2.37.1.
అనుష్టుప్.
మహామాత్రవచః శ్రుత్వా
రామో దశరథం తదా।
అభ్యభాషత వాక్యం తు
వినయజ్ఞో వినీతవత్॥
టీకః-
మహామాత్ర = మహామంత్రి; వచః = మాటలను; శ్రుత్వా = విని; రామః = రాముడు; దశరథం = దశరథుని గూర్చి; తదా = అప్పుడు; అభ్యభాషత = పలికెను; వాక్యం = మాటను; తు = ఇంకా; వినయజ్ఞః = వినయము నెరిగిన; వినీతవత్ = మంచినడవటి కలిగినవాడై, వావిళ్ళ నిఘంటువు
భావంః-
వినయశీలుడైన రాముడు, మహామంత్రి మాటలను విని, దశరథునితో సవినయముగా ఇట్లనెను.
2.37.2.
అనుష్టుప్.
“త్యక్తభోగస్య మే రాజన్
వనే వన్యేన జీవతః।
కిం కార్యమనుయాత్రేణ
త్యక్తసంగస్య సర్వతః॥
టీకః-
త్యక్త = విడువబడిన; భోగస్య = భోగములు గలవాడను; మే = నాకు; రాజన్ = రాజా; వనే = వనమునందు; వన్యేన = వనమున లభించెడివానితో; జీవతః = జీవించువాడనైన; కిం = ఏమి; కార్యమ్ = పని; అనుయాత్రేణ = అనుసరించువారితో; త్యక్త = విడువబడిన; సంగస్య = అనుబంధములు కలవాడను; సర్వతః = సమస్తమైన
భావంః-
”రాజా! భోగములను విడిచి, సర్వసంగపరిత్యాగము చేసి, వనవాసము చేయబోవు నాకు ఈ పరివారముతో పని ఏమి.
2.37.3.
అనుష్టుప్.
యో హి దత్త్వా ద్విపశ్రేష్ఠమ్
కక్ష్యాయాం కురుతే మనః।
రజ్జుస్నేహేన కిం తస్య
త్యజతః కుంజరోత్తమమ్॥
టీకః-
యః = ఎవరు; హి = కదా; దత్త్వా = ఇచ్చి వేసి; ద్విప = ఏనుగులలో; శ్రేష్ఠమ్ = శ్రేష్టమైనదానిని; కక్ష్యాయాం = నడుమునకు కట్టుత్రాటియందు; కురుతే = చేయును; మనః = మనసును; రజ్జు = త్రాడు; స్నేహేన = వ్యామోహముచే; కిం = ఏమి; తస్య = అతనికి; త్యజతః = విడిచిన; కుంజరః = ఏనుగును; ఉత్తమమ్ = ఉత్తమమైన
భావంః-
శ్రేష్ఠమైన ఏనుగును దానంచేసి, దాని నడుము త్రాటిమీద మనసు పడతారా? అంత గొప్ప ఏనుగునే ఇచ్చివేసిన తరువాత, దానిని బంధించే త్రాటికోసం వ్యామోహము ఎందుకు?
2.37.4.
అనుష్టుప్.
తథా మమ సతాం శ్రేష్ఠ!
కిం ధ్వజిన్యా జగత్పతే!।
సర్వాణ్యేవానుజానామి
చీరాణ్యేవాఽ నయన్తు మే॥
టీకః-
తథా = అట్లు; మమ = నాకు; సతాం = సత్పురుషులలో; శ్రేష్ఠః = శ్రేష్ఠమైనవాడా; కిం = ఏమి; ధ్వజిన్యాః = సేనలతో; జగత్పతే = మహారాజా; సర్వాణి = అన్నింటిని; ఏవ = నిశ్చయముగా; అనుజానామి = విడిచివేయుచున్నాను; చీరాణి = నార చీరలను; ఏవ = మాత్రము; అనయన్తు = తీసుకొనివచ్చెదరు గాక; మే = నాకు
భావంః-
సత్పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ మహారాజా! అట్లు సర్వస్వమును త్యజిస్తున్న నాకు సేనలు అవీ ఎందుకు. నాకు నారచీరలు మాత్రము ఇవ్వండి.
2.37.5.
అనుష్టుప్.
ఖనిత్రపిటకే చోభే
సమానయత గచ్ఛతః।
చతుర్దశ వనే వాసమ్
వర్షాణి వసతో మమ॥
టీకః-
ఖనిత్ర = గునపము; పిటకే = గంపను; చ = మఱియును; ఉభే = రెండును; సమానయత = సమ్ + ఆనయత = తీసుకొనిరండు; గచ్ఛతః = పోవుచున్నవాడను; చతుర్దశ = పదునాలుగు; వనే = వనమునందు; వాసమ్ = నివాసము; వర్షాణి = సంవత్సరములు; వసత = నివసించెడి; మమ = నాకు
భావంః-
నాకు గంప, గునపమును మాత్రమే ఇవ్వవలెను. నేను పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుటకు పోవుచున్నాను కదా.
2.37.6.
అనుష్టుప్.
అథ చీరాణి కైకేయీ
స్వయమాహృత్య రాఘవమ్।
ఉవాచ “పరిధత్స్వేతి"
జనౌఘే నిరపత్రపా॥
టీకః-
అథ = తరువాత; చీరాణి = నారచీరలను; కైకేయీ = కైకేయి; స్వయమ్ = స్వయముగ; ఆహృత్య = తీసుకొనివచ్చి; రాఘవమ్ = రాముని గూర్చి; ఉవాచ = పలికెను; పరిధత్స్వ = ధరింపుము; ఇతి = అని; జనౌఘే = జన సమూహమునందు; నిరపత్రపా = నిర్లజ్జగా
భావంః-
అప్పుడు కైకేయి తానే స్వయముగ నారచీరలను తీసుకొనివచ్చి, నిర్లజ్జగా అంతమంది ముందూ రామునికి ఇచ్చి "వీటిని ధరింపుము" అనెను.
2.37.7.
అనుష్టుప్.
స చీరే పురుషవ్యాఘ్రః
కైకేయ్యా ప్రతిగృహ్య తే।
సూక్ష్మవస్త్రమవక్షిప్య
మునివస్త్రాణ్యవస్త హ॥
టీకః-
సః = అతను; చీరే = చీరలను; పురుషవ్యాఘ్రః = పురుషోత్తముడు; కైకేయ్యా = కైకేయినుండి; ప్రతిగృహ్య = తీసుకొని; తే = ఆ; సూక్ష్మవస్త్రమ్ = పలుచని వస్త్రమును; అవక్షిప్య = విడిచి; మునివస్త్రాణి = మునులు ధరించెడి వస్త్రములను; అవస్త హ = ధరించివేసెను
భావంః-
పురుషోత్తముడైన ఆ రాముడు, కైకేయినుండి ఆ నారచీరలను తీసుకొనెను. తాను ధరించియున్న మేలైన పలుచని వస్త్రములను విడిచిపెట్టి, మునులు ధరించెడి వస్త్రములను ధరించెను.
2.37.8.
అనుష్టుప్.
లక్ష్మణశ్చాపి తత్రైవ
విహాయ వసనే శుభే।
తాపసాచ్ఛాదనే చైవ
జగ్రాహ పితురగ్రతః॥
టీకః-
లక్ష్మణః = లక్ష్మణుడును; చ = మఱియును; అపి = కూడ; తత్ర ఏవ = అక్కడనే; విహాయ = విడిచి; వసనే = వస్త్రములను; శుభే = మంచి; తాపసా = తాపసులచే; ఆచ్ఛాదనే = ధరింపబడు; ఏవమ్ = మాత్రమే; జగ్రాహ = ధరించెను; పితుః = తండ్రి; అగ్రతః = ఎదుట
భావంః-
లక్ష్మణుడు కూడ, తండ్రి ఎదుటనే, తాను ధరించియున్న మంచి వస్త్రములను విడిచి, తాపసులు ధరించెడి వస్త్రములను ధరించెను.
2.37.9.
అనుష్టుప్.
అథాఽ త్మపరిధానార్థమ్
సీతా కౌశేయవాసినీ।
సమీక్ష్య చీరం సంత్రస్తా
పృషతీ వాగురామివ॥
టీకః-
అథ = తరువాత; ఆత్మ = తాను; పరిధానార్థమ్ = కట్టుకొనుటకై ఉద్దేశింపబడిన; సీతా = సీత; కౌశేయవాసినీ = పట్టు వస్త్రములను ధరించిన; సమీక్ష్య = చూచి; చీరమ్ = నారచీరను; సంత్రస్తా = భయపడినది; పృషతీ = స్త్రీలింగ లేడి; వాగురామ్ = వలను; ఇవ = వలె
భావంః-
అటు పిమ్మట, పట్టువస్త్రములను ధరించియున్న సీత, కట్టుకొనుటకు తనకిచ్చుచున్న నారచీరలను చూచి, వలను చూచిన లేడి వలె బెదిరిపోయెను.
2.37.10.
అనుష్టుప్.
సా వ్యపత్రపమాణేవ
ప్రగృహ్య చ సుదుర్మనాః।
కైకేయీ కుశచీరే తే
జానకీ శుభలక్షణా॥
టీకః-
సా = ఆమె; వ్యపత్రపమాణేవ = సిగ్గుపడుచునే; ప్రగృహ్య = గ్రహించి; చ = మఱియు; సు = మిక్కలి; దుర్మనాః = అయిష్టముగా; కైకేయీ = కైకేయి నుండి; కుశచీరే = నారచీరలను; తే = ఆ; జానకీ = సీత; శుభలక్షణా = మంచిలక్షణములు గలది
భావంః-
సుభలక్షణవతి యైన సీత సిగ్గుపడుచు, అయిష్టముగానే కైకేయినుండి నారచీరలను తీసుకొనెను.
2.37.11.
అనుష్టుప్.
అశ్రుసమ్పూర్ణ నేత్రా చ
ధర్మజ్ఞా ధర్మదర్శినీ।
గంధర్వరాజప్రతిమమ్
భర్తారమిదమబ్రవీత్॥
టీకః-
అశ్రు = కన్నీటితో; సమ్పూర్ణ = నిండిన; నేత్రాః = నేత్రములు కలది; చ = ఇంకనూ; ధర్మజ్ఞా = ధర్మము నెరిగియున్నది; ధర్మదర్శినీ = ధర్మదృష్టి కలది; గంధర్వ = గంధర్వులలో; రాజ = ప్రభువు; ప్రతిమమ్ = వలెనున్నవాని; భర్తారమ్ = భర్తను గూర్చి; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను
భావంః-
ధర్మమూ, ధర్మదృష్టీ కల సీత, కన్నీళ్ళతో నిండిన కన్నులు కలదై, గంధర్వరాజు (పిశాచతోత్తమము) వలెనున్న తన భర్తతో ఇట్లనెను.
గమనికః-
(1) గంధర్వ- దేవయోని విశేషము, అంతరపిశాచము, వావిళ్ళనిఘంటువు. (2) గంధర్వం- మరణానికీ, తిరిగి జన్మించడానికీ మధ్య జీవుడు ధరించే యాతనా రూపం పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010. (3) గంధర్వులు- గాయక దేవయోని విశేషము.
2.37.12.
అనుష్టుప్.
కథంను చీరం బధ్నంతి
మునయో వనవాసినః।
ఇతి హ్యకుశలా సీతా
సా ముమోహ ముహుర్ముహుః॥
టీకః-
కథంను = ఎట్లు; చీరం = చీరను; బధ్నంతి = కట్టుకొందురో; మునయః = మునులు; వనవాసినః = వనవాసులు; ఇతి = ఈ; అకుశలా = చేతకానిదై; సీతా = సీత; సా = ఆమె; ముమోహ = మొహమాట పడెను; ముహుర్ముహుః = మాటిమాటికి
భావంః-
సీత రామునితో "వనమునందు నివసించే మునులు ఈ నారచీరలను ఎట్లు కట్టుకొందురో కదా" అని పలికి వాటిని ధరింపలేక మొహమాటపడు చుండెను.
2.37.13.
అనుష్టుప్.
కృత్వా కంఠే చ సా చీరమ్
ఏకమాదాయ పాణినా।
తస్థౌ హ్యకుశలా తత్ర
వ్రీడితా జనకాత్మజా॥
టీకః-
కృత్వా = చేసి; కంఠే చ = మెడపైన; కంఠే = ఇంకనూ; సా = ఆమె; చీరమ్ = చీరను; ఏకమ్ = ఒక దానిని; ఆదాయ = తీసుకొని; పాణినా = చేతితో; తస్థౌ = నిలబడెను; అకుశలా = చేతకాక; తత్ర = అక్కడ; వ్రీడితా = సిగ్గుపడి; జనకాత్మజా = జనకును పుత్రిక
భావంః-
జనకమహారాజుగారి పుత్రిక ఐన సీతాదేవి ఒక నారచీరను మెడపై వేసుకుని, మరొకదానిని చేతితో పట్టుకుని, ఎట్లు కట్టుకొనవలెనో తెలియక సిగ్గుపడుచు నిలబడియుండెను.
2.37.14.
అనుష్టుప్.
తస్యాస్తత్క్షిప్రమాగమ్య
రామో ధర్మభృతాం వరః।
చీరం బబంధ సీతాయాః
కౌశేయస్యోపరి స్వయమ్॥ తస్యాస్తత్క్షిప్రమాగమ్య
టీకః-
తస్యాః = ఆమె యొక్క; తత్ = ఆ; క్షిప్రమ్ = వేగముగ; ఆగమ్య = వచ్చి; రామః = రాముడు; ధర్మభృతాం = ధర్మమును పోషించువారిలో; వరః = శ్రేష్ఠుడు; చీరమ్ = చీరను; బబంధ = కట్టెను; సీతాయాః = సీత యొక్క; కౌశేయస్య = పట్టువస్త్రము యొక్క; ఉపరి = పైననే; స్వయమ్ = స్వయముగ
భావంః-
ధర్మమును రక్షించు వారిలో శ్రేష్ఠుడైన రాముడు, వెంటనే సీత దగ్గరకు వెళ్లి, ఆమె ధరించియున్న పట్టుచీర పైననే స్వయముగ నారచీరను కట్టెను.
2.37.15.
అనుష్టుప్.
రామం ప్రేక్ష్య తు సీతాయా
బధ్నంతం చీరముత్తమమ్।
అంతఃపురగతా నార్యో
ముముచుర్వారి నేత్రజమ్॥
టీకః-
రామమ్ = రాముని; ప్రేక్ష్య = చూచి; తు = విశేషంగా; సీతాయా = సీతకొరకు; బధ్నంతం = కట్టుచున్న; చీరమ్ = చీరను; ఉత్తమమ్ = శ్రేష్ఠుమైన; అంతఃపుర = అంతపురము; గతాః = అందున్న; నార్యః = స్త్రీలు; ముముచుః = విడిచిరి; వారి = నీటిని; నేత్రజమ్ = కన్నుల్లో పుట్టిన
భావంః-
రాముడు సీతకు నారచీరను కట్టుట చూచిన అంతఃపుర స్త్రీలు అందరును కంటతడి పెట్టిరి.
2.37.16.
అనుష్టుప్.
ఊచుశ్చ పరమాయస్తా
రామం జ్వలితతేజసమ్।
“వత్స! నైవం నియుక్తేయమ్
వనవాసే మనస్వినీ”॥
టీకః-
ఊచుశ్చ = పలికిరి; పరమాయస్తా = చాల దుఃఖించుచు; రామం = రాముని గూర్చి; జ్వలిత తేజసమ్ = తేజస్సుతో వెలుగుతున్న; వత్స = నాయనా; న = లేదు; ఏవం = ఈ విధముగ; నియుక్త = ఆజ్ఞాపించబడి; ఇయమ్ = ఈమె; వనవాసే = వనవాసమునందు; మనస్వినీ = మంచి మనసు గలామెను
భావంః-
ఆ స్త్రీలందరును ఎంతగానో దుఃఖించుచు, తేజశ్శాలి యైన రామునితో "మంచిమనసు గల సీత కూడ వనవాసమునకు వెళ్ళవలెనని ఎవ్వరును ఆదేశించలేదు కదా, నాయనా!" అనిరి. ఇంకా
2.37.17.
అనుష్టుప్.
“పితుర్వాక్యానురోధేన
గతస్య విజనం వనమ్।
తావద్దర్శనమస్యా నః
సఫలం భవతు ప్రభో!॥
టీకః-
పితుః = తండ్రియొక్క; వాక్య = మాటను; అనురోధేన = అనువర్తించి; గతస్య = వెళ్ళగ; విజనం = నిర్జనమైన; వనమ్ = వనమునుగూర్చి; తావత్ = అంతవరకు; దర్శనమ్ = దర్శనము; అస్యా = ఈమెయొక్క; నః = మాకు; సఫలం = సఫలమైన; భవతు = అగుగాక; ప్రభో = ప్రభూ
భావంః-
రామచంద్రప్రభూ! నీవు మీ తండ్రి మాటను శిరసావహించి, అరణ్యమునకు వెళ్లి తిరిగి వచ్చు నంతవరకు మమ్ము ఈమెను చూచుచుండనిమ్ము.
2.37.18.
అనుష్టుప్.
లక్ష్మణేన సహాయేన
వనం గచ్ఛస్వ పుత్రక।
నేయమర్హతి కల్యాణీ
వస్తుం తాపసవద్వనే॥
టీకః-
లక్ష్మణేన = లక్ష్మణుని; సహాయేన = సహాయముతో; వనం = వనమునుగూర్చి; గచ్ఛస్వ = వెళ్ళుము; పుత్రక = పుత్రా; న = లేదు; ఇయమ్ = ఈమె; అర్హతి = అర్హురాలు; కల్యాణీ = కళ్యాణప్రదమైన; వస్తుం = నివసించుటకు; తాపసవత్ = మునివలె; వనే = వనమునందు
భావంః-
కుమారా! నీవు లక్ష్మణుని తోడుగ తీసుకొని అరణ్యమునకు వెళ్ళుము. మంగళప్రదమైన ఈ సీత మునివలె అరణ్యములో నివసించుట తగదు.
2.37.19.
అనుష్టుప్.
కురు నో యాచనాం పుత్ర!
సీతా తిష్ఠతు భామినీ।
ధర్మనిత్యస్స్వయం స్థాతుమ్
న హీదానీం త్వమిచ్ఛసి”॥
టీకః-
కురు = చేయుము; నః = మా యొక్క; యాచనాం = ప్రార్థనను; పుత్ర = పుత్ర; సీతా = సీత; తిష్ఠతు = ఉండుగాక; భామినీ = స్త్రీ; ధర్మనిత్యః = నిత్యమూ ధర్మపరాయణుడవు; స్వయం = స్వయముగ; స్థాతుమ్ = ఉండుటకు; న = లేదు; ఇదానీం = ఇప్పుడు; త్వమ్ = నీవు; ఇచ్ఛసి = ఇష్టపడుట
భావంః-
కుమారా! మా ప్రార్థనను అంగీకరించి సీతదేవిని ఇక్కడనే ఉండనీయుము. నిత్య ధర్మపరాయణుడ వైన నీవు ఇక్కడ ఉండుటకు అంగీకరించుటలేదు కదా.”
2.37.20.
అనుష్టుప్.
తాసామేవంవిధా వాచః
శృణ్వన్ దశరథాత్మజః।
బబంధైవ తదా చీరమ్
సీతయా తుల్యశీలయా॥
టీకః-
తాసామ్ = వారి యొక్క; ఏవం = ఈ; విధా = విధమైన; వాచః = మాటలను; శృణ్వన్ = విని; దశరథాత్మజః = దశరథరాముడు; బబంధ = కట్టించసాగెను; ఏవ = తప్పక; తదా = అప్పుడు; చీరమ్ = చీరను; సీతయా = సీతచే తుల్యశీలయా = సరిసాటియైన వర్తనగల
భావంః-
రాముడు వారందరును ఇట్లు పలుకుచునుండ వినుచు, తనవలె ధర్మాత్మురాలైన సీతచేత నారచీరను ధరింపజేయసాగెను.
2.37.21.
అనుష్టుప్.
చీరే గృహీతే తు తయా
సమీక్ష్య నృపతేర్గురుః।
నివార్య సీతాం కైకేయీమ్
వసిష్ఠో వాక్యమబ్రవీత్॥
టీకః-
చీరే = నారచీర; గృహీతే = తీసుకొనబడుచుండగ; తు = పాద పూరణము; తయా = ఆమెచే; సమీక్ష్య = చూచి; నృపతేః = రాజు యొక్క; గురుః = గురువైన వసిష్టుడు; నివార్య = నివారించి; సీతాం = సీతను; కైకేయీమ్ = కైకేయినిగూర్చి; వసిష్ఠః = వశిష్ఠుడు; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను
భావంః-
దశరథుని గురువైన వశిష్ఠుడు, సీత నారచీరను తీసుకొనుట చూచి, ఆమెను నివారించి, కైకేయితో ఇట్లు పలికెను.
2.37.22.
అనుష్టుప్.
అతిప్రవృత్తే! దుర్మేధే!
కైకేయి! కులపాంసని!।
వంచయిత్వా చ రాజానమ్
న ప్రమాణేఽ వతిష్ఠసే॥
టీకః-
అతిప్రవృత్తే = మితిమీరి ప్రవర్తించుచున్నదానా; దుర్మేధే = దుర్బుద్ధి కలదానా; కైకేయి = కైకేయీ; కులపాంసని = కులమును దూషింప చేయుదానా; వంచయిత్వా = మోసము చేసియు; చ = ఇంకను; రాజానమ్ = రాజును; న = లేదు; ప్రమాణే = మర్యాదగా, అమరకోశము సమానార్థకము; అవతిష్ఠసే = నిలబడుట
భావంః-
“ఓసీ దుర్బుద్ధీ! మితిమీరి ప్రవర్తించుచున్నదానా! కైకేయీ! కులమును అపవిత్రము చేయుదానా! రాజుని ఈ విధముగా వంచించియు, ఇంకను మర్యాదగా ఉండుటలేదు.
2.37.23.
అనుష్టుప్.
న గంతవ్యం వనం దేవ్యా
సీతయా శీలవర్జితే।
అనుష్ఠాస్యతి రామస్య
సీతా ప్రకృతమాసనమ్॥
టీకః-
న = కాదు; గంతవ్యం = వెళ్లదగినది; వనం = వనమును గూర్చి; దేవ్యా = దేవి ఐన; సీతయా = సీతచే; శీలవర్జితే = సత్ప్రవర్తన విడిచినదాన; అనుష్ఠాస్యతి = అధిష్టించగలదు; రామస్య = రాముని యొక్క; సీతా = సీత; ప్రకృతమ్ = ప్రస్తుతమైన; ఆసనమ్ = సింహాసనమును
భావంః-
సత్ప్రవర్తన విడనాడిన కైకేయీ! సీతాదేవి అడవికి వెళ్లవలసిన పనిలేదు. ఆమె ఇక్కడనే ఉండి రాముని సింహాసనమును అధిష్టించగలదు.
2.37.24.
అనుష్టుప్.
ఆత్మా హి దారాస్సర్వేషామ్
దారసంగ్రహవర్తినామ్।
ఆత్మేయమితి రామస్య
పాలయిష్యతి మేదినీమ్॥
టీకః-
ఆత్మా = ఆత్మ; హి = కదా; దారాః = భార్య; సర్వేషామ్ = అందరికిని; దారసంగ్రహవర్తినామ్ = భార్యలను స్వీకరించిన వారు; ఆత్మ = ఆత్మ; ఇయమ్ = ఈమె; ఇతి = అనగ; రామస్య = రాముని యొక్క; పాలయిష్యతి = పరిపాలించగలదు; మేదినీమ్ = రాజ్యమును
భావంః-
భార్యను చేపట్టిన అందరికిని భార్య ఆత్మ వంటిది. అలా సీతాదేవి రామునికి ఆత్మ కావున, ఆమె రామునియొక్క రాజ్యమును పరిపాలించగలదు.
2.37.25.
అనుష్టుప్.
అథ యాస్యతి వైదేహీ
వనం రామేణ సంగతా।
వయమప్యనుయాస్యామః
పురం చేదం గమిష్యతి॥
టీకః-
అథ = అట్లుగాక; యాస్యతి = వెళ్లినచో; వైదేహీ = సీత; వనం = అడవినిగూర్చి; రామేణ = రామునితో; సంగతా = కూడినదై; వయమ్ = మేము; అపి = కూడ; అనుయాస్యామః = అనుసరించెదము; పురంమ్ = పట్టణమును; చ = కూడా; ఇదం = ఈ; గమిష్యతి = వెళ్లగలదు
భావంః-
అట్లుగాక, సీత రామునితో కలసి అరణ్యమునకు వెళ్లినచో, మేమును, పట్టణమంతయును వారిని అనుసరించి వెళ్ళగలము.
2.37.26.
అనుష్టుప్.
అంతపాలాశ్చ యాస్యంతి
సదారో యత్ర రాఘవః।
సహోపజీవ్యం రాష్ట్రం చ
పురం చ సపరిచ్ఛదమ్॥
టీకః-
అంతపాలాః = సరిహద్దులను కాపాడువారును; చ = కూడా; యాస్యంతి = వెళ్లగలరు; స = తో సహా; దారః = భార్య; యత్ర = ఎక్కడ ఉండునో; రాఘవః = రాముడు; సహ = కూడి; ఉపజీవ్యమ్ = రాజును అనుసరించి జీవించెడివారు; రాష్ట్రం = దేశమును; చ = కూడా; పురం = పట్టణమును; చ = కూడా; స = తో కూడిన; పరిచ్ఛదమ్ = పరివారము
భావంః-
సరిహద్దులను కాపాడువారును, దశరథ సహితమైన ఈ దేశము, ఈ పట్టణము, సకల పరివారములు కూడిన ఈ నగరము రాముడు ఉన్నచోటికే వెళ్లిపోవును.
2.37.27.
అనుష్టుప్.
భరతశ్చ సశత్రుఘ్నః
చీరవాసా వనేచరః।
వనే వసంతం కాకుత్స్థ
మనువత్స్యతి పూర్వజమ్॥
టీకః-
భరతః = భరతుడు; చ = కూడ; సశత్రుఘ్నః = శత్రుఘ్నునితో కూడిన; చీరవాసాః = నారచీరలను ధరించినవాడై; వనేచరః = అడవిలో తిరుగుచు; వనే = అడవిలో; వసంతం = నివసించుచున్న; కాకుత్స్థమ్ = రాముని; అనువత్స్యతి = అనుసరించి నివసించగలడు; పూర్వజమ్ = అన్నయైన
భావంః-
భరతుడు కూడ శత్రుఘ్నుడితో కూడి, నారచీరలు ధరించి, అరణ్యము నందు నివసించుచున్న తమ అన్న యైన రామునితో కలిసి అక్కడనే తిరుగుచు నివసించగలడు.
2.37.28.
అనుష్టుప్.
తతశ్శూన్యాం గతజనామ్
వసుధాం పాదపై స్సహ।
త్వమేకా శాధి దుర్వృత్తా!
ప్రజానామహితే స్థితా॥
టీకః-
తతః = తరువాత; శూన్యాం = పాడు పడినది; గతః = వెళ్ళిపోయిన; జనామ్ = ప్రజలు గలది; వసుధాం = భూమిని; పాదపైః = వృక్షములతో; సహ = కలసి; త్వమ్ = నీవు; ఏకా = ఒక్కతివే; శాధి = పరిపాలించుము; దుర్వృత్తా = దుర్మార్గురాల; ప్రజానామ్ = ప్రజలయొక్క; అహితే = కీడు కలిగించుటలో; స్థితా = ఉన్న
భావంః-
ప్రజలకు కీడు కలిగించుదానా! దుర్మార్గురాలా! ప్రజలందరును విడిచిపోయి పాడుపడిన ఈ భూమిపై గల చెట్లను మాత్రము నీవు ఒక్కతివే పాలించుచుండుము.
2.37.29.
అనుష్టుప్.
న హి తద్భవితా రాష్ట్రమ్
యత్ర రామో న భూపతిః।
తద్వనం భవితా రాష్ట్రమ్
యత్ర రామో నివత్స్యతి॥“
టీకః-
న = లేదు; హి = కదా; తత్ = ఆ; భవితా = అగుట; రాష్ట్రమ్ = రాష్ట్రముగ; యత్ర = ఎక్కడ; రామః = రాముడు; న = లేడు; భూపతిః = రాజు; తత్ = ఆ; వనం = అరణ్యము; భవితా = అగును; రాష్ట్రమ్ = రాష్ట్రముగ; యత్ర = ఎక్కడ; రామః = రాముడు; నివత్స్యతి = నివసించునో
భావంః-
రాముడు ఎక్కడ నివసించడో అది రాజ్యము కాజాలదు. రాముడు నివసింపబోవు ఆ అరణ్యమే రాజ్యము కాగలదు.
గమనికః-
రాష్ట్రం- పు. రాజతే ఇతి రాజ్య+ సర్వ్వధాతుభ్యః ష్ట్రన్, విషయః, విషయోం జనపదః,
2.37.30.
అనుష్టుప్.
న హ్యదత్తాం మహీం పిత్రా
భరతః శాస్తుమర్హతి।
త్వయి వా పుత్రవద్వస్తుమ్
యది జాతో మహీపతేః॥
టీకః-
న = కాడు; అదత్తాం = ఇవ్వబడని; మహీం = భూమిని; పిత్రా = తండ్రిచే; భరతః = భరతుడు; శాస్తుమ్ = పాలించుటకు; అర్హతి = తగినవాడు; త్వయి = నీ విషయమున; వా = కాని; పుత్రవత్ = పుత్రుని వలె; వస్తుమ్ = నివసించుటకు; యది = ఐనచో; జాతః = పుట్టినవాడు; మహీపతేః = రాజునకు
భావంః-
భరతుడు దశరథునికి జన్మించినవాడైనచో, తండ్రి తనకు ఇవ్వని రాజ్యమును పాలించడు. నీ పుత్రునివలె ప్రవర్తించడు.
2.37.31.
అనుష్టుప్.
యద్యపి త్వం క్షితితలాత్
గగనం చోత్పతిష్యసి।
పితుర్వంశచరిత్రజ్ఞః
సోఽ న్యథా న కరిష్యతి॥
టీకః-
యది = ఐనను; అపి = కూడ; త్వం = నీవు; క్షితితలాత్ = భూతలము నుండి; గగనం చ = ఆకాశమును గూర్చి; ఉత్పతిష్యసి = ఎగిరినదానవు; పితుః = తండ్రియొక్క; వంశ = వంశము; చరిత్రజ్ఞః = చరిత్రను తెలిసిన; సః = అతను; అన్యథా = మరియొక విధముగ; న కరిష్యతి = చేయబోడు
భావంః-
నీవు భూమి నుండి ఆకాశమునకు ఎగిరినను, తమ తండ్రి వంశచరిత్రను ఎరిగిన భరతుడు, నీవు చెప్పినట్లు ప్రవర్తించడు.
2.37.32.
అనుష్టుప్.
తత్త్వయా పుత్రగర్ధిన్యా
పుత్రస్య కృతమప్రియమ్।
లోకే హి స న విద్యేత
యో న రామమనువ్రతః॥
టీకః-
తత్ = ఆ; త్వయా = నీచే; పుత్ర = పుత్రునికొఱకు; గర్ధిన్యా = పేరాసగలదానివై, వావిళ్ళ నిఘంటువు; పుత్రస్య = పుత్రునకు; కృతమ్ = చేయబడినది; అప్రియమ్ = ఇష్టము లేనిది; లోకే = లోకమునందు; హి = కదా; సః = అతడు; న = లేదు; విద్యేత = ఉండుట; యః = ఎవడు; న = కాడు; రామమ్ = రాముని; అనువ్రతః = అనుసరించినవాడు
భావంః-
పుత్రుని యందు వాత్సల్యముతో నీవు నీ పుత్రునకు ఇష్టము లేని పనిని చేయుచున్నావు. ఈ లోకమునందు రాముని అనుసరించని వారు ఎవ్వరును ఉండరు కదా.
2.37.33.
అనుష్టుప్.
ద్రక్ష్యస్యద్యైవ కైకేయీ
పశువ్యాలమృగద్విజాన్।
గచ్ఛతస్సహ రామేణ
పాదపాంశ్చ తదున్ముఖాన్॥
టీకః-
ద్రక్ష్యసి = చూడగలవు; అద్య = నేడు; ఏవ = మాత్రమే; కైకేయీ = కైకేయీ; పశు = పశువులు; వ్యాల = ఏనుగులు; మృగ = మృగములు; ద్విజాన్ = పక్షులు; గచ్ఛతః = వెళుచున్న; సహ = కూడి; రామేణ = రామునితో; పాదపాం = వృక్షములును; చ = కూడా; తత్ = ఆ; ఉన్ముఖాన్ = వైపు ముఖము త్రిప్పి
భావంః-
ఓ కైకేయీ! నేడే పశువులు, ఏనుగులు, మృగములు, పక్షులు కూడా రాముని వెంటనే వెళ్ళుచుండగా, వృక్షములన్నియు రాముని వైపే ముఖమును త్రిప్పి ఉండగా నీవు చూచుచుండెదవు.
2.37.34.త్రిష్టుప్
అథోత్తమాన్యాభరణాని దేవి!
దేహి స్నుషాయై వ్యపనీయ చీరమ్।
న చీరమస్యాః ప్రవిధీయ”తేతి
న్యవారయత్తద్వసనం వసిష్ఠః॥
టీకః-
అథః = ఇంక; ఉత్తమాని = ఉత్తమమైన; ఆభరణాని = ఆభరణములను; దేవి = దేవి; దేహి = ఇమ్ము; స్నుషాయై = కోడలికి; వ్యపనీయ = తీసివేసి; చీరమ్ = నారచీరను; న = లేదు; చీరమ్ = నారచీరను; అస్యాః = ఈమెకు; ప్రవిధీయత = విధింపబడుట; ఇతి = అని; న్యవారయత్ = నివారించెను; తత్ = ఆ; వసనం = వస్త్రమును; వసిష్ఠః = వశిష్ఠుడు
భావంః-
"అందువలన దేవీ కైకేయీ! ఈ నారచీరలను తీసివేసి, సీతాదేవికి ఉత్తమమైన ఆభరణములను ఇమ్ము. ఈమె నారచీరలను ధరింపవలెనని విధింపబడలేదు కదా" అని కైకేయికి చెప్పుచు, వశిష్ఠుడు కైకేయి ఇచ్చిన ఆ వస్త్రములను సీత కట్టుకొనుచుండగా నివారించెను.
2.37.35.త్రిష్టుప్
“ఏకస్య రామస్య వనే నివాసః
త్వయా వృతః కేకయరాజపుత్రీ।
విభూషితేయం ప్రతికర్మనిత్యా
వసత్వరణ్యే సహ రాఘవేణ॥
టీకః-
ఏకస్య = ఒక్కనికి; రామస్య = రామునికి; వనే = వనము నందు; నివాసః = నివాసము; త్వయా = నీచే; వృతః = కోరబడినది; కేకయరాజపుత్రీ = కైకేయీ; విభూషితా = భూషితురాలై; ఇయం = ఈ; ప్రతికర్మనిత్యా = నిత్యము అలంకరించుకొనునదై; వసతు = నివసించును గాక; అరణ్యే = అరణ్యమునందు; సహ = కూడి; రాఘవేణ = రామునితో
భావంః-
అలా సీతాదేవిని నారచీరలు కట్టుకోకుండా ఆపి ఇమకా ఇలా అనెను. “కైకేయీ! నీవు రామునికి మాత్రమే వనవాసము కోరినావు కదా. అందువలన సీత సుభూషితురాలై రామునితో కూడి అరణ్యములో నివసించును గాక.
2.37.36.త్రిష్టుప్
యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ
సుసంవృతా గచ్ఛతు రాజపుత్రీ।
వస్త్రైశ్చ సర్వైస్సహితైర్విధానై
ర్నేయం వృతా తే వరసమ్ప్రదానే”॥
టీకః-
యానైశ్చ = వాహనములతోను; ముఖ్యైః = శ్రేష్ఠమైన; పరిచారకైశ్చ = పరిచారికలతోను; సుసంవృతా = కూడినదై; గచ్ఛతు = వెళ్ళును గాక; రాజపుత్రీ = సీత; వస్త్రైశ్చ = వస్త్రములతోను; సర్వైః = సమస్తమైన; సహితైః = కూడియున్న; విధానైః = నిత్యావసరములైన వాటితోను; న = లేదు; ఇయం = ఈ; వృతా = కోరబడియుండుట; తే = నీ యొక్క; వరసమ్ప్రదానే = వరములను తీర్చుటయందు
భావంః-
సీత వెనుక శ్రేష్ఠమైన వాహనములును, పరిచారకులును, వస్త్రములును, నిత్యావసరములైన ఉపకరణములు కూడ వెళ్ళును గాక. నీవు వరములు కోరినప్పుడు రామునితో సీత కూడ వెళ్ళ వలెనని కోరలేదు కదా.”
2.37.37.త్రిష్టుప్
తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే
గురౌ నృపస్యాప్రతిమప్రభావే।
నైవ స్మ సీతా వినివృత్తభావా
ప్రియస్య భర్తుః ప్రతికారకామా॥
టీకః-
తస్మిన్ = అతడు; తథా = అట్లు; జల్పతి = పలుకుచుండగ; విప్రముఖ్యే = బ్రాహ్మణశ్రేష్ఠుడైన; గురౌ = గురువు; నృపస్య = రాజు యొక్క; అప్రతిమప్రభావే = సాటిలేని ప్రభావము కలవాడు; న = లేదు; ఏవ = మాత్రము; స్మ = ఉండుట; సీతా = సీత; వినివృత్తభావా = మరలిన భావము కలిగినదై; ప్రియస్య = ప్రియమైన; భర్తుః = భర్తకు; ప్రతికారకామా = తగిన కార్యమును చేయగోరినదై
భావంః-
సాటిలేని ప్రభావము కలవాడును, రాజు గురువు, బ్రాహ్మణుడును ఐన వశిష్టుడు అట్లు చెప్పుచుండగ, ప్రియమైన భర్తకు తగిన సేవలను చేయదలచి యున్న సీత తన అభిప్రాయమును మార్చుకొనలేదు.
2.37.38.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే సప్తత్రింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; సప్తత్రింశః [37] = ముప్పైయేడవ; సర్గః = సర్గ
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [37] ముప్పైయేడవ సర్గ సంపూర్ణము,
2.38.1.
అనుష్టుప్.
తస్యాం చీరం వసానాయామ్
నాథవత్యామనాథవత్।
ప్రచుక్రోశ జనస్సర్వో
ధిక్త్వాం దశరథం త్వితి॥
టీకః-
తస్యాం = ఆమె; చీరం = చీరను; వసానాయామ్ = ధరించుచుండగా; నాథవత్యామ్ = భర్తను కలిగి ఉన్నామె; అనాథవత్ = భర్త లేనిదానివలె; ప్రచుక్రోశ = మిక్కిలి శోకించిరి; జనః = ప్రజలు; సర్వః = అందరు; ధిక్ = నిందా పూర్వక అవ్యయం; త్వం= నిన్ను; దశరథం = దశరథునిగూర్చి; ఇతి = అని
భావంః-
సీతాదేవి భర్త ఉండగా కూడ, భర్త లేనిదాని వలె నారచీరలను కట్టుకొనుచుండగా, ప్రజలెల్లరును రోదించుచు దశరథుని ఛీ అని నిందించిరి.
2.38.2.
అనుష్టుప్.
తేన తత్ర ప్రణాదేన
దుఃఖితస్స మహీపతిః।
చిచ్ఛేద జీవితే శ్రద్ధామ్
ధర్మే యశసి చాత్మనః॥
టీకః-
తేన = దానిచేత; తత్ర = అక్కడ; ప్రణాదేన = గట్టి మ్రోత, వావిళ్ళ నిఘంటువు; దుఃఖితః = దుఃఖితుడైన; స = ఆ; మహీపతిః = రాజు; చిచ్ఛేద = విడనాడెను; జీవితే = జీవితమునందు; శ్రద్ధామ్ = శ్రద్ధను; ధర్మే = ధర్మమునందు; యశసి = కీర్తియందు; ఆత్మనః = తనయందు
భావంః-
ఆ ప్రజల గగ్గోలు ధ్వనులు వినిన దశరథుడు దుఃఖితుడై, తనయందును, తన జీవితమునందును, ధర్మమునందును తన కీర్తియందును విరక్తి పొందెను.
2.38.3.
అనుష్టుప్.
స నిః శ్వస్యోష్ణమైక్ష్వాక
స్తాం భార్యామిదమబ్రవీత్।
“కైకేయి! కుశచీరేణ
న సీతా గంతుమర్హతి॥
టీకః-
సః = ఆ; నిఃశ్వస్య = నిట్టూర్చి; ఉష్ణమ్ = వేడిగ; ఐక్ష్వాకః = ఇక్ష్వాకువంశజుడు; తాం = తనయొక్క; భార్యామ్ = భార్యనుగూర్చి; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను; కైకేయి = కైకేయి; కుశ చీరేణ = నారచీరతో; న = కాదు; సీతా = సీతాదేవి; గంతుమ్ = వెళ్ళుటకు; అర్హతి = అర్హురాలు
భావంః-
దశరథ మహారాజు వేడిగ నిట్టూర్చుచు తన భార్యతో ఇలా అనెను, "కైకేయీ! సీతాదేవి నారచీరను ధరించి వనమునకు వెళ్ళనక్కరలేదు..
2.38.4.
అనుష్టుప్.
సుకుమారీ చ బాలా చ
సతతం చ సుఖోచితా।
నేయం వనస్య యోగ్యేతి
సత్యమాహ గురుర్మమ॥
టీకః-
సుకుమారీ = సుకుమారురాలును; చ = ఇంకను; బాలా = పిన్న వయస్కురాలును; చ = ఇంకను; సతతం = ఎల్లప్పుడును; చ = ఇంకను; సుఖోచితా = సుఖపడినది ఐన; న = కాదు; ఇయం = ఈ; వనస్య = వనమునకు; యోగ్య = తగినది; ఇతి = ఈ; సత్యమ్ = నిజమునే; ఆహ = పలుకుచున్నాడు; గురుః = గురువు; మమ = నాయొక్క
భావంః-
సీత సుకుమారురాలు, పైగా సుఖములకే అలవాటు పడిన చిన్న పిల్ల. అటువంటి ఆమెను వనవాసమునకు పంపుట తగినది కాదు అని మా గురువు చెప్పినది యథార్థమే.
2.38.5.త్రిష్టుప్
ఇయం హి కస్యాపకరోతి కించి-
త్తపస్వినీ రాజవరస్య కన్యా।
యా చీరమాసాద్య జనస్య మధ్యే
స్థితా విసంజ్ఞాశ్రమణీవ కాచిత్॥
టీకః-
ఇయం = ఈ; హి = కదా; కస్య = ఎవరికి; అపకరోతి = అపకారము చేసినది; కించిత్ = కొంచెమైనను; తపస్వినీ = జాలి పడదగిన; రాజవరస్య కన్యా = రాజశ్రేష్ఠుని కుమార్తె; యా = ఏ; చీరమ్ = చీరను; ఆసాద్య = తీసుకొని; జనస్య = ప్రజలయొక్క; మధ్యే = మధ్యన; స్థితా = ఉండి; విసంజ్ఞా = మూర్చితురాలై; శ్రమణీవ = సన్యాసిని వలె; కాచిత్ = ఒకానొక
భావంః-
రాజశ్రేష్ఠుడైన జనకమహారాజు కూతురైన ఈ సీతాదేవి ఒక సన్యాసిని వలె నారచీరను ధరించి, ఈ విధముగా మూర్ఛితురాలై దీనముగా జనుల మధ్య నిలబడి ఉండుటకు, ఈమె చిన్న అపకారమేదైనా ఎవరికైనా చేసినదా?
2.38.6.త్రిష్టుప్
చీరాణ్యపాస్యాజ్జనకస్య కన్యా
నేయం ప్రతిజ్ఞా మమ దత్తపూర్వా।
యథాసుఖం గచ్ఛతు రాజపుత్రీ
వనం సమగ్రా సహ సర్వరత్నైః॥
టీకః-
చీరాణి = నారచీరలను; అపాస్యా = విడిచిపెట్టును గాక; జనకస్య = జనకునియొక్క; కన్యా = కుమార్తె; న = లేదు; ఇయం = ఈ; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; మమ = నాకు; దత్తపూర్వా = పూర్వము ఇవ్వబడినది; యథాసుఖం = సుఖముగా; గచ్ఛతు = వెళ్ళును; రాజపుత్రీ = రాజకుమారి; వనం = వనమునుగూర్చి; సమగ్రా = నిండుగా; సహ = కూడినదై; సర్వరత్నైః = సర్వాభరణములతో
భావంః-
జనకమహారాజు కుమార్తెన సీతాదేవి నారచీరలను ధరింపనవసరము లేదు. నేను ఈ విధముగా నీకు ప్రతిజ్ఞ చేయలేదు. అందువలన ఈ రాజపుత్రి సకలాభరణములను ధరించి వనమునకు సుఖముగా వెళ్ళవలెను.
2.38.7.త్రిష్టుప్
అజీవనార్హేణ మయా నృశంసా
కృతా ప్రతిజ్ఞా నియమేన తావత్।
త్వయా హి బాల్యాత్ ప్రతిపన్నమేతత్
తన్మాం దహేద్వేణుమివాత్మపుష్పమ్॥
టీకః-
అజీవ = జీవించుటకు; న = లేని; అర్హేణ = అర్హత; మయా = నాచే; నృశంసా = క్రూరమైన; కృతా = చేయబడినది; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; నియమేన = కట్టుబడి; తావత్ = చేయబడినది; త్వయా = నీచే; హి = కదా; బాల్యాత్ = మూర్ఖత్వమువలన; ప్రతిపన్నమ్ = నిశ్చయింపబడినది; ఏతత్ = ఇది; తత్ = అది; మామ్ = నన్ను; దహేత్ = దహించివేయును; వేణుమ్ = వెదురును; ఇవ = వలె; ఆత్మపుష్పమ్ = తన పుష్పము
భావంః-
జీవించుటకు తగని నేను నీకు కట్టుబడి క్రూరమైన ప్రతిజ్ఞ చేసినాను. నీవు మూర్ఖత్వముతో చేసిన ఈ పని, వెదురుచెట్టును తన పుష్పమే దహించివేయునట్లు, నన్ను దహించివేయగలదు.
గమనికః-
దహేద్వేణుమివాత్మపుష్పమ్- అళి కుళీ కర్కటి వేణ రంభా ఫలముద్వహంతి. తేలు ఎండ్రకాయ పీత గర్భము ధరించుట వాటి మృత్వువునకే అనగా అవి ప్రసవించగానే మరణించునవి. వెదురు అరటి పుష్పించుట వాటి మృతికే. అనగా, అవి పుష్పించిన అవి అభివృద్ధిచెందవు. ఆ పూవులతోడనే అవి అంతరించును.
2.38.8.
అనుష్టుప్.
రామేణ యది తే పాపే!
కించిత్కృతమశోభనమ్।
అపకారః క ఇహ తే
వైదేహ్యా దర్శితోఽ ధమే!॥
టీకః-
రామేణ = రామునిచే; యది = ఐనను; తే = నీకు; పాపే = పాపాత్మురాల; కించిత్ =కొంచమైనను; కృతమ్ = చేయబడినది; అశోభనమ్ = కష్టము; అపకారః = అపకారము; కః = ఏ; ఇహ = ఇక్కడ; తే = నీకు; వైదేహ్యా = సీతాదేవిచేత; దర్శితః = చూపబడినది; అధమే = నీచురాల
భావంః-
ఓ పాపాత్మురాలా! అధమురాలా! రాముడు నీకేమైన పిసరంత అపకారము చేసినాడేమో, కాని సీతాదేవి నీకేమి అపకారము చేసినది?
2.38.9.
అనుష్టుప్.
మృగీవోత్ఫుల్లనయనా
మృదుశీలా తపస్వినీ।
అపకారం కమిహ తే
కరోతి జనకాత్మజా॥
టీకః-
మృగీ = ఆడలేడి; ఇవ = వలె; ఉత్ఫుల్లనయనా = విప్పారిన కన్నులుకలది; మృదుశీలా = మృదు స్వభావము కలది; తపస్వినీ = శాంత స్వభావురాలు; అపకారం = అపకారము; కమ్ = ఏమి; ఇహ = ఇక్కడ; తే = నీకు; కరోతి = చేయుచున్నది; జనకాత్మజా = జనకుని కుమార్తె
భావంః-
ఆడలేడి వలె విప్పారిన కన్నులుకలది, మృదుస్వభావము గలది, శాంత స్వభావము గలది, ఐన సీతాదేవి నీకు ఏమి అపకారము చేసినది?
2.38.10.
అనుష్టుప్.
నను పర్యాప్త మేతత్తే
పాపే! రామవివాసనమ్।
కిమేభిః కృపణైర్భూయః
పాతకైరపి తే కృతైః॥
టీకః-
నను = కదా; పర్యాప్తమ్ = యథేప్సితమ్, చాలును; ఏతత్ = ఈ; తే = నీకు; పాపే = పాపాత్మురాల; రామ = రాముని; వివాసనమ్ = అరణ్యమునకు పంపుట; కిమ్ = ఏమి; ఏభిః = ఈ; కృపణైః = నీచమైన; భూయః = ఇంకను; పాతకైః = పాపములచే; అపి = కూడ; తే = నీకు; కృతైః = చేయబడిన
భావంః-
పాపాత్మురాలా! నీవు రాముని అరణ్యమునకు పంపివేయుటయే కదా నీ కోరిక. అది చాలును కదా. ఇంకను ఈ నీచమైన పాపకృత్యములను ఎందుకు చేయుచున్నావు?
2.38.11.
అనుష్టుప్.
ప్రతిజ్ఞాతం మయా తావత్
త్వయోక్తం దేవి శృణ్వతా।
రామం యదభిషేకాయ
త్వమిహాగతమబ్రవీః॥
టీకః-
ప్రతిజ్ఞాతం = ప్రతిజ్ఞ చేయబడినది; మయా = నాచే; తావత్ = అంతవరకు; త్వయా = నీచే; ఉక్తం = చెప్పబడినది; దేవి = దేవి; శృణ్వతా = వినినది; రామం = రామునిగూర్చి; యత్ = ఏది; అభిషేకాయ = అభిషేకముకొరకై; త్వమ్ = నీవు; ఇహ = ఇక్కడకు; ఆగతమ్ = వచ్చిన; అబ్రవీః = పలికితివో
భావంః-
అభిషేక విషయమై రాముడు ఇక్కడకు వచ్చినప్పుడు నీవు అతనితో ఏమి చెప్పినావో, దానిని విని, నేను అంత మాత్రమే ప్రతిజ్ఞ చేసియుంటిని.
2.38.12.
అనుష్టుప్.
తత్త్వేతత్సమతిక్రమ్య
నిరయం గంతుమిచ్ఛసి।
మైథిలీమపి యా హి త్వమ్
ఈక్షసే చీరవాసినీమ్”॥
టీకః-
తత్ = ఆ; ఏతత్ = దానిని; సమతిక్రమ్య = అతిక్రమించి; నిరయం = నరకమును గూర్చి; గంతుమ్ = వెళ్ళుటకు; ఇచ్ఛసి = కోరుచున్నావు; మైథిలీమ్ = సీతాదేవి; అపి = కూడ; యా = ఏ; హి = కదా; త్వమ్ = నీవు; ఈక్షసే = చూచుచున్నావో; చీరవాసినీమ్ = నారచీరను ధరించినదానిగా
భావంః-
దానిని అతిక్రమించి సీతాదేవి నారచీరను ధరించగా చూడవలెనని కోరుచు, నీవు నరకమునకు పోవుచున్నావు.”
