2.73.1.
అనుష్టుప్.
శ్రుత్వా తు పితరం వృత్తమ్
భ్రాతరౌ చ వివాసితౌ।
భరతో దుఃఖసంతప్త
ఇదం వచనమబ్రవీత్॥
టీక:;
శ్రుత్వా = వినిన; తు = వెంటనే; పితరం = తండ్రియొక్క; వృత్తమ్ = మరణమునుగుఱించి; భ్రాతరౌ = సోదరులిద్దరిని గురించి; చ = మఱియు; వివాసితౌ = దేశము నుండి వెడలగొట్టినట్లును; భరతః = భరతుడు; దుఃఖ = దుఃఖముచే; సంతప్త = పీడితుడై; ఇదం = ఈ విధముగా; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను
భావం:-
భరతుడు తండ్రి మరణించినట్లును, సోదరులిద్దరిని దేశము నుండి వెడలగొట్టినట్లును విని, దుఃఖపీడితుడై ఇట్లు పలికెను.
2.73.2.
అనుష్టుప్.
“కిం ను కార్యం హతస్యేహ
మమ రాజ్యేన శోచతః।
విహీనస్యాథ పిత్రా చ
భ్రాత్రా పితృసమేన చ॥
టీక:;
కిం ను = ఎందుకు; కార్యం = పని; హతస్య = కొట్టబడి; ఇహ = ఇక్కడ; మమ = నాకు; రాజ్యేన = రాజ్యముతో; శోచతః = కష్టములపాలై; విహీనస్య = పోగొట్టుకొని; అథ = ఈ విధముగా; పిత్రా = తండ్రిని; చ = మఱియు; భ్రాత్రా = సోదరుడిని; పితృసమేన = తండ్రితో సమానుడైన; చ = మఱియు.
భావం:-
“తండ్రి మరణించి, తండ్రితో సమానుడైన సోదరుడు ప్రవాసమునకు పోయి దుఃఖించుచు కష్టములపాలై ఉన్న నాకు ఇప్పుడు ఈ రాజ్యము ఎందులకు?
2.73.3.
అనుష్టుప్.
దుఃఖే మే దుఃఖమకరోః
వ్రణేక్షారమివాదధాః।
రాజానం ప్రేతభావస్థమ్
కృత్వా రామం చ తాపసమ్॥
టీక:;
దుఃఖే = దుఃఖములో; మే = నాకు; దుఃఖమ్ = దుఃఖమును; అకరోః = చేసి; వ్రణేక్షారమివ = వ్రణే క్షారమ్ + ఇవ, పుండు మీద కారము చల్లినట్లు; ఆదధాః = చేసి; రాజానం = రాజును; ప్రేతభావస్థమ్ = మరణించినవానిగను; కృత్వా = చేసి; రామం = రాముడు; చ = ఇంకను; తాపసమ్ = తాపసుడగునట్లు
భావం:-
ఒకటికి రెండు దుఃఖములు కలిగించితివి. రాజు మరణించునట్లు, రాముడు తాపసుడగునట్లును చేసి, నీవు పుండుపై కారము చల్లినట్లు చేసితివి,
2.73.4.
అనుష్టుప్.
కులస్య త్వమభావాయ
కాలరాత్రిరివాఽగతా।
అంగారముపగూహ్య స్మ
పితా మే నావబుద్ధవాన్॥
టీక:;
కులస్య = ఈ వంశమును; త్వమ్ = నీవు; అభావాయ = నశింపచేయుటకు; కాలరాత్రిః = కాళరాత్రి; ఇవ = వలె; ఆగతా = దాపురించినావు; అంగారమ్ = కొరివిని; ఉపగూహ్య = కౌగిలించుకొంటిని; స్మ = అని; పితా = తండ్రి; మే = నా యొక్క; న = లేదు; అవబుద్ధవాన్ = తెలుసుకొననివాడినగుట.
భావం:-
నీవు మా వంశమును నశింపచేయుటకు కాళరాత్రి వలె దాపురించితివి. నా తండ్రి తాను కొరివిని కౌగిలించుకొంటినని తెలుసుకొనలేకపోయెను.
2.73.5.
అనుష్టుప్.
మృత్యుమాపాదితో రాజా
త్వయా మే పాపదర్శిని!।
సుఖం పరిహృతం మోహాత్
కులేఽస్మిన్కులపాంసని॥
టీక:;
మృత్యుమ్ = మరణమును; ఆపాదితః = కలిగించినదానివు; రాజా = మహారాజు; త్వయా = నీ చేత; మే = నా యొక్క; పాపదర్శిని = పాపపు ఆలోచనలు కలదాన; సుఖం = సుఖమును; పరిహృతం = లేకుండా; మోహాత్ = మోహము వలన; కులః = కులము; అస్మిన్ = మా యొక్క; కులపాంసని = కులదూషకురాలా..
భావం:-
నీవు పాపిష్టి దృష్టిదానవు. నీవే మా తండ్రికి చావు కలించితివి. కులమును అపవిత్రము చేసితివి. మోహముతో నీవు ఈ వంశములో సుఖము లేకుండా చేసితివి.
2.73.6.
అనుష్టుప్.
త్వాం ప్రాప్య హి పితా మేఽద్య
సత్యసంధో మహాయశాః।
తీవ్రదుఃఖాభిసంతప్తో
వృత్తో దశరథో నృపః॥
టీక:;
త్వాం = నిన్ను; ప్రాప్య = పొంది; హి = నిశ్చయముగా; పితా = తండ్రి; మే = నా; అద్య = ఇప్పుడు; సత్యసంధః = సత్యసంధుడు; మహాయశాః = మహాకీర్తిశాలి; తీవ్రదుఃఖ = తీవ్రమైన దుఃఖముచే; అభిసంతప్తః = మిక్కిలి పీడితుడై; వృత్తః = మరణించెను; దశరథఃనృపః = దశరథమహారాజు
భావం:-
సత్యసంధుడు, మహాకీర్తిశాలియును అయిన నా తండ్రి దశరథమహారాజు, ఇప్పుడు నీ మూలమున తీవ్రమైన దుఃఖముచే పీడితుడై మరణించెను.
2.73.7.
అనుష్టుప్.
వినాశితో? మహారాజః
పితా మే ధర్మవత్సలః।
కస్మాత్ప్రవ్రాజితో? రామః
కస్మాదేవ? వనం గతః॥
టీక:;
వినాశితః = చంపబడెను; మహారాజః = మహారాజు; పితా = తండ్రి; మే = నా యొక్క; ధర్మవత్సలః = ధర్మమునందు ప్రీతి గలవాడు; కస్మాత్ = ఎందుకు; ప్రవ్రాజితః = వెడలగొట్టబడెను; రామః = రాముడు; కస్మాదేవ = కస్మాత్ + ఏవ, ఏ కారణము వలన; వనం = అరణ్యమునకు; గతః = వెళ్లెను
భావం:-
ధర్మముపై ప్రీతి గల నా తండ్రి దశరథ మహారాజును ఎందుకు చంపితివి? రాముని దేశము నుండి వెడలగొట్టి అరణ్యమునకు ఎందుకు పంపితివి?
2.73.8.
అనుష్టుప్.
కౌసల్యా చ సుమిత్రా చ
పుత్రశోకాభిపీడితే।
దుష్కరం యది జీవేతామ్
ప్రాప్య త్వాం జననీం మమ॥
టీక:;
కౌసల్యా = కౌసల్య; చ = ఇంకను; సుమిత్రా = సుమిత్ర; చ = ఇంకను; పుత్రశోక = పుత్రశోకముతో; అభిపీడితే = మిక్కిలి బాధపడుచున్న; దుష్కరం = కష్ట సాధ్యము; యది = అనునది; జీవేతామ్ = జీవింపగలరు; ప్రాప్య = పొంది; త్వాం = నీ కారణంగా; జననీం = తల్లివైన; మమ = నాకు
భావం:-
పుత్ర శోకముతో బాధపడుచున్న కౌసల్యాసుమిత్రలు, నా తల్లివైన నీ సహవాసముతో జీవింపగలరు అనునది కల్ల.
2.73.9.
అనుష్టుప్.
నను త్వార్యోఽపి? ధర్మాత్మా
త్వయి వృతిమనుత్తమామ్।
వర్తతే గురువృత్తిజ్ఞో
యథా మాతరి వర్తతే॥
టీక:;
నను = అవునా; త్వ = కాదా; ఆర్యః = నా పెద్ద సోదరుడు; అపి = కూడా; ధర్మాత్మా = ధర్మాత్ముడు; త్వయి = నీ పట్ల; వృతిమ్ = ప్రవర్తన; అనుత్తమామ్ = ఉత్తమముగా; వర్తతే = ప్రవర్తించెను; గురువృత్తిజ్ఞః = పెద్దల పట్ల ఎట్లు ప్రవర్తించవలెనో తెలిసినవాడు; యథా = ఆ విధముగానే; మాతరి = తల్లి వలె; వర్తతే = ప్రవర్తించెడివాడు
భావం:-
ధర్మాత్ముడు మా అన్న నీ పట్ల చక్కగానే ప్రవర్తించెను కదా? పెద్దల విషయమున ఎట్లు ప్రవర్తించవలెనో తెలిసినవాడు అయిన, మా అన్నగారైన రాముడు, నీ విషయమునందు కూడా, తన తల్లి విషయమున ఎట్లు ప్రవర్తించునో అట్లే నీయందు ప్రవర్తించెడివాడు కదా?
2.73.10.
అనుష్టుప్.
తథా జ్యేష్ఠా హి మే మాతా
కౌసల్యా దీర్ఘదర్శినీ।
త్వయి ధర్మం సమాస్థాయ
భగిన్యామివ వర్తతే॥
టీక:;
తథా = అట్లే; జ్యేష్ఠా హి మే మాతా = మా పెదతల్లి కూడా; కౌసల్యా = కౌసల్య; దీర్ఘదర్శినీ = దూరదృష్టి గల; త్వయి = నిన్ను; ధర్మం = ధర్మమును; సమాస్థాయ = అనుసరించుచు; భగిన్యామ్ ఇవ = సోదరి విషయమున ప్రవర్తించు; ఇవ = విధముగనే; వర్తతే = ప్రవర్తించుచున్నది.
భావం:-
దూరదృష్టి గల మా పెద్దతల్లి కౌసల్య కూడ, ధర్మమును అనుసరించుచు, నీ విషయములో సోదరి విషయమున ప్రవర్తించుచున్నట్లు ప్రవర్తించుచున్నది.
2.73.11.
అనుష్టుప్.
తస్యాః పుత్రం కృతాఽత్మానమ్
చీరవల్కలవాససమ్।
ప్రస్థాప్య వనవాసాయ
కథం పాపే న శోచసి॥
టీక:;
తస్యాః = అటువంటి; పుత్రం = కుమారుని; కృత ఆత్మానమ్ = ఆత్మనిగ్రహముకలవాడు, సంయమి; చీరవల్కల = నారచీరలు; వాససమ్ = కట్టినవానిని; ప్రస్థాప్య =పంపిన; వనవాసాయ = వనవాసమునకు; కథం = ఏ విధముగా; పాపే = పాపాత్మురాలా; న = లేదా; శోచసి = విచారము కలుగుట.
భావం:-
పాపాత్మురాలా! అట్టి కౌసల్యయొక్క సంయమనశీలుడైన కుమారుని నారచీరలు కట్టింపచేసి, వనవాసమునకు పంపిన తరువాత కూడా నీకు విచారము కలుగుట లేదా!
2.73.12.
అనుష్టుప్.
అపాపదర్శనం శూరమ్
కృతాత్మనం యశస్వినమ్।
ప్రవ్రాజ్య చీరవసనమ్
కిన్ను పశ్యసి కారణమ్॥
టీక:;
అపాప = పుణ్యప్రదమైన; దర్శనం = దర్శనము కలవాడు; శూరమ్ = శూరుడు; కృతాఆత్మనం = మనోనిగ్రహవంతుడు; యశస్వినమ్ = కీర్తిశాలి; ప్రవ్రాజ్య = అరణ్యమునకు పంపబడుట; చీరవసనమ్ = నారచీరలు కట్టుట; కిం ను = ఏందుకు; పశ్యసి = చెప్పితివు; కారణమ్ = కారణము
భావం:-
పుణ్యప్రదమైన దర్శనము కలవాడు, శూరుడు, మనోనిగ్రహవంతుడు, కీర్తిశాలి అయిన రాముని నారచీరలు ధరింపచేసి అరణ్యమునకు పంపితివి కదా! దీనికి ఏమి కారణము చెప్పెదవు?
2.73.13.
అనుష్టుప్.
లుబ్ధాయా విదితో మన్యే
న తేఽహం రాఘవం ప్రతి।
తథాహ్యనర్థౌ రాజ్యార్థమ్
త్వయాఽనీతో మహానయమ్॥
టీక:;
లుబ్ధాయా = లుబ్ధురాలవు; విదితః = తెలిసినదానవు; మన్యే = నాకున్న; న = తెలియదు; తే = నీకు; అహం = నేను; రాఘవం ప్రతి = రాముని గురించి; తథాహి = అందువలననే; అనర్థః = అనర్థమును; రాజ్యార్థమ్ = రాజ్యము కొరకై; త్వయా = నీచేత; నీతః = తీసుకుని రాబడిన; మహాన్ = పెద్దదైన; అయమ్ = ఇటువంటి.
భావం:-
నీవు లుబ్ధురాలవు. రాముని పట్ల నాకున్న భక్తిని గూర్చి నీకు తెలియదు. అందువలననే రాజ్యముకొరకై నీవు అనర్థము తెచ్చి పెట్టితివి.
2.73.14.
అనుష్టుప్.
అహం హి పురుషవ్యాఘ్రా
అపశ్యన్రామలక్ష్మణౌ।
కేన? శక్తిప్రభావేన
రాజ్యం రక్షితుముత్సహే॥
టీక:;
అహం = నేను; హి = మాత్రము; పురుషవ్యాఘ్రా = పురుష శ్రేష్ఠులైన; అపశ్యన్ = దగ్గరలేని; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు; కేన = ఎటువంటి; శక్తిప్రభావేన = శక్తి ప్రభావము చేత; రాజ్యం = రాజ్యమును; రక్షితుమ్ = పాలించుటకు; ఉత్సహే = సమర్థుడను
భావం:-
పురుషశ్రేష్టులైన రామలక్ష్మణులు దగ్గర లేని నేను, ఈ రాజ్యమును ఏ శక్తితో పాలించుటకు సమర్థుడను అగుదును?
2.73.15.
అనుష్టుప్.
తం హి నిత్యం మహారాజో
బలవన్తం మహాబలః।
ఉపాశ్రితోఽభూద్ధర్మాత్మా
మేరుర్మేరువనం యథా॥
టీక:;
తం = అతనిని; హి = మాత్రము; నిత్యం = ఎల్లప్పుడు; మహారాజః = మహారాజు; బలవన్తం = మనోబలశాలిౖయెన; మహాబలః = మహాబలశాలి; ఉపాశ్రితః = ఆశ్రయించి; అభూత్ = ఉండిడివాడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; మేరుః = మేరు పర్వతము; మేరువనం = మేరు వనమును; యథా = ఆ విధముగా
భావం:-
మేరుపర్వతము తన రక్షణ కొరకై తన చుట్టు ఉన్న వనమును ఆశ్రయించినట్లు, మహాబలశాలి, ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు, ఎల్లప్పుడు మనో బలశాలియైన ఆ రాముని ఆశ్రయించి ఉందెడివాడు కదా?
2.73.16.
అనుష్టుప్.
సోఽహం కథమిమం భారమ్
మహాధుర్యసముద్ధృతమ్।
దమ్యోధురమివాఽసాద్య
వహేయం కేనచౌజసా?॥
టీక:;
సః = అటువంటి; అహం = నేను; కథమ్ = ఏ విధముగా; ఇమం భారమ్ = ఈ భారమును; మహా = పెద్ద; ధుర్య = వృషభము, ఎద్దు; సముద్ధృతమ్ = ఎత్తెడి పెద్దబరువును; దమ్యః = చిన్న ఎద్దు, కొడెద్దు; ధురమ్ = భారమును; ఇవ = వలె; ఆసాద్య = తగిలించిన పిదప; వహేయం = మోయుదును; కేన = ఎట్టి; చ = ఇంకను; ఓజసా = శక్తిచే.
భావం:-
పెద్ద ఎద్దు మోసెడి బరువును, ఇంకను ఆ పని నేర్పవలసి ఉన్న చిన్న ఎద్దును ఆ బరువు మోయమని తగిలించినట్లు, రాముడు మోయగల రాజ్యభారమును మోయగల శక్తి నాకెక్కడది?
*గమనిక:-
(1) ధుర్య్య- పెద్ద బరువు మోసెడి ఎద్దు. (2) దమ్య- మోయుటకు దున్నుటకు బనుపఱుపదగిన వయసుగల కొడె.
2.73.17.
అనుష్టుప్.
అథవా మే భవేచ్ఛక్తిః
యోగైర్బుద్ధిబలేన వా।
సకామాం న కరిష్యామి
త్వామహం పుత్రగర్ధినీమ్॥
టీక:;
అథవా = లేక; మే = నాకు; భవేత్ = జరగవచ్చునేమో; శక్తిః = శక్తి కలనాడను; యోగైః = కలుగుట; బుద్ధిబలేన = చతురోపాయములతో; వా = లేకపోతే; స = ఆ; కామాం = కోరికను; న = చేయను; కరిష్యామి = తీర్చుట; త్వామ్ = నీ యొక్క; అహం = నేను; పుత్రగర్ధినీమ్ = పుత్రునిపై మితిమీరిన ప్రేమ గల కోరికను
భావం:-
సామదానాది ఉపాయములను ప్రయోగించుట చేతను, బుద్ధిబలము చేతను, నాకు ఈ భారమును మోయు శక్తి కలుగవచ్చునేమో కాని. అయినను పుత్రునిపై మితి మీరిన ప్రేమ గల నీ కోరికను మాత్రము తీర్చను.
*గమనిక:-
ఉపాయములు- చతురోపాయములు, సామము, దానము, భేదము, దండము, అవి రాజ్యమేలు రాజు కార్యసాధనకు అనుసరించదగిన ఉపాయములు.
2.73.18.
అనుష్టుప్.
న మే వికాంక్షా జాయేత
త్యక్తుం త్వాం పాపనిశ్చయామ్।
యది రామస్య నావేక్షా
త్వయి స్యాన్మాతృవత్సదా॥
టీక:;
న = లేదు; మే = నాకు; వికాంక్షా = విశేషమైన కోరిక; జాయేత = కలుగుట; త్యక్తుం = విడిచిపెట్టుటకు; త్వాం = నిన్ను; పాపనిశ్చయామ్ = పాపబుద్ధి కలదానవైనను; యది = ఎవరైతే; రామస్య = రాముని యొక్క; న + అవేక్షా = మనసు రాకున్నది; త్వయి = నిన్ను; స్యాన్ మాతృవత్ = తల్లి వలె; సదా = సర్వదా
భావం:-
పాపబుద్ధి కలదానవైనను నిన్ను విడచుటకు మనసు రాకున్నది. రాముడు సర్వదా నిన్ను తన తల్లి వలె చూచుకొనుచుండెడివాడు కనుక.
2.73.19.
అనుష్టుప్.
ఉత్పన్నాతు కథం బుద్ధిః
తవేయం పాపదర్శిని!।
సాధుచారిత్రవిభ్రష్టే!
పూర్వేషాం నో విగర్హితా॥
టీక:;
ఉత్పన్నా = పుట్టినది; తు = అయ్యెను; కథం = ఏ విధముగా; బుద్ధిః = బుద్ధి; తవ = నీకు; ఇయం = ఇటువంటి; పాపదర్శిని = పాపిష్ఠి ఆలోచనపరురాల; సాధుచారిత్ర = మంచి వర్తనలకలదై; విభ్రష్టే = దిగజాఱిపోయినదానా; పూర్వేషాం = పూర్వులందరు; నః = మన; విగర్హితా = నిందించెదరు.
భావం:-
పాపిష్ఠిబుద్ధీ! నీకు ఈ ఎలా పుట్టినదీ బుద్ధి? సత్రవర్తననుండి జాఱిపోయిన దానా! మన పూర్వులందరును నిన్ను నిందించెదరు.
2.73.20.
అనుష్టుప్.
అస్మిన్కులే హి పూర్వేషామ్
జ్యేష్ఠఽరాజ్యేఽభిషిచ్యతే।
అపరే భ్రాతరస్తస్మిన్
ప్రవర్తన్తే సమాహితాః॥
టీక:;
అస్మిన్ = మన; కులే = వంశములో; హి = నిశ్చయముగా; పూర్వేషామ్ = పూర్వము నుండి; జ్యేష్ఠ = జ్యేష్ఠుడైనవాడు; రాజ్యే = రాజ్యమునకు; అభిషిచ్యతే = అభిషిక్తుడు అగుచున్నాడు; అపరే = మిగిలిన; భ్రాతరః = సోదరులు; తస్మిన్ = అతని యెడల; ప్రవర్తన్తే = ప్రవర్తించుచుందురు; సమాహితాః = మంచి భక్తితో.
భావం:-
‘పుత్రులందరిలోను జ్యేష్ఠుడైనవాడు రాజ్యాభిషిక్తుడు కాగా మిగిలిన సోదరులందరు అతని యెడల మంచి భక్తితో ప్రవర్తించుచుండుట’ అనునది ఈ వంశములోని ఆచారము కదా!
2.73.21.
అనుష్టుప్.
న హి మన్యే నృశంసే త్వమ్
రాజధర్మమవేక్షసే।
గతిం వా న విజానాసి
రాజవృత్తస్య శాశ్వతీమ్॥
టీక:;
న హి = లేదు; మన్యే = తెలియుట; నృశంసే = క్రూరురాలా; త్వమ్ = నీకు; రాజధర్మమ్ = రాజధర్మము; అవేక్షసే = చూచుట; గతిం = పద్ధతిని; వా = లేనిచో; న విజానాసి =తెలియకపోవలెను; రాజవృత్తస్య = రాజధర్మముపై; శాశ్వతీమ్ = శాశ్వతమైన
భావం:-
క్రూరురాలా! నీకు రాజధర్మము పై ఆదరమైన లేకపోయి ఉండవలెను లేదా నీకు శాశ్వతమైన రాజధర్మపద్ధతి తెలియకపోయి ఉండవలెను అని అనుకొనుచున్నాను.
2.73.22.
అనుష్టుప్.
సతతం రాజవృత్తే హి
జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే।
రాజ్ఞామేతత్సమం తత్సా్యత్
ఇక్ష్వాకూణాం విశేషతః॥
టీక:;
సతతం = ఎల్లప్పుడును; రాజవృత్తే = రాజధర్మానుసారము; హి = మాత్రమే; జ్యేష్ఠః = జ్యేష్ఠుడే; రాజ్యే = రాజ్యమునందు; అభిషిచ్యతే = అభిషిక్తుడగును; రాజ్ఞామ్ = రాజులందరికి; ఏతత్ = ఈ నియమము; సమం = సమానమే; తత్ స్యాత్ = అట్లు జరుగుట; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశీయులకు; విశేషతః = విశేషించి
భావం:-
రాజధర్మానుసారము జ్యేష్ఠుడు ఎల్లప్పుడును రాజ్యమునందు అఖిషిక్తుడగును. ఈ నియమము రాజులందరికిని సమానమే. విశేషించి, ఇది ఇక్ష్వాకువంశీయులకు ప్రధానమైన ధర్మము.
2.73.23.
అనుష్టుప్.
తేషాం ధర్మైకరక్షాణామ్
కులచారిత్రశోభినామ్।
అద్య చారిత్రశౌండీర్యమ్
త్వాం ప్రాప్య వినివర్తితమ్॥
టీక:;
తేషాం = నీ కారణముగా; ధర్మైక = ధర్మమే; రక్షాణామ్ = ప్రధాన రక్షించు; కుల = వంశ; చారిత్ర = చరిత్రచే; శోభినామ్ = వాసికెక్కినవారు; అద్య = ఈనాడు; చారిత్ర = సచ్చరిత్ర; శౌండీర్యమ్ = గర్వమును; త్వాం = నిన్ను; ప్రాప్య = పొందుటచే; వినివర్తితమ్ = నశింపచేసితివి.
భావం:-
ఇక్ష్వాకు వంశీయులకు ధర్మము రక్షించు వంశచరిత్ర కలవారు. అట్టి సచ్చరిత్ర విషయమున వారికి గల గర్వమును ఈనాడు నీవు నశింపచేసితివి.
2.73.24.
అనుష్టుప్.
తవాపి సుమహాభాగా
జనేంద్రాః కులపూర్వగాః।
బుద్ధేర్మోహః కథమయమ్
సమ్భూతస్త్వయి గర్హితః॥
టీక:;
తవ = నీయొక్క; అపి = కూడ; సుమహాభాగా = మహానుభావులు; జనేంద్రాః = మహారాజులందరును; కులపూర్వగాః = పూర్వపురుషులైన; బుద్ధేః మోహః = బుద్ధి మోహము; కథమ్ = ఏ విధముగా; అయమ్ = ఇటువంటి; సమ్భూతః = కలిగినది; త్వయి = నీకు; గర్హితః = నిందింపదగిన
భావం:-
నీ వంశములో పూర్వపురుషులైన మహారాజులందరు కూడ మహానుభావులే కదా! నిందింపదగిన ఈ మోహబుద్ధి నీకు ఎట్లు కలిగినది?
2.73.25.
అనుష్టుప్.
న తు కామం కరిష్యామి
తవాఽహం పాపనిశ్చయే।
త్వయా వ్యసనమారబ్ధమ్
జీవితాంతకరం మమ॥
టీక:;
న = లేదు; తు = అయినను; కామం = కోరిన పని; కరిష్యామి = చేయుట; తవ = నీచే; అహం = నేను; పాపనిశ్చయే = పాపపుటాలోచనకల; త్వయా = నీచే; వ్యసనమ్ = చెడ్డ పని; ఆరబ్ధమ్ = ప్రారంభించినావు; జీవితాంతకరం = ప్రాణములకు ముప్పు వాటిల్లజేయునది; మమ = నాకు
భావం:-
నీకు కలిగిన పాపపుటాలోచనకల కోరికను నేను మాత్రము తీర్చను. నీవు నా ప్రాణములకే ముప్పు వాటిల్లు చెడుపని మొదలు పెట్టితివి.
2.73.26.
అనుష్టుప్.
ఏషత్విదానీమేవాహమ్
అప్రియార్థం తవానఘమ్।
నివర్తయిష్యామి వనాత్
భ్రాతరం స్వజనప్రియమ్॥
టీక:
ఏషత్ = ఈ పనిని; ఇదానీమ్ = ఇప్పుడు; ఏవ = ఇప్పుడు; అహమ్ = నేను; అప్రియార్థం = అప్రియము చేయుటకు; తవ = నీకు; అనఘమ్ = దోషరహితుడైనవానిని; నివర్తయిష్యామి = వెనుకకు తీసికొని వచ్చెదను; వనాత్ = అరణ్యము నుండి; భ్రాతరం = సోదరుని; స్వజనప్రియమ్ = స్వజనులకు ఇష్టుడైన.
భావం:-
నేను ఇప్పుడు నీకు అప్రియము చేయుటకు, ఇప్పుడే స్వజనులకు ఇష్టుడును దోషరహితుడైన సోదరుని అడవినుండి వెనుకకు తీసికొని వచ్చెదను.
2.73.27.
అనుష్టుప్.
నివర్తయిత్వా రామం చ
తస్యాహం దీప్తతేజసః।
దాసభూతో భవిష్యామి
సుస్థిరేణాంతరాత్మనా॥
టీక:;
నివర్తయిత్వా = మరల వెనుకకు తీసికొని వచ్చి; రామం = రాముని; చ = ఇంకను; తస్య = అతనికి; అహం = నేను; దీప్తతేజసః = ప్రకాశవంతమైన తేజస్సుకలవాడు; దాసభూతః = దాస్యము చేయువాడను; భవిష్యామి = అగుదును; సుస్థిరేణ = సుస్థిరమైన; అంతరాత్మనా = అంతరాత్మ చేత లేదా మనస్సుతో
భావం:-
ప్రకాశవంతమైన తేజస్సుకల రాముని నేను మరల వెనుకకు తీసికొని వచ్చెదను. అతనికి సుస్థిరమైన మనస్సుతో దాస్యము చేయువానిగా ఉండెదను.
2.73.28.
త్రిష్టుప్.
ఇత్యేవముక్త్వా భరతో మహాత్మా
ప్రియేతరైర్వాక్యగణైస్తుదంస్తామ్।
శోకాతురశ్చాపి ననాద భూయః
సింహో యథా పర్వతగహ్వరస్థః॥
టీక:;
ఇతి = ఈ విధముగా; ఏవమ్ = విధముగా; ఉక్త్వా = పలుకుచు; భరతః = భరతుడు; మహాత్మా = మహాత్ముడైన; ప్రియేతరైః = ప్రియ+ఇతరైః, అప్రియములైన; వాక్యగణైః = మాటలచే; తుదన్ = పీడించుచు; తామ్ = ఆమెను; శోకాతురః = శోకపీడితుడై; చ = ఇంకను; అపి = కూడ; ననాద = అరిచెను; భూయః = మరల; సింహః = సింహము; యథా = విధముగా; పర్వత = కొండ; గహ్వః = గుహలో; అస్థః = ఉన్నది.
భావం:-
మహాత్ముడైన భరతుడు ఈ విధముగ పలుకుచు, అప్రియములైన మాటలచే ఆమెను పీడించుచు, శోకపీడితుడై కొండ గుహలో ఉన్న సింహమువలె మరల మరల గర్జించెను.
2.73.29.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే త్రిసప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; త్రిసప్తతితమ [73] = డెబ్బైమూడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [73] డెబ్బైమూడవ సర్గ సంపూర్ణము.
2.74.1.
అనుష్టుప్.
తాం తథా గర్హయిత్వా తు
మాతరం భరతస్తదా।
రోషేణ మహతాఽవిష్టః
పునరేవాబ్రవీద్వచః॥
టీక:
తాం = ఆమెను; తథా = ఆ విధముగా; గర్హయిత్వా = దూషించి; తు = విశేషముగా; మాతరం = తల్లిని; భరతః = భరతుడు; తదా = అప్పుడు; రోషేణ = కోపముతో; మహత = గొప్పదైన; ఆవిష్టః = కూడినవాడై; పునః ఏవ = మరల ఇట్లు; అబ్రవీత్ = పలికెను; వచః = మాటలు.
భావం:-
అప్పుడు భరతుడు తల్లిని ఆ విధముగా దూషించి, మిక్కిలి కోపముతో మరల ఇట్లు పలికెను.
2.74.2.
అనుష్టుప్.
“రాజ్యాద్భ్రంశస్వ కైకేయి!
నృశంసే! దుష్టచారిణి!।
పరిత్యక్తా చ ధర్మేణ
మా మృతం రుదతీ భవ॥
టీక:
రాజ్యాత్ = రాజ్యమునుండి; భ్రంశస్వ = వెళ్లిపొమ్ము; కైకేయి = ఓ కైకేయీ; నృశంసే = క్రూరురాలా; దుష్టచారిణి = దుష్టమైన ప్రవృత్తి గలదానా; పరిత్యక్తా చ ధర్మేణ = ధర్మవిహీనురాలవైన; మా = నన్ను గురించి; మృతం = మరణించిన; రుదతీ = ఏడ్చుచు; భవ = ఉండుము.
భావం:-
క్రూరురాలా! దుష్టమైన ప్రవృత్తి గలదానా! ఓ కైకేయీ! నీవు కోరిన రాజ్యము నీకు లభించకపోవుగాక! ధర్మవిహీనురాలవైన నీవు నేనూ మరణించినట్లే ఏడ్చుచు కూర్చుండుము.
2.74.3.
అనుష్టుప్.
కిన్ను తేఽదూషయద్రాజా
రామో వా భృశధార్మికః।
యయోర్మృత్యుర్వివాసశ్చ
త్వత్కృతే తుల్యమాగతౌ?॥
టీక:
కిన్ను = కిం + ను, ఎటువంటి; తే = నీకు; అదూషయత్ = అపకారము; రాజా = రాజు గాని; రామో వా = రాముడు కాని; భృశధార్మికః = పరమధార్మికుడైన; యయోః = ఎవరిని; మృత్యుః = మరణము; వివాసః = ప్రవాసము; చ = మఱియు; త్వత్ = నీచే; కృతే = చేయబడినదానికి; తుల్యమ్ = సరిపోలునది; ఆగతౌ = వచ్చును.
భావం:-
నీ మూలమున పరమధార్మికిలైన మా తండ్రికి మరణము, మా అన్నగారైన రామునకు ప్రవాసము ఒక్క మారుగా సంప్రాప్తించినవి కదా! ఆ మహారాజుగాని, పరమధార్మికుడైన రాముడు కాని నీవు చేసిన అపకారము వంటిది ఏమి చేసిరి?
2.74.4.
అనుష్టుప్.
భ్రూణహత్యామసి ప్రాప్తా
కులస్యాస్య వినాశనాత్।
కైకేయి! నరకం గచ్ఛ
మా చ భర్తుస్సలోకతామ్॥
టీక:
భ్రూణహత్యామ్ = భూణహత్యా పాపము; అసి = ఇత్యర్థః, నీకు; ప్రాప్తా = ప్రాప్తించును; కులస్య = కులమును; అస్య = ఈ; వినాశనాత్ = వినాశమువలన; కైకేయి = కైకేయీ; నరకం = నరకము గూర్చి ; గచ్ఛ = వెళ్ళుము; మా చ = వద్దు; చ = మఱి; భర్తుః = భర్తతో; సః = ఈ; సలోకతామ్ = సాలోక్యమును.
భావం:-
ఈ కులమును నశింపచేసి, భ్రూణహత్యాపాపమును పొందినావు. నీకు నరకమే ప్రాప్తించును గాని, భర్తతో సాలోక్యము అనగా భర్త ఉన్న లోకములోనే అతనితో కలిసి నివసించుట లభింపదు.
2.74.5.
అనుష్టుప్.
యత్త్వయా హీదృశం పాపమ్
కృతం ఘోరేణ కర్మణా।
సర్వలోకప్రియం హిత్వా
మమాప్యాపాదితం భయమ్॥
టీక:
యత్ = ఏ విధముగా; త్వయా = నీచేత; హి = విషాదః; ఈదృశం = ఇటువంటి; పాపమ్ = పాపము; కృతం = చేయబడినదో; ఘోరేణ = భయంకరమైన; కర్మణా = పనిచేత; సర్వలోకప్రియం = అందరికిని ప్రియమును చేయుట; హిత్వా = విడిచిపెట్టుటచే; మమ = నాకు; అపి = కూడా; ఆపాదితం = కలిగించినావు; భయమ్ = భయమును
భావం:-
నీవు ఈ భయంకరమైన పని చేసి ఇట్టి పాపము సంపాదించితివి. ఈ విధముగ అందరికిని అప్రియమును చేయుటచే నీ కుమారుడనైన నాకు కూడ భయము కలిగించినావు.
2.74.6.
అనుష్టుప్.
త్వత్కృతే మే పితా వృత్తో
రామశ్చారణ్యమాశ్రితః।
అయశో జీవలోకే చ
త్వయాఽహం ప్రతిపాదితః॥
టీక:
త్వత్ = నీ; కృతే = కారణముగా; మే = నా; పితా = తండ్రి; వృత్తః = మరణించెను; రామః = రాముడు; చ = ఇంకను; అరణ్యమ్ = అరణ్యములకు; ఆశ్రితః = ఆశ్రయించెను; అయశః = అపకీర్తి; జీవలోకే = లోకమునందు; చ = ఇంకను; త్వయా = నీ చేత; అహం = నాకు; ప్రతిపాదితః = తెచ్చిపెట్టితివి..
భావం:-
నీ మూలమున నా తండ్రి మరణించెను. రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయెను. నాకు కూడా నీవు ఈ లోకమునందు గొప్ప అపకీర్తి తెచ్చి పెట్టితివి.
2.74.7.
అనుష్టుప్.
మాతృరూపే మమామిత్రే
నృశంసే రాజ్యకాముకే।
న తేఽహ మభిభాష్యోఽస్మి
దుర్వృత్తే పతిఘాతిని॥
టీక:
మాతృరూపే = తల్లి రూపములో; మమ = నాకు; అమిత్రే = శత్రువువు; నృశంసే = క్రూరురాలవు; రాజ్యకాముకే = రాజ్యలోభము కలదానవు; న = కాదు; తే = నీవు; అహమ్ = నేను; అభిభాష్య = మాటలాడతగిన అర్హత; న = లేదు; అస్మి = అర్హత; దుర్వృత్తే = చెడుగా ప్రవర్తించి; పతిఘాతిని = భర్తను చంపినదానవో
భావం:-
నీవు నాకు తల్లి అను పేరు పెట్టుకొన్న శత్రువవు. క్రూరురాలవు. రాజ్యలోభము కలదానవు. చెడుగా ప్రవర్తించి భర్తను చంపితివి. నీవు నాతో మాటలాడతగినదానవు కావు.
2.74.8.
అనుష్టుప్.
కౌసల్యా చ సుమిత్రా చ
యాశ్చాన్యా మమ మాతరః।
దుఃఖేన మహతాఽవిష్టాః
త్వాం ప్రాప్య కులదూషిణీమ్॥
టీక:
కౌసల్యా = కౌసల్య; చ = ఇంకను; సుమిత్రా = సుమిత్ర; చ = ఇంకను; యాః = ఏ కారణముచే; చ = ఇంకను; అన్యా = మిగిలిన; మమ మాతరః = నా తల్లులందరికీ; దుఃఖేన = దుఃఖముచేత; మహతావిష్టాః = పెద్ద కష్టము; త్వాం = నీ చేత; ప్రాప్య = లభించిన; కులదూషిణీమ్ = కులమునకు చేటు
భావం:-
కులమునకు చేటు తెచ్చిన నీ మూలమున, కౌసల్యకు, సుమిత్రకు, నా మిగిలిన తల్లులు అందరికి కూడ గొప్ప కష్టము వచ్చిపడినది.
2.74.9.
అనుష్టుప్.
న త్వమశ్వపతేః కన్యా
ధర్మరాజస్య ధీమతః।
రాక్షసీ తత్ర జాతాఽసి
కులప్రధ్వంసినీ పితుః॥
టీక:
న = కాదు; త్వమ్ = నీవు; అశ్వపతేః = అశ్వపతి యొక్క; కన్యా = కుమార్తెవు; ధర్మరాజస్య = ధర్మాత్ముడు; ధీమతః = బుద్ధిశాలి; రాక్షసీ = రాక్షసివి; తత్ర = అక్కడ; జాతా + అసి = జన్మించిన నీవు; కులప్రధ్వంసినీ = వంశమును నశింపచేయుటకై; పితుః = తండ్రి
భావం:-
నీవు ధర్మాత్ముడు, బుద్ధిశాలి అయిన అశ్వపతి కుమార్తెవు కాదు. తండ్రి కులమును నశింపచేయుటకై ఆ వంశమునందు జన్మించిన రాక్షసివి.
2.74.10.
అనుష్టుప్.
యత్త్వయా ధార్మికో రామో
నిత్యం సత్యపరాయణః।
వనం ప్రస్థాపితో దుఃఖాత్
పితా చ త్రిదివం గతః॥
టీక:
యత్ = ఏ కారణముగా; త్వయా =నీచేత; ధార్మికః = ధర్మపరాయణుడు; రామః = రాముడు; నిత్యం సత్యపరాయణః = నిత్యసత్యపరాయణుడు; వనం = అడవుల గురించి ; ప్రస్థాపితః = పంపివేసితివి; దుఃఖాత్ = పుత్రశోకము వలన; పితా = తండ్రి; చ = ఇంకను; త్రిదివం గతః = స్వర్గస్థుడాయెను.
భావం:-
ధార్మికుడు, సత్యపరాయణుడు అయిన రాముని అరణ్యమునకు పంపివేసితివి. పుత్రశోకముతో నా తండ్రి మరణించెను.
2.74.11.
అనుష్టుప్.
యత్ప్రధానాఽసి తత్పాపమ్
మయి పిత్రా వినాకృతే।
భ్రాతృభ్యాం చ పరిత్యక్తే
సర్వలోకస్య చాప్రియే॥
టీక:
యత్ = ఏది; ప్రధానః = ముఖ్యకారణం; అసి = ఐఉన్నదో; తత్ + పాపమ్ = ఆ పాపము; మయి = నాకు; పిత్రా = తండ్రి; వినా = లేకుండా; కృతే = చేసినది; భ్రాతృభ్యాం = సోదరుల చేతను; చ = ఇంకను; పరిత్యక్తే = పరిత్యజించబడితిని; సర్వలోకస్య = లోకంలో అందరికిని; చ = ఇంకను; అప్రియే = అప్రియుడను
భావం:-
నీవు చేసిన పాపము నాకు సంక్రమించుటచే నా తండ్రి మరణించెను. సోదరులు నన్ను పరిత్యజించిరి. నేను అందరికిని అప్రియుడను అయితిని.
2.74.12.
అనుష్టుప్.
కౌసల్యాం ధర్మసంయుక్తామ్
వియుక్తాం పాపనిశ్చయే।
కృత్వా కం ప్రాప్స్యసే త్వద్య
లోకం నిరయగామిని॥
టీక:
కౌసల్యాం = కౌసల్యకు; ధర్మసంయుక్తామ్ = ధర్మాత్మురాలైన; వియుక్తాం = పుత్ర వియోగము; పాపనిశ్చయే = పాపములు చేయు క్రూరురాలా; కృత్వా = చేసి; కం = ఎటువంటి; ప్రాప్స్యసే = లభించును; త్వత్ = నీకు; అద్య = ఇప్పుడు; లోకం = లోకమును; నిరయగామిని = నరకమునకు పోవుదానా.
భావం:-
పాపిష్టిపనులుతలపెట్టుదానా! నరకమునకుపోవుదానా! ధర్మాత్మురాలైన కౌసల్యకు పుత్రవియోగము కలిగించిన నీవు పోవుటకు తగిన లోకమేదియో తెలియదు!
2.74.13.
అనుష్టుప్.
కిం నావబుధ్యసే క్రూరే
నియతం బంధుసంశ్రయమ్।
జ్యేష్ఠం పితృసమం రామమ్
కౌసల్యాయాఽత్మసమ్భవమ్॥
టీక:
కిం = ఏమి; న = లేదా; అవబుధ్యసే = తెలియుట; క్రూరే = ఓ క్రూరురాలా; నియతం = ఆత్మనిగ్రహము కలవాడని; బంధుసంశ్రయమ్ = బంధువులకు అండయైనవాడని; జ్యేష్ఠతం = జ్యేష్టుడు అగుటచే; పితృసమం = తండ్రివంటివాడని; రామమ్ = ఆ రాముని; కౌసల్యాయా = కౌసల్య యొక్క; ఆత్మసమ్భవమ్ = కుమారుని
భావం:-
క్రూరురాలా! కౌసల్య కుమారుడైన రాముడు ఆత్మనిగ్రహము కలవాడని, బంధువులకు ఆశ్రయమైనవాడని, జ్యేష్టు డగుటచే మాకు తండ్రి వంటివాడని నీకు తెలియదా?
2.74.14.
అనుష్టుప్.
అంగప్రత్యంగజః పుత్రో
హృదయాచ్చాపి జాయతే।
తస్మాత్ప్రియతమో మాతుః
ప్రియా ఏవ తు బాంధవాః॥
టీక:
అంగ ప్రతి + అంగజః = ప్రతి శరీర భాగమునుండి మరియు శరీరమునుండి; పుత్రః = పుత్రుడు; హృదయాత్ + చ + అపి = హృదయమునుండి కూడ; జాయతే = పుట్టినవాడగుటచే; తస్మాత్ = ఆ కారణముచే; ప్రియతమః = అత్యంత ప్రియుడు; మాతుః = తల్లికి; ప్రియా ఏవ తు = ప్రియమైన వారు మాత్రమే; బాంధవాః = బంధువులకు
భావం:-
పుత్రుడు తన మొత్తం ఆపాదమస్తకము (చిన్న పెద్ద ప్రతి అవయవములనుండి) మఱియు హృదయమునుండి పుట్టినవాడగుటచే తల్లికి అత్యంతప్రియుడు. ఇతర బాంధవులు ప్రియులు మాత్రమే.
*గమనిక:-
(1) ఆంధ్రశబ్ధరత్నాకరము, అంగప్రత్యంగ- చిన్నవి పెద్దవి యగు అన్ని అవయవములు. ప్రత్యంగః- వైద్యసంస్కృత ఇంగ్లీషు డిక్షనరీ, ప్రకారము అ) శరీరము యొక్క ఉప అంగములు/ అవయవములు. ఆ) విభాగము. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-3 ప్రకారము- గజదేహలక్షణములలో వ్రేళ్ళు, తొండము, తుదిభాగము, కుంభస్థలము, మస్తకము, కేసరము ,1, మణి (?) పాదాసనము ఇవి ప్రత్యంగములు. కనుక మానవ దేహమునకు కాలిచేతి వ్రేళ్ళు, అరికాలు, భుజములు, శిరస్సు, శిరోజములు, మస్తకము వంటివి అనియు. అంగప్రత్యంగ అన “ఆపాదమస్తకము సమస్తము” అనియూ గ్రహించడమైనది. (2) ప్రియః- ప్రియతరః- ప్రియతమః.(3) శృతివచనము “ఆగాదంగాత్ సంబవసి, హృదయాదదిజాయసే, ఆత్మావై పుత్రనామాన్”సౌజన్యం- గీతాప్రెల్ రామాయణం
2.74.15.
