2.109.1.
అనుష్టుప్.
జాబాలేస్తు వచశ్శ్రుత్వా
రామః సత్యాత్మనాం వరః।
ఉవాచ పరయా భక్త్యా
స్వబుద్ధ్యా చావిపన్నయా॥
టీక:-
జాబాలేః = జాబాలి యొక్క; తు = విశేషముగా; వచః = మాటలు; శ్రుత్వా = విని; రామః = రాముడు; సత్యాత్మనామ్ = సత్య + ఆత్మనాం, సత్యబుధులలో; వరః = శ్రేష్ఠుడైన; ఉవాచ = పలికెను; పరయా = గొప్ప; భక్త్యా = భక్తితో; స్వబుద్ధ్యా చ = తనదైన మంచి బుద్ధితో; చ = మఱియు; అవిపన్నయా = చలించని.
భావము:-
సత్యమైనబుద్ధి గలవారిలో శ్రేష్ఠుడైన రాముడు, జాబాలి మాటలు విని చలించని బుద్ధితోను గొప్ప భక్తితోను ఇట్లు పలికెను.
2.109.2.
అనుష్టుప్.
“భవాన్మే ప్రియకామార్థం
వచనం యదిహోక్తవాన్।
అకార్యం కార్యసంకాశమ్
అపథ్యం పథ్యసమ్మతమ్॥
టీక:-
భవాన్ = నీచే; మే = నాకు; ప్రియ = ప్రియమును; కామ = కోరుటకు; అర్థమ్ = ఉద్దేశించినవి; వచనం = మాటలు; యత్ = ఏవైతే; ఇహ = ఇప్పుడు; ఉక్తవాన్ = పలికబడినవి; అకార్యమ్ = చేయదగనిది; కార్య = చేయదగినదాని; సంకాశమ్ = వలె; అపథ్యం = చేయరానిది; పథ్య = చేయవలసినదిగా; సమ్మతమ్ = అంగీకరింపదగినది..
భావము:-
మీరు నా మేలు కోరి ఇంతవరకు మాటలాడిన మాటలు పైకి చేయదగిన, చేయవలసిన పనుల వలె కనబడచున్నను. వాస్తవముగా చేయదగని, చేయరాని పనులు కదా.
2.109.3.
అనుష్టుప్.
నిర్మర్యాదస్తు పురుషః
పాపాచారసమన్వితః।
మానం న లభతే సత్సు
భిన్నచారిత్రదర్శనః॥
టీక:-
నిర్మర్యాదస్తు = కట్టుబాట్లు లేక; పురుషః = మానవుడు; పాపాచార = పాపాచార వంతుడై; సమన్వితః = ప్రవర్తించువాడు; మానం = గౌరవము; న = లేరు; లభతే = పొందుట; సత్సు = సచ్చరిత్రులచే; భిన్న = విరుద్ధమైన, దోషపూరితమైన; చారిత్ర = వర్తనకలవారు; దర్శనః = దృష్టికలవాడు.
భావము:-
వేదమర్యాదలు పాటించక కట్టుబాట్లు లేక, పాపాచారవంతులై, దోషపూరిత ప్రవర్తన దృష్టికల మానవుడు సత్పురుషుల గౌరవము పొందజాలడు.
2.109.4.
అనుష్టుప్.
కులీనమకులీనం వా
వీరం పురుషమానినమ్।
చారిత్రమేవ వ్యాఖ్యాతి
శుచిం వా యది వాఽశుచిమ్॥
టీక:-
కులీనమ్ = ఉత్తమవంశమున పుట్టినవాడో; అకులీనమ్ = ఉత్తమము కాని వంశమున పుట్టినవాడో; వా = లేదా; వీరం = వీరుడో; పురుష మానినమ్ = వీరు పురుషుడనని భావించు వాడో; చారిత్రమ్ = నడవడిక; ఏవ = మాత్రమే; వ్యాఖ్యాతి = చెప్పును; శుచిమ్ = పరిశుద్ధుడో; వా = లేదా; యది = ఎవరు; వా = లేదా; అశుచిమ్ = అశుచియో.
భావము:-
ఎవడు మంచి వంశమున పుట్టి సదాచారసపన్నుడైన కులీనుడో, ఎవడు కాడో, ఎవడు వీరుడో, ఎవడు కేవలము వీరుడననుకొనువాడో, ఎవడు పరిశుద్ధుడో ఎవడు కాడో. వాని నడవడికయే తెలియచెప్పును.
2.109.5.
అనుష్టుప్.
అనార్యస్తు ఆర్య సంకాశః
శౌచాత్ హీనః తథా శుచిః।
లక్ష్యణ్యవదలక్ష్యణ్యో
దుశ్శీలః శీలవానివ॥
టీక:-
అనార్యస్తు = అనార్యుడు; అస్తు = ఐ ఉండియు; ఆర్య = ఆర్యుడు; సంకాశ = వలె; శౌచాత్ = శుచిత్వము; హీనః = లేనివాడు; తథా = వలె; శుచిః = శుచిమంతునిగ, పవిత్రునిగ; లక్ష్యణ్యవత్ = లక్ష్యముకలవాడు; అలక్ష్యణ్యో = ఏ లక్ష్యములు లేనివాడనై; దుశ్శీలః = చెడు నడవడికకలవాడు; శీలవాన్ = మంచి నడవడిక కలవాని; ఇవ = వలె.
భావము:-
నీవు చెప్పన విధముగ నడచువాడు, ఆర్యుడు (పూజనీయుని) వలె పైకి కనపడుచున్ను, అనార్యుడే, పవిత్రునిగ కనబడుచున్నను పవిత్రత లేని అశుచియే, ఉన్నత లక్ష్యములు కలవానివలె కనబడుచున్నను ఏ ఉన్నత లక్ష్యములు లేనివాడే. ఎంత సుశీలవంతునిగా కనబడుచున్నను దుశ్శీలుడే.
2.109.6.
అనుష్టుప్.
అధర్మం ధర్మవేషేణ
యదీమం లోకసంకరమ్।
అభిపత్స్యే శుభం హిత్వా
క్రియావిధి వివర్జితమ్॥
టీక:-
అధర్మమ్ = అధర్మమార్గము; ధర్మవేషేణ = ధర్మము వేషము ధరించిన; యది = అట్లయిన; ఇమమ్ = ఇది; లోకసంకరమ్ = లోక సంకర హేతువు; అభిపత్స్యే = పొందినది; శుభం = శుభములను; హిత్వా = విడిచిపెట్టుట; క్రియా విధి = సత్కర్మలు; వివర్జితమ్ = లేనిది.
భావము:-
ఒకవేళ లోక సంకరహేతువైన ధర్మము అనే వేషముతో ఉన్న నీవు చెప్పిన ఈ అధర్మము ఆచరించినచో లోకము సత్కర్మలు లేనిది, శుభ్రమైన మార్గమును విడిచినది అగును.
2.109.7.
అనుష్టుప్.
కశ్చేతయానః పురుషః
కార్యాకార్యవిచక్షణః।
బహుమంస్యతి మాం లోకే
దుర్వృత్తం లోకదూషణమ్॥
టీక:-
కః = ఎవడు; చేతయానః = చైతన్యవంతుడు; పురుషః = పురుషుడు; కార్య = చేయదగిన పని; అకార్య = చేయకూడని పని; విచక్షణః = తెలిసినవాడు; బహుమంస్యతి = గౌరవించునా; మాం = నన్ను; లోకే = లోకమునకు; దుర్వృత్తమ్ = దుష్టమైనవర్తన గలవాడను; లోక = లోకముచే; దూషణమ్ = నిందింపబడువాడు.
భావము:-
కార్యాకార్యముల విచక్షణ తెలిసిన చైతన్యవంతుడైన ఏ పురుషుడైన. నీవు చెప్పి మార్గమున లోకులు అందరిచే నిందింబడు, లోకమునకు చెడు కలిగించు ప్రవర్తనగలవాడనైతే నన్ను గౌరవించునా?
2.109.8.
అనుష్టుప్.
కస్య దాస్యామ్యహం వృత్తం
కేన వా స్వర్గమాప్నుయామ్।
ఆనయా వర్తమానో హి
వృత్త్యా హీనప్రతిజ్ఞయా॥
టీక:-
కస్య = ఎవనికి; దాస్యామి = ఇవ్వగలను; అహం = నేను; వృత్తమ్ = ప్రవర్తనతో; కేన = ఏ విధముగాను; వా = లేదా; స్వర్గమ్ = స్వర్గమును; ఆప్నుయామ్ = పొందగలను; ఆనయా = ఈ విధముగా; వర్తమానః = ప్రవర్తించువాడను; హి = ఐ; వృత్త్యా = వర్తనతో; హీనః = విడిచిన; ప్రతిజ్ఞయా = ప్రతిజ్ఞగలవాడనై..
భావము:-
ఇంక ఎవరికి మంచి మార్గమును ఉపదేశించగలను? స్వర్గమునకు ఎట్లు వెళ్ళగలను? నేనే చేసిన ప్రతిజ్ఞ విడచి ఈ విధముగా ప్రవర్తించువాడను అయ్యాక.
2.109.9.
అనుష్టుప్.
కామవృత్తస్త్వయం లోకః
కృత్స్నః సముపవర్తతే।
యద్వృత్తాః సంతి రాజానః
తద్వృత్తాః సంతి హి ప్రజాః॥
టీక:-
కామవృత్తః = స్వేచ్ఛాచారులు; తు = మఱియు; అయం = ఈ; లోకః = లోకస్తులు; కృత్స్నః = సమస్త; సముపవర్తతే = అనుసరించును; యద్వృత్తాః = ఏ విధముగా ప్రవర్తించునో; సంతి = కదా; రాజానః = రాజులు; తద్వృత్తాః = ఆ విధముగానే; సంతి = ప్రవర్తించుదురు; హి = కదా; ప్రజాః = ప్రజలు.
భావము:-
నేను అట్లు మెలగినచో ధర్మముతప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడనగుదును. అంత లోకులందరు అట్లే అనుసరించెదురు. రాజులు ఏ విధముగా ప్రవర్తింతురో ప్రజలు కూడ ఆ విధముగానే ప్రవర్తించుచుందురు కదా! “యథా రాజా తథా ప్రజాః” అని ఆర్యోక్తి.
2.109.10.
అనుష్టుప్.
సత్యమేవానృశంసం చ
రాజవృత్తం సనాతనమ్।
తస్మాత్సత్యాత్మకం రాజ్యం
సత్యే లోకః ప్రతిష్ఠితః॥
టీక:-
సత్యమ్ = సత్యపాలన; ఏవ = మాత్రమే; అనృశంసమ్ = కౄరత్వము లేకుండట; చ = ఇంకను; రాజవృత్తమ్ = రాజధర్మములు; సనాతనమ్ = అతిపరాతనమైన; తస్మాత్ = అందుచే; సత్యాత్మకం = సత్య రూపమైనది; రాజ్యం = రాజ్యము; సత్యే = సత్యము మీద; లోకః = లోకము; ప్రతిష్ఠితః = నిలిచి ఉన్నది
భావము:-
అతి పురాతనమైన రాజధర్మములు కౄరత్వము లేకుండట మఱియు సత్యపాలనలు. కదా అందుచేత రాజ్యము సత్యరూపమైనది. లోకము సత్యము మీదనే నిలిచి యున్నది.
2.109.11.
అనుష్టుప్.
ఋషయశ్చైవ దేవాశ్చ
సత్యమేవ హి మేనిరే।
సత్యవాదీ హి లోకేఽస్మిన్
పరమం గచ్ఛతి క్షయమ్॥
టీక:-
ఋషయః = ఋషులు; చ = ఇంకను; ఏవ = మాత్రమే; దేవాః = దేవతలు; చ = ఇంకను; సత్యమ్ = సత్యము పలుకుట; ఏవ = మాత్రమే; మేనిరే = తలంతురు, పరమ ధర్మమని; సత్యవాదీ = సత్యమే పలుకువారు; హి = మాత్రమే; లోకః = లోకము; అస్మిన్ = ఈ; పరమమ్ = పరమధామమును; గచ్ఛతి = పొందును; క్షయమ్ = గృహముగ, అమరకోశః.
భావము:-
ఋషులు, దేవతలు కూడ సత్యమే పరమధర్మమని తలంతురు. లోకముమందు ఈ సత్యమును పలుకువాడు మాత్రమే సర్వోన్నతమైన పరమధామమున శాశ్వక నివాసమును పొందును.
2.109.12.
అనుష్టుప్.
ఉద్విజన్తే యథా సర్పాన్
నరాదనృతవాదినః।
ధర్మస్సత్యం పరో లోకే
మూలం స్వర్గస్య చోచ్యతే॥
టీక:-
ఉద్విజన్తే = భయపడుదురు; యథా = ఏ విధముగా; సర్పాన్ = సర్పమును; నరాత్ = మానవుని; అనృతవాదినః = అసత్యము పలుకువాడు; ధర్మః = ధర్మము; సత్యం = సత్యమే; పరః = గొప్పదైన; లోకః = లోకము; మూలం = మూలమని; స్వర్గస్య = స్వర్గమునకు; చ = ఇంకను; ఉచ్యతే = చెప్పుదురు
భావము:-
అసత్యము చెప్పువానిని చూచి, జనులు సర్పమును చూచి భయపడునట్లు భయపడుదురు. ఇహ లోకములో సత్యమే ఉత్తమధర్మము. ఇది స్వర్గమునకు కూడ మూలకారణమని చెప్పుదురు.
2.109.13.
అనుష్టుప్.
సత్యమేవేశ్వరో లోకే
సత్యం పద్మాశ్రితా సదా।
సత్యమూలాని సర్వాణి
సత్యాన్నాస్తి పరంపదమ్॥
టీక:-
సత్యమ్ = సత్యము; ఏవ = మాత్రమే; ఈశ్వరః = ఉత్పత్తి. ఈశా ఏవాహమత్యర్థం న చ మామీశతే పరే। దదామి చ సదైశ్వర్య మీశ్వరస్థేన కీక్త్యే, ఇత్యుక్త లక్షణే, పరమేశర్వరుడు; లోకే = ఈ; సత్యం = ఈ; పద్మః = ఈ; ఆశ్రితా = ఈ; సదా = ఈ; సత్యమ్ = ఈ; మూలాని = ఈ; సర్వాణి = ఈ; సత్యాత్ = ఈ; న = ఈ; అస్తి = ఈ; పరంపదమ = ఈ.
భావము:-
లక్ష్మి ఎల్లపుడు సత్యమును ఆశ్రయించి ఉండును. ఈ లోకములో సత్యమే ఈశ్వరుడు. అన్నిటికిని సత్యమే మూలము. సర్వధర్మముల లోను సత్యమును మించిన ఉత్తమధర్మము ఏదియు లేదు.
2.109.14.
అనుష్టుప్.
దత్తమిష్టం హుతం చైవ
తప్తాని చ తపాంసి చ।
వేదాస్సత్యప్రతిష్ఠానాః
తస్మాత్సత్యపరో భవేత్॥
టీక:-
దత్తమ్ = దానము; ఇష్టమే = యజ్ఞకర్మ; హుతమ్ = హవిస్సు; చ = ఇంకను; ఏవ = మాత్రమే; తప్తాని = బలులు, ఐఐటి ఖరగ్పూరు వారి జాలిక రామాయణము; చ = ఇంకను; తపాంసి = తపస్సులు; చ = ఇంకను; వేదాః = వేదములు; సత్య = సత్యము; ప్రతిష్ఠానాః = ఆధారపడిఉన్నవి; తస్మాత్ = అందుచేత; సత్య = సత్యమునకు; పరః = కట్టుబడి ఉండువాడు; భవేత్ = అగుము
భావము:-
దానము, యాగము, హవిస్సు, బలులు, తపస్సు, వేదములు ఇవన్నియు సత్యము మీదనే ఆధారపడి ఉన్నవి. అందుచే మానవుడు సత్యపాలనకు కట్టుబడి ఉండుము.
2.109.15.
అనుష్టుప్.
ఏకః పాలయతే లోకమ్
ఏకః పాలయతే కులమ్।
మజ్జత్యేకో హి నిరయ
ఏకస్స్వర్గే మహీయతే॥
టీక:-
ఏకః = ఒకడు; పాలయతే = పరిపాలించును; లోకమ్ = లోకములో; ఏకః = ఒకడు; పాలయతే = పాలించును; కులమ్ = కులమును; మజ్జత్ = పడిపోవును; ఏకో హి = ఒకడు; హి = పోవును, వావిళ్ళ; నిరయ = నరకములోనికి; ఏకః = ఒకడు; స్వర్గే = స్వర్గములో; మహీయతే = గౌరవము పొందును
భావము:-
లోకములో ఒకడు రాజ్యము ఏలును. ఒకడు వంశమును వృద్ధిలోనికి తెచ్చును. ఒకడు నరకములో పడును. ఒకడు స్వర్గములో గౌరవమును పొందుచుండును. (ఇవి సత్యాసత్యముల వలన వచ్చు ఆ యా ఫలములు).
2.109.16.
అనుష్టుప్.
సోఽహం పితుర్నియోగం తు
కిమర్థం నానుపాలయే।
సత్యప్రతిశ్రవస్సత్యం
సత్యేన సమయీకృతః॥
టీక:-
సః = అట్టి, పూర్వ్యోక్తపరామర్శకః, సె ఇతి భాషా, శబ్దకల్పదృమః, సత్యప్రతిజ్ఞాః, సర్వశబ్దసంబోధిని; అహం = నేను; పితుః = తండ్రి; నియోగం = ఆజ్ఞను; తు = మఱి; కిమర్థం = ఎందుకు; న = చేయను; అనుపాలయే = పరిపాలించుట; సత్యప్రతిశ్రవః = సత్య+ ప్రతిశ్రవః, సత్యపాలన స్వీకరించినవాడను, సత్యమునకు కట్టుబడిన వాడను; సత్యం = తథ్యమ్, అమరకోశః, తప్పక; సత్యేన = సత్యముపై; సమయీకృతః = నిర్దేశించు కున్నవాడను
భావము:-
ముందుచెప్పినట్టి సత్యముపై ప్రతిజ్ఞచేసిన నేను తండ్రి ఆజ్ఞను పరిపాలించకుండ ఎట్లుందును? సత్యముపై శపథముచేసి తప్పక సత్యమునకు కట్టుబడి ఉందునని నిర్దేశించుకున్నవాడను కదా నేను.
2.109.17.
అనుష్టుప్.
నైవ లోభాన్న మోహాద్వా
న హ్యజ్ఞానాత్తమోఽన్వితః।
సేతుం సత్యస్య భేత్స్యామి
గురోస్సత్యప్రతిశ్రవః॥
టీక:-
న = లేదు; ఏవ = మాత్రమే; లోభాత్ = లోభము వలన; న = లేదు; మోహాత్ వా = మోహము చేత కాని; వా = కాని; న = లేదు; హి = నిశ్చయంగా; అజ్ఞానాత్ = అజ్ఞానము చేత; తమః = తమో గుణము; అన్వితః = కలిగినవాడనై; సేతుం = సేతువును; సత్యస్య = సత్యము యొక్క; భేత్స్యామి = భేదించుట; గురోః = తండ్రి గారి; సత్యప్రతిశ్రవః = సత్యప్రతిజ్ఞ కల.
భావము:-
తమోగుణమునకు కాని, అజ్ఞానముచేకాని, లోభం వలన కాని, మోహం వలన కాని ఎట్టిపరిస్తుతతలోనూ లేనేలేదు సత్యప్రతిజ్జ కల నా తండ్రిగారు కట్టుకున్న సత్యమను సేతువును భేదించను, అన తండ్రేగారి మాట ఎట్టి పరిస్తితలోనూ వ్యర్థము చేయను.
2.109.18.
అనుష్టుప్.
అసత్యసంధస్య సతః
చలస్యాస్థిరచేతసః।
నైవ దేవా న పితరః
ప్రతీచ్ఛన్తీతి నః శ్రుతమ్॥
టీక:-
అసత్యసంధస్య = అసత్యసంధుడై; సతః = సమర్పించిన; చలస్య = చిత్తస్థైర్యము; అస్థిర చేతసః = చపలుడుగా ఉన్నవాడు; న = లేదు; ఏవ = మాత్రమే; దేవా = దేవతలు; న = లేదు; పితరః = పితృదేవతలు; ప్రతీచ్ఛంతి = స్వీకరించుట; ఇతి = ఇట్లు; నః = మేము; శ్రుతమ్ = విన్నాము
భావము:-
అసత్యసంధుడై, చిత్తస్థైర్యము లేక, చపలుడుగా ఉన్నవాడు సమర్చించిన హవ్యకవ్యాదులను దేవతలు గాని, పితృదేవతలు గాని స్వీకరించరని మేము విన్నాము.
2.109.19.
అనుష్టుప్.
ప్రత్యగాత్మమిమం ధర్మం
సత్యం పశ్యామ్యహం స్వయమ్।
భారస్సత్పురుషాచీర్ణః
తదర్థమభిమన్యతే॥
టీక:-
ప్రత్యగాత్మమ్ = ప్రత్యక్ + ఆత్మ, ప్రత్యగాత్మయని; ఇమం = ఈ; ధర్మమ్ = ఈ ధర్మమును; సత్యమ్ = సత్యమును; పశ్యామి = తలచుచున్నాను; అహం = నేను; స్వయమ్ = స్వయముగా; భారః = కష్టమైన; సత్పురుషాః = సత్పురుషులు; ఆచీర్ణః = ఆచరించువానిని; తదర్థమ్ = అందుచేతనే; అభిమన్యతే = ఆదరించుచున్నాను.
భావము:-
ఈ సత్యము ధర్మములే సాక్షాత్తు పరమాత్మయని నేను తలచుచున్నాను. అందుచేతనే సత్పురుషులు ఆచరించిన ఈ కష్టమైన కార్యమును నేను గౌరవించుచున్నాను.
2.109.20.
అనుష్టుప్.
క్షాత్రం ధర్మమహంత్యక్ష్యే
హ్యధర్మం ధర్మసంహితమ్।
క్షుద్రైః నృశంసైః లుబ్థైశ్చ
సేవితం పాపకర్మభిః॥
టీక:-
క్షాత్రం ధర్మమ్ = క్షత్రియ ధర్మమును; అహం = నేను; త్యక్ష్యే హి = పరిత్యజించెదను; హి = తప్పక; అధర్మం = ఆధర్మమును; ధర్మ = ధర్మముతో; సంహితమ్ = కూడినను; క్షుద్రైః = నీచులు; నృశంసైః = క్రూరులు; లుబ్థేశ్చ = దురాశాపరులు ఇంకను; సేవితం = సేవించునది; పాపకర్మభిః = పాపకర్మములు
భావము:-
పాపాత్ములు, దురాశాపరులు, క్రూరులు, నీచులు సేవించునదీ, ధర్మముతో కూడినను అధర్మముతో కూడినది అయిన క్షత్రియ ధర్మమును నేను పరిత్యజించెదను.
2.109.21.
అనుష్టుప్.
కాయేన కురుతే పాపం
మనసా సంప్రధార్య చ।
అనృతం జిహ్వయా చాహ
త్రివిధం కర్మపాతకమ్॥
టీక:-
కాయేన = దేహముతో; కురుతే = చేయును; పాపం = పాప కర్మ; మనసా = మనస్సుతో; సంప్రధార్య = ఫలమపేక్షించి చేయును, వావిళ్ళ నిఘంటువు; చ = ఇంకను; అనృతం = అసత్యమును; జిహ్వయా = నాలుకతో; చ = ఇంకను; ఆహ = పలికి; త్రివిధం = మూడు విధములుగా; కర్మపాతకమ్ = పాపములు చేయును.
భావము:-
మానవుడు ముందుగా మనస్సుతో ఫలమును అపేక్షించి, పిమ్మట దేహముతో పాపకర్మ చేయును. నాలుకతో అసత్యము పలుకును. ఈ విధముగా పాపము. మానసికము, కాయికము, వాచికము అని మూడు విధములు.
2.109.22.
అనుష్టుప్.
భూమిః కీర్తిర్యశో లక్ష్మీః
పురుషం ప్రార్థయంతి హి।
స్వర్గస్థం చానుపశ్యంతి
సత్యమేవ భజేత తత్॥
టీక:-
భూమిః = రాజ్యము; కీర్తిః = కీర్తి, సత్కార్యాదులచే కలిగెడిది; యశః = యశస్సు, పౌరుషాదులచే కలిగెడిది; లక్ష్మీః = సంపదలు; పురుషమ్ = పురుషుని; ప్రార్థయంతి = కోరుచుండును; హి = తప్పక; స్వర్గస్థమ్ = స్వర్గుస్థడు; చ = ఐనను; అనుపశ్యంతి = చూచుచుండును; సత్యమ్ = సత్యము పలికెడివారిని; ఏవ = మాత్రమే; భజేత = భజించుచుండును; తత్ = అట్లు.
భావము:-
రాజ్యము, సత్కార్యాదులచే కలిగిన కీర్తి, పౌరుషాదులచే కలిగిన యశస్సు, సంపదలు.. ఇవి సత్యవంతుడైన పురుషుని చేరవలెనని కోరుచుండును. అతడు స్వర్గస్థుడయినను అతనినే చూచుచుండును. అందువలన సత్యమునే అవలంబించవలయును.
2.109.23.
అనుష్టుప్.
శ్రేష్ఠం హ్యనార్యమేవ స్యాత్
యద్భవానవధార్య మామ్।
ఆహ యుక్తి కరైర్వాక్యైః
ఇదం భద్రం కురుష్వ హ॥
టీక:-
శ్రేష్ఠం = శ్రేష్ఠము; హి = అని; అనార్యమ్ = చెడ్డది; ఏవ = మాత్రమే; స్యాత్ = తప్పనిసరిగా; యత్ = వలె; భవాన్ = నిన్ను; అవధార్య = నిర్ణయించి; మామ్ = నన్ను; ఆహ = పిలిచి; యుక్తి కరైః = యుక్తియుక్తములైన; వాక్యైః = మాటలు; ఇదం = దీనిని; భద్రం = మంగళకరమైన; కురుష్వ = చేయుము; హ = వికారము.
భావము:-
నీవు శ్రేష్టము అని నిర్ణయించి, యుక్తియుక్తములైన మాటలతో. మంగళకరమైన దీనిని చేయుము ’ అని నాతో చెప్పినదంతయు చెడ్డదే.
2.109.24.
అనుష్టుప్.
కథం హ్యహం ప్రతిజ్ఞాయ
వనవాసమిమం గురౌ।
భరతస్య కరిష్యామి
వచో హిత్వా గురోర్వచః॥
టీక:-
కథం హి = ఎట్లు; అహం = నేను; ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞ చేసి; వనవాసమ్ = వనవాసము చేసెదనని; ఇమం = ఇట్లు; గురౌ = తండ్రి యొక్క; భరతస్య = భరతుని యొక్క; కరిష్యామి = చేయుదును; వచః = మాటలను; హిత్వా = విడిచిపెట్టి; గురోః = తండ్రి ఎదుట; వచః = మాటలు.
భావము:-
నేను వనవాసము చేసెదను అని తండ్రి గారి ఎదుట ప్రతిజ్ఞ చేసి, ఇపుడు ఆయన మాట కాదని భరతుని మాటలు ఎట్లు చేయుదును?
2.109.25.
అనుష్టుప్.
స్థిరా మయా ప్రతిజ్ఞాతా
ప్రతిజ్ఞా గురుసన్నిధౌ।
ప్రహృష్యమాణా సా దేవీ
కైకేయీ చాభవత్తదా॥
టీక:-
స్థిరా = స్థిరమైన; మయా = నా చేత; ప్రతిజ్ఞాతా = ప్రతిజ్ఞ చేయబడి; ప్రతిజ్ఞా = ప్రమాణము; గురుసన్నిధౌ = తండ్రి ఎదుట; ప్రహృష్యమాణా = సంతోషించినది; సా = ఆ ; దేవీ కైకేయీ = రాణీ కైకేయి; చ = కూడా; అభవత్ = అయినది; తదా = అప్పుడు.
భావము:-
నేను తండ్రి ఎదుట స్థిరమైన ప్రతిజ్ఞ చేసితిని. అపుడు కైకేయి దేవి కూడ చాలా సంతోషించినది.
2.109.26.
అనుష్టుప్.
వనవాసం వసన్నేవం
శుచిర్నియతభోజనః।
మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః
పిత్రూన్ దేవాంశ్చ తర్పయన్॥
టీక:-
వనవాసం = వనవాసమును; వసన్ = అంగీకరించి; ఇవం = ఈ విధముగా; శుచిః = పరిశుద్ధుడనై; నియతభోజనః = మిత భోజనము చేయుచు; మూలైః = మూలములు; పుష్పైః = పుష్పములు; ఫలైః = ఫలములు; పుణ్యైః = పుణ్యములు; పిత్రూన్ దేవాంశ్చ = పితృ దేవతలను; తర్పయన్ = తృప్తి పొందించుదును
భావము:-
నేను పరిశుద్ధుడనై, మితభోజనము చేయుచు, పవిత్రములైన మూలఫలములతో పితృదేవతలను తృప్తి పొందించుదును.
2.109.27.
అనుష్టుప్.
సంతుష్ట పంచవర్గోఽహం
లోకయాత్రాం ప్రవర్తయే।
అకుహః శ్రద్ధధానస్సన్
కార్యాకార్య విచక్షణః”॥
టీక:-
సంతుష్ట = సంతుష్టి కలవాటినిగా; పంచవర్గః = పంచేంద్రియములను; అహం = నేను; లోకయాత్రాం = జీవితమును; ప్రవర్తయే = ప్రవర్తించుచు; అకుహః = కపటము విడనాడి; శ్రద్ధధానః సన్ = శ్రద్ధావంతుడనై; కార్యాకార్య = కార్యము, అకార్యములను; విచక్షణః = తెలిసికొనుట
భావము:-
పంచేంద్రియములను సంతుష్టి కలవాటినిగా ఉంచుకొనుచు, కపటము విడనాడి శ్రద్ధావంతుడనై కార్యాకార్యములను తెలిసికొనుచు, ఈ విధముగా వనవాసము చేయుచు జీవితమును గడపెదను.”
2.109.28.
అనుష్టుప్.
కర్మభూమిమిమాం ప్రాప్య
కర్తవ్యం కర్మ యచ్ఛుభమ్।
అగ్నిర్వాయుశ్చ సోమశ్చ
కర్మణాం ఫలభాగినః॥
టీక:-
కర్మభూమిమ్ = కర్మభూమిని; ఇమాం = ఇట్లు; ప్రాప్య = పొందగలిగినారు; కర్తవ్యం = తప్పక చేయవలెను; కర్మ = కర్మను; యత్ = ఏదైతే; శుభమ్ = శుభ్రమైన; అగ్నిః = అగ్ని; వాయుశ్చ = వాయువును; సోమశ్చ = చంద్రుడును; కర్మణాం = చేసిన కర్మలకు; ఫలభాగినః = ఫలముగా.
భావము:-
ఈ కర్మభూమిని పొందినవాడు.. శుభ్రమైన కర్మను తప్పక చేయవలెను. అగ్ని వాయుచంద్రులు, వారు చేసిన కర్మలకు ఫలముగా ఆయా పదములను పొందగలిగినారు.
2.109.29.
అనుష్టుప్.
శతం క్రతూనామాహృత్య
దేవరాట్ త్రిదివం గతః।
తపాంస్యుగ్రాణి చాస్థాయ
దివం యాతా మహర్షయః॥
టీక:-
శతం = వంద సంఖ్య గల; క్రతూనామ్ = క్రతువులను; ఆహృత్య = చేయుట చేత; దేవరాట్ = స్వర్గాధిపత్యము (ఇంద్రుడు); త్రిదివం = స్వర్గమునకు; గతః = వెళ్లినారు; తపాంసి = తపస్సులు; ఉగ్రాణి చ = తీవ్రమైన; ఆస్థాయ = ఆచరించి; దివం = స్వర్గమునకు; యాతా = వెళ్లినారు; మహర్షయః = మహర్షులు
భావము:-
దేవేంద్రుడు నూరు యజ్ఞములు చేయుటచేతనే స్వర్గాధిపత్యమును పొందినాడు. మహర్షులు తీవ్రమైన తపస్సులు చేసి స్వర్గమునకు వెళ్ళినారు.
2.109.30.
త్రిష్టుప్.
అమృష్యమాణః పునరుగ్రతేజాః
నిశమ్య తం నాస్తికవాక్యహేతుమ్।
అథాబ్రవీత్తం నృపతేస్తనూజో
విగర్హమాణో వచనాని తస్య॥
టీక:-
అమృష్యమాణః = సహింపజాలక; పునః = మరల; ఉగ్రతేజాః = ఉగ్రమైన తేజస్సు గల; నిశమ్య = విని; తం = అటువంటి (జాబాలి); నాస్తికవాక్య = నాస్తికత్వముతో; హేతుమ్ = హేతువాదమును; అథ = అటు పిమ్మట; అబ్రవీత్ = పలికెను; తం = ఆ; నృపతేః = దశరథుని; తనూజః = కుమారుడు; విగర్హమాణః = సహించజాలక; వచనాని = మాటలను; తస్య = అతని యొక్క
భావము:-
ఉగ్రమైన తేజస్సు గల దశరథ కుమారుడైన రాముడు, నాస్తికత్వముతో కూడిన ఆ జాబాలి చేసిన హేతువాదమును విని, దానిని సహించజాలక, అతని మాటలు ఖండించుచు ఇంకను ఇట్లు పలికెను.
2.109.31.
త్రిష్టుప్.
“సత్యం చ ధర్మం చ పరాక్రమం చ
భూతానుకమ్పాం ప్రియవాదితాం చ।
ద్విజాతిదేవాతిధిపూజనం చ
పంథానమాహుస్త్రిదివస్య సంతః॥
టీక:-
సత్యం = సత్యమును; చ = మఱియు; ధర్మం = ధర్మమును; చ = మఱియు; పరాక్రమం = పరాక్రమమును; చ = మఱియు; భూత + అనుకమ్పాం = భూత దయ; ప్రియవాదితాం = ప్రియవాక్కులును; ద్విజాతి = బ్రాహ్మణ; దేవ = దేవతలు; అతిథి = అతిథులు; పూజనం = పూజయును; చ = మఱియు; పంథానమ్ = మార్గములని; ఆహుః = చెప్పుచున్నారు; త్రిదివస్య = స్వర్గమునకు; సంతః = సత్పురుషులు.
భావము:-
“సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియవాక్కు, దేవబ్రాహ్మణ అతిథుల పూజ.. ఇవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు చెప్పుచున్నారు.
2.109.32.
త్రిష్టుప్.
తేనైవమాజ్ఞాయ యథావదర్థ=
మేకోదయం సంప్రతిపద్య విప్రాః।
ధర్మం చరంతః సకలం యథావత్
కాంక్షంతి లోకాగమమప్రమత్తాః॥
టీక:-
తేన = అందుచేత; ఏవ = మాత్రమే; ఆజ్ఞాయ = తెలిసికొని; యథావత్ = యధావిధిగా; అర్థమ్ = విషయమును; ఏకోదయం = తప్పనిసరిగా అభివృద్దిగల మార్గమును; సంప్రతిపద్య = అనుసరించి; విప్రాః = బ్రాహ్మణులు; ధర్మం = ధర్మములను; చరంతః =అవలంబించి; సకలం = సకలమైన; యథావత్ = యధావిధిగా; కాంక్షంతి = కోరుచున్నారు; లోకాగమమ్ = ఉత్తమలోక ప్రాప్తిని; అప్రమత్తాః = ఏమరుపాటు లేకుండగా.
భావము:-
అందుచేతనే బ్రాహ్మణులు. విషయమును సరిగా తెలుసుకొని, తప్పక సత్ఫలమునిచ్చు మార్గమును అవలంబించి, ఏమరుపాటు లేకుండగ, సకల ధర్మములను యథావిధిగా ఆచరించుచు, ఉత్తమలోకప్రాప్తిని కోరుచున్నారు.
2.109.33.
త్రిష్టుప్.
నిందామ్యహం కర్మ పితుః కృతం త=
ద్యస్త్వామగృహ్ణాద్విషమస్థబుద్ధిమ్।
బుద్ధ్యాఽనయైవంవిధయా చరంతం
సునాస్తికం ధర్మపథాదపేతమ్॥
టీక:-
నిందామి = నిందలకు అర్హుడవు; అహం = నేను; కర్మ = పనులు; పితుః = తండ్రి గారి చేత; కృతం = చేసిన; తత్ = ఆ; యదిః + = అటువంటి; త్వామ్ = నీను; అగృహ్ణాత్ = చేరదీసిన; విషమస్థ = చెడు మార్గమునందు; బుద్ధిమ్ = ప్రవర్తించుచున్న; బుద్ధి + అనయ = బుద్ధికలవాడవు; ఏవం విధయా = ఈ విధమైన; చరంతమ్ = సంచరించుచున్న; సునాస్తికం = మిక్కిలి నాస్తికుడవు; ధర్మపథాత్ = ధర్మ మార్గము నుండి; అపేతమ్ = చ్యుతుడవు.
భావము:-
చెడు మార్గమునందు ప్రవర్తించుచున్న బుద్ధి కలవాడవు, ఈ విధమైన ఆలోచనలతో సంచరించుచున్న నాస్తికుడవు, ధర్మ మార్గము నుండి చ్యుతుడవు అయిన నిన్ను చేరదీసిన మా తండ్రిగారిని నేను నిందించుచున్నాను.
2.109.34.
త్రిష్టుప్.
యథా హి చోరః స తథా హి బుద్ధః
తథాఽగతం నాస్తిక మత్ర విద్ధి।
తస్మా ద్ధి యః శంక్యతమః ప్రజానాం
న నాస్తికే నాఽభిముఖో బుధస్సా్యత్॥
టీక:-
యథా = ఏవిధంగానో అట్లు; హి = కదా; చోరః = చోరుడు; సః = అతడు; తథా = అచువంటి; హి = ఐన; బుద్ధః = బుద్ధికలవాడు; తథా + = అట్లే; ఆగతం = వచ్చును; నాస్తికమ్ = నాస్తికుడిని; అత్ర = ఇక్కడ; విద్ధి = తెలుసుకొనుట; తస్మాత్ = అందుచేత; హి = మాత్రమే; యః = ఎవడైతే; శంక్యతమః = అత్యంతా శంకాపాత్రుడు; ప్రజానాం = ప్రజలకు; న = కూడదు; నాస్తికే = నాస్తికునితో; న = కూడదు; అభిముఖః = సంబంధము; బుధః = పండితుడు; స్యాత్ = ఉంచుకొనుట
భావము:-
ఎవరైతే చోరుని వంటి కలవాడో, అతడు నాస్తికుడని తెలుసుకొనుము. అందుచే అతడు ప్రజలకు అత్యంత అనుమానించదగిన వాడు. పండితుడు ఎన్నడును నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు.
*గమనిక:-
 శంక్యమ్- శంక్యతరమ్- శంక్యతమమ్.
2.109.35.
త్రిష్టుప్.
త్వత్తో జనాః పూర్వతరే వరాశ్చ
శుభాని కర్మాణి బహూని చక్రుః।
జిత్వా సదేమం చ పరం చ లోకం
తస్మావ్దిజాస్స్వస్తి హుతం కృతం చ॥
టీక:-
త్వత్తః = నీ కంటె; జనాః = ప్రజలు; పూర్వతరే = పూర్వులు; వరాశ్చ = శ్రేష్ఠులు; శుభాని కర్మాణి = శుభకరమైన కర్మలను; బహూని = పెక్కు సంఖ్యలో; చక్రుః = చేసిరి; జిత్వాసత్ = జయించిరి; ఇమం చ = ఇహమును ఇంకను; పరం చ = పరమును ఇంకను; లోకం = లోకములను; తస్మాత్ = అందుచేత; విజాః = జయించిరి; స్వస్తి = మంగళార్థమై; హుతం = హోమమును; కృతం చ = చేయుచుందురు.
భావము:-
నీ కంటే పూర్వులు, శ్రేష్ఠులు అయిన జనులు అనేకమైన శుభకర్మలు చేసిరి. ఇహలోకమును, పరలోకమును కూడ జయించిరి. ఆ కారణము వలన బ్రాహ్మణులు హోమమును, కర్మలను మంగళార్ధమై చేయుచుందురు.
2.109.36.
త్రిష్టుప్.
ధర్మే రతాః సత్పురుషైః సమేతాః
తేజస్వినో దానగుణప్రధానాః।
అహింసకా వీతమలాశ్చ లోకే
భవంతి పూజ్యా మునయః ప్రధానాః”॥
టీక:-
ధర్మే రతా = ధర్మమునందు ఆసక్తి కలవారు; సత్పురుషై = సత్సురుషులతో; సమేతాః = స్నేహము; తేజస్వినః = తేజోవంతులు; దానగుణ = దానగుణము; ప్రధానాః = ప్రధానముగా; అహింసకా = హింస చేయనివారు; వీత + అమలాశ్చ = తొలగిన పాపము కలవారు; లోకే = లోకములో; భవంతి = తగినవారు; పూజ్యా = పూజ్యులైన; మునయః = మునులు; ప్రధానాః = ఉత్తములు అయిన.
భావము:-
ధర్మమునందు ఆసక్తి కలవారు, సత్పురుషుల స్నేహము చేయువారు, తేజోవంతులు, దానగుణము ప్రధానముగా కలవారు, హింస చేయనివారు, తొలగిన పాపము కలవారు, ఉత్తములు అయిన మునులే లోకములో పూజింపదగినవారు.”
2.109.37.
త్రిష్టుప్.
ఇతి బ్రువంతం వచనం సరోషం
రామం మహాత్మానమదీనసత్త్వమ్।
ఉవాచ పథ్యం పునరాస్తికం చ
సత్యం వచః సానునయం చ విప్రః॥
టీక:-
ఇతి = ఇట్లు; బ్రువంతం = పలుకుచున్న; వచనం = మాటలను; సరోషం = కోపముతో; రామం = రాముని; మహాత్మానమ్ = మహాత్ముడూ; అదీనసత్త్వమ్ = దైన్యములేని శక్తిశాలి; ఉవాచ = పలికెను; పథ్యం = హితమూ; పునః = మరల; ఆస్తికం = ఆస్తిక్యముతో కూడినదీ; చ = మఱియు; సత్యం = సత్యమూ; వచః = మాటలను; స = దానిని; అనునయం = అనునయపూర్వకముగా; చ = మరల; విప్రః = విప్రుడైన జాబాలి.
భావము:-
ఈ విధముగా కోపముతో పలుకుచున్న మహాత్ముడూ, దైన్యము లేని బుద్ధికలవాడూ అయిన రామునితో జాబాలి హితమూ, ఆస్తిక్యముతో కూడినదీ, సత్యమూ అయిన మాటను అనునయపూర్వకముగా ఇట్లు పలికను.
2.109.38.
త్రిష్టుప్.
“న నాస్తికానాం వచనం బ్రవీమ్యహం
న నాస్తికోఽహం న చ నాస్తి కించన।
సమీక్ష్య కాలం పునరాస్తికోఽభవం
భవేయ కాలే పునరేవ నాస్తికః॥
టీక:-
న = లేదు; నాస్తికానాం = నాస్తికుల యొక్క; వచనం = మాటలను; బ్రవీమి = చెప్పుట; అహం = నేను; న = కాదు; నాస్తికః = నాస్తికుడను; అహం = నేను; న = కాదు; చ = మఱియు; న + అస్తి = లేదు; కించన = కొంచెము కూడా; సమీక్ష్య కాలం = కాలమును అనుసరించి;పునరాస్తికః అభవం = మరల ఆస్తికుడు అగుదును; భవేయ కాలే = మరొక సమయమునందు; పునః = మరల; ఏవ = వలె; నాస్తికః = నాస్తికుడు.
భావము:-
నేను నాస్తికుల మాటలు చెప్పుట లేదు. నేను నాస్తికుడను కాను. పరలోకాదికము ఏమీ లేదనునది లేదు. కాలమును బట్టి నేను మరల ఆస్తికుడను అగుదును. మరొక సమయమునందు నాస్తికుని వలె మాటలాడుదును.
2.109.39.
జగతి.
న చాపి కాలోఽయ ముపాగతశ్శనై=
ర్యథా మయా నాస్తికవాగుదీరితా।
నివర్తనార్థం తవ రామ కారణాత్
ప్రసాదనార్థం చ మయైతదీరితమ్॥
టీక:-
న = లేదు; చ = మఱియు; అపి = అయినప్పటికీ; కాలః = సమయము; అయమ్ = ఈ; ఉపాగతః = వచ్చెను; శనైః = మెల్లగా; యథా = ఆ విధముగా; మయా = నా చేత; నాస్తికవాక్ = నాస్తిక వాక్కులను; ఉదీరితా = పలుకబడిన; నివర్తనార్థం = మరలించుటకూ; తవ = నీ; రామ = ఓ రామా; కారణాత్ = కారణముగా; ప్రసాదనార్థం చ = అనుగ్రహింప చేసికొనుటకు; మయా = నా చేత; ఏతత్ = ఇట్లు; ఈరితమ్ = పలికెను.
భావము:-
నేను నాస్తిక వాక్కు పలుకవలసిన సమయము మెల్లగా వచ్చుటచే అట్టి మాటలు చెప్పితిని. నిన్ను అయోధ్యకు మరలించుటకూ, నిన్ను అనుగ్రహింపచేసుకొనుటకు. నీ కొరకు మాత్రమే నేను ఈ విధముగా మాటలాడితిని.
2.109.40.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే నవోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; నవోత్తరశత తమః [100] = నూటతొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [109] నూటతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.110.1.
అనుష్టుప్.
క్రుద్ధమాజ్ఞాయ రామం తు
వసిష్ఠః ప్రత్యువాచ హ।
జాబాలిరపి జానీతే
లోకస్యాస్య గతాగతితమ్॥
టీకా:
క్రుద్ధమ్ = కోపంతో ఉన్నవాడైన; ఆజ్ఞాయ = తెలుసుకొని; రామం = శ్రీరామచంద్రుని; తు= అని; వసిష్ఠః = వసిష్ఠమహర్షి; ప్రత్యువాచ = ఇట్లు సమాధానము చెప్పెను; హ= విశేషముగ; జాబాలిః = జాబాలి ఋషి; అపి = కూడా; జానీతే = ఎఱుంగును; లోకస్య = లోకుల యొక్క; అస్య = ఈ; గతాగతమ్ = రాకపోకలను జనన మరణ చక్రము క్రమము గూర్చి
భావము:
లోకేశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహమును గుర్తించిన వశిష్ఠమహర్షి ఇట్లు పలుకరించుట ఆరభించెను. "నాయనా! శ్రీరామచంద్ర! జీవులు రాకపోకలను జనన మరణ చక్రము క్రమము గురుంచి జాబాలికి తెలియును.
2.110.2.
అనుష్టుప్.
నివర్తయితుకామస్తు
త్వామేతద్వాక్యముక్తవాన్।
ఇమాం లోకసముత్పత్తిం
లోకనాథ నిబోధ మే॥
టీకా:
నివర్తయితు = అయోధ్యకు మరలించమని; కామః = కోరువాడు; తు = విశేషించి; త్వామ్ = నిన్నుగూర్చి; ఏతత్= ఆ; వాక్యమ్ = మాటలను; ఉక్తవాన్ = చెప్పెను; ఇమాం = ఈ; లోక= లోకము యొక్క; సముత్పత్తిం = పుట్టుకను, ఉత్పత్తిని; లోకనాథ = జగత్పతి; నిబోధ = తెలిసికొనుము; మే = నా (మాట)
భావము:
అతడు కేవలము నిన్ను ఈ వనములనుండి తిరిగి అయోధ్యకు మఱలించుటకై అట్లు పలికెను. జగన్నాథుడవైన శ్రీరామ! ఈ జగత్తు ఆవిర్భావమును గూర్చి తెలిపెదను వినుము.
2.110.3.
అనుష్టుప్.
సర్వం సలిలమేవాసీత్
పృథివీ యత్ర నిర్మితా।
తతః సమభవద్బ్రహ్మా
స్వయమ్భూర్దైవత్ సహ॥
టీకా:
సర్వమ్ = ఇది అంతయును; సలిలమ్ = నీరు; ఏవ = మాత్రమే; ఆసీత్ = ఉండెను; పృథివీ = భూమి; యత్ర = దేనియందు; నిర్మితా = సృష్టించబడినదో; తతః = అటుపిమ్మట; సమభవత్ = ఆవిర్భవించెను; బ్రహ్మా = చతుర్ముఖ బ్రహ్మ; స్వయమ్భూః = స్వయముగా పుట్టినవాడు; దైవతైః = దేవతలతో; సహ = కలిసి.
భావము:
సృష్టి ప్రారంభములో ఎక్కడైతే ఈ భూమండలం అంతా ఉన్నదో అది సమస్తము జలమయమై ఉండెను. తరువాత స్వయముగా పుట్టిన బ్రహ్మదేవుడు దేవతలతో కలసి ఆవిర్భవించెను.
2.110.4.
అనుష్టుప్.