2.38.13.త్రిష్టుప్
ఇతీవ రాజా విలపన్మహాత్మా
శోకస్య నాంతం స దదర్శ కించిత్।
భృశాతురత్వాచ్చ పపాత భూమౌ
తేనైవ పుత్రవ్యసనేన మగ్నః॥
టీకః-
ఇతి = ఈ; ఇవ = విధముగ; రాజా = రాజు; విలపన్ = విలపించుచు; మహాత్మా = మహాత్ముడైన; శోకస్య = శోకమునకు; న = లేదు; అంతం = అంతమును; సః = అతడు; దదర్శ = చూచుట; కించిత్ = కొంచెము; భృశః = మిక్కిలి; భృశాతురత్వాత = మిక్కిలి మానసిక వేదనగలవాడై; చ = మఱియు; పపాత = పడెను; భూమౌ = నేలపై; తేన = దాని వలన; ఇవ = వలె; పుత్రవ్యసనేన = కొడుకుయందలి ఆసక్తిచే; పుత్రవ్యసనేన = కొడుకు కష్టముచే; మగ్నః = మునిగినవాడై, లోనైవాడై
భావంః-
ఈ విధముగా విలపించుచున్న ఆ దశరథ మహారాజుయొక్క దుఃఖమునకు అంతము కొంచెము కూడ కనబడలేదు. అతడు పుత్రవ్యసనము నకు లోనై మనోవేదనతో నేలపై పడిపోయెను.
2.38.14.
అనుష్టుప్.
ఏవం బ్రువంతం పితరమ్
రామస్సమ్ప్రస్థితో వనమ్।
అవాక్ఛిరసమాసీనమ్
ఇదం వచనమబ్రవీత్॥
టీకః-
ఏవం = ఇట్లు; బ్రువంతం = పలుకుచున్న; పితరమ్ = తండ్రినిగూర్చి; రామః = రాముడు; సమ్ప్రస్థితః = బయలుదేరిన; వనమ్ = వనమునుగూర్చి; అవాక్ఛిరసమ్ = వంచిన తల గలవాడు, వావిళ్ళ నింటువు; ఆసీనమ్ = కూర్చుని ఉన్న; ఇదం = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను
భావంః-
అరణ్యమునకు బయలుదేరిన రాముడు ఈ విధముగా పలుకుచు, తలవంచుకొని కూర్చునియున్న తండ్రితో ఇట్లు పలికెను.
2.38.15.
అనుష్టుప్.
ఇయం ధార్మిక! కౌసల్యా
మమ మాతా యశస్వినీ।
వృద్ధా చాక్షుద్రశీలా చ
న చ త్వాం దేవ! గర్హతే॥
టీకః-
ఇయం = ఈ; ధార్మిక = ధర్మాత్ముడా; కౌసల్యా = కౌసల్య; మమ = నాయొక్క; మాతా = తల్లి; యశస్వినీ = కీర్తిమంతురాలు; వృద్ధా = వృద్ధురాలు; చ = ఇంకనూ; అక్షుద్రశీలా = నీచస్వభావము లేనిదైన; చ = ఇంకనూ; న = లేదు; చ = ఇంకనూ; త్వాం = నిన్ను; దేవ = ప్రభో; గర్హతే = నిందించుట
భావంః-
ధర్మాత్ముడైన ఓ మహారాజా! కీర్తిమంతురాలైన నా తల్లి కౌసల్య వృద్ధురాలు. ఆమె నీచస్వభావము లేనిది. ఎన్నడును నిన్ను నిందించుట ఎరుగదు.
2.38.16.
అనుష్టుప్.
మయా విహీనాం వరద!
ప్రపన్నాం శోకసాగరమ్।
అదృష్టపూర్వవ్యసనామ్
భూయస్సమ్మంతుమర్హసి॥
టీకః-
మయా = నాతో; విహీనాం = వియోగమును పొందినది; వరద = వరములను ఇచ్చువాడా; ప్రపన్నాం = పొందినది; శోకసాగరమ్ = దుఃఖసాగరమును; అదృష్టపూర్వవ్యసనామ్ = పూర్వము ఎన్నడును చూడబడనటువంటి కష్టములు కలది; భూయః = ఎక్కువగా; సమ్మంతుమ్ = ఆదరించుటకు; అర్హసి = తగియుంటివి
భావంః-
వరములను ఇచ్చు ఓ మహారాజా! పూర్వము ఎన్నడును ఇటువంటి కష్టములు ఎరుగని మా తల్లి, నేను దూరముగా వెళ్లిపోవుటచే కలిగిన శోకసాగరమునందు మునిగపోయినది. కావున ఈమెను ఎక్కువ ఆదరణతో చూడవలయును.
2.38.17.
అనుష్టుప్.
పుత్రశోకం యథా నర్చ్ఛేత్
త్వయా పూజ్యేన పూజితా।
మాం హి సంచింతయంతీ సా
త్వయి జీవేత్తపస్వినీ॥
టీకః-
పుత్రశోకం = పుత్రశోకమును; యథా = ఎట్లు; న = లేదు; ఋచ్ఛేత్ = పొందుట; త్వయా = నీచే; పూజ్యేన = పూజ్యుడవైన; పూజితా = ఆదరింపబడినదై; మాం = నన్ను గూర్చి; హి = కదా; సంచింతయంతీ = ఆలోచించుచున్నదై; సా = ఆమె; త్వయి = నీయందు; జీవేత్ = జీవించును; తపస్వినీ = దీనురాలైన
భావంః-
నా గురించి చింతించుచున్న ఈమె పుత్రశోకమును పొందకుండునట్లుగా, పూజ్యుడవైన నీవు ఈమెను ఆదరించినచో దీనురాలైన ఈమె నీతో జీవించును.
2.38.18.
జగతి.
ఇమాం మహేంద్రోపమ! జాతగర్ధినీం
తథా విధాతుం జననీం మమార్హసి।
యథా వనస్థే మయి శోకకర్శితా
న జీవితం న్యస్య యమక్షయం వ్రజేత్॥
టీకః-
ఇమాం = ఈ; మహేంద్రోపమ = మహేంద్రునితో సమానమైనవాడా; జాతగర్ధినీం = పుత్రునియందు ప్రేమ కలిగియున్నామె; తథా = అట్లు; విధాతుం = చేయుటకు; జననీం = తల్లిని; మమ = నాయొక్క; అర్హసి = తగుదువు; యథా = ఎట్లు; వనస్థే = వనమునందుండగా; మయి = నేను; శోకకర్శితా = దుఃఖముచే కృశింపజేయబడినదై; న = ఉండదో; జీవితం = జీవితము; న్యస్య = విడిచి; యమక్షయం = యమనివాసమును; వ్రజేత్ = వెళ్ళుట
భావంః-
మహేంద్రునితో సమానమైన వాడా! పుత్రప్రేమ ఎక్కువగా కలిగియున్న నా తల్లి, నేను వనవాసమునకు వెళ్లిన తరువాత, శోకతప్తురాలై ప్రాణములను విడిచి యమలోమునకు వెళ్ళకుండునట్లు చూడుము.
2.38.19.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే అష్టత్రింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; అష్టత్రింశ [38] = ముప్పైఎనిమిదవ; సర్గః = సర్గ
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [38] ముప్పైఎనిమిదవ సర్గ సంపూర్ణము.
2.39.1.
అనుష్టుప్.
రామస్య తు వచః శ్రుత్వా
మునివేషధరం చ తమ్।
సమీక్ష్య సహ భార్యాభీ
రాజా విగతచేతనః॥
టీకః-
రామస్య = రాముని యొక్క; తు = పాదపూరణము; వచః = మాటలు; శ్రుత్వా = విని; మునిః = మునుల; వేష = వేషమును; ధరం = ధరించినవానిని; చ = మఱియు; తమ్ = అతనిని; సమీక్ష్య = చూచి; సహ = కలిసి; భార్యాభిః = భార్యలతో; రాజా = దశరథ మహారాజు; విగతచేతనః = తొలగిన చైతన్యము కలవాడై
భావంః-
రాముడు మునులవలె నారచీర ధరించాక మాట్లాడిన మాటలు విన్న, దశరథుడు, అతడి భార్యలు అనూహ్యమైన ఘటన ఎదురుపడినవారివలె కొయ్యబారిపోయిరి.
గమనికః-
విగతచేతనలు- పోయిన చేతనములుగల అవయవములు కలవారు, కొయ్యబారిపోయిన వారు.
2.39.2.
అనుష్టుప్.
నైనం దుఃఖేన సంతప్తః
ప్రత్యవైక్షత రాఘవమ్।
న చైనమభిసమ్ప్రేక్ష్య
ప్రత్యభాషత దుర్మనాః॥
టీకః-
న = లేదు; ఏనం = ఇతనిని చూడలేక; దుఃఖేన = దుఃఖము చేత; సంతప్తః = తపించబడినవాడై; ప్రత్యవైక్షత = చూచుట; రాఘవమ్ = రాముని; న = లేదు; చ = మఱియు; ఏనమ్ = ఈతనిని అనగా రాముని; అభిసమ్ప్రేక్ష్య = దిక్కుగా చూచుట; ప్రత్యభాషత = సమాధానము చెప్పుట; దుర్మనాః = మనసులో కలత చెందుచు
భావంః-
దుఃఖముతో తపించిపోవుచున్న దశరథుడు రాముని చూడలేక పోవుచుండెను. కనీసము అతనివైపునైనా చూడలేక పోవుచుండెను. కలత చెందిన మనసుతో సమాధానము చెప్పలేకపోవు చుండెను.
2.39.3.
అనుష్టుప్.
స ముహూర్తమివాసంజ్ఞో
దుఃఖితశ్చ మహీపతిః।
విలలాప మహాబాహూ
రామమేవానుచింతయన్॥
టీకః-
స = ఆ; ముహూర్తమ్ = క్షణకాలము; ఇవ + అసంజ్ఞో = స్పృహ తప్పినవాడై; దుఃఖితశ్చ = శోకించినవాడై; మహీపతిః = మహారాజు; విలలాప = ఏడ్చెను; మహాబాహుః = మిక్కిలి బలశాలి; రామమ్ = రాముని గురించి; ఏవ = మాత్రమే; అనుచింతయన్ = ఆలోచించుచుండెను
భావంః-
దశరథునకి దుఃఖముతో కొంచెము సేపు స్పృహతప్పెను. మిక్కిలి బలశాలి ఐనను, రాముని గూరించే తలచుచు విలపించుచుండెను.
2.39.4.
అనుష్టుప్.
“మన్యే ఖలు మయా పూర్వమ్
వివత్సా బహవఃకృతాః।
ప్రాణినో హింసితా వాపి
తస్మాదిదముపస్థితమ్॥
టీకః-
మన్యే = తలచుచున్నాను; ఖలు = నిశ్చమని; మయా = నాచేత; పూర్వమ్ = ఇంతక్రితము; వివత్సా = వారి పిల్లల నుండి విడిపోయినవారుగ; బహవః = చాలామంది, అనేకులు; కృతాః = చేయబడినారు; ప్రాణినః = జీవులు; హింసితా = చంపబడినవి; వ + అపి = లేదంటే, వ(సామ్యమ్)+ అపి (కూడా); తస్మాత్ = అందుకే; ఇదమ్ = ఈ పరిస్థితి; ఉపస్థితమ్ = వచ్చి ఉంటుంది
భావంః-
”పూర్వము నేను ఎందరికో తమ పిల్లలను దూరం చేసి ఉంటిని లేదా అలాంటి పని, వారికి ప్రాణసమానమైన వారిని చంపి ఉంటిని అనుకొనెదను. అందువలననే నాకు ఈ కష్టము వచ్చి పడిన దనుకొనుచుండెను.
2.39.5.
అనుష్టుప్.
న త్వేవానాగతే కాలే
దేహాచ్చ్యవతి జీవితమ్।
కైకేయ్యా క్లిశ్యమానస్య
మృత్యుర్మమ న విద్యతే॥
టీకః-
న = కాదు; తు; ఇవ= ఇట్లు ; అనాగతే = రాకుండగ; కాలే = కాలము; దేహాత్ = దేహమునుండి; చ్యవతి = విడిచిపెట్టుట; జీవితమ్ = జీవితము; కైకేయ్యా = కైకేయిచేత; క్లిశ్యమానస్య = పీడించబడుచున్న; మృత్యుః = మరణము; మమ = నన్ను; న = కాదు; విద్యతే = కలిగినది
భావంః-
కాలము రాకుండా ప్రాణములు దేహమును విడిచిపోవు. అందుచేతనే కైకేయిచే ఈ విధముగా పీడింపబడుచున్న నాకు మృత్యువు రాలేదు.
2.39.6.
అనుష్టుప్.
యోఽహం పావకసంకాశమ్
పశ్యామి పురతః స్థితమ్।
విహాయ వసనే సూక్ష్మే
తాపసాచ్ఛాదమాత్మజమ్॥
టీకః-
యః = ఏ; అహం = నేను; పావక సంకాశమ్ = అగ్నితో సమానమైన; పశ్యామి = చూచుచున్నాను; పురతః = ముందర; స్థితమ్ = నిలబడిన; విహాయ = విసర్జించి; వసనే = వస్త్రములు; సూక్ష్మే = సన్నని; తాపస = మునుల యొక్క; ఆచ్ఛాదమ్ = వస్త్రములను ధరించిన; ఆత్మజమ్ = నా కుమారుని
భావంః-
అగ్ని అంతటి పవిత్రమైన నా కుమారుడు సన్నని వస్త్రములు విడిచి మునులు ధరించు నారచీరలు ధరించి ఎదుట నిలచి ఉండగా చూచి కూడా నాకు చావు రాలేదు.
2.39.7.
అనుష్టుప్.
ఏకస్యాః ఖలు కైకేయ్యాః
కృతేఽయం క్లిశ్యతే జనః।
స్వార్థే ప్రయతమానాయాః
సంశ్రిత్య నికృతిం త్విమామ్”॥
టీకః-
ఏకస్యాః = ఒక్క; ఖలు = కారణమున, సర్వశబ్దసంభోదిని; కైకేయ్యాః = కైకేయిచే; కృతః = చేయబడిన; అయం = ఈ; క్లిశ్యతే = బాధపడుచున్నది; జనః = జనము; స్వార్థే = స్వార్థమునకు; ప్రయతమానాయాః = ప్రయత్నించుచున్న; సంశ్రిత్య = ఆశ్రయించి; నికృతిం = కుట్ర; తు = తప్పక; ఇమామ్ = ఈ
భావంః-
స్వప్రయోజనము కోసం ప్రయత్నించుచున్న ఒక్క కైకేయి ఈ విధముగా పన్నిన కుట్ర వలన దుర్మాక్గము వలన ఈ జనులందరు బాధపడుచున్నారు.”
2.39.8.
అనుష్టుప్.
ఏవముక్త్వా తు వచనమ్
బాష్పేణ పిహితేంద్రియః।
“రామేతి” సకృదేవోక్త్వా
వ్యాహర్తుం న శశాక హ॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; తు = విశేషముగ; వచనమ్ = మాటలను; బాష్పేణ = కన్నీటితో; పిహిత = కప్పివేయబడిన; ఇంద్రియః = ఇంద్రియములు కలవాడై; రామేతి = రామ అని; సకృత్ = ఒక్కసారి; ఏవ = మాత్రమే; ఉక్త్వా = పలికి; వ్యాహర్తుం = మాట్లాడుటకు; న= కాడు; శశాక హ = సమర్థుడు
భావంః-
అతడు ఈ విధముగా పలికి కన్నీరు సర్వ ఇంద్రియములను కప్పివేయగా, ‘రామా’ అని ఒక్కమారు పలికి ఆపై ఇంకేమియు పలుకజాలకపోయెను.
2.39.9.
అనుష్టుప్.
సంజ్ఞాం తు ప్రతిలభ్యైవ
ముహూర్తాత్స మహీపతిః।
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామ్
సుమంత్రమిదమబ్రవీత్॥
టీకః-
సంజ్ఞాం = స్పృహను; తు = చక్కగా; ప్రతిలభ్య = తిరిగి పొందిన; ఏవ = పిమ్మట; ముహూర్తాత్ = ఒక మపహూర్త కాలమునకు; స = ఆ; మహీపతిః = మహారాజు; నేత్రాభ్యామ్ = కన్నులతో; అశ్రుః = కన్నీటితో; పూర్ణాభ్యామ్ = నిండినవానితో; సుమంత్రమ్ = సుమంత్రునిగూర్చి; ఇదమ్ = ఈ మాటలు; అబ్రవీత్ = చెప్పెను
భావంః-
కొంతసేపటికి స్పృహ వచ్చిన ఆ దశరథుడు, కన్నీళ్లు కార్చుచు, సుమంత్రునితో ఇట్లనెను.
2.39.10.
అనుష్టుప్.
“ఔపవాహ్యం రథం యుక్త్వా
త్వమాయాహి హయోత్తమైః।
ప్రాపయైనం మహాభాగమ్
ఇతో జనపదాత్పరమ్॥
టీకః-
ఔపవాహ్యం = రాచవాహనము; రథం = రథమును; యుక్త్వా = కూర్చి; త్వమ్ = మీరు; ఆయాహి = రమ్ము; హయోత్తమైః = ఉత్తమమైన గుర్రములతో; ప్రాపయ = పొందించుము; ఏనమ్= ఈ ; మహాభాగమ్ = గొప్పభాగ్యవంతుని; ఇతః = ఇచటనుండి; జనపదాత్ = జనపదములకు; పరమ్ = ఆవలి స్థానమును గూర్చి
భావంః-
“నీవు ప్రయాణమునకు అనుకూలమైన రథమునకు ఉత్తమమైన అశ్వములు కూర్చి, రాముడిని జనావాసాలకు దూరంగా ఉన్న వనములకు చేర్చుము.
2.39.11.
అనుష్టుప్.
ఏవం మన్యే గుణవతామ్
గుణానాం ఫలముచ్యతే।
పిత్రా మాత్రా చ యత్సాధుః
వీరో నిర్వాస్యతే వనమ్॥
టీకః-
ఏవం = ఇట్లు; మన్యే = తలచెదను; గుణవతామ్ = సద్గుణములు కలవారి; గుణానాం = సద్గుణములకు; ఫలమ్ = ప్రతిఫలము; ఉచ్యతే = చెప్పబడును అని; పిత్రా = తండ్రిచేత; మాత్రా = తల్లిచేత; చ = మఱియు; యత్ = ఏ; సాధుః = సత్పురుషుడైన; వీరః = వీరుడు; నిర్వాస్యతే = బహిష్కరించబడు చుండెనో; వనమ్ = వనమును గూర్చి
భావంః-
సత్పురుషుడు, వీరుడు అయిన కుమారుని, తల్లిదండ్రులు నేడు వనమునకు పంపివేయుచున్నారు. గుణవంతునకు మంచిగుణములు ఉన్నందులకు ఇదియే ఫలము అని తలచుచున్నాను.”
గమనికః-
వనము- జలముకలది, అడవి, తోపు, సెలయూట, పరదేశము నందుట ఉనికి, ఇల్లు, సమూహము, శబ్దరత్నాకరము. పర్యాయ పదములు, కాంతారము, కుటపము, కుసుమాకరము, తోట, వృక్షవాటిక. వావిళ్ల నిఘంటువు- 7. అరణ్యవాసము. – చెట్లు, మొక్కలు, పొదలు సమూహములు, జలము, క్రూరమృగముల తాకిడి లేనిది, మానవులు వసించుటకు అనుకూల్యత గలది అడవి ప్రదేశములు. అడవి / ఊరి సరిహద్దులలోనిది ఉద్యానవనము. పెంచబడెడిది తోపు. అడవిలోని క్రూరమృగములు తిరుగు దట్టమైన వృక్షములు కల ప్రదేశములు అరణ్యము / అడవి. ఇందు మానవులకు భీకరమైనది.
2.39.12.
అనుష్టుప్.
రాజ్ఞో వచనమాజ్ఞాయ
సుమన్త్రః శీఘ్రవిక్రమః।
యోజయిత్వాఽయయౌ తత్ర
రథమశ్వైరలంకృతమ్॥
టీకః-
రాజ్ఞః = రాజుయొక్క; వచనమ్ = ఆజ్ఞను; ఆజ్ఞాయ = గ్రహించి; సుమన్త్రః = సుమంత్రుడు; శీఘ్ర విక్రమః = త్వరగల గమనము కలవాడై; యోజయిత్వా = అమర్చి; ఆయయౌ = వచ్చెను; తత్ర = అక్కడకు; రథమ్ = రథమును; అశ్వైః = గుర్రములతో; అలంకృతమ్ = అలంకరించబడినది, కట్టబడినది, పూన్చిన
భావంః-
సుమంత్రుడు రాజు మాటలు విని, శీఘ్రముగా వెళ్లి అలంకరింపబడిన అశ్వములు పూన్చిన రథమును తీసుకొనివచ్చెను.
2.39.13.
అనుష్టుప్.
తం రథం రాజపుత్రాయ
సూతః కనకభూషితమ్।
ఆచచక్షేఽంజలిం కృత్వా
యుక్తం పరమవాజిభిః॥
టీకః-
తం = ఆ; రథమ్ = రథమును; రాజపుత్రాయ = యువరాజుకొరకు; సూతః = రథ సారథి; కనక భూషితమ్ = బంగారముతో అలంకరించబడినది; ఆచచక్షేః = చెప్పెను; అంజలిం = దోసిలి; కృత్వా=కట్టి ; యుక్తం = అమర్చినది; పరమవాజిభిః = శ్రేష్ఠమైన గుర్రములతో
భావంః-
అతడు రామునకు నమస్కరించి బంగారముచే అలంకరింపబడి, ఉత్తమమైన గుర్రములు పూన్చిన రథము సిద్ధముగా ఉన్నదని చెప్పెను.
2.39.14.
అనుష్టుప్.
రాజా సత్వరమాహూయ
వ్యాపృతం విత్తసంచయే।
ఉవాచ దేశకాలజ్ఞమ్
నిశ్చితం సర్వతశ్శుచిమ్॥
టీకః-
రాజా = దశరథమహారాజు; సత్వరమ్ = త్వరగా; ఆహూయ = పిలిచి; వ్యాపృతం = పనిచేయు అధికారిని; విత్తసంచయే = కోశాగారములో; ఉవాచ = పలికెను; దేశకాలజ్ఞమ్ = ఉన్న స్థలమును, సమయమును తెలిసినవాడు; నిశ్చితమ్ = నిశ్చితమైన అభిప్రాయము కలవాడు; సర్వతః = అన్నివిధములుగా; శుచిమ్ = పరిశుద్ధముగా ఉన్నవాడు
భావంః-
దశరథుడు, దేశకాలములు ఎరిగినవాడు, నిశ్చితమైన, పరిశుద్ధమైన బుద్ధి కలవాడు, అన్నివిధముల నిజాయితీపరుడు అయిన కోశాగారాధికారిని వెంటనే రమ్మని పిలిపించి ఇట్లు చెప్పెను.
2.39.15.
అనుష్టుప్.
“వాసాంసి చ మహార్హాణి
భూషణాని వరాణి చ।
వర్షాణ్యేతాని సంఖ్యాయ
వైదేహ్యాః క్షిప్రమానయ”॥
టీకః-
వాసాంసి = వస్త్రములను; చ = మఱియు; మహార్హాణి = అమూల్యమైన; భూషణాని = నగలను; వరాణి = శ్రేష్ఠమైన; చ = మఱియు; వర్షాణి = సంవత్సరములను; ఏతాని = వీటిని; సంఖ్యాయ = పరిగణిస్తూ; వైదేహ్యాః = సీతకు; క్షిప్రమ్ = త్వరగా; ఆనయ = తీసుకుని రమ్ము
భావంః-
”అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో ఆ లెక్క ప్రకారము సీతకు కావలసిన అమూల్యమైన వస్త్రములను, శ్రేష్ఠమైన అలంకారములను శీఘ్రముగా తీసుకొని రమ్ము”.
2.39.16.
అనుష్టుప్.
నరేంద్రేణైవముక్తస్తు
గత్వా కోశగృహం తతః।
ప్రాయచ్ఛత్సర్వమాహృత్య
సీతాయై సమమేవ తత్॥
టీకః-
నరేంద్రేణ = రాజుచేత; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = ఆజ్ఞాపింపబడిన వాడై; తు = నిష్చయముగ; గత్వా = వెళ్లి; కోశగృహం = కోశాగారముగూర్చి; తతః = తర్వాత; ప్రాయచ్ఛత్ = ఇచ్చెను; సర్వమ్ = అన్నిటిని; ఆహృత్య = తెచ్చి; సీతాయై = సీతకు; సమమేవ = మొత్తమును; తత్ = దానిని
భావంః-
అతడు రాజాజ్ఞ ప్రకారము కోశాగారమునుండి ఆ వస్తువులను అన్నిటిని తీసుకొని వచ్చి, ఆ మొత్తమును సీతకిచ్చెను.
2.39.17.
అనుష్టుప్.
సా సుజాతా సుజాతాని
వైదేహీ ప్రస్థితా వనమ్।
భూషయామాస గాత్రాణి
తైర్విచిత్రైర్విభూషణైః॥
టీకః-
సా = ఆ; సుజాతా = గొప్ప జన్మగల; సుజాతాని = (బహువచనము) చక్కగా ఉత్పాదించబడినవి, శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు; వైదేహీ = సీతాదేవి; ప్రస్థితా = బయలుదేరిన; వనమ్ = అడవిగురించి; భూషయామాస = అలంకరించెను; గాత్రాణి = అవయవములను; తైః = వానిచే; విచిత్రైః = బాగుగా చిత్రించబడినవి; విభూషణైః = విశిష్ఠమైన ఆభరణములతో
భావంః-
అడవికి ప్రయాణమైన ఉన్నతవంశమున పుట్టిన సీత, విశేషముగా చెక్కబడి, చక్కగా తయారుచేయబడిన విశిష్ఠమైన అలంకారములతో, సుందరమైన తన అవయవములను అలంకరించుకొనెను.
గమనికః-
సుజాతాని, “వి”చిత్రైః “వి”భూషణైః అని వర్ణించుటలో ఈ ఆభరణముల ప్రత్యేకత తరువాతి సర్గలలో అనుసంధానము అగుచున్నవా?
2.39.18.
అనుష్టుప్.
వ్యరాజయత వైదేహీ
వేశ్మ తత్సువిభూషితా।
ఉద్యతోంఽశుమతః కాలే
ఖం ప్రభేవ వివస్వతః॥
టీకః-
వ్యరాజయత = ప్రకాశింపచేసెను; వైదేహీ = సీతాదేవి; వేశ్మ = రాజభవనమును; తత్ = ఆ; సువిభూషితా = అందముగా అలంకరించబడిన; ఉద్యతః = ఉదయించుచున్న; అంశుమతః = కిరణములు గల; కాలే = ఉదయమునందు; ఖం = ఆకాశమును; ప్రభా = ప్రకాశింపజేసిన; ఇవ = వలె; వివస్వతః = సూర్యునియొక్క
భావంః-
చక్కగా అలంకరించుకొనిన సీత ఆ గృహము నంతయును ఉదయించుచున్న సూర్యునికాంతి ఆకాశమును ప్రకాశింపచేసినట్లు ప్రకాశింపచేసెను.
2.39.19.
అనుష్టుప్.
తాం భుజాభ్యాం పరిష్వజ్య
శ్వశ్రూర్వచనమబ్రవీత్।
అనాచరంతీ కృపణమ్
మూర్ధ్న్యుపాఘ్రాయ మైథిలీమ్॥
టీకః-
తాం = ఆ; భుజాభ్యాం = భుజములచేత; పరిష్వజ్య = కౌగలించుకొని; శ్వశ్రూః = అత్తగారయిన కౌసల్య; వచనమ్ = మాటలు; అబ్రవీత్ = పలికెను; అనాచరంతీ = ప్రవర్తించని; కృపణమ్ = దైన్యముగా; మూర్ధ్ని = తలపై; ఉపాఘ్రాయ = వాసనచూసి; మైథిలీమ్ = మిథిలా రాజకుమార్తె సీతను
భావంః-
అట్టి సమయములో కూడ దైన్యముగా ప్రవర్తించక ఉత్సాహవంతురాలై ఉన్న సీతను కౌసల్య కౌగలించుకొని, శిరస్సుపై వాసన చూచి ఇట్లు పలికెను.
2.39.20.
అనుష్టుప్.
“అసత్యస్సర్వలోకేఽస్మిన్
సతతం సత్కృతాః ప్రియైః।
భర్తారం నానుమన్యన్తే
వినిపాతగతం స్త్రియః॥
టీకః-
అసత్యః = నిజాయితీ లేని; సర్వలోకః = ప్రపంచమంతటా; అస్మిన్ = ఈ; సతతం = ఎల్లపుడు; సత్కృతాః = గౌరవించబడినప్పటికి; ప్రియైః = ప్రియమైన భర్తలచే; భర్తారం = భర్తను; న = చేయరు; అనుమన్యన్తే = అంగీకరించుట; వినిపాత = దుర్దశలో; గతమ్ = పడివానిని; స్త్రియః = స్త్రీలు
భావంః-
”ఈ లోకములో నిజాయితీలేని స్త్రీలు, వారిని భర్తలు ఎంతగా గౌరవించుచున్నను, ఆ భర్తలు దుర్దశలో పడినప్పుడు వారిని అవమానింతురు.
2.39.21.
అనుష్టుప్.
ఏష స్వభావో నారీణామ్
అనుభూయ పురా సుఖమ్।
అల్పామప్యాపదం ప్రాప్య
దుష్యంతి ప్రజహత్యపి॥
టీకః-
ఏష = వీరి; స్వభావః = ప్రకృతి; నారీణామ్ = స్త్రీలయొక్క; అనుభూయ = అనుభవించి; పురా = పూర్వము; సుఖమ్ = సంతోషము; అల్పామపి = చిన్నది అయినా; ఆపదం = ఆపదను; ప్రాప్య = పొంది; దుష్యంlf = దూషితవర్తన కలవారై; ప్రజహతి = ప్ర+ జహతి, విడిచిపెట్టుదురు; అపి = కూడ
భావంః-
ఇట్టి స్త్రీల స్వభావము. ముందు తాము ఎంత సుఖపడినను, ఏ చిన్న ఆపద వచ్చినను తాము చెడిపోవుదురు. భర్తను కూడ పరిత్యజింతురు.
2.39.22.
అనుష్టుప్.
అసత్యశీలా వికృతా
దుర్గ్రాహ్యహృదయాస్సదా।
యువత్యః పాపసంంకల్పః
క్షణమాత్రాద్విరాగిణః॥
టీకః-
అసత్యశీలా = సచ్చీలము లేనివారు; వికృతాః = వికృతమైన; దుర్గ్రాహ్య = గ్రహించుటకు కష్టసాధ్యమైన; హృదయాః = అభిప్రాయము గలవారు, వావిళ్ళ; తథా = అటువంటి; యువత్యః = యువతులు; పాపసంకల్పాః = చెడు ఆలోచనలు గల; క్షణమాత్రాత్ = ఒక్క క్షణము లోపల; విరాగిణః = అనురాగము రహితురాళ్ళు
భావంః-
అట్టి యువతులు సచ్ఛీలము లేనివారు. వికృతమైన అంతుపట్టని ఆలోచనలు గలవారు, పాపసంకల్పులు. ఎంతటి ప్రేమానునురాగము ఒక్క క్షణములో కోల్పోవుదురు.
గమనికః-
వికృత- , భీభత్స అమరకోశం, అసంస్కృతం మోదిని, విమతి, వికార తస్యలక్షణమ్ శబ్దకల్పదృమం, మలినీకృతె వాచస్పతమ్.
2.39.23.
అనుష్టుప్.
న కులం న కృతం విద్యా
న దత్తం నాపి సంగ్రహః।
స్త్రీణాం గృహ్ణాతి హృదయమ్
అనిత్యహృదయా హి తాః॥
టీకః-
న = ఉండదు; కులం = అభిజాత్యము, అన్వయము, వంశము; న= ఉండదు; కృతం = చేసిన; విద్యా = విద్యార్జన; దత్తం = ఇవ్వబడినవి కాని; న = ఉండదు; అపి= కూడా; సంగ్రహః = ఆదరము; స్త్రీణాం = స్త్రీలయొక్క; గృహ్ణాతి = ఆకర్షించుట; హృదయమ్ = హృదయమును; అనిత్య = అనిత్యమైన లేదా అస్థిరమైన; హృదయా = హృదయము కలవారు; హి = కదా; తాః = వారు
భావంః-
భర్త వంశగౌరము కాని, చదివిన చదువు కాని, ఇవ్వబడిన వస్తువుల మేళ్ళ స్పృహ గాని, చూపిన ఆదరముగాని స్త్రీల మనసులకు పట్టదు. వారి హృదయము అస్థిరము.
2.39.24.
అనుష్టుప్.
2.39.24.
అనుష్టుప్.
సాధ్వీనాం హి స్థితానాం తు
శీలే సత్యే శ్రుతే శమే।
స్త్రీణాం పవిత్రం పరమమ్
పతిరేకో విశిష్యతే॥
టీకః-
సాధ్వీనాం = పతివ్రతలైన స్త్రీలకు; హి = నిశ్చయంగా; స్థితానాం = స్థిరమై ఉన్న; తు = విశేషముగ; శీలే = సత్ప్రవర్తనయందు; సత్యే = సత్యమునందు; శ్రుతే = శ్రుతమునందు; శమే = శమమునందు; స్త్రీణాం = స్త్రీలకు; పవిత్రం = పవిత్రమైన; పరమమ్ = శ్రేష్ఠమైన; పతిః = భర్తయే; ఏకః = ఒక్కరే; విశిష్యతే = విశిష్ఠుడు
భావంః-
శీలమునందు, సత్యమునందు, శాస్త్రమునందు, శమమునందు స్థిరమైన చిత్తముగల పతివ్రతలైన స్త్రీలకు మాత్రము ఒక్క భర్తయే పరమపవిత్రుడుగా విశిష్ట స్థానమును పొందియుండును.
2.39.25.
అనుష్టుప్.
స త్వయా నావమంతవ్యః
పుత్రః ప్రవ్రాజితో మమ।
తవ దైవతమస్త్వేష
నిర్ధనః సధనోఽపి వా”॥
టీకః-
సః = ఈ; త్వయా = నీ చేత; న = వద్దు; అవమంతవ్యః = తృణీకరించుట; పుత్రః = కుమారుడు; ప్రవ్రాజితః = అరణ్యములకు పంపబడుచున్న; మమ = నా చేత; తవ = నీకు; దైవతమ్ = దైవముగా; అస్తు = ఉండును గాక; ఏషః = ఇతడు; నిర్ధనః = ధనము లేనివాడు; సధనః = ధనము ఉన్నవాడు; అపివా = ఐనను
భావంః-
వనమునకు పంపివేయబడుచున్న నా కుమారుని నీవు అవమానింపకూడదు. ధనమున్నవాడైనను, ధనము లేనివాడైనను, ఇతనిని నీవు దైవముగా చూచుకొనవలెను..“
2.39.26.
అనుష్టుప్.
విజ్ఞాయ వచనం సీతా
తస్యా ధర్మార్థసంహితమ్।
కృతాంజలిరువాచేదమ్
శ్వశ్రూమభిముఖే స్థితామ్॥
టీకః-
విజ్ఞాయ = తెలుసుకొని; వచనం = మాటలను; సీతా = సీతాదేవి; తస్యా = ఆమెయొక్క; ధర్మార్థ = ధర్మము అర్థములతో; సంహితమ్ = సంయుక్తమైన; కృతాంజలిః = ముకుళించిన చేతులుగలదై; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈ విధముగా; శ్వశ్రూమ్ = అత్తగారిని గూర్చి; అభిముఖే = ఎదురుగా; స్థితామ్ = ఉన్న
భావంః-
సీత ధర్మార్థములు రెంటికిని అనుకూలముగా ఉన్న కౌసల్య మాటలు విని బాగుగా అర్థము చేసుకొని నమస్కరించుచు ఎదుట నిలచి ఉన్న అత్తగారితో..
2.39.27.
అనుష్టుప్.
“కరిష్యే సర్వమేవాహమ్
ఆర్యా! యదనుశాస్తి మామ్।
అభిజ్ఞాస్మి యథా భర్తుః
వర్తితవ్యం శ్రుతం చ మే॥
టీకః-
కరిష్యే = చేయగలను; సర్వమ్ = అన్నియు; ఇవ = తప్పక; అహమ్ = నేను; ఆర్యా = పూజ్యురాలు; యత్ = ఏ విధముగా; అనుశాసి = ఆదేశించెనో; మామ్ = నాకు; అభిజ్ఞా = తెలిసినదానను; అస్మి= అయితిని; యథా = ఏ విధముగా; భర్తుః = భర్తతో; వర్తితవ్యం = ప్రవర్తించవలెనో; శ్రుతం = వినబడినది కూడ; చ = కూడ; మే = నాకు
భావంః-
“పూజ్యురాలవైన నీవు ఆజ్ఞాపించిన విధముగా అన్నియు చేసెదను. భర్త విషయములో ఎట్లు ప్రవర్తించవలయునో నాకు తెలియును. నేను పూర్వము కూడ వినియుంటిని.
2.39.28.
అనుష్టుప్.
న మామసజ్జనేనార్యా
సమానయితుమర్హతి।
ధర్మాద్విచలితుం నాహమ్
అలం చంద్రాదివ ప్రభా॥
టీకః-
న = కాదు; మామ్ = నన్ను; అసజ్జనేన = దుష్ట స్త్రీలతో; ఆర్యా = పూజ్యురాలా!; సమానయితుమ్ = సమానముగ తలచుటకు; అర్హతి = యోగ్యురాలవు; ధర్మాత్ = ధర్మమునుండి; విచలితుం = చలించుటకు; న = కాదు; అహమ్ = నేను; అలం = సమర్థురాలను; చంద్రాత్ = చంద్రునినుండి; ఇవ= వలె; ప్రభా = కాంతి
భావంః-
నేను దుష్ట స్త్రీల వంటి దాననని పూజ్యురాలవైన నీవు తలంపకుము. కాంతి చంద్రుని విడువజాలనట్లు నేను ధర్మమును విడువజాలను.
2.39.29.
అనుష్టుప్.
నాతంత్రీ వాద్యతే వీణా
నాచక్రో వర్తతే రథః।
నాపతిస్సుఖమేధేత
యా స్యాదపి శతాత్మజా॥
టీకః-
న = లేదు; అతంత్రీ = తీగలు లేనిది; వాద్యతే = మ్రోగుట; వీణా = వీణ (భారతీయ తంత్రీ వాద్యము); న = లేదు; అచక్రః = చక్రములు లేని; వర్తతే = కదులుట; రథః = రథము; న = లేదు; అపతిః = భర్త లేకుండా; సుఖమ్ = సుఖముగ; ఏధేత = అభివృద్ధికలది; యా = ఎటువంటి; స్యాదపి = అయినను; శతాత్మజా = వందమంది పిల్లలుకలది
భావంః-
తీగలు లేని వీణ మ్రోగదు. చక్రము లేని రథము నడవదు. అట్లే భర్త లేని స్త్రీ నూరుగురు కుమారులున్నను, సుఖముగా అభివృద్ధికలిగి ఉండజాలదు.
2.39.30.
అనుష్టుప్.
మితం దదాతి హి పితా
మితం మాతా మితం సుతః।
అమితస్య హి దాతారమ్
భర్తారం కా న పూజయేత్॥
టీకః-
మితం = పరిమితస్థాయిలో; దదాతి = ఇచ్చును; హి = నిశ్చయంగా; పితా = తండ్రి; మితం = పరిమితముగా; మాతా = తల్లి; మితం = పరిమితముగ; సుతః = పుత్రుడు; అమితస్య = అపరిమితముగా; హి = తప్పక; దాతారమ్ = ఇచ్చు; భర్తారం = భర్తను; కా = ఏ స్త్రీ; న పూజయేత్ = ఆరాధించదు?
భావంః-
స్త్రీకి తండ్రిగాని, తల్లిగాని, కుమారుడుగాని ఏమైనా ఇవ్వగలిగినది పరిమితమైనదే. అపరిమితముగా ఇవ్వగలిగినవాడు భర్త ఒక్కడే. అట్టి భర్తను ఏ స్త్రీౖ ఐనా ఆరాధించకుండునా?
2.39.31.
అనుష్టుప్.
సాహమేవం గతా శ్రేష్ఠా
శ్రుతధర్మపరావరా।
ఆర్యే! కిమవమన్యేఽహమ్
స్త్రీణాం భర్తా హి దైవతమ్”॥
టీకః-
సా = అట్టి; అహమ్ = నేను; ఏవం = ఈ విధముగా; గతా = పూర్వము; శ్రేష్ఠా = శ్రేష్ఠురాలను; శ్రుత = వినబడిన; ధర్మపరావరా = ధర్మము యొక్క ప్రత్యేక మఱియు సాధారణ స్వరూపముల గురించి; ఆర్యే = పూజ్యురాలా; కిమ్ = ఎందులకు; అవమన్యే= అవమానింతును; అహమ్ = నేను; స్త్రీణాం = స్త్రీలకు; భర్తా = భర్తయే; హి = కదా; దైవతమ్ = దైవము
భావంః-
పూజ్యురాలా! ఇట్టి ఆలోచనలు కలిగి ధర్మమునకు సంబంధించిన సామాన్య విషయములను విశేష విషయములను విని శ్రేష్ఠురాలనై ఉన్న నేను భర్తను ఎట్లు అవమానింతును? స్త్రీలకు భర్తయే దైవము కదా!”
2.39.32.
అనుష్టుప్.
సీతాయా వచనం శ్రుత్వా
కౌసల్యా హృదయంగమమ్।
శుద్ధసత్త్వా ముమోచాశ్రు
సహసా దుఃఖహర్షజమ్॥
టీకః-
సీతాయా = సీతాదేవి యొక్క; వచనం = మాటలు; శ్రుత్వా = విని; కౌసల్యా = కౌసల్య; హృదయంగమమ్ = మనోజ్ఞమైన; శుద్ధ సత్త్వా = పరిశుద్ధమైన ఆలోచనగలదై; ముమోచ = విడిచెను; అశ్రు = కన్నీటిని; సహసా = తక్షణమే; దుఃఖ = దుఃఖము; హర్షజమ్ = సంతోషముతో కలిగిన
భావంః-
కౌసల్య సీత పలికిన మనోహరమైన మాటలు విని, పరిశుద్ధమైన మనస్సు కలదై, వెంటనే దుఃఖాశ్రువులను, ఆనందాశ్రువులను కూడ కలిపి ఒక్కసారి విడిచెను.
2.39.33.
అనుష్టుప్.
తాం ప్రాంజలిరభిక్రమ్య
మాతృమధ్యేఽతిసత్కృతామ్।
రామః పరమధర్మాత్మా
మాతరం వాక్యమబ్రవీత్॥
టీకః-
తాం = ఆ విధముగా; ప్రాంజలిః = చేతులు మోడ్చి; అభిక్రమ్య = ప్రదక్షిణము చేసి; మాతృమధ్యః = తల్లుల నడిమిలో; అతి = మిక్కిలి; సత్కృతామ్ = సత్కారములు అందుకున్న; రామః = రాముడు; పరమధర్మాత్మా = మిక్కిలి ధర్మాత్ముడైన; మాతరం = తల్లిని గూర్చి; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను
భావంః-
పరమధర్మాత్ముడైన రాముడు తల్లులందరిలో ఎక్కువ సత్కారము లందుకొనుచున్న ఆ తల్లి కౌసల్యకు ప్రదక్షిణము చేసి, నమస్కరించి ఆమెతో ఇట్లు పలికెను.
2.39.34.
అనుష్టుప్.
“అంబ మా దుఃఖితా భూస్త్వమ్
పశ్య త్వం పితరం మమ।
క్షయో హి వనవాసస్య
క్షిప్రమేవ భవిష్యతి॥
టీకః-
అంబ = ఓ తల్లీ!; మా= వలదుః దుఃఖితా = దుఃఖితురాలవు; భూః = అగుట; త్వమ్ = నీవు; పశ్య = చూచుకొనుము; త్వం = నీవు; పితరం = తండ్రిని; మమ = నా యొక్క; క్షయో = ముగింపు; హి = తప్పక; వనవాసస్య = వనవాసముయొక్క; క్షిప్రమేవ = త్వరగానే; భవిష్యతి = కాగలదు
భావంః-
“అమ్మా నీవు దుఃఖింపకుము. మా తండ్రిగారిని చూచుకొనుచుండుము. వనవాసము త్వరగానే ముగియగలదు.
2.39.35.
అనుష్టుప్.
సుప్తాయాస్తే గమిష్యంతి
నవ వర్షాణి పంచ చ।
సా సమగ్రమిహ ప్రాప్తమ్
మాం ద్రక్ష్యసి సుహృద్వృతమ్”॥
టీకః-
సుప్తాయాః = నిద్రలో నుండగా; తే = నీవు; గమిష్యంతి = గడచిపోవును; నవ వర్షాణి పంచ చ = పదునాలుగు సంవత్సరములు; సా = అట్టి మీరు; సమగ్రమ్ = సంపూర్ణుడనైన; ఇహ= ఇచటకు; సంప్రాప్తమ్ = వచ్చిన; మాం = నన్ను; ద్రక్ష్యసి = చూడగలవు; సుహృత్ = శ్రేయోభిలాషులతో; ఆవృతమ్ = చుట్టూచేరినవారితో కూడి
భావంః-
పదునాల్గు సంవత్సరములు నీ నిద్రలో గడచినట్లు, గడచిపోవును. నేను, ప్రతిజ్ఞ పూర్తి చేసికొని మిత్రులతో కూడి వచ్చెదను. నీవు చూడగలవు.”
2.39.36.
అనుష్టుప్.
ఏతావదభినీతార్థమ్
ఉక్త్వా స జననీం వచః।
త్రయశ్శతశతార్ధాశ్చ
దదర్శా వేక్ష్య మాతరః॥
టీకః-
ఏతావత్ = ఇంతమాత్రము; అభినీతార్థమ్ = అర్థవంతమైన; ఉక్త్వా = పలికి; సః=అతడుః జననీం = ఆ తల్లిని గూర్చి; వచః = మాటలు; త్రయః శతశతార్ధాః చ = మూడువందల ఏబది మంది; చ = మఱియు; దదర్శ = చూచుచు; అవేక్ష్య = జాగ్రత్తగా; మాతరః = తల్లుల గూర్చి
భావంః-
రాముడు ఈ విధముగా తల్లితో నిశ్చితమగు అర్థము గల వాక్యము పలికి, ఆలోచించి, మూడు వందల ఏబది మంది తల్లులను చూచి.
2.39.37.
అనుష్టుప్.
తాశ్చాపి స తథైవార్తా
మాతఽర్దశరథాత్మజః।
ధర్మయుక్తమిదం వాక్యమ్
నిజగాద కృతాంజలిః॥
టీకః-
తాః = ఆ; చ=మఱియు; అపి = కూడా; సః = ఆః తథైవ = అట్లే; ఆర్తా = దుఃఖించుచున్న; మాతః = తల్లుల గూర్చి; దశథాత్మజః = రాముడు; ధర్మయుక్తమ్ = ధర్మముతో కూడిన; ఇదం = ఈ; వాక్యమ్ = మాటను; నిజగాద = పలికెను; కృతాంజలిః = ముడిచిన చేతులు గలవాడై
భావంః-
ఆ రాముడు, కౌసల్య వలె దుఃఖించుచున్న ఆ తల్లులందరికీ నమస్కరించి వారితో ధర్మయుక్తమైన మాటలు మాట్లాడెను.
2.39.38.
అనుష్టుప్.
సంవాసాత్పరుషం కించిత్
అజ్ఞానాద్వాపి యత్కృతమ్।
తన్మే సమనుజానీత
సర్వాశ్చామంత్రయామి వః”॥
టీకః-
సంవాసాత్ = కలిసి జీవించుటవలన; పరుషం = పరుషమైన పని; కించిత్ = కొద్దిమాత్రమైనా; అజ్ఞానాత్ వా అపి = అజ్ఞానముచేత కాని; వా = లేదా; అపి = కాని; యత్ = ఏది; కృతమ్ = చేయబడినదో; తత్ = దానిని; మే = నా యొక్క; సమనుజానీత = మన్నించవలెను; సర్వాః + చ = అందఱి; ఆమంత్రయామి = సెలవు తీసుకొనుచున్నాను; వః = మీ యొక్క
భావంః-
‘చిరపరిచయమువలన గాని, అజ్ఞానమువలన గాని నేనేమైన పరుషమైన కార్యమును గాని తప్పు గాని చేసినచో దానిని మన్నించండి. మీ అందరి దగ్గర సెలవు తీసుకొనుచున్నాను”. అని పలికెను.
2.39.39.
అనుష్టుప్.
వచనం రాఘవస్యైతత్
ధర్మయుక్తం సమాహితమ్।
శుశ్రువుస్తాః స్త్రియస్సర్వాః
శోకోపహతచేతసః॥
టీకః-
వచనం = మాటలను; రాఘవస్య = రాముని యొక్క; ఏతత్ = ఈ; ధర్మయుక్తం = ధర్మముతో కూడినది; సమాహితమ్ = చక్కగా చెప్పబడినది; శుశ్రువుః = వినిరి; తాః = ఆ; స్త్రియః = స్త్రీలు; సర్వాః = అందరు; శోకోపహత = శోకముచే కొట్టబడిన; చేతసః = చిత్తము గలవారై
భావంః-
ఆ స్త్రీలందరును చక్కగా చెప్పబడిన, ధర్మయుక్తమగు రామవచనమును శోకాక్రాంతచిత్తులై వినిరి.
2.39.40.
అనుష్టుప్.
జజ్ఞేఽథ తాసాం సన్నాదః
క్రౌంచీనామివ నిస్వనః।
మానవేంద్రస్య భార్యాణామ్
ఏవం వదతి రాఘవే॥
టీకః-
జజ్ఞే = ఉదయించెను; అథ = పిదప; తాసాం = ఆ; సన్నాదః = ధ్వని; క్రౌంచీనామ్ = క్రౌంచపక్షుల; ఇవ = వలె; నిస్వనః = శబ్దము; మానవ + ఇంద్రస్య = రాజశ్రేష్ఠుడైన దశరథ మహారాజు యొక్క; భార్యాణామ్ = భార్యలయొక్క; ఏవం = ఈ విధముగా; వదతి = అరచిరి; రాఘవే = రాఘవుడు
భావంః-
రాముడిట్లు పలుకగానే దశరథమహారాజు భార్యలందరును క్రౌంచపక్షులు అరచినట్లు ఏడ్చిరి.
2.39.41.
జగతి.
మురజపణవమేఘఘోషవత్
దశరథవేశ్మ బభూవ యత్పురా।
విలపితపరిదేవనాకులం
వ్యసనగతం తదభూత్సుదుఃఖితమ్॥
టీకః-
మురజ = మృదంగము; పణవ = తప్పెట; మేఘ ఘోషవత్ = మేఘధ్వని వంటి; దశరథ వేశ్మ = దశరథుని రాజభవనము; బభూవ = జరిగెను; యత్ = ఏది; పురా = గతములో; విలపిత = ఏడుపులతో; పరిదేవన = రోదనలతోః; ఆకులం= వ్యాకులమై; వ్యసనగతం = ఆపదలలో పడినదై; తత్ = అది; అభూత్ = అయ్యెను; సుదుఃఖితమ్ = చాలా దుఃఖముతో కూడినది
భావంః-
పూర్వము మేఘధ్వని వంటి మురజము, పణవము మొదలైన వాద్యముల ధ్వనులతో మార్మోగుచుండిన దశరథుని గృహము, యిప్పుడు కష్టములలో చిక్కి, ఏడ్పులతోను, పెడబొబ్బలతోను నిండి దుఃఖసముద్రముగా మారినది.
