73-77వ సర్గ వరకు
బాల కాండ
॥త్రిసప్తతితమః సర్గః॥
[73 - వివాహమహోత్సవం]
1.73.1.
అనుష్టుప్.
యస్మింస్తు దివసే రాజా!
చక్రే గోదానముత్తమమ్ ।
తస్మిం స్తు దివసే శూరో!
యుధాజిత్సముపేయివాన్ ॥
టీక:-
యస్మిన్ తు = ఏ; తు; దివసే = దినమున; రాజా = రాజు; చక్రే = చేసెనో; గోదానమ్ = సమావర్తనము; ఉత్తమమ్ = ఉత్తమమైన; తస్మిన్ తు = ఆ; దివసే = దినమున; శూరః = శూరుడు, యుద్దమునకు భయపడనివాడు, ఆంధ్రవాచస్పతము; యుధాజిత్ = యుధాజిత్తు; సముపేయివాన్ = ఏతెంచెను.
భావము:-
దశరథమహారాజు తన నలుగురు కుమారుల వివాహసందర్భమున ఉత్తమమైన సమావర్తనము దినమునాడు, శూరుడు యుధాజిత్తు అచటకు వచ్చెను.
గమనిక:-
*- యుధాజిత్తు- యుద్దములను జయించు శీలము కలవాడు.
1.73.2.
అనుష్టుప్.
పుత్రః కేకయరాజస్య
సాక్షాద్భరతమాతులః" ।
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం
రాజానమిదమబ్రవీత్ ॥
టీక:-
పుత్రః = కుమారుడు; కేకయ రాజస్య = కేకయ రాజు (అశ్వపతి, పురాణ నామ చంద్రిక) యొక్క; సాక్షాత్ = సాక్షాత్తు; భరత = భరతుని; మాతులః = మేనమామ; దృష్ట్వా = చూసి; పృష్ట్వా = అడిగెను; చ = మఱియు కుశలమ్ = క్షేమసమాచారమును; రాజానమ్ = రాజును గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
కేకయరాజు కుమారుడు యుధాజిత్తు భరతునికి స్వయముగా మేనమామ. అతడు దశరథుని క్షేమసమాచారము అడిగి, మరల దశరథునితో ఇట్లు పలికెను.
1.73.3.
అనుష్టుప్.
“కేకయాధిపతీ రాజా
స్నేహాత్ కుశలమబ్రవీత్ ।
యేషాం కుశలకామోఽ సి
తేషాం సంప్రత్యనామయమ్ ॥
టీక:-
కేకయాధిపతీ = కేకయ దేశమునకు అధిపతి; రాజా = రాజు; స్నేహాత్ = స్నేహము వలన; కుశలమ్ = క్షేమమును; అబ్రవీత్ = అడిగెను; ఏషాం = ఎవరి; కుశల = క్షేమము; కామః = తెలుసుకొన గోరి; అసి = ఉంటివో; తేషాం = వారికి; సంప్రతి = ఇప్పుడు; అనామయమ్ = ఆరోగ్యము.
భావము:-
ఓ రాజా! కేకయ దేశాధిపతి, మా తండ్రి స్నేహపూర్వకముగా మీ కుశలమును అడిగిరి.మీరు కుశలము కోరుకొనుచున్నవారందరును ఆరోగ్యవంతులై ఉన్నారు.
1.73.4.
అనుష్టుప్.
స్వస్రీయం మమ రాజేంద్ర
ద్రష్టుకామో మహీపతిః! ।
తదర్థముపయాతోఽ హమ్
అయోధ్యాం రఘునందన!" ॥
టీక:-
స్వస్రీయం = మేనల్లుని; మమ = నా యొక్క; రాజేంద్ర = రాజులలో గొప్పవాడా; ద్రష్టు = చూచుటకు; కామః = ఇష్టుడు; మహీపతిః = రాజు; తత్ అర్థమ్ = దాని కొరకు; ఉపయాతః = వెళ్ళితిని; అహం = నేను; అయోధ్యామ్ = అయోధ్య గురించి; రఘునందన = రఘువంశమునకు ఆనందకరుడా.
భావము:-
దశరథ మహారాజా! మా తండ్రి కేకయరాజుగారు నా మేనల్లుడు భరతుని చూడగోరుచుటచే, నేను భరతుని తోడ్కొని పోవుటకు అయోధ్యకు వెళ్ళితిని.
1.73.5.
అనుష్టుప్.
శ్రుత్వా త్వహమయోధ్యాయాం
వివాహార్థం తవాత్మజాన్ ।
మిథిలాముపయాతాంస్తు
త్వయా సహ మహీపతే! ॥
టీక:-
శ్రుత్వా = విని; అహం = నేను; అయోధ్యాయామ్ = అయోధ్యలో; వివాహార్థం = వివాహము కొరకై; తవ = మీ యొక్క; ఆత్మజాన్ = పుత్రుల; మిథిలామ్ = మిథిలానగరము గూర్చి; ఉపయాతాన్ తు = వచ్చినవారిగ; తు; త్వయా = నీతో; సహ = కూడి; మహీపతే = రాజా.
భావము:-
దశరథ మహారాజా! మీరు మీ పుత్రుల వివాహ నిమిత్తము మిథిలానగరమునకు వెళ్ళితిరని అయోధ్యలో వినియుంటిని.
1.73.6.
అనుష్టుప్.
త్వరయాభ్యుపయాతోఽ హం
ద్రష్టుకామ స్స్వసుస్సుతమ్” ।
అథ రాజా దశరథః
ప్రియాతిథి ముపస్థితమ్ ॥
టీక:-
త్వరయా = వేగముగ; అభి+ఉపయాతః = బయలుదేరి వచ్చితిని; అహం = నేను; ద్రష్టు = చూచు; కామః = కోరిక గలవాడు; స్వసుః = సోదరి యొక్క; సుతమ్ = పుత్రుని; అథ = అప్పుడు; రాజా = రాజు దశరథ = దశరథుడు; ప్రియ = ఇష్టుడైన; అతిథిమ్ = అతిథిని; ఉపస్థితమ్ = వచ్చిన.
భావము:-
నేను త్వరితముగా నా మేనల్లుడు భరతుని చూచు కోరికతో ఇచటకు వచ్చితిని.” అపుడు దశరథమహారాజు వచ్చిన ఇష్టుడైన అతిథి యుధాథాజిత్తుతో,
1.73.7.
అనుష్టుప్.
దృష్ట్వా పరమసత్కారైః
పూజార్హం సమపూజయత్ ।
తతస్తాముషితో రాత్రిమ్
సహ పుత్రైర్మహాత్మభిః ॥
టీక:-
దృష్ట్వా = చూసి; పరమ = గొప్ప; సత్కారైః = సత్కారములు; పూజార్హం = పూజకు యోగ్యుడైన వానిని; సమపూజయత్ = తగురీతిగ పూజించెను; తతః = తరువాత; తామ్ = ఆ; ఉషితః = ఉండెను; సహ పుత్రైః = పుత్రులతో కూడి; మహాత్మభిః = మహాత్ములైన.
భావము:-
దశరథమహారాజు పూజకు యోగ్యుడైన యుధాజిత్తునితగురీతిలో సత్కరించెను. తరువాత తన నివాసమునకు వెళ్ళి ఆ రాత్రిమహత్ములైన తన నలుగురు కుమారులతో గడిపెను.
1.73.8.
అనుష్టుప్.
ప్రభాతే పునరుత్థాయ
కృత్వా కర్మాణి కర్మవిత్ ।
ఋషీంస్తదా పురస్కృత్య
యజ్ఞవాట ముపాగమత్ ॥
టీక:-
ప్రభాతే = వేకువన; పునః = మరల; ఉత్ధాయ = లేచి; కృత్వా = చేసి; కర్మాణి = శ్రద్ధాళువు; కర్మ = క్రియలను; విత్ = విధ్యుక్తమైనవి; ఋషీన్ = ఋషులను; తదా = అప్పుడు; పురస్కృత్యా = ముందు ఉంచుకొని; యజ్ఞవాటమ్ = యజ్ఞవాటిక గూర్చి; ఉపాగమత్ = చేరెను.
భావము:-
శ్రద్ధాళువైన దశరథుడు మరుసటి దినము వేకువన లేచి యథోచిత కర్మలను నిర్వర్తించిన పిమ్మట, ఋషుల వెంట యజ్ఞవాటికకు చేరెను.
గమనిక:-
*- ప్రభాతము- తెల్లవాఱుటకు ముందు నాలుగు గడియలు గల కాలము, శబ్దరత్నాకరము, వేకువ, తెల్లవాఱగట్ల.
1.73.9.
అనుష్టుప్.
యుక్తే ముహూర్తే విజయే
సర్వాభరణ భూషితైః ।
భ్రాతృభిస్సహితో రామః
కృతకౌతుక మంగళః ॥
టీక:-
యుక్తే = తగిన; ముహూర్తే = ముహూర్తమునందు; విజయే = విజయయందు; సర్వ = సకల; ఆభరణ = ఆభరణములతో; భూషితైః = అలంకరింపబడినవాడై; భ్రాతృభిః = సోదరులతో; సహితః = కూడి; రామః = రాముడు; కృత = చేయబడిన; కౌతుక మంగలః = పవిత్ర కంకణము.
భావము:-
రాముడు సకల ఆభరణములతో అలంకరింపబడి, తన సోదరులతో కూడి విజయ అను సుముహూర్త సమయములో ముంజేతికి పవిత్ర కంకణము ధరించెను.
గమనిక:-
*- ముహూర్తము అనగా మన భారతీయకాలమానములో దిన భాగము. ఒక ముహూర్తము రెండు గడియలకు సమానము, ఇప్పటిలెక్క ప్రకారము సుమారు 48 ని. దినమునకు 15 ముహూర్తములు. ఇందు కొన్ని మంచి సుముహూర్తములు. అట్టి ముహూర్తములలో ఆరవది (6)విజయము అనబడును. (https://telugubhagavatam.org/?Details&Branch = anuyuktaalu&Fruit = (2)%20kalamuKolataDinaBhagamuluMuhurtamunlu
1.73.10.
అనుష్టుప్.
వసిష్ఠం పురతః కృత్వా
మహర్షీ నపరానపి ।
పితు స్సమీపమాశ్రిత్య
తస్థౌ భ్రాతృభిరావృతః ॥
టీక:-
వసిష్ఠం = వసిష్ఠుని; పురతః = ముందు; కృత్వా = ఉంచుకొని; మహర్షీన్ = మహర్షులను; అపరాన్ = ఇతర; అపి = కూడ; పితుః = తండ్రియొక్క; సమీపమ్ = సమీపమును; ఆశ్రిత్య = ఆశ్రయించినవాడై; తస్థౌ = ఉండెను; భ్రాతృభిః = సోదరులతో; ఆవృతః = చుట్టుకొనబడినవాడై.
భావము:-
వసిష్ఠుడు మొదలగు ఋషులను వెంట, తన సోదరులు తనను చుట్టియుండ రాముడు తమ తండ్రి సమీపమున ఉండెను.
1.73.11.
అనుష్టుప్.
వసిష్ఠో భగవానేత్య
వైదేహమిదమబ్రవీత్ ।
“రాజా! దశరథో రాజన్
కృతకౌతుక మంగళైః ॥
టీక:-
వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = భగవత్స్వరూపుడైన; ఏత్య = సమీపించి; వైదేహమ్ = విదేహదేశపురాజుని; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను; రాజా = రాజు; దశరథః = దశరథుడు; రాజన్ = రాజా; కృత = చేయబడిన; కౌతుకమంగళైః = మంగళ తోరములు.
భావము:-
భగవత్స్వరూపుడు వసిష్ఠుడు జనకమహారాజుని సమీపించి అతనితో ఇట్లు చెప్పెను. "జనకమహారాజా! దశరథమహారాజు మంగళ తోరములు ధరించెను.
1.73.12.
అనుష్టుప్.
పుత్రైర్నరవర శ్రేష్ఠ!
దాతార మభికాంక్షతే ।
దాతృ ప్రతిగ్రహీతృభ్యామ్
సర్వార్థాః ప్రభవంతి హి ॥
టీక:-
పుత్రైః = పుత్రులతో; నరవర శ్రేష్ఠ = నరవరులలో శ్రేష్ఠుడా; దాతారమ్ = దానము చేయువాని గూర్చి; అభికాఙ్క్షతే = ఎదురు చూచుచున్నాడు; దాతృః = దాతకును; ప్రతిగ్రహీతృభ్యామ్ = దానము పుచ్చుకొనువారికిని; సర్వ = సమస్త; అర్థాః = పురుషార్థములు, ప్రయోజనములును; ప్రభవంతి = సంభవించును; హి = తప్పక.
భావము:-
నరవరులలో శ్రేష్ఠుడైన జనకమహారాజా! దశరథమహారాజు మంగళ తోరములు ధరించిన తన పుత్రులతో కన్యాదానోత్సవము గురించి ఎదురు చూచుచున్నాడు. కన్యాదాతకును కన్యాదానము స్వీకరించు వారికిని చతుర్విధ పురుషార్థము లన్నియు ప్రాప్తించును.
1.73.13.
అనుష్టుప్.
స్వధర్మం ప్రతిపద్యస్వ
కృత్వా వైవాహ్యముత్తమమ్" ।
ఇత్యుక్తః పరమోదారో
వసిష్ఠేన మహాత్మనా ॥
టీక:-
స్వధర్మం = నీ కర్తవ్యమును; ప్రతిపద్యస్వ = నెరవేర్చుము; కృత్వా = చేసి; వైవాహ్యమ్ = వివాహమును; ఉత్తమమ్ = ఉత్తమమైన; ఇతి = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; పరమోదారః = గొప్ప ఔదార్యము కలవాడు; వసిష్ఠేన = వసిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడైన.
భావము:-
నీవు నీ కర్తవ్యము నెరపి ఉత్తము వివాహము జరిపించుము." అని గొప్ప ఉదారస్వభావుడైన జనకమహారాజుతో వసిష్ఠ మహర్షి చెప్పెను.
1.73.14.
అనుష్టుప్.
ప్రత్యువాచ మహాతేజా
వాక్యం పరమధర్మవిత్ ।
“కస్స్థితః ప్రతిహారో మే
కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే ॥
టీక:-
ప్రత్యువాచ = బదులు పలికెను; మహాతేజా = మహా తేజశ్శాలి; వాక్యం = మాటను; పరమ = గొప్ప; ధర్మవిత్ = ధర్మవిదుడు; కః = ఎవడు; స్థితః = కలడు; ప్రతీహారః = ద్వారపాలకుడు; మే = నా యొక్క; కస్య = ఎవని యొక్క; ఆజ్ఞా = అనుమతి; సంప్రతీక్ష్యతే = ఎదురుచూడబడుచున్నది.
భావము:-
మహాతేజశ్శాలి, పరమధర్మవిదుడైన జనకమహారాజు వసిష్ఠునికి ఇట్లు బదులు పలికెను " మీ రాకను నిలువరించు ద్వారపాలకుడు ఎవడుఇక్కడ కలడు ? ఎవని అనుజ్ఞ కొరకు ఎదురు చూచుచుంటిరి ?
1.73.15.
అనుష్టుప్.
స్వగృహే కో విచారోఽ స్తి
యథా రాజ్యమిదం తవ ।
కృతకౌతుక సర్వస్వా
వేదిమూల ముపాగతాః ॥
టీక:-
స్వగృహే = స్వగృహములో; కః = ఏమి; విచారః = ఆలోచన; అస్తి = ఉండును; యథా = వలె; రాజ్యమ్ = రాజ్యము; ఇదం = ఈ; తవ = నీ యొక్క; కృత = చేయబడిన; కౌతుక = మంగళ తోరములు; సర్వస్వా = సకలములు; వేదిమూలమ్ = యజ్ఞవేదిక సమీపమున; ఉపాగతః = వచ్చియున్నారు.
భావము:-
ఎవరైనను స్వగృహము లోనికి ప్రవేశించుటకు ఆలోచించవలెనా? ఇదియును మీ రాజ్యమే. వారి చేతులకు మంగళ తోరములు ధరించి యజ్ఞవేదికకు వచ్చియున్నారు.
1.73.16.
అనుష్టుప్.
మమ కన్యా మునిశ్రేష్ఠ!
దీప్తా వహ్నేరివార్చిషః ।
సజ్జోఽ హం త్వత్ప్రతీక్షోఽ స్మి
వేద్యామస్యాం ప్రతిష్ఠితః ॥
టీక:-
మమ = నా యొక్క; కన్యా = కన్యలు; మునిశ్రేష్ఠా = మునిశ్రేష్ఠా; దీప్తాః = ప్రకాశించుచున్న; వహ్నేః = అగ్ని; ఇవ = వలె; అర్చిషః = జ్వాలలు; సజ్జః = సిద్ధముగా; అహం = నేను; త్వత్ = నీ కొరకై; ప్రతీక్షః = నిరీక్షించుచు; అస్మి = ఉంటిని; వేద్యామ్ = వేదిక యందు; అస్యాం = ఈ; ప్రతిష్ఠితః = నిలచిన.
భావము:-
మునిశ్రేష్ఠా! నా కన్యలు అగ్నిజ్వాలల వలె తేజోవంతులై వేదిక వద్దనుంటిరి. నేను సర్వసన్నద్ధుడనై ఈ వేదికయందు మీకై నిరీక్షించుచుంటిని.
1.73.17.
అనుష్టుప్.
అవిఘ్నం కురుతాం రాజా!
కిమర్థమవలమ్బతే" ।
తద్వాక్యం జనకేనోక్తమ్
శ్రుత్వా దశరథస్తదా ॥
టీక:-
అవిఘ్నం = విఘ్నము లేకుండగ; కురుతాం = చేయును గాక; రాజా = రాజు; కిమర్థం = దేని కొరకు; అవలంబతే = ఆలస్యము చేయుచుండెను; తత్ = ఆ; వాక్యం = మాటను; జనకేన = జనకునిచే; ఉక్తమ్ = చెప్పబడిన; శ్రుత్వా = విని; దశరథః = దశరథుడు; తదా = అప్పుడు.
భావము:-
దశరథమహారాజుఎటువంటి ఆటంకములు లేక కార్యము జరుపవలయును. ఆలస్యము చేయవలదు", అని జనకుడు పలుక దశరథుడు విని అప్పుడు.
1.73.18.
అనుష్టుప్.
ప్రవేశయామాస సుతాన్
సర్వా నృషిగణానపి ।
తతో రాజా విదేహానామ్
వసిష్ఠ మిదమబ్రవీత్ ॥
టీక:-
ప్రవేశయామాస = ప్రవేశపెట్టెను; సుతాన్ = పుత్రులను; సర్వాన్ = అందరిని; ఋషిగణాన్ = ఋషి గణములను; అపి = కూడ; తతః = పిదప; రాజా = రాజు; విదేహానామ్ = విదేహదేశపు; వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
జనకుని మాటలు విని దశరథుడు, తన పుత్రులు, ఋషులను అందరిని లోనికి ప్రవేశపెట్టెను. అప్పుడు జనకుడు వసిష్ఠునితో ఇట్లు పలికెను.
1.73.19.
అనుష్టుప్.
“కారయస్వ ఋషే సర్వం
ఋషిభిః సహ ధార్మిక ।
రామస్య లోకరామస్య
క్రియాం వైవాహికీం విభో" ॥
టీక:-
కారయస్వ = చేయింపుము; ఋషే = ఋషీ; సర్వం = అంతయును; ఋషిభిః = ఋషులతో; సహ = కూడి; ధార్మిక = ధర్మాత్ముడా; రామస్య = రామునియొక్క; లోక = లోకమును; రామస్య = రంజింపజేయు; క్రియాం = ప్రక్రియను; వైవాహికీం = వివాహ సంబంధమైన; విభో = ప్రభూ.
భావము:-
“ధర్మాత్మా! ఓ వసిష్ఠ మహర్షీ! మీ ఋషిగణములతో కూడి లోకమనోహరుడైన రాముని వివాహ ప్రక్రియను చేయించుడు ప్రభూ".
1.73.20.
అనుష్టుప్.
తథేత్యుక్త్వా తు జనకమ్
వసిష్ఠో భగవానృషిః ।
విశ్వామిత్రం పురస్కృత్య
శతానన్దం చ ధార్మికమ్ ॥
టీక:-
తథా = అట్లే; ఇతి = అని; ఉక్త్వా = పలికి; జనకమ్ = జనకమహారాజు గురించి; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ ఋషిః = భగవత్స్వరూపుడైన ఋషి; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్యా = ముందు ఉంచుకొని; శతానందం = శతానందుడు; ధార్మికమ్ = ధర్మాత్ముని.
