2.61.1.అనుష్టుప్.
వనం గతే ధర్మపరే
రామే రమయతాం వరే।
కౌసల్యా రుదతీ స్వార్తా
భర్తారమిదమబ్రవీత్॥
టీక:-
 వనమ్ = అరణ్యమునకు; గతే = వెళ్లెను; ధర్మపరే = ధర్మపరాయణుడైన; రామే = రాముని; రమయతాం = ఆనందమును కలిగించుటలో; వరే = శ్రేష్ఠుడు; కౌసల్యా = కౌసల్య; రుదతీ = ఏడ్చుచు; స్వార్తా = సం+ ఆర్తా, మిక్కిలి దుఃఖితురాలై; భర్తారమ్ = భర్తతో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను
భావం:-
 ధర్మమును ఆచరించుటలో శ్రేష్ఠుడైన రాముడు అరణ్యములకు వెళ్లినందుకు కౌసల్య చాలా దుఃఖించుచు, ఏడ్చుచు భర్తతో ఇట్లు పలికెను.
2.61.2.అనుష్టుప్.
“యదిదం త్రిషు లోకేషు
ప్రథితం తే మహద్యశః।
పుత్ర ప్రావ్రాజనాత్ తత్తే
ప్రనష్టమివ లక్షయే॥
టీక:-
 యదిదం = యత్+ ఇదం = ఏదైతే ఉన్నదో అద్; త్రిషులోకేషు = ముల్లోకముల యందు; ప్రథితం = గొప్పకీర్తి; తే = నీకు; మహద్యశః = మహత్ + యశః, గొప్ప యశస్సు; పుత్ర = కుమారుని; ప్రవ్రజనాత్ = బహిష్కరణచేయుటచే; తత్ = అది; తే = నీది; ప్రనష్టమ్ = పూర్తిగా నశించినది; ఇవ = అని; లక్షయే = భావించెదను.
భావం:-
 “నీవు గడించిన ముల్లోకములలోనూ ప్రసిద్ధమైన కీర్తి అంతయూ, నీ కుమారుని దేశబహిష్కరణతో తుడిచిపెట్టుకుపోయినది భావించుచున్నాను.
*గమనిక:-
పుల్లెల శ్రీరామచంద్రుల వారు తమ శ్రీమద్రామాయణము నందు ఈ ప్రాచ్యపాఠము (“యదిదం. . . ”, మన దక్షిణాది పాఠము “యద్యపి. . ” బదులు) గ్రహించినచో ఇంకనూ బాగుండును అంటిరి. ఏ తద్వాక్యమనుసరించి ఇక్కడ గ్రహించడమయినది. ఆ మన దక్షిణాది పాఠము. “యద్యపి త్రిషు లోకేషు,
ప్రథితం తే మహద్యశః। సానుక్రోశో వదాన్యశ్చ, ప్రియవాదీ చ రాఘవః”॥
2.61.3.అనుష్టుప్.
కథం నరవరశ్రేష్ఠ!
పుత్రౌ తౌ సహ సీతయా।
దుఃఖితౌ సుఖసంవృద్ధౌ
వనే దుఃఖం సహిష్యతః॥
టీక:-
 కథం = ఏ విధముగా; నరవరశ్రేష్ఠ = రాజులలో శ్రేష్ఠుడా; పుత్రౌ = కుమారులిద్దరు; తౌ = నీయొక్క; సహ = కూడా ఉన్న; సీతయా = సీతాదేవి; దుఃఖితౌ = దుఃఖించుచు; సుఖసంవృద్ధౌ = సుఖముగా పెరిగినవారు; వనే = వనములో; దుఃఖమ్ = క్లేశములను; సహిష్యతః = సహించగలరు.
భావం:-
 చిన్నతనము నుండియు సుఖముగా పెరిగిన, సీతాదేవీ సహితులైన నీ కుమారులు ఇరువురును దుఃఖించుచు, అడవులలోని బాధలను ఎట్లు సహించగలరు?
2.61.4.అనుష్టుప్.
సా నూనం తరుణీ శ్యామా
సుకుమారీ సుఖోచితా।
కథముష్ణం చ శీతం చ
మైథిలీ ప్రసహిష్యతే॥
టీక:-
 సా = ఆమె; నూనం = నిశ్చయముగా; తరుణీ = యువతి; శ్యామా = మంచి యవ్వనములో ఉన్న; సుకుమారీ = సౌకుమార్యము కలిగిన; సుఖోచితా = సుఖములకు అలవాటు పడిన; కథమ్ = ఏ విధముగా; ఉష్ణం = వేడిని; చ = మఱియు; శీతం = చలిని; చ = మఱియు; మైథిలీ = సీతాదేవి; ప్రసహిష్యతే = సహింపగలదు.
భావం:-
 సుకుమారీ, సుఖములకు అలవాటుపడినదీ, నడియౌవనమున ఉన్న యువతి అయిన ఆ సీత వనవాసములోని శీతోష్ణములను ఎట్లు సహింపగలదు?
2.61.5.అనుష్టుప్.
భుక్త్వాఽశనం విశాలాక్షీ
సూపదం శాన్వితం శుభమ్।
వన్యం నైవారమాహారమ్
కథం సీతోపభోక్ష్యతే॥
టీక:-
 భుక్త్వా = భుజించెను; అశనం = ఆహారముగా; విశాలాక్షీ = విశాలాక్షి అయిన; సూపదం = చక్కగా వండినవి; శాన్వితం = సున్నితమైన; శుభమ్ = మంచివాటిని; వన్యం = వనములో; నైవమ్ = అటవీ ధాన్యము, monier-william dictionery; ఆహారమ్ = ఆహారముగా; కథం = ఎట్లు; సీత = సీతాదేవి; ఉపభోక్ష్యతే = తినగలదు
భావం:-
 ఇంతవరకు చక్కగా వంటవారు వండిన సున్నితమైన చక్కటి ఆహారములు భుజించుయకు అలవాటుపడిన, సీతాదేవి అటవీ ధాన్యములను ఆహారముగా చేసుకుని ఎట్లు తినగలదు?
*గమనిక:-
(1) సూప- వండిన పప్పు, వావిళ్ళ వారి సంస్కృత-ఆంధ్ర నిఘంటువు. (2) శాని- సున్నితమైన, పనితనము, శ్రీహరి నిఘంటువు.
2.61.6.అనుష్టుప్.
గీత వాదిత్రనిర్ఘోషమ్
శ్రుత్వా శుభమనిందితా।
కథం క్రవ్యాదసింహానామ్
శబ్దం శ్రోష్యత్యశోభనమ్॥
టీక:-
 గీతః = పాడుతున్న పాటల; వాదిత్ర = వాద్యముల; నిర్ఘోషమ్ = ధ్వనులను; శ్రుత్వా = వినుటకు; శుభమ్ = మంగళకరమైన; అనిందితా = అనిందితయగు సీత; కథం = ఏ విధముగా; క్రవ్యాద = క్రూరమృగములైన; సింహానామ్ = సింహము మొదలైనవాని; శబ్దం = భయంకరమైన ధ్వనిని; శ్రోష్యతి = వినగలదు; అశోభనమ్ = అమంగళకరమైన, కఠోరమైన
భావం:-
 మంగళకరమైన పాలను, వాద్యముల ధ్వనులను వినుటకు అలవాటు పడిన, అనిందితయగు ఆ జానకి, అరణ్యములో సింహాది క్రూరమృగముల భయంకర కఠోర ధ్వనులని ఎట్లు వినగలదు?
2.61.7.అనుష్టుప్.
మహేంద్రధ్వజసంకాశః
క్వ ను శేతే మహాభుజః।
భుజం పరిఘసంకాశమ్
ఉపధాయ మహాబలః॥
టీక:-
 మహేంద్రధ్వజ = ఇంద్రధ్వజముతో; సంకాశః = సమానమైన; క్వ ను = ఏ విధముగా; శేతే = శయనించుటకు; మహాభుజః = ఉన్నతమైన భుజములు కలిగినవాడు; భుజం = బాహువును; పరిఘ సంకాశమ్ = పరిఘతో; సంకాశమ్ = సమానమైన; ఉపధాయ = తలగడగా; మహాబలః = మహాబలవంతుడు
భావం:-
 ఇంద్ర ధ్వజము వలె ఉన్నతమైనవాడు, మహాబలశాలీ అయిన రాముడు పరిఘ వంటి బాహువును తలగడగా పెట్టుకొని ఎక్కడ శయనించుచున్నాడో కదా?
2.61.8.అనుష్టుప్.
పద్మవర్ణం సుకేశాంతమ్
పద్మనిశ్శ్వాసముత్తమమ్।
కదా ద్రక్ష్యామి రామస్య
వదనం పుష్కరేక్షణమ్॥
టీక:-
 పద్మ = పద్మము వలె; వర్ణమ్ = వర్ణించదగినది; సుకేశాంతంమ్ = అందమైన పొడుగైవ కేశములు; పద్మ = పద్మ గంధము వంటి; నిశ్శ్వాసమ్ = శ్వాస; ఉత్తమమ్ = ఉత్తమమైన; కదా = ఎప్పుడు; ద్రక్ష్యామి = మరల చూచెదనో; రామస్య = రాముని యొక్క; వదనం = ముఖమును; పుష్కర = పద్మపత్రముల వంటి; ఈక్షణమ్ = కన్నులను.
భావం:-
 పద్మము వంటి వర్ణము, అందమైన కేశాగ్రములు, పద్మ గంధము వంటి గంధము గల శ్వాస, పద్మముల వంటి నేత్రములు కల ఉత్తమమైన రాముని ముఖమును మరల ఎప్పుడు చూచెదనో!
2.61.9.అనుష్టుప్.
వజ్రసారమయం నూనమ్
హృదయం మే న సంశయః।
అపశ్యంత్యాం న తం యద్వై
ఫలతీదం సహస్రధా॥
టీక:-
 వజ్ర = వజ్రము వలె; సారమయం = కఠినమైనది; నూనమ్ = నిశ్చయముగా; హృదయం = హృదయము; మే = నా యొక్క; న = లేదు; సంశయః = సందేహము; అపశ్యంత్యాం = చూడకున్నను; న = లేదు; తం = ఆ రాముడు; యత్ = ఏ కారణంగా; వై = నిస్సందేహముగా; ఫలతి = బ్రద్దలగుట; ఇదం = ఇది; సహస్రధా = వేయి ముక్కలగుట
భావం:-
  వజ్రమువంటి కఠినమైనది నా హదయము, ఏ సందేహమూ లేదు. అందుకే రాముని చూడకున్ననూ అది వేయి ముక్కలుగా బ్రద్దలగుట లేదు.
2.61.10.అనుష్టుప్.
యత్త్వయాఽకరుణం కర్మ
వ్యపోహ్య మమ బాంధవాః।
నిరస్తాః పరిధావంతి
సుఖార్హాః కృపణా వనే॥
టీక:-
 యత్ = ఎవరైతే; త్వయా = నీ చేత; అకరుణం = కరుణావీహినుడవై; కర్మ = కర్మవలన; వ్యపోహ్య = ప్రకటింబడిన; మమ = నా; బాంధవాః = బంఘువులను; నిరస్తాః = గెంటివేయబడి; పరిధావంతి = తిరుగాడుచున్నారు; సుఖార్హాః = సుఖమును అనుభవించుటకు అర్హులైన వారు; కృపణా = దీనులగుచు; వనే = వనములో.
భావం:-
 నా బంధువులపై నీవు దయమాలి చేసినదాని వలన.. వారు సుఖములను అనుభవించుటకు పూర్తి అర్హత కలవారు అయిననూ దీనులై అడవినపడి తిరుగాడుచున్నారు.
2.61.11.అనుష్టుప్.
యది పంచదశే వర్షే
రాఘవః పునరేష్యతి।
జహ్యాద్రాజ్యం చ కోశం చ
భరతో నోపలక్ష్యతే॥
టీక:-
 యది = వచ్చినను; పంచదశే వర్షే = పదునైదవ సంవత్సరమునందు; రాఘవః = రాముడు; పునరేష్యతి = తిరిగి వచ్చినను; జహ్యాత్ = అప్పచెప్పునని; రాజ్యం = రాజ్యమును; చ = మఱియు; కోశం = కోశమును; చ = మఱియు; భరతః = భరతుడు; న = లేము; ఉపలక్ష్యతే = ఊహింప.
భావం:-
 రాముడు పదునైదవ సంవత్సరమునందు తిరిగి వచ్చినను భరతుడు రాజ్యమును, కోశమును విడచి రామునకు అప్పచెప్పునని ఊహింపజాలము.
2.61.12.అనుష్టుప్.
భోజయంతి కిల శ్రాద్ధే
కేచిత్స్వానేవ బాంధవాన్।
తతః పశ్చాత్సమీక్షంతే
కృతకార్యా ద్విజర్షభాన్॥
టీక:-
 భోజయంతి = భోజనమునకు ఆహ్వానింతురు; కిల = అట; శ్రాద్ధే = శ్రాద్ధమునందు; కేచిత్ = కొందరు; స్వాన్ = తమ; ఏవ = మాత్రమే; బాంధవాన్ = బంధువులను; తతః = దాని; పశ్చాత్ = తరువాత; సమీక్షంతే = ఆహ్వానింతురట; కృతకార్యా = పని పూర్తయిన; ద్విజర్షభాన్ = బ్రాహ్మణోత్తములను.
భావం:-
 కొందరు శ్రాద్ధమునందు తమ బంధువులకే ముందుగా భోజనము పెట్టి పని పూర్తి ఐన పిమ్మట బ్రాహ్మణోత్తములను ఆహ్వానింతురట.
2.61.13.అనుష్టుప్.
తత్ర యే గుణవంతంశ్చ
విద్వాంసశ్చ ద్విజాతయః।
న పశ్చాత్తేఽభిమన్యంతే
సుధామపి సురోపమాః॥
టీక:-
 తత్ర = అక్కడ; యే = ఎవరిని; గుణవంతంః = గుణవంతులు; చ = మఱియు; విద్వాంసః = విద్వాంసులు; చ = మఱియు; ద్విజాతయః = బ్రాహ్మణులు; న పశ్చాత్తే = ఆహ్వానింపనపుడు; అభిమన్యంతే = స్వీకరింపరు; సుధామ్ = అమృతమే; అపి = అయినను; సురోపమాః = సుర + ఉపమాః, దేవతా సదృశులు
భావం:-
 ఆ విధముగా ఆహ్వానింపనపుడు గుణవంతులు, విద్వాంసులు, దేవతా సదృశులు అయిన బ్రాహ్మణులు, ఇతరులు భోజనము చేసిన తరువాత తమకు అమృతము పెట్టినను స్వీకరింపరు.
2.61.14.అనుష్టుప్.
బ్రాహ్మణేష్వపి తృప్తేషు
పశ్చాద్భోక్తుం ద్విజర్షభాః।
నాభ్యుపైతుమలం ప్రాజ్ఞాః
శృంగచ్ఛేదమివర్షభాః॥
టీక:-
 బ్రాహ్మణేషు = బ్రాహ్మణులే; అపి = అయినప్పటికీ; తృప్తేషు = భుజించి తృప్తి చెందినవారు; పశ్చాత్ = ఆ తరువాత; భోక్తుం = భుజించుటకు; ద్విజర్షభాః = బ్రాహ్మణోత్తములు; న = కారు; అభిపైతుమ్ = అంగీకరింటుటకు; అలమ్ = సమర్ధులు; ప్రాజ్ఞాః = బుద్ధిమంతులైన; శృంగచ్ఛేదమ్ = తమ కొమ్ములను ఛేదిమును; ఇవ = వలె; ఋషభాః = వృషభములు.
భావం:-
 తమకంటె ముందు భుజించినవారు బ్రాహ్మణులే ఐనను, బుద్ధిమంతులైన బ్రాహ్మణులు, వృషభములు తమ కొమ్ములను ఛేదించుటకు ఎట్లు అంగీకరింపవో, అట్లు ఇతరులు భుజించిన పిదప భుజించుటకు అంగీకరింపజాలరు.
2.61.15.అనుష్టుప్.
ఏవం కనీయసా భ్రాత్రా
భుక్తం రాజ్యం విశామ్పతే!।
భ్రాతా జ్యేష్ఠోఽవరిష్ఠశ్చ
కిమర్థం నావమంస్యతే॥
టీక:-
 ఏవం = అదేవిధముగా; కనీయసా = చిన్నవాడైన; భ్రాత్రా = సోదరుడు; భుక్తం = అనుభవించిన; రాజ్యం = రాజ్యమును; విశామ్పతే = రాజా; భ్రాతా = సోదరుడు; జ్యేష్ఠః = జ్యేష్ఠుడు; వరిష్ఠశ్చ = శ్రేష్ఠమైన; కిమర్థం = ఏ విధముగా; న = లేడు; అవమంస్యతే = అంగీకరించ.
భావం:-
 మహారాజా! అదేవిధముగా జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అయిన సోదరుడు తమ్ముడు అనుభవించి తనకు ఇచ్చిన రాజ్యమును నిరాకరింపకుండునా?
*గమనిక:-
విశామ్పతిః- విష మనుజే పతిః ప్రభువు, మహారాజు
2.61.16.అనుష్టుప్.
న పరేణాఽహృతం భక్ష్యమ్
వ్యాఘ్రః ఖాదితుమిచ్ఛతి।
ఏవమేతన్నరవ్యాఘ్రః
పరలీఢం న మన్యతే॥
టీక:-
 న = లేదు; పరేణా = మరియొక మృగము; ఆహృతం = ముట్టిన; భక్ష్యమ్ = ఆహారమును; వ్యాఘ్రః = పెద్ద పులి; ఖాదితుమ్ = తినుటకు; ఇచ్ఛతి = ఇష్టపడుట; ఏవమ్ = అదే విధముగా; ఏతత్ = అట్లే; నరవ్యాఘ్రః = పురుష శ్రేష్ఠుడైన రాముడు; పరలీఢం = ఇతరులు అనుభవించిన రాజ్యమును; న = ఉండదు; మన్యతే = అంగీకరించుట.
భావం:-
 మరియొక మృగము ముట్టిన ఆహారమును పెద్దపులి తినదు. అట్లే పురుష శ్రేష్ఠుడైన రాముడు, ఇతరులు అనుభవించిన రాజ్యమును అంగీకరించడు.
2.61.17.అనుష్టుప్.
హవిరాజ్యం పురోడాశాః
కుశా యూపాశ్చ ఖాదిరాః।
నైతాని యాతయామాని
కుర్వంతి పునరధ్వరే॥
టీక:-
 హవిః = హవిస్సులు; ఆజ్యం = నెయ్యి; పురోడాశాః = యజ్ఞార్హమైన ఆపూపము, హుతశేషము; కుశా = కుశలు; యూపాః = యూప స్తంభములు; చ = మఱియు; ఖాదిరాః = చండ్రచెట్టు నుండి తయారుచేసినది; న = లేదు; ఏతాని = వీటినన్నటిని; యాతయామాని = ఒక పర్యాయము ఉపయోగించిన వాటిని; కుర్వంతి = ఉపయోగించుట; పునః = మరల; అధ్వరే = యజ్ఞమునందు.
భావం:-
 హవిస్సు, నెయ్యి, పురోడాశములు, కుశలు, చండ్రకొయ్యతో చేసిన యూపస్తంభములు వీటిని ఒక పర్యాయము ఉపయోగించిన వాటిని, మరల యజ్ఞములో ఉపయోగించరు కదా.
2.61.18.అనుష్టుప్.
తథా హ్యాత్తమిదం రాజ్యమ్
హృతసారాం సురామివ।
నాభిమంతుమలం రామో
నష్టసోమమివాధ్వరమ్॥
టీక:-
 తథా = అట్టివిధము; హి = గానే; ఆత్తమ్ = ఇతరులు అనుభవించిన; ఇదం = ఈ; రాజ్యమ్ = రాజ్యమును; హృతసారాం = సారము తీసివేసిన; సురామ్ = సోమలత సారమును, సురను; ఇవ = వలె; న = కాడు; అభిమంతు = అంగీకరింటుట; అలం = సమర్ధుడు; రామః = రాముడు; నష్ట = నష్టమైన; సోమమ్ = సోమలతను; ఇవ = వలె; అధ్వరమ్ = యజ్ఞమును.
భావం:-
 అట్లే, సారము తీసివేసిన సురను వలె, యజ్ఞమునందు నష్టమైన సోమలత వలె రాముడు, ఇతరులు అనుభవించిన రాజ్యమును, అంగీకరింపజాలడు.
2.61.19.అనుష్టుప్.
న చేమం దర్షణాం రామః
సంగచ్చేదత్మమర్షణః।
దారయేన్మందరమపి
స హి క్రుద్ధః శితైః శరైః, ॥
టీక:-
 న = చేయడు; చ = మరి; ఇమామ్ = ఈ; దర్షణామ్ = అవమానమును; రాఘవః = రాముడు; సంగచ్ఛేత్ = పొందుట; అత్యమర్షణః = మిక్కిలి ఆత్మాభిమానము గల; దారయేత్ = చీల్చివేయును కదా; మందరమ్ = మందర పర్వతమును; అపి = కూడ; అభిమర్శనమ్ = స్పర్శించుట; సః = అతడు; హి = నిశ్చయముగా; కృద్ధః = కోపించిన; శితైః = వాడియైన; శరైః = బాణములచేత.
భావం:-
 అత్యంత ఆత్మాభిమానము కల రాముడు ఈ అవమానమును సహించడు. అతడు నిజంగా కోపించినచో తీక్ష్ణమైన శరములతో మందర పర్వతమును కూడా చీల్చివేయగలడు కదా.
*గమనిక:-
ఈ సర్గలోని ఈ 19, 20, 21 శ్లోకములు ప్రక్షిప్తములు. గోరఖపూర్ ప్రతిలో లేవు. వ్యాఖ్యాతలు వర్ణించలేదు అని పుల్లెల శ్రీరామచంద్రుని ప్రతిలో ఉటంకించిరి
2.61.20.అనుష్టుప్.
త్వాం తు నోత్సహతే హన్తుం
మహాత్మా పితృగౌరవాత్।
స సోమార్కగ్రహగణం
నభస్తారా విచిత్రితమ్ ॥
టీక:-
 త్వామ్ = నిన్ను; తు = కాని; న = చేయడు; ఉత్సహతే = ఉత్సాహము చూపుట; హన్తుమ్ = చంపుటకు; మహాత్మా = మహాత్మా; పితృగౌరవాత్ = తండ్రి అను; గౌరవాత్ = గౌరవముచేత; స = సహితముగా; సోమః = చంద్రుడు; అర్క = సూర్యుడు; గ్రహ = గ్రహముల; గణం = సమూహము అంతటిని; నభస్ = ఆకాశము; తారా = నక్షత్రములుచేత; విచిత్రితమ్ = రంగులు అద్దబడినది.
భావం:-
 తండ్రివనే గౌరవముతో నిన్ను హతమార్చుటకు ఇష్టపడడు. కాని, సూర్యుడు చంద్రుడు గ్రహములన్నీ నక్షత్రాలతో అలంకరింపబడిన ఆకాశమును..
2.61.21.అనుష్టుప్.
పాతయేద్యో దివం క్రుద్ధః
స త్వా న వ్యతివర్తతే
ప్రక్షోభయేద్ధారయోద్వా।
మహీం శైలశతాచితమ్ ॥
టీక:-
 పాతయేత్ = పడద్రోయునో; ద్యోః = ఆకాశమును; దివమ్ = స్వర్గలోకమును; క్రుద్ధః = కోపగించిన; స = అతడు; న = లేదు; వ్యతివర్తతే = అతిక్రమిచుట; ప్రక్షోభయేత్ = కలతపెట్టును; దారయేద్వా = చీల్చివేయును; మహీం = భూమండలమును; శైలః = పర్వతములచేత; శతాః = వందలకొలది; అచితమ్ = కూడినది.
భావం:-
 ఆకాశమును, స్వర్గముల సహితముగా కోపంవస్తే పడద్రోయగలడు. అంతటి రాముడు నీ మాట దాటుటలేదు. వందలకొలది పర్వతాలతో కూడి ఉన్న భూమండలాన్ని కలగలపి రెండుగా చీల్చివేయగలడు.
2.61.22.అనుష్టుప్.
నైవం విధమసత్కారమ్
రాఘవో మర్షయిష్యతి।
బలవానివ శార్దూలో
వాలధేరభిమర్శనమ్॥
టీక:-
 న = లేదు; ఏవం = అటువంటి; విధమ్ = విధమైన; అసత్కారమ్ = అవమానమును; రాఘవః = రాముడు; మర్షయిష్యతి = సహించుట; బలవాన్ = మిక్కిలి శక్తివంతుని; ఇవ = ఐన; శార్దూలః = పెద్ద పులి; వాలధేః = తోకను; అభిమర్శనమ్ = స్పర్శించుట.
భావం:-
 బలము గల పెద్ద పులి.. ఎవరైనను దాని తోకను స్పృశించినచో ఎట్లు సహింపదో అట్లే రాముడు ఈ అవమానమును సహించడు.
2.61.20.అనుష్టుప్.
నైతస్య సహితా లోకా
భయం కుర్యుర్మహామృథే।
అధర్మంత్విహ ధర్మాత్మా
లోకం ధర్మేణ యోజయేత్॥
టీక:-
 న = లేదు; ఏతస్య – అతనిలో; సహితా = కూడివచ్చినా; లోకా = లోకములన్నియు; భయం = భయము; కుర్యుః = ఎదిరించుటకు; మహామృథే = మహా యుద్ధములో; అధర్మం = ధర్మవిముఖము; తు = ఐన; ఇహ = ఈ; ధర్మాత్మా = ధర్మాత్ముడు; లోకం = లోకమునందు; ధర్మేణ = ధర్మముతో; యోజయేత్ = నిలుపగలడు.
భావం:-
 మహాయుద్ధములో లోకములు అన్నియు కలిసి వచ్చి ఎదిరించినను రామునకు భయము కలిగింపజాలవు. ఈ ధర్మాత్ముడు, ధర్మవిముఖమైన లోకమునందు ధర్మమును నిలుపగలడు.
2.61.21.అనుష్టుప్.
నన్వసౌ కాంచనైర్బాణైః
మహావీర్యో మహాభుజః।
యుగాంతం ఇవ భూతాని
సాగరానపి నిర్దహేత్॥
టీక:-
 నను = నిశ్చయముగ, వావిళ్ళ నిఘంటువు; అసౌ = ఈ రాముడు; కాంచనైః = బంగారు, శ్రేష్టమైన; బాణైః = బాణముల చేత; మహావీర్యః = మహా పరాక్రమవంతుడు; మహాభుజః = ఆజానుబాహువు; యుగాంతం = ప్రళయకాలము; ఇవ = వలె; భూతాని = భూతములను; సాగరాన్ = సుమద్రములను; అపి = కూడా; నిర్దహేత్ = కాల్చివేయగలడు
భావం:-
 మహాపరాక్రమవంతుడు, ఆజాను బాహువు అయిన రాముడు బంగారు బాణముల చేత, ప్రళయకాలము వలె, సకల భూతములను, సముద్రములను కూడ కాల్చివేయగలడు.
2.61.22.అనుష్టుప్.
స తాదృశస్సింహబలో
వృషభాక్షో నరర్షభః।
స్వయమేవ హతః పిత్రా
జలజేనాత్మజో యథా॥
టీక:-
 సః = అతడు; తాదృశః = ఆ విధముగా; సింహబలః = సింహము వంటి బలము కలవాడు; వృషభాక్షః = వృషభము నేత్రముల వంటి నేత్రములు కలవాడు; నరర్షభః = పురుష శ్రేష్ఠుని; స్వయమ్ = స్వయము; ఏవ = నిశ్చయార్థముగ; హతః = చంపినట్లు; పిత్రా = తండ్రివైన; జలజేన = మత్స్యము; ఆత్మజః = తన పిల్లను; యథా = ఆ విధముగా.
భావం:-
 సింహము వంటి బలము కలవాడూ, వృషభము నేత్రముల వంటి నేత్రములు కలవాడు అయిన అట్టి ఆ పురుష శ్రేష్ఠుని, చేప తన పిల్లలను మింగేసినట్లు, తండ్రివైన నీవే స్వయముగా చావుదెబ్బ కొట్టావు..
2.61.23.అనుష్టుప్.
ద్విజాతిచరితో ధర్మః
శాస్త్రదృష్టస్సనాతనః।
యది తే ధర్మనిరతే
త్వయా పుత్రే వివాసితే॥
టీక:-
 ద్విజాతి = ద్విజులు; చరితః = ఆచరింపబడునది; ధర్మః = ధర్మము; శాస్త్రదృష్టః = శాస్త్ర బోధితము; సనాతనః = సనాతన ధర్మము; యది = ఇదేనా; తే = నీవే; ధర్మనిరతే = ధర్మనిరతుడైన; త్వయా = నీచేత; పుత్రే = కుమారుని; వివాసితే = దేశము నుండి బహిష్కరణచేసితివా
భావం:-
 సనాతనము, శాస్రబద్దము ఐన ధర్మమును ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులచే అవిచ్ఛన్నముగా ఆచరింపబడుచున్నది. ధర్మనిరతుడైన నీ స్వంత పుత్రుని నీవే నీ దేశము నుండి వెడలగొట్టితివా?
2.61.24.అనుష్టుప్.
గతిరేకా పతిర్నార్యా
ద్వితీయా గతిరాత్మజః।
తృతీయా జ్ఞాతయో రాజన్
చతుర్థీ నేహ విద్యతే॥
టీక:-
 గతిః = గతి; ఏకా = మొదటి; పతిః = భర్త; నార్యా = స్త్రీకి; ద్వితీయా = రెండవ; గతిః = గతి; ఆత్మజః = కుమారుడు; తృతీయా = మూడవ గతి; జ్ఞాతయః = జ్ఞాతులు; రాజన్ = మహారాజా; చతుర్థీ = నాలుగవ గతి; న = లేదు; ఇహ = ఇంకేదీ; విద్యతే = ఉన్నిద.
భావం:-
 రాజా! స్త్రీకి భర్తే మొదటి ప్రధాన దిక్కు, అండ, తరువాత రెండవ దిక్కు కుమారుడు, ఆ తరువాతనే మూడవ గతి జ్ఞాతులు, వీటికి మించి నాల్గవ గతి ఏదీ లేదు.
2.61.25.అనుష్టుప్.
తత్ర త్వం చైవ మే నాస్తి
రామశ్చ వనమాశ్రితః।
న వనం గంతుమిచ్ఛామి
సర్వథా నిహతా త్వయా॥
టీక:-
 తత్ర = వాటిలో, ఆ ముగ్గరు అండదండలలో; త్వం = నీవు; చ = ఐనా; ఏవ = నిజానికి; మే = నాకు; నాస్తి = లేనట్లే; రామః = రాముడు; చ = కూడా; వనమ్ = అడవులకు; ఆశ్రితః = పోయినాడు; న = లేదు; వనమ్ = అరణ్యములకు; గంతుమ్ = వెళ్లుటకు ; ఇచ్ఛామి = కోరుచుండుట; సర్వథా = అన్ని విధములా; నిహతా = దెబ్బతిన్న దానిని; త్వయా = నీచే.
భావం:-
 ఆ మూడు గతులలో మొదటి గతిౖయెన నీవు నాకు ఉన్ననూ లేనట్లే. రాముడా అరణ్యమునకు పోయినాడు. అతనితో అరణ్యానికి వెళ్లజాలకపోతిని. నీవు అన్ని విధములా నన్ను దెబ్బతీసావు.
2.61.26.జగతి.
హతం త్వయా రాజ్యమిదం సరాష్ట్రం
హతస్తథాఽత్మా సహ మంత్రిభిశ్చ।
హతా సపుత్రాఽస్మి హతాశ్చ పౌరాః
సుతశ్చ భార్యా చ తవ ప్రహృష్టౌ”॥
టీక:-
 హతం = నశింపచేయబడినది; త్వయా = నీచేత; రాజ్యమ్ = రాజ్యము; ఇదం = ఈ; స= కలిసి; రాష్ట్రమ్ = ప్రజలను, దేశస్తులను; హతః = నశింపచేయబడినది; తథా = అట్లే; ఆత్మా = నిన్ను నీవు; సహ = సహితముగ; మంత్రిభిః = మంత్రులుకాడా; చ = ఇంకనూ; హతా = నశింపచేసితివి; స = సహితముగ; పుత్రాః = కుమారుని; అస్మి = నన్ను; హతాః = నశింపచేసితివి; చ = మఱియు; పౌరాః = పౌరులను; సుతః = కుమారుడైన భరతుడు; చ = మఱియు;భార్యా = భార్య అయిన కైకేయి; చ = మఱియు; తవ = నీ; ప్రహృష్టౌ = ఆనందించుచున్నారు.
భావం:-
 నీవే ఈ రాజ్యమును, ప్రజలతోపాటు నశింపచేసితివి. దానితోపాటు నిన్ను నీతోపాటు నీ మంత్రులను నీవే నశింపచేసుకొంటివి. నా కుమారుని, నన్ను, పౌరులను కూడా నశింపచేసితివి. కేవలం నీ కుమారుడైన భరతుడు, నీ భార్య అయిన కైకేయి మాత్రమే ఆనందించుచున్నారు.”
2.61.27.జగతి.
ఇమాం గిరం దారుణశబ్ద సంశ్రితాం
నిశమ్య రాజాఽపి ముమోహ దుఃఖితః।
తత స్స శోకం ప్రవివేశ పార్థివః
స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్॥
టీక:-
 ఇమామ్ = ఇటువంటి; గిరమ్ = మాటలను; దారుణ = క్రూరమైన; శబ్ద = పదములతో; సంశ్రితామ్ = కలిగినదానిని; నిశమ్య = వినిన పిమ్మట; రాజా = రాజు; అపి = ఇంకను; ముమోహ = మూర్చిల్లెను; దుఃఖితః = దుఃఖితుడై; తతః = అప్పుడు; స = కలిగిన; శోకం = శోకమును; ప్రవివేశ = చెందెను; పార్థివః = రాజు; స్వ = తనుచేసిన; దుష్కృతం = చెడ్డ పనిని; చాఅపి = అంతటిని; పునః = మరల మరల; తదా = అప్పుడు; స్మరన్ = స్మరించెను.
భావం:-
 రాజు తీవ్రమైన పదములతో కూడిన ఆ వాక్యమును విని, దుఃఖితుడై మూర్చ చెందెను. పిదప తాను చేసిన తప్పు పనిని మరల మరల గుర్తుచేసుకొని, రాజదశరథుడు శోకములో మునిగెను.
2.61.28.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ఏకషష్టితమసర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకషష్టితమ [61] = అరవైయొకటయవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [61] అరవైయొకటయవ సర్గ సంపూర్ణము.
2.62.2.
అనుష్టుప్.
చింతయిత్వా స చ నృపో
ముమోహ వ్యాకులేంద్రియః।
అథ దీర్ఘేణ కాలేన
సంజ్ఞామాప పరంతపః॥
టీక:-
 చింతయిత్వా = ఆలోచించి; సః = అతడు; చ = మఱియు; నృపః = దశరథ మహారాజు; ముమోహ = మూర్ఛ చెందెను; వ్యాకుల = కలత చెందిన; ఇంద్రియః = ఇంద్రియములు కలవాడయ్యెను; అథ = అటు పిమ్మట; దీర్ఘేణ కాలేన = చాలాసేపటికి; సంజ్ఞామాప = మూర్ఛ నుండి తేరుకుని; పరంతపః = శత్రుసంహారకుడైన రాజు.
భావం:-
 ఆ విధముగా ఆలోచించి, ఇంద్రియములు కలత చెందగా మూర్ఛ చెందెను. శత్రుసంహారకుడైన ఆ రాజు పిదప చాలా సేపటికి మూర్ఛ నుండి తేరుకొనెను.
2.62.3.
అనుష్టుప్.
స సంజ్ఞాముపలభ్యైవ
దీర్ఘముష్ణం చ నిశ్శ్వసన్।
కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా
పునశ్చింతా ముపాగమత్॥
టీక:-
 సః = దశరథ మహారాజు; సంజ్ఞామ్ = స్పృహలోనికి; ఉపలభ్య = తిరిగి వచ్చిన; ఏవ = వెంటనే; దీర్ఘమ్ = దీర్ఘముగాను; ఉష్ణమ్ = వేడియైన; చ = మఱియు; నిశ్శ్వసన్ = నిట్టూర్చుచు; కౌసల్యాం = కౌసల్యను; పార్శ్వతః = పక్కనున్న; దృష్ట్వా = చూచి; పునః = మరల; చింతామ్ = దుఃఖమున; ఉపాగమత్ = లోనయ్యెను
భావం:-
 స్పృహ వచ్చిన వెంటనే దీర్ఘముగాను, వేడిగాను, నిట్టూర్చుచు, ప్రక్కనున్న కౌసల్యను చూచి మరల చింతాకులుడు అయ్యెను.
2.62.4.
అనుష్టుప్.
తస్య చింతయమానస్య
ప్రత్యాభాత్కర్మ దుష్కృతమ్।
యదనేన కృతం పూర్వమ్
అజ్ఞానాచ్ఛబ్దవేధినా॥
టీక:-
 తస్య = విధముగా; చింతయమానస్య = ఆలోచించుచుండగా; ప్రత్యాభాత్ = గుర్తుకు వచ్చెను; కర్మ దుష్కృతమ్ = పాప కర్మము; యత్ = ఆ; అనేన = పాపము చేయనివాని యెడల, పుణ్యుని ఎడల; కృతం = చేసిన; పూర్వమ్ = పూర్వము; అజ్ఞానాత్ = అజ్ఞానం చేత; శబ్దవేధినా = శబ్దవేధి బాణముచేత.
భావం:-
 దశరథుడు ఆలోచించుచుండగా, తాను చేసిన పాపము గుర్తుకు వచ్చెను. అజ్ఞానముచేత శబ్దవేధి బాణమును ప్రయోగించి చాలాకాలము వెనుక పుణ్యాత్మునికి చేసిన పాపకర్మ అది.
2.62.5.
అనుష్టుప్.
అమనాస్తేన శోకేన
రామశోకేన చ ప్రభుః।
ద్వాభ్యామపి మహారాజః
శోకాభ్యామన్వతపత॥
టీక:-
 అమనాః = దుఃఖించుచున్న మనస్సుకలవాడై; తేన = ఆ; శోకేన = శోకమునకు; రామ = రామునిగురించిన; శోకేన = శోకమును; చ = మఱియు; ప్రభుః = రాజును; ద్వాభ్యామ్ = ఆ రెండును; అపి = కూడా; మహారాజః = మహారాజును; శోకాభ్యామ్ = పీడించగా; అన్వతపత = పరితపించెను.
భావం:-
 ఆ పాప కర్మము వలన కలిగిన శోకము, రామశోకము రెండును కలిసి మనస్సును ఎక్కువగా పీడించగా పరితపించెను.
2.62.6.
అనుష్టుప్.
దహ్యమానస్సశోకాభ్యామ్
కౌసల్యామాహ భూపతిః।
వేపమానోఽంజలిం కృత్వా
ప్రసాదార్థమవాంముఖః॥
టీక:-
 దహ్యమానః = దహించివేయుచుండగా; స = ఆ; శోకాభ్యామ్ = శోకములుచేత; కౌసల్యామ్ = కౌసల్యను గురించి; ఆహ = ఇట్లనెను; భూపతిః = ఆ రాజు; వేపమానః = వణికిపోవుచు; అంజలిం కృత్వా = చేతులు జోడించి; ప్రసాద = ప్రసన్నురాలిని చేసికొనుటకై; అర్థమ్ = చేసికొనుట కొఱకు; అవాంముఖః = తల వంచి
భావం:-
 ఆ శోకములు దహించివేయుచుండగా, ఆ రాజు వణికిపోవుచు, ముఖము క్రిందికి వంచి, కౌసల్యను అనుగ్రహింప చేసికొనుటకై చేతులు జోడించి నమస్కరించుచు ఆమెతో ఇట్లనెను.
2.62.7.
అనుష్టుప్.
“ప్రసాదయే త్వాం కౌసల్యే!
రచితోఽయం మయాఽంజలిః।
వత్సలా చానృశంసా చ
త్వం హి నిత్యం పరేష్వపి॥
టీక:-
 ప్రసాదయే = ప్రసన్నురాలవు కమ్ము; త్వామ్ = నీవు; కౌసల్యే = ఓ కౌసల్యా; రచితః = కట్టబడియున్న; అయం = ఈ; మయా = నా చేత; అంజలిః = చేతులు జోడించి; వత్సలా = ప్రేమతో; చ = మఱియు; అనృశంసా = కఠినముగా ప్రవర్తించినదానవు కాదు; చ = మఱియు; త్వం = నీవు; హి = కదా; నిత్యం = సర్వదా; పరేషు = ఇతరుల విషయమునందు; అపి = కూడా.
భావం:-
 “కౌసల్యా! ఇదిగో నేను చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. నీవు సర్వదా ఇతరుల విషయమునందు కూడ ప్రేమ కలిగి ఉండి ఎన్నడును కఠినముగా ప్రవర్తించినదానవు కాదు కదా?
2.62.8.
అనుష్టుప్.
భర్తా తు ఖలు నారీణామ్
గుణవాన్నిర్గుణోఽపి వా।
ధర్మం విమృశమానానామ్
ప్రత్యక్షం దేవి! దైవతమ్॥
టీక:-
 భర్తా = భర్తయే; తు = కదా; ఖలు = నిశ్చయముగ; నారీణామ్ = స్త్రీలకు; గుణవాన్ = గుణవంతుడైనను; నిర్గుణః = గుణవిహీనుడైనను; అపి = కూడా; వా = లేదా; ధర్మమ్ = ధర్మదృష్టి గురించి; విమృశమానానామ్ = విమర్శింకొనువారు; ప్రత్యక్షం = ప్రత్యక్షమైన; దేవి = కౌసల్యా; దైవతమ్ = దైవము.
భావం:-
 ధర్మదృష్టితో విమర్శించుకొనెడి స్త్రీలకు, గుణవంతుడైనను, గుణవిహీనుడైనను, భర్తయే ప్రత్యక్ష దైవము కదా!
2.62.9.
అనుష్టుప్.
సా త్వం ధర్మపరా నిత్యమ్
దృష్టలోక పరావరా।
నార్హసే విప్రియం వక్తుమ్
దుఖిఃతాఽపి సుదుఃఖితమ్”॥
టీక:-
 సా = అటువంటి; త్వమ్ = నీవు; ధర్మపరా = ధర్మమునే ఆచరించుదానవు; నిత్యమ్ = అనునిత్యము; దృష్ట = తెలిసినదానవు; లోక = లోకములోని; పరావరా = మంచిచెడులు, పెద్ద చిన్న అను తారతమ్యము తెలిసిన; న = కాదు; అర్హసే = తగినదానవు; విప్రియం = అప్రియమైన మాటలు; వక్తుమ్ = మాటలాడుటకు; దుఃఖితా అపి = ఎంతో దుఃఖముతో ఉన్న; అపి = కూడా; సుదుఃఖితమ్ = దుఖములోనున్న నన్ను.
భావం:-
 నీవు సదా ధర్మమునే ఆచరించుదానవు. లోకములోని మంచిచెడ్డలు పెద్ద చిన్న అను తారతమ్యము తెలిసినదానవు. అట్టి నీవు ఎంత దుఃఖముతో ఉన్నను, చాల దుఃఖించుచున్న నన్ను ఈ విధముగ అప్రియమైన మాటలు మాట్లాడరాదు.’’
2.62.10.
అనుష్టుప్.
తద్వాక్యం కరుణం రాజ్ఞః
శ్రుత్వా దీనస్య భాషితమ్।
కౌసల్యా వ్యసృజద్బాష్పమ్
ప్రణాలీవ నవోదకమ్॥
టీక:-
 తత్ = ఆ; వాక్యం = మాటలు; కరుణం = కరుణాభరితమైన; రాజ్ఞః = దశరథుడు; శ్రుత్వా = వినగానే; దీనస్య = దీనుడైన; భాషితమ్ = పలికెను; కౌసల్యా = కౌసల్య; వ్యసృజత్ = కార్చెను; బాష్పమ్ = కన్నీటిని; ప్రణాలి = జలగొట్టము, తూము; ఇవ = వలె; నవ = క్రొత్త; ఉదకమ్ = నీటిని.
భావం:-
 దీనుడైన దశరథుడు పలికిన, కరుణాభరితమైన ఆ మాటలు వినగానే, కౌసల్య, నీటి తూము గొట్టమునుండి క్రొత్త వానవీటిని కారుతునట్లుగ, కన్నీరు కార్చెను.
2.62.11.
అనుష్టుప్.
సా మూర్థ్నబధ్వా రుదతీ
రాజ్ఞః పద్మమివాంజలిమ్।
సంభ్రమాదబ్రవీత్ త్రస్తా
త్వరమాణాక్షరం వచః॥
టీక:-
 సా = ఆమె; మూర్థ్న బధ్వా = తలపై ఉంచుకొనుచు; రుదతీ = ఏడ్చుచు; రాజ్ఞః = మహారాజు; పద్మమ్ = పద్మము ; ఇవ = వంటి; అంజలిమ్ = దోసిలిని; సంభ్రమాత్ = మిక్కిలి భయపడి; అబ్రవీత్ = పలికెను; త్రస్తా = తొట్రు పడగా; త్వరమాణ = కంగారుచే; అక్షరం = మాటలు; వచః = మాటలు
భావం:-
 ఆమె మిక్కిలి భయపడిపోయి ఏడ్చుచు, రాజు గారి పద్మము వంటి దోసిలిని తన తలపై ఉంచుకొనుచు, కంగారుచే మాటలు తొట్రుపడగా ఇట్లు పలికెను.
2.62.12.
అనుష్టుప్.
“ప్రసీద శిరసా యాచే
భూమౌ నిపతితాస్మి తే।
యాచితాస్మి హతా దేవ!
క్షంతవ్యాహం న హి త్వయా॥
టీక:-
 ప్రసీద = మన్నించు; శిరసా = శిరస్సు; యాచే = యాచించుచున్నాను; భూమౌ = భూమి మీద; నిపతిత = పడి; అస్మి = నేను; తే = నీవు; యాచిత = యాచించుట ద్వారా; అస్మి = అయితిని; హతా = చచ్చినట్లు; దేవ = మహారాజా; క్షంతవ్య = క్షమింపరానిదానిని.; అహం = నేను; న = లేదు; హి = కూడా; త్వయా = నీ చేత
భావం:-
 మన్నింపుడు, భూమిపై పడి శిరస్సు వంచి మీకు నమస్కరించున్నాను. నా భర్త యైన మీచే యాచింపబడుటతో, మహారాజా! అది స్ఫురణలోకి వచ్చినది. చచ్చినంత సిగ్గుపడుతున్నాను. మీచే క్షమింపదగినదానిని కాదు.
2.62.13.
అనుష్టుప్.
నైషా హి సా స్త్రీ భవతి
శ్లాఘనీయేన ధీమతా।
ఉభయోర్లోకయోర్వీర
పత్యా యా సంప్రసాద్యతే॥
టీక:-
 న =లేదు; ఏషా హి సా స్త్రీ = అటువంటి స్త్రీ; భవతి = అగును; శ్లాఘనీయేన = శ్లాఘింపదగినవాడు; ధీమతా = బుద్ధిమంతుడు; ఉభయోః లోకయోః = ఇహలోకమునకు, పరలోకమునకు; వీర = ఓ వీరుడా; పత్యా = ఆమె భర్త; యా = ఏ స్త్రీ; సంప్రసాద్యతే = వేడుకొనచేసుకొనెడి.
భావం:-
 శ్లాఘింపదగినవాడు, బుద్ధిమంతుడు అయిన భర్త చేత వేడుకొనచేసుకొనే స్త్రీ ఈ ఇహలోకమునకును, పరలోకమునకును కూడా చెడును కదా.
2.62.14.
అనుష్టుప్.
జానామి ధర్మం ధర్మజ్ఞ
త్వాం జానే సత్యవాదినమ్।
పుత్రశోకార్తయా తత్తు
మయా కిమపి భాషితమ్॥
టీక:-
 జానామి = నాకు తెలియును; ధర్మం = ధర్మము; ధర్మజ్ఞః = ధర్మ వర్తనము తెలిసినవాడు; త్వాం జానే = నీకు తెలియును; సత్యవాదినమ్ = సత్యసంధుడవనే విషయము; పుత్రశోక +ఆర్తయా = పుత్ర శోకముతో బాధపడుచు; తత్ + తు = అయినను; మయా = నా చేత; కిమపి భాషితమ్ = ఏమేమో అనరాని మాటలు పలికినాను
భావం:-
 నాకు ధర్మము తెలియును. నీవు సత్యసంధుడవనే విషయము కూడా తెలియును. అయినను నేను పుత్రశోకముతో బాధపడుచు ఏమేమో అనరాని మాటలు పలికినాను.
2.62.15.
అనుష్టుప్.
శోకో నాశయతే ధైర్యమ్
శోకో నాశయతే శ్రుతమ్।
శోకో నాశయతే సర్వమ్
నాస్తి శోకసమో రిపుః॥
టీక:-
 శోకః = శోకము; నాశయతే = నశింపచేయును; ధైర్యమ్ = ధైర్యమును; శోకః = శోకము; నాశయతే = నశింపచేయును; శ్రుతమ్ = శాస్త్రజ్ఞానమును; శోకః = శోకము; నాశయతే = నశింపచేయును; సర్వమ్ = సర్వమును; నాస్తి = లేడు; శోక సమః = శోకముతో సమానమైన; రిపుః = శత్రువు
భావం:-
 శోకము ధైర్యమును నశింపచేయును. శోకము శాస్త్రజ్ఞానమును నశింపచేయును. శోకము సర్వమును నశింపచేయును. శోకము వంటి శత్రువు లేడు.
2.62.16.
అనుష్టుప్.
శక్య ఆపతితస్సోఢుమ్
ప్రహారో రిపుహస్తతః।
సోఢుంమాపతితశ్శోకః
సుసూక్షో్మఽపి నశక్యతే॥
టీక:-
 శక్య = శక్యము; ఆపతితః = అటువంటి; సోఢుమ్ = సహించవచ్చును; ప్రహారః = దెబ్బ; రిపు హస్తతః = శత్రువు కొట్టిన; సోఢుమ్ = సహించవచ్చును; ఆపతితః శోకః = అకస్మాత్తుగా వచ్చిన శోకము; సుసూక్ష్మః = ఎంత చిన్నది; అపి = ఆనను; నశక్యతే = సహించలేము
భావం:-
 శత్రువు కొట్టిన దెబ్బనైనను సహించవచ్చును గాని, హఠాత్తుగా వచ్చిన శోకము ఎంత చిన్నదైనను, దానిని సహించుట కష్టము.
2.62.17.
అనుష్టుప్.
ధర్మజ్ఞాశ్శ్రుతిమన్తోఽపి
ఛిన్నధర్మార్థసంశయాః।
యతయో వీర ముహ్యన్తి
శోకసమ్మూఢచేతసః॥
టీక:-
 ధర్మజ్ఞాః = ధర్మవేత్తలు; శుతిమన్తః = శాస్త్రజ్ఞులు; అపి = అయినప్పటికీ; ఛిన్న = నశించిన, తొలగిన; ధర్మార్థ = ధర్మార్థముల విషయమున; సంశయాః = సంశయములు కలవారు; యతయో = సన్యాసులు కూడ; వీర = ఓ వీరుడా; ముహ్యన్తి = అదుపుతప్పి; శోక = శోకముచే; సమ్మూఢ = మూఢమై ; చేతసః = మనసు
భావం:-
 ఓ వీరుడా! ధర్మవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మార్థముల విషయమున సంశయములన్నియు తొలగినవారు, సన్యాసము చేపట్టినవారు కూడ శోకముచేత మనస్సు మూఢమై మోహము చెందుచుందురు.
2.62.18.
అనుష్టుప్.
వనవాసాయ రామస్య
పంచరాత్రోఽద్య గణ్యతే।
యశ్శోకహతహర్షాయాః
పంచవర్షోపమో మమ॥
టీక:-
 వనవాసాయ = అరణ్యమునకు; రామస్య = రాముడు; పంచరాత్రః = ఐదు దినములు; అద్య = నేటికి; గణ్యతే = అయినది; యః = ఇతి యావత్, సర్వశబ్దసంబోధిని; శోక = శోకముచే; హత = నశించిన; హర్షాయాః = సంతోషము; పంచ = ఐదు; వర్ష = సంవత్సరములు; ఉపమః = వలె ఉన్నది; మమ = నాకు
భావం:-
 రాముడు అరణ్యమునకు వెళ్లి నేటికి ఐదు దినములయినది. దానితో శోకముచే నా సంతోషమన్నది లేకుండా నశించినది. ఈ ఐదు దినములు నాకు ఐదు సంవత్సరముల వలె ఉన్నది.
2.62.19.
అనుష్టుప్.
తం హి చింతయమానాయాః
శోకోఽయం హృది వర్ధతే।
నదీనామివ వేగేన
సముద్రసలిలం మహత్”॥
టీక:-
 తం = ఆ రాముని; హి = నిశ్చముంగ; చింతయమానాయాః = తలచుకొనిన కొలది హృదయములో; శోకః = శోకము; అయం = ఇదిగో; హృది = మనసున; వర్ధతే = పెరిగిపోతున్నది; నదీనామ్ = నదుల; ఇవ = వలె; వేగేన = వేగముచే; సముద్ర సలిలం = సముద్ర జలము; మహత్ = అధికమగుచున్నది.
భావం:-
  రాముని తలచుకొనిన కొలది నా హృదయములో శోకము పెరుగుచున్నది, నదుల ద్వారా వచ్చే నీటి వేగములచే, సముద్ర జలము పెఱుగునట్లు”.
2.62.20.
అనుష్టుప్.
ఏవం హి కథయన్త్యాస్తు
కౌసల్యాయాశ్శుభం వచః।
మందరశ్మిరభూత్సూర్యో
రజనీ చాభ్యవర్తత॥
టీక:-
 ఏవం = ఇలాగున; హి = కారణముగ; కథయన్తి + అస్తు = మాటలాడుచుండగా; కౌసల్యాయాః = కౌసల్యచే; శుభమ్ = మేలైన; వచః = మాటలు; మందరశ్మిః = వెలుగుతగ్గిపోవుట; అభూత్ = జరిగెను; సూర్యః = సూర్యునియొక్క; రజనీ = రాత్రి; చ = కూడా; అభ్యవర్తత = వచ్చెను
భావం:-
 కౌసల్య ఈ విధముగా మంచి మాటలు చెప్పుచుండగా, వెలుతురు తగ్గసాగెను. రాత్రి కూడా వచ్చెసింది.
2.62.21.
అనుష్టుప్.
తథా ప్రసాదితో వాక్యైః
దేవ్యా కౌసల్యయా నృపః।
శోకేన చ సమాక్రాంతో
నిద్రాయా వశమేయివాన్॥
టీక:-
 తథా = ఆ విధముగా; ప్రసాదితః = స్వాస్థ్య పడెను; వాక్యైః = మాటలుచే; దేవ్యా = దేవియొక్క; కౌసల్యయా = కౌసల్యా; నృపః = రాజు; శోకేన = శోకమున; చ = అంకనూ; సమాక్రాంతః = మునిగి యుండినవాడై; నిద్రాయా = నిద్రకు; వశమేయివాన్ = వశుడాయెను.
భావం:-
 కౌసల్యాదేవి మాటలతో ఆ దశరథమహారాజు కుదుటపడెను. ఇంకనూ శోకములో ములిగి యుండియే నిద్రపోయెను.
2.62.22.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే ద్విషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ద్విషష్టితమ [62] = అరవైరెండవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [62] అరవైరెండవ సర్గ సంపూర్ణము.
2.63.1
అనుష్టుప్.
ప్రతిబుద్ధో ముహూర్తేన
శోకోపహతచేతనః।
అథ రాజా దశరథః
సచింతామభ్యపద్యత॥
టీక:-
 ప్రతిబుద్ధః = మేల్కొని; ముహూర్తేన = కొద్దికాలము; శోక = దుఃఖముచే; ఉపహతచేతనః = స్పృహకోల్పోయినవాడు; అథ = తరువాత; రాజా = రాజు; దశరథః = దశరథుడు; సః = ఆ; చింతామ్ = చింతను; అభ్యపద్యత = పొందెను;
భావం:-
  తరువాత దుఃఖముతో సొమ్మసిల్లిన దశరథమహారాజు కొంతసేపటికి మేల్కొనినవాడై, ఆలోచించసాగెను.
2.63.2
అనుష్టుప్.
రామలక్ష్మణయోశ్చైవ
వివాసా ద్వాసవోపమమ్।
ఆవివేశోపసర్గస్తమ్
తమ స్సూర్యమివాసురమ్॥
టీక:-
  రామః = రాముడు; లక్ష్మణయోః = లక్ష్మణుల; వివాసాత్ = ప్రవాసములో ఉండుట వలన; వాసవః = ఇంద్రునితో; ఉపమమ్ = సమానమైనవాడు; ఆవివేశః = ఆవేశించెను; ఉపసర్గః = గొప్ప ప్రమాదము; తమ్ = ఆ; తమః = చీకటి; సూర్యమ్ = సూర్యుని; ఇవ = వలె; అసురమ్ = అసురులకు సంబంధించిన;
భావం:-
 రామలక్ష్మణులను వనవాసానికి ప్రవాసముగా పంపివేయుట వలన, రాహువు సూర్యుని కప్పివేసినట్లుగా, దేవేంద్రునితో సమానమైన దశరథునికి గొప్ప ఉపద్రవము సంభవించెను.
*గమనిక:-
అసురమ్+తమః- అసురుల తమస్సు, రాహువు
2.63.3
అనుష్టుప్.
సభార్యే నిర్గతే రామే
కౌసల్యాం కోసలేశ్వరః।
వివక్షురసితాపాంగామ్
స్మృత్వా దుష్కృతమాత్మనః॥
టీక:-
 స = సమేతముగ; భార్యేః = భార్యకలవాడై; నిర్గతే = వెళ్ళిన; రామే = రాముడు; కౌసల్యాం = కౌసల్యను గూర్చి; కోసలేశ్వరః = దశరథ మహారాజు; వివక్షుః = వివరించదలచినవాడై; అసితాపాంగామ్ = నల్లని కడకన్నులు కలది, కౌసల్యను గూర్చి; స్మృత్వా = జ్ఞప్తికి తెచ్చుకొని; దుష్కృతమ్ = పాపకర్మను; ఆత్మనః = తన;
భావం:-
 రాముడు భార్యాసమేతుడై అరణ్యమునకు వెళ్ళిన పిదప, దశరథుడు పూర్వము తాను చేసిన ఒక పాపకర్మను జ్ఞప్తికి తెచ్చుకొని, దానిని గూర్చి కౌసల్యకు చెప్ప తలంచెను.
2.63.4
అనుష్టుప్.
స రాజా రజనీం షష్ఠీమ్
రామే ప్రవ్రాజితే వనమ్।
అర్ధరాత్రే దశరథ
స్సంస్మరన్ దుష్కృతం కృతమ్॥
టీక:-
 సః = ఆ; రాజా = రాజు; రజనీం = రాత్రి సమయమున; షష్ఠీమ్ = ఆరవ దినము; రామే = రాముడు; ప్రవ్రాజితే = పంపి వేయబడిన తరువాత; వనమ్ = వనమును గూర్చి; అర్ధరాత్రే = అర్ధరాత్రి; దశరథః = దశరథుడు; సంస్మరన్ = గుర్తు చేసుకొనెను; దుష్కృతం = పాపకర్మను; కృతమ్ = చేసిన;
భావం:-
 రాముని వనవాసమునకు పంపిన తరువాత, ఆరవ దినమున, అర్ధరాత్రి సమయమున, దశరథుడు, తాను పూర్వము చేసిన ఒక పాపకర్మను, గుర్తుచేసుకొనెను.
2.63.5
అనుష్టుప్.
స రాజా పుత్రశోకార్తః
స్మృత్వా దుష్కృతమాత్మనః।
కౌసల్యాం పుత్రశోకార్తామ్
ఇదం వచనమబ్రవీత్॥
టీక:-
 సః = ఆ; రాజా = దశరథుడు; పుత్రశోకార్తః = పుత్ర శోకముచే దుఃఖితుడై; స్మృత్వా = తలంచి; దుష్కృతమ్ = పాపకర్మను; ఆత్మనః = తన; కౌసల్యాం = కౌసల్యనుగూర్చి; పుత్రశోకార్తామ్ = పుత్రశోకముచే దుఃఖితురాలై ఉన్న; ఇదం = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను;
భావం:-
 పుత్రశోకముచే దుఃఖితుడై యున్న దశరథుడు, తాను చేసిన పాపకర్మను తలచుకొనుచు, పుత్ర శోకముతో దుఃఖితురాలైయున్న కౌసల్యతో ఇట్లు పలికెను.
2.63.6
అనుష్టుప్.
“యదాచరతి కల్యాణి
శుభం వా యది వాఽశుభమ్।
తదేవ లభతే భద్రే
కర్తా కర్మజమాత్మనః॥
టీక:-
 యత్ = దేనిని; ఆచరతి = చేయునో; కల్యాణి = శుభప్రదమైనదాన; శుభం = శుభము; వా = ఐనను; యది = ఐనచో; వా = ఐనను; అశుభమ్ = అశుభము; తదేవ = దానిని; లభతే = పొందును; భద్రే = శుభప్రదమైన; కర్తా = కర్మను చేయువాడు; కర్మజమ్ = కర్మవలన కలిగినది; ఆత్మనః = తన;
భావం:-
 మంగళకరమైన కౌసల్యా! మానవుడు తాను చేసిన పాప పుణ్య కర్మలను బట్టి తగిన ప్రతిఫలమును పొందును.