స వరాహస్తతో భూత్వా
ప్రోజ్జహార వసుంధరామ్।
అసృజచ్చ జగత్సర్వం
సహ పుత్రైః కృతాత్మభిః॥
టీకా:
సః = అతడు; వరాహః = మహావరాహ రూపములో; తతః = తరువాత; భూత్వా = ఉద్భవించి; ప్రోజ్జహార = పైకెత్తెను; వసుంధరామ్ = భూమిని;
అసృజత్ = సృష్టించెను;చ = మఱియు; జగత్ = జగమును; సర్వమ్ = అఖిలమును; సహ = కూడి; పుత్రైః = తనయులతో; కృతాత్మభిః = శిక్షణపొందినవారు, శుద్ధాంతకరణులు, వాచస్పతము.
భావము:
పరబ్రహ్మ స్వరూపము మహావరాహ అవతారముగా బ్రహ్మదేవుని నాసికారంధ్రమునుండి ఆవిర్భవించి జలమగ్నమైన మేథినిని ఉద్దరించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు ప్రవిత్రాత్ములయిన తన పుత్రులతో కూడి ఈ జగత్తును సృష్టించెను.
2.110.5.
అనుష్టుప్.
ఆకాశప్రభవో బ్రహ్మా
శాశ్వతో నిత్య అవ్యయః।
తస్మాన్మరీచిః సంజజ్ఞే
మరీచేః కశ్యపస్సుతః॥
టీకా:
ఆకాశ+ప్రభవః = ఆకాశమునుండి పుట్టినవాడు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు;
శాశ్వతః = శాశ్వతుడు; నిత్యః = నిత్యుడు; అవ్యయః = తరగుదల లేనివాడు; తస్మాత్ = అతనినుండి; మరీచిః = మరీచిఋషి; సంజజ్ఞే = కలిగెను; మరీచేః = మరీచినుండి; కశ్యపః = కశ్యపుడు; సుతః = కుమారుడు.
భావము:
ఆకాశస్వరూపమైన పరబ్రహ్మమునుండి పుట్టిన బ్రహ్మదేవుడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. బ్రహ్మనుండి మరీచి జన్మించెను. మరీచి పుత్రుడు కశ్యప ప్రజాపతి.
2.110.6.
అనుష్టుప్.
వివస్వాన్కాశ్యపాజ్జజ్ఞే
మనుర్వైవస్వతస్సుతః।
మనుః ప్రజాపతిః పూర్వమ్
ఇక్ష్వాకుస్తు మనోస్సుతః॥
టీకా:
వివస్వాన్ = సూర్యుడు; కాశ్యపాత్ = కాశ్యపునినుండి; జజ్ఞే = పుట్టెను;
మనుః = మనువు; వైవస్వతః = వివస్వానునకు సంబంధించిన; సుతః = పుత్రుడు; మనుః = మనువు; ప్రజాపతిః = ప్రజాపతి; పూర్వమ్ = మొదట; ఇక్ష్వాకుః = ఇక్ష్వాకుడు; తు = అయితే; మనోః = మనువునుండి;సుతః = కుమారుడు.
భావము:
కశ్యపప్రజాపతికి సూర్యభగవానుడు ఉద్భవించెను. సూర్యభగవానుని పుత్రుడు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువునకు మొదట కలిగిన పుత్రుడు ఇక్ష్వాకుడు
*గమనిక:-
 చూ. పోతెభా. 9-1-సీ. చతుర్దశమనువులలో ఏడవ వాడు, ప్రస్తుతము నడుస్తున్న మన్వంతారాధిపుడు ఐన వైవస్వత మనువు. బ్రహ్మదేవుని మానస పుత్రుడు కశ్యపుడు. కశ్యపునికి దక్షపుత్రిక అదితిల పుత్రులు ద్వాదశాదిత్యులలో ప్రథముడైన వివస్వతుడు అను సూర్యుడు. పూర్వ కల్పపు ద్రావిడ రాజు సత్యవ్రతుడే, సూర్యునికి సంధ్య యందు, వైవస్వతుడుగా జన్మించి మనువు అయ్యాడు. వానికి ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు, కవి అని పదిమంది పుత్రులు.
2.110.7.
అనుష్టుప్.
యస్యేయం ప్రథమం దత్తా
సమృద్ధా మనునా మహీ।
తమిక్ష్వాకుమయోధ్యాయాం
రాజానం విద్ధి పూర్వకమ్॥
టీకా:
యస్య = ఎవనియొక్క; ఇయం = ఈ; ప్రథమమ్ = మొదట; దత్తా = ఇవ్వబడెను; సమృద్ధా = సమృద్ధమైన; మనునా = మనువుచేత; మహీ = భూమండలము; తమ్ = అతడిని; ఇక్ష్వాకుమ్ = ఇక్ష్వాకుని; అయోధ్యాయామ్ = అయోధ్యలో; రాజానమ్ = రాజుగా; విద్ధి = ఎఱుంగుము; పూర్వకమ్ = ప్రథముడని.
భావము:
ఓ శ్రీరామచంద్ర! సర్వసంపదలు సమృద్ధిగా ఉన్న ఈ భూమండలమును వైవస్వతమనువు ఇక్ష్వాకునకు అప్పగించెను. ఆ ఇక్ష్వాకుని అయోధ్యకు మొదటి మహారాజుగా తెలిసికొనుము.
2.110.8.
అనుష్టుప్.
ఇక్ష్వాకోస్తు సుత శ్రీమాన్
కుక్షిరేవేతి విశ్రుతః।
కుక్షేరథాత్మజో వీరో
వికుక్షిరుదపద్యత॥
టీకా:
ఇక్ష్వాకోః = ఇక్ష్వాకుని; తు = అయితే; సుతః = కుమారుడు; శ్రీమాన్ = శుభలక్షణ సంపన్నుడు అయిన; కుక్షిః = కుక్షి; ఏవ = మాత్రమే; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధుడు; కుక్షేః = కుక్షియొక్క; అథ = తరువాత; ఆత్మజః = కుమారుడు; వీరః = వీరుడు; వికుక్షిః = వికుక్షి; ఉదపద్యత = జన్మించెను.
భావము:
ఇక్ష్వాకునకు సర్వశుభలక్షణ సంపన్నుడైన కుక్షి జన్మించెను. కుక్షికి మహావీరుడైన వికుక్షి జన్మించెను.
2.110.9.
అనుష్టుప్.
వికుక్షేస్తు మహాతేజా
బాణః పుత్రత్రః ప్రతాపవాన్।
బాణస్య తు మహాబాహుః
అనరణ్యో మహాయశాః॥
టీకా:
వికుక్షేః = వికుక్షి యొక్క; తు = అయితే; మహాతేజాః = మహాతేజస్సు గలవాడు; బాణః = బాణుడు; పుత్రః = కుమారుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; బాణస్య = బాణుని యొక్క; తు = అయితే; మహాబాహుః = భుజబలశాలి; అనరణ్యః = అనరణ్యుడు; మహాయశాః = గొప్ప కీర్తివంతుడు.
భావము:
వికుక్షి పుత్రుడు బాణుడు గొప్ప తేజశ్శాలి, ప్రతాపవంతుడు. ఆ బాణుని పుత్రుడు అనరణ్యుడు గొప్ప కీర్తివంతుడు, భుజబలశాలి.
2.110.10.
అనుష్టుప్.
నానావృష్టిర్బభూవాస్మిన్
నదుర్భిక్షం సతాం వరే।
అనరణ్యే మహారాజే
తస్కరో నాపి కశ్చన॥
టీకా:
న = లేదు; అనావృష్టి = అనావృష్టి; బభూవ = ఉండుట; అస్మిన్ = వారి కాలమున; న = లేదు; దుర్భిక్షమ్ = దుర్భిక్షము; సతాం = సత్పురుషలయందు; వరే = శ్రేష్ఠుడైన; అనరణ్యే = అనరణ్య రాజ్యమునందు; మహారాజే = మహారాజుగా ఉండగా;
తస్కరః = దొంగ; న = లేడు; అపి = కూడా; కశ్చన = ఎవరు.
భావము:
సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు రాజ్యపాలన కాలంలో అనావృష్టిగాని, కఱవుకాటకములుగాని లేవు. ఒక్క చోరుడుకూడ లేకుండెను.
2.110.11.
అనుష్టుప్.
అనరణ్యాన్మహాబాహుః
పృథు రాజా బభూవ హ।
తస్మాత్పృథోమహారాజః
త్రిశంకురుదపద్యత॥
టీకా:
అనరణ్యాత్ = అనరణ్యునినుండి; మహాబాహుః = బలమైన భుజములు గలవాడు; పృథుః = పృథువు; రాజా = రాజు; బభూవ = జన్మించుట; హ = జరిగెను; తస్మాత్ = ఆయననుండి; పృథుః = పృథువు; మహారాజః = మహారాజునకు; త్రిశంకుః = త్రిశంకుడు; ఉదపద్యత = జన్మించాడు.
భావము:
అనరణ్య మహారాజునకు మహాభుజశాలైన పృథుమహారాజు జన్మించెను. ఆ పృథువునకు మహారాజైన త్రిశంకుడు జన్మించెను.
2.110.12.
అనుష్టుప్.
స సత్యవచనాధ్వీరః
సశరీరో దివం గతః।
త్రిశంకోరభవత్సూనుః
దుంధుమారో మహాయశాః॥
టీకా:
సః = అతడు; సత్యవచనాత్ = సత్యవంతుడై; వీరః = ధైర్యశాలి; సశరీరః = శరీరముతోనే; దివంగతః = స్వర్గమునకు వెళ్ళెను;త్రిశంకుః = త్రిశంకుని; అభవత్ = జన్మించాడు; సూనుః = కుమారుడు; దుంధుమారః = దుంధుమారుడు; మహాయశాః = గొప్ప యశస్సు కలవాడు.
భావము:
త్రిశంకుడు సత్యవంతుడై సశరీరముగా స్వర్గమునకు వెళ్ళెను. త్రిశంకునకు గొప్పకీర్తిమంతుడైన దుంధుమారుడు జన్మించెను.
2.110.13.
అనుష్టుప్.
దుంధుమారాన్మహాతేజా
యువనాశ్వో వ్యజాయత।
యువనాశ్వసుతః శ్రీమాన్
మాంధాతా సమపద్యత॥
టీకా:
దుంధుమారాత్ = దుంధుమారునినుండి; మహాతేజాః = మహాతేజస్సు కలవాడు; యువనాశ్వః = యువనాశ్వుడు; వ్యజాయత = జన్మించెను; యువనాశ్వ = యువనాశ్వుని; సుతః = కుమారుడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; మాంధాతా = మాంధాత; సమపద్యత = జన్మించెను.
భావము:
దుంధుమారునకు గొపతేజస్సుగల యువనాశ్వుడు జన్మించెను. యువనాశ్వనునకు శ్రీమంతుడైన మాంధాత జన్మించెను.
2.110.14.
అనుష్టుప్.
మాంధాతుస్తు మహాతేజాః
సుసంధిరుదపద్యత।
సుసంధేరపి పుత్రౌ ద్వౌ
ధ్రువసంధిః ప్రసేనజిత్॥
టీకా:
మాంధాతుః = మాంధాతునకు; తు= ఐతే; మహాతేజాః = మహాతేజస్సు గల; సుసంధిః = సుసంధి; ఉదపద్యత = జన్మించాడు; సుసన్ధేః = సుసంధినుండి; అపి = కూడా; పుత్రౌ = ఇరువురు కుమారులు; ద్వౌ = ఇద్దరు; ధ్రువసంధిః = ధ్రువసంధి; ప్రసేనజిత్ = ప్రసేనజిత్.
భావము:
మాంధాతునకు గొప్పతేజస్సు గల సుసంధి జన్మించెను. సుసంధికి ధ్రువసంధి మఱియు ప్రసేనజిత్ అను ఇరువురు కుమారులు జన్మించిరి.
2.110.15.
అనుష్టుప్.
యశస్వీ ధ్రువసంధేస్తు
భరతో రిపుసూదనః।
భరతాత్తు మహాబాహోః
అసితో నామ జాయత॥
టీకా:
యశస్వీ = యశస్సుగలవాడు; ధ్రువసంధేః = ధ్రువసంధినుండి; తు= అయితే; భరతః = భరతుడు; రిపుసూదనః = శత్రుసూదనుడు; భరతాత్ = భరతునినుండి; తు= అయితే; మహాబాహోః = గొప్పబాహువులు గల; అసితః = అసితుడు; నామ = అనే పేరు గల; జాయత = జన్మించెను.
భావము:
గొప్పయశస్సు కలిగిన ధ్రువసంధికి శత్రుసంహారకుడైన భరతుడు జన్మించెను. గొప్పభుజబలముగల భరతునకు, అసితుడు జన్మించెను.
2.110.16.
అనుష్టుప్.
యస్యైతే ప్రతిరాజాన
ఉదపద్యన్త శత్రవః।
హైహయాస్తాలజంఘాశ్చ
శూరాశ్చ శశిబిన్దవః॥
టీకా:
యస్య = ఎవనియొక్క; ఏతే = ఈ; ప్రతిరాజానః = తోటి రాజులు;
ఉదపద్యన్త = ప్రకటితమయ్యారు; శత్రవః = శత్రువులుగా;
హైహయాః = హైహయులు; తాలజంఘాః = తాలజంఘులు; చ = మఱియు; శూరాః = వీరులు; చ = మఱియు; శశిబిన్దవః = శశిబిందువులు.
భావము:
ఆ అసితునకు తోటిరాజులు శత్రువులైరి. అలా వీరులైన హైహయులు, తాలజంఘులు మఱియు శశిబిందువులు శత్రువులైరి.
*గమనిక:-
 (1) అసితః- తెల్లగా లేని వాడు. (2) తాలజంఘః- పొడవైన పిక్కలు కలిగి తాడిచెట్టువలె పొడవైనవాడు. (3) హైహయః- గుఱ్ఱములు పిలిచిన ప్రకారం స్పందింపజేయు వాడు. హైహయులు యందువశీయు లని చెప్పబడును. ఇప్పటి మధ్యప్రదేశులో ఉండే మహిష్మతీ పురము. ఇది బహుప్రాచీనమైనది సూర్యవంశపు బహు పురాతన మహారాజు ముచుకుందుడు ఋక్షప్రవతములలో మహిష్మతి, పూరికా నగరములను నిర్మించెను సౌజన్యము తెవికె.(4) శశిబిందుః- చంద్రవంశాల క్రోష్టవంశ రాజు చిత్రరథుని కొడుకు శశిబిందువు. ఇతడు గొప్ప నీతిమంతుడు, సప్త ద్వీపాలూ ఏలిన మహారాజు. ఇతని పుత్రుని పెద్ద కొడుకు పృథుశ్రవుడు.
2.110.17.
అనుష్టుప్.
తాంస్తు సర్వాన్ప్రతివ్యూహ్య
యుద్ధే రాజా ప్రవాసితః।
స చ శైలవరే రమ్యే
బభూవాభిరతో మునిః॥
టీకా:
తాన్ = వారిని; తు; సర్వాన్ = అందఱినీ; ప్రతివ్యూహ్య = ఎదిరించి యుద్ధముచేసి; యుద్ధే = యుద్ధములో; రాజా = అసితరాజు; ప్రవాసితః = తరుమబడినాడు; సః = అతడు; చ = మఱియు; శైలవరే = ఉన్నతమైన పర్వతముపై; రమ్యే = అందమైన; బభూవ = ఉండెను; అభిరతః = ఆసక్తుడై; మునిః = మునివలె.
భావము:
ఆ అసితుడు క యుద్ధమునందు శత్రురాజులను అందఱిని ఎదిరించగా, వారిచేత ఓడింపబడి రాజ్యమునుండి తరుమబడెను. అంతట ఆ అసితుడు ఒక మనోజ్ఞమైన పర్వతముపై ఒక మునివలె కోరి నివసించుచుండెను.
2.110.18.
అనుష్టుప్.
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ
బభూవతురితి శ్రుతిః।
తత్ర చైకా మహాభాగా
భార్గవం దేవవర్చసమ్॥
టీకా:
ద్వే = ఇద్దరు; చ = మఱి; అస్య = అతనియొక్క; భార్యే = భార్యలు; గర్భిణ్యౌ = గర్భవతులు; బభూవతుః = అయిఉన్నారు; ఇతి = అని; శ్రుతిః = వినబడినది; తత్రః = అక్కడ అప్పుడు; ఏకా = ఒకానొక; మహాభాగా = మిక్కిలి పవిత్రమైనవాడు, ఆంధ్రశబ్దరత్నాకరము; భార్గవమ్ = భృగువంశీయుడు; దేవ = దేవతలవంటి; వర్చసమ్ = తేజఃశ్శాలి.
భావము:
ఆ అసితునకు ఇద్దరు భార్యలు, వారు గర్భవతులు. అక్కడ అప్పుడు ఒకానొక దేవతలంత తేజఃశ్శాలి, మహాపవిత్రుడు ఐన భృగువంశీయ భార్గవుడు ఉండెను.
2.110.19.
అనుష్టుప్.
వవందే పద్మపత్రాక్షీ
కాంక్షణీ పుత్రముత్తమమ్।
ఏకా గర్భవినాశాయ
సపత్న్యై గరళం దదౌ॥
టీకా:
వవందే = పూజించసాగెను; పద్మపత్రాక్షీ = కలువరేకులవంటి కన్నులున్నామె, సుందరి; కాంక్షిణీ = కోరుచున్నది; పుత్రమ్ = కొడుకును; ఉత్తమమ్ = ఉత్తముని; ఏకా = మరొక భార్య; గర్భవినాశాయ = గర్భము నశించుటకై; సపత్న్యై = సవతికి; గరళం = విషమును; దదౌ = ఇచ్చెను.
భావము:
అందు బహు ఉత్తముడైన పుత్రుడు కావాలని తపిస్తున్న సౌందర్యవతి కాళింది అను భార్య ఆ భార్గవుని పూజించసాగెను. ఇంతలో మరొక భార్య తన సవతి యైన కాళిందికి గర్భము నశించుటకు విషము ఇచ్చెను.
2.110.20.
అనుష్టుప్.
భార్గవశ్చ్యవనో నామ
హిమవన్తముపాశ్రితః।
తమృషిం సముపాగమ్య
కాలిందీ త్వభ్యవాదయత్॥
టీకా:
భార్గవః = భృగువంశస్థుడు; చ్యవనః = చ్యవనుడు; నామ = అను పేరుగల ముని; హిమవంతమ్ = హిమవంత పర్వతమును; ఉపాశ్రితః = ఆశ్రయించియున్నవాడు; తమ్ = ఆ; ఋషిమ్ = ఋషిని; సముపాగమ్య = చక్కగా సమీపమునకు వెళ్ళి; కాలిందీ = కాలిందీదేవి; తు = అయితే; అభ్యవాదయత్ = ప్రణామము చేసినది.
భావము:
ఆ సమయములో భృగువంశమున జన్మించిన చ్యవన మహర్షి హిమవత్పర్వతముపై నివసించుచుండెను. అసితుని భార్యయైన కాలిందిదేవి వారికడకు వెళ్ళి నమస్కరించెను.
2.110.21.
అనుష్టుప్.
స తామభ్యవదద్విప్రో
వరేప్సుం పుత్రజన్మని।
“పుత్రస్తే భవితా దేవి!
మహాత్మా లోకవిశ్రుతః॥
టీకా:
సః = అతడు; తామ్ = ఆమెను గూర్చి; అభ్యవదత్ = నుడివెను; విప్రః = ఆ బ్రాహ్మణఋషి; వర = వరమును; ఇప్సుమ్ = కోరుచున్న; పుత్ర = కొడుకు; జన్మని = పుట్టాలని; పుత్రః = కుమారుడు; తే = నీకు; భవితా = జన్మించును; దేవి = ఓ దేవీ; మహాత్మా = మహాత్ముడు; లోకవిశ్రుతః = లోకమునందు పసిద్ధిపొందినవాడు.
భావము:
అప్పుడు ఆ విప్రోత్తముడు పుత్ర సంతానమును కోరుచున్న ఆ మహారాణితో ఇట్లు పలికెను “ఓ దేవీ! నీకు కొడుకే పుడతాడు. అతడు మహాత్ముడు, గొప్ప లోక ప్రసిద్ధుడు,
2.110.22.
అనుష్టుప్.
ధార్మికశ్చ సుశీలశ్చ
వంశకర్తాఽ రిసూదనః”।
కృత్వా ప్రదక్షిణం హృష్టా
మునిం తమనుమాన్య చ॥
టీకా:
ధార్మికః = ధర్మవంతుడు; చ = మఱియు; సుశీలః = మంచి స్వభావముగలవాడు; చ = మఱియు; వంశకర్తా = వంశమునకు మూల పురుషుడు; అరిసూదనః = శత్రువులను జయించువాడు; కృత్వా ప్రదక్షిణం = ప్రదక్షిణము చేసి; హృష్టా = హర్షముతో; మునిం = ఋషిని; తం = తను; అనుమాన్య = సెలవు పొందెను; చ = మఱియు.
భావము:
అతడు శత్రుసంహారకుడు, క్రొత్త వంశమునకు మూలపురుషుడు, సుశీలుడు, ధర్మాత్ముడు అగును.” ఆ కాలిందిదేవీ ఎంతో సంతసించి ఆ చ్యవనమహామునికి ప్రదక్షిణపూర్వక నమస్కారము లొనర్చి భక్తితో పూజించి వారి అనుమతితో తమ ఇంటికి చేరుకొనెను
2.110.23.
అనుష్టుప్.
పద్మపత్రసమానాక్షం
పద్మగర్భసమప్రభమ్।
తతస్సా గృహమాగమ్య
దేవీ పుత్రం వ్యజాయత॥
టీకా:
పద్మపత్ర = తామరపూవు రేకులకు; సమాన = సరిపోలిన; అక్షమ్ = కనులు గలవాడిని; పద్మగర్భః = బ్రహ్మతేజస్సుతో; సమ = సమానమైన; ప్రభమ్ = కాంతివంతుడైనవానిని; తతః = తరువాత; సా = ఆమె; గృహమ్ = ఇంటికి; ఆగమ్య = వచ్చి; దేవీ = ఆ రాజమహిషి; పుత్రమ్ = కుమారుని; వ్యజాయత = ప్రసవించినది.
భావము:
తరువాత ఇంటికి తిరిగి వచ్చాక, ఆ కాళిందీ రాణికి ఒక పుత్రుడు జన్మించెను. ఆ బాలుడు కమలపత్రముల వంటి నేత్రములతో, బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుచుండెను.
2.110.24.
అనుష్టుప్.
సపత్న్యా తు గరస్తస్యై
దత్తో గర్భజిఘాంసయా।
గరేణ సహ తేనైవ
జాతస్స సగరోఽ భవత్॥
టీకా:
సపత్న్యా = సవతిచేత; తు = అయితే; గరః = గరళము; తస్యై = ఆమెకు;
దత్తః = ఇవ్వబడినది; గర్భ = గర్భమును; జిఘాంసయా = నాశనము చేయు ఉద్దేశ్యముతో; గరేణ = ఆ విషముతో; సహ = కూడి; తేన = ఆ; ఏవ = మాత్రమే; జాతః = జన్మించెను; సః = అతడు; సగరః = సగరుడు; అభవత్ = అయ్యెను.
భావము:
కాళిందిదేవి గర్భము నశించవలెనను ఆమె సవతి విషప్రయోగము చేసినను, ఆ గర్భస్థ శిశువునకు ఎటువంటి హానియు కలుగలేదు, ఆ బాలుడు గరళము సహితముగా పుట్టెను. కనుక, ఆ పిల్లవాడు సగరుడు అనబడెను.
2.110.25.
అనుష్టుప్.
స రాజా సగరో నామ
యస్సముద్రమఖానయత్।
ఇష్ట్వా పర్వణి వేగేన
త్రాసయన్తమిమాః ప్రజాః॥
టీకా:
సః = అతడు; రాజా = రాజు; సగరః = సగరుడు; నామ = అను పేరుగల వాడు; యః = ఎవడు; సముద్రమ్ = సముద్రమును; అఖానయత్ = త్రవ్వింపఁజేసెనో; ఇష్ట్వా = యజ్ఞముచేసి; పర్వణి = అమావాస్య పున్నమి పర్వదినములందు; వేగేన = వేగముచేత; త్రాసయన్తమ్ = భయపెట్టుచున్న; ఇమాః = ఈ; ప్రజాః = ప్రజలను
భావము:
అ సగరమహారాజు యజ్ఞము చేయుచూ, అపహరింపబడిన యజ్ఞాశ్వమును వెతుకుటకు తన కుమారులను నియోగించెను. అంతట ఆ సగరపుత్రులు అమావాశ్య పున్నమి పర్వదినములలో ప్రజలను తన నీటివేగముచే భయభీతులను చేసెడి సముద్రమును త్రవ్విరి.
2.110.26.
అనుష్టుప్.
అసమంజస్తు పుత్రోఽ భూత్
సగరస్యేతి నః శ్రుతమ్।
జీవన్నేవ స పిత్రా తు
నిరస్తః పాపకర్మకృత్॥
టీకా:
అసమంజః = అసమంజుడు; తు = అను; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించెను; సగరస్య = సగరునకు; ఇతి = అని; నః = మాకు; శ్రుతమ్ = వినబడినది; జీవన్ = జీవించి ఉన్నప్పుడే; ఏవ = మాత్రము; సః = అతడు; పిత్రా = తండ్రిచేత; తు = అయితే; నిరస్తః = తిరస్కరింపబడెను, దూరము చేయబడెను; పాప = పాపపు; కర్మః = పనులు; కృత్ = చేసినవాడై.
భావము:
సగరునకు అసమంజుడు అనే కుమారుడు పుట్టెను. కాని అతడు పాపపు పనులు చేయుటచేత, సగరుడు అతనిని రాజ్యమునుండి బహిష్కరించెను.
2.110.27.
అనుష్టుప్.
అంశుమానితి పుత్రోఽ భూత్
అసమంజస్య వీర్యవాన్।
దిలీపోంశుమతః పుత్రో
దిలీపస్య భగీరథః॥
టీకా:
అంశుమాన్ = అంశుమంతుడు; ఇతి = అని; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించెను; అసమంజస్య = అసమంజసునకు; వీర్యవాన్ = పరాక్రమవంతుడు అయిన; దిలీపః = దిలీపుడు; అంశుమతః = అంశుమంతునియొక్క; పుత్రః = కుమారుడు; దిలీపస్య = దిలీపునకు; భగీరథః = భగీరథుడు.
భావము:
అసమంజసునకు పరాక్రమశాలి అయిన అంశుమంతుడను కుమారుడు పుట్టెను. అంశుమంతుని పుత్రుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు.
2.110.28.
అనుష్టుప్.
భగీరథాత్కకుత్స్థస్తు
కాకుత్స్థా యేన విశ్రుతాః।
కకుత్స్థస్య చ పుత్రోఽ భూత్
రఘుర్యేన చ రాఘవాః॥
టీకా:
భగీరథాత్ = భగీరథునినుండి; కకుత్స్థః = కకుత్స్థుడు; తు = ఐతే; కాకుత్స్థాః = కాకుత్స్థ వంశస్థులు; యేన = ఎవని వలన; విశ్రుతాః = ప్రసిద్ధులైనారు; కకుత్స్థస్య = కకుత్స్థుని; చ = మఱియు; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించెను; రఘుః = రఘువు; యేన = ఎవని వలన; చ = మఱియు; రాఘవాః = రాఘవులు.
భావము:
భగీరథునకు కకుత్స్థుడు జన్మించెను. కకుత్స్థుని వలన ఆయన వంశస్థులు "కాకుత్స్థులు" అనే పేరుతో ప్రసిద్ధులైనారు. కకుత్స్థునకు రఘువు జన్మించెను, ఆ మహాపురుషుని వలన ఈ వంశస్థులు "రాఘవులు" అని పిలువబడిరి.
2.110.29.
అనుష్టుప్.
రఘోస్తు పుత్రస్తేజస్వీ
ప్రవృద్ధః పురుషాదకః।
కల్మాషపాదస్సౌదాస
ఇత్యేవం ప్రథితో భువి॥
టీకా:
రఘోః = రఘువుయొక్క; తు = ఐతే; పుత్రః = కుమారుడు; తేజస్వీ = తేజోవంతుడు; ప్రవృద్ధః = పెరిగినవాడై; పురుష = మనుష్యులను; ఆదకః = తినువాడు; కల్మాషపాదః = కల్మాషపాదుడు; సౌదాసః = సౌదాసుడు; ఇతి = అని; ఏవం = ఈ విధముగ; ప్రథితః = ప్రసిద్ధుడు; భువి = భూలోకములో.
భావము:
రఘుమహారాజుయొక్క కుమారుడు కల్మాషపాదుడు, అతడు పెఱిగి పెద్దవాడైన పిదప శాపవశమున నరమాంసభక్షకు డయ్యెను. అతడు సౌదాసుడను పేరుతో ప్రసిద్ధికెక్కెను.
2.110.30.
అనుష్టుప్.
కల్మాషపాదపుత్రోఽ భూత్
శంఖణస్త్వితి విశ్రుతః।
యస్తు తద్వీర్యమాసాద్య
సహసైన్యో వ్యనీనశత్॥
టీకా:
కల్మాషపాద = కల్మాషపాదుని; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించెను; శంఖణః = శంఖణుడు; తు; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధుడు;
యః = ఎవడు; తు = అయితే; తత్ = తన తండ్రి; వీర్యమ్ = పరాక్రమును; ఆసాద్య = పొంది; సహ = కూడి; సైన్యః = సేనతో వ్యనీనశత్ = నశించిపోయెను.
భావము:
కల్మాషపాదునకు శంఖణుడు అనే కుమారుడు జన్మించెను. అతడు తన తండ్రి పరాక్రమును పొందినప్పటికిని, యుద్దములో సైన్యముతో కూడి నశించెను.
2.110.31.
అనుష్టుప్.
శంఖణస్య చ పుత్రోఽ భూత్
శూర శ్రీమాన్సుదర్శనః।
సుదర్శనస్యాగ్నివర్ణః
అగ్నివర్ణస్య శీఘ్రగః॥
టీకా:
శంఖణస్య = శంఖణుని; చ = మఱియు; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించాడు; శూరః = పరాక్రమశాలి; శ్రీమాన్ = శ్రీమంతుడు; సుదర్శనః = సుదర్శనుడు; సుదర్శనస్య = సుదర్శనునియొక్క; అగ్నివర్ణః = అగ్నివర్ణుడు; అగ్నివర్ణస్య = అగ్నివర్ణుని; శీఘ్రగః = శీఘ్రగుడు।
భావము:
శంఖణునకు పరాక్రమశాలి, శ్రీమంతుడైన సుదర్శనుడు జన్మించెను. సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్రగుడు జన్మించిరి.
2.110.32.
అనుష్టుప్.
శీఘ్రగస్య మరుః పుత్రో
మరోః పుత్రః ప్రశుశ్రువః।
ప్రశుశ్రువస్య పుత్రోఽభూత్
అమ్బరీషో మహాద్యుతిః॥
టీకా:
శీఘ్రగస్య = శీఘ్రగునియొక్క; మరుః = మరువు; పుత్రః = కుమారుడు।
మరః = మరువుయొక్క; పుత్రః = కుమారుడు; ప్రశుశ్రువః = ప్రశుశ్రువుడు; ప్రశుశ్రువస్య = ప్రశుశ్రువునియొక్క; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించెను; అమ్బరీషః = అంబరీషుడు; మహాద్యుతిః = మహాతేజోవంతుడు.
భావము:
శీఘ్రగునకు మరువు, మరువునకు ప్రశుశ్రువుడు జన్మించిరి. ప్రశుశ్రువునకు మహాతేజోవంతుడైన అంబరీషుడు జన్మించెను.
2.110.33.
అనుష్టుప్.
అమ్బరీషస్య పుత్రోఽభూత్
నహుషః సత్యవిక్రమః।
నహుషస్య చ నాభాగః
పుత్రః పరమధార్మికః॥
టీకా:
అమ్బరీషస్య = అంబరీషునియొక్క; పుత్రః = కుమారుడు; అభూత్ = జన్మించెను; నహుషః = నహుషుడు; సత్యవిక్రమః = నిజమైన పరాక్రమవంతుడు; నహుషస్య = నహుషునియొక్క; చ = మఱియు; నాభాగః = నాభాగుడు; పుత్రః = కుమారుడు; పరమ+ధార్మికః = అత్యంత ధార్మికుడు.
భావము:
అంబరీషునకు సత్యవిక్రముడైన నహుషుడు జన్మించెను. నహుషునకు అత్యంత ధార్మికుడైన నాభాగుడు జన్మించెను.
2.110.34.
అనుష్టుప్.
అజశ్చ సువ్రతశ్చైవ
నాభాగస్య సుతావుభౌ।
అజస్యైవ చ ధర్మాత్మా
రాజా దశరథస్సుతః॥
టీకా:
అజః = అజుడు; చ = మఱియు; సువ్రతః = సువ్రతుడు; చ = మఱియు; ఏవ = ఐన; నాభాగస్య = నాభాగునియొక్క; సుతౌ ఉభౌ = ఇరువురు కుమారులు; అజస్య = అజునియొక్క; ఏవ = మాత్రమే; చ = మఱియు; ధర్మాత్మా = ధర్మమూర్తి; రాజా = రాజు; దశరథః = దశరథుడు; సుతః = కుమారుడు.
భావము:
నాభాగునకు అజుడు, సువ్రతుడు అని ఇద్దరు కుమారులు. అజునకు ధర్మమూర్తి, మహారాజైన దశరథుడు కుమారుడుగా జన్మించెను.
2.110.35.
అనుష్టుప్.
యో జిత్వా వసుధాం కృత్స్నం
దివం శాసతి స ప్రభుః !
తస్య జ్యేష్ఠోఽ సి దాయాదో
రామ ఇత్యభివిశ్రుతః।
తద్గృహాణ స్వకం రాజ్యమ్
అవేక్షస్వ జనం నృప॥
టీకా:
యః = అతడు; జిత్వా = గెలిచెను; వసుధామ్ = భూమండలమును; కృత్స్నం = సర్వము; దివమ్ = స్వర్గలోకమును; శాసతి = పరిపాలించెను; స = సహితముగ; ప్రభుః = అధిపుడా; తస్య = ఆ దశరథునియొక్క; జ్యేష్ఠః = పెద్ద కుమారుడు; అసి = అయి ఉంటివి; దాయాదః = వంశపారంపర్య అధికారస్థుడవు; రామః = శ్రీరామచంద్రుడు; ఇతి = అని; అభివిశ్రుతః = ప్రసిద్ధుడువైన నీవు; తత్ = దానిని; గృహాణ = గ్రహించుము; స్వకమ్ = నీకు చెందిన; రాజ్యమ్ = రాజ్యమును; అవేక్షస్వ = పాలించుము; జనం = ప్రజలను; నృప = ఓ రాజా!.
భావము:
ఓ ప్రభూ! దశరథ మహారాజు స్వర్గలోకము సహితముగా భూమండలము సర్వం జయించి పరిపాలించెను. ఆ దశరథుని పెద్దకుమారుడవయిన నీవు శ్రీరాముడు అను పేరుతో ప్రసిద్ధికెక్కితివి. ఈ కోసలరాజ్యముపై వశపారంపర్య అధికారము కలవాడవు. అందుచేత నీవు నీ రాజ్యమును స్వీకరించి ప్రజలను పాలించుము.
2.110.36.
అనుష్టుప్.
ఇక్ష్వాకూణాం హి సర్వేషాం
రాజా భవతి పూర్వజః।
పూర్వజే నాపరః పుత్రో
జ్యేష్ఠో రాజ్యేఽ భిషిచ్యతే॥
టీకా:
ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశస్థులలో; హి = నిశ్చయంగా; సర్వేషాం = అందఱికి; రాజా = రాజు; భవతి = అగుచున్నాడు; పూర్వజః = జ్యేష్ఠుడు; పూర్వజే = మొదటి కుమారుడు ఉండగా; న = లేదు; అపరః = మరొక; పుత్రః = కుమారుడు; జ్యేష్ఠః = జ్యేష్ఠుడు; రాజ్యే = రాజ్యములో; అభిషిచ్యతే = అభిషిక్తుడగును.
భావము:
ఇక్ష్వాకువంశములో ఎల్లప్పుడు జ్యేష్ఠపుత్రుడు మాత్రమే రాజుగా ఉండును. జ్యేష్ఠుడు ఉండగా వేఱొక కుమారుడు రాజ్యాధికారము పొందడు. జ్యేష్ఠుడే రాజ్యాభిషిక్తుడగును.
2.110.37.
జగతి.
స రాఘవాణాం కులధర్మమాత్మనః
సనాతనం నాద్య విహన్తుమర్హసి।
ప్రభూతరత్నామనుశాధి మేదినీం
ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః॥
టీకా:
సః = అతడు; రాఘవాణాం = రాఘవుల; కులధర్మః = వంశాచారమును; ఆత్మనః = నీకు చెందిన; సనాతనం = ప్రాచీనమైన; న = కాదు; ఆద్య = ఇప్పుడు; విహంతుమ్ = భంగపరచుటకు; అర్హసి = యోగ్యుడవు; ప్రభూత+రత్నామ్ = అనేక రత్నములతో నిండియున్న; అనుశాధి = పాలించుము; మేదినీం = రాజ్యమును; ప్రభూత+రాష్ట్రామ్ = అనేక జనరాష్ట్రములతో నిండిన; పితృవత్ = తండ్రివలె; మహా+యశః = మహాయశస్సు గలవాడా.
భావము:
ఓ గొప్ప యశస్సుగల శ్రీరామచంద్ర! రాఘవవంశపు ఈ సనాతన కులధర్మమును నీవు ఈ రోజు భంగపఱచరాదు. అనేక రత్నములతో నిండియున్న మఱియు అనేక జనరాష్ట్రములతో వర్ధిల్లుచున్న రాజ్యమును మీ తండ్రివలె పాలించుము.
2.110.38.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే దశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; దశోత్తరశతతమః [110] = నూటపదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [110] నూటపదవ సర్గ సంపూర్ణము.
2.111.1.
అనుష్టుప్.
వసిష్ఠస్తు తదా రామమ్
ఉక్త్వా రాజపురోహితః।
అబ్రవీద్ధర్మసంయుక్తం
పునరేవాపరం వచః॥
టీక:-
వసిష్ఠః = వసిష్ఠ ముని; తు = మాత్రము; తదా = తదుపరి; రామం = రామునిగూర్చి; ఉక్త్వా = చెప్పిన పిమ్మట; రాజపురోహితః = రాజపురోహితుడు; అబ్రవీత్ = పలికెను; ధర్మసంయుక్తం = ధర్మముతో సమ కూడిన; పునః = మరల; ఏవ = వెను వెంటనే; ఆపరం = మరొక; వచః = మాట.
భావము:-
రాజపురోహితుడైన వసిష్ఠముని ఆ విధముగా రామునితో చెప్పిన పిమ్మట మరొక ధర్మవచనమును పలికెను.
2.111.2.
అనుష్టుప్.
“పురుషస్యేహ జాతస్య
భవంతి గురవస్త్రయః।
ఆచార్యశ్చైవ కాకుత్స్థ!
పితా మాతా చ రాఘవ!॥
టీక:-
పురుషస్య = పురుషుని యొక్క; ఇహ = ఇక్కడ; జాతస్య = జన్మించిన వాని యొక్క; భవంతి = అయ్యెదరు; గురవః = గురువులు, సంస్కరించువారు, మార్గదర్శకులు; త్రయః = ముగ్గురు; ఆచార్యః = ఉపాధ్యాయుడు; చ = మఱియు; ఏవ = మాత్రమే; కాకుత్స్థ = ఓ రామా, కకుత్స్థ వంశములో జన్మించిన వాడా; పితా = తండ్రి; మాతా = తల్లి; చ = మఱియు; రాఘవ = రఘురామా, రఘు వంశములో జన్మించిన వాడా. కకుత్స్థుడు; రఘు మొదలగువారు రాముని పూర్వీకులు.
భావము:-
ఓ కాకుత్స్థా, రాఘవా! జన్మించిన ప్రతీ మనిషికీ ముగ్గురు గురువులు వర్తించెదరు. వారు ఎవరనిన ఉపాధ్యాయుడు, తండ్రి, మఱియు తల్లి.
*గమనిక:-
గురువు- వ్యు. గౄ-గిరణే, గృ-శబ్దే- గౄ(గృ)+ కు-ఉత్. చ, కృ.ప్ర. అజ్ఞానమును పోగొట్టు వాడు, ధర్మమును ఉపదేశించువాడు. ఆంధ్రశబ్దరత్నాకరము. సంస్కరించువాడు, మార్గదర్శకుడు.
2.111.3.
అనుష్టుప్.
పితా హ్యేవం జనయతి
పురుషం పురుషర్షభ!।
ప్రజ్ఞాం దదాతి చాచార్యః
తస్మాత్స గురురుచ్యతే॥
టీక:-
పితా = తండ్రి; హి = కదా; ఏవం = కేవలము; జనయతి = పుట్టించును; పురుషమ్ = మానవుని; పురుషర్షభ = పురుష శ్రేష్ఠుడా; ప్రజ్ఞాం = జ్ఞానమును; దదాతి = ఇచ్చును; చ = మఱియు; ఆచార్యః = ఉపాధ్యాయుడు; తస్మాత్ = అందువలన; సః = అతను; గురుః = గురువు; ఉచ్యతే = పిలవబడును.
భావము:-
ఓ పురుష శ్రేష్ఠుడా! తండ్రి జన్మను మాత్రము ఇచ్చును. కానీ ఉపాధ్యాయుడు జ్ఞానమునిచ్చును, కావున గురువు అనబడును.
*గమనిక:-
పురుర్షభ- పురుషులందు వృషభము వంటి వాడు, పురుష శ్రేష్ఠుడు.
2.111.4.
అనుష్టుప్.
సోఽ హం తే పితురాచార్యః
తవ చైవ పరంతప।
మమ త్వం వచనం కుర్వన్
నాతివర్తేః సతాం గతిమ్॥
టీక:-
సః = ఆతడు; అహం = నేను; తే = నీ యొక్క; పితుః = తండ్రి యొక్క; ఆచార్యః = ఉపాధ్యాయుడు; తవ = నీ యొక్క; చైవ = మఱియును; పరంతప = ఓ శత్రువులను జయించినవాడా; మమ = నా యొక్క; త్వం = నీవు; వచనం = మాట; కుర్వన్ = చేసినచో; న = కాజాలదు; అతివర్తేః = మితిమీరుట; సతాం = సత్పురుషుల యొక్క; గతిమ్ = దారిని.
భావము:-
ఓ పరంతప! నేను అట్టి గురువును, జ్ఞానమునిచ్చిన గురువును. నీకునూ మీతండ్రికినీ ఉపాధ్యాయుడను. నీవు నా మాట ప్రకారము చేసినచో సత్పురుషుల దారిని వీడినటుల కాజాలదు.
2.111.5.
అనుష్టుప్.
ఇమా హి తే పరిషదః
శ్రేణయశ్చ ద్విజాస్తథా।
ఏషు తాత చరన్ధర్మం
నాతివర్తే స్సతాం గతిమ్॥
టీక:-
ఇమాః = వీరు; హి = నిజముగా; తే = నీ యొక్క; పరిషదః = సభలు, అనుచరులు; శ్రేణయః = వర్గములు, వైశ్యులు మొదలగు వర్గములు; చ = మఱియు; ద్విజాః = బ్రాహ్మణుదులు; తథా = మఱియు; ఏషు = వీరియందు; తాత = తండ్రి; చరన్ = నడచుచుండు; ధర్మం = ధర్మమును; న = కాజాలదు; అతివర్తేః = మితిమీరుట; సతాం = సత్పురుషుల యొక్క; గతిమ్ = దారిని.
భావము:-
ఈ సభలు, వర్గములు, మఱియు బ్రాహ్మణులు, వీరందరూ నీ వారలే. వీరియందు నీ తండ్రి ధర్మమును, పరిపాలనమును పాటించినచో సత్పురుషుల దారిని వీడినటుల కాజాలదు.
*గమనిక:-
ద్విజః- తల్లి కడుపులోనుండి ఒక మారు, ఉపనయనమున రెండవసారి జన్మించిన వారు, ఉపనయనము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మున్నగువారికి కలదు. వారంరు ద్విజులు, సాధారణుగా విప్రులు.
2.111.6.
అనుష్టుప్.
వృద్ధాయా ధర్మశీలాయా
మాతుర్నార్హస్యవర్తితుమ్।
అస్యాస్తు వచనం కుర్వన్
నాతివర్తేస్సతాం గతిమ్॥
టీక:-
వృద్ధాయాః = వృద్ధురాలి యొక్క; ధర్మ‑శీలాయాః = ధర్మాత్మురాలి యొక్క; మాతుః = తల్లి యొక్క; న అర్హసి = అర్హుడవు గావు; అవర్తితుమ్ = సేవ చేయకుండుటకు; అస్యాః = ఆమె యొక్క; తు = ఐతే; వచనం = మాట; కుర్వన్ = చేయుచుండువాడై; న = కావు; అతివర్తేః = మితిమీరుట; సతాం = సత్పురుషుల యొక్క; గతిమ్ = దారిని.
భావము:-
వృద్ధురాలైన మఱియు ధర్మాత్మురాలైన నీ తల్లి సేవను వీడుటకు నీవు అర్హుడవు గావు. ఆవిడ మాటను పాటించినచో సత్పురుషుల దారిని వీడినటుల కాజాలదు.
*గమనిక:-
మనుస్మృతిలో 2.145, “తండ్రి కంటే తల్లిని వేయిరెట్లు గౌరవించవలె” నని చెప్పబడినది. దాని ప్రకారము నీవు తల్లికే ప్రాముఖ్యతనివ్వవలెనని హెచ్చరిక.
2.111.7.
అనుష్టుప్.
భరతస్య వచః కుర్వన్
యాచమానస్య రాఘవ!।
ఆత్మానం నాతివర్తేస్త్వం
సత్యధర్మపరాక్రమ!”॥
టీక:-
భరతస్య = భరతుని యొక్క; వచః = మాట; కుర్వన్ = చేసిన వాడవై; యాచమానస్య = అభ్యర్ధించువాని యొక్క; రాఘవ = ఓ రాఘవా; ఆత్మానం = నీవు ఇచ్చిన మాటను; న అతివర్తేః = మితిమీరవు; త్వం = నువ్వు; సత్య-ధర్మ-పరాక్రమ = సత్యము ధర్మము పాటించుటలో పరాక్రముడా
భావము:-
ఓ సత్యధర్మపరాక్రమా, రాఘవా! భరతుడు అభ్యర్ధించుచున్నటుల రాజ్యాభిషేకము చేయించుకొనినచో అది నీ ధర్మమును వీడినటుల కాజాలదు.”
*గమనిక:-
రాఘవుడు- రఘువు మహారాజు వంశమున పుట్టివాడు, రాముడు
2.111.8.
అనుష్టుప్.
ఏవం మధురముక్తస్సన్
గురుణా రాఘవః స్వయమ్।
ప్రత్యువాచ సమాసీనం
వసిష్ఠం పురుషర్షభః॥
టీక:-
ఏవం = ఆ విధముగా; మధురమ్ = మధురమైన; ఉక్తః = వచనములు చెప్పబడిన వాడు; సన్ = అయివుండి; గురుణా = గురువు, వసిష్ఠుని చేత; రాఘవః = రఘురాముడు; స్వయమ్ = స్వయముగా; ప్రతి ఉవాచ = సమాధానమిచ్చెను; సమాసీనం = సమ + ఆసీనమ్, కూడా కూర్చొని ఉన్నవానిని; వసిష్ఠం = వసిష్ఠునిగూర్చి; పురుషర్షభః = పురుష శ్రేష్టుడు.
భావము:-
ఆ విధముగా గురువైన వసిష్ఠుడు చెప్పిన మధురవాక్యములు వినిని ఉత్తమపురుషుడు రాఘురాముడు, ప్రక్కన ఆసీనుడైవున్న ఆయనకి తిరిగి ఇటుల సమాధానమిచ్చెను.
2.111.9.
అనుష్టుప్.
“యన్మాతాపితరౌ వృత్తం
తనయే కురుతస్సదా।
న సుప్రతికరం తత్తు
మాత్రా పిత్రా చ యత్కృతమ్॥
టీక:-
యత్ = ఏదైతే; మాతా‑పితరౌ = తల్లితండ్రుల యందు; వృత్తమ్ = ప్రవర్తించినది, నిర్వహించిన విధి, సేవ; తనయే = కుమారునిచే; కురుతః = చేచేయబడినది; సదా = ఎప్పటికి; న = కాదు; సుప్రతికరం = ప్రత్యుపకారం, ఋణము తీర్చుకొనుట; తత్ = దానికి; తు = నిశ్చయుంగా; మాత్రా = తల్లి చేత; పిత్రా = తండ్రి చేత; చ = మఱియు; యత్ = ఏదైతే; కృతమ్ = చేయబడినదో
భావము:-
తల్లి తండ్రులకు పుత్రుడు ఎంతటి సేవ చేసినను, నిశ్చయముగా తల్లిదండ్రులు చేసిన మేలులకు ఋణము తీర్చుకొనుట కాజాలదు. తల్లిదండ్రులు సంతానానికి చేయు సేవలు, త్యాగములు తరువాతి శ్లోకములో ఉదహరింపబడెను.