భావము:-
జనక మహారాజుతో అట్లే అని పలికి, భగవత్స్వరూపుడైన వసిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని, ధర్మాత్ముడుశతానందులను ముందిడుకొని,
1.73.21.
అనుష్టుప్.
ప్రపామధ్యే తు విధివత్
వేదిం కృత్వా మహాతపాః ।
అలంచకార తాం వేదిమ్
గంధపుష్పై స్సమంతతః ॥
టీక:-
ప్రపా = మండపము; మధ్యే = మధ్యన; విధివత్ = సశాస్త్రీయముగా; వేదిం = యజ్ఞవేదికను; కృత్వా = సిద్ధపరచి; మహాతపః = మహాతపశ్శాలి; అలంకాకార = అలంకరించెను; తాం = ఆ; వేదిమ్ = యజ్ఞవేదికను; గంధ = గంధము; పుష్పైః = పుష్పములతో; సమంతతః = అంతట.
భావము:-
మహాతపశ్శాలి వసిష్ఠుడు, మండపము మధ్యలో యజ్ఞగుండమును శాస్త్రరీతిలో సిద్ధపరచి, దానిని అంతట గంధ,పుష్పములతో అలంకరించెను.
1.73.22.
అనుష్టుప్.
సువర్ణపాలి కాభిశ్చ
ఛిద్రకుమ్భైశ్చ సాంకురైః ।
అంకురాఢ్యైశ్శరావైశ్చ
ధూపపాత్రై స్సధూపకైః ॥
టీక:-
సువర్ణ = బంగారు; పాలికాభిః = పాలికలతో; చ = కూడ; ఛిద్రకుమ్భైః = చిల్లు పాత్రలతో; చ = కూడ; సః = కలసి యున్న; అంగరాఢ్యై = ధాన్యపు మొలకలతో; శరావైః = మట్టిపాత్రలతో; ధూపపాత్రైః = ధూపము వేయుటకు ఉపయోగించు పాత్రలతో; సధూపకైః = సుగంధ ధూపద్రవ్యముతో.
భావము:-
బంగారు పాత్రలు, చిల్లు పాత్రలు, మొలకలు వచ్చిన ధాన్యము కలిగిన పాలికలు, సుగంధ ధూపముతో నిండియున్న ధూపపాత్రలతో వేదికను అలంకరించెను.
1.73.23.
అనుష్టుప్.
శంఖపాత్రై స్స్రువైస్స్రుగ్భిః
పాత్రైరర్ఘ్యాభిపూరితైః ।
లాజపూర్ణైశ్చ పాత్రీభిః
అక్షతై రభిసంస్కృతైః ॥
టీక:-
శఙ్ఖపాత్రైః = శంఖపాత్రలతో; స్రువైః = స్రువములతో; స్రుగ్భిః = స్రుక్కులతో; పాత్రైః = పాత్రలతో; అర్ఘ్య = అర్ఘ్యోదకముతో; అభిపూరితైః = నింపబడిన; ఆది = మొదలగు; లాజ = పేలాలతో; పూర్ణైః = నిండిన; చ = మఱియు; పాత్రీభిః = పాత్రలతో; అక్షతైః = అక్షతలచేతను; అభిసంస్కృతైః = సంస్కరింపబడిన.
భావము:-
శంఖపాత్రలు, యజ్ఞములో నేయి వేయుటకు ఉపయోగపడు స్రువలు, స్రుక్కులు, అర్ఘ్యపాత్రలు, పేలాలతో నిండినపాత్రలతో, సంస్కరించబడిన అక్షతలు చేతను వేదికను సిద్ధపరచెను.
1.73.24.
అనుష్టుప్.
దర్భై స్సమై స్సమాస్తీర్య
విధివ న్మంత్రపూర్వకమ్ ।
అగ్నిమాదాయ వేద్యాం తు
విధిమ ంత్రపురస్కృతమ్ ॥
టీక:-
దర్భైః = దర్భలతో; సమైః = సమముగా చేయబడిన; సమాస్తీర్య = క్రమముగా పేర్చబడిన; విధివత్ = యథాశాస్త్రముగ; మంత్రపూర్వకమ్ = మంత్రపూర్వకముగా; అగ్నిమ్ = అగ్నిని; ఆదాయ = తీసుకొని; వేద్యాం తు = యజ్ఞ గుండమునందు; తు; విధి = శాస్త్రప్రకారము; మంత్రపురస్కృతమ్ = అభిమన్త్రించిన.
భావము:-
సమానముగా చేయబడిన దర్భలు మంత్రవిధిగా పేర్చి, మంత్రపూర్వకముగా అగ్నిని ఉంచెను.
1.73.25.
అనుష్టుప్.
జుహావాగ్నౌ మహాతేజా
వసిష్ఠో భగవానృషిః ।
తతస్సీతాం సమానీయ
సర్వాభరణ భూషితామ్ ॥
టీక:-
జుహావ = హోమము చేసెను; అగ్నౌ = అగ్ని యందు; మహాతేజా = గొప్ప తేజశ్శాలి; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవానృషిః = భగవత్స్వరూపుడైన ఋషి; తతః = అప్పుడు; సీతాం = సీతను; సమానీయ = తోడ్కొనివచ్చి; సర్వ = సమస్తమైన; ఆభరణ = ఆభరణములతో; భూషితామ్ = అలంకరింపబడిన.
భావము:-
మహాతేజశ్శాలియు భగవత్స్వరూపుడైన వసిష్ఠమహర్షి పవిత్రమైన ఆజ్యము యజ్ఞగుండమునందు వేసి హోమము చేసెను. అపుడు సకల ఆభరణములతో అలంకృతురాలైన సీతను అచ్చటకు తోడ్కొని వచ్చిరి.
1.73.26.
అనుష్టుప్.
సమక్షమగ్నే స్సంస్థాప్య
రాఘవాభిముఖే తదా ।
అబ్రవీజ్జనకో రాజా
కౌసల్యానంద వర్ధనమ్ ॥
టీక:-
సమక్షమ్ = సమక్షమున; అగ్నేః = అగ్నికి; సంస్థాప్య = నిలిపి; రాఘవ = రామ; అభిముఖే = ఎదుట; తదా = అప్పుడు; అబ్రవీత్ = పలికెను; జనకః = జనకమహారాజు; రాజా = రాజు; కౌసల్య = కౌసల్య యొక్క; ఆనంద = ఆనందమును; వర్ధనమ్ = వృద్ధి పొందించువాని గూర్చి.
భావము:-
అప్పుడు జనకమహారాజు యాగాజ్ఞి సమక్షమునందు, కౌసల్యాదేవి ఆనందమును పెంపొందింపజేయు రాముని ఎదుట సీతను ఉంచి అతనితో ఇట్లు పలికెను.
1.73.27.
అనుష్టుప్.
* “ఇయం సీతా మమ సుతా
సహధర్మచరీ తవ ।
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే
పాణిం గృహ్ణీష్వ పాణినా ॥
టీక:-
ఇయం = ఈ; సీతా = సీత; మమ = నా యొక్క; సుతా = కుమార్తె; సహ = కలసి; ధర్మ = ధర్మమార్గమున; చరీ = నడచును; తవ = నీ యొక్క; ప్రతీచ్ఛ = స్వీకరింపుము; చ = మఱియు; ఏనాం = ఈమెను; భద్రం = శుభమగు గాక; తే = నీకు; పాణిం = చేతిని; గృహ్ణీష్వ = గైకొనుము; పాణినా = చేతితో.
భావము:-
“రామా! ఈ సీత నా కుమార్తె. నీ యొక్క ధర్మమార్గమునందు నీకు తోడుగా ఉండగలదు.ఈమెను స్వీకరింపుము. ఈమె పాణిగ్రహణము (వధువు చేతిని తన చేతిలోనికి తీసుకొనుట) చేయుము. నీకు శుభమగుగాక.
గమనిక:-
*- పాణిగ్రహణము అనగా వధువు చేతిని తన చేతిలోనికి తీసుకొనుట, వధువు బాధ్యత నాది నేను భరించెదను అని తెలుపుతూ వివాహము చేసుకుంటున్నందుకు సంకేతము.
1.73.28.
అనుష్టుప్.
* పతివ్రతా మహాభాగా
ఛాయేవానుగతా సదా" ।
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా
మంత్రపూతం జలం తదా ॥
టీక:-
పతివ్రతా = పతివ్రత ఐన; మహాభాగా = గొప్ప భాగ్యవంతురాలు; ఛాయ = నీడ; ఇవ = వలె; అనుగతా = అనుసరించి ఉండును; సదా = ఎల్లప్పుడు; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; ప్రాక్షిపత్ = పోసెను; రాజా = రాజు; మంత్రపూతం = మన్త్రించబడిన; జలం = నీటిని; తదా = అప్పుడు.
భావము:-
పతివ్రతయు భాగ్యవంతురాలై ఈమె నిన్ను నీడవలె వెన్నంటి యుండును", అని పలికి జనకమహారాజు మంత్రపూరిత జలమును వదిలెను.
1.73.29.
అనుష్టుప్.
“సాధు సాధ్వి”తి దేవానా
మృషీణాం వదతాం తదా ।
దేవదున్దుభి ర్నిర్ఘోషః
పుష్పవర్షో మహానభూత్ ॥
టీక:-
సాధు సాధు = బాగున్నది బాగున్నది; ఇతి = అని; దేవానామ్ = దేవతల యొక్కయు; ఋషీణాం = ఋషులయొక్కయు; వదతాం = పలుకుచుండ; తదా = అప్పుడు; దేవదుందుభిః = దేవ దుందుభుల (సంగీత వాద్య పరికరములు); నిర్ఘోషః = ధ్వని; పుష్పవర్షః = పూలవర్షము; మహాన్ = గొప్పగా; అభూత్ = అయ్యెను.
భావము:-
అప్పుడు దేవతలు, ఋషులు "బాగు, బాగు" అని పలుకుచుండ, దేవదుందుభులు మ్రోగెను. పూలవర్షము కురిసెను.
1.73.30.
అనుష్టుప్.
ఏవం దత్త్వా తదా సీతామ్
మన్త్రోదక పురస్కృతామ్ ।
అబ్రవీజ్జనకో రాజా
హర్షేణాభి పరిప్లుతః ॥
టీక:-
ఏవం = అట్లు; దత్త్వా = ఇచ్చి; తదా = అప్పుడు; సీతామ్ = సీతను; మన్త్రోదక = మంత్రించబడిన జలముతో; పురస్కృతామ్ = పురస్కృతురాలును; అబ్రవీత్ = పలికెను; జనకః = జనకుడు; రాజా = రాజు; హర్షేణ = ఆనందముతో; అభిపరిప్లుతః = నిండినవాడు.
భావము:-
ఆ విధముగా అప్పుడు మంత్రపూరిత జలముతో సీతను కన్యాదానము చేసి జనకమహారాజు ఆనందభరితుడై ఇట్లు పలికెను.
1.73.31.
అనుష్టుప్.
“లక్ష్మణాగచ్ఛ! భద్రం తే
ఊర్మిలాముద్యతాం మయా ।
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ
మాభూత్కాలస్య పర్యయః" ॥
టీక:-
లక్ష్మణ = లక్ష్మణా; ఆగచ్ఛ = రమ్ము; భద్రం = క్షేమము; తే = నీకు; ఊర్మిళామ్ = ఊర్మిళను; ఉద్యతాం = ఇచ్చుటకు నిశ్చయించబడిన; మయా = నా చే; ప్రతీచ్ఛ = స్వీకరింపుము; పాణిం = చేతిని; గృహ్ణీష్వ = గైకొనుము; మాభూత్ = కాకుండు గాక; కాలస్య = కాలము యొక్క; పర్యయః = తప్పిపోవుట.
భావము:-
లక్ష్మణా రమ్ము. నీకు క్షేమమగు గాక ! నీకు ఇచ్చుటకు నిశ్చయించిన ఊర్మిళను స్వీకరించుము . ఆలస్యము జరుగకుండ ఊర్మిళ చేతిని నీ చేతిలోనికి తీసుకొనుము.”
1.73.32.
అనుష్టుప్.
తమేవముక్త్వా జనకో
భరతం చాభ్యభాషత ।
“గృహాణ పాణిం మాండవ్యాః
పాణినా రఘునందన!” ॥
టీక:-
తమ్ = అతని గూర్చి; ఏవమ్ = అట్లు; ఉక్త్వా = పలికి; జనకః = జనకమహారాజు; భరతం = భరతుని గూర్చి; అభ్యభాషత = పలికెను; గృహాణ = స్వీకరింపుము; పాణిం = చేతిని; మాండవ్యాః = మాండవి యొక్క; పాణినా = చేతితో; రఘునందన = రఘువంశీయుడా.
భావము:-
జనకమహారాజు లక్ష్మణునితో అట్లు పలికిన పిదప, భరతునితో "భరతా ! మాండవి చేతిని నీ చేతితో స్వీకరింపుము" అని పలికెను.
1.73.33.
అనుష్టుప్.
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా
అబ్రవీ జ్జనకేశ్వరః ।
“శ్రుతకీర్త్యా మహాబాహో!
పాణిం గృహ్ణీష్వ పాణినా” ॥
టీక:-
శత్రుఘ్నం = శత్రుఘ్నుని గూర్చి; చ = మఱియు; అపి = కూడ; ధర్మాత్మా = ధర్మాత్ముడు; అబ్రవీత్ = పలికెను; జనకేశ్వరః = జనకమహారాజు; శ్రుతకీర్త్యాః = శ్రుతకీర్తి యొక్క; మహాబాహుః = గొప్ప భుజములు కలవాడా; పాణిం = చేతిని; గృహ్ణీష్వ = చేపట్టుము; పాణినా = చేతితో.
భావము:-
ధర్మాత్ముడైన జనకమహారాజు శత్రుఘ్నునితో కూడ "గొప్పభుజములు గల శత్రుఘ్నా! నీవు శ్రుతకీర్తి చేతిని నీ చేతిలోనికి తీసుకొనుము" అనెను.
1.73.34.
అనుష్టుప్.
“సర్వే భవంతస్సౌమ్యాశ్చ
సర్వే సుచరితవ్రతాః ।
పత్నీభిస్సంతు కాకుత్స్థా!
మాభూత్కాలస్య పర్యయః" ॥
టీక:-
సర్వే = అందరు; భవంత = మీరు; సౌమ్యాః = మృదు స్వభావులు; చ = మఱియు; సర్వే = అందరు; సుచరిత వ్రతాః = మంచి నడవడి కలవారు; పత్నిభిః = భార్యలతో; సంతు = అగుదురు గాక; కాకుత్స్థాః = కాకుత్స్థ వంశీయులైన మీరు; మా భూత్ = కాకుండు గాక; కాలస్య = కాలము యొక్క; పర్యయః = విలంబనము.
భావము:-
“మీరందరు మృదుస్వభావులు. కాకుత్స్థ వంశజులైన మీరు మంచినడవడి కలవారు. ఆలస్యము లేక మీరు మీ భార్యలను స్వీకరించి ఉండుడు.”
1.73.35.
అనుష్టుప్.
జనకస్య వచః శ్రుత్వా
పాణీన్ పాణిభిరాస్పృశన్ ।
చత్వారస్తే చతసృణాం
వసిష్ఠస్య మతే స్థితాః ॥
టీక:-
జనకస్య = జనకమహారాజు యొక్క; వచః = మాటను; శ్రుత్వా = విని; పాణీన్ = చేతులను; పాణిభిః = చేతులతో; ఆస్పృశన్ = స్పృశించి; చత్వారః = నలుగురు; తే = వారు; చతుసృణామ్ = నలుగురి యొక్క; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మతే = మతమునందు; స్థితాః = ఉన్నవారై.
భావము:-
జనకమహారాజుయొక్క పలుకులు విని, ఆ వివాహ సందర్భానుసారముగా వసిష్ఠుని ఉద్దేశము గ్రహించి ఆ నలుగురు వరులు నలుగురు వధువుల చేతులను గ్రహించిరి.
1.73.36.
అనుష్టుప్.
అగ్నిం ప్రదక్షిణీకృత్య
వేదిం రాజానమేవ చ ।
ఋషీంశ్చైవ మహాత్మానః
సభార్యా రఘుసత్తమాః ॥
టీక:-
అగ్నిం = అగ్నిని; ప్రదక్షిణీ = ప్రదక్షిణము; కృత్వా = చేసి; వేదిం = యజ్ఞవేదికను; రాజానామ్ = రాజును; ఇవ = వలె; ఋషీంశ్చైవ = ఋషులను; చ = మఱియు; ఏవ = వలె; మహాత్మనః = మహాత్ములు; సభార్యా = భార్యలతో కూడి; రఘుసత్తమాః = రఘువంశ శ్రేష్ఠులు.
భావము:-
మహాత్ములైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వారి వారి భార్యలతో కూడి, అగ్నికి ప్రదక్షిణము చేసి, జనక మహారాజునకు, వసిష్ఠునకు, ఋషులకు కూడా ప్రదక్షిణ నమస్కారములు చేసిరి.
1.73.37.
అనుష్టుప్.
యథోక్తేన తదా చక్రుః
వివాహం విధిపూర్వకమ్ ।
కాకుత్స్థైశ్చ గృహీతేషు
లలితేషు చ పాణిషు ॥
టీక:-
యథా = ఏ విధముగా; ఉక్తేన = చెప్పబడెనో; తదా = అప్పుడు; చక్రుః = చేసిరి; వివాహం = వివాహమును; విధిపూర్వకమ్ = శాస్త్రపూర్వకముగా; కాకుత్స్థైః = కాకుత్స్థ వంశజుల చేత; చ = మఱియు గృహీతేషు = గ్రహింపబడుటయందు; లలితేషు = కోమలమైన; పాణిషు = చేతులు.
భావము:-
శాస్త్రములో చెప్పిన విధముగరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహము చేసుకొని వారి భార్యల కోమలమైన చేతులు గ్రహించునపుడు
1.73.38.
అనుష్టుప్.
పుష్పవృష్టి ర్మహత్యాసీత్
అంతరిక్షా త్సుభాస్వరా ।
దివ్యదున్దుభి నిర్ఘోషైః
గీతవాదిత్ర నిస్వనైః ॥
టీక:-
పుష్పవృష్టిః = పూలవాన; మహతీ = గొప్ప; ఆసీత్ = అయ్యెను; అంతరిక్షాత్ = ఆకాశమునుండి; సుభాస్వరా = బాగా మెరయుచున్న; దివ్యదున్దుభిః = దేవదుందుభులతో; నిర్ఝోషైః = ధ్వనులతో; గీత = పాటల; వాదిత్ర = వాయిద్యముల; నిస్వనైః = రవములతోడను
భావము:-
ఆ సమయమున ఆకాశమునుండి, గొప్పగా మెరయుచు పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను. గీతాలాపనలు, వాద్య సంగీతములు వినిపించెను.
1.73.39.
అనుష్టుప్.
ననృతుశ్చా ప్సరస్సంఘా
గంధర్వాశ్చ జగుః కలమ్ ।
వివాహే రఘుముఖ్యానామ్
తదద్భుత మదృశ్యత ॥
టీక:-
ననృతుః = నాట్యము చేసినవి; చ = మఱియు; అప్సర సఙ్ఘాః = అప్సరస బృందములు; గంధర్వాః = గంధర్వులు; చ = కూడ జగుః = చేసిరి; కలమ్ = గానమును; వివాహే = వివాహమునందు; రఘుముఖ్యానామ్ = రఘువంశములోని ముఖ్యులయొక్క; తత్ = ఆ; అద్భుతమ్ = అద్భుతము; అదృశ్యత = చూడబడెను.
భావము:-
రఘువంశశ్రేష్ఠుల వివాహమహోత్సవ వేడుక సమయములో అప్సరసలు నాట్యము చేసిరి, గంధర్వులు మధురముగా గానము సలిపిరి. అందరు ఆ అద్భుత దృశ్యములను కాంచిరి.
1.73.40.
అనుష్టుప్.
