2.49.1.
అనుష్టుప్.
రామోఽపి రాత్రిశేషేణ
తేనైవ మహదంతరమ్।
జగామ పురుషవ్యాఘ్రః
పితురాజ్ఞామనుస్మరన్॥
టీక:-
 రామః = రాముడు; అపి = కూడ; రాత్రి = ఆ రాత్రి; శేషేణ = మిగతా సమయనందు; తేన = ఆ కారణము; ఏవ = వలననే; మహత్ = చాలా అధికమైన; అంతరమ్ = దూరము; జగామ = ప్రయాణము చేసెను; పురుషవ్యాఘ్రః = పురుషులలో శ్రేష్ఠుడు; పితుః = తండ్రి; ఆజ్ఞామ్ = ఆజ్ఞను; అనుస్మరన్ = స్మరించుచు
భావం:-
 పురుష శ్రేష్ఠుడైన రాముడు తండ్రి ఆజ్ఞను స్మరించుచు, ఆ రాత్రి శేషమునందే చాల దూరము ప్రయాణము చేసెను.
2.49.2.
అనుష్టుప్.
తథైవ గచ్ఛతస్తస్య
వ్యపాయాద్రజనీ శివా।
ఉపాస్య స శివాం సంధ్యామ్
విషయాంతం వ్యగాహత॥
టీక:-
 తథ = అదేవిధము; ఏవ = గనే; గచ్ఛతః = వెళ్లుచుండగా; తస్య = అట్లు; వ్యపాయాత్ = గడిచెను; రజనీ = రాత్రి; శివా = మంగళకరమైన; ఉపాస్య = ఉపాసించి; సః = రాముడు; శివామ్ = మంగళకరమైన; సంధ్యామ్ = సాయం సంధ్యను; విషయాంతం = పొలిమేరలోనికి; వ్యగాహత = ప్రవేశించెను
భావం:-
 అతడు ఆ విధముగా మిగతా రాత్రి సమయమంతా ప్రయాణము చేయు చుండగా, ఆ శుభకరమైన రాత్రి గడచెను. అప్పుడు మంగళకరమైన సంధ్యను ఉపాసించి తమ కోసల దేశ పొలిమేరలోనికి ప్రవేశించెను.
2.49.3.
అనుష్టుప్.
గ్రామాన్ వికృష్టసీమాంతాన్
పుష్పితాని వనాని చ।
పశ్యన్నతియయౌ శీఘ్రమ్
శనైరివ హయోత్తమైః॥
టీక:-
 గ్రామాన్ = గ్రామములను; వికృష్ట = దున్నబడిన; సీమాంతాన్ = పొలిమేరలు; పుష్పితాని = పుష్పించినవి; వనాని = తోటలును; చ = మఱియు; పశ్యన్ = చూచుచూ; అతియయౌ = వాటి మీదుగా ప్రయాణించుచు; శీఘ్రమ్ = వేగముగా; శనైః = మెల్లని; ఇవ = విధానమున; హయ = ఆశ్వములలో; ఉత్తమైః = ఉత్తమమైనవి.
భావం:-
 దున్నిన పొలిమేరలు కల ఆమ్రగాములను, పుష్పించిన తోటలను చూచుచు, ఆ ఉత్తమాశ్వములతో, శీఘ్రముగా ప్రయాణము చేయుచు, ఆ గ్రామాదులను అన్నిటిని మెల్లగా దాటెను.
2.49.4.
అనుష్టుప్.
శృణ్వన్ వచో మనుష్యాణామ్
గ్రామసంవాసవాసినామ్।
“రాజానం ధిగ్దశరథమ్
కామస్య వశమాగతమ్॥
టీక:-
 శృణ్వన్ = వినుచు; వచః = మాటలను; మనుష్యాణామ్ = మనుష్యుల; గ్రామ = గ్రామములలో; సంవాస = గృహములలో; వాసినామ్ = నివసించువారి; రాజానం = మహారాజుని; ధిక్ = తిరస్కారము, నింద; దశరథమ్ = దశరథుని; కామస్య = కామమునకు; వశమాగతమ్ = వశుడయ్యెను
భావం:-
 గ్రామములలో నివసించు మనుష్యుల మాటలు వినుచు, “దశరథుడు మహారాజు ఛీ, కామమునకు వశుడైపోయెను.
2.49.5.
అనుష్టుప్.
హా నృశంసాద్య కైకేయీ
పాపా పాపానుబంధినీ।
తీక్ష్ణా సంభిన్నమర్యాదా
తీక్ష్ణకర్మణి వర్తతే॥
టీక:-
 హా = అయ్యో; నృశంస = క్రూరురాలు; అద్య = ఇప్పుడు; కైకేయీ = కైకేయి; పాపా = పాపాత్మురాలు; పాపా = పాప కర్మలచే; అనుబంధినీ = చుట్ట బడినది; తీక్ష్ణా = క్రూరురాలైనామె, కైకేయి; సంభిన్న = తెంచేసిన; మర్యాదా = కట్టుబాట్లు కలది; తీక్ష్ణ = తీవ్రమైన చడ్డ; కర్మణి = పనులందు; వర్తతే = మెలగుతున్నది.
భావం:-
  అయ్యో! క్రూరురాలు, పాపాత్మురాలు అయిన కైకేయి ఈనాడు పాపకర్మలచే అవిచ్ఛిన్నముగా చేయుచున్నది. క్రూరురాలైన కైకేయి, కట్టుబాట్లను ఛేదించి ఎంతటి క్రూరమైన పనికి ఒడికట్టినది.
2.49.6.
అనుష్టుప్.
యా పుత్రమీదృశం రాజ్ఞః
ప్రవాసయతి ధార్మికమ్।
వనవాసే మహాప్రాజ్ఞమ్
సానుక్రోశం జితేంద్రియమ్॥
టీక:-
 యా = పోయి; పుత్రమ్ = కుమారునికి; ఈదృశం = సమానుని; రాజ్ఞః = రాముని; ప్రవాసయతి = ప్రవాసమునకు పంపెను; ధార్మికమ్ = ధార్మికుడు; వనవాసే = వనవాసమునకై; మహాప్రాజ్ఞమ్ = గొప్ప బుద్ధి కలవాడు; సానుక్రోశం = దయాశీలుడు; జితేంద్రియమ్ = జిత + ఇంద్రియమ్, ఇంద్రియములను జయించినవాడు
భావం:-
 పరమ ధార్మికుడైన రాముని తన కుమారుని వంటివానిని పోయిపోయి దూరదేశమునకు పంపెను. గొప్ప బుద్ధి కలవాడు, దయాశీలుడు, ఇంద్రియములను జయించినవాడు, అయిన రాముని వనవాసమునకు పంపివేసెను.
2.49.7.
అనుష్టుప్.
కథం నామ మహాభాగా
సీతా జనకనందినీ।
సదా సుఖేష్వభిరతా
దుఃఖాన్యనుభవిష్యతి॥
టీక:-
 కథం = ఏ విధముగా; నామ = సంభావ్యము; మహాభాగా = మహానుభావురాలయిన; సీతా = సీతాదేవి; జనక నందినీ = జనక మహారాజు కుమార్తె; సదా = నిరంతరం; సుఖేషు = సుఖములకు; అభిరతా = అలవాటు పడినది; దుఃఖాని = కష్టములను; అనుభవిష్యతి = అనుభవించగలదు
భావం:-
 మంచి భాగ్యము కలది, ఎల్లపుడు సుఖములకే అలవాటు పడినది అయిన జనకుని పుత్రి సీత, దుఃఖములను ఎట్లు అనుభవించునో!
2.49.8.
అనుష్టుప్.
అహో దశరథో రాజా
నిస్నేహః స్వసుతం ప్రియమ్।
ప్రజానామనఘం రామమ్
పరిత్యక్తుమిహేచ్ఛతి”॥
టీక:-
 అహో = అయ్యో; దశరథో రాజా = దశరథ మహారాజు; నిస్నేహః = దయలేనివాడై; స్వసుతం = తన కుమారుని; ప్రియమ్ = ప్రియమైనవానిని; ప్రజానామ్ = ప్రజలకు; అనఘం = దోషరహితుడు; రామమ్ = రాముని; పరిత్యక్తుమ్ = విడిచిపెట్టుటకు; ఇహ = ఇచ్చట; ఇచ్ఛతి = కోరుచున్నాడు.
భావం:-
  ఎంత ఆశ్చర్యము! దశరథమహారాజుదయలేనివాడై ప్రజలకు ఇష్టుడూ, దోషరహితుడూ, స్వంతకుమారుడూ ఐన రాముని, కోరి విడిచిపెడుతున్నాడు.”
2.49.9.
అనుష్టుప్.
ఏతా వాచో మనుష్యాణామ్
గ్రామసంవాసవాసినామ్।
శృణ్వన్నతియయౌ వీరః
కోసలాన్ కోసలేశ్వరః॥
టీక:-
 ఏతా = ఇటువంటి; వాచః = మాటలను; మనుష్యాణామ్ = జనులు; గ్రామ = గ్రామములో; సంవాస = ప్రాంగణములోను; వాసినామ్ = ఉండెడి; శృణ్వన్ = వినుచు; అతియయౌ = దాటెను; వీరః = వీరుడు; కోసలాన్ = కోసల దేశమును; కోసలేశ్వరః = కోసలాధీశుడైన
భావం:-
 కోసలాధీశ్వరుడైన ఆ వీరుడు, గ్రామముల ప్రాంగణములలోని జనుల ఈ మాటలు వినుచు, కోసలదేశ సరిహద్దులను దాటెను.
2.49.10.
అనుష్టుప్.
తతో వేదశ్రుతిం నామ
శివవారివహాం నదీమ్।
ఉత్తీర్యాభిముఖః ప్రాయాత్
అగస్త్యాధ్యుషితాం దిశమ్॥
టీక:-
 తతః = అటు పిమ్మట; వేదశ్రుతిం = వేదశ్రుతియను; నామ = పేరు గల; శివ = పవిత్రమైన; వారివహాం = ఉదకము ప్రవహించుచున్న; నదీమ్ = నదిని; ఉత్తీర్య = దాటి; అభిముఖః = అభిముఖముగా; ప్రాయాత్ = ప్రయాణము; అగస్తి = అగస్త్యునిచే; అధ్యుషితాం = అధిష్టించబడిన; దిశమ్ = దిశ (దక్షిణం వైపు) గురించి
భావం:-
 పిమ్మట అతడు, పవిత్రమైన ఉదకము ప్రవహించుచున్న వేదశ్రుతి యను నదిని దాటి, అగస్త్యుడు నివసించు, దక్షిణము వైపు ప్రయాణము చేసెను.
*గమనిక:-
 వేదశ్రుతి- ఈ నది ఇప్పుడు విశు అని పిలవబడుతోంది. 15- 20 కిమీ. వచ్చి ఈ నదిని దాటెను.
2.49.11.
అనుష్టుప్.
గత్వా తు సుచిరం కాలమ్
తతః శీతజలాం నదీమ్।
గోమతీం గోయుతానూపామ్
అతరత్సాగరంగమామ్॥
టీక:-
 గత్వా తు = ప్రయాణించిన తరువాత; సుచిరం కాలమ్ = ఎక్కువ కాలము; తతః = అక్కడ నుండి; శీతజలాం = పవిత్రమైన జలములు గల; నదీమ్ = నదిని; గోమతీం = గోమతి అను పేరు గల; గోయుతానూపామ్ = గోవులతో నిండిన తీరమును; అతరత్ = దాటెను; సాగరం = గంగానదిలోనికి; గమామ్ = ప్రవహించునది
భావం:-
 అక్కడ నుండి చాల సేపు ప్రయాణము చేసిన పిమ్మట రాముడు పవిత్రమైన జలములు కలది, అనేక గోవులు కలది, గంగానదియొక్క ఉపనదీ ఐన గోమతీనదిని దాటెను.
*గమనిక:-
 గోమతీనది- శ్రీరామ చంద్రుడు దాటిన ఈ పవిత్ర నది గంగానదికి (గంగానదికి గంగాసాగరమనుట కూడ కలదు) ఉపనది. వసిష్ఠులవారి పుత్రిక. గోమతీతల్, నందు పుట్టి, లక్నో (ప్రస్తుత నామము) నగరం చేరుతుంది. అలా 960 కిమీ ప్రవహించి గంగానదిలో కలుస్తుంది.
2.49.12.
అనుష్టుప్.
గోమతీం చాప్యతిక్రమ్య
రాఘవః శీఘ్రగైర్హయైః।
మయూరహంసాభిరుతామ్
తతార స్యందికాం నదీమ్॥
టీక:-
 గోమతీమ్ = గోమతి నదిని; చ = ఇంకనూ; అపి = కూడా; అతిక్రమ్య = దాటి; రాఘవః = రాముడు; శీఘ్రగైః = వేగముగా పరుగెత్తు; హయైః = గుఱ్ఱముల చేత; మయూర = నెమళ్లు; హంస = హంసలు; అభిరుతామ్ = ప్రతిధ్వనించు చున్న; తతార = దాటెను; స్యందికాం = స్యందిక అను పేరు గల; నదీమ్ = నదిని.
భావం:-
 వేగముగా పరుగెత్తెడి గుఱ్ఱములతో గోమతీ నదిని కూడా దాటెను. ఒడ్డుకు చేరుకున్న రాముడు నెమళ్లు, హంసల అరుపులతో ప్రతిధ్వనించే స్యందిక అను పేరు గల నదిని దాటెను.
*గమనిక:-
 (1) గోమతీనది- గోమతి లేదా పన్గంటి పుల్హార లేదా గోమతి తలం నందు పుట్టినది. ఫుల్హార ఝీల్. సరస్సు వద్ద, ఈ సరస్సు ఉత్తర ప్రదేశము, ఫిలిబిత జిల్లాలో, ఫిలిబిత కు 30 కిమీ దూరంలో మేధోతండా వద్ద గోమతి పుట్టెను. ఇది 960 కిమీ ప్రవహించి వారణాశి జిల్లాలో ఘజియాపూరు వద్ద గంగానదిలో కలియును. గంగానదికి ఉపనది. వసిష్ఠుల వారు తపస్సు చేయుచుండా వారి చమటనుండి పుట్టిన ధార ఈ నదిగా ఏర్పడెను. అలా ఇది వసిష్ఠులవారి పుత్రిక అందురు. గోమతి చక్కటి నీటి ప్రవాహానికి, గట్లు ఆవులకు ప్రసిద్ధి (2) స్యందికా నది- ఈ నది కోశల దేశ దక్షిణ సరిహద్దు. ఇది నెమళ్ళు, హంసల గుంపులతో వాటి ఋతముతో గట్లు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
2.49.13.
అనుష్టుప్.
స మహీం మనునా రాజ్ఞా
దత్తామిక్ష్వాకవే పురా।
స్ఫీతాం రాష్ట్రావృతాం రామో
వైదేహీమన్వదర్శయత్॥
టీక:-
 స = ఆ; మహీం = రాజ్యమును; మనునా = మనుచే; రాజ్ఞా = చక్రవర్తి; దత్తామ్ = ఇచ్చిన; ఇక్ష్వాకవే = ఇక్ష్వాకువునకు; పురా = పూర్వము; స్ఫీతాం = విశాలమైన; రాష్ట్రావృతాం = రాష్ట్రములతో కూడిన; రామః = రాముడు; వైదేహీమ్ = సీతకు; అన్వదర్శయత్ = చూపించెను.
భావం:-
 అక్కడ అతడు, పూర్వము మను చక్రవర్తి ఇక్ష్వాకువునకు ఇచ్చిన అనేక రాష్ట్రములతో కూడిన విశాలమైనరాద్యమును సీతకు చూపించెను.
2.49.14.
అనుష్టుప్.
“సూత” ఇత్యేవ చాభాష్య
సారథిం తమభీక్ష్ణశః।
హంసమత్తస్వరశ్శ్రీమాన్
ఉవాచ పురుషర్షభః॥
టీక:-
 సూత = సూతా; ఇతి + ఏవ చ = ఈ విధముగా; అభాష్య = పలికెను; సారథిం = సుమంత్రుడిని; తమ్ = ఆ; అభీక్ష్ణశః = ప్రేమపూర్వకముగా; హంసమత్త స్వరః = హంస కంఠస్వరమును పోలిన స్వరముతో; శ్రీమాన్ = శ్రీమంతుడైన; ఉవాచ = పలికెను; పురుషర్షభః = పురుషులలో శ్రేష్ఠుడైన
భావం:-
 పురుషోత్తముడూ, శ్రీమంతుడు ఐన రాముడు, హంసకఠ ధ్వనితో మధురముగా సారథిౖ సుమంత్రుని ‘సూతా!’ అని ప్రేమపూర్వకముగా పిలిచి ఇట్లనెను.
2.49.15.
అనుష్టుప్.
కదాఽహం పునరాగమ్య
సరయ్వా పుష్పితే వనే।
మృగయాం పర్యటిష్యామి
మాత్రా పిత్రా చ సంగతః॥
టీక:-
 కదా = ఎప్పుడు; అహం = నేను; పునరాగమ్య = మరల వచ్చి; సరయ్వాః = సరయూ నదీ తీరములో; పుష్పితే = పుష్పించిన; వనే = వనమునందు; మృగయాం = వేటాడుటకు; పర్యటిష్యామి = పర్యటించగలనో; మాత్రాపిత్రా = తల్లిదండ్రుల; చ = కూడ; సంగతః = దర్శనము చేసి.
భావం:-
 నేను మరల వచ్చి తల్లిదండ్రుల దర్శనము చేసికొనుట, ఈ సరయూ తీరమున పుష్పించిన అడవియందు వేటాడుచూ సంచరించుట ఎప్పుడో కద!
2.49.16.
అనుష్టుప్.
రాజర్షీణాం చ లోకేఽస్మిన్
అభ్యస్యా మృగయా వనే।
కాలే వృతానాం మనుజైః
ధన్వినామభికాంక్షిణామ్॥
టీక:-
 రాజర్షీణాం = రాజర్షులకు; చ = మఱియు; లోకః = లోకములో; అస్మిన్ = ఈ; అభ్యస్యా = యోగ్యమైనది; మృగయా = వేటాడుట; వనే = అడవియందు; కాలే = కాలక్రమంలో; కృతానాం = చేయుట; మనుజైః = మానవులలో; ధన్వినామ్ = ధనుర్థారులకు; అభికాంక్షిణామ్ = వ్యసనమైనది.
భావం:-
  అడవిలో వేటాడుట ఈ లోకములో రాజర్షులకు యోగ్యమైనది. కాలక్రమంలో మానవులలో ధనుర్థారులకు అందరికీ వినోదంగా క్రీడించుట వ్యసనమైనది.
*గమనిక:-
 (1) అభ్యాస- వ్యుత్పత్తి ఆభిముఖ్యతే క్శియతె, అసుక్షేపేర్మ్మణి ఘఞ్, ఆవృత్థిః, ఖురళీ, యోగ్య, కల్పధృమం (2) మనుజః- వ్యుత్పత్తి. మనోర్జాతి. జన్+ణః, మనుష్య ఇతి అమరః, మానవులు (3) అభికాంక్షిత- అభి అధికస్య + కాంక్షింత ఈప్సిత అస్య, లాలస, కల్పధృమం, వ్యసనము.
2.49.17.
అనుష్టుప్.
నాత్యర్థమభికాంక్షామి
మృగయాం సరయూ వనే।
రతిర్హ్యేషాతులా లోకే
రాజర్షిగణసేవితా॥
టీక:-
 అత్యర్థమ్ = అంత ఎక్కువగా; నాభికాంక్షామి = న+అభికాంక్షామి, కోరను, లాలస లేదు; మృగయాం = వేటాడవలెనను; సరయూ = సరయూ తీరమునందలి; వనే = వనమున; రతిః = ఆనందకరము; హి = నిశ్చయార్థకం; ఏషా = ఇది, ఈవేటాడుచ; అతులా = సాటిలేని; లోకే = లోకమునందు; రాజర్షిగణ = రాజర్షులకు; సేవితా = వేటాడుట
భావం:-
 సరయూ తీర అడవి యందు వేటాడవలెనను లాలస నాకు అంతగా లేదు. కాని, రాజర్షి లోకమునందు వేటాడుట యోగ్యమైన సాటిలేని క్రీడే.
2.49.18.
అనుష్టుప్.
స తమధ్వానమైక్ష్వాకః
సూతం మధురయా గిరా।
తం తమర్థమభిప్రేత్య
యయౌ వాక్యముదీరయన్॥
టీక:-
 స = అటువంటి; తమ్ = ఆ; అధ్వానమ్ = మార్గములో; ఐక్ష్వాకః = ఇక్ష్వాక వంశస్థుడు, రాముడు; సూతం = సూతునితో; మధురయా = మధురముగా; గిరా = మాటలను; తమ్ తమ్ = ఆయా; అర్థమ్ = విషయములు; అభిప్రేత్య = ఉద్దేశించి; యయౌ = వెళ్లెను; వాక్యమ్ = మాటలను; ఉదీరయన్ = పలికెను
భావం:-
 రాముడు దారిలో ఆయా విషయములను గుఱించి సుమంత్రునితో తియ్యగా చెప్పుచూ ప్రయాణించెను.
*గమనిక:-
 అభిప్రేత- వ్యుత్పత్తి. అభి+ ప్ర+ ఇణ్ – క్త, అభిషితే, వాచస్పతం, ఉద్దేశము, సంస్కృత ఆంధ్ర నిఘంటువు.
2.49.19.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
ఏకోనపంచాశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; ఏకోనపంచాశ [49] = నలభైతొమ్మిదవ; సర్గః = సర్గ.
బావము:-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [49] నలభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.50.1.
అనుష్టుప్.
విశాలాన్ కోసలాన్ రమ్యాన్
యాత్వా లక్ష్మణపూర్వజః।
అయోధ్యాభిముఖో ధీమాన్
ప్రాంజలిర్వాక్యమబ్రవీత్॥
టీక:-
విశాలాన్ = విస్తృతమైన; కోసలాన్ = కోసల దేశము; రమ్యాన్ = అందమైన; యాత్వా = దాటిన; లక్ష్మణ పూర్వజః = రాముడు (లక్ష్మణుని కంటె ముందుగా పుట్టినవాడు); అయో«ధ్య = అయోధ్యా నగరమునకు; అభిముఖః = అభిముఖముగా; ధీమాన్ = జ్ఞాని; ప్రాంజలిః = చేతులు జోడించి; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను
భావం:-
రాముడు.. అందము, విశాలము అయిన ఆ కోసల దేశమును దాటి, అయోధ్యాపురము వైపు తిరిగి, నమస్కరించి, ఈ విధముగా పలికెను.
*గమనిక:-
లక్ష్మణ పూర్వజః = లక్ష్మణుని కంటె ముందుగా పుట్టినవాడు , రాముడు
2.50.2.
అనుష్టుప్.
“ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే
కాకుత్స్థపరిపాలితే।
దైవతాని చ యాని త్వామ్
పాలయన్తి వసన్తి చ॥
టీక:-
అపృచ్ఛః = కోరినావు; త్వాం = నీవు; పురీః శ్రేష్ఠే = నగరములలో ఉత్తమమైన అయోధ్య; కాకుత్థ్స = కకుత్థ్స వంశముచే; పరిపాలితే = పరిపాలించబడిన; దైవతాని = దేవతలను; చ = మఱియు; యాని = ఎవరైతే; త్వామ్ = నీచే;
భావం:-
”కకుత్థ్స వంశమునందు పుట్టిన వారిచే పరిపాలింపబడుచున్న ఓ నగర శ్రేష్ఠమా! అయోధ్యా! నిన్ను, నీయందు నివసించుచున్న, నిన్ను పాలించుచున్న దేవతలను. అనుమతి కోరుచున్నాను.
2.50.3.
అనుష్టుప్.
నివృత్తవనవాసస్త్వామ్
అనృణో జగతీపతేః।
పునర్ద్రక్ష్యామి మాత్రా చ
పిత్రా చ సహ సంగతః”॥
టీక:-
నివృత్త = మరల వచ్చి; వనవాసః = వనవాసము; త్వామ్ = నిన్ను; అనృణో = ఋణము తీర్చి; జగతీపతేః = దశరథ మహారాజు; పునః = తిరిగి; ద్రక్ష్యామి = చూచెదను; మాత్రా = తల్లి; చ = మఱియు; పిత్రా = తండ్రి; చ = మఱియు; సహ సంగతః = వారితో కలసి.
భావం:-
నేను వనవాసమును పూర్తి చేసుకొని వెనుకకు వచ్చి, దశరథ మహారాజు ఋణము తీర్చిన నేను తల్లిదండ్రులతో కలసి, మరల నిన్ను దర్శించెదను” అనెను.
2.50.4.
అనుష్టుప్.
తతో రుధిరతామ్రాక్షో
భుజముద్యమ్య దక్షిణమ్।
అశ్రుపూర్ణముఖో దీనోఽ -
బ్రవీజ్జానపదం జనమ్॥
టీక:-
తతః = పిమ్మట; రుధిర = రక్తము వలె; తామ్రాక్షః = ఎఱ్ఱని కన్నులతో; భుజమ్ = చేతిని, శబ్దరత్నాకరము; ఉద్యమ్య = పైకి ఎత్తి; దక్షిణమ్ = కుడివైపు; అశ్రుపూర్ణ = కన్నీళ్లతో నిండిన; ముఖః = ముఖముతో; దీనః = దీనుడై; అబ్రవీత్ = పలికెను; జానపదం = గ్రామీణులతో; జనమ్ = ప్రజలతో
భావం:-
పిమ్మట అతడు కన్నీళ్లతో నిండిన ముఖముతో రక్తము వలె ఎఱ్ఱనైన నేత్రములు కలవాడై, దీనుడై కుడిచేయి ఎత్తి తనను చూడవచ్చిన ఆ గ్రామీణులతో ఇట్లు పలికెను.
2.50.5.
అనుష్టుప్.
“అనుక్రోశో దయా చైవ
యథార్హం మయి వః కృతః।
చిరం దుఃఖస్య పాపీయో
గమ్యతామర్థసిద్ధయే”॥
టీక:-
అనుక్రోశః = కరుణ; దయా = దయ; చైవ = కూడా; యథార్హం = తగు విధముగా; మయి = నాకు; వః = మీ ద్వారా; కృతః = చూపబడ్డాయి; చిరం = చాలాకాలం; దుఃఖస్య = వేదన; పాపీయః = బహుచెడ్డది; గమ్యతామ్ = వెళ్లండి; అర్థసిద్ధయే = కార్యం నెరవర్చటం కోసం
భావం:-
“మీరు నాపై తగినంత జాలి, దయ చూపించిరి. చాలాకాలము దుఃఖించుట మిక్కిలి చెడ్డది. అందుచే మీ మీ పనులు చూచుకొనుటకు వెళ్లుడు” అనెను.
2.50.6.
అనుష్టుప్.
తేఽభివాద్య మహాత్మానమ్
కృత్వా చాపి ప్రదక్షిణమ్।
విలపన్తో నరా ఘోరమ్
వ్యతిష్ఠంత క్వచిత్ క్వచిత్॥
టీక:-
తే = ఆ; అభివాద్య = గౌరవముగా నమస్కరించుచు; మహాత్మానమ్ = మహాత్ముడైన రామునకు; కృత్వా = చేసి; చాపి = అంతేకాక; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణమూ; విలపన్తః = ఏడ్చుచు; నరా = వారందరు; ఘోరమ్ = భయంకరముగా; వ్యతిష్ఠంత = నిలిచి; క్వచిత్ క్వచిత్ = అక్కడక్కడే
భావం:-
వారందరును మహాత్ముడైన ఆ రామునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి, ఘోరముగా ఏడ్చుచు, అక్కడక్కడనే నిలచి, రాముని చూచుచుండిరి.
2.50.7.
అనుష్టుప్.
తథా విలపతాం తేషామ్
అతృప్తానాం చ రాఘవః।
అచక్షుర్విషయం ప్రాయాత్
యథార్కః క్షణదాముఖే॥
టీక:-
తథా = ఈ విధముగా; విలపతాం = విలపించుచు; తేషామ్ = వారు; అతృప్తానాం = తృప్తి చెందక; చ = మఱియు; రాఘవః = రాముడు; అచక్షుః = దర్శనమునకు; విషయం = తృప్తి చెందుట; ప్రాయాత్ = వెళ్లిపోయెను; యథా = వలె; అర్కః = సూర్యుడు; క్షణదా = రాత్రి; ముఖే = ప్రారంభమునకు
భావం:-
ఆ జనులందరు రామ దర్శనమునకు తృప్తి చెందక, ఆ విధముగా విలపించుచుండగా, రాత్రి ప్రారంభమున సూర్యుడు వలె, రాముడు వారి కండ్లకు కనబడకుండగా వెళ్లిపోయెను.
2.50.8.
అనుష్టుప్.
తతో ధాన్యధనోపేతాన్
దానశీలజనాన్ శివాన్।
అకుతశ్చిద్భయాన్ రమ్యామ్
చైత్యయూపసమావృతాన్॥
టీక:-
తతః = పిమ్మట; ధాన్య = ధాన్యము; ధన = ధనము; ఉపేతాన్ = నిండి ఉన్న; దానశీలజనాన్ = దాన స్వభావము గల ప్రజలతో; శివాన్ = మంగళప్రదమై; అకుతః = ఎక్కడి నుండియు; చిత్ = ఎటువంటి; భయాన్ = భయమును; రమ్యామ్ = మంగళప్రదమై; చైత్య = యజ్ఞశాలలు; యూప = యజ్ఞములకైన కొయ్య స్తంభములు; సమావృతాన్ = నిండి ఉండెను
భావం:-
పిమ్మట పురుషు శ్రేష్ఠుడైన రాముడు కోసల దేశమును దాటెను. ఆ దేశము ధనధాన్యములతో నిండి, మంగళప్రదమై, ఎక్కడి నుండియు ఎట్టి భయము లేక, సుందరముగా ఉండెను. అక్కడ జనులందరు దానస్వభావులు. యజ్ఞములు విరివిగా జరుగుతున్నటవని గుర్తుగా అచ్చటచ్చట యజ్ఞశాలలు, యూప స్తంభములు కనబడుచుండెను.
2.50.9.
అనుష్టుప్.
ఉద్యానామ్రవనోపేతాన్
సంపన్నసలిలాశయాన్।
తుష్టపుష్టజనాకీర్ణాన్
గోకులాకులసేవితాన్॥
టీక:-
ఉద్యాన్ = ఉద్యానవనములు; ఆమ్రవన = మామిడి తోటలు; ఉపేతాన్ = కూడుకున్నవి; సంపన్న = సమృద్ధిగా; సలిలాశయాన్ = నీటితో నిండిన చెరువులు; తుష్ట = బాగుగా; పుష్ట = పోషింపబడిన; జనాకీర్ణాన్ = జనులతో నిండిన; గోకులాకుల = గో సమూహములు; సేవితాన్ = నిండి ఉండెను
భావం:-
అడుగడుగునను ఉద్యానములు, మామిడి తోటలు, జలముతో నిండిన జలాశయములు ప్రకాశించుచుండెను. జనులందరును సంతుష్టులరై ఉండిరి. ఆ దేశమునందంతటను అనేక గోసమూహములు వ్యాపించి ఉండెను.
2.50.10.
అనుష్టుప్.
లక్షణీయాన్నరేంద్రాణామ్
బ్రహ్మఘోషాభినాదితాన్।
రథేన పురుషవ్యాఘ్రః
కోసలానత్యవర్తత॥
టీక:-
లక్షణీయాత్ = ఎచ్చట చూచినను; నరేంద్రాణామ్ = రాజులతోను; బ్రహ్మఘోష = వేదఘోషతోను; అభినాదితాన్ = నిండి యుండిన; రథేన = రథముల చేత; పురుషవ్యాఘ్రః = పురుషులలో ఉత్తముడైన; కోసలాన్ = కోసల దేశము; అత్యవర్తత = దాటెను.
భావం:-
ఎచట చూచినను, రాజసమూహాల ఘోష, వేద ఘోష, రథాలు చేయు వినబడుచుండెను. రాముడు అట్టి కోసల దేశమును రథము మీద దాటెను.
2.50.11.
అనుష్టుప్.
మధ్యేనముదితం స్ఫీతమ్
రమ్యోద్యానసమాకులమ్।
రాజ్యం భోగ్యం నరేంద్రాణామ్
యయౌ ధృతిమతాం వరః॥
టీక:-
మధ్యేనమ్ = మధ్యగా; ముదితం = సంతోషకరమైన; స్ఫీతమ్ = సంపన్నమైన; రమ్య = అందమైన; ఉద్యాన = తోటలతో; సమాకులమ్ = నిండిన; రాజ్యం = రాజ్యమును; భోగ్యం = ఆనందించదగిన; నరేంద్రాణామ్ = రాజులచే; యయౌ = కదిలిన; ధృతిమతాంవరః = ధైర్యవంతులలో శ్రేష్ఠుడైనవాడు.
భావం:-
విశాలమైన ఆ రాజ్యము ఆనందకరమై, సుందరములైన ఉద్యానములతో నిండి ఉండెను. మహా ధైర్యశాలియైన రాముడు రాజులు అనుభవించుటకు శ్రేష్టమైన తన కోసల రాజ్యమును, దాని మధ్య లోనుండి ప్రయాణము చేసి దాటెను.
2.50.12.
అనుష్టుప్.
తతస్త్రిపథగాం దివ్యామ్
శివతోయామశైవలామ్।
దదర్శ రాఘవో గంగామ్
పుణ్యామృషినిషేవితామ్॥
టీక:-
తతః = ఆ; త్రిపథగాం = మూడు మార్గములలో ప్రవహించునది, గంగానది; దివ్యామ్ = పవిత్రమైన; శివ = మంగళకరమైన, బిగ్గరగా శబ్దముచేయు; తోయామ్ = నీరు కలది; అశైవలామ్ = నాచు లేనిది; దదర్శ = చూచెను; రాఘవః = రాముడు; గంగామ్ = గంగానదిని; పుణ్యామ్ = పవిత్రమైనది; ఋషి = ఋషులచే; నిషేవితామ్ = సేవింపబడునది
భావం:-
కోసల దేశమును దాటిన పిమ్మట రాముడు, సుందరమైనదీ, మంగళకకర జలప్రవాహ శబ్దములు కలదీ, నాచు లేనిదీ, పవిత్రమైనది, ఋషులు సేవించునదీ అగు ఆ గంగానదిని దర్శించెను.
2.50.13.
అనుష్టుప్.
ఆశ్రమైరవిదూరస్థైః
శ్రీమద్భిస్సమలంకృతామ్।
కాలేఽప్సరోభిర్హృష్టాభిః
సేవితామ్భోహ్రదాం శివామ్॥
టీక:-
ఆశ్రమైః = సన్యాసుల చేత; అవిదూరస్థైః = దగ్గరా ఉన్నవి; శ్రీమద్భిః = శోభోపేతమైన; సమలంకృతామ్ = అలంకరించబడిన; కాలే = తగిన సమయాలలో; అప్సరోభిః = అప్సర స్త్రీలచే; హృష్టాభిః = సంతోషముతో కూడిన; సేవితామ్ = సేవించబడిన; అంభః = జలములుగల; హ్రదాం = హ్రదములలోని; శివామ్ = మంగళప్రదమైన
భావం:-
ఆ గంగానది సమీపమున ఉన్న అందమైన ఆశ్రమములు, ఆ నదికి అలంకారములుగా ఉండెను. సంతోషముతో కూడిన అప్సర స్త్రీలు తగిన సమయము లందు వచ్చి మంగళప్రదమైన గంగానదీ మడుగులలో స్నానము చేయుచుందురు.
2.50.14.
అనుష్టుప్.
దేవదానవగంధర్వైః
కిన్నరైరుపశోభితామ్।
నానాగంధర్వపత్నీభి
స్సేవితాం సతతం శివామ్॥
టీక:-
దేవదానవ = దేవతలు, దానవులు; గంధర్వైః = గంధర్వులు; కిన్నరైః = కిన్నరులు; ఉపశోభితామ్ = ప్రకాశింపచేయుదురు; నానా = చాలా మంది; గంధర్వపత్నీభిః= గంధర్వుల భార్యలు; సేవితాం = సేవించుదురు; సతతం = నిరంతరము; శివామ్ = శుభప్రదమైన
భావం:-
శుభప్రదమైన గంగను దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులతో కూడ ప్రకాశించుచుండును. గంధర్వుల భార్యలు చాలామంది ఈ నదిని సర్వదా సేవించుచుందురు.
2.50.15.
అనుష్టుప్.
దేవాక్రీడశతాకీర్ణామ్
దేవోద్యానశతాయుతామ్।
దేవార్థమాకాశగమామ్
విఖ్యాతాం దేవపద్మినీమ్॥
టీక:-
దేవా = దేవతల; క్రీడ = ఆటల; శతాః = వందలకొలదీతో; ఆకీర్ణామ్ = ఎడములేక నిండియున్న; దేవోద్యాన = దేవ +ఉద్యాన, దివ్యమైన ఉద్యానములు; శతాయుతామ్ = వందల కొలదీ; దేవాః = దేవతల; అర్థమ్ = కొరకై; ఆకాశ = ఆకాశమునందు; గమామ్ = ప్రవహించుటచే; విఖ్యాతాం = ప్రసిద్ధి చెందినది; దేవ పద్మినీమ్ = దేవనదని.
భావం:-
ఈ నదియందంతటను వందలకొలది దేవతలు విహరించుటతే కిక్కిరిసిన ఉద్యానములు వందలకొలదీ ఉన్నవి. దేవతల కొరకై ఆకాశమునందు ప్రవహించుటచే ఇది దేవనది అని ప్రసిద్ధమైనది.
2.50.16.
అనుష్టుప్.
జలాఘాతాట్టహాసోగ్రామ్
ఫేననిర్మలహాసినీమ్।
క్వచిద్వేణీకృతజలామ్
క్వచిదావర్తశోభితామ్॥
టీక:-
జలాః =జలముప్రవాహలచే; ఆఘాత = కొట్టబడిన; జఅట్టహాస = బిగ్గర శబ్దములచో; ఉగ్రామ్ = భయంకరముగా ఉన్నది; ఫేన = నురుగు; నిర్మలహాసినీమ్ = తెల్లని మందహాసముతో; హాసినీమ్ = తెల్లని మందహాసముతో; క్వచిత్ = కొన్నిచోట్ల; వేణీకృత జలామ్ = ప్రవాహము చీలి మప్పేటగా ప్రవహిస్తూ, జడల కుచ్చులను పోలిఉన్నది; క్వచిత్ = కొన్ని చోట్ల; ఆవర్త = సుడిగుండములచే; శోభితామ్ = సుందరమైనది
భావం:-
ఆ నది కొన్నిచోట్ల నీటి అట్టహాసముచే భయంకరముగా ఉన్నది. కొన్ని చోట్ల నురుగు అనెడు తెల్లని మందహాసముతో కూడి ఉన్నది. కొన్ని చోట్ల కొన్నిచోట్ల సుడులతో శోభించుచుండెను.
2.50.17.
అనుష్టుప్.
క్వచిత్ స్తిమితగంభీరామ్
క్వచిద్వేగజలాకులామ్।
క్వచిద్గపరనిర్ఘోషామ్
క్వచిద్భైరవనిస్వనామ్॥
టీక:-
క్వచిత్ = కొన్ని చోట్ల; స్తిమితః = నిశ్చలముగానున్నది; గంభీరామ్ = గంభీరముగాను అనగా లోతుగానున్నది; క్వచిత్ = కొన్నిచోట్ల; వేగ = వేగముగాను; జలాః = జలములు; ఆకులామ్ = కలతచెందినదిగాను నున్నది; క్వచిత్ = కొన్ని చోట్ల; గంభీర = గాఢమైన; నిర్ఘోషామ్ = గర్జించే ధ్వని కలది; క్వచిత్ = కొన్ని చోట్ల; భైరవ = భయంకరమైన; నిస్వనామ్ = శబ్దముచేయునది
భావం:-
ఆ గంగా నదీ జలము, కొన్ని చోట్ల నిశ్చలముగా, లోతుగా ఉండెను. కొన్ని చోట్ల వేగముగానూ కలతచెందినదిగాను ప్రవహించుచుండెను. దాని ధ్వని కొన్ని చోట్ల గంభీరముగాను, మరికొన్ని చోట్ల భయంకరముగాను ఉండెను.
2.50.18.
అనుష్టుప్.
దేవసంఘాప్లుతజలామ్
నిర్మలోత్పలశోభితామ్।
క్వచిదాభోగపులినామ్
క్వచిన్నిర్మలవాలుకామ్॥
టీక:-
దేవసంఘ = దేవతలందరు; ఆప్లుత = మునిగి; జలామ్ = నీటిలో; నిర్మల = స్వచ్ఛమైన; ఉత్పల = తామరలచే; శోభితామ్ = శోభిల్లుతున్నది; క్వచిత్ = కొన్నిచోట్ల; ఆభోగ = పరిపూర్ణముగా, విస్తారముగా యున్న; పులినామ్ = ఇసుకతిన్నెలు కలది; క్వచిత్ = కొన్ని చోట్ల; నిర్మల = తెల్లని; వాలుకామ్ = ఇసుకతో కప్పబడినది
భావం:-
దేవతలందరును, ఈ నదీ జలములో స్నానమాడుచుండిరి. అది తెల్లని కలువలతో ప్రకాశించుచుండెను. కొన్ని చోట్ల నిండుగా విశాలముగా ఉన్న ఇసుక తిన్నెలు ఉండెను. కొన్ని చోట్ల తెల్లని ఇసుక వ్యాపించి ఉండెను.
2.50.19.
అనుష్టుప్.
హంససారససంఘుష్టామ్
చక్రవాకోపకూజితామ్।
సదా మదైశ్చ విహగైః
అభిసన్నాదితాంతరామ్॥
టీక:-
హంస = హంసల; సారస = సారస పక్షుల, బెగ్గురు పక్షుల; సంఘుష్టామ్ = ధ్వనులుగలది; చక్రవాక = చక్రవాక పక్షుల; ఉపకూజితామ్ = కేకలతో; సదా మదైః = నిరంతరం మదించి ఉన్న; చ = ఇంకా; విహగైః = పక్షులుగలది; అభిసత్ = కొట్టుమిట్టాడుతూ; నాదిత = రొదచే; అంతరామ్ = మధ్యభాగము
భావం:-
ఈ నదియందు హంసలు, సారస పక్షులుకూతలు, చక్రవాకములల కూజితములు కలిగి ఉండెను. ఈ నదిలో ఎల్లపుడూ మదించి ఉన్న పక్షుల రొదచే ప్రతిధ్వనించుచుండెను.
2.50.20.
అనుష్టుప్.
క్వచిత్తీరరుహైర్వృక్షైః
మాలాభిరివశోభితామ్।
క్వచిత్ఫుల్లోత్పలచ్ఛన్నామ్
క్వచిత్పద్మవనాకులామ్॥
టీక:-
క్వచిత్ = కొన్నిచోట్ల; తీర = ఒడ్డున పెరుగుచున్న; రుహైః = పెరుగుచున్న; వృక్షైః = చెట్లతో; మాలాభిః = పూలదండల; ఇవ = వలె; శోభితామ్ = అలంకరించబడినది; క్వచిత్ = కొన్ని చోట్ల; ఫుల్ల = పూర్తిగా విచ్చుకున్న; ఉత్పలత్ = తామరలతో; ఛన్నామ్ = కప్పబడిన; క్వచిత్ = కొన్నిచోట్ల; పద్మ = పద్మముల; వనః = గుంపుతో; ఆకులామ్ = నిండినది.
భావం:-
కొన్ని చోట్ల తీరములపై మొలచిన వృక్షముల పంక్తులు, మాలల వలె ఆ గంగను అలంకరించినట్లు ఉండెను. కొన్ని చోట్ల బాగా వికసించిన కలువలు, మరి కొన్ని చోట్ల పద్మవనములు వ్యాపించి ఉండెను.
2.50.21.
అనుష్టుప్.
క్వచిత్కుముదషణ్డైశ్చ
కుడ్మలైరుపశోభితామ్।
నానాపుష్పరజోధ్వస్తామ్
సమదామివ చ క్వచిత్॥
టీక:-
క్వచిత్ = కొన్నిచోట్ల; కుముద = తెల్లని కలువల; షణ్డైః = తామర లోనగువాని సమూహములతో; చ = మరియు; కుడ్మలైః = మొగ్గలతో; ఉపశోభితామ్ = శోభిల్లుచుండెను; నానా = వివిధములైన; పుష్పరజః = పూల పరాగముతో; ఉధ్వస్తామ్ = కప్పబడిపోయి; సమదామ్ = మత్తెక్కెనా; ఇవ = అన్నట్లు; చ = ఇంకా; క్వచిత్ = కొన్నిచోట్ల
భావం:-
కొని చోట్ల తెల్లని కలువల గుంపులు, వాటి మొగ్గలు ఈ నదిని ప్రకాశింపచేయుచుండెను. కొన్ని చోట్ల అనేక విధములైన పూల పరాగములతో కప్పబడిపోయి, మత్తెక్కినట్లు కనబడుచుండెను.
2.50.22.
అనుష్టుప్.
వ్యపేతమలసంఘాతామ్
మణినిర్మలదర్శనామ్।
దిశాగజైర్వనగజై
ర్మత్తైశ్చ వరవారణైః॥
టీక:-
వ్యపేత = తొలగించిన; మల = మలినమును; సంఘాతామ్ = సమూహము; మణి = మణులు; నిర్మల = నిర్మలముగా; దర్శనామ్ = కనపడుచుండెను; దిశాగజైః = దిగ్గజములు; వనగజైః = అడవి ఏనుగులు; మత్తైశ్చ = మదించినవి; వర = శ్రేష్ఠమైన; వారణైః = ఏనుగులు
భావం:-
ఆ గంగానదిజలములు మణుల వలె నిర్మలముగా కనబడుచుండెను. దిగ్గజములు, మదించిన వన గజములు, శ్రేష్ఠమైన గజములు
2.50.23.
అనుష్టుప్.
దేవోపవాహ్యైశ్చ ముహుః
సన్నాదితవనాంతరామ్।
ప్రమదామివ యత్నేన
భూషితాం భూషణోత్తమైః॥
టీక:-
దేవః= దేవతల; ఉపవాహ్యః = వాహనములు; చ = ఇంకా; ముహుః = మాటిమాటికి; సన్నాదిత = చేయుతున్న ధ్వనికలి; వనా = అడవి; అంతరామ్ = లోపలంతా; ప్రమదామ్ = స్త్రీ; ఇవ = వలె;యత్నేన = కోరి, ప్రయత్న పూర్వకముగా; భూషితాం = అలంకరించినది; భూషణోత్తమైః = శ్రేష్ఠమైన అభరణములతో
భావం:-
గంగానదిలో దేవతల వాహనాలు మాటిమాటికి చేయుచున్న ధ్వనితో అడవి అంతటనూ ప్రతిధ్వనించుచుండెను. ఉత్తమమైన ఆభరణములుకోరి అలంకరించుకున్న స్త్రీ వలె ఉండెను. ఎలాగంటే.
2.50.24.
అనుష్టుప్.
ఫలైః పుష్పైః కిసలయైః
వృతాం గుల్మైర్ద్విజైస్తథా।
శింశుమారైశ్చ నక్రైశ్చ
భుజంగైశ్చ నిషేవితామ్॥
టీక:-
ఫలైః = ఫలములు; పుష్పైః = పువ్వులు; కిసలయైః = లేత ఆకులు; వృతాం = కలది; గుల్మైః = పొదలు; ద్విజైః = పక్షులు; తథా = ఆ; శింశుమారైః = నీరుకోతులు; నక్రైః = మొసళ్లు; చ = మఱియు; భుజంగైః = సర్పములు; చ = మఱియు; నిషేవితామ్ = కొలువబడుచున్నది.
భావం:-
ఆ గంగా నదీ ప్రాంతమందంతటను వ్యాపించిన ఉన్న ఫలములు, పుష్పములు, చిగుళ్లు, పొదలు, పక్షులతోనూ, నివసిస్తున్న మొసళ్లు, మకరములు, సర్పములతో, ఆభరణములుకోరి అలంకరించుకున్న స్త్రీ వలె ఉండెను.
*గమనిక:-
(1) శింశుమారము- నీటిలో బల్లి ఆకారములో ఉండే జంతువు, దీని పళ్ళు చాలా పదునుగా ఉండును. పర్యాయపదములు ఉలూపి, మొసలి. (2) నక్రము- బల్లిజాతికి చెందిన నీటిలో వుండే క్రూరజంతువు. పర్యాయపదలు : అంబుకంటకం, గోముఖం, జలకంఠకం, జలజిహ్వం, పలాంగం, మకరం, మొసలి
2.50.25.
అనుష్టుప్.
విష్ణుపాదచ్యుతాం దివ్యామ్
అపాపాం పాపనాశినీమ్।
తాం శంకరజటాజూటాత్
భ్రష్టాం సాగరతేజసా॥
టీక:-
విష్ణుపాద = విష్ణువు యొక్క పాదము నుండి; చ్యుతాం = వెలువడినది; దివ్యామ్ = దేవలోకమునకు సంబంధించినది; అపాపాం = పాపములు లేనిది; పాపనాశినీమ్ = పాపములను తొలగించునది; తాం = ఆ శంకర = శివుని; జటాజూటాత్ = జటాజూటము నుండి; భ్రష్టాం = నేలపై పడినది; సాగర = సగర వంశస్థుడైన భగీరథ చక్రవర్తి యొక్క; తేజసా = శక్తి ద్వారా
భావం:-
విష్ణుపాదము నుండి వెలువడినది, దేవలోకమునకు సంబంధించినది, పాపములు లేనిది అయిన ఆ గంగానది పాపములను తొలగించునది, భగీరథుని తపస్సుచే శంకరుని జటాజూటము నుండి నేలపైకి అవతరించినది.
2.50.26.
అనుష్టుప్.
సముద్రమహిషీం గంగామ్
సారసక్రౌంచనాదితామ్।
ఆససాద మహాబాహుః
శృంగిబేరపురం ప్రతి॥
టీక:-
సముద్ర = సముద్రము యొక్క; మహిషీం = మహిషియైన; గంగామ్ = గంగానదిని; సారస = సారస పక్షులు; క్రౌంచ = క్రౌంచ పక్షులు; నాదితామ్ = ధ్వని చేయుచుండగా; ఆససాద = చేరెను; మహాబాహుః = రాముడు; శృంగిబేరపురం = శృంగిబేర పురము; ప్రతి = పరిసరములు
భావం:-
సారస పక్షులు, క్రౌంచ పక్షులు, ఆ నదియందు ధ్వని చేయుచుండును. అట్టి సముద్ర మహిషియైన గంగను, రాముడు శృంగిబేర పురము వద్ద సమీపించెను.
*గమనిక:-
శృంగిబేరము- ఇది రాముని చెలిఁకాడు అగు గుహుఁడు అను ఎఱుకురాజుయొక్క పట్టణము. గంగాతీరమున ఉండును. పురాణనామచంద్రిక. శృంగిబేరము, శృంగబేరము అనగా అల్లము, ఆర్ద్రకము ఆంధ్రశబ్దరత్నాకరము.
2.50.27.
అనుష్టుప్.
తామూర్మికలిలావర్తామ్
అన్వవేక్ష్య మహారథః।
సుమంత్రమబ్రవీత్సూతమ్
“ఇహైవాద్య వసామహే॥
టీక:-
తామ్ = ఆ గంగానది; ఊర్మికలిల ఆవర్తామ్ = అలలైనా చొరరాని సుడిగుండములుకలదానిని; అన్వవేక్ష్య = చూచెను; మహారథః = మహారథుడుగు రాముడు; సుమంత్రమ్ = సుమంత్రునితో; అబ్రవీత్ = పలికెను; సూతమ్ = సూతుడు అయిన; ఇహైవ = ఇక్కడే; అద్య = ఈ రోజు; వసామహే = నివసించెదము
భావం:-
తరంగములైనా చొరలేనంతటి సుడిగుండములు కల ఆ నదిని చూచిన పిమ్మట, రాముడు సారథిౖయెన సుమంత్రునితో “నేడు ఇచటనే నివసించెదము.
2.50.28.
అనుష్టుప్.
అవిదూరాదయం నద్యా
బహుపుష్పప్రవాలవాన్।
సుమహానింగుదీవృక్షో
వసామోఽత్రైవ సారథే!॥
టీక:-
అవిదూరాత్ = దూరము కాదు; అయం = ఈ; నద్యా = నది నుండి; బహు = అనేక; పుష్ప = పువ్వులు; ప్రవాలవాన్ = రెమ్మలు; సుమహాన్ = పెద్దదైన; ఇంగుదీవృక్షః = పవిత్రమైన గార చెట్టు; వసామః = ఆగెదము; అత్రైవ = ఇక్కడనే; సారథే = ఓ సుమంత్రా
భావం:-
ఈ నదికి దగ్గరనే అనేకమైన పుష్పములతో చివుళ్లతో నిండిన చాల పెద్దదైన గార చెట్టు ఉన్నది. ఇక్కడనే ఆగెదము.
2.50.29.
అనుష్టుప్.
ద్రక్ష్యామస్సరితాం శ్రేష్ఠామ్
సమ్మాన్యసలిలాం శివామ్।
దేవదానవగంధర్వ
మృగమానుషపక్షిణామ్॥
టీక:-
ద్రక్ష్యామః = చూచెదము; సరితాం = గంగానది; శ్రేష్ఠామ్ = శ్రేష్ఠమైన; సమ్మాన్య = పూజింపదగిన; సలిలాం = జలములు; శివామ్ = శుభమును; దేవ = దేవతలకు; దానవ = దానవులకు; గంధర్వ = గంధర్వులకు; మృగః = మృగములకు; మానుషః = మనుష్యులకు; పక్షిణామ్ = పక్షులకు
భావం:-
పూజింపదగిన జలము గల నదీ శ్రేష్ఠమైన ఈ గంగానది దేవతలకు, దానవులకు, గంధర్వులకు, మృగములకు, మనుష్యులకు, పక్షులు మున్నగు సర్వులకు శుభమును కల్గించును. అట్టి ఈ నదిని చూచెదము” అని చెప్పెను.
2.50.30.
అనుష్టుప్.
లక్ష్మణశ్చ సుమంత్రశ్చ
బాఢమిత్యేవ రాఘవమ్।
ఉక్త్వా తమింగుదీవృక్షమ్
తదోపయయతుర్హయైః॥
టీక:-
లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; సుమంత్రః = సుమంత్రుడు; చ = మఱియు; బాఢమ్ = సరే అలాగే; ఇతి = అని; ఏవ = నిశ్చయాత్మకముగా; రాఘవమ్ = రాముని; ఉక్త్వా = పలికి; తామ్ = వారు; ఇంగుదీవృక్షమ్ = గారచెట్టు; తత్ = దాని; ఉపయయతుః = సమీపించిరి; హయైః = రథము నుండి
భావం:-
లక్ష్మణుడు, సుమంత్రుడు కూడ రాముని మాట అంగీకరించి, ఆ రథమును ఆ గారచెట్టు వైపునకు తోడ్కొని వెళ్లిరి. ఆ వృక్షము సమీపించి రాముడు, సీత, లక్ష్మణుడు రథము నుండి దిగిరి.
*గమనిక:-
గార లేక గారచెట్టు ముండ్లను కలిగి ఉండే ఒక బిరుసైన సతతహరిత వృక్షం. సాధారణంగా ఇది బహిరంగ ప్రదేశాలైన భారత ద్వీపకల్పంలోని ఇసుక మైదానాల్లో, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, భారతదేశం యొక్క పొడి ప్రాంతాల్లో పెరుగుతుంది. మహా భారతంలో దీనిని గురించి సరస్వతీనది తీరంలో పెరిగేచెట్టుగా పేర్కొనబడింది. చెట్టు యొక్క బెరడు, పండు విత్తనం, ఆకులు, విత్తనాల నుండి తీసిన నూనె ఔషధ విలువలు కలది
2.50.31.
అనుష్టుప్.
రామోఽభియాయ తం రమ్యమ్
వృక్షమిక్ష్వాకునందనః।
రథాదవాతరత్తస్మాత్
సభార్య స్సహలక్ష్మణః॥
టీక:-
రామః = రాముడు; అభియాయ = సమీపించిన; తం = ఆ; రమ్యమ్ = అందమైన; వృక్షమ్ = చెట్టును; ఇక్ష్వాకునందనః = ఇక్ష్వాకు వంశస్తులకు ఆనందము కలిగించు వాడు; రథాత్ = రథము నుండి; అవతరతః = దిగెను; తస్మాత్ = ఆ; స = కూడా; భార్యః = భార్యతో; సహ = తోపాటు; లక్ష్మణ = లక్ష్మణుడు
భావం:-
ఆ వృక్షము సమీపించిన రాముడు, సీత మఱియు లక్ష్మణులతో పాటు రథము దిగెను.
2.50.33.
అనుష్టుప్.
సుమంత్రోఽప్యవతీర్యాస్మాత్
మోచయిత్వా హయోత్తమాన్।
వృక్షమూలగతం రామమ్
ఉపతస్థే కృతాంజలిః॥
టీక:-
సుమంత్రః = సుమంత్రుడు; అపి = కూడ; అవతీర్య = దిగి; అస్మాత్ = అద్దానిని; మోచయిత్వా = విడిపించి; హయోత్తమాన్ = శ్రేష్ఠమైన గుఱ్ఱములను; వృక్ఖమూల = చెట్టుమొదలును; గతం = చెందిన; రామమ్ = రాముడిని; ఉపతస్తే = సేవించెను; కృతాంజలిః = అంజలిపట్టి ఉన్నవాడు.
భావం:-
సుమంత్రుడు కూడా రథము దిగి,గుఱ్ఱములను రథమునుండి విప్పెను. అంజలి పట్టి, ఆ గారచెట్టు మొదలువద్దకు చేరిన రాముని సమీపించెను.
2.50.34.
అనుష్టుప్.
తత్ర రాజా గుహో నామ
రామస్యాత్మసమస్సఖా।
నిషాదజాత్యో బలవాన్
స్థపతిశ్చేతి విశ్రుతః॥
టీక:-
తత్ర = అక్కడ; రాజా = ఒక రాజు; గుహో నామ = గుహః+ నామః, గుహుడు అను పేరు గలవాడు; రామస్య = రాముని యొక్క; ఆత్మసమాః = ప్రాణసమానుడైనవాడు; సఖా = స్నేహితుడు; నిషాద జాత్యః = ఒక తెగ బోయ కులములో పుట్టిన; బలవాన్ = బలవంతుడు; స్థపతిః= నిషాదుల శ్రేష్ఠుడు, పాలకుడు; చ = ఇంకనూ; అతి = అని; విశ్రుతః = ప్రసిద్ధుడైనవాడు.
భావం:-
అక్కడ రామునకు ప్రాణసమాన బోయజాతి స్నేహితుడు, బలవంతుడు, ఐన గుహుడు అను రాజు ఆ బోయజాతివారికి ప్రభువుగా ప్రసిద్ధుడై ఉండెను.
*గమనిక:-
నిషాదులు- అంగరాజు కొడుకు వేనుడు. అతడు నిరంకుశుడు కావున, విప్రులు అతనిని రూపుమాపిరి. అంత అతనిమీది ప్రేమతో, అతని తల్లి అగు సునీథ, అతని దేహమును తన యోగ శక్తిచే చెడిపోకుండా కాపాడెను. కాని అరాజకమైన దేశబాధలను చూచి, మునులు శవముయొక్క ఊరువులు (తొడలు) మధించారు. ఆ తొడనుండి ఒక బహు కురూపియైన మరుగుజ్జువాడు ఉదయించి “ఏమి చేయుదును” అని అడిగెను. మునులు “నిషీద (కూర్చుండుము)” అనిరి. అందుచేత, అతని పేరు నిషాదుడు అయినది. అతని వంశము వారు నిషాదులను బోయలై పర్వతములలో అడవులలో జీవించసాగిరి. చూ. పోతెభా 4-428 నుండి 4-433 వరకు.
2.50.35.
అనుష్టుప్.
స శృత్వా పురుషవ్యాఘ్రమ్
రామం విషయమాగతమ్।
వృద్ధైః పరివృతోఽమాత్యైః
జ్ఞాతిభిశ్చాభ్యుపాగతః॥
టీక:-
సః = అతడు; శృత్వా = విని; పురుషవ్యాఘ్రమ్ = పురుషులలో ఉత్తముడు; రామం = రాముని గురించి; విషయమ్ = వషయము; ఆగతమ్ = వచ్చినట్లు; వృద్ధైః = వృద్ధులు, పెద్దలు; పరివృతః = చుట్టూఉన్నవాడు; అమాత్యైః = అమాత్యులతోను; జ్ఞాతిభిః = జ్ఞాతులతోను; చ = కూడా; అభ్యుపాగతః = ఎదురు వచ్చెను.
భావం:-
రాముడు తన దేశమునకు వచ్చినట్లు విని, ఆ గుహుడు, పెద్దలూ, అమాత్యులూ, జ్ఞాతులూ కూడా రాగా, రాముని వద్దకు వచ్చెను.
2.50.36.
అనుష్టుప్.
తతో నిషాదాధిపతిమ్
దృష్ట్వా దూరాదుపస్థితమ్।
సహ సౌమిత్రిణా రామః
సమాగచ్ఛద్గుహేన సః॥
టీక:-
తతః = అంతట; నిషాదాధిపతిమ్ = నిసాద రాజుని; దృష్ట్వా = చూచి; దూరాత్ = దూరము నుండియే; ఉపస్థితమ్ = వచ్చుచున్నట్లు; సహ సౌమిత్రిణా = లక్ష్మణునితో కలసి; రామః = రాముడు; సమాగచ్ఛత్ = కలిసెను; గుహేన = గుహుని; సః = అతడు.
భావం:-
అంతట, ఒకతెగ బోయ దొర వచ్చుచున్నట్లు దూరము నుండియే చూచిన రాముడు, లక్ష్మణ సమేతుడై అతనిని కలిసెను.
2.50.37.
అనుష్టుప్.
తమార్తస్సంపరిష్వజ్య।
గుహో రాఘవమబ్రవీత్।।
యథాఽయోధ్యా తథేయం తే।
రామ కిం కరవాణి తే।।
ఈదృశం హి మహాబాహో।
కః ప్రాప్స్యత్యతిథిం ప్రియమ్॥
టీక:-
తమ్ = ఆ; ఆర్తః = ఆర్తిని; సంపరిష్వజ్య = దగ్గరగా కౌగలించుకొని; గుహః = గుహుడు; రాఘవమ్ = రాఘవునితో; అబ్రవీత్ = పలికెను; యథా = ఎటువంటిదో; అయోధ్యా = అయోధ్యా నగరము; తథా = అటువంటిదే; ఇయం = ఈ నగరము; తే = నీ కొరకు; రామః = రాముడు; కిం = ఏమి; కరవాణి = చేయగలను; తే = నీ కొరకు; ఈదృశం హి = అటువంటిదే; మహాబాహో = శక్తివంతమైన భుజబలుడు; కః = ఎవ్వరికైనను; ప్రాప్స్యతి = దొరకునా; అతిథిం = అతిథిని; ప్రియమ్ = ఇష్టుడైనవానిని
భావం:-
దుఃఖితుడై ఉన్న గుహుడు, రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఇట్లనెను “రామా! నీకు ఆ అయోధ్య ఎంతో ఈ నగరముకూడా అంతే. నీకు ఏమి సేవ చేయవలెనో చెప్పుము. చేసెదను. ఓ మహాభుజశాలీ! నీ వంటి ప్రియమైన అతిథి మరెవరికైనా దొరుకునా”
2.50.38.
అనుష్టుప్.
తతో గుణవదన్నాద్యమ్
ఉపాదాయ పృథగ్విధమ్।
అర్ఘ్యం చోపానయత్క్షిప్రమ్
వాక్యం చేదమువాచ హ॥
టీక:-
తతః = అటు పిమ్మట; గుణవత్ = నాణ్యవంతమైన; అన్నాద్యమ్ = అన్న + ఆద్యమ్, అన్నము మొదలైన వండిన పదార్థములను; ఉపాదాయ = తీసుకుని వచ్చి; పృథగ్విధమ్ = పృథక్+ విధమ్, వివిధరకాల పిండివంటలను; అర్ఘ్యమ్ = మిక్కిలి విలువైనవానిని; చ = మఱియు; ఉపానయత్ = తీసుకొని వచ్చి; క్షిప్రమ్ = శీఘ్రముగా; వాక్యం = మాటలను; చ = మఱిన్ని; ఇదమ్ = ఇటువంటివి; ఉవాచ హ = నిశ్చయాత్మకముగ మాట్లాడెను.
భావం:-
పిమ్మట అనేక విధములైన మిక్కిలి విలువైన, నాణ్యమైన అన్నమును మున్నగు ఆహారపదార్థములను వేగముగా తీసుకువచ్చెను.
*గమనిక:-
అర్ఘ్యము- వ్యుత్పత్తి. అర్ఘమ్ అర్హతి – అర్ఘ+యత్, తప్ర., మిక్కిల వెలకలది, పూజకు తగినది, పూజకొఱకైనద.
2.50.39.
అనుష్టుప్.
