఉన్నతమైమ; ప్రాసాదమ్ = భవంతిని; నరపుంగవః = పురుషులలో శ్రేష్ఠుడు; ఆరురోహ = అధిరోహించెను; నృపమ్ = దశరథ మహారాజును; ద్రష్టుమ్ = చూచుట కొరకు; సూతేన = సూతునితో; సహ = కలిసి; రాఘవః = రఘువంశీయుడు
భావం;-
 పురుషశ్రేష్ఠుడైన రఘురాముడు సూతునితోపాటు దశరథమహారాజును దర్శించుటకు కైలాసపర్వతశిఖరమంత ఎత్తైన ఆ మేడను అధిరోహించెను.
2.3.32.
అనుష్టుప్.
స ప్రాంజలి రభిప్రేత్య
ప్రణతః పితురంతికే।
నామ స్వం శ్రావయన్రామో
వవందే చరణౌ పితుః॥
టీక:-
 సః = అతడు; ప్రాంజలిః = జోడించిన చేతులు కలవాడు; అభిప్రేత్య = సమీపించి; ప్రణతః = వంగినవాడు; పితుః = తండ్రికి; అంతికే = సమీపములో; నామ = పేరు; స్వం = స్వయముగా; శ్రావయన్ =వినిపింపజేయుచు; రామః = రాముడు; వవందే = వందనమాచరించెను; చరణౌ = పాదములను; పితుః = తండ్రి యొక్క
భావం;-
 రాముడు అంజలి ఘటించి, ‘రామరాజః అహంభో అభివాదయే’ అని తన పేరు చెప్పుకొనచూ, తండ్రి పాదములకు వంగి వందనమాచరించెను.
2.3.33.
అనుష్టుప్.
తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే
కృతాంజలిపుటం నృపః।
గృహ్యాంజలౌ సమాకృష్య
సస్వజే ప్రియమాత్మజమ్॥
టీక:-
 తం– ఆ; దృష్ట్వా = చూచి;ప్రణతం = వినయముగా వంగియున్న; పార్శ్వే = ప్రక్కగా; కృతాంజలి పుటం = జోడించబడిన దోసిలిని; నృపః = మహారాజు; గృహ్యా = తీసుకుని; అంజలౌ = దోసిలియందు; సమాకృష్య = దగ్గరకు లాగుకొని; సస్వజే = ఆలింగనము చేసుకొనెను; ప్రియమ్ = ఇష్టమైన; ఆత్మజమ్ = తన కుమారుని
భావం;-
 దశరథ మహారాజు తన ప్రక్కన అంజలి ఘటించి వినయముగ నిలిచియున్న ఆ ప్రియపుత్రుని అంజలి పట్టి దగ్గరకు లాగుకొని కౌగలించుకొనెను.
2.3.34.
అనుష్టుప్.
తస్మై చాభ్యుదితం దివ్యమ్
మణికాంచన భూషితమ్।
దిదేశ రాజా రుచిరమ్
రామాయ పరమాసనమ్॥
టీక:-
 తస్మై = ఆతని; చ = కొరకు; అభ్యుదితం = ఉన్నతమైనది; దివ్యమ్ = శ్రేష్ఠమైనది; మణికాంచన = మణులు, బంగారముతో; భూషితమ్ = అలంకరించబడినది; దిదేశ = ఇచ్చెను; రాజా = మహారాజు; రుచిరమ్ = అందమైన; రామాయ = రామునికొరకు; పరమ = గొప్ప; ఆసనమ్ = ఆసనమును.
భావం;-
 దశరథమహారాజు సుందరమైన రామునకు ఉన్నతమైన, శ్రేష్ఠమైన, సువర్ణ రత్నాలంకృతమైన ఉత్తమ ఆసనమును ఇచ్చెను.
2.3.35.
అనుష్టుప్.
తదాసనవరం ప్రాప్య
వ్యదీపయత రాఘవః।
స్వయైవ ప్రభయా మేరుమ్
ఉదయే విమలో రవిః॥
టీక:-
 తత్ =ఆ; ఆసనవరం = శ్రేష్ఠమైన సింహాసనమును; ప్రాప్య = పొంది; వ్యదీపయత = ప్రకాశింపజేసెను; రాఘవః = రాఘవుడు; స్వయా = తనది; ఏవ = మాత్రమే ఐన; ప్రభయా = ప్రకాశముచేత; మేరుమ్ = మేరువును; ఉదయే = ప్రాతఃకాలంలో; విమలః = నిర్మలమైన; రవిః = సూర్యుడు
భావం;-
 రాముడు ఆ విశిష్టాసనముపై ఆసీనుడై, నిర్మలమైన సూర్యోదయ కాలమున సూర్యుడు మేరుపర్వతమును ప్రకాశింపజేయునట్లు తన తేజస్సుచేత ఆ ఆసనమును ప్రకాశింపచేసెను.
2.3.36.
అనుష్టుప్.
తేన విభ్రాజతా తత్ర
సా సభాభివ్యరోచత ।
విమల గ్రహనక్షత్రాః
శారదీ ద్యౌరివేందనా॥
టీక:-
 తేన = అతని చేత; విభ్రాజతా = ప్రకాశించుచున్న; తత్ర = అక్కడ; సా = ఆ; సభా = సభ; అభి = మిక్కిలి; వ్యరోచత = ప్రకాశింపజేయబడెను; విమల = స్వచ్ఛమైన; గ్రహ = గ్రహములు; నక్షత్రాః = నక్షత్రములు; శారదీ = శరత్కాలపు; ద్యౌః =ఆకాశము; ఇవ=వలె; ఇందునా = చంద్రునిచేత;
భావం;-
 గ్రహనక్షత్రములు కనబడు నిర్మలమైన ఆకాశమును శరత్కాలపు చంద్రుడు ప్రకాశింపచేయునట్లు, ఆ రాముడు తన ప్రకాశముచే ఆ సభను ప్రకాశింపచేసెను.
2.3.37.
అనుష్టుప్.
తం పశ్యమానో నృపతిః
తుతోష ప్రియమాత్మజమ్।
అలంకృతమి వాత్మానమ్
ఆదర్శతల సంస్థితమ్॥
టీక:-
 తం = ఆతని; పశ్యమానః = చూచుచు; నృపతిః = మహారాజు; తుతోష = ఆనందించెను; ప్రియమ్ =ఇష్టుడైన; ఆత్మజమ్ = తన కుమారుని; అలంకృతమ్ = అలంకరించబడినవానిని; ఇవ =వలె; ఆత్మానమ్ = తనను; ఆదర్శ = అద్దముయొక్క; తలః = తలమున; సంస్థితమ్ = ఉన్నట్టి.
భావం;-
 తనకిష్టుడైన కుమారుడు రాముని చూచుచు, దశరథ మహారాజు అలంకరించుకొని, తనను తాను అద్దములో తన ప్రతిబింబము చూచుకొనుచున్నట్లు మురిసిపోయెను.
2.3.38.
అనుష్టుప్.
స తం సస్మితమాభాష్య
పుత్రం పుత్రవతాం వరః।
ఉవాచేదం వచో రాజా
దేవేంద్రమివ కాశ్యపః॥
టీక:-
 సః = అతడు; తం = అతనిని; సస్మితమ్ = చిరునవ్వుతో; ఆభాష్య = పలుకరించి; పుత్రం = కుమారుని; పుత్రవతాం = కొడుకులు కలవారిలో; వరః = శ్రేష్ఠుడు; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈవిధముగ; వచః = మాట; రాజా = మహారాజు; దేవేంద్రమ్ = దేవేంద్రును; ఇవ= వలె; కాశ్యపః = కశ్యపుని
భావం;-
 రాముని వంటి ఉత్తమ పుత్రుడు కలిగిఉండుటచే, పుత్రులు కలవారు అందరిలో శ్రేష్ఠుడైన దశరథుడు చిరునవ్వుతో రాముని పలుకరించెను. కశ్యపునికి దితియందు కలిగిన ద్వాదశాదిత్యులలోని వాడగు ఇంద్రునితో తండ్రి కశ్యపుడు పలికినట్లు, రామునితో తండ్రిగా దశరథులవారు ఇలా చెప్పెను.
గమనిక:-
 దశాదిత్యులు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, అజఘన్యుడు (https://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=12_Suns .).
2.3.39.
అనుష్టుప్.
“జ్యేష్ఠాయామసి మే పత్న్యామ్
సదృశ్యాం సదృశస్సుతః।
ఉత్పన్నస్త్వం గుణశ్రేష్ఠో
మమ రామాత్మజః ప్రియః॥
టీక:-
 జ్యేష్ఠాయామ్ = పెద్ద ఆమెయందు; అసి = ఉంటివి; మే = నాయొక్క; పత్న్యామ్ = భార్యయందు; సదృశ్యామ్ = తగిన ఆమెయందు; సదృశః = తగిన; సుతః = కుమారుడవు; ఉత్పన్నః = జన్మించిన; త్వమ్ = నీవు; గుణ = సద్గుణములచే; శ్రేష్ఠః = శ్రేష్ఠుడవు; మమ = నాకు; రామా = ఓ రామా; ఆత్మజః = కుమారుడవు; ప్రియః = ప్రీతిపాత్రుడవు.
భావం;-
 “ఓ రామా! నీవు యోగ్యురాలైన నా జ్యేష్ఠభార్యయందు పుట్టిన సద్గుణశ్రేష్ఠుడవు, యోగ్యడవైన కుమారుడవు, నాకు ప్రీతిపాత్రుడవు.
2.3.40.
అనుష్టుప్.
యతస్త్వయా ప్రజాశ్చేమాః
స్వగుణై రనురంజితాః।
తస్మాత్త్వం పుష్యయోగేన
యౌవరాజ్య మవాప్నుహి॥
టీక:-
 యతః = ఎందువలన; త్వయా = నీ చేత; ప్రజాః = ప్రజలు; చ= మఱియు; ఇమాః = వీరు; స్వగుణైః = స్వీయ సుగుణములచే; అనురంజితాః = ఆనందించబడినవారు; తస్మాత్ = అందువలన; త్త్వం = నీవు; పుష్యయోగేన = పుష్యమి నక్షత్రము దినమున; యౌవరాజ్యమ్ = యువరాజు పదవిని; అవాప్నుహి = పొందుము.
భావం;-
 నీవు నీ సద్గుణములచేత ఈ ప్రజలను రంజింపచేసితివి. అందుచేత పుష్యమీ నక్షత్ర యుక్తమైన ముహూర్తమునందు నీవు యౌవరాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము.
2.3.41.
అనుష్టుప్.
కామతస్త్వం ప్రకృత్యైవ
వినీతో గుణవానసి।
గుణవత్యపి తు స్నేహాత్
పుత్ర! వక్ష్యామి తే హితమ్॥
టీక:-
 కామతః = మిక్కిలి; త్వమ్ = నీవు; ప్రకృతి = స్వభావసిద్ధము; ఏవ = చేతనే; వినీతః = వినయవంతుడవు; గుణవాన్ = సద్గుణములు కలిగినవాడవై; అసి= ఉంటివి; గుణవత్ = గుణవంతుడవు; అపి = అయినను; తు = కూడ; స్నేహాత్ = స్నేహమువలన; పుత్ర! = ఓ కుమారుడా!; వక్ష్యామి = చెప్పగలను; తే = నీకు; హితమ్ = మేలును.
భావం;-
 నీవు సహజస్వభావముము చేతనే మిక్కిలి వినయశాలివి. సద్గుణవంతుడవు. నీపై గల స్నేహమువలన నీకు హితము బోధించుచున్నాను.
2.3.42.
అనుష్టుప్.
భూయో వినయమాస్థాయ
భవ నిత్యం జితేంద్రియః।
కామక్రోధ సముత్థాని
త్యజేథా వ్యసనాని చ॥
టీక:-
 భూయః = ఇంకనూ; వినయమ్ = వినయమును; ఆస్థాయ = అవలంబించువాడవు; భవ=అగుము; నిత్యం = ఎల్లపుడు; జితేంద్రియః = జయించబడిన ఇంద్రియములు కలవాడవు; కామ = కోరికనుండి; క్రోధ = కోపమునుండి; సముత్థాని = ప్రభవించు; త్యజేథాః = విడిచిపెట్టుము; వ్యసనాని = దురలవాట్లు, వ్యసనములు; చ= కూడ.
భావం;-
 ఇంకను ఎక్కువ వినయము పెంచుకొని ఎల్లప్పుడును ఇంద్రియములను అదుపులో ఉంచుకొనుము. కామజ, క్రోధజ వ్యసనములకు, రాజులకు కలుగు సప్తవ్యసనములకు దూరముగా ఉండుము.
గమనిక:-
 1. సప్తవ్యసనములు- శ్లో॥ స్త్రీ ద్యూత మృగయా మద్య; వాక్పారుష్యోగ్రదండతాః। అర్థసందూషణం చేతి; రాజ్ఞాం వ్యసనసప్తకమ్॥- రాజులకు సప్తవ్యసనములు 1. స్త్రీ,2. జూదము, 3. వేట, 4. మద్యపానము లందు లౌల్యము, 5. పరుషముగా మాట్లాడుట, 6. చిన్నతప్పునకు పెద్దగా దండించుట, 7. ధన దుర్వినియోగము2. మరొకవిధ వ్యసనములు పది- శ్లో॥మృగయాఽక్షో దివాస్వాసః పరివాదః; స్త్రీయో మదః। తౌర్వత్రికం నృథాఢ్వా చ; కామజో దశకో గుణః॥– 1. వేట,2. జ్యూదము, 3. పగలు నిద్రించుట, 4. ఇతరులపై అప నిందలు వేయుట, 5. స్త్రీలౌల్యము, 6. గర్వితుడగుట, 7,8,9. నృత్య గీత వాయిద్యము లంను మూటి యందు శృతిమించిన ఆసక్తి, 10.వ్యర్థముగా తిరుగుట,
2.3.43.
అనుష్టుప్.
పరోక్షయా వర్తమానో
వృత్త్యా ప్రత్యక్షయా తథా।
అమాత్య ప్రభృతీ స్సర్వాః
ప్రకృతీ శ్చానురంజయ॥
టీక:-
 పరోక్షయా = పరోక్షమైన; వర్తమానః = ప్రవర్తన; వృత్త్యా = నడవడితోడను; ప్రత్యక్షయా = ప్రత్యక్షమైన; తథా = అటుల; అమాత్య = మంత్రి; ప్రభృతీః = మొదలైనవారు; సర్వాః = అందరు; ప్రకృతీః = జనుల; చ = తోడను; అనురంజయ = సంతోషింపజేయుము.
భావం;-
 పరోక్ష ప్రత్యక్ష ప్రవర్తనలతో అమాత్యులు మొదలగువారికి, ప్రజలకు ఆనందము చేకూర్చుము.
2.3.44.
అనుష్టుప్.
కోష్ఠాగారాయుధాగారైః
కృత్వా సన్నిచయా న్బహూన్।
తుష్టానురక్త ప్రకృతిః
యః పాలయతి మేదినీమ్॥
టీక:-
 కోష్ఠాగారాః = ధాన్యాగారములు; ఆయుధాగారైః = ఆయుధాగారములు చేత; కృత్వా = చేసి; సన్నిచయాన్ = భద్రపరిచి; బహూన్ = అనేకమైన; తుష్ట = సంతృప్తిపరులు; అనురక్తః = ఆహ్లాదముగా ఉన్నవారూ అగు; ప్రకృతిః = స్వామ్యాదులు ; యః = ఎవరు; పాలయతి = పరిపాలించునో; మేదినీమ్ = భూమిని
భావం;-
 ధాన్యాగారములను, ఆయుధాగారములను చక్కగా నింపి, ప్రజలను తృప్తిపరచి, వారలకు ఆనందము కలిగించుచు, అనురక్తులను చేయుచు భూమిని పరిపాలించుము.
గమనిక:-
 (1) రాజుల సప్తప్రకృతులు- స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. (2) ధాన్యాదులను నిల్వజేయునది కోష్టాగారము. (3) ధనము, సంపద, విలువైన వస్తువులు నిల్వజేయునది కోశాగారము. (4) ఆయుధములు, యుద్ధ సామగ్రి నిల్వజేయునది ఆయుధాగారము.
2.3.45.
అనుష్టుప్.
తస్యనన్దంతి మిత్రాణి
లబ్ధ్యాఽమృత మివామరాః।
తస్మాత్త్వమపి చాత్మానం
నియమ్యైవం సమాచర”॥
టీక:-
 తస్య = అతని యొక్క; నన్దంతి = సంతోషముగా ఉందురు; మిత్రాణి = స్నేహితులు; లబ్ధ్యాః = లభించినవారు; అమృతమ్ = అమృతమును; ఇవ = వలె; అమరాః = దేవతల; తస్మాత్ = ఆ విధముగా; త్వమపి = నీవు కూడా; చ = మఱియు; ఆత్మానం = తనను తాను; నియమ్యః = నియమవంతుడు; ఏవం = ఈ విధముగా; సమాచర = ప్రవర్తించుము
భావం;-
 అట్టివాని మిత్రులు, అమృతమును పొందిన దేవతల వలె ఆనందింతురు. అందుచేత నీవు కూడా ఆత్మ నిగ్రహవంతుడవై ఆ విధముగా వర్తిల్లుము.”
గమనిక:-
 మిత్ర- మిద్యతి స్నేహతి, మిద్+త్ర, స్నేహము చేయువాడు, రాజుసప్తప్రకృతులో వాడు.
2.3.46.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా సుహృదస్తస్య
రామస్య ప్రియకారిణః।
త్వరితా శ్శీఘ్రమభ్యేత్య
కౌసల్యాయై న్యవేదయన్॥
టీక:-
 తత్ = దానిని; శ్రుత్వా = విని; సుహృదః = స్నేహితులు; తస్య = ఆతనియొక్క; రామస్య = రాముని యొక్క; ప్రియః = ఇంపు, ప్రియము; కారిణః = చేయువారై; త్వరితాః = వేగముగా; శీఘ్రమ్ = వెంటనే; అభ్యేత్య = సమీపించి; కౌసల్యాయై = కౌసల్యకొరకు; న్యవేదయన్ = తెలియపరచిరి
భావం;-
 ఆ మాటలు విని రామునికి ప్రియముచేయువారైన మిత్రులు ఆత్రుతతో, కౌసల్య యొద్దకు శీఘ్రముగా వెళ్లి ఆమెకు ఈ రాముని యౌవరాజ పట్టాభిషేకము వార్త తెలిపిరి.
2.3.47.
అనుష్టుప్.
సా హిరణ్యం చ గాశ్చైవ
రత్నాని వివిధాని చ।
వ్యాదిదేశ ప్రియాఖ్యేభ్యః
కౌసల్యా ప్రమదోత్తమా॥
టీక:-
 సా = ఆమె: హిరణ్యం = బంగారమును; చ = ఇంకా; గాః = ఆవులను; చైవ = ఇంకా; రత్నాని = రత్నములను; వివిధాని = వివిధరకముల; చ = ఇంకా; వ్యాదిదేశ = ఇచ్చెను; ప్రియాఖ్యేభ్యః = శుభవార్త తీసుకువచ్చి చెప్పినవారికి; కౌసల్యా = కౌసల్య; ప్రమద = స్త్రీలలో; ఉత్తమా = ఉన్నతురాలు
భావం;-
 స్త్రీలలో ఉత్తమురాలైన ఆ కౌసల్య, ప్రియమైన వార్త తీసుకొనివచ్చిన వారికి బంగారము, గోవులు, వివిధ రత్నములు ఇచ్చి బహూకరించెను.
2.3.48.
అనుష్టుప్.
అథాఽభివాద్య రాజానం
రథమారుహ్య రాఘవః।
యయౌ స్వం ద్యుతిమద్వేశ్మ
జనౌఘైః ప్రతిపూజితః॥
టీక:-
 అథాః = తరువాత; అభివాద్య = నమస్కరించి; రాజానం = రాజును; రథమ్ =రథమును; ఆరుహ్య = ఎక్కి; రాఘవః = రాఘవుడు; యయౌ = వెళ్లెను; స్వం = తన యొక్క; ద్యుతిమత్ = ప్రకాశవంతమైన; వేశ్మ = గృహమును; జనః = ప్రజల; ఓఘైః = సమూహముల చేత; ప్రతిపూజితః = పూజించబడినవాడై.
భావం;-
 రాముడు దశరథ మహారాజునకు నమస్కరించి, రథమును అధిరోహించి, జనులందరు పూజించుచుండగా,తన సుందరమైన గృహమునకు వెళ్లెను.
2.3.49.త్రిష్టుప్
తే చాపి పౌరా నృపతేర్వచస్త
చ్ఛ్రుత్వా తథా లాభమివేష్టమాశు।
నరేంద్ర మామంత్ర్య గృహాణి గత్వా
దేవా న్సమానర్చు రతిప్రహృష్టాః॥
టీక:-
 తే = వారికి; చ = మఱియు; అపి = కూడా; పౌరాః = పురజనులు; నృపతేః = మహారాజు యొక్క; వచః = మాటలు; తత్=దానిని; శ్రుత్వా = విని; తథా = అట్లు; లాభమ్= లాభము; ఇవ=వలె; ఇష్టమ్= ఇష్టమైన; ఆశు= శీఘ్రముగా; నరేంద్రమ్ = మహారాజును; ఆమంత్రయ = సెలవు తీసుకుని; గృహాణి = గృహములనుగూర్చి; గత్వా = వెళ్లి; దేవాన్ = దేవతలను; సమానర్చుః = పూజించిరి; అతిప్రహృష్టాః = పరమానందము చెందినవారు.
భావం;-
 అపుడు ఆ పౌరులందరు రాజు మాటలను, తమకు అత్యంత ఇష్టమైన విషయమును వినినట్లు విని, సంతసించినవారై, అతని వద్ద సెలవు తీసుకుని, తమ గృహములు చేరి, దేవతలను పూజించిరి.
2.3.50.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
తృతీయాసర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; తృతీయ [3] = మూడవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [3] మూడవ సర్గ సంపూర్ణము
2.4.1.
అనుష్టుప్.
గతేష్వథ నృపో భూయః
పౌరేషు సహ మంత్రిభిః।
మంత్రయిత్వా తతశ్చక్రే
నిశ్చయజ్ఞ స్సనిశ్చయమ్॥
టీక:-
 గతేషు = వెళ్ళిన, అథ = తరువాత, నృపః = రాజు, భూయః = మరల, పౌరేషు = పౌరులు, సహ = కూడి, మంత్రిభిః = మంత్రులతో, మంత్రయిత్వా = చర్చించి, తతః = అప్పుడు, చక్రే = చేసెను, నిశ్చయజ్ఞః = నిర్ణయించుటలో సమర్థుడు, సః = అతను, నిశ్చయమ్ = నిశ్చయమును.
భావం;-
 పౌరులందరు వెళ్ళిన తరువాత, నిర్ణయములు చేయుటలో సమర్థుడైన దశరథమహారాజు, మరల మంత్రులతో చర్చించెను.
గమనిక:-
 నిశ్చయజ్ఞుడు- దేశ కాల పరిస్థితులను పూర్తిగా ఎఱిగి, సమయస్పూర్తితో సముచితమగు నిర్ణయములను తీసికొనువాడు. గీతాప్రెస్ వారి రామాయణము.
2.4.2.
అనుష్టుప్.
శ్వ ఏవ పుష్యో భవితా
శ్వోఽభిషేచ్యస్తు మే సుతః।
రామో రాజీవతామ్రాక్షో
యౌవరాజ్య” ఇతి ప్రభుః॥
టీక:-
 శ్వః = రేపు, ఏవ = నిశ్చయార్థము, పుష్యః = పుష్యమీ నక్షత్రము, భవితా = అగును, శ్వః = రేపు, అభిషేచ్యః = అభిషేకించదగినవాడు, తు, మే = నా యొక్క, సుతః = కుమారుడు, రామః = రాముడు, రాజీవతామ్రాక్షః = తామర రేకులవలె ఎఱ్ఱని కన్నులు గలవాడు, యౌవరాజ్య = యౌవరాజ్యమునందు, ఇతి = అని, ప్రభుః = ప్రభువు.
భావం;-
 "రేపే పుష్యమీ నక్షత్రము ఉన్నది. అందువలన తామరరేకుల వంటి ఎఱ్ఱనినేత్రములు గల నా కుమారుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేయవలెను" అని ప్రబువు దశరథులవారు నిర్ణయించిరి.
2.4.3.
అనుష్టుప్.
అథాఽంతర్గృహమాసాద్య
రాజా దశరథస్తదా।
సూత మామంత్రయామాస
రామం పునరిహానయ॥
టీక:-
 అథ = తరువాత, అంతరగృహమ్ = అంతఃపురమును, ఆసాద్య = పొంది, రాజా దశరథః = దశరథ మహారాజు, తదా = అప్పుడు, సూతమ్ = సారథిని, ఆమంత్రయామాస = ఆజ్ఞాపించెను, రామం = రాముని, పునః = మరల, ఇహ = ఇచటకు, ఆనయ = కొనిరమ్ము.
భావం;-
 తరువాత దశరథమహారాజు అంతఃపురములోనికి వెళ్ళి, తన రథసారథి ఐన సుమంత్రుని పిలిచి "రాముని మరల ఇచటకు తోడ్కొని రమ్ము" అని ఆజ్ఞాపించెను.
2.4.4.
అనుష్టుప్.
ప్రతిగృహ్య స తద్వాక్యం
సూతః పునరుపాయయౌ।
రామస్య భవనం శీఘ్రం
రామమానయితుం పునః॥
టీక:-
 ప్రతిగృహ్య = స్వీకరించి, సః = అతను, తత్ = ఆ, వాక్యం = మాటను, సూతః = సారథి, పునః = మరల, ఉపాయయౌ = పొందెను, రామస్య = రాముని యొక్క, భవనం = భవనమును, శీఘ్రం = త్వరగా, రామమ్ = రాముని, ఆనయితుమ్ = తోడ్కొని వచ్చుటకు, పునః = మరల.
భావం;-
 రథసారథి సుమంత్రుడు దశరథుని ఆజ్ఞానుసారము రాముని మరల తోడ్కొనివచ్చుటకై రాముని భవనమునకు త్వరగా వెళ్ళెను.
2.4.5.
అనుష్టుప్.
ద్వార్స్థైరావేదితం తస్య
రామాయా ఽఽగమనం పునః।
శ్రుత్వైవ చాపి రామస్తం
ప్రాప్తం శంకాన్వితోఽభవత్॥
టీక:-
 ద్వార్స్థః = ద్వాః స్థైః, ద్వారపాలకులచే, ఆవేదితం = తెలియజేయబడినది, తస్య = అతనియొక్క, రామాయ = రాముని కొరకు, ఆగమనం = రాకను, పునః = మరల, శ్రుత్వా = వినిన, ఏవ = అంతనే, అపి = కూడ, రామః = రాముడు, తం = అతనిని, ప్రాప్తం = వచ్చినవానిగా, శంకా = సందేహము, అన్వితః = కలిగినవాడు, అభవత్ = అయ్యెను.
భావం;-
 సుమంత్రుడు మరల తనకొరకు వచ్చినట్లు ద్వారపాలకులు తెలిపిరి. అతని రాక వినిన రామునకు సందేహము కలిగెను.
2.4.6.
అనుష్టుప్.
ప్రవేశ్య చైనం త్వరితం
రామో వచనమబ్రవీత్।
“యదాగమన కృత్యం తే
భూయస్త ద్బ్రూహ్యశేషతః”॥
టీక:-
 ప్రవేశ్య = ప్రవేశింపజేసి, చ, ఏనం = ఈతనిని, త్వరితం = త్వరగా, రామః = రాముడు, వచనమ్ = మాటను, అబ్రవీత్ = పలికెను, యత్ = ఏదైతే, ఆగమన కృత్యం = వచ్చుటలో కార్యము, తే = నీ యొక్క, భూయః = మరల, తత్ = దానిని, బ్రూహి = తెలుపుము, అశేషతః = సంపూర్ణముగా.
భావం;-
 రాముడు సుమంత్రుని లోపలకు రానిచ్చి, "నీవు మరల వచ్చుటకు కారణమేమియో సంపూర్ణముగా తెలియజేయుము" అని పలికెను.
2.4.7.
అనుష్టుప్.
తమువాచ తత స్సూతో
రాజా త్వాం ద్రష్టుమిచ్ఛతి।
శ్రుత్వా ప్రమాణమత్ర త్వం
గమనాయేతరాయ వా॥
టీక:-
 తమ్ = అతని గూర్చి, ఉవాచ = పలికెను, తతః = తరువాత, సూతః = సారథి, రాజా = రాజు, త్వాం = నిన్ను, ద్రష్టుమ్ = చూచుటకు, ఇచ్ఛతి = కోరుచున్నాడు, శ్రుత్వా = విని, ప్రమాణమ్ = ప్రమాణము, అత్ర = ఈ విషయమున, త్వం = నీవు, గమనాయ = వెళ్లుటకు, ఇతరాయ = ఇతరము, వా = లేదా.
భావం;-
 రాముని మాటలు వినిన సుమంత్రుడు "దశరథ మహారాజు నిన్ను చూడగోరుచున్నాడు. వెళ్ళుటయో వెళ్ళక మానుటయో నీవు నిర్ణయించుకొనుము" అని పలికెను.
2.4.8.
అనుష్టుప్.
ఇతి సూతవచశ్శ్రుత్వా
రామోఽథ త్వరయాఽన్వితః।
ప్రయయౌ రాజభవనం
పునర్ద్రష్టుం నరేశ్వరమ్॥
టీక:-
 ఇతి = ఇట్లు, సూత = సారథి, వచః = మాట, శ్రుత్వా = విని, రామః = రాముడు, అథ = తరువాత, త్వరయా = త్వరితముతో, అన్వితః = కూడినవాడై, ప్రయయౌ = వెళ్ళెను, రాజభవనం = రాజభవనము గురించి, పునః = మరల, ద్రష్టుం = చూచుటకు, నరేశ్వరమ్ = రాజును.
భావం;-
 సుమంత్రుని మాటలు వినిన రాముడు వెనువెంటనే మరల దశరథమహారాజును చూచుటకు రాజభవనమునకు వెళ్ళెను.
2.4.9.
అనుష్టుప్.
తం శ్రుత్వా సమనుప్రాప్తం
రామం దశరథో నృపః।
ప్రవేశయామాస గృహం
వివక్షుః ప్రియముత్తమమ్॥
టీక:-
 తం = ఆ, శ్రుత్వా = విని, సమనుప్రాప్తం = ఏతెంచినవానిగా, రామం = రాముని, దశరథః = దశరథుడు, నృపః = రాజు, ప్రవేశయామాస = ప్రవేశింపజేసెను, గృహం = గృహమును, వివక్షుః = తెలియజేయదలచిన వాడు, ప్రియమ్ = ప్రియమైనదానిని, ఉత్తమమ్ = ఉత్తమమైనదానిని.
భావం;-
 దశరథమహారాజు రాముని రాక ఎరిగినవాడై, అతనికి ఒక ప్రీతికరమైన విషయము తెలియజేయుటకు గృహములోనికి రావించెను.
2.4.10.
అనుష్టుప్.
ప్రవిశన్నేవ చ శ్రీమాన్
రాఘవో భవనం పితుః।
దదర్శ పితరం దూరాత్
ప్రణిపత్య కృతాంజలిః॥
టీక:-
 ప్రవిశన్నేవ = ప్రవేశించుచునే, శ్రీమాన్ = శోభాయుతుడైన, రాఘవః = రాఘవుడు, భవనం = భవనమును, పితుః = తండ్రియొక్క, దదర్శ = చూసెను, పితరం = తండ్రిని, దూరాత్ = దూరమునుండి, ప్రణిపత్య = ప్రణమిల్లి, కృతాంజలిః = హస్తములు ముకుళించి.
భావం;-
 శోభాయమానముగా నున్న రాముడు తన తండ్రి భవనములోనికి ప్రవేశించగనే ముకుళిత హస్తములతో ప్రణమిల్లి తండ్రిని గాంచెను.
2.4.11.
అనుష్టుప్.
ప్రణమంతం సముత్థాప్య
తం పరిష్వజ్య భూమిపః।
ప్రదిశ్య చాస్మై రుచిరమ్
ఆసనం పునరబ్రవీత్॥
టీక:-
 ప్రణమంతం = ప్రణమిల్లుచున్నవానిని, సముత్థాప్య = లేవనెత్తి, తం = అతనిని, పరిష్వజ్య = ఆలింగనము చేసుకొని, భూమిపః = రాజు, ప్రదిశ్య = ఇచ్చి, చ = మఱియు; అస్మై = ఇతనికి, రుచిరమ్ = అందమైన, ఆసనం = ఆసనమును, పునః = మరల, అబ్రవీత్ = పలికెను.
భావం;-
 ప్రణమిల్లుచున్న రాముని దశరథుడు లేవనెత్తి, ఆలింగనము చేసుకొని, సముచిత ఆసనమును ఇచ్చి ఇట్లు పలికెను.
2.4.12.
అనుష్టుప్.
“రామ! వృద్ధోఽస్మి దీర్ఘాయుః
భుక్తా భోగా మయేప్సితాః।
అన్నవద్భిః క్రతుశతై
స్తథేష్టం భూరిదక్షిణైః॥
టీక:-
 రామ = రామా!, వృద్ధః = వృద్ధుడు, అస్మి = అయియుంటిని, దీర్ఘాయుః = దీర్ఘాయుష్మంతుడనై, భుక్తాః = అనుభవింపబడినవి, భోగాః = రాజ భోగములు, మయా = నాచే, ఈప్సితాః = ఇష్టమైనవి, అన్నవద్భిః = అన్నముతో, క్రతుశతైః = వందలకొలది క్రతువులు, తథా = మఱియు, ఇష్టం = ఇష్టి (యజ్ఞములు), భూరి = మిక్కిలి, విశేషమైన, దక్షిణైః = సంభావనలతో.
భావం;-
 రామా! దీర్ఘాయుష్మంతుడనైన నేను ఇప్పుడు వృద్ధుడనైనాను. ఇష్టమైన రాజభోగములను అనుభవించితిని. అన్నదానములతోను, విశేషమైన సంభావనలతోను కూడియున్న వందల క్రతువులు యజ్ఞములు చేసితిని.
2.4.13.
అనుష్టుప్.
జాతమిష్టమపత్యం మే
త్వమద్యానుపమం భువి।
దత్తమిష్టమధీతం చ
మయా పురుషసత్తమ॥
టీక:-
 జాతమ్ = జన్మించితివి, ఇష్టమ్ = ఇష్టమైన, అపత్యం = సంతానము, మే = నాకు, త్వమ్ = నీవు, అద్య = ఇపుడు, అనుపమం = సాటిలేని, భువి = భువిలో, దత్తమ్ = ఇవ్వబడెను, ఇష్టమ్ = పూజింపబడెను, అధీతం = అధ్యయనము చేయబడెను, చ, మయా = నాచే, పురుషసత్తమ = పురుష శ్రేష్ఠా.
భావం;-
 పురుషోత్తమా ! రామా! లోకములోనే సాటిలేని సంతానముగా నీవు నాకు జన్మించితివి. ఎన్నియో దానములు చేసితిని. దైవ సంబంధమైన పూజలు చేసితిని. వేదాధ్యయనము కూడ చేసితిని.
2.4.14.
అనుష్టుప్.
అనుభూతాని చేష్టాని
మయా వీర! సుఖాన్యపి।
దేవర్షిపితృవిప్రాణామ్
అనృణోఽస్మి తథాఽత్మనః॥
టీక:-
 అనుభూతాని = అనుభవింపబడినవి, చ = ఇంకను, ఇష్టాని = ఇష్టమైనవి, మయా = నాచే, వీర = వీరుడా, సుఖాని = సుఖములు, అపి = కూడ, దేవ = దేవతలకు, ఋషి = ఋషులకును, పితృ = పితృదేవతలకును, విప్రాణామ్ = బ్రాహ్మణులకును, అనృణః = ఋణము లేనివాడు, అస్మి = అయి ఉన్నాను, తథా = అటులనే, ఆత్మనః = నాకును.
భావం;-
 వీరుడా రామా! నాకు ఇష్టమైన సుఖములన్నిటిని అనుభవించితిని. యజ్ఞములు చేయుటవలన దేవతాఋణమును, వేదాధ్యనము చేయుటవలన ఋషిఋణమును, సంతానము కలుగుటవలన పితృఋణమును, దానములు చేయుటవలన బ్రాహ్మణ ఋణమును తీర్చివేసితిని. ధర్మసుఖానుభవించుట వలన ఆత్మఋణము. ఈ విధముగా శరీరము దాల్చుటవలన చెల్లించవలసిన ఋణముల నన్నిటిని (ఋణపంచకము) చెల్లించితిని.
గమనిక:-
 అనృణః- అనగా చెల్లించవలసిన దేవ, ఋషి, పితృ, బ్రాహ్మణ, ఆత్మ అను పంచఋణములు తీర్చి ఋణవిముక్తుడు ఐనవాడు. శ్రుతులలో వివరించు ఋణత్రయము.- శ్రు. జాయామానోవై బ్రాహ్మణః త్రిభిక్ ఋణవాజాయతే। బ్రహ్మచర్యేణ ఋషిభ్యో, యజ్ఞేన దేవేభ్యో, ప్రజయా పితృభ్యః॥- పుట్టుకతోడనే ద్విజుడు మూడు ఋణములు (ఋణత్రయము) కలిగి ఉండును. బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాది విద్యలు అభ్యసించుటచే ఋషిఋణము తీరును. యజ్ఞము చేయుటవలన దేవఋణము తీరును. సత్సంతానము పొందుటచే పితృఋణము తీరును.
2.4.15.అనుష్టు
న కించిన్మమ కర్తవ్యం
తవాన్యత్రాభిషేచనాత్।
అతో యత్త్వామహం బ్రూయాం
తన్మే త్వం కర్తుమర్హసి॥
టీక:-
 న = లేదు, కించిత్ = ఏదియు, మమ = నాకు, కర్తవ్యం = చేయదగిన పని, తవ = నీయొక్క, అన్యత్ర = వేరుగా, అభిషేచనాత్ = అభిషేకము చేయుటకంటె, అతః = అందుచే, యత్ = ఏది, త్వమ్ = నీవు, అహం = నేను, బ్రూయాం = చెప్పెదనో, తత్ = దానిని, మే = నాకు, త్వం = నీవు, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగియున్నావు.
భావం;-
 నీకు రాజ్యాభిషేకము చేయుటకంటె నాకు వేరు కర్తవ్యము లేదు. అందువలన నేను చెప్పిన విధముగా నీవు చేయుము.
2.4.16.
అనుష్టుప్.
అద్య ప్రకృతయస్సర్వాః
త్వమిచ్ఛంతి నరాధిపమ్।
అతస్త్వాం యువరాజానమ్
అభిషేక్ష్యామి పుత్రక॥
టీక:-
 అద్య = ఇప్పుడు, ప్రకృతయః = ప్రజలు, సర్వాః = సకల, త్వమ్ = నిన్ను, ఇచ్ఛంతి = కోరుచున్నారు, నరాధిపమ్ = రాజుగా, అతః = అందువలన, త్వామ్ = నిన్ను, యువరాజానమ్ = యువరాజుగా, అభిషేక్ష్యామి = అభిషేకింపగలను, పుత్రక = కుమారా.
భావం;-
 రామా! ఇపుడు నీవు రాజు కావలెనని సకల ప్రజలు కోరుచున్నారు. కుమారా! అందువలన నిన్ను యువరాజుగా అభిషిక్తుని చేసెదను.
గమనిక:-
 ప్రకృతః- స్వామ్యాది. (సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము.
2.4.17.
అనుష్టుప్.
అపి చాద్యాఽశుభాన్రామ
స్వప్నే పశ్యామి దారుణాన్।
సనిర్ఘాతా దివోల్కా చ
పతతీహ మహాస్వనా॥
టీక:-
 అపి చ = మఱియు, అద్య = ఇపుడు, అశుభాన్ = అశుభములను, రామ = రామా, స్వప్నే = స్వప్నము నందు, పశ్యామి = చూచుచున్నాను, దారుణాన్ = భయంకరమైన, సనిర్ఘాతా = పిడుగుతో కూడిన, దివా = పగటి యందు, ఉల్కా = ఉల్క, పతతి = పడుచున్నది, ఇహ = ఇచట, మహా = పెద్ద, స్వనా = ధ్వనితో.
భావం;-
 రామా! అంతియే కాక, అమంగళకరమైన, భయంకరమైన స్వప్నములను కనుచున్నాను. పిడుగులతో కూడిన ఉల్కలు పెద్దధ్వనితో పగటియందే పడుచున్నవి.
2.4.18.
అనుష్టుప్.
అవష్టబ్ధం చ మే రామ
నక్షత్రం దారుణైర్గ్రహైః।
ఆవేదయంతి దైవజ్ఞాః
సూర్యాంగారకరాహుభిః॥
టీక:-
 అవష్టబ్ధం = ఆక్రమించబడినదిగా, చ = మఱియు; మే = నాయొక్క, రామ = రామా, నక్షత్రం = నక్షత్రము, దారుణైః = క్రూరములైన, గ్రహైః = గ్రహములచే, ఆవేదయంతి = ఎఱిగించుచున్నారు, దైవజ్ఞాః = జ్యోతిష పండితులు, సూర్య = సూర్యుడు, అంగారక = కుజుడు, రాహుభిః = రాహువు.
భావం;-
 రామా! క్రూరగ్రహములు రవి, కుజుడు, రాహువు నా జన్మనక్షత్రమును ఆక్రమించి యున్నట్లు దైవజ్ఞులు హెచ్చరించుచున్నారు.
2.4.19.
అనుష్టుప్.
ప్రాయేణ హి నిమిత్తానామ్
ఈదృశానాం సముద్భవే।
రాజా హి మృత్యుమాప్నోతి
ఘోరం వాఽఽపదమృచ్ఛతి॥
టీక:-
 ప్రాయేణ = సాధారణముగా, హి, నిమిత్తానామ్ = శకునములయొక్క, ఈదృశానామ్ = ఇటువంటి, సముద్భవే = సంభవించినపుడు, రాజా = రాజు, హి, మృత్యుమ్ = మరణమును, ఆప్నోతి = పొందును, ఘోరమ్ = ఘోరమైన, వా = లేక, ఆపదమ్ = ప్రమాదమును, ఋచ్ఛతి = పొందును.
భావం;-
 ఇటువంటి అపశకునములు కనబడినపుడు, సాధారణముగా, రాజునకు మరణమో, ఘోరమైన ప్రమాదమో గాని సంభవించును.
2.4.20.
అనుష్టుప్.
తద్యావదేవ మే చేతో
న విముంచతి రాఘవ।
తావదేవాభిషించస్వ
చలా హి ప్రాణినాం మతిః॥
టీక:-
 తత్ = అందువలన, యావత్ ఏవ = ఎంతలో, మే = నా యొక్క, చేతః = మనసు, న = లేదో, విముంచతి = విడుచుట, రాఘవ = రఘువంశజుడా, తావత్ ఏవ = అంతలోనే, అభిషించస్వ = అభిషిక్తుడవగుము, చలా = చంచలమైనది, హి, ప్రాణినాం = ప్రాణులయొక్క, మతిః = బుద్ధి.
భావం;-
 రఘురామా! నా చిత్తప్రవృత్తిలో ఎట్టి మార్పు రాక మునుపే, నీవు అభిషిక్తుడ వగుము. ప్రాణుల మనస్సు చంచలమైనది కదా.
2.4.21.
అనుష్టుప్.
అద్య చంద్రోఽభ్యుపగతః
పుష్యాత్పూర్వం పునర్వసూ।
శ్వః పుష్యయోగం నియతం
వక్ష్యంతే దైవచింతకాః॥
టీక:-
 అద్య = నేడు, చంద్ర = చంద్రుడు, అభ్యుపగతః = పొందినాడు, పుష్యాత్ = పుష్యమి నక్షత్రముకంటె, పూర్వం = ముందు, పునర్వసూ = పునర్వసు నక్షత్రమును, శ్వః = రేపు, పుష్యయోగం = పుష్యమీ నక్షత్ర యోగమును, నియతం = నిశ్చితమైనది, వక్ష్యంతే = చెప్పుచున్నారు, దైవచింతకాః = జ్యోతిష్కులు.
భావం;-
 నేడు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమునుచేరి యున్నపుడు పట్టాభిషేకము చేయుటకు నిశ్చయ సమయమని దైవజ్ఞులు చెప్పుచున్నారు.
2.4.22.
అనుష్టుప్.
తతః పుష్యేఽభిషించిస్వ
మనస్త్వరయతీవ మామ్।
శ్వస్త్వాఽహమభిషేక్ష్యామి
యౌవరాజ్యే పరంతప!॥
టీక:-
 తతః = అందు వలన, పుష్యే = పుష్యమీ నక్షత్రమునందు, అభిషించిస్వ = అభిషిక్తుడ వగుము, మనః = మనసు, త్వరయతీవ = తొందర పెట్టినట్లగుచున్నది, మామ్ = నన్ను, శ్వః = రేపు, త్వాం = నిన్ను, అహమ్ = నేను, అభిషేక్ష్యామి = అభిషేకించెదను, యౌవరాజ్యే = యౌవరాజ్యమునందు, పరంతప = శత్రుసంహారకా.
భావం;-
 అందువలన నీవు పుష్యమీ నక్షత్రమునందు అభిషిక్తుడ వగుము. నా మనసు నన్ను త్వర పెట్టుచున్నది. ఓ శత్రుసంహారకా! రామా! రేపు నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేసెదను.
2.4.23.
అనుష్టుప్.
తస్మాత్త్వయాఽద్య ప్రభృతి
నిశేయం నియతాత్మనా।
సహ వధ్వోపవస్తవ్యా
దర్భప్రస్తరశాయినా॥
టీక:-
 తస్మాత్ = అందువలన, త్వయా = నీచే, అద్య = నేడు, ప్రభృతి = మొదలుకొని, నిశ = రాత్రి, ఇయం = ఈ, నియతాత్మనా = నిగ్రహించబడిన మనస్సు గలవాడవై, సహ = కలసి, వధ్వః = కోడలు, ఉపవస్తవ్య = ఉపవసించి, దర్భప్రస్తర = దర్భాసనముపై, శాయినా = నిదురించిన.
భావం;-
 అందువలన నీవు మనోనిగ్రహముతో ప్రవర్తించి, నా కోడలు సీతతోసహ దర్భలపై పరుండి ఉపవాసము చేయుము.
2.4.24.
అనుష్టుప్.
సుహృదశ్చాప్రమత్తాస్త్వాం
రక్షంత్వద్య సమంతతః।
భవంతి బహు విఘ్నాని
కార్యాణ్యేవంవిధాని హి॥
టీక:-
 సుహృతః = స్నేహితులు; చ = కూడ, అప్రమత్తాః = ఏమరపాటులేనివారు, త్వాం = నిన్ను, రక్షంతు = రక్షింతురుగాక, అద్య = నేడు, సమంతతః = నలుదిక్కుల, భవంతి = అగును, బహు = అనేకములైన, విఘ్నాని = విఘ్నములు గల, కార్యాణి = కార్యములు, ఏవం = ఈ, విధాని = విధమైన, హి = కదా.
భావం;-
 నీ స్నేహితులు కూడ అప్రమత్తులై నిన్ను అన్నివైపుల నుండి రక్షించవలెను. ఇటువంటి కార్యముల యందు అనేక విఘ్నములు కలుగుచుండును కదా.
2.4.25.
అనుష్టుప్.
విప్రోషితశ్చ భరతో
యావదేవ పురాదితః।
తావదేవాభిషేకస్తే
ప్రాప్తకాలో మతో మమ॥
టీక:-
 విప్రోషితః = దూరముగా నున్నవాడు, చ = మఱియు భరతః = భరతుడు, యావత్ ఏవ = ఎంతవరకు, పురాత్ = నగరమునుండి, ఇతః = ఈ, తావత్ ఏవ = అంతలోనే, అభిషేకః = అభిషేకము, తే = నీ యొక్క, ప్రాప్తకాలః = సముచితమైనదిగా, మతః = అభిప్రాయము, మమ = నాకు.
భావం;-
 భరతుడు ఈ నగరమునకు దూరముగా ఉన్నపుడే నీకు అభిషేకము చేయుట శ్రేయస్కరమని నా అభిప్రాయము.
2.4.26.
అనుష్టుప్.
కామం ఖలు సతాం వృత్తే
భ్రాతా తే భరతస్స్థితః।
జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా
సానుక్రోశో జితేంద్రియః!॥
టీక:-
 కామం = అధికముగా, ఖలు = యథార్థము, సతాం = సత్పురుషుల, వృత్తే = ప్రవర్తనలో, భ్రాతా = సోదరుడైన, తే = నీ యొక్క, భరతః = భరతుడు, స్థితః = ఉన్నాడు, జ్యేష్ఠా = అన్నను, అనువర్తీ = అనుసరించువాడు, ధర్మాత్మా = ధర్మాత్ముడు, సానుక్రోశః = దయాపరుడు, జితేంద్రియః = జయింపబడిన ఇంద్రియములు వాడు.
భావం;-
 నీ సోదరుడైన భరతుడు సత్పురుషుల మార్గములో ప్రవర్తించువాడు. అతడు జ్యేష్టసోదరుడవైన నిన్ను సదా అనుసరించును. ధర్మాత్ముడు, దయాపరుడు, ఇంద్రియములను జయించినవాడు. ఇది యథార్థము
2.4.27.
అనుష్టుప్.
కింతు చిత్తం మనుష్యాణామ్
అనిత్యమితి మే మతిః।
సతాం చ ధర్మనిత్యానాం
కృతశోభి చ రాఘవ!”॥
టీక:-
 కింతు = కాని, చిత్తం = మనసు, మనుష్యాణామ్ = మానవులయొక్క, అనిత్యమ్ = స్థిరముగా ఉండదు, ఇతి = అని, మే = నాయొక్క, మతిః = అభిప్రాయము, సతాం = సత్పురుషులైనను, చ, ధర్మః = ధర్మమునందు, నిత్యానాం = స్థిరముగ మసలువారిలో, కృత = చేయబడిన, శోభి = శోభగల, రాఘవ = రాఘవుడా.
భావం;-
 కానీ రామా! ధర్మనిరతులైన సజ్జనుల శోభాయుక్తమైన మనస్సు కూడ చంచలమై యుండునని నా అభిప్రాయము.”
2.4.28.
అనుష్టుప్.
ఇత్యుక్తస్సోఽభ్యనుజ్ఞాతః
శ్వోభావిన్యభిషేచనే।
వ్రజేతి రామః పితరమ్
అభివాద్యాభ్యయాద్గృహమ్॥
టీక:-
 ఇతి = ఈ విధముగా, ఉక్తః = పలుకబడి, సః = అతను, అభ్యనుజ్ఞాతః = అనుజ్ఞ ఇవ్వబడినవాడై, శ్వః = రేపు, భావిని = జరుగబోవు, అభిషేచనే = అభిషేకము విషయమున, వ్రజ = వెళ్ళుము, ఇతి = అని, రామః = రాముడు, పితరమ్ = తండ్రిని, అభివాద్య = నమస్కరించి, అభ్యయాత్ = వెళ్ళెను, గృహమ్ = గృహమును గూర్చి.
భావం;-
 దశరథుడు మరుసటిదినమున జరుగబోవు అభిషేకమును గూర్చి అట్లు పలికి, "నీవు వెళ్ళుము" అని అనుజ్ఞ నీయగా, రాముడు తండ్రికి నమస్కరించి తన మందిరమునకు వెళ్ళెను.
2.4.29.
అనుష్టుప్.
ప్రవిశ్య చాత్మనో వేశ్మ
రాజ్ఞోద్దిష్టేఽభిషేచనే।
తత్క్షణేన వినిర్గమ్య
మాతురంతఃపురం యయౌ॥
టీక:-
 ప్రవిశ్య = ప్రవేశించి, చ, ఆత్మనః = తనయొక్క, వేశ్మ = గృహమును, రాజ్ఞః = రాజుచే, ఉద్దిష్టే = నిర్ణయింపబడుచుండగా, అభిషేచనే = అభిషేకమున, తత్ = ఆ, క్షణేన = క్షణముననే, వినిర్గమ్య = బయలుదేరి, మాతుః = తల్లి యొక్క, అంతఃపురం = అంతఃపురముగూర్చి, యయౌ = వెళ్ళెను.
భావం;-
 దశరథమహారాజు అభిషేకముగూర్చి ఇట్లు నిర్ణయించుచుండగనే, రాముడు తన గృహమునకు వెళ్ళి, తక్షణమే తన తల్లియొక్క అంతఃపురమునకు బయలుదేరి వెళ్ళెను.
2.4.30.
అనుష్టుప్.
తత్ర తాం ప్రవణామేవ
మాతరం క్షౌమవాసినీమ్।
వాగ్యతాం దేవతాగారే
దదర్శాఽఽయాచతీం శ్రియమ్॥
టీక:-
 తత్ర = అక్కడ, తాం = ఆ, ప్రవణామేవ = భగవద్ధ్యానమునందు ఆసక్తురాలైన, మాతరం = తల్లిని, క్షౌమ = పట్టు, వాసినీమ్ = వస్త్రములు ధరించినామెను, వాగ్యతాం = మౌనముగా, దేవతాగారే = దేవమందిరమునందు, దదర్శ = చూసెను, ఆయాచతీం = ప్రార్థించుచున్న ఆమెను, శ్రియమ్ = శ్రేయస్సు.
భావం;-
 అక్కడ పట్టువస్త్రములు ధరించి తన అంతఃపురములోని పూజామందిరములో శ్రేయస్సు కోరి, మౌనముగా ధ్యానము చేయుచున్న తన తల్లి కౌసల్యను రాముడు చూచెను.
2.4.31.
అనుష్టుప్.
ప్రాగేవ చాగతా తత్ర
సుమిత్రా లక్ష్మణ స్తథా।
సీతా చానాయితా శ్రుత్వా
ప్రియం రామాభిషేచనమ్॥
టీక:-
 ప్రాగేవ = ముందుగనే, చ, ఆగతా = వచ్చెను, తత్ర = అచటికి, సుమిత్రా = సుమిత్ర, లక్ష్మణః = లక్ష్మణుడు, తథా = అట్లే, సీతా = సీత, చ, ఆనాయితా = రప్పించబడినది, శ్రుత్వా = విని, ప్రియం = ప్రియమైన, రామాభిషేచనమ్ = రామునికి అభిషేకముగురించి.
భావం;-
 ప్రియమైన రామాభిషేకముగురించి విని, అంతకు ముందుగనే, సుమిత్రయు, లక్ష్మణుడు అచటకు వచ్చిరి. సీతను కూడ అచటకు పిలిపించిరి.
2.4.32.
అనుష్టుప్.
తస్మిన్ కాలే హి కౌసల్యా
తస్థావామీలితేక్షణా।
సుమిత్రయాఽన్వాస్యమానా
సీతయా లక్ష్మణేన చ॥
టీక:-
 తస్మిన్ = ఆ, కాలే = సమయమున, కౌసల్యా = కౌసల్య, తస్థౌ = ఉండెను, ఆమీలితేక్షణా = మూయబడిన కన్నులు గల, సుమిత్రయా = సుమిత్రచే, అన్వాస్యమాన = చెంతన ఉండి సేవించబడుచు, సీతయా = సీతచేతను, లక్ష్మణేన = లక్ష్మణునిచేతను.
భావం;-
 ఆ సమయమున కౌసల్య కండ్లు మూసుకొని ధ్యానము చేయుచుండెను. సుమిత్ర, లక్ష్మణుడు, సీతయు ఆమె చెంతనే కూర్చొని యుండిరి.
2.4.33.
అనుష్టుప్.
శ్రుత్వా పుష్యేణ పుత్రస్య
యౌవరాజ్యాఽభిషేచనమ్।
ప్రాణాయామేన పురుషం
ధ్యాయమానా జనార్దనమ్॥
టీక:-
 శ్రుత్వా = విని, పుష్యేణ = పుష్యమీ నక్షత్రమునందు, పుత్రస్య = పుత్రునియొక్క, యౌవరాజ్యాభిషేచనమ్ = యౌవరాజ్యాభిషేకమును, ప్రాణాయామేన = ప్రాణాయామముతో, పురుషం = పురుషోత్తమునిగూర్చి, ధ్యాయమానా = ధ్యానము చేయుచుండెను, జనార్దనమ్ = జనార్దనునిగూర్చి.
భావం;-
 పుష్యమీ నక్షత్రమున తన కుమారునకు జరుగబోవు యౌవరాజ్యాభిషేక వార్త విని, కౌసల్య ప్రాణాయామము చేసి పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువును గూర్చి ధ్యానము చేయుచుండెను.
2.4.34.
అనుష్టుప్.
తథా సనియమామేవ
సోఽభిగమ్యాభివాద్య చ।
ఉవాచ వచనం రామో
హర్షయంస్తామిదం తదా॥
టీక:-
 తథా = అట్లు, స = కూడిఉన్న, నియమామేవ = నియమముతో, సః = అతడు, అభిగమ్య = సమీపించి, అభివాద్య = నమస్కరించియు, చ, ఉవాచ = పలికెను, వచనం = మాటను, రామః = రాముడు, హర్షయన్ = సంతోషింపజేయుచు, తామ్ = ఆమెను, ఇదం = ఈ, తదా = అపుడు.
భావం;-
 రాముడు అట్లు నియమముతో ధ్యాననిమగ్నయై యున్న తల్లిని సమీపించి, ప్రణమిల్లి, ఆమెకు ఆనందము చేకూర్చునట్లు ఇట్లు పలికెను.
2.4.35.
అనుష్టుప్.
“అంబ! పిత్రా నియుక్తోఽస్మి
ప్రజాపాలనకర్మణి।
భవితా శ్వోఽభిషేకో మే
యథా మే శాసనం పితుః॥
టీక:-
 అంబ = తల్లీ, పిత్రా = తండ్రిచే, నియుక్తః = నియమింపబడి, అస్మి = ఉంటిని, ప్రజాపాలన = ప్రజలను పరిపాలించు, కర్మణి = కార్యమునందు, భవితా = కాగలదు, శ్వః = రేపు, అభిషేకః = అభిషేకము, మే = నా యొక్క, యథా = ఏవిధముగా ఐతే అట్లు, మే = నా యొక్క, శాసనం = ఆజ్ఞ, పితుః = తండ్రి యొక్క.
భావం;-
 “తల్లీ! తండ్రి గారు నన్ను ప్రజాపాలన చేయు కార్యమునందు నియమించినారు. వారి ఆజ్ఞ ననుసరించి రేపు నాకు యౌవరాజ్యాభిషేకము జరుగనున్నది.
2.4.36.
అనుష్టుప్.
సీతయాప్యుపవస్తవ్యా
రజనీయం మయా సహ।
ఏవమృత్విగుపాధ్యాయై
స్సహ మాముక్తవాన్పితా॥
టీక:-
 సీతయా = సీతచే, అపి = కూడ, ఉపవస్తవ్యా = ఉపవసించవలెనని, రజనీ = రాత్రి, ఇయమ్ = ఈ, మయా = నాతో, సహ = కూడి, ఏవమ్ = ఇట్లు, ఋత్విక్ = ఋత్విక్కులు, ఉపాధ్యాయైః = ఉపాధ్యాయులతోడను, సహ = కలసియున్న, మామ్ = నాగూర్చి, ఉక్తవాన్ = పలికెను, పితా = తండ్రి.