2.39.42.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశః సర్గః.
టీకః- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; ఏకోనచత్వారింశః [39] = ముప్పైతొమ్మిదవ; సర్గః = సర్గ
భావంః- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [39] ముప్పైతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.40.1.
అనుష్టుప్.
అథ రామశ్చ సీతా చ
లక్ష్మణశ్చ కృతాంజలిః।
ఉపసంగృహ్య రాజానమ్
చక్రుర్దీనాః ప్రదక్షిణమ్॥
టీకః-
అథ = తరువాత; రామః = రాముడును; చ = మఱియు; సీతా = సీతయు; చ = మఱియు; లక్ష్మణః = లక్ష్మణుడును; చ = మఱియు; కృతాంజలిః = ముకుళించిన దోసిలితో; ఉపసంగృహ్య = పాదములను తాకి; రాజానమ్ = రాజునకు; చక్రుః = చేసిరి; దీనాః = దీనముగా; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము
భావంః-
తరువాత సీతారామలక్ష్మణులు అంజలి ఘటించి, దీనముగా దశరథున పాదములను తాకి నమస్కరించి ప్రదక్షిణము చేసిరి.
2.40.2.
అనుష్టుప్.
తం చాపి సమనుజ్ఞాప్య
ధర్మజ్ఞస్సీతయా సహ।
రాఘవశ్శోకసమ్మూఢో
జననీమభ్యవాదయత్॥
టీకః-
తం = అతనిని; చ = మఱియు; అపి = కూడ; సమనుజ్ఞాప్య = అనుమతింపజేసి; ధర్మజ్ఞః = ధర్మము నెరిగిన; సీతయా = సీతతో; సహ = కూడి; రాఘవః = రాముడు; శోక = దుఃఖముచేత; సమ్మూఢః = మిక్కిలి మోహము చెందినామె; జననీమ్ = తల్లికి; అభ్యవాదయత్ = నమస్కరించెను
భావంః-
ధర్మము నెరిగిన రాముడును సీతయు, దశరథుని అనుమతిని పొందిన పిమ్మట, దుఃఖసాగరమున మునిగియున్న కౌసల్యకు నమస్కరించిరి.
2.40.3.
అనుష్టుప్.
అన్వక్షం లక్ష్మణో భ్రాతుః
కౌసల్యామభ్యవాదయత్।
అథ మాతు స్సుమిత్రాయా
జగ్రాహ చరణౌ పునః॥
టీకః-
అన్వక్షం = వెంటనే; లక్ష్మణః = లక్ష్మణుడు; భ్రాతుః = సోదరుని గురించి; కౌసల్యామ్ = కౌసల్యను గురించి; అభ్యవాదయత్ = నమస్కరించి; అథ = తరువాత; మాతుః = తల్లి ఐన; సుమిత్రాయాః = సుమిత్ర కొరకు; జగ్రాహ = పట్టుకొనెను; చరణౌ = రెండు పాదములను; పునః = మరల
భావంః-
రాముడు కౌసల్యకు పాదాభివందనము చేసిన పిమ్మట, లక్ష్మణుడు కూడ ఆమెకు నమస్కరించి, తరువాత తన తల్లి ఐన సుమిత్ర రెండు పాదములను పట్టుకొని నమస్కారము చేసెను.
2.40.4.
అనుష్టుప్.
తం వందమానం రుదతీ
మాతా సౌమిత్రిమబ్రవీత్।
హితకామా మహాబాహుమ్
మూర్ధ్న్యుపాఘ్రాయ లక్ష్మణమ్॥
టీకః-
తం = ఆ; వందమానం = నమస్కరించుచున్నవాడైన; రుదతీ = రోదించుచు; మాతా = తల్లి; సౌమిత్రిమ్ = సుమిత్ర యొక్క కుమారుడు; అబ్రవీత్ = పలికెను; హితకామా = క్షేమమును కోరుచు; మహాబాహుమ్ = గొప్ప బాహువులు కలిగియున్న; మూర్ధ్ని = శిరస్సుపై; ఉపాఘ్రాయ = వాసన చూచి; లక్ష్మణమ్ = లక్ష్మణుని గూర్చి
భావంః-
తల్లి ఐన సుమిత్రకు ఆ విధముగ నమస్కరించుచున్న ఆజానుబాహుడైన తన కుమారుడు లక్ష్మణుని శిరస్సుపై వాసన చూచి ఏడ్చుచు అతని క్షేమమును కోరుచు ఇట్లు పలికెను.
2.40.5.
అనుష్టుప్.
సృష్టస్త్వం వనవాసాయ
స్వనురక్తస్సుహృజ్జనే।
రామే ప్రమాదం మా కార్షీః
పుత్ర భ్రాతరి గచ్ఛతి॥
టీకః-
సృష్టః = సృష్టింపబడితివి, పంపబడుతున్నావు, అనుమతింపబడు చున్నావు; త్వం = నీవు; వనవాసాయ = వనవాసము చేయుటకొరకు; స్వనురక్తః = ఆత్మీయానురాగములుకలిగిన; సుహృజ్జనే = ఆప్తుల విషయమై; రామే = రాముని విషయమై; ప్రమాదం = ఏమరపాటు; మా = కూడదు; కార్షీః = చేయుట; పుత్ర = కుమారా; భ్రాతరి = సోదరుడైన; గచ్ఛతి = వెళుచున్న
భావంః-
“కుమారా! ఆప్తుల యెడల ఆత్మీయానురాగములు కలవాడవు. (రామునితో) వనవాసము చేయుటకే నీవు నాకు జన్మించితివి అని భావించి పంపుతున్నాము. ఏమాత్రమును ఏమరపాటు లేకుండ నీ అన్న ఐన రాముని అరణ్యవాసమునందు కాపాడుచుండుము.
గమనికః-
రాముడు నారాయణాంశజుడు, లక్ష్మణుడు ఆదిశేషాత్మజుడు. కనుక లక్ష్మణుడు రాముని వెన్నంటి రక్షణచేయుట కొఱకు జన్మించెను.
2.40.6.
అనుష్టుప్.
వ్యసనీ వా సమృద్ధో వా
గతిరేష తవానఘ।
ఏష లోకే సతాం ధర్మో
యజ్జ్యేష్ఠవశగో భవేత్॥
టీకః-
వ్యసనీ = వ్యసనపరుడు; వా = లేదా; సమృద్ధః = భాగ్యవంతుడు; వా = లేదా; గతిః = గతి; ఏషః = ఇది; తవ = నీకు; అనఘ = పాపములు చేయనివాడు; ఏష = ఇది; లోకే = లోకము నందు; సతాం = సత్పురుషుల యొక్క; ధర్మః = ధర్మము; యత్ = ఏది; జ్యేష్ఠ = పెద్దవాడు; వశగః = ఆధీనము; భవేత్ = అగును
భావంః-
పాపములు చేయుట ఎరుగని ఓ పుత్రా! వ్యసనపరుడైనను, భాగ్యవంతుడైనను, అన్నయే నీకు దిక్కు. పెద్దవానిని అనుసరించి యుండుటయే లోకమునందు సత్పురుషుల ధర్మము.
గమనికః-
జ్యేష్ఠో పితృసమః అన్న తండ్రితో సమానుడు, కనుక జ్యేష్ఠుని అనుసరణ సజ్జనుల కర్తవ్యము
2.40.7.
అనుష్టుప్.
ఇదం హి వృత్తముచితమ్
కులస్యాస్య సనాతనమ్।
దానం దీక్షా చ యజ్ఞేషు
తనుత్యాగో మృధేషు చ”॥
టీకః-
ఇదం = ఈ; హి = కదా; వృత్తమ్ = ఆచారము; ఉచితమ్ = తగిన; కులస్య = కులమునకు; అస్య = ఈ; సనాతనమ్ = పురాతనమైన; దానం = దానము; దీక్షా చ = దీక్షాపరుడై; యజ్ఞేషు = యజ్ఞమునందు; తనుత్యాగో = ప్రాణ త్యాగము చేయుట; మృధేషు చ = యుద్ధము నందు
భావంః-
దానములు చేయుట, దీక్షాపరుడై యజ్ఞములు చేయుట, యుద్ధములలో ప్రాణమును విడుచుట అనునవి అనాదిగా మన వంశాచారములు కదా”.
2.40.8.
అనుష్టుప్.
లక్ష్మణం త్వేవముక్త్వా సా
సంసిద్ధం ప్రియరాఘవమ్।
సుమిత్రా “గచ్ఛ గచ్ఛేతి”
పునః పునరువాచ తమ్॥
టీకః-
లక్ష్మణం తు = లక్ష్మణుని గూర్చి; తు = ఇంకనూ; ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; సా = ఆమె; సంసిద్ధం = సిద్ధముగానున్న; ప్రియ = ప్రియమైన; రాఘవమ్ = రాముని; సుమిత్రా = సుమిత్ర; గచ్ఛ గచ్ఛ = వెళ్లుము వెళ్లుము; ఇతి = అని; పునః పునః = మరల మరల; ఉవాచ = పలికెను; తమ్ = అతనిని గూర్చి
భావంః-
రాముని యెడల ప్రేమ అధికముగా గల లక్ష్మణునితో సుమిత్ర ఈ విధముగా పలికి రామునితో "వెళ్ళుము వెళ్ళు" మనుచు పలికెను.
2.40.9.
అనుష్టుప్.
* ”రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజామ్।
అయోధ్యామటవీం విద్ధి
గచ్ఛ తాత యథాసుఖమ్”॥
టీకః-
రామమ్ = రాముని; దశరథమ్ = దశరథునిగ; విద్ధి = ఎరుగుము; మాం = నన్నుగ; విద్ధి = ఎరుగుము; జనకాత్మజామ్ = జనకుని కుమార్తెను; అయోధ్యామ్ = అయోధ్యగ; అటవీమ్ = అరణ్యమును; విద్ధి = ఎరుగుము; గచ్ఛ = వెళ్లము; తాత = తండ్రీ; యథాసుఖమ్ = సుఖముగ
భావంః-
”నాయనా లక్ష్మణా! రాముని దశరథునిగను, సీతను నేనే అనియు, అరణ్యమును అయోధ్య అనియు భావింపుము. సుఖముగా వెళ్ళము”.
గమనికః-
(1) రామం దశరథం విద్ధి- దశరథః, దశము (పక్షి) రథః (వాహనముగాగలవాడు) శ్రీమహావిష్ణువు/ పలుదిక్కుల పోగలవాడు, దశరథమహారాజు, ఇక్కడ రాముడు శ్రీమహావిష్ణువుగా/ దశరథునిగా ఎఱుగుము, గీతాప్రెస్ రామాయణము, దశః- దశన(కఱచుట, వావిళ్ళ నిఘంటువు) కలది, పక్షి (2) మా- లక్ష్మీదేవి, తల్లి, ఇక్కడ సీతాదేవిని లక్ష్మీదేవిగా, నన్నుగా గ్రహింపుము, గీతాప్రెస్ రామాయణము (3) అయోధ్యామటవీం విద్ధి- అయోధ్య (ఎట్టివారికిని దేవతలకు, రాక్షసులకు సైతము జయింపశక్యము కానిది, అనగా అపరాజిత అనుపేరుగల వైకుంఠము, అయోధ్యానగరము, రాముడు నడయాడు అడవినే వైకుంఠముగా / అయోధ్యానగరముగా తలచుము. , గీతాప్రెస్ రామాయణము
2.40.10.
అనుష్టుప్.
తతః సుమంత్రః కాకుత్స్థమ్
ప్రాంజలిర్వాక్యమబ్రవీత్।
వినీతో వినయజ్ఞశ్చ
మాతలిర్వాసవం యథా॥
టీకః-
తతః = తరువాత; సుమంత్రః = సుమంత్రుడు; కాకుత్స్థమ్ = రాముని గూర్చి; ప్రాంజలిః = నమస్కరించుచు; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; వినీతః = వినమ్రముగా; వినయజ్ఞః = వినయము నెరిగిన; మాతలిః = మాతలి; చ = మాఱియు; వాసవం = ఇంద్రుని గూర్చి; యథా = వలె
భావంః-
తరువాత వినయము నెరిగిన సుమంత్రుడు, వినమ్రముగా నమస్కరించుచు, మాతలి (దేవేంద్రుని రథసారథి) దేవేంద్రునితో పలికినట్లు రామునితో ఇట్లు పలికెను.
2.40.11.
అనుష్టుప్.
“రథమారోహ భద్రం తే
రాజపుత్ర మహాయశః।
క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి
యత్ర మాం రామ వక్ష్యసి॥
టీకః-
రథమ్ = రథమును; ఆరోహ = ఎక్కుము; భద్రం = శుభమగుగాక; తే = నీకు; రాజపుత్ర = రాజకుమారా; మహాయశః = కీర్తిమంతుడా; క్షిప్రం = శీఘ్రముగా; త్వాం = నిన్ను; ప్రాపయిష్యామి = పొందించెదను; యత్ర = ఎక్కడికి; మాం = నన్ను; రామ = రామా; వక్ష్యసి = చెప్పేదవో
భావంః-
“ఓ కీర్తిమంతుడా! రాజకుమారా! రామా! నీకు క్షేమమగుగాక. రథమును ఆరోహింపుము. నీవు ఎక్కడికి వెళ్ళవలెనని చెప్పెదవో అక్కడికి వేగముగా నిన్ను తీసుకుని వెళ్ళెదను.
2.40.12.
అనుష్టుప్.
“చతుర్దశ హి వర్షాణి
వస్తవ్యాని వనే త్వయా।
తాన్యుపక్రమితవ్యాని
యాని దేవ్యాసి చోదితః”॥
టీకః-
చతుర్దశ = పదునాలుగు; హి = కదా; వర్షాణి = సంవత్సరములు; వస్తవ్యాని = నివసింపవలెను; వనే = వనము నందు; త్వయా = నీచే; తాని = అవి; ఉపక్రమితవ్యాని = ప్రారంభింపతగినవి; యాని = ఏవైతే; దేవ్యా = దేవి; అసి = ఉన్నది; చోదితః = ప్రేరేపించి
భావంః-
రామా! నీవు పదునాలుగు సంవత్సరములు అరణ్యములో నివసించలెను కదా. కైకేయిదేవి నిర్ణయించి ఆదేశించినట్లు ఆ పదునాలుగు సంవత్సరములు నీవు ఇప్పుడు ప్రారంభించ వలసియున్నది.”
2.40.13.
అనుష్టుప్.
తం రథం సూర్యసంకాశమ్
సీతా హృష్టేన చేతసా।
ఆరురోహ వరారోహా
కృత్వాలంకారమాత్మనః॥
టీకః-
తం = ఆ; రథం = రథమును; సూర్యసంకాశమ్ = సూర్యుని వలె ప్రకాశించుచున్న; సీతా = సీత; హృష్టేన = సంతోషముగ; చేతసా = మనసుతో; ఆరురోహ = ఎక్కెను; వరారోహా = మంచి నడుము కలిగియున్న; కృత్వా = చేసుకొని; అలంకారమ్ = అలంకారము; ఆత్మనః = తనకు
భావంః-
అందగత్తె ఐన సీత, తనను తాను మంచిగా అలంకరించుకుని, సూర్యునివలె ప్రకాశించుచున్న ఆ రథమును సంతోషముగ అధిరోహించెను.
2.40.14.
అనుష్టుప్.
అథో జ్వలనసంకాశమ్
చామీకరవిభూషితమ్।
తమారురుహతుస్తూర్ణమ్
భ్రాతరౌ రామలక్ష్మణౌ॥
టీకః-
అథః = తరువాత; జ్వలన = అగ్నిజ్వాలతో; సంకాశమ్ = సమానమైన; చామీకర = బంగారముతో; విభూషితమ్ = అలంకరింపబడిన; తమ్ = దానిని; ఆరురుహతుః = ఎక్కిరి; తూర్ణమ్ = శీఘ్రముగా; భ్రాతరౌ = ఇరువురు సోదరులైన; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు
భావంః-
తరువాత, సోదరులైన రామలక్ష్మణులు కూడ, బంగారముచే అలంకరింపబడి, అగ్నిజ్వాలవలె ప్రకాశించుచున్న ఆ రథమును వెంటనే ఎక్కిరి.
2.40.15.
అనుష్టుప్.
వనవాసం హి సంఖ్యాయ
వాసాంస్యాభరణాని చ।
భర్తారమనుగచ్ఛంతైః
సీతాయై శ్వశురో దదౌ॥
టీకః-
వనవాసం = వనవాస కాలమును; హి = కదా; సంఖ్యాయ = లెక్ఖ; వాసాంసి = వస్త్రములు; ఆభరణాని = ఆభరణములు; చ = మఱియు; భర్తారమ్ = భర్తను; అనుగచ్ఛంతై = అనుసరించుచున్న; సీతాయై = సీత కొరకు; శ్వశురః = మామగారు; దదౌ = ఇచ్చెను
భావంః-
భర్తను అనుసరించి వెళ్ళుచున్న సీత కొరకై, ఆమె వనవాసములో ఉండవలసిన కాలమును దశరథుడు లెక్ఖ చూసి వస్త్రములను ఆభరణములను ఇచ్చెను.
2.40.16.
అనుష్టుప్.
తథైవాయుధజాలాని
భ్రాతృభ్యాం కవచాని చ।
రథోపస్థే ప్రతిన్యస్య
సచర్మ కఠినం చ తత్॥
టీకః-
తథైవ = అట్లే; ఆయుధజాలాని = ఆయుధ సముదాయమును; భ్రాతృభ్యాం = అన్నదమ్ములకు; కవచాని = కవచములు; చ = మఱియు; రథః = రథము యొక్క; ఉపస్థే = మధ్య భాగములో; ప్రతిన్యస్య = ఉంచి; సచర్మ = చర్మముతో కప్పబడినటువంటి; కఠినం = డాలు; చ = మఱియు; తత్ = ఆ
భావంః-
అన్నదమ్ముల కొరకై వివిధ ఆయుధ సముదాయములు, కవచములు, చర్మముతో కప్పబడినటువంటి డాలు, మున్నగునవి రథ మధ్యమున ఉంచుము.
2.40.17.
అనుష్టుప్.
సీతాతృతీయానారూఢాన్
దృష్ట్వా దృష్టమచోదయత్।
సుమన్త్రస్సమ్మతానశ్వాన్
వాయువేగసమాన్జవే॥
టీకః-
సీతా = సీత; తృతీయాన్ = మూడవదిగ; ఆరూఢాన్ = ఎక్కిన దానిగ; దృష్ట్వా = చూచి; దృష్టమ్ = శీఘ్రముగా; అచోదయత్ = తోలెను; సుమంత్రః = సుమంత్రుడు; సమ్మతాన్ = సమ్మతింపబడినవి ఐన; అశ్వాన్ = గుఱ్ఱములను; వాయువేగసమాన్ = వాయువేగముతో సమానముగా; జవే = వేగమునందు
భావంః-
సుమంత్రుడు, రామలక్ష్మణులు రథమును అధిరోహించిన పిమ్మట, సీత కూడ ఎక్కుట చూచి రథమును వేగమునందు వాయువుతో సమానముగ గుఱ్ఱములను తోలెను.
2.40.18.
అనుష్టుప్.
ప్రతియాతే మహారణ్యమ్
చిరరాత్రాయ రాఘవే।
బభూవ నగరే మూర్ఛా
బలమూర్ఛా జనస్య చ॥
టీకః-
ప్రతియాతే = ప్రయాణమైన తరువాత; మహారణ్యమ్ = మహారణ్యమును గూర్చి; చిరరాత్రాయ = చాలా కాలము నివసించుటకై; రాఘవే = రాముడు; బభూవ = అయ్యెను; నగరే = నగరముమంతయు; మూర్ఛా = సొమ్మసిల్లెను; బలమూర్ఛా = బలము యొక్క మూర్ఛలు; జనస్య = జనుల యొక్క; చ = మఱియు
భావంః-
రాముడు చాలా కాలము మహారణ్యమునందు నివసించుటకై బయలుదేరి నంతనే, నగరమంతయు శోకాక్రాంతమాయెను. ప్రజలు కూడా బలములు కోల్పోయిరి.
2.40.19.
అనుష్టుప్.
తత్సమాకులసంభ్రాంతమ్
మత్తసంకపితద్విపమ్।
హయశింజితనిర్ఘోషమ్
పురమాసీన్మహాస్వనమ్॥
టీకః-
తత్ = ఆ; సమాకుల = ఉద్విగ్నముతో; సంభ్రాంతమ్ = బెదిరినది; మత్త = మదించిన; సంకపిత = చెలరేగిన; ద్విపమ్ = ఏనుగుల; హయ = గుఱ్ఱముల; శింజిత = సకిలింపుల; నిర్ఘోషమ్ = ధ్వని; పురమ్ = పట్టణము; ఆసీత్ = ఐనది; మహా = మిక్కిలి; స్వనమ్ = ధ్వనులు
భావంః-
అప్పుడు అయోధ్యానగరములో బెదిరి ఉద్విగ్నంతో మదపుటేనుగుల చెలరేగినవి. గుఱ్ఱములు సకిలించుచుండెను. వాటి ధ్వనిలు బిగ్గరగా ఆ పట్టణమంతయు నిండెను.
2.40.20.
అనుష్టుప్.
తత స్సబాలవృద్ధా సా
పురీ పరమపీడితా।
రామమేవాభిదుద్రావ
ఘర్మార్తా సలిలం యథా॥
టీకః-
తతః = తరువాత; స = సహితముగా; బాల = పిల్లలు; వృద్ధా = పెద్దలు; సా = ఆ; పురీ = పట్టణము; పరమపీడితా = చాలా పీడింపబడినదై ; రామమ్ = రాముని; ఏవ = మాత్రమే; అభిదుద్రావ = అనుసరించి పరిగెత్తిరి; ఘర్మార్తా = ఎండ తగిలిన వాడు; సలిలం = నీటిని; యథా = అట్లు
భావంః-
తరువాత పిల్లలు వృద్దులు సహితముగా అయోధ్యలోని ప్రజలందరును దుఖితులై, ఎండ తగిలిన వారు శోషతో నీటి వైపు పరుగెత్తినట్లు, రాముని వైపే పరిగెత్తిరి.
2.40.21.
అనుష్టుప్.
పార్శ్వతః పృష్ఠతశ్చైవ
లంబమానాస్తదున్ముఖాః।
బాష్పపూర్ణముఖాస్సర్వే
తమూచుర్భృశనిస్వనాః॥
టీకః-
పార్శ్వతః = ఇరువైపుల; పృష్ఠతః = వెనుకవైపు; చైవ = చ+ఏవ, కూడ; లంబమానాః = వ్రేలాడుచు; తత్ = అతని; ఉన్ముఖాః = వైపు ముఖముకలవారై; బాష్ప = కన్నీటితో; పూర్ణ = నిండిన; ముఖాః = ముఖములు కలవారై; సర్వే = అందరును; తమ్ = అతనిని; ఊచుః = పలికిరి; భృశనిస్వనాః = బిగ్గరగ
భావంః-
ఆ జనులందరును రామునికి ఇరు ప్రక్కలను, వెనుకను, గుమిగూడి, రాముని వైపు తిరిగి, కన్నీరు నిండిన ముఖములతో బిగ్గరగా ఇట్లు పలికిరి.
2.40.22.
అనుష్టుప్.
“సంయచ్ఛ వాజినాం రశ్మీన్
సూత యాహి శనైశ్శనైః।
ముఖం ద్రక్ష్యామ రామస్య
దుర్దర్శం నో భవిష్యతి॥
టీకః-
సంయచ్ఛ = లాగుము; వాజినాం = గుఱ్ఱములయొక్క; రశ్మీన్ = కళ్ళెములను; సూత = సారథి; యాహి = వెళ్లుము; శనైః శనైః = మెల్ల మెల్లగ; ముఖం = ముఖమును; ద్రక్ష్యామః = చూచెదము; రామస్య = రామునియొక్క; దుర్దర్శం = చూడశక్యము కాని; నః = మాకు; భవిష్యతి = అగును
భావంః-
“ఓ సారథీ! గుఱ్ఱముల కళ్ళెములను లాగి మెల్లగా వెళ్ళుము. మేము రాముని ముఖమును చూడవలెను. ఇకపై రాముని చూచుట మాకు కుదరదు కదా.
2.40.23.
అనుష్టుప్.
ఆయసం హృదయం నూనమ్
రామమాతురసంశయమ్।
యద్దేవగర్భప్రతిమే
వనం యాతి న భిద్యతే॥
టీకః-
ఆయసం = ఇనుముతో చేసినది; హృదయం = గుండె; నూనమ్ = కచ్చితముగా; రామమాతుః = రాముని యొక్క తల్లి; అసంశయమ్ = సందేహము లేదు; యత్ = దేనివలననైతే; దేవః = దేవతలయొక్క; గర్భ = కుమారుని; ప్రతిమే = వంటివాని; వనం = వనమును గూర్చి; యాతి = వెళ్ళుచుండగా; న = లేదు; భిద్యతే = బ్రద్దలగుట
భావంః-
దేవతా కుమారుని వంటి పుత్రుడు అరణ్యమునకు వెళ్ళుచుండగా, కౌసల్య హృదయము ఎందువలన బ్రద్దలగుటలేదో కదా. కచ్చితముగా ఆమె గుండె ఇనుముతో చేసినదై యుండును.
2.40.24.
అనుష్టుప్.
కృతకృత్యా హి వైదేహీ
ఛాయేవానుగతా పతిమ్।
న జహాతి రతా ధర్మే
మేరుమర్కప్రభా యథా॥
టీకః-
కృతకృత్యా = కృతార్థురాలు; హి = కదా; వైదేహీ = సీత; ఛాయ = నీడ; ఇవ = వలె; అనుగతా = అనుసరించుచున్నది; పతిమ్ = భర్తను; న = లేదు; జహాతి = విడుచుట; రతా = అనురక్తితో; ధర్మే = ధర్మమునందు; మేరుమ్ = మేరు పర్వతమును; అర్కప్రభా = సూర్యుని కాంతి; యథా = అట్లు
భావంః-
సీత ధర్మమునందు అనురక్తి కలిగియుండి, సూర్యుని కాంతి మేరు పర్వతమును విడువకుండునట్లు, భర్తను నీడవలె అనుసరించుచు వెళ్ళుచున్నది. ఈమె కృతార్థురాలు.
2.40.25.
అనుష్టుప్.
అహో లక్ష్మణ సిద్ధార్థః
సతతం ప్రియవాదినమ్।
భ్రాతరం దేవసంకాశమ్
యస్త్వం పరిచరిష్యసి॥
టీకః-
అహో = ఆహా; లక్ష్మణ = లక్ష్మణా; సిద్ధార్థ = కృతార్థుడవు; సతతం = ఎల్లప్పుడును; ప్రియవాదినమ్ = ప్రేమగ మాటలాడు వాడు; భ్రాతరం = సోదరుని; దేవ = దేవతలకు; సంకాశమ్ = సమానుడైన; యః = ఏ; త్వం = నీవు; పరిచరిష్యసి = సేవ చేయుచుందువు
భావంః-
ఓహో లక్ష్మణా! ప్రేమగా మాటలాడు వాడును, దైవ సమానుడును ఐన నీ సోదరునికి నిత్యము సేవ చేయుచున్న నీవు చాల కృతార్థుడవు.
2.40.26.
అనుష్టుప్.
మహత్యేషా హి తే సిధ్దిః
ఏష చాభ్యుదయో మహాన్।
ఏష స్వర్గస్య మార్గశ్చ
యదేనమనుగచ్ఛసి”॥
టీకః-
మహతీ = గొప్పది; ఏషా = ఇది; హి = కదా; తే = నీకు;సిద్ధిః = సిద్ధి; ఏష చ = ఇది; చ = యే; అభ్యుదయః = అభివృద్ధి; మహాన్ = గొప్ప; ఏషః = ఇది; స్వర్గస్య = స్వర్గమునకు; మార్గః = మార్గమును; చ = కూడా; యత్ = ఏది; ఏనమ్ = ఈ; అనుగచ్ఛసి = అనుసరించుచుండుట
భావంః-
లక్ష్మణా! నీవు రాముని అనుసరించి వెళ్ళుటయే నీకు గొప్ప సిద్ధి. ఇదియే గొప్ప అభివృద్ధి. ఇదియే స్వర్గమునకు మార్గము.”
2.40.27.
అనుష్టుప్.
ఏవం వదంతస్తే సోఢుమ్
న శేకుర్బాష్పమాగతమ్।
నరాస్తమనుగచ్ఛంతః
ప్రియమిక్ష్వాకునందనమ్॥
టీకః-
ఏవం = ఇట్లు; వదంతః = పలుకుచు; తే = ఆ; సోఢుమ్ = సహించుట; న = లేదు; శేకుః = సమర్థత; బాష్పమ్ = కన్నీరు; ఆగతమ్ = వచ్చుచున్న; నరాః = ప్రజలు; తమ్ = ఆ; అనుగచ్ఛంతః = అనుసరించుచున్న; ప్రియమ్ = ప్రియమైన; ఇక్ష్వాకునందనమ్ = ఇక్ష్వాకు వంశమునకు ఆనందమును చేకూర్చువాడు
భావంః-
ఇట్లు పలుకుచు, ఇక్ష్వాకు వంశోద్ధారకుడును, తమకు ప్రియమైన వాడును ఐన రాముని అనుసరించి వెళ్ళుచున్న ఆ జనులు, తమ కళ్ళనుండి కారుచున్న కన్నీటిని ఆపుకొనలేకపోయిరి.
2.40.28.
అనుష్టుప్.
అథ రాజా వృత స్త్రీభిః
దీనాభిర్దీనచేతనః।
నిర్జగామ “ప్రియం పుత్రమ్
ద్రక్ష్యామీతి” బ్రువన్ గృహాత్॥
టీకః-
అథ = తరువాత; రాజా = రాజు; వృతః = చుట్టుముట్టి యున్న; స్త్రీభిః = స్త్రీలతో; దీనాభిః = దీనుడై యున్న; దీనచేతనః = దీనమైన మనసుకలవాడు; నిర్జగామ = బయటకు వచ్చెను; ప్రియం = ప్రియమైన; పుత్రమ్ = పుత్రుని; ద్రక్ష్యామి = చూచెదను; ఇతి = ఇట్లు; బ్రువన్ = పలుకుచు; గృహాత్ = గృహమునుండి
భావంః-
తరువాత దుఃఖభరితమైన మనసు గల దశరథుడు "ప్రియమైన నా పుత్రుని చూచెదను" అని అనుచు, దుఃఖార్తులై తనను చుట్టుముట్టి యున్న స్త్రీలతో కలిసి గృహమునుండి బయటకు వచ్చెను.
2.40.29.
అనుష్టుప్.
శుశ్రువే చాగ్రతః స్త్రీణామ్
రుదన్తీనాం మహాస్వనః।
యథా నాదః కరేణూనామ్
బద్ధే మహతి కుంజరే॥
టీకః-
శుశ్రువే = వినబడినది; చ = కూడా; అగ్రతః = ఎదురుగ; స్త్రీణామ్ = స్త్రీలయొక్క; రుదన్తీనాం = ఏడ్చుచున్న; మహాస్వనః = గొప్ప ధ్వని; యథా = అట్లు; నాదః = ధ్వని; కరేణూనామ్ = ఆడ ఏనుగులయొక్క; బద్ధే = కట్టి వేయబడుచుండగ; మహతి = గొప్పదైన; కుంజరే = ఏనుగును
భావంః-
స్త్రీలందరును అట్లు బిగ్గరగా ఏడ్చుచుండగా కలిగిన ఆ ధ్వని, ఒక పెద్ద మగయేనుగును బంధించినప్పుడు ఆ ఏనుగుకు చెందిన ఆడఏనుగులు బిగ్గరగా ఘీంకరించుచు ఏడ్చుచున్నట్లు వినిపించెను.
2.40.30.
అనుష్టుప్.
పితా హి రాజా కాకుత్స్థః
శ్రీమాన్ సన్నస్తదాఽ భవత్।
పరిపూర్ణః శశీ కాలే
గ్రహేణోపప్లుతో యథా॥
టీకః-
పితా = తండ్రి, రక్షకుడు, ఆంధ్రశబ్దరత్నాకరము, శబ్దకల్పదృమము ఐన; హి = నిశ్చయముగా; రాజా = రాజు; కాకుత్స్థః = కాకుత్స్థ వంశమునందు జన్మించిన; శ్రీమాన్ = శ్రీమంతుడు; సన్నః = క్షీణించిన; తదా = అప్పుడు; అభవత్ = అయ్యెను; పరిపూర్ణః = పూర్ణమైన; శశీ = చంద్రుడు; కాలే = కాలమున; గ్రహేణః = గ్రహణ; ఉపపౢతః = బాధింపబడిన; యథా = అట్లు
భావంః-
తండ్రి వలె రక్షకుడైన ఆ దశరథమహారాజు, కాకుత్స్థ వంశమునందు జన్మించిన శ్రీమంతుడై యుండియు, అప్పుడు గ్రహణ కాలమున రాహువుచే పీడింపబడిన పూర్ణచంద్రుని వలె నిస్తేజుడయ్యెను.
గమనికః-
పితాః- వ్యు. (పురుష), పాతి రక్ష త్యపత్యం యః, (పా రక్షణే+ “నప్తృనేష్టృహోతృపోతృ భాతృజామాతృపితృదుహితృ”. ఉణాం శబ్దకల్పదృమము, పితః వ్యూ. పా, రక్షణే, పా+తృచ్- నిపాతః, కృ.ప్ర., కాపాడువాడు. ఆంధ్రశబ్దరత్నాకరము
2.40.31.
అనుష్టుప్.
స చ శ్రీమానచింత్యాత్మా
రామో దశరథాత్మజః।
సూతం సంచోదయామాస
“త్వరితం వాహ్యతామితి”॥
టీకః-
సః = ఆ; చ = ప్రాధాన్యతా సూచకం; శ్రీమాన్ = శ్రీమంతుడు; అచింత్యాత్మా = అనూహ్యమైన మనోధైర్యము గలవాడు; రామః = రాముడు; దశరథాత్మజః = దశరథుని కుమారుడు; సూతం = సారథిని; సంచోదయామాస = ప్రేరేపించెను; త్వరితం = త్వరగా; వాహ్యతామ్ = తోలబడుగాక; ఇతి = ఇట్లు
భావంః-
తేజోవంతుడును, ఊహించలేని మనోధైర్యము కలవాడును ఐన రాముడు, "రథమును శీఘ్రముగా తోలుము" అని సారథిని పురికొల్పెను.
2.40.32.
అనుష్టుప్.
రామో యాహీతి సూతం తమ్
తిష్ఠేతి స జనస్తదా।
ఉభయం నాశకత్సూతః
కర్తుమధ్వని చోదితః॥
టీకః-
రామః = రాముడు; యాహి = వెళ్ళుము; ఇతి = అని; సూతం = సారథిని; తమ్ = ఆ; తిష్ఠః = ఆగుము; ఇతి = అని; స = ఆ; జనః = ప్రజలు; తదా = అప్పుడు; ఉభయం = రెండు; న శకత్ = సమర్థుడు కాలేదు; సూతః = సారథి; కర్తుమ్ = చేయుటకు; అధ్వని = మార్గమునందు; చోదితః = ప్రేరేపింపబడినవాడు
భావంః-
అప్పుడు "తొందరగా తోలుము" అని రాముడును, "ఆగుము ఆగుము" అని ప్రజలును ఆ సారథితో చెప్పగా అతడు సందిగ్ధముతొ రెండు పనులను చేయలేకపోయెను.
2.40.33.
అనుష్టుప్.
నిర్గచ్ఛతి మహాబాహౌ
రామే పౌరజనాశ్రుభిః।
పతితైరభ్యవహితమ్
ప్రశశామ మహీరజః॥
టీకః-
నిర్గచ్ఛతి = బయలుదేరుచుండగ; మహాబాహౌ = ఆజానుబాహుడైన; రామే = రాముడు; పౌరజనా = పురజనులు; అశ్రుభిః = కన్నీటితో; పతితైః = పడిన; అభ్యవహితమ్ = పైకి రేగిన; ప్రశశామ = శాంతించెను; మహీ = భూమి యొక్క రజః = ధూళి
భావంః-
రాముడు బయలుదేరిన సమయములో, ప్రజల తొక్కిసిలాటచే భూమిపై నుండి చెలరేగిన ధూళి, పౌరుల కన్నీళ్లు పడి అణిగిపోయెను.
2.40.34.
అనుష్టుప్.
రుదితాశ్రుపరిద్యూనమ్
హాహాకృతమచేతనమ్।
ప్రయాణే రాఘవస్యాసీత్
పురం పరమపీడితమ్॥
టీకః-
రుదితాశ్రుః = బాధతో నిండిన కన్నీటితో; పరిద్యూనమ్ = తడిసెను; హాహాకృతమ్ = హాహాకారములు; అచేతనమ్ = మూర్చనొంది; ప్రయాణే = ప్రయాణ సమయమున; రాఘవస్య = రాముని యొక్క; ఆసీత్ = అయ్యెను; పురం = పట్టణము; పరమపీడితమ్ = మిక్కిలి పీడించబడినది
భావంః-
రాముని ప్రయాణ సమయమున ఆ పట్టణవాసులందరు కన్నీరు కార్చుచు, హాహాకారములు చేయుచు, కదలలేనివారై, చాల బాధకు లోనైరి.
2.40.35.
అనుష్టుప్.
సుస్రావ నయనైః స్త్రీణామ్
అస్రమాయాససంభవమ్।
మీనసంక్షోభచలితై
స్సలిలం పంకజైరివ॥
టీకః-
సుస్రావ = కారెను; నయనైః = కండ్ల నుండి; స్త్రీణామ్ = స్త్రీల యొక్క; అస్రమ్ = కన్నీటిని; ఆయాస = క్షోభ; సంభవమ్ = కలిగిన; మీన = చేపల; సంక్షోభ = కలతపడి; చలితైః = వేగముగా కదలుటచే; సలిలం = నీరు; పంకజైః = తామరలనుండి; ఇవ = వలె
భావంః-
కలతచెందిన చేపల కదలిక కంపనల వలన తామరపువ్వులనుండి నీరు కారినట్టు, స్త్రీల కండ్ల నుండి దుఃఖముచే కన్నీరు కారెను.
2.40.36.
అనుష్టుప్.
దృష్ట్వా తు నృపతి శ్శ్రీమాన్
ఏకచిత్తగతం పురమ్।
నిపపాతైవ దుఃఖేన
హతమూల ఇవ ద్రుమః॥
టీకః-
దృష్ట్వా = చూచి; నృపతి = రాజు; శ్శ్రీమాన్ = శ్రీమంతుడైన; ఏకచిత్తగతం = ఒకే విధమైన మనస్సు కలిగియున్న; పురమ్ = పట్టణమును; నిపపాతైవ = కిందపడెను; దుఃఖేన = దుఃఖముతో; హతమూల = కొట్టబడిన మొదలు కలిగియున్న; ఇవ = వలె; ద్రుమః = వృక్షము
భావంః-
పౌరులందరూ అలా ఒకే విధమైన భావలతో దుఃఖించుచుండుట దశరథుడు చూచి దుఃఖభరితుడై మొదలు నరికిన చెట్టువలె క్రిందకు పడిపోయెను.
2.40.37.
అనుష్టుప్.
తతో హలహలాశబ్దో
జజ్ఞే రామస్య పృష్ఠతః।
నరాణాం ప్రేక్ష్య రాజానమ్
సీదన్తం భృశదుఃఖితమ్॥
టీకః-
తతః = అప్పుడు; హలహలాశబ్దః = కలకలము; జజ్ఞే = పుట్టెను; రామస్య = రాముని యొక్క; పృష్ఠతః = వెనుక; నరాణాం = ప్రజల యొక్క; ప్రేక్ష్య = చూచి; రాజానమ్ = రాజును; సీదన్తం = దుర్బలుడగుచున్న; భృశదుఃఖితమ్ = చాల దుఃఖించుచు
భావంః-
అప్పుడు దుఃఖభరితుడై, నిస్సత్తువగా పడిపోయిన దశరథుని చూసి జనులు చేసిన కలకల ధ్వని రాముని వెనుక నుండి వినవచ్చెను.
2.40.38.
అనుష్టుప్.
హా రామేతి జనాః కేచిత్
రామమాతేతి చాపరే।
అంతఃపురం సమృద్ధం చ
క్రోశంతః పర్యదేవయన్॥
టీకః-
హా రామా = హారామ; ఇతి = అని; జనాః = ప్రజలు; కేచిత్ = కొందరు; రామమాత = రాముని తల్లీ; ఇతి = అని; అపరే = మరికొందరు; అంతఃపురం = అంతఃపురము; సమృద్ధం = సంపూర్ణముగ; క్రోశంతః = రోదించుచు; పర్యదేవయన్ = రోదింపజేసిరి
భావంః-
ఆ ప్రజలలో కొందరు "అయ్యో రామా" అని, మరికొందరు "అయ్యో రామ మాతా" అని అరుచుచు, అంతఃపురము లోని స్త్రీలు కూడా ఏడ్చునట్లు చేసిరి.
2.40.39.
అనుష్టుప్.
అన్వీక్షమాణో రామస్తు
విషణ్ణం భ్రాంతచేతసమ్।
రాజానం మాతరం చైవ
దదర్శానుగతౌ పథి॥
టీకః-
అన్వీక్షమాణః = వెనుకకు చూచుచు; రామస్తు = రాముడు; విషణ్ణం = దుఃఖితుడై; భ్రాంతచేతసమ్ = మతిభ్రమణము కలిగిన; రాజానం = రాజును; మాతరం చైవ = తల్లిని; దదర్శ = చూచెను; అనుగతౌ = తనను అనుసరించుచుండగా; పథి = దారిలో
భావంః-
రాముడు వెనుకకు తిరిగి చూడగా, దుఃఖభరితులై తన వెంట వచ్చుచున్న తన తల్లిదండ్రులను చూచెను.
2.40.40.
అనుష్టుప్.
స బద్ధ ఇవ పాశేన
కిశోరో మాతరం యథా।
ధర్మపాశేన సంక్షిప్తః
ప్రకాశం నాభ్యుదైక్షత॥
టీకః-
సః = ఆ; బద్ధ = బంధింపబడిన; ఇవ = వలె; పాశేన = త్రాడుతో; కిశోరః = గుఱ్ఱపు పిల్ల; మాతరం = తల్లిని; యథా = వలె; ధర్మపాశేన = ధర్మ పాశముచే; సంక్షిప్తః = బంధింపబడిన; ప్రకాశం = నేరుగా; న అభ్యుదైక్షత = చూడలేకపోయెను
భావంః-
త్రాడుతో కట్టబడి ఉన్న గుఱ్ఱపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు, ధర్మమునకు కట్టుబడియున్న రాముడు తన తల్లిదండ్రులను నేరుగా చూడలేకపోయెను.
2.40.41.
అనుష్టుప్.
పదాతినౌ చ యానార్హౌ
అదుఃఖార్హౌ సుఖోచితౌ।
దృష్ట్వా సంచోదయామాస
శీఘ్రం యాహీతి సారథిమ్॥
టీకః-
పదాతినౌ = కాలినడకనవచ్చు వారు; యానార్హౌ = వాహనములో ప్రయాణమునకు తగిన వారు; అదుఃఖార్హౌ = దుఃఖపడని వారు; సుఖోచితౌ = సుఖమునకు అలవాటు పడినవారు; దృష్ట్వా = చూచి; సంచోదయామాస = ప్రేరేపించెను; శీఘ్రం = శీఘ్రముగా; యాహి = వెళ్ళుము; ఇతి = అని; సారథిమ్ = సారథిని
భావంః-
సుఖమునకు అలవాటు పడినవారును, ఎన్నడును దుఃఖము తెలియనివారును, ఎప్పుడును వాహన ప్రయాణము చేయువారును ఐన తన తల్లిదండ్రులు కాలినడకన వచ్చుచుండగా చూచి "త్వరగా పోనిమ్ము" అని రాముడు సారథిని ప్రేరేపించెను.
2.40.42.
అనుష్టుప్.
న హి తత్పురుషవ్యాఘ్రో
దుఃఖదం దర్శనం పితుః।
మాతుశ్చ సహితుం శక్తః
తోత్రార్దిత ఇవ ద్విపః॥
టీకః-
న = లేడు; హి = కదా; తత్ = ఆ; పురుషవ్యాఘ్రో = పురుషశ్రేష్ఠుడు;దుఃఖదం = దుఃఖమును కలిగించు; దర్శనం = దర్శనమును; పితుః = తండ్రియొక్క; మాతుః = తల్లియొక్క; చ = మఱియు; సహితుం = సహించుటకు; శక్తః = సమర్థుడు; తోత్రః = అంకుశముచే; ఆర్దిత = పీడింపబడిన; ఇవ = వలె; ద్విపః = ఏనుగు
భావంః-
పురుషశ్రేష్ఠుడైన రాముడు, అంకుశముచే పీడింపబడిన ఏనుగు వలె బాధపడుచు, దుఃఖమును కలిగించు తల్లిదండ్రుల అవస్థలు చూడలేకపోయాను.
2.40.43.
అనుష్టుప్.
ప్రత్యగారమివాయాన్తీ
వత్సలా వత్సకారణాత్।
బద్ధవత్సా యథా ధేనూ
రామమాతాభ్యధావత॥
టీకః-
ప్రతి = గూర్చి, వెనుదిరిగి; అగారమ్ = గృహమును; ఇవ = వలె; ఆయాన్తీ = వచ్చుచున్న; వత్సలా = ప్రేమ కలిగియున్న; వత్సకారణాత్ = లేగదూడకొరకు; బద్ధవత్సా = కట్టబడియున్న లేగదూడ; యథా = వలె; ధేనుః = ఆవు; రామమాతా = రాముని యొక్క తల్లి; అభ్యధావత = ఎదురుగా పరుగిడెను
భావంః-
లేగదూడ యందు వాత్సల్యముగల గోవు, ఇంటికి తిరిగివచ్చి, కట్టివేయబడియున్న తన దూడ వైపు పరుగెత్తినట్లు, కౌసల్య తన కుమారుని వైపు పరుగెత్తెను.
2.40.44.
అనుష్టుప్.
తథా రుదన్తీం కౌసల్యామ్
రథం తమనుధావతీమ్।
క్రోశన్తీం రామ రామేతి!
హా సీతే! లక్ష్మణేతి! చ॥
టీకః-
తథా = అట్లు; రుదన్తీం = విలపించుచున్న; కౌసల్యామ్ = కౌసల్యను; రథం = రథమును; తమ్ = ఆ; అనుధావతీమ్ = అనుసరించి పరుగెడుతున్న; క్రోశన్తీం = అరుచుచున్న; రామ రామ = రామా రామా; ఇతి = అని; హా సీతే = హా సీతా; లక్ష్మణా = లక్ష్మణా; ఇతి = అని
భావంః-
కౌసల్య ఆవిధముగా విలపించుచు, "హా రామా! హా సీతా! హా లక్ష్మణా!" అని అరుచుచు రథము వైపు పరుగిడుచుండెను.
2.40.45.
అనుష్టుప్.
రామలక్ష్మణసీతార్థమ్
స్రవన్తీం వారి నేత్రజమ్।
అసకృత్ప్రైక్షత తదా
నృత్యన్తీమివ మాతరమ్॥
టీకః-
రామ = రాముని; లక్ష్మణ = లక్ష్మణుని; సీతా = సీతా; అర్థమ్ = కొరకై; స్రవన్తీం = కార్చుచున్న; వారి = నీరు; నేత్రజమ్ = కంటి నుండి; అసకృత్ = మాటిమాటికి; ప్రైక్షత = తదేకముగాచూచుచు; తదా = అప్పుడు; నృత్యన్తీమ్ = నాట్యము చేయుచున్న; ఇవ = వలె; మాతరమ్ = తల్లి
భావంః-
సీతారామ లక్ష్మణుల కళ్ళనుండి కారుతున్న కన్నీటితో, ఊగిపోవుచున్న కౌసల్యను, రాముడు తదేకముగా చూచుచుండెను.
2.40.46.
అనుష్టుప్.
“తిష్ఠేతి” రాజా చుక్రోశ
“యాహి యాహీతి” రాఘవః।
సుమన్త్రస్య బభూవాత్మా
చక్రయోరివ చాంతరా॥
టీకః-
తిష్ఠ = ఆగుము; ఇతి = అని; రాజా = రాజు; చుక్రోశ = అరచెను; యాహి యాహీ = నడుపుము నడుపుము; ఇతి = అని; రాఘవః = రాముడు; సుమన్త్రస్య = సుమంత్రుని యొక్క; బభూవ = అయ్యెను; ఆత్మా = మనసు; చక్రయోః = చక్రములు; ఇవ = వలె; అంతరా = మధ్యన
భావంః-
దశరథుడు "ఆగుము ఆగుము" అని అరుచుచుండగా, రాముడు "పోనిమ్ము పోనిమ్ము" అని అరుచుచుండెను. అప్పుడు సుమంత్రుని మనసు రెండు చక్రముల మధ్య నలుగుచున్నట్లుండెను.
2.40.47.
అనుష్టుప్.
“నాశ్రౌషమితి రాజానమ్
ఉపాలబ్ధోఽ పి వక్ష్యసి।
చిరం దుఃఖస్య పాపిష్ఠమ్”
ఇతి రామస్తమబ్రవీత్॥
టీకః-
న = లేదు; శ్రౌషమ్ = వినుట; ఇతి = ఇది; రాజానమ్ = రాజును గూర్చి; ఉపాలబ్ధో = నిందింపబడినవాడు; అపి = కూడ; వక్ష్యసి = చెప్పగలవు; చిరం = చిరకాలము; దుఃఖస్య = దుఃఖము యొక్క; పాపిష్ఠమ్ = సహింప లేని; ఇతి = అని; రామః = రాముడు; తమ్ = ; అబ్రవీత్ = పలికెను
భావంః-
"రథమును ఎందువలన ఆపలేదు" అని రాజు నిన్ను నిందించినను, "నాకు అది వినబడలేదు అని చెప్పవచ్చును. వీరి దుఃఖమును ఎక్కువసేపు సహింపరానిది" అని రాముడు సుమంత్రునితో చెప్పెను.
2.40.48.
అనుష్టుప్.
రామస్య చ వచః కుర్వన్
అనుజ్ఞాప్య చ తం జనమ్।
వ్రజతోఽ పి హయాన్ శీఘ్రమ్
చోదయామాస సారథిః॥
టీకః-
రామస్య = రాముని యొక్క; వచః = మాటలను; కుర్వన్ = చేయుచు; అనుజ్ఞాప్య చ = సమ్మతింపజేసి; చ = మఱియు; తం = ఆ; జనమ్ = ప్రజలను; వ్రజతః = నడుచుచున్న; అపి = కూడ; హయాన్ = గుఱ్ఱములను; శీఘ్రమ్ = వేగముగా; చోదయామాస = తోలెను; సారథిః = సారథి
భావంః-
సుమంత్రుడు రాముని మాట ప్రకారము చేయుచు, వచ్చుచున్న ప్రజలను కూడ ఒప్పించి, గుఱ్ఱములను మరింత వేగముగ పరిగెత్తునట్లు తోలెను.