“స్వాగతం తే మహాబాహో
తవేయమఖిలా మహీ।
వయం ప్రేష్యా భవాన్భర్తా
సాధు రాజ్యం ప్రశాధి నః॥
టీక:-
స్వాగతం = స్వాగతము; తే = మీకు; మహాబాహో = ఓ ఆజానుబాహు; తవ = నీ కొరకు; ఇయమ్ = ఈ; అఖిలా = అన్నియు; మహీ = భూమి; వయం = మేము; ప్రేష్యా = సేవకులము; భవాన్ = మీరు; భర్తా = ప్రభువులు; సాధు = చక్కగా; రాజ్యం = రాజ్యమును; ప్రశాధి నః = పరిపాలింపుము
భావం:-
‘ఆజానుబాహూ! నీకు స్వాగతము. మేము నీకు భృత్యులము. నీవు రాజువు. ఈ మా రాజ్యమను పరిపాలింపుము.
2.50.40.
అనుష్టుప్.
భక్ష్యం భోజ్యం చ పేయం చ
లేహ్యంచేదముపస్థితమ్।
శయనాని చ ముఖ్యాని
వాజినాం ఖాదనం చ తే”॥
టీక:-
భక్ష్యం = భక్ష్యములు; భోజ్యం చ = భోజ్యములు మఱియు; పేయ = మఱియు; చ = మఱియు; లేహ్యం = లేహ్యములు; చ = మఱియు; ఇదమ్ = ఇవిగో; ఉపస్థితమ్ = సిద్ధముగా ఉన్నవి; శయనాని = శయ్యలు; చ = మఱియు; ముఖ్యాని = అద్భుతమైన; వాజినాం = గుఱ్ఱములు; ఖాదానం = తినుటకు; చ = మఱియు; తే = మీ కొరకు.
భావం:-
పంచభక్ష్యపరమాన్నములు, చక్కటి శయ్యలు మీకొఱకు మఱియు గుఱ్ఱముల మేతలు (పశుగ్రాసము) సర్వం ఇక్కడే సిద్ధముగ నున్నవి.”
*గమనిక:-
(1) భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పేయ అను ఐదు విధములైన ఆహార పదార్థములు (భోజన పదార్థములు మఱియు పిండివంటలు). ఇందు నాలుగు సూచించబడనవి. భక్ష్య- తినదగినది అప్పము వంటివి, భోజ్య- భుజింపదగినది, వరి అన్నము, పులుహోర వంటివి, పేయ- త్రాగునవి, పానీయములు, నీరు, పాలు వంటివి. లేహ్యం- నాలికతో పుచ్చుకొనదగినది, నాకదగినది, తేనె, పాయసము వంటివి. (2) వాజి- వడిగలది, గుఱ్ఱము, బాణము, పక్షి.
2.50.41.
అనుష్టుప్.
ఏవం బ్రువాణం తు గుహమ్
రాఘవః ప్రత్యువాచ హ।
అర్చితాశ్చైవ హృష్టాశ్చ
భవతా సర్వథా వయమ్॥
టీక:-
ఏవం = ఈ విధముగా; బ్రువాణం = మాటలను విని; తు = విశేషముగా; గుహమ్ = గుహుని; రాఘవః = రాముడు; ప్రత్యువాచ హ = సమాధానమిచ్చెను; అర్చితాఃశ్చ + ఏవ = పూజించితివి; చ = ఇంకా; ఏవ = నిశ్చయుంగా; హృష్టాః = సంతృప్తపరచబడితిని; చ = మఱియు; భవతా = నీ ద్వారా; సర్వథా = సర్వవిధముల; వయమ్ = మమ్ములను.
భావం:-
గుహుని మాటలు విని రాముడు = ‘మమ్ములను సర్వవిధములుగా పూజించితి, తృప్తిపరచితివి. అందుకు చాలా సంతోషించుచున్నాము’ అనెను.
*గమనిక:-
హృష్ట- హృష్+క్త, ప్రీతః జాతహర్షః] ప్రీతినొందినవాడు; సంతోషించినవాడు. సంస్కృతాంధ్ర నిఘంటువు, 1. ఇష్టప్రాప్తిజనితానందయుక్తః -2. రోమాంచితః -3. విస్మితః -4. హృషితః -5. ప్రహసితః. (తె.) 4. సంతోషపడ్డవాఁడు. సర్వశబ్దసంబోధిని
2.50.42.
అనుష్టుప్.
పద్భ్యామభిగమాచ్చైవ
స్నేహసందర్శనేన చ।
భుజాభ్యాం సాధు పీనాభ్యామ్
పీడయన్వాక్యమబ్రవీత్॥
టీక:-
పద్భ్యామ్ = నడచి; అభిగమాచ్చైవ = ఎదురు వచ్చినావు; స్నేహ = స్నేహమును; సందర్శనేన = సందర్శనము వలన; చ = మఱియు; భుజాభ్యాం = బాహువులతో; సాధు = ఉదారమైన; పీనాభ్యామ్ = బలమైన; పీడయత్ = ఒత్తి; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను
భావం:-
‘నీవు మాకు ఎదురు వచ్చుట చేతను, స్నేహమును ప్రదర్శించుట చేతను కూడాను సంతోషించితి. తన పెద్దవైన బలమైన చేతులతో గట్టిగా రాముడు అతనిని కౌగలించుకొని ఇట్లు పలికెను.
2.50.43.
అనుష్టుప్.
“దిష్ట్యా త్వాం గుహ పశ్యామి
హ్యరోగం సహ బాంధవైః।
అపి తే కుశలం రాష్ట్రే
మిత్రేషు చ ధనేషు చ॥
టీక:-
దిష్ట్యా = చూడగలుగుచున్నాను; త్వాం = మిమ్ము; గుహ = గుహుని; పశ్యామి = చూచుచునే ఉన్నాను; హి = నిశ్చయంగా; అరోగం = మంచి ఆరోగ్యముతో; సహ = కూడి; బాంధవైః = బంధువులతో కలిసి; అపి = కూడా; తే = మీ యొక్క; కుశలం = క్షేమము; రాష్ట్రే = రాజ్యమునకు; మిత్రేషు చ = నీ మిత్రులకు; చ = మఱియు; ధనేషు = నీ ధనమునకు; చ = మఱియు.
భావం:-
‘నీవు, నీ బంధువులు, ఆరోగ్యముగా సుఖముగా ఉండగా, నా భాగ్యవశముచే చూడగలుగుచున్నాను. నీ రాష్ట్రమునకు, నీ మిత్రులకు, ధనమునకు క్షేమమే కదా.
2.50.44.
అనుష్టుప్.
యత్త్విదం భవతా కించిత్
ప్రీత్యా సముపకల్పితమ్।
సర్వం తదనుజానామి
న హి వర్తే ప్రతిగ్రహే॥
టీక:-
యత్ = దీని; తు = ద్వారా; ఇదం = ఈ; భవతా = నీ చేత; కించిత్ = కొద్ది మాత్రము; ప్రీత్యా = ఇష్టపూర్వకముగా; సముపకల్పితమ్ = విస్తారముగా అమర్చబడి ఉంది; సర్వం = అంతయు; తత్ = అది; అనుజానామి = నాకు తెలుసు; న హి = లేనే లేను; వర్తే = అట్టి స్థితిలో; ప్రతిగ్రహే = స్వీకరించుట
భావం:-
నీవు ప్రేమపూర్వకముగా నాకై ఏర్పరచిన దానిని అంతను నీకే ఇచ్చివేయుచున్నాను. నేను ఇపుడు ఎవ్వరేమి ఇచ్చినా దానిని తీసుకొను స్థితిలో లేను.
2.50.45.
అనుష్టుప్.
కుశచీరాజినధరమ్
ఫలమూలాశినం చ మామ్।
విద్ధి ప్రణిహితం ధర్మే
తాపసం వనగోచరమ్॥
టీక:-
కుశ = దర్భలను; చీర = నారచీరను; అజినృ = చర్మమును; ధరమ్ = ధరించినవాడిని; ఫల = పండ్లు; మూల = దుంపలు; అశినృంమ్ = ఆహారముగా కలవానిగా; చ = రూడా; మామ్ = నన్ను; విద్ధి = తెలుసుకొనుము; ప్రణిహితం = ప్రతిజ్ఞ ప్రకారము; ధర్మే = ధర్మనిరతుడనైన; తాపసం = మునిని; వనగోచరమ్ = వనములలో నివసించు.
భావం:-
ఇపుడు నేను దర్భలు నారచీర చర్మములను ధరించు వాడనని, పండ్లు దుంపలు తినువాడనని, వనములో నివసించు, ధర్మనిరతుడనైన మునిని అని తెలుసుకొనుము.
2.50.46.
అనుష్టుప్.
అశ్వానాం ఖాదనేనాహమ్
అర్థీ నాన్యేన కేనచిత్।
ఏతావతాఽత్ర భవతా
భవిష్యామి సుపూజితః!॥
టీక:-
అశ్వానాం = గుఱ్ఱములకు; ఖాదనేన = ఆహారము మాత్రమే; అహమ్ = నేను; అర్థీ = కోరుచున్నాను; న = వద్దు; అన్యేన = అంతకంటె ఇతరమైనది; కేన= దేనిని; చిత్ = ln;g’nsog.; ఏతావతా = ఇంత మాత్రమే; అత్ర = ఆ విధముగా; భవతా = చేసినచో; భవిష్యామి = అట్లే అగును; సుపూజితః = మిక్కిలిగౌరవింపబడువాడా.
భావం:-
ఇపుడు నేను కోరెడిదెల్ల అశ్వములకు ఆహారము మాత్రమే. మరేదియు కోరను. ఇవి ఇచ్చినచో చాలును నాకు బాగుగా గౌరవించి చేసినట్లే.
2.50.47.
అనుష్టుప్.
ఏతే హి దయితా రాజ్ఞః
పితుర్దశరథస్య మే।
ఏతైస్సువిహితైరశ్వై
భవిష్యామ్యహమర్చితః”॥
టీక:-
ఏతే = ఇవి; హి = ఐతే; దయితా = ప్రియమైనవి; రాజ్ఞః = మహారాజునకు; పితుః = తండ్రిగారైన; దశరథస్య = దశరథునకు; మే = నా యొక్క; ఏతైః = ఈ గుఱ్ఱములు; సువిహితైః = బాగుగా చూచుకున్నచో; అశ్వై = గుఱ్ఱములను; భవిష్యామి = అట్లే అగును; అహమర్చితః = నన్ను పూజించినట్లే
భావం:-
ఈ గుఱ్ఱములు అంటే మా తండ్రిగారైన దశరథ మహారాజుకు ఎంతో ప్రీతి. వీటిని బాగుగా చూచుకొన్నచో నన్ను పూజించినట్లే.” అని రాముడనెను
2.50.48.
అనుష్టుప్.
“అశ్వానాం ప్రతిపానం చ
ఖాదనం చైవ సోఽన్వశాత్”।
గుహస్తత్రైవ పురుషామ్
స్త్వరితం దీయతామితి॥
టీక:-
అశ్వానాం = గుఱ్ఱములకు; ప్రతిపానం = త్రాగుటకు నీరు; చ = మఱియు; ఖాదనమ్ = మేయుటకు గడ్డి దాణా; చ = మఱియు; ఏవ = వంటివి; సః = అతడు; అన్వశాత్ = ఆజ్ఞాపించెను; గుహః = గుహుడు; తత్రైవ = ఆ ప్రదేశములో; పురుషామ్ = వారిని; త్వరితం = శీఘ్రముగా; దీయతామ్ = ఈయబడుగాక; ఇతి = అని.
భావం:-
ఈ గుఱ్ఱములకు తాగుటకు నీరు,కుడితి మఱియు మేయుటకు గడ్డి, దాణా మున్నగు శీఘ్రముగా ఇవ్వండి. అని గుహుడు అక్కడున్నవారిని ఆజ్ఞాపించెను.
2.50.49.
అనుష్టుప్.
తతశ్చీరోత్తరాసంగః
సంధ్యామన్వాస్య పశ్చిమామ్।
జలమేవాదదే భోజ్యమ్
లక్ష్మణేనాఽఽహృతం స్వయమ్॥
టీక:-
తతః = అప్పుడు; చీర = నారచీరను; ఉత్తర = ఉత్తరీయమునృ; ఆసంగః = ధరించినవాడై; సంధ్యామ్ = సాయంత్రపు సంధ్యకు; అన్వాస్య = పూజించి; పశ్చిమామ్ = పశ్చిమమునకు; జలమేవ = నీటిని మాత్రమే; ఆదదే = పట్టినది; భోజ్యమ్ = ఆహారము కొరకు; లక్ష్మణేనా = లక్ష్మణునిచే; ఆహృతం = తీసుకుని వచ్చిన; స్వయమ్ = తాను
భావం:-
పిదప రాముడు నారచీరను ఉత్తరీయమును ధరించి, సాయంకాల సంధ్యను అర్చించి, స్వయముగా లక్ష్మణుడు తీసుకొని వచ్చిన ఉదకమును మాత్రమే ఆహారముగా గ్రహించెను.
2.50.50.
అనుష్టుప్.
తస్య భూమౌ శయానస్య
పాదౌ ప్రక్షాల్య లక్ష్మణః।
సభార్యస్య తతోఽభ్యేత్య
తస్థౌ వృక్షముపాశ్రితః॥
టీక:-
తస్య = రాముని; భూమౌ = నేల మీద; శయానస్య = పరుండినవాని యొక్క; పాదౌ = పాదద్వయములను; ప్రక్షాల్య = కడిగెను; లక్ష్మణః = లక్ష్మణుడు ; సభార్యస్య = భార్య అయిన సీతతో పాటు; తతః = అప్పుడు; అభ్యేత్య = వచ్చిన; తస్థౌ = విడిదిచేసిన; వృక్షమ్ = చెట్టు సమీపమున; ఉపాశ్రితః = ఆశేరయించెను
భావం:-
తాము వుండుటకు ఆగిన ఆ గారచెట్టు వద్ద భార్యాసమేతుడై, నేలపై పరుండిన ఆ రాముని పాదములు లక్ష్మణుడు కడిగెను.
2.50.51.
జగతి.
గుహోఽపి సహ సూతేన
సౌమిత్రిమనుభాషయన్।
అన్వజాగ్రత్తతో రామమ్
అప్రమత్తో ధనుర్ధరః॥
టీక:-
గుహః = గుహుడు; అపి = కూడా; సహ = సహితముగా; సూతేన = సుమంత్రునితో; సౌమిత్రిమ్ = లక్ష్మణుని; అనుభాషయన్ = సంభాషించుకొనిరి; అన్వ జాగ్రత్తతః = మిక్కిలి జాగరూకతతో ఉండెను; రామమ్ = రామునిగూర్చి; అప్రమత్తః = అప్రమత్తముగా; ధనుర్ధరః = ధనుర్ధారిౖయె.
భావం:-
గుహుడు కూడ ధనుర్ధారిౖయె, లక్ష్మణ సుమంత్రులతో మాటలాడుచూ రాముని సంరక్షణము నిమిత్తము సావధాన చిత్తుడై మేల్కొని ఉండెను.
2.50.52.
గద్య.
తథా శయానస్య తతోఽస్య ధీమతో
యశస్వినో దాశరథేర్మహాత్మనః।
అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా
తదావ్యతీయాయ చిరేణ శర్వరీ॥
టీక:-
తథా = అటు పిమ్మట; శయానస్య = శయనించిన; తతః = ఆ తరువాత; అస్య = అటువంటి; ధీమతః = బుద్ధిశాలి; యశస్వినః = కీర్తిమంతుడు; అదృష్టదుఃఖస్య = దుఃఖమును ఎన్నడూ చూడనివాడు; సుఖోచితస్య = సుఖములకు అలవాటు పడినవాడు; సా = అటువంటి; తదా = ఆ విధముగా; వ్యతీయాయ = గతించిన; చిరేణ = ఆలస్యముగా; శర్వరీ = ఆ రాత్రి
భావం:-
బుద్ధిమంతుడు, యశఃశాలి, మహాత్ముడు అయిన ఆ రాముడు ఎన్నడును దుఃఖములను అనుభవించి ఉండలేదు. సుఖములకే అలవాటు పడి ఉండెను. ఆ రోజున ఆ విధముగా నేలపై పండుకొని ఉన్న అట్టి రామునకు రాత్రి చాల ఆలస్యముగా గడచినట్లు అనిపించెను.
2.50.53.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
పంచాశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; పంచాశ [50] = ఏభైయవ; సర్గః = సర్గ.
బావము:-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [50] ఏభైయవ సర్గ సంపూర్ణము.
2.51.1.అనుష్టుప్
తం జాగ్రతమదంభేన
భ్రాతురర్థాయ లక్ష్మణమ్।
గుహః సంతాపసంతప్తో
రాఘవం వాక్యమబ్రవీత్॥
టీక:-
 తం = ఆ; జాగ్రతమ్ = మేల్కొని ఉన్న; అదంభేన = కపటము లేకుండ; భ్రాతుః = సోదరుని; అర్థాయ = కొరకు; లక్ష్మణమ్ = లక్ష్మణునిగూర్చి; గుహః = గుహుడు; సంతాపసంతప్తః = పరితాపము చెందియున్న; రాఘవం = రఘువంశములో పుట్టిన ; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 సోదరుడైన రాముని సంరక్షణ కొరకై మేల్కొనియున్న లక్ష్మణునితో, గుహుడు పరితాపము చెంది కపటము మాటలతో ఇట్లు పలికెను.
2.51.2.అనుష్టుప్
“ఇయం తాత! సుఖా శయ్యా
త్వదర్థముపకల్పితా।
ప్రత్యాశ్వసిహి సాధ్వస్యామ్
రాజపుత్ర! యథాసుఖమ్॥
టీక:-
 ఇయం = ఈ; తాత = నాయానా; సుఖా = సుఖప్రదమైన; శయ్యా = పడక; త్వదర్థమ్ = నీ కొరకై; ఉపకల్పితా = ఏర్పర్చబడినది; ప్రత్యాశ్వసిహి = ప్రతి + ఆశ్వసిహి, కొద్దిగా ఊరట నొందుము; సాధుః = మంచిగ; అస్యామ్ = దీనిపై; రాజపుత్ర = రాకుమారా; యథాసుఖమ్ = సుఖముగ.
భావం:-
  “రాకుమారా లక్ష్మణా! సుఖప్రదమైన ఈ పడక నీకొరకు ఏర్పర్చబడినది. నీవు దీనిపై సుఖముగా విశ్రమింపుము.
2.51.3.అనుష్టుప్
ఉచితోఽ యం జనస్సర్వః
క్లేశానాం త్వం సుఖోచితః।
గుప్త్యర్థం జాగరిష్యామః
కాకుత్స్థస్య వయం నిశామ్॥
టీక:-
 ఉచితః = అలవాటు కలిగియున్నది; అయం = ఈ; జనః = ప్రజలు; సర్వః = అందరు; క్లేశానాం = కష్టములకు; త్వం = నీవు; సుఖోచితః = సుఖమునకు అలవాటు పడినవాడవు; గుప్తి = సంరక్షణ; అర్థం = కొరకు; జాగరిష్యామః = మేల్కొని ఉండెదము; కాకుత్స్థస్య = రామునియొక్క; వయం = మేము; నిశామ్ = రాత్రిని.
భావం:-
 మేమందరము కష్టములకు, శ్రమకు అలవాటు పడినవారము. నీవు సుఖమునకు అలవాటు పడియున్నవాడవు. రాముని సంరక్షణకొరకై మేము రాత్రి అంతయు మేల్కొని యుండెదము.
2.51.4.అనుష్టుప్
న హి రామాత్ప్రియతమో
మమాస్తి భువి కశ్చన।
బ్రవీమ్యేతదహం సత్యమ్
సత్యేనైవ చ తే శపే॥
టీక:-
 న = లేడు; హి = కదా; రామాత్ = రాముని కన్న; ప్రియతమః = ప్రియమైన వాడు; మమ = నాకు; అస్తి = ఉండుట; భువి = భూమిపై; కశ్చన = ఎవ్వరు; బ్రవీమ్ = చెప్పుచున్నాను; ఏతత్ = దీనిని; అహం = నేను; సత్యమ్ = సత్యముగ; సత్యేనైవ = సత్యముగ మాత్రమే; తే = నీకు; శపే = శపథము చేయుచున్నాను.
భావం:-
 నాకు ఈ లోకములో రామునికంటె ప్రియమైన వారు ఎవరును లేరు నేను సత్యముపై ప్రమాణము చేసి నీకు నిజము చెప్పుచున్నాను.
2.51.5 అనుష్టుప్
అస్య ప్రసాదాదాశంసే
లోకేస్మిన్ సుమహద్యశః।
ధర్మావాప్తిం చ విపులామ్
అర్థావాప్తిం చ కేవలమ్॥
టీక:-
 అస్య = యొక్క; ప్రసాదాత్ = అనుగ్రహమువలన; ఆశంసే = కోరుచున్నాను; లోకే = లోకమునందు; అస్మిన్ = ఈ; సుమహత్ = గొప్ప; యశః = కీర్తి; ధర్మావాప్తిం = ధర్మమును పొందుటకు; విపులామ్ = మిక్కిలి; అర్థావాప్తిం = ధనప్రాప్తిని; కేవలమ్ = కేవలము.
తాత్పర్యం:
 ఈ రాముని అనుగ్రహమువలన మాత్రమే నేను లోకమునందు గొప్ప కీర్తిని, ధర్మమును, ధనమును పొందవలెనని కోరుచున్నాను.
2.51.6.అనుష్టుప్
సోఽ హం ప్రియసఖం రామమ్
శయానం సహ సీతయా।
రక్షిష్యామి ధనుష్పాణిః
సర్వతో జ్ఞాతిభిస్సహ॥
టీక:-
 సః = అటువంటి; అహం = నేను; ప్రియ = ప్రియమైన; సఖమ్ = మిత్రుని; రామమ్ = రాముని; శయానం = నిదురించుచున్న; సహ = కూడి; సీతయా = సీతతో; రక్షిష్యామి = రక్షించెదను; ధనుష్పాణిః = ధనుస్సును చేపట్టి; సర్వతః = అన్నిటి నుండి; జ్ఞాతిభిః = బంధువులతో; సహ = కూడి.
భావం:-
 నేను, నా బంధువులు ధనుస్సును చేబూని, నిదురించుచున్న నా ప్రియమైన మిత్రుడు రాముడిని. సీతను సకలవిధముల రక్షించెదము.
2.51.7.అనుష్టుప్
న హి మేఽ విదితం కించిత్
వనేఽ స్మింశ్చరతస్సదా।
చతురంగమ్ హ్యపి బలమ్
సుమహత్ప్రసహేమహి”॥
టీక:-
 న = లేదు; హి = కదా; మే = నాకు; అవిదితం = తెలియనిది; కించిత్ = కొంచెమైన; వనే = అరణ్యమునందు; అస్మిన్ = ఈ; చరతః = తిరుగుచున్న; సదా = ఎల్లప్పుడును; చతురంగమ్ = నాలుగు విధములైన; హి = కదా; అపి = కూడ; బలమ్ = బలము; సుమహత్ = గొప్ప; ప్రసహేమహి = సహించగలము.
భావం:-
 నిత్యము ఈ అరణ్యములో తిరుగుచున్న నాకు ఇక్కడ తెలియనిది ఏమియు లేదు. గొప్ప చతురంగ బలము వచ్చినను మేము ఎదుర్కొనగలము.”
2.51.8.అనుష్టుప్
లక్ష్మణస్తం తదోవాచ
“రక్ష్యమాణాస్త్వయానఘ।
నాత్ర భీతా వయం సర్వే
ధర్మమేవానుపశ్యతా”॥
టీక:-
 లక్ష్మణః = లక్ష్మణుడు; తం = అతనిని గూర్చి; తదా = అప్పుడు; ఉవాచ = పలికెను; రక్ష్యమాణాః = రక్షింపబడుచున్న; త్వయా = నీచే; అనఘ = పాప రహితుడా; న = లేదు; అత్ర = ఇక్కడ; భీతా = భయము; వయం = మేము; సర్వే = అందరమును; ధర్మమేవ = ధర్మమును మాత్రమే; అనుపశ్యతా = చూచుచున్న.
భావం:-
 అప్పుడు లక్ష్మణుడు గుహునితో "దోషరహితుడవైన ఓ గుహుడా! నిండు ధర్మపరాయణుడవైన నీవు రక్షించుచుండగా ఇక్కడ మాకేమియును భయము లేదు" అని పలికెను.
2.51.9.అనుష్టుప్
కథం దాశరథౌ భూమౌ
శయానే సహ సీతయా।
శక్యా నిద్రా మయా లబ్ధుమ్
జీవితం వా సుఖాని వా॥
టీక:-
 కథం = ఏ విధముగ; దాశరథౌ = దశరథాత్మజుడు; భూమౌ = భూమిపై; శయానే = నిదురించియుండగ; సహ = కూడి; సీతయా = సీతను; శక్యా = వీలగుట; నిద్రా = నిద్ర; మయా = నాకు; లబ్ధుమ్ = పొందుటకు; జీవితం వా = జీవితము గాని; సుఖాని వా = సుఖములు గాని.
భావం:-
 రాముడు సీతా సమేతుడై నేలపై నిదురించి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును? నేను సుఖముగా ఎట్లుండగలను.
2.51.10.అనుష్టుప్
యో న దేవాసురైః సర్వైః
శక్యః ప్రసహితుం యుధి।
తం పశ్య సుఖసంవిష్టమ్
తృణేషు సహ సీతయా॥
టీక:-
 యః = ఎవడు; న = కాడో; దేవాః = దేవతలచేతను; అసురైః = రాక్షసులచేతను; సర్వైః = సమస్తమైన; శక్యః = సమర్థతలు గలవాడు; ప్రసహితుం = సహించుటకు; యుధి = యుద్ధమునందు; తం = అతడు; పశ్య = చూడుము; సుఖ = సుఖముగా; సంవిష్టమ్ = పండుకొనినవాడు; తృణేషు = గడ్డిపై; సహ = కూడి; సీతయా = సీతను.
భావం:-
 సమస్తమైన దేవదానవులు కూడ యుద్ధమునందు ఎవరిని ఎదురింపజాలరో, అట్టి రాముడు, సర్వసమర్థుడు, సీతా సమేతుడై గడ్డిపై ఎట్లు నిదురించి యుండెనో చూడుము.
2.51.11.అనుష్టుప్
యో మంత్ర తపసా లబ్ధో
వివిధైశ్చ పరాశ్రమైః।
ఏకో దశరథస్యేష్టః
పుత్రః సదృశలక్షణః॥
టీక:-
 యః = ఎవరు; మంత్రతపసా = మంత్రము చేతను; తపస్సు తపస్సుచేతను; లబ్ధః = పొందబడిన; వివిధైశ్చ = అనేక విధములైన; పరాశ్రమైః = ప్రయాసచేతను; ఏకః = ముఖ్యమైన; దశరథస్య = దశరథునియొక్క; ఇష్టః = ఇష్టమైన; పుత్రః = పుత్రుడు; సదృశలక్షణః = సమానమైన లక్షణములు కలవాడు.
భావం:-
 రాముడు దశరథునకు సాటివచ్చు లక్షణములు కల ప్రియమైన పుత్రుడు. ఎంతయో తపస్సు వ్రతములు చేయుటచే లభించిన వాడు.
2.51.12.అనుష్టుప్
అస్మిన్ ప్రవ్రాజితే రాజా
న చిరం వర్తయిష్యతి।
విధవా మేదినీ నూనమ్
క్షిప్రమేవ భవిష్యతి॥
టీక:-
 అస్మిన్ = అటువంటి; ప్రవ్రాజితే = ప్రవాసమునకు వెళ్లిన; రాజా = రాజు; న = లేడు; చిరం = చాల; వర్తయిష్యతి = జీవించుట; విధవా = భర్త లేనిది; మేదినీ = భూమి; నూనమ్ = కచ్చితముగ; క్షిప్రమేవ = శీఘ్రముగ; భవిష్యతి = కాగలదు.
భావం:-
 అటువంటి రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయిన పిమ్మట రాజు ఎక్కువ కాలము జీవించలేడు. అచిరకాలములోనే భూమి భర్త లేనిది కాగలదు.
2.51.13.అనుష్టుప్
వినద్య సుమహానాదమ్
శ్రమేణోపరతాః స్త్రియః।
నిర్ఘోషోపరతం చాతో
మన్యే రాజనివేశనమ్॥
టీక:-
 వినద్య = అరచి; సుమహానాదమ్ = పెద్దశబ్దము వచ్చునట్లుగా; శ్రమేణ = కష్టముచే; ఉపరతాః = అచేతనముగా ఉందురు; త్రియః = స్త్రీలు; నిర్ఘోషోపరతం చ = నిశ్శబ్దముగా; చ = మఱియును; అతః = అందువలన; మన్యే = తలంచెదను; రాజనివేశనమ్ = రాజభవనమును.
భావం:-
 స్త్రీలందరును పెద్దగా విలపించి, అలసట చెంది, ఇప్పటికి ఊరుకొని యుందురు. అందువలన రాజగృహమంతయు నిశ్శబ్దముగా ఉండునని తలంచుచున్నాను.
2.51.14.అనుష్టుప్
కౌసల్యా చైవ రాజా చ
తథైవ జననీ మమ।
నాశంసే యది జీవన్తి
సర్వే తే శర్వరీమిమామ్॥
టీక:-
 కౌసల్యా = కౌసల్య; చైవ = కూడ; రాజా = రాజు; తథైవ = మరియు; జననీ = తల్లి; మమ = నా యొక్క; నాశంసే = ఊహించను; యది = ఒకవేళ; జీవన్తి = జీవించెదరు; సర్వే = అందరూ; తే = వారు; శర్వరీమ్ = రాత్రిని; ఇమామ్ = ఈ.
భావం:-
 కౌసల్య, దశరథుడును మా తల్లి, వీరందరును ఇక జీవించి యుందురుని నేను భావించుటలేదు.
2.51.15.అనుష్టుప్
జీవేదపి హి మే మాతా
శత్రుఘ్నస్యాన్వవేక్షయా।
తద్దుఃఖం యత్తు కౌసల్యా
వీరసూర్వినశిష్యతి॥
టీక:-
 జీవేదపి = జీవించియుండునేమో; హి = కదా; మే = నా; మాతా = తల్లి; శత్రుఘ్నస్య = శత్రుఘ్నునియొక్క; అన్వవేక్షయా = ఎదురుచూచుటచే; తత్ = ఆ; దుఃఖం = దుఃఖము; యత్ = ఏది; కౌసల్యా = కౌసల్య; వీరసూః = వీరుని కనిన; వినశిష్యతి = మరణించును.
భావం:-
 నా తల్లి శత్రుఘ్నునికొరకై ఎదురుచూచుచు జీవించునేమో కాని, వీరుడైన పుత్రుని కనిన కౌసల్య మాత్రము మరణించునని నాకు దుఃఖము కలుగుచున్నది.
2.51.16.అనుష్టుప్
అనురక్త జనాకీర్ణా
సుఖాలోకప్రియావహా।
రాజవ్యసనసంసృష్టా
సా పురీ వినశిష్యతి॥
టీక:-
 అనురక్త = అనురాగవంతులైన; జనాః = జనులతో; ఆకీర్ణా = కిక్కిరిసి యున్న; సుఖా = సుఖములు కలిగించు; లోకప్రి = లోకమునకు; ప్రియావహా = ప్రియము కలిగించునది; రాజ = రాజు యొక్క; వ్యసన = కామక్రోధములవలనఁ బుట్టిన దోషముతో; సంసృష్టా = బాగా కలుపబడినదైన; సా = ఆ; పురీ = పట్టణము; వినశిష్యతి = నశించగలదు.
భావం:-
 ప్రేమాస్పదులైన జనులతో నిండి యుండి, సుఖకరమైనది, లోకమునకు ప్రియమైనది ఐన అయోధ్య. ఇప్పుడు ధశరథమహారాజు యొక్క వ్యసనముతో కలతచెందినది ఐన ఆ నగరము నశించును.
2-51.17.అనుష్టుప్
కథం పుత్రం మహాత్మానమ్
జ్యేష్ఠం ప్రియమపశ్యతః।
శరీరం ధారయిష్యన్తి
ప్రాణా రాజ్ఞో మహాత్మనః॥
టీక:-
 కథం = ఎట్లు; పుత్రం = పుత్రుని; మహాత్మానమ్ = మహాత్ముడైన; జ్యేష్ఠం = పెద్ద; ప్రియమ్ = ప్రియమైన; అపశ్యతః = చూడని; శరీరం = శరీరమును; ధారయిష్యన్తి = కలిగియుండును; ప్రాణాః = ప్రాణములు; రాజ్ఞః = రాజు; మహాత్మనః = మహాత్ముడు.
భావం:-
 మహాత్ముడును, ప్రియమైనవాడును ఐన పెద్దకుమారుడు కనబడక పోయినచో మహాత్ముడైన దశరథ మహారాజు ప్రాణములతో ఎట్లు జీవించగలడు?
2.51.18.అనుష్టుప్
వినష్టే నృపతౌ పశ్చాత్
కౌసల్యా వినశిష్యతి।
అనంతరం చ మాతాఽ పి
మమ నాశముపైష్యతి॥
టీక:-
 వినష్టే = మరణించుచుండగా; నృపతౌ = రాజు; పశ్చాత్ = తరువాత; కౌసల్యా = కౌసల్య; వినశిష్యతి = మరణించును; అనంతరం = తరువాత; మాతా = తల్లి; అపి = కూడ; మమ = నాయొక్క; నాశమ్ = మరణమును; ఉపైష్యతి = పొందును.
భావం:-
 రాజు మరణించిన తరువాత కౌసల్య కూడ మరణించును. అటుపిమ్మట నా తల్లి సుమిత్ర కూడ మరణించును.
2.51.19.అనుష్టుప్
అతిక్రాంతమతిక్రాంతమ్
అనవాప్య మనోరథమ్।
రాజ్యే రామమనిక్షిప్య
పితా మే వినశిష్యతి॥
టీక:-
 అతిక్రాంతమతిక్రాంతమ్ = గడుచుచు గడుచుచుండగా; అనవాప్య = పొందలేక; మనోరథమ్ = మనోభీష్టమును; రాజ్యే = రాజ్యమునందు; రామమ్ = రాముని; అనిక్షిప్య = ఉంచజాలక; పితా = తండ్రి; మే = నా; వినశిష్యతి = మరణించును.
భావం:-
 తాను చాల కాలమునుండి అనుకొనుచున్న మనోభీష్టము నెరవేరక, రాముని పట్టాభిషిక్తుని చేయజాలక నా తండ్రి మరణించును.
2.51.20.అనుష్టుప్
సిద్ధార్థాః పితరం వృత్తమ్
తస్మిన్కాలేఽ ప్యుపస్థితే।
ప్రేతకార్యేషు సర్వేషు
సంస్కరిష్యన్తి భూమిపమ్॥
టీక:-
 సిద్ధార్థాః = కృతార్థులైన; పితరం = తండ్రి; వృత్తమ్ = మరణించిన; తస్మిన్ = ఆ; కాలే = కాలమునందు; ప్యుపస్థితే = వచ్చియుండగ; ప్రేతకార్యేషు = ప్రేతకార్యముల యందు; సర్వేషు = సమస్తమైన; సంస్కరిష్యన్తి = సంస్కరించగలరు; భూమిపమ్ = రాజును.
భావం:-
 మరణించిన నా తండ్రికి భరత శత్రుఘ్నులు, ప్రేత సంస్కారములు చేసి కృతార్థులు కాగలరు.
2.51.21.అనుష్టుప్
రమ్యచత్వరసంస్థానామ్
సువిభక్తమహాపథామ్।
హర్మ్యప్రాసాదసమ్పన్నామ్
గణికావరశోభితామ్॥
టీక:-
 రమ్య = రమ్యమైన; చత్వర = వాకిళ్ళు కలిగిన; సంస్థానామ్ = చక్కగా వ్యవస్థితమై ఉన్నది; సువిభక్త = సు+ విభక్త, చక్కగా అలంకరింపబడిన, చక్కగా విభాగములు (రథ్య, హయ, పదాతి) ఏర్పరుపబడిన; మహాపథామ్ = రాజమార్గములు కలది; హర్మ్య = సంపన్నుల గృహములుది; ప్రాసాద = రాజప్రసాదములు; సమ్పన్నామ్ = సమృద్దిగా కూడియున్నది; గణికా = వారకాంతలలో; వర = శ్రేష్టమైనవారితో; శోభితామ్ = ప్రకాశించుచున్నది.
భావం:-
 అయోధ్య గృహములు రమ్యమైన వాకిళ్లతో చక్కగా వ్యవస్థితమైనది. చక్కగా అలంకరించిన విశాలమైన రాచమార్గములు కలది. సంపన్నుల గృహములతోను, రాజప్రసాదములతోను, శ్రేష్టమైన వారకాంతలతోను శోభిల్లుచుండును.
2.51.22.అనుష్టుప్
రథాశ్వగజసంబాధామ్
తూర్యనాదవినాదితామ్।
సర్వకల్యాణసంపూర్ణామ్
హృష్టపుష్టజనాకులామ్॥
టీక:-
 రథః = రథములు; అశ్వః = గుఱ్ఱములు; గజః = ఏనుగులతో; సంబాధామ్ = ఇఱుకుగా యుండునది; తూర్యనాద = వాద్యఘోషలు; వినాదితామ్ = ప్రతిధ్వనించుచుండునది; సర్వ = సమస్తమైన; కల్యాణః = మంగళప్రదమైన కార్యములతో; సంపూర్ణామ్ = నిండియున్నది; హృష్ట = సంతుష్టులైన; పుష్ట = పుష్టిగా ఉండు; జనాః = ప్రజలతో; ఆకులామ్ = నిండియున్నది. .
భావం:-
 ఇటు అటు తిరుగుచున్న రథములతోను, గుఱ్ఱములతోను, ఏనుగులతోను, అయోధ్య రాజమార్గములు కిక్కిరిసి ఉండెను. సకల మంగళకరమైన కార్యములు జరుగుచు, ఇంపైన వాద్యగోష్ఠి వినిపించుచుండెను. అయోధ్య నిండా సంతుష్టులైన పుష్టిగా బలిష్టులైన ప్రజలుండిరి.
2.51.23.అనుష్టుప్
ఆరామోద్యానసమ్పన్నామ్
సమాజోత్సవశాలినీమ్।
సుఖితా విచరిష్యన్తి
రాజధానీం పితుర్మమ॥
టీక:-
 ఆరామః = ఉపవనములు, క్రీడావనములు; ఉద్యానః = ఉద్యానవనములు; సమ్పన్నామ్ = సమృద్ధిగా యుండునది; సమాజోత్సవశాలినీమ్ = జనసమాజములు చేయు ఉత్సవములతో ప్రకాశించుచుండునది; సుఖితాః = సుఖముగా నుండువారు; విచరిష్యన్తి = సంచరించుచుండునది; రాజధానీం = రాజధానిని; పితుః = తండ్రి; మమ = నాయొక్క.
భావం:-
 మా తండ్రిగారి రాజధాని, విశ్రాంతి భవనములతోను ఉద్యానవనములతోను నిండియుండును. ప్రజాసమాజములు చేయు ఉత్సవములతో విరాజిల్లుచుండును. జనులందరును సుఖ సంతోషములతో సంచరించుచుందురు.
*గమనిక:-
 ఆరామః- వ్యుత్పత్తి. ఆరమ్యతేఽత్ర, ఆఞ+ రమ్+ ఆధారే ఘఙ, ఉపవనం ఇతి అమరః. క్రీడావము
2.51.24.అనుష్టుప్
అపి జీవేద్దశరథో
వనవాసాత్పునర్వయమ్।
ప్రత్యాగమ్య మహాత్మానమ్
అపి పశ్యేమ సువ్రతమ్॥
టీక:-
 అపి = సంశయార్థకము; జీవేత్ = జీవించి యుండునా; దశరథః = దశరథుడు; వనవాసాత్ = వనవాసమునుండి; పునః = మరల; వయమ్ = మేము; ప్రత్యాగమ్య = తిరిగివచ్చి; మహాత్మానమ్ = మహాత్ముడైన; అపి = సంశయార్థకము; పశ్యేమ = చూచెదమా; సువ్రతమ్ = వ్రత సంపన్నుడైన.
భావం:-
 మేము వనవాసము నుండి తిరిగి వచ్చువరకు దశరథుడు జీవించియుండునా. ఉత్తమ వ్రత సంపన్నుడైన ఆ మహాత్ముని మేము మరల చూడగలిగెదమా.
2.51.25.అనుష్టుప్
అపి సత్యప్రతిజ్ఞేన
సార్ధం కుశలినా వయమ్।
నివృత్తే వనవాసేఽ స్మిన్
అయోధ్యాం ప్రవిశేమహి॥
టీక:-
 అపి = సంశయార్థకము; సత్యప్రతిజ్ఞేన = సత్య ప్రతిజ్ఞచే; సార్ధం = సార్థకతకలిగిన; కుశలినా = క్షేమముగా ఉన్న; వయమ్ = మేము; నివృత్తే = పూర్తైన ; వనవాసే = వనవాసము కలిగినవాడై; అస్మిన్ = ఇతను; అయోధ్యాం = అయోధ్యను; ప్రవిశేమహి = ప్రవేశించెదమా.
భావం:-
 మేము క్షేమముగ వనవాసము పూర్తి చేసిన తరువాత ప్రతిజ్ఞను సార్థకం చేసుకొనిన దశరథునితో అయోధ్యలో ప్రవేశించగలమా?
2.51.26.అనుష్టుప్
పరిదేవయమానస్య
దుఃఖార్తస్య మహాత్మనః।
తిష్ఠతో రాజపుత్రస్య
శర్వరీ సాఽ త్యవర్తత॥
టీక:-
 పరిదేవయః = పరితపించుచున్న; మానస్య = మనసుగలవాడు; దుఃఖా = దుఃఖముచే; ఆర్తస్య = పీడించబడుచు; మహాత్మనః = మహాత్ముడైన; తిష్ఠతః = నిలిచియుండగ; రాజపుత్రస్య = రాజకుమారుడు; శర్వరీ = రాత్రి; సా = ఆ; అత్యవర్తత = గడచిపోయెను.
భావం:-
 ఈ విధముగ లక్ష్మణుడు దుఃఖభరితుడై దీనాలాపములు చేయుచూ ఉండగానే ఆ రాత్రి అంతయు గడిచి పోయినది.
2.51.27.జగతి.
తథా హి సత్యం బ్రువతిప్రజాహితే
నరేంద్రపుత్రే గురుసౌహృదాద్గుహః।
ముమోచ బాష్పం వ్యసనాభిపీడితో
జ్వరాతురో నాగ ఇవవ్యథాతురః॥
టీక:-
 తథా = అట్లు; హి = కదా; సత్యం = సత్యమును; బ్రువతి = చెప్పుచుండగ; ప్రజాహితే = ప్రజలయొక్క హితమును కోరువాడు; నరేంద్రపుత్రే = రాకుమారుడు; గురు = పెద్దలయందు; సౌహృదాత్ = సౌహార్ధము కలిగియుండుట వలన; గుహః = గుహుడు; ముమోచ = వదిలెను; బాష్పం = కన్నీటిని; వ్యసనా = దుఃఖముతో; అభిపీడితః = పీడింపబడినవాడు; జ్వరాతుర = జ్వరముచే బాధపడుచున్న; నాగ = ఏనుగు; ఇవ = వలె; వ్యథాతురః = మనోవ్యాకులము కలిగియున్న.
భావం:-
 ప్రజల క్షేమమును కోరెడి లక్ష్మణుని సత్యవంతమైన ఆ మాటలు విని, పెద్దలయెడ సహృదయముగలవాడైన గుహుడు మనోవ్యాకులము చెంది, దుఃఖభరితుడై, జ్వరముచే బాధపడుచున్న ఏనుగు వలె కన్నీటిని కార్చెను.
2.51.28.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
ఏకపంచాశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; ఏకపంచాశ [51] = ఏభై ఒకటవ; సర్గః = సర్గ.
బావము:-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [51] ఏభై ఒకటవ సర్గ సంపూర్ణము.
2.52.1.అనుష్టుప్.
ప్రభాతాయాం తు శర్వర్యామ్
పృథువక్షా మహాయశాః।
ఉవాచ రామః సౌమిత్రిమ్
లక్ష్మణం శుభలక్షణమ్॥
టీక:-
 ప్రభాతాయాం = తెల్లవారిట; తు = కాగానే; శర్వర్యామ్ = రాత్రి; పృథువక్షా = విశాలమైన వక్షస్థలము కలిగినవాడు; మహాయశాః = గొప్ప యశస్సు కలిగిన వాడు; ఉవాచ = పలికెనుc రామః = రాముడు; సౌమిత్రిమ్ = సుమిత్ర కుమారుడైన; లక్ష్మణం = లక్ష్మణునితో; శుభలక్షణమ్ = శుభ సంకేతాలు కలిగిన.
భావం:-
 రాత్రి తెలతెలవారగానే, మహాతేజశ్శాలి, విశాలమైన వక్షస్థలమువాడు అయిన రాముడు, శుభలక్షణోపేతుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను.
2.52.2.అనుష్టుప్.
“భాస్కరోదయకాలోఽయమ్
గతా భగవతీ నిశా।
అసౌ సుకృష్ణో విహగః
కోకిలస్తాత! కూజతి॥
టీక:-
  భాస్కరః = సూర్యుడు; ఉదయకాలః = ఉదయించి సమయమున; అయమ్ = ఇది; గతా = గడిచినది; భగవతీ = పూజ్యురాలైన, వావిళ్ళ నిఘంటువు; నిశా = రాత్రి; అసౌ = ఈ; సుకృష్ణ = బాగా నల్లని రంగు కలిగిన; విహగః = పక్షి; కోకిలః = కోకిల; తాత = తండ్రీ; కూజతి = గానము చేయుచున్నది
భావం:-
 ”నాయనా! పూజ్యురాలైన రాత్రి గడచినది. సూర్యోదయము ఆసన్నమైనది. చాల నల్లని పక్షిౖయెన ఈ కోకిల కూయుచున్నది.
*గమనిక:-
(1) విహగః- విహాయస్+గమ్+డ (విహ ఆదేశః చ), విహాయసా గచ్ఛతి] ఆకాశంలో వెళ్లునది. పక్షి. (2) కోకిల- కుక్+ఇలచ్, కోకతి ఆదత్తే పుష్పరజాదికమ్] పుష్పరజములను స్వీకరించునది. కోకిల. (3) కోకిల అఱుపు- కూజితము, కూయుట
2.52.3.అనుష్టుప్.
బర్హిణానాం చ నిర్ఘోషః
శ్రూయతే నదతాం వనే।
తరామ జాహ్నవీం సౌమ్య!
శీఘ్రగాం సాగరంగమామ్”॥
టీక:-
 బర్హిణానామ్ = నెమళ్లు; చ = కూడా; నిర్ఘోషః = కేకలు; శ్రూయతే = వినబడుచున్నవి; నదతాం = ధ్వనిచేయుచుండుట; వనే = వనములో; తరామ = దాటెదము; జాహ్నవీం = గంగానదిని; సౌమ్య = ఓ సౌమ్యుడా; శీఘ్రగాం = శీఘ్రముగా ప్రవహించునది; సాగరం = సాగరమును; గమామ్ = చేరునది
భావం:-
 వనములో నెమళ్లు వేయు కేకలు కూడ వినబడుచున్నది. ఓ సౌమ్యుడా! శీఘ్రముగా ప్రవహించునది, సాగరమును చేరునది అయిన గంగానదిని దాటెదము’’ అని పలికెను.
*గమనిక:-
(1) బర్హిణః- ద్రిరేఫపుష్పలింభక్షట్పదభ్రమరాలయః, మయూరో బ్రహ్మిణో బర్హి నీలకంఠో భుజంగభుక్. మయూరః. ఇతి అమరకోషః. (2) బర్హిణం నెమలి అరుపు- నిర్ఘోష, కేక
2.52.4.అనుష్టుప్.
విజ్ఞాయ రామస్య వచః
సౌమిత్రిర్మిత్రనందనః।
గుహమామంత్ర్య సూతం చ
సోఽతిష్ఠద్భ్రాతురగ్రతః॥
టీక:-
 విజ్ఞాయ = అర్థము చేసుకొని; రామస్య = రాముని యొక్క; వచః = మాటలు; సౌమిత్రిః = సుమిత్ర పుత్రుడు; మిత్ర = స్నేహుతులకు; మిత్రనందనః = స్నేహుతులకు ఆనందము కలిగించువాడు; గుహమ్ = గుహుని; ఆమంత్రయ = పిలచి; సూతం చ = సుమంత్రుని మఱియు; చ = మఱియు; సః = అతడు; ఉతిష్ఠత్ = నిలచెను; భ్రాతుః = సోదరుడైన రాముని; అగ్రతః = ఎదుట
భావం:-
 సుమిత్రా పుత్రుడు, స్నేహితులకు ఆనందము కలిగించువాడు నైన లక్ష్మణుడు, రాముని మాట అర్థము చేసుకొని. గుహుని, సుమంత్రుని పిలచి, వారికి ఆ విషయము చెప్పి రాముని ఎదుట నిలచెను.
2.52.5.అనుష్టుప్.
స తు రామస్య వచనమ్
నిశమ్య ప్రతిగృహ్య చ।
స్థపతిస్తూర్ణమాహూయ
సచివానిదమబ్రవీత్॥
టీక:-
 సః = అతడు; తు = ఇంకను; రామస్య = రాముని యొక్క; వచనమ్ = మాటలను; నిశమ్య = విన్న పిదప; ప్రతిగృహ్య = స్వీకరించి; చ = ఇంకా; స్థపతిః = శ్రేష్ఠుడు, వావిళ్ళ నిఘంటువు, గుహుని; తూర్ణమ్ = వేగముగా; ఆహూయ = రప్పించి; సచివాన్ = మంత్రులను; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = చెప్పెను
భావం:-
 గుహుడు రాముని మాటలను విని, దాని ప్రకారము, వెంటనే తన మంత్రులను పిలిచి ఇట్లు చెప్పెను.
2.52.6.అనుష్టుప్.
“అస్య వాహనసంయుక్తామ్
కర్ణగ్రాహవతీం శుభామ్।
సుప్రతారాం దృఢాం తీర్థే
శీఘ్రం నావముపాహర”॥
టీక:-
 అస్య = రాముని కొరకు; వాహన సంయుక్తామ్ = పడవను నడుపువానిని; కర్ణ గ్రాహవతీం = చుక్కాని పట్టువారు; శుభామ్ = అందమైన; సుప్రతారాం = దాటుటకు వీలైనది; దృఢాం = దృఢమైనది; తీర్థే = రేవులోనికి;శీఘ్రం = వేగముగా; నావమ్ = నావను; ఉపాహర = తీసుకొని రండు.
భావం:-
 సులభముగా దాటుటకు వీలైనది, దృఢమైనది, సమర్థులైన నడుపువారు, చుక్కాని పట్టువారు ఉన్నది అయిన అందమైన నావను రాముని కొరకు శీఘ్రముగా రేవులోనికి తీసుకొని రండి.. అని ఆదేశించెను.
2.52.7.అనుష్టుప్.
తం నిశమ్య సమాదేశమ్
గుహామాత్యగణో మహాన్।
ఉపోహ్య రుచిరాం నావమ్
గుహాయ ప్రత్యవేదయత్॥
టీక:-
 తం = ఆ; నిశమ్య = విని; సమాదేశమ్ = ఆజ్ఞను; గుహ = గుహుని; అమాత్య = అమాత్యుల; గణః = సమూహము; మహాన్ = గొప్పదైన; ఉపోహ్య = తీసుకొని వచ్చి; రుచిరాం = అందమైన; నావమ్ = నావను; గుహాయ = గుహునకు; ప్రత్యవేదయత్ = విషయమును తెలిపిరి
భావం:-
 గుహుని అమాత్యులు, అతని ఆజ్ఞ విని, ఒక అందమైన నావను తీసుకొని వచ్చి, ఆ విషయమును గుహునకు తెలిపిరి.
2.52.8.అనుష్టుప్.
తతః స ప్రాంజలిర్భూత్వా
గుహో రాఘవమబ్రవీత్।
“ఉపస్థితేయం నౌర్దేవ
భూయః కిం కరవాణి తే॥
టీక:-
 తతః = అప్పుడు; సః = అతడు; ప్రాంజలిః = చేతులు జోడించి; భూత్వా = అయ్యెను; గుహః = గుహుడు; రాఘవమ్ = రాముని; అబ్రవీత్ = పలికెను; ఉపస్థిత = వచ్చియనది; ఇయం = ఇది; నౌః = పడవ; దేవ = ప్రభూ; భూయః = మరింత; కిం = ఏమి కరవాణి = ఏమి; తే = నీ కొరకు.
భావం:-
 అపుడు గుహుడు చేతులు మోడ్చి నమస్కరించుచు, రామునితో. ‘ఓ ప్రభూ! ఇదిగో నావ వచ్చినది. ఇంక నీకేమి చేయుదును?
2.52.9.అనుష్టుప్.
తవామరసుతప్రఖ్య
తర్తుం సాగరగాం నదీమ్।
నౌరియం పురుషవ్యాఘ్ర
తాం త్వమారోహ సువ్రత”॥
టీక:-
 తవ = నీవు; అమరసుత = దేవతా పుత్రులతో; ప్రఖ్య = తుల్యుడవు ; తర్తుం = దాటుటకు; సాగరగాం = సముద్రములోని ప్రవహించునది; నదీమ్ = నదిని; నౌః = పడవ; ఇయం = ఇది; పురుషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడు; తాం = నీ కొరకు; త్వమ్ = నీవు; ఆరోహ = ఎక్కుము; సువ్రత = మంచి చేయటయే వ్రతముగా కలవాడు; తే = నీ కొరకు
భావం:-
 రామా! నీవు దేవతా పుత్రులతో సాటివచ్చువాడవు. పురుష శ్రేష్ఠుడవు. ఈ గంగానదిని దాటుటకై, నీకు నావ సిద్ధముగా ఉన్నది. నీవు ఈ నావను ఎక్కుము’’ అనెను.
2.52.10.అనుష్టుప్.
అథోవాచ మహాతేజా
రామో గుహమిదం వచః।
“కృతకామోఽస్మి భవతా
శీఘ్రమారోప్యతామితి”॥
టీక:-
 అథ = అప్పుడు; ఉవాచ = పలికెను; మహాతేజా = గొప్ప తేజస్సు కలవాడు; రామః = రాముడు; గుహమ్ = గుహునికి; ఇదం = వీటిని; వచః = మాటలు; కృత కామః = కోరిన విధముగా చేసినవాడవు; అస్మి = అయ్యెను; భవతా = నీ ద్వారా; శీఘ్రమ్ = వేగముగా; ఆరోప్యతామ్ = ఎక్కించుము; ఇతి = ఈ విధముగా
భావం:-
 రాముడు గుహునితో, ‘నేను కోరిన విధముగా చేసితివి. మమ్ములను నావ ఎక్కించుము’ అని పలికెను.
2.52.11.అనుష్టుప్.
తతః కలాపాన్ సన్నహ్య
ఖడ్గౌ బధ్వా చ ధన్వినౌ।
జగ్మతుర్యేన తౌ గంగామ్
సీతయా సహ రాఘవౌ॥
టీక:-
 తతః = అటు పిమ్మట; కలాపాన్ = బాణములను; సన్నహ్య = కట్టుకొని; ఖడ్గౌ = కత్తులు; బధ్వా = కట్టుకొని; చ = మఱియు; ధన్వినౌ = ధనుస్సును ధరించి; జగ్మతుః = వెళ్లెను; ఏన = ఏ విధముగా; తౌ = ఇరువురు; గంగామ్ = గంగానది వైపుగా; సీతయా = సీతతో కూడి; సహ = సహితముగ; రాఘవౌ = రామునితో.
భావం:-
 పిమ్మట రామలక్ష్మణులు, అంబుల పొదులను ఖడ్గములను కట్టుకొని ధనుర్ధారులై, సీతతో కూడి గంగ వైపు వెళ్లిరి.
2.52.12.అనుష్టుప్.
రామమేవ తు ధర్మజ్ఞమ్
ఉపగమ్య వినీతవత్।
కిమహం కరవాణీతి
సూతః ప్రాంజలిరబ్రవీత్॥
టీక:-
 రామమ్ = రాముడు; ఏవ = మాత్రమే; తు = నిశ్చయంగా; ధర్మజ్ఞమ్ = ధర్మము తెలిసినవాడు; ఉపగమ్య = సమీపించిన; వినీతవత్ = వినయముతో; కిమ్ = ఏమి; అహం = నేను; కరవాణి = చేయగలను; ఇతి = ఈ విధముగా; సూతః = సుమంత్రుడు; ప్రాంజలిః = చేతులు మోడ్చి; అబ్రవీత్ = పలికెను.
భావం:-
  సుమంత్రుడు చేతులు మోడ్చి సవినయముగా ధర్మవేత్తౖయెన రాముని వద్దకు వెళ్లి, ఇపుడు నేనేమి చేయవలెను అని అడిగెను.
2.52.13.అనుష్టుప్.
తతోఽబ్రవీద్దాశరథిః సుమన్త్రం
స్పృశన్ కరేణోత్తమదక్షిణేన।
“సుమంత్ర! శీఘ్రం పునరేవ యాహి
రాజ్ఞః సకాశే భవ చాప్రమత్తః॥
టీక:-
 తతః = అప్పుడు; అబ్రవీత్ = పలికెను; దాశరథిః = రాముడు (దశరథుని కుమారుడు); సుమన్త్రం = సుమంత్రుని; స్పృశన్ = తాకి; కరేణ = చేతులతో; ఉత్తమ = ఉత్తమమైన; దక్షిణేన = దక్షిణవైపునది (కుడి చేతితో); సుమంత్ర = సుమంత్రుడు; శీఘ్రం = వేగముగా; పునరేవ = మరల; యాహి = ఆయనను; రాజ్ఞః = రాజు; సకాశే = సమీపమునకు; భవ = ఉండుము; చ = మఱియు; అప్రమత్తః = జాగరూకతతో.
భావం:-
 రాముడు సుమంత్రుని తన కుడిచేతితో స్పృశించి, “సుమంత్రుడా! వేగముగా రాజుని చేరి, ఆయన విషయమున ఏమరిపాటు లేక ఆయనను చూచుకొనుచుండుము.
2.52.14.అనుష్టుప్.
నివర్తస్వేత్యువాచైవ
హ్యేతావద్ధి కృతం మమ।
రథం విహాయ పద్భ్యాం తు
గమిష్యామి మహావనమ్”॥
టీక:-
 నివర్తస్వ =మరలిపొమ్ము; ఇతి = ఈ విధముగా; ఉవాచ = పలికెను; ఏవ హి = ఇంత; ఏతావద్ధి = ఇంత సేవ; కృతం = చేసినావు; మమ = నాకు; రథం = రథమును; విహాయ = విడిచి; పద్భ్యాం తు = కాలినడకనే; గమిష్యామి = వెళ్లుదును; మహావనమ్ = మహారణ్యమును
భావం:-
 నాకు ఇంత సాహాయ్యము చేసినావు కదా! ఇంక రథమును విడచి కాలినడకనే మహారణ్యమునకు వెళ్లెదను. నీవు మరలి వెళ్లుము’’ అని పలికెను.
2.52.15.అనుష్టుప్.
ఆత్మానం త్వభ్యనుజ్ఞాతమ్
అవేక్ష్యార్తః స సారథిః।
సుమంత్రః పురుషవ్యాఘ్రమ్
చక్ష్వాకమిదమబ్రవీత్॥
టీక:-
 ఆత్మానం = తనకు; త్వమ్ = మీకు; అభ్యనుజ్ఞాతమ్ = అనుజ్ఞ ఇవ్వబడితివి; అవేక్ష్య = చూచెను; ఆర్తః = ప్రేమగా; సః = ఆ; సారథిః = సారథి అయిన; సుమంత్రః = సుమంత్రుడు; పురుష వ్యాఘ్రమ్ = పురుషులలో శ్రేష్ఠుడైన; చ = మఱియు; ఇక్ష్వాకమ్ = ఇక్ష్వాకు వంశస్థుడైన రాముని; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను
భావం:-
 వెనుకకు మరలిపోవుటకై రాముడు తనకు అనుజ్ఞ ఇచ్చినట్లు తెలిసికొని సుమంత్రుడు. పురుష శ్రేష్ఠుడైన ఆ రామునితో ఇట్లు పలికెను.
2.52.16.అనుష్టుప్.
“నాతిక్రాంతమిదం లోకే
పురుషేణేహ కేనచిత్।
తవ సభ్రాతృభార్యస్య
వాసః ప్రాకృతవద్వనే॥
టీక:-
 న = లేరు; అతిక్రాంతమ్ = అతిక్రమించగలవారు; ఇదం = ఈ; లోకే = లోకములో; పురుషేణ = పురుషుడును; ఇహ = దీనిని; కేనచిత్ = ఏ ఒక్కరును; తవ = నీకు; సభ్రాతృ = సోదరునితోను; భార్యస్య = భార్యతోను; వాసః = నివాసము; ప్రాకృతవత్ = సామాన్య జనుడు వలె; వనే = అరణ్యములో.
భావం:-
  ఈ లోకములో ఇంత లేదా ఇంతకు మించి ఎవరునూ చేయజాలురు. సోదరునితోను, భార్యతోను కలసి రేపటినుండి సామాన్య జనుని వలె అరణ్యములో నివసింపనున్నావు.
2.52.17.అనుష్టుప్.
న మన్యే బ్రహ్మచర్యేఽస్తి
స్వధీతే వా ఫలోదయః।
మార్దవార్జవయోర్వాపి
త్వాం చేద్వ్యసనమాగతమ్॥
టీక:-
  న = వీలుకాదు; మన్యే = అనుకొనుట; బ్రహ్మచర్యః = బ్రహ్మచర్యము; అస్తి = కలదు; స్వధీతే = వేదాధ్యయనమునకు ; వా = గాని; ఫలోదయః = ఫలము కలుగుట; మార్దవాః = మృదుత్వమునకు గాని; జవయః = ఋజుత్వమునకు; అపి = గాని; త్వాం = నీకు; చేత్ = బహుశ; వసనమ్ = ఉండుట; ఆగతమ్ = వచ్చినది.
భావం:-
 నీకే ఇట్టి కష్టము వచ్చుట చూడగా బ్రహ్మచర్యమునకు గాని, వేదాధ్యయనమునకు గాని, మృదుత్వమునకు గాని, ఋజుత్వమునకు గాని ఫలమే లేదని తోచుచున్నది.
2.52.18.అనుష్టుప్.
సహ రాఘవ వైదేహ్యా
భ్రాత్రా చైవ వనే వసన్।
త్వం గతిం ప్రాప్స్యసే వీ!
త్రీన్ లోకాంస్తు జయన్నివ॥
టీక:-
 సహ = కలసి; రాఘవ = రాముడు; వైదేహ్యా = సీతతోను; భ్రాత్రా = సోదరుని; చైవ = తోను; వనే = అరణ్యములో; వసన్ = నివాసము; త్వం = నీవు; గతిం = సద్గతిని; ప్రాప్స్యసే = పొందగలవు; వీర = ఓ వీరుడా; త్రీన్ లోకాంస్తు = ముల్లోకములను; జయత్ = జయించినవాని; ఇవ = వలె.
భావం:-
 సీతతోను, సోదరునితోను, వనములో నివసించు నీవు మూడు లోకములను జయించినట్లు సద్గతిని పొందగలవు.
2.52.19.అనుష్టుప్.
వయం ఖలు హతా రామ
యే త్వయాప్యుపవంచితాః।
కైకేయ్యా వశమేష్యామః
పాపాయా దుఃఖభాగినః”॥
టీక:-
 వయం = మేము; ఖలు = నిశ్చయముగ; హతాః = నష్టజాకుకలము; రామ = ఓ రామా; యేన = ఎందువలననగా; త్వయ = మీ వలన; అపి = కూడా; ఉపవంచితాః = మిక్కిలి వంచింపబడి; కైకేయ్యా = కైకేయికి; వశమేష్యామః = వశులమై ఉండవలసి ఉన్నది; పాపాయా = పాపస్వభావముచే; దుఃఖ = దుఃఖమును; భాగినః = అనుభవించుచు.
భావం:-
 మేమే చాలా దురదృష్టవంతులము. నీ ద్వారా కూడా వంచింపబడితిమి. మేము దుఃఖించుచు, పాపాత్మురాలైన కైకేయికి వశులమై ఉండవలసి ఉన్నది’’ అని పలికెను.
2.52.20.అనుష్టుప్.
ఇతి బ్రువన్నాత్మసమమ్
సుమంత్రః సారథిస్తదా।
దృష్ట్వా దూరగతం రామమ్
దుఃఖార్తో రురుదే చిరమ్॥
టీక:-
 ఇతి = ఈ విధముగా; బ్రువత్ = పలికి; ఆత్మసమమ్ = ప్రాణముతో సమానుడైన, రామునితో; సుమంత్రః = సుమంత్రుడు; సారథిః = సారథి అయిన; తదా = అప్పుడు; దృష్ట్వా = చూచి; దూరగతం = దూరముగా వెళ్లిన; రామమ్ = రాముని; దుఃఖార్తః = దుఃఖముతో; రురుదే = విలపించెను; చిరమ్ = చాలాసేపు.
భావం:-
  తనకు ప్రాణతుల్యుడైన రామునితో ఈ విధముగా పలుకి, రాముడు దూరముగా వెళ్లుట చూచి, దుఃఖార్తుడై చాలసేపు ఏడ్చెను.
2.52.21.అనుష్టుప్.