భావం;-
 నాతో సీత కూడ ఈ రాత్రి ఉపవసించవలెనని, ఋత్విక్కులు, ఉపాధ్యాయులు ఎదురుగా మాతండ్రి గారు చెప్పిరి.
2.4.37.
అనుష్టుప్.
యాని యాన్యత్ర యోగ్యాని
శ్వోభావిన్యభిషేచనే।
తాని మే మంగలాన్యద్య
వైదేహ్యాశ్చైవ కారయ॥
టీక:-
 యాని యాని = ఏ యే, అత్ర = అక్కడ, యోగ్యాని = తగినవి, శ్వః = రేపు, భావిని = జరుగబోవు, అభిషేచనే = అభిషేకమునందు, తాని = వాటిని, మే = నాకు, మంగలాని = మంగళములు, అద్య = నేడు, వైదేహ్యాః = సీతకు, చ ఏవ = కూడ, కారయ = చేయింపుము.
భావం;-
 రేపు నాకు జరుగబోవు అభిషేకమునకు సంబంధించిన మంగళకార్యములు నేడు నాకును సీతకును చేయింపుము.”
2.4.38.
అనుష్టుప్.
ఏతచ్ఛ్రుత్వా తు కౌసల్యా
చిరకాలాభికాంక్షితమ్।
హర్షబాష్పకలం వాక్యమ్
ఇదం రామమభాషత॥
టీక:-
 ఏతత్ = ఇది, శ్రుత్వా తు = విని, కౌసల్యా = కౌసల్య, చిరకాల = చాలకాలముగా, అభికాంక్షితమ్ = కోరుబడుచున్న, హర్షబాష్పకలం = ఆనందాశ్రువులతో కూడిన, వాక్యమ్ = మాటను, ఇదం = ఈ, రామమ్ = రాముని గూర్చి, అభాషత = పలికెను.
భావం;-
 కౌసల్య చాల కాలముగా కోరుచున్న రాముని అభిషేక వార్త విని, ఆనందాశ్రువులతో కూడిన రామునితో ఇలా పలికెను.
2.4.39.
అనుష్టుప్.
“వత్స రామ! చిరంజీవ
హతాస్తే పరిపంథినః।
జ్ఞాతీన్మే త్వం శ్రియా యుక్త
స్సుమిత్రాయాశ్చ నందయ॥
టీక:-
 వత్స = కుమారా, రామ = రామా, చిరం = చాల కాలము, జీవ = జీవింపుము, హతాః = నశించినవారు, తే = నీయొక్క, పరిపంథినః = శత్రువులు, జ్ఞాతీన్ = జ్ఞాతులను, మే = నా యొక్క, త్వం = నీవు, శ్రియా = ఐశ్వర్యముతో, యుక్తః = కలిగియుండి, సుమిత్రాయాః = సుమిత్రయొక్క, చ = కూడా, నందయ = ఆనందింపజేయుము.
భావం;-
 “కూమారా, రామా! చిరకాలము జీవింపుము. నీ శత్రువులు నశించెదరు గాక! నా జ్ఞాతులను, సుమిత్ర జ్ఞాతులను ఆనందింపజేయుము.
2.4.40.
అనుష్టుప్.
కల్యాణే బత నక్షత్రే
మయి జాతోఽసి పుత్రక।
యేన త్వయా దశరథో
గుణైరారాధితః పితా॥
టీక:-
 కల్యాణే = కల్యాణప్రదమైన, బత = ఎంత ఆనందకరము, నక్షత్రే = నక్షత్రమునందు, మయి = నా యందు, జాతః = పుట్టి, అసి = ఉన్నావు, పుత్రక = పుత్రా, యేన = ఏ, త్వయా = నీచేత, దశరథః = దశరథుడు, గుణైః = సద్గుణములచే, ఆరాధితః = సంతోషించబడినాడు, పితా = తండ్రి.
భావం;-
 కుమారా రామా! నీవు నా యందు జన్మించిన నక్షత్రము చాల కల్యాణప్రదమైనది. అందువలన నీవు సద్గుణములతో నీ తండ్రి దశరథమహారాజును సంతోషింపపరచితివి.
2.4.41.
అనుష్టుప్.
అమోఘం బత మే క్షాంతం
పురుషే పుష్కరేక్షణే।
యేయమిక్ష్వాకురాజ్యశ్రీః
పుత్ర! త్వాం సంశ్రయిష్యతి”॥
టీక:-
 అమోఘం = వ్యర్థము కానివి, బత = ఎంత ఆనందము, మే = నా యొక్క, క్షాంతం = ఉపవాసములు వ్రతములు, పురుషే = శ్రీమహావిష్ణువునందు, పుష్కరేక్షణే = తామరరేకులవంటి కన్నులు కలవానియందు, యా = ఏ, ఇయమ్ = ఈ, ఇక్ష్వాకు రాజ్యశ్రీః = ఇక్ష్వాకు వంశపు రాజ్యలక్ష్మి, పుత్ర = కుమారా, త్వాం = నిన్ను, సంశ్రయ = ఆశ్రయించుటకు, యిష్యతి = ఇష్టపడుచున్నది.
భావం;-
 కుమారా రామా! నేను శ్రీమహావిష్ణువును గూర్చి చేసిన ఉపవాసములు, వ్రతములు వ్యర్థములు కాక, సఫలమైనవి. అందువలననే ఇక్ష్వాకువంశ రాజ్యలక్ష్మి నిన్ను ఆశ్రయించుటకు ఇష్టపడుచున్నది.”
2.4.42.
అనుష్టుప్.
ఇత్యేవముక్తో మాత్రేదం
రామో భ్రాతరమబ్రవీత్।
ప్రాంజలిం ప్రహ్వమాసీనమ్
అభివీక్ష్య స్మయన్నివ॥
టీక:-
 ఇతి ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలుకబడిన, మాత్రా = తల్లిచే, ఇదమ్ = ఈ, రామః = రాముడు, భ్రాతరమ్ = సోదరుని, అబ్రవీత్ = పలికెను, ప్రాంజలిం = ప్రణమిల్లుచున్నవాని, ప్రహ్వమ్ = వినమ్రముగానున్నవానిని, ఆసీనమ్ = కూర్చొనియున్నవానిని, అభివీక్ష్య = చూచి, స్మయన్ = నవ్వుచు, ఇవ = వలె.
భావం;-
 ఈ విధముగా తల్లి పలికిన మాటలు విని రాముడు, వినమ్రుడై నమస్కరించుచు కూర్చునియున్న లక్ష్మణుని చూసి చిరునవ్వుతో ఇట్లు పలికెను.
2.4.43.
అనుష్టుప్.
“లక్ష్మణేమాం మయా సార్ధం
ప్రశాధి త్వం వసుంథరామ్।
ద్వితీయం మేఽంతరాత్మానం
త్వామియం శ్రీరుపస్థితా॥
టీక:-
 లక్ష్మణే = లక్ష్మణా, ఇమాం = ఈ, మయా = నాతో, సార్ధం = కలసినవాడవు, ప్రశాధి = పాలింపుము, త్వం = నీవు, వసుంథరామ్ = భూమిని, ద్వితీయం = రెండవ, మే = నా యొక్క, అంతరాత్మానం = అంతరాత్మవైన, త్వామ్ = నిన్ను, ఇయం = ఈ, శ్రీః = లక్ష్మి, ఉపస్థితా = చేరినది.
భావం;-
 లక్ష్మణా! నీవు నాతో కలసి ఈ భూమిని పరిపాలింపుము. నీవు నా రెండవ అంతరాత్మవు. అందువలన నిన్ను సహితము ఈ రాజ్యలక్ష్మి వరించినది.
2.4.44.
అనుష్టుప్.
సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమ్
ఇష్టాన్ రాజ్యఫలాని చ।
జీవితం చ హి రాజ్యం చ
త్వదర్థమభికామయే॥
టీక:-
 సౌమిత్రే = లక్ష్మణా, భుంక్ష్వ = అనుభవింపుము, భోగాన్ = భోగములను, త్వమ్ = నీవు, ఇష్టాన్ = ఇష్టములైన, రాజ్యఫలాని = రాజ్యఫలములను, చ, జీవితం = జీవితమును, చ హి, రాజ్యం = రాజ్యమును, చ, త్వదర్థమ్ = నీ కొరకు, అభికామయే = కోరుచుంటిని.
భావం;-
 లక్ష్మణా! నీ కిష్టమైన భోగములను, రాజ్యఫలములను కూడ అనుభవింపుము. నేను జీవితమును, రాజ్యమును నీ కొరకే కోరుచున్నాను.
2.4.45.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా లక్ష్మణం రామో
మాతరావభివాద్య చ।
అభ్యనుజ్ఞాప్య సీతాం చ
జగామ స్వం నివేశనమ్॥
టీక:-
 ఇతి = ఇట్లు, ఉక్త్వా = పలికి, లక్ష్మణం = లక్ష్మణుని గూర్చి, రామః = రాముడు, మాతరౌ = తల్లులిద్దరిని, అభివాద్య = నమస్కరించి, చ, అభ్యనుజ్ఞాప్య = అనుమతి పొందింపజేసి, సీతాం = సీతకు, చ = కూడ, జగామ = వెళ్ళెను, స్వం = తన, నివేశనమ్ = గృహమును గుఱించి.
భావం;-
 రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికి, తల్లులిద్దరికిని నమస్కరించి, వారి అనుమతి పొంది, సీతతో కలసి తన భవనమునకు వెళ్ళెను.
2.4.46.
గద్య.ం.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
చతుర్థ సర్గః॥
టీక:-
  ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; చతుర్థః [4] = నాలుగవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [4] నాలుగవ సర్గ సమాప్తము
2.5.1.
అనుష్టుప్.
సందిశ్య రామం నృపతి
శ్శ్వోభావిన్యభిషేచనే।
పురోహితం సమాహూయ
వసిష్ఠమిదమబ్రవీత్॥
సందిశ్య = పంపివేసి; రామం = రాముని; నృపతిః = రాజు; శ్వః = రేపు; భావిని = జరుగబోవు; అభిషేచనే = అభిషేక విషయమున; పురోహితం = పురోహితుడైన; సమాహూయ = పిలిచి; వసిష్ఠం = వసిష్ఠుని; ఇదమ్ = ఈ మాటను; అబ్రవీత్ = పలికెను.
దశరథమహారాజు రాముని పంపివేసి, తన పురోహితుడు వసిష్ఠుని పిలువనంపి, మరుసటిదినమున జరుగబోవు అభిషేకవిషయమును గురించి ఇట్లు పలికెను.
2.5.2.
అనుష్టుప్.
“గచ్ఛోపవాసం కాకుత్స్థం
కారయాద్య తపోధన!।
శ్రీయశోరాజ్యలాభాయ
వధ్వా సహ యతవ్రతమ్”॥
గచ్ఛః = వెళ్ళుము; ఉపవాసం = ఉపవాసమును; కాకుత్స్థం = కాకుత్స్థ వంశమువానిచే (రామునిచే); కారయ = చేయించుము; అద్య = నేడు; తపోధన = తపోధనుడైన మహర్షీ; శ్రీ = ఐశ్వర్యము; యశః = కీర్తి; రాజ్యలాభాయ = రాజ్యలాభముకొరకు; వధ్వా = కోడలు; సహ = కూడి; యతవ్రతమ్ = వ్రతబద్ధుడైనవాని.
“ఓ మహర్షీ! నీవు వెళ్ళి, వ్రతబద్ధుడైన రామునిచేతను, కోడలు సీతచేతను, ఐశ్వర్యము కీర్తి రాజ్యలాభములు పొందుటకై ఉపవాసము చేయించుము.”
2.5.3.
అనుష్టుప్.
తథేతి చ స రాజానమ్
ఉక్త్వా వేదవిదాం వరః।
స్వయం వసిష్ఠో భగవాన్
యయౌ రామనివేశనమ్॥
తథా = అట్లే; ఇతి = అగుగాక; సః = ఆతడు; రాజానమ్ = రాజునుగూర్చి; ఉక్త్వా = పలికి; వేదవిదాం = వేద వేత్తలలో; వరః = శ్రేష్ఠుడు; స్వయం = స్వయముగ; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = భగవత్స్వరూపుడైన; యయౌ = వెళ్ళెను; రామ = రాముని యొక్క; నివేశనమ్ = భవనమునుగూర్చి.
వేదకోవిదులలో శ్రేష్ఠుడును భగవత్స్వరూపుడునైన వసిష్ఠుడు "అట్లే అగుగాక" అని దశరథమహారాజుతో పలికి తాను స్వయముగ రాముని భవనమునకు వెళ్ళెను.
2.5.4.
అనుష్టుప్.
ఉపవాసయితుం రామం
మంత్రవన్మంత్రకోవిదః।
బ్రాహ్మం రథవరం యుక్తమ్
ఆస్థాయ సుదృఢవ్రతః॥
ఉపవాసయితుం = ఉపవాసము చేయించుటకై; రామం = రాముని; మంత్రవత్ = సమంత్రకముగా; మంత్రకోవిదః = మంత్ర శాస్త్ర పండితుడు; బ్రాహ్మం = బ్రాహ్మణునకు యోగ్యమైన; రథవరం = శ్రేష్ఠమైన రథమును; యుక్తమ్ = సిద్ధముచేసి ఉంచబడిన; ఆస్థాయ = అధిరోహించి; సుదృఢవ్రతః = దృఢమైన వ్రత నియమము కలవాడు.
మంత్రశాస్త్రకోవిదుడును, దృఢవ్రతనియమము కలవాడునైన వసిష్ఠబ్రహ్మర్షి, బ్రాహ్మణులకు యోగ్యమైనదియు శ్రేష్ఠమైనదియునగు సిద్ధముగానున్న రథము నధిరోహించి, మంత్రపూర్వకముగా రామునిచే ఉపవాసదీక్ష పూనించుటకై రాముని గృహమునకు వెళ్ళెను.
2.5.5.
అనుష్టుప్.
స రామభవనం ప్రాప్య
పాండురాభ్రఘనప్రభమ్।
తిస్రః కక్ష్యా రథేనైవ
వివేశమునిసత్తమః॥
సః = అతడు; రామ = రాముని; భవనం = భవనమును; ప్రాప్య = పొంది (చేరి); పాండుర = తెల్లని; అభ్ర = మేఘముల; ఘన = దట్టమైన; ప్రభమ్ = కాంతివంతమైన; తిస్రః = మూడు; కక్ష్యా = వాకిళ్ళలను, ప్రాకారములు; రథేన = రథము చేత; ఏవ = మాత్రమే; వివేశ = ప్రవేశించెను; మునిసత్తమః = మునిపుంగవుడు.
తెల్లనిమేఘము వలె ప్రకాశించుచున్న రాముని భవనమునకు వసిష్ఠ మునిపుంగవుడు చేరి, మూడు ప్రాకారములను రథముతోనే ప్రవేశించెను.
2.5.6.
అనుష్టుప్.
తమాగతమృషిం రామః
త్వరన్నివ ససమ్భ్రమః।
మానయిష్యన్సమానార్హం
నిశ్చక్రామ నివేశనాత్॥
తమ్ = ఆ; ఆగతమ్ = ఏతెంచిన; ఋషిం = ఋషిని; రామః = రాముడు; త్వరన్ = త్వరపడుచున్న; ఇవ = వలె; ససమ్భ్రమః = కంగారుగ; మానయిష్యన్ = పూజింపనున్నవాడై; సః = అతడు; మానార్హం = గౌరవింపతగిన వాడైన; నిశ్చక్రామ = బయలుదేరెను; నివేశనాత్ = గృహమునుండి.
తన గృహమునకు ఏతెంచిన, పూజ్యనీయుడు వసిష్ఠమహర్షిని పూజించుటకై త్వరపడుచు కంగారుగ రాముడు తన గృహమునుండి బయటకు వచ్చెను.
2.5.7.
అనుష్టుప్.
అభ్యేత్య త్వరమాణశ్చ
రథాభ్యాశం మనీషిణః।
తతోఽవతారయామాస
పరిగృహ్య రథాత్స్వయమ్॥
అభ్యేత్య = పొంది; త్వరమాణః = త్వరపడుచున్నవాడు; రథాభ్యాశం = రథమును సమీపించి; మనీషిణః = బుద్ధిమంతుడు; తతః = ఆ; అవతారయామాస = దింపెను; పరిగృహ్య = పట్టుకొని; రథాత్ = రథమునుండి; స్వయమ్ = స్వయముగ.
రాముడు త్వరగా మహాజ్ఞాని వసిష్ఠుని రథమును సమీపించి, ఆయనను చేయి పట్టుకొని రథమునుండి స్వయముగ క్రిందకు దింపెను.
2.5.8.
అనుష్టుప్.
స చైనం ప్రశ్రితం దృష్ట్వా
సంభాష్యాభిప్రసాద్య చ।
ప్రియార్హం హర్షయన్ రామమ్
ఇత్యువాచ పురోహితః॥
సః = అతడు; ఏనం = ఈ; ప్రశ్రితం = వినయశీలిని; దృష్ట్వా = చూసి; సంభాష్య = పలుకరించి; అభిప్రసాద్య = ప్రసన్నుని చేసుకొని; ప్రియార్హం = ప్రియవచనములకు పాత్రుడుని; హర్షయన్ = సంతోషింపజేయుచు; రామమ్ = రామునిగూర్చి; ఇతి = ఇట్లు; ఉవాచ = పలికెను; పురోహితః = పురోహితుడు.
పురోహితుడు వసిష్ఠుడును వినయశీలి, ప్రియవచనములకు పాత్రుడునైన రాముని పలుకరించి, అతనికి సంతోషకరముగ ఇట్లు పలికెను.
2.5.9.
అనుష్టుప్.
ప్రసన్నస్తే పితా రామ
యౌవరాజ్యమవాప్స్యసి।
ఉపవాసం భవానద్య
కరోతు సహ సీతయా॥
ప్రసన్నః = ప్రసన్నుడైనాడు; తే = నీ; పితా = తండ్రి; రామ = ఓ రామా; యౌవరాజ్యమ్ = యువరాజత్వమును; అవాప్స్యసి = పొందెదవు; ఉపవాసం = ఉపవాసమును; కరోతు = చేసెదవు గాక; సహ = కూడి; సీతయా = సీతతో.
రామా! నీ తండ్రి నీయందు ప్రసన్నుడై యున్నాడు. నీవు యౌవరాజ్యాభిషిక్తుడ వగుదువు. అందువలన నీవు సీతతో కలసి ఉపవాసము చేయుము.
2.5.10.
అనుష్టుప్.
ప్రాతస్త్వామభిషేక్తా హి
యౌవరాజ్యే నరాధిపః।
పితా దశరథః ప్రీత్యా
యయాతిం నహుషో యథా॥
ప్రాతః = ఉదయమున; త్వామ్ = నిన్ను; అభిషేక్తా = అభిషిక్తుని చేయనున్నాడు; హి = కదా; యౌవరాజ్యే = యౌవరాజ్యమునందు; నరాధిపః = రాజు; పితా = తండ్రి; దశరథః = దశరథుడు; ప్రీత్యా = ప్రేమతో; యయాతిం = యయాతిని; నహుషః = నహుషుడు. యథా = వలె.
రామా! నహుషచక్రవర్తి యయాతిని అభిషిక్తపరచినట్లు, రేపు ఉదయమున నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ప్రేమపూర్వకముగా యౌవరాజ్యమునందు అభిషిక్తుని చేయనున్నాడు.
2.5.11.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా స తదా రామమ్
ఉపవాసం యతవ్రతమ్।
మంత్రవత్కారయామాస
వైదేహ్యా సహితం మునిః॥
ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; సః = ఆతడు; తదా = అప్పుడు; రామమ్ = రాముని; ఉపవాసం = ఉపవాసమును; యతవ్రతమ్ = నియమముతో కూడిన వ్రతమును; మంత్రవత్ = మంత్రపూర్వకముగా; కారయామాస = చేయించెను; వైదేహ్యా = సీత; సహితం = సమేతముగా; మునిః = ముని.
వసిష్ఠుడు ఇట్లు పలికి, నియమముగను మంత్రసహితముగను సీతాసమేతముగా రామునితో ఉపవాసము చేయించెను.
2.5.12.
అనుష్టుప్.
తతో యథావద్రామేణ
స రాజ్ఞో గురురర్చితః।
అభ్యనుజ్ఞాప్య కాకుత్స్థం
యయౌ రామనివేశనాత్॥
తతః = తరువాత; యథావత్ = శాస్త్రసమ్మతముగ; రామేణ = రామునిచే; సః = అతను; రాజ్ఞః = రాజు యొక్క; గురుః = గురువు; అర్చితః = పూజింపబడినవాడు; అభ్యనుజ్ఞాప్య = అనుజ్ఞ ఇచ్చునట్లుగ చేసి; కాకుత్స్థం = కాకుత్స్థ వంశపువాడైన రాముని; యయౌ = వెళ్ళెను; రామ = రామునియొక్క; నివేశనాత్ = భవనమునుండి.
తరువాత, రాముడు తమ గురువు వసిష్ఠుని యథోచితముగ పూజించెను. వసిష్ఠుడు రాముని అనుజ్ఞ గైకొని అతని భవనమునుండి వెళ్ళిపోయెను.
2.5.13.
అనుష్టుప్.
సుహృద్భిస్తత్ర రామోఽపి
సహాసీనః ప్రియంవదైః।
సభాజితో వివేశాఽథ
తాననుజ్ఞాప్య సర్వశః॥
సుహృద్భిః = మిత్రులు; తత్ర = అక్కడ; రామః = రాముడు; అపి = కూడ; సహ = కూడి; ఆసీనః = కూర్చొన్నవాడు; ప్రియం = ప్రియముగా; వదైః = మాటలాడువాడు; సభాజితః = గౌరవింపబడినవాడు; వివేశ = ప్రవేశించెను; అథ = తరువాత; తాన్ = వారిని; అనుజ్ఞాప్య = అనుజ్ఞ పొంది; సర్వశః = అన్నివిధముల.
రాముడు కొంత తడవ తన మిత్రులతో ప్రియసంభాషణము చేసి, వారిచే గౌరవింపబడి, అన్ని విధముల వారి అనుమతి పొంది లోనికి వెళ్ళెను.
2.5.14.
అనుష్టుప్.
హృష్టనారీనరయుతం
రామవేశ్మ తదా బభౌ।
యథా మత్తద్విజగణం
ప్రఫుల్లనలినం సరః॥
హృష్ట = సంతోషముగా నున్న; నారీ = స్త్రీలతో; నర = పురుషులతో; యుతమ్ = కూడిన; రామః = రాముని; వేశ్మ = భవనము; తదా = అప్పుడు; బభౌ = ప్రకాశించెను; యథా = వలె; మత్త = మదించిన; ద్విజ = పక్షుల; గణమ్ = గుంపు; ప్రఫుల్ల = వికసించిన; నలినం = తామరపువ్వులు; సరః = సరస్సు.
అప్పుడు మదించిన పక్షులగుంపులతోను, వికసించిన తామరపువ్వులతో నిండిన సరస్సు వలె, రాముని భవనము, సంతోషముగానున్న స్త్రీపురుషులతో, ప్రకాశించెను.
రాకుమారుడు రాముని అంతఃపురము, తెల్లగా (పాండుర) మెరిసిపోతూ మూడు ప్రాకారములతో (తిస్ర కక్ష్య) ఒప్పి ఉండెడిది. (2.5.5.
అనుష్టుప్..) + బలిసిన పక్షులు, వికసించిన తామరపూలతో మనోహరంగా ఉన్న సరస్సులవలె, సంతోషపూరిత స్త్రీపురుషులతో విరాజిల్లుతోంది.
2.5.15.
అనుష్టుప్.
స రాజభవనప్రఖ్యాత్
తస్మాద్రామనివేశానాత్।
నిర్గత్య దదృశే మార్గం
వసిష్ఠో జనసంవృతమ్॥
సః = ఆతడు; రాజభవన = రాజభవనమువలె; ప్రఖ్యాత్ = సదృశమైన, ప్రసిద్ధమైన; తస్మాత్ = ఆ; రామ నివేశనాత్ = రాముని యొక్క భవనమునుండి; నిర్గత్య = బయలుదేరి; దదృశే = చూసెను; మార్గం = (అంతఃపుర ప్రవేశ) దారిని; వసిష్ఠః = వసిష్ఠుడు; జనసంవృతమ్ = జనముతో నిండిన.
రాజభవనమువలె ఉన్న రాముని భవనమునుండి వసిష్ఠుడు బయలుదేరి జనముతో నిండియున్న ప్రవేశమార్గమును చూసెను.
2.5.16.
అనుష్టుప్.
బృందబృందైరయోధ్యాయాం
రాజమార్గాస్సమంతతః।
బభూవురభిసంబాధాః
కుతూహలజనైర్వృతాః॥
బృందబృందైః = గుంపులు గుంపులుగా ఉన్న; అయోధ్యాయాం = అయోధ్యానగరమునందు; రాజమార్గః = రాజమార్గములు; సమంతతః = అంతట; బభూవుః = ఉండెను; అభిసంబాధాః = క్రిక్కిరిసి; కుతూహల = కుతూహలముతో నిండిన; జనైః = జనులతో; వృతాః = కూడినవి.
అయోధ్యానగరము నందలి రాజమార్గము లన్నియు, కుతూహలముతో గుంపులు గుంపులుగా ఏర్పడిన జనులతో క్రిక్కిరిసి ఉండెను.
2.5.17.
అనుష్టుప్.
జనబృందోర్మిసంఘర్ష
హర్షస్వనవతస్తదా।
బభూవ రాజమార్గస్య
సాగరస్యేవ నిస్వనః॥
జన = ప్రజల; బృందః = సముదాయములు అను; ఊర్మి = తరంగముల; సంఘర్ష = తోపులాటల వలన; హర్ష = సంతోషపు; స్వనవతః = ధ్వనులుగల; తదా = అప్పుడు; బభూవ = అయ్యెను; రాజమార్గస్య = రాజమార్గముయొక్క; సాగరస్య = సముద్రముయొక్క; ఇవ = వలె; నిస్వన = ధ్వని.
అప్పుడు, రాజమార్గములో సంతోషముతో కూడిన జనసముదాయములు తోపులాటలు వలన కలిగిన కోలాహలధ్వని, సముద్రకెరటాల ఒరిపిడి వలన కలుగు సముద్రఘోషను తలపించెను.
2.5.18.
అనుష్టుప్.
సిక్తసమ్మృష్టరథ్యా హి
తదహర్వనమాలినీ।
ఆసీదయోధ్యానగరీ
సముచ్ఛ్రితగృహధ్వజా॥
సిక్త = తడపి, కళ్ళాపి జల్లిన; సమ్మృష్ట = తుడిచిన; రథ్యా= వీధులు కలదిగాను; హి; తత్ = ఆ; అహః = దినము; వన = వృక్షముల; మాలినీ = పంక్తులు గలది; ఆసీత్ = అయ్యెను; అయోధ్యానగరీ; సముచ్ఛ్రిత = ఎగురవేయబడిన; గృహ = ఇంటి; ధ్వజా = ధ్వజములు కలది.
ఆ దినమున, చెట్లవరుసలుతో ఉన్న ఆ అయోధ్యనగర వీధులన్నిటిని తుడిచి కళ్ళాపి జల్లి తడిపిరి. గృహములపై జెండా లెగురవేసిరి.
2.5.19.
అనుష్టుప్.
తదా హ్యయోధ్యాని లయ
స్సస్త్రీబాలాబలో జనః।
రామాభిషేకమాకాంక్షన్
నాకాంక్షదుదయం రవేః॥
తదాః = అప్పుడు; హీ; అయోధ్యః = అయోధ్యలో; ఆనిలయః = ఉంటున్న; స = సహితముగ; స్త్రీః = స్త్రీలు; బాలః = పిల్లలు; అబలః = వృద్ధులూ ఐన; జనః = జనము; రామాభిషేకమ్ = రామునియొక్క అభిషేకము; ఆకాంక్షన్ = కోరుచు; ఆకాంక్షత్ = కోరెను; ఉదయం = ఉదయమును; రవేః = సూర్యునియొక్క.
అయోధ్యానగరములో స్త్రీ బాల వృద్ధులతో సహ జనులందరు రాముని యౌవరాజ్యాభిషేకము ఆకాంక్షించుచు సూర్యోదయమునకై వేచియుంటిరి.
2.5.20.
అనుష్టుప్.
ప్రజాలంకారభూతం చ
జనస్యానందవర్ధనమ్।
ఉత్సుకోఽభూజ్జనో ద్రష్టుం
తమయోధ్యామహోత్సవమ్॥
ప్రజః = ప్రజలకు; అలంకార = అలంకారం; భూతం = ఐనది; జనస్య = జనముయొక్క; ఆనంద = ఆనందమును; వర్ధనమ్ = వృద్ధి పరచునది; ఉత్సుకః = వేడుక కలది; అభూత్ = అయ్యెను; జనః = జనము; ద్రష్టుం = చూచుటను; తమ్ = ఆ; అయోధ్యా = అయోధ్యలో జరుగనున్న; మహోత్సవమ్ = మహోత్సవము.
ప్రజలకు అలంకారమైనది, జనుల ఆనందమును వృద్ధిపరచునది ఐన అయోధ్యానగరములో జరుగనున్న మహోత్సవమును చూచుటకు జనులు మిగుల ఉత్సాహపడుచుండిరి.
2.5.21.
అనుష్టుప్.
ఏవం తజ్జనసంబాధం
రాజమార్గం పురోహితః।
వ్యూహన్నివ జనౌఘం తం
శనై రాజకులం యయౌ॥
ఏవమ్ = ఈ విధముగ; తత్ = ఆ; జన = జనులచే; సంబాధం = క్రిక్కిరిసియున్న; రాజమార్గం = రాజమార్గమును; పురోహితః = పురోహితుడు; వ్యూహన్ = విభజించుచున్నవాని; ఇవ = వలె; జనః = జనముతో; ఓఘం = సమూహమును; తం = ఆ; శనైః = మెల్లగా; రాజకులం = రాజగృహమును; యయౌ = పొందెను.
పురోహితుడు వసిష్ఠుడు ఈ విధముగ జనముతో క్రిక్కిరిసియున్న రాజమార్గమును చూచుచు, ఆ జనసమూహమును రెండుగా విభజించుచున్నట్లుగ మెల్లమెల్లగా రాజప్రాసాదమును చేరెను.
2.5.22.
అనుష్టుప్.
సితాభ్రశిఖరప్రఖ్యమ్
ప్రాసాదమధిరుహ్య సః।
సమీయాయ నరేంద్రేణ
శక్రేణేవ బృహస్పతిః॥
సిత = తెల్లని; అభ్ర = మేఘము గల; శిఖర = పర్వతశిఖరము; ప్రఖ్యమ్ = వలెనున్న; ప్రాసాదమ్ = రాజప్రాసాదమును; అధిరుహ్య = ఎక్కి; సః = అతడు; సమీయాయ = కలిసెను; నరేంద్రేణ = రాజుతో; శక్రేణ = ఇంద్రునితో; ఇవ = వలె; బృహస్పతిః = బృహస్పతి.
వసిష్ఠుడు తెల్లటిమేఘముతో నిండిన పర్వతశిఖరమువలె నున్న రాజప్రాసాదముపైకి ఎక్కి, బృహస్పతి దేవేంద్రుని కలిసినట్లు దశరథుని కలిసెను.
2.5.23.
అనుష్టుప్.
తమాగతమభిప్రేక్ష్య
హిత్వా రాజాసనం నృపః।
పప్రచ్ఛ స చ తస్మై తత్
కృతమిత్యభ్యవేదయత్॥
తమ్ = అతనిని; ఆగతమ్ = వచ్చిన; అభిప్రేక్ష్య = చూచి; హిత్వా = వదలి; రాజాసనమ్ = రాజసింహాసనమును; నృపః = రాజు; పప్రచ్ఛ = ప్రశ్నించెను; సః = అతడు; చ = కూడ; తస్మై = అతనిని; తత్ = అది; కృతమ్ = చేయబడినది; ఇతి = అని; అభ్యవేదయత్ = తెలియజేసెను.
వచ్చిన వసిష్ఠమహర్షిని చూచి, దశరథమహారాజు తన సింహాసనమునుండి క్రిందకు దిగి అతను వెళ్ళిన కార్యము గురించి ప్రశ్నించెను. వసిష్ఠుడు తాను ఆ కార్యమును నెరవేర్చినట్లు తెలియజేసెను.
2.5.24.
అనుష్టుప్.
తేన చైవ తదా తుల్యం
సహాసీనాస్సభాసదః।
ఆసనేభ్యస్సముత్తస్థుః
పూజయంతః పురోహితమ్॥
తేన = అతనితో; చ; ఏవ = వలె; తదా = అప్పుడు; తుల్యం = సమానముగ; సహ = కలసి; ఆసీనాః = కూర్చున్నవారు; సభాసదః = సభ్యులు; ఆసనేభ్యః = ఆసనములనుండి; సముత్తస్థుః = లేచిరి; పూజయంతః = గౌరవించుచు; పురోహితమ్ = పురోహితుని.
దశరథమహారాజుతో సహా సభాసదు లందరును పురోహితుడు వసిష్ఠమహర్షికి గౌరవము చూపుతూ ఆసనములనుండి లేచిరి.
2.5.25.
అనుష్టుప్.
గురుణా త్వభ్యనుజ్ఞాతో
మనుజౌఘం విసృజ్య తమ్।
వివే శాంతఃపురం రాజా
సింహో గిరిగుహామివ॥
గురుణా = గురువుచేత; తు ; అభ్యనుజ్ఞాతః = అనుమతి పొందినవాడై; మనుః = మనుష్యుల; ఓఘం = సమూహమును; విసృజ్య = విడచి; తమ్ = ఆ; వివేశ = ప్రవేశించెను; అంతఃపురం = అంతఃపురములోనికి; రాజా = రాజు; సింహః = సింహము; గిరి గుహామ్ = పర్వతగుహను; ఇవ = వలె.
దశరథమహారాజు గురువు వసిష్ఠమహర్షియొక్క అనుజ్ఞ పొంది, సభాసదులను వెళ్ళనంపి, సింహము పర్వత గుహలోనికి చొచ్చువిధముగ తాను అంతఃపురములోనికి ప్రవేశించెను.
2.5.26.
జగతి.
తదగ్య్రవేషప్రమదాజనాకులం
మహేంద్రవేశ్మప్రతిమం నివేశనమ్।
విదీపయంశ్చారు వివేశ పార్థివః
శశీవ తారాగణసంకులం నభః॥
తత్ = ఆ; అగ్ర్యః = శ్రేష్ఠమైన; వేష = వేషధారణలోనున్న; ప్రమదాజన = స్త్రీలతో; కులం = కూడినది; మహేంద్ర = ఇంద్రుని; వేశ్మ = భవనముతో; ప్రతిమం = సమానమైన; నివేశనమ్ = గృహమును; విదీపయన్ = ప్రకాశింప జేయుచు; చారు = అందముగా; వివేశ = ప్రవేశించెను; పార్థివః = రాజు; శశి = చంద్రుడు; ఇవ = వలె; తారాః = నక్షత్రముల; గణ = సముదాయముతో; సంకులం = నిండిన; నభః = ఆకాశము.
శ్రేష్ఠమైన వేషధారణలో ఉన్న స్త్రీలతో నిండిన ఆ అంతఃపురము ఇంద్రభవనమువలె నుండెను. దశరథ మహారాజు ఆ అంతఃపురములోనికి ప్రవేశించగనే నక్షత్రములతో నిండిన ఆకాశముపైకి చంద్రుడు చేరినట్లుండెను,
2.5.27.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
అయోధ్యకాణ్డే
పంచమ సర్గః॥
టీక:-
  ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; పంచమ [5] = ఐదవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [5] ఐదవ సర్గ సమాప్తము
2.6.1.
అనుష్టుప్.
గతే పురోహితే రామః
స్నాతో నియతమానసః।
సహ పత్న్యా విశాలాక్ష్యా
నారాయణముపాగమత్॥
టీక:-
  గతేః = వెడలినవాడగుచుండగ; పురోహిత = పురోహితుడు (వసిష్ఠుడు); రామః = రాముడు; స్నాతః = స్నానము ఆచరించినవాడై; నియతమానసః = ఏకాగ్రచిత్తము గలవాడై; సహ = కూడి; పత్న్యాః = భార్యతో; విశాలాక్ష్యాః = విశాలమైన నేత్రములు గల; నారాయణమ్ = శ్రీమన్నారాయణుని; ఉపాగతమ్ = ధ్యానించెను.
భావం;-
  వసిష్ఠుడు వెడలిన పిమ్మట రాముడు స్నానము చేసెను. విశాలనేత్రములు గల సీతాదేవితో కలసి ఏకాగ్రచిత్తముతో శ్రీహరిని ధ్యానించెను.
2.6.2.
అనుష్టుప్.
ప్రగృహ్య శిరసా పాత్రీమ్
హవిషో విధివత్తదా।
మహతే దైవతాయాజ్యమ్
జుహావ జ్వలితేఽనలే॥
టీక:-
  ప్రగృహ్య = స్వీకరించి; శిరసా = శిరస్సు చేత; పాత్రం = పాత్రను; హవిషః = హవిస్సుయొక్క; విధివత్తదా = శాస్త్రము చెప్పిన విధముగా; మహతే = గొప్ప; దైవతాయ = దేవతకొఱకు; ఆజ్యం = నేతిని; జుహావ = సమర్పించెను; జ్వలిత = జ్వలించుచున్న; అనలే = అగ్నిలోనికి
భావం;-
  హవిస్సు ఉన్న పాత్రను శాస్త్రోక్తముగ శిరస్సుపై ధరించెను. శ్రీమహావిష్ణువును ఉద్దేశించి ఆజ్యమును హోమాగ్నిలో ఆహుతి చేసెను.
2.6.3.
అనుష్టుప్.
శేషం చ హవిషస్తస్య
ప్రాశ్యాశాస్యాత్మనః ప్రియమ్।
ధ్యాయన్నారాయణం దేవమ్
స్వాస్తీర్ణే కుశసంస్తరే॥
టీక:-
  శేషం = మిగిలిన భాగమును; హవిషః = హవిస్సుయొక్క; తస్య = ఆ; ప్రాశ్య చ = భుజించి; ఆశాశ్య = కోరిక; ఆత్మనః = తనయొక్క; ప్రియమ్ = ఇష్టమైన; ధ్యాయన్ = ధ్యానించుచు; నారాయణం = నారాయణుని; దేవం = భగవంతుని గురించి; స్వాస్తీర్ణే = చక్కగా పరచబడిన; కుశ సంస్తరే = దర్భశయ్య మీద
భావం;-
  రాముడు హోమము చేయగా మిగిలిన హవిస్సును భుజించెను. పిమ్మట నారాయణుని ధ్యానించుచు, మౌనవ్రతము అవలంబించి, చక్కగా పరచిన దర్భశయనము మీద చేరెను..
2.6.4.
అనుష్టుప్.
వాగ్యత స్సహ వైదేహ్యా
భూత్వా నియతమానసః।
శ్రీమత్యాయతనే విష్ణో
శ్శిశ్యే నరవరాత్మజః॥
టీక:-
  వాగ్యతః = అదుపులో ఉన్న మాటలు కలవాడు; సహ = కూడి; వైదేహ్యాః = సీతమ్మతో; భూత్వా = అయి; నియతమానసః = అదుపులో ఉంచిన మనస్సు గలవాడై; శ్రీమతి= శోభించుచున్న; ఆయతనే = ఆలయములో; విష్టోః = విష్ణుమూర్తియొక్క; శిశ్యే = నిదురించెను; నరవరాత్మజః = రాజకుమారుడు
భావం;-
  సీత తాను వాగ్నియమము, మనోనిగ్రహము చేపట్టిరి. శోభిల్లుతున్న విష్ణాలయము నందు, స్వామిని ధ్యానించుచు, సీతమ్మతో కూడి శయనించెను.
2.6.5.
అనుష్టుప్.
ఏకయామావశిష్టాయామ్
రాత్ర్యాం ప్రతివిబుద్ధ్య సః।
అలంకారవిధిం కృత్స్నమ్
కారయామాస వేశ్మనః॥
టీక:-
  సః = అతడు; ఏక = ఒక; యామ = యామము, మూడు గంటలు; అవశిష్టాయామ్ = ఇంకనూ మిగిలి ఉండగా; రాత్య్రామ్ = రాత్రి సమయమున; ప్రతివిబుద్ధ్య = మేల్కొని; సః = అతడు; అలంకార విధిం = అలంకారించుటలు; కృత్స్నం = సంపూర్ణముగా; కారయామాస = చేయించెను; వేశ్మనః = గృహమునకు.
భావం;-
  రాత్రి ఇంకనూ ఒక యామము అనగా మూడు గంటల సమయము ఉన్నదనగా తెల్లవారుగట్ల 3-00 గంటలకు, రాముడు మేల్కొని, తన గృహమును సంపూర్ణముగా అలంకరింపచేసెను.
2.6.6.
అనుష్టుప్.
తత్ర శ్రృణ్వన్సుఖా వాచః
సూతమాగధవందినామ్।
పూర్వాం సంధ్యాముపాసీనో
జజాప యతమానసః॥
టీక:-
  తత్ర = అప్పుడు; శృణ్వన్ = వినుచు; సుఖా = ఆనందకరమైన; వాచః = వాక్కులు; సూతః = సూతులు; మాగధః = మాగధులు; వందినామ్ = వందులయొక్క; పూర్వాం = మొదటిదైన; సంధ్యామ్ = ప్రాతఃకాల సంధ్యను; ఉపాసీనః = ఉపాసించినవాడై; జజాప = జపించెను; యతమానసః = నిశ్చలచిత్తముతో.
భావం;-
  ఆ నాల్గవజామున సుఖకరములైన సూతమాగధవందుల మాటలు వినుచు, ప్రాతఃకాల సంధ్యను ఉపాసన చేసి, నిశ్చలచిత్తముతో గాయత్రీజపము చేసెను.
2.6.7.
అనుష్టుప్.
తుష్టావ ప్రణతశ్చైవ
శిరసా మధుసూదనమ్।
విమలక్షౌమసంవీతో
వాచయామాస స ద్విజాన్॥
టీక:-
  తుష్టావ = సంతోషంగా, తృప్తిగా; ప్రణతః = నమస్కరించుటకు వంగి; చ = మఱియు; ఏవ = ఎచ్చరికగా, అవధానంగా; శిరసా = శిరస్సుచేత; మధుసూదనమ్ = విష్ణుమూర్తిని; విమల = స్వచ్చమైన; క్షౌమ = పట్టు వస్త్రములచే; సంవీతః = చుట్టుకొన్నవాడై, ధరించినవాడై; వాచయామాస = పుణ్యాహవాచనము చేయించెను; స = తుల్య, తగిన; ద్విజాన్ = బ్రాహ్మణుల చేత.
భావం;-
  రాముడు సంతుషంగా శ్రీహరికి శిరస్సు వంచి నమస్కరించెను. స్వచ్చమైన పట్టువస్త్రములు ధరించి, బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనము చేయించెను.
2.6.8.
అనుష్టుప్.
తేషాం పుణ్యాహఘోషోఽథ
గంభీరమధురస్తదా।
అయోధ్యాం పూరయామాస
తూర్యఘోషానునాదితః॥
టీక:-
  తేసాం = వారి యొక్క; పుణ్యాహఘోషః = వేదవాక్కులతో (పుణ్యాహవాచము); గంభీర = గంభీరమైన; మధురః = తియ్యనైన; తదా = అప్పుడు , అయోధ్యాం = అయోధ్యా నగరమును; పూరయామాస = నింపెను; తూర్య ఘోషృః = సంగీత వాద్య ఘోషతో కలిసి; అనునాదితః = ప్రతిధ్వనించింది.
భావం;-
  అపుడు గంభీరము, మధురము అయిన ఆ బ్రాహ్మణుల పుణ్యాహవాచన ఘోషతో కూడిన తూర్య ధ్వనులతో అయోధ్యానగరమును నిండెను.
2.6.9.
అనుష్టుప్.
కృతోపవాసం తు తదా
వైదేహ్యా సహ రాఘవమ్।
అయోధ్యానిలయశ్శ్రుత్వా
సర్వః ప్రముదితో జనః॥
టీక:-
  కృతః = చేయబడిన; ఉపవాసం = ఉపవాసదీక్ష కలవానిగ; తు; తదా = అప్పుడు; వైదేహ్యా = విదేహరాజపుత్రి సీతమ్మతో; సహ = కలిసి; రాఘవమ్ = రాఘురాముని; అయోధ్యానిలయః = అయోధ్యానగరములో నివసించుచున్నవారు; శ్రుత్వా = విని; సర్వః = అందరు; ప్రముదితః = ఆనందించిరి; జనః = ప్రజలందరు..
భావం;-
  రాముడు, సీతయు అభిషేకము కొరకై ఉపవాసము చేసిరని విని అయోధ్యావాసులందరు ఆనందించిరి.
2.6.10.
అనుష్టుప్.
తతః పౌరజనస్సర్వః
శృత్వా రామాభిషేచనమ్।
ప్రభాతాం రజనీం దృష్ట్వా
చక్రే శోభయితుం పురీమ్॥
టీక:-
  తతః = ఆ పిమ్మట; పౌరజనః = పుర జనులు; సర్వః = సకలురు; శృత్వా = విని; రామాః = రాముని; అభిషేచనమ్ = అభిషేకము; ప్రభాతాం = తెల్లవారినట్లు; రజనీం = రాత్రిని; దృష్ట్వా = చూచి; చక్రే = చేసిరి; శోభయితుం = అలంకరించుటను; పురీమ్ = నగరమును
భావం;-
  పిమ్మట, రామాభిషేకము జరుగనున్నదని పౌరులందరును రాత్రి గడచి, సూర్యోదయము అయినట్లు చూచి వెంటనే పట్టణమును అలంకరించిరి.
2.6.11.
అనుష్టుప్. *
సితాభ్రశిఖరాభేషు
దేవతాయతనేషు చ।
చతుష్పథేషు రథ్యాసు
చైత్యేష్వట్టాలకేషు చ॥
టీక:-
  సితాః = తెల్లని; అభ్ర = తెల్లని మబ్బులచే కప్పబడిన; శిఖరః = శిఖరముల వంటి; ఆభేషు = కాంతి (ఆభ) గల; దేవతాయతనేషు = దేవాలయములందు; చ = మఱియు; చతుష్పథేషు = నాలుగు వీధుల కూడలియందు; రథ్యాసు = పెద్దవీధులందు; చైత్యేషు = యజ్ఞశాలలోను, రచ్చబండలమీద; అట్టాలకేషు = కోట బురుజులందు
భావం;-
  తెల్లని మబ్బులచే కప్పబడిన శిఖరములవలె ప్రకాశించే దేవాలయములందు, కూడళ్లలోనూ, ప్రథాన వీథులలోనూ, దేవాలయాలలోనూ, రచ్చబండల వద్దనూ, కోట బురుజులపైననూ,
2.6.12.
అనుష్టుప్.
నానాపణ్యసమృద్ధేషు
వణిజామాపణేషు చ।
కుటుంబినాం సమృద్ధేషు
శ్రీమత్సు భవనేషు చ॥
టీక:-
  నానా = వివిధ రకములైన; పణ్య = సరుకులతో; సమృద్ధేషు = సమృద్ధిగా ఉన్న; వణిజామ్ = వ్యాపారుల; ఆపణేషు = విపణులందు; చ = మఱియు; కుటుంబినాం = కుటుంబ సభ్యులయొక్క; సమృద్ధేషు = సమృద్ధములు; శ్రీమత్సు = సంపదలతో కూడిన; భవనేషు = భవంతులందు; చ = మఱియు.
భావం;-
  సరుకులతో సమృద్ధిగా ఉండే అంగడివీధులందునూ, ధనవంతుల భవనములందునూ,
2.6.13.
అనుష్టుప్.
సభాసు చైవ సర్వాసు
వృక్షేష్వాలక్షితేషు చ।
ధ్వజా స్సముచ్ఛ్రితాశ్చిత్రాః
పతాకాశ్చాభవంస్తదా॥
టీక:-
  సభాసు = సమావేశ మందిరములందు; చైవ = ఇంకనూ (చ+ఏవ); సర్వాసు = అన్నిచోట్లను; వృక్షేషు = వృక్షములందు; ఆలక్షితేషు = కంటికి కనిపించునన్నిటియందు; ధ్వజాః = ధ్వజములు; సముచ్ఛ్రితాః = ఎగురవేయబడిన; చిత్రాః = రంగురంగుల; పతాకాః = కేతనములను, జెండాలను; చ = కూడా; భవన్ = అయ్యెను; తదా = అప్పుడు
భావం;-
  సభా భవనములపైనను ఎత్తయిన వృక్షముల పైనను, ధ్వజములను, చిత్ర వర్ణములైన పతాకములను ఎగురవేసిరి.
2.6.14.
అనుష్టుప్.
నటనర్తకసంఘానామ్
గాయకానాం చ గాయతామ్।
మనః కర్ణసుఖా వాచః
శుశ్రువుశ్చ తతస్తతః॥
టీక:-
  నట = నటుల; నర్తక = నర్తకుల; సంఘానాం = సమూహములు; గాయకానాం = గాయకులు; చ = కూడా; గాయతామ్ = గానములు చేయుచుండిరి; మనః = మనస్సులకు; కర్ణః = చెవులకు; సుఖాః = ఇంపు కలుగు; వాచః = చక్కగా పలికిరి; శుశ్రువుః = పండితుడు. శుస్రువన్, శబ్దకల్పద్రుమము; చ = కూడా; తతః + తతః = అయా ప్రదేశములనుండి
భావం;-
  అక్కడక్కడ నటులు అభినయము చేయుచుండిరి. నర్తకులు నృత్యములు చేయుచుండిరి. గాయకులు గానము చేయుచుండిరి. పండితులు కూడా మనసులకు, చెవులకు సుఖకరమగు వాక్కులు పలికిరి.
2.6.15.
అనుష్టుప్.
రామాభిషేకయుక్తాశ్చ
కథాశ్చక్రుర్మిథో జనాః।
రామాభిషేకే సమ్ప్రాప్తే
చత్వరేషు గృహేషు చ॥
టీక:-
  రామాభిషేక = రాముని పట్టాభిషేకము; యుక్తాః = తగునట్లుగా; చ; కథాః = సంభాషణములు; చక్రుః = చేసిరి; మిథః = పరస్పరము; జనాః = ప్రజలు; రామాభిషేకే = రాముని పట్టాభిషేకము; సంప్రాప్తే = సమీపించగా; చత్వరేషు = నాలుగు వీధుల కూడలులందు; గృహేషు = గృహములందు; చ = కూడ.
భావం;-
  రామాభిషేకము సమీపించుచుండగా. జనులు వీధికూడళ్ళలోను, గృహములలోను, పరస్పరము రామాభిషేకముగుఱించి మాట్లాడుకొనిరి.
2.6.16.
అనుష్టుప్.
బాలా అపి క్రీడమానా
గృహద్వారేషు సంఘశః।
రామాభిషవసంయుక్తాః
చక్రురేవం మిథః కథాః॥
టీక:-
  బాలాః అపి = బాలలు సైతం; క్రీడమానాః = ఆడుకొనుచున్న; గృహద్వారేషు = గృహముల ద్వారములందు; సంఘశః = గుంపులుగుంపులుగా; రామాభిషవసంయుక్తాః = రాముని పట్టాభిషేక మహోత్సవమునకు సంబంధించిన; చక్రుః = చేసిరి; ఏవమ్ = ఆ విధముగా; మిథః = పరస్పరము; కథాః = కథలను
భావం;-
  గుమిగూడి ముంగిళ్లలో ఆడుకొనుచున్న బాలురు కూడ, పరస్పరము రామాభిషేకము గుఱించే మాట్లాడుకోసాగిరి.
2.6.17.
అనుష్టుప్.
కృతపుష్పోపహారశ్చ
ధూపగంధాధివాసితః।
రాజమార్గః కృతః శ్రీమాన్
పౌరై రామాభిషేచనే॥
టీక:-
  కృత=చేయబడిన; పుష్ప + ఉపహారశ్చ = పూల సత్కారము కలదై; ధూపగంధ = ధూపముల సుగంధముచే; అధివాసితః = పరిమళించబడినదై; రాజమార్గః = రాజవీధి; కృతః = చేయబడెను; శ్రీమాన్ = వైభవోపేతముగ; పౌరైః = పురజనులచే; రామాభిషేచనే = శ్రీరాముని అభిషేకపు వేళ
భావం;-
  రామాభిషేకము సందర్భమున పౌరులందరు పుష్పములు చల్లిరి. సుగంధ ధూపముల సువానలు వెదజల్లిరి. రాజమార్గమును శోభాయుక్తము చేసిరి.
2.6.18.
అనుష్టుప్.
ప్రకాశకరణార్థం చ
నిశాగమనశంకయా।
దీపవృక్షాం స్తథా చక్రుః
అను రథ్యాసు సర్వశః॥
టీక:-
  ప్రకాశః = వెలుతురు; కరణార్థం = ఏర్పాటుచేయుట కొఱరకు; చ; నిశః = రాత్రి; ఆగమన = వచ్చునను, అగునను; శంకయా = సందేహముచే; దీపవృక్షాం = వృక్షాకారములో ఉన్న దీపములు; తథా = మఱియు; చక్రుః = ఏర్పాటుచేసిరి; అను = నిడివి, ఒకటివెంబడి ఒకటి, ఆంధ్రవాచస్పతము; రథ్యాసు = ప్రధానవీధులందు; సర్వశః = అంతట
భావం;-
  రామాభిషేక ఉత్సవము పూర్తియగుసమయమునకు రాత్రి అగునేమో అను శంకచే, వెలుతురు కల్పించుటకు, వీధులు అన్నింటిలోనూ వెలిగించిన దీపంచెట్ల వరుసలసు అమర్చిరి.
2.6.19.
అనుష్టుప్.
అలంకారం పురస్యైవమ్
కృత్వా తత్పురవాసినః।
ఆకాంక్షమాణా రామస్య
యౌవరాజ్యాభిషేచనమ్॥
టీక:-
  అలంకారం = అలంకరామును; పురస్య = నగరమునకు; ఏవం = మొత్తం; కృత్వా = చేసి; తత్ = ఆ; పురః = నగరము యొక్క; వాసినః = నివాసులు; ఆకాంక్షమాణాః = కోరుకొనువారై; రామస్య = రాముని యొక్క; యౌవరాజ్యాభిషేచనమ్ = యౌవరాజ్యాభిషేకమును
భావం;-
  అయోధ్యాపురములో నివసించు పౌరులందరు పురము అంతటా ఈ విధముగా అలంకరించి, రాముని యౌవరాజ్యాభిషేకము కోరుచున్నవారై….
2.6.20.
అనుష్టుప్.
సమేత్య సంఘశస్సర్వే
చత్వరేషు సభాసు చ।
కథయంతో మిథస్తత్ర
ప్రశశంసుర్జనాధిపమ్॥
టీక:-
  సమేత్య = కలిసి; సంఘశః = సమావేశమైరి; సర్వే = అందరు; చత్వరేషు = నాలుగు వీధుల కూడలులందు; చ; సభాసు = సమావేశ మందిరములందు; చ; కథయంతః = చెప్పుకొనుచు; మిథః = ఒకరికొకరు; తత్ర = అక్కడ; ప్రశశంసుః = ప్రస్తుతించిరి; జనాధిపమ్ = మహారాజును
భావం;-
  అయోధ్యాపౌరులు రాముని యౌవరాజ్యాభిషేకమును కోరుచున్నవారై అన్ని కూడళ్ళలోనూ, సభామండపాలలోను గుంపులు గుంపులుగా చేరి వారిలో వారు ఆ విషయము గూర్చి మాటలాడుకొనుచు, దశరథమహారాజుని ప్రశంసించిరి.
2.6.21.
అనుష్టుప్.
“అహో మహాత్మా రాజాఽయమ్
ఇక్ష్వాకుకులనందనః।
జ్ఞాత్వా యో వృద్ధమాత్మానమ్
రామం రాజ్యేఽభిషేక్ష్యతి॥
టీక:-
  అహో = ఓహా; మహాత్మా = మంచి మనసు కలవాడు; రాజ్యామ్ = రాజ్యమును; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; కుల = వంశమునకు; నందనః = ఆనందము కలిగించువాడు; జ్ఞాత్వా = తెలిసికొని; యః =ఎవడు; వృద్ధమ్ = వృద్ధునిగా; ఆత్మానం = తనను; రామం = శ్రీరామచంద్రుడిని; రాజ్యే = రాజ్యమునందు; అభిషేక్ష్యతి = అభిషేకింపనున్నాడు
భావం;-
  ఆహా! ఇక్ష్వాకు వంశమును ఆనందింపచేయు ఈ దశరథమహారాజు చాలా మంచి మనస్సు గలవాడు. తాను వృద్ధుడైన విషయమును గ్రహించి, శ్రీరాముని రాజ్యమునందు అభిషేకింపనున్నాడు.
2.6.22.
అనుష్టుప్.
సర్వేప్యనుగృహీతా స్మో
యన్నో రామో మహీపతిః।
చిరాయ భవితా గోప్తా
దృష్టలోకపరావరః॥
టీక:-
  సర్వే = అందరము; అపి = కూడ; అనుగృహీత = అనుగ్రహించబడినవారము; అస్మ = అగుచుంటిమి; యత్ =ఎందువలన; నః = మాకు; రామః = రాముడు; మహీపతిః = మహారాజు; చిరాయ = ఎక్కువ కాలము; భవితా = కాబోవునో; గోప్తా = రక్షకుడు; దృష్ట = చూడబడిన: లోక = లోకములోని: పరావరః = హెచ్చుతగ్గులు గల.
భావం;-
  జనులలోని తారతమ్యబోధము తెలిసిన రాముడు రాజై, చాలాకాలము మనలను రక్షింపగలడు. మనమందరము అనుగ్రహించబడుచుంటిమి.
2.6.23.
అనుష్టుప్.
అనుద్ధతమనాః విద్వాన్
ధర్మాత్మా భ్రాతృవత్సలః।
యథా చ భ్రాతృషు స్నిగ్ధః
తథాఽస్మాస్వపి రాఘవః॥
టీక:-
  అనుద్ధత = గర్వము లేని; మనాః = మనస్సు గలవాడు; విద్వాన్ = విద్వాంసుడు; ధర్మాత్మా = ధర్మమును ఆచరించువాడు; భ్రాతృ = సోదరులందు; వత్సలః = వాత్సల్యము కలవాడు; యథా = ఎట్లు; చ; భాతృషు = సోదరులందు; స్నిగ్ధః = స్నేహశీలి; తధాచ = అటులనే; అస్మాస్వః = మనయందు; అపి = కూడ; రాఘవః = రఘురాముడు
భావం;-
  రాముడు మనస్సులో ఏ మాత్రము దర్పము లేనివాడు, పండితుడు, ధర్మాత్ముడు, సోదరులయందు వాత్సల్యము కలవాడు. రామునకు సోదరులపై ఎట్లు వాత్సల్యము గలదో మనపై కూడ అట్లే నెయ్యము నెరపును.