2.111.10.
అనుష్టుప్.
యథాశక్తి ప్రదానేన
స్వాపనోచ్ఛాదనేన చ।
నిత్యం చ ప్రియవాదేన
తథా సంవర్ధనేన చ॥
టీక:-
యథాశక్తి = తమ శక్తి సామర్థ్యముల ప్రకారము; ప్రదానేన = భోజనాదికములు ఇచ్చుట మున్నగు వాని చేత; స్వాపన = నిద్ర పుచ్చుట; ఉచ్ఛాదనేన = సుగంధద్వవ్యాదులతో మర్దన చేయుట, వాచస్పతము; చ = మఱియు; నిత్యం = ఎల్లపుడూ; చ = మఱియు; ప్రియవాదేన = వాత్సల్యపూరిత సంభాషణ చేత; తథా = అటుల; సంవర్ధనేన = పోషించుట చేత, ఆంప్టే డిక్షనకీ.
భావము:-
భోజనాదికములు ఇచ్చుట, నిద్ర పుచ్చుట మఱియు సుగంధద్రవ్యాలతో మర్దనా చేయుట, వాత్సల్యపూరిత సంభాషణల, పోషించుట చేతనూ తల్లిదండ్రులు పుత్రునికి చేయు మేలుల ఋణము ఎట్లు తీర్చగలడు.
2.111.11.
అనుష్టుప్.
స హి రాజా జనయితా
పితా దశరథో మమ।
ఆజ్ఞాతం యన్మయా తస్య
న తన్మిథ్యా భవిష్యతి”॥
టీక:-
సః = అతను; హి = కదా; రాజా = రాజు; జనయితా = జన్మనిచ్చిన వాడు; పితా = తండ్రి; దశరథః = దశరథుడు; మమ = నా యొక్క; ఆజ్ఞాతం = ఆజ్ఞాపించబడినది; యత్ = ఏదైతే; మయా = నా చేత; తస్య = అతని యొక్క; న = కాదు; తత్ = అది; మిథ్యా = అసత్యము; భవిష్యతి = అవ్వబడును.
భావము:-
జన్మనిచ్చిన నా తండ్రి ధశరుథుని ఆజ్ఞ, వనవాస గమనము నా చేత కల్ల కావింపబడదు.”
2.111.12.
అనుష్టుప్.
ఏవముక్తస్తు రామేణ
భరతః ప్రత్యనంతరమ్।
ఉవాచ పరమోదారః
సూతం పరమదుర్మనాః॥
టీక:-
ఏవం = ఆ విధంగా; ఉక్తః = చెప్పబడిన వాడు; తు = మాత్రము; రామేణ = రాముని చేత; భరతః = భరతుడు; ప్రతి అంతరమ్ = చెంతనే ఉన్నట్టి; ఉవాచ = చెప్పెను; పరమ ఉదారః = అత్యంత గొప్పవాడు; సూతం = రథసారథి సుమంత్రునితో; పరమ దుర్మనాః = అత్యంత దుఃఖపూరితుడు.
భావము:-
ఆ విధముగా రాముడు చెప్పగా, అత్యంత దుఃఖపూరితుడునూ, మిక్కిలి గొప్పవాడునూ ఐన భరతుడు చెంతనే ఉన్న రథసారథి సుమంత్రునితో ఇలా చెప్పెను.
2.111.13.
అనుష్టుప్.
“ఇహ మే స్థండిలే శీఘ్రం
కుశానాస్తర సారథే!।
ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి
యావన్మే న ప్రసీదతి॥
టీక:-
ఇహ = ఇక్కడ; మే = నా కొరకు; స్థండిలే = నేల యందు; శీఘ్రం = త్వరగా; కుశాన్ = దర్భలను; ఆస్తర = పరిపించుము; సారథే = ఓ రథసారథి సుమంతా; ఆర్యం = ఆర్యుని, రాముని; ప్రత్యుపవేక్ష్యామి = అడ్డగించెదను, అడ్డగించి తిష్టవేసి ఉందును; యావత్ = ఎప్పటివరకైతే; మే = నా కొరకు; న ప్రసీదతి = అనుగ్రహించడో.
భావము:-
ఓ రథసారథీ సుమంతా! వెంటనే ఇక్కడ నేలమీద దర్భలతో కూడిన ఆసనమును ఏర్పాటు చేయించుము. నన్ను అనుగ్రహించే వరకు, రాముడిని అడ్డగించి ఇక్కడే తిష్టవేసి ఉండెదను.
2.111.14.
అనుష్టుప్.
అనాహారో నిరాలోకో
ధనహీనో యథా ద్విజః।
శేష్యే పురస్తాచ్ఛాలాయా
యావన్న ప్రతియాస్యతి॥
టీక:-
అనాహారః = నిరాహార దీక్ష వహించువాడు; నిరాలోకః = కనులు మూసుకొని ఉన్నవాడు; ధనహీనః = బీదవానిగా చేయబడిన వాడు, విల్సన్ డిక్షనరీ; యథా = వలె; ద్విజః = బ్రాహ్మణుడు; శేష్యే = శయనించెదను; పురస్తాత్ = ముందర; శాలాయాః = కుటీరముయొక్క; యావత్ = ఎప్పటివరకైతే; న ప్రతియాస్యతి = తిరిగి రాజాలడో.
భావము:-
ఎట్లైతే బీదవానిగా చేయబడిన బ్రాహ్మణుడు ఎట్టి తీవ్రమైన ప్రతిస్పందనలు చేయక, నిరాహారంగా కన్నులు మూసుకుని ఉండునో. అదే విధముగా, రాముడు తిరిగి వచ్చేవరకు కుటీరము ముందరే పరుండెదను.
2.111.15.
అనుష్టుప్.
స తు రామమవేక్షంతం
సుమంత్రం పేక్ష్య దుర్మనాః।
కుశోత్తరముపస్థాప్య
భూమావేవాఽస్తరత్స్వయమ్॥
టీక:-
సః = అతను; తు = కానీ; రామం = రాముని గురించి; అవేక్షంతం = వేచియుండెడి; సుమంత్రం = సుమంత్రుని రథసారథిని; పేక్ష్య = చూసి; దుర్మనాః = దుఃఖపూరితుడు; కుశోత్తరమ్ = దర్భల బొంతను; ఉపస్థాప్య = తెప్పించి; భూమౌ = భూమియందు; ఏవ = మాత్రమే; ఆస్తరత్ = పరచెను; స్వయమ్ = స్వయముగా
భావము:-
దుఃఖపూరితుడైన భరతుడు, రాముని ఆజ్ఞ కోసము వేచియున్న సుమంత్రుని చూచి, స్వయముగా తనే దర్భలబొంతను తెప్పించి నేలపై పరచుకొనెను.
2.111.16.
అనుష్టుప్.
తమువాచ మహాతేజా
రామో రాజర్షిసత్తమః।
“కిం మాం భరత కుర్వాణం
తాత ప్రత్యుపవేక్ష్యసి॥
టీక:-
తమ్ = అతనితో; ఉవాచ = చెప్పెను; మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడు; రామః = రాముడు; రాజర్షి-సత్తమః = ఋషుల వంటి రాజులలో ఉత్తముడు; కిం = ఏమి; మాం = నన్ను; భరత = ఓ భరతా; కుర్వాణం = చేయచున్న; తాత = ఓ నాయనా, వాత్సల్యపూరిత సంబోధన; ప్రత్యుపవేక్ష్యసి = అడ్డగించుచున్నావు?
భావము:-
గొప్ప తేజస్సు కలవాడూ, ఋషుల వంటి రాజులలో ఉత్తముడూ ఐన రాముడు భరతుని ఇట్లు అడిగెను “నాయనా భరతా! నేను ఏమి చేయుచుంటినని నన్ను అడ్డగించుచుంటివి.
2.111.17.
అనుష్టుప్.
బ్రాహ్మణో హ్యేకపార్శ్వేన
నరాన్రోద్ధుమిహార్హతి।
న తు మూర్ధాభిషిక్తానాం
విధిః ప్రత్యుపవేశనే॥
టీక:-
బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; హి = కదా; ఏక-పార్శ్వేన = ఏకపక్షముగా; నరాన్ = నరులను; రోద్ధుం = నిరోధించుట; ఇహ = ఇక్కడ; అర్హతి = అర్హుడు; న = కాదు; తు = మాత్రము; మూర్ధ-అభిషిక్తానామ్ = పట్టాభిషేకము జరిగినవనికి; విధిః = నిబంధన; ప్రత్యుపవేశనే = ప్రతి + ఉపవేశనే = నిరోధించడము.
భావము:-
బ్రాహ్మణులకు మాత్రమే జనులను ఏకపక్షముగా అడ్డగించుటకు అర్హత కలదు. క్షత్రియులకు ఇట్లు అడ్డగించుట నిర్దేశించబడలేదు.
2.111.18.
అనుష్టుప్.
ఉత్తిష్ఠ నరశార్దూల
హిత్వైతద్దారుణం వ్రతమ్।
పురవర్యామితః క్షిప్రమ్
అయోధ్యాం యాహి రాఘవ॥
టీక:-
ఉత్తిష్ఠ = లెమ్ము; నర-శార్దూల = ఓ పురుషులలో శ్రేష్ఠుడా; హిత్వా = విడిచిపెట్టి; ఏతత్ = ఇట్టి; దారుణం = కఠినమైన; వ్రతమ్ = సంకల్పముని; పురవర్యామ్ = నగరములలో శ్రేష్టమైనదానికి; ఇతః = ఇక్కడినుండి; క్షిప్రమ్ = త్వరగా; అయోధ్యాం = అయోధ్యకు; యాహి = వెళ్ళుము; రాఘవ = ఓ రాఘవా.
భావము:-
ఓ నరశార్దూలా, రాఘవంశ భరతా! లెమ్ము, ఇంత కఠినమైన సంకల్పముని విడిచిపెట్టి, ఇక్కడినుండి వెంటనే బయలుదేరి అయోధ్యా నగరమునకు వెళ్ళుము
2.111.20.
అనుష్టుప్.
తే తమూచుర్మహాత్మానం
పౌరజానపదా జనాః।
కాకుత్స్థమభిజానీమః
సమ్యగ్వదతి రాఘవః॥
టీక:-
తే = వారు; తమ్ = ఆయననుగూర్చి; ఊచుః = చెప్పిరి; మహాత్మానమ్ = మహాత్ముని; పౌరః = పురజనులు; జానపదాః = గ్రామస్తులు ఐన; జనాః = ప్రజలు; కాకుత్స్థమ్ = కాకుత్స్థ వంశపు వాడిని, రాముడిని; అభిజానీమః = మేము అర్థము చేసుకొంటిమి; సమ్యక్ = సరిగ్గా; వదతి = చెప్పుతున్నాడు; రాఘవః = రఘు రాముడు.
భావము:-
పురజనులు మఱియు గ్రామస్తులు మహాత్ముడైన భరతునితో ఇలా చెప్పిరి “కాకుత్స్థుడైన రఘరాముని మేము అర్థము చేసుకుంటిమి. ఆయన చెప్పునది సబబుగానున్నది.
2.111.21.
అనుష్టుప్.
ఏషోఽపి హి మహాభాగః
పితుర్వచసి తిష్ఠతి।
అత ఏవ న శక్తాః స్మ
వ్యావర్తయితుమంజసా॥
టీక:-
ఏషః = ఇతను; అపి = కూడా; హి = నిజంగా; మహాభాగః = అమిత భాగ్యశాలి; పితుః = తండ్రి యొక్క; వచసి = మాటమీద; తిష్ఠతి = నిలబడుతున్నాడు; అతైవ = అందువలననే; న శక్తాః = అశక్తులము; స్మ = అయినాము; వ్యావర్తయితుం = వేరుచేయుటకు, నిరోధించుటకు; అంజసా = యథార్థము, వావిళ్ళనిఘంటువు.
భావము:-
రాముడు నిజమైన భాగ్యశాలి, తండ్రి మాట మీద నిలబడెను. నిజానికి, అందువలననే ఇతనిని నిరోధించుటకు అశక్తులమైనాము.
2.111.22.
అనుష్టుప్.
తేషామాజ్ఞాయ వచనం
రామో వచనమబ్రవీత్।
ఏవం నిబోధ వచనం
సుహృదాం ధర్మచక్షుషామ్”॥
టీక:-
తేషామ్ = వారి యొక్క; ఆజ్ఞాయ = అర్థము చేసుకుని; వచనం = మాటను; రామః = రాముడు; వచనం = మాటను; అబ్రవీత్ = చెప్పెను; ఏవం = ఈ విధంగా; నిబోధ = వినుము; వచనం = మాట; సుహృదామే = స్నేహితుల యొక్క; ధర్మచక్షుషాం = ధర్మ దృష్టికలిగినవారి యొక్క
భావము:-
పురజనుల మఱియు గ్రామస్థుల మాటను అర్థము చేసుకున్న రాముడు భరతునితో ఈ విధముగా చెప్పెను, “ధర్మదృష్టి గల ఈ సుహృత్తుల మాటను వినుము”.
2.111.23.
అనుష్టుప్.
ఏతచ్చైవోభయం శ్రుత్వా
సమ్యక్సమ్పశ్య రాఘవ।
ఉత్తిష్ఠ త్వం మహాబాహో
మాం చ స్పృశ తథోదకమ్”॥
టీక:-
ఏతత్ = ఇది; చ = మఱియు; ఏవ = కూడా; ఉభయం = రెండూ; శ్రుత్వా = విని; సమ్యక్ = సరిగా; సంపశ్య = విచారించు; రాఘవ = ఓ రాఘవా, ఓ భరతా; ఉత్తిష్ఠ = లెమ్ము; త్వం = నువ్వు; మహాబాహో = ఓ విశాల భుజములు కలవాడా, ఓ భరతా; మాం = నన్ను; చ = మఱియు; స్పృశ = తాకుము; తథా = అలానే; ఉదకమ్ = నీరు
భావము:-
ఓ రాఘువంశ భరతా! ఈ నా మాటనూ జనుల మాటను రెండింటినీ విని జాగ్రత్తగా విచారించుము. ఓ మహాబాహూ! లెమ్ము. నన్నూ మఱియు నీటినీ స్పృశించుము ఆచమనము చేయుము.”
2.111.24.
అనుష్టుప్.
అథోత్థాయ జలంస్పృష్ట్వా
భరతో వాక్యమబ్రవీత్।
“శ్రుణ్వన్తు మే పరిషదో
మంత్రిణః శ్రేణయస్తథా॥
టీక:-
అథ = అనంతరం; ఉత్థాయ = లేచి; జలం = నీటిని; స్పృష్ట్వా = తాకి; భరతః = భరతుడు; వాక్యమ్ = వాక్యమును; అబ్రవీత్ = చెప్పెను; శ్రుణ్వంతు = అందరూ వినెదరుగాక; మే = నా యొక్క; పరిషదః = సభ్యులు, అనుచరులు; మంత్రిణః = మంత్రులు; శ్రేణయః = వర్గములు; తథా = మఱియు.
భావము:-
అనంతరము భరతుడు లేచి, నీటిని స్పృశించి, ఈ విధముగా పలికెను, “నా అనుచరులూ, మంత్రులూ, వివిధ వర్గముల వారందరూ వినెదరు గాక.
2.111.25.
అనుష్టుప్.
న యాచే పితరం రాజ్యం
నానుశాసామి మాతరమ్।
ఆర్యం పరమధర్మజ్ఞం
నానుజానామి రాఘవమ్॥
టీక:-
న యాచే = కోరుటలేదు, కోరలేదు; పితరమ్ = తండ్రిని; రాజ్యం = రాజ్యమును; న అనుశాసామి = ఆజ్ఞాపించను, ప్రేరేపించలేదు; మాతరం = తల్లిని; ఆర్యమ్ = ఆర్యుడను, రాముడిని; పరమ-ధర్మజ్ఞమ్ = ధర్మములో ఉత్తమ నిపుణుణడిని; న అనుజానామి = సమ్మతించను, వనవాసమునకు ఒప్పుకొనలేదు; రాఘవమ్ = రాఘవుని
భావము:-
నేను తండ్రిని రాజ్యము కోరనూ లేదు, తల్లిని నా కొరకు రాజ్యము సంపాదించునటుల ప్రేరేపించనూ లేదు, పరమ ధర్మజ్ఞుడైన అన్న రఘురాముని వనవాసమునకు సమ్మతించనూ లేదు.
2.111.26.
అనుష్టుప్[.
యదిత్వవశ్యం వస్తవ్యం
కర్తవ్యం చ పితుర్వచః।
అహమేవ నివత్స్యామి
చతుర్దశ సమా వనే”॥
టీక:-
యది తు = ఒక వేళ; అవశ్యం = తప్పకుండా; వస్తవ్యమ్ = ఉండవలసి వస్తే; కర్తవ్యం = చేయవలసిన పని; చ = మఱియు; పితుః = తండ్రి యొక్క; వచః = మాట; అహం ఏవ = నేనే; నివత్స్యామి = నివసించెదను; చతుర్దశ = పదునాలుగు; సమాః = సంవత్సరములు; వనే = అరణ్యంలో
భావము:-
ఒక వేళ తండ్రి మాట ప్రకారము కర్తవ్యపాలన చేయవలసి వస్తే నేనే పదునాలుగు సంవత్సరములు అడవిలో నివసించెదను.”
2.111.27.
అనుష్టుప్.
ధర్మాత్మా తస్య తథ్యేన
భ్రాతుర్వాక్యేన విస్మితః।
ఉవాచ రామస్సమ్ప్రేక్ష్య
పౌరజానపదం జనమ్॥
టీక:-
ధర్మాత్మా = ధర్మవంతుడు; తస్య = అతని యొక్క; తథ్యేన = సత్యమైన దాని చేత; భ్రాతుః = సోదరుని యొక్క; వాక్యేన = మాట చేత; విస్మితః = ఆశ్చర్యచకితుడు; ఉవాచ = చెప్పెను; రామః = రాముడు; సంప్రేక్ష్య = చూసి; పౌరజానపదం = నగరములకూ మఱియు గ్రామములకూ చెందిన; జనమ్ = జనమును.
భావము:-
ధర్మాత్ముడైన రాముడు సోదరుని యొక్క సత్య వాక్కు చేత విస్మయము చెందెను. నగరస్తులనూ మఱియు గ్రామస్తులనూ చూచి ఇటుల పలికెను.
2.111.28.
అనుష్టుప్.
“విక్రీతమాహితం క్రీతం
యత్పిత్రా జీవతా మమ।
న తల్లోపయితుం శక్యం
మయా వా భరతేన వా”॥
టీక:-
విక్రీతమ్ = అమ్మివేయబడినది; ఆహితం = ఇచ్చివేయబడినది; క్రీతమ్ = కొనబడినది; యత్ = ఏది; పిత్రా = తండ్రి చేత; జీవతా = జీవించి ఉన్నప్పుడు; మమ = నా; న = లేదు; తత్ = అది; లోపయితుం = విచ్చేయగలిగే; శక్యం = సాధ్యం; మయా = నా చేత; వా = లేదా; భరతేన = భరతుని చేత; వా = లేదా.
భావము:-
“జీవించి ఉండగా మా తండ్రి చేత అమ్మివేయబడినది గానీ, ఇచ్చివేయబడినది గానీ, కొనబడినది గానీ ఏదైనను నా చేత గానీ భరతుని చేత గానీ మార్చుట సాధ్యము గాదు.”
2.111.29.
అనుష్టుప్.
ఉపధిర్న మయా కార్యో
వనవాసే జుగుప్సితః।
యుక్తముక్తం చ కైకేయ్యా
పిత్రా మే సుకృతం కృతమ్॥
టీక:-
ఉపధిః = కపటము, ప్రతినిధిని వనవాసమునకు పంపుట; న = కాదు; మయా = నా చేత; కార్యః = కార్యము; వనవాసే = అరణ్యవాసములో; జుగుప్సితః = జుగుప్సాకరమైనది; యుక్తమ్ = సరైనది; ఉక్తం = చెప్పబడినది; చ = మఱియు; కైకేయ్యా = కైకేయి చేత; పిత్రా = తండ్రి చేత; మే = నా యొక్క; సుకృతమ్ = మంచి పని; కృతమ్ = చేసినది.
భావము:-
నా బదులు వేరొకరిని లేదా భరతుడిని వనవాసమునకు పంపుట మంచిపని కాదు మఱియు జుగుప్సాకరమైనది. కైకేయి చెప్పినదీ యుక్తమే మఱియు నా తండ్రి చేసినదీ సుకృతమే.
2.111.30.
అనుష్టుప్.
జానామి భరతం క్షాంతం
గురుసత్కారకారిణమ్।
సర్వమేవాత్ర కల్యాణం
సత్యసన్ధే మహాత్మని॥
టీక:-
జానామి = నాకు తెలుసు; భరతమ్ = భరతుడిని; క్షాంతమ్ = సహనశీలుడని; గురుసత్కారకారిణమ్ = గురువులకు, పెద్దలకు గౌరవం చూపే వాడని; సర్వమ్ = అన్నీ; ఏవ = కూడా; అత్ర = ఇక్కడ; కల్యాణమ్ = మంచిదే; సత్యసంధే = సత్య పరాయణుని యందు; మహాత్మని = మహాత్ముని యందు.
భావము:-
భరతుడు సహనశీలుడూ, మఱియు గురుభక్తి కలవాడూ అని నాకు తెలుసు. అటువంటి సత్య పరాయణుడైన మహాత్మునికి శుభమే జరుగును.
2.111.31.
అనుష్టుప్.
అనేన ధర్మశీలేన
వనాత్ప్రత్యాగతః పునః।
భ్రాత్రా సహ భవిష్యామి
పృథివ్యాః పతిరుత్తమః॥
టీక:-
అనేన = ఇతని చేత; ధర్మశీలేన = ధర్మశీలుని చేత; వనాత్ = అరణ్యం నుండి; ప్రతి ఆగతః = తిరిగి వచ్చినవాడు; పునః = మరల; భ్రాత్రా = తమ్మునితోడ; సహ = కలిసి; భవిష్యామి = ఉండెదను; పృథివ్యాః = భూమి యొక్క; పతిః = పతిగా; ఉత్తమః = శ్రేష్ఠుడుగా.
భావము:-
నేను అరణ్యమునుండి వనవాసము పూర్తిచేసుకొని తిరిగి వచ్చిన తరువాత ఇటువంటి ధర్మశీలుడైన తమ్మునితో కలిసి ఉత్తమ భూపతినై యుండెదను.
2.111.32.
అనుష్టుప్.
వృతో హి రాజా కైకేయ్యా
మయా తద్వచనం కృతమ్।
అనృతాన్మోచయానేన
పితరం తం మహీపతిమ్॥
టీక:-
వృతః = కోరబడినవాడు; హి = కదా; రాజా = రాజు ధశరథ మహారాజు; కైకేయ్యా = కైకేయి చేత; మయా = నా చేత; తద్ వచనం = ఆయన మాట; కృతమ్ = చేయబడినది; అనృతాత్ = అసత్యము నుండి; మోచయ = విముక్తి కలిగించు; అనేన = దాని చేత; పితరమ్ = తండ్రిని; తం = ఆయనను; మహీపతిం = రాజును.
భావము:-
దశరథ మహారాజు కైకేయి చేత కోరబడినాడు. ఆయన ఆజ్ఞను నేను నిర్వర్తించితిని. నీవు కూడా రాజ్యపాలనము స్వీకరించి తండ్రిని అసత్యదోషము నుండి విముక్తుడను చేయుము.
2.111.32.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ఏకాదశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; ఏకాదశోత్తరశతతమః [111] = నూటతొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [111] నూటపదకొండవ సర్గ సంపూర్ణము.
2.112.1.ఽ
అనుష్టుప్.
తమప్రతిమతేజోభ్యాం
భ్రాతృభ్యాం రోమహర్షణమ్।
విస్మితాః సంగమం ప్రేక్ష్య
సమవేతా మహర్షయః॥
టీక:-
తమ్ = ఆ; అప్రతిమ = సాటిలేని; తేజోభ్యామ్ = తేజస్సుగలవారిని; భ్రాతృభ్యామ్ = సోదరుల యొక్క; రోమహర్షణమ్ = గగుర్పాటు కలిగించు; విస్మితాః = ఆశ్చర్యపడినవారు ఐరి; సంగమం = సమాగమమును; ప్రేక్ష్య = చూచి; సమవేతా = చేరిన; మహర్షయః = మహర్షులందరు
భావము:-
గగుర్పాటు కల్గించు, సాటిలేని తేజస్సు గల ఆ సోదరుల ఆ సమాగమమును, అక్కడ చేరిన మహర్షులందరు చూచి చాలా ఆశ్చర్యపోయిరి.
2.112.2.
అనుష్టుప్.
అంతర్హితా మునిగణాః
సిద్ధాశ్చ పరమర్షయః।
తౌ భ్రాతరౌ మహాత్మానౌ
కాకుత్థ్సౌ ప్రశశంసిరే॥
టీక:-
అంతర్హితా = కనబడకుండా ఉన్నవారు; మునిగణాః = ముని గణములు; సిద్ధాశ్చ = సిద్ధులు; పరమర్షయః = ఋషి గణములు; తౌ భ్రాతరౌ = ఆ సోదరులను; మహాత్మానౌ = మహాత్ములైన; కాకుత్థ్సౌ = రామభరతులను; ప్రశశంసిరే = పొగడిరి.
భావము:-
అక్కడ కనబడకుండా ఉండి చూచుచున్న మహర్షులు, ఋషులు, సిద్ధులు, దేవర్షులు మహాత్ములైన ఆ కాకుత్స్థవంశోద్భులైన రామభరతులను ఇద్దరు సోదరులను ప్రశంసించిరి.
2.112.3.
అనుష్టుప్.
స ధన్యో యస్య పుత్రౌ ద్వౌ
ధర్మజ్ఞౌ ధర్మవిక్రమౌ।
శ్రుత్వా వయం హి సమ్భాషామ్
ఉభయోః స్పృహయామహే॥
టీక:-
సః = ఆ; ధన్యః = ధన్యుడు; యస్య = ఎవరికైతే; పుత్రౌ = కుమార ద్వయము; ద్వౌ = ఇద్దరును; ధర్మజ్ఞౌ = ధర్మవేత్తలు; ధర్మవిక్రమౌ = ధర్మబద్దమైన శౌర్యము కలవారు; శ్రుత్వా = విని; వయం = మనకు; హి = కదా; సమ్భాషామ్ = సంభాషణము; ఉభయోః = ఇరువురి; స్పృహయామహే = మక్కువ కలుగుచున్నది.
భావము:-
“ధర్మవేత్తలూ, ధర్మబద్ద శూరులు ఐన ఈ ఇద్దరినీ కుమారులుగా కన్న దశరథుడు ధన్యుడు. వీరి సంభాషణము వినుటచే మనకు వీరిద్దరి పైనను మక్కువ కలుగుచున్నది కదా!” అనుకొనిరి
2.112.4.
అనుష్టుప్.
తతస్త్వృషిగణాః క్షిప్రం
దశగ్రీవవధైషిణః।
భరతం రాజశార్దూలమ్
ఇత్యూచుః సంగతా వచః॥
టీక:-
తతః తు = అటు పిమ్మట; ఋషిగణాః = ఋషుల సమూహము; క్షిప్రం = శీఘ్రముగా; దశగ్రీవ = రావణుని; వధ = సంహారము; ఏషిణః = కోరికతో; భరతం = భరతునితో; రాజశార్దూలమ్ = రాజశ్రేష్ఠుడైన; ఇతి = ఇట్లు; ఊచుః = చెప్పిరి; సంగతా = కలసి వచ్చి; వచః = మాటలు
భావము:-
పిమ్మట శీఘ్రముగా రావణసంహారము కోరు ఆ ఋషులందరు కలిసి వచ్చి రాజశ్రేష్ఠుడైన భరతునితో ఇట్లు చెప్పిరి.
2.112.5.
అనుష్టుప్.
“కులే జాత మహాప్రాజ్ఞః
మహావృత్త మహాయశః।
గ్రాహ్యం రామస్య వాక్యం తే
పితరం యద్యవేక్షసే॥
టీక:-
కులే = ఉత్తమ కులమునందు; జాత = పుట్టిన; మహాప్రాజ్ఞ = గొప్ప బుద్ధిమంతుడ; మహావృత్త = గొప్ప నడత కలవాడ; మహాయశః = గొప్ప కీర్తి కలవాడ; గ్రాహ్యం = గ్రహింపదగినది; రామస్య = రాముని యొక్క; వాక్యం = మాటలను; తే = నీ యొక్క; పితరం = తండ్రిపై; యది = ఏ విధమైన; అవేక్షసే = గౌరవభావము ఉన్నచో
భావము:-
ఓ భరతుడా! నీవు ఉత్తమ కులమందు పుట్టితివి. గొప్ప బుద్ధిమంతుడవు. మంచి నడత కలవాడవు. గొప్ప కీర్తి గలవాడవు. నీకు తండ్రిపై ఏపాటి గౌరవభావము ఉన్ననూ, నీవు రాముడు చెప్పినట్లు చేయుము.
2.112.6.
అనుష్టుప్.
సదాఽనృణమిమం రామం
వయమిచ్ఛామహే పితుః।
ఆనృణత్వాచ్చ కైకేయ్యాః
స్వర్గం దశరథో గతః”॥
టీక:-
సదా = ఎల్లప్పుడు; అనృణమ్ = ఋణమును తీర్చతీక్చుకున్నవాడు కావలెనని; ఇమమ్ = ఈ; రామమ్ = రాముని; వయమ్ = మేము; ఇచ్ఛామహే = కోరుచున్నాము; పితుః = తండ్రిగారు; ఆనృణత్వాత్ = ఋణమును తీర్చివేయుటచే; చ = ఇంకను; కైకేయ్యాః = కైకేయి యొక్క; స్వర్గం = స్వర్గమునకు; దశరథః = దశరథ మహారాజు; గతః = వెళ్లెను.
భావము:-
ఈ రాముడు తండ్రి ఋణమును తీర్చవలెనని మేము ఎల్లపుడు కోరుచున్నాము. దశరథుడు కైకేయి ఋణమును తీర్చివేయుటచేతనే స్వర్గమునకు వెళ్లగలిగినాడు.”
2.112.7.
అనుష్టుప్.
ఏతావదుక్త్వా వచనం
గంధర్వాః సమహర్షయః।
రాజర్షయశ్చైవ తదా
సర్వే స్వాం స్వాం గతిం గతాః॥
టీక:-
ఏతావత్ = ఇంత మాత్రము; ఉక్త్వా = చెప్పిరి; వచనమ్ = మాటలను; గంధర్వాః = గంధర్వులు; స = కలిసి; మహర్షయః = మహర్షులుతో; రాజర్షయః = రాజర్షులు; చ = ఇంకను; ఏవ = మున్నగువారు; తదా = అట్లు; సర్వే = అందరును; స్వాం స్వాం = తమ తమ; గతిం = స్థానములకు; గతాః = వెళ్లిరి.
భావము:-
గంధర్వులు, మహర్షులు, రాజర్షులు అందరు ఇంతవరకు చెప్పి తమ తమ స్థానములకు వెళ్లిరి.
2.112.8.
అనుష్టుప్.
హ్లాదితస్తేన వాక్యేన
శుభేన శుభదర్శనః।
రామస్సంహృష్టవదనః
తానృషీనభ్యపూజయత్॥
టీక:-
హ్లాదితః = వికసించిన; తేన = అటువంటి; వాక్యేన = మాటల చేత; శుభేన = శుభకరములైన; శుభదర్శనః = చూచువారికి మంగళము ఇచ్చు; రామః = రాముడు; సంహృష్ట = సంతోషించిన; వదనః = ముఖముతో; తాన్ = తను; ఋషీన్ = ఋషులను; అభ్యపూజయత్ = ఇంకను పూజించెను
భావము:-
చూచువారికి మంగళము ఇచ్చు రాముడు మంగళకరమైన ఆ వాక్యము విని, సంతోషించినవాడై వికసించిన ముఖముతో ఆ ఋషులను పూజించెను.
2.112.9.
అనుష్టుప్.
త్రస్తగాత్రస్తు భరతః
స వాచా సజ్జమానయా।
కృతాంజలిరిదం వాక్యం
రాఘవం పునరబ్రవీత్॥
టీక:-
త్రస్త = భయపడిన; గాత్రస్తు = శరీరముతో; భరతః = భరతుడు; స = ఆ; వాచా = మాటలు; సజ్జమానయా = తొట్రుపడి; కృతాంజలిః = అంజలి ఘటించి; ఇదం = ఇట్లు; వాక్యం = మాటలను; రాఘవం = రామునిగూర్చి; పునః = మరల; అబ్రవీత్ = పలికెను
భావము:-
ఆ మాటలకు తన కోరిక నెరవేరని భరతుడు తొట్రుబాటుచెంది ధైర్యము కోల్పోయెను. అంజలి ఘటించి రామునికి మరల ఇట్లు చెప్పెను.
2.112.10.
అనుష్టుప్.
“రాజధర్మమనుప్రేక్ష్య
కులధర్మానుసంతతిమ్।
కర్తుమర్హసి కాకుత్స్థ
మమ మాతుశ్చ యాచనామ్॥
టీక:-
రాజధర్మమ్ = రాజధర్మము; అనుప్రేక్ష్య = జరుగవలెను కదా; కులధర్మ = కుల ధర్మము; అనుసంతతిమ్ = అవిచ్ఛిన్నముగా; కర్తుమ్ + అర్హసి = చేయుటకు తగినపని; కాకుత్థ్స = ఓ రామా; మమ = నా యొక్కయు; మాతుః = తల్లి యొక్కయు; చ = మఱియు; యాచనామ్ = ప్రార్థనను
భావము:-
“ఓ రామా! రాజధర్మము, కులధర్మము అవిచ్చిన్నముగా జరుగవలెననుకదా. నా ప్రార్థనను, నా తల్లి ప్రార్థనను మన్నింపుము.
2.112.11.
అనుష్టుప్.
రక్షితుం సుమహద్రాజ్యమ్
అహమేకస్తు నోత్సహే।
పౌరజానపదాంశ్చాపి
రక్తాన్రంజయితుం తథా॥
టీక:-
రక్షితుం = రక్షించుటకు; సుమహత్ = విశాలమైన; రాజ్యమ్ = రాజ్యమును; అహమ్ = నేను; ఏకస్తు = ఒక్కడను; న = లేదు; ఉత్సహే = సమర్థుడను; పౌరః = పౌరులను; జానపదాః = జానపదులను; చ = మఱియు; అపి = అయినను; రక్తాన్ = అనురాగముచే; రంజయితుం = సంతోషపెట్టుటకు; తథా = అట్లు.
భావము:-
ఒంటరినైన నేను విశాలమైన ఈ రాజ్యమును రక్షించుటకు, పౌరులను జానపదులను అనురాగముచే సంతోషపెట్టుటకును సమర్థుడను కాను.
2.112.12.
అనుష్టుప్.
జ్ఞాతయశ్చ హి యోధాశ్చ
మిత్రాణి సుహృదశ్చ నః।
త్వామేవ ప్రతివీక్షన్తే
పర్జన్యమివ కర్షకాః॥
టీక:-
జ్ఞాతయః = బం«ధువులు; చ = మఱియు; హి = కదా; యోధాః = సైనికులు; చ = మఱి.; మిత్రాణి = మిత్రులు; సుహృదః = హితాభిలాషులు; చ = మఱియు; నః = మన; త్వామ్ = నీవే; ఏవ = మాత్రమే; ప్రతివీక్షన్తే = ఎదురుచూచుచున్నారు; పర్జన్యమ్ = మేఘములకై; ఇవ = ఇవ; కర్షకాః = రైతులు
భావము:-
మన బంధువులు, సైనికులు, మిత్రులు, మన హితాభిలాషులు, అందరు భూమిని దున్నువారు మేఘములకై ఎదురుచూచునట్లు నీవే కావలెనని ఎదురుచూచుచున్నారు.
2.112.13.
అనుష్టుప్.
ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ!
స్థాపయ ప్రతిపద్య హి।
శక్తిమానసి కాకుత్స్థ!
లోకస్య పరిపాలనే”॥
టీక:-
ఇదం = ఈ; రాజ్యం = రాజ్యమును; మహాప్రాజ్ఞ = మహా బుద్ధిశాలీ; స్థాపయ = నిలబెట్టుము; ప్రతిపద్య = పాలించుటకు; హి = ఐనా; శక్తిమానసి = సమర్థుడవు; కాకుత్స్థ = రామా; లోకస్య = లోకమును; పరిపాలనే = పరిపాలించుటకు.
భావము:-
ఈ సువిశాలమైన రాజ్యమును నిలబెట్టుటకైనా, పరిపాలించుటకైనా ఈ లోకమును పాలించుటకైనా నీవే సమర్థుడవు.”
2.112.14.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా న్యపతద్భ్రాతుః
పాదయోర్భరతస్తదా।
భృశం సంప్రార్థయామాస
రామమేవ ప్రియంవదః॥
టీక:-
ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలుకుచూ; న్యపతత్ = పడెను; భ్రాతుః = సోదరుడు; పాదయోః = పాములపై; భరతః = భరతుడు; తదా = అటు పిమ్మట; భృశం = సత్వరముగా; సంప్రార్థయామాస = ఎంతో ప్రార్థించసాగెను; రామమ్ = రాముని; ఏవ = మాత్రమే; ప్రియంవదః = ప్రియముగా మాటలాడుట.
భావము:-
ప్రియముగా మాటలాడు ఆ భరతుడు, సోదరుడైన రాముని ఇట్లు పలకుచు అతని పాదములపై పడెను. పిమ్మట రాముని ఈ విదముగా పార్థించ సాగెను.
2.112.15.
అనుష్టుప్.
తమంకే భరతం కృత్వా
రామో వచనమబ్రవీత్।
శ్యామం నలినపత్రాక్షం
మత్తహంసస్వరం స్వయమ్॥
టీక:-
తమ్ = ఆ; అంకే = ఒడిలోనికి; భరతం = భరతుని; కృత్వా = తీసుకుని; రామః = రాముడు; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను; శ్యామం = శ్యామవర్ణములో ఉన్న; నలినపత్ర = తామర రేకుల వంటి; అక్షం = కన్నులు; మత్త = సంహృష్ట ఇతి అమరకోశః; హంస = హంస; స్వరం = కంఠధ్వనితో; స్వయమ్ = స్వయముగా.
భావము:-
భరతుని తన ఒడిలోనికి తీసుకొని, స్వయముగా సంహృష్ట హంస కంఠధ్వనితో తామర రేకుల వంటి కన్నులు, శ్యామ ఛాయ దేహము కల రాముడు ఇట్లు పలికెను.
2.112.16.
అనుష్టుప్.
“ఆగతా త్వామియం బుద్ధిః
స్వజా వైనయికీ చ యా।
భృశముత్సహసే తాత
రక్షితుం పృథివీమపి॥
టీక:-
ఆగతా = సిద్ధించినది; త్వామ్ = నీవు; ఇయం = ఈ; బుద్ధిః = ఉత్తమమైన బుద్ధి; స్వజా = సహజముగా; వైనయికీ = గురుశిక్షణ వలన; చ = ఇంకను; యా = ఏదైతే; భృశమ్ = సర్వవిధముల; ఉత్సహసే = సమర్థుడవు; తాత = తండ్రీ; రక్షితుం = రక్షించుటకు; పృథివీమ్ = రాజ్యమును; అపి = అయినప్పటికీ
భావము:-
నాయనా భరతా! నీకు సహజముగాను, గురుశిక్షణ వలన.. ఉత్తమమైన బుద్ధి ఉన్నది. దానిచే నీవు రాజ్యము పరిపాలించుటకైనా సర్వ సమర్థుడవే.
2.112.17.
అనుష్టుప్.
అమాత్యైశ్చ సుహృద్భిశ్చ
బుద్ధిమద్భిశ్చ మంత్రిభిః।
సర్వకార్యాణి సమ్మన్త్ర్తయ
సుమహన్త్యపి కారయ॥
టీక:-
అమాత్యైః = అమాత్యులతోను; చ = ఇంకను; సుహృద్భిః = మిత్రులతోను; చ = ఇంకను; బుద్ధిమద్భిః = బుద్ధిశాలతోను; చ = ఇంకను; మంత్రిభిః = మంత్రులతో; సర్వకార్యాణి = అన్ని పనులను; సమ్మన్త్ర్తయ = ఆలోచించి; సుమహన్తి = ఎంత పెద్దవి; అపి = ఐనను; సు కారయ = చక్కగా చేయించుము.
భావము:-
బుద్ధిశాలులతోను, అమాత్యులతోను, మిత్రులతోను, మంత్రులతోను.. కలిపి ఆలోచించి ఎంత పెద్ద కార్యములైనే అన్నింటినీ చక్కగా చేయించుము.
2.112.18.
అనుష్టుప్.
లక్ష్మీ చంద్రాదపేయాద్వా
హిమవాన్వా హిమం త్యజేత్।
అతీయాత్సాగరో వేలాం
న ప్రతిజ్ఞామహం పితుః॥
టీక:-
లక్ష్మీ = శోభ, వావిళ్ళ; చంద్రత్ = చంద్రుని; అయాత్ = తొలగిపోయిన తొలగిపోవచ్చును; వా = లేదా; హిమవాన్ = హిమవత్పర్వతమునందు; వా = లేదా; హిమం = మంచు; త్యజేత్ = పోయినను పోవచ్చును; అతీయాత్ = అతిక్రమించవచ్చును; సాగరః = సముద్రము; వేలాం = తీరమును; న = లేదు; ప్రతిజ్ఞామ్ = మాటను; అహం = నేను; పితుః = తండ్రి గారి.
భావము:-
చంద్రుని శోభ తొలగిపోయిన తొలగిపోవచ్చును. హిమవత్పర్వతమునందు మంచు లేకుండ పోయిన పోవచ్చును. సముద్రము తీరమును దాటిన దాటవచ్చును. నేను మాత్రము తండ్రి మాటను ఎట్టిపరిస్థితులలోను అతిక్రమించను.
2.112.19.
అనుష్టుప్.
కామాద్వా తాత లోభాద్వా
మాత్రాతుభ్యమిదం కృతమ్।
న తన్మనసి కర్తవ్యం
వర్తితవ్యం చ మాతృవత్॥
టీక:-
కామాత్ = కోరిక వల్ల; వా = కానీ; తాత = తండ్రీ; లోభాత్ = ఆశవల్లనో; వా = కానీ; మాత్రా తుభ్యమ్ = తల్లి అయిన కైకేయి; ఇదం = ఈ; కృతమ్ = చేయుట; న = లేదు; తత్ = ఆ; మనసి = మనస్సులో; కర్తవ్యం = కర్తవ్యము; వర్తితవ్యం = గౌరవించవలెను; చ = ఇంకా; మాతృవత్ = తల్లిగా
భావము:-
తండ్రీ! నీ తల్లి అయిన కైకేయి కోరిక వల్లనో, ఆశ వల్లనో, నీ కొరకై ఇది అంతా చేసినది. నీవు దానిని మనస్సులో ఉంచుకొనకూడదు. తల్లిగా ఆమెను గౌరవించవలెను.
2.112.20.
అనుష్టుప్.
ఏవం బ్రువాణం భరతః
కౌసల్యాసుతమబ్రవీత్।
తేజసాఽదిత్యసంకాశం
ప్రతిపత్ చంద్రదర్శనమ్॥
టీక:-
ఏవం = మాత్రమే; బ్రువాణం = మాటలను; భరతః = భరతుడు; కౌసల్యాసుతమ్ = కౌసల్య కుమారుడైన రాముని; అబ్రవీత్ = పలికెను; తేజసా = తేజస్సులో; ఆదిత్య = సూర్యునితో; సంకాశం = సమానమైన; ప్రతిపత్ = పాడ్యమినాటి; చంద్రదర్శనమ్ = చంద్ర దర్శనము
భావము:-
సూర్యునియొక్క మఱియు శుక్ల పక్ష పాడ్యమి నాటి చంద్రోదయ తేజస్సుతో సమాన తేజశ్శాలి రాముని మాటలు విని భరతుడు ఇట్లు చెప్పెను. అనగా శ్రీరామచంద్రులవారు ముందుకు సాగుటయేకాని వెనుదిరుగుట లేని మహాశూరుడు మఱియు లోకమునకు అంతకంతకు ఆహ్లాదము అభివృద్ధి పెంపొందించువాడు. ఎలాగునననగా తేజశ్శాలి ఐన సూర్యుడు ముందుకే వెనుకకు తిరుగడు కదా అలాగ మఱియు శుక్ల పక్ష పాడ్యమి నుండి చంద్రోదయ శోభ వృద్ధిచెందును అని తాత్పర్యము.
2.112.21.
అనుష్టుప్.
ఆధిరోహాఽర్య పాదాభ్యాం
పాదుకే హేమభూషితే।
ఏతేహి సర్వలోకస్య
యోగక్షేమం విధాస్యతః॥
టీక:-
ఆధిరోహ = తొడగికొనుము; ఆర్య = పూజ్యుడవైన రామా; పాదాభ్యాం = పాదములకు; పాదుకే = పాదుకలను; హేమభూషితే = బంగారముచే అలంకరించబడిన; ఏతే = ఈ పాదుకలు; హి = మాత్రమే; సర్వలోకస్య = సమస్త లోకములకు; యోగక్షేమం = యోగక్షేమములు; విధాస్యతః = సమకూర్చగలవు.
భావము:-
పూజ్యుడవైన రామా! బంగారముచే అలంకరించిన ఈ పాదుకలపై నీ పాదములు ఉంచుము. ఈ పాదుకలే సమస్త లోకమునకు యోగక్షేమములు సమకూర్చగలవు.
*గమనిక:-
యోగక్షేమమ్- యోగశ్చ క్షేమశ్చ తయోః సమాహారః ఇతి శబ్దకల్పదృమః. యోగము క్షేమములు సమాహారము లభించుట. యోగము అన అపూర్వ వస్తు లాభము, వావిళ్ళ. క్షేమము అన కుశలము మఱియు లబ్ద రక్షణము, అలబ్ద ప్రాప్తి యోగము, వావిళ్ళ.
2.112.22.
అనుష్టుప్.
సోఽధిరుహ్య నరవ్యాఘ్రః
పాదుకే హ్యవరుహ్య చ।
ప్రాయచ్ఛత్సుమహాతేజా
భరతాయ మహాత్మనే॥
టీక:-
సః = రాముడు; అధిరుహ్య = తొడిగికొని; నరవ్యాఘ్రః = నరశ్రేష్ఠుడైన; పాదుకే = పాదుకలను; హి = నిశ్చయాత్మకము; అవరుహ్య = మరల విడిచి; చ = ఇంకను; ప్రాయచ్ఛత్ = ప్రసాదించెను, మోనియర్-విలియమ్స్; సుమహాతేజా = గొప్ప తేజస్సు కలిగిన; భరతాయ = భరతునకు; మహాత్మనే = మహాత్ముడైన
భావము:-
మానవోత్తముడైన రాముడు పాదుకలను తొడిగికొని, మరల విడచెను. గొప్ప తేజశ్శాలైన రాముడు వాటిని మహాత్ముడైన భరతునకు ప్రసాదించెను.
2.112.23.
అనుష్టుప్.
స పాదుకే సంప్రణమ్య
రామం వచనమబ్రవీత్।
“చతుర్దశ హి వర్షాణి
జటాచీరధరో హ్యాహమ్॥
టీక:-
స పాదుకే = ఆ పాదులకు; సంప్రణమ్య = నమస్కరించి; రామం = రామునిగూర్చి; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = చెప్పెను; చతుర్దశ = పదునాలుగు; హి = తప్పక; వర్షాణి = సంవత్సరములు; జటాచీరధరో = జటలను, చీర = నారచీరలను; ధరః = ధరించువాడను; హి = మాత్రమే; అహమ్ = నేను.
భావము:-
భరతుడు పాదుకలకు నమస్కరించి, రామునితో ఇట్లు చెప్పెను “నేను జటలను, నారచీరలను మాత్రమే ధరించి పదునాలుగు సంవత్సరములు నివసించెదను.
2.112.24.
అనుష్టుప్.
ఫలమూలాశనో వీర
భవేయం రఘునందన।
తవాఽగమనమాకాంక్షాన్
వసన్వై నగరాద్బహిః॥
టీక:-
ఫల = పండ్లను; మూల = దుంపలను; అశనః = ఆహారముగా తినువాడను; వీర = వీరుడా; భవేయం = ఐ ఉండెదను; రఘునందన = రఘురామా; తవ = నీ యొక్క; ఆగమనమ్ = రాకకై; ఆకాంక్షాన్ = ఎదురుచూచుచు; వసన్వై = నివసించెదను; నగరాత్ = నగరమునకు; బహిః = వెలుపల, బయటనే.
భావము:-
ఫలమూలములనే తినుచు, నీ రాకకై ఎదురుచూచుచు నగరము వెలుపల నివసించుచు పదునాలుగు సంవత్సరములు గడిపెదను.
2.112.25.
అనుష్టుప్.