తతస్తు విగతే బాష్పే
సూతం స్పృష్టోదకం శుచిమ్।
రామస్తు మధురం వాక్యమ్
పునః పునరువాచ తమ్॥
టీక:-
 తతః = అటు పిమ్మట; తు = ఇంక; విగతే = తగ్గిన పిమ్మట; బాష్పే = కన్నీరు; సూతమ్ = సుమంత్రునితో; సృష్టోదకం = సృష్ట + ఉదకం, ఆచమనము చేసి; శుచిమ్ = పరిశుద్ధుడై; రామః = రాముడు; తు = ఇంకను; మధురం = మధురముగా; వాక్యమ్ = మాటలను; పునః పునః = మరల మరల; ఉవాచ = పలికెను; తమ్ = అతనితో
భావం:-
 కన్నీరు తగ్గిన పిమ్మట ఆచమనము చేసి పరిశుద్ధుడై ఉన్న ఆ సూతునితో, రాముడు, మధురముగా మాటిమాటికి ఇట్లు పలికెను.
2.52.22.అనుష్టుప్.
“ఇక్ష్వాకూణాం త్వయా తుల్యమ్
సుహృదం నోపలక్షయే।
యథా దశరథో రాజా
మాం న శోచేత్తథా కురు॥
టీక:-
 ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశమువారికి; త్వయా = నీతో; తుల్యమ్ = సమానమైన; సుహృదం = మంచి మిత్రుడు; న = లేదు; ఉపలక్షయే = చూడ గలుగుట; యథా = ఏ విధముగా; దశరథః = దశరథ; రాజా = మహారాజు; మాం = నన్ను గూర్చి; న = లేకుండు; శోచేత్ = విచారించుట; తథా = అట్లు; కురు = చేయుము
భావం:-
 ఇక్ష్వాకు వంశము వారికి నీకు సాటివచ్చు మిత్రుడు ఎవ్వడును లేడు. మహారాజు దశరథలవారు నన్ను గూర్చి విచారించకుండునట్లు చూడుము.
2.52.23.అనుష్టుప్.
శోకోపహతచేతాశ్చ
వృద్ధశ్చ జగతీపతిః।
కామభావావసన్నశ్చ
తస్మాదేతద్బ్రవీమి తే॥
టీక:-
  శోకః = శోకాముచే; ఉపహత = మిక్కిలి పీడింపబడుచున్న; చేతాః = మనస్సు; చ = మఱియు; వృద్ధః = వృద్ధుడు; చ = మఱియు; జగతీపతిః = రాజు; కామభార = కామము అధికమగుటవలన కలుగు భారముచే; అవసన్నః = కృంగిపోయినవాడు; చ = మఱియు; తస్మాత్ = అందువలననే; ఏతత్ = ఈ విధముగా; బ్రవీమి = చెప్పుచున్నాను; తే = నీకు
భావం:-
 రాజ దశరథుని మనస్సు శోకాముచే పీడింపబడి ఉన్నది. అతడు వృద్ధుడు. కామభారముచే క్రుంగిపోయినవాడు. అందువలననే ఇట్లు చెప్పుచున్నాను.
2.52.24.అనుష్టుప్.
యద్యదాజ్ఞాపయేత్కించిత్
స మహాత్మా మహీపతిః।
కైకేయ్యాః ప్రియకామార్థమ్
కార్యం తదవికాంక్షయా॥
టీక:-
 యద్యత్ = ఇంతవరకు; ఆజ్ఞాపయేత్ = ఆజ్ఞాపించినను; కించిత్ = ఏమి చెప్పినను; సః = అతడు; మహాత్మా = మహాత్ముడు; మహీపతిః = చక్రవర్తి; కైకేయ్యాః = కైకేయికి; ప్రియకామార్థమ్ = ఇష్టమైన కోరికను తీర్చుటకు; కార్యం = పనులను; తత్ = ఆ; అవికాంక్షయా = చేయుచుండ వలయును.
భావం:-
 కైకేయికి ఇష్టమైన కోరికను తీర్చుటకూ మహాత్ముడైన ఆ రాజు ఏమేమి ఆజ్ఞాపించినను, దానిని నిస్సంశయముగా చేయుచుండవలయును.
2.52.25.అనుష్టుప్.
ఏతదర్థం హి రాజ్యాని
ప్రశాసతి నరేశ్వరాః।
యదేషాం సర్వకృత్యేషు
మనో న ప్రతిహన్యతే॥
టీక:-
 ఏతత్ = అందు; అర్థం = కొఱకు; హి = మాత్రమే; రాజ్యాని = రాజ్యములను; ప్రశాసతి = పరిపాలించుచున్నారనగా; నరేశ్వరాః = అందరు రాజులు; యదేషాం = వారి ఆజ్ఞ; సర్వ = అన్ని; కృత్యేషు = కార్యములందును; మనః = సంకల్పము; న = ఉండదు; ప్రతిహన్యతే = త్రోసివేయబడుట, వావిళ్ళ నిఘంటువు.
భావం:-
 రాజులు రాజ్యములను పరిపాలించుచున్నారనగా. అన్ని కార్యములందును వారి ఆజ్ఞ అప్రతిహతముగా ఉండుట వలననే కదా.
2.52.26.అనుష్టుప్.
యద్యథా స మహారాజో
నాళీకమధిగచ్ఛతి।
న చ తామ్యతి దుఃఖేన
సుమంత్ర కురు తత్తథా॥
టీక:-
 యత్ = ఏది; యథా = ఏ విధముగా; సః = ఆ; మహారాజః = మహారాజు; న = లేదు; అళీకమ్ = అప్రియముగా, అసత్యముగా; అధిగచ్ఛతి = అనుకొనడో; న = లేదు; చ = మఱియు; తామ్ = వారు; అతి = అత్యధిక; దుఃఖేన = దుఃఖముచే; సుమంత్ర = ఓ సుమంత్రా; కురు = నిర్వహించు; తత్తథా = ఆ విధముగా చేయుము
భావం:-
 ఎట్లైనను, ఆ మహారాజు, తాను ఆజ్ఞాపించినది, వ్యర్థమైనదే అని అనుకొనకుండునట్లును, దుఃఖముతో బాధ పడకుండునట్లును చేయుచుండుము.
2.52.27.అనుష్టుప్.
అదృష్టదుఃఖం రాజానమ్
వృద్ధమార్యం జితేంద్రియమ్।
బ్రూయాస్త్వమభివాద్యైవ
మమ హేతోరిదం వచః॥
టీక:-
 అదృష్ట = చూడని; దుఃఖమ్ = దుఃఖమును; రాజానమ్ = రాజునకు; వృద్ధమ్ = వృద్ధుడైన; ఆర్యం = పూజనీయుడైన; జితేంద్రియమ్ = ఇంద్రియములను జయించిన; బ్రూయాః = చెప్పుము; త్వమ్ = నీవు; అభివాద ఏవ = నమస్కరించి; మమ హేతోః = నా పక్షమున; ఇదం = ఈ విధముగా; వచః = మాటలను
భావం:-
 ఎన్నడును ఎట్టి దుఃఖము ఎఱుగనివాడు, వృద్ధుడు, పూజ్యుడు, జితేంద్రియుడు అయిన రాజునకు, నా పక్షమున నమస్కరించి నా మాటగా ఇట్లు చెప్పుము.
2.52.28.అనుష్టుప్.
‘నైవాహమనుశోచామి
లక్ష్మణో న చ మైథిలీ।
అయోధ్యాయాశ్చ్యుతాశ్చేతి
వనే వత్స్యామహేతి చ॥
టీక:-
 నైవ = ఏమాత్రమూ లేదు; అహమ్ = నేను; న = లేదు; అనుశోచామి = దుఃఖించుట; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; మైథిలీ = సీతాదేవి; అయోధ్యాయాః = అయోధ్య నుండి; చ్యుతాః = విడిచిపెట్టి; చ = పూర్తిగ; ఇతి = అని; వనే = వనమునందు; వత్స్యామహ = నివసించుచున్నాము; ఇతి = అని; చ = కూడా.
భావం:-
 ’అయోధ్యను విడిచిపెట్టవలసివచ్చినదే అని కాని, అరణ్యములో నివసింపవలసి వచ్చినదే అనిగాని నేను, లక్ష్మణుడు సీత ఏ మాత్రము దుఃఖించుట లేదు.
2.52.29.అనుష్టుప్.
చతుర్దశసు వర్షేషు
నివృత్తేషు పునః పునః।
లక్ష్మణం మాం చ సీతాం చ
ద్రక్ష్యసే క్షిప్రమాగతాన్’॥
టీక:-
 చతుర్దశసు = పదునాలుగు; వర్షేషు = సంవత్సరములు; నివృత్తేషు = గడిచిన పిమ్మట; పునః పునః = మరల మరల (నిత్యము); లక్ష్మణం = లక్ష్మణుని; మాం = నన్ను; చ = మఱియు; సీతాం = సీతమ్మను; చ = మఱియు; ద్రక్ష్యసే = చూడగలరు; క్షిప్రమ్ = వెంటనే; ఆగతాన్ = వచ్చిన
భావం:-
 పదునాలుగు సంవత్సరములు గడచిన వెంటనే, లక్ష్మణుడు, నేను సీత తిరిగి వచ్చెదము. అప్పటినుండి మీ ఎదుటనే ఉండెదము.’
2.52.30.అనుష్టుప్.
ఏవముక్త్వా తు రాజానమ్
మాతరం చ సుమంత్ర! మే।
అన్యాశ్చ దేవీస్సహితాః
కైకేయీం చ పునః పునః॥
టీక:-
 ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = చెప్పన; తు = పిమ్మట; రాజానమ్ = రాజుతో; మాతరం = తల్లిని; చ = మఱియు; సుమంత్ర = సుమంత్రా; మే = నా యొక్క; అన్యాశ్చ = ఇతర; దేవీః = భార్యలను; సహితాః = సహితముగా; కైకేయీం = కైకేయిని; చ = కూడా; పునః పునః = మరల మరల.
భావం:-
 ఓ సుమంత్రా! రాజుతో ఇట్లు చెప్పి, మా తల్లిని, సమస్తమైన ఇతర రాజ భార్యలను కైకేయిని, మేము మరల మరల
2.52.31.అనుష్టుప్.
ఆరోగ్యం బ్రూహి కౌసల్యామ్
అథ పాదాభివందనమ్।
సీతాయా మమ చాఽఽర్యస్య
వచనాల్లక్ష్మణస్య చ॥
టీక:-
 ఆరోగ్యం = ఆరోగ్యమును; బ్రూహి = తెలుపుము; కౌసల్యామ్ = కౌసల్యను; అథ = అప్పుడు; పాదాభివందనమ్ = పాదాభివందనము; సీతాయా = సీతాదేవి యొక్క; మమ = నాయొక్క; చ = కూడ; ఆర్యస్య = మహారాజుకు; వచనాత్ = మాటలను; లక్ష్మణస్య = లక్ష్మణునియొక్క; చ = కూడా.
భావం:-
 ఆరోగ్యమును గూర్చి ప్రశ్నించినట్లు చెప్పి, పిదప కౌసల్యా మహారాజులకు నేను, లక్ష్మణుడు, సీత పాదాభివందనము చేసినట్లు తెలుపుము.
2.52.32.అనుష్టుప్.
బ్రూయాశ్చ హి మహారాజమ్
భరతం క్షిప్రమానయ।
ఆగతశ్చాపి భరతః
స్థాప్యో నృపమతే పదే॥
టీక:-
 బ్రూయః = చెప్పుము; చ = కూడా; హి = ఇంకను ; మహారాజమ్ = చక్రవర్తికి; భరతం = భరతుని; క్షిప్రమ్ = శీఘ్రముగా; ఆనయ = తీసుకొని రండి; ఆగతశ్చ = రాక; అపి = పిమ్మట; భరతః = భరతుని; స్థాప్యః = స్థాపించుము; నృపమతః = రాజ్యాధికార; పదే = పదవియందు.
భావం:-
 భరతుని శీఘ్రముగా తీసుకొని రమ్ము. రాగానే, ఆ భరతునికి రాజ్యాధికార పదవి కట్టబెట్టండి.
2.52.33.అనుష్టుప్.
భరతం చ పరిష్వజ్య
యౌవరాజ్యేఽభిషిచ్య చ।
అస్మత్సంతాపజం దుఃఖమ్
న త్వామభిభవిష్యతి॥
టీక:-
 భరతం = భరతుని; చ = మఱియు; పరిష్వజ్య = కౌగిలించుకొని; యౌవరాజ్యః = యౌవరాజ్యమునందు; అభిషిచ్య = అభిషిక్తుని చేసిన; చ = పిమ్మట; అస్మత్ = మా; సంతాపజం = కష్టముల వలన కలిగిన; దుఃఖమ్ = దుఃఖము; న = ఉండదు; త్వామ్ = నీకు; అభిభవిష్యతి = ఇకముందు.
భావం:-
 భరతుని కౌగిలించుకొని, ‘అతనిని యౌవ రాజ్యమునందు అభిషిక్తుని చేసిన పిదప, నీకు మా కష్టముల వలన కల్గిన దుఃఖము ఉండదు.’ అని
2.52.34.అనుష్టుప్.
భరతశ్చాపి వక్తవ్యో
‘యథా రాజని వర్తసే।
తథా మాతృషు వర్తేథాః
సర్వాస్వేనావిశేషతః॥
టీక:-
 భరతః = భరతునితో; చాపి = కూడా; వక్తవ్యః = చెప్పవలెను; యథా = ఏ విధముగా; రాజని = రాజు పట్ల; వర్తసే = ప్రవర్తింతువో; తథా = అలాగే; మాతృషు = తల్లుల పట్లను; వర్తేథాః = ప్రవర్తించబడుగాక; సర్వాస్వన = అందరినీ; ఇవ = అటులనే; అవిశేషతః = భేద భావము లేకుండా
భావం:-
 భరతునితో ఇట్లు చెప్పవలెను – ‘రాజు విషయములో ఎట్లు ప్రవర్తించుచుందువో, అందరు తల్లుల విషయములో కూడ ఎట్టి భావము లేక ఆ విధముగనే ప్రవర్తించుచుండుము.
2.52.35.అనుష్టుప్.
యథా చ తవ కైకేయీ
సుమిత్రా చ విశేషతః।
తథైవ దేవీ కౌసల్యా
మమ మాతా విశేషతః॥
టీక:-
 యథా చ = ఉన్నట్లే; తవ = నీ యొక్క; కైకేయీ = కైకేయి; సుమిత్రా చ = సుమిత్ర మఱియు; విశేషతః =ప్రత్యేకించి; తథైవ = అదే విధముగా; దేవీ = రాణియు; కౌసల్యా = కౌసల్య; మమ = నా యొక్క; మాతా = తల్లి; విశేషతః = విశేషించి.
భావం:-
 నీకు కైకేయి ఎట్లో, సుమిత్ర ఎట్లో, రాణియు, విశేషించి అందులోను నా తల్లియు అయిన కౌసల్య కూడ అట్లే.
2.52.36.అనుష్టుప్.
తాతస్య ప్రియకామేన
యౌవరాజ్యమపేక్షతా।
లోకయోరుభయోః శక్యమ్
త్వయా యత్సుఖమేధితుమ్”॥
టీక:-
 తాతస్య = తండ్రి గారి యొక్క; ప్రియకామేన = ఇష్టమును చేయుటకై; యౌవరాజ్యమ్ = యౌవరాజ్యమును; అపేక్షతా = ఇష్టమును; లోకయోః = లోకములు; ఉభయోః = రెండింటియందును; శక్యమ్ = శక్యమగును; త్వయా = నీవు; యత్ = వాటి యందు; సుఖమ్ = సుఖమును; ఏధితుమ్ = పెంచుకొనుటకు.
భావం:-
 తండ్రి ఇష్టమును చేయుటకై యువరాజత్వమును స్వీకరించు. నీవు ఇహపరములు రెండింటియందును సుఖమును పెంచుకొనుటకు వీలగును.”
2.52.37.అనుష్టుప్.
నివర్త్యమానో రామేణ
సుమంత్రః శోకకర్శితః।
తత్సర్వం వచనం శ్రుత్వా
స్నేహాత్కాకుత్స్థమబ్రవీత్॥
టీక:-
 నివర్త్యమానః = వెనుకకు పంపబడుచున్న; రామేణ = రాముని చేత; సుమంత్రః = సుమంత్రుడు; శోక = శోకముతో; కర్శితః = పీడితుడు; తత్ = ఆ; సర్వం = అన్నియు; వచనం = మాటలను; శ్రుత్వా = వినిన తరువాత; స్నేహాత్ = స్నేహపూర్వకముగా; కాకుత్థ్సమ్ = కకుత్థ్స వంశీయుడైన రామునితో; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 రామునిచే వెనుకకు పంపబడుచున్న ఆ సుమంత్రుడు, శోకముతో బాధపడుతూ, ఆ మాటలన్నియు విని, స్నేహపూర్వకముగా రామునితో ఇట్లు పలికెను.
2.52.38.అనుష్టుప్.
“యదహం నోపచారేణ
బ్రూయాం స్నేహాదవిక్లబః।
భక్తిమానితి తత్తావత్
వాక్యం త్వం క్షన్తుమర్హసి॥
టీక:-
 యత్ = ఏ; అహం = నేను; న = లేకుండా; ఉపచారేణ = గౌరవములు; బ్రూయాం = చెప్పుచున్నానో; స్నేహాత్ = స్నేహముచే; అవిక్లబః = నిర్భయముగా; భక్తిమాన్ = భక్తుడు; ఇతి = అని; తత్ = అది; తావత్ = అంతయు; వాక్యం = మాటలు; త్వం = నీవు; క్షన్తుమ్ = క్షమించుటకు; అర్హసి = అర్హుడు.
భావం:-
 “నీపై ఉన్న చనువు కొలదీ నేను సంకోచము లేకుండగా మర్యాద తప్పి గాని, నమ్రక లోపించి కాని చెప్పిన మాటలను ‘ఈతడు మన భక్తుడు కదా’ అను భావముతో నీవు క్షమించవలెను.
2.52.39.అనుష్టుప్.
కథం హి త్వద్విహీనోఽహమ్
ప్రతియాస్యామి తాం పురీమ్।
తవ తావద్వియోగేన
పుత్రశోకాకులామివ॥
టీక:-
 కథం = ఏ విధముగా; హి = సందేహనివారణం; త్వత్ = నీవు; విహీనః = లేకుండా; అహమ్ = నేను; ప్రతియాస్యామి = తిరిగి వెళ్లగలను; తామ్ = ఆ; పురీమ్ = నగరమైన అయోధ్యకు; తవ = నీ; తావత్ = ఆ విధముగా; వియోగేన = వియోగముతో; పుత్ర = తన కుమారుని; శోకాః = బాధతో; ఆకులమ్ = కలతచెందిన; ఇవ = వలె
భావం:-
 నీ వియోగముతో పుత్రశోకముచే కలతచెందిన ఆ అయోధ్యా నగరమునకు నీవు లేకుండ నేను తిరిగి ఎట్లు వెళ్లగలను?
2.52.40.అనుష్టుప్.
సరామమపి తావన్మే
రథం దృష్ట్వా తదా జనః।
వినా రామం రథం దృష్ట్వా
విదీర్యేతాపి సా పురీ॥
టీక:-
  స = సహితముగా; రామమ్ = రామునితో; అపి = ఐనట్టి; తావత్ = ఆ విధముగా; మే = నా యొక్క; రథమ్ = రథమును; దృష్ట్వా = చూచిన; తదా = అప్పుడు; జనః = ప్రజలు; వినా రామం = రాముడు లేని; రథం = రథమును; దృష్ట్వా = చూచి; విదీర్యేత = కృంగిపోవుదురు; అపి = కదా; సా = ఆ; పురీ = పౌరు.
భావం:-
 ఆనాడు, రథములో రాముడుండగా చూచిన అయోధ్యా ప్రజలు, నేడు రాముడు లేని రథముతో వెళ్లినచో దానిని చూచి వారు మరీ కృంగిపోవుదురు కదా.
2.52.41.అనుష్టుప్.
దైన్యం హి నగరీ గచ్ఛేత్
దృష్ట్వా శూన్యమిమం రథమ్।
సూతావశేషం స్వం సైన్యమ్
హతవీరమివాఽహవే॥
టీక:-
 దైన్యమ్ = దుఃఖించినవారు; హి = కదా; నగరీ = నగరము; గచ్ఛేత్ = పోవుటను; దృష్ట్వా = చూచి; శూన్యమ్ = శూన్యముగా ఉన్న; ఇమమ్ = ఈ యొక్క; రథమ్ = రథమును; సూత = సారథి; అవశేషమ్ = మాత్రమే మిగిలిన దానిని; స్వం = అతని; సైన్యమ్ = సైన్యము; హతః = వీరుడు; వీరమ్ = మరణించిన; ఇవ = వలె; ఆహవే = యుద్ధములో.
భావం:-
 యుద్ధములో వీరుడు మరణించగా సారథి మాత్రమే మిగిలిన తమ రథమును చూచి, సైన్యము దుఃఖించినట్లు నీవు లేని ఈ రథమును చూచి, ఆ నగరం దైన్యమును పొందును.
2.52.42.అనుష్టుప్.
దూరేఽపి నివసంతం త్వామ్
మానసేనాగ్రతః స్థితమ్।
చింతయంతోఽద్య నూనం త్వామ్
నిరాహారాః కృతాః ప్రజాః॥
టీక:-
 దూరః = దూర ప్రదేశములో; అపి నివసంతం = నివసించుచున్నను; త్వామ్ = నిన్ను; మానసేన = మనస్సుచే; అగ్రతః = ఎదుటనే; స్థితమ్ = ఉన్నట్లుగా; చింతయంతః = ఆలోచించుచు; అద్య = నేడు; నూనం త్వామ్ = నీ గురించే; నిరాహారాః = ఆహారము లేకుండా; కృతాః = ఉందురు; ప్రజాః = ప్రజలు.
భావం:-
 ఇపుడు అయోధ్యలోని ప్రజలందరు దూరములో నివసించుచున్నను మనస్సునందే ఉన్న నిన్ను గూర్చి చింతించుచు నిరాహారులై ఉందురు.
2.52.43.అనుష్టుప్.
దృష్టం తద్ధి త్వయా రామ!
యాదృశం త్వత్ప్రవాసనే।
ప్రజానాం సంకులం వృత్తమ్
త్వచ్ఛోకక్లాంతచేతసామ్॥
టీక:-
 దృష్టమ్ = చూడబడెను; తత్ = దానిని; హి = కదా; త్వయా = నీచే; రామ = ఓ రామా; యాదృశం = ఏ విధముగా; త్వత్ = నీ; ప్రవాసనే = దేశాన్ని విడిచే సమయమున; ప్రజానామ్ = ప్రజలను; సంకులం = కలతచెందిన; వృత్తమ్ = విధమును; త్వత్ = నీవే; శోకః = శోకముతో; క్లాంత = వడలిన; చేతసామ్ = మనస్సులను.
భావం:-
 రామా! నీవు దేశము విడిచి పొవుచుండగా, నిన్ను గురించిన శోకముతో క్షోభచెందిన మనసులతో ప్రజలు ఏ విధముగా ప్రవర్తించిరో నీవే చూచితివి కదా!
2.52.44.అనుష్టుప్.
ఆర్తనాదో హి యః పౌరైః
ముక్తస్త్వద్విప్రవాసనే।
సరథం మాం నిశామ్యైవ
కుర్యుః శతగుణం తతః॥
టీక:-
 ఆర్తనాదః = ఆర్తనాదముచేసినవారు; హి = కదా; యః = ఏది; పౌరైః = పౌరులు; ముక్తః = విడిచిన; త్వత్ = నీవు; విప్రవాసనే = నగరము వీడు సమయములో; స = సహితంగా; రథం = రథము; మాం = నన్ను; నిశామ్య = చూచిన; ఏవ = వెంటనే; కుర్యుః = చేయుదురు; శతగుణం = వంద రెట్లు; తతః = దానికి
భావం:-
 నీవు వనమునకు ప్రయాణమై వచ్చు సమయమున, పౌరులు ఎంతటి ఆర్తనాదములు చేసినారో, రథములో నేను మాత్రమే ఉండగా చూడగనే దానికి నూరు రెట్లు ఆర్తనాదములను చేయుదురు.
2.52.45.అనుష్టుప్.
అహం కిం చాపి వక్ష్యామి
దేవీం “తవ సుతో మయా।
నీతోఽసౌ మాతులకులమ్
సంతాపం మా కృథా” ఇతి॥
టీక:-
 అహం = నేను; కిం చాపి = ఏమని; వక్ష్యామి = చెప్పవలెను; దేవీం = కౌసల్యాదేవితో; తవ = నీ; సుతః = కుమారుడు; మయా = నాచే; నీతః అసౌ = తీసుకొని వెళ్లిబడెను; మాతులకులమ్ = మేనమామ ఇంటికి; సంతాపమ్ = దుఃఖించుట; మా = వలదు; కృథాః = చేయ; ఇతి = అని.
భావం:-
 “నీకుమారుని మేనమామ ఇంటికి తీసుకొని వెళ్లితిని. దుఃఖించకుము”. . అని నేను కౌసల్యాదేవితో చెప్పవలెనా!
2.52.46.అనుష్టుప్.
అసత్యమపి నైవాహమ్
బ్రూయాం వచనమీదృశమ్।
కథమప్రియమేవాహమ్
బ్రూయాం సత్యమిదం వచః॥
టీక:-
 అసత్యమ్ = అసత్యమైనది; అపి = ఐనదానిని; న = కాదు; + ఏవ = చేయుట; అహమ్ = నేను; బ్రూయాం = చెప్పుట; వచనమ్ = మాటలను; ఈదృశమ్ = ఈ విధమైన; కథమ్ = ఏ విధముగా; అప్రియమ్ + ఏవ = అప్రియమైన; అహమ్ = నేను; బ్రూయాం = చెప్పుట;సత్యమ్ = సత్యమైనను; ఇదం వచః = ఇటువంటి మాటలు.
భావం:-
 నేను, అసత్యమైన విషయములు చెప్పజాలను. నీ కుమారుని అరణ్యములలో విడిచితిని.. అను అప్రియమైనది సత్యమైనను ఈ విషయమును కౌసల్యాదేవితో చెప్పజాలను.
*గమనిక:-
కథమప్రియమేవాహమ్- సత్యం బ్రూయాత్ `ప్రియం బ్రూయత్, న బ్రూయాత్ `సత్యమప్రియమ్; ప్రియంచ నాఽనృతం బ్రూయాత్, ఏషధర్మః సనాతనః. (నీతి శాస్త్రము), సత్యమును పలుకవలెను. ప్రియవచనమును నుడువువలెను. సత్యమే కదా యని, అప్రి.వచనమును పలుకరాదు. ప్రియమును గూర్చునదియే ఐనను, అసత్యమును వచింపరాద. ఇదియే సనాతన ధర్మము.
2.52.47.అనుష్టుప్.
మమ తావన్నియోగస్థాః
త్వద్బంధుజనవాహినః।
కథం రథం త్వయా హీనమ్
ప్రవక్ష్యన్తి హయోత్తమాః॥
టీక:-
 మమ = నా; తావత్ = ఇంతవరకు; నియోగస్థాః = అధీనములో; త్వత్ = మిమ్ములను; బంధుజన = బంధుజనులను (సీతాలక్ష్మణులను); వాహినః = గుఱ్ఱములను; కథం = ఏ విధముగా; రథం = రథమును; త్వయా = నీవు; హీనమ్ = లేనిదానిని; ప్రవక్ష్యన్తి = వెళ్లగలను; హయోత్తమాః =శ్రేష్ఠమైన గుఱ్ఱములు.
భావం:-
 నిన్ను, సీతా లక్ష్మణులను ఇంతవరకు తీసుకొని వచ్చిన, నా అదుపులో ఉన్న ఈ శ్రేష్ఠములైన గుఱ్ఱములు లాగుకుని వచ్చిన నీవు లేని రథమును ఎట్లు తీసుకొని వెళ్లగలను.
2.52.48.అనుష్టుప్.
తన్న శక్ష్యామ్యహం గన్తుమ్
అయోధ్యాం త్వదృతేఽనఘ।
వనవాసానుయానాయ
మామనుజ్ఞాతుమర్హసి॥
టీక:-
 తత్ = ఆ కారణము చేత; న = కాదు; శక్ష్యామ = చేత; అహం = నేను; గన్తుమ్ = వెళ్లుటకు; అయోధ్యాం = అయోధ్యా నగరమునకు; త్వత్ = నిన్ను; దృతః = అనుసరించిన వాడనై; అనఘ = ఓ దోషరహితుడా; వనవాస = అరణ్యమునకు; అనుయానాయ = వెంట వచ్చుటకు; మామ్ = నన్ను; అనుజ్ఞాతుమ్ + అర్హసి = అనుజ్ఞ ఇవ్వగలరు.
భావం:-
 ఈ కారణముచే నేను అయోధ్యకు తిరిగి వెళ్లజాలను. నీ వెనుకనే అరణ్యమునకు వచ్చుటకు నాకు అనుజ్ఞ ఇమ్ము.
2.52.49.అనుష్టుప్.
యది మే యాచమానస్య
త్యాగమేవ కరిష్యసి।
సరథోఽగ్నిం ప్రవేక్ష్యామి
త్యక్తమాత్ర ఇహ త్వయా॥
టీక:-
 యది = ఈ విధముగా; మే = నేను; యాచమానస్య = ప్రార్థించుచున్నను; త్యాగమేవ = విడిచి వేసినచో; కరిష్యసి = చేసెదను; స = సహితముగ; రథః = రథముత; అగ్నిం = అగ్నిలో; ప్రవేక్ష్యామి = ప్రవేశించెదను; త్యక్తమాత్ర = విడిచివేసినచో; ఇహ = ఇక్కడనే; త్వయా = నీచే.
భావం:-
 నేను ఇంతగా ప్రార్థించుచున్నను, నీవు నన్ను విడిచి వేసినచో, నేను వెంటనే రథముతో కూడ, ఇక్కడనే అగ్నిలో ప్రవేశించెదను.
2.52.50.అనుష్టుప్.
భవిష్యన్తి వనే యాని
తపోవిఘ్నకరాణి తే।
రథేన ప్రతిబాధిష్యే
తాని సత్త్వాని రాఘవ॥
టీక:-
 భవిష్యన్తి = వచ్చివచో; వనే = అడవిలో; యాని = ఏవేని; తపో = తపస్సునకు; విఘ్నః = అడ్డంకులు; కరాణి = సృష్టించునవి; తే = నీయొక్క; రథేన = రథము చేత; ప్రతిబాధిష్యే = నివారించెదను; తాని = అటువంటి; సత్త్వాని = జంతువులను; రాఘవ = రామా.
భావం:-
 అరణ్యములో నీ తపస్సుకు విఘ్నము కలిగించుటకు ఏవేని మృగములు వచ్చినచో, నేను మృగములను నీ రథము చేత నివారించెదను. అలా నేర్పు నాకు కలదు.
2.52.51.అనుష్టుప్.
త్వత్కృతేన మయాఽవాప్తమ్
రథచర్యాకృతం సుఖమ్।
ఆశంసే త్వత్కృతేనాహమ్
వనవాసకృతం సుఖమ్॥
టీక:-
  త్వత్ = నీ; కృతేన = అనుగ్రహముచేత; మయా = నా చేత; అవాప్తమ్ = పొందదలబడినది; రథచర్యాః = రథమును నడుపు; కృతమ్ = పని యందు; సుఖమ్ = ఆనందమును; ఆశంసే = అనుగ్రహింపుము; త్వత్ = నీ; కృతేన = అనుగ్రహముచేతనే; అహమ్ = నేను; వనవాస = వనవాస; కృతమ్ = కార్యము; సుఖమ్ = సుఖమును.
భావం:-
 నీ అనుగ్రహముచే నేను రథము నడుపు ఆనందము పొందితిని. నీ అనుగ్రహము చేతనే వనవాస సుఖమును కూడ పొందదలచుచున్నాను.
2.52.52.అనుష్టుప్.
ప్రసీదేచ్ఛామి తేఽరణ్యే
భవితుం ప్రత్యనంతరః।
ప్రీత్యాఽభిహితమిచ్ఛామి
భవ మే ప్రత్యనంతరః॥
టీక:-
 ప్రసీద = ఉండవలెనని; ఇచ్ఛామి = కోరుకొనుచున్నాను; తే = నీ యొక్క; అరణ్యే = అరణ్యములో; భవితుం = అగుటకొరకు; ప్రత్యనంతరః = ప్రతి + అనంతరః, సన్నిహిత సహచరునిగా; ప్రీత్యా = ప్రేమ పూర్వకముగా; అభిహితమ్ = సమ్మతిని; ఇచ్ఛామి = కోరుచున్నాను; భవ = నీ యొక్క; మే = నాకు; ప్రత్యనంతరః = సన్నిహిత సహచరునిగా.
భావం:-
 నేను అరణ్యములో నీ సమీపమునందే ఉండవలెనని కోరుచున్నాను. ‘నీవు సమీపమునందే ఉండుటకప’ అని నీవు ప్రేమపూర్వకముగా అనుమతించ మని కోరుచున్నాను.
2.52.53.అనుష్టుప్.
ఇమే చాపి హయా వీర!
యది తే వనవాసినః।
పరిచర్యాం కరిష్యన్తి
ప్రాప్స్యన్తి పరమాం గతిమ్॥
టీక:-
  ఇమే = ఈ విధముగా; చాపి = చేసినచో; హయా = గుఱ్ఱములు; వీర = ఓ వీరుడా; యది = అట్లైన; తే = నీకు; వనవాసినః = వనములో నివసించుచుండగా; పరిచర్యాం = సేవలు; కరిష్యన్తి = చేసినచో; ప్రాప్స్యన్తి = లభించును; పరమాం = ఉత్తమ; గతిమ్ = గతులు.
భావం:-
 నీవు వనములో నివసించుచుండగా ఈ గుఱ్ఱములు నీకు సేవ చేసినచో వాటికి కూడ ఉత్తమగతి లభించును కదా.
2.52.54.అనుష్టుప్.
తవ శుశ్రూషణం మూర్ధ్నా
కరిష్యామి వనే వసన్।
అయోధ్యాం దేవలోకం వా
సర్వథా ప్రజహామ్యహమ్॥
టీక:-
 తవ = నీ యొక్క; శుశ్రూషణం = సేవలు చేయుదును; మూర్థ్న = శిరస్సునదాల్చి; కరిష్యామి = చేసెదను; వనే = వనములో; వసన్ = నివసించుచు; అయోధ్యామ్ = అయోధ్య; దేవలోకం = దేవ లోకము; వా = లేక; సర్వథా = ఎప్పటికి; ప్రజహామి = విడిచిపెట్టెదను; అహమ్ = నేను
భావం:-
  వనములో నివసించుచు నీకు శిశుశ్రూషలు శిరసునదాల్చి ఆచరించెదను. ఇందుకు, నేను అయోధ్యనైనను, దేవ లోకమునైనను ఎప్పటికి విడచిపెట్టెదను.
2.52.55.అనుష్టుప్.
న హి శక్యా ప్రవేష్టుం సా
మయాఽయోధ్యా త్వయా వినా।
రాజధానీ మహేన్ద్రస్య
యథా దుష్కృతకర్మణా॥
టీక:-
 న = కాదు; హి = నిశ్చయముగా; శక్యా = సాధ్యము; ప్రవేష్టుమ్ = ప్రవేశించుటకు; సా = అట్లే; మయా = నేనును; అయోధ్యా = అయోధ్యలోనికి; త్వయా = నీవు; వినా = లేకుండగా; రాజధానీ = రాజధాని అయిన అమరావతిలోనికి; మహేన్ద్రస్య = దేవేంద్రుని యొక్క; యథా = ఆ విధముగా; దుష్కృత కర్మణా = పాప కర్మలు.
భావం:-
  నీవులేకుండగా నేను అయోధ్యలో ప్రవేశింపజాలను. ఎట్లన, పాపాత్ముడు దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి ప్రవేశింపజాలడు కదా అట్లే.
2.52.56.అనుష్టుప్.
వనవాసే క్షయం ప్రాప్తే
మమైష హి మనోరథః।
యదనేన రథేనైవ
త్వాం వహేయం పురీం పునః॥
టీక:-
 వనవాసే = అడవిలో నివసించే; క్షయం = పూర్తి అగుట; ప్రాప్తే = జరిగిన పిమ్మట; మమ = నా యొక్క; ఏష = ఇది; హి = మాత్రమే; మనోరథః = మనసున ఉన్నది; యత్ = అది; అనేన = అది; రథేన = రథమునందు; ఏవ = మాత్రమే; త్వాం = నిన్ను; వహేయమ్ = ఎక్కించి తీసుకుని వెళ్ళెదను; పురీం = అయోధ్యాపురికి; పునః = మరల.
భావం:-
 వనవాసము పూర్తి అయిన పిమ్మట ఇదే రథము ఎక్కించి, నిన్ను అయోధ్యాపురికి తీసుకొని వెళ్లవలెను అనునదియే నా మనసులో ఉన్న కోరిక.
2.52.57.అనుష్టుప్.
చతుర్దశ హి వర్షాణి
సహితస్య త్వయా వనే।
క్షణభూతాని యాస్యన్తి
శతసంఖ్యాన్యతోఽన్యథా॥
టీక:-
 చతుర్దశ = పదునాలుగు; హి = నిశ్చయముగ; వర్షాణి = సంవత్సరములు; సహితస్య = సన్నిధిలో; త్వయా = నీ యొక్క; వనే = వనములో; క్షణభూతాని = క్షణముల వలె; యాస్యన్తి = గడచిపోవును; శతసంఖ్యాని = వంద సంవత్సరములు కలవి; అతోన్యథా = అతః + అన్యథా, అట్లు కానిచో;
భావం:-
 వనములో నీ సన్నిధిలో ఉన్నచో నాకు పదునాలుగు సంవత్సరములు క్షణముల వలె గడచిపోవును. అట్లు కానిచో, వంద సంవత్సరముల వలె అగును.
2.52.58.అనుష్టుప్.
భృత్యవత్సల! తిష్ఠంతమ్
భర్తృపుత్రగతే పథి।
భక్తం భృత్యం స్థితం స్థిత్యామ్
త్వం న మాం హాతుమర్హసి”॥
టీక:-
 భృత్యవత్సల = భృత్యులయందు వాత్సల్యము గలవాడ; తిష్ఠంతమ్ = ఉన్నవాడను; భర్తృ = ప్రభువు; పుత్ర = పుత్రుడను; గతే = అనుసరించు; పథి = మార్గములో; భక్తమ్ = భక్తుడను; భృత్యమ్ = సేవకుడును; స్థితమ్ = స్థితి యందు; స్థిత్యామ్ = ఉన్నవాడను; త్వం = నిన్ను; న = లేదు; మాం = నన్ను; హాతుమ్ = విడిచిపెట్టు; అర్హసి = అర్హులము
భావం:-
 భృత్యులయందు ప్రేమ గల ఓ రామా! నేను నా ప్రభువు పుత్రుడవైన నీవు వెళ్లుచున్న మార్గముననే వెళ్లగోరుచున్నాను. నీ భక్తుడను. భృత్యుడను అయి ఉన్నవాడను. అట్టి నన్ను విడువతగదు’’ అని ప్రార్థించెను.
2.52.59.అనుష్టుప్.
ఏవం బహువిధం దీనమ్
యాచమానం పునః పునః।
రామో భృత్యానుకమ్పీ తు
సుమంత్రమిదమబ్రవీత్॥
టీక:-
 ఏవం = ఇట్లు; బహువిధం = అనేక విధముల; దీనమ్ = దీనుడై; యాచమానం = ప్రార్థించుచున్న; పునః పునః = మరల మరల; రామః = రాముడు; భృత్య = భృత్యులపై; అనుకమ్పీ తు = జాలి గలవాడు; సుమంత్రమ్ = సుమంత్రునితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 ఇట్లు మాటిమాటికి అనేక విధముల ప్రార్థించుచున్న, దీనుడైన ఆ సుమంత్రునితో భృత్యులపై జాలి గల రాముడు ఇట్లనెను.
2.52.60.అనుష్టుప్.
“జానామి పరమాం భక్తిమ్
మయి తే భర్తృవత్సల।
శృణు చాపి యదర్థం త్వామ్
ప్రేషయామి పురీమితః॥
టీక:-
 జానామి = నాకు తెలుసు; పరమాం = అద్భుతమైన; భక్తిమ్ = భక్తిని; మయి = నా మీద; తే = నీవు; భర్తృవత్సల = ప్రభువులపై ప్రేమగలవాడవు; శృణు = వినవలెను; చాపి = ఇంకను; యత్ = ఏ; అర్థం = కారణంగా; త్వామ్ = నిన్ను; ప్రేషయామి = పంపుచున్నాను; పురీమితః = పట్టణమునకు
భావం:-
  సుమంత్రా! నీవు ప్రభువులపై ప్రేమగలవాడవు. నీకు నాపై ఎంత గప్ప భక్తి ఉన్నదో నేను ఎరుగుదును. నిన్ను ఇక్కడ నుండి, పట్టణమునకు ఎందుకు పంపుచున్నానో వినుము.
2.52.61.అనుష్టుప్.
నగరీం త్వాం గతం దృష్ట్వా
జననీ మే యవీయసీ।
కైకేయీ ప్రత్యయం గచ్ఛేత్
ఇతి రామో వనం గతః॥
టీక:-
 నగరీం = అయోధ్యా నగరమునకు; త్వాం = నీవు; గతమ్ = వెళ్లగా; దృష్ట్వా = చూచి; జననీ = తల్లి; మే = నన్ను; యవీయసీ = చిన్నామె; కైకేయీ = కైకేయికి; ప్రత్యయం = రుజువు; గచ్ఛేత్ = పొందును; ఇతి = అని; రామః = రాముడు; వనమ్ = వనమునకు; గతః = వెళ్లినట్లు.
భావం:-
 నీవు అయోధ్యకు తిరిగి వెళ్లగా, నిన్ను చూచినచో మా పినతల్లి అయిన కైకేయికి రాముడు అరణ్యమునకు వెళ్లెను అని నమ్మకము కలుగును.
2.52.62.అనుష్టుప్.
పరితుష్టా హి సా దేవీ
వనవాసం గతే మయి।
రాజానం నాతిశంకేత
మిథ్యావాదీతి ధార్మికమ్॥
టీక:-
 పరితుష్టా = సంతోషించును; సా = ఆ; దేవీ = కైకేయి; వనవాసమ్ = వనవాసమునకు; గతే = వెళ్లుటచే; మయి = నేను; రాజానమ్ = రాజును; న = విడచును; అతిశంకేత = మిక్కిలిశంకను; మిథ్యావాది = అసత్యమును చెప్పుచున్నాడు; ఇతి = అను; ధార్మికమ్ = ధార్మికుడైన.
భావం:-
 నేను వనవాసమునకు వెళ్లుటచే కైకేయి సంతోషించును. ధార్మికుడైన రాజు దశరథుడు అసత్యము చెప్పుచున్నాడు అను శంకను విడుచును.
2.52.63.అనుష్టుప్.
ఏష మే ప్రథమః కల్పో
యదంబా మే యవీయసీ।
భరతారక్షితం స్ఫీతమ్
పుత్రరాజ్యమవాప్నుయాత్॥
టీక:-
 ఏష = ఇది; మే = నాకు; ప్రథమః కల్పః = ముఖ్యమైన పక్షము; యత్ = ఏమనగా; అంబా = తల్లి; మే = నాకు; యవీయసీ = చిన్నామె; భరతాః = భరతునిచే; రక్షితమ్ = రక్షింపబడిన; స్ఫీతమ్ = విశాలమైన; పుత్రః = కుమారుడు; రాజ్యమ్ = రాజ్యమును; అవాప్నుయా = పొందవలెను
భావం:-
 నాకు చాల ముఖ్యమైన విషయము ఏదంటే, మా పినతల్లి తన పుత్రుడైన భరతుడు విశాలమైన రాజ్యమును పొందవలెను.
2.52.64.అనుష్టుప్.
మమ ప్రియార్థం రాజ్ఞశ్చ
సరథస్త్వం పురీం వ్రజ।
సందిష్టశ్చాసి యానర్థాన్
తాంస్తాన్ బ్రూయాస్తథా తథా”॥
టీక:-
 మమ = నాకు; ప్రియః = ఇష్టము; అర్థం = కలిగించుట కోసము; రాజ్ఞః = మహారాజునకును; చ = కూడా; స = సహితముగ; రథః = రథముతో; త్వం = నీవు; పురీం = అయోధ్యా నగరమునకు; వ్రజ = వెళ్లుము; సందిష్టః = చెప్పబడినవాడవు; చ = కూడ; అసి = అగుదువో; యాన్ = యే; అర్థాన్ = విషయములు; తాంస్తాన్ = తాన్+ తాన్. వాటిని అన్నింటిని; బ్రూయాః = చెప్పుము; తథా = ఆ విధముగనే
భావం:-
 నీవు ఈ రథమును తీసుకొని నగరమునకు వెళ్లినచో, నాకును రాజునకును కూడ ప్రియమును చేసినవాడవు అగుదువు. నీకు ఏయే విషయములు చెప్పినానో వాటిని అన్నింటిని ఆ విధముగా చేయుము’’ అని పలికెను.
2.52.65.అనుష్టుప్.
ఇత్యుక్త్వా వచనం సూతమ్
సాన్త్వయిత్వా పునః పునః।
గుహం వచనమక్లీబో
రామో హేతుమదబ్రవీత్॥
టీక:-
 ఇతి = ఈ విధముగా; ఉక్త్వా = పలికిన; వచనం = మాటలను; సూతమ్ = సుమంత్రునితో; సాన్త్వయిత్వా = ఓదార్చి; పునః పునః = మరల మరల; గుహం = గుహునితో; వచనమ్ = పలుకులు; అక్లీబః = ధైర్యవంతుడు; రామః = రాముడు; హేతుమత్ = యుక్తియుక్తమగు; అబ్రవీత్ = పలికెను
భావం:-
 ధైర్యవంతుడైన రాముడు సుమంత్రునితో ఇట్లు పలికి, మాటిమాటికి అతనిని ఓదార్చి, గుహునితో యుక్తియుక్తముగ ఇట్లు పలికెను
2.52.66.అనుష్టుప్.
“నేదానీం గుహ! యోగ్యోఽయమ్
వాసో మే సజనే వనే।
ఆవశ్యం హ్యాశ్రమే వాసః
కర్తవ్యస్తద్గతో విధిః॥
టీక:-
 న = కూడదు; ఇదానీం = ఇప్పుడు; గుహ = ఓ గుహుడా; యోగ్యః = యోగ్యము; అయమ్ = ఇది; వాసః = నివాసము; మే = నాకు; సజనే = జనులు ఉన్న చోట; వనే = వనములో; ఆవశ్యం = ఉండవలెను; హి = తప్పక; ఆశ్రమే = మునులు నివసించు ప్రదేశములందు; వాసః = నివసించుట; కర్తవ్యః = చేయదగినది; తత్ = ఆ విధముగా; గతః = వర్తించుటే; విధిః = చేయవలసిన పద్దతి.
భావం:-
 ‘‘గుహుడా! ఇపుడు జనులు ఉన్న వనములో నేను నివసించగూడదు. నేను ఉండవలసినది ఆశ్రమములందే. అటులనే వర్తించుటే పద్దతి.
*గమనిక:-
విధి- 2.18.37. సప్త సప్త చ వర్షాణి; దండకారణ్యమాశ్రితః। అభిషేకమిమం త్యక్త్వా; జటాజినధరో వస॥ అని తండ్రి దశరథుల వారు, తల్లి కైకేయి నియమించిరి కదా అది అనుసరించుట నావిధి. అని సూచన
2.52.67.అనుష్టుప్.
సోఽహం గృహీత్వా నియమమ్
తపస్వి జనభూషణమ్।
హితకామః పితుర్భూయః
సీతాయా లక్ష్మణస్య చ॥
టీక:-
 సః = అట్టి; అహం = నేను; గృహీత్వా = స్వీకరించిన; నియమమ్ = నియమమును; తపస్వి = తపస్సు చేయు; జన = వారికి; భూషణమ్ = అలంకారమైన; హిత = మేలు; కామః = కోరుకునువాడను; పితుః = తండ్రికి; భూయః = మఱిల; సీతాయా = సీతకు; లక్ష్మణస్య = లక్ష్మణునియొక్క; చ = మఱియు.
భావం:-
 తాపసులకు అలంకారపూరితమైన నియమము నేను స్వీకరించినట్టితిని. నా తండ్రికి, సీతకు, లక్ష్మణునకు హితమును కోరుచున్నాడను.
2.52.68.అనుష్టుప్.
జటాః కృత్వా గమిష్యామి
న్యగ్రోధక్షీరమానయ”।
తత్ క్షీరం రాజపుత్రాయ
గుహః క్షిప్రముపాహరత్॥
టీక:-
 జటాః కృత్వా = జటలను; కృత్వా = చేసుకుని; గమిష్యామి = వెళ్లగలను; న్యగ్రోధ = మర్రిచెట్టు; క్షీరమ్ = పాలను; ఆనయ = తీసుకొని రమ్ము; తత్ = ఆ; క్షీరం = పాలను; రాజపుత్రాయ = రాజపుత్రులకు; గుహః = గుహుడు; క్షిప్రమ్= వెంటనే; ఉపాహరత్ = సమరేపించెను.
భావం:-
 ‘ మర్రి పాలు తెమ్ము. జటాధారినై వెళ్లెదము’ అని రాముడు పలుకగా, గుహుడు వెంటనే ఆ క్షీరమును తీసుకొని వచ్చి, రాకుమారులైన రామ లక్ష్మణులకు ఇచ్చెను.
2.52.69.అనుష్టుప్.
లక్ష్మణస్యాత్మనశ్చైవ
రామస్తేనాకరోజ్జటాః।
దీర్ఘబాహుర్నరవ్యాఘ్రో
జటిలత్వమధారయత్॥
టీక:-
 లక్ష్మణస్య = లక్ష్మణునకు; ఆత్మనః = తనకును; చైవ = కూడ; రామః = రాముడు; తే = దానితో; అకరోత్ జటాః = చేసెను; జటాః = జటలు; దీర్ఘ బాహుః = ఆజానుబాహువుng; నరవ్యాఘ్రౌ = పురుష శ్రేష్ఠులు; జటిలత్వమ్ = జటాధారణ; అధారయత్ = ధరించిరి.
భావం:-
 రాముడు ఆ పాలతో తనకును, లక్ష్మణునకును జటలు కట్టెను. ఆజానుబాహులు పురుష శ్రేష్ఠులు ఐన రామలక్ష్మణులు అటుల జటాధారులైరి.
2.52.70.అనుష్టుప్.
తౌ తదా చీరవసనౌ
జటామండలధారిణౌ।
ఆశోభేతామృషిసమౌ
భ్రాతరౌ రామలక్ష్మణౌ॥
టీక:-
 తౌ = వారిద్దరు; తదా = అప్పుడు; చీరః = నారచీర; వసనౌ = ధరించిన వారు; జటా = జటల; మండల = ముడులను; ధారిణౌ = ధరించిన వారు; ఆశోభేతామ్ = శోభించిరి; ఋషిః = ఋషులతో; సమౌ = వంటివారు; భ్రాతరౌ = ఇద్దరు సోదరులు; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు
భావం:-
 అప్పుడు నారచీరలు కట్టి, జటా ముడివేసుకుని, రామలక్ష్మణ సోదరులిద్దరూ, ఋషుల వలె శోభించిరి.
2.52.71.అనుష్టుప్.
తతో వైఖానసం మార్గమ్
ఆస్థితః సహ లక్ష్మణః।
వ్రతమాదిష్టవాన్ రామః
సఖాయం గుహమబ్రవీత్॥
టీక:-
 తతః = అటు పిమ్మట; వైఖానసం = విఖనసు అను మహర్షి ప్రోక్తమైన; మార్గమ్ = మార్గమును; ఆస్థితః = అవలంబించి; సహ = సహితముగ; లక్ష్మణః = లక్ష్మణునితో; వ్రతమ్ = నియమానుసరణ; ఆదిష్టవాన్ = అవలంభించి; రామః = రాముడు; సఖాయం = మిత్రుడైన; గుహమ్ = గుహునికి; అబ్రవీత్ = చెప్పెను.
భావం:-
 పిమ్మట, రామ లక్ష్మణులు విఖనసు అను మహర్షి ప్రతిపాదించిన వానప్రస్థ మార్గమును అవలంబించిరి. ఆ వైఖానస నియమానుసరణను వ్రతము అవలంభించి. రాముడు మిత్రుడైన గుహునితో ఇట్లు చెప్పెను.
*గమనిక:-
వైఖానసమ్- వానప్రస్థులకు, సన్యాసులకు సంబంధించిన, వైఖానస మహర్షులవారల నిబంధనల ఆగమము. వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. చాతుర్వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనలు తెలుపుతాయి. ఈ సూత్రానుసారులు విష్ణువును ముఖ్యవైవముగా కొలిచెదరు. వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటిస్తారు. (తెవికె)
2.52.72.అనుష్టుప్.
“అప్రమత్తో బలే కోశే
దుర్గే జనపదే తథా।
భవేథా గుహ! రాజ్యం హి
దురారక్షతమం మతమ్॥
టీక:-
 అప్రమత్తః = అప్రమత్తముగా (జాగరూకతతో); బలే = సైన్యము విషయములో; కోశే = ఖజానా విషయములో; దుర్గా = కోట; జనపదే = ప్రజల; తథా = ఆ విధముగా; భవేథా = ఉండండి; గుహ = గుహుడా; రాజ్యం = రాజ్యమును; హి = నిశ్చయముగ; దురా రక్షతమం = రక్షించుట కష్టమని; మతమ్ = పెద్దల అభిప్రాయం
భావం:-
 ‘గుహుడా! సైన్యము, ధనాగారము, దుర్గము, దేశము. వీటి విషయమున ఏ మాత్రము ఏమరుపాటు లేకుండగా ఉండుము. రాజ్యము పాలించుట అనునది చాల కష్టమైనదని పెద్దలు చెప్పుదురు కదా!
2.52.73.అనుష్టుప్.
తతస్తం సమనుజ్ఞాయ
గుహమిక్ష్వాకునందనః।
జగామ తూర్ణమవ్యగ్రః
సభార్యః సహ లక్ష్మణః॥
టీక:-
 తతః = అటు పిమ్మట; తం = ఆ; సమనుజ్ఞాయ = వీడ్కోలు ఒసగెను; గుహమ్ = గుహుని; ఇక్ష్వాకు నందనః = ఇక్ష్వాకు వంశీయుడైన రాముడు; జగామ = వెళ్లెను; తూర్ణమ్ = శీఘ్రముగా; అవ్యగ్రః = వ్యాకులత్వము చెందక; సభార్యః = భార్యతో; సహ లక్ష్మణః = లక్ష్మణ సమేతుడై
భావం:-
 పిమ్మట, రాముడు గుహునికి సెలవిచ్చి, వ్యాకులత్వము చెందక, భార్యాలక్ష్మణ సమేతుడై శీఘ్రముగా వెళ్లెను.
2.52.74.అనుష్టుప్.
స తు దృష్ట్వా నదీతీరే
నావమిక్ష్వాకునందనః।
తితీర్షుః శీఘ్రగాం గంగామ్
ఇదం లక్ష్మణమబ్రవీత్॥
టీక:-
 స = అతడు; తు = నిశ్చయంగా; దృష్ట్వా = చూచి; నదీ = గంగానది యొక్క; తీరే = తీరమున; నావమ్ = నావను; ఇక్ష్వాకు నందనః = ఇక్ష్వాకువంశ నందనుడైన రాముడు; తితీర్షుః = దాటదలచి; శీఘ్రగాం = వేగముగా ప్రవహించుచున్న; గంగామ్ = గంగానదిని; ఇదం = ఈ విధముగా; లక్ష్మణమ్ = లక్ష్మణునితో; అబ్రవీత్ = అనెను
భావం:-
 గంగాగంగానది ఒడ్డున ఉన్న నావను చూచెను. వడిగా ప్రవహిస్తున్న గంగానదిని దాటదలచిను. రాముడు లక్ష్మణునితో ఇట్లా చెప్పెను.
2.52.75.అనుష్టుప్.
“ఆరోహ త్వం నరవ్యాఘ్ర!
స్థితాం నావమిమాం శనైః।
సీతాం చారోపయాన్వక్షమ్
పరిగృహ్య మనస్వినీమ్॥
టీక:-
 ఆరోహ త్వం = నీవు ఎక్కుము; నరవ్యాఘ్ర = పురుషోత్తమా, లక్ష్మణ; స్థితామ్ = నిలిచిఉన్న; నావమ్ = నావను; ఇమాం = దీనిని; శనైః = మెల్లగా; సీతామ్ = సీతను; చ = కూడ; ఆరోపయ = ఎక్కించి; అన్వక్షమ్ = ఎదురుగా ఉన్నది; పరిగృహ్యమ్ = (నా) అర్థాంగిని; మనస్వినీమ్ = ఉత్తమమైన మనస్సుకలామెను.
భావం:-
 “లక్ష్మణా! ఈ నావను మెల్లగా ఎక్కుము, పిదప నా అర్థాంగి, సద్గుణవంతురాలు ఐన సీతను కూడ ఎక్కించుము” అనెను.
2.52.76.అనుష్టుప్.
స భ్రాతుః శాసనం శ్రుత్వా
సర్వమప్రతికూలయన్।
ఆరోప్య మైథిలీం పూర్వమ్
ఆరురోహాఽఽత్మవాం స్తతః॥
టీక:-
 సః = అతడు, లక్ష్మణుడు; భ్రాతుః = సోదరుడైన రాముని; శాసనం = ఆజ్ఞను; శ్రుత్వా = విని; సర్వమ్ = పూర్తిగా; అప్రతికూలయన్ = ఎదురు మాటాడకుండా; ఆరోప్య = ఎక్కించి; మైథిలీం = సీతాదేవిని; పూర్వమ్ = ముందుగా; ఆరురోహా = అధిరోహించెను; ఆత్మవాన్ = వివేకవంతుడు; తతః = పిదప.
భావం:-
 అన్న రాముని ఆజ్ఞను ఎదురు ప్రశ్నలు వేయకుండా లక్ష్మణుడు ఆలకించెను. పిమ్మట, బుద్ధిమంతుడైన లక్ష్మణుడు ముందుగా సీతను ఎక్కించి పిదప తాను ఎక్కెను.
*గమనిక:-
ముందుగా సీతను ఎక్కించి- రాముడు లక్ష్మణునికి ముందు నీవు నావను ఎక్కి, సీతను ఎక్కించమనెను. కాని లక్ష్మణుడు ముందుగా సీతను నావ ఎక్కించి, తరువాత తాను ఎక్కెను. సీతాదేవి తనకు మాతృసమానురాలు కనుక, ఆమెను ముందుగా ఎక్కించుట మర్యాద అని అటుల చేసెను. కనుక, ఇందు అన్నగారి ఆజ్ఞకు ఎక్కి అవరోధము కలుగ లేదు.
2.52.77.అనుష్టుప్.
అథారురోహ తేజస్వీ
స్వయం లక్ష్మణపూర్వజః।
తతో నిషాదాధిపతిః
గుహో జ్ఞాతీనచోదయత్॥
టీక:-
 అథ = ఆ తరువాత; ఆరురోహ = ఎక్కిన; తేజస్వీ = దివ్యమైన; స్వయం = స్వయముగా; లక్ష్మణపూర్వజః = లక్ష్మణుని అన్నగరైన రామునకు; తతః = అటు పిమ్మట; నిషాద = నిషాదపలకు; అధిపతిః = ప్రభువైన వాడు; గుహః = గుహుడు; జ్ఞాతీ = తెలియచెప్పెను; నచోదయత్ = ఆవలి ఒడ్డుకు చేర్చుము
భావం:-
 తేజఃశాలిౖయెన రాముడు కూడ నావను ఎక్కిన పిమ్మట, నిషాద అధిపతి అయిన గుహుడు, ‘‘నావను ఆవలి ఒడ్డు చేర్చుడు’ అని చెప్పెను.
2.52.78.అనుష్టుప్.
రాఘవోఽపి మహాతేజా
నావమారుహ్య తాం తతః।
బ్రహ్మవత్ క్షత్రవచ్చైవ
జజాప హితమాత్మనః॥
టీక:-
 రాఘవః = రాముడు; అపి = కూడా; మహాతేజా = గొప్ప తేజశ్శాలి; నవమ్ = నావను; ఆరుహ్య = ఎక్కిన; తాం = ఆ; తతః = అటు పిమ్మట; బ్రహ్మవత్ = బ్రాహ్మణులు; క్షత్రవత్ = క్షత్రియులును; చైవ = ఇంకను; జజాప = జపించెను; హితమ్ = మేలు; ఐత్మనః = తనకు కోరి..
భావం:-
 రాముడు తన శ్రేయస్సును కోరుచు, బ్రాహ్మణ క్షత్రియ జాతుల వారు సాధారణముగ జపించు, ‘దైవీం నావమ్’ అను నావను ఎక్కునపుడు జపించు మంత్రమును జపించెను.
2.52.79.అనుష్టుప్.
ఆచమ్య చ యథాశాస్త్రమ్
నదీం తాం సహ సీతయా।
ప్రాణమత్ప్రీతిసంహృష్టో
లక్ష్మణశ్చామితప్రభః॥
టీక:-
 ఆచమ్య = ఆచమనమును చేసి; చ = ఇంకను; యథాశాస్త్రమ్ = శాస్త్రము చెప్పిన ప్రకారముగా; నదీం = నదికి; తాం = ఆ; సహ = సహితముగా; సీతయా = సీతతో; ప్రాణమత్ = నమస్కారము చేసి; ప్రీతి సంహృష్టః = మిక్కిలి ఆనందముతో; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; అమితప్రభః = అమితమైన వైభవముకల వాడు.
భావం:-
  అటుపిమ్మట రాముడు, సీత, లక్ష్మణుడును యథా శాస్త్రముగా ఆచమనము చేసి ఆ నదికి నమస్కరించిరి.
2.52.80.అనుష్టుప్.
అనుజ్ఞాయ సుమన్త్రం చ
సబలం చైవ తం గుహమ్।
ఆస్థాయ నావం రామస్తు
చోదయామాస నావికాన్!॥
టీక:-
 అనుజ్ఞాయ = సెలవు తీసుకొన అనుమతించి; సుమన్త్రమ్ = సుమంత్రుని; చ = మఱియు; స = సమేతుడైన; బలం = సైన్యముతో; చైవ = ఇంకను; తం = ఆ; గుహమ్ = గుహుని; ఆస్థాయ = వీడ్కొలిపి; నావం = నావను; రామః = రాముడు; తు = నిశ్చయముగ; చోదయామాస = నడుపుడు; నావికాన్ = నావికులారా.
భావం:-
 రాముడు సుమంత్రుని, సైన్యసహితుడైన గుహుని వీడ్కొలిపి, నావలో కూర్చుండి, ‘నావికులారా! నావ నడుపుడు’ అని ఆదేశించెను.
2.52.81.అనుష్టుప్.
తతస్తైశ్చోదితా సా నౌః
కర్ణధారసమాహితా।
శుభస్ఫ్యవేగాభిహతా
శీఘ్రం సలిలమత్యగాత్॥
టీక:-
 తతః = అటు పిమ్మట; తైః = వారు; చోదితా = నడిపిరి; సా = ఆ; నౌః = పడవను; కర్ణధార = చుక్కాని పట్టి; సమాహితా = చక్కగా; శుభః = మంచి; స్ఫ్య = పొడవుగా ఉండుదానిని , సంస్త ఆంధ్ర నిఘంటువు, తెడ్డును; వేగాః = వేగముగా; అభిహతా = గట్టగా వేసి; శీఘ్రం = త్వరగా; సలిలమ్ = నీటిని; అత్యగాత్ = దాట సాగిరి
భావం:-
 చుక్కాని పట్టువాడు చక్కగా చుక్కాని పట్టగా, నావికులు మంచి తెడ్లను వేగంగా బలంగా వేలి ఆ నావ శీఘ్రముగా ఆ గంగానదీ జలములను దాటసాగిరి.
2.52.82.అనుష్టుప్.
మధ్యం తు సమనుప్రాప్య
భాగీరథ్యాస్త్వనిందితా।
వైదేహీ ప్రాంజలిర్భూత్వా
తాం నదీమిదమబ్రవీత్॥
టీక:-
 మధ్యమ్ = మధ్యభాగమునకు; తు = వెంటనే; సమనుప్రాప్య = చక్కగా పొందిv; భాగీరథ్యాః = గంగానదికి; అనిందితా = నిందబడరాని; వైదేహీ = సీతాదేవి; ప్రాంజలిః = చేతులు జోడించి నమస్కారము; భూత్వా = చేసి; తాం నదీమ్ = ఆ; నదీమ్ = నదిని (గంగానది); ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 నావ గంగానది మధ్యకు చేరగానే ఎట్టి నిందలు ఎరుగని సీతాదేవి చేతులు జోడించి ఈ విధముగా పలికెను.
2.52.83.అనుష్టుప్.
“పుత్రో దశరథస్యాయమ్
మహారాజస్య ధీమతః।
నిదేశం పారయిత్వేమమ్
గంగే త్వదభిరక్షితః॥
టీక:-
 పుత్రః = కుమారుడు; దశరథస్య = దశరథుని యొక్క; అయమ్ = ఈతడు; మహారాజస్య = మహారాజునకు; ధీమతః = ధీమంతుడు; నిదేశం = ఆజ్ఞ; పారయిత్వ = గడుపును; ఇమమ్ = ఇది; గంగే = ఓ గంగాదేవీ; త్వత్ = నీ చేత; అభిరక్షితః = రక్షింపబడుచు.
భావం:-
 ‘‘ఓ గంగాదేవీ! ధీమంతుడైన దశరథ మహారాజు కుమారుడైన ఈ రాముడు నీ చేత రక్షింపబడుగాక.
