బాల కాండ
1.49.1.
అనుష్టుప్.
అఫలస్తు తతః శక్రో
దేవానగ్నిపురోధసః ।
అబ్రవీత్ త్రస్తవదనః
సర్షిసంఘాన్ సచారణాన్ ॥
టీక:-
అఫలః = వృషణములు లేనివాడైన (వావిళ్ళవారి తెలుగు నిఘటువు); తు; తతః = అటు పిమ్మట; శక్రః = ఇంద్రుడు; దేవాన్ = దేవతల గూర్చి; అగ్ని = అగ్నృ; పురోగమాన్ = ముందుండగా; అబ్రవీత్ = నుడివెను; త్రస్త వదనః = దీన వదనుడై; స = కూడా ఉన్న; ఋషి = మహర్షులృ; సంఘాన్ = సంఘములతో; స = కూడా ఉన్న; చారణాన్ = చారణులతో.
భావము:-
అటు పిమ్మట, వృషణములు కోల్పోయిన దేవేంద్రుడు దీనవదనుడై అగ్నిదేవుని ముందుంచుకున్న దేవతల తోను, మహర్షుల తోను, చారణులతోను ఇట్లు పలికెను.
గమనిక:-
*- శక్రుడు- దుష్టజయమందు శక్రుడు, ఇంద్రుడు.
1.49.2.
అనుష్టుప్.
“కుర్వతా తపసో విఘ్నం
గౌతమస్య మహాత్మనః ।
క్రోధముత్పాద్య హి మయా
సురకార్యమిదం కృతమ్ ॥
టీక:-
కుర్వతా = చేసితిని; తపసః = తపస్సునకు; విఘ్నం = ఆటంకము; గౌతమస్య = గౌతమ మహామునికి; మహాత్మనః = మహాత్ముడైన; క్రోధమ్ = కోపమును; ఉత్పాద్య హి = తెప్పించి; హి = వలన మాత్రమే; మయా = నాచేత; సురకార్యమ్ = దేవతల పని; ఇదం = ఈ; కృతమ్ = చేయబడినది.
భావము:-
“మహాత్ముడైన గౌతమ మహర్షికి క్రోధము కలుగ చేయుట ద్వారా, వారి తపస్సునకు విఘ్నము కలుగజేసితిని. ఈ విధముగా దేవకార్యమును నెఱవేర్చితిని.
1.49.3.
అనుష్టుప్.
అఫలోఽ స్మి కృతస్తేన
క్రోధాత్ సా చ నిరాకృతా ।
శాపమోక్షేణ మహతా
తపోఽ స్యాపహృతం మయా ॥
టీక:-
అఫలః = వృషణములు లేని వాడు (వావిళ్ళ నిఠంటువు); అస్మి = అయితిని; కృతః = చేయబడిన; తేన = వాని; క్రోధాత్ = కోపముచే; సా = ఆమె (అహల్య); చ = కూడా; నిరాకృతా = నిరాకరింపబడినది; శాపః = శాపములు; ఉక్షేణ = ఇచ్చుటచే; మహతా = గొప్ప; తపః = తపస్సు; అస్య = ఈతని; అపహృతం = అపహరింపబడినది; మయా = నాచే
భావము:-
గౌతమముని శాపము కారణముగా నేను (ఇంద్రుడు) వంధ్యుడైతిని / గొడ్డుపోతిని. అహల్య పరిత్యజించబడినది. శాపము లిచ్చుట వలన గౌతమముని తపస్సు హరించినది.
1.49.4.
అనుష్టుప్.
తస్మాత్సురవరాః సర్వే
సర్షిసంఘాః సచారణాః ।
సురసాహ్యకరం సర్వే
సఫలం కర్తుమర్హథ" ॥
టీక:-
తస్మాత్ = అందుచేత; సుర = దేవతా; వరాః = శ్రేష్ఠులారా; సర్వే = అందరు; స = సమస్త; ఋషిః = ఋషి; సంఘాః = సంఘములారా; స = సమస్త; చారణాః = చారణులారా; సురః = దేవతలకు; సాహ్య = సహాయము; కరం = కలిగించిన వాడు; సర్వే = సమస్త; సఫలం = వృషణములు కలవానిగా; కర్తుమ్ = చేయుటకు; అర్హథ = తగినవానిని.
భావము:-
అందుచేత, ఓ దేవతాశ్రేష్ఠులారా! ఋషులారా! చారణులారా! మీరందఱు దేవతలు అందరకి సహాయపడిన నాకు తిరిగి వృషణములు వచ్చునట్లు చేయుడు.
గమనిక:-
*- సాధారణంగా ఇంద్రుడు తపమాచరించు వారి తపస్సు భంగపరచుటకు అప్సరసలను పంపి కామవికారాదులు ప్రేరేపించును. కాని గౌతమ మహర్షి మహాతపశక్తి సంపన్నుడు కనుక, కోపము పుట్టించుట యుక్తమని దేవేంద్రుడు భావించెను. అంత గౌతమ మునీశ్వరుడు కుపితుడై ఇంద్రుని, అహల్యను శపించెను. తన తపోబలము క్షీణించెను. ధీరులు ఎన్ని విఘ్నాలు వచ్చినా చలింపక తమ సంకల్పం కొనసాగిస్తారు కదా. మహా ధీరుడు గౌతముడు విడువక మరల తపస్సు కొనసాగించెను. త్రిలోక పూజ్యు డయ్యెను.
1.49.5.
అనుష్టుప్.
శతక్రతోర్వచః శ్రుత్వా
దేవాః సాగ్నిపురోగమాః ।
పితృదేంవానుపేత్యాహుః
సర్వే సహ మరుద్గణైః ॥
టీక:-
శతక్రతోః = ఇంద్రుని యొక్క; వచః = మాటలు; శ్రుత్వా = విని; దేవాః = దేవతలు; స = సహితము; అగ్నిః = అగ్నిదేవునితో; పురోగమాః = ముందుంచుకుని; పితృదేవాన్ = పితృదేవతలను; ఉపేత్య = సమీపించి; ఆహుః = వచించిరి; సహ = కూడ; సర్వైః = సమస్త; మరుద్గణైః = మరుద్గణములతో.
భావము:-
ఇంద్రుని వచనములు వినిన దేవతలు మరుద్గణములతో కలిసి అందరును అగ్నిదేవుని ముందుంచుకొని పితృదేవతల వద్దకు వెళ్ళి ఇట్లు పలికిరి.
గమనిక:-
*- శతక్రతః - నూరు యజ్ఞములు చేసి వాడు ఇంద్రపదవి పొందినవాడు, ఇంద్రుడు.
1.49.6.
అనుష్టుప్.
“అయం మేషః సవృషణః
శక్రో హ్యవృషణః కృతః ।
మేషస్య వృషణౌ గృహ్య
శక్రాయాశు ప్రయచ్ఛథ ॥
టీక:-
అయం = ఈ; మేషః = పొట్టేలు; స = కూడి ఉన్నది; వృషణః = వృషణములతో; శక్రః = ఇంద్రుడు; హి = ఏమో; అవృషణః = వృషణములు లేనివాడుగా; కృతః = చేయబడెను; మేషస్య = మేషము యొక్క; వృషణౌ = రెండు వృషణములను; గృహ్య = తీసుకుని; శక్రాయ = ఇంద్రునకు; ఆశు = వెంటనే; ప్రయచ్ఛత = తగిలించండి.
భావము:-
“ఇంద్రుడు వృషణములు కోల్పోయినందున, యజ్ఞములో మీకు సమర్పించిన ఈ గొఱ్ఱె పొట్టేలు యొక్క వృషణములు తీసుకుని మహేంద్రునకు వెంటనే అమర్చండి.
1.49.7.
అనుష్టుప్.
అఫలస్తు కృతో మేషః
పరాం తుష్టిం ప్రదాస్యతి ।
భవతాం హర్షణార్థే చ
యే చ దాస్యంతి మానవాః ।
అక్షయం హి ఫలం తేషాం
యూయం దాస్యథ పుష్కలం ॥
టీక:-
అఫలఃతు=వృషణములు లేనిదిగా; తు=వృషణములు లేనిదిగా; కృతః=చేయబడిన; మేషః=మేషము; పరాం=గొప్ప; తుష్టిం=తృప్తిని; ప్రదాస్యతి=కలిగించగలదు; భవతాం=మీకు; హర్షణః=సంతోషము; అర్థాయ=కలిగించుట కొఱకు; యే=ఏ; చ దాస్యంతి=ఇచ్చెదరో; మానవాః=మానవులు; అక్షయం హి = క్షయము; హి; ఫలం = ఫలమును; తేషాం = వారికి; యూయం = మీరు; దాస్యథ = ఇచ్చెదరు గాక; పుష్కలం = పుష్కలముగా.
భావము:-
మీకు యజ్ఞములో లభించిన మేషమునకు వృషణములు లేకపోయినను అది మీకు చాలా తృప్తిని కలిగించగలదు, అట్లే దానిని సమర్పించిన మానవులకు కూడా, మీరు పుష్కలముగా అక్షయమైన ఫలములు మనుజులకు చేకూర్చుడు.
1.49.8.
అనుష్టుప్.
అగ్నేస్తు వచనం శ్రుత్వా
పితృదేవాః సమాగతాః ।
ఉత్పాట్య మేషవృషణౌ
సహస్రాక్షే న్యవేశయన్ ॥
టీక:-
అగ్నేః = అగ్ని యొక్క; తు; వచనం = మాటలను; శ్రుత్వా = విని; పితృదేవాః = పితృదేవతలు; సమాగతాః = వచ్చిన; ఉత్పాట్య = పెకలించి; మేషః = పొట్టేలు యొక్క; వృషణౌ = రెండు వృషణములను; సహస్రాక్షే = ఇంద్రునిలో; న్యవేశయన్ = అమర్చిరి.
భావము:-
అక్కడ ఉన్న పితృదేవతలు అగ్ని మాటలను వినిరి. మేష వృషణములు రెంటిని పెకలించి ఇంద్రునికి అమర్చిరి.
1.49.9.
అనుష్టుప్.
తదాప్రభృతి కాకుత్స్థ!
పితృదేవాః సమాగతాః ।
అఫలాన్ భుంజతే మేషాన్
ఫలైస్తేషామంయోజయన్ ॥
టీక:-
తదా+ప్రభృతి = అప్పటినుండి{తదాప్రభృతి- తదా- అప్పడి ప్రభృతి- మొదలు, అప్పటినుండి}; కాకుత్స్థ = శ్రీరామచంద్ర; పితృదేవాః = పితృదేవతలు; సమాగతాః = కలిసి; అఫలాన్ = వృషణములులేని; భుఞ్జతే = స్వీకరించుచున్నారు; మేషాన్ = మేషములను; ఫలై: = వృషణములను; తేషామ్ = అతనికి, ఇంద్రునికి; అయోజయన్ = అమర్చుటచే;
భావము:-
శ్రీరామచంద్ర! నాటి నుండి పితృదేవతలు ఇంద్రునకు మేష వృషణములను అమర్చినందున, వృషణములు లేని గొఱ్ఱె పొట్టేలులను స్వీకరించుచున్నారు,
1.49.10.
అనుష్టుప్.
ఇంద్రస్తు మేషవృషణః
తదాప్రభృతి రాఘవ ।
గౌతమస్య ప్రభావేన
తపసశ్చ మహాత్మనః ॥
టీక:-
ఇన్ద్రః = ఇంద్రుడు; తు; మేష = పొట్టేలు; వృషణః = వృషణములు కలవాడు; తదా ప్రభృతి = అప్పటినుండి; రాఘవ = శ్రీరామచంద్ర; గౌతమస్య = గౌతమముని యొక్క; ప్రభావేన = ప్రభావముచేత; తపసః = తపస్సుయొక్క; చ; మహాత్మనః = మహాత్ముడైన.
భావము:-
శ్రీరఘురామ! మహాత్ముడైన గౌతమ మహర్షి తపశ్శక్తి ప్రభావముచే ఆనాటినుండి ఇంద్రుడు మేషవృషణుడైనాడు.
1.49.11.
అనుష్టుప్.
తదాగచ్ఛ మహాతేజ
ఆశ్రమం పుణ్యకర్మణః ।
తారయైనాం మహాభాగాం
అహల్యాం దేవరూపిణీమ్" ॥
టీక:-
తత్ = అందుచే; ఆగచ్ఛ = రమ్ము; మహా = గొప్ప; తేజ = తేజస్సు కలవాడా; ఆశ్రమం = ఆశ్రమము గూర్చి; పుణ్యకర్మణః = పుణ్యకర్మలు గలవాని; తారయ = తరింపజేయుము; ఏనాం = ఈ; మహాభాగామ్ = మహాభాగ్యము కలిగినది; అహల్యాం = అహల్యను; దేవ రూపిణీమ్ = దేవతల రూపము కలిగినది.
భావము:-
గొప్ప తేజస్సు కలిగిన శ్రీరామచంద్రా! పుణ్యకర్ముడైన గౌతమ ముని ఆశ్రమమునకు విచ్చేసి, దివ్యసౌందర్యము కలిగిన మహాభాగ్యవంతురాలు ఈ అహల్యను తరింపజేయుము.
1.49.12.
అనుష్టుప్.
విశ్వామిత్రవచః శ్రుత్వా
రాఘవః సహలక్ష్మణః ।
విశ్వామిత్రం పురస్కృత్య
తమాశ్రమంమథావిశత్ ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుని; వచః = మాటలను; శ్రుత్వా = విని; రాఘవః = శ్రీరామచంద్రుడు; సహ = సమేతుడై; లక్ష్మణః = లక్ష్మణుడు కలవాడు; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్య = ముందుంచుకొని; ఆశ్రమం = గౌతమముని ఆశ్రమమును; ప్రవివేశ = ప్రవేశించెను; హ.
భావము:-
విశ్వామిత్రుని మాటలను విన్న శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై, ఆ మహర్షి వెంట గౌతమముని ఆశ్రమము లోనికి ప్రవేశించెను.
1.49.13.
అనుష్టుప్.
* దదర్శ చ మహాభాగాం
తపసా ద్యోతితప్రభామ్ ।
లోకైరపి సమాగమ్య
దుర్నిరీక్ష్యాం సురాసురైః ॥
టీక:-
దదర్శ = చూచెను; చ; మహాభాగాం = గొప్ప అదృష్టము కలదియు; తపసా = తపస్సుచే; ద్యోతిత = ప్రకాశించబడిన; ప్రభామ్ = తేజస్సు కలిగినదియు; లోకై: = లోకులకు (మానవులకు); అపి = కూడా; సమాగమ్య = సమీపించిన; దుర్నిరీక్ష్యాం = చూడశక్యము కానిదియును; సురాః = దేవతలకైన; అసురైః = రాక్షసులకైన.
భావము:-
శ్రీరామచంద్రుడు తపస్సుచే ప్రకాశించుచున్న కాంతితో కూడిన ఆ మహాబాగ్యవంతురాలిని అహల్యను చూచెను. ఆమెను మానవులుకాని, దేవతలుకాని, అసురులుకాని సమీపించినను చూడజాలరు.
1.49.14.
అనుష్టుప్.
* ప్రయత్నాన్నిర్మితాం ధాత్రా
దివ్యాం మాయామయీమివ ।
సతుషారావృతాం సాభ్రాం
పూర్ణచంద్ర ప్రభామివ ॥
టీక:-
ప్రయత్నాత్ = ప్రయత్నపూర్వకముగా; నిర్మితాం = సృష్టింపబడినదియును; ధాత్రా = బ్రహ్మచే; దివ్యాం = దివ్యమైనదియును; మాయామయీమ్ = మాయా స్వరూపిణి; ఇవ = వలె; స = కూడిన; తుషార = మంచుచే; ఆవృతాం = కప్పబడిన; స = కూడిన; అభ్రాం = మేఘములతో; పూర్ణ = నిండు; చంద్ర = చంద్రుని; ప్రభామ్ = కాంతి; ఇవ = వలె నున్నది
భావము:-
ఆమె సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడుచేత కోరి దివ్యరూపివలెను, మాయాస్వరూపిణి వలెను సృష్టించబడినట్లు ఉండెను. పొగమంచు కప్పివేసిన నిండుపున్నమి కాంతి వంటి ప్రకాశవంతమైన దేహము కలిగి ఉండెను.
గమనిక:-
*- ధాత- నలువ, బ్రహ్మదేవుడు, ధరించువాడు, పోషించువాడు. వ్యుత్పత్తి. ధాఞ్- ధారణ, పోషణయోః- ధా+తృచ్, కృప్ర.
1.49.15.
అనుష్టుప్.
* మధ్యేఽ ంభసో దురాధర్షాం
దీప్తాం సూర్యప్రభామివ ।
సా హి గౌతమవాక్యేన
దుర్నిరీక్ష్యా బభూవ హ ॥
టీక:-
మధ్యే = మధ్యమున; అంభసః = నీటిలో; దురాధర్షాం = ఎదురింప శక్యము కాని; దీప్తాం = ప్రకాశించుచున్న; సూర్య = సూర్యుని; ప్రభామ్ = కాంతి; ఇవ = వలె; సా = ఆమె; హి; గౌతమ = గౌతమముని యొక్క; వాక్యేన = మాట ప్రభావమువలన; దుర్నిరీక్ష్యా = చూడశక్యము కానిది; బభూవ = అయ్యెను; హ.
భావము:-
ఆమె నీటిమధ్యలో ప్రతిబింబించు సూర్యకాంతివలె ఎదురింప శక్యముకాని తేజస్సుతో ప్రకాశించుచుండెను. ఆ అహల్య, గౌతమముని మాట ప్రభావము వలన ఎవ్వరికిని కనబడకుండా ఉండెను.
1.49.16.
అనుష్టుప్.
త్రయాణామపి లోకానాం
యావద్రామస్య దర్శనమ్ ।
శాపస్యాంతముపాగమ్య
తేషాం దర్శనమాగతా ॥
టీక:-
త్రయాణామ్ = మూడు; అపి = కూడ; లోకానాం = లోకములకు; యావత్ = అంతవరకు; రామస్య = శ్రీరామచంద్రుని; దర్శనమ్ = దర్శనము; శాపస్య = శాపము యొక్క; అంతమ్ = అంతమును; ఉపాగమ్య = పొంది; తేషాం = వారి; దర్శనమ్ = దర్శనము, కనబడుటను; ఆగతా = పొందినది.
భావము:-
గౌతముని శాపప్రభావముచే అహల్యమాతకు శ్రీరాముని దర్శనము కలిగినంతవరకు ఆమెను ముల్లోకములలో ఎవరు చూడలేక పోయిరి. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి దర్శనభాగ్యము పొందినంతనే ఆమెకు శాపవిముక్తి కలిగెను, అందరు అహల్యమాతను చూడగలిగిరి.
1.49.17.
అనుష్టుప్.
* రాఘవౌ తు తత స్తస్యాః
పాదౌ జగృహతుస్తదా ।
స్మరన్తీ గౌతమవచః
ప్రతిజగ్రాహ సా చ తౌ ॥
టీక:-
రాఘవౌ = రాఘవులు ఇద్దరు (రామ, లక్ష్మణులు); తు; తతః = అటుపిమ్మట; తస్యాః = ఆమెయొక్క; పాదౌ = రెండు పాదములను; జగృహతుః = సేవించిరి; తదా = అప్పుడు; స్మరన్తీ = స్మరించుచు; గౌతమ = గౌతమముని; వచః = చెప్పిన మాటలు; ప్రతిజగ్రాహ = మాఱు సేవించెను; సా = ఆమె; చ = కూడా; తౌ = వారిరువురను.
భావము:-
అప్పుడు శ్రీరామలక్ష్మణులు ఇరువురును అహల్యమాత పాదద్వయము సేవించిరి. అటుపిమ్మట గౌతమముని వచనములు స్మరించుచు ఆమెకూడ రామలక్ష్మణుల పాదములను సేవించెను.
1.49.18.
అనుష్టుప్.
పాద్యమర్ఘ్యం తథాఽఽ తిథ్యం
చకార సుసమాహితా ।
ప్రతిజగ్రాహ కాకుత్స్థో!
విధిదృష్టేన కర్మణా ॥
టీక:-
పాద్యమ్ = పాద్యమును; అర్ఘ్యం = అర్ఘ్యమును; తథా = మఱియు; ఆతిథ్యం = ఆతిథ్యమును; చకార = చేసెను; సుసమాహితా = సావధాన చిత్తముతో; ప్రతిజగ్రాహ = స్వీకరించెను; కాకుత్స్థః = శ్రీరాముడు; విధి దృష్టేన = శాస్త్రవిహితమైన; కర్మణా = విధానముగా
భావము:-
శ్రీరామ లక్ష్మణులను సావధానచిత్తముతో ఆదరించుచు శాస్త్రోక్తమైన అర్ఘ్యము,పాద్యములతో అతిథి సత్కారము లను ఆచరించెను. శ్రీరామచంద్రుడు ఆ మర్యాదలను స్వీకరించెను.
1.49.19.
అనుష్టుప్.
పుష్పవృష్టి ర్మహత్యాసీత్
దేవదున్దుభిః నిఃస్వనైః ।
గంధర్వాప్సరసాం చాపి
మహానాసీ త్సమాగమః ॥
టీక:-
పుష్పవృష్టిః = పూలవాన; మహత్ = గొప్పగ; ఆసీత్ = అయ్యెను; దేవదున్దుభినిస్స్వనైః = దేవదుందుభుల ధ్వనులతో కూడా; గంధర్వ = గంధర్వులు; అప్సరసాం = అప్సరసలు; చ; అపి = కూడా; మహాన్ = గొప్పగ; ఆసీత్ = అయ్యెను; సమాగమః = కలయుట.
భావము:-
దేవతలు దుందుభులు మ్రోగించి పూలవాన కురిపించిరి. గంధర్వులు గానమొనర్చగా, అప్సరసలు నాట్యము చేసిరి.
1.49.20.
అనుష్టుప్.
“సాధు సాధ్వితి” దేవాస్తాం
అహల్యాం సమపూజయన్ ।
తపోబల విశుద్ధాంగీం
గౌతమస్య వశానుగామ్ ॥
టీక:-
సాధు సాధు = బాగు బాగు; ఇతి = అని; దేవాః = దేవతలు; తామ్ = ఆ; అహల్యాం = అహల్యామాతను; సమపూజయన్ = పూజించిరి; తపోబల = తపోబలముచే; విశుద్ధ = విశుద్ధమైన; అంగీం = శరీరము కలిగినది; గౌతమస్య = గౌతమముని యొక్క; వశః = ఇచ్చానుసారము; అనుగామ్ = అనుసరించి.
భావము:-
గౌతమముని ఆజ్ఞానుసారము మహాతపస్సు ఆచరించడముచేత పరిశుద్ధమైన శరీరము కలిగిన అహల్యను దేవతలు “బాగు బాగు” అని మెచ్చుకుని కొనియాడిరి.
1.49.21.
అనుష్టుప్.
గౌతమో హి మహాతేజా
అహల్యాసహితః సుఖీ ।
రామం సంపూజ్య విధివత్
తపస్తేపే మహాతపాః ॥
టీక:-
గౌతమః = గౌతమముని కూడా; అపి = కూడా; మహాతేజాః = మహాతేజస్సు కల; అహల్యా = అహాల్యతో; సహితః = కూడి; సుఖీ = సుఖవంతుడై; రామం = శ్రీరామచంద్రుని; సంపూజ్య = బాగుగా పూజించి; విధివత్ = శాస్త్రప్రోక్తముగా; తపః+తేపే = తపస్సు చేయసాగెను; మహాతపాః = మహాతపస్వి.
భావము:-
మహాతపస్వి, గొప్ప తేజస్సు గల గౌతమ మని అచటకు చేరి అహల్యను స్వీకరించి, ఇద్దరును శ్రీరామచంద్రుని శాస్త్రోక్తముగ పూజించి సుఖముగ ఉండిరి. పిమ్మట వారిరువురు అచటనే తపము ఆచరింపసాగెను.
1.49.22.
అనుష్టుప్.
రామోఽ పి పరమాం పూజాం
గౌతమస్య మహామునేః ।
సకాశా ద్విధివత్ ప్రాప్య
జగామ మిథిలాం తతః ॥
టీక:-
రామః = శ్రీరామచంద్రుడుకూడ; అపి = కూడ; పరమాం = గొప్ప; పూజాం = పూజను; గౌతమస్య = గౌతమునియొక్క; మహామునేః = మహామునియైన; సకాశాత్ = వద్దనుండి; విధివత్ = యథావిధిగా; ప్రాప్య = పొంది; జగామ = వెళ్ళెను; మిథిలాం = మిథిలానగరము గూర్చి; తతః = పిమ్మట.
భావము:-
గౌతమముని వద్దనుండు పూజలను యథావిధిగా స్వీకరించిన శ్రీరామచంద్రుడు అచటనుండి మిథిలానగరమునకు వెళ్ళెను.
1.49.23.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనపంచాశ = నలభైతొమ్మిదవ [49]; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభైతొమ్మిదవ సర్గః [49] సమాప్తము.
బాల కాండ
1.50.1.
అనుష్టుప్.
తతః ప్రాగుత్తరాం గత్వా
రామః సౌమిత్రిణా సహ ।
విశ్వామిత్రం పురస్కృత్య
యజ్ఞవాట ముపాగమత్ ॥
టీక:-
తతః = పిమ్మట; ప్రాగుత్తరాం = ఈశాన్య దిక్కును గూర్చి; గత్వా = వెళ్లి; రామః = రాముడు; సౌమిత్రిణా = లక్ష్మణునితో; సహ = కూడ; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; పురస్కృత్య = పురస్కరించుకొని; యజ్ఞవాటమ్ = యజ్ఞవాటికను; ఉపాగమత్ = పొందెను (చేరెను).
భావము:-
శ్రీరాముడు లక్ష్మణునితో గూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్యదిశగా ప్రయాణము చేసి జనకమహారాజు యొక్క యజ్ఞవాటికకు చేరెను,
గమనిక:-
*- ప్రాగుత్తరము- ప్రాక్- తూర్పుదిక్కు ఉత్తరము దిక్కు, ఈశాన్య మూల.
1.50.2.
అనుష్టుప్.
రామస్తు మునిశార్దూలమ్
ఉవాచ సహలక్ష్మణః ।
“సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి
జనకస్య మహాత్మనః ॥
టీక:-
రామస్తు = రాముడైతే; మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి; ఉవాచ = పలికెను; సహలక్ష్మణః = లక్ష్మణ సమేతుడై; సాధ్వీ = మంచిది కదా; యజ్ఞసమృద్ధిః = యజ్ఞ సంభారముల సంపద; జనకస్య = జనకునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన.
భావము:-
రామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి, "మహాత్ము డైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చూడ చక్కగా నున్నవి,
1.50.3.
అనుష్టుప్.
బహూనీహ సహస్రాణి
నానాదేశ నివాసినామ్ ।
బ్రాహ్మణానాం మహాభాగ!
వేదాధ్యయన శాలినామ్ ॥
టీక:-
బహూనీహ = అనేక; సహస్రాణి = వేలగొలది; నానాదేశ = అనేక దేశములందు; నివాసినామ్ = నివసించువారును; బ్రాహ్మణానాం = బ్రాహ్మణులయొక్క; మహాభాగ = పూజ్యుడా; వేదాధ్యయన = వేదాధ్యయనముతో; శాలినామ్ = ప్రకాశించువారు
భావము:-
అనేక వేలకొలది నానాదేశవాసులు, వేదపండితులై ప్రకాశిస్తున్న బ్రాహ్మణులు ఇక్కడకు వచ్చి ఉన్నారు,
1.50.4.
అనుష్టుప్.
ఋషివాటాశ్చ దృశ్యంతే
శకటీశత సంకులాః ।
దేశో విధీయతాం బ్రహ్మన్
యత్ర వత్స్యామహే వయమ్" ॥
టీక:-
ఋషివాటః = ఋషుల నివాసస్థలముల తోను; చ = ఇంకను; దృశ్యంతే = చూడబడుచున్నవి; శకటీ = బండ్లు; శత = వందలకొలదికూడిన; సంకులాః = సందోహములు; దేశః = ప్రదేశము; విధీయతాం = నిర్ణయింపబడుగాక; బ్రహ్మన్ = ఓ మహాముని; యత్ర = ఎక్కడ; వత్స్యామహే = నివసించ గలమో; వయమ్ = మనము.
భావము:-
వందలకొలది బండ్లసందోహములతో ఋషివాటికలు కనపడుచున్నవి, కావున ఓ మహర్షి మనము నివసించ తగు ప్రదేశము నిర్ణయింపుడు,
1.50.5.
అనుష్టుప్.
రామస్య వచనం శ్రుత్వా
విశ్వామిత్రో మహామునిః ।
నివేశ మకరోద్దేశే
వివిక్తే సలిలాయుతే ॥
టీక:-
రామస్య = రామునియొక్క; వచనం = మాటలు; శ్రుత్వా = విని; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాముని = మహాముని అయిన; నివేశమ్ = విడిదిని; అకరోత్ = చేసెను; దేశే = ప్రదేశమునందు; వివిక్తే = జనసమర్ధ రహితము అగు; సలిలః = నీటితో; ఆన్వితే = కూడి నదియును;
భావము:-
మహాముని విశ్వామిత్రుడు రాముని మాటలు విని జలసౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు నివాసస్థలముగా నిర్ణయించెను,
1.50.6.
అనుష్టుప్.
విశ్వామిత్రమనుప్రాప్తమ్
శ్రుత్వా స నృపతిస్తదా ।
శతానన్దం పురస్కృత్య
పురోహిత మనిందితమ్ ।
ప్రత్యుజ్జగామ సహసా
వినయేన సమన్వితః ॥
టీక:-
విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; అనుప్రాప్తమ్ = వచ్చినవానిగా; శ్రుత్వా = విని; సః = ఆ; నృపతిః = రాజు; తదా = అప్పుడు; శతానన్దం = శతానందుని; పురస్కృత్య = ఎదుట ఉంచుకొని; పురోహితమ్ = పురోహితుని; అనిందితమ్ = దోష రహితుడగు; ప్రత్యుజ్జగామ = ఎదురు వెళ్ళెను; సహసా = వెంటనే; వినయేన = వినయముతో; సమన్వితః = కూడినవాడై.
భావము:-
అంతట జనక మహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు, పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందిడుకొని వినమ్రముగా ఆముని దగ్గరకు ఏతెంచెను,
1.50.7.
అనుష్టుప్.
ఋత్విజోఽ పి మహాత్మానః
త్వర్ఘ్యమాదాయ సత్వరమ్ ।
విశ్వామిత్రాయ ధర్మేణ
దదుర్మంత్ర పురస్కృతమ్ ॥
టీక:-
ఋత్విజః = ఋత్విక్తులు; అపి = కూడా; మహాత్మానః = మహాత్ములైన; తు; అర్ఘ్యమ్ = ఆర్ఘ్యము మొదలుగా గల పూజా ద్రవ్యములను; ఆదాయ = గ్రహించి; సత్వరమ్ = శీఘ్రముగా; విశ్వామిత్రాయ = విశ్వామిత్రుని కొఱకు; ధర్మేణ = ధర్మము చేత; దదుః = ఇచ్చిరి; మంత్ర పురస్కృతమ్ = మంత్రపూర్వకముగా.
భావము:-
వెనువెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాదికములను మంత్రపూర్వకము గాను, ధర్మానుసారముగాను ఇచ్చి అతిథి సత్కారములు జరిపిరి,
1.50.8.
అనుష్టుప్.
ప్రతిగృహ్య తు తాం పూజామ్
జనకస్య మహాత్మనః ।
పప్రచ్ఛ కుశలం రాజ్ఞో
యజ్ఞస్య చ నిరామయమ్ ॥
టీక:-
ప్రతిగృహ్య = స్వీకరించి; తు; తామ్ = ఆ; పూజామ్ = పూజను; జనకస్య = జనక మహారాజు యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; పప్రచ్ఛ = ఆడిగెను; కుశలం = యోగక్షేమమును; రాజ్ఞః = రాజుయొక్క; యజ్ఞస్య = యజ్ఞముయొక్క; నిరామయమ్ = ఎట్టి బాధలు లేకుండుటను
భావము:-
మహర్షి విశ్వామిత్రుడు జనక మహారాజు ఒనర్చిన అతిధి మర్యాదలు స్వీకరించి రాజు కుశలమును, యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించి అడిగెను,
1.50.9.
అనుష్టుప్.
స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా
సోపాధ్యాయ పురోధసః ।
యథాన్యాయం తతః సర్వైః
సమాగచ్ఛత్ ప్రహృష్టవత్ ॥
టీక:-
సః = విశ్వామిత్రుడు; తాం = వారందరితో; చ; అపి = కూడా; మునీన్ = మునులను; పృష్ట్వా = యోగక్షేమములు అడిగి; సః = సమేతముగ; ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతో పురోధసః = పురోహితులతో; యథాన్యాయం = న్యాయానుసారముగా; తతః = పిమ్మట; సర్వైః = వారి అందరితోను; సమాగచ్ఛత్ = కలిసి ఉండెను; ప్రహృష్టవత్ = సంతోషించిన వాడై.
భావము:-
పిమ్మట విశ్వామిత్రుడు గురువులు, పురోహితులు, శతానందాది మహాఋషులను పద్దతిగా కుశల ప్రశ్నలు వేయుచు, సంతోషింగా వారందరితో కలిసి ఉండెను,
1.50.10.
అనుష్టుప్.
అథ రాజా మునిశ్రేష్ఠమ్
కృతాంజలి రభాషత ।
ఆసనే భగవన్నాస్తామ్
సహైభి ర్మునిసత్తమైః ॥
టీక:-
అథ = పిమ్మట; రాజా = రాజు; మునిశ్రేష్ఠమ్ = ముని శ్రేష్ఠుని గూర్చి; కృతాంజలిః = దోసిలి కట్టినవాడై; అభాషత = పలికెను; ఆసనే = అసనమునందు; భగవన్ = పూజ్యుడవైన నీవు; ఆస్తామ్ = కుర్చుందువు గాక; సహ = కూడి; ఏభి = ఈ; మునిసత్తమైః = మునిశ్రేష్ఠులతో.
భావము:-
అంతట జనకమహారాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో "మహాత్మా! పూజ్యుడవైన నీవు ఈ మునిశ్రేష్ఠులతో గూడి అసనమును అలంకరింపుము " అని పలికెను,
1.50.11.
అనుష్టుప్.
జనకస్య వచః శ్రుత్వా
నిషసాద మహామునిః ।
పురోధా ఋత్విజశ్చైవ
రాజా చ సహ మంత్రిభిః ॥
టీక:-
జనకస్య = జనకమహారాజు యొక్క; వచః = వాక్కులు (మాటలు); శ్రుత్వా = విని; నిషసాద = కూర్చుండెను; మహామునిః = మహాముని; పురోధా = పురోహితుడును; ఋత్విజః = ఋత్విక్కులును; చ; ఏవ = మున్నగు వారు; రాజా = రాజును; చ; సహ = సహితము; మంత్రిభిః = మంత్రులతో కూడ.
భావము:-
విశ్వామిత్రుడు రాజు మాటలు విని ఆసీనుడయ్యెను, పిమ్మట మంత్రిగణంసహితంగా జనకమహారాజు మఱియు పురోహితులు, ఋత్విజులు మున్నగువారును ఆసీనులు లయిరి,
1.50.12.
అనుష్టుప్.
ఆసనేషు యథాన్యాయమ్
ఉపవిష్టాన్ సమంతతః ।
దృష్ట్వా స నృపతిస్తత్ర
విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥
టీక:-
ఆసనేషు = అసనముల యందు; యథాన్యాయమ్ = పద్దతి ప్రకారం; ఉపవిష్టాన్ = కూర్చున్న; సమంతతః = నలువైపుల; దృష్ట్వా = చూచి; సః = ఆ నృపతిః = రాజు; తత్ర = అచట; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి; అబ్రవీత్ = పలికెను.
భావము:-
వారందరు పద్దతి ప్రకారం ఆసీనులైన పిమ్మట, జనకమహారాజు నలువైపుల వీక్షించి విశ్వామిత్ర మహర్షితో ఇట్లనెను,
1.50.13.
అనుష్టుప్.