2.40.49.
అనుష్టుప్.
న్యవర్తత జనో రాజ్ఞో
రామం కృత్వా ప్రదక్షిణమ్।
మనసాప్యశ్రువేగైశ్చ
న న్యవర్తత మానుషమ్॥
టీకః-
న్యవర్తత = మరలుట; జనః = ప్రజలు; రాజ్ఞః = రాజు యొక్క; రామం = రామునికి; కృత్వా = చేసి; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము; మనసా = మనః పూర్వకముగ; అపి = కూడ; అశ్రువేగైశ్చ = కన్నీరు కారుచున్న; న = లేదు; న్యవర్తత = మరలుట; మానుషమ్ = మనుష్యులు
భావంః-
దశరథుని యొక్క ప్రజలందరను రామునకు ప్రదక్షిణము చేసి, మరలి వెళ్ళిరి. కాని వారి మనసులు మాత్రము వెనుకకు మరల లేదు. కన్నీరు ఆగలేదు.
2.40.50.
అనుష్టుప్.
“యమిచ్ఛేత్పునరాయాంతమ్
నైనం దూరమనువ్రజేత్”।
ఇత్యమాత్యా మహారాజమ్
ఊచుర్దశరథం వచః॥
టీకః-
యమ్ = ఎవరిని; ఇచ్ఛేత్ = కోరెదమో; పునః = మరల; ఆయాంతమ్ = వచ్చు వారిగ; న = తగదు; ఏనం = వారిని; దూరమ్ = దూరముగ; అనువ్రజేత్ = అనుసరించుట; ఇతి = అని; అమాత్యా = మంత్రులు; మహారాజమ్ = రాజుని గూర్చి; ఊచుః = పలికిరి; దశరథం = దశరథుని గూర్చి; వచః = మాటను
భావంః-
"ఎవరు మరల తిరిగి రావలెనని మనము కోరుకొందుమో, అట్టివారిని చాల దూరము వరకు అనుసరించి సాగనంపకూడదు" అని మంత్రులు దశరథ మహారాజుతో చెప్పిరి.
2.40.51.త్రిష్టుప్
తేషాం వచః సర్వగుణోపపన్నం
ప్రస్విన్నగాత్రః ప్రవిషణ్ణరూపః।
నిశమ్య రాజా కృపణః సభార్యో
వ్యవస్థితస్తం సుతమీక్షమాణః॥
టీకః-
తేషాం = వారి యొక్క; వచః = మాటను; సర్వ = సమస్తమైన; గుణః = సుగుణములతో; ఉపపన్నం = కూడియున్నది; ప్రస్విత్ = చెమట పట్టిన; గాత్రః = శరీరము కలవాడు; ప్రవిషణ్ణః = విషణ్ణమైన; రూపః = రూపము కలవాడు; నిశమ్య = విని; రాజా = రాజు; కృపణః = దీనుడు; సభార్యః = భార్యతో కూడి; వ్యవస్థితః = నిలిచెను; తం = ఆ; సుతమ్ = పుత్రుని; ఈక్షమాణః = చూచుచు
భావంః-
దశరథుని శరీరమంతయు చెమట పట్టెను. ముఖము వాడిపోయెను. ఈ విధముగా దీనుడైయున్న దశరథుడు భార్యా సహితుడై, బుద్ధిమంతులైన వారి మాటలను విని, పుత్రుని వైపే చూచుచు అక్కడే నిలబడెను.
2.40.52.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే చత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; చత్వారింశః [40] = నలభైయవ; సర్గః = సర్గ
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [40] నలభైయవ సర్గ సంపూర్ణము.
2.41.1.
అనుష్టుప్.
తస్మిన్స్తు పురుషవ్యాఘ్రే
వినిర్యాతి కృతాంజలౌ।
ఆర్తశబ్దోఽహి సంజజ్ఞే
స్త్రీణామంతఃపురే మహాన్॥
టీకః-
తస్మిన్ తు = ఆ రాముడు; పురుషవ్యాఘ్రే = పురుషులలో శ్రేష్ఠమైనవాడు; వినిర్యాతి = బయలుదేరగనే; కృతాంజలౌ = చేతులు జోడించి నమస్కరించి; ఆర్తశబ్దః హి = దుఃఖముతో విలపించిరి; సంజజ్ఞే = చేసిరి; స్త్రీణామ్ = స్త్రీలందరూ; అంతఃపురే = అంతఃపురమునందలి; మహాన్ = గొప్పవాడైన
భావంః-
పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు నమస్కరించి, అరణ్యమునకు బయలుదేరగనే అంతఃపురములోని స్త్రీలు దుఃఖార్తలై ఏడ్చిరి.
2.41.2.
అనుష్టుప్.
అనాథస్య జనస్యాస్య
దుర్బలస్య తపస్వినః।
యో గతిశ్శరణం చాసీత్
స నాథః క్వ ను గచ్ఛతి॥
టీకః-
అనాథస్య = ఏ దిక్కు లేని; జనస్య = ప్రజలకు; అస్య = ఈ యొక్క; దుర్బలస్య = బలహీనులకు; తపస్వినః = దీనమైనవారికి; యః = ఎవరైతే; గతిః = రక్షకునిగా ఉండెనో; శరణం = రక్షించువాడు; చ = కూడా; ఆసీత్ = అయ్యెనో; సః = అట్టి; నాథః = రక్షకుడు; క్వ ను = ఎచ్చటకు; గచ్ఛతి = వెళ్లుచున్నాడు?
భావంః-
రక్షకుడు లేని వారము, దుర్బలులము, దీనులము అయిన మా అందరికి రాముడు గతిౖయె రక్షకుడిగా ఉండెను. అట్టి మా రక్షకుడైన రాముడు ఎక్కడికి పోవుచున్నాడో!
2.41.3.
అనుష్టుప్.
న క్రుధ్యత్యభిశప్తోఽపి
క్రోధనీయాని వర్జయన్।
క్రుద్ధాన్ప్రసాదయన్సర్వాన్
సమదుఃఖః క్వచిగ్గతః॥
టీకః-
న = కాడు; క్రుధ్యతి = కోపగించువాడు; అభిశప్తః = ఎవరైనా నిందించినవారు; అపి = ఐనప్పటికీ; క్రోధనీయాని = కోపమును; వర్జయన్ = విడిచిపెట్టును; క్రుద్ధాన్ = కోపము; ప్రసాదయన్ = కలిగించినను; సర్వాన్ = అందరి; సమ = సమానమైన; దుఃఖః = దుఃఖము కలవాడు; క్వచిత్ = ఎచ్చటకు; గతః = వెళ్లెనో.
భావంః-
ఎవరైనను నిందించినను కోపగించెడివాడు కాదు. కోపము కల్గించు పనులను చేసెడివాడే కాదు. కోపము వచ్చినవారి కోపము పోవునట్లు బ్రతిమాలెడివాడు. అందరితో సమముగా దుఃఖము పంచుకొనెడివాడు. అట్టి రాముడు ఎక్కడికి వెళ్లిపోయినాడో!
2.41.4.
అనుష్టుప్.
కౌసల్యాయాం మహాతేజా
యథా మాతరి వర్తతే।
తథా యో వర్తతేఽస్మాసు
మహాత్మా క్వ ను గచ్ఛతి॥
టీకః-
కౌసల్యాయాం = కౌసల్యను; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగినవాడు; యథా = ఏ విధముగా; మాతరి = తన తల్లిని; వర్తతే = ప్రవర్తించెనో; తథా = అదే విధముగా; యః = ఏ రాముడు; వర్తతే = ప్రవర్తించిన; అస్మాసు = మా పట్ల; మహాత్మా = గొప్ప మనసు కలిగినవాడు; క్వ ను = ఎచ్చటకు; గచ్ఛతి = వెళ్లుచున్నాడు?
భావంః-
మహాతేజశ్శాలిౖయెన రాముడు, తన తల్లిౖయెన కౌసల్య విషయమున ఏ విధముగా ప్రవర్తించెడివాడో, మా విషయమునందు కూడ అట్లే ప్రవర్తించెడివాడు. అట్టి మహాత్ముడు ఎక్కడికి వెళ్లిపోవుచున్నాడో!
2.41.5.
అనుష్టుప్.
కైకేయ్యా క్లిశ్యమానేన
రాజ్ఞా సంచోదితో వనమ్।
పరిత్రాతా జనస్యాస్య
జగతః క్వ ను గచ్ఛతి॥
టీకః-
కైకేయ్యా = కైకేయి వలన; క్లిశ్యమానేన = కష్టముల చేత; రాజ్ఞా = మహారాజు; సంచోదితః = నిర్బంధించబడినవాడు; వనమ్ = అరణ్యములకు; పరిత్రాతా = రక్షించువాడు; జనస్య = ప్రజల యొక్క; అస్య = ఈ యొక్క; జగతః = ప్రపంచము; క్వ ను = ఎచ్చటకు; గచ్ఛతి = వెళ్లుచున్నాడు?
భావంః-
మా అందరినీ, ఈ జగత్తుని కూడా రక్షించు రాముడు. కైకేయి నిర్బంధించగా దశరథునిచే వనమునకు వెళ్లుమని ప్రేరేపింపబడి, ఎక్కడికి వెళ్లిపోవుచున్నాడో!
2.41.6.
అనుష్టుప్.
అహో నిశ్చేతనో రాజా
జీవలోకస్య సంప్రియమ్।
ధర్మ్యం సత్యవ్రతం రామమ్
వనవాసే ప్రవత్స్యతి॥
టీకః-
అహో = అయ్యో; నిశ్చేతనః = చేతన రహితుడై; రాజా = ఈ మహారాజు; జీవలోకస్య = మర్త్యలోకమునకు; సంప్రియమ్ = సంపూర్ణతృప్తి కలిగించువాడు; ధర్మ్యమ్ = ధర్మపరాయణుడు; సత్యవ్రతమ్ = సత్యమే వ్రతముగా కలిగినవాడు; రామమ్ = రాముని; వనవాసే = వనవాసమునకు; ప్రవత్స్యతి = పంపివేయుచున్నాడు
భావంః-
మర్త్యలోకమంతటికీ సంపూర్ణ తృప్తి కలించెడి ఇంతటి మహారాజు మతితప్పిన వాడై, ధర్మ పరాయణుడూ, సత్యవ్రతుడూ అయిన రాముని వనవాసమునకు పంపివేయుచున్నాడు. ఆశ్చర్యము!
*గమనికః
(1) జీవలోకము- వ్యు. జీవః లోకః , కర్మ.ప., మర్త్యలోకము, ఆంధ్ర శబ్దరత్నాకరము (2) సంప్రియము- వ్యు. సమ్ + ప్రీ (తర్పణే) + క- ఇయత్ కృప్ర. నిండైన తనివి, సంపూర్ణ తృప్తి, ఆంధ్ర శబ్దపత్నాకరము.
2.41.7.
అనుష్టుప్.
ఇతి సర్వా మహిష్యస్తా
వివత్సా ఇవ ధేనవః।
రురుదుశ్చైవ దుఃఖార్తాః
సస్వరం చ విచుక్రుశుః॥
టీకః-
ఇతి = ఈ విధంగా; సర్వా = అందరు; మహిష్యః = మహారాణులు; తా = ఆయా; వివత్సా = దూడల నుండి దూరమైన; ఇవ = మఱియు; ధేనవః = ఆవులు; రురుదుః = విలపించుచు; చైవ = మఱియు; దుఃఖః= దుఃఖముచే; ఆర్తాః = ఆర్తిచెంది; సస్వరం = బిగ్గరగా; చ = ఇంకనూ; విచుక్రుశుః = ఏడ్చిరి.
భావంః-
ఈ విధముగా ఆ రాజ భార్యలందరు, తమ దూడల నుండి దూరమైన ఆవుల వలె, దుఃఖముతో ఆర్తి చెంది, బిగ్గరగా విలపించుచు ఏడ్చిరి.
2.41.8.
అనుష్టుప్.
స తమంతఃపురే ఘోరమ్
ఆర్తశబ్దం మహీపతిః।
పుత్రశోకాభిసంతప్తః
శ్రుత్వా చాసీత్సుదుఃఖితః॥
టీకః-
సః = ఆ; తః = వారు; అంతఃపురే = అంతఃపురములో; ఘోరమ్ = భయంకరమైన; ఆర్తశబ్దం = ఏడ్చుచున్న శబ్దము; మహీపతిః = మహారాజు; పుత్రశోక = పుత్రశోకముతో; అభిసంతప్తః = మిక్కిలి బాధపడుచున్న వాడు; శ్రుత్వా = వినగానే; చ = ఇంకనూ; ఆసీత్ = అయ్యెను; సుదుఃఖితః = ఎంతో దుఃఖించిన వాడు.
భావంః-
ముందుగనే పుత్ర శోకముతో బాధపడుచున్న ఆ రాజునకు అంతఃపురము నుండి వినవచ్చిన ఆ రాణుల ఘోరమైన ఏడ్పులు వినగానే దుఃఖము రెట్టింపాయెను.
2.41.9.
అనుష్టుప్.
నాగ్నిహోత్రాణ్యహూయంత
నాపచన్ గృహమేధినః।
అకుర్వన్న ప్రజాః కార్యమ్
సూర్యశ్చాంతరధీయత॥
టీకః-
న = లేదు; అగ్నిహోత్రాణి = అగ్నిహోత్రములు; ఆహూయంత = ఆచరించుట; నాపచన్ = వంటలు వండలేదు; గృహమేధినః = గృహస్థులు; అకుర్వత్ = చేయలేదు; న = లేదు; ప్రజాః కార్యమ్ = ప్రజలు తమ పనులు; సూర్యశ్చ = సూర్యుడు కూడా; అంతరధీయత = అంతర్థానమయ్యెను
భావంః-
అపుడు గృహస్థులు అగ్నిహోత్రములను చేయలేదు. ఇండ్లలో వంటలు వండలేదు. ప్రజలు తమ పనులు చేయలేదు. సూర్యుడు కూడ కనబడకుండ పోయెను.
2.41.10.
అనుష్టుప్.
వ్యసృజన్ కబలాన్నాగా
గావో వత్సాన్న పాయయన్।
పుత్రం ప్రథమజం లబ్ధ్వా
జననీ నాభ్యనందత॥
టీకః-
వ్యసృజన్ = విడిచివేసెను; కబలాత్ = అన్నమును; నాగాః = ఏనుగులు; గావః = ఆవులు; వత్సాన్ = తమ దూడలకు; న = లేదు; పాయయన్ = పాలు ఇచ్చుట; పుత్రం = కుమారుడు; ప్రథమజం = తొలిసారిగా; లబ్ధ్వా = పుట్టినను; జననీ = తల్లి; న = లేదు; అభ్యనందత = మిక్కిలిసంతోషించుట.
భావంః-
ఏనుగులు నోటిలోనున్న కబళములను కక్కివేసెను. గోవులు దూడలకు పాలు ఇవ్వలేదు. తొలిసారిగా కుమారుడు పుట్టినను తల్లి అందులకు పెద్దగా సంతోషించలేదు.
2.41.11.
అనుష్టుప్.
త్రిశంకుర్లోహితాంగశ్చ
బృహస్పతిబుధావపి।
దారుణా స్సోమమభ్యేత్య
గ్రహాస్సర్వే వ్యవస్థితాః॥
టీకః-
త్రిశంకుః = త్రిశంకువు; లోహితాంగః = కుజుడు; చ = మఱియు; బృహస్పతి = గురుడు; బుధాః = బుధుడు; అపి = ఇంకా; దారుణాః = తీక్షణమైన; సోమమ్ = చంద్రునితో; అభ్యేత్య = ఉండెను; గ్రహాః = గ్రహములు; సర్వే = అన్ని; వ్యవస్థితాః = నివసించెను
భావంః-
త్రిశంకువు, కుజుడు, గురుడు, బుధుడు మొదలైన తీక్షణమైన గ్రహములన్నియు, చంద్రునితో కూడి వక్రగచి పొందినవి.
2.41.12.
అనుష్టుప్.
నక్షత్రాణి గతార్చీంషి
గ్రహాశ్చ గతతేజసః।
విశాఖాస్తు సధూమాశ్చ
నభసి ప్రచకాశిరే॥
టీకః-
నక్షత్రాణి = నక్షత్రములు; గత = తగ్గిపోయిన; గతార్చీంషి = ప్రకాశములు రలవి; గ్రహాః = గ్రహముల; చ = కూడ; గత = తగ్గిపోయిన; తేజసః = తేజస్సు కలవి; విశాఖాః = కోసల క్షేత్రమైన విశాఖను; అస్తు = ఐ ఉండెను; స = కూడి యున్న; ధూమాః = పొగబట్టినది; చ = కూడ; నభసి = ఆకాశమందు; ప్రచకాశిరే = ప్రకాశించినది.
భావంః-
నక్షత్రముల కిరణములు లోపించెను. గ్రహముల తేజస్సు తగ్గిపోయెను. కోసల దేశ క్షేత్రమైన విశాఖను, కోసలదేశ నక్షత్రమైన విశాఖానక్షత్రమును ఆకాశమందు ధూమము ఆవరించెను.
*గమనికః
విశాఖాః- (1) దక్షిణ కోసల క్షేత్రము. పురాణనామచంద్రిక- సరయూనదీ ప్రాంతమున ఉండిన ఒకానొక దేశము. దీనికి రాజధాని అయోధ్య. ఇక్ష్వాకువంశపు రాజులు దీనిని పాలించిరి. ఇది శ్రీరాముల కాలమునకు పిమ్మట ఉత్తర కోసలము అని వాడఁబడును. ఇదిగాక వింధ్యపర్వత సమీపమున మఱియొక కోసలము కలదు. ఇది దక్షిణ కోసలము అని వాడఁబడును. శ్రీరాముని తల్లియైన కౌసల్య ఈ దక్షిణ కోసల దేశపు రాకుమార్తె. (2) పుల్లెలవారి రామాయణము విశాఖానక్షత్రము, ఇది కోసలదేశము యొక్క నక్షత్రము.
2.41.13.
అనుష్టుప్.
కాలికానిలవేగేన
మహోదధిరివోత్థితః।
రామే వనం ప్రవ్రజితే
నగరం ప్రచచాల తత్॥
టీకః-
కాలికా = (ప్రళయ) కాలమునకు సంబంధించినః అనిల వేగేన = వాయువులః వేగేన = వేగముచేః మహోదధిః = మహాసముద్రము; ఇవ = వలె; ఉత్థితః = పొంగెను; రామే = రాముడు; వనం = వనమునకు; ప్రవ్రజితే = బయలుదేరగానే; నగరం = నరగమంతయు; ప్రచచాల = మిక్కిలి చలించెను; తత్ = ఆ
భావంః-
సముద్రము, ప్రళయకాలమునందలి వాయు వేగము చేత పొంగినట్లు పొంగెను. రాముడు అరణ్యమునకు ప్రయాణము కాగానే, ఆ నగరమంతయు ఎంతో చలించి పోయను.
2.41.14.
అనుష్టుప్.
దిశః పర్యాకులాస్సర్వాః
తిమిరేణేవ సంవృతాః।
న గ్రహో నాపి నక్షత్రమ్
ప్రచకాశే నకించన॥
టీకః-
దిశః = దిక్కులు; పర్యాకులాః = మలినమైనవి; సర్వాః = అన్నియు; తిమిరేణ = చీకటి చేత; ఏవ = ఆ విధముగా; సంవృతాః = కమ్మివేసినట్లు; గ్రహః = గ్రహములు; న = లేదు; అపి = కూడా; నక్షత్రమ్ = నక్షత్రములు; ప్రచకాశే = ప్రకాశించుట; నకించన = ఏ మాత్రమును
భావంః-
దిక్కులన్నియు మాసిపోయి, చీకటి కమ్మినట్లుండెను. ఏ గ్రహములుకాని, ఏ నక్షత్రములు కాని, ఏమాత్రమూ ప్రకాశించట లేదు.
2.41.15.
అనుష్టుప్.
అకస్మాన్నాగరస్సర్వో
జనో దైన్యముపాగమత్।
ఆహారే వా విహారే వా
న కశ్చిదకరోన్మనః॥
టీకః-
అకస్మాత్ = అకస్మాత్తుగా; నాగరః = నగరములోని; సర్వః = అందరూ; జనః = ప్రజలు; దైన్యమ్ = దైన్యము; ఉపాగమత్ = ఆవహించెను; ఆహారే వా = ఆహారమునందు; వా = గాని; విహారే = విహారమునందు; వా = గాని; న కశ్చిత్ = ఏ పనియందు; అకరోన్మనః = మనస్కరించుటలేదు.
భావంః-
నగరములోని పౌరులందరినీ అకస్మాత్తుగా దైన్యము ఆవహించెను. ఆహారమునందు గాని, విహారమునందు గాని ఏ ఒక్కనికి చేయబుద్ధి పుట్టుట లేదు. అనగా, తిండి, వినోదాలమీద కూడా ఆసక్తిలేక ఉన్నారు.
2.41.16.
అనుష్టుప్.
శోకపర్యాయసంతప్తః
సతతం దీర్ఘముచ్ఛ్వసన్।
అయోధ్యాయాం జనస్సర్వః
శుశోచ జగతీపతిమ్॥
టీకః-
శోక = శోకముల; పర్యాయ = ప్రకారము; సంతప్తః = పీడింపబడి; సతతం = నిరంతరము; దీర్ఘమ్ = దీర్ఘముగ; ఉచ్ఛ్వసన్ = నిట్టూర్చుచు; అయోధ్యాయాం = అయోధ్యా నగరంలోని; జనః = ప్రజలు; సర్వః = అందరూ; శుశోచ = మిక్కిలి దుఃఖించిరి; జగతీపతిమ్ = దశరథ మహారాజును గూర్చి
భావంః-
అయోధ్యలోని జనులందరు, శోకముచే పీడితులై నిరంతరము పెద్ద పెద్ద నిట్టార్పుల విడుచుచు, దశరథ మహారాజును గురించి మిక్కిలి దుఃఖించసాగిరి.
2.41.17.
అనుష్టుప్.
బాష్పపర్యాకులముఖో
రాజమార్గగతో జనః।
న హృష్టో లక్ష్యతే కశ్చిత్
సర్వ శ్శోకపరాయణః॥
టీకః-
బాష్ప = కన్నీటితో; పర్యాకుల = మలినములైన; ముఖః = ముఖములు కలవాడు; రాజమార్గ = రాజమార్గములో; గతః = ఉన్న వారైన; జనః = ప్రజలు; న = లేరు; హృష్టః = సంతోషముగా ఉన్నవాడు; చ = మఱియు; లక్ష్యతే = కనపడుట; కశ్చిత్ = ఒక్కరు కూడా; సర్వః = అందరూ; శోకపరాయణః = దుఃఖముతో నిండిరి
భావంః-
రాజమార్గములోని ప్రజలు కన్నీటి చారికలతో జిడ్డు ముఖములతో ఉండిరి. సంతోషముతో ఉన్నవారు ఒక్కడును కనబడుటలేదు. ప్రతి ఒక్కరును దుఃఖముతో నిండి ఉండిరి.
2.41.18.
అనుష్టుప్.
న వాతి పవనశ్శీతో
న శశీ సౌమ్యదర్శనః।
న సూర్యస్తపతే లోకమ్
సర్వం పర్యాకులం జగత్॥
టీకః-
న = లేదు; వాతి = వీచుట; పవనః = వాయువు; శీతః = చల్లగా; న = లేదు; శశీ = చంద్రుడు; సౌమ్య = సౌమ్యముగా; దర్శనః = కనబడువాడు; న = లేదు; సూర్యః = సూర్యుడు; తపతే = ఎండకాయుట; లోకమ్ = లోకము; సర్వం = మొత్తము; పర్యాకులం = వ్యాకులముగా; జగత్ = జగత్తు
భావంః-
ఆ సమయమున వాయువు చల్లగా వీచుటలేదు. చంద్రుని చూచుటకు సౌమ్యముగా లేడు. సూర్యుడు ఎండ కాయుట లేదు. జగత్తంతయు అస్తవ్యస్తమై ఉండెను.
2.41.19.
అనుష్టుప్.
అనర్థినస్సుతాః స్త్రీణామ్
భర్తారో భ్రాతరస్తథా।
సర్వే సర్వం పరిత్యజ్య
రామమేవాన్వచింతయన్॥
టీకః-
అనర్థినః = ఆసక్తి లేకుండెను; సుతాః = కుమారులకు; స్త్రీణామ్ = భార్యలయందు; భర్తారః = భర్తలకు; భ్రాతరః = సోదరులు; తథా = ఆ విధముగా; సర్వే = అందరూ; సర్వం = అన్నిటినీ? పరిత్యజ్య = విడిచిపెట్టి; రామమ్ + ఏవాన్ = రాముని గూర్చియే; అన్వచింతయన్ = ఆలోచించుచుండిరి
భావంః-
పుత్రులకు తల్లుల విషయమునను, భర్తలకు భార్యల విషయమునను ఆసక్తి తగ్గినది. సోదరులు పరస్పరము ఆసక్తి లేనివారైరి. అందరును అన్నింటినీ విడచిపెట్టి రాముని గూర్చియే ఆలోచించుచుండిరి.
2.41.20.
అనుష్టుప్.
యే తు రామస్య సుహృదః
సర్వే తే మూఢచేతసః।
శోకభారేణ చాక్రాన్తాః
శయనం న జహుస్తదా॥
టీకః-
యే = ఏవిధముగా; తు = ఐనను; రామస్య = రాముని యొక్క; సుహృదః = స్నేహితులు; సర్వే = అందరు; తే = వారు; మూఢచేతసః = ఏమి చేయుటకు తోచనివారు; శోకభారేణ చ = దుఃఖ భారములో; ఆక్రాన్తాః = మునిగిపోయి; శయనం = పడకలను; న = లేదు; జహుః = విడుచుట; తదా = అప్పుడు
భావంః-
అపుడు రాముని స్నేహితులందరును దుఃఖ భారముతో నిండి, ఏమి చేయుటకు తోచక, తమ పడకలను దిగకుండిరి.
2.41.21.
జగతి.
తతస్త్వయోధ్యా రహితా మహాత్మనా
పురందరేణేవ మహీ సపర్వతా।
చచాల ఘోరం భయశోకపీడితా
సనాగయోధాశ్వగణా ననాద చ॥
టీకః-
తతః = ఆ తరువాత; అయోధ్యా = అయోధ్యానగరము; రహితా = విహీనముగా; మహాత్మనా = మహాత్ముడైన రాముడు; పురందరేణ = దేవేంద్రుని; ఇవ = వలె; మహీ = భూమి; సపర్వతా = పర్వతాది సహితముగా; చచాల = చలించెను; ఘోరం = భయంకరముగా; భయ = భయ వలన; శోక = శోకముల వలన కలిగిన; పీడితా = బాధింపబడినది; స = సహితముగ; నాగ= ఏనుగులు; యోధ = యోధులు; అశ్వగణా = అశ్వగణములు; ననాద = ధ్వని చేసెను; చ = కూడ.
భావంః-
రాముడు లేని అయోధ్య, దేవేంద్రుడువలన పర్వతాదిసహితమగు భూమి వలె ఉండెను. భయ శోకముల వలన కలిగిన పీడతో, గజములు, యోధులు, అశ్వముల కలకలంతో, భయంకరముగా చలించెను.
2.41.22.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ఏకచత్వారింశః సర్గః.
టీకః- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; ఏకచత్వారింశః [41] = నలభైయొకటవ; సర్గః = సర్గ.
భావంః- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [41] నలభైయొకటవ సర్గ సంపూర్ణము.
2.42.1.
అనుష్టుప్.
యావత్తు గచ్ఛతస్తస్య
రజో రూపమపశ్యత।
నైవేక్ష్వాకువరస్తావత్
సంజహారాత్మచక్షుషీ॥
టీకః-
యావత్ = ఆకాలమంతా; గచ్ఛతః = వెళ్లిపోవుట; తస్య = (అతని) రాముడు; రజః = ధూళి; రూపమ్ = ఆకరాము; అపశ్యత = కనిపించినది; నైవ = లేదు; ఇక్ష్వాకువరః = ఇక్ష్వాకులలో ఉత్తముడైన దశరథుడు; తావత్ = అటువైపే; సంజహార = ఉపసంహరించుకొనుట; ఆత్మచక్షుషీ = అతని కళ్లు
భావంః-
రాముడు ప్రయాణమై వెళ్లుచున్నప్పుడు, రథ గమనముచే రేగిన పరాగము కనబడుచున్నంత వరకును, దశరథుడు కన్నులు మూయకుండ అటువైపే చూచుచు ఉండెను.
2.42.2.
అనుష్టుప్.
యావద్రాజా ప్రియం పుత్రమ్
పశ్యతి స్మ స చక్షుషా।
ఉత్ససర్జ మహీ తావత్
తదా దూరమివాంతరమ్॥
టీకః-
యావత్ = ఎంతవరకు; రాజా = దశరథ మహారాజు; ప్రియం = ప్రియమైన; పుత్రమ్ = పుత్రుని; పశ్యతి = చూచుట; స్మ = జరిగెనో; స = తుల్యకాలం; చక్షుసా = కన్నులారా; ఉత్ససర్జ = సృష్టించుట; మహీ = భూమి; తావత్ = అంత వరకు; తదా = అప్పుడు; దూరమ్ = దూరము; ఇవ = వలె; అంతరం = నడుమ
భావంః-
అత్యంత ధార్మికుడైన తన ప్రియపుత్రుని ఆ రాజు చూచుచున్నప్పుడు, అంతవరకు భూమి అధికమైన దూరమును సృష్టించి నట్లుండెను.
2.42.3.
అనుష్టుప్.
న పశ్యతి రజోఽప్యస్య
యదా రామస్య భూమిపః।
తదాఽఽర్తశ్చ విషణ్ణశ్చ
పపాత ధరణీతలే॥
టీకః-
న = లేదు; పశ్యతి = కనపడుట; రజః = ధూళి; అపి = కూడా; అస్య = ఈ యొక్క; యదా = ఎప్పుడు; రామస్య = రాముని యొక్క; భూమిపః = దశరథ మహారాజు; తత్ = ఆ కారణంగా; ఆర్తః = బాధపడినవాడై; చ = కూడా; విషణ్ణః = స్పృహకోల్పోయిన వాడు; చ = కూడా; పపాత = పడిపోయెను; ధరణీతలే = భూమి మీద
భావంః-
రాముని రథము వలన ఎగిరిన ధూళి కూడ ఎప్పుడు కనపడకుండా పోయాక, ఆ దశరథుడు దుఃఖితుడై, దిగులు చెంది నేలపై పడిపోయెను.
2.42.4.
అనుష్టుప్.
తస్య దక్షిణమన్వాగాత్
కౌసల్యా బాహుమంగనా।
వామం చాస్యాన్వగాత్పార్శ్వమ్
కైకేయీ భరతప్రియా॥
టీకః-
తస్య = అతని యొక్క; దక్షిణమ్ = కుడివైపు; అన్వగాత్ = పొందెను; కౌసల్యా = కౌసల్య; బాహుమ్ = బాహువును; అంగనా = భార్య; వామం = ఎడమ వైపు; చ = కూడా; అస్య = దానిని; అన్వగాత్ = పొందినది; పార్శ్వమ్ = పక్క భాగమున; కైకేయీ = కైకేయి; భరతప్రియా = భరతునియందు ప్రేమ గలామె
భావంః-
దశరథుడు నేలపై పడగానే అతనిని లేవదీయుటకై, భార్య కౌసల్య కుడిచేతి వైపునకును, భరతునియందు ప్రేమగల కైకేయి ఎడమవైపునకు వచ్చిరి.
2.42.5.
అనుష్టుప్.
తాం నయేన చ సమ్పన్నో
ధర్మేణ వినయేన చ।
ఉవాచ రాజా కైకేయీమ్
సమీక్ష్య వ్యథితేంద్రియః॥
టీకః-
తాం = ఆ యొక్క; నయేన = నీతివర్తన చేత; చ = మఱియు; సమ్పన్నః = సంపన్నుడు; ధర్మేణ = ధర్మము చేత; వినయేన = వినయము చేత; చ = మఱియు; ఉవాచ = పలికెను; రాజా = దశరథ మహారాజు; కైకేయీమ్ = కైకేయిని; సమీక్ష్య = చూచి; వ్యథితేంద్రియః = మిక్కిలి బాధపడుచున్న ఇంద్రియములు కలవాడు
భావంః-
నీతిమంతుడు, ధర్మపాలకుడు, వినయ సంపన్నుడు అయిన ఆ దశరథుడు, సకలేంద్రియములందును బాధపడుచూ కైకేయితో ఇలా పలికెను.
2.42.6.
అనుష్టుప్.
“కైకేయి! మా మమాంగాని
స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణీ!।
న హి త్వాం ద్రష్టుమిచ్ఛామి
న భార్యా న చ బాన్ధవీ॥
టీకః-
కైకేయి = ఓ కైకేయీ; మా = వద్దు; మమ = నా; అంగాని = శరీరమును; స్పృక్షీ = తాకుట; త్వం = నీవు ; దుష్టచారిణీ = తప్పుడు నడత గలదానా; న హి = వద్దు; త్వాం = నిన్ను; ద్రష్టుమ్ = చూచుటకు; ఇచ్ఛామి = ఇష్టము లేదు; న భార్యా = భార్యవి కావు; న చ బాన్ధవీ = బంధువు కూడా కావు
భావంః-
“కైకేయీ! తప్పుడు నడత గలదానా! నీవు నా శరీరమును తాకవద్దు. నిన్ను చూచుట నాకిష్టము లేదు. నీవు నా భార్యవు కావు. నా బంధువు కూడ కావు.
2.42.7.
అనుష్టుప్.
యే చ త్వామనుజీవంతి
నాహం తేషాం న తే మమ।
కేవలార్థపరాం హి త్వామ్
త్యక్తధర్మాం త్యజామ్యహమ్॥
టీకః-
యే = వారికి; చ = మఱియు; త్వామ్ = నీపై; అనుజీవంతి = ఆధారపడి జీవించువారికి; న = కాను; అహం = నేను; తేషాం = నీ యొక్క; న = కారు; తే = వారు; మమ = నాకు; కేవల = కేవలము; అర్థపరాం హి = ధనమునందు ఆసక్తి; హి = మాత్రమేగల; త్వామ్ = నిన్ను; త్యక్త = పరిత్యజించి; ధర్మామ్ = ధర్మముగలదానిని; త్యజామి = విడిచిపెట్టుచున్నాను; అహమ్ = నేను
భావంః-
నీ మీద ఆధారపడి జీవించు నీ అనుచరులకు కూడా నేనేమియు కాను. నాకు వారేమియు కారు. ధర్మమును తప్పి కేవలము అర్థము మాత్రమే ఆశించు నిన్ను నేను పరిత్యజించుచున్నాను.
2.42.8.
అనుష్టుప్.
అగృహ్ణాం యచ్చ తే పాణిమ్
అగ్నిం పర్యణయం చ యత్।
అనుజానామి తత్సర్వమ్
అస్మిన్ లోకే పరత్ర చ॥
టీకః-
అగృహ్ణాం = తీసుకొనుట; యచ్చ = వలన; తే = నీ; పాణిమ్ = చేతిని; అగ్నిం = అగ్నిచుట్టూ; పర్యణయం = ప్రదక్షిణము చేయుట; చ = అనునది; యత్ = ఏది కలదో; అనుజానామి = విడిచిపెట్టుచున్నాను; తత్సర్వమ్ = అవన్నియును; అస్మిన్ = ఇహ; లోకే = లోకమునందు; పరత్ర = పరలోకమునందు; చ = కూడా
భావంః-
నీ చేయి పట్టి, అగ్ని చుట్టూ ప్రదక్షిణము చేయించి, నిన్ను వివాహమాడుట వలన కలిగిన సంబంధమును ఇహలోకమునందును, పరలోకమునందును కూడ పరిత్యజించుచున్నాను.
2.42.9.
అనుష్టుప్.
భరతశ్చేత్ప్రతీతః స్యాత్
రాజ్యం ప్రాప్యేదమవ్యయమ్।
యన్మే స దద్యాత్పిత్రర్థమ్
మాం మా తద్దత్తమాగమత్”॥
టీకః-
భరతః = భరతుడు; చేత్ = సందర్భములో; ప్రతీతః = సంతోషించి నట్లయితే; స్యాత్ = ఆ యొక్క; రాజ్యం = రాజ్యమును; ప్రాప్యః = పొందిన తరువాత; ఇదమ్ = ఈ యొక్క; అవ్యయమ్ = నశించనది, అక్షయము; యత్ = అవి; మే = నాకు; స = అతడు; స = సమర్పించిన; పిత్రర్థమ్ = పితృకార్యమునందు, పిండప్రదానము; మాం = నాకు; మా = వద్దు; తత్ = అతనిచే; దత్తమ్ = అతనిచే ఈయబడిన; ఆగమత్ = చేరనిచ్చుట
భావంః-
అక్షయమైన ఈ రాజ్యము లభించినందుకు భరతుడు సంతోషించి నట్లయితే అతడు నాకు చేయు పితృకార్యము నందలి జలతర్పణ పిండప్రదానాదికము నాకు ముట్టకుండుగాక”.. అని ఆమెను దూషించెను.
2.42.10.
అనుష్టుప్.
అథ రేణుసముధ్వస్తమ్
సముత్థాప్య నరాధిపమ్।
న్యవర్తత తదా దేవీ
కౌసల్యా శోకకర్శితా॥
టీకః-
అథ = అటు పిమ్మట; రేణు = రేణువులతో; సముధ్వస్తమ్ = కప్పబడిన; సముత్థాప్య = లేవదీసి; నరాధిపమ్ = మహారాజును; న్యవర్తత = మరలి వెళ్లెను; తదా = అప్పుడు; దేవీ = మహారాణి; కౌసల్యా = కౌసల్యాదేవి; శోకకర్శితా = శోకముచే కృశించిన
భావంః-
శరీరమంతయు దుమ్మంటిన రాజును నేలపై నుండి లేవదీసి, శోకముచే కృశించిన మహారాణి కౌల్యాదేవి, తన గృహమునకు తీసుకువెళ్లెను.
2.42.11.
అనుష్టుప్.
హత్వేవ బ్రాహ్మణం కామాత్
స్పృష్ట్వాగ్నిమివ పాణినా।
అన్వతప్యత ధర్మాత్మా
పుత్రం సంచింత్య తాపసమ్॥
టీకః-
హత్వేవ = సంహరించిన వానిగా; బ్రాహ్మణం = బ్రాహ్మణులను; కామాత్ = కోరికవలన; స్పృష్ట్వాగ్నిమ్ = అగ్నిని ముట్టుకున్నవాని; ఇవ = వలె; పాణినా = చేతితో; అన్వతప్యత = పరితపించెను; ధర్మాత్మా = సద్గుణుడైన దశరథుడు; పుత్రం = కుమారుని; సంచింత్య = తలచుకొని; తాపసమ్ = ముని వేషము
భావంః-
ధర్మాత్ముడైన దశరథుడు, ముని వేషము ధరించి అరణ్యమునకు వెళ్లిన కుమారుని తలచుకొని, కోరికకు లొంగిన మత్తులో బ్రహ్మహత్య చేసినవాని వలెను, నిప్పు ముట్టుకొనుట వలన చేయి కాలిన వాని వలెను పరితపించెను.
2.42.12.
అనుష్టుప్.
నివృత్త్యైవ నివృత్త్యైవ
సీదతో రథవర్త్మసు।
రాజ్ఞో నాతిబభౌ రూపమ్
గ్రస్తస్యాంశుమతో యథా॥
టీకః-
నివృత్త్యైవ నివృత్త్యైవ = వెనుకకు తిరిగి తిరిగి; సీదతః = దుఃఖించుచు ; రథవర్త్మసు = రథ మార్గమును; రాజ్ఞః = దశరథ మహారాజు; నాతి బభౌ = ప్రకాశవిహీనము అయ్యెను; రూపమ్ = రూపము; గ్రస్తస్య = రాహుగ్రస్తుడైన; అంశుమతః = సూర్యుని రూపము; యథా = ఆ విధముగా
భావంః-
మాటిమాటికి వెనుకకు తిరిగి రథమార్గమును చూచుచు, దుఃఖించుచున్న ఆ దశరథుని రూపము, రాహుగ్రస్తుడైన సూర్యుని రూపము వలె ప్రకాశవిహీనమైనది.
2.42.13.
అనుష్టుప్.
విలలాప చ దుఃఖార్తః
ప్రియం పుత్రమనుస్మరన్।
నగరాంతమనుప్రాప్తమ్
బుధ్వా పుత్రమథాబ్రవీత్॥
టీకః-
విలలాప = విలపించెను; చ = ఇంకను; దుఃఖార్తః = దుఃఖార్తుడై; ప్రియం = ప్రియమైన; పుత్రమ్ = కుమారుని; అనుస్మరన్ = స్మరించుచు; నగరాంతమ్ = పట్టణము పొలిమేర; అనుప్రాప్తమ్ = దాటెనని; బుధ్వా = తెలుసుకొని; పుత్రమ్ = కుమారుని; అథ = అటు పిమ్మట; అబ్రవీత్ = పలికెను
భావంః-
అతడు తన ప్రియ పుత్రునే స్మరించుచు దుఃఖార్తుడై విలపించెను. ఇంతలో పుత్రుడు పట్టణ పొలిమేర దాటెనని విని ఈ విధముగా పలికెను.
2.42.14.
అనుష్టుప్.
“వాహనానాం చ ముఖ్యానామ్
వహతాం తం మమాత్మజమ్।
పదాని పథి దృశ్యన్తే
స మహాత్మా న దృశ్యతే॥
టీకః-
వాహనానాం = గుఱ్ఱములు మొదలైనవి; చ = గుఱ్ఱములు మొదలైనవి మఱియు; ముఖ్యానామ్ = అద్భుతమైన; వహతాం = తీసుకునివెళ్లిన; తం = ఆ రాముని; మమ = నా యొక్క; ఆత్మజమ్ = కుమారుడు; పదాని = గిట్టల గుర్తులు; పథి = దారిలో; దృశ్యన్తే = కనపడుచున్నవి; సః = అతడు; హాత్మా = గొప్పవాడైన; న దృశ్యతే = లేదు; దృశ్యతే = కనబడుట
భావంః-
“నా కుమారుని తీసుకొని వెళ్లిన శ్రేష్ఠములైన గుఱ్ఱముల అడుగుజాడలు నేలపై కనబడుచున్నవి కాని, మహాత్ముడైన ఆ రాముడు మాత్రము కనబడుటలేదు.
2.42.15.
అనుష్టుప్.
యః సుఖేషూపధానేషు
శేతే చందనరూషితః।
వీజ్యమానో మహార్హాభిః
స్త్రీభిర్మమ సుతోత్తమః॥
టీకః-
యః = ఎవరైతే; సుఖేషు = సుఖముగా; ఉపధానేషు = తలగడపై; శేతే = నిద్రించిన; చందనరూషితః = చందనమును పూసుకొని; వీజ్యమానః = వింజామరలతో వీచుచుండగా; మహార్హాభిః = మిక్కిల అర్హులైన; స్త్రీభిః = స్త్రీలందరు; మమ = నా యొక్క; సుతోత్తమః = కుమారులలో శ్రేష్ఠుడైనవాడు
భావంః-
ఉత్తమమైన స్త్రీలు వింజామరలతో వీచుచుండగా, శరీరమునకు చందనము పూసుకొని, నా కుమారులలో శ్రేష్ఠుడైన రాముడు, తలగడపై సుఖముగా విశ్రాంతి తీసుకొనో
2.42.16.
అనుష్టుప్.
స నూనం క్వచిదేవాద్య
వృక్షమూలముపాశ్రితః।
కాష్ఠం వా యది వాశ్మానమ్
ఉపధాయ శయిష్యతే॥
టీకః-
స = అతడు; నూనం = బహుశ; క్వచిత్ = ఎక్కడో ఒక చోట; ఏవ = తప్పక; అద్య = ఇప్పుడు; వృక్షమూలమ్ = చెట్టు బోదెను; ఉపాశ్రితః = ఆశ్రయించి; కాష్ఠం = కఱ్ఱను కాని; యది వాశ్మానమ్ = రాయిని గాని; ఉపధాయ = తలగడగా ఉంచుకొని; శయిష్యతే = శయనించును
భావంః-
మెత్తని తలగడాలపై శయనించుచుండెడి వాడో, ఆ రాముడే ఇపుడు, ఏదో ఒక చెట్టు నీడను ఆశ్రయించి. కఱ్ఱను గాని, రాయిని గాని తలగడగా ఉంచుకొని శయనించును.
2.42.17.
అనుష్టుప్.
ఉత్థాస్యతి చ మేదిన్యాః
కృపణః పాంసుకుణ్ఠితః।
వినిశ్శ్వసన్ ప్రస్రవణాత్
కరేణూనామివర్షభః॥
టీకః-
ఉత్థాస్యతి = మేల్కొనుచు; చ = మఱియు; మేదిన్యాః = భూమి మీద నుండి; కృపణః = దీనుడైన; పాంసు = పరాగముచే; కుణ్ఠితః = కప్పబడినవాడై; వినిశ్శ్వసన్ = నిట్టూర్చుచు; ప్రస్రవణాత్ = ప్రస్రవణ గిరి నుండి; కరేణూనామ్ = ఆడ ఏనుగుల; ఇవ = వలె; ఋషభః = ప్రభువైన మగఏనుగు
భావంః-
వంటినిండా పట్టిన దుమ్ముతో దీనుడై నేలపై పరుండి ఉన్న నా రాముడు నిట్టూర్చుచు, ప్రస్రవణ పర్వతముమీదున్న ఆడఏనుగుల మగనివలె, ఇకపై లేచుచుండును.
2.42.18.
అనుష్టుప్.
ద్రక్ష్యంతి నూనం పురుషా
దీర్ఘబాహుం వనేచరాః।
రామముత్థాయ గచ్ఛంతమ్
లోకనాథమనాథవత్॥
టీకః-
ద్రక్ష్యంతి = చూడగలరు; నూనం = బహుశ; పురుషా = శ్రీరామచంద్రుని; దీర్ఘబాహుం = ఆజానుబాహువైన; వనేచరాః = వనములలో నివసించు జనులు; రామమ్ = రాముని; ఉత్థాయ = నేలపై నుండి లేచి; గచ్ఛంతమ్ = వెళ్లుచున్న; లోకనాథమ్ = లోకములకు నాథుడైన; అనాథవత్ = అనాథుని వలె
భావంః-
లోకములకు నాథుడైన శ్రీరాముడు ఆ విధముగా నేలపై నుండి లేచి, అనాథుని వలె వెళ్లుచుండగా, ఆజానుబాహువైన అతనిని అడవులలో నివసించు జనులు చూడబోవుచున్నారు.
2.42.19.
అనుష్టుప్.
సా నూనం జనకస్యేష్టా
సుతా సుఖసదోచితా।
కంటకాక్రమణాక్లాంతా
వనమద్య గమిష్యతి॥
టీకః-
సా = ఆమె, సీతాదేవి; నూనం = బహుశ; జనకస్య = జనక మహారాజునకు; ఇష్టా = ప్రియమైన; సుతా = కుమార్తె; సుఖః = సుఖములకు; సదా = ఎల్లప్పుడు; ఉచితా = పడినదీ; కంటకాః = ముండ్లదారి; ఆక్రమణా = దాటబడునదై; ఆక్లాంతా = అలసినదై; వనమ్ = అరణ్యములోనికి; అద్య = ఇప్పుడు; గమిష్యతి = వెళ్లగలదు
భావంః-
సాక్షాత్తు జనకమహారాజుగారి ప్రియ కుమార్తె, ఎల్లపుడు సుఖములకు అలవాటు పడినది, ఐన సీతాదేవి ఇపుడు అడవిలో ముండ్లదారమ్మట నడవ వలసి ఉంటుందేమో.
2.42.20.
అనుష్టుప్.
అనభిజ్ఞా వనానాం సా
నూనం భయముపైష్యతి।
శ్వాపదానర్దితం శ్రుత్వా
గంభీరం రోమహర్షణమ్॥
టీకః-
అనభిజ్ఞా = తనకు తెలియని; వనానామ్ = అడవులను; సా = ఆమె, సీతాదేవి; నూనం = బహుశ; భయమ్ = భయపడుటను; ఉపైష్యతి = పొందును; శ్వాపదాన్ = పులులవంటి క్రృరమృగముల; అర్దతమ్ = గమనములు, పోవుట, ఆంధ్రశబ్దరత్నాకరము; శ్రుత్వా = విని; గంభీరమ్ = గంభీరమైన; రోమహర్షణమ్ = గగుర్పాటు కలిగించు
భావంః-
పూర్వమెన్నడును అడవులు తెలియని సీత, గగుర్పాటు కల్గించు గంభీరమైన క్రూరమృగముల కదలికలు విని భయపడునేమో.
2.42.21.
అనుష్టుప్.
సకామా భవ కైకేయి
విధవా రాజ్యమావస।
న హి తం పురుషవ్యాఘ్రమ్
వినా జీవితుముత్సహే॥
టీకః-
సకామా = కోరిక తీరినది; భవ = నీ యొక్క; కైకేయి = ఓ కైకేయీ; విధవా = విధవరాలివై; రాజ్యమ్ = రాజ్యమును; అవస = పాలించుము; న = లేదు; హి = నిశ్చయంగా; తం = అతడు,రాముడు; పురుషవ్యాఘ్రమ్ = పురుష శ్రేష్ఠుడైన; వినా = లేకుండా; జీవితుమ్ = జీవించుటకు; ఉత్సహే = ఇష్టము
భావంః-
కైకేయీ! నీ కోరిక తీరినది. విధవవై రాజ్యమును పాలించుము. పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు లేకుండగ నేను జీవింపజాలను.
2.42.22.
అనుష్టుప్.
ఇత్యేవం విలపన్ రాజా
జనౌఘేనాభిసంవృతః।
అపస్నాత ఇవారిష్టమ్
ప్రవివేశ పురోత్తమమ్॥
టీకః-
ఇతి + ఏవం = ఈ విధముగనే; విలపన్ = విలపించుచు; రాజా = దశరథ మహారాజు; జనః = జనముల; ఓఘేన = సముదాయముతో; అభిసంవృతః = పరివేష్టితుడై; అపస్నాత = కార్యక్రమం పిమ్మట స్నానము చేసినవాడై; ఇవ = వలె; అరిష్టమ్ = అమంగళమైన; ప్రవివేశ = ప్రవేశించినట్లు; పురోత్తమమ్ = నగరములోనికి
భావంః-
ఈ విధముగా విలపించుచు రాజు జన సముదాయముతో కూడి బంధు మరణము విని స్నానము చేసినవాడు అమంగళమైన గృహమును ప్రవేశించినట్లు పురములలో శ్రేష్ఠమైన అయోధ్యలోనికి ప్రవేశించెను.
2.42.23.
అనుష్టుప్.