అనుష్టుప్.
అన్యదా కిల ధర్మజ్ఞా
సురభిస్సురసమ్మతా।
వహమానౌ దదర్శోర్వాయమ్
పుత్రౌ విగతచేతసౌ॥
టీక:
అన్యదా = ఒకానొకప్పుడు; కిల = అట, సర్వశబ్ధసంబోధిని; ధర్మజ్ఞా = ధర్మము తెలిసినది; సురభిః = కామధేనువు (వసిష్ఠుని దగ్గర ఉన్న ధేనువు); సురసమ్మతా = దేవతలచే పూజింపబడినది; వహమానౌ = భారమని తలంచుచు; దదర్శః = చూచెనట; ఉర్వాయమ్ = నేల మీద; పుత్రౌ = పుత్రులు; విగతచేతసౌ = మూర్ఛ చెంది
భావం:-
ఒకానొకప్పుడు ధర్మములు తెలిసినది, దేవతలచే పూజింపబడునది అయిన కామధేనువు తన పుత్రులు భూలోకములో దున్నుచు మూర్ఛ చెంది ఉండగా చూచెనట.
2.74.16.
అనుష్టుప్.
తావర్ధదివసే శ్రాంతౌ
దృష్ట్వా పుత్రౌ మహీతలే।
రురోద పుత్రశోకేన
బాష్పపర్యాకులేక్షణా॥
టీక:
తాన్ = తను; అర్థదివసే = దినములో సగ భాగము; శ్రాంతౌ = శ్రమించి అలసిపోయిన; దృష్ట్వా = చూచి; పుత్రౌ = ఆ రెండు వృషభములను; మహీతలే = భూమి మీద; రురోద = ఏడ్చెను; పుత్రశోకేన = పుత్ర శోకముచే; బాష్పపర్యాకుల = కన్నీళ్లతో వ్యాకులమైన; ఈక్షణా = నేత్రములు
భావం:-
భూలోకమునందు మధ్యాహ్నం వరకు పని చేసిచేసి అలసిపోయిన తనపుత్రులైమ జంట కాడెద్దులను చూచి, పుత్రశోకముచే కన్నీళ్లతో వ్యాకులమైన నేత్రములు కలదై సురభి ఏడ్చెను.
2.74.17.
అనుష్టుప్.
అధస్తాద్వ్రజతస్తస్యాః
సురరాజ్ఞో మహాత్మనః।
బిన్దవః పతితా గాత్రే
సూక్షా్మ స్సురభిగంధినః॥
టీక:
అధస్తాత్ = క్రింది భాగమున; వ్రజతః = ప్రయాణించుచుండగా; తస్యాః = ఆమెకు; సురరాజ్ఞః = దేవేంద్రుడు; మహాత్మనః = గొప్పవాడైన; బిన్దవః = కన్నీటి బిందువులు; పతితా = పడినవి; గాత్రే = శరీరముపై; సూక్షా్మః = సూక్ష్మమైన; సురభి = సుగంధముతో; గంధినః = పరిమళించుచున్న
భావం:-
ఆ సమయమున దేవేంద్రుడు ఆకామున సురభికి క్రింద నుండి వెళ్ళుచుండగా, కామధేనువు యొక్క పరిమళించుచున్న సూక్ష్మమైన కన్నీటి బిందువులు అతనిపై పడెను.
2.74.18.
అనుష్టుప్.
ఇంద్రోఽప్యశ్రునిపాతం తమ్
స్వగాత్రే పుణ్యగంధినమ్।
సురభిం మన్యతే దృష్ట్వా
భూయసీం తాం సురేశ్వరః॥
టీక:
ఇంద్ర = ఇంద్రుడు; అపి = ఐతే; అశ్రు = కన్నీటి బిందువులను; పాతం = రాలుచున్నవాటిని; తమ్ = ఆ; స్వగాత్రే = తన శరీరముపై; పుణ్యగంధినమ్ = పరిమళించుచున్న; సురభిం = కామధేనువుయొక్క; మన్యతే = తలచెను; దృష్ట్వా = చూచి; భూయసీం = గొప్పదిగా; తాం = ఆ ధేనువును; సురేశ్వరః = దేవేంద్రుడు
భావం:-
దేవాధీశుడైన ఇంద్రుడు తన శరీరముపై పడిన పరిమళించుచున్న కన్నీటి బిందువులను చూచి, అవి పూజ్యురాలైన కామధేనువు కన్నీటి బిందువులే అయి ఉండునని తలచెను.
2.74.19.
అనుష్టుప్.
నిరీక్షమాణశ్శక్రస్తామ్
దదర్శ సురభిం స్థితామ్।
ఆకాశే విష్ఠితాం దీనామ్
రుదన్తీం భృశదుఃఖితామ్॥
టీక:
నిరీక్షమాణః = చూచుచు; శక్రః = ఇంద్రుడు; తామ్ = ఆ; దదర్శ = చూచెను; సురభిం = కామధేనువును; స్థితామ్ = నిలిచి ఉన్న; ఆకాశే = ఆకాశమునందు; విష్ఠితాం = వేదనతో; దీనామ్ = దీనముగా; రుదన్తీం = ఏడ్చుచున్న; భృశ దుఃఖితామ్ = పట్టరాని దుఃఖముతో
భావం:-
దేవేంద్రుడు పైకి చూచి, అక్కడ, వ్యాకులురాలై, దైన్యముతో మిక్కిలి దుః;ఖించుచు ఏడ్పుచున్న ఆ కామధేనువును చూచెను.
*గమనిక:-
శక్ర = శక్+రక్, శక్నోతి దైత్యాన్ నాశయితుమ్, రాక్షసులను నశింపజేయు సామర్థ్యము కలవాడు. ఇంద్రుడు;
2.74.20.
అనుష్టుప్.
తాం దృష్ట్వా శోకసంతప్తామ్
వజ్రపాణిర్యశస్వినీమ్।
ఇంద్ర ప్రాంజలిరుద్విగ్నః
సురరాజోఽబ్రవీద్వచః॥
టీక:
తాం = దినిని; దృష్ట్వా = చూచి; శోకసంతప్తామ్ = శోకముతో దుఃఖించుచు; వజ్రపాణిః = చేతిలో వజ్రాయుధమును కలిగినవాడు, ఇంద్రుడు; యశస్వినీమ్ = యశస్సు కలిగినవాడు ; ఇంద్ర = ఇంద్రుడు; ప్రాంజలిః = జోడించిన చేతులు గలవాడు ; ఉద్విగ్నః = దిగులు చెంది; సురరాజః = దేవతలకు ప్రభువు; అబ్రవీత్ = పలికెను; వచః = మాటలను.
భావం:-
చేతిలో వజ్రాయుధము కలిగి ఉన్న ఇంద్రుడు యశస్సురాలైన కామధేనువు శోకసంతప్తురాలగుటను చూచి దిగులు చెంది, నమస్కరించుచు ఇట్లు పలికెను.
2.74.21.
అనుష్టుప్.
“భయం కచ్ఛిన్న చాస్మాసు
కుతశ్చిద్విద్యతే మహత్।
కుతోనిమత్తశ్శోకస్తే
బ్రూహి సర్వహితైషిణి!”॥
టీక:
భయం = భయము; కచ్ఛిత్ = ఎవ్వరి నుండి; న = లేదు; అస్మాసు = మాకు; కుతోచిత్ = కుతః + చిత్, ఎక్కడ నుండి; విద్యతే = కలుగుట; మహత్ = గొప్ప; కుతో నిమత్తః = ఎవ్వరి కారణంగానైనా; శోకః = శోకము; తే = నీ యొక్క; బ్రూహి = చెప్పుము; సర్వహితైషిణి = అందరి హితమును కోరుదానా
భావం:-
అందరి హితమును కోరుదానా! మాకు ఎవ్వరి నుండియు పెద్ద భయము వచ్చుట లేదు కదా! నీ శోకమునకు కారణమేమో చెప్పుము.”
2.74.22.
అనుష్టుప్.
ఏవముక్తా తు సురభిః
సురరాజేన ధీమతా।
ప్రత్యువాచ తతో ధీరా
వాక్యం వాక్యవిశారదా॥
టీక:
ఏవమ్ = ఆ; ఉక్తా తు = పలుకబడిన; సురభిః = కామధేనువు; సురరాజేన = సురరాజుయొక్క; ధీమతా = ధీమంతుడైన; ప్రత్యువాచ = సమాధానమిచ్చెను; తతః = అప్పుడు; ధీరా = వివేకము గల; వాక్యం = మాటలను; వాక్యవిశారదా = మాటలలో నేర్పరిౖయెన
భావం:-
ధీమంతుడైన ఆ సురరాజు మాటలు విని, ధైర్యవంతురాలైన ఆ కామధేనువు.. మాటలలో నేర్పరియైన అతనితో ఇట్లు పలికెను.
2.74.23.
అనుష్టుప్.
“శాంతం పాపం న వః కించిత్
కుతశ్చిదమరాధిపః!।
అహం మగ్నౌ తు శోచామి
స్వపుత్రౌ విషమే స్థితౌ॥
టీక:
శాంతం = శమించుగాక; పాపం = పాపము; న = లేదు; వః = మీకు; కించిత్ = కొంచెము కూడా; కుతశ్చిత్ = ఎక్కడి నుండి; అమరాధిపః = దేవేంద్రా; అహం = నేను; మగ్నౌ తు = కష్టములో మునిగి ఉన్న; శోచామి = ఏడ్చుచున్నాను; స్వపుత్రౌ = నా పుత్రులు; విషమే = కష్టములో; స్థితౌ = ఉన్నవి
భావం:-
“పాపము శమించుగాక! ఇంద్రా! మీకు ఎక్కడి నుండియు ఏ భయము లేదు. నా పుత్రులైన ఈ వృషభములు కష్టములో ఉన్నవి.
2.74.24.
అనుష్టుప్.
ఏతౌ దృష్ట్వా కృశౌ దీనౌ
సూర్యరశ్మిప్రతాపితౌ।
అర్థ్యమానౌ బలీవర్ధౌ
కర్షకేణ సురాధిప!॥
టీక:
ఏతౌ = వీటిని; దృష్ట్వా = చూచి; కృశౌ = కృశించి; దీనౌ = దీనముగా; సూర్యరశ్మి = సూర్య కిరణముల; ప్రతాపితౌ = తీవ్రత చేత; అర్థ్యమానౌ = కష్టపడుచున్న; బలీవర్ధౌ = ఈ జంట ఎద్దులు; కర్షకేణ = రైతు చేత; సురాధిప = దేవేంద్రా
భావం:-
కృశించి ఎండకు బాధపడుచున్న ఈ ఎద్దులజంటను ఈ రైతు ఇంకను పీడించుచున్నాడు. దుఃఖమగ్నులైన వీటిని చూచుటచే నాకు దుఃఖము కలిగినది.
2.74.25.
అనుష్టుప్.
మమకాయాత్ప్రసూతౌ హి
దుఃఖితౌ భారపీడితౌ।
యౌ దృష్ట్వా పరితప్యేఽహమ్
నాస్తి పుత్రసమః ప్రియః॥
టీక:
మమ = నా యొక్క; కాయాత్ = శరీరము నుండి; ప్రసూతౌ = పుట్టినవి; హి = కదా; దుఃఖితౌ = దుఃఖించుచున్న; భారపీడితౌ = భారము మోయలేక; యౌ = వాటిని; దృష్ట్వా = చూచి; పరితప్య = బాధపడుచుంటిని; అహమ్ = నేను; నాస్తి = ఉండడు కదా; పుత్రసమః = పుత్రునితో సమానుడైన; ప్రియః = ప్రియమైనవాడు.
భావం:-
భారము మోయలేక దుఃఖించుచున్న ఈ ఎద్దులు నా శరీరమునుండి పుట్టినవి. అందుచేతనే వాటి దుఃఖమును చూచి నాకు దుఃఖము కలిగినది. పుత్రునితో సమానుడైన ప్రియమైనవాడు ఉండడు కదా.
2.74.26.
అనుష్టుప్.
యస్యాః పుత్రసహస్రైస్తు
కృత్స్నం వ్యాప్తమిదం జగత్।
తాం దృష్ట్వా రుదతీం శక్రో
న సుతాన్మన్యతే పరమ్॥
టీక:
యస్యాః = ఎవని యొక్క; పుత్ర = కుమారులు; సహస్త్రై = వేల కొలది; అస్తు = ఉన్నను; కృత్స్నమ్ = సంపూర్ణముగా; వ్యాప్తమ్ = వ్యాపించి; ఇదం = ఈ; జగత్ = ప్రపంచమంతటను; తాం = వాటిని; దృష్ట్వా = చూచి; రుదతీం = ఏడ్చుట; శక్రః = ఇంద్రుడు; న = లేదు; సుతాన్ = సుతులకై; మన్యతే = భావించెను; పరమ్ = ఇతరులెవ్వరును.
భావం:-
వేలకొలది కామధేను పుత్రులు ఈ ప్రపంచమునందు అంతటను వ్యాపించి ఉన్నారు. అట్టి కామధేనువు కూడ ఇద్దఱు పుత్రులకై ఏడ్చుట చూచి దేవేంద్రుడు, ‘పుత్రుని మించిన ప్రియమైన వారెవ్వరును లేరు కదా’ అని నిర్ణయించుకొనెను.
2.74.27.
అనుష్టుప్.
సదాఽప్రతిమవృత్తాయాః
లోకధారణకామ్యయా।
శ్రీమత్యా గుణనిత్యాయాః
స్వభావపరిచేష్టయా॥
టీక:
సదా = నిత్యము; అప్రతిమ = సాటిలేని; వృత్తాయాః = విధముగా; లోకధారణ = లోకములను నిలుపవలెనను; కామ్యయా = కోరికచే; శ్రీమత్యా = పూజనీయమైనది; గుణనిత్యాయాః = సద్గుణములకు నిలయమైనది; స్వభావ = స్వభావము చేతనే; పరిచేష్టయా = ప్రవర్తించుచుండును
భావం:=
ఈ లోకములను నిలుపవలెననే కోరికతో కామధేనువు సర్వదా సాటిలేని విధముగా ప్రవర్తించుచుండును. స్వభావము చేతనే ఎల్లప్పుడును సకల సద్గుణములకు నిలయమైనది, సకలైశ్వర్య సంపన్నురాలు,
2.74.28.
అనుష్టుప్.
యస్యాః పుత్రసహస్రాణి
సాఽపి శోచతి కామధుక్।
కిం పునర్యా? వినా రామమ్
కౌసల్యా వర్తయిష్యతి॥
టీక:
యస్యాః = ఎవరికైతే; పుత్రసహస్రాణి = వేలకొలది పుత్రుల పరంపర ఉన్నదో; సా = ఆ; అపి = కూడా; శోచతి = దుఃఖించుచున్నది; కామధుక్ = కామధేనువే; కిం పునః = ఎంత ఎక్కువ; యా = బహుశ ; వినా = లేకుండా; రామమ్ = రాముడు; కౌసల్యా = కౌసల్య; వర్తయిష్యతి = జీవించవలసిన
భావం:-
వేలకొలది పుత్రుల పరంపర గల అట్టి కామధేనువే ఈ విధముగ తన సంతానములో రెండు వృషభముల కొరకై దుఃఖించుచున్నది కదా, ఏకైక పుత్రుడైన రామునకు దూరమై జీవింపవలసిన కౌసల్య ఆ రామునకై ఎంత దుఃఖించునో చెప్పవలెనా?
2.74.29.
అనుష్టుప్.
ఏకపుత్రా చ సాధ్వీ చ
వివత్సేయం త్వయా కృతా।
తస్మాత్త్వం సతతం దుఃఖమ్
ప్రేత్య చేహ చ లప్స్యసే॥
టీక:
ఏకపుత్రా = ఒకే ఒక్క కుమారుడు కలిగిన; చ = ఇంకను; సాధ్వీ = సాధ్వీమణి అయిన; చ = ఇంకను; వివిత్సా = కుమారుడు లేకుండా; ఇయం = ఈమె; త్వయా = నీ చేత; కృతా = చేయబడిన; తస్మాత్ = అందువలన; త్వం = నీవు; సతతం = ఎల్లప్పుడు; దుఃఖమ్ = దుఃఖమును; ప్రేత్య = పరలోకము నందును; చ = ఇంకను; ఇహ = ఇహలోకమునందును; చ = ఇంకను; లప్స్యసే = పొందగలవు.
భావం:-
ఒకే కుమారుడు గల ఈ పరమసాధ్విని నీవు కుమారునకు దూరము చేసినావు. అందుచే ఇహలోకమునందు, మరణానంతరము కూడ నీకు ఎల్లప్పుడు దుఃఖము తప్పదు.
2.74.30.
అనుష్టుప్.
అహం హ్యపచితిం భ్రాతుః
పితుశ్చ సకలామిమామ్।
వర్ధనం యశసశ్చాపి
కరిష్యామి న సంశయః॥
టీక:
అహం హి = నేను; హి = కదా; అపచితిం = ప్రాయశ్చిత్తముగా; భ్రాతుః = నా సోదరుని విషయమిన; పితుః = నా తండ్రి విషయమున; చ = ఇంకను; సకలామ్ = పూర్తిగా; ఇమామ్ = ఇందుకోసము; వర్ధనం = పెంచుకొనెదను; యశసః = యశస్సును; చ = కూడా; అపి = మఱియు; కరిష్యామి = చేసెదను; న = లేదు; సంశయః = సంశయము.
భావం:-
నా సోదరుని విషయమునందు, నా తండ్రి విషయమునందు జరిగిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా చేయవలసినదంతయు చేసి నేను కీర్తిని కూడ పెంచుకొనెదను. సంశయము లేదు.
2.74.31.
అనుష్టుప్.
అనాయయిత్వా తనయమ్
కౌసల్యాయా మహాబలమ్।
స్వయమేవ ప్రవేక్ష్యామి
వనం మునినిషేవితమ్॥
టీక:
అనాయయిత్వా = వెనుకకు రప్పించుటకు; తనయమ్ = కుమారుని; కౌసల్యాయా = కౌసల్యకు; మహాబలమ్ = మహాబలశాలిౖయెన; స్వయమేవ = నేనే స్వయముగా; ప్రవేక్ష్యామి = ప్రవేశ్చగలను; వనం = వనమునకు; మునిః = మునులకు; నిషేవితమ్ = నివాసమైనది.
భావం:-
మహాబలశాలియైన కౌసల్యాదేవీ పుత్రుడు రాముని అరణ్యము నుండి వెనుకకు రప్పించుటకు, నేనే ముని నివాసమైన అరణ్యమునకు పోయెదను.
2.74.32.
అనుష్టుప్.
న హ్యహం పాపసంకల్పే!
పాపే! పాపం త్వయా కృతమ్।
శక్తో ధారయితుం పౌరైః
అశ్రుకంఠై ర్నిరీక్షితః॥
టీక:
న = లేదు; హి = నిశ్చయముగా; చ = మఱి; అహం = నేను; పాపసంకల్పే = పాపములు చేసే సంకల్పం కలిగినదానా; పాపే = ఓ పాపాత్మురాలా; పాపం = పాపమును; త్వయా కృతమ్ = నీచే చేయబడిన; శక్తః = శక్తి కలిగి ఉండుట; ధారయితుం = మోయుటకు; పౌరైః = పౌరులందరూ; అశ్రుకణ్ఠైః = దుఃఖమును మ్రింగి; నిరీక్షితః = చూచుచుండగా.
భావం:-
పాపీ! పాపాత్మురాలా! పౌరులందరు దుఃఖమును దిగమ్రింగుకొని చూచుచుండగా, నీవు చేసిన పాపమును మోయజాలను.
2.74.33.
అనుష్టుప్.
సా త్వమగ్నిం ప్రవిశ వా
స్వయం వా దండకాన్విశ।
రజ్జుం బధాన వా కంఠే
న హి తేఽన్యత్పరాయణమ్॥
టీక:
సా = అటువంటి; త్వమ్ = నీవు; అగ్నిం = అగ్నిలోనికి; ప్రవిశ = ప్రవేశించుము; వా = లేదా; స్వయం = స్వయముగా; వా = లేదా; దండకాన్ = దండకారణ్యమునకు; విశ = వెళ్లుము; రజ్జుం = తాడును; బధాన = బంధించి; వా = లేదా; కంఠే = కంఠమునకు; నహి = లేనేలేదు; తే = నీకు; అన్యత్ = వేరొక; పరాయణమ్ = గతి
భావం:-
నీవు అగ్నిలోనైనను దూకుము. నీవే ఆ దండకారణ్యమునకు వెళ్ళుము.. లేదా ఉరి పోసుకొనుము. మరేగతీ లేదు.
2.74.34.
అనుష్టుప్.
అహమప్యవనీం ప్రాప్తే
రామే సత్యపరాక్రమే।
కృతకృత్యో భవిష్యామి
విప్రవాసితకల్మషః॥
టీక:
అహమ్ = నేను; అపి = కూడ; అవనీం = రాజ్యమును; ప్రాప్తే = స్వీకరించిన పిమ్మట; రామే = రాముడు; సత్యపరాక్రమే = సత్య పరాక్రముడైన; కృతకృత్యః = కృతకృత్యుడను; భవిష్యామి = అయ్యెదను; విప్రవాసిత = పూర్తిగా తొలగిపోయిన; కల్మషః = పాపముకలవాడను.
భావం:-
సత్యపరాక్రముడైన రాముడు రాజ్యమును స్వీకరించిన పిమ్మట నేను కూడ నా పాపమంతయు తొలగిపోవుటచే కృతకృత్యుడను అయ్యెదను.
2.74.35.
అనుష్టుప్.
ఇతి నాగ ఇవారణ్యే
తోమరాంకుశచోదితః।
పపాత భువి సంకృద్ధో
నిశ్శ్వసన్నివ పన్నగః॥
టీక:
ఇతి = ఈ విధముగా; నాగ ఇవ = ఏనుగు వలె; అరణ్యే = అరణ్యములో; తోమర = తోమరముల చేత; అంకుశ = అంకుశములచేత; చోదితః = పొడవబడినది; పపాత = పడెను; భువి = నేల మీద; సంకృద్ధో = కోపించినవాడై; నిశ్శ్వసత్ = నిట్టూర్చుచు; ఇవ = వలె; పన్నగః = సర్పము
భావం:-
అరణ్యములో తోమరముల చేతను, అంకుశముల చేతను పొడవబడిన ఏనుగు వలె ఈ విధముగ చాల కోపించినవాడై, భరతుడు సర్పము వలె నిట్టూర్చుచు నేలపై పడెను.
2.74.36.
జగతి.
సంరక్తనేత్రశ్శిథిలామ్భరస్తదా
విధూతసర్వాభరణః పరంతపః।
బభూవ భూమౌ పతితో నృపాత్మజః
శచీపతేః కేతురివోత్సవక్షయే॥
టీక:
సంరక్త = ఎఱ్ఱబడిన; నేత్రః = కండ్లు; శిథిల + అంబరః = నలిగిపోయిన; అంబరః = వస్త్రములు కలవాడై; తదా = అప్పుడు; విధూత = చెల్లాచెదురుగా; సర్వ = అన్ని; ఆభరణః = అలంకారములుకలవాడై; పరంతపః = శత్రువులను తపింపజేయు వాడు; బభూవ = ఉండెను; భూమౌ = నేలమీద; పతితః = పడి ఉన్నవాడు; నృపాత్మజః = రాజకుమారుడు (భరతుడు); శచీపతేః = శచీదేవి భర్త ఐన ఇంద్రుని; కేతుః = వలె; ఇవ = వలె; ఉత్సవ = ఉత్సవము; క్షయే = అనంతరమునందు
భావం:-
కండ్లు ఎఱ్ఱబడి, వస్త్రములు నలిగిపోయి, అలంకారములన్నియు చెల్లాచెదురై, నేలపై పడి ఉన్న పరంతపుడైన ఆ భరతుడు, ఇంద్ర ధ్వజోత్సవానంతమునందు నేలపై పడిన ఇంద్రధ్వజము వలె ఉండెను.
2.74.37.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే చతుస్సప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; చతుస్సప్తతితమ [74] = డెబ్బైనాలుగవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [74] డెబ్బైనాలుగువ సర్గ సంపూర్ణము.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే చతుస్సప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; చతుస్సప్తతితమ [74] = డెబ్బైనాలుగవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [74] డెబ్బైనాలుగువ సర్గ సంపూర్ణము.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే చతుస్సప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; చతుస్సప్తతితమ [74] = డెబ్బైనాలుగవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [74] డెబ్బైనాలుగువ సర్గ సంపూర్ణము.
2.75.1.
అనుష్టుప్.
దీర్ఘకాలాత్సముత్థాయ
సంజ్ఞాం లబ్ధ్వా చ వీర్యవాన్।
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామ్
దీనాముద్వీక్ష్య మాతరమ్॥
టీక:
దీర్ఘకాలాత్ = చాలాసేపటికి; సముత్థాయ = లేచి; సంజ్ఞాం = స్పృహ; లబ్ధ్వా = పొంది; వీర్యవాన్ = బలశాలి; నేత్రాభ్యామ్ = రెండుకళ్ళతో; అశ్రుపూర్ణాభ్యామ్ = కన్నీటితో నిండిన; దీనామ్ = దీనురాలైన; ఉద్వీక్ష్య = చూచి; మాతరమ్ = తల్లిని.
భావం:-
పరాక్రమవంతుడైన భరతుడు చాలాసేపటికి తిరిగి స్పృహవచ్చి తేరుకొని లేచి కన్నీరు నిండిన కళ్ళతో దీనురాలైన కౌసల్యను చూచెను.
2.75.2.
అనుష్టుప్.
సోఽ మాత్యమధ్యే భరతో
జననీమభ్యకుత్సయత్।
రాజ్యం న కామయే జాతు
మంత్రయే నాపి మాతరమ్॥
టీక:
సః = ఆ; అమాత్యమధ్యే = మంత్రుల మధ్యన; భరతః = భరతుడు; జననీమ్ = తల్లిని; అభ్యకుత్సయత్ = నిందించెను; రాజ్యం = రాజ్యమును; న = లేదు; కామయే = కోరుట; జాతు = ఎన్నడును; మంత్రయే = ఆలోచన; న = లేదు; అపి = కూడ; మాతరమ్ = తల్లిని.
భావం:-
భరతుడు మంత్రుల ఎదుట తన తల్లిని ఇట్లు నిందించెను. “నేనెన్నడును రాజ్యమును కాంక్షించలేదు. ఈ విషయమై మా తల్లితో ఎన్నడును ఆలోచన కూడ చేయలేదు.
2.75.3.
అనుష్టుప్.
అభిషేకం న జానామి
యోఽ భూద్రాజ్ఞా సమీక్షితః।
విప్రకృష్టేహ్యహం దేశే
శత్రుఘ్నసహితోఽ వసమ్॥
టీక:
అభిషేకం = అభిషేకమును; న = లేదు; జానామి = ఎరుగుట; యః = ఏమి; అభూత్ = అయ్యెనో; రాజ్ఞా = రాజుచే; సమీక్షితః = చూడబడినది; విప్రకృష్టే = దూరముగానున్న; హి = కదా; అహం = నేను; దేశే = దేశమునందు; శత్రుఘ్నసహితః = శత్రుఘ్నునితో కూడి; ఆవసమ్ = ఉంటిని.
భావం:-
రాజు నాకు రాజ్యమిచ్చుటకు అంగీకరించిన విషయము కూడా నేను ఎరుగను. నేను శత్రుఘ్నునితో కూడి దూరముగా నున్న దేశములో ఉంటిని కదా.
2.75.4.
అనుష్టుప్.
వనవాసం న జానామి
రామస్యాహం మహాత్మనః।
వివాసనం వా సౌమిత్రేః
సీతాయాశ్చ యథాఽ భవత్॥
టీక:
వనవాసం = వనవాసమును గూర్చి; న = లేదు; జానామి = ఎరుగుట; రామస్య = రామునియొక్క; అహం = నేను; మహాత్మనః = మహాత్ముడైన; వివాసనం = దూరముగా పంపి వేయుట; వా = లేక; సౌమిత్రేః = లక్ష్మణునియొక్క; సీతాయాశ్చ = సీతయొక్క; యథా = ఎట్లు; అభవత్ = అయ్యెనో.
భావం:-
మహాత్ముడైన రాముడు వనవాసమునకు వెళ్ళినట్లు గాని, సీతా లక్ష్మణులు అరణ్యమునకు వెళ్ళుట గాని నేను ఎరుగను. అది ఎట్లు జరిగెనో.”
2.75.5.
అనుష్టుప్.
తథైవ క్రోశతస్తస్య
భరతస్య మహాత్మనః।
కౌసల్యా శబ్దమాజ్ఞాయ
సుమిత్రామిదమబ్రవీత్॥
టీక:
తథైవ = ఆ విధముగ; క్రోశతః = విలపించుచున్న; తస్య = ఆ; భరతస్య = భరతునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన; కౌసల్యా = కౌసల్య; శబ్దమ్ = శబ్దమును; ఆజ్ఞాయ = గ్రహించి; సుమిత్రామ్ = సుమిత్రనుగూర్చి; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను.
భావం:-
మహాత్ముడైన భరతుడు ఈ విధముగా విలపించుచుండగ, కౌసల్య అతని కంఠధ్వనిని గ్రహించి సుమిత్రతో ఇట్లు పలికెను.
2.75.6.
అనుష్టుప్.
“ఆగతః క్రూరకార్యాయాః
కైకేయ్యా భరతస్సుతః।
తమహం ద్రష్టుమిచ్ఛామి
భరతం దీర్ఘదర్శినమ్”॥
టీక:
ఆగతః = వచ్చినాడు; క్రూరకార్యాయాః = క్రూరమైన పని చేసిన; కైకేయ్యా = కైకేయియొక్క; భరతః = భరతుడు; సుతః = పుత్రుడు; తమ్ = అతనిని; అహం = నేను; ద్రష్టుమ్ = చూచుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; భరతం = భరతుని; దీర్ఘదర్శినమ్ = దూరాలోచన కలిగియున్న.
భావం:-
”క్రూరమైన పని చేసిన కైకేయి కుమారుడు భరతుడు వచ్చినాడు. దూరాలోచన గల ఆ భరతుని నేను చూడవలెనని కోరుచున్నాను”.
2.75.7.
అనుష్టుప్.
ఏవముక్త్వా సుమిత్రాం సా
వివర్ణా మలినా కృశా।
ప్రతస్థే భరతో యత్ర
వేపమానా విచేతనా॥
టీక:
ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; సుమిత్రాం = సుమిత్రను గూర్చి; సా = ఆ; వివర్ణా = పాలిపోయిన; మలినా = మలినముగా ఉన్న; కృశా = కృశించిపోయి; ప్రతస్థే = ప్రయాణమైనది; భరతః = భరతుడు; యత్ర = ఎక్కడ; వేపమానా = వణుకుచు; విచేతనా = చేష్టలుడిగి.
భావం:-
శరీరము పాలిపోయి, కళావిహీనమై, కృశించి ఉన్న ఆ కౌసల్య సుమిత్రతో ఇట్లు పలికి, వణికి పోవుచు, నిశ్చేష్టురాలై భరతుని యొద్దకు బయలుదేరెను.
2.75.8.
అనుష్టుప్.
స తు రామానుజశ్చాపి
శత్రుఘ్నసహితస్తదా।
ప్రతస్థే భరతో యత్ర
కౌసల్యాయా నివేశనమ్॥
టీక:
సః = ఆ; రామానుజః = రాముని తమ్ముడైన; అపి = ఐన; శత్రుఘ్నసహితః = శత్రుఘ్నునితో కూడి; తదా = అప్పుడు; ప్రతస్థే = ప్రయాణమయ్యెను; భరతః = భరతుడు; యత్ర = ఎక్కడ; కౌసల్యాయాః = కౌసల్య యొక్క; నివేశనమ్ = నివాసము.
భావం:-
అప్పుడు రాముని తమ్ముడైన భరతుడు శత్రుఘ్నునితో కూడి కౌసల్య నివాసమునకు బయలుదేరెను.
2.75.9.
అనుష్టుప్.
తతశ్శత్రుఘ్నభరతౌ
కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ।
పర్యష్వజేతాం దుఃఖార్తామ్
పతితాం నష్టచేతనామ్॥
టీక:
తతః = తరువాత; శత్రుఘ్నభరతౌ = భరత శత్రుఘ్నులు; కౌసల్యం = కౌసల్యను; ప్రేక్ష్య = చూచి; దుఃఖితౌ = దుఃఖించి; పర్యష్వజేతాం = కౌగలించుకొని; దుఃఖార్తామ్ = దుఃఖితురాలై ఉన్న; పతితాం = పడియున్న; నష్టచేతనామ్ = నిశ్చేష్టురాలై.
భావం:-
దుఃఖముతో నిశ్చేష్టురాలై పడియున్న కౌసల్యను భరతశత్రుఘ్నులు చూచి ఆమెను కౌగలించుకొనిరి.
2.75.10.
అనుష్టుప్.
రుదంతౌ రుదతీం దుఃఖాత్
సమేత్యార్యాం మనస్వినీమ్।
భరతం ప్రత్యువాచేదమ్
కౌసల్యా భృశదుఃఖితా॥
టీక:
రుదంతౌ = విలపించుచున్న వారిరువురు, రుదతీం = విలపించుచున్నది, దుఃఖాత్ = కష్టముగా, సమేత్య = దగ్గరకు చేరిన, ఆర్యాం = పూజనీయురాలు, మనస్వినీమ్ = మంచి మనసు కలిగియున్న, భరతం = భరతుని, ప్రతి = గూర్చి, ఉవాచ = పలికెను, ఇదమ్ = ఈ, కౌసల్యా = కౌసల్య, భృశదుఃఖితా = చాలా దుఃఖించుచు.
భావం:-
విలపించుచున్న వారిరువురు దుఃఖముతో విలపించుచున్న పూజనీయురాలు సహృదయురాలు ఐన కౌసల్య వద్దకు దగ్గరకుచేరిరి. దగ్గరకు వచ్చిన భరతునితో అత్యంతదుఃఖభారముతో నున్న కౌసల్యాదేవి ఇట్లు పలికెను.
2.75.11.
అనుష్టుప్.
“ఇదం తే రాజ్యకామస్య
రాజ్యం ప్రాప్తమకంటకమ్।
సంప్రాప్తం బత కైకేయ్యాః
శీఘ్రం క్రూరేణ కర్మణా॥
టీక:
ఇదం = ఈ; తే = నీకు; రాజ్యకామస్య = రాజ్యముపై ఆశ గల; రాజ్యం = రాజ్యము; ప్రాప్తమ్ = పొందబడినది; అకంటకమ్ = ఎదురులేని; సంప్రాప్తం = పొందబడినది; బత = ఏమి ఆశ్చర్యము; కైకేయ్యాః = కైకేయియొక్క; శీఘ్రం = వెంటనే; క్రూరేణ = క్రూరమైన; కర్మణా = కర్మచే.
భావం:-
“ఇదిగో రాజ్యముపై ఆశ కలిగిన నీకు ప్రతిబంధకములు ఏమి లేని రాజ్యము లభించినది కదా. కైకేయి చేసిన కుట్ర వలన చాల త్వరగా రాజ్యమును పొందితివి.
2.75.12.
అనుష్టుప్.
ప్రస్థాప్య చీరవసనమ్
పుత్రం మే వనవాసినమ్।
కైకేయీ కం గుణం తత్ర
పశ్యతి క్రూరదర్శినీ॥
టీక:
ప్రస్థాప్య = పంపివేసి; చీరవసనమ్ = నారచీరలు ధరింపజేసి; పుత్రం = పుత్రుని; మే = నా; వనవాసినమ్ = వనమునందు నివసించువానిగ; కైకేయీ = కైకేయి; కం = ఏమి; గుణం = గుణమును; తత్ర = అట్లు; పశ్యతి = చూచుచున్నదో; క్రూరదర్శినీ = క్రూరమైన పన్నాగముగల.
భావం:-
క్రూరమైన పన్నాగములను చేయగల కైకేయి, నా పుత్రుడు నారచీరలు ధరించి వనవాసమునకు పోవునట్లు చేసినది కదా. ఏమి ప్రయోజనమును ఆశించి అట్లు చేసినది?
2.75.13.
అనుష్టుప్.
క్షిప్రం మామపి కైకేయీ
ప్రస్థాపయితుమర్హతి।
హిరణ్యనాభో యత్రాస్తే
సుతో మే సుమహాయశాః!॥
టీక:
క్షిప్రం = శీఘ్రముగా; మామ్ = నన్ను; అపి = కూడ; కైకేయీ = కైకేయి; ప్రస్థాపయితుమ్ = పంపించివేయుటకు; అర్హతి = తగియున్నది; హిరణ్యనాభః = బంగారము లాంటి నాభి కలవాడు, హిరణ్యవస్త్పృహణీయ నాభియుక్తః, నాభిగ్రహణం శరీరస్యోపలక్షణం.(గో. చతుర్వేది వారి హిందీ ప్రతి); యత్ర = ఎక్కడ; అస్తే = ఉన్నాడో; సుతః = పుత్రుడు; మే = నా; సుమహాయశాః = గొప్ప కీర్తిమంతుడు.
భావం:-
గొప్ప కీర్తిమంతుడైన, నా కుమారుడు బంగారలాంటి నాభి కలవాడు నాభిగ్రహణం శరీరస్యోపలక్షణం. అతడు ఉన్నచోటికి కైకేయి నన్ను కూడా పంపించివేసిన బాగుండెడిది.
2.75.14.
అనుష్టుప్.
అథవా స్వయమేవాహమ్
సుమిత్రానుచరా సుఖమ్।
అగ్నిహోత్రం పురస్కృత్య
ప్రస్థాప్యే యత్ర రాఘవః॥
టీక:
అథవా = లేదా; స్వయమేవ = స్వయముగనే; అహమ్ = నేను; సుమిత్రానుచరా = సుమిత్ర వెంట ఉండిన దాననై; సుఖమ్ = సుఖముగ; అగ్నిహోత్రం = అగ్నిహోత్రమును; పురస్కృత్య = పురస్కరించుకొని; ప్రస్థాప్యే = వెళ్ళెదను; యత్ర = ఎక్కడ; రాఘవః = రాముడు.
భావం:-
లేదా నేనే స్వయముగా సుమిత్రను వెంటనిడుకొని సుళువుగా అగ్నిహోత్రము తీసుకుని రాముడు ఉన్నచోటికి సుఖముగ పోయెదను.
*గమనిక:-
అగ్నిహోత్రం పురస్కృత్య- “అగ్నిహోత్రంస్థాజ్యేష్ఠా భార్యాధీనత్వాత్ దశరథేన భరతసంస్కార ప్రతిధ్యావ్హేతిభాతః. (గో. చతుర్వేది వారి హిందీ ప్రతి).
2.75.15.
అనుష్టుప్.
కామం వా స్వయమేవాద్య
తత్ర మాం నేతుమర్హసి।
యత్రాసౌ పురుషవ్యాఘ్రః
పుత్రో మే తప్యతే తపః॥
టీక:
కామం = కోరిక ఉన్నచో; వా = లేదా; స్వయమేవ = నీవే స్వయముగ; అద్య = ఇప్పుడు; తత్ర = అక్కడికి; మాం = నన్ను; నేతుమ్ = తీసుకొనిపోవుటకు; అర్హసి = తగుదువు; యత్ర = ఎక్కడ; అసౌ = ఆ; పురుషవ్యాఘ్రః = పురుషశ్రేష్ఠుడు; పుత్రః = కుమారుడు; మే = నా; తప్యతే = చేయుచున్నాడో; తపః = తపస్సును.
భావం:-
లేదా కావలంటే నీవే స్వయముగా నన్ను ఇప్పుడే పురుషశ్రేష్ఠుడైన నా కుమారుడు ఎక్కడ తపస్సు చేయుచున్నాడో, అక్కడకు తీసుకొనిపొమ్ము.
2.75.16.
అనుష్టుప్.
ఇదం హి తవ విస్తీర్ణమ్
ధనధాన్యసమాచితమ్।
హస్త్వశ్వరథసంపూర్ణమ్
రాజ్యం నిర్యాతితం తయా”॥
టీక:
ఇదం = ఈ; హి = కదా; తవ = నీకు; విస్తీర్ణమ్ = విశాలమైనది; ధనధాన్యసమాచితమ్ = ధన ధాన్యములతో కూడినది; హస్త = ఏనుగులు; అశ్వ = గుఱ్ఱములు; రథ = రథములు; సంపూర్ణమ్ = నిండియున్నది; రాజ్యం = రాజ్యము; నిర్యాతితం = ఇప్పించబడినది; తయా = ఆమెచే.
భావం:-
ధనధాన్యములతో సమృద్ధిగా నిండియున్నది, ఏనుగులు, గుఱ్ఱములు, రథములతో కూడియున్నది ఐన ఈ విశాలమైన రాజ్యమును ఆమె నీకు ఇప్పించినది కదా.”
2.75.17.
అనుష్టుప్.
ఇత్యాదిబహుభిర్వాక్యైః
క్రూరైః సంభర్త్సితోఽనఘః।
వివ్యథే భరతస్తీవ్రమ్
వ్రణే తుద్యేవ సూచినా॥
టీక:
ఇత్యాది = ఇటువంటి; బహుభిః = అనేక; వాక్యైః = మాటలచే; క్రూరైః = క్రూరమైన; సంభర్త్సితః = నిందింపబడినవాడై; అనఘః = పాపము చేయనివాడై; వివ్యథే = వ్యథ చెందెను; భరతః = భరతుడు; తీవ్రమ్ = చాలా ఎక్కువగా ; వ్రణే = గాయముపై; తుద్యేవ = గుచ్చినట్లు; సూచినా = సూదితో.
భావం:-
ఏ పాపము ఎరుగని భరతుడు, గాయముపై సూదితో గుచ్చినట్లున్న అనేకమైన క్రూరమైన మాటలతో నిందింపబడి చాలా వ్యథ చెందెను.
2.75.18.
అనుష్టుప్.
పపాత చరణౌ తస్యాః
తదా సంభ్రాంతచేతనః।
విలప్య బహుధాఽసంజ్ఞో
లబ్దసంజ్ఞస్తతః స్థితః॥
టీక:
పపాత = పడెను; చరణౌ = పాదములపై; తస్యాః = ఆమెయొక్క; తదా = అప్పుడు; సంభ్రాంతచేతనః = మతిభ్రమణము కలిగినవాడై; విలప్య = విలపించి; బహుధా = అనేక విధములుగ; అసంజ్ఞః = అచేతనుడై; లబ్దసంజ్ఞః = స్పృహ కలిగి; తతః = తరువాత; స్థితః = ఉండెను.
భావం:-
అటువంటి మాటలు వినినంతనే భరతుడు తల తిరిగిపోయి ఆమె పాదములపై పడి అనేక విధములుగా విలపించి స్పృహ కోల్పోయెను. కొంతసేపటికి తేరుకొని అట్లే ఉండిపోయెను.
2.75.19.
అనుష్టుప్.
ఏవం విలపమానాం తామ్
భరతః ప్రాంజలి స్తదా।
కౌసల్యాం ప్రత్యువాచేదమ్
శోకైర్బహుభిరావృతామ్॥
టీక:
ఏవం = ఇట్లు; విలపమానాం = విలపించుచున్న; తామ్ = ఆ; భరతః = భరతుడు; ప్రాంజలిః = కట్టబడిన దోసిలి గలవాడై; తదా = అప్పుడు; కౌసల్యాం = కౌసల్యనుగూర్చి; ప్రత్యువాచ = బదులు పలికెను; ఇదమ్ = ఈ; శోకైః = శోకముతో; బహుభిః = అనేక విధమైన; ఆవృతామ్ = కూడి.
భావం:-
అనేక విధములుగ విలపించినవాడైన భరతుడు, ముకుళించిన హస్తములతో నమస్కరించి కౌసల్యతో ఇట్లు పలికెను.
2.75.20.
అనుష్టుప్.
“ఆర్యే! కస్మాదజానంతమ్
గర్హసే మామకిల్భిషమ్।
విపులాం చ మమ ప్రీతిమ్
స్థిరాం జానాసి రాఘవే॥
టీక:
ఆర్యే = ఓ ఆర్యురాలా; కస్మాత్ = ఎందువలన; అజానంతమ్ = ఏమీ ఎరుగని; గర్హసే = నింద చేయుచున్నావు; మామ్ = నన్ను; అకిల్భిషమ్ = పాపము లేని; విపులాం = అధికమైన; మమ = నా; ప్రీతిమ్ = ప్రేమను; స్థిరాం = స్థిరమైన; జానాసి = ఎరుగుదువు; రాఘవే = రాముని యందు.
భావం:-
“ఆర్యురాలా! ఏ పాపము ఎరుగని నన్ను ఈ విధముగా ఎందుకు నిందించుచున్నావు. నాకు రామునిపై, ఎంత స్థిరమైన ప్రేమ ఉన్నదో నీకు తెలియును కదా.
2.75.21.
అనుష్టుప్.