ఈదృశే వర్తమానే తు
తూర్యోద్ఘుష్ట నినాదితే ।
త్రిరగ్నిం తే పరిక్రమ్య
ఊహుర్భార్యాం మహౌజసః ॥
టీక:-
ఈదృశే = ఈ విధముగా; వర్తమానే తు = జరుగుచుండగా; తూర్య ఉద్ఘుష్ట = తూర్య నాదములు; నినాదితే = మ్రోగుచుండ; త్రిః = ముమ్మారు; అగ్నిమ్ = అగ్నిని; తే = వారు; పరిక్రమ్య = ప్రదక్షిణము చేసి; ఊహుః = వివాహమాడిరి; భార్యాం = భార్యలను; మహౌజసః = గొప్ప తేజస్సు గలవారు.
భావము:-
ఈ విధముగా, గాత్ర, వాద్య సంగీతాలాపనలు, నాట్యములు జరుగుచుండగా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అగ్మికి మూడుమార్లు ప్రదక్షిణము చేసి తమ భార్యలను వివాహమాడిరి.
1.73.41.
అనుష్టుప్.
అథోపకార్యాం జగ్ముస్తే
సభార్యా రఘునందనాః ।
రాజాఽ ప్యనుయయౌ పశ్యన్
సర్షిసంఘ స్సబాంధవః ॥
టీక:-
అథ = తరువాత; ఉపకార్యాం = విడిదిని గూర్చి; జగ్ముః = వెళ్ళిరి; తే = వారు; సభార్యా = భార్యలతో కూడి; రఘునందనాః = రఘువంశీయులు; రాజా = రాజు; అపి = కూడ; అనుయయౌ = వెనుక వెళ్ళెను; పశ్యన్ = చూసెను; సర్షిసఙ్ఘః = ఋషిగణములతోను; సబాంధవః = బంధువులతో కూడినవాడు
భావము:-
తరువాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో కూడి విడిదియింటికి వెళ్ళుట చూచిన దశరథుడు, ఋషిగణములతోను బంధువులతోను వారి వెనుక వెళ్ళెను.
1.73.42.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రిసప్తతితమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రిసప్తతితమః [73] = డబ్బెమూడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని డబ్బెమూడవ [73] సర్గ సంపూర్ణము.
బాల కాండ
॥చతుస్సప్తతితమః సర్గః॥
(74 - పరశురామ దర్శనం)
1.74.1.
అనుష్టుప్.
అథ రాత్ర్యాం వ్యతీతాయాం
విశ్వామిత్రో మహామునిః ।
ఆపృష్ట్వా తౌ చ రాజానౌ
జగామోత్తరపర్వతమ్।
జగామోత్తరపర్వతమ్।
ఆశీర్భిః పూరయిత్వా చ
టీక:-
అథ = తరువాత; రాత్ర్యాం = రాత్రి; వ్యతీతాయాం = గడిచినది అగుచుండ; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని ; ఆపృష్ట్వా = అడిగి; తౌ = ఆ; రాజానౌ = ఇరువురు రాజులను; జగామ = వెళ్ళెను; ఉత్తరపర్వతమ్ = ఉత్తరదిక్కున ఉన్న పర్వతము గుఱించి; ఆశీర్భిః = ఆశీస్సులతో; పూరయిత్వా = నింపి; చ = మఱియు; కుమారాన్ = కుమారులను,చ = మఱియు; సః =అ తడు; రాఘవాన్ = రఘువంశజులను.
భావము:-
రాత్రి గడిచిన తరువాత, విశ్వామిత్రమహాముని జనకమహారాజు దశరథమహారాజుల వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు బయలుదేరెను. విశ్వామిత్రమహాముని రఘువంశజులైన రాకుమారులు శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు అనేక ఆశీస్సులనిచ్చెను.
1.74.2.
అనుష్టుప్.
విశ్వామిత్రే గతే రాజా
వైదేహం మిథిలాధిపమ్ ।
ఆపృష్ట్వాఽ థ జగామాశు
రాజా దశరథః పురీమ్ ॥
టీక:-
విశ్వామిత్రే = విశ్వామిత్రుడు; గతే = వెళ్ళినవాడగుచుండగా; రాజా = రాజు; వైదేహం = వైదేహును; మిథిలాధిపమ్ = మిథిలాపుర ప్రభువును. ఆపృష్ట్వా = అడిగి; అథ = తరువాత; జగామ = వెళ్ళెను; ఆశు = శీఘ్రముగా; రాజా = రాజు; దశరథః = దశరథుడు; పురీమ్ = పట్టణముగూర్చి;
భావము:-
విశ్వామిత్రుడు వెడలిన పిమ్మట దశరథమహారాజుజనకమహారాజు వద్ద సెలవు గైకొని దశరథమహారాజు అయోధ్యకు బయలుదేఱెను.
1.74.3.
అనుష్టుప్.
గచ్ఛంతం తం తు రాజానమ్
అన్వగచ్ఛన్నరాధిపః ॥
టీక:-
గచ్ఛంతం = వెళ్ళుచున్న; తమ్ = ఆ; తు రాజానమ్ = రాజును; అన్వగచ్ఛత్ = అనుసరించి వెళ్ళెను; నరాధిపః = రాజు.
భావము:-
బయలుదేఱిన దశరథమహారాజును జనకమహారాజు అనుసరించెను.
1.74.4.
అనుష్టుప్.
అథ రాజా విదేహానాం
దదౌ కన్యాధనం బహు ।
గవాం శతసహస్రాణి
బహూని మిథిలేశ్వరః ॥
టీక:-
అథ = తరువాత; రాజా = రాజు; విదేహానాం = విదేహరాకుమార్తెలకు; దదౌ = ఇచ్చెను; కన్యాధనం = అరణము (తల్లితండ్రులు తమ పుత్రిక వివాహానంతరము ఆ నవవధువును సాగనంపుచు ఇచ్చెడి ధనము); బహు = ఎక్కువగా; గవాం = ఆవుల యొక్క; శతసహస్రాణి = లక్షలకొలది; బహూని = అనేకమైన; మిథిలేశ్వరః = జనకమహారాజు.
భావము:-
జనకమహారాజు ఆ నవవధువులను సాగనంపుచు వారికి చాల ధనమును అరణముగా ఇచ్చెను. అనేక లక్షల గోవులను ఇచ్చెను.
1.74.5.
అనుష్టుప్.
కమ్బళానాం చ ముఖ్యానాం
క్షౌమకోట్యంబరాణి చ ।
హస్త్యశ్వరథపాదాతం
దివ్యరూపం స్వలంకృతమ్ ॥
టీక:-
కమ్బళానాం = కంబళ్ళను; ముఖ్యానామ్ = ముఖ్యమైనవి; క్షౌమ = వెలి పట్టువి, దుకూలములను; కోటిః = కోట్లకొలది; అంబరాణి = వస్త్రములను; హస్త్యిః = ఏనుగులను; అశ్వః = గుఱ్ఱములను; పాదాతమ్ = కాలిబంటులను; దివ్యరూపం = దివ్యమైన రూపముగల; స్వలంకృతమ్ = బాగుగాఅలంకరింపబడిన.
భావము:-
ముఖ్యంగా అనేకమైన మంచికంబళీలను, అనేకానేకమైన పట్టు వస్త్రములను మఱియు అద్భుతమైన రూపములు కలిగి బాగుగా అలంకరించబడిన ఏనుగులు, గుఱ్ఱములు, బంటులు కలిగియున్న చతురంగ బలమును ఇంకా..
1.74.6.
అనుష్టుప్.
దదౌ కన్యాపితా తాసాం
దాసీదాసమనుత్తమమ్ ।
హిరణ్యస్య సువర్ణస్య
ముక్తానాం విద్రుమస్య చ ॥
టీక:-
దదౌ = ఇచ్చెను; కన్యాః = కన్యయొక్క; పితా = తండ్రి; తాసామ్ = వారికి; దాసీమ్ = పనికత్తెలను; దాసమ్ = పనివారిని; అనుత్తమమ్ = శ్రేష్ఠమైన; హిరణ్యస్య = వెండి యొక్క; సువర్ణస్య = బంగారము యొక్క; ముక్తానాం = ముత్యముల యొక్క; విద్రుమస్య = పగడముల యొక్క; చ = కూడ.
భావము:-
జనకమహారాజు ఆ నూతన వధువులకు ఉత్తములైన దాసదాసీ జనమును ఇచ్చెను. ఇంకా వెండి, బంగారము, ముత్యములు, పగడములు రూపమైనట్టి...
1.74.7.
అనుష్టుప్.
దదౌ పరమసంహృష్టః
కన్యాధనమనుత్తమమ్ ।
దత్త్వా బహు ధనం రాజా
సమనుజ్ఞాప్య పార్థివమ్ ॥
టీక:-
దదౌ = ఇచ్చెను; పరమ సంహృష్టః = చాల సంతోషించినవాడు; కన్యాధనమ్ = అరణమును; అనుత్తమమ్ = శ్రేష్ఠమైనదానిని; దత్త్వా = ఇచ్చి; బహు = అనేక రకములైన; ధనం = విత్తములను; రాజా = రాజు; సమ = చక్కగ; అనుజ్ఞాప్య = అనుజ్ఞ పొంది; పార్థివమ్ = మహారాజును.
భావము:-
చాలా మంచి అరణములు జనకమహారాజు మిక్కిలి సంతోషముగా కుమార్తెల కిచ్చెను. అనేకరకముల విత్తములను బహూకరించి, దశరథమహారాజు వద్ద చక్కగా సెలవు గైకొనెను.
1.74.8.
అనుష్టుప్.
ప్రవివేశ స్వనిలయమ్
మిథిలాం మిథిలేశ్వరః ।
రాజాఽ ప్యయోధ్యాధిపతిం
సహ పుత్రైర్మహాత్మభిః ॥
టీక:-
ప్రవివేశ = ప్రవేశించెను; స్వనిలయం = తన నివాసమును; మిథిలాం = మిథిలానగరమును; మిథిలేశ్వరః = మిథిలమహారాజు; రాజా = రాజు; అపి = కూడ; అయోధ్యాపతిః = అయోధ్యమహారాజు; సహ = కూడి; పుత్రైః = పుత్రులతో; మహాత్మభిః = మహాత్ములతో.
భావము:-
జనకమహారాజు తన నివాసము మిథిలానగరమునకు చేరుకొనెను. దశరథమహారాజు కూడ మహాత్ములైన తన కుమారులతో కలసి బయలుదేరెను.
1.74.9.
అనుష్టుప్.
ఋషీన్ సర్వాన్ పురస్కృత్య
జగామ సబలానుగః ।
గచ్ఛంతం తం నరవ్యాఘ్రం
సర్షిసంఘం సరాఘవమ్ ॥
టీక:-
ఋషీన్ = ఋషులను; సర్వాన్ = అందరిని; పురస్కృత్య = ముందు ఉంచుకొని; జగామ = వెళ్ళెను; సబలానుగః = సైన్యము; అనుచరులతో కూడి; గచ్ఛంతం = వెళ్ళుచున్న; తం = అతని గుఱించి నరవ్యాఘ్రమ్ = పురుషశ్రేష్ఠుని గూర్చి; సర్షిసఙ్ఘం = ఋషుల సమూహముతో కూడి; సరాఘవమ్ = రఘువంశజులతో కూడి
భావము:-
ఋషిల వెంట దశరథుడు, అనుచరులు వెంటరాగా తన సైన్యముతో బయలుదేరెను. ఋషులతోను కుమారులతోను అట్లు వెళ్ళుచున్న దశరథునకు
1.74.10.
అనుష్టుప్.
ఘోరాః స్మ పక్షిణో వాచో
వ్యాహరంతి తతస్తతః ।
భౌమాశ్చైవ మృగా స్సర్వే
గచ్ఛంతి స్మ ప్రదక్షిణమ్ ॥
టీక:-
ఘోరాః = భయంకరమైన; స్మ = ఉండిన; పక్షిణః = పక్షులు; వాచః = పలుకులు; వ్యాహరంతి = పలికెను; తతః తతః = అక్కడక్కడ; భౌమాః = భూమికి సంబంధించిన; చ = మఱియు; మృగాః = మృగములు; సర్వే = అన్నియు; గచ్ఛంతి స్మ = వెళ్ళెను; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణముగా.
భావము:-
అచ్చటచ్చట ఉన్న పక్షులు భీకరముగా అరచుచుండెను. మృగములు అన్నియు ప్రదక్షిణము చేయుచున్నట్లు భూమిపై తిరుగుచుండెను.
1.74.11.
అనుష్టుప్.
తాన్ దృష్ట్వా రాజశార్దూలో
వసిష్ఠం పర్యపృచ్ఛత ।
“అసౌమ్యాః పక్షిణో ఘోరా
మృగాశ్చాపి ప్రదక్షిణాః ॥
టీక:-
తాన్ = వాటిని; దృష్ట్వా = చూచి; రాజశార్దూలః = రాజశ్రేష్ఠుడు; వసిష్ఠం = వసిష్ఠుని; పర్యపృచ్ఛత = ప్రశ్నించెను; అసౌమ్యాః = వికృతంగా ఉన్నట్టి; పక్షిణః = పక్షులు; ఘోరా = భయంకరమైన; మృగాః = మృగములు; అపి = కూడ; ప్రదక్షిణాః = ప్రదక్షిణము చేయుచున్నవి
భావము:-
“ఆ దృశ్యము చూసి, దశరథుడు వసిష్ఠునితో "భయంకరమైన పక్షులు ఘోరముగా ప్రతికూలముగా అరచుచున్నవి, మృగములు ప్రదక్షిణముగా తిరుగుచున్నవి.
1.74.12.
అనుష్టుప్.
కిమిదం హృదయోత్కమ్పి
మనో మమ విషీదతి"।
రాజ్ఞో దశరథస్యైతః
శ్రుత్వా వాక్యం మహానృషిః ॥
టీక:-
కిమ్ = ఏమిటి; ఇదం = ఇది; హృదయోత్కమ్పి = గుండెదడలాడుచున్నది; మనః = మనస్సు; మమ = నా యొక్క; విషీదతి = క్రుంగిపోవుచున్నది; రాజ్ఞః = రాజైన; దశరథస్య = దశరథునియొక్క; ఏతః = ఈ; శ్రుత్వా = విని; వాక్యం = మాటను; మహాన్ = గొప్ప; ఋషిః = ఋషి.
భావము:-
నా హృదయము కంపించున్నది, నా మనస్సు క్రుంగిపోవుచున్నది. ఇదంతా ఏమిటి?" అని అడిగెను. దశరథుని ఈ మాటలు వినిన వసిష్ఠమహర్షి,
1.74.13.
అనుష్టుప్.
ఉవాచ మధురాం వాణీం
శ్రూయతామస్య యత్ఫలమ్ ।
ఉపస్థితం భయం ఘోరం
దివ్యం పక్షిముఖాచ్చ్యుతమ్ ॥
టీక:-
ఉవాచ = పలికెను; మధురాం = మధురమైన; వాణీమ్ = పలుకును; శ్రూయతామ్ = వినబడుగాక; అస్య = దీనికి; యత్ = ఏది; ఫలమ్ = ఫలమో; ఉపస్థితం = సమీపించిన; భయం = భయము; ఘోరమ్ = ఘోరమైన; దివ్యం = దైవికమైనది; పక్షిముఖాత్ = పక్షుల ముఖమునుండి; చ్యుతమ్ = జారినది.
భావము:-
మధురమైన వచనము ఇట్లు పలికెను. "ఈ శకునముల ఫలమిది. పక్షులు అరుపులచే దైవికముగా రానున్న ఘోరమైన భయమును సూచించుచున్నవి.
1.74.14.
అనుష్టుప్.
మృగాః ప్రశమయన్త్యేతే”
సంతాపస్త్యజ్యతామయమ్ ।
తేషాం సంవదతాం తత్ర
వాయుః ప్రాదుర్బభూవ హ ॥
టీక:-
మృగాః = మృగములు; ప్రశమయంతి = ఉపశమింపజేయుచున్నవి; ఏతే = దీనిని; సంతాపః = మనస్తాపము; త్యజ్యతామ్ = విడువబడుగాక; అయమ్ = ఈ; తేషాం = వారి; సంవదతాం = మాటలలో; తత్ర = అక్కడ; వాయుః = గాలి; ప్రాదుర్బభూవః = పుట్టెను; హ.
భావము:-
మృగములు ఆ భయమును ఉపశమింపజేయుచున్నవి. అందుచే నీవు మనస్తాపము వీడుము.” వారిట్లు మాటలాడుకొనుచుండ పెద్ద గాలి వీచెను.
1.74.15.
అనుష్టుప్.
కంపయన్ పృథివీం సర్వాం
పాతయంశ్చ ద్రుమాంచ్ఛుభాన్ ।
తమసా సంవృతస్సూర్య
స్సర్వా న ప్రబభుర్దిశ ॥
టీక:-
కంపయన్ = కంపింపజేయుచు; పృథివీం = భూమిని; సర్వాం = అంతటిని; పాతయన్ = కూల్చుచు; చ = మఱియు; ద్రుమాన్ = వృక్షములను; శుభాన్ = మంగళకరమైన; తమసా = చీకటిచే; సంవృతః = ఆవరింపబడెను; సూర్యః = సూర్యుడు; సర్వాః = అన్ని; న ప్రబభుః = ప్రకాశించలేదు; దిశః = దిక్కులు.
భావము:-
ఆ గాలి భూమిని కంపింపజేయుచు, శుభకరమైన వృక్షములను నేల గూల్చెను. పెనుచీకటి సూర్యుని ఆవరించెను. దిక్కులు కాంతివిహీనమై ఉండెను.
1.74.16.
అనుష్టుప్.
భస్మనా చావృతం సర్వం
సంమూఢమివ తద్బలమ్ ।
వసిష్ఠశ్చర్షయశ్చాన్యే
రాజా చ ససుతస్తదా ॥
టీక:-
భస్మనా = ధూళిచేత; చ; ఆవృతం = కప్పివేయబడెను; సర్వం = అంతయు; సమ్మూఢం = మందబుద్దికమ్మినవారు; ఇవ = వలె; తత్ = ఆ; బలమ్ = సైన్యము; వసిష్ఠః = వసిష్ఠుడు; చ = మఱియు; ఋషయః చ = ఋషులు; అన్యే = ఇతరులు; రాజా = రాజు; చ = మఱియు; ససుతః = పుత్రులతో కూడి; తదా = అప్పుడు.
భావము:-
అప్పుడు దశరథుని సైన్యమంతయు ధూళిచే కప్పబడి మందబుద్ధి కలవారైరి. వసిష్ఠుడు, ఇతర ఋషులు, పుత్రులతో కూడి దశరథమహారాజు మాత్రము,
1.74.17.
అనుష్టుప్.
సంసజ్ఞా ఇవ తత్రాసన్
సర్వమన్యద్విచేతనమ్ ।
తస్మింస్తమసి ఘోరే తు
భస్మచ్ఛన్నేవ సా చమూః ॥
టీక:-
సంసజ్ఞాః = స్పృహలో ఉన్నట్లు; ఇవ = వలె; తత్ర = అక్కడ; ఆసన్ = ఉండిరి; సర్వమ్ = అందరును; అన్యత్ = ఇతరులు; విచేతనమ్ = కదలిక లేక ఉండిరి; తస్మిన్ = ఆ; తమసి = అంధకారమునందు; ఘోరే = ఘోరమైన; తు; భస్మత్ = ధూళివలన; ఛన్న = కప్పబడిన; ఇవ = వలె; సా = ఆ; చమూః = సైన్యము.
భావము:-
అక్కడ స్పృహలో ఉన్నట్లు ఉండిరి. తదితరులందరు స్పృహ లేరు. అతని సైన్యము మొత్తము ధూళితో కప్పబడి ఘోరమైన అంధకారములో ఉండెను.
1.74.18.
అనుష్టుప్.
దదర్శ భీమసంకాశం
జటామండలధారిణమ్ ।
భార్గవం జామదగ్న్యం తం
రాజరాజవిమర్దినమ్ ॥
టీక:-
దదర్శ = దర్శనమిచ్చెను; భీమ = భీకరుని; సంకాశమ్ = వలె ఉన్నవానిని; జటామండల = జడలుగట్టిన జుట్టంతయు ముడిచిన ముడి; ధారిణమ్ = ధరించిన వానిని; భార్గవం = భృగు వంశీయుడిని; జామదగ్న్యం = జమదగ్ని మహర్షి కుమారుని; తమ్ = ఆ; రాజ = రాజుల యొక్క; రాజః = రాజిన్ / సమూహమును; విమర్దినమ్ = సంహరించినవానిని.