శూన్యచత్వరవేశ్మాంతామ్
సంవృతాపణదేవతామ్।
క్లాంతదుర్బలదుఃఖార్తామ్
నాత్యాకీర్ణమహాపథామ్॥
టీకః-
శూన్య = శూన్యములై; చత్వర = ముంగిళ్ళు; వేశ్మాంతామ్ = లోగిళ్లు; సంవృత = మూసిన, వావిళ్ళ; ఆపణ = అంగళ్లు; దేవతామ్ = దేవాలయములు; క్లాంతః = అలసటచెందినవారు; దుర్బలః = బలహీనమైన వారితో; దుఃఖార్తామ్ = దుఃఖార్తులైన వారితో; న = లేదు; అతి = అధికముగా; ఆకీర్ణః = జనసమ్మర్థ; మహాపథామ్ = రాజమార్గములు
భావంః-
అయోధ్యలోని ముంగిళ్ళు, లోగిళ్ళు అన్నీ జనశూన్యములై ఉండెను. అంగళ్లు, దేవాలయములు మూసివేయబడి యుండెను. రాజమార్గములూ పెద్దగా జనులు తిరుగుటలేదు. తిరుగుతున్న కొద్దిమందీ దుఃఖార్తులు, డస్సినవారు, దుర్బలులు.
2.42.24.
అనుష్టుప్.
తామవేక్ష్య పురీం సర్వామ్
రామమేవానుచింతయన్।
విలపన్ ప్రావిశద్రాజా
గృహం సూర్య ఇవామ్బుదమ్॥
టీకః-
తామ్ = దానిని; అవేక్ష్య = చూచి; పురీం = నగరమును; సర్వామ్ = మొత్తము; రామమ్ = రాముని; ఏవ = మాత్రమే; అనుచింతయన్ = ఆలోచిస్తూ; విలపన్ = విలపించెను; ప్రావిశత్ = ప్రవేశించినట్లు; రాజా = దశరథ మహారాజు; గృహం = గృహములోనికి; సూర్యః = సూర్యుడు; ఇవ = వలె; అమ్బుదమ్ = మేఘములోనికి
భావంః-
అట్టి ఆ నగరమునంతను చూసి, దశరథుడు రామునే స్మరించుచు విలపించుచు సూర్యుడు మేఘములోనికి ప్రవేశించినట్లు ఇంటిలోనికి ప్రవేశించెను.
2.42.25.
అనుష్టుప్.
మహాహ్రదమివాక్షోభ్యమ్
సుపర్ణేన హృతోరగమ్।
రామేణ రహితం వేశ్మ
వైదేహ్యా లక్ష్మణేన చ॥
టీకః-
మహాహ్రదమ్ = గొప్ప మడుగు; ఇవ = వలె; అక్షోభ్యమ్ = స్థిరమైన దగు; సుపర్ణేన = గరుత్మంతునిచే; హృత = తీసుకుపోయిన; ఉరగమ్ = సర్పములు గలదీ; రామేణ = రాముని చేత; రహితం = లేనిది; వేశ్మ = సదనము; వైదేహ్యా = సీతాదేవి; లక్ష్మణేన = లక్ష్మణుడు వలన; చ = కూడ
భావంః-
గరుత్మంతుడు సర్పములు అన్నింటినీ అపహరించగా, అలలు కలతలు లేని గొప్ప మడుగు వలె, సీతారామలక్ష్మణులు లేని ఆ సదనము కనబడుచుండెను.
2.42.26.
అనుష్టుప్.
అథ గద్గదశబ్దస్తు
విలపన్మనుజాధిపః।
ఉవాచ మృదుమందార్థమ్
వచనం దీనమస్వరమ్॥
టీకః-
అథ = పిమ్మట; గద్గద = డగ్గుతికతో కూడిన; శబ్దః = స్వరము కలవాడు; అస్తు = అయి; విలపన్ = విలపించుచు; మనుజాధిపః = చక్రవర్తి; ఉవాచ = మాట్లాడెను; మృదు = మెత్తనైన; మందార్థమ్ = స్పష్టముగా అర్థము కాని; వచనం = పదములు; దీనమ్ = దయనీయమైన; అస్వరమ్ = మెల్లని గొంతు
భావంః-
దశరథుడు అటుపిమ్మట డగ్గుత్తికతో కూడిన స్వరముతో విలపించుచు, స్పష్టముగా అర్థము కాని మెత్తని మాటలను గొణుగుతూ దీనముగా పలికెను.
2.42.27.
అనుష్టుప్.
“కౌసల్యాయాం గృహం శీఘ్రమ్
రామమాతుర్నయంతు మామ్।
న హ్యన్యత్ర మమాశ్వాసో
హృదయస్య భవిష్యతి”॥
టీకః-
కౌసల్యాయాం = కౌసల్య యొక్క; గృహం = గృహమునకు; శీఘ్రమ్ = శీఘ్రముగా; రామః = రాముని; మాతుః = తల్లి; నయంతు = తీసుకొని వెళ్లుదువు గాక; మామ్ = నన్ను; న = లేదు; హి = మరి; అన్యత్ర = ఎక్కడను; మమ = నాకు; ఆశ్వాసః = ఊరట; హృదయస్య = హృదయమునకు; భవిష్యతి = కలుగదు
భావంః-
“నన్ను శీఘ్రముగా రాముని తల్లి కౌసల్య ఇంటికి తీసుకొని వెళ్లుము. నా హృదయమునకు మరి ఎక్కడను ఊరట కలుగదు” అనెను.
2.42.28.
అనుష్టుప్.
ఇతి బ్రువంతం రాజానమ్
అనయన్ ద్వారదర్శినః।
కౌసల్యాయా గృహం తత్ర
న్యవేశ్యత వినీతవత్॥
టీకః-
ఇతి = ఈ విధముగా; బ్రువంతం = పలికిన ; రాజానమ్ = మహారాజును; అనయన్ = తీసుకొని వెళ్లి; ద్వారదర్శినః = ద్వారపాలకులు; కౌసల్యాయా = కౌసల్యాదేవి; గృహం = గృహమునకు; తత్ర = అక్కడ; న్యవేశ్యత = పరుండబెట్టిరి; వినీతవత్ = వినయపూర్వకముగా
భావంః-
రాజు పలికిన మాటలు విని, ద్వారపాలకులు అతనిని కౌసల్య యింటికి తీసుకొని వెళ్లి వినయపూర్వకముగా అచట పరుండబెట్టిరి.
2.42.29.
అనుష్టుప్.
తతస్తస్య ప్రవిష్టస్య
కౌసల్యాయా నివేశనమ్।
అధిరుహ్యాపి శయనమ్
బభూవ లులితం మనః॥
టీకః-
తతః = అప్పుడు; తస్య = అతని; ప్రవిష్టస్య = ప్రవేశించిన; కౌసల్యాయా = కౌసల్య; నివేశనమ్ = గృహములో; అధిరుహ్యః = ఎక్కినవాడు; అపి = ఐనను; శయనమ్ = శయనముపై; బభూవ = ఉండెను; లులితం = దుఃఖాక్రాంతమై; మనః = మనస్సుకలవాడై
భావంః-
దశరథుడు కౌసల్య గృహము ప్రవేశించి పక్కఎక్కినను, అతని మనస్సు దుఃఖాక్రాంతమై ఉండెను.
2.42.30.
అనుష్టుప్.
పుత్రద్వయవిహీనం చ
స్నుషయాపి వివర్జితమ్।
అపశ్యద్భవనం రాజా
నష్టచంద్రమివాంబరమ్॥
టీకః-
పుత్ర = కుమారులు; ద్వయ = ఇద్దరను; విహీనం = కోల్పోయి; చ = మఱియు; స్నుషయ = కోడలిని; చ = కూడా; వివర్జితమ్ = విడిచిపెట్టి; అపశ్యత్ = కనబడినది; భవనం = భవనమును; రాజా = దశరథ మహారాజు; నష్టచంద్రమ్ = చంద్రుడు లేని; ఇవ + అంబరమ్ = ఆకాశము వలె
భావంః-
ఇరువురు కుమారులు, కోడలైన సీత లేని ఆ గృహము, రాజునకు చంద్రుడు లేని ఆకాశము వలె కనబడెను.
2.42.31.
అనుష్టుప్.
తచ్చ దృష్ట్వా మహారాజో
భుజముద్యమ్య వీర్యవాన్।
ఉచ్చైస్స్వరేణ చుక్రోశ
హా రాఘవ జహాసి మామ్॥
టీకః-
తత్ = ఆ; చ = ఇంక; దృష్ట్వా = చూచి; మహారాజః = దశరథ మహారాజు; భుజమ్ = చేతులపై; ఉద్యమ్య = లేచి; వీర్యవాన్ = పరాక్రమవంతుడైన; ఉచ్చైః = బిగ్గరగా; స్వరేణ = గొంతుతో; చుక్రోశ = ఏడ్చెను; హా = అయ్యో; రాఘవ = రామా; జహాసి = విడిచివేయుచున్నావు; మామ్ = నన్ను
భావంః-
పరాక్రమవంతుడైన ఆ మహారాజు, ఆ గృహమును చూచి, చేతులు ఎత్తి, అయ్యో రామా నన్ను విడచివేయుచున్నావు కదా.. అని బిగ్గరగా ఏడ్చెను.
2.42.32.
అనుష్టుప్.
సుఖితా బత తం కాలమ్
జీవిష్యంతి నరోత్తమాః।
పరిష్వజన్తో యే రామమ్
ద్రక్ష్యంతి పునరాగతమ్॥
టీకః-
సుఖితా = సుఖవంతులు; బత = అయ్యో; తం = ఆ (పదునాలుగు సంవత్సరముల); కాలమ్ = పదునాలుగు సంవత్సరముల కాలము; జీవిష్యంతి = జీవించి యుండువారు; నరోత్తమాః = నర శ్రేష్ఠులు; పరిష్వజంతః = కౌగలించుకొని; యః = ఆ; రామమ్ = రాముని; ద్రక్ష్యంతి = చూడగలరు; పునరాగతమ్ = తిరిగి వచ్చునపుడు
భావంః-
పదునాలుగు సంవత్సరముల కాలము పూర్తియగు వరకు జీవించు నరశ్రేష్ఠులు రాముడు తిరిగి వచ్చునపుడు అతనిని చూచి కౌగలించుకొని సుఖముగా ఉండగలరు. అయ్యో, అట్టి భాగ్యము నాకుండదు కదా.. అని విలపించెను.
2.42.33.
అనుష్టుప్.
అథ రాత్ర్యాం ప్రపన్నాయామ్
కాళరాత్ర్యామివాత్మనః।
అర్ధరాత్రే దశరథః
కౌసల్యామిదమబ్రవీత్॥
టీకః-
అథ = ఇంతలో; రాత్య్రాం = రాత్రి; ప్రపన్నాయామ్ = ప్రాప్తించినది; కాళరాత్య్రామ్ ఇవ = కాళ రాత్రి; ఇవ = వంటి; ఆత్మనః = తనకు (దశరథ మహారాజునకు); అర్ధరాత్రే = అర్ధరాత్రి సమయములో; దశరథః = దశరథ మహారాజు; కౌసల్యామ్ = కౌసల్యాదేవితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను
భావంః-
ఇంతలో దశరథునకు కాళరాత్రి వంటి రాత్రి వచ్చినది. ఇపుడు దశరథుడు అర్ధరాత్రి కౌసల్యతో, ఈ విధముగా పలికెను.
2.42.34.
అనుష్టుప్.
"రామం మేఽనుగతా దృష్టిః
అద్యాపి న నివర్తతే।
న త్వా పశ్యామి కౌసల్యే!
సాధు మాం పాణినా స్పృశ”॥
టీకః-
రామం = రాముని; మే = నా యొక్క; అనుగతా = వెంట వెళ్లినది; దృష్టిః = దృష్టి; అద్యాపి = ఇది ఇంకను; న నివర్తతే = తిరిగి వచ్చుట లేదు; న = లేదు; త్వా = నీవు; పశ్యామి = చూచుచున్నాను; కౌసల్యే = ఓ కౌసల్యా; సాధు = సరిగా; మాం = నన్ను; పాణినా = చేతితో; స్పృశ = స్పృశించుము
భావంః-
“కౌసల్యా! రామునితోపాటు నా దృష్టి పోయినది. అది ఇంకను తిరిగి వచ్చుట లేదు. నువ్వు నాకు సరిగా కనబడుటలేదు. నీ హస్తముతో నన్ను స్పృశింపుము.” అనెను.
2.42.35.
జగతి.
తం రామమేవానువిచింతయంతం
సమీక్ష్య దేవీ శయనే నరేంద్రమ్।
ఉపోపవిశ్యాధికమార్తరూపా
వినిశ్వసంతీ విలలాప కృచ్ఛ్రమ్॥
టీకః-
తం = ఆ; రామమ్ = రాముని; ఏవ = గూర్చియే; అనువిచింతయంతం = ఆలోచనలో లీనమైనవాని; సమీక్ష్య = చూచి; దేవీ = కౌసల్యాదేవి; శయనే = మందిరమున; నరేంద్రమ్ = దశరథుని; ఉపోపవిశ్య = ఉప + ఉపవిశ్య, సమీపమున కూర్చుని; అధికమ్ = చాలా; ఆర్తరూపా = విచారంగా కనిపించినది; వినిశ్వసంతీ = గట్టిగా నిట్టూర్చుచు; విలలాప = ఏడ్చుచుండెను; కృచ్ఛ్రమ్ = బాధతో
భావంః-
శయనముపై పరుండి రాముని గూర్చియే ఆలోచించుచున్న ఆ రాజును చూచి, కౌసల్య చాల దుఃఖించుచు సమీపమున కూర్చుండి, నిట్టూర్చుచు, విలపించెను.
2.42.36.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ద్విచత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; ద్విచత్వారింశః [42] = నలభైరెండవ; సర్గః = సర్గ
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [42] నలభైరెండవ సర్గ సంపూర్ణము.
2.43.1.
అనుష్టుప్
తతః సమీక్ష్య శయనే
సన్నం శోకేన పార్థివమ్।
కౌసల్యా పుత్రశోకార్తా
తమువాచ మహీపతిమ్॥
టీకః-
తతః = తరువాత; సమీక్ష్య = చూచి; శయనే = శయ్యపైనున్న; సన్నం = కృశించిన; శోకేన = శోకముతో; పార్థివమ్ = రాజును; కౌసల్యా = కౌసల్య; పుత్రః = పుత్రునిగూర్చి; శోక = శోకముచే; ఆర్తా = పీడింపబడినామె; తం = ఆ; ఉవాచ = పలికెను; మహీపతిమ్ = రాజునుగూర్చి.
భావంః-
తరువాత శోకముచే కృశించి, మంచముపై పడుకొనియున్న ఆ దశరథమహారాజును చూచి, పుత్రశోకముతో బాధపడుతున్న కౌసల్య, అతనితో ఇట్లనెను.
2.43.2.
అనుష్టుప్
రాఘవే నరశార్దూలే
విషముప్త్వాహిజిహ్మగా
విచరిష్యతి కైకేయీ
నిర్ముక్తేవ హి పన్నగీ॥
టీకః-
రాఘవే = రామునియందు; నరశార్దూలే = మానవశ్రేష్ఠుడైన; విషమ్ = విషమును; ఉప్త్వా = నాటి; అహి = పాము వలె; జిహ్మగా = కుటిలవర్తన, వంకరగా నడచునది; విచరిష్యతి = ప్రవర్తించగలదు; కైకేయీ = కైకేయి; నిర్ముక్తా = కుబుసము విడిచిన; ఇవ = వలె; పన్నగీ = ఆడపాము.
భావంః-
హింసించే దుష్ట సర్పము వలె వంకరగా కుటిలముగా నడుచు స్వభావము కలిగియున్న కైకేయి, మానవశ్రేష్ఠుడైన రామునియందు విషమును నాటి, ఇప్పుడు కుబుసము విడిచిన ఆడుపాము వలె ప్రవర్తించును.
*గమనికః-
(1) అహి- వ్యు, హస = హింసాగత్యోః-ఆ + హస్ + ఇణ్-డిత్, అఙ్ హ్రస్వశ్చ. (ఔణా.) హింసించునది-తిరుగునది. పాము, దుష్టుడు (శంకరనారాయణ). (2) జిహ్మగము- వంకరగా పోవునది, సర్పము, ఆంధ్రవాచస్పతము.
2.43.3.
అనుష్టుప్
వివాస్య రామం సుభగా
లబ్ధకామా సమాహితా।
త్రాసయిష్యతి మాం భూయో
దుష్టాహిరివ వేశ్మని॥
టీకః-
వివాస్య = వెడలగొట్టి; రామం = రాముని; సుభగా = సౌందర్యవతి, పతిప్రియ, మాండవ్యః, శబ్దకల్పద్రుమం; లబ్ధకామా = కోరిక తీరినదై; సమాహితా = ప్రతిజ్ఞాతః, మోదినీ; త్రాసయిష్యతి = భయపెట్టగలదు; మాం = నన్ను; భూయః = మరల; దుష్ట = దుష్టమైన; అహి = పాము; ఇవ = వలె; వేశ్మని = ఇంటియందున్న.
భావంః-
రాజునకు ప్రియపత్నియై ఉండి కైకేయు, పట్టుపట్టి రాముని అరణ్యమునకు పంపివేసి, కోరిక తీర్చుకొన్నది. ఇంటిలో ఉన్న దుష్టసర్పము వలె, ఇకపై నన్ను భయపెట్టగలదు.
2.43.4.
అనుష్టుప్
అథ స్మ నగరే రామః
చరన్ భైక్షం గృహే వసేత్।
కామకారో వరం దాతుమ్
అపి దాసం మమాత్మజమ్॥
టీకః-
అథ = తరువాత; స్మ = ఉండును; నగరే = నగరమునందు; రామః = రాముడు; చరన్ = ఆర్జించుచు; భైక్షం = భిక్షమును; గృహే = గృహమునందు; వసేత్ = నివసించి; కామకారః = చెప్పినపని చేయువాడు; వరం = శ్రేష్ఠము; దాతుమ్ = ఇచ్చుట; దాసం = దాసునిగా; మమ = నాయొక్క; ఆత్మజమ్ = పుత్రుని.
భావంః-
నా పుత్రుని దాసునిగా చేసి ఆమెకు ఇచ్చినను బాగుండెడిది. అప్పుడు రాముడు, చక్కగా చెప్పిన పనిచేయుచు, నగరమునందే భిక్షాటన చేయుచు, ఇంటియందే ఉండెడివాడు.
2.43.5.
అనుష్టుప్
పాతయిత్వా తు కైకేయ్యా
రామం స్థానాద్యథేష్టతః।
ప్రదిష్టో రక్షసాం భాగః
పర్వణీవాహితాగ్నినా॥
టీకః-
పాతయిత్వా = పడద్రోసి; కైకేయ్యా = కైకేయిచే; రామం = రాముని; స్థానాత్ = స్థానమునుండి; యథేష్టతః = ఇష్ట ప్రకారము; ప్రదిష్టః = ఇవ్వబడినది; రక్షసాం = రాక్షసులకు; భాగః = భాగము; పర్వణి = పండుగలయందు; ఇవ = వలె; ఆహితాగ్నినా = ఆహితాగ్నిచే, నిత్యాగ్నిహోత్రునిచే.
భావంః-
నీవు నీ ఇష్ట ప్రకారమే కైకేయిచే, రాముని అతని స్థానమునుండి క్రిందకు పడద్రోయించి రామునిరాజ్యమును భరతునకు ఇచ్చితివి. ఇది నిత్యాగ్నిహోత్రునిచే పర్వములయందు దేవతలకు ఇవ్వవలసిన భాగమును రాక్షసులకు ఇచ్చినట్లు ఉన్నది.
*గమనికః-
(1) అహితాగ్ని- నిత్యమూ హోమము చేయువాడు, నిత్యాగ్నిహోత్రుడు. (2) పర్వములు- 1. కృష్ణ చతుర్దశి, 2. కృష్ణపక్షాష్టమి, 3. అమావాస్య, 4. పూర్ణిమ, 5. రవి సంక్రాంతి. "కృష్ణాష్టమీ చతుర్దశ్యప్యమావాస్యా చ పూర్ణిమా, సంక్రాంతిః పర్వతిథయో మునిభిః పరికీర్తితాః", దర్శపూర్ణమావాదిలు
2.43.6.
అనుష్టుప్
గజరాజగతిర్వీరో
మహాబాహుర్ధనుర్ధరః।
వనమావిశతే నూనమ్
సభార్య స్సహ లక్ష్మణః॥
టీకః-
గజరాజగతిః = గజరాజు వలె నడుచువాడు; వీరః = వీరుడు; మహాబాహుః = గొప్పభుజబలుడు; ధనుర్ధరః = ధనుస్సును ధరించినవాడు; వనమ్ = వనమును; ఆవిశతే = ప్రవేశించుచున్నాడు; నూనమ్ = నిశ్చయముగా; స = కూడా ఉన్న; భార్యః = భార్యకలవాడు; సహ = సహితంగా; లక్ష్మణః = లక్ష్మణుడుకలవాడు.
భావంః-
గజరాజు వంటి నడక కలవాడును, వీరుడును, భుజబలోన్నతుడు, ధనుర్ధారి ఐన రాముడు, సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యమును ప్రవేశించును.
2.43.7.
అనుష్టుప్
వనే త్వదృష్టదుఃఖానామ్
కైకేయ్యానుమతే త్వయా।
త్యక్తానాం వనవాసాయ
కాన్వవస్థా భవిష్యతి॥
టీకః-
వనే = వనమునందు; తు = నిశ్చయముగ; అదృష్ట = చూడబడని, ఇంతవరకు ఎఱుగని; దుఃఖానామ్ = దుఃఖములుకలవారు; కైకేయ్యాః = కైకేయియొక్క; అనుమతే = ఇష్టప్రకారము; త్వయా = నీచే; త్యక్తానాం = పంపబడిన వారు; వనవాసాయ = వనవాసము కొరకు; కా ను = ఎటువంటి; అవస్థా = అవస్థ; భవిష్యతి = కలుగునో.
భావంః-
వారు ఎన్నడును కష్టముల నెరిగినవారు కారు. అటువంటి వారిని నీవు కైకేయి ఇష్టప్రకారముఅరణ్యమునకు పంపివేసితివి. అరణ్యములో వారి అవస్థ ఎట్లుండబోవునో కదా.
2.43.8.
అనుష్టుప్
తే రత్నహీనాస్తరుణాః
ఫలకాలే వివాసితాః।
కథం వత్స్యన్తి కృపణాః
ఫలమూలైః కృతాశనాః॥
టీకః-
తే = వారు; రత్నహీనాః = ఆభరణములు లేనివారు ; తరుణాః = యుక్తవయసునందున్నవారు; ఫలకాలే = అన్నియు అనుభవించవలసిన కాలమున; వివాసితాః = వెడలగొట్టబడినవారు; కథం = ఎట్లు; వత్స్యన్తి = నివసింతురు; కృపణాః = దీనులై; ఫలమూలైః = పళ్ళు దుంపలతో; కృతా = ఏర్పరచిన; అశనాః = ఆహారము కలిగియున్నవారు.
భావంః-
యుక్తవయసులో ఉన్నవారిని, భోగములను అనుభవించవలసిన కాలములో, వెళ్లగొట్టితివి. శ్రేష్ఠమైన ఆహారము ఏమియు లేక, కేవలము అడవిలో దొరుకు పళ్ళు దుంపలను తినుచు వారు నివసించునట్లుగా చేసితివి.
2.43.9.
అనుష్టుప్
అపీదానీం స కాలస్స్యాన్
మమ శోకక్షయ శ్శివః।
సభార్యం యత్సహ భ్రాత్రా
పశ్యేయమిహ రాఘవమ్॥
టీకః-
అపి = కూడ; ఇదానీం = ఇప్పుడు; సః = ఆ; కాలః = కాలము; స్యాత్ = వచ్చునా; మమ = నాకు; శోకక్షయః = శోకము నశింపజేయునది; శివః = శుభప్రదమైన; సభార్యం = భార్యతో కూడి; యత్ = ఎప్పుడు; సహ భ్రాత్రా = సోదరునితో కూడి; పశ్యేయమ్ = చూచెదను; ఇహ = ఇక్కడ; రాఘవమ్ = రాముని.
భావంః-
రాముడు భార్యతోను, తన తమ్మునితోను, కలసి ఇక్కడికి వచ్చి, నా దుఃఖమును పోగొట్టు శుభప్రదమైన కాలమును నేను ఎన్నటికైనను చూతునా?
2.43.10.
అనుష్టుప్
శ్రుత్వైవోపస్థితౌ వీరౌ
కదాయోధ్యా భవిష్యతి।
యశస్వినీ హృష్టజనా
సూచ్ఛ్రితధ్వజమాలినీ॥
టీకః-
శ్రుత్వైవ = వినినంతనే; ఉపస్థితౌ = వచ్చియున్న; వీరౌ = వీరులను; కదా = ఎప్పుడు; అయోధ్యా = అయోధ్య; భవిష్యతి = కాగలదు; యశస్వినీ = ప్రఖ్యాతమైన; హృష్ట = సంతోషించిన; జనా = జనము గలదై; సూచ్ఛ్రిత = చక్కగాగా ఎగురవేయబడిన; ధ్వజ = పతాకములు; మాలినీ = పూలమాలలు గలదై.
భావంః-
వీరులైన ఆ రామలక్ష్మణులు తిరిగి వచ్చినట్లు విని, సంతోషించిన ప్రజలందరును, ప్రఖ్యాతమైన ఈ అయోధ్య అంతటను, అందమైన పతాకములను ఎప్పుడు ఎగురవేసేదరో, పూలమాలలు ఎప్పుడు కట్టుదురో కదా!
2.43.11.
అనుష్టుప్
కదా ప్రేక్ష్య నరవ్యాఘ్రౌ
అరణ్యాత్పునరాగతౌ।
నందిష్యతి పురీ హృష్టా
సముద్ర ఇవ పర్వణి॥
టీకః-
కదా = ఎప్పుడు; ప్రేక్ష్య = చూచి; నరవ్యాఘ్రౌ = మానవశ్రేష్ఠు లిద్దరూ; అరణ్యాత్ = అరణ్యమునుండి; పునః = మరల; ఆగతౌ = వచ్చియున్న; నందిష్యతి = సంతోషించును; పురీ = నగరము; హృష్టా = పొంగియున్న; సముద్ర = సముద్రము; ఇవ = వలె; పర్వణి = పౌర్ణమిన.
భావంః-
తిరిగి వచ్చిన రామలక్ష్మణులను చూచి, ఈ నగరమంతయు, పున్నమినాడు ఉప్పొంగిన సముద్రమువలె ఎన్నడు సంతోషించునో కదా!
2.43.12.
అనుష్టుప్
కదాఽ యోధ్యాం మహాబాహుః
పురీం వీరః ప్రవేక్ష్యతి।
పురస్కృత్య రథే సీతామ్
వృషభో గోవధూమివ॥
టీకః-
కదా = ఎప్పుడు; అయోధ్యాం = అయోధ్యను; మహాబాహుః = గొప్పబాహువులు కలిగియున్నవాడు; పురీం = పట్టణమును; వీరః = వీరుడు; ప్రవేక్ష్యతి = ప్రవేశించునో; పురస్కృత్య = ముందునిడుకొని; రథే = రథమునందు; సీతామ్ = సీతను; వృషభః = వృషభము; గోవధూమ్ = ఆవు; ఇవ = వలె.
భావంః-
ఆజానుబాహుడు, వీరుడును ఆయన రాముడు, వృషభము గోవును ఎదుటి నుంచుకొని వచ్చునట్లు, సీతను రథముపై ఎదుట కూర్చుండబెట్టుకొని అయోధ్యానగరమునకు ఎప్పుడు ప్రవేశించునో కదా!
2.43.13.
అనుష్టుప్
కదా ప్రాణిసహస్రాణి
రాజమార్గే మమాత్మజౌ।
లాజైరవకిరిష్యన్తి
ప్రవిశన్తావరిందమౌ॥
టీకః-
కదా = ఎప్పుడు; ప్రాణి = జనులు; సహస్రాణి = వేలకొలది; రాజమార్గే = రాచమార్గమునందు; మమ = నాయొక్క; ఆత్మజౌ = ఇద్దరు కుమారులను; లాజైః = పేలాలచే; అవకిరిష్యన్తి = చల్లెదరో; ప్రవిశన్తౌ = ప్రవేశించునపుడు; అరిందమౌ = శత్రు సంహారకు లిద్దరిని.
భావంః-
అరివీరభయంకరులైన నా కుమారులు అయోధ్యలోనికి ప్రవేశించు చుండగా, రాచమార్గమునందు ప్రజలు వేలకొలది చేరి వారిపై లాజులు జల్లుట ఎన్నడో కదా?
2.43.14.
అనుష్టుప్
ప్రవిశన్తౌ కదాఽ యోధ్యామ్
ద్రక్ష్యామి శుభకుండలౌ।
ఉదగ్రాయుధనిస్త్రింశౌ
సశృంగావివ పర్వతౌ॥
టీకః-
ప్రవిశన్తౌ = ప్రవేశించునప్పుడు; కదా = ఎప్పుడు; అయోధ్యామ్ = అయోధ్యను; ద్రక్ష్యామి = చూచెదను; శుభ = శోభాకరమైన; కుండలౌ = చెవికుండలములను ధరించు ఇరువురు; ఉదగ్ర = ఉన్నతమైన; ఆయుధ = ఆయుధములు; ధనిస్త్రింశౌ = ఖడ్గములు కల ఇరువురు; స = కూడియున్న; శృంగావ్ = శిఖరద్వయముతో; ఇవ = వలె; పర్వతౌ = పర్వత ద్వయము.
భావంః-
అందమైన కుండలములను ధరించి, ఉన్నతమైన ఆయుధములతోను, ఖడ్గములతోను, శిఖరద్వయములతోకూడిన పర్వతద్వయముల వలె ప్రకాశించుచున్న రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుట ఎన్నడో కదా? ఎన్నడుచూడగలిగెదనో కదా!
2.43.15.
అనుష్టుప్
కదాసుమనసః కన్యా
ద్విజాతీనాం ఫలాని చ।
ప్రదిశన్తః పురీం హృష్టాః
కరిష్యన్తి ప్రదక్షిణమ్॥
టీకః-
కదా = ఎన్నడు; సుమనసః = పుష్పములను; కన్యా = కన్యలకును; ద్విజాతీనాం = బ్రాహ్మణులకును; ఫలాని = ఫలములను; ప్రదిశన్తః = ఇచ్చుచు; పురీం = పట్టణమును; హృష్టాః = సంతోషించినవారై;కరిష్యన్తి = చేయగలరు; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము.
భావంః-
సీతారామలక్ష్మణులు కన్యలకును, బ్రాహ్మణులకును, ఫలపుష్పములను సంతోషముగా పంచిపెట్టుచు అయోధ్యా నగరమునకు ఎప్పుడు ప్రదక్షిణము చేసెదరో కదా!
2.43.16.
అనుష్టుప్
కదా పరిణతో బుద్ధ్యా
వయసా చామరప్రభః।
అభ్యుపైష్యతి ధర్మజ్ఞః
త్రివర్ష ఇవ మాం లలన్॥
టీకః-
కదా = ఎన్నడు; పరిణతః = పరిణతి చెందినవాడు; బుద్ధ్యా = బుద్ధిచేతను; వయసా = వయసు చేతను; అమర = దేవతల వంటి; ప్రభః = తేజస్సు కలిగి ఉన్నవారు; అభ్యుపైష్యతి = చేరునో; ధర్మజ్ఞః = ధర్మము నెరిగిన; త్రివర్ష = మూడు సంవత్సరములవయస్సు గలవాడు; ఇవ = వలె; మాం = నన్ను; లలన్ = క్రీడించుచు.
భావంః-
దేవతల వంటి తేజస్సుగలవాడు, ధర్మము నెరిగినవాడు ఐన రాముడు, పదునాలుగుసంవత్సరములలో, బుద్ధిచేతను, వయసుచేతను, అభివృద్ధి చెందును. అటువంటి రాముడు మూడు సంవత్సరముల పిల్లవాని వలె క్రీడించుచు నన్ను ఎప్పుడు చేరునో కదా!
2.43.17.అనుష్టుప్
నిస్సంశయం మయా మన్యే
పురా వీర కదర్యయా।
పాతుకామేషు వత్సేషు
మాతౄణాం శాతితాస్స్తనాః॥
టీకః-
నిస్సంశయం = నిస్సందేహముగ; మయా = నాచే; మన్యే = అనుకొనుచుండగ; పురా = పూర్వము; వీర = వీరా; కదర్యయా = క్రూరురాలనైన; పాతుకామేషు = పాలు త్రాగ దలచచుండగ; వత్సేషు = లేగదూడలు; మాతౄణాం = తల్లుల యొక్క; శాతితాః = తీసివేయబడినవి; స్తనాః = స్తనములు.
భావంః-
ఓ వీరా! నిస్సంశయముగ నేను పూర్వము క్రూరురాలనై, లేగదూడలు పాలు త్రాగవలెననుకొనుచుండగ, వాటి తల్లుల స్తనములు దూరముచేసితిని కాబోలు. .
2.43.18.
అనుష్టుప్
సాహం గౌరివ సింహేన
వివత్సా వత్సలా కృతా।
కైకేయ్యా పురుషవ్యాఘ్ర!
బాలవత్సేవ గౌర్బలాత్॥
టీకః-
సా = అట్టి; అహం = నేను; గౌః = ఆవు; ఇవ = వలె; సింహేన = సింహముచే; వివత్సా = బిడ్డ లేనిదానిగా; వత్సలా = వాత్సల్యము కలిగియున్న; కృతా = చేయబడితిని; కైకేయ్యా = కైకేయిచే; పురుషవ్యాఘ్ర = మానవశ్రేష్ఠుడా; బాలవత్సా = లేగదూడను కలిగియున్న; ఇవ = వలె; గౌః = ఆవు; బలాత్ = బలాత్కారముగ.
భావంః-
మానవశ్రేష్టుడవైన ఓ మహారాజా! లేగదూడపై ఆవుకు ఎంత వాత్సల్యముండునో నా పుత్రుడు అన్ననాకు అంత ప్రేమ ఉన్నది. అటువంటి నన్ను కైకేయి, సింహము గోవును తన దూడనుండి దూరముచేసినట్లు, బలాత్కారముగా నన్ను నాపుత్రునినుండి దూరము చేసినది.
2.43.19.
అనుష్టుప్
న హి తావద్గుణైర్జుష్టమ్
సర్వశాస్త్రవిశారదమ్।
ఏకపుత్రా వినా పుత్రమ్
అహం జీవితుముత్సహే॥
టీకః-
న = జాలను; హి = కదా; తావత్ = అన్ని; ద్గుణైః = సద్గుణములను; జుష్టమ్ = కలిగియున్నవాడు; సర్వ = అన్ని; శాస్త్ర = శాస్త్రములయందు; విశారదమ్ = నేర్పరిని; ఏకపుత్రా = ఏకైక పుత్రుడుగల; వినా = విడిచి; పుత్రమ్ = పుత్రుని; అహం = నేను; జీవితుమ్ = జీవించుటకు; ఉత్సహే = ఉత్సహింప
భావంః-
అన్ని సద్గుణములను కలిగియున్నవాడును, అన్ని శాస్త్రములందును నేర్పరి యైన నాయొక్క ఏకైకపుత్రుని విడిచి జీవింపజాలను.
2.43.20.
అనుష్టుప్
న హి మే జీవితే కించిత్
సామర్థ్యమిహ కల్ప్యతే।
అపశ్యన్త్యాః ప్రియం పుత్రమ్
మహాబాహుం మహాబలమ్॥
టీకః-
న = లేదు; హి = కదా; మే = నాకు; జీవితే = జీవించుటయందు; కించిత్ = కొంచెమైనను; సామర్థ్యమ్ = సామర్థ్యము; ఇహ = ఈ; కల్ప్యతే = కల్పించుట; అపశ్యన్త్యాః = చూడబడని; ప్రియం = ప్రియమైన; పుత్రమ్ = పుత్రుని; మహాబాహుమ్ = గొప్ప భుజబలుని; మహాబలమ్ = మహాబలశాలిని.
భావంః-
ఆజానుబాహుడును మహాబలశాలియు ఐన నాయొక్క ప్రియమైన పుత్రుని చూడకుండగజీవించుటకు నాకు ఎంత మాత్రము సామర్ధ్యము లేదు.
2.43.21.
జగతి.
అయం హి మాం దీపయతే సముత్థితః
తనూజశోకప్రభవో హుతాశనః।
మహీమిమాం రశ్మిభిరుద్ధతప్రభః
యథా నిదాఘే భగవాన్ దివాకరః॥
టీకః-
అయం = ఈ; హి = కదా; మాం = నన్ను; దీపయతే = దహించుచున్నది; సముత్థితః = పైకి లేచి; తనూజ = పుత్రునిగూర్చి; శోక = శోకమువలన; ప్రభవః = కలిగిన; హుతాశనః = అగ్ని; మహీమ్ = భూమిని; మామ్ = నన్ను; రశ్మిభిః = కిరణములచే; ఉద్ధత= తీవ్రమైన; ప్రభః = తేజస్సు కలిగియున్న; యథా = వలె; నిదాఘే = గ్రీష్మఋతువునందు; భగవాన్ = భగవంతుడైన; దివాకరః = సూర్యుడు.
భావంః-
పుత్రశోకమువలన కలిగిన ఈ అగ్ని పైకి లేచి, గ్రీష్మ ఋతువునందు తీవ్రమైన తేజస్సుగల సూర్యుడు, తన వేడిమిచే ఈ భూమిని తాపమొందించి నట్లు, నన్ను దహించుచున్నది.
2.43.22.
గద్యం
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే త్రిచత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; త్రిచశ్చత్వారింశః [43] = నలభైమూడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [43] నలభైమూడవ సర్గ సంపూర్ణము.
2.44.1.
అనుష్టుప్.
విలపంతీ తథా తాం తు
కౌసల్యాం ప్రమదోత్తమామ్।
ఇదం ధర్మే స్థితా ధర్మ్యమ్
సుమిత్రా వాక్యమబ్రవీత్॥
టీకః-
విలపంతీ = విలపించుచున్న; తథా = ఆ విధముగా; తాం = ఆ; తు = విశేషముగ; కౌసల్యాం = కౌసల్యను; ప్రమదోత్తమమ్ = ప్రమద + ఉత్తమమ్, స్త్రీలలో ఉత్తమురాలైన; ఇదం = ఇటువంటి; ధర్మే స్థితా = ధర్మము నందు స్థిరమైన బుద్ధి గల; ధర్మ్యమ్ = ధర్మసమ్మతమైన; సుమిత్రా = సుమిత్ర; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను
భావంః-
ఆ విధముగా విలపించుచున్న ఉత్తమ స్త్రీ అయిన కౌసల్యను చూచి, ధర్మమునకు అంకింతమైన బుద్ధి గల సుమిత్ర, ధర్మసమ్మతమైన మాటలతో ఇలా చెప్పెను.
2.44.2.
అనుష్టుప్.
“తవార్యే! సద్గుణైర్యుక్తః
పుత్ర స్స పురుషోత్తమః।
కిం తే విలపితేనైవమ్
కృపణం రుదితేన వా॥
టీకః-
తవ = నీ యొక్క; ఆర్యే = పూజ్యురాలా; సద్గుణైః = సద్గుణసంపన్నుడు; ఉక్తః = పలికెను; పుత్రః = కుమారుడు; సః = అతడు (రాముడు); పురుషోత్తమః = పురుషులలో శ్రేష్ఠుడు; కిం = ఎందుకు; తే = నీవు; విలపితేన = విలపించెదవు; ఇవమ్ = వలె; కృపణం = మూర్ఖుని; రుదితేన = రోదించెదవు; వా = ఏమిటి
భావంః-
“పూజ్యురాలా! నీ పుత్రుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు. పురుషులలో శ్రేష్ఠుడు. నీవు ఈ విధముగా ఏల విలపించెదవు?
2.44.3.
అనుష్టుప్.
యస్తవార్యే! గతః పుత్రః
త్యక్త్వా రాజ్యం మహాబలః।
సాధు కుర్వన్ మహాత్మానమ్
పితరం సత్యవాదినమ్॥
టీకః-
యః = ఏది; తవ = నీ యొక్క; ఆర్యే = ఓ పూజ్యురాలా; గతః = వెళ్ళెను; పుత్రః = కుమారుడు; త్యక్త్వా = త్యజించుట చేత; రాజ్యం = రాజ్యమును; మహాబలః = అమిత శక్తిసంపన్నుడు; సాధు = శిష్టులందరును; కుర్వన్ = ఆచరించిన; మహాత్మానమ్ = మహాత్ముల చేత; పితరం = తండ్రిని; సత్యవాదినమ్ = సత్యసంధుని
భావంః-
రాముడు మహాబలిశాలిౖయెన శ్రేష్ఠుడు. మహాత్ముడైన తండ్రి మాటను సత్యము చేయుటకై రాజ్యమును విడిచి వెళ్ళెను.
2.44.4.
అనుష్టుప్.
శిష్టైరాచరితే సమ్యక్
శశ్వత్ప్రేత్యఫలోదయే।
రామో ధర్మే స్థితః శ్రేష్ఠో
న స శోచ్యః కదాచన॥
టీకః-
శిష్టైః = శిష్టులందరిచేత; ఆచరితః = ఆచరించబడినది; సమ్యక్ = మునుల చేత; శశ్వత్ + ప్రేత్య = మరణానంతరము; ఫలోదయే = మంచి ఫలమును ఇచ్చునది; రామో = రాముని గురించి; ధర్మే స్థితః = ధర్మమార్గమున స్థిరముగా నిలచి; శ్రేష్ఠః = గొప్పవాడు; న = లేదు; సః = అతడు (శ్రీరాముడు); శోచ్యః = విచారించుట; కదాచన = ఎన్నడును
భావంః-
ఇటుల తండ్రిమాట గౌరవించుట శిష్టులందరును ఎల్లప్పుడును చక్కగా ఆచరించినది. మరణానంతరము గూడ మంచి ఫలమును ఇచ్చునది అయిన ధర్మమార్గమునందు స్థిరముగా నిలచి ఉన్నాడు. అట్టి రాముని గూర్చి ఎన్నడును విచారించవలసిన పని లేదు.
2.44.5.
అనుష్టుప్.
వర్తతే చోత్తమాం వృత్తిమ్
లక్ష్మణోఽస్మిన్ సదానఘః।
దయావాన్ సర్వభూతేషు
లాభస్తస్య మహాత్మనః॥
టీకః-
వర్తతే = ప్రవర్తించుచున్నాడు; చ = మఱియు; ఉత్తమాం = ఉత్తమమైన; వృత్తిమ్ = ప్రవృత్తిని; లక్ష్మణః = లక్ష్మణుడు; అస్మిన్ = ఈ యొక్క; సద + అనఘః = దోషరహితుడు; దయావాన్ = దయగలవాడు; సర్వభూతేషు = సకల ప్రాణులయందు; లాభః = లాభమును; తస్య = దానిచే; మహాత్మనః = మహాత్ముడైన
భావంః-
దోషరహితుడూ, సకల ప్రాణులందును దయ గలవాడు అయిన లక్ష్మణుడు ఈ రాముని విషయమున ఉత్తమమైన ప్రవృత్తిని అనగా భక్తిని చూపుచున్నాడు. దానిచే అతడు (రాముడు) లాభము పొందగలడు.
2.44.6.
అనుష్టుప్.
అరణ్యవాసే యద్దుఃఖమ్
జానతీ వై సుఖోచితా।
అనుగచ్ఛతి వైదేహీ
ధర్మాత్మానం తవాత్మజమ్॥
టీకః-
అరణ్యవాసే = అరణ్యవాసములో ఉండే; యద్దుఃఖమ్ = దుఃఖములన్నియు; జానతీవై = తెలిసియే; సుఖోచితా = సుఖములకు; అనుగచ్ఛతి = అనుసరించి వెళ్లినది; వైదేహీ = సీతా దేవి; ధర్మాత్మానం = ధర్మాత్ముడైన; తవాత్మజమ్ = నీ కుమారుని
భావంః-
సుఖములకు అలవాటుపడిన సీత కూడ అరణ్యవాసములో ఉండు కష్టములన్నియు తెలిసియే ధర్మాత్ముడైన నీ కుమారుని అనుసరించి వెళ్లినది.
2.44.7.
అనుష్టుప్.
కీర్తిభూతాం పతాకాం యో
లోకే భ్రమయతి ప్రభుః।
ధర్మసత్యవ్రతధనః
కిం న ప్రాప్తస్తవాత్మజః॥
టీకః-
కీర్తిభూతాం = కీర్తితో నిండిన; పతాకాం = పతాకమును (జెండాను); యః + లోకే = ఈ లోకము మీద; భ్రమయతి = ఎగురవేయుచున్నాడు; ప్రభుః = సర్వ సమర్థుడైన ప్రభువు; ధర్మ = ధర్మము; సత్యవ్రత = సత్య వ్రతము; ధనః = ధనము; కిం న ప్రాప్తః = లభించని; తవాత్మజః = నీ కుమారుడు
భావంః-
ధర్మము, సత్యవ్రతము అనునవియే ధనమని తలచిన, సర్వసమర్థుడైన నీ కుమారుడు, తన కీర్తి పతాకను ఈ లోకము మీద ఎగురవేయుచున్నాడు. అతనికి లభించని సత్ఫలితమేమున్నది,
2.44.8.
అనుష్టుప్.
వ్యక్తం రామస్య విజ్ఞాయ
శౌచం మాహాత్మ్యముత్తమమ్।
న గాత్రమంశుభిస్సూర్యః
సంతాపయితుమర్హతి॥
టీకః-
వ్యక్తం = బయటకు తెలిసెడి; రామస్య = రాముని యొక్క; విజ్ఞాయ = తెలుసుకొని; శౌచం = పరిశుద్ధమైన శీలము; మాహాత్మ్యమ్ = మహాత్మ్యము తెలిసిన; ఉత్తమమ్ = ఉత్తమమైన; న = కాడు; గాత్రమ్ = రాముని శరీరమును; అంశుభిః = కిరణములచే; సూర్యః = సూర్యుడు; సంతాపయితుమ్ = తపింపచేయుట; అర్హతి = అర్హుడు
భావంః-
రాముని పరిశుద్ధమైన శీలము, ఉత్తమమైన మహాత్మ్యము తెలిసిన సూర్యుడు తన కిరణములచే రాముని శరీరమును తపింపచేయడు. తథ్యము.
గమనికః-
(1) శౌచము- వ్యు. శుచి + ణ్, తప్ర., శుచుగా ఉండుట, శౌచము బాహ్యాభంతరమని రెండు విధమలు. ఆ రెంటి యందు శ్రీరాముడు శుద్ధుడే. (2) భీషారేతి సూర్యః అనగా శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరామునికి భయపడి , సూర్యుడు యుక్తముగా (తగినంతగా) ప్రకాశించును, తైత్తిరేయోపనిషత్తు ఆనందవల్లి 8వ మంత్రము.(గీతాప్రెస్ రామాయణము)
2.44.9.
అనుష్టుప్.
శివస్సర్వేషు కాలేషు
కాననేభ్యో వినిస్సృతః।
రాఘవం యుక్తశీతోష్ణః
సేవిష్యతి సుఖోఽనిలః॥
టీకః-
శివః = మంగళకరము; సర్వేషు = సమస్తమైన; కాలేషు = సమయము నందు; కాననేభ్యః = అడవుల నుండి; వినిస్సృతః = వచ్చుచు; రాఘవం = రాముని; యుక్తశీతోష్ణః = సమశీతోష్ణముగా; సేవిష్యతి = సేవించగలదు; సుఖ = సుఖకరముగా ఉన్న; అనిలః = వాయుదేవుడు
భావంః-
అడవుల నుండి వచ్చుచు. సమశీతోష్ణముగా, సుఖకరముగా ఉన్న గాలి, మంగళకరమగుచు, రాముని సర్వకాలములందును సేవించగలదు.
2.44.10.
అనుష్టుప్.
శయానమనఘం రాత్రౌ
పితేవాభిపరిష్వజన్।
రశ్మిభిస్సంస్పృశన్ శీతైః
చంద్రమాహ్లాదయిష్యతి॥
టీకః-
శయానమ్ = నిద్రించుచున్న; అనఘం = పుణ్యచరిత గల రాముని; రాత్రౌ = రాత్రియందు; పితేవ = తండ్రి వలె; అభిపరిష్వజన్ = కౌగిలించుకొని; రశ్మిభిః = కిరణముల చేత; సంస్పృశన్ = స్పృశించుచు; శీతైః = చల్లనైన; చంద్రమ్ = చంద్రుడు; ఆహ్లాదయిష్యతి = ఆనందింపచేయగలడు
భావంః-
రాత్రి నిద్రించుచున్న ఆ రాముని, చంద్రుడు తన కిరణముల చేత స్పృశించుచు, తండ్రి వలె కౌగిలించుకొని ఆనందింపచేయగలడు.
2.44.11.
అనుష్టుప్.
దదౌ చాస్త్రాణి దివ్యాని
యస్మై బ్రహ్మా మహౌజసే।
దానవేన్ద్రం హతం దృష్ట్వా
తిమిధ్వజసుతం రణే॥
టీకః-
దదౌ = ఇచ్చెను; చ = మరింతగా; అస్త్రాణి = అస్త్రములను; దివ్యాని = దివ్యమైన; యస్మై = దానికి ప్రతిగా (రాముడు చేసిన సహాయమునకు ప్రతిగా); బ్రహ్మా = బ్రహ్మదేవుడు; మహా = గొప్ప; ఓజసః = తేజస్సు గలవి; దానవేంద్రం = దానవ + ఇంద్రం = దానవేంద్రుని; హతం = సంహరింపగా; దృష్ట్వా = సంతోషించిన; తిమిధ్వజ = శంబరాసురుని నామాంతరము; సుతం = కుమారుని; రణే = యుద్ధమునందు
భావంః-
పూర్వము రాముడు యుద్ధమునందు, దానవేంద్రుడైన శంబరాసుర పుత్రుని సంహరింపగా సంతోషించిన బ్రహ్మదేవుడు గొప్ప తేజస్సు గల అతనిని దివ్య అస్త్రములను ఇచ్చెను.
గమనికః-
(1) తిమిధ్వజుడు అను మరొక పేరు గల శంబరాసురుడు దశరథుని శత్రువు. అతని కొడుకును రాముడు సంహరించెను. (2) శబరుడు ఒకానొక రాక్షసుడు. వీడు మాయావిద్యలో ఆఱితేఱినవాడు. మన్మథునిచే మట్టుపెట్టబడెను (అ) శంబరి- మాయ, గారడీ, శాబరి, శంబరాసురునికి సంబంధించిన విద్య, ఆంధ్రశబ్ద రత్నాకరము.
2.44.12.
అనుష్టుప్.
స శూరః పురుషవ్యాఘ్రః
స్వబాహుబలమాశ్రితః।
అసంత్రస్తోఽప్యరణస్థో
వేశ్మనీవ నివత్స్యతి॥
టీకః-
సః = అతడు; శూరః = శూరుడు; పురుషవ్యాఘ్రః = పురుషులలో శ్రేష్టుడు; స్వ = తన; బాహుబలమ్ = భుజబలము; ఆశ్రితః = సహాయముతో; అసంత్రస్తః = నిర్భయముగా, సంత్రాసము (మిక్కిలి వెఱపు, భీతి) లేనివాడు; అపి = అయినను; అరణ్యస్థః = అరణ్యములో ఉన్నను; వేశ్మని + ఇవ = ఇంటిలో నివసించునట్లు; నివత్స్యతి = నివసించగలడు
భావంః-
శూరుడు, పురుషులలో శ్రేష్ఠుడు అయిన అట్టి రాముడు, అరణ్యములలో ఉన్నను, తన బాహుబలము సహాయముచే నిర్భయుడై, ఇంటిలో నివసించునట్లు నివసించగలడు.