కృతా శాస్త్రానుగా బుద్ధిః
మాభూత్తస్య కదాచన।
సత్యసంథస్సతాం శ్రేష్ఠో
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
కృతా = చేయబడిన; శాస్త్రానుగా = శాస్త్రానుసారముగ; బుద్ధిః = బుద్ధి; మాభూత్ = కాకుండు గాక; తస్య = అట్టివాని; కదాచన = ఎప్పుడును; సత్యసంథః = సత్యసంధుడు; సతాం = సత్పురుషులలో; శ్రేష్ఠః = గొప్పవాడు; యస్య = ఎవరి; ఆర్యః = అన్న; అనుమతే = అంగీకారమునందు; గతః = వెళ్ళిపోయెనో.
భావం:-
సత్యసంధుడు, సత్పురుషులలో శ్రేష్ఠుడును ఐన మా అన్నగారు ఎవరి అనుమతితో వనవాసమునకు వెళ్ళినాడో, వారికి శాస్త్రసమ్మతమైన బుద్ధి లేకుండెనేమొ.
2.75.22.
అనుష్టుప్.
ప్రేష్యం పాపీయసాం యాతు
సూర్యంచ ప్రతిమేహతు।
హంతు పాదేన గాం సుప్తామ్
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
ప్రేష్యం = సేవను; పాపీయసాం = పాపాత్ములకు; యాతు = పొందుగాక; సూర్యంచప్రతి = సూర్యునకు ఎదురుగ; మేహతు = మలమూత్రములు విసర్జన చేయుగాక ; హంతు = తన్నుగాక; పాదేన = కాలితో; గాం = ఆవును; సుప్తామ్ = నిదురించుచున్న; యస్య = ఎవ్వని; ఆర్యః = పూజనీయుడైన అన్నగారు; అనుమతే = సమ్మతితో; గతః = వెళ్ళినాడో.
భావం:-
పూజనీయుడైన మా అన్నగారు అరణ్యమునకు పోవుట నాకు సమ్మతమే ఐనచో, పాపాత్ములకు సేవ చేసిన పాపము, సూర్యునికి ఎదురుగ మలమూత్ర విసర్జన చేసిన పాపము, నిదురించుచున్న ఆవును తన్నిన పాపము నాకు కలుగుగాక.
2.75.23.
అనుష్టుప్.
కారయిత్వా మహత్కర్మ
భర్తా భృత్యమనర్థకమ్।
అధర్మో యోఽ స్య సోఽ స్యాస్తు
యస్యాఽ ర్యోఽ నుమతేగతః॥
టీక:
కారయిత్వా = చేయించి; మహత్కర్మ = గొప్ప కార్యము; భర్తా = ప్రభువు; భృత్యమ్ = సేవకుని; అనర్థకమ్ = ఉచితముగ; అధర్మః = అధర్మము; యః = ఏ; అస్య = అతనికి; సః = అది; అస్తు = ఉండుగాక; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = సమ్మతితో; గతః = వెళ్ళినాడో.
భావం:-
మా అన్నగారు నా సమ్మతి ప్రకారమే వనవాసమునకు పోయినచో, ఒక యజమాని తన సేవకునిచే పనిచేయించుకుని, అతనికి ఏ విధమైన ధనమును ఇవ్వనిచో, వానికి ఎంత పాపము కలుగునో అంతటి పాపము నాకు కలుగును గాక.
2.75.24.
అనుష్టుప్.
పరిపాలయమానస్య
రాజ్ఞో భూతాని పుత్రవత్।
తతస్ను ద్రుహ్యతాం పాపమ్
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
పరిపాలయమానస్య = పాలించుచుండగ; రాజ్ఞః = రాజు; భూతాని = ప్రజలను; పుత్రవత్ = పుత్రులవలె; తతః = అతని; తు = విషయమున; ద్రుహ్యతాం = ద్రోహం చేయుచున్నవారికి; పాపమ్ = పాపము; యస్య = ఎవ్వని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
ప్రజలను కన్నబిడ్డలవలె గ్రహించి పరిపాలిస్తున్న ప్రభువునకు ద్రోహము చేసినంత పాపము, అన్నగారు వెళ్ళుటకు అనుమతిచ్చిన వారిక కలుగుగాక.
2.75.25.
అనుష్టుప్.
బలిషడ్భాగముద్ధృత్య
నృపస్యారక్షతః ప్రజాః।
అధర్మో యోఽ స్య సోఽ స్యాస్తు
యస్యార్థోఽ నుమతే గతః॥
టీక:
బలిషడ్భాగమ్ = ఆరవ భాగమైన ఆదాయపుపన్ను; ఉద్ధృత్య = తీసుకొని; నృపస్య = రాజు యొక్క; అరక్షతః = పరిపాలన చేయకుండుట; ప్రజాః = ప్రజలను; అధర్మః = అధర్మము; యః = ఏ; అస్య = అతని; సః = అది; అస్యః = ఈతని; అస్తు = ఉండుగాక; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = సమ్మతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
అన్నగారు వనవాసమునకు వెళ్ళుటయందు నా సమ్మతియే ఉన్నచో, ప్రజలనుండి ఆదాయపు పన్ను (ఆరవవంతు) తీసుకొని, పరిపాలన సరిగా చేయని ఆ రాజునకు ఎట్టి పాపము కలుగునో అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.26.
అనుష్టుప్.
సంశ్రుత్య చ తపస్విభ్యః
సత్రే వై యజ్ఞదక్షిణామ్।
తాం విప్రలపతాం పాపమ్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
సంశ్రుత్య = శపథము చేసి; తపస్విభ్యః = మునులకు; సత్రే = యజ్ఞమునందు; యజ్ఞదక్షిణామ్ = యజ్ఞ కార్యమునందు ఇవ్వవలసిన దక్షిణ; తాం = దానిని గూర్చి; విప్రలపతాం = బొంకెడివారికి కలిగెడి; పాపమ్ = పాపము; యస్య = ఎవని; ఆర్యః = ఆర్యుడు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా సమ్మతితోనే వనవాసమునకు వెళ్ళినట్లైనచో, యజ్ఞము చేయునప్పుడు మునులకు ఈయవలసిన దక్షిణ విషయమునందు అబద్ధములాడినచో ఎటువంటి పాపము కలుగునో అటువంటి పాపము నాకు కలుగును గాక.
2.75.27.
అనుష్టుప్.
హస్త్యశ్వరథసంభాధే
యుద్ధే శస్త్రసమాకులే।
మా స్మ కార్షీత్సతాం ధర్మమ్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
హస్తిః = ఏనుగులు; అశ్వః = గుఱ్ఱములు; రథః = రథములతో; సంభాధే = ఇరుకుగా నిండిన; యుద్ధే = యుద్ధమునందు; శస్త్రః = శస్త్రములు; సమాకులే = సమృద్దిగా ఉన్ననూ; మా = వద్దు; స్మ = అంటాడో; కార్షీత్ = చేయుట; సతాం = సత్పురుషుల యొక్క; ధర్మమ్ = ధర్మమును; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అడవికి వెళ్లినచో, చతురంగబలాన్విత మైన యుద్ధభూమిలో, శస్త్రాలు సమృద్దిగా ఉండిననూ శూరుల ధర్మము పాటించక వెన్నిచ్చి పారిపోవువానికి కలుగు పాపము నాకు కలుగుగాక.
2.75.28.
అనుష్టుప్.
ఉపదిష్టం సుసూక్ష్మార్థమ్
శాస్త్రం యత్నేన ధీమతా।
స నాశయతు దుష్టాత్మా
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
ఉపదిష్టం = ఉపదేశించబడిన; సుసూక్ష్మార్థమ్ = అంతరార్థమును; శాస్త్రం = శాస్త్రమును; యత్నేన = ప్రయత్న పూర్వకముగ; ధీమతా = బుద్ధిశాలియైన; సః = ఆ; నాశయతు = నశింపజేయు; దుష్టాత్మా = దుష్టాత్ముడు; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా ప్రమేయమువలననే అరణ్యమునకు వెళ్ళినచో, బుద్ధిశాలియైన గురువు కష్టపడి ఉపదేశించిన శాస్త్రము నందలి సూక్ష్మ విషయములను విస్మరించిన వానికి కలుగు పాపము దుష్టాత్ముడనైన నాకు కలుగును గాక.
2.75.29.
అనుష్టుప్.
మా చ తం వ్యూఢబాహ్వంసమ్
చంద్రార్కసమతేజసమ్।
ద్రాక్షీద్రాజ్యస్థమాసీనమ్
యస్యార్యోఽ నుమతేగతః॥
టీక:
మా = కూడదు; తం = ఆ; వ్యూఢబాహ్వంసమ్ = బలమైన భుజములు కలవాడు; చంద్రార్కసమతేజసమ్ = సూర్యచంద్రులతో సమానమైన తేజస్సు కలవాడు; ద్రాక్షీత్ = చూచుట; రాజ్యస్థమ్ = రాజ్య పరిపాలనలో; ఆసీనమ్ = సింహాసనంపై కూర్చుని ఉన్న; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అరణ్యమునకు నా సమ్మతితోనే వెళ్ళినచో, బలమైన భుజస్కంధములు కలిగిన వాడును, సూర్యచంద్రులతో సమానమైన తేజస్సు కలవాడును, రాజ్య పరిపాలనము చేయుచు సింహాసనాధీశుడైన వాడును ఐన ఆ రాముని నేను చూడకుందును గాక.
2.75.30.
అనుష్టుప్.
పాయసం కృసరం ఛాగమ్
వృథా సోఽ శ్నాతు నిర్ఘృణః।
గురూంశ్చాప్యవజానాతు
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
పాయసం = పాయసము; కృసరం = పులగము; ఛాగమ్ = మేక; వృథా = వృథాగ; సః = ఆ; అశ్నాతు = తినునుగాక; నిర్ఘృణః = నిర్దయగ; గురూన్ = గురువులను; అపి = కూడ; అవజానాతు = అవమానించు; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అడవికి వెళ్ళుట నాకు సమ్మతమైనచో, దేవతలకును పెద్దలకును, అతిథులకును నివేదించకనే, పాయసమును, పులగమును, మేకమాంసమును తినువానికి మరియు గురువులను అవమానించువానికి, దయాహీనునకు కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.31.
అనుష్టుప్.
గాశ్చ స్పృశతు పాదేన
గురూన్పరివదేత్స్వయమ్।
మిత్రే ద్రుహ్యేత సోఽ త్యంతమ్
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
గాః = ఆవులను; స్పృశతు = తాకుట; పాదేన = కాలితో; గురూన్ = గురువులను; పరివదేత్ = నిందించుట; స్వయమ్ = స్వయముగ; మిత్రే = మిత్రులందు; ద్రుహ్యేత = ద్రోహము; సః = ఆ; అత్యంతమ్ = మిక్కిలి; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అరణ్యమునకు వెళ్ళినచో, ఆవులను తన్నిన పాపము, గురువులను నిందించిన పాపము, మిత్రద్రోహము చేసిన పాపము నాకు కలుగును గాక.
2.75.32.
అనుష్టుప్.
విశ్వాసాత్కథితం కించిత్
పరివాదం మిథః క్వచిత్।
వివృణోతు స దుష్టాత్మా
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
విశ్వాసాత్ = విశ్వాసముతో; కథితం = చెప్పబడిన; కించిత్ = కొంచెము; పరివాదం = కొండెములను; మిథః = రహస్యముగ; క్వచిత్ = ఒకచోట; వివృణోతు = మరియొకరికి తెలియజేయును గాక; సః = ఆ; దుష్టాత్మా = దుష్టాత్ముడనైన; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతి ప్రకారమే అరణ్యమునకు వెళ్ళినచో, ఒక వ్యక్తి తన పైనున్న నమ్మకముతో ఇతరులను గూర్చి రహస్యముగ చెప్పిన కొండెములను మరియొకరికి చెప్పినచో కలుగు పాపము నాకు కలుగును గాక!
2.75.33.
అనుష్టుప్.
అకర్తా హ్యకృతజ్ఞశ్చ
త్యక్తాత్మా నిరపత్రపః।
లోకే భవతు విద్వేష్యో
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
అకర్తాః = పరోపకారము చేయనివాడు; అకృతజ్ఞశ్చ = కృతజ్ఞత లేనివాడు; త్యక్తాత్మా = ఆత్మహత్యకు పాల్పడినవాడు; నిరపత్రపః = సిగ్గులేనివాడు; లోకే = లోకులచే; భవతు = అగుగాక; విద్వేష్యః = ద్వేషింప తగినవాడు; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
అన్నగారు నా అనుమతితోనే అరణ్యమునకు వెళ్ళినచో, పరోపకారము చేయనివానిగను, కృతజ్ఞత లేనివానిగను, ఆత్మహత్యకు పాల్పడినవానిగను, సిగ్గులేవానిగను, లోకమునందు అందరిచే ద్వేషింపబడినవానిగను అగుదును గాక.
2.75.34.
అనుష్టుప్.
పుత్రైర్దారైశ్చ భృత్యైశ్చ
స్వగృహే పరివారితః।
స ఏకో మృష్టమశ్నాతు
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
పుత్రైః = పుత్రులు చేతను; దారైః = భార్యచేతను; భృత్యైః = సేవకులుచేతను; స్వగృహే = స్వగృహమునందు; పరివారితః = చుట్టుకొనబడినవాడై; సః = ఆతడు; ఏకః = ఒక్కడునే; మృష్టమ్ = ఇష్టమైన భోజనమును; అశ్నాతు = తినుగాక; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అడవుల పాలైనచో, ఇంటిలో భార్యాపుత్రులు, సేవకులు, తోటివారు ఉండగా మృష్టాన్న భోజనమును తాను ఒక్కడే భుజించు వానికి ఎట్టి పాపము కలుగునో అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.35.
అనుష్టుప్.
అప్రాప్య సదృశాన్ దారాన్
అనపత్యః ప్రమీయతామ్।
అనవాప్య క్రియాం ధర్మ్యామ్
యస్యాఽ ర్యోఽ నుమతే గతః॥
టీక:
అప్రాప్య = పొందక; సదృశాన్ = తగిన; దారాన్ = భార్యను; అనపత్యః = సంతానము లేనివాడు; ప్రమీయతామ్ = మరణించు వానికి; అనవాప్య = పొందక; క్రియాం = కార్యములను; ధర్మ్యామ్ = ధర్మ సమ్మతమైన; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
పూజనీయుడైన మా అన్నగారు నా అనుమతితోనే వనవాసమునకు వెళ్ళినచో, తనకు తగిన స్త్రీని వివాహమాడక, సంతానహీనుడై మరణించినివానికి, ధర్మకార్యములను చేయనివానికి ఎట్టి పాపము కలుగునో అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.36.
అనుష్టుప్.
మాఽ త్మనస్సంతతిం ద్రాక్షీత్
స్వేషు దారేషు దుఃఖితః।
ఆయుస్సమగ్రమప్రాప్య
యఽ స్యార్యోఽ నుమతే గతః॥
టీక:
మా = కూడదు; ఆత్మనః = తన; సంతతిం = సంతానమును; ద్రాక్షీత్ = చూచుట; స్వేషు = తన; దారేషు = భార్యయందు; దుఃఖితః = దుఃఖితుడై; ఆయుః = ఆయువును; సమగ్రమ్ = సంపూర్ణమైన; అప్రాప్య = పొందక; యస్య = ఎవని; ఆర్యః = పూజనీయుడైన; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అరణ్యమునకు పోయినచో, తన భార్యయందు సంతానము పొందక, దుఃఖితుడై, పూర్ణాయుర్దాయము లేని వానికి కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.37.
అనుష్టుప్.
రాజస్త్రీబాలవృద్ధానామ్
వధే యత్పాపముచ్యతే।
భృత్యత్యాగే చ యత్పాపమ్
తత్పాపం ప్రతిపద్యతామ్॥
టీక:
రాజస్త్రీబాలవృద్ధానామ్ = రాజును; స్త్రీని; బాలలను; వృద్ధులను; వధే = వధించుటవలన; యత్పాపముచ్యతే = ఏ పాపము కలుగునో; భృత్యత్యాగే = సేవకులను విడుచుట; యత్ = ఏ
భావం:-
అన్నగారు నా సమ్మతితో అరణ్యవాసమునకు వెళ్ళినచో, రాజును, స్త్రీలను, బాలలను, వృద్ధులను చంపుటవలనను, సేవకులను కష్టములో విడుచుట వలనను కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.38.
అనుష్టుప్.
లాక్షయా మధుమాంసేన
లోహేన చ విషేణ చ।
సదైవ బిభృయాద్భృత్యాన్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
లాక్షయా = లక్కచేతను; మధు = మత్తుపానీయము; మాంసేన = మాంసముచేతను; లోహేన = ఇనుముచేతను; విషేణ = విషముచేతను; సదైవ = సదా+ఇవ, ఎప్పుడును; బిభృయాత్ = పోషించును గాక; భృత్యాన్ = తనపై ఆధారపడిన వారిని; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అరణ్యమునకు వెళ్ళవలెనని నేను కోరుకున్నచో, వ్యాపారము చేయరాని లక్క, మత్తుపానీయము, మాంసము, లోహము, విషమును అమ్మి వ్యాపారము చేయుచు, తనపై ఆధారపడిన వారిని పోషించువారికి ఎట్టి పాపము కలుగునో అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.39.
అనుష్టుప్.
సంగ్రామే సముపోఢే స్మ
శత్రుపక్షభయంకరే।
పలాయమానో వధ్య
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
సంగ్రామే = యుద్ధమునందు; సముపోఢే = ఉధృతముగ; స్మ = ఉండగ; శత్రుపక్షభయంకరే = శత్రువులకు భయంకరమైన; పలాయమానః = పారిపోవుచున్నవాడై; వధ్యేత = చంపబడువాడు; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అడవికి పోయినచో, ఇరుపక్షముల వారి మధ్య యుద్ధం ఉధృతముగా నుండగా వెన్ను చూపి పారిపోవుచు చంపబడినవానికి కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.40.
అనుష్టుప్.
కపాలపాణిః పృథివీమ్
అటతాం చీరసంవృతః।
భిక్షమాణో యథోన్మత్తో
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
కపాలపాణిః = కపాలమును చేత పట్టుకొనినవాడు; పృథివీమ్ = భూమిపై; అటతాం = తిరుగాడు వాడు; చీరసంవృతః = చినిగిన వస్త్రములను ధరించువాడై; భిక్షమాణః = భిక్షమెత్తుకొనుచు; యథ = అట్లు; ఉన్మత్తః = పిచ్చివాడు; యస్య = ఎవని; ఆర్యః = అన్నగారు; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అరణ్యమునకు పోవలెనని నేను కోరినచో, కపాలమును చేబూని, చినిగిన వస్త్రములు ధరించి, బిచ్చమెత్తుకొని పిచ్చివాని వలె భూమిపై నేను తిరిగెదను గాక!
2.75.41.
అనుష్టుప్.
మద్యే ప్రసక్తో భవతు
స్త్రీష్వక్షేషు చ నిత్యశః।
కామక్రోధాభిభూతస్తు
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
మద్యే = మద్యపానమునందు; ప్రసక్తః = ఆసక్తి కలవాడు; భవతు = అగుగాక; స్త్రీషు = స్త్రీలయందు; అక్షేషు = పాచికలయందు; నిత్యశః = నిత్యము; కామక్రోధాభిభూతస్తు = కామ క్రోధముల చేత తిరస్కరింపబడిన వాడు; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = పోయెను.
భావం:-
మా అన్నగారు ఎవని అనుమతితో అరణ్యమునకు పోయెనో, వాడు నిత్యము సురాపానము, స్త్రీలు, జూదములందు వ్యసనపరుడై, కామ క్రోధములకు లోనై ఉండును గాక.
2.75.42.
అనుష్టుప్.
మాస్మ ధర్మే మనో భూయాత్
అధర్మం స నిషేవతామ్।
అపాత్రవర్షీ భవతు
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
మా = కూడదు; స్మ = ఉండుట; ధర్మే = ధర్మమునందు; మనః = మనసు; భూయాత్ = ఉండుట; అధర్మం = అధర్మము; సః = అతడు; నిషేవతామ్ = సేవించునుగాక; అపాత్రవర్షీ = అనర్హులకు దానము చేయువాడు; భవతు = అగుగాక; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = పోయెనో.
భావం:-
మా అన్నగారు అరణ్యమునకు పోవలెనని కోరిన వాని మనసు అధర్మముగా ప్రవర్తించును గాక. అతడు అపాత్రదానము చేయుచుండును గాక!
2.75.43.
అనుష్టుప్.
సంచితాన్యస్య విత్తాని
వివిధాని సహస్రశః।
దస్యుభిర్విప్రలుప్యంతామ్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
సంచితాని = కూడగట్టిన; అస్య = అతని; విత్తాని = ధనములు; వివిధాని = వివిధమైన; సహస్రశః = వేలకొలది; దస్యుభిః = దొంగలచే; విప్రలుప్యంతామ్ = లోపము చేయబడునుగాక; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = పోయేనో.
భావం:-
మా అన్నగారు వనవాసమునకు వెళ్ళవలెనని కోరిన వాని అనేక విధములైన ధనము, దొంగలచే అపహరింపబడును గాక.
2.75.44.
అనుష్టుప్.
ఉభే సంథ్యే శయానస్య
యత్పాపం పరికల్ప్యతే।
తచ్చపాపం భవేత్తస్య
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
ఉభే = రెండు; సంథ్యే = సంధ్యా సమయములందు; శయానస్య = నిదురించువానికి; యత్ = ఏ; పాపం = పాపము; పరికల్ప్యతే = కలుగునో; తత్ = ఆ; పాపం = పాపము; భవేత్ = కలుగును; తస్య = అతని; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = పోయెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అరణ్యమునకు వెళ్ళినచో, ఇరుసంధ్యలయందును నిదురించువానికి కలుగు పాపము నాకు కలుగునుగాక.
2.75.45.
అనుష్టుప్.
యదగ్నిదాయకే పాపమ్
యత్పాపం గురతల్పగే।
మిత్రద్రోహే చ యత్పాపమ్
తత్పాపం ప్రతిపద్యతామ్॥
టీక:
యత్ = ఏ; అగ్నిదాయకే = తగులపెట్టిన వానియందు; పాపమ్ = పాపము; యత్ = ఏ; పాపం = పాపము; గురతల్పగే = గురువు భార్యను చెఱపట్టినవానికి; మిత్రద్రోహే = మిత్రద్రోహికి; యత్ = ఏ; పాపమ్ = పాపము; తత్ = ఆ; పాపం = పాపము; ప్రతిపద్యతామ్ = కలుగుగాక.
భావం:-
పరుల గృహమును తగులపెట్టిన వానికి, గురువుగారి భార్యా సంగమము చేయు వానికి, మిత్రద్రోహికి ఎటువంటి పాపము కలుగునో అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.46.
అనుష్టుప్.
దేవతానాం పిత్రూణాం చ
మాతాపిత్రోస్తథైవ చ।
మా స్మ కార్షీత్స శుశ్రూషామ్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
దేవతానాం = దేవతలయొక్క; పిత్రూణాం = పితృదేవతలయొక్క; మాతాపిత్రోః = తల్లిదండ్రులయొక్క; తథైవ చ = మరియు; మా = కూడదు; స్మ = ఉండుట; కార్షీత్స = చేయుట; శుశ్రూషామ్ = సేవ; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అడవికి పోయినచో, దేవతలకు, పితృదేవతలకు, తల్లిదండ్రులకును, సేవ చేయనివానికి ఎట్టి పాపము కలుగునో, అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.47.
అనుష్టుప్.
సతాం లోకాత్సతాం కీర్త్యాః
సంజుష్టాత్కర్మణస్తథా।
భ్రశ్యతు క్షిప్రమద్యైవ
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
సతాం = సత్పురుషులయొక్క; లోకాత్ = లోకమునుండి; సతాం = సత్పురుషులయొక్క; కీర్త్యాః = కీర్తి నుండి; సంజుష్టాత్ = శ్రేష్టులైన వారిచే పొందబడిన; కర్మణః = కర్మనుండి; తథా = మరియు; భ్రశ్యతు = భ్రష్టుడగుగాక; క్షిప్రమ్ = శీఘ్రముగా; అద్య ఏవ = ఇప్పుడే; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అరణ్యమునకు వెళ్ళుటకు నేనే కారణమైనచో, ఇప్పుడే సత్పురుషులకు లభించు లోకమునుండి, సత్పురుషుల కీర్తినుండి, సత్పురుషులు ఆచరించు కర్మనుండి, నేను భ్రష్టుడనయ్యెదనుగాక.
2.75.48.
అనుష్టుప్.
అపాస్య మాతృశుశ్రూషామ్
అనర్థే సోఽ వతిష్ఠతామ్।
దీర్ఘబాహుర్మహావక్షాః
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
అపాస్య = వదిలి; మాతృశుశ్రూషామ్ = మాతృసేవను; అనర్థే = అనర్థకరమైన; సః = అతడు; అవతిష్ఠతామ్ = ఉండుగాక; దీర్ఘబాహుః = పొడవైన చేతులు; మహావక్షాః = విశాలమైన వక్షస్థలము; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
పొడవైన చేతులు, విశాలమైన వక్షస్థలము కలవాడైన మా అన్నగారు అరణ్యమునకు వెళ్ళవలెనని నేను కోరి యుండినచో, తల్లికి సేవ చేయుటమాని అనర్థకరమైన పనులు చేయువానికి కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.49.
అనుష్టుప్.
బహుపుత్రో దరిద్రశ్చ
జ్వరరోగసమన్వితః।
స భూయాత్సతత క్లేశీ
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
బహుపుత్రః = చాలామంది కొడుకులు కలవాడై; దరిద్రశ్చ = దరిద్రుడుగను; జ్వరరోగసమన్వితః = జ్వరము రోగము కలిగియున్నవానిగను; సః = అతడు; భూయాత్ = అగుగాక; సతత = ఎల్లప్పుడును; క్లేశీ = కష్టములు కలవాడు; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే అడవికి పోయినచో, అధిక సంతానము కలిగియుండి, దరిద్రుడై, జ్వరముతోను రోగములతోను నిత్యము బాధపడెడివాని కష్టములు నాకు కలుగును గాక.
2.75.50.
అనుష్టుప్.
ఆశామాశంసమానానామ్
దీనానామూర్ధ్వచక్షుషామ్।
అర్థినాం వితథాం కుర్యాత్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
ఆశామ్ = ఆశను; ఆశంసమానానామ్ = ఆశించుచున్నవారు; దీనానామ్ = దీనులు; ఊర్ధ్వచక్షుషామ్ = పైకి చూచుచుండెడివారు; అర్థినాం = యాచకులయొక్క; వితథాం = వ్యర్థమైనదానినిగా; కుర్యాత్ = చేయుగాక; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా ప్రమేయముతోనే వనవాసగతుడైనచో, పైకి చూచుచు దీనముగా యాచించు వాని ఆశను వమ్ము చేసిన వానికి కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.51.
అనుష్టుప్.
మాయయా రమతాం నిత్యమ్
పరుషః పిశునోఽ శుచిః।
రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
మాయయా = మోసముతో; రమతాం = ఆనందించును గాక; నిత్యమ్ = నిత్యము; పరుషః = కౄరమైనవాడై; పిశునః = చాడీలు చెప్పుచున్నవాడై; అశుచిః = అశుచియై; రాజ్ఞః = రాజునుండి; భీతః = భయపడినవాడై; అధర్మాత్మా = అధర్మము చేయువాడై; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
ఆర్యుడైన మా అన్నగారు అడవికి పోవుటకు నేను కారణమైనచో మోసగాడు, కౄరుడును, నేరములు చెప్పువాడును, అశుచి, అధర్మములు చేయుచూ నిత్యము రాజునకు పట్టుబడుదునేమో భయపడుచుండువానికి ఎట్టి పాపము కలుగునో అట్టి పాపము నాకు కలుగును గాక.
2.75.52.
అనుష్టుప్.
ఋతుస్నాతాం సతీం భార్యామ్
ఋతుకాలానురోధినీమ్।
అతివర్తేత దుష్టాత్మా
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
ఋతుస్నాతాం = ఋతుస్నానము ఐనది; సతీం = భార్యామ్ = భార్యను; ఋతుకాలానురోధినీమ్ = ఋతుకాలమును పాటించుచున్నది; అతివర్తేత = అతిక్రమించు; దుష్టాత్మా = దుష్టుడు; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అడవికి పోవుటకు నేనే అనుమతించినట్లైనచో, పతివ్రత ఐనది, ఋతుకాలమును పాటించునది ఐన తన భార్య ఋతుస్నాతయైన పిమ్మట, సంగమకోరిన తీర్చని దుష్టునకు ఎంత పాపము కలుగునో అంత పాపము నాకు కలుగును గాక.
2.75.53.
అనుష్టుప్.
ధర్మదారాన్పరిత్యజ్య
పరదారాన్నిషేవతామ్।
త్యక్తధర్మరతిర్మూఢో
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
ధర్మదారాన్ = ధర్మపత్నిని; పరిత్యజ్య = వదలి; పరదారాన్ = పరుని భార్యను; నిషేవతామ్ = సేవించును గాక; త్యక్తధర్మః = ధర్మమును విడిచినవాడై; అతిమూఢః = మూఢుడు; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
ఆర్యుడైన మా అన్నగారు నా వలననే అడవికి పోయినచో, ధర్మపత్నిని విడిచి ఇతరుని భార్యతో సంగమించు వానికి కలుగు పాపము నాకు కలుగును గాక.
*గమనిక:-
ధర్మభార్య- ధర్మసమ్మతముగా వివాహమాడిన భార్య, ఆ వివాహ సందర్భమున వరుడు ‘ధర్మేచ అర్థేచ కామేచ న అతి చరామి’ అని కన్యాదాతకు వాగ్దానము చేయును.
2.75.54.
అనుష్టుప్.
విప్రలుప్తప్రజాతస్య
దుష్కృతం బ్రాహ్మణస్య యత్।
తదేవ ప్రతిపద్యేత
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
విప్ర = బ్రాహ్మణుడు; లుప్తప్రజాతస్య = లోపించిన సంతానము గల; దుష్కృతం = పాపమును; బ్రాహ్మణస్య = బ్రాహ్మణునియొక్క; యత్ = ఏ; తదేవ = దానిని; ప్రతిపద్యేత = పొందును గాక; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
ఆర్యుడైన మా అన్నగారు నా అనుమతితోనే అడవులపాలైనచో, సంతానము లేని బ్రాహ్మణుడగుటకు ఎంత పాపము చేయవలెనో అంతటి పాపము నాకు కలుగును గాక.
2.75.55.
అనుష్టుప్.
పానీయదూషకే పాపమ్
తథైవ విషదాయకే।
యత్తదేకస్స లభతామ్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
పానీయదూషకే = మంచినీటిని పాడు చేయువానికి; పాపమ్ = పాపము; తథైవ = అట్లే; విషదాయకే = ఇతరులకు విషము పెట్టువానికి; యత్ = ఏ; ఏకః = ఒక్కడే; లభతామ్ = పొందుగాక; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా వలననే అడవికి పోయినచో, త్రాగునీటిని పాడుచేయువానికిని, ఇతరులకు విషము పెట్టువానికిని కలుగు పాపము, నాకు కలుగును గాక.
2.75.56.
అనుష్టుప్.
బ్రాహ్మణాయోద్యతాం పూజామ్
విహంతు కలుషేంద్రి;యః।
బాలవత్సాం చ గాం దోగ్ధు
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
బ్రాహ్మణాయ = బ్రాహ్మణుని కొరకు; ఉద్యతాం = సిద్ధము చేయబడిన; పూజామ్ = పూజను; విహంతు = భగ్నము చేయు; కలుషేంద్రి;యః = దుష్టమైన ఇంద్రియములు కలవాడు; బాలవత్సాం = లేగదూడకు; చ = లేకుండా; గాం = ఆవును; దోగ్ధు = పితుకువాడు; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా అనుమతితోనే వనవాసమునకు పోయినచో, దుష్టమైన ఇంద్రియములు కలవాడనై, బ్రాహ్మణుడు చేయు పూజకు విఘ్నము కలిగించువానికి ఎట్టి పాపము వచ్చునో, లేగ దూడకు మిగల్చకుండా మొత్తము పాలను పితికి వేయువానికి ఎట్టి పాపము వచ్చునో అట్టి పాపములు నాకు కలుగును గాక.
2.75.57.
అనుష్టుప్.
తృష్ణార్తం సతి పానీయే
విప్రలంభేన యోజయేత్।
లభేత తస్య యత్పాపమ్
యస్యార్యోఽ నుమతే గతః॥
టీక:
తృష్ణార్తం = దాహముతో ఉన్నవానికి; సతి = ఉన్నను; పానీయే = నీరు; విప్రలంభేన = ఎడబాటు; యోజయేత్ = చేకూర్చదలచునో; లభేత = పొందును; తస్య = అతనికి; యత్ = ఏ; పాపమ్ = పాపము; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు నా సమ్మతితోనే అడవికి పోయినచో, దాహముతో ఉన్నవానికి నీరు ఉండినను ఇవ్వకుండుటకు చూచువానికి కలుగు పాపము నాకు కలుగును గాక.
2.75.58.
అనుష్టుప్.
భక్త్యా వివదమానేషు
మార్గమాశ్రిత్య పశ్యతః।
తస్య పాపేన యుజ్యేత
యస్యార్యోఽ నుమతే గతః”॥
టీక:
భక్త్యా = విడిపోవుటచే; వివదమానేషు = కలహించుచుండగ; మార్గమ్ = మార్గమునందు; ఆశ్రిత్య = ఆశ్రయించి; పశ్యతః = చూచుచున్న; తస్య = అతని; పాపేన = పాపమువలన; యుజ్యేత = కలుగుగాక; యస్య = ఎవని; ఆర్యః = ఆర్య; అనుమతే = అనుమతితో; గతః = వెళ్ళెనో.
భావం:-
మా అన్నగారు అడవికి వెళ్ళవలెనని నేనే కోరి యున్నచో, రెండు పక్షములుగా విడిపోయిన కలహించువారికి నచ్చచెప్పక, చోద్యము చూచుచున్న వానికి ఎట్టి పాపము వచ్చునో అట్టి పాపము నాకు కలుగును గాక.”
*గమనిక:-
ఇక్కడ భరతుడు మొత్తం 50 పాపములను ఉదహరించెను, వివరములకు చూ. జాలిక వివరణలలో జాబితాల యందు గల భరతుడు ఉదహరించిన పాపములు
2.75.59.
అనుష్టుప్.
విహీనాం పతిపుత్రాభ్యామ్
కౌసల్యాం పార్థివాత్మజః।
ఏవమాశ్వాసయన్నేవ
దుఃఖార్తో నిపపాత హ॥
టీక:
విహీనాం = కోల్పోయిన; పతిపుత్రాభ్యామ్ = భర్తను పుత్రుని; కౌసల్యాం = కౌసల్యను; పార్థివాత్మజః = రాజకుమారుడు; ఏవమ్ = ఈ విధముగా; ఆశ్వాసయన్నేవ = ఓదార్చుచు; దుఃఖార్తః = దుఃఖితుడై; నిపపాత హ = పడిపోయెను.
భావం:-
భర్తను కోల్పోయి పుత్రుడు దూరమై ఉన్న కౌసల్యను ఈ విధముగా సాంత్వన పరుచుచు భరతుడు దుఃఖితుడై నేలపై పడిపోయెను.
2.75.60.
అనుష్టుప్.
తథా తు శపథైః కష్టైః
శపమానమచేతనమ్।
భరతం శోకసంతప్తమ్
కౌసల్యా వాక్యమబ్రవీత్॥
టీక:
తథా = అట్లు; శపథైః = శపథములు చేయుచు; కష్టైః = కష్టమైన; శపమానమ్ = ఒట్లు పెట్టుకొనుచున్న; అచేతనమ్ = స్పృహ కోల్పోయియున్న; భరతం = భరతుని గూర్చి; శోకసంతప్తమ్ = దుఃఖితుడైయున్న; కౌసల్యా = కౌసల్య; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావం:-
ఈ విధముగా కష్టమైన శపథములు చేయుచూ, ఒట్లు పెట్టుకొనుచు దుఃఖితుడై స్పృహ తప్పి నేలపై పడిపోయిన భరతునితో కౌసల్య ఇట్లు పలికెను.
2.75.61.
అనుష్టుప్.
“మమ దుఃఖమిదం పుత్ర!
భూయస్సముపజాయతే।
శపథైశ్శపమానో హి
ప్రాణానుపరుణత్సి మే॥
టీక:
మమ = నాకు; దుఃఖమ్ = దుఃఖము; ఇదం = ఈ; పుత్ర = పుత్రా; భూయః = ఇంకను; సముపజాయతే = కలుగుచున్నది; శపథైః = శపథములచే; శపమానః = ప్రతిజ్ఞ చేయుచు; హి = కదా; ప్రాణాన్ = ప్రాణములను; ఉపరుణత్సి = పీడించుచున్నావు; మే = నాయొక్క.
భావం:-
"పుత్రా! ఇట్లు ప్రతిజ్ఞలు చేసి నాకు దుఃఖమును కలిగించుచున్నావు. అందువలన నాకు మనోవేదన ఎక్కువగుచున్నది.
2.75.62.
అనుష్టుప్.
దిష్ట్యా న చలితో ధర్మాత్
ఆత్మా తే సహలక్ష్మణః।
వత్స! సత్యప్రతిజ్ఞో తే
సతాం లోకమవాప్స్యసి”॥
టీక:
దిష్ట్యా = భాగ్యవశమున; న = లేదు; చలితః = చలించుట; ధర్మాత్ = ధర్మమునుండి; ఆత్మా = బుద్ధి; తే = నీ; సహ = సహితముగా; లక్ష్మణః = లక్ష్మణునితో; వత్స = వత్సా; సత్యప్రతిజ్ఞః = సత్యనిష్టతో; తే = నీ; సతాం = సత్పురుషుల; లోకమ్ = లోకము; అవాప్స్యసి = పొందెదవు గాక.
భావం:-
ఓ పుత్రా! భాగ్యవశమున నీ బుద్ధి సత్యనిష్టతో ఉండి ధర్మము నుండి తప్పుటలేదు కనుక నీవు లక్ష్మణునితో సమానమైన సత్కీర్తిని పొందెదవు గాక.”
2.75.63.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా చాంకమానీయ
భరతం భ్రాతృవత్సలమ్।
పరిష్వజ్య మహాబాహుమ్
రురోద భృశదుఃఖితా॥
టీక:
ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; అంకమ్ = ఒడిపై; ఆనీయ = తీసుకొని; భరతం = భరతుని; భ్రాతృవత్సలమ్ = సోదరునికి అంకితమైన; పరిష్వజ్య = కౌగలించుకొని; మహాబాహుమ్ = పెద్ద బాహువులు కలిగియున్న; రురోద = విలపించెను; భృశదుఃఖితా = చాల దుఃఖితమతియై.
భావం:-
కౌసల్య రామునికి అంకితమై యుండెడు భరతునితో ఇట్లు పలికి, అతనిని తన ఒడిపైన కూర్చుండబెట్టుకొని, కౌగలించుకొని, దుఃఖితమతియై విలపించుచుండెను.
2.75.64.
అనుష్టుప్.
ఏవం విలపమానస్య
దుఃఖార్తస్య మహాత్మనః।
మోహాచ్చ శోకసంరోధాత్
బభూవ లులితం మనః॥
టీక:
ఏవం = ఇట్లు; విలపమానస్య = బాధపడుచున్న; దుఃఖాః = దుఃఖముచే; ఆర్తస్య = ఆర్తి నొందియున్న; మహాత్మనః = మహాత్ముడైన; మోహాచ్చ = నిస్పృహగ; శోకసంరోధాత్ = దుఃఖభరితుడై; బభూవ = అనుభవించెను; లులితం = వ్యాకులమైన; మనః = మనసు.
భావం:-
మహాత్ముడైన భరతుడు ఇట్లు దుఃఖభరితుడై నిస్పృహ చెంది మనోవ్యాకులమును పొందెను.
2.75.65.
త్రిష్టుప్.
లాలప్యమానస్య విచేతనస్య
ప్రణష్టబుద్ధేః పతితస్య భూమౌ।
ముహుర్ముహుర్నిశ్శ్వసతశ్చ ఘర్మం
సా తస్య శోకేన జగామ రాత్రిః॥
టీక:
లాలప్యమానస్య = విలపించుచున్న; విచేతనస్య = స్పృహ కోల్పోయిన; ప్రణష్టబుద్ధేః = మతి తప్పిన; పతితస్య = పడిపోయిన; భూమౌ = నేలపై; ముహుర్ముహుర్నిశ్శ్వసతశ్చ = పలుమార్లు నిట్టూర్చుచు; ఘర్మం = చెమట; సా = అతను; తస్య = అతనికి; శోకేన = శోకముతో; జగామ = గడచెను; రాత్రిః = రాత్రి.
భావం:-
శోకతప్తుడై నేలపై పడియున్న భరతునికి, చెమటలు పట్టి, వేడి నిట్టూర్పులతో రాత్రి అంతయు గడచెను.
2.75.66.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే పంచసప్తతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; పంచసప్తతితమ [75] = డెబ్బైఐదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [75] డెబ్బైఐజవ సర్గ సంపూర్ణము.
2.76.1.
అనుష్టుప్.
తమేవం శోకసంతప్తమ్
భరతం కైకయీ సుతమ్।
ఉవాచ వదతాం శ్రేష్ఠో
వసిష్ఠశ్శ్రేష్ఠవాగృషిః॥
టీక:
తమ్ = అతనితో; ఏవం = ఈ విధముగా; శోకసంతప్తమ్ = దుఃఖసంతప్తుడైన; భరతం = భరతుని గూర్చి; కైకయీ సుతమ్ = కైకేయి కుమారుడైన; ఉవాచ = పలికెను; వదతాం = పలుకువాడు; శ్రేష్ఠః = శ్రేష్ఠమైన; వసిష్ఠః = వసిష్ఠుడు; శ్రేష్ఠ వాక్ = శ్రేష్ఠమైన మాటలు; ఋషిః = ఋషి.
భావం:-
ఈ విధముగా దుఃఖసంతప్తుడైన కైకేయి కుమారుడైన భరతునితో మాటలలో నేర్పు కలవాడు, శ్రేష్ఠమైన విషయములు చెప్పువాడు అయిన వసిష్ఠ మహర్షి ఇట్లు పలికెను.
2.76.2.
అనుష్టుప్.
“అలం శోకేన భద్రం తే
రాజపుత్ర! మహాయశః!।
ప్రాప్తకాలం నరపతేః
కురు సంయానముత్తమమ్”॥
టీక:
అలమ్ = ఆపుము; శోకేన = దుఃఖమును; భద్రం = మంగళమగుగాక; తే = నీకు; రాజపుత్ర = రాజకుమార; మహాయశః = ఉత్తమమైన కీర్తిగలవాడా; ప్రాప్తకాలం = సమయము వచ్చినది; నరపతేః = రాజునకు; కురు = చేయుము; సంయానమ్ = దీర్ఘప్రస్థానమును, ఉత్తరక్రియను,ప్రేతకర్మలను; ఉత్తమమ్ = ఉత్తమమైన.
భావం:-
ఉత్తమమైన కీర్తి గల రాజకుమారా! నీకు మంగళమగుగాక. ఇంక దుఃఖము ఆపుకొనుము. రాజునకు ఉత్తమమైన ఉత్తరకర్మ చేయవలసిన సమయము ఆసన్నమయినది! ఆ ఉత్తరకర్మ చేయుము.”
2.76.3.
అనుష్టుప్.
వసిష్ఠస్య వచః శ్రుత్వా
భరతో ధారణాం గతః।
ప్రేతకార్యాణి సర్వాణి
కారయామాస ధర్మవిత్॥
టీక:
వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; వచః = మాటలు; శ్రుత్వా = విని; భరతః = భరతుడు; ధారణామ్ = నిగ్రహము; గతః = పొంది; ప్రేతకార్యాణి = ఉత్తరక్రియలను; సర్వాణి = అన్నింటిని; కారయామాస = నడిపించెను; ధర్మవిత్ = ధర్మవేత్తౖయెన
భావం:-
ధర్మవేత్తయైన భరతుడు వసిష్ఠుని మాటలు విని, స్థైర్యమును అవలంబించి, ప్రేతకార్యములను అన్నింటిని చేసెను.
2.76.4.
అనుష్టుప్.
ఉద్ధృతం తైలసంరోధాత్
సతు భూమౌ నివేశితమ్।
ఆపీతవర్ణవదనమ్
ప్రసుప్తమివ భూమిపమ్॥
టీక:
ఉద్ధృతమ్ = పైకి తీసి; తైలసంరోధాత్ = తైలద్రోణి నుండి; సః = అతడు; తు = ఇంకను; భూమౌ = నేలపై; నివేశితమ్ = ఉంచిరి; ఆపీతవర్ణ = పచ్చనైన; వదనమ్ = ముఖముతో; ప్రసుప్తమ్ = నిద్రపోవుచున్నవాని; ఇవ = వలెనున్న; భూమిపమ్ = రాజును.
భావం:-
దశరథమహారాజు కళేబరమును తైలద్రోణి నుండి పైకి తీసి నేలపై ఉంచిరి. పచ్చనైన ముఖముతో అతడు నిద్రపోవుచున్నవానివలె ఉండెను.
2.76.5.
అనుష్టుప్.