భావము:-
ఆ సైన్యము భయంకరుని, జటాజూటధారిని, భార్గవ వంశీయుడు జమదగ్నిమహర్షి పుత్రుడైన పరశురాముని, రాజుల సమూహమును సంహరించినవాని దర్శనము ఆయెను.
1.74.19.
అనుష్టుప్.
* కైలాసమివ దుర్ధర్షం
కాలాగ్నిమివ దుస్సహమ్ ।
జ్వలంతమివ తేజోభిః
దుర్నిరీక్ష్యం పృథగ్జనైః ॥
టీక:-
కైలాసమ్ = కైలాసము {కైలాసము-వ్యుత్పత్తి. కేలాసః- స్పటికః- కేలాస ఇవ శుభ్రం- కేలాస + ఇణ్ స్పటిక శివ వలె తెల్లగా ఉండునది,శివుని లోకము, కుబేరుని ఆవాసము,; ఇవ = వలె; దుర్ధర్షమ్ = ఎదురింప శక్యముకాని వానిని; కాలాగ్నిమ్ = ప్రళయ కాలాగ్ని; ఇవ = వలె; దుస్సహమ్ = సహింపనలవికాని వానిని; జ్వలంతమ్ = ప్రజ్వలించుచున్నవానిని; ఇవ = వలె; తేజోభిః = తేజస్సుచే; దుర్నిరీక్ష్యం = చూచుటకు వీలుకానివానిని; పృథగ్జనైః = పాపులకు, వావిళ్ళవారి నిఘంటువు, ఆంధ్రవాచస్పతము.
భావము:-
కైలాసపర్వతమువలె ఎదిరింపశక్యముకానివానిని, ప్రళయాగ్నివలె సహింపగరానివానిని, గొప్ప తేజస్సుతో ప్రజ్వరిల్లుచున్నను, పాపులకులకు కనబడని వానిని, వారు చూచిరి.
1.74.20.
అనుష్టుప్.
స్కంధే చాసజ్య పరశుం
ధనుర్వి ద్యుద్గణోపమమ్ ।
ప్రగృహ్య శరముఖ్యం చ
త్రిపురఘ్నం యథా శివమ్ ॥
టీక:-
స్కంధే = భుజమునందు; చ = మఱియు; ఆసజ్య = వ్రేలాడదీసుకొని; పరశుమ్ = గండ్రగొడ్డలిని; ధనుః = విల్లు; విద్యుత్ = మెఱుపు; గణః = తీగలతో; ఉపమమ్ = సమానమైనదానిని; ప్రగృహ్య = ధరించి; శరః = బాణములు; ముఖ్యం = శ్రేష్ఠమైనవి; త్రిపురఘ్నం = త్రిపురములను ధ్వంసము చేసిన; యథా = వలె; శివమ్ = శివుని.
భావము:-
అతడు, గండ్రగొడ్డలిని భుజమునకు తగుల్చుకొని, మెఱుపుతీగలవలె మిక్కిలిగా మెరయుచున్న విల్లును, శ్రేష్ఠమైన బాణమును చేబూని, త్రిపురాసురుల పురములు మూడు ధ్వంసం చేయు శివునివలె నుండెను.
1.74.21.
అనుష్టుప్.
తం దృష్ట్వా భీమసంకాశం
జ్వలంతమివ పావకమ్ ।
వసిష్ఠప్రముఖా విప్రా
జపహోమ పరాయణాః ॥
టీక:-
తం = అతనిని; దృష్ట్వా = చూసి; భీమ = భయంకరుని; సంకాసమ్ = వలె ఉన్నవాని; జ్వలంతమ్ = ప్రజ్వలించుచున్నవాని; ఇవ = వలె; పావకమ్ = అగ్ని; వసిష్ఠ ప్రముఖా = వసిష్ఠుడు మొదలగు; విప్రా = బ్రాహ్మణులు; జపః = జపములు; హోమః = హోమములు; పరాయణాః = లగ్నమై ఉండు వారు.
భావము:-
అగ్నివలె భయంకరముగా వెలుగుచున్న అతనిని చూచి, జపాలు హోమాలు చేస్తుండేవారైన వసిష్ఠాది బ్రాహ్మణులు.
1.74.22.
అనుష్టుప్.
సంగతా మునయస్సర్వే
సంజజల్పురథో మిథః ।
“కచ్చిత్పితృవధామర్షీ
క్షత్రం నోత్సాదయిష్యతి ॥
టీక:-
సంగతాః = కలసి; మునయః = మునులు; సర్వే = అందఱు; సంజజల్పుః = గుసగుసలాడుకొనిరి; అథః = తరువాత; మిథః = పరస్పరము; కచ్చిత్ = కదా; పితృ = తండ్రి; వధ = సంహారము; అమర్షీ = కోపోద్రిక్తుడైనవాడు; క్షత్రం = క్షత్రియులను; న = లేదు; ఉత్సాదయిష్యతి = నశింపజేయట.
భావము:-
మునిముఖ్యులందరు కలసి వారిలోవారు ఇట్లు గుసగుసలాడుకొనిరి. "కార్తవీర్యార్జునిచే తన తండ్రి సంహరింపబడుటవలన కోపోద్రిక్తుడైన ఇతడు క్షత్రియులనందరిని సంహరించడు కదా!
1.74.23.
అనుష్టుప్.
పూర్వం క్షత్రవధం కృత్వా
గతమన్యు ర్గతజ్వరః ।
క్షత్రస్యోత్సాదనం భూయో
న ఖల్వస్య చికీర్షితమ్" ॥
టీక:-
పూర్వం = పూర్వము; క్షత్రవధం = క్షత్రియ సంహారమును; కృత్వా = చేసి; గత = తగ్గిన; మన్యుః = కోపము కల వాడు; గత = తగ్గిన; జ్వరః = మనస్తాపము కల వాడు; క్షత్రస్య = క్షత్రియుల యొక్క; ఉత్సాదనం = వినాశమును; భూయః = మరల; న ఖలు = కాదుకదా; అస్య = ఇతనియొక్క; చికీర్షితమ్ = అభిలాష.
భావము:-
పూర్వము క్షత్రియసంహారము చేసిన తరువాత కోపము మనస్తాపము తగ్గి శాంతించిన ఇతడు మరల క్షత్రియుల వినాశనమునకు ఉద్యుక్తుడగుట లేదు కదా!"
1.74.24.
అనుష్టుప్.
ఏవముక్త్వాఽ ర్ఘ్య మాదాయ
భార్గవం భీమదర్శనమ్ ।
ఋషయో రామ రామేతి
వచో మధురమబ్రువన్ ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = మాటలాడుకొని; అర్ఘ్యమ్ = పూజార్థ జలమును; ఆదాయ = తీసుకొని; భార్గవం = పరశురాముని గూర్చి; భీమదర్శనమ్ = భయంకరముగా కనిపించువానిని; ఋషయః = ఋషులు; రామ రామ = రామా రామా; ఇతి = ఈ విధమైన; వచః = మాటను; మధురమ్ = మధురముగా; అబ్రువన్ = పలికిరి.
భావము:-
ఋషులు తమలో తామిట్లు సంభాషించుకొని, భీకరముగా కనిపించుచున్న భార్గవరామునికై అర్ఘ్యము గైకొని, అతనిని మధురముగా "రామా! రామా!" అని పిలిచి పూజించిరి.
1.74.25.
అనుష్టుప్.
ప్రతిగృహ్య తు తాం పూజాం
ఋషిదత్తాం ప్రతాపవాన్ ।
రామం దాశరథిం రామో
జామదగ్న్యోఽ భ్యభాషత ॥
టీక:-
ప్రతిగృహ్య = స్వీకరించి; తు; తాం = వారి; పూజాం = పూజను; ఋషిః = ఋషులచే; దత్తామ్ = ఇవ్వబడిన; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడైన; రామం = రామునిగూర్చి; దాశరథిం = దశరథుని పుత్రునిగూర్చి; రామః = రాముడు; జామదగ్న్యః = జమదగ్నిమహర్షి పుత్రుడు; అభ్యభాషత = పలికెను.
భావము:-
జమదగ్ని కుమారుడైన భార్గవరాముడు ఋషులు సమర్పించినఅర్ఘ్యమును పూజను స్వీకరించి, ప్రతాపవంతుడైన, దశరథుని పుత్రుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.
1.74.26.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుస్సప్తతితమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుస్సప్తతితమః [74] = డెబ్బైనాలుగవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథములోని డబ్బైనాలుగవ [74] సర్గ సంపూర్ణము
బాల కాండ
॥పంచసప్తతితమః సర్గః॥
(75 - వైష్ణవధనుస్సు ఎక్కుపెట్టమనుట)
1.75.1.
అనుష్టుప్.
“రామ! దాశరథే రామ!
వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్।
ధనుషో భేదనం చైవ
నిఖిలేన మయా శ్రుతమ్॥
టీక:-
రామ = ఓ రామా!; దాశరథే రామ = దశరథుని కుమారుడైనా ఓ రామా!; వీర్యమ్ = పరాక్రమము; తే = నీయొక్క; శ్రూయతే = వినబడుచున్నది; అద్భుతమ్ = విశిష్ఠమైనదిగ; ధనుషః = ధనుస్సుయొక్క; భేదనం చ ఏవ = విరుచుట కూడ; చైవ = కూడ; నిఖిలేన = సకల జనులచేత; మయా = నా చేత; శ్రుతమ్ = వినబడినది.
భావము:-
“రామా! దశరథుని కుమారుడా! నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని. శివధనుర్భంగము గురించి కూడా వినియుంటిని. ఇది చాలా ఆశ్చర్యకరము.
1.75.2.
అనుష్టుప్.
తదద్భుతమచిన్త్యం చ
భేదనం ధనుషస్త్వయా।
తచ్ఛ్రుత్వాఽహమనుప్రాప్తో
ధనుర్గృహ్యాపరం శుభమ్॥
టీక:-
తత్ = ఆ; అద్భుతమ్ = అద్భుతము; అచింత్యమ్ = ఊహించరానిది; చ = మఱియు; భేదనం = విరుచుట; ధనుషః = ధనుస్సుయొక్క; త్వయా = నీ చేత; తత్ = అది; శ్రుత్వా = విని; అహమ్ = నేను; అనుప్రాప్తః = వచ్చితిని; ధనుః = ధనుస్సు; గృహ్యా = గ్రహించి; అపరమ్ = వేరొక; శుభమ్ = శుభకరమైన.
భావము:-
నీవు శివుని విల్లు ఎక్కుపెట్టి విరిచిన శుభవార్త వినియుంటిని. అది చాలా అద్భుతము, ఊహింపశక్యము కానిది. ఇప్పుడు మరియొక శుభప్రదమైన విల్లు తీసుకొని వచ్చితిని.
1.75.3.
అనుష్టుప్.
తదిదం ఘోరసంకాశమ్
జామదగ్న్యం మహద్ధనుః ।
పూరయస్వ శరేణైవ
స్వబలం దర్శయస్వ చ॥
టీక:-
తత్ = అది; ఇదమ్ = ఇది; ఘోరమ్ = భయంకరమైన, శివునిది, వావిళ్ళవారి నిఘంటువు; సంకాశమ్ = వంటిది, సదృశమైనది; జామదగ్న్యమ్ = జమదగ్నినుండి వచ్చినది; మహత్ = గొప్పది; ధనుః = ధనుస్సు; పూరయస్వ = సంధించుము; శరేణ = బాణముతో; ఏవ = ఈ విధముగ; స్వ = సొంత; బలమ్ = శక్తిని; దర్శయస్వ = ప్రదర్శించగలవు; చ = మఱియు;
భావము:-
అది శివుని విల్లు వంటి, మిక్కిలి భయంకరమైనది. జమదగ్ని ద్వారా లభించినది. ఈ మహాధనుస్సునకు బాణము సంధించి నీ బలమును ప్రదర్శించు.
1.75.4.
అనుష్టుప్.
తదహం తే బలం దృష్ట్వా
ధనుషషోఽస్య ప్రపూరణే।
ద్వన్ద్వయుద్ధం ప్రదాస్యామి
వీర్యశ్లాఘ్యస్య రాఘవ!”॥
టీక:-
తత్ = అప్పుడు; అహం = నేను; తే = నీ; బలమ్ = బలమును; దృష్ట్వా = చూచి; ధనుషస్య = ధనుస్సుయొక్క; ప్రపూరణే = సంధించుట యందు; ద్వన్ద్వ = ఇరువురి మధ్య; యుద్ధం = యుద్ధమును; ప్రదాస్యామి = ఇచ్చెదను, ప్రదాన- వ్యుత్పత్తి. ప్ర- దా- భావే ల్యూట్, వాచస్పతము, గొప్పఈవి; వీర్య శ్లాఘ్యస్య = పరాక్రమముచే పొగడదగినవానికి; రాఘవ = ఓ రఘువంశీయుడా;
భావము:-
ఈ ధనుస్సును ఎక్కుబెట్టి బాణమును సంధించుము. అప్పుడు నీ బలము చూచి, పరాక్రమముచే శ్లాఘింపదగిన నీకు నాతో ద్వంద్వయుద్ధము అనుగ్రహించెదను.”
1.75.5.
అనుష్టుప్.
తస్య తద్వచనం శ్రుత్వా
రాజా దశరథస్తదా।
విషణ్ణవదనో దీనః
ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ॥
టీక:-
తస్య = అతనియొక్క; తత్ = ఆ; వచనం = మాటను; శ్రుత్వా = విని; రాజా దశరథః = దశరథ మహారాజు; తదా = అప్పుడు; విషణ్ణ = విచారముతో కూడిన; వదనః = ముఖము గలవాడు; దీనః = దీనుడు; ప్రాంజలిః = చేతులు జోడించినవాడు; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను;
భావము:-
దశరథమహారాజు భార్గవరాముని మాటలు విని, వాడిపోయిన ముఖముతో దీనుడై చేతులు జోడించి ఈ విధముగా పలికెను.
1.75.6.
అనుష్టుప్.
“క్షత్రరోషాత్ప్రశాంతస్త్వం
బ్రాహ్మణశ్చ మహాయశాః!।
బాలానాం మమ పుత్రాణామ్
అభయం దాతుమర్హసి॥
టీక:-
క్షత్ర = క్షత్రియులపై; రోషాత్ = కోపము నుండి; ప్రశాంత = శాంతించినవాడు; త్వమ్ = నీవు; బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; చ = మఱియు; మహాయశాః = గొప్ప పేరు కలిగినవాడు; బాలానాం = పిల్లలకు; మమ = నా యొక్క; పుత్రాణాం = కుమారులకు; అభయం = భయహీనతను, రక్షణను; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = అర్హుడవు;
భావము:-
“ఓ పరశురామ మహామునీ! నీవు బ్రాహ్మణుడవు. గొప్ప యశస్సు కలవాడవు. క్షత్రియులపై ఉన్న కోపము తొలగి శాంతించినవాడవు. ఇప్పుడు బాలురైన నా కుమారులకు అభయమిమ్ము.
1.75.7.
అనుష్టుప్.
భార్గవాణాం కులే జాతః
స్వాధ్యాయవ్రతశాలినామ్।
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ
శస్త్రం నిక్షిప్తవానసి॥
టీక:-
భార్గవాణామ్ = భృగుమహర్షి వంశీయుల; కులే = వంశములో; జాతః = పుట్టినవాడు; స్వాధ్యాయ = స్వయముగా వేదాధ్యయనమను; వ్రత = దీక్షను; శాలినామ్ = చేపట్టినవాడవు; సహస్రాక్షే = వేయికన్నుల ఇంద్రునియందు; ప్రతిజ్ఞాయ = ప్రమాణము చేసి; శస్త్రం = ఆయుధమును; నిక్షిప్తవాన్ = విడిచిపెట్టిన వాడవు; అసి = నీవు.
భావము:-
పరశురామ! నీవు భృగువంశములో జన్మించితివి, వేదాధ్యాయమను వ్రతము సలుపుచుంటివి. దేవేంద్రుని వేయికన్నుల సాక్షిగా ప్రతిజ్ఞచేసి, ఆయుధములను త్యజించిన వాడవు.
1.75.8.
అనుష్టుప్.
స త్వం ధర్మపరో భూత్వా
కాశ్యపాయ వసుంధరామ్।
దత్త్వా వనముపాగమ్య
మహేంద్రకృతకేతనః॥
టీక:-
సః = అట్టి; త్వమ్ = నీవు; ధర్మపరః = ధర్మపరుడవు; భూత్వా = అయి; కాశ్యపాయ = కశ్యపుని కొఱకు; వసున్థరామ్ = రాజ్యమును; దత్త్వా = ఇచ్చి; వనమ్ = వనమును; ఉపాగమ్య = పొంది; మహేంద్ర = మహేంద్రపర్వతమున; కృతకేతనః = నిలిపిన పతాకము కలవాడు;
భావము:-
నీవు ధర్మపరుడవై రాజ్యం అంతయును కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతము మీది అడవికి పోయి నివాసము ఏర్పరచుకుంటివి.
1.75.9.
అనుష్టుప్.
మమ సర్వవినాశాయ
సమ్ప్రాప్తస్త్వం మహామునే!।
న చైకస్మిన్ హతే రామే
సర్వే జీవామహే వయమ్”॥
టీక:-
మమ = నా యొక్క; సర్వ = సకల; వినాశాయ = వినాశముకొఱకు; సమ్ప్రాప్తః = పొందబడితివి; త్వమ్ = నీవు; మహామునే = ఓ మహామునీ; న = కాదు; చ; ఏకః + అస్మిన్ = ఒక్కడు; హతే = చంపబడినచో; రామే = రాముడు; సర్వే = అందరు; జీవామహే = జీవించము; వయమ్ = మేము;
భావము:-
ఈనాడు నీవు మా అందరి వినాశనము కొరకు వచ్చితివా మహామునీ! ఒక్క రాముడు మరణించినచోమేమందరము మరణించెదము కదా?” అనెను.
1.75.10.
అనుష్టుప్.
బ్రువత్యేవం దశరథే
జామదగ్న్యః ప్రతాపవాన్।
అనాదృత్యతు తద్వాక్యమ్
రామమేవాఽభ్యభాషత॥
టీక:-
బ్రువతి = పలికిన; ఇవమ్ = ఇట్లు; దశరథే = దశరథుని యందు; జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు, పరశురాముడు; ప్రతాపవాన్ = పరాక్రమవంతుడు; అనాదృత్యతు = లక్ష్యపెట్టక; తత్ = ఆ; వాక్యమ్ = మాటలను; రామమ్ = రాముని గురించి; ఏవ = మాత్రమే; అభిభాషత = అభి + అభాషత, సంభాషించెను.
భావము:-
దశరథుడు ఈ విధముగా మాటలాడుచుండగా ప్రతాపవంతుడైన పరశురాముడు అతని మాటలు లెక్కచేయక, రామునితో మాత్రము ఇట్లు పలికెను.
1.75.11.
అనుష్టుప్.
“ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే
దివ్యే లోకాభివిశ్రుతే।
దృఢే బలవతీ ముఖ్యే
సుకృతే విశ్వకర్మణా॥
టీక:-
ఇమే = ఇవి; ద్వే = రెండు; ధనుషీ = విల్లులు; శ్రేష్ఠే = గొప్పవి; దివ్యే = మేలైనవి, లోకాతీతమైనవిగా; లోకాః = లోకములలో; అభివిశ్రుతే = ప్రసిద్ధిగాంచినవి; దృఢే = దృఢమైనవి; బలవతీ = బలమైనవి; ముఖ్యే = ప్రధానమైనవి; సుకృతే = బాగుగా చేయబడినవి; విశ్వకర్మణా = విశ్వకర్మ చేత;
భావము:-
“రామా! ఈ రెండు ధనుస్సులు కూడా శ్రేష్ఠమైనవే. లోకాతీతమైనవి. సకలలోకములలో ప్రసిద్ధిచెందినవి. దృఢమైనవి. బలమైనవి. ప్రధానమైనవి. విశ్వకర్మ వీటిని బహు చక్కగా నిర్మించెను.
1.75.12.
అనుష్టుప్.
అనిసృష్టం సురైరేకమ్
త్య్రమ్బకాయ యుయుత్సవే।
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ!