“అద్య యజ్ఞసమృద్ధిర్మే
సఫలా దైవతైః కృతా ।
అద్య యజ్ఞఫలం ప్రాప్తం
భగవద్దర్శనా న్మయా ॥
టీక:-
అద్య = ఈ నాడు; యజ్ఞ = యజ్ఞము యొక్క; సమృద్ధిః = సంపద; మే = నాయొక్క; సఫలా = ఫలముకలదిగా; దైవతైః = దేవతలచేత; కృతా = చేయబడినది; అద్య = ఈ నాడు; యజ్ఞఫలం = యజ్ఞముయొక్క ఫలము; ప్రాప్తమ్ = పొందబడినది; భగవత్ = పూజ్యుడవైన నీ యొక్క; దర్శనాత్ = దర్శనము వలన; మయా = నాచేత.
భావము:-
“ఓ మహర్షి ! దైవాను గ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరి సాఫల్యము సిద్ధించినది, నేడు ఋషిసత్తములైన మీ దర్శనము లభించుట నా యజ్ఞఫలముగా భావించెదను, "అని జనక మహారాజు పలికెను,
1.50.14.
అనుష్టుప్.
ధన్యోఽ స్మ్యనుగృహీతోఽ స్మి
యస్య మే మునిపుంగవ ।
యజ్ఞోపసదనం బ్రహ్మన్!
ప్రాప్తోఽ సి మునిభిః సహ॥
టీక:-
ధన్యః అస్మి = ధన్యుడనైతిని; అనుగృహీతః అస్మి = అనుగ్రహింప బడినవాడినైతిని; యస్య = ఏ; మే = నాయొక్క; ముని = మునులలో; పుంగవ = శ్రేష్ఠుడ; యజ్ఞః = యజ్ఞముజరుగు; ఉపసదనం = స్థానమును గూర్చి; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా; ప్రాప్తః అసి = వచ్చినావో; మునిభిః = మునులతో; సహ = కూడి.
భావము:-
"ఓ మునీశ్వరా! ఓ విశ్వామిత్ర బ్రహ్మర్షీ ! మీరు నన్ను అనుగ్రహించి మునీశ్వరులతో కలిసి ఈ యజ్ఞవాటికకు విచ్చేయుట వలన నేను ధన్యుడనైతిని, అనుగ్రహ పాత్రుడనైతిని.
1.50.15.
అనుష్టుప్.
ద్వాదశాహం తు బ్రహ్మర్షే
శేషమాహు ర్మనీషిణః ।
తతో భాగార్థినో దేవాన్
ద్రష్టుమర్హసి కౌశిక!” ॥
టీక:-
ద్వాదశాహం = పన్నెండు రోజులు; తు = మాత్రమే; బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ; శేషమ్ = మిగిలిన దానినిగా; అహుః = చెప్పుచున్నారు; మనీషిణః = విద్వాంసులు; తతః = అటు పిమ్మట; భాగార్థినః = భాగములను కోరుచున్న; దేవాన్ = దేవతలను; ద్రష్టుమ్ = చూచుటకు; అర్హసి = తగియున్నావు; కౌశిక = విశ్వామిత్రా {కౌశికు- కుశికుని వంశమున పుట్టినవాడు, గాధికి విశ్వామిత్రుడు జన్మించి తపోబలమున బ్రహ్మర్షి ఆయెను, విశ్వామిత్రుడు}.
భావము:-
ఓ బ్రహ్మర్షీ ! యజ్ఞము పరిసమాప్తి నొందుటకు పన్నెండు దినములు మాత్రమే యున్నవి, అటుపిమ్మట యజ్ఞ హావిస్సుల కొరకు విచ్చేయు దేవతలను మీరు కూడా చూడవచ్చును”.
1.50.16.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా మునిశార్దూలం
ప్రహృష్టవదన స్తదా ।
పునస్తం పరిపప్రచ్ఛ
ప్రాంజలిః ప్రణతో నృపః ॥
టీక:-
ఇతి = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; ముని = మునుల యందు; శార్దూలమ్ = శ్రేష్ఠుని గుఱించి; ప్రహృష్టః = మిక్కిలి సంతసించిన; వదనః = ముఖము కలవాడై; తదా = అప్పుడు; పునః = మరల; తమ్ = అతనిని; పరిపప్రచ్ఛ = అడిగెను; ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై; ప్రణతః = నమస్కరించుచు; నృపః = రాజు.
భావము:-
జనక మహారాజు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికిన పిమ్మట, మరల దోసిలొగ్గి వినమ్రముగా నమస్కరించుచు, సంతోషముతో వికసించిన ముఖముతో మరల ఈ విధముగా ప్రశ్నించెను,
1.50.17.
అనుష్టుప్.
“ఇమౌ కుమారౌ భద్రం తే
దేవతుల్య పరాక్రమౌ ।
గజసింహగతీ వీరౌ
శార్దూల వృషభోపమౌ ॥
టీక:-
ఇమౌ = ఈ; కుమారౌ = బాలురు ఇద్దరకు; భద్రం = మంగళ మగుగాక; తే = నీకు; దేవః = దేవతలతో; తుల్య = సమాన మైన; పరాక్రమౌ = పరాక్రమము కలవారును; గజ = ఏనుగుల వంటి; సింహః = సింహముల వంటి; గతీ = గమనము కలవారును. వీరౌ = వీరులును; శార్దూల = పెద్దపులి తోడను; వృషభః = ఎద్దులతోడను. ఉపమౌ = సరితూగువారు.
భావము:-
“ఓ విశ్వామిత్రా1 నీకు క్షేమ మగుగాక, ఈ బాలురు ఇరువురు దేవతలతో సమానమగు పరాక్రమము కలవారు, వీరలు గజ సింహముల వంటి. వీరులు, ఇంకను, పెద్దపులులతోను, ఎద్దులతోను సాటువచ్చు వా,
1.50.18.
అనుష్టుప్.
పద్మపత్ర విశాలాక్షౌ!
ఖడ్గతూణీ ధనుర్ధరౌ ।
అశ్వినావివ రూపేణ
సముపస్థిత యౌవనౌ ॥
టీక:-
పద్మపత్ర = తామరరేకుల వలె; విశాలః = విశాలమైన; అక్షౌ = కనులు కలవారిద్దరును; ఖడ్గః = ఖడ్గములను; తూణీ = అంబుల పొదులను; ధనుః = ధనుస్సులను; ధరౌ = ధరించిన వారు; అశ్వినాః = అశ్వినీ దేవతలు; ఇవ = వలె; రూపేణ = అందమైన వారును; సముపస్థిత = సమీపించిన; యౌవనౌ = యవ్వన దశలో ఉన్నవారిరువురును.
భావము:-
తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవారును, ఖడ్గములను అంబులపొదులను ధనస్సులను ధరించిన వారును, అశ్వనీదేవతలంత అందగాళ్ళును యవ్వన దశను చేరుతున్నవారును,
గమనిక:-
*- అశ్వనీ దేవతలు- సూర్యుని భార్య సంధ్యాదేవి బడబా రూపమును ఒందిన నాసికయందు పుట్టిన అమడలు. వీరు దేవవైద్యులు, అతిరూపవంతులు అని ప్రసిద్ధి. వీరు ఇద్దరి పేర్లు సత్యాఖ్యుడు, దస్రుడు.
1.50.19.
అనుష్టుప్.
యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ
దేవలోకాది వామరౌ ।
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ
కిమర్థం కస్య వా మునే ॥
టీక:-
యదృచ్ఛయా = స్వేచ్ఛానుసారముగా; గామ్ = భూమిని; ప్రాప్తౌ = చేరిన; దేవలోకాత్ = దేవలోకము నుండి; అమరౌ ఇవ = దేవతలవలె; కథమ్ = ఎట్లు; పద్భ్యామ్ = పాదముల చేత; ఇహ = ఇచటకు; ఇమౌ = ఈ; ప్రాప్తౌ = చేరిన ఇద్దరు; కిమర్థం = ఎందుకు; కస్య వా = ఎవరికి సంబంధించిన వారు; మునే = ఓ మునీశ్వరా.
భావము:-
మునీశ్వరా ! దేవలోకము నుండి భూలోకమునకు దిగివచ్చిన దేవతల వలె ఉన్న ఈ బాలురు ఎవరివారు? ఇచ్చటికి కాలినడకను వచ్చినారేమి ? ఎందులకు వచ్చినారు?
1.50.20.
అనుష్టుప్.
వరాయుధధరౌ వీరౌ!
కస్య పుత్రౌ మహామునే ।
భూషయంతావిమం దేశమ్
చంద్రసూర్యా వివామ్బరమ్ ॥
టీక:-
వర = శ్రేష్ఠమైన; ఆయుధః = ఆయుధములను; ధరౌ = ధరించిన ఇద్దరు; వీరౌ = ఈ వీరులు; కస్య = ఎవరియొక్క; పుత్రౌ = పుత్రులు; మహామునే = ఓ మహాముని; భూషయన్తౌ = అలంకరించుకొన్నవారును; ఇమం = ఈ; దేశమ్ = ప్రదేశమును; చంద్రసూర్యామ్ = చంద్రడు సూర్యుడు; ఇవా = వలె; అమ్బరమ్ = ఆకాశమున.
భావము:-
ఓ మహామునీ! శ్రేష్ఠమైన ఆయుధములను ధరించిన ఈ వీరులు, ఈ ప్రదేశమును అలంకరింపజేయుచున్నారు, చంద్ర సూర్యులు ఆకాశమును ప్రకాశింప చేయునట్లు ఈ ప్రదేశమును ప్రకాశింపచేయుచున్న ఈ వీరులు ఇద్దరు ఎవరి పుత్రులో తెలియజేయ గోరుచున్నాను,
1.50.21.
అనుష్టుప్.
పరస్పరస్య సదృశౌ
ప్రమాణేంగిత చేష్టితైః ।
కాకపక్షధరౌ వీరౌ
శ్రోతుమిచ్ఛామి తత్త్వతః" ॥
టీక:-
పరస్పరస్య = ఒకరికొకరు; సదృశౌ = పొలికగల వారును; ప్రమాణః = వయో రూప పరిమాణముచేతను; ఇంగిత = బొమముడి మున్నగు అభిప్రాయ సూచనల చేతనg; చేష్టితైః = చేష్టల చేతను; కాకపక్షధరౌ = జులపములను ధరించిన వారగు; వీరౌ = ఈ వీరులిద్దరను గూర్చి; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; తత్త్వతః = యదార్థముగా.
భావము:-
జునపములను ధరించిన ఈ వీరులు రూప వయో పరిమాణములందు, బొమముడి మున్నగు అభిప్రాయ సూచన లందు, చేష్ఠ లందును ఒకరినొకరు బాగుగా పోలి యున్నారు, ఈ వీరు లిద్దరను గురించి తెలుసుకొన గోరు చున్నాను,
1.50.22.
అనుష్టుప్.
తస్య తద్వచనం శ్రుత్వా
జనకస్య మహాత్మనః ।
న్యవేదయ “న్మహాత్మానౌ
పుత్రౌ దశరథస్య తౌ ॥
టీక:-
తస్య = ఆ; తత్ = ఆ; వచనం = మాటలను; శ్రుత్వా; = విని; జనకస్య = జనక మహారాజు యొక్క; మహాత్మనః = మహాత్ములగు. న్యవేదయత్ = తెలిపెను; మహాత్మానౌ = మహాత్ములగు వీరిద్దరు; పుత్రౌ = పుత్రులు; దశరథస్య = దశరథ మహారాజు యొక్క; తౌ = వారిరువురు.
భావము:-
మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు మహాత్ముడైన జనకమహారాజు మాటలు విని అతనితో రామ లక్ష్మణుల గూర్చి ఇట్లనెను, “రాజా ఈ బాలురు ఇరువురు దశరథ మహారాజు కుమారులు,
1.50.23.
అనుష్టుప్.
సిద్ధాశ్రమ నివాసం చ
రాక్షసానాం వధం తథా ।
తచ్చాగమన మవ్యగ్రమ్
విశాలాయాశ్చ దర్శనమ్ ॥
టీక:-
సిద్ధాశ్రమ = సిద్ధాశ్రమము నందు; నివాసం = నివాసమును; చ = మఱియు; రాక్షసానాం = రాక్షసులయొక్క; వధం = సంహారమును; తథా = మఱియు; తత్ = ఆ; ఆగమనమ్ = వచ్చుటను; అవ్యగ్రమ్ = నిర్భయముగా; విశాలాయాః = విశాల నగరము యొక్క; దర్శనమ్ = దర్శనమును.
భావము:-
మహాతేజోశాలి అయిన విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు సిద్ధాశ్రమానికి వచ్చుట, రాక్షసులను వధించుట, నిర్భయముగా విశాలనగరమునకు వచ్చి చూచుట,
1.50.24.
అనుష్టుప్.
అహల్యాదర్శనం చైవ
గౌతమేన సమాగమమ్ ।
మహాధనుషి జిజ్ఞాసామ్
కర్తుమాగమనం తథా" ॥
టీక:-
అహల్యా = అహల్య; దర్శనం చైవ = దర్శనమును; చైవ = ఇంకను; గౌతమేన = గౌతమునితో; సమాగమమ్ = కలయుట; మహాధనుషి = గొప్పదైన శివధనస్సునందు; జిజ్ఞాసామ్ = తెలిసికొనగోరి; కర్తుమ్ = చేయుట; ఆగమనం = వచ్చుటను; తథా = సమస్తము.
భావము:-
అహల్యను చూచుట, గౌతమమునితో సమాగమమును, శివధనస్సును గుఱించి తెలుసుకొనగోరి మిథిలకు వచ్చుట మొదలగు విషయములు సమస్తము జనక మహారాజునకు ఎఱింగించెను,
1.50.25.
అనుష్టుప్.
ఏతత్సర్వం మహాతేజా
జనకాయ మహాత్మనే ।
నివేద్య విరరామాథ
విశ్వామిత్రో మహామునిః ॥
టీక:-
ఏతత్ = వాటిని; సర్వం = అన్నింటిని; మహాతేజాః = మహాతేజస్వి అయిన; జనకాయ = జనక మహారాజునకు; మహాత్మనే = మహాత్ముడైన; నివేద్య = తెలిపి; విరరామ = విరమించెను; అథ = పిమ్మట; విశ్వామిత్రః = విశ్వామిత్ర; మహామునిః = మహాముని.
భావము:-
ఆ విషయములను అన్నింటిని మహాత్ముడైన మహాతేజస్వి అగు జనకమహారాజునకు విశ్వామిత్ర మహాముని వివరముగా తెలిపెను,
1.50.26.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచాశ = ఏభైయవ [50]; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైవ [50] సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.51.1.
అనుష్టుప్.
తస్య తద్వచనం శ్రుత్వా
విశ్వామిత్రస్య ధీమతః ।
హృష్టరోమా మహాతేజాః
శతానన్దో మహాతపాః ॥
టీక:-
తస్య = అప్పుడు; తత్ = ఆ; వచనమ్ = వచనమును; శ్రుత్వా = విని; విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క; ధీమతః = బుద్ధిమంతుడైన; హృష్టరోమాః = గగుర్పాటు కలిగినవాడై; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన వారు; శతానందః = శతానందుడు; మహాతపాః = గొప్ప తపస్సు కలిగిన వారు
భావము:-
బుద్ధిమంతుడైన విశ్వామిత్రుని మాటలు విని, మహాతేజ శ్శాలియును, తపోధనుడును ఐన శతానందుడు పులకిత గాత్రుడయ్యెను.
1.51.2.
అనుష్టుప్.
గౌతమస్య సుతో జ్యేష్ఠః
తపసా ద్యోతితప్రభః ।
రామసందర్శనాదేవ
పరం విస్మయమాగతః ॥
టీక:-
గౌతమస్య = గౌతమముని యొక్క; సుతః = కుమారుడు; జ్యేష్టః = పెద్ద; తపసా = తపస్సు చేత; ద్యోతితప్రభః = కాంతితో వెలుగొందుచున్న వారు; రామాసందర్శనాత్ = శ్రీరామచందమూర్తి దర్శనము పొందిన; ఏవ = అంతనే; పరమ్ = మిక్కిలి; విస్మయమ్ = ఆశ్చర్యము; ఆగతః = పొందినారు.
భావము:-
తపస్సు వలన కలిగిన కాంతితో వెలుగొందుతున్న వాడును, గౌతమముని పెద్దకుమారుడైన శతానందుడు, శ్రీరామచందమూర్తి దర్శనము పొంది చకితుడయ్యెను.
1.51.3.
అనుష్టుప్.
స తౌ నిషణ్ణౌ సమ్ప్రేక్ష్య
సుఖాసీనౌ నృపాత్మజౌ ।
శతానన్దో మునిశ్రేష్ఠమ్
విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥
టీక:-
సః = ఆ; తౌ = ఆ; నిషణ్ణౌ = సమీపమునందున్నవారిని; సమ్ప్రేక్ష్య = చూచి; సుఖాసీనౌ = సుఖముగా కూర్చున్న; నృపాత్మజౌ = రాజకుమారులు ఇద్దరను; శతానన్దః = శతానన్దుడు; మునిశ్రేష్ఠమ్ = మునులలో శ్రేష్ఠుడైన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; అథ = అటు పిమ్మట; అబ్రవీత్ = పలికెను
భావము:-
ఆ శతానన్దుడు సమీపమునందు ఆసీనులై యున్న ఆ రాజకుమారులు రామ, లక్ష్మణులను చూచిన పిమ్మట, మునీశ్వరుడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను . .
1.51.4.
అనుష్టుప్.
“అపి తే మునిశార్దూల!
మమ మాతా యశస్వినీ ।
దర్శితా రాజపుత్రాయ
తపోదీర్ఘ ముపాగతా ॥
టీక:-
అపి = ఏమి; తే = మీచేత; మునిశార్దూల = మునిశ్రేష్ఠా; మమ = నాయొక్క; మాతా = మాతృమూర్తి; యశస్వినీ = కీర్తివంతురాలు; దర్శితా = చూపబడినదా?; రాజపుత్రాయ = రాకుమారునకు; తపః = తపస్సును; దీర్ఘమ్ = ఎంతోకాలం; ఉపాగతా = ఆచరించినటువంటి
భావము:-
“మునిశ్రేష్ఠా! విశ్వామిత్రా! ఎంతోకాలముగా తపస్సు ఆచరిస్తున్నకీర్తివంతురాలు, నా మాతృమూర్తి అహల్యా మాతను ఈ రాజకుమారుడు రామునికి చూపించితిరా?
1.51.5.
అనుష్టుప్.
అపి రామే మహాతేజా
మమ మాతా యశస్వినీ ।
వన్యైరుపాహర త్పూజామ్
పూజార్హే సర్వదేహినామ్ ॥
టీక:-
అపి = ఏమ్; రామే = శ్రీరామచంద్ర మూర్తిని; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన వారు; మమ = నాయొక్క; మాతా = మాతృమూర్తి; యశస్వినీ = యశస్సుకలిగిన; వన్యైః = వనములలో లభించు వాటితో; ఉపాహరత్ = చేసినదా?; పూజామ్ = పూజను; పూజార్హే = పూజించుటకు అర్హమయిన; సర్వదేహినామ్ = సకల ప్రాణులచే
భావము:-
గొప్ప తేజస్సు, యశస్సు కలిగిన మా మాతృమూర్తి, సకలప్రాణులకు పూజ్యుడైన శ్రీరామచంద్రమూర్తిని వనములో లభించు పూలు, కందమూల ఫలములతో పూజించెనా?
1.51.6.
అనుష్టుప్.
అపి రామాయ కథితమ్
యథావృత్తం పురాతనమ్ ।
మమ మాతుర్మహాతేజో!
దైవేన దురనుష్ఠితమ్ ॥
టీక:-
అపి = ఏమి; రామాయ = శ్రీరామునికి; కథితమ్ = చెప్పబడినదా?; యథావృత్తమ్ = యథాతథముగా; పురాతనమ్ = ఎప్పుడో జరిగిన ఘటన; మమ = నాయొక్క; మాతుః = మాతృమూర్తి గురించి; మహాతేజః = గొప్ప తేజస్సు కలిగిన; దైవేన = దైవము చేత; దురనుష్ఠితమ్ = చెడుగా చేయబడిన.
భావము:-
ఓ మహాతేజోమూర్తీ విశ్వామిత్రా ! విధివశమున మా మాతృమూర్తికి జరిగిన దుర్ఘటన యథాతథముగా శ్రీరామచంద్రమూర్తికి వివరించితిరా?
1.51.7.
అనుష్టుప్.
అపి కౌశిక! భద్రం తే
గురుణా మమ సంగతా ।
మాతా మమ మునిశ్రేష్ఠ
రామసందర్శ నాదితః ॥
టీక:-
అపి = ఏమి; కౌశిక = విశ్వామిత్రా; భద్రం = శుభమగుగాక; తే = నీకు; గురుణా = తండ్రితో; మమ = నాయొక్క; సంగతా = కలిసినదా?; మాతా = మాతృమూర్తి; మమ = నాయొక్క; మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడైన; రామ = శ్రీరామచంద్రమూర్తి; సందర్శనాదితః = సందర్శనము మొదలగువానిచే
భావము:-
మునులలో శ్రేష్ఠుడవైన ఓ విశ్వామిత్రా! నీకు శుభమగుగాక, శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యము వలన, మఱియు ఆమె చేసిన అథితి సత్కారముల వలన, మా మాతృమూర్తి మా తండ్రిగారిని చేరుకున్నదా?
గమనిక:-
*- విశ్వామిత్రుని కుశికుడు అని సంభోదించినట్లు, వారి వంశమును / పూర్వీకుని నామంతో పలకరించుట ఒక సత్సంప్రదాయము, అంతర్గగతంగా అంతటి కుటుంబములో జనించిన వాడవు కనుకనూ ఆ గొప్ప బుద్దులు వంశపారంపర్యంగా వచ్చిన వాడు అని స్మరిచుట
1.51.8.
అనుష్టుప్.
అపి మే గురుణా రామః
పూజితః కుశికాత్మజ ।
ఇహాగతో మహాతేజాః
పూజాం ప్రాప్తో మహాత్మనః ॥
టీక:-
అపి = ఏమి; మే = నా; గురుణా = తండ్రిచే; రామః = శ్రీరామచంద్రమూర్తి; పూజితః = పూజింపబడినారా?; కుశికాత్మజ = కుశికనందనా విశ్వామిత్రా; ఇహ = ఇక్కడకు; ఆగతః = వచ్చినటువంటి; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; పూజామ్ = పూజను; ప్రాప్తః = పొందినాడా?; మహాత్మనః = మహాత్ముడైన శ్రీరాముడు.
భావము:-
విశ్వామిత్రా! నాతండ్రి తేజోమూర్తి శ్రీరాముచంద్రమూర్తిని పుజించినారా? ఇక్కడకు వచ్చిన ఈ మహాత్ముడు శ్రీరామచంద్రమూర్తి నాతండ్రిని అనుగ్రహించినారా?
1.51.9.
అనుష్టుప్.
అపి శాంతేన మనసా
గురుర్మే కుశికాత్మజ ।
ఇహాగతేన రామేణ
ప్రయతే నాభివాదితః" ॥
టీక:-
అపి = ఏమ్; శాంతేన = శాంతమైన; మనసా = మనస్సుతో; గురుః = తండ్రి; మే = నా యొక్క; కుశికాత్మజ = కుశికనందనా విశ్వామిత్రా; ఇహ = ఇక్కడకు; ఆగతేన = వచ్చిన; రామేణ = శ్రీరామచంద్రమూర్తిచే; ప్రయతేన = పరిశుద్దుడైన, ప్రయత్నశీలుడైవ. అభివాదితః = అభివాదము చేయబడినాడా?
భావము:-
విశ్వామిత్రా! ఇక్కడకు వచ్చిన పరిశుద్దుడైన శ్రీరామచంద్రముర్తి ప్రశాంతమైన మనస్సుతో, మా తండ్రికి అభివాదము చేసెనా ?”
గమనిక:-
*- ప్రయతుడు- ఇంద్రియ నిగ్రహము కలవాడు, పవిత్రుడు, ప్రయత్నము కలవాడు, వ్యుత్పత్తి. ప్ర + యమ + క్త, కృ.ప్ర.
1.51.10.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా వచనం తస్య
విశ్వామిత్రో మహామునిః ।
ప్రత్యువాచ శతానందమ్
వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ ॥
టీక:-
తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = మాటలను; తస్య = అతనియొక్క; విశ్వామిత్రః = విశ్వమిత్రుడు; మహామునిః = మహాముని; ప్రత్యువాచ = తిరిగి పలికెను; శతానందమ్ = శతానందుని; వాక్యజ్ఞః = విని మాటలు బాగా గ్రహించువాడు; వాక్యకోవిదమ్ = మాటలాడుటలో నేర్పరి.
భావము:-
ఆ మాటలు వినిన విశ్వామిత్ర మహాముని, విన్నది చక్కగా గ్రహించు వాడును, సంభాషించుటలో నేర్పరి ఐన శతానందునికి సమాధానముగ ఇట్లు పలికెను.
1.51.11.
అనుష్టుప్.
“నాతిక్రాంతం మునిశ్రేష్ఠ!
యత్కర్తవ్యం కృతం మయా ।
సంగతా మునినా పత్నీ
భార్గవేణేవ రేణుకా" ॥
టీక:-
న = లేకుండా; అతిక్రాంతం = కర్తవ్యోల్లంఘనలు; మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడ; యత్ = ఏది; కర్తవ్యమ్ = కర్తవ్యమో; కృతమ్ = చేయబడినది; మయా = నాచేత; సంగతా = కలిసినది/చేరినది; మునినా = ముని గౌతమునితో; పత్నీ = వారి పత్ని అహల్యా; భార్గవేణేవ = జమదగ్నితో వలె; రేణుకా = రేణుకా.
భావము:-
“ఓ మునిశ్రేష్ఠ! శతానందా! ఏ మాత్రము కర్తవ్యోల్లంఘన లేకుండా నా కర్తవ్యము నెరవేర్చితిని. రేణుకాదేవి జమదగ్ని మహర్షిని చేరినట్లు, అహల్యాదేవి తన భర్త గౌతమమునిని చేరినది.”
1.51.12.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా వచనం తస్య
విశ్వామిత్రస్య భాషితమ్ ।
శతానన్దో మహాతేజా
రామం వచనమబ్రవీత్ ॥
టీక:-
తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = పలుకులు; తస్య = ఆ; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; భాషితమ్ = పలుకబడిన; శతానన్దః = శతానందుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; రామమ్ = శ్రీరామునితో; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను;
భావము:-
విశ్వామిత్ర మహర్షి పలికిన ఆ మాటలు విని, మహాతేజస్సు కలిగిన శతానందుడు శ్రీరామునితో ఈ విధముగా పలికెను.
1.51.13.
అనుష్టుప్.
“స్వాగతం తే నరశ్రేష్ఠ!
దిష్ట్యా ప్రాప్తోఽ సి రాఘవ! ।
విశ్వామిత్రం పురస్కృత్య
మహర్షి మపరాజితమ్ ॥
టీక:-
స్వాగతమ్ = స్వాగతము; తే = నీకు; నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడైన; దిష్ట్యా = దైవానుగ్రహంచే; ప్రాప్తః + అసి = వచ్చితివి; రాఘవ = శ్రీరామా; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; పురస్కృత్య = పురస్కరించుకుని; మహర్షిమ్ = మహర్షి అయిన; అపరాజితమ్ = అజేయుడైన
భావము:-
శ్రీరామా నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట ఇక్కడకు నీ రాక మా అదృష్టము.
1.51.14.
అనుష్టుప్.
అచిన్త్యకర్మా తపసా
బ్రహ్మర్షి రతులప్రభః ।
విశ్వామిత్రో మహాతేజా
వేత్స్యేనం పరమాం గతిమ్ ॥
టీక:-
అచిన్త్య = చింతింపశక్యము కాని; కర్మా = కర్మలు/పనులు; తపసా = తపస్సు చేత; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి; అతులప్రభః = సాటిలేని కాంతి కలిగినవారు విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; వేత్సి = ఎఱుగుము; ఏనమ్ = ఈతనిని; పరమామ్ = గొప్ప; గతిమ్ = గతి
భావము:-
తపస్సుచే బ్రహ్మర్షి అయి, సాటిలేని కాంతితో ప్రకాశించే ఈ విశ్వామిత్రుడు మహాతేజశ్శాలి. వీరి కార్యములు ఊహింపశక్యము కానివి. వీరిని పరమ గతిగా ఎఱుగుము.
1.51.15.
అనుష్టుప్.
నాస్తి ధన్యతరో రామ!
త్వత్తోఽ న్యో భువి కశ్చన ।
గోప్తా కుశికపుత్రస్తే
యేన తప్తం మహత్తపః ॥
టీక:-
నాస్తి = లేడు; ధన్యతరః = ధన్యాత్ముడు; రామ = ఓ శ్రీరామ; త్వత్తః = నీకంటే; అన్యః = మఱియొకడు; భువి = ఈ భూమండలములో; కశ్చన = ఒక్కడును గోప్తా = రక్షకుడు; కుశికపుత్రః = కుశిక నందనుడు విశ్వామిత్రుడు; తే = నీకు; యేన = ఎవరి చేత; తప్తమ్ = చేయబడినదో; మహత్ = గొప్ప; తపః = తపస్సు
భావము:-
శ్రీరామా, గొప్ప తప్పస్సు చేసిన ఈ కుశికనందనుడు నీకు రక్షకుడుగా ఉండుటచే నీ కంటే ధన్యాత్ముడు ఈ భూలోకంలో వేరొకరు లేరు.
1.51.16.
అనుష్టుప్.
శ్రూయతా మభిధాస్యామి
కౌశికస్య మహాత్మనః ।
యథా బలం యథా వృత్తమ్
తన్మే నిగదతః శృణు ॥
టీక:-
శ్రూయతామ్ = వినబడెను; అభిధాస్యామి = చెప్పెదను; కౌశికస్య = విశ్వామిత్రుని యొక్క; మహాత్మనః = మాహాత్ముడైన; యథా = ఏ విధముగా; బలమ్ = బలము; యథా = ఏ విధముగా; వృత్తమ్ = చరిత్రము; తత్ = దానిని; మే = నేను; నిగదతః = చెప్పుచున్న; శృణు = వినుము
భావము:-
మహాత్ముడైన విశ్వామిత్రుని చరిత్ర గురించి, నేను విన్న ప్రకారం తెలిపెదను. వినుము.
1.51.17.
అనుష్టుప్.
రాజాభూదేష ధర్మాత్మా
దీర్ఘకాల మరిందమః ।
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ
ప్రజానాం చ హితే రతః ॥
టీక:-
రాజా = రాజుగా; అభూత్ = ఉండెను; ఏషః = ఈతడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; దీర్ఘకాలమ్ = చాలా కాలము; అరిందమః = శత్ర్రువులను అణిచినవాడు; ధర్మజ్ఞః = ధర్మములు తెలిసినవాడు; కృతవిద్యః = సమస్త విద్యాపారంగతుడు; చ = మఱియు; ప్రజానామ్ = ప్రజల యొక్క; చ = మఱియు; హితే = హితముయందు; రతః = అనురక్తి కలవాడు
భావము:-
ఈ విశ్వామిత్రులవారు, ధర్మము తెలిసినవారు మఱియు ఎల్లప్పుడు ధర్మాన్ని ఆచరించు వారు, సకల విద్యా పారంగతులు. వీరు గొప్ప మహారాజుగా చాలాకాలము శత్రువులను అణచిన వారై, ఎల్లప్పుడు తన ప్రజల హితములో అనురక్తి కలిగిన వాడు.
1.51.18.
అనుష్టుప్.
ప్రజాపతి సుతస్త్వాసీత్
కుశో నామ మహీపతిః ।
కుశస్య పుత్రో బలవాన్
కుశనాభః సుధార్మికః ॥
టీక:-
ప్రజాపతి = ప్రజాపతి; సుతః = కుమారుడు; తు; ఆసీత్ = ఉండెను; కుశః = కుశుడను; నామ = పేరు కలిగిన; మహీపతిః = రాజు; కుశస్య = కుశుని యొక్క; పుత్రః = కుమారుడు; బలవాన్ = బలవంతుడైన; కుశనాభః = కుశనాభుడు; సుధార్మికః = మంచి ధార్మికుడు
భావము:-
ప్రజాపతి కుమారుడు కుశుడు. కుశుని పుత్రుడైన కుశనాభుడు బలవంతుడు మఱియు ధార్మికుడు.
1.51.19.
అనుష్టుప్.
కుశనాభ సుతస్త్వాసీత్
గాధిరిత్యేవ విశ్రుతః ।
గాధేః పుత్రో మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ॥
టీక:-
కుశనాభ = కుశ నాభుడు; సుతః = కుమారుడు; తు; ఆసీత్ = ఉండెను; గాధిః = గాధి; ఇత్యేవ = అని; విశ్రుతః = ప్రసిద్ధిపొందినవాడు; గాధేః = గాధి యొక్క; పుత్రః = కుమారుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని.
భావము:-
సుప్రసిద్ధుడగు కుశనాభునకు పుత్రుడు గాధి. ఆ గాధి సుతుడే ఈ మహాతేజశ్శాలి మహాముని అయిన విశ్వామిత్రులవారు.
గమనిక:-
*- రామాయణము ప్రకారం ప్రజాపతి కుమారుడు కుశుడు. అతనికి కుశనాభుడు, అతనికి గాధి, అతనికి విశ్వామిత్రుడు జన్మించెను. పాఠ్యంతరం పోతన తెలుగు భాగవతము ప్రకారము బుధునకు ఇళాకన్యక యందు పురూరవుడు జన్మించెను. పురూరవునకు ఊర్వశి యందు ఆరుగురు (6) కొడుకులు పుట్టిరి. వారిలో విజయునకు భీముడు పుట్టారు. అతనికి కాంచనుడు, అతనికి హోత్రకుడు, అతనికి గంగని పుక్కిట పట్టిన జహ్నుడు, అతనికి పూరుడు, అతనికి బాలకుడు, అతనికి అజకుడు, అతనికి కుశుడు, అతనికి నలుగురు పుట్టిరి. వారిలో కుశాంబునికి గాధి పుట్టెను. అతనికి అగ్నితేజుండగు విశ్వామిత్రుడుజన్మించెను.
1.51.20.
అనుష్టుప్.
విశ్వామిత్రో మహాతేజాః
పాలయామాస మేదినీమ్ ।
బహువర్ష సహస్రాణి
రాజా రాజ్య మకారయత్ ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వాముత్రుడు; మహాతేజాః = మహాతేజశ్శాలి; పాలయామాస = పరిపాలించెను; మేదినీమ్ = ఈ భూమండలము; బహు = అనేక; వర్షసహస్రాణి = వేల సంవత్సరాలు; రాజా = రాజుగా; రాజ్యమ్ = రాజ్యమును; అకారయత్ = చేసెను.
భావము:-
మహాతేజశ్శాలి అయిన విశ్వామిత్రుడు చాలా వేల సంత్సరములు ఈ భూమండలాన్ని రాజుగా పరిపాలించెను.
1.51.21.
అనుష్టుప్.
కదాచిత్తు మహాతేజా
యోజయిత్వా వరూథినీమ్ ।
అక్షౌహిణీ పరివృతః
పరిచక్రామ మేదినీమ్ ॥
టీక:-
కదాచిత్తు = ఒకానొకప్పుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; యోజయిత్వా = సమకూర్చుకొని; వరూథినీమ్ = సైన్యమును; అక్షౌహిణీ = ఒక అక్షౌహిణి; పరివృతః = తనవెంట రాగా; పరిచక్రామ = చుట్టూ తిరిగెను; మేదినీమ్ = భూమండలమును.
భావము:-
మహాతేజశ్శాలి అయిన విశ్వామిత్రుడు, ఒకానొకప్పుడు సైన్యమును సమకూర్చుకొని, ఒక అక్షౌహిణి సైన్యముతో భూమండలము చుట్టివచ్చెను.
1.51.22.
అనుష్టుప్.
నగరాణి చ రాష్ట్రాణి
సరితశ్చ తథా గిరీన్ ।
ఆశ్రమాన్ క్రమశో రామ!
విచరన్నాజగామ హ ॥
టీక:-
నగరాణి = నగరములను; చ = మఱియు; రాష్ట్రాణి = రాష్ట్రములను; సరితః = నదులను; చ = మఱియు; తథా = మఱియు; గిరీన్ = పర్వతములను; ఆశ్రమాన్ = ఆశ్రమములను; క్రమశః = క్రమముగా; రామ = ఓ శ్రీరామచంద్ర; విచరన్ = సంచరించుచు; అజగామ = చేరెను; హ =
భావము:-
శ్రీరామచంద్ర, విశ్వామిత్రుడు, నగరములను, నదులను దాటుచు క్రమముగా వశిష్ఠుని ఆశ్రమునకు విచ్చేసెను.