*గమనిక:-
కల్యాణి- కల్యాణము (వ్యు. గతౌ- కల్యం సుఖమ్ అణయతి ప్రాపయతి- కల్యా+ అణ+ అణ్, కృ.ప్ర., సుఖమును పెంపొందిచునది,) గలామె, శుభకరమైనది.
2.63.7
అనుష్టుప్.
గురులాఘవమర్థానామ్
ఆరమ్భే కర్మణాం ఫలమ్।
దోషం వా యో న జానాతి
న బాల ఇతి హోచ్యతే॥
టీక:-
 గురులాఘవమ్ = గురుత్వ లఘుత్వములను; అర్థానామ్ = ప్రయోజనమును; ఆరమ్భే = ఆరంభము నందు; కర్మణాం = కర్మయొక్క; ఫలమ్ = ఫలమును; దోషం = దోషమును; వా = గాని; యః = ఎవడు; న = లేడు; జానాతి = తెలుసుకొనగ; న = లేడు; బాల = బాలుడు, తెలివి తక్కువ వాడు; హి = నిశ్చయార్థకము; ఇతి = ఇది; ఉచ్యతే = చెప్పబడును;
భావం:-
 ఏదైనను ఒక పనిని మొదలుపెట్టుటకు ముందే దాని మంచి చెడులను మరియు దానివలన కలుగు ఫలదోషములను ఎవరైతే తెలుసుకొనడో వాడే మూర్ఖునిగా ఎంచబడును.
2.63.8
అనుష్టుప్.
కశ్చిదామ్రవణం ఛిత్త్వా
పలాశాంశ్చ నిషించతి।
పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నుః
స శోచతి ఫలాగమే॥
టీక:-
 కశ్చిత్ = ఒకడు; ఆమ్రవణం = మామిడి తోటను; ఛిత్త్వా = ఛేదించి; పలాశాన్ = మోదుగ వృక్షము; నిషించతి = నీరు పోసి పెంచి; పుష్పం = పువ్వును; దృష్ట్వా = చూచి; ఫలే = ఫలమునందు; గృధ్నుః = ఆశ కలిగినవాడై; సః = అతడు; శోచతి = దుఃఖించును; ఫలాగమే = ఫలించినంతనే;
భావం:-
 పెద్దవిగా ఉన్న మోదుగు పువ్వులను చూచి, దాని పండ్లపై ఆశతో, మామిడిపూత చిన్నగా ఉండుటచే మామిడి తోటను తొలగించి, మోదుగుచెట్టును పెంచినవాడు, మోదుగుచెట్టు ఫలించినపుడు దాని పండ్లను చూచి నిరాశ చెంది దుఃఖించును.
2.63.9
అనుష్టుప్.
అవిజ్ఞాయ ఫలం యో హి
కర్మ త్వేవానుధావతి।
స శోచేత్ఫలవేలాయామ్
యథా కింశుకసేచకః॥
టీక:-
 అవిజ్ఞాయ = అజ్ఞానముచే; ఫలం = ఫలితమును; యః = ఎవడు; కర్మ ఏవ = కర్మను; ఏవ = మాత్రమే; అనుధావతి = అనుసరించునో; సః = అతడు; శోచేత్ = దుఃఖించును; ఫలవేలాయామ్ = ఫలవంతమైనప్పుడు; యథా = అట్లు; కింశుకసేచకః = మోదుగు వృక్షమును పెంచిన వాని వలె;
భావం:-
 తాను చేయు కర్మ ఎట్టి ఫలితమునిచ్చునో తెలుసుకొనకనే కర్మను ఆచరించువాడు, మోదుగు వృక్షమును పెంచిన వానివలె దుఃఖించును.
2.63.10
అనుష్టుప్.
సోఽహమామ్రవణం ఛిత్వా
పలాశాంశ్చ న్యషేచయమ్।
రామం ఫలాగమే త్యక్త్వా
పశ్చాచ్ఛోచామి దుర్మతిః॥
టీక:-
 సః = అటువంటి; అహమ్ = నేను; ఆమ్రవణం = మామిడి తోటను; ఛిత్వా = తొలగించి; పలాశాన్ = మోదుగ చెట్లను; న్యషేచయమ్ = పెంచితిని; రామం = రాముని; ఫలాగమే = ఫలవంతమగు సమయమున; త్యక్త్వా = వదిలి; పశ్చాత్ = తరువాత; శోచామి = దుఃఖించుచున్నాను; దుర్మతిః = మతి లేనివాడనై;
భావం:-
 నేను మామిడి తోటను తొలగించి, మోదుగ చెట్లను పెంచినాను. అల్పబుద్ధి గల నేను అవి ఫలించు సమయమున రాముని దూరము చేసుకొని ఇప్పుడు దుఃఖించుచున్నాను.
2.63.11
అనుష్టుప్.
లబ్ధశబ్దేన కౌసల్యే
కుమారేణ ధనుష్మతా।
కుమారశ్శబ్దవేధీతి
మయా పాపమిదం కృతమ్॥
టీక:-
 లబ్ధశబ్దేన = కీర్తిని పొందబడి యున్న; కౌసల్యే = కౌసల్యా; కుమారేణ = కుమారునిగా ఉన్న వయసులో; ధనుష్మతా = ధనుస్సును ధరించి యుండి; కుమారః = యువకుడు; శబ్దవేధి = శబ్దమును బట్టి గురిపెట్టి కొట్టగల; ఇతి = అని; మయా = నాచే; పాపమ్ = పాప కార్యము; ఇదం = ఈ; కృతమ్ = చేయబడినది.
భావం:-
 కౌసల్యా! శబ్దమును బట్టి గురిపెట్టి కొట్టగల నేర్పరి ఇతడు అనెడు కీర్తిని నేను కుమారునిగా ఉన్నప్పుడే గడించితిని. నేను యవ్వనమునందు ధనస్సును ధరించి ఒక పాప కార్యమును చేసితిని.
2.63.12
అనుష్టుప్.
తదిదం మేఽనుసంప్రాప్తమ్
దేవి! దుఃఖం స్వయం కృతమ్।
సమ్మోహాదిహ బాలేన
యథా స్యాద్భక్షితం విషమ్॥
టీక:-
 తత్ = అటువంటి; ఇదం = ఈ; మే = నాకు; అనుసంప్రాప్తమ్ = సమనుప్రాప్తమ్, దాపురించినది; దేవి = దేవీ; దుఃఖం = దుఃఖము; స్వయం = స్వయముగా; కృతమ్ = చేయబడిన; సమ్మోహాత్ = అజ్ఞానముచే; ఇహ = ఈ లోకమున; బాలేన = బాలునిచే; యథా = ఎట్లు; స్యాత్ = అగునో; భక్షితం = తినబడిన; విషమ్ = విషము;
భావం:-
 కౌసల్యా! చిన్నపిల్లవాడు అజ్ఞానముచే తెలియక విషమును తినినట్లు, బాల్యములో స్వయముగా చేసిన దుష్కార్యము వలన నాకు ఇప్పుడు ఈ దుఃఖము దాపురించినది.
2.63.13
అనుష్టుప్.
యథాఽన్యః పురుషః కశ్చిత్
పలాశైర్మోహితో భవేత్।
ఏవం మమాఽప్యవిజ్ఞాతమ్
శబ్దవేధ్యమయం ఫలమ్॥
టీక:-
 యథా = ఎట్లైతే; అన్యః = వేరొక; పురుషః = పురుషుడు; కశ్చిత్ = ఒకానొక; పలాశైః = మోదుగ వృక్షముచే; మోహితః = మోహింపబడి; భవేత్ = అగునో; ఏవం = ఇట్లే; మమ = నా; అపి = కూడ; అవిజ్ఞాతమ్ = తెలియలేదు; శబ్దవేధ్యమయం = శబ్దముచే గురిపెట్టి లక్ష్యమును కొట్టిన కలుగు; ఫలమ్ = ఫలితము;
భావం:-
 మోదుగు వృక్షమును చూచి మోసపోవునట్లు, నేను కూడ, శబ్దముచే గురిపెట్టి లక్ష్యమును కొట్టిన కలుగు ఫలితమును ఊహించలేదు.
2.63.14
అనుష్టుప్.
దేవ్యనూఢా త్వమభవో
యువరాజో భవామ్యహమ్।
తతః ప్రావృడనుప్రాప్తా
మనస్సంహర్షిణీ మమ॥
టీక:-
 దేవి = కౌసల్యాదేవీ; అనూఢా = కన్య; త్వమ్ = నీవు; అభవః = ఐఉంటివి; యువరాజః = యువరాజునిగ; భవామి = ఐఉంటిని; అహమ్ = నేను; తతః = అప్పుడు; ప్రావృట్ = వర్ష ఋతువు; అనుప్రాప్తా = వచ్చినది; మనస్సంహర్షిణీ = మనసును సంతోషపరచునది; మమ = నాకు;
భావం:-
 కౌసల్యా! అప్పటికి నీవు కన్యవు. నేను యువరాజునిగా ఉంటిని. అప్పుడు నాకు హృదయానందమును కలిగించు వర్షఋతువు వచ్చినది.
2.63.15
అనుష్టుప్.
ఉపాస్య చ రసాన్భౌమామ్
స్తప్త్వా చ జగదంశుభిః।
పరేతాచరితాం భీమామ్
రవిరావిశతే దిశమ్॥
టీక:-
 ఉపాస్య = గ్రహించి; రసాన్ = నీటిని; భౌమామ్ = భూమికి సంబంధించిన; తప్త్వా = తపింపజేసి; జగత్ = జగత్తును; అంశుభిః = కిరణములచే; పరేతా = ప్రేతలచే; చరితాం = సంచరింపబడిన; భీమామ్ = భయంకరమైన; రవిః = సూర్యుడు; ఆవిశతే = ప్రవేశించెను; దిశమ్ = దిక్కును;
భావం:-
 సూర్యుడు భూమియందున్న రసములను గ్రహించి, తన కిరణములచే జగత్తును తపింపచేసి, ప్రేతలు తిరుగాడు భయంకరమైన దక్షిణ దిశగా వెళ్ళెను.
2.63.16
అనుష్టుప్.
ఉష్ణమంతర్దధే సద్యః
స్నిగ్ధా దదృశిరే ఘనాః।
తతో జహృషిరే సర్వే
భేకసారంగబర్హిణః॥
టీక:-
 ఉష్ణమ్ = వేడి; అంతర్దధే = అదృశ్యమయ్యెను; సద్యః = వెంటనే; స్నిగ్ధా = మెరయుచున్న; దదృశిరే = చూడబడినవి; ఘనాః = మేఘములు; తతః = తరువాత; జహృషిరే = సంతోషించెను; సర్వే = సమస్తము; భేక = కప్పలు; సారంగ = చక్రవాకములు; బర్హిణః = నెమళ్ళు;
భావం:-
 వెంటనే వేడి అంతయు తొలగిపోయెను. తెల్లగా మెరయుచున్న మేఘములు కనిపించెను. అప్పుడు కప్పలు, చక్రవాకములు, నెమళ్ళు అన్నియు సంతోషించినవి.
2.63.17
అనుష్టుప్.
క్లిన్న పక్షోత్తరాస్స్నాతాః
కృచ్ఛ్రాదివ పతత్రిణః।
వృష్టివాతావధూతాగ్రాన్
పాదపానభిపేదిరే॥
టీక:-
 క్లిన్న = తడిసిన; పక్షోత్తరాః = పక్షుల రెక్కలు; స్నాతాః = స్నానము చేసి; కృచ్ఛ్రాత్ = అతికష్టముగ; ఇవ = వలె; పతత్రిణః = పక్షులు; వృష్టి = వర్షము; వాతా = గాలి; వధూతాగ్రాన్ = పైభాగము; పాదపాన్ = వృక్షములు; అభిపేదిరే = చేరెను;
భావం:-
 పక్షులు తడిసిన రెక్కలతో స్నానము చేసినట్లుండి, గాలి వానకు కదిలిపోవుచున్న వృక్షముల పైభాగములను ఎంతోకష్టముగా చేరినవి.
2.63.18
అనుష్టుప్.
పతితేనాంభసాచ్ఛన్నః
పతమానేన చాసకృత్।
ఆబభౌ మత్తసారంగః
తోయరాశిరివాచలః॥
టీక:-
 పతితేన = పడినది; ఆంభసా = నీటిచే; ఛన్నః = కప్పబడిన; పతమానేన = పడుచున్న; ఆసకృత్ = మాటిమాటికిని; ఆబభౌ = ప్రకాశించెను; మత్త = మదించిన; సారంగః = జింకలు; తోయరాశిః = సముద్రము; ఇవ = వలె; అచలః = పర్వతము;
భావం:-
 కురిసియున్న నీరు మరియు ఇంకను అలా అలా కురియుచునే యున్న నీటిచే కప్పివేయబడియుండి, ఆ పర్వతము మదించిన జింకలుతో సముద్రము వలె కనిపించుచుండెను.
2.63.19
అనుష్టుప్.
పాణ్డురారుణవర్ణాని
స్రోతాంసి విమలాన్యపి।
సుస్రువుర్గిరిధాతుభ్యః
సభస్మాని భుజంగవత్॥
టీక:-
 పాణ్డుర = తెల్లని; అరుణ = ఎఱ్ఱని; వర్ణాని = రంగులు కల; స్రోతాంసి = నీటి ప్రవాహము; విమలాన్యపి = స్వచ్ఛముగా ఉన్నను; సుస్రువుః = పాకినవి, ప్రవహించుచున్నవి; గిరిధాతుభ్యః = పర్వతములపై నుండెడు గైరికాది ధాతు రజను (పొడి); సభస్మాని = భస్మముతో కలిసి; భుజంగవత్ = సర్పమువలె;
భావం:-
 అలా పడుతున్న వర్షము నీరు స్వచ్ఛమైనదే ఐనను తెల్లని ఎఱ్ఱని రంగులతో సెలయేర్లై పారుచున్నవి. పర్వతములపై ఉన్న గైరికాది ధాతువుల (రాతి బూడిద) కలయిక వలననూ, దావాగ్ని జనితమైన తెల్లని బూడిదల కలయిక వలననూ అలా సర్పముల వలె పారుచుండెను.
*గమనిక:-
గైరికాది- సప్తధాతువులు, 1. బంగారము (గైరిక, బంగారురంగు జేగుఱుఱాయి), 2. వెండి, 3. రాగి, 4. తగరము, 5. సత్తు, 6. సీసము, 7. ఇనుము [ఇవి ఖనిజములు]. మణిశిల వంటి గైరికాది ధాతువులు. ధీయతే అస్మిన్, ధా+తున్, ధాతువు, జవసత్వాలు ఇందుండును. సువర్ణరూప్యమాణిక్యహరితాలమనఃశిలాః । గైరికాంజనకాసీససీసలోహాః సహింగులాః ॥ గంధకోఽభ్రకమిత్యాద్యా ధాతవో గిరిసమ్భవాః
2.63.20
అనుష్టుప్.
ఆకులారుణ తోయాని
స్రోతాంసి విమలాన్యపి।
ఉన్మార్గజలవాహినీ
బభూవుర్జలదాగమే॥
టీక:-
 ఆకుల = కరిగిపోయి; అరుణ = ఎఱ్ఱని; తోయాని = నీరు; స్రోతాంసి = ప్రవాహము; విమలాన్యపి = స్వచ్ఛముగా ఉన్నను; ఉన్మార్గః = సుమార్గ సే విచలన; జలవాహినీ = నీటి ప్రవాహము; బభూవుః = అయ్యెను; జలదాగమే = వర్షాకాలమున;
భావం:-
 అప్పటివరకును స్వచ్ఛముగానున్న నీటి ప్రవాహము కూడ వర్షాకాలము ఆసన్నమైన వెంటనే, ఎఱ్ఱగానున్న జలముతో వేరువేరు మార్గములలో చీలి ప్రవహించుచుండెను.
2.63.21
అనుష్టుప్.
తస్మిన్నతిసుఖే కాలే
ధనుష్మానిషుమాన్రథీ।
వ్యాయామకృతసంకల్పః
సరయూమన్వగాం నదీమ్॥
టీక:-
 తస్మిన్ = ఆ సమయమున; అతిసుఖే = చాలా సుఖప్రదమైన; కాలే = కాలమునందు; ధనుష్మాన్ = ధనుస్సును ధరించిన; ఇషుమాన్ = బాణములను కలిగియున్న; రథీ = రథమును కలిగియున్న; వ్యాయామ = అభ్యాసము; కృత = చేయుటకై; సంకల్పః = సంకల్పించినవాడనై; సరయూ = సరయూనది; అన్వగాం = అనుసరించి వెళ్ళితిని; నదీమ్ = నదిని;
భావం:-
 ఆహ్లాదకరమైన ఆ వర్షాకాలమునందు ధనుర్బాణములను ధరించి, రథికుడనై, ధనుర్విద్య అభ్యాసము చేయ సంకల్పించి, సరయూనదీ తీరము వెంబడి వెళ్ళితిని.
2.63.22
అనుష్టుప్.
నిపానే మహిషం రాత్రౌ
గజం వాఽభ్యాగతం నదీమ్।
అన్యం వా శ్వాపదం కంచిత్
జిఘాంసు రజితేంద్రియః॥
టీక:-
 నిపానే = జలాశయము; మహిషం = దున్నపోతును; రాత్రౌ = రాత్రివేళ; గజం = ఏనుగును; వా = గాని; అభ్యాగతం = వచ్చిన; నదీమ్ = నదిని గూర్చి; అన్యం = వేరొక; వా = గాని; శ్వాపదం = క్రూరమృగము; కంచిత్ = ఏదైనా; జింఘాంసుః = చంపదలచి; అజితేంద్రియః = ఇంద్రియనిగ్రహము లేక;
భావం:-
 రాత్రి నదిలో నీరు త్రాగుటకు రేవునకు వచ్చు దున్నను గాని, ఏనుగును గాని క్రూరమృగమును గాని మరి ఏదైన జంతువును చంపవలెనను కోరికను నిగ్రహించుకొనలేక.....
2.63.23
అనుష్టుప్.
తస్మిం స్తత్రాహమేకాంతే
రాత్రౌ వివృతకార్ముకః।
తత్రాహం సంవృతం వన్యమ్
హతవాంస్తీరమాగతమ్॥
టీక:-
 తస్మిన్ = అక్కడ; తత్ర = అక్కడ; అహమ్ = నేను; ఏకాంతే = ఎవ్వరూ లేని ప్రదేశమునందు; రాత్రౌ = రాత్రి వేళ; వివృత = ఎక్కుపెట్టిన; కార్ముకః = ధనుస్సును; తత్ర = అక్కడ; అహం = నేను; సంవృతం = రహస్యముగ; వన్యమ్ = అడవి జంతువును; హతవాన్ = చంపితిని; తీరమ్ = నదీతీరమునకు; ఆగతమ్ = వచ్చిన;
భావం:-
 నిర్జనమైన ఆ ప్రదేశము నందు రాత్రివేళ రహస్యముగ నేను ధనుస్సును ఎక్కుపెట్టి ఆ నదీతీరమునకు వచ్చిన అడవి జంతువును చంపితిని.
2.63.24
అనుష్టుప్.
అన్యం చాపి మృగం హింస్రమ్
శబ్దం శ్రుత్వాఽభ్యుపాగతమ్।
అథాంధకారే త్వశ్రౌషమ్
జలే కుంభస్య పూర్యతః॥
టీక:-
 అన్యం = మరియొక; అపి = కూడ; మృగం = మృగమును; హింస్రమ్ = హింస స్వభావము కలిగిన; శబ్దం = శబ్దమును; శ్రుత్వా = విని; అభ్యుపాగతమ్ = వచ్చిన; అథ = తరువాత; అంధకారే = చీకటిలో; అశ్రౌషమ్ = వెంటనే; జలే = నీటియందు; కుంభస్య = కుంభము యొక్క; పూర్యతః = నింపుచున్న;
భావం:-
 అక్కడ మరియొక క్రూరజంతువును కూడ దాని శబ్దమును విని చంపితిని. ఆ చీకటియందు కుండయందు నీరు నింపుతున్న ధ్వని.....
2.63.25
అనుష్టుప్.
అచక్షుర్విషయే ఘోషమ్
వారణస్యేవ నర్దతః।
తతోఽహం శరముధృత్య
దీప్తమాశీవిషోపమమ్॥
టీక:-
 అచక్షుర్విషయే = కంటికి కానరాని; ఘోషమ్ = ధ్వనిని; వారణస్య = ఏనుగుయొక్క; ఇవ = వలె; నర్దతః = శబ్దమును చేయుచున్న; తతః = తరువాత; అహం = నేను; శరమ్ = బాణమును; ఉధృత్య = తీసి; దీప్తమ్ = ప్రకాశించుచున్న; ఆశీవిష = సర్పము; ఉపమమ్ = వలె;
భావం:-
 కంటికి కానరాని ఆ చీకటి ప్రదేశమునందు ఏనుగు నీరుత్రాగుచున్న ధ్వని వినపడినట్లైనది. అప్పుడు సర్పము వలె మెరయుచున్న ఒక బాణమును తీసి...
2.63.26
అనుష్టుప్.
శబ్దం ప్రతిగజప్రేప్సుః
అభిలక్ష్య త్వపాతయమ్।
అముంచాం నిశితం బాణమ్
అహమాశీవిషోపమమ్॥
టీక:-
 శబ్దం ప్రతి = శబ్దమును గూర్చి; గజప్రేప్సుః = ఏనుగును చంపదలచినవాడనై; అభిలక్ష్య = గురిపెట్టి; అపాతయమ్ = లాఘవముగా, ఆంధ్రవాచస్పతము; అముంచాం = వదిలితిని; నిశితం = వాడియైన; బాణమ్ = బాణమును; అహమ్ = నేను; ఆశీవిష = సర్పము; ఉపమమ్ = వలె;
భావం:-
 తరువాత ఆ ఏనుగును కొట్టదలచి, పామువలె మెరయుచున్న వాడియైన ఒక బాణమును శబ్దము వైపు గురిపెట్టి లాఘవముగా వదిలితిని.
2.63.27
అనుష్టుప్.
తత్ర వాగుషసి వ్యక్తా
ప్రాదురాసీద్వనౌకసః।
హాహేతి పతతస్తోయే
బాణాభిహతమర్మణః॥
టీక:-
 తత్ర = అక్కడ; వాగ్ = వాక్కు; ఉషసి = ప్రాతః కాలమున; వ్యక్తా = స్పష్టముగ; ప్రాదురాసీత్ = బయలుదేరెను; వనౌకసః = వనవాసి; హా హా = హాహాకారము; ఇతి = వలె; పతతః = పడుచున్న; తోయే = నీటియందు; బాణా = బాణముచే; అభిహత = కొట్టబడి; మర్మణః = మర్మస్థానమునందు;
భావం:-
 అక్కడ ఆ ప్రాతఃకాలమున, బాణము మర్మస్థానమునందు గ్రుచ్చుకొని నీటిలో పడిపోయిన ఒక వనవాసి "అయ్యో అయ్యో" అని అరచుట స్పష్టముగా వినిపించెను.
2.63.28
అనుష్టుప్.
తస్మిన్నిపతితే బాణే
వాగభూత్తత్ర మానుషీ।
“కథమస్మద్విధే శస్త్రమ్
నిపతేత్తు తపస్విని॥
టీక:-
 తస్మిన్ = ఆ; నిపతితే = పడుచుండగ; బాణే = బాణము; వాక్ = వాక్కు; అభూత్ = అయ్యెను; తత్ర = అక్కడ; మానుషీ = మానవ సంబంధమైన; కథమ్ = ఎట్లు; అస్మద్విధే = నా వంటి; శస్త్రమ్ = ఆయుధము; నిపతేత్తు = పడెనో; తపస్విని = మునియందు;
భావం:-
 ఆ బాణము తగిలిన వెంటనే అక్కడ ఒక మనుష్య శబ్దము వినబడెను. "తపస్సు చేసుకొను నావంటి వానిపై ఈ ఆయుధమును ఎవరు ప్రయోగించిరో కదా".....
2.63.29
అనుష్టుప్.
ప్రవివిక్తాం నదీం రాత్రౌ
ఉదాహాఽరోహమాగతః।
ఇషుణాఽభిహతః కేన
కస్య వా కిం కృతం మయా॥
టీక:-
 ప్రవివిక్తాం = నిర్మానుష్యమైన; నదీం = నదిని గూర్చి; రాత్రౌ = రాత్రివేళ; ఉదక ఆహారః = నీటిని తీసుకొనుటకై; అహమ్ = నేను; ఆగతః = వచ్చినాను; ఇషుణా = బాణముచే; అభిహతః = కొట్టబడితిని; కేన = ఎవనిచే; కస్య = ఎవనికి; వా = గాని; కిం = ఏమి; కృతం = చేయబడినది; మయా = నాచే;
భావం:-
 నేను జలమును కొనిపోవుటకై రాత్రివేళ జనసంచారము లేని ఈ నదికి వచ్చినాను. నన్ను బాణముతో ఎవరు కొట్టినారో కదా. నేను ఎవరికి ఏ అపకారము చేసితిని?
2.63.30
అనుష్టుప్.
ఋషేర్హిన్యస్తదండస్య
వనే వన్యేన జీవతః।
కథం ను శస్త్రేణ వధో
మద్విధస్య విధీయతే॥
టీక:-
 ఋషేః = ఋషికి; న్యస్తదండస్య = హింసను వదలి; వనే = వనమునందు; వన్యేన = వనమునందు లభించుదానితో; జీవతః = జీవించుచున్న; కథం ను = ఎట్లు; శస్త్రేణ = ఆయుధముతో; వధః = చంపుటకు; మద్విధస్య = నావంటి; విధీయతే = విధింపబడుచున్నది;
భావం:-
 అహింసాపరుడనై, వనమునందు లభించెడు వాటితో జీవనము చేయుచున్న నావంటి ఋషికి, ఆయుధముచే మరణమును విధించుటకు ఏమి కారణము.
2.63.31
అనుష్టుప్.
జటాభారధరస్యైవ
వల్కలాజినవాససః।
కో వధేన మమార్థీ స్యాత్
కింవాఽస్యాపకృతం మయా॥
టీక:-
 జటాభార = జటలను; ధర = ధరించువాడు; ఏవ = మాత్రము; వల్కల = నారచీరలు; అజిన = చర్మము; వాససః = వస్త్రములు; కః = ఎవ్వడు; వధేన = వధించుటయందు; మమ = నాయొక్క; అర్థీ = కోరికను కలిగి యున్న; స్యాత్ = అయి ఉండును; కిం వా = ఏమి; అస్య = అతనికి; అపకృతం = అపకారము చేయబడినది; మయా = నాచే;
భావం:-
 జటాజూటమును దాల్చి, నారచీరలను, జింక చర్మమును ధరించియున్న నన్ను చంపుటయందు కోరిక గలవాడు ఎవడు? అతనికి నేను చేసిన అపకారము ఏమి?
2.63.32
అనుష్టుప్.
ఏవం నిష్ఫలమారబ్ధమ్
కేవలానర్థసంహితమ్।
న కశ్చిత్సాధు మన్యేత
యథైవ గురుతల్పగమ్॥
టీక:-
 ఏవం = ఇట్లు; నిష్ఫలమ్ = వ్యర్థమైన; ఆరబ్ధమ్ = ప్రారంభింపబడిన; కేవల = మాత్రము; అనర్థసంహితమ్ = అనర్థముతో కూడియున్న; న = లేడు; కశ్చిత్ = ఎవ్వడు; సాధు = మంచిగ; మన్యేత = మెచ్చుకొనుట; యథ = ఎట్లైతే; ఇవ = వలె; గురుతల్పగమ్ = గురుపత్నిని చెరపట్టిన వాడు;
భావం:-
 అతడు ఎవ్వడో అనర్థమును మాత్రమే కలిగించు వ్యర్థమైన కార్యమును చేసినాడు. గురుపత్నిని చెరపట్టిన వానిని వలె ఈతనిని ఎవ్వరు మెచ్చుకొనజాలరు.
2.63.33
అనుష్టుప్.
నాహం తథాఽనుశోచామి
జీవితక్షయమాత్మనః।
మాతరం పితరం చోభౌ
అనుశోచామి మద్వధే॥
టీక:-
 న = జాలను; అహం = నేను; తథా = అంతగ; అనుశోచామి = దుఃఖించుట; జీవితక్షయమ్ = మరణము; ఆత్మనః = నా; మాతరం = తల్లిని; పితరం = తండ్రిని; ఉభౌ = ఉభయులను గూర్చి; అనుశోచామి = దుఃఖించుట; మత్ = నా; వధే = వధ;
భావం:-
 నేను చనిపోవుచున్నందుకు నాకు అంతగ విచారము లేదు. నాకు మరణము ప్రాప్తించినందుకు నా తల్లిదండ్రులను గూర్చి మాత్రమే దుఃఖించుచున్నాను.
2.63.34
అనుష్టుప్.
తదేతన్మిథునం వృద్ధమ్
చిరకాలభృతం మయా।
మయి పంచత్వమాపన్నే
కాం వృత్తిం వర్తయిష్యతి॥
టీక:-
 తత్ = ఆ; ఏతత్ = ఈ; మిథునం = దంపతులు; వృద్ధమ్ = వృద్ధ; చిరకాలభృతం = చాలా కాలముగా పోషింపబడిన; మయా = నాచే; మయి = నేను; పంచత్వమ్ = మరణము; ఆపన్నే = ఆసన్నమగుచుండగ; కాం = ఏ; వృత్తిం = వృత్తిని; వర్తయిష్యతి = అనుసరింతురో;
భావం:-
 నేను ఆ వృద్ధ దంపతులను చాల కాలముగ పోషించుచుంటిని. నేను మరణించిన తరువాత వారు జీవించుటకు ఏ వృత్తిని చేపట్టెదరో కదా.
2.63.35
అనుష్టుప్.
వృద్ధౌ చ మతాపితరౌ
అహం చైకేషుణా హతాః।
కేన స్మనిహతా స్సర్వే
సుబాలేనాకృతాత్మనా”॥
టీక:-
 వృద్ధౌ = వృద్ధులైన; మతాపితరౌ = తల్లిదండ్రులు; అహం = నేను; ఏక = ఒక; ఇషుణా = బాణముచే; హతా = చంపబడి; కేన = ఎవ్వనిచే; స్మ = ఉంటిని; నిహతాః = చంపబడి; సర్వే = మేమందరము; సుబాలేన = చాలా మూర్ఖులైన; అకృతాత్మ = మనోనిగ్రహములేని;
భావం:-
 నేను నా తల్లిదండ్రులు కూడ, ఒకే ఒక బాణముచే చంపబడినాము. ఇట్లు మమ్ములనందరినీ చంపిన మనోనిగ్రహము లేని ఆ మూర్ఖుడెవడో కదా.”
2.63.36
అనుష్టుప్.
తాం గిరం కరుణాం శ్రుత్వా
మమ ధర్మనుకాంక్షిణః।
కరాభ్యాం సశరం చాపమ్
వ్యథితస్యాపతద్భువి॥
టీక:-
 తాం = ఆ; గిరం = మాటను; కరుణాం = దీనమైన; శ్రుత్వా = విని; మమ = నా; ధర్మ = ధర్మము; అనుకాంక్షిణః = కోరుచున్న; కరాభ్యాం = చేతులనుండి; సశరం = బాణముతో కూడిన; చాపమ్ = ధనుస్సు; వ్యథితస్య = దుఃఖితుడనై ఉన్న; అపతత్ = పడెను; భువి = నేలపై;
భావం:-
 ఆ దీనాలాపములను వినిన వెంటనే, ధర్మమునందు అనురక్తిగల నాకు చాల దుఃఖము కలిగినది. నా చేతులనుండి ధనుర్బాణములు నేలపై జారిపడినవి.
2.63.37
అనుష్టుప్.
తస్యాహం కరుణం శ్రుత్వా
నిశి లాలవతో బహు।
సంభ్రాంశ్శోకవేగేన
భృశమాస విచేతనః॥
టీక:-
 తస్య = అతని; అహం = నేను; కరుణం = దీనాలాపములను; శ్రుత్వా = విని; నిశి = రాత్రివేళ; లాలవతః = శోకించుచున్న; బహు = చాల; సంభ్రాన్తః = తొట్రుపాటు; శోకవేగేన = పొంగి వచ్చుచున్న దుఃఖముచే; భృశమ్ = చాల; ఆస = ఐనాను; విచేతనః = చేష్టలుడిగి;
భావం:-
 రాత్రివేళ అట్లు చాలా శోకించుచున్న అతని దినాలాపములను విని, పొంగి వచ్చుచున్న దుఃఖముతో తొట్రుపడుచు నేను నిశ్చేష్టుడనైనాను.
2.63.38
అనుష్టుప్.
తం దేశమహమాగమ్య
దీనసత్త్వస్సుదుర్మనాః।
అపశ్యమిషుణా తీరే
సరయ్వాస్తాపసం హతమ్॥
టీక:-
 తం = ఆ; దేశమ్ = ప్రదేశమును; అహమ్ = నేను; ఆగమ్య = చేరి; దీనసత్త్వః = సత్తువ కోల్పోయి; సుదుర్మనాః = చాల దుఃఖపడుచున్న; అపశ్యమ్ = చూచితిని; ఇషుణా = బాణముచే; తీరే = తీరమున; సరయ్వాః = సరయూనది యొక్క; తాపసం = తాపసిని; హతమ్ = కొట్టబడిన;
భావం:-
 జవసత్వములుడిగిపోయి, చాల దుఃఖించుచు, నేను ఆ ప్రదేశమునకు వెళ్లి సరయూనదీ తీరమున బాణముచే కొట్టబడియున్న....
2.63.39
అనుష్టుప్.
అవకీర్ణ జటాభారమ్
ప్రవిద్ధకలశోదకమ్।
పాంసుశోణితదిగ్ధాంగమ్
శయానం శల్యపీడితమ్॥
టీక:-
 అవకీర్ణ = చెదిరిన; జటాభారమ్ = జటాజూటము; ప్రవిద్ధకలశోదకమ్ = ఒలికిపోయిన కడవలోని నీరు గలవాడు ; పాంసు = పరాగము; శోణిత = రక్తముతో; దిగ్ధ = పూయబడిన; అంగమ్ = శరీరము; శయానం = పడియున్న; శల్య = బాణము యొక్క పదునైన ములికిచే; పీడితమ్ = కొట్టబడినవాడు;
భావం:-
 బాణముచే కొట్టబడిన ఆ ముని కుమారుడు నేలపై పడియుండెను. అతని జటాజూటము చెదిరిపోయినది. అతని కుండలోని నీరు ఒలికి పోయినది. ఆతని శరీరమంతయు రక్తసిక్తమై ధూళిచే కప్పబడియుండెను.
2.63.40
అనుష్టుప్.
స మాముద్వీక్ష్య నేత్రాభ్యామ్
త్రస్తమస్వస్థచేతసమ్।
ఇత్యువాచ తతః కౄరమ్
దిధక్షన్నివ తేజసా॥
టీక:-
 సః = అతడు; మామ్ = నన్ను; ఉద్వీక్ష్య = పైకి చూచి; నేత్రాభ్యామ్ = కన్నులతో; త్రస్తమ్ = భయపడి; అస్వస్థచేతసమ్ = దిగులుపడియున్న; ఇతి = ఇట్లు; ఉవాచ = పలికి; తతః = అప్పుడు; కౄరమ్ = పరుషముగ; దిధక్షన్ = దహించివేయుట; ఇవ = వలె; తేజసా = తేజస్సుతో;
భావం:-
 భయముతోను, దిగులుతోను ఉన్న నన్ను అతడు తన తీక్షణమైన దృష్టిచే దహించవేయదలచుచున్నట్లుగ చూచి పరుషముగ ఇట్లు పలికెను.
2.63.41
అనుష్టుప్.
“కిం తవాపకృతం రాజన్!
వనే నివసతా మయా।
జిహీర్షురమ్భో గుర్వుర్థమ్
యదహం తాడితస్త్వయా॥
టీక:-
 కిం = ఏమి; తవ = నీకు; అపకృతం = అపకారము; రాజన్ = రాజా; వనే = వనమునందు; నివసతా = నివసించుచున్న; మయా = నాచే; జిహీర్షుః = తీసుకొనబోవుచున్న; అమ్భః = జలమును; గుర్వర్థమ్ = మాతాపితరులకొరకై; యత్ = ఏదైతే; అహం = నేను; తాడితః = కొట్టబడితిని; త్వయా = నీచే;
భావం:-
 “రాజా! నా తల్లిదండ్రుల కొరకై జలమును తీసుకుని పోవుచున్న నన్ను ఇట్లు కొట్టితివి కదా. వనము నందు నివసించుచున్న నేను నీకు ఏమి అపకారము చేసితిని.
2.63.42
అనుష్టుప్.
ఏకేన ఖలు బాణేన
మర్మణ్యభిహతే మయి।
ద్వావంధౌ నిహతౌ వృద్ధౌ
మాతా జనయితా చ మే॥
టీక:-
 ఏకేన = ఒకే ఒక; ఖలు = కదా; బాణేన = బాణముచే; మర్మణి = మర్మస్థానమునందు; అభిహతే = కొట్టబడి; మయి = నా; ద్వా = ఇద్దరు; అంధౌ = అంధులు; నిహతౌ = చంపబడినారు; వృద్ధౌ = వృద్ధులు; మాతా = తల్లియు; జనయితా = తండ్రియు; మే = నా;
భావం:-
 ఒకే ఒక బాణముతో నన్ను నా మర్మావయవమునందు కొట్టుటచే, వృద్ధులు అంధులు ఐన నా తల్లిదండ్రులను కూడ చంపితివి కదా.
2.63.43
అనుష్టుప్.
తౌ కథం దుర్బలావంధౌ
మత్ప్రతీక్షౌ పిపాసితౌ।
చిరమాశాకృతాం తృష్ణామ్
కష్టాం సంధారయిష్యతః॥
టీక:-
 తౌ = వారిరువురు; కథం = ఎట్లు; దుర్బలౌ = అశక్తులు; అంధౌ = గ్రుడ్డివారు; మత్ = నన్ను గూర్చి; ప్రతీక్షౌ = వేచియున్న; పిపాసితౌ = దాహముతోనున్న; చిరమ్ = చాలాసేపటినుండి; ఆశాకృతాం = ఆశతో; తృష్ణామ్ = దాహమును; కష్టాం = భరించలేని; సంధారయిష్యతః = భరింతురు;
భావం:-
 అశక్తులు, గ్రుడ్డివారు, దాహముతో ఉన్న నా తల్లిదండ్రులు దప్పికను భరించుచు, నేను జలమును తీసుకొని వచ్చెదనని ఆశతో నా కొరకై వేచియున్నారు.
2.63.44
అనుష్టుప్.
న నూనం తపసో వాస్తి
ఫలయోగశ్శ్రుతస్య వా।
పితా యన్మాం న జానాతి
శయానం పతితం భువి॥
టీక:-
 న = లేదు; నూనం = ఖచ్చితముగ; తపసః = తపస్సునకు; వా = గాని; అస్తి = ఉన్న; ఫలయోగః = ఫల సంబంధమైన; శ్రుతస్య = శాస్త్ర సంబంధమైన; వా = గాని; పితా = తండ్రి; యత్ = ఏ; మామ్ = నన్నుగూర్చి; న = లేడు; జానాతి = ఎరుగుట; శయానం = శయనించి ఉన్న; పతితం = పడిపోయిన; భువి = నేలపై;
భావం:-
 నేను ఇట్లు నేలపై పడి ఉన్నట్లు నా తండ్రి ఎరుగడు. అందుచే తపస్సు వలన గాని, శాస్త్రము వలన గాని ప్రయోజనము ఏమియు లేదని ఖచ్చితముగా చెప్పవచ్చును.
2.63.45
అనుష్టుప్.
జానన్నపి చ కిం కుర్యాత్
అశక్తిరపరిక్రమః।
భిద్యమానమివాశక్త
స్త్రాతుమన్యో నగో నగమ్॥
టీక:-
 జానన్ = ఎరిగిన వాడు; అపి = ఐనను; కిం = ఏమి; కుర్యాత్ = చేయగలడు; అశక్తిః = శక్తి లేనివాడు; అపరిక్రమః = నడవలేని వాడు; భిద్యమానమ్ = కొట్టబడుచుండగ; ఇవ = వలె; అశక్తః = ఏమియు చేయలేని; త్రాతుమ్ = రక్షించుటకు; అన్యః = వేరొక; నగః = వృక్షము; నగమ్ = వృక్షమును;
భావం:-
 నిర్బలుడై నడచుటకు కూడ శక్తి లేనివాడు ఈ విషయము నెఱిగినను ఏమి చేయగలడు. చెంతన ఉన్న వృక్షము నరికి వేయబడుచుండగా మరియొక వృక్షము దానిని ఎట్లు రక్షింపజాలదో అట్లే అతడును ఏమి చేయజాలడు.
2.63.46
అనుష్టుప్.
పితుస్త్వమేవ మే గత్వా
శీఘ్రమాచక్ష్వ రాఘవ!।
న త్వామనుదహేత్క్రుద్ధో
వనం వహ్నిరివైధితః॥
టీక:-
 పితుః = తండ్రికి; త్వమేవ = నీవే; మే = నా; గత్వా = వెళ్ళి; శీఘ్రమ్ = వెంటనే; ఆచక్ష్వ = తెలియజేయుము; రాఘవ = దశరథా; న = లేడు; త్వాం = నిన్ను; అనుదహేత్ = దహించి వేయును; కృద్ధః = కోపగించి; వనం = వనమును; వహ్నిః = అగ్ని; ఇవ = వలె; ఏధితః = ఎక్కువగుచున్న;
భావం:-
 దశరథా! నీవే శీఘ్రముగ పోయి, నా తండ్రికి ఈ విషయమును స్వయముగా తెలియజేయుము. లేనిచో నా తండ్రి కోపగించి రాజుకున్న అగ్ని వనమును ఎట్లు దహించునో అట్లు నిన్ను దహించును.
2.63.47
అనుష్టుప్.
ఇయమేకపదీ రాజన్!
యతో మే పితురాశ్రమః।
తం ప్రసాదయ గత్వా త్వమ్
న త్వాం స కుపితశ్శపేత్॥
టీక:-
 ఇయమ్ = ఈ; ఏకపదీ = కాలిబాట; రాజన్ = రాజా; యతః = ఏ వైపు; మే = నా; పితుః = తండ్రి; ఆశ్రమః = ఆశ్రమము; తం = అతనిని; ప్రసాదయ = ప్రసన్నము; గత్వా = పోయి; త్వమ్ = నీవు; న = లేడు; త్వాం = నిన్ను; సః = అతడు; కుపితః = కోపించి; శపేత్ = శపింపగ;
భావం:-
 రాజా ఈ కాలిబాటయే నా తండ్రి ఆశ్రమమునకు దారి. నీవు పోయి అతనిని ప్రసన్నము చేసుకొనినచో అతడు నిన్ను శపించడు.
2.63.48
అనుష్టుప్.
విశల్యం కురు మాం రాజన్!
మర్మ మే నిశితశ్శరః।
రుణద్ధి మృదుసోత్సేధమ్
తీరమమ్బురయో యథా”॥
టీక:-
 విశల్యం = బాణము తీసివేసి; కురు = చేయుము; మాం = నన్ను; రాజన్ = రాజా; మర్మ = మర్మస్థానము; మే = నా; నిశితః = వాడియైన; శరః = బాణము; రుణద్ధి = బాధించుచున్నది; మృదు = మృదువైన; సోత్సేధమ్ = ఎత్తైన; తీరమ్ = తీరము వెంబడి; అమ్బురయః = వేగమైన ప్రవాహము; యథా = అట్లు;
భావం:-
 రాజా! నా శరీరము నుండి బాణమును తీసివేయుము. నదీతీరము వెంబడి ఉన్న ఎత్తైన ఇసుక తిన్నెలను వేగముగా ప్రవహించు నదీజలము ఛేదించినట్లు వాడియైన ఈ బాణము నా మర్మస్థానమును పీడించుచున్నది.”
2.63.49
అనుష్టుప్.
సశల్యః క్లిశ్యతే ప్రాణైః
విశల్యో వినశిష్యతి।
ఇతి మామవిశచ్ఛింతా
తస్య శల్యాపకర్షణే॥
టీక:-
 సశల్యః = బాణము గ్రుచ్చుకొనియున్న; క్లిశ్యతే = బాధపడును; ప్రాణైః = ప్రాణముతో; విశల్యః = బాణము తీసివేయబడిన; వినశిష్యతి = మరణించిన; ఇతి = ఈ; మామ్ = నన్ను; అవిశత్ = ప్రవేశించెను; చింతా = ఆలోచన; తస్య = అతని; శల్యాః = బాణమును; అపకర్షణే = తీసివేయుట;
భావం:-
 అతని శరీరమునుండి బాణమును తీసివేయు విషయమున, "బాణమును తీసివేయకున్నచో ప్రాణములు పోక బాధపడుచుండును. బాణమును తీసివేసినచో చనిపోవును" అని నాకు చింత కలిగెను.
2.63.50
అనుష్టుప్.
దుఃఖితస్య చ దీనస్య
మమ శోకాతురస్య చ।
లక్షయామాస హృదయే
చిన్తాం మునిసుతస్తదా॥
టీక:-
 దుఃఖితస్య = దుఃఖితుడనై; దీనస్య = దీనముగ; మమ = నా; శోకాః = శోకముచే; ఆతురస్య = బాధపడి; లక్షయామాస = ఊహించి; హృదయే = మనసున; చిన్తాం = చింతను; మునిసుతః = ముని కుమారుడు; తదా = అప్పుడు;
భావం:-
 అప్పుడు ఆ మునికుమారుడు దుఃఖముతోను దీనముగను శోకించుచున్న నా మనోవ్యధను గ్రహించెను.
2.63.51
అనుష్టుప్.
తామ్యమానస్స మాం కృచ్ఛ్రాత్
ఉవాచ పరమార్తవత్।
సీదమానో వివృత్తాఙ్గో
వేష్టమానో గతః క్షయమ్॥
టీక:-
 తామ్యమానః = బాధపడుచున్న; సః = అతడు; మాం = నన్ను గూర్చి; కృచ్ఛ్రాత్ = అతి కష్టముగ; ఉవాచ = పలికెను; పరమార్తవత్ = చాల పీడింపబడి; సీదమానః = కృంగిపోవుచు; వివృత్తాంగః = అవయవములు వంకరపోవుచు; వేష్టమానః = పొర్లుచు; గతః = పొందియుండి; క్షయమ్ = నాశనము;
భావం:-
 అతడు బాధతో కృంగిపోయి అవయవములన్నియు వంకరలుతిరిగిపోయి, నేలపై పొర్లుచు, చాల దుఃఖించుచు, నాతో అతి కష్టముగ ఇట్లు పలికెను.
2.63.52
అనుష్టుప్.
“సంస్తభ్య శోకం ధైర్యేణ
స్థిరచిత్తో భవామ్యహమ్।
బ్రహ్మహత్యాకృతం పాపమ్
హృదయాదపనీయతామ్॥
టీక:-
 సంస్తభ్య = అణిగిపోయిన; శోకం = శోకమును; ధైర్యేణ = ధైర్యముగ; స్థిరచిత్తః = స్థిర చిత్తముతో; భవామి = అగుచున్నాను; అహమ్ = నేను; బ్రహ్మహత్యాకృతం = బ్రహ్మహత్య చేయుట వలన కలిగిన; పాపమ్ = పాపము; హృదయాత్ = మనసు నుండి; అపనీయతామ్ = పోగొట్టబడుగాక.
భావం:-
 “నేను ధైర్యముగ శోకమును అణచుకొని స్థిరచిత్తుడనగుచున్నాను. నీవు బ్రహ్మహత్యాపాతకము చేసితివనిన చింత నీ మనసునుండి తొలగించుకొనుము.
2.63.53
అనుష్టుప్.
న ద్విజాతిరహం రాజన్!
మా భూత్తే మనసో వ్యథా।
శూద్రాయామస్మి వైశ్యేన
జాతో జనపదాధిప!”॥
టీక:-
 న = కాను; ద్విజాతిః = బ్రాహ్మణుడను; అహం = నేను; రాజన్ = రాజా; మా = కాదు; భూత్ = కలుగుట; మనసః = మనసున; వ్యథా = బాధ; శూద్రాయామ్ = శూద్ర స్త్రీ యందు; ఆస్మి = అయినాను; వైశ్యేన = వైశ్యుని వలన; జాతః = జన్మించినాను; జనపదాధిప = ప్రజానాయకా;
భావం:-
 రాజా నేను బ్రాహ్మణుడను కాను నీవు మనసున చింతించకుము నేను ఒక వైశ్యుని వలన శూద్రస్త్రీ యందు జన్మించినాను.”
2.63.54
అనుష్టుప్.
ఇతీవ వదతః కృచ్ఛ్రాత్
బాణాభిహతమర్మణః।
విఘూర్ణతో విచేష్టస్య
వేపమానస్య భూతలే॥
టీక:-
 ఇతి = ఇది; ఇవ = వలె; వదతః = పలుకుచు; కృచ్ఛ్రాత్ = అతికష్టముగ; బాణాభిహతమర్మణః = బాణముచే కొట్టబడిన మర్మావయవము కలవాడు; విఘూర్ణతః = వంకరలు తిరిగిపోవుచున్నవాడు; విచేష్టస్య = చేష్టలుడిగి; వేపమానస్య = వణుకుచున్న; భూతలే = నేలపై;
భావం:-
 అతడు మర్మావయవమునందు బాణము తగిలి వంకరలు తిరిగిపోవుచు, నేలపై దొర్లుచు, చేష్టలుడిగి, అతికష్టము మీద నాతో ఈ మాటలు పలికెను.
2.63.55
అనుష్టుప్.
తస్యత్వానమ్యమానస్య
తం బాణమహముద్ధరమ్।
స మాముద్వీక్ష్య సంత్రస్తో
జహౌ ప్రాణాంస్తపోధనః॥
టీక:-
 తస్య = అతని; అనమ్యమానస్య = ముడుచుకొని పోవుచున్న; తం = ఆ; బాణమ్ = బాణమును; అహమ్ = నేను; ఉద్ధరమ్ = లాగివేసితిని; సః = అతడు; మామ్ = నన్ను గూర్చి; ఉద్వీక్ష్య = పైకి చూచి; సంత్రస్తః = భయపడి; జహౌ = వదిలెను; ప్రాణాన్ = ప్రాణములను; తపోధనః = తపస్సునే ధనముగా గల ముని;
భావం:-
 అంతట అతని శరీరమునుండి నేను ఆ బాణమును లాగివేసితిని. అప్పుడు ఆ మునికుమారుడు కండ్లెత్తి నా వంక చూచుచు భయపడుచు ప్రాణములను వదిలెను.
2.63.56
అనుష్టుప్.
జలార్ద్రగాత్రన్తు విలప్య కృచ్ఛ్రాత్
మర్మవ్రణం సంతతముచ్ఛ్వసంతమ్।
తత స్సరయ్వాం తమహం శయానం
సమీక్ష్య భద్రేఽస్మి భృశం విషణ్ణః॥
టీక:-
 జలార్ద్రగాత్రన్ = నీటితో తడిసిన శరీరము కలిగియున్నవాడు; విలప్య = విలపించి; కృచ్ఛ్రాత్ = అతి కష్టముగ; మర్మవ్రణం = మర్మస్థానమునందు గాయము; సంతతమ్ = ఎడతెగక; ఉచ్ఛ్వసంతమ్ = నిట్టూర్చుచు; తతః = దానిచే; సరయ్వాం = సరయూనదిలో; తమ్ = ఆ; అహం = నేను; శయానం = శయనించుచున్న; సమీక్ష్య = చూసి; భద్రే = మంగళకరమైన; అస్మి = ఐతిని; భృశం = చాల; విషణ్ణః = దుఃఖితుడను;
భావం:-
 మంగళకరమైన ఓ కౌసల్యా! మర్మస్థానమునందు కలిగిన గాయముచే బాధతో విలపించుచు, చాల నిట్టూర్చుచు, సరయూనది నీటితో తడిసిపడియున్న అతని శరీరమును చూచి నేను చాల దుఃఖితుడనైతిని.
2.63.57
గద్య.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే త్రిషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; త్రిషష్టితమ [63] = అరవైమూడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [63] అరవైమూడవ సర్గ సంపూర్ణము.
2.64.1
అనుష్టుప్
వధమప్రతిరూపం తు
మాహర్షేస్తస్య రాఘవః।
విలపన్నేవ ధర్మాత్మా
కౌసల్యాం పునరబ్రవీత్॥
టీక:-
 వధమ్ = వధను; అప్రతిరూపం = అనుచితమైనది; తు = పూర్తిగా; మాహర్షేః = ముని కుమారుని; తస్య = ఆ; రాఘవః = దశరథుడు; విలపన్నేవ = విలపించుచునే; ధర్మాత్మా = ధర్మాత్ముడు; కౌసల్యాం = కౌసల్యను గూర్చి; పునః = మరల; అబ్రవీత్ = ఇట్లు చెప్పెను.
భావం:-
 ధర్మాత్ముడైన దశరథుడు, అనుచితమైన ఆ మునికుమారుని వధను గురించి కౌసల్యతో మరల విలపించుచునే ఇట్లుచెప్పసాగెను.
2.64.2
అనుష్టుప్
“తదజ్ఞానాన్మహత్పాపమ్
కృత్వాహం సంకులేంద్రియః ।
ఏకస్త్వచింతయం బుధ్యా
కథం ను సుకృతం భవేత్॥
టీక:-
 తత్ = ఆ; అజ్ఞానాత్ = తెలియకపోవుటచేత; మహత్ = దొడ్డ; పాపమ్ = పాపము; కృత్వా = చేయుట వలన; అహం = నేను; సంకుల = వ్యాకులమైన; ఇంద్రియః = ఇంద్రియములు కలవాడనై; ఏకః = ఒంటరిని; అస్తు = ఐయుండి; అచింతయం = ఆలోచించితిని; బుధ్యా = తెలివితేటలతో; కథం ను = ఏ విధముగా; సుకృతం = మంచి; భవేత్ = జరుగును
భావం:-
 “అలా నేను తెలియకచేసిన దొడ్డపాపముతో పూర్తి అయోమయంలో పడిపోతిని. అక్కడ ఒంటరిగనే ఉన్న నేను ఈ అకృత్యానికి ప్రతిగా ఏమి చేయుట ఉత్తమము అని ఆలోచించుకుంటిని.
2.64.3
అనుష్టుప్
తతస్తం ఘటమాదాయ
పూర్ణం పరమవారిణా ।
ఆశ్రమం తమహం ప్రాప్య
యథాఽ ఖ్యాతపథం గతః॥
టీక:-
 తతః = అటుపిమ్మట; తం = ఆ; ఘటమ్ = కుండను; ఆదాయ = నింపి; పూర్ణం = నిండుగా; పరమవారిణా = మంచి నీటిచే; ఆశ్రమం = ఆశ్రమమునకు; తమ్ = ఆ; అహం = నేను; ప్రాప్య = తీసుకొని; యథాఖ్యాత = చెప్పబడిన; పథం = మార్గమున; గతః = వెళ్ళితిని.
భావం:-
 అటుపిమ్మట ఆ ఘటమునిండా నీరు నింపుకొని, ఆ మునికుమారుడు చెప్పిన మార్గమువెంట ఆ ఆశ్రమమునకు వెళ్ళితిని.
2.64.4
అనుష్టుప్
తత్రాహం దుర్బలావంధౌ
వృద్ధావపరిణాయకౌ ।
అపశ్యం తస్య పితరౌ
లూనపక్షావివ ద్విజౌ॥
టీక:-
 తత్ర = అక్కడ; అహం = నేను; దుర్బలౌ = దుర్బలులు; అంధౌ = అంధులు; వృద్ధౌ = ఇరువురు వృద్ధులు; అపరిణాయకౌ = జీవాధారులు లేనివారు; అపశ్యం = చూచితిని; తస్య = ఆ; పితరౌ = తల్లిదండ్రులు; లూనపక్షా = రెక్కలు తెగిన; ఇవ = వలె; ద్విజౌ = పక్షులజంట, బ్రాహ్మణులు.
భావం:-
 అక్కడ నేను వృద్ధులు, అంధులు, దుర్బలులు, దైనందిన జీవనము నడిపించు వారెవ్వరును లేనివారు రెక్కలు నరికిన పక్షుల వలె ఉన్నవారు, ఆ ముని కుమారుని తల్లిదండ్రులూ అయిన బ్రాహ్మణుల నిద్దరను చూచితిని.
*గమనిక:-
 పరిణాయకుడు- పరి+నీ+ణ్వుల్- అక, కృ.ప్ర., భర్త, నడుపువాడు, నాయకుడు, ఆంధ్రవాచస్పతము
2.64.5
అనుష్టుప్
తన్నిమిత్తాభిరాసీనౌ
కథాభిరపరిశ్రమౌ ।
తామాశాం మత్కృతే హీనై
ఉదాసీనావనాథవత్॥
టీక:-
 తత్ + నిమిత్తాభిః = అతడిని గురించిన మాటలను; ఆసీనౌ = కూర్చొని; కథాభిః = చెప్పుకొనుచుండిరి; అపరిశ్రమౌ = ఏపని చేయలేనివారు; తామ్ = వారి; ఆశామ్ = దిక్కైనవానిని; మత్ = నా యొక్క; కృతే = చేయబడిన పని కారణంగా; హీనై = కోల్పోయినవారై; ఉదాసీన = ఉత్సాహశూన్యులై; అనాథవత్ = రక్షకుడు లేనివారు
భావం:-
 అందుచేత, ఏపనీచేయలేని వారిద్దరూ కుమారుని గూర్చిన మాటలే చెప్పుకొనుచుండిరి. ఉత్సాహశూన్యులై, అనాథలవలె కూర్చున్న వారిని చూసితిని. వారికున్న ఏకైక దిక్కైన కుమారుని నా వలన వారు నష్టపోయితిరి.
2.64.6
అనుష్టుప్
శోకోపహతచిత్తశ్చ
భయసంత్రస్తచేతనః ।
తచ్చాఽ శ్రమపదం గత్వా
భూయశ్శోకమహం గతః॥
టీక:-
 శోకః = విచారము చేత; ఉపహత = పీడింపబడిన; చిత్తః = ప్రాణశక్తి కలవారు, వావిళ్ళ నిఘంటువు; చ = ఇంకనూ; భయసంత్రస్త = భయభీతులకు లోనైన; చేతనః = మనస్సుకలవాడను; తత్ = ఆ; చ = మఱియు; ఆశ్రమపదం = ఆశ్రమమును; గత్వా = చేరుకోగానే; భూయః = ఇంకను; శోకమ్ = దుఃఖమును; అహం = నేను; గతః = పొందితిని.
భావం:-
 అంతకు పూర్వమే శోకము చేత పీడింపబడిన చిత్తముతో, ఏమి జరుగునో అని భయపడుచున్న నాకు ఆ ఆశ్రమమును చేరగానే ఇంకను అధికముగా దుఃఖము కలిగెను.
2.64.7
అనుష్టుప్
పదశబ్దం తు మే శ్రుత్వా
మునిర్వాక్యమభాషత !
“కిం చిరాయసి మే పుత్ర
పానీయం క్షిప్రమానయ॥
టీక:-
 పదశబ్దం = అడుగుల సవ్వడి; తు = నిశ్చయంగా; మే = నా యొక్క; శ్రుత్వా = విని; మునిః = ముని; వాక్యమ్ = మాటలను; అభాషత = పలికెను; కిం = ఎందుకు; చిరాయసి = ఆలస్యము చేసితివి; మే = నాకు; పుత్ర = కుమారా; పానీయం = ఉదకమును; క్షిప్రమ్ = త్వరగా; ఆనయ = త్వరగా ఇమ్ము.
భావం:-
 నా అడుగుల చప్పుడు విని ఆ ముని ఇట్లనెను "కుమారా! ఆలస్యము చేసితివేమి! నాకు నీఘ్రముగా ఉదకము ఇమ్ము.
2.64.8
అనుష్టుప్
యన్నిమిత్తమిదం తాత
సలిలే క్రీడితం త్వయా? ।
ఉత్కంఠితా తే మాతేయమ్
ప్రవిశ క్షిప్రమాశ్రమమ్॥
టీక:-
 యత్ = ఏమి; నిమిత్తమ్ = కారణముగా; ఇదం = ఇది; తాత = కుమారా; సలిలే = నీటిలో; క్రీడితం = ఆడుకొనుటచే; త్వయా = నీ కొరకు; ఉత్కంఠితా = బెంగపెట్టుకున్నది; తే మాతః = నీ తల్లి; ఇయమ్ = ఈ; ప్రవిశ = రమ్ము; క్షిప్రమ్ = శీఘ్రముగా; ఆశ్రమమ్ = ఆశ్రమములోనికి
భావం:-
 ఎందుచేత ఇలా ఆలస్యం ఐనది? నీవు నీటిలో ఆడుకొనుటచేతనా? శీఘ్రముగా ఆశ్రమములోనికి రమ్ము. నీ తల్లి బెంగ పెట్టుకొనెను.