తవ పాదుకయోర్న్యస్త
రాజ్యతంత్రః పరంతప।
చతుర్దశే తు సంపూర్ణే
వర్షేఽహని రఘూత్తమ!॥
టీక:-
తవ = నీ యొక్క; పాదుకయోః = పాదుకలను; న్యస్త = ఉంచి; రాజ్యతంత్రః = రాజ్యపరిపాలనము చేయువాడను; పరంతప = శత్రుసంహారకుడా; చతుర్దశే = పదునాలుగు; తు = మాత్రమే; సంపూర్ణే = గడచిన మరుసటి దినము; వర్షే = సంవత్సరములు; అహని = దినమునందు; రఘూత్తమ = రఘురామా.
భావము:-
రాజ్యభారమునంతను నీ పాదుకలపై ఉంచి, పరిపాలించెదను. పదునాలుగు సంవత్సరములు గడిచిన మరుసటి దినమున రామా!
2.112.26.
అనుష్టుప్.
న ద్రక్ష్యామి యది త్వాం తు
ప్రవేక్ష్యామి హుతాశనమ్”।
తథేతి చ ప్రతిజ్ఞాయ
తం పరిష్వజ్య సాదరమ్॥
టీక:-
న = లేదు; ద్రక్ష్యామి = చూడగలుగుట; యది = ఒకవేళ; త్వాం = నిన్ను; తు = ఐనచో; ప్రవేక్ష్యామి = ప్రవేశిచెదను; హుతాశనమ్ = అగ్నిలోనికి; తథా = అట్లే; ఇతి = అని; చ = మఱి; ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞ చేసి; తమ్ = అతనిని; పరిష్వజ్య = ఆలింగనము చేసికొనెను; సాదరమ్ = ప్రేమపూర్వకముగా.
భావము:-
నీవు నాకు కనబడకపోయినచో, నేను అగ్నిలో ప్రవేశించెదను. అని శఫదము చేసి, రాముడు భరతుని మాటలకు అంగీకరించి, భరతుని ప్రేమపూర్వకముగా ఆలింగనము చేసికొని ఇట్లనెను.
2.112.27.
అనుష్టుప్.
“శత్రుఘ్నం చ పరిష్వజ్య
భరతం చేదమబ్రవీత్।
మాతరం రక్ష కైకేయీం
మా రోషం కురు తాం ప్రతి॥
టీక:-
శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; చ = కూడ; పరిష్వజ్య = కౌగిలించుకొని; భరతమ్ = భరతునిగూర్చి; చ = మఱి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను; మాతరం = తల్లిని; రక్ష = కాపాడు; కైకేయీం = కైకేయిని; మా= వద్దు; రోషం = కోపము; కురు = చేయుట; తామ్ = ఆమె; ప్రతి = ఎడల.
భావము:-
శత్రుఘ్నుని కూడ కౌగిలించుకొని, భరతునికి ఇట్లు చెప్పెను. “తల్లి కైకేయిని భద్రము. ఆమెపై కోపము చూపకుము.
2.112.28.
అనుష్టుప్.
మయా చ సీతయా చైవ
శప్తోఽసి రఘుసత్తమ।
ఇత్యుక్త్వాఽశ్రుపరీతాక్షో
భ్రాతరం విససర్జ హ॥
టీక:-
మయా = నా మీదను; చ = మఱియు; సీతయా = సీత మీదను; చ = కూడ; ఏవ = సహితము; శస్తోసి = ఒట్టుపెట్టుచున్నాను; రఘుసత్తమ = భరతా; ఇతి = అని; ఉక్త్వా = పలికి; అశ్రుపరీత = కన్నీళ్లు కార్చుచు; అక్షః = కన్నుల నుండి; భ్రాతరం = సోదరుడైన భరతునకు; విససర్జ హ = విడిచిపెట్టెను.
భావము:-
నా పైనను, సీత పైనను ఒట్టుపెట్టి చెప్పుచున్నాను” అని పలికి నేత్రముల నుండి కన్నీళ్లు కార్చుచు, భరతునకు వెళ్లుటకు అనుజ్ఞ ఇచ్చెను.
2.112.29.
జగతి.
స పాదుకే తే భరతః ప్రతాపవాన్
స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్।
ప్రదక్షిణం చైవ చకార రాఘవమ్
చకార తే చోత్తమనాగమూర్ధని॥
టీక:-
స = అతను; పాదుకే = పాదుకలను; తే = ఆ; భరతః = భరతుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; స్వలంకృతే = చక్కగా అలంకరింపబడిన; సంపరిపూజ్య = పూజించి; ధర్మవిత్ = ధర్మవేత్త అయిన; ప్రదక్షిణం= ప్రదక్షిణమును; చ = ఇంకను; ఏవ = చక్కగా; చకార = చేసి; రాఘవమ్ = రఘురామునికి; చకార = చేసిరి; తే = వారు; చ = ఇంకను; ఉత్తమ = ఉత్తమమైన; నాగమూర్ధని = ఏనుగుపై ఎక్కించెను.
భావము:-
ప్రతాపవంతుడు, ధర్మవేత్త అయిన భరతుడు. చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను పూజించి, రఘురామునకు ప్రదక్షిణము చేసి, ఆ పాదుకలను శ్రేష్ఠమైన ఏనుగుపై అధిరోహింపజేసెను.
2.112.30.
జగతి.
అథాఽనుపూర్వ్యా త్ప్రతినంద్య తం జనం
గురూంశ్చ మంత్రిప్రకృతీస్తథాఽనుజౌ।
వ్యసర్జయద్రాఘవవంశవర్ధనః
స్థిరః స్వధర్మే హిమవానివాచలః॥
టీక:-
అథ = అటు పిమ్మట; అనుపూర్వ్యాత్ = క్రమానుగతముగా; ప్రతినంద్య = అభినందించి; తం = ఆ; జనం = జనులను; గురూంశ్చ = గురువులను; చ = మఱియు; మంత్రి = మంత్రులను; ప్రకృతీః = ప్రజలను; తథా = అట్లు; అనుజః = భరతశత్రుఘ్నులను; వ్యసర్జయత్ = విడిచెను; రాఘవ = రాముడు; వంశవర్ధనః = వంశవర్ధనుడైన; స్థిరః = స్థిరముగా; స్వధర్మే = స్వధర్మముపై; హిమవాని = హిమవంతము; చ = అను; ఇవ = వలె; అచలః = పర్వతము.
భావము:-
స్వధర్మముపై హిమవత్పర్వతము వలె స్థిరముగా నిలబడిన ఆ రాముడు అచటకు వచ్చిన గురువులను, మంత్రులను, ఇతర రాజపరివారములను, భరతశత్రుఘ్నులను యథార్హక్రమముగా అభినందించి వారిని సాగనంపెను.
2.112.31.
త్రిష్టుప్.
తం మాతరో బాష్పగృహీతకంఠ్యో
దుఃఖేన నామంత్రయితుం హి శేకుః।
స త్వేవ మాత్రఽరభివాద్య సర్వా
రుదన్కుటీం స్వాం ప్రవివేశ రాఘవః॥
టీక:-
తం = ఆ రామునికి; మాతరః = తల్లులకు; బాష్పగృహీత = కన్నీళ్లు అడ్డుపడుటచే; కంఠ్యో = కంఠములు; దుఃఖేన = దుఃఖముతో; ఆమంత్రయితుం హి = వీడ్కోలు పలుకుటకు; శేకుః = చెప్పుట; సః = అతడు; తు = మరియు; ఏవ = మాత్రమే; మాత్రః = తల్లులు; అభివాద్య = నమస్కరించి; సర్వాః = అందరికీ; రుదన్ = ఏడ్చుచు;కుటీం = పర్ణశాలలోనికి; స్వాం = తన యొక్క; ప్రవివేశ = ప్రవేశించెను; రాఘవః = రాముడు
భావము:-
దుఃఖార్తులైన తల్లులు వారి కంఠములకు కన్నీళ్లు అడ్డుపడుటచే రామునకు వీడ్కోలు మాటలు చెప్పజాలకపోయిరి. అపుడు రాముడే తల్లులందరికీ నమస్కరించి. దుఃఖించుచు, తన పర్జ్ణశాలలోనికి వెళ్లిపోయెను.
2.112.32.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ద్వాదశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; ద్వాదశోత్తరశతతమః [112] = నూటపన్నెండవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [111] నూటపన్నెండవ సర్గ సంపూర్ణము.
2.113.1.
అనుష్టుప్.
తతః శిరసి కృత్వా తు
పాదుకే భరతస్తదా।
ఆరురోహ రథం హృష్టః
శత్రుఘ్నేన సమన్వితః॥
టీక:-
తతః = అటు పిమ్మట; శిరసి = శిరస్సుపై; కృత్వా = ఉంచుకొని; తు = విశేషముగా; పాదుకే = పాదుకలను; భరతః = భరతుడు; తదా = అట్లు; ఆరురోహ = ఎక్కెను; రథం = రథమును; హృష్టః = సంతోషించుచు; శత్రుఘ్నేన = శత్రుఘ్నునితో; సమన్వితః = సహితుడైన
భావము:-
పిమ్మట శత్రుఘ్న సహితుడైన భరతుడు, రాముని పాదుకలను శిరస్సుపై ఉంచుకొని, సంతోషముగా రథమును ఎక్కెను.
2.113.2.
అనుష్టుప్.
వసిష్ఠో వామదేవశ్చ
జాబాలిశ్చ దృఢవ్రతః।
అగ్రతః ప్రయయు స్సర్వే
మంత్రిణో మంత్రపూజితాః॥
టీక:-
వసిష్ఠః = వసిష్ఠుడు; వామదేవః = వామదేవుడు; చ = మఱియు; జాబాలిః = జాబాలి; చ = మఱియు; దృఢవ్రతః = గట్టి నియమములు కలవారు, నిష్టాగరిష్ఠులు; అగ్రతః = ముందుగా; ప్రయయుః = వెళ్లిరి; సర్వే = అందరును; మంత్రిణః = మంత్రులు; మంత్రపూజితాః = గౌరవింపబడు మంత్రాగము గలవారు
భావము:-
నిష్టాగరిష్ఠులైన వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి మఱియు మంత్రాగనిష్ణాతులైన మంత్రులు, అందరూ ముందు సాగిపోవుచుండిరి.
2.113.3.
అనుష్టుప్.
మందాకినీం నదీం రమ్యాం
ప్రాంముఖాస్తే యయుస్తదా।
ప్రదక్షిణం చ కుర్వాణాః
చిత్రకూటం మహాగిరిమ్॥
టీక:-
మందాకినీం = గంగా; నదీమ్ = నది వైపు; రమ్యాం = అందమైన; ప్రాంముఖాః = తూర్పు దిక్కునకు అభిముఖులై; తే = వారు; యయుః = వెళ్లిరి; తదా = అప్పుడు; ప్రదక్షిణం = ప్రదక్షిణముగా; చ = మఱి; కుర్వాణాః = ఆచరించి; చిత్రకూటం = చిత్రకూటమునకు; మహాగిరిమ్ = మహాపర్వతమునకు
భావము:-
మనోహరమైన గంగానది వైపు తూర్పుముఖముగా వెళ్ళి, చిత్రకూట మహాపర్వతమునకు ప్రదక్షిణము ఆచరించిరి.
2.113.4.
అనుష్టుప్.
పశ్యంధాతుసహస్రాణి
రమ్యాణి వివిధాని చ।
ప్రయయౌ తస్య పార్శ్వేన
ససైన్యో భరతస్తదా॥
టీక:-
పశ్యన్ = చూచెను; ధాతుః = ధాతువులు; సహస్రాణి = వేల కొలదీ; రమ్యాణి = సుందరమైన; వివిధాని చ = అనేక విధములైన; చ = ఐన; ప్రయయౌ = వెళ్లెను; తస్య = ఆ; పార్శ్వన = ప్రక్కన; స = కూడి; సైన్యః = సైన్యముla; భరతః = భరతుడు; తదా = అప్పుడు.
భావము:-
వారందరు వేలకొలదీ సుందరమైన రకరకములైన ధాతువులను చూచురి, అతడు సైన్యముతో కూడా ఆ చిత్రకూట పర్వతము ప్రక్కనుండి ప్రయాణము సాగించెను.
2.113.5.
అనుష్టుప్.
అదూరాచ్చిత్రకూటస్య
దదర్శ భరతస్తదా।
ఆశ్రమం యత్ర స మునిః
భరద్వాజః కృతాలయః॥
టీక:-
అదూరాత్ = సమీపమునందు; చిత్రకూటస్య = చిత్రకూటమునకు; దదర్శ = చూచెను; భరతః = భరతుడు; తదా = అప్పుడు; ఆశ్రమం = ఆశ్రమమును; యత్ర = ఎక్కడైతే; స= ఆ; మునిః = మునివర్యుడు; భరద్వాజః = భరద్వాజ మహర్షి; కృతాలయః = నివసముగా చేసుకున్న.
భావము:-
అపుడు భరతుడు చిత్రకూటమునకు సమీపమునందు భరద్వాజమహర్షి నివసించు ఆశ్రమమును చూచెను.
2.113.6.
అనుష్టుప్.
స తమాశ్రమమాగమ్య
భరద్వాజస్య బుద్ధిమాన్।
అవతీర్య రథాత్పాదౌ
వవందే భరతస్తదా॥
టీక:-
స = ఆ; తమ్ = అటువంటి; ఆశ్రమమ్ = ఆశ్రమమునకు; ఆగమ్య = చేరి; భరద్వాజస్య = భరద్వాజుని యొక్క; బుద్ధిమాన్ = బుద్ధిశాలి; అవతీర్య = దిగి; రథాత్ = రథము నుండి; పాదౌ = పాదములకు; వవందే = నమస్కరించెను; భరతః = భరతుడు; తదా = అప్పుడు.
భావము:-
బుద్ధిశాలియైన ఆ భరతుడు.. భరద్వాజుని ఆశ్రమమును చేరి, రథము నుండి దిగి, ఆ మహాముని పాదములకు నమస్కరించెను.
2.113.7.
అనుష్టుప్.
తతో హృష్టో భరద్వాజో
భరతం వాక్యమబ్రవీత్।
“అపి కృత్యం కృతం తాత
రామేణ చ సమాగతమ్”॥
టీక:-
తతః = అటు పిమ్మట; హృష్టః = సంతోషముతో; భరద్వాజః = భరద్వాజ మహర్షి; భరతమ్ = భరతునిగూర్చి; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = చెప్పెను; అపి = అయినదా; కృత్యం = కార్యము; కృతమ్ = పూర్తి చేయుట; తాత = నాయనా; రామేణ = రామునితో; చ = ఇంకా; సమాగతమ్ = కలియుట.
భావము:-
భరతుని చూచి సంతోషించిన భరద్వాజుడు. “నీవు వెళ్ళిన పని పూర్తియైనదా? రాముని కలిసితివా” అని అడిగెను.
2.113.8.
అనుష్టుప్.
ఏవముక్తస్స తు తతో
భరద్వాజేన ధీమతా।
ప్రత్యువాచ భరద్వాజం
భరతో ధర్మవత్సలః॥
టీక:-
ఏవమ్ = ఆవిధముగా; ఉక్తః = చెప్పబడిన; స = ఆ; తు = పూరణార్థం; తతః = పిమ్మట; భరద్వాజేన = భరద్వాజుని చేత; ధీమతా = ధీమంతుడైన; ప్రత్యువాచ = సమాధానము పలికెను; భరద్వాజం = భరద్వాజునితో; భరతః = భరతుడు; ధర్మవత్సలః = ధర్మబద్దుడు.
భావము:-
ధీమంతుడైన భరద్వాజుని మాటలు విని, ధర్మాత్ముడైన భరతుడు భరజ్వాజమునితో ఇట్లు పలికెను.
2.113.9.
అనుష్టుప్.
స యాచ్యమానో గురుణా
మయా చ దృఢవిక్రమః।
రాఘవః పరమప్రీతో
వసిష్ఠం వాక్యమబ్రవీత్॥
టీక:-
స = ఆ; యాచ్యమానః = ప్రార్థింపబడి; గురుణా = గురువుచేత; మయా = నా చేత; చ = మఱియు; దృఢవిక్రమః = దృఢమైన పరాక్రమము గల; రాఘవః = రాముడు; పరమప్రీతః = సంతోషించి; వసిష్ఠం = వసిష్ఠునితో; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = చెప్పెను
భావము:-
గట్టి పరాక్రమము గల ఆ రాముని గురువైన వసిష్ఠుడు మఱియు నేను ప్రార్ధింపగా. రఘురాముడు మిక్కిలి సంతోషించి వసిష్ఠునితో ఇట్లు చెప్పెను.
2.113.10.
అనుష్టుప్.
“పితుః ప్రతిజ్ఞాం తామేవ
పాలయిష్యామి తత్త్వతః।
చతుర్దశ హి వర్షాణి
యా ప్రతిజ్ఞా పితుర్మమ”॥
టీక:-
పితుః = తండ్రి చేసిన; ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞలనే; తామ్ = వానిని; ఏవ = మాత్రమే; పాలయిష్యామి = పాలించెదను; తత్త్వతః = యథాతథముగ; చతుర్దశ = పాదునాలుగు; హి = ఐన; వర్షాణి = సంవత్సరములు; యా = ఏదైతే; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞచే; పితుః = తండ్రి; మమ = నా యొక్క
భావము:-
”పదునాలుగు సంవత్సరములు నేను అరణ్యములో ఉండవలెనని నా తండ్రి చేసిన ప్రతిజ్ఞనే యథాతథముగ పాలించెదను.”
2.113.11.
అనుష్టుప్.
ఏవముక్తో మహాప్రాజ్ఞో
వసిష్ఠః ప్రత్యువాచ హ।
వాక్యజ్ఞో వాక్యకుశలం
రాఘవం వచనం మహత్॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తః = పలికబడిన; మహాప్రాజ్ఞః = గొప్ప పండితుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; ప్రత్యువాచ హ = సమాధానమిచ్చెను; వాక్యజ్ఞః = మాటలు చెప్పుటలో సమర్థుడు అయిన; వాక్యకుశలం = మాటలలో నేర్పరి అయిన; రాఘవమ్ = రామునిగూర్చి; వచనమ్ = మాటలను; మహత్ = గొప్పవైన
భావము:-
మహాపండితుడు, మాటలు చెప్పుటలో సమర్థుడు అయిన వసిష్ఠుడు ఆ మాటలు విని, మాటలలో నేర్చరియైన రామునితో గొప్పవైన పలుకులతో ఇట్లు చెప్పెను.
2.113.12.
అ నుష్టుప్.
“ఏతే ప్రయచ్ఛ సంహృష్టః
పాదుకే హేమభూషితే।
అయోధ్యాయాం మహాప్రాజ్ఞ
యోగక్షేమకరే తవ”॥
టీక:-
ఏతే = అవి; ప్రయచ్ఛ = ఇమ్ము; సంహృష్టః = సంతోషముతో; పాదుకే = పాదుకలను; హేమభూషితే = బంగారముచే అలంకరింపబడిన; అయోధ్యాయాం =అయోధ్యా నగరములో; మహాప్రాజ్ఞ = గొప్ప బుద్ధిశాలీ; యోగక్షేమకరే = యోగక్షేమములను సమకూర్చును; తవ = నీ యొక్క.
భావము:-
”మహా బుద్ధిశాలి రామా! నీవు బంగారముచే అలంకరింపబడిన ఈ పాదుకలను సంతోష పూర్వకముగా ఇమ్ము. అవి ఆయోధ్యాపురి ప్రజల యోగక్షేమములను సమకూర్చును.”
2.113.13.
అనుష్టుప్.
ఏవముక్తో వసిష్ఠేన
రాఘవః ప్రాంముఖః స్థితః।
పాదుకే హ్యధిరుహ్యైతే
మమ రాజ్యాయ వై దదౌ॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తః = పలుకబడగా; వసిష్ఠేన = వసిష్ఠుని చేత; రాఘవః = రాముడు; ప్రాంముఖః = తూర్పు దిక్కునకు; స్థితః = తిరిగి; పాదుకే = పాదులకను; హి = చక్కగా; అధిరుహ్యైతే = తొడుగుకొని; మమ = నాకు; రాజ్యాయ = రాజ్యము నడుపుటకై; వై = తప్పక; దదౌ = ఇచ్చెను.
భావము:-
వసిష్ఠుని మాటలు విని రాముడు తూర్పుదిక్కుకు తిరిగి ఈ పాదుకలు తొడుగుకొని, రాజ్యము నడుపుటకై వీటిని నాకు ఇచ్చెను.
2.113.14.
అనుష్టుప్.
నివృత్తోఽహమనుజ్ఞాతో
రామేణ సుమహాత్మనా।
అయోధ్యామేవ గచ్ఛామి
గృహీత్వా పాదుకే శుభే”॥
టీక:-
నివృత్తః = వెనుకకు; అహమ్ = నేను; అనుజ్ఞాతః = అనుజ్ఞ పొంది; రామేణ = రాముని చేత; సుమహాత్మనా = మహాత్ముడైన; అయోధ్యామేవ = అయోధ్యకు; గచ్ఛామి = వెళ్లుచున్నాను; గృహీత్వా = స్వీకరించి; పాదుకే = పాదుకలను; శుభే = మంగళకరములైన.
భావము:-
మహాత్ముడైన రాముని అనుజ్ఞ పొంది, మంగళ కరములైన ఈ పాదుకలతో నేను మరల అయోధ్యకు వెళ్లుచున్నాను.”
2.113.15.
అనుష్టుప్.
ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం
భరతస్య మహాత్మనః।
భరద్వాజః శుభతరం
మునిర్వాక్యమువాచ తమ్॥
టీక:-
ఏతత్ = అటువంటి; శ్రుత్వా = విని; శుభం = మంగళకరమైన; వాక్యం = మాటలను; భరతస్య = భరతునితో; మహాత్మనః = మహాత్ముడైన; భరద్వాజః = భరద్వాజుడు; శుభతరమ్ = అధికముగా మంగళకరమైన; మునిః = మహర్షి; వాక్యమ్ = మాటలను; ఉవాచ = పలికెను; తమ్ = అతనితో
భావము:-
మహాత్ముడైన భరతుని మంగళకరమైన మాటలు విని, భరద్వాజ మహర్షి మిక్కిలి మంగళకరమైన మాట పలికెను.
2.113.16.
అనుష్టుప్.
“నైతచ్చిత్రం నరవ్యాఘ్ర!
శీలవృత్తవతాం వర।
యదార్యం త్వయి తిష్ఠేత్తు
నిమ్నే సృష్టమివోదకమ్॥
టీక:-
న = లేదు; ఏతత్ = ఇది; చిత్రం = ఆశ్చర్యము; నరవ్యాఘ్ర = నరశ్రేష్ఠుడా; శీలవృత్తవతాం = మంచి శీలము కలవారిలో; వర = శ్రేష్ఠుడు; యత్ = ఏదైతే; ఆర్యమ్ = పూజ్య లక్షణములు; త్వయి = నీలో; తిష్ఠేత్ = ఉండునది; తు = ఐన; నిమ్నే = పల్లములో; సృష్ఠమ్ = నిలచిన; ఇవ = వలె; ఉదకమ్ = నీరు.
భావము:-
నరశ్రేష్టుడా భరతుడా! మంచి శీలము, ఉత్తమమైన చరిత్రము కలవారిలో శ్రేష్టుడా! నీరు పల్లములో నిలచి ఉండునట్లు, పూజ్యమైన లక్షణములన్నియు నీయందు ఉండుటలో ఆశ్చర్యము లేదు.
2.113.17.
అనుష్టుప్.
అమృతః స మహాబాహుః
పితా దశరథస్తవ।
యస్య త్వమీదృశః పుత్రో
ధర్మజ్ఞో ధర్మవత్సలః॥
టీక:-
అమృతః = మరణించనివారు; స = ఆ; మహాబాహుః = మహా బలపరాక్రమవంతుడు; పితా = తండ్రి; దశరథః = దశరథ మహారాజు; తవ = నీ వంటి; యస్య = ఏ విధముగా; త్వమ్ = నీవు; ఈదృశః = ఇటువంటివానిని; పుత్రః = కుమారుడుగా కలవాడు; ధర్మజ్ఞః = ధర్మము తెలిసినవాడు; ధర్మవత్సలః = ధర్మమునందు ఆసక్తి కలవాడు;
భావము:-
ధర్మజ్ఞుడు, ధర్మమునందు ఆసక్తి కలవాడు అయిన నీవంటి వానిని పుత్రునిగా బడసిన నీ తండ్రి మహాబలశాలి దశరథ మహారాజునకు మరణంలేదు. ఆయన అమరుడే.
2.113.18.
అనుష్టుప్.
తమృషిం తు మహాత్మానమ్
ఉక్తవాక్యం కృతాంజలిః।
ఆమంత్రయితుమారేభే
చరణావుపగృహ్య చ॥
టీక:-
తమ్ = ఆ; ఋషిమ్ = భరద్వాజుని; తు = ఐన; మహాత్మానమ్ = మహాత్మునిచే; ఉక్త = పలికబడిన; వాక్యమ్ = మాటలను; కృతాంజలిః = అంజలి బద్ధులై; ఆమంత్రయితుమ్ = వీడ్కొలు తీసుకొనుట; ఆరేభే = ఆరంభించెను; చరణ = పాదములను; ఉపగృహ్య = స్పృశించి; చ = మఱియు.
భావము:-
మహాత్ముడైన ఆ భరద్వాజుని మాటలు విని, భరతుడు అంజలి ఘటించి అతని పాదములు స్పృశించి నమస్కరించుచు, బయలుదేరుటకు అనుజ్ఞ కోరెను.
2.113.19.
అనుష్టుప్.
తతః ప్రదక్షిణం కృత్వా
భరద్వాజం పునః పునః।
భరతస్తు యయౌ శ్రీమాన్
అయోధ్యాం సహ మంత్రిభిః॥
టీక:-
తతః = అప్పుడు; ప్రదక్షిణం = ప్రదక్షిణ పూర్వకముగా; కృత్వా = ఆచరించి; భరద్వాజం = భరద్వాజునకు; పునః పునః = మరల మరల; భరతః = భరతుడు; తు = మరియు; యయౌ = వెళ్లెను; శ్రీమాన్ = శ్రీమంతుడైన; అయోధ్యాం = అయోధ్యకు; సహ = వెంటరాగా; మంత్రిభిః = మంత్రులు.
భావము:-
శ్రీమంతుడైన భరతుడు, భరద్వాజునకు అనేక పర్యాయములు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి, మంత్రులతో అయోధ్యకు వెళ్ళెను.
2.113.20.
అనుష్టుప్.
యానైశ్చ శకటైశ్చైవ
హయైర్నాగైశ్చ సా చమూః।
పునర్నివృత్తా విస్తీర్ణా
భరతస్యానుయాయినీ॥
టీక:-
యానైః = పల్లకీలతోను; చ = మఱియు; శకటైః = బండ్లతోను; చ = మఱియు; ఏవ = అటులనే; హయైః = గుర్రములతోను; నాగైః = గజములతోను; చ = మఱియు; సా = ఆ; చమూః = సేనలు; పునః = మరల; నివృత్తా = మరలెను; విస్తీర్ణా = విశాలమైన; భరతస్య = భరతుని యొక్క; అనుయాయినీ = అనుసరించి వెళ్లెను.
భావము:-
విశాలమైన ఆ భరతుని సేనలు పల్లకీలు, బండ్లు, అశ్వములు, గజములతోను అతనిని అనుసరించి తిరిగి అయోధ్య వైపు మరలెను.
2.113.21.
అనుష్టుప్.
తతస్తే యమునాం దివ్యాం
నదీం తీర్త్వోర్మిమాలినీమ్।
దదృశుస్తాం పున స్సర్వే
గంగాం శుభజలాం నదీమ్॥
టీక:-
తతః = అటు పిమ్మట; తే = వారు; యమునామ్ = యమునను; దివ్యాం = శ్రేష్ఠమైన; నదీం = నది యొక్క; తీర్త్వా = దాటి; ఊర్మి = అలల; మాలినీమ్ = పంక్తులతో నిండిన దానిని; దదృశుః = చూచిరి; తాం = ఆ; పునః = మరల; సర్వే = అందరును; గంగామ్ = గంగను; శుభజలామ్ = పవిత్రములైన జలములుకలదానిని; నదీమ్ = నదిని.
భావము:-
పిమ్మట వారందరు నిండా అలల వరుసలు గల శ్రేష్ఠమైన యమునా నదిని దాటిరి. వారు మరల పవిత్రములైన జలములు గల ఆ గంగానదిని చూచిరి.
2.113.22.
అనుష్టుప్.
తాం రమ్యజల సంపూర్ణాం
సంతీర్య సహబాంథవః।
శృంగిబేరపురం రమ్యం
ప్రవివేశ ససైనికః।
శృంగిబేరపురాద్భూయః
అయోధ్యాం సందదర్శ హ॥
టీక:-
తాం = ఆ గంగానదిని; రమ్య = ఒప్పిదమైన, శబ్దరత్నాకరము; జల = నీటితో; సంపూర్ణామ్ = నిండినఉన్నది; సంతీర్య = దాటి; సహబాంథవః = బంధువులతోను; శృంగిబేరపురం = శృంగిబేరపురమును; రమ్యం = సుందరమైన; ప్రవివేశ = ప్రవేశించెను; ససైనికః = సైనికులతోను; శృంగిబేరపురాత్ = శృంగిబేర పురము నుండి; భూయః = మరల; అయోధ్యాం = అయోధ్యా నగరమును; సందదర్శ హ = చూచెను.
భావము:-
భరతుడు బంధువులతోను, సైనికులతోను కలిసి చక్కటినీరు గల ఆ గంగానదిని దాటి, సుందరమైన శృంగిబేరపురమును ప్రవేశించెను. శృంగిబేరపురము నుండి బయలుదేరి వెడలి అయోధ్యానగరమును దర్శించెను.
2.113.23.
అనుష్టుప్.
అయోధ్యాం చ తతో దృష్ట్వా
పిత్రా భ్రాత్రా వివర్జితామ్।
భరతో దుఃఖ సంతప్తః
సారథిం చేదమబ్రవీత్॥
టీక:-
అయోధ్యాం = అయోధ్యా నగరమును; చ = ఇంకా; తతః = తరువాత; దృష్ట్వా = చూచి; పిత్రా = తండ్రిగారు; భ్రాత్రా = అన్నగారు; వివర్జితామ్ = లేనటువంటి; భరతః = భరతుడు; దుఃఖ = దుఋఖముతో; సంతప్తః = పీడితుడై; సారథిమ్ = సారథితో; చ = మఱి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
తండ్రి, అన్నగారు లేని అయోధ్యను చూడగానే దుఃఖముచేత పీడితుడై భరతుడు సారథితో ఇట్లనెను.
2.113.24.
అనుష్టుప్.
సారథే పశ్య విధ్వస్తా
సాఽయోధ్యా న ప్రకాశతే।
నిరాకారా నిరానందా
దీనా ప్రతిహతస్వరా॥
టీక:-
సారథే = సారథీ సుమంతా; పశ్య = చూడుము; విధ్వస్తా = చెడిపోయి; సా = ఆ; అయోధ్యా = అయోధ్యా నగరము; న = లేదు; ప్రకాశతే = ప్రకాశించుట; నిరాకారా = ఆకారహీనమై; నిరానందా = ఆనంద హీనమై; దీనా = దైన్యముతో; ప్రతిహత = కొట్టబడిన; స్వరా = స్వరముకలదైన.
భావము:-
సారథీ సుమంత! చూడవయ్యా! మన అయోధ్యా నగరము పూర్తిగా చెడిపోయి, రూప రహితమై, ఆనందహీనమై, దైన్యముతో, రుద్ధమైన కంఠస్వరములతో, ఏ కళాకాంతులులేక ఉన్నది.
2.113.25.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే త్రయోదశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; త్రయోదశోత్తరశతతమః [113] = నూటపదమూడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [113] నూటపదమూడవ సర్గ సంపూర్ణము.
2.114.1.
అనుష్టుప్.
స్నిగ్ధ గంభీర ఘోషేణ
స్యందనే నోపయాంప్రభుః।
అయోధ్యాం భరతః క్షిప్రం
ప్రవివేశ మహాయశాః॥
టీక:-
స్నిగ్ధ = మృదువైన; గంభీర = గంభీరమైన; ఘోషేణ = ధ్వని గల; స్యందనేన = రథముపై; ఉపయాన్ = ప్రయాణము చేసి; ప్రభుః = ప్రభువు; అయోధ్యాం = అయోధ్యలోనికి; భరతః = భరతుడు; క్షిప్రం = శీఘ్రముగా; ప్రవివేశ = ప్రవేశించెను; మహాయశాః = మహాహశస్సు కలిగిన
భావము:-
భరతుడు. మృదువైన గంభీర ధ్వని గల రథముపై ప్రయాణము చేసి వేగముగా అయోధ్యలోనికి ప్రవేశించెను.
*గమనిక:-
  దశరథుడు గాని, రాముడు గాని లేక అయోధ్యయొక్క దుస్థితి, ఇలా ప్రవేశించిన భరతునికి, ఎలా కనబడుచున్నదో 2వ శ్లోకము నుండి 20వ శ్లోకము వరకు (19 శ్లోకములలోనూ) వర్ణించబడినది.
2.114.2.
అనుష్టుప్.
బిడాల ఉలూక చరితామా
లీన నర వారణామ్।
తిమిర అభ్యాహతాం కాళీమ్
అప్రకాశాం నిశామివ॥
టీక:-
బిడాల = పిల్లులు; ఉలూక = గుడ్లగూబలు; చరితామ్ = సంచరించబడినది; ఆలీన = అణగి మెసలుచున్న; నర = మనుష్యులు; వారణామ్ = ఏనుగులు; తిమిర = చీకటి; అభ్యాహతాం = ఆవరించిన, ఆప్టే; కాళీమ్ = నల్లని; అప్రకాశాం = వెలుగు ఏమాత్రము లేని; నిశామ్ = రాత్రి; ఇవ = వలె
భావము:-
ఆ అయోధ్యను చూస్తుంటే ఎక్కడ చూసినా పిల్లులు, గుడ్లగూబలు తిరుగుచుండెను. మనుష్యులు, ఏనుగులు అణగి మెసలుచుండెను. వెలుగు ఏమాత్రం లేని చీకటి ఆవరించిన నల్లని రాత్రి వలె ఉండెను.
2.114.3.
అనుష్టుప్.
రాహు శత్రోః ప్రియాం పత్నీం
శ్రియా ప్రజ్వలిత ప్రభామ్।
గ్రహేణ అభ్యుత్థితేన ఏకాం
రోహిణీమివ పీడితామ్॥
టీక:-
రాహుశత్రోః ప్రియాంపత్నీం = రోహిణీ నక్షత్రము; శ్రియా = శ్రీమంతమై; ప్రజ్వలిత = ప్రకాశించుచున్న; ప్రభామ్ = కాంతి గలది; గ్రహేణ = గ్రహము చేత; అభ్యుత్థేన = ఎదురుగా నిలచిన; ఏకాం = ఒంటరిగా; రోహిణీమ్ = రోహిణిని; ఇవ = వలె; పీడితామ్ = పీడింపబడినది
భావము:-
అయోధ్యానగరమును చూస్తుంటే అది పట్టపగలైనా, తేజోవంతమైన ప్రకాశంతో శ్రీమంతమై ఉండు రోహిణీ నక్షత్రము, తన ఎదురుగానే తన భర్తను రాహువనే ఆ కౄర గ్రహము మింగేస్తుంటే బాధతో బాధాతప్తమైనట్లు, నైరాశ్యముగా కనబడుచున్నది
*గమనిక:-
 రాహుశత్రోః ప్రియాంపత్నీం = రోహిణీ, వివరణ. రాహువుకు శత్రువైన చంద్రునికి ప్రియమైన భార్య
2.114.4.
అనుష్టుప్.
అల్పః ఉష్ణక్షుబ్ధసలిలాం
ఘర్మోత్తప్త విహంగమామ్।
లీన మీన ఝష గ్రాహాం
కృశాం గిరి నదీమివ॥
టీక:-
అల్ప = స్వల్పమైన; ఉష్ణ = ఎండకు; క్షుబ్ధ = పీడింపబడిన; సలిలాం = జలముతో; ఘర్మ = ఎండకు; ఉత్తప్త = మిక్కిలి బాధపడుచున్న; విహంగమామ్ = పక్షులన్నీ; లీన = తరిగిపోయిన; మీన = చేపలు; ఝష = పెద్ద చేపలు; గ్రాహాం = మొసళ్లు; కృశాం = కృశించిన; గిరినదీమ్ = సెలయేఱుల, పర్వతపై ప్రవహించు ప్రవాహము; ఇవ = వలె.
భావము:-
ఎండ వేడికి ఆవిరైపోయి స్వల్పమైన జలమే ఉండుటచే ఎండకు మిక్కిలి బాధ పడుచున్న పక్షులవలె, తరిగిపోయిన చేపలు, పెద్దచేపలు మొసళ్ళుతో ఉన్న కృశించిన సెలయేఱుల వలె ఆ అయోధ్య శోభావిహీనమై కనబడుచుండెను.
2.114.5.
అనుష్టుప్.
విధూమామ్ ఇవ హేమాభామ్
అధ్వరాగ్నేః సముత్థితామ్।
హవి రభ్యుక్షితాం పశ్చా
చ్ఛిఖాం విప్రళయం గతామ్॥
టీక:-
విధూమామ్ = ధూమము లేకపోవుటచే; ఇవ = వలె; హేమాభామ్ = బంగారమువలె; అధ్వరా = యజ్ఞమునందలి; అగ్నేః = అగ్ని; సముత్థితామ్ = పైకి ఎగురుచు; హవిః = హవిస్సు వేయగనే; అభ్యుక్షితాం = ఆరిపోయిన; పశ్చాత్ = వెంటనే; శిఖాం = అగ్ని శిఖ వలె; విప్రళయం గతామ్ = శోభావిహీనమై ఉండెను
భావము:-
ఏమాత్రం పొగ లేకుండా బంగారములా పసుపు పచ్చగా వెలిగిపోతుండగా, హవిస్సు వేయగనే ఆణిపోయిన యజ్ఞము గుండములోని అగ్నిశిఖ వలె, దశరథమహారాజు ఉండగా, శ్రీరాముడు నగరంలో ఉండగా మహోజ్వలంగా వెలిగిపోయిన ఆ అయోధ్య ఇప్పుడు శోభావిహీనమై అణిగిపోయినట్లు ఉండెను.
2.114.6.
అనుష్టుప్.
విధ్వస్త కవచాం రుగ్ణ
గజ వాజి రథ ధ్వజామ్।
హత ప్రవీరామ్ ఆపన్నాం
చమూమ్ ఇవ మహాఽహవే॥
టీక:-
విధ్వస్త = బ్రద్దలైన; కవచాం = కవచములు; రుగ్ణ = విరిగిపోయిన; గజ = ఏనుగులు; వాజి = గుఱ్ఱములు; రథ = రథములు; ధ్వజామ్ = ధ్వజములు; హత = మరణించిన; ప్రవీరామ్ = మహా వీరులతో; ఆపన్నాం = ఆపదలపాలైన; చమూమ్ = సేన; ఇవ = వలె; మహా = గొప్పదైన; ఆహవే = యుద్ధములో.
భావము:-
ఘోర యుద్ధమునందు కవచములన్నీ బద్దలైపోగా, ఏనుగులు, గుఱ్ఱములు, రథములు దెబ్బతినగా, ధ్వజములు విరిగి పడిపోగా, ఉత్తమ వీరులందరు మరణించగా గొప్ప ఆపదలో పడిన సైన్యము వలె ఆ అయోధ్యానగరము పరమ భయంకరముగా కనబడుచుండెను.
2.114.7.
అనుష్టుప్.
స ఫేనాం స స్వనాం భూత్వా
సాగరస్య సముత్థితామ్।
ప్రశాంత మారుతోద్భూతాం
జలోర్మిమివ నిస్స్వనామ్॥
టీక:-
స = కలిగిన; ఫేనామ్ = నురుగలు; స= లేచి; స్వనాం = ద్వనిలు; భూత్వా = అయి; సాగరస్య = సముద్రము యొక్క; సముత్థితామ్ = ఉవ్వెత్తుగా లేచిన; ప్రశాంత = ప్రశాంతమైన; మారుతః = వాయువు; ఉభూతాం = చెదరగొట్టబడిన; జలోర్మిమ్ = తరంగములను; ఇవ = వలె; నిస్స్వనామ్ = ధ్వనులు, వావిళ్ళ & పురుషోత్తమ కవీయం1918 .
భావము:-
నురుగలతోనూ, సముద్రఘోషతోనూ ఉవ్వెత్తుగా లేచిన సాగరం ప్రశాంతమైన వాయువుచే తరంగముల ధ్వనులు చెదరగొట్టబడినట్లు. అయోధ్య భయంకరమైన నిశ్శబ్దత ఆవరించి ఉన్నది
2.114.8.
అనుష్టుప్.
త్యక్తాం యజ్ఞాఽయుధైః సర్వై:
అభిరూపై శ్చ యాజకైః।
సుత్యా కాలే వినిర్వృత్తే
వేదిం గత రవామ్ ఇవ॥
టీక:-
త్యక్తాం = విడువబడిన; యజ్ఞా = యజ్ఞముయొక్క; ఆయుధైః = ఉపకరణములు; సర్వైః = సమస్తమును; అభిరూపైశ్చ = చక్కని, ఒప్పిదమైన,వావిళ్ళ; యాజకైః = ఋత్విక్కులు; సుత్యా కాలే = సమాప్తి దినము గడచిన పిమ్మట; వినిర్వృత్తే = పూర్తైపోయిన; వేదిమ్ = వేదిక; గతరవామ్ = నిశ్శబ్దముగా ఉన్నదాని; ఇవ = వలె
భావము:-
యాగ సమాప్తి దినము గడిచిన పిమ్మట, యజ్ఞోపకరణములు, చక్కని ఋత్విక్కులు విడిచిపెట్టి పోయాక, నిశ్శబ్దముగానుండు వేదిక వలె అయోధ్య కళావిహీనమై ఉండెను.
2.114.9.
అనుష్టుప్.
గోష్ఠ మధ్యే స్థితామ్ ఆర్తామ్
అచరంతీం నవం తృణమ్।
గో వృషేణ పరిత్యక్తాం
గవాం పత్నీమ్ ఇవోత్సుకామ్॥
టీక:-
గోష్ఠ మధ్యే = గోశాల మధ్యలో; స్థితామ్ = నిలచి; ఆర్తామ్ = అర్హురాలై ఉండెను; అచరంతీం = కదలని; నవం = లేత; తృణమ్ = గడ్డికలది; గోవృషేణ = వృషభము, ఆంబోతు; పరిత్యక్తాం = విడిచిపెట్టిన; గవాం పత్నీమ్ = గోవు; ఇవ = వలె; ఉత్సుకామ్ = అధికమైన ఆసక్తితో.
భావము:-
వదలని ఒక ఆవును ఆంబోతు విడుచిపెట్టేసింది. దానితో ఆ గోవుకోసం వేసిన గోశాల మధ్య లేతగడ్డి పరకలు మేయక అలాగే పడి ఉన్నాయి. అలా అర్తురాలై గోశాల నడుమ ఉన్న గోవు వలె ఆ అయోధ్య కనబడుచుండెను.
2.114.10.
అనుష్టుప్.
ప్రభాకరాద్యై సుస్నిగ్ధైః
ప్రజ్వలద్భిరివోత్తమైః
వియుక్తాం మణిభిర్జాత్యై
ర్నవాం ముక్తావళీమివ॥
టీక:-
ప్రభాకర = ప్రకాశవంతము; ఆద్యైః = ముఖ్యముగా కలవి; సుస్నిగ్ధై = చాలా నున్నగా ఉన్నవి; ప్రజ్వలద్భిః = జ్వలించుచున్నట్లు ఉన్నవి; ఇవ = వలె; ఉత్తమైః = ఉత్తమమైన; వియుక్తాం = విడిచిపెట్టిన; మణిభిః = మణులు; జాత్యైః = జాతివి; నవాం = కొత్త; ముక్తావళీమ్ = ముత్యాల హారము; ఇవ = వలె
భావము:-
ఆ అయోధ్య, మంచి ప్రకాశవంతము లైనవి, చక్కని మెఱుగు పెట్టినవీ, జ్వలించుచున్నట్లున్నవీ ఐన మంచిజాతి మణులను కూర్చక నవమౌక్తులతో మాత్రమే కట్టిన ముత్యాలహారము వలె ఉండెను.
2.114.11.
అనుష్టుప్.
సహసా చలితాం స్థానాన్
మహీం పుణ్య క్షయాద్గతామ్।
సంహృత ద్యుతి విస్తారాం
తారామివ దివశ్చ్యుతామ్॥
టీక:-
సహసా = వెంటనే; చలితాం = కదలిపోయి; స్థానాన్ = స్థానము నుండి; మహీమ్ = భూమిమీదకు; పుణ్య = పుణ్యము; క్షయాత్ = క్షీణించుట; గతామ్ = జరిగిన; సంహృత = నశించిన; ద్యుతి విస్తారాం = కాంతి అంతయు; తారామ్ = నక్షత్రమును; ఇవ = వలె; దివః = ఆకాశము నుండి; చ్యుతామ్ = జారి
భావము:-
పుణ్యము క్షీణించుటచే స్థానము నుండి కదిలి, కాంతియంతయు నశించగా ఆకాశము నుండి జారి తటాలున భూమిపై పడిన నక్షత్రము వలె ఆ అయోధ్య ఉండెను.
2.114.12.
అనుష్టుప్.
పుష్ప నద్ధాం వసంతాంతే
మత్త భ్రమర నాదితాం
ద్రుత దావాగ్నివిప్లుష్టాం
క్లాంతాం వనలతామివ॥
టీక:-
పుష్పః = పుష్పములు; నద్ధాం = కూర్చబడినది; వసంతాంతే = గ్రీష్మఋతువురాగా; మత్త భ్రమర = మదించిన తుమ్మెదల; నాదితాం = రొదతోకూడినది; ద్రుత = ఆవరించిన; దావాగ్ని = దావాగ్నిచే; విప్లుష్టాం = కాల్చబడినది; క్లాంతాం = వడలిపోయినది; వనలతామ్ = అడవితీగ; ఇవ = వలె.
భావము:-
వసంతంలో నిండా పుష్పములు పూసి, మదించిన తుమ్మెదలు రొద చేసుండెడిది ఐన అడవితీగె, వసంతము వెళ్ళి గ్రీష్మఋతువు రాగా, చుట్టుముట్టిన దావాగ్నికి కాలిపోయ వాడిపోయినది అగు అడవితీగె వలె అయోధ్య ఆ విధముగా కనిపించెను.
2.114.13.
అనుష్టుప్.
సమ్మూఢ నిగమాం సర్వాం
సంక్షిప్త విపణాపణామ్।
ప్రచ్ఛన్నశశి నక్షత్రాం ద్యామ్
ఇవామ్బుధరైర్వృతామ్॥
టీక:-
సమ్మూఢ = పూర్తిగా మందగించిన, వావిళ్ళ; నిగమాం = వీధులు, మార్గములుస వావిళ్ళ; సర్వాం = అన్నీ; సంక్షిప్త = చిన్నబోయిన; విపణ = అంగళ్లు; ఆపణామ్ = అంగడి వీధులు; ప్రచ్ఛన్న = కనపడకుండా పోయిన; శశి = చంద్రుడు; నక్షత్రాం = నక్షత్రములు; ద్యామ్ = ఆకాశము; ఇవ = వలె; న = లేని; అమ్బుధరైః = మేఘములు; ఆవృతామ్ = ఆవరించుట
భావము:-
అయోధ్యలోని వీధులలో సంచారాలు పూర్తిగా మందగించాయి. అంగళ్లు, అంగడి వీధులు చిన్నబోయాయి. మేఘములు ఆవరించగా. చంద్రుడు, నక్షేత్రములు కనబడకుండా పోయినవి. అయోధ్య ఇలా స్తబ్ధుగా ఉండెను.
2.114.14.
అనుష్టుప్.
క్షీణ పానోత్తమైర్భిన్నైః
శరావైరభిసంవృతామ్।
హతశౌణ్డామివాకాశే
పాన భూమిమసంస్కృతామ్॥
టీక:-
క్షీణ = క్షీణించిన; పాన = మధ్యము; ఉత్తమైః = ఉత్తమమైన; భిన్నైః = పగిలిన; శరావైః = పాన పాత్రలు; అభిసంవృతామ్ = మిక్కిలి వ్యాప్తమైన, చిందరవందరా పడి ఉన్నట్టి; హత = దెబ్బలుతిన్న; శౌణ్డామ్ = ఎక్కువగా త్రాగిన త్రాగుబోతులు; ఇవ = వలె; ఆకాశే = ఆ ప్రదేశము; పాన భూమిమ్ = పాన భూమిని; అసంస్కృతామ్ = సంస్కారము లేక.
భావము:-
బ్రద్దలైన పానపాత్రలు, మిగిలిపోయి ఒలికిన ఉత్తమ మధువులు, దెబ్బలుతినిన త్రాగుబోతులు అంతా మధ్యం అమ్మే ఆ శాల లోని ప్రదేశమంతా చిందరవందరగా పడి పైగా అశుభ్రంగా ఉన్న ఆ పానశాల వలె అయోధ్య అస్తవ్యస్తముగా ఉండెను.