భగ్నం కాకుత్థ్స యత్త్వయా॥
టీక:-
అనిసృష్టం = నిర్మింపబడినది; సురైః = దేవతలచేత; ఏకమ్ = ఒకటి; త్య్రమ్బకాయ = త్య్రయంబకుడైన శివుని కొరకు; యుయుత్సవే = యుద్ధోత్సాహునికి; త్రిపురఘ్నం = త్రిపురములను నాశనము చేసిన; నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా; భగ్నమ్ = విరువబడినది; కాకుత్స్థ = కాకుత్స్థుడా; యత్ = ఏది; త్వయా = నీచే;
భావము:-
వీటిలో ఒక ధనుస్సును యుద్ధము చేయగోరుచున్న ఈశ్వరునికొరకు, దేవతలు నిర్మింపజేసిరి. త్రిపుర వినాశకరమగు ఆ ధనుస్సునే నీవు విరిచితివి.
1.75.13.
అనుష్టుప్.
ఇదం ద్వితీయం దుర్ధర్షమ్
విష్ణోర్దత్తం సురోత్తమైః।
తదిదం వైష్ణవం రామ!
ధనుః పరమభాస్వరమ్॥
టీక:-
ఇదమ్ = ఇది; ద్వితీయమ్ = రెండవది; దుర్ధర్షమ్ = ఎదిరింపశక్యము కానిది; విష్ణోః = విష్ణువునకు; దత్తమ్ = ఇవ్వబడినది; సుర = దేవతలలో; ఉత్తమైః = శ్రేష్ఠులచేత; తత్ = ఆ; ఇదమ్ = ఇది; వైష్ణవమ్ = విష్ణుమూర్తిది; రామః = ఓ! రామా; ధనుః = ధనుస్సు; పరమ = మిక్కిలి; భాస్వరమ్ = తేజోవంతమైనది, ప్రకాశవంతమైనది;
భావము:-
ఎదిరింపరాని ఈ రెండవ ధనుస్సును దేవతలు విష్ణువునకు ఇచ్చిరి. ఈ విష్ణువిల్లు తేజస్సు ఎంతో గొప్పది.
1.75.14.
అనుష్టుప్.
సమానసారం కాకుత్థ్స!
రౌద్రేణ ధనుషా త్విదమ్।
తదా తు దేవతాస్సర్వాః
పృచ్ఛంతి స్మ పితామహమ్॥
టీక:-
సమాన = సమానమైన; సారం = సత్తువ, చేవ కలిగినది; కాకుత్స్థ = కాకుత్స్థుడా; రౌద్రేణ = శివుని యొక్క; ధనుషా = ధనుస్సుతో; తు; ఇదమ్ = ఇది; తదా = ఆ విధముగా; తు = ఇంకను; దేవతాః = దేవతలు; సర్వాః = సకల; పృచ్ఛంతి = అడుగుచున్నారు; స్మః పితామహమ్ = మా యొక్క పితామహుని (బ్రహ్మదేవుని);
భావము:-
ఈ విష్ణువిల్లు చేవ శివధనుస్సుతో సమానమైనది. అపుడు దేవతలందరు శివవిష్ణువుల బలాబలములను తెలిసికొను కోరికతో బ్రహ్మను అడిగిరి.
1.75.15.
అనుష్టుప్.
శితికణ్ఠస్య విష్ణోశ్చ
బలాబలనిరీక్షయా।
అభిప్రాయం తు విజ్ఞాయ
దేవతానాం పితామహః॥
టీక:-
శితికణ్ఠస్య = గరళకంఠుడైన శివునియొక్క; విష్ణోః = విష్ణుమూర్తి యొక్క,; చ - మఱియు; బలాబల = బలాబలములను; నిరీక్షయా = చూచుట కొరకు; అభిప్రాయమ్ = అభిప్రాయమును; తు = మఱియు; విజ్ఞాయ = తెలిసికొని; దేవతానామ్ = దేవతలయొక్క; పితామహః = పితామహుడు;
భావము:-
శివుడు, విష్ణుమూర్తి.. ఇరువురి బలాబలములను చూడవలెనను దేవతల అభిప్రాయము తెలుసుకొని.. పితామహుడైన బ్రహ్మ
1.75.16.
అనుష్టుప్.
విరోధం జనయామాస
తయో స్సత్యవతాం వరః।
విరోధే తు మహద్యుద్ధం
అభవద్రోమహర్షణమ్॥
టీక:-
విరోధమ్ = శత్రుత్వము; జనయామాస = పుట్టించెను. తయోః = వారిలో; సత్యవతామ్ = సత్యవంతులలో; వరః = సశ్రేష్ఠుడు; విరోధే = శత్రుత్వము; తు = వలన; మహత్ = గొప్ప; యుద్ధమ్ = యుద్ధము; అభవత్ = సంభవించినది; రోమహర్షణమ్ = గగుర్పాటు కలిగించు;
భావము:-
సత్యవంతులలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు దేవతల అభిప్రాయము తెలిసికొని, శివునకు విష్ణువునకు విరోధము కల్పించెను. వారిరువురి మధ్య గగుర్పాటు కలిగించు భయంకరమైన యుద్ధము జరిగెను.
1.75.17.
అనుష్టుప్.
శితికణ్ఠస్య విష్ణోశ్చ
పరస్పరజిగీషుణోః।
తదా తు జృమ్భితం శైవం
ధనుర్భీమ పరాక్రమమ్॥
టీక:-
శితికణ్ఠస్య = గరళకంఠుడైన శివుని యొక్క; విష్ణోః = విష్ణుని యొక్క; చ = మఱియు; పరస్పర = ఒకరి నొకరు; జిగీషుణోః = గెలుచు కోరికతో; తదా తు = అప్పుడు; జృమ్భితమ్ = ఆవులించెను. శైవమ్ = శివుని; ధనుః = ధనుస్సు; భీమ = భయంకరమైన; పరాక్రమమ్ = పరాక్రమము కలిగినది;
భావము:-
అట్లు విరోధము కలుగగా, ఒకరినొకరు జయింపగోరుచున్న శివుడు విష్ణువుల మధ్య భయంకరమైన యుద్ధము జరిగెను. అప్పుడు భయంకర ప్రతాపము గల శివధనుస్సు ఆవులించెను (చైతన్యము కోల్పోయెను).
1.75.18.
అనుష్టుప్.
హుఙ్కారేణ మహాదేవ
స్తమ్భితోఽథ త్రిలోచనః।
దేవైస్తదా సమాగమ్య
సర్షిసంఘై స్సచారణైః॥
టీక:-
హుఙ్కారేణ = హుంకారము చేత (విష్ణువు యొక్క ధ్వని); మహాదేవః = మహాదేవుడైన పరమశివుడు; స్తమ్భితః = స్తంభింపబడెను. అథః = అటుపిమ్మట; త్రిలోచనః = ముక్కంటి; దేవైః = దేవతలచేత; తదా = అప్పుడు; సమాగమ్య = ఒకచోట చేరి; స = కూడా ఉన్న; ఋషిః = మునుల; సంఘైః = సమూహముతో; స = సహితంగా; చారణైః = చారణులతో.
భావము:-
విష్ణువు హుంకారము చేయగా భయంకర పరాక్రమము గల శివధనుస్సు జడమైపోయెను. త్రిలోచనుడు కూడా కదలలేకపోయెను. అప్పుడు దేవతలు, ఋషులు, చారణులుతో కలిసి;
1.75.19.
అనుష్టుప్.
యాచితౌ ప్రశమం తత్ర
జగ్మతుస్తౌ సురోత్తమౌ।
జృమ్భితం తద్ధనుర్దృష్ట్వా
శైవం విష్ణుపరాక్రమైః॥
టీక:-
యాచితౌ = ప్రార్థింపబడినవారై; ప్రశమం = శాంతిని; తత్ర = అచట; జగ్మతుః = పొందిరి; తౌ = వారిరువురు; సురోత్తమౌ = దేవతాశ్రేష్ఠులు ఇరువురు; జృమ్భితం = ఆవులించబడిన (జడము చేయబడిన); తత్ = ఆ; ధనుః = ధనుస్సు; దృష్ట్వా = చూసి; శైవమ్ = శివుని; విష్ణు పరాక్రమైః = శ్రీమహావిష్ణువుయొక్క పరాక్రమముచే; దేవతలు ఋషిగణములు, చారణులు చేరి ప్రార్థింప, శివకేశవులు శాంతించిరి.
భావము:-
విష్ణు పరాక్రమముచే శివధనుస్సు జడమైపోవుట చూచిన దేవతలు, ఋషి గణములు విష్ణువే అధికుడని తెలుసుకొనిరి.
1.75.20.
అనుష్టుప్.
అధికం మేనిరే విష్ణుం
దేవాస్సర్షిగణాస్తదా ।
ధనూ రుద్రస్తు సంకృద్ధో
విదేహేషు మహాయశాః॥
టీక:-
అధికమ్ = గొప్పవానిగా; మేనిరే = తలచిరి; విష్ణుమ్ = విష్ణువును; దేవాః = దేవతలు; స = కలిసి ఉన్న; ఋషి = ఋషుల; గణాః = సమూహములతో; తదా = అప్పుడు; ధనూః = ధనుస్సు; రుద్రః = శివుడు; తు = మరి; సంకృద్ధః = ఆగ్రహించిన; విదేహేషు = విదేహ రాజ్యమునందు; మహా = గొప్ప; యశాః = కీర్తివంతుడు.
భావము:-
దేవతలు ఋషిగణములతో కూడి విష్ణువును గొప్పవాడిగా భావించిరి. మహా యశస్సు గల రుద్రుడు కోపించి, ఆ ధనుస్సును, విదేహ దేశములో దేవరాతుడను రాజర్షికి ఇచ్చివేసెను.
1.75.21.
అనుష్టుప్.
దేవరాతస్య రాజర్షేః
దదౌ హస్తే ససాయకమ్।
ఇదం చ వైష్ణవం రామ!
ధనుః పరపురంజయమ్॥
టీక:-
దేవరాతస్య = దేవరాతునియొక్క; రాజర్షేః = రాజులలో ఋషి అయిన; దదౌ = ఇచ్చెను; హస్తే = చేతియందు; ససాయకమ్ = బాణముతో కూడిన; ఇదం = ఇది; చ = మఱియు; వైష్ణవం = విష్ణుసంబంధమైన; రామ = ఓ రామా; ధనుః = ధనుస్సు; పర = శత్రువుల; పురః = నగరములు; జయమ్ = జయించుశీలముకలది.
భావము:-
రామా! అపుడు కోపముతో రుద్రుడు శరముతో కూడిన తన ధనుస్సును విదేహరాజ్యములో రాజర్షి దేవరాతుని చేతికి ఇచ్చెను. ఓ రామా ! ఇది శత్రుపురములను జయించు వైష్ణవధనుస్సు
1.75.22.
అనుష్టుప్.
ఋచీకే భార్గవే ప్రాదాత్
విష్ణుః స న్యాసముత్తమమ్।
ఋచీకస్తు మహాతేజాః
పుత్రస్యాప్రతికర్మణః॥
టీక:-
ఋచీకే = ఋచీకుని యందు; భార్గవే = భృగువంశీయుడు; ప్రాదాత్ = ఇచ్చెను; విష్ణుః = విష్ణుమూర్తి; సః = అతడు; న్యాసమ్ = ఇల్లడగా, పదిలపరచకొనునది; ఉత్తమమ్ = ఉత్తమమైనదానిని; ఋచీకః = ఋచీకుడు; తు; మహాతేజాః = గొప్ప తేజోసంపన్నుడు; పుత్రస్యా = కుమారునికి; అప్రతికర్మణః = సాటిలేని కార్యములు గలవాడు;
భావము:-
విష్ణువు ఆ శ్రేష్ఠమైన ధనుస్సును భృగు వంశమునకుచెందిన ఋచీకుని వద్ద పదిలపరచుకొమని ఇచ్చెను. మహాతేజఃశాలియగు ఋచీకుడు, ఆ వైష్ణవ ధనుస్సును తన పుత్రుడు, సాటిలేని కర్మలు కలవాడును..
1.75.23.
అనుష్టుప్.
పితుర్మమ దదౌ దివ్యం
జమదగ్నేర్మహాత్మనః।
న్యస్తశస్త్రే పితరి మే
తపోబలసమన్వితే॥
టీక:-
పితుః = తండ్రి; మమ = నా యొక్క; దదౌ = ఇచ్చెను; దివ్యమ్ = దేవతా సంబంధమైన; జమదగ్నేః = జమదగ్నికి; మహాత్మనః = గొప్ప ఆత్మకలిగినవాడు; న్యస్త = విడువబడిన; శస్త్రే = శస్త్రములు కలవాడు; పితరి = తండ్రి; మే = నా యొక్క; తపోబల = తపస్సుయొక్క బలము; సమన్వితే = కూడిన;
భావము:-
ఋచీకుడు మహాత్ముడు నా తండ్రియగు జమదగ్నునకు ఆ దివ్యధనుస్సును ఇచ్చెను. తపోబలసంపన్నుడైన నా తండ్రి ఆయుధములను విడిచిపెట్టియుండగా
1.75.24.
అనుష్టుప్.
అర్జునో విదధే మృత్యుం
ప్రాకృతాం బుద్ధిమాస్థితః।
వధమప్రతిరూపం తు
పితు శ్శృత్వా సుదారుణమ్॥
టీక:-
అర్జునః = కార్తవీర్యార్జునుడు; విదధే = కావించెను. మృత్యుమ్ = మరణమును; ప్రాకృతాం = నీచమైన, వావిళ్ళ వారి నిఘంటువు; బుద్ధిమ్ = బుద్ధిని , ఆలోచనను; అస్థితః = అవలంబించినవాడై; వధమ్ = వధను; అప్రతిరూపం = యుక్తముకానిది, తగనిది; తు = మఱియు; పితుః = తండ్రి; శ్రుత్వా = విని; సుదారుణమ్ = అత్యంత భయంకరమైన.
భావము:-
కార్తవీర్యార్జునుడు నీచ బుద్ధికలవాడై నా తండ్రిని చంపెను. నా తండ్రి వధ అను ఆ అత్యంత భయంకరమైన తగనిపని గూర్చి వినిన నేను.
1.75.25.
అనుష్టుప్.
క్షత్రముత్సాదయన్రోషాత్
జాతం జాతమనేకశః।
పృథివీం చాఖిలాం ప్రాప్య
కాశ్యపాయ మహాత్మనే॥
టీక:-
క్షత్రమ్ = క్షత్రియుని; ఉత్సాదయన్ = తొలగించుచు, నాశనముచేయుచు; రోషాత్ = కోపమువలన; జాతం జాతమ్ = పుట్టినవానిని పుట్టినట్లు; అనేకశః = పలుమారులు; పృథివీం = భూమండలమును; చ; అఖిలామ్ = సమస్తమైన; ప్రాప్య = పొంది; కాశ్యపాయ = కశ్యపుని కొరకు; మహాత్మనే = గొప్పవాడు;
భావము:-
కోపముతో అనేక పర్యాయములు క్షత్రియజాతికి చెందిన ప్రతి ఒక్కనిని, పుట్టినవానిని పుట్టినట్లుగనే సంహరించితిని. ఈ భూమండలమునంతను జయించి, దానిని యజ్ఞము పూర్తియగు సమయములో మహాత్ముడు, పుణ్యకర్మ కలవాడు అయిన కశ్యపునకు దానము చేసితిని.
1.75.26.
అనుష్టుప్.
యజ్ఞస్యాంతే తదా రామ!
దక్షిణాం పుణ్యకర్మణే।
దత్త్వా మహేంద్రనిలయః
తపోబలసమన్వితః॥
టీక:-
యజ్ఞస్య = యజ్ఞముయొక్క; అంతే = యజ్ఞము పూర్తియగు సమయములో; తదా = అప్పుడు; రామ = ఓ రామా; దక్షిణాం = దక్షిణగా; పుణ్యకర్మణే = సత్కారముగా, ఆంధ్రశబ్ధరత్నాకరము; దత్త్వా = ఇచ్చి; మహేంద్ర = మహేంద్రపర్వతమును; నిలయః = నివాసముగా కలవాడు; తపోబల = తపోబలము; సమన్వితః = కూడినవాడు;
భావము:-
యజ్ఞాంతమునందు ఆ భూమండలమును మహాత్ముడు, పుణ్యాత్ముడునగు కశ్యపునికి సత్కరించు సమయమున దక్షిణగా దానమిచ్చి, పిదప తపోబలసమన్వితుడనై, మహేంద్రపర్వతముపై నివసించుచున్నాను,
1.75.27.
అనుష్టుప్.
అద్యతూత్తమవీర్యేణ
త్వయా రామ! మహాబల।
శ్రుతవాన్ ధనుషో భేదం
తత్రోఽహం ద్రుతమాగతః॥
టీక:-
అద్య = ఇప్పుడు; తు; ఉత్తమ = శ్రేష్ఠమైన; వీర్యేణ = పరాక్రమము గల; త్వయా = నీ చేత; రామ = ఓ రామా; మహాబల = గొప్ప బలము గల; శ్రుతవాన్ = విన్నవాడను; ధనుషః = ధనుస్సుయొక్క; భేదమ్ = విరుచుటను; తత్ర = అచటకు; అహమ్ = నేను; ద్రుతమ్ = వేగముగ; ఆగతః = వచ్చితిని;
భావము:-
మహాబలుడా! ఓ రామా! ఇప్పుడు ఉత్తమ పరాక్రమవంతుడవైన నీవు శివధనుస్సు విరిచితివని విని నేను శీఘ్రముగా వచ్చితిని.
1.75.28.
అనుష్టుప్.
తదిదం వైష్ణవం రామ!
పితృ పైతామహం మహత్।
క్షత్రధర్మం పురస్కృత్య
గృహ్ణీష్వ ధనురుత్తమమ్॥
టీక:-
తత్ = ఆ; ఇదమ్ = ఈ; వైష్ణవమ్ = విష్ణువిల్లు; రామ = ఓ రామా; పితృపైతామహమ్ = వంశపారంపర్యంగా వచ్చినది; మహత్ = గొప్పదైన; క్షత్రధర్మం = క్షత్రియ ధర్మమును; పురస్కృత్య = గౌరవించి; గృహ్ణీష్వ = స్వీకరించుము; ధనుః = ధనుస్సును; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన;
భావము:-
ఓ రామా ! ఇదిగో ఆ విష్ణువిల్లు. మీ గొప్పదైన వంశపారంపర్యమైన క్షత్రియధర్మమును గౌరవించి యీ శ్రేష్ఠమైన ధనుస్సును గ్రహింపుము.
1.75.29.
అనుష్టుప్.
యోజయస్వ ధనుశ్శ్రేష్ఠే
శరం పరపురంజయమ్।
యది శక్నోషి కాకుత్స్థ!
ద్వన్ద్వం దాస్యామి తే తతః॥
టీక:-
యోజయస్వ = సంధింపుము; ధనుః = ధనుస్సు; శ్రేష్ఠే = శ్రేష్ఠమైనదానియందు; శరం = బాణమును; పర = శత్రువుల; పురం = పురములను; జయమ్ = జయించు శీలము గలది; యది = ఐనచో; శక్నోషి = సమర్థుడవు; కాకుత్స్థ = ఓ కాకుత్స్థా !; ద్వన్ద్వం = ద్వంద్వయుద్ధమును; దాస్యామి = ఇచ్చెదను; తే = నీకు; తతః = ఆ పిదప;
భావము:-
ఓ కాకుత్థ్స కులతిలక రాఘవరామా! నీవు యీ శ్రేష్ఠమైన ధనుస్సునందు శత్రుపురములను జయించెడి బాణమును సంధించగలిగితే, అప్పుడు నీకు నాతో ద్వంద్వయుద్ధము అవకాశము ఇచ్చెదను.
1.75.30.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
బాలకాండే
పంచాసప్తతితమః సర్గః॥
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచసప్తతితమః [75] = డెబ్బైఐదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోనిడెబ్బైఐదవ [75] సర్గ సంపూర్ణము.
బాల కాండ
॥షట్సప్తతితమః సర్గః॥
(76 - వైష్ణవధనుస్సు ఎక్కుపెట్టుట)
1.76.1.
అనుష్టుప్.
శ్రుత్వా తజ్జామదగ్న్యస్య
వాక్యం దాశరథిస్తదా ।
గౌరవాద్యంత్రితకథః
పితూ రామమథాబ్రవీత్ ॥
టీక:-
శ్రుత్వా = విని; తత్ = ఆ; జామదగ్న్యస్య = జమదగ్నిమహర్షి పుత్రునియొక్క; వాక్యం = మాటను; దాశరథిః = దశరథుని పుత్రుడు; తదా = అప్పుడు; గౌరవాత్ = గౌరవమువలన; యంత్రిత = తనను తాను నియంత్రించుకొని; కథః = అనెను; పితుః = తండ్రియొక్క; రామమ్ = పరశురాముని గుఱించి; అథ = అప్పుడు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
పరశురాముని మాటలు విని, రాముడు తన తండ్రి పైనున్న గౌరవముతో తనను తాను నియంత్రించుకొనుచు, పరశురామునితో ఇట్లు అనెను.