2.6.24.
అనుష్టుప్.
చిరం జీవతు ధర్మాత్మా
రాజా దశరథోఽనఘః।
యత్ప్రసాదాభిషిక్తం తు
రామం ద్రక్ష్యామహే వయమ్”॥
టీక:-
  చిరంజీవతు = చిరకాలము జీవించు గాక; ధర్మాత్మా = ధర్మాచరణపరాయణుడు; రాజా=రాజు; దశరథః = దశరథుడు; అనఘః = దోషరహితుడు; యత్ =ఎవని; ప్రసాదేన = అనుగ్రహముతో; అభిషిక్తం = అభిషేకము చేయబడిన; తు = పాదపూరణము; రామం = రాముని; ద్రక్ష్యామహే = చూడగలమో; వయమ్ = మేము.
భావం;-
  ఎవని అనుగ్రహముచే యౌవరాజ్యాభిషిక్తుడైన రాముని చూడగలిగెదమో, అట్టి దశరథమహారాజు చిరకాలము జీవించుగాక!
2.6.25.
అనుష్టుప్.
ఏవంవిధం కథయతామ్
పౌరాణాం శుశ్రువు స్తదా।
దిగ్భ్యోపి శ్రుతవృత్తాన్తాః
ప్రాప్తా జానపదా జనాః॥
టీక:-
  ఏవం=ఈ; విధం = విధముగా; కథయతాం = చెప్పుకొనుచుండగా; పౌరాణాం = పురప్రజలు; శుశ్రువుః = వినిరి; తదా = అప్పుడు; దిగ్భ్యః + అపి = నలు దిక్కులనుండి; శ్రుత వృత్తాన్తాః = సమాచారము వినిన తరువాత; ప్రాప్తా = వచ్చినవారు; జానపదా = గ్రామస్థులు; నరాః = మనుజులు
భావం;-
  రామునకు యౌవరాజ్యాభిషేకము జరుగగలదని విని నలు దిక్కులనుండి వచ్చిన జానపదులు, పౌరులు ఇట్లు మాటలాడుచుండగా వినిరి.
2.6.26.
అనుష్టుప్.
తే తు దిగ్భ్యః పురీం ప్రాప్తా
ద్రష్టుం రామాభిషేచనమ్।
రామస్య పూరయామాసుః
పురీం జానపదా జనాః॥
టీక:-
  తే = వారు; తు = మఱియు; దిగ్భ్యః = వేరువేరు దిక్కులనుండి; పురీం = అయోధ్యా నగరమును; ప్రాప్తాః = పొందినవారు; ద్రష్టుం = చూచుటకు; రామాభిషేచనమ్ = రాముని పట్టాభిషేకమును; రామస్య = రాముని యొక్క; పూరయామాసుః = నింపివేసిరి; పురీం = నగరమును; జానపదా = గ్రామాములకు చెందిన; జనాః = ప్రజలు.
భావం;-
  నలుదిక్కులనుండి రామాభిషేకము చూచుటకు వచ్చిన గ్రామస్థులతో అయోధ్యా నగరము నిండిపోయెను.
2.6.27.
అనుష్టుప్.
జనౌఘైస్తైర్విసర్పద్భిః
శుశ్రువే తత్ర నిస్వనః।
పర్వసూదీర్ణవేగస్య
సాగరస్యేవ నిస్వనః॥
టీక:-
  జనౌఘైః = జనసమూహములచేత; తైః = వారిచే; విసర్పద్భిః = సంచరించుచున్న; శుశ్రువే = వినబడెను; తత్ర = అక్కడ; నిస్వనః = ధ్వని; పర్వసు = పర్వదినములందు; ఉదీర్ణ=అతిశయించిన; వేగస్య=వేగమునకు; సాగరస్య = సముద్రముయొక్క; ఇవ=వలె; నిస్వనః=ఘోష
భావం;-
  అక్కడ జనప్రవాహముల సంచారముచే కలిగిన మ్రోత, పర్వదినమందు (పౌర్ణమి దినమున) అతిశయించిన వేగము గల సముద్రపుటలల ఘోష వలె వినబడెను.
2.6.28.
జగతి.
తతస్తదింద్రక్షయసన్నిభం పురం
దిదృక్షుభిర్జానపదైరుపాగతైః।
సమంతత స్సస్వనమాకులం బభౌ
సముద్రయాదోభిరివార్ణవోదకమ్॥
టీక:-
  తతః=అందుచే; తత్=ఆ; ఇంద్రక్షయృ = ఇంద్రుని గృహము (నగరము) అమరావతితో; సన్నిభం = సరిపోలెడు; పురం = నగరమును; దిదృక్షుభిః = చూచు కోరికతో; జానపదైః = గ్రామస్థులతో; ఉపాగతైః = వచ్చిన; సమంతతః = అంతటను; సస్వనమ్ = శబ్దముతో కూడినది; ఆకులం = కలత చెందినది; బభౌ = ప్రకాశించెను; సముద్రయాదోభిః = సముద్రపు జంతువులతో; ఇవ=వలె; అర్ణవః = సముద్రప; ఉదకమ్ = జలముల.
భావం;-
  రాముని యౌవరాజ్యాభిషేకము చూడవలెనను అభిలాషతో వచ్చిన జానపదులతో అంతట నిండియుండి, నిర్ఘోషముతో కూడిన అమరావతితో పోల్చదగిన ఆ అయోధ్యానగరము, జల జంతురాశితో నిండి కలతనొంది ఘోషించుచున్న సముద్రమువలె ఉండెను.
2.6.29.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
షష్ఠ సర్గః॥
టీక:-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [6] ఆరవ సర్గ సమాప్తము
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [6] ఆరవ సర్గ సమాప్తము
2.7.1.
అనుష్టుప్.
జ్ఞాతిదాసీ యతో జాతా
కైకేయ్యాస్తు సహోషితా।
ప్రాసాదం చంద్రసంకాశమ్
ఆరురోహ యదృచ్ఛయా॥
టీక:-
 జ్ఞాతిదాసీ = పుట్టింటినుండి అరణముగా వచ్చిన సేవకురాలు, బంధువు; యతః = అప్పటినుండి; జాతా = పుట్టిన; కైకేయ్యాస్తు = కైకేయితో ఉండి; సహ = కలసి; ఉషితా = నివసించుచున్న; ప్రాసాదం = రాజగృహమును; చంద్ర = చంద్రునితో; సంకాశమ్ = సమానమైన; ఆరురోహ = ఎక్కెను; యదృచ్ఛయా = దైవవశాత్తు.
భావం;-
 పుట్టినప్పటినుండి కైకేయి దగ్గరే ఉండి అరణముగావచ్చిన దాసి మంథర, దైవవశాత్తు వెన్నెలవలె తెల్లగా ప్రకాశించుచున్న మేడపైకి పైకి ఎక్కెను.
గమనిక:-
 కైకేయి జాసియైన ఈ మంథర పుట్టుపూర్వోత్తరములు తెలియరావు. ఈమె పూర్వ జన్మలో దుందుభి యను ఒక గంధర్వకాంత. రావణుడు పెట్టెడి బాధలకు తట్టుకొనలేక దేవతలకు మొఱపెట్టుకొనగా, బ్రహ్మదేవుడే రావణసంహార నిమిత్తము కుబ్జరూపమున ఈమెను సృష్టించెను. విధినిర్ణయానుసారము ఈమె కైకేయి మనసునందు దురాలోచనలు రేకెత్తించెను. - అని గీతాప్రెస్ వారి రామాయణము.
2.7.2.
అనుష్టుప్.
సిక్తరాజపథాం కృత్స్నాం
ప్రకీర్ణకుసుమోత్కరామ్।
అయోధ్యాం మంథరా తస్మాత్
ప్రసాదాదన్వవైక్షత॥
టీక:-
 సిక్త = తడుపబడిన; రాజపథాం = రాజమార్గములు కలది; కృత్స్నాం = సమస్త; ప్రకీర్ణ = చల్లబడిన; కుసుమః = పూవులు; ఉత్కరామ్ = దట్టముగా కలది; అయోధ్యామ్ = అయోధ్యను; మంథరాః = మంథరకు; తస్మాత్ = అప్పుడు; ప్రాసాదాత్ = ప్రాసాదము నుండి; అన్వవైక్షత = కంటబడెను, అన్వక్ష, ఎదుట ఉండునది, వావిళ్ళ నిఘంటువు.
భావం;-
 కళ్ళాపి జల్లి, పూలతో అలంకరింపబడియున్న రాజమార్గములు గల అయోధ్యానగరము అంతయు ప్రాసాదము పైనుండి చూస్తున్న, మంథర కంటబడెను.
2.7.3.
అనుష్టుప్.
పతాకాభిర్వరార్హాభిః
ధ్వజైశ్చ సమలంకృతామ్।
వృతాం ఛందపథైశ్చాపి
శిరస్స్నాతజనైర్వృతామ్॥
టీక:-
 పతాకాభిః = జెండాలతో; వరాః = శ్రేష్ఠమైనవి; అర్హాభిః = తగినవికూడ; ధ్వజైః = జెండాస్తంభములతో; చ; సమ = చక్కగా; అలంకృతామ్ = అలంకరింపబడినదానిని; వృతాం = కూడియున్నదానిని; ఛంద = చక్కని, స్వేచ్చాయాన; పథైః = రాజ మార్గములతో; చాపి; శిరస్స్నాత = శిరః+ స్నాత, తలస్నానము చేసిన; జనైః = జనులతో; వృతామ్ = కూడినది.
భావం;-
 స్వేచ్ఛగా తిరుగుటకైన విశాలమైన రాచబాటలు శ్రేష్ఠమైన యోగ్యమైన జెండాలతోను, అలంకరింపబడిన జెండాస్తంభములతోను, తలస్నానము చేసిన జనులతో నిండి ఉండెను.
2.7.4.
అనుష్టుప్.
మాల్యమోదకహస్తైశ్చ
ద్విజేంద్రైరభినాదితామ్।
శుక్లదేవగృహద్వారాం
సర్వవాదిత్ర నిస్వనామ్॥
టీక:-
 మాల్య = పూలమాలలు; మోదక = ఉండ్రాళ్ళు; హస్తైః = చేతులయందుగల; చ; ద్విజేంద్రైః = బ్రాహ్మణోత్తములు; అభినాదితామ్ = గట్టగాపలుకుచుండిరి; శుక్ల = పవిత్రమైన, శుభ్రమైన ఆంధ్ర శబ్దరత్నాకరము, శబ్దకల్పధృమము; దేవగృహ = రాచనగరు, దేవాలయము; ద్వారాం = ద్వారములందు, నుండి; సర్వ = సకల; వాదిత్ర = వాద్యపరికరముల; నిస్వనామ్ = ధ్వని కలది.
భావం;-
 ఆ రాచమార్గములో చేతులయందు పుష్పమాలలు, మోదకములు ధరించిన బ్రాహ్మణోత్తములు గట్టిగా మంత్రోచ్చారణ చేయుచుండిరి. పరిశుభ్రమైన రాచనగరు, పవిత్ర దేవాలయముల ద్వారములవద్ద సకల వాద్యపరికరములు మ్రోగుచున్నవి.
గమనిక:-
 రామ యువరాజ పట్టాభిషేకమునకు అయోధ్యానగర శోభలు ఇలా, కైక దాసి మంథర కంటబడెను. (1) కళ్ళాపి జల్లి, పూలతో అలంకరింపబడియున్న రాజమార్గములు. (2) స్వేచ్ఛగా తిరుగుటకైన విశాలమైన రాచబాటలు. (3) శ్రేష్ఠమైన యోగ్యమైన జెండాలు గల జెండా స్తంభములు. (4) తలస్నానము చేసిన జనులు. (5) రాచమార్గములో చేతులయందు పుష్పమాలలు, మోదకములు ధరించి గట్టిగా మంత్రోచ్చారణచేయుచున్న బ్రాహ్మణోత్తముల, (6) పరిశుభ్రమైన రాచనగరు. (7) పవిత్ర దేవాలయములు. (8) ఆ దేవాలయ ద్వారముల వద్ద మ్రోగుచున్న సకల వాద్యపరికరములు. (9) ఆనందముగా తిరుగుచున్న ప్రజలు కిక్కిరిసి ఉన్న రాజమార్గములు. (10) ఆ మార్గముల యందు మారుమ్రోగుచున్న వేదఘోషలు. (11) రాజ మారగమున ఉత్సాహముగా ఉన్న గజ తురగములు. (12) ఱంకెలు వేయు చున్న ఆంబోతులు రాజమాగ్గమున తిరుగుచున్నవి. (13) ఎంతో ఉల్లాసముగా ఉన్న సకల పౌరులు. (14) ఎత్తైన జెండా స్తంభముల పంక్తులు.
2.7.5.
అనుష్టుప్.
సంప్రహృష్ట జనాకీర్ణాం
బ్రహ్మఘోషాభినాదితామ్।
ప్రహృష్ట వరహస్త్యశ్వాం
సంప్రణర్దిత గోవృషామ్॥
టీక:-
 సమ్ = చక్కగా; ప్రహృష్ట = మిక్కిలి సంతోషముగానున్న; జనః= జనులతో; ఆకీర్ణాం = కిక్కిరిసి ఉన్నది; బ్రహ్మఘోషాః = వేదఘోషలచే; అభినాదితామ్ = మారుమ్రోగుచున్నది; ప్రహృష్ట = మిక్కలి సంతోషముగా నున్న; వర = శ్రేష్ఠమైన; హస్తిం = ఏనుగులు కలది; అశ్వాం = గుఱ్ఱములు కలది; సంప్రణర్దిత = ఱంకెలు వేయుచున్న; గోవృషామ్ = ఆంబోతులు కలది.
భావం;-
 రాజమార్గములు నిండా ప్రజలు ఎంతో ఆనందముగా తిరుగుచుండిరి, వేదఘోషలు మారుమ్రోగుచుండెను, గజ తురగములు ఉత్సాహముగా ఉండెను. ఆంబోతులు ఱంకెలు వేయుచుండెను.
2.7.6.
అనుష్టుప్.
ప్రహృష్టముదితైః పౌరైః
ఉచ్ఛ్రితధ్వజమాలినీమ్।
అయోధ్యాం మంథరా దృష్ట్వా
పరం విస్మయమాగతా॥
టీక:-
 ప్రహృష్టః = ఉల్లాసముగాను; ముదితైః = మిక్కిలి సంతోషముగా నున్న; పౌరైః = పురజనులతోను; ఉచ్ఛ్రిత = పొడవైన; ధ్వజ = జెండాస్తంభముల; మాలినీమ్ = వరుసలు కల; అయోధ్యాం = అయోధ్యను; మంథరా = మంథర; దృష్ట్వా = చూచి; పరం = మిక్కిలి; విస్మయమాగతా = ఆశ్చర్యపడెను.
భావం;-
 పౌరులందరూ ఎంతో ఉల్లాసముగా ఉండిరి. ఎత్తైన జెండా స్తంభముల పంక్తులతో ఉండెను. అయోధ్య అలా ఉండుట చూచి, మంథర ఆశ్చర్యపోయెను.
2.7.7.
అనుష్టుప్.
ప్రహర్షోత్ఫుల్లనయనాం
పాండురక్షౌమవాసినీమ్।
అవిదూరే స్థితాం దృష్ట్వా
ధాత్రీం పప్రచ్ఛ మంథరా॥
టీక:-
 ప్రహర్షః = మిక్కిలి ఆనందముతో; ఉత్ఫుల్ల = విప్పారిన; నయనాం = కన్నులు గలామెను పాండుర = తెల్లని; క్షౌమ = పట్టు వస్త్రమును; వాసినీమ్ = వస్త్రమును ధరించిన ఆమెను; అవిదూరే = చెంతనే; స్థితాం = ఉన్నామెను; దృష్ట్వా = చూచి; ధాత్రీం = దాదిని; పప్రచ్ఛ = అడిగెను; మంథరా = మంథర.
భావం;-
 మంథర చెంతే ఒక దాది ఆనందముతో విప్పారిన కన్నులతో, పట్టు ధవళవస్త్రములు ధరించి ఉండెను. ఆ దాదిని మంథర చూచి ఇట్లడిగెను.
గమనిక:-
 1) ధాత్రి అనగా దాది, ఆయా, చిన్నపిల్లలను సాకి పెంచు స్త్రీ, అవసరమైతే తన చనుబాలు ఇచ్చి పెంచుటకైన స్త్రీ , 2) హర్షోత్ఫల్లనయనామ్ అనుటవలన ఈ దాది రాముని పెంచిన దాది అని సూచితమగుతున్నది, పుల్లెలవారి రామాయణం. 3) పాండురక్షౌమ వాసినీమ్ అనుట వలన ఆకాలమున శుభకార్యములందు తెల్లని వస్త్రములు ధరించుట సదాచారమని సూచితమగుచున్నది, పుల్లెలవారి రామాయణం.
2.7.8.
అనుష్టుప్.
“ఉత్తమేనాభిసంయుక్తా
హర్షేణార్థపరా సతీ।
రామమాతా ధనం కిన్ను
జనేభ్యః సం ప్రయచ్ఛతి?॥
టీక:-
 ఉత్తమేన = ఉత్తమమైన; అభిసంయుక్త = కూడియున్న; హర్షేణ = సంతోషముతో; అర్థపరా = ధనాశాపరురాలైన, గొప్పప్రయోజనము ఆశించి; సతీ = స్త్రీ; రామమాతా = రాముని తల్లి; ధనం = ధనమును; కిం ను = ఎందులకు; జనేభ్యః = జనులకొరకు; సంప్రయచ్ఛతి = దానము చేయుచున్నది.
భావం;-
 “ధనాశాపరురాలైన రాముని తల్లి, కౌసల్య ఇంత సంతోషముగ ఏమి ప్రయోజనము కొఱకు జనులకు ధనము దానములు చేయుచున్నది?
గమనిక:-
 మంథర కౌసల్యాదేవిని పేరుతో పేర్కొనక “రామమాత” అని అనుటను బట్టి మంథరకుపై గల అసూయ వెల్లడి అగుచున్నది.
2.7.9.
అనుష్టుప్.
అతిమాత్రప్రహర్షోఽయం
కిం జనస్య? చ శంస మే।
కారయిష్యతి కిం? వాపి
సంప్రహృష్టో మహీపతిః”॥
టీక:-
 అతిమాత్రప్రహర్షః = చాలా సంతోషము; అయం = ఈ; కిం = ఎందువలన; జనస్య = ప్రజల యొక్క; శంస = తెలుపుము; మే = నాకు; కారయిష్యతి = చేయింపనున్నాడా; కిం వా అపి = ఏమైన కూడ; సంప్రహృష్టః = సంతోషముగ; మహీపతి = రాజు.
భావం;-
 ప్రజల ఆనందమునకు కారణమేమి? దశరథమహారాజు సంతోషముగ ఏదైన గొప్పకార్యమును తలపెట్టినాడా? నాకు తెలియజేయుము.”
2.7.10.
అనుష్టుప్.
విదీర్యమాణా హర్షేణ
ధాత్రీ తు పరయా ముదా।
ఆచచక్షేఽథ కుబ్జాయై
భూయసీం రాఘవ శ్రియమ్॥
టీక:-
 విదీర్యమాణా = పట్టరాని; హర్షేణ = ఆనందముచే; ధాత్రీ = దాది; తు = యైతే; పరయా = అత్యంత; ముదా = సంతోషముతో; ఆచచక్షే = తెలిపెను; అథ = తరువాత; కుబ్జాయై = గూనిదైన, మఱుగుజ్జు; భూయసీం = మిక్కిలి; రాఘవ = రామునికి; శ్రియమ్ = రాజ్యలక్ష్మి ప్రాప్తిని గూర్చి.
భావం;-
 అప్పుడు ఆ దాది, పట్టరాని సంతోషముతో, రామునికి జరుగబోవు యౌవరాజ్య పట్టాభిషేకమును గురించి, ఆ మఱుగుజ్జు, గూనిది ఐన మంథరతో ఇలా చెప్పదొడగెను.
2.7.11.
అనుష్టుప్.
“శ్వః పుష్యేణ జితక్రోధం
యౌవరాజ్యేన రాఘవమ్।
రాజా దశరథో రామమ్
అభిషేచయితాఽనఘమ్”॥
టీక:-
 శ్వః = రేపు; పుష్యేణ = పుష్యమీ నక్షత్రమునందు; జితక్రోధం = జయించబడిన కోపము కలవానిని; యౌవరాజ్యేన = యౌవరాజ్యముచే; రాఘవమ్ = రఘురాముని; రాజా = రాజు; దశరథః = దశరథుడు; రామమ్ = రాముని; అభిషేచయితా = అభిషేకము చేయనున్నాడు; అనఘమ్ = దోషము లేనివానిని.
భావం;-
 “రేపు పుష్యమీ నక్షత్రమునందు జితక్రోధుడు, దోషరహితుడును ఐన రామునికి దశరథమహారాజు యౌవరాజ్యపట్టాభిషేకము చేయనున్నాడు.”
2.7.12.
అనుష్టుప్.
ధాత్ర్యాస్తు వచనం శృత్వా
కుబ్జా క్షిప్రమమర్షితా।
కైలాసశిఖరాకారాత్
ప్రాసాదాదవరోహత॥
టీక:-
 ధాత్ర్యాః = దాది యొక్క; తు; వచనం = మాటను; శ్రుత్వా = విని; కుబ్జా = మఱుగుజ్జు, గూనిది; క్షిప్రమ్ = వెంటనే; అమర్షితా = క్రోధముతో; కైలాసశిఖరాః = కైలాస పర్వతమువంటి; ఆకారాత్ = ఆకారముగల; ప్రాసాదాత్ = రాజగృహము నుండి; అవరోహత = దిగెను.
భావం;-
 దాది మాటలు విన్న కుబ్జయైన మంథర కోపోద్రిక్తురాలై కైలాసశిఖరమంత ఎత్తైన ఆ భవనంపైనుండి వేగముగా దిగెను.
2.7.13.
అనుష్టుప్.
సా దహ్యమానా కోపేన
మంథరా పాపదర్శినీ।
శయానామేత్య కైకేయీమ్
ఇదం వచనమబ్రవీత్॥
టీక:-
 సా = ఆ; దహ్యమానా = దహింపబడుచున్నది; కోపేన = క్రోధముతో; మంథరా = మంథర; పాపదర్శినీ = పాప దృష్టి గల; శయానామ్ = నిదురించియున్న; ఏత్య = చేరి; కైకేయీమ్ = కైకేయిని; ఇదం = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావం;-
 దురాలోచన గల మంథర కోపముతో మండిపడుచు, నిదురించియున్న కెైకేయి చెంతకు చేరి ఇట్లు పలికెను.
2.7.14.
అనుష్టుప్.
“ఉత్తిష్ఠ మూఢే కిం శేషే
భయం త్వామభివర్తతే।
ఉపపౢతమఘౌఘేన
కిమాత్మానం న బుధ్యసే॥
టీక:-
 ఉత్తిష్ఠ = లెమ్ము; మూఢే = మూఢురాలా; కిం = ఎందులకు; శేషే = నిదురించుచున్నావు; భయం = భయము; త్వామ్ = నిన్ను; అభివర్తతే = సమీపించుచున్నది; ఉపపౢతమ్ = ముంచెత్తబడిన; అఘౌఘేన = ఆపదలతో; కిమ్ = ఎందువలన; ఆత్మానం = తనను గూర్చి; న = లేదు; బుధ్యసే = తెలుసుకొనుట.
భావం;-
 “మూఢురాలా ఇంకా నిదురించుచున్నావేమి? మేల్కొనుము. నీకు ఆపదలు వచ్చుచున్నవి. ఎందుకు తెలుసుకొనజాలకున్నావు.”
2.7.15.
అనుష్టుప్.
అనిష్టే సుభగాకారే
సౌభాగ్యేన వికత్థసే।
చలం హి తవ సౌభాగ్యం
నద్యాస్స్రోత ఇవోష్ణగే”॥
టీక:-
 అనిష్టే = అనిష్టమైనదానా; సుభగాకారే = మనోహరముగ కనబడుదానా; సౌభాగ్యేన = భాగ్యవశమున; వికత్థసే = గొప్పగా భావించుకొనుచున్నావు; చలం హి = చంచలమైనది కదా; తవ = నీ యొక్క; సౌభాగ్యం = సౌభాగ్యము; నద్యాః = నది యొక్క; స్రోతః = ప్రవాహము; ఇవ = వలె; ఉష్ణగే = గ్రీష్మమున.
భావం;-
 కైకేయీ! మనోహరముగ కనిపించుటచే, నీవు నీ భర్తకు ఇష్టురాలివని అనుకొనుచున్నావు గాని అది యదార్థము కాదు. గొప్ప భాగ్యవంతురాలివని గొప్పగా ఊహించుకొనుచున్నావు. నీ సౌభాగ్యము వేసవికాలపు నదీప్రవాహము వలె చంచలమైనది.”
2.7.16.
అనుష్టుప్.
ఏవముక్తా తు కైకేయీ
రుష్టయా పరుషం వచః।
కుబ్జయా పాపదర్శిన్యా
విషాదమగమత్పరమ్॥
టీక:-
 ఏవమ్ = ఇట్లు; ఉక్తా తు = పలుకబడిన; కైకేయీ = కైకేయి; రుష్టయా = కోపించిన; పరుషం వచః = పరుషమైన మాటను; కుబ్జయా = గూనిదానిచే; పాపదర్శిన్యా = పాపదృష్టిగల; విషాదమ్ = దిగులు; అగమత్ = చెందెను; పరమ్ = మిక్కిలి.
భావం;-
 పాపదృష్టిగల మంథర కోపముతో పలికిన కఠినమైన మాటలు విని కైకేయి పెద్దగా దిగులుచెందెను.
2.7.17.
అనుష్టుప్.
కైకేయీ త్వబ్రవీత్కుబ్జాం
కచ్చిత్క్షేమం న మంథరే।
విషణ్ణవదనాం హి త్వాం
లక్షయే భృశదుఃఖితామ్॥
టీక:-
 కైకేయీ = కైకేయి; తు; అబ్రవీత్ = పలికెను; కుబ్జాం = గూనిదానిని గూర్చి; కచ్చితి = ఏమి, ఎందుకు; క్షేమం = (ఇది)క్షేమము; న = కాదా; మంథరే = మంథరా; విషణ్ణ = దిగులుచెందిన; వదనాం = ముఖము గలదానినిగా; హి = కదా; త్వాం = నిన్ను; లక్షయే = చూచుచున్నాను; భృశః = చాల; దుఃఖితామ్ = దుఃఖితురాలిగను.
భావం;-
 కైకేయి మంథరతో "మంథరా! మన క్షేమమునకు ఏమైనది. నీవు ఎంతో దిగులుపడుతూ, దుఃఖంతో ఎందుకున్నావు" అని అడిగెను.
2.7.18.
అనుష్టుప్.
మంథరా తు వచ శ్శ్రుత్వా
కైకేయ్యా మధురాక్షరమ్।
ఉవాచ క్రోధసంయుక్తా
వాక్యం వాక్యవిశారదా॥
టీక:-
 మంథరా = మంథర; తు = ఐతే; వచః = మాటను; శ్రుత్వా = విని; కైకేయ్యాః = కైకేయియొక్క; మధుర = మధురమైన; అక్షరమ్ = స్వరయుక్తమైన; ఉవాచ = పలికి; క్రోధ = కోపముతో; సంయుక్తా = కూడినది; వాక్యం = మాటను; వాక్యవిశారదా = మాటలాడుటలో నేర్పరి.
భావం;-
 మాటలలో జాణ ఐన మంథర, కైకేయి తీయని అందమైన మాటలు విని కోపముగా ఇట్లు పలికెను.
2.7.19.
అనుష్టుప్.
సా విషణ్ణతరా భూత్వా
కుబ్జా తస్యా హితైషిణీ।
విషాదయంతీ ప్రోవాచ
భేదయంతీ చ రాఘవమ్॥
టీక:-
 సా=ఆ, విషణ్ణతరా = మిక్కిలి దిగులును, భూత్వా = కలిగియున్నది, కుబ్జా = మంథర, తస్యా = ఆమె యొక్క, హితైషిణీ = మేలు కోరుచున్నదై, విషాదయన్తీ = దిగులును కలిగించుచు, ప్రోవాచ = పలికెను, భేదయన్తీ = భేదము కలిగించుచున్నదై, చ = పాదపూరణము; రాఘవమ్ = రామునిగూర్చి.
భావం;-
 కైకేయి మేలును కోరుచున్న మంథర, మరింత దిగులుతో కైకేయికి దుఃఖము కలుగునట్లుగా రాముని వేరుచేయుచు ఇట్లు పలికెను.
విషణ్ణా- విషణ్ణతరా- విషణ్ణతమా
2.7.20.
అనుష్టుప్.
“అక్షయ్యం సుమహద్దేవి
ప్రవృత్తం త్వద్వినాశనమ్।
రామం దశరథో రాజా
యౌవరాజ్యేఽభిషేక్ష్యతి॥
టీక:-
 అక్షయ్యం = అంతులేని; సుమహత్ = గొప్పదైన; దేవీ = రాణి; ప్రవృత్తం = ఏర్పడినది; త్వత్ = నీకు; వినాశనమ్ = వినాశనము; రామం = రాముని; దశరథః = దశరథుడు; రాజా = రాజు; యౌవరాజ్యే = యౌవరాజ్యమునందు; అభిషేక్ష్యతి = అభిషేకించనున్నాడు.
భావం;-
 “ఓ మహారాణీ! నీకు అంతులేని ఆపద వచ్చినది. దశరథమహారాజు రాముని యువరాజుగా అభిషిక్తుని చేయనున్నాడు.
2.7.21.
అనుష్టుప్.
సాఽస్మ్యగాధే భయే మగ్నా
దుఃఖశోకసమన్వితా।
దహ్యమానాఽనలేనేవ
త్వద్ధితార్థమిహాగతా॥
టీక:-
 సా = దానికి; అస్మః = నేను; అగాధే = మిక్కిలిలోతుగల; భయే = భయమునందు; మగ్నా = మునిగినదాననై; దుఃఖ = ఏడుపు; శోక = బాధను; సమన్వితా = కలిగినదానను; దహ్యమానా = మండిపోవుచున్నదాని వలె; అనలేన = మంటచే; త్వత్ = నీ యొక్క; హితార్థమ్ = మేలు కోరి; ఇహ = ఇచటికి; ఆగతా = వచ్చియున్నాను.
భావం;-
 అందుకే అదే నీకు వచ్చిన ఆపదకే, నాకు అంతులేని దుఃఖముతో కూడిన బాధ అనే అగాధంలో పడుతున్నంత భీతి కలుగుతున్నది. ఈ బాధనే నిప్పులలో కాలిపోతూ, నీ మేలు కోరి ఇచటికి వచ్చితిని.
2.7.22.
అనుష్టుప్.
తవ దుఃఖేన కైకేయి
మమ దుఃఖం మహద్భవేత్।
త్వద్వృద్ధౌ మమ వృద్ధిశ్చ
భవేదత్ర న సంశయః॥
టీక:-
 తవ = నీ యొక్క; దుఃఖేన = దుఃఖముచే; కైకేయి = కైకేయీ; మమ = నాకు; దుఃఖం = దుఃఖము; మహత్ = ఎక్కువ; భవేత్ = కలుగును; త్వత్ = నీకు; వృద్ధౌ = అభివృద్ధి కలిగిన; మమ = నాకు; వృద్ధి = అభివృద్ధి; భవేత్ = కలుగును; అత్ర = ఈ విషయమున; న సంశయః = సంశయము లేదు.
భావం;-
 ఓ కైకేయీ! నీకు దుఃఖము కలిగినచో నాకు ఎక్కువ దుఃఖము కలుగును. నీ అభివృద్ధివలన నాకు అభివృద్ధి కలుగును. ఈ విషయములో సందేహము లేదు.
2.7.23.
అనుష్టుప్.
నరాధిపకులే జాతా
మహిషీ త్వం మహీపతేః।
ఉగ్రత్వం రాజధర్మాణాం
కథం దేవి న బుధ్యసే॥
టీక:-
 నరాధిపకులే = రాజవంశమునందు; జాతా = జన్మించిన; మహిషీ = మహా రాణివి; త్వం = నీవు; మహీపతే = రాజుయొక్క; ఉగ్రత్వం = కుటిలత్వమును; రాజధర్మాణాం = రాజధర్మముయొక్క; కథం = ఎట్లు; న = లేదు; బుధ్యసే = ఎరుగుటను.
భావం;-
 కైకేయీ! రాజవంశమునందు జన్మించి, దశరథు మహారాజునకు మహారాణి. నీవు రాజధర్మమునందలి కుటిలత్వము నెందుకు ఎరుగకున్నావు?
2.7.24.
అనుష్టుప్.
ధర్మావాదీ శఠో భర్తా
శ్లక్ష్ణవాదీ చ దారుణః।
శుద్ధభావే న జానీషే
తేనైవ మతిసన్ధితా॥
టీక:-
 ధర్మవాదీ = ధర్మము మాటలాడువాడు; శఠః = కుత్సితుడు; భర్తా = భర్త; శ్లక్ష్ణవాదీ = మృదువుగ మాటలాడువాడు; చ; దారుణః = క్రూరుడు; శుద్ధ = మంచిదైన; భావే = స్వభావము గలిగియుండుటచే; స జానీషే = తెలుసుకొనజాలకున్నావు; తేన = అతనిచే; ఏవమ్ = ఇట్లు; అతిసన్ధితా = మోసగింపబడి.
భావం;-
 నీ భర్త ధర్మవాక్యములు పలుకు కృత్సితుడు. ప్రియముగ మాట్లాడుచు క్రూరముగ ప్రవర్తించును. నీవు మంచిస్వభావము కలదానవు గావున అతడు చేయుచున్న మోసము నెరుగకున్నావు.
2.7.25.
అనుష్టుప్.
ఉపస్థితః ప్రయుంజానః
త్వయి సాంత్వమనర్థకమ్।
అర్థేనైవాద్య తే భర్తా
కౌసల్యాం యోజయిష్యతి॥
టీక:-
 ఉపస్థితః = చెంతకు చేరి; ప్రయుంజానః = ప్రయోగించు; త్వయీ = నీ విషయమున; సాంత్వమ్ = మంచి మాటలు; అనర్థకమ్ = నిరుపయోగమైన; అర్థేన = లాభముతో; ఏవ = మాత్రమే; అద్య = నేడు; తే = నీ; భర్తా = భర్త; కౌసల్యాం = కౌసల్యగురించి; యోజయిష్యతి = కూర్చగలడు.
భావం;-
 నీ భర్త నీ చెంతన చేరి నిరుపయోగమైన మంచిమాటలు పలుకుచు, కౌసల్యకు మాత్రము లాభము చేకూర్చుచుండును.
2.7.26.
అనుష్టుప్.
అపవాహ్య స దుష్టాత్మా
భరతం తవ బంధుషు।
కాల్యే స్థాపయితా రామం
రాజ్యే నిహతకంటకే॥
టీక:-
 అపవాహ్య = పంపివేసి; సః = అతడు; దుష్టాత్మా = దుర్బుద్ధిగల; భరతం = భరతుని; తవ = నీ యొక్క; బంధుషు = బంధువుల వద్దకు; కాల్యే = ఉదయమున; స్థాపయితా = స్థాపింపనున్నాడు; రామం = రాముని; రాజ్యే = రాజ్యమునందు; నిహత = తొలగింపబడిన; కంటకే = అడ్డుచే.
భావం;-
 దుర్బుద్ధిగల నీ భర్త, భరతుని నీ బంధువుల వద్దకు పంపించివేసి, అడ్డు తొలగించుకొని, రేపు ఉదయము రాముని రాజుగా స్థాపింపనున్నాడు.
2.7.27.
అనుష్టుప్.
శత్రుః పతిప్రవాదేన
మాత్రేవ హితకామ్యయా।
ఆశీవిష ఇవాంకేన
బాలే పరిధృతస్త్వయా॥
టీక:-
 శత్రుః = శత్రువు; పతిప్రవాదేన = భర్త అనే పేరుతో; మాత్రేవ = తల్లిచేతవలె; హితకామ్యయా = హితాభిలాషచే; ఆశీఃవిష = విషసర్పము; ఇవ = వలె; అంకేన = ఒడిలో; బాలే = చిన్నదానా, అమాయకురాలా; పరిధృతః = ధరింపబడినాడు; త్వయా = నీచే.
భావం;-
 ఓ అమాయకురాలా! నీవు మాతృహృదయముతో, మేలు కోరుచు విషసర్పమును ఒడిలో చేర్చుకొనినట్లు, శత్రువును భర్త యను పేరుతో గ్రహించియున్నావు.
2.7.28.
అనుష్టుప్.
యథా హి కుర్యాత్సర్పో వా
శత్రుర్వా ప్రత్యుపేక్షితః।
రాజ్ఞా దశరథేనాద్య
సపుత్రా త్వం తథా కృతా॥
టీక:-
 యథా హి = ఏవిధముగా ఐతే; కుర్యాత్ = చేయునో; సర్పః = పాము; వా = కాని; శత్రుః = శత్రువు; వా = కాని; ప్రత్యుపేక్షితః = అలక్ష్యము చేయబడిన; రాజ్ఞా = రాజైన; దశరథేన = దశరథునిచే; అద్య = నేడు; స = సహితముగా; పుత్రా = పుత్రునితో; త్వం = నీవు; తథా = అట్లు; కృతా = చేయబడితివి.
భావం;-
 అలక్ష్యము చేయబడిన పాము గాని, శత్రువు గాని, ఏమిచేయునో, దశరథమహారాజు నీ విషయమున, నీ కుమారుని విషయమునను అట్లే చేసినాడు.
2.7.29.
అనుష్టుప్.
పాపేనానృతసాంత్వేన
బాలే! నిత్యసుఖోచితే।
రామం స్థాపయతా రాజ్యే
సానుబంధా హతా హ్యసి॥
టీక:-
 పాపేన = పాపిచే; అనృత = కల్ల; సాంత్వేన = మంచిమాటలచే; బాలే = బాలా; నిత్య = నిత్యము; సుఖోచితే = సుఖమునకు అలవాటు పడిన; రామం = రాముని; స్థాపయితా = స్థాపించుచున్నాడు; రాజ్యే = రాజ్యమునందు; సానుబంధా = అడ్డులేకుండా (ఆంప్టే నిఘంటువు, ఆంధ్రశబ్దార్థచంద్రిక) ; హతా = కొట్టబడినదానవు; హి = నిశ్చయంగా; అసి = అగుచున్నావు.
భావం;-
 ఓ బాల వలె తెలివితక్కువదానా! పాపాత్ముడైన ఆ రాజు, కల్లలగు మంచిమాటలతో మోసగించుచు, ఎట్టిఅడ్డంకులు లేకుండా చూసుకుని, రామునకు రాజ్యాభిషేకము చేసి, నిత్యము సుఖములకు అలవడియున్న నిన్ను, నశింపజేయుచున్నాడు.
2.7.30.
అనుష్టుప్.
సా ప్రాప్తకాలం కైకేయి!
క్షిప్రం కురు హితం తవ।
త్రాయస్వ పుత్రమాత్మానం
మాం చ విస్మయదర్శనే!”॥
టీక:-
 సా = అటువంటి నీవు; ప్రాప్తకాలం = సమయమునకు తగినట్లు; కైకేయి = కైకేయీ; క్షిప్రం = వెంటనే; కురు = చేయుము; హితం = హితమును; తవ = నీకు; త్రాయస్వ = రక్షించుము; పుత్రమ్ = పుత్రుని; ఆత్మానం = తనను (నిన్ను నువ్వే); మాం = నన్ను; చ = కూడ; విస్మయదర్శనే = ఆశ్చర్యపరచు దర్శనము కల.
భావం;-
 ఓ అచ్చెరువు కలిగించునట్టి అందము గలదానా! కైకేయీ! సమయమునకు తగినట్లుగా, నీకు మేలొనర్చు పనిని చేయుము. నిన్ను, నీ పుత్రుని, నన్ను కూడ రక్షింపుము.”
2.7.31.
అనుష్టుప్.
మంథరాయా వచశ్శ్రుత్వా
శయానా సా శుభాననా।
ఉత్తస్థౌ హర్షసమ్పూర్ణా
చంద్రలేఖేవ శారదీ॥
టీక:-
 మంథరాయాః = మంథర యొక్క; వచః = మాట; శ్రుత్వా = విని; శయానా = పండుకొనియున్న; సా = ఆ; శుభాననా = అందమైన మొగము కలామె; ఉత్తస్థౌ = లేచెను; హర్ష = సంతోషముతో; సంపూర్ణా = నిండినదై; చంద్రలేఖ = చంద్రరేఖ; ఇవ = వలె; శారదీ = శరదృతువు నందలి.
భావం;-
 పడుకొనియున్న ఆ సుందరి కైకేయి, మంథర మాటలు విని, శరదృతువులో చంద్రరేఖ వలె సంతోషముగా లేచెను.
2.7.32.
అనుష్టుప్.
అతీవ సా తు సంహృష్టా
కైకేయీ విస్మయాన్వితా।
ఏకమాభరణం తస్యై
కుబ్జాయై ప్రదదౌ శుభమ్॥
టీక:-
 అతీవ = చాల; సా;తు = ఆ; సంహృష్టా = సంతోషించినదై; కైకేయీ = కైకేయి; విస్మయాన్వితా = ఆశ్చర్యముతో నిండినదై; ఏకమ్ = ఒక; ఆభరణం = నగను; తస్యై = ఆ; కుబ్జాయై = గూనిదానికొరకు; ప్రదదౌ = ఇచ్చెను; శుభమ్ = అందమైన.
భావం;-
 కైకేయి చాలా సంతోషించి, మంథర మాటలకు ఆశ్చర్యచకితురాలై, ఆమెకు ఒక అందమైన ఆభరణమును ఇచ్చెను.
2.7.33.
అనుష్టుప్.
దత్వా త్వాభరణం తస్యై
కుబ్జాయై ప్రమదోత్తమా।
కైకేయీ మంథరాం దృష్ట్వా
పునరేవాబ్రవీదిదమ్॥
టీక:-
 దత్వా = ఇచ్చి; తు; ఆభరణం = నగను; తస్యై = ఆ; కుబ్జాయై = కుబ్జకొరకు; ప్రమదోత్తమా = ఉత్తమ స్త్రీ; కైకేయీ = కైకేయి; మంథరాం = మంథరను; దృష్ట్వా = చూచి; పునః = మరల; ఇవ = వలె; అబ్రవీత్ = పలికెను; ఇదమ్ = ఈ మాటను.
భావం;-
 స్త్రీలలో ఉత్తమురాలైన కైకేయి, మంథరకు ఆభరణమునిచ్చి ఆమెను చూచి, మరల ఇట్లు పలికెను.
2.7.34.బృహతి.
“ఇదం తు మంథరే మహ్యమ్
ఆఖ్యాసి పరమం ప్రియమ్।
ఏతన్మే ప్రియమాఖ్యాతుః
కిం వా భూయః కరోమి తే॥
టీక:-
 ఇదం తు = దీనిని; మంథరే = మంథరా; మహ్యమ్ = నాకు; ఆఖ్యాసి = చెప్పుచున్నావు; పరమం ప్రియమ్ = చాల ఇష్టమైనదానిని; ఏతత్ = ఇది; మే = నాకు; ప్రియమ్ = ఇష్టమైనది; ఆఖ్యాతుః = చెప్పు వారికి; కిం వా = ఇంకేమి; భూయః = ఇంకను; కరోమి = చేయగలను; తే = నీకు.
భావం;-
 “మంథరా! నీవు చెప్పినది నాకు అత్యంత ప్రియమైన మాట. ఈ నగ ప్రియమైన వార్త చెప్పిననీకు నేనిచ్చు బహుమానము. అంతటి ప్రీతికరమైన వార్తను చెప్పిన నీకు ఇంకేమి ఇవ్వగలనో చెప్పుము.
2.7.35.
బృహతి.
రామే వా భరతే వాఽహం
విశేషం నోపలక్షయే।
తస్మాత్తుష్టాఽస్మి యద్రాజా
రామం రాజ్యేఽభిషేక్ష్యతి॥
టీక:-
 రామే = రామునియందు; వా = కాని; భరతే = భరతునియందు; వా = కాని అహం = నేను; విశేషం = భేదమును; న ఉపలక్షయే = చూడను; తస్మాత్ = అందువలన; తుష్టా = సంతోషముగా; అస్మి = ఉన్నాను; యత్ = అట్లు; రాజా = రాజు; రామం = రాముని; రాజ్యే = రాజ్యమునందు; అభిషేక్ష్యతి = అభిషేకించుటలో.
భావం;-
 మంథరా! నాకు రామ భరతుల మధ్య భేదదృష్టి లేదు. అందువలన దశరథుడు రాముని రాజ్యాభిషిక్తుని చేయుచున్నందులకు సంతోషించుచున్నాను.
2.7.36.
జగతి.
న మే పరం కించిదితస్త్వయాపి నః
ప్రియం ప్రియార్హే సువచం వచఃపరమ్।
తథా హ్యవోచస్త్వమతః ప్రియోత్తరం
వరం పరం తే ప్రదదామి తం వృణు॥
టీక:-
 న = లేదు; మే = నాకు; పరం = గొప్పది; కించిత్ = ఏదియు; ఇతః = ఇంతకంటె; త్వయా = నీచేత; అపి = కూడ; నః = కాదు; ప్రియం = ప్రియమైన; ప్రియార్హే = ప్రేమకు తగినది; సువచం = సులభముగా చెప్పగలిగినది; వచః = మాట; పరమ్ = గొప్ప; తథా = అట్లు; హి = కదా; ఆవోచః = చెప్పినావు; త్వమ్ = నీవు; అతః = అందువలన; ప్రియోత్తరం = ఇష్టమైన వాటిలో గొప్పది; వరం = వరమును; పరం = గొప్పది; తే = నీకు; ప్రదదామి = ఇచ్చుచున్నాను; వృణు = కోరుకొనుము.
భావం;-
 మంథరా! నా ప్రేమను పొందుటకు నీవు అర్హురాలవు. నాకు ఇంతకుమించిన సంతోషకరమైన విషయము మరియొకటి లేదు. ఇంతకంటె మంచి విషయము చెప్పలేవు. కనుకనే నీకు గొప్ప వరము నిచ్చుచున్నాను. కోరుకొనుము.
2.7.37.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
అయోధ్యకాణ్డే
సప్తమ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; సప్తమ [7] = ఏడవ; సర్గః = సర్గ.
భావం;-
  ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [7] ఏడవ సర్గ సమాప్తము
2.8.1.
అనుష్టుప్.
మంథరా త్వభ్యసూయైనామ్
ఉత్సృజ్యాభరణం చ తత్।
ఉవాచేదం తతో వాక్యం
కోపదుఃఖసమన్వితా॥
టీక:-
 మంథరా = మంథర; తు = అయితే; అభ్యసూయ = విసుగుకొని; ఏనామ్ = ఆమెగూర్చి; ఉత్సృజ్య = విసిరివేసినది; ఆభరణం = ఆభరణమును; చ = మఱియు; తత్ = ఆ; ఉవాచ = నుడివెను; ఇదం = ఇట్లు; తతః = పిమ్మట; వాక్యం = వాక్యమును; కోప = కోపము; దుఃఖ = దుఃఖము; సమన్వితా = కూడినదై॥
భావం;-
 మంథర అయితే కైకేయిపై విసుగుకొని కోపముతోనూ, దుఃఖములతోనూ ఆ ఆభరణము విసిరివేసి ఇట్లనెను.
2.8.2.
అనుష్టుప్.
“హర్షం కిమిదమస్థానే
కృతవత్యసి బాలిశే!।
శోకసాగరమధ్యస్థమ్
ఆత్మానం నావబుధ్యసే॥
టీక:-
 హర్షం = సంతోషము; కిమ్ = ఎందులకు? ఇదమ్ = ఇటుల; అస్థానే = తగనిదానికి; కృతవత్యసి = కృతవతీ+అసి, చేయుచున్నదానివి అగుచుంటివి; బాలిశే = మూర్ఖురాలా!; శోక = శోకమను; సాగర = సముద్రము; మధ్యస్థమ్ = మధ్యలోనున్న; ఆత్మానం = నిన్నుగూర్చి; నావబుధ్యసే = న+ అవబుధ్యసే = తెలుసుకొనలేకపోవుచున్నావు.
భావం;-
 “ఓ మూర్ఖురాలా! ఇంత విచారకర సమయములో సంతసించుచుంటివేలనే? నీకిది శోకసాగరములో మునగవలసిన విషయము నీకు బోధపడుటలేదు.
2.8.3.
అనుష్టుప్.
మనసా ప్రహసామి త్వాం
దేవి! దుఃఖార్దితా సతీ।
యచ్ఛోచితవ్యే హృష్టాఽసి
ప్రాప్యేదం వ్యసనం మహత్॥
టీక:-
 మనసా = మనస్సుచేత; ప్రహసామి = గట్టిగా నవ్వుచుంటివి; త్వాం = నీవు; దేవి = ఓ దేవీ!; దుఃఖార్దితా = దుఃఖముచే పీడింపబడినదాన; సతీ = నాశముపొందినదాన, 9శబ్దరత్నాకరము, అవసానమ్, సర్వశబ్దసంబోధిని; యత్ = ఎందుకు?; శోచితవ్యే = శోకింపతగియండ; హృష్టాసి = హృష్టా+అసి, సంతసించిన దానివి అగుట; ప్రాప్య = పొంది; ఇదం = ఈ, ఇంతటి; వ్యసనం = ఆపదను; మహత్ = గొప్ప.
భావం;-
 ఏమిటిది దేవీ! వినాశ దుఃఖపీడితురాలివై కూడా ఇలా మనస్పూర్తిగ గట్టిగా నవ్వుచుంటివి. ఇంతటి పెను ఆపద మీద పడుతుంటే, శోకించక ఏల సంతోషించుచుంటివి.
2.8.4.
అనుష్టుప్.
శోచామి దుర్మతిత్వం తే
కా హి ప్రాజ్ఞా ప్రహర్షయేత్।
అరేస్సపత్నీపుత్రస్య
వృద్ధిం మృత్యోరివాగతామ్॥
టీక:-
 శోచామి = దుఃఖించుచున్నాను; దుర్మతిత్వం = తెలివితక్కువబుద్దికి; తే = నీయొక్క; కా = ఎవరు?; హి; ప్రాజ్ఞా = బుద్ధికలిగినవారు; ప్రహర్షయేత్ = సంతోషించును? అరేః = శత్రువు గూర్చి; సపత్నీ = సవతి; పుత్రస్య = పుత్రునియొక్క; వృద్ధిం = అభివృద్ధిని గూర్చి; మృత్యోః = మృత్యువు; ఇవ = వలె; ఆగతామ్ = ఆసన్నమైన.
భావం;-
 నీ తెలివితక్కువబుద్ది చూచి దుఃఖించుచుంటిని. బుద్ధిమంతులు ఎవరైనా ఆనందింతురా? శత్రువుదైనా, సవతి పుత్రునిదైనా ఉన్నతి చావు దగ్గరపడడంతో సమానము కదా!
2.8.5.
అనుష్టుప్.
భరతాదేవ రామస్య
రాజ్యసాధారణాద్భయమ్।
తద్విచింత్య విషణ్ణాఽస్మి
భయం భీతాఽద్ధి జాయతే॥
టీక:-
 భరతాత్ = భరతునివలన; ఏవ = మాత్రమే; రామస్య = రాముడికి; రాజ్యసాధారణాత్ = రాజ్యముపై సమాన అధికారమున్న; భయమ్ = భయము; తత్ = అది; విచింత్య = ఆలోచించి; విషణ్ణా = విచారించుదానను; అస్మి = అయితిని; భయం = భయము; భీతాద్ధి = భీతాత్+ హి, భీతివలననే; జాయతే = కలుగును.
భావం;-
 పట్టము కట్టుటకు రాముడికి ఎంత అర్హత ఉన్నదో భరతునకు కూడ అంతే అర్హత ఉన్నది. అందుచే రాముడికి భరతుడనిన భయము. ఈ విషయము చింతించిన మనకు వానినుండి ఆపదలు కలుగగలవని అని నాకు భయము కలుగుచున్నది.
2.8.6.
అనుష్టుప్.
లక్ష్మణో హి మహేష్వాసో
రామం సర్వాత్మనా గతః।
శత్రుఘ్నశ్చాపి భరతం
కాకుత్స్థం లక్ష్మణో యథా॥
టీక:-
 లక్ష్మణః = లక్ష్మణుడు; హి; మహా = గొప్ప; ఇష్వాసః = గొప్ప ధనుర్ధారి అయిన; రామం = రామడిని; సర్వాత్మనా = అన్నివిధములా; గతః = వెళ్ళువాడు; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; చ = మఱియు; అపి = కూడ; భరతం = భరతుని; కాకుత్స్థం = కాకుత్స్థ వంశస్థుని; లక్ష్మణః = లక్ష్మణుడు; యథా = ఏ విధముగ.
భావం;-
 గొప్పధనుర్ధారుడయిన లక్ష్మణుడు ఎల్లపుడు రాముడిని అనుసరించువాడు. రాముడిని లక్ష్మణుని వలె, శత్రుఘ్నుడు భరతుని అనుసరించును.
2.8.7.
అనుష్టుప్.
ప్రత్యాసన్నక్రమేణాపి
భరతస్యైవ భామిని!।
రాజ్యక్రమో విప్రకృష్టః
తయోస్తావత్కనీయసోః॥
టీక:-
 ప్రత్యాసన్న = పుట్టుకలో సామీప్యము; క్రమేణ = క్రమముచే; అపి = కూడ; భరతస్య = భరతునకు; ఏవ = మాత్రమే; భామిని = ఓ భామిని; రాజ్యక్రమః = రాజ్యక్రమము; విప్రకృష్టః = దూరమైనది; తయోః = వారిరువురికి; తావత్ = అయితే; కనీయసోః = పిన్నవారు.
భావం;-
 ఓ కైకేయి! నీవు క్రీడాసమయములో కూడా కోపము చూపకలదానవు. జన్మించిన క్రమముబట్టి చూచిన శ్రీరామచంద్రుని తరువాత రాజ్యాధికారము భరతునిది మాత్రమే. లక్ష్మణ, శత్రుఘ్నులు పిన్నవారు అగుటచే వారికి రాజ్యాధికారము దూరమయినది.
గమనిక:-
 భామిని- క్రీడాసమయమునందు కోపము చూపెడు ఆఁడుది, శబ్దరత్నాకరము. బెట్టుకలామె.
2.8.8.
అనుష్టుప్.
విదుషః క్షత్రచారిత్రే
ప్రాజ్ఞస్య ప్రాప్తకారిణః।
భయాత్ప్రవేపే రామస్య
చింతయంతీ తవాత్మజమ్॥
టీక:-
 విదుషః = అన్నీతెలిసినవాడు; క్షత్రచారిత్రే = రాజతంత్రము; ప్రాజ్ఞస్య = ప్రతిభావంతుని యొక్క; ప్రాప్త = ప్రాప్తించినదానిబట్టి; కారిణః = పనిచేయువాడు; భయాత్ = భయమువలన; ప్రవేపే = వణుకుచుంటిని; రామస్య = రాముడి యొక్క; చింతయంతీ = ఆలోచించుచున్నదానిని; తవ = నీ యొక్క; ఆత్మజమ్ = పుత్రుని గురించి.
భావం;-
 రాముడు అవినీతిపరుడు, రాజతంత్రమున ప్రతిభాశాలి, కాలానుగుణముగా కార్యములు ఆచరించెడివాడు. నీ కుమారుడైన భరతుని గురించి ఆలోచించుచున్న నేను, అటువంటి రాముడి వలన భరతునకు హాని కలుగునేమోనని భయకంపితను అగుతుంటిని.
విదుషః- విదుష్- వ్యు. వి+దుష్య, దుష్యతి, అవినీతి. విదుషః అవినీతిపరుడు.
2.8.9.
అనుష్టుప్.
సుభగా ఖలు కౌసల్యా
యస్యాః పుత్రోఽభిషేక్ష్యతే।
యౌవరాజ్యేన మహతా
శ్వః పుష్యేణ ద్విజోత్తమైః॥
టీక:-
 సుభగా = సౌభాగ్యము; ఖలు = గొప్ప; కౌసల్యా = కౌసల్యాదేవి; యస్యాః = ఎవరియొక్క; పుత్రః = కుమారుడు; అభిషేక్ష్యతే = అభిషేకింపబోతుండెనో; యౌవరాజ్యేన = యువరాజ్యముచే; మహతా = గొప్పదైన; శ్వః = అనాగతాహః, రేపు; పుష్యేణ = పుష్యమి నక్షత్రముయందు; ద్విజోత్తమైః = శ్రేష్ఠులయిన బ్రాహ్మణులచే.
భావం;-
 భాగ్యమంటే పట్టాభిషిక్తుడు కానున్న కొడుకు గల కౌసల్యాదేవిదే కదా! రేపు ప్రొద్దున్న పుష్యమి నక్షత్ర లఘ్నమందు బ్రాహ్మణోత్తములు రాముడికి యువరాజు పట్టంగడుతారుట.
2.8.10.
అనుష్టుప్.
ప్రాప్తాం సుమహతీం ప్రీతిం
ప్రతీతాం తాం హతద్విషమ్।
ఉపస్థాస్యసి కౌసల్యాం
దాసీవత్త్వం కృతాంజలిః॥
టీక:-
 ప్రాప్తాం = పొందినది; సుమహతీం = చాల గొప్పదైన; ప్రీతిం = సంతోషమును; ప్రతీతాం = ప్రసిద్ధికెక్కినదీ; తాం = ఆమెను; హతద్విషమ్ = నశించిన శత్రువులు గలది; ఉపస్థాస్యసి = సేవించగలవు; కౌసల్యాం = కౌసల్యదేవిని; దాసీవత్ = సేవకురాలువలె; త్వం = నీవు; కృతాంజలిః = చేయబడిన దోసిలి గలిగి.
భావం;-
 రామడికి పట్టాభిషేకము జరిగిన పిదప రాజ్యాధికారము మొత్తము కౌసల్య చేతిలో ఉండును. అంతట ఆమె మిక్కిలి సంతోషంగా రాజమాతగా ప్రఖ్యాతిగాంచును. ఆమె శత్రువులు నశించెదరు. ఓ కైకేయి! నీవు ఆ కౌసల్యాదేవికి దోసిలొగ్గి నమస్కరించుచు ఒక దాసివలె సేవించవలసియుండును.
2.8.11.
అనుష్టుప్.