1.51.23.
అనుష్టుప్.
వసిష్ఠ స్యాశ్రమపదమ్
నానావృక్షసు మాకులమ్ ।
నానామృగ గణాకీర్ణమ్
సిద్ధచారణ సేవితమ్ ॥
టీక:-
వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రదేశమును; నానా = అనేకమైన; వృక్షః = వృక్షములు; ఆకీర్ణమ్ = నిండినదియును; సిద్ధచారణసేవితమ్ = సిద్ధులు , చారణులు సేవించేది అయిన.
భావము:-
ఆ ఆశ్రమము, బహువిధముల వృక్షసంపదతో, పుష్పములతో; వన్యమృగములతో, ప్రశాంతమైన లేళ్ళ సముదాయములతో, పక్షుల గుంపులతో అలరారుచుండెను;
1.51.24.
అనుష్టుప్.
దేవదానవ గంధర్వైః
కిన్నరైరుప శోభితమ్ ।
ప్రశాంత హరిణాకీర్ణమ్
ద్విజసంఘ నిషేవితమ్ ॥
టీక:-
దేవ = దేవతలు; దానవ = దానవులు; గంధర్వైః = గంధర్వులతో; కిన్నరైః = కిన్నెరలతోను; ఉపశోభితమ్ = శోభిల్లుచున్నటువంటి; ప్రశాంత = ప్రశాంతముగానున్న; హరిణః = లేళ్ళతో; ఆకీర్ణమ్ = నిండి ఉన్ని; ద్విజ = పక్షుల; సంఘ = సముదాయములతో; నిషేవితమ్ = సేవింపబడుతున్నదియు; సంఘనిషేవితమ్ = సముదాయములతో సేవింపబడుతున్నదియు.
భావము:-
ఆ ఆశ్రమమునందు దేవ దానవ గంధర్వ కిన్నెరలు సిద్ధులు చారణులు సేవించుచుండెడివారు.
1.51.25.
అనుష్టుప్.
బ్రహ్మర్షిగణ సంకీర్ణమ్
దేవర్షిగణ సేవితమ్ ।
తపశ్చరణ సంసిద్ధైః
అగ్నికల్పై ర్మహాత్మభిః ॥
టీక:-
బ్రహ్మర్షి = బ్రహ్మర్షుల; గణ = గణములతో; సఙ్కీర్ణమ్ = కూడినదియును; దేవర్షి = దేవర్షుల; గణ = గణములు; సేవితమ్ = సేవించుచుండెడి; తపః = తపస్సును; చరణ = చేయుచు; సంసిద్ధైః = సిద్ధి పొందిన వారును; అగ్నికల్పైః = అగ్నివలె; మహాత్మభిః = మహాత్ములును.
భావము:-
ఆ ఆశ్రమము, బ్రహ్మర్షుల గణములతో, దేవర్షుల సమూహములతో, తపస్సుచే సిద్ధిపొందినవారితో, అగ్నివంటి తేజస్సు కలిగిన మహాత్ములతో కూడి ఉన్నది.
1.51.26.
అనుష్టుప్.
అబ్భక్షై ర్వాయుభక్షైశ్చ
శీర్ణపర్ణాశనై స్తథా ।
ఫలమూలాశ నైర్దాన్తైః
జితరోషైర్జి తేంద్రియైః ॥
టీక:-
అప్ = నీరు; భక్షైః = భక్షించెడివారును; వాయు = వాయువును; భక్షైః = భక్షించెడివారును; చ = మఱియు; శీర్ణ = పండిరాలిన; పర్ణ = ఆకులను; అశనైః = తినేవారు; తథా = మఱియు; ఫలమూల = ఫలములను, దుంపలను; అశనైః = తినేవారు; దాన్తైః = మనోనిగ్రహము కలవారు; జిత = జయింపబడిన; రోషైః = కోపము; జితేంద్రియైః = జయింపబడిన ఇంద్రియములు కలవారును.
భావము:-
ఆ ఆశ్రమములో, కొందరు నీటినే ఆహారముగా స్వీకరించుట / జలభక్షణము చేయువారు, కొందరు వాయుభక్షణ, ఇంకొందరు రాలిన ఆకులను, కొంతమంది ఫలములు కందమూలములు ఆహారముగా గొనువారు ఉండిరి. కొందరు మనోనిగ్రహ సంపన్నులును, జితక్రోధులు, జితేంద్రియులు అక్కడ నివసించేవారు.
1.51.27.
అనుష్టుప్.
ఋషిభిర్వా లఖిల్యైశ్చ
జపహోమ పరాయణైః ।
అన్యై ర్వైఖానసైశ్చైవ
సమంతా దుపశోభితమ్ ॥
టీక:-
ఋషిభిః = ఋషులతోను; వాలఖిల్యైః = వాలఖిల్యులతోను; చ = మఱియు; జపహోమపరాయణైః = జపము, హోమములయందు ఆసక్తి కలిగిన వారితోను; అన్యైః = ఇతరులైన; వైఖానసైః = వైఖానసులతోను; చ = మఱియు; ఏవ = మాత్రమే; సమంతాత్ = అంతటా; ఉపశోభితమ్ = శోభిల్లుచుండెను.
భావము:-
ఎల్లప్పుడు జపము, హోమముల యందు ఆసక్తి కలిగిన ఋషు లతోను మఱియు వాలఖిల్యులు, వైఖానసులు అగు వానప్రస్థు లతోను ఆశ్రమము అంతటా శోభిల్లుతుండెను.
గమనిక:-
*- 1. వాలఖిల్యులు- వాలఖిల్య ధర్మములు అనులరించు వారు, తృతీయాశ్రమమైన వానప్రస్థులలో కొత్త పంట రాగానే పాత పంటను విసర్జించువారు. 2. వైఖానసులు- విఖనస ధర్మ శాస్త్రానుచరులు, తృతీయాశ్రమమైన వానప్రస్థులలో భూమిని దున్నకుండా దొరకు ఆహారము సేవించువారు.
1.51.28.
అనుష్టుప్.
వసిష్ఠ స్యాశ్రమపదమ్
బ్రహ్మలోక మివాపరమ్ ।
దదర్శ జయతాం శ్రేష్ఠో
విశ్వామిత్రో మహాబలః ॥
టీక:-
వశిష్ఠస్య = వశిష్టులవారియొక్క; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రదేశము; బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకము; ఇవ = వలె; అపరమ్ = ఇంకొక; దదర్శ = దర్శించెను; జయతామ్ = జయశీలురలో; శ్రేష్ఠః = శ్రేష్టుడైన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = మహా బలము కలిగిన.
భావము:-
ఇంకొక బ్రహ్మలోకము వలె విరాజిల్లుతున్నటువంటి ఆ వశిష్ఠ ముని ఆశ్రమమును విజేతలలో శ్రేష్ఠుడును, మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు దర్శించెను.
1.51.29.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకపంచాశ [51] = ఏభై ఒకటవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైఒకటవ [51] సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.52.1.
అనుష్టుప్.
స దృష్ట్వా పరమప్రీతో
విశ్వామిత్రో మహాబలః ।
ప్రణతో వినయాద్వీరో
వసిష్ఠం జపతాం వరమ్ ॥
టీక:-
సః = అతడు; దృష్ట్వా = చూచి; పరమ = చాలా; ప్రీతః = సంతసించినవాడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = గొప్ప బలవంతుడు; ప్రణతః = నమస్కరించెను; వినయాత్ = వినయమువలన; వీరః = వీరుడు; వశిష్ఠం = వశిష్ఠుని; జపతాం = జపముచేయు వారిలో; వరం = శ్రేష్ఠుడును.
భావము:-
మహాబలుడు; పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు తాపసులలో శ్రేష్ఠుడైన వశిష్టుని చూచి సంతసించినవాడై వినయముతో నమస్కరించెను.
1.52.2.
అనుష్టుప్.
స్వాగతం తవ చేత్యుక్తో
వసిష్ఠేన మహాత్మనా ।
ఆసనం చాస్య భగవాన్
వసిష్ఠో వ్యాదిదేశ హ ॥
టీక:-
స్వాగతం = స్వాగతము; తవ = నీకు; చ = మఱియు; ఇతి = ఇట్లు; ఉక్తః = పలుకబడెను. వసిష్ఠన = వసిష్ఠునిచేత; మహాత్మనా = మహాత్ముడైన; ఆసనంచ = ఆసనమును కూడా; అస్య = ఇతనికి; భగవాన్ = భగవంతుడు అయిన; వసిష్ఠః = వసిష్ఠుడు; వ్యాదిదేశహ = ఇచ్చెను.
భావము:-
మహాత్ముడు; పూజ్యుడు అయిన వసిష్ఠుడు విశ్వామిత్రునికి స్వాగత వచనములు పలికి, ఆసనమును ఇచ్చెను.
1.52.3.
అనుష్టుప్.
ఉపవిష్టాయ చ తదా
విశ్వామిత్రాయ ధీమతే ।
యథాన్యాయం మునివరః
ఫలమూల ముపాహరత్ ॥
టీక:-
ఉపవిష్టాయ = కూర్చుని ఉన్న; చ = మఱియు; తదా = అప్పుడు విశ్వామిత్రాయ = విశ్వామిత్రుని కొరకు; ధీమతే = బుద్ధి మంతుడైన; యథాన్యాయం = తగువిధముగా; మునివరః = మునులలో శ్రేష్ఠుడు; ఫలమూలం = ఫలములను; కందమూలములను; ఉపాహరత్ = సమర్పించెను.
భావము:-
అప్పుడు మునిశ్రేష్ఠుడైన వసిష్ఠుడు ఉచితాసనముపై కూర్చుని ఉన్న విశ్వామిత్రునకు యథోచితముగా ఫలములను, కందమూలములను సమర్పించెను.
1.52.4.
అనుష్టుప్.
ప్రతిగృహ్య చ తాం పూజామ్
వసిష్ఠా ద్రాజసత్తమః ।
తపోఽ గ్నిహోత్రశిష్యేషు
కుశలం పర్యపృచ్ఛత ॥
టీక:-
ప్రతిగృహ్య = స్వీకరించి; చ; తామ్ = అతని; పూజామ్ = పూజను; వసిష్ఠాత్ = వసిష్ఠునినుండి; రాజసత్తమః = రాజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు; తప: = తపస్సు నందు; అగ్నిహోత్ర = అగ్నిహోత్రమునందు; శిష్యేషు = శిష్యులందు కుశలం = క్షేమమును; పర్యపృచ్ఛత = అడిగెను.
భావము:-
రాజర్షిశ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు మునిశ్రేష్ఠుడు వసిష్ఠుని అతని అగ్నిహోత్రము గురించియు, శిష్యుల క్షేమము గురించియు అడిగెను.
1.52.5.
అనుష్టుప్.
విశ్వామిత్రో! మహాతేజా
వనస్పతిగణే తథా ।
సర్వత్ర కుశలం చాహ
వసిష్ఠో రాజసత్తమమ్ ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతేజా = గొప్ప తేజోవంతుడు; వనస్పతిగణే = వనస్పతుల సమూహములందు; తథా = అట్లే; సర్వత్ర = అన్ని చోట్ల; కుశలం = క్షేమమును; చ = మఱియు; ఆహ = పలికెను. వసిష్ఠః = వసిష్ఠుడు; రాజసత్తమమ్ = రాజులలో శ్రేష్ఠుని గూర్చి
భావము:-
రాజర్షి శ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు వసిష్ఠుని వృక్ష సమూహములయొక్క క్షేమమును అడిగెను. వసిష్ఠుడు ‘అన్నియు క్షేమమే’ అని బదులు చెప్పెను.
1.52.6.
అనుష్టుప్.
సుఖోపవిష్టం రాజానమ్
విశ్వామిత్రం మహాతపాః ।
పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో
వసిష్ఠో బ్రహ్మణః సుతః ॥
టీక:-
సుఖః = సుఖముగా; ఉపవిష్టమ్ = కూర్చొని ఉన్న రాజానం = రాజును; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహాతపాః = గొప్ప తపః సంపన్నుడిని; ప్రపచ్చ = అడిగెను. జపతాం = జపము చేయువారిలో శ్రేష్ఠః = శ్రేష్ఠుడైన; వసిష్ఠః = వసిష్ఠుడు; బ్రహ్మణ: = బ్రహ్మయోక్క; సుతః = కుమారుడు.
భావము:-
బ్రహ్మ యొక్క కుమారుడు, గొప్ప తపఃసంపన్నుడు, మునులలో శ్రేష్ఠుడు అయిన వసిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రునితో యిట్లు పలికెను.
1.52.7.
అనుష్టుప్.
“కచ్చిత్తే కుశలం రాజన్!
కచ్చిద్ధర్మేణ రంజయన్ ।
ప్రజాః పాలయసే వీర
రాజవృత్తేన ధార్మిక ॥
టీక:-
కచ్చిత్ = కదా !; తే = నీకు; కుశలం = క్షేమము; రాజన్ = రాజేంద్ర; కశ్చిత్ = కదా !; ధర్మేణ = ధర్మముచేత రంజయన్ = సంతోషింపజేయుచు; ప్రజాః = ప్రజలను; పాలయసే = పాలించుచున్నావు; వీర = వీరుడా! రాజవృత్తేన = రాజధర్మానుసారముగా; ధార్మిక = ధర్మబద్ధుడవు.
భావము:-
“రాజేంద్ర! నీవు క్షేమముగా ఉంటివి కదా! ధార్మికుడువైన ఓ వీరుడా! రాజధర్మమును అనుసరించి ధర్మముగా ప్రజలను సంతోషింపజేయుచు పరిపాలించుచుంటివి కదా.
గమనిక:-
*- రాజవృత్తములు- 1. దుష్టులను శిక్షించుట, 2. దానము చేయుట, 3. ప్రజా పరిపాలనము, 4. కోశమును న్యాయముగ నార్జించుట.
1.52.8.
అనుష్టుప్.
కచ్చిత్తే సమ్భృతా భృత్యాః
కచ్చిత్తిష్ఠంతి శాసనే ।
కచ్చిత్తే విజితాః సర్వే
రిపవో రిపుసూదన! ॥
టీక:-
కచ్చిత్ = కదా ! తే = నీ; సమ్భృతాః = బాగుగా పోషించబడి; భృత్యాః = సేవకులు; కచ్చిత్ = కదా !; తిష్టంతి = ఉంటిరి; శాసనే = ఆజ్ఞలో; కచ్చిత్ = కదా !; తే = నీ; విజితాః = జయింపబడినవారు; సర్వే = అందరు; రిపవః = శత్రువులు; రిపుసూదన = శత్రు సంహారకుడా!
భావము:-
నీ సేవకులను బాగుగా పోషించుచుంటివి కదా ! వారు నీ ఆజ్ఞను అతిక్రమించరు కదా ! ఓ శత్రుసంహారకా ! నీవు నీ శత్రువుల నందరినీ జయించితివి కదా !
1.52.9.
అనుష్టుప్.
కచ్చిద్బలేషు కోశేషు
మిత్రేషు చ పరంతప! ।
కుశలం తే నరవ్యాఘ్ర!
పుత్రపౌత్రే తవానఘ!” ॥
టీక:-
కచ్చిత్ = కదా !; బలేషు = సైన్యమునందు; కోశేషు = ధనాగారములందు; మిత్రేషు = స్నేహితులందు; చ = మఱియు; పరంతప = శత్రువులను బాధించువాడా; కుశలం = క్షేమము; తే = నీకు; నరవ్యాఘ్ర = నరుల యందు శ్రేష్ఠమైనవాడా; పుత్రపౌత్రే = కుమారులు; మనుమలయందు; తవ = నీయొక్క; అనఘ = పాప రహితుడా.
భావము:-
శత్రుసంహారకుడా! నరశ్రేష్ఠుడా ! నీ సైన్యము; ధనాగారము; కుమారులు; మనుమలు కుశలమేకదా!”
1.52.10.
అనుష్టుప్.
సర్వత్ర కుశలం రాజా
వసిష్ఠం ప్రత్యుదాహరత్ ।
విశ్వామిత్రో మహాతేజా
వసిష్ఠం వినయాన్వితః ॥
టీక:-
సర్వత్ర = అంతట; కుశలం = క్షేమము; రాజా = రాజు; వసిష్ఠం = వసిష్ఠుని; ప్రతి = గూర్చి; ఉదాహరత్ = పలికెను; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు. మహాతేజః = గొప్పతేజోవంతుడు; వసిష్ఠం = వసిష్ఠుని గూర్చి; వినయః = వినయముతో; ఆన్వితః = కూడి ఉన్నవాడు.
భావము:-
గొప్ప తేజోవంతుడైన విశ్వామిత్రుడు వసిష్ఠునితో ‘ అంతటా కుశలమే ‘ అని సవినయముగా
1.52.11.
అనుష్టుప్.
కృత్వోభౌ సుచిరం కాలమ్
ధర్మిష్ఠౌ తాః కథాశ్శుభాః ।
ముదా పరమయా యుక్తౌ
ప్రీయేతాం తౌ పరస్పరమ్ ॥
టీక:-
కృత్వా = చేసి; ఉభౌ = ఇరువురు; సుచిరం = చాలా; కాలమ్ = కాలము; ధర్మిష్ఠా = ధర్మమునందు ఆసక్తి కలవారు; తాః. = ఆ యా; కథాః = కథలను; శుభాః = శుభప్రదం అయిన; ముదా = సంతోషముతో; పరమయా = గొప్పదైన; యుక్తే = కూడినవారై; ప్రీయేతాం = సంతోషము కలిగించుకొనిరి; తౌ = వారు; పరస్పరం = ఒకరికి ఒకరు.
భావము:-
ధర్మపరాయణులైన వారు ఇద్దరు చాలా సంతోషముగా చాలా సమయము ఆ యా కథా విషయముల గూర్చి మాటలాడుకొని; ఒకరికి మరియొకరు ఆనందము కలిగించుకొనిరి .
1.52.12.
అనుష్టుప్.
తతో వసిష్ఠో భగవాన్
కథాంతే రఘునందన! ।
విశ్వామిత్రమిదం వాక్యమ్
ఉవాచ ప్రహసన్నివ ॥
టీక:-
తతః = తరువాత; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = పూజ్యుడు; కథాంత = కథ చివర; రఘునందన = రామ; విశ్వామిత్రం = విశ్వామిత్రునిగూర్చి; ఇదం = ఈ; వాక్యం = మాటను; ఉవాచ = పలికెను; ప్రహసన్నివ = నవ్వుచు.
భావము:-
రామ! వారి సంభాషణలు అనంతరము పూజ్యుడు వసిష్ఠుడు నవ్వుచు; విశ్వామిత్రునితో యిట్లు
1.52.13.
అనుష్టుప్.
ఆతిథ్యం కర్తుమిచ్ఛామి
బలస్యాస్య మహాబల! ।
తవ చైవాప్రమేయస్య
యథార్హం సంప్రతీచ్ఛ మే ॥
టీక:-
ఆతిథ్యం = ఆతిధ్యమును; కర్తుం = చేయుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; బలస్య = సైన్యమునకు అస్య = ఈ మహాబల = గొప్పబలము కలవాడా! తవ = నీకు చ ఏవ = కూడను; అప్రమేయస్య = సాటిలేని; యథార్హం = తగువిధముగా; సత్ప్రతీచ్చ = అంగీకరించుము; మే = నా నుండి.
భావము:-
ఓవిశ్వామిత్రా!సాటి లేని మేటి బల సంపన్నుడు వైన నీకు నీ సైన్యమునకు అతిథి మర్యాదలు యథోచితముగా చేయగోరుచున్నాను. అంగీకరించుము.
1.52.14.
అనుష్టుప్.
సత్క్రియాం హి భవానేతామ్
ప్రతీచ్ఛతు మయోద్యతామ్ ।
రాజా! త్వమతిథిశ్రేష్ఠః
పూజనీయః ప్రయత్నతః" ॥
టీక:-
సత్త్రియాం = సత్కారమును; హి; భవాన్ = నీవు; ఏతామ్ = = ఈ; ప్రతీచ్ఛతు = అంగీకరించెదవు గాక! మయా = నాచేత; ఉద్యతామ్ = ఇవ్వబడుచున్న; రాజా = మహారాజా; త్వమ్ = నీవు అతిథిశ్రేష్ఠః = అతిథులలోశ్రేష్ఠుడవు; పూజనీయః = పూజింపతగినవాడవు; ప్రయత్నతః = ప్రయత్నపూర్వకముగా.
భావము:-
నేను ఇవ్వబోవుచున్న సత్కారమును స్వీకరించుము. రాజువైన నీవు విశిష్టమైన అతిథివి. అందుచే నిన్ను పూని పూజింపవలసియున్నది.
1.52.15.
అనుష్టుప్.
ఏవముక్తో వసిష్ఠేన
విశ్వామిత్రో మహామతిః ।
“కృతమి త్యబ్రవీద్రాజా
ప్రియవాక్యేన మే త్వయా ॥
టీక:-
ఏవమ్ = ఈవిధంగా ఉక్తః = పలుకబడిన; వసిష్ఠన = వశిష్టుని చేత; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామతిః = గొప్ప బుద్ధి కలవాడు; కృతమ్ = చేయబడినది; ఇతి = అని; అబ్రవీత్ = పలికెను. రాజా = రాజు; ప్రియవాక్యేన = ప్రియ వాక్యముచేతనే; మే = నాకు; త్వయా = నీచేత.
భావము:-
వసిష్ఠుని విశిష్టమైన మాటలు విని గొప్ప మతిమంతుడైన విశ్వామిత్రుడు ”నీవు మధురమైన మాటలు పలికితివి. అవి చాలు.అదియే నాకు ఆతిథ్యము” అని పలికెను.
1.52.16.
అనుష్టుప్.
ఫలమూలేన భగవన్!
విద్యతే యత్తవాశ్రమే ।
పాద్యే నాచమనీయేన
భగవద్దర్శనేన చ ॥
టీక:-
ఫలమూలేన = ఫలములు; మూలములు మొదలగువాటిచే; భగవన్ = పూజ్యుడా; విద్యతే = ఉన్నదో; యత్ = ఏదైతే; తవ = నీ యొక్క ఆశ్రమే = ఆశ్రమములో; పాద్యేన = పాద్యముచేత; ఆచమనీయేన = ఆచమనముచేత; భగవత్ = పూజ్యులైన మీ; దర్శనేన చ = దర్శనముచేతను.
భావము:-
భగవానుడా! నీ ఆశ్రమములోని కంద ములాదులచేత, పాద్యముచేత, ఆచమనముచేత, మీ దర్శనముచేత ఆతిథ్యము అయినది.
1.52.17.
అనుష్టుప్.
సర్వథా చ మహాప్రాజ్ఞ!
పూజార్హేణ సుపూజితః! ।
గమిష్యామి నమస్తేఽ స్తు
మైత్రేణేక్షస్వ చక్షుషా" ॥
టీక:-
సర్వథా = అన్ని విధముల; చ = మఱియు; మహాప్రాజ్ఞ = శ్రేష్ఠమైన జ్ఞానము కలవాడా!; పూజార్హేణ = పూజకు యోగ్యుడైన వానిచే; సుపూజితః = బాగుగ పూజింపబడితిని; గమిష్యామి = వెళ్ళెదను; నమః = నమస్కారము; తే = నీకు; అస్తు = అగుగాక! మైత్రేణ = స్నేహముచేత; ఈక్షస్వ = చూచుచుండుము; చక్షుషా = కన్ను లతో.
భావము:-
గొప్ప జ్ఞానము కలవాడా! పూజార్హుడవైన నీచేత నేను చక్కగా పూజింపబడితిని. నీకు నమస్కారము. నేను వెళ్ళెదను. నీవు నన్ను స్నేహపూర్వకమైన దృష్టితో అనుగ్రహించుము.
1.52.18.
అనుష్టుప్.
ఏవం బ్రువంతం రాజానమ్
వసిష్ఠః పునరేవ హి ।
న్యమంత్రయత ధర్మాత్మా
పునః పునరుదారధీః ॥
టీక:-
ఏవం = ఈవిధంగా; బ్రువంతం = పలుకుచున్న; రాజానమ్ = రాజును; వసిష్ఠః = వసిష్ఠుడు; పునః పునః = మరల మరల; ఏవ హి = అట్లు; న్యమక్త్రయత = ఆహ్వానించెను. ధర్మాత్మా = ధర్మాత్ముడైన; పునః పునః = మరల మరల ఉదారధీః = ఉదారమైన బుద్ధి కలవాడు.
భావము:-
విశ్వామిత్రుడు ఆ విధముగ చెప్పినను ఉదారబుద్ధి కల వసిష్ఠుడు, ఆతిథ్యము స్వీకరించుమని మరల మరల అతనిని బలవంతపెట్టెను.
1.52.19.
అనుష్టుప్.
బాఢమిత్యేవ గాధేయో
వసిష్ఠం ప్రత్యువాచ హ ।
“యథాప్రియం భగవతః
తథాస్తు మునిసత్తమ" ॥
టీక:-
భాఢమ్ = తప్పక; ఇతి ఏవ = అట్లే అగును ! గాధేయః = విశ్వామిత్రుడు; వసిష్ఠం = వసిష్ఠుని గూర్చి; ప్రత్యువాచహ = తిరిగి పలికెను.యథా = ఎట్లు; ప్రియం = ప్రియమగునో; భగవతః = పూజ్యులకు; తథా = అట్లు; అస్తు = అగుగాక మునిసత్తమ = మునిశ్రేష్ఠా!
భావము:-
విశ్వామిత్రుడు వసిష్ఠుని గూర్చి “మునిశ్రేష్టా! నీకు ఎట్లు ప్రియమగునో అట్లు అగుగాక.” అని పలికెను.
1.52.20.
అనుష్టుప్.
ఏవముక్తో మహాతేజా
వసిష్ఠో జపతాం వరః ।
ఆజుహావ తతః ప్రీతః
కల్మాషీం ధూతకల్మషః ॥
టీక:-
ఏవమ్ = ఈవిధంగా; ఉక్తః = పలుకబడిన; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; జపతాం = జపము చేయువారిలో; వరః = శ్రేష్ఠుడు; ఆజుహావ = పిలిచెను; తతః = తరువాత; ప్రీతః = సంతుష్టుడు; కల్మాషీమ్ = చిత్ర వర్ణము గల; ధూతకల్మషః = తొలగించబడిన పాపములు కలవాడు.
భావము:-
మహా తేజోమూర్తి, మునులలో గొప్పవాడు, పాపరహితుడు అగు వసిష్ఠుడు ఆమాటలకు సంతసించినవాడై చిత్రవర్ణము గల శబలను పిలిచెను.
1.52.21.
అనుష్టుప్.
“ఏహ్యేహి శబలే క్షిప్రమ్।
శృణు చాపి వాచో మమ ।
సబలస్యాస్య రాజర్షేః।
కర్తుం వ్యవసితోఽ స్మ్యహమ్ ।
భోజనేన మహార్హేణ।
సత్కారం సంవిధత్స్వ మే ॥
టీక:-
ఏహి ఏహి = రమ్ము రమ్ము; శబలే = చిత్రవర్ణములు గల ధేనువా! క్షిప్రమ్ = త్వరగా; శృణు = వినుము; చ; అపి = కూడ; వచః = మాట; మమ = నాయొక్క; స = సహితముగ; బలః = సైన్యములతో; అస్య = ఈ; రాజర్షేః = రాజర్షికి; కర్తుం = చేయుటకు; వ్యవసితః = నిశ్చయించినవాడను; అస్మి = అయితిని; అహమ్ = నేను; భోజనేన = భోజనము చేత; మహా = బహు; అర్హేణ = యోగ్యమైన; సత్కారం = సన్మానమును; సంవిధత్స్వ = ఏర్పాటు చేయుము; మే = నాకు.
భావము:-
ఓ శబల! కామధేనువా! ఇటురమ్ము నా మాటలు వినుము. విచ్చేసిన ఈ రాజర్షికి అతని సైన్య పటాలములకు అందరికి చక్కటి భోజనము పెట్టాలని నఅనుకున్నాను. వెంటనే వీరందరికీ బహు యోగ్యమైన సత్కారం నాకోసం ఏర్పాటు చేయుము.
1.52.22.
అనుష్టుప్.
యస్య యస్య యథాకామమ్
షడ్రసే ష్వభిపూజితమ్ ।
తత్సర్వం కామధుక్ క్షిప్రం
అభివర్ష కృతే మమ ॥
టీక:-
యస్య = ఎవనికి; యస్య = ఎవనికి; యథాకామమ్ = ఎట్లు అభిలషించెదరో; షడ్రసేషు = ఆరురుచులయందు; అభిపూజితమ్ = నచ్చినవి; తత్ = ఆ; సర్వం = సకలము; కామధుక్ = ఓ కామధేనువా! క్షిప్రం = వెనువెంటనే అభివర్ష = వర్షించుము; కృతే = నిమిత్తముగ; మమ = నాకు.
భావము:-
ఓ కామధేనువా! ఎవరెవరు ఏవేమి అభిలషించెదరో; వారి వారి షడ్రుచులకు అనుగుణముగా వారు కోరిన వాటిని నా నిమిత్తము వర్షింప జేయుము.
1.52.23.
అనుష్టుప్.
రసేనాన్నేన పానేన
లేహ్యచోష్యేణ సంయుతమ్ ।
అన్నానాం నిచయం సర్వమ్
సృజస్వ శబలే త్వర" ॥
టీక:-
రసేన = రసమయమైనవానితో; అన్నేన = అన్నముతో; పానేన = పానీయము లతో; లేహ్య = నాకెడు పదార్థములతో; చోష్యేణ = పీల్చు పదార్థములతో; సంయుతమ్ = కూడిన వానిని; సృజస్వ = సృష్టించుము; శబలే = కామధేనువా! త్వర = శీఘ్రము.
భావము:-
ఓ !కామధేనువా! రసమయములైన అన్నములను; పానీయములను, పీల్చు పదార్థములనుతో పంచభక్యపరమాన్నములు తొందరగా సృష్టించుము.
1.52.24.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్విపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్విపంచాశః [52] = ఏభై రెండవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైరెండవ సర్గః [52]
బాల కాండ
1.53.1.
అనుష్టుప్.
ఏవముక్తా వసిష్ఠేన
శబలా శత్రుసూదన! ।
విదధే కామధుక్కామాన్
యస్య యస్య యథేప్సితమ్ ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; వసిష్ఠేన = వసిష్ఠునిచేత; శబలా = శబల అను పేరు గల కామధేనువు; శత్రుసూదన = శత్రువులను సంహరించువాడా; విదధే = సమకూర్చెను; కామధుక్ = కోరిన వస్తువులను పిదికి యిచ్చెడి; కామాన్ = కోరికలను; యస్య యస్య = ఎవరెవరికి; యథా = ఏ విధముగా; ఈప్సితమ్ = వాంఛితమైనవాటిని.
భావము:-
శత్రువులను వధించు ఓ రామా! వసిష్ఠుడు చెప్పిన విధముగ ఆ కామధేనువు శబల ఎవరెవరిఏ యే పదార్థములు వాంఛితమో వారికి ఆ యా పదార్థములను సమకూర్చెను.
1.53.2.
అనుష్టుప్.
ఇక్షూన్ మధూంస్తథా లాజాన్
మైరేయాంశ్చ వరాసవాన్ ।
పానాని చ మహార్హాణి
భక్ష్యాంశ్చోచ్చావచాంస్తథా ॥
టీక:-
ఇక్షూన్ = చెరుకుగడలను; మధూన్ = తేనెలను; తథా = ఇంకను; లాజాన్ = వరిపేలాలను; మైరేయాన్ = సుర; చ = మఱియు; వరాః = శ్రేష్ఠమైన; ఆసవాన్ = కల్లు; పానాని = మద్యపానీయములును; మహార్హాణి = శ్రేష్ఠమైన; భక్ష్యాం = భక్ష్యములను, తినుబండారములు; చ = మఱియు; ఉచ్చావచాన్ = నానావిధములైన; తథా = మఱియు.
భావము:-
ఆ కామధేనువు, చెరుకుగడలను, తేనెలను, వరిపేలాలను, మంచి ఫలరసములను, రకరకముల మద్యములను, పంచభక్ష్యములను మఱియు అనేక రకములైన పంచభక్ష్యపదార్థములను సృష్టించెను.
గమనిక:-
*- 1. సుర- కల్లు, సుర, మత్తపానీయము, కల్లులో రకములు (i) ఆరెపువ్వు లోనగువానితో చేసిన కల్లు మైరేయము, (ii) చెఱుకు కల్లు ఆసవము, ఆంధ్రవాచస్పతము, పక్వముకాని చెఱకురసమున జేసిన కల్లు, శబ్దరత్నాకరము. *2. పంచభక్ష్యములు - 1భక్ష్యము (కొరికి తినగలిగినవి, లడ్డు, అరిసెలు, గారెలు, జంతికలు వగైరా) 2భోజ్యము (పిడుచగా తిన గలిగినవి, అన్నము, పులిహోర వగైరా) 3లేహ్యము (నాకి చప్పరించ గలవి, వెన్న, తేనె, గట్టిపరవాన్నము వంటివి) 4చోష్యము (జుఱ్ఱుకోదగినవి, జున్ను, పాలమీగడ, పెఱుగు, చెఱుకు గడ, మామిడి పండ్లు రసాలు వంటివి) 5పానీయము (తాగగలిగినవి, పాలు, పండ్లరసములు, పానకము మొదలగునవి) ఐన ఆహార పదార్థములు.
1.53.3.
అనుష్టుప్.
ఉష్ణాఢ్య స్యౌదనస్యాత్ర
రాశయః పర్వతోపమాః ।
మృష్టాన్నాని చ సూపాశ్చ
దధికుల్యాస్తథైవ చ ॥
టీక:-
ఉష్ణాఢ్యస్య = వేడితో కూడిన; ఓదనస్య = అన్నముయొక్క; అత్ర = ఇక్కడ; రాశయః = రాశులు; పర్వత ఉపమాః = పర్వతములతో పోల్చదగిన; మృష్టాన్నాని = శ్రేష్ఠములైన అన్నములు; చ = మఱియు; సూపాః చ = పప్పులును; దధికుల్యాః = పెరుగు కాలువలును; తథా ఏవ చ = అటులనే మఱియు.
భావము:-
అక్కడ పర్వతములతో పోల్చదగిన వేడివేడి అన్నపురాశులును, శ్రేష్ఠమైన మధురాన్నములును, పప్పులును, పెరుగు కాలువలును సిద్ధమైనవి. ఇంకా
1.53.4.
అనుష్టుప్.
నానాస్వాదు రసానాం చ
షాడవానాం తథైవ చ ।
భాజనాని సుపూర్ణాని
గౌడాని చ సహస్రశః ॥
టీక:-
నానా = అనేక రకములైన; స్వాదు = రుచికరమైన; రసానాం = రసములును; షాడవానాం = షడ్రసోపేతమైన భక్ష్యములును; తథైవ = ఇవన్నియును; చ = ఇంకను; భాజనాని = వడ్డన పాత్రలును; సుపూర్ణాని = నిండి ఉన్న; గౌడాని = బెల్లపు వంటకములు; చ = మఱియు; సహస్రశః = వేలకొలది.
భావము:-
అనేక రకముల రుచికర రసములతో, షడ్రసముల రుచుల భోజనపదార్థములు. బెల్లపు వంటకములు నిండుగాగల పాత్రలు వేలకొలది. ఏర్పడినవి.
గమనిక:-
*- షడ్రసములు- ఉప్పు, కారము, పులుపు, తీపి, ఒగరు, చేదు అను ఆరు రుచులతో కలవి.
1.53.5.
అనుష్టుప్.
సర్వ మాసీత్సు సంతుష్టమ్
హృష్టపుష్ట జనాయుతమ్ ।
విశ్వామిత్రబలం రామ!
వసిష్ఠే నాభితర్పితమ్ ॥
టీక:-
సర్వమ్ = అంతయు; ఆసీత్ = అయ్యెను; సుసంతుష్టమ్ = బాగుగా సంతోషించిదినది; హృష్ట = తృప్తిగా (మానసికము); పుష్ట = పుష్టిగా (భౌతికము) భుజించి; జన = జనులు; ఆయుతమ్ = కలిగియున్నది; విశ్వామిత్ర బలం = విశ్వామిత్రుని సైన్యము; రామ = రామా; వసిష్ఠేన = వసిష్ఠునిచే; అభితర్పితమ్ = పూర్తిగా సంతృప్తిపరచబడినది.