2.64.9
అనుష్టుప్
యద్వ్యలీకం కృతం పుత్ర
మాత్రా తే యది వా మయా
న తన్మనసి కర్తవ్యమ్
త్వయా తాత తపస్వినా॥
టీక:-
 యత్ = ఏదైనా; వ్యలీకం = నీకు నచ్చనిది; కృతం = జరిగితే; పుత్ర = కుమారా; మాత్రా = తల్లి వల్ల; తే = నీయొకిక; యదివా = లేదంటే; మయా = నా వల్ల; న = లేదు; తత్ = దానిని; మనసి = మనస్సులో పెట్టుకొనట; కర్తవ్యమ్ = ఉచితము; త్వయా = నీవంటి; తాత = కుమారా; తపస్వినా = తపఃశాలియైనవానికి.
భావం:-
 నీ తల్లిగాని, నేను గాని ఏదైనా అపరాధము చేసినచో తపఃశాలివైన నీవు దానిని పట్టించుకొనరాదు.
2.64.10
అనుష్టుప్
త్వం గతిస్త్వగతీనాం చ
చక్షుస్త్వం హీనచక్షుషామ్ ।
సమాసక్తాస్త్వయి ప్రాణాః
కిం త్వం నో నాభిభాషసే॥
టీక:-
 త్వం = నీవే; గతిః = దిక్కు; తు = నిశ్చయంగా; అగతీనాం చ = దిక్కు లేని మాకు; చ = మఱియు; చక్షుః = కన్నులు; త్వం = నీవే; హీనచక్షుషామ్ = కన్నులు లేని మాకు; సమాసక్తాః = ఆధారపడి ఉన్నవి; త్వయి = నీ మీదనే; ప్రాణాః = ప్రాణములు; కిం = ఎందువలన; త్వం = నీవు; నః = మాతో; న = లేదేమి; అభిభాషసే = మాటలాడుట.
భావం:-
 గతిలేని మాకు నీవే గతివి. ఇంకా నేత్రములు లేని మాకు నీవే నేత్రములు. తప్పదు. మా ప్రాణములు నీ మీదనే ఆధారపడియున్నవి. అవును, నీవు మాతో మాటలాడుటలేదేమి?
2.64.11
అనుష్టుప్
మునిమవ్యక్తయా వాచా
తమహం సజ్జమానయా ।
హీనవ్యంజనయా ప్రేక్ష్య
భీతచిత్త ఇవాబ్రువమ్॥
టీక:-
 మునిమ్ = మునిని; అవ్యక్తయా = అస్పష్టము; వాచా = మాటలను; తమ్ = ఆ; అహం = నేను; సజ్జమానయా = సిద్దమైనవాడనై; హీన వ్యంజనయా = పదములు కలిసిపోయినవి; ప్రేక్ష్య = చూచి; భీతచిత్త = భయపడి; ఇవ = ఈ విధముగా; అబ్రువమ్ = చెప్పితిని.
భావం:-
 నేను మాట్లాడడానికి సిద్దపడి మునిని చూడగానే భయపడి అస్పష్టము, కడబడుతున్న మాటలతో ఇట్లు పలికితిని.
2.64.12
అనుష్టుప్
మనసః కర్మ చేష్టాభిః
అభిసంస్తభ్య వాగ్బలమ్ ।
ఆచచక్షే త్వహం తస్మై
పుత్రవ్యసనజం భయమ్॥
టీక:-
 మనసః కర్మ చేష్టాభిః = మనఃప్రవృత్తిని; అభిసంస్తభ్య = బలమును తెచ్చుకుని; వాగ్బలమ్ = వాగ్బలమును; ఆచచక్షే = చెప్పితిని; తు = తప్పక; అహం = నేను; తస్మై = ఆ మునీశ్వరునకు; పుత్ర = పుత్రుని; వ్యసనజం = ఆపద వలన కలిగిన; భయమ్ = భయమును.
భావం:-
 నేను ఎంతో ప్రయత్నించి మనఃప్రవృత్తిని, వాగ్బలమును నిలబెట్టుకొని ఆ మునీశ్వరునకు పుత్ర నాశము వలన కలుగు భయమును గూర్చి చెప్పితిని.
2.64.13
అనుష్టుప్
“క్షత్రియోఽ హం దశరథో
నాహం పుత్రో మహాత్మనః ।
సజ్జనావమతం దుఃఖమ్
ఇదం ప్రాప్తం స్వకర్మజమ్॥
టీక:-
 క్షత్రియః = క్షత్రియుడను; అహం = నేను; దశర థః = దశరథుడు; న = కాను; అహం = నేను; పుత్రః = కుమారుడను; మహాత్మనః = మహాత్ముడైన; సజ్జన = సజ్జనులు; అవమతం = నిందించు; దుఃఖమ్ = దుఃఖమును; ఇదం = ఈ; ప్రాప్తం = తెచ్చిపెట్టుకొన్నాను; స్వకర్మజమ్ = చేతులార చేసిన కర్మచే.
భావం:-
 “నేను దశరథుడనే పేరు గల క్షత్రియుడను, మహాత్ముడైన నీ కుమారుడిని కాదు. సజ్జనులు నిందించు ఈ దుఃఖమును చేతులార చేసిన కర్మచే తెచ్చిపెట్టుకొనినాను.
2.64.14
అనుష్టుప్
భగవంశ్చాపహస్తోఽ హమ్
సరయూతీరమాగతః ।
జిఘాంసుశ్శా్వపదం కంచిన్
నిపానే చాఽ గతం గజమ్॥
టీక:-
 భగవన్ = ఓ పూజ్యుడా; చాపహస్తః = ధనుస్సును ధరించి; అహమ్ = నేను; సరయూ = సరయూనదీ; తీరమ్ = తీరమునకు; ఆగతః = వచ్చితిని; జిఘాంసుః = చంపవలెనను కోరికతో; శ్వాపదం = క్రూరమృగమును; కంచిత్ = ఏదైనా; నిపానే = నీరు త్రాగుటకు; చ = ఇంకా; ఆగతం = ఏనుగును; గజమ్ = ఏనుగును.
భావం:-
 పూజ్యుడా! నేను ధనుస్సు ధరించి, సరయూనదీ తీరమునకు వచ్చితిని. ఏదైనా ఒక క్రూరమృగమును, లేదా నీరు త్రాగుటకు రేవునకు వచ్చు ఏనుగును చంపవలెనను కోరికతో వచ్చితిని.
2.64.15
అనుష్టుప్
తతశ్శ్రుతో మయా శబ్దో
జలే కుమ్భస్య పూర్యతః ।
ద్విపోఽ యమితి మత్వాఽ యమ్
బాణేనాభిహతో మయా॥
టీక:-
 తతః = అప్పుడు; శ్రుతః = వినబడెను; మయా = నా చేత; శబ్దః = ఒక శబ్దము; జలే = నీటితో; కుమ్భస్య = కుంభస్థలమును; పూర్యతః = నింపబడుచున్న; ద్విపః = ఏనుగు; అయమ్ = అది ( ఆ శబ్దము); ఇతి = వలె; మత్వా = భావించి; అయమ్ = నేను; బాణేన = ఈ బాణముతో; అభిహతః = కొట్టబడినది; మయా = నా చేత.
భావం:-
 అంతలో నాకు ఏనుగు కుంభస్థలము నీరు నింపుచున్న ధ్వనివలె వినబడెను. అది ఏనుగే అని తలచి నేను దానిని బాణముతో కొట్టితిని.
2.64.16
అనుష్టుప్
గత్వా నద్యాస్తత స్తీరమ్
అపశ్యమిషుణా హృది ।
వినిర్భిన్నం గతప్రాణమ్
శయానం భువి తాపసమ్॥
టీక:-
 గత్వా = వెళ్లి; నద్యాః = నదీ; తతః = అప్పుడు; తీరమ్ = తీరమునకు; అపశ్యమ్ = చూచితిని; ఇషుణా = బాణము; హృది = గుండెలో; వినిర్భిన్నం = గ్రుచ్చుకొని; గతప్రాణమ్ = ప్రాణములు పోయి; శయానంభువి = నేలపై పడియున్న; తాపసమ్ = మునిని.
భావం:-
 పిదప నదీతీరమునకు వెళ్లి, అక్కడ బాణము వక్షఃస్థలమునందు గ్రుచ్చుకొని ప్రాణములు పోయి, నేలపై పడియున్న మునిని చూచితిని.
2.64.17
అనుష్టుప్
భగవంచ్ఛబ్దమాలక్ష్య
మయా గజజిఘాంసునా ।
విస్పృష్టోఽ మ్భసి నారాచః
తేన తే నిహతస్సుతః॥
టీక:-
 భగవత్ = ఓ మహానుభావా; శబ్దమ్ = శబ్దమును; ఆలక్ష్య = లక్ష్యముగా చేసి; మయా = నా చేత; గజజిఘాంసునా = ఏనుగును చంపవలెనను; విస్పృష్టః = వేసిన; అమ్భసి = బాణమును; నారాచః = ఇనపముల్లుది; తేన = ఆ బాణము చేత; తే = నీ యొక్క; నిహతః = నిహతుడైనాడు; సుతః = కుమారుడు.
భావం:-
 శబ్దమును లక్ష్యముగా చేసి ఏనుగును చంపలెనను ఉద్దేశముతో నేను ఇనుప బాణమును వేయగా అది తగిలి నీ కుమారుడు నిహతుడైనాడు.l
2.64.18
అనుష్టుప్
తతస్తస్యైవ వచనాత్
ఉపేత్య పరితప్యతః ।
స మయా సహసా బాణ
ఉద్ధృతో మర్మతస్తదా॥
టీక:-
 తతః= అటు పిమ్మట; తస్య = అతని యొక్క; + ఏవ = మాత్రమే; వచనాత్ = మాట ప్రకారము; ఉపేత్య = సమీపించి; పరితప్యతః = బాధపడుచున్న; సః = అతడు; మయా = నా చేత; సహసా = వెంటనే; బాణ = బాణమును; ఉద్ధృతః = ఊడలాగితిని; మర్మతః = మర్మస్థానము నుండి; తదా = అతని మాట ప్రకారము.
భావం:-
 పిమ్మట నేను అతనిని సమీపించి, బాధపడుచున్న అతని మాట ప్రకారము అతని మర్మ స్థానము నుండి బాణమును ఊడలాగితిని.
2.64.19
అనుష్టుప్
స చోధృతేన బాణేన
తత్రైవ స్వర్గమాస్థితః ।
భవన్తౌ పితరౌ శోచన్
అంధావితి విలప్య చ॥
టీక:-
 స = అతడు చ = కూడా; ఉధృతేన = ఊడలాగుటతో; బాణేన = బాణమును; తత్రైవ = అక్కడికక్కడే; స్వర్గమాస్థితః = మరణించెను; భవన్తౌ = మీ ఇరువురి గురించి; పితరౌ = తల్లిదండ్రులైన; శోచత్= దుఃఖించుచు; అంధావ = అంధులని; ఇతి = ఈ విధముగా; విలప్య = విలపించుచు; చ = ఇంకనూ ఎక్కువగా
భావం:-
 ఆ బాణమును ఊడలాగిన వెంటనే అతడు తల్లిదండ్రులైన మీ ఇరువురి గురించి దుఃఖించుచు, వారు అంధులని చెప్పి విలపించుచు, అక్కడనే స్వర్గమునకు వెళ్లినాడు. –
2.64.20
అనుష్టుప్
అజ్ఞానాద్భవతః పుత్రః
సహసాఽ భిహతో మయా ।
శేషమేవం గతే యత్స్యత్
తత్ప్రసీదతు మే మునిః”॥
టీక:-
 అజ్ఞానాత్ = తెలియకపోవుటచేత; భవతః = నీ యొక్క; పుత్రః = కుమారుడు; సహసా = తొందరపాటువలన; అభిహతః = చంపబడినాడు; మయా = నా చేత; శేషామ్ = ఇంకచేయవలసిన; ఏవం గతే = ఇటుపైన; యత్స్యాత్ = ఏమి చేయవలెనో; తత్ = ఈ విషయమున; ప్రసీదతు = ఆజ్ఞాపించుము; మే = నన్ను; మునిః = ఓ మునీశ్వరా.
భావం:-
 అజ్ఞానముచే నేను తొందరపడి నీ కుమారుడిని చంపితిని. ఇది ఈ విధముగా జరిగిపోయినది. ఈ విషయమున ఇంక నేనేమి చేయవలెనో నీవు ఆజ్ఞాపించుము.”
2.64.21
అనుష్టుప్
స తచ్చ్రుత్వా వచః క్రూరమ్
మయోక్తమఘశంసినా ।
నాశకత్తీవ్రమాయాసమ్
అకర్తుం భగవానృషిః॥
టీక:-
 సః = అతడు; తత్ = ఆ మాటలు; శ్రుత్వా = వినినటువంటి; వచః = మాటలు; క్రూరమ్ = క్రూరమైన; మయా = నా చేత; ఉక్తమ్ = చెప్పబడిన; అఘశంసినా = చేసిన పాపం చెప్పుకొనుట; నాశకత్ = సమర్థుడను కాను; తీవ్రమ్ = తీక్షణమైన; ఆయాసమ్ = దుఃఖము; అకర్తుం = కలిగెను; భగవాన్ = పూజ్యుడైన; ఋషిః = మునీశ్వరునకు
భావం:-
 నేను చేసిన క్రూరమైన పాపం చెప్పుకొనుట విని, పూజ్యుడైన ఆ మునీశ్వరునకు కలుగు తీవ్రమైన దుఃఖము కలుగకుండా చెప్పలేకపోయాను.
2.64.22
అనుష్టుప్
స బాష్పపూర్ణవదనో
నిశ్శ్వసన్శోకకర్శితః ।
మామువాచ మహాతేజాః
కృతాంజలిముపస్థితమ్॥
టీక:-
 సః = మునీశ్వరుడు; బాష్పపూర్ణ = కన్నీటితో నిండు ఉన్న; వదనః = ముఖముతో; నిశ్శ్వసన్ = నిట్టూర్చుచు; శోక = దుఃఖముచే; కర్శితః = పీడితుడై; మామ్ = నాతో గూర్చి; ఉవాచ = పలికెను; మహాతేజాః = మహాతేజఃశాలి అయిన; కృతాంజలిమ్ = జోడించిన చేతులు గలవాడై; ఉపస్థితమ్ = ఉన్నవాని.
భావం:-
 మహాతేజఃశాలిౖయెన ఆ మునీశ్వరుడు కన్నీటిమయమైన ముఖముతో నిట్టూర్చుచు, దుఃఖపీడితుడనై చేతులు జోడించుకొని నిలచి ఉన్న నాతో ఇట్లనెను.
2.64.23
అనుష్టుప్
“యద్యేతదశుభం కర్మ
న త్వం మే కథయేస్స్వయమ్ ।
ఫలేన్మూర్ధాస్మ తే రాజన్!
సద్యశ్శతసహస్రధా॥
టీక:-
 యది = ఒకవేళ; ఏతత్ = ఏదైతే అది; అశుభం = అమంగళకరమైన; కర్మ = కృత్యమును; న = లేకుంటే; త్వం = నీవు; మే = నాకు; కథయేః = చెప్పుట; స్వయమ్ = స్వయముగా; ఫలేత్ = ఫలితముగా; మూర్ధాస్మ = శిరస్సు; తే = నీ యక్క; రాజన్ = ఓ రాజా; సద్యః = వెంటనే; శతసహస్రధా = లక్ష ముక్కలుగా
భావం:-
 రాజా! నీవు చేసిన ఈ అమంగళ కృత్యమును నీవు స్వయముగా వచ్చి నాకు చెప్పకున్నచో, వెంటనే నీ శిరస్సు లక్షముక్కలుగా బ్రద్దలై ఉండెడిది.
2.64.24
అనుష్టుప్
క్షత్రియేణ వధో రాజన్
వానప్రస్థే విశేషతః ।
జ్ఞానపూర్వం కృతస్థా్థనాత్
చ్యావయేదపి వజ్రిణమ్॥
టీక:-
 క్షత్రియేణ = క్షత్రియుని చేత; వధః = చంపబడినచో; రాజన్ = రాజా; వానప్రస్థే = వానప్రస్థుని; విశేషతః = విశేషించి; జ్ఞానపూర్వం = తెలిసి; కృతస్థ = చేసి ఉండిన; స్థానాత్ = పదవినుండి; చ్యావయేత్ = చ్యుతుడు అవుతాడు; అపి = అయినప్పటికీ; వజ్రిణమ్ = దేవేంద్రుడే
భావం:-
 రాజా!క్షత్రియుడు ఎవ్వనినైన చంపదగనివానిని తెలిసి చంపినచో, విశేషించి వానప్రస్థుని ఐతే, ఆ పాపము దేవేంద్రుని ఐనా కూడా పదవీచ్యుతుని చేయును.
2.64.25
అనుష్టుప్
సప్తధా తు ఫలేన్మూర్ధా
మునౌ తపసి తిష్ఠతి ।
జ్ఞానాద్విసృజతశ్శస్త్రమ్
తాదృశే బ్రహ్మచారిణి॥
టీక:-
 సప్తధా = ఏడు ముక్కలుగా; తు = నిశ్చయంగా; ఫలేత్ = తత్ఫలితంగా; మూర్ధా = శిరస్సు; మునౌ = మునియందును; తపసి = తపసు యందు; తిష్ఠతి = ఉన్న; జ్ఞానాత్ = తెలిసి; విసృజతః = ప్రయోగించినవాని; శస్త్రమ్ = ఆయుధమును; తాదృశే = అట్టి; బ్రహ్మచారిణి = బ్రహ్మచారియందును.
భావం:-
 తపస్సులో ఉన్న మునిపై గాని, అట్టి బ్రహ్మచారిపై గాని, తెలిసి ఆయుధమును ప్రయోగించిన వాని శిరస్సు ఏడు ముక్కలగును.
2.64.26
అనుష్టుప్
అజ్ఞానాద్ధికృతం యస్మాత్
ఇదం తేనైవ జీవసి।
అపి హ్యద్య కులం న స్యాత్
ఇక్షా్వకూణాం కుతో భవాన్”॥
టీక:-
 అజ్ఞానాత్ = తెలియక; హి = కదా; కృతం = చేయబడినదో; యస్మాత్ = ఏ కారణంగా; ఇదం = ఈ పనిని; తేన = ఆ కారణముగా; ఏవ = మాత్రమే; జీవసి = జీవించి ఉన్నావు; అపి = అయినప్పటికీ; హి = కదా; అద్య = నేడు; కులం = వంశమే; న = కాదు; స్యాత్ = ఉండెడిది; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకులు; కుతః = ఎక్కడ?; భవాన్ = ఎక్కడ?
భావం:-
 నీవు ఈ పనిని తెలియక చేసితివి కనుక ఇంకను బ్రతికి ఉన్నావు. అట్లు కానిచో ఇక్ష్వాకు వంశమే నశించెడిది ఇంక నీగురించి చెప్పేది ఏముంది.”
2.64.27
అనుష్టుప్
నయ నౌ నృప తం దేశమ్
ఇతి మాం చాభ్యభాషత ।
అద్య తం ద్రష్టుమిచ్ఛావః
పుత్రం పశ్చిమదర్శనమ్॥
టీక:-
 నయ = తీసుకొని వెళ్లుము; నౌ = మమ్ములను; నృపః = ఓ రాజా; తం దేశమ్ = ఆ ప్రదేశమునకు; ఇతి = ఇలా; మాం = నాకు; చ = మఱియు; అభ్యభాషత = అని పలికెను; అద్య = ఇప్పుడు; తం = అతడిని; ద్రష్టుమ్ ఇచ్ఛావః = చూడవలెనని కోరుచున్నాము; పుత్రం = కుమారుని; పశ్చిమ = చివరి చూపుగా; దర్శనమ్ = చూడవలెనని
భావం:-
 పిమ్మట ఇలా అని నాతో చెప్పెను. “రాజా! మా ఇద్దరినీ ఆ ప్రదేశమునకు తీసికొని వెళ్లుము. కుమారుని చివరి చూపుగా చూడవలెనని కోరుచున్నాము.
2.64.28
అనుష్టుప్
రుధిరేణావసిక్తాంగమ్
ప్రకీర్ణాజినవాససమ్ ।
శయానం భువి నిస్సంజ్ఞమ్
ధర్మ రాజవశం గతమ్”॥
టీక:-
 రుధిరేణ = రక్తముతో; అవసిక్త =తడిసిన; అంగమ్ = శరీరము గలవాని ; ప్రకీర్ణ = తొలగిపోయిన; అజినవాససమ్ = కృష్ణాజినము గలవాని ; శయానం = పడి ఉన్నవాని; భువి = నేలపై; నిస్సజ్ఞమ్ = చేతన కోల్పోయినవాని; ధర్మరాజ వశం = యమునకు వశమును; గతమ్ = పొందినవాని.
భావం:-
 రక్తముచే శరీరము తడిసి, వస్త్రముగా ధరించిన కృష్ణాజినము తొలగిపోయి, యమునకు వశుడై ప్రాణములు కోల్పోయి నేలపై పడి వానిని.”
2.64.29
అనుష్టుప్
అథాహమేకస్తందేశమ్
నీత్వా తౌ భృశదుఃఖితౌ ।
అస్పర్శయమహం పుత్రమ్
తం మునిం సహ భార్యయా॥
టీక:-
 అథ = అటు పిమ్మట; అహమ్ = నేను; ఏకః = ఒంటరిగా, తమ్ = ఆ; దేశమ్ = ప్రదేశమును గూర్చి; నీత్వా = తీసుకుని వెళ్లి; తౌ = వారు ఇరువురినీ; భృశ = ఎక్కువగా; దుఃఖితౌ = దుఃఖించుచున్న; అస్పర్శయమ్ = స్పృశించునట్లు; అహం = నేను; పుత్రమ్ = పుత్రుని; తం = ఆ; మునిం = మునిని; సహ = సహితముగా; భార్యయా = భార్యతో.
భావం:-
 పిదప, నేను ఎంతగానో దుఃఖించుచున్న ఆ మునిని మునిభార్యను ఆ ప్రదేశమునకు తీసికొని, వెళ్లి వారు తమ పుత్రుని స్పృశించునట్లు చేసితిని.
2.64.30
అనుష్టుప్
తౌ పుత్రమాత్మనస్పృష్ట్వా
తమాసాద్య తపస్వినౌ ।
నిపేతతుశ్శరీరేఽ స్య
పితా చాస్యేదమబ్రవీత్॥
టీక:-
 తౌ = వారు ఇరువురూ; పుత్రమ్ = కుమారుని; ఆత్మనః = వారి యొక్క; స్పృష్ట్వా = స్పృశించి; తమ్ = ఆ; ఆసాద్య = సమీపించి; తపస్వినౌ = తపశ్శాలులైన ఆ ఇద్దరూ; నిపేతతుః = పడిరి; శరీరే = శరీరము మీద; అస్య = అతని యొక్క; పితా = తండ్రి; చ = ఇంకనూ; అస్య = అతని; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 తపశ్శాలులైన ఆ ఇద్దరును తమ కుమారుని సమీపించి, అతని శరీరమును స్పృశించి, అతని శరీరముపై పడిరి. ఇంకను అతని తండ్రి ఇట్లు పలికెను.
2.64.31
అనుష్టుప్
“నాభివాదయసే మాద్య
న చ మాఽ మభిభాషసే ।
కిం ను? శేషే తు భూమౌ త్వమ్
వత్స కిం? కుపితో హ్యసి॥
టీక:-
 న = లేదు; అభివాదయసే = నమస్కారము చేయుట; మా = నాకు; అద్య = ఇప్పుడు; న = లేదు; చ = మఱియు; మామ్ = నాతో; అభిభాషసే = మాటలాడుట; కిం ను = ఎందులకు; శేషే తు = శయనించితివి; తు = ఇలా; భూమౌ = నేలపై; త్వమ్ = నీవు; వత్స = కుమారా; కిం = ఏమి; కుపితః = కోపము వచ్చినవాడవు; హి = ఇటుల; అసి = ఐ ఉంటివి.
భావం:-
 ”వత్సా! నేడు నీవు నాకు నమస్కారము చేయుట లేదు. మాట కూడ మాటలాడుట లేదు. ఏల నేలపై శయనించితివి? లేక నీకు కోపముకాని వచ్చినదా?
2.64.32
అనుష్టుప్
న త్వహం తే ప్రియః పుత్ర!
మాతరం పశ్య ధార్మిక ।
కిం ను? నాలింగసే పుత్ర!
సుకుమార వచో వద॥
టీక:-
 న = లేదు; తు = ఐనచో; అహం = నేను; తే = నీకు; ప్రియః = ఇష్టమైనవానిని; పుత్ర = కుమారా; మాతరం = తల్లిని; పశ్య = చూడుము; ధార్మిక = ఓ ధర్మాత్ముడా; కిం ను = ఎందుకు లేదు; ఆలింగసే = ఆలింగనము చేసికొనుట; పుత్ర = కుమారా; సుకుమార = మంచికుమారుడ; వచోవద = మాటలాడుము.
భావం:-
 కుమారుడా! నీవు సుకుమారుడవు కదా. నేననినచో నీకు ఇష్టము లేనిచో నీ తల్లినైనను చూడుము. పుత్రా! నన్ను ఆలింగనము చేసికొనుట లేదేమి? ఏదో ఒకటి మాటలాడవయ్యా.
2.64.33
అనుష్టుప్
కస్య? వాఽ పరరాత్రేఽ హమ్
శ్రోష్యామి హృదయంగమమ్ ।
అధీయానస్య మధురమ్
శాస్త్రం వాన్యద్విశేషతః॥
టీక:-
 కస్య = ఎవరు; వా = గాని; అపరరాత్రే = తెల్లవారు జామున; అహమ్ = నేను; శ్రోష్యామి = వినిపించును; హృదయంగమమ్ = మనస్సునకు సంతోషము కలుగునట్లు; అధీయానస్య = చదువుచుండెడి; మధురమ్ = మధురమైన; శాస్త్రం = వేదమును; వా = గాని; అన్యత్ = వేరొక; విశేషతః = ప్రత్యేకముగా.
భావం:-
 తెల్లవారు జామున వేదమును గాని మరియొక శాస్త్రమును గాని మనోహరముగా చదివెడు నీ మధుర కంఠధ్వని నాకు ఇటుపై ఎవరు వినిపింతురు?
2.64.34
అనుష్టుప్
కో?మాం సంద్యాముపాస్యైవ
స్నాత్వా హుతహుతాశనః ।
శ్లాఘయిష్యత్యుపాసీనః
పుత్ర! శోకభయార్దితమ్॥
టీక:-
 కః = ఎవరు; మాం = నాకు; సంధ్యామ్ = సంధ్యా కాలపు; ఉపాస్యః = అనుష్టానము చేసినవాడై; ఇవ = అటులనే; స్నాత్వా = స్నానానంతరము; హుత = హోమముచేసిన; హుతాశనః = అగ్నికలవాడై; శ్లాఘయిష్యతి = ప్రశంసించుట; ఉపాసీనః = నా పక్కన కూర్చొని; పుత్ర = కుమారా; శోకః = శోకతో; భయః = భయముతో; అర్దితమ్ = పీడింపబడినవాడిని.
భావం:-
 కుమారా! స్నానము చేసి, సంధ్యోపాసన అనంతరము హోమకార్యము చేసికొని, శోకభయములతో బాధపడుచున్న నా ప్రక్కనే కూర్చుండి, నన్ను ప్రశంసించువారు ఎవరు?
2.64.35
అనుష్టుప్
కందమూలఫలం హృత్వా
కో? మాం ప్రియమివాతిథిమ్ ।
భోజయిష్యత్యకర్మణ్యమ్
అప్రగ్రహమనాయకమ్॥
టీక:-
 కందమూలఫలమ్ = కందమూల ఫలములను; హృత్వా = తెచ్చి; కః = ఎవరు; మాం = నాకు; ప్రియమివ = ప్రియమైన; అతిథిమ్ = అతిథికి; భోజయిష్యతి = తినిపించెదరు; అకర్మణ్యమ్ = ఏ పనీ చేయలేని వాడను; అప్రగ్రహమ్ = ఏమీ సంపాదించలేని వాడను; అనాయకమ్ = అనాథుడను, నాథుడు లేనివావాడను.
భావం:-
 కందమూల ఫలములను తెచ్చి ప్రియమైన అతిథికి పెట్టినట్లు, ఏ పనులను చేయలేనివాడను, సంపాదించలేని వాడను, అనాథన అయిన నాకు ఎవ్వరు తినిపించెదురు?
2.64.36
అనుష్టుప్
ఇమామంధాం చ వృద్ధాం చ
మాతరం తే తపస్వినీమ్ ।
కథం? వత్స! భరిష్యామి
కృపణాం పుత్రగర్ధినీమ్॥
టీక:-
 ఇమామ్ = ఇట్టి; అంధామ్ = అంధురాలు; చ = మఱియు; వృద్ధామ్ = వృద్ధురాలు; చ = మఱియు; మాతరం = తల్లిని; తే = నీ; తపస్వినీమ్ = తపస్వినిని; కథం = ఏ విధముగా; వత్స = కుమారా; భరిష్యామి = నేను పోషించగలను; కృపణాం = దీనుడను; పుత్రగర్ధినీమ్ = పుత్రవాత్సల్యము కలది.
భావం:-
 తపస్విని, పుత్రవాత్సల్యపూరితురాలు, వృద్ధురాలు, అంధురాలు అయిన నీ తల్లిని దీనుడనైన నేను ఎట్లు పోషించగలను?
2.64.37
అనుష్టుప్
తిష్ఠ మామాగమః పుత్ర!
యమస్య సదనం ప్రతి ।
శ్వో మయా సహ గంతాసి
జనన్యా చ సమేధితః॥
టీక:-
 తిష్ఠ = ఆగుము; మామా = వద్దు; గమః = వెళ్లుట; పుత్ర = కుమారా; యమస్య = యమునియొక్క; సదనం ప్రతి = సదనమునుగూర్చి; శ్వః = రేపు; మయా = నాతో; సహ = కలసి; గంతాసి = వెళ్లెదవులెమ్ము; జనన్యా = తల్లిని; చ = కూడా; సమేధితః = కలుపుకున్నవాడవై.
భావం:-
 కుమారా! ఆగుము. యమలోకమునకు వెళ్లవద్దు. వెళ్లవద్దు. నాతోడను, తల్లితోడను కలసి రేపు వెళ్లెదవు లెమ్ము.
2.64.38
అనుష్టుప్
ఉభావపి చ శోకార్తౌ
అనాథౌ కృపణౌ వనే ।
క్షిప్రమేవ గమిష్యావః
త్వయా హీనౌ యమక్షయమ్॥
టీక:-
 ఉభౌ = ఇరువురము; అపి = కూడా; చ = మరి; శోకార్తౌ = దుఃఖముతో పీడింపబడుతున్న; అనాథౌ = రక్షకులు లేని; కృపణౌ = దీనులమైన; వనే = వనములో; క్షిప్రమేవ = వెంటనే; గమిష్యావః = వచ్చెదము; త్వయా = నీవు; హీనౌ = లేకపోవుటచే; యమక్షయమ్ = యమలోకమునకు
భావం:-
 అడవిలో మేమిరువరము శోకార్తులము, అనాథలము, దీనులము ఉన్న మేము, నీవు లేకపోవుటచే వెంటనే యమలోకమునకు వచ్చెదము.
2.64.39
అనుష్టుప్
తతో వైవస్వతం దృష్ట్వా
తం ప్రవక్షా్యమి భారతీమ్ ।
క్షమతాం ధర్మరాజో మే
బిభృయాత్పితరావయమ్॥
టీక:-
 తతః = అటుపిమ్మట; వైవస్వతం = యముని; దృష్ట్వా = చూచి; తం = అతనితో; ప్రవక్ష్యామి = చెప్పెదను; భారతీమ్ = ఈ మాటలను; క్షమతాం = క్షమించుము; ధర్మరాజః = యమధర్మరాజా; మే = నేను; బిభృయాత్ = పోషించుట; పితరౌ = తల్లిదండ్రులను; అయమ్ = అతనిని.
భావం:-
 అక్కడ నేను యమునితో,"యమధర్మరాజా! క్షమించుము. ఇతడు తల్లిదండ్రులను పోషించునట్లు అనుమతిని ఇమ్ము’’ అని పలికెదను.
2.64.40
అనుష్టుప్
దాతుమర్హతి ధర్మాత్మా
లోకపాలో మహాయశాః ।
ఈదృశస్య మమాక్షయ్యా
మేకామభయదక్షిణామ్॥
టీక:-
 దాతుమ్ అర్హతి = ఇవ్వగలడు; ధర్మాత్మా = ధర్మాత్ముడును; లోకపాలః = లోకపాలకుడును; మహాయశాః = మహాయశఃశాలీ; ఈదృశస్య = ఇట్టి స్థితిలో ఉన్న; మమ = నన్ను; అక్షయ్యామ్ = నశించని; ఏకామ్ = ఒకదానిని; అభయ = అభయ; దక్షిణామ్ = దక్షిణను.
భావం:-
  ధర్మాత్ముడును, మహాయశఃశాలీ, లోకపాలకుడును అయిన ఆ యమధర్మరాజు ఇట్టి స్థితిలో ఉన్న నాకు ఈ అభయ దక్షిణను ఒక్కదానిని ఇవ్వగలడు.
2.64.41
అనుష్టుప్
అపాపోఽ సి యదా పుత్ర
నిహతః పాపకర్మణా ।
తేన సత్యేన గచ్ఛాశు
యే లోకాశ్శస్త్రయోధినామ్॥
టీక:-
 అపాపః = ఏ పాపము లేనివాడవు; అసి = ఐనప్పటికీ; యదా = ఏ విధముగా; పుత్ర = కుమారా; నిహతః = చంపబడినావు; పాపకర్మణా = పాపకర్మునిచే; తేన = నీ; సత్యేన = పుణ్యము కారణముగా; గచ్ఛాశు = పొందుము; యేలోకాః = ఏ లోకములు లభించునో; శస్త్రయోధినామ్ = ఆయుధములతో యుద్ధముచేయువారికి.
భావం:-
 కుమారా! ఏ పాపము లేని నిన్ను ఈ పాపకర్మునిచే ఎలా చంపబడినావు. అందుచే యుద్ధము చేయుచు మరణించు వారికి ఏ లోకములు లభించునో వాటిని పొందుము.
2.64.42
అనుష్టుప్
యాంతి శూరా గతిం యాం చ
సంగ్రామేష్వనివర్తినః ।
హతాస్త్వభిముఖాః పుత్ర
గతిం తాం పరమాం వ్రజ॥
టీక:-
 యాంతి = పొందుము; శూరా = శూరులకు; గతిం = స్థితి; యాం చ = ఏది కలదో; సంగ్రామేషు = యుద్ధములో; నివర్తినః = వెనుకకు తిరగని; హతాస్తు = నిహతులై; అభిముఖాః = ఎదురుగా నిలచి; పుత్ర = కుమారా; గతిం = స్థితిని; తాం = అటువంటి; పరమాం వ్రజ = ఉత్తమ గతిని.
భావం:-
 యుద్ధములో వెనుకకు తిరగని శూరులు శత్రువులకు ఎదురుగా నిలిచి, వారిచే నిహతులై ఏ ఉత్తమ గతిని పొందుదురో ఆ గతిని పొందుము.
*గమనిక:-
 
2.64.43
అనుష్టుప్
యాం గతిం సగరశ్శైభ్యో
దిలీపో జనమేజయః ।
నహుషో దుంధుమారశ్చ
ప్రాప్తాస్తాం గచ్ఛ పుత్రక॥
టీక:-
 యాం గతిం = ఏ గతి పొందినారో; సగరః = సగరుడు; శైభ్యః = శైభ్యుడు; దిలీపః = దిలీపుడు; జనమేజయః = జనమేజయుడు; నహుషః = నహుషుడు; దుంధుమారః = దుంధుమారుడు; చ = మఱియు; ప్రాప్తాః = పొందుదురో; తాం = అట్టి; గచ్ఛ = లభించుగాక; పుత్రక = కుమారుడ.
భావం:-
 సగరుడు, శైబ్యుడు, దిలీపుడు, జనమేజయుడు, నహుషుడు, దుంధుమారుడు ఏ గతి పొందినారో అట్టి సద్గతి నీకు లభించునుగాక.
*గమనిక:-
 దుంధుమారుడు- ఇతడు బృహదశ్వుని కుమారుడు. ఇతని పేరు యవనాశ్వుడు ఉదంకుని తపస్సుకు భంగము కలిగించుచున్న దుంధువు లేదా దుందువు అను నామాంతరములుగల రాక్షసుని సంహరించుటచే ఇతనికి దుంధుమారుడు అను పేరు వచ్చెను. చూ. తెభా. 9-165-4-క.
2.64.44
అనుష్టుప్
యా గతి స్సర్వసాధూనామ్
స్వాధ్యాయాత్తపసాచ యా ।
యా భూమిదస్యాహిఽ తాగ్నేః
ఏకపత్నీ వ్రతస్య చ॥
టీక:-
 యా గతిః = ఏ గతులు లభించునో; సర్వ సాధూనామ్ = సమస్తమైన; సాధూనామ్ = సాధువులకు; స్వాధ్యాయాత్ = స్వాధ్యాయము వలనను; తపసాచ యా = తపస్సు చేసినవారికి; చ = మఱియు; యా = ఏ గతులు లభించునో; యా = ఏ గతులు లభించునో; భూమిదస్య = భూ దానము చేసినవారికి; అహితాగ్నేః = నిత్యాగ్నిహోత్రునికి; ఏకపత్నీవ్రతస్య = ఏకపత్నీ వ్రతము పాటించువారికి; చ = మఱియు.
భావం:-
 సమస్తమైన సాధువులకు ఏ గతి లభించునో, స్వాధ్యాయము వలనను, తపస్సు వలనను ఏ గతి లభించునో, భూదానము చేసినవారికి, నిత్యాగ్నిహోత్రముచేయు నిష్ఠాపరునకు, ఏకపత్నీవ్రతము పాటించువారికిని ఏ గతి లభించునో నీకు అట్టి సద్గతి లభించును గాక.
2.64.45
అనుష్టుప్
గోసహస్ర ప్రదాతౄణామ్
యా యా గురుభృతామపి ।
దేహన్యాసకృతాం యా చ
తాం గతిం గచ్ఛ పుత్రక॥
టీక:-
 గో సహస్ర = వేయి గోవులను; ప్రదాతౄణామ్ = దానము చేసినవారికి; యా యా = ఎటువంటి; గురుభృతామ్ = పెద్దలను సేవించువారికి; అపి = ఇంకనూ; దేహన్యాస కృతాం = శరీరత్యాగము చేసినవారికి (సాధుసన్యాసులు తమ సాధన చివరి దశలో చేయు దేహత్యాగులకు); యా చ = ఎట్టి గతులు లభించునో; తాం గతిం = అట్టి సద్గతి; గచ్ఛ = లభించును; పుత్రక = కుమారా
భావం:-
 కుమారా! వేయి గోవులను దానముచేసినవారికి ఏ గతి లభించునో, గురువులను పెద్దలను సేవించువారికి ఏ గతి లభించునో సాధుసన్యాసులు తమ సాధన చివరి దశలో చేయు దేహత్యాగులకు ఏ గతి లభించునో ఆ గతి నీకు లభించు గాక.
2.64.46
అనుష్టుప్
న హి త్వస్మిన్కులే జాతో
గచ్ఛత్యకుశలాం గతిమ్ ।
స తు యాస్యతి యేన త్వమ్
నిహతో మమ బాంధవః॥
టీక:-
 న = ఉండవు; హి = కదా; తు = తప్పక; అస్మిన్ = మన; కులే = వంశమున; జాతః = పుట్టినవారు; గచ్ఛతి = చేరును; అకుశలాం = దుర్గతులు; గతిమ్ = గమ్యము; సః = అతడు; తు = కాని; యాస్యతి = లభించును; యేన = ఎవనిచేత; త్వమ్ = నీవు; నిహతః = చంపబడితివో; మమ = నా; బాంధవః = బంధువైన.
భావం:-
 మన కులములో పుట్టినవానికి ఎవ్వనికిని చెడుగతి రాదు. నా కుమారుడవైన నిన్ను చంపినవానికే అట్టి గతి కలుగును.
2.64.47
అనుష్టుప్
ఏవం స కృపణం తత్ర
పర్యదేవయతాసకృత్ ।
తతోఽ స్మై కర్తుముదకమ్
ప్రవృత్తస్సహభార్యయా॥
టీక:-
 ఏవం = ఆ విధముగా; సః = ఆ ముని; కృపణం = దీనముగా; తత్ర = అక్కడ; పర్యదేవయత = విలపించెను; అసకృత్ = పదేపదే; తతః = అప్పుడు; అస్మై = అతని యొక్క; కర్తుమ్ = చేయుట; ఉదకమ్ = ఉదక క్రియలు; ప్రవృత్తః = ప్రారంభించెను; సహ = కూడా ఉన్న; భార్యయా = భార్యకలవాడు.
భావం:-
 ఈ విధముగా ఆ ముని అక్కడ చాలసేపు విలపించెను. పిమ్మట, భార్యాసహితుడైన అతడు కుమారునకు ఉదకక్రియలు చేయుట ప్రారంభించెను.
2.64.48
అనుష్టుప్
స తు దివ్యేన రూపేణ
మునిపుత్రస్స్వకర్మభిః ।
స్వర్గమధ్యారుహత్ క్షిప్రమ్
శక్రేణ సహ ధర్మవిత్॥
టీక:-
 సః = అతడు; తు = ఐతే; దివ్యేన రూపేణ = దివ్యమైన; రూపేణ = రూపముతో; మునిపుత్రః = ముని కుమారుడు; స్వకర్మభిః = తన పుణ్యకర్మల ఫలముగా; స్వర్గమ్ = స్వర్గమునకు; అధ్యారుహత్ = అధిరోహించెను; క్షిప్రమ్ = శీఘ్రముగా; శక్రేణ = దేవేంద్రునితో; సహ = కూడ; ధర్మవిత్ = ధర్మవేత్తౖయెన
భావం:-
 ధర్మవేత్తౖయెన ఆ మునికుమారుడు తన పుణ్యకర్మల ఫలమువలన దివ్యరూపము ధరించి దేవేంద్రునితో కూడ వెంటనే స్వర్గలోకమునకు వెళ్లెను. –
2.64.49
అనుష్టుప్
ఆబభాషే చ వృద్ధౌ తౌ
సహ శక్రేణ తాపసః ।
ఆశ్వాస్యచ ముహూర్తం తు
పితరౌ వాక్యమబ్రవీత్॥
టీక:-
 ఆబభాషే చ = ఓదార్పు మాటలు పలికి; చ = ఇంకనూ; వృద్ధౌ = వృద్ధులజంట; తౌ = వారితో; సహ = సమేతుడై; శక్రేణ = ఇంద్రునితో; తాపసః = ముని కుమారుడు; ఆశ్వాస్య = ఓదార్చి; చ = మఱి; ముహూర్తం = క్షణకాలము; తు = పాటు; పితరౌ = తల్లిదండ్రులను గూర్చి; వాక్యమ్ = కొన్నిమాటలు; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 ఇంద్రసమేతుడైన ఆ మునికుమారుడు ఆ వృద్ధులైన తల్లిదండ్రులతో మాటలాడెను. క్షణకాలము పాటు వారితో కొన్ని ఓదార్పు మాటలు, పలికెను.
2.64.50
అనుష్టుప్
స్థానమస్మి మహత్ప్రాప్తో
భవతోః పరిచారణాత్ ।
భవంతావపి చ క్షిప్రమ్
మమ మూలముపైష్యతః॥
టీక:-
 స్థానమ్ = స్థానమును; అస్మి = నేను; మహత్ = ఉత్తమ; ప్రాప్తః = పొందగలిగితిని; భవతః = మీకు; పరిచారణాత్ = సేవ చేయుటవలన; భవన్తౌ అపి చ = మీరు ఇరువురు; అపి = కూడా; చ = మఱి; క్షిప్రమ్ = శీఘ్రముగా; మమ =; మూలమ్ = స్థానమునకు; ఉపైష్యతః = రాగలరు.
భావం:-
 మీకు సేవ చేయుటవలన నేను ఉత్తమస్థానమును పొందగలిగితిని. మీరు కూడ శీఘ్రముగ నేనుండు స్థానమునకు రాగలరు.
2.64.51
అనుష్టుప్
ఏవముక్త్వా తు దివ్యేన
విమానేన వపుష్మతా ।
ఆరురోహ దివం క్షిప్రమ్
మునిపుత్రో జితేంద్రియః॥
టీక:-
 ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; తు = వెళ్ళెను; దివ్యేన = దివ్యమైన; విమానేన = విమానముపై; వపుష్మతా = చూడచక్కనిది; ఆరురోహ = అధిరోహించి; దివం = స్వర్గమునకు; క్షిప్రమ్ = వెంటనే; మునిపుత్రః = ముని కుమారుడు; జితేంద్రియః = ఇంద్రియజయము కలవాడైన.
భావం:-
 జితేంద్రియుడైన ఆ మునికుమారుడు ఇట్లు పలికి, వెంటనే అందమైన దివ్యవిమానము ఎక్కి స్వర్గమునకు వెళ్లెను.
*గమనిక:-
 వపుషా- వపుషాయ రూపార్థ దర్షతం దర్షనీయమ్. ఇతి తద్భాష్యె సాయణః.
2.64.52
అనుష్టుప్
స కృత్వా తూదకం తూర్ణమ్
తాపసస్సహ భార్యయా ।
మామువాచ మహాతేజాః
కృతాంజలిముపస్థితమ్॥
టీక:-
 స = ఆయన; కృత్వా = పూర్తిచేసిన; తు = పిమ్మట; ఉదకం = జలతర్పణములు; తూర్ణమ్ = వెంటనే; తాపసః = ముని; సహ భార్యయా = భార్యా సమేతుడై; మామ్ = నాతో; ఉవాచ = పలికెను; మహాతేజాః = గొప్ప తేజస్సు గల; కృతాంజలిమ్ = ఘటించిన అంజలి గలవాడినై ; ఉపస్థితమ్ = నిలిచి ఉన్న.
భావం:-
 ఆ ముని భార్యసమేతుడై, జలతర్పణములు త్వరగా ముగించుకొనెను. దగ్గరనే అంజలి ఘటించి నిలిచి ఉన్న నాతో ఆ గొప్ప తేజశ్శాలి ఇట్లనెను.
2.64.53
అనుష్టుప్
“అద్యైవ జహిం మాం రాజన్!
మరణే నాస్తి మే వ్యథా ।
యచ్ఛరేణైకపుత్రం మామ్
త్వమకర్షీరపుత్రకమ్॥
టీక:-
 అద్య + ఏవ = ఇప్పుడే; జహి = చంపుము; మాం = నన్ను; రాజన్ = ఓ రాజా; మరణే = మరణములు; నాస్తి = లేదు; మే = నాకు; వ్యథా = బాధ; అపి చ = ఇంకను; యత్ = ఏ కారణంగా; శరేణ = బాణముతో; ఏక = ఏకైక; పుత్రం = కుమారుని; మామ్ = నా యొక్క; త్వమ్ = నీవు; అకర్షీః = చంపివేసి; అపుత్రకమ్ = పుత్రుడు లేనివానిగా.
భావం:-
 రాజా! నాకు మరణ భయము లేదు. నన్ను కూడ ఇప్పుడే చంపివేయుము. బాణముచే నా ఏకైక పుత్రుని చంపి నన్ను పుత్రుడు లేనివానిగా చేసితివి కదా!
2.64.54
అనుష్టుప్
త్వయా తు యదవిజ్ఞానాత్
నిహతో మే సుతశ్శుచిః ।
తేన త్వామభిశప్స్యామి
సుదుఃఖమతిదారుణమ్॥
టీక:-
 త్వయా = నీ; తు = చేత; యద్ = ఏ కారణం చేత; అవిజ్ఞానాత్ = తెలియక; నిహతః = చంపబడినను; మే = నా; సుతః = కుమారుడు; శుచిః = పవిత్రుడైన; తేన = ఆ కారణముగా; త్వామ్ = నీకు; అభిశప్స్యామి = శాపమును ఇచ్చెదను; సుదుఃఖమ్ = మిక్కిలి దుఃఖము కలుగునట్లు; అతిదారుణమ్ = అత్యంత భయంకరమైన
భావం:-
 నీవలన తెలియక కాని మరే కారణముచేతనైతేనేమి పవిత్రుడైన నా కుమారుడు చంపిబడెను. అందుచేత, నీకు చాల దుఃఖము కలుగునట్లు అత్యంత భయంకరమైన శాపమును ఇచ్చెదను.
2.64.55
అనుష్టుప్
పుత్రవ్యసనజం దుఃఖమ్
యదేతన్మమ సామ్ప్రతమ్ ।
ఏవం త్వం పుత్రశోకేన
రాజన్కాలంకరిష్యసి॥
టీక:-
 పుత్ర వ్యసనజం = పుత్ర శోకముతో; దుఃఖమ్ = దుఃఖమును; యత్ + ఏతత్ = ఏ విధముగా; మమ = నాకు; సామ్ప్రతమ్ = ఇప్పుడు; ఏవం = ఆ విధముగా; త్వం = నీవు; పుత్రశోకేన = పుత్రశోకముతో; రాజన్ = ఓ రాజా; కాలంకరిష్యసి = కాలంచేసెదవు, మరణించగలవు
భావం:-
 రాజా! ఇపుడు నేను పుత్రశోకముతో బాధపడుచున్నట్లు నీవు కూడా పుత్రశోకముతో బాధపడుచు మరణించగలవు.
2.64.56
అనుష్టుప్
అజ్ఞానాత్తు హతో యస్మాత్
క్షత్రియేణ త్వయా మునిః
తస్మాత్త్వాం నావిశత్యాశు
బ్రహ్మహత్యా నరాధిప॥
టీక:-
 అజ్ఞానాత్ = తెలియకపోవడమను; తు = కారణము చేత; హతః = చంపినాడు; యస్మాత్ = ఏ కారణము చేతను; క్షత్రియేణ = క్షత్రియుడవైన; త్వయా = నీ చేత; మునిః = ముని; తస్మాత్ = ఆ కారణముగా; త్వాం = నీకు; న = కలుగదు; అవిశతి = ఆవేశించుట; అశు = శీఘ్రముగా; బ్రహ్మహత్యా = బ్రహ్మహత్యా దోషము; నరాధిప = ఓ రాజా
భావం:-
 క్షత్రియుడవైన నీవు మునిని తెలియక చంపినావు గాన నీకు బ్రహ్మహత్యా దోషము అంటదు.
2.64.57
అనుష్టుప్
త్వామప్యేతాదృశో భావః
క్షిప్రమేవ గమిష్యతి ।
జీవితాంతకరో ఘోరో
దాతారమివ దక్షిణా॥
టీక:-
 త్వామ్ = నీకు; అపి = కూడా; ఏతాదృశః = అటువంటి; భావః = భావము; క్షిప్రమ్ = తొందర; ఏవ = గనే; గమిష్యతి = పొందగలవు; జీవితాంత = జీవితమును అంతమొందు సమయపు; కరః = జరిమానా; ఘోరః = ఘోరమైన; దాతారమ్ = దాతకు; ఇవ = వలెనే; దక్షిణ = బహుమతి.
భావం:-
 పురోహితునకు, యాజ్ఞికునకు బహుమతిగా ఇచ్చు దక్షిణ ప్రదానము చేసిన దాతను చెందు విధముగనే, నీ జీవితమును అంతమొందించు, ఘోరమైన ఇట్టి పుత్రశోకమను జరిమానా తొందరలోనే నీవు పొందెదవు.
2.64.58
అనుష్టుప్
ఏవం శాపం మయి న్యస్య
విలప్య కరుణం బహు ।
చితామారోప్య దేహం తత్
మిథునం స్వర్గమభ్యయాత్॥
టీక:-
 ఏవం = ఈ విధముగా; శాపం = శాపమును; మయి = నాకు; న్యస్య = పెట్టి; విలప్య = విలపించుచు; కరుణం = దీవముగా; బహు = ఎక్కువగా; చితామ్ = చితిపై; ఆరోప్య = ఎక్కించి; దేహం = దేహమును; తత్ = ఆ; మిథునం = దంపతులు; స్వర్గమ్ = స్వర్గమునకు; అభ్యయాత్ = వెళ్లిరి
భావం:-
 ఆ దంపతులు నన్ను ఈ విధముగా శపించి, చాల దీనముగా విలపించి, తమ శరీరములను చితిపై ఎక్కించి స్వర్గస్థులైరి.
2.64.59
అనుష్టుప్
తదేతచ్ఛింతయానేన
స్మృతం పాపం మయా స్వయమ్ ।
తదా బాల్యాత్కృతం దేవి!
శబ్దవేధ్యనుశిక్షిణా॥
టీక:-
 తత్ = అటువంటి; ఏతత్ = ఇందుకు; చింతయానేన = ఆలోచించుచుండగా; స్మృతం = గుర్తుకు; పాపం = పాపము; మయా స్వయమ్ = స్వయముగా నా చేత; తదా = అప్పుడు; బాల్యాత్ = అజ్ఞానము చేత; కృతం = చేయబడిన ; దేవి = కౌసల్యా; శబ్దవేధి = శబ్దవేధిని; అనుశిక్షిణా = కనుపించని దానిపై బాణప్రయోగము చేసి
భావం:-
 కౌసల్యా! ఈనాడు, ఆలోచించుచుండగా ఆనాడు శబ్దవేధి సాధనలో, అజ్ఞానముచే నేను స్వయముగ చేసిన పాపము నాకు గుర్తుకు వచ్చినది.
2.64.60
అనుష్టుప్
తస్యాయం కర్మణో దేవి!
విపాకస్సముపస్థితః ।
అపథ్యైస్సహసంభుక్తే
వ్యాధిరన్నరసే యథా॥
టీక:-
 తస్య = ఆ; అయం = ఇటువంటి; కర్మణః = పని; దేవి = కౌసల్యా; విపాకః = ఫలితము; సముపస్థితః = వచ్చెను; అపథ్యైః = అనారోగ్యకరమైన ఐహారము; సహ = కలిపి; సంభుక్తే = భుజించిన; వ్యాధిః = వ్యాధిగ్రస్తుడు; అన్నరసే = ఆ ఆహారము; యథా = వలె.
భావం:-
 అపథ్యమైన వస్తువులు కలిసిన అన్నము భుజించిన వ్యాధిగ్రస్థుని ఆ ఆహారాసారము వలెనే నేను చేసిన ఆ అ ఫలితముగా ఈ పరిస్థితి వచ్చినది.
*గమనిక:-అపథ్యము- వ్యాధిగ్రస్తునకు వైద్యుడు, పథ్యము పదార్థములు (ఆరోగ్యకరమైనవి) మాత్రమే భిజింపవలోనని చెప్పును. అపథ్యములు తినవలదని చెప్పును
 
2.64.61
అనుష్టుప్
తస్మాన్మామాగతం భద్రే!
తస్యోదారస్య తద్వచః ।
యదహం పుత్రశోకేన
సంత్యక్ష్యామ్యద్య జీవితమ్॥
టీక:-
 తస్మాత్ = అందువలన; మామ్ = నాకు; ఆగతం = వచ్చినది; భద్రే = కౌసల్యా; తస్య = ఆయొక్క్; ఉదారస్య = గొప్పవాడైన ఆ మునియొక్క; తత్ = ఆ; వచః = శాపము; యత్ = దానివలన; అహం = నేను; పుత్రశోకేన = పుత్రశోకముచేతన్; సంత్యక్ష్యామి = విడిచెజను; అద్య = ఈనాడు; జీవితమ్ = ప్రాణమును
భావం:-
 నేను పుత్రశోకముతో మరణించగలను అని ఆ మునీశ్వరుడు ఆనాడు పెట్టిన శాపము ప్రకారము ఈనాడు నేను పుత్రశోకముచేతనే ప్రాణములు విడిచెదను..
2.64.62
అనుష్టుప్
చక్షుభ్యాం త్వాం న పశ్యామి
కౌసల్యే! సాధు మాం స్పృశ”।
ఇత్యుక్త్వా స రుదంస్త్రస్తో
భార్యామాహ చ భూమిపః॥
టీక:-
 చక్షుభ్యాం = కన్నుల; త్వాం = నిన్ను; న = లేదు; పశ్యామి = చూడగలుగుట; కౌసల్యే = ఓ కౌసల్యా; సాధు = బాగుగా; మాం = నన్ను; స్పృశ = స్పృశించుము; ఇతి + ఉక్త్వా = ఈ విధముగా పలికెను; సః = అతడు; రుదన్ = ఏడ్చుచు; త్రస్తో = భయంకరముగా; భార్యామ్ = భార్యనుగురింటి; ఆహ చ = పిలిచి; భూమిపః = దశరథ మహారాజు;
భావం:-
 నా దృష్టి మందగించినది, నీవు నాకు కనబడుట లేదు. నన్ను స్పృశించుము” అని పలుకుచు, దశరథుడు ఏడ్చుచు, మరల ఆమెతో ఇట్లనెను.
2.64.63
అనుష్టుప్
“ఏతన్మే సదృశం దేవి!
యన్మయా రాఘవే కృతమ్ ।
సదృశం తత్తు తస్యైవ
యదనేన కృతం మయి॥
టీక:-
 ఏతత్ = ఆ చేసిన పని; మే = నాకు; సదృశం = తగినగి; దేవి = దేవీ కౌసల్యా; యత్ = ఏదైతే ఉందో; మయా = నా చేత; రాఘవే = రఘువంశపు వాడైన రామునియందు; కృతమ్ = చేసినది; సదృశం = తగినట్లు ఉన్నది; తత్ = అటువంటిది; తు = నిశ్చయంగా తస్య = అతనికి; ఏవ = మాత్రమే; యత్ = ఎటువంటి; అనేన = అతనిచే; కృతం = చేయబడిన పని; మయి = నా యందు
భావం:-
 కౌసల్యా! రాముని విషయమున నేను చేసిన పని, (అతనిని అరణ్యవాసమునకు పంపివేయుట అనుననది) పాపబుద్ధినైన నాకు తగినట్లు ఉన్నది. రాముడు నా విషయమున చేసినపని, (మారు మాటలాడక అరణ్యమునకు వెళ్లుట అనునది) అతనికే తగును.
2.64.64
అనుష్టుప్
దుర్వృత్తమపి కః? పుత్రమ్
త్యజేద్భువి విచక్షణః ।
కశ్చ? ప్రవ్రాజ్యమానో వా
నాసూయేత్పితరం సుతః॥
టీక:-
 దుర్వృత్తమ్ = చెడ్డవాడు; అపి = అయినప్పటికీ; కః = ఎవరు; పుత్రమ్ = కుమారుని; త్యజేత్ = విడిచిపెట్టెదరు; భువి = ఈ భూప్రపంచంలో; విచక్షణః = తెలివిగలవారు; కః = ఎవడు; చ = పైగా; ప్రవ్రాజ్యమానః = దేశబహిష్కరణ; వా = ఉండును; న = చేయకుండును; ఆసూయేత్ = కోపగించుట; పితరం = తండ్రిని గూర్చి; సుతః = కుమారుడు.
భావం:-
 ఈ లోకములో తెలివిగలవాడు ఎంత చెడ్డవాడైనను కుమారుని విడిచిపెట్టునా? ఏ కుమారుడైనను, తనను ప్రవాసమునకు పంపివేయు తండ్రిపై కోపగించకుండునా?
2.64.65
అనుష్టుప్
యది మాం సంస్పృశేద్రామః
సకృదద్య లభేత వా ।
యమక్షయమనుప్రాప్తా
ద్రక్ష్యంతి న హి మానవాః॥
టీక:-
 యది = లేనిచో; మాం = నన్ను; సంస్పృశేత్ = స్పృశించినను; రామః = రాముడు; సకృత్ = ఒకమారైనా; అద్య = ఇప్పుడు; లభేత సమీపించినా; వా = లేనిచో; యమక్షయమ్ = మరణము; అనుప్రాప్య = పొందిన పిమ్మట; ద్రక్ష్యంతి = చూడగలుగుట; న = ఉండదు; హి = కదా; మానవాః = మానవులు
భావం:-
 నేను మరణించుటకు ముందు ఒకసారైనా రాముడు నన్ను స్పృశించినను లేదా నా దగ్గరకు వచ్చినను బాగుండెడిది. మరణానంతరము మానవులు తమ బంధువులెవరినీ చూడజాలరు కదా!
2.64.66
అనుష్టుప్
చక్షుషా త్వాం న పశ్యామి
స్మృతిర్మమ విలుప్యతే ।
దూతా వైవస్వతస్యైతే
కౌసల్యే త్వరయంతి మామ్॥
టీక:-
 చక్షుషా = కన్నులతో; త్వాం = నిన్ను; హి = కదా; న = లేదు; పశ్యామి = చూడగలుగుట; స్మృతిః = జ్ఞాపక శక్తి; మమ = నాకు; విలుప్యతే = పోవుచున్నది; దూతా = దూతలు; వైవస్వతస్య = యమునియొక్క; ఏతే = ఈ ; కౌసల్యే = ఓ కౌసల్యా; త్వరయంతి = తొందరపెట్టుచున్నారు; మామ్ = నన్ను.
భావం:-
 కౌసల్యా! నా కండ్లకు నీవు కనబడుట లేదు. నా జ్ఞాపకశక్తి తగ్గిపోవుచున్నది. ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందరపెట్టుచున్నారు.
2.64.67
అనుష్టుప్
అతస్తు కిం దుఃఖతరమ్
యదహం జీవితక్షయే ।
న హి పశ్యామి ధర్మజ్ఞమ్
రామం సత్యపరాక్రమమ్॥
టీక:-
 అతః = దీనికి మించిన; తు = నిశ్చయముగా; కిం = ఏది; దుఃఖతరమ్ = మిక్కిలి దుఃఖమైనది; యది = ఇటువంటి; అహం = నేను; జీవితక్షయే = మరణ సమయమున; న = లేదు; హి = కదా; పశ్యామి = చూడగలుగుట; ధర్మజ్ఞమ్ = ధర్మజ్ఞుని; రామం = రాముని; సత్యపరాక్రమమ్ = సత్య పరాక్రమముగలవాని.