ఏవం చేత్త్వం సహాస్మాభిః
తస్యాః ప్రేష్యా భవిష్యసి।
పుత్రశ్చ తవ రామస్య
ప్రేష్యభావం గమిష్యతి॥
టీక:-
 ఏవం = ఈ విధముగా; చేత్ = అయినచో ; త్వం = నీవు; సహ = కూడి; అస్మాభిః = మాతో; తస్యాః = ఆమెకు; ప్రేష్యా = దాసివి; భవిష్యసి = అయ్యెదవు; పుత్రః = కుమారుడు; చ = కూడ; తవ = నీయొక్క; రామస్య = శ్రీరామచంద్రునికి; ప్రేష్యభావం = దాసత్వమును; గమిష్యతి = పొందును.
భావం;-
 నీవు ఈ విధముగా కౌసల్యదేవికి మా అందఱితో పాటు దాసీవి అగుదువు. అపుడు నీ పుత్రుడు రాముడికి భృత్యుడగును.
2.8.12.
అనుష్టుప్.
హృష్టాః ఖలు భవిష్యంతి
రామస్య పరమాస్స్త్రియః।
అప్రహృష్టా భవిష్యంతి
స్నుషాస్తే భరతక్షయే”॥
టీక:-
 హృష్టాః = సంతసించినవారు; ఖలు = నిశ్చయంగా; భవిష్యంతి = కాగలరు; రామస్య = రామడి యొక్క; పరమాః = చెందిన; స్త్రియః = స్త్రీలు; అప్రహృష్టా = సంతోషములేనివారు; భవిష్యంతి = అయ్యెదరు; స్నుషాః = కోడళ్ళు; తే = నీయొక్క; భరత = భరతుని; క్షయే = క్షీణతచే.
భావం;-
 రాముని అంతఃపుర స్త్రీలందఱు సంతోషముతో పొంగిపోదురు. ఇది తప్పదు. ఇక భరతుని క్షీణదశవలన నీ కోడళ్ళు మొదలుగాగల స్త్రీలు సంతోషవిహీనులు అగుదరు.”
2.8.13.
అనుష్టుప్.
తాం దృష్ట్వా పర మప్రీతాం
బ్రువంతీం మంథరాం తతః।
రామస్యైవ గుణాందేవీ
కైకేయీ! ప్రశశంస హ॥
టీక:-
 తాం = ఆ; దృష్ట్వా = చూచి; పరమ = మహా; అప్రీతాం = దుఃఖితురాలై; బ్రువంతీం = మాట్లాడుచున్న; మంథరాం = మంథరను; తతః = పిమ్మట; రామస్య = శ్రీరామచంద్రునియొక్క; ఏవ = మాత్రమే; గుణాన్ = సుగుణములను; దేవీ = రాణీ అయిన; కైకేయీ = కైకేయి; ప్రశశంస = ప్రశంసించెను; హ.
భావం;-
 అమిత దుఃఖముతో అట్లు మాట్లాడుచున్న మంథరను చూచి మహారాణి కైకేయి శ్రీరామచంద్రుని సుగుణములను ఇట్లు ప్రశంసించెను.
2.8.14.
అనుష్టుప్.
“ధర్మజ్ఞో గురుభిర్దాంతః
కృతజ్ఞస్సత్యవాక్ఛుచిః।
రామో రాజ్ఞ స్సుతో జ్యేష్ఠో
యౌవరాజ్యమతోఽర్హతి॥
టీక:-
 ధర్మజ్ఞః = ధర్మములు ఎఱిగినవాడు; గురుభిః = గురువులచే; దాంతః = శిక్షణపొందినవాడు; కృతజ్ఞః = చేసిన మేలు గుర్తు పెట్టుకొనువాడు; సత్యవాక్ = సత్యమునే పలుకువాడు; శుచిః = పవిత్రుడు; రామః = శ్రీరామచంద్రుడు; రాజ్ఞః = రాజుయొక్క; సుతః = సుతుడు; జ్యేష్ఠః = పెద్ద; యౌవరాజ్యమ్ = యౌవరాజ్యమును గూర్చి; అతః = అందుచే; అర్హతి = అర్హుడు.
భావం;-
 శ్రీరామచంద్రుడు సకల ధర్మములెఱిగినవాడు, గురువులవద్ద చక్కగా విద్యనభ్యసించిన యోగ్యుడు. కృతజ్ఞతాభావము గలవాడు, సత్యము పలుకువాడు. పరమ పవిత్రుడు. మహారాజుగారికి పెద్దకుమారుడు. అందుచే అతడు యౌవరాజ్యాభిషేకమునకు అర్హుడు.
2.8.15.
అనుష్టుప్.
భ్రాతౄన్ భృత్యాంశ్చ దీర్ఘాయుః
పితృవత్పాలయిష్యతి।
సంతప్స్యసే కథం కుబ్జే!
శ్రుత్వా రామాభిషేచనమ్॥
టీక:-
 భ్రాతౄన్ = సోదరులను; భృత్యామ్ = పోషించ తగినవారిని; చ; దీర్ఘాయుః = దీర్ఘమైన ఆయువు కలవాడు; పితృవత్ = తండ్రివలె; పాలయిష్యతి = పాలించగలవాడు; సంతప్స్యసే = సంతాపము చెందుచుంటివి; కథం = ఎందులకు?; కుబ్జే = ఓకుబ్జా!; శ్రుత్వా = విని; రామః = శ్రీరామచంద్రుని; అభిషేచనమ్ = అభిషేకము గుఱించి.
భావం;-
 “చిరంజీవి శ్రీరామచంద్రుడు తన సోదరులను, అనుచరులను తన తండ్రివలె వాత్సల్యముతో పాలించగలడు. కుబ్జా! శ్రీరాముని పట్టాభిషేకపు వార్త విని నీవు ఎందుకు పరితపించుచుంటివి?
2.8.16.
అనుష్టుప్.
భరతశ్చాపి రామస్య
ధ్రువం వర్షశతాత్పరమ్।
పితృపైతామహం రాజ్యమ్
అవాప్తా పురుషర్షభః॥
టీక:-
 భరతః = భరతుడు = మఱియు; చ; అపి = కూడ; రామస్య = శ్రీరామచంద్రుని యొక్క; ధ్రువం = ఇది నిశ్చయము; వర్షశతాత్ = నూరు సంవత్సరములకంటె; పరమ్ = తరువాత; పితృపైతామహం = తండ్రి, తాతలనుంచి వచ్చిన; రాజ్యమ్ = రాజ్యమును; అవాప్తా = పొందగలడు; పురుషర్షభః = పురుష శ్రేష్ఠుడు.
భావం;-
 శ్రీరామచంద్రమూర్తి అనేక వర్షములు పాలించిన పిదప వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును పురుషశ్రేష్ఠుడైన భరతుడు కూడ పరిపాలించగలడు, ఇది నిశ్చయము.
కేకయదేశ యువరాణి, దశరథుని మహారాణి. ఆమెకి గొప్ప సంస్కారము, యుద్ధవిద్యలందు నేర్పు, రాజతంత్ర నైపుణ్యము కలవు. వీటితోపాటు మాతృత్వమమకారం కలసి ఆమెచే “వంశపారంపర్య సింహాసనం రాముని పిమ్మట భరతునికి వచ్చు” నని పలికించింది.
2.8.17.
అనుష్టుప్.
సా త్వమభ్యుదయే ప్రాప్తే
వర్తమానే చ మంథరే।
భవిష్యతి చ కల్యాణే!
కిమర్థం పరితప్యసే॥
టీక:-
 సా = ఆ; త్వమ్ = నీవు; అభ్యుదయే = అభ్యుదయము; ప్రాప్తే = ప్రాప్తించుచుండగా; వర్తమానే = వర్తమానమునందు; చ = మఱియు; మంథరే = ఓ మంథర; భవిష్యతి = జరుగబోవుచుండగ; చ = మఱియు; కల్యాణే = మంగళ స్వరూపిణీ; కిమర్థం = ఎందులకు?; పరితప్యసే = శోకించుచుంటివి?
భావం;-
 ఓ మంగళ స్వరూపిణీ! మంథర! ఇప్పుడు మనకు అభ్యుదయము జరుగనుండగా, భవిష్యత్తులో మంగళములు జరుగనుండగ, నీవు ఎందులకు శోకించుచుంటివి?
2.8.18.
అనుష్టుప్.
యథా మే భరతో మాన్యః
తథా భూయోఽపి రాఘవః।
కౌసల్యాతోఽతిరిక్తం చ
సోఽనుశుశ్రూషతే హి మామ్॥
టీక:-
 యథా = ఏవిధముగా అయితే; మే = నాకు; భరతః = భరతుడు; మాన్యః = ప్రీతిపాత్రుడో; తథా = అదేవిధముగా; భూయః = ఎక్కువగ; అపి = కూడ; రాఘవః = రాఘురాముడు; కౌసల్యాతః = కౌసల్యనుకంటె; అతిరిక్తం = ఎక్కువగ; చ = మఱియు; సః = అతడు; అనుశుశ్రూషతే = సేవించుచుండును; హి; మామ్ = నన్ను.
భావం;-
 నాకు భరతుడు ఎంత ప్రీతిపాత్రుడో అంతకుమించి శ్రీరామచంద్రుడు అత్యంత ప్రీతిపాత్రుడు. అతడు కూడ నన్ను కౌసల్యనుకంటె ఎక్కువగా సేవించుచుండును.
2.8.19.
అనుష్టుప్.
రాజ్యం యది హి రామస్య
భరతస్యాపి తత్తదా।
మన్యతే హి యథాత్మానం
తథా భ్రాతఽశ్చభ్రాతౄంశ్చ రాఘవః”॥
టీక:-
 రాజ్యం = రాజ్యము; యది = అయినచో; హి; రామస్య = శ్రీరామచంద్రుని యొక్క; భరతస్య = భరతునియొక్క; అపి = కూడ; తత్ = అది; తదా = అప్పుడు; మన్యతే = తలచును; హి; యథా = ఏవిధముగా అగునో; ఆత్మానం = తనను; తథా = ఆవిధముగా; భ్రాతౄః = సోదరులను; చ= కూడ; రాఘవః = రఘురాముడు.
భావం;-
 శ్రీరామచంద్రుడు తన సోదరులను తనతో సమానముగా చూచుకొనును. అతనికి భేదబుద్ధి లేదు కదా! రాజ్యాధికారము శ్రీరామచంద్రునిది అయినను, భరతునది అయినను ఒకటే.”
2.8.20.
అనుష్టుప్.
కైకేయీవచనం శ్రుత్వా
మంథరా భృశదుఃఖితా।
దీర్ఘముష్ణం చ నిఃశ్వస్య
కైకేయీమిదమబ్రవీత్॥
టీక:-
 కైకేయీవచనం = కైకేయి మాటలను; శ్రుత్వా = విని; మంథరా = మంథర; భృశృ = మిక్కిలి; దుఃఖితా = దుఃఖించినదై; దీర్ఘమ్ = దీర్ఘమైన; ఉష్ణం = వేడిదైన; చ = మఱియు; నిఃశ్వస్య = నిట్టూర్చెను; కైకేయీమ్ = కైకేయినిగూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = నుడివెను.
భావం;-
 కైకేయి మాటలు విని మంథర మిక్కిలి దుఃఖితయై దీర్ఘమైన వేడి నిట్టూర్పులు విడుచుచు కైకేయితో ఇట్లు నుడివెను.
2.8.21.
అనుష్టుప్.
“అనర్థదర్శినీ! మౌర్ఖ్యాన్
నాత్మానమవబుధ్యసే।
శోకవ్యసనవిస్తీర్ణే
మజ్జంతీ దుఃఖసాగరే॥
టీక:-
 అనర్థదర్శినీ = స్వప్రయోజనము చూడలేనిదాన; మౌర్ఖ్యాత్ = ముర్ఖత్వముతో; ఆత్మానమ్ = నిన్ను నీవే; అవబుధ్యసే = తెలుసుకొనలేకపోవు చున్నావు; శోక = శోకము; వ్యసన = ఆపదలు; విస్తీర్ణే = విస్తరించిన; మజ్జంతీ = మునిగిపోవు చున్నావు; దుఃఖసాగరే = దుఃఖ సముద్రము నందు.
భావం;-
 “స్వప్రయోజనము చూసుకొనలేని కైకేయి! శోకము, ఆపదలతో నిండిన దుఃఖసముద్రములో మునిగిపోవుచు నీ మూర్ఖత్వముచే నీ స్థితిని నీవు తెలుసుకొనలేకపోవుచున్నావు.
2.8.22.
అనుష్టుప్.
భవితా రాఘవో రాజా
రాఘవస్యాను యస్సుతః।
రాజవంశాత్తు కైకేయి!
భరతః పరిహాస్యతే॥
టీక:-
 భవితా = అగును; రాఘవః = రాఘవుడు; రాజా = రాజు; రాఘవస్య = రాఘవునియొక్క; అను = తరువాత; యః = ఎవడు; సుతః = సుతుడు; రాజవంశాత్ = రాజవంశమునుండి; తు; కైకేయి = ఓ కైకేయి; భరతః = భరతుడు; పరిహాస్యతే = పరిహసించబడును.
భావం;-
 ఓ కైకేయి! శ్రీరామచంద్రుడు రాజు అయినచో, వాని అనంతరము ఆతని సంతానమునకు రాజ్యాధికారము దక్కును. భరతుడు రాజవంశమునకు ఎడ అగును. భవిష్యత్తులో భరతుడు రాజగుట సంభవముకాదు.
2.8.23.
అనుష్టుప్.
న హి రాజ్ఞస్సుతా స్సర్వే
రాజ్యే తిష్ఠంతి భామిని।
స్థాప్యమానేషు సర్వేషు
సుమహాననయో భవేత్॥
టీక:-
 న = లేదు; హి; రాజ్ఞః = రాజుయొక్క; సుతాః = సుతులు; సర్వే = అందఱు; రాజ్యే = రాజ్యము నందు; తిష్ఠంతి = కూర్చొనుట; భామిని = ఓ సుందరీ!; స్థాప్యమానేషు = స్థాపించబడినచో; సర్వేషు = అందఱికి; సుమహాన్ = చాల గొప్ప; అనయః = నీతి లేకుండుట; భవేత్ = అగును.
భావం;-
 ఓ సుందరీ! రాజుయొక్క కుమారులు అందఱు సింహాసనము అధిష్ఠించలేరు. అట్లు ఎక్కించుట న్యాయము కాదు, పైగా అనర్థదాయకము.
భామిని- సుందరమైన యువతి, సులభముగా కోపమును పొందు స్త్రీ, వ్యు. 1. భామ- క్రోధే + ణిని జీప్., కృ.ప్ర.,2. భామ + ఇని – జీష్, త.ప్ర. ఆంధ్రశబ్దరత్నాకరము
2.8.24.
అనుష్టుప్.
తస్మాజ్జ్యేష్ఠే హి కైకేయి!
రాజ్యతంత్రాణి పార్థివాః।
స్థాపయంత్యనవద్యాంగి
గుణవత్స్వితరేష్వపి॥
టీక:-
 తస్మాత్ = అందుచేత; జ్యేష్ఠే = పెద్దకుమారుని యందు; హి; కైకేయి = ఓ కైకేయి!; రాజ్యతంత్రాణి = రాజ్య తంత్రములను; పార్థివాః = రాజులు; స్థాపయంతి = స్థాపించెదరు; అనవద్యాంగి = దోషములు లేని అంగములుగల; గుణవత్సు = గుణవంతులైన; ఇతరేషః = ఇతరులయందు; అపి = కూడ.
భావం;-
 ఓ సుందరాంగి అయిన కైకేయి, అందుచేత రాజులు రాజ్యభారమును పెద్దకుమారునకుగాని, లేదా గుణవంతులైన ఇతర కుమారులకు గాని అప్పగించెదరు.
2.8.25.
అనుష్టుప్.
అసావత్యంతనిర్భగ్నః
తవ పుత్రో భవిష్యతి।
అనాథవత్సుఖేభ్యశ్చ
రాజవంశాచ్చ వత్సలే!॥
టీక:-
 అసా = ఈ; అత్యంతః = పూర్తిగా; నిర్భగ్నః = భగ్నమైన; తవ = నీ; పుత్రః = కుమారుడు; భవిష్యతి = కాగలడు; అనాథవత్ = అనాథవలె; సుఖేభ్యః = సుఖములనుండి; చ = మఱియు; రాజవంశాత్ = రాజవంశమునుండి; చ = మఱియు; వత్సలే = పుత్రవాత్సల్యముగల.
భావం;-
 పుత్రవాత్సల్యముగల కైకేయి! నీపుత్రుడు దిక్కులేనివానివలె రాజ్యాధికారమును, సర్వసుఖములను ఆదరాభిమానాలు కోల్పోవును.
2.8.26.
అనుష్టుప్.
సాఽహం త్వదర్థే సమ్ప్రాప్తా
త్వం తు మాం నావబుద్ధ్యసే।
సపత్ని వృద్ధౌ యా మే త్వం
ప్రదేయం దాతుమిచ్ఛసి॥
టీక:-
 సా = అట్టి; అహం = నేను; త్వదర్థే = నీ కొఱకు; సమ్ప్రాప్తా = పొందబడితిని (వచ్చితిని); త్వం = నీవు; తు; మాం = నన్ను; నావబుద్ధ్యసే = అర్థముచేసుకొనుట లేదు; సపత్ని = సవతి; వృద్ధౌ = వృద్ధిపొందుచుండగ; యా = ఏ; మే = నాకు; త్వం = నీవు; ప్రదేయం = బహుమతిని; దాతుమ్ = ఇచ్చుటకు; ఇచ్ఛసి = ఇష్టపడుచుంటివి.
భావం;-
 నీ ప్రయోజనము కొఱకు నేను ఇక్కడకు వచ్చితిని, అయినను నన్ను అర్థముచేసుకొనక, నీ సవతికి వృద్ధి కలుగుచుండ నాకు బహుమానము ఇచ్చుటకు ఇష్టపడుచుంటివి.
2.8.27.
అనుష్టుప్.
ధ్రువం తు భరతం రామః
ప్రాప్య రాజ్యమకణ్టకమ్।
దేశాంతరం వా నయితా
లోకాంతరమథాఽపి వా॥
టీక:-
 ధ్రువం = నిశ్చయము; తు; భరతం = భరతుని; రామః = శ్రీరామచంద్రుడు; ప్రాప్య = పొంది; రాజ్యమ్ = రాజ్యమును; అకణ్టకమ్ = అడ్డంకులులేని; దేశాంతరం = ఇంకొక దేశమునకు; వా = కాని; నయితా = పంపించును; లోకాంతరమ్ = ఇంకొక లోకమునకుగాని; అథ = తరువాత; అపి = కూడ; వా = కాని.
భావం;-
 శ్రీరామచంద్రమూర్తి రాజ్యాధికారమును పొందిన తరువాత ఎటువంటి అడ్డంకులు లేకుండ తప్పక భరతుడిని మఱియొక దేశమునకు గాని, పరలోకమునకు గాని పంపించివేయును.
2.8.28.
అనుష్టుప్.
బాల ఏవ హి మాతుల్యం
భరతో నాయితస్త్వయా।
సన్నికర్షాచ్చ సౌహార్దం
జాయతే స్థావరేష్వపి॥
టీక:-
 బాలః = బాలుడు; ఏవ = మాత్రమే; హి; మాతుల్యం = మేనమామ గృహము గూర్చి; భరతః = భరతుడు; నాయితః = పంపబడినాడు; త్వయా = నీచేత; సన్నికర్షాత్ = దగ్గరగ ఉండుట వలన; చ = మఱియు; సౌహార్దం = స్నేహము; జాయతే = పుట్టును; స్థావరేషు = స్థావరముల యందు; అపి = కూడ.
భావం;-
 నీవు భరతుని చిన్నతనములోనే మేనమామ గారింటికి పంపించితివి. సమీపమున ఉన్నప్పుడు స్థావరములయిన వృక్షములపై కూడ అనురాగము కలుగుట సహజము కదా! (భరతుని దూరముగా పంపుటచే వానిపై దశరథునకు ప్రేమలేకుండ చేసితివి)
2.8.29.
అనుష్టుప్.
భరతస్యాప్యనువశః
శత్రుఘ్నోఽపి సమం గతః।
లక్ష్మణో హి యథా రామం
తథాఽసౌ భరతం గతః॥
టీక:-
 భరతస్య = భరతునకు; అపి = కూడ; అనువశః = అనువర్తించువాడు; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; అపి = కూడ; సమం = అతనితో కూడి; గతః = వెళ్ళెను; లక్ష్మణః = లక్ష్మణుడు; హి; యథా = ఏ విధముగా; రామం = శ్రీరామచంద్రుని; తథా = ఆవిధముగా; అసౌ = ఈ; భరతం = భరతుని; గతః = చేరెను.
భావం;-
 భరతుని అనుసరించి శత్రుఘ్నుడు కూడ వెళ్ళెను. లక్ష్మణుడు శ్రీరామచంద్రుని అనువర్తించునట్లు శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయించి యుండును కదా! (శత్రుఘ్నుడు అయోధ్యయందు ఉండినయెడల భరతుని ఉన్నతికి ప్రయత్నించి ఉండెడివాడు)
2.8.30.
అనుష్టుప్.
శ్రూయతే హి ద్రుమః కశ్చిత్
ఛేత్తవ్యో వనజీవిభిః।
సన్నికర్షాదిషీకాభిః
మోచితః పరమాద్భయాత్॥
టీక:-
 శ్రూయతే = వినబడుచున్నది; హి; ద్రుమః = చెట్టు; కశ్చిత్ = ఒకానొక; ఛేత్తవ్యః = చేదింపబడదగిన; వనజీవిభిః = అరణ్యములో జీవించువారిచేత; సన్నికర్షాత్ = సామీప్యమువలన; ఇషీకాభిః = ముండ్లదుబ్బు చేత, శబ్దరత్నాకరము; మోచితః = విడిపింపబడినదిగా; పరమాత్ = మిక్కిలి; భయాత్ = భయమునుండి.
భావం;-
 అరణ్యములలో నివసించువారు ఒకానొక చెట్టును కొట్టుటకు సిద్ధపడినప్పుడు దాని చుట్టూ ముళ్ళపొదలు ఆవరించియుండుటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యపడలేదు అని విందుముకదా! ముళ్ళపొదలు కప్పబడుటచే వృక్షము రక్షింపబడి నట్లు, శత్రుఘ్నుడితో కూడిన భరతుడు ఇచట ఉండియున్న అతనికి రక్షణ కలిగియుండెడిది.
2.8.31.
అనుష్టుప్.
గోప్తా హి రామం సౌమిత్రిః
లక్ష్మణం చాపి రాఘవః।
అశ్వినోరివ సౌభ్రాత్రమ్
తయోర్లోకేషు విశ్రుతమ్॥
టీక:-
 గోప్తా = రక్షింపగలడు; హి = కదా!; రామం = శ్రీరామచంద్రుని; సౌమిత్రిః = లక్ష్మణుడు; లక్ష్మణం = లక్ష్మణుని; చ = మఱియు; అపి = కూడ; రాఘవః = రాఘవుడు (రఘు రాముడు); అశ్వినోః = అశ్వినీదేవతలయొక్క; ఇవ = వలె; సౌభ్రాత్రమ్ = సోదరప్రేమ; తయోః = వారిరువురి; లోకేషు = లోకమునందు; విశ్రుతమ్ = ప్రసిద్ధినొందినది.
భావం;-
 లక్ష్మణస్వామి ఎల్లపుడు శ్రీరామచంద్రుని రక్షించుచుండును, అదేవిధముగ శ్రీరాముడుకూడ సౌమిత్రిని కాపాడుచు నుండును. వారి సౌభ్రాతృత్వము ఆశ్వినీదేవతల వలె సోదరప్రేమ వలె లోకప్రసిద్ధి గాంచినది.
2.8.32.
అనుష్టుప్.
తస్మాన్న లక్ష్మణే రామః
పాపం కించిత్కరిష్యతి।
రామస్తు భరతే పాపం
కుర్యాదితి న సంశయః॥
టీక:-
 తస్మాత్ = అందుచేత; న = లేదు; లక్ష్మణే = లక్ష్మణునియందు; రామః = శ్రీరామచంద్రుడు; పాపం = పాపమును; కించిత్ = కొంచెమైనను; (న)కరిష్యతి = చేయడు (న కరిష్యతి అని తీసుకోవలెను); రామః = శ్రీరామచంద్రుడు; తు; భరతే = భరతునియందు; పాపం = పాపమును; కుర్యాత్ = చేయును; ఇతి = ఇందు; న = లేదు; సంశయః = సందేహము.
భావం;-
 అందుచేత శ్రీరామచంద్రుడు లక్ష్మణునకు ఎట్టి అపకారము తలపెట్టడు. ఆ శ్రీరామచంద్రుడు భరతునకు కీడు తలపెట్టును అనుటలో సందేహములేదు.
2.8.33.
అనుష్టుప్.
తస్మాద్రాజగృహాదేవ
వనం గచ్ఛతు తే సుతః।
ఏతద్ధి రోచతే మహ్యం
భృశం చాపి హితం తవ॥
టీక:-
 తస్మాత్ = అందుచే; రాజగృహాత్ = రాజగృహమునుండి; ఏవ = అటులే; వనం = అడవికి; గచ్ఛతు = వెళ్ళుగాక; తే = నీయొక్క; సుతః = పుత్రుడు; ఏతత్ హి = ఇది; రోచతే = ఇష్టమగును; మహ్యం = నాకు; భృశం = మిక్కిలి; చ = మఱియు; అపి = కూడ; హితం = మేలు; తవ = నీకు.
భావం;-
 అందుచేత, భరతుడు కేకయరాజ్యమునుండియే అరణ్యములకు వెళ్ళుట మంచిదని నాకు తోచుచున్నది. అదియే నీకు కూడ మిక్కిలి హితము.
2.8.34.
అనుష్టుప్.
ఏవం తే జ్ఞాతిపక్షస్య
శ్రేయశ్చైవ భవిష్యతి।
యది చేద్భరతో ధర్మాత్
పిత్ర్యం రాజ్యమవాప్స్యసి॥
టీక:-
 ఏవం = ఈ విధముగా; తే = నీకు; జ్ఞాతిపక్షస్య = బంధుపక్షము యొక్క; శ్రేయః = శ్రేయస్సు; చ = మఱియు; ఏవ = మాత్రము; భవిష్యతి = కాగలదు; యది = అయిన; చేత్ = యెడల; భరతః = భరతుడు; ధర్మాత్ = ధర్మమువలన; పిత్ర్యం = తండ్రియొక్క; రాజ్యమ్ = రాజ్యమును; అవాప్స్యసి = పొందును.
భావం;-
 ధర్మమును అనుసరించి భరతునకు తండ్రిగారి రాజ్యము లభించినయెడల నీకు, నీ బంధువర్గమునకు శ్రేయస్సు కలుగును.
2.8.35.
అనుష్టుప్.
స తే సుఖోచితో బాలో
రామస్య సహజో రిపుః।
సమృద్ధార్థస్య నష్టార్థో
జీవిష్యతి కథం వశే॥
టీక:-
 సః = అతడు; తే = నీకు; సుఖోచితః = సుఖములకు అర్హుడు; బాలః = బాలుడు; రామస్య = శ్రీరామచంద్రునియొక్క; సహజః = సహజమైన; రిపుః = శత్రువు; సమృద్ధి = సమృద్ధిచెందిన; అర్థస్య = ప్రయోజనముగలవాని యొక్క; నష్టార్థః = ప్రయోజనములు కోల్పోయిన వాడు; జీవిష్యతి = జీవించుట; కథం = ఎట్లు; వశే = వశమునందు.
భావం;-
 బాలుడైన భరతుడు సర్వసుఖములకు అర్హుడు. అట్టి భరతుడు, సవతితల్లివైన నీకుమారుడు అగుటచే శ్రీరామచంద్రునకు సహజమైన శత్రువు. తన ప్రయోజనములు కోల్పోయిన భరతుడు, అన్ని ప్రయోజనములను పొందిన శ్రీరామచంద్రుని వశములో ఎట్లు జీవించగలడు?
2.8.36.
అనుష్టుప్.
అభిద్రుతమివారణ్యే
సింహేన గజయూథపమ్।
ప్రచ్ఛాద్యమానం రామేణ
భరతం త్రాతుమర్హసి॥
టీక:-
 అభిద్రుతమ్ = పాఱిపోయినది; ఇవ = వలె; అరణ్యే = వనమునందు; సింహేన = సింహము చేత; గజయూథపమ్ = ఏనుగుల గుంపు నాయకుడు; ప్రచ్ఛాద్యమానం = కప్పివేయబడు చున్న; రామేణ = శ్రీరామచంద్రునిచే; భరతం = భరతుడిని; త్రాతుమ్ = రక్షించుటకు; అర్హసి = తగి ఉంటివి.
భావం;-
 వనమునందు సింహముచే తరుమబడి పాఱిపోవుచున్న గజరాజువలె భరతుడు శ్రీరామచంద్రునిచే ఆక్రమించబడుచుండెను. వానిని నీవే రక్షించగలవు.
2.8.37.
అనుష్టుప్.
దర్పాన్నిరాకృతా పూర్వం
త్వయా సౌభాగ్యవత్తయా।
రామమాతా సపత్నీ తే
కథం వైరం న శాతయేత్॥
టీక:-
 దర్పాత్ = దర్పమువలన; నిరాకృతా = తిరస్కరింపబడిన; పూర్వం = ఇంతకుముందు; త్వయా = నీచేత; సౌభాగ్యవత్తయా = సౌభాగ్యము కలిగినదానవు అగుటచే; రామమాతా = శ్రీరామచంద్రుని తల్లి; సపత్నీ = సవతి; తే = నీకు; కథం = ఎట్లు?; వైరం = వైరమును; న = లేదు; శాతయేత్ = తీర్చుకొనుట.
భావం;-
 దశరథమహీపతి ప్రేమాదరములు లభించుటచే గర్వముతో నువ్వు శ్రీరామచంద్రుని తల్లి ఆ కౌసల్యను నిరాదరించితివి. నీ సవతి అయిన ఆ కౌసల్య ప్రతీకారము తీర్చుకొనక ఊరుకొనునా?
2.8.38.
జగతి.
యదా హి రామః పృథివీమవాప్స్యతి
ప్రభూతరత్నాకరశైలపత్తనామ్।
తదా గమిష్యస్యశుభం పరాభవం
సహైవ దీనా భరతేన భామిని!॥
టీక:-
 యదా = ఎప్పుడు; హి; రామః = రాముడు; పృథివీమ్ = సమస్త భూమండలమును; అవాప్స్యతి = పొందునో; ప్రభూత = సమృద్ధమైన; రత్నాకర = సముద్రములు; శైల = కొండలు; పత్తనామ్ = పట్టణములు గల; తదా = అప్పుడు; గమిష్యసి = పొందగలవు; అశుభం = అశుభములను; పరాభవం = అవమానములను; సహ = కూడి; ఏవ = మాత్రమే; దీనా = దీనురాలివి; భరతేన = భరతునితో; భామిని! = భామిని!
భావం;-
 భామినీ! కైకేయీ! సమృద్ధమైన సముద్రములు, పర్వతములు, పురములు గల ఈ సమస్త భూమండలమునకు ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రభువైనప్పుడు నీవు భరతునితో కలిసి దీనముగా అవమానములను పొందెదవు.
గమనిక:-
 (1) పత్తనము- వ్యు. పతంతి తత్ర జనాః- పత +తన, కృ.ప్ర., ఇందుల జనులు మిక్కిలగా కూడుదురు. (2) భామిని అనుటలో కైక కోప స్వభావము స్పురించి, అవమానములు తట్టుకొనుట కష్టతరమని సూచన.
2.8.39.
జగతి.
యదా హి రామః పృథివీమవాప్స్యతి
ధ్రువం ప్రణష్టో భరతో భవిష్యతి।
అతో హి సంచింతయ రాజ్యమాత్మజే
పరస్య చైవాద్య వివాసకారణమ్॥
టీక:-
 యదా = ఎప్పుడైతే; హి = నిశ్చయాత్మకము రామః = శ్రీరామచంద్రుడు; పృథివీమ్ = సమస్త భూమండలమును; అవాప్స్యతి = పొందునో; ధ్రువం = తప్పదు; ప్రణష్టః = నశించినవాడు; భరతః = భరతుడు; భవిష్యతి = కాగలడు; అతః = అందుచేత; హి; సంచింతయ = ఆలోచించుము; రాజ్యమ్ = రాజ్యమును; ఆత్మజే = నీ పుత్రునకు; పరస్య = శత్రువునియొక్క; చ = మఱియు; ఏవ = మాత్రమే; అద్య = ఇప్పుడు; వివాసకారణమ్ = రాజ్యబహిష్కరణకు నెపము.
భావం;-
 శ్రీరామచంద్రుడు రాజ్యాధికారము పొందినంతనే భరతుడు అన్నివిధముల నష్టపోవుట తప్పదు. అందుచేత నీ పుత్రుడు భరతుడు రాజ్యము పొందుటకు, శత్రువైన శ్రీరామచంద్రుని రాజ్యబహిష్కరణకు గురిచేయు ఉపాయము ఇప్పుడే ఆలోచించుము.
2.8.40.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
అష్టమ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; అష్టమ [8] = ఏడవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమైన వాల్మీకి విరచిత తెలుగు వారి రామాయణములోని అయోధ్యా కాండలోని అష్టమ (8వ) సర్గ సంపూర్ణము.
2.9.1.
అనుష్టుప్.
ఏవముక్తా తు కైకేయీ
క్రోధేన జ్వలితాననా।
స్య
మంథరామిదమబ్రవీత్॥
టీక:-
 ఏవమ్ = ఇట్లు; ఉక్తా తు = పలుకబడిన; తు; కైకేయీ = కైకేయి; క్రోధేన = కోపముచే; జ్వలిత = మండిపడుతున్న; ఆనన = ముఖము కలదై; దీర్ఘమ్ = దీర్ఘముగా; ఉష్ణం = వేడిగా; వినిశ్వస్య = నిట్టూర్చి; మంథరామ్ = మంథరను గూర్చి; ఇదమ్ = దీనిని; అబ్రవీత్ = పలికెను.
భావం;-
 ఆమె మాటలు విని, కైకేయి కోపముతో మండిపడుతూ ముఖము కందిపోయి, దీర్ఘముమైన వేడి నిట్టూర్చులు విడుచుచు మంథరతో ఇట్లు పలికెను.
2.9.2.
అనుష్టుప్.
“అద్య రామమితః క్షిప్రం
వనం ప్రస్థాపయామ్యహమ్।
యౌవరాజ్యే చ భరతం
క్షిప్రమేవాభిషేచయే॥
టీక:-
 అద్య = ఇప్పుడు; రామమ్ = రాముని; ఇతః = ఇచటి నుండి; క్షిప్రం = శీఘ్రముగా; వనం = అరణ్యమును గూర్చి; ప్రస్థావయామి = పంపించెదను; అహమ్ = నేను; యౌవరాజ్యే = యౌవరాజ్యమునందు; భరతం చ = భరతుని కూడ; క్షిప్రమేవ = త్వరగానే; అభిషేచయామి = అభిషేకింపజేసెదను.
భావం;-
 ఇప్పుడే రాముని అరణ్యమునకు పంపింపజేసెదను. భరతునికి యువరాజ పట్టాభిషేకము కూడ శీఘ్రముగానే జేయించెదను.
2.9.3.
అనుష్టుప్.
ఇదం త్విదానీం సమ్పశ్య
కేనోపాయేన మంథరే।
భరతః ప్రాప్నుయాద్రాజ్యం
న తు రామః కథంచన”॥
టీక:-
 ఇదం = దీనిని; తు; ఇదానీం = ఇప్పుడు; సమ్పశ్య = బాగుగా చూడుము; కేనః = ఏ; ఉపాయేన = ఉపాయముచేత; మంథరే = మంథరా; భరతః = భరతుడు; ప్రాప్నుయాత్ = పొందును; రాజ్యం = రాజ్యమును; న = పొందజాలడో; తు; రామః = రాముడు; కథంచన = ఎట్లైనను.
భావం;-
 మంథరా! భరతునకు రాజ్యము ప్రాప్తించుటకును, రామునకు లభింపకుండుటకును ఏదైన మంచి ఉపాయము ఆలోచింపుము.”
2.9.4.
అనుష్టుప్.
ఏవముక్తా తయా దేవ్యా
మంథరా పాపదర్శినీ।
రామార్థముపహింసన్తీ
కైకేయీమిదమబ్రవీత్॥
టీక:-
 ఏవమ్ = ఇట్లు; ఉక్తా = పలుకబడి; తయా = ఆ; దేవ్యా = రాణిచే; మంథరా = మంథర; పాపదర్శినీ = దురాలోచన గల; రామః = రాముని; అర్థమ్ = ప్రయోజనమును; ఉపహింసన్తీ = చెడగొట్టుచున్నదై; కైకేయీమ్ = కైకేయిని గూర్చి; ఇదమ్ = దీనిని; అబ్రవీత్ = పలికెను.
భావం;-
  రాముని రాజ్యలాభము చెడగొట్టు దురాలోచనలు గల మంథర రాణీ కైకేయి మాటలను విని, ఆమెతో ఇట్లు పలికెను.
2.9.5.
అనుష్టుప్.
“హన్తేదానీం ప్రవక్ష్యామి
కైకేయి శ్రూయతాం చ మే।
యథా తే భరతో రాజ్యం
పుత్రః ప్రాప్స్యతి కేవలమ్॥
టీక:-
 హన్త = అయ్యో, సర్వశబ్దసంబోధిని, 1875; ఇదానీం = ఇప్పుడే; ప్రవక్ష్యామి = చెప్పెదను; కైకేయి = కైకేయీ; శ్రూయతాం = వినబడుగాక; మే = నా యొక్క; యథా = ఎట్లు; తే = నీ యొక్క; భరతః = భరతుడు; రాజ్యం = రాజ్యమును; పుత్రః = కుమారుడు; ప్రాప్స్యతి = పొందగలుగునో; కేవలమ్ = కేవలము.
భావం;-
 ”అయ్యో ఇప్పుడే చెప్తాను. కైకేయీ! వినుము. కేవలము నీ కుమారుడైన భరతుడు రాజ్యము నెట్లు పొందగలడో ఆ ఉపాయమును మాత్రము చెప్పెదను.
2.9.6.
అనుష్టుప్.
కిం న స్మరసి కైకేయి
స్మరన్తీ వా నిగూహసే।
యదుచ్యమానమాత్మార్థం
మత్తస్త్వం శ్రోతుమిచ్ఛసి॥
టీక:-
 కిం = ఏమి; న = లేదు; స్మరసి = ఆలోచించుట; కైకేయి = కైకేయీ; స్మరన్తీ = ఆలోచించుచున్నను; వా = లేదా; నిగూహసే = కప్పిపుచ్చుచుంటివా; యత్ = అట్టి; ఉచ్యమానమ్ = చెప్పబడుచున్న; ఆత్మార్థమ్ = స్వప్రయోజనమును; మత్తః = నా నుండి; త్వం = నీవు; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛసి = కోరుచున్నావు.
భావం;-
 కైకేయీ! నీ స్వలాభాపేక్ష కొరకైన ఉపాయమును నా నుండి వినగోరుచుంటివి కదా. అది మరచితివా? మరచినట్లుగా అభినయించుచుంటివా, ఏమి?
2.9.7.
అనుష్టుప్.
మయోచ్యమానం యది తే
శ్రోతుం ఛన్దో విలాసిని।
శ్రూయతామభిధాస్యామి
శ్రుత్వా చాపి విమృశ్యతామ్”॥
టీక:-
 మయా = నా చే; ఉచ్యమానం = చెప్పబడుచుండగ; యది = ఒకవేళ; తే = నీకు; ఛన్దః = కోరిక; విలాసిని = విలాసవంతురాలా; శ్రూయతామ్ = వినబడుగాక; అభిధాస్యామి = తెలిపెదను; శ్రుత్వా = విని; చ; అపి = కూడ; విమృశ్యతామ్ = విమర్శచేయబడుగాక.
భావం;-
 కైకేయీ! అటువంటి ఉపాయము నా నుండి వినవలెననియే నీ కోరిక అయినచో తెలిపెదను. వినుము. వినిన పిమ్మట ఆలోచించుము.”
2.9.8.
అనుష్టుప్.
శ్రుత్వైవం వచనం తస్యా
మంథరాయాస్తు కైకయీ।
కించిదుత్థాయ శయనాత్
స్వాస్తీర్ణాదిదమబ్రవీత్॥
టీక:-
 శ్రుత్వైవ = వినినంతనే; వచనం = మాటను; తస్యాః = ఆమెయొక్క; మంథరా = మంథర; అస్తు = ఉండిన; కైకేయీ = కైకేయి; కించిత్ = కొంచెము; ఉత్థాయ = లేచి; శయనాత్ = శయనము (మంచము, పానుపు) నుండి; స్వాస్తీర్ణాత్ = మంచిగా పరచబడిన; ఇదమ్ = దీనిని, ఈవిధముగ; అబ్రవీత్ = పలికెను.
భావం;-
 కైకేయి ఆ మంథర మాటలను వినినంతనే చక్కని పక్క పరచబడిన మాన్పుపై నుండి కొంచెము పైకి లేచి ఇట్లనెను.
2.9.9.
అనుష్టుప్.
“కథయ త్వం మమోపాయం
కేనోపాయేన మంథరే।
భరతః ప్రాప్నుయాద్రాజ్యం
న తు రామః కథంచన”॥
టీక:-
 కథయ = చెప్పుము; త్వం = నీవు; మమ = నాకు; ఉపాయం = ఉపాయమును; కేన = ఏ; ఉపాయేన = ఉపాయముచే; మంథరే = మంథరా; భరతః = భరతుడు; ప్రాప్నుయాత్ = పొందునో; రాజ్యం = రాజ్యమును; న తు = లేడో; రామః = రాముడు; కథంచన = ఏ విధముగ;
భావం;-
 ”మంథరా! ఏ ఉపాయముచే భరతుడు రాజ్యమును పొందగలడో, రాముడు పొందలేడో, అద్దానిని తెలియజేయుము.
2.9.10.
అనుష్టుప్.
ఏవముక్తా తయా దేవ్యా
మంథరా పాపదర్శినీ।
రామార్థముపహింసన్తీ
కుబ్జా వచనమబ్రవీత్॥
టీక:-
 ఏవమ్ = ఇట్లు; ఉక్తా = పలుకబడిన; తయా = ఆ; దేవ్యా = రాణిచే; మంథరా = మంథర; పాపదర్శినీ = కుటిల బుద్ధిగల; రామార్థమ్ = రాముని ప్రయోజనమును; ఉపహింసన్తీ = చెడగొట్టుచున్నదై; కుబ్జ = మఱుగుజ్జుది; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావం;-
 కైకేయి అట్లు అడుగగా, కుటిలబుద్ధిగల మఱుగుజ్జు మంథర, రాముని ప్రయోజనమును చెడగొట్టుటకు ఇట్లు చెప్పెను.
2.9.11.
అనుష్టుప్.
“తవ దైవాసురే యుద్ధే
సహ రాజర్షిభిః పతిః।
అగచ్ఛత్త్వాముపాదాయ
దేవరాజస్య సాహ్యకృత్॥
టీక:-
 తవ = నీ యొక్క; దైవాసురే = దేవతలకు అసురులకు జరిగిన; యుద్ధే = యుద్ధమునందు; సహ = కలసి; రాజర్షిభిః = రాజర్షులతో; పతిః = భర్త; అగచ్ఛత్ = వెళ్ళెను; త్వామ్ = నిన్ను; ఉపాదాయ = తీసికొని; దేవరాజస్య = దేవేంద్రునకు; సాహ్యకృత్ = సహాయము చేయుటకై.
భావం;-
 ”కైకేయీ! నీ భర్త దశరథుడు, పూర్వము దేవాసుర సంగ్రామమునందు, దేవేంద్రునకు సహాయము చేయుటకై, రాజర్షులతో వెళ్ళుచు నిన్ను కూడ తీసుకొని వెళ్ళెను.
2.9.12.
అనుష్టుప్.
దిశమాస్థాయ వై దేవి
దక్షిణాం దణ్డకాన్ప్రతి।
వైజయన్తమితి ఖ్యాతం
పురం యత్ర తిమిధ్వజః॥
టీక:-
 దిశమ్ = దిక్కును; ఆస్థాయ వై = పొంది; దేవి = రాణీ; దక్షిణాం = దక్షిణమును; దణ్డకాన్ప్రతి = దండకారణ్యమును గూర్చి; వైజయన్తమ్ ఇతి = వైజయంతం అను పేర; ఖ్యాతం = ప్రసిద్ధి చెందిన; పురం = పురమును గూర్చి; యత్ర = ఎక్కడ; తిమిధ్వజః = తిమిధ్వజుడు.
భావం;-
 దక్షిణదిశ యందు దండకారణ్య సమీపమున, ఎక్కడ తిమిధ్వజుడను అసురుడు నివసించుచుండెనో ఆ వైజయంతమను పేరు గల పట్టణమునకు వెళ్ళెను.
2.9.13.
అనుష్టుప్.
స శమ్బర ఇతి ఖ్యాతః
శతమాయో మహాసురః।
దదౌ శక్రస్య సంగ్రామం
దేవసంఘైరనిర్జితః॥
టీక:-
 స = ఆ; శమ్బరః = శంబరుడు; ఇతి = అని; ఖ్యాతః = ప్రసిద్ధి చెందిన; శతమాయః = అనేక మాయలు గల; మహాసురః = గొప్ప అసురుడు; దదౌ = ఇచ్చెను; శక్రస్య = దేవేంద్రునకు; సంగ్రామం = యుద్ధమును; దేవసంఘై = దేవగణములచే; అనిర్జితః = జయింపబడనివాడై.
భావం;-
 గొప్ప మాయావి యైన శంబరుడను మహాసురుడు దేవేంద్రునితో యుద్ధము చేసి, దేవగణములను నిర్జించెను.
2.9.14.
అనుష్టుప్.
తస్మిన్మహతి సంగ్రామే
పురుషాన్క్షతవిక్షతాన్।
రాత్రౌ ప్రసుప్తాన్ ఘ్నన్తి స్మ
తరసాఽఽసాద్య రాక్షసాః॥
టీక:-
 తస్మిన్ = ఆ; మహతి = గొప్ప; సంగ్రామే = యుద్ధమునందు; పురుషాన్ = పురుషులను; క్షతః = గాయములతో; విక్షతాన్ = విశేషముగా క్షీణించినవారిని; రాత్రౌ = రాత్రి యందు; ప్రసుప్తాన్ = నిదురించుచున్నవారిని; ఘ్నన్తి స్మ = వధించిరి; తరసా = బలముచే; ఆసాద్య = చేరి; రాక్షసాః = రాక్షసులు.
భావం;-
 రాక్షసులు, ఆ మహాసంగ్రామమునందు, గాయములతో మిక్కిలి నీరసించినవారిని మఱియు రాత్రివేళ నిదురించుచున్న వారిని సంహరించిరి.
2.9.15.
అనుష్టుప్.
తత్రాకరోన్మహద్యుద్ధం
రాజా దశరథస్తదా।
అసురైశ్చ మహాబాహుః
శస్త్రైశ్చ శకలీకృతః॥
టీక:-
 తత్ర = అక్కడ; ఆకరోత్ = చేసెను; మహత్ = గొప్ప; యుద్ధం = యుద్ధమును; రాజా దశరథః = దశరథ మహారాజు; తదా = అప్పుడు; అసురః = అసురులచే; చ; మహాబాహుః = గొప్ప బాహువులు గలవాడు; శస్త్రైః = శస్త్రములచే; చ; శకలీ = ముక్కలుగా; కృతః = చేయబడెను.
భావం;-
 అపుడు, మహాబాహుడైన దశరథమహారాజు యుద్ధము చేయగా, రాక్షసులు ఆయుధములతో అతనిని చితకకొట్టిరి.
2.9.16.
అనుష్టుప్.
అపవాహ్య త్వయా దేవి
సంగ్రామాన్నష్టచేతనః।
తత్రాపి విక్షతశ్శస్త్రైః
పతిస్తే రక్షితస్త్వయా॥
టీక:-
 అపవాహ్య = దూరముగ; త్వయా = నీచే; దేవి = రాణీ; సంగ్రామాత్ = యుద్ధభూమినుండి; నష్ట చేతనః = అచేతనుడై పడియున్న; తత్ర = అక్కడ; అపి = కూడ; విక్షతః = కొట్టబడిన; శస్త్రైః = ఆయుధములచే; పతిః = భర్త; తే = నీయొక్క; రక్షితః = రక్షింపబడెను; త్వయా = నీచే.
భావం;-
 కైకేయీ! స్పృహ కోల్పోయి పడియున్న నీ భర్తను నీవు దూరముగా తీసుకొని పోయితివి. రాక్షసులు అక్కడకు కూడ వచ్చి అతనిని గాయపరచగా, నీవే అతనిని మరల కాపాడితివి.
2.9.17.
అనుష్టుప్.
తుష్టేన తేన దత్తౌ తే
ద్వౌ వరౌ శుభదర్శనే।
స త్వయోక్తః పతిర్దేవి
యదేచ్ఛేయం తదా వరౌ॥
టీక:-
 తుష్టేన = సంతోషించిన; తే న = అతనిచే; దత్తౌ = ఇవ్వబడినవి; తే = నీకు; ద్వౌ = రెండు; వరౌ = వరములు; శుభదర్శనే = శుభప్రదమైన దర్శనముగలదానా; స = ఆ; త్వయ = నీచే; ఉక్తః = పలుకబడినది; పతిః = భర్త; దేవి = రాణీ; యదా = ఎప్పుడు; ఇచ్ఛేయం = కోరెదనో; తదా = అప్పుడు; వరౌ = వరములను.
భావం;-
 శుభప్రదమైన దర్శనము గల ఓ కైకేయీ! అప్పుడు సంతోషించిన నీ భర్త నిన్ను రెండు వరములు కోరుకొనమనగా, నీవు నీకు ఇష్టము వచ్చినపుడు కోరుకొందునని చెప్పితివి.
2.9.18.
అనుష్టుప్.
గృహ్ణీయామితి తత్తేన
తథేత్యుక్తం మహాత్మనా।
అనభిజ్ఞామ్హ్యహం దేవి
త్వయైవ కథితా పురా॥
టీక:-
 గృహ్ణీయామ్ = తీసుకొనెదను; ఇతి = అని; తత్ = ఆ; తే న = అతనిచే; తథా = అట్లే; ఇతి = అని; ఉక్తం = చెప్పబడినది; మహాత్మనా = మహాత్మునిచేత; అనభిజ్ఞామ్ హి = తెలియనిదానను కదా; అహం = నేను; దేవి = దేవీ; త్వయైవ = నీ చేతనే; కథితా = తెలుపబడిన; పురా = పూర్వము.
భావం;-
 ఓ దేవీ! అక్కడ ఏమి జరిగినదో నేనెరుగను కదా. ఇది అంతయు పూర్వము నీవే నాకు తెలియజేసితివి.
2.9.19.
అనుష్టుప్.
కథైషా తవ తు స్నేహాత్
మనసా ధార్యతే మయా।
రామాభిషేకసమ్భారాన్
నిగృహ్య వినివర్తయ॥
టీక:-
 కథా = కథ; ఏషా = ఈ; తవ = నీ తోడ; తు; స్నేహాత్ = స్నేహమువలన; మనసా = మనసునందు; ధార్యతే = ధరింపబడుచున్నది; మయా = నా చే; రామాభిషేక = రామునియొక్క అభిషేకపు; సమ్భారాన్ = సంభారములను; నిగృహ్య = బలవంతముగ; వినివర్తయ = నిలుపజేయుము.
భావం;-
 నీతో నాకు ఉన్న స్నేహమువలన, ఆ విషయమును నేను నా మనసులో జ్ఞాపకముగా ఉంచుకొంటిని. పట్టుపట్టి రాముని అభిషేకపు సంబరములను నిలిపివేయుము.
2.9.20.
అనుష్టుప్.
తౌ వరౌ యాచ భర్తారం
భరతస్యాభిషేచనమ్।
ప్రవ్రాజనం చ రామస్య
త్వం వర్షాణి చతుర్దశ॥
టీక:-
 తౌ = ఆ; వరౌ = రెండువరములను; యాచ = అడుగుము; భర్తారం = భర్తను; భరతస్య = భరతుని యొక్క; అభిషేచనమ్ = అభిషేకమును; ప్రవ్రాజనం = సుదూరప్రాంతమునకు పంపివేయుటను; తు; రామస్య = రాముని యొక్క; త్వం = నీవు; వర్షాణి = సంవత్సరములు; చతుర్దశ = పదునాలుగు.
భావం;-
 నీవు భరతునికి యౌవరాజ్యపట్టాభిషేకమును, రాముని పదునాలుగు సంవత్సరముల కాలము సుదూరప్రాంతమునకు పంపివేయుటయును అను రెండు వరములు నీ భర్తను అడుగుము.
2.9.21.
అనుష్టుప్.
చతుర్దశ హి వర్షాణి
రామే ప్రవ్రాజితే వనమ్।
ప్రజాభావగతస్నేహః
స్థిరః పుత్రో భవిష్యతి॥
టీక:-
 చతుర్దశ హి వర్షాణి = పదునాలుగు సంవత్సరములు; రామే = రాముడు; ప్రవ్రాజితే = పంపివేయబడగ; వనమ్ = వనమునుగూర్చి; ప్రజాభావగత = ప్రజల మనోభావములందు పొందబడిన; స్నేహః = స్నేహము గలవాడై; స్థిరః = స్థిరముగ; పుత్రః = పుత్రుడు; భవిష్యతి = ఉండును.
భావం;-
 కైకేయీ! రాముని పదునాలుగు సంవత్సరములు వనమునకు పంపివేసినచో, నీ పుత్రుడు భరతుడు ప్రజల మనస్సులలో స్నేహము స్థిరముగ నుండును.
2.9.22.
అనుష్టుప్.
క్రోధాగారం ప్రవిశ్యాఽద్య
క్రుద్ధేవాశ్వపతేస్సుతే।
శేష్వాఽనన్తర్హితాయాం త్వం
భూమౌ మలినవాసినీ॥
టీక:-
 క్రోధాగారం = కోపగృహమును; ప్రవిశ్య = ప్రవేశించి; అద్య = ఇపుడు; కృద్ధేవ = కోపగించినదానివలె; అశ్వపతేః = అశ్వపతి యొక్క; సుతే = పుత్రికవైన కైకేయీ; శేష్వ = పరుండుము; అనన్తర్హితాయాం = (వస్త్రములు మొదలైనవి) కప్పబడని; త్వం = నీవు; భూమౌ = భూమిపైన; మలినవాసినీ = మలినవస్త్రములు కట్టుకొనినదానవు.
భావం;-
 కైకేయీ! నీవు ఇపుడు కోపగించినదానివలె కోపగృహములోనికి ప్రవేశించి, మాసిన వలువలు ధరించి, కటిక నేలపై పరుండుము.
2.9.23.
అనుష్టుప్.
మాస్మైనం ప్రత్యుదీక్షేథా
మా చైనమభిభాషథాః।
రుదన్తీ చాపి తం దృష్ట్వా
జగత్యాం శోకలాలసా॥
టీక:-
 మా స్మ = ఉండకుము; ఏనమ్ = ఈతనిని; ప్రత్యుత్ = ఎదురుగా పోయి; ఈక్షేథాః = చూచుట; మా చ = చేయకుము; ఏనమ్ = ఇతనిని; అభిభాషథాః = ఎదురేగి మాటలాడుట; రుదన్తీ = ఏడ్చుచు; అపి = కూడ; తం = అతనిని; దృష్ట్వా = చూచి; జగత్యాం = జగతిలో; శోకలాలస = దుఃఖితురాలుగ.
భావం;-
 ఎదురేగి దశరథుని చూడకుము. అతనికి ఎదురుగా పోయి మాటలాడకుము. అతనిని చూడగనే ఏడ్చుచు దుఃఖితురాలవై యుండుము.
2.9.24.
అనుష్టుప్.
దయితా త్వం సదా భర్తుః
అత్ర మే నాస్తి సంశయః।
త్వత్కృతే స మహారాజో
విశేదపి హుతాశనమ్॥
టీక:-
 దయితా = ప్రియమైనదానవు; త్వం = నీవు; సదా = ఎల్లప్పుడు; భర్తుః = భర్తకు; అత్ర = ఈ విషయమై; మే = నాకు; నాస్తి = లేదు; సంశయః = అనుమానము; త్వత్కృతే = నీ కొరకై; సః = ఆ; మహారాజః = మహారాజు; విశేత్ = ప్రవేశించును; అపి = కూడ; హుతాశనమ్ = అగ్నిని.
భావం;-
 నీవు సదా నీ భర్తకు ప్రియమైనదానవే. నాకు ఈ విషయమున సందేహము లేదు. దశరథమహారాజు నీ కొరకు అగ్నియందు కూడ దూకగలడు.
2.9.25.
అనుష్టుప్.
న త్వాం క్రోధయితుం శక్తో
న కృద్ధాం ప్రత్యుదీక్షితుమ్।
తవ ప్రియార్థం రాజా హి
ప్రాణానపి పరిత్యజేత్॥
టీక:-
 న = చేయడు; త్వాం = నిన్ను; క్రోధయితుం = కోపింపజేయుటకు; న = కాడు; శక్తః = శక్తకలవాడు; కృద్ధాం = కోపించియున్న నిన్ను; ప్రత్యుత్ = ఎదురుగ; ఈక్షితుమ్ = చూచుట; తవ = నీ యొక్క; ప్రియార్థమ్ = ప్రేమ కొరకై; రాజా హి = రాజు కదా; ప్రాణః = ప్రాణము; అపి = కూడ; పరిత్యజేత్ = విడచును.
భావం;-
 దశరథుడు కోపించియున్న నిన్ను చూడలేడు. నిన్ను కోపింపజేయ లేడు. నీ ప్రేమకొరకై ప్రాణత్యాగము కూడ చేయును.
2.9.26.
అనుష్టుప్.
న హ్యతిక్రమితుం శక్తః
తవ వాక్యం మహీపతిః।
మందస్వభావే బుధ్యస్వ
సౌభాగ్యబలమాత్మనః॥
టీక:-
 న అతిక్రమితుం శక్తః = అతిక్రమింపజాలడు; తవ = నీ యొక్క; వాక్యం = మాటను; మహీపతిః = రాజు; మందస్వభావే = మందస్వభావము గలదానా; బుధ్యస్వ = తెలిసికొనుము; సౌభాగ్యబలమ్ = సౌభాగ్యబలమును; ఆత్మనః = నీ యొక్క.
భావం;-
 దశరథమహారాజు నీ మాట జవదాటజాలడు. ఓ మందబుద్ధీ! నీ వెంతటి సౌభాగ్యవంతురాలవో తెలిసికొనుము.
2.9.27.
అనుష్టుప్.