భావము:-
రామా! ఈ విధముగా వసిష్ఠుని ఆతిథ్యమువలన, విశ్వామిత్రుని సైన్య మంతయు తుప్తిగా, పుష్టిగా భుజించి, బాగుగా సంతోషించినది ఆయెను.
1.53.6.
అనుష్టుప్.
విశ్వామిత్రోఽ పి రాజర్షిః
హృష్టః పుష్టస్తదాఽ భవత్ ।
సాంతపురవరో రాజా
సబ్రాహ్మణ పురోహితః ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడ; రాజర్షిః = ఋషి వంటి రాజు; హృష్టః = సంతోషించినవాడు; పుష్టః = తృప్తినొందినవాడు; తదా = అప్పుడు; అభవత్ = అయ్యెను; స = కలసి; అంతఃపుర వరః = శ్రేష్ఠులైన అంతఃపురవాసులు; రాజా = రాజు; స = కూడియున్న; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; పురోహితః = పురోహితులు.
భావము:-
రాజర్షి ఐన విశ్వామిత్రుడును, అతనితో వచ్చిన అంతఃపురకాంతలును, బ్రాహ్మణులును, పురోహితులును పరివారము అంతయును సంతృప్తులై ఆనందించిరి.
1.53.7.
అనుష్టుప్.
సామాత్యో మంత్రిసహితః
సభృత్యః పూజితస్తదా ।
యుక్తః పరమహర్షేణ
వసిష్ఠ మిదమబ్రవీత్ ॥
టీక:-
స = కూడి; అమాత్యః = అమాత్యులు; మంత్రి = మంత్రులు; సహితః = కలసి; సభృత్యః = భృత్యులతో కూడినవాడు; పూజితః = పూజింపబడి; తదా = అప్పుడు; యుక్తః = కూడినవాడు; పరమ హర్షేణ = చాల సంతోషముతో; వసిష్ఠమ్ = వసిష్ఠునిగురించి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
అమాత్యులు, మంత్రులు, భృత్యులు అందరితో కలసి పూజలందుకొనిన విశ్వామిత్రుడు సంతోషముగా వసిష్ఠునితో ఇట్లు పలికెను.
1.53.8.
అనుష్టుప్.
“పూజితోఽ హం త్వయా బ్రహ్మన్
పూజార్హేణ సుసత్కృతః" ।
శ్రూయతా మభిధాస్యామి
వాక్యం వాక్యవిశారద ॥
టీక:-
పూజితః = పూజింపబడితిని; అహం = నేను; త్వయా = నీచే; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా; పూజార్హేణ = పూజింపదగిన; సుసత్కృతః = మంచిగా సత్కరింపబడితిని; శ్రూయతామ్ = వినబడు గాక; అభిదాస్యామి = చెప్పెదను; వాక్యం = మాటను; వాక్య విశారద = మాటలాడుటయందు నేర్పరీ.
భావము:-
“ఓ బ్రాహ్మణోత్తమా! వసిష్ఠుడా! పూజార్హుడవైన నీవు నన్ను పూజించి సత్కరించినావు. భాషావేత్తవైన నీకు నేను ఒక మాటను చెప్పెదను. వినుము.
1.53.9.
అనుష్టుప్.
గవాం శతసహస్రేణ।
దీయతాం శబలా మమ ।
రత్నం హి భగవన్నేతత్।
రత్నహారీ చ పార్థివః ।
తస్మాన్మే శబలాం దేహి।
మమైషా ధర్మతో ద్విజ! ” ॥
టీక:-
గవామ్ = ఆవులయొక్క; శత సహస్రేణ = నూరు వేలచే, లక్షచే; దీయతాం = ఇవ్వబడుగాక; శబలా = శబల; మమ = నాకు; రత్నం = రత్నము; హి = కదా; భగవన్ = భగవత్సమానుడా; ఏతత్ = ఇది; రత్నహారీ = రత్నములను గ్రహించువాడు; చ = మఱియు; పార్థివః = రాజు; తస్మాత్ = అందు వలన; మే = నాకు; శబలాం = శబలను; దేహి = ఇమ్ము; మమ = నాది; ఏషా = ఇది; ధర్మతః = ధర్మానుసారముగా; ద్విజ = ఓ; బ్రాహ్మణుడా.
భావము:-
ఓ బ్రాహ్మణా! వసిష్ఠుడా! నేను నీకు లక్ష గోవుల నిచ్చెదను. ఈ శబలను నాకు ఇమ్ము. పూజ్యుడా ! ఇది రత్నము వంటిది. రత్నములు రాజుల సొమ్ము కదా. ధర్మబద్ధముగ ఇది నాకు చెందును. అందువలన దీనిని నాకిమ్ము.”
1.53.10.
అనుష్టుప్.
ఏవముక్తస్తు భగవాన్
వసిష్ఠో మునిసత్తమః ।
విశ్వామిత్రేణ ధర్మాత్మా
ప్రత్యువాచ మహీపతిమ్ ॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తః తు = పలుకబడిన; భగవాన్ = పూజ్యనీయుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; మునిసత్తమః = మునులలో శ్రేష్ఠుడు; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచే; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ప్రత్యువాచ = బదులు పలికెను; మహీపతిమ్ = రాజుగూర్చి.
భావము:-
విశ్వామిత్రుడు పలికిన మాటలు విని, పూజ్యనీయుడు, ధర్మాత్ముడైన వసిష్ఠ మహర్షి ఆ రాజుతో ఇట్లు బదులు పలికెను,
1.53.11.
అనుష్టుప్.
“నాహం శతసహస్రేణ
నాపి కోటిశతైర్గవామ్ ।
రాజన్! దాస్యామి శబలామ్
రాశిభీ రజతస్య వా ॥
టీక:-
న = ఇవ్వను; అహం = నేను; శతసహస్రేణ = లక్షతో; న = ఇవ్వను; అపి = ఐనా; కోటిశతైః = వంద కోట్లతో; గవామ్ = ఆవులయొక్క; రాజన్ = రాజా; దాస్యామి = దానము; శబలాం = శబలను; రాశిభీః = రాశులతో; రజతస్య = వెండి యొక్క; చ: వా = అయినను
భావము:-
“రాజా! నీవు నాకు లక్ష ఆవుల నిచ్చినను, వందకోట్ల ఆవుల నిచ్చినను, వెండిరాశుల నిచ్చినను, నేను శబలను ఇవ్వను.
1.53.12.
అనుష్టుప్.
న పరిత్యాగమర్హేయమ్
మత్సకాశా దరిందమ ।
శాశ్వతీ శబలా మహ్యమ్
కీర్తిరాత్మవతో యథా ॥
టీక:-
న = కాదు; పరిత్యాగమ్ = వదలివేయుటను గూర్చి; అర్హ = తగినది; ఇయమ్ = ఇది; మత్ = నా; సకాశాత్ = దగ్గరనుండి; అరిందమ = శత్రువులను హింసించువాడా; శాశ్వతీ = శాశ్వతమైనది; శబలా = శబల; మహ్యమ్ = నాకు; కీర్తిః = కీర్తి; ఆత్మవతః = బుద్ధిశాలికి; యథా = వలె.
భావము:-
శత్రువులను హింసించు ఓ విశ్వామిత్రా! శబలను నా నుండి వేరుచేయుటకు వీలుకాదు. బుద్ధిమంతునకు కీర్తితో ఉండెడి సంబంధమువలె, నాకు శబలతో గల సంబంధము శాశ్వతమైనది.
1.53.13.
అనుష్టుప్.
అస్యాం హవ్యం చ కవ్యం చ
ప్రాణయాత్రా తథైవ చ ।
ఆయత్తమగ్నిహోత్రం చ
బలిర్హోమస్తథైవ చ ॥
టీక:-
అస్యాం = దీని యందు; హవ్యం = యజ్ఞములో దేవతలకై ఇచ్చు హవ్యమును; చ = మఱియు; కవ్యం = పితృదేవతలకు సమర్పించు కవ్యమును; చ = మఱియు; ప్రాణయాత్రా = జీవనయాత్ర; తథా ఏవ = అటులనే; చ = మఱియు; ఆయత్తమ్ = ఆధారము; అగ్నిహోత్రం = అగ్నిహోత్రమును; చ = మఱియు; బలిః = భూత బలి; హోమం = హోమమును; చ = మఱియు; తథైవ చ = ఇంకను.
భావము:-
హవ్యము, కవ్యము, నా జీవనయానము, అగ్నిహోత్రము, భూతబలి, హోమము, వీటి అన్నిటికిని ఈ శబలయే ఆధారము.
1.53.14.
అనుష్టుప్.
స్వాహాకారవషట్కారౌ
విద్యాశ్చ వివిధాస్తథా ।
ఆయత్తమత్ర రాజర్షే
సర్వమేతన్న సంశయః ॥
టీక:-
స్వాహాకారః = స్వాహాకారము; వషట్కారౌ = వషట్కారములు రెండు; విద్యాః చ = విద్యలును; చ = మఱియు; వివిధాః = వివిధమైన; తథా = అట్లు; ఆయత్తమ్ = ఆధారము; అత్ర = దాని యందు; రాజర్షే = రాజర్షీ; సర్వమ్ = అంతయు; ఏతత్ = ఇది; నసంశయః = సందేహము లేదు.
భావము:-
ఓ రాజర్షీ! స్వాహాకార వషట్కారములకు, నానా విద్యలకు, వీటి అన్నిటికిని శబలయే ఆధారము. సందేహము లేదు.
1.53.15.
అనుష్టుప్.
సర్వస్వమే తత్సత్యేన
మమ తుష్టికరీ సదా ।
కారణైర్బహుభీ రాజన్
న దాస్యే శబలాం తవ" ॥
టీక:-
సర్వస్వమ్ = అంతయు; ఏతత్ = ఇది; సత్యేన = సత్యముగా; మమ = నా యొక్క; తుష్టికరీ = ఆనందము కలిగించునది; సదా = ఎల్లపుడు; కారణైః = కారణములవలన; బహుభీః = అనేకములైన; రాజన్ = రాజా; న దాస్యే = ఇవ్వను; శబలాం = శబలను; తవ = నీకు.
భావము:-
రాజా! ఈ ధేనువు నాకు సర్వస్వము. ఎల్లవేళలా ఇది నాకు ఆనందము కలిగించునది. అనేక ఇతర కారణములచే నేను ఈ ధేనువును నీకు ఇవ్వజాలను".
1.53.16.
అనుష్టుప్.
వసిష్ఠే నైవముక్తస్తు
విశ్వామిత్రోఽ బ్రవీత్తతః ।
సంరబ్ధతర మత్యర్థమ్
వాక్యం వాక్యవిశారదః ॥
టీక:-
వసిష్ఠేన = వసిష్ఠునిచే; ఏవమ్ = ఇట్లు; ఉక్తః తు = పలుకబడినవాడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అబ్రవీత్ = పలికెను; తతః = తరువాత; సంరబ్ధతరమ్ = మిక్కిలి తొందరపాటుతో కూడినదానిని; వాక్యం = మాటను; వాక్యవిశారదః = మాటల నేర్పరి.
భావము:-
వసిష్ఠుని మాటలు విని, మాటలాడుటలో నేర్పరైన విశ్వామిత్రుడు రాజసముతో కూడిన అతితొందరపాటుచే ఇట్లు పలికెను.
గమనిక:-
*- సంరబ్ధము- సంరబ్ధతరము- సంరబ్ధతమము.
1.53.17.
అనుష్టుప్.
“హైరణ్య కక్ష్యాగ్రైవేయాన్
సువర్ణాంకుశ భూషితాన్ ।
దదామి కుంజరాణాం తే
సహస్రాణి చతుర్దశ ॥
టీక:-
హైరణ్య = బంగారపు; కక్ష్యా = మొలత్రాడులు; గ్రైవేయాన్ = కంఠ హారములును; సువర్ణ = బంగారపు; అంకుశ = అంకుశములు; భూషితాన్ = అలంకరింపబడినవానిని; దదామి = ఇచ్చెదను; కుంజరాణాం = ఏనుగులయొక్క; తే = నీకు; సహస్రాణి = వేలను; చతుర్దశ = పదునాలుగు.
భావము:-
“బంగారపు కటిసూత్రములతోను, సువర్ణ కంఠసూత్రములతోను అలంకరింపబడిన పదునాలుగువేల ఏనుగులను, బంగారపు అంకుశములతో కలిపి ఇచ్చెదను.
1.53.18.
అనుష్టుప్.
హైరణ్యానాం రథానాం తే
శ్వేతాశ్వానాం చతుర్యుజామ్ ।
దదామి తే శతాన్యష్టౌ
కింకిణీక విభూషితాన్ ॥
టీక:-
హైరణ్యానాం = బంగారపు; రథానాం = రథములయొక్క; తే = నీకు; శ్వేత = తెల్లని; అశ్వానాం = గుఱ్ఱములయొక్క; చతుః = నాలుగింటిని; యుజామ్ = కట్టదగినవానిని; దదామి = ఇచ్చెదను; తే = నీకు; శతాని = వందల; అష్టౌ = ఎనిమిది; కింకిణీక = చిరుగంటలచే; విభూషితాన్ = అలంకరింప బడినవానిని
భావము:-
చిరుగంటలతో అలంకరింపబడిన తెల్లటి గుఱ్ఱములు నాలుగేసి కూర్చెడి ఎనిమిది వందల బంగారపు రథములు నీకిచ్చెదను.
1.53.19.
అనుష్టుప్.
హయానాం దేశజాతానామ్
కులజానాం మహౌజసామ్ ।
సహస్రమేకం దశ చ
దదామి తవ సువ్రత ॥
టీక:-
హయానాం = గుఱ్ఱములయొక్క; దేశజాతానామ్ = మంచిదేశములో జన్మించినవానిని; కులజానాం = మంచిజాతికి చెందినవానిని; మహౌజసామ్ = గొప్ప బలిష్ఠమైనవి; సహస్రమ్ = వేయి; ఏకం = ఒక; దశ = పది; చ = మఱియు; దదామి = ఇచ్చెదను; తవ = నీకు; సువ్రత = మంచి వ్రతము కలవాడా.
భావము:-
సదాచారపరుడవైన ఓ వసిష్ఠమహర్షీ! మంచి దేశములోను మంచిజాతియందును జన్మించిన బాగా బలిష్ఠములైన పదకొండువేల గుఱ్ఱములు నీకిచ్చెదను.
1.53.20.
అనుష్టుప్.
నానావర్ణ విభక్తానామ్
వయఃస్థానాం తథైవ చ ।
దదామ్యేకాం గవాం కోటిమ్
శబలా దీయతాం మమ ॥
టీక:-
నానా = అనేక; వర్ణ = రంగులచే; విభక్తానామ్ = వేరైనవాటిని; వయఃస్థానాం = మంచి వయసులో ఉన్నవాటిని; తథైవ = అటులనే; చ = మఱియు; దదామి = ఇచ్చెదను; ఏకాం = ఒక; గవాం = ఆవులయొక్క; కోటిమ్ = కోటిని; శబలా = శబల; దీయతాం = ఇవ్వబడుగాక; మమ = నాకు.
భావము:-
వివిధ రంగులలో ఉన్నవి, మంచిప్రాయములో ఉన్నవియును అగు కోటి ఆవులు ఇచ్చెదను. ఈ శబలను నాకిమ్ము.
1.53.21.
అనుష్టుప్.
యావదిచ్ఛసి రత్నం వా
హిరణ్యం వా ద్విజోత్తమ ।
తావద్దదామి తత్సర్వమ్
శబలా దీయతాం మమ" ॥
టీక:-
యావత్ = ఎంత; ఇచ్ఛసి = కోరుచుంటివో; రత్నం = రత్నములను; వా = కాని; హిరణ్యం = బంగారమును; వా = కాని; ద్విజోత్తమ = బ్రాహ్మణోత్తమా; తావత్ = అంతయు; దదామి = ఇచ్చెదను; తత్ = అది; సర్వమ్ = అంతయును; శబలా = శబల; దీయతాం = ఇవ్వబడుగాక; మమ = నాకు.
భావము:-
ఓ బ్రాహ్మణోత్తమా! రత్నరాశులు గాని, బంగారము గాని, నీవు ఎంత కోరెదవో అంత ఇచ్చెదను. శబలను నాకిమ్ము."
1.53.22.
అనుష్టుప్.
ఏవముక్తస్తు భగవాన్
విశ్వామిత్రేణ ధీమతా ।
"న దాస్యామీతి శబలామ్
ప్రాహ రాజన్ కథంచన ॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తః తు = పలుకబడిన; భగవాన్ = భగవత్సమానుడైన; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచే; ధీమతా = బుద్ధిశాలి; న దాస్యామి = ఇవ్వను; ఇతి = అని; శబలామ్ = శబలను; ప్రాహ = పలికెను; రాజన్ = రాజా; కథంచన = ఏమైనను.
భావము:-
బుద్ధిశాలియగు విశ్వామిత్రుడు పలికిన మాటలు విని, భగవత్సమానుడైన వసిష్ఠ మహర్షి "రాజా! ఏమైనను శబలను ఇవ్వను" అని పలికెను.
1.53.23.
అనుష్టుప్.
ఏతదేవ హి మే రత్నమ్
ఏతదేవ హి మే ధనమ్ ।
ఏతదేవ హి సర్వస్వమ్
ఏతదేవ హి జీవితమ్ ॥
టీక:-
ఏతత్ = ఇది; ఏవ = మాత్రమే; మే = నాకు; రత్నమ్ = రత్నము; ఏతత్ ఏవ = ఇదియే; ధనమ్ = ధనము; ఏతదేవ = ఇదియే; సర్వస్వమ్ = అంతయును; ఏతత్ ఏవ = ఇదియే; జీవితమ్ = జీవితము.
భావము:-
నాకు ఈ శబలయే రత్నము, ఇదియే ధనము, ఇదియే సర్వస్వము, ఇదియే నా జీవితము.
1.53.24.
అనుష్టుప్.
దర్శశ్చ పూర్ణమాసశ్చ
యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః ।
ఏతదేవ హి మే రాజన్
వివిధాశ్చ క్రియాస్తథా ॥
టీక:-
ధర్శః = దర్శ యాగమును; చ = మఱియు; పూర్ణమాసః = పూర్ణమాస యాగమును; చ = మఱియు; యజ్ఞః = యజ్ఞములును; చ = మఱియు; ఏవ = అలాగుననే; ఆప్తదక్షిణాః = తగిన దక్షిణలు కలవి; ఏతత్ = ఏవైతే; ఏవ = అవి; హి; మే = నాకు; రాజన్ = రాజా; వివిధాః = అనేక విధములైన; చ = కూడా; క్రియాః = క్రియలును; తథా = మఱియు.
భావము:-
రాజా! నాకు దర్శ, పూర్ణమాస యాగములును, మంచి దక్షిణల నొసంగు యజ్ఞములును, అన్ని క్రియలును నిజముగా ఈ శబలయే.
1.53.25.
అనుష్టుప్.
అదోమూలాః క్రియాః సర్వా
మమ రాజన్న సంశయః ।
బహునా కిం ప్రలాపేన
న దాస్యే కామదోహినీమ్" ॥
టీక:-
అతః = ఇది; మూలాః = మూలమైనది; క్రియాః = క్రియలు; సర్వాః = సకలము; మమ = నా యొక్క; రాజన్ = రాజా; న = లేదు సంశయః = సందేహము; బహునా = ఎక్కువ; కిం = ఏమి; ప్రలాపేన = వదరుమాటలతో; న దాస్యే = ఇవ్వను; కామ = కోరికలు; దోహినీమ్ = పిదికి ఇచ్చుదానిని
భావము:-
రాజా! నా పనులన్నింటికిని శబలయే ఆధారము. వట్టిమాటలు ఎక్కువ ఎందులకు? నా కోర్కెలన్నియు తీర్చెడి ఈ కామధేనువును నేను ఇవ్వను.
1.53.26.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రిపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రిపంచాశః [53] = ఏభైమూడు; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైమూడవ [53] సర్గ సంపూర్ణము.
బాల కాండ
1.54.1.
అనుష్టుప్.
కామధేనుం వసిష్ఠోఽ పి
యదా న త్యజతే మునిః ।
తదాస్య శబలాం రామ
విశ్వామిత్రోఽ న్వకర్షత ॥
టీక:-
కామధేనుమ్ = కోరికలను నెరవేర్చు ఆవును, కామధేనువును; వశిష్ఠః = వశిష్ఠ మహర్షి; అపి = కూడా; యదా = ఎప్పుడు; న = లేదో; త్యజ్యతే = విడిచిపెట్టుట; మునిః = ముని ఐన; తదా = అప్పుడు; అస్య = అతని; శబలామ్ = శబలను; రామ = ఓ రామా!; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అన్వకర్షత = బలవంతముగా లాగెను.
భావము:-
ఓ రామచంద్రా! వశిష్ఠ మహర్షి కామధేనువును ఇచ్చుటకు నిరాకరించగా, విశ్వామిత్రుడు ఆ శబలను బలవంతముగా లాగుకొనెను.
1.54.2.
అనుష్టుప్.
నీయమానా తు శబలా
రామ! రాజ్ఞా మహాత్మనా ।
దుఃఖితా చింతయామాస
రుదన్తీ శోకకర్శితా ॥
టీక:-
నీయమానా = బలవంతముగా తీసుకుపోబడుచున్న; తు; శబలా = శబల ధేనువు; రామ = ఓ రామా!; రాజ్ఞా = రాజు విశ్వామిత్రుని చేత; మహాత్మనా = మహాత్ముడు; దుఃఖితా = శోకముతో; చింతయామాస = విచారించెను; రుదన్తీ = విలపించుచు; శోకకర్శితా = శోకముతో కృశించినది
భావము:-
ఓ రామచంద్రా ! బలశాలియైన ప్రభువు విశ్వామిత్రునిచే దౌర్జన్యముగా తీసుకుపోబడుచున్న శబల, దుఃఖముతో విలపించుచు శోకముచే కృశించినదై ఇట్లు ఆలోచించెను.
1.54.3.
అనుష్టుప్.
పరిత్యక్తా వసిష్ఠేన
కిమహం సుమహాత్మనా ।
యాఽ హం రాజభటైర్దీనా
హ్రియేయం భృశదుఃఖితా ॥
టీక:-
పరిత్యక్తా = విడువబడితినా; వసిష్ఠేన = వసిష్ఠునిచేత; కిమ్ = ఏమి; అహం = నేను; సుమహాత్మనా = గొప్ప మహాత్మునిచే; యా = ఏ; అహం = నేను; రాజభటైః = రాజభటుల చేత; దీనా = దీనురాలను; హ్రీయేయ = దొంగిలించబడుచున్న; భృశ = మిక్కిలి; దుఃఖితా = దుఃఖితురాలను.
భావము:-
రాజభటులు నన్ను బలవంతముగా కొనిపోవుచున్నారు. దుఃఖితురాలను, దీనురాలను అగు నన్ను మహాత్ముడు వసిష్ఠ మహర్షి విడిచిపెట్టెనా, ఏమి ?
1.54.4.
అనుష్టుప్.
కిం మయాఽ పకృతం తస్య
మహర్షే ర్భావితాత్మనః ।
యన్మామనాగసం భక్తామ్
ఇష్టాం త్యజతి ధార్మికః ॥
టీక:-
కిమ్ = ఏమి; మయా = నాచే; అపకృతం = అపకారము; తస్య = అతనికి; మహర్షేః = మహర్షికి; భావిత = పవిత్రమైన; ఆత్మనః = మనస్సు కలవాడు; యత్ = అది; అనాగసమ్ = నిరపరాధురాలను; భక్తామ్ = భక్తురాలను; ఇష్టామ్ = ఇష్టురాలను; త్యజతి = విడిచిపెట్టుచుండెను; ధార్మిక = ధర్మమార్గములో నడిచెడు
భావము:-
పవిత్ర మనస్కుడైన ఆ మహర్షికి నా వలన ఎట్టి అపకారము కలిగెను? ఆతడు నన్ను ఎందులకు విడిచిపెట్టెను? నేను నిరపరాధురాలను, అతనికి ఇష్టురాలను, భక్తురాలను కదా !
1.54.5.
అనుష్టుప్.
ఇతి సా చింతయిత్వా తు
వినిశ్శ్వస్య పునఃపునః ।
నిర్ధూయ తాంస్తదా భృత్యాన్
శతశః శత్రుసూదన ।
జగామానిల వేగేన
పాదమూలం మహాత్మనః ॥
టీక:-
ఇతి = ఈ విధముగా; సా = ఆ ధేనువు; చింతయిత్వా = ఆలోచిస్తూ; తు; వినిశ్శ్వస్య = నిట్టూర్చుచు; పునః పునః = మరల, మరల; నిర్ధూయ = విదిలించుకొని; తాం = వారిని; తదా = ఆ సమయములో; భృత్యాన్ = సేవకులను; శతశః = వందల సంఖ్యలో; శత్రుసూదన = శత్రువులను సంహరించువాడా!; జగామ = వెళ్ళెను; అనిల వేగేన = వాయు వేగముతో; పాదమూలం = పాదముల సమీపము గూర్చి; మహాత్మనః = మహాత్ముని యొక్క.
భావము:-
శత్రుసంహారకుడైన ఓ రామా! ఆ ధేనువు ఆ విధముగా ఆలోచించుచు, పదే పదే నిట్టూర్చుచు, వందల సంఖ్యలో ఉన్న ఆ సేవకులను విదిలించుకొని, వాయువేగముతో వశిష్ఠుని పాదముల దరికి చేరెను.
1.54.6.
అనుష్టుప్.
శబలా సా రుదన్తీ చ
క్రోశన్తీ చేదమబ్రవీత్ ।
వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా
మేఘ దున్దుభిరావిణీ ॥
టీక:-
శబలా = శబల; సా = ఆ; రుదన్తీ = గోలుగోలున విలపించుచు; చ = మఱియు; క్రోశన్తీ = అరచుచు; చ = మఱియు; ఇదమ్ = ఈ వచనమును; అబ్రవీత్ = పలికెను; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; అగ్రతః = ఎదుట; స్థిత్వా = నిలచి; మేఘః = మేఘముల వంటి; దున్దుభిః = దుందుభుల వంటి; రావిణీ = ధ్వనితో.
భావము:-
శత్రుసంహారకుడైన ఓ రామా! ఆ ధేనువు ఆ విధముగా ఆలోచించుచు, పదే పదే నిట్టూర్చుచు, వందల సంఖ్యలో ఉన్న ఆ సేవకులను విదిలించుకొని, వాయువేగముతో వశిష్ఠుని పాదముల దరికి చేరెను.
1.54.7.
అనుష్టుప్.
“భగవన్! కిం పరిత్యక్తా
త్వయాఽ హం బ్రహ్మణః సుత ।
యస్మాద్రాజభృతా మాం హి
నయంతే త్వత్సకాశతః" ॥
టీక:-
భగవన్ = ఓ భగవానుడా; కిం = ఎందులకు; పరిత్యక్తా = విడిచివేయబడితిని?; త్వయా = నీచేత; అహం = నేను; బ్రహ్మణః = బ్రహ్మయొక్క; సుతః = కుమారుడా; యస్మాత్ = ఎందువలన; రాజః = రాజు యొక్క; భృతాః = సేవకులు; మాం = నన్ను; హి; నయంతే = కొనిపోవుచుంటిరి; త్వత్ = నీయొక్క; సకాశతః = దగ్గరనుంచి
భావము:-
“ఓ బ్రహ్మకుమారా ! వసిష్ఠా! భగవానుడా! నీవు నన్ను ఎందులకు విడిచిపెట్టితివి? ఏ కారణముచే ఈ రాజు యొక్క సేవకులు నన్ను నీ సమీపమునుండి తీసుకుపోవుచుంటిరి?”
1.54.8.
అనుష్టుప్.
ఏవముక్తస్తు బ్రహ్మర్షిః
ఇదం వచనమబ్రవీత్ ।
శోకసంతప్త హృదయాం
స్వసారమివ దుఃఖితామ్ ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః తు = పలుకబడిన; తు; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి; ఇదమ్ = ఈ; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను; శోకః = బాధతో; సంతప్త = తపించబడిన; హృదయాం = హృదయము గలదానిగురించి; స్వసారమ్ = సహోదరి గురించి; ఇవ = వలె; దుఃఖితామ్ = దుఃఖించుచున్న
భావము:-
శోకముతో తపించుచున్న హృదయము గల శబలతో బ్రహ్మర్షి వసిష్ఠుడు దుఃఖితయైన తన సహోదరికి చెప్తున్నట్లు ఇట్లు చెప్పెను.
1.54.9.
అనుష్టుప్.
“న త్వాం త్యజామి శబలే
నాపి మేఽ పకృతం త్వయా ।
ఏష త్వాం నయతే రాజా
బలాన్మత్తో మహాబలః ॥
టీక:-
న = లేదు; త్వామ్ = నిన్ను; త్యజామి = నేను విడిచిపెట్టుట; శబలే = ఓ శబలా! న = లేదు; అపి = కూడ; అపకృతం = కీడు; త్వయా = నీ చేత; ఏషః = ఈ; త్వామ్ = నిన్ను; నయతే = తీసుకొనిపోవుచున్నాడు; రాజా = రాజు; బలాత్ = బలవంతముగా; మత్తః = నానుండి; మహాబలః = అత్యంత బలవంతుడు
భావము:-
ఓ శబలా! నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీవు నాకు ఎట్టి అపకారము చేయలేదు. మిక్కిలి బలవంతుడైన ఈ రాజు నానుంచి నిన్ను బలవంతముగా కొనిపోవుచున్నాడు.
1.54.10.
అనుష్టుప్.
న హి తుల్యం బలం మహ్యం
రాజా త్వద్య విశేషతః ।
బలీ రాజా క్షత్రియశ్చ
పృథివ్యాః పతిరేవ చ ॥
టీక:-
న = కాను; హి; తుల్యమ్ = సమానుడను; బలమ్ = బలములో; మహ్యమ్ = నా యొక్క; రాజా తు = రాజు కూడను; అద్య = ఈ దినము; విశేషతః = విశేషముగ; బలీ = శక్తివంతుడు; రాజా = రాజు; క్షత్రియః = క్షత్రియుడు; చ = మఱియు; పృథివ్యాః = ఈ భూమికి; పతిః = ప్రభువు; ఏవ చ = మఱియును
భావము:-
శక్తిసామర్థ్యములలో నేను అతనికి సరికాను. అతడు బలవంతుడు, రాజై యున్నాడు. ఈ పృథివిని పరిపాలించు ప్రభువు కూడ.
1.54.11.
అనుష్టుప్.
ఇయమక్షౌహిణీ పూర్ణా
సవాజిరథసంకులా ।
హస్తిధ్వజసమాకీర్ణా
తేనాసౌ బలవత్తరః" ॥
టీక:-
ఇయమ్ = ఈ; అక్షౌహిణీ = అక్షౌహిణీ సంఖ్యలో; పూర్ణా = సంపూర్ణముగా; స = సహితముగా; వాజిః = గుఱ్ఱములతో; రథః = రథములతో; సంకులా = సమ్మర్థమై ఉన్నది; హస్తి = ఏనుగులు; ధ్వజ = ధ్వజములు; సమ = అధికముగా; ఆకీర్ణ = కిక్కిఱిసినది; తేన = ఆ కారణముచే; అసౌ = అతడు; బలవత్తరః = మిక్కిలి శక్తివంతుడు
భావము:-
ఈ రాజునకు నిండు అక్షౌహిణీ సంఖ్యలో సేన గలదు. గుఱ్ఱములు, రథములు, ఏనుగులు, ధ్వజములు పదాతిదళములతో కిక్కిరిసి సమ్మర్ధమై ఉన్నది. అందువలన ఇతడు మిక్కిలి శక్తివంతుడు.”
1.54.12.
అనుష్టుప్.
ఏవముక్తా వసిష్ఠేన
ప్రత్యువాచ వినీతవత్ ।
వచనం వచనజ్ఞా సా
బ్రహ్మర్షిమతులప్రభమ్ ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; వసిష్ఠేన = వసిష్ఠునిచే; ప్రత్యువాచ = బదులు చెప్పెను; వినీతవత్ = వినయవంతురాలు; వచనమ్ = మాటను; వచనజ్ఞా = జ్ఞానముతో నిండిన పలుకులు తెలిసిన; సా = ఆమె; బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షి గూర్చి; అతులప్రభమ్ = సాటిలేని కాంతివంతుని గూర్చి
భావము:-
సాటిలేని తేజస్సు గల బ్రహ్మర్షి వసిష్ఠుని మాటలు విని, మాటలు నేర్పుగా వాడుట తెలిసిన శబల సవినయముగా అతనికి ఇట్లు బదులు చెప్పెను.
1.54.13.
అనుష్టుప్.
“న బలం క్షత్రియస్యాహుః
బ్రాహ్మణో బలవత్తరః ।
బ్రహ్మన్! బ్రహ్మబలం దివ్యం
క్షత్రాత్తు బలవత్తరమ్ ॥
టీక:-
న = తగదు; బలమ్ = బలమును; క్షత్రియస్య = క్షత్రియుని యొక్క; ఆహుః = పలుకుట; బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; బలవత్తరః = ఎక్కువ బలవంతుడు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా !; బ్రహ్మబలమ్ = బ్రాహ్మణ బలము; దివ్యమ్ = దివ్యమైనది; క్షత్రాత్ తు = క్షత్రియుని కంటె; బలవత్తరమ్ = ఎక్కువ బలమైనది.
భావము:-
ఓ బ్రాహ్మణోత్తమా! క్షత్రియుని బలమును గొప్పదిగా చెప్పరు. బ్రాహ్మణుడే ఎక్కువ బలవంతుడు. అతని బలము దివ్యమైనది. బ్రాహ్మణబలము క్షత్రియశక్తి కంటె అధికమైనది.
1.54.14.
అనుష్టుప్.
అప్రమేయబలం తుభ్యం
న త్వయా బలవత్తరః ।
విశ్వామిత్రో మహావీర్యః
తేజస్తవ దురాసదమ్ ॥
టీక:-
అప్రమేయబలమ్ = అంతులేని శక్తి; తుభ్యమ్ = నీకు; న = కాదు; త్వయా = నీ కంటె; బలవత్తరః = ఎక్కువ బలవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహావీర్యః = గొప్ప పరాక్రమవంతుడు; తేజః = తేజస్సు; తవ = నీ యొక్క; దురాసదమ్ = పొందరానిది
భావము:-
నీవు అత్యంత శక్తిమంతుడివి. ఎంతో పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు నీ కంటె బలవంతుడు కాడు. నీ తేజస్సు ఇతరులకు పొందరానిది.
1.54.15.
అనుష్టుప్.
నియుంక్ష్వ మాం మహాతేజః!
త్వద్బ్రహ్మబల సమ్భృతామ్ ।
తస్య దర్పబలం యత్తన్
నాశయామి దురాత్మనః" ॥
టీక:-
నియుఙ్క్ష్వ = నియమించుము; మామ్ = నన్ను; మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా; త్వత్ = నీ యొక్క; బ్రహ్మబల = బ్రాహ్మణబలము; సమ్భృతామ్ = నిండియున్న; తస్య = అతని యొక్క; దర్పబలమ్ = గర్వముతో కూడిన బలము; యత్ = ఏదియో; తత్ = దానిని; నాశయామి = నాశనము చేసెదను; దురాత్మనః = చెడు బుద్ధి కలవాడు
భావము:-
మహాతేజోవంతుడా! నీ నిండైన బ్రాహ్మణశక్తితో నన్ను ఆదేశించుము. నేను ఆ దురాత్ముని గర్వము నణచి ఆతని బలమును నశింపజేసెదను.”
1.54.16.
అనుష్టుప్.
ఇత్యుక్తస్తు తయా రామ!
వసిష్ఠస్తు మహాయశాః ।
“సృజస్వేతి” తదోవాచ
”బలం పరబలారుజమ్” ॥
టీక:-
ఇతి = ఇట్లు; ఉక్తః తు = పలుకబడి; తయా = ఆమెచేత; రామ = ఓ రామా; వసిష్ఠః తు = వసిష్ఠుడు; మహాయశాః = గొప్ప కీర్తివంతుడు; సృజస్వ = సృష్టించుము; ఇతి = అని; తదా = అప్పుడు; ఉవాచ = పలికెను; బలమ్ = సైన్యమును; పరబలారుజమ్ = శత్రుసైన్యమును పీడించెడు
భావము:-
ఓ రామా ! ఆమె పలుకులు విని మహాయశస్వి వసిష్ఠ మహర్షి శబలతో ‘‘శత్రువులను పీడించెడు సైన్యమును సృష్టించుము” అని పలికెను.