2.114.15.
అనుష్టుప్.
వృక్ణ భూమి తలాం నిమ్నాం
వృక్ణ పాత్రైః సమావృతామ్
ఉపయుక్తోదకాం భగ్నాం
ప్రపాం నిపతితామ్ ఇవ॥
టీక:-
వృక్ణ = పగిలిన; భూమి తలాం = నేల భాగము; నిమ్నాం = పల్లమైపోగా; వృక్ణ = బ్రద్దలైన; పాత్రైః = పాత్రలు; సమావృతామ్ = అటు ఇటు పడి ఉండగా; ఉపయుక్త = త్రాగుటకు; ఉదకాం = జలము; భగ్నాం = విరిగిన; ప్రపాం = చలివేంద్రముల; నిపతితామ్ = పడిపోయిన; ఇవ = వలె
భావము:-
ఆ అయోధ్యానగరము, నేల పగిలి పల్లమైపోగా, బద్దలైన పాత్రలు ఇటు అటు పడి ఉండగా త్రాగుటకు జలము లేక, పడిపోయిన చలివేంద్రము వలె కనబడుచుండెను.
2.114.16.
అనుష్టుప్.
విపులాం వితతాం చైవ
యుక్త పాశాం తరస్వినామ్।
భూమౌ బాణై ర్వినిష్కృత్తాం
పతితాం జ్యామ్ ఇవాఽయుధాత్॥
టీక:-
విపులాం = విశాలమైన; వితతాం = దీర్ఘములైన; చైవ = ఇంకనూ; యుక్త = తగిన; పాశాం = నారిత్రాళ్లు కలది; తరస్వినామ్ = బలవంతుల యొక్క; భూమౌ = నేల మీద; బాణైః = బాణములచే; వినిష్కృత్తాం = ఖండింపబడి; పతితాం = పడిపోయిన; జ్యామ్ = వింటి నారి; ఇవ = వలె; ఆయుధాత్ = బాణమునుండి.
భావము:-
దీర్ఘము, తగిన త్రాళ్ళు కలది అయిన విశాలమైన నారి బలవంతుల బాణములచే ఛేదింపబడి, ధనుస్సు నుండి తెగి నేలపై పడిన ఎట్లుండునో అయోధ్య ఆ విధముగా ఉండెను.
2.114.17.
అనుష్టుప్.
సహసా యుద్ధ శౌండేన
హయారోహేణ వాహితామ్।
నిహతామ్ ప్రతిసైన్యేన
వడవామివ పాతితామ్॥
టీక:-
సహసా = తీసుకొనిపోగా; యుద్ధ = .యుద్ధకళలో; శౌండేన = శ్రేష్ణునిచే; హయ = గుఱ్ఱమును; ఆరోహేణ = ఎక్కిన రౌతు; వాహితామ్ = తననుమోయునట్లుచేసిన; నిహతామ్ = చంపబడి; ప్రతిసైన్యేన = శత్రుసేనలచే; వడవామ్ = ఆడ గుఱ్ఱము; ఇవ = వలె; పాతితామ్ = పడిపోయిన.
భావము:-
యుద్ధ నైపుణ్యముగల రౌతు తటాలున ఎక్కి యుద్ధ రంగమునకుపోయగా, శత్రువులచే చంపబడి, నేలపై పడిన తనను మోయుచున్న ఆడ గుఱ్ఱము వలె ఆ అయోధ్య కనబడెను.
2.114.18.
అనుష్టుప్.
శుష్క తోయాం మహా మత్స్యైః
కూర్మై శ్చ బహుభి ర్వృతాం।
ప్రభిన్న తట విస్తీర్ణాం
వాపీ మివ హృతోత్పలాం॥
టీక:-
శుష్క = ఎండిపోయిన; తోయామ్ = నీటిలో; మహా = పెద్ద పెద్ద; మత్స్యైః = చేపలు; కూర్మైః = తాబేల్ళు; చ = మఱియు; బహుభిః = అనేకమైన; వృతాం = చుట్టు ప్రక్కల; ప్రభిన్న = బీటలు వారిన; తట విస్తీర్ణాం = తీర ప్రదేశము; వాపీమ్ = దిగుడు బావి; ఇవ = వలె; హృత = హరింపబడిన; ఉత్పలాం = కలువలు కలది.
భావము:-
నీరు ఎండిపోయి, అనేకమైన పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు, బయటపడి ఉండగా, చుట్టుప్రక్కల ఉన్న తీర ప్రదేశము బీటలు వారి ఉన్న కలువలు లేని, దిగుడు బావి వలె ఆ అయోధ్యా నగరము కాంతివిహీనమై ఉండెను.
2.114.19.
అనుష్టుప్.
పురుషస్యా ప్రహృష్టస్య
ప్రతిషిద్దాఽనులేపనాం।
సంతప్తా మివ శోకేన
గాత్ర యిష్టి మఽభూషణాం॥
టీక:-
పురుషస్య = పురుషుని యొక్క; ప్రహృష్టస్య = సంతోషము కొరకు; ప్రతిషిద్ధా = పైన పూసుకొను; అనులేపనాం = చందనాదులు పూయక; సంతప్తామ్ = బాధపడుచున్న; ఇవ = వలె; శోకేన = శోకముతో; గాత్రయిష్టిమ్ = శరీరము; అభూషణాం = భూషణములు ధరించక
భావము:-
పైన అలదుకొను చందనాదులు అలదుకొనక, ఒంటిమీద భూషణములు ధరించక, శోకముతో బాధపడుచున్న దుఃఖితుడైన పురుషుని వలె ఆ అయోధ్య ఉండెను.
2.114.20.
అనుష్టుప్.
ప్రావషి ప్రవిగాఢాయాం
ప్రవిష్టస్యా 2భ్ర మణ్డలమ్।
ప్రచ్ఛన్నాం నీల జీమూతై:
భాస్కరస్య ప్రభామివ॥
టీక:-
ప్రావషి = వర్షాకాలమునందు; ప్రవిగాఢాయాం = బాగాదట్టంగా; ప్రవిష్టస్యా = ప్రవేశించగా; అభ్రమణ్డలమ్ = మేఘమండలములో; ప్రచ్ఛన్నాం = కప్పబడిన; నీల = నల్లని; జీమూతైః = మేఘములచే; భాస్కరస్య = సూర్యుని యొక్క; ప్రభామ్ = కాంతి; ఇవ = వలె
భావము:-
మంచి వర్షకాలమునందు. నల్లని మేఘములచే కప్పబడిన మేఘమండలములో ప్రవేశించగా సూర్యుని కాంతి వలె ఆ అయోధ్య కాంతిహీనమై ఉండెను.
2.114.21.
అనుష్టుప్.
భరతస్తు రథస్థస్స
శ్రీమాన్ దశరథాత్మజః।
వాహయంతం రథ శ్రేష్ఠం
సారథిం వాక్యమబ్రవీత్ ॥
టీక:-
భరతః తు = భరతుడు; రథస్థః = రథమునందు; స శ్రీమాన్ = శ్రీమంతుడు; దశరథాత్మజః = దశరథుని పుత్రుడు; వాహయంతం = నడిపించుచున్న; రథ శ్రేష్ఠం = రథ శ్రేష్ఠమును; సారథిం = సారథితో; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను
భావము:-
శ్రీమంతుడు, దశరథుని పుత్రుడు అయిన భరతుడు. రథము నందు కూర్చుండి, ఆ రథ శ్రేష్ఠమును నడిపించుచున్న సారథి సుమంతునితో ఇట్లు పలికెను.
2.114.22.
అనుష్టుప్.
“కిం ను ఖల్వద్య గంభీరో
మూర్ఛితో న నిశమ్యతే।
యథాపురమయోధ్యాయాం
గీత వాదిత్ర నిస్స్వనః ॥
టీక:-
కిం ను ఖలు = ఏమి కారణమో; అద్య = నేడు; గంభీరః = గంభీరమైన; మూర్ఛితః = సర్వత్రా వ్యాపించిన; న = లేదు; నిశమ్యతే = వినబడుట; యథాపురమ్ = ఇంతకుముందు వలె; అయోధ్యాయాం = అయోధ్యా నగరములో; గీత వాదిత్ర = గీత వాద్యాదుల; నిస్స్వనః = ధ్వని
భావము:-
అయోధ్యా నగరములో ఇపుడు గంభీరమైన గీతవాద్యాదుల ధ్వని ఇంతకుముందు వలె సర్వత్రా వ్యాపించి వినబడుట లేదు. ఎందుచేత నంటావు.
2.114.23.
అనుష్టుప్.
వారుణీ మద గంధశ్చ
మాల్య గంధశ్చ మూర్ఛితః।
ధూపితాగరు గంధశ్చ
న ప్రవాతి సమంతతః॥
టీక:-
వారుణీ = మద్యము యొక్క; మద = మత్తైన; గంధః = వాసనలు; చ = మఱియు; మాల్య = పుష్పమాలల; గంధః = సువాసనలు; చ = మఱియు; మూర్ఛితః = వ్యాపించుట; ధూపిత = ధూపముల; అగరు = అగరు; గంధః = సుగంధములు; చ = అగరు; న = లేదు; ప్రవాతి = గుబాళించుట; సమంతతః = నలువైపులా.
భావము:-
మత్తైన మద్యగంధము, పుష్పమాలల సుగంధము, అగరు ధూపముల సుగంధము అంతటను వ్యాపించి గుబాళించుట లేదు.
*గమనిక:-
 అగరు- అగరు చెట్టు కఱ్ఱనుండి నుండి తీసిన పరిమళ ద్రవ్యము. ఇది రాజార్హము. వాచస్పతము నల్ల చందనము చెక్క ఆంధ్ర శబ్దరత్నాకరము. అగరు చెట్టు చిత్రము, వపరిమళ ద్రవ్యముగా వాడుట మున్నగువానికి ప్రసిద్ది. ఈ చెట్టు 40 మీ. ఎత్తు, 80 సెంమీ. చుట్టుకొలత వరకు పెరుగగలదు. శబ్ద సారూప్యత గల మరొక పదము అలుగు / అరుగు అనునది బియ్యము లేదా బార్లీ గింజలు మాడ్చి తయారుచేయుదురు, నల్లగా తిలకము వలె ఉండును, దీనిని పిల్లలకు బొట్టు పెట్టుటకు వాడుదురు. దిష్టిదోషము తగలకుండా పనిచేయును అని నమ్ముదురు.
2.114.24.
అనుష్టుప్.
యాన ప్రవర ఘోషశ్చ
స్నిగ్ధశ్చ హయ నిస్స్వనః।
ప్రమత్త గజ నాదశ్చ
మహాంశ్చ రథ నిస్స్వనః।
నేదానీం శ్రూయతే పుర్యామ్
అస్యాం రామే వివాసితే॥
టీక:-
యాన = వాహనములు; ప్రవర = శ్రేష్ఠమైన; ఘోషః = ఘోష; చ = మఱియు; స్నిగ్ధః = మృదువైనవి; చ = మఱియు; హయ = గుఱ్ఱముల; నిస్స్వనః = శబ్దములు; ప్రమత్త = మిక్కిలి మదించిన; గజ = ఏనుగుల; నాదః = శబ్దములు; చ = మఱియు; మహాః = గొప్పవైన; చ = మఱియు; రథ = రథముల; నిస్స్వనః = ధ్వనులు; న = లేదు; ఇదానీం = ఇప్పుడు; శ్రూయతే = వినపడుట; పుర్యామ్ = పురమునందు; అస్యాం = ఈ; రామే = రాముడు; వివాసితే = దేశబహిష్కరణచే.
భావము:-
రాముని దేశబహిష్కరణ వలన, ఇపుడు ఈ నగరమునందు రథములు చేయు పెద్ద ధ్వనులు గజాది వాహనముల రణగొణలు, గుఱ్ఱముల మృదువైన సకిలింపాదులు, మదించిన ఏనుగుల గీకాదులు, మునగు ధ్వనులు వినబడుట లేదు.
2.114.25.
అనుష్టుప్.
చందనాఽగరు గంధాంశ్చ
మహాఽర్హా శ్చ నవ స్రజ:
గతే హి రామే తరుణా
సంతప్తా నోపభుంజతే॥
టీక:-
చందన = చందనమును; అగరు = అగరువును; గంధాః = సుగంధ ద్రవ్యములను; చ = మఱియు; మహార్హాః = శ్రేష్ఠములైనవి; చ = మఱియు; నవ = నవనవలాడుతున్న; స్రజః = పూలమాలలను; గతే చ = వెళ్లిపోయిన; హి = పిమ్మట; రామే = రాముడు; తరుణాః = యువకులు; సంతప్తా = దుఃఖాక్రాంతులైన; న = లేదు; ఉపభుంజతే = ఆస్వాదించుట, ఆప్టే, వాడుట.
భావము:-
రాముడు అయోధ్యను విడిచి వెళ్ళిపోయిన సిమ్మట దుఃఖాక్రాంతులైన యువకులు. చందనమును, అగరువును, ఇతర సుగంధ ద్రవ్యములను, శ్రేష్టములైన క్రొత్త పుష్పమాలలను వాడుట లేదు.
2.114.26.
అనుష్టుప్.
బహీ రాత్య్రాం న గచ్ఛంతి
చిత్రమాల్య ధరా నరా:।
నోత్సవా స్సంప్రవర్తంతే
రామ శోకాఽర్దితే పురే॥
టీక:-
బహీః = బయటకు; యాత్య్రామ్ = విలాసయాత్రలనుగూర్చి; న = లేదు; గచ్ఛంతి = వెళ్లుట; చిత్ర = రంగురంగుల, వావిళ్ళ; మాల్య న = పూలమాలలు; ధరాః = ధరించి; నరాః = పౌరులు; న = లేదు; ఉత్సవాః = ఉత్సవములు; సంప్రవర్తంతే = జరుగుట; రామ శోకాః = రామవిరహా జనిత శోకముచే; ఆర్దితే = పీడితమైన; పురే = అయోధ్యా నగరము.
భావము:-
ఈ అయోధ్యానగరము రామవియోగ శోకముచే పీడితమై ఉన్నది. పౌరులెవ్వరు రంగురంగుల పూలమాలలు ధరించుట, విలాసయాత్రకు బయటకు వెళ్లుట లేదు. ఉత్సవము లేమియు జరుగుటలేదు.
2.114.27.
అనుష్టుప్.
సహ నూనం మమ భ్రాత్రా
పురస్యాఽస్య ద్యుతిర్గతా।
న హి రాజ త్యయోధ్యే
యం సాసారేవాఽర్జునీ క్షపా॥
టీక:-
సహ = కలిసి; నూనమ్ = నిశ్చయము; మమ = నా యొక్క; భ్రాత్రా = సోదరునితో; పురస్యా = పురముయొక్క; అస్య = ఈ; ద్యుతిః = శోభ, కాంతి; గతా = వెళ్లిపోయినది; న = లేదు; హి = ఏమాత్రము; రాజతి = ప్రకాశించుట; అయోధ్యః = అయోధ్యా నగరము; ఇయమ్ = ఈ; సాసారా = ధారా వర్షము పడుచున్నప్పుడు; ఇవ = వలె; అర్జునీ = శుక్లపక్షపు; క్షపా = రాత్రి.
భావము:-
శోభ అంతయు నా సోదరుడు రామునితో కలిసి, ఈ పురమును విడచి వెళ్ళిపోయినది. ధారాపాతముగా వర్షము పడుచున్నపుడు శుక్ల పక్ష రాత్రి వలె ఈ అయోధ్యానగరము ప్రకాశించుట లేదు.
*గమనిక:-
 సూర్యుడు ఉన్నప్పుడు లోకమంతా కాంతివంతముగా నుండును. శుక్లపక్షములో చంద్రకాంతి ప్రకాశవంతముగా ఉండును. కాని శుక్లపక్షమే ఐనా వర్షము పడుతుంటే చీకటిగా ఉండును కదా. అలాగే సూర్యవంశపు రాముడను సూర్యుడు ఉండగా అయోధ్య గొప్ప శోభతో ఉండేది. కాలంతరమున రాముడు బయటకు వెళ్ళినా తొందరలోనే వచ్చునను చంద్రకాంతితో కొంత శోభ ఉండును. కాని ఇప్పుడు పద్నాలుగేళ్ళ దేశబహిష్కరణ అను వర్షం పడుతున్న రాత్రి కనుక అయోధ్యకు ఏమాత్రం శోభ ఉండదు కదా.
2.114.28.
అనుష్టుప్.
కదా ను ఖలు మే భ్రాతా
మహోత్సవ ఇవాఽగత:
జనయిష్యత్య 2యోధ్యా యాం
హర్షం గ్రీష్మ ఇవాంబుదః॥
టీక:-
కదా = ఎప్పుడు; ను= కదా; ఖలు = ప్రశ్నార్థకము; మే = నా; భ్రాతా = సోదరుడైన రాముని; మహోత్సవ = మహోత్సవము; ఇవ = వలె; ఆగతః = వచ్చినవాడై; జనయిష్యతి = కలుగచేయునో; అయోధ్యాయాం = అయోధ్యకు; హర్షం = ఆనందమును; గ్రీష్మ = ఎండా కాలమునందు; ఇవ = వలె; అంబుదః = మేఘము.
భావము:-
ఎపుడు జరుగునో కదా? నా సోదరుడైన రాముని రాక మహోత్సవము అను మేఘము, ఎండాకాలమునందు మేఘము తాపోపశమనము కలుగజేయునట్లు, అయోధ్యకు ఆనందమును కలుగజేయునో కదా?
2.114.29.
అనుష్టుప్.
తరుణైశ్చారు వేషైశ్చ
నరైః ఉన్నత గామిభిః।
సంపతద్భి రయోధ్యాయాం
న విభాన్తి మహా పథాః॥
టీక:-
తరుణైః = యువకులు; చారు = అందమైన; వేషైః = వస్త్రభూషణాద్యలంకార ధరులు; చ = మఱియు; నరైః = జనులు; ఉన్నత = నిటారుగా; గామిభిః = నడచుచున్నవారు; సంపతద్భిః = ఐశ్వర్యవంతులు అయి; అయోధ్యాయాం = అయోధ్యలోని; న విభాన్తి = ప్రకాశించుట లేదు; మహా పథాః = రాజవీధులు
భావము:-
చక్కని వస్త్రాదులు ధరించి చక్కగా తయారై. సగర్వముగా తిరుగుచున్న, ఐశ్వర్యవంతులైన యువజనులతో, అయోధ్యలోని రాజవీధులు కళకళలాడుట లేదు.
2.114.30.
అనుష్టుప్.
ఏవం బహువిధం జల్పన్
వివేశ వసతిం పితుః।
తేన హీనాం నరేంద్రేణ
సింహ హీనాం గుహామ్ ఇవ॥
టీక:-
ఏవం = ఇట్లు; బహువిధమ్ = అనేక విధములుగా; జల్పన్ = మాట్లాడుచు; వివేశ = ప్రవేశించెను; వసతిమ్ = నివాసములోనికి; పితుః = తండ్రి; తేన = ఆయన; హీనాం = లేకపోవుటచే; నరేంద్రేణ = మహారాజు దశరథుడు; సింహ హీనాం = సింహము లేని; గుహామ్ ఇవ = గుహ వలె,
భావము:-
భరతుడు ఇట్లు అనేక విధములుగా మాట్లాడుచు తండ్రి సౌధము ప్రవేశించెను. దశరథ మహారాజు లేకపోవుటచే ఆ రాచనగరి సింహము లేని గుహ వలె ఉండెను.
2.114.31.
జగతి.
తదా తదంతఃపురం ఉజ్ఝిత ప్రభం
సురైరివో త్సృష్టమాభాస్కరం దినం।
నిరీక్ష్య సర్వం తు వివిక్త మాత్మవాన్
ముమోచ బాష్పం భరత స్సుదుఃఖితః॥
టీక:-
తదా = అప్పుడు; తత్ = ఆ; అంతఃపురం = అంతఃపురము; ఉజ్ఝిత = విడువబడిన; ప్రభమ్ = కాంతి కలదై; సురైః = దేవాసురులు; ఇవ = వలె; ఉత్సృష్టమ్ = విడువబడిన; అభాస్కరమ్ = సూర్యుడు లేనట్టి; దినమ్ = దినము; నిరీక్ష్య = చూచి; సర్వమ్ = అంతయును; తు = ఆ; వివిక్తమ్ = ఏకాంతుడైన; ఆత్మవాన్ = బుద్ధిశాలియైన; ముమోచ = విడిచెను; బాష్పం = కన్నీరు; భరతః = భరతుడు; సుదుఃఖితః = మిక్కిలి దుఃఖముతో.
భావము:-
దేవతలకు రాక్షసులకు జరిగిన మహాయుద్ధము నాడు రేగన దుమ్ముదూసరితమై ఆ దినము సూర్యదర్శనహీనమైనది. దానితో దేవతలు దుఃఖితులు ఐరి. అటుల అప్పుడు, ఆ దశరథమహారాజు అంతఃపుర సౌధము అంత శోభావిహీనమ ఉండెను. అత్యంత దుఃఖితుడైన బుద్ధిశాలి భరతుడు, పూర్తిగా కాంతిరహితమై శూన్యముగా ఉన్న ఆ అంతఃపురమును చూచి కన్నీరు విడిచెను.
2.114.31.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే చతుర్దశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; చతుర్దదశోత్తరశతతమః [114] = నూటపదునాలుగవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [114] నూటపదునాలుగవ సర్గ సంపూర్ణము.
2.115.1.
అనుష్టుప్.
తతో నిక్షిప్య మాతౄః స
అయోధ్యాయాం దృఢ వ్రతః।
భరతః శోకసంతప్తో
గురూనిదమథాబ్రవీత్॥
టీక:-
తతః = అటుపిమ్మట; నిక్షిప్య = ఉంచి; మాతౄః = తల్లులను; సః = అతడు; అయోధ్యాయాం = అయోధ్యయందు; దృఢవ్రతః = దృఢ సంకల్పము కలిగినవాడై; భరతః = భరతుడు; శోకసంతప్తః = శోకభరితుడై; గురూన్ = గురువులను గూర్చి ; ఇదమ్ = ఈ విధముగ; అథా = పిమ్మట; అబ్రవీత్ = పలికెను
భావము:-
భరతుడు అటుపిమ్మట తల్లులను అయోధ్యలో ఉంచి, దృఢ సంకల్పముతో, శోకము భరిత హృదయముతో, గురువులకు ఈ విధముగా తన అభిప్రాయమును తెలియజేసెను.
2.115.2.
అనుష్టుప్.
”నందిగ్రామం గమిష్యామి
సర్వానామంత్రయేఽద్య వః।
తత్ర దుఃఖమిదం సర్వం
సహిష్యే రాఘవం వినా॥
టీక:-
నందిగ్రామం = నందిగ్రామమునుగురించి; గమిష్యామి = వెళ్ళెదను; సర్వాన్ = అందరిని; ఆమంత్రయే = ఆహ్వానించున్నాను; అద్య = ఈ దినము; వః = మిమ్ములను; తత్ర = అచ్చట; దుఃఖమ్ ఇదమ్ = ఈ దుఃఖమును; సర్వం = మొత్తమును; సహిష్యే = సహించెదను; రాఘవం వినా = రాముడు లేకుండా
భావము:-
నేను ఈ దినము నందిగ్రామమునకు వెళ్లెదను. అచ్చటకు మీ అందరిని కూడా ఆహ్వానించున్నాను. అచ్చటనే రాముడు లేకపోవుటచే కలిగిన దుఃఖము అంతటిని సహించెదను.
2.115.3.
అనుష్టుప్.
గతశ్చ వా దివం రాజా
వనస్థశ్చ గురుర్మమ।
రామం ప్రతీక్షే రాజ్యాయ
స హి రాజా మహాయశాః॥
టీక:-
గతః = వెళ్ళిపోయెను; చ = మఱి; హి = కదా; దివం = స్వర్గమునుగూర్చి; రాజా = రాజు (దశరథుడు); వనస్థః = వనవాసియైనాడు; చ = మఱియు; గురుః = పెద్దవాడు; మమ = నాకు; రామమ్ = రామునిగూర్చి; ప్రతీక్షే = వేచియుండెదను; రాజ్యాయ = రాజ్యాముకొరకు; సః = అతను; హి = నిశ్చయముగా; రాజా = నిజమైన రాజు; మహాయశాః = గొప్ప కీర్తి గలవాడు
భావము:-
తండ్రిగారు స్వర్గస్థులైనారు, మఱియు పెద్దవాడైన అన్నగారు వనవాసియైనాడు. రాజ్యమును తిరిగి పాలించుటకు వచ్చు రామునిగూర్చి వేచియుండెదను, ఎందుకనగా గొప్పకీర్తిగలవాడైన అతడే నిజమైన రాజు.
2.115.4.
అనుష్టుప్.
ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం
భరతస్య మహాత్మనః।
అబ్రువన్మంత్రిణః సర్వే
వసిష్ఠశ్చ పురోహితః॥
టీక:-
ఏతత్ = అది; శ్రుత్వా = విని; శుభం = మంగళకరమైన; వాక్యం = మాటలను; భరతస్య = భరతునియొక్క; మహాత్మనః = మహాత్మునియొక్క; అబ్రువన్ = పలికిరి; మంత్రిణః = మంత్రులు; సర్వే = అందరూ; వసిష్ఠ = వసిష్ఠుడు; చ = మఱియు; పురోహితః = పురోహితుడు
భావము:-
మహాత్ముడైన భరతుడు చెప్పిన మంగళకరమైన వాక్యమును విని, పురోహితుడైన వసిష్ఠుడును, మంత్రులును ఇట్లు పలికిరి.
2.115.5.
అనుష్టుప్.
“సుభృశం శ్లాఘనీయం చ
యదుక్తం భరత! త్వయా।
వచనం భ్రాతృవాత్సల్యాత్
అనురూపం తవైవ తత్॥
టీక:-
సుభృశం = బహుమిక్కిలి; శ్లాఘనీయం చ = ప్రశంసనీయమైనది కూడ; చ = మఱియు; యత్ = ఏదైతే; ఉక్తమ్ = చెప్పబడినదో; భరత = ఓ భరతా; త్వయా = నీచేత; వచనం = మాట; భ్రాతృ-వాత్సల్యాత్ = సోదర ప్రేమతో; అనురూపం = సరిపడు; తవ = నీయొక్క; ఏవ = మాత్రమే; తత్ = అది
భావము:-
ఓ భరతా! సోదరప్రేమతో నీవు చెప్పిన మాట బహుమిక్కిల శ్లాఘనీయమైనది, ప్రశంసనీయమైనది. ఇది నీకు మాత్రమే తగినది.
2.115.6.
అనుష్టుప్.
నిత్యం తే బంధులుబ్ధస్య
తిష్ఠతో భ్రాతృసౌహృదే।
ఆర్యమార్గం ప్రపన్నస్య
నానుమన్యేత కః పుమాన్?॥
టీక:-
నిత్యం = ఎల్లప్పుడు; తే = నీయొక్క; బంధు = బంధువుల ఎడ; లుబ్ధస్య = మిక్కిల ఆసక్తికలవాడవు; తిష్ఠతః = స్థిరముగ ఉన్నవాడవు; భ్రాతృ = సోదరుని; సౌహృదే = ప్రేమ యందు; ఆర్యమార్గం = ధర్మమార్గము; ప్రపన్నస్య = ఆశ్రయించిన వానియొక్క; న = ఉండదు; అనుమన్యేత = అర్థంచేసుకొనుట; కః = ఎవరైనా; పుమాన్ = నరుడు
భావము:-
ఎల్లప్పుడు మిక్కిలి బంధుప్రీతి కలిగిన వాడవు, సోదరప్రేమ యందు స్థిరముగానున్నవాడవు, ధర్మమార్గమునే ఆశ్రయించినవాడవును ఐన నీ అభిప్రాయమును అర్థముచేసుకొనని వారు ఎవరైనా ఉందురా?
2.115.7.
అనుష్టుప్.
మంత్రిణాం వచనం శ్రుత్వా
యథాభిలషితం ప్రియమ్।
అబ్రవీత్సారథిం వాక్యం
“రథో మే యుజ్యతామితి”॥
టీక:-
మంత్రిణాం = మంత్రులయొక్క; వచనం = మాటను; శ్రుత్వా = విని; యథా = ఎటుల; అభిలషితమ్ = ఆశించబడెను; ప్రియమ్ = ప్రియమైనది; అబ్రవీత్ = పలికెను; సారథిమ్ = సారథినిగూర్చి; వాక్యమ్ = మాటలను; రథః = రథమును; మే = నాయొక్క; యుజ్యతామ్ = సిద్ధముచేయబడుగాక; ఇతి = అని.
భావము:-
తను ఆశించిన విధముగా చెప్పిన మంత్రుల ప్రియమైన మాటలను విని. భరతుడు సారథితో తన రథమును సిద్ధము చేయుమని ఆజ్ఞాపించెను.
2.115.8.
అనుష్టుప్.
ప్రహృష్టవదనస్సర్వా
మాతౄస్సమభివాద్య సః।
ఆరురోహ రథం శ్రీమాన్
శత్రుఘ్నేన సమన్వితః॥
టీక:-
ప్రహృష్ట = సంతుష్టపూరిత; వదనః = ముఖముకలవాడై; సర్వాః = అందరు; మాతౄః = తల్లులు; సమభివాద్య = గౌరవముగా నమస్కరించి; సః = అతడు; ఆరురోహ = ఎక్కెను; రథం = రథమును; శ్రీమాన్ = శ్రేష్ఠుడు; శత్రుఘ్నేన = శత్రుఘ్నునితో కూడ; సమన్వితః = కలిసినవాడై
భావము:-
సంతుష్టవదనముతో తల్లులందరకు గౌరవముగా నమస్కరించి శ్రేష్ఠుడైన భరతుడు శత్రుఘ్నునితో కలిసి రథమును అధిరోహించెను.
2.115.9.
అనుష్టుప్.
ఆరుహ్య చ రథం శీఘ్రం
శత్రుఘ్నభరతావుభౌ।
యయతుః పరమప్రీతౌ
వృతౌ మంత్రిపురోహితైః॥
టీక:-
ఆరుహ్య = ఎక్కిన పిమ్మట; తు = వెళ్ళిరి; రథమ్ = రథముపై; శీఘ్రం = త్వరగా; శత్రుఘ్నభరతౌ = శత్రుఘ్నడును, భరతుడును; ఉభౌ = ఇద్దరు; యయతుః = వెడలినారు; పరమప్రీతౌ = మిక్కిలి ఆనందించిన వారై; వృతౌ = చుట్టబడినవారై; మంత్రిః = మంత్రులు; పురోహితైః = పురోహితులచేత
భావము:-
భరతుడు మఱియు శత్రుఘ్నుడు రథమును అధిరోహించి మిక్కిలి ఆనందముతో మంత్రులు, పురోహితులు అనుసరించగా శీఘ్రముగా వెడలినారు.
2.115.10.
అనుష్టుప్.
అగ్రతో గురవస్తత్ర
వసిష్ఠప్రముఖా ద్విజాః।
ప్రయయుః ప్రాంగ్ముఖాస్సర్వే
నందిగ్రామో యతోఽభవత్॥
టీక:-
అగ్రతః = ముందుగా; గురవః = గురువులు; తత్ర = అక్కడకు; వసిష్ఠ = వసిష్టుడు; ప్రముఖాః = మున్నగు ప్రముఖులు; ద్విజాః = బ్రాహ్మణులు; ప్రయయుః = వెళ్ళిరి; ప్రాక్ = తూర్పు; ముఖాః = వైపునకు; సర్వే = అందరును; నందిగ్రామః = నందిగ్రామమునకు; యతః = ఎటువైపు; అభవత్ = ఉన్నదో అటు.
భావము:-
వారికంటె ముందుగా వసిష్ఠుడు మొదలగు ప్రముఖులు బ్రాహ్మణులు అందరు నందిగ్రామము ఉన్న తూర్పువైపునకు బయలుదేరిరి.
2.115.11.
అనుష్టుప్.
బలం చ తదనాహూతం
గజాశ్వరథసంకులమ్।
ప్రయయౌ భరతే యాతే
సర్వే చ పురవాసినః॥
టీక:-
బలం = సైనికదళము; చ = కూడా; తత్ = అది; అనాహూతమ్ = ఆహ్వానించబడనిది ఐనా; గజః = ఓనుగులు; అశ్వః = గుఱ్ఱములు; రథ = రథములు; సంకులమ్ = కూడిన సమూహము; ప్రయయౌ = బయలుదేరెను; భరతే = భరతుడు; యాతే = ప్రయాణమగుట వలన; సర్వే = అందరు; చ = కూడా; పురవాసినః = నగరవాసులు.
భావము:-
భరతుడు వెడలుట చూసి ఆహ్వానము లేకపోయినా చతురంగ బలములు మఱియు నగరవాసులు అందరూ బయలుదేరిరి.
2.115.12.
అనుష్టుప్.
రథస్థస్స హి ధర్మాత్మా
భరతో భ్రాతృవత్సలః।
నందిగ్రామం యయౌ తూర్ణం
శిరస్యాదాయ పాదుకే॥
టీక:-
రథస్థః = రథమును అధిరోహించినవాడై; సః = అతడు; హి = చక్కగా; ధర్మాత్మా = ధర్మపరుడు; భరతః = భరతుడు; భ్రాతృవత్సలః = సోదరప్రేమ గలవాడు; నందిగ్రామమ్ = నందిగ్రాముగూర్చి; యయౌ = వెళ్లెను; తూర్ణం = త్వరగా; శిరసి = తలపై; ఆధాయ = ఉంచుకొని; పాదుకే = పాదుకలను.
భావము:-
ధర్మపరుడు సోదరప్రేమ గలవాడును ఐన భరతుడు (రాముని) పాదుకల శిరస్సుపై కెత్తుకొని రథము నధిరోహించి వేగంగా నందిగ్రామునకు వెళ్లెను.
2.115.13.
అనుష్టుప్.
తతస్తు భరతః క్షిప్రం
నందిగ్రామం ప్రవిశ్య సః।
అవతీర్య రథాత్తూర్ణం
గురూనిదమువాచ హ॥
టీక:-
తతః = అటుపిమ్మట; తు = శుభముగ, సర్వశబ్దసంబోధిని; భరతః = భరతుడు; క్షిప్రమ్ = త్వరగా; నందిగ్రామం = నందిగ్రామమును; ప్రవిశ్య = ప్రవేశించి; సః = అతడు; అవతీర్య = క్రిందికి దిగి; రథాత్ = రథమునుండి; తూర్ణం = వెంటనే; గురూన్ = గురువులనుగురించి; ఉవాచ = చెప్పెను; హ = అహో
భావము:-
త్వరితముగా నందిగ్రామమును ప్రవేశించిన భరతుడు, రథమును దిగి వెంటనే తన గురువులను ఉద్దేశించి ఇట్లు పలికెను.
2.115.14.
అనుష్టుప్.
“ఏతద్రాజ్యం మమ భ్రాత్రా
దత్తం సన్న్యాసవత్స్వయమ్।
యోగక్షేమవహే చేమే
పాదుకే హేమభూషితే॥
టీక:-
ఏతత్ = ఈ యొక్క; రాజ్యము = రాజ్యము; మమ = నా; భ్రాత్రా = అన్నగారిచేత; దత్తం = ఇవ్వబడినది; సన్న్యాసవత్ = సమ్ + న్యాసవతే, మిక్కిలి + ఇల్లడగా, న్యాసముగా, కొంతకాలము భద్రపరచమని విశ్వాసపాత్రులకు ఇచ్చినది; స్వయమ్ = స్వయముగా; యోగక్షేమవహే = యోగ క్షేమముల భారము వహించెడి; చ = కూడా; ఇమే= ఈ; పాదుకే = పాదుకలను; హేమభూషితే = బంగారముతో అలంకరించబడినట్టివి.
భావము:-
ఈ రాజ్యము, ఈ బంగారు పాదుకలు మా అన్నగారు తను వచ్చేవరకు బహు భద్రంగా కాపాడమని స్వయముగా నాకు ఇల్లడగా ఇచ్చిరి. ఇంకా యోగక్షేమముల బాధ్యత వహించెడి బంగారముతో అలంకరించిన ఈ పాదుకలను కూడా అనుగ్రహంచిరి.
*గమనిక:-
న్యాసము- న్యాసస్యత ఇతి, ని+ఉస్+ఘఞ, ఉపనిధి, స్థాప్యద్రవ్యమ్, ఇత్యమరః. షడ్విధన్యాసము- 1. అనుకూల్యస్య సంకల్పః, కార్యసాఫల్యత కొఱకు మరొక చోట/ మరొరి వద్ద ఉంచుట, 2. ప్రాతికూల్యస్య వర్జనమ్, పనికి అనుకూలం కానిది ఉంచుట, 3. రక్షిష్యసీతి విశ్వాసః, భద్రపరచమని విశ్వాసపాత్రులకు ఇచ్చుట, 4. గోప్తృత్వ వరణమ్, దాచమని ఇచ్చుట, 5. ఆత్మసమర్పణమ్, తానే న్యాసముగా వెళ్ళుట, 6. కార్పణ్యమ్, జాలికొద్దీ ఉంచమని ఇచ్చుట, సౌజన్యము సంకేత పదకోశము, రవ్వాశ్రీహరి
2.115.15.
అనుష్టుప్.
భరతః శిరసా కృత్వా
సన్న్యాసం పాదుకే తతః।
అబ్రవీద్ధుఃఖసంతప్తః
సర్వం ప్రకృతిమండలమ్॥
టీక:-
భరతః = భరతుడు; శిరసాకృత్వా = తలపైపెట్టుకొని; సన్న్యాసం = చినక్కటి ఇల్లడగా ఇచ్చ; పాదుకే = పాదుకలను; తతః = అటుపిమ్మట; అబ్రవీత్ = చెప్పెను; దుఃఖసంతప్తః = దుఃఖభారముతో బాధపడువాడై; సర్వం = మొత్తము; ప్రకృతి-మండలం = పౌరవర్గము, శబ్దరత్నాకరము.
భావము:-
అటుపిమ్మట భరతుడు ఇల్లడ పాదుకలను తలమీద పెట్టుకుని మనసులో దుఃఖము నిండినవాడై తన పౌరవర్గములోని అమాత్యులు, సుహృత్తులు, కోశాధికారులు, రాష్ట్రప్రజలు, రక్షకభటులు, సైన్యముల సమూహములను ఉద్దేశించి ఇలా అనెను.
2.115.16.
అనుష్టుప్.
“ఛత్రం ధారయత క్షిప్రమ్
ఉర్యపాదావిమౌ మతౌ।
ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః
పాదుకాభ్యాం గురోర్మమ॥
టీక:-
ఛత్రం = (రాజులకు పట్టు) ఛత్రమును; ధారయత = పట్టుకొనుడు; క్షిప్రమ్ = సత్వరము; ఆర్య = అన్నగారి; పాదౌ= పాదద్వయము అని; ఇమౌ = వీటి; మతౌ = గ్రహించబడినవి; ఆభ్యాం = వీటిచేతనే; రాజ్యే = రాజ్యమునందు; స్థితః = ఉన్నది; ధర్మః = ధర్మము; పాదుకాభ్యాం = పాదుకలచేతనే; గురోః = అన్నగారివి; మమ = మా.
భావము:-
“సత్వరము ఈ పాదుకలకు రాజ లాంఛనమగు ఛత్రము పట్టుడు. ఈ పాదుకలను మా అన్నగారి పాదములనియే గ్రహించగలరు. మా అన్నగారి ఈ పాదుకల చేతనే రాజ్యములో ధర్మము నిర్వహించబడును.
2.115.17.
అనుష్టుప్.
భ్రాత్రా హి మయి సంన్యాసో
నిక్షిప్తస్సౌహృదాదయమ్।
తమిమం పాలయిష్యామి
రాఘవాగమనం ప్రతి॥
టీక:-
భ్రాత్రా హి = అన్నగారిచేతనే; మయి = నాయందు; సన్న్యాసః = ఇల్లడగా చక్కగా భద్రపరచమని నావద్ద ఉంచినది; నిక్షిప్తః = ఉంచబడినది; సౌహృదాత్ = సుహృదయముతో; అయమ్ = ఈ; తమ్= అట్టి; ఇమమ్ = వీటిని; పాలయిష్యామి = పాలించెదను; రాఘవ= రాముడు; ఆగమనమ్= తిరిగివచ్చు; ప్రతి = వరకు.
భావము:-
సుహృదయముతో అన్నగారు నాకు ఇల్లడగా ఇచ్చిన దీనిని ఆ రఘురాముడు తిరిగివచ్చు వరకు నేను రక్షించెదను.
2.115.18.
అనుష్టుప్.
క్షిప్రం సంయోజయిత్వాతు
రాఘవస్య పునస్స్వయమ్।
చరణౌ తౌ తు రామస్య
ద్రక్ష్యామి సహపాదుకౌ॥
టీక:-
క్షిప్రమ్ = త్వరలో; సంయోజయిత్వా = జోడించిన; తు = పిమ్మట; రాఘవస్య = రామునియొక్క; పునః = మరల; స్వయమ్ = స్వయముగా; చరణౌ = పాదద్వయములను; తౌ = ఆ రెంటిని; తు = చేసి; రామస్య = రామునియొక్క; ద్రక్ష్యామి = చూచెదను; సహపాదుకౌ = పాదుకలతో కూడి
భావము:-
అనతికాలములో ఈ రాముని పాదుకలను ఆయనకు స్వయముగా తొడిగి, ఈ పాదుకలు ధరించిన ఆయన పాదములను దర్శించుకొనెదను.
2.115.19.
అనుష్టుప్.
తతో నిక్షిప్తభారోఽహం
రాఘవేణ సమాగతః।
నివేద్య గురవే రాజ్యం
భజిష్యే గురువృత్తితామ్॥
టీక:-
తతః = అప్పుడు; నిక్షిప్త= ఇల్లడ; భారః = బాధ్యతను వహించువాడనైన; అహం = నేను; రాఘవేణ = రామునితోడ; సమాగతః = చేరినవాడినై; నివేద్య = అర్పించి; గురవే = అన్నగారికొరకు; రాజ్యమ్ = రాజ్యమును; భజిష్యే = సేవించెదను; గురేవృత్తితామ్ = తండ్రిసేవ చేయునటుల
భావము:-
అప్పుడు నేను రాముడిని కలిసి ఆయనకు రాజ్యభారమును అప్పగించి తండ్రిని సేవించునటుల అన్నగారిని సేవించెదను.
2.115.20.
అనుష్టుప్.
రాఘవాయ చ సన్యాసం
దత్త్వేమే వరపాదుకే।
రాజ్యం చేదమయోధ్యాం చ
ధూతపాపో భవామి చ॥
టీక:-
రాఘవాయ = రామునికొరకు; చ = మఱియు; సన్న్యాసమ్ = ఇల్లడను (భద్రపరచమని ఇచ్చినది); దత్త్వా = ఇచ్చి; ఇమే= ఈ; వర= ఉత్తమమైన; పాదుకే = పాదుకలను; రాజ్యమ్ = రాజ్యమును; చ = మఱియు; ఇదమ్= ఈ; అయోధ్యామ్ = అయోధ్యను; చ = కూడా; ధూత = వదలబడిన, వావిళ్ళే; పాపః = పాపము కలవాడనువాడను; భవామి = అయ్యెదను; చ = కూడా.
భావము:-
రామునికి ఈ శ్రేష్ఠమైన పాదుకలను, అయోధ్య మఱియు రాజ్యమును ఇచ్చి, అన్నఉండగా తమ్ముడు రాజ్యపాలనాధికారము చేపట్టుట అను అనివార్యముగా చేయబడిన, పాపమును పోగొట్టుకొనెదను. పాదుకల తరఫున చేయుచుంటినను భావముతో చేసినను బాధ్యతలు నెరవేర్చిన దానికి కొంతైన పాపమంటును కదా.
2.115.21.
అనుష్టుప్.
అభిషిక్తే తు కాకుత్స్థే
ప్రహృష్టముదితే జనే।
ప్రీతిర్మమ యశశ్చైవ
భవేద్రాజ్యాచ్చతుర్గుణమ్॥
టీక:-
అభిషిక్తే తు = అభిషేకించినంతనే; కాకుత్స్థే = రాముడిని; ప్రహృష్ట-ముదితే = సంతోషముతో పులకరించినంతనె; జనే = జనులు; ప్రీతిః = ఆనందము; మమ = నాయొక్క; యశః చ = ప్రతిష్ట కూడా; ఏవ = తప్పక; భవేత్ = అగును; రాజ్యాత్ = రాజ్యము పొందుటకంటె; చతుర్గుణము = చతుః గుణమ్, నాలుగు రెట్లు
భావము:-
రామునకు రాజ్యాభిషేకమ చేసినంతనే, ప్రజలందరు మిక్కిలి సంతోషించెదరు. అంతట, నాకు రాజ్యము పొందుటకంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆనందమూ కీర్తియును లభించును.
2.115.22.
అనుష్టుప్.
ఏవం తు విలపందీనో
భరతః సమహాయశాః।
నందిగ్రామేఽకరోద్రాజ్యం
దుఃఖితో మంత్రిభిః సహ॥
టీక:-
ఏవం = ఈ విధముగా; తు = విశేషముగ; విలపన్ = విలపించెడి వాడై; దీనః = దీనుడు; భరతః = భరతుడు; సః = ఆ; మహాయశాః = గొప్ప ఖ్యాతిగలవాడు; నందిగ్రామే = నందిగ్రామమునందు; అకరోత్ = అతడు; రాజ్యము = రాజ్యము చేసెను; దుఃఖితః = దుఃఖితుడు; మంత్రిభిః = అతడు; సహ = మంత్రులతో కలసి
భావము:-
మహాఖ్యాతి గల భరతుడు దీనుడు ఈ విధముగా విలపించుచు, మంత్రుల సహాయకహకారుంలు ఉండియు ఆ దుఃఖితుడు రాజ్యమును నందిగ్రామమునుండియే పాలించెను.
2.115.23.
అనుష్టుప్.
స వల్కలజటాధారీ
మునివేషధరః ప్రభుః।
నందిగ్రామేఽవసద్వీరః
ససైన్యో భరతస్తదా॥
టీక:-
సః = అతడు; వల్కల-జటా-ధారీ = నార వస్త్రములను మఱియు సంస్కారము లేక జడలు కట్టిన జుట్టును ధరించినవాడై; మునివేష-ధరః = మునివేషము ధరించినవాడై; ప్రభుః = రాజై; నందిగ్రామే = నందిగ్రామమునందు; అవసత్ = నివసించెను; వీరః = వీరుడు; ససైన్యః = సైన్యముతో కూడినవాడై; భరతః = భరతుడు; తదా = అనంతరము
భావము:-
వీరుడైన భరతుడు నారవస్త్రములను, జటలను, మునివేషమును ధరించినవాడై సైన్యముతోకూడిన రాజై నందిగ్రామమునందు నివసించెను.
*గమనిక:-
(1) వల్కలః- నారతో చేసిన బట్టలు, నారచీర, linen cloth, వీటిని మునులు, ఋషులు మున్నగు వారు (2) జటాః- దినదినము శిరోజసంస్కార జంఝాటము తప్పించుకొనుటకు మున్యాదులు, తమ జుట్టునకు మఱ్ఱిపాలు పట్టించి జటలు కట్టించుకుందురు. వివరములకు చూ.వాతెరా> వివరణములో > వ్యాసములు నందు > 2.115.23.-వల్కలము-జటాధారణము
2.115.24.అనుష్టుప్.
రామాగమనమాకాంక్షన్
భరతో భ్రాతృవత్సలః।
భ్రాతుర్వచనకారీ చ
ప్రతిజ్ఞాపారగస్తథా॥
టీక:-
రామ = రాముని యొక్క; ఆగమనమ్ = రాకను; ఆకాంక్షన్ = ఆశించినవాడై; భరతః = భరతుడు; భ్రాతృవత్సలః = సోదరప్రేమ కలవాడు; భ్రాతుర్వచనకారీ = భ్రాతృ-వచన-కారీ, అన్నగారి మాటను ఆచరించెడివాడు; చ = మఱియు; ప్రతిజ్ఞాపారగః = ప్రతిజ్ఞను నిలబెట్టుకొనెడివాడు; తథా = ఆ విధముగాs
భావము:-
సోదరప్రేమకలవాడు అన్నగారి మాటను ఆచరించెడివాడు, ప్రతిజ్ఞను నిలబెట్టుకొనెడివాడు ఐన భరతుడు ఆ విధముగా రాముని మరలిరాకకు ఆశించినవాడై, , ,
2.115.25.
అనుష్టుప్.
పాదుకేత్వభిషిచ్యాథ
నందిగ్రామేఽవసత్తదా।
స వాలవ్యజనం ఛత్రం
ధారయామాస స స్వయం॥
టీక:-
పాదుకే = పాదుకలను; తు = చక్కగా; అభిషిచ్య = అభిషేకించి; అథ = అటుల; నందిగ్రామే = నందిగ్రామమునందు; అవసత్ = నివసించెను; తదా = ఆ సమయమునందు; భరతః = భరతుడు; శాసనం = పాలనను; సర్వం = మొత్తమును; పాదుకాభ్యాం = పాదుకలకు; న్యవేదయత్ = విన్నవించెను
భావము:-
పాదుకలకు రాజ్యాభిషేకము చేసి, నందిగ్రామమునందు భరతుడు నివసించెను. రాజ్యపాలన వివరములను మొత్తము ఆ పాదుకలకు విన్నవించెను.