1.76.2.
అనుష్టుప్.
“శ్రుతవానస్మి యత్కర్మ
కృతవానసి భార్గవ ।
అనురున్ధ్యామహే బ్రహ్మన్
పితురానృణ్యమాస్థితమ్ ॥
టీక:-
శ్రుతవాన్ = విని; అస్మి = ఉన్నాను; యత్కర్మ = ఏ కర్మ; కృతవాన్ అసి = చేసితివో దానిని; భార్గవ = పరశురామా; అనురున్ధ్యామహే = అభినందించుచున్నాను; బ్రహ్మన్ = బ్రాహ్మణుడా; పితుః = తండ్రికి; అనృణ్యమ్ = ఋణవిముక్తి; ఆస్థితమ్ = పొందినవానిని.
భావము:-
ఓ బ్రాహ్మణుడా! పరశురామా! నీవు పితౄణము నుండి విముక్తి పొందుటకు చేసిన కార్యముగురించి వినియున్నాను. అందులకు నీకు నా అభినందనలు.
గమనిక:-
*- కార్తవీర్యార్జునుఁడు పరశురాముని తండ్రి జమదగ్ని హోమధేనువును కొనిపోయెను. పరశురాముఁడు వానిని చంపెను. పగగొన్న కార్తవీర్యుని కొడుకులు జమదగ్నిని చంపిరి. అదికారణముగ పరశురాముఁడు ఇరువదియొక్క మాఱు రాజులను ఎల్ల వెదకివెదకి చంపి ఆనెత్తురు అయిదు మడుఁగులుగ కావించి అందు పితృతర్పణములు చేసెను. కనక, అది పితౄణము నుండి విముక్తి పొందుటకు చేసిన కార్యము అయినది.
1.76.3.
అనుష్టుప్.
* వీర్యహీనమివాశక్తమ్
క్షత్రధర్మేణ భార్గవ ।
అవజానాసి మే తేజః
పశ్య మేఽద్య పరాక్రమమ్” ॥
టీక:-
వీర్యం = శూరత్వమున; హీనమ్ = అల్పుని; ఇవ = వలె; అశక్తమ్ = శక్తిహీనుడిగా; క్షత్రధర్మేణ = క్షత్రియధర్మమునకు సంబంధించి; భార్గవ = పరశురామా; అవజానాసి = అవజాన+అసి, అవమానము చేయుచుంటివి; మే = నా యొక్క; తేజః = గొప్పదనము; పశ్య = చూడుము; అద్య = ఇప్పుడు; పరాక్రమమ్ = పరాక్రమమును.
భావము:-
“భార్గవరామా! క్షత్రియులకు ఉండవలసిన శౌర్యము, శక్తి నాకు లేవని అంటివి. అవమానించితివి. చూడు. ఇప్పుడు నా తేజోపరాక్రమము లను ప్రదర్శించెదను.”
1.76.4.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో
భార్గవస్య శరాసనమ్ ।
శరం చ ప్రతిజగ్రాహ
హస్తాల్లఘుపరాక్రమః ॥
టీక:-
ఇతి = ఈవిధముగృ; ఉక్త్వా = పలికి; రాఘవః = రాముడు; క్రుద్ధః = కోపించినవాడు; భార్గవస్య = పరశురామునియొక్క; శరాసనమ్ = ధనుస్సును; శరం = బాణమును; చ = కూడ; ప్రతిజగ్రాహ = గ్రహించెను; హస్తాత్ = చేతినుండి; అలఘు = అధికమైన; పరాక్రమః = శౌర్యము కలవాడు;
భావము:-
అలా కోపించి పలికిన మహాపరాక్రమవంతుడైన, రఘురాముడు పరశురాముని చేతినుండి విల్లంబులు తీసుకొనెను.
1.76.5.
అనుష్టుప్.
ఆరోప్య స ధనూ రామః
శరం సజ్యం చకార హ ।
జామదగ్న్యం తతో రామమ్
రామః క్రుద్ధోఽబ్రవీద్వచః ॥
టీక:-
ఆరోప్య = ఎక్కుపెట్టి; సః = అతను; ధనూః = ధనుస్సును; రామః = రాముడు; శరం = బాణమును; సజ్యం = వింటినారితో కూడినదిగ; చకార = చేసెను; హ; జామదగ్న్యం = పరశురామునిగూర్చి; తతః = అప్పుడు; రామమ్ = రాముడిని; రామః = రాముడు; క్రుద్ధః = ఆగ్రహించినవాడు; అబ్రవీత్ = పలికెను; ఇదమ్ = ఇది.
భావము:-
రాముడు విల్లును ఎక్కుపెట్ట, బాణమును వింటినారిపై సంధించెను. రాముడు ఎంతో ఆగ్రహముతో పరశురామునితో ఇట్లు పలికెను.
1.76.6.
అనుష్టుప్.
“బ్రాహ్మణోఽసీతి పూజ్యో మే
విశ్వామిత్రకృతేన చ ।
తస్మాచ్ఛక్తో న తే రామ
మోక్తుం ప్రాణహరం శరమ్ ॥
టీక:-
బ్రాహ్మణః = బ్రాహ్మణుడవు; అసి = అయిఉన్నావు; ఇతి = ఇది; పూజ్యః = పూజనీయమైన; మే = నాకు; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; కృతేన = సంబంధముచే; చ = కూడ; తస్మాత్ = ఆ కారణమువలన; శక్తః = సమర్థుడను; న = కాదు; రామ = రాముడు; మోక్తుం = విడుచుటకు; ప్రాణహరం = ప్రాణమును హరించునది; శరమ్ = బాణమును.
భావము:-
ఓ భార్గవరామా! నీవు బ్రాహ్మణుడవు. పైగా మా గురువు విశ్వామిత్రునితో సంబంధము కలిగి ఉన్నవాడవు. అలా నాకు పూజనీయుడవు. ఆ కారణమువలన, ప్రాణము తీయగల ఈ బాణమును నీపై సంధించలేక పోవుచున్నాను.
గమనిక:-
*- గాది రాజు కొడుకు “విశ్వామిత్రుని” సోదరి “సత్యవతి”. ఋచికమహర్షికి భార్య ఆ సత్యవతి యందు కలిగన పుత్రుడు జమదగ్ని, “జమదగ్న”కి భార్య రేణుక యందు కలిగిన నలుగురు కొడుకులు ఉరుమతి, ఉత్సాహుడు, విశ్వావసుడు, “పరశురాముడు”. కనుక, విశ్వామిత్రుని మనుమడు పరశురాముడు. రామునికి గురువుగారి మనుమడు.
1.76.7.
అనుష్టుప్.
ఇమాం పాదగతిం రామ
తపోబలసమార్జితాన్ ।
లోకానప్రతిమాన్వా తే
హనిష్యామి యదిచ్ఛసి ॥
టీక:-
ఇమాం = ఈ; పాదగతిం = నడకతతో / గమనము; రామ = పరశురామా; తపః = తపస్సు యొక్క; బల = శక్తిచేత; సమార్జితాన్ = సంపాదించిన; లోకాన్ = లోకములను; అప్రతిమాన్ = అడ్డులేని; వా = లేక; అపి = కూడ; హనిష్యామి = కొట్టెదను; యత్ = ఏది; ఇచ్ఛసి = కోరెదవో దాని.
భావము:-
ఓ పరశురామా! నీవు తపోబలముతో సకల లోకములకు పోగల అడ్డులేని గమన శక్తిని, అసమానమైన పుణ్యలోకము / రాసు లను ఆర్జించితివి. ఈ బాణముతో నీ గమనశక్తిపై సంధించ మందువా లేక తపోబలముతో ఆ పుణ్యలోకములపై సంధించ మందువా. తెలుపుము.
1.76.8.
అనుష్టుప్.
న హ్యయం వైష్ణవో దివ్యః
శరః పరపురంజయః ।
మోఘః పతతి వీర్యేణ
బలదర్పవినాశనః” ॥
టీక:-
న హి = కాదు కదా; అయం = ఈ; వైష్ణవః = విష్ణువు యొక్క; దివ్యః = దివ్యమైన; శరః = బాణము; పరపురంజయః = ఇతరుల పురములను జయించగల; మోఘః = వృధా అగునది; పతతి = పడుట; వీర్యేణ = వీరుల; బల = బలము; దర్ప = గర్వమును; వినాశనః = వినాశకారి.
భావము:-
ఈ విష్ణుబాణము శత్రువుల పట్టణములను జయింప గలది, శత్రు వీరుల బలగర్వములను నశింపజేయునది. ఈ దివ్యమైన విష్ణు బాణము వృధా కానేరాదు.”
1.76.9.
అనుష్టుప్.
వరాయుధధరం రామమ్
ద్రష్టుం సర్షిగణాస్సురాః ।
పితామహం పురస్కృత్య
సమేతాస్తత్ర సంఘశః ॥
టీక:-
వర = శ్రేష్ఠమైన; ఆయుధ = ఆయుధమును; ధరం = ధరించిన; రామమ్ = రాముని; ద్రష్టుం = చూడవలెనని; సః = కూడి; ఋషి = ఋషులు; గణాః = గణములు; సురాః = దేవతల; పితామహం = తాత న; పురస్కృత్య = ముందు ఉంచుకొని; సమేతాః = కలసి; తత్ర = అక్కడ; సంఘశః = సమూహములు.
భావము:-
శ్రేష్ఠమైన ఆయుధమును ధరించిన రాముని చూచుటకు దేవతలు, ఋషులు, బ్రహ్మను ముందిడుకొని, గుంపులు గుంపులుగ వచ్చిరి.
1.76.10.
అనుష్టుప్.
గంధర్వాప్సరసశ్చైవ
సిద్ధచారణకిన్నరాః ।
యక్షరాక్షసనాగాశ్చ
తద్ద్రష్టుం మహదద్భుతమ్ ॥
టీక:-
గంధర్వ = గంధర్వులు; అప్సరసః చ ఏవ = అప్సరసలును; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; కిన్నరాః = కిన్నరులు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; నాగః చ = నాగులు కూడ; తత్ = ఆ; ద్రష్టుం = చూచూటకు; మహత్ = గొప్ప; అద్భుతమ్ = ఆశ్చర్యకరమైన.
భావము:-
గంధర్వులు, అప్సరసులు, సిధ్ధులు, చారణులు, కిన్నరలు, యక్షులు, రాక్షసులు, నాగులు కూడ ఆ అద్భుత దృశ్యమును చూచుటకు వచ్చిరి.
1.76.11.
అనుష్టుప్.
జడీకృతే తదా లోకే
రామే వరధనుర్ధరే ।
నిర్వీర్యో జామదగ్న్యోఽసౌ
రామో రామముదైక్షత ॥
టీక:-
జడీకృతే = చలనము లేకుండగ చేయబడినదగుచుండ; తదా = అప్పుడు; లోకే = లోకము; రామే = రాముడు; వర = శ్రేష్ఠమైన; ధనుః = ధనుస్సు; ధరే = ధరించినవాడగుచుండ; నిర్వీర్యః = శక్తిహీనుడు; జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు; అసౌ = ఈ; రామః = రాముడు; ఉత్ ఐక్షత = విప్పార్చిన కళ్ళతో చూచెను.
భావము:-
దశరథరాముడు విష్ణుధనుస్సును సంధించి నిలబడగా, లోకము స్తంభించిపోయెను. పరశురాముడు నిశ్చేష్టుడై, శక్తి (వైష్ణవ తేజము) ఉడిగినవాడై, కన్నులు విప్పార్చి చూచుచుండెను.
1.76.12.
అనుష్టుప్.
తేజోభిహతవీర్యత్వాత్
జామదగ్న్యో జడీకృతః ।
రామం కమలపత్రాక్షమ్
మన్దం మందమువాచ హ ॥
టీక:-
తేజః = తేజస్సు; అభిహత = భంగపరచబడిన; వీర్యత్వాత్ = వీరత్వమువలన; జామదగ్న్యః = పరశురాముడు; జడీకృతః = నిశ్చేష్టుడిగా చేయబడినవాడు; రామమ్ = రాముని గూర్చి; కమలపత్రాక్షమ్ = తామరరేకులవంటి కన్నులుగల; మన్దం మన్దం = మెల్ల మెల్లగా; ఉవాచ హ = పలికెను.
భావము:-
రాముని తేజస్సుచే, భంగపడి నిశ్చేష్ఠుడైన పరశురాముడు, పద్మదళాయతాక్షుడైన రామునితో మెల్ల మెల్లని కంఠస్వరముతో ఇట్లు పలికెను.
1.76.13.
అనుష్టుప్.
“కాశ్యపాయ మయా దత్తా
యదా పూర్వం వసుంధరా ।
విషయే మే న వస్తవ్యమ్
ఇతి మాం కాశ్యపోఽబ్రవీత్ ॥
టీక:-
కాశ్యపాయ = కాశ్యపునికొరకు; మయా = నాచే; దత్తా = ఈయబడిన; పూర్వం = పూర్వము; వసుంధరా = భూమండలము; విషయే = దేశములో; మే = నా యొక్క; న = తగదు; వస్తవ్యమ్ = నివసించుట; ఇతి = ఇట్లు; మాం = నన్ను గూర్చి; కాశ్యపః = కశ్యపుడు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
“పూర్వము నాచే భూమండలమంతయు కాశ్యప మహర్షికి ధారాదత్తము చేయబడినది. అనంతరము, నేను ఇకపై అచట ఉండ తగదు అని కశ్యపుడు ఆదేశించెను.
1.76.14.
అనుష్టుప్.
సోఽహం గురువచః కుర్వన్
పృథివ్యాం న వసే నిశామ్ ।
కృతా ప్రతిజ్ఞా కాకుత్స్థ
కృతా భూః కాశ్యపస్య హి ॥
టీక:-
సః = అట్టి; అహం = నేను; గురువచః = గురువాజ్ఞను; కుర్వన్ = పాటించి; పృథివ్యాం = భూమియందు; న = ఉండను; వసే = నివసించి; నిశామ్ = రాత్రి; కృతా = చేయబడినది; ప్రతిజ్ఞా = ప్రమాణము; కాకుత్స్థ = రామా; కృతా = చేయబడినది; భూః = భూమండలము; కాశ్యపస్య హి = కాశ్యపునిదిగా.
భావము:-
రామా! ఈ భూమి మా గురువు కాశ్యపునిది కదా. అందుచే గురువాజ్ఞను పాటించి రాత్రి సమయములందు భూమిపై నేను నివసించను. ఏలనన, ఈ ప్రతిజ్ఞ రాత్రి సమయమున చేసితిని కనుక.
1.76.15.
అనుష్టుప్.
తదిమాం త్వం గతిం వీర
హన్తుం నార్హసి రాఘవ ।
మనోజవం గమిష్యామి
మహేంద్రం పర్వతోత్తమమ్ ॥
టీక:-
తత్ = అందువలన; ఇమాం = ఈ; త్వం = నీవు; గతిం = గమనమును; వీర = వీరా; హన్తుం = కొట్టుటకు; న = కావు; అర్హసి = తగినవాడవు; రాఘవ = రామా; మనోజవం = మనోవేగముతో; గమిష్యామి = వెళ్ళెదను; మహేంద్రం = మహేంద్రమను; పర్వత = పర్వతముసందు; ఉత్తమం = శ్రేష్ఠమైనదానినిగూర్చి.
భావము:-
అందువలన పరాక్రమవంతుడా! ఓ రామా! నీవు నా గమనశక్తిని నిగ్రహించుట సముచితము కాదు. నేను శ్రేష్ఠమైన ఆ మహేంద్ర పర్వతమునకు మనోవేగముతో వెడలిపోయెదను.
1.76.16.
అనుష్టుప్.
లోకాస్త్వప్రతిమా రామ
నిర్జితాస్తపసా మయా ।
జహి తాన్ శరముఖ్యేన
మా భూత్కాలస్య పర్యయః ॥
టీక:-
లోకాః తు = లోకములు; తు; అప్రతిమ = అసమానమైన; రామ = రామా; నిర్జితాః = జయించబడినవి; తపసా = తపస్సుచే; మయా = నా యొక్క; జహి = నశింపజేయుము; తాన్ = వాటిని; శర = బాణము; శర = ప్రధానమైనదానితో; మా భూత్ = ఉండకుండుగాక; కాలస్య = సమయముయొక్క; పర్యయః = యాపనము.
భావము:-
రామా! కాలయాపన చేయక, అసమానమైన తపశ్శక్తితో నేను జయించిన లోకములను ఒక మేటిబాణము వేసి నశింపజేయుము.
1.76.17.
అనుష్టుప్.
అక్షయ్యం మధుహంతారమ్
జానామి త్వాం సురేశ్వరమ్ ।
ధనుషోఽస్య పరామర్శాత్
స్వస్తి తేఽస్తు పరంతప ॥
టీక:-
అక్షయ్యం = నశింపబడరాని వానిగ; మధు హంతారమ్ = మధు అను రాక్షసుని వధించినవానినిగ; జానామి = గ్రహించితిని; త్వాం = నిన్ను; సురేశ్వరమ్ = దేవతలకు అధిపతిగ; ధనుషః = ధనుస్సు; అస్య = ఈ; పరామర్శాత్ = వివేచనచే; స్వస్తి = మంగళము; తే = నీకు; అస్తు = అగు గాక; పరంతప = శత్రువులను పరితపించువాడా !
భావము:-
ఓ రామా! నీవు ఈ ధనుస్సును గైకొనుట చూచి నీవు నాశరహితుడవైన, మధుసూదనుడవైన మహావిష్ణువునిగా గ్రహించితిని. ఓ పరంతపా! నీకు మంగళమగు గాక.
1.76.18.
అనుష్టుప్.
* ఏతే సురగణాస్సర్వే
నిరీక్షంతే సమాగతాః ।
త్వామప్రతిమకర్మాణం
అప్రతిద్వన్ద్వమాహవే ॥
టీక:-
ఏతే = ఈ; సురగణాః = దేవగణములు; సర్వే = అన్నియు; నిరీక్షంతే = నిరీక్షించుచున్నారు; సమ ఆగతాః = కలసి వచ్చినవారు; త్వామ్ = నిన్ను; అప్రతిమ = అసమాన; కర్మాణం = కార్యములను; అప్రతి ద్వన్ద్వమ్ = ఎదిరిలేనివాడవును; ఆహవే = యుద్ధమునందు.
భావము:-
ఈ దేవగణములన్నియు వచ్చి అసమానమైన అద్భుతకర్మలు చేయునట్టి, యుద్ధములో ఎదిరిలేనియట్టి నిన్ను చూచుచున్నారు.
1.76.19.
అనుష్టుప్.
న చేయం మమ కాకుత్స్థ
వ్రీలా భవితుమర్హతి ।
త్వయా త్రైలోక్యనాథేన
యదహం విముఖీకృతః ॥
టీక:-
న చ = కాదు; ఇయం = ఇది; మమ = నా యొక్క; కాకుత్స్థ = కాకుత్స్థుడా!; వ్రీలా = అవమానము; భవితుమ్ = అగుటకు; అర్హతి = తగును; త్వయా = నీకు; త్రైలోక్యనాథేన = మూడులోకముల అధిపతిచే; యత్ = ఎందువలన; అహం = నేను; విముఖీకృతః = పరాజితునిగా చేయబడినవాడు.
భావము:-
కాకుత్స్థా! ఓ రామా! నీవు త్రిలోకాధిపతివి. నీచే పరాజితుడనగుట నాకు అవమానము కానేకాదు.
1.76.20.
అనుష్టుప్.
శరమప్రతిమం రామ
మోక్తుమర్హసి సువ్రత ।
శరమోక్షే గమిష్యామి
మహేంద్రం పర్వతోత్తమమ్” ॥
టీక:-
శరమ్ = బాణమును; అప్రతిమం = సాటి లేనిదానిని; రామ = రామా; మోక్తుమ్ = విడుచుటకు; అర్హసి = తగియున్నావు; సువ్రత = మంచివ్రతనియమము గలవాడా; శరమోక్షే = బాణము వదలుటచే; గమిష్యామి = వెళ్ళెదను; మహేంద్రం = మహేంద్రగిరి గురించి; పర్వతోత్తమమ్ = శ్రేష్ఠమైన పర్వతము గూర్చి.