భావం:-
 మరణ సమయములో నాకు ధర్మవేత్తయు, సత్యపరాక్రముడును అయిన రాముని చూడలేకపోవుటుంటిని కదా. ఇంతకంటె అధికమైన దుఃఖమేదైనా ఉండునా!
*గమనిక:-
 దుఃఖము- దుఃఖతరము- దుఃఖతమము
2.64.68
అనుష్టుప్
తస్యాదర్శనజశ్శోకః
సుతస్యాప్రతికర్మణః ।
ఉచ్ఛోషయతి మే ప్రాణాన్
వారిస్తోకమివాతపః॥
టీక:-
 తస్య = అటువంటి; అదర్శనజః = కనపడక పోవుటచే కలిగిన; శోకః = కము; సుతస్యా = కుమారునిగూర్చినది; అప్రతికర్మణః = సాటిలేని మహాకార్యములు; ఉత్ = అధికముగ; శోషయతి = ఆవిరిచేయుచుండెను; మే = నా; ప్రాణాన్ = ప్రాణములను; వారిః = నీటి; స్తోకమ్ = బిందువు; ఇవ = వలె; ఆతపః = ఎండకు.
భావం:-
 సాటిలేని మహాకార్యములు చేయగల నా కుమారుడు కనబడక పోవుటచే కలిగిన శోకము. ఎండవేడికి ఆవిరియగు అల్పమైన నీటిబిందువు వలె నా ప్రాణములు ఆవిరిఅదుచుండెను.
2.64.69
అనుష్టుప్
న తే మనుష్యా దేవాస్తే
యే చారుశుభకుండలమ్ ।
ముఖం ద్రక్ష్యంతి రామస్య
వర్షే పంచదశే పునః॥
టీక:-
 న = కాదు; తే = వారు; మనుష్యా = మానవులు; దేవాః = దేవతలు; తే = వారు; యే = ఎవరు; చారు = అందమైన; శుభ = మంగళకరమైన; కుండలమ్ = కుండలములు గల; ముఖం = ముఖమును; ద్రక్ష్యంతి = చూడగలుగువారు; రామస్య = రామునియొక్క; వర్షే = సంవత్సరమునందు; పంచదశే = పదునైదవ; పునః = మరల.
భావం:-
 పదునైదవ సంవత్సరమునందు తిరిగి వచ్చిన రాముని అందమైన కుండల శోభితమైన ముఖమును చూడగులుగువారు దేవతలే, మానవులు కారు.
2.64.70
అనుష్టుప్
పద్మపత్రేక్షణం సుభ్రు
సుదంష్ట్రం చారునాసికమ్ ।
ధన్యా ద్రక్ష్యంతి రామస్య
తారాధిపనిభం ముఖమ్॥
టీక:-
 పద్మపత్రేక్షణం = తామరరేకుల వంటి కన్నులను; సుభ్రు = అందమైన కనుబొమలను; సుదంష్ట్రం = చక్కని పలువరుసను; చారు = చక్కని; నాసికమ్ = ముక్కును; ధన్యా = ధన్యులు; ద్రక్ష్యంతి = చూడగలవారు; రామస్య = రామునియొక్క; తారాధిప = తార + అధిప, చంద్రునికి; నిభం = సమానమైన; ముఖమ్ = ముఖమును.
భావం:-
 తామర రేకుల వంటి కండ్లు, అందమైన కనుబొమలు, చక్కని పలువరుస, చక్కని ముక్కు గల చంద్రమామవంటి మోము గల రాముని, అతడు తిరిగి వచ్చిన తరువాత చూడగలవారు ధన్యాత్ములు.
2.64.71
అనుష్టుప్
సదృశం శారదస్యేంధోః
ఫుల్లస్య కమలస్య చ ।
సుగంధి మమ రామస్య
ధన్యా ద్రక్ష్యంతి తన్ముఖమ్॥
టీక:-
 సదృశం = సరిపోలునది; శారదస్య = శరత్కాలపు; ఇంధోః = చంద్రునకును; ఫుల్లస్య = వికసించిన; కమలస్య = పద్మముయొక్క; చ = వంటి; సుగంధి = మంచివాసన గల; మమ = నా; రామస్య = రాముని యొక్క; ధన్యా = ధన్యులు; ద్రక్ష్యంతి = చూడగలిగినవారు; తత్ = ఆ; ముఖమ్ = ముఖమును.
భావం:-
 శరత్కాల చంద్రునికి సరిపోలునది, వికసించిన పద్మముల వంటి సుగంధ భరితమైన రాముని ముఖమును చూడగలవారు ధన్యులు.
2.64.72
అనుష్టుప్
నివృత్తవనవాసం తమ్
అయోధ్యాం పునరాగతమ్ ।
ద్రక్ష్యంతి సుఖినో రామమ్
శుక్రం మార్గగతం యథా॥
టీక:-
 నివృత్త = ముగించుకుని; వనవాసం = వనవాసమును; తమ్ = వారు; అయోధ్యాం = అయోధ్యకు; పునరాగతమ్ = తిరిగి వచ్చుచుండ; ద్రక్ష్యంతి = చూడగలవారు; సుఖినః = సుఖవంతులు; రామమ్ = రాముని; శుక్రం = అగ్నిదేవుని, అమరకోశః; మార్గగతం = వచ్చుచున్నవాని; యథా = విధముగా.
భావం:-
 వనవాసము ముగించుకొని అయోధ్యకు తిరిగివచ్చుచున్న అగ్నిదేవుడే వస్తున్నవాడా అన్నట్లు ఉన్న రాముని, సుఖవంతులు మాత్రమే చూడగలరు.
2.64.73
అనుష్టుప్
కౌసల్యే! చిత్తమోహేన
హృదయం సీదతీవ మే ।
వేదయే న చ సంయుక్తాన్
శబ్దస్పర్శరసానహమ్॥
టీక:-
 కౌసల్యే = కౌసల్యాదేవీ; చిత్తమోహేన = మనోభ్రాంతి చేత; హృదయం = హృదయము; సీదతి ఇవ = క్రుంగిపోవున్నది; ఇవ = వలె; మే = నా యొక్క; వేదయే = గ్రహింపగలుగుట; న = లేదు; చ = కూడా; సంయుక్తాన్ = కూడియున్నను; శబ్దస్పర్శరసామ్ = శబ్ద, స్పర్శ, రుతి; అహమ్ = నేను.
భావం:-
 కౌసల్యా! చిత్తమోహము చేత నా హృదయము శిథివమగుచున్న్టట్లు ఉన్నది. నా ఇంద్రియములతో కూడి ఉన్ననూ శబ్దము స్పర్శ రుచి ఏదియు గ్రహింపజాలకున్నాను.
2.64.74
అనుష్టుప్
చిత్తనాశాద్విపద్యన్తే
సర్వాణ్యేవేంద్రియాణి మే ।
క్షీణస్నేహస్య దీపస్య
సంసక్తా రశ్మయో యథా॥
టీక:-
 చిత్తనాశాత్ = మనస్సు నశించుటచే; విపద్యన్తే = క్షీణించుచున్నవి; సర్వాణి + ఏవ = అన్నియును; ఇంద్రియాణి = ఇంద్రియములు; మే = నాకు; క్షీణ స్నేహస్య = తైలము క్షీణించుటచే; దీపస్య = దీపము యొక్క; సంసక్తా = నశించుచున్నది; రశ్మయః యథా = కిరణముల వలె
భావం:-
 మనస్సు నశించుటచే నా ఇంద్రియములు అన్నియు, తైలము క్షీణించుటచే దీపపు కాంతి తగ్గునట్లు, నశించుచున్నవి.
2.64.75
అనుష్టుప్
అయమాత్మభవశ్శోకో
మామనాథమచేతనమ్ ।
సంసాదయతి వేగేన
యథా కూలం నదీరయః॥
టీక:-
 అయమ్ = ఇటువంటి; ఆత్మభవః = నా కారణంగా ఏర్పడిన; శోకః = శోకము; మామ్ = నన్ను; అనాథమ్ = రక్షకులు లేనివాడను; అచేతనమ్ = చైతన్య శూన్యుడను; సంసాదయతి = క్షీణింపచేయుచున్నది; వేగేన = ప్రవాహ వేగము చేత; యథా కూలం = ఒడ్డు; నదీ = నది యొక్క; రయః = వడిచేత.
భావం:-
 నదీ ప్రవాహపు వడి తీరమును కూలత్రోసినట్లు పుత్ర వియోగముచే కలిగిన ఈ శోకము రక్షకులెవ్వరూ లేనివాడను, చైతన్య శూన్యుడను అయిన నన్ను క్షీణింపచేయుచున్నది.
2.64.76
అనుష్టుప్
హా రాఘవ! మహాబాహో!
హా మమాఽ యాసనాశన! ।
హా పితృ ప్రియ! మే నాథ!
హాఽ ద్య క్వాసి గతస్సుత॥
టీక:-
 హా = అయ్యో; రాఘవ = రఘురామా; మహాబాహో = ఆజానుబాహుడా; హా = అయ్యో; మమాయాసనాశన = మదీయ దుఃఖనాశకా; హా = అయ్యో; పితృ ప్రియ = తండ్రిమీద మిక్కిలి ఇష్టము కలవాడా; మేనాథ = మద్రక్షకా; హా = అయ్యో; అద్య = నేడు; క్వాసి = ఎక్కడికి; గతః = వెళ్లిపోయినావు; సుత = కుమారా
భావం:-
 అయ్యో రఘురామా! అయ్యో మహాబాహూ! అయ్యో మదీయ దుఃఖనాశకా! అయ్యో పితృప్రియా! అయ్యో మద్రక్షకా! అయ్యో ఇపుడు ఎక్కడి వెళ్లిపోయినావు నాయనా!?
2.64.77
అనుష్టుప్
హా కౌసల్యే నశిష్యామి
హా సుమిత్రే తపస్విని ।
హా నృశంసే మమామిత్రే
కైకేయి కులపాంసని”॥
టీక:-
 హా = అయ్యో; కౌసల్యే = కౌసల్యాదేవీ; నశిష్యామి = మరణించుచున్నాను; హా = అయ్యో; సుమిత్రే = సుమిత్రాదేవీ; తపస్విని = దీనురాలవైన; హా = అయ్యో; నృశంసే = క్రూరురాలా; మమ = నా; అమిత్రే = శక్రువా; కైకేయి = కైకేయి; కులపాంసని = కులమున అపవిత్రము చేసినదానవైన.
భావం:-
 అయ్యో కౌసల్యా! అయ్యో దీనురాలవైన సుమిత్రా! అయ్యో క్రూరురాలవు, నా విరోధివి, కులమున అపవిత్రము చేసినదానవు అయిన కైకేయీ! నేను ఇపుడు మరణించుచున్నాను.”
2.64.78
అనుష్టుప్
ఇతి రామస్య మాతుశ్చ
సుమిత్రాయాశ్చ సన్నిధౌ ।
రాజా దశరథశ్శోచన్
జీవితాంతముపాగమత్॥
టీక:-
 ఇతి = ఈ విధముగా; రామస్య = రామునియొక్క; మాతుః చ = తల్లి కౌసల్యాదేవి; చ = మఱియు; సుమిత్రాయాః = సుమిత్రాదేవి; చ = మఱియు; సన్నిధౌ = సన్నిధిలో; రాజా దశరథః = దశరథ మహారాజు; శోచన్ = విలపించుచు; జీవితాంతమ్ = మరణమును; ఉపాగమత్ = చేరెను.
భావం:-
 దశరథ మహారాజు ఈ విధముగా కౌసల్య సుమిత్రల సమీపమున విలపించుచు మరణించెను.
2.64.79
జగతి
యదా తు దీనం కథయన్నరాధిపః
ప్రియస్య పుత్త్రస్య వివాసనాతురః
గతేఽ ర్ధరాత్రే భృశదుఃఖపీడిత–
స్తదా జహౌ ప్రాణముదారదర్శనః॥
టీక:-
 యదా = ఎప్పుడు; తు = ఐతే; దీనం = దీనముగా; కథయత్ = మాట్లాడుచు; నరాధిపః = దశరథ మహారాజు; ప్రియస్య = ప్రియమైన; పుత్త్రస్య = కుమారుని యొక్క; వివాసన = వనవాసమునకు పోవుటచే; ఆతురః = దుఃఖితు డైనవాడు; గతే = గడచిన పిమ్మట; అర్ధరాత్రే = అర్థరాత్రిసమయము; భృశ = మిక్కిలి; దుఃఖ = దుఃఖముచే; పీడితః = పీడింపబడినవాడై; తదా = అప్పుడు; జహౌ = విడిచెను; ప్రాణమ్ = ప్రాణమును; ఉదార దర్శనః = దీనముగా కనబడుచున్నవాడు.
భావం:-
 పుత్రుడు అరణ్యమునకు పోవుటచే దశరథ మహారాజు దుఃఖార్తుడై ఈ విధముగా బహుదీనుడై, అర్థరాత్రి గడిచిన పిమ్మట అధికమైన దుఃఖముతో ప్రాణములు విడచెను.
2.64.80
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే చతుషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; చతుషష్టితమ [64] = అరవైనాలుగవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [64] అరవైనాలుగవ సర్గ సంపూర్ణము.
2.65.1.అనుష్టుప్
విలప్యాథ తమేవం తు
తూష్ణీంభూతం నరాధిపమ్।
సుప్త ఇత్యవగమ్యార్తా
కౌసల్యా నవ్యబోధయత్॥
టీక:-
 విలప్య = రోదించి; అథ = పిమ్మట; తమ్ = ఆయన; ఏవమ్ = ఈ విధముగ; తు = విశేషముగ, మిక్కిలి; తూష్ణీంభూతం = మిన్నకుండినవాడుకాగా; నరాధిపమ్ = రాజా దశరథుడు; సుప్తః = నిదురించెను; ఇతి = అని; అవగమ్య = భావించి; ఆర్తా = క్షోభచెంది ఉన్న; కౌసల్యా = కౌలవ్య; న = చేయలేదు; వ్యబోధయత్ = మేల్కొలుపుట.
భావం:
 దశరథమహారాజు ఇట్లు రోధించి రోధించి మిన్నకుండెను. అసలే దుఃఖములో నున్న కౌసల్యాదేవి భర్త అలసిపోయి, నిద్రించెనని భావించి మేల్కొలుపలేదు.
2.65.2.అనుష్టుప్
అనుక్తైవ చ భర్తారం
కించిచ్ఛోకశ్రమాలసా।
సుష్వావ శయనే భూయః
పుత్రశోకార్తమానసా॥
టీక:-
  అనుక్త = పలుకకుండ; ఇవ = మాత్రమే; చ = ఇంక; భర్తారం = భర్తను; కించిత్ = కొద్దిగానైనను; శోకశ్రమ = శోకమువలన కలిగిన శ్రమచేత; అలసా = అలసిపోయినవానిని; సుష్వావ = నిద్రించెను; శయనే = పక్కమీద; భూయః = మరల; పుత్రశోక = పుత్రశోకముచేత; ఆర్త = దుఋఖింతురావైన; మానసా = మనసుకలామె.
భావం:-
 దుఃఖించుటవలన కలిగిన శ్రమచేత అలసిన భర్తను ఏమాత్రమూ పలుకరించలేదు. పుత్రశోకం పీడిస్తుండుటచేత మరల మంచంమెక్కి పరుండెను. సుమిత్ర విషయం కూడ ఇదే అని భావించదగును.
2.65.3.అనుష్టుప్
అథ రాత్య్రాం వ్యతీతాయామ్
ప్రాతరేవాపరేఽహని।
వందినః పర్యుపాతిష్ఠన్
తత్పార్థివ నివేశనమ్॥
టీక:-
 అథ = అటు పిమ్మట; రాత్య్రాం = రాత్రి సమయము; వ్యతీతాయామ్ = గడచిన తరువాత; ప్రాతః = తెల్లవారిన; ఇవ = పూర్తిగా; అపరే = ముందు; అహని = పగలుసమయమున; వందినః = వందివారు; పర్యుపాతిష్ఠన్ = స్తుతించుటకు అచ్చటకు వచ్చిరి; తత్ = ఆ; పార్థివ = రాజాదశరథుని; నివేశనమ్ = భవనములోనికి.
భావం:-
 రాత్రి గడచి తెల్లగాతెల్లవారిన సమయమున సూర్యోదయమునకు ముందే దశరథుని మేల్కొలుపుటకు రాజు గొప్పదనములను వర్ణించుచు స్తుతించుటకు వచ్చిన వందివారు రాజభవనమునకు వచ్చిచేరిరి.
2.65.4.అనుష్టుప్
సూతాః పరమసంస్కారా
మంగలాశ్చోత్తమశ్రుతాః।
గాయకాః స్తుతిశీలాశ్చ
నిగదంతః పృథక్ పృథక్॥
టీక:-
 సూతాః = సూతులు; పరమసంస్కారా = ఉత్తమ సంస్కారము కలిగినవారు; మంగలాః = మంగళవాక్యములు పలుకువారు; చ = ఇంకనూ; ఉత్తమశ్రుతాః = బాగుగా చదువుకున్నవారు; గాయకాః = గాయకులు; స్తుతిశీలాశ్చ = స్తుతించెడివారైన; నిగదంతః = ఉచ్చైస్వరముతో; పృథక్ పృథక్ = వేరువేరుగా
భావం:-
 ఇంకా ఉన్నతమైన చదువులు చదివిన మంగళశాసనములు పలుకువారూ, ఉత్తమ సంస్కారము కల సూతులు, స్తోత్రములు కట్టి పాటలుపాడే గాయకులు అందరూ బిగ్గరగా రాజును స్తుతించుచుండిరి.
*గమనిక:-
 (1) వందివారు- గొప్పదనములు ఉదహరిస్తూ స్తుతించువారు. (2) సూతులు- వంశావళి కీర్తించువారు. (3) మంగళాః- మంగళశాసనములు చదువు వారు. (3) గాయక- పాటలుకట్టి పాడువారు,
2.65.5.అనుష్టుప్
రాజానం స్తువతాం తేషామ్
ఉదాత్తాభిహితాశిషామ్।
ప్రాసాదాఽభోగవిస్తీర్ణః
స్తుతిశబ్దోహ్యవర్తత॥
టీక:-
 రాజానం = రాజును గురించి; స్తువతాం = ప్రశంసలు; తేషామ్ = వారి యొక్క; ఉదాత్త = పెద్ద ధ్వనితో; అభిహిత = పలుకుచున్న; ఆశిషామ్ = ఆశీస్సులు; ప్రాసాద = రాజభవనముయొక్క; ఆభోగ = విస్తారముగా; విస్తీర్ణః = ప్రదేశమునందు; స్తుతిశబ్దః = స్తుతుల ధ్వని; హి = విశేషముగా; అవర్తత = వ్యాపించెను
భావం:-
 రాజును ప్రశంసించుచు, పెద్ద ధ్వనితో పలుకుతున్న వారి ఆశీస్సులు.. అనగా స్తోత్ర ధ్వని ప్రాసాదము యొక్క విశాల ప్రదేశమునందు వ్యాపించెను.
2.65.6.అనుష్టుప్
తతస్తు స్తువతాం తేషామ్
సూతానాం పాణివాదకాః।
అవదానాన్యుదాహృత్య
పాణివాదా న్యవాదయన్॥
టీక:-
 తతః = అప్పుడు; తు = ఇంకను; స్తువతాం = స్తుతించుచుండగా; తేషామ్ = ఆయొక్క; సూతానాం = సూతులు; పాణివాదకాః = పాణిఘుడు, చేతులతో తాళమువేయువాడు, ఆంధ్రవాచస్పదము, ఆంధ్రశబ్దరత్నాకరము; అవదానాని = ప్రశస్తమైన కర్మలను, పనులను; ఉదాహృత్య = ఉదహరింపబడిన; పాణివాదాన్ = తాళములు; అవాదయన్ = చరిచిరి.
భావం:-
 అలా సూతులు స్తుతించుచుండగా, చేతులతో తాళము వేయువారు ఉదహరింపబడిన దశరథుడు పూర్వము చేసిన ప్రశస్తమైన కృత్యములకు, తాళములు చరిచిరి.
*గమనిక:-
 (1) పాణివాదకుడు- సం. విణ. చేతులతో తాళము వేయువాడు, వ్యుత్పత్తి. పాణి+వద+ణ్వుల్- అక, కృ.ప్ర. (2) పాణివాదాన్యవాదయన్- పాణివాదాన్+ అవాదయన్,
2.65.7.అనుష్టుప్
తేన శబ్దేన విహగాః
ప్రతిబుద్ధా విసస్వనుః।
శాఖాస్థాః పంజరస్థాశ్చ
యే రాజకులగోచరాః॥
టీక:-
 తేన = ఆ; శబ్దేన = శబ్దముచేత; విహగాః = పక్షులు; ప్రతిబుద్ధా = మేల్కొని; విసస్వనుః = రొద చేయుట ప్రారంభించెను; శాఖాస్థాః = చెట్లకొమ్మల మీద; పంజరస్థాశ్చ = పంజరాలలో ఉన్న; యే = ఏవైతే; రాజకుల = రాచగృహములో; గోచరాః = ప్రాంతములోనివి. ఆప్ట డిక్షనరీ.
భావం:-
  ఆ శబ్దమునకు మేల్కొని రొద చేయుట ప్రారంభించెను. రాచనగర ప్రాంతముల చెట్లకొమ్మల మీద, పంజరములలోను ఉన్న పక్షులన్నియు
2.65.8.అనుష్టుప్
వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ
వీణానాం చాపి నిస్స్వనాః।
ఆశీర్గేయం చ గాథానామ్
పూరయామాస వేశ్మ తత్॥
టీక:-
 వ్యాహృతాః = ఉచ్చరించబడిన; పుణ్య = పవిత్రములైన; శబ్దః = పలుకులు; చ = మఱియు; వీణానాం = వీణ నుండి; చ = మఱియు; అపి = కూడా; నిస్స్వనాః = ధ్వనులు; ఆశీః = ఆశీర్వాద రూప; గేయం = పాటలు; చ = మఱియు; గాథానామ్ = గాథ అను ఛందోనిబద్ధ రచనలతో; పూరయామాస = నింపివేసినవి; వేశ్మ = గృహమును; తత్ = ఆ
భావం:-
 రాజగృహమును ఉచ్చరించిన పుణ్యాహవచనములులోని, పవిత్రములైన పలుకులు, వీణధ్వనులు, ఆశీర్వాద రూప గాథాఛందోనిబద్ధ గేయములు, ఆ గృహమును నింపివేసినవి.
2.65.9.అనుష్టుప్
తతశ్శుచిసమాచారాః
పర్యుపస్థానకోవిదాః।
స్త్రీవర్ష ధరభూయిష్ఠా
ఉపతస్థుర్యథాపురమ్॥
టీక:-
 తతః = అప్పుడు; శుచి = పరిశుద్ధమైన; సమాచారాః = మంచి ఆచారము కల; = పర్యుపస్థాన = రాజాస్థానమందు; కోవిదాః = నిపుణులు; స్త్రీ= స్త్రీలు; వర్ష = స్త్రీలు, కంచుకులు; ధరభూయిష్ఠా = రాజా దశరథుని; ఉపతస్థుః = సేవించుటకు; యథాపురమ్ = పూర్వము వలె
భావం:-
 పిమ్మట పరిశుద్ధమైన ఆచారము కలవారు, రాజసేవయందు నిపుణులు, అయిన జనులు ఎప్పటి వలెనే దశరథుని సేవించుటకు వచ్చిరి. వారిలో స్త్రీలును, కంచుకులును అధిక సంఖ్యలో ఉండిరి.
2.65.10.అనుష్టుప్
హరిచందనసంసృక్తమ్
ఉదకం కాంచనైర్ఘటైః।
ఆనిన్యుస్నానశిక్షాజ్ఞా
యథాకాలం యథావిధి॥
టీక:-
 హరిచందన సంసృక్తమ్ = మంచి గంధము కలిపిన; ఉదకం = నీటిని; కాంచనైః ఘటైః = బంగారు కలశములలో; ఆనిన్యుః = తీసికొనివచ్చిరి; స్నాన శిక్షాజ్ఞా = స్నానము చేయించుటలో నేర్పు గలవారు; యథాకాలం = కాలానుగుణముగా; యథావిధి = నియమానుసారముగా
భావం:-
 స్నానము చేయించుటలో నేర్పు గల పరిచారకులు, బంగారు కలశములలో మంచి గంధము కలిపిన నీటిని కాలానుగుణమైన, పద్ధతి ప్రకారముగా, తీసికొని వచ్చిరి.
2.65.11.అనుష్టుప్
మంగళాలంభనీయాని
ప్రాశనీయాన్యుపస్కరాన్।
ఉపనిన్యుస్తథాప్యన్యాః
కుమారీ బహుళాః స్త్రియః॥
టీక:-
 మంగళ = మంగళకరమైనవాటిని; ఆలంభనీయాని = స్పర్శించుటకు తగిన వాటిని; ప్రాశనీయాని = తినదగిన ఆహారపదార్థములను; ఉపస్కరాన్ = భుజించుటకు వలసిన ఆధరవులను; ఉపనిన్యుః = తీసుకువచ్చిరి; తథాపి = ఆ విధముగా; అన్యాః = కొందరు; కుమారీ = కుమారీవయస్కులు; బహుళాః = చాలా ఎక్కువమంది; స్త్రియః = స్త్రీలు
భావం:-
 మరికొందరు కుమారీ వయుస్సు స్త్రీలు చాలామంది, స్పర్శించుటకు తగిన శుభకరములైన పసుపు గోవులు మున్నగునవి, తినుబండారములను మఱియు వలయు కూరలు పచ్చళ్ళు మున్నగు ఆధరవులను తీసుకొని వచ్చిరి.
2.65.12.అనుష్టుప్
సర్వలక్షణసమ్పన్నమ్
సర్వం విధివదర్చితమ్।
సర్వం సుగుణలక్ష్మీవత్
తద్బభూవాభిహారికమ్॥
టీక:-
 సర్వ = సకల; లక్షణ = మంచి లక్షణములు; సమ్పన్నమ్ = సమృద్ధిగా కలవి; సర్వం = అన్నియు; విధివత్ = పద్దతిప్రకారము; అర్చితమ్ = సమర్పించబడినవి; సర్వం = అవి అన్నియు; సుగుణ = మిక్కిలి నాణ్యము; లక్ష్మీవత్ = శోభకలవి; తత్ = ఆ; అభూవ = ఐనవి; అభిహారికమ్ = అతని వద్దకు తీసుకువచ్చినవి.
భావం:-
 దశరథ మహారాజు కొరకై, అలావారు విశిష్ఠమైన పదార్థములను సమృద్దిగా తీసికొని వచ్చి పద్దతిప్రకారం వడ్డించిరి. ఆ తీసుకువచ్చిన వదార్థములు అన్నియు, మిక్కిలి నాణ్యమైనవి, ప్రకాశవంతమైనవి.
2.65.13.అనుష్టుప్
తతస్సూర్యోదయం యావత్
సర్వం పరిసముత్సుకమ్।
తస్థావనుపసంప్రాప్తమ్
కింస్విదిత్యుపశంకితమ్॥
టీక:-
 తతః = అటు పిమ్మట; సూర్యోదయం = సూర్యోదయము వరకు; యావత్ = పూర్తిగా; సర్వం = పరిజనమందరును; పరిసముత్సుకమ్ = మిక్కిలి ఉత్కంఠతో; తస్థౌ = అక్కడనే వేచి ఉండిరి; అనుపః = దగ్గఱగాకానిది; సంప్రాప్తమ్ = పొందుట; కిం = ఏమి; స్విత్ = ఐనదా; ఇతి = అని; ఉపశంకితమ్ = శంకించుచు
భావం:-
 ఆ పరిజనమంతయు, రాజుకు దగ్గరగా మాత్రము వెళ్లక, ఉత్కంఠతో ఏమైనదా అని శంకించుచు, తెల్లారి పూర్తగా సూర్యుడు వచ్చు వరకు అట్లే వేచి ఉండిరి.
2.65.14.అనుష్టుప్
అథ యాః కోసలేంద్రస్య
శయనం ప్రత్యనంతరాః।
తాః స్త్రియస్తు సమాగమ్య
భర్తారం ప్రత్యబోధయన్॥
టీక:-
 అథ = అప్పుడు; యాః = ఎవరైతే; కోసలేంద్రస్య = దశథునియొక్క; శయనం ప్రతి = శయనము వైపుగా; అనంతరాః = ఆటంకము లేకుండా వెళ్ళగల వారు; తాః = ఆ; స్త్రియస్తు = స్త్రీలే; సమాగమ్య = దగ్గరకు చేరిరి; భర్తారం = వారి ప్రభువును; ప్రత్యబోధయన్ = నిద్ర లేపుటకు
భావం:-
 అటుపిమ్మట, దశరథ మహారాజు శయనము దగ్గరకు వెళ్లుటకు అర్హత గల స్త్రీలు, మేల్కొలుపుటకు దగ్గరకు వెళ్లిరి.
2.65.15.అనుష్టుప్
తథాప్యుచితవృత్తాస్తా
వినయేన నయేన చ।
నహ్యస్య శయనం స్పృష్ట్వా
కించిదప్యుపలేభిరే॥
టీక:-
 తథాపి = అటు పిమ్మట; ఉచిత = తగినరీతిని; వృత్తాః = ప్రవర్తించెడి; తాః = ఆ స్త్రీలు; వినయేన = వినయముతోను; నయేన = మృదువుగాను; చ = మఱియు; నహి = లేదు; అస్య = దశరథుని యొక్క; శయనం = మంచమును; స్పృష్ట్వా = స్పృశించినను; కించిదపి = కొంచమైనను; ఉపలేభిరే = తెలుసుకొనుట
భావం:-
 వినయముగా, మృదువుగా ఉచితరీతిని ప్రవర్తించు ఆ స్త్రీలు దశరథుని మంచము స్పృశించి చూచినను ఏమియును తెలుసుకొనలేకపోయిరి.
2.65.16.అనుష్టుప్
తాః స్త్రియస్స్వప్నశీలజ్ఞాః
చేష్టాసంచలనాదిషు।
తా వేపథుపరీతాశ్చ
రాజ్ఞః ప్రాణేషు శంకితాః।
ప్రతిస్రోతస్తృణాగ్రాణామ్
సదృశం సంచకాశిరే॥
టీక:-
 తాః = అటువంటి; స్త్రియః = స్త్రీలు; స్పప్న = స్వప్నాది, జాగ్రత్, స్వప్న, సుషుప్తి; శీలజ్ఞాః = అవస్థలు గుఱించిన; జ్ఞాః = తెలిసిన వారు; చేష్ట = నడవడి; సంచలన = కదలికలను; ఆదిషు = మున్నగునవి; తాః = అటువంటి స్త్రీలు; వేపథుపరీతాః = వణికిపోవుచు; చ = ఇంకనూ; రాజ్ఞః = రాజు యొక్క; ప్రాణేషు = ప్రాణముల విషయమున; శంకితాః = శంకతో; ప్రతిస్రోతః = ఎదురు ప్రవాహములకు; తృణాగ్రాణామ్ = గడ్డి కొనల; సదృశం = వలె; సంతకాశిరే = ప్రకాసించిరి, ఉండిరి.
భావం:-
 ఆ స్త్రీలు చేష్టలను, కదలికలను బట్టి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను స్పనాది అవస్థలు గ్రహించగలిగినవారు. అట్టి ఆ స్త్రీలు, రాజు ప్రాణముల విషయమున శంకతో, ప్రవాహమునకు ఎదురుగా నిలచిన తృణముల చివరి భాగములు వణకిపోసాగిరి.
2.65.17.అనుష్టుప్
అథ సందేహమానానామ్
స్త్రీణాం దృష్ట్వా చ పార్థివమ్।
యత్తదాశంకితం పాపమ్
తస్య జజ్ఞే వినిశ్చయః॥
టీక:-
 అథ = అటు పిమ్మట; సందేహమానానామ్ = సందేహించుచున్న; స్త్రీణాం = స్త్రీలు; దృష్ట్వా చ = చూచిన పిమ్మట; పార్థివమ్ = రాజును; యత్ + తదాశంకితం = ఏది శంకించిరో ఆ; పాపమ్ = పాపమును; తస్య = అది; జజ్ఞే వినిశ్చయః = నిశ్చితమాయెను
భావం:-
 రాజును చూచిన పిమ్మట, సందేహించుచున్న స్త్రీలు ఏ పాపమును శంకించిరో అది నిశ్చితమాయెను. అనగా రాజు మరణించెనని తెలిసెను.
2.65.18.అనుష్టుప్
కౌసల్యా చ సుమత్రచ
పుత్రశోకపరాజితే।
ప్రసుప్తే న ప్రబుధ్యేతే
యథా కాలసమన్వితే॥
టీక:-
 కౌసల్యా = కౌసల్యమఱియు; సుమత్ర= సుమిత్ర; చ = మఱియు; పుత్రశోక = పుత్రశోకమునకు; పరాజితే = లొంగినవారై; ప్రసుప్తే న = నిద్రపోవుచున్న; న = లేదు; ప్రబుధ్యేతే = మేల్కొనృ; యథా = వలె; కాలసమన్వితే = మరణించినవారి.
భావం:-
  ఆ సమయమున పుత్ర శోకమున మునిగి ఉన్న కౌసల్యాసుమిత్రలు మరణించిన వారి వలె గాఢనిద్రలో పడి ఉండుటవలన మేల్కొనలేదు.
2.65.19.అనుష్టుప్
నిష్ప్రభా చ వివర్ణా చ
సన్నా శోకేన సన్నతా।
న వ్యరాజత కౌసల్యా
తారేవ తిమిరావృతా॥
టీక:-
 నిష్ప్రభా = కాంతివిహీనురాలై; చ = మఱియు; వివర్ణా = వెలవెల యినదై; సన్నా = క్రుంగి; శోకేన = శోకము చేత; సన్నతా = వంగినదై; న = లేదు; వ్యరాజత = ప్రకాశించుట; కౌసల్యా = కౌసల్య; తారా = తారల; ఇవ = వలె; తిమిర = చీకటి; ఆవృతా = కమ్మినవైన.
భావం:-
 కౌసల్య శోకము చేత, కాంతివిహీనురాలై, వెలవెలెబోయినదై, క్రుంగి, కృశించి ఉండుటచే, చీకటి కమ్మిన నక్షత్రమువలె ప్రకాశించుటలేదు.
2.65.20.అనుష్టుప్
కౌసల్యాఽనంతరం రాజ్ఞః
సుమిత్రా తదనంతరమ్।
న స్మ విభ్రాజతే దేవీ
శోకాశ్రులులితాననా॥
టీక:-
 కౌసల్యా = కౌసల్య; అనంతరం = తరువాత; రాజ్ఞః = రాజుభార్య, రాణి; సుమిత్రా = సుమిత్ర కూడా; తదనంతరమ్ = ఆతరువాత; న = లేదు; స్మ = సుమీ; విభ్రాజతే = ప్రకాశవంతమై; దేవీ = రాణీసుమిత్రాదేవి; శోక = దుఃఖముచే కలిగిన; అశ్రు = కన్నీటిచే; లులిత = చెదిరిన; ఆననా = ముఖముకలదై
భావం:-
  కౌసల్యాదేవి తరువాతి రాణి ఐన సుమిత్రాదేవి, కౌసల్యాదేవి తోపాటు సుమిత్రాదేవి కూడా దుఃఖాశ్రువులచే వ్యాకులములైన ముఖముతో ప్రకాశ హీనురాలై ఉండెన.
2.65.21.అనుష్టుప్
తే చ దృష్ట్వా తథా సుప్తే
శుభే దేవ్యౌ చ తం నృపమ్।
సుప్తమేవోద్గతప్రాణమ్
అంతఃపురమమన్యత॥
టీక:-
 తే = వారు; చ = కూడా; దృష్ట్వా = చూచి; తథా = ఆ విధముగా; సుప్తే శుభే = నిద్రపోవుచున్న; దేవ్యౌ = రాణులిద్దరిని; చ = మఱియు; తం = ఆ; నృపమ్ = రాజును; సుప్తమ్వ = నిద్రలోనే; ఉద్గత = పోయెనని; ప్రాణమ్ = ప్రాణము; అంతఃపురమ్ = అంతఃపుర జనులు; అమన్యత = తలచిరి (తెలుసుకొనిరి)
భావం:-
 ఆ విధముగా నిద్రపోవుచున్న రాణులిద్దరిని, ఆ రాజును చూచి, రాజు నిద్రలోనే మరణించెనని అంతఃపుర జనులు తలచిరి (తెలుసుకొనిరి)
2.65.22.అనుష్టుప్
తతః ప్రచుక్రుశుర్దీనాః
సస్వరం తా వరాంగనాః।
కరేణవైవ అరణ్యే
స్థాన ప్రచ్యుత యూథపాః॥
టీక:-
 తతః = అప్పుడు; ప్రచుక్రుశుః = బిగ్గరగా; దీనాః = దీనముగా; సస్వరం = స్వరయుక్తముగా; తాః = ఆ; వరాంగనాః = ఉత్తమస్త్రీలందరును; కరేణవః = ఆడ ఏనుగులు; ఇవ = వలె; అరణ్యే = అరణ్యములో; స్థాన = తన స్థానమునుండి; ప్రచ్యుత = దూరమైన, భష్టమైన; యూథపాః = గుంపు నాయక గజము.
భావం:-
 పిమ్మట ఆ స్త్రీలందరును, అరణ్యములో తమ గుంపుకు నాయకుడైన గజము దూరమైపోయినపుడు ఆడ ఏనుగులు ఏడ్చినట్లు బిగ్గరగా, సుస్వరముగా ఏడ్చిరి.
*గమనిక:-
స్త్రీలు మరణించినవారు చేసిన మేళ్ళు మున్నగునవి తలుస్తూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తారు అది ఒక స్వరబద్దము వలె వినబడును కనుక దానిని సుస్వరము అని ఉండవచ్చును.
2.65.23.అనుష్టుప్
తాసామాక్రందశబ్దేన
సహసోద్ధతచేతనే।
కౌసల్యా చ సుమిత్రా చ
త్యక్త నిద్రే బభూవతుః॥
టీక:-
 తాసామ్ = ఆ స్త్రీల; ఆక్రంద = ఏడుపుల; శబ్దేన = ధ్వని చేత; సహసా = హఠాత్తుగా; ఉద్గత = కలిగి; చేతన = తెలివి; కౌసల్యా = కౌసల్య; చ = మఱియు; సుమిత్రా = సుమిత్ర; చ = మఱియు; త్యక్త = విడిచి; నిద్రే = నిద్రను; బభూవతుః = ఇద్దరును మేల్కొనిరి
భావం:-
 ఆ స్త్రీల ఆక్రందన ధ్వనిచేత హఠాత్తుగా తెలివి వచ్చి, కౌసల్యాసుమిత్రలు నిద్రనుండి మేల్కొనిరి.
2.65.24.అనుష్టుప్
కౌసల్యా చ సుమిత్రా చ
దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివమ్।
“హా నా”థేతి పరిక్రుశ్య
పేతతుర్ధరణీతలే॥
టీక:-
 కౌసల్యా = కౌసల్య; చ = మఱియు; సుమిత్రా = సుమిత్ర; చ = మఱియు; దృష్ట్వా = చూచి; స్పృష్ట్వా = స్పృశించి; చ = మఱియు; పార్థివమ్ = మహారాజును; హా నాథ = హా నాథా; ఇతి = అనుచు; పరిక్రుశ్య = అరచి; పేతతుః = పడిపోయిరి; ధరణీతలే = నేల మీద
భావం:-
 కౌసల్యాసుమిత్రలు, ఆ దశరథ మహారాజును చూచి, స్పృశించి।హా నాథా! అని అరచుచు నేలపై పడిపోయిరి.
2.65.25.అనుష్టుప్
సా కోసలేంద్రదుహితా
వేష్టమానా మహీతలే।
న బభ్రాజ రజోధ్వస్తా
తారేవ గగనాచ్చ్యుతా॥
టీక:-
 సా = ఆ; కోసలేంద్రదుహితా = కోసల రాజకుమార్తె అయిన కౌసల్య; వేష్టమానా = దొరలుచు; మహీతలే = నేలపై; న = లేదు; బభ్రాజ = ప్రకాశించుట; రజః = దుమ్ము; ధ్వస్తా = చెడినదై; తార = నక్షత్రము; ఇవ = వలె; గగనాత్ = ఆకాశము నుండి; చ్యుతా = క్రిందకు పడిన
భావం:-
 నేలపై దొరలుచు దుమ్ముపట్టియున్న కౌసల్య, ఆకాశము నుండి క్రిందికి పడిన నక్షత్రము వలె, కాంతివిహీన అయి ఉండెను.
*గమనిక:-
కౌసల్యాదేవి- మగథ సామ్రాజ్యపు (కోసల) రాజు సుకౌశలుడు, మహారాణి అమృతప్రభ వారి పుత్రిక కౌసల్యాదేవి. దశరథుడు మొదటగా సుకౌశలుని మిత్రరాజ్యముగా ఉండమని ఆహ్వానించెను. అందుకు ఆసన అంగీకరించలేదు. అంత దశరథుడు అతనిమీద దండెత్తి ఓడించెను. అప్పుడు, సుకౌశలుడు తన కుమార్తెను దశరథునికి ఇచ్చి వివాహముచేసి సంధిచేసుకొనెను. అటుల, కౌసల్య దశరథుని ప్రథమ పట్టమహిషి ఆయెను. దశరథునికి ఈమె కడుపుననే శ్రీరామచంద్రునిగా శ్రీమహావిష్ణువు అవతరించెను. శ్రీ విళంబినామ సంవత్సరము చైత్ర శుద్ధ నవమి పునర్వసూ నక్షత్రమున కర్కాటక లగ్నమునందు ఆ రఘుకుల తిలకుడైన శ్రీరాముని దశరథుడు కౌసల్యాదేవి యందు. సౌజన్యము వికీపీడియా.
2.65.26.అనుష్టుప్
నృపే శాంతగుణే జాతే
కౌసల్యాం పతితాం భువి।
అపశ్యంస్తాః స్త్రియః సర్వా
హతాం నాగవధూమివ॥
టీక:-
 నృపే = దశరథ మహారాజు; శాంతగుణే =శాంతించిన వేడి మున్నగు గుణములు కలవాడు; జాతే = కాగా; కౌసల్యాం = కౌసల్యను; పతితాం = పడినది; భువి = నేలపై; అపశ్యన్ = కనపడెను; తాః = ఆయొక్క; స్త్రియః = స్త్రీలకు; సర్వా = అందరికిని; హతాం = చంపబడి; నాగవధూమ్ + ఇవ = ఆడ ఏనుగు వలె
భావం:-
 నేలపై పడి ఉన్న కౌసల్య అక్కడి స్త్రీలకందరికిని, చంపబడి నేలపై పడి ఉన్న ఆడ ఏనుగు వలె కనబడెను.
2.65.27.అనుష్టుప్
తతస్సర్వా నరేంద్రస్య
కైకేయీప్రముఖాః స్త్రియః।
రుదంత్యశ్శోకసంతప్తా
నిపేతుర్గతచేతనాః॥
టీక:-
 తతః = పిమ్మట; సర్వే = అందరు; నరేంద్రస్య = దశరథ మహారాజు యొక్క; కైకేయీ = కైకేయి; ప్రముఖాః = మొదలైనవారు; స్త్రియః = భార్యలందరు; రుదంత్యః = విలపించుచు; శోకసంతప్తా = దుఃఖముచేత పీడితులై; నిపేతుః = పడిపోయిరి; గతచేతనాః = స్పృహ తప్పి
భావం:-
 కైకేయి మొదలైన రాజుభార్యలందరును, ఏడ్చుచు, దుఃఖముచే పీడితులై, స్పృహ తప్పిపోయిరి.
2.65.28.అనుష్టుప్
తాభిస్స బలవాన్నాదః
క్రోశంతీభిరనుద్రుతః।
యేన స్ఫీతీకృతం భూయః
తద్గ్గృహం సమనాదయత్॥
టీక:-
 తాభిః = ఆ స్త్రీల చేత; స = ఆ; బలవాన్ = అత్యధికమైన; నాదః = శబ్దము; క్రోశంతీభిః = ఏడ్చుచున్న; అనుద్రుతః = అనుసరింపబడిన; యేన = దేని చేత; స్ఫీతీకృతం = అధికము చేయబడినదో; భూయః = మరింత; తత్ = ఆ; గృహం = ఇంటిని; సమనాదయత్ = ప్రతిధ్వనించెను
భావం:-
 ఆ స్త్రీలు అవిశ్రాంతంముగా బిగ్గరగా ఏడ్చుచున్న ధ్వనిని గృహము ఇంకను అధికము చేయిటచే గృహమంతయు నిండించెను.
2.65.29.అనుష్టుప్
తత్సముత్త్రస్త సంభ్రాంతం
పర్యుత్సుకజనాకులమ్।
సర్వతస్తుములాక్రందమ్
పరితాపార్తబాంధవమ్॥
టీక:-
 తత్ = ఆ; సముత్త్రస్తః = మిక్కిలి భెదిరినవారు,Monier williams; సమ్భ్రాంతమ్ = గాబరాపడుతున్నావారు; పర్యుత్సుక = అశాంతమైన; జనాః = పరిజనులు; ఆకులమ్ = వ్యాకులురైన; సర్వతః = అంతట; తుముల = కలవరపాటుతో; ఆక్రందమ్ = బిగ్గరగా ఏడ్చుచు; పరితాప = సంతాపముతో; ఆర్త = దుఃఖితులగు; బాంధవమ్ = బంధుజనులందరును
భావం:-
 దశరథుడు మరణించగనే భవనములోని అశాంతికి వ్యాకులతకు లోనైన పరిజనులందరును మిక్కిలి భయవిభ్రాంతులై ఏమి చేయుటకును తోచక గాబరాపడుచుంటిరి. బంధుడనులందరు సంతాప దుఃఖ కలవరపాటులతో బిగ్గరగా ఏడ్చుచుచుండిరి.
2.65.30.అనుష్టుప్
సద్యో నిపతితానందమ్
దీనవిక్లబదర్శనమ్।
బభూవ నరదేవస్య
సద్మ దిష్టాంతమీయుషః॥
టీక:-
 సద్యః = తతక్షణము; నిపతిత = తొలగిపోయిన; ఆనందమ్ = ఆనందముకలవారు; దీన = దైన్యముచే; విక్లబ = బెగ్గటిలినదై; దర్శనమ్ = కనబడుచున్నది; బభూవ = ఆయెను; నరదేవస్య = దశరథ మహారాజుయొక్క; సద్మ = గ-హము, ఆఘాతముతో; దిష్టాంతమ్ = మరణము; ఈయుషః = తెలిసిన;
భావం:-
 దశరథమహారాజు మరణమనే ఆఘాతము తగిలిన వెంటనే అంతఃపురములో ఆనందమమతా ఆవిరైపోయెను. దైన్యముతో బెగ్గటిల్లినది కనబడసాగెను.
2.65.31.జగతి.
అతీతమాజ్ఞాయ తు పార్థివర్షభం
యశస్వినం సమ్పరివార్య పత్నయః।
భృశం రుదంత్యః కరుణం సుదుఃఖితాః
ప్రగృహ్య బాహూ వ్యలపన్ననాథవత్॥
టీక:-
 అతీతమ్ = మరణించెనని; ఆజ్ఞాయ తు = తెలిసిన వెంటనే; పార్థివర్షభం = రాజ శ్రేష్ఠుడై; యశస్వినం = యశఃశాలీ; సమ్పరివార్య = చుట్టుముట్టి; పత్నయః = భార్యలు; భృశం = బిగ్గరగా; రుదంత్యః = ఏడ్చుచు; కరుణం = జాలి కలుగునట్లు; సుదుఃఖితాః = దుఃఖించుచు; ప్రగృహ్య బాహూ = ఒకరి చేతులు ఒకరు పట్టుకొని; వ్యలపత్ = విలపించిరి; అనాథవత్ = అనాథల వలె
భావం:-
 యశఃశాలీ, రాజశ్రేష్ఠుడూ అయిన దశరథుడు మరణించినట్లు తెలియగానే అతని భార్యలు అతనిని చుట్టుముట్టి చాలా దుఃఖించుచు, జాలి కలుగునట్లు ఎక్కువగా ఏడ్చుచు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అనాథలు వలె విలపించిరి.
2.65.32.
గద్య.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే పంచషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; పంచషష్టితమ [65] = అరవైఐదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [65] అరవైఐదవ సర్గ సంపూర్ణము.
2.66.1
అనుష్టుప్
తమగ్నిమివ సంశాంతమ్
అంబుహీనమివార్ణవమ్।
హతప్రభమివాఽదిత్యమ్
స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివమ్॥
టీక:-
 తమ్ = ఆ; అగ్నిమ్ = అగ్ని; ఇవ = వలె; సంశాంతమ్ = మిక్కలి శాంతించిన; అంబు = నీరు; హీనమ్ = లేని; ఇవ = వలె; అర్ణవమ్ = సముద్రము; హత = కోల్పోయిన; ప్రభమ్ = తేజస్సుకలది; ఇవ = వలె; ఆదిత్యమ్ = సూర్యుని; స్వర్గస్థం = మరణించిన; ప్రేక్ష్య = చూచి; పార్థివమ్ = రాజును
భావం:-
 శాంతించిన అగ్ని వలె, నీరు లేని సముద్రము వలె, తేజస్సు పోయిన సూర్యుడు వలె ఉన్న, మరణించిన ఆ రాజు దశరథుని, కౌసల్యాదేవి చూచెను.
2.66.2
అనుష్టుప్
కౌసల్యా బాష్పపూర్ణాక్షీ
వివిధాం శోకకర్శితా।
ఉపగృహ్య శిరో రాజ్ఞః
కైకేయీం ప్రత్యభాషత॥
టీక:-
 కౌసల్యా = కౌసల్య; బాష్పపూర్ణాక్షీ = కన్నీళ్లతో నిండిన కన్నులు గలది ; వివిధాం = అనేక విధములైన; శోకకర్శితా = దుఃఖములచే పీడితురాలు; ఉపగృహ్య = ఒడిలో పెట్టుకుని; శిరో = శిరస్సును; రాజ్ఞః = రాజుయొక్క; కైకేయీం = కైకేయిని; ప్రత్యభాషత = దెప్పెను
భావం:-
 కంటినిండా కన్నీటితో అనేకవిధములుగా దుఃఖార్తురాలు ఐన కౌసల్యాదేవి దశరథుని శిరస్సు ఒడిలో పెట్టుకొని కైకేయిని ఇట్లు దెప్పెను.
2.66.3
అనుష్టుప్
“సకామా భవ కైకేయి!
భుంక్ష్వ రాజ్యమకంటకమ్।
త్యక్త్వా రాజానమేకాగ్రా
నృశంసే దుష్టచారిణి!॥
టీక:-
 సకామా = కోరికలు ఈడేరినవి; భవ = అగుము; కైకేయి = ఓ కైకేయీ; భుంక్ష్వ = అనుభవించుము; రాజ్యమ్ = రాజ్యమును; అకంటకమ్ = అడ్డంకులు లేనిదానిని; త్యక్త్వా = విడిచి; రాజానమ్ = రాజుని; ఏకాగ్రా = అనాకులముగా, అమర కోశము; నృశంసే = పరద్రోహీ; దుష్టచారిణి = చెడ్డపనులు చేయుదానా.
భావం:-
 ”పరద్రోహి! చెడువర్తన కైకేయీ! నీ కోరికలు ఈడేరినవి కదా. ఏ అడ్డూలేదు కదా ఇక రాజ్యమేలుకో. రాజుని వదిలేసి అంతా నీదే అధిపత్యం ఏలుకో.
*గమనిక:-
 నృశంసః- నూన్ నరాన్ శంసతి హినస్తితి. నృ+శంస హింసాయామ్+ కర్మణ్యణ్, కౄరః, పరద్రోహి. ఇత్యమర్.
2.66.4
అనుష్టుప్
విహాయ మాం గతో రామః
భర్తా చ స్వర్గతో మమ।
విపథే సార్థహీనేవ
నాహం జీవితుమ్ ఉత్సహే॥
టీక:-
 విహాయ = విడిచిపెట్టి; మాం = నన్ను; గతః = వెళ్లిపోయెను; రామః = రాముడు; భర్తా = భర్త; చ = కూడా; స్వర్గతః = స్వర్గమునకు వెళ్లెను; మమ = నన్ను; విపథే = దుష్టపు దారిలో పడ్డదానిని; సార్థహీనేవ = నష్టపోయిన బ్రతుకు అర్థం కలదానినై; న = లేదు; అహం = నేను; జీవితుమ్ = జీవించుటకు; ఉత్సహే = కోరిక
భావం:-
 నన్ను విడిచి నా పుత్రుడు రాముడు వెళ్లిపోయాడు. నా భర్త ధశరథుడు స్వర్గస్థుడైపోయాడు. బ్రతుకునకు అర్థము లేనిదానిని, దుష్టపు దారిలో పడ్డ దానిని ఐన నాకు ఇంక జీవించవలెనను కోరిక లేదు.
2.66.5
అనుష్టుప్
భర్తారం తం పరిత్యజ్య
కా స్త్రీ దైవతమాత్మనః।
ఇచ్ఛేజ్జీవితుమన్యత్ర
కైకేయ్యాస్త్యక్తధర్మణః॥
టీక:-
 భర్తారం = భర్తను; తం = కోరి; పరిత్యజ్య = విడిచి; కా = ఏ; స్త్రీ = సవాసిని; దైవతమ్ = దేవతౖయెన; ఆత్మనః = తనకు; ఇచ్ఛేత్ = ఇచ్చగించునా; జీవితుమ్ = జీవించుటకు; అన్యత్ర = ఇతరులు; కైకేయ్యాః = కైకేయి; త్యక్త ధర్మణః = ధర్మమును విడిచిపెట్టిన
భావం:-
 ధర్మమును కాలదన్నిన కైకేయి తప్ప మరి యే సువాసిని ఐన తనకు దైవమైన భర్తను వదిలేసి జీవించుటకు ఇచ్చగించునా?
2.66.6
అనుష్టుప్
న లుబ్ధో బుధ్యతే దోషాన్
కింపాకమివ భక్షయన్।
కుబ్జానిమిత్తం కైకేయ్యా
రాఘవాణాం కులం హతమ్॥
టీక:-
 న = లేక; లుబ్ధః = దురాశాపరుడు; బుధ్యతే = గుర్తించుట; దోషాన్ = దోషమును; కింపాకమ్= ముసిడి కాయలు; ఇవ = వలె; భక్షయన్ = తిను; కుబ్జా = గూనిదాని; నిమిత్తమ్ = కారణమున; కైకేయ్యా = కైకేయి; రాఘవాణామ్ = రఘువంశస్తుల యొక్క; కులమ్ = కులమును; హతమ్ = నశింపచేసినది
భావం:-
 దురాశాపరులు దోషము నెరుగక విషపూరిత ముసిడి కాయలు తినునట్లు. కైకేయి గూనిదానిని పట్టుకుని రఘువంశమంతా నాశనముచేసినది.
2.66.7.
అనుష్టుప్
అనియోగే నియుక్తేన
రాజ్ఞా రామం వివాసితమ్।
సభార్యం జనకశ్శ్రుత్వా
పరితప్స్యత్యహం యథా॥
టీక:-
 అనియోగే = చెప్పరాని పనియందు; నియుక్తేన = ఆజ్ఞాపింపబడిన, శబ్దకల్పదృమమ్; రాజ్ఞా = దశరథ మహారాజుచేత; రామం = రాముని; వివాసితమ్ = అరణ్యమునకు పంపుట; స = సహితముగ; భార్యమ్ = భార్యతో; జనకః = జనకుడు; శ్రుత్వా = విని; పరితప్స్యతి = దుఃఖించును; అహం = నా; యథా = వలెను.
భావం:-
 దశరథమహారాజు బలవంతపెట్టబడి రాముడిని అరణ్యమునకు పంపివేసెనని విని, జనకుడు ఆయన భార్య కూడ నా వలెనే దుఃఖించును.
2.66.8
అనుష్టుప్
స మామనాథాం విధవామ్
నాద్య జానాతి ధార్మికః।
రామః కమలపత్రాక్షః
జీవన్నాశమితో గతః॥
టీక:-
 సః = అతడు; మామ్ = నన్ను; అనాథాం = అనాథురాలను; విధవామ్ = భర్త లేనిదానను; న = లేదు; అద్య = ఇప్పుడు; జానాతి = తెలియదు; ధార్మికః = ధార్మికుడు; రామః = రాముడు; కమలపత్రాక్షః = కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు; జీవత్ = జీవించ ఉండగానే; నాశమితో గతః = కనబడకుండ పోయినాడు
భావం:-
 పరమ ధార్మికుడైన రామునికి వైధవ్యం పొందితినని, అనాథురాలనైతినని తెలియదు. కమలపత్రముల వంటి నేత్రములు కల రాముడు అంతటివాడూ, జీవించి ఉండగానే నాశనమై పోయాడు.
*గమనిక:-
 కమలపత్రేక్షణః అనుటలో కమలపత్ర అన విశాలమైనట్టి, జ్ఞానవికాసము కల, ఈక్షణః అన కన్నులు కలవాడు, సర్వము తెలియగలవాడు అని రాముని అంటున్నాడు. ఆహా. ఏమి శ్లేష.
2.66.9
అనుష్టుప్
విదేహరాజస్య సుతా
తథా సీతా తపస్వినీ।
దుఃఖస్యానుచితా దుఃఖమ్
వనే పర్యుద్విజిష్యతి॥
టీక:-
 విదేహరాజస్య = విదేహరాజుయొక్క; సుతా = కుమార్తె; తథా = అట్లు; సీతా = సీతాదేవి; తపస్వినీ = దీనురాలు; దుఃఖస్య = దుఃఖమునకు; అనుచితా = తగనిది; దుఃఖమ్ = దుఃఖితురాలై; వనః = వనములో; పర్యుద్విజిష్యతి = భయపడుచుండును
భావం:-
 జనకరాజ కుమార్తెయైన సీతాదేవి, దుఃఖమునకు తగనిది, అలా దీనురాలై అడవిలో ఇడుములుపడుచు చాల దుఃఖితురాలై భయపడుచుండును.
2.66.10
అనుష్టుప్
నదతాం భీమఘోషాణామ్
నిశాసు మృగపక్షిణామ్।
నిశమ్య నూనం సంత్రస్తా
రాఘవం సంశ్రయిష్యతి॥
టీక:-
 నదతాం = అరిచెడి; భీమ = భయంకరమైన; ఘోషాణామ్ = అరుపులు; నిశాసు = రాత్రులందు; మృగః = క్రూర మృగములు; పక్షిణామ్ = పక్షులు; నిశమ్య = వినినదై; నూనం = తప్పక; సంత్రస్తా = దుఃఖాక్రాంతుడై; రాఘవం = రాముని చెంతకు; సంశ్రయిష్యతి = తప్పక చేరుచుండును
భావం:-
  మృగపక్ష్యాదుల రాత్రులందు అరిచెడి భీకరమైన అరుపులను. వినిన సీతాదేవి భయపడిపోయి, తప్పక రాముని చెంతకు చేరుచుండును.
2.66.11
అనుష్టుప్
వృద్ధశ్చైవాల్పపుత్రశ్చ
వైదేహీమనుచింతయన్।
సోఽపి శోకసమావిష్టో
నను త్యక్ష్యతి జీవితమ్॥
టీక:-
 వృద్ధః = వృద్ధుడు; చ = మఱియు; ఏవ = మాత్రమే; అల్ప పుత్రశ్చ = తక్కువ పుత్రులు కలవాడు; వైదేహీమ్ = సీతనుగూర్చి; అనుచింతయన్ = తలచుకొనుచుండెడి; సః = అతడు; అపి = కూడా; శోకసమావిష్టః = దుఃఖక్రాంతుడై; నను = కదా; త్యక్ష్యతి = విడుచును; జీవితమ్ = ప్రాణములను
భావం:-
 సీతను గురించి నిరంతరం తలచుకొనుచుండెడి, సీరధ్వజుడు అను జనకుడు అసలే వృద్ధుడు, పైగా కుశధ్వజుడు ఒక్కడే పుత్రుడు. ఆ జనకుడు కూడ దుఃఖాక్రాంతుడై ప్రాణములను విడుచును కదా.
*గమనిక:-
 జనకుడు- నిమివంశపు వాడు మిథులుడు అను మిథిలుడు. ఇతని వంశమువారు జనకులు ఏలుచుండెడి వారు. ఈ జనక వంశము నందలి హ్రస్వరోమునికి పుత్రులు సీరధ్వజుడు, కుశధ్వజుడు. సీరధ్వజునికి భార్య సునయన కొడుకు కుశధ్వజుడు, సీత నాగటి చాలులో దొరికిన పెంపుడు కుమార్తె మఱియు రెండవ కూతురు ఊర్మిళ. తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవి మఱియు శ్రుతకీర్తి. ఈ సీతను రాముడు, ఈమె చెల్లెలు ఊర్మిళను లక్ష్మణుడు, వారి సోదరి మాండవిని భరతుడు, శ్రుతకీర్తిని శత్రుఘ్నుడు వివాహమాడిరి. సీతాదేవి శ్రీరామచంద్రులకు కుశుడు, లవుడు అని ఇద్దరు పుత్రులు. చూ. బాలకాండ 71, 72 కాండలు.