1.54.17.
అనుష్టుప్.
తస్య తద్వచనం శ్రుత్వా
సురభిః సాఽ సృజత్తదా ।
తస్యా హుంభారవోత్సృష్టాః
పప్లవాః శతశో నృప ॥
టీక:-
తస్య = అతని యొక్క; తత్ వచనమ్ = ఆ మాటను; శ్రుత్వా = విని; సురభిః = ఆ కామధేనువు; సా = ఆ; అసృజత్ = సృష్టించెను; తదా = అప్పుడు; తస్యా = ఆమెయొక్క; హుంభారవ = హుంభా అను శబ్దమునుండి; ఉత్సృష్టాః = విడువబడి; పప్లవాః = పప్లవులు; శతశః = వందల సంఖ్యలో; నృప = రాజా;
భావము:-
అపుడు వసిష్ఠుని మాటలు వినిన కామధేనువు, సైన్యము సృష్టించెను. ఓ రామా! ఆ ధేనువు అంభారవములనుంచి, వందలకొలది పప్లవులు వెలువడి,
1.54.18.
అనుష్టుప్.
నాశయంతి బలం సర్వమ్
విశ్వామిత్రస్య పశ్యతః ।
బలం భగ్నం తతో దృష్ట్వా
రథేనాక్రమ్య కౌశికః ॥
టీక:-
నాశయంతి = నాశనము చేసిరి; బలమ్ = సైన్యమును; సర్వమ్ = మొత్తమును; విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క; పశ్యతః = చూచుచుండగ; బలమ్ = సైన్యము; భగ్నమ్ = నశింపబడిన; తతః = పిమ్మట; దృష్ట్వా = చూచి; రథేన = రథముతో; ఆక్రమ్య = ఆక్రమించి; కౌశికః = విశ్వామిత్రుడు
భావము:-
విశ్వామిత్రుని మొత్తపు సైన్యమును అతడు చూచుచుండ నాశనము చేసిరి. సైన్యము నశించుట చూచి విశ్వామిత్రుడు రథముతో ఆక్రమించి,
1.54.19.
అనుష్టుప్.
స రాజా పరమక్రుద్ధః
క్రోధవిస్ఫారి తేక్షణః ।
పప్లవాన్ నాశయామాస
శస్త్రై రుచ్చావచైరపి ॥
టీక:-
సః = ఆ; రాజా = ఆ రాజు; పరమక్రుద్ధః = మిక్కిలి కోపోద్రిక్తుడయిన; రోష = కోపముతో; విస్ఫారిత = విప్పారిన; ఈక్షణః = కన్నులతో; పప్లవాః = పప్లవులను; నాశయామాస = నశింపజేసెను; శస్త్రైః = శస్త్రములచే; ఉచ్చావచైః = బహుప్రకారము లైన; అపి = సహితముగ.
భావము:-
విశ్వామిత్రమహారాజు తన సైన్యము నశింపబడుట చూచి చాలా కుపితుడై, కోపముతో విప్పారిన కన్నులు కలవాడై, వివిధరకముల ఆయుధములతో పప్లవులను నాశనము చేసెను.
1.54.20.
అనుష్టుప్.
విశ్వామిత్రార్దితాన్ దృష్ట్వా
పప్లవాన్ శతశస్తదా ।
భూయ ఏవాసృజత్కోపాత్
శకాన్ యవనమిశ్రితాన్ ॥
టీక:-
విశ్వామిత్రాః = విశ్వామిత్రునిచే; అర్థితాన్ = పీడింపబడిన, నాశనం కాబడిన; దృష్ట్వా = చూచి; పప్లవాన్ = పప్లవులను; శతశః = వందల కొలది; తదా = అప్పుడు; భూయ = మరల; ఏవ; అసృజత్ = సృష్టించెను; కోపాత్ = కోపమువలన; శకాన్ = శకులను; యవన = యవనులతో; మిశ్రితాన్ = కలపి.
భావము:-
విశ్వామిత్రుని చేతిలో నాశనమయిన పప్లవులను చూచి, శబల మరల క్రోధముతో వందలకొలది పప్లవులను,శకులను యవనులతో కలసి సృష్టించెను.
1.54.21.
అనుష్టుప్.
తైరాసీత్సంవృతా భూమిః
శకైర్య వనమిశ్రితైః ।
ప్రభావద్భి ర్మహావీర్యైః
హేమ కింజల్క సన్నిభైః ॥
టీక:-
తైః = వారిచే; ఆసీత్ = అయ్యెను; సంవృతా = కప్పబడినది; భూమిః = భూమి; శకైః = శకులచే; యవనమిశ్రితైః = యవనులతో కలసిన వారిచే; ప్రభావద్భిః = కాంతిమంతులు; మహావీర్యైః = మహావీరులు; హేమకిఞ్ఙల్క సన్నిభైః = బంగారు తీగలను పోలినవారిచే;
భావము:-
బంగారు తీగలవలె మిక్కిలి కాంతిమంతులు మహావీరులైన యవనులు శకులు, భూమిని పూర్తిగా కప్పివేసిరి.
1.54.22.
అనుష్టుప్.
దీర్ఘాసి పట్టిశధరైః
హేమవర్ణామ్బ రావృతైః ।
నిర్దగ్ధం తద్బలం సర్వమ్
ప్రదీప్తైరివ పావకైః ॥
టీక:-
దీర్ఘాసి = పొడవైన కత్తులు; పట్టిశ = అడ్డకత్తులు; ధరైః = ధరించినవారిచే; హేమ = బంగారు; వర్ణః = రంగు; అమ్బరః = వస్త్రములచే; ఆవృతైః = ఆచ్ఛాదింపబడినవారిచే; నిర్దగ్ధమ్ = కాల్చబడినది; తత్ = ఆ; బలమ్ = సైన్యము; సర్వమ్ = సకలము; ప్రదీప్తైః = మండుచున్న; ఇవ = వలె; పావకైః = అగ్నులచేత;
భావము:-
శకులు, యవనులు పొడవైన కత్తులు, పట్టిసములు మొదలగు ఆయుధములు ధరించి, బంగారురంగు పట్టు వస్త్రములు ధరించినవారై, మండుచున్న అగ్నులువలె మొత్తము సైన్యమును దహింపజేసిరి.
1.54.23.
అనుష్టుప్.
తతోఽ స్త్రాణి మహాతేజా
విశ్వామిత్రో ముమోచ హ ।
తైస్తైర్యవన కాంభోజాః
పప్లవా శ్చాకులీకృతాః ॥
టీక:-
తతః = ఆ తరువాత; అస్త్రాణి = అస్త్రములను; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; ముమోచ హ = విడిచిపెట్టెను; తైః తైః = వాటిచే; యవనః = యవనులు; కాంభోజాః = కాంభోజులు; పప్లవాః = పప్లవులు; చ = కూడ; అకులీకృతాః = చెదిరినదిగా చేయబడెను.
భావము:-
త తరువాత గొప్ప తేజస్సు కలిగిన విశ్వామిత్రుడు అస్త్రములను ప్రయోగించెను. ఆ ఆయుధములచే యవనులు, కాంభోజులు, పప్లవులు కూడా చెల్లాచెదురు అయిరి.
1.54.24.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుష్పంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుష్పంచాశ [54] = ఏభై నాలుగవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైనాలుగవసర్గ [54] సంపూర్ణం
బాల కాండ
1.55.1.
అనుష్టుప్.
తతస్తానాకులాన్ దృష్ట్వా
విశ్వామి త్రాస్త్రమోహితాన్ ।
వసిష్ఠ శ్చోదయామాస
కామధుక్సృజ యోగతః ॥
టీక:-
తతః = అటు పిమ్మట; తాన్ = వారిని; ఆకులాన్ = వ్యాకులపాటుకు గురియయిన; దృష్ట్వా = చూచి; విశ్వామిత్ర = విశ్వామిత్ర; అస్త్ర = అస్త్రములచే; మోహితాన్ = మోహితులయిన; వసిష్ఠః = వసిష్ఠ మహర్షి; చోదయామాస = ప్రోత్సహించెను; కామధుక్ = ఓ కామధేనువా!; సృజ = సృజింపుము; యోగతః = యోగబలముచే
భావము:-
అటుపిమ్మట, విశ్వామిత్రుని అస్త్రములచే మోహితులై వ్యాకులతకు గురియయిన వారిని (సైనికులను) చూచి వసిష్ఠ మహర్షి "ఓ కామధేనువా! నీ యోగబలంతో ఇంకను సృష్టించుము" అని ప్రోత్సహించెను.
1.55.2.
అనుష్టుప్.
తస్యా హుంభారవాజ్జాతాః
కాంభోజా రవిసన్నిభాః ।
ఊధసస్త్వథ సంజాతాః
పప్లవాః శస్త్రపాణయః ॥
టీక:-
తస్యా = ఆమెయొక్క(ఆ కామధేనువు యొక్క); హుంభారవాత్ = హుంభారవము; జాతాః = పుట్టిరి; కాంభోజాః = కాంభోజులు; రవిసన్నిభాః = సూర్యతేజస్సు కలిగిన; ఊధసః = పొదుగునుండి; అథ = మఱియు; సంజాతాః = పుట్టిరి; పప్లవాః = పప్లవులు; శస్త్రపాణయః = ఆయుధములు ధరించినటువంటి ॥
భావము:-
వసిష్ఠమహర్షి ఆదేశానుసారం ఆ కామధేనువు హుంభారావము చేసినది. ఆ హుంభారావము నుండి సూర్యతేజస్సు కలిగిన కాంభోజులు పుట్టిరి, పొదుగు నుండి ఆయుధాలు ధరించిన పప్లవులు పుట్టిరి.
1.55.3.
అనుష్టుప్.
యోనిదేశాచ్చ యవనాః
శకృ ద్దేశాచ్ఛకాస్తథా ।
రోమకూపేషు చ మ్లేచ్ఛా
హారీతా స్సకిరాతకాః ॥
టీక:-
యోనిదేశాత్ = యోని ప్రాంతం నుండి; చ = మఱియు; యవనాః = యవనులు; శకృత్ = గోమయ; దేశాత్ = ప్రదేశము నుండి; చ = మఱియు; శకాః = శకులును; తథా = ఆ విదముగా; రోమకూపేషు = రోమ కూపములనుండి; చ = మఱియు; మ్లేచ్ఛాః = మ్లేచ్ఛులును; హారీతాః = హారీతులును; స = సహితంగా; కిరాతకాః = కిరాతకులతో.
భావము:-
యోని వద్దనుండి యవనులు, పృష్ఠము వద్దనుండి శకులు, రోమకూపముల నుండి మ్లేచ్చులు, హారితులు, కిరాతులు ఉద్భవించిరి.
1.55.4.
అనుష్టుప్.
తైస్తై ర్నిషూదితం సర్వమ్
విశ్వామిత్రస్య తత్క్షణాత్ ।
సపదాతిగజం సాశ్వమ్
సరథం రఘునందన! ॥
టీక:-
తైస్తైః = వారిచేత; నిషూదితం = నశింపచేయబడినది; సర్వమ్ = సర్వము: విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; తత్ + క్షణాత్ = అప్పటికప్పుడే: స = సహితంగా; పదాతి = కాల్బలము; గజం = గజ బలముతొ; స = సహితంగా; అశ్వమ్ = అశ్వ బలంతో; స = సహితంగా; రథం = రథబలముతో; రఘునందన = శ్రీరామచంద్రా!
భావము:-
శ్రీరామచంద్ర! కామధేనువు నుండి సృష్టింపబడిన వారిచే, విశ్వామిత్రుని రథ, గజ, తురగ, పదాతి దళాలు సర్వము ఆ క్షణమే నశించాయి
1.55.5.
అనుష్టుప్.
దృష్ట్వా నిషూదితం సైన్యమ్
వసిష్ఠేన మహాత్మనా ।
విశ్వామిత్ర సుతానాం తు
శతం నానావిధాయుధమ్ ॥
టీక:-
దృష్ట్వా = చూచి; నిషూదితం = నశించిన; సైన్యమ్ = సైన్యమును; వసిష్ఠేన = వశిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడై నటువంటి; విశ్వామిత్ర సుతానాం = విశ్వామిత్రుని కుమారుల; తు; శతం = శతము; నానావిధ = వివిధమైన; ఆయుధమ్ = ఆయుధములతో;
భావము:-
మహాత్ముడైన వసిష్ఠునిచే తమ సైన్యములన్ని నాశనమగుట చూచిన విశ్వామిత్రుని నూర్గురు కుమారులు అనేక విధముల ఆయుధములతో ….
1.55.6.
అనుష్టుప్.
అభ్యధావ త్సుసంక్రుద్ధమ్
వసిష్ఠం జపతాం వరమ్ ।
హుంకారేణైవ తాన్ సర్వాన్
దదాహ భగవానృషిః ॥
టీక:-
అభ్యధావత్ = వారివైపు వేగంగా వెళ్ళిరి; సుసంక్రుద్ధమ్ = చాలా కోపముతో; వసిష్ఠం = వసిష్టుని గూర్చి; జపతాం = తాపసులలో; వరమ్ = శ్రేష్ఠుడైన; హుఙ్కారేణః = హుంకారము; ఏవ = మాత్రముచేతన్; తాన్ = ఆ; సర్వాన్ = అందరిని; దదాహ = కాల్చివేసెను; భగవాన్ = భగవత్స్వరూపుడైన; ఋషిః = ఋషి.
భావము:-
మునులలో శ్రేష్ఠుడు, భగవత్స్వరుపుడైన ఆ వసిష్ఠ మహర్షి మీదకు చాలా కోపముతో దాడి చేసిన ఆ విశ్వామిత్రుని పుత్రులు వందమందిని వసిష్ఠుడు ఒక్క హుంకారముతో కాల్చివేసెను.
1.55.7.
అనుష్టుప్.
తే సాశ్వరథపాదాతా
వసిష్ఠేన మహాత్మనా ।
భస్మీకృతా ముహూర్తేన
విశ్వామిత్ర సుతాస్తదా ॥
టీక:-
తే = ఆ; స = సర్వసహితంగ; అశ్వ = ఆశ్విక దళములతో; రథః = రథము బలములతో; పాదాతాః = కాల్బముతో; వసిష్ఠేన = వసిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడైన; భస్మీకృతాః = భస్మము చేయబడినారు; ముహూర్తేన = ముహూర్త కాలములో; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; సుతాః = కుమారులు; తదా = అప్పుడు.
భావము:-
మహాత్ముడైన వసిష్ఠముని ఆ విశ్వామిత్రుని కుమారులందఱిని అశ్వ, రథ పదాతి దళములతో సహా క్షణములో భస్మము చేసెను.
1.55.8.
అనుష్టుప్.
దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్
బలం చ సుమహాయశాః ।
సవ్రీడశ్చింతయాఽఽ విష్టో
విశ్వామిత్రోఽ భవత్తదా ॥
టీక:-
దృష్ట్వా = చూచి; వినాశితాన్ = నశించిన; పుత్రాన్ = కుమారులను; బలం చ = బలగమును; = కూడ; సు = మంచి: మహా = గొప్ప: యశాః = యశస్సు కలిగిన: స = తో; వ్రీడః = సిగ్గు; చింతయా = చింతకు; ఆవిష్టః = వశమయినవాడై; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభవత్ = అయ్యెను; తదా = అప్పుడు.
భావము:-
గొప్ప యశస్సు కలిగిన విశ్వామిత్రుడు, తన వందమంది కుమారులు, సమస్త బలగము నశించుట చూసి సిగ్గుతో మిక్కిలి దిగులుచెందెను.
1.55.9.
అనుష్టుప్.
సముద్ర ఇవ నిర్వేగో
భగ్నదంష్ట్ర ఇవోరగః ।
ఉపరక్త ఇవాదిత్యః
సద్యో నిష్ప్రభతాం గతః ॥
టీక:-
సముద్ర = సముద్రము; ఇవ = వలెను; నిః+వేగః = వేగము లేని, కల్లోలరహితమైన; భగ్న = భగ్నమయిన; దంష్ట్రః = కోరలు; ఇవ = వలెను; ఉరగః = సర్పము; ఉపరక్త = రాహుగ్రస్తము; ఇవ = వలెను; ఆదిత్యః = సూర్యుని; సద్యః = వెంటనే; నిష్ప్రభతాం = తేజోవిహీనుడు; గతః = అయ్యెను ॥
భావము:-
విశ్వామిత్రుడు కల్లోలమే లేని సముద్రము వలెను, కోరలు పీకిన సర్పము వలెను, రాహువు మింగిన సూర్యుని వలెను తేజోవిహీనుడయ్యెను.
1.55.10.
అనుష్టుప్.
హతపుత్రబలో దీనో
లూనపక్ష ఇవ ద్విజః ।
హతదర్పో హతోత్సాహో
నిర్వేదం సమపద్యత ॥
టీక:-
హత = చంపబడిన; పుత్ర = కుమారులును; బలః = బలగమును కలవాడై; దీనః = దీనుడై; లూన = కోయబడిన; పక్షః = ఱెక్కలు; ఇవ = వలె; ద్విజః = పక్షి; హత = నశించిన; దర్పః = దర్పము కలవాడై; హత = నశించిన; ఉత్సాహః = ఉత్సాహము కలవాడై; నిర్వేదం = దుఃఖము; సమపద్యత = పొందెను
భావము:-
విశ్వామిత్రుడు పుత్రులు, సైన్యబలగము చంపబడుటచే ఆతడు ఱెక్కలు తెగిన పక్షివలె, దీనుడై, దర్పము నశించిన వాడై, ఉత్సాహము నీరుగారినవాడై, దుఃఖపడెను.
1.55.11.
అనుష్టుప్.
స పుత్రమేకం రాజ్యాయ
పాలయేతి నియుజ్య చ ।
పృథివీం క్షత్రధర్మ్మేణ
వనమేవాన్వ పద్యత ॥
టీక:-
సః = అతడు; పుత్రం = కుమారుడిని; ఏకం = ఒకనిని; రాజ్యాయ = రాజ్యము కొఱకు; పాలయేతి = పాలించమని; నియుజ్య = నియమించి; చ = మఱియు; పృథివీం = లోకంలో; క్షత్రధర్మ్మేణ = క్షాత్ర ధర్మమును అనుసరించి; వనమ్ ఏవ = అడవికే; అన్వపద్యత = వెళ్ళెను
భావము:-
ఆ విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుటకు ఒక కుమారుని రాజుగ నియమించెను. లోకం లోని క్షాత్ర ధర్మానుసారం అరణ్యమున కేగెను.
1.55.12.
అనుష్టుప్.
స గత్వా హిమవ త్పార్శ్వమ్
కిన్నరోరగ సేవితమ్ ।
మహాదేవ ప్రసాదార్థమ్
తపస్తేపే మహాతపాః ॥
టీక:-
సః = అతడు; గత్వా = చేరి; హిమవత్ = హిమవత్పర్వత; పార్శ్వమ్ = సమీపమునకు; కిన్నర = కిన్నెరలు; ఉరగ = సర్పములు; సేవితమ్ = సేవించునట్టి; మహాదేవ = పరమ శివుని; ప్రసాద = అనుగ్రహము; అర్థమ్ = కొఱకు; తపః = తపస్సు; తేపే = తపించెను; మహాతపాః = గొప్ప తపస్సుగల ॥
భావము:-
మహాతపస్వి ఆ విశ్వామిత్రుడు కిన్నెరులు, నాగులు నివసించు హిమవత్పర్వత ప్రాంతమునకు చేరుకుని, అచట మహాశివుని అనుగ్రహము కొఱకు తపస్సు ఆచరించెను.
1.55.13.
అనుష్టుప్.
కేనచిత్త్వథ కాలేన
దేవేశో వృషభధ్వజః ।
దర్శయామాస వరదో
విశ్వామిత్రం మహాబలమ్ ॥
టీక:-
కేనచిత్ = కొంత; అథ = పిమ్మట; కాలేన = కాలమునకు; దేవేశః = దేవతలకు ఈశుడైన; వృషభధ్వజః = వృషభము ధ్వజముగా కలిగినవాడు {శివుడు}; దర్శయామాస = దర్శనమును ప్రసాదించెను; వరదః = వరములను ఇచ్చువాడు; విశ్వామిత్రం = విశ్వామిత్రునకు; మహాబలమ్ = గొప్ప బలశాలి అయిన
భావము:-
కొంతకాలమునకు దేవాదిదేవుడు, వృషభ ధ్వజుడు అయిన పరమేశ్వరుడు మహాబలశాలియగు విశ్వామిత్రునకు తన దర్శనమును అనుగ్రహించెను.
1.55.14.
అనుష్టుప్.
“కిమర్థం తప్యసే రాజన్
బ్రూహి యత్తే వివక్షితమ్ ।
వరదోఽ స్మి వరో యస్తే
కాంక్షితః సోఽ భిధీయతామ్" ॥
టీక:-
కిమర్థం = ఎందులకు; తప్యసే = తపస్సుచేయుచున్నావు; రాజన్ = ఓ రాజా; బ్రూహి = చెప్పుము; యత్ = ఏది; తే = నీవు; వివక్షితమ్ = చెప్పదలచితివో; వరదః = వరములను ఇచ్చువాడను; అస్మి = అయ్యి; వరః = వరం; యః = ఏ; తే = నీచేత; కాంక్షితః = కోరబడినదో; సః = అది; అభిధీయతామ్ = చెప్పబడుగాక.
భావము:-
“ఓ రాజా! ఎందులకు తపస్సును ఆచరించుచున్నావు? నీ అభిమతమును ప్రకటించుచు, నీవు కోరదలచినది ఏదియో నాకు తెలుపుము, వరమును అనుగ్రహించెదను.”
1.55.15.
అనుష్టుప్.
ఏవముక్తస్తు దేవేన
విశ్వామిత్రో మహాతపాః ।
ప్రణిపత్య మహాదేవమ్
ఇదం వచనమబ్రవీత్ ॥
టీక:-
ఏవం = ఈ విధముగా; ఉక్తః తు = పలుకబడగా; దేవేన = మహాదేవునిచే; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతపాః = గొప్ప తపస్సు చేసిన; ప్రణిపత్య = ప్రణమిల్లి; మహాదేవమ్ = మహాదేవునితో; ఇదం = ఇట్లు; వచనం = వచనములను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
పరమశివుడు పలికిన వచనములు విని మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు పలికెను.
1.55.16.
అనుష్టుప్.
“యది తుష్టో మహాదేవ
ధనుర్వేదో మమానఘ ।
సాంగోపాంగోపనిషదః
సరహస్యః ప్రదీయతామ్ ॥
టీక:-
యది = అయితే; తుష్టః = సంతసిచినట్లు; మహాదేవ = ఓ పరమేశ్వరా!; ధనుః+వేదః = ధనుర్వేదము, విలువిద్య; మమ = నాకు; అనఘ = పాపరహితుడవైన; సాంగోపాంగ = సంపూర్ణంగా; ఉపనిషదః = ఉపనిషత్తులతో; స = కూడిన; రహస్యః = రహస్యములతో; ప్రదీయతామ్ = ప్రసాదించుము;
భావము:-
ఓ మహాదేవా ! పరమేశ్వర! నీవు నా తపస్సునకు మెచ్చితివో, నాకు సాంగోపాంగముగ, ఉపనిషత్, రహస్యములతో కూడిన విలువిద్యను ప్రసాదించుము.
గమనిక:-
*- 1. సాంగోపాంగముగ- స+అంగ+ఉపాంగ, అంగ ఉపాంగ సహితముగ, సంపూర్ణంగా. 2. వేదమునకు అంగములు, ఉపాంగములు, ఉపనిషదులు అనే భాగములు ఉన్నవి.
1.55.17.
అనుష్టుప్.
యాని దేవేషు చాస్త్రాణి
దానవేషు మహర్షిషు ।
గంధర్వ యక్ష రక్షస్సు
ప్రతిభాంతు మమానఘ ॥
టీక:-
యాని = ఏ; దేవేషు = దేవతల యందు; చ; అస్త్రాణి = అస్త్రములు; దానవేషు = దానవుల యందు; మహర్షిషు = మహర్షుల యందు: గంధర్వ = గంధర్వుల యందు; యక్ష = యక్షుల యందు; రక్షస్సు = రాక్షసుల యందు; ప్రతిభాంతు = స్ఫురించు గాక; మమ = నాకు; అనఘ = పాపరహితుడా! ॥
భావము:-
ఓ పాపరహితుడవైన పరమేశ్వర! సకల దేవతల, దానవుల, మహర్షుల, గంధర్వుల,యక్షుల, రాక్షసులకు తెలిసిన అస్త్ర విద్యను నాకు ప్రసాదించుము.
1.55.18.
అనుష్టుప్.
తవ ప్రసా దాద్భవతు
దేవదేవ! మమేప్సితమ్" ।
ఏవమస్త్వితి దేవేశో
వాక్యముక్త్వా గతస్తదా ॥
టీక:-
తవ = నీ యొక్క; ప్రసాదాత్ = ప్రసాదముచే; భవతు = అగుగాక; దేవదేవ = దేవతలకు దేవుడవు అయిన ఈశ్వరా!; మమ = నా యొక్క; ఈప్సితమ్ = కోరిక; ఏవం = ఆ విధముగా; అస్తు+ఇతి = అగుగాక; దేవేశః = దేవతలకు ఈశ్వరుడవైన; వాక్యం = వాక్యమును; ఉక్త్వా = పలికి; గతః = వెళ్ళేను; తదా = అప్పుడు.
భావము:-
"పరమేశ్వరా! నీ ప్రసాదముచే నా అభీష్టము నెరవేరుగాక". అని పలికిన విని, మహాశివుడు "ఆ విధముగానే అగుగాక" అని దీవించి అంతర్ధానమయ్యెను.
1.55.19.
అనుష్టుప్.
ప్రాప్య చాస్త్రాణి రాజర్షిః
విశ్వామిత్రో మహాబలః ।
దర్పేణ మహతాయుక్తో
దర్పపూర్ణోఽ భవత్తదా ॥
టీక:-
ప్రాప్య = పొంది; చ = మఱియు; అస్త్రాణి = అస్త్రములను; రాజర్షిః = రాజర్షి అయిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = మహా బలశాలి; దర్పేణ = దర్పముతో; మహతా = అధికముగా; యుక్తః = కూడినవాడగు; దర్ప = దర్పము; పూర్ణః = పూర్తిగ కలవాడు; అభవత్ = అయ్యెను; తదా = అప్పుడు ॥
భావము:-
రాజర్షి, మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు సహజముగానే దర్పము కలవాడు, ఇప్పుడు పరమేశ్వరానుగ్రహముతో లభించిన అస్త్రములచే పూర్తిగా దర్పముతో నిండిపోయెను.
1.55.20.
అనుష్టుప్.
వివర్ధమానో వీర్యేణ
సముద్ర ఇవ పర్వణి ।
హతమేవ తదా మేనే
వసిష్ఠ మృషిసత్తమమ్ ॥
టీక:-
వివర్ధమానః = వృద్ధి పొందుచు; వీర్యేణ = పరాక్రమముచే; సముద్ర = సముద్రము; ఇవ = వలె; పర్వణి = పర్వకాలము నందు; హతం = చంపబడినట్లుగా; ఏవ = ఆ విధముగ; తదా = అప్పుడు; మేనే = తలపోసెను; వసిష్ఠం = వసిష్ఠ మహర్షి; ఋషి = ఋషులలో; సత్తమమ్ = శ్రేష్ఠుడు.
భావము:-
పౌర్ణమి అమావాస్యలకు సముద్రము పొంగినట్లు, పరాక్రమముచే వృద్ధిచెందుచు, విశ్వామిత్రుడు " ఋషులలో శ్రేష్ఠుడైన వసిష్ఠమహర్షి ఇక హతుడైనట్లే" అని తలపోసెను.
గమనిక:-
*- అమావాస్య, పౌర్ణమి దినములు పర్వదినములు.
1.55.21.
అనుష్టుప్.
తతో గత్వాఽఽ శ్రమపదమ్
ముమోచాస్త్రాణి పార్థివః ।
యైస్తత్తపోవనం సర్వమ్
నిర్దగ్ధం చాస్త్రతేజసా ॥
టీక:-
తతః = అటు పిమ్మట; గత్వా = వెళ్ళి; ఆశ్రమపదమ్ = వసిష్ఠాశ్రమమునకు; ముమోచ = వదిలెను; అస్త్రాణి = అస్త్రములను; పార్థివః = రాజు; యైః = వాటి; తత్ = ఆ; తపోవనం = ఆశ్రమము వనము; సర్వం = మొత్తం; నిర్దగ్ధమ్ = కాల్టివేయబడెను; చ; అస్త్రః = అస్త్రముల; తేజసా = తేజస్సుచేత.
భావము:-
విశ్వామిత్రుడు వెంటనే బయలుదేరి వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. తన అస్త్రములు అక్కడ ప్రయోగించుటచే , ఆ తపోవననం మొత్తం కాలిపోయెను.
1.55.22.
అనుష్టుప్.
ఉదీర్యమాణమస్త్రం తత్
విశ్వామిత్రస్య ధీమతః ।
దృష్ట్వా విప్రద్రుతా భీతా
మునయః శతశో దిశః ॥
టీక:-
ఉదీర్యమాణం = విజృభించుచున్న; అస్త్రం = అస్త్రమును; తత్ = ఆ; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; ధీమతః = బుద్ధిశాలు డైన; దృష్ట్వా = చూచి; విప్రద్రుతాః = పరుగుతీసిరి; భీతా = భయముచే; మునయః = మునులు; శతశః = వందలాది; దిశః = అన్ని దిక్కులకు.
భావము:-
బుద్ధిశాలియైన విశ్వామిత్రుని విజృభించుచున్న అస్త్రములను చూచి వందలాది మునులు అన్ని దిక్కులకు భయముతో పరుగుతీసిరి.
1.55.23.
అనుష్టుప్.
వసిష్ఠస్య చ యే శిష్యాః
తథైవ మృగపక్షిణః ।
విద్రవంతి భయాద్భీతా
నానాదిగ్భ్యః సహస్రశః ॥
టీక:-
వసిష్ఠస్య = వసిష్ఠ ముని యొక్క; చ = మఱియు; యే = ఏ; శిష్యాః = శిష్యులును; తథైవ = ఇంకా; మృగపక్షిణః = మృగములును; పక్షులును; విద్రవంతి = పారిపోయిరి; భయాత్ = భయము వలన; భీతాః = భీతిచెంది; నానాదిగ్భ్యః = అన్ని దిక్కులకును; సహస్రశః = వేలాది.
భావము:-
వసిష్ఠుని శిష్యులు, ఇంకా వేలాది మృగములు, పక్షులు భయముతో అన్ని దిక్కులకు పారిపోయెను
1.55.24.
అనుష్టుప్.
వసిష్ఠ స్యాశ్రమపదమ్
శూన్యమాసీ న్మహాత్మనః ।
ముహూర్తమివ నిఃశబ్దమ్
ఆసీదిరిణ సన్నిభమ్ ॥
టీక:-
వసిష్ఠస్య = వసిష్టుని యొక్క; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రాంతము; శూన్యం = శూన్యముగా; ఆసీత్ = ఆయెను; మహాత్మనః = మహాత్ముడైన; ముహూర్తం = ముహూర్త కాలము; ఇవ = అందే; నిఃశబ్దమ్ = నిశ్శబ్దము; ఆసీత్ = ఆయెను; ఇరిణ = ఎడారిప్రాంతము; సన్నిభమ్ = వలె.
భావము:-
మహాత్ముడైన వసిష్ఠుని ఆశ్రమప్రాంతము అంతయు మూహూర్తకాలములో ఎడారి వలె సర్వము ధ్వంసమయి శున్యమయ్యెను. అక్కడ నిశ్శబ్దము ఆవరించెను.
1.55.25.
అనుష్టుప్.
వదతో వై వసిష్ఠస్య
“మాభైరితి ముహుర్ముహుః ।
నాశయామ్యద్య గాధేయమ్
నీహారమివ భాస్కరః" ॥
టీక:-
వదతః = పలుకుచున్నను; వై =; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మా = వద్దు; భైః = భయము; ఇతి = అని; ముహుః+ముహుః = మాటికి మాటికి; నాశయామి = నశింపచేసెదను; అద్య = ఇప్పుడే; గాధేయమ్ = విశ్వామిత్రుని; నీహారం = మంచు; ఇవ = వలె; భాస్కరః = సూర్యుడు;
భావము:-
ఆ సమయంలో "భయపడకండి, భయపడకండి, సూర్యుడు మంచును నశింపచేయునట్లు ఈ గాధినందనుడిని ఇప్పుడే అంతమొందించెదను" అని వసిష్ఠ మహర్షి మాటిమాటికి పలుకుచున్నను వారందఱు పాఱిపోవుచుండిరి.
గమనిక:-
*- గాధేయుడు- గాధి పుత్రుడు, విశ్వామిత్తుడు.
1.55.26.
అనుష్టుప్.
ఏవముక్త్వా మహాతేజా
వసిష్ఠో జపతాం వరః ।
విశ్వామిత్రం తదా వాక్యమ్
సరోషమిద మబ్రవీత్ ॥
టీక:-
ఏవం = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; వసిష్ఠః = వసిష్ఠమహర్షి; జపతాం = మునులలో {జపించువారిలో}; వరః = శ్రేష్ఠుడు; విశ్వామిత్రం = విశ్వామిత్రునితో; తదా = అప్పుడు; వాక్యమ్ = వాక్యమును; స = తో; రోషం = రోషము; ఇదం = ఈ; అబ్రవీత్ = పలికెను.
భావము:-
జపతపస్సంపన్నుడు మహాతేజశ్శాలి అయిన వసిష్ఠ మహర్షి (ఆశ్రమవాసులతో) ఈ విధముగా పలికిన పిమ్మట, మిక్కిలి క్రోధముతో విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.
1.55.27.
అనుష్టుప్.
“ఆశ్రమం చిరసంవృద్ధమ్
యద్వినాశిత వానసి ।
దురాచారోఽ సి తన్మూఢ
తస్మాత్త్వం న భవిష్యసి" ॥
టీక:-
ఆశ్రమం = ఆశ్రమము; చిర = ఎంతోకాలముగా; సంవృద్ధమ్ = వృద్ధి పొందినటువంటి; యత్ = ఎందుకు; వినాశితవాన్ = నాశనము చేసినవాడవు; అసి = అయితివో; దురాచారః = దురాచారుడవు; అసి = అయితివో; తత్ = ఆ కారణముచే; మూఢ = మూర్ఖుడా; తస్మాత్ = అందువలన; త్వం = నీవు; న = లేదు; భవిష్యసి = జీవించుట.
భావము:-
“ఓ ముర్ఖుడా! దురాచారుడవై ఎంతోకాలము నుండి పెంచిన ఈ ఆశ్రమమును నాశనము చేసినందువలన ఇంక నీవు జీవించవు.”
1.55.28.
అనుష్టుప్.
ఇత్యుక్త్వా పరమక్రుద్ధో
దండముద్యమ్య సత్వరః ।
విధూమమివ కాలాగ్నిమ్
యమదండ మివాపరమ్ ॥
టీక:-
ఇతి = అని; ఉక్త్వా = పలికి; పరమ = మిక్కిలి; క్రుద్ధః = కోపించినవాడై; దణ్డం = తన దండమును; ఉద్యమ్య = పైకెత్తి; సత్వరః = తొందర కలిగినవాడై; వి = లేని; ధూమం = ధూమము; ఇవ = వలె; కాల+అగ్నిమ్ = కాలాగ్నివంటి; యమదణ్డం = యమదండము; ఇవ = వలె; అపరమ్ = ఇంకొక.
భావము:-
అని పలికి, మిక్కిలి క్రోధముతో పొగలేని కాలాగ్ని వలె, ఇంకొక యమదండమా అని తలపించు తన దండమును చేతితో పైకెత్తి నిలిచెను.
1.55.29.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచపంచాశః = ఏభైయైదవ [55]; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఐదవ సర్గ [55] సంపూర్ణము
బాల కాండ
1.56.1.
అనుష్టుప్.