భావము:-
మంచివ్రత నియమము గల ఓ రామా! సాటిలేని నీ బాణమును ప్రయోగించుము. నీ బాణ ప్రయోగము పిదప, నేను శ్రేష్ఠమైన ఆ మహేంద్రగిరికి పోయెదను.”
1.76.21.
అనుష్టుప్.
తథా బ్రువతి రామే తు
జామదగ్న్యే ప్రతాపవాన్ ।
రామో దాశరథిశ్శ్రీమాన్
చిక్షేప శరముత్తమమ్ ॥
టీక:-
తథా = అట్లు; బ్రువతి = పలుకుచుండగ; రామే తు = రాముడు; జామదగ్న్యే = జమదగ్ని కుమారుడు; ప్రతాపవాన్ = పరాక్రమవంతుడు; రామో దాశరథిః శ్రీమాన్ = శ్రీమంతుడైన దశరథరాముడు; చిక్షేప = ప్రయోగించెను; శరమ్ ఉత్తమమ్ = ఉత్తమమైన బాణమును.
భావము:-
ప్రతాపవంతుడైన పరశురాముడు అట్లు పలుకుచుండగ, శ్రీమంతుడైన దశరథరాముడు బాణమును ప్రయోగించెను.
1.76.22.
అనుష్టుప్.
స హతాన్ దృశ్య రామేణ
స్వాంల్లోకాన్ తపసాఽఽర్జితాన్ ।
జామదగ్న్యో జగామాశు
మహేంద్రం పర్వతోత్తమమ్ ॥
టీక:-
స = అతడు; హతాన్ = కొట్టబడినవాటినిగా; దృశ్య = చూచి; రామేణ = రామునిచే; స్వాన్ = తనకు సంబంధించిన; లోకాన్ = లోకములను; తపసా = తపస్సుచే; ఆర్జితాన్ = పొందబడిన; జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు; జగామ = వెళ్ళెను;ఆశు = శీఘ్రముగా; మహేంద్రం = మహేంద్రగిరి గూర్చి; పర్వతోత్తమమ్ = శ్రేష్ఠమైన పర్వతము గురించి.
భావము:-
పరశురాముడు తన తపశ్శక్తితో పొందబడిన పుణ్యలోకములన్నియు రామబాణముచే కొట్టబడుట చూచి, తక్షణమే మహేంద్రగిరికి వెళ్ళిపోయెను.
1.76.23.
అనుష్టుప్.
తతో వితిమిరాస్సర్వా
దిశశ్చోపదిశస్తథా ।
సురాస్సర్షిగణా రామమ్
ప్రశశంసురుదాయుధమ్ ॥
టీక:-
తతః = అప్పుడు; వి = లేని; తిమిరాః = చీకటి; సర్వా = అన్ని; దిశః = దిక్కులు; ఉపదిశః = మూలలు; తథా = అట్లు; సురాః = దేవతలు; స ఋషిగణాః = ఋషిగణములతో కూడ; రామమ్ = రాముని; ప్రశశంసుః = ప్రశంసించిరి; ఉత్ = ఎత్తబడిన; ఆయుధమ్ = ఆయుధము గలవానిని.
భావము:-
అప్పుడు, సకల దిక్కులలోను, మూలలందును చీకట్లు తొలగ, ఋషిగణములతో కూడిన దేవతలు, ఆయుధధారియైన రాముని హర్షధ్వానములతో ప్రశంసించిరి.
1.76.24.
అనుష్టుప్.
రామం దాశరథిం రామో
జామదగ్న్యః ప్రశస్య చ ।
తతః ప్రదక్షిణీ కృత్య
జగామాత్మగతిం ప్రభుః ॥
టీక:-
రామం దాశరథిం = దశరథరాముని; రామః జామదగ్న్యః = జమదగ్ని కుమారుడైన పరశురాముడు; ప్రశస్య చ = ప్రశంసించి; తతః = అప్పుడు; ప్రదక్షిణీ = ప్రదక్షిణము; కృత్య = చేసి; జగామ = వెడలెను; ఆత్మ గతిం = తన త్రోవను; ప్రభుః = ప్రభువు.
భావము:-
అప్పుడు, పరశురాముడు దశరథరాముని ప్రశంసించి, ఆతనికి ప్రదక్షిణము చేసి, తన త్రోవన వెళ్ళిపోయెను.
1.76.25.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
షట్సప్తతితమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్సప్తతమ [76] = డెబ్బై ఆరవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [76] డెబై ఆరవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
॥సప్తసప్తతితమః సర్గః॥
[77 -నవవధువులతో అయోధ్య చేరుట]
1.77.1.
అనుష్టుప్.
గతే రామే ప్రశాంతాత్మా
రామో దాశరథిర్ధనుః ।
వరుణాయాప్రమేయాయ
దదౌ హస్తే ససాయకమ్ ॥
టీక:-
గతే = వెళ్ళిన వాడగుచుండ; రామే = రాముడు; ప్రశాంతాత్మా = ప్రశాంతమైన చిత్తము కలవాడు; రామః = శ్రీరామచంద్రమూర్తి; దాశరథిః = దశరథ తనయుడు; ధనుః = ధనుస్సు; వరుణాయ = వరుణుని కొఱకు; అప్రమేయాయ = కొలవలేనంత ప్రతిభ కలవాడు అయిన; దదౌ = ఇచ్చెను; హస్తే = చేతియందు; స = సహితముగా; సాయకమ్ = సహితముగా.
భావము:-
పరశురాముడు వెళ్ళిన పిదప శ్రీరామచంద్రమూర్తి ఆ ధనుర్బాణములను అపరిమిత ప్రతిభావంతుడైన వరుణదేవునకు ఇచ్చెను.
1.77.2.
అనుష్టుప్.
అభివాద్య తతో రామో
వసిష్ఠప్రముఖా నృషీన్ ।
పితరం విహ్వలం దృష్ట్వా
ప్రోవాచ రఘునందనః ॥
టీక:-
అభివాద్య = నమస్కరించి; తతః = అటు పిమ్మట; రామః = శ్రీరామచంద్రమూర్తి; వసిష్ఠః = వసిష్ఠుడు; ప్రముఖాన్ = మొదలగు ప్రముఖమైన; ఋషీన్ = ఋషులను; పితరం = తండ్రిని; విహ్వలం = వ్యాకులచిత్తుడైన వానిని; దృష్ట్వా = చూచి; ప్రోవాచ = నుడివెను; రఘునందనః = రఘునందనుడు.
భావము:-
రఘునందనుడైన శ్రీరామచంద్రమూర్తి వసిష్ఠుడు మొదలగు ఋషులకు నమస్కరించి, వ్యాకులచిత్తుడైన తన తండ్రితో ఇట్లు నుడివెను.
1.77.3.
అనుష్టుప్.
“జామదగ్న్యో గతో రామః
ప్రయాతు చతురంగిణీ ।
అయోధ్యాభిముఖీ సేనా
త్వయా నాథేన పాలితా ॥
టీక:-
జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు; గతః = వెళ్ళెను; రామః = రాముడు; ప్రయాతు = వెళ్ళుగాక; చతురఙ్గిణీ = చతురంగములు కల; అయోధ్య = అయోధ్య నగరమునకు; అభిముఖీ = అభిముఖముగా; సేనా = సేన; త్వయా = నీచేత; నాథేన = నాథుడవయిన; పాలితా = పాలింపబడుచున్న.
భావము:-
“జమదగ్ని పుత్రుడైన పరశురాములవారు వెళ్ళిరి, మీ ఆధినములోనున్న ఈ చతురంగబలములు అయోధ్యానగరమువైపు పయనించవచ్చును.
1.77.4.
అనుష్టుప్.
సందిశస్వ మహారాజ!
సేనాం త్వచ్ఛాసనే స్థితామ్ ।
శాసనం కాంక్షతే సేనా
చాతకాలిర్జలం యథా" ॥
టీక:-
సమ్ = చక్కగా; దిశస్వ = ఆజ్ఞాపించుము; మహారాజ = ఓ మహారాజ!; సేనాం = సేనను; త్వత్ = నీ; శాసనే = ఆజ్ఞనందు; స్థితామ్ = ఆగి ఉన్న; శాసనం = ఆజ్ఞను; కాఙ్క్షతే = కోరుచున్నది; సేనా = సేన; చాతకాలిః = చాతక పక్షుల సమూహము; జలం = నీటిని; యథా = వలె.
భావము:-
ఓ మహారాజా! మీ ఆజ్ఞకు లోబడి సైన్యము ఆగి యున్నది. చాతక పక్షులు నీటి కొఱకు ఎదురుచూచునట్లుగా సేన నీ ఆజ్ఞ కొఱకు ఎదురు చూస్తున్నది".
1.77.5.
అనుష్టుప్.
రామస్య వచనం శ్రుత్వా
రాజా దశరథ స్సుతమ్ ।
బాహుభ్యాం సంపరిష్వజ్య
మూర్ధ్ని చాఘ్రాయ రాఘవమ్ ॥
టీక:-
రామస్య = శ్రీరామచంద్రమూర్తి యొక్క; వచనం = వాక్యమును; శ్రుత్వా = విని; రాజా = రాజు; దశరథః = దశరథుడు; సుతమ్ = పుత్రుని; బాహుభ్యాం = చేతులతో; సమ్ = గట్టిగా; పరిష్వజ్య = కౌగిలించుకొని; మూర్ధ్ని = తలపై; చ = కూడ; ఆఘ్రాయ = వాసన చూసెను; రాఘవమ్ = శ్రీరాముని.
భావము:-
దశరథమహారాజు శ్రీరామచంద్రుని మాటలు విని తన ప్రియసుతుని రెండుచేతులతో గట్టిగా కౌగిలించుకొని శిరస్సును ఆఘ్రాణించెను.
1.77.6.
అనుష్టుప్.
గతో రామ ఇతి శ్రుత్వా
హృష్టః ప్రముదితో నృపః ।
పునర్జాతం తదా మేనే
పుత్రమాత్మానమేవ చ ॥
టీక:-
గతః = వెళ్ళినవాడు; రామ = పరశురాముడు; ఇతి = అని; శ్రుత్వా = విని; హృష్టః = ఆనందించినవాడు; ప్రముదితః = పొంగిపోయినవాడు; నృపః = రాజు; పునః = మఱల; జాతం = జన్మించినవానిగ; తదా = అప్పుడు; మేనే = తలచెను; పుత్రమ్ = కుమారుని; ఆత్మానమ్ = తనను; ఏవ = మాత్రమే; చ = మఱియు.
భావము:-
పరశురాముడు వెళ్లిన విషయమును విన్న దశరథుడు పరమానందముతో పొంగిపోయెను. అంతేగాక తానును, తన పుత్రుడును మఱల జన్మించినట్లుగా భావించెను.
1.77.7.
అనుష్టుప్.
చోదయామాస తాం సేనామ్
జగామాశు తతః పురీమ్ ।
పతాకాధ్వజినీం రమ్యామ్
తూర్యోద్ఘుష్ట నినాదితామ్ ॥
టీక:-
చోదయామాస = ప్రేరేపించెను; తాం = ఆ; సేనామ్ = సేనను; జగామ = వెళ్ళెను; ఆశు = త్వరితముగా; తతః = పిమ్మట; పురీమ్ = పురమును;; పతాకాం = జండాలు కలదానిని; ధ్వజినీం = ధ్వజములు కలదానిని; రమ్యామ్ = రమ్యమైనదియు; తూర్యః = తూర్యములు మొదలగు వాద్యధ్వనులతో; ఉద్ఘుష్ట = గట్టిగా ధ్వనించు; నినాదితామ్ = తూర్యములు మొదలగు వాద్యధ్వనులతో మారుమ్రోగినది.
భావము:-
కుదుటపడిన దశరథమహారాజు సైన్యమును బయలుదేరమని ఆజ్ఞాపించెను. శీఘ్రముగా ప్రయాణము చేసి అయోధ్యనగరమునకు చేరెను. ఆ నగరము గృహములపై రెపరెపలాడు ధ్వజపతాకములతో శోభిల్లుచుండెను, తూర్యములు మొదలగు వాద్యధ్వనులతో ప్రతిధ్వనించుచుండెను.
1.77.8.
అనుష్టుప్.
సిక్తరాజ పథాం రమ్యామ్
ప్రకీర్ణ కుసుమోత్కరామ్ ।
రాజప్రవేశ సుముఖైః
పౌరైర్మంగళ వాదిభిః ॥
టీక:-
సిక్త = తడుపబడిన; రాజపథాం = రాజమార్గములు కలదియు; రమ్యామ్ = మనోహరమైనదియు; ప్రకీర్ణ = చిమ్మబడిన; కుసుమః = పూల; ఉత్కరామ్ = సమూహములు కలదియును; రాజ = రాజుగారి; ప్రవేశ = ప్రవేశముచే; సుముఖైః = సంతోషించిన; పౌరైః = పౌరులతో; మంగళవాదిభిః = మంగళకర వచనములు పలుకుచున్న.
భావము:-
నగరములో రాజవీధులు నీటితో తడుపబడి పలువన్నెల పుష్పములతో అలంకరింపబడి చూడముచ్చటగా నుండెను. నూతనవధూవరులతో వచ్చుచున్న దశరథమహారాజునకు పౌరులందఱు సంతోషముతో వికసించిన వదనములతో జయజయ నినాదములు మంగళకర వాక్యములు పలుకుచు స్వాగతములు పలికిరి.
1.77.9.
అనుష్టుప్.
సంపూర్ణాం ప్రావిశద్రాజా
జనౌఘై స్సమలంకృతామ్ ।
పౌరైః ప్రత్యుద్గతో దూరమ్
ద్విజైశ్చ పురవాసిభిః ॥
టీక:-
సంపూర్ణాం = నిండినదియను; ప్రావిశత్ = ప్రవేశించెను; రాజా = రాజు; జనః = జనుల; ఓఘైః = సముదాయములచే; సమ్ = బాగుగా; అలంకృతామ్ = బాగుగా అలంకరించబడినది; పౌరైః = పౌరులతో; ప్రత్యుద్గతః = ఎదుర్కొనబడివాడై; దూరమ్ = దూరమునుండి; ద్విజైః = బ్రాహ్మణులచే; చ = మఱియు; పురవాసిభిః = నగరవాసులచే.
భావము:-
దశరథుల వారు ఆగమన సమయానికి అయోధ్య కిక్కిరిసిన జనులతో నిండిపోయి ఉన్నది. అందంగా అలంకరింపబడి ఉన్నది. నగరములోని ప్రముఖులు, బ్రాహ్మణోత్తములు దూరమునుండి ఎదురువచ్చి రాజునకు తమ హర్షమును తెలిపిరి.
1.77.10.
అనుష్టుప్.
పుత్రై రనుగత శ్శ్రీమాన్
శ్రీమద్భిశ్చ మహాయశాః ।
ప్రవివేశ గృహం రాజా
హిమవత్సదృశం పునః ॥
టీక:-
పుత్రైః = పుత్రులతో; అనుగతః = అనుసరింపబడినవాడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; శ్రీమద్భిః = శ్రీమంతులైన; చ = మఱియు; మహాయశాః = గొప్ప యశస్సు కలిగినవాడు; ప్రవివేశ = ప్రవేశించెను; గృహం = ఇంటిని; రాజా = రాజు; హిమవత్ = హిమవత్ పర్వతము; సదృశం = సమానమైన; పునః = మఱల.
భావము:-
శ్రీమంతుడు, మహాయశశ్శాలి అయిన దశరథమహారాజు, శోభాయమానముగా ప్రకాశించుచున్న తన పుత్రులు వెంటవచ్చుచుండ హిమవత్పర్వతము వలె ఉన్నతమైన తన ప్రాసాదములోనికి ప్రవేశించెను.
1.77.11.
అనుష్టుప్.
ననంద సజనో రాజా
గృహే కామై స్సుపూజితః ।
కౌసల్యా చ సుమిత్రా చ
కైకేయీ చ సుమధ్యమా ॥
టీక:-
ననంద = ఆనందించెను; సజనః = ఆత్మీయులతో గలవాడు; రాజా = రాజు; గృహే = ఇంటియందు; కామైః = భోగ్యవస్తువులతో; సుపూజితః = బాగుగా పూజింపబడినవాడు । కౌసల్యా = కౌసల్యా మాత; చ = మఱియు; సుమిత్రా = సుమిత్రా మాత; చ = మఱియు; కైకేయీ = కైకేయి మాత; చ = మఱియు; సుమధ్యమా = చక్కని నడుము కలిగినవారు, సుందరీమణులు.
భావము:-
ఆత్మీయులు ఆనందముతో వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. కౌసల్యా, సుమిత్రా, కైకైయిలు ఇతర రాజస్త్రీలు అందరూ.
1.77.12.
అనుష్టుప్.
వధూప్రతిగ్రహే యుక్తా
యాశ్చాన్యా రాజయోషితః ।
తతస్సీతాం మహాభాగామ్
ఊర్మిలాం చ యశస్వినీమ్ ॥
టీక:-
వధూ = నవవధువులను; ప్రతిగ్రహే = స్నేహముగా ఆహ్వానించుట; యుక్తాః = యుక్తులై; యాః = ఏ; చ = మఱియు; అన్యాః = ఇతరులైన; రాజయోషితః = రాజస్త్రీలు, రాణీవాస స్త్రీలు । తతః = పిమ్మట; సీతాం = సీతను; మహాభాగామ్ = గొప్పభాగ్యము గల; ఊర్మిలాం = ఊర్మిళను; చ = మఱియు; యశస్వినీమ్ = యశస్సుగల.
భావము:-
నవవధువులను సంతోషముగా ఆహ్వానించుటలో దశరథుని అంతఃపుర స్త్రీలు అందరు నిమగ్నులైరి. అంతట, దశరథమహారాజు భార్యలు భాగ్యలక్ష్మి అయిన సీతాదేవిని, యశస్సుగల ఊర్మిళను,
1.77.13.
అనుష్టుప్.
కుశధ్వజసుతే చోభే
జగృహుర్నృపపత్నయః ।
మంగళాలంభనైశ్చాపి
శోభితాః క్షౌమవాససః ॥
టీక:-
కుశధ్వజ = కుశధ్వజుని; సుతే = పుత్రికలను; చ = మఱియు; ఉభే = ఇఱువురిని; జగృహుః = గ్రహించిరి; నృపపత్నయః = మహారాజు భార్యలు;; మంగళ = మంగళకరములైన; ఆలంభనైః = సుగంధద్రవ్యములచే; చ = మఱియు; అపి = కూడా; శోభితాః = శోభిల్లబడినవారై; క్షౌమ = పట్టువస్త్రములు; వాససః = ధరించినవారై;.
భావము:-
మఱియు కుశధ్వజ పుత్రికలైన మాండవి, శ్రుతకీర్తులను నలుగురను దశరథ మహారాజు రాణులు అంతఃపురములోనికి స్వీకరించిరి. ఆ నవవధువులు మంగళకరమైన సుగంధద్రవ్యములను అలదుకొని, పట్టువస్త్రములను ధరించిరి.
1.77.14.
అనుష్టుప్.
దేవతాయతనాన్యాశు
సర్వాస్తాః ప్రత్యపూజయన్ ।
అభివాద్యాభివాద్యాంశ్చ
సర్వా రాజసుతాస్తదా ॥
టీక:-
దేవతాయతనాని = దేవాలయములను; ఆశు = వేగముగా; సర్వాః = అందఱు; తాః = ఆ; ప్రత్యపూజయన్ = ఆరాధించిరి; అభివాద్య = నమస్కరించిరి. అభివాద్యాన్ = నమస్కరింపదగువారిని; చ = మఱియు; సర్వాః = అందఱు; రాజసుతాః = రాకుమార్తెలు; తదా = అప్పుడు.
భావము:-
శీఘ్రమే అంతఃపురమందలి దేవాలయములలో ఇలవేల్పులను ఆరాధించిరి. పిమ్మట,ఆ రాకుమార్తెలు అందఱు పెద్దలకు, పూజ్యులకు అందరికి నమస్కరించిరి.
1.77.15.
అనుష్టుప్.