మణిముక్తం సువర్ణాని
రత్నాని వివిధాని చ।
దద్యాద్దశరథో రాజా
మాస్మ తేషు మనః కృథాః॥
టీక:-
 మణి = మణులు; ముక్తం = ముత్యములు; సువర్ణాని = బంగారమును; రత్నాని = రత్నములను; వివిధాని = వివిధములైన; చ; దద్యాత్ = ఇవ్వవచ్చును; దశరథః = దశరథుడు; రాజా = రాజు; మా స్మ = లేకుండగ; తేషు = వాటియందు; మనః = మనస్సు; కృథాః = ఉండుట.
భావం;-
 దశరథమహారాజు నీకు మణులను, ముత్యములను, బంగారమును, అనేకమైన రత్నములను ఇవ్వవచ్చునేమొ. నీవు మాత్రము వాటిపై మనసు పెట్టకుము.
2.9.28.
అనుష్టుప్.
యౌ తౌ దైవాసురే యుద్ధే
వరౌ దశరథోఽదదాత్।
తౌ స్మారయ మహాభాగే
సోఽర్థో న త్వామతిక్రమేత్॥
టీక:-
 యౌ = ఏ; తౌ = ఆ; దైవాసురే = దేవాసురుల; యుద్ధే = యుద్ధమునందు; వరౌ = వరములను; దశరథః = దశరథుడు; అదదాత్ = ఇచ్చెనో; తౌ = వాటిని; స్మారయ = గుర్తుచేయుము; మహాభాగే = గొప్ప భాగ్యవంతురాలా; సః = ఆ; అర్థః = ప్రయోజనము; న = వద్దు; త్వామ్ = నిన్ను; అతిక్రమేత్ = దాటవేయుట.
భావం;-
 ఓ భాగ్యవంతురాలా! దశరథుడు ప్రశస్తమైన దేవాసుర సంగ్రామమునందు నీ కొసగిన వరములను గుర్తు చేయుము. నీ ప్రయోజనమును దాటిపోనీయకుము.
2.9.29.
అనుష్టుప్.
యదాతు తే వరం దద్యాత్
స్వయముత్థాప్య రాఘవః।
వ్యవస్థాప్య మహారాజం
త్వమిమం వృణుయా వరమ్॥
టీక:-
 యదా తు = ఎప్పుడు; తే = నీకు; వరం = వరమును; దద్యాత్ = ఇచ్చునో; స్వయమ్ = స్వయముగనే; ఉత్థాప్య = లేవనెత్తి; రాఘవః = రఘువంశజుడైన దశరథుడు; వ్యవస్థాప్య = కూర్చుండబెట్టి; మహారాజం = మహారాజును; తమ్ = ఆ; ఇమం = ఈ; వృణుయాః = కోరుము; వరమ్ = వరమును.
భావం;-
 దశరథుడు ఎప్పుడు స్వయముగ నిన్ను నేలపైనుండి లేవనెత్తి వరము కోరుకొమ్మనునో, అప్పుడు అతనిని కూర్చుండబెట్టి, ఈ వరములను కోరుము.
2.9.30.
అనుష్టుప్.
రామం ప్రవ్రాజయారణ్యే
నవ వర్షాణి పఞ్చ చ।
భరతః క్రియతాం రాజా
పృథివ్యాః పార్థివర్షభః॥
టీక:-
 రామం = రాముని; ప్రవ్రాజయ = ప్రవాసముండు నట్లు జేయుము; అరణ్యే = అరణ్యమునందు; నవ వర్షాణి పఞ్చ చ = (9+5 = 14) పదునాలుగు సంవత్సరములు; భరతః = భరతుడు; క్రియతాం = చేయబడుగాక; రాజా = రాజు; పృథివ్యాః = భూమికి; పార్థివర్షభః = మహారాజా.
భావం;-
 "మహారాజా! రాముడు పదునాలుగు సంవత్సరముల కాలము అరణ్యమునందు నివసించుటకు పంపుము, భరతుని రాజుగ చేయుము."
2.9.31.
అనుష్టుప్.
చతుర్దశ హి వర్షాణి
రామే ప్రవ్రాజితే వనమ్।
రూఢశ్చ కృతమూలశ్చ
శేషం స్థాస్యతి తే సుతః॥
టీక:-
 చతుర్దశ హి వర్షాణి = పదునాలుగు సంవత్సరములు; రామే = రాముడు; ప్రవ్రాజితే = పంపివేయబడగ; వనమ్ = వనమును గూర్చి; రూఢః చ = స్థిరపడి; కృత మూలః చ = వ్రేళ్ళూనుకొని; శేషం = మిగిలిన కాలము; స్థాస్యతి = ఉండును; తే = నీ యొక్క; సుతః = కుమారుడు.
భావం;-
 రాముని పదునాలుగు సంవత్సరములపాటు అడవికి పంపివేసినచో, నీ కుమారుడు రాజ్యమునందు వ్రేళ్ళూనుకొని మిగిలిన కాలము కూడ స్థిరముగ నుండగలడు.
2.9.32.
అనుష్టుప్.
రామప్రవ్రాజనం చైవ
దేవి యాచస్వ తం వరమ్।
ఏవం సిద్ధ్యన్తి పుత్రస్య
సర్వార్థాస్తవ భామిని॥
టీక:-
 రామ = రాముని; ప్రవ్రాజనం చ ఏవ = ప్రవాసమును కూడ; దేవి = దేవీ; యాచస్వ = కోరుము; తం = అతనిని; వరమ్ = వరము; ఏవం = ఇట్లు; సిద్ధ్యన్తి = సిద్ధించును; పుత్రస్య = కుమారునియొక్క; సర్వార్థా = ప్రయోజనములన్నియు; తవ = నీ యొక్క; భామిని = భామా కైకేయీ.
భావం;-
 కైకేయీ! రాముని అరణ్యమునకు పంపుట కూడ వరముగా కోరుకొనుము. ఈ విధముగ నీ కుమారుని ప్రయోజనములన్నియు సిద్ధించును.
2.9.33.
అనుష్టుప్.
ఏవం ప్రవ్రాజితశ్చైవ
రామోఽరామో భవిష్యతి।
భరతశ్చ హతామిత్రః
తవ రాజా భవిష్యతి॥
టీక:-
 ఏవం = ఈ విధముగ; ప్రవ్రాజితః చ ఏవ = ఇట్లు ప్రవాసితుడైన; రామః = రాముడు; అరామః = రాముడు ( ప్రీతిపాత్రుడు) కాని వానిగ ; భవిష్యతి = అగును; భరతః చ = భరతుడు కూడ; హత అమిత్రః చ = శత్రునిర్మూలనమైన వాడు; తవ = నీ యొక్క; రాజా = రాజుగను; భవిష్యతి = అగును.
భావం;-
 ఈ విధముగ, రాముని అరణ్యమునకు పంపివేసినచో, భరతుడు శత్రువులు లేని వాడగును. రాముడు, తనకు గల ప్రజలను రంజింపజేయు గుణమును కోల్పోయి రాముడు కాకుండ పోవును.
2.9.34.
అనుష్టుప్.
యేన కాలేన రామశ్చ
వనాత్ప్రత్యాగమిష్యతి।
తేన కాలేన పుత్రస్తే
కృతమూలో భవిష్యతి॥
టీక:-
 యేన కాలేన = ఏ కాలముచే; రామః = రాముడు; వనాత్ = వనమునుండి; ప్రత్యాగమిష్యతి = తిరిగి వచ్చునో; తేన కాలేన = ఆ సమయముచేత; పుత్రః = పుత్రుడు; తే = నీ యొక్క; కృతమూలః = స్థిరపడినవాడు, వ్రేళ్ళూనుకొనినవాడు; భవిష్యతి = కాగలడు.
భావం;-
 రాముడు వనవాసము నుండి తిరిగి వచ్చు వేళకు, నీ కుమారూడు రాజ్యమునందు వ్రేళ్ళూనుకొని స్థిరపడగలడు.
2.9.35.
అనుష్టుప్.
సుగృహీతమనుష్యశ్చ
సుహృద్భిస్సార్ధమాత్మవాన్।
ప్రాప్తకాలం ను మన్యేఽహమ్
రాజానం వీతసాధ్వసా!॥
టీక:-
 సుగృహీత = వశపరచుకొనబడిన; మనుష్యః = జనులు; చ = మఱియు; సుహృద్భిః = స్నేహితులను; సార్థమ్ = వర్తకులు; ఆత్మవాన్ = బుద్ధిమంతుడు; ప్రాప్తకాలం ను = కలిసివచ్చినచో; మన్యే = తలచుచున్నాను; అహమ్ = నేను; రాజానం = రాజును; వీతసాధ్వసా = వీడిన భయము కలదాన.
భావం;-
 భయరహితవు కదా కైకా! బుద్ధిశాలి యైన, భరతుడు ప్రజల, స్నేహితుల మఱియు వర్తకుల ప్రేమను చూరగొని వశపరచుకొనగలడు రాజునకు అవసాన కాలము దాపురించినది అని తలచుచున్నాను. నీవు భయమును వీడి యుండుము.
2.9.36.
అనుష్టుప్.
రామాభిషేకసంకల్పాత్
నిగృహ్య వినివర్తయ।
అనర్థమర్థరూపేణ
గ్రాహితా సా తతస్తయా॥
టీక:-
 రామాభిషేక సంకల్పాత్ = రామునికి అభిషేకము చేయవలెనను సంకల్పమునుండి; నిగృహ్య = దృఢముగ; వినివర్తయ = మరల్పుము; అనర్థమ్ = అనర్థమును; అర్థరూపేణ = ప్రయోజనకరముగ; గ్రాహితా = గ్రహింపచేయబడిన; సా = ఆ; తతః = తరువాత; తయా = ఆమెచే.
భావం;-
 రామునికి పట్టాభిషేకము చేయవలెనను దశరథుని సంకల్పమును దృఢముగా మరల్చుము.” మంథర పలికిన అనర్థకరమైన మాటలు కైకేయికి ప్రయోజనకరముగ తోచినవి.
2.9.37.
అనుష్టుప్.
హృష్టా ప్రతీతా కైకేయీ
మంథరామిదమబ్రవీత్।
సా హి వాక్యేన కుబ్జాయాః
కిశోరీవోత్పథం గతా॥
టీక:-
 హృష్టా = సంతోషించినదై; ప్రతీతా = తెలిసికొన్నదై; కైకేయీ = కైకేయి; మంథరామ్ = మంథరనుగూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను; సా హి = ఆ; వాక్యేన = వాక్యముచే; కుబ్జాయాః = గూనిదానియొక్క; కిశోరీ = చిన్నబాలిక; ఇవ = వలె; ఉత్పథం = తప్పుదారిని; గతా = పొందినది.
భావం;-
 కైకేయి చిన్నపిల్ల వలె గూనిదైన మంథర మాటలకు సంతోషించి, చెడుదారిలో పడెను.
2.9.38.
అనుష్టుప్.
కైకేయీ విస్మయం ప్రాప్తా
పరం పరమదర్శనా।
కుబ్జే త్వాం నాభిజానామి
శ్రేష్ఠాం శ్రేష్ఠాభిధాయినీమ్॥
టీక:-
 కైకేయీ = కైకేయి; విస్మయం = ఆశ్చర్యమును; ప్రాప్తా = పొంది; పరం = చాల; పరమదర్శనా = సదాలోచన చేయు; కుబ్జే = గూనిదానవైన; త్వాం = నిన్ను; న అభిజానామి = గుర్తించకపోతిని; శ్రేష్ఠాం = గొప్పదానిగ; శ్రేష్ఠాభిదాయినీమ్ = మంచిమాటలు చెప్పుచున్న.
భావం;-
 కైకేయి పరమాశ్చర్యము నొంది, మంథరతో "గూనిదానవైన ఓ మంథరా! మంచి ఆలోచనలు చేయుచున్న నిన్ను శ్రేష్ఠురాలిగ, చక్కని పలుకులు పలికెడిదానిగ గుర్తించజాలకపోయితిని" అనెను.
2.9.39.
అనుష్టుప్.
పృథివ్యామసి కుబ్జానామ్
ఉత్తమా బుద్ధినిశ్చయే।
త్వమేవ తు మమాఽర్థేషు
నిత్యయుక్తా హితైషిణీ॥
టీక:-
 పృథివ్యామ్ = భూమిపై; అసి = అయి ఉన్నావు; కుబ్జానామ్ = మఱుగుజ్జులలో; ఉత్తమా = ఉత్తమమైనదానివి; బుద్ధినిశ్చయే = బుద్ధి నిర్ణయమునందు; త్వమ్ = నీవు; ఏవ తు = మాత్రమే; మమ = నా యొక్క; అర్థేషు = కార్యములందు; నిత్య = ఎల్లప్పుడును; యుక్తా = ఆసక్తి కలిగి; హితైషిణీ = మేలు కోరుదానవు.
భావం;-
 మంథరా! భూమిపై నున్న కుబ్జులలో నీవు ఉత్తమమైనదానవు. నీవు మాత్రమే నా కార్యములందు ఆసక్తి కలిగి నాకు హితమును చేకూర్చుదానవు.
2.9.40.
అనుష్టుప్.
నాహం సమవబుధ్యేయం
కుబ్జే రాజ్ఞశ్చికీర్షితమ్।
సన్తి దుస్సంస్థితాః కుబ్జా
వక్రాః పరమదారుణాః॥
టీక:-
 న = కాను; అహం = నేను; సమవబుద్ధ్యేయం = ఎరిగి యుండుట; కుబ్జే = మఱుగుజ్జులు; రాజ్ఞః = రాజు యొక్క; చికీర్షితమ్ = సంకల్పమును; సన్తి = ఉన్నారు; దుః సంస్థితాః = అవయవలోపము కలవారు; కుబ్జా = గూనివారు; వక్రాః = వంకరగ నుండువారు; పరమదారుణాః = చాల భయంకరమైన వారు.
భావం;-
 మంథరా! నేను దశరథమహారాజు యొక్క సంకల్పము తెలిసికొనలేకపోయెడిదానను. ఎందరో కుబ్జులున్నారు. వారు వంకరగను భయంకరముగను ఉందురు.
2.9.41.
అనుష్టుప్.
త్వం పద్మమివ వాతేన
సన్నతా ప్రియదర్శనా।
ఉరస్తేఽభినివిష్టం వై
యావత్స్కన్ధాత్ సమున్నతం॥
టీక:-
 త్వం = నీవు; పద్మ = తామరపువ్వు; ఇవ = వలె; వాతేన = గాలితాకిడికి; సన్నతా = వంగిన; ప్రియదర్శనా = అందముగా కనిపించుచున్నావు; ఉరః = వక్షస్థలము; తే = నీ యొక్క; అభినివిష్టం వై = బిగిసినదై; యావత్ స్కన్ధాత్ = మూపు వరకు; సమున్నతం = ఎత్తుగనున్నది.
భావం;-
 నీవు గాలితాకిడికి వంగిన పద్మము వలె నున్నావు. బిగుతుగా వున్న నీ వక్షస్థలము మూపు వరకు ఎత్తుగ నున్నది.
2.9.42.
అనుష్టుప్.
అధస్తాచ్చోదరం శాతం
సునాభమివ లజ్జితమ్।
పరిపూర్ణం తు జఘనం
సుపీనౌ చ పయోధరౌ॥
టీక:-
 అధస్తాత్ = దానిక్రిందనున్న; ఉదరం = పొట్ట; శాతం = సన్నముగ; సునాభమ్ = మంచిగా నున్న బొడ్డు; ఇవ = వలె; లజ్జితమ్ = సిగ్గుబడుచున్నట్లు; పరిపూర్ణం తు = నిండుగా ఉన్నది; జఘనం = పిరుదులు; సుపీనౌ చ = నిండుగ ఉన్నవి.; పయోధరౌ = స్తనములు.
భావం;-
 మంచి నాభి గల నీ పొట్ట, నీ వక్షస్థలమునకున్న బిగువును చూసి, తానట్లు లేకుండుట వలన సిగ్గుపడుతున్నంత సన్నగా నున్నది. పిరుదులు ఎత్తుగను, స్తనములు నిండుగను ఉన్నవి.
2.9.43.
అనుష్టుప్.
విమలేందుసమం వక్త్రమ్
అహోరాజసి మంథరే।
జఘనం తవ నిర్ఘుష్టం
రశనాదామశోభితమ్॥
టీక:-
 విమల = నిర్మలమైన; ఇందు = చంద్రునితో; సమం = సమానమైన; వక్త్రమ్ = ముఖము; అహో = ఆహా; రాజసి = ప్రకాశించుచున్నావు; మంథరే = మంథరా; జఘనం = మొల; తవ = నీ యొక్క; నిర్ఘుష్టం = ధ్వని చేయుచున్నది; రశనా = వడ్డాణముచే; ఆదామ = కూడి; శోభితమ్ = మెరయుచున్న.
భావం;-
 మంథరా! మచ్చలేని చంద్రునితో సమానమైన ముఖముతో ప్రకాశించుచున్నావు. వడ్డాణముతో మెరయుచున్న నీ నడుము సవ్వడి చేయుచున్నది.
2.9.44.
అనుష్టుప్.
జఙ్ఘే భృశముపన్యస్తే
పాదౌ చాప్యాయతావుభౌ।
త్వమాయతాభ్యాం సక్థిభ్యాం
మంథరే క్షౌమవాసినీ॥
టీక:-
 జఙ్ఘే = పిక్కలు; భృశమ్ = చాల; ఉపన్యస్తే = తీరుగ నున్నవి; పాదౌ చ = పాదములు; అపి = కూడ; ఆయతా = పొడవుగా నున్నవి; ఉభౌ = రెండును; త్వమ్ = నీవు; ఆయతాభ్యాం = పొడవైన; సక్తిభ్యాం = తొడలతో; మంథరే = మంథరా; క్షౌమవాసినీ = పట్టువస్త్రములు ధరించిన దానవై.
భావం;-
 మంథరా! నీ పిక్కలు తీరుగ నున్నవి. పాదములు రెండును పొడవుగ నున్నవి. పొడవైన రెండు ఊరువులు కలిగి, పట్టు వస్త్రములు ధరించి యున్నావు.
2.9.45.
అనుష్టుప్.
అగ్రతో మమ గచ్ఛన్తీ
రాజహంసీవ రాజసే।
ఆసన్యాశ్శమ్బరే మాయాః
సహస్రమసురాధిపే॥
టీక:-
 అగ్రతః = ఎదురుగ; మమ = నా; గచ్ఛన్తీ = నడచుచు; రాజహంస = రాజహంస; ఇవ = వలె; రాజసే = ప్రకాశించుచున్నావు; ఆసన్యాః = ఏవైతే ఉండెడివో; శమ్బరే = శంబరుని యందు; మాయాః = మాయలు; సహస్రమ్ = వేయి; అసురాధిపే = అసురులకు రాజైన.
భావం;-
 మంథరా! నీవు నా ఎదురుగా రాజహంస వలె ప్రకాశించుచు నడచుచున్నావు. అసురరాజైన శంబరాజరాసురునిలో ఉన్న వేయి మాయలు నీలో ఉన్నవి.
2.9.46.
అనుష్టుప్.
సర్వాస్త్వయి నివిష్టాస్తా
భూయశ్చాన్యాస్సహస్రశః।
తవేదం స్థగు యద్దీర్ఘం
రథఘోణమివాయతమ్॥
టీక:-
 సర్వాః = అన్నియు; త్వయి = నీ యందు; నివిష్టాః = ఉన్నవి; తాః = ఆ; భూయః చ = ఇంకను; అన్యాః = మఱియు వేరైన; సహస్రశః = వేలకొలది; తవ = నీ యొక్క; ఇదం = ఈ; స్థగు = జిత్తులమారి; యత్ = ఏదైతే; దీర్ఘం = దీర్ఘమైన; రథఘోణమ్ = రథము యొక్క ముందు భాగము; ఇవ = వలె; ఆయతమ్ = పొడవైన.
భావం;-
 మంథరా! నీలో ఇంకను ఇతరమైన వేలకొలది మాయలు ఉన్నవి. నీ జిత్తులమారితనము రథముయొక్క ముందరి భాగము వలె పొడవుగా నున్నది.
2.9.47.
అనుష్టుప్.
మతయః క్షత్రవిద్యాశ్చ
మాయాశ్చాత్ర వసన్తి తే।
అత్ర తే ప్రతిమోక్ష్యామి
మాలాం కుబ్జే హిరణ్మయీమ్॥
టీక:-
 మతయః = ఆలోచనలు; క్షత్రవిద్యాః చ = క్షాత్రవిద్యలు; మాయాః చ = మాయలు; అత్ర = అందులో; వసన్తి = ఉన్నవి; తే = నీ యొక్క; అత్ర = అక్కడ; తే = నీ యొక్క; ప్రతిమోక్ష్యామి = తొడిగెదను; మాలామ్ = మాలను; కుబ్జే = కుబ్జా; హిరణ్మయీమ్ = బంగారపు.
భావం;-
 కుబ్జ నీలో ఆలోచనలు, క్షాత్రవిద్యలు, మాయలు ఉన్నవి. నీకు బంగారపు మాలను తొడిగెదను.
2.9.48.
అనుష్టుప్.
అభిషిక్తే చ భరతే
రాఘవే చ వనం గతే।
జాత్యేన చ సువర్ణేన
సునిష్టప్తేన మంథరే॥
టీక:-
 అభిషిక్తే చ = అభిషేకము అగుచుండగా; భరతే = భరతునకు; రాఘవే చ = రాముడును; వనం = వనమును గూర్చి; గతే = వెళ్ళుచుండగా; జాత్యేన చ = మంచి జాతికి చెందిన; సువర్ణేన = బంగారముచే; సువిష్టప్తేన = బాగుగ పుటము వేయబడిన; మంథరే = మంథరా.
భావం;-
 మంథరా! రాముడు వనవాసమునకు బయలుదేరిన పిమ్మట, భరతునికి పట్టాభిషేకము అగుచుండగా, నేను నీ గూనికి మేలిమి బంగారపు తొడుగు వేసెదను.
2.9.49.
అనుష్టుప్.
లబ్ధార్థా చ ప్రతీతా చ
లేపయిష్యామి తే స్థగు।
ముఖే చ తిలకం చిత్రం
జాతరూపమయం శుభమ్॥
టీక:-
 లబ్దార్థా = కోరినది పొందినదాననై; చ = మఱియు; ప్రతీతా = సంతోషించినదాననై; చ = మఱియు; లేపయిష్యామి = పూత పెట్టించెదను; తే = నీ; స్థగు = గూనికి; ముఖే = ముఖమునకు; చ = మఱియు; తిలకం = తిలకమును; చిత్రం = విచిత్రమైన; జాతరూపమయం = బంగారుమయమైన; శుభమ్ = శుభప్రదమైన.
భావం;-
 నేను కోరుతున్నది లభించాక, సంతోషించిన దాననైన, నీ గూనికి బంగారపుపూత వేయించెదను. నీ నొసటన చిత్రవిచిత్రమైన బంగారపు తిలకమును దిద్దించెదను.
2.9.50.
అనుష్టుప్.
కారయిష్యామి తే కుబ్జే
శుభాన్యాభరణాని చ।
పరిధాయ శుభే వస్త్రే
దేవతేవ చరిష్యసి॥
టీక:-
 కారయిష్యామి = చేయించెదను; తే = నీ యొక్క; కుబ్జే = కుబ్జా; శుభాని = శుభప్రదమైన; ఆభరణాని చ = నగలను; పరిధాయ = ధరించి; శుభే = అందమైన; వస్త్రే = వస్త్రములను; దేవత = దేవత; ఇవ = వలె; చరిష్యసి = తిరుగాడగలవు.
భావం;-
 మంథరా! నేను నీకు శుభప్రదమైన ఆభరణములను చేయించెదను. నీవు శుభకరమైన అందమైన వస్త్రములను ధరించి దేవతాస్త్రీ వలె తిరుగాడగలవు.
2.9.51.
అనుష్టుప్.
చంద్రమాహ్వయమానేన
ముఖేనాప్రతిమాననా।
గమిష్యసి గతిం ముఖ్యాం
గర్వయన్తీ ద్విషజ్జనమ్॥
టీక:-
 చంద్రమ్ = చంద్రుని; ఆహ్వయమానేన = పోటీకి పిలుచుచున్న; ముఖేన = ముఖముతో; అప్రతిమ్ = సాటిలేని; ఆననా = ముఖము గలదానా; గమిష్యసి = పొందగలవు; గతిం = స్థితిని; ముఖ్యాం = ఉన్నతమైన; గర్వయన్తీ = గర్వితురాలవై; ద్విషజ్జమ్ = శత్రువుల మధ్యన.
భావం;-
 చంద్రునితో పోటీపడెడు సాటిలేని అందమైన ముఖము గలదానా, నీవు గర్వముతో శత్రువుల మధ్య ఉన్నతమైన స్థితిని పొందెదవు.
2.9.52.
అనుష్టుప్.
తవాపి కుబ్జాః కుబ్జాయాః
సర్వాభరణభూషితాః।
పాదౌ పరిచరిష్యన్తి
యథైవ త్వం సదా మమ”॥
టీక:-
 తవ = నీ యొక్క; అపి = కూడ; కుబ్జాః = ఇతర గూనివారు; కుబ్జాయాః = కుబ్జవైన; సర్వాభరణభూషితాః = సకలాభరణములచే అలంకరింపబడిన; పాదౌ = పాదముల; పరిచరిష్యన్తి = సేవ చేయుదురు; యథ = ఏ విధముగ; ఇవ = వలె; త్వం = నీవు; సదా = ఎల్లప్పుడు; మమ = నాకు.
భావం;-
 మంథరా! నీవు నాకు ఎల్లప్పుడును ఏ విధముగా సేవ చేయుచుంటివో, అట్లే, సర్వాభరణభూషితులైన గూనిపరిచారికలు నీకు పాదసేవ చేసెదరు.”
2.9.53.
అనుష్టుప్.
ఇతి ప్రశస్యమానా సా
కైకేయీమిదమబ్రవీత్।
శయానాం శయనే శుభ్రే
వేద్యామగ్నిశిఖామివ॥
టీక:-
 ఇతి = ఇట్లు; ప్రశస్యమానా = ప్రశంసింపబడుచున్న; సా = ఆమె; కైకేయీమ్ = కైకేయిని గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను;శయానాం = పండుకొనియున్న; శయనే = మంచమునందు; శుభ్రే = శుభ్రమైన; వేద్యామ్ = వేదిలోనున్న; అగ్నిశిఖామ్ = అగ్నిశిఖ; ఇవ = వలె.
భావం;-
 ఈ విధముగా ప్రశంసింపబడుచున్న మంథర, శుభ్రమైన శయ్యపై పరుండియున్న కైకేయితో ఇట్లు పలికెను.
2.9.54.
అనుష్టుప్.
“గతోదకే సేతుబన్ధో
న కల్యాణి విధీయతే।
ఉత్తిష్ఠ కురు కల్యాణం
రాజానమనుదర్శయ”॥
టీక:-
 గత = పోయిన; ఉదకే = నీటికి; సేతుబన్ధనః = గట్టు కట్టుట; న = లేదు; కల్యాణి = మంగళప్రదయైన; విధీయతే = చేయబడుట; ఉత్తిష్ఠ = లెమ్ము; కురు = చేయుము; కల్యాణం = శుభకార్యమును; రాజానమ్ = రాజునకు; అనుదర్శయ = చూపింపుము.
భావం;-
 “మంగళప్రదవైన కైకేయీ! గతజలసేతుబంధనము తగదు. లెమ్ము. ప్రయోజనకరమైన కార్యమును చేయుటకకు సమకట్టి దశరథునకు చూపుము.”
2.9.55.
అనుష్టుప్.
తథా ప్రోత్సాహితా దేవీ
గత్వా మంథరయా సహ।
క్రోధాగారం విశాలాక్షీ
సౌభాగ్యమదగర్వితా॥
టీక:-
 తథా = ఆ విధముగ; ప్రోత్సాహితా = ప్రోత్సహింపబడినదై; దేవీ = రాణి; గత్వా = పొంది; మంథరయా = మంథరతో; సహ = కలసి; క్రోధాగారం = కోపగృహమును; విశాలాక్షీ = విశాలమైన కన్నులు గలది; సౌభాగ్యమదగర్వితా = అందము వలన గర్వించినది.
భావం;-
 విశాలమైన కన్నులు గల, సౌందర్యమదముచే గర్వించిన కైకేయి, మంథర మాటలచే ప్రోత్సహింపబడినదై, మంథరతో కూడి కోపగృహములోనికి ప్రవేశించినది.
2.9.56.
అనుష్టుప్.
అనేకశతసాహస్రమ్
ముక్తాహారం వరాంగనా।
అవముచ్య వరార్హాణి
శుభాన్యాభరణాని చ॥
టీక:-
 అనేకశతసహస్రమ్ = అనేక లక్షల విలువ గల; ముక్తాహారం = ముత్యాలహారమును; వరాంగనా = గొప్ప అంగ సౌష్టవముగల అందమైన స్త్రీ; అవముచ్య = తొలగించి; వరార్హాణి = చాల విలువైన; శుభాని = శుభప్రదమైన; ఆభరణాని చ = ఆభరణములను.
భావం;-
 గొప్ప అందగత్తె ఐన కైకేయి, అనేక లక్షల విలువైన ముత్యాలహారమును, శుభప్రదమైన ఆభరణములను తీసివేసెను.
2.9.57.
అనుష్టుప్.
తతో హేమోపమా తత్ర
కుబ్జావాక్యవశం గతా।
సంవిశ్య భూమౌ కైకేయీ
మంథరామిదమబ్రవీత్॥
టీక:-
 తతః = తరువాత; హేమ = బంగారము; ఉపమా = సమానమైన; తత్ర = అక్కడ; కుబ్జావాక్య = కుబ్జ యొక్క మాటలకు; వశంగతా = వశురాలై; సంవిశ్య = శయనించి; భూమౌ = నేలపై; కైకేయీ = కైకేయి; మంథరామ్ = మంథరను గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావం;-
 తరువాత, బంగారమువలె నున్న కైకేయి మంథర మాటకు వశురాలై, నేలపై పడుకొని మంథరతో ఇట్లు పలికెను.
2.9.58.
అనుష్టుప్.
“ఇహ వా మాం మృతాం కుబ్జే
నృపాయావేదయిష్యసి।
వనం తు రాఘవే ప్రాప్తే
భరతః ప్రాప్స్యతి క్షితిమ్॥
టీక:-
 ఇహ = ఇక్కడ; వా = లేనిచో; మాం = నన్ను; మృతాం = చనిపోయినదానిగ; కుబ్జే = కుబ్జా; నృపాయ = రాజుకొరకు; ఆవేదయిష్యసి = చెప్పగలవు; వనం తు = అడవికి; రాఘవే = రాముడు; ప్రాప్తే = పొందుచుండగా; భరతః = భరతుడు; ప్రాప్యతి = పొందగలడు; క్షితిమ్ = భూమిని.
భావం;-
 “రాముడు అడవికి వెళ్ళిన పిదప, భరతునకు రాజ్యము సంక్రమించవలెను. లేనిచో నీవు నేనిక్కడ మరణించి నట్లుగా, దశరథమహారాజునకు తెలియజేయుము.
2.9.59.
అనుష్టుప్.
న సువర్ణేన మే హ్యర్థో
న రత్నైర్న చ భూషణైః।
ఏష మే జీవితస్యాన్తో
రామో యద్యభిషిచ్యతే”॥
టీక:-
 న = లేదు; సువర్ణేన = బంగారముతో; మే = నాకు; అర్థః = లాభము; న = లేదు; రత్నైః = రత్నములచేత; న = లేదు; చ = కూడా; భూషణైః = ఆభరణములచే; ఏషః = ఇదియే; మే = నా యొక్క; జీవితస్య = జీవితము యొక్క; అన్తః = అంతము; రామః = రాముడు; యది = ఒకచో; అభిషిచ్యతే = అభిషేకింపబడినట్లైనచో.
భావం;-
 నాకు బంగారముతోను, రత్నములతోను, ఆభరణములతోను పనిలేదు. రాముడు అభిషేకింపబడినట్లైనచో అదియే నా జీవితమునకు తుది.”
2.9.60.
జగతి.
అథో పునస్తాం మహిషీం మహీక్షితో
వచోభిరత్యర్థమహాపరాక్రమైః।
ఉవాచ కుబ్జా భరతస్య మాతరం
హితం వచో రామముపేత్య చాహితమ్॥
టీక:-
 అథః = ఆ తరువాత; పునః = మరల; తాం = ఆ; మహిషీం = పట్టపురాణియైన; మహీక్షితః = రాజుయొక్క; వచోభిః = మాటలతో కూడిన; అత్యర్థ = మిక్కిలి; మహా = అధికమైన; పరాక్రమైః = పరాక్రమమైన (తీవ్రమైన); ఉవాచ = పలికెను; కుబ్జా = కుబ్జ; భరతస్య = భరతుని యొక్క; మాతరం = తల్లిని గూర్చి; హితం = హితమైన; వచః = మాటను; రామమ్ = రామునకు; ఉపేత్య = సంబంధించిన; చ; అహితమ్ = హితముకానిదైన.
భావం;-
 తరువాత మంథర, అత్యంత తీవ్రముగ మాటలాడుచున్న కైకేయికి హితకరమైనదియు, రామునికి హితము కానిదియు నైన మాటను పలికెను.
2.9.61.
జగతి.
“ప్రపత్స్యతే రాజ్యమిదం హి రాఘవో
యది ధ్రువం త్వం ససుతా చ తప్స్యసే।
అతో హి కల్యాణి! యతస్వ తత్తథా
యథా సుతస్తే భరతోఽభిషేక్ష్యతే”॥
టీక:-
 ప్రపత్స్యతే = పొందినచో; రాజ్యమ్ = రాజ్యమును; ఇదం = ఈ; రాఘవః = రాముడు; యది = ఒక వేళ; ధ్రువం = నిశ్చయము; త్వం = నీవు; ససుతా = కూమారునితో సహా; తప్స్యసే = పరితపించెదవు; అతః = అందువలన; కల్యాణి = మంగళస్వరూపురాలా; యతస్వ = యత్నించుము; తత్ = ఆ విషయము; తథా = ఆ విధముగ; యథా = ఎట్లు; సుతః = కుమారుడు; తే = నీ యొక్క; భరతః = భరతుడు; అభిషేక్ష్యతే = అభిషిక్తుడగునో.
భావం;-
 ఓ కైకేయీ! రాముడు ఒకవేళ ఈ రాజ్యమును పొందినచో, నీవు నీ కుమారునితో సహా పరితపించెదవు. అందువలన భరతుడు అభిషిక్తుడగు విధముగ ప్రయత్నింపుము.
2.9.62.
జగతి.
తథాఽతివిద్ధా మహిషీ తు కుబ్జయా
సమాహతా వాగిషుభిర్ముహుర్ముహుః।
నిధాయహస్తౌ హృదయేఽతివిస్మితా
శశంస కుబ్జాం కుపితా పునః పునః॥
టీక:-
 తథా = అట్లు; అతివిద్ధా = చాల పరితపించిన; మహిషీ = రాణి; కుబ్జయా = కుబ్జచే; సమాహతా = కొట్టబడినది; వాగిషుభిః = వాక్కులనెడి బాణములతో; ముహుర్ముహుః = మాటిమాటికిని; నిధాయ = ఉంచి; హస్తౌ = చేతులను; హృదయే = గుండెలపై; అతివిస్మితా = చాల ఆశ్చర్యపడినదై; శశంస = ప్రశంసించెను;కుబ్జాం = కుబ్జను; కుపితా = కోపించినదై; పునః పునః = మరల మరల.
భావం;-
 మంథర అట్లు మాటిమాటికి మాటల బాణములతో కైకేయిని బాధింపగా, దుఃఖితురాలైన కైకేయి థశరథునిపై కోపించి, గుండెలపై చేతులు వేసుకొని, ఆ కుబ్జ మాటలకు ఆశ్చర్యమునొంది, ఆమెను చాల ప్రశంసించెను.
2.9.63.
జగతి.
“యమస్య వా మాం విషయం గతామితో
నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి।
వనం గతే వా సుచిరాయ రాఘవే
సమృద్ధకామో భరతో భవిష్యతి॥
టీక:-
 యమస్య = యముని యొక్క; వా = లేక; మాం = నన్ను; విషయం = దేశమును; గతామ్ = వెళ్ళినదానిగా; ఇతః = ఇక్కడనుండి; నిశామ్య = చూచి; కుబ్జే = కుబ్జా; ప్రతివేదయిష్యసి = తెలిపెదవు; వనం = వనమునుగూర్చి; గతే = వెళ్ళినవాడగుచుండగ; వా = లేక; సుచిరాయ = చాలా కాలము; రాఘవే = రాముడు; సమృద్ధకామః = కోరిక నెరవేరినవాడై; భరతః = భరతుడు; భవిష్యతి = కాగలడు.
భావం;-
 మంథరా! నేను యమలోకమునకు పోయినను పోవలెను లేదా రాముడు అడవిలో దీర్ఘకాలముండుటకు వెళ్ళిన పిమ్మట భరతుడు మనోభీష్టము నెరవేరినవాడై ఉండవలెను. అంతే. ఈ విషయమును దశరథునికి తెలియజేయుము.
2.9.64.
జగతి.
అహం హి నైవాస్తరణాని న స్రజో
న చందనం నాంజనపానభోజనమ్।
న కించిదిచ్ఛామి న చేహ జీవితం
న చేదితో గచ్ఛతి రాఘవో వనమ్॥
టీక:-
 అహం = నేను; న = లేదు; ఆస్తరణాని = ఆసన శయనములు; న = లేదు; స్రజః = హారములు; చందనం = గంధము; అంజనః = కాటుకను; పానః = పానీయములు; భోజనమ్ = భోజనములు; న = లేదు; కించిత్ = కొంచెము కూడ; ఇచ్ఛామి = కోరుదును; న = లేదు; చ = కూ-; ఇహ = ఇక్కడ; జీవితం = జీవితమును; న = లేనిచో; చేదితః = విడిచిపెట్టి; గచ్ఛతి = వెళ్ళట; రాఘవః = రాముడు; వనమ్ = వనమును గూర్చి.
భావం;-
 రాముడు రాజ్యము విడిచుపెట్టి అరణ్యమునకు వెళ్ళనిచో, నాకు ఆసన శయనములతోను, హారములతోను, గంధముతోను, కాటుకతోను పానీయ భోజనములతోను, జీవితముతోను పని లేదు.
2.9.65.
జగతి.
అథైతదుక్త్వా వచనం సుదారుణం
నిధాయ సర్వాభరణాని భామినీ।
అసంవృతామాస్తరణేన మేదినీం
తదాఽధిశిశ్యే పతితేవ కిన్నరీ॥
టీక:-
 అథ = తరువాత; ఏతత్ = ఈ; ఉక్త్వా = పలికి; వచనం = మాటను; సుదారుణం = దారుణమైన; నిధాయ = తీసి వేసి; సర్వ = అన్ని; ఆభరణాని = ఆభరణములను; భామిని = స్త్రీ; అసంవృతామ్ = కప్పబడని; ఆస్తరేణ = పడకలచే; మేదినీం = నేలను; తదా = అప్పుడు; ఆధిశిశ్యే = అధిష్టించి పరుండెను; ఇవ = వలె; కిన్నరీ = కిన్నెర స్త్రీ.
భావం;-
 కైకేయి ఈ విధముగ దారుణమైన మాటలను పలికి, కటికనేలపై, సకల ఆభరణములు తీసివైచి, క్రింద పడిపోయిన కిన్నరస్త్రీ వలె అలవిమాలిన కోరికతో పండుకొనెను.
గమనిక:-
 1. భామిని- కోపస్వభావము గల స్త్రీ.,2. ఆభరణ- నగ, భూషణము, 3. కిన్నర- అశ్వముఖము నరదేహము కల దేవవర్గు.
2.9.66.
జగతి.
ఉదీర్ణసంరంభతమోవృతాననా
తదాఽవముక్తోత్తమమాల్యభూషణా।
నరేంద్రపత్నీ విమనా బభూవ సా
తమోవృతా ద్యౌరివ మగ్నతారకా॥
టీక:-
 ఉదీర్ణ = అధికమైన; సంరంభతమః = అధికకోపమము, కోపమను చీకటి; ఆవృత = కప్పబడిన; ఆనన = ముఖము కలది; తదా = అప్పుడు; అవముక్తః = తీసివేయబడిన; ఉత్తమ = శ్రేష్ఠమైన; మాల్యభూషణా = పూలమాలలు; భూషణా = ఆభరణములుకలది; నరేంద్రపత్నీ = రాజుయొక్క భార్య, రాణీ; విమనాః = మనో వికారముకలదై; బభూవ = ఉండెను; సా = ఆమె; తమోవృతా = కప్పబడిన చీకటిలో; ద్యౌః = ఆకాశము; ఇవ = వలె; మగ్న = మునిగిన (అగుపించని); తారకా = నక్షత్రములు కలది.
భావం;-
 అత్యధికమైన కోపమనెడి చీకటి, ముఖమును కప్పివేయగా, అలంకారములన్నిటిని తీసివేసి, విమనస్కురాలై ఉన్న కైకేయి, చీకటి ఆవరించి నక్షత్రములు కనబడని ఆకాశము వలె నుండెను.
2.9.67.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
అయోధ్యకాణ్డే నవమ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; నవమ [9] = తొమ్మిదవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమైన వాల్మీకి విరచిత తెలుగు వారి రామాయణములోని అయోధ్యా కాండలోని తొమ్మిదవ (9వ) సర్గ సంపూర్ణము.
2.10.1.
అనుష్టుప్.
విదర్శితా యదా దేవీ
కుబ్జయా పాపయా భృశమ్।
తదా శేతే స్మ సా భూమౌ
దిగ్ధవిద్ధేవ కిన్నరీ॥
టీక:-
 విదర్శితా = విపరీత బోధ చేయబడి; యదా = ఎప్పుడు; దేవీ = దేవి!; కుబ్జయా = కుబ్జచేత; పాపయా = పాపాత్మురాలు అయిన; భృశమ్ = మిక్కిలి; తదా = అప్పుడు; శేతే = శయనించి ఉండెను; స్మ = పాదపూరణం; సా = ఆమె; భూమౌ = భూమిపై; దిగ్ధవి = విషముపూసిన బాణముతో; విద్ధా = కొట్టబడిన; ఏవ = వలె; కిన్నరీ = కిన్నెర.
భావం;-
 పరమపాపాత్మురాలు అయిన మంథర విపరీతబోధనలచేత ప్రభావితమయిన ఆ కైకేయి, విషముపూసిన బాణముతో కొట్టబడిన కిన్నెరవలె నేలపై పడియుండెను.
2.10.2.
అనుష్టుప్.
నిశ్చిత్య మనసా కృత్యం
సా సమ్యగితి భామినీ।
మంథరాయై శనైస్సర్వం
ఆచచక్షే విచక్షణా॥
టీక:-
 నిశ్చిత్య = నిశ్చయించుకుని; మనసా = మనస్సుచేత; కృత్యం = కర్తవ్యమును; సా = ఆమె; సమ్యక్ = సమగ్రముగా; ఇతి = ఈవిధముగ; భామినీ = స్త్రీ; మంథరాయై = మంథరకు; శనైః = నెమ్మదిగా; సర్వం = మొత్తము; ఆచచక్షే = చెప్పెను; విచక్షణా = విచక్షణ కలిగిన.
భావం;-
 మిక్కిలి విచక్షణ కలిగిన ఆ కైకేయి తన చేయదలచిన కార్యమును మనస్సునందు నిలుపుకుని, దానిని సమగ్రముగా మంథరకు నెమ్మదిగా చెప్పెను.
2.10.3.
అనుష్టుప్.
సా దీనా నిశ్చయం కృత్వా
మంథరావాక్యమోహితా।
నాగకన్యేవ నిఃశ్వస్య
దీర్ఘముష్ణం చ భామినీ॥
టీక:-
 సా = ఆమె; దీనా = దీనురాలు; నిశ్చయం = నిశ్చయము; కృత్వా = చేసుకుని; మంథరాః = మంథర యొక్క; వాక్యః = మాటలకు; మోహితా = ప్రభావితమైన; నాగకన్యేవ = నాగకన్యవలె; నిఃశ్వస్య = ఊపిరి విడుచుచు; దీర్ఘమ్ = దీర్ఘమయిన; ఉష్ణం = వేడియైన; చ = మఱియు; భామినీ = స్త్రీ.
భావం;-
 మంథర మాటలచేత ప్రభావితమైన కైకేయి నిశ్చయం చేసుకొని దీనురాలుగా ఆయెను. నాగకన్యవలె దీర్ఘముగా వేడిగా ఊపిరి విడుచుచుండెను.
2.10.4.
అనుష్టుప్.
ముహూర్తం చింతయామాస
మార్గమాత్మసుఖావహమ్।
సా సుహృచ్చార్థకామా చ
తం నిశమ్య సునిశ్చయమ్॥
టీక:-
 ముహూర్తం = ఒక ముహూర్తకాలము; చింతయామాస = ఆలోచించెను; మార్గమ్ = మార్గము; ఆత్మ = తనకు; సుఖావహమ్ = సుఖముకలిగించునది; సా = ఆమె; సుహృత్ = ఆత్మీయురాలు; చ = మఱియు; అర్థకామా = కార్యసిద్ధి కోరుచున్న; చ = మఱియు; తం = ఆ; నిశమ్య = విని; సునిశ్చయమ్ = దృఢమైన నిశ్చయమును.
భావం;-
 తాను తలచినది జరుగుటకు ఏది మేలయిన మార్గమో ఆలోచించసాగెను. కైకేయికి ఆత్మీయురాలు, ఆమెకార్యము నెరవేరాలనే ఆశ కలది అయిన మంథర కైకేయి తీసుకున్న నిర్ణయమును వినినంతనే నిశ్చయించుకొనెను.
2.10.5.
అనుష్టుప్.
బభూవ పరమప్రీతా
సిధ్దిం ప్రాప్యేవ మంథరా।
అథ సా రుషితా దేవీ
సమ్యక్కృత్వా వినిశ్చయమ్॥
టీక:-
 బభూవ = అయ్యెను; పరమప్రీతా = మిక్కిలి ప్రీతిపొందినది; సిద్ధిం = కార్యసిద్ధి; ప్రాప్యేవ = పొందినట్లు; మంథరా = మంథర; అథ = తరువాత; సా = ఆమె; రుషితా = కోపముతో; దేవీ = దేవి అయిన; సమ్యక్ = పూర్తిగా; కృత్వా = చేసి; వినిశ్చయమ్ = బలముగా నిశ్చయము చేసుకుని.
భావం;-
 తాను తలచినది జరిగితీరుతుంది అని మంథర పరమ సంతోషమును పొందెను. కోపముతో ఆ కైకేయిదేవి ఆవిధముగా దృఢనిశ్చయము చేసుకున్న తరువాత
2.10.6.
అనుష్టుప్.
సంవివేశాబలా భూమౌ
నివేశ్య భృకుటీం ముఖే।
తతశ్చిత్రాణి మాల్యాని
దివ్యాన్యాభరణాని చ॥
టీక:-
 సంవివేశ = శయనించెను; అబలా = స్త్రీ; భూమౌ = భూమిపై; నివేశ్య = ఉంచి; భ్రుకుటీం = కనుబొమ్మల విఱుపు; ముఖే = ముఖమునందు; తతః = అటుపిమ్మట; చిత్రాణి = చిత్రమైన; మాల్యాని = మాలలు; దివ్యాని = దివ్యమైన; ఆభరణాని = ఆభరణములు; చ = మఱియు.
భావం;-
 కైకేయి కనుబొమ్మలు ముడిచి నేలపై పరుండెను. ఆటుపిమ్మట, కోపముతో చిత్రమైన తన మాలలు, దివ్యమైన ఆభరణములు తీసి.
2.10.7.
అనుష్టుప్.
అపవిద్ధాని కైకేయ్యా
తాని భూమిం ప్రపేదిరే।
తయా తాన్యపవిద్ధాని
మాల్యాన్యాభరణాని చ॥
టీక:-
 అపవిద్ధాని = విసిరివేయబడినవై; కైకేయ్యా = కైకేయిచేత; తాని = ఆ; భూమిం = భూమిని; ప్రపేదిరే = పొందినవి; తయా = ఆమెచేత; తాని = ఆ; అపవిద్ధాని = విసిరివేయబడిన; మాల్యాని = మాలలు; ఆభరణాని = ఆభరణములు; చ = మఱియు.
భావం;-
 మహారాణీ కైక విసిరికొట్టెను. అలా విసిరినవన్నీ అక్కడ నేలపై పడెను. అలా ఆమె నేలపైకి విసిరిన మాలలు, ఆభరణములు.
2.10.8.
అనుష్టుప్.
అశోభయంత వసుధాం
నక్షత్రాణి యథా నభః।
క్రోధాగారే నిపతితా
సా బభౌ మలినామ్బరా॥
టీక:-
 అశోభయంత = శోభిల్లజేసెను; వసుధాం = భూమిని; నక్షత్రాణి = తారలచే; యథా = ఆవిధముగా; నభః = ఆకాశము; క్రోధాగారే = కోపగృహమునందు; నిపతితా = పడియున్న; సా = ఆమె; బభౌ = ప్రకాశించెను.; మలిన = మలిన; అమ్బరా = దుస్తులను.
భావం;-
 ఆ మాలలు ఆభరణాలు నక్షత్రములతో కూడిన ఆకాశమువలె శోభిల్లుచుండెను. ఆ కైకేయి మలినదుస్తులను ధరించి, కోపగృహములో పడియుండెను.
2.10.9.
అనుష్టుప్.
ఏకవేణీం దృఢం బద్వా
గతసత్త్వేవ కిన్నరీ।
ఆజ్ఞాప్య చ మహారాజో
రాఘవస్యాభిషేచనమ్॥
టీక:-
 ఏకవేణీం = ఒంటి జడను; దృఢం = దృఢముగా; బద్వా = బంధించి; గతృ = పోయిన; సత్త్వా = ప్రాణములు కలదాని; ఇవ = వలె; కిన్నరీ = కిన్నెర స్త్రీ; ఆజ్ఞాప్య = ఆజ్ఞాపించి; చ = మఱియు; మహారాజః = మహారాజు; రాఘవస్య = రాఘవుని యొక్క; అభిషేచనమ్ = అభిషేకమును.
భావం;-
 అప్పుడు, కేశములను ఒంటిజడగా బిగించివేసుకుని అచేతన స్థితిలోనున్న కిన్నెరస్త్రీ వలె మహారాణి కైక ఉండెను. దశరథమహారాజు శ్రీరామచంద్రుని పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్లను పురమాయించెను.
2.10.10.
అనుష్టుప్.
ఉపస్థానమనుజ్ఞాప్య
ప్రవివేశ నివేశనమ్।
అద్య రామాభిషేకో వై
ప్రసిద్ధ ఇతి జజ్ఞివాన్॥
టీక:-
 ఉపస్థానమ్ = సన్నిహితులను; అనుజ్ఞాప్య = అనుజ్ఞ ఇచ్చునట్లు చేసుకుని; ప్రవివేశ = ప్రవేశించెను; నివేశనమ్ = గృహమును; అద్య = ఇప్పుడు; రామాభిషేకః = శ్రీరామచంద్రుని పట్టాభిషేకము; వై; ప్రసిద్ధ = ప్రసిద్ధి పొందినది; ఇతి = అని; జజ్ఞివాన్ = గ్రహించినవాడై.
భావం;-
 సన్నిహితిలైన సచివులకు, పురోహతులకు కార్యక్రమము సక్రమముగా జరిగేవిధముగా ఆజ్ఞలు చేసిన తరువాత తన గృహములోనికి ప్రవేశించెను. దశరథమహారాజు శ్రీరామపట్టాభిషేకము గురించి అందఱికి తెలియుచున్నది అని నిశ్చయించుకొనెను.
2.10.11.
అనుష్టుప్.
ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం
వివేశాంతఃపురం వశీ।
స కైకేయ్యా గృహం శ్రేష్ఠం
ప్రవివేశ మహాయశాః॥
టీక:-
 ప్రియాః = ప్రియురాళ్ళు, భార్యలు; అర్హాం = తగిన; ప్రియమ్ = ప్రియమైన వార్తను; ఆఖ్యాతుం = చెప్పుటకు; వివేశ = లోనికివెళ్ళెను; అంతఃపురం = అంతఃపురము; వశీ = కార్యము సానుకూలపరచు కున్నవాడు; సః = అతడు; కైకేయ్యాః గృహం = కైకేయి యొక్క గృహమును; శ్రేష్ఠం = శ్రేష్ఠమైన; ప్రవివేశ = ప్రవేశించెను; మహాయశాః = గొప్పయశస్సు కలిగిన.
భావం;-
 పనులన్నీ సానుకూలంచేసుకుని వచ్చిన ఆ దశరథడు తన భార్యలకు విషయము తెలుపుటకు అంతఃపురములోనికి ప్రవేశించెను. అందు, శ్రేష్టమైన కైకేయిదేవి భవనములోనికి ఆ యశస్వి ప్రవేశించెను.
2.10.12.
అనుష్టుప్.
పాణ్డురాభ్రమివాకాశం
రాహుయుక్తం నిశాకరః।
శుకబర్హిణసంఘుష్టం
క్రౌంచహంసరుతాయుతమ్॥
టీక:-
 పాణ్డుర = స్వచ్ఛమైన తెల్లని; అభ్రమ్ = తెల్లని మేఘములు కల; ఇవ = వలె; ఆకాశం = ఆకాశము; రాహు = రాహువుతో; యుక్తం = కూడిన; నిశాకరః = చంద్రుడు; శుక = చిలుకలు; బర్హిణ = నెమళ్ళు; సంఘుష్టం = సంఘములతో కూడినది; క్రౌంచ = క్రౌంచపక్షులు; హంస = హంసల; రుతాయుతమ్ = ధ్వనులతో కూడినది.
భావం;-
 స్వచ్ఛమైన తెల్లని మేఘములు కలిగి రాహుయుక్తమై యున్న ఆకాశములో చంద్రుడు ప్రవేశించినట్లు కైకేయి అంతఃపురములోనికి ప్రవేశించెను. ఆ భవనంలో చిలుకలు, నెమళ్ళు, క్రౌంచపక్షులు మఱియు హంసల కిలకిలారావము కలిగి యుండెను.
2.10.13.
అనుష్టుప్.
వాదిత్రరవసంఘుష్టం
కుబ్జా వామనికాయుతమ్।
లతాగృహైశ్చిత్రగృహైః
చమ్పకాశోకశోభితైః॥
టీక:-
 వాదిత్ర = వాద్యముల; రవ = రవములతో; సంఘుష్టం = కూడినది; కుబ్జా = కుబ్జరూపులైన; వామ = ఉత్తమస్త్రీల; నికాయుతమ్ = సమూహముతో కూడినది; లతాగృహైః = పొదరిళ్శతో, వావిళ్ళ నిఘంటువు, 1949; చిత్రగృహైః = చిత్రిత గృహములతో; చమ్పక = చంపకవృక్షములతో; అశోక = అశోకవృక్షములతో; శోభితైః = శోభించుచున్నది॥
భావం;-
 ఇంకను ఆమె అంతఃపురము, వాద్యములధ్వనులతో మారుమ్రోగుచుండెను. అంతట కుబ్జరూపులైన స్త్రీమూర్తులు తిరుగాడుచుండిరి. అనేక పొదరిళ్ళతో, చిత్రములు చిత్రించిన గదులతో నిండియున్నది. చంపక, అశోకవృక్షములతో శోభిల్లుచున్నది.
2.10.14.
అనుష్టుప్.
దాంతరాజతసౌవర్ణ
వేదికాభి స్సమాయుతం।
నిత్యపుష్పఫలైర్వృక్షైః
వాపీభిశ్చోపశోభితమ్॥
టీక:-
 దాంత = దంతములతో; రాజత = వెండి;సౌవర్ణ = బంగారు; వేదికాభిః = వేదికలతో; సమాయుతం = కూడియున్నది; నిత్య = ఎల్లప్పుడు; పుష్పః = పుష్పములతో; ఫలైః = ఫలములతో కూడిన; వృక్షైః = వృక్షములతోను; వాపీభిః = దిగుడుబావులతోను; చ = మఱియు; ఉపశోభితమ్ = శోభిల్లబడినది.
భావం;-
 ఆ అంతఃపురమున ఇంకను, ఏనుగుదంతములు, వెండి, బంగారములతో నిర్మింపబడిన వేదికలు కూడ యున్నవి. మఱియు, పుష్పములతో ఫలములతో నిత్యము కళకళలాడే వివిధ వృక్షములతోను, దిగుడుబావులతోను శోభిల్లుచున్నది.
2.10.15.
అనుష్టుప్.
దాంతరజతసౌవర్ణైః
సంవృతం పరమాసనైః।
వివిధైరన్నపానైశ్చ
భక్ష్యైశ్చ వివిధైరపి॥
టీక:-
 దాంత = దంతములతో;రజత = వెండితో; సౌవర్ణైః = బంగారములతో; సంవృతం = కూడియున్నది; పరమ = గొప్ప; ఆసనైః = ఆసనములతో; వివిధైః = వివిధములైన; అన్నః = ఆహారములతో; పానైః = పానీయములతో; చ = మఱియు; భక్ష్యైః = పిండివంటలోలతో; చ = మఱియు; వివిధైః = వివిధములైన; అపి = కూడ.
భావం;-
 ఆ అంతఃపురములో ఏనుగుదంతములు, వెండి, బంగారములతో చేసిన ఉన్నతాసనములు ఉండెను. ఇంకా, అనేకరకముల ఆహార పదార్థములు, పానీయములు, పిండివంటలు సిద్ధముగానుండెను.
2.10.16.
అనుష్టుప్.
ఉపపన్నం మహార్హైశ్చ
భూషితై స్త్రిదివోపమమ్।
తత్ప్రవిశ్య మహారాజః
స్వమంతఃపుర మ్భుద్ధిమత్॥
టీక:-
 ఉపపన్నం = కూడియున్నది; మహా = గొప్ప; అర్హైః = ఉన్నతులతో; చ = మఱియు; భూషితైః = అలంకారములతో; త్రిదివ = స్వర్గము; ఉపమమ్ = వలె ఉన్న; తత్ = అది; ప్రవిశ్య = ప్రవేశించి; మహారాజః = మహారాజు; స్వమ్ = తన; అంతఃపురమ్ = అంతఃపురమును; ఋద్ధిమత్ = బుద్దిశాలి
భావం;-
 అందముగా అలంకరించుకొన్న మహోన్నత మూర్తులతో కూడిన ఆ ఆంతఃపురము స్వర్గమువలె ఒప్పుచుండెను. అటువంటి అంతఃపురములోనికి బుద్ధిశాలి యైన దశరథుడు ప్రవేశించెను.
2.10.17.
అనుష్టుప్.
న దదర్శ ప్రియాం రాజా
కైకేయీం శయనోత్తమే।
స కామబలసంయుక్తో
రత్యర్థం మనుజాధిపః॥
టీక:-
 న = లేదు; దదర్శ = చూడబడుట; ప్రియాం = ప్రియమైన; రాజా = రాజునకు; కైకేయీం = కైకేయిని; శయనోత్తమే = ఉత్తమ శయనముపై; సః = అతడు; కామబల = బలమైన కోరిక; సంయుక్తః = కలవాడు; రతి = సురతము; అర్థం = నిమిత్తమై; మనుజాధిపః = మనుష్యులకు అధిపతి।
భావం;-
 కాని అచట శయనమందిరములో శ్రేష్టమైన తల్పముపై కైకేయిదేవి మాత్రము కనబడలేదు. కాని, దశరథ మహారాజు బలమైన కోరికతో రతికై వచ్చిఉండెను.