సంవేశ్య శయనే చాగ్య్రే
నానారత్నపరిష్కృతే।
తతో దశరథం పుత్రో
విలలాప సుదుఃఖితః॥
టీక:
సంవేశ్య = పరుండబెట్టిరి; శయనే = శయనముపై; చ = ఇంకను; అగ్య్రే = శ్రేష్ఠమైన; నానారత్న = రకరకముల; రత్న = రత్నములచే; పరిష్కృతే = అలంకృతమైన; తతః = అటువంటి; దశరథం = దశరథుని; పుత్రః = భరతుడు; విలలాప = విలపించెను; సుదుఃఖితః = చాలా దుఃఖించుచు
భావం:-
పిదప అతనిని అనేక రత్నములచే అలంకృతమైన శ్రేష్ఠమైన శయనముపై పరుండబెట్టిరి. అట్టి దశరథుని చూచి కుమారుడైన భరతుడు చాలా దుఃభించుచు విలపించెను.
2.76.6.
అనుష్టుప్.
“కిం? తే వ్యవసితం రాజన్
ప్రోషితే మయ్యనాగతే।
వివాస్య రామం ధర్మజ్ఞమ్
లక్ష్మణం చ మహాబలమ్॥
టీక:
కిం = ఎందుకు; తే = నీచే; వ్యవసితమ్ = నిర్ణయింపబడివాడవైతివి; రాజన్ = మహారాజా; ప్రోషితే = ప్రవాసములో ఉండగా; మయి = నేను; అనాగతే = రాకముందు; వివాస్య = పంపివేసి; రామం = రాముని; ధర్మజ్ఞమ్ = ధర్మవేత్తౖయెన; లక్ష్మణం = లక్ష్మణుని; చ = ఇంకను; మహాబలమ్ = మహాబలశాలి అయిన
భావం:-
మహారాజా! విదేశమునున్న నేను తిరిగి రాకుండగనే, ధర్మవేత్తయైన రాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుని దూరముగా పంపివేసి, వెళ్ళిపోడానికి నిశ్చయించుకున్నావయ్యా?.
2.76.7.
అనుష్టుప్.
క్వ? యాస్యసి మహారాజ!
హిత్వేమం దుఃఖితం జనమ్।
హీనం పురుషసింహేన
రామేణాక్లిష్టకర్మణా॥
టీక:
క్వ = ఎక్కడకు; యాస్యసి = వెళ్లెదవు; మహారాజ = మహారాజా; హిత్వ = విడిచిపెట్టి; ఇమం = ఈ; దుఃఖితం = దుఃఖార్తుడైన; జనమ్ = వారినందరిని; హీనం = లేకుండా; పురుషసింహేన = పురుషశ్రేష్ఠుడైన; రామేణ = రాముడు; ఆక్లిష్టకర్మణా = శ్రమపడకుండా పనులు చేయగలవాడు
భావం:-
నీవు ఏమి నిర్ణయము చేసుకొని అట్లు చేసినావు? శ్రమపడకుండా పనులు చేయగలవాడు, పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు దగ్గర లేని, దుఃఖార్తులమైన ఈ మమ్మల్నందరిని విడిచి ఎక్కడికి వెళ్ళెదవు?
2.76.8.
అనుష్టుప్.
యోగక్షేమం తు తే రాజన్
కోఽస్మిన్కల్పయితా? పురే।
త్వయి ప్రయాతే స్వస్తాత
రామే చ వనమాశ్రితే॥
టీక:
యోగక్షేమం = యోగక్షేమములు; తు = ఇంకను; తే = నీవు; రాజన్ = మహారాజా; కః = ఎవరు; అస్మిన్ = ఈ; కల్పయితా = చూచువారు; పురే = అయోధ్యా నగరమును; త్వయి ప్రయాతే = నీవు వెళ్లిపోయినావు; స్వః = స్వర్గమునకు; తాత = తండ్రీ; రామే = రాముడు; చ = మరియు; వనమాశ్రితే = అరణ్యమునందు
భావం:-
నీవు స్వర్గమునకు వెళ్ళిపోతివి. రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయెను. ఇపుడు నీ అయోధ్యా నగరము యోగక్షేమములు చూచువారెవరు?
2.76.9.
అనుష్టుప్.
విధవా పృథివీ రాజన్
స్త్వయా హీనా న రాజతే।
హీనచంద్రేవ రజనీ
నగరీ ప్రతిభాతి మే”॥
టీక:
విధవా = విధవౖయె; పృథివీ = భూమి; రాజన్ = ఓ మహారాజా; త్వయా = నీతో; హీనా = లేకుండా; న = లేదు; రాజతే = ప్రకాశము; హీన = లేని; చంద్ర = చంద్రుడు; ఇవ = వలె; రజనీ = రాత్రి; నగరీ = నగరము; ప్రతిభాతి = కనపడుచున్నది; మే = నాకు
భావం:-
నీవు లేని ఈ భూమి విధవౖయె ప్రకాశహీనురాలై ఉన్నది. నాకు ఈ నగరము చంద్రుడు లేని రాత్రి వలె కనబడుచున్నది.”
2.76.10.
అనుష్టుప్.
ఏవం విలపమానం తమ్
భరతం దీనమానసమ్।
అబ్రవీద్వచనం భూయో
వసిష్ఠస్తు మహామునిః॥
టీక:
ఏవం = ఈ విధముగా; విలపమానం = విలపించుచున్న; తమ్ భరతం = ఆ భరతుని; దీన = దీనమైన; మానసమ్ = మనస్సుగలవానికి; అబ్రవీత్ = పలికెను; వచనం = మాటలను; భూయో = మరల; వసిష్ఠః = వసిష్ఠుడు; తు = ఇంకను; మహామునిః = మహాముని అయిన.
భావం:-
మనోవిచారముతో ఈ విధముగా విలపించుచున్న భరతునితో మహాముని అయిన వసిష్ఠుడు మరల ఇట్లు పలికెను.
2.76.11.
అనుష్టుప్.
“ప్రేతకార్యాణి యాన్యస్య
కర్తవ్యాని విశాం పతేః।
తాన్యవ్యగ్రం మహాబాహో!
క్రియాంతామవిచారితమ్”॥
టీక:
ప్రేతకార్యాణి = ప్రేత కార్యములను; యాని = నిర్వర్తింపుము; అస్య = ఈ యొక్క; కర్తవ్యాని = చేయవలసినవానిని; విశాంపతేః = రాజునకు; తాని = వాటిని; అవ్యగ్రం = జాగు చేయక; మహాబాహో = బాహుబలసంపన్నా; క్రియాంతామ్ = జరపవలసినవానిని; అవిచారితమ్ = బాధపడకుండా.
భావం:-
”మహాబాహూ! రాజునకు జరపవలసిన ప్రేతకార్యములన్నీ జరుపుము. ఇంక జాగు చేయకుండా, బాధపడకుండా నిర్వర్తించుము,”
*గమనిక:-
విశాంపతి- విశాం, ప్రజలు, వివిశతి దేశే పతి, రాజు)
2.76.12.
అనుష్టుప్.
“తథేతి” భరతో వాక్యమ్
వసిష్ఠస్యాభిపూజ్య తత్।
ఋత్విక్పురోహితాచార్యాన్
స్త్వరయామాస సర్వశః॥
టీక:
తథేతి = అటులనే చేసెదను అని; భరతః = భరతుడు; వాక్యమ్ = మాటలను; వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క; అభిపూజ్య = గౌరవించి; తత్ = ఆతని; ఋత్విక్ = ఋత్విక్కులను; పురోహిత = పురోహితులను; ఆచార్యాన్ = ఆచార్యులను; త్వరయామాస = తొందరపెట్టెను; సర్వశః = వివిధ
భావం:-
వసిష్ఠుని మాటను గౌరవించి, భరతుడు “అటులనే చేసెదను” అని పలికి, ఋత్విక్కులను, పురోహితులను, ఆచార్యులను వివిధ కార్యములు చేయుటకు తొందరపెట్టెను.
*గమనిక:-
(1) ఋత్విజః- యజ్ఞకర్మాణి కృతాః, యజ్ఞకర్మలను జేయువాడు, యాజ్ఞికుడు (2) పురోహితాః- శాంతి పోష్టికాది క్రియా పిరవ్రవర్తకా, శాంతిప్రవర్థకము లైన క్రియాకలాపములని నడిపించువాడు. పురోహితుడు. (3) ఆచార్యః- వేదకర్మ విధులము నిర్వహించుటలో కుశలురు.
2.76.13.
అనుష్టుప్.
యే త్వగ్నయో నరేంద్రస్య
చాగ్న్యగారాద్బహిష్కృతా।
ఋత్విగ్భిర్యాజకైశ్చైవ
తేఽహ్రియంత యథావిధి॥
టీక:
యే = ఏదైతే; తు = మరియు; అగ్నయో = అగ్నులను; నరేంద్రస్య = దశరథునియొక్క; చ = ఇంకను; అగ్న్యగారాత్ = అగ్నిగృహమునుండి; బహిష్కృతా = బయటకు తీసుకొని వచ్చిన; ఋత్విగ్భిః = ఋత్విక్కులు; యాజకైశ్చ = పురోహితులు; ఏవ = ఇట్లు; తే = వారు; అహ్రియంత = గ్రహించబడినది; యథావిధి = యథాశాస్త్రముగా.
భావం:-
అగ్ని గృహమునుండి బైటకు తీసికొనివచ్చిన దశరథుని అగ్నులను.. ఋత్విక్కులు, పురోహితులు యథాశాస్త్రముగా గ్రహించిరి.
2.76.14.
అనుష్టుప్.
శిబికాయామథారోప్య
రాజానం గతచేతసమ్।
బాష్పకంఠా విమనసః
తమూహుః పరిచారకాః॥
టీక:
శిబికాయామ్ = పల్లకీపై; అథ = పిమ్మట; ఆరోప్య = ఎక్కించి; రాజానం = మహారాజును; గతచేతసమ్ = చైతన్యము లేని (మరణించిన); బాష్పకంఠా = బాష్పముతో నిండిన కంఠములతో; విమనసః = దుఃఖించుచు; తమూహుః = మోసుకుని వెళ్లిరి; పరిచారకాః = పరిచారకులు
భావం:-
పిమ్మట పరిచారకులు, బాష్పముతో నిండిన కంఠములతో దుఃఖించుచు, మరణించిన ఆ రాజును పల్లకీపై ఎక్కించి మోసికొని వెళ్ళిరి.
2.76.15.
అనుష్టుప్.
హిరణ్యం చ సువర్ణం చ
వాసాంసి వివిధాని చ।
ప్రకిరంతో జనా మార్గమ్
నృపతేరగ్రతో యయుః॥
టీక:
హిరణ్యం = వెండిని; చ = ఇంకను; సువర్ణం = బంగారమును; చ = ఇంకను; వాసాంసి = వస్త్రములు; వివిధాని చ = అనేక విధాలైన; ప్రకిరంతః = చల్లుచు; జనా = జనులు; మార్గమ్ = మార్గమునందు; నృపతేః = రాజునకు; అగ్రతః = ముందర; యయుః = వెళ్లిరి.
భావం:-
రాజునకు ముందరగా వెండి, బంగారము, అనేక విధములైన వస్త్రములు చల్లుచు జనులు మార్గమునందు వెళ్ళిరి.
2.76.16.
అనుష్టుప్.
చందనాగరునిర్యాసాన్
సరలం పద్మకం తథా।
దేవదారూణి చాహృత్య
క్షేపయంతి తథాపరే॥
టీక:
చందన = చందనము చెట్టు; అగరు = అగురువు చెట్టు; నిర్యాసాన్ = గుగ్గిలము చెట్టు; సరలమ్ = తెల్లతెగడ అను వంకరలులేని చెట్టు; పద్మకం = పద్మకాష్టము, పుష్కరమూలము అను చెట్టు; తథా = అక్కడ; దేవదారూణి = దేవదారు వృక్షములు; చ = ఇంకను; ఆహృత్య = తీసుకొనివచ్చి; క్షేపయంతి = వేసిరి; తథ = అటు; అపరే = పిమ్మట.
భావం:-
మరికొందరు చందనము, అగురువు, గుగ్గిలము, సరళ పద్మక దేవదారువృక్షముల కట్టెలు అనేకమైనవి తీసికొనివచ్చి అక్కడ వేసిరి. పిదప
2.76.17.
అనుష్టుప్.
గంధానుచ్చావచాంశ్చాన్యాం
స్తత్ర గత్వాథ భూమిపమ్।
తత్ర సంవేశయామాసుః
చితామధ్యే తమృత్విజః॥
టీక:
గంధాన్ = సుగంధద్రవ్యములను; ఉచ్చావచాన్ = అనేకములైనవి; చ = మఱియు; అన్యామ్ = ఇతరమైనవి; తత్ర= అచటికి; గత్వా = వెళ్ళి; అథ = పిమ్మట; భూమిపమ్ = మహారాజు; తత్ర = అక్కడ; సంవేశయామాసుః = పరుండబెట్టిరి; చితామధ్యే = చితిమధ్యలో; తమ్ = అతనిని; ఋత్విజః = ఋత్విక్కులు.
భావం:-
ఇంకా సుగంధద్రవ్యములు మొదలగునవి ఎన్నే వేసి. రాజుగారి కళేబరాన్ని అక్కడకు తీసుకువెళ్ళిరి. పిమ్మట ఋత్విక్కులు దశరథ మహారాజు కళేబరమును చితి మధ్యలో పరుండబెట్టిరి.
2.76.18.
అనుష్టుప్.
తదా హుతాశనం హుత్వా
జేపుస్తస్య తదృత్విజః
జగుశ్చ తే యథాశాస్త్ర
తత్ర సామాని సామగాః॥
టీక:
తదా = అప్పుడు; హుతాశనం = అగ్నిలో; హుత్వా = దహనముచేసి; జేపుః = జపించిరి; తస్య = అతనిని; తత్ = ఆ; ఋత్విజః = ఋత్విక్కులు; జగుశ్చ = గానము చేసిరి; తే = వారు; యథాశాస్త్రమ్ =శాస్త్రోక్తముగా; తత్ర = అక్కడ; సామాని = సామగులు; సామగాః = సామగానము.
భావం:-
అప్పుడు ఋత్విజులు అతనిని అగ్నిలో దహనము చేసి జపించిరి. సామగాన నిపుణులు అక్కడ యథావిథిగా సామగానము చేసిరి.
2.76.19.
అనుష్టుప్.
శిబికాభిశ్చ యానైశ్చ
యథార్హం తస్య యోషితః।
నగరాన్నిర్యయుస్తత్ర
వృద్ధైః పరివృతాస్తదా॥
టీక:
శిబికాభిః = పల్లకీలపైన; చ = ఇంకను; యానైః = వాహనములపైన; చ = ఇంకను; యథార్హం = అర్హతను అనుసరించి; తస్య = రాజుయొక్క; యోషితః = స్త్రీలు; నగరాత్ = నగరమునుండి; నిర్యయుః = బయలుదేరి వచ్చిరి; తత్ర = ఆ ప్రదేశమునకు; వృద్ధైః = వృద్ధులు; పరివృతాః = వెంటరాగా; తదా = అప్పుడు
భావం:-
రాజు స్త్రీలు, వృద్దులు వెంటరాగా, తమ తమ అర్హతను అనుసరించి పల్లకీలను, ఇతర వాహనములను ఎక్కి నగరమునుండి బయలుదేరి వచ్చిరి.
2.76.20.
అనుష్టుప్.
ప్రసవ్యం చాపి తం చక్రుః
ఋత్విజోఽగ్నిచితం నృపమ్।
స్త్రియశ్చ శోకసంతప్తాః
కౌసల్యాప్రముఖాస్తదా॥
టీక:
ప్రసవ్యం = అప్రదక్షిణముగా; చ అపి = అయిన; అపి = విధముగా; తం = ఆ; చక్రుః = ప్రదక్షిణం చేసిరి; ఋత్విజః = ఋత్విజులు; అగ్నిచితం = అకాలిన చితికి; నృపమ్ = రాజునకు; స్త్రియః = స్త్రీలు; చ = ఇంకను; శోకసంతప్తాః = దుఃఖముతో శోకించుచున్న; కౌసల్యా ప్రముఖాః = కౌసల్యాది స్త్రీలు; తదా = అప్పుడు.
భావం:-
అప్పుడు ఋత్విక్కులు, దుఃఖాక్రాంతులైన కౌసల్యాది స్రీలు ఆ చితాగ్ని యైన రాజునకు చుట్టూ అప్రదక్షిణముగా తిరిగిరి.
2.76.21.
అనుష్టుప్.
క్రౌంచీనామివ నారీణామ్
నినాదస్తత్ర శుశ్రువే।
ఆర్తానాం కరుణం కాలే
క్రోశంతీనాం సహస్రశః॥
టీక:
క్రౌంచీనామ్ = క్రౌంచ పక్షుల; ఇవ = వలె; నారీణామ్ = స్త్రీలయొక్క; నినాదః = ధ్వని; తత్ర = అక్కడ; శుశ్రువే = వినవచ్చెను; ఆర్తానాం = దుఃఖముతో; కరుణం = దీనముగా; కాలే = సమయమున; క్రోశంతీనాం = ఏడ్చుచున్న; సహస్రశః = వేలకొలది
భావం:-
ఆ సమయమున, అతిదీనముగా దుఃఖముతో ఏడ్చుచున్న వేలకొలది స్త్రీల రోదనధ్వని క్రౌంచపక్షుల ధ్వనివలె వినవచ్చెను.
2.76.22.
అనుష్టుప్.
తతో రుదంత్యో వివశా
విలప్య చ పునః పునః।
యానేభ్యస్సరయూతీరమ్
అవతేరుర్వరాంగనాః॥
టీక:
తతః = అటు పిమ్మట; రుదంత్యః =ఏడ్చుచున్న; వివశా = స్వాధీనము తప్పి; విలప్య = విలాపము చేసి; చ = మఱియు; పునః పునః = మాటిమాటికిని; యానేభ్యః = యానములనుండి; సరయూతీరమ్ = సరయూనదీ తీరమునందు; అవతేరుః = దిగిరి; వరాంగనాః = స్త్రీలు
భావం:-
పిమ్మట స్వాధీనము తప్పి, ఏడ్చుచున్న స్రీలు మాటిమాటికిని విలాపించుచు సరయూనదీ తీరమునందు యానముల నుండి దిగిరి.
2.76.23.
త్రిష్టుప్.
కృత్వోదకం తే భరతేన సార్ధం
నృపాంగనా మంత్రిపురోహితా శ్చ।
పురంప్రవిశ్యాశ్రుపరీతనేత్రాః
భూమౌ దశాహం వ్యనయంత దుఃఖమ్॥
టీక:
కృత్వ ఉదకం = జల తర్పణములు ఇచ్చి; తే = వారు; భరతేన సార్ధం = భరతునితో పాటు; నృపాంగనా = రాజ స్త్రీలు; మంత్రిపురోహితాః = మంత్రి పురోహితాదులు; చ = ఇంకను; పురం = పురమును; ప్రవిశ్య = ప్రవేశించి; అశ్రుపరీత నేత్రాః = కన్నీళ్లతో నిండిన నేత్రములతో; భూమౌ = నేల మీదనే; దశాహం = పది దివసములు; వ్యనయంత = గడిపిరి; దుఃఖమ్ = అతి కష్టముతో
భావం:-
ఆ రాజ స్త్రీలు, మంత్రి పురోహితాదులు, భరతునితో పాటు తాము కూడా రాజునకు జలతర్పణములు ఇచ్చి, కన్నీళ్లతో నిండిన నేత్రములతో పురమును ప్రవేశించి నేల మీదనే పరుండుచు, పది దినములు అతికష్టముతో గడిపిరి.
*గమనిక:-
ఉత్తరక్రియలు- ప్రేతముతో సహా అగ్నులను వెలుపలికి తీసుకొని వచ్చుట, శవమునకు స్నానాది సంస్కారములను నడుపుట, దానిని శ్మశానమునకు చేర్చుట, శవమును చితిపై ఉంచుట, మంత్రపూర్వకముగా చితికి నిప్పు అంటించుట, దానికి ప్రదక్షిణములను ఒనర్చుట, నదీజలములలో తర్పణములను వదులుట, పదిదినములు ముగియు వరకు మృతాశౌచము పాటించుట, నేలపై పరుండుట, మొదలగునవి ఉత్తరక్రియలలోని కొన్ని అంశములు, (గీతాప్రెస్ వారి రామాయణము)
2.76.24.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే చతుస్సప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; షట్సప్తతితమ [76] = డెబ్బైఆఱవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [76] డెబ్బైఆఱవ సర్గ సంపూర్ణము.
2.77.1.
అనుష్టుప్.
తతో దశాహేఽతిగతే
కృతశౌచో నృపాత్మజః।
ద్వాదశేఽహని సంప్రాప్తే
శ్రాద్ధకర్మాణ్యకారయత్॥
టీక:
తతః = అటుపిమ్మట; దశాహే = పదవదినము; అతిగతే = గడచిన పిమ్మట; కృత = చేసికొనిన; శౌచః = శుద్ధి కలవాడు; నృపాత్మజః = రాకుమారుడు; ద్వాదశే = పండ్రెండవ; అహని = దినము; సంప్రాప్తే = వచ్చినదగుచుండగా; శ్రాద్ధకర్మాణి = శ్రాద్ధకర్మలను; అకారయత్ = చేయించెను.
భావం:-
భరతుడు పదవ దినము గడిచిన పిమ్మట పదకొండవదినమున శుద్ధి చేసికొని, పండ్రెండవ దినమునందు షోడశము, సపిండీకరణము మున్నగు శ్రాద్ధకర్మలు నిర్వర్తించెను.
2.77.2.
అనుష్టుప్.
బ్రాహ్మణేభ్యో దదౌ రత్నమ్
ధనమన్నం చ పుష్కలమ్।
వాసాంసి చ మహార్హాణి
రత్నాని వివిధాని చ॥
టీక:
బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు; దదౌ = ఇచ్చెను; రత్నమ్ = రత్నములను; ధనమ్ = ధనమును; అన్నం = అన్నమును; చ = ఇంకను; పుష్కలమ్ = పుష్కలమైన; వాసాంసి = వస్త్రములను; చ = ఇంకను; మహార్హాణి = అత్యంత విలువైన; రత్నాని = శ్రేష్టమైనవస్తువులను; వివిధాని = అనేక విధములైన; చ = ఇంకను
భావం:-
భరతుడు శ్రాద్ధ సమయమునందు బ్రాహ్మణులకు రత్నములు, ధనము, పుష్కలమైన భోజనము, బాగా విలువైన వస్త్రములు, ఎన్నో రకముల శ్రేష్ఠమైన వస్తువులు దానము చేసెను.
2.77.3.
అనుష్టుప్.
బాస్తికం బహు శుక్లం చ
గాశ్చాపి శతశస్తథా।
దాసీదాసం చ యానం చ
వేశ్మాని సుమహాన్తి చ।
బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రో
రాజ్ఞస్తస్యౌర్ధ్వదైహికమ్॥
టీక:
బాస్తికం = మేకలగుంపులను; బహు = అధిక సంఖ్యలో; శుక్లం = తెల్లని; చ = ఇంకను; గా = ఆవులను; చాపి = ఐతే; శతశః = వందలకొలది; తథా = అటులనే; దాసీదాసం = దాసదాసీ జనమును; చ = ఇంకను; యానం = వాహనములను; చ = ఇంకను; వేశ్మాని = గృహములను; సుమహాన్తి = పెద్ద పెద్ద; చ = ఇంకను; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు; దదౌ = ఇచ్చెను; పుత్రః = కుమారుడైన భరతుడు; రాజ్ఞః = రాజు; తస్య = ఆ; ఊర్ధ్వదైహికమ్ = పారలౌకిక క్రియలును ఉద్దేశించి.
భావం:-
దశరథునికి పారలౌకిక క్రియలు చేయు సందర్భమున భరతుడు పెద్ద తెల్లని మేకల మందను, వందల కొలది గోవులను, దాసదాసీ జనమును, వాహనములను, విశాలమైన గృహములను బ్రాహ్మణులకు దానము చేసెను.
2.77.4.
అనుష్టుప్.
తతః ప్రభాతసమయే
దివసేఽథ త్రయోదశే।
విలలాప మహాబాహుః
భరతశ్శోకమూర్ఛితః॥
టీక:
తతః = అప్పుడు; ప్రభాతసమయే = ప్రాతః కాలమునందు; దివసే = దినమున; అథ = అటుపిమ్మట; త్రయోదశే = పదమూడవది; విలలాప = విలపించెను; మహాబాహుః = గొప్పభుజబలసంప్పన్నుడు; భరతః = భరతుడు; శోకమూర్ఛితః = శోకాక్రాంతుడై ఏడ్చెను.
భావం:-
పదమూడవ దినమున ప్రాతఃకాలమునందు గొప్పభుజబలసంప్పన్నుడు అగు భరతుడు శోకాక్రాంతుడై, ఎలుగెత్తి ఏడ్చెను.
2.77.5.
అనుష్టుప్.
శబ్దాపిహితకంఠస్తు
శోధనార్థముపాగతః।
చితామూలే పితుర్వాక్యమ్
ఇదమాహ సుదుఃఖితః॥
టీక:
శబ్దాపిహిత కంఠస్తు = గద్గదికమైన కంఠముతో; శోధనార్థమ్ = అస్థి సంచయనముచేయుటకై; ఉపాగతః = సమీపించి; చితామూలే = చితివద్దకు; పితుః = తండ్రి; వాక్యమ్ = పలికెను; ఇదమ్ = ఈ విధముగా; ఆహ సుదుఃఖితః = చాలా దుఃఖించుచు
భావం:-
అస్థి సంచయనము చేయుటకై శ్మశానమునకు వెళ్ళిన భరతుడు.. తండ్రి చితివద్దకు వెళ్ళెను. అంత చాల దుఃఖించుచు ఇట్లు పలికెను
2.77.6.
అనుష్టుప్.
“తాత యస్మిన్నిస్పష్టోఽహమ్
త్వయా భ్రాతరి రాఘవే।
తస్మిన్వనం ప్రవ్రజితే
శూన్యే త్యక్తోఽస్మ్యహం త్వయా॥
టీక:
తాత = తండ్రీ; యస్మిన్ = ఎవరికి; నిస్పష్ట = అప్పగించినావు; అహమ్ = నన్ను; త్వయా = నీవు; భ్రాతరి = సోదరుడు; రాఘవే = రామునకు; తస్మిన్ = ఆ రాముడు; వనం = అడవులకు; ప్రవ్రజితే = వెళ్లిపోయెను; శూన్యే = శూన్యములో; త్యక్తః అస్మి = వదలివేయబడను; అస్మి = ఐతిని; అహం = నేను; త్వయా = నీ చేత
భావం:-
“తండ్రీ! నీవు నన్ను రామునకు అప్పగించితివి. ఆ రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయెను. ఇక ఇప్పుడు నీచే శూన్యములో వదలివేయబడితిని.
2.77.7.
అనుష్టుప్.
యస్యా గతిరనాథాయాః
పుత్రః ప్రవాజితో వనమ్।
తామమ్బాం తాత కౌసల్యామ్
త్యక్త్వా త్వం క్వ గతో నృప!”॥
టీక:
యస్యా = ఎవరి యొక్క; గతిః = అండ కావలసియున్న; అనాథాయాః = అనాథురాలైన; పుత్రః = కుమారుడైన రాముని; ప్రవాజితః = పంపివేసి; వనమ్ = వనములకు; తామ్ = నీచే; అమ్బాం = తల్లిని; తాత = తండ్రీ; కౌసల్యామ్ = కౌసల్యకు; త్యక్త్వా = విడిచి; త్వం = నీవు; క్వ గతః = ఎక్కడికి వెళ్లిపోతివి; నృప = మహారాజా
భావం:-
మహారాజా! అనాథురాలైన కౌసల్యకు అండగా ఉడవలసిన రాముని అరణ్యమునకు పంపివేసి, ఇపుడు నీవు కూడ ఆమెను విడచి ఎక్కడికి వెళ్ళిపోతివి?”
2.77.8.
అనుష్టుప్.
దృష్ట్వా భస్మారుణం తచ్చ
దగ్ధాస్థి స్థానమండలమ్।
పితుశ్శరీరనిర్వాణమ్
నిష్టనన్విషసాద సః॥
టీక:
దృష్ట్వా = చూచి; భస్మారుణం = భస్మము చేత ఎఱ్రబడిన; అరుణం = ఎఱ్రగా ఉన్నది; తత్ = ఆ; చ = ఇంకను; దగ్ధః = కాలినవి; అస్థి = ఎముకలుతో; స్థానమండలమ్ = స్థానమును; మండలమ్ = మండలాకారమైన; పితుః = తండ్రి; శరీర నిర్వాణమ్ = శరీరమును అదృశ్యము చేసినది; నిష్టనన్ = బిగ్గరగా ఏడ్చెను; విషసాద = దీనుడై; సః = భరతుడు.
భావం:-
అతడు అక్కడ కాలిన ఎముకలుతో, ఇంకా ఎఱ్రగా ఉన్న భస్మము కలది, తన తండ్రి శరీరమును అదృశ్యము చేసినది అయిన ఆ మండలాకారమైన స్థానమును చూచి బిగ్గరగా ఏడ్చెను.
2.77.9.
అనుష్టుప్.
స తు దృష్ట్వా రుదన్ దీనః
పపాత ధరణీతలే।
ఉత్థాప్యమానశ్శక్రస్య
యంత్రధ్వజ ఇవ చ్యుతః॥
టీక:
స తు = ఆ భరతుడు; దృష్ట్వా = చూచి; రుదన్ = ఏడ్చుచు; దీనః = దీనుడై; పపాత = పడిపోయెను; ధరణీతలే = నేల మీద; ఉత్థాప్యమానః = పైకి ఎత్తుచుండగా; శక్రస్యయంత్రధ్వజ = యంత్రబద్దమైన ఇంద్రధ్వజము; ఇవ = వలె; చ్యుతః = పడెను
భావం:-
భరతుడు ఆ చితాస్థానము చూచి, ఏడ్చుచు దీనుడై, ఎత్తుచుండగా పడిపోయిన యంత్రబద్ధమైన ఇంద్రధ్వజము వలె నేలపై పడెను. ఇది అనర్థ సూచకముగా చేయబడిన వర్ణన.
*గమనిక:-
(1) ఇంద్రధ్వజము- సస్యవృద్ధికరమగు వాన కురియుటకై ఇంద్రప్రీతిగా ఎత్తునట్టి ధ్వజము. ఆంధ్రశబ్దరత్నాకరము, పూర్వకాలములో రాజులు తమ దేశంలో వానలు బాగా కురవడం కోసం ఇంద్రుడిని ప్రసన్నుడిని చేసుకొనే లక్ష్యంతో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు ఇంద్ర ధ్వజాన్ని ఆవిష్కరించేవారు. ఇదొక వ్రతం. పారమార్థిక పదకోశం. (2) యంత్రధ్వజము- బీజాక్షర కూడిన చక్రమను యంత్రము కల ధ్వజము. (3) శ్రీశ్రీశ్రీ కంచికామకోటిపీఠము వారి జాలగూడు – ఇంద్రధ్వజ నిమిత్త శమనవర్ణన నందు ఇంద్రధ్వజము పతనము / భంగముల వలన కలుగు ప్రమాదములు వాటి నివారణ చర్యలు సప్రమాణికముగా సూచింపబడినవి. (https://www.kamakoti.org/telugu/64/156.htm)
2.77.10.
అనుష్టుప్.
అభిపేతుస్తతస్సర్వే
తస్యామాత్యాశ్శుచివ్రతమ్।
అంతకాలే నిపతితమ్
యయాతిమృషయో యథా॥
టీక:
అభిపేతుః = భరతుని శీఘ్రముగా సమీపించిరి; తతః = అప్పుడు; సర్వే = అందరును; తస్యామ్ = అతని యొక్క; అమాత్యాః = మంత్రులు; శుచివ్రతమ్ = మంచి శీలము కలిగిన; అంతకాలే = అంతిమ కాలములో; నిపతితమ్ = నేలపై పడెను; యయాతిమ్ = యయాతిని; ఋషయో యథా = ఋషులు వలె
భావం:-
అప్పుడు, యయాతి మరణ సమయమున ఋషులందరు వచ్చిన విధముగా. ఆతని మంత్రులు అందరును మంచి శీలము కలిగిన భరతుని శీఘ్రముగా సమీపించిరి.
2.77.11.
అనుష్టుప్.
శత్రుఘ్న శ్చాపి భరతమ్
దృష్ట్వా శోకమ్ పరిప్లుతః।
విసంజ్ఞో న్యపతద్భూమౌ
భూమిపాలమనుస్మరన్॥
టీక:
శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; చాపి = సహితము; భరతమ్ = భరతుని; దృష్ట్వా = చూచి; శోకమ్ = శకముతో; పరిప్లుతః = వ్యాకులుడై; విసంజ్ఞః = స్పహ తప్పి; న్యపతత్ = పడెను; భూమౌ = నేల మీద; భూమిపాలమ్ = రాజును; అనుస్మరన్ = స్మరించుచు
భావం:-
శత్రుఘ్నుడు కూడ భరతుని చూచి శోకముతో వ్యాకులుడై, దశరథ మహారాజును స్మరించుచు, స్పృహ తప్పి నేలపై పడెను.
2.77.12.
అనుష్టుప్.
ఉన్మత్త ఇవ నిశ్చేతా
విలలాప సుదుఃఖితః।
స్మృత్వా పితుర్గుణాంగాని
తాని తాని తథా తథా॥
టీక:
ఉన్మత్త = పిచ్చివాని; ఇవ = వలె; నిశ్చేతా = మనోధైర్యము కోల్పోయి; విలలాప = విలపించెను; సుదుఃఖితః = మిక్కిలిదుఃఖముతో; స్మృత్వా = స్మరించుచు; పితుః = తండ్రి యొక్క; గుణాం = మంచిగుణములను; అంగాని = అవయవములను; తాని తాని = ఆయా; తథా తథా = అయా విధములుగా.
భావం:-
తండ్రి యొక్క శ్రేష్టములైన ఆ యా సుగుణములను అవయవములను వాటివాటి ప్రత్యేకతలు స్మరించుచు, పిచ్చివాని వలె, మనఃస్థెర్యము కోల్పోయి, చాలా దుఃఖముతో విలపించెను.
2.77.13.
అనుష్టుప్.
మంథరాప్రభవస్తీవ్రః
కైకేయీగ్రాహసంకులః।
వరదానమయో క్షోభ్యో
మంజయచ్ఛోకసాగరః॥
టీక:
మంథరా = మంథర; ప్రభవః = ఉత్పత్తిస్థానముగా కలదీ; తీవ్రః = భయంకరమైనది; కైకేయీ = కైకేయి; గ్రాహసంకులః = మొసలిచే; సంకులః = వ్యాకులపరచునది; వరదానమయః = కైకేయికి దానముగా చేసిన వరములతో నిండినది; అక్షోభ్యః = క్షోభింపశక్యము కానిదీ; ఆమంజయత్ = ముంచివేసినది; శోకసాగరః = శోక సాగరములో.
భావం:-
తీవ్రమైన మంథర ఉత్పత్తిస్థానముగా కల, కైకేయి అను మొసలిచే వ్యాకులపరచినదీ, క్షోభింపశక్యము కానిదీ ఐన ఈ ముంచివేసిన శోకసాగరము కైకేయికి ఒసగబడిన వరమయము.
2.77.14.
అనుష్టుప్.
“సుకుమారం చ బాలం చ
సతతం లాలితం త్వయా।
క్వ తాత భరతం హిత్వా
విలపంతం గతో భవాన్॥
టీక:
సుకుమారం = సుకుమారుడు; చ = ఇంకను; బాలం = బాలుని; చ = ఇంకను; సతతం = సర్వదా; లాలితం = లాలింపబడినవాడు; త్వయా = నీ చేత; క్వ = ఎక్కడికి; తాత = తండ్రీ; భరతం = భరతుడు; హిత్వా = విడిచి; విలపంతం = విలపించుచుండగా; గతః = వెళ్లిపోతివి; భవాన్ = నీవు.
భావం:-
తండ్రీ! సుకుమారుడు, బాలుడు సర్వదా నీచేత లాలింపబడినవాడు అయిన భరతుడు ఈ విధముగా విలపించుచుండగా విడచి ఎక్కడికి వెళ్ళిపోతివి?
2.77.15.
అనుష్టుప్.
నను భోజ్యేషు పానేషు
వస్త్రేష్వాభరణేషు చ।
ప్రవారయసి నః సర్వాన్
తన్నః కోఽన్యః కరిష్యతి॥
టీక:
నను = చేసెడివాడవు; భోజ్యేషు = తినుబండారముల విషయమున; పానేషు = పానీయముల విషయమున; వస్త్రేషు = వస్త్రముల విషయమున; ఆభరణేషు = ఆభరణముల విషయమున; చ = ఇంకను; ప్రవారయసి = కామ్యవస్తువు దానము చేయుట; నః సర్వాన్ = మా అందరికీ; తత్ + నః = అట్లు మాకు; కః = ఎవ్వరు; అన్యః = ఇతరులు; కరిష్యతి = చేయగలరు.
భావం:-
తినుబండారములు, పానీయములు, వస్త్రములు, ఆభరణములు మున్నగు వాటి విషయమున కోరినవన్నీ ఇచ్చెడివాడవు. వాటిని మాకు అట్లు మరి ఎవ్వరు ఇచ్చెదరు?
2.77.16.
అనుష్టుప్.
అవదారణకాలే తు
పృథివీ నావదీర్యతే।
యా విహీనా త్వయా రాజ్ఞా
ధర్మజ్ఞేన మహాత్మనా॥
టీక:
అవదారణ = బ్రద్దలయిపోవలసిన; కాలే = సమయము; తు = ఐనను; పృథివీ = భూమి; నావదీర్యతే = బ్రద్దలయిపోలేదు; యా = శోభా,సర్వశబ్దసంబోధిని; విహీనా = లేకుండా; త్వయా = నీ చేత; రాజ్ఞా = రాజు; ధర్మజ్ఞేన = ధర్మాత్ముడు; మహాత్మనా = మహాత్ముడు
భావం:-
ధర్మాత్ముడవు, మహాత్ముడవు, రాజువు అయిన నీవు లేని ఈ భూమి బ్రద్దలైపోవలసిన సమయము వచ్చినను అట్లు బ్రద్దలగుట లేదు.
2.77.17.
అనుష్టుప్.
పితరి స్వర్గమాపన్నే
రామే చారణ్యమాశ్రితే।
కిం మే జీవితసామర్థ్యమ్
ప్రవేక్ష్యామి హుతాశనమ్॥
టీక:
పితరి = తండ్రి; స్వర్గమ్ = స్వర్గస్థుడగుట; ఆపన్నే = పొందినవా డగుచుండ; రామే = రామునిచే; చ = కూడ; అరణ్యమ్ = రాముడు అరణ్యమును; ఆశ్రితే = ఆశ్రయింపబడెను; కిం = ఎక్కడిది; మే = నాకు; జీవిత = జీవించుటకు; సామర్థ్యమ్ = శక్తి; ప్రవేక్ష్యామి = ప్రవేశించదను; హుతాశనమ్ = అగ్నిలోనికి.
భావం:-
తండ్రి స్వర్గమునకు. రాముడేమో అరణ్యమునకు వెళ్ళిపోయినాడు. ఇంక నాకు జీవించే శక్తి ఎక్కడిది? అగ్నిలో ప్రవేశించెదను.”
2.77.18.
అనుష్టుప్.
హీనో భ్రాత్రా చ పిత్రా చ
శూన్యామిక్షా్వకుపాలితామ్।
అయోధ్యాం న ప్రవేక్ష్యామి
ప్రవేక్ష్యామి తపోవనమ్॥
టీక:
హీనః = లేనటువంటి; భ్రాత్రా = సోదరుడు; చ = ఇంకను; పిత్రా = తండ్రీ; చ = ఇంకను; శూన్యామ్ = శూన్యమైపోయిన; ఇక్ష్వాకు = ఇక్ష్వాకు వంశీయులచే; పాలితామ్ = పాలితమైన; అయోధ్యాం = అయోధ్యా నగరమును; న = చేయను; ప్రవేక్ష్యామి = ప్రవేశించుట; ప్రవేక్ష్యామి = ప్రవేశించెదను; తపోవనమ్ = తపోవనమును
భావం:-
సోదరుడూ, తండ్రీ లేని నేను ఇక్ష్వాకు వంశీయులచే పాలితమైన ఈ శూన్యమైపోయిన అయోధ్యను ప్రవేశించను. తపోవనమును వ్రేశించెదను.
2.77.19.
అనుష్టుప్.
తయోర్విలపితం శ్రుత్వా
వ్యసనం చాన్వవేక్ష్య తత్।
భృశమార్తతరా భూయః
సర్వఏవానుగామినః॥
టీక:
తయోః = వారిద్దరి; విలపితం = విలాపములు; శ్రుత్వా = విని; వ్యసనం = ఆపదను; చ = ఇంకను; అన్వవేక్ష్య = చూచి; తత్ = ఆ; భృశమ్ = మిక్కిలి; ఆర్తతరా = మిక్కిలి దుఃఖితులైరి; భూయః = మరొకసారి; సర్వ = అందరు; ఏవ = నిష్చయార్థకము; అనుగామినః = అనుచరులు.
భావం:-
వారిద్దరి విలాపములు విని, వచ్చి పడిన ఆ ఆపదను చూచి, అనుచరులందరు చాల దుఃఖితులైరి.
*గమనిక:-
ఆర్తః- ఆర్తతర- ఆర్తతమః
2.77.20.
అనుష్టుప్.
తతో విషణ్ణౌ శ్రాంతౌ చ
శత్రుఘ్నభరతావుభౌ।
ధరణ్యాం సంవ్యవేష్టేతామ్
భగ్నశృంగావివర్షభౌ॥
టీక:
తతః = అటుపిమ్మట; విషణ్ణౌ = దుఃఖముతో; శ్రాంతౌ = అలసిపోయిన; చ = ఇంకను; శత్రుఘ్న = శత్రుఘ్నుడు; భరతా = భరతుడు; ఉభౌ = ఇద్దరూ; ధరణ్యాం = నేల మీద; సంవ్యవేష్టేతామ్ = దొర్లిరి; భగ్న = విరుగగొట్టబడిన; శృంగా = కొమ్ములు; ఇవ = వలె; వృషభౌ = రెండు వృషభములు
భావం:-
దుఃఖితులై అలసిపోయిన ఆ శత్రుఘ్నభరతులిద్దరూ కొమ్ములు విరగగొట్టిన రెండు వృషభములు వలె నేలపై దొర్లిరి.
2.77.21.
అనుష్టుప్.
తతః ప్రకృతిమాన్వైద్యః
పితురేషాం పురోహితః।
వసిష్ఠో భరతం వాక్యమ్
ఉత్థాప్య తమువాచ హ॥
టీక:
తతః = అప్పుడు; ప్రకృతిమాన్ = ఉత్తమ స్వభావము కలవాడు; వైద్యః = జ్ఞానవంతుడు; పితురేషాం = తండ్రి యొక్క; పురోహితః = పురోహితుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; భరతం = భరతునితో; వాక్యమ్ = మాటలను; ఉత్థాప్య = లేవదీసి; తమ్ = ఆ; ఉవాచ హ = ఇట్లు పలికెను
భావం:-
అప్పుడు ఉత్తమ స్వభావము కలవాడు, జ్ఞానవంతుడు, వీరి తండ్రికి పురోహితుడు అయిన వసిష్ఠుడు భరతుని లేవదీసి, ఇట్లు పలికెను.
2.77.22.
అనుష్టుప్.
“త్రయోదశోఽయం దివసః
పితుర్వృత్తస్య తే విభో।
సావశేషాస్థినిచయే
కిమిహ త్వం విలంబసే॥
టీక:
త్రయోదశః = పదమూడవ; అయం = ఇప్పుడు; దివసః = దినము; పితుః = తండ్రి; వృత్తస్య = మరణించి; తే = నీ యొక్క; విభో = ప్రభువైన; సా = ఆ; అవశేష = మిగిలి ఉన్నది; అస్థినిచయే = అస్థి సంచయన కార్యము; కిమ్ = ఎందుకు; ఇహ = ఇక్కడ; త్వం = నీవు; విలంబసే = ఆలస్యము చేయుచున్నావు
భావం:-
“ప్రభువైన ఓ భరతా! నీ తండ్రి మరణించి ఇది పదమూడవ దివసము. అస్థి సంచయన కార్యము ఇంకను మిగిలి ఉన్నది. నీవు ఇక్కడ ఆలస్యము చేయుచున్నావేమి?
2.77.23.
అనుష్టుప్.
త్రీణి ద్వన్ద్వాని భూతేషు
ప్రవృత్తాన్యవిశేషతః।
తేషు చాపరిహార్యేషు
నైవం భవితుమర్హసి॥
టీక:
త్రీణి = మూడు; ద్వన్ద్వాని = ద్వంద్వములు (ఆకలిదప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు); భూతేషు = ప్రాణుల విషయమున; ప్రవృత్తాని = సంభవించును; అవిశేషతః = భేదమేమీ లేదు; తేషు = అవి; చ = ఇంకను; అపరిహార్యేషు = అనివార్యము; నైవం = లేదు; భవితుమ్ = నీవిట్లు అగుటకు; అర్హసి = తగినవాడవు.