2.115.26.
అనుష్టుప్.
తతస్తు భరతశ్శ్రీమాన్
అభిషిచ్యార్యపాదుకే।
తదధీనస్తదా రాజ్యం
కారయామాస సర్వదా॥
టీక:-
తతః = అటుపిమ్మట; తు = చక్కగా; భరతః = భరతుడు; శ్రీమాన్ = భాగ్యశాలి; అభిషిచ్య = అభిషేకము చేసి; ఆర్య = అన్నగారి; పాదుకే = పాదుకలకు; తత్ = వాటి; అధీనః = అధీనములో ఉన్నవాడు; తదా = ఆ సమయములో; రాజ్యం = రాజ్య పాలన; కారయామాస = సాగించెను; సర్వదా = ఎల్లప్పుడు
భావము:-
భాగ్యశాలియైన భరతుడు అన్నగారి పాదుకలకు అభిషేకము చేసి, ఎల్లప్పుడు ఆ అన్నగారి పాదుకల అధీనములో ఉండి ఉన్న రాజ్య పరిపాలన సాగించెను.
2.115.27.
ఉపేంద్రవ్రజా.
తదా హి యత్కార్యముపైతి కించిత్
ఉపాయనం చోపహృతం మహార్హమ్।
స పాదుకాభ్యాం ప్రథమం నివేద్య
చకార పశ్చాద్భరతో యథావత్॥
టీక:-
తదా = ఆ సమయములో (పాదుకల పేర భరతుడు రాజ్యపాలన చేయు సమయములో); హి = తప్పక; యత్ = ఏ; కార్యమ్ = పని; ఉపైతి = చేపట్టినను; కించిత్ = ఏ చిన్న; ఉపాయనం = కానుక; చ = ఐనను; ఉపహృతం = ఇవ్వబడినదో; మహార్హం = అత్యుత్తమయినది ఐనను; సః = అతను; పాదుకాభ్యాం = పాదుకలకొరకు; ప్రథమం = మొదటగా; నివేద్య = సమర్పించి; చకార = చేసెను; పశ్చాత్ = పిమ్మట; భరతః = భరతుడు; యథావత్ = యథా ప్రకారము
భావము:-
పాదుకల పేర రాజ్యపాలన చేయు సమయములో భరతుడు ఏ కార్యము చేపట్టినను, ఎంత చిన్నదైనను, ఎంత గొప్పదైనను పొందిన కానుకను మొట్టమొదట పాదుకలకు సమర్పించిన పిమ్మటనే యథాప్రకారము విధులను నిర్వర్తించెను.
2.115.27.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే చతుర్దశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; పంచదశోత్తరశతతమః [115] = నూటపదిహేన; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [115] నూటపదిహేనవ సర్గ సంపూర్ణము.
s2.116.1.
అనుష్టుప్.
ప్రతిప్రయాతే భరతే
వసన్ రామస్తపోవనే।
లక్ష్యమాస సోద్వేగమ
థౌత్సుక్యం తపస్వినామ్॥
టీక:-
ప్రతిప్రయాతే = తిరిగి వెళ్లిపోయెను; భరతః = భరతుడు; వసన్ = నివసించుచు; రామః = రాముడు; తపోవనే = తపోవనములో; లక్ష్యమాస = గుర్తించెను; స = ఆ; ఉద్వేగమ్ = అస్తిమితముగా ఉన్నట్లు; అథ = పిమ్మట; ఔత్సుక్యమ్ = ఉత్కంఠతో ఉన్నట్లు; తపస్వినామ్ = తాపసులు
భావము:-
భరతుడు తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట, రాముడు తపోవనములో నివసించుచు అక్కడ ఉన్న తాపసులు అందరూ అస్తిమితముగనూ, ఉద్వేగముతోనూ ఉన్నట్లు గుర్తించెను.
2.116.2.
అనుష్టుప్.
యే తత్ర చిత్రకూటస్య
పురస్తాత్తాపసాశ్రమే।
రామమాశ్రిత్య నిరతా
స్తానలక్షయతుత్సుకాన్॥
టీక:-
యే = ఎవరైతే; తత్ర = అక్కడ; చిత్రకూటస్య = చిత్రకూట పర్వతముపై; పురస్తాత్ = ఇతఃపూర్వమే; తాపస = తాపసులు; ఆశ్రమే = ఆశ్రమమునందు; రామమ్ = రాముని; ఆశ్రిత్య = ఆశ్రయించుకొని ఉందామని; నిరతాః = ఆసక్తితో ఉన్నవారిని; తాన్ = వారిని; అలక్షయత్ = చూచెను; ఉత్సుకాన్ = అట్టి ఔత్సుకముతో ఉన్నట్లు.
భావము:-
ఆ చిత్రకూటపర్వతముపై ఉన్న ఆశ్రమములో పూర్వము తనను ఆశ్రయించుకొని సంతోషముతో ఉన్నవారే ఇపుడు ఎందుకో ఉద్వేగ పడుచున్నట్లు రామునకు అనిపించెను.
2.116.3.
అనుష్టుప్.
నయనైః భృకుటీభిశ్చ
రామం నిర్దిశ్య శంకితాః।
అన్యోన్యముపజల్పన్తః
శనైశ్చక్రుమిథః కథాః॥
టీక:-
నయనైః = చూపులతోను; భృకుటీభిశ్చ = కనుబొమల కదలికలతోను; రామం = రాముని; నిర్దిశ్య = చూపుచు; శంకితాః = జంకుచు; అన్యోన్యమ్ = ఒకరితో ఒకరు; ఉపజల్పన్తః = మాట్లాడుకొనుట; శనైః = నెమ్మదిగా; చక్రు = చేసిరి; మిథః = రహస్యముగా; కథాః = ఏమో.
భావము:-
ఆ మునులు భయపడుతు చూపులు, కనుబొమల కదలికలు మున్నగు సైగలతో రాముని వైపు చూపుచు, నెమ్మదిగా ఏదియో రహస్యముగా మాట్లాడుకొనుచుంటిరి.
2.116.4.
అనుష్టుప్.
తేషామౌత్సుక్యమాలక్ష్య
రామస్త్వాత్మని శంకితః।
కృతాంజలిరువాచేదమ్
ఋషిం కులపతిం తతః॥
టీక:-
తేషామ్ = వారి; ఔత్సుక్యమ్ = ఔత్యుక్యమును; ఆలక్ష్య = కనుగొని; రామః = రాముడు; తు = ఐతే; ఆత్మని = తన వలన; శంకితః = జంకుతో; కృతాంజలిః = నమస్కరించుచు; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఇట్లు; ఋషిమ్ = ఋషులను; కులపతిమ్ = ఋషి ఆశ్రమ అధిపతిని; తతః = పిమ్మట.
భావము:-
రాముడు వారి ఔత్సుక్యమును గుర్తించి, తన వలన ఏమైనా అపరాధము జరిగినదేమో అని జంకెను. ఆ ఆశ్రమమునకు అధిపతియైన ఋషి వద్దకు వెళ్ళి నమస్కరించుచు ఇట్లు పలికెను.
2.116.5.
అనుష్టుప్.
“న కచ్చిద్ భగవన్ కించిత్
పూర్వవృత్తమిదం మయి।
దృశ్యతే వికృతం యేన
విక్రియన్తే తపస్వినః॥
టీక:-
న = లేదు; కచ్చిత్ = ఏదైనను; భగవన్ = ఓ పూజ్యుడా; కించిత్ = చిన్నదైనను; పూర్వవృత్తమ్ = ఇంతవరకు నడచిన నడతలో; ఇదమ్ = ఈ; మయి = నాచే; దృశ్యతే = కనపడుచుండెను; వికృతమ్ = వికారమైనది, అసహజమైనది; యేన = ఏ కారణముచేతైన; విక్రియన్తే = మార్పు; తపస్వినః = మహర్షులందరిలో.
భావము:-
పూజ్యుడా! ఈమధ్యన నా నడచిన నడతలో తేడానడత ఏమియు జరుగలేదు కదా? ఈ తాపసులు అందరిలో ఏదో మార్పు కనబడుచుండను.
2.116.6.
అనుష్టుప్.
ప్రమాదాచ్చరితం కచ్చిత్
కించిన్నావరజస్య మే।
లక్ష్మణస్యర్షిభిదృష్టం
నానురూపమివాత్మనః॥
టీక:-
ప్రమాదాత్ = పొరపాటు వలన; చరితమ్ = ప్రవర్తన; కచ్చిత్ కించిత్ న = ఏమాత్రమూ జరగలేదు కదా; అవరజస్య = సోదరుని యొక్క; మే = నా; లక్ష్మణస్య = లక్ష్మణునిచే; ఋషిభి = ఋషుల చేత; దృష్టం = చూచుట; న = కానిది; అనురూపమ్ = అతనికి తగిన పని; ఇవ = వలె; ఆత్మనః = తనకు.
భావము:-
నా తమ్ముడైన లక్ష్మణుని విషయమున ఏ పొరపాటు వర్తన జరుగలేదు కదా? తనకు తగని పని ఏదైనా చేసినట్లు ఋషుల దృష్టిలో జరుగలేదు కదా?
2.116.7.
అనుష్టుప్.
కచ్చిచ్ఛుశ్రూషమాణా? వః
శుశ్రూషణపరా? మయి।
ప్రమదాఽభ్యుచితాం వృత్తిం
సీతా యుక్తం న వర్తతే?”॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము; శుశ్రూషమాణా = శుశ్రూష చేయుచుండను కదా; వః = మీకు; శుశ్రూషణపరా = శ్రద్ధగా శుశ్రూష చేయుచుండెను; మయి = నా యందు; ప్రమదః = స్త్రీ, హర్షః సంతోష స్వభావి; అభ్యుచితామ్ = అభి+ఉచితామ్, మిక్కిలి యోగ్యమైన; వృత్తిమ్ = విధముగా; సీతా = సీతాదేవి; యుక్తమ్ = తగినట్లు; న = లేదు; వర్తతే = ప్రవర్తించుట.
భావము:-
నాకు అత్యాసక్తితో శుశ్రూష చేయుచు, మీకు కూడ శుశ్రూష చేయుచున్న సీత మీ విషయమున ఉత్తమస్త్రీకి యోగ్యమైన పద్ధతిలో తగినట్లు ప్రవర్తించకుండట జరుగ లేదు కదా?”
2.116.8.
అనుష్టుప్.
అథర్షిర్జరయా వృద్ధః
తపసా చ జరాం గతః।
వేపమాన ఇవోవాచ
రామం భూతదయాపరమ్॥
టీక:-
అథ = పిమ్మట; ఋషిః = ఆ మహర్షి; జరయా = ముసలితనము చేతను; వృద్ధః = వృద్ధుడైన; తపసా = తపస్సు చేతను; చ = మఱియు; జరామ్ = ముసలితనము చేతను; గతః = పొందిన; వేపమాన = వణుకుచున్న; ఇవ = విధముగ; ఉవాచ = పలికెను; రామమ్ = రామునిగూర్చి; భూతదయాపరమ్ = జీవకారుణ్యశాలి.
భావము:-
ఆ మాటలు విని, ముసలితనము చేతను, తపస్సు చేతను కూడ వృద్ధుడైన ఆ మహర్షి వణకుచు, జీవకారుణ్యమూర్తి అయిన రామునితో ఇట్లు పలికెను.
2.116.9.
అనుష్టుప్.
“కుతః? కల్యాణసత్త్వాయాః
కల్యాణాభిరతేస్తథా।
చలనం తాత వైదేహ్యాః
తపస్విషు విశేషతః॥
టీక:-
కుతః = ఎట్లు చేయగలదు; కల్యాణ = మంగళకరమైన; సత్త్వాయాః = స్వభావము కలది; కల్యాణ = శుభకరమైన; అభిరతేః = ఇచ్చ కలది; తథా = మఱియు; చలనం = ధర్మలోపము; తాత = తండ్రీ; వైదేహ్యాః = సీతమ్మలో; తపస్విషు = మునుల విషయమున; విశేషతః = విశేషించి.
భావము:-
”నాయనా రామా! సీత మంగళకరమైన స్వభావము కలది, ఎల్లపుడు శుభకరములైన కార్యములందే ఇచ్చ కలది. అట్టి సీతలో ధర్మ లోపము ఎట్లు కలుగును? విశేషించి మునుల విషయమున ఎట్లు కల్గును?
2.116.10.
అనుష్టుప్.
త్వన్నిమిత్తమిదం తావత్
తాపసాన్ప్రతివర్తతే।
రక్షోభ్యస్తేన సంవిగ్నాః
కథయంతి మిథః కథాః॥
టీక:-
త్వత్ = నీ; నిమిత్తమ్ = మూలముగా; ఇదం = ఇది; తావత్ = అంతయు; తాపసాన్ = తాపసులకు; ప్రతివర్తతే = కలుగుచుండెను; రక్షోభ్యః = రాక్షసుల వలన; తేన = ఆ కారణముగా; సంవిగ్నాః = ఆపదలు; కథయంతి = మాట్లాడుకొనుచుంటిరి; మిథః = రహస్యముగా; కథాః = వృత్తాంతములు
భావము:-
నీ మూలమున తాపసులకు రాక్షసుల వలన ఆపదలు కలుగుచున్నవి. అందుచేచతనే భయముతో వీరు రహస్యముగా మాటలాడుకొనుచుంటిరి.
2.116.11.
అనుష్టుప్.
రావణావరజః కశ్చిత్
ఖరో నామేహ రాక్షసః।
ఉత్పాట్య తాపసాన్సర్వాన్
జనస్థాననికేతనాన్॥
టీక:-
రావణ = రావణుని; అవరజః = తమ్ముడు; కశ్చిత్ = ఎవడు గలడో వాడు; ఖరః = ఖరుడు; నామః = అను పేరు గలవాడు; ఇహ = ఇక్కడ; రాక్షసః = రాక్షసుడు; ఉత్పాట్య = సమూలంగా చంపుచుండెను; తాపసాన్ = మునులను; సర్వాన్ = అందరినీ; జనస్థాన = జనస్థానములో; నికేతనాన్ = నివసించుచున్న.
భావము:-
తండ్రీ! ఇక్కడ ఉన్న రావణుని తమ్ముడైన ఖరుడు అనే రాక్షసుడు జనస్థానములో ఉన్న మునులను అందరినీ సమూలముగా సంహరించు చుండను.
2.116.12.
అనుష్టుప్.
ధృష్టశ్చ జితకాశీ చ
నృశంసః పురుషాదకః।
అవలిప్తశ్చ పాపశ్చ
త్వాం చ తాత న మృష్యతే॥
టీక:-
ధృష్టః = ప్రతిభ కలవాడు; చ = మఱియు; జితకాశీ = జయశీలుడు; చ = మఱియు; నృశంసః = క్రూరుడు; పురుషాదకః = నరభక్షకుడు; అవలిప్తః = గర్వితుడు; చ = మఱియు; పాపః = పాపాత్ముడు; చ = మఱియు; త్వామ్ = నిన్ను చూచి; చ = మఱియు; తాత = నాయనా; న = లేదు; మృష్యతే = ఓర్వజాలకుండుట.
భావము:-
ధారుడ్యము కలవాడూ, క్రూరుడూ, నరభక్షకుడూ, విజయశీలుడు, గర్వితుడూ, పాపాత్ముడూ అయిన ఆ రాక్షసుడు నిన్ను చూచి ఓర్వజాలకుండెను.
2.116.13.
అనుష్టుప్.
త్వం యదాప్రభృతి హ్యస్మి
నాశ్రమే తాత వర్తసే।
తదాప్రభృతి రక్షాంసి
విప్రకుర్వంతి తాపసాన్॥
టీక:-
త్వం = నీవు; యదా = ఎప్పడు; ప్రభృతి = మొదలుపెట్టి; హి = ఐతే; అస్మిన్ = ఈ; ఆశ్రమే = ఆశ్రమములో; తాత = నాయనా; వర్తసే = నివాసము ఏర్పరచుకుంటివో; తదా = అది; ప్రభృతి = మొదలుగా; రక్షాంసి = రాక్షసులు; విప్రకుర్వంతి = బాధించుచున్నారు; తాపసాన్ = మునులను.
భావము:-
నీవు ఈ ఆశ్రమములో నివాసము ఏర్పరచుకున్నది మొదలు, రాక్షసులు మునులను బాధించుచున్నారు.
2.116.14.
అనుష్టుప్.
దర్శయంతి హి బీభత్సైః
క్రూరైః భీషణకైరపి।
నానారూపైః విరూపైశ్చ
రూపైః వికృతదర్శనైః॥
టీక:-
దర్శయంతి = చూచుటకు; హి = ఐతే; బీభత్సైః = జుగుప్స కలిగించునవి; క్రూరైః = క్రూరమైనవి; భీషణకైః = భయమును పుట్టించునవి; అపి = కూడ; నానా = వివిధే; రూపైశ = వివిధ ఆకారములతో; విరూపైశ్చ = వికారముగా ఉన్నవి; రూపైః = రూపములలో; వికృత = వికృతమైన; దర్శనైః = కనపడుచున్నారు
భావము:-
ఆ రాక్షసులు జుగుప్స కలిగించునవీ, క్రూరమైనవీ, భయమును పుట్టించునవీ ఐన వివిధ రూపములలో ఉన్నవీ, వికృతమైన రూపము కలవీ, చూచుటకు వికారముగా ఉన్నవీ అయిన ఆకారములతో కనబడుచున్నారు.
2.116.15.
అనుష్టుప్.
అప్రశస్తై అశుచిభిః
సంప్రయోజ్య చ తాపసాన్।
ప్రతిఘ్నంత్యపరాన్ క్షిప్రమ్
అనార్యాః పురతః స్థితాః॥
టీక:-
అప్రశస్తైః = అపవిత్రములైన; అశుచిభిః = అశుభ్రమైన; సంప్రయోజ్య = పడవేయుచు; చ = మఱియు; తాపసాన్ = మునులపై; ప్రతిధ్నంతి = కడదేరుస్తున్నారు; పరాన్ = కొందరిని; క్షిప్రమ్ = వేగముగా; అనార్యాః = దుష్టులు; పురతః = ఎదుట; స్థితాః = నిలచి.
భావము:-
దుష్టులైన రాక్షసులు కొందరు మునులపై, అపవిత్రములైన అశుభ్రమైన పదార్ధములు పడవేయుచుంటిరి. మరికొందరిని యెదిరించి కడతేరుస్తుంటిరి.
2.116.16.
అనుష్టుప్.
తేషు తేష్వాశ్రమస్థానే –
ష్వబుద్ధమవలీయ చ।
రమన్తే తాపసాంస్తత్ర
నాశయంతోఽల్పచేతసః॥
టీక:-
తేషు తేషు = ఆయా ప్రదేశములలో; ఆశ్రమ = ఆశ్రమ; స్థానేషు = ప్రదేశములందు; అబుద్ధమ్ = తెలియకుండగా; అవలీయశ్చ = దాగుకొనుచు; రమన్తే = ఆనందించుచున్నారు; తాపసాన్ = తాపసులను; తత్ర = అక్కడ; నాశయన్త = చంపుచు; అల్పచేతసః = నీచ బుద్ధి గల
భావము:-
నీచ బుద్ధి గల ఈ రాక్షసులు, ఆశ్రమమునందు ఆయా ప్రదేశములలో, తెలియకుండగా దాగి ఉండి, మునులను చంపుచు, ఆనందించుచున్నారు.
2.116.17.
అనుష్టుప్.
అపక్షిపంతి స్రుగ్భాండాన్
అగ్నీస్నించంతి వారిణా।
కలశాంశ్చ ప్రమథ్నంతి
హవనే సముపస్థితే॥
టీక:-
అపక్షిపంతి = చిందరవందర చేయుచున్నారు; స్రుక్ = స్రుక్కులను; భాండాన్ = పాత్రలను; అగ్నీః = అగ్నిగుండములో; శించంతి = పోయుచున్నారు; వారిణా = నీటిని; కలశాంశ్చ = కలశలను; ప్రమథ్నంతి = బ్రద్దలుకొట్టుచున్నారు; హవనే = హోమ సమయమునందు; సముపస్థితే = జరుగుచుండగా.
భావము:-
హోమ సమయమునందు.. స్రుక్కులనూ, హోమద్రవ్య పాత్రలనూ పారవేయుచున్నారు. అగ్నిగుండములో నీరు పోయుచున్నారు. కలశలను బ్రద్దలు కొట్టుచున్నారు.
*గమనిక:-
స్రుక్ స్రువం- స్రుక్ రావికఱ్ఱతో చేసిన కొద్దిగా కోణాలు కలిగిన గిన్నవంటిది చివర ఉండు గరిట వంటిది. దీనితో హోమంలో ఆహుతి చేయుటకు నేతిని తీసుకుంటారు. స్రువంతో వెడల్పైన కాడ ఉండి, పాత్రవంటిది గుండ్రంగా ఉండి ఒక ప్రక్క సూది కొమ్ము ఉండు మోదగ కఱ్ఱతో చేసిన నేతిగరిటవంటి సాధనం. స్రుక్ నుండి దీనిలోనికి నేతిని గ్రహించి హోమగుండంలో ఆహుతిగా వేస్తారు. ఇందంతా మంత్రసహితంగా జరుగును.
2.116.18.
అనుష్టుప్.
తైర్దురాత్మభిరామృష్టాన్
ఆశ్రమాన్ప్రజిహాసవః।
గమనాయాన్యదేశస్య
చోదయన్త్యృషయోఽద్య మామ్॥
టీక:-
తైః = ఈ; దురాత్మభిః = దురాత్ములు; అమృష్టాన్ = ఆక్రమించుచున్న; ఆశ్రమాన్ = ఆశ్రమములను; ప్రజిహాసవః = విడిచిపెట్టి; గమనాయ = వెళ్లిపోవుటకు; అన్యదేశస్య = మరియొక ప్రదేశమునకు; చోదయంతి = ప్రేరేపించుచున్నారు; ఋషయః = ఋషులందరు; అద్య = ఇప్పుడు; మామ్ = నన్ను.
భావము:-
ఇపుడు ఈ ఋషులందరు, ఈ దురాత్ములు ఆక్రమించుచున్న ఆశ్రమములను విడచి, మరియొక ప్రదేశమునకు వెళ్లెదము అని నన్ను ప్రేరేపించుచున్నారు.
2.116.19.
అనుష్టుప్.
తత్పురా రామ శారీరామ్
ఉపహింసాం తపస్విషు।
దర్శయంతి హి దుష్టాస్తే
త్యక్ష్యామ ఇమమాశ్రమమ్॥
టీక:-
తత్ = దానికి; పురా = ముందుగానే; రామ = రామా; శారీరామ్ = శారీరకమైన; ఉపహింసామ్ = చిత్రహింసలను; తపస్విషు = మునుల విషయమున; దర్శయంతి = చూపించుచుంటిరి; హి = రామా; దుష్టాః = దుర్మార్గులు; తే = వారు; త్యక్ష్యామ = విడిచివేసెదము; ఇమమ్ = ఈ; ఆశ్రమమ్ = ఆశ్రమప్రదేశమును.
భావము:-
ఆ దుర్మార్గులు ఈలోగా మునుల శరీరమును చిత్రహింసలకు కూడ గురిచేయుచున్నారు. వారు పరమ దుర్మార్గులు. అందువలన ఈ ఆశ్రమమును మేము విడిచిపెట్టెదము.
2.116.20.
అనుష్టుప్.
బహుమూలఫలం చిత్రమ్
అవిదూరాదితో వనమ్।
పురాణాశ్రమమేవాహం
శ్రయిష్యే సగణః పునః॥
టీక:-
బహు = ఎక్కువగా; మూలః = దుంపలు; ఫలం = ఫలములు; చిత్రమ్ = రకరకముల; అవిదూరాత్ = సమీపమున; ఇతః = ఇక్కడికి; వనమ్ = వనములో; పురాణ = ప్రాచీన; ఆశ్రమమ్ + ఏవ = ఆ ఆశ్రమమునే; అహం = నేను; శ్రయిష్యే = ఆశ్రయించెదము; సగణః = ముని గణము; పునః = మరల.
భావము:-
ఇక్కడికి సమీపమున అధికమైన రకరకముల మూలఫలములు లభించు వనము కలదు. నేను, మునిగణము సహితముగా మరల అచటి పురాణప్రసిద్ధమైన ఆశ్రమమునే ఆశ్రయించెదము.
2.116.21.
అనుష్టుప్.
ఖరస్త్వయ్యపి చాయుక్తం
పురా తాత ప్రవర్తతే।
సహాస్మాభిరితో గచ్ఛ
యది బుద్ధిః ప్రవర్తతే॥
టీక:-
ఖరః = ఖరుడు; త్వయి = నీ విషయములో; అపి = కూడా; చ = మఱి; అయుక్తం = చెడ్డగా; పురా = ఎప్పటిలాగే; తాత = తండ్రీ; ప్రవర్తతే = ప్రవర్తించును; సహ = కలిసి; అస్మాభిః = మాతో; ఇతః = ఈ ప్రదేశము గూర్చి; గచ్ఛ = బయలుదేరుము; యది = ఒకవేళ; బుద్ధిః = నీ ఆలోచన; ప్రవర్తతే = అలగా నడచినయెడల.
భావము:-
నాయనా రానా! ఆ ఖరుడు ఎప్పటిలాగే నీ విషయములో కూడ చెడ్డగా ప్రవర్తించును. అందుచే నీకు ఇష్టమైనచో ఈ ప్రదేశమును విడచి మాతో రమ్ము.
2.116.22.
అనుష్టుప్.
సకళత్రస్య సందేహో
నిత్యం యత్తస్య రాఘవ।
సమర్థస్యాపి హి సతో
వాసో దుఃఖమిహాద్య తే”॥
టీక:-
సకళత్రస్య = భార్యతో కలసి ఉన్న; సందేహః = సంశయము కలవాడవై; నిత్యమ్ = ప్రతి నిత్యము; యత్తస్య = సన్నధుడవై ఉండుట; రాఘవ = రామా; సమర్థస్యాపి హి = సమర్థులలో; హి = ఐనను; సతః = సమర్థుడవు; వాసః = నివసించుట; దుఃఖమ్ = దుఃఖమును కలిగించునది; ఇహ = ఇక్కడ; అద్య = ఇప్పుడు; తే = నీకు
భావము:-
భార్యతో కలిసి ఉన్న నీవు, ఎంత జాగరూకతతో ఉన్నను, ఎంత సమర్థుడవైనను, ప్రతి నిత్యమూ సంశయముతోనే ఉండవలెను. అలా ఇప్పుడు ఇక్కడ నివసించుట దుఖదాయకము కదా.”
2.116.23.
అనుష్టుప్.
ఇత్యుక్తవన్తం రామస్తం
రాజపుత్రస్తపస్వినమ్।
న శశాకోత్తరైర్వాక్యైః
అవరోద్ధుం సముత్సుకమ్॥
టీక:-
ఇతి = ఇట్లు; ఉక్త్తవన్తమ్ = పలికినను; రామః = రాముడు; తం = ఆ; రాజపుత్రః = రాజకుమారుడు; తపస్వినమ్ = మునులను; న = కాలేదు; శశాకః = సమర్థుడు; ఉత్తరైః = ప్రత్యుత్తర; వాక్యైః = మాటలచే; అవరోద్ధుం = ఆపుటకు; సముత్సుకమ్ = వేగిరపడుచున్నవారిని
భావము:-
ఈ విధముగా చెప్పి ఆశ్రమమును విడిచి వెళ్ళిపోవుటకు వేగిరపడుచున్న ఆ తాపసులను ఆపుటకు తగిన సమాధాన పలుకులు చెప్పలేకపోయెను.
2.116.24.
అనుష్టుప్.
అభినంద్య సమాపృచ్ఛ్య
సమాధాయ చ రాఘవమ్।
స జగామాశ్రమం త్యక్త్వా
కులైః కులపతిస్సహ॥
టీక:-
అభినంద్య = అభినందించి; సమాపృచ్ఛ్య = వీడ్కొలిపి; సమాధాయ చ = ఒప్పించి; చ = ఇంక; రాఘవమ్ = రాముని; స = ఆ; జగామ = వెళ్లిపోయిరి; ఆశ్రమమ్ = ఆశ్రమమును; త్యక్త్వా = విడిచిపెట్టి; కులైః = ముని సమూహము; కులపతిః = కులపతితో; సహ = కలసి.
భావము:-
రాముని అభినందించి, అతనిని అంగీకరింపచేసి, వీడ్కొలిపి, ఆ కులపతితో కలిసి ముని సమూహము ఆ ఆశ్రమమును విడిచి వెళ్ళిపోయరి.
2.116.25.
జగతి.
రామః సంసాద్య ఋషిగణమనుగమనాత్
దేశాత్తస్మాత్కులపతిమభివాద్య ఋషిమ్।
సమ్యక్ప్రీతైస్తైరనుమత ఉపదిష్టార్థః
పుణ్యం వాసాయ స్వనిలయముపసమ్పేదే॥
టీక:-
రామః = రాముడు; సంసాద్య = వీడ్కోలు పలికి; ఋషిగణమ్ = ఋషి గణమును; అనుగమనాత్ = అనుసరించి వెళ్లి; దేశాత్ = ప్రదేశము నుండి; తస్మాత్ = ఆ; కులపతిమ్ = కులపతికి; అభివాద్య = నమస్కరించి; ఋషిమ్ = ఋషులతో; సమ్యక్ = బాగుగా; ప్రీతైః = సంతోషించిన; తైః = వారి; అనుమత = అనుమతితో; ఉపదిష్ట = ఉపదేశించిన; అర్థః = విషయములను; పుణ్యమ్ = పవిత్రమైన; వాసాయ = నివసించుటకు; స్వనిలయమ్ = తన పర్ణశాలను; ఉపసమ్పేదే = చేరెను.
భావము:-
రాముడు కొంత దూరము అనుసరించి వెళ్ళి, ఆ ఋషులను వీడ్కొలిపి, కులపతికి నమస్కరించి, మిక్కలి సంతోషించిన వారు ఉపదేశించిన పవిత్రమైన విషయములు గ్రహించి, వారి అనుమతి పొంది, తన పర్ణశాలకు చేరెను.
2.116.26.
త్రిష్టుప్.
ఆశ్రమమృషివిరహితం ప్రభుః
క్షణమపిన జహౌ స రాఘవః।
రాఘవం హి సతతమనుగతా
స్తాపసాశ్చార్షచరితే ధృతగుణాః॥
టీక:-
ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఋషి = ఋషులు; విరహితమ్ = లేనట్టి; ప్రభుః = ప్రభువైన; క్షణమ్ = క్షణకాలమైన; అపి = కూడా; న = లేదు; జహౌ = విడిచిపెట్టి ఉండ; స = ఆ; రాఘవః = రఘురాముడు; రాఘవమ్ = రఘురాముడినే; హి = మాత్రమే; సతతమ్ = నిరంతరము; అనుగతాః = అనుసరించుటయందు; తాపసాః = మునులు; చ = కూడ; అర్షచరితే = ఋషీశ్వరులవర్తన యందు; ధృత= స్థిరమైన; గుణాః = ఆసక్తికలవారు.
భావము:-
ప్రభువైన ఆ రాముడు ఋషులు లేని ఆ ఆశ్రమమును క్షణకాలము అయినను విడువలేదు. ఋషుల ధర్మమును ఆచరించుటయందు వైశిష్ట్యమును పొందిన ఆ ఋషీశ్వరులు ఇంతవరకును రామునే అనుసరించి ఉండెడివారు కదా!
2.116.27.
గద్యం..
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే చతుర్దశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; షోడశోత్తరశతతమః [11l] = నూటపదహారవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [115] నూటపదహారవ సర్గ సంపూర్ణము.
2.117.1.
అనుష్టుప్.
రాఘవస్త్వథ యాతేషు
తపస్విషు విచింతయన్।
న తత్రారోచయద్వాసం
కారణైర్బహుభిస్తదా॥
టీక:-
రాఘవః = రాముడు; తు = మాత్రము; అథ = అటుపిమ్మట; యాతేషు = వెడలిన పిమ్మట; తపస్విషు = తాపసులు; విచింతయన్ = ఆలోచించుచు; న = క్రియకు అన్వయించ వలసిన వ్యతిరేక భావము; తత్ర = అచ్చట; అరోచయత్ = ఇష్టపడెను; వాసం = నివాసము చేయుటకు ; కారణైః = కారణములచేత; బహుభిః = అనేకమైన వాటిచేత; తదా = ఆ సమయమున
భావము:-
తాపసులు వెడలిన పిమ్మట రాముడు విశ్లేషించి అనేక కారణముల వలన అచ్చట నివసించుటకు యిచ్చగించలేదు.
2.117.2.
అనుష్టుప్.
ఇహ మే భరతో దృష్టో
మాతరశ్చ సనాగరాః।
సా చ మే స్మృతిరన్వేతి
తాన్నిత్యమనుశోచతః॥
టీక:-
ఇహ = ఇచ్చట; మే = నా చేత; భరతః = భరతుడు; దృష్టః = చూడబడెను; మాతరః = తల్లులు; చ = కూడా; స = సహ; నాగరాః = నగర పౌరులతో; సా = అట్టి; చ = మఱియు; మే = నా యొక్క; స్మృతిః = జ్ఞాపకము; అన్వేతి = అనుసరించును; తాన్ = వారిని; నిత్యమ్ = సదా; అనుశోచతః = తలుచుకోబడినవారిని
భావము:-
ఇచ్చట నేను భరతుడను, మా తల్లులను, నగర పౌరులను కలుసుకుంటిని. కావున ఇచ్చట నిత్యము వారి జ్ఞాపకములు నన్ను వెంటాడుచుండును. తద్వారా శోకము కలిగించును.
2.117.3.
అనుష్టుప్.
స్కందావారనివేశేన
తేన తస్య మహాత్మనః।
హయహస్తికరీషైశ్చ
ఉపమర్దః కృతో భృశమ్॥
టీక:-
స్కందావార = సైనికదళముల; నివేశేన = నివాసముచేత రాజుగారు మఱియు సైనికులు ఉండు శిబిరముల చేత; తేన = అందుచేత; తస్య = అతనియొక్క; మహాత్మనః = మహాత్మునియొక్క, భరతుని; హయః = గుఱ్ఱముల; హస్తిః = గజముల; కరీషైః = పేడలచేత; చ = కూడా; ఉపమర్దః = తొక్కబడుట; కృతః = చేయబడినది; భృశమ్ = అమితముగా
భావము:-
ఇచ్చట సమీపమున మహాత్ముడైన భరతుని సైనికశిబిర విడిసెను. సైనికులతోడ వచ్చిన అనేక గుఱ్ఱముల ఏనుగుల పేడలచేత ఈ నేల అంతయు అమితముగా తొక్కబడినది. అందువలన ఈ ప్రదేశము నివాసమునకు అనుకూలముగా లేదు.
2.117.4.
అనుష్టుప్.
తస్మాదన్యత్ర గచ్ఛామ
ఇతి సంచింత్య రాఘవః।
ప్రాతిష్ఠత స వైదేహ్యా
లక్ష్మణేన చ సంగతః॥
టీక:-
తస్మాత్ = అందువలన; అన్యత్ర = ఇతర ప్రాంతమునకు; గచ్ఛామః = వెళ్ళెదము; ఇతి = అని; సంచింత్య = బాగుగా ఆలోచించి; రాఘవః = రఘురాముడు; ప్రాతిష్ఠత = ప్ర+అతిష్ఠత, బయలుదేరెను; సః = అతను; వైదేహ్యా = సీత తోడ; లక్ష్మణేన = లక్ష్మణుని తోడ; చ = మఱియు; సంగతః = కలిసినవాడై
భావము:-
ఆ కారణములవలన తాము ఇతర ప్రాంతమునకు వెళ్లవలెనని బాగుగా ఆలోచించి నిర్ణయించుకొని రాముడు సీతాలక్ష్మణులతో కలిసి బయలుదేరెను.
2.117.5.
అనుష్టుప్.
సోఽ త్రేరాశ్రమమాసాద్య
తం వవన్దే మహాయశాః।
తం చాపి భగవానత్రిః
పుత్రవత్ప్రత్యపద్యత॥
టీక:-
సః = అతను; అత్రేః = అత్రిముని యొక్క; ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఆసాద్య = చేరుకొని; తం = ఆయనకు; వవన్దే = నమస్కరించెను; మహాయశాః = గొప్ప కీర్తి కలవాడైన; తం = అతనిని, రాముడిని; చ అపి = కూడా; భగవాన్ = భగవత్స్వరూపుడైన; అత్రిః = అత్రిముని; పుత్రవత్ = కుమారుని వలె భావించి; ప్రత్యపద్యత = ప్రతి+ అపద్యత = ఆహ్వానించెను.
భావము:-
మహా కీర్తిశాలి రాముడు అత్రిముని యొక్క ఆశ్రమమును చేరుకొని ఆయనకు నమస్కరించెను. భగవత్స్వరూపుడైన అత్రిముని కూడా పుత్ర వాత్సల్యముతోడ రాముడిని ఆహ్వానించెను.
*గమనిక:-
 అత్రి- మంత్రద్రష్ట ఐన మహర్షి. ఆంధ్రశబ్దరత్నాకరము. వీరు బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు. ఈయన ప్రస్తుత వైవస్వత మన్వంతరంలోని సప్తఋషులలో ఒకరు, భర్య అనసూయాదేవి, కర్దమ ప్రజాపతి పుత్రిక, సప్త పతివ్రతలలో ఒకరు. ఇతడు తపోబలముచే త్రిమూర్తుల అంశములందు సోముడు, దూర్వాసుడు, దత్తాత్రేయులను పుత్రులుగా పడసెవు. పురాణనామ చంద్రిక, గంగ తన ఆశ్రమమును ముంచినదని ఒకే గుక్కలో గంగని మింగిన మహాత్ముడు. ఇతడు సప్తర్షులలో ఒకడు. బ్రహ్మర్షి అత్రి ఋగ్వేదంలోని ఐదవ మండలము మఱియు అగ్ని, ఇంద్రుడు, మఱియు ఇతర దేవతలకు చెందిన అనేక మంత్రములకే ద్రష్ట. ఋగ్వేదంలో అనేక శ్లోకాలను రచించారు. కర్దమ మహర్షి కుమార్తె అనసూయను వివాహం చేసుకున్నారు. సౌజన్యము వికీపీడియా. ఆత్రేయసగోత్ర పురుషుడు.
2.117.6.
అనుష్టుప్.
స్వయమాతిథ్యమాదిశ్య
సర్వమస్య సుసత్కృతమ్।
సౌమిత్రిం చ మహాభాగాం
సీతాం చ సమసాంత్వయత్॥
టీక:-
స్వయమ్ = స్వయముగా; ఆతిథ్యమ్ = ఆతిథ్యమును; ఆదిశ్య = సమర్పించి; సర్వమ్ = సర్వము; అస్య = అతని యొక్క (రాముని యొక్క); సుసత్కృతమ్ = బాగుగా నిర్వర్తించినది; చ = కూడా; సౌమిత్రిం = లక్ష్మణుని; చ = కూడా; మహాభాగామ్ = మహాభాగ్యవతియైన; సీతాం = సీతను ; చ = కూడా; సమాసాంత్వయత్ = సమ్ + అసాంత్వయత్, చక్కగా ఓదార్చెను.
భావము:-
అత్రిముని రామునికి శ్రేష్ఠమైన ఆతిథ్యమును స్వయముగా సమర్పించిన పిమ్మట లక్ష్మణుని, మహాభాగ్యవతియైన సీతను పలుకరించి సమాధానపరిచెను.
2.117.7.
అనుష్టుప్.
పత్నీం చ సమనుప్రాప్తాం
వృద్ధామామంత్ర్య సత్కృతామ్।
సాంత్వయామాస ధర్మజ్ఞః
సర్వభూతహితే రతః॥
టీక:-
పత్నీం = భార్యను; చ = కూడా; సమ్ అనుప్రాప్తామ్ = వెంట తీసుకువచ్చినది; వృద్ధాం = వృద్ధురాలైన; ఆమంత్ర్య = రప్పించి; సత్కృతామ్ = గౌరవింపబడినది; సాంత్వయామాస = సాంత్వన కల్పించెను; ధర్మజ్ఞః = ధర్మము తెలిసినవాడు; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; హితే = చేయుటలో; రతః = ఆసక్తుడైనవాడు
భావము:-
తన వెంట గౌరవనీయురాలు వృద్ధురాలు అయిన భార్యను రప్పించుకొని ఆవిడతో కలిసి అతిథులుగా వచ్చిన సీతారామలక్ష్మణులకు ధర్మపరుడును సర్వజీవులకు హితము చేయుటలో ఆసక్తుడైన అత్రిముని ఓదార్పెను.
2.117.8.
అనుష్టుప్.
ఆనసూయాం మహాభాగాం
తాపసీం ధర్మచారిణీమ్।
ప్రతిగృహ్ణీష్వ వైదేహీమ్
అబ్రవీదృషిసత్తమః॥
టీక:-
ఆనసూయామ్ = అనసూయను; మహాభాగామ్ = మహాభాగ్యవతిని; తాపసీమ్ = తపస్వినిని; ధర్మచారిణీమ్ = ధర్మము ఆచరించుదానిని; ప్రతగృహ్ణీష్వ = నీవు స్వీకరించుము అని; వైదేహీమ్ = సీతను; అబ్రవీత్ = అని పలికెను; ఋషి సత్తమః = ఋషిశ్రేష్ఠుడు
భావము:-
ఋషిశ్రేష్ఠుడైన అత్రిముని మహాభాగ్యవతియు, తపస్వినియు, ధర్మాత్మురాలును అయిన తన భార్య అనసూయను నీవు సీతను గౌరవించుమని నిర్దేశించెను.
2.117.9.
అనుష్టుప్.
రామాయ చాచచక్షే తాం
తాపసీం ధర్మచారిణీమ్।
దశ వర్షాణ్యనావృష్ట్యా
దగ్ధే లోకే నిరంతరమ్॥
టీక:-
రామాయ = రాముని కొరకు; చ = మఱియు; ఆచచక్షే = వివరించెను; తాం = ఆవిడ గురించి; తాపసీం = తపస్విని గురించి; ధర్మచారిణీమ్ = ధర్మాచరణము చేయుదాని గురించి; దశవర్షాణి = పది సంవత్సరములు; అనావృష్ట్యా = కరవు వలన ; దగ్ధే = దహించబడు చుండగా; లోకే = ప్రపంచము; నిరంతరం = నిరంతరము
భావము:-
తపస్వినీ, ధర్మాచరణము చేయునదియును అయిన అనసూయ గురించి రామునకు ఇట్లు వివరించెను - పది సంవత్సరముల పాటు కరవు వలన అలమటించుచున్న లోకమును నిరంతరము.
2.117.10.
అనుష్టుప్.
యయా మూలఫలే సృష్టే
జాహ్నవీ చ ప్రవర్తితా।
ఉగ్రేణ తపసా యుక్తా
నియమైశ్చాప్యలంకృతా॥
టీక:-
యయా = ఎవరి చేతనైతే; మూలఫలే = కందమూలములు ఫలములు; సృష్టే = సృష్టించబడగా; జాహ్నవీ = గంగా నది; చ = కూడా; ప్రవర్తితా = ప్రవహించినదో; ఉగ్రేణ = తీవ్రమైనదానిచేత; తపసా = తపస్సు చేత; యుక్తా = నిమగ్నమైనది; నియమైః = నియమములచేత; చ అపి = కూడా; అలంకృతా = అలంకరించబడినది
భావము:-
ఈ అనసూయచేతనే కందమూలములు, ఫలములు సృష్టించబడినవి, గంగానది కూడా తిరిగి ప్రవహింపగలిగినది, ఈమె తీవ్రమైన తపస్సు చేసెను మఱియు నియబద్దురాలు.
2.117.11.
అనుష్టుప్.
దశవర్ష సహస్రాణి
తయా తప్తం మహత్తపః।
అనసూయా వ్రతైస్స్నాతా
ప్రత్యూహాశ్చ నివర్తితాః॥
టీక:-
దశ-వర్ష-సహస్రాణి = పదివేల సంవత్సరములు; తయా = ఆవిడచేత; తప్తం = తపించబడింది; మహత్తపః = తీవ్రమైన తపస్సు; అనసూయా = అనసూయ; వ్రతైః = వ్రతముల చేత; స్నాతా = స్నానము చేయబడినది; ప్రత్యూహాః = ఆటంకములు; చ = కూడా; నివర్తితాః = తొలగించబడినవి
భావము:-
అనసూయ అనేకవ్రతములను పూర్తిచేసినది. ఆమె పదివేల సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేసినది. ఆవిడ మహిమ వలన ఆశ్రమవాసుల తపోభంగములు వంటి ఆటంకములు తొలగించబడినవి.
2.117.12.
అనుష్టుప్.
దేవకార్యనిమిత్తం చ
యయా సంత్వరమాణయా।
దశరాత్రం కృతా రాత్రి
స్సేయం మాతేవ తేఽ నఘ॥
టీక:-
దేవ-కార్య-నిమిత్తం = దేవతల కోరిక మేరకు; చ = కూడా; యయా = ఎవరి చేతనైతే; సంత్వరమాణయా = త్వరపడుదాని చేత; దశ-రాత్రం = పది రాత్రులు; కృతా = చేయబడినది; రాత్రిః = ఒక రాత్రి; సా ఇయం = అట్టి ఈవిడ; మాతా = మాత; ఇవ = వంటిది; తే = నీ యొక్క; అనఘ = ఓ పాప రహితుడా!
భావము:-
ఓ అనఘుడా రామా! దేవతల కోరిక మేరకు ఈమె పది దివారాత్రములను ఒక్క రాత్రిగా అగునట్లు చేసెను. అట్టి మహిమగల ఈవిడ నీకు తల్లితో సమానురాలు.
*గమనిక:-
గీతాప్రెస్ వారి రామాయణము సౌజన్యముతో:: ఒకానొక సమయమున మాండవ్యమహాముని “శాండిలి” అను తపస్విని “నీవు పది దినములలలోగా ఒక ప్రాతఃకాలమున వైధ్యమును పొందుదువు” అని శపించెను. ఆ శాండిలి “అనసూయాదేవికి” ఆత్మీయురాలు. మాండవ్య ముని ఇచ్చిన శాపమునకు ప్రతీకారముగ శాండిలి “ఇక సూర్యోదయమే కాకుండు గాక” అని ప్రతిశాపము ఇచ్చెను. దీనికి దేవతలందరు భయభ్రాంతులై అనసూయాదేవిని శరణుజొచ్చిరి. ఆమె తన తపోమహిమచే పదిరాత్రులను ఒక్కరాత్రిగా జేసెను. ఆ విధముగ ఆమె శాండిలి ప్రామములను కాపాడమూ, దేవతల కోరికను తీర్చుట చేసెను.
2.117.13.
అనుష్టుప్.
తామిమాం సర్వభూతానాం
నమస్కార్యాం యశస్వినీమ్।
అభిగచ్ఛతు వైదేహీ
వృద్ధామాక్రోధనాం సదా।
అనసూయేతి యా లోకే
కర్మభిః ఖ్యాతిమాగతా”॥
టీక:-
తామ్ = అట్టి; ఇమామ్ = ఈవిడను; సర్వభూతానామ్ = సమస్త ప్రాణులకు ; నమస్కార్యామ్ = పూజింపదగిన దానిని; యశస్వినీమ్ = గొప్ప కీర్తి గలదానిని; అభిగచ్ఛతు = సమీపించు గాక; వైదేహీ = సీతాదేవి; వృద్ధాం = వృద్ధురాలైనదానిని; ఆక్రోధనామ్ = కోపముపూనని దానిని; సదా = ఎప్పుడును; అనసూయా = అసూయ లేనిది; ఇతి = అను; యా = ఎవరైతే; లోకే = లోకములో; కర్మభిః = తన పుణ్య కార్యముల వలన; ఖ్యాతిమ్ = కీర్తిని; ఆగతా = పొందినదో.
భావము:-
అట్టి మహిమగల ఈవిడ సమస్త ప్రాణులకు పూజింపదగినది, గొప్ప కీర్తిగలది, వృద్ధురాలును, ఎన్నడును కోపము ఎరుగనిదియును. అసూయారహితమైనది, కర్మలు లోకకళ్యాణము కొరకు చేయుటలో ప్రసిద్దురాలు ఐన ఈ అనసూయాదేవిని దగ్గరకు వెళ్ళి, రామా! సీతాదేవీని దర్శించుకొనుమని చెప్పుము.”
2.117.14.
అనుష్టుప్.