2.10.18.
అనుష్టుప్.
అపశ్యన్ దయితాం భార్యాం
పప్రచ్ఛ విషసాద చ।
న హి తస్య పురా దేవీ
తాం వేలామత్యవర్తత॥
టీక:-
 అపశ్యన్= చూడనివాడై; దయితాం = ప్రియురాలైన; భార్యాం = భార్యను; పప్రచ్ఛ = పిలిచెను; విషసాద = చింతించెను; చ = మఱియు; భావము; న = లేదు; హి = పాదపూరణం; తస్య = వానియొక్క; పురా = ఇంతకుపూర్వము; దేవీ = కైకేయిదేవి; తాం = ఆ; వేలామ్ = వేళయందు; అత్యవర్తత = అతిక్రమించుట.
భావం;-
 దశరథ మహారాజునకు తన ప్రియ భార్య కనబడక పోవుటచే, అతడు "ఓ కైక! నీవెక్కడ" అని పిలిచెను. సమాధానము రాకపోవుటచే చింతాక్రాంతుడయ్యెను. మున్నెన్నడును కైకేయిదేవి ఆసమయమున అచట లేకపోవుటలేదు.
2.10.19.
అనుష్టుప్.
న చ రాజా గృహం శూన్యం
ప్రవివేశ కదాచన।
తతో గృహగతో రాజా
కైకేయీం పర్యపృచ్ఛత॥
టీక:-
 న = లేదు; చ = మఱియు; రాజా = రాజు; గృహం = నివాసము; శూన్యం = ఖాళీగానున్న; ప్రవివేశ = ప్రవేశించుట; కదాచన = ఎప్పుడు; తతః = పిమ్మట; గృహగతః = గృహములోనున్న; రాజా = రాజు; కైకేయీం = కైకేయిగూర్చి; పర్యపృచ్ఛత = అడిగెను.
భావం;-
 దశరథుడు ఎన్నడును ఇంత శూన్యముగానుండగా ఆ మందిరములోనికి ప్రవేశించలేదు. కైకేయిగురించి అచటనున్న ద్వారపాలకులను అడిగెను.
గమనిక:-
  కైకేయి అలకపాన్పు ఎక్కుటచే, ఆ గృహములోని వారందరూ సహజంగా యజమానురాలి చిత్తవృత్తిని అనుసరించి స్తబ్దుగా నిశ్శబ్దముగా నుండుటచే గృహము శూన్యముగా ఉన్న భావన కలిగెను.
2.10.20.
అనుష్టుప్.
యథా పూర్వమవిజ్ఞాయ
స్వార్థలిప్సుమపణ్డితామ్।
ప్రతీహారీ త్వథోవాచ
సంత్రస్తా సుకృతాంజలిః॥
టీక:-
 యథాపూర్వమ్ = ఎప్పటిలాగే; అవిజ్ఞాయ = తెలియని; స్వార్థ= తన పని యందే; లిప్సుమ్ = ఇచ్చగలది; అపణ్డితామ్ = అజ్ఞానురాలు; ప్రతీహారీ = ద్వారపాలకురాలు; తు ;అథ = పిమ్మట; ఉవాచ = నుడివెను; సంత్రస్తా = భయముతో; సుకృతాంజలిః = ఘటించిన అంజలి కలదై।
భావం;-
 అజ్ఞానురాలు తనపనేదో చూసుకునేది ఎప్పటిలాగే తెలియనిది అగు ఆ ద్వారపాలకురాలు భయముతో అంజలి ఘటించి,
2.10.21.
అనుష్టుప్.
దేవ దేవీ భృశం కృద్ధా
క్రోధాగారమభిదృతా।
ప్రతీహార్యా వచశ్శృత్వా
రాజా పరమదుర్మనాః॥
టీక:-
 దేవ = ఓ రాజ!; దేవీ = కైకేయిదేవి; భృశం = మిక్కిలి; కృద్ధా = కోపముతో; క్రోధాగారమ్ = కోపగృహమును; అభిదృతా = వేగముగాచేరెను; ప్రతీహార్యాః = ద్వారపాలకురాలి; వచః = మాటలు; శ్రుత్వా = విని; రాజా = రాజు; పరమ = మిక్కిలి; దుర్మనాః = కలవరపడిన మనస్సు కలవాడై।
భావం;-
 "ప్రభూ! రాణీగారు చాలాకోపముతో అలకమందిరమునకు వడిగా వెళ్ళారు" అని తెలిపెను. ద్వారపాలకురాలి మాటలు విన్న దశరథుని మనస్సు మిక్కిలి కలవరపడెను.
2.10.22.
అనుష్టుప్.
విషసాద పునర్భూయో
లులితవ్యాకులేన్ద్రియః।
తత్ర తాం పతితాం భూమౌ
శయానామతథోచితామ్॥
టీక:-
 విషసాద = దుఃఖించెను; పునః = మఱల; భూయః = మిక్కిలి; లులిత = తడబడుతున్న; వ్యాకుల = వ్యాకులమైన; ఇన్ద్రియః = ఇంద్రియములు కలవాడై; తత్ర = అచట; తాం = ఆమెను; పతితాం = పడియున్న; భూమౌ = నేలపై; శయానామ్ = శయనించిన; అతథోచితామ్ = తగనిస్థితిలో నున్నటువంటి।
భావం;-
 చాలా విషాదమునకు లోనగుటచే ఇంద్రియములన్నియు వ్యాకులము చెంది తడబడసాగెను. అక్కడ అలకమందిరము నందు రాణీస్థాయికి తగనివిధముగా నేలపై పడియున్న కైకేయిని చూచెను.
2.10.23.
అనుష్టుప్.
ప్రతప్త ఇవ దుఃఖేన
సోఽపశ్యజ్జగతీపతిః।
స వృద్ధస్తరుణీం భార్యాం
ప్రాణేభ్యోఽపి గరీయసీమ్॥
టీక:-
 ప్రతప్తః = దహించబడినవాడు; ఇవ = వలె; దుఃఖేన = దుఃఖముచేత; సః = అతడు; అపశ్యత్ = చూచెను; జగతీపతిః = మహారాజు; సః = అతడు; వృద్ధః = వృద్ధుడు; తరుణీం = యువతి అయిన; భార్యాం = భార్యనుగూర్చి; ప్రాణేభ్యః = ప్రాణములకంటెను; అపి = కూడ; గరీయసీమ్ = ఎక్కువ అయినది.
భావం;-
 ఆ వృద్ధమహారాజు తాను ప్రాణములకంటె మిన్నగా ప్రేమించెడి, పడుచుభార్య కైకేయిని, అలా చూచిన దుఃఖముతో పరితపించెను
2.10.24.
అనుష్టుప్.
అపాపః పాపసంకల్పాం
దదర్శ ధరణీతలే।
లతామివ వినిష్కృత్తాం
పతితాం దేవతామివ॥
టీక:-
 అపాపః = పాపములెఱుగనివాడు; పాపసంకల్పాం = పాపకర్మను సంకల్పించుకొనిన ఆమెను; దదర్శ = చూచెను; ధరణీతలే = నేలపైన; లతామ్ = లత; ఇవ = వలె; వినిష్కృత్తాం = త్రుంచివేయబడిన; పతితాం = పడిపోయిన; దేవతామ్ = దేవత; ఇవ = వలె।
భావం;-
 ఏపాపము ఎఱిగని దశరథుడు, నేలమీద పడున్న పాపం చేయలని సంకల్పించుకున్న కైకేయిని చూసెను. అప్పుడు ఆమె త్రుంచివేసిన లతలాగ, పడిపోయిన దేవతలాగ ఉంది.
2.10.25.
అనుష్టుప్.
కిన్నరీమివ నిర్ధూతాం
చ్యుతామప్సరసం యథా।
మాయామివ పరిభ్రష్టాం
హరిణీమివ సంయతామ్॥
మాయామ్ = మాయ; ఇవ = వలె; పరిభ్రష్టాం = జారిపడిన; హరిణీమ్ = ఆడులేడి; ఇవ = వలె; సంయతామ్ = బంధింపబడిన.
భావం;-
 ఇంకా ఆమె క్రిందికి త్రోసివేయబడిన కిన్నరస్త్రీవలెను, స్వర్గమునుండి జారిపడిన అప్సరసవలెను, లక్ష్యము నెఱవేఱని మాయవలెను, వలలో బంధింపబడిన లేడివలె ఉండెను.
2.10.26.
అనుష్టుప్.
కరేణుమివ దిగ్ధేన
విద్ధాం మృగయునా వనే।
మహాగజ ఇవారణ్యే
స్నేహాత్పరిమమర్శ తామ్॥
టీక:-
 కరేణుమ్ = ఆడఏనుగు; ఇవ = వలె; దిగ్ధేన = విషపూరిత బాణముచేత; విద్ధాం = కొట్టబడిన; మృగయునా = వేటకాడిచే; వనే = వనమునందు; మహాగజ = గొప్ప ఏనుగు; ఇవ = వలె; అరణ్యే = వనమునందు; స్నేహాత్ = స్నేహభావమువలన; పరిమమర్శ = తాకెను; తామ్ = ఆమెను.
భావం;-
 ఇంకా వనములో వేటగాని విషపూరితమైన బాణముతగిలి క్రిందపడిన ఆడుఏనుగువలె యున్నది. అరణ్యములోనున్న ఒక మహాగజము ఆడఏనుగును తాకినట్లు ఆ దశరథుడు ఆమెను ప్రేమతో స్పృశించెను.
2.10.27.
అనుష్టుప్.
పరిమృశ్య చ పాణిభ్యాం
అభిసంత్రస్తచేతనః।
కామీ కమలపత్రాక్షీం
ఉవాచ వనితామిదమ్॥
టీక:-
 పరిమృశ్య = తాకి; చ = మఱియు; పాణిభ్యాం = చేతులతో; అభి = మిక్కిలి; సంత్రస్త = భయపడిన; చేతనః = మనస్సుతో; కామీ = కామముతోనున్నవాడు; కమలపత్రాక్షీం = తామరరేకులవంటి కన్నులుగలామెను; ఉవాచ = నుడివెను; వనితామ్ = వనితగూర్చి; ఇదమ్ = ఈవిధముగా.
భావం;-
 కామేచ్ఛతోనున్న అతడు కలవరపడిన మనస్సుతో తామరపూవు రేకులవంటి కన్నులు గల ఆ కైకేయిని తన చేతితో నిమురుచు ఇట్లు నుడివెను.
2.10.28.
అనుష్టుప్.
“న తేఽహమభిజానామి
క్రోధమాత్మని సంశ్రితమ్।
దేవి కేనాభిశప్తాసి
కేన వాసి విమానితా॥
టీక:-
 న = లేదు; తే = నీకు; అహమ్ = నేను; అభిజానామి = ఎఱుగుట; క్రోధమ్ = కోపమును; ఆత్మని = నాయెడల; సంశ్రితమ్ = ఆశ్రయించిన; దేవి = దేవీ!; కేన = ఎవరివలన?; అభి = మిక్కిలి; శప్త = తిట్టబడినదానివి; అసి = ఐతివి; కేన = ఎవరివలన?; వా = లేక; అసి = ఐతివా; విమానితా = అవమానింపబడినదానివి.
భావం;-
 శుభలక్షణములు కలిగిన ఓ దేవీ! నాపై నీకు ఎందులకు అలుక కలిగినదో నాకు తెలియదు. నిన్ను ఎవరయినా నిందించితిరా? లేక అవమానించితిరా?
2.10.29.
అనుష్టుప్.
యదిదం మమమ్ దుఃఖాయ
శేశేషే కల్యాణి పాంసుషు।
భూమౌ శేషే కిమర్థం త్వం
మయి కల్యాణచేతసి॥
టీక:-
 యత్ = ఏదయితే; ఇదం = ఇది; మమమ్ = నాయొక్క; దుఃఖాయ = దుఃఖకారణము; శేషే = శయనించియుండుట; కల్యాణి = శుభలక్షణములు గలదానా; పాంసుషు = ధూళియందు; భూమౌ = నేలపై; శేషే = శయనించియుంటివి; కిమర్థం = ఎందుకు?; త్వం = నీవు; మయి = నేను; కల్యాణచేతసి = మంచిమనస్సుతో.
భావం;-
 నువ్వు ఈ విధముగా దుమ్ములో శయనించుట నన్ను బాధపెట్టుచున్నది. నీకు శుభములు చేయు చిత్తముతో నేనుండగ నేలపై ధూళిలో ఎందుకు శయనించితివి?
2.10.30.
అనుష్టుప్.
భూతోపహతచిత్తేవ
మమ చిత్తప్రమాథినీ।
సన్తి మే కుశలా వైద్యాః
త్వభితుష్టాశ్చ సర్వశః॥
టీక:-
 భూతోపహతచిత్త = దయ్యము పట్టినదానివలె; ఇవ = వలె; మమ = నాయొక్క; చిత్తప్రమాథినీ = మనస్సును క్షోభపెట్టుచున్నదానివి; సన్తి = ఉన్నారు; మే = నాయొక్క; కుశలాః = నేర్పుకలిగిన; వైద్యాః = వైద్యులు; తు; అభితుష్టాః = సంతృప్తికరమైన; చ = మఱియు; సర్వశః = అన్నివిధముల.
భావం;-
 దయ్యము పట్టినదానివలె నేలపై శయనించి నామనస్సును కష్టపెట్టుచున్నావెందులకు? మనయొద్ద పూర్తిగా సంతృప్తికరమైన చికిత్స చేసే నేర్పరులైన, ఘనవైద్యులు ఉన్నారు కదా.
2.10.31.
అనుష్టుప్.
సుఖితాం త్వాం కరిష్యన్తి
వ్యాధిమాచక్ష్వ భామిని॥
కస్య వా తే ప్రియం కార్యం
కేన వా విప్రియం కృతమ్।
టీక:-
 సుఖితాం = సుఖమైనదానిగా; త్వాం = నిన్ను; కరిష్యన్తి = చేయగలరు; వ్యాధిమ్ = వ్యాధినిగూర్చి; ఆచక్ష్వ = చెప్పుము; భామిని = ఓ భామ!; కస్య వా = ఎవరికి?; తే = నీచేత; ప్రియం = ప్రియము; కార్యం = చేయదగిన పని; కేన వా = ఎవరిచేత?; విప్రియం = అపకారము; కృతమ్ = చేయబడినది।
భావం;-
 ఓ భామినీ! నీ ఇబ్బంది ఏమిటో వివరించుము, వారు అనారోగ్యమును తొలగించి స్వస్థత చేకూర్చగలరు. నీవు ఎవరికైనను మేలు చేయదలచితివా? నీకు ఎవరయినను అపకారము చేసితిరా?
2.10.32.
అనుష్టుప్.
కః ప్రియం లభతామద్య
కో వా సుమహదప్రియమ్
మా రోదీర్మా చ కార్షిస్త్వం ।
దేవి సంపరిశోషణమ్॥
టీక:-
 కః = ఎవడు? ప్రియం = ప్రియమును; లభతామ్ = పొందును; అద్య = ఇప్పుడు; కః వా = ఎవడు?; సుమహత్ = మిక్కిలి; అప్రియమ్ = దండించుట{అప్రియము}; మా = వలదు; రోదీః = రోదనములు; మా = వలదు; చ = కూడ; కార్షిః = చేయటలు; త్వం = నీవు; దేవి = ఓ దేవి!; సం = మిక్కిలి; పరిశోషణమ్ = ఎండినది, చిక్కిపోయినది.
భావం;-
 ఇప్పుడు నేనెవరికి ప్రియము చేకూర్చవలెను? లేదా ఎవరిని దండించవలెను? ఓ దేవీ! నీరు ఏడవుకుము, ఏడ్చి ఏడ్చి శరీరమును శుష్కించేయకుము.
2.10.33.
అనుష్టుప్.
అవధ్యో వధ్యతాం కో వా
కో వా వధ్యో విముచ్యతామ్ ।
దరిద్రః కో భవేదాఢ్యో
ద్రవ్యవాన్వాప్యకించనః॥
టీక:-
 అవధ్యః = వధింపతగనివాడు; వధ్యతాం = వధింపబడవలెనా?; కః+వా = ఎవడు; కః+వా = ఎవడు; వధ్యః = వధింపతగినవానిని; విముచ్యతామ్ = విడిచిపెట్టవలెనా? దరిద్రః = దరిద్రుడు; కః = ఎవడు; భవేత్ = కావలెనా? ఆఢ్యః = సంపన్నుడు; ద్రవ్యవాన్ = ధనవంతుడు; అపి = కూడ; అకించనః = పేదవాడు కావలెనా?
భావం;-
 ఓ దేవీ! నీరు ఏడవుకుము, ఏడ్చి ఏడ్చి శరీరమును పరితపింపచేయకుము. ఏ అనర్హుడినైన వధించవలెనా? వధించవలసినవానిని ఎవరినైనను విడిచిపెట్టవలెనా? ఏ దరిద్రుడి నైనను సంపన్నునిగా చేయవలెనా? లేక సంపన్నుని పేదవానిగా చేయవలెనా? తెలుయపఱచుము.
2.10.34.
అనుష్టుప్.
అహం చైవ మదీయాశ్చ
సర్వే తవ వశానుగాః।
న తే కించిదభిప్రాయం
వ్యాహన్తుమహముత్సహే॥
టీక:-
 అహం = నేను; చ = మఱియు; ఏవ = నిశ్చయముగ; మదీయాః = నా వారు; చ = మఱియు; సర్వే = అందఱును; తవ = నీకు; వశానుగాః = లోబడియుండు వారము; న = లేదు; తే = నీయొక్క; కించిత్ = కొంచెమైనను; అభిప్రాయం = అభిప్రాయము; వ్యాహన్తుమ్ = చెడగొట్టుటకు; అహమ్ = నేను; ఉత్సహే = పూనుకొనను.
భావం;-
 నేను నా వారందఱు నీకు లోబడియుందుము. నీ మనోరథము ఏది అయినను దానిని వ్యతిరేకించుటకు నేను ఏమాత్రము పూనుకొనను.
2.10.35.
అనుష్టుప్.
ఆత్మనో జీవితేనాపి
బ్రుబ్రూహి యన్మనసేచ్ఛసి।
బలమాత్మని జానన్తీ
న మాం శంకితుమర్హసి॥
టీక:-
 ఆత్మనః = నాయొక్క; జీవితేన = జీవితముచేత; అపి = కూడ; బ్రూహి = చెప్పుము; యత్ = ఏది; మనసా = మనస్సుచేత; ఇచ్ఛసి = కోరుచుంటివో; బలమ్ = బలమును; ఆత్మని = నాగురించి; జానన్తీ = తెలిసినదానవు; న = వలదు; మాం = నన్ను; శంకితుమర్హసి = శంకించుము.
భావం;-
 నీవు మనసా కోఱుకొనుచున్నది ఏదియో నాకు తెలుపుము నా ప్రాణములను పణముగా పెట్టి అయినను దానిని నెఱవేర్చెదను. నామీద నీకున్న అధికారము తెలిసిన నీవు, నన్ను శంకింపకుము.
2.10.36.
అనుష్టుప్.
కరిష్యామి తవ ప్రీతిం
సుకృతేనాపి తే శపే।
యావదావర్త తే చక్రం
తావతీ మే వసున్ధరా॥
టీక:-
 కరిష్యామి = చేయగలను; తవ = నీయొక్క; ప్రీతిం = ఇష్టమైనదానిని; సుకృతేన = పుణ్యముతో; అపి = కూడ; తే = నీకు; శపే = ఒట్టు (ప్రమాణము); యావత్ = ఎంతవరకు; ఆవర్తతే చక్రం = అధికారం నడచునో; తావతీ = అంతవరకు; మే = నా; వసున్ధరా = నా రాజ్యమున.
భావం;-
 నా పూర్వపుణ్యముపైన ఆన. నీ అభీష్టమును తప్పక నెఱవేర్చెదను.ఇది నా ఆన!
2.10.37.
అనుష్టుప్.
ప్రాచీనాః సింధుసౌవీరాః
సౌరాష్ట్రా దక్షిణాపథాః ।
వంగాంగ మగధా మత్స్యాః
సమృద్ధాః కాశికోసలాః॥
టీక:-
  ప్రాచీనాః = తూర్పుదేశములు; సింధు = నా; సౌవీరాః = సౌవీరరాష్ఠ్రములు; సౌరాష్ట్రా = సౌరాష్ఠమును; దక్షిణాపథాః = దక్షిణపథ దేశములు; వంగ = వంగ; అంగ = అంగ; మగధా = మగధ దేశములు; మత్స్యాః = మత్స్యదేశములు; సమృద్ధాః = మిక్కిలి సంపదవంతములు; కాశి = కాశీ; కోసలాః = కోసల దేశములు.
భావం;-
 తూర్పు దేశములు, సింధు, సౌవీర, సౌరాష్టములును, దక్షిణమువైపున గల దేశములును, అంగ-వంగ-మాగధ-మత్స్య దేశములును, కాశికోసల దేశములు అన్నియు సకలసంపదలతో తులతూగుతున్నవి.
2.10.38.
అనుష్టుప్.
తత్ర జాతం బహుద్రవ్యం
ధనధాన్య మజావికమ్।
తతో వృణీష్వ కైకేయి
యద్యత్త్వం మనసేచ్ఛసి॥
టీక:-
 తత్ర = అక్కడ; జాతం = పుట్టినవి; బహు = అధికమైన; ద్రవ్యం = వస్తువులు; ధనః = సంపదలు; ధాన్యమ్ = పంటలు; అజావికమ్ = మేకలమందలు, గొఱ్ఱెలమందలు; తతః = వాటినుండి; వృణీష్వ = కోరుకొనుము; కైకేయి = ఓ కైకేయి; యద్యత్ = ఏదేది; త్వం = నీవు; మనసా = మనస్సులో; ఇచ్ఛసి = కోరుతుంటివో.
భావం;-
 మహారాణీ కైక! ఆ దేశములలో సమృద్ధిగా సకల వస్తు సామగ్రులు, ధనధాన్యములు, పశుసంపద లభించును. వీటినుండి నీకు ఏమేమి కావలెనో కోరుకొనుము.
2.10.39.
అనుష్టుప్.
కిమాయాసేన తే భీరు!
ఉత్తిష్టోత్తిష్ట శోభనే।
తత్త్వం మే బ్రూహి కైకేయి!
యతస్తే భయమాగతమ్॥
టీక:-
 కిమ్ = ఎందుకు?; ఆయాసేన = హైరానపడుట; తే = నీవు; భీరు = పిఱికిదానా; ఉత్తిష్ట+ఉత్తిష్ట = లెమ్ము, లెమ్ము; శోభనే = మంగళస్వభావములు కలదానా!; తత్=దానిని; త్వం=నీవు; మే=నాకు; బ్రూహి=తెలుపుము; కైకేయి=ఓ కైకేయి!; యతః=ఎక్కడనుండి?; తే=నీకు; భయమ్=భీతి; ఆగతమ్=వచ్చినదో?
భావం;-
 ఓ పిరికిదానా! ఇట్లు ఆయాసపడుట ఎందులకు? ఓ సుందరీ! లెమ్ము, లెమ్ము! నీ భయమునకు కారణము నాకు తెలుపుము.
2.10.40.
అనుష్టుప్.
తత్తే వ్యపనయిష్యామి
నీహరమివ రశ్మివాన్”।
తథోక్తా సా సమాశ్వస్తా
వక్తుకామా తదప్రియమ్।
పరిపీడయితుం భూయో
భర్తారముపచక్రమే॥
టీక:-
 తత్ = దానిని; తే = నీయొక్క; వ్యపనయిష్యామి = తొలగించెదను; నీహరమ్ = మంచును; ఇవ = వలె; రశ్మివాన్ = సూర్యుడు; తథా = ఆ విధముగా; ఉక్తా = పలుకబడిన; సా = ఆమె; సమాశ్వస్తా = ఊరడిల్లి; వక్తుకామా = చెప్పదలచినదై; తత్ = ఆ; అప్రియమ్ = చేదుమాటలను; పరిపీడయితుం = మిక్కిలి పీడించుటకు; భూయః = మఱల; భర్తారమ్ = భర్తను; ఉపచక్రమే = పూనుకొనెను.
భావం;-
 సూర్యభగవానుడు మంచును తొలగించునట్లు ఇప్పుడే ఆ భయమును తొలగించెదను.” ఇలా పలికిన దశరథుని మాటలు విన్న కైకేయి కొంత ఊరడిల్లి, ఆయనకు అప్రియమయిన (శ్రీరాముని అరణ్యవాసముగూర్చి) విషయములను అడిగి ఆతనిని మిక్కిలి పీడించుటకు ఉపక్రమించెను.
2.10.41.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
దశమ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; దశమ [10] = పదియవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [10] పదియవ సర్గ సంపూర్ణము
2.11.1.
అనుష్టుప్.
తం మన్మథశరైర్విద్ధమ్
కామవేగవశానుగమ్।
ఉవాచ పృథివీపాలమ్
కైకేయీ దారుణం వచః॥
టీక:-
 తం = ఆ; మన్మథశరైః = మన్మథుని బాణములతో, మదనకాంక్షను రెచ్చగొట్టునవానిచే; విద్ధం = కొట్టబడినవాడు, ఓడినవాడు; కామ = రతి; వేగ = ఆతురతకు; వశానుగమ్ = వశవర్తియైన వాడు; ఉవాచ = పలికెను; పృథివీపాలం = రాజును గుఱించి; కైకేయీ = కైకేయి; దారుణం = క్రూరమైన; వచః = మాటలు
భావం;-
 మదనకాంక్షాపూరితుడై, కామాతురతకు వశవర్తి యైన ఆ దశరథ మహారాజుతో కైకేయి ఎంతో క్రూరమైన మాటలు పలికెను.
2.11.2.
అనుష్టుప్.
“నాస్మి విప్రకృతాదేవ
కేన చిన్నావమానితా।
అభిప్రాయస్తు మే కశ్చిత్
తమిచ్ఛామి త్వయా కృతమ్॥
టీక:-
 న = కాదు; అస్మిన్ = నన్ను; విప్రకృతా = పీడించబడినది; దేవ = ఓ రాజా; కేనచిత్ = ఇతరుల చేత; న అవమానితా = అవమానించబడలేదు; అభిప్రాయః = కోరికలు; తు = పాదపూరణం; మే = నేను; కశ్చిత్ = కొన్ని; తమ్ = ఈ; ఇచ్ఛామి = కోరుకుంటున్నాను; త్వయా = మీ చేత; కృతమ్ = సఫలము చేయబడినదానిగ.
భావం;-
 మహారాజా! నన్నెవరును పీడించనూ లేదు. అవమానించనూ లేదు. నాకు కోరికలు ఉన్నవి. మీరు వానిని నెరవేర్చవలెను.
2.11.3.
అనుష్టుప్.
ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ
యది త్వం కర్తుమిచ్ఛసి।
అథ తద్వ్యాహరిష్యామి
యదభిప్రార్థితం మయా”॥
టీక:-
 ప్రతిజ్ఞాం= ప్రతిజ్ఞను; ప్రతిజానీష్వ = నిశ్చయింపుము; యది = ఏదైతే; త్వమ్ = మీరు; కర్తుమ్ = చేయుటకు; ఇచ్ఛసి = ఇచ్చగించినచో; అథ = అటు పిమ్మట; తత్ = ఆ; వ్యాహరిష్యామి = చెప్పుదును; యత్ = ఏది; అభిప్రార్థితం = కోరబడినదో; మయా = నా చేత
భావం;-
 నా కోరికను నెరవేర్చుటకు అంగీకరించినచో, నెరవేర్చెదనని ప్రతిజ్ఞ చేయుడు. మీరు ప్రతిజ్ఞ చేసిన పిమ్మట నాకోరిక యేదియో తెలిపెదను”.
2.11.4.
అనుష్టుప్.
తామువాచ మహాతేజాః
కైకేయీమీషదుత్స్మితః।
కామీ హస్తేన సంగృహ్య
మూర్ధజేషు శుచిస్మితామ్॥
టీక:-
 తామ్ = ఆమె; ఉవాచ = పలికెను; మహాతేజాః= గొప్ప తేజస్సు కలిగిన; కైకేయీమ్ = కైకేయిని; ఈషద్ = చిన్నగా; ఉత్స్మితః = చిరునవ్వుతో; కామీ = కామవశుడైన దశరథుడు; హస్తేన = చేతులతో; సంగృహ్య = పట్టుకొనుచు; మూర్ధజేషు = తలకురులలోనికి; శుచిస్మితామ్ = స్వచ్ఛమైన నవ్వుతో.
భావం;-
 ఆమె అటుల పలుకగా, కామవశుడైన దశరథుడు కొంచెము నవ్వి, తెల్లని చిరునవ్వు కల ఆ కైకేయి కేశపాశమును హస్తముతో గ్రహించి.
2.11.5.
అనుష్టుప్.
“ఆవలిప్తే! న జానాసి
త్వత్తః ప్రియతరో మమ।
మనుజో మనుజవ్యాఘ్రాత్
రామాదన్యో న విద్యతే॥
టీక:-
 ఆవలిప్తే = ఓ బడాయిగలదానా; న జానాసి = నీకు తెలియదా; త్వత్తః = నీ కంటె; ప్రియతరః = ఎక్కువ ప్రియమైనవారు; మమ = నాకు; మనుజః = మానవుడు; మనుజవ్యాఘ్రాత్ = పురుషులలో శ్రేష్ఠుడు; రామాత్ = రాముడు కంటె; అన్యః = ఇతరులు; న విద్యతే = లేరని తెలియదా!
భావం;-
 ”ఓ బడాయిగలదానా! ఈ లోకములో నాకు నీకంటె ఎక్కువ ప్రియమైనవారు, మానవశ్రేష్ఠుడైన రాముడు తప్ప మరెవ్వరును లేరని నీకు తెలియదా?
2.11.6.
అనుష్టుప్.
తేనాజయ్యేన ముఖ్యేన
రాఘవేణ మహాత్మనా।
శపే తే జీవనార్హేణ
బ్రూహి యన్మనసేచ్ఛాసి॥
టీక:-
 తేన = అటువంటి; ఆజయ్యేన = ఎవరి చేతిలోని ఓటమి లేనివాడు; ముఖ్యేన = సర్వలోక ప్రధానుడు; రాఘవేణ = రఘురాముని చేత; మహాత్మనా = విశాల హృదయుడు; శపే = శపథము చేయుచున్నాను; తే = ఆ; జీవనార్హేణ = జీవనాధారభూతుడు; బ్రూహి = చెప్పుము; యత్ = ఏ; మనసా=మనస్సు చేత; ఇచ్ఛాసి = కోరుచుంటివో
భావం;-
 రాముడు శత్రువులచే జయింప శక్యము కానివాడు, సర్వలోక ప్రధానుడు, విశాల హృదయుడు, అందరికీ జీవనాధారభూతుడు. అటువంటి రామునిపై ఒట్టు పెట్టుచున్నాను. నీకేమి కావలెనో చెప్పుము.
2.11.7.
అనుష్టుప్.
యం ముహూర్తమపశ్యంస్తు
న జీవేయమహం ధ్రువమ్।
తేన రామేణ కైకేయి
శపే తే వచనక్రియామ్॥
టీక:-
 యం = ఎవనిని; ముహూర్తమ్ = క్షణకాలము కూడా; అపశ్యన్ = చూడకుండా; న = ఉండలేనో; జీవేయమ్ = జీవించి; అహం = నేను; ధ్రువమ్ = నిశ్చయము; తేన రామేణ = అటువంటి రామునిచే; కైకేయి = ఓ కైకేయీ; శపే = శపథము చేయుచున్నాను; తే = నీ యొక్క; వచనక్రియామ్ = చెప్పినట్లు చేయుటగూర్చి
భావం;-
 రాముని చూడనిదే నేను క్షణకాలమైనను జీవింపలేను. ఇది నిశ్చయము. అటువంటి రామునిపై ఒట్టుపెట్టి, నీవు చెప్పినటుల చేసెదనని చెప్పుచున్నాను.
2.11.8.
అనుష్టుప్.
ఆత్మనా వాత్మజైశ్చాన్యైః
వృణేయం మనుజర్షభమ్।
తేన రామేణ కైకేయి
శపే తే వచనక్రియామ్॥
టీక:-
 ఆత్మనా = నాచేతను; ఆత్మజైశ్చా = నా కుమారులచేతను; అన్యైః = ఇతర; వృణే = కోరెదనో; యం = ఏదైతే; మనుజర్షభమ్ = పురుషులలో శ్రేష్ఠుని; తేన రామేణ = ఆ రాముని చేత; కైకేయి = ఓ కైకేయీ; శపే = ప్రమాణము చేయుచున్నాను; తే = నీ యొక్క; వచనక్రియామ్ = మాట ప్రకారము చేయుటను
భావం;-
 నా ప్రాణములనైనను, నా ఇతర కుమారుల ప్రాణములనైనను ఒడ్డి పురుషశ్రేష్ఠుడైన రాముని క్షేమము సంపాదింపకోరుచుందును. అట్టి రామునిపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ వచనము ప్రకారము చేసెదను.
2.11.9.
అనుష్టుప్.
భద్రే హృదయమప్యేతత్
అనుమృశ్యోద్ధరస్వ మే।
ఏతత్సమీక్ష్య కైకేయి
బ్రూహి యత్సాధు మన్యసే॥
టీక:-
 భద్రే = ఓ మంగళప్రదురాలా; హృదయమపి = మనసునందు కూడా; ఏతత్ = దేనిని; అనుమృశ్య = స్పృశించి; ఉద్ధరస్వ = ఉద్ధరించుము; మే = నేను; ఏతత్ = దీనిని; సమీక్ష్య = గమనించి; కైకేయి = ఓ కైకేయీ; బ్రూహి = చెప్పుము; యత్ = ఏది; సాధు = మంచిదని; మన్యసే = భావించుచున్నావో
భావం;-
 మంగళప్రదురాలా! నా హృదయమును స్పృశించి ఉద్ధరించుము. దీనిని పరిశీలించి నీవేది మంచిదని భావించుచుంటివో దానిని చెప్పుము.
2.11.10.
అనుష్టుప్.
బలమాత్మని జానన్తీ
న మాం శంకితుమర్హసి।
కరిష్యామి తవ ప్రీతిమ్
సుకృతేనాపి తే శపే”॥
టీక:-
 బలమ్ = శక్తిని; ఆత్మని = నాపై; జానన్తీ = తెలిసిన; మాం = నన్ను; న శంకితుమ్= శంకించుటకు; న అర్హసి = తగదు; కరిష్యామి = చేసెదను; తవ = నీ యొక్క; ప్రీతిం = ప్రీతిని; సుకృతేనాపి = పుణ్యముచేత కూడ; తే = నీకు; శపే = ప్రమాణము చేయుచున్నాను.
భావం;-
 నీకు నాపై ఎంత అధికారమున్నదో తెలిసిన నీవు ఏ మాత్రము శంకింపరాదు. నేను చేసిన పుణ్యముపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నీ వచనము ప్రకారము చేసెదను”.
2.11.11.
అనుష్టుప్.
సా తదర్థమనా దేవీ
తమభిప్రాయమాగతమ్।
నిర్మాధ్యస్థ్యాచ్చ హర్షాచ్చ
బభాషే దుర్వచం వచః॥
టీక:-
  సా = ఆమె, తత్ = ఆయొక్క, అర్థమ్ = తలపు (రాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము), మనా = మనసునుపెట్టుకొనిన; దేవీ = కైకేయి; తమ్ అభిప్రాయమ్ = ఆ కోరిక; ఆగతమ్ = ఆమె ఆలోచనలోకి ప్రవేశించిన; నిర్మాధ్యస్థ్యాత్ = పక్షపాతబుద్దితో; చ; హర్షాత్ = సంతోషము వలన; చ; బభాషే = పలికెను; దుర్వచం = ఉచ్చరింపకూడని; వచః = పలుకులు
భావం;-
 భరతుని రాజ్యాభిషేకము, రామ వనవాసము అను విషయములపై తీవ్రమైన ఇచ్ఛ గల కైకేయి తన మనస్సులో ఉన్న ఆ తలపులను తెలుపుచు భరతునిపై పక్షపాత బుద్ధితో, ఆనందముతో కూడినదై, ఉచ్చరించుటకు కూడా తగని వచనము పలికెను.
2.11.12.
అనుష్టుప్.
తేన వాక్యేన సంహృష్టా
తమభిప్రాయమాగతమ్।
వ్యాజహార మహాఘోరమ్
అభ్యాగతమివాంతకమ్॥
టీక:-
 తేన వాక్యేన = ఆ మాటలతో; సంహృష్టా = సంతోషము నిండిన కైకేయి; తమ్ = ఆ; అభిప్రాయమ్ = కోరికను; ఆగతమ్ = తన మనసులోకి ప్రవేశించినదానిని; వ్యాజహార = పలికెను; మహాఘోరం = చాలా భయంకరమైన; అభ్యాగతమ్ = హఠాత్తుగా వచ్చిపడిన; ఇవ = వలె; అంతకమ్ = మృత్యువు
భావం;-
 దశరథుని మాటలకు సంతోషించి, కైకేయి తన మనస్సులోనికి చేరిన మృత్యువు వలె వచ్చిపడిన అతి భయంకరమైన తలపును అతనికి తెలిపెను.
2.11.13.
అనుష్టుప్.
“యథా క్రమేణ శపసి
వరం మమ దదాసి చ।
తచ్ఛృణ్వన్తు త్రయస్త్రింశత్
వేగాస్సాగ్నిపురోగమాః॥
టీక:-
 యథా = ఎట్లు; క్రమేణ = వరుసగా; శపసి = నీ ప్రమాణములు; వరం = వరము; మమ = నాకు; దదాసి చ = ఇచ్చుచు; తత్ = దానిని; శృణ్వన్తు = విందురు గాక; త్రయస్త్రింశత్ = ముప్పదిముగ్గురు దేవతలు; వేగా; సః = ఆ; అగ్ని = అగ్నిదేవుడు; పురోగమాః = ముందు ఉండగా.
భావం;-
 మీరు వరుసగా ఒట్టులు పెట్టుచు నాకు వరములిచ్చుచు పలికిన ఈ మాటలను, అగ్నిదేవునితో సహా ముప్పది ముగ్గురు దేవతలు వినెదరుగాక.
2.11.14.
అనుష్టుప్.
చంద్రాదిత్యౌ నభశ్చైవ
గ్రహా రాత్ర్యహనీ దిశః।
జగచ్చ పృథివీ చేయమ్
సగంధర్వా సరాక్షసా॥
టీక:-
  చంద్రదిత్యౌ = సూర్యచంద్రులు ఇద్దరూ; నభశ్చ = ఆకాశమును; ఏవ = ఇంకనూ; గ్రహాః = గ్రహములు; రాత్రి = రాత్రి; అహనీ = పగలు; దిశః = దిక్కులు; జగత్ = లోకము; చ; పృథివీ = భూమి; చ; ఇయం = ఈ; స = సహితముగ; గంధర్వా = గంధర్వులు; స = సహితమగ; రాక్షసా = దానవులతో.
భావం;-
 సూర్యచంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రి, పగలు, దిక్కులు, జగత్తు, ఈ భూమి, గంధర్వులు, రాక్షసులు..
2.11.15.
అనుష్టుప్.
నిశాచరాణి భూతాని
గృహేషు గృహదేవతా।
యాని చాన్యాని భూతాని
జానీయుర్భాషితం తవ॥
టీక:-
 నిశాచరాణి = రాత్రులందు సంచరించువారు; భూతాని = భూతములు; గృహేషు = ఇండ్లయందున్న; గృహదేవతా = గృహదేవతలు; యాని = ఎటువంటి; చ = మఱియు; అన్యాని = ఇతరమైన; భూతాని = ప్రాణులు; జానీయుః=తెలిసుకొందురు గాక; భాషితం = మాటలు; వ = మీవి.
భావం;-
 రాత్రియందు సంచరించు భూతములు, ఇండ్లలోని గృహదేవతలు, ఇంకను ఇతరమైన భూతములు నీ మాటలు వినెదరుగాక.
2.11.16.
అనుష్టుప్.
సత్యసన్ధో మహాతేజాః
ధర్మజ్ఞః సుసమాహితః।
వరం మమ దదాత్యేష
తన్మే శ్రృణ్వన్తు దైవతాః”॥
టీక:-
 సత్యసన్ధః = మాటకు కట్టుబడినవాడు; మహాతేజాః = గొప్ప పరాక్రమము కలవాడు; ధర్మజ్ఞః = ధర్మము తెలిసినవాడు; సుసమాహితః = సమభావము కలిగినవాడు; వరం = వరమును; మమ = నాకు; దదాతి = ఇచ్చుచున్నాడు; ఏష = ఈ దశరథ మహారాజు; తత్ = ఇది; మే = నా కొరకు; శృణ్వన్తు= విందురు గాక : దైవతాః= దేవతలందరు
భావం;-
 సత్యసంధుడు, మహాతేజశ్శాలి, ధర్మముల నెరిగినవాడు, సావధానచిత్తుడు అయిన ఈ దశరథ మహారాజు నాకు వరమిచ్చుచున్నాడు. నా కొరకు సాక్షులుగా దేవతలందరును, ఈ వరప్రదాన వచనమును విందురుగాక”.
2.11.17.
అనుష్టుప్.
ఇతి దేవీ మహేష్వాసమ్
పరిగృహ్యాభిశస్య చ।
తతః పరమువాచేదమ్
వరదం కామమోహితమ్॥
టీక:-
 ఇతి = ఇట్లు; దేవీ = కైకేయి; మహేష్వాసం = ఘనమైన ధనుస్సు కలిగినవాడిని, దశరథుడిని; పరిగృహ్య = పట్టుకొని, వశుణ్ణి చేసుకొని; అభిశస్య చ = అధికముగా ప్రశంసించి; తతః పరమ్ = అటుపిమ్మట; ఉవాచ = పలికెను; ఇదం = ఈ మాటలు; వరదం = వరముల నిచ్చువాడు; కామమోహితమ్ = కామముచే మోహితుడైనవాడు
భావం;-
 కైకేయి ఇట్లు దశరథుడు తన మాట వినునట్లు చేసుకొని, అతనిని ఉబ్బవేసి, అటు పిమ్మట, వరము లిచ్చుటకు సిద్ధముగా ఉన్న, కామమోహితుడైన అతనితో..
2.11.18.
అనుష్టుప్.
“స్మర రాజన్! పురావృత్తమ్
తస్మిన్ దైవాసురే రణే।
తత్ర చాచ్యావయచ్ఛత్రుః
తవ జీవితమంతరా॥
టీక:-
 స్మర = గుర్తు తెచ్చుకొనుడు; రాజన్ = ఓ రాజా; పురా = గతములో; వృత్తం = జరిగిన విషయము; తస్మిన్ = ఆ; దైవాసురే = దేవదానవుల మధ్య; రణే = యుద్ధమునందు; తత్ర = ఆ సందర్భమున; చ; అత్ = ఆ; యావయచ్ఛత్రుః = అచట శత్రువు; తవ = మీ యొక్క; జీవితమంతరా = ప్రాణములను తప్పించి మిగిలిన బలమును.
భావం;-
 ‘రాజా! పూర్వము దేవాసుర యుద్ధమునందు ఏమయినదో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అచట శత్రువు మీ ప్రాణములు తప్ప రథతురగాయుధాదులను అన్నింటిని నశింపచేసెను.
2.11.19.
అనుష్టుప్.
తత్ర చాపి మయా దేవ
యత్త్వం సమభిరక్షితః।
జాగ్రత్యా యతమానాయాః
తతో మే ప్రాదదా వరౌ॥
టీక:-
 తత్రచ = అక్కడ; అపి = మఱియు; మయా = నా చేత; దేవ = ఓ రాజా; యత్ = ఏ కారణము చేత; త్వం = మీరు; సమాభిరక్షితః = రక్షింపబడితిరో; జాగ్రత్యాః = అతి జాగరూకతతో; యతమానాయాః = రక్షించుటకు ప్రయత్నించిన; తతః = ఆ కారణం చేత; మే = నాకు; ప్రాదదా = మీరు ఇచ్చియుంటిరి; వరౌ = రెండు వరములు
భావం;-
 మహారాజా! అచట నేను నిన్ను రక్షించితిని. అందువలన. నిన్ను రక్షించుటకై అతి జాగరూకతతో ప్రయత్నించిన నాకు నీవు రెండు వరములు ఇచ్చి యున్నావు.
2.11.20.
అనుష్టుప్.
తౌ తు దత్తౌ వరౌ దేవ
నిక్షేపౌ మృగయామ్యహమ్।
తథైవ పృథివీపాల
సకాశే సత్యసంగర॥
టీక:-
 తౌ = ఆ; తు = మఱియు; దత్తౌ = ఇవ్వబడిన; వరౌ = రెండు వరములు; దేవ = ఓ రాజా; నిక్షేపౌ = సురక్షితముగా ఉంచిన; మృగయామి = వేఁడుచున్నాను, వావిళ్ళ వారి నిఘంటువు, ఆంధ్రశబ్దరత్నాకరము; అహమ్ = నేను; తథైవ = వాటిని మాత్రమే; పృథివీపాల = రాజుల; సకాశే = సమీపములో; సత్యసంగర = వాగ్దానము చెల్లించు కొనువాడు, శబ్దరత్నాకరము.
భావం;-
 సత్యప్రతిజ్ఞుడవైన మహారాజా! నీ దగ్గరనే సురక్షితముగా దాచి ఉంచిన నీవిచ్చిన ఆ వరములను ఇపుడు కోరుచున్నాను.
గమనిక:-
 సత్యసంగర- వ్యుత్పత్తి. సత్యః సంగరః అస్య. సత్యః- సత్యవచనవాన్, సంగరః- ప్రతిజ్ఞ, బ.వ్రీ. బాస చెల్లించుకొనువాడు.
2.11.21.
అనుష్టుప్.
తత్ప్రతిశ్రుత్య ధర్మేణ
న చేద్దాస్యసి మే వరమ్।
అద్యైవ హి ప్రహాస్యామి
జీవితం త్వద్విమానితా”॥
టీక:-
 తత్ = ఆ కారణంగా; ప్రతిశ్రుత్య = వాగ్దానము చేసి; ధర్మేణ = ధర్మమును; చేత్ = అనుసరించి; న = లేనిచో; న దాస్యసి = ఇచ్చుట; మే = నా యొక్క; వరమ్ = వరములను; అద్యైవ = ఇప్పుడే; హి = కూడా; ప్రహాస్యామి = త్యజించెదను; జీవితం = జీవితము; త్వత్ = మీచే; విమానితా = అవమానింపబడినదానను.
భావం;-
 మీరు వాగ్దానము చేసిన ఆ వరదానము ధర్మానుసారముగా ఇవ్వవలెను. అట్లు ఇవ్వక నన్ను అవమానించినచో ఇప్పుడే ప్రాణములు విడిచెదను”. అని పలికెను.
2.11.22.
అనుష్టుప్.
వాంగ్మాత్రేణ తదా రాజా
కైకేయ్యా స్వవశే కృతః।
ప్రచస్కన్ద వినాశాయ
పాశం మృగ ఇవాత్మనః॥
టీక:-
 వాంగ్మాత్రేణ = మాటల మాత్రముచేతనే; తదా = అప్పుడు; రాజా = దశరథుడు; కైకేయ్యా = కైకేయి చేత; స్వవశే = తన వశములో; కృతః = చేసుకొనబడిన; ప్రచస్కన్ద = పడిపోయిన, మిక్కిలిప్రవేశించుట; వినాశాయ = నాశనమునకు; పాశం = ఉచ్చులో; మృగైవ = లేడి వలె; ఆత్మనః = తన యొక్క
భావం;-
 ఈ విధముగా కైకేయి మాటల మాత్రమునకే లొంగిపోయిన దశరథుడు, లేడి పాశములో దూకినట్లు, ఆమె పన్నిన మాయాపాశములో, ఆత్మవినాశమునకై దూరెను. అనగా అట్లే ఇచ్చెదనని చెప్పెను.
2.11.23.
అనుష్టుప్.
“తతః పరమువాచేదమ్
వరదం కామమోహితమ్।
వరౌ యౌ మే త్వయా దేవ
తదా దత్తౌ మహీపతే॥
టీక:-
 తతః పరమ్ = అటు పిమ్మట; ఉవాచ = మాట్లాడెను; ఇదం = ఈ మాటలు; వరదం = వరములు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్న దశరథుని గుఱించి; కామమోహితమ్ = కామమోహితుడైన; వరౌ = రెండు వరములు; యౌ = ఏవి; మే = నాకు; త్వయా = మీ చేత; దేవ = ఓ రాజా; తదా = అప్పుడు; దత్తౌ = ఇవ్వబడినవో; మహీపతే =భూమిని పరిపాలించు ప్రభువా
భావం;-
 ”పిమ్మట కామమోహితుడై వరములిచ్చుటకు అంగీకరించిన ఆ దశరథునితో కైకేయి, ‘పృధ్వీపతివైన మహారాజా! ఆనాడు మీరు నాకిచ్చిన వరములను ఇప్పుడే కోరెదను. వినుము.
2.11.24.
అనుష్టుప్.
తౌ తావదహమద్యైవ
వక్ష్యామి శృణు మే వచః।
అభిషేకసమారంభో
రాఘవస్యోపకల్పితః॥
టీక:-
 తౌ = ఆ; తావత్ = అది అంతయు; అహమ్ = నేను; అద్య + ఏవ = ఈ క్షణమే; వక్ష్యామి = చెప్పుచున్నాను; శృణు = వినుము; మే = నా; వచః = మాటలు; అభిషేక = పట్టాభిషేకపు; సమారంభః = సామగ్రి; రాఘవస్య = రఘు రాముని యొక్క; ఉపకల్పితః = ఏర్పాటు చేయబడినవి
భావం;-
 ఆ వరాలు ఏమిటో ఇప్పుడే చెప్తాను. రాముని రాజ్యాభిషిక్తుని చేయుటకై సంభారములన్నియు సమకూర్చబడినవి కదా! ఈ అభిషేక సంభారములతోనే,
2.11.25.
అనుష్టుప్.
అనేనైవాభిషేకేణ
భరతో మేఽభిషిచ్యతామ్।
యో ద్వితీయో వరో దేవ!
దత్తః ప్రీతేన మే త్వయా॥
టీక:-
 అనేనైవ = వీనిచేతనే; అభిషేకేణ = పట్టాభిషేకపు సామగ్రితో; భరతః = భరతుడు; మే = నాయొక్క; అభిషిచ్యతామ్ = పట్టాభిషేకము చేయబడుగాక; యః = ఏ; ద్వితీయః = రెండవ; వరః = వరము; దేవ = ప్రభువా!; దత్తః = ఇవ్వబడినది; ప్రీతేన = ప్రేమతో; మే = నాకు; త్వయా = మీచే
భావం;-
  ఈ అభిషేక సామగ్రితోనే నా కుమారుడైన భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను.ఆనాడు ప్రభూ! దేవాసుర యుద్ధము నందు ప్రేమతో మీరు నాకిచ్చిన రెండవ వరము.
2.11.26.
అనుష్టుప్.
తదా దైవాసురే యుద్ధే
తస్య కాలోఽయమాగతః।
నవ పంచ చ వర్షాణి
దండకారణ్యమాశ్రితః॥
టీక:-
 తదా = అప్పుడు; దైవాసురః = దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన; యుద్ధే = యుద్ధమునందు; తస్య=దానికి; కాలః = సమయము; అయమ్ =ఇది; ఆగతః = వచ్చినది; నవ పంచ = తొమ్మిది మఱియు ఐదు, పదునాలుగు; చ; వర్షాణి=సంవత్సరములు; దండకారణ్యమ్ = దండకమను పేరు గల అరణ్యమును; ఆశ్రితః = ఆశ్రయించినవాడై
భావం;-
 దేవాసుర యుద్దము అప్పుడు ఇచ్చిన రెండవ వరము ఇచ్చుటకు సమయం ఆసన్నమయినది, రాముడు పదునాలుగుసంవత్సరములపాటు దండకారణ్యములో నివసించవలెను.
2.11.27.
అనుష్టుప్.
చీరాజినజటాధారీ
రామో భవతు తాపసః।
భరతో భజతామద్య
యౌవరాజ్యమకంటకమ్॥
టీక:-
 చీర = నార వస్త్రములు; అజిన = నల్లజింక చర్మము; జటాధారీ = జటలు కట్టిన జుట్టును ధరించినవాడై; రామః = రాముడు; భవతు = అగుగాక; తాపసః = ముని; భరతః = భరతుడు; భజతామ్ = పొందుగాక; అద్య = ఇప్పుడు; యౌవరాజ్యమ్ = యువరాజ పదవిని; అకంటకమ్ = శత్రువులు లేనిది.
భావం;-
 రాముడు నారచీరలు, మృగాజినము, జటలు ధరించి, మునివృత్తిని అవలంబించుగాక. భరతునకు ఇపుడునే శత్రు బాధలు ఏవియు లేని యౌవరాజ్యము లభింపవలెను.
2.11.28.
అనుష్టుప్.
ఏష మే పరమః కామో
దత్తమేవ వరం వృణే।
అద్య చైవ హి పశ్యేయమ్
ప్రయాంతం రాఘవం వనమ్॥
టీక:-
 ఏష = ఇది; మే = నాకు; పరమః = గొప్పదైన; కామః = కోరిక; దత్తమేవ = ఇవ్వబడినదే; వరం = వరమును; వృణే = అడుగుచున్నాను; అద్య చైవ హి = ఈ క్షణమే; పశ్యేయం = చూచెదను గాక; ప్రయాంతం = వెళ్లుచున్న; రాఘవం = రఘురాముని; వనమ్ = అడవి గురించి
భావం;-
 ఇదే నా గొప్పదైన కోరిక. పూర్వము నీవిచ్చిన వరమునే ఇప్పుడు కోరుచుంటిని. రాముడీనాడే వనవాసమునకు వెళ్లుచుండగా నేను చూడవలెను.
2.11.29.
జగతి.
స రాజరాజః! భవ సత్యసంగరః
కులం చ శీలం చ హి రక్ష జన్మ చ।
పరత్రవాసే హి వదన్త్యనుత్తమం
తపోధనాస్సత్యవచో హితం నృణామ్॥
టీక:-
 సః = ఆ విధముగా; రాజరాజః = రాజులకు రాజు అయిన; భవ = అగుము; సత్యసంగరః = సత్యవాగ్దానము లిచ్చువాడవు; కులం = కులమును; చ = మఱియు; శీలం = పాత్రతను; చహి = మఱియు; రక్ష = రక్షించుము; జన్మ = జన్మము; చ = మఱియు; పరత్ర = పరలోకములో; వాసే హి = నివాసము ఉండుట; వదంతి = చెప్పుదురు; అనుత్తమం = ఉత్తమోత్తమమైనది; తపోధనాః = తపమే ధనముగా గల ఋషులు; సత్య వచః = సత్యమును మాత్రము మాట్లాడుట; హితం = మిక్కిలి మంచిది; నృణామ్ = మానవులకు
భావం;-
 రాజులకు రాజువైన దశరథ మహారాజా! చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనువాడా! కులమును, శీలమును, జన్మమును రక్షించుకొనుము. సత్యవాక్యపరిపాలనయే మానవులకు పరలోకవాసమునందు సౌఖ్యము కలిగించునది అని తపోధనులు చెప్పుదురు కదా’ అని పలికెను.
2.11.30.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
ఏకాదశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; ఏకాదశ [11] = పదకొండవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [11] పదకొండవ సర్గ సంపూర్ణము
2.12.1.
అనుష్టుప్.
తతశ్శృత్వా మహారాజః
కైకేయ్యా దారుణం వచః।
చింతామభిసమాపేదే
ముహూర్తం ప్రతతాప చ॥
టీక:-
 తతః = తరువాత; శ్రుత్వా = విని; మహారాజః = మహారాజు; కైకేయ్యాః = కైకేయి యొక్క; దారుణం = దారుణమైన; వచః = మాటను; చింతామ్ = చింతను; అభిసమాపేదే = పొందెను; ముహూర్తం = క్షణ (ముహూర్త) కాలము; ప్రతతాప = చాలా పరితపించెను; చ.
భావం;-
 దారుణమైన కైకేయి మాటలను వినిన దశరథ మహారాజు చాల వ్యాకులపడి, క్షణకాలము నివ్వెరపడి చింతాక్రాంతు డయ్యెను.
2.12.2.
అనుష్టుప్.
కిన్ను మే యది వా స్వప్నః
చిత్తమోహోఽపి వా మమ।
అనుభూతోపసర్గో వా
మనసో వాప్యుపద్రవః॥
టీక:-
 కిన్ను = ఏమిది; మే = నా యొక్క; యది = ఒకవేళ; వా = లేక; స్వప్నః = కలయా; చిత్త మోహా = మనోవికారమా; అపి = సంశయార్థకము; వా = లేక; అనుభూతః = నా ప్రత్యక్ష జ్ఞానము లందు; ఉపసర్గః = రోగవికారములు; వా = లేక; మనసః = మనస్సు యొక్క; వా = లేక; అపి = సంశయార్థకము; ఉపద్రవః = హింసిచుట.
భావం;-
 ఏమిది? కలయా? నేను మనోవిబ్రాంతికి లోనైతినా? లేక ఎదురుగుండా ఉన్నది తెలియకుంటినా? లేక నా మతి ఏమైనను చలించెనా?
2.12.3.
అనుష్టుప్.
ఇతి సంచింత్య తద్రాజా
నాధ్యగచ్ఛత్తదాసుఖమ్।
ప్రతిలభ్య చిరాత్సంజ్ఞాం
కైకేయీవాక్యతాడితః॥
టీక:-
 ఇతి = ఇట్లు; సంచింత్య = బాగా ఆలోచించి; తత్ = ఆ; రాజా = రాజు; న = లేదు; అధ్యగచ్ఛత్ = పొందుట; తదా = అప్పుడు; సుఖమ్ = సుఖమును; ప్రతిలభ్య = పొంది; చిరాత్ = చాలకాలమునకు; సంజ్ఞామ్ = స్పృహను; కైకేయీ = కైకేయి యొక్క; వాక్య = మాటలచే; తాడితః = కొట్టబడిన.
భావం;-
 దశరథమహారాజు, ఈ విధముగ పరితపించి, తూలి పోయెను. కైక పలుకుల తాకిడి పిమ్మట ఎంతో సమయము గడిచాక స్పృహలోనికి వచ్చెను.
2.12.4.
అనుష్టుప్.