2.66.12
అనుష్టుప్
సాహమద్యైవ దిష్టాంతమ్
గమిష్యామి పతివ్రతా।
ఇదం శరీర మాలింగ్య
ప్రవేక్ష్యామి హుతాశనమ్॥
టీక:-
 సా = అట్టి; అహమ్ = నేను; అద్యైవ = ఇప్పుడ; దిష్టాంతమ్ = మరణము; గమిష్యామి = పొందగలను; పతివ్రతా = పతివ్రతనైన; ఇదం = ఈ; శరీరమ్ = శరీరమును; ఆలింగ్య = ఆలింగనము చేసికొని; ప్రవేక్ష్యామి = ప్రవేశించి; హుతాశనమ్ = అగ్నిలో
భావం:-
 పతివ్రతనైన నేను ఇప్పుడు మరణించెదను. ఈ నా భర్త శరీరమును ఆలింగనము చేసికొని అగ్నిలో ప్రవేశించెదను.
2.66.13
అనుష్టుప్
తాం తతస్సంపరిష్వజ్య
విలపంతీం తపస్వినీమ్।
వ్యపనీయ సుదుఃఖార్తామ్
కౌసల్యాం వ్యావహారికాః॥
టీక:-
 తాం = ఆ; తతః = అక్కడి నుండి; సంపరిష్వజ్య = కౌగిలించుకుని; విలపంతీం = విలపించుచున్న; తపస్వినీమ్ = కుమిలిపోతున్నది; వ్యపనీయః = తీసుకొనివెళ్లిరి; సుదుఃఖార్తామ్ = మిక్కలి దుఃఖముచే పీడించబడినరాలైన ; కౌసల్యాం = కౌసల్యను; వ్యావహారికాః = అంతఃఫుర కార్యములందు నియుక్తలైన స్త్రీలు
భావం:-
 కుమిలిపోతున్న కౌసల్య శోకార్తురాలై, దశరథుని కళేబరముపై పడి ఏడ్చుచుండగా, అంతఃపుర పరిచారికలు, ఆమెను అక్కడి నుండి దూరముగా తీసికొనిపోయిరి.
2.66.14
అనుష్టుప్
తైలద్రోణ్యామథామాత్యా
సమ్వేశ్య జగతీపతిమ్।
రాజ్ఞస్సర్వాణ్యథాదిష్టాః
చక్రుః కర్మాణ్యనంతరమ్॥
టీక:-
 తైలద్రోణ్యామ్ = నూనెతొట్టెలో; అథ = అటు పిమ్మట; అమాత్యా = అమాత్యులు; సమ్వేశ్య = ఉంచిరి; జగతీపతిమ్ = జగత్తుకు ప్రభువును; రాజ్ఞః = రాజునకు; సర్వాణి = సకలమైన; ఆదిష్టాః = వశిష్ఠాదుల ఆజ్ఞ ప్రకారము; చక్రుః = చేసిరి; కర్మాణి = కర్మలను; అనంతరమ్ = పిమ్మట.
భావం:-
 అమాత్యులు, దశరథమహారాజు దేహమును తైలద్రోణిలో ఉంచిరి. తరువాత వసిష్ఠాదుల ఆజ్ఞ ప్రకారము చేయవలసిన కర్మలన్నియు ఆచరించిరి.
2.66.15
అనుష్టుప్
న తు సంకలనం రాజ్ఞో
వినా పుత్రేణ మంత్రిణః।
సర్వజ్ఞాః కర్తుమీషుస్తే
తతో రక్షంతి భూమిపమ్॥
టీక:-
 న = రాదు; తు = కనుక; సంకలనం = దహనక్రియలు; రాజ్ఞః = రాజునకు; వినా పుత్రేణ = కుమారులు లేనప్పుడు; మంత్రిణః = మంత్రులు; సర్వజ్ఞాః = అన్ని విషయములు తెలిసినవారు; కర్తుమీషుః = చేయుటకు ఇచ్చగించుట; తే = వారు; తతః = అటు పిమ్మట; రక్షంతి = రక్షించిరి; భూమిపమ్ = రాజు దేహమును
భావం:-
  కుమారులెవ్వరును దగ్గర లేనపుడు రాజు శరీరమునకు దహన సంస్కారము చేయుటకు అన్ని విషయములు తెలిసిన మంత్రులు ఇచ్చగించక ఆ రాజు దేహమును రక్షించిరి.
2.66.16
అనుష్టుప్
తైలద్రోణ్యాం తు సచివైః
శాయితం తం నరాధిపమ్।
హా మృతోఽయమితి జ్ఞాత్వా
స్త్రియస్తాః పర్యదేవయన్॥
టీక:-
 తైలద్రోణ్యామ్ = తైలద్రోణిలో; తు = ఐతే; సచివైః = మంత్రులు; శాయితం = శరీరమును ఉంచగానే; తం = ఆ; నరాధిపమ్ = రాజుయొక్క; హా మృతః = అయ్యో మరణించినాడు; అయమ్ = దేవుడా; ఇతి = అని; జ్ఞాత్వా = తెలిసిన; స్త్రియః = స్త్రీలు; తాః = వారందరు; పర్యదేవయన్ = ఏడ్చిరి
భావం:-
 ఆ రాజు శరీరమును మంత్రులు తైలద్రోణిలో ఉంచగానే। “అయ్యో దేవుడా! ఇతడు మరణించెను” అని స్త్రీలు అందరూ ఏడ్చిరి.
2.66.17
అనుష్టుప్
బాహూనుద్యమ్య కృపణాః
నేత్రప్రస్రవణైర్ముఖైః।
రుదంత్యశ్శోకసంతప్తాః
కృపణం పర్యదేవయన్॥
టీక:-
 బాహూన్ = బాహువులను; ఉద్యమ్య = పైకెత్తి; కృపణాః = దీనులైన స్త్రీలు; నేత్రప్రస్రవణైః = కన్నీరు కారుచున్న నేత్రుములు గల; ముఖైః = ముఖములతో; రుదంతిః = విలపించిరి; శోకసంతప్తాః = దుఃఖపీడితులై; కృపణం = దీనముగా; పర్యదేవయన్ = విలపించిరి
భావం:-
 కన్నీళ్లు కారుచున్న నేత్రములు గల ముఖములతో, దీనులై బాహువులను పైకెత్తి ఏడ్చుచు, దుఃఖపీడితులై దీనముగా విలపించిరి.
2.66.18
అనుష్టుప్
“హా మహారాజ రామేణ
సతతం ప్రియవాదినా।
విహీనాస్సత్యసన్ధేన
కిమర్థం విజహాసి నః॥
టీక:-
 హా మహారాజ = అయ్యో మహారాజా; రామేణ = రామునకు; సతతం = ఎల్లప్పుడును; ప్రియవాదినా = ప్రియముగా మాటలాడువాడు; విహీనాః = విడిచిపోయినావు; సత్యసన్ధేన = సత్యసంధుడు; కిమర్థం = ఏ కారణముగా; విజహాసి = విడిచిపెట్టినావు; నః = మమ్ములను
భావం:-
 ”అయ్యో! మహారాజా! ప్రియముగా మాటలాడువాడు, సత్యసంధుడు అయిన రామునకు దూరమైన మమ్ములను నీవు కూడ ఏల విడిచిపోతివి?
2.66.19
అనుష్టుప్
కైకేయ్యా దుష్టభావాయాః
రాఘవేణ వియోజితాః।
కథం పతిఘ్న్యా వత్స్యామః
సమీపే విధవా వయమ్॥
టీక:-
 కైకేయ్యా = కైకేయి; దుష్టభావాయాః = దుష్టమైన భావము గల; రాఘవేణ = రామునికి; వియోజితాః = దూరము చేసినది; కథం = ఏ విధముగా; పతిఘ్న్యా = భర్తను చంపినది; వత్స్యామః = ఉండగలము; సమీపే = దగ్గర; విధవా = రాజు లేకుండా; వయమ్ = మేము
భావం:-
 దుష్టమైన భావము గల కైకేయి మొదటనే మమ్ములను రామునకు దూరము చేసినది. ఇపుడు ప్రభువు కూడ లేని మేము భర్తను చంపిన ఆమె వద్ద ఎట్లుండగలము?
2.66.20
అనుష్టుప్
స హి నాథస్సదాస్మాకమ్
తవ చ ప్రభురాత్మవాన్।
వనం రామో గతశ్శ్రీమాన్
విహాయ నృపతిశ్రియమ్॥
టీక:-
 సః = ఆ; హి = కదా; నాథః = రక్షించువాడు; సదా = నిరంతరము; అస్మాకమ్ = మాకు; తవ = నీకు; చ = మఱియు; ప్రభుః = సంరక్షకుడు; ఆత్మవాన్ = సమర్థుడు; వనం = వనమునకు; రామః = రాముడు; గతః = వెళ్లెను; శ్రీమాన్ = శ్రీమంతుడు; విహాయ = విడిచి; నృపతిః శ్రియమ్ = రాజ్యలక్ష్మిని
భావం:-
 సమర్థుడు, సద్బుద్ధిశాలి, శ్రీమంతుడు, సర్వదా నీకును మాకును సంరక్షకుడిగా ఉన్నవాడు అయిన ఆ రాముడు రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యమునకు వెళ్లిపోయెను కదా!
2.66.21
అనుష్టుప్
త్వయా తేన చ వీరేణ
వినా వ్యసనమోహితాః।
కథం వయం నివత్స్యామః
కైకేయ్యా చ విదూషితాః॥
టీక:-
 త్వయా = నీవు; తేన = ఆ; చ = మఱియు; వీరేణ వినా = వీరుడైన రాముడు; వినా = లేకుండ; వ్యసన = మమకారముచే; మోహితాః = మోహమున పడినవారము; కథం = ఎట్లు; వయం = మేము; నివత్స్యామః = నివసించగలము; కైకేయ్యా = కైకేయిచేత; చ = ఇంకను; విదూషితాః = దూషింపబడుచు.
భావం:-
 నీవు ఆ వీరుడైన రాముడు లేకపోవుటచే మమకారమువలన మోహము పడినవారమైన, మేము కైకేయి దూషణలను కూడ భరించుచు ఎట్లు నివసించగలము?
2.66.22
అనుష్టుప్
యయా తు రాజా రామశ్చ
లక్ష్మణశ్చ మహాబలః।
సీతయా సహ సంత్యక్తాః
సాకమన్యం నహాస్యతి?॥
టీక:-
 యయా తు = అటువంటి కైకేయి; తు = తప్పక; రాజా = రాజును; రామః = రాముడు; చ = మఱియు; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; మహాబలః = మహాబలులైన; సీతయా = సీతను; సహ = కూడ; సంత్యక్తాః = వదలివేయగలిగిన; సా = ఆమె చేత; కమ్ = ఎవ్వరినైనను; అన్యం = ఇతరులను; న = కాదా; హాస్యతి = విడిచివేయగలదు.
భావం:-
  రాజును, మహాబలులైన రామలక్ష్మణులను ఇంకనూ సీతను కూడ వదలివేయగలిగిన కైకేయి ఇతరులను ఎవ్వరిని విడిచివేయలేదు?
2.66.23
అనుష్టుప్
తా బాష్పేణ చ సంవీతాః
శోకేన విపులేన చ।
వ్యవేష్టంత నిరానన్దా
రాఘవస్య వరస్త్రియః॥
టీక:-
 తాః = వారు; బాష్పేణ చ సంవీతాః = కన్నీటిచేత; చ = మఱియు; సంవీతాః = కూడినవారు; శోకేన = శోకముతో; విపులేన = విస్త్రుతమైన; చ = మఱియు; వ్యవేష్టంత = నేలపై దొర్లిరి; నిరానన్దా = ఆనందము నశింపగా; రాఘవస్య = దశరథునియొక్క; వరస్త్రియః = భార్యలందరు
భావం:-
 దశరథుని సతులందరు అధికమైన శోకమువలన కన్నీటిచే తడసిన వారగుచు, ఆనందము అడుగంటి నేలపై దొర్లిరి.
2.66.24
అనుష్టుప్
నిశా చంద్రవిహీనేవ
స్త్రీవ భర్తృ వివర్జితా।
పురీ నారాజతాయోధ్యా
హీనా రాజ్ఞా మహాత్మనా॥
టీక:-
 నిశా = రాత్రి; చంద్ర = చంద్రుడు; విహీన = లేని; ఇవ = విధముగ; స్త్రి = సతి; ఇవ = వలె; భర్తృ = పతిచేత; వివర్జితా = వదిలిపెట్టబడిన; పురీ = నగరము; నారాజత = శోభావిహీనమయ్యెను; అయోధ్యా = అయోధ్య; హీనా రాజ్ఞా = రాజు లేని; మహాత్మనా = మహాత్ముడైన.
భావం:-
 మహాత్ముడైన ఆ దశరథమహారాజు లేని ఆ అయోధ్య చంద్రుడు లేని రాత్రి వలె, పతి వదిలిపెట్టిన సతి వలె శోభావిహీనమయ్యెను.
2.66.25
అనుష్టుప్
బాష్పపర్యాకులజనా
హాహాభూతకులాంగనా।
శూన్యచత్వరవేశ్మాంతా
న బభ్రాజ యథాపురమ్॥
టీక:-
 బాష్ప = కన్నీటితో; పర్యాకుల = కలత చెందిన; జనా = జనులందరును; హాహాభూత = హాహాకారము చేయుచున్న; కులాంగనా = అంతఃపురస్త్రీలు; శూన్య = శూన్యములైన; చత్వరః = గృహాద్బాహరరంగణ, వాచస్పతము; వేశ్మాంతా = ముంగిలి; న = కోల్పోయిన; బభ్రాజః = శోభకలవి; యథాపురమ్ = వెనుకటి వంటి.
భావం:-
 తాత్పర్యము; ఆ నగరములోని జనులందరును కన్నీళ్లతో కలత చెంది ఉండిరి. కులాంగనలు హాహాకారము చేయుచుండిరి. ఇళ్ల ముందు వాకిళ్లు, బయటి పెరళ్ళు శూన్యములైనవి యీ విధముగా వెనుకటి శోభను కోల్పోయినవి ఆయెను.
2.66.26
జగతి
గతే తు శోకాత్త్రిదివం నరాధిపే
మహీతలస్థాసు నృపాంగనాసు చ।
నివృత్తచారస్సహసా గతో రవిః
ప్రవృత్తచారా రజనీ హ్యుపస్థితా॥
టీక:-
 గతే తు = మరణించెను; శోకా = పుత్రశోకముచే; త్రిదివం = స్వర్గమునకు; నరాధిపే = ఓ మహారాజా; మహీతలస్థాసు = నేలపై పడియుండిరి; నృపాంగనాసు = మహారాజుయొక్క భార్యలు; చ = మఱియు; నివృత్తచారః = సంచరించు ప్రాణుల; సహసా = వేగముగా; గతః = అస్తమించెను; రవిః = సూర్యుడు; ప్రవృత్తచారా = సంచారమునకు అనువుగా; రజనీ హి = రాత్రి; ఉపస్థితా = వచ్చెను.
భావం:-
 దశరథమహారాజు పుత్రశోకముచే స్వర్గస్థుడయ్యెను. అతని భార్యలు దుఃఖముచే నేలపై పడియుండిరి. ఆ సమయమునందు సూర్యుడు అస్తమించెను. రాత్రి సంచరించు ప్రాణుల సంచారమునకు అనువుగా రాత్రి వచ్చెను.
2.66.27
జగతి
ఋతే తు పుత్రాద్దహనం మహీపతేః
నరోచయంతే సుహృదస్సమాగతాః।
ఇతీవ తస్మిన్ శయనే న్యవేశయన్
విచింత్య రాజానమచింత్య దర్శనమ్॥
టీక:-
 ఋతే = దగ్గర లేకుండగ; తు = నిశ్చయముగు; పుత్రాత్ = పుత్రులు; దహనం = దహన సంస్కారము చేయుటకు; మహీపతేః = మహారాజు యొక్క; న రోచయంతే = ఇష్టపడరు; సుహృదః = బంధుమిత్రులు; సమాగతాః = అక్కడ ఉన్నవారు; ఇతీవ = ఈ విధముగా; తస్మిన్ = ఆయొక్క; శయనే = ఆ శయనము పైననే; న్యవేశయన్ = తైలద్రోణిలో ఉంచిరి; విచింత్య = ఆలోచించి; రాజానమ్ = రాజునకు; అచింత్య = ఊహింపరాని; దర్శనమ్ = దర్శనము గల
భావం:-
 పుత్రులు దగ్గరలేకుండ దశరథునకు సంస్కారము చేయుటకు, వచ్చిన బంధుమిత్రులు ఇష్టపడరు అని ఆలోచించి, అనూద్యమైన పరిస్థితిలో ఆ దశరథుని శరీరమును ఆ శయనము పైననే తైలద్రోణిలో భద్రపరచిరి.
2.66.28
జగతి
గతప్రభా ద్యౌరివ భాస్కరం వినా
వ్యపేతనక్షత్రగణేవ శర్వరీ।
పురీ బభాసే రహితా మహాత్మనా
న చాస్రకంఠాఽకులమార్గచత్వరా॥
టీక:-
 గతప్రభా = కాంతిహీనమయ్యెను; ద్యౌః = ఆకాశము; ఇవ = వలె; భాస్కరం = సూర్యుడు; వినా = లేనిది; వ్యపేత = మిక్కిలి తొలగిన; నక్షత్రగణ = నక్షత్ర సముదాయములు; ఇవ = వలె; శర్వరీ = రాత్రి; పురీ = అయోధ్యా నగరము; బభాసే = ప్రకాశించుట; రహితా = లేకపోవుటచే; మహాత్మనా = మహాత్ముడైన దశరథుడు; న = లేకుండుటచే; చ = మఱియును; అస్రకంఠా = గద్గద కంఠములతో, కన్నీరు కంఠమునందు నిలుపుకొనుటచే; అకుల = వ్యాకులమై ఉన్న; మార్గ = వీధులు; చత్వరా = కూడళ్ళుగల.
భావం:-
 సూర్యుడు లేని ఆకాశము వలె, నక్షత్రములు లేని రాత్రి వలె, శోభారహితమై, దశరథుడు మరణించుటచే, అయోధ్య అన్ని వీధులు, కూడళ్ళులోనూ గద్గద కంఠములుతో దుఃఖించుచున్న పౌరులతో వ్యాకులమై ఉండెను.
2.66.29
జగతి
నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘశః
విగర్హమాణా భరతస్య మాతరమ్।
తదా నగర్యాం నరదేవసంక్షయే
బభూవురార్తా న చ శర్మ లేభిరే॥
టీక:-
 నరాశ్చ = పురుషులును; నార్యశ్చ = స్త్రీలును; సమేత్యసంఘశః = గుంపులు గుంపులుగా చేరి; విగర్హమాణా = నిందించువారు; భరతస్య = భరతుని యొక్క; మాతరమ్ = తల్లిని; తదా = అప్పుడు; నగర్యాం = నగరములోని; నరదేవ = దశరథుని; సంక్షయే = మరణముతో; బభూవుః = అయ్యిరి; ఆర్తా = చాల దుఃఖించువారు; న చ శర్మ లేభిరే = సంతోషముతో లేకుండిరి; న = లేని; చ = ఏమాత్రమూ; శర్మ = సంతోషము; లేభిరే = పొందినవారు.
భావం:-
 దశరథుడు మరణించిన పిమ్మట నగరములోని పురుషులును, స్త్రీలును గుంపులుగుంపులుగా చేరి, భరతుని తల్లిని నిందించుచు చాల దుఃఖించిరి సంతోష మన్నది ఏమాత్రమూ లేనివారైరి.
2.66.30
గద్యం
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే మషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; షట్ షష్టితమ [66] = అరవైఆరవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [66] అరవైఆరవ సర్గ సంపూర్ణము.
2.67.1
అనుష్టుప్.
ఆక్రందితనిరానంoe
సాస్రకంఠజనాకులా।
అయోధ్యాయామవతతా
సా వ్యతీయాయ శర్వరీ॥
టీక:-
ఆక్రందిత = ఏడుపు పెడబొబ్బలతో నిండిన; నిరానందిత = ఆనందమన్నది హీవమైనది; స = కల; అస్రకంఠ = కన్నీటివవలన గద్గద కంఠమై; జనః = ప్రజలు; ఆకులా = వ్యాకులపాటుచెంది; అయోధ్యాయామ్ = అయోధ్యనగరమునందు; అవతతా = సుదీర్ఘమైన; సా = ఆ; వ్యతీయాయ = గడచెను; శర్వరీ = నిశయ
భావం:-
అయోధ్యయందలి పౌరులకు ఆ రాత్రి క్షణమొకయుగమై, ఏడుపు పెడబొబ్బలతో నిండి, కన్నీరుగార్చుచు దుఃఖమునకు లోనైన వారిగొంతులు గద్గదమై మనస్సు కలవరపాటుకు గుఱియైయుండెను.
2.67.2
అనుష్టుప్.
వ్యతీతాయాం తు శర్వర్యామ్
ఆదిత్యస్యోదయే తతః।
సమేత్య రాజకర్తారః
సభామీయుర్ద్విజాతయః॥
టీక:-
వ్యతీతాయాం = గడిచినది; తు; శర్వర్యామ్ = రాత్రి; ఆదిత్యస్య = సూర్యునియొక్క; ఉదయే = ఉదయమునందు; తతః = పిమ్మట। సమేత్య = కలిసి; రాజకర్తారః = రాజును నియమించువారు; సభామ్ = సభను; ఈయుః = పొందిరి; ద్విజాతయః = బాహ్మణులు.
భావం:-
రాత్రిగడచిన పిమ్మట, సూర్యోదయము కాగానే బ్రాహ్మణులు, రాజును నిర్ణయించువారు కలిసి సభను ఏర్పాటు చేసిరి.
2.67.3
అనుష్టుప్.
మార్కండేయోఽ థ మౌద్గల్యో
వామదేవశ్చ కాశ్యపః।
కాత్యాయనో గౌతమశ్చ
జాబాలిశ్చ మహాయశాః॥
టీక:-
మార్కండేయః = మార్కండేయుడు; అథ = తరువాత; మౌద్గల్యః = మౌద్గల్యుడు; వామదేవః = వామదేవుడు; చ = మఱియు; కాశ్యపః = కాశ్యపుడు; కాత్యాయనః = కాత్యాయనుడు; గౌతమః = గౌతముడు; చ = మఱియు; జాబాలిః = జాబాలి; చ = మఱియు; మహాయశాః = గొప్పకీర్తిగల.
భావం:-
గొప్ప గొప్ప యశాశ్శాలులైన మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి
2.67.4
అనుష్టుప్.
ఏతే ద్విజా స్సహామాత్యైః
పృథగ్వాచముదీరయన్।
వసిష్ఠమేవాభిముఖాః
శ్రేష్ఠం రాజపురోహితమ్॥
టీక:-
ఏతే = ఈ; ద్విజాః = ద్విజులు; సహ = కూడి; అమాత్యైః = అమాత్యులతో; పృథక్ = వేఱువేఱుగా; వాచమ్ = మాటను; ఉదీరయన్ = పలికిరి; వసిష్ఠమ్ = వాసిష్ఠునిగూర్చి; ఏవ = మాత్రమే; అభిముఖాః = అభిముఖులై; శ్రేష్ఠం = శ్రేష్ఠుడైన; రాజపురోహితమ్ = రాజపురోహితునిగూర్చి.
భావం:-
ఆ ద్విజులు, మంత్రులు ఒక్కొక్కరు వారి అభిప్రాయములు శ్రేష్ఠుడైన రాజపురోహితుడు వసిష్టులవారిని వ్యక్తిగతంగా కలిసి ఈ విధముగా వ్యక్తపరచిరి.
2.67.5
అనుష్టుప్.
“అతీతా శర్వరీ దుఃఖమ్
యా నో వర్షశతోపమా।
అస్మిన్పంచత్వమాపన్నే
పుత్రశోకేన పార్థివే॥
టీక:-
అతీతా = గడిచినది; శర్వరీ = రాత్రి; దుఃఖమ్ = దుఃఖముతో; యా = ఏది; నః = మనకు; వర్షః = సంవత్సరములు; శతః = వందతో; ఉపమా = సమాన మయినవిగ; అస్మిన్ = ఈ; పంచత్వమ్ = మృత్యువును; ఆపన్నే = పొందినవారు; పుత్రశోకేన = పుత్రశోకముతో; పార్థివే = రాజు.
భావం:-
దశరథమహీపతి పుత్రశోకముతో ఇలా మరణించుటచే దుఃఖభారముతో ఈరాత్రి మనకు వంద సంవత్సరములతో సమానముగా అతికష్టముమీద గడిచినది.
2.67.6
అనుష్టుప్.
స్వర్గతశ్చ మహారాజో
రామశ్చారణ్యమాశ్రితః।
లక్ష్మణశ్చాపి తేజస్వీ
రామేణైవ గతస్సహ॥
టీక:-
స్వర్గతః = స్వర్గమును పొందెను; చ = మఱియు; మహారాజః = మహారాజు; రామః = శ్రీరామచంద్రుడు; చ = మఱియు; అరణ్యమ్ = వనమును; ఆశ్రితః = ఆశ్రయించియున్నాడు; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; అపి = కూడ; తేజస్వీ = తేజస్సుగల; రామేణ = శ్రీరామచంద్రునితో; ఏవ = కూడ; గతః = వెళ్ళెను; సహ = కూడి॥
భావం:-
మహారాజుగారు స్వర్గస్తులయ్యినారు. శ్రీరామచంద్రుడు వనములకేగినాడు. లక్ష్మణుడు కూడ తన అన్నగారితో కూడి అడవులకు వెళ్ళినాడు.
2.67.7
అనుష్టుప్.
ఉభౌ భరతశత్రుఘ్నౌ
కేకయేషు పరన్తపౌ।
పురే రాజగృహే రమ్యే
మాతామహనివేశనే॥
టీక:-
ఉభౌ = ఇరువురు; భరతశత్రుఘ్నౌ = భరత, శత్రుఘ్నులు; కేకయేషు = కేకయరాజ్యముయొక్క; పరన్తపౌ = శత్రుభయంకరులైన; పురే = పట్టణమునందు; రాజగృహే = రాజగృహము అను నామముగల; రమ్యే = రమ్యమైన; మాతామహనివేశనే = తాతగారింటిలో ఉన్నారు.
భావం:-
శత్రుభయంకరులైన భరత, శత్రుఘ్నులు ఇరువురు కేకయదేశముయొక్క రాజగృహమను నామముగల పట్టణములో రమ్యమైన వారి తాతగారింటిలో యున్నారు.
2.67.8
అనుష్టుప్.
ఇక్ష్వాకూణామిహాద్యైవ
కశ్చిద్రాజా విధీయతామ్।
అరాజకం హి నో రాష్ట్రమ్
వినాశం సమవాప్నుయాత్॥
టీక:-
ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశములో; ఇహ = ఇక్కడ; అద్యైవ = ఇప్పుడే; కశ్చిత్ = ఎవరినైన; రాజా = రాజుగా; విధీయతామ్ = తెలియబడుగాక; అరాజకం = రాజులేకపోవట; హి= కదా; నః = మనయొక్క; రాష్ట్రమ్ = రాజ్యమునకు; వినాశం = నాశమును; సమవాప్నుయాత్ = పొందెను.
భావం:-
ఇక్ష్వాకు వంశీయులైన వారిని ఎవరినైన ఇప్పటికిప్పుడు రాజుని నిర్ణయింపవలెను. రాజులేనిచో అరాజకము ఏర్పుడును. అరాజకము వలన మన రాజ్యము వినాశనమగును కదా.
2.67.9
అనుష్టుప్.
నారాజకే జనపదే
విద్యున్మాలీ మహాస్వనః।
అభివర్షతి పర్జన్యో
మహీం దివ్యేన వారిణా॥
టీక:-
న = ఉండదు; అరాజకే = అరాజకమునందు; జనపదే = ఊళ్ళల్లో; విద్యున్మాలీ = మెఱుపుల వరుసలతో కూడిన; మహాస్వనః = గొప్ప శబ్దము, ఉరుములు; అభివర్షతి = వర్షించుట; పర్జన్యః = మేఘములు; మహీం = భూమిమీద; దివ్యేన = ఆకాశమునుండి; వారిణా = నీటితో.
భావం:-
అరాజకము అన కట్టుబట్లు లేనిది. అట్టి అరాజకములో మెఱుపులు మెఱుస్తాయి. ఉఱుముల ఉఱుముతాయి, గాని ఆకాశము నుండి నేలమీదకి వానైతే కురవదు.
2.67.10
అనుష్టుప్.
నారాజకే జనపదే
బీజముష్టిః ప్రకీర్యతే।
నారాజకే పితుః పుత్రో
భార్యా వా వర్తతే వశే॥
టీక:-
న = ఉండదు; అరాజకే = అరాకములో; జనపదే = గ్రామములలో; బీజః = విత్తనములు; ముష్టిః = పిడికిలి పట్టే పాటికూడ; ప్రకీర్యతే = చల్లుట; న = ఉండదు; అరాజకే = అరాజములో; పితుః = తండ్రియొక్క; పుత్రః = పుత్రుడు; భార్యా = భార్యగాని; వా = గాని; వర్తతే = ప్రవర్తించరు; వశే = వశమునందు॥
భావం:-
అరాజకము ఏర్పడిందంటే వ్యవసాయము సక్రమముగా జరుగదు. గ్రామాలలో కనీసం విత్తనాలు పిడికిడైనా జల్లడమన్నదే జరగదు. ఇంకా తండ్రిమాట కొడుకు వినడు. భర్తమాట భార్యా వినదు.
2.67.11
అనుష్టుప్.
నారాజకే ధనం చాస్తి
నాస్తి భార్యా ప్యరాజకే।
ఇద మత్యాహితం చాన్యత్
కృకుతస్సత్య మరాజకే॥
టీక:-
న = ఉండదు; అరాజకే = అరాజకము నందు; ధనం = సంపదలు; చ = మఱియు; అస్తి = ఉండుట; నాస్తి = లేదు; భార్య = పత్ని; అపి = కూడ; అరాజకే = రాజులేనిదేశమున; ఇదమ్ = ఇది; అతి = మిక్కిలి; అహితమ్ = ప్రమాదకరమైనది; చ = మఱియు; అన్యత్ = మరొకటి; కుతః = ఎట్లు; సత్యమ్ = సత్యము; అరాజకే = రాజులేని దేశమున.
భావం:-
అరాజకము ఏర్పడితే సంపద లేదు. భార్య లేదు. అంతా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితే. ఇంక అరాజకములో సత్యమునకు స్థానము ఏట్లు ఉండును? (ఉండదని భావము)
2.67.12
అనుష్టుప్.
నారాజకే జనపదే
కారయంతి సభాం నరాః।
ఉద్యానాని చ రమ్యాణి
హృష్టాః పుణ్యగృహాణి చ॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = ఊళ్ళల్లో; కారయంతి = చేయించుట; సభామ్ = న్యాయసభలను; నరాః = మానవులు; ఉద్యానాని = ఉద్యానవనములను; చ = మఱియు; రమ్యాణి = అందమైన; హృష్టాః = సంతోషముతో; పుణ్యగృహాణి = సత్రములు, దేవాలయములు; చ = మఱియు.
భావం:-
అరజకమునందు కట్టుబాట్లు ఉండవు కనుక ఊళ్ళల్లో న్యాయసభలను నిర్వహించరు. చక్కని ఉద్యానవనములు పెంచరు. సత్రములు, దేవాలయములు వంటి పుణ్య గృహములను నిర్మించరు.
2.67.13
అనుష్టుప్.
నారాజకే జనపదే
యజ్ఞశీలా ద్విజాతయః।
సత్రాణ్యన్వాసతే దాంతా
బ్రాహ్మణా స్సంశితవ్రతాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; యజ్ఞశీలాః = యజ్ఞములను ఆచరించువారు; ద్విజాతయః = ద్విజులు। సత్రాణి = యాగములను; అన్వాసతే = ఆచరించుట; దాంతాః = బ్రహ్మచర్యాది క్లేశములు ఓర్చువారు, ఇంద్రియనిగ్రహముగలవారు; బ్రాహ్మణాః = వేదపండితులు; సంశితవ్రతాః = వ్రతనిష్ఠాగరిష్టులు॥
భావం:-
రాజులేని రాజ్యమునందు ఎప్పుడును యజ్ఞములు ఆచరించే దమనశీలురు, వ్రతనిష్ఠాగరిష్టులు అయిన వేదపండితులు కూడ యాగము లాచరించుటకు ఉత్సాహము చూపరు.
2.67.14
అనుష్టుప్.
నారాజకే జనపదే
మహాయజ్ఞేషు యజ్వనః।
బ్రాహ్మణా వసుసమ్పన్నా
విసృజన్త్యాప్తదక్షిణాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = అరాజకము నందు; జనపదే = రాజ్యమునందు; మహాయజ్ఞేషు = గొప్ప యాగములందు; యజ్వనః = యాగకర్తలు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; వసుసమ్పన్నాః = ధనవంతులు; విసృజంతి = ఇచ్చుట; ఆప్తదక్షిణాః = తగిన దక్షిణ॥
భావం:-
అరాజక పరిస్థితులలో ఒకవేళ ఎవరయినా ధనికులు యజ్ఞకర్తలుగా యజ్ఞములు ఆచరించినను, ఆ ధనవంతులు యాగములాచరించిన ఋత్విజులకు తగిన దక్షిణలను ఇచ్చుట ఉండదు.
2.67.15
అనుష్టుప్.
నారాజకే జనపదే
ప్రభూతనటనర్తకాః।
ఉత్సవాశ్చ సమాజాశ్చ
వర్ధన్తే రాష్ట్రవర్ధనాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేకపోతే; జనపదే = రాజ్యమునందు; ప్రభూత = సంభూతము; నట = నటులు; నర్తకాః = నర్తకులు; ఉత్సవాః = ఉత్సవములు; చ = మఱియు; సమాజాః = సమాజములు; చ = మఱియు; వర్ధన్తే = వృద్ధిచెందుట; రాష్ట్రవర్ధనాః = దేశమునకు అభివృద్ధి చెందుట.
భావం:-
రాజులేని రాజ్యమునందు నటులు, నర్తకులు, దేశాభివృద్ధి, ఉత్సవములు, సమాజములు వృద్ధిచెందుట సంభవము కాదు.
*గమనిక:-
(1) నటః- నటతీతి, నటుడు, (2)నర్తకః- నృత్యతీతి, నట్+అచ్, నాట్యగత్తె.
2.67.16
అనుష్టుప్.
నారాజకే జనపదే
సిద్ధార్థా వ్యవహారిణః।
కథాభిరనురజ్యన్తే
కథాశీలాః కథాప్రియైః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; సిద్ధార్థాః = ప్రయోజనము పొందుట; వ్యవహారిణః = వ్యవహారములందు, వ్యాపారములందు; కథాభిః = కథలతో; అనురజ్యన్తే = సంతోషముపొందుట; కథాశీలాః = కథలు వినువారు; కథాప్రియైః = కథాలయందు ఆసక్తికలవారు.
భావం:-
రాజులేని రాజ్యమునందు వ్యవహారములందు, వ్యాపారాములందు ప్రయోజనము పొందుట ఉండదు. కథలు చెప్పువారు, కథలవినువారు కథల యందు రంజించుట ఉండదు.
2.67.17
అనుష్టుప్.
నారాజకే జనపదే
ఉద్యానాని సమాగతాః।
సాయాహ్నే క్రీడితుం యాంతి
కుమార్యో హేమభూషితాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = అరాజకపరిస్తితులలో; జనపదే = రాజ్యమునందు; ఉద్యానాని = ఉద్యానవనముల వద్ద; సమాగతాః = సమావేశమగుటకు; సాయాహ్నే = సాయంకాల సమయమునందు; క్రీడితుం = ఆడుకొనుటకు; యాంతి = వెళ్ళుట; కుమార్యః = కుమారికలు; హేమభూషితాః = బంగారు ఆభరణములు అలంకరించుకుని.
భావం:-
అరాజకపరిస్తితులలో దేశములో ఎక్కడా ఆడపిల్లలు బంగారు ఆభరణములు ధరించి సాయంకాల సమయములో ఉద్యానవనములలో కలిసి సంతోషముగా విహరించుట ఉండదు.
2.67.18
అనుష్టుప్.
నారాజకే జనపదే
వాహనైశ్శీఘ్రగామిభిః।
నరా నిర్యాన్త్యరణ్యాని
నారీభిస్సహ కామినః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; వాహనైః = వాహనములమీద; శీఘ్రగామిభిః = వేగముగా వెళ్ళెడి; నరాః = మానవులు; నిర్యాంతి = బయలుదేరుట; అరణ్యాని = వనముల గూర్చి; నారీభిః = స్త్రీలతో; సహ = కూడి; కామినః = రసికులు..
భావం:-
రాజులేని రాజ్యములో రసికులైన యువకులు వేగముగా ప్రయాణించు వాహనముల మీద వారి ప్రియురాండ్రతోగూడి వనవిహారములకు వెళ్ళజాలరు.
2.67.19
అనుష్టుప్.
నారాజకే జనపదే
ధనవన్తస్సురక్షితాః।
శేరతే వివృతద్వారాః
కృషిగోరక్షజీవినః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; ధనవన్తః = ధనవంతులు; సురక్షితాః = సురక్షితముగా। శేరతే = నిద్రించుట; వివృతద్వారాః = తలుపులు తెరుచుకుని; కృషిగోరక్షజీవినః = వ్యవసాయము మఱియు గోరక్షణ చేయువారు॥
భావం:-
రాజులేని రాజ్యములో దొంగల భయము కారణముగా వ్యవసాయము చేసుకునువారు, గోరక్షణ చేయువారు, వ్యాపారముచేయు ధనికులుగాని సురక్షితముగా జీవించలేరు. వారు తలుపులు తెరుచుకుని నిద్రింపజాలరు.
2.67.20
అనుష్టుప్.
నారాజకే జనపదే
బద్ధఘణ్టావిషాణినః।
అటంతి రాజమార్గేషు
కుంజరా షష్టిహాయనాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; బద్ధఘణ్టావిషాణినః = బంధింపబడిన, ఘంటలు కట్టబడిన, దంతములుగల । అటంతి = తిరుగుట; రాజమార్గేషు = రాజ మార్గములో; కుంజరాః = గజములు; షష్టిహాయనాః = అరువది సంవత్సరములుగల॥
భావం:-
రాజులేని రాజ్యములో మెడలో గంటలు కట్టబడినవి, బలిష్ఠమైన దంతములు గల అఱువది సంవత్సరములు వయస్సుగల గజములు కిరాతుల భయముతో రాజమార్గములలో సంచరించవు.
2.67.21
అనుష్టుప్.
నారాజకే జనపదే
శరాన్సన్తతమస్యతామ్।
శ్రూయతే తలనిర్ఘోష
ఇష్వస్త్రాణాముపాసనే॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; శరాన్ = బాణములను; సన్తతమ్ = నిరంతరము; అస్యతామ్ = విడవబడుచున్న। శ్రూయతే = వినబడుట; తలనిర్ఘోషః = తలము యొక్క ధ్వని; ఇష్వస్త్రాణామ్ = ఇతర శస్త్ర, అస్త్రములయొక్క; ఉపాసనే = అభ్యాసమునందు॥
భావం:-
రాజులేని రాజ్యములో, బాణప్రయోగములు మఱియు అస్త్రవిద్యలను అభ్యసించు సమయమున అవిచ్ఛన్నముగా బాణప్రయోగము చేయుచున్న ధ్వనులు వినబడవు. అరాజకము కారణముగా విలువిద్యాభ్యాసములు సక్రమముగా, నిరంతరాయముగా కొనసాగవని భావము.
2.67.22
అనుష్టుప్.
నారాజకే జనపదే
వణిజో దూరగామినః।
గచ్ఛంతి క్షేమమధ్వానమ్
బహుపణ్యసమాచితాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; వణిజః = వ్యాపారులు; దూరగామినః = దూరప్రయాణములు; గచ్ఛంతి = వెళ్ళుట; క్షేమమ్ = సురక్షితముగ; అధ్వానమ్ = మార్గమును గూర్చి; బహుపణ్యసమాచితాః = పలువిధములయిన విక్రయవస్తువులతో కూడి.
భావం:-
రాజు లేని రాజ్యమునందు వ్యాపారనిమిత్తమై దూరప్రదేశములకు వివిధ వ్యాపారసామాగ్రితో ప్రయాణము చేయవలిసిన వర్తకులు దొంగలకారణముగా క్షేమముగ ప్రయాణము చేయజాలరు.
2.67.23
అనుష్టుప్.
నారాజకే జనపదే
చరత్యేకచరో వశీ।
భావయన్నాత్మనాఽ త్మానమ్
యత్ర సాయంగృహో మునిః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; చరతి = సంచరించుట; ఏకచరః = ఒంటరిగా సంచరించువాడు; వశీ = ఇంద్రియములను తన ఆధీనములో ఉంచినవాడు; భావయన్ = భావనచేయువాడు; ఆత్మనా = అంతఃకరణమును; ఆత్మానమ్ = ఆత్మయందు; యత్ర = ఎక్కడ; సాయంగృహః = సాయంకాలమగునో అక్కడే నివసించే; మునిః = మునీశ్వరుడు.
భావం:-
రాజు లేని రాజ్యమునందు ఎప్పుడు ఒంటరిగా సంచరించువాడు, శమదమములు కలిగినవాడు, అంతఃకరణమును పరమాత్మయందు నిలిపినట్టి స్థితప్రజ్ఞుడు, ఎక్కడ సాయంకాలమగునో అక్కడే నివసించువాడు అయిన ముని దేశములో ఎక్కడికి సంచరించడు.
2.67.24
అనుష్టుప్.
నారాజకే జనపదే
యోగక్షేమం ప్రవర్తతే।
నచాప్యరాజకే సేనా
శత్రూన్విషహతే యుధి॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; యోగక్షేమం = యోగక్షేమములు; ప్రవర్తతే = ప్రవర్తించుట; న = లేదు; చ = మఱియు; అపి = కూడ; అరాజకే = రాజులేని దేశమందు; సేనా = సేనలు; శత్రూన్ = శత్రువులను; విషహతే = ఎదుర్కొనుట; యుధి = రణమునందు.
భావం:-
రాజులేని రాజ్యములో యోగక్షేమములు లోపించును, ఇంకను యుద్ధమునందు సైన్యము {కట్టుబాట్లు సడలి, సరియైన క్రమశిక్షణలేకపోవుటచే} శత్రువులను ఎదుర్కొనలేదు.
2.67.25
అనుష్టుప్.
నారాజకే జనపదే
హృష్టైః పరమవాజిభిః।
నరాస్సంయాంతి సహసా
రథైశ్చ పరిమణ్డితాః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; హృష్టైః = సంతోషముతో; పరమవాజిభిః = శ్రేష్ఠమైన గుఱ్ఱములపై; నరాః = మానవులు; సయాంతి = వెళ్ళుట; సహసా = వేగముగ; రథైః = రథముల; చ = మఱియు; పరిమణ్డితాః = అలంకరించబడిన.
భావం:-
రాజులేని రాజ్యములో మానవులెవ్వరు మానసోల్లాసముకై బాగుగ ఆభరణములు ధరించి మేలుజాతి గుఱ్ఱములపైనగాని, వేగముగా పరుగులు తీసే రథములపైగాని వెళ్ళుటకు సాహసించరు.
2.67.26
అనుష్టుప్.
నారాజకే జనపదే
నరాశ్శాస్త్రవిశారదాః।
సంవదన్తోఽ వతిష్ఠన్తే
వనేషూపవనేషు చ॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; నరాః = మానవులు; శాస్త్రవిశారదాః = శాస్త్రములందు ఆరితేరిన పండితులు; సంవదన్తః = చర్చించుట; అవతిష్ఠన్తే = కూర్చుని; వనేషు = వనములందు; ఉపవనేషు = ఉపవనములందు; చ = మఱియు.
భావం:-
రాజులేని రాజ్యములో శాస్త్రములందు ఆరితేరిన పండితులు వనములలోగాని, ఉపవనములలోగాని కూర్చుని శాస్త్రచర్చలు చేయజాలరు.
2.67.27
అనుష్టుప్.
నారాజకే జనపదే
మాల్యమోదకదక్షిణాః।
దేవతాభ్యర్చనార్థాయ
కల్ప్యన్తే నియతైర్జనైః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; మాల్య = పుష్పమాలలు; మోదక = మిఠాయిలు, ప్రసాదములు; దక్షిణాః = గురువులకు ఇచ్చే కానుకలు; దేవతాభ్యర్చనార్థాయ = దైవారాధన నిమిత్తమై; కల్ప్యన్తే = ఏర్పరచుట; నియతైః = నియమింపబడిన; జనైః = జనులచేత.
భావం:-
రాజులేని రాజ్యములో ఏకాగ్రచిత్తులైనవారుగూడ దేశపరిస్థితుల కాలుష్యమగుటచేత నియమపూర్వకముగా దేవాతారాధన చేయుటకు పూలమాలలను, మధురమైన పదార్థ నైవేద్యములను, కానుకలను ఏర్పరచ లేరు.
2.67.28
అనుష్టుప్.
నారాజకే జనపదే
చన్దనాగరురూషితాః।
రాజపుత్రా విరాజన్తే
వసన్త ఇవ శాఖినః॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; చందన = చందనముతో; అగరు = అగరు గంధములతో; రూషితాః = పూయబడినవారు; రాజపుత్రాః = రాజకుమారులు; విరాజన్తే = ప్రకాశించుట; వసంతః = వసంత ఋతువు నందు; ఇవ = వలె; శాఖినః = వృక్షములు।
భావం:-
రాజులేని రాజ్యములో వసంత ఋతువులో వృక్షములు వలె విరాజిల్లెడి రాకుమారులు చందనం, అగరు గంధము వంటి సుగంధలేపనములను నిరాదరింతురు.
2.67.29
అనుష్టుప్.
యథా హ్యనుదకా నద్యః
యథా వాఽ ప్యతృణం వనమ్।
అగోపాలా యథా గావః
తథా రాష్ట్రమరాజకమ్॥
టీక:-
యథా = ఏ విధముగా; హి = ఏలనన; అన్+ఉదకాః = నీరులేని; నద్యః = నదులు; యథా = ఏ విధముగా; వా = ; అపి = కూడా; అతృణం = గడ్డిలేని; వనమ్ = అరణ్యము; అగోపాలాః = కాపరిలేని; యథా = ఏ విధముగా; గావః = గోవులు; తథా = ఆ విధముగా; రాష్ట్రమ్ = రాజ్యము; అరాజకమ్ = రాజు లేని.
భావం:-
రాజులేని దేశము నీరులేని నదులు ఎట్లు ఉండునో, గడ్డిలేని అరణ్యము ఎట్లు ఉండునో; గోపాలకుడులేని గోవులు ఎట్లు ఉండునో, అట్లు ఉండును.
2.67.30
అనుష్టుప్.
ధ్వజో రథస్య ప్రజ్ఞానమ్
ధూమో జ్ఞానం విభావసోః।
తేషాం యో నో ధ్వజో రాజా
స దేవత్వమితో గతః॥
టీక:-
ధ్వజః = పతాకము; రథస్య = రథముయొక్క; ప్రజ్ఞానమ్ = గుర్తించుటకు సాధనము; ధూమః = పొగ; జ్ఞానం = గుర్తించుటకు సాధనము; విభావసోః = అగ్నికి; తేషాం = అట్టి; యః = ఎవరు; నః = మనకు; ధ్వజః = ప్రతీక అయినటువంటి; రాజా = రాజు; సః = అతడు; దేవత్వమ్ = దేవత్వమును; ఇతః = ఇచటనుండి; గతః = పొందెను.
భావం:-
రథికుని గుర్తించుటకు రథమునకున్న పతాకము సంకేతము; పొగ అగ్ని ఉనికికి సంకేతము; అయోధ్య పౌరుల ఔన్నత్యమునకు మహారాజు ప్రతీక. అట్టి దశరథమహీపతి మనలను విడిచి స్వర్గమునకేగినాడు.
2.67.31
అనుష్టుప్.
నారాజకే జనపదే
స్వకం భవతి కస్యచిత్।
మత్స్యా ఇవ నరా నిత్యమ్
భక్షయంతి పరస్పరమ్॥
టీక:-
న = ఉండదు; అరాజకే = రాజులేని; జనపదే = రాజ్యమునందు; స్వకం = స్వంతము; భవతి = ఉండుట; కస్యచిత్ = ఎవ్వరికి; మత్స్యాః = చేపలు; ఇవ = వలె; నరాః = మానవులు; నిత్యం = ఎప్పుడును; భక్షయంతి = భక్షించెదరు; పరస్పరం = ఒకరినొకరు.
భావం:-
రాజులేని రాజ్యములో పౌరులకు, వారి సంపదలకు రక్షణ కఱువగును. పెద్దచేప, చిన్న చేపను భక్షించినట్లు బలవంతులు బలహీనుల ధనమును అపహరింతురు.
2.67.32
అనుష్టుప్.
యే హి సమ్భిన్నమర్యాదా
నాస్తికాశ్ఛిన్నసంశయాః।
తేఽ పి భావాయ కల్పన్తే
రాజదణ్డనిపీడితాః॥
టీక:-
యే = ఎవరు; హి = నిజంగా; సమ్భిన్నమర్యాదా = భేదింపబడిన మర్యాదలు గలవారు; నాస్తికాః = నాస్తికులు; ఛిన్నసంశయాః = సంశయములు లేకుండ ; తే = వారు; అపి = కూడా; భావాయ = వారి భావములను; కల్ప్యంతే = కల్పించును; రాజదణ్డనిపీడితాః = చట్టబద్దమైన శిక్షకు గురైనవారు.
భావం:-
ఇంతవఱకును రాజదండమునకు భయపడిన నాస్తికులు, అరాజక పాలనలోని పరిస్థితులను అదునుగా తీసుకుని శాస్త్ర ధర్మములను ఉల్లంఘించుచు ఎట్టి భయము లేకుండ విశృంఖలముగా ప్రవర్తించెదరు.
2.67.33
అనుష్టుప్.
యథా దృష్టిశ్శరీరస్య
నిత్యమేవ ప్రవర్తతే।
తథా నరేన్ద్రో రాష్ట్రస్య
ప్రభవస్సత్యధర్మయోః॥
టీక:-
యథా = ఏవిధముగానయితే; దృష్టిః = చూపు; శరీరస్య = దేహముయొక్క{సంరక్షానాది విషయములో}; నిత్యమ్ = ఎప్పుడును; ఏవ = మాత్రమే; ప్రవర్తతే = సాగుతుంది; తథా = అట్లే; నరేన్ద్రః = రాజు; రాష్ట్రస్య = రాజ్యముయొక్క; ప్రభవః = నెలకొల్పును; సత్యధర్మయోః = సత్యం మఱియు ధర్మం.
భావం:-
దృష్టి ఏవిధముగానయితే శరీరమును సంరక్షించుచుండునో, అదే విధముగా భూపతి తన దేశములోని సత్యమును, ధర్మమును పరిరక్షించును.
2.67.34
అనుష్టుప్.
రాజా సత్యం చ ధర్మశ్చ
రాజా కులవతాం కులమ్।
రాజా మాతా పితా చైవ
రాజా హితకరో నృణామ్॥
టీక:-
రాజా = రాజు; సత్యం = సత్యము; చ = మఱియు; ధర్మః = ధర్మము; చ = మఱియు; రాజా = రాజు; కులవతాం = కులవంతులకు; కులమ్ = కులము; రాజా = రాజు; మాతా = తల్లి; పితా = తండ్రి; చ = మఱియు; ఏవ = మాత్రమే; రాజా = రాజు; హితకరః = మంచి చేయువాడు; నృణామ్ = మనుషులకు.
భావం:-
దేశములోని సత్యమును, ధర్మమును పరిరక్షించువాడు రాజు. రాజు కులాచారమును చక్కగా ప్రవర్తిల్లచేయువాడు. ప్రజలకు తల్లిఁదండ్రుల వలె సర్వహితమును గూర్చువాడు.
2.67.35
అనుష్టుప్.
యమో వైశ్రవణశ్శక్రః
వరుణశ్చ మహాబలః।
విశేష్యన్తే నరేన్ద్రేణ
వృత్తేన మహతా తతః॥
టీక:-
యమః = యముడు; వైశ్రవణః = కుబేరుడు; శక్రః = ఇంద్రుడు; వరుణః = వరుణుడు; చ = మఱియు; మహాబలః = గొప్ప బలము కలవాడు। విశేష్యన్తే = మించిన వాడగుట; నరేన్ద్రేణ = రాజుచేత; వృత్తేన = నడవడికచే; మహతా = గొప్పదైన; తతః = తరువాత.
భావం:-
రాజు ఆదర్శప్రాయమైన తన నడవడికచేత ఇంద్ర, వరుణ, యమ, కుబేరుల కంటె మించినవాడై ప్రజలకు అండగానుండును.
2.67.36
అనుష్టుప్.
అహో తమ ఇవేదం స్యాత్
న ప్రజాయేత కించన।
రాజా చే న్న భవేల్లోకే
విభజ సాధ్వసాధునీ॥
టీక:-
అహో = ఏమి ఆశ్చర్యము; తమః = చీకటి; ఇవ = వలె; ఇదం = ఇది; స్యాత్ = అగును; న ప్రజాయేత = పుట్టునదికాదు; కించన = ఏదియును। రాజా = రాజు; చేన్; న భవేత్ = లేకుండినట్లు అయితే; లోకే = లోకమందు; విభజ = వేఱుచేయుచు; సాధ్వసాధునీ = మచి చెడ్డలను.
భావం:-
ధర్మాధర్మ విభజనను విడమర్చి చెప్పనిచో ప్రజలు అజ్ఞానమనే అంధకారములో పడి దిక్కుతోచని వారగుదురు.
2.67.37
అనుష్టుప్.
జీవత్యపి మహారాజే
తవైవ వచనం వయమ్।
నాతిక్రమామహే సర్వే
వేలాం ప్రాప్యేవ సాగరః॥
టీక:-
జీవతి = జీవించియున్నప్పుడు; అపి = కూడ; మహారాజే = మహారాజు; తవ = నీయొక్క; ఏవ = మాత్రమే; వచనం = మాటను; వయమ్ = మేము; న = లేదు; అతిక్రమామహే = దాటుట; సర్వే = అందఱమును; వేలాం = తీరమును; ప్రాప్య = చేరి; ఇవ = వలె; సాగరః = సముద్రము.
భావం:-
ఓ వసిష్ఠమహర్షి! దశరథ మహీపతి జీవించియున్నంతకాలము సాగరము చెలియలికట్టను ఏ విధముగా దాటకుండునో అదేవిధముగా మేమందఱమును మీ మాటెన్నడును మీరలేదు.
2.67.38
జగతి.
స నస్సమీక్ష్య ద్విజవర్య వృత్తం
నృపం వినా రాజ్యమరణ్యభూతమ్।
కుమారమిక్ష్వాకుసుతం వదాన్యం
త్వమేవ రాజానమిహాభిషించ॥
టీక:-
సః = అతడు; నః = మాకు; సమీక్ష్య = విశ్లేషించి; ద్విజవర్య = ఓ బ్రాహ్మణోత్తమ; వృత్తం = వృత్తాంతమును; నృపం = రాజు; వినా = లేని; రాజ్యమ్ = రాజ్యము; అరణ్యభూతమ్ = అడవిగా మారునని గుర్తించి; కుమారమ్ = కుమారుడిని; ఇక్ష్వాకుసుతం = ఇక్ష్వాకు వంశములో జన్మించిన సుతుని; వదాన్యం = ఉదారుడైన; త్వమ్ = నీవు; ఏవ = మాత్రమే; రాజానమ్ = రాజుగా; ఇహ = ఇక్కడ; అభిషించ = పట్టాభిషేచనము చేయుము.
భావం:-
ఓ బ్రహ్మర్షీ! మేము నీకు విన్నవించుకున్న విషయమును విశ్లేషించి, రాజులేని రాజ్యము అరణ్యమగునని గుర్తించి, ఇక్ష్వాకువంశ సుతులలో ఉదారుడైన దశరథుని కుమారుడిని ఈ అయోధ్యకు రాజుగా పట్టభిషేకము కావింపవలెను.
2.67.39
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే సప్తషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; సప్తషష్టితమ [67] = అరవైఏడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [67] అరవైఏడవ సర్గ సంపూర్ణము.
2.68.1
అనుష్టుప్.
తేషాం హి వచనం శ్రుత్వా
వసిష్ఠః ప్రత్యువాచ హ।
మిత్రామాత్యగణాన్సర్వాన్
బ్రాహ్మణాంస్తానిదం వచః॥
టీక:-
 తేషాం = వారియొక్క; హి = విశేషముగ; వచనం = మాటలను; శ్రుత్వా = విని; వసిష్ఠః = వసిష్ఠుడు; ప్రత్యువాచ = సమాధానమిచ్చెను; హ = వెంటనే; మిత్ర = రాజు మిత్రులతోను; అమాత్య = మంత్రులతోను; గణాన్ = గణములతోను; సర్వాన్ = అందరితోను; బ్రాహ్మణాం = బ్రాహ్మణులతోను; తాన్ = వారికి; ఇదం వచః = ఈ మాటల చేత
భావం:-
 వారి మాటలు శ్రద్ధగా విని, వసిష్ఠుడు ఆ రాజు మిత్రులు, అమాత్యులు, బ్రాహ్మణులు సమూహములతో ఇట్లు పలికెను.
2.68.2
అనుష్టుప్.
“యదసౌ మాతులకులే
దత్తరాజ్యం పరం సుఖీ।
భరతో వసతి భ్రాత్రా
శత్రుఘ్నేన సమన్వితః॥
టీక:-
 యది = ఏ కారణము చేతైనను; అసౌ = ఆ; మాతులకులే = తన మేనమామ ఇంటి వద్ద; దత్తరాజ్యం = రాజ్యముఇవ్వబడినవాడు; పరం సుఖీ = అత్యంత సుఖముగా; భరతః = భరతుడు; వసతి = ఉన్నాడు; భ్రాత్రా = సోదరుడైన; శత్రుఘ్నేన = శత్రుఘ్రునితో; సమన్వితః = కలసి+M26
భావం:-
 రాజుగారిచే రాజ్యం ఇవ్వబడిన భరతుడు, శత్రుఘ్న సహితుడై మేనమామకు రాజ్యములో సుఖముగా ఉన్నాడు.
2.68.3
అనుష్టుప్.
తచ్ఛీఘ్రం జవనా దూతా
గచ్ఛంతు త్వరితైర్హయైః।
ఆనేతుం భ్రాతరౌ వీరౌ
కిం సమీక్షామహే వయమ్”॥
టీక:-
 తత్ = ఆ కారణంగా; శీఘ్రం = తొందరగా; జవనా = వేగవంతులైన; దూతా = దూతలు; గచ్ఛంతు = వెళ్లవలెను; త్వరితైః = వడిగల; హయైః = గుఱ్ఱములను; ఆనేతుం = తీసుకొని వచ్చుటకు; భ్రాతరౌ = సోదరులను; వీరౌ = వీరులైన ఇరువురిని; కిం సమీక్షామహే = ఆలోచించవలసినది ఏమున్నది; వయమ్ = మనము
భావం:-
 అందుచేత, వీరులైన ఆ సోదరులను ఇద్దరిని తీసికొనివచ్చుటకు, వేగవంతులైన దూతలు త్వరగా పరుగెత్తగల అశ్వములమీద వెంటనే బయలుదేర వలెను. దశరథుడే భరతునకు రాజ్యమిచ్చిన పిమ్మట ఈ విషయములో మనము ఆలోచించవలసినది ఏమున్నది.”
2.68.4
అనుష్టుప్.
గచ్ఛన్త్వితి తతస్సర్వే
వసిష్ఠం వాక్యమబ్రువన్।
తేషాం తద్వచనం శ్రుత్వా
వసిష్ఠో వాక్యమబ్రవీత్॥
టీక:-
 గచ్ఛంతు = వెళ్ళెదరుగాక; ఇతి = అని; తతః = అప్పుడు; సర్వే = వారందరు; వసిష్ఠం = వసిష్ఠునితో; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికిరి; తేషాం = వారియొక్క; తత్ = ఆ; వచనం = మాటలను; శ్రుత్వా = విని; వసిష్ఠః = వసిష్ఠుడు; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను
భావం:-
 వారందరు ముక్తకంఛంతో వసిష్ఠునితో నీవు చెప్పినట్లు దూతలు వెళ్లెదరు గాక.. అని పలికిరి. అపుడు ఆ మాట విని వసిష్ఠుడు ఇట్లు ఆజ్ఞాపించెను.
2.68.5
అనుష్టుప్.
“ఏహి సిద్ధార్థ! విజయ!
జయన్తాశోక! నందన!।
శ్రూయతామితి కర్తవ్యమ్
సర్వానేవ బ్రవీమి వః॥
టీక:-
 ఏహి = రండి; సిద్ధార్థ = సిద్ధార్థా; విజయ = విజయా; జయంత = జయంతా; అశోక = అశోకా; నందన = నందనా; శ్రూయతామ్ = వినండి; ఇతి కర్తవ్యమ్ = ఏమి చేయవలెనో; సర్వానేవ = అందరికీ; బ్రవీమి = చెప్పుచున్నాను; వః = మీకు
భావం:-
 సిద్ధార్థా! జయంతా! విజయా! అశోకా! నందనా! రండి. మీ అందరికి చెప్పుచున్నాను. ఏమి చేయవలెనో వినండి.