ఏవం బ్రువాణం తమృషిం
తథేత్యుక్త్వా స రాఘవః।
సీతామువాచ ధర్మజ్ఞామ్
ఇదం వచనముత్తమమ్॥
టీక:-
ఏవం = ఆ విధముగా; బ్రువాణం = చెప్పుచుండెడి; తమ్ = ఆ; ఋషిమ్ = ఆ ఋషికి; తథా = అటులనే కానిమ్మొ; ఇతి = అని; ఉక్త్వా = చెప్పి; సః = ఆ; రాఘవః = రాఘురాముడు; సీతామ్ = సీతకు; ఉవాచ = చెప్పెను; ధర్మజ్ఞామ్ = ధర్మము తెలిసినదానికి; ఇదం = ఇట్టి; వచనమ్ = మాటను; ఉత్తమమ్ = ఉత్తమమైనది
భావము:-
ఆ విధముగా చెప్పుచుండెడి ఆ ఋషి అత్రికి అటులనే కానిమ్ము డని సమాధానము ఇచ్చి, ధర్మాత్మురాలైన సీతకు మంచి మాటలతో ఇలా చెప్పెను.
2.117.15.
అనుష్టుప్.
“రాజపుత్రి! శ్రుతమిదం
మునేరస్య సమీరితమ్।
శ్రేయోఽ ర్థమాత్మనశ్శీఘ్రమ్
అభిగచ్ఛ తపస్వినీమ్॥
టీక:-
రాజపుత్రి = ఓ రాజ కుమారీ; శ్రుతమ్ = విన్నది; ఇదం = ఇది; మునేః = అత్రిముని; అస్య = యొక్క; సమీరితమ్ = ఈమాట; శ్రేయః+అర్థమ్ = శ్రేయోదాయమైనది; ఆత్మనః = నీయొక్క; శీఘ్రమ్ = త్వరగా; అభిగచ్ఛ = సమీపించుము; తపస్వినీమ్ = తపస్విని ఐన అనసూయను.
భావము:-
ఓ సీతా రాకుమారి! శ్రేయస్కరమైన అత్రిముని మాట వినుము, త్వరగా అనసూయను సమీపించి దర్శించుకొనుమే.
2.117.16.
అనుష్టుప్.
సీతాత్వేతద్వచశ్శృత్వా
రాఘవస్య హితైషిణః।
తామత్రిపత్నీం ధర్మజ్ఞామ్
అభిచక్రామ మైథిలీ॥
టీక:-
సీతా = సీతాదేవి; తు = కూడా; ఏతద్ = ఇట్టి; వచః = మాటలను; శృత్వా = విని; రాఘవస్య = రామునియొక్క; హితైషిణః = హితము కోరెడివానియొక్క; తాం = ఆమెను; అత్రిపత్నీం = అత్రిముని భార్య అనసూయను; ధర్మజ్ఞామ్ = ధర్మజ్ఞురాలిని; అభిచక్రామ = సమీపించెను; మైథిలీ = సీతాదేవి.
భావము:-
సీతాదేవి కూడా హితము కోరెడి రాముని మాటను విని, ధర్మజ్ఞురాలైన అత్రిముని భార్య అనసూయ దగ్గరకు వెళ్ళెను.
2.117.17.
అనుష్టుప్.
శిథిలాం వలితాం వృద్ధాం
జరాపాండురమూర్ధజామ్।
సతతం వేపమానాంగీం
ప్రవాతే కదళీం యథా॥
టీక:-
శిథిలామ్ = అవయవముల పట్టు తప్పినదానిని; వలితామ్ = చర్మము ముడతలు పడినదానిని; వృద్ధామ్ = వృద్ధురాలిని; జరాపాండుర మూర్ధజామ్ = వృద్ధాప్యము వలన తెల్లబడిన కేశములు కలదానిని; సతతమ్ = ఎల్లప్పుడు; వేపమానాంగీం = శరీరము వణికుచుండెడి దానిని; ప్రవాతే = తీవ్రమైన గాలి వీచినచో; కదళీం = అరటిచెట్టు; యథా = వలె
భావము:-
శిథిలమైనది, ముడతల చర్మము కలది, వృద్ధురాలును, వృద్ధాప్యమువలన అవయవములు పట్టు దప్పిన, చర్మము ముడతలు పడిన, శిరోజములు తెల్లబడిన, గాలి తీవ్రముగా వీచినచో అరటిచెట్టు వలె వణికెడి ఆమె ఐన అనసూయను.
2.117.18.
అనుష్టుప్.
తాం తు సీతా మహాభాగామ్
అనసూయాం పతివ్రతామ్।
అభ్యవాదయదవ్యగ్రా
స్వనామ సముదాహరత్॥
టీక:-
తాం = ఆమెను; తు = ఐతే; సీతా = సీతాదేవి; మహాభాగామ్ = మహాభాగ్యవతిని; అనసూయామ్ = అనసూయను; పతివ్రతామ్ = పతివ్రతను; అభ్యవాదయత్ = గౌరవముగా నమస్కరించెను; అవ్యగ్రా = ఆతురతలేకుండగ; స్వనామ = తన పేరును; సముదాహరత్ = తెలుపుకొనుచు.
భావము:-
సీతాదేవి మహాభాగ్యవతి, పతివ్రత ఐన అనసూయకు ఏమాత్రం ఆతురత లేకుండగా తన పేరును తెలుపుకొనుచు, గౌరవముగా నమస్కరించి.
2.117.19.
అనుష్టుప్.
అభివాద్య చ వైదేహీ
తాపసీం తామనిందితామ్।
బద్ధాంజలిపుటా హృష్టా
పర్యపృచ్ఛదనామయమ్॥
టీక:-
అభివాద్య = నమస్కరించినదై; చ = మఱియు; వైదేహీ = సీత; తాపసీం = తపస్వినిని; తాం = ఆమెను; అనిందితామ్ = నిందకు తావులేనిదానిని; బద్ద-అంజలిపుటా = జోడించిన దోసిళ్ళు కలదైన; హృష్టా = సంతుష్టురాలైన; పర్యపృచ్ఛత్ = కుశలములడిగెను; అనామయమ్ = ఆరోగ్యము గురించి.
భావము:-
నిండునిర్దోషి తపస్విని అనసూయకు ఆనందముగా నమస్కరించి, అంజలిఘటించి ఉంచి సీత అనసూయను ఆరోగ్యము గురించి కుశలప్రశ్నలడిగెను.
2.117.20.
అనుష్టుప్.
తతస్సీతాం మహాభాగాం
దృష్ట్వా తాం ధర్మచారిణీమ్।
సాంత్వయంత్యబ్రవీద్ధృష్టా
“దిష్ట్యా ధర్మమవేక్షసే”॥
టీక:-
తతః = పిమ్మట; సీతామ్ = సీతను; మహాభాగామ్ = మహాభాగ్యవతిని; దృష్ట్వా = చూచి; తాం = ఆమెను; ధర్మచారిణీమ్ = ధర్మము ఆచరించుదానిని; సాంత్వయంతీ = ఓదార్చుచున్నదై; అబ్రవీత్ = చెప్పెను; హృష్టా = ఆనందించుచు; దిష్ట్యా = భాగ్యవశము కొలది ; ధర్మమ్ = ధర్మమును; అవేక్షసే = వీక్షించుచుంటివి.
భావము:-
అటుపిమ్మట మహాభాగ్యవతియును ధర్మము ఆచరించునది అగు సీతను చూచి అనసూయ ఆనందించి ఆమెను ఓదార్చుచు, “నీ భాగ్యవశమున పాతివ్రత్య ధర్మమును పాటించుచుంటివి”, అని పలికెను.
2.117.21.
అనుష్టుప్.
“త్యక్త్వా జ్ఞాతిజనం సీతే!
మానమ్బుద్ధిం చ భామిని!।
అవరుద్ధం వనే రామం
దిష్ట్యా త్వమనుగచ్ఛసి॥
టీక:-
త్యక్త్వా = వదిలిపెట్టి; జ్ఞాతిజనం = బంధువులను; సీతే = ఓ సీతాదేవీ!; మానమ్ = అహంకారమును; ఋద్ధిమ్ = తెలివితేటలతో; చ = కూడ; భామిని = ఓ సుందరీ; అవరుద్ధం = చిక్కుకున్నవాడిని; వనే = అరణ్యములో; రామమ్ = రాముడిని; దిష్ట్యా = అదృష్టవశాత్తు; త్వమ్ = నీవు; అనుగచ్ఛసి = అనుసరించుచుంటివి.
భావము:-
“ఓ సుందరీ, సీతాదేవీ! నీ తెలువితేటలతో అహంకారమును విడిచి బంధువులను వదిలిపెట్టి, అదృష్టవశాత్తు వనవాసము పాలైన నీ భర్త రాముడిని అనుసరించుచుంటివి.
2.117.22.
అనుష్టుప్.
నగరస్థో వనస్థో వా
పాపో వా యది వా శుభః।
యాసాం స్త్రీణాం ప్రియో భర్తా
తాసాం లోకా మహోదయాః॥
టీక:-
నగరస్థః = నగరవాసి; వనస్థః = వనవాసి; వా = కానీ; పాపః = పాపి; వా = కానీ; యది = ఒకవేళ; వా = లేదా; శుభః = పుణ్యాత్ముడు; యాసాం = ఏ; స్త్రీణామ్ = స్త్రీల యొక్క; ప్రియః = ప్రియమైనవాడు; భర్తా = భర్త మాత్రమే; తాసాం = అట్టి మహిళలకు; లోకాః = లోకములు; మహోదయాః = గొప్ప అభివృద్ది కలవి, ఉత్తమమైనవి.
భావము:-
నగరవాసి ఐనను, వనవాసి ఐనను, పాపి ఐనను, లేక పుణ్యాత్ముడైనను భర్తను ఏ స్త్రీలకు ఐనా ప్రియైనవాడు అట్లు వర్తించు భార్యలకు ఉత్తమలోకములు ప్రాప్తించును.
2.117.23.
అనుష్టుప్.
దుశ్శీలః కామవృత్తో వా
ధనైర్వా పరివర్జితః।
స్త్రీణామార్యస్వభావానాం
పరమం దైవతం పతిః॥
టీక:-
దుశ్శీలః = దురాచారైనా; కామవృత్తః = కామాంధుడైన; వా = లేదా; ధనైః = సంపదల చేత; వా = లేదా; పరివర్జితః = నిశూన్యుడైనా; స్త్రీణాం = మహిళలకు; ఆర్య = పూజనీయమైన; స్వభావానామ్ = గలామెకు; పరమం = అత్యుత్తమ; దైవతమ్ = దైవము; పతిః = భర్త
భావము:-
భర్త దురాచారి ఐనను, కామాంధుడైనను లేక పేదవాడైనను ఉత్తమ స్త్రీలకు భర్తే అత్యుత్మమైన దైవము.
2.117.24.
అనుష్టుప్.
నాతో విశిష్టం పశ్యామి
బాంధవం విమృశంత్యహమ్।
సర్వత్ర యోగ్యం వైదేహి!
తపః కృతమివావ్యయమ్॥
టీక:-
న = (క్రియకు అన్వయించవలసిన వ్యతిరేక భావము);అతః = పతికంటె; విశిష్టమ్ = విశిష్టుని; పశ్యామి = చూచుచుంటిని; బాంధవం = బంధువుని; విమృశన్తీ = పరిశీలించినదానినై; అహమ్ = నేను; సర్వత్ర = అంతట; యోగ్యమ్ = తగిన; వైదేహి = ఓ సీతా!; తపః = తపస్సు; కృతమ్ = చేయబడినది; ఇవ = వలె; అవ్యయమ్ = అనంతమైన.
భావము:-
ఓ సీతా! బాగుగా పరిశీలించిన పిమ్మట నాకు పతికంటె గొప్ప బంధువు వేరొకరు తోచుటలేదు. అతడు చేసిన అనంతమైన తపస్సు వంటివాడు.
2.117.25.
అనుష్టుప్.
న త్వేవమవగచ్ఛంతి
గుణదోషమసత్త్స్రియః।
కామవక్తవ్యహృదయా
భర్తృనాథాశ్చరంతి యాః॥
టీక:-
న = క్రియకు అన్వయించవలసిన వ్యతిరేక భావము; తు = ఏమాత్రము; ఏవం = ఈ విధముగా; అవగచ్ఛంతి = తెలుసుకొనగలరు; గుణదోషమ్ = మంచిచెడులను; అసత్స్త్రియః = అసత్+స్త్రియః = చెడ్డ స్త్రీలు; కామవక్తవ్యహృదయాః = కోరికలకు లోబడిన హృదయముకల స్త్రీలు; భర్తృనాథాః = భర్తలపై ఆధిపత్యము చూపువారు; చరంతి = ఆచరించెదరు; యాః = ఏ స్త్రీలైతే
భావము:-
ఏ స్త్రీలు గుణరహితులై, కోరికలకు లోబడి భర్తలపై ఆధిపత్యము చూపుచు గడుపుచుంటిరో వారు ఇట్టి మంచిచెడులు తెలుసుకొనుటలేదు.
2.117.26.
అనుష్టుప్.
ప్రాప్నువంత్యయశశ్చైవ
ధర్మభ్రంశం చ మైథిలి!।
అకార్యవశమాపన్నాః
స్త్రియో యాః ఖలు తద్విధాః॥
టీక:-
ప్రాప్నువంతి = పొందుచున్నారు; అయశమ్ = అపకీర్తిని; చ = మఱి; ఏవ = కేవలము; ధర్మభ్రంశమ్ = ధర్మనాశనము; చ = మఱియు; మైథిలి = ఓ సీతా!; అకార్యవశమ్ = చెడుపనులకు లోబడుట; ఆపన్నాః = పొందినవారు; స్త్రియః = మహిళలు; యాః = ఎవరైతే; ఖలు = నిశ్చయముగా; తత్విధాః = అటువంటివారు.
భావము:-
అటువంటి చెడుపనులు చేయబూనిన స్త్రీలు కేవలము ధర్మనాశనమును అపకీర్తిని మాత్రమే పొందుచున్నారు.
2.117.27.
అనుష్టుప్.
త్వద్విధాస్తు గుణైర్యుక్తా
దృష్ట లోక పరావరాః।
స్త్రియః స్వర్గే చరిష్యంతి
యథా ధర్మకృత స్తథా॥
టీక:-
త్వత్ = నీ; విధాః = వంటివారు; తు = మాత్రము; గుణైః = సుగుణములతో; యుక్తాః = కలవారు; దృష్టలోకపరావరాః = చూడబడిన లోకమునందలి మంచిచెడులు కలవారు; స్త్రీయః = మహిళలు; స్వర్గే = స్వర్గమునందు; చరిష్యంతి = వసించెదరు; యథా = ఎటులైతే; ధర్మకృతః = ధర్మమును పాటించువారు; తథా = ఆ విధముగా
భావము:-
ఎటులైతే ధర్మమును పాటించువారు స్వర్గమును పొందెదరో అటులనే నీ వంటి గుణవతులును లోకమునందలి మంచిచెడులు తెలిసిన మహిళలు కూడ స్వర్గమును పొందెదరు.
2.117.28.
జగతి.
తదేవమేనం త్వమనువ్రతా సతీ
పతివ్రతానాం సమయానువర్తినీ।
భవ స్వభర్తు స్సహధర్మచారిణీ
యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి॥
టీక:-
తత్ = ఆ; ఏవమ్ = విధముగా; ఏనం = ఇతనిని రాముడిని; త్వం = నీవు; అనువ్రతా = అనుసరించుదానవై; సతీ = అనుసరించదగిన నియమమువు కలదానవై; పతివ్రతానామ్ = పతివ్రతల యొక్క; సమయానువర్తినీ = ఆచారములను పాటించుదానవై; భవ = అగుదువు గాక; స్వభర్తుః = నీ భర్తయొక్క; సహధర్మచారిణీ = ధర్మాచరణములో కూడి ఉండు దానవై; యశః = కీర్తిని; చ = మఱియు; ధర్మమ్ = ధర్మమును; చ = కూడా; తతః = ఆ కారణమున; సమాప్స్యసి = మంచిగా పొందెదవు.
భావము:-
ఆ విధముగా నీవు నీ భర్త రాముడిని అనుసరించు భార్యవై, పతివ్రతల ఆచారములను పాటించుదానవై మసలుము. అందువలన నీవు భర్తకు సహధర్మచారిణివని గొప్ప కీర్తిని ధర్మఫలమును పొందెదవు.
2.117.29.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే సప్తాదశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; సప్తాదశోత్తరశతతమః [117] = నూటపదిహేడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [117] నూటపదిహేడవ సర్గ సంపూర్ణము.
2.118.1.
అనుష్టుప్.
సాత్వేవముక్తా వైదేహీ
అనసూయాఽనసూయయా।
ప్రతిపూజ్య వచో మందం
ప్రవక్తుముపచక్రమే॥
టీక:-
సా = ఆమె, సీతాదేవి; తు = విశేషముగ; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలికగా; వైదేహీ = సీత; అనసూయా = అనసూయ లేని ఆమె; అనసూయయా = అనసూయ చేత; ప్రతిపూజ్య = మన్నించుచు; వచః = మాటలను; మందం = మెల్లగా; ప్రవక్తుమ్ = పలుకుటకు; ఉపచక్రమే = ప్రారంభించెను
భావము:-
అసూయ లేని అనసూయాదేవి సీతాదేవికి ‘స్త్రీకి తన భర్తయే పూజనీయుడు’ అని వివరించగా విని, ఆ పలుకులను మన్నించి సీతాదేవి మెల్లగా ఇట్లు చెప్పనారంభించెను,
2.118.2.
అనుష్టుప్.
“నైతదాశ్చర్యమార్యాయా
యన్మాం త్వమభిభాషసే।
విదితన్తు మమాప్యేతత్
యథా నార్యాః పతిర్గురుః॥
టీక:-
న = కాదు; ఏతత్ = ఇట్లు; ఆశ్చర్యమ్ = ఆశ్చర్యము; ఆర్యాయా = పూజ్యురాలవైన; యత్ = అటువంటిది; మాం = నాతో; త్వమ్ = నీవు; అభిభాషసే = చెప్పినది; విదితః = తెలియును; తు = నిశ్చయముగ; మమ = నాకు; ఆపి = కూడా; ఏతత్ = ఇది; యథా = ఎట్లు; నార్యాః = స్త్రీకి; పతిః = భర్తయే; గురుః = పూజ్యుడు.
భావము:-
పూజ్యురాలవైన నీవు నాతో ఇట్లు పలుకుట ఆశ్చర్యము కాదు. స్త్రీకి భర్త పూజ్యుడను విషయము నాకు కూడ తెలియును.
2.118.3.
అనుష్టుప్.
యద్యప్యేష భవేద్భర్తా
మమాఽర్యే వృత్తవర్జితః।
అద్వైధముపచర్తవ్యః
తథాప్యేష మయా భవేత్॥
టీక:-
యద్యపి = యది + అపి, అయినప్పటికీ; ఏష = అతడు; భవేత్ = అగుగాక; భర్తా = భర్త; మమ = నా యొక్క; ఆర్యే = పూజ్యురాలా; వృత్తవర్జితః = చరిత్ర హీనుడైనను; అద్వైధమ్ = భేదము చూపకుండా; ఉపచర్తవ్యః = సేవింప తగినవాడే, ఇతి అమరః; తథాపి = తథా+ అపి, అటువంటి వాడు అయినప్పటికీ; ఏష = అతడిని; మయా = నేను; భవేత్ = అగును.
భావము:-
ఓ పూజ్యురాలా! నా భర్త చరిత్రహీనుడైననూ నేను అతనిని ఎట్టి భేదభావము చూపకుండా పూజించవలసినదే.
2.118.4.
అనుష్టుప్.
కిం పునర్యో గుణశ్లాఘ్యః
సానుక్రోశో జితేంద్రియః।
స్థిరానురాగో ధర్మాత్మా
మాతృవత్పితృవత్ప్రియః॥
టీక:-
కిం = ఏమి; పునర్యః = మరల చెప్పవలెనా; గుణ = గుణముల చేత; శ్లాఘ్యః = శ్లాఘింపతగినవాడు; సానుక్రోశః = దయామయుడు; జితేంద్రియః = జితేంద్రియుడు; స్థిర = స్థిరమైన; అనురాగః = ప్రేమ గలవాడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; మాతృవత్ = తల్లి వలె; పితృవత్ = తండ్రి వలె; ప్రియః = చాలా ఇష్టుడు
భావము:-
శ్లాఘనీయ సుగుణశీలి, దయామయుడు, జితేంద్రియుడు, స్థిరమైన ప్రేమ గలవాడు, ధర్మాత్ముడు, తల్లి వలె, తండ్రి వలె చాలా ఇష్టుడు అయిన భర్త విషయమున వేరే చెప్పవలెనా.
2.118.5.
అనుష్టుప్.
యాం వృత్తిం వర్తతే రామః
కౌసల్యాయాం మహాబలః।
తామేవ నృపనారీణామ్
అన్యాసామపి వర్తతే॥
టీక:-
యామ్ = ఎట్టి; వృత్తిం = ఏ విధముగా ప్రవర్తించునో; వర్తతే = ప్రవర్తించును; రామః = రాముడు; కౌసల్యాయాం = కౌసల్య విషయమున; మహాబలః = మహా బలశాలి అయిన; తామ్ = అదే; ఏవ = విధముగా; నృపనారీణామ్ = దశరాథ మహారాజు భార్యల విషయమునందు; అన్యా = ఇతరులు అందరి; సామ్ = పట్ల; అపి = కూడా; వర్తతే = ప్రవర్తించును.
భావము:-
మహా బలశాలి అయిన రాముడు కౌసల్య విషయమున ఏ విధముగా ప్రవర్తించునో, ఇతర దశరథ మహారాజు భార్యల విషయము నందు కూడ ఆ విధముగానే ప్రవర్తించును.
2.118.6.
అనుష్టుప్.
సకృద్దృష్టాస్వపి స్త్రిషు
నృపేణ నృపవత్సలః।
మాతృవద్వర్తతే వీరో
మానముత్సృజ్య ధర్మవిత్॥
టీక:-
సకృత్ = ఒక్కమారు; దృష్టాసు = చూసినవారిని; అపి = కూడ; స్త్రిషు = స్త్రీలను; నృపేణ = దశరథ మహారాజు చేత; నృపవత్సలః = తండ్రి అయిన దశరథ మహారాజుపై ప్రేమ గలవాడు; మాతృవత్ = తల్లులను వలె; వర్తతే = గౌరవించును; వీరః = పరాక్రమవంతుడు; మానమ్ = అహంకారము; ఉత్సృజ్య = విడిచి; ధర్మవిత్ = ధర్మవేత్త.
భావము:-
తండ్రిపై మిక్కిలి ప్రేమ గలవాడు, ధర్మవేత్త, పరాక్రమవంతుడు అయిన రాముడు, దశరథుడు ఒక్కమాటు చూచిన స్రీలను కూడ నిరహంకారంగా తల్లుల వలెనే గౌరవించును.
2.118.7.
అనుష్టుప్.
ఆగచ్ఛన్త్యాశ్చ విజనం
వనమేవం భయావహమ్।
సమాహితం మే శ్వశ్వ్రా చ
హృదయే తద్ధృతం మహత్॥
టీక:-
ఆగచ్ఛన్త్యాః = వచ్చుచున్న సమయమున; చ = అప్పుడు; విజనమ్ = నిర్జనమైన; వనమ్ = వనమునకు; ఏవం = ఇట్లు; భయావహమ్ = భయంకరమైన; సమాహితమ్ = ఉపదేశమును; మే = నాకు; శ్వశ్వ్రా = అత్తగారు; చ = కూడ; హృదయే = మనస్సులో; తత్ = ఆ; ధృతం మహత్ = ఉంచుకొని ఉన్నాను
భావము:-
భయంకరమైన ఈ నిర్జనమైన వనమునకు వచ్చుచున్న సమయమున అత్తగారు నాకు చేసిన మహత్తరమైన ఉపదేశమును మనస్సులో భద్రంగా ఉంచుకొని యుంటిని.
2.118.8.
అనుష్టుప్.
పాణిప్రదానకాలే చ
యత్పురాత్వగ్ని సన్నిధౌ।
అనుశిష్టా జనన్యాఽస్మి
వాక్యం తదపి మే ధృతమ్॥
టీక:-
పాణిప్రదాన = వివాహ; కాలే = సమయము; చ = లో; యత్ = ఏవైతే; పురాతు = పూర్వము; అగ్నిసన్నిధౌ = అగ్నిసన్నిధిలో; అనుశిష్టా = ఉపదేశించిన; జనన్య = తల్లిచే; అస్మి = నా యొక్క; వాక్యం = మాటలను; తదపి = వాటిని కూడా; మే = నాకు; ధృతమ్ = ఉంచుకొన్నాను.
భావము:-
పూర్వము వివాహ సమయమునందు అగ్నిహోత్రము వద్ద నాకు మా తల్లి ఉపదేశించిన మాటలు కూడ మనస్సులో ఉంచుకొన్నాను.
2.118.9.
అనుష్టుప్.
నవీకృతం తు తత్సర్వం
వాక్యైస్తే ధర్మచారిణి!।
పతిశుశ్రూషణాన్నార్యాః
తపో నాన్యద్విధీయతే॥
టీక:-
నవీకృతమ్ = క్కొత్తగా స్మృతికి వచ్చుట; తు = నిశ్చయముగ; తత్సర్వం = అన్నియును; వాక్యైః = మాటలచే; తే = నీ యొక్క; ధర్మచారిణి = ధర్మమును అనుసరించుదానా; పతిశుశ్రూషణాత్ = పతి సేవ చేయుట; నార్యాః = స్త్రీలకు; తపః = తపస్సు; న = లేదు కదా; అన్యత్ = మరియొకటి; విధీయతే = విధించబడుట.
భావము:-
నీ మాటలు వినగానే మా అత్తగారు, తల్లీ చేసిన ఉపదేశములు మరల స్మృతికి వచ్చుచున్నవి. స్త్రీకి పతి శుశ్రూష తప్ప మరియొక తపస్సు విధింపబడలేదు కదా.
2.118.10.
అనుష్టుప్.
సావిత్రీ పతిశుశ్రూషాం
కృత్వా స్వర్గే మహీయతే।
తథావృత్తిశ్చ యాతా త్వం
పతిశుశ్రూషయా దివమ్॥
టీక:-
సావిత్రీ = సావిత్రీ దేవి; పతిశుశ్రూషాం = పతిసేవ; కృత్వా = చేయుట చేత; స్వర్గే = స్వర్గములో; మహీయతే = ప్రకాశించుచున్నది; తథా = అదే; వృత్తిః = విధముగా; చ = కూడ; యాతా = వెళ్లనున్నావు; త్వం = నీవు; పతిశుశ్రూషయా = పతి శుశ్రూష చేత; దివమ్ = స్వర్గమునకు.
భావము:-
సావిత్రీదేవి పతి శుశ్రూష చేయుట చేత స్వర్గములో ప్రకాశించుచున్నది. అదే విధముగా ప్రవర్తించుచున్న నీవు కూడ పతి శుశ్రూష చేత స్వర్గమునకు వెళ్ళనున్నావు.
2.118.11.
అనుష్టుప్.
వరిష్ఠా సర్వనారీణామ్
ఏషా చ దివి దేవతా।
రోహిణీ న వినాచంద్రం
ముహూర్తమపి దృశ్యతే॥
టీక:-
వరిష్ఠా = ఉత్తమురాలైన; సర్వనారీణామ్ = సమస్త స్త్రీలలో; ఏషా చ = అటువంటి; దివి = ఆకాశమునందు; దేవతా = దేవత; రోహిణీ = రోహిణీ అను పేరు గల; న = లేదు; వినా = విడచి; చంద్రం = చంద్రుని; ముహూర్తమపి = క్షణకాలమైనను; దృశ్యతే = కనిపించుట
భావము:-
స్త్రీలందరిలోనూ సర్వోత్తమురాలైన రోహిణీ ఆకాశంలో ఉండే దేవత భర్త చంద్రుని, క్షణకాలమైనను విడచి కనబడదు.
2.118.12.
అనుష్టుప్.
ఏవంవిధాశ్చ ప్రవరాః
స్త్రియో భర్తృదృఢవ్రతాః।
దేవలోకే మహీయన్తే
పుణ్యేన స్వేన కర్మణా”॥
టీక:-
ఏవం = ఇటువంటి; విధాః = నియమములు అవలంబించి; చ = ఇంకా; ప్రవరాః = ఉత్తమమైన; స్త్రియో = ఎందరో స్త్రీలు; భర్తృ = భర్త విషయమున; దృఢవ్రతాః = దృఢమైన నిష్ట కలవారు; దేవలోకే = దేవ లోకమునందు; మహీయన్తే = పూజింపబడుచున్నారు; పుణ్యేన = పుణ్యము చేత; స్వేన = తామయొక్క; కర్మణా = కర్మముల చేత.
భావము:-
ఇట్టి విధమున ఎందరో ఉత్తమ స్త్రీలు భర్తల విషయమున దృఢమైన నియమములు అవలంబించి, తాము చేసిన పుణ్యకర్మకు ఫలితముగా దేవలోకమునందు పూజింపబడుచున్నారు”.
2.118.13.
అనుష్టుప్.
తతోఽనసూయా సంహృష్టా
శ్రుత్వోక్తం సీతయా వచః।
శిరస్యాఘ్రాయ చోవాచ
మైథిలీం హర్షయన్త్యుత॥
టీక:-
తతః = అటు పిమ్మట; అనసూయా = అనసూయాదేవి; సంహృష్టా = సంతోషించి; శ్రుతి = విని; ఉక్తమ్ = పలుకబడినది; సీతయా = సీత చేత; వచః = మాటలను; శిరస్య = శిరస్సును; ఆఘ్రాయ = వాసన చూచి; చ = తరువాత; ఉవాచ = పలికెను; మైథిలీమ్ = సీతమ్మనుగూర్చి; హర్షయన్త్యుత = సంతోషము కలిగించుచు.
భావము:-
పిమ్మట అనసూయాదేవి సీత మాటలు విని, చాలా సంతోషించి, ఆమె శిరస్సుపై వాసన చూచి, ప్రేమతో ముద్దు పెట్టుకొని. ఆమెకు సంతోషము కల్గించుచు, ఇట్లు పలికెను.
2.118.14.
అనుష్టుప్.
“నియమైర్వివిధైరాప్తం
తపో హి మహదస్తి మే।
తత్సంశ్రిత్య బలం సీతే
ఛందయే త్వాం శుచిస్మితే॥
టీక:-
నియమైః = నియమములను; వివిధైః = వివిధములైన; ఆప్తం = సంపాదించిన; తపః = తపస్సు; హి = మాత్రమే; మహదస్తి = గొప్పదైన; మే = నా చేత; తత్ = ఆ; సంశ్రిత్య = ఆశ్రయించి; బలం = శక్తి; సీతే = ఓ సీతా; ఛందయే = వరముగా ఇచ్చెదను; త్వాం = నీకు; శుచిస్మితే = స్వచ్ఛమైన చిరునవ్వు గల.
భావము:-
“స్వచ్ఛమైన చిరునవ్వుతో ఉండెడి సీతా! నేను అనేక విధములైన నియమములు పాటించి సంపాదించిన గొప్ప తపస్సు ఉన్నది. దాని బలము చేత నీకు ఏమి కావలెనో ఇచ్చెదను. కోరుకొనుము.
2.118.15.
అనుష్టుప్.
ఉపపన్నం మనోజ్ఞం చ
వచనం తవ మైథిలి!।
ప్రీతా చాస్మ్యుచితం కిం తే
కరవాణి బ్రవీహి మే”॥
టీక:-
ఉపపన్నం = యుక్తియుక్తముగాను; మనోజ్ఞం = మనోహరముగాను; చ = మఱియు; వచనం = మాటలు; తవ = నీ యొక్క; మైథిలి = మిథిలా రాకుమారి సీతాదేవి; ప్రీతా = సంతోషించినదానను; చ = మఱియు; అస్మి = నేను; ఉచితం = తగినది; కిం = ఏమి; తే = నీకు; కరవాణి = చేయుదునో; బ్రవీహి = చెప్పుము; మే = నాకు.
భావము:-
నీ మాటలు యుక్తియుక్తముగాను, మనోహరముగాను ఉన్నవి. చాలా సంతృప్తిచెందితిని. అందుకు తగినది నీకు ఏమి చేయమందువో నాకు చెప్పు. తీర్చెదను.”
2.118.16.
అనుష్టుప్.
తస్యాస్తద్వచనం శ్రుత్వా
విస్మితా మందవిస్మయా।
కృతమిత్యబ్రవీస్తీతా
తపోబలసమన్వితామ్॥
టీక:-
తస్యాత్ = ఆమె యొక్క, అనసూయాదేవి యొక్క; తత్ = ఆ; వచనం = మాటలను; శ్రుత్వా = విని; విస్మితా = ఆశ్చర్యపడినదై; మంద = అల్పమైన; విస్మయా = ఆశ్చర్యద్యోతకముగ; కృతమ్ = ఈ చేయబడినది; ఇతి = ఇతి (ఇదే చాలు అని); అబ్రవీత్ = పలికెను; సీతా = సీతాదేవి; తపోబల = తపోబలముతో; సమన్వితామ్ = కూడిన.
భావము:-
సీత అనసూయాదేవి మాటలు విని, ఆశ్చర్యపడినదై, చిరు విస్మయ పూర్వకముగ,”ఇదియే చాలును, నాకు వరము ఇచ్చినట్లే’’ అని తపోబలముకల ఆమెతో పలికెను.
2.118.17.
అనుష్టుప్.
“సా త్వేవముక్తా ధర్మజ్ఞా!
తయా ప్రీతతరాఽభవత్।
సఫలం చ ప్రహర్షం తే
హంత సీతే కరోమ్యహమ్॥
టీక:-
సా = ఇంత; తు = చక్కగా; ఏవమ్ = ఈవిధముగ; ఉక్తా = పలికిన; ధర్మజ్ఞా = ధర్మజ్ఞురాల, సీతాదేవి; తయా = నీ విషయమున; ప్రీతతరా = అధిక సంతోషమును; అభవత్ = కలిగినవి; సఫలం = సార్థకము; చ = ఇంకను; ప్రహర్షం = సంతోషమును; తే = నీ యందు; హంత = అయ్యో, హర్షసూచకము; సీతే = ఓ సీతా; కరోమి = చేసెదను; అహమ్ = నేను
భావము:-
ధర్మజ్జురాలైన సీతాదైవి! ఇంత చక్కటి పలుకలు ఈ విధమా పలికితివి. బాగా సంతోషము, కలిగెను. అయ్యో అలా కాదు సీతా! నాకు నీ విషయమున కలిగిన సంతోషము సార్ధకమగునట్లు నీకు నేను చేసెదను.
*గమనిక:-
ప్రీతః- ప్రీతతరాః- ప్రీతతమము
2.118.18.
అనుష్టుప్.
ఇదం దివ్యం వరం మాల్యం
వస్త్రమాభరణాని చ।
అంగరాగం చ వైదేహి
మహార్హం చానులేపనమ్॥
టీక:-
ఇదం = ఇవిగో ఇచ్చుచున్నాను; దివ్యమ్ = దివ్యములు; వరమ్ = శ్రేష్ఠములు; మాల్యమ్ = పుష్పమాలలను; వస్త్రమ్ = వస్త్రములను; ఆభరణాని = అలంకారములను; చ = మఱియు; అంగరాగం = మైపూతలను; చ = ఇంకను; వైదేహి = సీతా; మహార్హం = విలువైనవి; చ = ఇంకను; అనులేపనమ్ = లేపములను.
భావము:-
దివ్యములు, శ్రేష్ఠములు అయిన ఈ పుష్పమాలలను, వస్త్రములను, అలంకారములను, మైపూతలను, మిక్కిలి విలువైన లేపములను ఇచ్చుచున్నాను.
*గమనిక:-
(1) మాల్య- పూలను దారమునకు కట్టి/ గుచ్చి పొడవుగా చేసిన దండ, పూలమాల. (2) అంగరాగః- మైపూత, అలంకారార్థము మేనికి పూసుకొనెడి కేసరము, చందనము, కుంకుమ మున్నగు ద్రవ్యము. (3) అనులేపనః- సుగంధద్రవ్యాలు కలిపిన తైలము. (అ) అభ్యంగన స్నాన సమయమున వాడు మర్దన తైలము. (ఆ) శృంగారము / అలంకారము పిమ్మట సువాసన కొఱకు, చెమటాది దుర్గంథాదులను నివారించుటకు జల్లుకొను లేపములు. (ఇ) సౌజన్యము కల్పదృమము. పాత్రే గంథద్రవ్యాది లేపనం, తద్ద్రవ్యఞ్చ, తస్య గుణః, ప్రీత్సోజః శుక్రవర్ధికారిత్వ ఘర్మ్మదౌర్గం ధ్యతంద్రాతాప శ్రమనాశిత్వజ్ఞ, ఇతి రాజవల్లభః. నిరస్తమాల్యాభరణానులేపనః, ఇతి ఋతుసంహారె.
2.118.19.
అనుష్టుప్.
మయా దత్తమిదం సీతే
తవ గాత్రాణి శోభయేత్।
అనురూపమసంక్లిష్టం
నిత్యమేవ భవిష్యతి॥
టీక:-
మయా = నాచే; దత్తమ్ = ఇవ్వబడిన; ఇదం = ఇవి; సీతే = ఓ సీతా; తవ = నీ యొక్క; గాత్రాణి = శరీరమునకు; శోభయేత్ = శోభవృద్ధికరము; అనురూపమ్ = యోగ్యమైనది; అసంక్లిష్టం = కల్తీ రహితము; నిత్యమేవ = నిత్యమ్ + ఏవ, అనునిత్యమును; భవిష్యతి = కలిగించును
భావము:-
సీతాదేవీ! నేను ఇస్తున్న వస్తువులు ఎట్టి అశుద్దపదార్థములు కలపనివి. నిత్యమూ వాడినను ఇవి ఎప్పుడూ మాసిపోవు. నీ శరీరమునకు తగినవి నీ అవయవములకు నిత్యము శోభను వృద్ధిచేయును.
2.118.20.
అనుష్టుప్.
అంగరాగేణ దివ్యేన
లిప్తాంగీ జనకాత్మజే।
శోభయిష్యసి భర్తారం
యథా శ్రీర్విష్ణుమవ్యయమ్॥
టీక:-
అంగరాగేణ = అంగరాగమును; దివ్యేన = దివ్యమైన; లిప్తాంగీ = శరీరమునకు పూసుకునినచో; జనకాత్మజే = జనకుని కుమార్తె అయిన ఓ సీతా; శోభయిష్యసి = శోభింపచేయగలదు; భర్తారం = భర్తను; యథా = ఏ విధముగా అన; శ్రీః = లక్ష్మీదేవి; విష్ణుమ్ = విష్ణువును; అవ్యయమ్ = నాశ రహితుడైన.
భావము:-
దివ్యమైన నీవు ఈ అంగరాగమును శరీరమునకు అలదుకొనిన, నాశరహితుడైన విష్ణువును లక్ష్మీదేవి శోభింపచేసినట్లు, నీ భర్తను శోభింపచేయగలవు.
2.118.21.
అనుష్టుప్.
సా వస్త్రమంగరాగం చ
భూషణాని స్రజస్తథా।
మైథిలీ ప్రతిజగ్రాహ
ప్రీతిదానమనుత్తమమ్॥
టీక:-
సా = ఆ; వస్త్రమ్ = వస్త్రములను; అంగరాగం = మైపూతలను; చ = ఇంకను; భూషణాని = ఆభరణములను; స్రజః = పూలమాలలను; తథా = అటు పిమ్మట; మైథిలీ = సీతాదేవి; ప్రతిజగ్రాహ = స్వీకరించుము; ప్రీతి = ప్రీతితో; దానమ్ = బహుమానము; అనుత్తమమ్ = శ్రేష్ఠమైనవి.
భావము:-
అనసూయాదేవి ఇచ్చిన వస్త్రమును, అంగరాగమును, భూషణములను, మాలికలను, సీత శ్రేష్ఠమైన బహుమేనముగా స్వీకరించెను.
2.118.22.
అనుష్టుప్.
ప్రతిగృహ్య చ తత్సీతా
ప్రీతిదానం యశస్వినీ।
శ్లిష్టాంజలిపుటా తత్ర
సముపాస్త తపోధనామ్॥
టీక:-
ప్రతిగృహ్య = స్వీకరించి; చ = ఇంకను; తత్ = దానిని; సీతా = సీతాదేవి; ప్రీతిదానం = ప్రేమపూర్వక బహుమానమును; యశస్వినీ = అధికమైన యశస్సుగలది; శ్లిష్టాంజలిపుటా = చేతులు జోడించినది, దగ్గరగాచేర్చబడి దొప్పవంటి దోసిలి కలది; తత్ర = అప్పుడు; సముపాస్త = సేవించెను; తపోధనామ్ = తపోధనురాలిని, అనసూయాదేవిని.
భావము:-
మిక్కిలి యశశ్సాలి అగు సీత, ఆ ప్రేమపూర్వక బహుమానమును స్వీకరించెను. పిమ్మట చేతులు జోడించి నమస్కరించుచు, అనసూయాదేవిని సేవించెను.
2.118.23.
అనుష్టుప్.
తథా సీతాముపాసీనామ్
అనసూయా దృఢవ్రతా।
వచనం ప్రష్టుమారేభే
కాంచిత్ ప్రియకథామను॥
టీక:-
తథా = అప్పుడు; సీతామ్ = సీతాదేవితో; ఉప + ఆసీనామ్ = సమీపమున కూర్చొని ఉన్న; అనసూయా = అనసూయా దేవి; దృఢవ్రతా = స్థిరమైన నియమములు గల; వచనం = మాటలను; ప్రష్టుమ్ = ప్రశ్నించుటకై; ఆరేభే = ప్రారంభించెను; కాంచిత్ = ఒకానొకప్పుడు; ప్రియ కథామను = ప్రియమైన విషయమును.
భావము:-
గట్టి నియమములు గల ఆ అనసూయా దేవి ప్రియమైన విషయమును ఒకదానిని ప్రశ్నించుటకై, తన ప్రక్కనే కూర్చొనియున్న సీతాదేవితో ఇట్లు పలికెను.
2.118.24.
అనుష్టుప్.
“స్వయంవరే కిల ప్రాప్తా
త్వమనేన యశస్వినా।
రాఘవేణేతి మే సీతే
కథా శ్రుతిముపాగతా॥
టీక:-
స్వయంవరే = స్వయంవరములో; కిల = ఇట్లు చెప్పుచున్నారు; ప్రాప్తా = భార్యగా పొందినాడని; త్వమ్ = నిన్ను; అనేన యశస్వినా = యశశ్శాలి అయిన; రాఘవేణ = రాముని చేత; ఇతి = ఇట్లు; మే = నాచే; సీతే = ఓ సీతాదేవీ; కథా = సమాచారము; శ్రుతిమ్ = విని ఉన్నాను; ఉపాగతా = పొందినాడని.
భావము:-
“ఓ సీతాదేవి! యశశ్శాలియైన ఈ రఘురాముడు నిన్ను స్వయంవరంలో పొందినాడను విషయమును నేను విని ఉన్నాను.
2.118.25.
అనుష్టుప్.
తాం కథాం శ్రోతుమిచ్ఛామి
విస్తరేణ చ మైథిలి।
యథాఽనుభూతం కార్త్స్న్యన
తన్మే త్వం వక్తుమర్హసి”॥
టీక:-
తాం = ఆ; కథాం = వృత్తాంతమును; శ్రోతుమ్ = వినవలెనని; ఇచ్ఛామి = కోరుచున్నాను; విస్తరేణ = సవిస్తరముగా; చ = మఱియు; మైథిలి = ఓ మిథిలా రాకుమారి సీతాదేవీ; యథాఽనుభూతం = జరిగినది జరిగినట్లు; కార్త్న్యేన = సంపూర్ణముగా; తత్ = దానిని; మే = నాకు; త్వం = నీవు; వక్తుమ్ = వివరించుటకు; అర్హసి = తగి ఉంటివి.
భావము:-
ఆ వృత్తాంతమును సవిస్తరముగా వినగోరుచున్నాను. నీవు దానిని యథాతథముగా నాకు పూర్తిగా వివరించుము.”
2.118.26.
అనుష్టుప్.
ఏవముక్తా తు సా సీతా
తాం తతో ధర్మచారిణీమ్।
“శ్రూయతా”మితి చోక్త్వా వై
కథయామాస తాం కథామ్॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తా = పలికిన; తు = అయి; సా = ఆ; సీతా = సీతాదేవి; తామ్ = ఆమె అనసూయగూర్చి; తతః = అప్పుడు; ధర్మచారిణీమ్ = ధర్మాత్మురాలైనామె; శ్రూయతామ్ = వినము; ఇతి = ఇట్లు; చ = ఇంకనూ; ఉక్త్వా = చెప్పెను; వై = యదార్థమును; కథయామాస = వివరించెను; తాం = ఆ; కథామ్ = వృత్తాంతము.
భావము:-
ఈ విధముగా అడిగిన అనసూయతో సీతాదేవి “వినుము” అని పలికి, ధర్మాత్మురాలైన ఆ అనసూయకు ఆ వృత్తాంతమును ఇలా చెప్పెను.
2.118.27.
అనుష్టుప్.
“మిథిలాధిపతిర్వీరో
జనకో నామ ధర్మవిత్।
క్షత్రధర్మే హ్యభిరతో
న్యాయతః శాస్తి మేదినీమ్॥
టీక:-
మిథిలాధిపతిః = మిథిల + అధిపతిః, మిథిలకు ప్రభువు; వీరః = వీరుడు; జనకః = జనకుడు; నామః = అను పేరుగలవాడు; ధర్మవిత్ = ధర్మవేత్త అయిన; క్షత్రధర్మే హి = క్షత్రియ ధర్మమునందు; హి = నిశ్చయార్థకము; అభిరతః = మిక్కిలి ఆసక్తి గలవాడు; న్యాయతః = న్యాయానుసారముగా; శాస్తి = పాలించుచున్నాడు; మేదినీమ్ = రాజ్యమును.
భావము:-
మిథిలకు ప్రభువు, వీరుడు, ధర్మవేత్త అయిన జనకుడను పేరు గల ఒక మహారాజు, క్షత్రియ ధర్మమును కోరి అనుసరించుచు, న్యాయబద్దముగా రాజ్యమును పాలించుచున్నాడు.
2.118.28.
అనుష్టుప్.
తస్య లాంగలహస్తన్య
కర్షతః క్షేత్రమండలమ్।
అహం కిలోత్థితా భిత్వా
జగతీం నృపతేస్సుతా॥
టీక:-
తస్య = ఆ జనకునికి; లాంగల = నాగలిని; హస్తన్య = చేతపట్టి; కర్షతః = దున్నుచుండగా; క్షేత్రమండలమ్ = యాగభూమిని; అహం = నేను; కిల = అని చెప్పుకొనుచున్నారు; ఉత్థితా = పైకి వచ్చినట్లు; భిత్వా = బ్రద్దలు కొట్టుకొని; జగతీమే = నేలను; నృపతేః = రాజునకు; సుతా = కుమార్తెను అయినానట
భావము:-
ఆ రాజు నాగలి పట్టి యజ్ఞభూమిని దున్నుచుండగా, నేను ఆ నేలను బ్రద్దలు కొట్టుకొని, పైకి వచ్చి ఆ రాజునకు కుమార్తెను అయినానట.
*గమనిక:-
(1)క్షేత్రం- వరిపొలము, (సీతాదేవి పుట్టిల్లు ప్రాంతము ఇప్పటి నేపాలులో ఉన్నది, అక్కడ వరి బియ్యము వాడుదురు) 2 కేదారః ఇత్యమరః (2) మండలము- దేశము. (3) క్షేత్రమండలము- యజ్ఞయోగ్యక్షేత్రము, కాశీనాథ పాండురంగ పరబ వారి, దేవనాగరిలిపి, 1902, రామాయణ ప్రతి
2.118.29.
అనుష్టుప్.
స మాం దృష్ట్వా నరపతిః
ముష్టివిక్షేపతత్పరః।
పాంసుగుంఠితసర్వాంగీం
జనకో విస్మితోఽభవత్॥
టీక:-
స = అటువంటి; మామ్ = నన్ను; దృష్ట్వా = చూచి; నరపతిః = రాజు, జనకుడు; ముష్టి = పిడికిళ్లతో; విక్షేపతత్పరః = విత్తనములు చల్లు కార్యమునందు ఉన్నవాడు; పాంసు = ధూళిచే; కుంఠిత = విరూపితమై యున్న; సర్వాంగీం = శరీరమంతను; జనకః = జనకుడు; విస్మితః = ఆశ్చర్యపడినవాడు; అభవత్ = ఆయెను.
భావము:-
అలా భూమిని చీల్చుకు వచ్చి నటువంటి నన్ను, ఆ యాగభూమిలో పిడికిళ్ళతో విత్తనములు చల్లుట యందు నిమగ్నుడై ఉన్న ఆ జనక మహారాజు, శరీరమంతా ధూళి ధూసరితమై ఉన్న నన్ను కనుగొని ఆశ్చర్యపోయెను.
2.118.30.
అనుష్టుప్.
అనపత్యేన చ స్నేహాత్
అంకమారోప్య చ స్వయమ్।
“మమేయం తనయే”త్యుక్త్వా
స్నేహో మయి నిపాతితః॥
టీక:-
అనపత్యేన = సంతానము లేనివాడు; చ = ఇంకా; స్నేహాత్ = ప్రేమగా; అంకమ్ = ఒడిలోనికి; ఆరోప్య = తీసుకొనెను; చ = మఱియు; స్వయమ్ = స్వయముగా; మమ = నన్ను; ఇయం = ఈమె; తనయ = నా కూతురు; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; స్నేహ = ఆప్యాయతను; మయి = నాయందు; నిపాతితః = వర్షించెను.