2.52.84.అనుష్టుప్.
చతుర్దశ హి వర్షాణి
సమగ్రాణ్యుష్య కాననే।
భ్రాత్రా సహ మయా చైవ
పునః ప్రత్యాగమిష్యతి॥
టీక:-
 చతుర్దశ = పదునాలుగు; హి = మాత్రము; వర్షాణి = సంవత్సరములు; సమగ్రాణి = పూర్తిగా; ఉష్య = నివసించి; కాననే = అరణ్యములో; భ్రాత్రాః సహ = సోదరునితో; సహ = కలిసి; మయా = నాతో; చైవ = కూడా; పునః = మరల; ప్రత్యాగమిష్యతి = తిరిగి వచ్చును
భావం:-
 సోదరునితోను, నాతోను కలసి పదునాలుగు సంవత్సరములు పూర్తిగా అరణ్యవాసము చేసి, మరల వచ్చును.
2.52.85.అనుష్టుప్.
తతస్త్వాం దేవి! సుభగే
క్షేమేణ పునరాగతా।
యక్ష్యే ప్రముదితా గంగే!
సర్వకామసమృద్ధినీ॥
టీక:-
 తతః = అటు పిమ్మట; త్వాం = నిన్ను; దేవి = తల్లీ గంగాదేవి; సుభగే = శుభములను చేకూర్చునదాన; క్షేమేణ =క్షేమముగా; పునరాగతా =మరలి వచ్చి; యక్ష్యే = పూజించెదను; ప్రముదితా = మిక్కిలి సంతోషించి; గంగే = ఓ గంగాదేవీ; సర్వకామ = సకల కోరికలను; సమృద్ధినీ = సమృద్ధిగాతీర్చుదాన
భావం:-
 తండ్రి ఆజ్ఞను పాలించి, సతల కోరికను సమృద్ధిగా తీర్చెడి తల్లీ, శుభములనుజేకూర్చెడి ఓ గంగాదేవీ! క్షేమముగా తిరిగి వచ్చి సంతోషపూర్తిగా, నిన్ను పూజించెదను.
2.52.86.అనుష్టుప్.
త్వం హి త్రిపథగా దేవి!
బ్రహ్మలోకం సమీక్షసే।
భార్యా చోదధిరాజస్య
లోకేఽస్మిన్ సమ్ప్రదృశ్యసే॥
టీక:-
 త్వం హి = నీవు; త్రిపథగా = గంగా; దేవి = ఓ తల్లీ; బ్రహ్మలోకం = బ్రహ్మలోకముతో; సమీక్షసే = సంబంధించి; భార్యా చ = భార్యగా; ఉదధి రాజస్య = సముద్ర దేవుని; లోకః + అస్మిన్ = ఈ లోకములో; సమ్ప్రదృశ్యసే = చక్కగా కనపడుచున్నావు
*గమనిక:-
త్రిపథగ- గంగానది, ముత్త్రోవద్రిమ్మరి. స్వర్గ, భూ, పాతాళ లోకములలో ప్రవహించెడిది, గంగ
భావం:-
 స్వర్గ భూలోక పాతాళములందు మూడింటియందును ప్రవహించు గంగాదేవి! నీవు బ్రహ్మలోకముతో సంబంధించి ఉన్నావు. సముద్రుని భార్యవుగా పాతాళలోకమున, ఈలోకమున వ్యక్తమగుచున్నావు.
2.52.87.అనుష్టుప్.
సా త్వాం దేవి నమస్యామి
ప్రశంసామి చ శోభనే।
ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే
శివేన పునరాగతే॥
టీక:-
 సా = అటువంటి; త్వాం = నిన్ను; దేవి = ఓ గంగాదేవీ; నమస్యామి = నమస్కరించున్నాను; ప్రశంసామి = స్తుతించుచున్నాను; చ = ఇంకనూ; శోభనే = మంగళప్రదురాలవైన; ప్రాప్త = పొందిన పిదప; రాజ్యే = రాజ్యమును; నరవ్యాఘ్రే = పురుష శ్రేష్ఠుడైన; శివేన = క్షేమముగా; పునరాగతే = తిరిగి వచ్చి
భావం:-
 ఓ మంగళప్రదురాల, గంగాదేవీ! నీకు నమస్కరించి స్తుతించుచున్నాను. పురుష శ్రేష్ఠుడైన రాముడు, క్షేమముగా తిరిగి వచ్చి రాజ్యము పొందిన పిదప.
2.52.88.అనుష్టుప్.
గవాం శతసహస్రాణి
వస్త్రాణ్యన్నం చ పేశలమ్।
బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి
తవ ప్రియచికీర్షయా॥
టీక:-
 గవాం = ఆవులను; శతసహస్రాణి = లక్షల కొలది; వస్త్రాణి = వస్త్త్రములను; అన్నం = అన్నమును; చ = మఱియు; పేశలమ్ = మనోహరమైనవానిని; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు; ప్రదాస్యామి = అర్పించెదను; తవ = నీ యొక్క; ప్రియ = ప్రియమును; చికీర్షయా = చేయునిచ్ఛతో.
భావం:-
 లక్షలకొలది గోవులను, వస్త్రములను, మంచి అన్నమును నీ సంతోషమునకై బ్రాహ్మణులకు అర్పించెదను.
2.52.89.అనుష్టుప్.
సురాఘటసహస్రేణ
మాంసభూతౌదనేన చ।
యక్ష్యే త్వాం ప్రయతా దేవి!
పురీం పునరుపాగతా॥
టీక:-
  సురా = కల్లు; ఘట = కుండలు; సహస్రేణ = వేలకలది; మాంస చ = మాంసము; భూత = తగినంత; ఔదనేన = వంటలను; చ = మఱియు; యక్ష్యే = పూజించెదను; త్వాం = నీయొక్క; ప్రయతా = సంతృప్తి కొఱకు; దేవి = ఓ గంగాదేవీ; పురీం = నగరమునకు; పునః = వెనుతిరిగి; ఉపాగతా = వచ్చిన పిమ్మట.
భావం:-
 గంగాదేవీ! నీకు తృప్తి కలిగేలా వెలకొలది కుండల కల్లు, మంచి మాంస వంటకములను అయోధ్యానగరము పొందిన పిమ్మట సమర్పించి పూజించెదను.
*గమనిక:-
(1) సురాఘటసహస్రేణ- అను సమాసమునకు; లురేషు దేవేషు, నఘటంతో, నవంతి ఇత్యర్థః తేషాం సహస్రం, తేన, సహస్ర సంఖ్యాక సుర దుర్లభ పదార్థేన, దేవతలకును దుర్లభమైన అసంఖ్యాక మధుర పదార్థములతో, అని అర్థము. (2) అట్లే మాంసభూతేన; అను సమా సమునకు, మా- నాస్థి, అతసో- రాజభోగో, యస్యాంసా, ఏవభూ- పుధ్వీచ, ఉతం- వస్త్రంచ, ఓదనంచ- ఏతేషాం సమాహారః, అనగా సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూ, వస్త్ర, అన్న దానములతో, అని అర్థము
2.52.90.అనుష్టుప్.
యాని త్వత్తీరవాసీని
దైవతాని చ సంతి హి।
తాని సర్వాణి యక్ష్యామి
తీర్థాన్యాయతనాని చ॥
టీక:-
 యాని = ఎవరైతే; త్వత్ = నీ; తీరవాసీని = ఒడ్డున; వాసీని = కొలువై ఉన్న; దైవతాని = దేవతలు; చ = అందరికి; సంతి = కానుకలను; హి = కూడాను; తాని = వారినీ; సర్వాణి = అందరినీ; యక్ష్యామి = సేవించెదను; తీర్థాన్ = తీర్థములను; ఆయతనాని = దేవాలయములను; చ = కూడ.
భావం:-
 నీ తీరములపై ఉన్న సమస్త దేవతలను, తీర్థములను, దేవాలయములను కూడ సేవించెదను.
2.52.91.అనుష్టుప్.
పునరేవ మహాబాహుః
మయా భ్రాత్రా చ సంగతః।
అయోధ్యాం వనవాసాత్తు
ప్రవిశత్వనఘోఽనఘే!”॥
టీక:-
 పునః = మరల తిరిగి వచ్చి; ఏవ = ఎచ్చరికగా; మహాబాహుః = గొప్ప భుజబలము కలవాడు; మయా = నాతోను; భ్రాత్రా = సోదరునితోను; చ = మఱల; సంగతః = కలసి; అయోధ్యాం = అయోధ్యలోనికి; వనవాసాత్తు = వనవాసము నుండి; ప్రవిశత్వ = ప్రవేశించుగాత; అనఘః = పుణ్యాత్మురాలా.
భావం:-
 ఓ పుణ్యాత్మురాలా గంగాదేవి! గొప్ప భుజబలశాలి అయిన రాముడు, నాతోను సోదరునితోను కలసి, వనవాసము నుండి తిరిగి వచ్చి, మరల అయోధ్యలోప్రవేశించుగాత”. అని ఆ గంగానదిని ప్రార్థించెను.
2.52.92.అనుష్టుప్.
తథా సమ్భాషమాణా సా
సీతా గంగామనిందితా।
దక్షిణా దక్షిణం తీరమ్
క్షిప్రమేవాభ్యుపాగమత్॥
టీక:-
 తథా = ఆ విధముగా; సమ్భాషమాణా = పలుకుచుండగా; సా సీతా = ఆ సీతాదేవి; గంగామ్ = గంగను; అనిందితా = నిందలేని; దక్షిణా = సరళ ఉదార స్వభావురాలు, అమరకోశః; దక్షిణమ్ = దక్షిణము వైపు; తీరమ్ = ఒడ్డును; క్షిప్రమ్ = శీఘ్రముగా; ఏవ = మాత్రమే; అభి + ఉపాగమత్ = చేరెను.
భావం:-
 మంచిసమర్థురాలైన సీత ఇట్లు గంగాదేవిగుఱించి పలుకుచుండగా నావ శీఘ్రముగా దక్షిణము వైపున ఉన్న తీరమును చేరెను.
2.52.93.అనుష్టుప్.
తీరం తు సమనుప్రాప్య
నావం హిత్వా నరర్షభః।
ప్రాతిష్ఠత సహ భ్రాత్రా
వైదేహ్యా చ పరంతపః॥
టీక:-
 తీరం = తీరమును; తు = నిశ్చయముగా; సమనుప్రాప్య = చక్కగా పొందిన పిదప; నావమ్ = నావను; హిత్వా = విడచి; నరర్షభః = పురుష శ్రేష్ఠుడు; ప్రాతిష్ఠత = బయలుదేరెను; సహ = సహితముగ; భ్రాత్రా = సోదరునితోను; వైదేహ్యా చ = విదేహ రాకుమారితోను; చ = మఱియు; పరంతపః = శత్రు సంహారకుడు.
భావం:-
 రాముడు తీరమును చేరిన పిమ్మట ఆ నావను విడచి, సోదరునితోను సీతతోను కలిసి నడిచి వెళ్లెను.
*గమనిక:-
పరంతప- వ్యుత్పత్తి. పర+తప్+ణిచ్+కచ్+ముమ్, పరాన్ శత్రూన్ తాపయతి, శత్రువులను తపింప చేయువాడు.శూరుడు, రాముడు.
2.52.94.అనుష్టుప్.
అథాబ్రవీన్మహాబాహుః
సుమిత్రానందవర్ధనమ్।
“భవ సంరక్షణార్థాయ
సజనే విజనేఽపి వా॥
టీక:-
 అథ = అటు పిమ్మట; అబ్రవీత్ = పలికెను; మహాబాహుః = ఆజానుబాహువైన రాముడు; సుమిత్రానందవర్ధనమ్ = సుమిత్రా ఆనందము వృద్ధిచేయువానితో, లక్ష్మణునితో; భవ = సిద్ధముగా ఉండుము; సంరక్షణార్థాయ = రక్షించుట కొరకు; సజనే = జనలు ఉన్నచోటను; విజనే = జనులేనిచోటను; విజనే అపి వా = ఐనప్పటికీ.
భావం:-
 పిదప రాముడు, లక్ష్మణునితో – ‘జనులు ఉన్న ప్రదేశమునందైనను, లేని ప్రదేశమునందైనను రక్షణము విషయమున జాగ్రత్తగా ఉండుము.
2.52.95.అనుష్టుప్.
అవశ్యం రక్షణం కార్యమ్
అదృష్టే విజనే వనే।
అగ్రతో గచ్ఛ సౌమిత్రే!
సీతా త్వామనుగచ్ఛతు॥
టీక:-
 అవశ్యం = తప్పనిసరి; రక్షణమ్ = రక్షణ విషయమున; కార్యమ్ = కర్తవ్యము; అదృష్టే = చూడని; విజనే = జనశూన్యమైన; వనే = అడవులలో; అగ్రతః = ముందు; గచ్ఛ = నడువుము; సౌమిత్రే = సుమిత్రానందనా; సీతా = సీతాదేవి; త్వామ్ = నిన్ను; అనుగచ్ఛతు = అనుసరించుగాక.
భావం:-
 మనకుతెలియని ఈ జనశూన్యమైన అడవులలో మనము తప్పక రక్షణ విషయమున బహుజాగ్రత్తగా ఉండవలెను. లక్ష్మణా! నీవు ముందు నడువుము. సీత వెనుక నడచును.
2.52.96.అనుష్టుప్.
పృష్ఠతోఽహం గమిష్యామి
త్వాం చ సీతాం చ పాలయన్।
అన్యోన్యస్యేహ నో రక్షా
కర్తవ్యా పురుషర్షభ!॥
టీక:-
 పృష్ఠతః = వెనుక; అహం = నేను; గమిష్యామి = నడచుదును; త్వాం = నీన్ను; చ = మఱియు; సీతామ్ = సీతాదేవిని; చ = మరియు; పాలయన్ = రక్షించుచు; అన్యోన్యస్య = ఒకరిని ఒకరు; ఇహ = ఇక్కడ; నః = మనము; రక్షా కర్తవ్యా = రక్షించుకొనుట; కర్తవ్యా = కర్తవ్యము; పురుషర్షభ = పురుష శ్రేష్ఠుడా
భావం:-
 ఓ పురుష శ్రేష్ఠుడా! నేను నిన్ను, సీతను రక్షించుచు, వెనుక నడచెదను. మనము ఇక్కడ ఒకరిని ఒకరు రక్షించుకొనవలెను.
2.52.97.అనుష్టుప్.
న హి తావదతిక్రాంతా
సుకరా కాచన క్రియా।
అద్య దుఃఖం తు వైదేహీ
వనవాసస్య వేత్స్యతి॥
టీక:-
 న = కుదరదు; హి = కదా; తావత్ = దానిని; అతిక్రాంతా = చేయిదాటిపోయినచో; సుకరా = సరిచేయుట; కాచన = ఏదైనా; క్రియా = కార్యము; అద్య = ఇప్పుడు; దుఃఖమ్ = కష్టముల గురించి; హి = కదా; వైదేహీ = సీతకు; వనవాసస్య = వనవాసములోని; వేత్స్యతి = తెలియును
భావం:-
 ఏ పని అయినను చేయి దాటి పోయినచో, దానిని మరల సరిచేయుట శక్యము గాదు కదా. ఇప్పుడు కదా, వనవాసములోని కష్టములను గూర్చి ఇసీతకు అర్థమగును.
2.52.98.అనుష్టుప్.
ప్రణష్టజనసమ్బాధమ్
క్షేత్రారామవివర్జితమ్।
విషమం చ ప్రపాతం చ
వనమద్య ప్రవేక్ష్యతి”॥
టీక:-
  ప్రణష్ట = పూర్తిగాకనబడని; జనః = మానవుల; సమ్బాధమ్ = సమ్మర్దము; క్షేత్రః = పొలములు; ఆరామః = ఉద్యానవనములు; వివర్జితమ్ = ఉండని; విషమం = మిట్ట పల్లములుకలది; చ = మఱియు; ప్రపాతం = లోతైన లోయలు; చ = మఱియు; వనమ్ = వనములోకి; అద్య = ఇప్పుడు; ప్రవేక్ష్యతి = ప్రవేశించగలదు.
భావం:-
 ఈ వనములో జనసమ్మర్దము కాని, పొలములు గాని, ఉద్యానవనములు గాని ఉండవు. మిట్ట పల్లములు, లోతైన లోయలు ఉండును. అట్టి అడవిలోనికి సీత ఈనాడు ప్రవేశించగలదు..’ అని పలికెను.
2.52.99.అనుష్టుప్.
శ్రుత్వా రామస్య వచనమ్
ప్రతస్థే లక్ష్మణోఽగ్రతః।
అనంతరం చ సీతాయా
రాఘవో రఘునందనః॥
టీక:-
 శ్రుత్వా = విని; రామస్య = రాముని యొక్క; వచనమ్ = మాటలను; ప్రతస్థే = శిరసావహించి; లక్ష్మణః = లక్ష్మణుడు; అగ్రతః = ముందుగా; అనంతరం = ఆ వెనుక; చ = మఱియు; సీతాయా = సీతాదేవి; రాఘవః = రాముడు; రఘు నందనః = రఘువంశస్థుడు.
భావం:-
 లక్ష్మణుడు, రాముని మాట శిరసావహించి ముందుగా నడచెను. ఆ వెనుక సీతాదేవి రాముడు వరుసగా నడచిరి.
2.52.100.అనుష్టుప్.
గతం తు గంగాపరపారమాశు
రామం సుమంత్రః ప్రతతం నిరీక్ష్య।
అధ్వప్రకర్షాద్వినివృత్తదృష్టి
ర్ముమోచ బాష్పం వ్యథిత స్తపస్వీ॥
టీక:-
 గతమ్ = చేరిన; తు = చేరిన పిదప; గంగా = గంగానదికి; పర = ఆవలి; పారమాశు = ఒడ్డుకు; రామం = రాముని; సుమంత్రః = సుమంత్రుడు; ప్రతతం = నిరంతరము; నిరీక్ష్య = చూచుచు; అధ్వ = మార్గముయొక్క; ప్రకర్షాత్ = అధికమైన, చాలా దూరము వరకు; వినివృత్త దృష్టిః = కంటికి కనబడునంత వరకు; ముమోచ = విడిచెను; బాష్పమ్ = కన్నీటిని; వ్యథితః = దుఃఖితుడు; తపస్వీ = తపించుచున్న వాడు.
భావం:-
 సుమంత్రుడు, గంగ అవతలి ఒడ్డుకు చేరి మార్గము పట్టిన రాముని దీర్ఘమైన దూరము పోవుటచే కంటికి కనబడక పోవునంత వరకు చూచుచునే ఉండి దుఃఖితుడై కన్నీరు కార్చెను.
2.52.101.జగతి.
స లోకపాలప్రతిమప్రభావవాం
స్తీర్త్వా మహాత్మా వరదో మహానదీమ్।
తతః సమృద్ధాన్ శుభసస్యమాలినః
క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్॥
టీక:-
 సః = అతడు; లోకపాల = లోకపాలురతోన ; మహానదీమ్ = గంగానదిని; తతః = అటు పిమ్మట; సమృద్ధాన్ = సుసంపన్నమైనది; శుభ = ఉత్తమమైన; సస్యమాలినః = సస్య సముదాయములతో; క్రమేణ = క్రమముగా; వత్సాన్ = వత్స దేశమును; ముదిత = సంతోషించిన; అనుపాగమత్ = చేరెను.
భావం:-
 లోకపాలురతో సమానమైన ప్రభావము కలవాడు, మహాత్ముడు, రాముడు, వరములను ఇచ్చునది, గొప్పనది అయిన గంగను దాటిన పిమ్మట, నడచి వెళ్లుచు, మంచి సస్యములు సమృద్ధిగా కలది, సుసంపన్నమైనది, సంతోషించిన జనులు కలది అయిన వత్స దేశమును చేరెను.
2.52.102.జగతి.
తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్
వరాహమృశ్యం పృషతం మహారురుమ్।
ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ
వాసాయ కాలే యయతుర్వనస్పతిమ్॥
టీక:-
 తౌ = వారిరువురు; తత్ర = అక్కడ; హత్వా = చంపి; చతురః = నాలుగు; మహా = పెద్ద; మృగాన్ = జంతువులను; వరాహమ్ = అడవి పందిని; ఋశ్యమ్ = మనుబంటి, మనుబోతు అను ఒక జాతి (లేడి); పృషతమ్ = దుప్పిని, కారుకొమ్ము మెకము, బొట్లదుప్పి; మహా = పెద్ద; రురుమ్ = నల్లచారల దుప్పిని; ఆదాయ = స్వీకరించిరి; మేధ్యం = మాంసమును; త్వరితం = వేగముగా; బుభుక్షితౌ = ఆకలితో ఉన్నందున; వాసాయ = నివసించుటకు; కాలే = రాత్రి; యయతుః = చేరిరి; వనస్పతిమ్ = చెట్టు మొదలునకు.
భావం:-
 రామలక్ష్మణులు ఇద్దరు, అక్కడ వరాహము, ఋష్యము, దుప్పి, నల్లచారల దుప్పి అను నాలుగు మహామృగములను చంపి, ఆకలిగొన్న వారగుటచే, వాటి పరిశుద్ధమైన మాంసమును తీసుకొనిరి, రాత్రి అక్కడ గడుపుటకు తగిన ఒక చెట్టు మొదలు చేరిరి.
2.52.103.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాండే
ద్విపంచాశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ద్విపంచాశ [52] = ఏభై రెండవ; సర్గః = సర్గ.
బావము:-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [52] ఏభై రెండవ సర్గ సంపూర్ణము.
2.53.1.అనుష్టుప్.
స తం వృక్షం సమాసాద్య
సంధ్యామన్వాస్యపశ్చిమామ్।
రామో రమయతాం శ్రేష్ఠ
ఇతి హోవాచ లక్ష్మణమ్॥
టీక:-
సః = అతడు (రాముడు); తం వృక్షం = ఆ చెట్టు మూలము; సమాసాద్య = చేరి; సంధ్యామ్ = సంధ్యను; అన్వాస్య = సేవించి; పశ్చిమామ్ = పడమటి; రామః = రాముడు; రమయతాం = ఆనందింప చేయు వారిలో; శ్రేష్ఠ = శ్రేష్ఠుడైన; ఇతి హ ఉవాచ = ఈ విధముగా మాట్లాడెను; లక్ష్మణమ్ = లక్ష్మణునితో
భావం:-
వృక్షమూలము చేరి పడమటి సంధ్యోపాసన చేసుకునిన పిమ్మట,ఆనందింపచేయువారిలో శ్రేష్ఠుడైన రాముడు, లక్ష్మణునితో ఇట్లు పలికెను.
2.53.2.అనుష్టుప్.
“అద్యేయం ప్రథమా రాత్రిః
యాతా జనపదాద్బహిః।
యా సుమంత్రేణ రహితా
తాం నోత్కంతుమర్హసి॥
టీక:-
అద్య = ఇప్పుడు; ఇయం = ఇదే; ప్రథమా రాత్రిః = మొదటిరాత్రి; యాతా = ఇటుపై; జనపదాత్ = జనవాసమలనుండి; బహిః = బయటకు; యా = ఇది; సుమంత్రేణ = సుమంత్రుడు; రహితా = లేకుండా; తాం = నీవు; న = కాదు; ఉత్కంతుమ్ = దుఃఖించుటకు; అర్హసి = అర్హుడు
భావం:-
”ఇపుడు మనము జనపదములు దాటి అడవికి వచ్చితిమి. సుమంత్రుడు కూడ వెళ్లిపోయెను. ఇటుపై మనము ఒంటరిగా ఉండవలసిన రాత్రులలో, ఇది మొదటిది. నీవు దుఃఖింపవలదు.
2.53.3.అనుష్టుప్.
జాగర్తవ్యమతంద్రిభ్యామ్
అద్యప్రభృతి రాత్రిషు।
యోగక్షేమౌ హి సీతాయా
వర్తేతే లక్ష్మణావయోః॥
టీక:-
జాగర్తవ్యమ్ = మేల్కొని ఉండవలెను; అతంద్రిభ్యామ్ = జాగ్రత్తగా, ఏమరుపాటు లేకుండగ; అద్య ప్రభృతి = నేడు మొదలుగా; రాత్రిషు = రాత్రులందు; యోగక్షేమౌ = యోగక్షేమములను; హి = నిశ్చయముగ; సీతాయా = సీతాదేవి యొక్క; వర్తేతే = ఆధారపడి ఉన్నది; లక్ష్మణా = ఓ లక్ష్మణా; ఆవయోః = మన ఇద్దరి మీద
భావం:-
నేడు మొదలు మనమిద్దరము రాత్రులందు ఏమరుపాటు లేకుండా మేల్కొని యుండవలెను. సీత క్షేమము మన యిద్దరి పైననే ఆధారపడియున్నది కదా!
2.53.4.అనుష్టుప్.
రాత్రిం కథంచిదేవేమామ్
సౌమిత్రే! వర్తయామహే।
అపావర్తామహే భూమౌ
ఆస్తీర్య స్వయమార్జితైః”॥
టీక:-
రాత్రిం = ఈ రాత్రి; కథంచిదేవ = ఏదో ఒక విధముగా; ఇమామ్ = ఈ యొక్క; సౌమిత్రే = ఓ లక్ష్మణా; వర్తయామహే = గడపెదము; ఉపావర్తామహే = పరుండి; భూమౌ = నేలపై; ఆస్తీర్య = పరచుకొని; స్వయమ్ = స్వయముగా; ఆర్జితైః = తెచ్చుకొనినవానితో
భావం:-
‘ఏ పర్ణాదులో స్వయముగా తెచ్చుకొని, భూమిపై పరచుకొని, పరుండి ఈ రాత్రి ఏదో విధముగా గడపెదము” అనెను.
2.53.5.అనుష్టుప్.
స తు సంవిశ్య మేదిన్యామ్
మహార్హశయనోచితః।
ఇమాః సౌమిత్రయే రామో
వ్యాజహార కథాః శుభాః॥
టీక:-
సః = ఆ రాముడు; తు = ఇంకను; సంవిశ్య = పరుండి; మేదిన్యామ్ = నేలపై; మహార్హ = ఉత్తమమైన; శయనోచితః = పాన్పుపై పరుండుటకు అలవాటుపడిన; ఇమాః = వీటిని; సౌమిత్రయే = లక్ష్మణునికి; రామః = రాముడు; వ్యాజహార = పలికెను; కథాః శుభాః = మంచి మాటలు
భావం:-
ఉత్తమమైన పాన్పుపై పరుండుటకు అలవాటుపడిన ఆ రాముడు నేలపై పరుండి, లక్ష్మణునితో ఈ విధముగా మంచి మాటలు చెప్పెను.
2.53.6.అనుష్టుప్.
“ధృవమద్య మహారాజో
దుఃఖం స్వపితి లక్ష్మణ!।
కృతకామా తు కైకేయీ
తుష్టా భవితుమర్హతి॥
టీక:-
ధృవమ్ = నిశ్చయముగా; అద్య = ఇప్పుడు; మహారాజః = దశరథ మహారాజునకు; దుఃఖం = బాధపొంది; స్వపితి = నిద్రపట్టుటందు; లక్ష్మణ = ఓ లక్ష్మణా; కృతకామా తు = కోరిక తీరుటచే; తు = ఇంక; కైకేయీ = కైకేయి; తుష్టా = సంతోషము; భవితుమ్ = పొంది; అర్హతి = ఉండనోపును.
భావం:-
‘లక్ష్మణా! మహారాజునకు ఇపుడు దుఃనిద్రపట్టనంత బాధతో ఉండును. కైకేయి మాత్రము తన కోరిక తీరుటచే సంతోషించుచుండనోపును.
2.53.7.అనుష్టుప్.
సా హి దేవీ మహారాజమ్
కైకేయీ రాజ్యకారణాత్।
అపి న చ్యావయేత్ప్రాణాన్
దృష్ట్వా భరతమాగతమ్॥
టీక:-
సా = ఆ; హి = కూడా; దేవీ = రాణి; మహారాజమ్ = మహారాజును; కైకేయీ = కైకేయి; రాజ్యకారణాత్ = రాజ్యము కొరకై; అపి = కూడా; న = చేయదు; చ = కదా; అవయేత్ = తీసివేయుట; ప్రాణాన్ = ప్రాణములను; దృష్ట్వా = చూచిన పిమ్మట; భరతమ్ = భరతుని; ఆగతమ్ = తిరిగి వచ్చిన
భావం:-
ఆ కైకేయి భరతుడు వచ్చిన పిమ్మట రాజ్యము కొరకై మహారాజు ప్రాణములు తీసివేయదు కదా!
2.53.8.అనుష్టుప్.
అనాథశ్చ హి వృద్ధశ్చ
మయా చైవ వినాకృతః।
కిం కరిష్యతి కామాత్మా
కైకేయీ వశమాగతః॥
టీక:-
అనాథః = దిక్కులేక; చ = మఱియు; హి = కూడా; వృద్ధః = వృద్ధుడై ఉన్న; చ = మఱియు; మయా = నా; చ = నుండి; ఏవ = ఐన; వినా = లేకుండా, దూరంచేసిన వాడు; కృతః = లొంగిపోయెను; కిం కరిష్యతి = ఏమి చేయగలదు; కామాత్మా = కామబుద్ధి కలవాడై; కైకేయీ = కైకేయికి; వశమాగతః = వశమైపోయినాడు
భావం:-
ఆ దశరథమహారాజు నా నుండి కూడ దూరమైనాడు. దిక్కు లేక, వృద్ధుడై ఉన్నాడు. కామబుద్ధి కలవాడై, కైకేయికి లొంగిపోయినవాడు కదా. ఇంక ఏమి చేయగలడు?
2.53.9.అనుష్టుప్.
ఇదం వ్యసనమాలోక్య
రాజ్ఞశ్చ మతివిభ్రమమ్।
కామ ఏవార్థ ధర్మాభ్యామ్
గరీయానితి మే మతిః॥
టీక:-
ఇదమ్ = ఈ; వ్యసనమ్ = కష్టమును; ఆలోక్య = చూచి; రాజ్ఞః = రాజు యొక్క; చ = మఱియు; మతివిభ్రమమ్ = బుద్ధిలో కలిగిన భ్రాంతిని; కామ = కామము; ఏవ = మాత్రమే; అర్థ = అర్థము కంటె; ధర్మాభ్యామ్ = ధర్మము కంటె; గరీయాన్ = బలమైనది; ఇతి = అని; మే = నాకు; మతిః = అభిప్రాయము కలుగుచున్నది.
భావం:-
ఈ కష్టమును, రాజు బుద్ధిలో కలిగిన ఈ భ్రాంతిని చూడగా, అర్ధ ధర్మముల కంటె కూడ కామమే బలమైనదని నాకు అనిపించుచున్నది.
2.53.10.అనుష్టుప్.
కో హ్యవిద్వానపి పుమాన్
ప్రమదాయాః కృతే త్యజేత్।
ఛందానువర్తినం పుత్రమ్
తాతో మామివ లక్ష్మణ॥
టీక:-
కృ = ఎవ్వడు; హి = ఐనను; అవిద్వాన్ = తెలివితక్కువవాడై; అపి = ఐనను; పుమాన్ = మరొకడు; ప్రమదాయాః = ఆడుదాని; కృతే = చేయునా; త్యజేత్ = విడిచివేయుట; ఛందాః = ధర్మమును; అనువర్తినమ్ = ప్రకారము ప్రవర్తించువాడైన; పుత్రమ్ = కుమారుని; తాతః = తండ్రి; మామ్ = నన్ను; ఇవ = వలె; లక్ష్మణ = లక్ష్మణా
భావం:-
మన తండ్రి నన్ను విడచివేసినట్లు, ఎంత తెలివితక్కువ వాడైనను, మరొకడు ఎవరైనా ఆడుదాని మాట విని, ధర్మానుసారం మెలగుచున్న కుమారుని విడిచిపెట్టునా!
2.53.11.అనుష్టుప్.
సుఖీ బత సభార్యశ్చ
భరతః కేకయీసుతః।
ముదితాన్ కోసలానేకో
యో భోక్ష్యత్యధిరాజవత్॥
టీక:-
సుఖీ = అనుభవించగలడు; బత = అయ్యో; స = సహితుడై; భార్యః = భార్యతో; చ = ఇంక; భరతః = భరతుడు; కేకయీ సుతః = కైకేయి కుమారుడైన; ముదితాన్ = ఆనందించగలడు; కోసలాన్ = కోసల దేశమును; ఏకః = ఒక్కడే; యో భోక్ష్యతి = అనుభవించగలడు; అధిరాజవత్ = మహారాజు వలె
భావం:-
అయ్యో! కైకేయి కొడుకైన భరతుడొక్కడే భార్యసహితుడై మహారాజు వలె కోసల దేశమును సుఖముగా అనుభవింపగలడు.
2.53.12.అనుష్టుప్.
స హి సర్వస్య రాజ్యస్య
ముఖమేకం భవిష్యతి।
తాతే చ వయసాఽతీతే
మయి చారణ్యమాస్థితే॥
టీక:-
సృ = ఆ భరతుడు; హి = నిశ్చయముగా; సర్వస్య = అంతటికిని; రాజ్యస్య = రాజ్యమునకు; ముఖమ్ = ముఖ్యుడు; ఏకమ్ = ఒక్కడే; భవిష్యతి = కాగలడు; తాతే = తండ్రిగారు; చ = ఏమో; వయసా = వయసు చేత; అతీతే = మరణించును; మయి = నేను; చ = ఏమో; అరణ్యమ్ = అరణ్యములో; ఆస్థితే = ఉన్నాను
భావం:-
భరతుడు రాజ్యమనకు అంతకును ప్రధానుడైన రాజు కాగలడు. ఏలనన, రాజు వయస్స చేత మరణించును. నేను అరణ్యములో ఉన్నాను. కదా.
2.53.13.అనుష్టుప్.
అర్థధర్మౌ పరిత్యజ్య
య కామమనువర్తతే।
ఏవమాపద్యతే క్షిప్రమ్
రాజా దశరథో యథా॥
టీక:-
అర్థ = ప్రయోజనములు; ధర్మౌ = ధర్మమార్గములు; పరిత్యజ్య = విడిచి పెట్టి; యృ = ఎవరు; కామమ్ = కామమునందే; అనువర్తతే = అనుసరించుదురో; ఏవమ్ = వారు మాత్రము; ఆపద్యతే = ఆపదలలో; క్షిప్రమ్ = శీఘ్రముగా; రాజా దశరథః = దశరథ మహారాజు; యథా = వలె
భావం:-
అర్ధ ధర్మములు విడిచి కామమునే అనుసరించువాడు, దశరథ మహారాజు వలె శీఘ్రముగనే ఆపదలలో చిక్కుకొనును.
2.53.14.అనుష్టుప్.
మన్యే దశరథాంతాయ
మమ ప్రవ్రాజనాయ చ।
కైకేయీ సౌమ్య! సంప్రాప్తా
రాజ్యాయ భరతస్య చ॥
టీక:-
మన్యే = అనుకొనుచున్నాను; దశరథ = దశరథుని; అంతాయ = చావునకును; మమ = నా యొక్క; ప్రవ్రాజనాయ చ = వనగమనమునకు; చ = మఱియు; కైకేయీ = కైకేయి; సౌమ్య = సౌమ్యుడైన లక్ష్మణా; సంప్రాప్తా = చేరినదని; రాజ్యాయ = రాజ్యమునకును; భరతస్య = భరతుని యొక్క; చ = కూడ.
భావం:-
నేను అనుకొనుచున్నాను. ఈ కైకేయి దశరథుని చావునకును, నా వన వాసమునకును, భరతుని రాజ్యమునకును, మన ఇంట చేరినదని.
2.53.15.అనుష్టుప్.
అపీదానీం తు కైకేయీ
సౌభాగ్యమదమోహితా।
కౌసల్యాం చ సుమిత్రాం చ
సంప్రబాధేత మత్కృతే॥
టీక:-
అపి = ప్రశ్నసూచికము; ఇదానీం = ఇప్పుడు; తు = కదా; కైకేయీ = కైకేయి; సౌభాగ్య = సౌభాగ్యముచే; మదమోహితా = ఒళ్లు తెలియక; కౌసల్యాం చ = కౌసల్యను; చ = ఇంకా; సుమిత్రాం = సుమిత్రను; చ = ఇంకా; సంప్రబాధేత = మిక్కిలి బాధించదు కదా; మత్ = నా; కృతే = కారణంగా.
భావం:-
కైకేయి తనకు కలిగిన సౌభాగ్యముచే గర్వించి, ఒళ్లు తెలియక నా మూలమున కౌసల్యను, సుమిత్రను కూడ బాధించడు కదా!
2.53.16.అనుష్టుప్.
మా స్మ మత్కారణాద్దేవీ
సుమిత్రా దుఃఖమావసేత్।
అయోధ్యామిత ఏవ త్వమ్
కాల్యే ప్రవిశ లక్ష్మణ!॥
టీక:-
మాస్మః = వద్దు; మత్ = నా; కారణాత్ = కారణంగా; దేవీ = రాణి; సుమిత్రా = సుమిత్రాదేవి; దుఃఖమావసేత్ = దుఃఖపడకుండుగాక; అయోధ్యామ్ = అయోధ్యకు; ఇత ఏవ = ఇక్కడి నుండి; ఏవ = ఏ; త్వమ్ = నీవు; కాల్యేప్రవిశ = ప్రాతః కాలముననే; లక్ష్మణ = లక్ష్మణా!
భావం:-
లక్ష్మణా! నా మూలమున సుమిత్రాదేవి కూడా దుఃఖపడకుండు గాక! అందుచే నీవు ప్రాతఃకాలముననే లేచి ఇక్కడి నుండియే అయోధ్యకు వెళ్లి పొమ్ము.
2.53.17.అనుష్టుప్.
అహమేకో గమిష్యామి
సీతయా సహ దండకాన్।
అనాథాయా హి నాథస్త్వమ్
కౌసల్యాయా భవిష్యసి॥
టీక:-
అహమ్ = నేను; ఏకః = ఒక్కడనే; గమిష్యామి = వెళ్లుదును; సీతయా = సీతతో; సహ = కలసి; దండకాన్ = దండకారణ్యమునకు; అనాథాయా హి = అనాథురాలైన; నాథః = రక్షించుము; త్వమ్ = నీవు; కౌసల్యాయా = కౌసల్య విషయములో; భవిష్యసి = చేయవచ్చును
భావం:-
నేనొక్కడనే సీతతో కలసి దండకారణ్యమునకు వెళ్లెదను. అనాథురాలైన కౌసల్యను నీవు రక్షంచుము.
2.53.18.అనుష్టుప్.
క్షుద్రకర్మా హి కైకేయీ
ద్వేష్యమన్యాయ్యమాచరేత్।
పరిదద్యాహి ధర్మజ్ఞే
భరతే మమ మాతరమ్॥
టీక:-
క్షుద్రకర్మా = నీచకార్యములనుచేయు; హి = ఐన; కైకేయీ = కైకేయి; ద్వేష్యమ్ = ఇష్టపడనిది; అన్యాయ్యమ్ = న్యాయ విరుద్ధముగా; ఆచరేత్ = చేయవచ్చును; పరిదద్యాహి = అప్పచెప్పుము; ధర్మజ్ఞే = ధర్మములు తెలిసిన; భరతే = భరతునకు; మమ మాతరమ్ = నా తల్లి కౌసల్యను
భావం:-
నీచమైన కార్యములను చేయు కైకేయి, నా తల్లి విషయమున న్యాయవిరుద్ధముగా ప్రవర్తించవచ్చును. అందుచే మా తల్లిని ధర్మములు తెలిసిన భరతునకు అప్పచెప్పుము.
2.53.19.అనుష్టుప్.
నూనం జాత్యంతరే కస్మిన్
స్త్రియః పుత్రైర్వియోజితాః।
జనన్యా మమ సౌమిత్రే
తస్మాదేతదుపస్థితమ్॥
టీక:-
నూనం = బహుశ; జాత్యంతరే = జాత్య+ అంతరే, పూర్వ జన్మలలో; కస్మిన్ = ఎప్పుడో; స్త్రియః = స్త్రీలను; పత్రైః = పుత్రుల నుండి; వియోజితాః = దూరముచేసినది; జనన్యా = తల్లి; మమ = నా యొక్క; సౌమిత్రే = లక్ష్మణా; తస్మాత్ = అందువలన; ఏతత్ = ఈ విధముగా; ఉపస్థితమ్ = జరిగినది
భావం:-
పూర్వ జన్మలో ఎప్పుడో నా తల్లి, స్త్రీలను తమ పుత్రుల నుండి దూరము చేసినది. అందువలననే ఈ కష్టము వచ్చినది; నిజము.
*గమనిక:-
అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం॥ ఎవ్వరైనను తాము చేసిన పుణ్య. పాప కర్మలకు తగిన ఫలములను అనుభవించక తప్పదు. ఇది భారతీయతత్వమునకు మూలసూత్రము. గీతాప్రెస్ వారి రామాయణము.
2.53.20.అనుష్టుప్.
మయా హి చిరపుష్టేన
దుఖసంవర్ధితేన చ।
విప్రాయుజ్యత కౌసల్యా
ఫలకాలే ధిగస్తు మామ్॥
టీక:-
మయా = నన్ను; హి = ఏ; చిరపుష్టేన = చిరకాలము; పుష్టేన = పోషించుటలో; దుఃఖ = కష్టమునోర్చి; సంవర్ధితేన = పెంచబడినా; చ = కూడా; విప్రాయుజ్యత = దూరమగుటను, విరహము; కౌసల్యా = కౌసల్య; ఫల = ఫలమును; కాలే = పొందుసమయమున; దిగస్తు = పొందవలసిన; మామ్ = నాయొక్క
భావం:-
నన్ను చిరకాలము పోషించి, కష్టాలకోర్చి పెంచిన నా తల్లి, నా వలన ఫలమును పొందవలసిన సమయమున నేను దూరమగుటను పొందెను.
*గమనిక:-
తల్లి పుత్రునివలన పొందవలసినఫలము- “మాతృశుశ్రూషణమేవ పుత్రోత్పత్తి ఫలమే”, తల్లిదండ్రులకు వారి పుత్రులవలన సేవలు సభించుటయే వారు పుత్రులను కనినందువకు ఫలము. తల్లిదండ్రులకు సేవలొనర్చుట తనయులకు ముఖ్యకర్తవ్యము. గీతా ప్రెస్ వారి రామాయణము.
2.53.21.అనుష్టుప్.
మా స్మ సీమంతినీ కాచిత్
జనయేత్పుత్రమీదృశమ్।
సౌమిత్రే! యోఽహమంబయా
దద్మి శోకమనంతకమ్॥
టీక:-
మా స్మః = నేను ఎంత వ్యర్థ జన్ముడను; సీమంతినీ = పునిస్త్రీ; కాచిత్ = ఏ ఒక్క; జనయేత్ = తల్లికి; పుత్రమ్ = పుత్రుని; ఈదృశమ్ = ఇటువంటి; సౌమిత్రే = లక్ష్మణా; యో = వంటి; అహమ్ = నేను; అంబయా = తల్లికి; దద్మి = ఇచ్చుచున్నానో; శోకమ్ = శోకమును; అనంతకమ్ = అనంతమైన
భావం:-
లక్ష్మణా! ఏ తల్లియూ కూడ నా వంటి పుత్రుని కనకుండుగాక. నేను నా తల్లికి కలిగించినట్టి, ఇలా అనంతమైన పుత్రవియోగశోకము కలిగించువానిని కనకుండెడిగా.
2.53.22.అనుష్టుప్.
మన్యే ప్రీతివిశిష్టా సా
మత్తో లక్ష్మణ శారికా।
యస్యాస్తచ్ఛ్రూయతే వాక్యమ్
శుక పాదమరేర్దశ॥
టీక:-
మన్యే = అనుకొనుచున్నాను; ప్రీతి విశిష్టా = ఎక్కువ ప్రేమ కలది; సా = ఆ; మత్తః = నా కంటె; లక్ష్మణ = లక్ష్మణా; శారికా = గోరింక; యస్య = ఎవరికైతే; అస్తత్ = ఉన్నది; శ్రూయతే = వినగానే; వాక్యమ్ = మాటలను; శుక = ఓ చిలుకా; పాదమ్ = పాదమును; అరేః = శత్రువైన; దశ = కొరకుము
భావం:-
లక్ష్మణా! నా వనవాసము మాట వినగానే గోరువంక పిట్ట ‘ఓ చిలుకా! శత్రువైన కైకేయి పాదమును కొరకుము’ అని చిలుకతో పలికినది. ఆ శారికకు కౌసల్యపై నాకున్న ప్రీతి కంటె ఎక్కువ ప్రీతి ఉన్నదని తలచెదను.
*గమనిక:-
ఇలా కౌసల్యాదేవి పెంచిన గోరువంక పిల్లిమీద (మరొక పక్షిమీద) వంకపెట్టి, కౌసల్యాదేవి యెడ శత్రుభావము వహించిన కైకేయి కాలు కొరకమని అనుచున్నది. పక్షి యైన గోరువంక, తనను పోషించున్న కౌసల్యాదేవి యందు ప్రేమతో ఇంత తీవ్రముగా ప్రకటించుచున్నది. మానవులలో పౌరషవంతులైన క్షత్రియుడనైన నేను, ఆమెకు కొడుకునై ఉండి, కైకేయిని పల్లెత్తుమాట అనలేదు అన రాముడు బాధపడుచున్నాడు- గీతా ప్రెస్ రామాయణము
2.53.23.అనుష్టుప్.
యావదేకశ్చ ఖందశ్చ
యావదస్య ముఖం మయి।
తావదాత్మ విమోక్షార్థం
శుకపాద మరేర్దశ॥
టీక:-
యవత్ = ఎప్పుడైతే ఇంకా ఆకాశంలో ఉండగానే; ఏకః = ఒకటే; చ = ఉండగా; ఖన్దః = సంతోషం; చ = ఉండగా; యావత్ = అప్పుడే; చ = ఇంకా; ముఖమ్ = నోరు; మయి = నామీదకు; తావతే = ఆసమయంలోనే; ఆత్మ = నా; విముక్ష్యః = విడిపించుట; అర్థం = కొఱకు; శుక = చిలుక; పాదమ్ = కాలిని; అరేః = శత్రువైన; దశ = కరువుము.
భావం:-
నా మీదకు దాని ముఖం దాడిచేయడానికి వచ్చే సమయంలో ఇంకా అంది ఆకాశంలో నన్ను పొడిచేస్తున్నానని సంతోషంతో ఆకాశంలోనే ఉండగానే, అదే సమయంలోనే నన్ను ఆ కాటు నుండి తప్పించడానికి ఆ శత్రు చిలుక పాదాన్ని కొరికెయ్యి.
*గమనిక:-
ఈ శ్లోకం ప్రాచ్యప్రతిలో ఈ వరుసలో ఉన్నది. “మన్యే ప్రీతివిశిష్టా సా” అను పైశ్లోకం పాఠం అంత చక్కగాలేదు కాని ఈ శ్లోకం పాఠ్యం బాగుంది అని, దీనికి సంబంధించిన పూర్వ కథ కూడ ఉండే ఉంటుందని పుల్లెల శ్రీరామచంద్రుల వారు తమ రామాయణంలో అభిప్రాయం వ్యక్తపరచారు. దానిని గ్రహించి ఈ శ్లోకము ఇక్కడ చేర్చడమయినది. ఇట్టి కథ ఎవరికైనా తారసపడి ఉంటే, దయచేసి దానిన సవివరంగా మాకు ఇక్కడ లింకుచేయుట కొఱకు అందించమనవి.
2.25.24.అనుష్టుప్.
శోచంత్యా అల్పభాగ్యాయా
న కించిదుపకుర్వతా।
పుత్రేణ కిమపుత్రాయా
మయా కార్యమరిందమ!॥
టీక:-
శోచంత్యా = విచాకించుచున్న; అల్పభాగ్యాయా = అల్పభాగ్యురాలికి; న = చేయలేని; కించిత్ = కొంచెము కూడా; ఉపకుర్వతా = ఉపకారము చేయుట; పుత్రేణ = పుత్రుని చేత; కిమ్ = ఏమి; అపుత్రాయా = ఇంకొకపుత్రుడులేనామె; మయా = నావలన; కార్యమ్ = ప్రయోజనము; అరిందమ = శత్రు సంహారనకుడైనా ఓ లక్ష్మణా
భావం:-
నేను తప్ప వేరు పుత్రులెవ్వరును లేని అల్పభాగ్యురాలై విచారంలో ఉన్న నా తల్లికి ఏ విధముగాను ఉపకారము చేయజాలని నేను పుత్రుడనై ఉండి ఏమి ప్రయోజనము?
2.53.24.అనుష్టుప్.
అల్పభాగ్యా హి మే మాతా
కౌసల్యా రహితా మయా।
శేతే పరమదుఃఖార్తా
పతితా శోకసాగరే॥
టీక:-
అల్పభాగ్యా = దురదృష్టవంతురాలు; హి = ఐన; మే = నా; మాతా = తల్లి అయిన; కౌసల్యా = కౌసల్య; రహితా = లేకపోవుట చేత; మయా = నేను; శేతే = దగ్గరగా ఉండుట; పరమదుఃఖార్తా = అధికమైన దుఃఖము చేత; పతితా = పడియుండును; శోకసాగరే = శోక సాగరమునందు;
భావం:-
దురదృష్టవంతురాలైన నా తల్లి కౌసల్య, నేను దగ్గర లేకపోవుటచే అత్యధికమైన దుఃఖము చేత పీడితురాలై, శోకసాగరమునందు మునిగి యుండును.
2.53.25.అనుష్టుప్.
ఏకో హ్యహమయోధ్యాం చ
పృథివీం చాపి లక్ష్మణ।
తరేయమిషుభిః క్రుద్ధో
నను వీర్యమకారణమ్॥
టీక:-
ఏకో హి = ఒక్కడినే; అహమ్ = నేను; అయోధ్యాం చ = అయోధ్యను; పృథివీం చ = ఈ భూమినంతను; అపి = కూడా; లక్ష్మణ = లక్ష్మణా; తరేయమ్ = సాధించగలను; ఇషుభిః =బాణములతో; క్రుద్ధః = కోపించినచో; నను వీర్యమ్ = పరాక్రమము చూపు సందర్భము; అకారణమ్ = ఏ కారణము లేకుండా
భావం:-
లక్ష్మణా! కోపించినచో, నేను ఒక్కడనే బాణములతో అయోధ్యను, ఈ భూమినంతను గూడ సాధించగలను. కాని ఇది పరాక్రమము చూపు సందర్భము కాదు కదా!
2.53.26.అనుష్టుప్.
అధర్మభయభీతశ్చ
పరలోకస్య చానఘ!।
తేన లక్ష్మణ నాద్యాహ
మాత్మానమభిషేచయే॥
టీక:-
అధర్మ = అధర్మము పట్ల; భయ భీతః = భయము మఱియు భీతి; చ = మఱియు; పరలోకస్య = పరలోకములో; చ = మఱియు; అనఘ = ఓ దోషరహితుడా (లక్ష్మణా); తేన = ఆ కారణంగా; లక్ష్మణ = ఓ లక్ష్మణా; న = చేసుకోను; అద్య = ఇవాళ; అహమ్ = నేను; ఆత్మానమ్ = నా యొక్క; అభిషేచయే = పట్టాభిషేకం
భావం:-
ఓ పుణ్యుడా లక్ష్మణా! నేను అధర్మమునకు పరలోకమునకు భయపడి, ఇప్పుడు యువరాజ్యాభిషేకానికి అంగీకరింపలేను.
2.53.27.అనుష్టుప్.
ఏతదన్యశ్చ కరుణమ్
విలప్య విజనే వనే।
అశ్రుపూర్ణముఖో రామో
నిశి తూష్ణీముపావిశత్॥
టీక:-
ఏతత్ = ఆ మాటలు ఈ మాటలు; అన్యశ్చ = మరి కొన్ని మాటలు ; కరుణమ్ = దీనముగా; విలప్య = విలపించి; విజనే = ఒంటరిగా; వనే = అడవిలో; అశ్రుపూర్ణముఖః = కన్నీళ్లతో నిండిన ముఖము కలవాడై; రామః = రాముడు; నిశి = ఆ రాత్రి; తూష్ణీమ్ = మాటలాడక; ఉపావిశత్ = కూర్చుండెను
భావం:-
రాముడు ఆ రాత్రి నిర్జనమైన ఆ వనమునందు, దైన్యముతో ఏవేవో మాటలు పలికి, కన్నీళ్లతో నిండిన ముఖము కలవాడై మాటలాడక కూర్చుండెను.
2.53.28.అనుష్టుప్.
విలప్యోపరతం రామమ్
గతార్చిషమివానలమ్।
సముద్రమివ నిర్వేగమ్
ఆశ్వాసయత లక్ష్మణః॥
టీక:-
విలప్య = విలపించిన; ఉపరతం = పిమ్మట; రామమ్ = రాముని; గత = ఆరిపోయిన; అర్చిషమ్ = మంటలుగల; ఇవ = వంటి; అనలమ్ = అగ్ని వలె; సముద్రమ్ =సముద్రము; ఇవ = వలె; నిర్వేగమ్ = నిః + వేగమ్, కల్లోలములేని; ఆశ్వాసయత = ఓదార్చెను; లక్ష్మణః = లక్ష్మణుడు
భావం:-
ఈ విధముగా విలపించిన పిమ్మట మంటలు లేని అగ్ని వలె, వేగము లేని సముద్రము వలె ఊరకున్న ఆ రాముని లక్ష్మణుడు ఓదార్చెను.
2.53.29.అనుష్టుప్.
ధ్రువమద్య పురీ రాజన్
అయోధ్యాయుధినాం వర।
నిష్ప్రభాత్వయి నిష్క్రాన్తే
గతచంద్రేవ శర్వరీ॥
టీక:-
ధ్రువమ్ = నిశ్చయము; అద్య = ఇప్పుడు; పురీ = నగరము; రాజన్ = ఓ రాజా; అయో«ధ్య = అయోధ్య; ఆయుధినాం = శస్త్రధారులలో; వర = శ్రేష్ఠుడైన; నిష్ప్రభా = కాంతి విహీనమై; త్వయి = నీవు; నిష్క్రాన్తే = విడిచి వెళ్లిపోవుటచే; గత చంద్ర = చంద్రుడు లేని; ఇవ = వలె; శర్వరీ = రాత్రి
భావం:-
శస్త్రధారులలో శ్రేష్ఠుడైన ఓ రామా! నీవు విడిచి వెళ్లిపోవుటచే, అయోధ్యానగరము ఇపుడు చంద్రుడు లేని రాత్రి వలె కాంతి విహీనమై ఉండును. ఇది నిశ్చయము.
2.53.30.అనుష్టుప్.
నైతదౌపయికం రామ
యదిదం పరితప్యతే।
విషాదయసి సీతాం చ
మాం చైవ పురుషర్షభ॥
టీక:-
న = కాదు; ఏతత్ = ఇది; ఔపయికం = సరైనది; రామ = ఓ రామా; యత్ = అట్లు; ఇదం = ఈ; పరితప్యతే = బాధపడుట; విషాదయసి = దుఃఖము; సీతాం = సీతకును; చ = మఱియు; మాం = నాకును; చ = మఱియును; ఏవ = ఆ విధముగా; పురుషర్షభ = ఓ పురుష రత్నమా
భావం:-
నీవు ఇట్లు దుఃఖించుట యుక్తము కాదు. నీవు ఇట్లు చేయుటచే నాకును, సీతకును కూడ దుఃఖము కలుగును.
2.53.31.అనుష్టుప్.
న చ సీతా త్వయా హీనా
న చాహమపి రాఘవ।
ముహూర్తమపి జీవావో
జలాన్మత్స్యావినోద్ధృతౌ॥
టీక:-
న = ఉండలేము; చ = కాని; సీతా = సీత; త్వయా = నీ సాన్నిధ్యము; హీనా = లేనిచో; న = ఉండలేము; చ = కాని; అహమ్ = నేను; అపి = ఐనను; రాఘవ = రామా; ముహూర్తమ్ = క్షణకాలము అపి = ఐనను; జీవావః = జీవించినవారమై; జలాన్ = నీటి నుండి; మత్సా్య = మత్స్యము; వినా = లేదు; ఉద్ధృతౌ = పైకి తీసిన
భావం:-
నీ సాన్నిధ్యము లేనిచో సీత గాని, నేను గాని, నీటి నుండి పైకి తీసిన చేప వలె క్షణకాలమైనను జీవించి ఉండలేము.
2.53.32.అనుష్టుప్.
నహి తాతం న శత్రుఘ్నమ్
న సుమిత్రాం పరంతప।
ద్రష్టుమిచ్ఛేయమద్యాహమ్
స్వర్గం చాపి త్వయా వినా॥
టీక:-
నహి = లేదు; తాతమే = తండ్రిని గాని; నహి = లేదు; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని గాని; నహి = లేదు; సుమిత్రామ్ = సుమిత్రను గాని; పరంతప = శత్రువులకు బాధ కలిగించువాడా; ద్రష్టుమ్ = చూడవలెనను; ఇచ్ఛేయమ్ = కోరిక; అద్య = ఇప్పుడు; అహమ్ = నేను; స్వర్గమ్ = స్వర్గము; చ = ఐన; అపి = కూడా; త్వయా = నీవు; వినా = లేకుండా.
భావం:-
నిన్ను విడచి తండ్రిని గాని, శత్రుఘ్నుని గాని, సుమిత్రను గాని, స్వర్గమును గాని చూడవలెనను కోరిక నాకు లేదు.
2.53.33.అనుష్టుప్.
తతస్తత్ర సుఖాసీనౌ
నాతిదూరే నిరీక్ష్య తామ్।
న్యగ్రోధే సుకృతాం శయ్యామ్
భేజాతే ధర్మవత్సలౌ॥
టీక:-
తతః = అప్పుడు; అత్ర = అక్కడ; సుఖాసీనౌ = సుఖముగా కూర్చొన్న; న + అతిదూరే = దగ్గరగా; నిరీక్ష్య = కూర్చొని ఉన్న; తామ్ న్యగ్రోధే = ఆ మర్రి చెట్టు కింద; సుకృతాం = చక్కగా అమర్చిన; శయ్యామ్ = శయ్యను చూచి; భేజాతే = పండుకొనిరి; ధర్మ వత్సలౌ = ధర్మమునకు మారుపేరుగా ఉన్న
భావం:-
అక్కడ సుఖముగా కూర్చొని ఉన్న ధర్మాత్ములైన ఆ రామలక్ష్మణులు, దగ్గరనే మర్రిచెట్టు కింద చక్కగా అమర్చిన శయ్యను చూచి దానిపై పండుకొనిరి.
2.53.34.జగతి.
స లక్ష్మణస్యోత్తమపుష్కలం వచో
నిశమ్య చైవం వనవాసమాదరాత్।
సమాః సమస్తా విదధే పరంతపః
ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవః॥
టీక:-
స = ఆ; సలక్ష్మణస్య = లక్ష్మణుని యొక్క; ఉత్తమ = ఉత్తమమైన; పుష్కలమ్ = అర్థసంపూర్ణమైన; వచః = మాటలు; నిశమ్య = వినుట; చ = మఱియు; ఏవం = ఇటువంటి; వనవాసమ్ = అరణ్యవాసమును; ఆదరాత్ = శ్రద్ధగా; సమాః = సంవత్సరాల; సమస్తా = అన్నియు; విదధే = పరిష్కరించబడిన; పరంతపః = శత్రువులను అంతము చేయువాడు; ప్రపద్య = స్వీకరించుట; ధర్మం = ధర్మమును; సుచిరాయ = చాలాకాలము పాటు; రాఘవః = రాముడు
భావం:-
రాముడు లక్ష్మణుడు చెప్పిన ఉత్తమములు, అర్ధ సంపూర్ణములు అయిన మాటలు సాదరముగా విని, చిరకాలము వానప్రస్థ ధర్మము అవలంబించి, పదునాలుగు సంవత్సరములు పూర్తిగా వనవాసము చేయ నిర్ణయించెను.
2.53.35.జగతి.
తతస్తు తస్మిన్ విజనే వనే తదా
మహాబలౌ రాఘవవంశవర్ధనౌ।
న తౌ భయం సంభ్రమమభ్యుపేయతు
ర్యథైవ సింహౌ గిరిసానుగోచరౌ॥
టీక:-
తతః + తు = అక్కడ నుండి; తస్మిన్ = ఆ; విజనే = నిర్జన; వనే = అడవిలో; తదా = అప్పుడు; మహాబలౌ = మహాబలశాలులైన; రాఘవ = రాముడు; వంశవర్ధనౌ = వంశవర్ధనులు; న = లేదు; తౌ = ఆ ఇద్రకును; భయం = భయము గాని; సమభ్రమమ్ = ఆందోళన; అభి +ఉపేయతుః = లేకుండ ఉండిరి; యథైవ = వాని వలె; సింహౌ = రెండు సింహములు; గిరి సాను = పర్వతముల చరియలపై; గోచరౌ = సంచరించు
భావం:-
అప్పుడు మహాబలశాలులైన రామలక్ష్మణులు జనశూన్యమైన అరణ్యములో కూడ, పర్వతముల చరియలపై సంచరించు రెండు సింహముల వలె, ఏ మాత్రము భయము గాని, తొందర గాని లేకుండ ఉండిరి.
2.53.36.గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
త్రిపంచాశ సర్గః॥
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; త్రిపంచాశ [53] = ఏభై మూడవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [53] ఏభై మూడవ సర్గ సంపూర్ణము.
2.54.1.అనుష్టుప్
తే తు తస్మిన్మహావృక్షే
ఉషిత్వా రజనీం శివామ్।
విమలేఽభ్యుదితే సూర్యే
తస్మాద్దేశాత్ప్రతస్థిరే॥
టీక:-
 తే = వారు; తు = ఇంకను; తస్మిన్ = దాని క్రింద; మహావృక్షే = పెద్ద చెట్టు; ఉషిత్వా = గడిపిన; రజనీమ్ = రాత్రి; శివామ్ = సుఖమైన, వావిళ్ళ నిఘంటువు; విమలే = ఒప్పిదముగా; అభ్యుదితే = లేచెను; సూర్యే = సూర్యుడు; తస్మాత్ = అక్కడ నుండి; దేశాత్ = ప్రదేశము; ప్రతస్థిరే = బయలుదేరిరి.
భావం:-
 సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అంతయు సుఖముగా మహావృక్షము క్రింద గడిడి, మరునాడు సూర్యుడు ఉదయించిన పిమ్మట, ఆ ప్రదేశమునుండి బయలుదేరిరి.
2.54.2.అనుష్టుప్
యత్ర భాగీరథీం గంగామ్
యమునాభిప్రవర్తతే।
జగ్ముస్తం దేశముద్దిశ్య
విగాహ్య సుమహద్వనమ్॥
టీక:-
 యత్ర = ఎక్కడైతే; భాగీరథీమ్ = భగీరథునిచే తీసుకుని రాబడిన గంగానదియును: గంగామ్ = సరస్వతీనదియును; యమున = యమునా నదియును; అభిప్రవర్తతే = సంగమించుచున్నచోటునకు; జగ్ముః = వెళ్లెను; తమ్ = ఆ; దేశమ్ = ప్రాంతము; ఉద్దిశ్య = వైపుగా; విగాహ్య = ప్రవేశించిన; సుమహత్ = విస్తృతమైన; వనమ్ = అడవిలోనికి
భావం:-
 యమున సరస్వతీ గంగానదులు సంగమించుచున్న త్రివేణీ సంగమ ప్రదేశము వైపు వెళ్లి,ఒక పెద్దఅడవిలోకి ప్రవేశించిరి.
2.54.3.అనుష్టుప్
తే భూమిభాగాన్వివిధాన్
దేశాంశ్చాపి మనోరమాన్।
అదృష్టపూర్వాన్ పశ్యంతః
తత్ర తత్ర యశశ్వినః॥
టీక:-
 తే = వారు; భూమిభాగాన్ = ప్రదేశములను; వివిధాన్ = వివిధములైన; దేశామ్ శ్చాపి = దేశములను; చాపి = కూడా; మనోరమాన్ = మనోహరమైన; అదృష్టపూర్వాన్ = పూర్వము ఎన్నడును చూడబడని; పశ్యంతః = చూచిరి; తత్ర తత్ర = అక్కడక్కడ; యశశ్వినః = కీర్తి గడించినవారు
భావం:-
 మహాయశస్వులైనట్టి సీతారామలక్ష్మణులు, అక్కడక్కడ అనేక విధములైన భూమి భాగములను, పూర్వము ఎన్నడును ఎవరును చూడని అందమైన దేశములను చూచిరి.
2.54.4.అనుష్టుప్
యథా క్షేమేణ గచ్ఛన్ స
పశ్యంశ్చ వివిధాన్ ద్రుమాన్।
నివృత్తమాత్రే దివసే
రామః సౌమిత్రిమబ్రవీత్॥
టీక:-
 యథా = ఆ విధముగా; క్షేమేణ = కష్టము కలుగకుండునట్లు; గచ్ఛన్ = వెళ్లిరి; స = వాటిని; పశ్యం = వాటిని చూచుచు; చ = మఱియు; వివిధాన్ = రకరకములైన; ద్రుమాన్ = వృక్షములను; నివృత్తమాత్రే = మరలినవెంటనే; దివసే = పగలు; రామః = రాముడు; సౌమిత్రిమ్ = లక్ష్మణునితో; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 రాముడు కష్టము కలుగకుండునట్లు మెల్లగా నడచి ప్రయాణము చేయుచు, అనేక విధములైన వృక్షములను చూచుచు వెళ్లి, పగలు గడవగానే లక్ష్మణునితో ఇట్లనెను..