భావం:-
ఆకలిదప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు అను మూడు విడదీయరాని ద్వంద్వములు అన్ని ప్రాణుల విషయమునను భేదమేమీ లేకుండా ప్రవర్తించును. అవి పరిహరింప శక్యము కానివి. అట్టి స్థితిలో నీవిట్లు అగుట బాగుగా లేదు.
2.77.24.
అనుష్టుప్.
సుమంత్రశ్చాపి శత్రుఘ్నమ్
ఉత్థాప్యాభిప్రసాద్య చ।
శ్రావయామాస తత్త్వజ్ఞః
సర్వభూతభవాభవమ్॥
టీక:
సుమన్త్రః = సుమంత్రుడు; చాపి = కూడా; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; ఉత్థాపి = లేవదీసి; అభిప్రసాద్య = అనునయముగా; చ = ఇంకను; శ్రావయామాస = బోధించెను; తత్త్వజ్ఞః = తత్త్వవేత్తౖయెన; సర్వభూత = సకల ప్రాణులకు; భవాభవమ్ = జననమరణములు.
భావం:-
తత్త్వవేత్తయైన సుమంత్రుడు శత్రుఘ్నుని లేవదీసి, సకలప్రాణులకు జననమరణములు తప్పనివి అను విషయమును బోధించెను.
2.77.25.
అనుష్టుప్.
ఉత్థితౌ చ నరవ్యాఘ్రౌ
ప్రకాశేతే యశస్వినౌ।
వర్షాతపపరిక్లినౌ
పృథగింద్రధ్వజావివ॥
టీక:
ఉత్థితౌ = పైకి లేచి; చ = ఇంకను; నరవ్యాఘ్రౌ = పురుష శ్రేష్ఠులిద్దరు; ప్రకాశేతే = ప్రకాశించిరి; యశస్వినౌ = యశఃశాలులు; వర్షాః = వర్షమునకు; ఆతపః = ఎండలకు; పరిక్లినౌ = వాడినా; పృథక్ = మరల; ఇంద్రధ్వజా = ఇంద్ర ధ్వజముల; ఇవ = వలె.
భావం:-
నేలనుంచి లేచిన ఆ యశఃశాలులు ఇరువురూ, ఎండావానలకు వాడిన ఇంద్రధ్వజముల వలె ప్రకాశించిరి.
2.77.26.
అనుష్టుప్.
అశ్రూణి పరిమృద్నంతౌ
రక్తాక్షౌ దీనభాషిణౌ।
అమాత్యాస్త్వరయన్తి స్మ
తనయౌ చాపరాః క్రియాః॥
టీక:
అశ్రూణి = కన్నీటిని; పరిమృద్నంతౌ = తుడుచుకుంటున్నవారిని; రక్తాక్షౌ = ఎఱ్రబడిన కళ్లు కలవారిని; దీనభాషిణౌ = దీనముగా మాటలాడుచున్న వారిని; అమాత్యాః = మంత్రులు; త్వరయన్తి = తొందరపెట్టిరి; స్మ = వారిని; తనయౌ = రాజకుమారులను; చ = ఇంకను; అపరాః = మిగిలిన; క్రియాః = పనులు.
భావం:-
కన్నీరు తుడుచుకొనుచు, ఎఱ్రబడిన కళ్ళతో దీనముగా మాటలాడుచున్న ఆ రాజకుమారులను మిగిలిన, పనులను చేయుటకు అమాత్యులు తొందర బెట్టిరి.
2.77.27.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే సప్తసప్తతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; సప్తసప్తతితమ [77] = డెబ్బైఏడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [77] డెబ్బైఏడవ సర్గ సంపూర్ణము.
2.78.1.
అనుష్టుప్.
అథ యాత్రాం సమీహంతమ్
శత్రుఘ్నో లక్ష్మణానుజః।
భరతం శోకసంతప్తమ్
ఇదం వచనమబ్రవీత్॥
టీక:
అథ = పిమ్మట; యాత్రాం = శ్రీరామచంద్రుని వద్దకు ప్రయాణము గురించి; సమీహంతమ్ = సిద్ధపడుచున్న; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; లక్ష్మణానుజః = లక్ష్మణుని సోదరుడు; భరతం = భరతుని గూర్చి; శోకసంతప్తమ్ = దుఃఖముతో మనస్సును కుంగిన; ఇదం = ఈ; వచనమ్ = మాట; అబ్రవీత్ = చెప్పెను.
భావం:-
తదనంతరము లక్ష్మణుని సోదరుడైన శత్రుఘ్నుడు శోకముతో కాగిపోతూ శ్రీరామునివద్దకు వెళ్ళుటకు సిద్ధపడుచున్న అన్న భరతునితో ఇట్లు పలికెను.
2.78.2.
అనుష్టుప్.
“గతిర్యః సర్వభూతానామ్
దుఃఖే కిం పునరాత్మనః।
స రామస్సత్త్వసంపన్నః
స్త్రియా ప్రవ్రాజితో వనమ్॥
టీక:
గతిః = అండగా (ప్రాపు), దండగా (పక్షమున) ఉండువాడు; యః = ఎవరు; సర్వభూతానామ్ = ప్రాణులన్నింటికిని; దుఃఖః = దుఃఖితులకు; కిం పునః = మరల చెప్పనేల; ఆత్మనః = తనకు (మనకు); సః = అతడు; రామః = శ్రీరామచంద్రుడు; సత్త్వసంపన్నః = సత్త్వగుణ సంపన్నుడు; స్త్రియా = ఆడదాని చేత; ప్రవ్రాజితః = పంపబడినవాడు; వనమ్ = అరణ్యమును గూర్చి .
భావం:-
సర్వ ప్రాణులకును అండదండ అయిన శ్రీరామచంద్రుడు, దుఃఖితులమైన మనలను రక్షించగలడని మఱల చెప్పనేల? అట్టి సత్త్వగుణసంపన్నుడైన శ్రీరామచంద్రుడిని ఒక ఆడది అడవికి పంపుట మిక్కిలి దుఃఖకరము.
2.78.3.
అనుష్టుప్.
బలవాన్ వీర్యసంపన్నో
లక్ష్మణో నామ యోఽప్యసౌ।
కిం న మోచయతే రామమ్
కృత్వా స్మ పితృనిగ్రహమ్॥
టీక:
బలవాన్ = బలశాలి; వీర్యసంపన్నః = పరాక్రమ సంపన్నుడు; లక్ష్మణః = లక్ష్మణుడు; నామ = పేరుగల; యః = ఎవడు; అపి = ఐనను; అసౌ = అతడు; కిం = ఎందులకు; న = లేదో; మోచయతే = విడిపించ; రామమ్ = శ్రీరామచంద్రుని; కృత్వా = చేసి; స్మ = సుమ; పితృ = నాన్నగారిని; నిగ్రహమ్ = నిగ్రహించుట.
భావం:-
మిక్కిలి బలశాలి, పరాక్రమ సంపన్నుడు, మన సోదరుడైన లక్ష్మణుడు ఇచటనే ఉండి నాన్నగారిని వద్దని వారించియైనను శ్రీరామచంద్రుని వనవాసమును ఎందుకు ఆపలేదో కదా?
2.78.4.
అనుష్టుప్.
పూర్వమేవ తు నిగ్రాహ్యః
సమవేక్ష్య నయానయౌ।
ఉత్పథం యః సమారూఢో
రాజా నార్యా వశం గతః”॥
టీక:
పూర్వమ్ = ముందుగానే; ఏవ = మాత్రమే; తు; నిగ్రాహ్యః = నిగ్రహించవలసినవాడు; సమవేక్ష్య = గమనించి; నయ+అనయౌ = న్యాయాన్యాయములు; ఉత్పథం = మార్గమును; యః = ఎవడు; సమారూఢః = అధిష్టించినవాడు; రాజా = రాజు; నార్యాః = వనితయొక్క; వశం = ఆధీనుడై; గతః = పొందినవాడు.
భావం:-
మహారాజు ఆడదానికి వశుడై తప్పుదారి పట్టుచున్నప్పుడు, లక్షణుడు ముందుగానే న్యాయాన్యాయములను గమనించి నిగ్రహించవలసినది.”
2.78.5.
అనుష్టుప్.
ఇతి సమ్భాషమాణే తు
శత్రుఘ్నే లక్ష్మణానుజే।
ప్రాగ్ద్వారేఽభూత్తదా కుబ్జా
సర్వాభరణభూషితా॥
టీక:
ఇతి = ఇటులు; సమ్భాషమాణే = పలుకుచుండగా; తు = ఎదుట; శత్రుఘ్నే = శత్రుఘ్నుని యందు; లక్ష్మణానుజే = లక్ష్మణస్వామి తమ్ముడైన; ప్రాక్ = తూర్పు దిక్కునున్న; ద్వారే = ద్వారమువద్ద; అభూత్ = ఉండెను; తదా = ఆవిధముగా; కుబ్జా = గూనితోనున్న స్త్రీ (మంథర) ; సర్వ = సకల; ఆభరణ = ఆభరణములు; భూషితా = అలంకరించుకొనినది.
భావం:-
లక్ష్మణస్వామి తమ్ముడైన శత్రుఘ్నుడు ఇట్లు పలుకుచుండగా, ఇంతలో ఒంటినిండా ఆభరణములు ధరించిన గూని మంథర ఎదురుగా తూర్పు ద్వారము వద్ద నిలబడి యుండెను.
2.78.6.
అనుష్టుప్.
లిప్తా చందనసారేణ
రాజవస్త్రాణి బిభ్రతీ।
వివిధం వివిధైస్తైస్తైః
భూషణైశ్చ విభూషితా॥
టీక:
లిప్తా = పూయబడినది; చందనసారేణ = చందనము అరగదీసి చేసిన గంధములచేత; రాజవస్త్రాణి = రాచస్త్రీలకు తగిన వస్త్రములు; బిభ్రతీ = ధరించినది; వివిధం = అనేక విధములుగా; వివిధైః = అనేక రకముల; తైః+తైః = ఆ యా; భూషణైః = ఆభరణములను; చ = మఱింతగా; విభూషితా = అలంకరించుకొని ఉన్నది.
భావం:-
ఆ మంథర మహారాణులకు తగిన బట్టలు వేసుకుని, మంచిగంధము పూతలు పూసుకుని, మహారాణులకు తగిన బట్టలు వేసుకుని, అతిగా అలంకరించుకుని ఉండెను.
2.78.7.
అనుష్టుప్.
మేఖలాదామభిశ్చిత్రైః
అన్యైశ్చ శుభభూషణైః।
బభాసే బహుభిర్బద్ధా
రజ్జుబద్ధేవ వానరీ॥
టీక:
మేఖలాః = ఒడ్డాణములతో; దామభిః = పూలదండలతో; చిత్రైః = విచిత్రములైన; అన్యైః = ఇతరములైన; చ = మఱియు; శుభభూషణైః = మంచి ఆభరణములతోను; బభాసే = ఒప్పుచుండెను; బహుభిః = బోలెడు; బద్ధా = బంధించబడిన; రజ్జుబద్ధా = తాళ్ళతో కట్టబడిన; ఇవ = వలె; వానరీ = ఆడకోతి.
భావం:-
ఇంకను నడుమునకు విచిత్రములైన ఒడ్డాణములను, పూలమాలలను, ఇంకా అనేక బంగారపు నగలతోనున్న ఆ మంథర, వంటినిండా బోలెడు తాళ్లు కట్టుకున్న ఆడకోతివలె ఒప్పుచుండెను.
2.78.8.
అనుష్టుప్.
తాం సమీక్ష్య తదా ద్వాస్థాః
సుభృశం పాపకారిణీమ్।
గృహీత్వాఽకరుణాం కుబ్జామ్
శత్రుఘ్నాయ న్యవేదయన్॥
టీక:
తాం = ఆ; సమీక్ష్య = చూచి; తదా = ఆవిధముగా; ద్వాస్స్థాః = ద్వారపాలకులు; సుభృశం = మిక్కిలి; పాపకారిణీమ్ = పాపాత్మురాలిన; గృహీత్వా = పట్టుకుని; అకరుణాం = కరుణలేని; కుబ్జామ్ = గూని మంథరను; శత్రుఘ్నాయ = శత్రుఘ్నుని వలన; న్యవేదయన్ = విన్నవించిరి.
భావం:-
అంతట మిగుల పాపాత్మురాలు, కఠినాత్మురాలు అయిన ఆ గూని మంథరను ద్వారపాలకులు జూచి, ఆమెను తీసుకుని వచ్చి శత్రుఘ్నునితో ఇట్లు నివేదించిరి.
2.78.9.
అనుష్టుప్.
“యస్యాః కృతే వనే రామో
న్యస్తదేహశ్చ వః పితా।
సేయం పాపా నృశంసా చ
తస్యాః కురు యథామతి॥
టీక:
యస్యాః = ఎవరి; కృతే = కారణముగా; వనే = అడవియందు; రామః = శ్రీరామచంద్రుడు; న్యస్తదేహః = శరీరమును విడిచినవాడు; చ = మఱియు; వః = మీ; పితా = నాన్నాగారు; సా = ఆమె; ఇయం = ఇదిగో; పాపా = పాపి; నృశంసా = క్రూరమైనది; చ = మఱియు; తస్యాః = ఆమె యొక్క; కురు = చేయుము; యథామతి = నీ తలంపు ప్రకారము.
భావం:-
ప్రభూ! శ్రీరామచంద్ర ప్రభువు అడవులకు వెళ్ళుటకు, మీ తండ్రిగారు స్వర్గస్థులగుటకు కారణమైనది ఈ మంథరే. ఇదిగో, క్రూరురాలు ఐన ఈమెను మీకు ఇష్టము ప్రకారము శిక్షింపుడు.
2.78.10.
అనుష్టుప్.
శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ
వచనం భృశదుఃఖితః।
అంతఃపురచరాన్సర్వాన్
ఇత్యువాచ ధృతవ్రతః॥
టీక:
శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; చ = మఱియు; తత్ = ఆ; ఆజ్ఞాయ = విని; వచనం = మాటను; భృశదుఃఖితః = అత్యంత దుఃఖముతో ఉన్నవాడు; అంతఃపురచరాన్ = అంతఃపువాసులను; సర్వాన్ = అందఱి గురించి; ఇత్యువాచ = ఇట్లు పలికెను; ధృతవ్రతః = ధృఢమైన సంకల్పమును ధరించినవాడు, తన వ్రతమునకు కట్టుబడినవాడు.
భావం:-
అత్యంత దుఃఖంలో ఉన్న శత్రుఘ్నుడు ద్వారపాలకుల మాటలు వినినంతనే ఆ నియమజీవనుడు, అక్కడ అంతఃపురములోనున్న వారందఱిని ఉద్దేశించి ఇట్లు పలుకనారంభించెను.
2.78.11.
అనుష్టుప్.
“తీవ్రముత్పాదితం దుఃఖమ్
భ్రాతౄణాం మే తథా పితుః।
యయా సేయం నృశంసస్య
కర్మణః ఫలమశ్నుతామ్”॥
టీక:
తీవ్రమ్ = తీవ్రమైన; ఉత్పాదితం = కలిగించబడినదో; దుఃఖమ్ = దుఃఖము; భ్రాతౄణాం = సోదరులమైన మాకు; మే = నాయొక్క; తథా = అదేవిధముగా; పితుః = నాన్నగారికి; యయా = ఎవరి వలన; సా = అటువంటి; ఇయం = ఈమె; నృశంసస్య = క్రూరమైన; కర్మణః = కార్యమునకు; ఫలమ్ = ఫలితమును; అశ్నుతామ్ = అనుభవించునుగాక.
భావం:-
“మా సోదరులకు, తండ్రిగారికి ఇంత తీవ్రమైన దుఃఖము కలిగించిన, ఈమె తను చేసిన క్రూరమైన పనికి తగినవిధముగా శిక్షించాలి.”
2.78.12.
అనుష్టుప్.
ఏవముక్త్వా తు తేనాశు
సఖీజనసమావృతా।
గృహీతా బలవత్కుబ్జా
సా తద్గృహమనాదయత్॥
టీక:
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; తు; తేన = వానిచేత; ఆశు = వెంటనే; సఖీజనః = తోటివారితో; సమావృతా = కూడియున్న; గృహీతా = పట్టుకోబడినది; బలవత్ = బలముగా; కుబ్జా = మంథర; సా = ఆమె; తత్ = ఆ; గృహమ్ = అంతఃపురమును; అనాదయత్ = ప్రతిధ్వనింపజేసెను.
భావం:-
శత్రుఘ్నుడు ఇట్లు పలికి, తోటివారితో కలిసి యున్న ఆ మంథరను బలముగా పట్టుకొనెను, అంతట ఆమె ఆర్తనాదములు అంతఃపురమంతా ప్రతిధ్వనించెను.
2.78.13.
అనుష్టుప్.
తతః సుభృశసంతప్తః
తస్యాః సర్వః సఖీజనః।
క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నమ్
విపలాయత సర్వశః॥
టీక:
తతః = పిమ్మట; సుభృశసంతప్తః = మిక్కిలి దుఃఖించుచు; తస్యాః = ఆమెయొక్క; సర్వః = అందఱు; సఖీజనః = తోటిదాసీజనులు; క్రుద్ధమ్ = క్రోధమును; ఆజ్ఞాయ = గ్రహించి; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; విపలాయత = పాఱిపోయెను; సర్వశః = అందఱు.
భావం:-
అంతట శత్రుఘ్నుని కోపమును జూచిన ఆమె తోటి సఖులందఱు భయమునకు లోనగుటచే మిక్కిలి దుఃఖముతో పాఱిపోయిరి.
2.78.14.
అనుష్టుప్.
ఆమంత్రయత కృత్స్నశ్చ
తస్యాః సర్వః సఖీజనః।
యథాఽయం సముపక్రాంతో
నిఃశ్శేషాం నః కరిష్యతి॥
టీక:
అమంత్రయత = అనుకొనెను; కృత్స్నః = మొత్తము; చ = మఱియు; తస్యాః = ఆమెయొక్క; సర్వః = అందఱు; సఖీజనః = తోటిదాసీజనులు; యథా = ఏవిధముగా; అయం = ఇతడు; సముపక్రాంతః = దాడినారంభించుట; నిః+శేషాం = శేషములేకుండ; నః = మనలను; కరిష్యతి = చేయును.
భావం:-
ఆ మంథర తోటి దాసీజనులు శత్రుఘ్నుడు మంథరను పట్టుకున్న తీరు గమనించి అతని కోపాగ్నికి వారందఱు "మనలో ఎవ్వరిని ప్రాణములతో వదిలిపెట్టేటట్టులేడు" అని తమలో తాము అనుకొనిరి.
2.78.15.
అనుష్టుప్.
సానుక్రోశాం వదాన్యాం చ
ధర్మజ్ఞాం చ యశస్వినీమ్।
కౌసల్యాం శరణం యామ
సా హి నోఽస్తు ధ్రువా గతిః॥
టీక:
సానుక్రోశాం = కరుణగలది; వదాన్యాం = ఔదార్యముగలది; చ = మఱియు; ధర్మజ్ఞాం = ధర్మములు నిఖిలముగా తెలిసినది; చ = మఱియు; యశస్వినీమ్ = కీర్తిగలది; కౌసల్యాం = కౌసల్యా దేవిని; శరణం = ఆశ్రయము; యామ = యాచించెదము; సా = ఆమె;హి; నః = మనకు; అస్తు = అగును; ధ్రువా = నిశ్చితమైన; గతిః = మార్గము, గమ్యము.
భావం:-
ఇప్పుడు మనము కరుణాస్వరూపిణి, ధర్మములెఱిగినది, గొప్పకీర్తిగలది అగు కౌసల్యాదేవిని శరణువెడెదము. ఆమె మాత్రమే మనకు దిక్కు.
2.78.16.
అనుష్టుప్.
స చ రోషేణ తామ్రాక్షః
శత్రుఘ్నః శత్రుతాపసః।
విచకర్ష తదా కుబ్జామ్
క్రోశన్తీం ధరణీతలే॥
టీక:
సః = అతడు; చ = మఱియు; రోషేణ = కోపముతో; తామ్రాక్షః = ఎఱ్ఱబడిన కళ్ళు గలవాడు; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; శత్రు-తాపనః = శత్రువులను తపింపజేయువాడు; విచకర్ష = ఈడ్చెను; తదా = అప్పుడు; కుబ్జామ్ = గూని స్త్రీని {మంథరను}; క్రోశన్తీమ్ = అరుచుచున్న; ధరణీతలే = నేలపై.
భావం:-
శత్రుభయంకరుడైన శత్రుఘ్నుడు కోపముతో కళ్ళెఱ్ఱజేసి అరుచుచున్న ఆ మంథరను నేలపై ఈడ్చెను.
2.78.17.
అనుష్టుప్.
తస్యా హ్యాకృష్యమాణాయా
మంథరాయాస్తతస్తతః।
చిత్రం బహువిధం భాండమ్
పృథివ్యాం తద్వ్యశీర్యత॥
టీక:
తస్యాః = ఆమెయొక్క; హి = స్ఫుటముగా; ఆకృష్యమాణాయాః = ఈడ్చబడుచున్న; మంథరాయాః = మంథర యొక్క; తతః తతః = అన్నివైపుల; చిత్రమ్ = చిత్రమైన; బహువిధమ్ = అనేకరకముల; భాండమ్ = వస్తువులు; పృథివ్యాం = నేలపై; తత్ = అవి; వ్యశీర్యత = చెల్లాచెదురుగా పడెను.
భావం:-
ఈడ్చబడుచున్న మంథర ధరించిన వివిధ ఆభరణములు నేలపై చెల్లాచెదురుగా పడెను.
2.78.18.
నుష్టుప్.
తేన భాండేన సంస్తీర్ణమ్
శ్రీమద్రాజనివేశనమ్।
అశోభత తదా భూయః
శారదం గగనం యథా॥
టీక:
తేన = ఆ; భాండేన = వస్తువులచేత; సంస్తీర్ణమ్ = వ్యాపించబడిన; శ్రీమత్ = శోభాయమానమైన; రాజ-నివేశనమ్ = రాజభవనము; అశోభత = శోభించెను; తదా = అప్పుడు; భూయః = మఱల; శారదమ్ = శరదృతువులో; గగనం = ఆకాశం; యథా = ఏవిధముగా.
భావం:-
అంతా చెల్లాచెదురుగా పడిన ఆభరణములతో విలసిల్లుతున్న ఆ రాజభవనము శరత్కాలమునందు తారలతో నిండిన ఆకాశమువలె మఱల ప్రకాశించినది.
2.78.19.
అనుష్టుప్.
స బలీ బలవత్క్రోధాత్
గృహీత్వా పురుషర్షభః।
కైకేయీమభినిర్భర్త్స్య
బభాషే పరుషం వచః॥
టీక:
సః = అతడు; బలీ = బలముగలవాడు అయిన; బలవత్ = బలవంతముగా; క్రోధాత్ = కోపముతో; గృహీత్వా = పట్టుకొని; పురుషర్షభః = పురుషులలో శ్రేష్ఠుడు; కైకేయీమ్ = కైకేయిని; అభినిర్భర్త్స్య = బెదిరించుచు; బభాషే = మాటలాడెను; పరుషం = కఠినమైన; వచః = మాట.
భావం:-
శత్రుఘ్నుడు రోషముతో మంథరను వేగముగా ఈడ్చుచుండగ, అక్కడకు కైకేయి వచ్చెను. అప్పుడు అతడు కైకేయిని బెదిరించుచు కఠోరముగా నిందించెను.
2.78.20.
అనుష్టుప్.
తైర్వాక్యైః పరుషైర్దుఃఖైః
కైకేయీ భృశదుఃఖితా।
శత్రుఘ్నభయసంత్రస్తా
పుత్రం శరణమాగతా॥
టీక:
తైః = ఆ; వాక్యైః = మాటలవలన; పరుషైః = కఠినమైన; దుఃఖైః = వేదన కలిగించు; కైకేయీ = కైకేయి; భృశదుఃఖితా = తీవ్రముగా బాధపడినది; శత్రుఘ్న = శత్రుఘ్నుని వలన కలిగిన; భయ = భయముతో; సంత్రస్తా = గజగజ వణికిన; పుత్రం = తన కుమారుడిని (భరతుడిని); శరణమ్ = రక్షణను; ఆగతా = ఆశ్రయించెను.
భావం:-
శత్రుఘ్నుడు పలికిన కఠినమైన, బాధాకరమైన మాటలను భరింపలేక కైకేయి తీవ్రముగా కలత చెందెను. అతని కోపమునకు భయకంపింతయై, తన కుమారుడైన భరతుని శరణము వేడెను.
2.78.21.
అనుష్టుప్.
తం ప్రేక్ష్య భరతః క్రుద్ధమ్
శత్రుఘ్నమిదమబ్రవీత్।
“అవధ్యాః సర్వభూతానామ్
ప్రమదాః క్షమ్యతామితి॥
టీక:
తమ్ = అతనిని; పేక్ష్య = చూచి; భరతః = భరతుడు; క్రుద్ధమ్ = కోపముతో ఉన్న; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; ఇదమ్ = ఈ మాటను; అబ్రవీత్ = చెప్పెను. అవధ్యాః = చంపదగనివారు; సర్వః = సకల; భూతానామ్ = జీవులలోను; ప్రమదాః = స్త్రీలు; క్షమ్యతామ్ = క్షమించబడుగాక; ఇతి = అని.
భావం:-
శత్రుఘ్నుడు కోపముతో మంథరను హింసించుచుండగా, భరతుడు అతనిని గాంచి, "స్త్రీలను చంపరాదు. ఈమెను క్షమించుము" అని చెప్పెను.
2.78.22.
అనుష్టుప్.
హన్యామహమిమాం పాపామ్
కైకేయీం దుష్టచారిణీమ్।
యది మాం ధార్మికో రామో
నాసూయేన్మాతృఘాతకమ్॥
టీక:
హన్యామ్ = చంపిఉండేవాడిని; అహమ్ = నేను; ఇమామ్ = ఈ; పాపామ్ = పాపముచేసినదానిని; యది = అయితే; మామ్ = నన్ను; ధార్మికః = ధర్మమును ఆచరించువాడు; రామః = శ్రీరామచంద్రుడు; న = కాదు; అసూయేత్ = కోపగించుట; మాతృఘాతకమ్ = తల్లి హంతకునిగా (నన్ను).
భావం:-
కైకేయి చాల చెడ్డప్రవర్తన కలిగిన పాపాత్మురాలు, కనుక నేనే ఆమెను చంపవలిసియున్నది, కాని ధర్మాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి నన్ను మాతృహంతకునిగా నిందించునను భయముతో నేను అట్లు చేయుట లేదు.
2.78.23.
అనుష్టుప్.
ఇమామపి హతాం కుబ్జామ్
యది జానాతి రాఘవః।
త్వాం చ మాం చ హి ధర్మాత్మా
నాభిభాషిష్యతే ధ్రువమ్”॥
టీక:
ఇమామ్ = ఈ; అపి = కూడ; హతామ్ = చంపబడిన; కుబ్జామ్ = గూనిదానిని {మంథరను}; యది = అయితే; జానాతి = తెలుసుకొనుట; రాఘవః = శ్రీరామచంద్రుడు; త్వామ్ = నిన్ను; చ = మఱియు; మామ్ = నన్ను; చ = మఱియు; హి = నిశ్చయముగా; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; న = కాదు; అభిభాషిష్యతే = మాటలాడుట; ధ్రువమ్ = నిశ్చయముగా.
భావం:-
మనము ఈ మంథరను చంపేమనే వార్త శ్రీరామచంద్రమూర్తికి తెలిసినచో ఆ ధర్మాత్ముడు నీతోకాని, నాతోకాని ఇక మాట్లాడడు. ఇది తథ్యము.”
2.78.24.
అనుష్టుప్.
భరతస్య వచశ్శ్రుత్వా
శత్రుఘ్నో లక్ష్మణానుజః।
న్యవర్తత తతో రోషాత్
తాం ముమోచ చ మంథరామ్॥
టీక:
భరతస్య = భరతుని; వచః = మాటలు; శ్రుత్వా = విని; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; లక్ష్మణ+అనుజః = లక్ష్మణుని తమ్ముడు; న్యవర్తత = వెనుకకు మరలుట; తతః = పిమ్మట; రోషాత్ = కోపమునుండి; తామ్ = ఆ; ముమోచ = విడిచెను; చ = మఱియు; మంథరామ్ = మంథరను.
భావం:-
భరతుని మాటలు వినినంతనే, లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు కోపమును అదుపుచేసుకుని, ఆ మంథరను విడిచిపెట్టెను.
2.78.25.
అనుష్టుప్.
సా పాదమూలే కైకేయ్యా
మంథరా నిపపాత హ।
నిశ్శ్వసన్తీ సుదుఃఖార్తా
కృపణం విలలాప చ॥
టీక:
సా = ఆమె; పాదమూలే = పాదముల దగ్గర; కైకేయ్యాః = కైకేయియొక్క; మంథరా = మంథర; నిపపాత = పడిపోయెను; హ = జరిగెను; నిశ్శ్వసన్తీ = దీర్ఘ నిశ్వాసములు విడుచుచు; సు = తీవ్రమైన; దుఃఖ = దుఃఖముతో; ఆర్తా = బాధపడుచున్నదై; కృపణం = దీనముతో; విలలాప = విలపించెను; చ = ఇంకను.
భావం:-
ఆ మంథర, భయముతో కైకేయి పాదాల వద్ద పడిపోయి, దీర్ఘ నిశ్వాసములు విడుచుచు తీవ్ర దుఃఖంతో బాధపడుచు, దీనముగా విలపించెను.
2.78.26.
త్రిష్టుప్.
శత్రుఘ్నవిక్షేపవిమూఢసంజ్ఞాం
సమీక్ష్య కుబ్జాం భరతస్య మాతా।
శనైస్సమాశ్వాసయదార్తరూపాం
క్రౌంచీం విలగ్నామివ వీక్షమాణామ్॥
టీక:
శత్రుఘ్నః = శత్రుఘ్నునిచేత; విక్షేప = దూరముగా త్రోసివేయబడుట వలన; విమూఢసంజ్ఞాం = నిశ్చేష్టురాలయిన; సమీక్ష్య = చూచి; కుబ్జాం = గూనిగల స్త్రీ; భరతస్య = భరతునియొక్క; మాతా = తల్లి (కైకేయి); శనైః = మెల్లగా; సమాశ్వాసయత్ = ఓదార్చెను; ఆర్త+రూపాం = బాధపడుచున్న; క్రౌంచీం = క్రౌంచపక్షిని; విలగ్నామివ = వలలో చిక్కుకొని బాధపడుచున్నట్టుగా; వీక్షమాణామ్ = అటుఇటు చూచుచున్న.
భావం:-
శత్రుఘ్నుడు మంథరను గట్టిగా త్రోసివేసిన తర్వాత, నిశ్చేష్టురాలయి అల్లాడుతూ పడిపోయిన మంథరను చూసిన భరతుని తల్లి కైకేయి, దుఃఖముతో వలలో చిక్కుకున్న క్రౌంచపక్షి వలె అటుఇటు చూడసాగిన ఆమె బాధను చూచి మెల్లగా ఓదార్చెను.
2.78.27.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే అష్టసప్తతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; అష్టసప్తతితమ [77] = డెబ్బైఎనిమిదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [78] డెబ్బైఎనిమిదవ సర్గ సంపూర్ణము.
2.79.1.
అనుష్టుప్.
తతః ప్రభాతసమయే
దివసే చ చతుర్దశే।
సమేత్య రాజకర్తారో
భరతం వాక్యమబ్రువన్॥
టీక:
తతః = అప్పుడు; ప్రభాతసమయే = ప్రాతఃకాలమునందు; దివసే = దినమునందు; చ = మఱియు; చతుర్దశే = పదునాల్గవ; సమేత్య = కలిసి; రాజకర్తారః = రాజును ఎన్నుకొను అధికారము గలవారు; భరతం = భరతునిగూర్చి; వాక్యమ్ = మాటలను; అబ్రువన్ = పలికిరి
భావం:-
పిమ్మట, పదునాల్గవ దినము ఉదయమున, రాజును ఎన్నుకొను అధికారముగల అమాత్యాదులు అందరూ కలిసి, భరతుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికిరి
*గమనిక:-
రాజకర్త / రాజకర్తృ- ఇది అథర్వవేదము, బ్రాహ్మణములలోని సాంకేతిక పదము. రాజుగా ఎవరు ఉండవలెనని నిర్ణయించుటలో సహకరించు వారు. వీరు స్వయముగా రాజులు కారు. శతపథబ్రాహ్మణము నందు (1) సూతులు (సారథి రథము మున్నగునవి, క్షత్రియుని వలన బ్రాహ్మణస్త్రీ యందు పుట్టినవారు, వంది, బచ్చువారు, అశ్వములను ప్రేరేపించువారు, జ్ఞానమును ప్రేరేపించు వారు, మునులు), (2) గ్రామణులు (గ్రామాధికారులు, ముఖ్యలు, శబ్దరత్నాకరము) రాజు కాదగ్గవారినిగా సూచింతురు. ఐత్రేయబ్రాహ్మణము నందు (3) తండ్రి, (4) సోదరులు కూడా చెప్పబడిరి. (1) ఐత్రేయ బ్రాహ్మణము viii.17,5; (2) AV/ iii.5,7; శతపథ బ్రాహ్మణము iii.4,1,7; xiii. 2, 2, 18. 3) Loc. cit. 2) Av. iii. 5, 7; Śatapatha Brāhmaṇa, iii. 4, 1, 7; xiii. 2, 2, 18. 4) Sacred Books of the East, 41, 60, n. Cf. Weber, Indische Studien, 17, 199 et seq. 1) Aitareya Brāhmaṇa, viii. 17. 5. 2) Av. iii. 5, 7; Śatapatha Brāhmaṇa, iii. 4, 1, 7; xiii. 2, 2, 18.(The Vedic Index of Names and Subjecta / sanskrtkosh.com)
2.79.2.
అనుష్టుప్.
“గతో దశరథః స్వర్గమ్
యో నో గురుతరో గురుః।
రామం ప్రవ్రాజ్య వై జ్యేష్ఠమ్
లక్ష్మణం చ మహాబలమ్॥
టీక:
గతః = వెళ్లెను; దశరథః = దశరథుడు; స్వర్గమ్ = స్వర్గమునకు; యః = ఎవరైతే; నః = మన అందరికీ; గురుతరః = అధిక పూజ్యుడైన; గురుః = తండ్రి; రామం = రాముని; ప్రవ్రాజ్య వై = వనమునకు పంపివేసి; జ్యేష్ఠమ్ = జ్యేష్ఠ కుమారుడైన; లక్ష్మణం = లక్ష్మణుని; చ = ఇంకను; మహాబలమ్ = మహాబలవంతుడైన
భావం:-
మన అందరికీ అధికపూజ్యుడైన దశరథుడు, జ్యేష్ఠ కుమారుడైన రాముని, మహాబలవంతుడైన లక్ష్మణుని వనమునకు పంపివేసి, తాను స్వర్గస్థుడైనాడు
2.79.3.
అనుష్టుప్.
త్వమద్య భవ నో రాజా
రాజపుత్ర! మహాయశః!।
సంగత్యా నాపరాధ్నోతి
రాజ్యమేతదనాయకమ్॥
టీక:
త్వమ్ = నీవు; అద్య = ఇప్పుడు; భవ = అగుము; నః = మాకు; రాజా = మహారాజువు; రాజపుత్ర = రాజకుమారా; మహాయశః = గొప్ప యశస్సు కలిగిన; సంగత్యా = దైవ వశముచే; న = లేదు; అపరాధ్నోతి = పరస్పర పీడనము మొదలైన అపరాధములు చేయుట; రాజ్యమ్ = రాజ్యమునందు; ఏతత్ = ఈ; అనాయకమ్ = అరాజకము
భావం:-
ఓ గొప్పయశశ్శాలివైన రాజకుమారా! ఇపుడు నీవు మాకు రాజువగుము. అరాజక దినములు వచ్చినను, ప్రస్తుతానికి దైవవశమున రాజ్యములోని ప్రజలు పరస్పరపీడనాది అపరాథములు చేయుటలేదు. ఆలసించినచో అట్టి ఉపద్రవములు ప్రారంభము కావచ్చును అని సూచన.
2.79.4.
అనుష్టుప్.
అభిషేచనికం సర్వమ్
ఇదమాదాయ రాఘవ!।
ప్రతీక్షతే త్వాం స్వజనః
శ్రేణయశ్చ నృపాత్మజ!॥
టీక:
అభిషేచనికం = అభిషేక సంభారములు; సర్వమ్ = అన్నియును; ఇదమ్ = ఈ; ఆదాయ = సిద్ధము చేసికొని; రాఘవ = రఱువంశీయుడా; ప్రతీక్షతే = వేచి ఉన్నవి, సిద్ధముగా ఉన్నవి; త్వాం = నీ కొరకు; స్వజనః = స్వజనుల; శ్రేణయః = శ్రేణులు; చ = ఈ; నృపాత్మజ = ఓ రాజకుమారా
భావం:-
రఘువంశపు భరతుడా! నీవారందరూ అభిషేక సంభారములు సిద్ధము చేసికొని నీకొరకై వేచి ఉన్నారు.
2.79.5.
అనుష్టుప్.
రాజ్యం గృహాణ భరత!
పితృ పైతామహం ధ్రువమ్।
అభిషేచయ చాత్మానమ్
పాహి చాస్మాన్నరర్షభ!॥
టీక:
రాజ్యం = రాజ్యమును; గృహాణ = గ్రహించి; భరత = ఓ భరతా; పితృ పైతామహం = పితృపితామహ క్రమమున వచ్చుచున్న, వంశపారంపర్యమైన; ధ్రువమ్ = స్థిరమైన; అభిషేచయ = రాజ్యాభిషిక్తుడవగుము; చ = ఇంకను; ఆత్మానమ్ = నీ కొరకు; పాహి = పాలింపుము; చ = ఇంకను; అస్మాన్ = మమ్ములను; నరర్షభ = నరశ్రేష్ఠుడా, రాజా.
భావం:-
భరతవంశపు రాజా భరతుడా! వంశపారంపర్యముగా వచ్చుచున్న, స్థిరమైన, ఈ రాజ్యమును గ్రహించి, రాజ్యాభిషిక్తుడవగుము. మమ్ము పాలింపుము.”
2.79.6.
అనుష్టుప్.
అభిషేచనికం భాండమ్
కృత్వా సర్వం ప్రదక్షిణమ్।
భరతస్తం జనం సర్వమ్
ప్రత్యువాచ ధృతవ్రతః॥
టీక:
అభిషేచనికం = పట్టాభిషేకమునకు సంబంధించిన వస్తువుల; భాండమ్ = సముదాయమునకు; కృత్వా = చేసి; సర్వం = అంతటికి; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణ నమస్కారము; భరతః = భరతుడు; తం = అక్కడున్న; జనం = వారు; సర్వమ్ = అందరికీ; ప్రత్యువాచ = ప్రత్యుత్తరమిచ్చెను; ధృతవ్రతః = నిశ్చయించుకొనిన వర్తనకలవాడు.
భావం:-
దృఢనిశ్చయముతో ఉన్న భరతుడు, అభిషేకమునకు సంబంధించిన ఆ సమస్త వస్తు సముదాయమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి, వారందరికీ ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను
2.79.7.
అనుష్టుప్.
“జ్యేష్ఠస్య రాజతా నిత్యమ్
ఉచితా హి కులస్య నః।
నైవం భవన్తో మాం వక్తుమ్
అర్హన్తి కుశలా జనాః॥
టీక:
జ్యేష్ఠస్య = జ్యేష్ఠ కుమారునికి; రాజతా = రాజ్యాధికారము; నిత్యమ్ = ఎప్పటికీ; ఉచితాః = తగినది; హి = కదా; కులస్య = వంశములో; నః = మా యొక్క; న = కాదు; ఏవం = ఈ విధముగా; భవన్తః = మీరు; మాం = నాతో; వక్తుమ్ = పలుకుట; అర్హన్తి = అర్హతకలవారు; కుశలా = అన్నీ తెలిసిన; జనాః = వారికి.
భావం:-
“మా వంశములో ఎప్పుడూ పెద్దకుమారుడే రాజు అగుట తగిన ఆచారము కదా. అన్నీ తెలిసినవారైన మీరిట్లు నాకు చెప్పుట సరికాదు.
2.79.8.
అనుష్టుప్.
రామః పూర్వో హి నో భ్రాతా
భవిష్యతి మహీపతిః।
అహం త్వరణ్యే వత్స్యామి
వర్షాణి నవపంచ చ॥
టీక:
రామః = రాముడు; పూర్వః = ముందుపుట్టినవాడు; హి = కదా; నః = మా; భ్రాతా = సోదరులలో; భవిష్యతి = కాగలడు; మహీపతిః = రాజు; అహం = నేను; తు = ఐతే; అరణ్యే = అరణ్యములో; వత్స్యామి = నివసించెదను; వర్షాణి = సంవత్సరములు; నవపంచ = పదునాలుగు; చ = ఇంకను.
భావం:-
మా సోదరులలో పెద్దవాడు రాముడు కదా. అతడే రాజు కాగలడు. నేను కావాలంటే వెళ్ళి పద్నాలుగేళ్ళు అరణ్యవాసము చేసెదను.
2.79.9.
అనుష్టుప్.
యుజ్యతాం మహతీ సేనా
చతురంగమహాబలా।
ఆనయిష్యామ్యహం జ్యేష్ఠమ్
భ్రాతరం రాఘవం వనాత్॥
టీక:
యుజ్యతాం = సమకూర్చుడు; మహతీ = గొప్పదైన; సేనా = సైన్యము; చతురంగ = చతురంగ; మహాబలా = గొప్పసైన్యములను; ఆనయిష్యామి = తీసుకొని వచ్చెదను; అహం = నేను; జ్యేష్ఠమ్ = పెద్దవాడైన; భ్రాతరం = అన్నగారైన; రాఘవం = రఘురాముని; వనాత్ = వనము నుండి
భావం:-
చతురంగ బలములు గల మహా సైన్యమును సమకూర్చుడు. నేను మా సోదరులలో ప్రథముడైన రఘురాముని అడవి తీసుకువచ్చెదను.
2.79.10.
అనుష్టుప్.
అభిషేచనికం చైవ
సర్వమేతదుపస్కృతమ్।
పురస్కృత్య గమిష్యామి
రామహేతోః వనంప్రతి
టీక:
అభిషేచనికం = అభిషేక సంభారములు అన్నియు; చైవ = ఐనవి; సర్వమ్ = అన్నిటినీ; ఏతత్ = ఈ; ఉపస్కృతమ్ = సమకూర్చబడినవి, ఆంధ్రశబ్దరత్నాకరం; పురస్కృత్య = ఎదుట ఉంచుకొని; గమిష్యామి = వెళ్లెదను; రామహేతోః = రాముని కొరకు; వనంప్రతి = అరణ్యమునకు
భావం:-
చక్కగా సమకూర్చిన ఈ అభిషేక సంభారములన్నీ ఎదుట ఉంచుకొని, రాముని తిరిగి తీసికొనివచ్చుటకు అడవికి వెళ్లెదను
2.79.11.
అనుష్టుప్.
తత్రైవం తం నరవ్యాఘ్రమ్
అభిషిచ్య పురస్కృతమ్।
ఆనేష్యామి తు వై రామమ్
హవ్యవాహమివాధ్వరాత్॥
టీక:
తత్రైవ = తత్ర + ఏవం, అక్కడనే; అభిషిచ్య = రాజ్యాభిషేకము చేయించి; పురస్కృతమ్ = ముందుగా; ఆనేష్యామి = తీసుకొని వచ్చెదను; తు = కూడ; వై = తప్పక; రామమ్ = రాముని; హవ్యవాహమ్ = అగ్నిని; ఇవ = వలె; అధ్వరాత్ = యజ్ఞము నుండినే; తం = ఆ; నరవ్యాఘ్రమ్ = ఆ పురుష శ్రేష్ఠుని.
భావం:-
పురుష శ్రేష్ఠుడైన రామునకు ముందుగా అక్కడనే రాజ్యాభిషేకము చేయించెదను, యజ్ఞము నుండి అగ్నిని తీసికొని వచ్చినట్లు అతనిని తప్పక తీసికొని వచ్చెదను కూడా.
2.79.12.
అనుష్టుప్.
న సకామాం కరిష్యామి
స్వామిమాం మాతృ గంధినీమ్।
వనే వత్స్యామ్యహం దుర్గే
రామో రాజా భవిష్య/తి॥
టీక:
న = లేదు; సకామాం = కోరిక తీరునట్లు; కరిష్యామి = చేయుట; స్వామ్ = నా యొక్క; ఇమాం = ఈమె; మాతృ గంధినీమ్ = అస్వాభావిక మాత, వైద్య సంస్కృత ఇంగ్లీషు డిక్షనరీ, తల్లి అను గంథము కలది; వనే = వనములో; వత్స్యామి = నివసించెదను; అహం = నేను; దుర్గే = దాటరాని; రామో = రాముడు; రాజా భవిష్యతి = రాజు కాగలడు
భావం:-
ఈ నా తల్లి అను పేరు పెట్టుకొనిన, మాతృస్వాభావములేని నా తల్లి కోరిక తీరునట్లు దుర్గమమైన అరణ్యవాసము చేసెదను. రాముడు రాజు కాగలడు.