ఏవముక్తో వసిష్ఠేన
విశ్వామిత్రో మహాబలః ।
ఆగ్నేయమస్త్రముత్క్షిప్య
“తిష్ఠ తిష్ఠేతి” చాబ్రవీత్ ॥
టీక:-
ఏవం = ఈ విధముగా; ఉక్తః = పలుక బడిన వాడైన; వసిష్టేన = వసిష్టుని చేత; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = గొప్ప బలము గలవాడు; ఆగ్నేయమ్ అస్త్రమ్ = ఆగ్నేయాస్త్రమును; ఉత్+క్షిప్య = వేసి; తిష్ట తిష్ట ఇతి = నిలువుము; నిలువుము అని; చ = కూడా; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ఈ విధముగా పలికిన వశిష్ఠునితో మహాబలుడైన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి ‘నిలువుము, నిలువుము ‘ అని హెచ్చరించెను.
1.56.2.
అనుష్టుప్.
బ్రహ్మదణ్డం సముత్క్షిప్య
కాలదండ మివాపరమ్ ।
వసిష్ఠో భగవాన్ క్రోధాత్
ఇదం వచనమబ్రవీత్ ॥
టీక:-
బ్రహ్మదండమ్ = బ్రహ్మదండమును; సముత్క్షిప్య = పైకెత్తి; కాలదండమ్ = యమదండము; ఇవ = వలె; అపరమ్ = రెండవ; వశిష్ఠః = వశిష్ఠుడు; భగవాన్ = పూజ్యుడైన; క్రోధాత్ = క్రోధముతో; ఇదం = ఈ; వచనమ్ = వచనమును; అబ్రవీత్ = పలికెను.
భావము:-
రెండవ యమదండమా అన్నట్లు ఉన్న తన బ్రహ్మదండమును పైకెత్తి, పూజ్యుడైన వశిష్ఠుడు కోపముగా ఇట్లు పలికెను.
1.56.3.
అనుష్టుప్.
“క్షత్రబన్ధో స్థితోఽ స్మ్యేష
యద్బలం తద్విదర్శయ ।
నాశయామ్యద్య తే దర్పమ్
శస్త్రస్య తవ గాధిజ ॥
టీక:-
క్షత్రబంధః = ఓ క్షత్రియాధమా; స్థితః అస్మి = నిలచి యున్నాను; ఏషః = ఈ నేను; యత్ = ఏ; బలం = బలము ఉన్నదో; తత్ = దానిని; విదర్శయ = చూపుము; నాశయామి = నశింపచేయుదును; అద్య = ఇప్పుడు; తే = నీ యెక్క; దర్పమ్ = దర్పమును; శస్త్రస్య = శస్త్రము యెక్క; తవ = నీ యెక్క; గాధిజ = గాధి కుమారుడా, విశ్వామిత్ర!
భావము:-
”ఓ క్షత్రియాధమా! గాధి పుత్రా! ఇదిగో నేను ఇచ్చటనే నిలిచి యుంటిని. నీకు ఏపాటి బలముందో ప్రదర్శించుకో. ఇప్పుడే నీకు నీ శస్త్రములకు గల దర్పము అంతా, నశింపచేసెదును.
1.56.4.
అనుష్టుప్.
క్వ చ తే క్షత్రియబలమ్
క్వ చ బ్రహ్మబలం మహత్ ।
పశ్య బ్రహ్మబలం దివ్యమ్
మమ క్షత్రియపాంసన" ॥
టీక:-
క్వ = ఎక్కడ; చ; తే = నీ యెక్క; క్షత్రియబలమ్ = క్షత్రియ బలము; క్వ = ఎక్కడ; చబ్రహ్మబలమ్ = బ్రహ్మ బలము; మహత్ = గొప్పదైన; పశ్య = చూడుము; బ్రహ్మ బలమ్ = బ్రహ్మబలమును; దివ్యమ్ = దివ్యమైన; మమ = నా యొక్క; క్షత్రియపాంసన = ఓ క్షత్రియకులము చెఱచువాడ!
భావము:-
క్షత్రియకుల నాశక! గొప్పదైన బ్రహ్మ బలము ముందు నీ క్షత్రియ బలము ఎంత. నా దివ్యమైన బ్రహ్మబలమును చూడుము.”
1.56.5.
అనుష్టుప్.
తస్యాస్త్రం గాధిపుత్రస్య
ఘోరమాగ్నేయ ముద్యతమ్ ।
బ్రహ్మదండేన తచ్ఛాంతం
అగ్నేర్వేగ ఇవాంభసా ॥
టీక:-
తస్య = ఆ; అస్త్రం = అస్త్రము; గాధిపుత్రస్య = గాధి పుత్రుని యొక్క; ఘోరమ్ = భయంకరమైన; ఆగ్నేయమ్ = ఆగ్నేయమను అస్త్రము; ఉద్యతమ్ = ప్రయోగింపబడిన; బ్రహ్మదండేన = బ్రహ్మదండము వలన; తత్ = అది; శాంతం = శాంతించినది; అగ్నేః = అగ్ని యెక్క; వేగః = విస్పోటము; వేగః = వలె; అంభసా = నీటి చేత
భావము:-
బ్రహ్మదండముచే, అగ్నివిస్పోట మైనా నీటిచే శాంతింప బడినట్లు, ఆ గాధి పుత్రుడైన విశ్వామిత్రుడు ప్రయోగించిన అతంటి భయంకర ఆగ్నేయ అస్త్రము శాంతించినది.
1.56.6.
అనుష్టుప్.
వారుణం చైవ రౌద్రం చ
ఐంద్రం పాశుపతం తథా ।
ఐషీకం చాపి చిక్షేప
కుపితో గాధినందనః ॥
టీక:-
వారుణమ్ = వారుణాస్త్రమును; చైవ = మఱియు; రౌద్రమ్ = రౌద్ర అస్త్రమును; చ; ఐంద్రమ్ = ఐంద్రాస్త్రమును; పాశుపతమ్ = పాశుపత అస్త్రమును; తథా = మఱియు; ఐషీకం = ఐషీక అస్త్రమును; చాపి = కూడా; చిక్షేప = ప్రయోగించెను; కుపితో = కోపించిన; గాదినందనః = గాది కుమారుడైన విశ్వామిత్రుడు.
భావము:-
అంతట కోపించిన గాధినందనుడైన విశ్వామిత్రుడు వరుసగా వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐషీక అస్త్రములను ప్రయోగించెను.
1.56.7.
అనుష్టుప్.
మానవం మోహనం చైవ
గాంధర్వం స్వాపనం తథా ।
జృంభణం మాదనం చైవ
సంతాపన విలాపనే ॥
టీక:-
మానవం = మానవాస్త్రమును; మోహనం = మోహమును కలిగించు అస్త్రమును; చైవ = కూడృ; గాంధర్వం = గాంధర్వ అస్త్రమును; స్వాపనం = నిద్ర కలిగించు అస్త్రమును; జృంభణం = ఆవులింతలు కలిగించు అస్త్రమును; మాదనం = మత్తును కలిగించు అస్త్రమును; చైవ = కూడా; సంతాపన = తాపమును; విలాపనే = విలాపము కలిగించు అస్త్రములను.
భావము:-
మానవ , మోహన, గాంధర్వ అస్త్రములు, స్వాపనం అను నిద్రను కలిగించు, జృంభణము అను ఆవులింతలు కలిగించు, మాదనం అను మత్తును కలిగించు, సంతాపనం అను తాపమును, విలాపనే అను విలాపము కలిగించు అస్త్రమును ఆ విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ప్రయోగించెను.
1.56.8.
అనుష్టుప్.
శోషణం దారణం చైవ
వజ్రమస్త్రం సుదుర్జయమ్ ।
బ్రహ్మపాశం కాలపాశమ్
వారుణం పాశమేవ చ ॥
టీక:-
శోషణం = ఎండింప చేసెడి అస్త్రము; దారణం = చీల్చి వేయు అస్త్రమును; చైవ = కూడా; వజ్రమస్త్రం = వజ్రాస్త్రమును; సుదుర్జయమ్ = జయింప వీలు కానిది; బ్రహ్మపాశమ్ = బ్రహ్మపాశమును; కాలపాశమ్ = కాలపాశమును; వారుణమ్ = వారుణ; పాశమేవ = పాశమును; చ = కూడా.
భావము:-
ఆ విశ్వామిత్రుడు వశిష్ఠునిపై శోషణము అను శుష్కింపచేసెడి అస్త్రమును, దారణం అను చీల్చి వేయగలిగెడి అస్త్రమును, సుదుర్జయము అను జయింప శక్యము గాని అస్త్రమును, వజ్రాస్త్రమును, బ్రహ్మ పాశమును, కాలపాశమును, వారుణపాశమును కూడా ప్రయోగించెను.
1.56.9.
అనుష్టుప్.
పైనాకాస్త్రం చ దయితమ్
శుష్కార్ద్రే అశనీ ఉభే ।
దండాస్త్రమథ పైశాచమ్
క్రౌంచమస్త్రం తథైవ చ ॥
టీక:-
పైనాకాస్త్రమ్ = అంకుశము; చ; దయితమ్ = దయితాస్త్రమును కూడా; శుష్కార్ద్రే = ఎండినది; తడిసినది అను; అశనీ = కొరివి వంటి ఆయుధములు; ఉభే = రెండు; దండాస్త్రమ్ = దండాస్త్రమును; అథ = మఱియు; పైశాచమ్ = పైశాచ మను కండరాదులను పీకెడి అస్త్రమును; క్రౌఞ్చమస్త్రం = క్రౌంచ మనెడి వంకరా పోవు అస్త్రమును; చ = కూడా.
భావము:-
ఆ విశ్వామిత్రుడు పైనాకాస్త్రము అను అంకుశము, దయితాస్త్రము, శుష్క,ఆర్ద్ర అను రెండు వజ్రాస్త్రము లను, దండాస్త్రమును, పైశాచ అను కండరాదులను పీకు అస్త్రము,క్రౌంచ అను వంకరటింకరగా పోవు అస్త్రమును ప్రయోగించెను.
1.56.10.
అనుష్టుప్.
ధర్మచక్రం కాలచక్రమ్
విష్ణుచక్రం తథైవ చ ।
వాయవ్యం మథనం చైవ
అస్త్రం హయశిరస్తథా ॥
టీక:-
ధర్మచక్రం = ధర్మ చక్రమును; కాలచక్రమ్ = కాలచక్రమును; విష్ణుచక్రం = విష్ణుచక్రమును; తథైవ చ = మఱియును; వాయవ్యం = వాయవు అస్త్రమును; మథనం చైవ = మథనమును; చైవ; హయశిరః = హయశిరమనెడు అస్త్రమును; తథా = మఱియును.
భావము:-
ఆ విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ధర్మచక్రము, విష్ణుచక్రము, వాయవ్యము, మథనము, హయశిరము అనెడి అస్త్రములను వరుసగా ప్రయోగించెను.
1.56.11.
అనుష్టుప్.
శక్తిద్వయం చ చిక్షేప
కంకాళం ముసలం తథా ।
వైద్యాధరం మహాస్త్రం చ
కాలాస్త్రమథ దారుణమ్ ॥
టీక:-
శక్తిద్వయం = రెండు శక్తులను విష్ణుశక్తి శివశక్తి; చ; చిక్షేప = ప్రయోగించెను; కంకాళం = కంకాళము; తథా = అటులనే; ముుసలము = రోకలి; తథా = కూడా; వైద్యాధరం = వైధ్యాధరము అనెడి; మహాస్త్రం చ = గొప్ప అస్త్రమును కూడా; చ; కాలాస్త్రమ్ = కాలాస్త్రము; అథ = ఇంకా; దారుణమ్ = భయంకరమైనది.
భావము:-
రెండు గొప్ప శక్తులను, కంకాళము, ముసలము, వైద్యాధరము అనెడి గొప్ప శక్తి వంతమైన అస్త్రములను, కాలాస్త్రము మఱియు దారుణము అను అతి భయంకరమైన అస్త్రములను విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ప్రయోగించెను.
1.56.12.
అనుష్టుప్.
త్రిశూలమస్త్రం ఘోరం చ
కాపాలమథ కంకణమ్ ।
ఏతాన్యస్త్రాణి చిక్షేప
సర్వాణి రఘునందన! ॥
టీక:-
త్రిశూలమ్ అస్త్రమ్ = త్రిశూలము; ఘోరం = అతి భయంకరమైనది; చ = కూడా; కాపాలమ్ = కాపాలమును; అథ = మఱియు; కంకణమ్ = కంకణము అనెడి అస్త్రమును; ఏతాని = ఈ; అస్త్రాణి = అస్త్రములను; చిక్షేప = ప్రయోగించెను; సర్వాణి = సమస్తములైన; రఘునందన = ఓ రఘునందనా.
భావము:-
ఓ రఘునందనా! విశ్వామిత్రుడు వశిష్ఠునిపై త్రిశూలము అనెడి అతి భయంకర మైన అస్త్రమును, కాపాలము,కంకణము వంటి తన వద్ద ఉన్న సమస్త ఆస్త్రములను ప్రయోగించెను.
1.56.13.
అనుష్టుప్.
వసిష్ఠే జపతాం శ్రేష్ఠే
తదద్భుతమివాభవత్ ।
తాని సర్వాణి దండేన
గ్రసతే బ్రహ్మణః సుతః ॥
టీక:-
వసిష్ఠే = వశిష్ఠునిపై; జపతాం = మునులలో; శ్రేష్ఠే = శ్రేష్ఠుడైన; తత్ = అది; అద్భుతమ్ ఇవ = ఆశ్చర్యకరమైనది; అభవత్ = ఆయెను; తాని సర్వాణి = వాని నన్నిటిని; దండేన = దండము చేత; గ్రసతే = మ్రింగివేసెను; బ్రహ్మణః సుతః = బ్రహ్మ కుమారుడైన వశిష్ఠుడు.
భావము:-
మునులలో శ్రేష్ఠుడు వశిష్ఠునిపై విశ్వామిత్రుని అస్త్రముల ప్రయోగము ఆద్భుతమే, కానీ ఆ బ్రహ్మ కుమారుడైన వశిష్ఠుడు విశ్వామిత్రుని అస్త్రములన్నింటిని తన దండముతో మ్రింగివేసెను.
1.56.14.
అనుష్టుప్.
తేషు శాంతేషు బ్రహ్మాస్త్రమ్
క్షిప్తవాన్ గాధినందనః ।
తదస్త్రముద్యతం దృష్ట్వా
దేవాః సాగ్నిపురోగమాః ॥
టీక:-
తేషు = ఆ అస్త్రములు; శాంతేషు = శాంతించగా; బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును; క్షిప్తవాన్ = ప్రయోగించెను; గాధినందనః = గాధి కుమారుడైన విశ్వామిత్రుడు; తత్ = ఆ; అస్త్రమ్ = అస్త్రమును; ఉద్యతం = ప్రయోగింపబడిన; దృష్ట్వా = చూచి; దేవాః = దేవతలు; స = సహితముగ; అగ్ని = అగ్నిదేవునితో; పురోగమాః = ముందుకు వచ్చి.
భావము:-
ఆ అస్త్రములు అన్నీ శాంతించుట చేత విశ్వామిత్రుడు బ్రహ్మస్త్రమును ప్రయోగించెను. అది చూచి అగ్నితో సహా దేవతలంతా కలత చెందిరి.
1.56.15.
అనుష్టుప్.
దేవర్షయశ్చ సమ్భ్రాంతా
గంధర్వాః సమహోరగాః ।
త్రైలోక్యమాసీత్ సంత్రస్తమ్
బ్రహ్మాస్త్రే సముదీరితే ॥
టీక:-
దేవర్షయః = దేవఋషులు; చ = కూడా; సమ్భ్రాంతా = కలత చెందిరి; గంధర్వాః = గంధర్వులు; సమః = సర్వః; ఉరగాః = సర్పములు; త్రైలోక్యమ్ = మూడు లోకములు; ఆసీత్ = ఆయెను; సంత్రస్తమ్ = వణికి పోయినవి; బ్రహ్మాస్త్రే = బ్రహ్మస్త్రము; సముదీరితే = ప్రయోగింప బడుచుండగా.
భావము:-
బ్రహ్మాస్త్రము ప్రయోగింపబడుచుండగా దేవ ఋషులు, గంధర్వులు, నాగులుతో అందరును, ముల్లోకములు కలత చెంది భయముతో వణికి పోయినవి.
1.56.16.
అనుష్టుప్.
తదప్యస్త్రం మహాఘోరమ్
బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా ।
వసిష్ఠో గ్రసతే సర్వమ్
బ్రహ్మదండేన రాఘవ! ॥
టీక:-
తత్ = ఆ; అపి = కూడా; అస్త్రం = అస్త్రము; మహాఘోరమ్ = చాలా వినాశకరము; బ్రాహ్మం = బ్రహ్మస్త్రము; బ్రాహ్మేణ తేజసా = బ్రహ్మ తేజస్సు గల; వసిష్ఠః = వసిష్ఠుడు; గ్రసతే = మ్రింగివేసెను; సర్వమ్ = సర్వమును; బ్రహ్మదండేన = బ్రహ్మదండముతో; రాఘవ = ఓ రాఘవా!
భావము:-
ఓ రామా! వశిష్ఠుడు తన బ్రహ్మతేజ ప్రభావము చేత బ్రహ్మదండముతో ఆ మహాభయంకరమైన బ్రహ్మస్త్రమును కూడా మ్రింగి వేసెను.
1.56.17.
అనుష్టుప్.
బ్రహ్మాస్త్రం గ్రసమానస్య
వసిష్ఠస్య మహాత్మనః ।
త్రైలోక్యమోహనం రౌద్రమ్
రూపమాసీత్ సుదారుణమ్ ॥
టీక:-
బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మస్త్రమును; గ్రసమానస్య = మ్రింగుతున్న; వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన; త్రైలోక్యమోహనం = మూడు లోకములను సమ్మోహ పరచగల; రౌద్రమ్ = రౌద్రముతో; రూపమ్ = రూపము; ఆసీత్ = ఆయెను; సుదారుణమ్ = చాలా దారుణముగా.
భావము:-
బ్రహ్మస్త్రమును మ్రింగుచున్న సమయములో ఆ మహాత్ముడైన వసిష్ఠుని రూపము త్రిలోకాలకు మూర్ఛ కలిగించు రౌద్రముతో మహాదారుణముగా కనబడెను.
1.56.18.
అనుష్టుప్.
రోమకూపేషు సర్వేషు
వసిష్ఠస్య మహాత్మనః ।
మరీచ్య ఇవ నిష్పేతుః
అగ్నే ర్ధూమాకులా ర్చిషః ॥
టీక:-
రోమకూపేషు = రోమకూపముల యందు; సర్వేషు = సమస్తమైన; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; మరీచ్యః = కిరణములు; ఇవ = వలె; నిష్పేతుః = బయలువెడలెను; అగ్నేః = అగ్ని యొక్క; ధూమ = పొగతో; ఆకుల = నిండిన; అర్చిషః = జ్వాలలు.
భావము:-
మహాత్ముడైన ఆ వసిష్ఠుని రోమకూపములనుండి కిరణములు వలె పొగలతో కూడిన జ్వాలలు బయలువెడలెను.
1.56.19.
అనుష్టుప్.
ప్రాజ్వల ద్బ్రహ్మదండశ్చ
వసిష్ఠస్య కరోద్యతః ।
విధూమ ఇవ కాలాగ్నిః
యమదండ ఇవాపరః ॥
టీక:-
ప్రాజ్వలత్ = మండిపడెను; బ్రహ్మదండశ్చ = బ్రహ్మ దండము; వసిష్ఠస్య = వసిష్ఠుని; కరోద్యతః = చేతితో ఎత్తబడిన; విధూమ = ధూమములేని; ఇవ = వలె; కాలాగ్నిః = కాలాగ్ని; యమదండ = యమదండము; అపరః = మరియొక.
భావము:-
వసిష్ఠుని చేతిచే ఎత్తబడిన బ్రహ్మదండము ధూమము లేని కాలాగ్ని వలె, యమదండము వలెప్రజ్వరిల్లెను.
1.56.20.
అనుష్టుప్.
తతోఽ స్తువన్ మునిగణా
వసిష్ఠం జపతాం వరమ్ ।
అమోఘం తే బలం బ్రహ్మన్
తేజో ధారయ తేజసా ॥
టీక:-
తతః = అప్పడు; అస్తువన్ = స్తుతించిరి; మునిగణాః = మునిగణములు; వసిష్ఠం = వసిష్ఠుని; జపతాం = మునులలో; వరమ్ = శ్రేష్ఠుడైన; అమోఘం = అత్యంత శ్రేష్ఠమైనది; తే = నీ యొక్క; బలం = బలము; బ్రహ్మన్ = ఓ బ్రహ్మణా!; తేజో = తేజస్సును; ధారయ = ధరింపుము; తేజసా = తేజస్సుచేత;
భావము:-
అపుడు మునిగణములు ముని శ్రేష్ఠుడైన వసిష్టుని స్తుతించి ఇట్లు పలికిరి "ఓ బ్రాహ్మణా! నీ బలము ఆమోఘమైనది. దానిని నీ తేజస్సు నందు నీవే నిగ్రహింపుము."
1.56.21.
అనుష్టుప్.
నిగృహీతస్త్వయా బ్రహ్మన్
విశ్వామిత్రో మహాతపాః ।
ప్రసీద జపతాం శ్రేష్ఠ
లోకాః సంతు గతవ్యథాః ॥
టీక:-
నిగృహీతః = నిగ్రహింపబడెను; త్వయా = నీచేత; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా; విశ్వామిత్ర్రః = విశ్వామిత్రుడు; మహాతపాః = గొప్ప తపస్సంపన్నుడైన; ప్రసీదః = అనుగ్రహింపుము; జపతాం = మునులలో; శ్రేష్ఠః = శ్రేష్ఠుడా; లోకాః = లోకములు; సంతు = అగుగాక; గతవ్యథాః = వ్యధలు తొలగినవి.
భావము:-
"ఓ బ్రాహ్మణా! నీవు గొప్ప తపశ్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ మునిశ్రేష్ఠుడా నీ వనుగ్రహించి లోకముల బాధలు తొలగఁజేయుము.
1.56.22.
అనుష్టుప్.
ఏవముక్తో మహాతేజాః
శమం చక్రే మహాతపాః ।
విశ్వామిత్రోఽ పి నికృతో
వినిఃశ్వస్యే దమబ్రవీత్ ॥
టీక:-
ఏవమ్ = ఈవిధముగా; ఉక్తః = పలుకబడిన; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; శమమ్ చక్రే = శమించిన వాడు ఆయెను; మహాతపాః = గొప్ప తపశ్శాలి; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడా; నికృతః = అవమానింపబడినవాడై; వినిఃశ్వస్య = నిట్టూర్చి; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను.
భావము:-
వారి మాటలకు మహాతేజోవంతుడు, తపశ్శాలి అయిన వశిష్ఠుడు శాంతించెను. భంగపాటుకు గురియైన విశ్వామిత్రుడు అవమానముతో నిట్టూర్చి ఈ విధముగా పలికెను.
1.56.23.
అనుష్టుప్.
* “ధిగ్బలం క్షత్రియబలమ్
బ్రహ్మతేజోబలం బలమ్ ।
ఏకేన బ్రహ్మదండేన
సర్వాస్త్రాణి హతాని మే” ॥
టీక:-
ధిక్ + బలమ్ = ఛీ! ఏమి బలము; క్షత్రియబలమ్ = క్షత్రియబలము; బ్రహ్మ తేజః = బ్రహ్మ తేజస్సు యొక్క; బలమ్ = బలమే; బలమ్ = బలము; ఏకేన = ఒకే ఒక్క; బ్రహ్మదండేన = బ్రహ్మదండముతో; సర్వృ = సమస్తమైన; అస్త్రాణి = అస్త్రములు; హతాని = హతమైనవి; మే = నా యొక్క.
భావము:-
“ఛీ! ఈ క్షత్రియబలము ఏమి బలము. బ్రహ్మ తేజోబలమే బలము. ఒకే ఒక్క బ్రహ్మ తేజోదండముతో నా సర్వ అస్త్రములను నశింపచేసెను” అని విశ్వామిత్రుడు అనుకొనెను.
1.56.24.
అనుష్టుప్.
తదేతత్ సమవేక్ష్యాహమ్
ప్రసన్నే ంద్రియమానసః ।
తపో మహత్ సమాస్థాస్యే
యద్వై బ్రహ్మత్వకారణమ్" ॥
టీక:-
తత్ = ఆ కారణముగా; ఏతత్ = ఈ విషయమును; సమవేక్ష్య = చూచి; అహమ్ = నేను; ప్రసన్న = ప్రసన్నములైన; ఇంద్రియ = ఇంద్రియములు; మానసః = మనస్సు కలిగినవాడనై; తపః = తపమును; మహత్ = గొప్పదైన; సమాస్థాస్యే = అవలంబించెదను; యత్ = ఏది; వై = అయితే; బ్రహ్మత్వ = బ్రాహ్మణత్వమునకు; కారణమ్ = కారణము అగునో అట్టి.
భావము:-
అంతట విశ్వమిత్రుడు"ఈ విషయమును చూచిన పిమ్మట గ్రహించితిని. ఇకపై నేను ప్రసన్నములైన ఇంద్రియములు, మనసు కలిగిన వాడనై ఏది బ్రాహ్మణత్వ కారణమో అటువంటి గొప్పదైన తపమును ఆచరించెదను." అని తలచెను.
1.56.25.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
షట్పంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్పంచాశః సర్గః = యాభైయారవ [56]; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఆరవ సర్గ [56] సంపూర్ణము.
బాల కాండ
1.57.1.
అనుష్టుప్.
తతః సంతప్తహృదయః
స్మరన్ నిగ్రహమాత్మనః ।
వినిఃశ్వస్య వినిఃశ్వస్య
కృతవైరో మహాత్మనా ॥
టీక:-
తతః = అటు పిమ్మట; సంతప్త = పరితపించుచున్న; హృదయః = మనసు కలవాడై; స్మరన్ = గుర్తు చేసుకొనుచు; నిగ్రహం = నిగ్రహింపబడిన వైనము; ఆత్మనః = తన యొక్క; వినిఃశ్వస్య = నిట్టూర్చుచు; వినిఃశ్వస్య = నిట్టూర్చుచు; కృత = పెట్టుకున్న; వైరః = వైరముగలవాడు; మహాత్మనా = మహాత్మునితో.
భావము:-
అటుపిమ్మట, తనకు జరిగిన పరాజయమును తలచుకుని మనసులో మిక్కిలి పరితపించసాగెను. మహాత్ముడైన వసిష్ఠమహర్షితో వైరము పెట్టుకొనిన విశ్వామిత్రుడు పదే పదే నిట్టూర్చుచు చుండెను.
1.57.2.
అనుష్టుప్.
స దక్షిణాం దిశం గత్వా
మహిష్యా సహ రాఘవ!।
తతాప పరమం ఘోరమ్
విశ్వామిత్రో మహత్తపః।
ఫల మూలాశనో దాన్తైః
చకార సుమహత్తపః॥
టీక:-
సః = అతడు; దక్షిణాం = దక్షిణ; దిశం = దిశగా; గత్వా = వెళ్ళి; మహిష్యా = జ్యేష్ఠ భార్యతో; సహ = కూడి; రాఘవ! = ఓ శ్రీరామచంద్ర; తతాప = చేసెను; పరమం = మిక్కిలి; ఘోరమ్ = ఘోరమైన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహత్తపః = గొప్ప తపస్సును; ఫలమూల = ఫలములు, కందమూలములు; అశనః = తినుచున్నవాడై; దాన్తైః = ఇంద్రియ నిగ్రహముతో; చకార = చేసెను; సు = చాల; మహత్ = గొప్ప; తపః = తపస్సు.
భావము:-
విశ్వామిత్రుడు తన పట్టమహిషిని తీసుకుని దక్షిన దిశగా ప్రయాణించి ఫలములు కంద మూలములు ఆహారముగా స్వీకరిస్తూ, ఇంద్రియ నిగ్రహముతో చాల గొప్ప తపస్సును ఆచరించెను
1.57.3.
అనుష్టుప్.
అథాస్య జజ్ఞిరే పుత్రాః
సత్యధర్మపరాయణాః।
హవిష్యన్దో మధుష్యన్దో
దృఢనేత్రో మహారథః ॥
టీక:-
అథ = అటు పిమ్మట; అస్య = అతనికి; జజ్ఞిరే = జన్మించిరి; పుత్రాః = కుమారులు; సత్య = సత్యమునందు; ధర్మ = ధర్మమునందు; పరాయణాః = అనురక్తి కలిగినవారు; హవిష్యన్దః = హవిష్యందుడు; మధుష్యన్దః = మధుష్యందుడు; దృఢనేత్రః = దృడనేత్రుడు; మహారథః = మహారథుడు.
భావము:-
పిమ్మట వారికి సత్య ధర్మ పరాయణులైన హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను నలుగురు కుమారులు కలిగిరి.
1.57.4.
అనుష్టుప్.
పూర్ణే వర్షసహస్రే తు
బ్రహ్మా లోకపితామహః ।
అబ్రవీన్మధురం వాక్యమ్
విశ్వామిత్రం తపోధనమ్ ॥
టీక:-
పూర్ణే = పూర్తి; వర్ష = సంవత్సరములు; సహస్రః = వెయ్యి; తు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; లోక = లోకములన్నిటికి; పితామహః = పితామహుడు; అబ్రవీత్ = పలికెను; మధురం = మధురమైన; వాక్యమ్ = వాక్యములను; విశ్వామిత్రం = విశ్వామిత్రునితో; తపోధనమ్ = తపస్సు అనే ధనము కలిగిన.
భావము:-
వేయి సంవత్సరములు ఘోరతపస్సును ఆచరించిన పిమ్మట లోకములన్నిటికి పితామహుడు అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వామిత్రునితో మధురముగా ఇట్లు నుడివెను.
గమనిక:-
*- బ్రహ్మ = పరబ్రహ్మ, బ్రహ్మా = త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుడు.
1.57.5.
అనుష్టుప్.
జితా రాజర్షిలోకాస్తే
తపసా కుశికాత్మజ ।
అనేన తపసా త్వాం తు
రాజర్షిరితి విద్మహే"॥
టీక:-
జితాః = జితపడినవాడవు, స్థిరపడినవాడవు; రాజర్షి = రాజర్షుల; లోకాః = , జనములు (వావిళ్ళవారి నిఘంటువు) అందు; తే = నీయొక్క; తపసా = తపస్సుచేత; కుశికాత్మజ = విశ్వామిత్రా!; అనేన = ఈ; తపసా = తపస్సుచేత; త్వాం తు = నిన్ను; రాజర్షిః = రాజర్షి; ఇతి = అని; విద్మహే = గుర్తించుచున్నాను.
భావము:-
ఓ కుశికనందనా ! విశ్వామిత్రా! నీయొక్క తపశ్శక్తిచే రాజర్షులు సమాజములో స్థిరపడితివి. ఈ తపస్సుచే నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను.
1.57.6.
అనుష్టుప్.
ఏవముక్త్వా మహాతేజా
జగామ సహ దైవతైః ।
త్రివిష్టపం బ్రహ్మలోకమ్
లోకానాం పరమేశ్వరః॥
టీక:-
ఏవం = ఈ విధముగా; ఉక్త్వా = పలికిన పిదప; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కలిగిన; జగామ = వెళ్ళెను; సహ = కూడి; దైవతైః = దేవతలతో; త్రివిష్టపం = వేల్పుల లోకమునకు; బ్రహ్మలోకమ్ = బ్రహ్మ లోకమునకు; లోకానాం = లోకములకు; పరమేశ్వరః = ప్రభువు అయిన.
భావము:-
సృష్టికర్త అయిన బ్రహ్మ, ఈ విధముగ పలికిన పిమ్మట తన బ్రహ్మలోకమున కేగెను. దేవతలు వారి స్వర్గధామములకు వెళ్ళిరి.
1.57.7.
అనుష్టుప్.
విశ్వామిత్రోఽ పి తచ్ఛ్రుత్వా
హ్రియా కించిదవాంముఖః।
దుఃఖేన మహతావిష్టః
సమన్యు రిదమబ్రవీత్॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడ; తత్ = ఆ వచనములను; శ్రుత్వా = విని; హ్రియా = సిగ్గుతో; కిఞ్చిత్ = కొంచెము; అవాఙ్ముఖః = వంచిన తల కలవాడై; దుఃఖేన = దుఃఖముతో; మహతా = గొప్ప; ఆవిష్టః = ఆవేశించబడినవాడై; సమన్యుః = కోపముతో; ఇదం = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ఆ సృష్టికర్త వచనములు విన్న విశ్వామిత్రుడు సిగ్గుతో తలవంచుకొని మిక్కిలి దుఃఖమునకులోనై కోపముతో ఇట్లు పలికెను.
1.57.8.
అనుష్టుప్.
“తపశ్చ సుమహత్తప్తమ్
రాజర్షిరితి మాం విదుః ।
దేవాః సర్షిగణాః సర్వే
నాస్తి మన్యే తపఃఫలమ్॥
టీక:-
తపః = తపస్సు; చ; సు = చాలా; మహత్ = గొప్పదైన; తప్తమ్ = తపింపఁజేయఁబడినది; రాజర్షిః = రాజర్షి; ఇతి = అని; మాం = నన్ను; విదుః = గుర్తించారు ; దేవాః = దేవతలు; స = సహితంగా; ఋషిః = ఋషులు; గణాః = సమూహములు; సర్వే = అందఱు; నాస్తి = లేదు; మన్యే = తలతును; తపఃఫలమ్ = తపస్సు వలన ఫలితము.
భావము:-
“నేను ఇంతటి తపస్సును ఆచరించినను దేవతలు,మునులు అందఱు నన్ను కేవలము రాజర్షిగానే గుర్తించారు. నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేదు అని తలచెదను.
1.57.9.
అనుష్టుప్.
ఏవం నిశ్చిత్య మనసా
భూయ ఏవ మహాతపాః"।
తపశ్చకార కాకుత్స్థ!
పరమం పరమాత్మవాన్॥
టీక:-
ఏవం = ఇలా; నిశ్చిత్య = నిశ్చయించుకొని; మనసా = మనస్సులో; భూయ = మఱల; ఏవ = మాత్రమే; మహాతపాః = గొప్ప తపస్సు చేసినవాడు।; తపః = తపస్సు; చకార = చేసెను; కాకుత్స్థ = శ్రీరామచంద్ర; పరమం = గొప్ప; పరమాత్మవాన్ = విశిష్ఠ బుద్ధి కలిగిన॥
భావము:-
శ్రీరామచంద్ర! మహాతపస్వియును, మఱియు విశిష్ఠమైన బుద్ధి శాలి ఐన విశ్వామిత్రుడు ఈ విధముగా మనస్సులో అనుకొని మఱల తీవ్రతపస్సును చేయనారంభించెను
గమనిక:-
*- కాకుత్స్థ- శ్రీరామచంద్ర, కకుత్స్థ మహరాజ వంశమునకు చెందినవాడు.
1.57.10.
అనుష్టుప్.
ఏతస్మిన్నేవ కాలే తు
సత్యవాదీ జితేంద్రియః ।
త్రిశంకురితి విఖ్యాత
ఇక్ష్వాకు కులవర్ధనః॥
టీక:-
ఏతస్మిన్నేవ = ఇదే; కాలే = కాలమందు; తు; సత్యవాదీ = సత్యవాదియును; జితేంద్రియః = ఇంద్రియములను నిగ్రహించినవాడు అయిన; త్రిశంఖు = త్రిశంకుడు; ఇతి = అను; విఖ్యాత = ప్రసిద్ధిపొందిన; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుల; కుల = వంశమును; వర్ధనః = వృద్ధికి కారణుడు.
భావము:-
ఇదే కాలమందు ఇక్ష్వాకువంశ వర్ధనుడు, జితేంద్రియుడు మఱియు సత్యవాది అయిన త్రిశంకువు అనే రాజు వర్ధిల్లుచుండెను.
1.57.11.
అనుష్టుప్.
తస్య బుద్ధిః సముత్పన్నా
యజేయమితి రాఘవ! ।
గచ్ఛేయం సశరీరేణ
దేవానాం పరమాం గతిమ్॥
టీక:-
తస్య = అతనికి; బుద్ధిః = బుద్ధి; సముత్పన్నా = పుట్టినది; యజేయమితి = యాగముచే; రాఘవ! = శ్రీరామచంద్ర!; గచ్ఛేయం = వెళ్ళెదను; సశరీరేణ = తన శరీరముతో; దేవానాం = దేవతలయొక్క; పరమాం = ఉత్కృష్టమైన; గతిమ్ = గతి॥
భావము:-
ఆ త్రిశంకువునకు యాగముచేసి తన శరీరముతో దేవతలుండే స్వర్గమునకు వెళ్ళవలెను అనే బుద్ధి పుట్టినది.