2.54.5.అనుష్టుప్
“ప్రయాగమభితః పశ్య
సౌమిత్రే! ధూమమున్నతమ్।
అగ్నేర్భగవతః కేతుమ్
మన్యే సన్నిహితో మునిః॥
టీక:-
 ప్రయాగమ్ = ప్రయాగమునకు; అభితః = సమీపమున, సర్వ శబ్ద సంబోధిని; పశ్య = చూడుము; సౌమిత్రే = లక్ష్మణా; ధూమమ్ = ధూమము; ఉన్నతమ్ = ఎత్తుగా; అగ్నేః = అగ్నికి; భగవతః = భగవంతుడైన; కేతుమ్ = ధ్వజమైన; మన్యే = ఉన్నట్లుగా; సన్నిహితో = దగ్గరలో; మునిః = భరద్వాజ ముని.
భావం:-
 లక్ష్మణా! ప్రజాపతి క్షేత్రమైన ప్రయాగకు సమీపమున భగవంతుడైన అగ్నికి ధ్వజమైన ధూమము ఎత్తుగా కనబడుచున్నది. చూడుము. ఇక్కడ దగ్గరనే భరద్వాజ ముని ఉన్నాడని తలచెదను.
*గమనిక:-
(1)ప్రయాగ- వ్యుత్పత్తి, ప్రకృష్టే యాగో యాగఫలం యస్య యస్మాత్ వా. గంగాయసునయోః సంగమజాతే, తీర్థబేధ, త్రివేణీసంగమం, నందీసంగమ పుణ్యతీర్థం. (2) ప్రయాగ- ప్రజాపతిక్షేత్రము- ఒకానొక పుణ్యక్షేత్రము. ప్రయాగ మొదలు ప్రతిష్ఠాన పురము వఱకును వాసుకి హ్రదము మొదలు కంబళాశ్వతర బహుమూల పర్వతముల వఱకును కల దేశము. ఇచట స్నానముచేసిన వారికి స్వర్గము లభించుటయెకాక పునర్జన్మము కూడ లేదు అందురు. బ్రహ్మాదిదేవతలు ఈ క్షేత్రమును ఎల్లప్పుడు రక్షణచేయుచు ఉండెదరు. ఇచటి పుణ్యతీర్థములను లెక్కింప అలవిగాదు. వానిలోపల జాహ్నవి యమున ఈరెండు నదులను సూర్యుఁడు రక్షించుచు ఉండును. ప్రయాగను, దానిమండలమును, అందు ఉండు వటవృక్షమును శివుఁడును, అందలి స్నానఫలమును దేవతలును రక్షింతురు. ప్రయాగను స్మరించిన మాత్రముననే సకలదురితములు పాయును. మఱియు ఈప్రయాగయొక్క దర్శనము, స్పర్శనము, మృత్తికాలేపనము వీనిచే పాపపరిహారము అగును.
2.54.6.అనుష్టుప్
నూనం ప్రాప్తాః స్మ సంభేదమ్
గంగాయమునయోర్వయమ్।
తథా హి శ్రూయతే శబ్దో
వారిణో వారిఘట్టితః॥
టీక:-
 నూనం = కచ్చితముగా; ప్రాప్తాః = చేరుకున్నాము; స్మ = నిజమునకు; సంభేదమ్ = నదీసంగమమును; గంగా = గంగానది; యమునయోః = యమునా నది; వయమ్ = మనము; తథా హి = ఎందుచేతననగా; శ్రూయతే = వినపడుచున్నది; శబ్దః = శబ్దము; వారిణః = నీరు; వారి = నీటితో; ఘట్టితః = కొట్టుకొనుటచే.
భావం:-
 మనము గంగా యమున సంగమ స్థానమును చేరితిమి. సందేహంలేదు. ఎందుచేత ననగా, వేగముగా ప్రవహించుచున్న రెండు నీటిప్రవాహములు ఒకదాని నొకటి ఢీకొట్టుకొనుటచే కలుగు శబ్దము వినపడుచున్నది.
2.54.7.అనుష్టుప్
దారూణి పరిభిన్నాని
వనజైరుపజీవిభిః।
భరద్వాజాశ్రమే చైతే
దృశ్యంతే వివిధా ద్రుమాః॥
టీక:-
 దారూణి = కర్ర ముక్కలు; పరిభిన్నాని = విరిచివేయబడిన; వనజైః = వనములో లభించు; ఉపజీవిభిః = ఆధారపడి జీవించువారిచే; భరద్వాజ = భరద్వాజ; ఆశ్రమే = ఆశ్రమములో; చ = ఇంకా; ఏతే = ఈ; దృశ్యంతే = చూడవచ్చు; వివిధా = అనేక విధములైన; ద్రుమాః = వృక్షములు.
భావం:-
 అడవులపై ఆధారపడి జీవించువారిచే నరకబడిన కర్రలు ఇదిగ ఇచ్చట పడి యున్నవి. భరద్వాజ ఆశ్రమములో అనేక విధములైన ఈ వృక్షములు కనబడుచున్నవి.
2.54.8.అనుష్టుప్
ధన్వినౌ తౌ సుఖం గత్వా
లంబమానే దివాకరే।
గంగాయమునయోస్సంధౌ
ప్రాపతుర్నిలయం మునేః॥
టీక:-
 ధన్వినౌ = ధనుర్ధారులిద్దరూ; తౌ = వారిరువురు (రామలక్ష్మణులు); సుఖం = సుఖముగా; గత్వా = వెళ్లిరి; లంబమానే = సాయంకాల సమయము, కుంగుచుండగా (పడమటి దిక్కు); దివాకరే = సూర్యుని; గంగాయమునయోః = గంగాయమునా నదుల; సంధౌ = సంగమమునకు; ప్రాపతుః = చేరిరి; నిలయం = ఆశ్రమమును; మునేః = భరద్వాజ ముని యొక్క
భావం:-
 ధనుర్ధరులైన ఆ రామలక్ష్మణులు సుళువుగా ప్రయాణము చేసి, సూర్యుడు పడమమట క్రుంగే,సాయంకాల సమయమున, గంగాయమునల సంగమమునకు దగ్గరగా ఉన్న భరద్వాజ ఆశ్రమమును చేరిరి.
2.54.9.అనుష్టుప్
రామస్త్వాశ్రమమాసాద్య
త్రాసయన్మృగపక్షిణః।
గత్వా ముహూర్తమధ్వానమ్
భరద్వాజముపాగమత్॥
టీక:-
 రామః = రాముడు; తు = చక్కగా; ఆశ్రమమ్ = ఆశ్రమ సమీపమును; ఆసాద్య = చేరగానే; త్రాసయత్ = భయపడినవి; మృగః = మృగములు; పక్షిణః = పక్షులు; గత్వా = చేరగానే; ముహూర్తమ్ = కొద్దిసమయపు; అధ్వానమ్ = నడకతో; భరద్వాజమ్ = భరద్వాజుని ఆశ్రమమును; ఉపాగమత్ = సమీపించెను.
భావం:-
 రాముడు ఆశ్రమ సమీపమునకు చేరుటచూచి, మృగములు పక్షులు భయపడినవి. రాముడు కొంతదూరము వెళ్ళి, భరద్వాజుని ఆశ్రమము వద్దకు చేరెను.
2.54.10.అనుష్టుప్
తతస్త్వాశ్రమమాసాద్య
మునేర్దర్శనకాంక్షిణౌ।
సీతయానుగతౌ వీరౌ
దూరాదేవావతస్థతుః॥
టీక:-
 తతః = అటుపిమ్మట; త్వామ్ = ఆయన; ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఆసాద్య = వచ్చిన; మునేః = మునిని; దర్శన కాంక్షిణౌ = చూడవలెనను కోరుచు; సీతయా = సీతచే; అనుగతౌ = అనుసరించబడుచున్న; వీరౌ = పరాక్రమవంతులైన ఆ వీరులు ఇద్దరు (రామలక్ష్మణులు); దూరాదేవ = దూరాత్ + ఏవ, దూరముగనే; అవతస్థతుః = నిలిచి ఉండిరి.
భావం:-
 పిమ్మట ఆశ్రమము సమీపించిన సీతారామలక్ష్మణులు, మునిని చూడవలెనను కోరికతో కొద్దిసేపు దూరముగనే నిలిచి ఉండిరి.
2.54.11.అనుష్టుప్
స ప్రవిశ్య మహాత్మానమ్
ఋషిం శిష్యగణైర్వృతమ్।
సంశితవ్రతమేకాగ్రమ్
తపసా లబ్ధచక్షుషమ్॥
టీక:-
 సః = రాముడు; ప్రవిశ్య = ప్రవేశించి; మహాత్మానమ్ = మహాత్ముడైన; ఋషిం = భరద్వాజ మునిని; శిష్యగణైః = శిష్యుల సముదాయముతో; వృతమ్ = కూడి ఉన్న; సంశితవ్రతమ్ = కఠినమైన వత్రతములను ఆచరించుచు; ఏకాగ్రమ్ = ఏకాగ్రచిత్తుడై; తపసా = తపస్సుచేత; లబ్ధ చక్షుషమ్ = దివ్యదృష్టిని పొందినవానిని.
భావం:-
 పిమ్మట రాముడు ఆశ్రమములో ప్రవేశించెను. అక్కడ శిష్యులందరు మహాత్ముడైన భరద్వాజ మహర్షిని చేరి ఉండగా చూచెను. ఆ మహర్షి కఠినమైన వ్రతములను ఆచరించుచు, ఏకాగ్రచిత్తుడై, తపస్సు చేత దివ్యదృష్టిని పొందినవాడు.
2.54.12.అనుష్టుప్
హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ
మహాభాగం కృతాంజలిః।
రామః సౌమిత్రిణా సార్ధమ్
సీతయా చాభ్యవాదయత్॥
టీక:-
 హుత = వ్రేల్చిన; అగ్నిహోత్రమ్ = అగ్నిహోత్రము కలవాని; దృష్ట్వా = చూసిన; ఏవ = వెంటనే; మహాభాగమ్ = మహాభాగ్యవంతుని; కృతాంజలిః = చేతులు జోడించి; రామః = రాముడు; సౌమిత్రిణా = లక్ష్మణుని చేత; సార్ధమ్ = కలిసి; సీతయా = సీత చేత మఱియు; చ = మఱియు; అభ్యవాదయత్ = నమస్కరించిరి.
భావం:-
 అతడు అగ్నిహోత్రము వ్రేల్చియున్న, మహాభాగుడు అయిన ఆ మహర్షిని చూచిన వెంటనే, రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించిరి.
2.54.13.అనుష్టుప్
న్యవేదయత చాత్మానమ్
తస్మై లక్ష్మణపూర్వజః।
“పుత్రౌ దశరథస్యావామ్
భగవన్ రామలక్ష్మణౌ॥
టీక:-
 న్యవేదయత = నివేదించెను; చ = మఱియు; ఆత్మానమ్ = తన గురించి; తస్మై = వారికి; లక్ష్మణపూర్వజః = లక్ష్మణుని అన్నగారు; పుత్రౌ = కుమారులము; దశరథస్య = దశరథుని యొక్క; అవామ్ = మేమిద్దరము; భగవన్ = ఓ మహానుభావుడా; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులము.
భావం:-
 రాముడు తనను గూర్చి, ఆ భరద్వాజ మహర్షికి ఇట్లు తెలిపెను. ‘ఓ పూజ్యుడా! మేము దశరథుని పుత్రులమైన రామలక్ష్మణులము.
2.54.14.అనుష్టుప్
భార్యా మమేయం వైదేహీ
కల్యాణీ జనకాత్మజా।
మాం చానుయాతా విజనమ్
తపోవనమనిందితా॥
టీక:-
 భార్యా = భార్య; మమ = నా యొక్క; ఇయం = ఈమె; వైదేహీ = సీతాదేవి; కల్యాణీ = మంగళకరమైనామె; జనకాత్మజా = జనకుని కుమార్తె; మాం = నన్ను; చ = మఱి; అనుయాతా = అనుసరించను; విజనమ్ = నిర్జనమైన; తపోవనమ్ = తపోవనమునకు; అనిందితా = నిందింపదగిన వర్తన లేనామె, సచ్చీలురాలు.
భావం:-
 ఈ కల్యాణి నా భార్య. జనకుని కమార్తైయెన సీత. సచ్చీలవతియైన ఈమె నన్ను అనుసరించి, తపోవనమునకు వచ్చుచున్నది.
2.54.15.అనుష్టుప్
పిత్రా ప్రవ్రాజ్యమానం మామ్
సౌమిత్రిరనుజ ప్రియః।
అయమన్వగమద్భ్రాతా
వనమేవ దృఢవ్రతః॥
టీక:-
 పిత్రా = తండ్రిచే; ప్రవ్రాజ్యమానం = అరణ్యమునకు పంపబడిన; మామ్ = నన్ను; సౌమిత్రిః = లక్ష్మణుడు; అనుజ = తమ్ముడు; ప్రియః = ఇష్టమైనవాడు; అయమ్ = ఇది; అన్వగమత్ = అనుసరించి వచ్చెను; భ్రాతా = సోదరుడు; వనమేవ = వనమునకు; దృఢవ్రతః = దృఢమైన నిశ్చయము కలవాడు.
భావం:-
  నా తమ్ముడు దృఢమైన నిశ్చయము కలవాడు, నాయందు స్నేహము కలవాడు అయిన ఈ లక్ష్మణుడు తండ్రిచే అరణ్యమునకు పంపబడిన నన్ను అనుసరించి, తాను కూడ అరణ్యమునకు వచ్చెను.
2.54.16.అనుష్టుప్
పిత్రా నియుక్తా భగవన్
ప్రవేక్ష్యామస్తపోవనమ్।
ధర్మమేవ చరిష్యామ
స్తత్ర మూలఫలాశనాః”॥
టీక:-
 పిత్రా = తండ్రి గారి; నియుక్తా = ఆజ్ఞ ప్రకారము; భగవన్ = ఓ మహానుభావా; ప్రవేక్ష్యామః = ప్రవేశించితిమి; తపోవనమ్ = తపోవనములో; ధర్మమ్ = ధర్మవర్తనయందు; ఏవ = మాత్రమే; చరిష్యామః = చరించెదము; తత్ర = అక్కడ; మూలః = దుంపలు; ఫలః = ఫలములు; అశనాః = ఆహారముగా కలవారమై.
భావం:-
 మేము తండ్రి ఆజ్ఞ ప్రకారము తపోవనములో నివసించి, అక్కడ దుంపలు, ఫలములు తినుచు, ధర్మమునే ఆచరించుచు ఉండెదము.”
2.54.17.అనుష్టుప్
తస్య తద్వచనం శ్రుత్వా
రాజపుత్రస్య ధీమతః।
ఉపానయత ధర్మాత్మా
గామర్ఘ్యముదకం తతః॥
టీక:-
 తస్య = వాని యొక్క; తత్ + వచనం = ఆ మాటలు విని; శ్రుత్వా = విని; రాజపుత్రస్య = రాజకుమారుడైన రామునికి;ధీమతః = ధీమంతుడైన; ఉపానయత = సమర్పించుటకు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; గామ్ = గోవును; అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; ఉదకం = ఉదకమును;
భావం:-
 ధీమంతుడైన ఆ రాముని మాటలు విని, ధర్మాత్ముడైన ఆ భరద్వాజుడు గోవును, అర్ఘ్యోదకములను, రామునకు సమర్పించుటకు తీసుకొని వచ్చెను.
2.54.18.అనుష్టుప్
నానావిధానన్నరసాన్
వన్యమూలఫలాశ్రయాన్।
తేభ్యో దదౌ తప్తతపా
వాసం చైవాభ్యకల్పయత్॥
టీక:-
 నానావిధాన్ = అనేకరకములైన; అన్నరసాన్ = ఆహారపదార్థములను; వన్య = వనములలో లభించు; మూలః = దుంపలుతోను; ఫలాః = ఫలములతోను; ఆశ్రయాన్ = చేసినవి; తేభ్యః = వారికి; దదౌ = ఇచ్చెను; తప్తతపా = గొప్ప తపస్సు చేసినవాడు; వాసం = నివాసమును; చ = కూడా; ఏవ = తప్పక; అభ్యకల్పయత్ = అభి + అకల్పయత్ = సమకూర్చెను.
భావం:-
 గొప్ప తపస్సు చేసిన ఆ భరద్వాజ మహర్షి వారికి వనములో లభించు మూలములతోను, ఫలములతోను తయారుచేసిన అనేక విధములైన ఆహారపదార్థములను ఇచ్చి నివాసము కూడా ఏర్పాటుచేసెను.
2.54.19.అనుష్టుప్
మృగపక్షిభిరాసీనో
మునిభిశ్చ సమంతతః।
రామమాగతమభ్యర్చ్య
స్వాగతేనాహతం మునిః॥
టీక:-
 మృగః = మృగములును; పక్షిభిః = పక్షులును; ఆసీనః = కూర్చుండిరి; మునిభిఃశ్చ = మునులు; చ = మఱియు; సమంతతః = సమీపమున; రామమ్ = రాముని; ఆగతమ్ = రమ్మని; అభ్యర్చ్య = పూజించి; స్వాగతేన = స్వాగతముచేత; ఆహ = పలికెను; తమ్ = అతని గుఱించి; మునిః = భరద్వాజముని.
భావం:-
 అక్కడ, భరద్వాజ ముని చుట్టును, మృగములు, పక్షులు, మునులు కూర్చుండి యుండిరి. ఆ భరద్వాజుడు తన ఆశ్రమమునకు వచ్చిన రాముని రమ్మని స్వాగతించి, పూజించెను. పిమ్మట రామునితో ఇట్లనెను.
2.54.20.అనుష్టుప్
ప్రతిగృహ్య చ తామర్చామ్
ఉపవిష్టం స రాఘవమ్।
భరద్వాజోఽబ్రవీద్వాక్యమ్
ధర్మయుక్తమిదం తదా॥
టీక:-
 ప్రతిగృహ్య = స్వీకరించి; చ = ఉన్న; తామ్ అర్చామ్ = తానకు చేసిన; అర్చామ్ = పూజను; ఉపవిష్టమ్ = కూర్చొనియున్న; స = కూడా; రాఘవమ్ = రఘువంశీయుడు రామునితో; భరద్వాజః = భరద్వాజ ఋషి; అబ్రవీత్ = చెప్పెను; వాక్యమ్ = మాటలు; ధర్మయుక్తమ్ = ధర్మబద్ధమైన; ఇదం = ఈ; తదా = విధముగా.
భావం:-
 తానిచ్చిన పూజను స్వీకరించియున్న ఆ రామునితో, భరద్వాజుడు ధర్మబద్ధమైన మాటలు చెప్పెను.
2.54.21.అనుష్టుప్
“చిరస్య ఖలు కాకుత్స్థ
పశ్యామి త్వామిహాగతమ్।
శ్రుతం తవ మయా చేదమ్
వివాసనమకారణమ్॥
టీక:-
 చిరస్య = చాలాకాలమునకు; ఖలు = నిశ్చయముగ; కాకుత్థ్స = కకుత్థ్స వంశీయుని; పశ్యామి = చూడగలుగుచున్నాను; త్వామ్ = నిన్ను; ఇహ = ఇక్కడికి; ఆగతమ్ = వచ్చిన; శ్రుతం = విన్నాను; తవ = నీ గురించి; మయా = నాచే; చ = కూడా; ఇదమ్ = ఈ విధముగా; వివాసనమ్ = అరణ్యమునకు; అకారణమ్ = కారణము లేకుండా.
భావం:-
 ”రామా! ఎంతో కాలమునకు ఇక్కడికి వచ్చిన కాకుత్స్థవంశస్థుడవైన నిన్ను చూడగలుగుచున్నాను. నిన్ను అకారణముగా తండ్రి అరణ్యమునకు పంపెనను విషయమును కూడ వినియున్నాను.
2.54.22.అనుష్టుప్
అవకాశో వివిక్తోఽయమ్
మహానద్యోస్సమాగమే।
పుణ్యశ్చ రమణీయశ్చ
వసత్విహ భవాన్ సుఖమ్”॥
టీక:-
 అవకాశః = స్థలము; వివిక్తః = ఏకాంతమైన, పవిత్రమైన, వావిళ్ళ నిఘంటువు; అయమ్ = ఈ; మహానద్యోః = మహానదులైన గంగా యమునా; సమాగమే = సంగమము దగ్గర ఉన్న; పుణ్యః = పుణ్యవంతమైనది; చ = మఱియు; రమణీయః = సుందరమైనది; చ = మఱియు; వసత్విహ = ఇక్కడ నివసించవచ్చు; భవాన్ = నీవు; సుఖమ్ = సుఖముగా.
భావం:-
 మహానదులైన గంగా యమునల సంగమము దగ్గరనున్న ఈ ప్రదేశములో జన సమ్మర్దము తక్కువగా ఉన్న పవిత్ర ప్రదేశము. ఈ ప్రదేశము పుణ్యవంతమైనది, సుందరమైనది. నీవు ఇక్కడ సుఖముగా నివసించవచ్చును.”
2.54.23.అనుష్టుప్
ఏవముక్తస్తు వచనమ్
భరద్వాజేన రాఘవః।
ప్రత్యువాచ శుభం వాక్యమ్
రామః సర్వహితే రతః॥
టీక:-
 ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = పలికిన; తు = పిమ్మట; వచనమ్ = మాటలను; భరద్వాజేన = భరద్వాజునిచేత; రాఘవః = రాముని గురించి; ప్రత్యువాచ = సమాధానమిచ్చెను; శుభం = మంచి; వాక్యమ్ = మాటలను; రామః = రాముడు; సర్వహితేరతః = అందరి హితమును కోరునది
భావం:-
  భరద్వాజుని మాటలు విని ఇట్లు రామునికి చెప్పగా, రాముడు శుభకర మైన పలుకులతో అందరి హితమును కోరునట్టి సమాధానము చెప్పెను.
2.54.24.అనుష్టుప్
“భగవన్నిత! ఆసన్నః
పౌరజానపదో జనః।
సుదర్శమిహ మాం ప్రేక్ష్య
మన్యేఽహమిమమాశ్రమమ్॥
టీక:-
 భగవత్ = మహానుభావా; ఇతః = ఇక్కడకు; ఆసన్నః = దగ్గరగా; పౌరః = పురముల, పట్టణముల; జానపదః = జనపదముల; జనః = ప్రజలు; సుదర్శమ్ = చూచుట సులభమని; ఇహ = ఇక్కడ; మాం = నన్ను; ప్రేక్ష్య = చూచుటకు; మన్యే = భావించి; అహమ్ = నేను; ఇమమ్ = ఈయొక్క; ఆశ్రమమ్ = ఆశ్రమమునకు.
భావం:-
 ”ఓ పూజ్యుడా! పట్టణాలు, జనపదములు, ఈ ప్రదేశమునకు చాల దగ్గరగా ఉన్నవి. ఆ ప్రజలు ఇక్కడ నన్ను చూచుట సులభమని తెలిసి వారందరును, నన్ను చూచుటకై ఈ ఆశ్రమమునకు వచ్చెదరని నా అభిప్రాయము.
2.54.25.అనుష్టుప్
ఆగమిష్యతి వైదేహీమ్
మాం చాపి ప్రేక్షకో జనః।
అనేన కారణేనాహమ్
ఇహ వాసం న రోచయే॥
టీక:-
 ఆగమిష్యతి = వచ్చుదురు; వైదేహీమ్ = సీతను; మామ్ = నన్ను; చ = మఱియు; అపి = కూడా; ప్రేక్షకః = చూచుటకు; జనః = జనులు; అనేన = ఇట్టి; కారణేన = కారణముల చేత; అహమ్ = నేను; ఇహ= ఈప్రదేశమున; వాసం = నివసించుటకు; న = కాదు; రోచయే = ఇష్టపడుట.
భావం:-
 నన్ను మఱియు సీతను చూచుటకు ప్రజలు వచ్చుదురు. అందుచే ఇక్కడ నివసించుటకు నాకు ఇష్టము లేదు.
2.54.26.అనుష్టుప్
ఏకాంతే పశ్యభగవన్
ఆశ్రమస్థానముత్తమమ్।
రమేత యత్ర వైదేహీ
సుఖార్హా జనకాత్మజా”॥
టీక:-
 ఏకాంతే = నిర్జనప్రదేశము; పశ్య = చూడుము; భగవన్ = మహానుభావ; ఆశ్రమస్థానమ్ = ఆశ్రమము వంటి ప్రదేశమును; ఉత్తమమ్ = ఉత్తమమైనది; రమేత = విహరింపగలుగునట్టి; యత్ర = ఎక్కడ; వైదేహీ = సీత; సుఖార్హా = సుఖముగా ఉండి; జనకాత్మజా = జనకుని కుమార్తె అయిన సీత.
భావం:-
 సుఖములకు తగిన జనకాత్మజౖయెన సీత సుఖముగా ఉండి విహరింప గలుగునట్టిది, నిర్జన ప్రదేశమును సూచించుడు.” అని అడిగెను.
2.54.27.అనుష్టుప్
ఏతఛ్రుత్వా శుభం వాక్యమ్
భరద్వాజో మహామునిః।
రాఘవస్య తతో వాక్యమ్
అర్థగ్రాహకమబ్రవీత్॥
టీక:-
 ఏతత్ = అటువంటి; శ్రుత్వా = విని; శుభం = మంగళకరమైన; వాక్యమ్ = మాటలను; భరద్వాజ = భరద్వాజ; మహామునిః = మహర్షి; రాఘవస్య = రాముని; తతః = అప్పుడు; వాక్యమ్ = వాక్యమును; అర్థగ్రాహకమ్ = తగిన అర్థమును చూపెడి; అబ్రవీత్ = పలికెను,
భావం:-
 భరద్వాజ మహాముని రాముడు పలికిన ఈ మంగళకరమైన మాట విని, వారి అభిప్రాయమునకు తగినట్లు ఇట్లు చెప్పెను.
2.54.28.అనుష్టుప్
“దశక్రోశ ఇతస్తాత
గిరిర్యత్రనివత్స్యసి।
మహర్షిసేవితః పుణ్యః
సర్వతః సుఖదర్శనః॥
టీక:-
 దశ క్రోశ = పది క్రోశుల; ఇతః = ఇక్కడ నుండి; తాత = నాయనా; గిరిః = పర్వతము; యత్ర = ఎక్కడైతే; నివత్స్యసి = నివసించు; మహర్షిః = మహర్షులచేత; సేవితః = సేవించబడుచున్న; పుణ్యః = పవిత్రమైనది; సర్వతః = అన్నివైపుల; సుఖదర్శనః = చూచుటకు ఆనందము కలిగించును.
భావం:-
 “నాయనా! ఇక్కడ నుండి పది క్రోశుల దూరంలో ఎందరో మహర్షులు నివసించు ఆ పర్వతము పవిత్రమైనది. ఎలా చూచినను ఆనందము కల్గించునది.
2.54.29.అనుష్టుప్
గోలాంగూలానుచరితో
వానరర్క్షనిషేవితః।
చిత్రకూట ఇతి ఖ్యాతో
గంధమాదనసన్నిభః॥
టీక:-
 గోలాంగూలః = కొండముచ్చులు; అనుచరితః = సంచరింపబడుచున్నది; వానర = వానరములు; ఋక్ష = ఎలుగుబంట్లు; నిషేవితః = కొలువబడుచున్నది; చిత్రకూట = చిత్రకూటము; ఇతి = అని; ఖ్యాతః = ప్రసిద్ధమైనది; గంధమాదన = గంధమాదన పర్వతముతో; సన్నిభః = సమానమైన.
భావం:-
 కొండముచ్చులు, వానరములు, ఎలుగుబంటులు తిరుగుచుండెడి చిత్రకూటమని ప్రసిద్ధమైన పర్వతము గంధమాదన పర్వతముతో సమానమైనది ఉన్నది..
2.54.30.అనుష్టుప్
యావతా చిత్రకూటస్య
నరశృంగాన్యవేక్షతే।
కల్యాణాని సమాధత్తే
న పాపే కురుతే మనః॥
టీక:-
 యావతా = ఉన్నంతవరకు; చిత్రకూటస్య = చిత్రకూట పర్వతము యొక్క; నరః = మానవుడు; శృంగాన్ = శిఖరములను; అవేక్షతే = చూచునో; కల్యాణాని = మంగళకరములైన; సమాధత్తే = ప్రవర్తించును; న = ఉండదు; పాపే = పాపకార్యములను; కురుతే = చేయుచుండుటను; మనః = మనస్సు
భావం:-
 మానవుడు ఆ చిత్రకూట పర్వత శిఖరములను చూచుచున్నంతవరకు మంగళకరములైన కార్యములనే చేయుచుండెను. అతని మనస్సు అమంగళకార్యముల వైపు ప్రవర్తించుట జరగదు.
2.54.31.అనుష్టుప్
ఋషయస్తత్ర బహవో
విహృత్య శరదాం శతమ్।
తపసా దివమారూఢాః
కపాలశిరసా సహ॥
టీక:-
 ఋషయః = ఋషులు; తత్ర = అక్కడ; బహవః = అనేక; విహృత్య = విహరించి; శరదాం = సంవత్సరములు; శతమ్ = వందల కొలది; తపసా = తపస్సుచేసి; దివమ్ = స్వర్గమునకు; ఆరూఢాః = వెళ్లిరి; కపాలశిరసా = కపాలములుగా మారిన శిరస్సులు కలవారు అగువరకు; సహ = కూడా.
భావం:-
 ఆ చిత్రకూటముపై ఎందరో ఋషులు వందల కొలది సంవత్సరములు, తమ శిరస్సులు కపాలములుగా ఎండిపోవుటకూడా అగువరకు తపస్సు చేసి స్వర్గమునకు వెళ్లిరి.
2.54.32.అనుష్టుప్
ప్రవివిక్తమహం మన్యే
తం వాసం భవతస్సుఖమ్।
ఇహ వా వనవాసాయ
వస రామ మయా సహ”॥
టీక:-
 ప్రవివిక్తమ్ = నిర్జనమైన; అహం = నేను; మన్యే = తలచుచున్నాను; తం = ఆ; వాసమ్ = నివాసించదగ్గదిగా (పర్వతముపై); భవత్ = మీ కోసం; సుఖమ్ = సుఖముగా; ఇహ = ఇక్కడే; వా = లేదా; వనవాసాయ = వనవాసమును; వస = నివాసించుము; రామ = రామా; మయా = నాతో; సహ = కలసి.
భావం:-
 రామా! నిర్జనమైన ఆ చిత్రకూట ప్రాంతము మీరు సుఖముగా నివాసించుటకు అనుకూలమని తలచెదను. లేకపోతే నాతో ఇక్కడనే ఉండి వనవాసమును పూర్తి చేసుకొనుడు.”
2.54.33.అనుష్టుప్
స రామం సర్వకామైస్తమ్
భరద్వాజః ప్రియాతిథిమ్।
సభార్యం సహ చ భ్రాత్రా
ప్రతిజగ్రాహ ధర్మవిత్॥
టీక:-
 స = ఆ; రామం = రామునకు; సర్వకామైః = కావలసిన పదార్థము లన్నియు; తమ్ = వారికి; భరద్వాజః = భరద్వాజుడు; ప్రియ = ప్రియమైన; అతిథిమ్ = అతిథిగా; స = కలిసి; భార్యం = భార్యతో; సహ = కలసి; చ = కూడా; భ్రాత్రా = సోదరునితో; ప్రతిజగ్రాహ = స్వాగతము పలికెను; ధర్మవిత్ = ధర్మవేత్తౖయెన.
భావం:-
 ధర్మవేత్తౖయెన ఆ భరద్వాజుడు భార్యతోను, సోదరునితోను కలసి ప్రియమైన అతిథిగా వచ్చిన ఆ రామునకు కావలసిన పదార్థములన్నియు యిచ్చి స్వాగతము చెప్పెను.
2.54.34.అనుష్టుప్
తస్య ప్రయాగే రామస్య
తం మహర్షిముపేయుషః।
ప్రపన్నా రజనీ పుణ్యాః
చిత్రాః కథయతః కథాః॥
టీక:-
 తస్య = ఆ; ప్రయాగే = ప్రయాగ వద్ద (గంగా యమున సంగమ స్థానము); రామస్య = రామునికి; తం = ఆ; మహర్షిమ్ = మహర్షిని; ఉపేయుషః = పొందిన ఉండగా; ప్రపన్నా = పొందెను; రజనీ = రాత్రి; పుణ్యాః = పవిత్రమైన; చిత్రాః = రకరకములుగా; కథయతః = సంభాషణలు; కథాః = చేయుచుండగా
భావం:-
 ఆ ప్రయాగ క్షేత్రములో భరద్వాజ మహర్షి దగ్గర కూర్చుండి, రాముడు అతనితో అనేక విధముల సంభాషణలు చేయుచుండగా పవిత్రమైన రాత్రి వచ్చినది.
2.54.35.అనుష్టుప్
సీతా తృతీయః కాకుత్స్థః
పరిశ్రాంతః సుఖోచితః।
భరద్వాజాశ్రమే రమ్యే
తాం రాత్రిమవసత్సుఖమ్॥
టీక:-
 సీతా = సీతాదేవి; తృతీయః = ముగ్గురును; కాకుత్థ్సః = కకుత్థ్స వంశస్థుడైన రామలక్ష్మణులు; పరిశ్రాంతః = బాగా అలసిపోయిన; సుఖోచితః = సుఖమునకు అలవాటు పడిన; భరద్వాజ = భరద్వాజుని; ఆశ్రమే = ఆశ్రమములో; రమ్యే = సుందరమైన; తాం = ఆ; రాత్రిమ్ = రాత్రి; అవసత్ = గడిపెను; సుఖమ్ = సుఖముగా
భావం:-
 సుఖపడుటకు అలవాటు పడిన ఆ సీతారామలక్ష్మణులు చాల అలసిపోయినవారై, ఆ రాత్రి సుందరమైన ఆ భరద్వాజ ఆశ్రమములో సుఖముగా నివసించిరి.
2.54.36.అనుష్టుప్
ప్రభాతాయాం రజన్యాం తు
భరద్వాజముపాగమత్।
ఉవాచ నరశార్దూలో
మునిం జ్వలితతేజసమ్॥
టీక:-
 ప్రభాతాయాం = తెల్లవారిన పిమ్మట; రజన్యాం = రాత్రి గడచి; తు = పిమ్మట; భరద్వాజమ్ = భరద్వాజుని; ఉపాగమత్ = పొంది; ఉవాచ = పలికెను; నరశార్దూలః = నరులలో శ్రేష్ఠుడు; మునిం = మునితో; జ్వలిత = వెలుగుచున్న; తేజసమ్ = తేజస్సుతో.
భావం:-
 రాత్రి తెల్లవారిన పిమ్మట నరులలో శ్రేష్ఠుడైన రాముడు తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ భరద్వాజుని వద్దకు వెళ్లి, ఇట్లు పలికెను.
2.54.37.అనుష్టుప్
“శర్వరీం భగవన్నద్య!
సత్యశీల తవాశ్రమే।
ఉషితాః స్మేహ వసతిమ్
అనుజానాతు నో భవాన్”॥
టీక:-
 శర్వరీం = రాత్రిని;; భగవత్ = ఓ మహర్షీ; అద్య = ఇప్పుడు; సత్యశీల = సత్యాన్ని ఆచరిస్తున్నారు; తవ = నీ; ఆశ్రమే = ఆశ్రమములో; ఉషితాః స్మః = మేము బస చేశాము; ఇహ = ఇక; వసతిమ్ = నివాస స్థలమునకు; అనుజానాతు = అనుజ్ఞ ఇవ్వండి; నః = మాకు; భవాన్ = మీరు
భావం:-
 “మహర్షీ! నీ ఆశ్రమములో రాత్రి గడపినాము. ఇక మా నివాస స్థలమునకు వెళ్లుటకు అనుజ్ఞ ఇమ్ము” అని కోరెను.
2.54.38.అనుష్టుప్
రాత్ర్యాం తు తస్యాం వ్యుష్టాయామ్
భరద్వాజోఽబ్రవీదిదమ్।
“మధుమూలఫలోపేతమ్
చిత్రకూటం వ్రజేతి హ॥
టీక:-
 రాత్య్రాం తు = రాత్రి సమయము; తు = తప్పక; తస్యాం = ఆ యొక్క; వ్యుష్టాయామ్ = గడచినది అగుతుండగా; భరద్వాజః = భరద్వాజుడు; బ్రవీత్ = పలికెను; ఇదమ్ = ఈ మాటలు; మధుః = తేనెలు; మూలః = దుంపలు; ఫలః = ఫలములు; ఉపేతమ్ = లభించును; చిత్రకూటం = చిత్రకూట పర్వతముపై; వ్రజేతి హ = అక్కడికి వెళ్లుము
భావం:-
 భరద్వాజుడు రామునితో “చిత్రకూట పర్వతముపై తేనె, దుంపలు, ఫలములు అధికముగా లభించును. అక్కడికి వెళ్లుము” అని పలికెను.
2.54.39.అనుష్టుప్
వాసమౌపయికం మన్యే
తవ రామ! మహాబల!।
నానానగగణోపేతః
కిన్నరోరగసేవితః॥
టీక:-
 వాసమ్ = నివసించుటకు; ఔపయికమ్ = యుక్తమైనది; మన్యే = గౌరవముగా; తవ = నిన్ను; రామ = ఓ రామా; మహాబల = గొప్ప బలము కలిగిన; నానా = వివిధ రకములైన; నగ = పర్వతము; గణ = సమూహములు; ఉపేతః = కూడిఉన్నవి; కిన్నర = కిన్నరులు; ఉరగ = ఉరగులు; సేవితః = నివసించు చున్నారు.
భావం:-
  “రామా! చిత్రకూట పర్వతము నీకు తగిన నివాసస్థానము అని తలచెదను. అందుచే నీవు అచటకు వెళ్లుము. ఆ పర్వతము పై అనేక విధములైన వృక్షములు ఉండును. కిన్నరులు, ఉరగులు దానిపై నివసించుచుందురు.
2.54.40.అనుష్టుప్
మయూరనాదాభిరుతో
గజరాజనిషేవితః।
గమ్యతాం భవతా శైల
శ్చిత్రకూటః స విశ్రుతః।
పుణ్యశ్చ రమణీయశ్చ
బహుమూలఫలాయుతః॥
టీక:-
 మయూరః = నెమళ్ల; నాద = క్రేంకారములతో; అభిరుతః = గచ్చిగా ధ్వనించునది; గజరాజ = ఉత్తమమైన గజములు; నిషేవితః = సేవింపబడునది; గమ్యతాం = వెళ్లుటకు; భవతా = మీకు; శైలః = పర్వతము; చిత్రకూటః = చిత్రకూట; స = కలిసి; విశ్రుతః = ప్రసిద్ధమైన; పుణ్యః = పవిత్రమైనది; చ = మఱియు; రమణీయ = సుందరమైనది; చ = మఱియు; బహు = అనేక; మూల = మూలములు; ఫలాయుతః = ఫలములతో నిండిన.
భావం:-
 ఆ చిత్రకూటపర్వతము మీద. నెమళ్ల కూతల చేత ప్రతిధ్వనించుచున్న ఉత్తమమైన గజములు నివసించుచుండును. మూల ఫలములతో సమృద్ధమైన ఆ పర్వతము పవిత్రమైనది. సుందరమైనది కూడ.
2.54.41.అనుష్టుప్
తత్ర కుంజరయూథాని
మృగయూథాని చాభితః।
విచరన్తి వనాంతేస్మిన్
తాని ద్రక్ష్యసి రాఘవ॥
టీక:-
 తత్ర = అక్కడ; కుంజరయూథాని = ఏనుగుల గుంపులు; మృగయూథాని చ = లేళ్ల గుంపులు; అభితః = అంతటను; విచరన్తి = తిరుగాడుచుండును; వనాః = వనములో; తే = అవి; అస్మిన్ = ఈ; తాని = వాటిని; ద్రక్ష్యసి = చూడువచ్చును; రాఘవ = రామా.
భావం:-
 ఆ వన మధ్యమునందు ఏనుగులు, లేళ్లు, గుంపులు గుంపులుగా విహరించుచుండును. నీవు వాటిని చూడగలవు.
2.54.42.అనుష్టుప్
సరిత్ప్రస్రవణప్రస్థాన్
దరీకంధరనిర్ఝరాన్।
చరతః సీతయా సార్ధమ్
నందిష్యతి మనస్తవ॥
టీక:-
 సరిత్ = నదులు; ప్రస్రవణ = సెలయేళ్ళు; ప్రస్థాన్ = ప్రవహించుట; దరీ = గోడలాగ ఉంటే కొండదరి / పార్శము; కంధర = గుహలు; నిర్ఝరాన్ = జల ప్రవాహములు; చరతః = నడుచుచున్న; సీతయా = సీతతో; సార్థమ్ = కలసి; నందిష్యతి = ఆనందించగలదు; మనః = మనస్సు; తవ = నీ యొక్క.
భావం:-
 నీవు సీతతో కలసి నదులు, సెలయేళ్లు, కొండల చరియలు, చిన్న గుహలు, పెద్ద గుహలు, జల ప్రవాహములు చూచుచు ఆనందించగలవు.
2.54.43.జగతి.
ప్రహృష్ట కోయష్టికకోకిల స్వనై
ర్వినాదితం తం వసుధాధరం శివమ్।
మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరైః
సురమ్యమాసాద్య సమావసాశ్రమమ్॥
టీక:-
 ప్రహృష్టః = అధిక సంతోషముతో; కోయష్టిక = చీకుగొక్కెర; కోకిల= కోకిల; స్వనైః = శబ్దములతో; వినాదితం = గట్టిగా ధ్వనించుచున్న; తం = వాటి; వసుధాధరం = వృక్షములు; శివమ్ = మంగళకరమైన; మృగైః = మృగములతోను; చ = మఱియును; మల్తైః = మదించిన; బహుభిః = పెద్ద సంఖ్యలో; చ = కూడా; కుంజరైః = ఏనుగులు; సురమ్యమ్ = బాగా అందమైనవైన; ఆసాద్య = చేరిన పిదప; సమావస = చక్కగా నివసించుము; ఆశ్రమమ్ = ఆశ్రమమునందు.
భావం:-
 మంగళకరమైన ఆ చిత్రకూట పర్వతమునందు సంతోషించిన కోయష్టి పక్షులు, కోకిలలు కూయుచుండును. ఇట్లు అటు సంచరించుచున్న అనేకమైన మృగములతోను, మదించిన ఏనుగులతోను అది రమ్యముగా ఉండును. అట్టి చిత్రకూటమును చేరి ఆశ్రమములో నివసించుము
2.54.44.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
చతు:పంచాశ సర్గః॥
టీక:-
 ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; చతుఃపంచాశ [54] = ఏభై నాలుగవ; సర్గః = సర్గ.
బావము:-
 ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [54] ఏభై నాలుగవ సర్గ సంపూర్ణము.
2.55.1.అనుష్టుప్
ఉషిత్వా రజనీం తత్ర
రాజపుత్రావరిందమౌ।
మహర్షిమభివాద్యాథ
జగ్మతుస్తం గిరిం ప్రతి॥
టీక:-
ఉషిత్వా = నివసించి; రజనీం = రాత్రిని; తత్ర = అక్కడ; రాజపుత్రౌ = ఇద్దరు రాకుమారులు; అరిందమౌ = ఇద్దరు శత్రువినాశకులు; మహర్షిమ్ = మహర్షినిగూర్చి; అభివాద్య = ప్రణామములుచేసి; అథ = పిమ్మట; జగ్మతుః = బయలుదేరిరి; తం = ఆ; గిరిం ప్రతి = పర్వతమును గూర్చి.
భావం:-
శత్రువినాశకులైన శ్రీరామలక్ష్మణులు ఆ రాత్రి అచటనే నిదురఁజేసి మరునాడు భరద్వాజమహామునికి భక్తిపూర్వకముగా నమస్కారములు చేసి చిత్రకూటపర్వతమునకు బయలుదేరిరి
2.55.2.అనుష్టుప్
తేషాం చైవ స్వస్త్యయనమ్
మహర్షి స్స చకార హ।
ప్రస్థితాంశ్చైవ తాన్ప్రేక్ష్య
పితా పుత్రానివాన్వగాత్॥
టీక:-
తేషాం = వారికి; చ = మఱియు; ఏవ = మాత్రమే; స్వస్త్యయనమ్ = ప్రయాణము సుగమము అగుటకు మంగళాశాసనమును; మహర్షిః = మహర్షి; సః = అతడు; చకార హ = ఒనర్చెను; ప్రస్థితాన్ = బయలుదేఱిన; చ = మఱియు; ఏవ = మాత్రమే; తాన్ = వారిని; ప్రేక్ష్య = చూచి; పితా = తండ్రి; పుత్రాన్ = బిడ్డలను; ఇవ = వలె; అన్వగాత్ = {కొంతదూరము}అనుసరించి వెళ్ళెను॥
భావం:-
భరద్వాజ మహర్షి, బయలుదేరనున్న ఆ సీతారామలక్ష్మణులకు వారి ప్రయాణము సుగమము అవ్వాలని మంగళాశాసనములను ఒనర్చెను.
*గమనిక:-
స్వస్త్యయనమ్- వ్యుత్పత్తి. స్వస్తి+అయన, స్వస్తి శుభస్య అయనం లాభః యస్మాత్, దీనితో శుభమును పొందుదురు.
2.55.3.అనుష్టుప్
తతః ప్రచక్రమే వక్తుమ్
వచనం స మహామునిః।
భరద్వాజో మహాతేజా
రామం సత్యపరాక్రమమ్॥
టీక:-
తతః = పిమ్మట; ప్రచక్రమే = ఆరంబించెను; వక్తుమ్ = మాట్లాడుట; వచనం = వచనమును; సః = అతడు; మహామునిః = గొప్ప ముని; భరద్వాజః = భరద్వాజుడు; మహాతేజా = గొప్ప తేజస్సుగల; రామం = శ్రీరామచంద్రునిగూర్చి; సత్యపరాక్రమమ్ = వ్యర్థముగాని పరాక్రమము కలిగిన॥
భావం:-
తదుపరి గొప్పతేజస్సుగల ఆ భరద్వాజ మహాముని, సత్యపరాక్రము డయిన శ్రీరామచంద్రునితో ఇట్లు మాటలాడనారంభించెను
2.55.4.అనుష్టుప్
“గంగాయమునయోస్సంధిమ్
ఆసాద్య మనుజర్షభౌ।
కాళిందీమనుగచ్ఛేతామ్
నదీం పశ్చాన్ముఖాశ్రితామ్॥
టీక:-
గంగాయమునయోః = గంగా, యమునలయొక్క; సంధిమ్ = సంగమము; ఆసాద్య = పొందఁదగినది; మనుజర్షభౌ = ఇరువురు మనుషులలో శ్రేష్ఠులు; కాళిందీమ్ = కాళిందీ; అనుగచ్ఛేతామ్ = అనుసరించి వెళ్ళండి; నదీం = నదిని గూర్చి; పశ్చాత్ = పశ్చిమదిక్కు; ముఖాః = వైపును; ఆశ్రితామ్ = అనుసరించి.
భావం:-
ఓ నరశ్రేష్ఠులారా! మీరు గంగాయమున సంగమ ప్రదేశమునకు చేరి అక్కడనుండి పశ్చిమభిముఖులై యమునానదీ తీరముననుసరించి ప్రయాణము చేయండి
2.55.5.అనుష్టుప్
అథాఽఽసాద్య తు కాళిందీ
శీఘ్రస్రోతసమాపగామ్।
తస్యాస్తీర్థం ప్రచలిరితమ్
పురాణం ప్రేక్ష్య రాఘవౌ॥
టీక:-
అథ = తదుపరి; ఆసాద్య = చేరి; తు; కాళిందీ = కాళిందీని; శీఘ్రస్రోతసమ్ = వేగముగా ప్రవహించు; ఆపగామ్ = నదియైన; తస్యాః = ఆ; తీర్థం = తీర్థమును; ప్రచరితమ్ = జనులు సంచరించునట్టి; పురాణం = ప్రాచీనమైన; ప్రేక్ష్య = చూచి; రాఘవౌ = ఇద్దరు రాఘవులారా!
శ్రీరామలక్ష్మణులారా! తరువాత, వేగముగా ప్రవహించే ఆ యమునానదికి చేరి, అచట జనులందఱు సంచరించెడి తీర్థమును చూడండి.
2.55.6.అనుష్టుప్
తత్ర యూయం ప్లవం కృత్వా
తరతాంశుమతీం నదీమ్।
తతో న్యగ్రోధమాసాద్య
మహాంతం హరితచ్ఛదమ్॥
టీక:-
తత్ర = అచట; యూయం = మీరు; ప్లవం = తెప్పను; కృత్వా = నిర్మించుకుని; తరత = దాటుడు; అంశుమతీం = సూర్యపుత్రిక అయిన యమున; నదీమ్ = నదిని; తతః = పిమ్మట; న్యగ్రోధమ్ = మఱ్ఱిచెట్టును; ఆసాద్య = సమీపించి; మహాంతం = గొప్పది; హరితచ్ఛదమ్ = పచ్చనిఆకులుగల.
అక్కడ ఒక తెప్పను సిద్ధపరచుకుని సూర్యపుత్రిక అయిన ఆ నదిని దాటుడు. పిమ్మట పచ్చని గొప్ప మఱ్ఖిచెట్టును చేరి
2.55.7.అనుష్టుప్
వివృద్ధం బహుభిర్వృక్షై
శ్శ్యామం సిద్ధోపసేవితమ్।
తస్మై సీతాంజలిం కృత్వా
ప్రయుంజీతాశిషశ్శివాః॥
టీక:-
వివృద్ధం = బాగాపెరిగినది; బహుభిః = అనేకములైన్; వృక్షైః = ద్రుమములు; శ్యామం = శ్యామమను నామముగల; సిద్ధోపసేవితమ్ = సిద్దులచే సేవింపబడు। తస్మై = దానికి; సీత = సీతాదేవి; అంజలిం = నమస్కారములు; కృత్వా = చేసి; ప్రయుంజీత = కోరవలెను; ఆశిషః = కోరికలను; శివాః = మంగళకరమైన॥
భావం:-
ఆ సిద్ధులచే సేవింపబడుచూ శ్యామము అనబడుతూ అనేక ఊడలు దిగి వృక్షములవలె ఉన్న మఱ్ఱిచెట్టును చేరి. దానికి మంగళకరమైన క్రోరికలను సీతాదేవి కోరవలెను.
2.55.8.అనుష్టుప్
సమాసాద్య తు తం వృక్షమ్
వసేద్వాతిక్రమేత వా।
క్రోశమాత్రం తతో గత్వా
నీలం ద్రక్ష్యథ కాననమ్।
పలాశబదరీమిశ్రమ్
రమ్యం వంశైశ్చ యామునైః॥
టీక:-
సమాసాద్య = సమీపించి; తు; తం = ఆ; వృక్షమ్ = ద్రుమమును; వసేద్వా = అచట ఉండవచ్చును; అతిక్రమేత = దాటి వెళ్ళవచ్చును; వా = లేదాంటే; క్రోశమాత్రం = క్రోసుడు దూరము; తతః = పిమ్మట; గత్వా = వెళ్ళితే; నీలం = నల్లని; ద్రక్ష్యథ = కానబడును; కాననమ్ = అడవి; పలాశః = మోదుగ వృక్షములు; బదరీః = రేగుచెట్లు; మిశ్రమ్ = కలిగిన; రమ్యం = రమణీయమైన; వంశైః = వెదురుపొదలు; చ = మఱియు; యామునైః = యమునా నదీ తీరమునగల;
భావం:-
ఆ మఱ్ఱివృక్షమువద్ద చేరి కావలెనన్న కొంతసేపు సేదతీరవచ్చును, లేదా అచటనుండి ముందుకు ప్రయాణించవచ్చును. అక్కడనుండి క్రోసెడు దూరంలో మోదుగ చెట్లతోనూ, రేగుచెట్లతోనూ, యమునానదీ తీరమున వెదురు బొంగులతోనూ రమణీయమైన నీలవర్ణపు అడవి కనబడును.
2.55.9.అనుష్టుప్
స పంథాశ్చిత్రకూటస్య
గతస్సుబహుశో మయా।
రమ్యో మార్దవయుక్తశ్చ
వనదావైర్వివర్జితః”॥
టీక:-
సః = అది; పంథాః = మార్గము; చిత్రకూటస్య = చిత్రకూటము యొక్క; గతః = వేళ్ళబడినది; సుబహుశః = చాలాచాలా మార్లు; మయా = నాచేత; రమ్యః = అందమైనది; మార్దవయుక్తః = మృదువైనది; చ = మఱియు; వనదావైః = దావాగ్నులకు; వివర్జితః = లేనటువంటిది.
భావం:-
అది చిత్రకూటపర్వతమునకు వెళ్ళు మార్గము. నేను చాలాచాలా మార్లు ఆ మార్గమున వెళ్ళితిని. అది అందమైనది. సుఖకరమైనది. అక్కడ దావాగ్ని భయము ఉండదు.”
2.55.10.అనుష్టుప్
ఇతి పంథానమావేద్య
మహర్షిస్సన్యవర్తత।
అభివాద్య తథేత్యుక్త్వా
రామేణ వినివర్తితః॥
టీక:-
ఇతి = ఇట్లు; పంథానమ్ = మార్గమును; ఆవేద్య = తెలియపఱిచి; మహర్షిః = గొప్ప ఋషి; సః = అతడు; న్యవర్తత = మఱలుట; అభివాద్య = నమస్కారములు చేసి; తథా = అలాగే; ఇతి = అని; ఉక్త్వా = పలికి; రామేణ = శ్రీరామచంద్రునిచే; వినివర్తితః = వెనకకు పంపబడిన.
భావం:-
భరద్వాజ మహర్షి ఈవిధముగా మార్గ నిర్దేశము చేయగా, శ్రీరాముడు అలాగే వెళ్ళెదమని చెప్పి వారికి నమస్కరించి “మీరు తిరిగి మీఆశ్రమమునకు వెళ్ళుడు” అని ప్రార్థింపగా, ఆ మహర్షి వెనుకకు మఱలెను.
2.55.11.అనుష్టుప్
ఉపావృత్తే మునౌ తస్మిన్
రామో లక్ష్మణమబ్రవీత్।
“కృతపుణ్యాః స్మ సౌమిత్రే!
మునిర్యన్నోఽ నుకంపతే”॥
టీక:-
ఉపావృత్తే = తిరుగుప్రయాణము అయ్యిన పిదప; మునౌ = ముని; తస్మిన్ = ఆ; రామః = శ్రీరామచందుడు; లక్ష్మణమ్ = లక్ష్మణస్వామి గూర్చి; అబ్రవీత్ = నుడివెను; కృతపుణ్యాః = పుణ్యములు చేయబడినవి; స్మ = సుమ; సౌమిత్రే = ఓ సౌమిత్రి!; మునిః = ముని; యత్ = ఎందులకు; నః = మనలను గూర్చి; అనుకంపతే = దయచూపుచున్నాడో.
భావం:-
ఆ భరద్వాజమహర్షి వారి ఆశ్రమమునకు తిరుగు ప్రయాణమయ్యిన పిదప శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ఇట్లు పలికెను, "ఓ సౌమిత్రి! ఎంత పుణ్యము చేసామో మనము భరద్వాజ మహర్షి దయకు పాత్రులము అయ్యి కృతార్థులైతిమి"
2.55.12.అనుష్టుప్
ఇతి తౌ పురుషవ్యాఘ్రౌ
మంత్రయిత్వా మనస్వినౌ।
సీతామేవాగ్రతః కృత్వా
కాళిందీం జగ్మతుర్నదీమ్॥
టీక:-
ఇతి = ఈవిధముగా; తౌ = వారిరువురు; పురుషవ్యాఘ్రౌ = నరశ్రేష్ఠులు; మంత్రయిత్వా = మంతనములు చేసుకుని; మనస్వినౌ = సహృదయులు। సీతామ్ = సీతాదేవిని; ఎవ = మాత్రమే; అగ్రతః = ముందున; కృత్వా = ఉంచుకుని; కాళిందీం = యమున; జగ్మతుః = చేరిరి; నదీమ్ = నదిని॥
భావం:-
సహృదయులు నరశ్రేష్ఠులు అయిన శ్రీరామలక్ష్మణులు ఈ విధముగా మాట్లాడుకొనుచు, సీతాదేవి ఏమో ముందు నడుచుచుండగా యమునానదీ తీరమును చేరిరి.
2.55.13.అనుష్టుప్
అథాఽఽసాద్య తు కాళిందీమ్
శీఘ్రస్రోతోవహాం నదీమ్।
చింతాంమాపేదిరే సర్వే
నదీజలతితీర్షవః॥
టీక:-
అథ = తరువాత; ఆసాద్య = పొందిన; తు; కాళిందీమ్ = యమునను; శీఘ్రస్రోతోవహాం = వేగముగా ప్రవహించుచున్న; నదీమ్ = నదిని; చింతాంమ్ = ఆలోచనను; ఆపేదిరే = చేసిరి; సర్వే = అందఱు; నదీజల = నదినీటిని; తితీర్షవః = దాటుట గూర్చి.
భావం:-
చాల వేగముగా ప్రవహించుచున్న ఆ నదిని చేరి దానిని చూచి "ఇంత వడితో ప్రవహించే ఈ నది నీటిని దాటుట ఏట్లు?" అని వారందఱు ఆలోచించసాగిరి
2.55.14.అనుష్టుప్
తౌ కాష్ఠసంఘాతమథో
చక్రతుస్సుమహాప్లవమ్।
శుష్కైర్వంశై స్సమాస్తీర్ణమ్
ఉశీరైశ్చ సమావృతమ్॥
టీక:-
తౌ = వారిరువురు; కాష్ఠసంఘాతమ్ = కఱ్ఱల సముదాయము; అథః = అటు పిమ్మట; చక్రతుః = చేసిరి; సుమహాప్లవమ్ = బాగాపెద్ద తెప్పను, బల్లకట్టును; శుష్కైః = ఎండిన; వంశైః = వెదురుబొంగులతో; సమాస్తీర్ణమ్ = పరచబడిన; ఉశీరైః = వట్టివేళ్ళతో; చ = మఱియు; సమావృతమ్ = కప్పబడిన॥
భావం:-
రామలక్ష్మణులిద్దరు కలిసి ఎండిన వెదురు కఱ్ఱలను పరిచి వట్టివేళ్ళ తడకలను చేర్చి ఒక పెద్ద తెప్పను సిద్ధము చేసిరి.
2.55.15.అనుష్టుప్
తతో వేతసశాఖాశ్చ
జంబూశాఖాశ్చ వీర్యవాన్।
చకార లక్ష్మణశ్ఛిత్వా
సీతాయాస్సుఖమాసనమ్॥
టీక:-
తతః = తరువాత; వేతస = నీటిప్రబ్బలిచెట్ల; శాఖాః = కొమ్మలను; చ = ఇంకను; జంబూశాఖాః = నేరేడు; శాఖాః = కొమ్మలను; చ = మఱియు; వీర్యవాన్ = వీరుడైన; చకార = చేసెను; లక్ష్మణః = లక్ష్మణస్వామి; ఛిత్వా = నరికి; సీతాయాః = సీతాదేవియొక్క; సుఖమ్ = సౌఖ్యమైన; ఆసనమ్ = ఆసనమును.
భావం:-
అనంతరము వీరుడైన లక్ష్మణస్వామి నీటిప్రబ్బలిచెట్ల కొమ్మలను, నేరేడు కొమ్మలను నరికి వాటితో సీతామాతకు ఒక చక్కని ఆసనమును ఏర్పాటుచేసెను
2.55.16.అనుష్టుప్
తత్ర శ్రియమివాచింత్యామ్
రామో దాశరథిః ప్రియామ్।
ఈషత్సంలజ్జమానాం తామ్
అధ్యారోపయతప్లవమ్॥
టీక:-
తత్ర = అచట; శ్రియమ్ = లక్ష్మీదేవి; ఇవ = వలె; అచింత్యామ్ = ఊహకు అందని శక్తిగల; రామః = శ్రీరామచంద్రుడు; దాశరథిః = దశరథనందనుడైన; ప్రియామ్ = ప్రియమైన; ఈషత్ = కొంచెము; సంలజ్జమానాం = బిడియపడుచున్న; తామ్ = ఆ; అధ్యారోపయత = ఎక్కించెను; ప్లవమ్ = బల్లకట్టును.
భావం:-
కొంచెము బిడియపడుతూ, ఆలోచనకు అందని శక్తిగల లక్ష్మీదేవివలె ఉన్న సీతాదేవిని, దశరథతనయుడైన శ్రీరామచంద్రమూర్తి ఆ తెప్పెమీదికి ఎక్కించెను
2.55.17.అనుష్టుప్
పార్శ్వే చ తత్ర వైదేహ్యా
వసనే భూషణాని చ।
ప్లవే కఠినకాజం చ
రామశ్చక్రే సహాయుధైః॥
టీక:-
పార్శ్వే = సమీపముగ; చ = మఱియు; తత్ర = అచట; వైదేహ్యాః = సీతాదేవికి; వసనే = దుస్తులను; భూషణాని = ఆభరణములను; చ = మఱియు। ప్లవే = తెప్పయందు; కఠినక = చిన్న గునపము; ఆజం = మేకతోలుతో చేసిన పుటిక/ చిన్నగంప, పుల్లెల శ్రీరామచంద్రులవారి రామాయణము; చ = మఱియు; రామః = శ్రీరామచంద్రమూర్తి; చక్రే = చేర్చెను; సహ = కూడ; ఆయుధైః = ఆయుధములు.
భావం:-
తదుపరి శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి వస్త్రాభరణములను, పలుగు గంపలను ఇంకా ఆయుధములను బల్లకట్టు (తెప్ప) మీదకు తెచ్చి సీతాదేవికి సమీపమున ఉంచెను
2.55.18.అనుష్టుప్
ఆరోప్య ప్రథమం సీతామ్
సంఘాటం పరిగృహ్య తౌ।
తత ప్రతేరతుర్యత్తౌ
వీరౌ దశరథాత్మజౌ॥
టీక:-
ఆరోప్య = ఎక్కించి; ప్రథమం = ముందుగా; సీతామ్ = సీతాదేవిని; సంఘాటం = ఆ బల్లకట్టు; పరిగృహ్య = గట్టిగా పట్టుకుని; తౌ = వారిరువురు। తతః = తరువాత; ప్రతేరతుః = దాటించిరి; యత్తౌ = సావధానమైన మనస్సుతో; వీరౌ = ఇద్దరు వీరులు; దశరథాత్మజౌ = ఇద్దరు దశరథ తనయులు.
భావం:-
ఆ విధముగా వీరులైన శ్రీరామలక్ష్మణులు ముందుగా సీతాదేవిని ఎక్కించి ఆ బల్లకట్టును గట్టిగా పట్టుకుని తరువాత సావధానముగా ఈదుతూ యమునా నదిని దాటించిరి.
*గమనిక:-
యమునను దాటుటకు, సీతను మాత్రమే బల్లకట్టుపైకి రాముడు ఎక్కించెను. కాని వారిరువురును ఎక్కలేదు. బల్లకట్టును ఇరువురు (చెరొకప్రక్క) గట్టగా పట్టుకొని, (ఈదుతూ) దాటించిరి. ఇందుకు ‘ప్రతేరతుర్యత్తౌ’ పదము నిదర్శనము- చతుర్వేదీ ద్వారకాప్రసాద శర్మ వారి హిందీ భాషానువాద సహిత శ్రీమద్వాల్మీకి రామాయణం.
2.55.19.అనుష్టుప్
కాళిందీమధ్యమాయాతా
సీతా త్వేనామవందత।
“స్వస్తి దేవి తరామి త్వామ్
పారయే న్మే పతిర్వ్రతమ్॥
టీక:-
కాళిందీ = కాళిందీనది; మధ్యమ్ = నడిమిప్రాంతమున, మధ్యమమును; ఆయాతా = వెళ్ళిన పిదప; సీతా = సీతాదేవీ; తు; ఏనామ్ = ఆ నదిని; అవందత = ప్రార్థించెను; స్వస్తి = శుభమగుగాక; దేవి = ఓయమునాదేవీ!; తరామి = దాటుచున్నాము; త్వామ్ = నిన్ను; పారయేత్ = పూర్తగుగాక; మే = నాయొక్క; పతిః = పతిదేవుని; వ్రతమ్ = దీక్ష.
భావం:-
ఆ తెప్ప నదీమధ్యబాగమును చేరాక, సీతాదేవి ఆ నదికి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. “ఓ యమునాదేవి! శుభము. మేము నిన్ను దాటుచున్నాము. నా భర్త తన దీక్షను పూర్తిచేయుగాక.
2.55.20.అనుష్టుప్
యక్ష్యే త్వాం గోసహస్రేణ
సురాఘటశతేన చ।
స్వస్తి ప్రత్యాగతే రామే
పురీ మిక్ష్వాకుపాలితామ్॥
టీక:-
యక్ష్యే = పూజించెదను; త్వాం = నిన్ను; గో = వేయి గోవులను; సహస్రేణ = వేయింటితో; సురా = సురా; ఘటః = కుండలు; శతేన = వందింటితోను; చ = మఱియు; స్వస్తి = శుభము; ప్రత్యాగతే = తిరిగి వచ్చిన పిదప; రామే = శ్రీరామచంద్రుని యందు; పురీమ్ = నగరమును; ఇక్ష్వాకుపాలితామ్ = ఇక్ష్వాకు ప్రభులచే పాలింపబడు.