2.79.13.
అనుష్టుప్.
క్రియతాం శిల్పిభిః పంథా
సమాని విషమాణి చ।
రక్షిణశ్చానుసమ్యాన్తు
పథి దుర్గవిచారకాః”॥
టీక:
క్రియతాం = ఏర్పరచబజుగాక; శిల్పిభిః = శ్రామికులు; పంథా = మార్గమును; సమాని = సమమైనదిగా చేయువారు; విషమాణి = ఎత్తుపల్లములున్న; చ = మఱిక; రక్షిణశ్చ = రక్షకభటులు; చ = మఱియు; అనుసమ్యాన్తు = మన వెంట రావలెను; పథి = మార్గమువెంట; దుర్గవిచారకాః = దుర్గమప్రాంతములు సంచరించువారు.
భావం:-
శిల్పులు, ఎత్తుపల్లములున్న ప్రదేశములు సమములుగా చేయు పనివారిని ఏర్పాటు చేయబడుగాక. వారు మఱియు, దుర్గమమైన దారులలో సంచరించగల రక్షకభటులు కూడా అనుసరింతురు గాక.”
2.79.14.
అనుష్టుప్.
ఏవం సంభాషమాణం తమ్
రామహేతోర్నృపాత్మజమ్।
ప్రత్యువాచ జనస్సర్వః
శ్రీమద్వాక్యమనుత్తమమ్॥
టీక:
ఏవం = ఈ విధముగా; సంభాషమాణం = మాటలాడుచున్న; తమ్ = ఆ; రామహేతోః –రాముని నిమిత్తమై; నృపాత్మజమ్ = రాజకుమారుడైన భరతునితో; ప్రత్యువాచ = పలికిరి; జనః సర్వః = ప్రజలు; సర్వః = అందరూ; శ్రీమత్ = శోభాయుక్తము; వాక్యమ్ = మాటను; అనుత్తమమ్ = ఉత్తమము
భావం:-
ఈ విధముగ మాటలాడుచున్న ఆ భరతునితో ఆ జనులందరూ శోభాయుక్తము, చాల ఉత్తమము అయిన మాటలు పలికిరి.
2.79.15.
అనుష్టుప్.
“ఏవం తే భాషమాణస్య
పద్మా శ్రీరుపతిష్ఠతాత్।
యస్త్వం జ్యేష్ఠే నృపసుతే
పృథివీం దాతుమిచ్ఛసి”॥
టీక:
ఏవం = ఈ విధముగా; తే = నీకు; భాషమాణస్య = మాటలాడుచున్న; పద్మా = సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి; శ్రీః = శోభాయుక్తమై; ఉపతిష్ఠతాత్ = ఉండుగాక; యః = అటువంటి; త్వం = నిన్ను; జ్యేష్ఠే = పెద్దవాడైన; నృపసుతే = రాజకుమారునికి; పృథివీం = రాజ్యమును; దాతుమ్ = ఇవ్వవలెనని; ఇచ్ఛసి = అభిలషించుచు
భావం:-
“పెద్దవాడైన రాజకుమారునికి రాజ్యమును ఇవ్వవలెనని అభిలషించుచు, ఈ విధముగా మాటలాడుచున్న నీకు సంపదలకు అధిదేవత ఐన లక్ష్మీదేవి శోభలు అబ్బునుగాక.”ठ
2.79.16.
జగతి.
అనుత్తమం తద్వచనం నృపాత్మజ–
ప్రభాషితం సంశ్రవణే నిశ్యమ్య చ।
ప్రహర్షజాస్తం ప్రతి బాష్పబిన్దవో
నిపేతురార్యానననేత్రసంభవాః॥
టీక:
అనుత్తమం = ఉత్తమమైన; తత్ = ఆ; వచనం = మాటలను; నృపాత్మజ = రాజకుమారుడైన భరతుడు; ప్రభాషితం = పలికిన; సంశ్రవణే = చెవులు ప్రత్యక్షముగా; నిశ్యమ్య = వినునట్లు; చ = ఇంకను; ప్రహర్షజాః = ఆనందము చేత జనించిన; తం ప్రతి = అతని యొక్క; బాష్పబిన్దవః = ఆనంద బాష్పములు; నిపేతుః = కారినవి; ఆర్య + ఆనన = పూజ్యులైన వారి నేత్రముల నుండి; నేత్రసంభవాః = నేత్రముల నుండి బయటకు వచ్చిన
భావం:-
తమ చెవులు ప్రత్యక్షముగా వినునట్లు ఆ రాజకుమారుడు పలికిన మాటలు విన్న పిదప అతని విషయమున కలిగిన ఆనందముచేత, పూజ్యులైన ఆ జనుల నేత్రముల నుండి కన్నీటి బిందువులు జాలువారినవి.
2.79.17.
అతిజగతి.
ఊచుస్తే వచనమిదం నిశమ్య హృష్టా
స్సామాత్యాః సపరిషదో వియాతశోకాః।
“పంథానం నరవర! భక్తిమాన్జనశ్చ
వ్యాదిష్టస్తవ వచనాచ్చ శిల్పివర్గః”॥
టీక:
ఊచుః = పలికిన; తే = వారు; వచనమ్ = మాటలను; ఇదం = ఇటువంటి; నిశమ్య = వినిన; హృష్టాః = సంతోషముతో; స = సహితముగా; అమాత్యాః = మంత్రులతో కలిసిన; స = సహితముగా; పరిషదః = సభికులు; వియాతశోకాః = విడిచిన శోకము కలవారు, సంతోషించినవారై; పంథానం = మార్గములను; నరవర = నరశ్రేష్ఠా; భక్తిమాన్ = భక్తిమంతులైన; జనః = జనులు; చ = ఇంకను; వి + ఆదిష్టః = ఆదేశించిరి; తవ = వారి యొక్క; వచనాత్ = మాటలను; చ = ఇంకను; శిల్పివర్గః = శిల్పి సముదాయమును
భావం:-
అమాత్యులు, పరిషత్తు తోబాటు ఆ జనులందరు అతని మాటలు విని సంతోషించి, “ఓ నరశ్రేష్ఠా! నీ ఆజ్ఞ ప్రకారము భక్తిమంతులైన జనులను, శిల్పి సముదాయమును మార్గ నిర్మాణము చేయుడని ఆదేశించితిమి” అనిరి
2.79.18.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే ఏకోనాఽశీతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకోనాఽశీతితమ [79] = డెబ్బైతొమ్మిమిదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [79] డెబ్బైతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.80.1.
అనుష్టుప్.
అథ భూమిప్రదేశజ్ఞాః
సూత్రకర్మ విశారదాః।
స్వకర్మాభిరతాః శూరాః
ఖనకా యంత్రకాస్తథా॥
టీక:
 అథ = అటు పిమ్మట; భూమిప్రదేశజ్ఞాః = ఆయా ప్రదేశముల స్వరూప స్వభావములు తెలిసినవారు; సూత్రకర్మ = సూత్రములు పట్టి కొలతలు వేయువారు; విశారదాః = నేర్పరులు; స్వకర్మ = తమ తమ సనులందు; అభిరతాః = శ్రద్ధగలవారు; శూరాః = శూరులు; ఖనకా = నేల త్రవ్వువారు; యంత్రకాః = యంత్రములు తెలిసిన వారు; తథా = ఆ విధముగా
భావం:-
 పిమ్మట ఆయా ప్రదేశముల స్వరూపస్వభావములు తెలిసినవారు, తాడు వేసి కొలతలు వేయువారు, తమ తమ పనులందు శ్రద్ధ గల కార్యశూరులు, నేల త్రవ్వువారు, యంత్రములు ఉపయోగించువారు, ఇంకా..
2.80.2.
అనుష్టుప్.
కర్మాంతికాః స్థపతయః
పురుష యంత్రకోవిదాః।
తథా వార్ధకయశ్చైవ
మార్గిణో వృక్షతక్షకాః॥
టీక:
 కర్మాంతికాః = కూలి వారు; స్థపతయః = పెద్ద శిల్పులు; పురుష = కార్మికులు; యంత్రకోవిదాః = ఇంజనీరులు; తథా = ఆ విధముగా; వార్ధకయః = వడ్రంగులు; చైవ = ఇంకనూ; మార్గిణః = బాట వేయువారు; వృక్షతక్షకాః = వృక్షములు ఛేదించువారు
భావం:-
 కూలివాళ్లు, పెద్ద శిల్పులు, కార్మికులు, ఇంజనీర్లు, వడ్రంగులు, బాట వేయువారు, చెట్లు కొట్టువారు
2.80.3.
అనుష్టుప్.
కూపకారాః సుధాకారాః
వంశకర్మకృతః తథా।
సమర్థా యే చ ద్రష్టారః
పురతస్తే ప్రతస్థిరే॥
టీక:
 కూపకారాః = నూతులు త్రవ్వేవారు; సుధాకారాః = సున్నము వేయువారు; వంశకర్మ = వెదురు పని; కృతః = చేయువారు; తథా = ఆ విధముగా ; సమర్థా = సమర్థులైన; యే చ = వీరందరును; ద్రష్టారః = పర్యవేక్షకులు; పురతః = ముందుగా; తే = వారు; ప్రతస్థిరే = బయలుదేరిరి
భావం:-
 నూతులు త్రవ్వువారు, సున్నము వేయువారు, వెదురు పని చేయువారు, సమర్థులైన పర్యవేక్షకులు వీరందరూ ముందు బయలుదేరిరి,
2.80.4.
అనుష్టుప్.
స తు హర్షాత్తముద్దేశమ్
జనౌఘో విపులః ప్రయాన్।
అశోభత మహావేగః
సముద్ర ఇవ పర్వణి॥
టీక:
 స = ఆ; తు = ఇంకను; హర్షాత్తమ్ = మంచిసంతోషముతో; ఉద్దేశమ్ = పొంగిన; జనః = జనుల; ఓఘో = సమూహము; విపులః = గొప్ప; ప్రయాన్ = వేగముతో; అశోభత = ప్రకాశించెను; మహా = అధికమైన; వేగః = వేగముతో; సముద్ర = సముద్రము; ఇవ = వలె; పర్వణి = పర్వ దివసమునందు
భావం:-
 సంతోషముతో ఆ ప్రదేశమునందు నడుచుచున్న ఆ పెద్ద జనసమూహము పర్వ దివసమునందు చాలా వేగముగా పొంగిన సముద్రము వలె ఉండెను.
2.80.5.
అనుష్టుప్.
తే స్వవారం సమాస్థాయ
వర్త్మకర్మణి కోవిదాః।
కరణైర్వివిధోపేతైః
పురస్తాత్సమ్ప్రతస్థిరే॥
టీక:
 తే = వారందరూ; స్వవారం = వారి స్థానములకు; సమాస్థాయ = గుంపులుగా; వర్త్మ కర్మణి = బాటలు వేయుటలో; కోవిదాః = నేర్పు కలవారు; కరణైః = సాధనములుతో; వివిధ = అనేక విధములైన; ఉపేతైః = కూడినదై; పురస్తాత్ = ముందు; సంప్రతస్థిరే = బయలుదేరిరి
భావం:-
 బాటలు వేయుటలో నేర్పు కల వారందరు అనేక విధములైన సాధనములు తీసుకుని, ఒక గుంపుగా ముందు బయలుదేరిరి.
2.80.6.
అనుష్టుప్.
లతావల్లీశ్చ గుల్మాంశ్చ
స్థాణూనశ్మన ఏవ చ।
జనాయాం చక్రిరే మార్గమ్
ఛిందన్తో వివిధాన్ ద్రుమాన్॥
టీక:
 లతావల్లీః = పాదులు, తీగలు, లతలు; చ = మఱియు; గుల్మాం = పొదలు; చ = మఱియు; స్థాణూన్ = మోడులు, వావిళ్ళ నిఘంటువు; అశ్మన = రాళ్లు; ఏవ = మున్నగునవి; చ = మఱియు; జనాయాం = ప్రజలకు; చక్రిరే = ఏర్పరచిరి; మార్గమ్ = మార్గమును; ఛిందన్తో = ఛేదించి; వివిధాన్ = అనేక విధములైన; ద్రుమాన్ = చెట్లను.
భావం:-
 తీగలు, పాదులు, పొదలు, మోళ్ళు, రాళ్లు మునగునవి మఱియు అనేకవిధములైన చెట్లు నఱికి, వారు ప్రజలకు మార్గము ఏర్పరచిరి.
2.80.7.
అనుష్టుప్.
అవృక్షేషు చ దేశేషు
కేచిద్వృక్షా నరోపయన్।
కేచిత్కుఠారైష్టంకైశ్చ
దాత్రైశ్చిందన్క్వచిత్క్వచిత్॥
టీక:
 అవృక్షేషు చ = వృక్షములు లేని చోట; దేశేషు = ప్రదేశములలో; కేచిత్= కొందరు; వృక్షాన్ = చెట్లను; అరోపయన్ = నాటిరి; కేచిత్= కొందరు; కుఠారైః = గొడ్డళ్లతోను; టంకైశ్చ = కొజవళ్ళతోను, వావిళ్ళ నిఘంటువు; దాత్రైః = ఱంపముతోను; చిందన్ = ఛేదించిరి; క్వచిత్క్వచిత్ = ఆయా ప్రదేశములయందు
భావం:-
 కొందరు చెట్లు లేని ప్రదేశములందు చెట్లు నాటిరి. కొందరు ఆ యా ప్రదేశములందు (మార్గమునకు అడ్డుగా ఉన్న) చెట్లను గొడ్డళ్ళతోను, కంపలను కొడవళ్ళతోను, మోళ్ళను ఱంపములతోను నరికిరి.
2.80.8.
అనుష్టుప్.
అపరే వీరణస్తంబాన్
బలినో బలవత్తరాః।
విధమంతి స్మ దుర్గాణి
స్థలాని చ తత స్తతః॥
టీక:
 అపరే = మరి కొందరు; వీరణః = వట్టివేరుల అను సువాసన గల గడ్డిజాతి; స్తంబాన్ = బలమైనపోచలు; బలినః = బలముగా వేళ్ళూనిన; బలవత్తరాః = దృఢముగా ఉన్నవారు; విధమంతి = పెఱికి; స్మ= వేసిరి; దుర్గాణి = వెళ్ళుటకు కష్టముగా ఉన్న ప్రదేశములను; స్థలామి = చదునుచేసిరి; చ = మఱియు; తతః తతః = అక్కడికక్కడ.
భావం:-
 దృఢముగా ఉన్న కొందరు బలముగా వేళ్ళూనిన వట్టివేరుల దుబ్బులను తృణములను పెరికివేసిరి. ఎగుడుదిగుడుగా ఉండి వెళ్ళుట కష్టమైన చోట్ల అక్కడికక్కడే చదునుచేసిరి.
2.80.9.
అనుష్టుప్.
అపరేఽపూరయన్ కూపాన్
పాంసుభిః శ్వభ్రమాయతమ్।
నిమ్నభాగాం స్తతః కేచిత్
సమాంశ్చక్రుః సమంతతః॥
టీక:
 అపరే = మరి కొందరు; అపూరయన్ = నింపిరి; కూపాన్ = బావులను; పాంసుభిః = బూడిదతో; శ్వభ్రమ్ = గోతులను; ఆయతమ్ = పొడవైన; నిమ్నభాగాన్ = పల్లములను; తతః = పిమ్మట; కేచిత్ = కొందరు; సమాన్ = సమముగా; చక్రుః = చేసిరి; సమంతతః = అంతటను.
భావం:-
 కొందరు నూతులను, పొడవైన గోతులను బూడిదతో కప్పివేసిరి. మరి కొందరు అంతట ఉన్న పల్లములను సమము చేసిరి.
2.80.10.
అనుష్టుప్.
బబంధుర్బన్ధనీయాంశ్చ
క్షోద్యాన్సంచుక్షుదుస్తదా।
బిభిదుర్భేదనీయాంశ్చ
తాంస్తాన్ దేశాన్నరాస్తదా॥
టీక:
 బబంధుః = కట్టిరి; బంధనీయాంశ్చ = కట్టదగిన వానిని; క్షోద్యాన్ = నలగ్గొట్టిరి; సంచుక్షుదుః = నలగ్గొట్టదగిన వాటిని; తదా = అప్పుడు; బిభిదుః = బద్దలుకొట్టిరి; భేదనీయాంశ్చ = బద్దలు కొట్టదగినవాటిని; తాంస్తాన్ = ఆయా; దేశాన్ = ప్రదేశములను; నరాః = కొందరు మనుష్యులు; తదా = అప్పుడు
భావం:-
 అప్పుడు కొందరు మనుష్యులు ఆయా ప్రదేశములలో కట్టవలసినవానిని కట్టిరి. నల్లగ్గొట్టవలసిన వాటిని నలగ్గొట్టిరి. బ్రద్దలు కొట్టవలసినవి బ్రద్దలు కొట్టిరి.
2.80.11.
అనుష్టుప్.
అచిరేణైవ కాలేన
పరివాహాన్ బహూదకాన్।
చక్రుః బహువిధాకారాన్
సాగరప్రతిమాన్ బహూన్॥
టీక:
 అచిరేణ = చాలా కొద్దిదైన; ఏవ = మాత్రమైన; కాలేన = సమయమున; పరివాహాన్ = కాలువలను; బహూదకాన్ = చాలా నీళ్ళు కలవి; చక్రుః = నిర్మించిరి; బహువిధాకారాన్ = అనేకమైన ఆకారము కలవి; సాగర = సముద్రమునకు; ప్రతిమాన్ = సాటి వచ్చునవి; బహూన్ = అనేకమైన
భావం:-
 కొద్ది సమయములోనే చాలా నీళ్ళు కలవి నిర్మించారు, అదీ రకరకాల కాలువలు, సముద్రమునకు సాటివచ్చేవి, అనేకము నిర్మించిరి.
2.80.12.
అనుష్టుప్.
నిర్జలేషు చ దేశేషు
ఖానయామాసురుత్తమాన్।
ఉదపానాన్బహువిధాన్
వేదికాపరిమండితాన్॥
టీక:
 నిర్జలేషు చ = ఉదకము లభించని; దేశేషు = ప్రదేశములలో; ఖానయామాసుః = త్రవ్వించిరి; ఉత్తమాన్ = శ్రేష్ఠమైన; ఉదపానాన్ = బావులను; బహువిధాన్ = అనేక విధములైన; వేదిక = పళ్లెరములను; అపరిమండితాన్ = చుట్టును ఉండునవి.
భావం:-
 నీరు లభించని ప్రదేశములలో చుట్టును వేదికలు (పళ్ళెములు) కట్టిన అనేక విధములైన శ్రేష్ఠమైన నూతులు త్రవ్వించిరి.
2.80.13.
అనుష్టుప్.
ససుధాకుట్టిమతలః
ప్రపుష్పితమహీరుహః।
మత్తోద్ఘుష్ట ద్విజగణః
పతాకాభిరలంకృతః॥
టీక:
 ససుధా = సున్నము వేసిన; కుట్టిమతలః = శిలాదులు పఱచి చదును చేసిన ప్రదేశములు కలవి; ప్రపుష్పిత = పుష్పించినవి; మహీరుహః = వృక్షములన్నియు; మత్త = మదించి; ఉద్ఘుష్ట = కూయుచుండెను; ద్విజగణః = పక్షుల సమూహమలు; పతాకాభిః = పతాకలు కట్టి; అలంకృతః = అలంకరించిరి
భావం:-
 శిలాదులుపఱచి సున్నము వేసి చదునుచేసననేలతో ఉన్న బాగా పూలుపూసిన చెట్లు ఉన్నాయి. పక్షులు మదించి కూయుచుండెను. మార్గము నందు అంతటా పతాకలు కట్టి అలంకరించిరి.
2.80.14.
అనుష్టుప్.
చందనోదక సంసిక్తో
నానాకుసుమ భూషితః।
బహ్వశోభత సేనాయాః
పంథాః సురపథోపమః॥
టీక:
 చందన = చందన గంధము కలిపిన; ఉదక = నీటితో; సంసిక్తః = తడిపిన; నానా = రకరకముల; కుసుమ = పూలతో; భూషితః = అలంకరించబడినవి; బహు = మిక్కిలి; అశోభత = శోభించుచుండెను; సేనాయాః = సేనలు నడుచు; పంథాః = మార్గమునందు; సురపథ = దేవతల మార్గము; ఉపమః = పోలునదై.
భావం:-
 సేన నడుచు ఆ మార్గమునందు చందనోదకముతో తడిపిరి. రకరకాల పూలు అలంకరించారు. ఈ విధముగా దేవతల మార్గము వలె ఉన్న ఆ సేనామార్గము మిక్కిలి శోభించుచుండెను.
2.80.15.
అనుష్టుప్.
ఆజ్ఞాప్యాథ యథాఽజ్ఞప్తి
యుక్తాస్తేఽధికృతా నరాః।
రమణీయేషు దేశేషు
బహుస్వాదుఫలేషు చ॥
టీక:
 ఆజ్ఞా = ఆజ్ఞాపించి; అపి = ప్రకరాము; అథ = ఆ ప్రకారముగా; యథా = ఏ విధముగా; ఆజ్ఞప్తి = ఆదేశములు; యుక్తాః = కలిగిన; తే = వారు; అధికృతా = నియమింపబడిన అధికారులు; నరాః = నరులు; రమణీయేషు = అలంకారముగ ఉండునట్లు; దేశేషు = ప్రదేశము; బహు = మిక్కిలి; స్వాదు = మధురమైన; ఫలేషు = పండ్లను ఇచ్చు; చ = ఇంకా.
భావం:-
 భరతుని ఆజ్ఞపొందిన అధికారులు తమ క్రింద పనిచేయువారికి ఆయా ఆజ్ఞల ప్రకారము ఆదేశములిచ్చిరి. పిమ్మట మంచి మధురమైన ఫలములనిచ్చు చాలా చెట్లు ఉన్నచోట.
2.80.16.
అనుష్టుప్.
యో నివేశస్త్వభిప్రేతో
భరతస్య మహాత్మనః।
భూయస్తం శోభయామాసుః
భూషాభిర్భూషణోపమమ్॥
టీక:
 యః = ఎవరు; నివేశః = వసించుటకు; తు = ఐన; అభిప్రేతః = ఉద్దేశించినదో; భరతస్య = భరతునకు; మహాత్మనః = మహాత్ముడైన; భూయః = మరింతగా; తం = ఆ విడిదిని; శోభయామాసుః = శోభింపజేసిరి; భూషాభిః = అలంకారములకే; భూషణః = అలంకారముగ; ఉపమమ్ = సరిపోలునట్లు
భావం:-
 భరతుడు మార్గములో ఆగినప్పుడు వాడుకొను విడిదిని అలంకరాములకే అలంకారముగా ఉండున్నట్లు మరింతగా శోభించునట్లు తయారు చేసిరి.
2.80.17.
అనుష్టుప్.
నక్షత్రేషు ప్రశస్తేషు
ముహూర్తేషు చ తద్విదః।
నివేశాన్ స్థాపయామాసుః
భరతస్య మహాత్మనః॥
టీక:
 నక్షత్రేషు = నక్షత్రములయందు; ప్రశస్తేషు = ప్రశస్తములైన; ముహూర్తేషు = ముహూర్తములందు; చ = కూడా; తత్ = ఆశ్శాస్త్రము; విదః = తెలిసినవారు; నివేశాన్ = శిబిరములను; స్థాపయామాసుః = స్థాపించిరి; భరతస్య = భరతుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన
భావం:-
 ముహూర్తములు నక్షత్రములు తెలిసినవారు, శుభ నక్షత్రములయందు, శుభ ముహూర్తములందు మహాత్ముడైన భరతుని నివాసము కొఱకు శిబిరములు స్థాపించిరి.
2.80.18.
అనుష్టుప్.
బహుపాంసుచయాశ్చాపి
పరిఖాపరివారితాః।
తత్రేంద్రకీల ప్రతిమాః
ప్రతోలీ వరశోభితాః॥
టీక:
 బహు = అనేక; పాంసుచయః = ఇసుక కుప్పలుతో; అపి = కూడిన; పరిఖా = అగడ్తలు; పరివారితాః = చుట్టునుఉన్న; తత్ర = అక్కడ; ఇంద్రకీల ప్రతిమాః = ఇంద్రకీల పర్వతము వలె; ప్రతోలీ = వీధులన్నియు; వరశోభితాః = ప్రకాశవంతముగా
భావం:-
 చుట్టూ అగడ్తలూ, ఇంద్రకీల పర్వతము వలె ఎత్తుగా ఉన్న ఇసుక కుప్పలు ఉండెను. వీధులన్నియు మిక్కిలి శోభాయమానముగా ఉండెను.
2.80.19.
అనుష్టుప్.
ప్రాసాదమాలావితతాః
సౌధప్రాకారసంవృతాః।
పతాకాశోభితాస్సర్వే
సునిర్మితమహాపథాః॥
టీక:
 ప్రాసాద = రాజగృహముల; మాలా = పంక్తులతో; వితతాః = విస్తరించిన; సౌధ = మేడలు; ప్రాకార = ప్రహరీగోడలుచేత; సంవృతాః = చుట్టునుఉన్నవి; పతాకా = పతాకములతో; శోభితాః = శోభిల్లుచున్న; సర్వే = అంతటా; సునిర్మిత = చక్కగా నిర్మింపబడిన; మహాపథాః = పెద్దవీధులు
భావం:-
 విస్తారమైన రాజగృహముల పంక్తులు, మేడలు, చుట్టూ ఎత్తుగా ఉన్న ప్రహారీగోడలు, చక్కగా నిర్మించిన విశాలమైన వీధులు వేసిరి.. అంతటా పతాకములు కట్టిరి,
2.80.20.
అనుష్టుప్.
విసర్పద్భిరివాఽకాశే
విటంకాగ్రవిమానకైః।
సముచ్ఛ్రితైర్నివేశాస్తే
బభుశ్శక్రపురోపమాః॥
టీక:
 విసర్పద్భిః = ఎగిరిపోవుచున్నవి; ఇవ = అన్నట్లు; ఆకాశే = ఆకాశమునందు; విటంకాగ్ర = పక్షుల గూళ్లు పైనున్న; విమానకైః = గోపురములు; సముచ్ఛ్రితైః = ఉన్నతమైన; నివేశాః = గృహములు; తే = వారి యొక్క; బభుః = ఉండెను; శక్రపురః = స్వర్గంలోని అమరావతి, దేవేంద్రుని నగరము వలె; ఉపమాః = సాటివచ్చు.
భావం:-
 పక్షులగూళ్ళు పైనున్న గోపురములు ఆకాశములో ఎగురుతున్నవా అన్నట్లున్నవీ, దేవేంద్రుని అమరావతీనగరలోని సౌధములకు సాటివచ్చెడివీ ఐన వారి నివాసగృహములు మిక్కిలి ఉన్నతములై ఉండెను.
2.80.21.
అనుష్టుప్.
జాహ్నవీం తు సమాసాద్య
వివిధద్రుమకాననామ్।
శీతలామలపానీయామ్
మహామీనసమాకులామ్॥
టీక:
 జాహ్నవీం = గంగానది; తు = ఐతే; సమాసాద్య = చేరి; వివిధ = వివిధములైన; ద్రుమ= చెట్లతో; కాననామ్ =అడవులుకలది; శీతల = చల్లనైన; అమల = స్వచ్ఛమైన; పానీయామ్ =నీటితోనూ; మహా మీన = పెద్ద చేపలతోనూ; సమాకులామ్ = నిండి ఉన్నది.
భావం:-
 గంగానదిని చేరి రకరకముల వృక్షములుకల అడవులు ఉండెను. నదిలో కిక్కిరిసి ఉన్న పెద్ద పెద్ద చేపలు, చల్లని స్వచ్ఛమైన మంచినీరు ఉండెను.
*గమనిక:-
జాహ్నవి- గంగానది, జహ్ను కన్య, వ్యుత్పత్తి. జహ్నోః ఇయమ్, జహ్ను+ అణ్, జీప్, తప్ర., విశే. (భగీరథుని వెంట వచ్చుచుండగా) తన యజ్ఞవాటికను ముంచెత్తుటచే కుపితుడైన జహ్నుమహర్షి గంగానదిని పీల్చివేసెను. పిమ్మట దేవతలును, ఋషులును ప్రార్థింపగా జాలిపడి తన చెవులనుండి ఆనదిని విడిచిపుచ్చెను. అందువలన గంగకు జహ్ను మహర్షి తండ్రివంటి వాడాయెను. కావున ఈ వ్యవహారము కలిగినది, ఆంధ్రశబ్దరత్నాకరము. -422-వ. = పురురవునికి ఊర్వశి యందు కలిగిన సత్యాయువు వంశమున హోత్రకుని కుమారుడు ఈ గంగా ప్రవాహమును పుక్కిటం బెట్టిన జహ్నుండు, జహ్నునకు పూరుండు . . . పూరుని వంశమున గాధి, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. 9-422-వ. = పోతన తెలుగు భాగవతము. 9-3-శ్లో. భీమస్తు విజయస్యాథ కాఞ్చనో హోత్రకస్తతః తస్య జహ్నుః సుతో గఙ్గాం గణ్డూషీకృత్య యోऽపిబత్ జహ్నోస్తు పురుస్తస్యాథ బలాకశ్చాత్మజోఽజకః. వ్యాసభాగవతము.
2.80.22.
జగతి.
సచంద్రతారాగణమండితం యథా
నభః క్షపాయామమలం విరాజతే।
నరేంద్రమార్గస్స తథా వ్యరాజతే
క్రమేణ రమ్యః శుభశిల్పినిర్మితః॥
టీక:
 స = కూడిన; చంద్ర = చంద్రునితో; తారాగణ = నక్షత్ర మండలము; మండితం = అలంకరింపబడినిదాని; యథా = వలె; నభః = ఆకాశము; క్షపాయామ్ = రాత్రియందు; అమలం = నిర్మలముగా; విరాజతే = ప్రకాశించుచున్నది; నరేంద్ర మార్గః = రాజమార్గము; స = ఆ; తథా = అదేవిధముగా; వ్యరాజత = ప్రకాశించెను; క్రమేణ = క్రమముగా; రమ్యః = రమ్యమైన; శుభశిల్పి = ఉత్తమములైన శిల్పులచే; నిర్మితః = నిర్మితమైన
భావం:-
 ప్రకాశవంతమైనట్టి నిర్మలమైన రాత్రియందు ఆకాశము చంద్రునితో కూడిన నక్షత్రమండలము అలంకరించినట్లు, ఉత్తమములైన శిల్పులు క్రమముగా నిర్మించిన ఆ రమ్యమైన రాజమార్గము ప్రకాశించెను.
2.80.23.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే అశీతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; అశీతితమ [80] = ఎనభైయవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [80] ఎనభైయవ సర్గ సంపూర్ణము
2.81.1.
అనుష్టుప్.
తతో నాందీముఖీం రాత్రిమ్
భరతం సూతమాగధాః।
తుష్టువుర్వాగ్విశేషజ్ఞాః
స్తవైర్మంగళ సంహితైః॥
టీక;-
తతః = అటు పిమ్మట; నాందీముఖీం = ఆనందకరమైన ప్రారంభము గల; రాత్రిమ్ = రాత్రియందు; భరతం = భరతుని; సూతః = సూతులు; మాగధాః = మాగధులు; తుష్టువుః = స్తుతించిరి; వాగ్విశేషజ్ఞాః = మాటలలోని విశేషములు ఎఱిగిన వారు; స్తవైః = స్తుతించిరి; మంగళః = మంగళకరమైనవానితో; సంహితైః = కూడిన
భావముమ
పిమ్మట, ఆనందకరమైన ప్రారంభము గల రాత్రి (తెల్లవారుఝామున) మాటలలో విశేషములు ఎఱిగిన సూతమాగధులు, మంగళకరమైనవానితో కూడిన స్తోత్రములతో భరతుని స్తుతించిరి.
*గమనిక:-
(1) సూత- 1. సారథి, తుష్టా ఇతి అమరం 2. క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ యందు పుట్టినవాడు, బట్టువాడు, ముని, 3. అశ్వములను తోలువాడు, వ్యుత్పత్తి. సూ+ క్త, సువతి ప్రేరయతి అళ్వాన్ 4. వ్యుత్పత్తి. సూ+ క్త, సూవతి ప్రేరయతి జ్ఞానమ్, జ్ఞానమును ప్రేరేపించువాడు, సూర్యుజ, సూతమహరాషి, లోమహర్షణుడు, నైమిశారరణ్య వాసి. (2) మాగధ- 1. క్షత్రియ స్త్రీకిని వైశ్యునకు పుట్టినవాడు, 2. వంశావళి చదువువాడు, 2. మోడి సంస్కృత- తెలుగు నిఘంటువు, 4. మగధ దేశపువాడు (3) నాందీముఖి- ఆనందదాయకమైనది, శ్రీరాముని యోధ్యకు వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నంకు ముందు రాత్రి కనుక. నిఘంటువుల ప్రకారము, సుభకార్యములకు ముందు చేయు పితృదేవతలకైన శ్రాద్దము అని ఉన్నది. పుల్లెల వారు ప్రేతకర్మాంతరమున అట్టి శ్రాద్దము కర్తవ్యమై ఉండవచ్చును అని.
2.81.2.
అనుష్టుప్.
సువర్ణకోణాభిహతః
ప్రాణదద్యామదుందుభిః।
దధ్ముశ్శంఖాంశ్చ శతశో
నాదాంశ్చోచ్చావచస్వరాన్॥
టీక;-
సువర్ణ = బంగారపు; కోణః = వాయించెడు కొడుపుతో, దండముతో; అభిహతః = కొట్టి; ప్రాణదత్ = మోగించిరి; యామదుందుభిః = యామ సూచించు దుందుభిని; దధ్ముః = పూరించిరి; శంఖాం = శంఖములను; చ = మఱియు; శతశః = వందల కొలది; నాదాంశ్చ = వాద్యములను; ఉచ్చావచ = వాయించిరి; స్వరాన్ = స్వరములు గల
భావము;-
బంగారు వాయించు దండముతో కొట్టి యామ సూచించు దుందుభి మ్రోగించిరి. వందలకొలది శంఖములను పూరించిరి. వివిధ స్వరములు గల వాద్యములు వాయించిరి.
2.81.3.
అనుష్టుప్.
స తూర్యఘోషస్సుమహాన్
దివమాపూరయన్నివ।
భరతం శోకసంతప్తమ్
భూయశ్శోకైరరంధ్రయత్॥
టీక;-
స = ఆ; తూర్యఘోషః = బిగ్గరగా ఉన్న వాయిద్యముల ధ్వని; సుమహాన్ = గొప్పదైన; దివమ్ = ఆకాశమునంతను; ఆపూరయత్ = నింపుచున్నది; ఇవ = వలె; భరతం = భరతుని; శోక = శోకముతో; సంతప్తమ్ = బాధపడుచున్న; భూయః= అధికమైన; శోకైః = శోకముచే; అరంధ్రయత్ = పీడించెను
భావము;-
ఆకాశమునంతను నింపుచున్నట్లున్న ఆ గొప్ప తూర్య ధ్వని శోకముతో బాధపడుచున్న భరతుని ఇంకను అధికమైన శోకముచే పీడించెను.
2.81.4.
అనుష్టుప్.
తతః ప్రబుద్ధో భరతః
తం ఘోషం సన్నివర్త్య చ।
నాహం రాజేతి చాప్యుక్త్వా
శత్రుఘ్నమిదమబ్రవీత్॥
టీక;-
తతః = అప్పుడు; ప్రబుద్ధః = మేల్కొని; భరతః = భరతుడు; తం = ఆ; ఘోషం = తూర్యఘోషను; సన్నివర్త్య = నిలిపివేసి; చ = మఱియు; న = కాదు; అహం = నేను; రాజ = రాజును; ఇతి అని; చ = మఱియు; అపి = ఇంకా; ఉక్త్వా = చెప్పుచు; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నునితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను
భావము;-
భరతుడు మేల్కొని, “నేను రాజును కాను.’’ అని చెప్పుచు ఆ తూర్యఘోష నిలిపివేయించి, శత్రుఘ్నునితో ఇట్లు చెప్పెను.
2.81.5.
అనుష్టుప్.
“పశ్య శత్రుఘ్న! కైకేయ్యా
లోకస్యాపకృతం మహత్।
విసృజ్య మయి దుఃఖాని
రాజాదశరథో గతః॥
టీక;-
పశ్య = చూడుము; శత్రుఘ్న = శత్రుఘ్నా; కైకేయ్యా = కైకేయి వలన; లోకస్య = లోకమునకు; అపకృతం = అపకారము; మహత్ = గొప్పదైన; విసృజ్య = విడిచిపెట్టి; మయి = నాకు; దుఃఖాని = దుఃఖములను; రాజాదశరథః = దశరథ మహారాజు; గతః = వెళ్లిపోయినాడు
భావము;-
“శత్రుఘ్నా! చూడు. కైకేయి వలన లోకమునకు పెద్ద అపకారము జరిగినది. దశరథ మహారాజు దుఃఖములన్నీ నాకు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు.
2.81.6.
అనుష్టుప్.
తస్యైషా ధర్మరాజస్య
ధర్మమూలా మహాత్మనః।
పరిభ్రమతి రాజ్య శ్రీః
నౌరివాకర్ణికా జలే॥
టీక;-
తస్య = దాని యొక్క; ఏషా = ఇట్లు; ధర్మరాజస్య = ధర్మానుసారముగా; ధర్మమూలా = ధర్మరక్షకుడు; మహాత్మనః = మహాత్ముడైన; పరిభ్రమతి = తిరుగుచున్నది; రాజ్యశ్రీః = రాజ్యలక్ష్మి; నౌః = పడవ; ఇవ = వలె; అకర్ణికా = చుక్కాని లేని; జలే = నీటిలో
భావము;-
ధర్మరక్షకుడు, మహాత్ముడు అయిన ఆ దశరథ మహారాజునకు ధర్మానుసారముగా సంక్రమించిన ఈ రాజ్యలక్ష్మి, ఇపుడు చుక్కాని లేని పడవ నీటిలో తిరిగినట్లు తిరుగుచున్నది.
2.81.7.
అనుష్టుప్.
యో హి నస్సుమహాన్నాథః
సోఽపి ప్రవ్రాజితో వనమ్।
అనయా ధర్మముత్సజ్య
మాత్రా మే రాఘవస్స్వయమ్”॥
టీక;-
యః = ఎవరు; హి = ఐతే; నః = మనందరకు; సుమహాన్ = గొప్ప; నాథః = రక్షకుడైన; సః = అతడు; అపి = అయినను; ప్రవ్రాజితః = దేశాంతరవాసిగా; వనమ్ = అడవులకు; అనయా = ఈమె; దర్మమ్ = ధర్మమును; ఉత్సృజ్య = విడిచి; మాత్రా = తల్లి; మే = నా యొక్క; రాఘవః = రాముని; స్వయమ్ = స్వయముగా.
భావము;-
మన కందరికినిమా గొప్ప రక్షకుడైన రాముని కూడ, ధర్మహీనురాలైన ఈ తల్లి స్వయముగా అడవికి ప్రవాసమున పంపివేసినది."
2.81.8.
అనుష్టుప్.
ఇత్యేవం భరతం ప్రేక్ష్య
విలపంతం విచేతనమ్।
కృపణం రురుదుస్సర్వాః
సస్వరం యోషిత స్తదా॥
టీక;-
ఇత్యేవమ్ = ఇతి + ఏవం, ఈ విధముగా; భరతం = భరతుని; ప్రేక్ష్య = చూచి; విలపంతమ్ = విలపించుచున్న; విచేతనమ్ = జడతతోనున్న; కృపణమ్ = దీనముగా; రురుదుః = ఏడ్చిరి; సర్వాః = అందరును; సస్వరం = ఎలుగెత్తి; యోషితః = స్త్రీలందరును; తదా = అప్పుడు
భావము;-
ఈ విధముగా జడతతో విలపించుచున్న భరతుని చూచి, స్త్రీలందరు దీనముగా ఎలుగెత్తి ఏడ్చిరి.
2.81.9.
అనుష్టుప్.
తథా తస్మిన్విలపతి
వసిష్ఠ రాజధర్మవిత్।
సభామిక్ష్వాకునాథస్య
ప్రవివేశ మహాయశాః॥
టీక;-
తథా = అప్పుడు; తస్మిన్ = అతడు; విలపతి = విలపించుచుండగా; వసిష్ఠ = వసిష్ఠుడు; రాజధర్మవిత్ = రాజధర్మము తెలిసినవాడు; సభామ్ = దర్భారునకు; ఇక్ష్వాకునాథస్య = ఇక్ష్వాకు రాజుల యొక్క; ప్రవివేశ = ప్రవేశించెను; మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు
భావము;-
భరతుడు ఇట్లు విలపించుచుండగా, రాజధర్మములు ఎఱిగినవాడని సుప్రసిద్దుడైన వసిష్టుడు ఇక్ష్వాకు వంశస్థుల రాజదర్భారు ప్రవేశించెను.
2.81.10.
అనుష్టుప్.
శాతకుంభమయీం రమ్యామ్
మణిరత్నసమాకులామ్।
సుధర్మామివ ధర్మాత్మా
సగణః ప్రత్యపద్యత॥
టీక;-
శాతకుంభ = బంగారము; మయీం = వికారమైనది, చేయబడినది; రమ్యామ్ = అందమైనది; మణి = మణులు; రత్న = రత్నములుతో; సమాకులామ్ = సమలంకృతమైనది; సుధర్మామ్ = సుధర్మ మను దేవసభ; ఇవ = వలె ఉన్న; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; సగణః = జన సమూహముతో కూడి; ప్రత్యపద్యత = ప్రవేశించెను.
భావము;-
జనసమూహముతో కూడి ఉన్నదీ, వివిధ మణులు రత్నాలతో సమలంకృతమై, బంగారముతో నిర్మించిన, సుధర్మ మను దేవ సభ వలె ఉన్న రమ్యమైన ఆ సభను ధర్మాత్ముదైన వసిష్టుడు ప్రవేశించెను.
2.81.11.
అనుష్టుప్.
స కాంచనమయం పీఠమ్
సుఖాస్తరణసంవృతమ్।
అధ్యాస్త సర్వవేదజ్ఞో
దూతాననుశశాస॥
టీక;-
సః = వసిష్ఠుడు; కాంచనమయం = బంగారముతో చేసిన; పీఠమ్ = పీఠముపై; సుఖాస్తరణ = సుఖకరమైన పీఠముమీద వేయు మెత్తు; సంవృతమ్ = కప్పిన; అధ్యాస్త = కూర్చుండి; సర్వవేదజ్ఞః = సర్వ వేదసారము తెలిసినవాడు; దూతాన్ = దూతలను; అనుశశాస = ఆజ్ఞాపించెను
భావము;-
వసిష్టుడు, సుఖకరమైన మెత్తవేసిన బంగారు పీఠముపై కూర్చుండి, దూతలను ఈ విధముగ ఆజ్ఞాపించెను.
2.81.12.
అనుష్టుప్.
బ్రాహ్మణాన్ క్షత్రియాన్వైశ్యన్
అమాత్యాన్గణవల్లభాన్।
క్షిప్రమానయతాఽవ్యగ్రాః
కృత్యమాత్యయికం హి నః॥
టీక;-
బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; క్షత్రియాన్ = క్షత్రియులను; వైశ్యన్ = వైశ్యులను; అమాత్యాన్ = అమాత్యులను; గణవల్లభాన్ = సేనానాయకులను, గణమను మను సేనావిశేషమునకు నాయకులు; క్షిప్రమ్ = శీఘ్రముగా; ఆనయతా = తీసుకుని రండి; అవ్యగ్రాః = నిశ్చింతగా; కృత్యమ్ ఆత్యయికం = తొందర పని ఉన్నది; హి = కదా; నః = మాకు.
భావము;-
మీరు కడు జాగరూకులై, బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, అమాత్యులను, సేనానాయకులను శీఘ్రముగా తీసికొని రండి. మాకు వారితో చాల తొందరపని ఉన్నది.
*గమనిక:-
గణవల్లభుడు- గణము అను సేనావిశేషము, 27 రథములు, 27 ఏనుగులు, 81 గుఱ్ఱములు, 136 కాల్బలము కలది, అట్టి గణమునకు నాయకుడు. శబ్దరత్నాకరము.
2.81.13.
అనుష్టుప్.
సరాజభృత్యం శత్రుఘ్నమ్
భరతం చ యశస్వినమ్।
యుధాజితం సుమంత్రం చ
యే చ తత్ర హితా జనాః॥
టీక;-
స = కూడాఉన్న; రాజభృత్యమ్ = రాజభృత్యులను; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; భరతమ్ = భరతుని; చ = ఇంకా; యశస్వినమ్ = కీర్తిమంతుడైన; యుధాజితమ్ = యుధాజిత్తును; సుమంత్రమ్ = సుమంత్రుని; చ = ఇంకా; యేచ = అందరిని; తత్ర = అక్కడ; హితాజనాః = రాజ హితులను
భావము;-
రాజభృత్యులు సహితంగా శత్రుఘ్నుని, కీర్తిమంతుడైన భరతుని, యుధాజిత్తును, సుమంత్రుని, రాజహితులను అందరిని తీసికొనిరండి.
2.81.14.
అనుష్టుప్.