వ్యథితో విక్లబశ్చైవ
వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః।
అసంవృతాయామాసీనో
జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్॥
టీక:-
 వ్యథితః = వ్యథ చెందినవాడై; విక్లబః చ ఏవ = వ్యాకులపడి; వ్యాఘ్రీం = ఆడుపులిని; దృష్ట్వా = చూసి; యథా మృగః = జింక వలె; అసంవృతాయాం = స్వాధీనము తప్పిన; ఆసీనః = కూర్చొనిన వాడై; జగత్యాం = నేలపై; దీర్ఘమ్ = దీర్ఘముగా; ఉచ్ఛ్వసన్ = నిట్టూర్చెను.
భావం;-
 అట్లు మూర్ఛనుండి తేరుకొని, ఆడుపులిని చూసిన జింకవలె మనోవ్యాకులముతోపాటు వ్యథనొందెను. దీర్ఘముగా నిట్టూర్చుచు, వశముతప్పి కటికనేలపై చతికిలబడెను
2.12.5.
అనుష్టుప్.
మండలే పన్నగో రుద్ధో
మంత్రైరివ మహావిషః।
అహో ధిగితి సామర్షో
వాచముక్త్వా నరాధిపః॥
టీక:-
 మండలే = మండలమునందు; పన్నగః = సర్పము; రుద్ధః = బంధింపబడిన; మంత్రైః = మంత్రముచే; ఇవ = వలె; మహావిషః = భయంకరమైన విషమును గలిగియున్న; అహో = అయ్యో; ధిక్ = తిరస్కారము వావిళ్ళవారి నిఘంటువు, థూ; ఇతి = అని; స = కూడిన; అమర్షః = ఓర్వలేనితనము, వావిళ్ళ నిఘంటువు; వాచమ్ = మాటను; ఉక్త్వా = పలికి; నరాధిపః = రాజు.
భావం;-
 మహావిషసర్పము మంత్రముచే గీసిన గిరి మధ్యనే బంధిపబడి యున్నట్లు కటికనేలపైపడి యుండి, ఆ దశరథమహారాజు ఓర్చుకోలేక "హా" అని, "థూ" అని అనుకొనుచుండెను.
2.12.6.
అనుష్టుప్.
మోహమాపేదివాన్భూయ
శ్శోకోపహతచేతనః।
చిరేణ తు నృపస్సంజ్ఞామ్
ప్రతిలభ్య సుదుఃఖితః॥
టీక:-
 మోహమ్ = మోహమును; ఆపేదివాన్ = పొందెను; భూయః = మరల; శోకః = శోకముచే; ఉపహతచేతనః = కొట్టబడినవాడై; చిరేణ = చాలా సమయమునకు; నృపః = రాజు; సంజ్ఞామ్ = స్పృహను, చేతన; ప్రతిలభ్య = పొంది; సుదుఃఖితః = దుఃఖితుడయ్యెను.
భావం;-
 మరల శోక మోహములచే బాధపడినవాడై, చాలసేపటికి తెప్పరిల్లి, స్పృహలోనికి వచ్చి, చాల దుఃఖితుడయ్యెను.
2.12.7.
అనుష్టుప్.
కైకేయీమబ్రవీత్క్రుద్ధః
ప్రదహన్నివ చక్షుషా।
“నృశంసే! దుష్టచారిత్రే!
కులస్యాస్య వినాశిని!॥
టీక:-
 కైకేయీమ్ = కైకేయిని; అబ్రవీత్ = పలికెను; క్రుద్ధః = కోపోద్రిక్తుడై; ప్రదహన్ = కాల్చివేయుచున్న; ఇవ = విధమైన; చక్షుషా = కన్నులచే; నృశంసే = క్రూరురాలా; దుష్టచారిత్రే = దుష్టచరితురాలా; కులస్యాస్య = కులముయొక్క; వినాశిని = వినాశకురాలా.
భావం;-
 దశరథుడు క్రోధము నిండిన చూపులతో కాల్చివేయున్నట్లుగ చూచుచు కైకేయితో ఇట్లు పలికెను. "క్రూరాత్మురాలా! దుష్టచరితా! కులమును నాశనము చేయుదానా"
2.12.8.
అనుష్టుప్.
కిం కృతం తవ రామేణ
పాపం పాపే! మయాపి వా।
యదా తే జననీతుల్యాం
వృత్తిం వహతి రాఘవః॥
టీక:-
 కిం = ఏమి; కృతం = చేయబడినది; తవ = నీకు; రామేణ = రామునిచేత; పాపం = అపకారము; పాపే = పాపాత్మురాలా; మయా అపి = నా చేత కాని; వా = లేక; యదా = ఎప్పుడు; తే = నిన్ను; జననీ = తల్లితో; తుల్యాం = సమానురాలు; వృత్తిం = విధము; వహతి = ధరించుచుండెను; రాఘవః = రాముడు.
భావం;-
 రాముడు గాని, నేను గాని నీపట్ల ఏమి అపకారము చేసితిమి. రాముడు నిన్ను తన మాతృసమానురాలిగా చూచుకొనుచుండెను కదా.
2.12.9.
అనుష్టుప్.
తస్యైవ త్వమనర్థాయ
కింనిమిత్తమిహోద్యతా।
త్వం మయాఽఽత్మవినాశార్థం
భవనం స్వం ప్రవేశితా॥
టీక:-
 తస్య ఏవ = అతనికే; త్వమ్ = నీవు; అనర్థాయ = కీడు; కిం = ఏమి; నిమిత్తమ్ = విషయమై; ఇహ = ఇపుడు; ఉద్యతా = పూనుకొనినావు; త్వం = నీవు; మమ ఆత్మ = నాయొక్క; వినాశనార్థం = వినాశమునకు; భవనం = ఇంటిని; స్వం = నా యొక్క; ప్రవేశితా = ప్రవేశింపబడినావు.
భావం;-
 అటువంటి రామునికే నీవు అపకారము చేయుటకు ఎందుకు తలపెట్టినావు. నీవు నా వినాశనముకొరకే నా గృహములోనికి ప్రవేశపెట్టబడినదానవు.
2.12.10.
అనుష్టుప్.
అవిజ్ఞానాన్నృపసుతా
వ్యాలీ తీక్ష్ణవిషా యథా।
జీవలోకో యదా సర్వో
రామస్యాహ గుణస్తవమ్॥
టీక:-
 అవిజ్ఞాత్ = అజ్ఞానముచే; నృపసుతా = రాజకుమారివి యని; వ్యాలీ = ఆడుపాము; తీక్ష్ణవిషా = తీక్ష్ణమైన విషము; యథా = వలె, వంటి; జీవలోకః = జీవరాశి; యదా = ఎప్పుడు; సర్వః = సమస్తమైన; రామస్య = రాముని యొక్క; ఆహ = చెప్పుచున్నదో; గుణస్తవమ్ = గుణస్తోత్రమును.
భావం;-
 రాకుమారివైన నిన్ను తీవ్రమైన విషసర్పము వంటి దానవని అజ్ఞానవశమున ఎరుగకపోతిని. ప్రపంచములోని వారందరూ రాముని గుణగణములను కీర్తించుచుండిరి.
2.12.11.
అనుష్టుప్.
అపరాధం కముద్దిశ్య
త్యక్ష్యామీష్టమహం సుతమ్।
కౌసల్యాం వా సుమిత్రాం వా
త్యజేయమపి వా శ్రియమ్॥
టీక:-
 అపరాధం = తప్పుడుపని; కం = ఏమి; ఉద్దిశ్య = ఉద్దేశించి; త్యక్ష్యామి = విడచివేతును; ఇష్టమ్ = ప్రియమైన; అహం = నేను; సుతమ్ = పుత్రుని; కౌసల్యాం వా = కౌసల్య; వా = గాని; సుమిత్రాం = సుమిత్ర; వా = గాని; త్యజేయమ్ = త్యజింతును; అపి = కూడ; వా = లేదా; శ్రియమ్ = ఐశ్వర్యమును.
భావం;-
 నా ప్రియపుత్రుని విడచుటచే ఏమి తప్పుడుపని ఆశించితివి? కౌసల్యను, సుమిత్రను, నా ఐశ్వర్యమును ఐనా వదిలివేయగలను.
2.12.12.
అనుష్టుప్.
జీవితం వాఽత్మనో రామం
న త్వేవ పితృవత్సలమ్।
పరా భవతి మే ప్రీతిః
దృష్ట్వా తనయమగ్రజమ్॥
టీక:-
 జీవితం = జీవితమును; వా = ఐనను; ఆత్మనః = నా యొక్క; రామం = రాముని; న = వీలుకాదు; తు = పాదపూరణము; ఏవ = మాత్రము; పితృవత్సలమ్ = తండ్రి యందు ప్రేమగలిగియున్న; పరా = గొప్ప; భవతి = అగును; మే = నా యొక్క; ప్రీతిః = ఆనందము; దృష్ట్వా = చూచి; తనయమ్ = కుమారుని; అగ్రజమ్ = జ్యేష్ఠుడైన.
భావం;-
 నేను ప్రాణత్యాగమునైనను చేయగలను గాని, పితృభక్తిపరాయణుడైన రాముని విడువజాలను. జ్యేష్ఠకుమారుడైన నా రాముని చూడగనే నాకు పరమానందము కలుగును.
2.12.13.
అనుష్టుప్.
అపశ్యతస్తు మే రామం
నష్టా భవతి చేతనా।
తిష్ఠేల్లోకో వినా సూర్యం
సస్యం వా సలిలం వినా॥
టీక:-
 అపశ్యత్ = చూడకుండ; అస్తు = ఉండిన యెడల; మే = నా యొక్క; రామం = రాముని; నష్టా భవతి = నశించును; చేతనా = చైతన్యము; తిష్ఠేత్ = ఉండవచ్చును; లోకః = లోకము; వినా = లేకుండగ; సూర్యం = సూర్యుడు; సస్యం = పంటలు; వా = ఐనా; సలిలం = నీరు; వినా = నీరులేకుండగ.
భావం;-
 అతనిని చూడకుండిన యెడల నా లోని చైతన్యము నశించును. సూర్యుడు లేని లోకము ఉండవచ్చునేమొ. నీరు లేని పంటలు కూడ ఉండవచ్చునేమొ.
2.12.14.
అనుష్టుప్.
న తు రామం వినా దేహే
తిష్ఠేత్తు మమ జీవితమ్।
తదలం త్యజ్యతామేష
నిశ్చయః పాపనిశ్చయే!॥
టీక:-
 న = ఉండదు; తు = పాదపూరణము; రామం = రాముడు; వినా = లేకుండ; దేహే = దేహము నందు; తిష్ఠేత్తు = ఉండుట; మమ = నా యొక్క; జీవితమ్ = జీవించి ఉండుట; తత్ = ఆ; అలం = చాలును; త్యజ్యతామ్ = త్యజింపుము; ఏషః = దీనిని; నిశ్చయః = నిశ్చయము; పాపనిశ్చయే = పాపము చేయుటకు నిశ్చయించినదానా.
భావం;-
 రాముడు లేని యెడల నా శరీరములో ప్రాణము లుండవు. పాప నిశ్చయము కల కైకేయీ! ఇక చాలును. ఈ నీ నిర్ణయము విడిచిపెట్టుము.
2.12.15.
అనుష్టుప్.
అపి తే చరణై మూర్ధ్నా
స్పృశామ్యేష ప్రసీద మే।
కిమిదిం చింతితం? పాపే!
త్వయా పరమదారుణమ్॥
టీక:-
 అపి = కూడ; తే = నీ యొక్క; చరణై = పాదములు; మూర్ధ్నా = శిరసుతో; స్పృశామ్ = స్పృశించెదను; ఏష = దీనిని; ప్రసీద = ప్రసన్నము; మే = నాకు; కిం ఇదం = ఇట్లేల; చింతితం = ఆలోచించుచున్నావు; పాపే = పాపాత్మురాలా; త్వయా = నీ చే; పరమదారుణమ్ = పరమదారుణమైన.
భావం;-
 నే చెప్పిన ఈ మాట వింటే. నీ పాదములను నా శిరసు తాకించెదను. అనగా నీకు లొంగి ఉండెదను. ఓ పాపాత్మురాలా! ఇంతటి దురాలోచన నీకెట్లు కలిగినది?
2.12.16.
అనుష్టుప్.
అథ జిజ్ఞాససే మాం త్వం
భరతస్య ప్రియాప్రియే।
అస్తు యత్తత్త్వయా పూర్వం
వ్యాహృతం రాఘవం ప్రతి॥
టీక:-
 అథ = ఒకవేళ; జిజ్ఞాససే = తెలియగోరుచున్నావేమొ; మాం = నా యొక్క; త్వం = నీవు; భరతస్య = భరతుని యొక్క; ప్రియ అప్రియే = ఇష్టాయిష్టములు; అస్తు = ఉండనిమ్ము; యత్ = ఏ కారణముచే; త్వయా = నీచే; పూర్వ = పూర్వము; వ్యాహృతం = చెప్పబడిన; రాఘవం ప్రతి = రాముని గూర్చి.
భావం;-
 భరతుడనిన నాకు ఇష్టమొ అయిష్టమొ నీవు తెలియగోరుచున్నావేమొ. అది యట్లుండనిమ్ము. నీవు పూర్వము రాముని గూర్చి ఈ విధముగ అనియుంటివి గదా.
2.12.17.
అనుష్టుప్.
‘స మే జ్యేష్ఠస్సుత శ్రీమాన్
ధర్మజ్యేష్ఠ ఇతీవ మే’।
తత్త్వయా ప్రియవాదిన్యా
సేవార్థం కథితం భవేత్?॥
టీక:-
 సః = అతను; మే = నాకు; జ్యేష్ఠ సుతః = జ్యేష్ఠ పుత్రుడు; శ్రీమాన్ = లక్షణవంతుడు; ధర్మజ్యేష్ఠః = ధర్మాత్ములలో ఉన్నతుడు; ఇతి ఇవ = అని; మే = నాతో; తత్ = ఆ; త్వయా = నీచే; ప్రియవాదిన్యా = ప్రియముగా మాటలాడుదానవు; సేవః = సేవలు; అర్థం = వలన; కథితమ్ భవేత్ = చెప్పియున్నావు.
భావం;-
 "రాముడు నాకు పెద్దకొడుకు. శుభలక్షణుడు. ధర్మాత్ములలో ఉన్నతుడు". మధురభాషిణివైన నీవు నా తృప్తి కొరకై గాని, లేక రాముడు నీకొనర్చిన సేవలను బట్టి గాని అట్లు మాట్లాడినావేమొ.
2.12.18.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా శోకసంతప్తా
సంతాపయసి మాం భృశమ్।
ఆవిష్టాఽసి గృహం శూన్యం
సా త్వం పరవశం గతా॥
టీక:-
 తత్ = అది; శ్రుత్వా = విని; శోకసంతప్తా = దుఃఖితవై; సంతాపయసి = పీడించుచున్నావు; మాం = నన్ను; భృశమ్ = మిక్కిలి; ఆవిష్టా అసి = దుష్టశక్తిచే ఆవహింపబడి; గృహం శూన్యం = ఎవరును లేని గృహమునందు; సా త్వం = అటువంటి నీవు; పరవశం గతా = ఇతరులకు లోబడి.
భావం;-
 రామపట్టాభిషేక వార్త విని, దుఃఖితురాలవై, నన్ను పీడించుచున్నావు. దుష్టశక్తి ఆవహించి, ఇతరులకు లోబడి నీవు ఈ కోపగృహమును ప్రవేశించినట్లున్నావు.
2.12.19.
అనుష్టుప్.
ఇక్ష్వాకూణాంకులే దేవి!
సమ్ప్రాప్తస్సుమహానయమ్।
అనయో నయసంపన్నే
యత్ర తే వికృతా మతిః॥
టీక:-
 ఇక్ష్వాకూణాం కులే = ఇక్ష్వాకు వంశము నందు; దేవి = రాణీ; సంప్రాప్తః = సంప్రాప్తించినది; సుమహాన్ = చాల గొప్ప; అయమ్ = ఈ; అనయః = అనర్థము; నయసంపన్నే = పేరుప్రతిష్ఠలకు పెన్నిధి; యత్ర = దేనికారణముచే; వికృతామతిః = విపరీతబుద్ధి.
భావం;-
 ఓ దేవీ! ఇక్ష్వాకువంశము గొప్ప పేరు ప్రతిష్ఠలకు నిలయము. నీకు ఇటువంటి అనర్థహేతువైన విపరీతబుద్ధి ఏ కారణముచే కలిగినది?
2.12.20.
అనుష్టుప్.
నహి కించిదయుక్తం వా
విప్రియం వా పురా మమ।
అకరోస్త్వం విశాలాక్షి!
తేన న శ్రద్దధామ్యహమ్॥
టీక:-
 న హి = లేదు; కించిత్ = కొంచెము; అయుక్తం వా = అనుచితమైనది; వా = కాని; విప్రియం = ఇష్టములేనది; వా = కాని; పురా = ఇంతకుముందు; మమ = నాకు; అకరైః = చేయలేదు; త్వం = నీవు; విశాలాక్షి = విశాలమైన కన్నులు గలిగియున్న కైకేయి; తేన = ఆ కారణముచే; న శ్రద్ధధామి = విశ్వాసము లేదు; అహమ్ = నేను.
భావం;-
 కైకేయీ! నీవు ఇంతకు ముందెన్నడు, నా పట్ల తగనిపని గాని, అపకారము గాని చేసియుండలేదు. నేను ఆ కారణముచే నీ మాటలను విశ్వసింపలేకున్నాను.
2.12.21.
అనుష్టుప్.
నను తే రాఘవస్తుల్యో
భరతేన మహాత్మనా।
బహుశో హి సుబాలే! త్వమ్
కథాః కథయసే మమ॥
టీక:-
 నను = కదా; తే = నీకు; రాఘవః = రాముడు; తుల్యః = సమానుడు; భరతేన = భరతునితో; మహాత్మనా = మహాత్ముడైన; బహుశః = చాల మార్లు; హి; సుబాలే = మంచిదానవు కదా; త్వమ్ = నీవు; కథాః = కథలను; కథయసే = చెప్పియుంటివి; మమ = నాకు.
భావం;-
 బుద్ధిమంతురాలైన ఓ కైకేయి! నీకు మహాత్ముడైన రాముడు భరతునితో సమానమని నీవు నాతో పలుమారులు కథలు కథలుగా చెప్పియుంటివి కదా.
2.12.22.
అనుష్టుప్.
తస్య ధర్మాత్మనో దేవి
వనవాసం యశస్వినః।
కథం రోచయసే భీరు
నవవర్షాణిపంచచ॥
టీక:-
 తస్య = అతని యొక్క; ధర్మాత్మనః = ధర్మాత్ముడును; దేవి = కైకేయీ; వనవాసం = వనవాసమును; యశస్వినః = కీర్తిమంతుడును; కథం = ఎట్లు; రోచయసే = ఇష్టపడుచున్నావు; భీరు = భయపడు స్వభావముగల; నవవర్షాణిపంచచ = పద్నాలుగు సంవత్సరములు.
భావం;-
 అధర్మకార్యము చేయుటకు భయపడు ఓ దేవీ! ధర్మాత్ముడును, కీర్తిమంతుడును ఐన రాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుటకు నీవు ఎట్లు ఇష్టపడుచున్నావు??
గమనిక:-
 నవవర్షాణిపంచచ- నవ = తొమ్మిది; వర్షాణి = సంవత్సరములు; పంచ = ఐదును; చ = మఱియు (9+5 = 14సంవత్సరములు).
2.12.23.
అనుష్టుప్.
అత్యంతసుకుమారస్య
తస్య ధర్మే ధృతాత్మనః।
కథం రోచయసే వాసం
అరణ్యే భృశదారుణే॥
టీక:-
 అత్యంత = బహుమిక్కిలి; సుకుమారస్య = సుకుమారుడును; తస్య = అతని యొక్క; ధర్మే = ధర్మమునందు; ధృతాత్మనః = స్థిరచిత్తము కలవాడు; కథం = ఎట్లు; రోచయసే = ఇష్టపడుచున్నావు; వాసం = నివసించుటకు; అరణ్యే = అరణ్యమునందు; భృశదారుణే = చాల భయంకరమైన.
భావం;-
 ఎతో సుకుమారుడును, ధర్మమునందు స్థిరచిత్తము కలవాడును ఐన రాముడు దారుణమైన అడవియందు నివసించవలెనని నీవు ఎట్లు కోరుచున్నావు.
గమనిక:-
  అతి- అత్యంతర- అత్యంత
2.12.24.
అనుష్టుప్.
రోచయస్యభిరామస్య
రామస్య శుభలోచనే।
తవ శుశ్రూషమాణస్య
కిమర్థం విప్రవాసనమ్॥
టీక:-
 రోచయసి = ఇష్టపడుచున్నావు; అభిరామస్య = మనోహరుడును; రామస్య = రామునియొక్క; శుభలోచనే = మంచి కన్నులు కలదానా; తవ = నీకు; శుశ్రూషమాణస్య = సేవచేయుచున్న వాడును; కిమర్థం = దేనికొరకై; విప్రవాసనమ్ = దేశాతరవాసము, వావిళ్ళ నిఘంటువు, దేశబహిష్కరణ, సూర్యరాయాంధ్ర నిఘంటువు
భావం;-
 ఓ శుభనేత్రీ! రాముడు మనోహరుడని ఇష్టపడేదానివి, రాముడు నీకు సేవలు చేయువాడుకదా, దేశబహిష్కరణ చేయమంటున్నావు?
2.12.25.
అనుష్టుప్.
రామో హి భరతాద్భూయః
తవ శుశ్రూషతే సదా।
విశేషం త్వయి తస్మాత్తు
భరతస్య న లక్షయే॥
టీక:-
 రామో హి = రాముడే; భరతాత్ = భరతుని కన్న; భూయః = మఱింత; తవ = నీ యొక్క; శుశ్రూషతే = సేవచేయుచున్నాడు; సదా = ఎల్లప్పుడు; విశేషం = అధికముగ; త్వయి = నీపట్ల; తస్మాత్తు = ఆ కారణము వలన కూడ; భరతస్య = భరతుని యొక్క; న = లేదు; లక్షయే = అనిపించుట.
భావం;-
 రాముడు భరతుని కంటెను అధికముగా నీకు ఎల్లప్పుడును సేవ చేయుచున్నాడు కదా. అందువలన నీకు రామునిపై కంటెను భరతునిపై ఎక్కువ మక్కువ ఉండుటకు కారణమేదియును నా కగుపడుటలేదు.
2.12.26.
అనుష్టుప్.
శుశ్రూషాం గౌరవం చైవ
ప్రమాణం వచనక్రియామ్।
కస్తే భూయస్తరం కుర్యాత్
అన్యత్ర మనుజర్షభాత్॥
టీక:-
 శుశ్రూషాం = సేవను; గౌరవం చైవ = గౌరవమును; చైవ = కూడ; ప్రమాణం = తగు విధముగ; వచనక్రియామ్ = ఆజ్ఞాచరణమును; కః = ఎవరు; తే = నీకు; భూయస్తరం = మిక్కిల ఎక్కువగా; కుర్యాత్ = చేయును; అన్యత్ర = వేరొక; మనుజర్షభాత్ = మానవోత్తముడు.
భావం;-
 నీకు శుశ్రూష చేయుచు, పూజ్యభావముతో నిన్ను గౌరవించుచు, నీ ఆజ్ఞను శిరసావహించువాడు, మానవోత్తముడైన రాముడు కాక వేరొకరు ఎవరు గలరు?
గమనిక:-
  భూయః- భూయస్తరః- భూయస్తమః
2.12.27.
అనుష్టుప్.
బహూనాం స్త్రీసహస్రాణాం
బహూనాం చోపజీవినామ్।
పరివాదోఽపవాదో వా
రాఘవే నోపపద్యతే॥
టీక:-
 బహూనాం = అనేక; స్త్రీః = స్త్రీలు; సహస్రాణాం = వేలకొలది; బహూనాం చ = అనేక; చ; ఉపజీవినామ్ = ఆశ్రితులు, సేవకులు; పరివాదః = నింద, ఆక్షేపము, చేసిన పనిలో తప్పుపట్టుట; అపవాదః = అపనింద, నీలాపనింద, అబాండము; వా = లేదా; రాఘవే = రాముని విషయమున; న = కాదు; ఉపపద్యతే = భావ్యమైనది.
భావం;-
 వేలకొలది స్త్రీలు, చాలమంది సేవకులు ఉన్నారు. రామునిపై అభాండములు వేయుట గాని, అతనికి నిందించుట గాని ఏమాత్రము భావ్యము కాదు.
2.12.28.
అనుష్టుప్.
సాంత్వయన్సర్వభూతాని
రామశ్శుద్ధేన చేతసా।
గృహ్ణాతి మనుజవ్యాఘ్రః
ప్రియైర్విషయవాసినః॥
టీక:-
 సాంత్వయన్ = మంచి చేసికొనుచు; సర్వభూతాని = సకల జీవులను; రామః = రాముడు; శుద్ధేన = నిర్మలమైన; చేతసా = మనసుతో; గృహ్ణాతి = స్వాధీనపరచుకొనుచున్నాడు; మనుజవ్యాఘ్రః = పురుషసింహము; ప్రియైః = ప్రియముగా; విషయవాసినః = దేశములో నున్నవారిని.
భావం;-
 మానవశ్రేష్ఠుడైన రాముడు, నిర్మలమైన మనసుతో దేశవాసులతోను, సమస్త జీవులతోను ప్రియముగ ప్రవర్తించుచు మంచి చేసుకొనుచున్నాడు.
2.12.29.
అనుష్టుప్.
సత్యేన లోకాన్ జయతి
దీనాన్ దానేన రాఘవః।
గురూన్ శుశ్రూషయా వీరో
ధనుషా యుధి శాత్రవాన్॥
టీక:-
 సత్యేన = సత్యముతో; లోకాన్ = లోకులను; జయతి = జయించుచున్నాడు; దీనాన్ = దీనులను; దానేన = దానము చేసి; రాఘవః = రాముడు; గురూన్ = గురువులను; శుశ్రూషయః = సేవ చేసి; వీరః = వీరుడు; ధనుషా = ధనుస్సుచే; యుధి = యుద్ధమునందు; శాత్రవాన్ = శత్రువులను.
భావం;-
 సత్యవాక్పరిపాలనచే ప్రజల మనస్సులను గెలుచుచున్నాడు. దానముచే దీనులను రంజింపజేయు చున్నాడు. శుశ్రూషచే గురువుల మన్ననలను పొందుచున్నాడు. యుద్ధమునందు పరాక్రమముచే శత్రువులను జయించుచున్నాడు. రాముడు గొప్ప వీరుడు. ధర్మపరాయణత, దయాశీలత, దానమొసంగుట, యుద్ధము చేయుట అను నాలుగు విషయములందు అసమానమైనవాడు.
2.12.30.
అనుష్టుప్.
సత్యం దానం తపస్త్యాగో
మిత్రతా శౌచమార్జవమ్।
విద్యా చ గురుశుశ్రూషా
ధ్రువాణ్యేతాని రాఘవే॥
టీక:-
 సత్యం = సత్యము; దానం = దానము; తపః = తపస్సు; త్యాగః = త్యాగము; మిత్రతాః = స్నేహశీలత; శౌచమ్ = శుభ్రత; ఆర్జవమ్ = ఋజుత్వము; విద్యా = విద్య; చ = ఇంకను; గురుశుశ్రూషా = గురువులకు సేవ చేయుట; ధ్రువాణి = స్థిరమైనవి; ఏతాని = ఇవి అన్నియు; రాఘవే = రాముని యందు.
భావం;-
 సత్యము, దానము, తపస్సు, త్యాగముచేయుట, స్నేహశీలత. అంతర్బాహ్య పరిశుద్ధత, నిష్కపటము, విద్య, గురుశుశ్రూష అను సద్గుణములు రాముని యందు రూఢిగ నున్నవి.
(1) సత్యము- మనోవాక్కాయకర్మల యందు ఒకేవిధముగ నుండుట. (2) దానము- తనకు ఉన్నది ఇతరులకు ఇచ్చుట. (3)తపస్సు- శాస్త్రము విధించిన ప్రకారము యమనియమాది పాటించుట. (4) త్యాగము- ఇతరుల అవసరములకు తన అవసరము విడుచుట. (5) మిత్రత- ఇతరులందు ఆత్మీయత ప్రసరించుట. (6) శౌచము- అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి కలిగి ఉండుట. (7) ఆర్జవము-సరళత్వము, కపటము లేకపోవుట. (8) విద్య- సకల విద్యలు, తత్వజ్ఞానములు కలిగి ఉండుట. (9) గురుశుశ్రూష- విద్యా బోధకులకు, పెద్దలకు చేయు సేవలు.
2.12.31.
అనుష్టుప్.
తస్మిన్నార్జవసంపన్నే
దేవి! దేవోపమే కథమ్।
పాపమాశంససే రామే
మహర్షిసమతేజసి॥
టీక:-
 తస్మిన్ = ఆ; ఆర్జవ = ఋజుత్వము; సంపన్నే = సమృద్ధిగా కలవాడు; దేవి = దేవీ; దేవోపమే = దేవతలతో సమానమైన; కథమ్ = ఎట్లు; పాపమ్ = పాతకమును; ఆశంససే = ఆశించుచున్నావు; రామే = రాముని విషయమై; మహర్షి సమతేజసే = మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు.
భావం;-
 ఓ దేవీ! రాముడు సద్గుణసంపన్నుడు. మిక్కిలి ఋజుస్వభావము కలవాడు, దేవతలతో సమానమైనవాడు. మహర్షులవంటి తేజస్సు గలవాడు. అట్టి రాముని పట్ల ఇట్టి పాపపుటాలోచన నీకెట్లు కలిగినది?
2.12.32.
అనుష్టుప్.
న స్మరామ్యప్రియం వాక్యం
లోకస్య ప్రియవాదినః।
స కథం త్వత్కృతే రామం
వక్ష్యామి ప్రియమప్రియమ్॥
టీక:-
 న స్మరామి = తలపలేను; అప్రియం = అప్రియమైన; వాక్యం = మాటను; లోకస్య = లోకమునకు; ప్రియవాదినః = ప్రియముగ మాటలాడువాడు; సః = అటువంటి; కథం = ఎట్లు; త్వత్కృతే = నీ కొరకై; రామం = రాముని గూర్చి; వక్ష్యామి = పలికెదను; ప్రియమ్ = ప్రియమైన; అప్రియమ్ = అప్రియమైన.
భావం;-
 రాముడు ప్రజలందరి యెడల ప్రియముగ మాటలాడును గాని అప్రియముగ మాటలాడుట నేనెరుగను. అటువంటి రామునితో అప్రియమైన మాటను నీ కొరకై ఎట్లు పలికెదను.
2.12.33.
అనుష్టుప్.
క్షమా యస్మిన్దమస్త్యాగ
సత్యం ధర్మః కృతజ్ఞతా।
అప్యహింసా చ భూతానాం
తమృతే కా గతిర్మమ॥
టీక:-
 క్షమా = సహనము; యస్మిన్ = ఎవనినియందు; దమః = ఇంద్రియనిగ్రహము; త్యాగః = త్యాగము; సత్యం = సత్యము; ధర్మః = ధర్మము; కృతజ్ఞతా = కృతజ్ఞత; అపి = మఱియు; అహింసా = అహింస; భూతానాం = జీవులయొక్క; తమ్ = అతను; ఋతే = కాక; కా = ఎవరు; గతిః = దిక్కు; మమ = నాకు.
భావం;-
 సహనము, ఇంద్రియనిగ్రహము, త్యాగనిరతి, సత్యము, ధర్మము, కృతజ్ఞత, సకల జీవులపట్ల అహింస అను గుణములు కలిగియున్న రామునికన్న నాకు వేరు దిక్కెవరు.
2.12.34.
అనుష్టుప్.
మమ వృద్ధస్య కైకేయి
గతాంతస్య తపస్వినః।
దీనం లాలప్యమానస్య
కారుణ్యం కర్తుమర్హసి॥
టీక:-
 మమ = నా యొక్క; వృద్ధస్య = వృద్ధాప్యముపట్ల; కైకేయి = కైకేయీ; గతాంతస్య = చరమాంకముననున్న; తపస్వినః = తపించుచున్న; దీనం = దీనముగ; లాలప్యమానస్య = విలపించుచున్న; కారుణ్యం = కరుణను; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగియున్నావు.
భావం;-
 కైకేయీ! వృద్ధుడనై నా జీవిత చరమాంకమున దీనముగ పరితపించుచు, విలపించుచున్న నాపట్ల కరుణజూపుము.
2.12.35.
అనుష్టుప్.
పృథివ్యాం సాగరాంతాయాం
యత్కించిదధిగమ్యతే।
తత్సర్వం తవ దాస్యామి
మా చ త్వాం మన్యురావిశేత్॥
టీక:-
 పృథివ్యాం = భూమిపై; సాగరాంతాయాం = సముద్రాంతము వరకు ఉన్న; యత్కిఞ్చిత్ = ఏదైతే; అధిగమ్యతే = కలిగి యున్నదో; తత్ = అది; సర్వం = అంతయు; తవ = నీకు; దాస్యామి = ఇచ్చెదను; మా = వద్దు; త్వాం = నిన్ను; మన్యుః = కోపము; ఆవిశేత్ = ఆవేశింపబడుట.
భావం;-
 సముద్రము చివరి వరకు విస్తరించియున్న ఈ భూమిపై పొందగలిగినదంతయు నీకు ఇచ్చెదను. నీవు కోపము చెందకుము.
2.12.36.
అనుష్టుప్.
అంజలిం కుర్మి కైకేయి
పాదౌ చాపి స్పృశామి తే।
శరణం భవ రామస్య
మాఽధర్మో మామిహ స్పృశేత్॥
టీక:-
 అంజలిం = ముకుళిత హస్తములు; కుర్మి = చేసి; కైకేయి = కైకేయీ; పాదౌ చ అపి = పాదములను కూడ; స్పృశామి = తాకెదను; నీ యొక్క; శరణం = రక్ష; భవ = అగుము; రామస్య = రాముని యొక్క; మా = వద్దు; అధర్మః = అధర్మము; మామ్ = నన్ను; ఇహ = ఈ విషయమున; స్పృశేత్ = తాకుట.
భావం;-
 కైకేయి! నేను నీకు అంజలి ఘటించి నమస్కరించుచున్నాను. నీ పాదములను కూడ పట్టుకొనెదను. ఇందువలన నాకు అధర్మము సోకకుండుగాక.
2.12.37.
అనుష్టుప్.
ఇతి దుఃఖాభిసంతప్తం
విలపంతమచేతనమ్।
ఘూర్ణమానం మహారాజం
శోకేన సమభిపౢతమ్॥
టీక:-
 ఇతి = ఇట్లు; దుఃఖాః = దుఃఖముచే; అభిసంతప్తం = పరితపించువాడు; విలపంతమ్ = విలపించుచున్నవాడు; అచేతనమ్ = నిశ్చేష్టుడైనవాడు; ఘూర్ణమానమ్ = భ్రమించిపోవుచున్నవాడు; మహారాజం = మహారాజును; శోకేన = శోకముచే; సమభిపౢతమ్ = నిండినవాడు.
భావం;-
 దశరథమహారాజు, దుఃఖముతో పరితపించుచు, విలపించుచు, చేష్టలుడిగి, శోకభరితుడై యుండెను.అతనితో,
2.12.38.
అనుష్టుప్.
పారం శోకార్ణవస్యాశు
ప్రార్థయంతం పునః పునః।
ప్రత్యువాచాథ కైకేయీ
రౌద్రా రౌద్రతరం వచః॥
టీక:-
 పారం = అంతము; శోక ఆర్ణవ అస్య = శోకసాగరము యొక్క; ఆశు = తఱచు; ప్రార్థయంతం = వేడుకొను చున్నవాడు; పునః పునః = మరల మరల; ప్రత్యువాచ = బదులు పలికెను; అథ = తరువాత; కైకేయీ = కైకేయి; రౌద్రా = క్రూరాత్మురాలైన; రౌద్రతరం = చాలా తీక్షణమైన; వచః = మాటను.
భావం;-
 శోకసాగరమున మునిగి తఱచుగా వేడుకొనుచున్న దశరథమహారాజుతో, క్రూరాత్మురాలైన కైకేయి బహు తీక్షణముగా ఇలా అనెను.
2.12.39.
అనుష్టుప్.
“యది దత్త్వా వరౌ రాజన్!
పునః ప్రత్యనుతప్యసే।
ధార్మికత్వం కథం వీర!
పృథివ్యాం కథయిష్యసి॥
టీక:-
 యది = ఇట్లు; దత్వా = ఇచ్చి; వరౌ = రెండు వరములను; రాజన్ = రాజా; పునః = మరల; ప్రత్యనుతప్యసే = ఎదురు పరితపించుచుంటివి; ధార్మికత్వం = ధర్మగుణమును; కథం = ఎట్లు; వీర = వీరుడా; పృథివ్యాం = లోకములో; కథయిష్యసి = చెప్పుకొనెదవు.
భావం;-
 “ఓ మహారాజా! వీరా! నాడు వరములనిచ్చి పిమ్మట ఇలా పరితపించుచుంటివి. ఇక నీవు ధార్మికుడనని లోకములో ఎట్లు చెప్పుకొనగలవు?
2.12.40.
అనుష్టుప్.
యదా సమేతా బహవః
త్వయా రాజర్షయ స్సహ।
కథయిష్యంతి ధర్మజ్ఞ
తత్ర కిం ప్రతివక్ష్యసి॥
టీక:-
 యదా = ఎప్పుడు; సమేతా = కలిసి; బహవః = అనేక; త్వయా = నీతో; రాజర్షయః = రాజర్షులు; సహ = కూడి; కథయిష్యంతి = చెప్పెదరో; ధర్మజ్ఞ = ధర్మము నెరిగినవాడా; తత్ర = అప్పుడు; కిం = ఏమని; ప్రతివక్ష్యసి = బదులు చెప్పెదవు.
భావం;-
 ఓ ధర్మజ్ఞుడా! అనేక రాజర్షులు నిన్ను కలసి, నీతో ఈ విషయమై చర్చించునపుడు నీవు వారికి ఏమని చెప్పెదవు.
2.12.41.
అనుష్టుప్.
యస్యాః ప్రసాదే జీవామి
యా చ మామభ్యపాలయత్।
తస్యాః కృతమ్ మయా మిథ్యా
కైకేయ్యా ఇతి వక్ష్యసి॥
టీక:-
 యస్యాః = ఎవరి యొక్క; ప్రసాదే = దయవలన; జీవామి = జీవించి ఉంటినో; యా = ఎవరు; మామ్ = నన్ను; అభ్యపాలయత్ = రక్షించినదో; తస్యాః = ఆమెకు; కృతం = చేయబడినది; మయా = నా చే; మిథ్యా = అసత్యము; కైకేయ్యాః = కైకేయిపట్ల; ఇతి = ఇట్లు; వక్ష్యసి = చెప్పెదవా.
భావం;-
 ఎవరి దయవలన నేను జీవించి ఉంటినో, ఎవరు నన్ను రక్షించెనో అట్టి కైకేయిపట్ల అసత్యముగా ప్రవర్తించుచుంటిని అని చెప్పెదవా?
2.12.42.
అనుష్టుప్.
కిల్బిషం త్వం నరేంద్రేణాం
కరిష్యసి నరాధిప।
యో దత్వా వరమద్యైవ
పునరన్యాని భాషసే॥
టీక:-
 కిల్బిషం = కళంకమును; త్వం = నీవు; నరేంద్రేణాం = రాజులకు; కరిష్యసి = కలిగించుచున్నావు; నరాధిప = మహారాజా; యః = ఏ నీవు; దత్త్వా = ఇచ్చి; వరమ్ = వరమును; అద్యైవ = ఇపుడే; పునః అన్యాని = మరల వేరొక విధముగ; భాషసే = పలుకుచుంటివో.
భావం;-
 మహారాజా! వరమిచ్చెదనని యిపుడే పలికి, మరల వేరొక విధముగా మాటలాడి రాజులకే కళంకము కలిగించుచున్నావు.
2.12.43.
అనుష్టుప్.
శైబ్యశ్శ్యేనకపోతీయే
స్వమాంసం పక్షిణే దదౌ।
అలర్కశ్చక్షుషీ దత్వా
జగామ గతిముత్తమామ్॥
టీక:-
 శైబ్యః = శిబిచక్రవర్తి; శ్యేనః = గ్రద్దకును; కపోతీయే = పావురమునకును మధ్యలో; స్వమాంసం = తన యొక్క మాంసమును; పక్షిణే = పక్షికి (గ్రద్దకు); దదౌ = ఇచ్చెను; అలర్కః = అలర్క మహారాజు; చక్షుసీ = నేత్రములను; దత్వా = ఇచ్చి; జగామ = పొందెను; గతిం ఉత్తమామ్ = ఉత్తమ లోకములను.
భావం;-
 ఒక గ్రద్ద పావురమును చంపబోయినపుడు, శిబిచక్రవర్తి ఆ పావురపుటెత్తు మాంసమును తన తొడనుండి కోసి గ్రద్ద కొసంగి ఆ పావురము యొక్క ప్రాణమును కాపాడినాడు. ఒక గ్రుడ్డి బ్రాహ్మణునకు అలర్కుడను మహారాజు నేత్రదానము చేసినాడు.
గమనిక:-
  (1) పూర్వము శిబిచక్రవర్తి ఔదార్యము పరీక్షింప గోరి దేవేంద్రుడు డేగ రూపం ధరించి, పావురము రూపం ధరించిన అగ్నిదేవుని వేటాడుతూ తఱుము చుండెను. పావురము శిబిచక్రవర్తిని ఆశ్రయించెను. డేగవచ్చి “పావురము నా ఆహారము, నేను భక్షింపవలయును దానిని విడువుము” అనెను. శిబిచక్రవర్తి పావురము బరువుకు సమానమైన మాంసము తన శరీరమునుండి కోసి ఇచ్చి పావురమును రక్షించెను. ఇంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతని ఔదార్యము మెచ్చుకొని, వరములు ఉత్తమలోకములు అనుగ్రహించిరి. (2) పూర్వము రాజర్షి అలర్కుని కడకు ఒక అంధుడు వచ్చి, తనకు నేద్రదానము చేయమని అడిగెను. వెంటనే ఆ అలర్క మహారాజు తననేత్రములను ఆ బ్రాహ్మణునకు ఇచ్చెను. పరమగతిని పొందెను
2.12.44.
అనుష్టుప్.
సాగరస్సమయం కృత్వా
న వేలామతివర్తతే।
సమయం మాఽనృతం కార్షీః
పూర్వవృత్తమనుస్మరన్॥
టీక:-
 సాగరః = సముద్రుడు; సమయం = ప్రతిజ్ఞను; కృత్వా = చేసి; న = లేదు; వేలామ్ = చెలియలికట్టను; అతివర్తతే = దాటుట; సమయం = ప్రతిజ్ఞను; మా = వద్దు; అనృతం = అబద్ధముగా; కార్షీః = చేయుట; పూర్వవృత్తమ్ = పూర్వీకుల చరిత్రను; అనుస్మరన్ = జ్ఞప్తికి తెచ్చుకొని.
భావం;-
 సముద్రుడు తాను దేవతల కొసంగిన మాటకు కట్టుబడి చెలియలికట్టను ఎన్నడును దాటలేదు. అట్టి పూర్వీకుల చరిత్రను జ్ఞప్తియందుంచుకొని, నీవు చేసిన ప్రతిజ్ఞను వమ్ము చేయకుము.
2.12.45.
అనుష్టుప్.
స త్వం ధర్మం పరిత్యజ్య
రామం రాజ్యేఽభిషిచ్య చ।
సహ కౌసల్యయా నిత్యం
రంతుమిచ్ఛసి దుర్మతే॥
టీక:-
 సః = అటువంటి; త్వం = నీవు; ధర్మం = ధర్మమును; పరిత్యజ్య = విడిచి; రామం = రాముని; రాజ్యే = రాజ్యమునందు; అభిషిచ్య చ = అభిషేకించి; చ = మఱియు; సహ = కూడి; కౌసల్య = కౌసల్యతో; నిత్యం = నిత్యము; రంతుమ్ = విలసిల్లుటకు; ఇచ్ఛసి = ఇష్టపడుచున్నావు; దుర్మతే = దుష్టబుద్ధితో.
భావం;-
 ఓ దుర్భుద్దితో నీవు ధర్మమును త్యజించి, రాముని రాజ్యాభిషిక్తునిజేసి, కౌసల్యతో విలసిల్లుటకు ఇష్టపడుచున్నావు.
2.12.46.
అనుష్టుప్.
భవత్వధర్మో ధర్మో వా
సత్యం వా యది వొ ఽనృతమ।
యత్త్వయా సంశ్రుతం మహ్యం
తస్య నాస్తి వ్యతిక్రమః॥
టీక:-
 భవతు = అగుగాక; అధర్మః = అధర్మము; ధర్మః వా = ధర్మము గాని; సత్యం వా = సత్యము గాని; యది వా = లేక; అనృతమ్ = అసత్యము; యత్ = ఏది; త్వయా = నీచే; సంశ్రుతం = అంగీకారము తెలుపబడినదో; మహ్యం = నాకొరకై; తస్య = దానియొక్క; నాస్తి = లేదు; వ్యతిక్రమః = మార్పు.
భావం;-
 నా కోరిక ధర్మమైనను, అధర్మమైనను, సత్యమైనను, అసత్యమైనను కానిమ్ము, నీవు నా కిచ్చిన మాటను మార్చుటకు వీలులేదు.
2.12.47.
అనుష్టుప్.
అహం హి విషమద్యైవ
పీత్వా బహు తవాగ్రతః।
పశ్యతస్తే మరిష్యామి
రామో యద్యభిషిచ్యతే॥
టీక:-
 అహం = నేను; హి = కదా; విషమ్ = విషమును; అద్య ఏవ = ఇప్పుడే; పీత్వా = త్రాగి; బహు = చాల; తవ = నీయొక్క; అగ్రతః = ఎదుట; పశ్యతః = చూచుచుండగనే; తే = నీవు; మరిష్యామి = మరణించెదను; రామః = రాముడు; యది = ఒకవేళ; అభిషిచ్యతే = అభిషేకింపబడినచో.
భావం;-
 ఒకవేళ రాముడు అభిషేకించబడినచో, నేను నీ ఎదుటనే విషమును త్రాగి నీవు చూచుచుండగనే మరణించెదను.
2.12.48.
అనుష్టుప్.
ఏకాహమపి పశ్యేయం
యద్యహం రామమాతరమ్।
అంజలిం ప్రతిగృహ్ణంతీమ్
శ్రేయో నను మృతిర్మమ॥
టీక:-
 ఏక = ఒక్క; అహమ్ = దినము; అపి = ఐనను; పశ్యేయం = చూడవలసి వచ్చుట; యది = ఐనచో, జరిగినచో; అహం = నేను; రామమాతరమ్ = రామునియొక్క తల్లిని; అంజలిం = నమస్కారమును; ప్రతిగృహ్ణంతీమ్ = స్వీకరించుచున్నదానినిగా; శ్రేయృః = శ్రేయస్కరము; నను = కదా; మృతిః = మరణమే; మమ = నాకు.
భావం;-
 రాముని తల్లియైన కౌసల్యకు ఒక్కనాడైనను నేను నమస్కరింపవలసి వచ్చుటకన్న, నాకు మరణమే మేలు గదా.
2.12.49.
అనుష్టుప్.
భరతేనాత్మనా చాహం
శపే తే మనుజాధిప।
యథా నాన్యేన తుష్యేయమ్
ఋతే రామవివాసనాత్”॥
టీక:-
 భరతేన = భరతునితోడను; ఆత్మనా = నాతోడను; చ = మఱియు; అహం = నేను; శపే = ప్రమాణము చేయుచున్నాను; తే = నీకు; మనుజాధిప = రాజా; యథా = ఏమనగా; న = లేను; అన్యేన = మరి యే విధముగను; తుష్యేయమ్ = సంతోషించగ; ఋతే = రూఢిగ; రామః = రాముని; వివాసనాత్ = ప్రవాసముచే, స్వదేశబహిష్కరణ.
భావం;-
 రాజా! భరతునిపైనను, నాపైనను ప్రమాణము చేసి చెప్పుచున్నాను. రాముని దేశము నుండి బహిష్కారముచే తప్ప నాకు మరి యెందువలనను సంతోషము కలుగదు.”
2.12.50.
అనుష్టుప్.
ఏతావదుక్త్వా వచనం
కైకేయీ విరరామ హ।
విలపంతం చ రాజానం
న ప్రతివ్యాజహార సా॥
టీక:-
 ఏతావత్ = ఇంతగ; ఉక్త్వా = పలికి; వచనం = మాటను; కైకేయీ = కైకేయి; విరరామ = చాలించెను; హ = పాదపపణం; విలపంతం = వివపించుచున్న; రాజానం = రాజును గూర్చి; న ప్రతివ్యాజహార = మారుమాటలాడలేదు; సా = ఆమె.
భావం;-
 కైకేయి ఈ విధముగ పలికి మాటలాడుట చాలించెను. దశరథుడు ఎంత విలపించుచున్నను స్పందించలేదు.
2.12.51.
అనుష్టుప్.
శ్రుత్వా తు రాజా కైకేయ్యా
వృతం పరమశోభనమ్।
రామస్య చ వనే వాస
మైశ్వర్యం భరతస్య చ॥
టీక:-
 శ్రుత్వా తు = విని; రాజా = రాజు; కైకేయ్యా = కైకేయిచే; వృతం = కోరబడినది; పరమ్ = చాల; అశోభనమ్ = అమంగళకరమైన; రామస్య = రాముని యొక్క; వనే = వనమునందు; వాసమ్ = నివసించుట; ఐశ్వర్యం = ఐశ్వర్యము; భరతస్య = భరతునకును; చ = పాదపూరణం.
భావం;-
 కైకేయిచే అమంగళకరముగ కోరబడిన రాముని వనవాసమును, భరతుని రాజ్యాభిషేకమును దశరథుడు విని నిశ్చేష్టుడయ్యెను.
2.12.52.
అనుష్టుప్.
నాభ్యభాషత కైకేయీం
ముహూర్తం వ్యాకులేంద్రియః।
ప్రైక్షతానిమిషో దేవీం
ప్రియామప్రియవాదినీమ్॥
టీక:-
 న = లేదు; అభ్యభిభాషత = మాటలాడట; కైకేయీం = కైకేయిని గూర్చి; ముహూర్తం = ముహూర్త కాలము; వ్యాకులేంద్రియః = మనోవైకల్యము; ప్రైక్షత = చూచెను; అనిమిషః = కనురెప్పవేయకుండగ; దేవీం = దేవిని (కైకేయిని); ప్రియామ్ = ప్రియమైన; అప్రియవాదినీమ్ = అప్రియముగ మాటలాడుచున్న.
భావం;-
 దశరథుడు చేష్టలుడిగి కైకేయితో ఏమియు మాటలాడలేకపోయెను. అప్రియములాడుచున్న తన ప్రియమైన కైకేయిని కనురెప్పవేయకుండసాగెను.
2.12.53.
అనుష్టుప్.
తాం హి వజ్రసమాం వాచమ్
ఆకర్ణ్య హృదయాప్రియామ్।
దుఃఖశోకమయీం ఘోరాం
రాజా న సుఖితోఽభవత్॥
టీక:-
 తాం = ఆ; వజ్ర = పిడుగు; సమాం = వంటి; వాచమ్ = మాటను; ఆకర్ణ్య = విని; హృదయ = మనసునకు; అప్రియామ్ = అప్రియమైనది; దుఃఖః = దుఃఖము; శోకః= శోకములతో; మయీం = నిండినది; ఘోరాం = ఘోరమైనది; రాజా = రాజు; న = లేకపోయెను; సుఖితః = సుఖముగ; అభవత్ = ఉండుట.
భావం;-
 పిడుగువలె నున్నది, మనస్కరించనిది, దుఃఖశోకభరితమైనది, ఘోరమైనది ఐన ఆ మాట వినిన దశరథుడు సుఖముగ నుండలేక పోయెను.
2.12.54.
అనుష్టుప్.
స దేవ్యా వ్యవసాయం చ
ఘోరం చ శపథం కృతమ్।
ధ్యాత్వా రామేతి నిశ్శ్వస్య
ఛిన్నస్తరురివాపతత్॥
టీక:-
 సః = అతడు; దేవ్యాః = దేవి (కైక) యొక్క; వ్యవసాయం = విపరీత నిర్ణయము/పని ; చ = పాదపూరణము; ఘోరం చ = ఘోరమైన; చ = మఱియు; శపథం = ప్రతిజ్ఞ; కృతమ్ = చేయబడిన; ధ్యాత్వా = తలచుకొని; రామ ఇతి = రామా అని; నిశ్శ్వస్య = నిట్టూర్చి; ఛిన్నః = నరకబడిన; తరుః = వృక్షము; ఇవ = వలె; అపతత్ = పడిపోయెను.
భావం;-
 కైకేయి విపరీతపుపని ప్రతిజ్ఞలను తలచుకొనుచు, దశరథుడు "రామా" అని పెద్దగ నిట్టూర్చి, నరకబడిన వృక్షము వలె నేలపై పడిపోయెను.
2.12.55.
అనుష్టుప్.
నష్టచిత్తో యథోన్మత్తో
విపరీతో యథాఽతురః।
హృతతేజా యథా సర్పో
బభూవ జగతీపతిః॥
టీక:-
 నష్ట = పోయిన; చిత్తః = మనసుకలవాడు; యథః = వలె; ఉన్మత్తః = పిచ్చివాని; విపరీతః = విపరీతమైన; యథ = వలె; ఆతురః = రోగి; హృత = ఆర్పబడిన; తేజః = తేజస్సు కలవాడు; యథా = వలె; సర్పః = సర్పము; బభూవ = అయ్యెను; జగతీపతిః = రాజు.
భావం;-
 దశరథుడు మనస్సు చలించిన పిచ్చివాని వలె, వింతప్రవర్తన గల వ్యాధిగ్రస్తుని వలె, శక్తి ఉడిగిన పాము వలె నుండెను.
2.12.56.
అనుష్టుప్.
దీనయా తు గిరా రాజా
ఇతి హోవాచ కైకయీమ్।
“అనర్థమిమమర్థాభం
కేన త్వముపదర్శితా”॥
టీక:-
 దీనయా = దీనమైన; తు = పాదపూరణము; గిరా = వాక్కుచే; రాజా = రాజు; ఇతి = ఇట్లు; ఉవాచ = పలికెను; కైకేయీమ్ = కైకేయిని గూర్చి; అనర్థమ్ = అనర్థమును; ఇమమ్ = ఈ; అర్థాభం = ప్రయోజనకరముగనున్న; కేన = ఎవనిచే; త్వమ్ = నీవు; ఉపదర్శితా = చూపబడినావు.
భావం;-
 దశరథుడు దీనముగా కైకేయితో ఇట్లు పలికెను. "లాభదాయకముగ అనిపించు ఈ అనర్థకరమైన ఆలోచన నీకు ఎవరివలన కలిగినది.”
2.12.57.
అనుష్టుప్.
భూతోపహతచిత్తేవ
బ్రువంతీ మాం న లజ్జసే।
శీలవ్యసనమేతత్తే
నాభిజానామ్యహం పురా॥
టీక:-
 భూతః = భూతముచే; అపహత = ఆవహింపబడిన; చిత్త = మనసు; ఇవ = వలె; బ్రువంతీ = మాటలాడుచున్నావు; మాం = నన్ను గూర్చి; న లజ్జసే = సిగ్గుపడక; శీలవ్యసనమ్ = విపరీతబుద్ధి; ఏతత్ = ఈ; తే = నీకు; న అభిజానామి = ఎరుగను; అహం = నేను; పురా = పూర్వము.
భావం;-
 భూతముచే ఆవహింపబడిన చిత్తము కలదానివలె మాటలాడుచున్నావు. నీకు సిగ్గు లోపించినదా? మునుపు ఎన్నడును నీకు ఇటువంటి విపరీత బుద్ధి యుండుట నేనెరుగను.
2.12.58.
అనుష్టుప్.
బాలాయాస్తత్త్విదానీం తే
లక్షయే విపరీతవత్।
కుతో వా తే భయం జాతం
యా త్వమేవంవిధం వరమ్॥
టీక:-
 బాలాయాః = చిన్నతనమున; తత్ = దీనిని; ఇదానీం = ఇప్పుడు; తే = నీకు; లక్షయే = చూచుచున్నాను; విపరీతవత్ = విపరీతముగ; కుతః = ఎవరినుండి; తే = నీకు; భయం = భయము; జాతం = కలిగినది; యా = ఏ; త్వమ్ = నీవు; ఏవం = ఈ; విధం = విధముగ; వరమ్ = వరమును.
భావం;-
 నీ బాల్యమునందు నీలో లేని విపరీతబుద్ధి ఇప్పుడు నీయందు కనబడుచున్నది. నీవు ఎవరివలన భయపడి ఈ వరములను కోరుచున్నావు?
2.12.59.
అనుష్టుప్.
రాష్ట్రే భరతమాసీనం
వృణీషే రాఘవం వనే।
విరమైతేన భావేన
త్వమేతేనానృతేన వా॥
టీక:-
 రాష్ట్రే = రాజ్యమునందు; భరతమ్ = భరతుడు; ఆసీనం = ఉండవలెనని; వృణీషే = కోరుచున్నావు; రాఘవం = రాముడు; వనే = వనమునందు; విరమ్ = విరమించుము; ఏతేన భావేన = ఈ ఉద్దేశమును; త్వమ్ = నీవు; ఏతేన = దీనితో; అనృతేన = అసంబద్ధమైనది; వా = ఐనది.
భావం;-
 భరతుడు రాజ్యమునందుండ వలెనని, రాముడు వనవాసము చేయవలెను అనెడి నీ అసంబద్ధమైన కోరికను విడువుము.
2.12.60.
అనుష్టుప్.
యది భర్తుః ప్రియం కార్యం
లోకస్య భరతస్య చ।
నృశంసే పాపసంకల్పే!
క్షుద్రే! దుష్కృతకారిణి॥
టీక:-
 యది = ఐనచో; భర్తుః = భర్తకు; ప్రియం = ప్రియమైన; కార్యం = కార్యమును; లోకస్య = లోకమునకు; భరతస్య = భరతునకు; చ = పాదపూరణము; నృశంసే = క్రూరురాలా; పాపసంకల్పే = పాపపుటాలోచన కలదాన; క్షుద్రే = నీచురాలా; దుష్కృతకారిణి = దుష్కార్యములు చేయుదాన.
భావం;-
 క్రూరాత్మురాలా! పాపపుటాలోచన కలదానా! నీచురాలా! దుష్కర్మల నొనరించుదానా! నీ భర్తకును, లోకమునకును, భరతునకును, ప్రియము చేకూర్చుటకై రాముని అరణ్యవాసమునకు పంపెడి నీ దురుద్దేశమును మానుము.
2.12.61.
అనుష్టుప్.