భావం:-
వందకుండల సురతోను, వెయ్యి గోవులతోను నిన్ను పూజించెదనప. శుభమగుగాక. ఇక్ష్వాకవంశస్థులు పాలించు అయోధ్యానగరమునకు శ్రీరాముడు మరలివచ్చినప్పుడు
2.55.21.అనుష్టుప్
కాళిందీమథ సీతా తు
యాచమానా కృతాంజలిః।
తీరమేవాభిసంప్రాప్తా
దక్షిణం వరవర్ణినీ॥
టీక:-
కాళిందీమ్ = కాళిందీ నది; అథ = పిమ్మట; సీతా = సీతాదేవీ; తు; యాచమానా = అర్థించుచు; కృతాంజలిః = అంజలి ఘటించుచు। తీరమ్ = ఆవలితీరమును; ఏవ = జాగ్రత్తగా; అభిసంప్రాప్తా = పూర్తిగాపొందెను; దక్షిణం = దక్షిణమున యున్న; వరవర్ణినీ = ఉత్తమ వర్ణముగల, స్త్రీ, సుందరీమణి.
భావం:-
సుందరమగు శరీరఛాయగల సుందరీమణి సీతాదేవీ అంజలి ఘటించి ఆ యమునను నమస్కరించుచు ఆవలి ఒడ్డు ఎక్కెను.
2.55.22.అనుష్టుప్
తత ప్లవేనాంశుమతీమ్
శీఘ్రగామూర్మిమాలినీమ్।
తీరజై ర్బహుభిర్వృక్షైః
సంతేరుర్యమునాం నదీమ్॥
టీక:-
తతః = తరువాత; ప్లవేన = ఈదుతూ; అంశుమతీమ్ = సూర్యపుత్రి అయిన యమును; శీఘ్రగామ్ = వేగముగా ప్రవహించుచున్న; ఊర్మిమాలినీమ్ = తరంగములగల; తీరజైః = తీరమునదు పుట్టిన; బహుభిః = అనేకములైన; వృక్షైః = చెట్లను; సంతేరుః = సుగంధభరితమైన, మోనియర్-వియమ్స్-డిక్షనరీ; యమునాం = యమునా; నదీమ్ = నదియయొక్క.
భావం:-
అంతట వారు తరంగములతో పరవళ్ళుద్రొక్కుచు ప్రవహించుచున్న యమునా నదిని దాటి ఆ తెప్ప సహాయముతో దాటి, సుగంధభరితమైన చాలా చెట్లుగల ఆ యమునానది ఒడ్డును చేరిరి.
2.55.23.అనుష్టుప్
తే తీర్ణాః ప్లవముత్సృజ్య
ప్రస్థాయ యమునావనాత్।
శ్యామం న్యగ్రోధ మాసేదుః
శీతలం హరితచ్ఛదమ్॥
టీక:-
తే = వారు; తీర్ణాః = దాటి; ప్లవమ్ = తెప్పను; ఉత్సృజ్య = విడిచి; ప్రస్థాయ = ప్రయాణముచేసి; యమునా = యమునా నదీ; వనాత్ = వనములమీదుగా; శ్యామం = శ్యామమను; న్యగ్రోధమ్ = మఱ్ఱిచెట్టు; ఆసేదుః = సమీపించిరి; శీతలం = చల్లనిది; హరితః = పచ్చని; ఛదమ్ = ఆకులుగలది.
భావం:-
సీతారామలక్ష్మణులు ఆ నదిని దాటిన పిమ్మట తెప్పను విడిచి, యమునా నదీ అడవ మీదుగా వెళ్ళి పచ్చని ఆకులతోనిండి చల్లనినీడను అందిస్తూ సుమనోహరముగానున్న శ్యామమను పేరుగల మఱ్ఱిచెట్టును సమీపించిరి
2.55.24.అనుష్టుప్
న్యగ్రోధం తముపాగమ్య
వైదేహీ వాక్యమబ్రవీత్।
“నమస్తేఽ స్తు మహావృక్ష
పారయేన్మే పతిర్వ్రతమ్॥
టీక:-
న్యగ్రోధం = మఱ్ఱిచెట్టును; తమ్ = ఆ; ఉపాగమ్య = చేరి; వైదేహీ = సీతాదేవీ; వాక్యమ్ = వాక్యమును; అబ్రవీత్ = పలికెను; నమస్తే = నీకు నమస్కారము; అస్తు = అగుగాక; మహావృక్ష = ఓ గొప్ప వృక్షమా!; పారయేత్ = దాటుగాక; మే = నాయొక్క; పతిః = భర్త; వ్రతమ్ = వనవాస దీక్షను.
భావం:-
ఆ వృక్షమువద్దకు చేరగాన సీతాదేవీ ఇట్లు ప్రార్థించెను, "ఓ వృక్షరాజమా! నీకు నమస్కారము. నా భర్తయొక్క దీక్ష సుసంపూర్ణమగు గాక.
2.55.25.అనుష్టుప్
కౌసల్యాం చైవ పశ్యేయమ్
సుమిత్రాం చ యశశ్వినీమ్”।
ఇతి సీతాఽంజలిం కృత్వా
పర్యగచ్ఛద్వనస్పతిమ్॥
టీక:-
కౌసల్యాం = కౌసల్యను; చైవ = ఇంకనూ; పశ్యేయమ్ = దర్శించుగాక; సుమిత్రాం = సుమిత్రను; చ = మఱియు; యశశ్వినీమ్ = కీర్తిమంతుని; ఇతి = అని; సీతా = సీతదేవీ!; అంజలిం కృత్వా = అంజలి ఘటించి; పర్యగచ్ఛత్ = ప్రదక్షిణము చెసెను; వనస్పతిమ్ = ఆ మహావేక్షమునకు॥
భావం:-
ఇంకనూ కీర్తిమంతుడు కౌసల్యాదేవిని, సుమిత్రాదేవినికూడ దర్సించుగాక” అని, ఆ వృక్షమున నమస్కరించుచు ప్రదక్షిణ చేసెను.
2.55.26.అనుష్టుప్
అవలోక్య తతస్సీతామ్
ఆయాచన్తీమనిందితామ్।
దయితాం చ విధేయాం చ
రామో లక్ష్మణమబ్రవీత్॥
టీక:-
అవలోక్య = చూచి; తతః = తదుపరి; సీతామ్ = సీతాదేవిని; ఆయాచన్తీమ్ = నమస్కరించుచున్న; అనిందితామ్ = నిందపడనిది, ఋజువర్తనగది; దయితాం = ప్రియురాలు; చ = మఱియు; విధేయాం = విధేయురాలు; చ = మఱియు; రామః = శ్రీరామచంద్రమూర్తి; లక్ష్మణమ్ = లక్ష్మణునిగూర్చి; అబ్రవీత్ = నుడివెను॥
భావం:-
శ్రీరామచంద్రుడు తనకు ప్రాణసమానమయిన ప్రియురాలు, విధేయురాలు మఱియు ఋజువర్తని అయిన సీతాదేవి ఆ వటవృక్షమును ప్రార్థించుచుండగా చూచి, లక్ష్మణస్వామితో ఇట్లు నుడివెను
2.55.27.అనుష్టుప్
“సీతామాదాయ గచ్ఛత్వమ్
అగ్రతో భరతానుజ।
పృష్ఠతోఽహం గమిష్యామి
సాయుధో ద్విపదాం వర॥
టీక:-
సీతామ్ = సీతాదేవిని; ఆదాయ = తీసుకుని; గచ్ఛ = వెళ్ళుము; త్వమ్ = నీవు; అగ్రతః = ముందు; భరతానుజ = భరతుని తమ్ముడు అయిన లక్ష్మణస్వామి। పృష్ఠతః = వెనుక; అహం = నేను; గమిష్యామి = వచ్చెదను; సాయుధః = ఆయుధములతో; ద్విపదాం = మనుష్యులలో; వర = శ్రేష్ఠుడైనవాడ.
భావం:-
ఓ నరశ్రేష్ఠ లక్ష్మణ! నీవు మీ వదినగారయిన సీతాదేవికి ముందుగా నడువుము, నేను ఆమె వెనుక ధనుర్దారినై నడిచెదను
2.55.28.అనుష్టుప్
యద్యత్ఫలం ప్రార్థయతే
పుష్పం వా జనకాత్మజా!।
తత్తత్ప్రదద్యా వైదేహ్యా
యత్రాఽ స్యా రమతే మనః”॥
టీక:-
యత్+యత్ = ఏ యే; ఫలం = పళ్ళను; ప్రార్థయతే = కావాలని అడుగునో; పుష్పం = పువ్వులు; వా = లేదా; జనకాత్మజా = జానకీదేవి; తత్+తత్ = ఆ యావాటిని; ప్రదద్యాః = ఇమ్ము; వైదేహ్యాః = వైదీహి యొక్క; యత్ర = దేనియెడల; అస్యాః = ఈ; రమతే = కావలెనని అనుకొనునో; మనః = మనస్సు.
భావం:-
సీతాదేవి ఏ యే ఫలములను గాని, పుష్పములను గాని లేదా ఎవయినా ఇతర వస్తువులు కాని కావలెనని అనుకొనునో వాటిని వైదేహికి సమకూర్చుము.”
2.55.29.అనుష్టుప్
గచ్ఛతోఽస్తు తయోర్మధ్యే
బభూవ జనకాత్మజా।
మాతంగయోర్మధ్యగతా
శుభా నాగవధూరివ॥
టీక:-
గచ్ఛతః = నడుచుచున్న; అస్తు = అగుగాక; తయోః = వారిరువురి; మధ్యే = మధ్యలో; బభూవ = ఉండెను; జనకాత్మజా = జానకీదేవి; మాతంగయోః = రెండు ఏనుగుల; మధ్యగతా = మధ్యలోనున్న; శుభా = శుభమైన; నాగవధూః = ఆడఏనుగు; ఇవ = వలె.
భావం:-
శ్రీరామలక్ష్మణు లిరువురి మధ్యలో నడుచుచున్న జానకీదేవీ, రెండు గజముల మధ్యలో ఉన్న ఆడఏనుగువలె శోభిల్లుచుండెను
2.55.30.అనుష్టుప్
ఏకైకం పాదపం గుల్మమ్
లతాం వా పుష్పశాలినీమ్।
అదృష్టపూర్వాం పశ్యన్తీ
రామం పప్రచ్ఛ సాఽ బలా॥
టీక:-
ఏకైకమ్ = ఒక్కొక్క; పాదపమ్ = చెట్టును; గుల్మమ్ = పొదను; లతామ్ = తీగను; వా = కాని; పుష్పశాలినీమ్ = పూలతో శోభిల్లుచునున్న। అదృష్టపూర్వాం = ఇంతకుమునుపు చూడనివి; పశ్యన్తీ = చూచుచున్నది; రామం = శ్రీరామచంద్రుని; పప్రచ్ఛ = అడిగెను; సా = ఆమె; అబలా = సీతాదేవి॥
భావం:-
ఇదివరలో తాను చూడని చెట్టు కాని, పొద గాని, పూలతో శోభిల్లుచునున్న లత గాని కనబడినప్పుడు సీతాదేవీ వాటిమీదనున్న అభిలాషను శ్రీరామచంద్రుడికి విన్నవించుకొనసాగెను
2.55.31.అనుష్టుప్
రమణీయాన్బహువిధాన్
పాదపాన్కుసుమోత్కటాన్।
సీతావచనసంరబ్ధ
ఆనయామాస లక్ష్మణః॥
టీక:-
రమణీయాన్ = అందమైనవి; బహువిధాన్ = నానావిధములైన; పాదపాన్ = చెట్లను; కుసుమః = పూలతో; ఉత్కటాన్ = నిండిన; సీతా = సీతాదేవి; వచన = మాట; సంరబ్ధః = వెంటనే; ఆనయామాస = తీసుకొనివచ్చెను; లక్ష్మణః = లక్ష్మణస్వామి.
భావం:-
సీతాదేవీ రామునితో చెప్పిన మాటవెలువడగానే పూలతో నిండిన గుత్తులను, మొక్కలను లక్ష్మణస్వామి తీసుకువచ్చి ఇచ్చుచుండెను
2.55.32.అనుష్టుప్
విచిత్రవాలుకజలామ్
హంససారసనాదితామ్।
రేమే జనకరాజస్య
సుతా ప్రేక్ష్య తదా నదీమ్॥
టీక:-
విచిత్ర = చిత్రవర్ణములుగల; వాలుక = ఇసుకతిన్నెలు; జలామ్ = జలములు; హంస = హంసలు; సారస = కొంగలుయొక్క; నాదితామ్ = ధ్వనులతో; రేమే = క్రీడించెను, ఆడుకొనెను; జనకరాజస్య = జనకమహీపతియొక్క; సుతా = పుత్రిక; ప్రేక్ష్య = చూచి; తదా = అప్పుడు; నదీమ్ = నదిని.
భావం:-
జానకీదేవి చిత్రవర్ణముల ఇసుకతిన్నెలతో, జలములతో శోభిల్లుచున్నది, హంసలు మఱియు బెగ్గురు పక్షుల కిలకిలరావములతో ముచ్చటగొలుపుచున్నది, అగు ఆ యమునా నదీతీరమును చూచి మిక్కిలి ఆనందించెను.
2.55.33.అనుష్టుప్
క్రోశమాత్రం తతో గత్వా
భ్రాతరౌ రామలక్ష్మణౌ।
బహూన్మేధ్యాన్మృగాన్హత్వా
చేరతుర్యమునావనే॥
టీక:-
క్రోశమాత్రం = ఒక క్రోసెడు దూరము; తతః = తదుపరి; గత్వా = వెళ్ళి; భ్రాతరౌ = అన్నదమ్ములు; రామలక్ష్మణౌ = శ్రీరామ లక్ష్మణులు। బహూన్ = అనేక; మేధ్యాన్ = పవిత్రములైన, శుద్ధిచేయబడిన; మృగాన్ = అశ్వకందములను, పెన్నెరు, అశ్వగంధ, లేళ్ళను; హత్వా = సేకరించి, సంహరించి; చేరతుః = భక్షించిరి; యమునావనే = యమునా తీర అరణ్యమునందు॥
భావం:-
గమనిక: ఈ అర్థములు ఘోరఖ్పూర్గీతాప్రెస్ వారి ప్రతిలో "మదనపాల నిఘంటువు ఆధారముగా" అని ఉన్నవి అన్నదమ్ములైన శ్రీరామలక్ష్మణులు ఒక క్రోసెడు దూరము ప్రయాణించిన పిదప పవిత్రములైన అశ్వగందములను, మధురమైన ఫలమూలములను సేకరించి ఆ యమునా నదీతీర అరణ్యమున వాటిని స్వీకరించిరి.
*గమనిక:-
1) మేధ్యాన్- పవిత్రములైన, మృగాన్- అశ్వకందములను, హృత్వా- ఆహృత్యా- సేకరించి, చేరతుః- భక్షించిరి, మదనపాల నిఘంటువు ఆధార్ముగా ఈ అర్థవివరణ చేయబడినది అని ఘోరఖ్పూర్గీతాప్రెస్ వారి ప్రతి. (2) మృగా- మృగః మృగమాంసతుల్యః రసోఽస్తి అస్యః అర్ష ఆదిభ్యోఽచ్। సహదేవీలతా। ఇతి రాజనిగ్ఘంటః॥ శబ్దకల్పదృమము. (3) మృగో మృగమాంసతుల్యరసోస్త్యస్య అచ్। సహదేవీలతాయామ్ రాజనీం। వాచస్పతము(4) మృగా అనగా మృగమాంసముతో సరిపోలెడిది ఐన సహదేవీ లతా (5) మృగా- సహదేవీ లతా, సర్వశబ్దసంబోధిని (6) సహదేవీ- వెణుతురు చెట్టు, సహదేవి చెట్టు, సర్వశబ్దభోదిని. (7) అర్ష- దారకంద, సర్వశబ్దసంభోధిని. కనుక మృగా శబ్దము జంతుసంబందము కాదు, వృక్షసంబందము.
2.55.34.జగతి.
విహృత్య తే బర్హిణపూగనాదితే
శుభే వనే వానరవారణాయుతే।
సమం నదీవప్రముపేత్య సమ్మతం
నివాస మాజగ్ము రదీనదర్శనాః!॥
టీక:-
విహృత్య = విహరించి; తే = వారు; బర్హిణః = నెమళ్ళ; పూగ = సమూహముచే; నాదితే = ద్వనించచుతున్నది; శుభే = శుభమైన; వనే = అడవియందు; వానర = వానరములుv వారణాః = ఏనుగులతోను; ఆయుతే = కూడిన; సమం = సమముగానున్న; నదీ = నదియొక్క; వప్రమ్ = ఒడ్డును; ఉపేత్య = చేరి; సమ్మతం = అనుకూలమైన; నివాసమ్ = నివాసమును; ఆజగ్ముః = పొందిరి; అదీనదర్శనాః = దైన్యములేని దర్శనముగలవారు.
భావం:-
పిదపవారు నెమెళ్ళగుంపుల మధురధ్వనులతో, వానరములు మఱియు గజముల సంచారములతోనున్న ఆ సుందరవనమున విహరించి ఒక సమతల ప్రదేశమును ఎన్నుకుని అచ్చట ఆ రాత్రికి నివాసము ఏర్పరుచుకుని సేదతీరిరి.
2.55.35.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
పంచపంచాశ సర్గః॥
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; పంచపంచాశ [55] = ఏభై ఐదవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [55] ఏభై ఐదవ సర్గ సంపూర్ణము.
2.56.1
అనుష్టుప్
అథ రాత్ర్యాం వ్యతీతాయామ్
అవసుప్తమనంతరమ్।
ప్రబోధయామాస శనైః
లక్ష్మణం రఘునందనః॥
టీక:-
 అథ = అప్పుడు; రాత్య్రాం = ఆ రాత్రి; వ్యతీతాయామ్ = గడచిన పిదప; అవసుప్తమ్ = నిద్రించుచున్న; అనంతరమ్ = అటు పిమ్మట; ప్రబోధయామాస = నిద్ర నుండి లేచి; శనైః = నెమ్మదిగా; లక్ష్మణం – లక్ష్మణుని; రఘునందనః = రఘురాముడు.
భావం:-
 ఆ రాత్రి గడచిన పిమ్మట ముందుగా నిద్ర నుండి లేచిన రాముడు, ఇంకను నిద్రించుచున్న లక్ష్మణుని మెల్లగా మేల్కొలిపెను.
2.56.2
అనుష్టుప్
“సౌమిత్రే! శ్రుణు వన్యానామ్
వల్గు వ్యాహరతాం స్వనమ్।
సంప్రతిష్ఠామహే కాల
ప్రస్థానస్య పరంతప॥
టీక:-
 సౌమిత్రే = ఓ లక్ష్మణా; శ్రుణు = వినుము; వన్యానామ్ = వన్యప్రాణుల; వల్గు = మధురముగా; వ్యాహరతాం = పలుకుతున్న; స్వనమ్ = శబ్దమును; సంప్రతిష్ఠామహే = బయలుదేరెదము; కాల = సమయము; ప్రస్థానస్య = బయలుదేరుటకు; పరంతప = ప్రయాణమునకు
భావం:-
 లక్ష్మణా! వన్య ప్రాణులు మధురముగా ధ్వని చేయుచున్నవి. వినుము. ఇది మనము బయలుదేరుటకు తగిన సమయము. వెంటనే బయలుదేరెదము.
2.56.3
అనుష్టుప్
స సుప్తస్సమయే భ్రాత్రా
లక్ష్మణః ప్రతిబోధితః।
జహౌ నిద్రాం చ తంద్రీం చ
ప్రసక్తం చ పథి శ్రమమ్॥
టీక:-
 స = ఆ; సుప్తః = నిద్రించుచున్న; సమయే = సరైన సమయమునకు; భ్రాత్రా = అన్నగారి చేత; లక్ష్మణః = లక్ష్మణుడు; ప్రతిబోధితః = మేల్కొలుపబడిన వాడై; జహౌ = విడచెను; నిద్రాం = నిద్రను; చ = మఱియు; తంద్రీం = అలసటను; చ = మఱియు; ప్రసక్తం = కలిగిన; చ = మఱియు; పథిశ్రమమ్ = మార్గాయాసమును.
భావం:-
 సోదరుడు ఆ విధముగా మేల్కొలుపగానే లక్ష్మణుడు నిద్రను, మార్గాయాసమును కూడ విడచెను.
2.56.4
అనుష్టుప్
తత ఉత్థాయ తే సర్వే
స్పృష్ట్వా నద్యాశ్శివం జలమ్।
పన్థానమృషిణాఽదిష్టమ్
చిత్రకూటస్య తం యయుః॥
టీక:-
 తతః = అటు పిమ్మట; ఉత్థాయ = లేచి; తేసర్వే = వారందరు; స్పృష్ట్వా = స్పృశించి; నద్యాః = నది యొక్క; శివం = మంగళప్రదమైన; జలమ్ = జలమును; పంథానమ్ = మార్గము గుండా; ఋషిణా = భరద్వాజ మహర్షి చేత; ఆదిష్టమ్ = సూచించబడిన; చిత్రకూటస్య = చిత్రకూట పర్వత యొక్క; తం = వారు; యయుః = వెళ్లిరి
భావం:-
  వారందరును లేచి, మంగళప్రదమగు యమునా నదీజలమును స్పృశించి స్నానము చేసి, భరద్వాజ మహర్షి చెప్పిన చిత్రకూట పర్వత మార్గమున వెళ్లిరి.
*గమనిక:-
 చిత్రకూటము- చిత్ర (ఆశ్చర్యకరమైన, విశేషమైన, నానా వర్ణములు (రకములు) కలది+ కూటము (ప్రోగు, గుంపు, సమూహము), చిత్రాతిచిత్రమైన చరాచరములు కలది. బహుచక్కనిది
2.56.5
అనుష్టుప్
తతస్సంప్రస్థితః కాలే
రామస్సౌమిత్రిణా సహ।
సీతాం కమలపత్రాక్షీమ్
ఇదం వచనమబ్రవీత్॥
టీక:-
 తతః = అప్పుడు; సంప్రస్థితః = కలసి పోవుచున్న; కాలే = సమయమునందు; రామః = రాముడు; సౌమిత్రిణా సహ = లక్ష్మణునితో కలసి; సీతాం = సీతను గూర్చి; కమలపత్రాక్షీమ్ = పద్మపత్రముల వంటి కన్నులు కల ఆమెను; ఇదం = ఈ; వచనమ్ = మాటలు; అబ్రవీత్ = పలికెను
భావం:-
 ఇట్లు లక్ష్మణునితో కలసిపోవుచున్న రాముడు పద్మ పత్రముల వంటి నేత్రములు గల సీతతో ఇట్లనెను.
2.56.6
అనుష్టుప్
ఆదీప్తానివ వైదేహి!
సర్వతః పుష్పితాన్నగాన్।
స్వైః పుష్పైః కింశుకాన్ పశ్య
మాలినః శిశిరాత్యయే॥
టీక:-
 ఆదీప్తాన్ = మండుచున్నది; ఇవ = వంటి; వైదేహి = ఓ సీతా; సర్వతః = అంతటా; పుష్పితాత్ = పుష్పించిన; నగాన్ = వృక్షములను; స్వైః = వాటి యొక్క; పుష్పైః = పుష్పములు; కింశుకాన్ = కింశుకములు అనెడి; పశ్య = చూడు; మాలినః = మావవు ధరించినట్లు; శిశిరాత్యయే = శిశిర ఋతువు
భావం:-
 సీతా! ఈ శింశుప వృక్షములు శిశిర ఋతువు గడచిపోవుటతో అంతటా పుష్పించి ఎర్రని పూవులతో మండుచున్నట్లున్నవి. వాటి పుష్పములతోనే అవి మాటలను ధరించినట్లు ఉన్నవి. చూడుము.
2.56.7
అనుష్టుప్
పశ్య భల్లాతకాన్ ఫుల్లాన్
నరైరనుపసేవితాన్।
ఫలపత్రైరవనతాన్
నూనం శక్ష్యామ జీవితుమ్॥
టీక:-
 పశ్య = చూడుము; భల్లాతకాన్ = నల్ల జీడి చెట్లు; ఫుల్లాన్ = వికసించి ఉన్నవి; నరైః = నరులు; అనుపసేవితాన్ = అనుభవించుటకు; ఫల = పండ్లతోను; పత్రైః = ఆకులతోను; అవనతాన్ = వంగి ఉన్నవి; నూనం = నిశ్చయముగా; శక్ష్యామ = సమర్థులము; జీవితుమ్ = జీవించుటకు.
భావం:-
 ఈ భల్లాతక వృక్షములు అనగా జీడి చెట్లు వికసించి పుష్పఫలములతో నిండియున్నవి. కాని వీటి ఫలాదులను నరులు అనుభవించుటకు వంగి ఉన్నవి. వీటిని చూడుము. ఇట్టి వృక్షములు ఉన్న ఈ ప్రదేశమున మనము తప్పక సుఖముగా జీవించగలము.
*గమనిక:-
 చిత్రకూటమున కల అడవిలో జనసంచారము మృగ్యము. మానవులకు జీవికకు అవసరమగు ఫలవృక్షాదులు సమృద్దిగా ఉన్నవి. శ్రమపడనక్కరలేకుండా అందుతూ పండ్లు మున్నగునవి ఉన్నవి, సమీపములోనే సమృద్ధిఐన జలసంపత్తి కలదని భరద్వాజులవారు చెప్పిరి. కనుక, ఇక్కడ నివసించుటకు అనుకూలముగా ఉన్నది అని భావన.
2.56.8
అనుష్టుప్
పశ్య ద్రోణప్రమాణాని
లమ్బమానాని లక్ష్మణ।
మధూని మధుకారీభిః
సమ్భృతాని నగే నగే॥
టీక:-
 పశ్య = చూడుము; ద్రోణప్రమాణాని = తెట్టెలవలె పెద్దగా; లంబమానాని = వేలాడుచున్నవి; లక్ష్మణ = లక్ష్మణా; మధూని = తేనెపట్టులు; మధుకారీభిః = తేనెటీగల చేత; సంభృతాని = దట్టముగా; నగే నగే = ప్రతి చెట్టు మీదను
భావం:-
 పిమ్మట లక్ష్మణునితో ఇట్లనెను.. లక్ష్మణా ప్రతి చెట్టు మీదను తొట్టెల వలె ఉన్న పెద్ద తేనెపట్టులు వ్రేలాడుచున్నవి. చూడుము.
2.56.9
అనుష్టుప్
ఏష క్రోశతి నత్యూహః
తం శిఖీ ప్రతికూజతి।
రమణీయే వనోద్దేశే
పుష్పసంస్తరసంకటే॥
టీక:-
 ఏషః = ఈ; క్రోశతి = కూయుచున్నది; నత్యూహః = వాన కోయిల; తం శిఖీ = ఆ నెమలి; ప్రతికూజతి = ఎదురు కూత; రమణీయే = అంముగా; వనోద్దేశే = వన ప్రదేశము; పుష్పసంస్తర సంకటే = దట్టముగా రాలిన పూలతో కప్పబడి
భావం:-
  ఈ వానకోయిల కూయుచుండగా నెమలి దానికి ఎదురు కూత కూయుచున్నది. ఈ వన ప్రదేశము దట్టముగా రాలిన పూలతో కప్పబడి అందముగా ఉన్నది.
2.56.10
అనుష్టుప్
మాతంగయూథానుసృతమ్
పక్షిసంంఘానునాదితమ్।
చిత్రకూటమిమం పశ్య
ప్రవృద్ధశిఖరం గిరిమ్॥
టీక:-
 మాతంగ = ఏనుగులు; యూథాః = గుంపులు; అనుసృతమ్ = సంచరించుచున్నవి; పక్షిః = పక్షుల; సంఘః = గుంపులు; అనునాదితమ్ = ధ్వని చేయుచున్నవి; చిత్రకూటమ్ = చిత్రకూట; ఇమం = ఈ; పశ్య = చూడుము; ప్రవృద్ధ = అధికముగా; శిఖరం = శిఖరములు; గిరిమ్ = పర్వతపై
భావం:-
 ఆ ఏనుగును అదిగో ఆ గుంపు అనుసరిస్తోంది. వాటిని చూసి పక్షుల గుంపులు అరుస్తున్నాయి. ఈ చిత్రకూటమి పర్వత శిఖరములు చాల ఎత్తుగా ఉన్నవి. చూడు.
2.56.11
అనుష్టుప్
సమభూమితలే రమ్యే
ద్రుమైర్బహుభిరావృతే।
పుణ్యేరంస్యామహే తాత!
చిత్రకూటస్య కాననే॥
టీక:-
 సమభూమితలే = సమమైన నేల కలది; రమ్యే = అందమైన; ద్రుమైః బహుభిరావృతే = అనేక వృక్షములతో నిండినది; పుణ్యే = పవిత్రమూ అయిన; రంస్యామహే = నివసించెదము; తాత = నాయనా; చిత్రకూటస్య = చిత్రకూటము యొక్క; కాననే = వనమునందు
భావం:-
 నాయనా! సమమైన నేల కలదీ, అనేకమైన వృక్షములతో నిండినదీ పవిత్రమూ అయిన ఈ చిత్రకూట పర్వత వనమునందు సుఖముగా నివసించెదము.
*గమనిక:-
 కాననము- మనుష్యులు వేసి పెంచిన తోట,వనము, ఆంధ్ర వాటస్పతము, వ్యుత్పత్తి. కన – దీప్తౌ- కన, ణిచ్, + ల్యుట్, కృ.ప్ర., ఫలపుష్పాదులచే వెలయునది., ఆంధ్రశబ్దరత్నాకరము, కం జలం అననం జీవనమస్య. యద్ధా కానయతి దీపయతి, కనదీప్తౌ ణిచ్ ల్యుట్, వనమ్ శబ్ధకల్పద్రుమః, నివాసయోగ్య వనము, ఆప్టే ప్రాక్టికల్. (ఇందుకే భరధ్వాజులవారు సూచించారేమో)
2.56.12
అనుష్టుప్
తతస్తౌ పాదచారేణ
గచ్ఛన్తౌ సహ సీతయా।
రమ్యమాసేదతుశ్శైలమ్
చిత్రకూటం మనోరమమ్॥
టీక:-
 తతః = అప్పుడు; తౌ = వారిరువురు; పాదచారేణ = కాలినడకన ప్రయాణము చేయుచున్న; గచ్ఛంతౌ = సమీపించిరి; సహ సీతయా = సీతతో కలిసి; రమ్యమ్ = అందమైన; ఆసేదతుః = సమీపించిరి; శైలమ్ = పర్వతమును; చిత్రకూటం = చిత్రకూటమను; మనోరమమ్ = మనోరహము
భావం:-
 సీతారామలక్ష్మణులు అలా నడుచుకుంటూ సుందరమూ మనోహరమూ అయిన చిత్రకూట పర్వతమును సమీపించిరి.
2.56.13
అనుష్టుప్
తం తు పర్వతమాసాద్య
నానాపక్షిగణాయుతమ్।
బహుమూలఫలం రమ్యమ్
సమ్పన్నం సరసోదకమ్॥
టీక:-
 తం = ఆ; తు = యొక్క; పర్వతమ్ = పర్వతమును; ఆసాద్య = సమీపించెను; నానా = అనేక; పక్షిః= పక్షుల; గణః = జాతులు; ఆయుతమ్ = లభించుచుండెను; బహు = అత్యధికముగా; మూల = దుంపలు; ఫలం = పండ్లు; రమ్యమ్ = రమ్యముగా; సంపన్నం = సమృద్ధముగా; సరస = మంచి రుచి గల; ఉదకమ్ = జలములతో
భావం:-
 ఆ పర్వతమునందు అనేక జాతుల పక్షుల సముదాయము ఉండెను. దుంపలు, పండ్లు సమృద్ధిగా లభించుచుండెను. మంచి రుచి గల ఉదకము లఙించుచుండెను. ఆ పర్వతము రమ్యముగాను సుసంపన్నముగాను ఉండెను. అట్టి పర్వతమును సమీపించెను.
2.56.14
అనుష్టుప్
“మనోజ్ఞోఽయం గిరిస్సౌమ్య!
నానాద్రుమలతాయుతః।
బహుమూల ఫలో రమ్యః
స్వజీవః ప్రతిభాతి మే॥
టీక:-
 మనోజ్ఞః = మనస్సుకు ఆహ్లాదము కలిగించునది; అయం గిరిః = ఈ పర్వతము; సౌమ్య = ఓ లక్ష్మణా; నానాద్రుమ = వివిధ వృక్షములు; లతాయుతః = లతలు కలది; బహు = అనేకమైన; మూల = మూలములు; ఫలః = ఫలములు; రమ్యః = రమ్యము; స్వజీవః = జీవించవచ్చునని; ప్రతిభాతి = అనిపించుచున్నది; మే = నాకు.
భావం:-
 “లక్ష్మణా! సుందరమైనదీ, అనేక విధములైన వృక్షములు, లతలు కలదీ, అనేకములైన దుంపలు పండ్లు కలది, రమ్యమానది అయిన ఈ చిత్రకూట పర్వతము పై సుఖముగా జీవించవచ్చునని నాకు తోచుచున్నది.
2.56.15
అనుష్టుప్
మునయశ్చ మహాత్మానో
వసన్త్యస్మి శిలోచ్చయే।
అయం వాసో భవేత్తావత్
అత్ర సౌమ్య! రమేమహి॥
టీక:-
 మునయః = మునులు; చ = కూడ; మహాత్మానః = మహాత్ములైన; వసంతి = నివసించుచున్నారు; అస్మిన్ = ఈ; శిలోచ్చయే = పర్వతము మీదనే; అయం = మనము; వాసః = నివాసము; భవేత్తావత్ = అగునట్లు; అత్ర = ఇక్కడ; సౌమ్య = ఓ లక్ష్మణా; రమేమహి = ఆనందముగా ఉండెదము
భావం:-
 ఈ పర్వతముపై మహాత్ములైన మునులు కూడ నివసించుచున్నారు. లక్ష్మణ! మనమిక్కడన సంతోముగా నివసించెదము.
*గమనిక:-
 శిలోచ్చయము- వ్యుత్పత్తి- శిలా+ ఉచ్ఛయ, శిలానం ఉచ్చయ యత్ర, శిలల గుట్టలుగా కలది, పర్వతము, సంస్కృత- ఆంధ్ర నిఘంటువు.
2.56.16
అనుష్టుప్
ఇతి సీతా చ రామశ్చ
లక్ష్మణశ్చ కృతాంజలిః।
అభిగమ్యాఽశ్రమం సర్వే
వాల్మీకి మభివాదయన్॥
టీక:-
 ఇతి = ఈ విధముగా; సీతా = సీత; చ = మఱియు; రామః = రాముడు; చ = మఱియు; లక్ష్మణః = లక్ష్మణుడు; చ = మఱియు; కృతాంజలిః = చేతులు ముకుళించినవారు వారు; అభిగమ్యా = చేరి; అశ్రమం = ఆశ్రమమును; సర్వే = అందరూ; వాల్మీకిమ్ = వాల్మీకి మహర్షికి; అభివాదయన్ = నమస్కరించికి
భావం:-
 ఈ విధముగ నిర్ణయించుకొని సీతారామలక్ష్మణులు చేతులు ముకుళించుకొని, వాల్మీకి ఆశ్రమమును చేరి వాల్మీకి మహర్షికి నమస్కరించిరి.
2.56.17
అనుష్టుప్
తాన్మహర్షి ప్రముదితః
పూజయామాస ధర్మవిత్।
“అస్యతామితి” చోవాచ
స్వాగతం తు నివేద్య చ॥
టీక:-
 తాన్ = వారిని; మహర్షి = వాల్మీకి మహర్షి; ప్రముదితః = సంతోషముతో; పూజయామాస = సత్కరించెను; ధర్మవిత్ = ధర్మవేత్తౖయెన; అస్యతామ్ = కూర్చుండుడు; ఇతి = ఈ విధము; చ = ప్రకాశముగా; ఉవాచ = పలికెను; స్వాగతం = స్వాగతము; తు = శుభము, సర్వశబ్దసంబోధిని; నివేద్య = సమర్పించుట; చ = చేసి.
భావం:-
 ధర్మవేత్తౖయెన ఆ వాల్మీకి మహర్షి చాలా సంతోషించి వారిని ఆదరించెను. అప్పుడు కూర్చుండుడు అని చెప్పెను వారికి శుభ స్వాగత వచనములు పలికెను.
గమనిక:-
 వాల్మీకి ఆశ్రమము- వాల్మీకి ఆశ్రమము తమసానదీ తీరమున ఉన్నట్లును, రామాయణ కావ్యరచన అక్కడనుండే వ్యాసినట్లును బాలకాండలో పేర్కొనబడిను. కాని వాల్మీకి ఆశ్రమము చిత్రకూటమున ఉన్నట్లు ఈ శ్లోకములందు కనబడుచుండెను. భరతుని ఆగమనము వరకు చిత్రకూటమున ఉండి ఆ తరువాత అతడు తమసానదీ తీరమున నివసించినట్లు భావించవలెను. ఇది గోవిందరాజీయ వ్యాఖ్య.
2.56.18
అనుష్టుప్
తతోఽబ్రవీన్మహాబాహుః
లక్ష్మణం లక్ష్మణాగ్రజః।
సన్నివేద్య యథాన్యాయ
మాత్మానమృషయే ప్రభుః॥
టీక:-
 తతః = అటు పిమ్మట; అబ్రవీత్ = పలికెను; మహాబాహుః = గొప్ప బాహువులు గల; లక్ష్మణం = లక్ష్మణునితో; లక్ష్మణాగ్రజః = లక్ష్మణుని సోదరుడైన రాముడు; సన్నివేద్య = తెలిసెను; యథాన్యాయమ్ = యథాన్యాయముగా; ఆత్మానమ్ = తనను గురించి; ఋషయే = ఋషికి; ప్రభుః = ప్రభువు
భావం:-
 పరమశూరాగ్రేసరుడైన రాముడు తనను గూర్చి ఆ వాల్మీకిమహర్షికి పద్దతి ప్రకారం తెలిసెను. పిమ్మట రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను.
2.56.19
అనుష్టుప్
లక్ష్మణాఽఽనయ దారూణి
దృఢాని చ వరాణి చ।
కురుష్వాఽవసథం సౌమ్య
వాసే మేఽభిరతం మనః॥
టీక:-
 లక్ష్మణ = లక్ష్మణుడా; అనయ = తీసుకొని రమ్ము; దారూణి = కఱ్ఱలను (కలప); దృఢాని = బలమైన; చ = మఱియు; వరాణి = శ్రేష్ఠమైనవి; చ = మఱియు; కురుష్వా = నిర్మించు; అవసథం = గృహమును; సౌమ్య = సౌమ్యుడైన లక్ష్మణుడు; వాసే = నివాసము; మే = నాకు; అభిరతం = కోరుచున్నాను; మనః = మనస్సు
భావం:-
 లక్ష్మణా! దృఢములు, శ్రేష్ఠములు అయిన కర్రలు తీసికొని వచ్చి గృహమును నిర్మింపుము. మనము నివాసమొకటి ఏర్పరచుకొనవలెనని కోరుచున్నాను.
2.56.20
అనుష్టుప్
తస్య తద్వచనం శ్రుత్వా
సౌమిత్రిర్వివిధాన్ ద్రుమాన్।
ఆజహార తత శ్చక్రే
పర్ణశాలామరిందమః॥
టీక:-
 తస్య = ఆ రాముని యొక్క; తత్ +వచనం = ఆ మాటలను; శ్రుత్వా = విని; సౌమిత్రిః = లక్ష్మణుడు; వివిధాన్ = రకరకాలైన; ద్రుమాన్ = చెట్లను; ఆజహార = తీసుకొనివచ్చెను; తతః =అప్పుడు; చక్రే = నిర్మించెను; పర్ణశాలామ్ = పర్ణశాలను; అరిందమః = శత్రుసంహారకుడైన
భావం:-
 శత్రుసంహారకుడైన రాముని ఆజ్ఞ ప్రకారము లక్ష్మణుడు అనేక విధములైన వృక్షములను తెచ్చి పర్ణశాలను నిర్మించెను.
2.56.21
అనుష్టుప్
తాం నిష్ఠితాం బద్ధకటామ్
దృష్ట్వా రామస్సుదర్శనామ్।
శుశ్రూషమాణమేకాగ్రమ్
ఇదం వచనమబ్రవీత్॥
టీక:-
 తాం = దానిని; నిష్ఠితాం = దృఢముగా నిర్మించినది; బద్ధ = కట్టబడిన; కటామ్ = చాపలు, తడికలు కలది; దృష్ట్వా = చూచి; రామ = రాముడు; సుదర్శనామ్ = చూడచక్కనిది; శుశ్రూషమాణమ్ = సేవించనలెననుభావము; ఏకాగ్రమ్ = ఏకాగ్రచిత్తము కలవాని గూర్చి; ఇదం = ఇట్లు; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 లక్ష్మణుడు పర్ణశాలను చూడచక్కగా దృఢముగా నిర్మించి తడికలుకూడ కట్టెను. ఆ పర్ణశాలను రాముడు చూచెను. తననే సేవించుట యందు కల ఆజ్ఞ కల లక్ష్మణునికి ఇలా చెప్పెను.
2.56.22
అనుష్టుప్
“ఐణేయం మాంసమాహృత్య
శాలాం యక్ష్యామహే వయమ్।
కర్తవ్యం వాస్తుశమనమ్
సౌమిత్రే! చిరజీవిభిః॥
టీక:-
 ఐణేయం = లేడి యొక్క; మాంసమ్ = మాంసమును; ఆహృత్య = తీసుకొనివచ్చి; శాలాం = ఈ పర్ణశాలను; యక్ష్యామహే = పూజించెదము; వయమ్ = మనము; కర్తవ్యం = చేయదగినది; వాస్తుశమనమ్ = వాస్తుశాంతి; సౌమిత్రే = లక్ష్మణా; చిరజీవిభిః = చిరకాలము జీవించగోరువారు
భావం:-
 ”లక్ష్మణా! మనము లేడి మాంసము తీసికొనివచ్చి శాలపూజ చేసెదము. చిరకాలము జీవించగోరువారు వాస్తు దేవతా శాంతి చేసికొనవలెను కదా.
2.56.23
అనుష్టుప్
మృగం హత్వాఽఽనయ క్షిప్రమ్
లక్ష్మణేహ శుభేక్షణ!।
కర్తవ్యశ్శాస్త్రదృష్టో హి
విధిర్ధర్మమనుస్మర”॥
టీక:-
 మృగం = లేడిని; హత్వా = చంపి; అనయ = తీసుకొనిరమ్ము; క్షిప్రమ్ = వెంటనే; లక్ష్మణ = లక్ష్మణా; ఇహ = ఇక్కడకు; శుభేక్షణ = శుభకరమైన కన్నులు కలవాడు; కర్తవ్యః = మన కర్తవ్యము; శాస్త్రదృష్టః = శాస్త్రవిహితమగు కార్యము; హి = కదా; విధిః = చేయవలసిన కార్యము; ధర్మమ్ = ధర్మము; అనుస్మర = గుర్తుచేసుకొనుము.
భావం:-
 ఒక లేడిని చంపి శీఘ్రముగా ఇచటికి తీసికొని రమ్ము. శాస్త్ర విహితమగు కార్యమును చేయవలెను కదా. ఈ ధర్మము గుర్తుచేసుకొనుము.”
2.56.24
అనుష్టుప్
భ్రాతుర్వచనమాజ్ఞాయ
లక్ష్మణః పరవీరహా।
చకార స యథోక్తం చ
తం రామ పునరబ్రవీత్॥
టీక:-
 భ్రాతుః = అన్నగారి; వచనమ్ = మాటలను; ఆజ్ఞాయ = ఆజ్ఞాపించిన; లక్ష్మణః = లక్ష్మణుడు; పరవీరహా = శత్రువులను సంహరించెడి; చకార = చేసెను; సః = రాముడు; యథోక్తం చ = చెప్పిన విధముగా; తం = అతనితో; రామ = రాముడు; పునః = మరల; అబ్రవీత్ = చెప్పెను.
భావం:-
 శత్రు వీరులను సంహరించెడి లక్ష్మణుడు ఆజ్ఢాపించిన ప్రకారముగ చేసెను. మరల రాముడు అతనితో ఇట్లనెను.
2.56.25
అనుష్టుప్
“ఐణేయం శ్రపయస్వైతత్
శాలాం యక్ష్యామహే వయమ్।
త్వర సౌమ్య! ముహూర్తోఽయమ్
ధ్రువశ్చ దివసోఽప్యయమ్॥
టీక:-
 ఐణేయం = లేడి మాంసమును; శ్రపయస్వ = ఉడికించుము; ఏతత్ = దీనిని; శాలాం = పర్ణశాలకు; యక్ష్యామహే = పూజ చేసెదము; వయమ్ = మనము; త్వర = త్వరగా; సౌమ్య = లక్ష్మణా; ముహూర్తః = ముహూర్తము; అయమ్ = ఈ; ధ్రువశ్చ = స్థిర; దివసః అపి = దినము కూడా; అయమ్ = ఈ
భావం:-
 ఓ సౌమ్యుడా ఈ లేడి మాంసమును ఉడికించుము. పర్ణశాలా పూజ చేసెదము. ఈ దినము శనివారము. ముహూర్తము కూడ స్థిరముహూర్తము.
*గమనిక:-
 ధ్రువ ముహూర్తము- శ్లో. ఉత్తరాత్రయం రోహిఁణ్యో భాస్కరస్చ ధ్రువం స్థిరమ్ ముహూర్త చింతామణి.; ఉత్తరాత్రమము (ఉత్తర, ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర) రోహిణి నక్షత్రలతో కూడిన ఆదివారము అని, గృహశాంతికి ఇదే శ్రేష్ఠమైనది.
2.56.26
అనుష్టుప్
స లక్ష్మణః కృష్ణమృగమ్
మేధ్యం హత్వా ప్రతాపవాన్।
అథ చిక్షేప సౌమిత్రిః
సమిద్ధే జాతవేదసి॥
టీక:-
 స లక్ష్మణః = ఆ లక్ష్మణుడు; కృష్ణమృగమ్ = కృష్ణ సారము అనే జింకను; మేధ్యం = మాంసమును; హత్వా = చంపి; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడైన; అథ = అప్పుడు; చిక్షేప = అగ్నిలో కాల్చి; సౌమిత్రిః = లక్ష్మణుడు; సమిద్ధే = కాల్చెను (పక్వము చేసెను); జాతవేదసి = ప్రజ్వలించుచున్న అగ్నిలో
భావం:-
 లక్ష్మణుడు ఒక పవిత్రమైన కృష్ణసారము అను లేడిని చంపి, దానిని ప్రజ్వలించుచున్న అగ్నిలో పడవేసి దాని మాంసమును పక్వము చేసెను.
2.56.27
అనుష్టుప్
తన్తు పక్వం పరిజ్ఞాయ
నిష్టప్తం ఛిన్నశోణితమ్।
లక్ష్మణః పురుషవ్యాఘ్రమ్
అథ రాఘవమబ్రవీత్॥
టీక:-
 తం = ఆ; తు = పిదప; పక్వం = ఉడికినది; పరిజ్ఞాయ = తెలుసుకొని; నిష్టప్తం = బాగుగా కాలబడినది; ఛిన్నశోణితమ్ = రక్తము తొలగిపోయిన; లక్ష్మణః = లక్ష్మణుడు; పురుష వ్యాఘ్రమ్ = పురుష శ్రేష్ఠుడైన; అథ = అటు పిమ్మట; రాఘవమ్ = రామునితో; అబ్రవీత్ = పలికెను
భావం:-
 బాగుగా కాలి, రక్తము తొలగిపోయిన ఆ మృగము ఉడికినట్లు తెలుసుకొని లక్ష్మణుడు రామునితో ఇట్లనెను.
2.56.28
అనుష్టుప్
“అయం సర్వస్సమస్తాంగః
శృతః కృష్ణమృగో మయా।
దేవతాం దేవసంకాశ
యజస్వ కుశలో హ్యసి॥
టీక:-
 అయం = ఈ; సర్వః = పూర్తిగా; సమాప్తాంగ = అంగవైకల్యము లేని; శృతః = పక్వము; కృష్ణమృగః = కృష్ణ మృగము; మయా = నా చేత; దేవతాం = దేవతలు; దేవసంకాశ = దేవతలను పోలిన; యజస్వ = పూజింపుము; కుశలః = నేర్పుగలవాడవు; హి = కదా; అసి = ఐ ఉంటివి.
భావం:-
 అంగవైకల్యమేమియు లేని ఈ కృష్ణ మృగమును పూర్తిగా పక్వము చేసినాను. దేవతలతో సరిపోలువాడా రామా! దేవతాపూజ చేయుము. అట్టి కార్యమునందు నేర్పుగలవాడవు.
2.56.29
అనుష్టుప్
రామస్స్నాత్వా తు నియతో
గుణవాన్ జప్యకోవిదః।
సంగ్రహేణాకరోత్సర్వాన్
మన్త్రాన్సత్రావసానికాన్॥
టీక:-
 రామః = రాముడు; స్నాత్వా = స్నానము చేసి; తు = పిదప; నియతః = నియమవంతుడై; గుణవాన్ = బాగుగా తెలిసినవాడు; జప్యకోవిదః = జపించుటలో నేర్పరి అయిన; సంగ్రహేణ = సంగ్రహముగా; అకరోత్ = చదివెను; సర్వాన్ = అన్నింటినీ; మంత్రాన్ = మంత్రములను; సత్రావసానికాన్ = పఠింపదగినవన్నీ
భావం:-
 రాముడు ఆయా సందర్భములలో జపింపదగిన మంత్రములు బాగుగా తెలిసినవాడు. అతడు స్నానము చేసి నియమవంతుడై, వాస్తు పూజా సమయమున పఠింపదగిన మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా చదివెను.
2.56.30
అనుష్టుప్
ఇష్ట్వా దేవగణాన్సర్వాన్
వివేశాఽవసథం శుచిః।
బభూవ చ మనోహ్లాదో
రామస్యామితతేజసః॥
టీక:-
 ఇష్ట్వా = పూజించి; దేవగణాత్ = దేవగణములు; సర్వాన్ = అందరినీ; వివేశ = ప్రవేశించెను; అవసథం = పర్ణశాలలోనికి; శుచిః = శుభ్రముగా; బభూవ చ = అక్కడ; మనోహ్లాదః = మనస్సునందు ఆహ్లాదము; రామస్య = రాముని యొక్క; అమిత తేజసః = గొప్ప తేజస్సు కలిగిన.
భావం:-
 దేవతలనందరినీ పూజించి, పవిత్రుడై పర్ణశాలలో ప్రవేశించగనే రాముని మనస్సునందు ఆహ్లాదము కలిగెను.
2.56.31
అనుష్టుప్
వైశ్వదేవబలిం కృత్వా
రౌద్రం వైష్ణవ మేవ చ।
వాస్తుసంశమనీయాని
మంగళాని ప్రవర్తయన్॥
టీక:-
 వైశ్వదేవ = విశ్వదేవతలను; బలిం = బలిని; కృత్వా = చేసి; రౌద్రం = రుద్రుని; వైష్ణవమ్ + ఏవ చ = విష్ణువును మఱియు; వాస్తుసంశమనీయాని = వాస్తు శాంతి నిమిత్తమై; మంగళాని = మంగళములను; ప్రవర్తయన్ = సమర్పించెను.
భావం:-
 రాముడు విశ్వదేవతలను, రుద్రుని, విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి, వాస్తు శాంతి నిమిత్తమై మంగళములు చేసెను.
2.56.32
అనుష్టుప్
జపం చ న్యాయత కృత్వా
స్నాత్వా నద్యాం యథావిధి।
పాపసంశమనం రామః
చకార బలిముత్తమమ్॥
టీక:-
 జపం = జపించి; చ = మఱియు; న్యాయతః = నియమానుసారముగా; కృత్వా = చేపి; స్నాత్వా = సాన్నము; నద్యాం = నదిలో; యథావిధి = యథావిధిగా; పాప సంశమనం = పాపములను నశింపచేయునది; రామః = రాముడు; చకార = ఇచ్చెను; బలిముత్తమమ్ = బలిమ్ + ఉత్తమమ్, ఉత్తమమైన బలిని.
భావం:-
 నియమానుసారంగా జపించి, యథావిధిగా నదిలో స్నానము చేసి, పాపములను నశింపచేయు ఉత్తమ బలిని ఇచ్చెను.
2.56.33
అనుష్టుప్
వేదిస్థలవిధానాని
చైత్యాన్యాయతనాని చ।
ఆశ్రమస్యానురూపాణి
స్థాపయామాస రాఘవః॥
టీక:-
 వేదిః = తిన్నెల, అరుగుల, వేదికల; స్థలః = స్థలములు; విధానాని = విధానములో; చైత్యాని = అగ్నిగుండములు; ఆయతనాని = పూజాస్థలములను; చ = కూడా; ఆశ్రమస్య = ఆశ్రమములో; అనురూపాణి = సమానమైన; స్థాపయామాస = స్థాపించెను; రాఘవః = లక్ష్మణుడు.
భావం:-
 లక్ష్మణుడు, ఆశ్రమములో తిన్నెల (అరుగుల) రూపంలో అనువైన అగ్నిగుండములు, పూజావేదికలు, స్థాపించెను.
2.56.34
అనుష్టుప్
వన్యైర్మాల్యైః ఫలైర్మూలైః
పక్వైర్మాంసైర్యథావిధి।
అద్భిర్జపైశ్చ వేదోక్తైః
దర్భైశ్చ ససమిత్కుశైః॥
టీక:-
 వన్యైః = వనములో లభించువానితో; మాల్యైః = పూలమాలలు; ఫలైః = పండ్లు; మూలైః = దుంపలు; పక్వైః = పక్వమైన; మాంసైః = మాంసములు; యథావిధి = యధావిధిగా; అద్భిః = ఉదకము; జపైశ్చ = జపమును; వేదోక్తైః = వేదోక్త విధానమున; దర్భైః = దర్భలు; చ = మఱియు; స = సహితముగా; సమిత్ = మంచి సమిధలు అనగా చిదుగులు అను అగ్నిహోత్రమునకు పనికివచ్చు చిన్నచిన్న కఱ్ఱపుల్లలు; కుశైః = కుశలు
భావం:-
 సీతారామలక్ష్మణులు వనమునందు లభించు పుష్పములు, ఫలములు, మూలములు, పక్వ మాంసములు, ఉదకము, వేదోక్త విధానమున జపమును, దర్భలు, మంచి సమిధలు, కుశలు మొదలగువానిచే యథావిధిగా పూజించెను.
2.56.35
అనుష్టుప్
తౌ తర్పయిత్వా భూతాని
రాఘవౌ సహ సీతయా।
తదా వివిశతుశ్శాలామ్
సుశుభాం శుభలక్షణౌ॥
టీక:-
 తౌ = వారు; తర్పయిత్వా = సమర్పించి; భూతాని = భూతతృప్తిని; రాఘవౌ = రామలక్ష్మణులు; సహ = కలసి; సీతయా = సీతతో; తదా = అప్పుడు; వివిశతుః = ప్రవేశించెను; శాలామ్ = పర్ణశాలలోనికి; సుశుభామ్ = మంచి శోభనకరమైవది; శుభలక్షణౌ = శుభ లక్షణములు కలిగిన.
భావం:-
 భూత తృప్తిని చేసి, శుభలక్షణములు కలిగిన రామలక్ష్మణులు సీతతో కలిసి, శుభకరమైన పర్ణశాలలోనికి ప్రవేశించిరి.
2.56.36
జగతి
తాం వృక్షపర్ణచ్ఛదనాం మనోజ్ఞాం
యథాప్రదేశం సుకృతాం నివాతామ్।
వాసాయ సర్వే వివిశుస్సమేతా-
స్సభాం యథా దేవగణాస్సుధర్మామ్॥
టీక:-
 తాం = వారు; వృక్షపర్ణచ్ఛదనాం = చెట్ల ఆకులచే ఏర్పరచిన ఆచ్ఛాదనము కలది; మనోజ్ఞాం = మనోహరమైనది; యథాప్రదేశం = యోగ్యమైన ప్రదేశము; సుకృతామ్ = చక్కగా నిర్మించబడినది; నివాతామ్ = సురక్షితమైనది, వావిళ్ళ; వాసాయ = నివసించుటకు; సర్వే = అందరూ; వివిశుః = ప్రవేశించిరి; సమేతాః = కలసి; సభాం = సభలోనికి; యథా = ఆ విధముగా; దేవగణాః = దేవతా గణములు; సుధర్మామ్ వ = సుధర్మయను పేరు గల దేవసభను
భావం:-
 చెట్ల ఆకులచే ఏర్పరచిన ఆచ్ఛాదనము కలదీ, మనోహరమూ, ఏ ప్రదేశములో ఏ విధముగా ఉండవలెనో అట్లు నిర్మింపబడినదీ, సురక్షిచమైనదీ, అయిన ఆ పర్ణశాలలోనికి సీతారామలక్ష్మణులు ముగ్గురును కలిసి, దేవతా గణములు సుధర్మయను దేవసభలోనికి ప్రవేశించినట్లు ప్రవేశించిరి.
2.56.37
జగతి
అనేకనానామృగపక్షిసంకులే
విచిత్రపత్రస్తబకైర్ద్రుమైర్యుతే।
వనోత్తమే వ్యాలమృగానునాదితే
తదా విజహ్రు స్సుసుఖం జితేన్ద్రియాః॥
టీక:-
 అనేక = అనేకమైన; నానా = రకరకముల; మృగ = మృగములు; పక్షి = పక్షులు; సంకులే = నిండినది; విచిత్ర = రంగురంగుల; పత్రః = ఆకులు; తబకైః = పుష్ప గుచ్ఛములు; ద్రుమైర్యుతే = వృక్షములు కలది; వనః = నివాసయోగ్యమైన అడవులలో; ఉత్తమే = శ్రేష్ఠమైనదానినందు; వ్యాల = మదపుటేనుగులు; మృగ = లేళ్ళు చేతను; అనునాదితే = ధ్వనింపచేయబడినది; తదా = అప్పుడు; విజహ్రుః = విహరించెను; సుసుఖం = ఎంతో సంతోషముతో; జితేంద్రియాః = జితేంద్రియులైన సీతారామలక్ష్మణులు.
భావం:-
 జితేంద్రియులైన సీతారామలక్ష్మణులు అసంఖ్యాకములైన రకరకముల పక్షి మృగాదులతో వ్యాకులము, రంగురంగుల పత్రదళములతో, పుష్ప గుచ్ఛములతో నిండిన వృక్షములు కలదైన ఆ వనమునందు సుఖముగా విహరించిరి. అందు మదపుటేనుగుల, ఇతర జంతువుల అరుపులు చక్కగా వినబడుచుండును.
2.56.38
జగతి
సురమ్యమాసాద్య తు చిత్రకూటం
నదీం చ తాం మాల్యవతీం సుతీర్థామ్।
ననంద హృష్టో మృగపక్షిజుష్టాం
జహౌ చ దుఖం పురవిప్రవాసాత్॥
టీక:-
 సురమ్యమ్ = మంచి అందమైన; ఆసాద్య = వచ్చిన; తు = పిమ్మట; చిత్రకూటం = చిత్రకూట పర్వతమును; నదీం = నదులు; చ = మఱియు; తాం = ఆ; మాల్యవతీం = మాల్యవతి అను పేరు గల; సుతీర్థామ్ = నదీ తీర ప్రాంతమును; ననంద = ఆనందముతో; హృష్టః = సంతోషించిరి; మృగ = మృగములచే; పక్షి = పక్షులచే; జుష్టాం = సేవితమైనది; జహౌ = విడిచిరి; చ = ఇంక; దుఃఖం = దుఃఖమును; పురవి = నగరమును; ప్రవాసాత్ = వదలి వచ్చినందుకు.
భావం:-
 సమృద్దిగా గల మృగములూ పక్షులూ, మాల్యవతీ నది యొక్క మంచి తీర్థములతో బహు రమ్యమైన ఆ చిత్రకూటమునకు వచ్చిన పిమ్మట, చాల ఆనందించుచు, సీతారామలక్ష్మణులు తమ పురమును వదిలి వచ్చినందు వలన కలిగిన దుఃఖమును విడచిరి.
2.56.39
గద్య
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్య కాండే షట్పంచాశసర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; షట్పంచాశ [5] = ఏభైఆరవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [56] ఏభైఆరవ సర్గ సంపూర్ణము.
2.57.1.అనుష్టుప్
కథయిత్వా సుదుఃఖార్తః
సుమంత్రేణ చిరం సహ।
రామే దక్షిణకూలస్థే
జగామ స్వగృహం గుహః॥
టీక:-
 కథయిత్వా = తెలియజేసి; సుదుఃఖార్తః = మిక్కిలి దుఃఖముచే పీడించబడి; సుమంత్రేణ = సుమంత్రునితో; చిరం = చాలా కాలము; సహ = కూడి; రామే = రాముడు; దక్షిణకూలస్థే = దక్షిణ తీరమునందు ఉండగా; జగామ = వెళ్ళెను; స్వగృహం = స్వగృహమును గూర్చి; గుహః = గుహుడు.
భావం:-
 రాముడు గంగానదిని దాటి దక్షిణ తీరమునకు చేరిన తరువాత, గుహుడు సుమంత్రునితో చాల కాలము సంభాషించి, చాల దుఃఖముతో తన నివాసమునకు తిరిగి వెళ్ళెను.
2.57.2.అనుష్టుప్
భరద్వాజాభిగమనమ్
ప్రయాగే చ సహాఽ సనమ్।
ఆగిరేర్గమనం తేషామ్
తత్రస్థైరుపలక్షితమ్॥
టీక:-
 భరద్వాజ = భరద్వాజ మహర్షిని గూర్చి ; అభిగమనమ్ = వెళ్ళుట; ప్రయాగే = ప్రయాగయందు; సహ = కూడి; ఆసనమ్ = కూర్చుండి; ఆగిరేః = పర్వతము వరకు; గమనం = వెళ్ళుట; తేషామ్ = వారియొక్క; తత్రస్థైః = అక్కడ ఉన్నవారిచే; ఉపలక్షితమ్ = చూడబడినది.
భావం:-
  అక్కడనే ఉన్న గుహుడు, సుమంత్రుడు మున్నగువారు, సీతారామ లక్ష్మణులు భరద్వాజమహర్షి వద్దకు చేరుట, ఆ మహర్షితో కలిసి సంభాషించుకొనుట, చిత్రకూటము వరకు వెళ్ళుట గురించి తెలుసుకొనిరి.
2.57.3.అనుష్టుప్
అనుజ్ఞాతస్సుమంత్రోఽ థ
యోజయిత్వా హయోత్తమాన్।
అయోధ్యామేవ నగరీమ్
ప్రయయౌ గాఢదుర్మనాః॥
టీక:-
 అనుజ్ఞాతః = అనుమతిని పొంది; సుమంత్రః = సుమంత్రుడు; అథ = తరువాత; యోజయిత్వా = రథమునకు పూన్చి; హయోత్తమాన్ = శ్రేష్ఠమైన గుఱ్ఱములను; అయోధ్యామ్ = అయోధ్యా; ఏవ = అను; నగరీమ్ = నగరమును గూర్చి; ప్రయయౌ = పొందెను; గాఢ = మిక్కిలి; దుర్మనాః = దుఃఖిత మనస్కుడై.
భావం:-
 రాముని అనుమతిని పొందిన సుమంత్రుడు, రథమునకు ఆ శ్రేష్ఠమైన గుఱ్ఱములను పూన్చుకొని, చాలా దుఃఖితుడై అయోధ్యానగరమునకే తిరిగి బయలుదేరెను.
2.57.4.అనుష్టుప్
స వనాని సుగంధీని
సరితశ్చ సరాంసి చ।
పశ్యన్నతియయౌ శీఘ్రమ్
గ్రామాణి నగరాణి చ॥
టీక:-
 సః = అతడు; వనాని = వనములను; సుగంధీని = సువాసనా భరితమైన; సరితః = నదులను; చ = మఱియు; సరాంసి = సరస్సులను; పశ్యన్ = చూచుచు; అతియయౌ = దాటెను; శీఘ్రమ్ = వేగముగ; గ్రామాణి = గ్రామములను; నగరాణి = నగరములను.
భావం:-
 సుమంత్రుడు మంచి సువాసనా భరితమైన వనములను, నదులను, సరస్సులను, గ్రామములను, నగరములను, చూచుచు వాటిని వేగముగా దాటి ప్రయాణించెను.
2.57.5.అనుష్టుప్
తతస్సాయాహ్న సమయే
తృతీయేఽ హని సారథిః।
అయోధ్యాం సమనుప్రాప్య
నిరానందాం దదర్శ హ॥
టీక:-
 తతః = తరువాత; సాయాహ్న = సాయంత్రపు; సమయే = కాలములో; తృతీయే = మూడవ; అహని = దినమున; సారథిః = సారథి; అయోధ్యాం = అయోధ్యను; సమనుప్రాప్య = చేరి; నిరానందాం = ఆనందము లేని; దదర్శ హ = చూచెను.
భావం:-
 సుమంత్రుడు మూడవదినమున సాయంకాల సమయమునందు సంతోషమన్నదే కనిపించని అయోధ్యానగరమును చేరెను.