2.44.13.
అనుష్టుప్.
యస్యేషుపథమాసాద్య
వినాశం యాంతి శత్రవః।
కథం న పృథివీ తస్య
శాసనే స్థాతుమర్హతి॥
టీకః-
యస్య = ఎవని యొక్క (ఏ రాముని యొక్క); ఇషుపథమ్ = బాణముల యొక్క లక్ష్యం; ఆసాద్య = పొందుతుంది; వినాశం = నాశనము; యాంతి = ప్రవేశించడం; శత్రవః = శత్రువులు; కథం = ఎందుకు; న = లేదు; పృథివీ = భూమి; తస్య = అటువంటి రామునిలో; శాసనః = నియమము; స్థాతుమ్ = స్థిరముగా; అర్హతి = ఉండును
భావంః-
ఏ రాముని బాణములకు గురిౖయెనచో శత్రువులు తప్పక నశింతురో, ఆ రామునికి ఈ భూమి యంతయు వశము కాక ఎట్లుండును?
2.44.14.
అనుష్టుప్.
యా శ్రీశ్శౌర్యం చ రామస్య
యా చ కల్యాణసత్వతా।
నివృత్తారణ్యవాసః స్వం
క్షిప్రం రాజ్యమవాప్స్యతి॥
టీకః-
యా = ఏది; శ్రీః = లక్ష్మి; శౌర్యం చ = పరాక్రమము; చ = మఱియు; రామస్య = రామునియందు; యా = ఏది; చ = మఱియు; కల్యాణ = మంగళప్రద మైన; సత్వత = బలము; నివృత్తః = పూర్తిచేసుకొనిన; అరణ్యవాసః = అరణ్యవాసము కలవాడు; స్వం = తాను; క్షిప్రం = శీఘ్రముగా; రాజ్యమ్ = రాజ్యమును; అవాప్స్యతి = పొందగలడు
భావంః-
రామునికి లక్ష్మి, శౌర్యము, మంగళప్రదమైన బలము ఉన్నవి. వీటితో కూడిన రాముడు, అరణ్యవాసమును పూర్తి చేసుకొని శీఘ్రముగా తన రాజ్యమును పొందగలడు.
2.44.15.
అనుష్టుప్.
సూర్యస్యాపి భవేత్సూర్యో
హ్యగ్నేరగ్ని ప్రభోః ప్రభుః।
శ్రియః శ్రీశ్చ భవేదగ్ర్యా
కీర్తిః కీర్త్యాః క్షమాక్షమా॥
టీకః-
సూర్యస్య = కూడ; అపి = కూడ; భవేత్ = కాగలడు; సూర్యః = సూర్యునిగా; అగ్నేః = అగ్నికి; అగ్నిః = అగ్నిగాను; ప్రభోః = ప్రభువునకు; ప్రభుః = ప్రభువుగాను; శ్రియః = సంపదలకు; శ్రీః = సంపదగాను; చ = మఱియు; భవేత్ = కాగలడు; అగ్య్రా = శ్రేష్ఠమైన; కీర్తిః = కీర్తికి; కీర్త్యః = కీర్తిగాను; క్షమాః = ఓర్పునకు; క్షమా = ఓర్పుగాను
భావంః-
రాముడు సూర్యునకు కూడ సూర్యుడుగాను, అగ్నికి అగ్నిగాను, ప్రభువునకు ప్రభువుగాను, సంపదకు సంపదగాను, కీర్తికి శ్రేష్ఠమైన కీర్తిగాను, ఓర్పుకు ఓర్పుగాను కాగలడు.
2.44.16.
అనుష్టుప్.
దైవతం దైవతానాం చ
భూతానాం భూతసత్తమః।
తస్య కే హ్యగుణా దేవి!
వనే వాప్యథవా పురే॥
టీకః-
దైవతం = దేవతలకు; దైవతానాం చ = దేవతగాను; భూతానాం = సమస్త జీవులకు; భూతసత్తమః = మనవ శ్రేష్ఠుడుగాను; తస్య = అతని యొక్క; కే హి = ఏమి; హి = కలుగును; అగుణా = మేలుకానిది, చెడుగు; దేవి = మహారాణి; వనే = వనములో; వా = లేదా; అపి = ఐనను; అథవా = లేదంటే; పురే = పురములో
భావంః-
దేవతలకు దేవత, సకల జీవములలో సర్వోత్తమమానవుడు. అట్టి రామునకు అరణ్యములో ఉన్నను, పురములో ఉన్నను ఏ లోపములు ఉండును?
2.44.17.
అనుష్టుప్.
పృథివ్యా సహ వైదేహ్యా
శ్రియా చ పురుషర్షభః।
క్షిప్రం తిసృభిరేతాభిః
సహ రామోఽభిషేక్ష్యతే॥
టీకః-
పృథివ్యా = తో; సహ = కలిసి; వైదేహ్యా = సీతాదేవితో; శ్రియా చ = సంపదతో మఱియు; పురుషర్షభః = పురుష శ్రేష్ఠుడైన; క్షిప్రం = త్వరలో; త్రిసృభిః = ముగ్గురితో; ఏతాభిః = వీటితో; సహ = కలిసి; రామః = రామునికి; అభిషేక్ష్యతే = రాజ్యాభిషేకము
భావంః-
పురుష శ్రేష్ఠుడైన రామునకు భూమి, సీత, లక్ష్మి అను ఈ ముగ్గురితో కలసి, రాజ్యాభిషేకము జరుగగలదు. అనగా, రాముడు సీతాదేవితో కలిసి ఈ భూమండలము, సకల సంపదలను ఏలగలడు.
2.44.18.
అనుష్టుప్.
దుఃఖజం విసృజంత్యస్రః
నిష్క్రామంతముదీక్ష్య యమ్।
అయోధ్యాయాం జనాస్సర్వే
శోకవేగసమాహతాః॥
టీకః-
దుఃఖజం = దుఃఖమువలన కలిగిన; విసృజంతి = విడుచుట; అస్రః = కన్నీటిని; నిష్క్రామంతమ్ = బయలుదేరి; ఉదీక్ష్య = చూచెను; యమ్ = ఏ రాముడు; అయోధ్యాయాం = అయోధ్యా నగరములో; జనాః = ప్రజలు; సర్వే = అన్నిటినీ; శోకవేగ = శోకవేగముచే; సమాహతాః = పీడితులై
భావంః-
ఏ రాముని వనమునకు ప్రయాణమై వెళ్లుచుండగ చూచి, అయోధ్యలోని జనులందరు, శోకవేగముచే పీడితులై, కన్నీరు విడుచుట జరిగెనో.
2.44.19.
అనుష్టుప్.
కుశచీరధరం దేవమ్
గచ్ఛంతమపరాజితమ్।
సీతేవానుగతా లక్ష్మీ
స్తస్య కిం నామ దుర్లభమ్॥
టీకః-
కుశ చీర = నార చీరలు; ధరం = ధరించి; దేవమ్ = దివ్యమైన వాడు; గచ్ఛంతమ్ = వెళ్లుచున్న; అపరాజితమ్ = పరాజయము ఎరుగని; సీత = సీత; ఏవ = వలె; అనుగతా = అనుసరించినదో; లక్ష్మిః = రాజ్యలక్ష్మి; తస్య = అటువంటి రామునికి; కిం నామ = ఏది; దుర్లభమ్ = పొందజాలనిది , అసాధ్యము
భావంః-
నార చీరలు ధరించి వెళ్లుచున్న, పరాజయము అనునది ఎరుగని ఆ రాముని అనుసరించి, సీతాదేవి రూపంలో రాజ్యలక్ష్మి కూడ వెళ్లినదో, అట్టి రాముడు పొందజాలనిది ఈ లోకములో ఏమి ఉన్నది?
2.44.20.
అనుష్టుప్.
ధనుర్గ్రహవరో యస్య
బాణఖడ్గాస్త్రభృత్స్వయమ్।
లక్ష్మణో వ్రజతి హ్యగ్రే
తస్య కిం నామ దుర్లభమ్॥
టీకః-
ధనుర్గహ = ధనుర్థరులలో; వరః = శ్రేష్ఠుడైన; యస్య = వీరిలో; బాణ = బాణములు; ఖడ్గ = ఖడ్గములు; అస్త్రభృత్ = ఇతర అస్త్రములను; స్వయమ్ = స్వయముగా; లక్ష్మణః = లక్ష్మణుడు; వ్రజతి = ధరించి; హి = నిశ్చయంగా; అగ్రే = ముందుగా; తస్య = ఆ రామునికి; కిం నామ = ఏది ఉండును; దుర్లభమ్ = దుర్లభమైనది
భావంః-
ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు స్వయముగా బాణములు, ఖడ్గములు, ఇతర ఆయుధములు ధరించి, రాముని అనుసరించుచుండగా, ఆ రామునకు దుర్లభమైనది యేది ఉండును?
2.44.21.
అనుష్టుప్.
నివృత్తవనవాసం తమ్
ద్రష్టాసి పునరాగతమ్।
జహిశోకం చ మోహం చ
దేవి! సత్యం బ్రవీమి తే॥
టీకః-
నివృత్త = తిరిగివచ్చి; వనవాసమ్ = వనవాసమునుండి; తమ్ = అతడు (ఆ రాముడు); ద్రష్టాసి = చూడగలవు; పునరాగతమ్ = మరల వచ్చుట; జహి = విడిచిపెట్టు; శోకమ్ = శోకమును; చ = మఱియును; మోహమ్ = మోహమును; చ = మఱియును; దేవి = ఓ కౌసల్యా; సత్యం = సత్యమును; బ్రవీమి = చెప్పుచున్నాను; తే = నీవు
భావంః-
రాముడు వనవాసమునుండి వెనుతిరిగి మరలవచ్చుట నీవు తప్పక అతనిని చూడగలవు. అందుచే శోకమును, మోహమును విడువుము. కౌసల్య మహారాణి! నేను సత్యమునే చెప్పుచున్నాను.
2.44.22.
అనుష్టుప్.
శిరసా చరణావేతౌ
వందమానమనిందితే।
పునర్ద్రక్ష్యసి కల్యాణి!
పుత్రం చంద్రమివోదితమ్॥
టీకః-
శిరసా = శిరస్సుతో; చరణాః = చరణములకు; ఏతౌ = వీటి ద్వయమును; వందమానమ్ = నమస్కరించుచుండగా; అనిందితః = నిందలేనివాడు; పునః = మరల; ద్రక్ష్యసి = చూడగలవు; కల్యాణి = ఓ శుభప్రదమైన కౌసల్యా; పుత్రం = నీ కుమారుని; చంద్రమ్ = చంద్రుని; ఇవ = వలె; ఉదితమ్ = ఉదయించిన
భావంః-
నీ పుత్రుడు వచ్చి నీ పాదములకు గౌరవముగా నమస్కరించుచుండగా, ఉదయించిన చంద్రుని వంటి అతనిని మరల చూడగలవు.
2.44.23.
అనుష్టుప్.
పునః ప్రవిష్టం దృష్ట్వా తమ్
అభిషిక్తం మహాశ్రియమ్।
సముత్స్రక్ష్యసి నేత్రాభ్యామ్
క్షిప్రమానందజం పయః॥
టీకః-
పునః = మరల; ప్రవిష్టం = వచ్చిన; దృష్ట్వా = చూచి; తమ్ = అతనిని; అభిషిక్తం = రాజ్యాభిషిక్తుడై; మహాశ్రియమ్ = గొప్ప తేజస్సుతో; సముత్స్రక్ష్యసి = విడువగలవు; నేత్రాభ్యామ్ = కంటి నుండి; క్షిప్రమ్ = త్వరలో; ఆనందజం పయః = ఆనంద బాష్పములను
భావంః-
రాముడు మరల వచ్చి రాజ్యాభిషిక్తుడై, గొప్ప తేజస్సుతో ప్రకాశించుచుండగా, అతనిని చూచి, అచిరకాలములో ఆనందాశ్రువులను విడువగలవు.
2.44.24.
అనుష్టుప్.
మా శోకో దేవి! దుఃఖం వా
న రామే దృశ్యతేఽశివమ్।
క్షిప్రం ద్రక్ష్యసి పుత్రం త్వమ్
ససీతం సహలక్ష్మణమ్॥
టీకః-
మా = జరుగదు; శోకః = శోకము; దేవి = ఓ కౌసల్యా; దుఃఖం వా = దుఃఖము లేదా; న = కలుగదు; రామే = రామునితో; దృశ్యతే = చూడగలవు; అశివమ్ = అమంగళము; క్షిప్రం = త్వరలో; ద్రక్ష్యసి = చూడగలవు; పుత్రం = కుమారుడు; త్వమ్ = నీవు; స సీతమ్ = సీతతో పాటు; సహ లక్ష్మణమ్ = లక్ష్మణునితో కూడిన
భావంః-
రామునికి ఎట్టి అమంగళము కలుగదు. అందుచే నీవు శోకమును దుఃఖమును విడువుము. సీతాలక్ష్మణులతో కూడిన నీ కుమారుని, అచిరకాలములో చూడగలవు.
2.44.25.
అనుష్టుప్.
త్వయా శేషో జనశ్చైవ
సమాశ్వాస్యో యదాఽనఘే!।
కిమిదానీమిదం దేవి!
కరోషి హృది విక్లబమ్॥
టీకః-
త్వయా = నీచే; శేషః = మిగిలినవారిని; జనః = ప్రజలు; చైవ = అందరిని; సమాశ్వాస్యః = ఓదార్చవలసినదానవు; యదా = అయితే; అనఘే = పుణ్యాత్మురాల; కిమ్ = ఎందుకు; ఇదానీమ్ = ఇప్పుడు; ఇదం = ఇట్లు; దేవి = ఓ కౌసల్యా; కరోషి = చేసుకొనుచున్నావు; హృది = హృదయమును; విక్లబమ్ = వికలముగా
భావంః-
మహపుణ్యాత్మురాలా! అంతఃపురములోని వారందరినీ ఓదార్చవలసిన దానవు నీవు. కౌసల్యాదేవీ! ఇదేమిటి? నీవే ఇట్లు మనస్సును వికలముగా చేసుకొనుచుంటివు.
2.44.26.
అనుష్టుప్.
నార్హా త్వం శోచితుం దేవి!
యస్యాస్తే రాఘవస్సుతః।
న హి రామాత్పరో లోకే
విద్యతే సత్పథే స్థితః॥
టీకః-
న = కాదు; అర్హా = అర్హురాలవు; త్వం = నీవు ; శోచితుం = శోచనీయము; దేవి = ఓ కౌసల్యా; యస్యాః = ఏదైతే; తే = నీకు; రాఘవః = రాముని వంటి; సుగాతః = కుమారుని; న హి = ఎక్కడను లేడు; రామాత్ = రాముని వంటి; పరః = ఇతర; లోకే = లోకములో; న = ఎవరునూ; విద్యతే = తెలియబడుట; సత్పథే = సన్మార్గములో; స్థితః = ఉన్నవాడు
భావంః-
మహారాణీ! రాముని వంటి కుమారుని కనిన నీవు ఈ విధముగా విచారముగా ఉండకూడదు. ఈ లోకములో, రాముని వలె సన్మార్గములో ఉన్నవాడు ఎవ్వడును లేడు.
2.44.27.
అనుష్టుప్.
అభివాదయమానం తమ్
దృష్ట్వా ససుహృదం సుతమ్।
ముదాశ్రు మోక్ష్యసే క్షిప్రమ్
మేఘలేఖేవ వార్షికీ॥
టీకః-
అభివాదయమానం = నమస్కరించుచుండగా; తమ్ = నీవు; దృష్ట్వా = చూచి; స= సహితముగా; సుహృదమ్ = స్నేహితులు; సుతమ్ = కుమారుని; ముదాః = సంతోషముతో; అశ్రు = ఆనందాశ్రువులు; మోక్ష్యసే = విడువగలవు; క్షిప్రమ్ = అచిరకాలములో; మేఘలేఖఇవ = మేఘపంక్తి; ఇవ = వలె; వార్షికీ = వర్షాకాలమునందు
భావంః-
స్నేహితులతో కూడ వచ్చి, నమస్కరించున్న, నీకుమారుని చూచి నీవు అచిరకాలములో, వర్షాకాలములో మూగిన మేఘాలు వర్షించినట్లు, ఆనందాశ్రువులను వర్షించెదవు.
2.44.28.
అనుష్టుప్.
పుత్రస్తే వరదః క్షిప్రమ్
అయోధ్యాం పునరాగతః।
పాణిభ్యాం మృదుపీనాభ్యామ్
చరణౌ పీడయిష్యతి॥
టీకః-
పుత్రః = కుమారుడు; తే = నీ యొక్క; వరదః = వరములను ఇచ్చువాడు; క్షిప్రమ్ = త్వరలోనే; అయోధ్యాం = అయోధ్యా నగరమునకు; పునరాగతః = తిరిగి వచ్చి; పాణిభ్యాం = చేతులతో; మృదు = మృదువైన; పీనాభ్యామ్ = బలిష్ఠమైన; చరణౌ = పాదద్వయమును; పీడయిష్యతి = స్పృశింపగలడు
భావంః-
వరములను ఈయ సమర్థుడైన నీ కుమారుడు, శీఘ్రముగా అయోధ్యకు తిరిగి వచ్చి, మెత్తని బలిష్ఠమైన చేతులతో, నీ పాదములను రెంటిన స్పృశించును.
2.44.29.
అనుష్టుప్.
అభివాద్య నమస్యంతమ్
శూరం ససుహృదం సుతమ్।
ముదాఽస్రైః ప్రోక్ష్యసి పునః
మేఘరాజిరివాచలమ్”॥
టీకః-
అభివాద్య = అభివాదము చేసి; నమస్యంతమ్ = నమస్కరించుచుండగా; శూరమ్ = శూరుడైన; స = సహితుడైవాడు; సుహృదమ్ = మిత్రులు; సుతమ్ = కుమారుని; ముదాః అస్రైః = ఆనందబాష్పములతో; ప్రోక్ష్యసి = తడుపగలవు; పునః = మరల; మేఘరాజిః = మేఘపంక్తి; ఇవ = వలె; అచలమ్ = పర్వతమును
భావంః-
మిత్రసహితుడై శూరుడు ఐన నీ కుమారుడు, అభివాదము చేసి, నమస్కరించుచుండగా, మేఘపంక్తి పర్వతమును తడిపినట్లు అతనిని మరల ఆనందాశ్రువులతో తడుపెదవు.”
2.44.30.త్రిష్టుప్
ఆశ్వాసయంతీ వివిధైశ్చ వాక్యైః
వాక్యోపచారే కుశలాఽనవద్యా।
రామస్య తాం మాతరమేవముక్త్వా
దేవీ సుమిత్రా విరరామ రామా॥
టీకః-
ఆశ్వాసయంతీ = ఓదార్చెను; వివిధైః = అనేక రకములైన; చ = మఱికొన్ని; వాక్యైః = మాటలను; వాక్యోపచారే = ఓదార్పుపలుకుల యందు; కుశలా = నేర్పు కలది; అనవద్యా = ఎట్టి దోషములు లేనిది; రామస్య = రాముని యొక్క; తాం = అతని; మాతరమ్ = తల్లిని; ఏవమ్ = అన్నియును; ఉక్త్వా = పలికి; దేవీ సుమిత్రా = సుమిత్రాదేవి; విరరామ = ఊరకుండెను; రామా = మనోహరమైన
భావంః-
అనునయించుట యందు నేర్పు కలది, ఎట్టి దోషములు లేనిది అయిన మహారాణి సుమిత్ర, ఈ విధముగా మరికొన్ని ఓదార్పు మాటలచే రామమాత కౌసల్యను ఓదార్చి, ఊరకుండెను.
2.44.31.త్రిష్టుప్
నిశమ్య తల్లక్ష్మణమాతృవాక్యం
రామస్య మాతుర్నరదేవపత్న్యాః।
సద్యశ్శరీరే విననాశ శోకః
శరద్గతో మేఘ ఇవాల్పతోయః॥
టీకః-
నిశమ్య = వినిన పిమ్మట; తత్ = ఆ; లక్ష్మణ = లక్ష్మణుని యొక్క; మాతృః = తల్లి అయిన సుమిత్ర; వాక్యం = మాటలు; రామస్య = రాముని యొక్క; మాతుః = తల్లి; నరదేవపత్న్యాః = దశరథ మహారాజు భార్య; సద్యః = త్వరగా; శరీరే = శరీరమునందు; విననాశ = లీనమయ్యెను; శోకః = శోకము; శరద్గతః = శరత్కాలమునందు; మేఘ ఇవ = మేఘము వలె; అల్పతోయః = అల్పమైన ఉదకము గల
భావంః-
లక్ష్మణుని తల్లి సుమిత్ర మాటలు వినిని పిమ్మట, రాముని తల్లిౖ కౌసల్య శోకమును, శరత్కాలమునందలి తేలికపాటి మేఘము వలె వెంటనే ఆమె యందే లీనమైపోయెను.
2.44.32.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; చతుశ్చత్వారింశః [44] = నలభైనాలుగవ; సర్గః = సర్గ
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [44] నలభైనాలుగవ సర్గ సంపూర్ణము.
2.45.1.
అనుష్టుప్.
అనురక్తా మహాత్మానమ్
రామం సత్యపరాక్రమమ్।
అనుజగ్ముః ప్రయాన్తం తమ్
వనవాసాయ మానవాః॥
టీకః-
అనురక్తా = (రామునియందు) ప్రేమ కలిగిన; మహాత్మానమ్ = మహాత్ముని; రామం = రాముని; సత్యపరాక్రమమ్ = సత్యపరాక్రముని; అనుజగ్ముః = అతనిని అనుసరించి; ప్రయాన్తం = వెళ్లుచుండగా; తమ్ = ఆ; వనవాసాయ = వనవాసమునకు; మానవాః = పౌరులు
భావంః-
రాముడు వనవాసమునకై వెళ్లుచుండగా అతనిపై ప్రేమ గల పౌరులందరును అతనిని అనుసరించి వెళ్లిరి.
2.45.2.
అనుష్టుప్.
నివర్తితేఽపి చ బలాత్
సుహృద్వర్గే చ రాజని।
నైవ తే సంన్యవర్తంత
రామస్యానుగతా రథమ్॥
టీకః-
నివర్తితే = వెనుకకు పంపబడెను; అపి = ఐనను; చ = కూడ; బలాత్ = బలవంతముగా; సుహృత్ = మిత్రల; వర్గే = సమూహము; చ = ఇంకనూ; రాజని = మహారాజుని; నైవ = లేదు; తే = వారు; సంన్యవర్తంత = వెనుకకు మరలుట; రామస్య = రాముని యొక్క; అనుగతా = అనుసరించుచున్న; రథమ్ = రథమును
భావంః-
రాముని మిత్రవర్గమును, దశరథ మహారాజునూ బలవంతముగా వెనుకకు పంపివేసినను, రాముని రథమును అనుసరించి వెళ్లుచున్న ఆ పౌరులు మాత్రము తిరిగి వెళ్లుటలేదు.
2.45.3.
అనుష్టుప్.
అయోధ్యానిలయానాం హి
పురుషాణాం మహాయశాః।
బభూవ గుణసమ్పన్నః
పూర్ణచంద్ర ఇవ ప్రియః॥
టీకః-
అయోధ్యా = అయోధ్యలో; నిలయానాం = నివసించుచున్న; హి = విశేషముగా; పురుషాణాం = పౌరులందరికీ; మహాయశాః = యశస్సు కలిగిన; బభూవ = ఉండెను; గుణసమ్పన్నః = గుణములతో సంపన్నుడైన; పూర్ణచంద్ర ఇవ = పూర్ణచంద్రుని వలె; ప్రియః = ఇష్టుడైన
భావంః-
అయోధ్యలో నివసించు పౌరులందరికీ రాముడు, పూర్ణచంద్రుని వలె, చాల ఇష్టుడై ఉండెను.
2.45.4.
అనుష్టుప్.
స యాచ్యమానః కాకుత్స్థః
స్వాభిః ప్రకృతిభిస్తదా।
కుర్వాణః పితరం సత్యమ్
వనమేవాన్వపద్యత॥
టీకః-
సః = ఆ రాముని; యాచ్యమానః = ప్రార్థించినప్పటికీ; కాకుత్స్థః = కకుత్థ్స వంశీయుడైన రాముడు; స్వాభిః = తన యొక్క; ప్రకృతిభిః = ప్రజలు; తదా = ఆవిధముగా; కుర్వాణః = చేయుటకు; పితరం = తండ్రిని; సత్యమ్ = సత్యమును; వనమ్ = అరణ్యములకుపోవుటకు; ఏవ = మాత్రమే; అన్వపద్యత = అనుసరించెను.
భావంః-
తన ప్రజలందరును, ఎంత ప్రార్థించినను వినక, ఆ రాముడు తండ్రిని సత్యవంతుని చేయుటకే నిర్ణయించుకుని, వనమునకు వెళ్లసాగెను.
2.45.5.
అనుష్టుప్.
అవేక్షమాణః సస్నేహమ్
చక్షుషా ప్రపిబన్నివ।
ఉవాచ రామః స్నేహేన
తాః ప్రజాః స్వాః ప్రజా ఇవ॥
టీకః-
అవేక్షమాణః = చూచుచూ; సస్నేహమ్ = స్నేహముతో; చక్షుషా = కంటితో; ప్రపిబన్నివ = త్రాగివేయుచున్నట్లు; ఉవాచ = పలికెను; రామః = రాముడు; స్నేహేన = ప్రేమ పూర్వకముగా; తాః = ఆ; ప్రజాః = ప్రజలను; స్వాః = తన యొక్క; ప్రజా = సంతానము; ఇవ = వలె.
భావంః-
అతడు ఆ ప్రజలను తన సంతానము వలె, కంటితో త్రాగి వేయుచున్నట్లు ప్రేమపూర్వకముగా చూచుచు స్నేహముతో ఇట్లు చెప్పెను.
2.45.6.
అనుష్టుప్.
“యా ప్రీతిర్బహుమానశ్చ
మయ్యయోధ్యానివాసినామ్।
మత్ప్రియార్థం విశేషేణ
భరతే సా నివేశ్యతామ్॥
టీకః-
యా = ఏదైతే; ప్రీతిః = ప్రేమః బహుమానశ్చ = గౌరవములను; మయి = నాకు; అయోధ్యా = అయోధ్యా నగర; నివాసినామ్ = నివాసులైన; మత్ = నాకు; ప్రియార్థం = సంతోషము కలిగించుట కొఱకు; విశేషేణ = అధికముగా; భరతః = భరతుని; సా = వైపు; నివేశ్యతామ్ = మందిరము.
భావంః-
“అయోధ్యా నివాసులైన మీరందరును, నాపై మీకు గల ప్రేమ గౌరవములను, భరతుని వైపు చూపుడు. అట్లు చేసినచో నాకు అధికముగా సంతోషము కలుగును.
2.45.7.
అనుష్టుప్.
స హి కల్యాణచారిత్రః
కైకేయ్యానందవర్ధనః।
కరిష్యతి యథావద్వః
ప్రియాణి చ హితాని చ॥
టీకః-
సః = భరతుడు; హి = కూడా; కల్యాణ చారిత్రః = మంగళకరమైనచరిత్ర కలవాడ; కైకేయ్యా = కైకేయికి; నందవర్ధనః = ఆనందమును కలిగించువాడు; కరిష్యతి = చేయగలడు; యథావత్ = సక్రమముగా; వః = మీకు; ప్రియాణి = ఇష్టములు; చ = మఱియు; హితాని = క్షేమకరములు; చ = మఱియు.
భావంః-
భరతుడు, మంగళకరమైన చరిత్ర కలవాడు. మీకు నచ్చేవి, క్షేమకరములు అయిన పనులను చక్కగా చేయగలడు.
2.45.8.
అనుష్టుప్.
జ్ఞానవృద్ధో వయోబాలో
మృదుర్వీర్యగుణాన్వితః।
అనురూపః స వో భర్తా
భవిష్యతి భయాపహః॥
టీకః-
జ్ఞాన = జ్ఞానముచే; వృద్ధః = శ్రేష్ఠుడు; వయోబాలః = వయస్సుచే చిన్నవాడైనను; మృదుః = మృదువైన స్వభావము; వీర్య = పరాక్రమమును; గుణ = సద్గుణములను; అన్వితః = కలిగిః అనురూపః = ఒప్పుచున్నాడు; సః = అతడు; వో = తగిన; భర్తా = ప్రభువు; భవిష్యతి = కాగలడు; భయాపహః = భయములను తొలగించువాడు
భావంః-
అతడు వయస్సుచే చిన్నవాడైనను, జ్ఞానము చేత వృద్ధుడు. మృదువైన స్వభావము కలవాడు. పరాక్రమముతోను, సద్గుణములతోను ఒప్పుచున్నవాడు. అతడు మీకు తగిన ప్రభువై మీ సమస్త భయములను తొలగించును.
2.45.9.
అనుష్టుప్.
స హి రాజగుణైర్యుక్తో
యువరాజః సమీక్షితః।
అపి చాపి మయా శిష్టైః
కార్యం వో భర్తృశాసనమ్॥
టీకః-
సః = ఆతడు; హి = మాత్రమే; రాజగుణైః = రాజగుణములతో; యుక్తః = కూడిన; యువరాజః = యువరాజుగా; సమీక్షితః = నియుక్తుడైనాడు; అపి చ = ఇక ముందు; మయా = నా చేత; శిష్టైః = మిగిలినరాకుమారులచేత; కార్యం = చేయవలసిన;వః = మీరును; భర్తృ = ప్రభువు; శాసనమ్ = ఆజ్ఞను
భావంః-
సకల రాజగుణములుకల భరతుడు యువరాజుగా నియుక్తుడైనాడు. నేను, లక్ష్మణ, శత్రుఘ్నువు, మీరు, మనమందరము కూడ ప్రభువు ఆజ్ఞను అనుసరించవలెను.
గమనికః-
రాజగుణములు- షణ్మవతి రాజగుణములు, సంకేత పదకోశము, రవ్వా శ్రీహరి, వస్తురత్నకోశః. మరింత వివరములకొఱకు వివరణల విభాగంలో పారిభాషిక పదమలు ఉపవిభాగములో, షణ్మవతి శీర్షిక చూడండి.
2.45.10.
అనుష్టుప్.
న సంతప్యేద్యథా చాసౌ
వనవాసం గతే మయి।
మహారాజస్తథా కార్యో
మమ ప్రియచికీర్షయా॥
టీకః-
న = లేకుండా; సంతప్యేత్ = దుఃఖించుచుండుట; యథా = ఏ విధముగా; చ = ఐనను; అసౌ = ఈ; వనవాసం = అరణ్యవాసమునకు; గతే = వెళ్లిన; మయి = నాచే; మహారాజః = మహారాజు; తథా = ఆ విధముగా; కార్యః = చేయవసినది పని; మమ = నాకు; ప్రియచికీర్షయా = సంతోషము కలిగించునది.
భావంః-
నేను వనవాసమునకు వెళ్లిన పిమ్మట మహారాజు దుఃఖింపకుండునట్లు చూసుకొనవలెను. ఇదే మీరు నాకు సంతోషము కలిగించుటకు మహారాజునకు చేయవలసినది.
2.45.11.
అనుష్టుప్.
యథా యథా దాశరథిః
ధర్మ ఏవాస్థితోఽభవత్।
తథా తథా ప్రకృతయో
రామం పతిమకామయన్॥
టీకః-
యథా యథా = ఎలా ఎలా ఐతే; దాశరథిః = దశరథుని కుమారుడైన రాముడు; ధర్మః = ధర్మము; ఏవ = పైననే; అస్థితః = స్థైర్యము ఉండువాడు; అభవత్ = అయ్యెను; తథా తథా = అలా అలాగుననే; ప్రకృతయః = ప్రజలు; రామం = రాముని; పతిమ్ = రాజుగా; అకామయన్ = కోరుకొనిరి
భావంః-
రాముడు ధర్మముపై స్థైర్యము చూపించినకొలది, ప్రజలు కూడ అతడే మాకు రాజు కావలెను అని కోరిరి.
2.45.12.
అనుష్టుప్.
బాష్పేణ పిహితం దీనమ్
రామః సౌమిత్రిణా సహ।
చకర్షేవ గుణైర్బద్ధ్వా
జనం పురనివాసినమ్॥
టీకః-
బాష్పేణ = కన్నీటితో; పిహితం = నిండిన; దీనమ్ = దీనముగా; రామః = రాముడు; సౌమిత్రిణా = సుమిత్రాదేవి పుత్రుడైన లక్ష్మణుని; సహ = సమేతుడై; చకర్షేవ = ఆకర్షించెను; గుణైః = శ్రేష్ఠ్యత్వముతో వావిళ్ళనిఘంటువు, త్రాడుతో; బద్ధ్వా = కట్టినట్లుగా; జనం = జనులను; పురనివాసినమ్ = పురములో నివసించు
భావంః-
లక్ష్మణ సమేతుడగు రాముడు కన్నీరు కప్పి, దీనముగా ఏడ్చుచున్న ఆ పౌరులను తన సద్గుణములు అనే త్రాడుతో కట్టినట్లు కట్టి ఆకర్షించెను.
2.45.13.
అనుష్టుప్.
తే ద్విజాస్త్రివిధం వృద్ధా
జ్ఞానేన వయసౌజసా।
వయః ప్రకమ్పశిరసో
దూరాదూచురిదం వచః॥
టీకః-
తే = ఆ; ద్విజాః = బ్రాహ్మణులు; త్రివిధం = మూడు రకములుగా; వృద్ధా = వృద్ధులైన; జ్ఞానేన = జ్ఞానము చేత; వయసా = వయస్సు చేత; ఓజసా = తేజస్సు చేత; వయః = వయస్సు కారణంగా; ప్రకమ్పః = వణుకుచుండగా; శిరశః = శిరస్సులు; దూరాత్ = దూరము నుండియే; ఊచుః = పలికెను; ఇదం వచః = ఈ మాటలను
భావంః-
జ్ఞానము చేత, వయస్సు చేత, తేజస్సు చేత మూడు విధముల వృద్ధులైన బ్రాహ్మణులు, వార్థక్యము చేత శిరస్సులు వణుకుచుండగా, దూరము నుండియే ఇట్లు పలికిరి.
2.45.14.
అనుష్టుప్.
“వహన్తో జవనా రామమ్
భో భో! జాత్యాస్తురంగమాః!।
నివర్తధ్వం న గంతవ్యమ్
హితా భవత భర్తరి॥
టీకః-
వహన్తః = మోయుచున్న; జవనా = వేగము గల; రామమ్ = రాముని; భో భో = ఓ ఓ (సంబోధన, ముఖ్యముగా పశువుల గుఱించిన సంబోధన / ఆగు ఆగు వంటిది); జాత్యాః = ఉత్తమ జాతికి చెందిన; తురంగమాః = గుఱ్ఱములారా; నివర్తధ్వం = వెనుకకు మరలండి; న = వద్దు; గంతవ్యమ్ = పయనమగుట; హితా = హితమును; భవత = మీయొక్క; భర్తరి = ప్రభువైన
భావంః-
“ఉత్తమ జాతులలో పుట్టి, మంచి వేగము కలిగి, రాముని తీసుకొని పోవుచున్న ఓ మిక్కిలి వేగవంతమైన ఉత్తమ జాతి గుఱ్ఱములారా! ముందుకు వెళ్లవద్దు. వెనుకకు మరలి రండి. మీ ప్రభువైన రామునకు హితమును చేయండి.
2.45.15.
అనుష్టుప్.
కర్ణవంతి హి భూతాని
విశేషేణ తురంగమాః।
యూయం తస్మాన్నివర్తధ్వమ్
యాచనాం ప్రతివేదితాః॥
టీకః-
కర్ణవంతి = చెవులు కలిగినవి; హి = తప్పక; భూతాని = ప్రాణులు; విశేషేణ = ప్రత్యేకముగా, పొడవైన; తురంగమాః = గుఱ్ఱములకు; యూయం = నీవు; తస్మాత్ = ఆ కారణంగా; నివర్తధ్వమ్ = వెనుకకు; యాచనాం = విన్నపమును; ప్రతివేదితాః = మరలుము
భావంః-
జంతువులన్నింటికి చెవులుండును. అందును గుఱ్ఱముల పొడవైన చెవులకు అధికమైన గ్రహణశక్తి ఉండును. అందుచే మీరు మా ప్రార్థనను విని వెనుకకు మరలండి.
2.45.16.
అనుష్టుప్.
ధర్మతః స విశుద్ధాత్మా
వీరః శుభదృఢవ్రతః।
ఉపవాహ్యస్తు వో భర్తా
నాపవాహ్యః పురాద్వనమ్”॥
టీకః-
ధర్మతః = ధర్మముచే; సః = అతడు; విశుద్ధాత్మా = పవిత్రమైన చిత్తము కలవాడు; వీరః = వీరుడు; శుభ =శుభమైన; దృఢవ్రతః = వ్రతములందు స్థిరముగా ఉండువాడు; ఉపవాహ్యస్తు = తీసుకుని రావలెను; వః = మీరు; భర్తా = ప్రభువును; న = కాదు; అపవాహ్యః = తీసుకొని వెళ్లుట; పురాత్ = పురము నుండి; వనమ్ = వనమునకు
భావంః-
ధర్మముచే పరిశుద్ధమైన చిత్తము కలవాడూ, వీరుడు, శుభమైన వ్రతములందు స్థిరముగా ఉండువాడు అయిన మీ ప్రభువును మీరు పురములోకి తీసుకొని రావలెను కాని పురము నుండి వనమునకు తీసుకొని వెళ్లకూడదు.”
2.45.17.
అనుష్టుప్.
ఏవమార్తప్రలాపాంస్తాన్
వృద్ధాన్ ప్రలపతో ద్విజాన్।
అవేక్ష్య సహసా రామో
రథాదవతతార హ॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఆర్త = ఆర్తితో కూడిన; ప్రలాపాన్ = వాగుడును; తాన్ = ఆ; వృద్ధాన్ = వృద్ధులైన; ప్రలపతః = పలవరిస్తున్న; ద్విజాన్ = బ్రాహ్మణులను; అవేక్ష్య = చూచి ; సహసా = శీఘ్రముగా; రామః = రాముడు; రథాత్ = రథము నుండి; అవతతార హ = దిగెను
భావంః-
ఈ విధముగా దుఃఖముతో కూడిన మాటలు పలుకుచున్న, వృద్ధులైన, ఆ ద్విజులను చూచి, రాముడు రథము నుండి చటుక్కున దిగెను.
2.45.18.
అనుష్టుప్.
పద్భ్యామేవ జగామాథ
ససీత స్సహలక్ష్మణః।
సన్నికృష్టపదన్యాసో
రామో వనపరాయణః॥
టీకః-
పద్భ్యామ్ = నడచి; ఏవ = యే; జగామ = వెళ్లెను; అథ = అటు పిమ్మట; స = సహితంగా; సీతః = సీత; సహ = సహితంగా; లక్ష్మణః = లక్ష్మణుడు కలవాడు; సన్నికృష్ట = దగ్గర దగ్గరగా; పదన్యాసః = అడుగులను వేయుచు; రామః = రాముడు; వనః = వనము; పరాయణః = దిక్కుగాపోవువాడు.
భావంః-
పిమ్మట సీతాలక్ష్మణ సహితుడైన రాముడు అడుగులు దగ్గరదగ్గరగా వేయుచు, మెల్లగా నడచియే వనమునకు వైపునకు వెళ్లసాగెను.
2.45.19.
అనుష్టుప్.
ద్విజాతీంస్తు పదాతీంస్తాన్
రామశ్చారిత్రవత్సలః।
న శశాక ఘృణాచక్షుః
పరిమోక్తుం రథేన సః॥
టీకః-
ద్విజాతీమ్ = బ్రాహ్మణులను; తు = కూడ; పదాతీన్ = నడిచెను; తాన్ = ఆ; రామః = రాముడు; చారిత్రవత్సలః = సచ్చరిత్రయందు ప్రేమ కలవాడు; న = లేదు; శశాక = వెళ్లగలుగుట; ఘృణాచక్షుః = దయతో కూడిన నేత్రములు కలవారు; పరిమోక్తుం = వారిని విడిచి; రథేన = రథముపై; సః = అతడు
భావంః-
సచ్చరిత్రమునందు ప్రేమ కలవాడు, దయతో కూడిన నేత్రములు కలవాడు అయిన రాముడు, ఆ బ్రాహ్మణులు పాదచారులై వచ్చుచుండగ వారిని విడిచి తాను రథముపై వెళ్లజాలకపోయెను.
*గమనికః-
ద్విజాతి- వ్యుత్పత్తి. ద్వి+జాతి, ద్విఽయస్య జాతి జన్మని యస్య, రెండు జన్మలు, మాతృగర్భంనుండి మఱియు ఉపనయన సంస్కారంవలన, కలవాడు, బ్రాహ్మణ క్షత్రియాదులు.
2.45.20.
అనుష్టుప్.
గచ్ఛంతమేవ తం దృష్ట్వా
రామం సంభ్రాంతచేతసః।
ఊచుః పరమసంతప్తా
రామం వాక్యమిదం ద్విజాః॥
టీకః-
గచ్ఛంతమ్ = వెళ్లిపోవుచున్న; ఏవ = అలాగే, వావిళ్ళ నిఘంటువు; తం = అతనిని; దృష్ట్వా = చూచి; రామం = రాముని; సంభ్రాంత = దుఃఖముతో; చేతసః = మనస్సుతో; ఊచుః = పలికిరి; పరమ = మిక్కిలి; సంతప్తా = కలత చెందిన; రామం = రాముని; వాక్యమ్ = మాటలను; ఇదమ్ = ఈ; ద్విజాః = బ్రాహ్మణులు
భావంః-
రాముడు ఇంకను, వనము వైపు వెళ్లిపోవుచుండగా చూచి, ఆ బ్రాహ్మణులు కలత చెందిన మనస్సుతో మిక్కిలి దుఃఖించుచు, ఇట్లు పలికిరి.
2.45.21.
అనుష్టుప్.
“బ్రాహ్మణ్యం సర్వమేతత్త్వామ్
బ్రహ్మణ్యమనుగచ్ఛతి।
ద్విజస్కంధాధిరూఢాస్త్వామ్
అగ్నయోఽప్యనుయాన్త్యమీ॥
టీకః-
బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణుల; సర్వమ్ = సమూహము; ఏతః = అంతయు; త్వామ్ = నిన్ను; బ్రహ్మణ్యమ్ = బ్రాహ్మణులకు హితుని; అనుగచ్ఛతి = వెనుకనే వచ్చుచున్నది; ద్విజః = బ్రాహ్మణులు; స్కంధ = మూపు; అధిరూఢాః = పై యెక్కి; త్వామ్ = నిన్ను; అగ్నయో = అగ్నులు కూడను; అపి + అనుయాన్త్యమీ
భావంః-
“ఈ బ్రాహ్మణ సమూహమంతయు, బ్రాహ్మణులకు హితుడవైన నీ వెనుకనే వచ్చుచున్నది. ఈ అగ్నులు కూడ బ్రాహ్మణుల మూపుపై ఎక్కి నీ వెనుకనే వచ్చుచున్నవి.
2.45.22.
అనుష్టుప్.
వాజపేయసముత్థాని
ఛత్రాణ్యేతాని పశ్య నః।
పృష్ఠతోఽనుప్రయాతాని
మేఘానివ జలాత్యయే॥
టీకః-
వాజపేయ = వాజపేయ యాగము వలన; సముత్థాని = లభించిన; ఛత్రాణి = ఛత్రములను; ఏతాని = వీటిని; పశ్య = చూడుము; నః = మన; పృష్ఠతః = వెనుకనే; అనుప్రయాతాని = వచ్చుచున్నవి; మేఘాని = మేఘముn; ఇవ = వలె; జలాత్యయే = శరదృతువునందలి (వర్షాకాలాంతమునందు)
భావంః-
వాజపేయ యాగము చేయుటచే మాకు లభించిన, శరదృతువునందలి మేఘముల వలె, తెల్లగా ఉన్న ఈ ఛత్రములు మా వెనుకనే వచ్చుచున్నవి. చూడుము.
2.45.23.
అనుష్టుప్.
అనవాప్తాతపత్రస్య
రశ్మిసంతాపితస్య తే।
ఏభిశ్ఛాయాం కరిష్యామః
స్వైశ్ఛత్రైర్వాజపేయికైః॥
టీకః-
అనవాప్త = లభించిన; ఆతపత్రస్య = గొడుగుతో; రశ్మిసంతాపి = ఎండచే తపింపబడుచున్న; తస్య = మీకు; తే = నీకు; ఏభిః = దీనిచే; ఛాయాం = నీడను; కరిష్యామః = కలిగించెదము; స్వైః = మేము; ఛత్రైః = ఛత్రముచే; వాజపేయికైః = వాజపేయ యాగము వలన
భావంః-
మాకు వాజపేయ యాగము వలన లభించిన ఈ శ్వేత ఛత్రముచే. ఛత్రము లేక ఎండచే తపింపబడుచున్న నీకు మేము నీడను కల్గించెదము.
2.45.24.
అనుష్టుప్.
యా హి నః సతతం బుద్ధిః
వేదమంత్రానుసారిణీ।
త్వత్కృతే సా కృతా వత్స
వనవాసానుసారిణీ॥
టీకః-
యా హి = ఎటువంటి; నః = మాకు; సతతం = నిరంతరము; బుద్ధిః = ఆలోచన; వేదమంత్ర = వేదమంత్రములను; అనుసారిణీ = అనుసరించుచు; త్వత్కృతే = నీ కొరకు; సాకృతా = అట్టి మా బుద్ధి; వత్స = కుమారా; వనవాస = వనవాసమును; అనుసారిణీ = కోరుచున్నది
భావంః-
నాయనా! మా బుద్ధి ఎల్లప్పుడును వేదమంత్రముల పైననే ఉండును. అట్టి మా బుద్ధి నీ కొరకై వనవాసమును కోరుచున్నది.
2.45.25.
అనుష్టుప్.
హృదయేష్వేవ తిష్ఠంతి
వేదా యే నః పరం ధనమ్।
వత్స్యన్త్యపి గృహేష్వేవ
దారాశ్చారిత్రరక్షితాః॥
టీకః-
హృదయేషు = హృదయములందు; ఇవ = మాత్రమే; తిష్ఠంతి = ఉండును; వేదా = వేదములు; యే = ఎటువంటి; నః = మాకు; పరమ్ = ఉత్తమమైన; ధనమ్ = సంపద అను; వత్స్యంతి = ఉండగలదు; అపి = కూడ; గృహేషు = ఇండ్లలో; ఏవ = మాత్రమే; దారాః = భార్యలు; చారిత్ర = సచ్చరిత్రము చేత; రక్షితాః = రక్షింపబడును.
భావంః-
మా ఉత్తమమైన వేదసంపదలు మా హృదయములందే ఉండును. మా భార్యలు పాతివ్రత్యముచే రక్షింపబడుచు ఇండ్లలో ఉండగలరు.
2.45.26.
అనుష్టుప్.
న పునర్నిశ్చయః కార్యః
త్వద్గతౌ సుకృతా మతిః।
త్వయి ధర్మవ్యపేక్షే తు
కిం స్యాద్ధర్మపథే స్థితమ్?॥
టీకః-
న = లేదు; పునః = మరల; నిశ్చయః = నిశ్చయము; కార్యః = చేయతగినది; త్వత్ = నీ; గతౌ = రాక గురించి; సుకృతా = చక్కగా చేయబడినది; మతిః = బుద్ధి; త్వయి = నీవు; ధర్మ = ధర్మమునందు; వ్యపేక్షే = ధర్మవిముఖుడవైనచో; తు = ఇంక; కిం = ఎవరు; స్యాత్ = అలా ఇలాగున; ధర్మపథే = ధర్మమార్గమును; స్థితమ్ = నిలబడుదురు.
భావంః-
నీవు అయోధ్యకు తిరిగి రావలెనని మేము నిర్ణయించితిమి. దీనికి మరొక నిర్ణయము చేయకుము. నీవు ధర్మ విముఖుడవైనచో మరి ఎవరు ధర్మమున నిలబడుదురు?
2.45.27.
అనుష్టుప్.
యాచితో నో నివర్తస్వ
హంసశుక్లశిరోరుహైః।
శిరోభిర్నిభృతాచార
మహీపతనపాంసులైః॥
టీకః-
యాచితః = ప్రార్థించుచున్నాము; నః = మేము; నివర్తస్వ = వెనుకకు మరలుము; హంస = హంసల వలె; శుక్ల = తెల్లనైన; శిరోరుహైః = కేశములు గల; శిరోభిః = శిరస్సులతో; నిభృత = స్థిరమై; ఆచారచార = మంచి నడవడిక గల; మహీపతన = నేలపై పడుటచే; పాంసులైః = దుమ్ము తగిలిన
భావంః-
నేలపై బడుటచే దుమ్ము తగిలిన, హంసలవలె తెల్లనైన కేశములు గల శిరస్సులతో మేము ప్రార్థించుచున్నాము. వెనుకకు మరలుము.
2.45.28.
అనుష్టుప్.
బహూనాం వితతా యజ్ఞా
ద్విజానాం య ఇహాగతాః।
తేషాం సమాప్తిరాయత్తా
తవ వత్స నివర్తనే॥
టీకః-
బహూనాం = చాలామంది; వితతాః = ప్రారంభించినారు; యజ్ఞా = యజ్ఞమును; ద్విజానాం = బ్రాహ్మణులు; య = ఎవరైతే; ఇహ = ఇక్కడకు; ఆగతాః = వచ్చినవారిలో; తేషాం = వారి యొక్క; సమాప్తిః = సమాప్తము; ఆయత్తా = ఆధారపడియున్నది; తవ = నీ యొక్క; వత్స = ఓ కుమారా; నివర్తనే = తిరిగి వచ్చుటయందు
భావంః-
ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో, చాలామంది యజ్ఞములు ప్రారంభించియున్నారు. ఓ వత్సా! ఆ యజ్ఞముల సమాప్తి, నీవు తిరిగి వచ్చుటయందు, ఆధారపడియున్నది.
2.45.29.
అనుష్టుప్.
భక్తిమంతి హి భూతాని
జంగమాజంగమాని చ।
యాచమానేషు రామ! త్వమ్
భక్తిం భక్తేషు దర్శయ॥
టీకః-
భక్తిమంతి = భక్తిని కలిగియున్నవి; హి = ఐన; భూతాని = జీవము లన్నియు; జంగమః = జంగమములు; అజంగమాని = స్థావరములు; చ = మరియు; యాచమానేషు = కోరుచున్న; రామ = రామా; త్వమ్ = నిన్ను; భక్తిమ్ = గౌరవాభిమానములు; భక్తేషు = ఆ భక్తుల పట్ల; దర్శయ = చూపుము
భావంః-
స్థావర జంగమాత్మకములైన, భూతములన్నియు, నీపై భక్తితో, నిన్ను ప్రార్థించుచున్నవి. నీవు వారిపై గౌరవాభిమానములు చూపుము.
2.45.30.
అనుష్టుప్.
అనుగంతుమశక్తా స్త్వామ్
మూలైరుద్ధతవేగి నః।
ఉన్నతా వాయువేగేన
విక్రోశంతీవ పాదపాః॥
టీకః-
అనుగంతుమ్ = అనుసరించుటకు; అశక్తాః = శక్తి లేకుండినవి; త్వామ్ = నిన్ను; మూలైః = వ్రేళ్లతో; ఉద్ధత = మొండిగా; వేగిన = త్వరితముగ; ఉన్నతా = లేచిన; వాయువేగేన = వాయు వేగము చేత; విక్రోశంతి = ఏడ్చుచున్నవి; ఇవ = వలె; పాదపాః = వృక్షములు
భావంః-
వాయు వేగము చేత లేచిన ఈ వృక్షములు, నిన్ను అనుసరించవలెనని కోరుచున్నను, వాటి వేగమును వ్రేళ్లు అడ్డుకొనుటచే నిన్ను అనుసరింపజాలక, ఏడ్చుచున్నట్లున్నవి.