2.68.6
అనుష్టుప్.
పురం రాజగృహం గత్వా
శీఘ్రం శీఘ్రజవై ర్హయైః।
త్యక్తశోకైరిదం వాచ్యః
శాసనాద్భరతో మమ॥
టీక:-
 పురం = పురమును; రాజగృహం = రాజగృహమును గూర్చి; గత్వా = వెళ్లి; శీఘ్రం = శీఘ్రముగా బయలుదేరి; శీఘ్రజవైః = మిక్కిలివేగము గల; హయైః = గుఱ్ఱములపై; త్యక్తశోకైః = దుఃఖమును పైకి కనపడనీయక; ఇదం వాచ్యః = ఈ మాటలను; శాసనాత్ = ఆజ్ఞగా; భరతో = భరతునితో; మమ = నాయొక్క
భావం:-
 మీరు ఇచటి నుండి శీఘ్రముగా బయలుదేరి, మంచి వేగము గల గుఱ్ఱములపై ప్రయాణము చేసి రాజగృహ పురమును చేరి, మనస్సులోని దుఃఖమును పైకి కనబడనీయక నా ఆజ్ఞగా భరతునితో ఇట్లు చెప్పవలెను.
2.68.7
అనుష్టుప్.
“పురోహితస్త్వాం కుశలమ్
ప్రాహ సర్వే చ మంత్రిణః।
త్వరమాణశ్చ నిర్యాహి
కృత్యమాత్యయికం త్వయా”॥
టీక:-
 పురోహితః = పురోహితుడును; త్వాం= మీ; కుశలమ్ = కుశలమును; ప్రాహ = ప్రశ్నించుచున్నారు; సర్వే చ = అందరును; చ = మఱియు; మంత్రిణః = మంత్రులును; ,త్వరమాణశ్చ = వెంటనే; నిర్యాహి = బయలుదేరి రావలెను; కృత్యమ్ = పని; ఆత్యయికం = అతి+ఆయకం, చాలా తొందరైనది; త్వయా = నీతో
భావం:-
 ”పురోహితుడును, మంత్రులును, అందరును మీ కుశలము అడుగుచున్నారు. వెంటనే నీవు బయలుదేరి రావలెను. మీతో చాల తొందర పని ఉన్నది.”
2.68.8
అనుష్టుప్.
మా చాస్మై ప్రోషితం రామమ్
మా చాస్మై పితరం మృతమ్
భవంతశ్శంసిషుర్గత్వా
రాఘవాణామిమం క్షయమ్॥
టీక:-
 మా = వద్దు; చ = ఇంకా; అస్మై = అతనికి; ప్రోషితం = ప్రవాసము వెళ్లినట్లును; రామమ్ = రాముడు; మా = వద్దు; చ = ఇంకా; అస్మై = అతనికి; పితరం = తండ్రిని; మృతమ్ = మరణించినవానిగను; భవన్తః = మీరు; శంసిషుః = చెప్పుట; గత్వా = వెళ్లి; రాఘవాణామ్ = రఘువంశీయులయొక్క్; ఇమం = ఈ; క్షయమ్ = ఆపదలు.
భావం:-
 మీరు అక్కడకు వెళ్లి రాముడు ప్రవాసమునకు వెళ్లినట్లును, అతని తండ్రి మరణించినట్లును, రఘువంశీయులకు ఆపదలు సంభవించినట్లును చెప్పవద్దు.
2.68.9
అనుష్టుప్.
కౌశేయాని చ వస్త్రాణి
భూషణాని వరాణి చ।
క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ
భరతస్య చ గచ్ఛత”॥
టీక:-
 కౌశేయాని = పట్టుతోనేయబడిన; చ = పాదపూరణము; వస్త్రాణి = వస్త్రములను; భూషణాని = అలంకారములను; వరాణి = ఉత్తమమైన; చ = మఱియు; క్షిప్రమ్ = వెంటనే; ఆదాయ = తీసుకుని; రాజ్ఞః = కేకయ రాజునకు; చ = మఱియు; భరతస్య = భరతునికి; చ = మఱియు; గచ్ఛత = వెళ్లెదరుగాక.
భావం:-
 కేకయ రాజునకు, భరతునకు ఉత్తమమైన పట్టువస్త్రములు, అలంకారములను తీసుకొని వెళ్లవలెను.”
2.68.10
అనుష్టుప్.
దత్తపథ్యశనా దూతా
జగ్ముస్స్వం స్వం నివేశనమ్।
కేకయాంస్తే గమిష్యన్తో
హయానారుహ్య సంమతాన్॥
టీక:-
 దత్త = ఇవ్వబడిన; పథ్యశనా = దారిభత్యములుతో; దూతా = దూతలు; జగ్ముః = వెళ్లిరి; స్వం స్వం = తమ తమ; నివేశనమ్ = గృహములకు; కేకయాం = కేకయ దేశమునకు; తే = ఆ; గమిష్యన్తో = వెళ్లనున్న; హయాన్ = గుఱ్ఱములను; ఆరుహ్య = ఎక్కి; సంమతాన్ = అంగీకారయోగ్యమైన.
భావం:-
  ఆ దూతలు, ఇచ్చిన దారిబత్తెములు తీసుకుని కేకయదేశమునకు వెళ్లవలసిన తగిన అశ్వములను ఎక్కి, తమ తమ ఇండ్లకు వెళ్లిరి.
2.68.11
అనుష్టుప్.
తతః ప్రాస్థానికం కృత్వా
కార్యశేషమనంతరమ్
వసిష్ఠేనాభ్యనుజ్ఞాతా
దూతాస్సంత్వరితా యయుః॥
టీక:-
 తతః = పిమ్మట; ప్రాస్థానికం = ప్రయాణమునకు; కృత్వా = చేసుకొని; కార్య = పనులు; శేషమ్ = మిగిలినవి; అనంతరమ్ = పిమ్మట; వసిష్ఠేన = వసిష్ఠునిచేత; అభ్యజ్ఞాతా = అనుమతి పొంది; దూతాః = దూతలు; సంత్వరితా = మిక్కిలి తొందరగా; యయుః = వెళ్లిరి
భావం:-
 పిమ్మట ఆ దూతలు, ప్రయాణము నిమిత్తమై కావలసిన మిగిలిన పనులన్నియు పూర్తి చేసుకొని, వసిష్ఠుని అనుమతి తీసుకొని, మిక్కిలి తొందరగా వెళ్లిరి.
2.68.12
అనుష్టుప్.
న్యన్తేనాపరతాలస్య
ప్రలమ్బస్యోత్తరం ప్రతి।
నిషేవమాణా స్తే జగ్ముః
నదీం మధ్యేన మాలినీమ్॥
టీక:-
 న్యన్తేన = ఉండినట్టి; అపరతాలస్య = అపరతాల పర్వతము యొక్క; ప్రలమ్బస్య = ప్రలంబ పర్వతము యొక్క; ఉత్తరం ప్రతి = ఉత్తరాభిముఖులై; నిషేవమాణాః = తాకుచు; తే = ఆ దూతలు; జగ్ముః = వెళ్లి; నదీం = నదికి; మధ్యేన = మధ్యలో; మాలినీమ్ = మాలిని అను పేరు గల
భావం:-
 దూతలు అయోధ్య నుండి బయలుదేరి పశ్చిమాభిముఖులై కొంత దూరము వెళ్లి, అపరతాల పర్వతము చివరి దక్షిణభాగము దాటి, పిదప అపరతాల ప్రలంబ పర్వతముల మధ్య మాలినీ నదీతీర మార్గములో ఉత్తరముగా ప్రయాణము చేసి, పశ్చిమాభిముఖులై వెళ్లిరి.
2.68.13
అనుష్టుప్.
తే హస్తినాపురే గంగామ్
తీర్త్వా ప్రత్యంముఖా యయుః।
పాంచాలదేశమాసాద్య
మధ్యేన కురుజాంగలమ్॥
టీక:-
 తే = ఆ దూతలు; హస్తినాపురే = హస్తినాపురములో; గంగామ్ = గంగానదిని; తీర్త్వా =దాటిరి; ప్రత్యంముఖా = పశ్చిమాభిముఖులై; యయుః = ప్రయాణము చేసి; పాంచాల దేశమ్ = పాంచాల దేశమును; ఆసాద్య = చేరి; మధ్యేన = మధ్య దేశము మీదుగా; కురుజాంగలమ్ = కురజాంగలమును
భావం:-
 ఆ దూతలు పశ్చిమాభిముఖులై ప్రయాణము చేసి, హస్తినా పురములో గంగానదిని దాటి, కురజాంగల మధ్యదేశము మీదుగా పాంచాలదేశము చేరిరి.
2.68.14
అనుష్టుప్.
సరాంసి చ సుపూర్ణాని
నదీశ్చ విమలోదకాః।
నిరీక్షమాణాస్తే జగ్ముః
దూతాః కార్యవశాద్ద్రుతమ్॥
టీక:-
 సరాంసి = సరస్సులను; సుపూర్ణాని = జలములతో బాగుగా నిండుగా ఉన్నది; నదీః = నదులను; చ = మఱియు; విమలోదకాః = నిర్మలమైన ఉదకము గల; నిరీక్షమాణాః = చూచుచు; తే = వారు; జగ్ముః = వెళ్లిరి; దూతాః = దూతలు; కార్యవశాత్ = పని తొందరను బట్టి; ద్రుతమ్ = అతి శీఘ్రముగా.
భావం:-
 అచట నుండి, బాగుగా నీటితో నిండుగా ఉన్న సరస్సులను, నిర్మలమైన నీరు గల నదులను చూచుచు, పనితొందరను బట్టి అతి శీఘ్రముగా వెళ్లిరి.
2.68.15
అనుష్టుప్.
తే ప్రసన్నోదకాం దివ్యామ్
నానావిహగసేవితామ్।
ఉపాతిజగ్ముర్వేగేన
శరదండాం జనాకులామ్॥
టీక:-
 తే = ఆ దూతలు; ప్రసన్న = నిర్మలమైన; ఉదకాం = నీరు కలది; దివ్యామ్ = శ్రేష్ఠము; నానా = వివిధములైన; విహగ = పక్షులచే; సేవితామ్ = సేవింపబడినది; ఉపాతి = దాటుతూ; జగ్ముః = వెళ్లిరి; వేగేన = వేగముగా; శరదండాం = శరదండా నదిని; జనాకులామ్ = జనులతో నిండినది
భావం:-
 ఆ దూతలు శ్రేష్ఠమైన నిర్మలమైన నీటితో, వివిధములైన పక్షులచే సేవింపబడినది, జనులతో సందడిగా కలదీ అయిన శరదండానదిని దాటి వేగముగా ప్రయాణముచేసిరి.
2.68.16
అనుష్టుప్.
నికూలవృక్షమాసాద్య
దివ్యం సత్యోపయాచనమ్।
అభిగమ్యాభివాద్యం తమ్
కుళింగాం ప్రావిశన్పురీమ్॥
టీక:-
 నికూల =తీరముపై ఉన్న; వృక్షమ్ = వృక్షమును; ఆసాద్య = సమీపించి; దివ్యం = దివ్యమైన; సత్యోపయాచనమ్ = సత్య + ఉపయాచనమ్, సత్యౌపచాయనము అనెడి; అభిగమ్య = ప్రదక్షిణము చేసి; అభివాద్యం = నమస్కార అర్హమైన; తమ్ = వారు; కుళింగాం = కుళంగ అనుపేరు; గల ప్రావిశన్ = ప్రవేశించిరి; పురీమ్ = నగరిని
భావం:-
 వారు తీరముపై ఉన్న సత్యోపచాయనము అనెడి దివ్య వృక్షమును సమీపించి నమస్కారదగిన దానికి ప్రదక్షిణ నమస్కారము చేసి, కుళింగానగరిని ప్రవేశించిరి.
*గమనిక:-
 (1) సత్యోపయాచనమ్- సత్య + ఉపయాచనమ్, సత్య సత్యమగుట, ఉపయాచన, దగ్గఱకువచ్చి యాచించువారు+ వారుకలది, చేరికోరిన తీర్చునది. (2) కుళింగ- అడవి పిచ్చుక, శబ్దరత్నాకరము.
2.68.17
అనుష్టుప్.
ఆభికాళం తతః ప్రాప్య
తే బోధిభవనాచ్చ్యుతామ్।
పితృపైతామహీం పుణ్యామ్
తేరురిక్షుమతీం నదీమ్॥
టీక:-
 ఆభికాళం = అభికాల గ్రామమునకు; తతః = అక్కడినుండి; ప్రాప్య = చేరి; తే = వారు; బోధిభవనాత్ = బోధిభవనము అను పర్వతమునుండి; చ్యుతామ్ = ప్రవహించుచున్న; పితృపైతామహీం = దశరథుని పితృపితామహాదుల చేత అనుభవింపబడిన; పుణ్యామ్ = పవిత్రమైన; తేరుః = దాటిరి; ఇక్షుమతీం నదీమ్ = ఇక్షుమతీ నదిని
భావం:-
 వారు అక్కడి నుండి అభికాళ గ్రామమునకు చేరి, అక్కడ బోధిభవనమను పర్వతము నుండి ప్రవహించుచున్న పవిత్రమైన ఇక్షుమతీ నదిని దాటిరి. ఆ నదీ ప్రాంత దేశము ఇక్ష్వాకులపాలనలోనిది.
*గమనిక:-
 ఇక్షుమతి నది కురుక్షేత్రము దగ్గర ప్రవహించునది. ఇందు తక్షకుడు, అశ్వసేన అను సర్పములు నివసించినవి అని మహాభారతము ఆదిపర్వము, 4వ అధ్యాయమున కలదు. ఇక్షుమతిని పాణిని తన అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథమున ఉదహరించెను.
2.68.18
అనుష్టుప్.
అవేక్ష్యాంజలిపానాంశ్చ
బ్రాహ్మణాన్వేదపారగాన్।
యయుర్మధ్యేన బాహ్లీకాన్
సుదామానం చ పర్వతమ్॥
టీక:-
 అవేక్ష్య = చూచి; అంజలిపానాం = దోసిళ్లతో మాత్రమే నీరు త్రాగి జీవించు; చ = మఱియు; బ్రాహ్మణాత్ = బ్రాహ్మణులను; వేదపారగాన్ = వేదవిద్వాంసులైన; యయుః = నడిచిరి; మధ్యేన = మధ్య ప్రాంతమున; బాహ్లీకాన్ = బాహ్లీక దేశ; సుదామానం = సుదామ అను పేరుగల; పర్వతమ్ = పర్వతమును
భావం:-
 అక్కడ దోసిళ్లతో మాత్రమే నీళ్లు త్రాగి జీవించు వేదవిద్వాంసులైన బ్రాహ్మణులను చూచి, బాహ్లీక దేశ మధ్య ప్రాంతమున ప్రయాణము చేసి, సుదామ పర్వతము చేరిరి.
*గమనిక:-
 సుదామ పర్వతం పైని తొలుత మెఱుస్తుంది కాబట్టి మెఱుమునకు సౌదామని అని పేరు వచ్చిందని ఒక కథ; సుదామము అంటే - 1. మబ్బు, 2.కొండ. 3 సముద్రము - ఆంధ్రశబ్దరత్నాకరము
2.68.19
అనుష్టుప్.
విష్ణోః పదం ప్రేక్షమాణా
విపాశాంచాపి శాల్మలీమ్।
నదీర్వాపీ స్తటాకాని
పల్వలాని సరాంసి చ॥
టీక:-
 విష్ణోః పదం = విష్ణుక్షేత్రమును; ప్రేక్షమాణా = చూచి; విపాశాం = విపాశానదిని; అపి = ఇంకను; శాల్మలీమ్ = బూరుగుచెట్లను; నదీః వాపిః = బావులను; తటాకాని = తటాకములను; పల్వలాని = పల్లములను, పడియలను; సరాంసి చ = సరస్సులను
భావం:-
 ఆ ప్రాంతమునందున్న విష్ణుక్షేత్రమును, విపాశానదిని, బూరుగుచెట్లను, నదులను, దిగుడు బావులను, చెరువులను, పడియలను, సరస్సులను చూచిరి.
*గమనిక:-
  విపాశ- నదీ విశేషము, విడిచిపోయిన పాశములు గలది, ఇది హిమవత్పర్వతమునకు దక్షిణమున ఉత్పత్తి అయి శతద్రూనదితో సంగమము అగును. ("పుత్రశోకాత్పాశం బద్ధ్వా ప్రవిష్టం వసిష్ఠం పాశాద్విమోచిత వతీతి విపాశా" అని వ్యుత్పత్తి.), పాశములను విడిపించునది. శబ్దరత్నాకరము. పురాణనామచంద్రిక,
2.68.20
అనుష్టుప్.
పశ్యన్తో వివిధాంశ్చాపి
సింహావ్యాఘ్రమృగ ద్విపాన్।
యయుః పథా 2 తిమహతా
శాసనం భర్తురీప్సవః॥
టీక:-
 పశ్యన్తః = చూచుచు; వివిధాం= రకరకములు; చాపి = ఐన; సింహ = సింహములు; వ్యాఘ్ర = పెద్ద పులులు; మృగ = మృగములను; ద్విపాన్ = ఏనుగులు; యయుః = వెళ్లిరి; పథా = మార్గమున; అతి = మిక్కిలి; మహతా = పెద్దదైన; శాసనం = ఆజ్ఞను పాలించవలెనని; భర్తుః = ప్రభువు యొక్క; ఈప్సవః = కోరికతో.
భావం:-
 అనేక విధములైన సింహ వ్యాఘ్ర గజాది వన్య మృగములను చూచుచు, ప్రభువు ఆజ్ఞను పాలించవలెనను ఉత్సాహముతో అతి దీర్ఘమైన మార్గమున ప్రయాణము చేయుచు వెళ్లిరి.
2.68.21
అనుష్టుప్.
తే శ్రాంతవాహనా దూతా
వికృష్ణేన పథా తతః।
గిరివ్రజం పురవరమ్
శీఘ్రమాసేదురంజసా॥
టీక:-
 తే = వారు; శ్రాంతవాహనా = అలసిన; వాహనా = గుఱ్ఱములుకలవారు; దూతా = దూతలు; వికృష్ణేన = విశేషేణ కర్షిత, మిక్కిలి శ్రమపూరితమైన; పథా = మార్గముచేత; తతః = అప్పుడు; గిరివ్రజం = గిరివ్రజము అను; పురవరమ్ = పురమును; శీఘ్రమ్ = తొందరగా; ఆసేదు = ప్రవేశించిరి; రంజసా = చక్కగారప్రయాణముచేత; గిరివ్రజం = గిరివ్రజము అను; పురవరమ్ = పురమును;
భావం:-
 అతిదూర ప్రయాణముచేత అశ్వములు అలసిన ఆ దూతలు తొందరగానే గిరివ్రజ పురమును చక్కగా ప్రవేశించిరి. ఈ గిరివ్రజమునకే రాజగృహమను మరొక పేరు కలదు. ఇది కేకయదేశమునకు రాజధాని.
2.68.22
త్రిష్టుప్.
భర్తుః ప్రియార్థం కులరక్షణార్థం
భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థమ్।
అహేడమానా స్త్వరయా స్మ దూతా
రాత్య్రాంతు తే తత్పురమేవ యాతాః॥
టీక:-
 భర్తుః = ప్రభువునకు; ప్రియ = సంతోషము కలిగించు; అర్థం = కొఱకు; కుల = దేశ, సంస్కృతాంధ్ర నిషంటువు; రక్షణ = కాపాడుట; అర్థం = కొఱకు; భర్తుః = ప్రభువులయొక్క; చ = ఇంకనూ; వంశస్య = వంశము యొక్క; పరిగ్రహ = ప్రతిష్ఠ కాపాడుట; అర్థం = కొఱకు; అహేడమానాః = అనాదరము చేయనివారై, అశ్రద్ధ చూపక; త్వరయా = త్వరగా; స్మ = ఇంకనూ; దూతా = దూతలు; రాత్య్రాం = రాత్రివేళకి; తు = నిశ్చయముగ; తే = వారు; తత్ = ఆ; పురమ్ = పురము; ఏవ = లోనికి; యాతాః = చేరిరి
భావం:-
 ఆ దూతలు తమ ప్రభువునకు ప్రియము ఆచరించుట కొఱకును, రాజకులమును రక్షించుట కొఱకును, రాజవంశ ప్రతిష్ఠ కాపాడు కొఱకును ఏమాత్రం అశ్రద్ధ చూపక, రాత్రి అగుసరికి ఆ పట్టణము చేరిరి.
2.68.23
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే అష్టషష్టితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; అష్టషష్టితమ [68] = అరవైఎనిమిదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [68] అరవైఎనిమిదవ సర్గ సంపూర్ణము.
2.69.1.
అనుష్టుప్.
యామేవ రాత్రిం తే దూతాః
ప్రవిశంతి స్మ తాం పురీమ్।
భరతేనాపి తాం రాత్రిమ్
స్వప్నో దృష్టఽయమప్రియః॥
టీక:-
 యామః = ఝాము; ఏవ = మాత్రమే; రాత్రిం = రాత్రియందు; తే = ఆ; దూతాః = దూతలు; ప్రవిశంతి = ప్రవేశించి; స్మ = ఉంటిరో; తాం = ఆ; పురీమ్ = నగరము లోనికి; భరతేన = భరతుడు; అపి = ఐతే; తాం = ఆ; రాత్రిమ్ = రాత్రియందు; స్వప్నః = స్వప్నమును; దృష్టః = చూడబడినది; అయమ్ = ఈ; అప్రియః = అప్రియమైనట్టిది.
భావం:-
 ఆ దూతలు ఆ నగరములోనికి ప్రవేశించిన రాత్రి తెల్లవారు ఝాము నందే, భరతుడు ఒక అప్రియమైన దుఃస్వప్నమును చూచెను.
2.69.2.
అనుష్టుప్.
వ్యుష్టామేవ తు తాం రాత్రిమ్
దృష్ట్వా తం స్వప్నమప్రియమ్।
పుత్రో రాజాధిరాజస్య
సుభృశం పర్యతప్యత॥
టీక:-
 వ్యుష్టామ్ = తెల్లవారకముందు; ఏవ = గనే; తు = సరిగ; తాం = ఆ; రాత్రిమ్ = రాత్రి యందు; దృష్ట్వా = చూచి; తం = ఆ; స్వప్నమ్ = కలను; అప్రియమ్= అప్రియమైనట్టి; పుత్రః = కుమారుడైన; రాజాధిరాజస్య = మహారాజు యొక్క; సుభృశం = అత్యధికముగా; పర్యః = గుఱించి; తప్యత = మనస్సులో ఖేదమును పొందెను
భావం:-
  ఆ రాత్రి తెల్లవారుఝామున దుఃస్వప్నమును చూచిన, దశరథమహారాజు కుమారుడైన భరతుడు మనస్సులో చాల ఖేదమును పొందెను.
2.69.3.
అనుష్టుప్.
తప్యమానం సమాజ్ఞాయ
వయస్యాః ప్రియవాదినః।
ఆయాసం హి వినేష్యన్తః
సభాయాం చక్రిరే కథాః॥
టీక:-
 తప్యమానం = పరితపించుచున్నట్లు; సమాజ్ఞాయ = తెలుసుకొని లేదా గ్రహించి; వయస్యాః = స్నేహితులు; ప్రియవాదినః = ప్రియ వాక్యములు పలుకుచు; ఆయాసం = మనఃపరితాపమును; హి = విశేషముగ; వినేష్యన్తః = తొలగించుటకై; సభాయాం = సభలో; చక్రిరే = ఏర్పాటు చేసిరి; కథాః = వినోద కార్యక్రమములు
భావం:-
 ప్రియవాక్యములు పలుకు స్నేహితులు భరతుడు పరితపించుచున్నట్లు గ్రహించి అతని మనఃపరితాపమును తొలగించుటకై సభలో అనేక విధములైన కథలు (వినోద కార్యక్రమములు) జరిపిరి.
2.69.4.
అనుష్టుప్.
వాదయంతి తథా శాంతిమ్
లాసయన్త్యపి చాపరే।
నాటకాన్యపరే ప్రాహుః
హాస్యాని వివిధాని చ॥
టీక:-
 వాదయంతి = సంగీత వాద్యములను మ్రోగించిరి; తథా = అదే విధముగా; శాంతిమ్ = శాంతి కలుగుటకు; లాసయంతి = నటించుట; అపిచ = ఇంకను; అపరే = మరి కొందరు; నాటకాని = నాటకములు; అపరే = మరి కొందరు; ప్రాహుః = చెప్పిరి; హాస్యాని = హాస్యప్రధానములైన; వివిధాని = వివిధములైనవి; చ = కూడ.
భావం:-
 భరతుని మనస్సుకు శాంతి కలుగుటకై కొందరు వీసంగాత వాద్యములను మ్రోగించిరి. కొందరు నాటకములాడించిరి. మరికొందరు హాస్యము పలుకుట చేసిరి. ఇలా వారందరు రకరకముల ప్రయత్నములు చేసిరి.
2.69.5.
అనుష్టుప్.
స తైర్మహాత్మా భరతః
సఖిభిః ప్రియవాదిభిః।
గోష్ఠీహాస్యాని కుర్వద్భిః
న ప్రాహృష్యత రాఘవః॥
టీక:-
 స = ఆ; తైః = వారు; మహాత్మా = మహాత్ముడైన; భరతః = భరతుడు; సఖిభిః = స్నేహితులు అందరు; ప్రియవాదిభిః = ప్రియముగా మాటలాడు; గోష్ఠీ = గోష్ఠులు; హాస్యాని = హాస్యాదులు; కుర్వద్భిః = చేసినను; న ప్రాహృష్యత = సంతోషము కలుగలేదు; రాఘవః = రఘు వంశములో జన్మించిన
భావం:-
 ప్రియమైన హాస్యగోష్టు లెన్ని చేసినను, రఘు వంశములో జన్మించిన, మహాత్ముడైన భరతునకు సంతోషము కలుగలేదు.
2.69.6.
అనుష్టుప్.
తమబ్రవీత్ “ప్రియసఖో!
భరతం సఖిభిర్వృతమ్।
సుహృద్భిః పర్యుపాసీనః
కిం సఖే నానుమోదసే”॥
టీక:-
 తమ్ = అతనిని; అబ్రవీత్ = పలికెను; ప్రియసఖః = ఒక ప్రియ మిత్రుడు; భరతం = భరతుని; సఖిభిః = మిత్రులతో; వృతమ్ = కూడిన; సుహృద్భిః = స్నేహితులు అందరూ; పర్యుపాసీనః = నీ చుట్టూ ఉన్నను; కిం = ఎందువలన; సఖే = మిత్రమా; న + అనుమోదసే = ఆనందముగా లేవేమి
భావం:-
 మిత్రులతో కూడిన ఆ భరతుని, ఒక ప్రియమిత్రుడు, “ఓ మిత్రమా! స్నేహితులందరు వచ్చి నిన్ను చుట్టి ఉన్నను నీవు ఇట్లు ఆనందము లేక ఉన్నావేమి?’’ అని ప్రశ్నించెను.
2.69.7.
అనుష్టుప్.
ఏవం బ్రువాణం సుహృదమ్
భరతః ప్రత్యువాచ హ।
“శ్రుణు త్వం యన్నిమిత్తం మే
దైన్యమేతదుపాగతమ్॥
టీక:-
 ఏవం = ఇట్లు; బ్రువాణమ్ = ఇట్లు ప్రశ్నించుచున్న; సుహృదమ్ = మిత్రునికి; భరతః = భరతుడు; ప్రత్యువాచ = సమాధానమిచ్చుట; హ = చేసెను; శ్రుణు = వినుము; త్వం = నీవు; యత్ = ఏ; నిమిత్తం = కారణంగా; మే = నాకు; దైన్యమ్ = దైన్యమును; ఏతత్ = ఈ; ఉపాగతమ్ = కలుగుటకు.
భావం:-
 ఇట్లు ప్రశ్నించిన ఆ మిత్రునికి భరతుడు ఈ విధముగ సమాధానము చెప్పెను. “నాకు ఈ దైన్యము కలుగుటకు కారణమును వినుము’’
2.69.8.
అనుష్టుప్.
స్వప్నే పితరమద్రాక్షమ్
మలినం ముక్త మూర్ధజమ్।
పతంతమద్రిశిఖరాత్
కలుషే గోమయహ్రదే॥
టీక:-
 స్వప్నే = స్వప్నము నందు; పితరమ్ = తండ్రిగారిని; అద్రాక్షమ్ = చూచితిని; మలినం = మలినమైన శరీరముతో; ముక్త = విరబోసికొనిన; మూర్ధజమ్ = జుట్టు కలవానిని; పతంతమ్ = పడుచున్నట్లు; అద్రిశిఖరాత్ = పర్వత శిఖరము నుండి; కలుషే = కలుషితమైన; గోమయ = పేడ; హ్రదే = గోతిలో
భావం:-
 నా తండ్రి మలినమైన శరీరముతో, జుట్టు విరబోసికొని, పర్వత శిఖరము నుండి, పేడతో నిండిన గోతిలో పడుచున్నట్లు స్వప్నము చూచితిని.
2.69.9.
అనుష్టుప్.
ప్లవమానశ్చ మే దృష్టః
స తస్మిన్గోమయహ్రదే।
పిబన్నంజలినా తైలమ్
హసన్నపి ముహుర్ముహుః॥
టీక:-
 ప్లవమానశ్చ = తేలుచు; మే = నాకు; దృష్టః = కనిపించెను; సః = ఆయన; తస్మిన్ = ఆ; గోమయహ్రదే = పేడగుంటలో; పిబన్ = త్రాగుచున్నట్లుగా; అంజలినా = దోసిలితో; తైలమ్ = నూనెను; హసన్ = నవ్వుచు; అపి = కూడా; ముహుర్ముహుః = మాటిమాటికి.
భావం:-
 నా తండ్రి ఆ గోమయహ్రదమునందు తేలుచు, మాటిమాటికిని నవ్వుచు నవ్వుచూ, దోసిలితో నూనె త్రాగుచున్నట్లుగా కనబడినాడు.
2.69.10.
అనుష్టుప్.
తతస్తిలోదనమ్ భుక్త్వా
పునః పునరధశ్శిరాః।
తైలేనాభ్యక్తసర్వాంగః
తైలమేవాన్వగాహత॥
టీక:-
 తతః = అటుపిమ్మట; తిలోదనమ్ = తిలలు కలిపిన అన్నము; భుక్త్వా = తిని; పునః పునః = మాటిమాటికీ: అధశ్శిరాః = శిరస్సు క్రిందకి వంచుచు; తైలేన = తైలమును; అభ్యక్త = పూసికొని; సర్వాంగః = శరీరమంతటికీ; తైలమేవ = తైలములోనే; అన్వగాహత = మునిగిపోయెను
భావం:-
  మాటిమాటికి శిరస్సు క్రిందకి వంచి, పిదప నువ్వులు కలిపిన అన్నము తిని, శరీరమంతటికీ తైలము పూసికొని, తైలములోనే మునిగిపోయెను.
2.69.11.
అనుష్టుప్.
స్వప్నేఽపి సాగరం శుష్కమ్
చంద్రం చ పతితం భువి।
ఉపరుద్ధాం చ జగతీమ్
తమసేవ సమావృతామ్॥
టీక:-
 స్వప్నః = కలలో; అపి = ఇంకనూ; సాగరం = సముద్రము; శుష్కమ్ = ఎండిపోవుచునట్లు; చంద్రం = చంద్రుడు; చ = ఐతే; పతితం = నేలపై పడిపోవుచునట్లు; భువి = నేలమీద; ఉపరుద్ధాం = అడ్డగింపబడుచున్నట్లు; చ = మఱియు; జగతీమ్ = భూమిని; తమసేవ = చీకటి; సమావృతామ్ = కప్పివేయుట చేత
భావం:-
 ఇంకనూ సముద్రము ఎండిపోలుచునట్లు, చంద్రుడు నేలపై పడిపోవుచునట్లు, భూమి చీకటి కప్పివేయుట చేత వలె కనబడకుండ పోయినట్లు కలలో కనబడినది.
2.69.12.
అనుష్టుప్.
ఔపవాహ్యస్య నాగస్య
విషాణం శకలీకృతమ్।
సహసాచాపి సంశాంతమ్
జ్వలితం జాతవేదసమ్॥
టీక:-
 ఔపవాహ్యస్య = రాజు ఉత్సవ సమయములలో అధిరోహించునదైన; నాగస్య = ఏనుగు యొక్క; విషాణం = దంతములు; శకలీకృతమ్ = విరిగిపోవుచునట్లు; సహసా = హఠాత్తుగా; చాపి = ఇంకా; సంశాంతమ్ = ఆరిపోయినట్లు; జ్వలితం = ప్రజ్వలించుచున్న; జాతవేదసమ్ = అగ్ని
భావం:-
 రాజు ఉత్సవ సమయములలో అధిరోహించు గజము దంతములు విరిగిపోయినట్లు, ఇంకా ప్రజ్వలించుచున్న అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు కలలో కనిపించెను.
2.69.13.
అనుష్టుప్.
అవతీర్ణాం చ పృథివీమ్
శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్।
అహం పశ్యామి విధ్వస్తాన్
సధూమాంశ్చాపి పర్వతాన్॥
టీక:-
 అవతీర్ణాం = బ్రద్దలైపోవుచునట్లు; చ = మఱింకా; పృథివీమ్ = భూమి అంతయు; శుష్కామ్ = ఎండిపోవుచునట్లు; చ = మఱింకా; వివిధాన్ = వివిధములైన; ద్రుమాన్ = చెట్లన్నియు; అహం = నేను; పశ్యామి = చూచితిని; విధ్వస్తాన్ = నాశనముచేయబడి; స = సహితమైన; ధూమామ్ = పొగ ఆవరింపబడు చున్నట్లు; చాపి = అంతేకాక; పర్వతాన్ = పర్వతములు
భావం:-
 మఱింకా భూమి బ్రద్దలైపోవుచునట్లు, చెట్లన్నియు ఎండిపోవుచునట్లు, అంతేకాక, పర్వతములు నాశనముచేయబడి, పొగ ఆవరించుచునట్లు నాకు స్వప్నములో కనబడినది.
2.69.14.
అనుష్టుప్.
పీఠే కార్ష్ణాయసే చైనమ్
నిషణ్ణం కృష్ణవాససమ్।
ప్రహసంతి స్మ రాజానమ్
ప్రమదాః కృష్ణపింగలాః॥
టీక:-
 పీఠే = ఆసనముపై; కార్ష్ణ = నల్లని; ఆయసే = ఇనుముతో తయారుచేసిన; చ = మఱియు; ఏనమ్ = ఈ; నిషణ్ణం = కూర్చుండినవాని; కృష్ణ = నల్లని; వాససమ్ = వస్త్రములుధరించినవాని; ప్రహసంతి = పరిహాయముచేయుచు; స్మ = ఉన్నట్లును; రాజానమ్ = రాజును; ప్రమదాః = స్త్రీలందరు; కృష్ణ = నల్లగానున్నవారూ; పింగలాః = నీలముపసుపు కలసినరంగు గలవారు
భావం:-
 నా తండ్రి నల్లని వస్త్రములను ధరించి ఇనుముతో చేసిన ఆసనముపై కూర్చుని ఉన్నట్లును, నల్లని, పింగల ఛాయల స్త్రీలు అతనిని చూచి పరిహాస పూర్వకముగా నవ్వుచున్నట్లును స్వప్నములో కనబడినది.
2.69.15.
అనుష్టుప్.
త్వరమాణశ్చ ధర్మాత్మా
రక్తమాల్యానులేపనః।
రథేన ఖరయుక్తేన
ప్రయాతో దక్షిణాముఖః॥
టీక:-
 త్వరమాణః = తొందరపడుచున్నవాని; చ= మఱియు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; రక్తమాల్య = ఎఱ్ఱని; మాల్య = మాలలు; అనులేపనః = మైపూతలు కలవాని; రథేన = రథముపై; ఖరయుక్తేన = గాడిదలచే కట్టబడిన; ప్రయాతః = ప్రయాణించనిట్లు; దక్షిణాముఖః = దక్షిణాభిముఖముగా
భావం:-
 ధర్మాత్ముడైన నా తండ్రి ఎఱ్ఱని మాలికలు ధరించి, ఎఱ్ఱని మైపూత పూసుకొని తొందరపడుచూ, గాడిదలు కట్టిన రథము ఎక్కి దక్షిణాభిముఖముగా వెళ్లుచునట్లు స్వప్నములో కనబడినది.
2.69.16.
అనుష్టుప్.
ప్రహసంతీవ రాజానమ్
ప్రమదా రక్తవాసినీ।
ప్రకర్షంతీ మయా దృష్టా
రాక్షసీ వికృతాననా॥
టీక:-
 ప్రహసంతీ = పరిహస్తున్నదాని; ఇవ = వలె; రాజానమ్ = మహారాజును; ప్రమదా = స్త్రీ; రక్తవాసినీ = ఎఱ్ఱని వస్త్రములు ధరించి; ప్రకర్షంతీ = లాగుచున్నట్లుగా; మయా దృష్టా = నాకు కనపడినది; రాక్షసీ = ఒక రాక్షసి; వికృతాననా = వికృతమైన ముఖము గల.
భావం:-
 ఎఱ్ఱని వస్త్రములు ధరించిన స్త్రీ దశరథ మహారాజును పరిహసిస్తున్నట్లుగా, వికృతమైన ముఖము గల రాక్షసి లాగుచున్నట్లుగా నాకు కనబడినది.
2.69.17.
అనుష్టుప్.
ఏవమేతన్మయా దృష్టమ్
ఇమాం రాత్రిం భయావహమ్।
అహం రామోఽథవా రాజా
లక్ష్మణో వా మరిష్యతి॥
టీక:-
 ఏవమ్ = ఈ విధముగా; ఏతత్ = ఇట్టి; మయా = నాచే; దృష్టమ్ = చూడబడినది; ఇమామ్ = ఈ; రాత్రిమ్ = రాత్రి యందు; భయావహమ్ = భయంకరమైనది; అహం = నేను; రామః = రాముడు; అథవా = లేదంటే; రాజా = మహారాజు; లక్ష్మణః = లక్ష్మణుడు; వా = లేదా; మరిష్యతి = మరణించును.
భావం:-
 ఈ రాత్రి నాకు ఇటువంటి భయంకరమైన స్వప్నము కనబడినది. నేను గాని, రాముడు గాని, దశరథమారాజున గాని లక్ష్మణున గాని మరణించుట జరుగును.
2.69.18.
అనుష్టుప్.
నరో యానేన యస్స్వప్నే
ఖర యుక్తేన యాతి హి।
అచిరాత్తస్య ధూమాగ్రమ్
చితాయాం సమ్ప్రదృశ్యతే॥
టీక:-
 నరః = వ్యక్తి; యానేన = వాహనముపై; యః = ఎవరు; స్వప్నే = స్వప్నమున; ఖర యుక్తేన = గాడిదలు కట్టిన; యాతి = వెళ్లుచున్నట్లు; హి = నిశ్చయముగా; అచిరాత్ = కొద్ది కాలములోనే; తస్య = అతని యొక్క; ధూమాగ్రమ్ = ధూమ శిఖ; చితాయాం = చితి నుండి వచ్చు; సమ్ప్రదృశ్యతే = కనబడును
భావం:-
 ఎవడు గాడిదలు కట్టిన వాహనము ఎక్కి వెళ్లినట్లు స్వప్నము వచ్చునో, అతని చితి కాలుచున్న పొగ కొద్ది కాలములోనే కనబడును.
2.69.19.
అనుష్టుప్.
ఏతన్నిమిత్తం దీనోఽహమ్
తన్నవః ప్రతిపూజయే।
శుష్యతీవ చ మే కంఠః
న స్వస్థమివ మే మనః॥
టీక:-
 ఏతత్ = ఆయొక్క; నిమిత్తం = కారణము చేత; దీనః = దీనుడనై ఉంటిని; అహమ్ = నేను; తత్ = అందువల్ల; వః = మిమ్ములను; ప్రతిపూజయే = ఆదరించుట; శుష్యతీవ చ = ఎండిపోవుచున్నట్లున్నది; చ = మఱియు; మే = నా; కంఠః = కంఠము; న= లేదు; స్వస్థమివ = స్వస్థముగా; మే = నా; మనః = మనస్సు.
భావం:-
 అందుచేతనే నేను దీనుడనై ఉంటిని. అందుకనే మిమ్ములను సరిగా అదరించుట లేదు. నా కంఠము ఎండిపోవుచున్నట్లున్నది. నా మనస్సు కూడ స్థిమితముగా లేదు.
2.69.20.
అనుష్టుప్.
న పశ్యామి భయస్థానమ్
భయం చైవోపధారయే।
భ్రష్టశ్చ స్వరయోగో మే
ఛాయా చోపహతా మమ।
జుగుప్సన్నివ చాఽత్మానమ్
న పశ్యామి చ కారణమ్॥
టీక:-
 న = లేదు; పశ్యామి = కనిపించుట; భయః = భయమునకు; స్థానమ్ = మూలము; భయమ్ = భయమును; చ = ఐతే; ఏవ = మాత్రము; ఉపధారయే = అనుభవించుచున్నాను; భ్రష్టః = పాడైపోయినది; చ = కాని; స్వరయోగః = కంఠస్వరము; మే = నా యొక్క; ఛాయా = శరీరకాంతి; చ = కూడ; ఉపహతా = మందగించినది; మమ = నేను; జుగుప్సత్ = జుగుప్స కలుగుచున్నది; ఇవ = వలె; చ = కూడ; ఆత్మానమ్ = నా మీద నాకు; న = లేక; పశ్యామి = తెలియ; కారణమ్ = కారణము.
భావం:-
 భయానికి కారణము తెలియుట లేదు గాని, భయము కలుగుటైతే తప్పక కలుగుచున్నది. నా కంఠస్వరము మందగించినది. దేహకాంతి తగ్గినది. కారణమేమియు తెలియకనే నాపై నాకే జుగుప్స కలుగుచున్నట్లున్నది.
2.69.21.
జగతి.
ఇమాం చ దుస్స్వప్నగతిం నిశామ్యతామ్
అనేకరూపామవితర్కితాం పురా।
భయం మహత్తద్దృదయాన్నయాతి మే
విచిన్త్య రాజానమచింత్య దర్శనమ్”॥
టీక:-
 ఇమాం = ఇటువంటిది; చ = ఐన; దుస్స్వప్నః = దుఃస్వప్నము; గతిమ్ = నడచుటను; నిశామ్య = చూచుట; తామ్ = అచువంటిది; అనేక = అనేక; రూపామ్ = రూపములు గలది; అవితర్కితాం = ఊహింపబడనిది; పురా = ఇంతకు ముందు ఎన్నడును; భయం = భయము; మహత్ = గొప్పదైన; తత్ = అది; హృదయాత్ = హృదయము నుండి; న = లేదు; యాతి = పోవుట; మే = నా యొక్క; విచింత్య = విశేషమైన చింత; రాజానమ్ = దశరథ మహారాజు గూర్చి; అచింత = ఊహించరాని; దర్శనమ్ = దర్శనము
భావం:-
 పూర్వము ఎన్నడును ఊహింపని, అనేక రూపములు గల ఇటువంటి దుఃస్వప్నమును కనుటచేతను, నా తండ్రిౖయెన దశరథ మహారాజుగారు ఊహింపరాని విధము కనబడుటచేచను కలిగిన విపరీతమైన చింత వలన నా హృదయములో గట్టిగా కలిగిన భయము పోవుట లేదు.”
2.69.22.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే ఏకోనసప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకోనసప్తతితమ [69] = అరవైతొమ్మిదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [69] అరవైతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.70.1.
అనుష్టుప్.
భరతే బ్రువతి స్వప్నమ్
దూతాస్తే క్లాంతవాహనాః।
ప్రవిశ్యాసహ్యపరిఖమ్
రమ్యం రాజగృహం పురమ్॥
టీక:-
 భరతే = భరతుడు; బ్రువతి = చెప్పుచుండగానే; స్వప్నమ్ = కలను; దూతాః = దూతలు; తే = ఆ; క్లాంతవాహనాః = అలసిపోయిన; వాహనాః = గఱ్ఱములు కలవారు; ప్రవిశ్య = ప్రవేశించెను; అసహ్య = దాటశక్యముకాని; పరిఖమ్ = ప్రాకారమును; రమ్యం = అందమైన; రాజగృహం = రాజగృహము అను; పురమ్ = నగరమును
భావం:-
 భరతుడు తనకు వచ్చిన భయంకరమైన స్పప్నమును గురించి మిత్రులకు చెప్పుచుండెను. అంతలో సుదీర్ఘ ప్రయాణము వలన అలసిపోయిన గుఱ్ఱాలు వాహనాలుపై వచ్చిన ఆ వసిష్టులవారు పంపిన దూతలు, కట్టుదిట్టమైన ప్రాకారము దాటి అ రాజగృహపురము ప్రవేశించిరి.
2.70.2.
అనుష్టుప్.
సమాగమ్య తు రాజ్ఞా చ
రాజపుత్రేణ చార్చితాః।
రాజ్ఞః పాదౌ గృహీత్వా తు
తమూచుర్భరతం వచః॥
టీక:-
 సమాగమ్య = దర్శించుకొనినవారు; తు = అయి; రాజ్ఞా = రాజుయొక్క; చ = మఱియు; రాజపుత్రేణ = రాజకుమారుని; చ = మఱియు; అర్చితాః = అర్చించి; రాజ్ఞః = ఆ రాజు; పాదౌ = పాదములకు; గృహీత్వా = ఎరగి; తు = నిశ్చయంగా; తమ్ = వారు; ఊచుః – పలికిరి; భరతం = భరతునిగూర్చి; వచః = మాటలు
భావం:-
 అదే సమయమున వసిష్ఠుడు పంపిన దూతలు వెంటనే కేకయరాజు అళ్వపతి మఱియు రాకుమారుడు యుధాజిత్తుల దర్శనము చేసుకొనిరి. ఆ రాజు పాదములకు నమస్కరించిరు. వారు భరతునితో ఇట్లు చెప్పిరి.
2.70.3.
అనుష్టుప్.
“పురోహితస్త్వాం కుశలమ్
ప్రాహ సర్వే చ మంత్రిణః।
త్వరమాణశ్చ నిర్యాహి
కృత్యమాత్యయికం త్వయా॥
టీక:-
 పురోహితః = పురోహితుడు; త్వాం = మీ; కుశలమ్ = కుశలమును; ప్రాహ = అడుగుచున్నారు; సర్వే = అందరును; చ = కూడా; మంత్రిణః = మంత్రులు; త్వరమాణ_ = త్వరగా; చ = మఱియు; నిర్యాహి = బయలుదేరుము; కృత్యమ్ = పని; ఆత్యయికమ్ = అత్యవసరమైనది; త్వయా = నీతో
భావం:-
 ”పురోహితుడు, మంత్రులందరును మీ కుశలము అడుగుచున్నారు. మీరు తొందరగా బయలుదేరవలెను. మీతో చాల అత్యవసరమైన పని ఉన్నది.
2.70.4.
అనుష్టుప్.
ఇమాని చ మహార్హాణి
వస్త్రాణ్యాభరణాని చ।
ప్రతిగృహ్య విశాలాక్ష
మాతులస్య చ దాపయ॥
టీక:-
 ఇమాని = ఇవయన్నియు; చ = మఱియు; మహార్హాణి = అత్యంత విలువైన; వస్త్రాణి = వస్త్రములను; ఆభరణాని = ఆభరణములను; చ = మఱియు; ప్రతిగృహ్య = తీసుకొని; విశాలాక్ష = పెద్ద కన్నులు కలిగినవాడా; మాతులస్య = నీ మేనమామకు; చ = మఱి; దాపయ = ఇవ్వవలయును.
భావం:-
 ఈ విలువైన ఈ వస్త్రములను, ఆభరణములను తీసికొని నీ మేనమామకు ఇమ్ము.
2.70.5.
అనుష్టుప్.
అత్ర విశంతికోట్యస్తు
నృపతేర్మాతులస్య తే।
దశకోట్యస్తు సమ్పూర్ణాః
తథైవ చ నృపాత్మజా॥
టీక:-
 అత్ర = ఇందులో (ఈ వస్త్రాభరణాదులలో); విశంతికోట్యస్తు = ఇరువది కోట్లు; నృపతేః = రాజునకు; మాతులస్య తే = మేనమామ అయిన; తే = మీ; దశకోట్యస్తు = పది కోట్లు;సమ్పూర్ణాః = పూర్తిగా; తథైవ చ = అదే విధముగా; చ = మఱియు; నృపాత్మజా = రాకుమారునకు.
భావం:-
 ఇవి ఇరువది కోట్ల విలువైన ఈ వస్త్రాభరణాదులు మీ మాతామహుడైన కేకయరాజు అశ్వపతికి. పూర్తిగా పది కోట్లు విలువైనవి మీ మేనమామైన రాకుమారునికి.
2.70.6.
అనుష్టుప్.
ప్రతిగృహ్య తు తత్సర్వమ్
స్వనురక్త స్సుహృజ్జనే।
దూతానువాచ భరతః
కామైస్సంప్రతిపూజ్య తాన్॥
టీక:-
 ప్రతిగృహ్య = తీసికొని; తు = పిమ్మట; తత్ సర్వమ్ = ఆ వస్తువులను; సర్వమ్ = అన్నింటిని; స్వనురక్తః = ప్రేమగలవాడు; సుహృజ్జనే = మిత్రులకు; దూతాన్l= దూతలగురించి; ఉవాచ = పలికెను; భరతః = భరతుడు; కామైః = కోరిన వస్తువులతో; సంప్రతిపూజ్య = మాఱుబహుమానములతో గౌరవించి; తాన్ = ఆ
భావం:-
 ఈ భరతుడు ఆ వస్తువులనన్నింటిని తీసుకొని ఆ దూతలకు కావలసిన వస్తువులను బహూకరించి ఆదరించి వారితో ఇట్లు పలికెను.
2.70.7.
అనుష్టుప్.
“కచ్చిత్సుకుశలీ? రాజా
పితా దశరథో మమ।
కచ్చిచ్చారోగతా? రామే
లక్ష్మణే చ మహాత్మని॥
టీక:-
 కచ్చిత్ = కదా; సు = మంచి; కుశలీ = క్షేమముగాఉన్నాడు; రాజా = మహారాజు; పితా = తండ్రి; దశరథః = దశరథుడు; మమ = నాయొక్క; కచ్చిత్ = కదా; చ = ముఱియు; అరోగతా = ఆరోగ్యగాఉన్నవారు; రామః = రాముడు; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; మహాత్మని = మహాత్ములైన.
భావం:-
 నా తండ్రి దశరథ మహారాజు క్షేమముగా ఉన్నాడు కదా? మహాత్ములైన రామలక్ష్మణులు ఆరోగ్యముగా ఉన్నారు కదా?
2.70.8.
అనుష్టుప్.
ఆర్యా చ ధర్మనిరతా
ధర్మజ్ఞా ధర్మదర్శినీ।
అరోగా చాపి కౌసల్యా
మాతా రామస్య ధీమతః॥
టీక:-
 ఆర్యా చ = పూజ్యురాలు; ధర్మనిరతా = ధర్మమునందే ఆసక్తి కలది; ధర్మజ్ఞా = ధర్మము తెలిసినది; ధర్మదర్శినీ = ధర్మమునే చూచునది; అరోగా చ + అపి = ఆరోగ్యముగానే ఉన్నదా; కౌసల్యా = కౌసల్య; మాతా = తల్లి; రామస్య = రామునియొక్క; ధీమతః = ధీమంతుడైన
భావం:-
 పూజ్యురాలు, ధర్మమునందే ఆసక్తి కలది, ధర్మము తెలిసినది, ధర్మమునే చూచునది, ధీమంతుడైన రాముని తల్లి ఐన కౌసల్యాదేవీ ఆరోగ్యముగా ఉన్నదా?
2.70.9.
అనుష్టుప్.
కచ్చిత్సుమిత్రా ధర్మజ్ఞా
జననీ లక్ష్మణస్య యా।
శత్రుఘ్నస్య చ వీరస్య
సాఽ రోగా చాపి మధ్యమా॥
టీక:-
 కచ్చిత్ = ఉన్నది కదా; సుమిత్రా = సుమిత్ర; ధర్మజ్ఞా = ధర్మము తెలిసినది; జననీ = తల్లి; లక్ష్మణస్య = లక్ష్మణుని యొక్క; యా = ఎవరో; శత్రుఘ్నస్య చ = శత్రుఘ్నునియొక్క మఱియు; వీరస్య = వీరులైన; సా = ఆ; అరోగా చ + అపి = ఆరోగ్యముగా ఉన్నది కదా; మధ్యమా = మధ్యమ తల్లి.
భావం:-
 ధర్మములు తెలిసినది, వీరులైన లక్ష్మణ శత్రుఘ్నులకు తల్లి అయిన మా మధ్యమ తల్లి, సుమిత్రాదేవి ఆరోగ్యముగా ఉన్నదా?
2.70.10.
అనుష్టుప్.
ఆత్మకామా సదా చండీ
క్రోధనా ప్రాజ్ఞమానినీ।
అరోగా చాపి మే మాతా
కైకేయీ కిమువాచ హ”॥
టీక:-
 ఆత్మకామా = తన సుఖమునే కోరునది; సదా = నిరంతరము; చండీ = తీవ్రముగా ప్రవర్తించునది; క్రోధనా = క్రోధస్వభావురాలు; ప్రాజ్ఞమానినీ = బుద్ధిమంతురాలననే గర్వము కలది; అరోగా చ అపి = ఆరోగ్యముగా ఉన్నదా; మే మాతా = నా తల్లి; కైకేయీ = కైకేయి; కిమ్ + ఉవాచ హ = ఏమి చెప్పమన్నది
భావం:-
 తన సుఖమునే కోరుకొనునది, తీవ్రముగా ప్రవర్తించెడిది, క్రోధస్వభావురాలును, బుద్ధిమంతురాలననే గర్వము కలదియును అయిన, నా తల్లి కైకేయి ఆరోగ్యముగా ఉన్నదా? ఆమె మాకు ఏమి చెప్పమన్నది?”
2.70.11.
అనుష్టుప్.
ఏవముక్తాస్తు తే దూతాః
భరతేన మహాత్మనా।
ఊచుస్సప్రశ్రయం వాక్యమ్
ఇదం తం భరతం తదా॥
టీక:-
 ఏవముక్తాస్తు = ఆ విధముగా పలుకగా; తే దూతాః = ఆ దూతలు; భరతేన = భరతునిచేత; మహాత్మనా = మహాత్ముడైన; ఊచుః = పలికిరి; సప్రశ్రయం = సవినయముగా; వాక్యమ్ ఇదం = ఈ మాటలు; తం భరతం = ఆ భరతునిగూర్చి; తదా = అప్పుడు
భావం:-
 మహాత్ముడైన భరతుని మాటలు విని ఆ దూతలు, భరతునితో సవినయముగా ఇట్లు పలికిరి.
2.70.12.
అనుష్టుప్.
“కుశలాస్తే నరవ్యాఘ్ర
యేషాం కుశలమిచ్ఛసి।
శ్రీశ్చ త్వాం వృణుతే పద్మా
యుజ్యతాం చాపి తే రథః””॥
టీక:-
 కుశలాః = క్షేమమే; తే నరవ్యాఘ్ర = ఓ నరశేష్ఠా; యేషాం = వారందరును; కుశలమ్ = కుశలము; ఇచ్ఛసి = కోరుచున్నది; శ్రీశ్చ = లక్ష్మీదేవియును; త్వాం = నిన్ను; వృణుతే = సిద్ధముగా ఉన్నది; పద్మా = పద్మమును చేతిలో ధరించి; యుజ్యతాం చ + అపి = బయలుదేరుము; తే రథః = రథములో కూర్చొనుము
భావం:-
 ”ఓ నరశ్రేష్ఠా! వారందరును క్షేమముగా ఉన్నారు. నిన్ను ఐశ్వర్యము, లక్ష్మియును వరించుచున్నవి. శీఘ్రముగా రథములో కూర్చుని బయలుదేరుము.”
2.70.13.
అనుష్టుప్.
భరతశ్చాపి తాన్ దూతాన్
ఏవముక్తోఽ భ్యభాషత।
”ఆపృచ్చేఽ హం మహారాజమ్
దూతాస్సన్త్వరయన్తి మామ్”॥
టీక:-
 భరతః + చ + అపి = భరతుడు కూడా; తాన్ దూతాన్ = ఆ దూతలచ్; ఏవమ్ = ఆ విధముగా; ఉక్తః = పలుకబడి; అభ్యభాషత = పలికెను; ఆపృచ్ఛః = అనుజ్ఞ వేడెదను; అహం = నేను; మహారాజమ్ = మహారాజును; దూతాః = దూతలు; సన్త్వరయన్తి = తొందరపెట్టుచున్నారు; మామ్ = నన్ను.
భావం:-
 దూతల మాటలు విని భరతుడు వారితో, ”నన్ను దూతలు తొందరపెట్టుచున్నారు అని చెప్పి రాజు అనుజ్ఞ వేడెదను” అని చెప్పెను.
2.70.14.
అనుష్టుప్.
ఏవముక్త్వా తు తాన్ దూతాన్
భరతః పార్థివాత్మజః।
దూతై స్సంచోదితో వాక్యమ్
మాతామహమువాచ హ॥
టీక:-
 ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా తు = చెప్పబడిన తరువాత; తాన్ దూతాన్ = ఆ దూతలచే; భరతః = భరతుడు; పార్థివాత్మజః = మహారాజ కుమారుడైన; దూతైః = ఆ దూతలు; సంచోదితః = త్వరగా బయలుదేరుమని; వాక్యమ్ = మాటలను; మాతామహమ్ = మాతామహునితో; ఉవాచ హ = ఇట్లు చెప్పెను
భావం:-
 ఆ దూతలతో ఈ విధముగా పలికి, మహారాజకుమారుడైన భరతుడు త్వరగా బయలుదేరుమని తన మాతామహునితో ఇట్లు అనెను.
2.70.15.
అనుష్టుప్.
“రాజన్ పితుర్గమిష్యామి
సకాశం దూతచోదితః।
పునరప్యహమేష్యామి
యదా మే త్వం స్మరిష్యసి”॥
టీక:-
 రాజన్ = మహారాజా; పితుః = తండ్రి వద్దకు; గమిష్యామి = వెళ్లెదను; సకాశం = ఆయన దగ్గరకు; దూతచోదితః = దూతలు రమ్మనుచున్నారు; పునః + అపి = మరల; అహమ్ = నేను; ఏష్యామి = వచ్చెదను; యదా = ఎప్పుడు; మే = నన్ను; త్వం = నీవు; స్మరిష్యసి = తలచిన వెంటనే
భావం:-
 ”మహారాజా! దూతలు నన్ను అయోధ్యకు రమ్మనుచున్నారు. నేను నా తండ్రిగారి వద్దకు వెళ్ళెదను. మరల మీరు ఎప్పుడు తలచిన అప్పుడు వచ్చెదను.”
2.70.16.
అనుష్టుప్.
భరతేనైవముక్తస్తు
నృపో మాతామహస్తదా।
తమువాచ శుభం వాక్యమ్
శిరస్యాఘ్రాయ రాఘవమ్॥
టీక:-
 భరతేన = భరతుని చేత; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః + తు = పలికిన; నృపః = కేకయరాజు; మాతామహః మాతామహుడైన; తదా = అప్పుడు; తమ్ + ఉవాచ = అతని మాటలు విని; శుభం = మంగళకరమైన; వాక్యమ్ = వాక్యమును; శిరస్యాఘ్రాయ = శిరస్సుపై మూర్కొని; రాఘవమ్ = భరతుని
భావం:-
 మాతామహుడైన కేకయరాజు భరతుని మాట విని, అతని శిరస్సుపై మూర్కొని, మంగళకరమైన వాక్యమును పలికెను.
2.70.17.
అనుష్టుప్.
“గచ్ఛ తాతానుజానే త్వామ్
కైకేయీసుప్రజాస్త్వయా।
మాతరం కుశలం బ్రూయాః
పితరం చ పరంతప!॥
టీక:-
 గచ్ఛ = బయలుదేరుము; తాత = తండ్రి; అనుజానే = అనుజ్ఞ ఇచ్చుచున్నాను; త్వామ్ = నీ చేత; కైకేయీ = కైకేయి; సుప్రజాః = సత్పుత్రడవు; త్వయా = నీ; మాతరం = తల్లిని; కుశలం = కుశలమును; బ్రూయాః = అడిగినట్లు; పితరం చ = తండ్రిని; పరంతప = శత్రుభయంకరుడు
భావం:-
 ”నాయనా! నేను అనుజ్ఞ ఇచ్చుచున్నాను. వెళ్లుము. నీవు కైకేయి సత్పుత్రుడవు. నీ తల్లినీ, తండ్రినీ కుశలము అడిగినట్లు చెప్పుము.
2.70.18.
అనుష్టుప్.
పురోహితం చ కుశలమ్
యే చాన్యే ద్విజసత్తమాః।
తౌ చ తాత! మహేష్వాసౌ
భ్రాతరౌ రామలక్ష్మణౌ”॥
టీక:-
 పురోహితం చ = పురోహితుడైన వసిష్ఠుని; కుశలమ్ = కుశలమును; యే చ = ఎవరినైతే; అన్యే = ఇతరులను; ద్విజసత్తమాః = బ్రాహ్మణోతత్తములను; తౌ చ = ఇతరులైన; తాత = నాయనా; మహేష్వాసౌ = మహాధనుర్ధరులైన; భ్రాతరౌ = సోదరులు; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులను
భావం:-
 పురోహితుడైన వసిష్ఠుని, ఇతరులైన బ్రాహ్మణోత్తములను, మహాధనుర్ధరులైన ఆ సోదరులు రామలక్ష్మణులను కుశలము అడిగినానని చెప్పుము.”