2.57.6.అనుష్టుప్
స శూన్యామివ నిశ్శబ్దామ్
దృష్ట్వా పరమదుర్మనాః।
సుమంత్రశ్చింతయామాస
శోకవేగసమాహతః॥
టీక:-
 స = ఆ; శూన్యామ్ = పాడుపడినదాని, వావిళ్ళ నిఘంటువు, ఆంధ్రభారతి నిఘంటువు; ఇవ = వలె; నిశ్శబ్దామ్ = నిశ్శబ్దముగ ఉన్నది; దృష్ట్వా = చూచి; పరమ = చాల; దుర్మనాః = ఖేదపడిన మనస్సు కలవాడై, ఆంధ్రభారతిడాట్-కం; మంత్రః = సుమంత్రుడు; చింతయామాస = ఆలోచించెను; శోకవేగ = దుఃఖముయొక్క; వేగ = ప్రవాహవడిచేత, వావిళ్ళ నిఘంటువు; సమాహతః = కొట్టబడినవాడై.
భావం:-
 సుమంత్రుడు, పాడుపడినట్లునదియును నిశ్శబ్దముగను, ఎట్టి సందడియును లేని అయోధ్యను చూచి, చాల చింతాక్రాంతుడై, ఉబికి వచ్చుచున్న దుఃఖముతో ఈ విధముగ తలంచెను.
*గమనిక:-
 దుర్మనాః- దుర్+ మనస్. దుష్టం చింతావ్యాకులం, చింతతోకూడిన మనస్సు కలవాడు, ఖేదపడిన మనసు కలవాడు, ఆంధ్రభారతి నిఘంటువు
2.57.7.అనుష్టుప్
కచ్చిన్న సగజా సాఽ శ్వా
సజనా సజనాధిపా।
రామసంతాపదుఃఖేన
దగ్ధా శోకాగ్నినా పురీ॥
టీక:-
 కచ్చిత్ = కదా; న = లేదు; స = కలిగి, కూడి; గజా = ఏనుగులతో; స = కలిగి, కూడి; అశ్వా = గుఱ్ఱములతో; స = కలిగి, కూడి; జనా = జనులతో; స = కలిగి, కూడి; జనాధిపా = రాజులతో; రామ = రాముని సంబంధపు; సంతాప = బాధించు; దుఃఖేన = దుఃఖమువలన; దగ్ధా = కాల్చబడుట; శోక = దుఃఖము; అగ్నినా = అగ్నిచే; పురీ = నగరము.
భావం:-
 ఏనుగులతోను, గుఱ్ఱములతోను, జనులతోను, రాజులతోను కూడియుండిన ఈ అయోధ్యానగరము, రాముని విషయమై, దుఃఖముచే పీడింపబడి, శోకాగ్నిచే దహింపబడలేదు కదా.
2.57.8.అనుష్టుప్
ఇతి చింతాపరస్సూతో
వాజిభిశ్శీఘ్రపాతిభిః।
నగరద్వారమాసాద్య
త్వరితః ప్రవివేశ హ॥
టీక:-
 ఇతి = ఇట్లు; చింతాపరః = చింతతో నిండిన; సూతః = సారథి; వాజిభిః = గుఱ్ఱములచే; శీఘ్రపాతిభిః = వేగముగా పరుగెత్తెడి; నగరద్వారమ్ = నగరముపు ద్వారమును; ఆసాద్య = పొంది; త్వరితః = త్వరగా; ప్రవివేశహ = ప్రవేశించెను.
భావం:-
 ఈ విధముగా సుమంత్రుడు చింతించుచు, వేగముగా పరిగెత్తెడి గుఱ్ఱములతో అయోధ్యానగరపు సింహద్వారమును ప్రవేశించెను.
2.57.9.అనుష్టుప్
సుమంత్రమభియాంతం తమ్
శతశోఽ థ సహస్రశః।
“క్వ రామ” ఇతి పృచ్ఛంతః
సూతమభ్యద్రవన్నరాః॥
టీక:-
 సుమంత్రమ్ = సుమంత్రుని; అభియాంతం = వచ్చుచున్న; తమ్ = ఆ; శతశః = వందలకొలది; అథ = తరువాత; సహస్రశః = వేలకొలది; క్వ = ఎక్కడ; రామః = రాముడు; ఇతి = ఇట్లు; పృచ్ఛంతః = ప్రశ్నించుచు; సూతమ్ = సూతుడు; అభ్యద్రవన్ = ఆ వైపు వేగముగ వెళ్ళిరి; నరాః = ప్రజలు.
భావం:-
 వందలకొలది, వేలకొలది ప్రజలు, సుమంత్రుని రాకను చూచి, "రాముడు ఎక్కడ" అని ప్రశ్నించుచు సుమంత్రుని వైపు పరుగెత్తిరి.
2.57.10.అనుష్టుప్
తేషాం శశంస గంగాయామ్
అహమాపృచ్ఛ్య రాఘవమ్।
అనుజ్ఞాతో నివృత్తోఽ స్మి
ధార్మికేణ మహాత్మానా॥
టీక:-
 తేషాం = వారికి; శశంస = చెప్పెను; గంగాయామ్ = గంగానది వద్ద; అహమ్ = నేను; ఆపృచ్ఛ్య = అడిగి; రాఘవమ్ = రాముని; అనుజ్ఞాతః = అనుజ్ఞ యివ్వబడినవాడనై; నివృత్తః = తిరిగి వచ్చి; అస్మి = ఉన్నాను; ధార్మికేణ = ధర్మాత్ముడైన; మహాత్మానా = మహాత్ముడైన.
భావం:-
 "నేను గంగానది ఒడ్డున రామునకు వీడ్కోలు పలికి, ధర్మాత్ముడైన ఆ మహాత్ముని అనుమతి గ్రహించి తిరిగి వచ్చితిని" అని సుమంత్రుడు వారికి చెప్పెను.
2.57.11.అనుష్టుప్
తే తీర్ణా ఇతి విజ్ఞాయ
బాష్పపూర్ణముఖా జనాః।
అహో ధిగితి నిశ్శ్వస్య
హా రామేతి చ చుక్రుశుః॥
టీక:-
 తే = వారు; తీర్ణా = దాటిరి; ఇతి = అని; విజ్ఞాయ = తెలుసుకొని; బాష్ప = కన్నీటితో; పూర్ణ = నిండిన; ముఖాః = ముఖములు కలవారై; జనాః = ప్రజలు; అహో = అయ్యో; ధిక్ = ఛా; ఇతి = అని; నిశ్శ్వస్య = నిట్టూర్చి; హా రామా = ఓ రామా; ఇతి = అని; చుక్రుశుః = ఆర్తనాదము చేసిరి.
భావం:-
 సీతారామలక్ష్మణులు గంగానదిని దాటి వెళ్లిపోయినారని తెలుసుకొని, ఆ జనులు "అయ్యో" అని "ఛా" అని తమను తాము నిందించుకొనుచు, నిట్టూర్పులు విడుచుచు, "హా రామా!" యనుచు ఆర్తనాదములు చేయుచు ఉండిరి.
2.57.12.అనుష్టుప్
శుశ్రావ చ వచస్తేషామ్
బృందం బృందం చ తిష్ఠతామ్।
హతాస్మ ఖలు యే నేహ
పశ్యామ ఇతి రాఘవమ్॥
టీక:-
 శుశ్రావ = వినెను; చ = కూడ; వచః = మాటలను; తేషామ్ = వారియొక్క; బృందం = గుంపులు; బృందం = గుంపులుగా; తిష్ఠతామ్ = ఉన్న; హతాః = దెబ్బతిన్న వారము; స్మ = అయినాము; ఖలు = నిజముగా యే = ఏ; న = లేదు; ఇహ = ఇక్కడ; పశ్యామ = చూచుట; ఇతి = అని; రాఘవమ్ = రాముని.
భావం:-
 ప్రజలు అక్కడ గుంపులు గుంపులుగా చేరుకొని, "రాముడు మనకు ఇక్కడ కనిపించడు. ఎంత దెబ్బతింటిమి" అని అనుకొనుచుండుట సుమంత్రుడు వినెను.
2.57.13.అనుష్టుప్
దానయజ్ఞవివాహేషు
సమాజేషు మహత్సు చ।
న ద్రక్ష్యామః పునర్జాతు
ధార్మికం రామమంతరా॥
టీక:-
 దాన = దానములందు; యజ్ఞ = యజ్ఞములందు; వివాహేషు = వివాహ వేడుకలందు; సమాజేషు = సమాజములందు; మహత్సు = గొప్పవైన; న = ఉండదు; ద్రక్ష్యామః = చూచుట; పునః = మరల; జాతు = ఎన్నడును; ధార్మికం = ధర్మాత్ముడైన; రామమ్ = రాముని; అంతరా = మధ్యన.
భావం:-
 గొప్పదానముల యందును, యజ్ఞముల యందును, వివాహవేడుకల యందును, సమాజముల యందును, మనము రాముని చూచుచుండెడివారము. ఇప్పుడిక రాముడు ఎన్నడును మనకు కనపడడు.
2.57.14.అనుష్టుప్
కిం సమర్థం జనస్యాస్య
కిం ప్రియం కిం సుఖావహమ్।
ఇతి రామేణ నగరమ్
పితృవత్పరిపాలితమ్॥
టీక:-
 కిం = ఏది; సమర్థం = తగినది; జనస్య = జనమునకు; అస్య = ఈ; కిం = ఏది; ప్రియం = ఇష్టమైనది; కిం = ఏది; సుఖావహమ్ = సుఖమును కలిగించునది; ఇతి = అని; రామేణ = రామునిచే; నగరమ్ = నగరము; పితృవత్ = తండ్రివలె; పరిపాలితమ్ = పాలింపబడినది.
భావం:-
 రాముడు తండ్రి వలె "ఈ పురజనులకు ఏది తగినది, ప్రియమైనది, సుఖమును ప్రసాదించునది" అని ఆలోచించి అయోధ్యను పాలించుచుండెను.
2.57.15.అనుష్టుప్
వాతాయనగతానాం చ
స్త్రీణామన్వంతరాపణమ్।
రామశోకాభితప్తానామ్
శుశ్రావ పరిదేవనమ్॥
టీక:-
 వాతాయనగతానాం = కిటికీలందు; చ = నుండి; స్త్రీణామ్ = స్త్రీలయొక్క; అన్వంతర = మధ్యన; ఆపణమ్ = అంగళ్ళు (దుకాణములు / సంత); రామః = రాముని గూర్చి; శోకాః = విచారించుటను; అభితప్తానామ్ = మిక్కిలి తపించుటను; శుశ్రావ = వినెను; పరిదేవనమ్ = ఏడుపును.
భావం:-
 నివాస భవనముల కిటికీలలోనుండి స్త్రీల విలాపములను, విపణివీధిలో రాముని విషయమై విలపించుచున్న జనుల ఆర్తనాదములను సుమంత్రుడు వినెను.
2.57.16.అనుష్టుప్
స రాజమార్గమధ్యేన
సుమంత్రః పిహితాననః।
యత్ర రాజా దశరథః
తదేవోపయయౌ గృహమ్॥
టీక:-
 సః = ఆ; రాజమార్గమధ్యేన = రాజమార్గమునందు; సుమంత్రః = సుమంత్రుడు; పిహిత = కప్పబడిన; ఆననః = ముఖము కలవాడై; యత్ర = ఎక్కడ కలడో; రాజా = రాజు; దశరథః = దశరథుడు; తత్ ఏవ = అక్కడకే; ఉపయయౌ = చేరెను; గృహమ్ = గృహమును.
భావం:-
 సుమంత్రుడు తన ముఖమును కనబడకుండునట్లు కప్పివేసుకుని, రాజమార్గము గుండా వెళ్ళి దశరథుడు ఉన్న గృహమును చేరెను.
2.57.17.అనుష్టుప్
సోఽ వతీర్య రథాచ్ఛీఘ్రమ్
రాజవేశ్మ ప్రవిశ్య చ।
కక్ష్యాస్సప్తాభిచక్రామ
మహాజనసమాకులాః॥
టీక:-
 సః = అతడు; అవతీర్య = దిగి; రథాత్ = రథమునుండి; శీఘ్రమ్ = వేగముగ; రాజవేశ్మ = రాజుగృహమును; ప్రవిశ్య = ప్రవేశించెను; కక్ష్యాః = ముంగిళ్ళు; సప్త = ఏడు; అభిచక్రామ = దాటెను; మహాజన = చాలా జనులతో; సమాకులాః = కిక్కిరిసియున్న.
భావం:-
 సుమంత్రుడు రథమునుండి దిగి, జనులతో క్రిక్కిరిసియున్న ఏడు ముంగిళ్ళను దాటి, వేగముగా రాచలోగిలి లోనికి ప్రవేశించెను.
2.57.18.అనుష్టుప్
హర్మ్యై ర్విమానైః ప్రాసాదైః
అవేక్ష్యాథ సమాగతమ్।
హాహాకారకృతా నార్యో
రామదర్శనకర్శితాః॥
టీక:-
 హర్మ్యైః = మేడలనుండి; విమానైః = బహుళ అంతస్తుల మేడల నుండి; ప్రాసాదైః = రాజ భవనములనుండి; అవేక్ష్య = చూచి; అథ = తరువాత; సమాగతమ్ = వచ్చియున్న; హాహాకార = హాహాకారములు; కృతాః = చేసిరి; నార్యః = స్త్రీలు; రామదర్శన = రాముని దర్శనము లేక; కర్శితాః = కృశించినవారై.
భావం:-
 మేడలలోను, బహుళ అంతస్తుల మేడలలోను, రాజభవనములలోను ఉన్న స్త్రీలు, సుమంత్రుని రాకను చూచి, రాముడు కనిపించకపోవుటవలన చింతించి, ఆక్రందనలను చేసిరి.
2.57.19.అనుష్టుప్
ఆయతైర్విమలైర్నేత్రైః
అశ్రువేగపరిప్లుతైః।
అన్యోన్యమభివీక్షంతేఽ
వ్యక్తమార్తతరాః స్త్రియః॥
టీక:-
 ఆయతైః = విశాలమైన; విమలైః = స్వచ్ఛమైన; నేత్రైః = కన్నులతో; అశ్రువేగపరిప్లుతైః = ఉబికి వచ్చుచున్న కన్నీటితో; అన్యోన్యమ్ = పరస్పరము; అభివీక్షంతే = చూచుకొనుచుండిరి; అవ్యక్తమ్ = చెప్పలేని; ఆర్తతరాః = చాల దుఃఖించుచున్నవారై; స్త్రియః = స్త్రీలు.
భావం:-
 స్త్రీలు చాల దుఃఖముతో విశాలమైన, స్వచ్ఛమైన, ఉబికి వచ్చుచున్న కన్నీటితో నిండియున్న కన్నులతో ఒకరినొకరు చూచుకొనుచుండిరి.
2.57.20.అనుష్టుప్
తతో దశరథస్త్రీణామ్
ప్రాసాదేభ్య స్తత స్తతః।
రామశోకాభితప్తానామ్
మందం శుశ్రావ జల్పితమ్॥
టీక:-
 తతః = తరువాత; దశరథ = దశరథుని; స్త్రీణామ్ = స్త్రీలయొక్క; ప్రాసాదేభ్యః = ప్రాసాదములనుండి; తతః తతః = ఆ యా; రామ = రాముని గురించిన; శోకాః = శోకముతో; అభితప్తానామ్ = మిక్కిలి తపింపబడిన; మందం = మెల్లగ; శుశ్రావ = వినెను; జల్పితమ్ = సంభాషణమును.
భావం:-
 సుమంత్రుడు, దశరథుని భార్యలు రామునిగురించి శోకముతో బాధపడుచు, రాజప్రాసాదములలో మెల్ల మెల్లగా చెప్పుకొనుచున్న మాటలను వినెను.
2.57.21.అనుష్టుప్
“సహ రామేణ నిర్యాతో
వినా రామ మిహాగతః।
సూతః కిన్నామ కౌసల్యామ్
శోచంతీం ప్రతివక్ష్యతి॥
టీక:-
 సహ = కూడి; రామేణ = రామునితో; నిర్యాతః = బయలుదేరి వెళ్ళినవాడై; వినా = లేక; రామమ్ = రాముడు; ఇహ = ఇక్కడకు; ఆగతః = వచ్చి యున్న; సూతః = రథసారథి; కిం నామ = ఏమి; కౌసల్యామ్ = కౌసల్యను గూర్చి; శోచంతీం = శోకించుచున్న; ప్రతివక్ష్యతి = సమాధానము చెప్పునో.
భావం:-
 “రామునితో కలిసివెళ్లిన సుమంత్రుడు, ఇప్పుడు రాముడు లేకయే తిరిగివచ్చి, దుఃఖించుచున్న కౌసల్యకు ఏమని సమాధానము చెప్పును?
2.57.22.అనుష్టుప్
యథా చ మన్యే దుర్జీవమ్
ఏవం న సుకరం ధ్రువమ్।
ఆచ్ఛిద్య పుత్రే నిర్యాతే
కౌసల్యా యత్ర జీవతి”॥
టీక:-
 యథా = ఎట్లు; మన్యే = తలంచుచున్నాను; దుర్జీవమ్ = జీవించుట కష్టమైమది; ఏవం = ఇట్లు; న = కాదు; సుకరం = సులభముగ; ధ్రువమ్ = నిశ్చయము; ఆచ్ఛిద్య = బలవంతముగ; పుత్రే = పుత్రుడు; నిర్యాతే = వెళ్ళిపోగా; కౌసల్యా = కౌసల్య; యత్ర = ఎక్కడ; జీవతి = జీవించును.
భావం:-
 తాను అనుమతించకున్నను, తన పుత్రుడు దూరముగ వెళ్లిపోయిన తరువాత కూడ, కౌసల్య జీవించి యున్నది. ఇట్లు జీవనము సాగించుట చాల కష్టము. సులభముగ చేయదగినది కాదు అని తలంచెదను.”
2.57.23.అనుష్టుప్
సత్యరూపం తు తద్వాక్యమ్
రాజ్ఞః స్త్రీణాం నిశామయన్।
ప్రదీప్తమివ శోకేన
వివేశ సహసా గృహమ్॥
టీక:-
 సత్యరూపం = యథార్థమైన; తత్ = ఆ; వాక్యమ్ = మాటలు; రాజ్ఞః = రాజుయొక్క; స్త్రీణాం = స్త్రీలయొక్క; నిశామయన్ = వినుచు; ప్రదీప్తమ్ = మండుచున్నట్లు; ఇవ = వలె; శోకేన = శోకముతో; వివేశ = ప్రవేశించెను; సహసా = వెంటనే; గృహమ్ = గృహమును గూర్చి.
భావం:-
 దశరథుని భార్యలు అనుకొనుచున్న యథార్థమైన మాటలను సుమంత్రుడు వినుచు వేగముగ, శోకాగ్నితో కాలిపోతున్నట్లున్న గృహమును ప్రవేశించెను.
2.57.24.అనుష్టుప్
స ప్రవిశ్యాష్టమీం కక్ష్యామ్
రాజానం దీనమాతురమ్।
పుత్రశోకపరిమ్లానమ్
అపశ్యత్పాండురే గృహే॥
టీక:-
 సః = అతడు; ప్రవిశ్య = ప్రవేశించి; అష్టమీం = ఎనిమిదవ; కక్ష్యామ్ = వాకిలిని; రాజానం = రాజును; దీనమ్ = దీనుడిని; ఆతురమ్ = దుఃఖితుడిని; పుత్రశోక = పుత్రవిరహమువలనశోకముచే; పరిమ్లానమ్ = మిక్కిలి వాడిపోయి యున్నవాడు; అపశ్యత్ = చూచెను; పాండురే = తెల్లని; గృహే = గృహమునందు.
భావం:-
 సుమంత్రుడు ఎనిమిదవ వాకిలిని ప్రవేశించి, అక్కడ తెల్లని గృహమునందు, పుత్రశోకముతో కృంగిపోయి, దుఃఖించుచు, దీనముగనున్న దశరథుడిని చూచెను.
2.57.25.అనుష్టుప్
అభిగమ్య తమాసీనమ్
నరేన్ద్ర మభివాద్య చ।
సుమంత్రో రామవచనమ్
యథోక్తం ప్రత్యవేదయత్॥
టీక:-
 అభిగమ్య = సమీపించి; తమ్ = ఆ; ఆసీనమ్ = కూర్చొనియున్న; నరేన్ద్రమ్ = రాజును; అభివాద్య = నమస్కరించి; సుమంత్రః = సుమంత్రుడు; రామవచనమ్ = రాముని మాటను; యథ = అట్లు; ఉక్తం = చెప్పిన; ప్రత్యవేదయత్ = తెలియజేసెను.
భావం:-
 సుమంత్రుడు, కూర్చొనియున్న దశరథుని సమీపించి, నమస్కరించి, రాముని సందేశమును యథాతథముగ తెలియజేసెను.
2.57.26.అనుష్టుప్
స తూష్ణీమేవ తచ్ఛ్రుత్వా
రాజా విభ్రాంతచేతనః।
మూర్ఛితో న్యపతద్భూమౌ
రామశోకాభిపీడితః॥
టీక:-
 సః = అతడు; తూష్ణీమ్ ఏవ = మౌనముగనే; తత్ = ఆ; శ్రుత్వా = విని; రాజా = రాజు; విభ్రాంతచేతనః = నిశ్చేష్టుడై; మూర్ఛితః = మూర్ఛనొందినవాడై; న్యపతత్ = పడిపోయెను; భూమౌ = నేలపై; రామశోకాః = రామునిగూర్చి శోకముతో; అభిపీడితః = పీడింపబడినవాడై.
భావం:-
 దశరథుడు, సుమంత్రుడు వినిపించిన రాముని సందేశమును మౌనముగానే విని, చేష్టలుడిగి, శోకతప్తుడై, మూర్ఛనొంది నేలపై పడిపోయెను.
2.57.27.అనుష్టుప్
తతోఽ ంతఃపురమావిద్ధమ్
మూర్ఛితే పృథివీపతౌ।
ఉద్ధృత్య బాహూ చుక్రోశ
నృపతౌ పతితే క్షితౌ॥
టీక:-
 తతః = తరువాత; అంతఃపురమ్ = అంతఃపురము; ఆవిద్ధమ్ = కొట్టబడెను; మూర్ఛితే = మూర్చనొందుచుండగ; పృథివీపతౌ = రాజు; ఉద్ధృత్య = ఎత్తి; బాహూ = బాహువులను; చుక్రోశ = ఏడ్చెను; నృపతౌ = రాజు; పతితే = పడిపోవుచుండగ; క్షితౌ = నేలపై.
భావం:-
 దశరథుడు మూర్ఛనొందినందువలన, అంతఃపురములోని వారందరును చాల బాధపడిరి. అతడు నేలపై పడిపోగా, వారందరు చేతులు పైకెత్తి విలపించిరి.
2.57.28.అనుష్టుప్
సుమిత్రయా తు సహితా
కౌసల్యా పతితం పతిమ్।
ఉత్థాపయామాస తదా
వచనం చేదమబ్రవీత్॥
టీక:-
 సుమిత్రయా = సుమిత్రతో; సహితా = కూడిన; కౌసల్యా = కౌసల్య; పతితం = పడిపోయిన; పతిమ్ = భర్తను; ఉత్థాపయామాస = లేవనెత్తెను; తదా = అప్పుడు; వచనం = వచనమును; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను.
భావం:-
 నేలపై పడిపోయిన తమ భర్తను కౌసల్యయు, సుమిత్రయు కలిసి పైకి లేవనెత్తిరి. కౌసల్య అతనితో ఇట్లనెను.
2.57.29.అనుష్టుప్
“ఇమం తస్య మహాభాగ!
దూతం దుష్కరకారిణః।
వనవాసాదనుప్రాప్తమ్
కస్మాన్న ప్రతిభాషసే॥
టీక:-
 ఇమం = ఈ; తస్య = అతనియొక్క; మహాభాగ = మహాభాగ్యవంతుడా; దూతం = దూతను గూర్చి; దుష్కర = శక్యముకాని పనిని; కారిణః = చేసినవాడు; వనవాసాత్ = వనవాసము నుండి; అనుప్రాప్తమ్ = వచ్చిన; కస్మాత్ = ఎందువలన; న = లేదు; ప్రతిభాషసే = మాటలాడుట.
భావం:-
 “మహాభాగ్యవంతుడవైన ఓ రాజా! దుష్కరమైన కార్యమును చేసిన రాముని దూతగ సుమంత్రుడు వనవాసమునుండి తిరిగి వచ్చినాడు. ఇతనితో నీవు ఎందువలన మాటలాడుటలేదు?
2.57.30.అనుష్టుప్
అద్యైవమనయం కృత్వా
వ్యపత్రపసి రాఘవ!।
ఉత్తిష్ఠ సుకృతం తేస్తు
శోకే నస్యా త్సహాయతా॥
టీక:-
 అద్య = ఇప్పుడు; ఏవమ్ = ఈ విధముగ; అనయం = కూడని పని; కృత్వా = చేసి; వ్యపత్రపసి = సిగ్గుపడుచున్నావు; రాఘవ = దశరథా; ఉత్తిష్ఠ = లెమ్ము; సుకృతం = పుణ్యకార్యము; తే = నీకు; అస్తు = అగుగాక; శోకే = దుఃఖమునందు; న = అవదు; స్యాత్ = లభించుట; సహాయతా = సహాయము.
భావం:-
 దశరథా! నీతిబాహ్యమైన పని చేసి, ఇప్పుడు ఈ విధముగా ఎందుకు సిగ్గుపడుచున్నావు? లెమ్ము. నీవు చేసిన వాగ్దానమును నిలబెట్టుకొని పుణ్యమును పొందినావు కదా! ఇప్పుడు దుఃఖించినచో నీకు ఎవరు సహాయము చేయుదురు?
2.57.31.అనుష్టుప్
దేవ! యస్యా భయాద్రామమ్
నానుపృచ్ఛసి సారథిమ్।
నేహ తిష్ఠతి కైకేయీ
విస్రబ్ధం ప్రతిభాష్యతామ్”॥
టీక:-
 దేవ = దేవా; యస్యా = ఎవతెవలన; భయాత్ = భయమువలన; రామమ్ = రామునిగూర్చి; న = లేదు; అనుపృచ్ఛసి = ప్రశ్నించుట; సారథిమ్ = సారథిని; న = లేదు; ఇహ = ఇక్కడ; తిష్ఠతి = ఉండుట; కైకేయీ = కైకేయి; విస్రబ్ధం = నిర్భయముగ; ప్రతిభాష్యతామ్ = మాటలాడెదవు గాక.
భావం:-
 ఎవతెవలన భయపడి నీవు రామునిగురించి సుమంత్రునితో మాటలాడుట లేదో, ఆ కైకేయి ఇక్కడ లేదు. ఇప్పుడు నీవు నిర్భయముగా మాటలాడవచ్చును.”
2.57.32.అనుష్టుప్
సా తథోక్త్వా మహారాజమ్
కౌసల్యా శోకలాలసా।
ధరణ్యాం నిపపాతాఽ శు
బాష్పవిప్లుతభాషిణీ॥
టీక:-
 సా = ఆ; తథ = అట్లు; ఉక్త్వా = పలికి; మహారాజమ్ = మహారాజునుగూర్చి; కౌసల్యా = కౌసల్య; శోకలాలసా = దుఃఖితయైన; ధరణ్యాం = నేలపై; నిపపాత = పడిపోయాను; ఆశు = వెంటనే; బాష్పవిప్లుత = కన్నీటితో మునిగి; భాషిణీ = మాటలాడుచున్న.
భావం:-
 కౌసల్య కన్నీరు కార్చుచు శోకతప్తయై దశరథునితో ఇట్లు మాటలాడుచు వెంటనే నేలపై పడిపోయెను.
2.57.33.అనుష్టుప్
ఏవం విలపతీం దృష్ట్వా
కౌసల్యాం పతితాం భువి।
పతిం చావేక్ష్య తా స్సర్వా
సుస్వరం రురుదుః స్త్రియః॥
టీక:-
 ఏవం = ఈ విధముగ; విలపతీం = విలపించుచున్న; దృష్ట్వా = చూచి; కౌసల్యాం = కౌసల్యను; పతితాం = పడియున్న; భువి = నేలపై; పతిం = భర్తను; ఆవేక్ష్య = చూచి; తాః = ఆ; సర్వా = అందరును; సుస్వరం = బిగ్గరగ; రురుదుః = ఏడ్చిరి; స్త్రియః = స్త్రీలు.
భావం:-
 ఈ విధముగా నేలపైపడి విలపించుచున్న కౌసల్యను, మూర్ఛనొంది యున్న ఆమె భర్తను చూచి, ఆ స్త్రీలందరును బిగ్గరగా విలపించిరి.
2.57.34.జగతి.
తతస్తమంతఃపురనాదముత్థితం
సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః।
స్త్రియశ్చ సర్వా రురుదు స్సమంతతః
పురం తదాసీత్పునరేవ సంకులమ్॥
టీక:-
 తతః = తరువాత; తమ్ = ఆ; అంతఃపుర = అంతఃపురముయొక్క; నాదమ్ = ధ్వనిని; ఉత్థితం = బయలుదేరిన; సమీక్ష్య = చూచి; వృద్ధాః = వృద్ధులు; తరుణాః చ = యువకులును; మానవాః = మానవులు; స్త్రియశ్చ = స్త్రీలును; సర్వా = అందరును; రురుదుః = ఏడ్చిరి; సమంతతః = అంతటను; పురం = నగరము; తత్ = ఆ; ఆసీత్ = అయ్యెను; పునః ఏవ = మరల; సంకులమ్ = వ్యాకులము.
భావం:-
 అంతఃపురమునుండి వినవచ్చిన ఆ ఆక్రందనలను విని, వృద్ధులు, యువకులు, స్త్రీలు, అందరును అక్కడ బిగ్గరగా విలపించిరి. అపుడు పురము మరల వ్యాకులము చెందినది.
2.57.35.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
సప్తపంచాశ సర్గః॥
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; సప్తపంచాశ [57] = ఏభై ఏడవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [57] ఏభై ఏడవ సర్గ సంపూర్ణము.
2.58.2.అనుష్టుప్
అథ సూతో మహారాజమ్
కృతాంజలిరుపస్థితః ।
రామమేవానుశోచంతమ్
దుఃఖశోకసమన్వితమ్॥
టీక:-
అథ = అటు పిమ్మట; సూతః = సుమంత్రుడు; మహారాజమ్ = మహారాజునకు; కృతాంజలిః = అంజలి ఘటించి; ఉపస్థితః = దగ్గరకు వెళ్లెను; రామమ్ = రాముని గూర్చి; ఏవ = మాత్రమే; అనుశోచంతమ్ = ఆలోచించుచు; దుఃఖ = దుఃఖముతో; శోక = శోకముతో; సమన్వితమ్ = కుంగి ఉన్న.
భావం:-
ఆ రాముని గూర్చియే ఆలోచించుచు దుఃఖ శోకములలో క్రుంగి ఉన్న దశరథ మహారాజు దగ్గరకు సుమంత్రుడు అంజలి ఘటించి వెళ్లెను.
2.58.3.అనుష్టుప్
వృద్ధం పరమసంతప్తమ్
నవగ్రహమివ ద్విపమ్।
వినిశ్వసంతం ధ్యాయంతమ్
స్వస్థమివ కుంజరమ్॥
టీక:-
వృద్ధం = వృద్ధుడైన దశరథుడు; పరమ = అధికమైన; సంతప్తమ్ = దుఃఖముచే; నవ = కొత్తగా; గ్రహమ్ = పట్టుకొనినదాని; ఇవ = వలె; ద్విపమ్ = ఏనుగు; వినిశ్వసంతం = నిట్టూర్చుచు; ధ్యాయంతమ్ = ఆలోచించుచుండెను; అస్వస్థమ్ = అస్వస్థమైన దాని; ఇవ = వలె; కుంజరమ్ = ఏనుగును
భావం:-
వృద్ధుడైన ఆ దశరథుడు దుఃఖముచే హృదయము దహించుకొని పోవుచుండగా, క్రొత్తగా పట్టుకొనిన ఏనుగు వలె, దీర్ఘముగా నిట్టూర్చుచుండెను. అస్వస్థమైన గజము వలె ఏదియో ఆలోచించుచుండెను.
2.58.4.అనుష్టుప్
రాజా తు రజసా సూతమ్
ధ్వస్తాంగం సముపస్థితమ్ ।
అశ్రుపూర్ణముఖం దీనమ్
ఉవాచ పరమార్తవత్॥
టీక:-
రాజా = రాజును; తు = ఐతే; రజసా = దుమ్ముతో; సూతమ్ = సూతుని; ధ్వస్తాంగం = కప్పివేయబడిన శరీరముతో; సముపస్థితమ్ = సమీపించెను; అశ్రుపూర్ణ = కన్నీళ్లతో నిండిన; ముఖం = ముఖమును; దీనమ్ = దీనముగా; ఉవాచ = పలికెను; పరమ = మిక్కిలి; ఆర్తవత్ = దుఃఖించుచున్నవాడు.
భావం:-
ప్రయాణము వలన ఆ సూతుని శరీరమంతా దుమ్ము కప్పి ఉండెను. అతడు దీనుడై, కన్నీళ్లతో నిండిన ముఖముతో రాజును సమీపించెను. రాజు మిక్కిలి దుఃఖించుచు ఆ సూతునితో ఇట్లు పలికెను.
2.58.5.అనుష్టుప్
“క్వను వత్స్యతి ధర్మాత్మా
వృక్షమూలముపాశ్రితః ।
సోఽత్యంతసుఖితస్సూత
కిమశిష్యతి రాఘవః॥
టీక:-
క్వను = ఎక్కడ; వత్స్యతి = నివసించాడు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; వృక్షమూలమ్ = చెట్టుమానువద్ద; ఉపాశ్రితః = శయనించాడు; సః = రాముడు; అత్యంత = నిరంతరము; సుఖితః = సుఖించినవాడు; సూత = సుమంత్రా; కిమ్ = ఏ విధముగా; ఆశిష్యతి = తినుచున్నాడు; రాఘవః = రాముడు.
భావం:-
“సుమంత్రా! ధర్మాత్ముడైన ఆ రాముడు, అక్కడ చెట్ల క్రింద ఎలా నివసించుచున్నాడు? ఇంతవరకును చాల సుఖపడిన అతడు ఏమి తినుచున్నాడు?
2.58.6.అనుష్టుప్
దుఃఖస్యానుచితో దుఃఖమ్
సుమంత్ర శయనోచితః ।
భూమిపాలాత్మజో భూమౌ
శేతే కథమనాథవత్॥
టీక:-
దుఃఖస్య = దుఃఖితుడుడగుటకు; అనుచితః = తగినవాడు కాదు; దుఃఖమ్ = దుఃఖములకు; సుమంత్ర = సుమంత్రా; శయన = శయనములు; ఉచితః = మంచివాటి; భూమిపాలాత్మజః = రాజకుమారుడైన రామచంద్రుడు; భూమౌ = నేల మీద; శేతే = నిద్రించెను; కథమ్ = ఏ విధముగా; అనాథవత్ = అనాథుడు వలె.
భావం:-
రాముడు ఎన్నడు దుఃఖపడు అవసరములేనివాడు, రాజకుమారుడు. మంచి మంచి తల్పములపై పరుండెడి వాడు. అట్టి రాముడు, అనాథుని వలె, నేలమీద ఎట్లు పండుకొనగలుగుచున్నాడో కదా!
2.58.7.అనుష్టుప్
యం యాంతమనుయాంతి స్మ
పదాతిరథకుంజరాః ।
స వత్స్యతి కథం రామో
విజనం వన మాశ్రితః॥
టీక:-
యం = ఎచటికైనను; యాంతమ్ = ప్రయాణమై వెళ్లుచుండగా; అనుయాంతి = వెంట వెళ్లెడివారు; స్మ = సుమ; పదాతి = కాలి బంట్లు; రథ = రథికుల దళము; కుంజరాః = గజదళము; సః = ఆ; వత్స్యతి = నివసించగలడు; కథం = ఏ విధముగా; రామః = రాముడు; విజనం = జనశూన్యమైన; వనమ్ = వనమునందు; ఆశ్రితః = నినివాసము.
భావం:-
రాముడు ఎచటికైన ప్రయాణమై వెళ్లుచుండగా, వెంట కాల్బంటు, రథ, గజ దళములు ఉండెడివి. అట్టి రాముడు జనశూన్యమైన వనములో ఎట్లు నివసించగలడు?
2.58.8.అనుష్టుప్
వ్యాళైర్మృగైరాచరితమ్
కృష్ణసర్పనిషేవితమ్।
కథం కుమారౌ వైదేహ్యా
సార్ధం వన ముపస్థితౌ॥
టీక:-
వ్యాళైః = పులులవంటి క్రూరమృగములు; మృగైః = లేళ్ళ వంటి మృగములు; ఆచరితమ్ = సంచరించుచున్నది; కృష్ణసర్ప = కృష్ణ సర్పములతోను; నిషేవితమ్ = నిండి ఉన్నది; కథం = ఏ విధముగా; కుమారౌ = రామలక్ష్మణులు; వైదేహ్యా = సీతాదేవితో; సార్ధమ్ = జంతుసమూహములు కలదైన, అమరకోశము; వనమ్ = అరణ్యమును; ఉపస్థితౌ = చేరిరి.
భావం:-
సీతారామలక్ష్మణులు పులులవంటి క్రూరమృగములతోను, లేళ్ళవంటి ఇతరమృగములతోనూ, భీకరమైన కృష్ణ సర్పములతోను నిండిన అరణ్యమును ఎట్లు చేరినారు?
2.58.9.అనుష్టుప్
సుకుమార్యా తపస్విన్యా
సుమంత్ర! సహ సీతయా।
రాజపుత్రౌ కథం పాదై
రవరుహ్య రథాద్గతౌ॥
టీక:-
సుకుమార్యా = సుకుమారి; తపస్విన్యా = దీనమైన, చాంద్రాయణాది వ్రతధారిణియైన; సుమంత్ర = సుమంత్రా; సహ = కలసి; సీతయా = సీతతో; రాజపుత్రౌ = రాకుమారులు ఇరువురు; కథం = ఏ విధముగా; పాదైః = పాదచారులై; అవరుహ్య = క్రిందికి దిగి; రథాత్ = రథము నుండి; గతౌ = వెళ్ళుచుండిరి.
భావం:-
ఆ రాజకుమారులు,పూజలుచునది దీనయు, సుకుమారియినైన సీతతో కలసి, రథము దిగి, పాదచారులై అరణ్యములోనికి ఎలా వెళ్ళగలిగిరి?
2.58.10.అనుష్టుప్
సిద్ధార్థః ఖలు సూత! త్వమ్
యేన దృష్టౌ మమఽఽత్మజౌ।
వనాంతం ప్రవిశన్తౌ తౌ
అశ్వినావివమందరమ్॥
టీక:-
సిద్ధార్థః = అదృష్టవంతుడివి; ఖలు = మిక్కిలి; సూత = సుమంత్రా; త్వమ్ = నీవు; యేన = ఎంతయు; దృష్టౌ = చూడగలిగితివి; మమ = నా యొక్క; ఆత్మజౌ = కుమారులను; వనాంతం = వనములోనికి; ప్రవిశనౌ = ప్రవేశించుచున్నట్లు; తౌ = వారిని; అశ్వినాఃఇవ = అశ్వినీ దేవతల; ఇవ = వలె; మందరమ్ = మందర పర్వత ప్రాంతమును.
భావం:-
అశ్వినీ దేవతలు మందర పర్వత ప్రాంతమును ప్రవేశించుచున్నట్లు, అరణ్యములోని ప్రవేశించుచున్న నా కుమారులను చూడగలిగితివి. నీవు ఎంతయు అదృష్టవంతుడవు.
2.58.11.అనుష్టుప్
కిమువాచ వచో రామః
కిమువాచ చ లక్ష్మణః ।
సుమంత్ర! వనమాసాద్య
కిమువాచ చ మైథిలీ॥
టీక:-
కిమ్ = ఏమి; ఉవాచ = చెప్పెను; వచః = పలుకులు; రామః = రాముడు; కిమ్ = ఏమి; ఉవాచ = చెప్పెను; చ = ఇంకను; లక్ష్మణః = లక్ష్మణుడు; సుమంత్ర = సుమంత్రా; వనమ్ = వనములోనికి; ఆసాద్య = ప్రవేశించిన పిమ్మట; కిమ్ = ఏమి; ఉవాచ = చెప్పెను; మైథిలీ = మిథిలీ రాకుమారి సీతాదేవి.
భావం:-
అరణ్యమునకు చేరిన పిమ్మట రాముడు ఏమనినాడు? లక్ష్మణుడు ఏమనినాడు? సీత ఏమన్నది?
2.58.12.అనుష్టుప్
ఆసితం శయితం భుక్తమ్
సూత! రామస్య కీర్తయ ।
జీవిష్యామహమేతేన
యయాతిరివ సాధుషు”॥
టీక:-
ఆసితం = కూర్చుండెనో; శయితం = శయనించెనో; భుక్తమ్ = భుజించెనో; సూత = సుమంత్రా; రామస్య = రాముని యొక్క; కీర్తయ = చెప్పుము; జీవిష్యామి = జీవించెదను; అహమ్ = నేను; ఏతేన = ఆ విషయములను; యయాతిః ఇవ = వలె; ఇవ = వలె; సాధుషు = సాధుజనుల యందుs.
భావం:-
రాముడు ఎక్కడ కూర్చుండెనో, ఎక్కడ పరుండెనో, ఎక్కడ భుజించెనో చెప్పుము. ఆ విషయములను వినుచు, నేను సాధుజన సంగమము చేత యయాతి జీవించినట్లు జీవించెదను.”
*గమనిక:-
యయాతి- చంద్రవంశపురాజు. తండ్రి నహుషుడు. తల్లి ప్రియంవద. యయాతి తీవ్రముగా తపమొనర్చి, తన తపోమహిమచే స్వర్గమునకేగెను. ఇంద్రుడు ఇతని తపస్సునకు మెచ్చుకొనెను. ఇచటివారి తపస్సు నా తపస్సుతో సాటికాదు గదా అని యయాతి గర్వముతో పలికెను. అందులకు కుపితుడైన ఇంద్రుడు ఇచనిని స్వర్గభ్రష్ని గావించెను. పిదప ఇంద్రుని అనుద్రహముతో యయాతి సాధువుల మధ్య పడెను. వారి సాంగత్యమువలన అతడు దుఃఖవిమిక్చుడయ్యెను. గీతా ప్రెస్సు వారి రామాయణము.
2.58.13.అనుష్టుప్
ఇతి సూతో నరేంద్రేణ
బోధితస్సజ్జమానయా ।
ఉవాచ వాచా రాజానమ్
స బాష్పపరిబద్ధయా॥
టీక:-
ఇతి = ఈ విధముగా; సూతః = సుమంత్రుడు; నరేంద్రేణ = దశరథుని చేత; బోధితః = ప్రశ్నింపబడగా; సజ్జమానయా = మనసులో సిద్ధమై; ఉవాచ = పలికెను; వాచా = మాటలను; రాజానమ్ = రాజునకు; సః = అతడు;
భావం:-
దశరథుడు ఇట్లు పశ్నింపగా సుమంత్రుడు ఆలోచించుకుని సామాధానమునకు తయారై రాజునకు ఇట్లు చెప్పెను.
2.58.14.అనుష్టుప్
“అబ్రవీన్మాం మహారాజ
ధర్మమేవానుపాలయన్ ।
అంజలిం రాఘవః కృత్వా
శిరసాఽభిప్రణమ్య చ॥
టీక:-
అబ్రవీత్ = ఇట్లు పలికెను; మాం = నాతో; మహారాజ = ఓ మహారాజా; ధర్మమ్ = ధర్మముగను; ఏవ = మాత్రమే; అనుపాలయన్ = అనుసరించుచు; అంజలిం = రెండు చేతులను; రాఘవః = రాముడు; కృత్వా = జోడించి; శిరస = శిరస్సును వంచి; అభిప్రణమ్య = నమస్కరించి.
భావం:-
మహారాజా! రాముడు ధర్మానుసారము అంజలి ఘటించి, శిరస్సు వంచి నీకు నమస్కరించి, నాతో ఇట్లు చెప్పెను.
2.58.15.అనుష్టుప్
“సూత! మద్వచనాత్తస్య
తాతస్య విదితాత్మనః ।
శిరసా వందనీయస్య
వంద్వౌ పాదౌ మహాత్మనః॥
టీక:-
సూత = సుమంత్రా; మత్ = నా; వచనాత్ = మాటలను; తస్య = నా; తాతస్య = తండ్రిగారికి; విదితాత్మనః = అన్నిటియందు పరిజ్ఞానము కలిగినవానికి; శిరసా = శిరస్సును వంచి; వందనీయస్య = గౌరవపూర్వకముగా; వంద్వౌ = నమస్కరించినట్లు; పాదౌ = పాదములకు; మహాత్మనః = మహాత్ముడైన
భావం:-
సుమంత్రా! మహాత్ముడైన నా తండ్రికి నేను శిరస్సు వంచి నమస్కరించినట్లు చెప్పుము.
2.58.16.అనుష్టుప్
సర్వమంతఃపురం వాచ్యమ్
సూత! మద్వచనాత్త్వయా ।
ఆరోగ్యమవిశేషేణ
యథార్హం చాభివాదనమ్॥
టీక:-
సర్వమ్ = అందరినీ; అంతఃపురం = అంతఃపురములో; వాచ్యమ్ = చెప్పవలెను; సూత = సుమంత్రా; మత్ = నా; వచనాత్ = నా మాటగా; త్వయా = నీ ద్వారా; ఆరోగ్యమ్ = క్షేమమును; అవిశేషేణ = ఎట్టి భేదము లేకుండ; యథార్హం చ = యోగ్యతానుసారముగా; చ = కూడ; అభివాదనమ్ = అభివాదనము చేసినట్లు
భావం:-
అంతఃపురంలో ఉన్నవారిని అందరినీ ఎట్టి భేదము లేకుండ క్షేమము అడిగినట్లును, ఆయా వ్యక్తులకు వారి యోగ్యతానుసారముగా అభివాదనము చేసినట్లును చెప్పవలెను.
2.58.17.అనుష్టుప్
మాతా చ మమ కౌసల్యా
కుశలం చాభివాదనమ్ ।
అప్రమాదం చ వక్తవ్యా
బ్రూయాశ్చైనామిదం వచః॥
టీక:-
మాతా = తల్లి; చ = ఇంకను; మమ = నా యొక్క; కౌసల్యా = కౌసల్యకు; కుశలం = కుశలమును; చ = ఇంకను; అభివాదనమ్ = అభివాదనమును; అప్రమాదం = ఏమరుపాటు లేకుండా; చ = ఇంకను; వక్తవ్యా = చెప్పవలెను; బ్రూయాః = చెప్పుము; చ = మఱియు; ఏనామ్ = తెలిసి; ఇదం = ఈ; వచః = మాటలను.
భావం:-
నా తల్లి అయిన కౌసల్యకు నా కుశలమును, నా అభివాదనమును చెప్పి ఏమరుపాటు లేకుండ ఉండవలెనని తెలిసి, ఈ మాటలు కూడా చెప్పుము.
2.58.18.అనుష్టుప్
ధర్మనిత్యా యథాకాలమ్
అగ్న్యగారపరా భవ ।
దేవి! దేవస్య పాదౌ చ
దేవవత్పరిపాలయ॥
టీక:-
ధర్మ = ధర్మమునందు; నిత్యా = స్థిరత్వము కలదానవై; యథాకాలమ్ = ఉచిత సమయమున; అగ్న్యగారపరా = అగ్ని గృహములో అగ్ని హోమాదికము చేయుచు; భవ = ఉండుము; దేవి = తల్లీ; దేవస్య = దశరథ మహారాజు యొక్క; పాదౌ = పాదములను; చ = మఱియు; దేవవత్ = దేవతలకు; పరిపాలయ = ఉపచారములు చేసినట్లు.
భావం:-
తల్లీ! ధర్మమునందు స్థిరత్వము కలదానవై, యథాకాలమున, అగ్ని గృహములో అగ్నిహోమాదికము చేయుచు, దేవతలకు ఉపచారములు చేసినట్లు దశరథ మహారాజునకు ఉపచారములు చేయుచు ఆయనను రక్షించుకొనుము.
2.58.19.అనుష్టుప్
అభిమానం చ మానం చ
త్యక్త్వా వర్తస్య మాతృషు
అను రాజానమార్యాం చ
కైకేయీమంబ కారయ॥
టీక:-
అభిమానం = అహంకారమును; చ = మఱియు; మానం = పట్టపురాణిని అను చిత్తసమున్నతిని; చ = మఱియు; త్యక్త్వా = విడచి; వర్తస్య = ప్రవర్తింపుము; మాతృషు = తల్లుల విషయమున; అను రాజానమ్ = రాజునకు అనుకూలముగా ఉండునట్లు; ఆర్యాం = పూజ్యురాలైన; చ = మఱియు; కైకేయీమ్ = కైకేయిని; అంబ = తల్లీ; కారయ = చేయుము
భావం:-
అహంకారమును, నేను పట్టపురాణిని అను చిత్త సమున్నతిని అనగా గర్వమును విడచి నా మిగిలిన తల్లుల అనగా నీ సవతుల విషయమున సౌహార్దముతో ప్రవర్తింపుము. పూజ్యురాలైన కైకేయి రాజునకు అనుకూలముగా ఉండునట్లు చేయుము.
2.58.20.అనుష్టుప్
కుమారే భరతే వృత్తిః
వర్తితవ్యా చ రాజవత్ ।
అర్థజ్యేష్ఠా హి రాజానో
రాజధర్మమనుస్మర॥
టీక:-
కుమారే = కుమారుడే; భరతే = భరతుని పట్ల; వృత్తిః = ప్రవృత్తిచే; వర్తితవ్యా = ప్రవర్తించినట్లు; చ = మఱియు; రాజవత్ = రాజు విషయమున; అర్థజ్యేష్ఠా = శబ్దార్థము చేతనే జ్యేష్ఠులు; హి = కదా; రాజానో = రాజులు; రాజధర్మమ్ = రాజధర్మమును; అనుస్మర = గుర్తు ఉంచుకొనుము
భావం:-
భరతుడు నీకు కుమారుడే అయినను అతని విషయమునందు రాజు విషయమున ప్రవర్తించినట్లు ప్రవర్తించుచుండుము. రాజు అను పదమునకు అర్థము గొప్పవాడు, అటుల రాజుగా ఉన్న భరతుడు గొప్పవాడు కదా. ఈ రాజధర్మమును గుర్తు ఉంచుకొనుము.
2.58.21.అనుష్టుప్
భరతః కుశలం వాచ్యో
వాచ్యో మద్వచనేన చ ।
సర్వాస్వేవ యథాన్యాయమ్
వృత్తిం వర్తస్వ మాతృషు॥
టీక:-
భరతః= భరతుని; కుశలం = కుశలమును; వాచ్యో = అడిగి; వాచ్యో = మాటలను; మత్ = నా మాటగా; వచనేన చ = నా యొక్క మాటగా; వచనేన చ = నా యొక్క మాటగా; సర్వాస్వేవ = అందరి విషయములో; యథాన్యాయమ్ = న్యాయానుసారముగా; వృత్తిం = సత్ప్రవర్తనతో; వర్తస్వ = వర్తించుము; మాతృషు = తల్లులందరి విషయములో
భావం:-
భరతుని కుశలము అడిగి, అతనితో ఈ విధముగ కూడ చెప్పమనినాడు. తల్లులందరి విషయమునను, న్యాయానుసారముగా ప్రవర్తింపుము.
2.58.22.అనుష్టుప్
వక్తవ్యశ్చ మహాబాహుః
ఇక్ష్వాకుకులనందనః ।
పితరం యౌవరాజ్యస్థో
రాజ్యస్థమనుపాలయ॥
టీక:-
వక్తవ్యః = చెప్పుము; చ = మఱియు; మహాబాహుః = మిక్కిలి భుజబలము కలవానికి; ఇక్ష్వాకుకులనందనః = ఇక్ష్వాకు వంశమున నందనుడైన; పితరం = తండ్రిగారి; యౌవరాజ్యస్థో = యౌవరాజ్యమును పొందిన పిదప; రాజ్యస్థమ్ = రాజ్యమును; అనుపాలయ = పరిపాలించుము.
భావం:-
ఇక్ష్వాకులోద్భవుడవు, ఇక్ష్వాకుకులమునకు సంతోషదాయకుడవునైన ఓ మహా భుజబలసంపన్నుడైన భరతునికి. “నీవు యౌవరాజ్యమును పొందిన పిదప, మహారాజుగా ఉన్న తండ్రిగారి అనుమతి ప్రకారము రాజ్యపాలనము చేయుము.
2.58.23.అనుష్టుప్
అతిక్రాంతవయా రాజన్
మాస్మైనం వ్యవరోరుధః
కుమారరాజ్యే జీవ త్వమ్
తస్యైవాజ్ఞాప్రవర్తనాత్”॥
టీక:-
అతిక్రాంతవయః = వయసుమీరినవాడైనాడు; రాజా = మహారాజు; మాస్మైనం = వలదు సుమా; వ్యవరోరుధః = నిర్బంధించుట; కుమారరాజ్యే = యౌవ రాజ్యమును; జీవ = జీవించుము; త్వమ్ = నీవు; తస్య = అతనియొక్క; ఏవ = మాత్రమే; ఆజ్ఞా = ఆజ్ఞలు; ప్రవర్తనాత్ = చెల్లునట్లు చూచుచు.
.భావం:-
రాజు చాల వృద్ధుడైనాడు. ఏ విషయమునందును ఆయనను నిర్బంధింపకుము. ఆయన ఆజ్ఞయే చెల్లునట్లు చూచుచు, నీ యౌవరాజ్యమును నడిపింపుము.”
2.58.24.అనుష్టుప్
అబ్రవీచ్చాపి మాం భూయో
భృశమశ్రూణి వర్తయన్ ।
మాతేవ మమ మాతా తే
ద్రష్టవ్యా పుత్రగర్ధినీ”॥
టీక:-
అబ్రవీత్ = పలికెను; మాం = నాతో; భూయః = మరల; భృశమ్ = అమితముగా; అశ్రూణి = కన్నీరు; వర్తయన్ = కార్చుచు; మాత = తల్లిని; ఏవ = ఐన; మమ = నాయొక్క; మాతా = తల్లి వలెనే; తే = నీయొక్క; ద్రష్టవ్యా = చూచుకొనుము; పుత్రగర్ధినీ = పుత్రునిపై అత్యంత ప్రేమకలది.
భావం:-
అధికముగా కన్నీళ్లు కార్చుచు, భరతునితో చెప్పమని మరల ఇట్లు పలికెను. పుత్రునిపై ఎంతో ప్రేమ గల నా తల్లిని, నీ తల్లిని వలెనే చూచుకొనుము’’
2.58.25.అనుష్టుప్
ఇత్యేవం మాం మహరాజ
బ్రువన్నేవ మహాయశాః ।
రామో రాజీవతామ్రాక్షో
భృశమశ్రూణ్యవర్తయత్॥
టీక:-
ఇతి + ఏవం = ఆ విధముగా; మాం = నాతో; మహరాజ = మహారాజా; బ్రువత్ ఏవ = మాటలాడుట; ఏవ = చేయుచునే; మహాయశాః = మహా యశశ్శాలి అయిన; రామః = రాముడు; రాజీవ తామ్రాక్షః = ఎఱ్ఱతామరపూల వలె ఎఱ్ఱని నేత్రములు కలవాడు; భృశమ్ = అధికముగా; అశ్రూణ్య = కన్నీటిని; వర్తయత్ = రాల్చెను
భావం:-
మహారాజా! ఎఱ్ఱతామరల వలె ఎఱ్ఱని నేత్రములు కలవాడు, మహా యశశ్శాలీ అయిన రాముడు, నాతో ఈ విధముగ మాటలాడుచునే, చాలా ఎక్కువగా కన్నీళ్లు రాల్చెను.
*గమనిక:-
ఎక్కువగా కన్నీరు కార్చుచు విచారించుటవలన రాముని కన్నులు ఎంత ఎఱ్ఱబారినవి.
2.58.26.అనుష్టుప్
లక్ష్మణస్తు సుసంకృద్ధో
నిశ్శ్వసన్వాక్యమబ్రవీత్ ।
“కేనాయమపరాధేన
రాజపుత్రో వివాసితః॥
టీక:-
లక్ష్మణః = లక్ష్మణుడు; తు = మాత్రము; సుసంకృద్ధో = చాల కోపగించి; నిశ్శ్వసన్ = నిట్టూర్చుచు; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను; కేన = ఎటువంటి; అయమ్ = ఇతనిని; అపరాధేన = అపరాధము వలన; రాజపుత్రః = రాజకుమారుని; వివాసితః = వెడలగొట్టినారు
భావం:-
లక్ష్మణుడు మాత్రము చాల కోపగించి, నిట్టూర్చుచు ఇట్లు పలికెను. “ఈ రాజకుమారుడు ఏ అపరాధము చేసినాడని ఇతనిని రాజ్యము నుండి వెడలగొట్టినారు?
2.58.27.అనుష్టుప్
రాజ్ఞా తు ఖలు కైకేయ్యా
లఘుత్వాశ్రిత్య శాసనమ్ ।
కృతం కార్యమకార్యం వా
వయం యేనాభిపీడితాః॥
టీక:-
రాజ్ఞా = రాజుగారు; తు = ఐతే; ఖలు = మిక్కిలి; కైకేయ్యా = కైకేయి యొక్క; లఘుత్వా = తుచ్ఛమైన; ఆశ్రిత్య = పాటించి; శాసనమ్ = ఆజ్ఞను; కృతం = చేయదగిన; కార్యమ్ = పనిని; అకార్యం = చేయరాని పని; వా = అన్నట్లు; వయం = cscg; యేన = దేనిచేత; అభిపీడితాః = ఎంతో కష్టపడినవారమైతిమి.
భావం:-
రాజైతే, కైకేయి ఇచ్చిన తుచ్ఛమైన శాసనమును పాటించి, చేయదగిన పని చేసినట్లు ఒక చేయకూడని పనిని చేసినాడు. దీనితో మేమందరము ఎంచో కష్టములు అనుభవించవలసి వచ్చినది.
2.58.28.అనుష్టుప్
యది ప్రవ్రాజితో రామో
లోభకారణకారితమ్ ।
వరదాననిమిత్తం వా
సర్వథా దుష్కృతం కృతమ్॥
టీక:-
యది = ఐతే; ప్రవ్రాజితః = వెడలగొట్టబడినవాడగుట; రామః = రాముడు; లోభకారణ = దురాశ చేత; కారితమ్ = చేసిన పని కాని; వరదాన = వరము ఇచ్చుట అను; నిమిత్తం = కారణము చేత; వా = కాని; సర్వథా = అన్ని విధములుగా; దుష్కృతం = చెడ్డ పని; కృతమ్ = చేసెను
భావం:-
రాజ్యముపై దురాశ చేత వెడలగొట్టినా, వరము అను కారణముచే వెడల గొట్టినా రాముని వెడలగొట్టుట రాజు చేసిన చెడ్డ పని.
2.58.29.అనుష్టుప్
ఇదం తావద్యథాకామమ్
ఈశ్వరస్య కృతే కృతమ్ ।
రామస్య తు పరిత్యాగే
న హేతు ముపలక్షయే॥
టీక:-
ఇదం = ఇది; తావత్ = ఏ విధముగా చేసినప్పటికీ; యథాకామమ్ = యథేచ్ఛగా; ఈశ్వరస్య కృతే = ప్రభువుగా చేసిన; కృతమ్ = పని; రామస్య = రాముని యొక్క; తు = మాత్రము; పరిత్యాగే = త్యాగము చేయుట అనునది; న = కాదు; హేతుమ్ = తగిన హేతువుగా; ఉపలక్షయే = కనపడదు
భావం:-
ఈ రామపరిత్యాగము అనునది, ‘నేను ప్రభువును కదా’ అని దశరథుడు యథేచ్ఛగా చేసినదే కాని, ఇందుకు తగిన హేతువు నాకు ఏదియు కనపడదు.
2.58.30.అనుష్టుప్
అసమీక్ష్య సమారబ్ధమ్
విరుద్ధం బుధ్దిలాఘవాత్ ।
జనయిష్యతి సంక్రోశమ్
రాఘవస్య వివాసనమ్॥
టీక:-
అసమీక్ష్య = సరిగా ఆలోచించక; సమారబ్ధమ్ = చేయబడినది; విరుద్ధం = తప్పుడు నిర్ణయము; బుధ్దిలాఘవాత్ = తెలివితక్కువచే; జనయిష్యతి = కలిగించగలదు; సంక్రోశమ్ = దుఃఖము; రాఘవస్య = రాముని; వివాసనమ్ = ప్రవాసమునకు
భావం:-
సరిగా ఆలోచించక, తెలివితక్కువతనముగా, తప్పుడునిర్ణయముచే రాముని ప్రవాసమునకు పంపివేయుట జరిగినది. ఇది దుఃఖమును కలిగించగలదు.
2.58.31.అనుష్టుప్
అహం తావన్మహారాజే
పితృత్వం నోపలక్షయే
భ్రాతా భర్తా చ బంధుశ్చ
పితా చ మమ రాఘవః
టీక:-
అహం = నేను; తావత్ = ఆ కారణంగా; మహారాజే = దశరథ మహారాజును; పితృత్వం = తండ్రిగా; న = లేదు; ఉపలక్షయే = పరిగణించుట; భ్రాతా = సోదరుడైనను; భర్తా = ప్రభువు; చ = మఱియు; బంధుః = బంధువు; చ = మఱియు; పితా = తండ్రిౖ; చ = మఱియు; మమ = నాకు; రాఘవః = రాముడే
భావం:-
నేను దశరథ మహారాజును తండ్రిగా పరిగణించను. నాకు సోదరుడైనను, ప్రభువైనను, బంధువైనను, తండ్రిౖయెనను రాముడే.
2.58.32.అనుష్టుప్
సర్వలోకప్రియం త్యక్త్వా
సర్వలోకహితే రతమ్ ।
సర్వలోకోఽనురజ్యేత
కథం త్వాఽనేనకర్మణా॥
టీక:-
సర్వ లోక ప్రియమ్ = సకల జనులకు ఇష్టుని; త్యక్త్వా = విడిచిపెట్టి; సర్వలోక = సకల జనుల; హితే రతమ్ = హితము కోరువాడు; సర్వలోకః = సకల లోకములు; అనురజ్యేత = అనురాగము ఉండును; కథం = ఏ విధముగా; త్వా = నీ పట్ల; అనేన కర్మణా = ఇట్టి అకార్యము చేసిన.
భావం:-
సకల జనులకు ప్రియుడు, సకల జనుల హితము కోరువాడు అయిన రాముని పరిత్యజించి, ఇట్టి అకార్యము చేసిన నీ విషయమున ఎవరికి అనురాగము ఉండును?
2.58.33.అనుష్టుప్
సర్వప్రజాభిరామం హి
రామం ప్రవ్రాజ్య ధార్మికమ్ ।
సర్వలోకం విరుధ్యేమమ్
కథం రాజా భవిష్యసి॥
టీక:-
సర్వ = సకల; ప్రజ = ప్రజలకును; అభిరామం = మనోహరుడు; హి = ఐన; రామం = రాముని; ప్రవ్రాజ్య = వనమునకు పంపి; ధార్మికమ్ = ధార్మికుడును; సర్వలోకం = ప్రజలందరితో; విరుధ్యేమమ్ = విరోధముతెచ్చుకొనిన; కథం = ఏ విధముగా; రాజా = రాజుగా; రాజా = ఉండగలడు.
భావం:-
మహారాజా! సకల ప్రజలకును మనోహరుడు, ధార్మికుడు అయిన రాముని వనమునకు పంపి ప్రజలందరితో విరోధము తెచ్చుకొనినవాడు రాజుగా ఎట్లు ఉండగలడు.
2.58.34.అనుష్టుప్
జానకీ తు మహారాజ
నిశ్శ్వసన్తీ మనస్వినీ ।
భూతోపహతచిత్తేవ
విష్ఠితా విస్మృతా స్థితా॥
టీక:-
జానకీ తు = జానకి అయితే; మహారాజ = మహారాజా; నిశ్శ్వసన్తీ = నిట్టూర్చుచు; మనస్వినీ = అభిమానవంతురాలగు; భూత = భూతముచే; అపహత = ఆక్రమింపబడిన; చిత్తః = మనస్సు కలది; ఏవ = వలె; విష్ఠితా = వికలౖయె నిలచినది; విస్మృతాస్థితా = తనను తాను మరచినదై.
భావం:-
ఆత్మాభిమానవంతురాలగు జానకి అయితే, నిట్టూర్చుచు, తనను తాను మరచినదై, దయ్యంపట్టిన మనస్సు కలదాని వలె, వికలౖయె నిలచినది.
2.58.35.అనుష్టుప్
అదృష్టపూర్వవ్యసనా
రాజ్యపుత్రీ యశస్వినీ ।
తేన దుఃఖేన రుదతీ
నైవ మాం కించిదబ్రవీత్॥
టీక:-
అదృష్ట = ఎరుగని; పూర్వవ్యసనా = ఇంతకు ముందు; వ్యసనా = బాధలు పడుట; రాజ్యపుత్రీ = రాజకుమార్తె; యశస్వినీ = కీర్తివతియెన; తేన దుఃఖేన = అటువంటి; దుఃఖేన = దుఃఖముతో; రుదతీ = ఏడ్చుచు; న = లేదు; ఏవ = ఏమి; మాం = నాతో; కించిత్ = కొంచెము కూడా; అబ్రవీత్ = పలికెను
భావం:-
పూర్వము ఎన్నడును ఇట్టి బాధలు ఎరుగని, కీర్తిమంతురాలైయెన ఆ సీత, దుఃఖముతో ఏడ్చుచు నాతో ఏమియును చెప్పలేదు.