తతో హలహలాశబ్దః
సుమహాన్ సమపద్యత।
రథైరశ్వైర్గజైశ్చాపి
జనానాముపగచ్ఛతామ్॥
టీక;-
తతః = అటు పిమ్మట; హలహలాశబ్దః = కలకల ధ్వని; సుమహాన్ = = గొప్పదైన; సమపద్యత = ఆహూతులందరూ; రథైః = రథములు; అశ్వైః = గుర్రములు; గజైః = గజములు; చ = ఇంకను; అపి = అయినను; జనానామ్ = ప్రజలలో; ఉపగచ్ఛతామ్ = వచ్చుచుండగా
భావము;-
పిమ్మట వసిష్ణుని ఆజ్ఞప్రకారము ఆహూతులందరూ రథములు, అశ్వములు, గజములు ఎక్కి వచ్చుచుండగా గొప్ప కలకల ధ్వని కలిగెను.
2.81.15.
అనుష్టుప్.
తతో భరతమాయాంతమ్
శతక్రతుమివామరాః।
ప్రత్యనందన్ ప్రకృతయో
యథా దశరథం తథా॥
టీక;-
తతః = అప్పుడు; భరతమ్ = భరతుని; ఆయాంతమ్ = వచ్చుచున్న; శతక్రతుమ్ = దేవేంద్రుని; ఇవ = వలె; అమరాః = దేవతలు; ప్రత్యనందన్ = అభినందించినట్లు; ప్రకృతయోః = ప్రకృతులు తాము; యథా = ఏ విధముగా; దశరథం = దశరథుని; తథా = ఆ విధముగా.
భావము;-
వచ్చుచున్న భరతుని చూచి ఆమాత్యాది ప్రకృతులు తాము దశరథుని అభినందించినట్లును, దేవతలు దేవేంద్రుని అభినందించినట్లును అభినందించిరి.
2.81.16.
త్రిష్టుప్.
హ్రద ఇవ తిమినాగసంవృతః
స్తిమితజలో మణిశంఖశర్కరః।
దశరథసుతశోభితా సభా
సదశరథేవ బభౌ యథా పురా॥
టీక;-
హ్రద = సరస్సు; ఇవ = వలె; తిమిః = పెద్ద సముద్రపు చేప విశేషము; నాగః = నాగుపాములతో; సంవృతః = నిండిన; స్తిమిత = ప్రశాంతమైన; జలః = నీళ్ళు; మణిః = మణులు; శంఖః = శంఖములు; శర్కరః = ఇసుక; దశరథసుత = దశరథ కుమారుని చేత; శోభితా = శోభితమైన; సభా = ఆ సభ; సదశరథ + ఇవ = దశరథుడు ఉండెనా; ఇవ = అన్నట్లు; అభౌ = ప్రకాశించెను; యథా = వలెనే; పురా = పూర్వము
భావము;-
శంఖములు, మణులు, ఇసుకతో, తిమింగలము, పాములతో నిండిన సరస్సు వలె, దశరథ కుమారుని చేత శోభితమైన ఆ సభ, పూర్వము దశరథుడు ఉండగా ఎట్లు ప్రకాశించెనో అట్లే ప్రకాశించెను. ప్రకాశించెను.
*గమనిక:-
తిమి / తిమిగలము- నూఱు యోజనముల పొడువు కల చేఁప. వావిళ్ళ. సముద్రపుచేప. తిమింగలము- తిమిని మ్రింగెడు చేప, శబ్ధరత్నాకరము.
2.81.17.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే అశీతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; ఏకాశీతితమ [81] = ఎనభైఒకటవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [81] ఎనభైఒకటవ సర్గ సంపూర్ణము.
2.82.1.
అనుష్టుప్.
తామార్యగణసంపూర్ణామ్
భరతః ప్రగ్రహాం సభామ్।
దదర్శ బుద్ధిసంపన్నః
పూర్ణచంద్రో నిశామివ॥
టీక;-
తామ్ = ఆ; ఆర్య = మాన్యులైనజనుల; గణః = సమూహములతో; సంపూర్ణామ్ = నిండియున్నది; భరతః = భరతుడు; ప్రగ్రహామే = ఉత్తమమైన గ్రహములతో; సభామ్ = సభను; దదర్శ = చూచెను; బుద్ధిసంపన్నః = బుద్ధిశాలిౖయెన; పూర్ణచంద్రః = పూర్ణచంద్రుడు; నిశామ్ = రాత్రిని; ఇవ = వలె.
భావము;-
బుద్ధిశాలియైన భరతుడు మాన్యుల సమూహములతో నిండిన ఆ సభను, పూర్ణచంద్రుడు ఉత్తమమైన గ్రహములతో కూడిన రాత్రిని వలె ఆ సభను చూచెను.
2.82.2.
అనుష్టుప్.
ఆసనాని యథాన్యాయమ్
ఆర్యాణాం విశతాం తదా।
వస్త్రాంగరాగప్రభయా
ద్యోతితా సా సభోత్తమా॥
ఆసనాని = ఆసనములను; యథాన్యాయమ్ = తగినవిధమైన; ఆర్యాణాం = సభ్యులందరూ; విశతాం = అధిష్ఠించుచుండగా; తదా = అప్పుడు; వస్త్ర = వస్త్రముల; అంగరాగ = అంగరాగముల; ప్రభయా = కాంతి చేతను; ద్యోతితా = ప్రకాశింపచేయ బడెను; సా = ఆ; సభ = సభ; ఉత్తమా = ఉత్తమమైన.
సభ్యులందరూ ఎవరికి తగిన ఆసనములు వారు అధిష్టించుచుండగా వారి వస్త్రముల కాంతి చేతను, అంగరాగముల కాంతి చేతను ఉత్తమమైన ఆ సభ ప్రకాశింపచేయబడెను.
2.82.3.
అనుష్టుప్.
సా విద్వజ్జన సంపూర్ణా
సభా సురుచిరా తదా।
అదృశ్యత ఘనాపాయే
పూర్ణచంద్రేవ శర్వరీ॥
టీక;-
సా = ఆ; విద్వజ్జన = విద్వత్+ జన, విద్వాంసులతో; సంపూర్ణా = నిండిన; సభా = సభ; సురుచిరా = అందమైన; తదా = అప్పుడు; అదృశ్యత = ప్రకాశించెను; ఘనాపాయే = శరదృతువునందు; పూర్ణచంద్రః = పూర్ణచంద్రుని; ఇవ = వలె; శర్వరీ = రాత్రి.
భావము;-
విద్వాంసులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువునందు పూర్ణ్జచంద్రునితో కూడిన రాత్రి వలె ప్రకాశించెను.
2.82.4.
అనుష్టుప్.
రాజ్ఞస్తు ప్రకృతీస్సర్వాః
సమగ్రాః ప్రేక్ష్య ధర్మవిత్।
ఇదం పురోహితో వాక్యమ్
భరతం మృదు చాబ్రవీత్॥
టీక;-
రాజ్ఞః = రాజుయొక్క; తు = పాదపూరణము; ప్రకృతీః = అమాత్యాది ప్రకృతులు; సర్వాః = అందరును; సమగ్రాః = సంపూర్ణముగా; ప్రేక్ష్య = చూచుచూ; ధర్మవిత్ = ధర్మవేత్తౖయెన; ఇదమ్ = ఈ విధముగా; పురోహితః = వసిష్ఠుడు; వాక్యమ్ = మాటలను; భరతమ్ = భరతునితో; మృదు చ = మృదువుగా; చ = మఱియు; అబ్రవీత్ = పలికెను.
భావము;-
దశరథుని అమాత్యాది ప్రకృతులు, అందరును అచటికి వచ్చియుండిరి. ఆ సభను సంపూర్ణముగా చూచి, ధర్మవేత్తౖయెన వసిష్టుడు భరతునితో మృదువుగా ఇట్లు పలికెను.
*గమనిక:-
రాజు యొక్క ప్రభృతులు- స్వామ్యాది, సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము.
2.82.5.
అనుష్టుప్.
“తాత! రాజా దశరథః
స్వర్గతో ధర్మమాచరన్।
ధనధాన్యవతీం స్ఫీతామ్
ప్రదాయ పృథివీం తవ॥
టీక;-
తాత = నాయనా భరతా; రాజాదశరథః = దశరథ మహారాజు; స్వర్గతః = స్వర్గస్థుడైనాడు; ధర్మమాచరన్ = ధర్మాచరణము చేయుచు; ధనధాన్యవతీమ్ = ధనధాన్యమున్నగు గల; స్ఫీతామ్ = విశాలమైన; ప్రదాయ = ఇచ్చి; పృథివీమ్ = ఈ రాజ్యమును; తవ = నీకు
భావము;-
“నాయనా! భరతా! దశరథ మహారాజు ధర్మాచరణము చేయుచు రాజ్యము పాలించి, ధనధాన్య సమృద్ధమైన విశాలమైన ఈ పృథివిని నీకు ఇచ్చి, స్పర్గస్థుడైనాడు.
2.82.6.
అనుష్టుప్.
రామస్తథా సత్యధృతిః
సతాం ధర్మమనుస్మరన్।
నాజహాత్పితురాదేశమ్
శశీ జ్యోత్సా్నమివోదితః॥
టీక;-
రామః = రాముడు; తథా = ఆ విధముగా; సత్యధృతిః = సత్యమునందు స్థిరమైన చిత్తము గల; సతాం = సత్పురుషులయందు; ధర్మమ్ = ధర్మమును; అనుస్మరన్ = స్మరించుచు; న = లేదు; అజహాత్ = విడిచిపెట్టేయ; పితుః = తండ్రి; ఆదేశమ్ = ఆజ్ఞను; శశీ = చంద్రుడు; జ్యోత్సా్నమ్ = వెన్నెలను; ఇవ = వలె; ఉదితః = విడువకుండునట్లు
భావము;-
సత్యమునందు స్థిరమైన చిత్తము గల రాముడు కూడ, సత్పురుషులు అనుసరించిన ధర్మమును స్మరించుచు, ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడువకుండునట్టు, తండ్రి ఆజ్ఞను విడువలేదు.
2.82.7.
అనుష్టుప్.
పిత్రా భ్రాత్రా చ తే దత్తమ్
రాజ్యం నిహతకంటకమ్।
తద్భుంక్ష్వ ముదితామాత్యః
క్షిప్రమేవాభిషేచయ॥
టీక;-
పిత్రా = తండ్రి; భ్రాత్రా = సోదరుడు; చ = ఇంకను; తే = నీకు; దత్తమ్ = ఇచ్చిన; రాజ్యం = రాజ్యమును; నిహత = లేనటువంటి; కంటకమ్ = క్షుద్రశత్రువును; తత్ = ఆ; భుంక్ష్వ = అనుభవింపుము; ముదిత = సంతోషించిన; అమాత్యః = మంత్రులు; క్షిప్రమేవ = శీఘ్రముగా; అభిషేచయ = అభిషిక్తుడవు అగుము
భావము;-
ఈ విధముగా నీ తండ్రి, సోదరుడు నీకు ఇచ్చిన ఏ కంటకము లేని రాజ్యమును, సంతోషించిన మంత్రులతో అనుభవింపుము. శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు అగుము.
2.82.8.
అనుష్టుప్.
ఉదీచ్యాశ్చ ప్రతీచ్యా శ్చ
దాక్షిణాత్యాశ్చ కేవలాః।
కోట్యాపరాన్తాః సాముద్రాః
రత్నాన్యభిహరన్తుతే”॥
టీక;-
ఉదీచ్యాః = ఉత్తర దేశపు రాజులును; చ = ఇంకను; ప్రతీచ్యాః = పశ్చిమ దేశపు రాజులు; చ = ఇంకను; దాక్షిణాత్యాః = దాక్షిణాత్య రాజులు; చ = ఇంకను; కేవలాః = సింహాసమను లేని రాజులును; కోట్యాపరాన్తాః = సరిహద్దులలోని రాజులును; సాముద్రాః = సముద్ర ద్వీపములలోని రాజులును; రత్నాత్ = రత్నములను; అభిహరన్తు = సమర్పించెదరుగాక; తే = నీకు.
భావము;-
ఉత్తరదేశపు రాజులు, పశ్చిమదేశపు రాజులు, దాక్షిణాత్య రాజులు, సింహాసనము లేని రాజులు, సరిహద్దులోని రాజులు, సముద్ర ద్వీపములలోని రాజులు నీకు కోట్లకొలది ఉత్తమ వస్తువులను పారితోషికముగ తీసికొని వచ్చి సమర్పించెదరుగాక.”
2.82.9.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా భరతో వాక్యమ్
శోకేనాభిపరిప్లుతః।
జగామ మనసా రామమ్
ధర్మజ్ఞో ధర్మకాంక్షయా॥
టీక;-
తత్ = వాటిని; శ్రుత్వా = విని; భరతః = భరతుడు; వాక్యమ్ = మాటలను; శోకేన = శోకముతో; అభిపరిప్లుతః = నిండినవాడై; జగామ = స్మరించెను; మనసా = మనస్ఫూర్తిగా; రామమ్ = రాముని; ధర్మజ్ఞః = ధర్మజ్ఞుడైన; ధర్మకాంక్షయా = ధర్మమార్గమును అవలంబింపవలెనని ఆకాంక్షగలవాడైన.
భావము;-
ధర్మజ్ఞుడైన భరతుడు ఆ మాటలు విని, శోకాక్రాంతుడై, ధర్మమార్గమును అవలంబింపవలెనని కోరుచు, రాముని మనసా స్మరించెను.
2.82.10.
అనుష్టుప్.
సబాష్పకలయా వాచా
కలహంసస్వరో యువా।
విలలాప సభామధ్యే
జగర్హే చ పురోహితమ్॥
టీక;-
సః = అతడు; బాష్పకలయా = బాష్పముతో కూడిన; వాచా = స్వరముతో; కలహంస స్వరః = మధురమైన స్వరముతో; యువా = యువకుడైన; విలలాప = విలపించుచు; సభామధ్యే = సభా మధ్యమునందు; జగర్హే చ = తిరస్కరించెను; పురోహితమ్ = పురోహితుని
భావము;-
కలహంసస్వరము వంటి స్వరము గల యువకుడైన ఆ భరతుడు, సభామధ్యమునందు, బాష్పముతో కూడిన మధురమైన స్వరముతో విలపించుచు, పురోహితుని సూచనను తిరస్కరించెను.
2.82.11.
అనుష్టుప్.
“చరితబ్రహ్మచర్యస్య
విద్యాస్నాతస్య ధీమతః।
ధర్మే ప్రయతమానస్య
కో రాజ్యం మద్విధో హరేత్॥
టీక;-
చరిత = ఆచరించి; బ్రహ్మచర్యస్య = బ్రహ్మచర్య వత్రతమును; విద్యాస్నాతస్య = సకల విద్యాపారంగతుడై; ధీమతః = ధీశాలి; ధర్మే = ధర్మమును; ప్రయతమానస్య = రక్షించుటకు ప్రయత్నించుచున్న; కః = ఎవ్వడైనను; రాజ్యం = రాజ్యమును; మద్విధః = మత్ + విధః, నా వంటివాడు; హరేత్ = అపహరించవలెనని యత్నించునా
భావము;-
బ్రహ్మచర్య వ్రతమును ఆచరించి, సకలవిద్యాపారంగతుడై ధర్మమును రక్షించుటకు ప్రయత్నించుచున్న రామునివంటి ధీశాలికి చెందవలసిన రాజ్యమును అపహరించవలెనని నా వంటివాడు ఎవ్వడైన యత్నించునా?
2.82.12.
అనుష్టుప్.
కథం దశరథాజ్జాతో
భవేద్రాజ్యాపహారకః।
రాజ్యం చాహం చ రామస్య
ధర్మం వక్తుమిహార్హసి॥
టీక;-
కథం = ఎన్నడైనను; దశరథాత్ = దశరథునికి; జాతః = పుట్టినవాడు; భవేత్ = చేయునా; రాజ్య = రాజ్యమును; అపహారకః = అపహరించువాడుగా; రాజ్యం = ఈ రాజ్యము; చ = ఇంకను; అహం = నేను; చ = ఇంకను; రామస్య = రామునకు; ధర్మం = ధర్మమును; వక్తుమ్ = చెప్పుము; ఇహ = ఈ విషయములో; అర్హసి = మీరే అర్హులు
భావము;-
దశరథునికి పుట్టినవాడు ఎన్నడైన రాజ్యాపహారము చేయునా! ఈ రాజ్యము, నేనూ కూడ రామునకు చెందినవారము. ఈ విషయములో ధర్మమేదో మీరే చెప్పుడు.
2.82.13.
అనుష్టుప్.
జ్యేష్ఠశ్శ్రేష్ఠశ్చ ధర్మాత్మా
దిలీపనహుషోపమః।
లబ్ధుమర్హతి కాకుత్సో్థ
రాజ్యం దశరథో యథా॥
టీక;-
జ్యేష్ఠః = జ్యేష్ఠుడు; శ్శ్రేష్ఠః = శ్రేష్ఠుడు; చ = ఇంకను; ధర్మాత్మా = ధర్మాత్ముడు అయిన; దిలీపః = దిలీపుడు; నహుషః = నహుషుడు; ఉపమః = సమానుడు; లబ్ధుమ్ = పొందుటకు; అర్హతి = అర్హుడు; కాకుత్థ్సః = రాముడు; రాజ్యం = రాజ్యమును; దశరథః = దశరథునకు; యథా = వలె
భావము;-
పెద్దవాడు, శ్రేష్టుడు, ధర్మాత్ముడు, దిలీపనహుషులతో సమానుడు అయిన రామునికే ఈ రాజ్యముపై దశరథునకు వలె అధికారమున్నది. వేరెవ్వరికీ లేదు.
2.82.14.
అనుష్టుప్.
అనార్యజుష్టమస్వర్గ్యమ్
కుర్యాం పాపమహం యది।
ఇక్ష్వాకూణామహం లోకే
భవేయం కులపాంసనః॥
టీక;-
అనార్యజుష్టమ్ = చెడ్డవారు చేసే; అస్వర్గ్యమ్ = నరకహేతువైన; కుర్యాం = చేసినచో; పాపమ్ = పాపమును; అహం = నేను; యది = చేసినట్లయితే; ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకు వంశమునకు; అహం = నేను; లోకే = ఈ లోకమునందు; భవ + ఇయం = తెచ్చినవాడను అగుదును; కులసాంసనః = కళంకమును
భావము;-
చెడ్డవారు చేసే ఈ నరక హేతువైన పాపమును చేసినచో నేను ఈ లోకమునందు ఇక్ష్వాకు వంశమునకు కళంకము తెచ్చినవాడను అగుదును.
2.82.15.
అనుష్టుప్.
యద్ధి మాత్రా కృతం పాపమ్
నాహం తదపి రోచయే।
ఇహస్థో వనదుర్గస్థమ్
నమస్యామి కృతాంజలిః॥
టీక;-
యద్ధి = ఏ మాత్రము; మాత్రా = తల్లి; కృతం = చేసిన; పాపమ్ = పాపమును; న = అంగీకరించను; అహం = నేను; తదపి = అయినప్పటికీ; రోచయే = ఇష్టపడను; ఇహస్థః = ఇక్కడి నుండియే; వనదుర్గస్థమ్ = దుర్గమమైన వనములో ఉన్న; నమస్యామి = నమస్కరించుచున్నాను; కృతాంజలి = దోసిలి కట్టి
భావము;-
నా తల్లి చేసిన పాపకార్యమును నేను ఏ మాత్రము అంగీకరించను. దుర్గమమైన వనములో ఉన్న అన్నగారికి దోసిలి కట్టి ఇక్కడి నుండియే నమస్కరించుచున్నాను.
2.82.16.
అనుష్టుప్.
రామమేవానుగచ్ఛామి
రాజా స ద్విపదాంవరః।
త్రయాణామపి లోకానామ్
రాజ్యమర్హతి రాఘవః”॥
టీక;-
రామమ్ = రాముని; ఏవ = మాత్రమే; అనుగచ్ఛామి = అనుసరించి వెళ్లెదను; రాజా = రాజు; సః = అతడు; ద్విపదాంవరః = మానవోత్తముడైన; త్రయాణామ్ = మూడు; అపి = ఇంకను; లోకానామ్ = లోకముల; రాజ్యమ్ = రాజ్యమును; అర్హతి = తగినవాడు; రాఘవః = రాముడు
భావము;-
నేను రామునే అనుసరించి వెళ్ళెదను. మానవోత్తముడైన ఆ రాముడే రాజు. వేరెవ్వరును కాజాలరు. రాముడు మూడు లోకములలో కూడ రాజ్యము ఏలుటకు తగినవాడు.”
2.82.17.
అనుష్టుప్.
తద్వాక్యం ధర్మసంయుక్తమ్
శ్రుత్వా సర్వే సభాసదః।
హర్షాన్ముముచురశ్రూణి
రామే నిహితచేతసః॥
టీక;-
తత్ = ఆ; వాక్యమ్ = మాటలను; ధర్మసంయుక్తమ్ = ధర్మబద్ధమైన; శ్రుత్వా = విని; సర్వే = అందరు; సభాసదః = సభాసదులు; హర్షాన్ = ఆనందముతో; ముముచుః = విడచిరి; అశ్రూణి = బాష్పములను; రామే = రాముని; నిహిత చేతసః = స్మరించుచు
భావము;-
ఆ సభాసదులందరు ధర్మబద్ధమైన ఆ భరతుని మాటలు విని రామునే స్మరించుచు కన్నీటిని విడచిరి.
2.82.18.
అనుష్టుప్.
“యది త్వార్యం న శక్ష్యామి
వినివర్తయితుం వనాత్।
వనే తత్రైవ వత్స్యామి
యథాఽర్యో లక్ష్మణస్తథా॥
టీక;-
యది = అటుల; తు = అయినట్లయితే; ఆర్యమ్ = అన్నగారిని; న శక్ష్యామి = చేయలేకపోతే; వినివర్తయితుమ్ = వెనుకకు తీసుకొని వచ్చువానిగ; వనాత్ = వనము నుండి; వనే = వనములోన; తత్రైవ = అక్కడే; వత్స్యామి = ఉండిపోయెదను; యథా = ఆ విధముగా; ఆర్యః = ఆర్యుడైన; లక్ష్మణః = లక్ష్మణుని; లక్ష్మణః తథా = వలె.
భావము;-
“అన్నగారిని వనము నుండి వెనుకకు తీసికొనిరాజాలని యెడల ఆర్యుడైన లక్ష్మణుడున్నట్లే నేను కూడా ఆ వనములోనే ఉండిపోయెదను.
2.82.19.
అనుష్టుప్.
సర్వోపాయం తు వర్తిష్యే
వినివర్తయితుం బలాత్।
సమక్షమార్యమిశ్రాణామ్
సాధూనాం గుణవర్తినామ్”॥
టీక;-
సర్వ + ఉపాయం = అన్ని ఉపాయములు; తు = మరియు; వర్తిష్యే = ప్రయోగించెదను; వినివర్తయితుం = తీసుకొనివచ్చుటకు; బలాత్ = బలంగా; సమక్షమ్ = ఎదుట; ఆర్యమిశ్రాణామ్ = పూజ్యులు ఐన మీరందరి; సాధూనామ్ = సత్పురుషులను; గుణవర్తినామ్ = సద్గుణములందు ఉన్న.
భావము;-
గుణవంతులు, సత్పురుషులు, పూజ్యులు ఐన మీ అందరి ఎదురుగానే, రాముని ఎట్లయిన వెనుకకు తీసికొని వచ్చుటకు అన్ని ఉపాయములు ప్రయోగించెదను.
2.82.20.
అనుష్టుప్.
విష్టికర్మాన్తికా స్సర్వే
మార్గశోధకరక్షకాః।
ప్రస్థాపితా మయా పూర్వమ్
యత్రాపి మమ రోచతే”॥
టీక;-
విష్టికర్మాన్తికాః = కూలివారిని; సర్వే = అందరిని; ప్రస్థాపితా = పంపి ఉన్నాను; మయా = నా చేత; పూర్వమ్ = ముందుగనే; యత్రాపి = బయలుదేరవలెనని; మమ = నాకు; రోచతే = ఇష్టమగుచున్నది మార్గశోధక = మార్గమును శోధించేవారు; రక్షకాః = రక్షకులను;
భావము;-
మార్గమును శోధించేవారు, రక్షకభటులను, కూలివాళ్లను నేను ముందుగనే పంపి ఉన్నాను. ఇపుడు నేను కూడ బయలుదేరవలెనని అనుకొనుచున్నాను.”
2.82.21.
అనుష్టుప్.
ఏవముక్త్వా తు ధర్మాత్మా
భరతో భ్రాతృ వత్సలః।
సమీపస్థ మువాచేదమ్
సుమంత్రం మంత్రకోవిదమ్॥
టీక;-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా తు = పలికిన; ధర్మాత్మా = ధర్మాత్ముడు; భరతః = భరతుడు; భ్రాతృ వత్సలః = సోదరునియందు ప్రేమ కలవారు; సమీపస్థమ్ = ప్రక్కనే ఉన్న; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈ విధముగా; సుమంత్రం = సుమంత్రునితో; మంత్రకోవిదమ్ = మంత్రాంగనిపుణుడైన
భావము;-
ధర్మాత్ముడు, సోదరునియందు ప్రేమ కలవాడు అయిన భరతుడు ఇట్లు పలికి, ప్రక్కనే ఉన్న మంత్రాంగనిపుణుడైన సుమంత్రునితో ఇట్లు పలికెను.
2.82.22.
అనుష్టుప్.
“తూర్ణముత్థాయ గచ్ఛ త్వమ్
సుమంత్ర! మమ శాసనాత్।
యాత్రామాజ్ఞాపయ క్షిప్రమ్
బలం చైవ సమానయ”॥
టీక;-
తూర్ణమ్ = శీఘ్రముగా; ఉత్థాయ = లేచి; గచ్ఛ = వెళ్లి; త్వమ్ = నీవు; సుమంత్ర = సుమంత్రా; మమ = నా; శాసనాత్ = నా ఆజ్ఞప్రకారము; యాత్రామ్ = ప్రయాణమునకు; ఆజ్ఞాపయ = ఆజ్ఞాపించుము; క్షిప్రమ్ = వెంటనే; బలమ్ = సైన్యమును; చైవ = కూడ; సమానయ = తీసుకొని రమ్ము
భావము;-
“సుమంత్రా! ఈ నా ఆజ్ఞ ప్రకారము శీఘ్రముగా లేచి వెళ్ళి ప్రయాణమునకు వెంటనే బయలుదేరమని ఆజ్ఞాపించుము. సైన్యమును కూడ బయలుదేరమను.”
2.82.23.
అనుష్టుప్.
ఏవముక్తః సుమంత్రస్తు
భరతేన మహాత్మనా।
హృష్టః తదాదిశత్సర్వమ్
యథా సందిష్టమిష్టవత్॥
టీక;-
ఏవమ్ = అలా; ఉక్తః = చెప్పబడినవాడై; సుమంత్రః + తు = సుమంత్రుడును; తు = అలా; భరతేన = భరతునిచేత; మహాత్మనా = మహాత్ముడైన; హృష్టః = సంతోషించి; తదా = అటు పిమ్మట; ఆదిశత్ = ఆజ్ఞాపించెను; సర్వమ్ = అంతను; యథా = యథావిధముగా; సందిష్టమ్ = ఆదేశము ప్రకారము; ఇష్టవత్ = ఇష్టముతో
భావము;-
మహాత్ముడైన భరతుని మాటలు విని సుమంత్రుడు సంతోషించి, భరతుని ఆజ్ఞ ప్రకారము ఆ కార్యమునంతను, తనకు ఇష్టమైన కార్యమైనట్లు ఆదేశించినట్లే ఏర్పాటు చేసెను.
2.82.24.
అనుష్టుప్.
తాః ప్రహృష్టాః ప్రకృతయో
బలాధ్యక్షా బలస్య చ।
శ్రుత్వా యాత్రాం సమాజ్ఞప్తామ్
రాఘవస్య నివర్తనే॥
టీక;-
తాః = ఆ; ప్రహృష్టాః = సంతోషించి; ప్రకృతయో = ఆమత్యాదులు; బలాధ్యక్షా = సైన్యాధ్యక్షులు; బలస్య = సైన్యము; చ = కూడ; శ్రుత్వా = విని; యాత్రాం = ప్రయాణమునకు; సమాజ్ఞప్తామ్ = ఆజ్ఞ ఇచ్చినట్లు; రాఘవస్య = రాముని; నివర్తనే = వెనుకకు తీసుకువచ్చుటకై
భావము;-
రాముని వెనుకకు తీసికొనివచ్చుటకై సైన్యమును కూడ తీసికొని వెళ్ళవలెనని ఆజ్ఞ ఇచ్చినట్లు విని, ఆ ప్రకృతులు, సైన్యాధ్యక్షులు సంతోషించిరి.
2.82.25.
అనుష్టుప్.
తతో యోధాంగనాః సర్వా
భర్తౄన్ సర్వాన్ గృహేగృహే।
యాత్రాగమనమాజ్ఞాయ
త్వరయన్తి స్మ హర్షితాః॥
టీక;-
తతః = అటు పిమ్మట; యోధాంగనాః = యోధుల భార్యలందరును; సర్వా = అందరును; భర్తౄన్ = భర్తలను; సర్వాన్ = అందరు; గృహేగృహే = ప్రతి ఇంటిలోనివారు; యాత్రా = ప్రయాణము యొక్క; గమనమ్ = సంకల్పము గూర్చి; ఆజ్ఞాయ = తెలుసుకొని; త్వరయన్తి = తొందరపెట్టిరి; స్మ = తమతమ; హర్షితాః = సంతోషించుచు
భావము;-
పిమ్మట యోధుల భార్యలందరును భరతుడు సంకల్పించిన యాత్రను గూర్చి విని, సంతోషించుచు, ప్రతి ఇంటివారును, తమ తమ భర్తలను తొందరపెట్టిరి.
2.82.26.
అనుష్టుప్.
తే హయైర్గోరథై శ్శీఘ్రైః
స్యందనైశ్చ మహాజవైః।
సహ యోధైః బలాధ్యక్షా
బలం సర్వమచోదయన్॥
టీక;-
తే = ఆ; హయైః = గుఱ్ఱములు; గోరథైః = ఎడ్లబండ్లు; శీఘ్రైః = వేగముగా పోవు; స్యందనైః = రథములు; చ = మఱియు; మహాజవైః = మిక్కిలి వేగము గల; సహ = సహితముగా; యోధైః = యుద్ధభటులు; బలాధ్యక్షాః = సేనాధ్యక్షులు; బలమ్ = సైన్యమును; సర్వమ్ = అంతను; అచోదయన్ = నడిపించిరి.
భావము;-
ఆ సేనాధ్యక్షులు గుఱ్ఱములు, శీఘ్రముగా పోవు ఎడ్లబండ్లు, అత్యంత వేగము గల రథములు, యుద్ధభటులుతో ఉన్న సైన్యమునంతను నడిపించిరి.
2.82.27.
అనుష్టుప్.
సజ్జం తు తద్భలం దృష్ట్వా
భరతో గురుసన్నిధౌ।
“రథం మే త్వరయ”స్వేతి
సుమంత్రం పార్శ్వతోఽబ్రవీత్॥
టీక;-
సజ్జం తు = సన్నద్ధమైన; చ = కూడ; తత్ = ఆ; బలమ్ = సైన్యమును; దృష్ట్వా = చూచి; భరతః = భరతుడు; గురు = గురువైన వసిష్ఠుని; సన్నిధౌ = సమక్షమునందు; రథం మే = నా రథమును; త్వరయస్వ = తొందరగా; ఇతి = అని; సుమంత్రం = సుమంత్రునితో; పార్శ్వతః = ప్రక్కన ఉన్న; అబ్రవీత్ = పలికెను
భావము;-
భరతుడు సన్నద్ధమైన ఆ సైన్యమును చూచి, గురువైన వసిష్టుని సమక్షమునందు, తన ప్రక్కన ఉన్న సుమంత్రునితో, “నా రథమును తొందరగా సిద్ధము చేయుము’’ అని ఆజ్ఞాపించెను.
2.82.28.
అనుష్టుప్.
భరతస్య తు తస్యాజ్ఞామ్
ప్రతిగృహ్య చ హర్షితః।
రథం గృహీత్వా ప్రయయౌ
యుక్తం పరమవాజిభిః॥
టీక;-
భరతస్య = భరతుని యొక్క; తు = వెంటనే; తస్య = ఆ; ఆజ్ఞామ్ = ఆజ్ఞను; ప్రతిగృహ్య = అంగీకరించి; చ = ఇంకా; హర్షితః = సంతోషముతో; రథమ్ = రథమును; గృహీత్వా = తీసికొని వచ్చెను; ప్రయయౌ = సమీపించెను; యుక్తమ్ = అనువైన; పరమవాజిభిః = ఉత్తమమైన గుఱ్ఱములుకలదానిని
భావము;-
భరతుని ఆజ్ఞ విని సుమంత్రుడు వెంటనే సంతోషముతో ఉత్తమమైన గుఱ్ఱములు కట్టిన రథమును తీసికొనివచ్చెను.
2.82.29.
జగతి.
స రాఘవ స్సత్యధృతిః ప్రతాపవాన్
బ్రువన్ సుయుక్తం దృఢసత్యవిక్రమః।
గురుం మహారణ్యగతం యశస్వినం
ప్రసాదయిష్యన్భరతోఽబ్రవీత్తదా॥
టీక;-
స = ఆ; రాఘవః = రాఘువశపువాడు; సత్యధృతిః = సత్యసంధుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; బ్రువన్ = పలికెను; సుయుక్తం = అనుగుణమైన; దృఢ సత్య విక్రమః = బలమైన, సత్యమైన పరాక్రమవంతుడు; గురుం = అన్నగారిని; మహారణ్యగతం = మహారణ్యంలో ఉన్నవానిని; యశస్వినం = యశఃశాలిౖయెన; ప్రసాదయిష్యన్ = అనుగ్రహింపచేసికొనబోవుచున్నవాడై; భరతః = భరతుడు; అబ్రవీత్ = పలికెను; తదా = అప్పుడు
భావము;-
సత్యమైవ స్థిరచిత్తము కలవాడు, ప్రతారవంతుడు, దృఢమైన సత్యమైన పరాక్రము కలవాడు, తగినట్లు సంభాషించువాడు నగు భరతుడు, మహారణ్యములో ఉన్న యశఃశాలిౖయెన అన్నగారిని అనుగ్రహింపచేసికొనబోవుచున్నవాడై అపుడు ఇట్లు పలికెను.
2.82.30.
జగతి.
“తూర్ణం సముత్థాయ సుమంత్ర! గచ్ఛ
బలస్య యోగాయ బలప్రధానాన్।
ఆనేతుమిచ్ఛామి హి తం వనస్థం
ప్రసాద్య రామం జగతో హితాయ”॥
టీక;-
తూర్ణం = శీఘ్రముగా; సముత్థాయ = లేచి; సుమంత్ర = సుమంత్రా; గచ్ఛ = వెళ్లి; బలస్య = సైన్యమును; యోగాయ = సమకూర్చుడని; బలప్రధానాన్ = సైన్యాధిపతులకు; ఆనేతుమ్ = తీసుకొని రావలెనని; ఇచ్ఛామి = కోరుచున్నాను; హి = తప్పక; తం = ఆ; వనస్థం = వనములో ఉన్న; ప్రసాద్య = అనుగ్రహింప చేసుకొని; రామం = రాముని; జగతః = జగత్తుకు; హితాయ = హితము చేకూర్చుటకై.
భావము;-
“సుమంత్రా! శీఘ్రముగా లేచి వెళ్ళి సైన్యమును సమకూర్చుడని సైన్యాధిపతులకు చెప్పుము. వనములో ఉన్న రాముని అనుగ్రహింపచేసుకొని, లోకహితము కొఱకు తీసికొని రావలెనని కోరుచున్నాను.”
2.82.31.
త్రిష్టుప్.
ససూతపుత్రో భరతేన సమ్య–
గాజ్ఞాపితః సంపరిపూర్ణకామః।
శశాస సర్వాన్ ప్రకృతిప్రధానాన్
బలస్య ముఖ్యాంశ్చ సుహృజ్జనం చ॥
టీక;-
స = ఆ; సూతపుత్రః = సుమంత్రుడు; భరతేన = భరతుని చేత; సమ్యక్ = చక్కగా; ఆజ్ఞాపితః = ఆజ్ఞాపింబడినవాడై; సంపరిపూర్ణకామః = కోరిక తీరుటచే; శశాస = ఆజ్ఞాపించెను; సర్వాన్ = అందరినీ; ప్రకృతి = ప్రకృతులలో; ప్రధానాన్ = ప్రధానులైనవారిని; బలస్య = సేనలయొక్క; ముఖ్యాంశ్చ = ముఖ్యులైనవారిని; చ = ఇంకను; సుహృజ్జనం = మిత్రులను; చ = ఇంకను.
భావము;-
భరతుడు ఈ విధముగా చక్కగా ఆజ్ఞాపించగా, సుమంత్రుడు తన కోరిక తీరుటచే సంతోషించుచు ప్రకృతులలో ప్రధానులైనవారిని, సేనాధిపతులను, మిత్రులను ఆజ్ఞాపించెను.
2.82.32.
త్రిష్టుప్.
తత స్సముత్థాయ కులే కులే తే
రాజన్యవైశ్యా వృషలాశ్చ విప్రాః।
అయూయుజన్నుష్ట్రఖరాన్రథాంశ్చ
నాగాన్హయాంశ్చైవ కులప్రసూతాన్॥
టీక;-
తతః = సముత్థాయ; కులే కులే = ప్రతి కులస్తులు; తే = వారు; రాజన్య = క్షత్రియులు; వైశ్యా = వైశ్యులు; వృషలాః = శూద్రులు; చ = ఇంకను; విప్రాః = బ్రాహ్మణులు; అయూయుజన్ = సిద్ధము చేసిరి; ఉష్ట్ర = ఒంటెలను; ఖరాన్ = గాడిదలను; రథాంశ్చ = రథములను; నాగాన్ = ఏనుగులను; హయాంశ్చ + ఏవ = గుఱ్ఱములను; కులప్రసూతాన్ = ఉత్తమ జాతులకు చెందిన
ప్రతి గృహమునందును, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు లేచి, ఒంటెలను, గాడిదలను, రథములను, ఉత్తమ జాతులకు చెందిన గజములను, అశ్వములను సిద్ధము చేసిరి
2.82.33.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ద్వాశీతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; ద్వాశీతితమ [82] = ఎనభైరెండవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [82] ఎనభైరెండవ సర్గ సంపూర్ణము.
2.83.1.అనుష్టుప్.
అనుష్టుప్.
తతస్సముత్థితః కాల్యమ్
ఆస్థాయ స్యందనోత్తమమ్।
ప్రయయౌ భరతశ్శీఘ్రమ్
రామదర్శనకాంక్షయా॥
టీక;-
తతః = పిమ్మట; సముత్థితః = లేచి; కాల్యమ్ = ప్రాతఃకాలమునందే; ఆస్థాయ = అధిష్టించి; స్యందన = రథమును; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన; ప్రయయౌ = వెళ్లెను; భరతః = భరతుడు; శీఘ్రమ్ = శీఘ్రముగా; రామ = రాముని; దర్శన = చూడవలెనను; కాంక్షయా = కోరికతో.
భావము;-
పిమ్మట భరతుడు ప్రాతఃకాలమునందే లేచి, శ్రేష్ఠమైన రథమును అధిష్టించి, రాముని చూడవలెనను కోరికతో శీఘ్రముగా వెళ్లెను.
2.83.2.అనుష్టుప్.
అనుష్టుప్.
అగ్రతః ప్రయయుస్తస్య
సర్వే మంత్రిపురోధసః।
అధిరుహ్య హయైర్యుక్తాన్
రథాన్సూర్యరథోపమాన్॥
టీక;-
అగ్రతః = ముందు; ప్రయయుః = వెళ్లిరి; తస్య = అతని యొక్క; సర్వే = అందరూ; మంత్రిపురోధసః = మంత్రులు, పురోహితులు; అధిరుహ్య = ఎక్కి; హయైః = గుఱ్ఱములు; ఉక్తాన్ = కట్టిన; రథాన్ = రథములను; సూర్యరథః = సూర్యరథ; ఉపమాన్ = సదృశములైన.
భావము;-
మంత్రులు, పురోహితులు అందరూ.. గుఱ్ఱములు కట్టిన, సూర్యరథ సదృశములైన రథములెక్కి భరతుని ముందు వెళ్ళిరి.
2.83.3.అనుష్టుప్.
అనుష్టుప్.
నవనాగసహస్రాణి
కల్పితాని యథావిధి।
అన్వయుర్భరతం యాంతమ్
ఇక్ష్వాకుకులనందనమ్॥
టీక;-
నవ = తొమ్మిది; నాగ = ఏనుగులు; సహస్రాణి = వేలకొలది; కల్పితాని = కూర్చిన; యథావిధి = నియమానుసారముగా; అన్వయుః = ముందు; భరతం = భరతుడు; యాంతమ్ = వెళ్లుచుండగా; ఇక్ష్వాకు కుల = ఇక్ష్వాకు వంశమునకు; నందనమ్ = ఆనందకరుడైన.
భావము;-
ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన భరతుడు ముందు వెళ్లుచుండగా అతనివెనుక నియమానుసారముగా కూర్చిన తొమ్మిది వేల ఏనుగులు ప్రయాణము చేసినవి.
2.83.4.అనుష్టుప్.
అనుష్టుప్.
షష్టీ రథసహస్రాణి
ధన్వినో వివిధాయుధాః।
అన్వయుర్భరతం యాంతమ్
రాజపుత్రం యశస్వినమ్॥
టీక;-
షష్టీ = అరవై (60); రథ = రథములు; సహస్రాణి = వేల సంఖ్యలో; ధన్వినః = ధనుర్ధారులు; వివిధ = వివిధములైన; ఆయుధాః = ఆయుధములు; అన్వయుః = అనుసరించిరి; భరతం = భరతుని వెంట; యాంతమ్ = వెళ్లుచున్న; రాజపుత్రం = రాకుమారుడు; యశస్వినమ్ = యశఃశాలి.
భావము;-
అనేక విధములైన ఆయుధములు ధరించిన ధనుర్ధారులు గల అరవైవేల రథములు, అలా వెళ్తున్న యశఃశాలైన రాకుమారుడు భరతుని అనుసరించిరి.
2.83.5.అనుష్టుప్.
అనుష్టుప్.
శతం సహస్రాణ్యశ్వానామ్
సమారూఢాని రాఘవమ్।
అన్వయుర్భరతం యాంతమ్
సత్యసంధం జితేంద్రియమ్॥
టీక;-
శతం సహస్రాణి = లక్ష మంది; అశ్వానామ్ సమారూఢాని = అశ్వికులు, అశ్వములను అధిరోహింమినవారు; రాఘవమ్ = రఘువంశీయుడైన; అన్వయుః = అనుసరించిరి; భరతం = భరతుని; యాంతమ్ = వెళ్లిరి; సత్యసంధం = సత్యసంధుvf; జితేంద్రియమ్ = ఇంద్రియజయము గలవానిని.
భావము;-
లక్ష మంది అశ్వికులు సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన రఘువంశపు భరతుని అనుసరించి వెళ్ళిరి.
2.83.6.అనుష్టుప్.
అనుష్టుప్.
కైకేయీ చ సుమిత్రా చ
కౌసల్యా చ యశస్వినీ।
రామానయనసంహృష్టా
యయుర్యానేన భాస్వతా॥
టీక;-
కైకేయీ = కైకేయి; చ = ఇంకను; సుమిత్రా = సుమిత్ర; చ = ఇంకను; కౌసల్యా = కౌసల్య; చ = ఇంకను; యశస్వినీ = యశఃశాలిని; రామ = రాముడు; ఆనయన = తీసుకువచ్చుటకు; సంహృష్టా = ఆనందించుచు; యయుః = వెళ్లిరి; యానేన = వాహనముచేత; భాస్వతా = ప్రకాశించుచున్న
భావము;-
యశఃశాలిని కౌసల్య, సుమిత్ర మఱియు కైకేయి కూడ రాముడు తీసుకువచ్చెదము కదా అనిన ఆనందముతో, ప్రకాశించుచున్న వాహనమును ఎక్కి వెళ్ళిరి.
2.83.7.అనుష్టుప్.
అనుష్టుప్.
ప్రయాతాశ్చార్యసంఘాతా
రామం ద్రష్టుం సలక్ష్మణమ్।
తస్యైవ చ కథాశ్చిత్రాః
కుర్వాణా హృష్టమానసాః॥
టీక;-
ప్రయాతాః = వెళ్ళినవి; చ = ఇంకను; ఆర్యసంఘాతా = సజ్జన సమదాయములు; రామమ్ = రాముని; ద్రష్టుమ్ = చూచుటకు; సలక్ష్మణమ్ = లక్ష్మణునితో కలసి; తస్య = వారి యొక్క; ఏవ = మాత్రమే; చ = ఇంకను; కథాః = గాథలు; చిత్రాః = విచిత్రమైనవి; కుర్వాణా = చేయుచు; హృష్టమానసాః = సంతోషముతో నిండిన మనసు కలవారు.
భావము;-
రామలక్ష్మణులను చూచు వేడుకలతో, సజ్జనులు గుంపులు గుంపులుగా కలిసి వారికి సంబంధించిన విచిత్రమైన గాథలు చెప్పుకొనుచు, సంతోషమనస్కులై వెళ్ళిరి.