భావము:-
సంతానము లేని ఆ జనకమహారాజు నన్ను స్వయముగా లేవనెత్తి ఒడిలోనికి తీసుకొని,”ఈమె నా కూతురు’’ అని పలుకుచు నాపై ఆప్యాయతను వర్షించెను.
2.118.31.
అనుష్టుప్.
అంతరిక్షే చ వాగుక్త్వా
“ప్రతిమాఽమానుషీ కిల।
ఏవమేతన్నరపతే!
ధర్మేణ తనయా తవ॥
టీక:-
అంతరిక్షే = ఆకాశము నుంచి; చ = ఇటుల; వాక్ = వాణి; ఉక్త్వా = పలకబడెను; ప్రతిమః = సాటిలేనిది; అమానుషీ కిల = మనుష్య జాతికి చెందినది కాదు; కిల = అట; ఏవమ్ = ఈమె; ఏతత్ = ఈ విధముగా; నరపతే = ఓ రాజా; ధర్మేణ = ధర్మము చేత; తనయా = కూతురుగా; తవ = నీకు.
భావము:-
ఓ రాజా! ఈమె మనుష్యజాతికి చెందినది కాదు. సాటి లేని దేవతా స్త్రీ. ధర్మము చేత నీకు ఈమె కూతురు అను విషయము సత్యమే.. అని ఆకాశవాణి వినబడెనట.
2.118.32.
అనుష్టుప్.
తతః ప్రహృష్టో ధర్మాత్మా
పితా మే మిథిలాధిపః।
అవాప్తో విపులాం బుద్ధిం
మామవాప్య నరాధిపః॥
టీక:-
తతః = అటు పిమ్మట; ప్రహృష్టః = సంతోషముపొందినవాడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; పితా = తండ్రి; మే = నా యొక్క; మిథిలాధిపః = మిథిలాథిపతి జనకుడు; అవాప్తః = పొందిన; విపులామ్ = విశాలమైన, పెద్ద; బుద్ధిమ్ = మనసుతో; మామ్ = నన్ను; అవాప్య = పొందెను, చేరదీసెను; నరాధిపః = మహారాజు
భావము:-
ఆ ఆకాశవాణిని విని ధర్మాత్ముడు, మిథిలాధిపతి అయిన నా తండ్రి ఎంతో సంతోషించెను. తన పెద్దమనసుతో నన్ను పుత్రికనుగా గ్రహించెను.
2.118.33.
అనుష్టుప్.
దత్తా చాస్మీష్టవద్దేవ్యై
జ్యేష్ఠాయై పుణ్యకర్మణా।
తయా సంభావితా చాస్మి
స్నిగ్ధయా మాతృ సౌహృదాత్॥
టీక:-
దత్తా చ = ఇవ్వబడినదానను; చ = వలె; అస్మి = ఐతిని; ఇష్టవత్ = ఇష్టమైన వస్తువును; దేవ్యై జ్యేష్ఠాయై = రాణులలో పెద్దామెకు, పట్టపురాణికి; పుణ్యకర్మణా = పుణ్యకర్మలను ఆచరించు; తయా = ఆమ చేత; సంభావితా = ఆదరించబడిన దానను; చ = ఇంకను; అస్మి = ఐతిని; స్నిగ్ధయా = చిక్కనైన, వావిళ్ళ; మాతృసౌహృదాత్ = మాతృప్రేమతో.
భావము:-
పుణ్యచరితుడైన ఆ జనక మహారాజు నన్ను తన పట్టపురాణికి చాలా ఇష్టమైన వస్తువును ఇచ్చినట్లు ఇచ్చెను. ఆమె నన్ను మిక్కిలి ప్రేమగా తల్లివలె ఆదరించెను.
2.118.34.
అనుష్టుప్.
పతిసంయోగసులభం
వయో దృష్ట్వా తు మే పితా।
చింతామభ్యగమద్ధీనో
విత్తనాశాదివాధనః॥
టీక:-
పతిసంయోగ = పాణిగ్రహణమునకు; సులభం = తగిన; వయో = వయస్సు; దృష్ట్వా = గమనించిన; తు = విశేషముగ; మే = నా; పితా = తండ్రి; చింతామి = చింతించుటచే; అభ్యాగమత్ = పొందెను; దీనః = దీనుడై; విత్తనాశాత్ = ధనము పోయిన; ఇవ = వలె; అధనః = బీదవాని.
భావము:-
నాకు వివాహమునకు తగిన వయస్సు వచ్చుట గమనించిన నా తండ్రి ధనము పోయిన బీదవాని వలె చింతించెను.
2.118.35.
అనుష్టుప్.
సదృశాచ్చాపకృష్టాచ్చ
లోకే కన్యాపితా జనాత్।
ప్రధర్షణామవాప్నోతి
శక్రేణాపి సమో భువి॥
టీక:-
సదృశాత్ = సమానుడు; చమఅపకృష్టాత్ = తన కంటె తక్కువ వారి నుండి; చ = ఐన; లోకే = లోకములో; కన్యాపితా = ఆడపిల్ల తండ్రి; జనాత్ = జనుల నుండి; ప్రధర్షణామ్ = తిరస్కారమును; అవాప్నోతి = పొందును; శక్రేణ = దేవేంద్రునితో; అపి = ఐనను; సమో = సమానుడు; భువి = భూలోకములో.
భావము:-
భూలోకములో దేవేంద్రుని వంటివాడైనను ఆడపిల్లతండ్రి తనతో సమానులైన వారి నుండీ, తన కంటె తక్కువ వారి నుండీ లోకములో తిరస్కారము పొందవలసి వచ్చును.
2.118.36.
అనుష్టుప్.
తాం ధర్షణామదూరస్థాం
దృష్ట్వా చాత్మని పార్థివః।
చింతార్ణవగతః పారం
నాససాదాప్లవో యథా॥
టీక:-
తాం = అట్టి; ధర్షణామ్ = తిరస్కారము; అదూరస్థామ్ = దగ్గరలో ఉన్నది అని; దృష్ట్వా = గ్రహించిన; చ = మఱియు; ఆత్మని = తనలో తాను; పార్థివః = జనక మహారాజు; చింత = చింత అనెడు; అర్ణవ = సముద్రములో; గతః = ఉన్న; పారమ్ = దాటుటను; నాససాదః = పొందలేనట్లు; ఆప్లవః = తెప్ప లేనివాడు; యథా = వలె
భావము:-
అట్టి తిరస్కారము తనకు చాలా దగ్గరలో ఉన్నది అని గ్రహించిన జనక మహారాజు, సముద్రములో పడి తెప్ప లేక తీరమును చేరలేని వలె చింతార్ణవములో పడెను.
2.118.37.
అనుష్టుప్.
అయోనిజాం హి మాం జ్ఞాత్వా
నాధ్యగచ్ఛద్విచింతయన్।
సదృశం చానురూపం చ
మహీపాలః పతిం మమ॥
టీక:-
అయోనిజామ్ = పుట్టిన మాతృగర్భము లేనిదానిగా; హి = చక్కగా; మామ్ = నన్ను; జ్ఞాత్వా = తెలిసి; న = లేదు; అధిగచ్ఛత్ = గోచరించుట; విచింతయన్ = ఆలోచించినను; సదృశమ్ = సమానుడు; చ = మఱియు; అనురూపమ్ = తగినవాడు; చ = మఱియు; మహీపాలః = రాజు జనకునకు; పతిం = భర్తగా; మమ = నాకు
భావము:-
నేను అయోనిజను అని తెలిసినవాడగుటచే, ఆ జనక మహారాజు ఎంత ఆలోచించినను నాతో సరిజోడు మఱియు తగినవాడు అయిన భర్త ఆయన మనస్సుకు గోచరించలేదు.
2.118.38.
అనుష్టుప్.
తస్య బుద్ధిరియం జాతా
చింతయానస్య సంతతమ్।
స్వయంవరం తనూజాయాః
కరిష్యామీతి ధీమతః॥
టీక:-
తస్య = అతనికి; బుద్ధిః = బుద్ధిశాలైన; ఇయం = ఈ; జాతా = కలిగినది; చింతయానస్య = ఆలోచన చేయగా; సంతతమ్ = నిరంతరము; స్వయంవరం = స్వయంవరమును; తనూజాయాః = కుమార్తెకు; కరిష్యామి = చేయవలెనని; ఇతి = ఇట్లు; ధీమతః = బుద్ధిమంతుడైన
భావము:-
నిరంతరము ఆలోచన చేయగా చేయగా, బుద్ధిశాలి ఐన ఆ జనకునకు, కుమార్తెకు స్వయంవరము చేయవలెనను ఆలోచన తట్టెను.
2.118.39.
అనుష్టుప్.
మహాయజ్ఞే తదా తస్య
వరుణేన మహాత్మనా ।
దత్తం ధనుర్వరం ప్రీత్యా
తూణీచాక్షయసాయకౌ॥
టీక:-
మహాయజ్ఞే = ఒక మహాయజ్ఞమునందు; తదా = అప్పుడు; తస్య = ఆయనకు; వరుణేన = వరుణుని చేత; మహాత్మనా = మహాత్ముడైన; దత్తమ్ = ఇవ్వబడినది; ధనుః = ధనుస్సును; వరం = శ్రేష్ఠమైనది; ప్రీత్యా = ప్రేమతో; తూణీచాక్షయసాయకౌ = మఱియు తరగని బాణములుండు అమ్ములపొది జంటను.
భావము:-
పూర్వము ఒక మహాయజ్ఞమునందు మహాత్ముడైన వరుణుడు ఆ జనక మహారాజునకు గొప్పన ధనస్సు ను, బాణములు అక్షయముగా ఉండు రెండు అమ్ముల పొదులను ప్రేమగా ఇచ్చియుండెను.
2.118.40.
అనుష్టుప్.
అసంచాల్యం మనుష్యైశ్చ
యత్నేనాపి చ గౌరవాత్।
తన్న శక్తా నమయితుం
స్వప్నేష్వపి నరాధిపాః॥
టీక:-
అసంచాల్యమ్ = కదల్పజాలనిది; మనుష్యైః = మానవులకు ఎవరికీ; చ = ఇంకను; యత్నేన = ఎంత ప్రయత్నము చేత; అపి = అయినను; చ = కూడా; గౌరవాత్ = బరువైనది అగుటచే; తత్ = దానిని; న = కారు; శక్తా = సమర్థులు; నమయితుము = ఎక్కుపెట్టుటకు; స్వప్నేషు = కలలో; చ = ఐనాకూడా; నరాధిపాః = రాజులు.
భావము:-
ఆ ధనుస్సు చాలా బరువైనది అగుటచే, దానిని మానవులు ఎవరూ, ఎంత ప్రయత్నము చేసినను కదల్పజాలరు. రాజులు కలలో కూడ దానిని వంచుటకు సమర్థులు కారు.
2.118.41.
అనుష్టుప్.
తద్ధనుః ప్రాప్య మే పిత్రా
వ్యాహృతం సత్యవాదినా।
సమవాయే నరేంద్రాణాం
పూర్వమామంత్రయ పార్థివాన్॥
టీక:-
తత్ = ఆ; ధనుః = ధనుస్సును గూర్చి; ప్రాప్య = పొంది; మే = నా; పిత్రా = తండ్రి; వ్యాహృతం = వివరించెను; సత్యవాదినా = సత్యవాక్పాలకుడు; సమవాయే = సమూహమునకు; నరేంద్రాణాం = రాజులకు; పూర్వమ్ = ముందుగానే; ఆమంత్రయ = పిలచి; పార్థివాన్ = రాజులను.
భావము:-
సత్యవాది అయిన మా తండ్రి ముందుగానే రాజులను అందరినీ పిలిచి, ఆ ధనుస్సును గూర్చి వారితో ఇట్లు చెప్పెను.
2.118.42.
అనుష్టుప్.
“ఇదం చ ధనురుద్యమ్య
సజ్యం యః కురుతే నరః।
తస్య మే దుహితా భార్యా
భవిష్యతి న సంశయః”॥
టీక:-
ఇదం = ఈ; చ = యొక్క; ధనుః = ధనస్సును; ఉద్యమ్య = ఎత్తి; సజ్యమ్ = నారిని కట్టి; యః = ఎవరైతే; కురుతే = చేసెదరో; నరః = రాజు; తస్య = అతనికి; మే = నా; దుహితా = కుమార్తె; భార్యా = భార్యగా; భవిష్యతి = కాగలదు; న = లేదు; సంశయః = సందేహము..
భావము:-
“ఎవడు ఈ ధనుస్సును ఎత్తి, దీనికి నారిని కట్టునో, అతనిని నా కుమార్తె వివాహము చేసుకొనును. ఇందుకు ఏ సందేహము లేదు.”
2.118.43.
అనుష్టుప్.
తచ్చ దృష్ట్వా ధనుశ్శ్రేష్ఠం
గౌరవాద్గిరిసన్నిభమ్।
అభివాద్య నృపా జగ్ముః
అశక్తాస్తస్య తోలనే॥
టీక:-
తత్ = ఆ యొక్క; చ = మఱి; దృష్ట్వా = చూచి; ధనుః = ధనుస్సును; శ్రేష్ఠమ్ = శ్రేష్ఠమైనదానిని; గౌరవాత్ = బరువులో; గిరి = పర్వతమంత; సన్నిభమ్ = సమానమైనది; అభివాద్య = నమస్కరించి; నృపా = రాజులందరూ; జగ్ముః = వెళ్లిపోయిరి; అశక్తాస్తస్య = అసమర్థులై; తోలనే = ఎత్తుటకు.
భావము:-
ఆ రాజులు పర్వతమంత బరువు గల శ్రేష్ఠమైన ధనుస్సును చూచి, దానిని కదల్చుటకు అసమర్థులై దానికి నమస్కరించి వెళ్ళిపోయిరి.
2.118.44.
అనుష్టుప్.
సుదీర్ఘస్య తు కాలస్య
రాఘవోఽయం మహాద్యుతిః।
విశ్వామిత్రేణ సహితో
యజ్ఞం ద్రష్టుం సమాగతః॥
టీక:-
సుదీర్ఘస్య = చాలాఎక్కువది; తు = ఐన; కాలస్య = చాలాకాలమునకు; రాఘవః = రఘురాముడు; అయం = ఈ; మహాద్యుతిః = గొప్ప కాంతిగలవాడు; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునితో; సహితః = కలసి; యజ్ఞమ్ = యజ్ఞమును; ద్రష్టుమ్ = చూచుటకు; సమాగతః = వచ్చెను.
భావము:-
చాలాకాలము గడిచిన పిమ్మట.. గొప్ప తేజస్సు గలవాడు, రఘువంశ సంజాతుడు అయిన ఈ రాముడు విశ్వామిత్రుని వెంట యజ్ఞము చూచుటకు వచ్చెను.
2.118.45.
అనుష్టుప్.
లక్ష్మణేన సహ భ్రాత్రా
రామ స్సత్యపరాక్రమః।
విశ్వామిత్రస్తు ధర్మాత్మా
మమ పిత్రా సుపూజితః॥
టీక:-
లక్ష్మణేన = లక్ష్మణునితో; సహ = కలసి; భ్రాత్రా = సోదరుడైన; రామః = రాముడు; సత్యపరాక్రమః = సత్యపరాక్రముడు; విశ్వామిత్రః + తు = విశ్వామిత్రుడును; తు = చక్కగా; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; మమ = నా యొక్క; పిత్రా = తండ్రిగారు; సుపూజితః = చేసిన పూజలను.
భావము:-
అలా సత్యపరాక్రముడైన రామునితో పాటు అతని తమ్ముడు లక్ష్మణుడు కూడ వచ్చెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు నా తండ్రి చేత పూజలను అందుకొనెను.
2.118.46.
అనుష్టుప్.
ప్రోవాచ పితరం తత్ర
భ్రాతరౌ రామలక్ష్మణౌ।
సుతౌ దశరథస్యేమౌ
ధనుర్దర్శనకాంక్షిణౌ॥
టీక:-
ప్రోవాచ = పలికెను; పితరం = తండ్రిగారిని గూర్చి; తత్ర = ఇక్కడ; భ్రాతరౌ = సోదరులైన; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు; సుతౌ = కుమారులైన; దశరథస్య = దశరథుని యొక్క; ఇమౌ = వీరిరువురు; ధనుః = ధనస్సును; దర్శన కాంక్షిణౌ = చూడగోరుచున్నారు
భావము:-
సోదరులైన ఆ రామలక్ష్మణులను గూర్చి అతనికి ఇలా చెప్పెను.దశరథుని కుమారులైన ఈ రామలక్ష్మణులు ధనుస్సును చూడగోరుచున్నారు.
2.118.47.
అనుష్టుప్.
ధనుర్దర్శయ రామాయ
రాజపుత్రాయ దైవికమ్”।
ఇత్యుక్తస్తేన విప్రేణ
తద్ధనుసముపానయత్॥
టీక:-
ధనుః = ధనుస్సును; దర్శయ = చూచుటకు; రామాయ = రామునికి; రాజపుత్రాయ = రాజపుత్రుడైన; దైవికమ్ = దైవదత్తముగా వచ్చిన; ఇతి = ఇట్లు; ఉక్తః = పలికగా; తేన = ఆ; విప్రేణ = బ్రాహ్మణోత్తముడైన విశ్వామిత్రుని; తత్= ఆ; ధనుః = ధనుస్సును; సముపానయత్ = తెప్పించెను.
భావము:-
దేవతల ద్వారా లభించిన ఆ ధనుస్సును రాజపుత్రుడైన రామునకు చూపుము. ఆ బ్రాహ్మణోత్తముడైన విశ్వామిత్రుని మాటలు విని, దైవ దత్తముగా వచ్చిన ఆ ధనుస్సును.. రాజపుత్రుడైన రామునికి చూపుటకై మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించెను.
2.118.48.
అనుష్టుప్.
నిమేషాంతరమాత్రేణ
తదాఽనమ్య మహాబలః।
జ్యాం సమారోప్య ఝడితి
పూరయామాస వీర్యవాన్॥
టీక:-
నిమేషాంతర మాత్రేణ = రెప్పపాటు కాలములోనే; తదా = దానిని; ఆనమ్య = (ధనుస్సును) వంచి; మహాబలః = మహాబలశాలి; జ్యాం = నారిని; సమారోప్య = ఎక్కించి, సంధించి; ఝడితి = తక్షణమే; పూరయామాస = ఎక్కుపెట్టెను; వీర్యవాన్ = పరాక్రమవంతుడు.
భావము:-
మహాబలశాలి, పరాక్రమవంతుడు అయిన రాముడు రెప్పపాటుకాలములో దానిని ఎత్తి, నారి సంధించి, ఎక్కుపెట్టెను.
2.118.49.
అనుష్టుప్.
తేన పూరయతా వేగాన్
మధ్యే భగ్నం ద్విధా ధనుః।
తస్య శబ్దో భవద్భీమః
పతితస్యాశనేరివ॥
టీక:-
తేన = అతని; పూరయతా = ఎక్కుపెట్టిన; వేగాన్ = వేగమినకు; మధ్యే = నడుమకు; భగ్నమ్ = విరిగిను; ద్విధా = రెండు ముక్కలుగా; ధనుః = ధనుస్సు; తస్య = ఆ; శబ్దః = ధ్వని; భవత్ = ఉండెను; భీమః = భయంకరంగా; పతితస్య = పడినట్లు; అశనేః = పిడుగు;ఇవ = వలె.
భావము:-
రాముడు దానిని ఎక్కుపెట్టిన వేగమునకు అది మధ్యలో రెండు ముక్కలుగా బద్దలయ్యెను. అపుడు పిడుగు పాటువంటి భయంకరమైన శబ్ధము పుట్టెను.
2.118.50.
అనుష్టుప్.
తతోఽహం తత్ర రామాయ
పిత్రా సత్యాభిసంధినా।
నిశ్చితా దాతుముద్యమ్య
జలభాజనముత్తమమ్॥
టీక:-
తతః = అటు పిమ్మట; అహం = నన్ను; తత్ర = అక్కడ;, రామాయ = రామునికి; పిత్రా = తండ్రిగారు; సత్యాభిసంధినా = సత్య ప్రతిజ్ఞ గల; నిశ్చితా = నిశ్చయించుకున్న; దాతుమ్ = ఇచ్చుటకై; ఉద్యమ్య = గ్రహించెను; జలభాజనమ్ = జల కలశమును; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన.
భావము:-
అప్పుడు అక్కడే సత్యప్రతిజ్ఞ గల నా తండ్రి నన్ను రామునకు ఇచ్చుటకై, జలకలశమును గ్రహించెను.
2.118.51.
అనుష్టుప్.
దీయమానాం న తు తదా
ప్రతిజగ్రాహ రాఘవః।
అవిజ్ఞాయ పితుశ్ఛందమ్
అయోధ్యాఽధిపతేః ప్రభోః॥
టీక:-
దీయమానామ్ = ఇవ్వబడుచున్న నన్ను; న = లేదు; తు = నిస్చయముగా; తదా = అప్పుడు; ప్రతిజగ్రాహ = స్వీకరించ; రాఘవః = రఘురాముడు; అవిజ్ఞాయ = తెలియకుండా; పితుః = తండ్రికి; చందమ్ = అభిప్రాయము; అయోధ్యా = అయోధ్యా నగరమునకు; అధిపతేః = అధిపతి; ప్రభోః = ప్రభువు
భావము:-
అపుడు రాముడు తన తండ్రీ, ప్రభువూ అయిన అయోద్య మహారాజు ఐన దశరథుని అభిప్రాయము తెలుసుకొనకుండగా, నా తండ్రి జనకుడు ఇచ్చుచున్న నన్ను స్వీకరించలేదు.
2.118.52.
అనుష్టుప్.
తత శ్వశురమామంత్రయ
వృద్ధం దశరథం నృపమ్।
మమ పిత్రా త్వహం దత్తా
రామాయ విదితాత్మనే॥
టీక:-
తతః = అప్పుడు; శ్వశురమ్ = మామగారిని; ఆమంత్రయ = పిలిపించి; వృద్ధం = పెద్దవాడైన; దశరథమ్ = దశరథుని; నృపమ్ = రాజును; మమ = నా; పిత్రా = తండ్రి; తు = అయిన; అహం = నన్ను; దత్తా = ఇచ్చెను; రామాయ = రామునికి; విదితాత్మనే = బుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన
భావము:-
పిమ్మట నా తండ్రి గొప్పవాడైన మామగారు దశరథ మహారాజును పిలిపించి బుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన రామునకు నన్ను ఇచ్చెను.
2.118.53.
అనుష్టుప్.
మమ చైవానుజా సాధ్వీ
ఊర్మిళా ప్రియదర్శనా।
భార్యార్థే లక్ష్మణస్యాపి
పిత్రా దత్తా మమ స్వయమ్॥
టీక:-
మమ = మా; చైవ = ఐన; అనుజా = సోదరిని; సాధ్వీ = పవిత్రురాలు; ఊర్మిళా = ఊర్మిళను; ప్రియదర్శనా = చూడచక్కనిది; భార్యార్థే = భార్యగా; లక్ష్మణస్య = లక్ష్మణునకు; అపి = కూడా; పిత్రా = తండ్రి; దత్తా = ఇచ్చి; మమ = మా; స్వయమ్ = స్వయముగా
భావము:-
నా తండ్రి స్వయముగా నా చెల్లలు, పవిత్రురాలు, చూడచక్కనిది అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహము చేసెను.
2.118.54.
అనుష్టుప్.
ఏవం దత్తాఽస్మి రామాయ
తదా తస్మిన్స్వయంవరే।
అనురక్తాఽస్మి ధర్మేణ
పతిం వీర్యవతాం వరమ్॥
టీక:-
ఏవం = ఆవిదముగ; దత్తా = ఇవ్వబడినదానను; అస్మి = ఐతిని; రామాయ = రామునకు; తదా = అప్పుడు; తస్మిన్ = ఆ; స్వయంవరే = స్వయంవరమునుండి; అనురక్తా = అనురాగము కలదాననై; అస్మి = ఐఉంటిని; ధర్మేణ = ధర్మానుసారముగా; పతిం = భర్తపై; వీర్యవతాం = పరాక్రమవంతులలో; వరమ్ = శ్రేష్ఠుడైన.
భావము:-
నా తండ్రి అపుడు ఆ స్వయంవరమునందు, నన్ను రామునకు ఆ విధముగా ఇచ్చి వివాహము చేసెను. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడైన భర్తపై ధర్మానుసారముగా అనురాగము కలదాననై ఉన్నాను.
2.118.55.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే అష్టాదశోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; అష్టాదశోత్తరశతతమః [118] = నూటపద్దెనిమిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [118] నూటపద్దెనిమిదవ సర్గ సంపూర్ణము.
2.119.1.
అనుష్టుప్.
అనసూయా తు ధర్మజ్ఞా
శ్రుత్వా తాం మహతీం కథామ్।
పర్యష్వజత బాహుభ్యాం
శిరస్యాఘ్రాయ మైథిలీమ్॥
టీక:-
అనసూయా తు = అనసూయాదేవి; తు = విశేషముగా; ధర్మజ్ఞా = ధర్మము తెలిసినామె; శ్రుత్వా = విని; తాం = ఆ; మహతీం = గొప్ప; కథామ్ = వృత్తాంతమును; పర్యష్వజత = కౌగిలించుకొనెను; బాహుభ్యాం = బాహువులతో; శిరçస్య = శిరస్సుపై; ఆఘ్రాయ = వాసన చూసి; మైథిలీమ్ = మిథిలా రాకుమారి సీతాదేవిని.
భావము:-
ధర్మశాస్త్ర నిష్ణాతురాలగు అనసూయ, సీతాదేవి చెప్పిన సీతా స్వయంవర కథను విని, మిథిలా రాకుమారి సీతాదేవి శిరస్సుపై ఆఘ్రాణించి, చేతులారా కౌగిలించుకొనెను.
2.119.2.
అనుష్టుప్.
వ్యక్తాక్షరపదం చిత్రం
భాషితం మధురం త్వయా।
యథా స్వయంవరం వృత్తం
తత్సర్వం హి శ్రుతం మయా॥
టీక:-
వ్యక్త = స్పష్టముగా తెలియునట్ల; అక్షర = అక్షరములు; పదమ్ = పదములు; చిత్రమ్ = ఆశ్చర్యకరమైన రీతిలో; భాషితమ్ = మాటలాడబడిన; మధురం = మధురముగా; త్వయా = నీ చేత; యథా = ఎట్లు; స్వయంవరమ్ = స్వయంవరము; వృత్తమ్ = వృత్తాంతము జరిగినదో; తత్ = అది; సర్వం = అంతయు; హి = చక్కగా; శ్రుతం = వినబడినది; మయా = నాచే
భావము:-
నీవు అక్షరములు, పదములు స్పష్టముగా పలుకునట్లు ఎంతో మధురముగా ఆశ్చర్యకరమైన రీతిలో చెప్పితివి. నీ స్వయంవరము ఎట్లు జరిగినదో ఆ విషయమును అంతయు చక్కగా వింటిని.
2.119.3.
అనుష్టుప్.
రమేఽహం కథయా తే తు
దృఢం మధురభాషిణి!।
రవిరస్తంగతః శ్రీమాన్
ఉపోహ్య రజనీం శివామ్॥
టీక:-
రమే = ఆనందించితిని; అహం = నేను; కథయా = కథను; తే తు = నీది; తు = అయిన; దృఢమ్ = గట్టిగా, శ్రద్ధగా; మధురభాషిణి = మధురముగా మాటలాడుదానా; రవిః = సూర్యుడు; అస్తంగతః = అస్తమయము; గతః = జరిగెను; శ్రీమాన్ = మనోజ్ఞమైన; ఉపోహ్య = ఏతెంచను; రజనీం = రాత్రి; శివామ్ = శుభకరమగు, వావిళ్ళ.
భావము:-
నీ స్వయంవర కథను శ్రద్ధగా వింటిని. నాకు ఆనందము కలిగెను. మనోజ్ఞమైన సూర్యాస్తమయము జరిగినది. శుభకరమగు రాత్రిసమయము ఏతెంచెను.
2.119.4.
అనుష్టుప్.
దివసం ప్రతికీర్ణానామ్
ఆహారార్థం పతత్రిణామ్।
సంధ్యాకాలే నిలీనానాం
నిద్రార్థం శ్రూయతే ధ్వనిః॥
టీక:-
దివసం = పగటి సమయములో; ప్రతికీర్ణానామ్ = వివిధ ప్రదేశములు తిరిగినవి; ఆహారార్థం = ఆహారముకోసము; పతత్రిణామ్ = పక్షులు; సంధ్యాకాలే = సాయంకాలమునందు; నిలీనానాం = అణగుచున్నవి; నిద్రార్థం = నిద్రకోసం; శ్రూయతే = వినబడుచున్నవి; ధ్వనిః = కలకలారావములు.
భావము:-
ఆహారము కొరకై, పగలంతా ఎక్కడెక్కడో తిరిగి, సంధ్యా సమయానికి తమ గూళ్లకు చేరి నిద్రపోవుటకు సిద్ధపడుతున్న పక్షుల కలకలారావములు వినబడుచున్నవి.
2.119.5.
అనుష్టుప్.
ఏతే చాప్యభిషేకార్ద్రా
మునయః కలశోద్యతాః।
సహితా ఉపవర్తన్తే
సలిలాప్లుతవల్కలాః॥
టీక:-
ఏతే = ఈ; చ = మఱి; అపి = కూడా; అభిషేకః = స్నానములు చేసినవారు; ఆర్ద్రా = తడి బట్టలతో; మునయః = మునులు; కలశః = కలశలను; ఉద్యతాః = గ్రహించి; సహితా = గుంపులుగా కలిసి; ఉపవర్తన్తే = వెనుకకు వచ్చుచున్నారు; సలిల = నీటితో; ఆప్లుత = తడపబడిన; వల్కలాః = నారచీరలు కలవారు.
భావము:-
ఈ మునులు కూడ స్నానములు చేసి, తడిబట్టలతో జలపూర్ణములైన కలశలను పట్టుకుని, నీటిలో తడిపిన నారచీరలతో గుంపులుగా కూడి వచ్చుచుంటిరి.
2.119.6.
అనుష్టుప్.
ఋషీణామగ్నిహోత్రేషు
హుతేషు విధిపూర్వకమ్।
కపోతాంగారుణో ధూమో
దృశ్యతే పవనోద్ధతః॥
టీక:-
ఋషీణామ్ = ఋషుల చేత; అగ్నిహోత్రేషు = అగ్నిహోత్రము నుండి; హుతేషు = హోమమును; విధిపూర్వకమ్ = యథావిధిగా చేయగా; కపోత = పావురము; అంగ = శరీర భాగమైన మెడ; అరుణః = కపిల వర్ణము రంగులో; ధూమో = ఎగయుచున్న; దృశ్యతే = కనపడుచున్నవి; పవన = గాలివాటముచే; ఉద్ధతః = ఎగయుచున్నవి.
భేవము:-
ఋషులు సాయంకాలము చేయు హోమ గుండములో అగ్నిహోత్రము యథావిధిగా చేయగా, పావురము మెడ రంగు కపిలవర్ణ ఛాయతో ఉన్న ధూమము గాలికి ఎగుయుచు కనబడుచున్నది.
2.119.7.
అనుష్టుప్.
అల్పపర్ణా హి తరవో
ఘనీభూతాస్సమన్తతః।
విప్రకృష్టేంద్రియే దేశే
న ప్రకాశంతి వై దిశః॥
టీక:-
అల్పపర్ణా = స్వల్పమైన ఆకులు గలవి; హి = ఐనను; తరవః = చెట్లు; ఘనీభూతాః = దట్టముగా ఉన్నట్లు ఉన్నవి; సమన్తతః = నలుదిక్కులలోను; విప్రకృష్ణ = వికర్షింపబడినవి; ఇంద్రియే = ఇంద్రియములు (కన్నులు); దేశే = ఈ ప్రదేశమున; న = లేదు; ప్రకాశంతి వై = ప్రకాశించుట; వై = ప్రసిద్దముగ; దిశః = దిక్కులు
భావము:-
చుట్టుప్రక్కల ఉన్న స్వల్పమైన ఆకులు గల చెట్లు కూడ దట్టముగా ఉన్నట్లు కనబడుచున్నవి. ఇక్కడ దిక్కులు అన్నే ప్రకాశించుటలేదు.
2.119.8.
అనుష్టుప్.
రజనీచరసత్త్వాని
ప్రచరంతి సమన్తతః।
తపోవనమృగా హ్యేతే
వేదితీర్థేషు శేరతే॥
టీక:-
రజనీచర = రాత్రి సంచరించు; సత్త్వాని = జంతువులు; ప్రచరంతి = సంచరించుచున్నవి; సమన్తతః = నలువైపులా; తపోవన = ఈ తపోవనమున ఉండు; మృగా హి = జంతువులు; హి = ఐతే; ఏతే = ఇవి; వేది = వేదికలయందు; తీర్థేషు = నదీతీరములయందు; శేరతే = శయనించుచున్నవి.
భావము:-
నిశాచర జంతువులు నలువైపులా సంచరించుచున్నవి. ఈ తపోవన మృగములు యజ్ఞవేదికలయందు, నదీతీరములందు చేరుచుండెను.
2.119.9.
అనుష్టుప్.
సంప్రవృత్తానిశా సీతే!
నక్షత్రసమలంకృతా।
జ్యోత్స్నాప్రావరణశ్చంద్రో
దృశ్యతేఽభ్యుదితోఽమ్బరే॥
టీక:-
సంప్రవృత్తా = పూర్తిగా ప్రారంభమైనది; నిశా = రాత్రి; సీతే = ఓ సీతాదేవీ; నక్షత్ర = నక్షత్రములచే; సమలంకృతా = అలంకృతమై; జ్యోత్స్నా= వెన్నెలను; ప్రావరణః = పరచున్నవాడై; చంద్రః = చంద్రుడు; దృశ్యతే = కనపడుచుండెను; అభ్యుదిత = ఉదయించినవాడై; అమ్బరే = ఆకాశమునందు.
భావము:-
ఓ సీతాదేవీ! చూడు నక్షత్రములచే అలంకృతమై, పూర్తిగా రాత్రి అయిపోవుచుండెను. చంద్రుడు వెన్నెలను పరచుచు, ఆకాశమునందు ఉదయించెను.
2.119.10.
అనుష్టుప్.
గమ్యతామనుజానామి
రామస్యానుచరీ భవ।
కథాయంత్వా హి మధురం
త్వయాఽహం పరితోషితా॥
టీక:-
గమ్యతామ్ = వెళ్లెదవు గాక; అనుజానామి = అనుమతి ఇచ్చుచున్నాను; రామస్య = రాముని వద్దకు; అనుచరీ = అనుసరించుదానవు; భవ = అగుము; కథాయంత్వా = చెప్పబడినది; హి = చక్కగా; మధురమ్ = అందమైనది; త్వయా = నీచే; అహం = నేను; పరితోషితా = సంతోషించినాను.
భావము:-
అనుజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక నీవు రాముని వద్దకు వెళ్లుము. అందంగా నీవు చెప్పావు. నేను చాలా సంతోషించితిని.
2.119.11.
అనుష్టుప్.
అలంకురు చ తావత్త్వం
ప్రత్యక్షం మమ మైథిలి!।
ప్రీతిం జనయ మే వత్సే!
దివ్యాలంకారశోభితా॥
టీక:-
అలంకురు = అలంకరించుకొనెదవు గాక; చ = ఇంక; తావత్ = అన్నిటినీ; త్వం = నీవు; ప్రత్యక్షమ్ = ఎదుటనే; మమ = నా; మైథిలి = ఓ మిథిలానగర రాకుమారి సీతాదేవీ; ప్రీతిమ్ = ఆనందమును; జనయ = కలిగించుము; మే = నాకు; వత్సే = అమ్మాయీ; దివ్య = దివ్యమైన; అలంకార = ఆభరణములచే; శోభితా = శోభితురాలవై.
భావము:-
ఓ మిథిలానగర రాకుమారి సీతాదేవీ! నా ఎదుటనే నీవు అలంకరించుకొనుము. దివ్యాభరణములన్నీ అలంకరించుకొని, నన్ను ఆనందింప జేయుము.
2.119.12.
అనుష్టుప్.
సా తథా సమలంకృత్య
సీతా సురసుతోపమా।
ప్రణమ్య శిరసా తస్యై
రామం త్వభిముఖీ యయౌ॥
టీక:-
సా = వాటిని; తథా = ఆ విధముగా; సమలంకృత్య = అలంకరించుకొని; సీతా = సీతాదేవి; సురసుత = దేవకన్యతో; ఉపమా = సరిపోలెడిది; ప్రణమ్య = నమస్కరించి; శిరసా = శిరస్సు వంచి; తస్యై = ఆమెకు; రామం తు అభిముఖీ = రాముని వద్దకు; యయౌ = వెళ్లెను.
భావము:-
దేవకన్యతో సరిపోలే ఆ సీత, అనసూయాదేవి కోరిక ప్రకారము ఆ దివ్యాభరణములన్నీ అలంకరించుకొని, ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి, రాముని వద్దకు వెళ్లెను.
2.119.13.
అనుష్టుప్.
తథా తు భూషితాం సీతాం
దదర్శ వదతాం వరః।
రాఘవః ప్రీతిదానేన
తపస్విన్యా జహర్ష చ॥
టీక:-
తథా = ఆ విధముగా; తు = ఐనట్టి; భూషితామ్ = అలంకరించుకొనినామె; సీతామ్ = సీతను; దదర్శ = చూచి; వదతాం = మాటలాడువారిలో; వరః = శ్రేష్ఠుడైన; రాఘవః = రాముడు; ప్రీతిదానేన = ప్రేమగా ఇచ్చిన బహుమతులకు; తపస్విన్యా = తాపసి అయిన అనసూయా దేవిచేత; జహర్ష = సంతోషించెను; చ = కూడా.
భావము:-
బహుసంభాషణా నేర్పరి ఐన రాముడు అట్లు అలంకరించుకొని వచ్చిన సీతను చూచి, తాపసి అనసూయాదేవి వాత్సల్యముతో ఇచ్చిన బహుమతులకు మిక్కిలి సంతోషించెను.
2.119.14.
అనుష్టుప్.
న్యవేదయత్తతస్సర్వం
సీతా రామాయ మైథిలీ।
ప్రీతిదానం తపస్విన్యా
వసనాభరణస్రజమ్॥
టీక:-
న్యవేదయత్ = చూపించెను; తతః = పిమ్మట; సర్వం = అన్నిటినీ; సీతా = సీతాదేవి; రామాయ = రామునకు; మైథిలీ = సీతకు; ప్రీతిదానం = ప్రేమపూర్వకముగా ఇచ్చిన బహుమతులు; తపస్విన్యా = అనసూయా దేవి; వసన = వస్త్రములను; ఆభరణ = అలంకరాములను; స్రజమ్ = పుష్ప మాలలను
భావము:-
మిథిలానగర రాకుమారి సీతాదేని, తపస్విని అనసూయాదేవి వాత్సల్యముతో తనకు బహూకరించిన వస్త్రములను, అలంకారములను, పుష్పమాలలను రామునకు చూపించెను.
2.119.15.
అనుష్టుప్.
ప్రహృష్టస్త్వభవద్రామో
లక్ష్మణశ్చ మహారథః।
మైథిల్యాస్సత్క్రియాం దృష్ట్వా
మానుషేషు సుదుర్లభామ్॥
టీక:-
ప్రహృష్టస్తు = మిక్కిలి సంతోషించినవారు; అభవత్ = ఐరి; రామః = రాముడు; లక్ష్మణః = లక్ష్మణుడును; చ = కూడా; మహారథః = మహారథులు అయిన; మైథిల్యాః = సీతాదేవికి; సత్క్రియాం = సత్కారమును; దృష్ట్వా = చూచి; మానుషేషు = మనుష్యులలో; సుదుర్లభామ్ = లభింపజాలని
భావము:-
మనుష్యులలో ఎవ్వరికిని లభింపజాలని, సీతకు జరిగిన సత్కారము చూచి, రాముడు, లక్ష్మణుడు కూడా ఎంతో సంతోషించిరి.
2.119.16.
అనుష్టుప్.
తతస్తాం శర్వరీం ప్రీతః
పుణ్యాం శశినిభాననః।
అర్చితస్తాపసైస్సిద్ధైః
ఉవాస రఘునందనః॥
టీక:-
తతః = పిమ్మట; తాం = ఆ; శర్వరీమ్ = ఆ రాత్రిని; ప్రీతః = సంతోషించి; పుణ్యామ్ = పవిత్రమైన; శశినిభాననః = చంద్రుని వంటి మోము కలిగిన; అర్చితః = ఆతిథ్యమును; తాపసైః = తపశ్శాలులతో; సిద్ధైః = తపస్సిద్ధులతో; ఉవాస = గడిపెను; రఘునందనః = రాముడు.
భావము:-
చంద్రముఖుడైన శ్రీరాముడు సిద్దుల మునీశ్వరుల ఆతిథ్యమును స్వీకరించి, నంతోషించి, పవిత్రమైన ఆ రాత్రిని అక్కడ గడపెను.
2.119.17.
అనుష్టుప్.
తస్యాం రాత్య్రాం వ్యతీతాయామ్
అభిషిచ్య హుతాగ్నికాన్।
ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ
తాపసాన్వనగోచరాన్॥
టీక:-
తస్యాం = ఆ యొక్క; రాత్య్రాం = రాత్రి సమయము; వ్యతీతాయామ్ = గడచిన పిమ్మట; అభిషిచ్య = స్నానము చేసి; హుతాగ్నికాన్ = అగ్నిహోత్రము పూర్తిచేసికొని; ఆపృచ్ఛేతామ్ = వీడ్కొనిరి; నరవ్యాఘ్రౌ = నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు ఇరువురు; తాపసాన్ = మునులను; వనగోచరాన్ = ఆశ్రమములో నివసించు.
భావము:-
ఆ రామలక్ష్మణులు రాత్రి గడచిన పిమ్మట, స్నానము చేసి, అగ్నిహోత్రమును పూర్తిచేసుకొనిన పిమ్మట ఆ ఆశ్రమములో నివసించు మునులను వీడ్కొనిరి.
2.119.18.
అనుష్టుప్.
తావూచుస్తే వనచరాః
తాపసా ధర్మచారిణః।
“వనస్య తస్య సంచారం
రాక్షసైస్సమభిప్లుతమ్॥
టీక:-
తౌ = వారు రామలక్ష్మణులిరువురు; ఊచుః = పలికిరి; తే = ఆ; వనచరాః = వనములో నివసించు; తాపసా = మునులు; ధర్మచారిణః = ధర్మాచరణము చేయుచున్న; వనస్య = వనములోని; తస్య = ఆ; సంచారం = సంచారముతో; రాక్షసైః = రాక్షసుల యొక్క; సమభిప్లుతమ్ = ఉపద్రవముతో.
భావము:-
వనములో నివసించుచు, ధర్మాచరణము చేయుచున్న ఆ మునులు, “ఆ వనములోని మార్గమంతయు రాక్షసుల ఉపద్రవముతో కూడిన”దని రామలక్ష్మణులకు చెప్పిరి.
2.119.19.
అనుష్టుప్.
రక్షాంసి పురుషాదాని
నానారూపాణి రాఘవ!।
వసంతి అస్మిన్మహారణ్యే
వ్యాలాశ్చ రుధిరాశనాః॥
టీక:-
రక్షాంసి = రాక్షసులు; పురుషాదాని = నరమాంసభక్షకులు; నానా = వివిధ; రూపాణి = రూపములు గలవారు; రాఘవ = ఓ రామా; వసంతి = నివసించుచుండును; అస్మిన్ = ఈ; మహారణ్యే = మహాటవిలో; వ్యాళాః = క్రూరజంతువులు; చ = కూడా; రుధిరాశనాః = రక్తము త్రాగు.
భావము:-
రామా! ఈ మహారణ్యములో, అనేక రూపములు గల నరమాంస భక్షక రాక్షసులూ, రక్తము త్రాగు క్రూరజంతువులూ నివసించుచున్నవి.
2.119.20.
అనుష్టుప్.
ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా
తాపసం ధర్మచారిణమ్।
అదన్త్యస్మిన్మహారణ్యే
తాన్నివారయ రాఘవ!॥
టీక:-
ఉచ్ఛిష్టమ్ వా = ఎంగిలి తినువాడు; వా = కాని; ప్రమత్తమ్ వా = ఏమరుపాటుగా ఉన్నవాడు; వా = కాని; తాపసం = మునిని; ధర్మచారిణమ్ = ధర్మవర్తనులు; అదంతి = తినివేయుచుందురు; అస్మిన్ = ఈ; మహారణ్యే = మహారణ్యములో; తాత్ = వారిని; నివారయ = నివారించెదవు గాక; రాఘవ = ఓ రామా.
భావము:-
ఈ మహారణ్యములో ఎవ్వరైనా ముని ఎంగిలి తినువాడు గాని ఏమరుపాటుతో ఉన్నవాడు గాని ఉన్నచో వానిని రాక్షసులు తినివేయుచుందురు. వారిని నివారించుకొనుము.
2.119.21.
అనుష్టుప్.
ఏష పంథా మహర్షీణాం
ఫలాన్యాహరతాం వనే।
అనేన తు వనం దుర్గం
గంతుం రాఘవ తే క్షమమ్”॥
టీక:-
ఏష = ఈ; పంథా = మార్గమును; మహర్షీణాం = మహర్షులు; ఫలాని = ఫలముల కొరకు; ఆహరతాం = తెచ్చుకొనుటకై; వనే = వనమునందు; అనేన = ప్రవేశించినచో; తు = తప్పక; వనమ్ = వనమును; దుర్గమ్ = దుర్గమమైనది; గంతుమ్ = వెళ్లుటకు; రాఘవ = ఓ రఘురామా; తే = నీకు; క్షమమ్ = అనుకూలమైనది.
భావము:-
ఫలములు తెచ్చుకొనుటకై అరణ్యములలోనికి వెళ్లెడు మహర్షులు ఈ మార్గమును ఉపయోగింతురు. దుర్గమమైన వనములోనికి నీవు ఈ మార్గమున ప్రవేశించినచో అనుకూలముగా ఉండును.”
2.119.22.
జగతి.
ఇతీవ తైః ప్రాంజలిభిస్తపస్విభి
ర్ద్విజైః కృతస్వస్త్యయనః పరన్తపః।
వనం సభార్యః ప్రవివేశ రాఘవ=
స్సలక్ష్మణస్సూర్య ఇవాభ్రమండలమ్॥
టీక:-
ఇతీవ = ఆ విధముగా చేసిన; తైః = వారు; ప్రాంజలిభిః = దోసిలి ఒగ్గిన వారై; తపస్విభిః = మునులచే; ద్విజైః = బ్రాహ్మణులచే; కృత = చేయబడిన; స్వస్త్యయనః = శుభాశీస్సులను; పరన్తపః = సూర్యుడు; వనం = వనములో; సభార్యః = సీతతో కూడి; ప్రవివేశ = ప్రవేశించెను; రాఘవః = రాముడు; సలక్ష్మణః = లక్ష్మణునితో కూడి; సూర్యః ఇవ = సూర్యుని వలె; అభ్రమండలమ్ = మేఘమండలములో.
భావము:-
సీతాలక్ష్మణ సమేతుడైన, శత్రుసంహారకుడైన ఆ రాముడు.. ఉత్తమమైన తపస్సు గల ఆ మునులు దోసిలి ఒగ్గి చేసిన శుబాశీస్సులను స్వీకరించి సూర్యుడు మేఘమండలములో ప్రవేశించినట్లు ఆ దండకారణ్యములో ప్రవేశించెను.
2.119.23.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే చతుర్వింశత్సహస్రికాయాం సంహితయాం అయోధ్యకాండే ఏకోనవింశ్యుత్తరశతతమః సర్గః. అయోధ్యకాండః సమాప్తః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; చతుర్వింశత్ సహస్రికాయాం = ఇరవై నాలుగు వేల సంఖ్యతో; సంహితయాం = కూడి ఉన్నట్టిదైన; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకోనవింశ్యుత్తర శతతమః [119] = నూటపందొమ్మిదవ; సర్గః = సర్గ. అయోధ్యకాండః = అయోధ్యకాండ; సమాప్తః = సంపూర్తి ఐనది.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత ఇరవైనాలుగువేల శ్లోకములలో చెప్పబడిన తెలుగు వారి రామాయణ మహా గ్రంథములోని నూటపందొమ్మిదవ [119] సర్గ సంపూర్ణము. బాలకాండ సుసంపూర్ణము.
బాల కాండ
॥కాండాత ప్రార్థనలు॥
1.
కందపద్యము.
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్థ్సవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
2.
అనుష్టుప్.
యదక్షర పదభ్రష్టం
మాత్రాహీనం యద్భవేత్।
తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణా నమోస్తుతే॥
3.
జగతి.
కాయేనవాచా మనసేంద్రియైర్వా
బుధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణేతి సమర్పయామి॥
4.
వచనము.
ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనా స్సుఖినోభవంతు.
~~~X~~~