2.70.19.
అనుష్టుప్.
తస్మై హస్త్యుత్తమాంశ్చిత్రాన్
కమ్బలానజినాని చ।
అభిసత్కృత్య కైకేయో
భరతాయ ధనం దదౌ॥
టీక:-
 తస్మై = వాటిని; హస్తిః = గజములను; ఉత్త్తమాం = శ్రేష్ఠమైనవాటిని; చిత్రాన్ = రంగురంగుల; కమ్బలాని = కంబళ్లను; అజినాని = మృగచర్మములను; చ = మఱియు; అభిసత్కృత్య = ప్రేమపూర్వకముగా; కైకేయో = కేకయరాజు; భరతాయ = భరతునకు; ధనం = ధనమును; దదౌ = ఇచ్చెను.
భావం:-
 కేకయరాజు ఆ భరతునకు ప్రేమ పూర్వకముగా శ్రేష్టమైన గజములను, రంగురంగుల కంబళ్లను, మృగచర్మములను, ధనమును ఇచ్చెను.
2.70.20.
అనుష్టుప్.
రుక్మనిష్కసహస్రే ద్వే
షోడశాశ్వశతాని చ।
సత్కృత్య కైకయీపుత్రమ్
కేకయో ధనమాదిశత్॥
టీక:-
 రుక్మనిష్క = బంగారపు; నిష్క = పూర్వకాలపు నాణెములు; సహస్రే = వేలు; ద్వే = రెండు; షోడశాశ్వశతాని = షోడశ + అశ్వ + శతాని, పదునారు వందల అశ్వములు; చ = మఱియు; సత్కృత్య = బహూకరించెను; కైకయీ పుత్రమ్ = కైకేయి కుమారుడైన భరతునికి; కేకయో = కేకయ మహారాజు; ధనమ్ = ధనమును; ఆదిశత్ = ఇచ్చెను
భావం:-
 కేకయ మహారాజు కైకేయి కుమారుడైన భరతునికి రెండువేల బంగారు కంఠహారములు, పదునారువందల అశ్వములు అను ధనమును బహూకరించెను.
2.70.21.
అనుష్టుప్.
తథాఽ మాత్యానభిప్రేతాన్
విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్।
దదావశ్వపతిః క్షిప్రమ్
భరతాయానుయాయినః॥
టీక:-
 తథా = ఆ విధముగా; అమాత్యాన్ = సర్వదా సమీపముననే ఉండువారు; అభిప్రేతాన్ = ఇష్టులు; విశ్వాస్యాంశ్చ = విశ్వాసపాత్రులు; చ = మఱియు; గుణాన్వితాన్ = సద్గుణవంతులు; దదౌ = ఇచ్చెను; అశ్వపతిః = అశ్వపతి; క్షిప్రమ్ = వెంటనే; భరతాయ = భరతునకు; అనుయాయినః = అనుచరులను
భావం:-
 అశ్వపతి ఆ భరతునకు, ఇష్టులు, విశ్వాసపాత్రులు, సద్గుణవంతులు, సర్వదా సమీపము నందుండు వారు అయిన అనుచరులను ఇచ్చెను.
*గమనిక:-
 అమాత్యః- అమా+ త్యక్, అమా సహ (రాజ్ఞా) విద్యచే వసతి వా, ప్రభువు సమీపమున ఉండువాడు, మంత్రి. ప్రెగ్గడ.
2.70.22.
అనుష్టుప్.
ఐరావతానైంద్రశిరాన్
నాగాన్వై ప్రియదర్శనాన్।
ఖరాన్ శీఘ్రాన్సుసంయుక్తాన్
మాతులోఽ స్మై ధనం దదౌ॥
టీక:-
 ఐరావతాన్ = ఐరావతము అను పేరు గలిగిన; ఐంద్రశిరాన్ = ఇంద్రశిర పర్వతశ్రేషులలో పుట్టిన; నాగాన్ = ఏనుగులను; అన్వై = వంశమునకు చెందిన; ప్రియదర్శనాన్ = చూచుటకు అందమైన; ఖరాన్ = గాడిదలను; శ్రీఘ్రాన్ = వేగముగా పరుగెత్తు; సుసంయుక్తాన్ = బాగుగా శిక్షణము ఇచ్చిన; మాతులః = మేనమామ; అస్మై = అతనికి; ధనం = కానుకలను; దదౌ = ఇచ్చెను
భావం:-
 మేనమామ అయిన యుధాజిత్తు అతనికి చూడచక్కని ఐరావత వంశమునకు చెందిన, ఇంద్రశిర పర్వతమునందు పుట్టిన, ఏనుగులను మఱియు బాగుగా శిక్షణము ఇచ్చిన శీఘ్రముగా పరుగెత్తు గాడిదలు అను సంపదను ఇచ్చెను.
*గమనిక:-
 నాగ- న గచ్ఛతి హత్యగః న అగో నాగః. హస్తి, ఏనుగు.
2.70.23.
అనుష్టుప్.
అంతఃపురేఽ తి సంవృద్ధాన్
వ్యాఘ్రవీర్యబలాన్వితాన్।
దంష్ట్రాఽఽ యుధాన్మహాకాయాన్
శునశ్చోపాయనం దదౌ॥
టీక:-
 అంతఃపురః = అంతఃపురములో; ఇతి = వీటిని; సంవృద్ధాన్ = చక్కగా పెంచబడిన; వ్యాఘ్ర = పులివలె; వీర్య = పరాక్రమము; బలాః = బలము; ఆన్వితాన్ = కలవి; దంష్ట్రా = కోరలే; ఆయుధాన్ = ఆయుధములుగా కలవి; మహాకాయాన్ = పెద్ద శరీరము కలవి; శునః = కుక్కలను; చ = కూడా; ఉపాయనం = బహుమతిగా; దదౌ = ఇచ్చెను
భావం:-
 అంతఃపురములో చక్కగా పెంచబడినవి, వ్యాఘ్రములతో సమానమైన వీర్యబలములు కలవి, కోరలే ఆయుధములుగా కలవి, చాల పెద్ద శరీరము కలవి అయిన కుక్కలను కూడ ఉపాయనముగా ఇచ్చెను.
2.70.24.
అనుష్టుప్.
స దత్తం కేకయేంద్రేణ
ధనం తన్నాభ్యనందత।
భరతః కైకయీపుత్రో
గమనత్వరయా తదా॥
టీక:-
 స దత్తం = ఇవ్వబడిన; కేకయేంద్రేణ = కేకయదేశ రాజు చేత; ధనం తత్ = సంపదలు; తత్ = ఆ; న = లేదు; అభినందత = ఆనందము కలిగించుట; భరతః = భరతుడు; కైకయీపుత్రః = కైకేయియొక్క పుత్రుడైన; గమన = వెళ్లెడి; త్వరయా = తొందరలో ఉన్నవానికి; తదా = అప్పుడు.
భావం:-
 అయోధ్యకు వెళ్ళెడి తొందరలో ఉన్న కైకేయీ పుత్రుడగు భరతునకు తన మాతామహుడిచ్చిన కానుకలు ఏవియు ఆనందమును కలిగించలేదు.
2.70.25.
అనుష్టుప్.
బభూవ హ్యస్య హృదయే
చింతా సుమహతీ తదా।
త్వరయా చాపి దూతానామ్
స్వప్నస్యాపి చ దర్శనాత్॥
టీక:-
 బభూవ = కలిగెను; హి = కదా; అస్య = అతని; హృదయే = మనస్సు నందు; చింతా = బాధ; సుమహతీ = అతిఅధికమైనది; తదా = అప్పుడు; త్వరయా = తొందర పెట్టట; చాపి = వలన; దూతానామ్ = దూతల చేత; స్వప్నస్య దర్శనాత్ = ఇంకను తాను చూచిన స్వప్నము చేత; స్వప్నస్య = కలను; అపి = ఇంకా; చ = కూడా; దర్శనాత్ = కనుట చేతను
భావం:-
 దూతలు తొందర పెట్టుట వలన, మఱియు తాను కనిన ఆ దుఃస్వప్నము వలన ఆ సమయమున అతని మనస్సునకు విపరీతమైన చింత కలిగెను కదా.
2.70.26.
అనుష్టుప్.
స స్వవేశ్మాభ్యతిక్రమ్య
నరనాగాశ్వసంవృతమ్।
ప్రపేదే సుమహచ్ఛ్రీమాన్
రాజమార్గమనుత్తమమ్॥
టీక:-
 సః = భరతుడు; స్వవేశ్మ = తన భవనము; అభి = అంతయును; అతిక్రమ్య = దాటెను; నర = జనులతోను; నాగ = ఏనుగులతోను; అశ్వ = గుర్రములతోను; సంవృతమ్= పరివృతమై ఉన్న; ప్రపేదే = ప్రవేశించెను; సుమహత్ = సువిశాలమైన; శ్రీమాన్ = శ్రీమంతమైన; రాజమార్గమ్ = రాజమార్గమును; అనుత్తమమ్ = ఉత్తమమైనదానిని
భావం:-
  భరతుడు అప్పుడు జనులు, ఏనుగులూ, గుఱ్ఱాలు తోను నిండి ఉన్న తన భవనము ప్రాంగణమంతా దాటి, సువిశాలమైన శ్రీమంతమైన శ్రేష్టమైన రాజమార్గమును ప్రవేశించెను.
2.70.27.
అనుష్టుప్.
అభ్యతీత్య తతోఽ పశ్యత్
అంతఃపురముదారధీః।
తతస్తద్భరతశ్శ్రీమాన్
ఆవివేశానివారితః॥
టీక:-
 అభ్యతీత్య = దాటి; తతః = అప్పుడు; అపశ్యత్ = దర్శించెను; అంతఃపురమ్ = అంతఃపురమును; ఉదారధీః = మిక్కిలి బుద్ధిమంతుడైన; తతః = అప్పుడు; తత్ = ఆ; భరతః = భరతుడు; శ్రీమాన్ = శ్రీమంతుడైన; ఆవివేశ = ప్రవేశించెను; అనివారితః = అడ్డమేమియు లేక
భావం:-
 పిదప రాజమార్గము దాటి వెళ్ళి, అంతఃపురమును చేరిన ఆ శ్రీమంతుడైన భరతుడు తిన్నగా అంతఃపురము ప్రవేశించెను.
2.70.28.
అనుష్టుప్.
స మాతామహమాపృచ్ఛ్య
మాతులం చ యుధాజితమ్।
రథమారుహ్య భరతః
శత్రుఘ్నసహితో యయౌ॥
టీక:-
 సః = అతడు; మాతామహమ్ = మాతామహునికి; అపృచ్ఛ్య = చెప్పి; మాతులం = మేనమామకు; చ = కూడా; యుధాజితమ్ = యుధాజిత్తు నకు; రథమ్ = రథమును; ఆరుహ్య = అధిరోహించి; భరతః = భరతుడు; శత్రుఘ్న = శత్రుఘ్న; సహితః = సమేతుడై; యయౌ = బయలుదేరెను
భావం:-
 అతడు మాతామహుని వద్ద, మేనమామయైన యుధాజిత్తు వద్దను సెలవు తీసుకుని, శత్రుఘ్న సమేతుడై రథమెక్కి బయలుదేరెను.
2.70.29.
అనుష్టుప్.
రథాన్మండల చక్రాంశ్చ
యోజయిత్వా పరశ్శతమ్।
ఉష్ట్ర గోఽ శ్వబలైర్భృత్యా
భరతం యాంతమన్వయుః॥
టీక:-
 రథాత్ = రథములను; మండల = చూట్టూ ఆవరించి ఉన్న; చక్రామ్ = వర్తులాకారములలో; చ = కూడిన; యోజయిత్వా = కూర్చుకొని; పరశ్శతమ్ = వందల కొలది; ఉష్ట్రః = ఒంటెలు; గోః = ఆవులు; అశ్వబలైః = అశ్వ బలములు; భృత్యాః = భృత్యులు; భరతం = భరతుని; యాంతమ్ = బయలుదేరెను; అన్వయుః = అనుసరించి
భావం:-
 భరతుడు ప్రయాణమై వెళ్ళుచుండగా, అతనిని చుట్టునూ గుండ్రముగా గుమికూడి వందలకొలది భృత్యులు, ఒంటెలు, గోవులు, అశ్వబలములు మొదలగునవి బయలుదేరినవి.
2.70.30.
త్రిష్టుప్.
బలేన గుప్తో భరతో మహాత్మా
సహార్యకస్యాఽ త్మసమైరమాత్యైః।
ఆదాయ శత్రుఘ్నమపేతశత్రు–
ర్గృహాద్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్॥
టీక:-
 బలేన = బలము చేత; గుప్తః = రక్షించబడుచున్న; భరతః = భరతుడు; మహాత్మా = మహాత్ముడైన; సహ = కలసి; ఆర్యకస్య = మాతామహుని యొక్క, సంస్కృత- ఆంధ్ర నిఘంటువు; ఆత్మసమైః = తనతో సమానులైన; అమాత్యైః = అమాత్యులచే; ఆదాయ = తీసుకొని; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుడును; అపేతశత్రుః = తొలగిన శత్రువులు కల వాడు; గృహాత్ = ఇంటి నుండి; యయౌ = బయలుదేరెను; సిద్ధ = సిద్ధపురుషుడు; ఇవ = వలె; ఇంద్రలోకాత్ = ఇంద్ర లోకము నుండి
భావం:-
 భరతుడు తన మాతామహునియొక్క స్వసమాన బలశాలులైన పరిచరాదులుచే రక్షితుడై, శత్రువిదారకుడైన శత్రుఘ్నుని వెంట తీసుకుని, సిద్ధపురుషుడు ఇంద్రలోకము నుండి బయలుదేరినట్లు మాతామహుని ఇంటినుండి బయలుదేరెను.
2.70.31.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే ఏకోనసప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకోనసప్తతితమ [69] = అరవైతొమ్మిదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [69] అరవైతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.71.1.
అనుష్టుప్.
స ప్రాఙ్గ్ముఖో రాజగృహాత్
అభినిర్యాయ రాఘవః।
తతస్సుదామాం ద్యుతిమాన్
సంతీర్యావేక్ష్య తాం నదీమ్॥
టీక:-
 సః = ఆ; ప్రాఙ్గ్ముఖః = తూర్పు ముఖముగ; రాజగృహాత్ = రాజగృహము నుండి; అభినిర్యాయ = బయలుదేరి; రాఘవః = భరతుడు; తతః = తరువాత; సుదామాం = సుదామ అను పేరుగల; ద్యుతిమాన్ = తేజోవంతుడైన; సంతీర్య = దాటి; అవేక్ష్య = చూచి; తాం = ఆ; నదీమ్ = నదిని.
భావం:-
 తేజశ్శాలి ఐన ఆ భరతుడు రాజగృహ పురము నుండి బయలుదేరి, తూర్పుదిశగా ప్రయాణిస్తూ సుదామ అను నదిని చూసి దానిని దాటెను.
*గమనిక:-
 అయోధ్యనుండి బయలుదేరిన దూతలు, భరతుని తొందరగా చేరుటకు దగ్గరి త్రోవలమ్మట గుఱ్ఱములపై ప్రయాణము చేసి గిరివ్రజము, రాజగృహము అను పేర్లు గల కేకయ దేశ రాజధానీ పురమును చేరిరి. తిరుగు ప్రయాణములో భరత శత్రుఘ్నులు చతురంగ బలములతోనూ, విశేషమైన రథముపైనూ ప్రయాణము అగుట వలన వేరొక విశాలమైన మార్గమున ప్రయాణించిరి. కనుక వేరువేరు నదుల, పర్వతముల, ప్రాంతముల పేర్లు గలవి దాటిరి. సౌజన్యము- గీతాప్రెస్ వారి రామాయణము.
2.71.2.
అనుష్టుప్.
హ్లాదినీం దూరపారాం చ
ప్రత్యక్స్రోతస్తరంగిణీమ్।
శతద్రూమతరచ్ఛ్రీమాన్
నదీమిక్ష్వాకునందనః॥
టీక:-
 హ్లాదినీం = హ్లాదినీ అను నదిని; దూరపారాం = దూరముగానున్న ఒడ్డును కలిగియున్న; ప్రత్యక్ స్త్రోతః తరంగిణీమ్ = పశ్చిమదిశగా ప్రవహించు అలలు గల దానిని; శతద్రూః = శతద్రూమ అను నదిని; అతరత్ = దాటెను; శ్రీమాన్ = శ్రీమంతుడైన; నదీమ్ = నదిని; ఇక్ష్వాకునందనః = ఇక్ష్వాకు వంశమునకు ఆనందము కలిగించువాడైన.
భావం:-
 తరువాత, భరతుడు హ్లాదిని అను నదిని మఱియు తీరము దూరముగా ఉండెడిది, పశ్చిమ దిశగా ప్రవహించునదీ ఐన శతద్రూ (సట్లెజ్) అను పేరు గల నదిని దాటెను.
*గమనిక:-
 గిరివ్రజము పిమ్మట వరుసగా సదామ, హ్లాదిని, శతద్రూ (సట్లెజ్) నదులు, సింధునదీ పారివాహిక (ప్రస్తుత పంజాబుల) ప్రాంతములోనివి
2.71.3.
అనుష్టుప్.
ఏలాధానే నదీం తీర్త్వా
ప్రాప్య చాపరపర్పటాన్।
శిలామకుర్వతీం తీర్త్వా
ఆగ్నేయం శల్యకర్తనమ్॥
టీక:-
 ఏలాధానే = ఏలాధాన అను గ్రామమున; నదీం = శతద్రుమ నదిని; తీర్త్వా = దాటి; ప్రాప్య = పొంది; చ = తరువాత;అపరపర్పటాన్ = అపరపర్పటమను దేశమును; శిలామకుర్వతీమ్ = శిలావహ అను శిలలను ఆకర్షించు నదిని; తీర్త్వా = దాటి; ఆగ్నేయం = ఆగ్నేయము అను గ్రామమును; శల్యకర్తనమ్ = శల్యకర్తనము అను గ్రామమును.
భావం:-
 భరతుడు ఏలాధాన అను గ్రామమును, అపరపర్పట ప్రదేశమును శిలావహ మను నదిని చేరి, అక్కడకు ఆగ్నేయదిశలోనున్న శల్యకర్తనము అను నగరము దాటెను.
*గమనిక:-
 (1) పూర్వపర్పటా అపరపర్పటా ఏచేతి ఆమదూయమాస్తి.. (2) శిలాకుర్వతీం- షిలామాసమంతాత్కుర్వతీం ఇతి చతుర్వేది కా హిందీ రామాయణం
2.71.4.
అనుష్టుప్.
సత్యసంధశ్శుచిశ్శ్రీమాన్
ప్రేక్షమాణ శ్శిలావహామ్।
అత్యయాత్స మహాశైలాన్
వనం చైత్రరథం ప్రతి॥
టీక:-
 సత్యసంధః = సత్యసంధుడు; శుచిః = పరిశుద్ధుడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; ప్రేక్షమాణ = చూచుచు; శిలావహామ్ = శిలావహ అను నదిని; అత్యయాత్ = దాటెను; సః = అతడు; మహాశైలాన్ = గొప్ప పర్వతములను; వనం = వనమును; చైత్రరథం = చైత్రరథము; ప్రతి = గూర్చి.
భావం:-
 సత్యసంధుడు పరిశుద్ధుడు శ్రీమంతుడును ఐన ఆ భరతుడు; శిలావహ అను నదిని చూచుచు, ఆ గొప్ప పర్వతములను దాటెను. పిమ్మట చైత్రరథము అను వనమును వైపు ప్రయాణము సాగించెను.
2.71.5.
అనుష్టుప్.
సరస్వతీం చ గంగాం చ
యుగ్మేన ప్రతిపద్యచ।
ఉత్తరాన్వీరమత్స్యానామ్
భారుండం ప్రావిశద్వనమ్॥
టీక:-
 సరస్వతీం = సరస్వతీ నదిని; చ = మఱియు; గంగాం = పవిత్ర నదిని; యుగ్మేన = జంటను; ప్రతిపద్య = పొంది; చ = పొంది; ఉత్తరాన్ = ఉత్తరమున; వీర = వీరుడు; మత్స్యానామ్ = మత్స్య అను దేశమును; భారుండం = భారుండమును; ప్రావిశత్ = ప్రవేశించెను; వనమ్ = వనమును.
భావం:-
 వీరుడు, భరతుడు సరస్వతీ పవిత్ర జంట నదుల చేరి, మత్స్య అను దేశమునకు ఉత్తరమున ఉన్న భారుండము అను అడవి ప్రవేశించెను.
*గమనిక:-
 మత్స్యదేశము రాజధాని విరాట నగరము, ఆ దేశము మద్రదేశమునకు ఆగ్నేయమున కలదు
2.71.6.
అనుష్టుప్.
వేగినీం చ కుళింగాఖ్యామ్
హ్లాదినీం పర్వతాఽ ఽ వృతామ్।
యమునాం ప్రాప్య సంతీర్ణః
బలమాశ్వాసయత్తదా॥
టీక:-
 వేగినీం = వేగము కలది; కుళింగా ఆఖ్యామ్ = కుళింగ అను పేరు కలిగియున్న; హ్లాదినీం = సంతోషపఱచుదానిని; పర్వత ఆవృతామ్ = నలువైపులా పర్వతములను కలిగియున్నది; యమునాం = యమునా నదిని; ప్రాప్య = పొంది; సంతీర్ణః = దాటిన; బలమ్ = బలగమును; ఆశ్వాసయత్ = నిలిపెను; తదా = అప్పుడు.
భావం:-
 అప్పుడు కుళింగ అను వేగినీ నది. హాయిని చేకూర్చునది, నలువైపుల పర్వతములచే ఆవరింపబడియున్నది ఐన హ్లాదినీ నది మఱియు యమునా నదిని దాటి అక్కడ తన సైన్యమునకు విశ్రాంతిని ఇచ్చెను.
*గమనిక:-
 హ్లాదిన్- హ్లాద్+ణిని, ప్రసన్నహోనేవాలా, ఖుష్ హోనేవాలా, సంతోషపఱచు. శివుడి జటాఝూటమున ఉన్న సురగంగ, హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని ఏడు పాయలుగా తాకుతుంది. వాటిని పవిత్రనది / గంగ అందురు తూర్పువైపున (1) హ్లాదిని, (2) పావని, (3) నళిని. పశ్చిమం దిక్కున (4) సుచక్షు, (5) సీత, (6) సింధు. వెుత్తం ఆరుపాయలు. ఏడోపాయ మాత్రం (7) భగీరథుడి రథం వెనకాలే పరిగెట్టిన భాగీరథీ గంగానది.
2.71.7.
అనుష్టుప్.
శీతీకృత్య తు గాత్రాణి
క్లాంతానాశ్వాస్య వాజినః।
తత్ర స్నాత్వా చ పీత్వా చ
ప్రాయాదాదాయ చోదకమ్॥
టీక:-
 శీతీకృత్య = చల్లబరచి; గాత్రాణి = శరీరమును; క్లాంతాన్ = అలసియున్న; ఆశ్వాస్య = సేద దీర్చి; వాజినః = గుఱ్ఱములను; తత్ర = అక్కడ; స్నాత్వా = స్నానము చేసి; పీత్వా = త్రాగి; ప్రాయాత్ = వెళ్ళెను; ఆదాయ = తీసుకొని; ఉదకమ్ = నీటిని.
భావం:-
 భరతుడు అలసియున్న గుఱ్ఱములను నీటితో తడిపి చల్లబరచి, వాటి సేద దీర్చి, తాను స్నానము చేసి, నీరు త్రాగి బయలుదేరెను.
2.71.8.
అనుష్టుప్.
రాజపుత్రో మహారణ్యమ్
అనభీక్ష్ణోపసేవితమ్।
భద్రో భద్రేణ యానేన
మారుతః ఖమివాత్యయాత్॥
టీక:-
 రాజపుత్రః = రాజకుమారుడు; మహారణ్యమ్ = మహారణ్యమును; అనభీక్ష్ణః = అరుదుగా, మెకడోనాల్ seldom; ఉపసేవితమ్ = జనసంచారము కలది; భద్రోభద్రేణ = భద్రభద్ర జాతికి చెందిన ఏనుగు; యానేన = వాహనముపై; మారుతః = వాయువు; ఖమ్ = ఆకాశము; ఇవ = వలె; ఆత్యయాత్ = దాటెను.
భావం:-
 ర భరతుడు, భద్రవంతమైన వాహనముగా భద్రభద్ర జాతి ఏనుగు ఎక్కి చాలా తక్కువ జనసంచారము గల ఆ మహారణ్యమును, గాలి ఆకాశమును దాటినట్లుగా, వేగముగా దాటెను.
*గమనిక:-
 గజజాతులు మూడు- అవి భద్రము, మందము, మృగము. వీని ప్రతి దానిలోను ఇదే పేరున ఉపజాతులు కలవు. భద్ర జాతి ఏనుగు, రాజ వాహనముగను, దేవాలయములందు ఉచ్సవములందు వాడుదురు. అందు భద్ర-భద్ర మరింత సురక్షితమైనది,
2.71.9.
అనుష్టుప్.
భాగీరథీం దుష్ప్రతరామ్
అంశుధానే మహానదీమ్।
ఉపాయాద్రాఘవస్తూర్ణమ్
ప్రాగ్వటే విశ్రుతే పురే॥
టీక:-
 భాగీరథీం = గంగానదిని; దుష్ప్రతరామ్ = దాటుటకు దుర్లభమైన; అంశుధానే = అంశుధానము అను ప్రదేశమునందు; మహానదీమ్ = మహానది ఐన; ఉపాయాత్ = చేరెను; రాఘవః = భరతుడు; తూర్ణమ్ = శీఘ్రముగ; ప్రాగ్వటే = ప్రాగ్వటము అను పేరున; విశ్రుతే = ప్రసిద్ధి చెందిన; పురే = నగరమును.
భావం:-
 భరతుడు అంశుధాన అను ప్రదేశమున దాటుటకు దుర్లభమైన మహానది గంగానదిని, ప్రసిద్ధి చెందిన ప్రాగ్వటము అను నగరమును మిక్కిలి వేగముగా చేరెను.
2.71.10.
అనుష్టుప్.
స గంగాం ప్రాగ్వటే తీర్త్వా
సమాయాత్కుటికోష్ఠికామ్।
సబలస్తాం స తీర్త్వాఽ థ
సమాయాద్ధర్మవర్ధనమ్॥
టీక:-
 సః = అతడు; గంగాం = గంగను; ప్రాగ్వటే = ప్రాగ్వటమునందు; తీర్త్వా = దాటి; సమాయాత్ = చేరెను; కుటికోష్ఠికామ్ = కుటికోష్ఠికా అను పేరుగల నదిని; సబలః = బలగముతో; తాం = దానిని; సః = అతడు; తీర్త్వా = దాటి; అథ = తరువాత; సమాయాత్ = చేరెను; ధర్మవర్ధనమ్ = ధర్మవర్ధనము అను ప్రదేశమును.
భావం:-
 భరతుడు ప్రాగ్వటపురము వద్ద గంగానదిని దాటి, తన సైన్యముతో సహా కుటికోష్ఠికా అను పేరుగల నదిని కూడ దాటి, ధర్మవర్ధనము అను పురమును చేరెను.
*గమనిక:-
 ప్రాగ్వటపురము- నేపాలు సరిహద్దు దగ్గర ఉండెడిదు
2.71.11.
అనుష్టుప్.
తోరణం దక్షిణార్ధేన
జమ్బూప్రస్థముపాగమత్।
వరూథం చ యయౌ రమ్యమ్
గ్రామం దశరథాత్మజః॥
టీక:-
 తోరణం = తోరణం అను ప్రదేశము; దక్షిణార్ధేన = దక్షిణ దిక్కున; జమ్బూప్రస్థమ్ = జంబూప్రస్థము అను గ్రామము; ఉపాగమత్ = చేరెను; వరూథం = వరూథము అను గ్రామము; యయౌ = పొందెను; రమ్యమ్ = అందమైన; గ్రామం = గ్రామము; దశరథాత్మజః = దశరథుని కుమారుడు.
భావం:-
 భరతుడు తోరణము అను ప్రదేశమునకు దక్షిణముగా ఉన్న జంబూప్రస్థము అను గ్రామమును,డి నుండి వరూథము అను మరియొక అందమైన గ్రామమును చేరెను.
2.71.12.
అనుష్టుప్.
తత్ర రమ్యే వనే వాసమ్
కృత్వాఽ సౌ ప్రాఙ్గ్ముఖో యయౌ।
ఉద్యానముజ్జిహానాయాః
ప్రియకా యత్ర పాదపాః॥
టీక:-
 తత్ర = అక్కడ; రమ్యే = అందమైన; వనే = వనము నందు; వాసమ్ = నివాసమును; కృత్వా = ఏర్పరచుకుని; అసౌ = అతడు; ప్రాఙ్గ్ముఖః = తూర్పు దిశగా; యయౌ = పొందెను; ఉద్యానమ్ = ఉద్యానమును; ఉజ్జిహానాయాః = ఉజ్జిహాన అను ప్రదేశము యొక్క; ప్రియకాః = కదంబ వృక్షములు; యత్ర = దేనియందు; పాదపాః = వృక్షములు.
భావం:-
 భరతుడు అందమైన అరణ్యమునందు బస చేసి; అక్కడి నుండి తూర్పు దిశగా కదంబ వృక్షములు ఉన్న ఉజ్జిహాన అను ప్రదేశము చేరుకొనెను.
2.71.13.
అనుష్టుప్.
సాలాంస్తు ప్రియకాన్ప్రాప్య
శీఘ్రానాస్థాయ వాజినః।
అనుజ్ఞాప్యాథ భరతః
వాహినీం త్వరితో యయౌ॥
టీక:-
 సాలాన్ = వృక్షములు; ప్రియకాన్ = కదంబములను; ప్రాప్య = పొంది; శీఘ్రాన్ = వేగముగా పయనించు; ఆస్థాయ = ఎక్కి; వాజినః = గుఱ్ఱములను; అనుజ్ఞాప్య = ఒప్పించి; అథ = తరువాత; భరతః = భరతుడు; వాహినీం = సైన్యమును; త్వరితః = తొందరగా; యయౌ = వెళ్ళెను.
భావం:-
 భరతుడు అక్కడి కదంబ వృక్షముల వద్ద నుండి వేగముగా పరుగెట్టగలిగిన జవనాశ్వముల నెక్కి, తన వెనుక సైన్యమును త్వరగా రమ్మని ఆదేశించి తాను తొందరగ వెళ్ళెను.
2.71.14.
అనుష్టుప్.
వాసం కృత్వా సర్వతీర్థే
తీర్త్వా చోత్తానికాం నదీమ్।
అన్యా నదీశ్చ వివిధాః
పార్వతీయైస్తురంగమైః॥
టీక:-
 వాసం = నివాసమును; కృత్వా = చేసి; సర్వతీర్థే = సర్వతీర్థము అను ప్రదేశమునందు; తీర్త్వా = దాటి; ఉత్తానికాం = ఉత్తానికా అను పేరు గల; నదీమ్ = నదిని; అన్యా = ఇతర; నదీశ్చ = నదులను; వివిధాః = అనేక; పార్వతీయైః = పర్వతములందు పుట్టిన; తురంగమైః = గుఱ్ఱములతో.
భావం:-
 భరతుడు సర్వతీర్థము అను ప్రదేశమునందు వసించి; ఉత్తానిక అను పేరుగల నదిని మఱియు పర్వతములందు పుట్టిన అనేక నదులను దాటుతూ గుఱ్ఱములపై వెళ్ళెను.
2.71.15.
అనుష్టుప్.
హస్తిపృష్ఠకమాసాద్య
కుటికామత్యవర్తత।
తతార చ నరవ్యాఘ్రో
లౌహిత్యే స కపీవతీమ్॥
టీక:-
 హస్తిపృష్ఠకమ్ = ఏనుగు నెక్కి; ఆసాద్య = పొంది; కుటికామ్ = కుటికా నదిని; అత్యవర్తత = దాటెను; తతార = దాటెను; నరవ్యాఘ్రః = మానవ శ్రేష్ఠుడు; లౌహిత్యే = లౌహిత్యము అను ప్రదేశమును; సః = అతడు; కపీవతీమ్ = కపీవతి అను నదిని
భావం:-
 ఆ మానవ శ్రేష్ఠుడు భరతుడు ఏనుగునెక్కి కుటికా నదిని దాటెను. తరువాత లౌహిత్యము అను ప్రదేశమున కపీవతీ నదిని దాటెను.
2.71.16.
అనుష్టుప్.
ఏకసాలే స్థాణుమతీమ్।
వినతే గోమతీం నదీమ్।
కలింగనగరే చాపి।
ప్రాప్య సాలవనం తదా।
టీక:-
 ఏకసాలే = ఏకసాల అను గ్రామమునందు; స్థాణుమతీమ్ = స్థాణుమతి అను నదిని; వినతే = వినత అను గ్రామమునందు; గోమతీం = గోమతి నదిని; నదీమ్ = నదిని; కలింగనగరే = కళింగ నగరమునందు; అపి = కూడ; ప్రాప్య = చేరి; సాలవనం = సాలవృక్ష వనమును; తదా = అప్పుడు; భరతః = భరతుడు; క్షిప్రమ్ = వేగముగా; ఆగచ్ఛత్ = వెళ్ళి; సుపరిశ్రాంత = చాల అలిసిపోయిన; వాహనః = వాహనములను.
భావం:-
 భరతుడు ఏకసాల గ్రామమునందు స్థాణుమతి అను నదిని మఱియు వినత అను గ్రామమునందు గోమతి అను నదిని దాటి, గుఱ్ఱములు అలిసి యుండుటచే కలింగనగరమునందలి సాలవృక్షవనమునందు విశ్రమించి తిరిగి వెంటనే ప్రయాణమయ్యెను.
2.71.17.
అనుష్టుప్.
వనం చ సమతీత్యాశు
శర్వర్యామరుణోదయే।
అయోధ్యాం మనునా రాజ్ఞా
నిర్మితాం సందదర్శ హ॥
టీక:-
 వనం = వనమును; సమతీత్య = దాటి; ఆశు = శీఘ్రముగ; శర్వర్యామ్ = రాత్రివేళ; అరుణోదయే = అరుణోదయ సమయమున; అయోధ్యాం = అయోధ్యను; మనునా = మనువు అను పేరు గల; రాజ్ఞా = రాజుచే; నిర్మితాం = నిర్మింపబడిన; సందదర్శ హ = చూచెను.
భావం:-
 రాత్రివేళ శీఘ్రముగా సాలవృక్ష వనమును దాటి; ఉదయముననే; మనుచక్రవర్తిచే నిర్మింపబడిన అయోధ్యానగరమును చూచెను.
2.71.18.
అనుష్టుప్.
తాం పురీం పురుషవ్యాఘ్రః
సప్తరాత్రోషితః పథి।
అయోధ్యామగ్రతో దృష్ట్వా
సారథిం వాక్యమబ్రవీత్॥
టీక:-
 తాం = ఆ; పురీం = నగరమును; పురుషవ్యాఘ్రః = పురుష శ్రేష్ఠుడు; సప్తరాత్రోషితః = ఏడు దినములు సమయము; పథి = మార్గమునందు; అయోధ్యామ్ = అయోధ్యను; అగ్రతః = ఎదురుగా; దృష్ట్వా = చూచి; సారథిం = సారథిని గూర్చి; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 ఆ మానవశ్రేష్ఠుడు ఏడు దినములు పాటు ప్రయాణము చేసి చేసి ఎదురుగా అయోధ్యానగరమును చూచి సారథితో ఇట్లు పలికెను.
2.71.19.
అనుష్టుప్.
“ఏషా నాతిప్రతీతా మే
పుణ్యోద్యానా యశస్వినీ।
అయోధ్యా దృశ్యతే దూరాత్
సారథే! పాండుమృత్తికా॥
టీక:-
 ఏషా = ఈ; నతిప్రతీతా = అస్పష్టముగ; మే = నాకు; పుణ్యోద్యానా = పుణ్యమైన ఉద్యానములు ఉన్న; యశస్వినీ = ప్రశస్తమైన; అయోధ్యా = అయోధ్యానగరము; దృశ్యతే = కనబడుచున్నది; దూరాత్ = దూరముగా; సారథే = సారథీ; పాండుమృత్తికా = తెల్లని మట్టితో.
భావం:-
 సారథీ ! పుణ్యప్రదమైన ఉద్యానములతో ఒప్పుచూ, చాల ప్రశస్తమైన తెల్లమట్టిగల అయోధ్యానగరము నాకు దూరము నుండి అస్పష్టముగా కనబడుచున్నది.
2.71.20.
అనుష్టుప్.
యజ్వభిర్గుణసమ్పన్నైః
బ్రాహ్మణైర్వేదపారగైః।
భూయిష్ఠమృద్ధైరాకీర్ణా
రాజర్షిపరిపాలితా॥
టీక:-
 యజ్వభిః = యజ్ఞములు చేసిన వారు; గుణసమ్పన్నైః = సద్గుణ సంపన్నులు; బ్రాహ్మణైః = బ్రాహ్మణులు; వేదపారగైః = వేద పండితులు; భూయిష్ఠమ్ = చాలామంది ఉన్నది; ఋద్ధైః = ఐశ్వర్యవంతులు; ఆకీర్ణా = వ్యాప్తి చెందిన; రాజర్షిపరిపాలితా = రాజర్షులచే పాలింపబడిన.
భావం:-
 సారథీ! సద్గుణ సంపన్నులైన యజ్ఞములు చేసిన వారు, వేదపండితులైన బ్రాహ్మణులు, ఐశ్వర్యవంతులు ఎందరో ఇక్కడ నివసించుచున్నారు. ఎందరో రాజర్షులు పాలించారు.
2.71.21.
అనుష్టుప్.
అయోధ్యాయాం పురా శబ్దః
శ్రూయతే తుములో మహాన్।
సమంతాన్నరనారీణామ్
తమద్య న శ్రుణోమ్యహమ్॥
టీక:-
 అయోధ్యాయాం = అయోధ్యానగరమునందు; పురా = పూర్వము; శబ్దః = మాటలతో; శ్రూయతే = వినబడుచుండెడి; తుములః = సందడిగా ఉండెడిది; మహాన్ = గొప్ప; సమంతాన్ = ప్రాంతములన్నీ; నరనారీణామ్ = స్త్రీ పురుషుల; తమ్ = తరించుట; అద్య = ఇప్పుడు; న = లేదు; శ్రుణోమ్య = వినుటలేదు; అహమ్ = నేను.
భావం:-
 పూర్వము ఈ అయోధ్యానగరమునందు స్త్రీ పరుషుల సంభాషణాదులతో గొప్ప కోలాహలము వినబడుచుండెడిది. ఇప్పుడు ఇదేచోటులో నాకు స్త్రీపురుషుల సందటి వినబడుటలేదు.
2.71.22.
అనుష్టుప్.
ఉద్యానాని హి సాయాహ్నే
క్రీడిత్వోపరతైర్నరైః।
సమంతాత్పరిధావద్భిః
ప్రకాశన్తే మమాన్యథా॥
టీక:-
 ఉద్యానాని = ఉద్యానములు; సాయాహ్నే = సాయంత్రములందు; క్రీడిత్వా = ఆటలు; ఉపరతైః = క్రీడించుచున్న; నరైః = పురుషులు; సమంతాత్ = అన్ని చోటులందు; పరిధావద్భిః = పరుగిడుచున్న; ప్రకాశన్తే = ప్రకాశించుచుండెడిది; మమ = నాకు; అన్యథా = మరి వేరు విధముగా.
భావం:-
 సాయంత్రములందు ఎక్కడ చూసినా పురుషుల ఆటపాటలతో పరుగులతో నిండి కనిపించెడి ఉద్యానవనములు అన్నియు నాకు వేరుగా కనిపించుచున్నవి.
2.71.23.
అనుష్టుప్.
తాన్యద్యానురుదంతీవ
పరిత్యక్తాని కామిభిః।
అరణ్యభూతేవ పురీ
సారథే! ప్రతిభాతి మే॥
టీక:-
 తాని = ఇవి; అద్య = ఇప్పుడు; అనురుదంతి = దీనముగా; ఇవ = వలె; పరిత్యక్తాని = వదిలివేసినవారి; కామిభిః = ప్రియులచే; అరణ్యభూతా = అరణ్యములవంటివి; ఇవ = వలె; పురీ = నగరము; సారథే = సారథీ; ప్రతిభాతి = కనబడుచున్నది; మే = నాకు.
భావం:-
 సారథీ! ఈ నగరములు ఇప్పుడు ప్రియులచే వదిలివేయబడి శోకిస్తున్నవారి వలె ఉన్నది, ఈ నగరము ఇప్పుడు పాడుపడి అడవులవంటివి ఐపోయినట్లు నాకు కనబడుచున్నవి.
2.71.24.
అనుష్టుప్.
న హ్యత్ర యానైర్దృశ్యన్తే
న గజైర్న చ వాజిభిః।
నిర్యాంతో వాఽ భియాంతో వా
నరముఖ్యా యథాపురమ్॥
టీక:-
 నహి = లేదు; అత్ర = ఇక్కడ; యానైః = వాహనములు; దృశ్యన్తే = కనుబడుట; గజైః = ఏనుగులు; వాజిభిః = గుఱ్ఱములు; నిర్యాంతః = సంచరించుట; ంlfఅభియాంత- = బయట; ంlfనరముఖ్యా = పురప్రముఖులు; యథా = వలె; పురమ్ = పూర్వము.
భావం:-
 ఇక్కడ. వాహనములు పల్లకీలు, ఏనుగులు, గుఱ్ఱముల ఏవీ కనబడుట లేదు. పురప్రముఖులు పూర్వము వలె రాకపోకలు సాగించుట లేదు, సంచరించుట లేదు.
2.71.25.g,
అనుష్టుప్.
ఉద్యానాని పురా భాంతి
మత్తప్రముదితాని చ।
జనానాం రతిసంయోగే -
ష్వత్యంతగుణవంతి చ॥
టీక:-
 ఉద్యానాని = ఉద్యానములు; పురా = పూర్వము; భాంతి = ప్రకాశవంతముగా; మత్తప్రముదితాని = ఆనందోత్సాహులై; చ = మఱియు; జనానాం = ప్రజలు; రతిసంయోగేషు = స్త్రీపురుషసంగమవిద్యలో; అత్యంతగుణవంతి = నేర్పరులై; చ = ఇంకను.
భావం:-
 పూర్వము ఈ ఉద్యానముల యందు ఆనందోత్సాహములు విలసిల్లేవి. ఇంకా జనులందరూ రతిశాస్త్రములో నేర్పరులై యుండెడివారు.
2.71.26.
అనుష్టుప్.
తాన్యేతాన్యద్య పశ్యామి
నిరానందాని సర్వశః।
స్రస్తపర్ణైరనుపథమ్
విక్రోశద్భిరివ ద్రుమైః॥
టీక:-
 తాన్యేన = తాన్+ ఏన, అవియన్నీ; అద్య = నేడు; పశ్యామి = చూచుచున్నాను; నిరానందాని = సంతోషమును కోల్పోయినవిగా; సర్వశః = అంతటా; స్రస్త = రాలిపోయిన; పర్ణైః = ఆకులుకలవి; అనుపథమ్ = మార్గమునందు; విక్రోశద్భిః = ఏడ్చుచున్నట్లున్న; ఇవ = వలె; ద్రుమైః = వృక్షములు.
భావం:-
 నేడు, ఎటుచూసినా అవన్నీ ఆనందమే లేనివాని వలె కనబడుచున్నవి. వీధుల వెంట చెట్లు శోకిస్తున్నట్లుగా ఆకులను కన్నీటిబొట్లు రాల్చుచున్నవి.
2.71.27.
అనుష్టుప్.
నాద్యాపి శ్రూయతే శబ్దః
మత్తానాం మృగపక్షిణామ్।
సంరక్తాం మధురాం వాణీమ్
కలం వ్యాహరతాం బహు॥
టీక:-
 న = లేదు; అద్య = నేడు; అపి = కూడ; శ్రూయతే = వినబడుట; శబ్దః = శబ్దములు; మత్తానాం = మదించిన; మృగ = మృగముల; పక్షిణామ్ = పక్షుల; సంరక్తాం = అనురక్తి; మధురాం = మధురమైన; వాణీమ్ = మాటను; కలం = మధుర భావము; వ్యాహరతాం = పలుకుచున్న; బహు = చాల.
భావం:-
 తెల్లవారినను మదించి, అనురాగభరితము, మధురమూ ఐన ధ్వనులను చేయు పక్షుల మృ,గముల అరుపులు వినబడుటలేదు.
2.71.28.
అనుష్టుప్.
చందనాగరుసమ్పృక్తో
ధూపసమ్మూర్ఛితోఽ తులః।
ప్రవాతి పవనశ్శ్రీమాన్
కిన్నునాద్య యథాపురమ్॥
టీక:-
 చందన = మంచిగంధము; అగరు = అగరుచెక్కల; సమ్పృక్తః = సమ+పృక్తః, మిక్కిలి కూడినది; ధూపః = ధూపముల; సమ = మిక్కిలి; మూర్ఛితః = వ్యాప్తి చెంది యున్నది; అతులః = అసమానమైన; ప్రవాతి = వీచుట; పవనః = వాయువు; శ్రీమాన్ = శోభాయమానమైన; కిం ను = ఎందువలన; న = లేదు; అద్య = నేడు; యథా = అట్లు; పురమ్ = పూర్వము.
భావం:-
 చందన అగరు సుగంధభరితమైన ధూపముచే నిండి ఆహ్లాదమానమై యుండెడి గాలి పూర్వము వలె ఇప్పుడు ఎందువలన వీచుట లేదో.
*గమనిక:-
 (1) అగరు- చందన విశేషము, చందన చెక్కలనుండి తీసిన పరిమళ ద్రవ్యము, విశేషమైన పరిమళముగలిగి ఎఱ్ఱదాళుగ నుండే గంధపు చెక్క. (2) ధూపము- సుగంధు ద్రవ్యముల నుండి వెలువడు పొగ, వావిళ్ళ నిఘంటువు
2.71.29.
అనుష్టుప్.
భేరీమృదంగవీణానామ్
కోణసంఘట్టితః పునః।
కిమద్య శబ్దో విరతః
సదాఽ దీనగతిః పురా॥
టీక:-
 భేరీమృదంగవీణానామ్ = భేరీ మృదంగ వీణల యొక్క; కోణసంఘట్టితః = వాయింపబడుట; పునః = మరల మరల; కిమ్ = ఎందువలన; అద్య = నేడు; శబ్దః = శబ్దములు; విరతః = ఆగిపోయినవి; సదా = ఎప్పుడు; అదీనగతిః = ఆగని, తగ్గని గమనము కలవి; పురా = పూర్వము.
భావం:-
 పూర్వము భేరీ మృదంగ వీణాది వాద్యములను కొదుపులతో మరల మరల కొడుతున్న రవములు వినబడెడివి కదా. ఎందువలననో, ఆ ఎడతెగనివీ, ప్రసన్నకరములూ ఐన శబ్దములు వినవచ్చుట లేదు.
*గమనిక:-
 కోణః- కుణ+ ఘఞ్, కుణతి వాదయతి, అనేన. దీనితో భేరి, వీణ మొదలదునవి వాయింతురు, కోణము, కొదుపు. ముదిగొండ వారి నిఘంటువు.
2.71.30.
అనుష్టుప్.
అనిష్టాని చ పాపాని
పశ్యామి వివిధాని చ।
నిమిత్తాన్యమనోజ్ఞాని
తేన సీదతి మే మనః॥
టీక:-
 అనిష్టాని = అయిష్టమును కలిగించునవి, ; పాపాని = పాపకరములు, కౄరమైనవి; పశ్యామి = చూచుచున్నాను; వివిధాని = నానా విధములైన; నిమిత్తాని = దుశ్శకునములు; అమనోజ్ఞాని = మనోహరములు కానివి, చూచినంతనే దుఃఖము కలిగించునవి; తేన = దాని వలన; సీదతి = కుంగిపోవుచున్నది; మే = నా; మనః = మనసు.
భావం:-
 అయిష్టమున కలిగించునవి, కౄరమైనవి, కనబడినంతనే దుఃఖము కల్పించునవి ఐన అనేక విధములైన దుశ్శకునములు కనబడుచున్నవి, వాని వలన నా మనసు చాలా బాధపడుచున్నది.
2.71.31.
అనుష్టుప్.
సర్వథా కుశలం సూత
దుర్లభం మమ బంధుషు।
తథాహ్యసతి సమ్మోహే
హృదయం సీదతీవ మే”॥
టీక:-
 సర్వథా = అన్ని విధముల; కుశలం = క్షేమము; సూత = సారథీ; దుర్లభం = దుర్లభము; మమ = నా; బంధుషు = బంధువులలో; తథాహి = నిదర్శనము; అసతి = లేకుండినను; సమ్మోహే = సమ్మోహము; హృదయం = హృదయము; సీదతి = కుంగుబాటుచెందుతున్నది; ఇవ = వలె; మే = నాకు.
భావం:-
 సారథీ! నా బంధువులు అన్ని విధములుగ క్షేమముగా ఉన్నారని తలచుట దుర్లభముగ నున్నది. ఏ కారణమూ లేకుండిననూ, నాకు మనసు దిగులు చెందుచున్నట్లు ఉన్నది.”
2.71.32.
అనుష్టుప్.
విషణ్ణశ్శ్రాంతహృదయః
త్రస్తస్సులులితేంద్రియః।
భరతః ప్రవివేశాశు
పురీమిక్ష్వాకుపాలితామ్॥
టీక:-
 విషణ్ణః = దుఃఖముతో; శ్రాంత = అలసిన; హృదయః = హృదయము; త్రస్తః = భయము చెందిన; సులులితేన్ద్రియః = మిక్కిలి నలిగిపోయిన; ఇంద్రియః = మిక్కిలి నలిగిపోయిన; భరతః = భరతుడు; ప్రవివేశ = ప్రవేశించెను; ఆశు = శీఘ్రముగ; పురీమ్ = అయోధ్యను; ఇక్ష్వాకుపాలితామ్ = ఇక్ష్వాకుచే పాలింపబడిన.
భావం:-
 ఈ విధముగా దిగులుతో అలసిపోయిన మనసుతో, నలిగిపోయిన అవయవములతో, తెలియని భయము చెందిన భరతుడు పూర్వము ఇక్ష్వాకుడు పాలించినంతటి ఆ అయోధ్యాపురము ప్రవేశించెను.
2.71.33.
అనుష్టుప్.
ద్వారేణ వైజయన్తేన
ప్రావిశచ్ఛ్రాంతవాహనః।
ద్వాస్స్థైరుత్థాయ విజయమ్
ఉక్తస్తై స్సహితో యయౌ॥
టీక:-
 ద్వారేణ = ద్వారము నుండి; వైజయన్తేన = వైజయంతి అను పేరు గల; ప్రావిశత్ = ప్రవేశించెను; శ్రాంత = అలసిపోయిన; వాహనః = వాహనము; ద్వాః = ద్వారమువద్ద; స్స్థైః = ఉన్నవారు; ఉత్థాయ = నిలబడి; విజయమ్ = విజయము; ఉక్తః = పలికిరి; తైః = వారితో; సహితః = సహా; యయౌ = వెళ్ళెను.
భావం:-
 భరతుడు అలసిపోయివున్న గుఱ్ఱములతో వైజయంతి అను ద్వారముగుండా లోనికి ప్రవేశించి ద్వారపాలకులు జయ జయ ధ్వానములు పలుకుచుండగా వారితో కలిసి లోనికి వెళ్ళెను.
2.71.34.
అనుష్టుప్.
స త్వనేకాగ్రహృదయో
ద్వాస్స్థం ప్రత్యర్చ్య తం జనమ్।
సూతమశ్వపతేః క్లాంతమ్
అబ్రవీత్తత్ర రాఘవః॥
టీక:-
 సః = అతడు; అనేకాగ్ర = నిలకడ లేని; హృదయో = మనసుతో; ద్వాస్స్థం = ద్వారము వద్ద ఉన్న; ప్రతి = గూర్చి; అర్చ్య = గౌరవముగా; తం = ఆ; జనమ్ = ప్రజలను ; సూతమ్ = సారథిగూర్చి; అశ్వపతేః = అశ్వపతికి; క్లాంతమ్ = అలసి ఉన్న; అబ్రవీత్ = పలికెను; తత్ర = అక్కడ; రాఘవః = భరతుడు.
భావం:-
 మనోవేదనతో ఉన్న భరతుడు; ఆ ద్వారపాలకులను గౌరవించి, బాగా అలసట చెంది ఉన్న అశ్వపతి మహారాజు యొక్క సారథితో ఇట్లు పలికెను.
*గమనిక:-
 సూతమశ్వపతేః “క్లాంతమ్”, అనీ, సూతమశ్వపతేః “కాంతమ్” అనీ పాఠ్యంతరములు కలవు. ఇక్కడ భరతుని రథమువచ్చిన వాడు అశ్వపతి మహారాజు యొక్క సారథి అని సూచించారు. అనగా తను ఒడిదుడుకు ప్రయాణాలు నడపిన వాడని తెలుస్తోంది కదండి. అంతటి వాడు సైతము క్లాంత అనగా అలసట చెందాడు అని చెప్పబడడంతో ఈ ప్రయాణము ఎంతటి శ్రమతో కూడినదో నొక్కి చెప్పినట్లు అనిపించుచున్నది. కనుక సూతమశ్వపతేః క్లాంతమ్” మరింత ఉచితము.
2.71.35.
అనుష్టుప్.
“కిమహం త్వరయాఽఽనీతః
కారణేన వినానఘ!।
అశుభాశంఖి హృదయమ్
శీలం చ పతతీవ మే॥
టీక:-
 కిమ్ = ఎందువలన; అహం = నేను; త్వరయా = త్వరగా; అనీతః = తీసుకొని రాబడిన; కారణేన = కారణముచే; వినా = లేని; అనఘ = పాపము లేనివాడు; అశుభా = అశుభమును శంఖి = శంకించుచున్నది; హృదయమ్ = మనసు; శీలం = సద్గుణము; పతతి = పడిపోవుట; ఇవ = వలె; మే = నాకు.
భావం:-
 ”పుణ్యాత్ముడా ఓ సారథీ! నిష్కారణముగా నన్ను ఇంత తొందరగా ఎందువలన తీసుకొని రావలసి వచ్చినదో తెలియకున్నది. నేను అశుభము శంకిచు హదయముతో పతితుడను అగుచుంటినేమో.
2.71.36.
అనుష్టుప్.
శ్రుతా నో యాదృశాః పూర్వమ్
నృపతీనాం వినాశనే।
ఆకారాంస్తానహం సర్వాన్
ఇహ పశ్యామి సారథే!॥
టీక:-
 శ్రుతాః = వినియున్నాను; నః = మాకు; యాదృశాః = ఎటువంటివి; పూర్వమ్ = పూర్వము; నృపతీనాం = రాజులు; వినాశనే = మరణించుట; ఆకారాం = ఆకారములు; తాన్ = ఆ; అహం = నేను; సర్వాన్ = అన్నిటిని; ఇహ = ఇక్కడ; పశ్యామి = చూచుచున్నాను; సారథే = సారథీ.
భావం:-
 సారథీ! రాజులు మరణించినప్పుడు ఎటువంటి గుర్తులు కలుగునని పూర్వము విని యున్నామో అటువంటి గుర్తులన్నియు ఇక్కడ నేను చూచుచున్నాను.
2.71.37.
అనుష్టుప్.
సమ్మార్జనవిహీనాని
పరుషాణ్యుపలక్షయే।
అసంయత కవాటాని
శ్రీవిహీనాని సర్వశః॥
టీక:-
 సమ్మార్జన = తుడవబడుట; విహీనాని = లేనివి; పరుషాణి = ముఱికియైనవి, ఆంధ్రశబ్దరత్నాకరము; ఉపలక్షయే = కనబడుచున్నవి; అసంయత = తెరిచి ఉన్న; కవాటాని = తలుపులను; శ్రీవిహీనాని = శోభ లేని వాటిగ; సర్వశః = అన్ని యెడల.
భావం:-
 అయోధ్యలో ముఱికా కనబడుచున్న తుడవని వాకిళ్ళు, శోభను కోల్పోయిన తెరిచి ఉన్న ముఖద్వారములు అంతటా కనబడుచున్నవి.
2.71.38.
అనుష్టుప్.
బలికర్మవిహీనాని
ధూపసమ్మోదనేన చ।
అనాశితకుటుంబాని
ప్రభాహీనజనాని చ॥
టీక:-
 బలికర్మ = బలి కర్మలు; విహీనాని = చేయని; ధూపః = ధూపములచే; సమ్మోదనేన = సమ్మోదన హీనములైనవి, సువాసనలు కలిగించుట శూన్యమైనవి; అనాశిత = భోజనములు చేయని; కుటుంబాని = కుటుంబులు; ప్రభాహీన = నిస్తేజమైమ; జనాని = జనులు; చ = ఇంకనూ.
భావం:-
 పూజాక్రియలయందు చేయు బలికర్మలను చేయని. ఇండ్లయందు ధూపములుచే సుగంధ భరితములు కాని కుటుంబాలు. ఇంకా నిస్తేజముగా కనిపించుచున్న ప్రజలు.
2.71.39.
అనుష్టుప్.
అలక్ష్మీకాని పశ్యామి
కుటుమ్బిభవనాన్యహమ్।
అపేతమాల్యశోభాని
హ్యసమ్మృష్టాజిరాణి చ॥
టీక:-
 అలక్ష్మీకాని = లక్ష్మీకళవిహీనములుగ; పశ్యామి = చూచుచున్నాను; కుటుమ్బి = కుటుంబీకుల; భవనాని = భవనములను; అహమ్ = నేను; అపేత = తొలగిన, వావిళ్ళ నిఘంటువు; మాల్య = పూమాల; శోభానిః = ప్రభగలవి; హ్యః = గతాహః, నిన్నటి, పరవస్తు వారి నిఘంటువు; అసమ్మృష్ట = అ+ సమ+ మృష్ట, సరిగా శుభ్రము చేయబడని; ఆజిరాణి = ముంగిళ్ళు, వాకిళ్ళు; చ = ఇంకనూ.
భావం:-
 లక్ష్మీకళ లేని కుటుంబములు నివసించు భవనములు. పూలమాలలు శోభలు కనిపించుంటలేదు. నిన్నటినుండీ తుడవని వాకిళ్ళను కనబడుతున్నవి.
2.71.40.
అనుష్టుప్.
దేవాగారాణి శూన్యాని
న చాభాంతి యథాపురమ్।
దేవతార్చాః ప్రవిద్ధాశ్చ
యజ్ఞగోష్ఠ్యస్తథావిధాః॥
టీక:-
 దేవాగారాణి = దేవాలయములు; శూన్యాని = నిర్మానిష్యుంగా ఉన్న; న = లేవు; చ = మఱియు; భాంతి = ప్రకాశవంతముగా; యథాపురమ్ = పూర్వము వలె; దేవతార్చాః = దేవతార్చనలు; ప్రవిద్ధాః = కొట్టబడినవి; చ = మఱియు; యజ్ఞగోష్ఠ్యః = యజ్ఞమంత్ర ఘోషలు; తథావిధాః = అదేవిధము ఉన్నవి.
భావం:-
 పూర్వమువలెకాక నిర్జనమైపోయిన దేవాలయములు ప్రకాశవంతముగా లేవు. ఇంకా దేవతామూర్తులను పూజించుటలు విడిచిపెట్టబడినవి. యజ్ఞ సభలు, మంత్రములు వినిపించుటలేదు.
2.71.41.
అనుష్టుప్.
మాల్యాపణేషు రాజన్తే
నాద్య పణ్యాని వా తథా।
దృశ్యన్తే వణిజోఽ ప్యద్య
న యథాపూర్వమత్రవై॥
టీక:-
 మాల్యాపణేషు = పూమాలల అంగళ్ళు; రాజన్తే = ప్రకాశించుట; న = లేదు; అద్య = నేడు; పణ్యాని = అంగడివీధులలో; వా = లేక; తథా = మఱియు; దృశ్యన్తే = కనబడుట; వణిజః = వ్యాపారులు; అపి = కూడ; అద్య = నేడు; న = లేరు; యథాపూర్వమ్ = పూర్వము వలె; అత్ర = ఇక్కడ.
భావం:-
 పూమాలలు అమ్ము అంగళ్ళకు కాని, అంగడివీధులకు కాని కళ లేదు. వ్యాపారులు కూడా పూర్వము వలె కళగా లేరు.
2.71.42.
అనుష్టుప్.
ధ్యానసంవిగ్నహృదయాః
నష్టవ్యాపారయంత్రితాః।
దేవాయతనచైత్యేషు
దీనాః పక్షిగణాస్తథా॥
టీక:-
 ధ్యానసంవిగ్నహృదయాః = అదే ధ్యాసచే; సంవిగ్న = ఉద్విగ్నము చెందిన, వాచస్పతము; హృదయాః = మనస్సులుగలవారు; నష్ట = నష్టపోయిన; వ్యాపార = వ్యాపారములచే; యంత్రితాః = కట్టబడినవారు, వావిళ్ళ నిఘంటువు; దేవాయతన = దేవాలయములు; చైత్యేషు = రచ్చబండలు వద్ద, ఆంధ్రశబ్దరత్నాకరము; దీనాః = దీనముగా; పక్షిగణాః = కక్షిదారులు; తథా = మఱియు.