2.45.31.
అనుష్టుప్.
నిశ్చేష్టాహారసంచారా
వృక్షైకస్థానవిష్ఠితాః।
పక్షిణోఽపి ప్రయాచన్తే
సర్వభూతానుకంపినమ్!”॥
టీకః-
నిశ్చేష్టః = చేష్టలు మాని; ఆహార = ఆహారము; సంచారా = సంచారము; వృక్షైక = వృక్షములపైననే; స్థానవిష్ఠితాః = స్థిరముగ; విష్ఠితాః = కూర్చుండి; పక్షిణః = పక్షులు; అపి = కూడా; ప్రయాచన్తే = మిక్కిలిగ కోరుచున్నవి; సర్వభూత = సర్వభూతములయందు; అనుకంపినమ్ = జాలి కలిగినవాడ.
భావంః-
పక్షులు కూడ ఆహారము, సంచారము చేష్టలను మాని, వృక్షములపైననే నిశ్చలముగ కూర్చుండి ప్రార్థించుచున్నవి. సర్వ భూతములందు జాలి గల రామా!”
2.45.32.
అనుష్టుప్.
ఏవం విక్రోశతాం తేషామ్
ద్విజాతీనాం నివర్తనే।
దదృశే తమసా తత్ర
వారయంతీవ రాఘవమ్॥
టీకః-
ఏవం = ఈ విధముగా; విక్రోశతామ్ = మొత్తుకొను 0చుండగా; తేషామ్ ద్విజాతీనాం = ఆ బ్రాహ్మణులు; నివర్తనే = మరల్చుటకై; దదృశే = అనునట్లుగా; తమసా = తమసా నది; తత్ర = అక్కడ; వారయంతి + ఇవ = మరల్చుచున్నదా అనునట్లు; రాఘవమ్ = రాముని
భావంః-
రాముని వెనుకకు మరల్చుటకై ఆ బ్రాహ్మణులిట్లు మొత్తుకొను చుండగా, ఇంతలో తాను కూడ రాముని మరల్చుచున్నదా అన్నట్లు తమసా నది వచ్చెను.
2.45.33.త్రిష్టుప్
తతః సుమంత్రోఽపి రథాద్విముచ్య
శ్రాంతాన్హయాన్సమ్పరివర్త్య శీఘ్రమ్।
పీతోదకాంస్తోయపరిప్లుతాంగా-
నచారయద్వై తమసావిదూరే॥
టీకః-
తతః = అటు పిమ్మట; సుమంత్ర = సుమంత్రుడు; అపి = కూడ; రథాత్ = రథము నుండి; విముచ్యః = వేరు చేసి; శ్రాంతాన్ = అలసిపోయిన; హయాన్ = గుఱ్ఱములను; సమ్పరివర్త్య = నేలపై పొర్లించి; శీఘ్రమ్ = వేగముగా; పీతిని = త్రాగబడిన; ఉదకాన్ = మంచినీరుకలవిi; తోయః = నీటితో; పరిప్లుతః = తడపబడిన, కడిగిన; అంగాన్ = శరీరములకలవిగ; అచారయద్వై = గడ్డి మేయుటకువదిలివేసెను; తమసా = తమసా నది; విదూరే = సమీపమున, దూరముకానిది.
భావంః-
పిమ్మట, సుమంత్రుడు కూడ అలసిపోయిన గుఱ్ఱములను రథము నుండి విప్పి, శీఘ్రముగా నేలపై పొరలించి, నీరు త్రాగించి వాటి శరీరములు కడిగి, తమసా నదీ సమీపమున వాటిని మేయుటకు వదిలెను.
2.45.34.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే పంచచత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; పంచచశ్చత్వారింశః [45] = నలభైఐదవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [45] నలభైయైదవ సర్గ సంపూర్ణము.
2.46.1.అనుష్టుప్
తతస్తు తమసాతీరమ్
రమ్యమాశ్రిత్య రాఘవః।
సీతాముద్వీక్ష్య సౌమిత్రిమ్
ఇదం వచనమబ్రవీత్॥
టీక:
తతః = పిమ్మట; తు = ఇంక; తమసా = తమసా నది యొక్క; తీరమ్ = ఒడ్డును; రమ్యమ్ = అందమైనది; ఆశ్రిత్య = చేరి; రాఘవః = రఘురాముడు; సీతామే = సీతాదేవిని గూర్చి; ఉద్వీక్ష్య = చూచి; సౌమిత్రిమ్ = సుమిత్రాపుత్రుని గూర్చి; ఇదం = ఈవిధముగా; వచనమ్ = మాటలు; అబ్రవీత్ = చెప్పెను.
భావం:-
అటుపిమ్మట, వారు అందమైన తమసాతీరము వద్దకు చేరిరి. రాముడు సీతను వీక్షించి, లక్ష్మణునితో ఇట్లనెను,
2.46.2.అనుష్టుప్
“ఇయమద్య నిశా పూర్వా
సౌమిత్రే! ప్రహితా వనమ్।
వనవాసస్య భద్రం తే
స నోత్కంఠితుమర్హసి॥
టీక:
ఇయమ్ = ఇదిగో; అద్య = ఇప్పుడు; నిశా = రాత్రి; పూర్వా = మొదటిది; సౌమిత్రే = లక్ష్మణా; ప్రహితా = పంపబడితిమి; వనమ్ = అడవికి; వనవాసస్య = ఈ వనవాసములో; భద్రం = భద్రము కలుగుగాక; తే = నీకు; స = కలిగి ఉండుటకు; న = కాదు; ఉత్కంఠితుమ్ = వ్యాకులపడుట; అర్హసి = తగినవాడవు.
భావం:-
“లక్ష్మణా! ఇదిగో మనం అడవిలోకి వచ్చిన తరువాత వచ్చిన మొదటి రాత్రి. వ్యాకులపాటు చెందవద్దు. ఈ వనవాసములో నీకు అంతా మంచే కలుగు గాక.
2.46.3.అనుష్టుప్
పశ్య శూన్యాన్యరణ్యాని
రుదంతీవ సమంతతః।
యథానిలయమాయద్భిః
నిలీనాని మృగద్విజైః॥
టీక:
పశ్య = చూడుమ; శూన్యాని = ఖాళీగా ఉన్న; అరణ్యాని = అరణ్యములను; రుదంతీవ = విలపించుచున్నట్లు; సమంతతః = అన్ని వైపుల నుండి; యథా = వాటి; నిలయమ్ = నివాసములకు; ఆయద్భిః = వచ్చుచున్నవి; నిలీనాని = దాగి వసించెడి; మృగ = జంతువులు; ద్విజైః = పక్షులు.
భావం:-
ఇదిగో చూడు. విలపిస్తున్నట్లు ఉన్న శూన్య మగుచున్న అడవులను, చూడు. మరుగు చూసుకుని నిద్రించుటకు అన్ని జంతువులు, పక్షులు వాటి గూళ్ళకు చేరుకొనుచుండెను.
*గమనిక:-
ద్విజః- రెండుజన్మలు కలవి, గ్రుడ్డు రూపంలోనూ పక్షి రూపంలోనూ కలివి కనుక పక్షులు ద్విజులు. బ్రాహ్మణుడు
2.46.4.అనుష్టుప్
అద్యాయోధ్యా తు నగరీ
రాజధానీ పితుర్మమ।
సస్త్రీపుంసా గతానస్మాన్
శోచిష్యతి న సంశయః॥
టీక:
అద్య = ఇప్పుడు; అయోధ్యా = అయోధ్య అను; తు = తప్పక; నగరీ = నగరమునందలి; రాజధానీ = రాజధాని ఐన; పితుః = తండ్రిగారి యొక్క; మమ = నా; స = సహితముగా; స్త్రీ = ఆడవారు; పుంసా = పురుషులు; గతాన్ = వెళ్ళిపోయిన; అస్మాన్ = మనలనుగూర్చి; శోచిష్యతి = శోకించగలరు; న = లేదు; సంశయః = సంశయము.
భావం:-
ఇపుడు మన తండ్రిగారి రాజధాని అయోధ్యానగరములోని స్త్రీపురుషులు అందరు, మనము విడిచి వచ్చినందుకు దుఃఖించుచుందురు.
2.46.5.అనుష్టుప్
అనురక్తా హి మనుజా
రాజానం బహుభిర్గుణైః।
త్వాం చ మాం చ నరవ్యాఘ్ర!
శత్రుఘ్నభరతౌ తథా॥
టీక:
అనురక్తా = ప్రీతికలవారు; హి = కదా; మనుజా = ప్రజలు; రాజానం = రాజుగూర్చియు; బహుభిః = అనేకమైన; గుణైః = సుగుణములచేత; త్వాం = నిన్ను గూర్చి; చ = మఱియు; మాం = నన్నుగూర్చి; చ = మఱియు; నరవ్యాఘ్ర = నరులలో శ్రేష్ఠుడా; శత్రుఘ్నభరతౌ = భరతశత్రృఘ్నులిద్దరు గూర్చి; తథా = అటులనే.
భావం:-
లక్ష్మణా! అనేక సుగుణాలరాసి మన తండ్రిగారు అంటే ప్రజలకు ఎంతో ప్రీతికదా. అలాగే నీవన్నా, నేనన్నా, భరతశత్రుఘ్నులన్నా ప్రీతి కలదు కదా.
2.46.6.అనుష్టుప్
పితరం చానుశోచామి
మాతరం చ యశస్వినీమ్।
అపి వాంధౌ భవేతాం తు
రుదన్తౌ తావభీక్ష్ణశః॥
టీక:
పితరం = తండ్రిగారినిగూర్చి; చ = మఱియు; అనుశోచామి = విచారించుచున్నాను; మాతరం = తల్లిగూర్చి; చ = మఱియు; యశస్వినీమ్ = కీర్తిమంతురాలగు; అపి = ఒకవేళ; వా = ఏమో; అంధౌ = గుడ్డివాళ్ళిద్దరూ; భవేతాం = అగుదురు; తు = ఏమో; రుదన్తౌ = విలపించుచువారై; తౌ = వారిద్దరూ; అవభీక్ష్ణశః = శాశ్వతముగా, అభీక్షణ (క్షణమాత్రముండునది, సంస్కృత-ఆంధ్ర నిఱంటువు) కానిది అవభీక్షణ.
భావం:-
తండ్రిగారి గురించీ ఇంకా మంచి యశస్సుగల తల్లిగారిని గురించి నాకు ఆందోళనగా ఉన్నది. నాకోసం వారిద్దరూ అలా విలపించి విలపించి ఆ బాధతో పూర్తిగా గుడ్డివారు అగుదురేమో అని విచారంగా ఉన్నది.
2.46.7.అనుష్టుప్
భరతః ఖలు ధర్మాత్మా
పితరం మాతరం చ మే।
ధర్మార్థకామసహితైః
వాక్యైరాశ్వాసయిష్యతి॥
టీక:
భరతః = భరతుడు; ఖలు = నిశ్చయముగా; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; పితరం = తండ్రిగారినిగూర్చి; మాతరం = తల్లిగారినిగూర్చి; చ = మఱియు; మే = నా; ధర్మ = ధర్మబద్దమైన; అర్థ = అర్థవంతమైన; కామ = ప్రీతికరమైనవి; సహితైః = కల; వాక్యైః = మాటలతో; ఆశ్వాసయిష్యతి = ఓదార్చగలడు.
భావం:-
ఔను ధర్మాత్ముడైన భరతుడు, తండ్రిని నా తల్లిని ఇద్దరిని ధర్మ పూరితములూ, అర్థవంతములూ, మఱియు ప్రీతికరములూ ఐన మాటలు చెప్పి ఓదార్చగలడు.
*గమనిక:-
ధర్మము- పుత్రుని యెడబాటు కారణముగా దుఃఖితులై యున్న పెద్దలను సేవించు విషయమున పుత్రధర్మములను, వారి ప్రయోజనములను వారి అభిరుచులను, ఆకాంక్షలను ఎఱింగి ఉపచారములు నడపుటయే- ధర్మార్థకామ యుక్తముగ సేవించుట యనబడును, గీతాప్రెస్ వారి రామాయణ ప్రతి.
2.46.8.అనుష్టుప్
భరతస్యానృశంసత్వమ్
విచింత్యాహం పునః పునః।
నానుశోచామి పితరమ్
మాతరం చాపి లక్ష్మణ!॥
టీక:
భరతస్య = భరతునియొక్క; అనృశంసత్వమ్ = అహింసాయుతమైనబుద్ది; విచింత్యా = ఆలోచించుకుని; అహం = నేను; పునఃపునః = మరలమరల; న = లేదు; అనుశోచామి = దుఃఖించుచూ; పితరమ్ = తండ్రిగారిని గూర్చి; మాతరం = తల్లిగారి గూర్చి; చాపి = కాని; లక్ష్మణ = లక్ష్మణుడా.
భావం:-
లక్ష్మణ! కానీ, భరతుని మంచితనము అహింసాప్రవృత్తి తలచుకుని తలచుకుని. అమ్మానాన్నల గురించి చింతించుట లేదు.
2.46.9.అనుష్టుప్
త్వయా కార్యం నరవ్యాఘ్ర!
మామనువ్రజతా కృతమ్।
అన్వేష్టవ్యా హి వైదేహ్యా
రక్షణార్థే సహాయతా॥
టీక:
త్వయా = నీచేత; కార్యం = జరుగవలసిన పని ఉన్నది; నరవ్యాఘ్ర = నరులలో శ్రేష్ఠుడా; మామ్ = నన్ను; అనువ్రజతా = అనుసరించి వచ్చుట; కృతమ్ = చేయబడినది; అన్వేష్టవ్యా = వెదుక దగినది; హి = కదా; వైదేహ్యా = విదేహ రాకమారి యొక్క; రక్షణార్థే = రక్షణకొఱకు; సహాయతా = సహాయము.
భావం:-
లక్ష్మణా! నన్ను అనుసరించి వచ్చి మంచిపని చేసితివి. నాకు సీతాదేవిని రక్షించుకొనుట కొఱకు సహాయము కావలెను కదా.
2.46.10.అనుష్టుప్
అద్భిరేవ తు సౌమిత్రే!
వత్స్యామ్యద్య నిశామిమామ్।
ఏతద్ధి రోచతే మహ్యమ్
వన్యేఽపి వివిధే సతి”॥
టీక:
అద్భిన్ = నీరు; ఏవ = మాత్రమే; తు = తో; సౌమిత్రే = సుమిత్రా పుత్ర; వత్స్యామి = ఉండెదను; అద్య = నేటి; నిశామ్ = రాత్రి; ఇమామ్ = ఈ; ఏతత్ = కదా; హి = కదా; రోచతే = ఇష్టమగుచున్నది; మహ్యమ్ = నాకు; వన్యే = అటవీ పదార్థములు; అపి = కూడా; వివిధే = అనేకమైనవి; సతి = ఉన్నను.
భావం:-
లక్ష్మణా! ఇవాళ ఈరాత్రికి నీరు మాత్రమే తీసుకొనెదను. ఫలమూలాది అటవీ పదార్థములు ఎన్నిరకాలు ఉన్ననూ, నేను ఇష్టపూర్వకముగనే ఈ నిర్ణయం తీసుకొంటిని.”
2.46.11.అనుష్టుప్
ఏవముక్త్వా తు సౌమిత్రిమ్
సుమంత్రమపి రాఘవః।
“అప్రమత్తస్త్వ మశ్వేషు
భవ” సౌమ్యేత్యువాచ హ॥
టీక:
ఏవమ్ = ఈవిధముగా; ఉక్త్వా = చెప్పి; తు = పిమ్మట; సౌమిత్రిమ్ = సుమిత్రా పుత్రునిగూర్చి; సుమంత్రమ్ = సుమంత్రుని గూర్చి; అపి = కూడా; రాఘవః = రఘురాముడు; అప్రమత్తః = ఏమరుపాటు లేనివాడవై; త్వమ్ = నీవు; అశ్వేషు = గుఱ్ఱములనుగూర్చి; భవ = అగుము; సౌమ్య = సౌమ్యుడా; ఇతి = అని; ఉవాచ = చెప్పెను; హ = ఆదేశించెను.
భావం:-
ఈ విధముగా లక్ష్మణునికి చెప్పిన పిమ్మట, శ్రీరాముడు సుమంత్రునితో “సౌమ్యుడా! నీవు గుఱ్ఱములను జాగ్రత్తగా చూచుకొనుము" అని ఆదేశించెను.
2.46.12.అనుష్టుప్,
సోఽశ్వాన్, సుమంత్రః సంయమ్య
సూర్యేఽస్తం సముపాగతే।
ప్రభూతయవసాన్ కృత్వా
బభూవ ప్రత్యనంతరః॥
టీక:
సః = ఆ; అశ్వాన్ = గుఱ్ఱములను; సుమంత్రః = సుంత్రుడు; సంయమ్య = కట్టి; సూర్యే = సూర్యుని; అస్తం = అస్తమయము; సముపాగతే = చేరగానే; ప్రభూత = అధికమైన; యవసాన్ = గడ్డిగలవిగా; కృత్వా = చేసి; బభూవ= ఉండెను; ప్రత్యనంతరః = సమీపముననే.
భావం:-
సూర్యాస్తమయం అగుచుండగా, సుమంత్రుడు ఆ గుఱ్ఱములను కట్టివేసెను. వాటికి ఎక్కువగా గడ్డి వేసి తానునూ వాటి సమీపమున ఉండెను.
2.46.13.అనుష్టుప్
ఉపాస్య తు శివాం సంధ్యామ్
దృష్ట్వా రాత్రిముపస్థితామ్।
రామస్య శయనం చక్రే
సూతః సౌమిత్రిణా సహ॥
టీక:
ఉపాస్య = ఉపాశించిన; తు = పిమ్మట; శివామ్ = మంగళకరమైన; సంధ్యామ్ = సంధ్యోపాసన; దృష్ట్వా = కనుగొని; రాత్రిమ్ = రాత్రిసమయము; ఉపస్థితామ్ = అగుట; రామస్య = రామునికి; శయనం = పక్క, శయనము; చక్రే = ఏర్పరచెను; సూతః = సూతుడు; సౌమిత్రిణా = సుమిత్రాపుత్రునితో; సహ = కలిసి.
భావం:-
సాయంసమయమున సూతుడు సంధ్యోపాసన పూర్తిచేసుకునిన పిమ్మట, రాత్రి అగుచుండుట గమనించి సూతుడు లక్ష్మణుడు కలిసి రామునికి శయనము ఏర్పాటుచేసిరి.
2.46.14.అనుష్టుప్
తాం శయ్యాం తమసాతీరే
వీక్ష్య వృక్షదలైః కృతామ్।
రామః సౌమిత్రిణా సార్ధమ్
సభార్యః సంవివేశ హ॥
టీక:
తాం = ఆ; శయ్యాం = శయ్యను; తమసా = తమసానదీ; తీరే = ఒడ్డున; వీక్ష్య = చూసి; వృక్ష = చెట్ల; దలైః = ఆకులతో; కృతామ్ = చేసినది; రామః = రాముడు; సౌమిత్రిణా = లక్ష్మణునితో; సార్ధమ్ = అర్థవంతముగా; స = సహితముగా; భార్యః = భార్యతో; సంవివేశ = వసించుట; హ = చేసెను.
భావం:-
ఆ తమసానది ఒడ్డున చెట్లఆకులతో చక్కగా ఏర్పాటుచేసిన శయ్యను లక్ష్మణునితో పరిశీలించి, సీతాదేవితో కలిసి ఆ శయ్యయందు పరుండెను.
2.46.15.అనుష్టుప్
సభార్యం సంప్రసుప్తం తమ్
భ్రాతరం వీక్ష్య లక్ష్మణః।
కథయామాస సూతాయ
రామస్య వివిధాన్ గుణాన్॥
టీక:
స = సహితముగా; భార్యం = భార్యతో; సంప్రసుప్తం = ఆదమరచి నిద్ర పోవుచున్న; తమ్ = ఆ; భ్రాతరం = అన్నగారిని; వీక్ష్య = గమనించి; లక్ష్మణః = లక్ష్మణుడు; కథయామాస = చెప్పదొడగెను; సూతాయ = సూతునిగూర్చి; రామస్య = రామునియొక్క; వివిధాన్ = అనేకమైన; గుణాన్ = సుగుణములను.
భావం:-
ఆవిధముగా అన్నగారు వదినగారూ ఐన సీతారాములు ఆదమరచి నిద్రించుచుండిరని గమనించి, లక్ష్మణుడు సూతునికి రామునియొక్క వివిధ సద్గుణములు వర్ణించి చెప్పసాగెను
2.46.16.అనుష్టుప్
జాగ్రతో హ్యేవ తాం రాత్రిమ్
సౌమిత్రేరుదితో రవిః।
సూతస్య తమసాతీరే
రామస్య బ్రువతో గుణాన్॥
టీక:
జాగ్రతః = మెళకువగా; హి = పూర్తిగా; ఇవ = ఉండగానే; తాం = ఆ; రాత్రిమ్ = రాత్రిని; సౌమిత్రేః = లక్ష్మణుడు; ఉదితః = ఉదయించెను; రవిః = సూర్యుడు; సూతస్య = సూతునకు; తమసా = తమసానది; తీరే = ఒడ్డున; రామస్య = రాముని యొక్క; బ్రువతః = చెప్పెను; గుణాన్ = సుగుణములను.
భావం:-
లక్ష్మణుడు అలా తమసానది ఒడ్డున ఆరాత్రి అంతా మెళకువగానే ఉండి సుమంత్రునకు రాముడి సుగుణములు చెప్పుచూ ఉండగనే సూర్యోదయము అయిపోయింది.
2.46.17.అనుష్టుప్
గోకులాఃకులతీరాయాన్
తమసాయా విదూరతః।
అవసత్తత్ర తాం రాత్రిమ్
రామః ప్రకృతిభిస్సహ॥
టీక:
గోకులాః = ఆవులమంద; ఆకులః = నిండిఉన్న; తీరాయాన్ = తీరమునకు; తమసాయా = తమసానదియొక్క; విదూరతః = దూరముగా; అవసత్ = ఉండెను; తత్ర = అక్కడే; తాం = ఆ; రాత్రిమ్ = రాత్రికి; రామః = రాముడు; ప్రకృతిభీః = ప్రజలతో; సహ = పాటు.
భావం:-
తమసానదీతీరము ఆవులతో నిండిఉన్నది. రాముడు తన ప్రజలందరితో పాటు ఆ తీరానికి కొంతదూరములో ఆ రాత్రి అంతా ఉండెను.
2.46.18.అనుష్టుప్
ఉత్థాయ స మహాతేజాః
ప్రకృతీస్తా నిశామ్య చ।
అబ్రవీద్భ్రాతరం రామో
లక్ష్మణం పుణ్యలక్షణమ్॥
టీక:
ఉత్థాయ = మేల్కొ ని; సః = ఆ; మహాతేజాః = మిక్కిలి తేజశ్శాలి; ప్రకృతీః = తన ప్రజలును; తాః = ఆ; నిశామ్య = చూచి; చ = పిమ్మట; అబ్రవీత్ = పలికెను; భ్రాతరం = తమ్మునిగూర్చి; రామః = రాముడు; లక్ష్మణం = లక్ష్మణునిగూర్చి; పుణ్యలక్షణమ్ = శుభలక్షణములు కల.
భావం:-
మహాతేజశ్శాలి రాముడు, ఉదయము మేల్కొని ఆ తన ప్రజలను వీక్షించి, పిమ్మట శుభలక్షణములుగల సోదరుడు లక్ష్మణునికి ఇట్లు తెప్పెను.
2.46.19.అనుష్టుప్
“అస్మద్వ్యపేక్షాన్ సౌమిత్రే!
నిరపేక్షాన్ గృహేష్వపి।
వృక్షమూలేషు సంసుప్తాన్
పశ్య లక్ష్మణ! సాంప్రతమ్॥
టీక:
అస్మద్ = మనయందు; అపేక్షాన్ = ఆసక్తికలవారు; సౌమిత్రే = లక్ష్మణా; నిరపేక్షాన్ = ధ్యాసలేకుండా; గృహేష్వపి = ఇంటిమీద; వృక్షమూలేషు = చెట్టుమొదటలో; సంసుప్తాన్ = నిద్రించుచున్నవారిని; పశ్య = చూడుము; లక్ష్మణ = లక్ష్మణా; సాంప్రతమ్ = ఇప్పుడు.
భావం:-
“లక్ష్మణా! మనయందు గల ఆసక్తితో వచ్చిన ఈ ప్రజలు తమ ఇంటిమీద ధ్యాస కూడ లేకుండా ఇప్పుడు ఇక్కడ చెట్టుమొదళ్ళ వద్ద నిద్రించుచున్నారు.
2.46.20.అనుష్టుప్
యథైతే నియమం పౌరాః
కుర్వన్త్యస్మన్నివర్తసే।
అపి ప్రాణాన్ న్యసిష్యన్తి
న తు త్యక్ష్యన్తి నిశ్చయమ్॥
టీక:
యథైతే = ఏదైతే ఉందో ఆ; నియమం = పట్టుదల; పౌరాః = పౌరుల యొక్క; కుర్వన్తి = చేయుచున్నారో; అస్మన్ = మనలను; నివర్తసే = మరల్చుట యందు; అపి = ఐతే; ప్రాణాన్ = ప్రాణములను; న్యసిష్యన్తి = విడిచిపెట్టెదరు; న = లేగు; తు = తప్పకుండా; త్యక్ష్యన్తి = విడిచిపెట్టుట; నిశ్చయమ్ = నిశ్చయముగా.
భావం:-
మనలను అయోధ్యకు వచ్చుటకు మరల్చుట యందు, పురువాసులు యొక్క పట్టుదల చాలా గట్టిది. దానికోసం నిశ్చయముగా ప్రాణములైనా విడిచివైతురు, తప్ప తమ పట్టుదల విడువరు.
2.46.21.అనుష్టుప్
యావదేవ తు సంసుప్తాః
తావదేవ వయం లఘు।
రథమారుహ్య గచ్ఛామః
పంథానమకుతోభయమ్॥
టీక:
యావత్ = ఎంతవరకూ; ఏవ = వీరు అందరూ; తు = ఐతే; సంసుప్తాః = నిద్రస్తుంటారో; తావత్ = అంతలోపల; ఏవ = మాత్రమే; వయం = మనము; లఘు = వడిగలవారమై; రథమ్ = రథమును; ఆరుహ్య = ఎక్కి; గచ్ఛామః = వెళ్ళెదము గాక; పంథానమ్ = మార్గము; అకుతోభయమ్ = ఏమాత్రము వెఱపు లేనివారమై.
భావం:-
ఈ పౌరులందరు నిద్రనుండి మేల్కొను లోపలే, మనం వేగంగా రథం ఎక్కి ఎవరూ తెలుసుకోలేని మార్గమున ఇక్కడనుండి వెళ్ళిపోయదము.
2.46.22.అనుష్టుప్
అతో భూయోఽ పి నేదానీమ్
ఇక్ష్వాకుపురవాసినః।
స్వపేయురనురక్తా మామ్
వృక్షమూలాని సంశ్రితాః॥
టీక:
అతః = ఇందువలన; భూయోః = మరల; అపి = ఇక; న = ఉండదు; ఇదానీమ్ = ఇప్పటివలె; ఇక్ష్వాకుపురవాసినః = ఇక్షాకునగరపౌరులు; స్వపేయుః = నిద్రించుట; అనురక్తా = ప్రీతిగల; మామ్ = నాయందు; వృక్షమూలాని = ఐతే; సంశ్రితాః = ఐతే.
భావం:-
ఇటుల మనము చేసినచో, ఇక్షాకుల రాజధాని పౌరులు ఇంక ఇప్పటివలె మరల, నా యందలి ప్రీతిచేత ఇలా చెట్లక్రింద పరుండుట జరుగదు.
2.46.23.అనుష్టుప్
పౌరా హ్యాత్మకృతాద్దుఃఖాత్
విప్రమోచ్యా నృపాత్మజైః।
న తు ఖల్వాత్మనా యోజ్యా
దుఃఖేన పురవాసినః”॥
టీక:
పౌరాః = పౌరులకు; హి = కదా; ఆత్మకృతాః = తమవలన కలిగిన; దుఃఖాత్ = దుఃఖములను; విప్రమోచ్యా = తొలగించవలెను; నృపాత్మజైః = రాకుమారులు; న = కాదు; తు = మఱి; ఖలు = మిక్కిలి; ఆత్మనా = స్వయముగా; యోజ్యా = కూర్చదగినవారప; దుఃఖేన = దుఃములను; పురవాసినః = పౌరులకు.
భావం:-
రాజకుమారులు తమవలన పౌరులకు ఏదైనా దుఃఖము కలిగినచో దానిని తొలగించ వలెను కదా, స్వయముగా పౌరులకు దుఃఖము కలిగించ రాదు.”
2.46.24.అనుష్టుప్
అబ్రవీల్లక్ష్మణో రామమ్
“సాక్షాద్ధర్మమివస్థితమ్।
రోచతే మే తథా ప్రాజ్ఞ!
క్షిప్ర మారుహ్యతామితి”॥
టీక:
అబ్రవీత్ = చెప్పెను; లక్ష్మణః = లక్ష్మణుడు; రామమ్ = రామునిగూర్చి; సాక్షాత్ = సాక్షాత్తు; ధర్మమ్ = ధర్మము; ఇవ = వలె; స్థితమ్ = ఉన్నది; రోచతే = నచ్చినది; మే = నాకు; తథా = అట్లు; ప్రాజ్ఞ = బుద్ధిశాలి; క్షిప్ర మ్ = శీఘ్రమే; ఆరుహ్యతామ్ = ఎక్కబడుగాక; ఇతి = అని.
భావం:-
లక్ష్మణుడు రామునితో సాక్షాత్తు ధర్మబద్దముగా ఉన్నది. నాకు నచ్చినది. శీఘ్రమగా రథము ఎక్కెదము.
2.46.25.అనుష్టుప్
అథ రామోఽ బ్రవీచ్ఛ్రీమాన్
సుమంత్రం “యుజ్యతాం రథః।
గమిష్యామి తతోఽ రణ్యమ్
గచ్ఛ శీఘ్రమితః ప్రభో”॥
టీక:
అథ = పిమ్మట; రామః = రాముడు; అబ్రవీత్ = పలికెను; శ్రీమాన్ = శ్రీమంతుడైన; సుమంత్రమ్ = సుమంత్రునిగూర్చి; యుజ్యతాం = కట్టబడుగాక; రథః = రథము; గమిష్యామి = వెళ్ళెదము; తతః = దానిపై; అరణ్యమ్ = అడవినిగూర్చి; గచ్ఛ = వెళ్ళుము; శీఘ్రమ్ = శీఘ్రముగా; ఇతః = ఇక్కడనుండి; ప్రభో = సమర్థుడా.
భావం:-
తరువాత, తేజశ్శాలి రాముడు సుమంత్రునికి ఇలా ఆదేశించెను. “ఓ సమర్థుడా! శీఘ్రమే రథము కట్టుము. దానిపై అడవికి వెళ్ళెదము. బయలుదేరుము.”
2.46.26.అనుష్టుప్
సూతస్తతః స త్వరితః
స్యందనం తైర్హయోత్తమైః।
యోజయిత్వాఽథ రామాయ
ప్రాంజలిః ప్రత్యవేదయత్॥
టీక:
సూతః = సూతుడు; తతః = ఆ వెంటనే; సః = ఆ; త్వరితః = వేగముగా; స్యందనం = రథమును; తైః = తయారుచేసి; హయోత్తమైః = శ్రేష్టమైన గుఱ్ఱములను; యోజయిత్వా = కట్టి; అథ = పిమ్మట; రామాయ = రామునికి; ప్రాంజలిః = దోసిలొగ్గి; ప్రత్యవేదయత్= తెలిజేసెను.
భావం:-
ఆ వెంటనే సూతుడు వేగముగా రథమును సిద్ధముచేసి, గుఱ్ఱములను పూన్చి, రామునికి దోసిలొగ్గి ఇలా తెలియజేసెను.
2.46.27.అనుష్టుప్
“అయం యుక్తో మహాబాహో!
రథస్తే రథినాంవర!।
త్వమారోహస్వ భద్రం తే
ససీత స్సహలక్ష్మణః॥
టీక:
అయం = ఇదిగో; యుక్తః = సిద్ధమగా ఉన్నది; మహాబాహో = గొప్పభుజబలశాలి; రథః = రథము; తే = నీయొక్క; రథినాంవర = రథికులలో శ్రేష్ణుడా; త్వమ్ = నీవు; ఆరోహస్వ = ఎక్కుము; భద్రంతే = నీకుభద్రమగుగాక; స = కూడ; సీతః = సీతతో; సహ = సహితంగా; లక్ష్మణః = లక్షణుడు.
భావం:-
మహారథికుడా! రామా! ఇదిగో నీ రథం సిద్ధమగా ఉన్నది. నీకు క్షేమ మగుగాక. నీవు, సీత, లక్ష్మణులు రథము ఎక్కండి.
2.46.28.అనుష్టుప్
తం స్యందనమధిష్ఠాయ
రాఘవః సపరిచ్ఛదః।
శీఘ్రగామాకులావర్తాం
తమసామ్ అతరన్నదీమ్॥
టీక:
తం = తరణమ్, దాటించగలదగు; స్యందనమ్ = రథము; అధిష్ఠాయ = ఎక్కి; రాఘవః = రఘురాముడు; సపరిచ్ఛదః = పరికరములతో; శీఘ్రగామే = వడిగా ప్రవహిస్తున్నది; ఆకులావర్తామ్ = వ్యాకులమైన సుడులుగలదీ; తమసామ్ = తమసానదిని; అతరత్ = దాటెను; నదీమ్ = నదిని.
భావం:-
సీతారామ లక్ష్మణులు తమ ధనుర్భాణాదులు మున్నగు సకల పరికరములు సహితముగా రథమును అధిష్టించి, మిక్కిలి వ్యాకులమైన సుడులుతో వేగముగా ప్రవహిస్తున్న తమసానదిని దాటెను
2.46.29.అనుష్టుప్
స సంతీర్య మహాబాహుః
శ్రీమాన్ శివమకణ్టకమ్।
ప్రాపద్యత మహామార్గమ్
అభయం భయదర్శినామ్॥
టీక:
స = అతడు; సంతీర్య = దాటి; మహాబాహుః = భుజబలశాలి; శ్రీమాన్ = శ్రీమంతుడు; శివమ్ = మంగళకరమైనదీ; అకణ్టకమ్ = ఏ ఇబ్బందులలేనిది, మోర్నియర్-విలియమ్స్; ప్రాపద్యత = పొందెను; మహామార్గమ్ = రహదారిని; అభయం = భయములేనిది; భయదర్శినామ్ = చూడభయంకరముగా ఉండునవి.
భావం:-
రాముడు మంగళకరమైనదీ ఏ ఇబ్బందీ పెట్టనిదీ ఐన ఆ నదిని దాటి, భీకరమైన మృగాదుల భయము లేనిది అగు రహదారిని చేరిరి.
*గమనిక:-
పుల్లెలవారి రామాయణ ప్రతిలో- ప్రాచ్యప్రతిలో :ప్రపేదే తమసామార్గ। మభయం క్షేమదర్శనీమ్॥“ అను పాఠము బాగున్నది. భద్రమైనది, భయరహితమైనది అగు తమసానదికి వెళ్ళు మార్గము చేరిరి అని అర్థము కనుక చక్కగా ఉన్నది.
2.46.30.అనుష్టుప్
“మోహనార్థం తు పౌరాణామ్”
సూతం రామోఽ బ్రవీద్వచః।
“ఉదఙ్ముఖః ప్రయాహి త్వమ్
రథమాస్థాయ సారథే!”॥
టీక:
మోహనార్థం = మోసపుచ్చుటకు, మరిపించుచకు; తు = తప్పక; పౌరాణామ్ = పౌరుల; సూతం = సూతునిగూర్చి; రామః = రాముడు; అబ్రవీత్ = పలికెను; వచః = మాటలు; ఉదంముఖః = ఉత్తరాభిముఖుడవై; ప్రయాహి = వెళ్ళుము; త్వమ్ = నీవు; రథమ్ = రథము; ఆస్థాయ = ఎక్కి; సారథే = సారథీ.
భావం:-
సూతునికి రాముడు ఇలా ఆదేశించెను. “సారధీ! నీవు రథము ఎక్కుము. మన పౌరులను మరిపించుటకు ఉత్తరంవైపుకు పోనిమ్ము.
2.46.31.అనుష్టుప్
ముహూర్తం త్వరితం గత్వా
నివర్తయ రథం పునః।
యథా న విద్యుః పౌరా మామ్
తథా కురు సమాహితః”॥
టీక:
ముహూర్తం = కొద్దిసేపు, 45 నిమిషములు; త్వరితం = వేగంగా; గత్వా = వెళ్ళి; నివర్తయ = వెనుదిరుగుదుగాక; రథం = రథమును; పునః = మరల; యథా = ఎట్లైతే; న = లేరో; విద్యుః = తెలిసికొన; పౌరా = పౌరులు; మామ్ = నన్ను; తథా = ఆవిధముగా; కురు = చేయుము; సమాహితః = సావధానచిత్తుడవై.
భావం:-
కొద్దిసేవు వేగంగా అలా వెళ్ళి, మరల రథమును వెనుకకు మరల్చుము. సావధానచిత్తుడవై పౌరులకు నా ఆచూకి తెలియకుండునట్లు చూడుము.”
2.46.32.అనుష్టుప్
రామస్య వచనం శ్రుత్వా
తథా చక్రే స సారథిః।
ప్రత్యాగమ్య చ రామస్య
స్యందనం ప్రత్యవేదయత్॥
టీక:
రామస్య = రాముని; వచనం = ఆజ్ఞ; శ్రుత్వా = విని; తథా = అటులనే; చక్రే = చేసెను; స = ఆ; సారథిః = సారథి; ప్రత్యాగమ్య = తిరిగివచ్చి; చ = మఱియు; రామస్య = రామునికి; స్యందనమ్ = రథమునుగూర్చి; ప్రత్యవేదయత్ = తెలియజేసెను.
భావం:-
ఆ సుమంత్రు రాముని ఆజ్ఞ ప్రకారము అలాగే చేసి, తిరిగి వచ్చి రామునికి రథము సిద్దముగా ఉన్నదని చెప్పెను.
2.46.33.జగతి.
తౌ సంప్రయుక్తం తు రథం సమాస్థితౌ
తదా ససీతౌ రఘువంశవర్ధనౌ।
ప్రచోదయామాస తతస్తురంగమాన్
స సారథిర్యేన పథా తపోవనమ్॥
టీక:
తౌ = అంతట; సంప్రయుక్తమ్ = పూన్చినది; తు = ఐనట్టి; రథమ్ = రథమును; సమాస్థితౌ = ఎక్కిరి; తదా = అప్పుడు; స = సహితముగా; సీతౌ = సీతతో; రఘువంశవర్ధనౌ = రఘువంశమును వృద్ధి పొందించు రామలక్ష్మణులు; ప్రచోదయామాస = తోలెను; తతః = పిమ్మట; తురంగమాన్ = గుఱ్ఱములను; స = ఆ; సారథి = సారథి; యేన = ఎటు; పథా = మార్గము ఉన్నదో; తపోవనమ్ = తాపసులు ఉండు వనము.
భావం:-
అంతట, సీతాదేవి తోపాటు రామలక్ష్మణులు ఇద్దరూ పూన్చి ఉన్న రథము అధిరోహించిరి. సుమంత్రుడు తపోవనము వైపు వెళ్ళెడి దారమ్మట గుఱ్ఱములను తోలెను.
2.46.34.జగతి.
తతః సమాస్థాయ రథం మహారథః
ససారథిః దాశరథిర్వనం యయౌ।
ఉదఙ్ముఖం తం తు రథం చకార స
ప్రయాణమాంగళ్య నిమిత్తదర్శనాత్॥
టీక:
తతః = అనంతరం; సమాస్థాయ = ఎక్కి; రథమ్ = రథమును; మహారథః = మహారథియైన; స = తోపాటు; సారథిః = సారథి; దాశరథిః = దశరథరాముడు; వనమ్ = వనమునకు; యయౌ = బయలుదేరెను; ఉదఙ్ముఖమ్ = ఉత్తరాభిముఖముగా; తం = ఆ; తు = యొక్క; రథము = రథమును; చకార = చేసెను; స = ఆ; ప్రయాణః = ప్రయాణమునకు; మాంగళ్య = మంగళకరమైన; నిమిత్త = శకునము; దర్శనాత్ = చూచుటవలన.
భావం:-
మహారథి ఐన దాశరథరాముడు సారథితోపాటు రథము అధిష్టించి వనమునకు బయలుదేరెను. ప్రయాణమునకు మంగళకరమైన శకునములు చూచి, సారథి సుమంతుడు రథమును ఉత్తరాభిముఖముగా ప్రయాణము కొనసాగించెను.
2.46.35.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; షట్చశ్చత్వారింశః [46] = నలభైఆరవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని లోని [46] నలభైఆరవ సర్గ సంపూర్ణము.
2.47.1.
అనుష్టుప్.
ప్రభాతాయాం తు శర్వర్యామ్
పౌరాస్తే రాఘవం వినా।
శోకోపహతనిశ్చేష్టా
బభూవుర్హతచేతసః॥
టీకః-
ప్రభాతాయాం = తెల్లవారగనే; తు = నిశ్చయంగా; శర్వర్యామ్ = రాత్రి; పౌరాః = పౌరులు; తే = వారు; రాఘవం = శ్రీరామచంద్రుడు; వినా = లేకపోవుటచే; శోకః = శోకముచేత; ఉపహత = పీడింపబడినవారై; నిశ్చేష్టాః = నిశ్చేష్టులు; బభూవుః = అయ్యిరి; హత = చెడిన; చేతసః = మనస్సులు గలవారై.
భావంః-
ఆ రాత్రి గడచి తెల్లవారగానే పౌరులు మేల్కొనిరి. అక్కడ శ్రీరామచంద్రుడు కనపడకపోవుటచే వారందఱు నిశ్చేష్టులై దుఃఖభారముతో నీరుగారిపోయిరి.
*గమనికః-
శర్వరి- వ్యుత్పత్తి- శౄ-హింసాయామ్+ షర్వచ్- జీష్. కృ.ప్ర.
2.47.2.
అనుష్టుప్.
శోకజాశ్రుపరిద్యూనా
వీక్షమాణాస్తతస్తతః।
ఆలోకమపి రామస్య
న పశ్యన్తి స్మ దుఃఖితాః॥
టీకః-
శోకజాః = దుఃఖముచే కలిగిన; అశ్రు = కన్నీటితో; పరిద్యూనాః = దుఃఖముచే కలిగిన కన్నీటితో తడిసినవారై; వీక్షమాణాః = చూచుచు; తతః+తతః = అటునిటు; ఆలోకమ్ = జాడను; అపి = కూడ; రామస్య = రామునియొక్క; న = లేదు; పశ్యన్తి = కనుట; స్మ = సుమా!; దుఃఖితాః = బాధపడినవారై.
భావంః-
కన్నీరు నిండిన కళ్ళతో శ్రీరామచంద్రుని జాడకొఱకు అటునిటు వెదికిరి. ఎంత గాలించినను ఆ స్వామి జాడ వారికి కనబడకుండెను.
2.47.3.
అనుష్టుప్.
తే విషాదార్తవదనా
రహితాస్తేన ధీమతా।
కృపణాః కరుణా వాచో
వదన్తి స్మ మనస్వినః॥
టీకః-
తే = వారు; విషాద = శోకముతో; ఆర్త = పీడింపబడుచున్న; వదనాః = మోములు గలవారై; రహితాః = శూన్యులై; తేన = వానితో; ధీమతా = బుద్ధిమంతుడు; కృపణాః = దీనులు; కరుణాః = కరుణతో; వాచః = వాక్కులు;వదన్తి = నుడివిరి; స్మ = సుమ; మనస్వినః = సున్నిత మనస్కులు.
భావంః-
సున్నితమైన మనస్సు గల ఆ పౌరులందఱు శ్రీరామచంద్రుని దర్శనభాగ్యమునకు దూరమగుటవలన మిక్కిలి దుఃఖించిరి, వారి మోములు వెలవెలబోయెను. దీనులై దిగులు పడుచు ఇట్లు మాటాలాడుకొనిరి.
*గమనికః-
విషాదము- వ్యుత్పత్తి. వి విశేషస్య+ షద విశారణాదౌ
ఘఞ, కృ.ప్ర. ఖేదము, దుఃఖము, అపహాస్యము అవమానము మొదలైన వానిటే ఉపాయముతోచక మనసున కలిగెడి చింత, ఆంధ్రశబ్దరత్నాకరము.
2.47.4.
అనుష్టుప్.
ధిగస్తు ఖలు నిద్రాం తామ్
యయాఽ పహృతచేతసః।
నాద్య పశ్యామహే రామమ్
పృథూరస్కం మహాభుజమ్॥
టీకః-
ధిక్ = నింద; అస్తు = అగుగాక; ఖలు = నిశ్చయముగ; నిద్రాం = నిద్రనుగూర్చి; తామ్ = ఆ;యయా = దేనివలన; అపహృతచేతసః = దొంగిలించబడిన మనస్సులు కాలవారమై; న = లేదు; అద్య = ఇప్పుడు; పశ్యామహే = చూచుట; రామమ్ = శ్రీరామచంద్రుని; పృథూరస్కం = పృథూః+ ఉరస్కం, విశాలవక్షస్స్థలముగల; మహాభుజమ్ = గొప్పబాహువులు కలిగిన.
భావంః-
ఛీ! ఈ పాడు నిద్రమత్తులో పడి స్పృహలేక నిద్రించితిమి. ఈ నిద్ర ఎంతపని చేసింది, దీనివలన మహాభుజశాలియు, విశాలవక్షస్థలము గలవాడు అయిన శ్రీరామచంద్రుని దర్శనమునకు దూరమైతిమి.
2.47.5.
అనుష్టుప్.
కథం నామ మహాబాహు
స్స తథావితథక్రియః।
భక్తం జనం పరిత్యజ్య
ప్రవాసం రాఘవో గతః॥
టీకః-
కథం = ఎట్లు; నామ = విస్మయార్థకము; మహాబాహుః = భుజబలుడు; సః = అతడు; తథా = అట్లు; అవితథక్రియః = అమోఘకార్యములు చేయువాడు; భక్తం = భక్తికలిగిన; జనం = జనమును; పరిత్యజ్య = వదిలి; ప్రవాసం = పరదేశవాసము; రాఘవః = రఘువంశమువాడు, శ్రీరామచంద్రుడు; గతః = వెళ్ళినాడు.
భావంః-
అమోఘకార్యములు చేయువాడు, ఆజానుబాహువు అయిన శ్రీరాముడు భక్తులమైన మనలను విడిచిపెట్టి విదేశవాసమునకు ఎట్లు వెడలెను?
*గమనికః-
నామ- వ్యుత్పత్తి- నమ్+ణిచే+డ, నామయతి నామ్యతే అనేన వా, విస్మయము, కోపము.
2.47.6.
అనుష్టుప్.
యో నః సదా పాలయతి
పితా పుత్రానివౌరసాస్।
కథం రఘూణాం స శ్రేష్ఠః
త్యక్త్వా నో విపినం గతః॥
టీకః-
యః = ఎవడు; నః = మనలను; సదా = ఎల్లవేళల; పాలయతి = పాలించునట్టి; పితా = నాన్నగారు; పుత్రాన్ = కుమారుల; ఇవ = వలె; ఔరసాస్ = ఔరసులయిన; కథం = ఏట్లు?; రఘూణాం = రాఘవులయందు; సః = అతడు; శ్రేష్ఠః = శ్రేష్ఠుడు; త్యక్త్వా = వదిలి; నః = మనలను; విపినం = వనముగూర్చి; గతః = వెడలెను?.
భావంః-
రఘువంశోత్తముడయిన శ్రీరామచంద్రమూర్తి మనలను నిరంతరము తండ్రి తన ఔరస పుత్రులను కాపాడుతున్నట్లుగా పాలించెడివాడు; అట్టి ఆ రఘువరుడు మనలందఱిని విడిచి వనమున కెట్లు ఏగినాడు?
2.47.7.
అనుష్టుప్.
ఇహైవ నిధనం యామో
మహాప్రస్థానమేవ వా।
రామేణ రహితానాం హి
కిమర్థం జీవితం హి నః॥
టీకః-
ఇహైవ = ఇక్కడనే; నిధనం = చావును; యామః = కూడినవారు; మహాప్రస్థానమ్ = మరణదీక్షతో ఉత్తర అభిముఖముగా చనుట; ఏవ = మాత్రమే; వా = లేక; రామేణ = రామునితో; రహితానాం = శూన్యమైన; హి; కిమర్థం = ఎందులకు?; జీవితం = బ్రతుకుట; హి; నః = మనలకు.
భావంః-
మనము ఇక్కడే మరణించెదము, లేదా మరణదీక్షతో ఉత్తరాభిముఖులమై ప్రయణించెదము. శ్రీరామచంద్రమూర్తి లేని ఈ బ్రతుకు వ్యర్థము. మనము జీవించి ప్రయోజనమేమి?
2.47.8.
అనుష్టుప్.
సన్తి శుష్కాణి కాష్ఠాని
ప్రభూతాని మహాన్తి చ।
తైః ప్రజ్వాల్య చితాం సర్వే
ప్రవిశామోఽ థ పావకమ్॥
టీకః-
సన్తి = ఉన్నవి; శుష్కాణి = ఎండిన; కాష్ఠాని = కఱ్ఱలు; ప్రభూతాని = అధికముగా; మహాన్తి = పెద్దవి; చ = మఱియు; తైః = వాటిచే; ప్రజ్వాల్య = రగిలించి; చితాం = చితియందు; సర్వే = అందఱము; ప్రవిశామః = ప్రవేశించెదమ; అథ = పిమ్మట; పావకమ్ = అగ్నిలో.
భావంః-
అట్లుకాకున్నచో! ఇక్కడ పెద్దపెద్ద ఎండిన కట్టెలు చాలా ఉన్నవి. వీటికి నిప్పంటించి చితి ఏర్పరచుకుని మంటలలో ప్రవేశించెదము.
2.47.9.
అనుష్టుప్.
కిం వక్ష్యామో మహాబాహుః
అనసూయః ప్రియంవదః।
నీత స్స రాఘవోఽ స్మాభిః”
ఇతి వక్తుం కథం క్షమమ్॥
టీకః-
కిం = ఏది; వక్ష్యామః = చెప్పగలము; మహాబాహుః = గొప్ప భుజబలుడు; అనసూయః = అసూయ ఎఱుగనివాడు; ప్రియంవదః = ప్రియముగా పలుకువాడు; నీతః = శిక్షింపబడెను; సః = అతడు; రాఘవః = రాఘవుడు; అస్మాభిః = మనచేత; ఇతి = అని; వక్తుం = పలుకుటకు; కథం = ఎట్లు; క్షమమ్ = శక్యమైనది.