స్వం స్వం గృహమథాసాద్య
కుబేరభవనోపమమ్ ।
గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ
తర్పయిత్వా ద్విజోత్తమాన్ ॥
టీక:-
స్వం స్వం = తమతమ; గృహమ్ = గృహములను; అథ = అప్పుడు; ఆసాద్య = పొంది; కుబేర = కుబేరుని; భవనః = భవనములతో; ఉపమమ్ = పోల్చతగిన । గోభిః = గోవులచేతను; ధనైః = ధనములచేతను; చ = మఱియు; ధాన్యైః = ధాన్యములచేతను; చ = మఱియు; తర్పయిత్వా = తృప్తిపఱచిర; ద్విజోత్తమాన్ = ఉత్తమమైన బ్రాహ్మణులను.
భావము:-
అనంతరము కుబేరభవనములతో సాటివచ్చే తమ తమ గృహములకు వెళ్ళిరి. పిదప గోవులను, ధనధాన్యములను ఉత్తములైన బ్రాహ్మణులకు దానమొనర్చి వారిని ఆనందింపజేసిరి.
1.77.16.
అనుష్టుప్.
రేమిరే ముదితాః సర్వా
భర్తృభిః సహితా రహః ।
కుమారాశ్చ మహాత్మానో
వీర్యేణాప్రతిమా భువి ॥
టీక:-
రేమిరే = క్రీడించిరి; ముదితాః = ఆనందించినవారై; సర్వా = అందఱు; భర్తృభిః = భర్తలతో; సహితా = కూడినవారై; రహః = ఏకాంతముగా । కుమారాః = రాకుమారులు; చ = మఱియు; మహాత్మానః = మహాత్ములు; వీర్యేణ = వీరత్వముచేత; అప్రతిమా = సాటిలేనివారు; భువి = భూమియందు.
భావము:-
అనంతరము ఆ నవవధువులు ఏకాంతముగా తమ భర్తలతో కలిసి క్రీడించిరి. శ్రీరామ,భరత,లక్ష్మణ,శత్రుఘ్న రాకుమారులు మహానుభావులు, భువిపై సాటిలేని పరాక్రమవంతులు.
1.77.17.
అనుష్టుప్.
కృతదారాః కృతాస్త్రాశ్చ
సధనాః ససుహృజ్జనాః ।
శుశ్రూషమాణాః పితరమ్
వర్తయంతి నరర్షభాః ॥
టీక:-
కృతః = చేపట్టిన; దారాః = భార్యలు కలవారు; కృతాః = పూర్తిగా నేర్చిన; అస్త్రాః = అస్త్రవిద్యలు కలవారు; చ = మఱియు; స = సమృద్ధిగా; ధనాః = సంపదలు కలవారు; స = కలిసి ఉన్న; సుహృజ్జనాః = బంధుమిత్రులు కలవారు; శుశ్రూషమాణాః = సేవించుచు; పితరమ్ = తండ్రిని; వర్తయంతి = ప్రవర్తించుచుండిరి; నరర్షభాః = మనుజులలో శ్రేష్ఠులు.
భావము:-
వివాహితులైఅస్త్రవిద్యాపారంగతులై, అష్టైశ్వర్యములతో తులతూగుచు ఆ ఉత్తములు నలుగురు బంధుమిత్రులతో కలిసి నివసించుచు, తండ్రిని సేవించుచు వారి ఆజ్ఞలను పాటించుచుండిరి.
1.77.18.
అనుష్టుప్.
కస్యచిత్త్వథ కాలస్య
రాజా దశరథః సుతమ్ ।
భరతం కైకయీపుత్రం
అబ్రవీ ద్రఘునందనః ॥
టీక:-
కస్యచిత్ = కొంత; తు; అథ = అనంతరము; కాలస్య = కాలమునకు; రాజా = రాజు అయిన; దశరథః = దశరథుడు; సుతమ్ = పుత్రుని; భరతం = భరతుని గూర్చి; కైకయీపుత్రమ్ = కైకయీ కుమారునిగూర్చి; అబ్రవీత్ = నుడివెను; రఘునందనః = రఘునందనుడు.
భావము:-
కొంతకాలము గడిచిన పిదప, రఘునందనుడైన దశరథమహారాజు తన సుతుడు, కైకెయి కుమారుడైన భరతుని పిలిచి ఇట్లు పలికెను.
గమనిక:-
కస్యచిత్త్వథ-కస్యచిత్ +తు- కస్యచిత్తు, కస్యచిత్తు+అథ = కస్యచిత్త్వథ , యణాదేశసంధి.
1.77.19.
అనుష్టుప్.
“అయం కేకయరాజస్య
పుత్రో వసతి పుత్రక ।
త్వాం నేతుమాగతో వీర
యుధాజి న్మాతులస్తవ ॥
టీక:-
అయం = ఈ; కేకయరాజస్య = కేకయ రాజుయొక్క; పుత్రః = కుమారుడు; వసతి = ఉన్నాడు; పుత్రక = కుమారా!; త్వాం = నిన్ను; నేతుమ్ = తోడ్కొనిపోవుటకు; ఆగతః = వచ్చియున్నవాడు; వీరః = వీరుడు; యుధాజిత్ = యుధాజిత్తు; మాతులః = మేనమామ; తవ = నీయొక్క.
భావము:-
“ఓ కుమారా భరతా! కేకయరాకుమారుడు మన వద్దనే ఉన్నాడు కదా. ఆయన వీర యుధాజిత్తు, నీ మేనమామ నిన్ను తోడ్కొనిపోవుటకు వచ్చియున్నాడు.
1.77.20.
అనుష్టుప్.
ప్రార్థితస్తేన ధర్మజ్ఞ
మిధిలాయామహం తథా ।
ఋషిమధ్యే తు తస్య త్వం
ప్రీతిం కర్తుమిహార్హసి" ॥
టీక:-
ప్రార్థితః = ప్రార్థింపబడితిని; తేన = వానిచే; ధర్మజ్ఞ = ధర్మములెఱిగినవాడా!; మిథిలాయామ్ = మిథిలయందు; అహం = నేను; తథా = ఆ విధముగా; ఋషిమధ్యే = ఋషుల మధ్యలో; తు; తస్య = అతనికి; త్వమ్ = నీవు; ప్రీతిం = సంతోషమును; కర్తుమ్ = చేయుటకు; ఇహ = ఇక్కడ, ఇప్పుడు; అర్హసి = తగియున్నవాడవు.
భావము:-
ధర్మమెఱిగిన ఓ భరతకుమారా! మిథిలానగరమునందు ఋషుల సమక్షములో అతడు నన్ను వేడుకొనెను. వారికి ప్రీతి గూర్చుట నీ కర్తవ్యము.
1.77.21.
అనుష్టుప్.
శ్రుత్వా దశరథస్యైతత్
భరతః కైకయీసుతః ।
అభివాద్య గురుం రామం
పరిష్వజ్య చ లక్ష్మణమ్ ।
టీక:-
శ్రుత్వా = విని; దశరథస్య = దశరథునియొక్క; ఏతత్ = దీనిని।; భరతః = భరతుడు; కైకయీసుతః = కైకయి కుమారుడు; అభివాద్య = నమస్కరించి; గురుం = తండ్రిని; రామమ్ = శ్రీరామచంద్రమూర్తిని।; పరిష్వజ్య = ఆలింగనమొనర్చి; చ = మఱియు; లక్ష్మణమ్ = లక్ష్మణుని; గమనాయ = ప్రయాణమునకు; అభిచక్రామ = సన్నద్ధుడాయెను।; శత్రుఘ్నః = శత్రుఘ్నునితో; సహితః = కలిసి; తదా = అప్పుడు.
భావము:-
పితృవచనములను విన్న భరతుడు తండ్రికి, శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి, లక్ష్మణుని ఆలింగనము చేసుకునెను. పిమ్మట, శత్రుఘ్నసమేతముగా ప్రయాణమునకు సన్నద్ధుడాయెను.
1.77.22.
అనుష్టుప్.
ఆపృచ్ఛ్య పితరం శూరో
రామం చాక్లిష్టకారిణమ్ ।
మాతృశ్చాపి నరశ్రేష్ఠః
శత్రుఘ్నసహితో యయౌ ॥
టీక:-
ఆపృచ్ఛ్య = అడిగి; పితరం = తండ్రిని; శూరః = శూరుడు; రామం = శ్రీరామచంద్రమూర్తిని; చ = మఱియు; అక్లిష్టకారిణమ్ = అనాయాసముగా కార్యములొనరించు; మాతౄః = తల్లులు; చ = మఱియు; అపి = కూడా; నరశ్రేష్ఠః = నరులలో శ్రేష్ఠుడు; శత్రుఘ్నసహితః = శత్రుఘ్నసహితుడై; యయౌ = వెళ్లెను.
భావము:-
శూరుడు, నరులలో శ్రేష్ఠుడు అయిన భరతుడు తండ్రి ఆజ్ఞను గైకొని, పనులు సుళువుగా చేయు శ్రీరాముని వద్దను మఱియు తల్లులవద్దను సెలవు గైకొని శత్రుఘ్నసహితుడై బయలుదేరెను.
1.77.23.
అనుష్టుప్.
గతే తు భరతే రామో!
లక్ష్మణశ్చ మహాబలః ।
పితరం దేవసంంకాశం
పూజయామాస తు స్తదా"॥
టీక:-
గతే = వెళ్లినవాడు; తు; భరతే = భరతుడు; రామః = శ్రీరామచంద్రమూర్తి; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; మహాబలః = మహాబలశాలి; పితరం = తండ్రిని; దేవసంకాశమ్ = దేవతలతో సమానుడైన; పూజయామాసతుః = సేవించిరి; తదా = అప్పుడు.
భావము:-
భరత, శత్రుఘ్నులు వెళ్లిన పిదప శ్రీరామచంద్రమూర్తి మహాబలశాలియగు లక్ష్మణుడితో కలిసి దైవసమానుడు అయిన తండ్రిని సేవించుచుండిరి.
1.77.24.
అనుష్టుప్.
పితురాజ్ఞాం పురస్కృత్య
పౌరకార్యాణి సర్వశః ।
చకార రామో ధర్మాత్మా
ప్రియాణి చ హితాని చ ॥
టీక:-
పితుః = తండ్రి యొక్క; ఆజ్ఞాం = ఆజ్ఞను; పురస్కృత్య = పరిగ్రహించి; పౌర = పౌరుల; కార్యాణి = కార్యకలాపములు; సర్వశః = అన్నియును; చకార = చేసెను; రామః = శ్రీరామచంద్రమూర్తి; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ప్రియాణి = ప్రీతికరమైనవి; చ = మఱియు; హితాని = హితకరమైనవి; చ = మఱియు.
భావము:-
ధర్మాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి తండ్రియొక్క ఆజ్ఞానువర్తియై తన పౌరులకు ప్రియమైనవి హితమైనవి యగు కార్యకలాపములన్నిటిని చేసెను.
1.77.25.
అనుష్టుప్.
మాతృభ్యో మాతృకార్యాణి
కృత్వా పరమయంత్రితః ।
గురూణాం గురుకార్యాణి
కాలే కాలేఽ న్వవైక్షత ॥
టీక:-
మాతృభ్యః = మాతృమూర్తులకు; మాతృః = తల్లులకు చేయవలసిన; కార్యాణి = సపర్యలు; కృత్వా = చేసి; పరమయంత్రితః = మిక్కిలి నియమబద్ధుడై; గురూణాం = గురువులకు; గురు = గురువులకు చేయవలసిన; కార్యాణి = సేవలు; కాలే కాలే = ఆయా సమయములందు; అన్వవైక్షత = పరిశీలించుచుండెను.
భావము:-
శ్రీరామచంద్రమూర్తి నియమబద్ధముగా తల్లులకు చేయవలసిన సపర్యలు చేయుచు, ఆయా సమయములయందు పూజ్యులైన గురువులకు చేయవలసిన శుశ్రూషాదికార్యములను పర్యవేక్షించుచుండెను.
1.77.26.
అనుష్టుప్.
ఏవం దశరథః ప్రీతో
బ్రాహ్మణా నైగమాస్తథా ।
రామస్య శీలవృత్తేన
సర్వే విషయవాసినః ॥
టీక:-
ఏవం = ఈ విధముగ; దశరథః = దశరథుడు; ప్రీతః = ప్రీతినొందెను; బ్రాహ్మణాః = బ్రాహ్మణులును; నైగమాః = నగరవాసులు; తథా = ఆవిధముగా; రామస్య = శ్రీరామచంద్రునియొక్క; శీలవృత్తేన = శీలప్రవృత్తిచేత; సర్వే = అందఱు; విషయః = దేశమున; వాసినః = ప్రజలు.
భావము:-
రాముని కార్యదక్షత, పెద్దల ఎడ గౌరవము చూసి దశరథుడు బ్రాహ్మణులు, నగరపౌరులు చాలా సంతోషించిరి. అదేవిధముగా రామచంద్రుని సౌశీల్యమునకు, సద్గుణ సంపన్న ప్రవర్తనకు దేశ ప్రజలు అందఱునూ సంతసించిరి.
1.77.27.
అనుష్టుప్.
తేషామతియశా లోకే
రామ స్సత్యపరాక్రమః ।
స్వయమ్భూరివ భూతానామ్
బభూవ గుణవత్తరః ॥
టీక:-
తేషామ్ = వారికి; అతి = అత్యధికమైన; యశాః = యశస్సుకలవాడు; లోకే = లోకమునందు; రామః = శ్రీరామచంద్రమూర్తి; సత్యపరాక్రమః = సత్య పరాక్రమవంతుడు; స్వయమ్భూః = బ్రహ్మదేవుడు; ఇవ = వలె; భూతానామ్ = సమస్త ప్రాణికోటికి; బభూవ = అయ్యెను; గుణవత్తరః = అధిక గుణవంతుడు.
భావము:-
బహుమిక్కిలి యశశ్శాలి, సత్యపరాక్రముడు, గొప్ప గుణవంతుడు అయిన శ్రీరామచంద్రమూర్తి తన సద్గుణసంపదతో సమస్త ప్రాణికోటికి బ్రహ్మదేవునితో సమానుడాయెను.
గమనిక:-
గుణవాన్- గుణత్తర- గుణవత్తమ,
1.77.28.
అనుష్టుప్.
* రామస్తు సీతయా సార్ధమ్
విజహార బహూనృతూన్ ।
మనస్స్వీ తద్గతస్తస్యాః
నిత్యం హృది సమర్పితః ॥
టీక:-
రామః = శ్రీరామచంద్రుడు; తు; సీతయా = సీతాదేవియును; సార్ధమ్ = కలిసియుండి, ఆంధ్రశబ్దరత్నాకరము; విజహార = విహరించెను; బహూన్ = అనేక; ఋతూన్ = ఋతువులు, కాలం; మనస్వీ = మంచిమనస్సు కలిగిన వారు; తద్గతః = ఆమెను పొందినవాడై; తస్యాః = ఆమెయొక్క; నిత్యం = ఎల్లప్పుడు; హృది = అంతఃకరణమందు; సమర్పితః = సమర్పించబడినవాడై.
భావము:-
చాలాకాలం శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి పరస్పర కలిసిమెలసి విహరించిరి. నిర్మలమైన మనస్సు కలిగిన వారివురు సతతము ఒకరినౌకరు మనసున నిలుపుకుని అన్యోన్యాసక్తులై ఉండిరి.
1.77.29.
అనుష్టుప్.
* ప్రియా తు సీతా రామస్య
దారాః పితృకృతా ఇతి ।
గుణాద్రూపగుణాచ్చాపి
ప్రీతిర్భూయోఽ భ్యవర్ధత ॥
టీక:-
ప్రియా = ప్రియమైనది; తు; సీతా = సీతాదేవి; రామస్య = శ్రీరామునియొక్క; దారాః = భార్యగా; పితృ = తండ్రిచే; కృతా = కూర్చబడినది; ఇతి = అందుకు; గుణాత్ = గుణములచే; రూపగుణాత్ = రూపముగుణముచే; చ = మఱియు; అపి = కూడ; ప్రీతిః = ప్రీతినొందెను; భూయః = మరల; అభ్యవర్ధత = వృద్ధినొందెను.
భావము:-
తన తండ్రి దశరథమహారాజు సీతాదేవిని తనకు భార్యగా కూర్చినందులకు ఆమెపై శ్రీరామచంద్రమూర్తి ప్రీతుడయ్యెను. సద్గుణములచేతను, రూపసౌందర్యముచేతను ప్రీతిగొల్పెడి సీతాదేవియెడల శ్రీరామచంద్రమూర్తికి ప్రేమ దినదినమూ ప్రవర్ధిల్లెను.
1.77.30.
అనుష్టుప్.
* తస్యాశ్చ భర్తా ద్విగుణమ్
హృదయే పరివర్తతే ।
అంతర్జాతమపి వ్యక్తమ్
ఆఖ్యాతి హృదయం హృదా ॥
టీక:-
తస్యాః = ఆమెయొక్క; చ = మఱియు; భర్తా = పతి; ద్విగుణమ్ = రెండింతలు; హృదయే = హృదయమునందు; పరివర్తతే = తిరుగాడును; అంత = లోపల; జాతమ్ = జనించినది; అపి = కూడ; వ్యక్తమ్ = స్పష్టముగా; ఆఖ్యాతి = చెప్పును; హృదయం = హృదయము; హృదా = హృదయముతో.
భావము:-
అదేవిధముగా శ్రీరామచంద్రుడు తన సద్గుణసంపదతో, రూపసౌందర్య సౌశీల్యముతో సీతాదేవి హృదయములో రెట్టింపై తిరుగాడుచుండెను. సీతారాములవారి హృదయములు హృదయములతో సంభాషించుకొనుచుండెను.
1.77.31.
అనుష్టుప్.
* తస్య భూయో విశేషేణ
మైథిలీ జనకాత్మజా ।
దేవతాభిస్సమా రూపే
సీతా శ్రీరివ రూపిణీ ॥
టీక:-
తస్య = వానియొక్క; భూయః = మఱల; విశేషేణ = పేర్మిచేత; మైథిలీ = మైథిలీ; జనకాత్మజా = జనకుని కుమర్తె; దేవతాభిః = దేవతలతో; సమా = సమానమైన; రూపే = రూపముతో; సీతా = సీతాదేవి; శ్రీః = లక్ష్మీమాత; ఇవ = వలె; రూపిణీ = రూపముగలది.
భావము:-
దేవతలతో సమాన సౌందర్యవంతురాలైన జానకి రూపములో లక్ష్మీదేవివలె ఒప్పుచు తన గుణముల పేర్మిచే శోభిల్లుచు శ్రీరాముని హృదయమును రంజింపసాగెను.
1.77.32.
త్రిష్టుప్.
తయా స రాజర్షిసుతోఽ భిరామయా
సమేయివా నుత్తమరాజకన్యయా ।
అతీవ రామశ్శుశుభేఽ భిరామయా
విభుశ్శ్రియా విష్ణురివామరేశ్వరః ॥
టీక:-
తయా = ఆమెతో; సః = అతడు; రాజర్షిసుతః = రాజర్షి పుత్రుడు; అభిరామయా = మనోజ్ఞమైన; సమేయివాన్ = కలసి; ఉత్తమరాజకన్యయా = శ్రేష్ఠమైన రాకుమారితో; అతీవ = చాలా; రామః = శ్రీరామచంద్రుడు; శుశుభే = శోభిల్లెను; అభిరామయా = మనోహరమైన; విభుః = విభుడు; శ్రియా = మహాలక్ష్మితో; విష్ణుః = విష్ణువు; ఇవ = వలె; అమరేశ్వరః = దేవతలకు ప్రభువు.
భావము:-
రాజర్షి యైన దశరథుని మనోజ్ఞమైన పుత్రుడు శ్రీరామచంద్రుడు శ్రేష్ఠమైన రాకుమారి యగు సీతాదేవితోకలిసి, దేవాధిదేవుడైన శ్రీమహావిష్ణువు లక్మీదేవితో వలె, ఎంతో శోభిల్లుచుండెను.
1.77.33.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
చతుర్వింశత్సహస్రికాయాం
సంహితయాం బాలకాండే
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; చతుర్వింశత్సహస్రికాయాం = ఇరవై నాలుగు వేల సంఖ్యతో; సంహితయాం = కూడి ఉన్నట్టి; బాలకాండే = బాలకాండ లోని; సప్తసప్తతితమః [77] = డెబ్బైఏడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత ఇరవైనాలుగువేల శ్లోకములలో చెప్పబడిన తెలుగు వారి రామాయణ మహా గ్రంథములోని డెబ్బైఏడవ [77] సర్గ సంపూర్ణము.