కిన్ను దుఖమలీకం వా
మయి రామే చ పశ్యసి।
న కథంచిదృతే రామాత్
భరతో రాజ్యమావసేత్॥
టీక:-
 కిం ను = ఏ; దుఃఖమ్ = దుఃఖకారకమైన; అలీకం = అపరాధము; వా = కాని; మయి = నా యందు; రామే = రాముని యందు; పశ్యసి = చూచుచుంటివి; న = లేడు; కథంచిత్ = ఏ విధముగను; దృతే = విడిచి; రామాత్ = రాముని; భరతః = భరతుడు; రాజ్యమ్ = రాజ్యమును; ఆవసేత్ = అధిష్ఠించుట.
భావం;-
 నీవు, నా యందుగాని, రాముని యందుగాని, దుఃఖకారకమైన విషయములు గాని, అపరాధములు గాని ఏమి కనబడినవి? భరతుడు రాముని విడిచి రాజ్యాధికారమును చేపట్టడు.
2.12.62.
అనుష్టుప్.
రామాదపి హి తం మన్యే
ధర్మతో బలవత్తరమ్।
కథం ద్రక్ష్యామి రామస్య
వనం గచ్ఛేతి భాషితే॥
టీక:-
 రామాత్ = రామునికంటె; అపి = కూడ; తం = అతనిని; మన్యే = తలచుచున్నాను; ధర్మతః = ధర్మము వలన; బలవత్తరమ్ = ఎక్కువ బలవంతునిగా; కథం = ఎట్లు; ద్రక్ష్యామి = చూడగలను; రామస్య = రాముని యొక్క; వనం = అడవికి; గచ్ఛ = వెళ్ళుము; ఇతి = అని; భాషితే = అనినంతనే.
భావం;-
 భరతుడు రామునికంటె ధర్మమునందు ఎక్కువ పట్టుదల గలవాడని అనుకొనుచున్నాను. అడవికి పొమ్మని చెప్పి రాముని ముఖమెట్లు చూడగలను.
2.12.63.
అనుష్టుప్.
ముఖవర్ణం వివర్ణం తం
యథైవేందుముపప్లుతమ్।
తాం హి మే సుకృతాం బుద్ధిం
సుహృద్భిస్సహ నిశ్చితామ్॥
టీక:-
 ముఖవర్ణం = ముఖవర్ణము; వివర్ణం = కళావిహీనమైన; తం = నీవు; యథ = ఎట్లైతే; ఇవ = వలె; ఇందుమ్ = చంద్రుడు; ఉపప్లుతమ్ = గ్రహణము పట్టిన; తాం = ఆ; మే = నా యొక్క; సుకృతాం = చక్కగా చేయబడినది; బుద్ధిం = బుద్ధిని; సుహృద్భిః = మిత్రులతో; సహ = కలసి; నిశ్చితామ్ = నిశ్చయించబడిన.
భావం;-
 గ్రహణము పట్టిన చంద్రుని వలె, కళావిహీనమైన రాముని ముఖమును ఎట్లు చూడగలను. నేను నా మిత్రులతో సమాలోచనచేసి ఇట్లు నిర్ణయించినాను.
2.12.64.
అనుష్టుప్.
కథం ద్రక్ష్యామ్యపావృత్తాం
పరైరివ హతాం చమూమ్।
కిం మాం వక్ష్యంతి రాజానో
నానాదిగ్భ్య స్సమాగతాః॥
టీక:-
 కథం = ఎట్లు; ద్రక్ష్యామి = చూడగలను; అపావృత్తాం = తారుమారు చేయబడిన; పరైః = శత్రువులచే; ఇవ = వలె; హతాం = త్రిప్పి కొట్టబడిన; చమూమ్ = సేన; కిం = ఎట్లు; మాం = నన్ను గూర్చి; వక్ష్యంతి = పలుకగలరు; రాజానః = రాజులు; నానా = వివిధ; దిగ్భ్యః = దిక్కులనుండి; సమాగతః = వచ్చిన.
భావం;-
 నా నిర్ణయమును, శత్రువులు సేనను త్రిప్పికొట్టినట్లుగ నీవు తిరస్కరించి ప్రవర్తించినచో నేనెట్లు చూడగలను? అనేక దేశములనుండి వచ్చిన రాజులు నాగురించి ఏమనెదరు.
2.12.65.
అనుష్టుప్.
బాలో బతాఽయమైక్ష్వాకః
చిరం రాజ్యమకారయత్।
యదా తు బహవో వృద్ధా
గుణవంతో బహుశ్రుతాః॥
టీక:-
 బాలః = మూర్ఖుడు; బత = అయ్యో; అయమ్ = ఈ; ఇక్ష్వాకః = ఇక్ష్వాకు వంశజుడైన దశరథుడు; కః = ఏ విధముగ; చిరం = చాలకాలమునుండి; రాజ్యమ్ = రాజ్యమును; అకారయత్ = చేసినాడు; యదా తు = ఎప్పుడు; బహవః = చాలమంది; వృద్ధా = వృద్ధులు; గుణవంతః = గుణవంతులు; బహుశ్రుతాః = గొప్పవిద్యావంతులు.
భావం;-
 ‘మూర్ఖుడైన ఈ దశరథుడు ఇంతకాలము ఎట్లు రాజ్యము చేసినాడు?’ అని గుణవంతులు, గొప్పవిద్యావంతులు ఐన పెద్దలు వచ్చి అడిగెదరు కదా!
2.12.66.
అనుష్టుప్.
పరిప్రక్ష్యంతి కాకుత్స్థం
వక్ష్యామి కిమహం తదా।
కైకేయ్యా క్లిశ్యమానేన
రామః ప్రవ్రాజితో మయా॥
టీక:-
 పరిప్రక్ష్యంతి = అడుగుగ; కాకుత్స్థం = రాముని గురించి; వక్ష్యామి = చెప్పెదను; కిం = ఏమి; అహం = నేను; తదా = అప్పుడు; కైకేయ్యా = కైకేయిచే; క్లిశ్యమానేన = బాధపెట్టబడి; రామః = రాముడు; ప్రవ్రాజితః = పంపబడినాడు; మయా = నాచే.
భావం;-
 వారందరు రాముని గురించి అడిగినచో నేనేమని చెప్పగలను? కైకేయిచే బాధపెట్టబడిన నేను రాముని అడవికి పంపినాను, అని చెప్పుదునా.
2.12.67.
అనుష్టుప్.
యది సత్యం బ్రవీమ్యేతత్
తదసత్యం భవిష్యతి।
కిం మాం వక్ష్యతి కౌసల్యా
రాఘవే వనమాస్థితే॥
టీక:-
 యది = ఐనచో; సత్యం = సత్యము; బ్రవీమి = చెప్పెదను; ఏతత్ = ఈ; అసత్యం = అబద్ధము; భవిష్యతి = అగును; కిం = ఎట్లు; మాం = నన్ను గూర్చి; వక్ష్యతి = చెప్పును; కౌసల్యా = కౌసల్య; రాఘవే = రాముడు; వనమ్ = వనమును; ఆస్థితే = పొందినవాడగుచుండగ.
భావం;-
 అట్లు నేను నిజమును వక్కాణించినను, వారు అది అసత్యమనుకొనెదరు. రాముడు వనమున కేగినచో కౌసల్య నన్ను ఏమనును?
2.12.68.
అనుష్టుప్.
కిం చైనాం ప్రతివక్ష్యామి
కృత్వా విప్రియమీదృశమ్।
యదా యదా హి కౌసల్యా
దాసీవచ్చ సఖీవ చ॥
టీక:-
 కిం = ఎట్లు; చ = పాదపూరణం; ఏనామ్ = ఈమెను గూర్చి; ప్రతివక్ష్యామి = చెప్పగలను; కృత్వా = చేసి; అప్రియమ్ = అప్రియమును; ఈదృశమ్ = ఇట్టి; యదా యదా హి = ఎప్పుడెప్పుడు; కౌసల్యా = కౌసల్య; దాసీవచ్చ = దాసి వలె; సఖీవ = సఖురాలివలె; చ = ఇంకా.
భావం;-
 కౌసల్య ఒక దాసివలె, ఒక సఖురాలివలె నావద్దకు వచ్చినపుడు ఇంతటి అప్రియమైన అకృత్యమును చేసిన నేను కౌసల్యకు ఏమని బదులు చెప్పగలను?
2.12.69.
అనుష్టుప్.
భార్యావద్భగినీవచ్చ
మాతృవచ్చోపతిష్ఠతి।
సతతం ప్రియకామా మే
ప్రియపుత్రా ప్రియంవదా॥
టీక:-
 భార్యావత్ = భార్యవలె; భగినీవచ్చ = సోదరివలె; మాతృవచ్చ = తల్లివలె; ఉపతిష్ఠతి = వచ్చునో; సతతం = ఎల్లప్పుడును; ప్రియకామా = ఇష్టమైనది కోరెడు; మే = నా; ప్రియపుత్రా = ప్రియమైన పుత్రుని కలిగియున్న; ప్రియం వదా = ప్రియముగా మాటలాడునది.
భావం;-
 భార్యవలె, సోదరివలె, తల్లివలె ఎల్లప్పుడును నాకు ప్రియమును కోరునది, ప్రియమైన పుత్రుని కలిగి యున్నదియు, ప్రియభాషిణియు ఐన కౌసల్య నన్ను చేరవచ్చును.
గమనిక:-
 ఇల్లాలు- శ్లో. కార్యోషు దాసీ, కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి। భోజ్యషు మాతా, శయనేతు రంభా షట్ధర్మయుక్తా సహధర్మపత్నీ॥ నీతిశాస్త్రము. ఉత్తమురాలైన ఇల్లాలు పనులు చేయునప్పుడు దాసి వలెను, ఆలోచనల విషయములో మంత్రి వలెను, రూపసౌభాగ్యము లందు లక్ష్మీదేవి వలెను, కష్టసుఖములందు ఓర్చుకొనుటలో భూదేవి వలెను. శయన మందిరమున రంభ వలెను మెలగుచూ భర్తకు సకల సుఖసంతోషములను కలిగించును.
2.12.70.
అనుష్టుప్.
న మయా సత్కృతా దేవీ
సత్కారార్హా కృతే తవ।
ఇదానీం తత్తపతి మాం
యన్మయా సుకృతం త్వయి॥
టీక:-
 న = లేదు; మయా = నాచే; సత్కృతా = సత్కరింపబడుట; దేవి = దేవిని; సత్కారార్హా = సత్కారములు పొందుటకు అర్హురాలు; కృతే = చేసిన; తవ = నీకై; ఇదానీం = ఇపుడు; తత్ = అది; తపతి = బాధపెట్టుచున్నది; మాం = నన్ను; యత్ = ఏదైతే; మయా = నా చే; సుకృతం = మంచిపని; త్వయి = నీ విషయమై.
భావం;-
 అపుడు సత్కారములకు అర్హురాలైన ఆమెను నేను సత్కరించలేను. నేను నీకు ఇష్టమైన ఎన్నో సత్కారములు చేసినాను. అవి నన్ను ఇపుడు తపింపజేయుచున్నవి.
2.12.71.
అనుష్టుప్.
అపథ్యవ్యంజనోపేతం
భుక్తమన్నమివాతురమ్।
విప్రకారం చ రామస్య
సమ్ప్రయాణం వనస్య చ॥
టీక:-
 అపథ్య = తినకూడని; వ్యంజన = పదార్థములతో; ఉపేతం = కూడిన; భుక్తమ్ = తినబడిన; అన్నమ్ = అన్నము; ఇవ = వలె; ఆతుర = రోగి; విప్రకారం = అపకారమును; రామస్య = రాముని యొక్క; సమ్ప్రయాణం = ప్రయాణమును; వనస్య = అడవికి; చ = పాదపూరణం.
భావం;-
 నీకు నేను చేసిన ఉపకారములన్నియు, అపథ్య పదార్థములతో కలిపి చేసిన భోజనము వలె నన్ను బాధించుచున్నవి. రాముడు నేను చేసిన అపకారము వలన వనమునకు పోవును.
2.12.72.
అనుష్టుప్.
సుమిత్రా ప్రేక్ష్య వై భీతా
కథం మే విశ్వసిష్యతి।
కృపణం బత వైదేహీ
శ్రోష్యతి ద్వయమప్రియమ్॥
టీక:-
 సుమిత్రా = సుమిత్ర; ప్రేక్ష్య వై = చూచి; భీతా = భయపడిన; కథం = ఎట్లు; మే = నన్ను; విశ్వసిష్యతి = నమ్మును; కృపణం = దీనముగ; బత = అయ్యో; వైదేహీ = సీత; శ్రోష్యతి = వినును; ద్వయమ్ = రెండు విషయములను; అప్రియమ్ = అప్రియమైన.
భావం;-
 రాముడు వనవాసమునకు పోవుచండగా చూచి భయపడిన సుమిత్ర నన్నెట్లు విశ్వసించును? అయ్యో! సీత ఈ రెండు వార్తలను విని దీనపడును.
2.12.73.
అనుష్టుప్.
మాం చ పంచత్వమాపన్నం
రామం చ వనమాశ్రితమ్।
వైదేహీ బత మే ప్రాణాన్
శోచంతీ క్షపయిష్యతి॥
టీక:-
 మాం = నన్ను; చ = పాదపూరణం; పంచత్వమ్ = మరణము; ఆపన్నం = సమీపించినవానిగాను; రామం = రాముని; చ = ఇంకా; వనమ్ = వనమును; ఆశ్రితమ్ = చేరినవానిగాను; వైదేహి = సీత; బత = అయ్యో; మే = నా యొక్క; ప్రాణాన్ = ప్రాణములను; శోచంతీ = దుఃఖించుచున్న; క్షపయిష్యతి = పోవునట్లు చేయును.
భావం;-
 అయ్యో నేను మరణించినట్లును, రాముడు వనవాసమున కేగినట్లును సీత వినవలసి యుండును.
2.12.74.
అనుష్టుప్.
హీనా హిమవతః పార్శ్వే
కిన్నరేణేవ కిన్నరీ।
న హి రామమహం దృష్ట్వా
ప్రవసంతం మహావనే॥
టీక:-
 హీనా = దీనురాలైన; హిమవతః = హిమవత్పర్వతము; పార్శ్వే = ప్రక్కన; కిన్నరేణ = కిన్నరునితో; ఇవ = వలె; కిన్నరీ = కిన్నరస్త్రీ; న హి = లేను కదా; రామమ్ = రాముని; అహం = నేను; దృష్ట్వా = చూచి; ప్రవసంతం = ప్రవాసము చేయుచున్న; మహావనే = మహా అరణ్యము నందు.
భావం;-
 రాముడు వనవాసమున కేగినపుడు, హిమవత్పర్వత ప్రాంతమున కిన్నరునకు దూరమైన కిన్నరస్త్రీ వలె దుఃఖించుచున్న సీతను నేను చూడలేను.
2.12.75.
అనుష్టుప్.
చిరం జీవితుమాశంసే
రుదంతీం చాపి మైథిలీమ్।
సా నూనం విధవా రాజ్యం
సపుత్రా కారయిష్యసి॥
టీక:-
 చిరం = చాల కాలము; జీవితుమ్ = జీవించుటకు; ఆశంసే = ఆశించుట; రుదంతీం = రోదించుచున్న; చ = పాదపూరణం; అపి = కూడ; మైథిలీమ్ = సీతను; సా = అటువంటి; నూనం = తప్పక; విధవా = భర్తృహీనవై; రాజ్యం = రాజ్యమును; సపుత్రా = పుత్రునితో కూడి; కారయిష్యసి = చేయగలవు.
భావం;-
 సీత రోదించుచుండ, అట్టి పరిస్థితిలో నేను ఎంతో కాలము జీవించలేను కదా. అప్పుడు భర్తృహీనవైన నీవు నీ పుత్రునితో సహా రాజ్యమేలెదవు గాక.
2.12.76.
అనుష్టుప్.
న హి ప్రవ్రాజితే రామే
దేవి జీవితుముత్సహే।
సతీం త్వామహమత్యంతం
వ్యవస్యామ్యసతీం సతీమ్॥
టీక:-
 న హి = లేను కదా; ప్రవ్రాజితే = ప్రవాసము చేయుటకు పోవ; రామే = రాముడు; దేవి = కైకేయీ; జీవితుమ్ = జీవించుటకు; ఉత్సహే = ఉత్సహించ; సతీం = సద్గుణవతి ఐన భార్యగ; త్వామ్ = నిన్ను; అహమ్ = నేను; అత్యంతం = చాల; వ్యవస్యామి = భావించితిని; అసతీం = దుష్టురాలవైన; సతీం = భార్య.
భావం;-
 రాముడు వనవాసమునకేగిన పిమ్మట నేను జీవించియుండలేను. ఇంత దుష్టురాలవైన నిన్నుసద్గుణవతివైన భార్యవని భావించినాను.
2.12.77.
అనుష్టుప్.
రూపిణీం విషసంయుక్తాం
పీత్వేవ మదిరాం నరః।
అనృతైర్బహు మాం సాంత్వై
స్సాంత్వయంతీ స్మ భాషసే॥
టీక:-
 రూపిణీం = సౌందర్యవతివి; విషసంయుక్తాం = విషపూరితమైన; పీత్వా = త్రాగిన; ఇవ = వలె; మదిరాం = మద్యమును; నరః = నరుడు; అనృతైః = అసత్యమైన; బహు = చాల; మాం = నన్ను; సాంత్వైః = ప్రియమైన వాక్కులతో; సాంత్వయంతీ = బుజ్జగించుచు; స్మ = ఉన్నావు; భాషసే = మాటలాడుచు.
భావం;-
 రూపవతివైన నీవు అసత్యమైన మంచిమాటలతో నన్ను బుజ్జగించుటచే విషభరితమైన మద్యమును మంచిదనుకొని సేవించువానివలె నేను నిన్ను నమ్మినాను.
2.12.78.
అనుష్టుప్.
గీతశబ్దేన సంరుధ్య
లుబ్ధో మృగమివావధీః।
అనార్య ఇతి మామార్యాః
పుత్రవిక్రాయకం ధ్రువమ్॥
టీక:-
 గీతశబ్దేన = సంగీత నాదముచే; సంరుధ్య = బంధించి; లుబ్ధః = బోయవాడు; మృగమ్ = జింకను; ఇవ = వలె; ఆవధీః = వధించినావు; అనార్య = దుష్టుడు; ఇతి = అని; మామ్ = నన్ను; ఆర్యాః = పూజనీయులు; పుత్రవిక్రాయకం = పుత్రుని అమ్ముకొన్నవాడు; ధ్రువమ్ = నిర్ణయించెదరు.
భావం;-
 బోయవాడు సంగీత నాదముచే లేడిని బంధించి చంపినట్లుగా నన్ను చంపుచున్నావు. పూజనీయు లందరును నన్ను పుత్రుని అమ్ముకొను దుష్టునిగా ముద్రవేయుదురు.
2.12.79.
అనుష్టుప్.
ధిక్కరిష్యంతి రథ్యాసు
సురాపం బ్రాహ్మణం యథా।
అహో దుఃఖమహో కృచ్ఛ్రం
యత్ర వాచః క్షమే తవ॥
టీక:-
 ధిక్కరిష్యంతి = నిందించెదరు; రథ్యాసు = రాజవీధులయందు; సురాపం = సురాపానము చేసిన; బ్రాహ్మణం = బ్రాహ్మణుని; యథా = వలె; అహో = ఆహా; దుఃఖమ్ = దుఃఖము; అహో = ఆహా; కృచ్ఛ్రం = కష్టము; యత్ర = ఎక్కడ; వాచః = మాటను; క్షమే = సహించుచున్నాను; తవ = నీ యొక్క.
భావం;-
 వారందరు నన్ను రాజవీధులయందు మద్యపానము చేసిన బ్రాహ్మణుని నిందించినట్లు నిందించెదరు. ఆహా ఎంత దుఃఖము! ఎంత కష్టము! ఎచట (ఏ స్థితిలో) నీ మాటలను సహించుచున్నాను?
గమనిక:-
 బ్రాహ్మణు వంశజుల సహజలక్షణం మధుమాంసాదు లకు దూరముగా నుండుట. దాని వలనను ప్రజలు గౌరవింతురు. అట్టిపుట్టుకపుట్టి మత్తుపానీయము తీసుకొనిన వానిని ఇతర వంశజుల కన్నా ఎక్కువ నిందింతురు.
2.12.80.
అనుష్టుప్.
దుఃఖమేవంవిధం ప్రాప్తం
పురాకృతమివాశుభమ్।
చిరం ఖలు మయా పాపే
త్వం పాపేనాభిరక్షితా॥
టీక:-
 దుఃఖం = దుఃఖము; ఏవం విధం = ఈ విధమైన; ప్రాప్తం = కలిగినది; పురా = పూర్వము; కృతమ్ = చేసిన; ఇవ = వలె; అశుభమ్ = పాపము; చిరం = చాలకాలము; ఖలు = నిజము; మయా = నాచే; పాపే = పాపాత్మురాలా; త్వం = నీవు; పాపేన = పాపాత్ముడనైన; అభిరక్షితా = పోషింపబడినావు.
భావం;-
 నేను పూర్వము చేసిన పాపము నేడీ దుఃఖరూపమున సంక్రమించినది కదా! పాపాత్మురాలవైన నీవు ఇంత కాలము పాపాత్ముడనైన నాచే పోషింపబడినావు.
2.12.81.
అనుష్టుప్.
అజ్ఞానాదుపసంపన్నా
రజ్జురుద్బన్ధినీ యథా।
రమమాణస్త్వయా సార్థం
మృత్యుం త్వాం నాభిలక్షయే॥
టీక:-
 అజ్ఞానాత్ = అజ్ఞానమువలన; ఉపసంపన్నా = ఐనావు; రజ్జుః = త్రాడు; ఉద్బన్ధినీ = ఉరి వేయుటకు; యథా = వలె; రమమాణః = రమించుచున్న; త్వయా = నీతో; సార్థం = నీకొరకై; మృత్యుం = మృత్యువుగా; న అభిలక్షయే = గుర్తించలేకపోతిని.
భావం;-
 నా అజ్ఞానవశమున నీవు నాకు ఉరిత్రాడువైనావు. నీకొరకై నీతో జీవితమును అనుభవించుచున్న నేను నిన్ను మృత్యువుగ గుర్తించలేకపోతిని.
2.12.82.
అనుష్టుప్.
బాలో రహసి హస్తేన
కృష్ణసర్పమివాస్పృశమ్।
మయా హ్యపితృకః పుత్ర
స్సమహాత్మా దురాత్మనా॥
టీక:-
 బాలః = బాలుడు; రహసి = రహస్యముగ; హస్తేన = చేతితో; కృష్ణ = నల్లని; సర్పమ్ = సర్పము; ఇవ = వలె; ఆస్పృశమ్ = స్పృశించినాను; మయా = నాచే; అపితృకః = తండ్రిలేని వాడు; పుత్రః = పుత్రుడు; సః = అతడు; మహాత్మా = మహాత్ముడైన; దురాత్మనా = దూరాత్ముడనైన.
భావం;-
 ఎవ్వరు చూడనపుడు చిన్నిబాలుడు నల్లని త్రాచుపై చేయివేసి నట్లు నేను నిన్ను చేపట్టినాను. దురాత్ముడనైన నా వలన మహాత్ముడైన రాముడు తండ్రిలేనివాడైనాడు.
2.12.83.
అనుష్టుప్.
తం తు మాం జీవలోకోఽయం
నూనమాక్రోష్టుమర్హతి।
బాలిశో బత కామాత్మా
రాజా దశరథో భృశమ్॥
టీక:-
 తమ్ = అట్టి; తు = పాదపూరణం; మాం = నన్ను; జీవలోకః = ప్రపంచమంతయు; అయం = ఈ; నూనమ్ = రూఢిగ; ఆక్రోష్టుమ్ = నిందించుట; అర్హతి = తగియున్నది; బాలిశః = మూర్ఖుడు; బత = అయ్యో; కామాత్మా = కామబుద్ధిగల; రాజా దశరథః = దశరథమహారాజు; భృశమ్ = చాల.
భావం;-
 అటువంటి నన్ను ఈ లోకమంతయు దూషించుటకు తగును. అయ్యో దశరథమహారాజు ఎంతటి కామాంధుడు, ఎంత మూర్ఖుడు.
2.12.84.
అనుష్టుప్.
యః స్త్రీకృతే ప్రియం పుత్రం
వనం ప్రస్థాపయిష్యతి।
వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ
గురుభిశ్చోపకర్శితః॥
టీక:-
 యః = ఏ; స్త్రీ = స్త్రీ; కృతే = కొరకై; ప్రియం = ప్రియమైన; పుత్రం = పుత్రుని; వనం = వనమునకు; ప్రస్థాప = పంపుటకు; ఇష్యతి = ఇష్టపడుచున్నాడు; వ్రతైశ్చ = వ్రత నియమముచేత; బ్రహ్మచర్యైశ్చ = బ్రహ్మచర్యాది కట్టుబాటులచేత; గురుభిశ్చ = గురువులచేత; ఉపకర్శితః = కట్టడిచేయబడిన.
భావం;-
 ఈ దశరథుడు స్త్రీకి వశుడై, ప్రియమైన పుత్రుని అడవికి పంపుటకు సిద్ధమైనాడు. రాముడు ఇంతకాలము వ్రతనియమ నిష్టాగరిష్టుడై, బ్రహ్మచర్యము పాటించినవాడై, గురువుల యొద్ద క్రమశిక్షణ పొందినవాడై ఉన్నాడు.
2.12.85.
అనుష్టుప్.
భోగకాలే మహత్కృచ్ఛ్రం
పునరేవ ప్రపత్స్యతే।
నాలం ద్వితీయం వచనం
పుత్రో మాం ప్రతిభాషితుమ్॥
టీక:-
 భోగకాలే = భోగములనుభవింప వలసిన కాలములో; మహత్ = గొప్ప; కృచ్ఛ్రం = కష్టమును; పునః = మరల; ఇవ = వలె; ప్రపత్స్యతే = పొందగలడు; నాలం = అసమర్థుడు; ద్వితీయమ్ = రెండవ; వచనం = మాటను; పుత్రః = పుత్రుడు; మాం = నన్ను; ప్రతి = గూర్చి; భాషితుమ్ = పలుకుటకు.
భావం;-
 భోగములనుభవింప వలసిన ఈ వయసులో రాముడు మరల ఇట్టి కష్టముల పాలగుచున్నాడు. అతడు నా మాటకు ఎదురాడజాలడు.
2.12.86.
అనుష్టుప్.
స వనం ప్రవ్రజేత్యుక్తో
బాఢమిత్యేవ వక్ష్యతి।
యది మే రాఘవః కుర్యాత్
వనం గచ్ఛేతి చోదితః॥
టీక:-
 సః = అతడు; వనం = వనమునకు; వ్రజ = పోవుము; ఇతి = అని; ఉక్తః = పలుకబడినవాడై; బాఢమ్ = తప్పక; ఇతి = అని; ఇవ = అట్లే; వక్ష్యతి = చెప్పగలడు; యది = ఒకవేళ; మే = నాకు; రాఘవః = రాముడు; కుర్యాత్ యది = చేసినచో; వనం = అడవిని గూర్చి; గచ్ఛ = పొమ్ము; ఇతి = అని; చోదితః = ఆజ్ఞాపించబడినవాడై.
భావం;-
 నేను రాముని వనవాసమునకు వెళ్ళుమని ఆజ్ఞాపించినచో తాను తప్పక అట్లే చేసెదనని చెప్పును.
2.12.87.
అనుష్టుప్.
ప్రతికూలం ప్రియం మే స్యాత్
న తు వత్సః కరిష్యతి।
శుద్ధభావో హి భావం మే
న తు జ్ఞాస్యతి రాఘవః॥
టీక:-
 ప్రతికూలం = విరుద్ధముగ; ప్రియం = ఇష్టము; మే = నాకు; స్యాత్ = అగును; న తు = లేడు; వత్సః = పుత్రుడు; కరిష్యతి = చేయగ; శుద్ధభావః = త్రికరణ శుద్ధిగ ఆలోచించు; హి = కదా; భావం = అభిప్రాయమును; మే = నా యొక్క; న తు = లేడు; జ్ఞాస్యతి = తెలిసికొనుట; రాఘవః = రాముడు.
భావం;-
 రాముడు నా ఆజ్ఞకు విరుద్ధముగా వనవాసమునకు పోనని చెప్పినచో అది నాకు సంతోషము కలిగించును. కాని నా పుత్రుడైన రాముడు అట్లు చేయడు. త్రికరణశుద్ధి కలిగియున్న రాముడు తాను నా యాజ్ఞ నతిక్రమించుట నా కిష్టమేనని ఎరుగజాలడు.
2.12.88.
అనుష్టుప్.
స వనం ప్రవ్రజే త్యుక్తో
బాఢ మిత్యేవ వక్ష్యతి।
రాఘవే హి వనం ప్రాప్తే
సర్వలోకస్య ధిక్కృతమ్॥
టీక:-
 సః = అతడు; వనం = వనమును గూర్చి; ప్రవ్రజే = వెళ్ళుము; ఇతి = అని; ఉక్తః = పలుకబడినవాడై; బాఢమ్ = అట్లే; ఇతి ఏవ = అనియే; వక్ష్యతి = అనును; రాఘవే = రాముడు; వనం = వనమును గూర్చి; ప్రాప్తే = చేరినంతనే; సర్వలోకస్య = సమస్తలోకమునకు; ధిక్కృతమ్ = నింద్యుడను.
భావం;-
 నీవు వనవాసమునకేగుము అని నేను అనిన తోడనే రాముడు "సరే అట్లే చేసెదను" అనును. రాముడు అడవికి పోయినంతనే, లోకులందరు నను నిందింతురు.
2.12.89.
అనుష్టుప్.
మృత్యురక్షమణీయం మాం
నయిష్యతి యమక్షయమ్।
మృతే మయి గతే రామే
వనం మనుజపుంగవే॥
టీక:-
 మృత్యుః = మృత్యువు; అక్షమణీయం = క్షమింపతగనివాడు; మాం = నన్ను; నయిష్యతి = పొందించును; యమక్షయమ్ = యమలోకమును; మృతే = మరణించిన పిమ్మట; మయి = నేను; గతే = వెళ్ళగా; రామే = రాముడు; వనం = వనమును గూర్చి; మనుజపుంగవే = మానవోత్తముడైన.
భావం;-
 అపుడు యమధర్మరాజు నన్ను క్షమార్హుడను కానివానిగ యమపురికి గొనిపోవును. మానవోత్తముడైన రాముడు అడవికి పోయినంతనే నేను మరణించెదను.
2.12.90.
అనుష్టుప్.
ఇష్టే మమ జనే శేషే
కిం పాపం ప్రతిపత్స్యసే।
కౌసల్యా మాం చ రామం చ
పుత్రౌ చ యది హాస్యతి॥
టీక:-
 ఇష్టే మమ జనే = నా స్వజనుల విషయమై; శేషే = మిగిలిన; కిం = ఏమి; పాపం = పాపమును; ప్రతిపత్స్యసే = ఆలోచించ గలవో; కౌసల్యా = కౌసల్య; మాం = నన్ను; రామం = రాముని; పుత్రౌ చ = పుత్రులను; యది హాస్యతి = కోల్పోయిన యెడల.
భావం;-
 మిగిలిన నా స్వజనుల విషయములో ఏ పాపము తలపెట్ట నున్నావో. కౌసల్య నన్ను, రామ, లక్ష్మణ, శత్రుఘ్నులను కూడ కోల్పోవును.
2.12.91.
అనుష్టుప్.
దుఃఖాన్యసహతీ దేవీ
మామేవానుమరిష్యతి।
కౌసల్యాం చ సుమిత్రాం చ
మాం చ పుత్రైస్త్రిభిస్సహ॥
టీక:-
 దుఃఖాని = దుఃఖములను; అసహతీ = భరించలేని; దేవీ = కౌసల్యాదేవి; మామేవ = నన్నే; అనుమరిష్యతి = అనుసరించి మరణించును; కౌసల్యాం = కౌసల్యను; సుమిత్రాం = సుమిత్రను; మాం = నా; చ = కూడ; పుత్రైః = పుత్రులు; త్రిభిః = ముగ్గురితో; సహ = సహితముగ.
భావం;-
 అంతటి తీవ్రమైన వరుస దుఃఖములను భరింపలేని కౌసల్య నా వెనుకనే తాను కూడ మరణించును. నన్ను, కౌసల్యను, సుమిత్రను, రామ, లక్ష్మణ, శత్రుఘ్నులను ముగ్గురను...
2.12.92.
అనుష్టుప్.
ప్రక్షిప్య నరకే సా త్వం
కైకేయి సుఖితా భవ।
మయా రామేణ చ త్యక్తం
శాశ్వతం సత్కృతం గుణైః॥
టీక:-
 ప్రక్షిప్య = పడద్రోసి; నరకే = నరకములో; సా = అటువంటి; త్వం = నీవు; కైకేయి = కైకేయీ; సుఖితా భవ = సుఖముగా నుండుము; మయా = నా వలన; రామేణ చ = రాముని వలనను; చ = మఱియు; త్యక్తం = విడువబడినది; శాశ్వతం = శాశ్వతమైనది; సత్కృతం = సత్కరింపబడినది; గుణైః = గుణములచే.
భావం;-
 కైకేయీ! మా అందరిని నరక కూపమున పడద్రోసి, నీవు సుఖముగ నుండుము. సద్గుణసంపన్నమైన ఇక్ష్వాకు వంశము శాశ్వతముగా గౌరవనీయమైనది. నేనును మఱియు రాముడును లేని ఇక్ష్వాకు వంశమును..
2.12.93.
అనుష్టుప్.
ఇక్ష్వాకుకులమక్షోభ్యమ్
ఆకులం పాలయిష్యసి।
ప్రియం చేద్భరతస్యైతత్
రామప్రవ్రాజనం భవేత్॥
టీక:-
 ఇక్ష్వాకుకులమ్ = ఇక్ష్వాకు వంశమును; అక్షోభ్యమ్ = క్షోభింపబడుటకు అశక్యమైన; ఆకులం = వ్యాకులపరచి; పాలయిష్యసి = పాలింపుము; ప్రియం చేత్ = మనసునకు ఇష్టమైనది; భరతస్య = భరతునికి; ఏతత్ = ఈ; రామ ప్రవ్రాజనం = రాముని పంపివేయుట; భవేత్ = ఐనచో.
భావం;-
 క్షోభింపబడరాని ఇక్ష్వాకు వంశమును వ్యాకులపరచి, రాముని వనవాసమునకు పంపివేయుట, భరతునకు సమ్మతమైనచో నీవు రాజ్య పాలనచేయుము.
2.12.94.
అనుష్టుప్.
మా స్మ మే భరతః కార్షీత్
ప్రేతకృత్యం గతాయుషః।
హంతానార్యే! మమామిత్రే!
సకామా భవ కైకయి!॥
టీక:-
 మా = వద్దు; స్మ = సుమీ; మే = నాకు; భరతః = భరతుడు; కార్షీత్ = చేయుట; ప్రేతకృత్యం = ప్రేతకార్యమును; గతాయుషః = మరణించినపిమ్మట; హంతా = హా; అనార్యే = కుటిలమైనదానా; మమ = నా యొక్క; అమిత్రే = శత్రువు; సకామా = కోరిక తీరినదానవు; భవ = అగుము; కైకయి = కైకేయి.
భావం;-
 నేను మరణించిన పిదప భరతుడు అంత్యేష్టి (అంత్యకర్మలు) కూడ చేయనవసరము లేదుసుమా! హా కైకేయీ! ఓసి కుటిలురాలా! నాకు పగరవైన నీ కోరిక తీరును.
2.12.95.
అనుష్టుప్.
మృతే మయి గతే రామే
వనం పురుషపుంగవే।
సేదానీం విధవా రాజ్యం
సపుత్రా కారయిష్యసి॥
టీక:-
 మృతే = మరణానంతరము; మయి = నేను; గతే = వెళ్ళుచుండగ; రామే = రాముడు; వనం = వనమునకు; పురుషపుంగవే = పురుషోత్తముడైన; సా = అటువంటి నీవు; ఇదానీం = ఇప్పుడు; విధవా = విధవవై; రాజ్యం = రాజ్యమును; సపుత్రా = పుత్రునితోకూడి; కారయిష్యసి = చేసెదవుగాక.
భావం;-
 పురుషోత్తముడైన రాముడు వనవాసమునకు వెళ్ళగా నేను మరణించిన పిదప, నీవు భర్తృహీనవై భరతునితో కలసి రాజ్యము చేయుము.
2.12.96.
అనుష్టుప్.
త్వం రాజపుత్రీవాదేన
న్యవసో మమ వేశ్మని।
అకీర్తిశ్చాతులా లోకే
ధ్రువః పరిభవశ్చ మే।
టీక:-
 ఇప్పటి వరకు రాకుమారివను పేరిట నా యింట నివసించినావు. నీ కారణముచే, నాకు మిక్కిలి అపకీర్తి, పరాభవము కలుగును. సకలజీవులు పాపకృత్యములు చేసిన వానివలె నన్ను అగౌరవించగలవు.
భావం;-
 యథా పాపకృతస్తథా॥
2.12.97.
అనుష్టుప్.
కథం రథైర్విభుర్యాత్వా
గజాశ్వైశ్చ ముహుర్ముహుః।
పద్భ్యాం రామో మహారణ్యే
వత్సో మే విచరిష్యతి॥
టీక:-
 కథం = ఎట్లు; రథైః = రథములయందును; విభుః = ప్రభువు; యాత్వా = వెళ్ళి; గజా = ఏనుగులపైనను; అశ్వైశ్చ = గుఱ్ఱములపైనను; ముహుర్ముహుః = మాటిమాటికి; పద్భ్యాం = పాదములతో; రామః = రాముడు; మహారణ్యే = మహాటవి యందు; వత్సః = పుత్రుడు; మే = నాయొక్క; విచరిష్యతి = సంచరించును.
భావం;-
 ఇప్పటివరకు రథముల యందును, ఏనుగుల పైనను, గుఱ్ఱముల పైనను తిరుగాడిన నా పుత్రుడు రాముడు, ఆ మహారణ్యమునందు కాలినడకన ఎట్లు సంచరించునో కదా.
2.12.98.
అనుష్టుప్.
యస్యత్వాహారసమయే
సూదాః కుండలధారిణః।
అహంపూర్వాః పచంతి స్మ
ప్రశస్తం పానభోజనమ్॥
టీక:-
 యస్యత్ = ఎవరి; ఆహారసమయే = భోజనవేళ; సూదాః = వంటగత్తెలు; కుండలధారిణః = కుండలములు ధరించిన; అహం = నేను; పూర్వాః = ముందు; పచంతి = వండుచు; స్మ = ఉండెడి వారో; ప్రశస్తం = ఉత్తమమైన; పాన = పానీయములు; భోజనమ్ = ఆహారపదార్థములు.
భావం;-
 రామునికి భోజనసమయమైనంతనే, చక్కని ఆభరణభూషితులైన వంటగత్తెలు, "ముందుగ నేను, నేనచు" శ్రేష్ఠమైన ఆహారపానీయములను వడ్డించెడివారు.
2.12.99.
అనుష్టుప్.
స కథన్ను కషాయాణి
తిక్తాని కటుకాని చ।
భక్షయన్వన్యమాహారం
సుతో మే వర్తయిష్యతి॥
టీక:-
 సః = అటువంటి; కథం ను = ఎట్లు; కషాయాణి = కషాయములను; తిక్తాని = చేదుపదార్థములను; కటుకాని చ = కారముగ ఉన్నవాటిని; చ = ఇంకా; భక్షయన్ = తినును; వన్యమాహారం = అడవి పదార్థములను; సుతః = పుత్రుడు; మే = నా యొక్క; వర్తయిష్యతి = జీవించునో.
భావం;-
 అటువంటి నా కుమారుడు, అడవియందు లభించు, వగరు, చేదు, కారపు పదార్థములను తినుచు ఎట్లు జీవించునో కదా.
2.12.100.
అనుష్టుప్.
మహార్హవస్త్రసంవీతో
భూత్వా చిరసుఖోషితః।
కాషాయపరిధానస్తు
కథం భూమౌనివత్స్యతి॥
టీక:-
 మహార్హ = గొప్పవిలువైన; వస్త్రః = వస్త్రములు; సంవీతః = కట్టకొనుట; భూత్వా = చేసినవాడు; చిర = చాలకాలము; సుఖః = సుఖములు; ఉషితః = అనుభవించినవాడు; కాషాయ = కాషాయవస్త్రములు; పరిధానస్తు = కాషాయవస్త్రములు ధరించి యుండి; కథం = ఎట్లు; భూమౌ = నేలపై; నివత్స్యతి = నివసించగలడు.
భావం;-
 గొప్పవిలువైన వస్త్రములు ధరించినవాడు కాషాయవస్త్రములు ధరించి ఎట్లుండగలడు. చాలకాలము సుఖజీవనము చేసిన రాముడు నేలపై ఎట్లు నివసించగలడు.
2.12.101.
అనుష్టుప్.
కస్యైతద్దారుణం వాక్యమ్
ఏవంవిధ మచింతితమ్।
రామస్యారణ్యగమనం
భరతస్యాభిషేచనమ్॥
టీక:-
 కస్య = ఎవరిది; ఏతత్ = ఈ; దారుణం = భయంకరమైన; వాక్యం = మాట; ఏవం = ఈ; విధమ్ = విధమైన; అచింతితమ్ = అకస్మాత్తుగా; రామస్య = రాముని యొక్క; అరణ్యగమనం = అరణ్యమునకు వెళ్ళుట; భరతస్య = భరతుని యొక్క; అభిషేచనమ్ = రాజ్యాభిషేకము.
భావం;-
 రాముడు అరణ్యమునకు వెళ్ళవలెను, భరతునికి పట్టాభిషేకము చేయవలెను అనెడి అకస్మాత్తుగా వచ్చిన ఈ దురాలోచన ఎవరిది?
2.12.102.
అనుష్టుప్.
ధిగస్తు యోషితో నామ
శఠా స్స్వార్థపరాస్సదా।
న బ్రవీమి స్త్రియ స్సర్వా
భరతస్యైవ మాతరమ్॥
టీక:-
 ధిక్ అస్తు = నింద; అస్తు = అగుగాక; యోషితః నామ = ఆడువారు అనగ; శఠాః = మోసకారులు; స్వార్థపరాః = స్వార్థచింతనగలవారు; సదా = ఎల్లప్పుడు; న = లేదు; బ్రవీమి = నేను అనుట; స్త్రియః = స్త్రీలను గూర్చి; సర్వాః = సకల; భరతస్య = భరతుని యొక్క; ఏవ = మాత్రమే; మాతరమ్ = తల్లిని గూర్చి.
భావం;-
 స్త్రీలు అనగా రహస్యముగ అపకారము తలపెట్టువారే. ఎప్పటికీ స్వార్థపరులే. ఇది అందరి స్త్రీల గురించిన అభిప్రాయము కాదు. కేవలం భరతుని తల్లిని గూర్చి మాత్రమే ఇట్లనుచున్నాను.
2.12.103.త్రిష్టుప్
అనర్థభావేఽర్థపరే! నృశంసే!
మమానుతాపాయ నివిష్టభావే!।
కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం
హితానుకారిణ్యథవాఽపి రామే॥
టీక:-
 అనర్థభావే = అనర్థపుటాలోచనలు చేయుదానా; అర్థపరే = లోభిష శబ్దాథ దీపిక, ఆంధ్రశబ్దరత్నాకరము; నృశంసే = క్రూరాత్మురాలా; మమ = నా యొక్క; అనుతాపాయ = బాధపెట్టుటకొరకు; నివిష్టభావే = దృఢనిశ్చయము కలదానా; కిమ్ = ఏమి; అప్రియం = అప్రియమును; పశ్యసి = చూచుచున్నావు; మన్నిమిత్తం = నా వలన; హితానుకారిణి = హితమును చేకూర్చు; అథవా అపి = లేక.
భావం;-
 అనర్థపుటాలోచనలు చేయుదానా! పిలినారీ! క్రూరాత్మురాలా! నన్ను పరితపింప చేయుటకు దృఢనిశ్చయముతో ఉన్నదానా! నా వలన గాని, నీ హితమును కోరు రామునివలన గాని, నీకు ఏమి అనర్థము జరుగుననుకొనుచున్నావు?
2.12.104.
జగతి.
పరిత్యజేయుః పితరో హి పుత్రాన్
భార్యాః పతీంశ్చాపి కృతానురాగాః।
కృత్స్నం హి సర్వం కుపితం జగత్స్యా
ద్దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నమ్॥
టీక:-
 పరిత్యజేయుః = విడిచివేయుదురు; పితరః = తండ్రులు; పుత్రాన్ = పుత్రులను; భార్యాః = భార్యలు; పతీంశ్చ = భర్తలను; అపి = కూడ; కృతానురాగాః = ప్రేమానురాగములు కలిగియున్న; కృత్స్నం = సకల; సర్వం = సమస్త; కుపితం = కోపము; జగత్ = ప్రపంచము; దృష్ట్యైవ = చూచినంతనే; రామం = రాముని; వ్యసనే = కష్టములలో; నిమగ్నమ్ = మునిగియున్న.
భావం;-
 కష్టములలో మునిగియున్న రాముని చూచి అయోధ్యవాసులు కుపితులగుదురు. పుత్రుల వలననే తండ్రులకు, భర్తల వలననే స్త్రీలకు అత్యంతానందము కలుగును. అట్టి తండ్రులు తమ పుత్రులను, స్త్రీలు తమ భర్తలను పరిత్యజింతురు.
2.12.105.
జగతి.
అహం పునర్దేవకుమారరూప
మలంకృతం తం సుతమావ్రజంతమ్।
నన్దామి పశ్యన్నపి దర్శనేన
భవామి దృష్ట్వైవ చ పునర్యువేవ॥
టీక:-
 అహం = నేను; పునః = మరల; దేవకుమారరూపమ్ = దేవతాపుత్రుని వంటి రూపము కలవాడు; అలంకృతం = చక్కగా అలంకరింపబడినవాడు; తం సుతమ్ = ఆ పుత్రుని; ఆవ్రజంతమ్ = వచ్చుచున్న; నన్దామి = ఆనందించుచుందును; పశ్యన్ = చూచుచు; అపి = కూడ; దర్శనేన = కనబడినంత మాత్రమున; భవామి = అయ్యెదను; దృష్ట్వా = చూచి; పునః = మరల; యువేవ = యువకుని వలె.
భావం;-
 చక్కగా అలంకరించుకొని, దేవతాకుమారుని వలె వచ్చుచున్న రాముని చూచినంత మాత్రమున మరల యౌవనము వచ్చినట్లు ఆనందించెదను.
2.12.106.
జగతి.
వినాఽపి సూర్యేణ భవేత్ప్రవృత్తి
రవర్షతా వజ్రధరేణ వాఽపి।
రామం తు గచ్ఛంతమిత స్సమీక్ష్య
జీవేన్న కశ్చిత్త్వితి చేతనా మే॥
టీక:-
 వినా = లేకపోయిన; అపి = కూడ; సూర్యేణ = సూర్యుడు; భవేత్ = జరుగవచ్చును; ప్రవృత్తిః = లోకవ్యవహారము; అవర్షతా = వర్షింపకపోయినను; వజ్రధరేణ = ఇంద్రుడు; అపి = కూడ; రామం = రాముని; తు = కాని; గచ్ఛంతమ్ = వెళ్ళుచుండగ; ఇతః = ఇక్కడి నుండి; సమీక్ష్య = చూచి; జీవేత్ న = జీవించి ఉండడు; కశ్చిత్ = ఒక్కడును; ఇతి = అని; చేతనా = అభిప్రాయము; మే = నా యొక్క.
భావం;-
 సూర్యుడు లేకపోయినను, ఇంద్రుడు వర్షము కురిపించకపోయినను, కాలగతులు గడచిపోగలవు. కాని, రాముడు వెళ్ళిపోవుచుండగ చూచిన ఏ ఒక్కడును జీవింపజాలడు, అని నేననుకొనుచున్నాను.
2.12.107.
జగతి.
వినాశకామామహితామమిత్రా
మావాసయం మృత్యుమివాత్మనస్త్వామ్।
చిరం బతాంకేన ధృతాసి సర్పీ
మహావిషా తేన హతోఽస్మి మోహాత్॥
టీక:-
 వినాశకామామ్ = సర్వనాశము; కామామ్ = కోరుదానవు; అహితామ్ = అపకారము చేయుదానవు; అమిత్రామ్ = శత్రువవు; ఆవాసయం = దగ్గరగా ఉంచుకుంటిని; మృత్యుమ్ = మృత్యువు; ఇవ = వలె; ఆత్మనః = తనయొక్క; త్వామ్ = నిన్ను; చిరం = చాలకాలము; బత = ఎంత కష్టము; అంకేన = ఒడిలో; ధృతాసి = ఉంచుకొనబడితివి; సర్పీ = ఆడసర్పమువు; మహావిషా = దారుణమైన విషముగల; తేన = అందువలన; హతః అస్మి = చంపబడుచున్నాను; మోహాత్ = మోహమువలన.
భావం;-
 నా నాశనమును కోరుదానవు, నాకు అపకారము తలపెట్టుదానవు, శత్రువు ఐన నిన్ను మృత్యువును ఉంచుకొనినట్లు సమీపములో ఉంచుకొనినాను. మహావిషభరితమైన ఆడపామువయిన నిన్ను నా ఒడిలో ఉంచుకొనినాను. అయ్యో! అందువలననే నేనిట్లు చంపబడుచున్నాను.
2.12.108.
జగతి.
మయా చ రామేణ చ లక్ష్మణేన
ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ।
పురం చ రాష్ట్రం చ నిహత్య బాంధవాన్
మమాహితానాం చ భవాభిహర్షిణీ॥
టీక:-
 మయా చ = నాతో; రామేణ = రామునితో; సలక్ష్మణేన = లక్ష్మణునితో కూడియున్న; ప్రశాస్తు = పాలించుగాక; హీనః = లేని; భరతః = భరతుడు; త్వయా సహ = నీతో కూడి; పురం చ = పురమును; రాష్ట్రం చ = రాష్ట్రమును; నిహత్య = చంపి; బాంధవాన్ = బంధువులను; మమ = నాయొక్క; అహితానామ్ = శత్రువులకు; భవ = అగుము; అభిహర్షిణీ = ఆనందము చేకూర్చుదానవు.
భావం;-
 నాకును, లక్ష్మణసమేతుడైన రామునకును దూరమైన భరతునితో కలసి, నీవు నగరమును, రాష్ట్రమును పాలింపుము. నీవు నా శత్రువులకు ఆనందము చేకూర్చుదాన వయ్యెదవుగాక.
2.12.109.
జగతి.
నృశంసవృత్తే! వ్యసనప్రహారిణి!
ప్రసహ్య వాక్యం యదిహాద్య భాషసే।
న నామ తే కేన ముఖాత్పతంత్యధో
విశీర్యమాణా దశనా స్సహస్రధా॥
టీక:-
 నృశంసవృత్తే = క్రూరప్రవృత్తి కలదాన; వ్యసన = ఆపదలతో; ప్రహారిణి = దెబ్బతీసుదాన; ప్రసహ్య = బలవంతముగ; వాక్యం = మాటను; యత్ = ఏ; అద్య = ఇపుడు; భాషసే = మాటలాడుచున్నావో; న నామ = లేదో; తే = నీ యొక్క; కేన = ఎందువలన; ముఖాత్ = ముఖమునుండి; పతంతి = పడుట; అధః = క్రింద; విశీర్యమాణా = విరిగిపోయి; దశనా = దంతములు; సహస్రధా = వేయి ముక్కలుగ.
భావం;-
 క్రూర ప్రవృత్తి కలదానా! కష్టకాలమున అపకారము తలపెట్టుదాన! నీవు ఇపుడిట్లు మాటలాడుచున్న సమయమున నీదంతములు వేయి ముక్కలుగ విరిగిపోయి ఎందులకు రాలిపడుట లేదో కదా!
2.12.110.
జగతి.
న కించిదాహాహితమప్రియం వచో
న వేత్తి రామః పరుషాణి భాషితుమ్।
కథన్ను రామే హ్యభిరామవాదిని
బ్రవీషి దోషాన్గుణనిత్యసమ్మతే॥
టీక:-
 న = లేదు; కించిత్ = కొంచెముకూడ; ఆహితమ్ = హితము కానిది; అప్రియం = అప్రియమైన; వచః = మాటను పలుకుట; న వేత్తి = ఎరుగనే ఎరుగడు; రామః = రాముడు; పరుషాణి = పరుషమైన; భాషితుమ్ = పలుకుట; కథం ను = ఎట్లు; రామే = రాముని విషయమై; అభిరామ = మధురముగ; వాదిని = మాటలాడువాడు; బ్రవీషి = చెప్పుచున్నావు; దోషాన్ = దోషములను; గుణనిత్యసమ్మతే = గుణముల వలన ఆదరింపబడువాడు; గుణ = సుగుణముల వలన; నిత్య = ఎల్లప్పుడు; సమ్మతే = ఆదరింపబడువాడు.
భావం;-
 రాముడు అహితముగను, అప్రియముగను మాటలాడడు. పరుషముగ మాటలాడుట అతడు ఎరుగడు. మధురముగ మాటలాడువాడును, అందరిచే ఆదరింపబడువాడును ఐన రాముని గురించి దోషములు ఎట్లు చెప్పగలవు.
2.12.111.
జగతి.
ప్రతామ్య వా ప్రజ్వల వా ప్రణశ్య వా
సహస్రశో వా స్ఫుటితా మహీం వ్రజ।
న తే కరిష్యామి వచ స్సుదారుణం
మమాహితం కేకయరాజపాంసని!॥
టీక:-
 ప్రతామ్య = దుఃఖపడుము; వా = లేదా; ప్రజ్వల = కాలిపొమ్ము; వా = లేదా; ప్రణశ్య = నాశనమైనను; వా = లేదా; సహస్రశః = వేయిముక్కలుగ; స్ఫుటితా = విరిగిపోయి; మహీం = నేలను; వ్రజ = పొందుము; న = లేదు; తే = నీ యొక్క; కరిష్యామి = చేయను; వచః = మాటను; సుదారుణం = చాల దారుణమైన; మమ = నా యొక్క; ఆహితం = హితము కానిది; కేకయరాజపాంశని = కేకయరాజులకు కళంకమైనదాన.
భావం;-
 కేకయ వంశమునకు కళంకమైనదాన! నీవు ఏడ్చినను, కాలిపోయినను, నాశనమైనను, వేయి ముక్కలుగ విరిగి నేలపై పడిపోయినను, చాల దారుణమైనదియు, నాకు అప్రియమైనదియు ఐన నీ మాట ఆచరించను.
2.12.112.
జగతి.
క్షురోపమాం నిత్యమసత్ప్రియంవదాం
ప్రదుష్టభావాం స్వకులోపఘాతినీమ్।
న జీవితుం త్వాం విషహేఽమనోరమాం
దిధక్షమాణాం హృదయం సబంధనమ్॥
టీక:-
 క్షుర = మంగలికత్తి; ఉపమాం = వంటిదానవు; నిత్యమ్ = ఎల్లప్పుడును; అసత్ = అబద్దపు; ప్రియం = తీయని, ప్రీతిగా; వదాం = మాటలు పలుకుదానవు; ప్రదుష్టభావాం = మిక్కిలి దుష్టబుద్ధి కలదానవు; స్వకుల = స్వంత కులమునే; ఉపఘాతినీమ్ = నాశనము చేయుదానవు; న = లేదు; జీవితుం = జీవించి యుండుటకు; త్వాం = నిన్ను; విషహే = సహించుట; అమనోరమాం = మనసునకు సంతోషము కలిగించనిదానవు; దిధక్షమాణాం = దహింపచేయుచున్నదానవు; హృదయం = హృదయమును; సబంధనమ్ = ఆధారములతో సహ.
భావం;-
 నీవు మంగలికత్తి వంటిదానవు. ప్రతినిత్యము అసత్యమైన ప్రియవాక్కులను మాటలాడుదానవు. నీ కులమునకే నాశనము తలపెట్టినదానవు. మనోవేదన కలిగించుదానవు. నా హృదయమును దహింపజేయుచున్నావు. అటువంటి నీవు జీవించియుండుట నాకు ఇష్టము లేదు.
2.12.113.
జగతి.
న జీవితం మేఽస్తి పునఃకుతస్సుఖమ్
వినాఽఽత్మజేనాఽత్మవతః కుతో రతిః।
మమాహితం దేవి! న కర్తుమర్హసి
స్పృశామి పాదావపి తే ప్రసీద మే॥
టీక:-
 న = లేదు; జీవితం = జీవితము; మే = నాకు; అస్తి = ఉండుట; పునః = మరల; కుతః = ఎట్లు; సుఖమ్ = సుఖము; వినా ఆత్మజేన = పుత్రుడు లేకుండగ; ఆత్మవతః = జీవించి ఉండగ; కుతః = ఎట్లు; రతిః = ఆనందము; మమ = నా యొక్క; అహితం = హితము కానిది; దేవి = దేవీ; న కర్తుమ్ అర్హసి = చేయుటకు తగవు; స్పృశామి = స్పృశించెదను; పాదౌ = పాదములను; అపి = కూడ; తే = నీ యొక్క; ప్రసీద = దయచూపుము; మే = నా విషయమై.
భావం;-
 రాముడు లేని యెడల నాకు జీవితమే లేదు. ఇక సుఖము ఎట్లు కలుగును. నేను జీవించియుండగ నాకు ఆనందము ఎట్లు కలుగును. ఓ దేవీ! నాకు హితము కానటువంటి ఈ కార్యమును చేయకుము. నీ పాదములు కూడ పట్టుకొనెదను. నా పై దయచూపుము.
2.12.114.
జగతి.
స భూమిపాలో విలపన్ననాథవత్
స్త్రియా గృహీతో హృదయేఽతిమాత్రయా।
పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారితా
వుభావసమ్స్పృశ్య యథాఽతురస్తథా॥
టీక:-
 సః = ఆ; భూమిపాలః = రాజు; విలపన్ = విలపించుచు; అనాథవత్ = అనాథ వలె; స్త్రియా = స్త్రీచేత; గృహీతః = పట్టుకొనబడిన; హృదయే = హృదయమునందు; అతిమాత్రయా = మర్యాదను అతిక్రమించిన; పపాత = పడిపోయెను; దేవ్యాః = దేవియొక్క; చరణౌ = పాదములను; ప్రసారితౌ = దూరముగ చాపబడిన; ఉభౌ = రెండు; అవసమ్స్పృశ్య = ముట్టకుండగనే; యథా = ఎట్లో; ఆతురః = వ్యాధిగ్రస్తుడు; తథా = అట్లు.
భావం;-
 మర్యాదను అతిక్రమించిన భార్య, మనోవేదనను కలిగించగా, దశరథుడు అనాథవలె విలపించుచు, ఎక్కడ తన పాదములు పట్టుకొనునో అని దూరము జరుగగా, ఆమె పాదములను తాకకుండగనే వ్యాధిగ్రస్తునివలె నేలపై పడిపోయెను.
2.12.115.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
అయోధ్యకాణ్డే
ద్వాదశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యా కాండ లోని; ద్వాదశ [12] = పన్నెండవ; సర్గః = సర్గ.
భావం;-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [12] పన్నెండవ సర్గ సంపూర్ణము.