భావంః-
శ్రీరామచంద్రపభువు ఎక్కడ? అని ఎవరైన అడిగినచో వారికి మనము ఏమి చెప్పగలము? ‘ఆజానుబాహువు , ప్రేమగా మాటలాడువాడు అయిన ఆ శ్రీరామచంద్రుని అడవులలో విడిచి వచ్చితిమి’ అని వారికి ఎట్లు చెప్పగలము?
2.47.10.
అనుష్టుప్.
సా నూనం నగరీ దీనా
దృష్ట్వాఽస్మాన్ రాఘవం వినా।
భవిష్యతి నిరానన్దా
సస్త్రీబాలవయోధికా॥
టీకః-
సా = ఆ; నూనం = తప్పక; నగరీ = నగరము; దీనా = దీనత్వమును పొంది; దృష్ట్వా = చూచి; అస్మాన్ = మనలను; రాఘవం = శ్రీరామచంద్రుడు; వినా = లేకుండ; భవిష్యతి = కాగలదు; నిరానన్దా = నిః+ఆనన్దా, ఆనందమును కోల్పోయినవారగుదురు; స = ఆ; స్త్రీ = ఆడువాఱు; బాల = పిల్లలు; వయోధికా = వృద్ధులు.
భావంః-
అయోధ్యపురములోని బాలబాలికలు, స్త్రీలు, వృద్ధులు మున్నగువారందఱు శ్రీరామచంద్రమూర్తి లేకుండ మనము మాత్రమే తిరిగి వచ్చుట చూచి ఎంతగానో దుఃఖించెదరు, వారి సర్వానందములు అదృశ్యమగును.
2.47.11.
అనుష్టుప్.
నిర్యాతాస్తేన వీరేణ
సహ నిత్యం జితాత్మనా।
విహీనాస్తేన చ పునః
కథం పశ్యామ తాం పురీమ్”॥
టీకః-
నిర్యాతాః = వెడలిన వారము; తేన = ఆ; వీరేణ = వీరునితో; సహ = కూడి; నిత్యం = ఎల్లప్పుడు; జితాత్మనా = మనోనిగ్రహసంప్పన్నుని; విహీనాః = విహీనులమై; తేన = వానితో; చ = మఱియు; పునః = మరల; కథం = ఎట్లు; పశ్యామ = చూచెదము; తాం = ఆ; పురీమ్ = నగరమును.
భావంః-
మనోనిగ్రహసంపన్నుడు, మహావీరుడు అయిన శ్రీరామచంద్రమూర్తితో కలిసి మనము వచ్చితిమి. ఇప్పుడు ఆ ప్రభువు లేకుండ మఱల ఎట్లు ఆ నగరమును చూడగలము?”
2.47.12.
అనుష్టుప్.
ఇతీవ బహుధా వాచో
బాహుముద్యమ్య తే జనాః।
విలపన్తి స్మ దుఃఖార్తా
వివత్సా ఇవ ధేనవః॥
టీకః-
ఇతీవ = ఇట్లు; బహుధా = పరిపరివిధములుగా; వాచః = మాట్లాడుచు; బాహుమ్ = చేతులను; ఉద్యమ్య = పైకెత్తి; తే = ఆ; జనాః = జనులు; విలపన్తి = దుఃఖించిరి; స్మ = సుమ; దుఃఖార్తా = బాధచే పీడింపబడినవారై; వివత్సాః = లేగదూడలను కోల్పోయిన; ఇవ = వలె; ధేనవః = ఆవుల.
భావంః-
ఈ విధముగ ఆ నగరవాసులు పరిపరి విధముల వాపోవుచు చేతులు పైకిచాచి లేగదూడలకు దూరమైన పాడిఆవులవలె విలపించిరి.
2.47.13.
అనుష్టుప్.
తతో మార్గానుసారేణ
గత్వా కించిత్ క్షణం పునః।
మార్గనాశాద్విషాదేన
మహతా సమభిప్లుతాః॥
టీకః-
తతః = తరువాత; మార్గానుసారేణ = మార్గమునందు; గత్వా = వెళ్ళి; కించిత్ = కొంచెము; క్షణం = సమయము; పునః = మఱల;; మార్గనాశాత్ = దారికనపడకపోవుటచేత; విషాదేన = విషాదమునందు; మహతా = చాల; సమభిప్లుతాః = ముంచబడిరి.
భావంః-
ఆ నగరవాసులకు కొంచెము దూరములో ఆ స్వామి రథచక్రముల జాడలు కనిపించెను. ఆ జాడలననుసరించి కొంచెము దూరము ప్రయాణించిరి. తరువాత ఆ జాడలు కనుమరుగవటముతో వారు అంతులేని దుఃఖములో మునిగిపోయిరి.
2.47.14.
అనుష్టుప్.
రథస్య మార్గనాశేన
న్యవర్తంత మనస్వినః।
కిమిదం కిం కరిష్యామో
దైవేనోపహతా ఇతి॥
టీకః-
రథస్య = రథముయొక్క; మార్గృ = జాడ; నాశేన = పోవుట చేత; న్యవర్తంత = మరలిరి; మనస్వినః = సుమనస్కులు; కిమిదం = ఇదేమిటి?; కిం = ఏమి?; కరిష్యామః = చేయగలము?; దైవేన = దైవముచేత; ఉపహతా = దెబ్బతిన్నవారు; ఇతి = వలె॥
భావంః-
శ్రీరామచంద్రుని రథచక్రపు జాడలు కనుమరుగవుటచే దిక్కుతోచని సుమనస్కులైన ఆ పౌరులు "మనము దేపోహతులమి, ఇంకేమి చేయగలము?" అని తలచుచు అయోధ్యకు తిరుగుముఖముపట్టిరి.
2.47.15.
అనుష్టుప్.
తతో యథాగతేనైవ
మార్గేణ క్లాంతచేతసః।
అయోధ్యామగమన్సర్వే
పురీం వ్యథితసజ్జనామ్॥
టీకః-
తతః = పిమ్మట; యథాగతేనైవ = ఎట్లు వచ్చితిరో అటులనే; మార్గేణ = ఆ మార్గమునందే; క్లాంత = అలసిపోయిన, వావిళ్ళ; చేతసః = మనస్సు గలవారు; అయోధ్యామ్ = అయోధ్య గురించి; గమన్ = వెళ్ళిరి; సర్వే = అందఱు; పురీం = నగరమును; వ్యథిత = దుఃఖిత; సజ్జనామ్ = సజ్జనులుకల.
భావంః-
ఆ పౌరులు వికల మనస్సులైరి. వచ్చిన మార్గములోనే అరణ్యము నుండి తిరిగి అయోధ్యకు ప్రయాణమయ్యిరి. ఆ సమయములో అయోధ్యలోని జనులందఱు శోకాక్రాంతులైయుండిరి.
2.47.16.
అనుష్టుప్.
ఆలోక్య నగరీం తాం చ
క్షయవ్యాకులమానసాః।
ఆవర్తయంత తేఽ శ్రూణి
నయనైః శోకపీడితైః॥
టీకః-
ఆలోక్య = చూచి; నగరీం = పురమును; తాం = ఆ; చ = మఱియు; క్షయ = వెలితితో, న్యూనత, వావిళ్ళ; వ్యాకుల = వ్యాకులమైన; మానసాః = మనస్సు కలవారు; ఆవర్తయంత = రాల్చిరి; తే = వారు; అశ్రూణి = కన్నీళ్ళను; నయనైః = కన్నులచే; శోకపీడితైః = శోకముచే పీడింపబడిన.
భావంః-
శ్రీరామచంద్రుడులేని ఆ నగరమును చూచిన వారి మనసులు న్యూనత వ్యాకులపాటులు చెందినవి. దుఃఖముచే పీడింపబడిన కన్నులతో కన్నీరు కార్చుచు విలపించిరి.
2.47.17.
అనుష్టుప్.
ఏషా రామేణ నగరీ
రహితా నాతిశోభతే।
ఆపగా గరుడేనేవ
హ్రదాదుద్ధృతపన్నగా॥
టీకః-
ఏషా = ఈ; రామేణ = శ్రీరామచంద్రునితో; నగరీ = పట్టణము; రహితా = లేనటువంటి; న = లేదు; అతిశోభతే = శోభించుట; ఆపగా = నది; గరుడేన = గరుత్మంతునితో; ఇవ = వలె; హ్రదాత్ = మడుగునుండి; ఉద్ధృత = ఎత్తుకుపోయిన; పన్నగా = పాము గల.
భావంః-
మడుగులోని సర్పమును గరుత్మంతుడు ఎత్తుకునిపోగా శోభావిహీన మైయున్న నదివలె, శ్రీరామచంద్రుడు లేని ఆ పట్టణము ఏమియు ప్రకాశించుట లేదు.
*గమనికః-
(1) పన్నగ- వ్యుత్పత్తి, పద+ న+ గమ్+ డ, పధ్యాం న గచ్ఛతి, కాళ్ళతో వెళ్ళనిది, సర్పము, (2) గరుత్మంత- వ్యుత్పత్తి. ప్రశస్తే గుతాస్తః- గరుత్ (పక్షి ఱెక్క అస్య+ మతుపే, తప్ర., సారవంతమైన ఱెక్కలుగలవాడు, హరివాహనుడు, ఆంధ్రశబ్దరత్నాకరము
2.47.18.
అనుష్టుప్.
చంద్రహీనమివాకాశమ్
తోయహీనమివార్ణవమ్।
అపశ్యన్నిహతానందమ్
నగరం తే విచేతసః॥
టీకః-
చంద్ర = చందబింబము; హీనమ్ = లేని; ఇవ = వలె; ఆకాశమ్ = గగనము; తోయ = నీరు; హీనమ్ = లేని; ఇవ = వలె; అర్ణవమ్ = సాగరము; అపశ్యన్ = చూచిరి; నిహత = మిక్కిలి చెడిన, వావిళ్ళ; ఆనందమ్ = ఆనందము గల; నగరం = పట్టణమును; తే = వారు; విచేతసః = విరుద్ధమైన చిత్తము గల.
భావంః-
సంతోషమన్నది చెరిగిపోయి, బాధపడుతున్న ఆ పౌరులకు అయోధ్యా నగరము చందమామలేని ఆకాశమువలె, నీరులేని సముద్రము వలె తోచినది.
2.47.19.
త్రిష్టుప్.
తే తాని వేశ్మాని మహాధనాని
దుఃఖేన దుఃఖోపహతా విశన్తః।
నైవ ప్రజజ్ఞుః స్వజనం జనం వా
నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః॥
టీకః-
తే = వారు; తాని = ఆ; వేశ్మాని = ఇళ్ళను; మహాధనాని = మిక్కిలి ధనముగల; దుఃఖేన = బాధతో; దుఃఖోపహతా = దుఃఖముతో గాయబడిన వారై; విశన్తః = విస్తారమైన; న = లేదు; ఏవ = మాత్రము; ప్రజజ్ఞుః = గుర్తుపట్టుట; స్వజనం = తమవారిని; జనమ్ = వారిని; వా = కాని; నిరీక్షమాణాః = ఎదురుచూచుచున్న; ప్రవినష్ట =పూర్తిగా కోల్పోయిన; హర్షాః = సంతోషముగలవారై.
భావంః-
తమ ఇండ్లు కొల్లలుగా సంపదలు గలవైనను తీవ్రదుఃఖముతో ఆ పౌరులను ఆ ధనములు వారి శోకములను తొలగింపలేకున్నవి. వారు తమ యెదుటనున్న వ్యక్తులు తమకోసం ఎదురు చూస్తున్న తమవారో లేక ఇతరులో అని కూడ గుర్తింపలేకుండిరి.
2.47.20.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే సప్తచత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; సప్తచశ్చత్వారింశః [47] = నలభైఏడవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [47] నలభైయేడవ సర్గ సంపూర్ణము.
2.48.1.అనుష్టుప్
తేషామేవం విషణ్ణానామ్
పీడితానామతీవ చ।
బాష్పవిప్లుతనేత్రాణామ్
సశోకానాం ముమూర్షయా॥
టీక;-
తేషామ్ = వారు; ఏవం = ఈ విధముగా; విషణ్ణానామ్ = దుఃఖమునొందిన వారు; పీడితానామ్ = బాధింపబడిన వారు; అతీవ = అధికముగా; చ = మఱియు; బాష్ప = కన్నీరు; విప్లుత = నిండిన; నేత్రాణామ్ = కన్నులు గలవారు; స = కూడిన; శోకానాం = శోకము కలవారు; ముమూర్షయా = మరణించవలె నను కోరికతో ఉన్నవారు.
భావము;-
ఆ నగరవాసులు ఈ విధముగా బాగా బాధపడుచు, దుఃఖించుచున్నారు. చచ్చిపోదాం అనుకుంటూ కళ్ళనిండాకన్నీళ్ళతో విలపించుచుండిరి.
2.48.2.అనుష్టుప్
అనుగమ్య నివృత్తానామ్
రామం నగరవాసినామ్।
ఉద్గతానీవ సత్వాని
బభూవురమనస్వినామ్॥
టీక;-
అనుగమ్య = అనుసరించి; నివృత్తానామ్ = మరలి వచ్చువారు; రామమ్ = రాముని; నగరవాసినామ్ = పౌరుల యొక్క; ఉద్గతానీవ = లేచిపోయినవా అన్నట్లున్న; సత్వాని = ప్రాణములు గలవారు; బభూవః = అయిరి; అమనస్వినామ్ = దేనియందు ఆసక్తి లేనివారు.
భావము;-
రాముని వెంటవెళ్ళి వెనుదిరిగిన ఆ పౌరులు, దేనియందూ ఆసక్తి లేకుండా ప్రాణాలు పోయావా అన్నట్లు ఉండిరి.
2.48.3.అనుష్టుప్
స్వంస్వం నిలయమాగమ్య
పుత్రదారైః సమావృతాః।
అశ్రూణి ముముచుః సర్వే
బాష్పేణ పిహితాననాః॥
టీక;-
స్వంస్వమ్ = తమతమ; నిలయమ్ = ఇండ్లకు; ఆగమ్య = వచ్చి; పుత్రః = పిల్లలు; దారైః = భార్యలచేత; సమావృతాః = చుట్టూఉన్నవారు; అశ్రూణి = కన్నీరు; ముముచుః = విడిచిరి; సర్వే = వారందరూ; బాష్పేణ = కన్నీళ్లు; పిహిత = కప్పిన; ఆననాః = ముఖములు కలవారైరి.
భావము;-
వారందరూ వారివారి ఇండ్లకు చేరారు. భార్యాపిల్లలు చుట్టూ చేరారు. కన్నీటితో తడిసిపోయిన ముఖములతో విలపించిరి.
2.48.4.అనుష్టుప్
న చాహృష్యన్ న చామోదన్
వణిజో న ప్రసారయన్।
న చాశోభంత పుణ్యాని
నాపచన్ గృహమేథినః॥
టీక;-
న = లేదు; చ = ఇక; అహృష్యన్ = సంతోషించుట; న = లేదు; చ = ఇక; అమోదన్ = అభినందించుట; వణిజః = వర్తకులు; న = లేదు; ప్రసారయన్ = అమ్ముట; న = లేవు; చ = ఇక; అశోభన్తః = కళగా; పుణ్యాని = పుణ్యక్షేత్రములు; న = అ; అపచన్ = వండుట; గృహమేథినః = గృహస్తులు.
భావము;-
వారికి ఎవరికీ ఇక సంతోషమన్నది లేదు, దేనిని అమోదించుటన్నదీ లేదు. వర్తకులు అమ్మకాలు చేయుటలేదు. దేవాలయాలాది కళావిహీనంగా ఉన్నాయి. ఏ ఇంటిలోనూ వంట వండుటంలేదు.
2.48.5.అనుష్టుప్
నష్టం దృష్ట్వా నాభ్యనందన్
విపులం వా ధనాగమమ్।
పుత్రం ప్రథమజం లబ్ధ్వా
జననీ నాభ్యనందత॥
టీక;-
నష్టమ్ = నష్టము; దృష్ట్వా = చూచినా; న = లేదు; అభ్యనందన్ = అభి+ ఆనందన్, ఏమాత్రము సంతోషించుట; విపులం = అధికముగా; వా = ఐనా; ధనాః = సంపదలు; ఆగమమ్ = వచ్చినా; పుత్రం = కొడుకు; ప్రథమజమ్ = తొలికాన్పులో పుట్టుట; లబ్ధ్వా = పొందినా; జననీ = తల్లి; న = లేదు; అభ్యనందత = అభి+ ఆనందన్, ఏమాత్రము సంతోషించుట.
భావము;-
చాలా లాభాలు వచ్చినా లేదా నష్టాలు వచ్చినా ఏమాత్రం స్పందించుట లేదు. తొలిచూలులో మగబిడ్డ పుట్టినా తల్లి ఏమాత్రం సంతోషించుటలేదు.
2.48.6.అనుష్టుప్
గృహే గృహే రుదన్త్యశ్చ
భర్తారం గృహమాగతమ్।
వ్యగర్హయంత దుఃఖార్తా
వాగ్భిస్తోత్రైరివ ద్విపాన్॥
టీక;-
గృహేగృహే = ప్రతిఇంటిలోనూ; రుదన్త్యః = ఏడ్చుచు; చ = ఇంక; భర్తారమ్ = భర్తను; గృహమ్ = ఇంటికి; ఆగతమ్ = వచ్చినవానిని; వ్యగర్హయంత = నిందించింరి; దుఃఖః = దుఃఖముచే; ఆర్తా = పీడింపబడినవారు; వాగ్భిః = మాటలతో; తోత్రైః = అంకుశముతో; ఇవ = వలె; ద్విపాన్ = ఏనుగును.
భావము;-
దుఃఖముతో పీడింపబడుచూ ప్రతీ మహిళ భర్త ఇంటికి రావడం తరువాయి ఏడుస్తూ, ఏనుగును అంకుశంతో పొడిచినట్లు, మాటలతో హింసిస్తున్నారు.
2.48.7.అనుష్టుప్
కిం ను తేషాం గృహైః కార్యమ్
కిం దారైః కిం ధనేన వా।
పుత్రైర్వా కిం సుఖైర్వాపి
యే న పశ్యంతి రాఘవమ్॥
టీక;-
కిం = ఏమి; ను = ఉన్నది; తేషామ్ = వారికి; గృహైః = గృహములచేత; కార్యమ్ = ప్రయోజనము; కిం = ఏమి; దారైః = భార్యలచేత; కిం = ఏమి; ధనేన = సంపదలచేత; వా = లేదా; పుత్రైః = సంతానంచేత; వా = లేదా; కిం = ఏమి; సుఖైః = సుఖములచేత; అపి = ఐనా; యేన్ = ఎవరు; న = లేదో; పశ్యంతి = చూచుట; రాఘవమ్ = రఘురాముని.
భావము;-
రాముడిని చూడనివారికి, ఇప్పుడు ఇండ్లతోకాని, భార్యలతోగాని, సంపదలతో గాని ఏమి ప్రయోజనము ఉన్నది. సంతానం వలనగాని, సుఖాలవలన గాని ఏమి ప్రయోజనము ఉన్నది.
2.48.8.అనుష్టుప్
ఏకః సత్పురుషో లోకే
లక్ష్మణః సహ సీతయా।
యోఽనుగచ్ఛతి కాకుత్స్థమ్
రామం పరిచరన్ వనే॥
టీక;-
ఏకః = ఒకేఒక్కడు; సత్పురుషః = సత్పురుషుడు; లోకే = లోకంలో; లక్ష్మణః = లక్ష్మణుడు; సహ = కలిసి; సీతయా = సీతతో; యః = వెళ్ళుచుండగా; అనుగచ్ఛతి = అనుసరించి వెళ్ళెను; కాకుత్స్థమ్ = కాకుత్స్థ వంశపు; రామమ్ = రాముని; పరిచరన్ = సేవించుటకు; వనే = అడవులలోనికి.
భావము;-
లోకంలో లక్ష్మణుడొక్కడే సత్పురుషుడు. రాముని సేవించుట కొఱకు వనవాసానికి వెళ్ళుచుండగా సీతాదేవితో కలిసి అనుసరించి వెళ్ళెను.
2.48.9.అనుష్టుప్
ఆపగాః కృతపుణ్యాస్తా
పద్మిన్యశ్చ సరాంసి చ।
యేషు స్నాస్యతి కాకుత్స్థో
విగాహ్య సలిలం శుచి॥
టీక;-
ఆపగాః = నదులూ; కృత = చేయబడిన; పుణ్యాః = పుణ్యము గలవి; తాః= అవి; పద్మిన్యః = తామరకొలనులు; చ = మఱియు; సరాంసి = సరస్సులు; చ = మఱియు; యేషు = వేటియందు; స్నాస్యతి = స్నానము చేయగలడో; కాకుత్థ్సః= రాముడు; విగాహ్య = ప్రవేశించి; సలిలమ్ = నీటిలో; శుచి = శుభ్రమైనవి.
భావము;-
కాకుత్స్థవంశపు రాముడు నదులూ, కొలనులు, సరస్సుల యందలి శుభ్రమైన నీటిలో స్నానములు చేయగలడో అవి పుణ్యవంతమైనవి.
2.48.10.అనుష్టుప్
శోభయిష్యంతి కాకుత్స్థమ్
అటవ్యో రమ్యకాననాః।
ఆపగాశ్చ మహానూపాః
సానుమంతశ్చ పర్వతాః॥
టీక;-
శోభయిష్యంతి = ప్రకాశింపజేయగలవు; కాకుత్స్థమ్ = రాముని; అటవ్యః = అడవులలోని; రమ్య = అందమైన; కాననాః = వనములు; ఆపగాః = జలప్రవాహములు; చ = మఱియు; మహా = పెద్ద; అనూపాః = బురదనేలలు; సానుమన్తః = చరియలు గల; చ = మఱి; పర్వతాః = కొండలు.
భావము;-
ఆ దండకారణ్యములలోని వనములు జలసదుపాయము, చక్కని చెట్లు ఉండుటచే అందముగా ఉండును. ఇవి ఇంకా జల ప్రవాహములు, విశాలమైన బురదనేలలు మఱియు చరియలు గల కొండలు రాముని శోభింపజేయగలవు.
*గమనిక:-
(1) కాననం- వ్యుత్పత్తి- కం జలం అననం జీవనమస్య, జలమే జీవనముగా కలది వనము. ఇక్కడ వనము నందు జలసదుపాయము ఉండుటచే ఇక్కడ జీవించుటకు అనువుగా ఉండును. (2) అపగా- అప పల్లమువైపు గా పోవునది, జల ప్రవాహములు, నదులు, ఏరులు.
2.48.11.అనుష్టుప్
కాననం వాపి శైలం వా
యం రామోఽధిగమిష్యతి।
ప్రియాతిథిమివ ప్రాప్తమ్
నైనం శక్ష్యన్త్యనర్చితుమ్॥
టీక;-
కాననమ్ = వనములు; వాపి = నడబావిలు, దీర్ఘికలు; శైలమ్ = కొండలు; వా = లేదా; యమ్ = ఆగినవి = అ; రామః = రాముడు; అధిగమిష్యతి = దాటినవి; ప్రియా = ఇష్టుడైన; అతిథిమ్ = అతిథులను; ఇవ = వలె; ప్రాప్తమ్ = పొందును; న = లేవు; ఏనమ్ = ఇతనిని; శక్ష్యంతి = సమర్థములు; అనర్చితుమ్ = పూజించుటకుండా.
భావము;-
రాముడు దాటి వెళ్ళినవి, ఆగి ఉన్నవి ఐన వనములు, నడబావులు లేదా కొండలు ఇతనిని ప్రియమైన అతిథి వలె ఆదరించకుండా ఉండలేవు.
*గమనిక:-
మామూలు ప్రభువు వస్తేనే ఇంటివారందరూ గొప్పగా ఆతిథ్యం ఇస్తారు, అలాంటప్పుడు, వచ్చువాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు. కనుక ప్రకృతి తన ప్రభువు అతిథియై వస్తున్నాడని పరవశించి గౌరవాదారాలుతో సత్కరిస్తోంది అన్నమాట అనకపోయినా ప్రతిఫలిస్తోంది.
2.48.12.అనుష్టుప్
విచిత్రకుసుమాపీడా
బహుమంజరి ధారిణః।
రాఘవం దర్శయిష్యంతి
నగా భ్రమరశాలినః॥
టీక;-
విచిత్ర = విచిత్రమైన; కుసుమ = పూలు; ఆపీడాః = శిరోభూషణములుగా కలవి; బహు = అనేకమైన; మంజరి = పూగుత్తులు; ధారిణః = ధరించినవి; రాఘవమ్ = రఘురామునికి; దర్శయిష్యంతి = కనుపింపజేయగలవు; నగా = కొండలు; భ్రమర = తుమ్మెదల; శాలినః = శోభించునవి.
భావము;-
అనేక పూలగుత్తులు ధరించి రంగు రూపుల విశిష్టమైన పూలు శిరోభూషణముగా కల, కొండలు తమ తుమ్మెదలతో కూడిన శోభను రామునికి చూపించ గలవు.
2.48.13.అనుష్టుప్
అకాలే చాపి ముఖ్యాని
పుష్పాణి చ ఫలాని చ।
దర్శయిష్యన్త్యనుక్రోశాత్
గిరయో రామమాగతమ్॥
టీక;-
అకాలే = కాపుకాసేకాలం కానికాలం; చాపి = చ+ అపి, అయినప్పటికీ; ముఖ్యాని = ఉత్తమమైన; పుష్పాణి = పూవులు; చ = మఱియు; ఫలాని = పండ్లు; చ = మఱియు; దర్శయిష్యంతి = కనపడజేయగలవు; అనుక్రోశాత్ = దయవలన; గిరయః = కొండలు; రామమ్ = రామునికి; ఆగతమ్ = వచ్చిన.
భావము;-
అకాలము అయినప్పటికినీ, మంచి పువ్వులు పండ్లూ, పర్వతములు దయతో పండించి వచ్చిన రామునికి అందించగలవు.
2.48.14.అనుష్టుప్
ప్రస్రవిష్యంతి తోయాని
విమలాని మహీధరాః।
విదర్శయన్తో వివిధాన్
భూయశ్చిత్రాంశ్చ నిర్ఝరాన్॥
టీక;-
ప్రస్రవిష్యంతి = ఊరుతున్నాయి; తోయాని = నీళ్ళు; విమలాని = స్వచ్చమైనవి; మహీధరాః = పర్వతాలనుండి; విదర్శయన్తః = చూపుచున్నవై; వివిధాన్ = అనేకము; భూయః = మఱల; చిత్రాం = విచిత్రమైన; చ = ఇంకా; నిర్ఝరాన్ = సెలయేర్లను.
భావము;-
పర్వతములు స్వచ్చమైన నీళ్ళు కారుస్తూ, మాటిమాటికీ అనేకమైన సెలయేర్లు విచిత్రముగా కనుపింపజేయుచున్నవి.
2.48.15.అనుష్టుప్
పాదపాః పర్వతాగ్రేషు
రమయిష్యంతి రాఘవమ్।
యత్ర రామో భయం నాత్ర
నాస్తి తత్ర పరాభవః॥
టీక;-
పాదపాః = వృక్షములు; పర్వతాగ్రేషు = పర్వతశిఖరాలందు; రమయిష్యంతి = ఆనందింపజేయగలవు; రాఘవమ్ = రఘురాముని; యత్ర = ఎక్కడ ఉండునో; రామః = రాముడు; భయం = భయము; న = లేదు; అత్ర = అక్కడ; న = లేదు; అస్తి = ఉండుట; తత్ర = అక్కడ; పరాభవః = నాశనమగుట, వావిళ్ళ నిఘంటువు.
భావము;-
రఘురాముని పర్వతశిఖరాలమీది వృక్షములు ఆనందింపజేయగలవు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ భయము గాని, నాయనమగుట గాని ఉండదు.
2.48.16.అనుష్టుప్
స హి శూరో మహాబాహుః
పుత్రో దశరథస్య చ।
పురా భవతి నోదూరాత్
అనుగచ్ఛామ రాఘవమ్॥
టీక;-
స = అతడు; హి = తప్పక; శూరః = వీరుడు; మహాబాహుః = మిక్కిలి బలశాలి; పుత్రః = కుమారుడు; దశరథస్య = దశరథునియొక్క; చ = మఱి; పురాభవతి = కాగలడు; నః = మనకు; దూరాత్ = దూరము; ఆనుగచ్ఛామ = అనుసరించెదము; రాఘవమ్ = రఘురాముని.
భావము;-
దశరథుని కుమారుడు, శూరుడు, మహాబలశాలి ఐన రఘురాముడు మనకు దూరమగుటకు ముందే అతనిని అనుసరించి వెళ్ళెదము.
2.48.17.అనుష్టుప్
పాదచ్ఛాయా సుఖా భర్తుః
తాదృశస్య మహాత్మనః।
స హి నాథో జనస్యాస్య
స గతిః స పరాయణమ్॥
టీక;-
పాదః = పాదములు; ఛాయా = నీడలో; సుఖా = సుఖకరమైనది; భర్తుః = ప్రభువు యొక్క; తాదృశస్య = అట్టి; మహాత్మనః = మహాత్ముడైన; స = లేదు; హి = నిశ్చయంగా; నాథః = నాథుడు; జనస్యాస్య = లేదు; సః = అతడే; గతిః = దిక్కు; సః = అతడే; పరాయణమ్ = ఉత్తమమైన గమ్య,థానము.
భావము;-
అట్టి మహాత్ముడైన పభువుయొక్క అడుగుజాడలను అనుసరించుటయే క్షేమకరము. అతడే ఈ జనమునకు అంతటికి నాథుడు, దిక్కు, పరమాశ్రయము.
2.48.18.అనుష్టుప్
“వయం పరిచరిష్యామః
సీతాం యూయం తు రాఘవమ్”।
ఇతి పౌరస్త్రియో భర్తౄన్
దుఖార్తాః తత్తదబ్రువన్॥
టీక;-
వయం = మేము; పరిచరిష్యామః = సేవించెదము; సీతాం = సీతాదేవిని; యూయం = మీరు; తు = ఐతే; రాఘవమ్ = రఘురాముని; ఇతి = అని; పౌరస్త్రియో = పౌరులలో స్త్రీలు; భర్తౄన్ = భర్తలతో; దుఖాః = దుఃఖమపవలన; ఆర్తాః = ఆర్తితో; తత్తత్ = వారివారి; అబ్రువన్ = పలికిరి.
భావము;-
”మేము స్త్రీలము సీతాదేవిని కొలచెదము. మీరు పురుషులు రఘురాముని సేవించుకొనుడు” అని వారివారి భర్తలతో స్త్రీజనులు అనిరి.
2.48.19.అనుష్టుప్
“యుష్మాకం రాఘవోఽరణ్యే
యోగక్షేమం విధాస్యతి।
సీతా నారీజనస్యాస్య
యోగక్షేమం కరిష్యతి॥
టీక;-
యుష్మాకమ్ = మీయొక్క; రాఘవః = రఘురాముడు; అరణ్యేః = అడవులలో; యోగక్షేమమ్ = సంక్షేమము; విధాస్యతి = సమృద్దిగా చేయును; సీతా = సీతాదేవి; నారీజనస్యాస్య = నారీజనము యొక్క; యోగక్షేమమ్ = కుశలము; కరిష్యతి = ఏర్పాటుచేయును.
భావము;-
వనవాసములో మీ పురుషుల యోగక్షేమములు రాముడు చూసుకుంటాడు. మా నారీజనులయొక్క యోగక్షేమములు మా సీతాదేవి చూసుకుంటుంది.
2.48.20.అనుష్టుప్
కో? న్వనేనాఽప్రతీతేన
సోత్కణ్ఠితజనేన చ।
సంప్రియేతా మనోజ్ఞేన
వాసేన హృతచేతసా॥
టీక;-
కోన్ = ఎవరు; అనేన = పుణ్యాత్ముడు; అప్రతీతేన = అప్రశస్తమూ; సోత్కణ్ఠిత = బెంగపెట్టుకొనిన; జనేన = ప్రజలు కలదీ; చ = మఱియు; సంప్రియేతా = సంతోషించును; అమనోజ్ఞేన = మనోహరముకానిది; వాసేన = నివాసమునందు; హృతచేతసా = మనసుమనసులోనివాడు.
భావము;-
ఈ అయోధ్య నివాసించుటకు యోగ్యముగ లేదు. ఇక్కడున్న జనులందరు బెంగపెట్టుకుని ఉన్నరు. ఇక్కడ నివాసము సుఖకరము కాదు. దుఃఖకరము. అట్టి ఈ అయోధ్యలో నివసించుటకు ఎవురు ఇష్టపడతారు?
2.48.21.అనుష్టుప్
కైకేయ్యా యది చే ద్రాజ్యమ్
స్యాదధర్మ్యమనాథవత్।
న హి నో జీవితేనార్థః
కుతః పుత్రైః కుతో ధనైః॥
టీక;-
కైకేయ్యా = కైకేయికి; యది = ఒకవేళ; చేత్ = అయినచో; రాజ్యమ్ = రాజ్యపాలనాధికారము; స్యాత్ = ఎలాగో అలాగ; అధర్మ్యమ్ = అధర్మముచేత; అనాథవత్ = నాథుడులేనిదని; న = లేదు; హి = కదా; నః = మనకు; జీవితేన్ = జీవితమునందు; అర్థః = ప్రయోజనము; కుతః = ఎక్కడిది; పుత్రైః = పుత్రులవలన; కుతో = ఎక్కడిది; ధనైః = సంపదలలో.
భావము;-
నాథుడు లేని ఈ రాజ్యము ధర్మవిరుద్ధముగా ఎలాగో అలాగా కైకేయి చేతిలోనికి వెళ్ళినట్లు ఐతే. ఈ జీవితాలకు ప్రయోజనము లేదు. ఇక పుత్రుల వలన, సంపదల వలన ప్రయోజనమేమియు లేదని చెప్పనక్కర లేదు కదా.
2.48.22.అనుష్టుప్
యయా పుత్రశ్చ భర్తా చ
త్యక్తావైశ్వర్యకారణాత్।
కం సా పరిహరేదన్యమ్
కైకేయీ కులపాంసనీ॥
టీక;-
యయా = ఎవరైతే; పుత్రః = పుత్రుని, రాముని; చ = మఱియు; భర్తా = భర్తను; చ = కూడా; త్యక్తాః = విడిచినదో; ఐశ్వర్యకారణాత్ = ఐశ్వర్యముకొఱకు; కమ్ = ఎవరిని; సా = ఆమె; పరిహరేత్ = విడిచిపెట్టును; అన్యమ్ = ఇతరులను; కైకేయీ = కైకేయి; కులపాంసనీ = వంశాన్ని చెడగొట్టునది.
భావము;-
ఐశ్వర్యముకోసము పుత్రుసమానుడైన రాముని, ఆఖరికి భర్తను వదిలించుకున్న, ఆ వంశము చెడగొట్టే కైకేయి ఇతరులను మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది.
2.48.23.అనుష్టుప్
కైకేయ్యా న వయం రాజ్యే
భృతకా నివసేమహి।
జీవన్త్యా జాతు జీవన్త్యః
పుత్రైరపి శపామహే॥
టీక;-
కైకేయ్యా = కైకేయి; న = ఉండలేము; వయం = మేము; రాజ్యే = రాజ్యమేలుతూ; భృతకా = భృత్యులుగా; నివసేమహి = నివిసించ; జీవన్త్యా = జీవించి ఉండగా; జాతు = ఎన్నడును; జీవన్త్యః = జీవించి ఉన్నవారమై; పుత్రైః = కిమారులమీద; అపి = ఇక; శపామ = ఒట్టు
పెట్టుకున్నాము.
భావము;-
కైక రాజ్యాధికారంలో జీవించిఉండగా, మేము మా ప్రాణాలున్నంతవరకు ఈ రాజ్యమునందు భృత్యులమై నివసింపము. మా కుమారులపై ఒట్టు.
2.48.24.అనుష్టుప్
యా పుత్రం పార్థివేంద్రస్య
ప్రవాసయతి నిర్ఘృణా।
కస్తాం ప్రాప్య సుఖం జీవేత్
అధర్మ్యాం దుష్టచారిణీమ్॥
టీక;-
యా = ఎవరైతేవారు; పుత్రం = కుమారుని; పార్థివేంద్రస్య = మహారాజుగారి; ప్రవాసయతి = దేశబహిష్కరణచేసనో; నిర్ఘృణా = జాలిలేకుండా; కః = ఎవరు; తామ్ = ఆమెను; ప్రాప్య = పొంది; సుఖమ్ = సుఖముగా; జీవేత్ = జీవించును; అధర్మ్యాం = అధర్మపరురాలు; దుష్టచారిణీమ్ = దుష్టస్వభావురాలు.
భావము;-
కైకేడ్డయి జాలిలేనిదై దశరథమహారాజు కుమారునికి దేశబహిష్కరణ చేయించెను. అట్టి అధర్మపరురాలు, చెడుస్వభావి వద్ద ఎవరూ సుఖముగా ఉండలేరు.
2.48.25.అనుష్టుప్
ఉపద్రుతమిదం సర్వమ్
అనాలంబమనాయకమ్।
కైకేయ్యా హి కృతే సర్వమ్
వినాశముపయాస్యతి॥
టీక;-
ఉపద్రుతమ్ = ఉపద్రవము; ఇదమ్ = ఈ; సర్వమ్ = అంతా; అనాలంబమ్ = ఆధారములేనిది; అనాయకమ్ = నాయకుడు; కైకేయ్యా = కైకేయి; హి = వలన; కృతే = చేయబడినది; సర్వమ్ = సమస్తము; వినాశమ్ = నాశమును; ఉపయాస్యతి = పొందగలదు.
భావము;-
ఆధారములేనిదైన, నాయకరహితమైన ఈ ఉపద్రవము అంతా కైకేయి చేసిన పనే. సర్వమూ నాశనమగును. తప్పదు.
2.48.26.అనుష్టుప్
న హి ప్రవ్రజితే రామే
జీవిష్యతి మహీపతిః।
మృతే దశరథే వ్యక్తమ్
విలాపస్తదనంతరమ్॥
టీక;-
న = ఉండడు; హి = కదా; ప్రవ్రజితే = ప్రవాశమునకు వెళ్ళినవాడగుచో; రామే = రాముడు; జీవిష్యతి = జీవించినవానిగా; మహీపతిః = మహారాజు; మృతే = మరణించాక; దశరథే = దశరథుడు; వ్యక్తమ్ = తెలియును; విలాపః = విలపించవారికి; తదనంతరమ్ = పిమ్మట.
భావము;-
రాముడు వనవా,మునకు వెళ్ళాక మహారాజు బ్రతికి ఉండడు. దశరథ మహారాజు మరణించిన పిమ్మట ఏడ్చేటప్పుడు తెలిసొస్తుంది.
2.48.27.అనుష్టుప్
తే విషం పిబతాలోడ్య
క్షీణపుణ్యాస్సుదుర్గతాః।
రాఘవం వానుగచ్ఛధ్వమ్
అశ్రుతిం వాపి గచ్ఛత॥
టీక;-
తే = మీరు; విషమ్ = విషమును; పిబత = తాగండి; ఆలోడ్య = కలుపుకొని; క్షీణపుణ్యాః = పుణ్యమంతానశించినవారు; సుదుర్గతాః = మిక్కిలి దుర్గతి పొందువారు; రాఘవమ్ = రఘురాముని; వా = లేదా; అనుగచ్ఛధ్వమ్ = అనుసరించండి; అశ్రుతిమ్ = ఎప్పుడూ వినబడని చోటికి; వా = లేదా; అపి = ఇక; గచ్ఛత = పొండి.
భావము;-
పుణ్యమంతా నష్టపోయినట్టి, మిక్కిలి దుర్గతి పోవునట్టి మీరంతా విషం కలుపుకుని త్రాగండి. లేదా రఘురాముని వెంట వెళ్ళండి. లేదా ఎవరికీ తెలియని చోటుకు పొండి.
2.48.28.అనుష్టుప్
మిథ్యాప్రవ్రాజితో రామః
ససీతస్సహలక్ష్మణః।
భరతే సన్నిసృష్టాః స్మః
సౌనికే పశవో యథా॥
టీక;-
మిథ్యా = కపటముతో; ప్రవ్రాజితః = దేశబహిష్కరణ చేయబడినాడు; రామః = రాముడు; స = కలిసి; సీతః = సీతతో; సహ = సహితముగా; లక్ష్మణః = లక్ష్మణునితో; భరతే = భరతుడు; సత్ = నిజముగా; నిసృష్టాః = దాచబెట్టినది; స్మః = అయితిమి; సౌనికే = కసాయివాడు; పశవః = పశువులను; యథా = వలె.
భావము;-
సీతా లక్ష్మణులను రామునితో పాటు దేశమునుండి పంపివేసి, కసాయివానికి పశువులను అప్పజెప్పినట్లు మనలను భరతునకి అప్పజెప్పారు.
2.48.29.అనుష్టుప్
పూర్ణచంద్రాననః శ్యామో
గూఢజత్రురరిందమః।
ఆజానుబాహుః పద్మాక్షో
రామో లక్ష్మణపూర్వజః॥
టీక;-
పూర్ణచంద్రాననః = నిండుచందమామవంటి మోము కలవాడు; శ్యామః = మబ్బు ఛాయ శరీరమువాడు; గూఢజత్రుః = కనబడని మూపుల సంధి ఎముకలు కలవాడు, కనబడని మెడఎముక కలవాడు; అరిందమః = శత్రుభయంకరుడు; ఆజానుబాహుః = మోకాళ్ళవరకు చేతులు కలవాడు; పద్మాక్షః = పద్మములవంటి కన్నులు కలవాడు; రామః = రాముడు; లక్ష్మణపూర్వజః = లక్ష్మణుని అన్నగారు.
భావము;-
లక్ష్మణుని అన్నగారైన రాముడు నిండు చంద్రబింబము వంటి మోముతో మనోహరుడు. శ్యామసుందరుడు, మెడఎముకలు కనబడని ఐశ్వర్యశాలి, శత్రుభయంకర పరాక్రముడు, ఆజానుబాహువు, విష్ణువు వలె పద్మముల వంటి కన్నులు కలవాడు.
*గమనిక:-
గూఢజత్రిణి- దనాధిపలక్షణమ్-ద్వ. సర్వశబ్దసంబోధిని.
2.48.30.అనుష్టుప్
పూర్వాభిభాషీ మధురః
సత్యవాదీ మహాబలః।
సౌమ్యః సర్వస్య లోకస్య
చంద్రవత్ప్రియదర్శనః॥
టీక;-
పూర్వాభిభాషీ = ముందుగా పలకరించువాడు; మధురః = మధురమైన స్వభావి; సత్యవాదీ = సత్యమునే మాట్లాడువాడు; మహాబలః = అత్యంత బలశాలి; సౌమ్యః = శాంతస్వభావి; సర్వస్య = సమస్తమైన; లోకస్య = లోకమునకు; చంద్రవత్ = చంద్రుని వలె; ప్రియదర్శనః = ఇష్ణునిగా కనబడువాడు.
భావము;-
రాముడు ఎదురైనవారిని సౌహార్దముతో ముందుగా తానే పలకరించు స్వేహశీలి. మధుర స్వభావి, సత్యమునే పలుకువాడు, అత్యంత బలశాలి, శాంతస్వభావి, లోకమంతటికీ చందమామ వలె చూడగానే ఇష్టముగా కనబడతాడు.
2.48.31.అనుష్టుప్
నూనం పురుషశార్దూలో
మత్తమాతంగవిక్రమః।
శోభయిష్యత్యరణ్యాని
విచరన్ స మహారథః”॥
టీక;-
నూనం = నిశ్చముగ; పురుషశార్దూలః = పురుషులలో ; మత్తమాతంగవిక్రమః = మదించిన ఏనుగు వంటి నడకగలవాడు; శోభయిష్యతి = శోభిల్లజేయగలడు; అరణ్యాని = అడవులను; విచరన్ = సంచరించుచు; సః = అతడు; మహారథః = మహారథి.
భావము;-
మానవులలో శ్రేష్ఠుడు, మదించిన ఏనుగు వంటి నడక గలవాడు, మహారథుడు ఐన ఆ రాముడు తన సంచారములతో అడవులను శోభిల్లజేయును.”
2.48.32.అనుష్టుప్
తాస్తథా విలపన్త్యస్తు
నగరే నాగరస్త్రియః।
చుక్రుశుర్దుఃఖసంతప్తా
మృత్యోరివ భయాగమే॥
టీక;-
తాః = ఆ; తథా = అప్పుడు; విలపన్త్యః = ఏడ్చుచు; తు = మఱి; నగరే = పురమునందలి; నాగరస్త్రియః = సంస్కారవంతులైన ఆజువారు; చుక్రుశు = విలపించిరి; దుఃఖ = దుఃఖముతో; సంతప్తా = మిక్కిలి తాపమునొందిరి; మృత్యుః = మరణము; ఇవ = వలె; భయాః = భయము; ఆగమే = వచ్చుటచేత.
భావము;-
ఆ అయోధ్యలోని సంస్కారవంతమైన స్తీలూ ఆవిధముగా విలపించుచు, మృత్యుభయము కలిగినంతగా దుఃఖముతో మిక్కిలి తాపము నొందిరి.
2.48.33.అనుష్టుప్
ఇత్యేవం విలపన్తీనామ్
స్త్రీణాం వేశ్మసు రాఘవమ్।
జగామాస్తం దినకరో
రజనీ చాభ్యవర్తత॥
టీక;-
ఇత్యేవమ్ = ఈవిధముగా; విలపన్తీనామ్ = విలపించచుండగా; స్త్రీణాం = వలె; వేశ్మసు = ఇండ్లలో; రాఘవమ్ = రఘురాముని గుఱించి; జగామ = వెళ్ళెను; అస్తమ్ = పశ్చిమాచలమునకు; దినకరః = సూర్యుడు; రజనీః = చంద్రుడు; చ = కూడా; అభ్యవర్తత = వచ్చెను, ఉదయించెను.
భావము;-
ఈ విధముగా రాముని గుఱించి వనితలు విలపించుచుండగా, సూర్యుడు అస్తమించెను, చంద్రుడు ఉదయించెను.
2.48.34.అనుష్టుప్
నష్టజ్వలనసంపాతా
ప్రశాంతాధ్యాయసత్కథా।
తిమిరేణాభిలిప్తేవ
సా తదా నగరీ బభౌ॥
టీక;-
నష్ట = నశించిన; జ్వలన = ఆహవనీయాగ్నలు, చతుర్వేది వారి హిందీ ప్రతి; సంపాతాః = బాగుగా నడచిన; ప్రశాంతాః = విరామములు కలిగిన; అధ్యాయ = వేదాధ్యయనములు; సత్కథా = పురాణపఠనములుకలదై; తిమిరేణ = చీకట్లటేత; అభిలిప్తః = పూయూడినది; ఇవ = వలె; సా = ఆ; తదా = ఆప్పుడు; నగరీ = పురము; బభౌ = ఆయెను.
భావము;-
పురాణపఠనాలు, వేదాధ్యయనములు మందగించినదై, ఆహవనీయాగ్ని నిర్వాహణలు పోయినదై అప్పుడు ఆ అయోధ్యానగరము చీకట్లు అల్లుకుపోయిట్లు అయిపోయెను.
2.48.35.అనుష్టుప్
ఉపశాంతవణిక్పణ్యా
నష్టహర్షా నిరాశ్రయా।
అయోధ్యానగరీ చాసీత్
నష్టతారమివాంబరమ్॥
టీక;-
ఉపశాంత = ఆణగిన; వణిక్ = వర్తకుల; పణ్యా = ఆంగళ్ళు కలది; నష్ట = నశించిన; హర్షా = ఆనందములు కలది; నిరాశ్రయా = ఆండలేనిది; అయోధ్యానగరీ = ఆయోధ్యానగరము; చ = ఇక; ఆసీత్ = ఆయెను; నష్టతారమ్ = నక్షత్రములు లేనట్టి; ఇవ = వలె; అంబరమ్ = ఆకాశము.
భావము;-
ఏ అండాలేనిదీ, విచారముగా ఉన్నది, వర్తకుల అంగళ్ళన్నీ మూసేసినది ఐన ఆ అయోధ్యానగరము, నక్షత్రములు లేని రాత్రి ఆకాశమువలె అయిపోయెను.
2.48.36.జగతి.
తథా స్త్రియో రామనిమిత్తమాతురా
యథా సుతే భ్రాతరి వా వివాసితే।
విలప్య దీనా రురుదుర్విచేతసః
సుతైర్హి తాసామధికో హి సోఽభవత్॥
టీక;-
తథా = ఆట్లు; స్త్రియః = ఆడవారు; రామ = రాముని; నిమిత్తమ్ = గుఱించి; ఆతురాః = బాధపడిరి; యథా = ఎట్లైతే; సుతే = సంతనము; భ్రాతరి = సహోదరులు; వా = లేదా; వివాసితే = దేశబహిష్కరించబడితే; విలప్య = దీర్ఘాలుతీస్తూ; దీనాః = దీనులై; రురుదుః = మిక్కిలి ఏడ్చిరి; విచేతసః = వంటిమీద తెలివి లేకుండా; సుతైః = కుమారుల; హి = కన్నా; తాసామ్ = వారికి; అధికః = ఎక్కువ; హి = కదాఆ; సః = ఆతడు; అభవత్ = ఆయెను.
భావము;-
దేశబహిష్కారనికి గురైనవారు తమ సంతానం కాని తోడబుట్టినవారు కాని ఐతే బాధపడతారో అట్లు రాముని గురించి బాధపడిరి. వారికి కన్న కొడుకుల కన్నా రాముడు ఎక్కువ ఆయెను కదా. అందుచేత దీనంగా దీర్ఘాలు తీస్తూ గట్టిగా ఏడ్చిరి.
2.48.37.జగతి.
ప్రశాంతగీతోత్సవ నృత్త వాదనా
వ్యపాస్త హర్షా పిహితాపణోదయా।
తదా హ్యయోధ్యా నగరీ బభూవ సా
మహార్ణవః సంక్షపితోదకో యథా॥
టీక;-
ప్రశాంత = ఆగిపోయిన; గీతః = సంగీతాలు పాడుట; ఉత్సవః = ఉత్సవాలు చేసుకొనుట; నృత్తః = నాట్యములు ఆడుట; వాదనా = వాయిద్యఘోష కలవారు; వ్యపాస్త = తొలగిన; హర్షాః = ఆనందమము కలవారు; పిహితః = పోయినట్టి; అపణః = ఆంగళ్ళు; ఉదయా = తెఱచుట; తదా = ఆప్పుడు; హి = కదా; అయోధ్యానగరీ = ఆయోఝ్యానగరము; బభూవ = ఆయెను; సా = ఆ; మహార్ణవః = మహాసముద్రము నందలి; సంక్షపితః = సంగ్రహించిన, ఆవిరైపోయిన; ఉదక- = నీరు; యథా = వలె..
భావము;-
అంగళ్ళు తెఱచుకోవడం లేనిదీ, ఆనందమన్నది ఆరిపోయినదీ, సంగీత కార్యక్రమములు, ఉత్సవాల నిర్వాహణలు, నాట్యవేదికలు, మంగళ వాయిద్యాల ఘాషా మౌనం వహించినదీ ఐన ఆ అయోధ్యానగరము నీరంతా ఆవిరైపోయిన మహాసముద్రములలె ఉండెను.
2.48.38.గద్య
ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే అష్టచత్వారింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; అష్టచశ్చత్వారింశ [48] = నలభైఎనిమిదవ; సర్గః = సర్గ.
బావముః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [48] నలభైయెనిమిదవ సర్గ సంపూర్ణము.