భావం:-
 పూర్వము వలె కాక వ్యాపారున నష్టమువలన దిగులు చెందినవారై ఉన్నారు. దేవాలయములు, రచ్చబండలు వద్ద ఉండు కక్షిదారులు సర్వులు దీనముగా ఉండెను.
2.71.43.
అనుష్టుప్.
మలినం చాశ్రుపూర్ణాక్షమ్
దీనం ధ్యానపరం కృశమ్।
సస్త్రీపుంసం చ పశ్యామి
జనముత్కణ్ఠితం పురే॥
టీక:-
 మలినం = అశుభ్రముగాను; చ = మఱియు; అశ్రుపూర్ణాక్షమ్ = కన్నీరు నిండిన కన్నులు గలవారు; దీనం = దీనులు; ధ్యానపరం = అదే ధ్యాసలో మునిగినవారు; కృశమ్ = కృశించినవారు; స = నిండి ఉన్న; స్త్రీపుంసం = స్త్రీ; పుంసం = పురుషులుగలది; పశ్యామి = చూచుచున్నాను; జనమ్ = ప్రజలను; ఉత్కణ్ఠితం = బెంగపెట్టుకున్నవారు; పురే = నగరమునందు.
భావం:-
 నగరములోని స్త్రీపురుషులందరును దిగులు పడి అశుభ్రముగాను; కన్నీళ్లు నిండిన కన్నులతోను; దీనులు, ఏదో ధ్యాసలో ఉన్నవారు, కృశించిన వారు, బెంగపెట్టుకున్నవారు ఐన స్త్రీపురుషులతో నిండిన నగరము వలె కనిపించుచున్నది.”
2.71.44.
అనుష్టుప్.
ఇత్యేవముక్త్వా భరతః
సూతం తం దీనమానసః।
తాన్యనిష్టాన్యయోధ్యాయామ్
ప్రేక్ష్య రాజగృహం యయౌ॥
టీక:-
 ఇత్యేవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి భరతః = భరతుడు; సూతం = సారధిని గూర్చి; తం = ఆ; దీనమానసః = దీన మనస్కుడై; తాని = ఆ; అనిష్టాని = దుఃశకునములు కనబడుతున్న; అయోధ్యాయామ్ = అయోధ్య నగరము; ప్రేక్ష్య = చూచుచు; రాజగృహం = రాజభవనమును గూర్చి; యయౌ = వెళ్ళెను.
భావం:-
 భరతుడు అయోధ్యలో అలా దుశ్శకునములను చూచుచూ దీన మనస్కుడై సారథితో ఇట్లు పలికి రాజభవనమునకు వెళ్ళెను.
2.71.45.
త్రిష్టుప్.
తాం శూన్యశృంగాటకవేశ్మరథ్యాం
రజోఽరుణ ద్వార కవాటయంత్రామ్।
దృష్ట్వా పురీమింద్రపురప్రకాశాం
దుఃఖేన సంపూర్ణతరో బభూవ॥
టీక:-
 తాం = ఆ; శూన్య = నిర్జనముగా ఉన్న; శృంగాటక = నాలుగు వీధుల కూడళ్ళను; వేశ్మ = నివాసములను; రథ్యాం = రాచవీధులను; రజః = ధూళిదూసరములతో; అరుణ = ఎఱ్ఱబారిన; ద్వార = ద్వారబంధములను; కవాట = తలుపులను; యంత్రామ్ = లను; దృష్ట్వా = చూచి; పురీమ్ = అయోధ్యను; ఇంద్రపురప్రకాశాం = ఇంద్ర నగరము వంటి ప్రకాశవంతమైన; దుఃఖేన = దుఃఖముతో; సంపూర్ణతరః = మిక్కిలి నిండియున్న; బభూవ = అయ్యెను.
భావం:-
 దుమ్ముపట్టి ఎఱ్ఱబాఱిన ద్వారములు, తలుపులు, యంత్రసామగ్రితో నిర్జనమైన నాలుగువీధుల కూడళ్ళు, గృహములు, రథాలు తిరుగు రాజవీధుల తోను, ఘంటాపథములతోని ఉన్నట్టి అయోధ్యా నగరము చూచిన భరతుడు నిండా దుఃఖములో మునిగిపోయెను.
*గమనిక:-
 సంపూర్ణము- సంపూర్ణతరము- సంపూర్ణతమము
2.71.46.
త్రిష్టుప్.
బహూని పశ్యన్మనసోఽ ప్రియాణి
యాన్యన్యదా నాస్య పురే బభూవుః।
అవాక్ఛిరా దీనమనా నహృష్టః
పితుర్మహాత్మా ప్రవివేశ వేశ్మ॥
టీక:-
 బహూని = అనేక; పశ్యన్ = చూచి; మనసః = మనసునకు; అప్రియాణి = దుశ్శకునములను; యాని = ఏవి; అన్యదా = ఇతర సమయములందు; న = లేదు; అస్య = ఈతని; పురే = నగరమునందు; బభూవుః = అగుట; అవాక్ఛిరా = అధోముఖుడై; దీనమనాః = దీనమనస్కుడై; న = నశించిన; హృష్టః = సంతోషముతో; పితుః = తండ్రియొక్క; మహాత్మా = మహాత్ముడైన; ప్రవివేశ = ప్రవేశించెను; వేశ్మ = గృహమును.
భావం:-
 మహాత్ముడైన భరతుడు తన నగరమునందు పూర్వము ఎన్నడును చూడని దుశ్శకునములను చూచుచు దీనమనస్కుడై నిస్సంతోషముగా తలవంచుకొని తండ్రి గృహమును ప్రవేశించెను.
2.71.47.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే ఏకసప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకసప్తతితమ [71] = డెబ్బైయొకటవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [71] డెబ్బైయొకటవ సర్గ సంపూర్ణము.
2.72.1.
అనుష్టుప్.
అపశ్యంస్తు తతస్తత్ర
పితరం పితురాలయే।
జగామ భరతో ద్రష్టుమ్
మాతరం మాతురాలయే॥
టీక:-
అపశ్యన్ = కనపడకపోవుట; తు = చేత; తతః = అప్పుడు; తత్ర = అక్కడ; పితరం = తండ్రి; పితురాలయే = తండ్రి భవనములో; జగామ = వెళ్లెను; భరతః = భరతుడు; ద్రష్టుమ్ = చూచుటకు; మాతరం = తల్లిని; మాతురాలయే = తల్లి అంతఃపురమునకు.
భావం:-
తండ్రి భవనములో తండ్రి కనబడకపోగా, భరతుడు తల్లిని చూచుటకై ఆమె అంతఃపురమునకు వెళ్ళెను.
2.72.2.
అనుష్టుప్.
అనుప్రాప్తం తు తం దృష్ట్వా
కైకేయీ ప్రోషితం సుతమ్।
ఉత్పపాత తదా హృష్టా
త్యక్త్వా సౌవర్ణమాసనమ్॥
టీక:-
అనుప్రాప్తం = తిరిగి వచ్చిట; తు = కాగా; తం = ఆ; దృష్ట్వా = చూచి; కైకేయీ = కైకేయి; ప్రోషితం = దూర దేశమున నున్న; సుతమ్ = కుమారుని; ఉత్పపాత = దిగ్గున లేచి; తదా = అప్పుడు; హృష్టా = సంతోషించి; త్యక్త్వా = విడిచిపెట్టి; సౌవర్ణమ్ = బంగారముతో చేసిన; ఆసనమ్ = ఆసనమును
భావం:-
తిరిగి వచ్చిన దూరదేశముననున్న కుమారుని చూడగానే కైకేయి సంతోషించి తన బంగారు ఆసనము నుండి దిగ్గున లేచెను.
2.72.3.
అనుష్టుప్.
స ప్రవిశ్యైవ ధర్మాత్మా
స్వగృహం శ్రీవివర్జితమ్।
భరతః ప్రతిజగ్రాహ
జనన్యాశ్చరణౌ శుభౌ॥
టీక:-
సః = అతడు; ప్రవిశ్య = ప్రవేశించిన; ఏవ = పిదప; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; స్వగృహం = తన గృహములో; శ్రీవివర్జితమ్ = శోభావిహీనమై; భరతః = భరతుడు; ప్రతిజగ్రాహ = నమస్కరించెను; జనన్యాః =తల్లి యొక్క; చరణౌ = పాదములు గూర్చి; శుభౌ = మంగళకరములైన
భావం:-
భరతుడు శోభావిహీనమై ఉన్న తన గృహములో ప్రవేశించి మంగళకరములైన తల్లి పాదములు స్పృశించి సమస్కరించెను.
2.72.4.
అనుష్టుప్.
సా తం మూర్ధన్యుపాఘ్రాయ
పరిష్వజ్య యశస్వినమ్।
అంకే భరతమారోప్య
ప్రష్టుం సముపచక్రమే॥
టీక:-
సా = ఆ కైకేయి; తం = అతని; మూర్ధన్య = శిరస్సుపై; ఉపాఘ్రాయ = మూర్కొని; పరిష్వజ్య = కౌగిలించుకొని; యశస్వినమ్ = యశః శాలిౖయెన; అంకే = ఒడిలో; భరతమ్ = భరతుని; ఆరోప్య = కూర్చుండబెట్టుకొని; ప్రష్టుం = ప్రశ్నించుట; సముపచక్రమే = ప్రారంభించెను.
భావం:-
ఆమె యశఃశాలియైన తన కుమారుని శిరస్సుపై మూర్కొని, కౌగిలించుకొని, ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రశ్నింప ప్రారంభించెను.
2.72.5.
అనుష్టుప్.
“అద్య తే కతిచిద్రాత్య్రః
చ్యుతస్యార్యకవేశ్మనః।
అపి నాధ్వశ్రమశ్శీఘ్రమ్
రథేనాపతతస్తవ॥
టీక:-
అద్య = నేటికి; తే = నీకు; కతిచిత్ = ఎన్ని; రాత్య్రః = రాత్రులు (గడచినవి); చ్యుతస్య = విడిచిపెట్టి; ఆర్యక వేశ్మనః = తాత గారి; వేశ్మనః = ఇంటినుండి; అపి న = కలుగ లేదు కదా; అధ్వ = ప్రయాణపు; శ్రమః = బడలిక ; శీఘ్రమ్ = శీఘ్రముగా; రథేన = రథముపై; అపతతః = ప్రయాణము చేయుట చేత; తవ = నీకు
భావం:-
”నీవు తాతగారి ఇంటినుండి బయలుదేరి ఎన్ని దినము లైనవి? రథముపై శీఘ్రముగా ప్రయాణము చేయుటచే నీ కేమియు మార్గాయాసము కలగలేదు కదా?
2.72.6.
అనుష్టుప్.
ఆర్యకస్తే సుకుశలీ
యుధాజిన్మాతులస్తవ।
ప్రవాసాచ్చ సుఖం పుత్ర
సర్వం మే వక్తుమర్హసి”॥
టీక:-
ఆర్యకః = తాత; తే = నీవు; సుకుశలీ = క్షేమముగా ఉన్నారు కదా; యుధాజిత్ = యుధాజిత్తు; మాతులః = మేనమామ; తవ = నీ యొక్క; ప్రవాసాచ్చ = ప్రవాసము; చ = కూడ; సుఖం = సుఖముగా; పుత్ర = కుమారా; సర్వం = విషయములన్నియు; మే = నాకు; వక్తుమ్ = చెప్పుటకు; అర్హసి = అర్హత కలిగియున్నావు
భావం:-
కుమారా! నీ తాత, నీ మేనమామ అయిన యుధాజిత్తు క్షేమముగా ఉన్నారా? నీ ప్రవాసము సుఖముగా గడచినదా? ఈ విషయములన్నియు చెప్పుము.”
2.72.7.
అనుష్టుప్.
ఏవం పృష్టస్తు కైకేయ్యా
ప్రియం పార్థివనందనః।
ఆచష్ట భరత స్సర్వమ్
మాత్రే రాజీవలోచనః॥
టీక:-
ఏవం పృష్టస్తు = ఇట్లు ప్రశ్నించగా; పృష్టస్తు = ఇట్లు ప్రశ్నించగా; కైకేయ్యా = కైకేయి; ప్రియం = ప్రేమ పూర్వకముగా; పార్థివ నందనః = రాజకుమారుడు; ఆచష్ట = చెప్పెను; భరతః = భరతుడు; సర్వమ్ = అంతయు; మాత్రే = తల్లితో; రాజీవలోచనః = రాజీవ లోచనురాలు
భావం:-
కైకేయి ప్రేమపూర్వకముగా ఇట్లు ప్రశ్నించగా భరతుడు ఆమెకు అంతయు చెప్పెను.
2.72.8.
అనుష్టుప్.
“అద్య మే సప్తమీ రాత్రిః
చ్యుతస్యాఽర్యకవేశ్మనః।
అంబాయాః! కుశలీ తాత
యుధాజిన్మాతులశ్చ మే॥
టీక:-
అద్యమే= నేటికి ; సప్తమీ రాత్రిః = ఏడు దినములైనది; చ్యుతస్య = విడిచి; ఆర్యక = తాతగారి; వేశ్మనః = ఇంటిని; అంబాయాః = తల్లి యొక్క; కుశలీ = క్షేమముగా ఉన్నారు; తాత = తాతగారు అయిన కేకయ రాజు; యుధాజిత్ = యుధాజిత్తు; మాతులః = మేనమామ; చ = ఐన; మే = నా యొక్క.
భావం:-
”తల్లి గారూ! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి ఏడు దినము లైనది. తాతగారు అశ్వపతి కేకయరాజు, నా మేనమామ యుధాజిత్తు క్షేమముగా ఉన్నారు.
2.72.9.
అనుష్టుప్.
యన్మే ధనం చ రత్నం చ
దదౌ రాజా పరంతపః।
పరిశ్రాంతం పథ్యభవత్
తతోఽహం పూర్వమాగతః॥
టీక:-
యత్ = ఏయే; మే = నాకు; ధనం = ధనమును; చ = మఱియు; రత్నం =రత్నములను; చ = మఱియు; దదౌ = ఇచ్చిన; రాజా = కేకయ రాజు; పరంతపః = శత్రుసంహారకుడైన; పరిశ్రాంతం = అలసట చెందుటచే; పథ్యభవత్ = మార్గములో; తతః = అందువలన; అహం = నేను; పూర్వమాగతః = ముందుగా వచ్చితిని
భావం:-
శత్రుసంహారకుడైన కేకయరాజు ధనమును, రత్నములను నాకు ఇచ్చిరి. తీసికొనివచ్చువారు మార్గములో అలసట చెందుటచే వారిని వెనుక రమ్మని, నేను ముందుగా వచ్చితిని.
2.72.10.
అనుష్టుప్.
రాజవాక్యహరైర్దూతైః
త్వర్యమాణోఽహమాగతః।
యదహం ప్రష్టుమిచ్ఛామి
తదంబా వక్తుమర్హతి॥
టీక:-
రాజవాక్య = రాజసందేశము; హరైః = తీసుకొని వచ్చిన; దూతైః = దూతలు; త్వర్యమాణః = తొందరపెట్టుటచే; అహమ్ = నేను; ఆగతః = వచ్చినాను; యత్ = ఏయే; అహం = నేను; ప్రష్టుమ్ = అడగవలెనని; ఇచ్ఛామి = అనుకొనుచున్నాను; తత్ = దానిని; అంబా = తల్లీ; వక్తుమ్ అర్హతి = సమాధానము చెప్పుటకు తగియున్నావు.
భావం:-
ఇమ్మా! రాజసందేశము తీసికొని వచ్చిన దూతలు తొందరపెట్టుటచే నేను ముందుగా వచ్చినాను. నేను కొన్ని ప్రశ్నలు అడగదలచుచున్నాను. సమాధానము చెప్పుము.
2.72.11.
అనుష్టుప్.
శూన్యోఽయం శయనీయస్తే
పర్యంకో హేమభూషితః।
న చాయమిక్ష్వాకుజనః
ప్రహృష్టః ప్రతిభాతి మా॥
టీక:-
శూన్యః = శూన్యముగా ఉన్నది; అయం = ఈ; శయనీయః = శయనించుటకు తగినది; తే = నీ యొక్క; పర్యంకః = పర్యంకము; హేమభూషితః = బంగారముచే అలంకరించబడిన; న = లేదు; చ = మఱియు; అయమ్ – ఈ; ఇక్ష్వాకు =దశరథమహారాజు యొక్క; జనః = పరివారము; ప్రహృష్టః = ఆనందముగా ఉన్నట్లు; ప్రతిభాతి = కనబడుట; మా = లేదు.
భావం:-
నీ బంగారప పర్యంకము శయనము శోభావిహీనముగా ఉన్నది. ఇక్కడనున్న దచశరథమహారాజు పరివారము ఆనందముగ ఉన్నట్లు కనబడుట లేదు.
2.72.12.
అనుష్టుప్.
రాజా భవతి భూయిష్ఠమ్
ఇహాంబాయా! నివేశనే।
తమహం నాద్య పశ్యామి
ద్రష్టుమిచ్ఛన్నిహాఽగతః॥
టీక:-
రాజా = దశరథ మహారాజు; భవతి = ఉండును; భూయిష్ఠమ్ = ఎక్కువ సమయము; ఇహ = ఇక్కడ; అంబాయా = తల్లిగారు; వేశనే = నివసించును; తమ్ = వారిని; అహం = నేను; న = లేదు; అద్య = ఇప్పుడు; పశ్యామి = చూగలుగుట; ద్రష్టుమ్ = చూడవలెనను; ఇచ్ఛతి = కోరికతో; ఇహ = ఇక్కడకు; ఆగతః = వచ్చితిని
భావం:-
తల్లీ! దశరథ మహారాజు ఎక్కువగా ఇక్కడనే ఉండును కదా. ఆయనను చూచుట కోసమే నేను ఇక్కడికి వచ్చితిని. ఇప్పుడు ఆయన కనబడుట లేదు.
2.72.13.
అనుష్టుప్.
పితుర్గృహీష్యే చరణౌ
తం మమాఽఖ్యాహి పృచ్ఛతః।
ఆహోస్విదంబ జ్యేష్ఠాయాః
కౌసల్యాయా నివేశనే॥
టీక:-
పితుః = తండ్రిగారుయొక్క; గృహీష్య = మ్రొక్కి; చరణౌ = పాద ద్వయమును; తం = వారినిగురించి; మమ = నాకు; ఆఖ్యాహి = చెప్పుము; పృచ్ఛతః = అడుగుచున్నాను; ఆహోస్విత్ = ఒకవేళ; అంబ జ్యేష్ఠాయాః = పెద్దతల్లి అయిన; కౌసల్యాయా = కౌసల్యయొక్క; నివేశనే = గృహములోనా.
భావం:-
నా తండ్రిగారికి పాదాభివందనములు చేయవలెను. ఆయనను గూర్చి చెప్పుము. ఆయన ఒకవేళ నా పెద్దతల్లి అయిన కౌసల్య గృహములో ఉన్నాడా?
2.72.14.
అనుష్టుప్.
తం ప్రత్యువాచ కైకేయీ
ప్రియవద్ఘోరమప్రియమ్।
అజానంతం ప్రజానంతీ
రాజ్యలోభేన మోహితా॥
టీక:-
తం = అతనికి; ప్రత్యువాచ = సమాధానము చెప్పెను; కైకేయీ = కైకేయి; ప్రియవత్ = ప్రియమైనదివలె; ఘోరమ్ = భయంకరమైన; అప్రియమ్ = అయిష్టమైన విషయమును; అజానంతం =ఏమియు తెలియనివానికి; ప్రజానంతీ = సర్వమూ తెలిసినదైనను; రాజ్యలోభేన = రాజ్య లోభముచే; మోహితా = మోహితురాలైన
భావం:-
అన్ని విషయములు తెలిసినదైనను, రాజ్య లోభముచే మోహితురాలైన ఆ కైకేయి ఈ విషయములు ఏమియు తెలియని ఆ భరతునకు, భయంకరమైన అప్రియ విషయమును, ప్రియమైన విషయమును చెప్పినట్లు చెప్పెను.
2.72.15.
అనుష్టుప్.
“యా గతిస్సర్వభూతానామ్
తాం గతిం తే పితా గతః।
రాజా మహాత్మా తేజస్వీ
యాయజూకస్సతాం గతిః”॥
టీక:-
యా గతిః = ఏది చివరి గతియో; సర్వభూతానామ్ = సకల ప్రాణులకు; తాం గతిం = ఆ గతిని; తే పితా = నీ తండ్రి; గతః = పొందినాడు; రాజా = మహారాజు; మహాత్మా = మహాత్ముడు; తేజస్వీ = తేజఃశాలి; యాయజూకః = యజ్ఞములు చేసినవాడు; సతాం = సత్పురుషులకు; గతిః = ఆశ్రయభూతుడైనవాడు.
భావం:-
”మహారాజు, మహాత్ముడు, తేజఃశాలీ, యజ్ఞములు చేసినవాడు, సత్పురుషులకు ఆశ్రయభూతుడు అయిన నీ తండ్రి ప్రాణులన్నింటికి ఏది చివరి గతియో, ఆ గతిని పొందినాడు.”
2.72.16.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా భరతో వాక్యమ్
ధర్మాభిజనవాన్ శుచిః।
పపాత సహసా భూమౌ
పితృశోకబలార్దితః॥
టీక:-
తత్ = ఆ; శ్రుత్వా = వినగానే; భరతః = భరతుడు; వాక్యమ్ = మాటలు; ధర్మజనవాన్ = ధర్మముబాగా తెలిసినవాడు; శుచిః = పరిశుద్ధ స్వభావుడు; పపాత = పడిపోయెను; సహసా = వెంటనే; భూమౌ = నేల మీద; పితృశోక = పితృమరణశోకముయొక్క; బలః = తీవ్రతచే; ఆర్దితః = పీడింపబడినవాడు.
భావం:-
పరిశుద్ధాత్ముడు, ధర్మజ్ఞుడు ఐన భరతుడు ఆ మాట వినగానే పితృశోకతీవ్రతచే పీడింపబడి వెంటనే క్రిందపడిపోయెను.
2.72.17.
అనుష్టుప్.
“హా హతోఽస్మీతి” కృపణామ్
దీనాం వాచముదీరయన్।
నిపపాత మహాబాహుః
బాహూ విక్షిప్య వీర్యవాన్॥
టీక:-
హా = అయ్యో; హతః అస్మి = చచ్చిపోతిని; ఇతి = ఇట్లు; కృపణామ్ = జాలికొలుపునట్లుగా; దీనాం = దీనముగా; వాచమ్ = మాటలు; ఉదీరయన్ = లేచి; నిపపాత = పడిపోయెను; మహాబాహుః = బాహు పరాక్రమమలు కలిగిన; బాహూ విక్షిప్య = చేతులు చాచి; వీర్యవాన్ = శక్తిమంతుడు
భావం:-
అతడు జాలికొలుపునట్లుగా దీనముగా “అయ్యో చచ్చిపోతిని” అని పలుకుచు అంచటి మహాపరాక్రమశాలి, మహావీరుడూ చేతులు చాచి నేలపై పడెను.
2.72.18.
అనుష్టుప్.
తతశ్శోకేన సంవీతః
పితుర్మరణదుఃఖితః।
విలలాప మహాతేజా
భ్రాంతాకులితచేతనః॥
టీక:-
తతః = అప్పుడు; శోకేన = శోకముతో; సంవీతః = చుట్టబెట్టుకుపోయిన వాడై; పితుః = తంజ్రియొక్క; మరణ = మరణముచే; దుఃఖితః =దుఃఖితుడు; విలలాప = విలపించెను; మహాతేజా = గొప్ప తేజస్సు కలిగిన; భ్రాంత = బ్రాంతితో; ఆకులిత = కలత చెందిన; చేతనః = మనస్సు కలవాడైన.
భావం:-
ఆ మహాతేజశ్శాలి ఐన భరతుడు, పితృమరణముచే దుఃఖితుడాయెను. ఆ శోకముతో చుట్టబెట్టుకిపోయెను. భ్రాంతి చెంది కలత చెందిన మనస్సులో విలపించెను.
2.72.19.
అనుష్టుప్.
ఏతత్ సురుచిరం భాతి
పితుర్మే శయనం పురా।
శశినేవామలం రాత్రౌ
గగనం తోయదాత్యయే॥
టీక:-
ఏతత్ = ఏదైతే ఉందో అది; సురుచిరం = అందమైనది; భాతి = ప్రకాశించుచు; పితుః = తండ్రి; మే = నా; శయనం = శయ్య; పురా = ఇంతకు ముందు; శశిన = చంద్రుని; ఇవ = వలె; అమలం = నిర్మలముగా; రాత్రౌ = రాత్రియందు; గగనం = ఆకాశము; తోయద = వర్షాకాలము; అత్యయే = గడచిన పిమ్మట.
భావం:-
నా తండ్రిగారి శయ్య ఇంతకు ముందు సుందరముగా ప్రకాశించెడిది, వర్షాకాలము గడచిన పిమ్మట నిర్మలముగా ఉన్న రాత్రియందు ఆకాశము చంద్రునితో ప్రకాశించునట్లు ప్రకాశించుచుండెడిది.
2.72.20.
అనుష్టుప్.
తదిదం న విభాత్యద్య
విహీనం తేన ధీమతా।
వ్యోమేవ శశినా హీనమ్
అప్చుష్క ఇవ సాగరః॥
టీక:-
తత్+ ఇదం = అట్టి ఇది; న = లేదు; విభాతి = ప్రకాశించుట; అద్య = నేడు; విహీనం = లేకపోవుటచే; తేన = అతనితో; ధీమతా = ధీశాలిౖయెన; వ్యోమ = ఆకాశము; ఇవ = వలె; శశినా = చంద్రుడు; హీనమ్ = లేని; అప్ = నీరు ; శుష్క = ఎండిపోయిన; ఇవ = వలె; సాగరః = సాగరము
భావం:-
ధీశాలిౖయెన నా తండ్రి లేకపోవుటచే, ఆ శయనమే ఈనాడు చంద్రుడు లేని ఆకాశము వలె, నీరు ఎండిపోయిన సముద్రము వలె ప్రకాశరహితమై ఉన్నది.
2.72.21.
అనుష్టుప్.
బాష్పముత్సృజ్య కణ్ఠేన
స్వాత్మనా పరిపీడితః।
ఆచ్ఛాద్య వదనం శ్రీమత్
వస్త్రేణ జయతాం వరః॥
టీక:-
బాష్పమ్ = కన్నీటిని; ఉత్సృజ్య = విడుచుచు; కణ్ఠేన = కంఠముతో; స్వాత్మనా = తనమనస్సులో; పరిపీడితః = అధికముగా పీడితుడయిన; ఆచ్ఛాద్య = కప్పుకొనెను; వదనం = ముఖమును; శ్రీమత్ = శోభాయుక్తమైన; వస్త్రేణ = వస్త్రముతో; జయతాం = జయించువారిలో; వరః = శ్రేష్ఠుడైన.
భావం:-
జయించువారిలో శ్రేష్టుడైన భరతుడు, మనసులో చాలా బాధపడుచూ కన్నీటిని కంఠములోనికి దిగమింగుతూ, శోభాయుక్తమైన ముఖమును వస్త్రముతో కప్పికొనెను.
2.72.22.
అనుష్టుప్.
తమార్తం దేవసంకాశమ్
సమీక్ష్య పతితం భువి।
నికృత్తమివ సాలస్య
స్కంధం పరశునా వనే॥
టీక:-
తమ్ = అతనిని; ఆర్తం = దుఃఖించుచున్నవానిని; దేవసంకాశమ్ = దేవతల వంచివాడు; సమీక్ష్య = చూచి; పతితం = పడి ఉన్నవాని; భువి = నేల మీద; నికృత్తమ్ = ఛేదించిన; ఇవ = వలె; సాలస్య = సాలవృక్షము; స్కంధం = మాను; పరశునా = గండ్రగొడ్డలి; వనే = వనమునందు.
భావం:-
నేలపై పడిఉన్న దేవతాసమానుడైన భరతుని చూసి. అడవిలో గండ్రగొడ్డలి నరికిన సాలవృక్షము మాను వలె నేలపై పడున్నవానిని.
2.72.23.
అనుష్టుప్.
మత్తమాతంగసంకాశమ్
చంద్రార్కసదృశం భువః।
ఉత్థాపయిత్వా శోకార్తమ్
వచనం చేదమబ్రవీత్॥
టీక:-
మత్త = మదించిన; మాతంగ = ఏనుగును; సంకాశమ్ = పోలిన; చంద్రార్క = చంద్ర + అర్క, సూర్యచంద్రులను; సదృశం = పోలిన; భువః = నేల మీద; ఉత్థాపయిత్వా = లేవదీసి; శోకార్తమ్ = శోకార్తుడైన; వచనం = మాటలను; చ = మఱియు; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావం:-
మదించిన ఏనుగు వంటి, భూమ్మాది సూర్యచంద్రులను పోలినవానిని భరతుని, కైకేయి నేల మీద నుండి లేవదీసి ఇట్లు పలికెను.
2.72.24.
అనుష్టుప్.
“ఉత్తిష్ఠో్త్తిష్ఠ కిం శేషే
రాజపుత్ర మహాయశః।
త్వద్విధా నహి శోచంతి
సంతస్సదసి సమ్మతాః॥
టీక:-
ఉత్తిష్ఠ = లెమ్ము; ఉత్తిష్ఠ = లెమ్ము; కిమ్ = ఏమి; శేషే = పండుకొని ఉంచివి; రాజపుత్ర = రాజకుమారా; మహాయశః = గొప్ప కీర్తి కలవాడా; త్వద్విధా = అటువంటివారు; నహి = చేయరాదు; శోచంతి = దుఃఖించుట; సంతః = సత్పురుషిలు; సదసి = సభలలో; సమ్మతాః = గౌరింపబడువాడు.
భావం:-
గొప్ప కీర్తి గల ఓ రాజకుమారా! లెమ్ము, లెమ్ము. అట్లు పండుకొని ఉన్నావేమి? సభలలో సమ్మానమును పొందుటకు అర్హత గల నీ వంటి సత్పురుషులు ఈ విధముగా దుఃఖింపరాదు.
2.72.25.
అనుష్టుప్.
దానయజ్ఞాధికారా హి
శీలశ్రుతివచోఽనుగా।
బుద్ధిస్తే బుద్ధిసమ్పన్న!
ప్రభేవార్కస్య మందిరే”॥
టీక:-
దానః = దానములు; యజ్ఞః = యజ్ఞాదులు; అధికారాః = ఆచరించు అధికారము కలది; హి = కదా; శీల = శీలమును; శ్రుతివచః = వేదవాక్యములను; అనుగా = అనుసరించెడు; బుద్ధిః = బుద్ధి; తే = నీ; బుద్ధిసమ్పన్న = బుద్ధిసంపన్నుడ; ప్రభేవ = ప్రకాశించును; అర్కస్య = సూర్యుని యొక్క; మందిరే = గృహమునందు
భావం:-
శీలమును, వేదవాక్యములను అనుసరించు నీ బుద్ది, దానయజ్ఞాదులందు అధికారము కలదై, సూర్యుని గృహమున కాంతి వలె అవిచ్చిన్నముగ ప్రకాశించును.”
2.72.26.
అనుష్టుప్.
స రుదిత్వా చిరం కాలమ్
భూమౌ విపరివృత్య చ।
జననీం ప్రత్యువాచేదమ్
శోకైర్బహుభిరావృతః॥
టీక:-
సః = అతడు; రుదిత్వా = ఏడ్చి; చిరంకాలమ్ = చాలాసేపు; భూమౌ = నేల మీద; విపరివృత్య = దొర్లుచు; చ = మఱియు; జననీం = తల్లితో; ప్రత్యువాచ = సమాధానమిచ్చెను; ఇదమ్ = ఇట్లు; శోకైః = శోకములు; బహుభిః = అనేక విధములైన; ఆవృతః = చుట్టుముట్టగా
భావం:-
అనేక విధములైన శోకములు చుట్టుముట్టగా అతడు నేలపై దొర్లుచు చాలసేపు ఏడ్చి, తల్లితో మరల ఇట్లనెను. (26)
2.72.27.
అనుష్టుప్.
“అభిషేక్ష్యతి రామం ను?
రాజా యజ్ఞం ను? యక్ష్యతే।
ఇత్యహం కృతసంకల్పో
హృష్టో యాత్రామయాసిషమ్॥
టీక:-
అభిషేక్ష్యతి = రాజ్యాభిషేకము చేయునో; రామం ను = రామునుని; రాజా = మహారాజు; యజ్ఞం ను = యజ్ఞమును; యక్ష్యతే = చేయునో; ఇతి = ఈ విధముగా; అహం = నేను; కృతసంకల్పః = ఆలోచించుకొనుచు; హృష్టః = సంతోషముతో; యాత్రామ్ = ప్రయాణము; అయాసిషమ్ = చేసితిని.
భావం:-
మహారాజు రామునకు రాజ్యాభిషేకము చేయును ఏమో? లేదా ఏదైనా యజ్ఞము చేయును ఏమో? అని ఆలోచించుకొనుచు నేను సంతోషముతో ప్రయాణము చేసితిని.
2.72.28.
అనుష్టుప్.
తదిదం హ్యన్యథా భూతమ్
వ్యవదీర్ణం మనో మమ।
పితరం యో న పశ్యామి
నిత్యం ప్రియహితే రతమ్॥
టీక:-
తత్ ఇదం హి = అది అంతయు కూడా; అన్యథా భూతమ్ = తారుమారైనది; వ్యవదీర్ణం = బ్రద్దలైపోయినది; మనః = మనస్సు; మమ = నా యొక్క; పితరం = తండ్రిని; యో = ఇట్లు; నపశ్యామి = చూడజాలక పోవుటచే; నిత్యం = ఎల్లప్పుడు; ప్రియహితే = ఇష్టమైనవి కోరుట యందు; రతమ్ = ఆసక్తి కలవాడు.
భావం:-
నేను అనుకున్నది అంతయు తారుమారైనది. ఎప్పుడీ, నాకు ఇష్టమైనవి మంచివి కోరు నా తండ్రిని చూడజాలక పోవుటచే నా మనస్సు బ్రద్దలైపోయినది.
2.72.29.
అనుష్టుప్.
అంబ! కేనాత్యగాద్రాజా
వ్యాధినా మయ్యనాగతే।
ధన్యా రామాదయస్సర్వే
యైః పితా సంస్కృతస్స్వయమ్॥
టీక:-
అంబ = తల్లీ; కేన = ఏమి; అత్యగాత్ = మరణించెను; రాజా = మహారాజు; వ్యాధినా = అనారోగ్యము చేత; మయి అనాగతే = నేను ఇక్కడ లేనప్పుడు; ధన్యా = ధన్యాత్ములు; రామాదయః = రామాదులు; సర్వే = అందరు; యైః = ఎవరైతే; పితా = నా తండ్రిగారికి; సంస్కృతః = ప్రేత సంస్కారము; స్వయమ్ = స్వయముగా
భావం:-
తల్లీ! నేను ఇక్కడ లేనప్పుడు తండ్రి చనిపోవుటకు అతనికి ఏమి వ్యాధి వచ్చినది? స్వయముగా తండ్రికి ప్రేతసంస్కారము చేసిన రామాదులు ధన్యాత్ములు కదా!
2.72.30.
అనుష్టుప్.
న నూనం మాం మహారాజః
ప్రాప్తం జానాతి కీర్తిమాన్।
ఉపజిఘ్రేద్ధి మాంమూర్థ్నా
తాతస్సన్నమ్య సత్వరమ్॥
టీక:-
న = తెలియదు; నూనం = బహుశ; మాం = నన్ను; మహారాజః = మహారాజునకు; ప్రాప్తం = వచ్చి ఉండెడివారు; జానాతి = తెలిసినచో; కీర్తిమాన్ = కీర్తిమంతుడైన; ఉపజిఘ్రేద్ధి = ఆఘ్రాణించి; మాం = నా యొక్క; మూర్థ్నా = శిరస్సుపై; తాతః = తండ్రి; సన్నమ్య = తలవంచి; సత్వరమ్ = శీఘ్రముగా.
భావం:-
కీర్తిమంతుడైన మహారాజునకు నిజముగా నేను వచ్చినట్లు తెలియదు. తెలిసి ఉన్నచో శీఘ్రముగా నన్ను వంచి, నా తలపై ఆఘ్రాణించి ఉండెడివాడు.
2.72.31.
అనుష్టుప్.
క్వ స పాణిస్సుఖస్పర్శః
తాతస్యాక్లిష్టకర్మణః।
యేన మాం రజసా ధ్వస్తమ్
అభీక్ష్ణం పరిమార్జతి॥
టీక:-
క్వ = ఎక్కడ ఉన్నది; స = అట్టి; పాణిః = హస్తముతో; సుఖ = సుఖకరమైన; స్పర్శః = స్పర్శ; తాతస్య = తండ్రి యొక్క; అక్లిష్టకర్మణః = శ్రమ లేకుండా చేయు; యేన = ఏది కలదో; మాం = నన్ను; రజసా = బూడిద; ధ్వస్తమ్ = కప్పి ఉన్న; అభీక్ష్ణం = తరచుగా; పరిమార్జతి = తుడుచుచుండెడివాడు.
భావం:-
దుమ్ముపట్టి ఉన్న నన్ను ఏ చేతితో మాటిమాటికి తుడుచుచుండెడి వాడో, ఏ నా తండ్రి చేయి శ్రమ లేకుండ చేసి సుఖకరమైన స్పర్శను చేయునో, అట్టి ఆ హస్తము ఎక్కడ ఉన్నది?
2.72.32.
అనుష్టుప్.
యో మే భ్రాతా పితా బంధుః
యస్య దాసోఽస్మి ధీమతః।
తస్య మాం శీఘ్రమాఖ్యాహి
రామస్యాక్లిష్టకర్మణః॥
టీక:-
యః = ఎవరైతే; మే = నాకు; భ్రాతా = సోదరుడో; పితా = తండ్రియో; బంధుః = బంధువో; యస్య = ఎవనికైతే; దాసః = దాసుడను; అస్మి = అయిఉంటినో; ధీమతః = ధీమంతుడైన; తస్య = ఆ రామునికి; మాం = నా గురించి; శీఘ్రమ్ = శీఘ్రముగా; ఆఖ్యాహి = తెలుపుము; రామస్య = రామునకు; ఆక్లిష్టకర్మణః = శ్రమ లేకుండా చేయు.
భావం:-
నాకు సోదరుడూ, తండ్రీ, బంధువూ, శ్రమలేకుండా చేయువాడూ, ధీమంతుడూ ఐన నా రామునకు నేను దాసుడను. ఆ రాముడు ఎక్కడ ఉన్నాడో శీఘ్రముగా తెలుపుము.
2.72.33.
అనుష్టుప్.
పితా హి భవతి జ్యేష్ఠో
ధర్మమార్యస్య జానతః।
తస్య పాదౌ గృహీష్యామి
స హీదానీం గతిర్మమ॥
టీక:-
పితా = తండ్రితో సమానడు; హి = కదా; భవతి = ఐ ఉండును; జ్యేష్ఠః = అన్నగారు; ధర్మమ్ = ధర్మము; ఆర్యస్య = వినీతునికి; జానతః = తెలిసిన; తస్య = అటువంటి; పాదౌ = పాదములను; గృహీష్యామి = పట్టుకొనెదను; సః = అతడు; హి = మాత్రమే; ఇదానీం = ఇప్పుడు; గతిః = గతి ఐనవాడు; మమ = నాకు
భావం:-
ధర్మము తెలిసిన వినతునికి అన్నగారు తండ్రే కదా! అట్టి అన్నగారి పాదములు పట్టుకొనెదను. ఇప్పుడు నాకు అతడే గతి కదా!
2.72.34.
అనుష్టుప్.
ధర్మవిద్ధర్మనిత్యశ్చ
సత్యసంధో దృఢవ్రతః।
ఆర్యః కిమబ్రవీద్రాజా
పితా మే సత్యవిక్రమః॥
టీక:-
ధర్మవిత్ = ధర్మములు తెలిసినవాడు; ధర్మనిత్యశ్చ = నిత్యము ధర్మమును అనుసరించువాడు; సత్యసంధః = సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు; దృఢవ్రతః = దృఢమైన నియమము కలవాడు; ఆర్యః = పూజ్యుడు; కిమ్ = ఏమని; అబ్రవీత్ = చెప్పెను; రాజా = మహారాజు; పితా = తండ్రి; మే = నా; సత్యవిక్రమః = సత్యమైన పరాక్రమము కలవాడు
భావం:-
ధర్మములు తెలిసినవాడు, నిత్య ధర్మవర్తనుడు, సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు, దృఢమైన నియమములు కలవాడు, పూజ్యుడు, సత్యమైన పరాక్రమము కలవాడు, మహారాజు అయిన నా తండ్రి ఏమి చెప్పెను?
2.72.35.
అనుష్టుప్.
పశ్చిమం సాధు సందేశమ్
ఇచ్ఛామి శ్రోతుమాత్మనః”।
ఇతి పృష్టా యథాతత్త్వమ్
కైకేయీ వాక్యమబ్రవీత్॥
టీక:-
పశ్చిమం = చివరి; సాధు = చక్కటి; సందేశమ్ = సందేశమును; ఇచ్ఛామి = కోరుచున్నాను; శ్రోతుమ్ = విననలెనని; ఆత్మనః = నాకు; ఇతి = అని; పృష్టా = అడుగగా; యథాతత్త్వమ్ = జరిగినది జరిగినట్లుగా; కైకేయీ = కైకేయి; వాక్యమ్ అబ్రవీత్ = మాట పలికెను
భావం:-
నాకు నా తండ్రి ఇచ్చిన చివరి సందేశమును యథాతథముగా వినగోరుచున్నాను. భరతుడు ఈ విధముగ ప్రశ్నించగా, కైకేయి జరిగినది జరిగినట్లుగా చెప్పుచు ఇట్లు పలికెను.
2.72.36.
అనుష్టుప్.
“రామేతి రాజా విలపన్
హా సీతే లక్ష్మణేతి చ।
స మహాత్మా పరం లోకమ్
గతో గతిమతాం వరః॥
టీక:-
రామ = రామా; ఇతి = అనుచు; రాజా = మహారాజు; విలపన్ = విలపించెను; హా = అయ్యో; సీతే = సీతా; లక్ష్మణా = లక్ష్మణా; ఇతి = అని; చ = ఇంకను; సః = ఆ; మహాత్మా = మహాత్ముడు; పరంలోకమ్ = పరలోకమును; గతః = పొందెను; గతిమతాం = ప్రపంచజ్ఞానముకలవారిలో; వరః = శ్రేష్ఠుడైన
భావం:-
సజ్జనశ్రేష్ఠుడైన ఆ మహాత్ముడు, “హా రామా!” అనీ ఇంకనూ “హా సీతా! హా లక్ష్మణా!” అని విలపించుచు మరణించెను.
2.72.37.
అనుష్టుప్.
ఇమాం తు పశ్చిమాం వాచమ్
వ్యాజహార పితా తవ।
కాలధర్మపరిక్షిప్తః
పాశైరివ మహాగజః॥
టీక:-
ఇమామ్ = ఇవియే; తు = నిజముగ; పశ్చిమాంవాచమ్ = చివరి మాటలు; వ్యాజహార = పలికెను; పితా = తండ్రి; తవ = మీ; కాలధర్మపరిక్షిప్తః = కాలధర్మము చెందెను, మృతుడాయెను; పాశైః = పాశములచే; ఇవ = వలె; మహాగజః = మహాగజము.
భావం:-
నీ తండ్రి ఇవే చివరి మాటలు పలికి, తాళ్ళతో బంధించబడిన మహాగజము వలె, కాలధర్మము చెందెను.
2.72.38.
అనుష్టుప్.
సిద్ధార్థాస్తే నరా రామమ్
ఆగతం సహ సీతయా।
లక్ష్మణం చ మహాబాహుమ్
ద్రక్ష్యంతి పునరాగతమ్”॥
టీక:-
సిద్ధార్థాః = ధన్యాత్ములు; తే = అటువంటి; నరాః = మానవులు; రామమ్ = రాముని; ఆగతం = వచ్చిన; సహ = సమేతుడై; సీతయా = సీతాతోనూ; లక్ష్మణం చ = లక్ష్మణునితోను; చ= మఱియు; మహాబాహుమ్ = మహాబలశాలియైన; ద్రక్ష్యంతి = చూడగలిగినవారు; పునరాగతమ్ = పునః + ఆగతమ్, తిరిగి వచ్చినవాని.
భావం:-
సీతాసమేతుడై తిరిగి వచ్చిన రాముని, మఱియు గొప్పబలశాలియైన లక్ష్మణుని చూడగలిగినవారు ధన్యాత్ములు కదా!”
2.72.39.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా విషసాదైవ
ద్వితీయాప్రియశంసనాత్।
విషణ్ణవదనో భూత్వా
భూయః పప్రచ్ఛ మాతరమ్॥
టీక:-
తత్ = దానిని; శ్రుత్వా = విని; విషసాది = కుంగిపోయినవాని; ఇవ = వంటి; ద్వితీయా = రెండవ; అప్రియః = అశుభవార్త; శంసనాత్ = చెప్పబడినది; విషణ్ణవదనః = దిగులుచెందినమోముకలవాడు; భూత్వా = అయ్యెను; భూయః = మరల; పప్రచ్ఛ = అడిగెను; మాతరమ్ = తల్లిని
భావం:-
ఆ రెండవ అశుభ వార్తను వినగానే భరతుడు కుంగిపోయినవానివలె దిగులు చెందిన ముఖముతో తల్లిని మరల ఇట్లు అడిగెను.
2.72.40.
అనుష్టుప్.
క్వ చేదానీం స ధర్మాత్మా
కౌసల్యానందవర్ధనః।
లక్ష్మణేన సహ భ్రాత్రా
సీతయా చ సమం గతః॥
టీక:-
క్వ = ఎచ్చటకు; చ = ఇంక; ఇదానీం = ఇప్పుడు; సః = అతడు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; కౌసల్యానందవర్ధనః = కౌసల్య ఆనందము పెంచువాడు; లక్ష్మణేన = లక్ష్మణునితోను; సహ భ్రాత్రా = సోదరుడైన; సీతయా చ = సీతాదేవితోను; చ = మఱియు; సమం = కూడుకున్నవాడై; గతః = వెళ్లెను.
భావం:-
ధర్మాత్ముడైన రాముడు, సోదరుడు లక్ష్మణునితోను, సీతతోను కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయెను.
2.72.41.
అనుష్టుప్.
తథా పృష్టా యథాతత్త్వమ్
ఆఖ్యాతుముపచక్రమే।
మాతాస్య సుమహద్వాక్యమ్
విప్రియం ప్రియశంకయా॥
టీక:-
తథా = ఈ విధముగా; పృష్టా = అడుగగా; యథాతత్త్వమ్ = యథార్థము ప్రకారముగా; ఆఖ్యాతుమ్ = చెప్పుటకు; ఉపచక్రమే = ప్రారంభించెను; మాత = తల్లి; అస్య = అతనియొక్క; సుమహత్ = గొప్పదైన; వాక్యమ్ = మాటలను; విప్రియం = చాలా అప్రియమైన; ప్రియ = ప్రియమైనది అను; శంకయా = అపోహతో
భావం:-
భరతుడు ఈ విధముగ ప్రశ్నించగా, అతని తల్లి.. అతనికి ప్రియమైన విషయము చెప్పుచున్నాననే భ్రాంతితో చాల అప్రియమైన వాక్యమును, జరిగినది జరిగినట్లుగా చెప్పుటకు ప్రారంభించెను.
2.72.42.
అనుష్టుప్.
“స హి రాజసుతః పుత్ర!
చీరవాసా మహావనమ్।
దండకాన్సహ వైదేహ్యా
లక్ష్మణానుచరో గతః”॥
టీక:-
సః = ఆ; హి = జరిగెను; రాజసుతః = రాకుమారుడు; పుత్ర = కుమారా; చీరవాసా = నారచీరలు ధరించి; మహావనమ్ దండకాన్ = దండకారణ్యమునకు; సహ వైదేహ్యా = సీతాసమేతుడై; లక్ష్మణ = లక్ష్మణుడు; అనుచరః = వెంటరాగా; గతః = వెళ్లెను.
భావం:-
“కుమారా! రాముడు నారచీరలు ధరించి, సీతాసమేతుడై, లక్ష్మణుడు కూడ వెంట రాగా, దండకారణ్యమునకు వెళ్ళినాడు.”
2.72.43.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా భరతస్త్రస్తో
భ్రాతుశ్చారిత్రశంకయా।
స్వస్య వంశస్య మహాత్మ్యాత్
ప్రష్టుం సముపచక్రమే॥
టీక:-
తత్ = అవి; శ్రుత్వా = విని; భరతః = భరతుడు; త్రస్తః = భయపడెను; భ్రాతుః = సోదరుడైన రాముడు; చారిత్ర = ప్రవర్తనపై; శంకయా = అనుమానముతో; స్వస్య = తనయొక్క; వంశస్య = వంశముయొక్క; మహాత్మ్యాత్ = ఔన్నత్యమును; ప్రష్టుం = ప్రశ్నించుట; సముపచక్రమే = మొదలుపెట్టెను.
భావం:-
భరతుడు ఆ మాటలు విని, తన వంశ ఔన్నత్యము తెలిసినవాడు అగుటచే, రాముడు ఏదైనా అధర్మకార్యము చేయుటచే దేశము నుండి వెడలకొట్టబడినాడా అని శంకతో భయపడి, ఇలా అడగసాగెను.
2.72.44.
అనుష్టుప్.
“కచ్చిన్న బ్రాహ్మణధనమ్
హృతం రామేణ కస్యచిత్।
కచ్చిన్నాఢ్యో దరిద్రో వా
తేనాపాపో విహింసితః॥
టీక:-
కచ్చిత్ = ఏమి; న = లేదుకదా; బ్రాహ్మణధనమ్ = బ్రాహ్మణుల సంపదలను; హృతం = అపహరించుట; రామేణ = రాముని చేత; కస్యచిత్ = ఎవరిదైనా, ఏ ఒక్క; కచ్చిత్ = ఏమి; న = లేదుకదా; ఆఢ్యః = సంపన్నుడనైనను; దరిద్రః= దరిద్రునైనను; వా = లేక; తేన = రాముని చేత; అపాపః = పాపము చేయనివాడు; విహింసితః = హింసించబడలేదు కదా.
భావం:-
”రాముడు ఏ బ్రాహ్మణునిదైనా ధనమును అపహరించలేదు కదా! అపరాధ మేదియు లేకుండగ, అతడు ధనవంతుడనైనను, దరిద్రుడనైనను ఎవరినీ హింసించ లేదు కద!
2.72.45.
అనుష్టుప్.
కచ్చిన్న పరదారాన్వా
రాజపుత్రోఽభిమన్యతే।
కస్మాత్స దండకారణ్యే
భ్రూణహేవ వివాసితః”॥
టీక:-
కచ్చిత్ = ఎవరిని; ం = లేదు కదా; పరదారాన్ = పరుల భార్యలపై; వా = లేదా; రాజపుత్రః = రాజకుమారుడు; అభిమన్యతే = కోరుట; కస్మాత్ = ఎందువలం; సః = రాముని; దండకారణ్యే = దండకారణ్యమునకు; భ్రూణహ = భ్రూణ హత్య చేసినవానికి; ఇవ = వలె; వివాసితః = వెడలగొట్టిరి.
భావం:-
రాజకుమారుడైన రాముడు పరుల భార్యలనుకాని కోరలేదు కద? భ్రూణహత్యా పాపము చేసినవానిని వలె అతనిని దండకారణ్యమునకు ఎందువలన వెడలగొట్టిరి.”
2.72.46.
అనుష్టుప్.
అథాస్య చపలా మాతా
తత్స్వకర్మ యథాతథమ్।
తేనైవ స్త్రీస్వభావేం
వ్యాహర్తుముపచక్రమే॥
టీక:-
అథ = పిమ్మట; అస్య = అతనియొక్క; చపలా = చపల స్వభావురాలైం; మాతా = తల్లి; తత్ = అప్పుడు; స్వకర్మ = తాను చేసినపని; యథాతథమ్ =///// జరిగింది జరిగినట్లు; తేం + ఏవ = ఆ విధముగానే; స్త్రీస్వభావేన = స్త్రీ స్వభావము చేత; వ్యాహర్తుమ్ = చెప్పుటకు; ఉపచక్రమే = ప్రారంభించెను
భావం:-
పిమ్మట చపల స్వభావురాలైన అతని తల్లి, తాన స్త్రీ స్వభావము వలన తాను చేసిం పనిని జరిగింది జరిగింట్లు చెప్పుటకు ప్రారంభించెను.
2.72.47.
అనుష్టు/ప్.
ఏవముక్తా తు కైకేయీ
భరతేన మహాత్మనా।
ఉవాచ వచనం హృష్టా
మూఢా పండితమానినీ॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తా = ఇట్లు పలికెను; తు = ఇట్లు పలికెను; కైకేయీ = కైకేయి; భరతేన = భరతుని చేత; మహాత్మనా = మహాత్ముడైన; ఉవాచ = పలికిన; వచనం = మాటలను; హృష్టా = సంతోషించుచు; మూఢా = మూఢురాలు; పణ్డిత మానినీ = బుద్ధిమంతురాలను అను గర్వముతో.
భావం:-
మూఢురాలు, బుద్ధిమంతురాలను అనే గర్వము కలది అయిన కైకేయి, మహాత్ముడైన భరతుని మాటలు విని, సంతోషించుచు ఇట్లు పలికెను.
2.72.48.
అనుష్టుప్.
న బ్రాహ్మణధనం కించిత్
హృతం రామేణ కస్యచిత్ ।
కశ్చిన్నాఢ్యో దరిద్రో వా
తేనాపాపో విహింసితః।
న రామః పరదారాంశ్చ
చక్షురఽభ్యమపి పశ్యతి॥
టీక:-
న = లేదు; బ్రాహ్మణ ధనం = బ్రాహ్మణుని ధనము; కించిత్ = కొంచెము కూడా; హృతం = అపహరించుట; రామేణ = రాముని చేత; కస్యచిత్ = ఏ ఒక్కరిది; కశ్చిత్ = ఎవ్వరిని; న = లేదు; ఆఢ్యః = సంపన్నుడు; దరిద్రో వా = దరిద్రునిది గాని; తేన = అతని చేత; అపాపః = పాపము చేయని; విహింసితః = హింసించబడుట; న = లేదు; రామః = రాముడు; పరదారాంశ్చ = పరుల భార్యలను; చక్షురభ్యామ్ = కళ్ళతో; పశ్యతి = చూడ.
భావం:-
రాముడు ఏ బ్రాహ్మణుని ధనమును కూడ కొంచెమైనను హరించలేదు. అతడు పాపము చేయని ధనికుని గాని, దరిద్రుని గాని ఎవ్వనిని హింసించలేదు. రాముడు పరభార్యలను కంటితో చూడను కూడ చూడలేదు.
2.72.49.
అనుష్టుప్.
మయా తు పుత్ర! శ్రుత్వైవ
రామస్యైవాభిషేచనమ్।
యాచితస్తే పితా రాజ్యమ్
రామస్య చ వివాసనమ్॥
టీక:-
మయా = నా చేత; తు = మాత్రమే; పుత్ర = కుమారా; శ్రుత్వి = వినిన; ఏవ = వెంటనే; రామస్య = రామునియొక్క; ఏవ = ఐన ; అభిషేచనమ్ = పట్టాభిషేకము; యాచితః = కోరితిని; తే = నీ; పితా = తండ్రిని; రాజ్యమ్ = రాజ్యమును; రామస్య చ = రాముని; చ = మఱి; వివాసనిమ్ = బహిష్కరణ.
భావం:-
కుమారా! రామునికి అభిషేకము జరుగనున్నదని వినగానే నేను, నీ తండ్రిని, నీకు రాజ్యము ఇమ్మనీ, రాముని అరణ్యమునకు పంపివేయమనీ కోరితిని.
2.72.50.
అనుష్టుప్.
స స్వవృత్తిం సమాస్థాయ
పితా తే తత్తఽథాకరోత్।
రామశ్చ సహ సౌమిత్రిః
ప్రేషితః సహ సీతయా॥
టీక:-
సః = ఆయన; స్వ = తన; వృత్తిం = న్యాయవర్తనను; సమాస్థాయ = పాటించుచు; పితా = తండ్రి; తే = నీ యొక్క; తత్ = దానిని; అథ = అట్లు; అకరోత్ = చేసెను; రామః = రాముని; చ = మఱియు; సహ = సహితముగా; సౌమిత్రిః = లక్ష్మణుని; ప్రేషితః = పంపెను; ; సహ = సహితముగా; సీతయా = సీతతో.
భావం:-
నీ తండ్రి తన ధర్మమును పాటించుచు ఆ విధముగానే చేసెను. సీతాలక్ష్మణ సమేతుడైన రాముని అరణ్యమునకు పంపివేసెను.
2.72.51.
అనుష్టుప్.
తమపశ్యన్` ప్రియంపుత్రం
మహీపాలో మహాయశాః।
పుత్రశోకపరిద్యూనః
పంచత్వముపపేదివాన్॥
టీక:-
తమ్ = ఆ; అపశ్యన్ = చూడలేకపోవుటచే; ప్రియం = ప్రియ; పుత్రమ్ = పుత్రుని; మహీపాలః = మహారాజు; మహాయశాః = మహాకీర్తిశాలి; పుత్రశోక = పుత్ర శోకముతో; పరిద్యూనః = పరితపించుచు; పంచత్వమ్ = మరణించుట; ఉపపేదివాన్ = సంభవించెను
భావం:-
మహాకీర్తిశాలి అయిం మహారాజు తన ప్రియపుత్రుడైన రాముడు కంబడక పోవుటచే, పుత్రశోకముతో పరితపించుచు మరణించుట జరిగెను.
2.72.52.
అనుష్టుప్.
త్వయాత్విదానీం ధర్మజ్ఞ!
రాజత్వమవలంభ్యతామ్।
త్వత్కృతే హి మయా సర్వమ్
ఇదమేవం విధం కృతమ్॥
టీక:-
త్వయా = నీ చేత; ఇదానీం = ఇప్పుడు; ధర్మజ్ఞ = ధర్మము తెలిసినవాడా; రాజత్వమ్ = రాజత్వమును; అవలంభ్యతామ్ = అవలంబించబడునుగాక; త్వత్కృతే హి = నీ కొరకే; హి = మాత్రమే; మయా = నా చేత; సర్వమిదమ్ = ఇది అంతయు; ఏవం విధం = ఈ విధముగా; కృతమ్ = చేయబడినది.
భావం:-
ఇపుడు నీవు రాజత్వమును స్వీకరింపుము. ఈ విధముగా నేను ఇది అంతయు నీ కొరకు చేసినాను.
2.72.53.
అనుష్టుప్.
మా శోకం మా చ సంతాపమ్
ధైర్యమాశ్రయ పుత్రక!।
త్వదధీనా హి నగరీ
రాజ్యం చైతదనామయమ్॥
టీక:-
మా = విడిచిపెట్టుము; శోకం = శోకమును; మా = విడిచిపెట్టుము; చ = కూడా; సంతాపమ్ = సంతాపమును; ధైర్యమ్ = ధైర్యమును; ఆశ్రయ = అవలంబించుము; పుత్రక = కుమారా; త్వత్ = నీకు; అధీనా = అధీనములై; హి = ఉన్నవి; నగరీ = నగరము; రాజ్యం చ = రాజ్యము కూడ; ఏతత్ = ఇదంతా; అనామయమ్ = నిరాటంకముగానున్నది
భావం:-
శోక సంతాపములను విడచి నీవు ధైర్యము అవలంబించుము. కంటక రహితములైన ఈ అయధ్యా నగరము, ఈ కోశలదేశ రాజ్యాధికారము కూడ నీకు అధీనములై ఉన్నవి.
2.72.54.
త్రిష్టుప్.
తత్పుత్ర! శీఘ్రం విధినా విధిజ్ఞై
ర్వసిష్ఠముఖ్యైః సహితో ద్విజేన్ద్రైః।
సంకాల్య రాజాన మదీనసత్త్వ
మాత్మానముర్వ్యా మభిషేచయస్వ॥
టీక:-
తత్ = అందువలం; పుత్ర = కుమారా; శీఘ్రం = శీఘ్రముగా; విధినా విధిజ్ఞైః = శాస్త్ర విధానము తెలిసిన; వసిష్ఠ = వసిష్ఠుడు; ముఖ్యైః = ముఖ్యులు; సహితః = సమావేశమై; ద్విజేన్ద్రై = బ్రాహ్మణ శ్రేష్ఠులతో; సంకాల్య = సంస్కారమును; రాజానమ్ = రాజునకు; అదీనసత్త్వమ్ = దైన్యము లేనివాడవై; ఆత్మానమ్ = మనస్సులో; ఉర్వామ్ = భూమికి; అభిషేచయస్వ = రాజ్యాభిషిక్తుడవు అగుముగాక.
భావం:-
శాస్త్రవిధానము తెలిసిన వసిష్టుడు మొదలగు బ్రాహ్మణశ్రేష్టులతో, మనస్సులో ఏ దైన్యము లేనివాడవై, శీఘ్రముగా రాజునకు చేయవలసిన సంస్కారములు యథావిధిగా చేయించుకొని, రాజ్యాభిషిక్తుడవు అగుము.
2.72.55.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే ద్విసప్తతితమసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ద్విసప్తతితమ [72] = డెబ్బైరెండవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [72] డెబ్బైరెండవ సర్గ సంపూర్ణము.