2.83.8.అనుష్టుప్.
అనుష్టుప్.
మేఘశ్యామం మహాబాహుమ్
స్థిరసత్త్వం దృఢవ్రతమ్।
కదా ద్రక్ష్యామహే రామమ్
జగతశ్శోకనాశనమ్॥
టీక;-
మేఘశ్యామమ్ = నల్లని మేఘము వంటి ఛాయ కలవాని; మహాబాహుమ్ = ఆజానుబాహుని; స్థిరసత్త్వమ్ = స్థితప్రజ్ఞుడు; దృఢవ్రతమ్ = చేపట్టినది వదలని వాడు; కదా = ఎప్పుడు; ద్రక్ష్యామహే = చూచెదమో కదా; రామమ్ = రాముని; జగతః = జగత్తు; శోకనాశనమ్ = శోకమును నశింపచేయువాడు.
భావము;-
మేఘశ్యాముడు, ఆజానుబాహువు, స్థితప్రజ్ఞుడు, చేపట్టినది వదలని వాడు, లోకుల శోకమును నాశనము చేయువాడు ఐన రాముని ఎప్పుడు చూచెదమో కదా!
2.83.9.అనుష్టుప్.
అనుష్టుప్.
దృష్ట ఏవ హి నశ్శోకమ్
అపనేష్యతి రాఘవః।
తమస్సర్వస్య లోకస్య
సముద్యన్నివ భాస్కరః॥
టీక;-
దృష్ట ఏవ = కంటబడగానే; హి = నిశ్చయంముగా; నః = మన; శోకమ్ = శోకమును; అపనేష్యతి = తొలగించును; రాఘవః = రాముడు; తమః సర్వస్య = అంధకారమునంతను; సర్వస్య = అంతటిని; లోకస్య = లోకముయొక్క; సముద్యన్ = ఉదయించుచున్న; ఇవ = వలె; భాస్కరః = సూర్యుడు
భావము;-
రాముడు మన కంటబడగానే మన శోకములన్నియు, ఉదయించిన సూర్యుడు సకల లోకమునందలి అంధకారమును తొలగించినట్లు, తొలగించును.
2.83.10.అనుష్టుప్.
అనుష్టుప్.
ఇత్యేవం కథయంతస్తే
సంప్రహృష్టాః కథాశ్శుభాః।
పరిష్వజానాశ్చాన్యోన్యమ్
యయుర్నాగరికా జనాః॥
టీక;-
ఇత్యేవం = ఇతి + ఏవం, ఈ విధముగా; కథయన్తః = చెప్పుకొనుచు; తే = వారు; సంప్రహృష్టాః = సంతోషముతో; కథాః = గాథలను; శుభాః = శుభకరమైనవి; పరిష్వజానాః = కౌగిలించుకొనుచు; చ = మఱియు; అన్యోన్యమ్ = ఒకరినొకరు; యయుః = వెళ్లిరి; నాగరికా = పట్టణములోని; జనాః = జనులందరు
భావము;-
ఈ విధముగా సంతోషముగా మంచి మాటలు చెప్పుకొనుచు పట్టణములోని జనులందరూ ఒండొరులను కౌగిలించుకొనుచు వెళ్ళిరి.
2.83.11.అనుష్టుప్.
అనుష్టుప్.
యే చ తత్రాపరే సర్వే
సమ్మతా యే చ నైగమాః।
రామం ప్రతి యయుర్హృష్టా
స్సర్వాః ప్రకృతయస్తథా॥
టీక;-
యే = ఎవరైతే; చ = ఇంకను; తత్ర = అక్కడ; అపరే = ఇతరులు; సర్వే = అందరును; సమ్మతాః = రాజకుటుంబమునకు దగ్గరగా; యే = ఏదైతే; చ = ఇంకను; నైగమాః = వర్తకుల సంఘమునకు చెందినవారు; రామం ప్రతి = రాముని చూచుటకై; యయుః = వెళ్లిరి; హృష్టాః = సంతోషించుచు; సర్వాః = సమస్తమైన; ప్రకృతయః = ప్రజలు; తథా = ఇంకను
భావము;-
వర్తకుల సంఘములకు చెందినవారు, రాజకుటుంబమునకు దగ్గరగా ఉండేవారు, సమస్తమైన ప్రజలు సంతోషించుచు రాముని చూచుటకై వెళ్ళిరి.
*గమనిక:-
ప్రకృతిః-(1) ప్రభువునకు ప్రజలే ప్రకృతి. (2) ప్రభువునకు అష్టప్రకృతులు. 1. అరి, 2. అరిమిత్రము, 3. మిత్రమిత్రము, 4. అరిమిత్రమిత్రము, 5. పార్ష్ణిగ్రాహుడు (దం డెత్తిపోవు రాజునకు వెనుక దిక్కుననుండు శత్రువు), 6. ఆక్రందుడు (పొరుగు రాజ్యమునకు ప్రక్కనుండు రాజ్యమునేలు రాజు), 7. పార్ష్ణిగ్రాహాసారుడు, 8. ఆక్రాందాసారుడు. (3) మనుస్మృతి 7 అ. ప్రకారము ద్వాదశ ప్రకృతులు ఏవి అనగా అష్ట ప్రకృతులు మఱియు 10. అరిభూమి మిత్రుడు, 11. విజిగీషువు (మిక్కిలి జయింపనిచ్ఛగలవాఁడు), 12. ఉదాసీనుడు (శత్రుమిత్రదేశములకుమీఁద నుపకారాపకారములు చేయక యూరకుండువాఁడు). (4) రాజ్యమునకు సప్త ప్రకృతులు మనుస్మృతి ప్రకారము. 1. స్వామి, 2. అమాత్య, 3. సుహృత్, 4. కోశః, 5. రాష్ట్రమ్, 6. దుర్గమ్, 7. బలమ్.
2.83.12.అనుష్టుప్.
అనుష్టుప్.
మణికారాశ్చ యే కేచిత్
కుంభకారాశ్చ శోభనాః।
సూత్రకర్మకృతశ్చైవ
యే చ శస్త్రోపజీవినః॥
టీక;-
మణికారాః = రత్నములు సానపట్టువారు, వైకటికులు, హేమచంద్రః; చ = ఇంకను; యే = ఎవరైతే; కేచిత్ = కొందరు; కుంభకారాః = కుండలు తయారు చేయువారు, కుమ్మరి; చ = ఇంకను; శోభనాః = అందమైన; సూత్రకర్మకృతః = వడ్రంగులు / స్థపతి; ఏవ = వారందరును; యే = ఎవరైతే; చ = ఇంకను; శస్త్రోపజీవినః = ఆయుధములతో జీవించు యోధులు.
భావము;-
భరతుని వెంట.. అందమైన కుండలు తయారు చేయు కుమ్మరులు, రత్నాభరణములు చేయు వైకటికులు, వడ్రంగులు, స్థపతులు, ఆయుధములతో జీవించు యోధులు అనుసరించిరి.
2.83.13.అనుష్టుప్.
అనుష్టుప్.
మయూరకాః క్రాకచికా
రోచకా వేధకాస్తథా।
దంతకారా స్సుధాకారా
స్తథా గంధోపజీవినః॥
టీక;-
మయూరకాః = అంజనవిశేషములు చేయువారు, ఇత్యమరః; క్రాకచికా = ఱంపపు పనివారు; రోచకా = అలంకరణము చేయు రుచికారకులు; వేధకాః = మణి ముత్యాదులకు రంధ్రములు చేసి జీవించు వేధకులు; తథా = మరియు; దంతకారాః = దంతపు పని వారు; సుధాకారాః = వెల్ల వేయువారు లేదా సున్నము పనివారు; తథా = మరియు; గంధోపజీవినః = సుగంధ ద్రవ్యములు చేసి జీవించువారు
భావము;-
అంజనము నిపుణులు, రంపపు పనివారు, మెఱుగు పెట్టు రోచకారకులు, మణులు ముత్యాలు మున్నగువానికి రంధ్రములు చేయువారు, దంతపు పనివారు, వెల్ల వేయువారు లేదా సున్నము పనివారు, సుగంధ ద్రవ్యములు చేయు సౌగంధికులు ఉండిరి.
*గమనిక:-
మయూరకః- మయూరకము నిపుణులు, మయూరకం- మయూరగ్రీవేవ ప్రతికృతిరితి, అంజనా విశేషములు, అవి 1. తప్తర్య్యయః, 2. తృత్తాంజనమ్, 3.శిఖిగ్రీవమ్, 4. వితున్నకమ్. ఇతి అమరః (1. మృదుమరువకః, 2. అపామార్గః, 3. మయూరః, 4. తుత్థకమ్, 5. మయూరశిఖా, సర్వశబ్దసంబోధిని). అంజనము నిపుణులు.
2.83.14.అనుష్టుప్.
అనుష్టుప్.
సువర్ణకారాః ప్రఖ్యాతాః
తథా కంబళధావకాః।
స్నాపకోష్ణో్ణదకా వైద్యా
ధూపకాశ్శౌణ్డికాస్తథా॥
టీక;-
సువర్ణకారాః = బంగ3రపు పని చేయు కంసాలులు; ప్రఖ్యాతాః = ప్రసిద్ధులైన; తథా = మరియు; కంబళధావకాః = కంబళ్లు ఉతుకువారు; స్నాపక = స్నానాలు చేయించువారు; ఉష్ణోదకా = ఉష్ణ + ఉదకా, వేడి నీటిని అందించువారు; వైద్యా = వైద్యులు; ధూపకాః = సుగంధ ధూపములు వేయువారు; శౌణ్డికాః = మద్యము కాచువారు; తథా = మరియు
భావము;-
కంబళ్ళు ఉతుకువారు, ప్రసిద్ధులైన కంసాలులు, మద్యము కాచువారు, సుగంధ ధూపములు వేయువారు, స్నానాలు చేయించేవారు, వైద్యులు, వేన్నీళ్ళు అందించేవారు, సుగంధ ధూపములు వేయువారు వెంటవెళ్ళిరి.
2.83.15.అనుష్టుప్.
అనుష్టుప్.
రజకాస్తున్నవాయాశ్చ
గ్రామఘోషమహత్తరాః।
శైలూషాశ్చ సహ స్త్రీభిః
యయుః కైవర్తకాస్తథా॥
టీక;-
రజకాః = వస్త్రములు ఉతుకు చాకళ్లు; తున్నవాయాః = కుట్టుపనివారు; చ = ఇంకను; గ్రామః = గ్రామముల యొక్క; ఘోషః = గొల్లపల్లెలయొక్క; మహత్తరాః = పెద్దలు; శైలూషాః = నటులు; చ = ఇంకను; సహ = సహితులైన; స్త్రీభిః = ఆడవారితో; యయుః = వెళ్లిరి; కైవర్తకాః = చేపలు పట్టు కైవర్తులు; తథా = మరియు.
భావము;-
గ్రామపెద్దలు, గొల్లపల్లెలపెద్దలు, వస్త్రములు ఉతుకు చాకళ్లు, కుట్టుపనివారు, చేపలు పట్టువారు, స్త్రీలుతో కూడిన నటులు భరతుని సైన్యంతో పాటు కూడా వెళ్లిరి.
2.83.16.అనుష్టుప్.
అనుష్టుప్.
సమాహితా వేదవిదో
బ్రాహ్మణా వృత్తసమ్మతాః।
గోరథైర్భరతం యాంతమ్
అనుజగ్ము స్సహస్రశః॥
టీక;-
సమాహితాః = నిశ్చలమైన మనస్సు కలవారు; వేదవిదః = వేదవేత్తలు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; వృత్తసమ్మతాః= మంచి నడవడిక చేత పూజ్యులు; గోరథైః = ఎడ్లబండ్లచేత; భరతం = భరతుని; యాంతమ్ = వెళ్ళుచున్న; అనుజగ్ముః = అనుసరించి వెళ్లిరి; సహస్రశః = వేలకొలది
భావము;-
నిశ్చలమైన మనస్సు కలవారు, మంచి నడవడిక చేత పూజ్యులు, వేదవేత్తలు అయిన వేలకొలది బ్రాహ్మణులు భరతుని వెనుక ఎడ్లబండ్లెక్కి వెళ్ళిరి.
2.83.17.అనుష్టుప్.
అనుష్టుప్.
సువేషాశ్శుద్ధవసనాః
తామ్రమృష్టానులేపనాః।
సర్వే తే వివిధైర్యానైః
శనైర్భరతమన్వయుః॥
టీక;-
సువేషాః = సందరమైన వేషములు కలవారు; శుద్ధవసనాః = పరిశుద్ధమైన వస్త్రములు ధరించినవారు; తామ్ర = ఎఱ్ఱగా; మృష్ట = మంచి; అనులేపనాః = సుగంధ ద్రవ్యముల అనులేపనములను; సర్వే = అందరు; తే = వారు; వివిధైః = అనేకవిధములైన; యానైః = వాహనములను; శనైః = మెల్లగా; భరతమ్ = భరతుని; అన్వయుః = అనుసరించి వెళ్లిరి.
భావము;-
వారందరు ఎఱ్ఱని మంచి సుగంధద్రవ్యముల అనులేపములను పూసికొని, పరిశుద్ధమైన వస్త్రములు కట్టుకొని,అందముగా అలంకరించుకుని, రకరకముల వాహనములు ఎక్కి భరతుని మెల్లగా అనుసరించి వెళ్ళిరి.
2.83.18.అనుష్టుప్.
అనుష్టుప్.
ప్రహృష్టముదితా సేనా
సాఽన్వయాత్కైకయీసుతమ్।
భ్రాతురానయనే యాంతమ్
భరతం భ్రాతృవత్సలమ్॥
టీక;-
ప్రహృష్టముదితాః = మిక్కిలి సంతోషించుచున్న; సేనాః = సేనలు; సా = ఆ; అన్వయాత్ = అనుసరించి వెళ్ళెను; కైకేయీసుతమ్ = కైకేయి పుత్రుడైన; భ్రాతుః = సోదరుడు; ఆనయనే = తీసుకొని వచ్చుటకై; యాంతమ్ = వెళ్లుచున్న; భరతం = భరతుని; భ్రాతృ = సోదరునిపై; వత్సలమ్ = ప్రేమతో.
భావము;-
మిక్కిలి సంతోషించుచు ఆనందించుచున్న ఆ సేన సోదరునిపై ప్రేమతో అతనిని తిరిగి తీసికొని వచ్చుటకై వెళ్ళుచున్న, కైకేయి పుత్రుడైన భరతుని వెంట వెళ్ళెను.
2.83.19.అనుష్టుప్.
అనుష్టుప్.
తే గత్వా దూరమధ్వానమ్
రథయానాశ్వకుంజరైః।
సమాసేదుస్తతో గంగామ్
శృంగిబేరపురం ప్రతి॥
టీక;-
తే = వారందరూ; గత్వా = ప్రయాణించి; దూరమ్ = చాలాదూరమును; అధ్వానమ్ = ఆమార్గమున; రథయాన = రథముల మీద; అశ్వః = గుఱ్ఱముల పైన; కుంజరైః = ఏనుగుల మీద; సమాసేదుః = చేరిరి; తతః = అక్కడ; గంగామ్ = గంగానదిని; శృంగిబేరపురం ప్రతి = శృంగిబేరపురము వద్ద.
భావము;-
వారందరూ రథముల పైన, బండ్ల పైన, గుఱ్ఱముల పైన, గజముల పైన ఆ దారమ్మట చాల దూరము ప్రయాణము చేసి శృంగిబేరిపురము దగ్గర గంగానది వద్దకు చేరిరి.
2.83.20.అనుష్టుప్.
అనుష్టుప్.
యత్ర రామసఖో వీరో
గుహో జ్ఞాతిగణైర్వృతః।
నివసత్యప్రమాదేన
దేశం తం పరిపాలయన్॥
టీక;-
యత్ర = ఎక్కడైతే; రామసఖః = రామునికి మిత్రుడు; వీరః = వీరుడు; గుహః = గుహుడు; జ్ఞాతిగణైః = బంధుగణములతో; వృతః = కలసి; నివసతి = నివసించుచున్నాడో; అప్రమాదేన = జాగ్రత్తగా; దేశం = ప్రదేశమునకు; తం = ఆ; పరిపాలయన్ = పరిపాలించుచున్న
భావము;-
రాముని మిత్రుడు, వీరుడు అయిన గుహుడు తన బంధువులతో కలిసి నివసించుచు ఏమరుపాటు లేకుండా పరిపాలించుచున్న ఆ దేశమునకు వెళ్లిరి.
2.83.21.అనుష్టుప్.
అనుష్టుప్.
ఉపేత్య తీరం గంగాయాః
చక్రవాకైరలంకృతమ్।
వ్యవాతిష్ఠత సా సేనా
భరతస్యానుయాయినీ॥
టీక;-
ఉపేత్య = చేరి; తీరం = తీరమును; గంగాయాః = గంగా నది యొక్క; చక్రవాకైః = చక్రవాక పక్షులతో; అలంకృతమ్ = అందముగా ఉన్న; వ్యవాతిష్ఠత = నిలబడెను; సా = ఆ; సేనా = సేన; భరతస్య = భరతుని; అనుయాయినీ = అనుసరించు.
భావము;-
భరతుని అనుసరించుచున్న ఆ సేన, చక్రవాక పక్షులతో అందముగా ఉన్న గంగా తీరమును చేరి అక్కడ నిలచెను.
2.83.22.అనుష్టుప్.
అనుష్టుప్.
నిరీక్ష్యానుగతాం సేనామ్
తాం చ గంగాం శివోదకామ్।
భరతస్సచివాన్సర్వాన్
అబ్రవీద్వాక్యకోవిదః॥
టీక;-
నిరీక్ష్య = చూచుచు; అనుగతాం = అనుసరించిన; సేనామ్ = సేనను; తాం = ఆ; చ = ఇంకను; గంగాం = గంగను; శివ = పవిత్రమైన; ఉదకామ్ = ఉదకము గల; భరతః = భరతుడు; సచివాన్ = మంత్రులు; సర్వాన్ = అందరితో; అబ్రవీత్ = పలికెను; వాక్యకోవిదః = మాటలలో నేర్పరి అయిన.
భావము;-
తన వెనుక వచ్చిన సేనను, ముందున్న ఆ పవిత్ర ఉదకము గల గంగను చూచి, చక్కగా మాటలాడెడు భరతుడు అమాత్యులతో ఇట్లు ఆదేశించెను.
2.83.23.అనుష్టుప్.
అనుష్టుప్.
“నివేశయత మే సైన్యమ్
అభిప్రాయేణ సర్వతః।
విశ్రాన్తాః ప్రతరిష్యామః
శ్వ ఇదానీమిమాం నదీమ్॥
టీక;-
నివేశయత = విడిది చేయింతురు గాక; మే = మాయొక్క; సైన్యమ్ = సైన్యము; అభిప్రాయేణ = మీ సౌకర్యమును అనుసరించి; సర్వతః = అందరును; విశ్రాన్తాః = విశ్రాంతి తీసుకుందురు గాక; ప్రతరిష్యామః = దాటెదము; శ్వ = రేపు; ఇదానీమ్ = ఇప్పుడు; ఇమాం = ఈ; నదీమ్ = నదిని.
భావము;-
మీ అందరి సౌకర్యమును అనుసరించి సైన్యమును ఆయా స్థానములందు విడిది చేయించండి. విశ్రాంతి తీసికొనుడు. రేపు ఈ గంగానదిని దాటెదము.
2.83.24.అనుష్టుప్.
అనుష్టుప్.
దాతుం చ తావదిచ్ఛామి
స్వర్గతస్య మహీపతేః।
ఔర్ధ్వదేహనిమిత్తార్థమ్
అవతీర్యోదకం నదీమ్”॥
టీక;-
దాతుం = ఈయ వలెనని; చ = ఇంకను; తావత్ = కూడా; ఇచ్ఛామి = కోరుచున్నాను; స్వర్గతస్య = స్వర్గస్థుడైన; మహీపతేః = మహారాజునకు (నా తండ్రి దశరథునికి); ఔర్ధ్వదేహ = ఊర్ధ్వలౌకిక శరీరము; నిమిత్తార్థమ్ = కొఱకు; అవతీర్యః = వదులుదును; ఉదకం = జలతర్పణములు; నదీమ్ = నదిలో
భావము;-
నేను ఈ గంగానదిలో దిగి, స్వర్గస్థుడైన నా తండ్రిగారికి ఊర్ధ్వ లోక శరీరము కలుగుటకై, జలతర్పణములు వదలవలెనని కోరుచున్నాను.”
2.83.25.అనుష్టుప్.
అనుష్టుప్.
తస్యైవం బ్రువతోఽమాత్యాః
తథేత్యుక్త్వా సమాహితాః।
న్యవేశయంస్తాం ఛందేన
స్వేన స్వేన పృథక్ పృథక్॥
టీక;-
తస్య = అతని చేత; ఏవం = ఈ విధముగా; బ్రువతః = పలికిన; అమాత్యాః = మంత్రులు; తథేతి = అట్లే అని; ఉక్త్వా = సమాధానమిచ్చిరి; సమాహితాః = జాగ్రత్తగా; న్యవేశయన్ = నిలబెట్టెను; తాం = వారిని; ఛందేన = ఇష్ట ప్రకారము; స్వేన స్వేన = వారి వారి; పృథక్ పృథక్ = అచ్చటచ్చట.
భావము;-
భరతుని మాటలు విన్న ఆ అమాత్యులు॥అట్లే చేసెదము’’ అని పలికి లారి వారి ఇష్టప్రకారము ఆ సేనను వేరు వేరుగా నిలిపిరి.
2.83.26.జగతి.
జగతి.
నివేశ్య గంగామను తాం మహానదీం
చమూం విధానైః పరిబర్హశోభినీమ్।
ఉవాస రామస్య తదా మహాత్మనో
విచింతయానో భరతో నివర్తనమ్॥
టీక;-
నివేశ్య = విడిది చేయించి; గంగామ్ + అను = గంగామ్ + అను, గంగానది అనుసరించి; తాం = ఆ; మహానదీం = మహానదిని; చమూం = సేనను; విధానైః = తగు ఏర్పాట్లతో; పరిబర్హ = శ్వేతచ్ఛత్రాది రాజార్హమైనవానితో, సంస్కృత-ఆంధ్ర నిఘంటువు; శోభినీమ్ = శోభించుచున్న; ఉవాస = నివసించెను; రామస్య = రాముని; తదా = అప్పుడు; మహాత్మనః = మహాత్ముడైన; విచింతయానః = ఆలోచించుచుండెను; భరతః = భరతుడు; నివర్తనమ్ = వెనుకకు తీసుకురావలెనా; జితేంద్రియమ్ = జిత + ఇంద్రియమ్, ఇంద్రియములను జయించినవాడు.
భావము;-
శ్వేతచ్ఛత్రాది రాజార్హమైన చిహ్నములతో చక్కని ఏర్పాట్లతో శోభించుచున్న తన సేనను ఆ గంగా మహానది వెంబడి విడిది చేయించి, మహాత్ముడైన రాముని ఎట్లు వెనుకకు తీసుకొని రావలెనా అని భరతుడు ఆలోచించుచుండెను.
2.83.27.గద్య.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే త్ర్యశీతితమ సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; త్ర్యశీతితమ [83] = ఎనభైమూడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [83] ఎనభైమూడవ సర్గ సంపూర్ణము.
2.84.1.అనుష్టుప్.
అనుష్టుప్.
తతో నివిష్టాం ధ్వజినీమ్
గంగామన్వాశ్రితాం నదీమ్।
నిషాదరాజో దృష్ట్వైవ
జ్ఞాతీన్సంత్వరితోఽ బ్రవీత్॥
టీక:-
తతః = ఆ తరువాత; నివిష్టామ్ = విడిదిచేయుచున్న; ధ్వజినీమ్ = సైన్యమును; గంగామ్ = గంగను; అన్వాశ్రితాం = ఆశ్రయించిన; నదీమ్ = నదిని; నిషాదరాజః = నిషాదుల రాజు; దృష్ట్వా = చూచి; ఏవ = మాత్రమే; జ్ఞాతీన్ = తన బంధువులను గూర్చి; సంత్వరితః = తొందరపడుచు; అబ్రవీత్ = నుడివెను.
భావము:-
అంతట నిషాదరాజయిన గుహుడు గంగానదీతీరమున విడిదిచేయుచున్న భరతుని సైన్యమును చూచినంతనే తొందరపడుచు తన బంధువులను పిలిచి ఇట్లు చెప్ప నారంభించెను.
*గమనిక:-
చూ. (2.50.34.-నిషాదులు - వాతెరా.-వివరములు- వ్యాసములు.) నిషాదులు – ఒక తెగ గిరిజనులు. అంగరాజు కొడుకు వేనుడు. అతడు నిరంకుశుడు కావున, విప్రులు అతనిని రూపుమాపిరి. అంత అతనిమీది ప్రేమతో, అతని తల్లి అగు సునీథ, అతని దేహమును తన యోగ శక్తిచే చెడిపోకుండా కాపాడెను. కాని అరాజకమైన దేశబాధలను చూచి, మునులు శవముయొక్క ఊరువులు (తొడలు) మధించారు. ఆ తొడనుండి ఒక బహు కురూపియైన మరుగుజ్జువాడు ఉదయించి “ఏమి చేయుదును” అని అడిగెను. మునులు “నిషీద (కూర్చుండుము)” అనిరి. అందుచేత, అతని పేరు నిషాదుడు అయినది. అతని వంశము వారు నిషాదులను గిరిజనులై పర్వతములలో అడవులలో జీవించసాగిరి. పిమ్మట, భుజము మధించగా పృథువు అను ఆదిరాజు అర్చి అను కన్య జనించిరి. చూ. పోతెభా 4-428 నుండి 4-433 వరకు.
2.84.2.అనుష్టుప్.
అనుష్టుప్.
“మహతీయమితస్సేనా
సాగరాభా ప్రదృశ్యతే।
నాస్యాన్తమధిగచ్ఛామి
మనసాపి విచిన్తయన్॥
టీక:-
మహతీ = పెద్ద; ఇయమ్ = ఈ; ఇతః = ఇక్కడ; సేనా = సైన్యము; సాగరాభా = సముద్రమువంటి; ప్రదృశ్యతే = చూడబడుచున్నది; న = కాదు; అస్యాః = ఈ సేనకు; అంతం = అవధిని; న = లేను; అధిగచ్ఛామి = నే చేర; మనసా = మనసుతో; అపి = అయినా; విచిన్తయన్ = ఆలోచించినను
భావము:-
“ఇచ్చట విడిదిచేసియున్న యీ సైన్యమును చూడుడు. ఒక మహాసాగరమువలె విస్తరించియున్నది. ఈ సేన అవధులు ఎక్కడ ఉన్నవో అంతుపట్టుట లేదు. మనస్సులో కూడ ఆలోచించలేక ఉంటిని.
2.84.3.అనుష్టుప్.
అనుష్టుప్.
యథా తు ఖలు దుర్బుద్ధిః
భరతస్స్వయమాగతః।
స ఏష హి మహాకాయః
కోవిదారధ్వజో రథే॥
టీక:-
యథా = ఎట్లు; తు = అయిన; ఖలు = నిజముగా; దుర్బుద్ధిః = చెడ్డ ఆలోచనలు కలవాడు; భరతః = భరతుడు; స్వయమ్ = తానే స్వయముగా; ఆగతః = వచ్చెను; సః = అతడు; ఏషః = ఇది; హి = నిశ్చయముగా; మహాకాయః = బలిష్ట శరీరముగలవాడు; కోవిదారధ్వజః = ఎఱ్ఱకాంచనము చెట్టు ధ్వజము కలిగినవాడు; రథే = రథమునందు
భావము:-
అదిగో ఎఱ్ఱకాంచనము చెట్టు గుర్తు జెండాగల రథము ఎక్కి వచ్చుచున్న వాడు మహాబలిష్ఠుడైన భరతుడు. అతడు దుర్బుద్ధితో స్వయముగా వచ్చెనా ఏమి.
2.84.4.అనుష్టుప్.
అనుష్టుప్.
బంధయిష్యతి వా దాశాన్
అథవాఽ స్మాన్వధిష్యతి।
అథ దాశరథిం రామమ్
పిత్రా రాజ్యాద్వివాసితమ్॥
టీక:-
బంధయిష్యతి = బంధించునేమో?; వా = లేదా; దాశాన్ = భృత్యులను; అథవా = లేదా; అస్మాన్ = మమ్ము; వధిష్యతి = చంపునేమో?; అథ = సంశయార్థకము; దాశరథిమ్ = దశరథుని కుమారుడైన; రామమ్ = రామచంద్రుని; పిత్రా = తండ్రిచే; రాజ్యాత్ = రాజ్యమునుండి; వివాసితమ్ = వెళ్ళగొట్టబడినవాడు
భావము:-
నన్ను చంపునా? లేక నా సేవకులనా? లేక బంధించునా? కానిచో తండ్రిచే రాజ్యబహిష్కారము చేయబడిన దశరథరాముడినా? ఏమిచేయునో.
2.84.5.అనుష్టుప్.
అనుష్టుప్.
సమ్పన్నాం శ్రియమన్విచ్ఛన్
తస్య రాజ్ఞ స్సుదుర్లభామ్।
భరతః కైకయీపుత్రో
హన్తుం సమధిగచ్ఛతి॥
టీక:-
సంపన్నామ్ = మిక్కిలి సంపదగలది; శ్రియమ్ = రాజ్యలక్ష్మిని; అన్విచ్ఛన్ = కావలెనని; తస్య = ఆ; రాజ్ఞః = రాజుయొక్క; సుదుర్లభామ్ = మిక్కిలి దుర్లభమైనది; భరతః = భరతుడు; కైకయీపుత్రః = కైకేయి కుమారుడు; హన్తుం = చంపుటకు; సమధిగచ్ఛతి = వచ్చుచున్నాడేమో?
భావము:-
దశరథుని మిక్కిలి దుర్లభమైన సుసంపన్నమైన ఆ రాజ్యలక్ష్మిని కైకేయి పుత్రుడైన భరతుడు తన హస్తగతము చేసుకోవాలని చంపుటకు వచ్చుచుండెనా?
2.84.6.అనుష్టుప్.
అనుష్టుప్.
భర్తాచైవ సఖాచైవ
రామో దాశరథిర్మమ।
తస్యార్థకామాస్సన్నద్ధా
గంగాఽ నూపే ప్రతిష్ఠత॥
టీక:-
భర్తా = ప్రభువు; చ = మఱియు; సఖా = స్నేహితుడు; చ = మఱియు; ఇవ = వలె; రామః = శ్రీరామచంద్రుడు; దాశరథిః = దశరథుని కుమారుడు; మమ = నాయొక్క; తస్య = వానియొక్క; అర్థకామాః = ప్రయోజనార్థమై; సన్నద్ధాః = సన్నద్ధులై; గంగా = గంగానదియొక్క; అనూపే = తీరమునందు; ప్రతిష్ఠత = నిలిచియుండుడు
భావము:-
నా ప్రభువు, ఆప్తమిత్రుడు ఐన దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి ప్రయోజనము తీర్చుట కొఱకు ఈ గంగాతీరము వద్ద అస్త్రశస్త్రములతో సిద్ధముగానుండుడు.
2.84.7.అనుష్టుప్.
అనుష్టుప్.
తిష్ఠన్తు సర్వే దాశాశ్చ
గంగామన్వాశ్రితా నదీమ్।
బలయుక్తా నదీరక్షా
మాంసమూలఫలాశనాః॥
టీక:-
తిష్ఠన్తు = నిలిచి ఉందురుగాక; సర్వే = అందఱు; దాశాః = అనుయాయులు; చ = మఱియు; గంగామ్ = గంగను; అన్వాశ్రితాః = అనుసరించి ఆశ్రయించినవారై; నదీమ్ = నదిని; బలయుక్తాః = సైన్యములతో కూడినవారై; నదీరక్షాః = నదిని రక్షించుటకు; మాంస = మాంసమును; మూలఫలాశనాః = మూలికలు మరియు పండ్లను స్వీకరించువారు
భావము:-
కందమూలములను, ఫలములను భుజించునట్టివారును, నదీరేవులను రక్షించువారును అయిన మన అనుయాయులందరు తమ సైన్యములతో సహితముగా గంగాతీరమున సిద్దముగా యుండవలెను.
2.84.8.అనుష్టుప్.
అనుష్టుప్.
నావాం శతానాం పంచానామ్
కైవర్తానాం శతం శతమ్।
సన్నద్ధానాం తథా యూనామ్
తిష్ఠన్త్విత్యభ్యచోదయత్”॥
టీక:-
నావాం = నావలయొక్క; శతానాం = వందల; పంచానామ్ = ఐదు; కైవర్తానాం = చేపలుపట్టువారు; శతం శతమ్ = వందలకొలది; సన్నద్ధానాం = సిద్ధముగ నున్న; తథా = అటులనే; యూనామ్ = యువకుల; తిష్ఠన్తు = నిలిచి ఉండెదరు గాక; ఇతి = అని; అభ్యచోదయత్ = ఆదేశించెను
భావము:-
మన ఐదువందల నావలు, వందలకొలది జాలర్లు అలాగే యువయోధులు సర్వసన్నద్ధులై నిలిచియుండవలెను” అని గుహుడు వారందఱిని ఆదేశించెను.
2.84.9.అనుష్టుప్.
అనుష్టుప్.
“యదాఽదుష్టస్తు భరతో
రామస్యేహ భవిష్యతి।
సేయం స్వస్తిమతీ సేనా
గంగామద్య తరిష్యతి”॥
టీక:-
యదా = ఒకవేళ; అదుష్టః = దుష్టత్వము లేనివాడు; తు = అయితే; భరతః = భరతుడు; రామస్య = శ్రీరామచంద్రునికి; ఇహ = ఇక్కడ; భవిష్యతి = అగును; సా = అట్టి; ఇయం = ఈ; స్వస్తిమతీ = క్షేమకరమై; సేనా = సైన్యము; గంగాం = గంగానదిని; అద్య = ఈ దినము; తరిష్యతి = దాటగలదు
భావము:-
“ఒకవేళ భరతునికి శ్రీరామచంద్రుని యెడల దుష్టబుద్ధి లేనిచో ఈ సైన్యము నేడు సురక్షితముగ గంగానదిని దాటించెదము.”
2.84.10.అనుష్టుప్.
అనుష్టుప్.
ఇత్యుక్త్వోపాయనం గృహ్య
మత్స్యమాంసమధూని చ।
అభిచక్రామ భరతమ్
నిషాదాధిపతిర్గుహః॥
టీక:-
ఇతి = ఇట్లు; ఉక్త్వా = చెప్పి; ఉపాయనం = అర్పణార్థమైన కానుకలు; గృహ్య = తీసుకుని; మత్స్య+ = చేపలను; మాంస+మధూని = మాంసమును; మధూని = తేనెలను; చ = మఱింతగా; అభిచక్రామ = వెళ్లెను; భరతమ్ = భరతునిగూర్చి; నిషాదః = నిషాదుల; అధిపతిః = ప్రభువు; గుహః = గుహుడు
భావము:-
తన అనుచరులకు ఈ విధముగా ఆజ్ఞలు చేసి, చేపలు, మాంసము, తేనెలు వంటి కానుకలను తీసుకొని, నిషాదాధిపతియైన గుహుడు భరతుని వద్దకు వెళ్ళెను.
2.84.11.అనుష్టుప్.
అనుష్టుప్.
తమాయాన్తం తు సమ్ప్రేక్ష్య
సూతపుత్రః ప్రతాపవాన్।
భరతాయాఽ చచక్షేఽ థ
వినయజ్ఞో వినీతవత్॥
టీక:-
తమ్ = అతనిని; ఆయాన్తం = వచ్చుచున్న; తు; సమ్ప్రేక్ష్య = చూచి; సూతపుత్రః = రథసారథి కుమారుడు (సుమంత్రుడు); ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; భరతాయ = భరతునికొఱకు; ఆచచక్షే = తెలియజేసెను; అథ = పిదప; వినయజ్ఞః = వినయమును బాగుగా తెలిసినవాడు ; వినీతవత్ = వినయశీలి.
భావము:-
తమ వద్దకు వచ్చుచున్న గుహుని చూచిన పరాక్రమశాలి, వినయశీలి, రథసారథి ఐన సుమంత్రుడు భరతునికి ఇట్లు విన్నవించెను.
2.84.12.అనుష్టుప్.
అనుష్టుప్.
“ఏష జ్ఞాతిసహస్రేణ
స్థపతిః పరివారితః।
కుశలో దణ్డకారణ్యే
వృద్ధో భ్రాతుశ్చ తే సఖా॥
టీక:-
ఏషః = ఇతడు; జ్ఞాతి = బంధువులు; సహస్రేణ = వేలకొలదితో; స్థపతిః = రక్షకభటులతో (అంతఃపుర కావలివారు, వావిళ్ళ); పరివారితః = పరివారముతో; కుశలః = నైపుణ్యము కలవారిలో; దండకారణ్యేః = దండక అను అరణ్యముగూర్చి; వృద్ధః = గొప్పవాడు; భ్రాతుః = అన్నగారికి; చ = మఱియు; తే = నీయొక్క; సఖా = స్నేహితుడు
భావము:-
“వేలకొలది పరివారములు, బంధువులు, రక్షకభటులతో మనవద్దకు వచ్చుచున్న ఈ గుహుడు దండకారణ్యపు ఆనుపానుల విషయములో ఆరితేరినవాడు. ఇతడు మీ అన్నగారైన శ్రీరామచంద్రమూర్తికి ఆప్తమిత్రుడు.
2.84.13.అనుష్టుప్.
అనుష్టుప్.
తస్మాత్పశ్యతు కాకుత్స్థ!
త్వాం నిషాదాధిపో గుహః।
అసంశయం విజానీతే
యత్ర తౌ రామలక్ష్మణౌ”॥
టీక:-
తస్మాత్ = అందుచేత; పశ్యతు = చూచును గాక; కాకుత్స్థ = రఘువంశజుడా; త్వాం = నిన్ను; నిషాదాధిపః = నిషాదుల నాయకుడు; గుహః = గుహుడు; అసంశయం = నిశ్చయముగ; విజానీతే = ఎఱుగును; యత్ర = ఎక్కడ; తౌ = వారిరువురు; రామ+లక్ష్మణౌ = రామలక్ష్మణులు
భావము:-
కావున, ఓ కాకుత్స్థ భరతా! నిషాదుల అధిపతియైన గుహునికి నీ దర్శనమును ఇమ్ము. అతడు రామలక్ష్మణులు ఇద్జరూ ఎక్కడ ఉంటిరో నిస్సందేహముగా తెలుపగలడు.”
2.84.14.అనుష్టుప్.
అనుష్టుప్.
ఏతత్తు వచనం శ్రుత్వా
సుమంత్రాద్భరతశ్శుభమ్।
ఉవాచ వచనం “శీఘ్రమ్
గుహః పశ్యతు మా” మితి॥
టీక:-
ఏతత్ = అవన్నీ; తు = చక్కగా; వచనం = మాటను; శ్రుత్వా = విని; సుమంత్రాత్ = సుమంత్రునిగూర్చి; భరతః = భరతుడు; శుభమ్ = శుభమైన; ఉవాచ = నుడివెను; వచనం = మాటను; శీఘ్రం = వెంటనే; గుహః = గుహుడు; పశ్యతు = చూచుగాక; మామ్ = నన్ను; ఇతి = అని
భావము:-
భరతుడు, సుమంత్రుడు పలికిన సంతోషకరమైన వచనములను విని “వెంటనే గుహుడిని నా వద్దకు తీసుకొనిరండు” అని అనుమతించెను.
2.84.15.అనుష్టుప్.
అనుష్టుప్.
లబ్ధ్వాఽ భ్యనుజ్ఞాం సంహృష్టో
జ్ఞాతిభిః పరివారితః।
ఆగమ్య భరతం ప్రహ్వో
గుహో వచనమబ్రవీత్॥
టీక:-
లబ్ధ్వా = పొందిన; అభ్యనుజ్ఞామ్ = అనుమతిని; సంహృష్టః = సంతసించినవాడై; జ్ఞాతిభిః = బంధువులతో; పరివారితః = కూడినవాడై; ఆగమ్య = వచ్చి; భరతమ్ = భరతునిగూర్చి; ప్రహ్వః = వినమ్రుడై; గుహః = గుహుడు; వచనమ్ = మాటలు; అబ్రవీత్ = చెప్పెను
భావము:-
భరతుని అనుమతి లభించుటతో గుహుడు సంతసించి తన పరివారముతో కూడి భరతునివద్దకు చని సవినయముగ ఇట్లు పలికెను.
2.84.16.అనుష్టుప్.
అనుష్టుప్.
“నిష్కుటశ్చైవ దేశోఽ యమ్
వంచితాశ్చాపి తే వయమ్।
నివేదయామస్తే సర్వే
స్వకే దాసకులే వస॥
టీక:- నిష్కుటః = పెరటితోఁట(విహారవనము); చ = మఱియు; ఏవ = మాత్రమే; దేశః = ప్రదేశము; అయం = ఈ; వంచితాః = లొంగియున్నవారలము; చ = మఱియు; అపి = కూడా; తే = నీకు; వయమ్ = మేము; నివేదయామః = వినమ్రముగా నివేదించుచున్నాము; తే = నీకు; సర్వే = మేమందఱము; స్వకే = మీ స్వంత; దాసకులే = దాసుని తెగ; వస = నీవు నివాసము చేయుము
భావము:-
ఓ రాజా! ఈ ప్రాంతము మీ విహారవనము వంటిది. మేమందఱము మీకు లొంగిఉండే వారము. ఇది మీ దాసుని తెగ యేకదా. మీరు మీ సేవకుల ఇంట విడిదిచేయగలరు.
2.84.17.అనుష్టుప్.
అనుష్టుప్.
అస్తి మూలం ఫలంచైవ
నిషాదైస్సముపాహృతమ్।
ఆర్ద్రం చ మాంసం శుష్కం చ
వన్యం చోచ్చావచం మహత్॥
టీక:-
అస్తి = ఉన్నవి; మూలమ్ = కందమూలములు; ఫలమ్ = ఫలములు; చ = మఱియు; ఏవ = అన్నీ; నిషాదైః = నిషాదులచేత; సముపాహృతమ్ = తీసుకురాబడిన; ఆర్ద్రం = పచ్చివి; చ = మఱియు; మాంసం = మాంసము; శుష్కం = ఎండబెట్టినవి; చ = మఱియు; వన్యం = అడవి సంబంధమైన; చ = మఱియు; ఉచ్చావచం = అనేక రకముల, వావిళ్ళ; మహత్ = గొప్ప
భావము:-
ప్రభూ! మా బోయవారిచే సమకూర్చబడిన ఈ ఫలమూలాదులన్నియు మఱియు రకరకముల గొప్ప అడవిజంతువుల మాంసములు కొన్ని పచ్చివి, మఱికొన్ని ఎండిబెట్టినవి ఉన్నవి.
*గమనిక:-
అతిథులైన సైన్యములోని అత్యధికులు క్షత్రియవర్ణాదులే ఉందురు. అటులనే భరతుడు వారి జ్ఞాతులు క్షత్రియవర్ణీయులే. వీరందరు క్షాత్రధర్మము వారే కనుక వారికి మాంసాహారము పెట్టుట సరైనదే. ఆతిథ్యము చేయు గృహస్తులు గిరిజనులు మాంసాహారులే కనుక ఇబ్బంది లేదు. శాఖాహారము బ్రాహ్మణాది వర్ణస్థులు కొద్ది మందికే నిషిద్దము. వారికి వలసిన శాకాహారములు సైతము ఉన్నవి కనుక ఆతిథ్యములో లోటురాదు..
2.84.18.అనుష్టుప్.
అనుష్టుప్.
ఆశంసే స్వాశితా సేనా
వత్స్యతీమాం విభావరీమ్।
అర్చితో వివిధైః కామైః
శ్వస్ససైన్యో గమిష్యసి॥
టీక:-
ఆశంసే = కోరుచుంటిని; స్వాశితా = తృప్తిగా భుజించినవారై; సేనా = సైన్యము; వత్స్యతి = నివసించగలదు; ఇమాం = ఈ; విభావరీమ్ = రాత్రికి; అర్చితః = సత్కారము నొందినవాడవై; వివిధైః = వివిధ రకముల; కామైః = అభీష్ట వస్తువులతో; శ్వః = రేపు; స = కూడినవాడవై; సైన్యః = సైన్యముతో; గమిష్యసి = ప్రయాణము చేయగలవు
భావము:-
మీ సైన్యము ఈ రాత్రికి ఇచటనే విడిదిచేసి తృప్తిగా భుజించి మా అతిథిమర్యాదలను స్వీకరించవలెనని ఆశించుచున్నాము. మా సపర్యలను అందుకుని మీరు మీ సైన్యముతో రేపు వెళ్ళవచ్చును కదా.
2.84.19.గద్యం.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే చతురశీతితమః సర్గః
టీకః-
ఇతి = ఇది సమాప్తము: ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ: ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ: వాల్మీకి = వాల్మీకీ విరచిత: తెలుగు = తెలుగు వారి: రామాయణే = రామాయణములోని: అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని: చతురశీతితమః [84] = ఎనభైనాలుగవ: సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [84] ఎనభైనాలుగవ సర్గ సంపూర్ణము.