2.58.36.అనుష్టుప్
ఉద్వీక్షమాణా భర్తారమ్
ముఖేన పరిశుష్యతా ।
ముమోచ సహసా బాష్పమ్
మాం ప్రయాంతముదీక్ష్య సా॥
టీక:-
ఉద్వీక్షమాణా = చూచుచు; భర్తారమ్ = భర్త వైపు; ముఖేన = ముఖముతో; పరిశుష్యతా = ఎండిపోవుచున్న; ముమోచ = రాల్చెను; సహసా = వెంటనే; బాష్పమ్ = కన్నీరు; మాం = నన్ను; ప్రయాంతమ్ = బయలుదేరుచున్న; ఉదీక్ష్య = చూచుచు; సా = ఆ సీత.
భావం:-
మరలి వచ్చుటకు ప్రయాణమైన నన్ను చూచి, సీత, ఎండిపోవుచున్న ముఖముతో భర్త వైపు చూచుచు, కన్నీరు రాల్చెను.
2.58.37.జగతి.
తథైవ రామోఽశ్రుముఖః కృతాంజలిః
స్థితోఽభవల్లక్ష్మణబాహుపాలితః ।
తథైవ సీతా రుదతీ తపస్వినీ
నిరీక్షతే రాజరథం తథైవ మామ్॥
టీక:-
తథైవ = ఆ విధముగా; రామః = రాముడు; అశ్రుముఖః = కన్నీటితో నిండిన ముఖముతో; కృతాంజలిః = రెండు చేతులు జోడించుచు; స్థితః అభవత్ = నిలబడెను; లక్ష్మణ బాహుపాలితః = లక్ష్మణుని భుజములను ఆనుకొని; తథైవ = ఆ విధముగా; సీతా = సీత; రుదతీ = ఏడ్చుచు; తపస్వినీ = దీనురాలైన; నిరీక్షతే = చూచుచు; రాజరథం = రాజరథము వైపునకు; తథైవ = ఆ విధముగా; మామ్ = నన్ను
భావం:-
రాముడు కూడ కన్నీళ్లతో నిండిన ముఖముతో, చేతులు ఘటించి నమస్కరించుచు లక్ష్మణుని భుజమును ఆనుకొని నిలబడెను. దీనురాలైన సీత ఏడ్చుచు, రాజరథము వైపునకు, నా వైపునకు చూచుచు నిలచిపోయెను.
2.58.38.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే।
అయోధ్యకాణ్డే
అష్టపంచాశ సర్గః॥
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; అష్టపంచాశ [58] ఏభై ఎనిమిదవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [58] ఏభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
2.59.1.అనుష్టుప్
*ఇతి బ్రువంతం తం సూతం
సుమంత్రం మంత్రి సత్తమం।
“బ్రూహి శేషం పున” రితి
రాజా వచన మబ్రవీత్॥
టీక:-
ఇతి = ఇట్లు; బ్రువంతం = చెప్పుచున్న; తం = ఆ; సూతం = సారథియైన; సుమంత్రం = సుమంత్రునిగూర్చి; మంత్రి = మంత్రి; సత్తమం = శ్రేష్ఠమైన; బ్రూహి = చెప్పుము; శేషం = మిగిలినది; పునః = మరల; ఇతి = ఇట్లు; రాజా = రాజు; వచనం = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావం:-
సుమంత్రుడు చెప్పిన మాటలను విని దశరథుడు "మిగిలిన విషయములను చెప్పుము" అని సారథియు గొప్పమంత్రియు నైన సుమంత్రునితో పలికెను.
2.59.2.అనుష్టుప్
తస్య త ద్వచనం శ్రుత్వా
సుమంత్రో బాష్ప విక్లబః।
కథ యా మాస భూయోఽపి
రామ సందేశ విస్తరం॥
టీక:-
తస్య = అతని; తత్ = ఆ; వచనం = మాటలను; శ్రుత్వా = విని; సుమంత్రః = సుమంత్రుడు; బాష్ప = కన్నీటితో; విక్లబః = బాధపడుచున్న; కథయామాస = చెప్పెను; భూయః = మరల; అపి = కూడ; రామ = రాముని; సందేశ = సందేశమును; విస్తరం = వివరముగ.
భావం:-
దశరథుని మాటను విని సుమంత్రుడు కన్నీటి పర్యంతముగ బాధనొందుచు రాముని సందేశమును మరల సవివరముగ చెప్పెను.
2.59.3.అనుష్టుప్
“జటాః కృత్వా మహారాజ
చీర వల్కల ధారిణౌ।
గంగాం ఉత్తీర్య తౌ వీరౌ
ప్రయాగాఽభిముఖౌ గతౌ॥
టీక:-
జటాః = జటలను; కృత్వా = చేసికొని; మహారాజ = మహారాజా; చీర = నారచీరలు; వల్కల = వస్త్రములను; ధారిణౌ = ధరించిన; గంగాం = గంగను; ఉత్తీర్య = దాటి; తౌ = ఆ ఇరువురు; వీరౌ = వీరులు; ప్రయాగ = ప్రయాగకు; అభిముఖౌ = ఎదురుగ; గతౌ = వెళ్ళిరి.
భావం:-
మహారాజా! రామలక్ష్మణులు నారచీరలను ధరించి, జటలను ముడివేసికొని, గంగానదిని దాటి, ప్రయాగవైపు వెళ్ళిరి.
2.59.4.అనుష్టుప్
అగ్రతో లక్ష్మణో యాతః
పాలయన్ రఘు నందనం।
అనంతరం చ సీతాఽథ
రాఘవో రఘు నందనః।
తాం స్తథా గచ్ఛతో దృష్ట్వా
నివృత్తోఽస్మ్యవశ స్తదా॥
టీక:-
అగ్రతః = ముందుగ; లక్ష్మణః = లక్ష్మణుడు; యాతః = వెళ్ళెను; పాలయన్ = పాలించుచు; రఘునందనం = రాముని; అనంతరం = తరువాత; సీతా = సీత; అథ = తరువాత; రాఘవః = రాముడు; రఘునందనః = రాముడు; తాం = వారిని; తథా = మరియు; గచ్ఛతః = వెళ్ళుచున్న; దృష్ట్వా = చూచి; నివృత్తః = వెనుకకు తిరిగి; అస్మి = ఉండి; అవశః = ఏమియు చేయలేక; తదా = అప్పుడు.
భావం:-
లక్ష్మణుడు ముందుగను, తరువాత సీత, ఆమె వెనుక రాముడు నడిచి వెళ్ళిరి. ఆ విధముగా పోవుచున్న వారిని చూచి నేను నిశ్చేష్టుడనై వెనుకకు తిరిగి వచ్చితిని.
2.59.5.అనుష్టుప్
మమత్వశ్వా నివృత్తస్య
న ప్రావర్తంత వర్త్మని।
ఉష్ణమశ్రు ప్రముంచంతో
రామే సంప్రస్థితే వనమ్॥
టీక:-
మమ = నా; తు; అశ్వాః = గుఱ్ఱములు; నివృత్తస్య = వెనుకకు తిరిగి; న = లేదు; ప్రావర్తంత = నడచుట; వర్త్మని = మార్గమున; ఉష్ణమ్ = వేడి; అశ్రు = కన్నీరు; ప్రముంచంతః = విడుచుచున్న; రామే = రాముడు; సంప్రస్థితే = ప్రయాణమగుచుండగ; వనమ్ = అరణ్యమునుగూర్చి.
భావం:-
రాముడు అరణ్యమునకు బయలుదేరిన తరువాత నేను వెనుకకు తిరిగి ప్రయాణమైతిని. నా గుఱ్ఱములు మాత్రము, వేడికన్నీరు కార్చుచు, దారి పొడవున నడచుటకు నిరాకరించినవి.
2.59.6.అనుష్టుప్
ఉభాభ్యాం రాజపుత్రాభ్యామ్
అథ కృత్వాహమంజలిమ్।
ప్రస్థితో రథమాస్థాయ
తద్దుఃఖమపి ధారయన్॥
టీక:-
ఉభాభ్యాం = ఇరువురుకు; రాజపుత్రాభ్యామ్ = రాకుమారులకు; అథ = తరువాత; కృత్వా = చేసి; అహమ్ = నేను; అంజలిమ్ = దోసిలిని; ప్రస్థితః = బయలుదేరితిని; రథమ్ = రథమును; ఆస్థాయ = ఎక్కి; తత్ = ఆ; దుఃఖమ్ = దుఃఖమును; అపి = కూడ; ధారయన్ = కలిగియుండి.
భావం:-
తరువాత నేను దుఃఖమును ఆపుకొనుచు రాకుమారులకు ఇరువురికి కృతాంజలుడనై నమస్కరించి రథము నెక్కి బయలుదేరితిని.
2.59.7.అనుష్టుప్
గుహేన సార్ధం తత్రైవ
స్థితోఽస్మి దివసాంబహూన్।
ఆశయా యది మాం రామః
పునశ్శబ్దాపయేదితి॥
టీక:-
గుహేన = గుహునితో; సార్ధం = కూడి; తత్ర = అక్కడ; ఏవ = అట్లే ఏ; స్థితః = ఉండి; అస్మి = ఉంటిని; దివసాన్ = దినములను; బహూన్ = చాల; ఆశయా = ఆశగ; యది = ఒకవేళ; మాం = నన్ను; రామః = రాముడు; పునః = మరల; శబ్దాపయేద్ = పిలుచును; ఇతి = అను.
భావం:-
రాముడు మరల నన్ను పిలుచునను ఆశచే గుహనితో కలిసి అక్కడనే చాల దినములు ఉండిపోయితిని.
2.59.8.అనుష్టుప్
విషయే తే మహారాజ
రామవ్యసనకర్శితాః।
అపి వృక్షాః పరిమ్లానాః
సపుష్పాంకరకోరకాః॥
టీక:-
విషయే = దేశమునందు; తే = నీ; మహారాజ = మహారాజా; రామ = రాముని; వ్యసన = అలవాటుచే; కర్శితాః = కృశించి; అపి = కూడ; వృక్షాః = వృక్షములు; పరిమ్లానాః = వాడిపోయినవి; సపుష్పా = పుష్పములతో సహా; అంకర = మొలకలు; కోరకాః = మొగ్గలు.
భావం:-
మహారాజా నీ దేశమునందు ఉన్న వృక్షములు కూడ రామవ్యసనముచే కృశించి పువ్వులు, మొలకలు, మొగ్గలతో సహా వాడిపోయినవి.
2.59.9.అనుష్టుప్
ఉపతప్తోదకా నద్యః
పల్వలాని సరాంసి చ।
పరిశుష్కపలాశాని
వనాన్యుపవనాని చ॥
టీక:-
ఉపతప్తః = వేడెక్కిన; ఉదకాః = నీరు గలవి; నద్యః = నదులు; పల్వలాని = చెరువులు; సరాంసి = సరస్సులు; పరిశుష్క = ఎండిపోయిన; పలాశాని = ఆకులు గలవి; వనాని = వనములు; ఉపవనాని = ఉద్యానవనములు.
భావం:-
నదులలోను, చెరువులలోను, సరస్సులలోను, ఉన్న నీరు వేడెక్కియున్నది. వనములలోను, ఉద్యానవనములలోను, ఆకులు ఎండిపోయినవి.
2.59.10.అనుష్టుప్
న చ సర్పంతి సత్త్వాని
వ్యాళ న ప్రచరంతి చ।
రామశోకాభిభూతం తత్
నిష్కూజమభవద్వనమ్॥
టీక:-
న = లేదు; చ = ఇంకా; సర్పంతి = కదలుట; సత్త్వాని = ప్రాణులు; వ్యాళ = మృగములు / పాములు ; న = లేదు; ప్రచరంతి = తిరుగుట; రామశోకాభిభూతం = రామశోకము వలన దుఃఖితులై; తత్ = ఆ; నిష్కూజమ్ = కూతలు లేనిది; అభవత్ = అయ్యెను; వనమ్ = అరణ్యమునందు.
భావం:-
ప్రాణులన్నియు చలనములేక పడియున్నవి. మృగములు కూడ తిరుగాడుటలేదు. రాముని గురించిన శోకముచే దుఃఖితయై అరణ్యమంతయు పక్షుల కూతలు లేక నిశ్శబ్దముగ నున్నది.
2.59.11.అనుష్టుప్
లీనపుష్కరపత్రాశ్చ
నరేంద్ర కలుషోదకాః।
సంతప్తపద్మాః పద్మిన్యో
లీనమీనవిహంగమాః॥
టీక:-
లీన = లోపలనున్న; పుష్కర = తామరపూలు; పత్రాః = పత్రములును; చ = మఱియు; నరేంద్ర = రాజా; కలుష = కలుషితమైన; ఉదకః = నీరు; సంతప్త = వాడిపోయిన; పద్మాః = కమలములు; పద్మిన్యః = పద్మములతో నిండిఉన్న సరస్సులు; లీన = అణగిపోయియున్న; మీన = చేపలు; విహంగమాః = పక్షులు గలవి.
భావం:-
మహారాజా! పద్మములతో నిండియున్న సరస్సులలోని నీరు కలుషితమైపోయినది. కమలములు వాడిపోయి వాటి రేకులు అణగిపోయి పైకి కనబడుటలేదు. ఆ సరస్సులోని చేపలు, పక్షులు అణగి పడిపోయి ఉన్నవి.
2.59.12.అనుష్టుప్
జలజాని చ పుష్పాణి
మాల్యాని స్థలజాని చ।
నాద్య భాంత్యల్పగందీని
ఫలాని చ యథాపురమ్॥
టీక:-
జలజాని = నీటియందు జనించునవి; చ = మఱియు; పుష్పాణి = పుష్పములు; మాల్యాని = పుష్పమాలలు; స్థలజాని = నేలపైన జనించునవియును; చ = మఱియు; న = లేదు; అద్య = నేడు; భాంతి = వెలుగుట; అల్పగందీని = తక్కువ సువాసన కలిగియుండి; ఫలాని = ఫలములు; యథా = వలె; పురమ్ = పూర్వము.
భావం:-
నీటిలోన జనియించు పద్మములు, నేలపై జనియించు మల్లెలు మొదలగు పుష్పములును, ఫలములును, ఇప్పుడు వాటి పూర్వపు అందమును, సుగంధమును కోల్పోయి ప్రకాశించుట లేదు.
2.59.13.అనుష్టుప్
అత్రోద్యానాని శూన్యాని
ప్రలీనవిహగాని చ।
న చాభిరామా నారామాన్
పశ్యామి మనుజర్షభ॥
టీక:-
అత్ర = ఇక్కడ; ఉద్యానాని = ఉద్యానవనములు; శూన్యాని = శూన్యమై; ప్రలీన = అణగియున్న; విహగాని = పక్షులు గలవై; చ = మఱియు; న = లేదు; అభిరామాన్ = మనోహరముగ; ఆరామాన్ = ఉద్యానవనములు; పశ్యామి = నేను చూచుట; మనుజర్షభ = మానవోత్తమా.
భావం:-
మానవోత్తమా! ఇక్కడ ఉద్యానవనములన్నియును నిర్జనమై,అణిగి పడియుండిన పక్షులు గలవై, మనోహరముగ కనబడుటలేదు.
2.59.14.అనుష్టుప్
ప్రవిశంతమయోధ్యాం మామ్
న కశ్చిదభినందతి।
నరా రామమపశ్యంతో
నిశ్శ్వసంతి ముహుర్ముహుః॥
టీక:-
ప్రవిశంతమ్ = ప్రవేశించుచున్న; అయోధ్యాం = అయోధ్యను గూర్చి ; మామ్ = నన్ను; న = లేదు; కశ్చిత్ = ఒక్కడు; అభినందతి = అభినందించుట; నరాః = మనుషులు; రామమ్ = రాముని; అపశ్యంతః = చూడనివారై; నిశ్శ్వసంతి = నిట్టూర్చుచున్నారు; ముహుర్ముహుః = మాటిమాటికి.
భావం:-
రాజా! ఏ ఒక్కరును, అయోధ్యలో ప్రవేశించుచున్న నన్ను చూచి, అభినందించలేదు. రాముడు కనబడక జనులందరును పదేపదే నిట్టూర్చుచున్నారు.
2.59.15.అనుష్టుప్
దేవ! రాజరథం దృష్ట్వా
వినా రామమిహాగతమ్।
దుఃఖాదశ్రుముఖస్సర్వో
రాజమార్గగతో జనః॥
టీక:-
దేవ = దేవా; రాజరథం = రాజరథమును; దృష్ట్వా = చూచి; వినా = లేక; రామమ్ = రాముడు; ఇహ = ఇక్కడకు; ఆగతమ్ = వచ్చిన; దుఃఖాత్ = దుఃఖమువలన; అశ్రుముఖః = కన్నీరు నిండిన ముఖము గలవారైరి; సర్వః = సకల; రాజమార్గగతః = రాజమార్గమున; జనః = ప్రజలు.
భావం:-
మహారాజా! రాముడు లేకనే తిరిగి వచ్చిన రాజరథమును చూచి, రాజమార్గమునందున్న ప్రజలందరును దుఃఖముతో కన్నీరు కార్చుచున్నారు.
2.59.16.అనుష్టుప్
హర్మ్యైర్విమానైః ప్రాసాదైః
అవేక్ష్యరథమాగతమ్।
హాహాకారకృతానార్యో
రామాదర్శనకర్శితాః॥
టీక:-
హర్మ్యైః = ఒంటి మేడ భవనములనుండి; విమానైః = ఏడంతస్తుల మేడలనుండి; ప్రాసాదైః = రాజప్రసాదములనుండి; అవేక్ష్య = చూచి; రథమ్ = రథమును; ఆగతమ్ = వచ్చిన; హాహాకార = హాహాకారములు; కృతాః = చేసిరి; నార్యః = స్త్రీలు; రామా = రాముని; అదర్శన = దర్శనము లేమిచే; కర్శితాః = కృశించినవారై.
భావం:-
తిరిగి వచ్చిన రథమును ఒంటి మేడ భవనములనుండి, ఏడంతస్తుల మేడలనుండి, రాజప్రాసాదములనుండి చూసిన స్త్రీలు, రాముడు కనపడకపోవుట వలన దుఃఖించుచు హాహాకారములు చేసిరి.
2.59.17.అనుష్టుప్
ఆయతైర్విమలైర్నేత్రైః
అశ్రువేగపరిప్లుతైః।
అన్యోన్యమభివీక్షంతేఽ -
వ్యక్తమార్తతరాః స్త్రియః॥
టీక:-
ఆయతైః = విశాలమైన; విమలైః = నిర్మలమైన; నేత్రైః = కన్నులతో; అశ్రువేగపరిప్లుతైః = ఉబికి వచ్చుచున్న కన్నీటితో కలత చెందిన; అన్యోన్యమ్ = పరస్పరము; అభివీక్షంతే = చూచుచున్నారు; అవ్యక్తమ్ = అస్పష్టముగా; ఆర్తతరాః = దుఃఖితులై; స్త్రియః = స్త్రీలు.
భావం:-
స్త్రీలు చాల దుఃఖితులై, ఉబికి వచ్చుచున్న కన్నీరు నిండిన విశాలమైన, నిర్మలమైన కన్నులతో ఒకరినొకరు అస్పష్టముగా చూచుకొనుచున్నారు.
2.59.18.అనుష్టుప్
నామిత్రాణాం న మిత్రాణామ్
ఉదాసీనజనస్య చ।
అహమార్తతయా కించిత్
విశేషముపలక్షయే॥
టీక:-
న = లేదు; అమిత్రాణాం = శత్రువులలో; న = లేదు; మిత్రాణామ్ = మిత్రులలో; ఉదాసీన = పట్టించుకొనని; జనస్య = ప్రజలలో; అహమ్ = నేను; ఆర్తతయా = దుఃఖించుటచే; కించిత్ = కొంచెమైనను; విశేషమ్ = భేదము; ఉపలక్షయే = చూచుట.
భావం:-
రాముడు లేకపోవుటచే శత్రువులు, మిత్రులు, ఉదాసీనులైయున్న ప్రజలు, అందరును ఒకే విధముగా దుఃఖించుచున్నారు.
2.59.19.అనుష్టుప్
అప్రహృష్టమనుష్యా చ
దీననాగతురంగమా।
ఆర్తస్వరపరిమ్లానా
వినిశ్శ్వసితనిస్స్వనా॥
టీక:-
అప్రహృష్టమనుష్యా = ఆనందముగాలేని ప్రజలు గలది; చ = మఱియు; దీన = దీనముగానున్న; నాగ = ఏనుగులు; తురంగమా = గుఱ్ఱములు గలది ; ఆర్తస్వరపరిమ్లానా = ఆర్తనాదముచే వాడిపోయినది; వినిఃశ్వసిత = నిట్టూర్పు; నిస్స్వనా = ధ్వనులతో కూడినది.
భావం:-
మహారాజా! ఏమాత్రము ఆనందముగలేని మనుష్యులతో, దీనముగానున్న ఏనుగులతోను, గుఱ్ఱములతోను, ఆర్తనాదము వలన నిట్టూర్పు నిస్పృహల ధ్వనులతో.....
2.59.20.అనుష్టుప్
నిరానందా మహారాజ
రామప్రవ్రాజనాతురా।
కౌసల్యా పుత్రహీనేవ
అయోధ్యా ప్రతిభాతి మా॥
టీక:-
నిరానందా = ఆనందములేనిది; మహారాజ = మహారాజా; రామ ప్రవ్రాజన్ ఆతురా = రాముని దూరముగా పంపివేయుటవలన దుఃఖించుచున్నది; కౌసల్యా = కౌసల్య; పుత్రహీనా = పుత్రుడు తనచెంత లేని; ఇవ = వలె; అయోధ్యా = అయోధ్య; ప్రతిభాతి = కనబడుచున్నది; మా = నాకు.
భావం:-
నా కంటికి రాముని దూరముగా పంపించుటవలన దుఃఖించుచున్న అయోధ్య, పుత్రుడు దూరమైన కౌసల్యవలె కనబడుచున్నది.”
2.59.21.అనుష్టుప్
సూతస్య వచనం శ్రుత్వా
వాచా పరమదీనయా।
బాష్పోపహతయా రాజా
తం సూతమిదమబ్రవీత్॥
టీక:-
సూతస్య = సూతుని; వచనం = మాటలను; శ్రుత్వా = విని; వాచా = వాక్కుచే; పరమదీనయా = చాలా దీనము; బాష్పోపహతయా = కన్నీటితో అడ్డుకొనబడినది; రాజా = రాజు; తం = ఆ; సూతమ్ = సారథిని గూర్చి; ఇదమ్ = దీనిని; అబ్రవీత్ = పలికెను.
భావం:-
దశరథమహారాజు సూతుని మాటలను విని, దుఃఖముతో గద్గదమైన మాటలతో , దీనముగ అతనితో ఇట్లు పలికెను.
2.59.22.అనుష్టుప్
“కైకేయ్యా వినియుక్తేన
పాపాభిజనభావయా।
మయా న మంత్రకుశలైః
వృద్ధైస్సహ సమర్థితమ్॥
టీక:-
కైకేయ్యా = కైకేయిచే; వినియుక్తేన = ప్రేరేపింపబడిన; పాపాభిజనభావయా = దుష్టులైన బంధువులు; భావము గల; మయా = నాచే; న = లేదు; మంత్రకుశలైః = ఆలోచన చేయుటయందు నిపుణులైన; వృద్ధైః = వృద్ధులతో; సహ = కూడి; సమర్థితమ్ = చేయబడుట.
భావం:-
దుష్టులైన బంధువులు, దుష్టమైన ఆలోచనలు గల కైకేయిచే ప్రేరేపించబడి, ఆలోచనాపరులైన వృద్ధులను సంప్రదించకనే నేను ఈ పని చేసితిని.
2.59.23.అనుష్టుప్
న సుహృద్భిర్నచామాత్యైః
మంత్రయిత్వా న నైగమైః।
మయాయమర్థస్సమ్మోహాత్
స్త్రీహేతోస్సహసా కృతః॥
టీక:-
న = లేదు; సుహృద్భిః = స్నేహితులతో; న = లేదు; అమాత్యైః = మంత్రులతో; మంత్రయిత్వా = ఆలోచించుట; న = లేదు; నైగమైః = నిగమ సంబంధమైన వారితో; మయా = నాచే; అయమ్ = ఈ; అర్థః = కార్యము; సమ్మోహాత్ = మోహముచే; స్త్రీహేతోః = స్త్రీ కొరకై; సహసా = తొందరపాటుచే; కృతః = చేయబడినది.
భావం:-
నేను ఒక స్త్రీ మాటను విని, స్నేహితులతోను, మంత్రులతోను, ధర్మజ్ఞులతోను ఆలోచన చేయక, ఈ పనిని తొందరపడి చేసితిని.
2.59.24.అనుష్టుప్
భవితవ్యతయా నూనమ్
ఇదం వా వ్యసనం మహత్।
కులస్యాస్య వినాశాయ
ప్రాప్తం సూత యదృచ్ఛయా॥
టీక:-
భవితవ్యతయా = అట్లు కావలసియుండుటవలన; నూనమ్ = కచ్చితముగ; ఇదం = ఈ; వా = లేక; వ్యసనం = కష్టము; మహత్ = పెద్ద; కులస్య = కులముయొక్క; అస్య = ఈ; వినాశాయ = వినాశము కొరకై; ప్రాప్తం = ప్రాప్తించినది; సూత = సారథీ; యదృచ్ఛయా = దైవేచ్ఛ వలన.
భావం:-
సుమంత్రా! ఈ విధముగా కావలసి యుండి, దైవ వశమున, కచ్చితముగ ఇంత పెద్దకష్టము ఈ కుల వినాశనమునకై ప్రాప్తించినది.
2.59.25.అనుష్టుప్
సూత! యద్యస్తి తే కించిత్
మయా తు సుకృతం కృతమ్।
త్వం ప్రాపయాఽఽశు మాం రామమ్
ప్రాణాస్సంత్వరయంతిమామ్॥
టీక:-
సూత = సుమంత్రా; యది = ఒకవేళ; అస్తి = ఉండిన; తే = నీకు; కించిత్ = కొంచెమైనను; మయా = నాచే; సుకృతం = మేలు; కృతమ్ = చేయబడినది; త్వం = నీవు; ప్రాపయా = పొందించుము; ఆశు = వెంటనే; మాం = నన్ను; రామమ్ = రాముని; ప్రాణాః = ప్రాణములు; సంత్వరయంతి = తొందర పెట్టుచున్నవి; మామ్ = నన్ను.
భావం:-
సుమంత్రా! నేను నీకు ఏమాత్రమైన ఉపకారము చేసియున్నచో, నన్ను రామునికడకు కొనిపొమ్ము. నా ప్రాణములు నన్ను తొందర పెట్టుచున్నవి.
2.59.26.అనుష్టుప్
యద్యద్యాపి మమైవాజ్ఞా
నివర్తయతు రాఘవమ్।
న శక్ష్యామి వినా రామమ్
ముహూర్తమపి జీవితుమ్॥
టీక:-
యది = ఒకవేళ; అద్య = ఇప్పుడు; అపి = కూడ; మమ = నా; ఏవ = అయినచో; ఆజ్ఞ = ఆజ్ఞ; నివర్తయతు = వెనుకకు మరలించుము; రాఘవమ్ = రాముని; న = లేను; శక్ష్యామి = సమర్థుడను; వినా = లేక; రామమ్ = రాముడు; ముహూర్తమ్ = ముహూర్త కాలము; అపి = కూడ; జీవితుమ్ = జీవించి ఉండుటకు.
భావం:-
ఇప్పుడు కూడ నా ఆజ్ఞ ఇంకను పాటించబడినట్లైనచో, రాముని వెనుకకు తీసుకొని రమ్ము. రాముడు లేకుండ క్షణకాలమైనను నేను జీవింపజాలను.
2.59.27.అనుష్టుప్
అథవాఽ పి మహాబాహుః
గతో దూరం భవిష్యతి।
మామేవ రథమారోప్య
శీఘ్రం రామాయ దర్శయ॥
టీక:-
అథవా = లేదా; అపి = కూడ; మహాబాహుః = గొప్ప బాహువులు గల రాముడు; గతః = వెళ్లి; దూరం = దూరముగ; భవిష్యతి = ఉండినచో; మామ్ ఏవ = నన్నే; రథమ్ = రథమును; ఆరోప్య = ఎక్కించి; శీఘ్రం = వెంటనే; రామాయ = రాముని; దర్శయ = చూపుము.
భావం:-
ఆజానుబాహుడైన రాముడు దూరముగ వెళ్లియుండినచో, అతనిని తీసుకొని వచ్చుట కుదరనియెడల, నన్నే రథము నెక్కించి, వెంటనే రాముని యొద్దకు తీసుకొనిపోయి చూపింపుము.
2.59.28.అనుష్టుప్
వృత్తదంష్ట్రో మహేష్వాసః
క్వాసౌ లక్ష్మణపూర్వజః।
యది జీవామి సాధ్వేనమ్
పశ్యేయం సీతయా సహ॥
టీక:-
వృత్తదంష్ట్రో = గుండ్రని దంతములు కలవాడు; మహా = గొప్ప; ఇష్వాసః = ధనుస్సు గలవాడు ; క్వ = ఎక్కడ; అసౌ = ఆ; లక్ష్మణపూర్వజః = లక్ష్మణుని అన్న; రాముడు; యది = అయినచో; జీవామి = జీవించెదను; సాధు = బాగుగా; ఏనమ్ = ఇతనిని; పశ్యేయం = చూచుట; సీతయా = సీతతో; సహ = కూడి.
భావం:-
గుండ్రని పలువరుస కలిగి, గొప్ప ధనుస్సును ధరించియున్న ఆ రాముడు ఎక్కడ ఉన్నాడు?సీతాసమేతుడైన ఆ రాముని చూడగలిగినచో నేను జీవించగలను.
2.59.29.అనుష్టుప్
లోహితాక్షం మహాబాహుమ్
ఆముక్తమణికుండలమ్।
రామం యది న పశ్యేయమ్
గమిష్యామి యమక్షయమ్॥
టీక:-
లోహితాక్షం = ఎర్రని కన్నులు కలవాడు ; మహాబాహుమ్ = ఆజానుబాహుడైన; ఆముక్తమణికుండలమ్ = ధరించబడిన ముత్యములు మణులు గలవాడు ; రామం = రాముని; యది = ఒకవేళ; న = లేనిచో; పశ్యేయమ్ = చూచుట; గమిష్యామి = వెళ్ళగలను; యమక్షయమ్ = యమపురిని గూర్చి .
భావం:-
ఎర్రని కన్నులు కలవాడును, ఆజానుబాహువు, ముత్యములను, మణులను, ధరించినవాడును ఐన రాముని ఒకవేళ చూడలేకపోయినచో నేను మరణించెదను.
2.59.30.అనుష్టుప్
అతో ను కిం దుఃఖతరమ్
సోఽహమిక్ష్వాకునందనమ్।
ఇమామవస్థామాపన్నో
నేహ పశ్యామి రాఘవమ్॥
టీక:-
అతః = దీనికంటె; ను = ఉండును; కిం = ఏమి; దుఃఖతరమ్ = ఎక్కువ దుఃఖమును కలిగించునది; సః = ఆ; అహమ్ = నేను; ఇక్ష్వాకునందనమ్ = ఇక్ష్వాకు వంశమునకు ఆనందమును కలిగించు; ఇమామ్ = ఈ; అవస్థామ్ = అవస్థను; ఆపన్నః = పొందిన; న = లేక; ఇహ = ఇక్కడ పశ్యామి = చూచుట; రాఘవమ్ = రాముని.
భావం:-
ఇటువంటి దురవస్థ యందున్న నేను, ఇక్ష్వాకువంశమునకు ఆనందమును చేకూర్చు రాముని చూడలేకున్నచో, ఇంతకంటె దుఃఖకరమైనది ఏమియుండును?
2.59.31.అనుష్టుప్
హా రామ! రామానుజ! హా
హా వైదేహి! తపస్విని।
న మాం జానీథ దుఃఖేన
మ్రియమాణమనాథవత్”॥
టీక:-
హా రామ = అయ్యో రామా; రామానుజ హా = అయ్యో లక్ష్మణా; హా వైదేహి = అయ్యో సీతా; తపస్విని = దీనురాలవైన; న = లేదు; మాం = నన్ను; జానీథ = తెలియుట; దుఃఖేన = దుఃఖమువలన; మ్రియమాణమ్ = మరణించుచున్నట్లుగ; అనాథవత్ = అనాథుని వలె.
భావం:-
అయ్యో రామా! ఓ లక్ష్మణా! దీనురాలివైయున్న ఓ సీతా! అనాథునివలె నేను మరణించుచున్నట్లున్న విషయమును మీరు ఎరుగరు కదా!”
2.59.32.అనుష్టుప్
స తేన రాజా దుఃఖేన
భృశమర్పితచేతనః।
అవగాఢస్సుదుష్పారమ్
శోకసాగరమబ్రవీత్॥
టీక:-
సః = ఆ; తేన = దాని; రాజా = రాజు; దుఃఖేన = దుఃఖముచే; భృశమ్ = చాలా; అర్పితచేతనః = లొంగిపోయిన చిత్తము గల; అవగాఢః = ప్రవేశించినవాడై; సుదుష్పారమ్ = దాటుటకు శక్యము కాని; శోకసాగరమ్ = శోకసముద్రమును; అబ్రవీత్ = పలికెను.
భావం:-
ఆ దుఃఖముచే చాల కృంగిపోయి, దశరథుడు తేరుకొనలేనంతటి దుఃఖసాగరములో మునిగిపోయినవాడై ఇట్లు పలికెను.
2.59.33.అనుష్టుప్
రామశోకమహాభోగః
సీతావిరహపారగః।
శ్వసితోర్మి మహావర్తో
బాష్పఫేనజాలావిలః॥
టీక:-
రామశోకమహాభోగః = రాముని గురించి అనంతమైన శోకము గలది ; సీతావిరహపారగః = సీతావిరహమనెడి ఆవలితీరము వరకు వ్యాపించినది; శ్వసితోర్మిమహావర్తిః = నిట్టూర్పులనెడి అలలు గలది ; బాష్పఫేనజాలావిలః = కన్నీరనెడి నురుగుతోను మరియు జలముతోను వ్యాకులము చెందియున్నది
భావం:-
కౌసల్యా! నేను రాముని గురించిన మహాశోకసముద్రములో మునిగి ఉన్నాను. రాముని గురించిన శోకమే దీని నిడివి. సీతా విరహమే దీని ఆవలి తీరము. నా నిట్టూర్పులే దీని అలలు. నా మనోవ్యాకులభరిత కన్నీరే ఆ శోకసముద్రజలము మరియు దాని నురుగు.
2.59.34.అనుష్టుప్
బాహువిక్షేపమీనౌఘో
విక్రందిత మహాస్వనః।
ప్రకీర్ణకేశశైవాలః
కైకేయీబడబాముఖః॥
టీక:-
బాహువిక్షేపమీనౌఘః = నా చేతుల కదలికలు అనెడి చేపలు గలది ; విక్రందిత మహాస్వనః = నా ఆక్రందన లనెడి ఘోష గలది ; ప్రకీర్ణకేశశైవాలః = రేగిపోయియున్న నా కేశము లనెడి నాచు గలది ; కైకేయీబడబాముఖః = కైకేయి అనెడి బడబాగ్ని గలది .
భావం:-
నా చేతుల కదలికలే ఆ సముద్రము నందలి చేపలు. నా ఆక్రందనలే ఆ సాగరఘోష. రేగిపోయియున్న నా కేశములే ఆ సముద్రము నందలి నాచు. కైకేయి అనెడి బడబాగ్నియే దానికి మూలహేతువు.....
2.59.35.అనుష్టుప్
మమాశ్రువేగప్రభవః
కుబ్జావాక్యమహాగ్రహః।
వరవేలో నృశంసాయా
రామప్రవ్రాజనాయతః॥
టీక:-
మమ = నా; అశ్రువేగప్రభవః = కన్నీటి ధారలకు కారణమైన; కుబ్జావాక్య = గూనిదాని మాటలు; మహాగ్రహః = మొసళ్ళు గలది; వరవేలః = వరములే ఆవలి తీరముగా గలది ; నృశంసాయా = క్రూరురాలి; రామ = రాముని; ప్రవ్రాజన్ = దూరముగ పంపివేయుటచే; ఆయతః = నిడివైనది.
భావం:-
నా కన్నీటి ధారలకు కారణమైన మందర మాటలే అందలి మొసళ్ళు. క్రూరాత్మురాలైన కైకేయి వరములే ఆవలి తీరములు. రాముని వనవాసమే ఆ శోకసాగరమును ఇంకను విస్తరింప జేయుచున్నది.
2.59.36.అనుష్టుప్
యస్మింబత నిమగ్నోఽ హమ్
కౌసల్యే! రాఘవం వినా।
దుస్తరో జీవతా దేవి
మయాఽ యం శోకసాగరః॥
టీక:-
యస్మిన్ = దేనియందు; బత = కష్టము; నిమగ్నః = మునిగి ఉంటినో; అహమ్ = నేను; కౌసల్యే = కౌసల్యా; రాఘవం = రాముడు; వినా = లేక; దుస్తరః = దాటుటకు వీలులేనిది; జీవతా = జీవించియుండగ; దేవి = దేవీ; మయా = నాచే; అయం = ఈ; శోకసాగరః = శోకసముద్రము.
భావం:-
ఓ కౌసల్యా! రాముడు లేకుండగ నేను జీవించియుండి, ఈ శోకసముద్రమును దాటజాలను. ఇది చాలా కష్టము.
2.59.37.జగతి.
అశోభనం యోఽ హమిహాద్య రాఘవం
దిదృక్షమాణో న లభే సలక్ష్మణమ్”।
ఇతీవ రాజా విలపంమహాయశాః
పపాత తూర్ణం శయనే సమూర్ఛితః॥
టీక:-
అశోభనం = చాల అమంగళము; యః = ఏ; అహమ్ = నేను; ఇహ = ఇక్కడ; అద్య = ఇప్పుడు; రాఘవం = రాముని; దిదృక్షమాణః = చూడదలచిన వాడనైనను; న = లేదు; లభే = పొందుట; సలక్ష్మణమ్ = లక్ష్మణునితో కూడిన; ఇతి = ఇట్లు; ఇవ = వలె; రాజా = రాజు; విలపన్ = శోకించుచు; మహాయశాః = గొప్ప కీర్తిమంతుడైన; పపాత = పడిపోయెను; తూర్ణం = వెంటనే; శయనే = మంచముపైన; సమూర్ఛితః = మూర్ఛనొంది.
భావం:-
"లక్ష్మణ సమేతముగా రాముని చూడవలెనని కోరికతో ఉన్న నేను రాముని ఇక్కడ చూచుట లేదు. ఇది చాలా బాధాకరము" అని విలపించుచు గొప్ప కీర్తిమంతుడైన దశరథుడు వెంటనె మూర్చనొంది మంచముపైన పడిపోయెను.
2.59.38.జగతి.
ఇతి విలపతి పార్థివే ప్రణష్టే
కరుణతరం ద్విగుణం చ రామహేతోః।
వచనమనునిశమ్య తస్య దేవీ
భయమగమత్పునరేవ రామమాతా॥
టీక:-
ఇతి = ఇట్లు; విలపతి = విలపించుచు; పార్థివే = రాజు; ప్రణష్టే = మూర్చనొందగ; కరుణతరం = చాల దీనముగ; ద్విగుణం = రెట్టింపు; రామహేతోః = రాముని కొరకై; వచనమ్ = మాటను; అనునిశమ్య = విని; తస్య = అతని; దేవీ = దేవి; భయమ్ = భయమును; అగమత్ = పొందెను; పునరేవ = మరల; రామమాతా = రాముని తల్లి.
భావం:-
దశరథుడు ఆ విధముగా రామునికొరకై చాల దీనముగ, రెట్టింపు దుఃఖముతో విలపించుచు, మూర్ఛనొందగ, కౌసల్య ఆ మాటలను విని చాలా భయపడెను.
2.59.39.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ఏకోనషష్టితమ సర్గః॥
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; ఏకోనషష్టితమ [59] ఏభై తొమ్మిదవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [59] ఏభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.60.1.అనుష్టుప్
తతో భూతోపసృష్టేవ
వేపమానా పునః పునః।
ధరణ్యాం గతసత్త్వేవ
కౌసల్యా సూతమబ్రవీత్॥
టీక:-
తతః = అప్పుడు; భూత = భూతము; ఉపసృష్టేవ = ఆవహించినది వలె; వేపమానా = వణుకుచు; పునః పునః = మాటిమాటికిని; ధరణ్యాం = నేల మీద; గతసత్వ + ఇవ = ఓపికలేనిదాని; ఇవ = వలె; కౌసల్యా = కౌసల్య; సూతమ్ = సుమంత్రునితో; అబ్రవీత్ = పలికెను
భావం:-
అపుడు కౌసల్య, దయ్యంపట్టినదాని వలె వణుకుచు, ఓపికలేనిదాని వలె మాటిమాటికిని వణికిపోవుచూ, సుమంత్రునితో ఇట్లు పలికెను.
2.60.2.అనుష్టుప్
“నయ మాం యత్ర కాకుత్థ్సః
సీతా యత్ర చ లక్ష్మణః।
తాన్వినా క్షణమప్యత్ర
జీవితుం నోత్సహేహ్యహమ్॥
టీక:-
నయ = తీసుకొనిపొమ్ము; మాం = నన్ను; యత్ర = ఎక్కడ; కాకుత్థ్సః = రాముడు; సీతా = సీత; యత్ర చ = ఎక్కడ ఉన్నారో; చ = ఇంకనూ; లక్ష్మణః = లక్ష్మణుడు; తాన్ = వారిని; వినా = విడిచి; క్షణమ్అపి = క్షణకాలము; అపి = ఐనను; అత్ర = ఇక్కడ; జీవితుం = ఉండుటకు; న = లేదు; ఉత్సహేహి = ఇచ్చగించుకు; అహమ్ = నేను.
భావం:-
సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో, నన్ను కూడా అక్కడికే తీసికొని పొమ్ము. వాళ్లను విడిచి నేను ఇక్కడ క్షణకాలమైనను ఉండుటకు ఇచ్చగింపను.
2.60.3.అనుష్టుప్
నివర్తయ రథం శీఘ్రమ్
దండకాన్నయ మామపి।
అథ తాన్నానుగచ్ఛామి
గమిష్యామి యమక్షయమ్”॥
టీక:-
నివర్తయ = మరల్చుము; రథం = రథమును; శీఘ్రమ్ = వేగముగా; దండకాత్ = దండకారణ్యమునకు; నయ = మరల్చుము; మామ్ = నన్ను; అపి = కూడ; అథ = ఒకవేళ; తాన్ = వారిని; అననుగచ్ఛామి = అనుసరించి వెళ్లకపోయినచో; గమిష్యామి = పోయెదను; యమక్షయమ్ = యమలోకమునకే
భావం:-
రథమును శీఘ్రముగా వెనుకకు మరల్చుము. నన్ను కూడ దండకారణ్యమునకు తీసుకొని పొమ్ము. వాళ్లను అనుసరించి వెళ్లకపోయినచో నేను యమలోకమునకే పోయెదను.”
2.60.4.అనుష్టుప్
బాష్పవేగోపహతయా
స వాచా సజ్జమానయా।
ఇదమాశ్వాసయన్దేవీమ్
సూతః ప్రాంజలిరబ్రవీత్॥
టీక:-
బాష్పవేగః = ఉబికివస్తున్న కన్నీరు; ఉపహతయా = కంఠంలో అడ్డుపడగా; స = అట్టి; వాచా = వాక్కుతో; సజ్జమానయా = తొట్రుపడుచున్న; ఇదమ్ = ఇట్లు; ఆశ్వాసయన్ = ఓదార్చుచు; దేవీమ్ = కౌసల్యను; సూతః = సుమంత్రుడు; ప్రాంజలిః = నమస్కరించుచు; అబ్రవీత్ = పలికెను
భావం:-
ఉబికివస్తున్న కన్నీటి ప్రవాహం కంఠంలో అడ్డుపడుతుండ తొట్రుపడుచున్న పలుకులతో కౌసల్యను ఓదార్చుచు, సుమంత్రుడు అంజలి ఘటించి నమస్కరించుచు, ఇట్లు పలికెను.
2.60.5.అనుష్టుప్
“త్యజ శోకం చ మోహం చ
సంభ్రమం దుఃఖజం తథా।
వ్యవధూయ చ సంతాపమ్
వనే వత్స్యతి రాఘవః॥
టీక:-
త్యజ = విడిచిపెట్టుము; శోకం = శోకమును; చ = ఇంకను; మోహం = మోహమును; చ = ఇంకను; సంభ్రమం = భయమును, వావిళ్ళ నిఘంటువు; దుఃఖజం = దుఃఖము వలన కలిగిన; తథా = ఎటువంటి; వ్యవధూయ = కష్టములును; చ = ఇంకను; సంతాపమ్ = తొందరపాటును; వనే = వనములో; వత్స్యతి = నివసించగలడు; రాఘవః = రాముడు
భావం:-
శోకమును, మోహమును, దుఃఖము వలన కలిగిన తొందరపాటును విడిచిపెట్టుము. రాముడు ఏ కష్టములును లేకుండా వనములో నివసించగలడు.
*గమనిక:-
(1) శోకః- చిత్తవికల్పలతా. (2) మోహ-అజ్ఞానే మోది. (3) సంభ్రమ- సం+ భ్రమ+ ఘఞ్, సం అధికం, భ్రమతి భిభేత్, చపలో భవతి తస్య భావః కర్మ వా, వేగిరపాటు, భయము.
2.60.6.అనుష్టుప్
లక్ష్మణశ్చాపి రామస్య
పాదౌ పరిచరన్వనే।
ఆరాధయతి ధర్మజ్ఞః
పరలోకం జితేంద్రియః॥
టీక:-
లక్ష్మణః = లక్ష్మణుడు; చ = పాదపూరణ; అపి = కూడ; రామస్య = రాముని; పాదౌ = పాదద్వయమును; పరిచరత్ = సేవ చేయుచు; వనే = అడవిలో; ఆరాధయతి = సాధించుచున్నాడు; దర్మజ్ఞః = ధర్మజ్ఞుడైన; పరలోకం = పరలోమమును; జితేంద్రియః = జిత + ఇంద్రియః, జితేంద్రియుడై
భావం:-
ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు జితేంద్రియుడై అడవి యందు రాముని పాదసేవ చేయుచు పరలోకమును సాధించుచున్నాడు.
2.60.7.అనుష్టుప్
విజనేఽపి వనే సీతా
వాసం ప్రాప్య గృహేష్వివ।
విస్రంభం లభతేఽభీతా
రామే సన్న్యస్తమానసా॥
టీక:-
విజనః = నిర్మానుష్యమైనదే; అపి = ఐనా; వనే = అడవిలో; సీతా = సీతాదేవి; వాసం = నివసించుచు; ప్రాప్య = ఉండెను; గృహేషు = గృహమునందు; ఇవ = వలె; విస్రంభం = విశ్వాసమును; లభతే = సంపాదించుకొని; అభీతా = భయములేనిదై; రామే = రామునిపై; సన్న్యస్త = నిలిపి; మానసా = మనస్సును.
భావం:-
ఆ నిర్మానుష్యంగా ఉన్న అడవిలోకూడ సీతాదేవి, గృహమునందు వలె నివసించుచు, మనస్సును రాముని పైననే నిలిపి, భయములేనిదై, విశ్వాసముతో ఉన్నది.
*గమనిక:-
కరుణశ్రీ విరచితమైన ఊర్మిళ ఖండికలోని దీనిని చూడండి. రమణుడు చెంతనుండిన అరణ్యములే అపరంజి మేడలౌ- రమణుడులేక మేడలే అరణ్యములౌ- - - ఇకనేమి జానకీ రమణిది రాణీవాసము.
2.60.8.అనుష్టుప్
నాస్యా దైన్యం కృతం కించిత్
సుసూక్ష్మమపి లక్ష్యతే।
ఉచితేవ ప్రవాసానామ్
వైదేహీ ప్రతిభాతి మా॥
టీక:-
న = లేదు; అస్యాః = ఆమెలో, సీతాదేవిలో; దైన్యం = దైన్యమును; కృతం = చెందుట లేదు; కించిత్ = ఏ మాత్రము; సుసూక్ష్మమపి = కొంచెము కూడా; లక్ష్యతే = లక్ష్యపెట్టుట; ఉచిత = అలవాటుపడినదాని; ఏవ = వలె; ప్రవాసానామ్ = ప్రవాసములకు; వైదేహీ = సీత; ప్రతిభాతి మా = నాకు కనపడుచున్నది.
భావం:-
సీతలో ఏ మాత్రము కూడ దైన్యము కనబడుట లేదు. ఆమె ఎన్నియో ప్రవాసములకు, ఎప్పటి నుండియో అలవాటుపడివారిలా మెలగుచున్నట్లు నాకు కనబడుచున్నది.
2.60.9.అనుష్టుప్
నగరోపవనం గత్వా
యథా స్మ రమతే పురా।
తథైవ రమతే సీతా
నిర్జనేషు వనేష్వపి॥
టీక:-
నగర = నగరములోని; ఉపవనం = ఉద్యానములకు; గత్వా = వెళ్లినచో; యథా = ఏ విధముగా; స్మః రమతే = క్రీడించుచుండెడితో; పురా = పూర్వము; తథైవ = అదేవిధముగా; రమతే = విహరించుచున్నది; సీతా = సీతాదేవి; నిర్జనేషు = నిర్జనములైన; వనేషు = అరణ్యములందు; అపి = కూడ.
భావం:-
సీత, పూర్వము నగరములోని ఉద్యానములకు వెళ్లి అక్కడ ఏ విధముగ క్రీడించుచుండెడిదో, అదేవిధముగా నిర్జనారణ్యములందు కూడ విహరించుచున్నది.
2.60.10.అనుష్టుప్
బాలేవ రమతే సీతా
బాలచంద్రనిభాననా।
రామా రామే హ్యధీనాత్మా
విజనేఽపి వనే సతీ॥
టీక:-
బాల = బాలిక; ఇవ = వలె; రమతే = విహరించుచు; సీతా = సీత; బాలచంద్ర నిభాననా = బాలచంద్రుని వంటి ముఖము కలది అయిన; రామా = రమించునది, లక్ష్మీదేవి, సీతాదేవి, సర్వశబ్దసంబోధిని; రామేహి = రామునిపైననే; అధీనాత్మా = అధీన + ఆత్మా, చిత్తము నిలిపిన; విజనః = విజనమైనది; వనే = ఐనప్పటికీ; వనే = వనము; సతీ = సీతాదేవి.
భావం:-
పున్నమిచంద్రుని వంటి కాంతివంతమైన మోము కల సీతాదేవి, చిన్న బాలిక వలె ఆస్వాదిస్తూ విహరించుచున్నది. రమించుస్వభావము కలది, సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము ఐన సీత, అడవులు నిర్జనమైనవి ఐనను, పూర్తిగా రామునిపై చిత్తము నిలిపినది కనుక ఏచింతా లేక హాయిగా ఆనందించుచుండెను.
2.60.11.అనుష్టుప్
తద్గతం హృదయం హ్యస్యాః
తదధీనం చ జీవితమ్।
అయోధ్యాపి భవేఽత్తస్యా
రామహీనా తదా వనమ్॥
టీక:-
తత్ = ఆ రామునియందే; గతం = లగ్నమైన; హృదయమ్ = చిత్తము కలది; హి = నిశ్చలముగా; అస్యాః = సీత; తత్ = అతనిపైననే; అధీనమ్ = ఆధారపడి ఉన్నది; చ = కూడా; జీవితమ్ = జీవితమును; అయోధ్య = అయోధ్యా నగరము; చ = కూడా; భవేః = అగును; తస్యా = సీతమ్మకు; రామహీనా = రాముడు లేనిచో; తదా = అప్పుడు; వనమ్ = అడవే.
భావం:-
ఆమె ఎల్లప్పుడును రామునియందే తన హృదయమును, జీవితమును అంకితముచేసి ఉన్నది. రాముడు లేని అయోధ్యనగరమైనా ఆమెకు అడవియే.
2.60.12.అనుష్టుప్
పరి పృచ్ఛతి వైదేహీ
గ్రామాంశ్చ నగరాణి చ।
గతిం దృష్ట్వా నదీనాం చ
పాదపాన్వివిధానపి॥
టీక:-
పరిపృచ్ఛతి = అడిగి తెలుసుకొనుచున్నది; వైదేహీ = సీతాదేవి; గ్రామామ్ = గ్రామములు; చ = మఱియు; నగరాణి = నగరములు; చ = మఱియు; గతిం = ప్రవర్తించుచు; దృష్ట్వా = చూచుచు; నదీనాం = నదుల ప్రవాహమును; చ = మఱియు; పాదపాన్ = చెట్లను; వివిధాన్ = వివిధములైన; అపి = అయినవాటిని
భావం:-
సీత తనకు కనబడిన గ్రామములు, నగరములు, నదులు, ప్రవాహములు, వివిధ వృక్షములు మొదలగు వాటిని గూర్చి అడిగి తెలుసుకొనుచున్నది.
2.60.13.అనుష్టుప్
రామం హి లక్ష్మణం వాపి
పృష్ట్వా జానాతి జానకీ।
అయోధ్యా క్రోశమాత్రే తు
విహారమివ సంశ్రితా॥
టీక:-
రామమ్ = రాముని; హి = తప్పక; లక్ష్మణం = లక్ష్మణుని; వాపి = అయినాగాని; పృష్ట్వా = ప్రశ్నించి; జానాతి = తెలుసుకొనుచున్నది; జానకీ = సీతాదేవి; అయోధ్యా = అయోధ్యకు; క్రోశమాత్రే తు = క్రోసు దూరమునందున్న; తు = ఉన్న;విహారమ్ = ఉద్యానవనములో; ఇవ = వలెనే; సంశ్రితా = ప్రవర్తించుచు.
భావం:-
ఎంతటి అరణ్యములో ఉన్నను, అయోధ్యకు క్రోసు దూరమునందున్న ఉద్యానవనములో ఉన్నట్లు ప్రవర్తించుచు, రాముని గాని, లక్ష్మణుని గాని ప్రశ్నించి తెలుసుకొనుచున్నది.
2.60.14.అనుష్టుప్
ఇదమేవ స్మరామ్యస్యాః
సహసైవోపజల్పితమ్।
కైకేయీ సంశ్రితం వాక్యమ్
నేదానీం ప్రతిభాతి మామ్॥
టీక:-
ఇదమ్ = ఇది; ఏవ = మాత్రమే; స్మరామి = జ్ఞప్తిలో ఉన్నది; అస్యాః = ఆమెకు; సహస = తటాలున; ఏవ = ఐతే; ఉపజల్పితమ్ = పలికింది; కైకేయీ = కైకేయిని; సంశ్రితం = సంబంధించి; వాక్యమ్ = మాటలు; న = లేదు; ఇదానీం = ఇప్పుడు; ప్రతిభాతి = జ్ఞాపకము; మామ్ = నాకు
భావం:-
సీతకు సంబంధించి ఈ విషయములు మాత్రమే నాకు జ్ఞప్తిలో ఉన్నవి. కైకేయిని విషయమై ఆమె అధాట్టుగా ఏమో అన్నది గాని, అది నాకు ఇప్పుడు గుర్తు లేదు.
2.60.15.అనుష్టుప్
ధ్వంసయిత్వా తు తద్వాక్యమ్
ప్రమాదాత్పర్యుపత్స్థితమ్।
హ్లాదనం వచనం సూతో
దేవ్యా మధురమబ్రవీత్॥
టీక:-
ధ్వంసయిత్వా తు = పరుషముగా పలికినది; తు = ఐనట్టి; తత్ + వాక్యమ్ = ఆ మాటలను; ప్రమాదాత్ = కప్పిపుచ్చి; పర్యుపత్ స్థితమ్ = నాలుక చివరకు వచ్చిన; హ్లాదనం = ఆనందమును కలిగించు; వచనం = మాటలను; సూతః = సుమంత్రుడు; దేవ్యా = కౌసల్యకు; మధురమ్ = మధురమైన; అబ్రవీత్ = పలికెను.
భావం:-
ఈ విధముగా నాలుక చివరకు వచ్చిన, కైకేయిని గూర్చి సీత అన్న మాటలను కప్పిపుచ్చి, సుమంత్రుడు కౌసల్యకు ఆనందమును కలిగించు, మధురమైన వాక్యము పలికెను.
2.60.16.అనుష్టుప్
అధ్వనా వాతవేగేన
సంభ్రమేణాఽతపేన చ।
న విగచ్ఛతి వైదేహ్యాః
చంద్రాంశు సదృశీ ప్రభా॥
టీక:-
అధ్వనా = ప్రయాణము చేత; వాతవేగేన = వాయు వేగము చేత; సంభ్రమేణా = కంగారు పడుట చేత; ఆతపేన = ఎండ చేత; చ = కూడా; న = లేదు; విగచ్ఛతి = వాడిపోవుట; వైదేహ్యాః = సీతాదేవి; చంద్రాంశు = చంద్రకిరణములతో; సదృశీ = సమానమైన; ప్రభా = కాంతి.
భావం:-
ప్రయాణము చేత గాని, వాయువేగము చేత గాని, కంగారు పడుట చేత గాని, ఎండ చేత గాని, చంద్రకిరణములతో సమానమైన సీత శరీరకాంతి ఏ మాత్రము వాడిపోవుట లేదు.
2.60.17.అనుష్టుప్
సదృశం శతపత్రస్య
పూర్ణచంద్రోపమ ప్రభమ్।
వదనం తద్వదాన్యాయా
వైదేహ్యా న వికమ్పతే॥
టీక:-
సదృశం = సమానమైనది; శతపత్రస్య = పద్మముతో; పూర్ణచంద్ర = వంటి; ఉపమ = వంటి; ప్రభమ్ = కాంతి గల; వదనం = ముఖము; తత్ = ఆ; వదాన్యాయా = ఉదారస్వభావురాలగు; వైదేహ్యా = సీతాదేవి యొక్క; న = లేదు; వికమ్పతే = వసివాడ.
భావం:-
శతపత్రపద్మముతో సమానమైనది, పూర్ణచంద్రుని వంటి కాంతి గలది అయిన, ఉదార స్వభావురాలగు ఆ సీత ముఖము ఏ మాత్రము వసివాడలేదు.
2.60.18.అనుష్టుప్
అలక్తరసరక్తాభౌ
అలక్తరసవర్జితౌ।
అద్యాపి చరణౌ తస్యాః
పద్మకోశసమప్రభౌ॥
టీక:-
అలక్తరసః = లాక్షారసము (పారాయణ) వ్రాసుకొనుటచే; రక్తాభౌ = ఎఱ్ఱబారినట్లు(రెండు పాదాలు); అలక్తరస = లాక్షారసము; వర్జితౌ = లేనివైనా; అద్యాపి = అయినప్పటికీ; చరణౌ = పాద ద్వయములు; తస్యాః = సీతాదేవి; పద్మకోశః = పద్మపు మొగ్గలకు; సమ = వంటి; ప్రభౌ = కాంతితో ప్రకాశించుచున్నవి.
భావం:-
ఆమె పాదములకు ఎఱ్ఱబారుటకు పారాయణ పెట్టుకొనకపోయినను అవి పారాయణపెట్టుకున్నట్లు వలె ఎఱ్ఱగా ఉండి, ఇప్పుడు కూడ పద్మపు మొగ్గల ఎఱుపు వంటి కాంతితో ప్రకాశించుచున్నవి.
2.60.19.అనుష్టుప్
నూపురోద్ఘుష్టహేలేవ
ఖేలం గచ్ఛతి భామినీ।
ఇదానీమపి వైదేహీ
తద్రాగాన్న్యస్త భూషణా॥
టీక:-
నూపుర = కాలిఅందెలు; ఉద్ఘుష్ట = ఘల్లుఘల్లుచున్న; హేల = విలాసముకలది; ఇవ = అన్నట్లు; ఖేలమే = క్రీడిస్తున్నట్లే; గచ్ఛతి = వర్తిల్లుచున్నది; భామినీ = ఆమె; ఇదానీమ్ = ఇప్పటికి; అపి = కూడా; వైదేహీ = సీతాదేవి; తత్ = అతనికి; రాగాత్ = ఆనందముకలిగించుటకు; న్యస్త = ధరించిన; భూషణా = భూషణములు కలది.
భావం:-
సీత క్రీడించుచున్నట్లు నడచుచుండగా ఆమె కాలి అందెలు, ఆమె విలాసమును ఘోషించుచున్నట్లు ఘల్లుఘల్లు మనుచున్నవి. రామునకు అనురాగము కలిగించుటకై భూషణములు ధరించి ఉన్నది.
2.60.20.అనుష్టుప్
గజం వా వీక్ష్య సింహం వా
వ్యాఘ్రం వా వనమాశ్రితా।
నాఽహారయతి సంత్రాసమ్
బాహూ రామస్య సంశ్రితా॥
టీక:-
గజమ్ = ఏనుగును; వా = గాని; వీక్ష్య = చూచి; సింహమ్ = సింహమును; వా = గాని; వ్యాఘ్రమ్ = పెద్దపులిని; వా = గాని; వనమ్ = అరణ్యముని; ఆశ్రితా = ఆశ్రయించి ఉన్నవాటిని; నా = లేదు; ఆహారయతి = చెందుట; సంత్రాసమ్ = భయంమును; బాహూ = బాహు ద్వయ బలముచే; రామస్య = రాముని; సంశ్రితా = ఆశ్రయించినదై.
భావం:-
సీత ఇప్పుడు, రాముని యొక్క బాహుబలముచే రక్షింపబడుచు, అడవిలో తిరుగుచున్న ఏనుగును గాని, సింహమును గాని, పులిని గాని చూచి కూడా భయపడుట లేదు.
2.60.21.అనుష్టుప్
న శోచ్యాస్తే న చాత్మనః
శోచ్యో నాపి జనాధిపః।
ఇదం హి చరితం లోకే
ప్రతిష్ఠాస్యతి శాశ్వతమ్॥
టీక:-
న = లేదు; శోచ్యాః = విచారించుచు; అస్తి = ఉండు అవసరము; తే = వారి గురించి గాని; న = లేదు; చ = ఇంకను; ఆత్మనః = మనలను గురించి గాని; శోచ్యః = ఆలోచించవలసిన; న = లేదు; అపి = అయినను; జనాధిపః = మహారాజును గూర్చి; ఇదం హి = ఈ విధముగా; చరితం = చరిత్ర; లోకే = లోకమునందు; ప్రతిష్ఠాస్యతి = నిలచి ఉండగలదు; శాశ్వతమ్ = శాశ్వతముగా
భావం:-
వనములో ఉన్న ఆ సీత,, వారిని గూర్చి గాని, మనలను గూర్చి గాని, మహారాజును గూర్చి గాని విచారించవలసిన పని లేదు. ఈ చరిత్ర లోకమునందు స్థిరముగా నిలచి ఉండగలదు.
2.60.22.జగతి.
విధూయ శోకం పరిహృష్టమానసా
మహర్షియాతే పథి సువ్యవత్సి్థతాః।
వనేరతా వన్యఫలాశనాః పితుః
శుభాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి తే॥
టీక:-
విధూయ = విడచి; శోకం = శోకమును; పరిహృష్ట = సంతోషముతో కూడిన; మానసా = మనసులతో; మహర్షియాతే = మహర్షులు నడచిన; పథి = మార్గమునందు; సువ్యవత్థ్సితాః = స్థిరముగా ఉన్నవారై; వనే = వనములో; రతా = ఆనందించుచు; వన్య = అరణ్యములో; ఫల = ఫలములను; అశనాః = భుజించుచు; పితుః = తండ్రి యొక్క; శుభాం = శుభమైన; ప్రతిజ్ఞాం = ప్రతిజ్ఞను; పరిపాలయంతి = పాలించుచున్నారు; తే = వారు.
భావం:-
ఆ సీతారామలక్ష్మణులు శోకమును విడచి, సంతోషముతో గూడిన మనస్సులతో, మహర్షులు నడచిన మార్గమునందు స్థిరముగా ఉన్నవారై, అరణ్యములో ఆనందించుచు, అక్కడ లభించు ఫలములను భుజించుచు, తండ్రి యొక్క శుభప్రదమైన ప్రతిజ్ఞను పాలించుచున్నారు.
2.60.23.జగతి.
తథాపి సూతేన సుయుక్తవాదినా
నివార్యమాణా సుతశోకకర్శితా।
న చైవ దేవీ విరరామ కూజితాత్
ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ॥
టీక:-
తథాపి = అయినప్పటికీ; సూతేన = సుమంత్రుని చేత; సుయుక్తవాదినా = యుక్తముగా పలుకుచున్న; నివార్యమాణా = నివారించుచున్న; సుతశోక = పుత్ర శోకము చేత; కర్శితా = పీడితురాలై; న = లేదు; చైవ = ఇసుమంతైనను; దేవీ = కౌసల్యాదేవి; విరరామ = మానుట; కూజితాత్ = అరచుట; ప్రియేతి పుత్రా = ప్రియపుత్రా; ఇతి = అనుచు; చ = ఇంకా; రాఘవ = రామా; ఇతి = ఈ విధముగా; చ = కూడా.
భావం:-
యుక్తముగా పలుకుచున్న సుమంత్రుడు ఈ విధముగా నివారించుచున్నను కౌసల్య పుత్ర శోకముచే పీడితురాలై,”ప్రియపుత్రా” “రామా!’’ అని విలపించుట మానలేదు.
2.60.24.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే షష్టితమ సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాండే = అయోధ్యకాండ లోని; షష్టితమ [60] = అరవైయవ; సర్గః = సర్గ.
బావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని [60] అరవైయవ సర్గ సంపూర్ణము.