1.57.12.
అనుష్టుప్.
స వసిష్ఠం సమాహూయ
కథయామాస చింతితమ్।
“అశక్యమితి” చాప్యుక్తో
వసిష్ఠేన మహాత్మనా॥
టీక:-
సః = అతడు; వసిష్ఠం = వసిష్ఠుని; సమాహూయ = పిలిపించి; కథయామాస = తెలిపెను; చింతితమ్ = తన ఆలోచనను।; అశక్యం = అసాధ్యమైనది; ఇతి; చ+అపి = అని కూడ; ఉక్తః = పలుకబడెను; వసిష్ఠేన = వసిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడైన.
భావము:-
అతడు(త్రిశంకువు) వసిష్ఠమహర్షిని ఆహ్వానించి తన ఆలోచనను తెలిపెను. అంతట మహాత్ముడైన వసిష్ఠమహర్షి ఇది శక్యము కాదు అని చెప్పెను.
1.57.13.
అనుష్టుప్.
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన
స యయౌ దక్షిణాం దిశమ్।
తతస్తత్కర్మసిద్ధ్యర్థమ్
పుత్రాంస్తస్య గతో నృపః॥
టీక:-
ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడిన వాడు; వసిష్ఠేన = వసిష్ఠమహర్షిచే; స = అతడు; యయౌ = వెళ్ళెను; దక్షిణాం = దక్షిణ; దిశమ్ = దిశగా।; తతః = అటు పిమ్మట; తత్ = ఆ; కర్మ = పని; సిద్ధ్యర్థమ్ = సాధించుటకు; పుత్రాన్ = పుత్రుల వద్దకు; తస్య = ఆ వసిష్ఠమహర్షి యొక్క; గతః = వెళ్ళెను; నృపః = రాజు॥
భావము:-
వసిష్ఠమహర్షిచే నిరాకరింపబడిన ఆ రాజు త్రిశంకువు ఆ పని సాధించుటకు, దక్షిణదిశగా బయలుదేఱి వసిష్ఠమహర్షి పుత్రులవద్దకు వెళ్ళెను.
1.57.14.
అనుష్టుప్.
వాసిష్ఠా దీర్ఘతపసః
తపో యత్ర హి తేపిరే।
త్రిశంకుః సుమహాతేజాః
శతం పరమభాస్వరమ్॥
టీక:-
వాసిష్ఠా = వసిష్ఠమహర్షి పుత్రులు; దీర్ఘ = ఎంతో కాలం; తపసః = తపస్సు చేసినవారు; తపః = తపస్సు; యత్ర = ఎక్కడ; హి; తేపిరే = చేసారో అచట; త్రిశంకుః = త్రిశంకువు; సుమహాతేజాః = చాల గొప్ప తేజస్సు కలిగిన; శతం = నూరుగురు; పరమభాస్వరమ్ = చాలా ప్రకాశించుచున్న.
భావము:-
గొప్పతేజస్సు కలిగిన త్రిశంకువు ఎంతోకాలముగా తపమాచరించుచున్న వాసిష్ఠులు (వసిష్ఠమహర్షి పుత్రులు)వందమందిఉన్న ప్రదేశమునకు వెళ్ళెను
1.57.15.
అనుష్టుప్.
వసిష్ఠపుత్రాన్ దదృశే
తప్యమానాన్ యశస్వినః।
సోఽ భిగమ్య మహాత్మానః
సర్వానేవ గురోః సుతాన్॥
టీక:-
వసిష్ఠపుత్రాన్ = వసిష్ఠ పుత్రులను; దదృశే = చూచెను; తప్యమానాన్ = తపస్సు చేయుచున్న; యశస్వినః = యశస్సు కలిగినవారు; సః = అతడు; అభిగమ్య = సమీపించి; మహాత్మానః = మహాత్ములైన; సర్వాన్+ఏవ = సమస్తము అయిన; గురోః సుతాన్ = గురువుగారి పుత్రులను.
భావము:-
మిక్కిలి ప్రకాశించుచున్న, యశస్సు కలిగిన తపస్సు చేసుకొంటున్న నూరుగురు వసిష్ఠ కుమారులను కృతాంజలి అయి దర్శించెను.
1.57.16.
అనుష్టుప్.
అభివాద్యానుపూర్వ్యేణ
హ్రియా కించిదవాంముఖః।
అబ్రవీ త్సుమహాత్మానః
సర్వానేవ కృతాంజలిః॥
టీక:-
అభివాద్య = నమస్కరించి; అనుపూర్వ్యేణ = వయస్సు క్రమముగా; హ్రియా = సిగ్గుతో; కిఞ్చిత్ = కొంచెము; అవాఙ్ముఖః = తలవంచినవాడై।; అబ్రవీత్ = ఇట్లనెను; సుమహాత్మానః = చాలా గొప్ప మహాత్ములు; సర్వాన్+ఏవ = అందరికి; కృతాఞ్జలిః = అంజలి ఘటించినవాడై.
భావము:-
ఆ త్రిశంకువు మహాత్ములైన ఆ గురుపుత్రులను సమీపించి వారందఱికి వయస్సు క్రమముగా నమస్కరించి కొంచెము సిగ్గుతో తలవంచుకుని అంజలి ఘటించి ఇట్లనెను.
1.57.17.
అనుష్టుప్.
“శరణం వః ప్రపద్యేఽ హం
శరణ్యాన్ శరణాగతః।
ప్రత్యాఖ్యాతోఽ స్మి భద్రం వో
వసిష్ఠేన మహాత్మనా॥
టీక:-
శరణం = శరణు; వః = మిమ్ములను; ప్రపద్యే = పొందుచున్నాను; అహమ్ = నేను; శరణ్యాన్ = శరణ్యులు; రక్షకులు; శరణాగతః = శరణు కొఱకు వచ్చిన।; ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడినవాడు; అస్మి = నేను భద్రం = క్షేమము; వః = మీకు; వసిష్ఠేన = వసిష్టునిచే; మహాత్మనా = మహాత్ముడైన॥
భావము:-
“ఓ వసిష్ఠ కుమారులారా, మీకు క్షేమమగుగాక; మహాత్ముడైన వసిష్ఠ మహర్షిచే నేను నిరాకరింపబడితిని. మీరు అనన్య శరణ్యులు , మిమ్ములను శరణు వేడుకుంటున్నాను.
1.57.18.
అనుష్టుప్.
యష్టుకామో మహాయజ్ఞం
తదనుజ్ఞాతుమర్హథగురు।
పుత్రానహం సర్వాన్
నమస్కృత్య ప్రసాదయే॥
టీక:-
యష్టు = యజ్ఞకర్తనై; కామః = చేయు తలచితిని; మహా = గొప్ప; యజ్ఞమ్ = యజ్ఞమును; తత్ = అందుచేత; అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు; అర్హథ = తగినవారు; గురు = గురువుగారి; పుత్రాన్ = పుత్రులు; అహం = నేను; సర్వాన్ = మీఅందరికి; నమస్కృత్య = నమస్కరించి; ప్రసాదయే = అనుగ్రహించగలరు.
భావము:-
నేను యజ్ఞకర్తగా ఒక మహయజ్ఞమును చేయదలచితిని. అందుకు అనుజ్ఞ ఇవ్వమని, గురుపుత్రులైన మిమ్మల నందఱిని నమస్కరించి అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
1.57.19.
అనుష్టుప్.
శిరసా ప్రణతో యాచే
బ్రాహ్మణాంస్తపసి స్థితాన్।
తే మాం భవంత సిద్ధ్యర్థం
యాజయంతు సమాహితాః॥
టీక:-
శిరసా = శిరముచే; ప్రణతః = ప్రణమిల్లుచున్న వాడినై; యాచే = కోరుచున్నాను; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులైన మిమ్ము; తపసి = తపము; స్థితాన్ = ఆచరించుచున్న; తే = అట్టి; మాం = నన్ను; భవంత = మీరు; సిద్ధ్యర్థమ్ = సిద్ధించుటకు; యాజయంతు = యాగము చేయించగలరు; సమాహితాః = సావధానచిత్తులై.
భావము:-
తపస్సు ఆచరించుచున్న గొప్ప బ్రాహ్మణోత్తములయిన మీకు తలవంచి నమస్కరించి వేడుకుంటున్నాను. నా అభీష్టము సిద్ధించుటకు మీరు యజ్ఞమును చేయించగలరు.
1.57.20.
అనుష్టుప్.
సశరీరో యథాఽ హం హి
దేవలోకమవాప్నుయామ్।
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన
గతిమన్యాం తపోధనాః॥
టీక:-
సశరీరః = సశరీరుడనై; యథా = ఏవిధముగా; అహం = నేను; హి; దేవలోకం = స్వర్గమును; అవాప్నుయామ్ = పొందగలనో।; ప్రత్యాఖ్యాతః = తిరస్కరింపబడిన; వసిష్ఠేన = వసిష్ఠ మహర్షిచే; గతిం = గతి; అన్యాం = వేఱొక; తపోధనాః = తపోధనులారా!.
భావము:-
ఓ తపోధనులారా! నేను సశరీరముగా స్వర్గమునకు వెళ్ళగోరు చున్నాను. వసిష్ఠ మహర్షిచే తిరస్కరించబడిన నాకు ఇతర దారిలేదు,
1.57.21.
అనుష్టుప్.
గురుపుత్రానృతే సర్వాన్
నాహం పశ్యామి కాంచన।
ఇక్ష్వాకూణాం హి సర్వేషాం
పురోధాః పరమా గతిః॥
టీక:-
గురు = గురుపు; పుత్రాన్ = పుత్రులైన మీరు; అనృతే = తప్ప ఇతరులు; సర్వాన్ = అందరు; న = లేదు; అహం = నేను; పశ్యామి = చూడగలను; కాంచన = దేనిని; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశీయులకు; హి; సర్వేషామ్ = సమస్తమైన; పురోధాః = పురోహితుడు; పరమా = గొప్ప; గతిః = గతి.
భావము:-
గురుపుత్రులైన మీరు తప్ప వేఱే మార్గము కనబడుటలేదు. సమస్త ఇక్ష్వాకువంశ రాజులకు పురోహితుడైన వసిష్ఠ మహర్షే పరమగతి.
1.57.22.
అనుష్టుప్.
పురోధసస్తు విద్వాంసః
తారయంతి సదా నృపాన్ ।
తస్మాదనంతరం సర్వే
భవన్తో దైవతం మమ" ॥
టీక:-
పురోధసః = పురోహితులు; తు; విద్వాంసః = విద్వాంసులైన; తారయంతి = తరింపజేయుదురు; సదా = ఎల్లప్పుడు; నృపాన్ = రాజులను; తస్మాత్ = అందుచేత; అనంతరం = తరువాత; సర్వే = అందరు; భవంత = మీరు; దైవతం = దేవతలు; మమ = నాకు.
భావము:-
విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడు రాజులను తరింప జేయుదురు. వసిష్ఠుని తరువాత మీరే నాకు దేవతలు.
1.57.23.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
సప్తపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తపంచాశః [57] = యాభై ఏడవవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఏడవ సర్గ [57] సంపూర్ణము.
బాల కాండ
1.58.1.
అనుష్టుప్.
తతస్త్రిశంకో ర్వచనం
శ్రుత్వా క్రోధసమన్వితమ్ ।
ఋషిపుత్రశతం రామ!
రాజాన మిదమబ్రవీత్ ॥
టీక:-
తతః = పిమ్మట; త్రిశంకోః = త్రిశంకుని; వచనమ్ = వచనమును; శ్రుత్వా = విని; క్రోధః = కోపము; సమన్వితమ్ = పూనిన వారై; ఋషి = వసుష్ఠ ఋషి; పుత్ర = పుత్రులు; శతమ్ = వందమంది; రామ = రామా; రాజానమ్ = త్రిశంకు రాజును గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను
భావము:-
వసిష్ఠుని నూరుగురు కొడుకులు రాజు త్రిశంకుని వచనములు విని కోపముతో ఇట్లు పలికిరి.
1.58.2.
అనుష్టుప్.
ప్రత్యాఖ్యాతోఽ సి దుర్బుద్ధే
గురుణా సత్యవాదినా ।
తం కథం సమతిక్రమ్య
శాఖాంతర ముపేయివాన్ ॥
టీక:-
ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడినవాడవు; అసి = అయి; దుర్బుద్ధే = చెడ్డబుద్ధి కలవాడా; గురుణా = గురువు చేత; సత్యవాదినా = సత్యమును పలికెడు; తం = ఆతని; కథమ్ = ఎట్లు; సమతిక్రమ్య = అతిక్రమించి; శాఖాంతరమ్ = వేఱొక శాఖను; ఉపేయివాన్ = పొందెదవు ?
భావము:-
ఓ దుష్టశీలుడా! సత్యవాక్కులను నుడువు గురువుని అతిక్రమించి వేఱొకరిని ఎట్లు ఆశ్రయించెదవు ?
1.58.3.
అనుష్టుప్.
ఇక్ష్వాకూణాం హి సర్వేషామ్
పురోధాః పరమో గురుః ।
న చాతిక్రమితుం శక్యమ్
వచనం సత్యవాదినః ॥
టీక:-
ఇక్ష్వాకుణామ్ హి = ఇక్ష్వాకు వంశపు రాజులు; హి; సర్వేషామ్ = అందఱికీ; పురోధాః = పురోహితుడు; పరమః = గొప్ప; గురుః = గురువు; న = కాదు; చ = కూడా; అతిక్రమితుమ్ = అతిక్రమించుటకు; శక్యమ్ = సాధ్యము; వచనమ్ = వచనమును; సత్యవాదినః = సత్యమును పలికెడువాని.
భావము:-
ఇక్ష్వాకు వంశీయరాజులు అందఱికీ పురోహితుడు పరమ గురువు.సత్యవాదియైన గురువు పలుకు అతిక్రమించుట సాధ్యము కాదు.
1.58.4.
అనుష్టుప్.
అశక్యమితి చోవాచ
వసిష్ఠో భగవానృషిః ।
తం వయం వై సమాహర్తుమ్
క్రతుం శక్తాః కథం తవ ॥
టీక:-
అశక్యమ్ = అసాధ్యము; ఇతి = అని; చః = గురువు; ఉవాచ = చెప్పెను; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = పూజ్యనీయుడైన; ఋషిః = మహర్షి; తమ్ = అట్టి దానిని; వయమ్ వై = మేమైనా; సమాహర్తుమ్ = నిర్వహించుటకు; క్రతుమ్ = యజ్ఞమును; శక్తాః = సమర్థులము; కథమ్ = ఎట్లు; తవ = నీయొక్క.
భావము:-
ఆ యజ్ఞము చేయుట అసాధ్యము అని గురువు, భగవంతుడు, వసిష్ఠమహర్షి చెప్పెను. అట్టి నీ యజ్ఞమును నిర్వహించుట మా కెట్లు సాధ్యమగును?
1.58.5.
అనుష్టుప్.
బాలిశస్త్వం నరశ్రేష్ఠ
గమ్యతాం స్వపురం పునః ।
యాజనే భగవాన్ శక్తః
త్రైలోక్యస్యాపి పార్థివ! ।
అవమానం చ తత్కర్తుమ్।
తస్య శక్ష్యామహే కథమ్ ॥
టీక:-
బాలిశః = మూర్ఖుడవు; త్వమ్ = నీవు; నరశ్రేష్ఠ = రాజా; గమ్యతామ్=వెళ్ళెదవు గాక; స్వపురమ్ = నీ పురము గూర్చి; పునః = మరల; యాజనే అపి=యజ్ఞము చేయించుటకు; అపి=కూడ; భగవాన్ = పూజ్యనీయుడు; శక్తః = శక్తివంతుడు; త్రైలోక్యమ్ = ముల్లోకములలో; పార్థివ = రాజా; అవమానమ్ = అవమానమును; చ; తత్ = అందువలన; కర్తుమ్ = చేయుటకు; తస్య = ఆతని యొక్క; శక్ష్యామహే = సమర్థులము కాగలము; కథమ్ = ఎట్లు.
భావము:-
ఓ నరులలో శ్రేష్ఠుడా! నీవు మూఢుడవు. నీ పురమునకు తిరిగి పొమ్ము. భగవంతుడు వసిష్ఠుడు ముల్లోకములలో ఎవరిచేతనైనా యజ్ఞము చేయించుటకు సమర్థుడు. ఓ రాజా! అతడు కాదని పలికిన పిదప యాగమును చేయించి మేము వారిని అవమానింపగలమా ?
1.58.6.
అనుష్టుప్.
తేషాం తద్వచనం శ్రుత్వా
క్రోధప ర్యాకులాక్షరమ్ ।
స రాజా పునరేవైతాన్
ఇదం వచనమబ్రవీత్ ॥
టీక:-
తేషామ్ = వారి యొక్క; తత్ =; వచనము = వచనమును; శ్రుత్వా = విని; క్రోధ = కోపముతో; పర్యాకుల = ఆవేశపూరితమైన; అక్షరమ్ = పలుకులు గల; సః = ఆ; రాజా = రాజు; పునః ఏవ = మాఱుగా; ఏతాన్ = వీనిని; ఇదం = ఈ; వచనమ్ = వచనమును; అబ్రవీత్ = పలికెను.
భావము:-
త్రిశంక మహారాజు వారి వచనములు విని కోపముచే ఆవేశపూరిత పలుకులతో ఇలా మాఱు పలికెను.
1.58.7.
అనుష్టుప్.
“ప్రత్యాఖ్యాతోఽ స్మి గురుణా
గురుపుత్రైస్తథైవ చ ।
అన్యాం గతిం గమిష్యామి
స్వస్తి వోఽ స్తు తపోధనాః" ॥
టీక:-
ప్రత్యాఖ్యాతః = నిరాకరించబడి; అస్మి = ఉంటిని; గురుణా = గురువు చేతను; గురుపుత్రైః = గురుపుత్రుల చేతను; చ = కూడా; తథా ఏవ = తగిన విధముగా; ఏవ = మాత్రమే; చ; అన్యామ్ = వేఱొక; గతిమ్ = మార్గములో; గమిష్యామి = వెళ్ళెదను; స్వస్తి అస్తు = క్షేమము అగుగాక; తపోధనాః = తపమే ధనముగా గల ఋషులారా
భావము:-
"ఓమునులారా! నేను నా గురువు చేతను, గురుపుత్రుల చేతను కూడా నిరాకరించబడితిని. తగినట్టి వేఱొక మార్గమున వెళ్ళెదను. మీకు శుభమగు గాక!"
1.58.8.
అనుష్టుప్.
ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా
వాక్యం ఘోరాభిసంహితమ్ ।
శేపుః పరమసంక్రుద్ధాః
చండాలత్వం గమిష్యసి ॥
టీక:-
ఋషిః = ఋషి; పుత్రాస్తు = ఋషిపుత్రులు; తత్ = ఆ; శ్రుత్వా = విని; వాక్యమ్ = పలుకలతో; ఘోరాభిసంహితమ్ = తీవ్రమైన అభిప్రాయముతో కూడినట్టి; శేపుః = శపించిరి; పరమ = మిక్కిలి; సంక్రుద్ధాః = కోపించినవారై; చండాలత్వమ్ = చండాలునిగనుండుట; గమిష్యసి = పొందగలవు.
భావము:-
ఋషి వసిష్ఠుని కుమారులు ఘోరభావముతో కూడుకున్న అతని పలుకులు విని మిగుల కోపించి “చండాలత్వమును పొందెదవు గాక!” అని ఆతనిని శపించిరి.
గమనిక:-
*- చండాలుడు- పరులను హింసింపుచు కౄరుడై పర ధనద్రవ్యాపహారభిలాషులై పర దారాగమనాసక్తులై ఉండువాడు, ఆంధ్రశబ్దరత్నాకరము.
1.58.9.
అనుష్టుప్.
ఏవముక్త్వా మహాత్మానో
వివిశుస్తే స్వమాశ్రమమ్ ।
అథ రాత్ర్యాం వ్యతీతాయామ్
రాజా చండాలతాం గతః ॥
టీక:-
ఉక్త్వా = ఇట్లు; ఉక్త్వా = పలికి; మహాత్మనః = మహానుభావులు; వివిశుః = ప్రవేశించిరి; తే = వారు; స్వమ్ = తమ; ఆశ్రమమ్ = ఆశ్రమమును; అథ = అటు పిమ్మట; రాత్ర్యామ్ = రాత్రి; వ్యతీతాయామ్ = కడచుచుండ; రాజా = రాజు; చండాలత్వమ్ = చండాలత్వమును; గతః = పొందెను.
భావము:-
మహాత్ములైన ఋషి తనయులు ఇట్లు పలికి వారి ఆశ్రమములోనికి వెళ్ళిరి.రాత్రి గడచిన పిమ్మట రాజు చండాలుడయ్యెను.
1.58.10.
అనుష్టుప్.
నీలవస్త్రధరో నీలః
పరుషో ధ్వస్తమూర్ధజః ।
చిత్య మాల్యానులేపశ్చ
ఆయసాభరణోఽ భవత్ ॥
టీక:-
నీల = నల్లని; వస్త్ర = వస్త్రములను; ధరః = ధరించినవాడు; నీలః = నల్లనివాడు; పరుషః = కర్కశుడు; ధ్వస్తమూర్ధజః = తలవెండ్రుకులు పోయినవాడు, బట్టతలవాడు; చిత్యః = శ్మశానములోని; మాల్యః = మాలలు ధరించువాడు; అనులేపః = బూడిదను పూసుకొనినవాడు; చ = కూడా; ఆయస = ఇనుప; ఆభరణః = అలంకారములు ధరించినవాడు; అభవత్ = అయ్యెను.
భావము:-
త్రిశంకుడు నల్లని వస్త్రములు ధరించినవాడు, నల్లనివాడు, మోటువాడు, బట్టతలవాడు, శ్మశానములోని దండలు బూడిద ధరించువాడు, ఇనుప ఆభరణాలు ధరించువాడు ఆయెను.
1.58.11.
అనుష్టుప్.
తం దృష్ట్వా మంత్రిణః సర్వే
త్యజ్య చండాలరూపిణమ్ ।
ప్రాద్రవన్ సహితా రామ!
పౌరా యేఽ స్యానుగామినః ॥
టీక:-
తం = అతనిని; దృష్వా = చూసి; మంత్రిణః = మంత్రులు; సర్వే = అందఱు; త్యజ్య = విడిచిపెట్టిjf; చండాల = చండాలుని; రూపిణమ్ = రూపములో ఉన్నవానిని; ప్రాద్రవన్ = పాఱిపోయిరి; సహితా = కలసి; రామ = ఓ రామా; పౌరా = పురజనులు; యే = ఎవరైతే; అనుగామినః = అనుసరించినారో
భావము:-
ఓ రామా! చండాలరూపములో ఉన్న త్రింశకుని చూచి ఆతని మంత్రులు అందఱు, అతనిని అనుసరించి వచ్చిన పురజనులతో కలసి అతనిని విడిచిపెట్టి పాఱిపోయిరి.
1.58.12.
అనుష్టుప్.
ఏకో హి రాజా కాకుత్స్థ!
జగామ పరమాత్మవాన్ ।
దహ్యమానో దివారాత్రం
విశ్వామిత్రం తపోధనమ్ ॥
టీక:-
ఏకఃహి = ఒక్కడే; రాజా = రాజు; కాకుత్స్థ = రామా!; జగామ = వెళ్ళెను; పరమ = మిక్కిలి; ఆత్మవాన్ = స్థైర్యము గలవాడు; దహ్యమానః = దహింపబడుచు; దివారాత్రమ్ = పగళ్ళు; రాత్రులు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గుఱించి; తపోనిధిమ్ = మహాతాపసి.
భావము:-
ఓ రామా ! మిక్కిలి ధైర్యవంతుడైన త్రిశంకుమహారాజు ఏకాకై, దుఃఖముచే రాత్రింబవళ్ళు దహింపబడుచు తపోనిధియైన విశ్వామిత్రుని వద్దకు వెళ్ళెను.
1.58.13.
అనుష్టుప్.
విశ్వామిత్రస్తు తం దృష్ట్వా
రాజానం విఫలీకృతమ్ ।
చండాలరూపిణం రామ!
మునిః కారుణ్యమాగతః ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అస్తు = ఆయెను; తం = వానిని; దృష్వా = చూచి; రాజానమ్ = రాజును; విఫలీ = వ్యర్థుడుగా; కృతమ్ = చేయబడినవాడు; చండాల = చండాలుని; రూపిణమ్ = రూపములో ఉన్నవానిని; రామ = రామచంద్ర!; మునిః = ముని; కారుణ్యమ్ = కరుణను; ఆగతః = పొందినవాడు.
భావము:-
విశ్వామిత్ర మహర్షి చండాల రూపములో వ్యర్థుడిగా చేయబడిన త్రిశంకు మహారాజును చూసి జాలి వహించెను.
1.58.14.
అనుష్టుప్.
కారుణ్యాత్ స మహాతేజా
వాక్యం పరమధార్మికః ।
ఇదం జగాద “భద్రం తే”
రాజానం ఘోరరూపిణమ్ ॥
టీక:-
కారుణ్యాత్ = జాలితో; సః = అతడు; మహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడు; వాక్యమ్ = వాక్యమును; పరమ ధార్మికః = మిక్కిలి ధర్మాత్ముడు; ఇదమ్ = ఈ; జగాద = ఉచ్చరించెను; భద్రమ్ = మంగళము అగు గాక; తే = నీకు; రాజానమ్ = రాజును గుఱించి; ఘోర = భయంకర; రూపిణమ్ = రూపములో ఉన్నవానిని.
భావము:-
గొప్పతేజస్సు గల, మిక్కిలి ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహర్షి భయంకర రూపములో ఉన్న రాజుపై జాలి వహించి ” నీకు మంగళమగు గాక !” అనుచు ఈవిధముగ వచించెను.
1.58.15.
అనుష్టుప్.
” కిమాగమనకార్యం తే
రాజపుత్ర! మహాబల! ।
అయోధ్యాధిపతే వీర!
శాపాచ్చండాలతాం గతః” ॥
టీక:-
కిమ్ = ఏమి; ఆగమన = వచ్చిన; కార్యమ్ = పని; తే = నీ యొక్క; రాజపుత్ర = రాజకుమారా; మహాబల = గొప్పబలము గలవాడ; అయోధ్య = అయోధ్యానగరపు; అధిపతే = రాజా; వీర = వీరుడా; శాపాత్ = శాపము వలన; చండాలతామ్ = చండాలత్వమును; గతః = పొందినవాడ.
భావము:-
” మహాబలవంతుడవైన రాజా! నీవు ఏ కార్యమును ఆశించి వచ్చితివి? ఓ వీరుడా ! అయోధ్య మహారాజా!అయ్యో! శాపవశమున చండాలుడైన వాడ !”
1.58.16.
అనుష్టుప్.
అథ తద్వాక్యమాకర్ణ్య
రాజా చండాలతాం గతః ।
అబ్రవీ త్ప్రాంజలి ర్వాక్యం
వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ ॥
టీక:-
అథ = పిమ్మట; తత్ = ఆ; వాక్యమ్ = వాక్యమును; ఆకర్ణ్య = విని; రాజా = రాజు; చండాలతామ్ = చండాలత్వమును; గతః = పొందిన; అబ్రవీత్ = పలికెను; ప్రాంజలిః = చేమోడ్చినవాడు; వాక్యమ్ = వాక్యమును; వాక్యజ్ఞః = పలుకులు తెలిసిన; వాక్యకోవిదమ్ = వాక్యవిశారదుడైన వానికి
భావము:-
ఆ విశ్వామిత్రుని మాటలు విని చండాలత్వము పొందిన త్రిశంకుడు కైమోడ్పుతో నమస్కరించి వాక్యవిశారదుడైన విశ్వామిత్ర మహర్షితో ఇట్లు పలికెను.
1.58.17.
అనుష్టుప్.
“ప్రత్యాఖ్యాతోఽ స్మి గురుణా
గురుపుత్రై స్తథైవ చ ।
అనవాప్యైవ తం కామమ్
మయా ప్రాప్తో విపర్యయః ॥
టీక:-
ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడినవాడను; అస్మి = నేను; గురుణా = గురువు చేతను; గురు = గురువు యొక్క; పుత్రైః = పుత్రుల చేతను; తథా ఏవ చ = ఆ విధముగానే; అనవాప్యైవ = పొందకుండగనే; తమ్ = ఆ; కామమ్ = కోరిక; మయా = నాకు; ప్రాప్తః = ప్రాప్తించినది; విపర్యయః = విపరీత ఫలితము
భావము:-
“గురువుచేతను, గురుపుత్రుల చేతను నిరాకరింపబడిన వాడనై నా కోరిక తీరకుండగనే నాకీ విపరీత ఫలము కలిగి చండాలత్వము లభించినది.
1.58.18.
అనుష్టుప్.
సశరీరో దివం యాయామ్
ఇతి మే సౌమ్య దర్శనమ్ ।
మయా చేష్టం క్రతుశతమ్
తచ్చ నావాప్యతే ఫలమ్ ॥
టీక:-
సశరీరః = దేహముతో; దివమ్ = స్వర్గము; యాయామ్ = వెళ్ళెదను; ఇతి = అని; మే = నా యొక్క; సౌమ్య = సౌమ్యుడా! దర్శనమ్ = అభిప్రాయము; మయా = నా చేత; చేష్టమ్ = చేయబడిన; క్రతు = యాగములు; శతమ్ = వందచేతను; తత్ = దాని; చ; నా వాప్యతే = పొందబడుటలేదు; ఫలమ్ = ఫలితము
భావము:-
ఓ సౌమ్యుడా ! విశ్వామిత్రా! ఈ బొందితో దేవలోకమునకు వెళ్ళవలెనని నా అభిమతము.దానికై నూరు క్రతువులు చేసితిని.కాని నాకు ఫలితము సిద్ధింపలేదు.
1.58.19.
అనుష్టుప్.
అనృతం నోక్తపూర్వం మే
న చ వక్ష్యే కదాచన ।
కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య
క్షత్రధర్మేణ తే శపే ॥
టీక:-
అనృతమ్ = అసత్యమును; న = లేదు; ఉక్తః = పూర్వము పలికినది; పూర్వమ్ = ఇంతకు ముందు; మే = నా చేత; న = లేదు; చ = కూడా; వక్ష్యే = పలుకబడుట; కదాచన = ఎన్నడును; కృచ్ఛ్రేషు = కష్టములు; అపి = కూడా; గతః = పొందినను; సౌమ్య = సౌమ్యగుణములు కలవాడా; క్షత్రధర్మేణ = క్షత్రియధర్మము చేత; తే = నీకు; శపే = ప్రతిజ్ఞ చేయుచుంటిని
భావము:-
ఓ సౌమ్యవంతుడా! నేను పూర్వము అసత్యము పలుకలేదు.ఎట్టి కష్టములు వాటిల్లినా అసత్యము పలుకను. నా క్షత్రియధర్మముపై నీకు ప్రతిజ్ఞ చేయుచున్నాను.
1.58.20.
అనుష్టుప్.
యజ్ఞై ర్బహువిధై రిష్టం
ప్రజా ధర్మేణ పాలితాః ।
గురవశ్చ మహాత్మానః
శీలవృత్తేన తోషితాః ॥
టీక:-
యజ్ఞైః = యజ్ఞములచే; బహు = అనేక; విధైః = విధముల; ఇష్టమ్ = యజ్ఞము (దేవతా పూజ) చేయబడినది.ప్రజాః = ప్రజలు; ధర్మేణ = ధర్మయుక్తముగా; పాలితాః = పాలించబడిరి; గురువః = పెద్దలు; చ = కూడ; మహాత్మానః = మహాత్ములు; శీలవృత్తేన = సత్శీలము/ నడవడికలచే; తోషితాః = సంతోషపెట్టబడిరి.
భావము:-
నేను అనేక విధముల యజ్ఞములు చేసి దేవతలను పూజించితిని. ప్రజలను ధర్మయుక్తముగా పరిపాలించితిని. మహాత్ములను పెద్దలను సచ్చీలము / మంచి నడవడికలచేత సంతోషబెట్టితిని.
1.58.21.
అనుష్టుప్.
ధర్మే ప్రయతమానస్య
యజ్ఞం చాహర్తుమిచ్ఛతః ।
పరితోషం న గచ్ఛంతి
గురవో మునిపుంగవ ॥
టీక:-
ధర్మే = ధర్మములో; ప్రయతమానస్య = ప్రయత్నము చేయుచున్నాను. యజ్ఞమ్ = యజ్ఞమును; చ; అహర్తుమ్ = చేయుటకు; ఇచ్ఛతః = ఇష్టపడుచుంటిని; పరితోషమ్ = సంతోషము; న = లేదు; గచ్ఛంతి = పొందుట లేదు; గురవః = గురువులు; మునిపుంగవ = ఓ మునిశ్రేష్ఠుడా
భావము:-
ఓ మునివర్యా! ధర్మమును ఆచరించుటకు యత్నిస్తుంటిని. యజ్ఞము చేయుటకు ఇచ్చగించుచుంటిని. అయినను నాపై గురువులు ప్రసన్నులు కావుటలేదు.
1.58.22.
అనుష్టుప్.
దైవమేవ పరం మన్యే
పౌరుషం తు నిరర్థకమ్ ।
దైవేనాక్రమ్యతే సర్వమ్
దైవం హి పరమాగతిః ॥
టీక:-
దైవమ్ = దైవము; ఏవ = మాత్రమే; పరమ్ = శ్రేష్ఠమైనదిగా; మన్యే = తలంచెదను; పౌరుషమ్ తు = పురుష ప్రయత్నము; తు = మాత్రము; నిరర్థకమ్ = వ్యర్థము; దైవేన = దైవము చేత; ఆక్రమ్యతే = ఆక్రమించబడును; సర్వమ్ = అంతయు; దైవమ్ = దైవము; హి = మాత్రమే; పరమా = శ్రేష్ఠమైన; గతిః = శరణ్యము.
భావము:-
దైవశక్తియే ఉత్తమము, శ్రేష్ఠము అని తలచెదను. పురుష ప్రయత్నము వ్యర్థము. దైవము సర్వవ్యాపి. దేవుని శరణ్యము మాత్రమే అత్యుత్తమమైనది.
1.58.23.
అనుష్టుప్.
తస్య మే పరమార్తస్య
ప్రసాదమభికాంక్షతః ।
కర్తుమర్హసి భద్రం తే
దైవోపహత కర్మణః ॥
టీక:-
తస్య = అట్టి; మే = నాకు; పరమ = మిక్కిలిగా; ఆర్తస్య = పీడతుడనైనన; ప్రసాదమ్ = అనుగ్రహము; అభికాంక్షతః = అర్థించుచుంటిని; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = అర్హుడవు; భద్రమ్ = మంగళము; తే = నీకు; దైవోపహతకర్మణః = దైవముచే కొట్టబడిన కర్మ గలవాడు, దురదృష్టవంతుడు.
భావము:-
అట్టి మిక్కిలి ఆర్తితో ఉన్న నాకు తమను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పరమ దురదృష్టవంతుడనైన నేను అట్లు ప్రసాదించుటకు తగిన వాడను. నీకు మంగళము అగుగాక!
1.58.24.
అనుష్టుప్.
నాన్యాం గతిం గమిష్యామి
నాన్యః శరణమస్తి మే ।
దైవం పురుషకారేణ
నివర్తయితు మర్హసి" ॥
టీక:-
న = లేదు; అన్యమ్ = వేఱొకరి; గతిమ్ = రక్షణకు; గమిష్యామి = వెళ్ళను; న = లేదు; అన్యః = వేఱొక; శరణమ్ = రక్షకుడు; అస్తి = ఉండుట; మే = నాకు; దైవమ్ = దైవమును; పురుషకారేణ = పురుషకార్యముచేత; నివర్తయితుమ్ = మఱల్చుటకు; అర్హసి = అర్హుడవై ఉంటివి.
భావము:-
నేను వేఱొకరి రక్షణ అర్థించను. నాకు వేఱొక రక్షకుడు లేడు. దైవమును పురుషయత్నముతో మఱల్చుటకు నీవు మాత్రమే అర్హుడవు. కనుక అనుగ్రహించండి.
1.58.25.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
అష్టపంచాశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టపంచాశః = యాభైఎనిమిదవ [58]; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఎనిమిదవ [58] సర్గ సంపూర్ణము.
బాల కాండ
1.59.1.
అనుష్టుప్.
ఉక్తవాక్యం తు రాజానమ్
కృపయా కుశికాత్మజః ।
అబ్రవీ న్మధురం వాక్యమ్
సాక్షా చ్చండాలరూపిణమ్ ॥
టీక:-
ఉక్త = పలుకబడిన; వాక్యం = మాటలు; రాజానమ్ = రాజును గూర్చి; తు; కృపయా = జాలిగా; కుశికాత్మజః = కౌశికుని కుమారుడైన విశ్వామిత్రుడు; అబ్రవీత్ = పలికెను; మధురమ్ = తీయని; వాక్యమ్ = వాక్యమును; సాక్షాత్ = కన్నుల కెదురుగా; చండాల = చండాలమైన; రూపిణమ్ = రూపము గల.
భావము:-
తన ఎదురుగా చండాల రూపము దాల్చి జాలిగా ఉన్న ఆ రాజు త్రిశంకుని మాట విని, విశ్వామిత్రుడు తీయని పలుకులతో ఇట్లు పలికెను.
1.59.2.
అనుష్టుప్.
ఐక్ష్వాక స్వాగతం వత్స!
జానామి త్వాం సుధార్మికమ్ ।
శరణం తే భవిష్యామి
మా భైషీర్నృపపుంగవ! ॥
టీక:-
ఐక్ష్వాక = ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన వాడ; స్వాగతమ్ = నీకు స్వాగతము; వత్స = నాయనా; జానామి = తెలుసుకొంటిని; త్వామ్ = నిన్ను; సు = మంచి; ధార్మికమ్ = ధార్మ పరాయణునిగా; శరణమ్ = రక్షకుడను; తే = నీకు; భవిష్యామి = అయ్యెదను; మా = వలదు; భైషీ = భయపడుట; నృప = రాజ; పుంగవ = రాజశ్రేష్ఠా.
భావము:-
“నాయనా! ఇక్ష్వాకు వంశమున జన్మించిన త్రిశంఖు! నీకు స్వాగతము. నీవు ధార్మికుడవని నేనెరుగుదును. త్రిశంఖు రాజపుంగవా! నేను నీకు రక్షణ నొసగెదను. భయపడ వలదు.
1.59.3.
అనుష్టుప్.
అహమామంత్రయే సర్వాన్
మహర్షీన్ పుణ్యకర్మణః ।
యజ్ఞసాహ్యకరాన్ రాజన్
తతో యక్ష్యసి నిర్వృతః ॥
టీక:-
అహమ్ = నేను; ఆమంత్రయే = ఆహ్వానించెదను; సర్వాన్ = అందరు; మహర్షీన్ = మహర్షులను; పుణ్యకర్మణః = పుణ్యాత్ములైన; యజ్ఞ = యజ్ఞములో; సాహ్య = సహాయము; కరాన్ = చేయ; రాజన్ = రాజా; తతః = ఆ; యక్ష్యసి = యజ్ఞము నిర్వహించగలవు; నిర్వృతః = సంతోషముగా.
భావము:-
రాజా! నేను పుణ్యాత్ములైన మహర్షులనందరినీ యజ్ఞములో సహాయము చేయుటకు ఆహ్వానించెదను. నీవు సంతోషముగా యజ్ఞము పూర్తి చేయగలవు.
1.59.4.
అనుష్టుప్.
గురుశాపకృతం రూపమ్
యదిదం త్వయి వర్తతే ।
అనేన సహ రూపేణ
సశరీరో గమిష్యసి ॥
టీక:-
గురు = గురువుయొక్క; శాప = శాపముచే; కృతమ్ = చేయబడిన; రూపమ్ = రూపము; యత్ = ఏ; ఇదమ్ = ఈ; త్వయి = నీ యందు; వర్తతే = ఉన్నదో; అనేన = ఈ; సహ = సహితముగ; రూపేణ = రూపముతో; సశరీరః = శరీరముతో; గమిష్యసి = వెళ్ళగలవు.
భావము:-
గురుశాపవశమున నీకు ఏర్పడిన ఈ రూపము తోనే సశరీరుడవై స్వర్గమునకు వెళ్ళగలవు.
1.59.5.
అనుష్టుప్.
హస్తప్రాప్తమహం మన్యే
స్వర్గం తవ నరాధిప ।
యస్త్వం కౌశికమాగమ్య
శరణ్యం శరణాగతః" ॥
టీక:-
హస్త = చేతికిగ; ప్రాప్తమ్ = అందినదానిగ; అహమ్ = నేను; మన్యే = తలచెదను; స్వర్గమ్ = స్వర్గమును; తవ = నీకు; నరాధిప = రాజా; యః = ఏ; త్వమ్ = నీవు; కౌశికమ్ = విశ్వామిత్రుని; ఆగమ్య = చేరి; శరణ్యమ్ = శరణు పొందదగిన; శరణాగతః = శరణు వేడితివో.
భావము:-
రాజా! శరణాగత రక్షకుడైన విశ్వామిత్రుని శరణువేడితివి. ఇక నీకు స్వర్గము అందేసినట్లే నా భావన.
1.59.6.
అనుష్టుప్.
ఏవముక్త్వా మహాతేజాః
పుత్రాన్ పరమధార్మికాన్ ।
వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్
యజ్ఞసంభారకారణాత్ ॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; మహాతేజాః = గొప్ప తేజోవంతుడైన విశ్వామిత్రుడు; పుత్రాన్ = పుత్రులను; పరమ = మిక్కిలి; ధార్మికాన్ = ధర్మనిరతులను; వ్యాదిదేశ = ఆజ్ఞాపించెను; మహా = అత్యంత; ప్రాజ్ఞాన్ = ప్రజ్ఞావంతులును; యజ్ఞ = యజ్ఞమునకు వలసిన; సంభారః = సంబారములను; కారణాత్ = సమకూర్చుటకై.
భావము:-
మహాతేజస్వి ఐన విశ్వామిత్రుడు ఇట్లు పలికి, యజ్ఞ సంబారములను సమకూర్చుడని మిక్కిలి ధర్మనిరతులు, ఎంతోప్రజ్ఞావంతులునైన తన కుమారులను ఆజ్ఞాపించెను.
1.59.7.
అనుష్టుప్.
సర్వాన్ శిష్యాన్ సమాహూయ
వాక్యమే తదువాచ హ ।
సర్వా నృషిగణాన్ వత్సాః!
ఆనయధ్వం మమాజ్ఞయా ।
సశిష్య సుహృదశ్చైవ
సర్త్విజః సబహుశ్రుతాన్" ॥
టీక:-
సర్వాన్ = అందరు; శిష్యాన్ = శిష్యులను; సమాహూయ = పిలిచి; వాక్యమ్ = ఆజ్ఞను; ఏతత్ = ఆ; ఉవాచ హ = పలికెను; సర్వాన్ = అందరు; ఋషి = ఋషుల; గణాన్ = సమూహలను; వత్సాః = శిష్యులారా; ఆనయధ్వమ్ = తీసుకొని రండు; మమ = నా; ఆజ్ఞయా = ఆజ్ఞగా; స = తోడను; శిష్య = శిష్యుల; సుహృదః = మిత్రులతోను; చ ఏవ; స = తోడను; ఋత్విజః = ఋత్విక్కుల; స = తోడను; బహుశ్రుతాన్ = విద్యావంతులతోను.
భావము:-
ప్రతిపదార్థము :- సర్వాన్ = అందరు; శిష్యాన్ = శిష్యులను; సమాహూయ = పిలిచి; వాక్యమ్ = ఆజ్ఞను; ఏతత్ = ఆ; ఉవాచ హ = పలికెను; సర్వాన్ = అందరు; ఋషి = ఋషుల; గణాన్ = సమూహలను; వత్సాః = శిష్యులారా; ఆనయధ్వమ్ = తీసుకొని రండు; మమ = నా; ఆజ్ఞయా = ఆజ్ఞగా; స = తోడను; శిష్య = శిష్యుల; సుహృదః = మిత్రులతోను; చ ఏవ; స = తోడను; ఋత్విజః = ఋత్విక్కుల; స = తోడను; బహుశ్రుతాన్ = విద్యావంతులతోను.
1.59.8.
అనుష్టుప్.
యదన్యో వచనం బ్రూయాన్
మద్వాక్య బలచోదితః ।
తత్సర్వ మఖిలేనోక్తమ్
మమాఖ్యేయ మనాదృతమ్" ॥
టీక:-
యత్ = ఏ; అన్యః = వ్యతిరేకముగ; వచనం = మాటను; బ్రూయాన్ = పలుకునో; మత్ = నా; వాక్యబల = సందేశముచే; చోదితః = ప్రేరేపింపబడిన వాడై; తత్ సర్వమ్ = అది అంతయు; అఖిలేన = అందరిచేతను; ఉక్తమ్ = పలుకబడిన; మమ = నాకు; ఆఖ్యేయమ్ = చెప్పవలెను; అనాదృతమ్ = అగౌరవ పూర్వకమైన.
భావము:-
నా సందేశము విని, ఇతరులు ఎవరెవరు ఏమేమి వ్యతిరేకముగను, అగౌరవముగను పలికెదరో వారి పలుకులు అన్నియు నాకు తెలియ చేయవలెను.”
1.59.9.
అనుష్టుప్.
తస్య తద్వచనం శ్రుత్వా
దిశో జగ్ముస్తదాజ్ఞయా ।
ఆజగ్మురథ దేశేభ్యః
సర్వేభ్యో బ్రహ్మవాదినః ॥
టీక:-
తస్య = అతని యొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; దిశః = దిక్కులను గూర్చి; జగ్ముః = వెళ్ళిరి; తత్ = అతని; ఆజ్ఞయా = ఆజ్ఞచే; ఆజగ్ముః = వచ్చిరి; అథ = తరువాత; దేశేభ్యః = దేశములనుండి; సర్వేభ్యః = సమస్తమైన; బ్రహ్మవాదినః = వేదవిద్యాధికులైన ఋషులు.
భావము:-
విశ్వామిత్రుని ఆజ్ఞానుసారము, శిష్యులు నాలుగు దిక్కులకు వెళ్ళి ఆహ్వానించిరి. సకల దేశములనుండి వేదవిదులైన ఋషులు అందరును వచ్చిరి.
1.59.10.
అనుష్టుప్.
తే చ శిష్యాః సమాగమ్య
మునిం జ్వలితతేజసమ్ ।
ఊచుశ్చ వచనం సర్వే
సర్వేషాం బ్రహ్మవాదినామ్ ॥
టీక:-
తే = ఆ; చ = కూడా; శిష్యాః = శిష్యులు; సమాగమ్య = తిరిగి వచ్చి; మునిమ్ = ముని గూర్చి; జ్వలిత = ప్రకాశించుచున్న; తేజసమ్ = తేజస్సు కలవాడు; ఊచుః = చెప్పిరి; చ; వచనమ్ = మాటను; సర్వే = అందరును; సర్వేషామ్ = సమస్తమైన; బ్రహ్మవాదినామ్ = వేదవిదులు.
భావము:-
శిష్యులు అందరు తిరిగి వచ్చి, వేదవిదులైన సకల ఋషులు పలికిన మాటలను తేజస్సుతో వెలుగుచున్న విశ్వామిత్రునికి చెప్పిరి.
1.59.11.
అనుష్టుప్.
శ్రుత్వా తే వచనం సర్వే
సమాయాంతి ద్విజాతయః ।
సర్వదేశేషు చాగచ్ఛన్
వర్జయిత్వా మహోదయమ్ ॥
టీక:-
శ్రుత్వా = విని; తే = మీ యొక్క; వచనమ్ = మాటను; సర్వే = అందరును; సమాయాంతి = వచ్చుచున్నారు; ద్విజాతయః = బ్రాహ్మణులు; సర్వదేశేషు = సమస్త దేశములందు ఉన్న; ఆగచ్ఛన్ = వచ్చిరి; వర్జయిత్వా = మినహాయించి; మహోదయమ్ = మహోదయుడు అను వసిష్ఠుని పుత్రుడు.
భావము:-
“మీ సందేశము విని, మహోదయుడు అను వసిష్ఠుని పుత్రుడు తక్క, సకల దేశములలో ఉన్న బ్రాహ్మణోత్తములు వచ్చి యున్నారు.
1.59.12.
అనుష్టుప్.
వాసిష్ఠం తచ్ఛతం సర్వమ్
క్రోధపర్యాకు లాక్షరమ్ ।
యదాహ వచనం సర్వమ్
శృణు త్వం మునిపుంగవ ॥
టీక:-
వాసిష్ఠమ్ = వసిష్టుని యొక్క కుమారులు; తత్ = ఆ; శతమ్ = నూరుగురు; సర్వమ్ = అందరును; క్రోధపర్య = కోపముచే; ఆకులః = కలత చెందిన; అక్షరమ్ = మాటలను; యత్ = ఏ; ఆహ = పలికెనో; వచనమ్ = మాటను; సర్వమ్ = అంతటినీ; శృణు = వినుము; త్వమ్ = నీవు; మునిపుంగవ = మునిశ్రేష్ఠా.
భావము:-
మునిశ్రేష్ఠా! వసిష్ఠుని నూరుగురు కుమారులు కోపముతో ఏమి పలికిరో ఆ పలుకులు వినుము.
1.59.13.
అనుష్టుప్.
క్షత్రియో యాజకో యస్య
చండాలస్య విశేషతః ।
కథం సదసి భోక్తారో
హవిస్తస్య సురర్షయః ॥
టీక:-
క్షత్రియః = క్షత్రియుడు; యాజకః = యజ్ఞము చేయించువాడు; యస్య = ఎవరికి; చండాలస్య = చండాలుడైన; విశేషతః = విశేషించి; కథమ్ = ఎట్లు; సదసి = యజ్ఞసదస్సు నందు; భోక్తారః = భుజించ గలరు; హవిః = హవిస్సును; తస్య = వాని యొక్క; సురః = సురులును; ఋషయః = ఋషులును.
భావము:-
యాజకడు క్షత్రియుడు అందునా చండాలుడు. ఇక హవిస్సును దేవతలు ఋషులు ఏ విధముగా స్వీకరించెదరు?
1.59.14.
అనుష్టుప్.
బ్రాహ్మణా వా మహాత్మానో
భుక్త్వా చండాలభోజనమ్ ।
కథం స్వర్గం గమిష్యంతి
విశ్వామిత్రేణ పాలితాః" ॥
టీక:-
బ్రాహ్మణా = బ్రాహ్మణులు; వా = ఐనను; మహాత్మానః = మహాత్ములు; భుక్త్వా = భుజించి; చండాల భోజనమ్ = చండాలుడు పెట్టిన భోజనమును; కథమ్ = ఎట్లు; స్వర్గమ్ = స్వర్గమును గూర్చి; గమిష్యంతి = వెళ్ళగలరు; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచే; పాలితాః = పాలింపబడిన.
భావము:-
విశ్వామిత్రుని ఆజ్ఞానుసారము చండాలుడు పెట్టిన భోజనము స్వీకరించిన మహాత్ములైన బ్రాహ్మణు లైనను, స్వర్గమునకు ఎట్లు వెళ్ళగలరు?
1.59.15.
అనుష్టుప్.
ఏతద్వచననైష్ఠుర్యమ్
ఊచుః సంరక్తలోచనాః ।
వాసిష్ఠా మునిశార్దూల
సర్వే తే సమహోదయాః ॥
టీక:-
ఏ తత్ = ఆ; వచన నైష్ఠుర్యమ్ = పరుష వాక్యములను; ఊచుః = పలికిరి; సంరక్తలోచనాః = ఎఱ్ఱబడిన నేత్రములు కలవారై; వాసిష్ఠాః = వసిష్ఠ కుమారులు; మునిశార్దూల = మునిశ్రేష్ఠా; సర్వే = సమస్తమైన; తే = వారు; స = కూడి ఉన్న; మహోదయాః = మహోదయునితో.
భావము:-
ఓ! మునిశ్రేష్ఠా! మహోదయుడు సహితంగా వసిష్ఠుని కుమారులు అందరును క్రోధముచే ఎఱుపెక్కిన నేత్రములు కలవారై ఈ పరుషపు మాటలు పలికిరి.
1.59.16.
అనుష్టుప్.
తేషాం తద్వచనం శ్రుత్వా
సర్వేషాం మునిపుంగవః ।
క్రోధసంరక్తనయనః
సరోష మిదమబ్రవీత్ ॥
టీక:-
తేషామ్ = అందరి; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; సర్వేషామ్ = అందరి యొక్క; మునిపుంగవః = మునిశ్రేష్ఠుడు; క్రోధ = క్రోధముచే; సంరక్త = ఎఱ్ఱబడిన; నయనః = నేత్రములు కలవాడై; సరోషమ్ = క్రోధముతో; ఇదమ్ = ఈ మాటను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
మునిపుంగవుడు విశ్వామిత్రుడు వారి మాటలు విని; క్రోధముతో ఎఱ్ఱబడిన కన్నులు కలవాడై ఈ విధముగా పలికెను.
1.59.17.
అనుష్టుప్.
యే దూషయన్త్యదుష్టం మామ్
తప ఉగ్రం సమాస్థితమ్ ।
భస్మీభూతా దురాత్మానో
భవిష్యంతి న సంశయః ॥
టీక:-
యే = ఎవరు; దూషయంతి = దూషించుచున్నారో; అదుష్టమ్ = దుష్టుడు కాని వానిని; మామ్ = నన్ను; తపః = తపస్సు; ఉగ్రమ్ = ఉగ్రమైన; సమాస్థితమ్ = ఆచరించుచున్న; భస్మీభూతా = భస్మమైనవారుగా; దురాత్మానః = దురాత్ములు; భవిష్యంతి = అయ్యెదరు; న = లేదు; సంశయః = సంశయము.
భావము:-
ఎటువంటి దోషములు లేనివాడను, దీక్షగా ఉగ్రతపస్సు చేయుచున్నవాడను నగు నన్ను దూషించు ఆ దురాత్ములు నిస్సంశయముగా భస్మమైపోయెదరు.
1.59.18.
అనుష్టుప్.
అద్య తే కాలపాశేన
నీతా వైవస్వతక్షయమ్ ।
సప్తజాతిశతాన్యేవ
మృతపాః సంతు సర్వశః ॥
టీక:-
ఆద్యః = ఇప్పుడు; తే = వారు; కాలపాశేన = యమపాశముచే; నీతా = కొనిపోబడినవారై; వైవస్వతక్షయమ్ = యమలోకము గూర్చి; సప్త = ఏడు; జాతి = జన్మములు; శతాన్యేవ = వందేసి పాటు; మృతపాః = శవభక్షకులుగా; సంతు = అగుదురు గాక; సర్వశః = అన్ని విధముల.
భావము:-
ఇప్పుడు వారందరును యమపాశబద్ధులై యమలోకములో ఏడువందల జన్మముల పాటు శవభక్షకులై ఉండెదరు గాక.
1.59.19.
అనుష్టుప్.
శ్వమాంస నియతాహారా
ముష్టికా నామ నిర్ఘృణాః ।
వికృతాశ్చ విరూపాశ్చ
లోకాననుచర న్త్విమాన్ ॥
టీక:-
శ్వమాంస = కుక్క మాంసము; నియతాహారాః = నిత్యము ముఖ్యాహారంగా భక్షించుచు; ముష్టికా = ముష్టికు అను; నామ = పేరు గల; నిర్ఘృణాః = జాలి, సిగ్గు లేని జాతివారై; వికృతాః = వికారము గలవారై; చ; విరూపాః = చెడు రూపము గలవారై; చ; లోకాన్ = లోకములో; అనుచరంతు = సంచరించెదరు; ఇమాన్ = ఈ.
భావము:-
వసిష్ఠకుమారులందరు కుక్క మాంసము తిను, నిర్దయులు, సిగ్గుమాలినవారును ఐన ముష్టిక జాతివారై, వికారము పొంది వికృతరూపులై తిరుగాడుచుండెదరు గాక.
1.59.20.
అనుష్టుప్.
మహోదయశ్చ దుర్బుద్ధిః
మామదూష్యం హ్యదూషయత్ ।
దూషితః సర్వలోకేషు
నిషాదత్వం గమిష్యతి ॥
టీక:-
మహోదయః = ఆ మహానుబావుడు; చ; దుర్బుద్ధిః = దుర్భుద్ధి కల; మామ్ = నన్ను; అదూష్యమ్ = దూషింపకూడని; హి; అదూషయత్ = దూషించినాడు; దూషితః = దూషింపబడినవాడై; సర్వ = అన్ని; లోకేషు = లోకములందును; నిషాదత్వమ్ = కిరాతకత్వమును; గమిష్యతి = పొందగలడు.
భావము:-
దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు, అందరిచే దూషింపబడు కిరాతకత్వము పొందుగాక.
1.59.21.
అనుష్టుప్.
ప్రాణాతిపాత నిరతో
నిరనుక్రోశతాం గతః ।
దీర్ఘకాలం మమ క్రోధాత్
దుర్గతిం వర్తయిష్యతి" ॥
టీక:-
ప్రాణాతిపాత = ప్రాణములు తీయుటలో; నిరతః = ఆసక్తి గలవాడై; నిరనుక్రోశతామ్ = నిర్దయను; గతః = పొందినవాడై; దీర్ఘకాలమ్ = చాలా కాలము; మమ = నా యొక్క; క్రోధాత్ = కోపము వలన; దుర్గతిమ్ = నరకమున; వర్తయిష్యతి = ఉండుగాక.
భావము:-
నా క్రోధము కారణముగా, ఆ మహోదయుడు నిర్దయుడు, హంతకుడు అగుగాక. చాలా కాలము నరకమున పడి ఉండుగాక.”
1.59.22.
అనుష్టుప్.
ఏతావదుక్త్వా వచనమ్
విశ్వామిత్రో మహాతపాః ।
విరరామ మహాతేజా
ఋషిమధ్యే మహామునిః ॥
టీక:-
ఏతావత్ = అంతమాత్రము; ఉక్త్వా = పలికి; వచనమ్ = మాటను; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతపాః = గొప్ప తపస్వి; విరరామ = విరమించెను; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; ఋషి = ఋషుల; మధ్యే = నడుమ; మహామునిః = మహాముని.
భావము:-
మహాతపస్సంపన్నుడు గొప్పతేజస్సు గలవాడును అగు విశ్వామిత్ర మహాముని ఋషులమధ్య ఇట్లు పలికి విరమించెను.
1.59.23.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనషష్టితమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనషష్టితమః [59] = ఏభై తొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైతొమ్మిదవ [59] సర్గ సంపూర్ణము
బాల కాండ
1.60.1.
అనుష్టుప్.
తపోబలహతాన్ కృత్వా
వాసిష్ఠాన్ సమహోదయాన్ ।
ఋషిమధ్యే మహాతేజా
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీక:-
తపః = తపవలన కలిగిన; బల = శక్తిచే; హతాన్ = దెబ్బకొట్టుట; కృత్వా = చేసి; వాసిష్ఠాన్ = వసిష్ఠ కుమారులను; స = సహితముగా; మహోదయాన్ = మహోదయునితో; ఋషిః = ఋషుల; మధ్యే = నడుమ; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభ్యభాషత = పలికెను.
భావము:-
గొప్ప తేజశ్శాలి ఐన విశ్వామిత్రుడు మహోదయునితో సహా వసిష్ఠుని కుమారులను అందరిని తన శపించి ఋషులతో ఇట్లు పలికెను.
1.60.2.
అనుష్టుప్.
“అయమిక్ష్వాకు దాయాదః
త్రిశంకురితి విశ్రుతః ।
ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ
మాం చైవ శరణం గతః ॥
టీక:-
అయమ్ = ఇతడు; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; దాయాదః = వంశజుడు; త్రిశంకః = త్రిశంకువు; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధి చెందిన వాడు; ధర్మిష్ఠః = ధర్మాత్ముడు; చ; వదాన్యః = గొప్ప దాతయును; చ; మామ్ = నా; చైవ; శరణం = రక్షణ; గతః = పొందినాడు.
భావము:-
“ఇతడు ఇక్ష్వాకు వంశజుడైన త్రిశంకువు. ధర్మనిరతుడు మఱియు గొప్ప దాత. నా శరణు పొందినాడు.
1.60.3.
అనుష్టుప్.
తేనానేన శరీరేణ
దేవలోక జిగీషయా ।
యథాఽ యం స్వశరీరేణ
స్వర్గలోకం గమిష్యతి? ॥
టీక:-
తేన = అటువంటి; అనేన = ఈ; శరీరేణ = శరీరముతో; దేవలోక = స్వర్గలోకము; జిగీషయా = వెళ్ళవలెనను కోరిక; యథా = ఏ విధముగా; అయమ్ = ఇతడు; స్వ = స్వంత; శరీరేణ = శరీరము; స్వర్గలోకమ్ = స్వర్గలోకమునకు; గమిష్యతి = వెళ్ళగలడు.
భావము:-
ఇతడు ఎట్లు తన శరీరముతోడనే స్వర్గలోకమునకు వెళ్ళవలెనని కోరినాడో అట్లు వెళ్ళగలడు?
1.60.4.
అనుష్టుప్.
తథా ప్రవర్త్యతాం యజ్ఞో
భవద్భిశ్చ మయా సహ” ।
విశ్వామిత్రవచః శ్రుత్వా
సర్వ ఏవ మహర్షయః ॥
టీక:-
తథా = అట్లే; ప్రవర్త్యతామ్ = అగుగాక; యజ్ఞః = యజ్ఞము; భవద్భిః = మీచే; చ; మయా = నాతో; సహ = కలిసి; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; వచః = అడిగిన మాటను; శ్రుత్వా = విని; సర్వ = అందరు; ఏవ = కూడ; మహర్షయః = మహర్షులు.
భావము:-
ఆ విధముగా మీరందరును నాతో కలిసి యజ్ఞమును చేసెదరు గాక”. అట్లు పలికిన విశ్వామిత్రుని మాటలు మహర్షులు అందరు వినిరి.
1.60.5.
అనుష్టుప్.
ఊచుః సమేత్య సహితా
ధర్మజ్ఞా ధర్మసంహితమ్ ।
“అయం కుశికదాయాదో
మునిః పరమకోపనః ॥
టీక:-
ఊచుః = పలికిరి; సమేత్య = అక్కడ ఉన్న వారును; సహితాః = కలిసి; ధర్మజ్ఞాః = ధర్మము నెరిగిన వారును; ధర్మ సంయుతమ్ = ధర్మ బద్ధముగా; అయమ్ = ఈ; కుశిక దాయాదః = కుశిక వంశీయులు; మునిః = ముని; పరమ కోపనః = ఎక్కువ కోపము గల.
భావము:-
విశ్వామిత్రుని మాటలు వినిన ధర్మజ్ఞులైన ఆ మహర్షులందరును ధర్మసమ్మతమైన మాటను ఏక గ్రీవముగ ఇట్లు పలికిరి. “ఈ కౌశికుడు (కుశుని వంశములో జన్మించిన విశ్వామిత్రుడు) పరమ కోపిష్ఠి.
1.60.6.
అనుష్టుప్.
యదాహ వచనం సమ్యక్
ఏతత్కార్యం న సంశయః ।
అగ్నికల్పో హి భగవాన్
శాపం దాస్యతి రోషితః ॥
టీక:-
యత్ = ఏ; ఆహ = పలుకుచున్నాడో; వచనమ్ = మాటను; సమ్యక్ = బాగుగాకావలె; ఏతత్ = ఆ; కార్యమ్ = కార్యమును; న = లేకుండ; సంశయః = సంశయములు; అగ్నికల్పః = అగ్నితో సమానమైన; భగవాన్ = పూజ్యనీయుడు; శాపమ్ = శాపమును; దాస్యతి = ఇచ్చును; రోషితః = కోపించినవాడైన.
భావము:-
ఈయన చెప్పిన విధముగా చేయ వలెను. ఈ విశ్వామిత్రునిది అగ్నివంటి తీవ్రమైన స్వభావము. కోపోద్రిక్తుడైన శపించ గలడు.
1.60.7.
అనుష్టుప్.
తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః
సశరీరో యథా దివమ్ ।
గచ్ఛే దిక్ష్వాకుదాయాదో
విశ్వామిత్రస్య తేజసా ॥
టీక:-
తస్మాత్ = అందువలన; ప్రవర్త్యతాం = చేయబడు గాక; యజ్ఞః = యజ్ఞము; స = సహితముగ; శరీరః = తన శరీరముతో; యథా = ఏ విధముగా; దివమ్ = స్వర్గమును గూర్చి; గచ్ఛేత్ = వెళ్ళగలడో; ఇక్ష్వాకుదాయాదః = ఇక్ష్వాకు వంశజుడైన త్రిశంకువు; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; తేజసా = తేజస్సు వలన.
భావము:-
అందుచేత, విశ్వామిత్రుని తేజస్సు వలన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు పోవునట్లు యజ్ఞము చేయవలెను.
1.60.8.
అనుష్టుప్.
తథా ప్రవర్త్యతాం యజ్ఞః
సర్వే సమధితిష్ఠత” ।
ఏవముక్త్వా మహర్షయః
చక్రుస్తాస్తాః క్రియాస్తదా ॥
టీక:-
తథా = ఆ విధముగా; ప్రవర్త్యతామ్ = చేయబడును గాక; యజ్ఞః = యజ్ఞము; సర్వే = ఎల్లరు; సమధితిష్ఠత = ప్రారంభింపుడు; ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహర్షయః = మహర్షులు; చక్రుః = చేసిరి; తాస్తాః = ఆ యా; క్రియాః = కార్యములను; తదా = అప్పుడు.
భావము:-
ఆ విధముగా అందరు యజ్ఞమును ప్రారంభింపుడు” అని మహర్షులు పలికి క్రతుకార్యములను ప్రారంభించిరి.
1.60.9.
అనుష్టుప్.
యాజకశ్చ మహాతేజా
విశ్వామిత్రోఽ భవత్ క్రతౌ ।
ఋత్విజ శ్చానుపూర్వ్యేణ
మంత్రవ న్మంత్రకోవిదాః ॥
టీక:-
యాజకః = యజ్ఞము నిర్వహించుటలో ప్రధాన ఋత్విక్కు; చ; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభవత్ = అయ్యెను; క్రతౌ = యజ్ఞములో; ఋత్విజః = ఋత్విక్కులు; చ = సహితము; అనుపూర్వ్యేణ = ఒక క్రమములో, నియమబద్దముగ; మంత్రవత్ = మన్త్రోక్తముగా; మంత్ర = మంత్రపఠన; కోవిదాః = మంత్ర నిష్ణాతులు.
భావము:-
ఆ క్రతువులో మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు ప్రధాన ఋత్త్విక్కుగా వ్యవహరించెను. మంత్రవేత్తలైన ఋత్విక్కులు నియమబద్దముగ, మంత్రోక్తముగ.
1.60.10.
అనుష్టుప్.
చక్రుః సర్వాణి కర్మాణి
యథాకల్పం యథావిధి ।
తతః కాలేన మహతా
విశ్వామిత్రో మహాతపాః ॥
టీక:-
చక్రుః = చేసిరి; సర్వాణి = అన్ని; కర్మాణి = క్రతుకర్మలను; యథా = ఎట్లుచెప్పబడినదో అట్లు; కల్పమ్ = కల్పమునందు {కల్పము- వేదాంగమైన విధి తెలిపెడి నియమన గ్రంథము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను షడ్వేదాంగములలలో / శాస్త్రషట్కములలో ఒకటి, కల్పములు షోడశ (16) అని, షడ్వింశతి (26) అని ఇలా పాఠ్యంతరములు ఉన్నాయి}; యథావిధి = పద్దతిప్రకారము; తతః = ఆ తరువాత; కాలేన = కాలమునకు; మహతా = చాల; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతపః = మహాతపశ్శాలి.
భావము:-
ఋత్విక్కులు నియమబద్దముగ, మంత్రోక్తముగ ఆయా క్రతు కర్మములను యథావిధిగా కల్పోక్త ప్రకారముగా చేసిరి. తరువాత మహాతపశ్శాలియైన విశ్వామిత్రుడు చాలా కాలమునకు
గమనిక:-
కల్పము- వేదాంగమైన విధి తెలిపెడి నియమన గ్రంథము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను షడ్వేదాంగములలలో / శాస్త్రషట్కములలో ఒకటి, కల్పములు షోడశ (16) అని, షడ్వింశతి (26) అని ఇలా పాఠ్యంతరములు ఉన్నాయి.
1.60.11.
అనుష్టుప్.
చకారావాహనం తత్ర
భాగార్థం సర్వదేవతాః ।
నాభ్యాగమం స్తదాఽఽ హూతా
భాగార్థం సర్వదేవతాః ॥
టీక:-
చకార = చేసెను; ఆవాహనం = ఆవాహనము; తత్ర = అక్కడ; భాగ = హవిర్భాగముల; అర్థమ్ = స్వీకరించుట కొరకు; సర్వ = సమస్త; దేవతాః = దేవతలను; న = జరగలేదు; అభాగ్యమన్ = ఏతెంచుట; తదా = అప్పుడు; ఆహుతాః = ఆహ్వానింపబడిన; భాగ = హవిర్భాగముల; అర్థమ్ = కొరకు; సర్వ = సమస్త; దేవతాః = దేవతలను;
భావము:-
హవిర్భాగములు స్వీకరించ మని దేవతల నందరిని ఆహ్వానించెను. ఐనను దేవత లెవరును హవిర్భాగములనుస్వీకరించుటకు రాలేదు.
1.60.12.
అనుష్టుప్.
తత్ర క్రోధసమావిష్టో
విశ్వామిత్రో మహామునిః ।
స్రువముద్యమ్య సక్రోధః
త్రిశంకు మిదమబ్రవీత్ ॥
టీక:-
తత్రః = అక్కడ; క్రోధః = కోపము; సమావిష్టః = ఆవరించినవాడై; విశ్వామిత్రః = విశ్వామిత్ర; మహామునిః = మునీశ్వరుడు; స్రువమ్ = స్రువమును; ఉద్యమ్య = ఎత్తి పట్టి; సక్రోధః = క్రోధముతో; త్రిశంకమ్ = త్రిశంకునితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను.
భావము:-
హవిర్భాగములను స్వీకరించుటకు ఏ దేవతలును రానందులకు విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై, స్రువమును (హోమములో నెయ్యి వ్రేల్చుటకు ఐన యజ్ఞోపకరణము) ఎత్తిపెట్టి త్రిశంకువుతో ఇట్లు పలికెను.
గమనిక:-
స్రుక్కు- స్రుక్కు స్రువము అని హోమమునందు నేతిని వ్రేల్చుటకు వాడు కొయ్య ఉద్దరిణి / మిల్లిగరిట వంటి పరికరముల జత, స్రుక్కు తో నేతిని నేతిపాత్రనుండి తీసుకుని, స్రువము నందు వేసి, ఆ స్రువముతో అగ్నికి సమర్పింతురు. స్రువము చివర అరచేతివలె ఉండును.
1.60.13.
అనుష్టుప్.
పశ్య మే తపసో వీర్యమ్
స్వార్జితస్య నరేశ్వర! ।
ఏష త్వాం సశరీరేణ
నయామి స్వర్గమోజసా ॥
టీక:-
పశ్య = చూడుము; మే = నా; తపసః = తపస్సు యొక్క; వీర్యమ్ = శక్తిని; స్వార్జితస్య = స్వయముగా సంపాదించబడిన; అస్య = అట్టి; నరేశ్వర = రాజా; ఏషః = ఈ నేను; త్వామ్ = నిన్ను; సశరీరేణ = శరీరముతో; నయామి = పొందింప చేసెదను; స్వర్గమ్ = స్వర్గమును; ఓజసా = తేజస్సుతో.
భావము:-
రాజా! నేను స్వయముగా సంపాదించిన నా తపశ్శక్తిని చూడుము. నా తేజస్సుతో నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను.
1.60.14.
అనుష్టుప్.
దుష్ప్రాపం సశరీరేణ
దివం గచ్ఛ నరాధిప! ।
స్వార్జితం కించిదప్యస్తి
మయా హి తపసఃఫలమ్" ॥
టీక:-
దుష్ప్రాపమ్ = పొందుటకు వీలు కాని; సశరీరేణ = శరీరముతో; దివమ్ = స్వర్గమునకు; గచ్ఛ = వెళ్ళుము; నరాధిప = రాజా; స్వార్జితమ్ = స్వయముగా సంపాదించిన; కించిదపి = కొంచెము; అస్తి = ఉన్నది; మయాహి = నాచే; తపసః = తపస్సుయొక్క; ఫలమ్ = ఫలితముగా దక్కునది.
భావము:-
రాజా! సశరీరముతో వెళ్ళుటకు సాధ్యము కాని స్వర్గమునకు వెళ్ళుము. ఓ రాజా! స్వార్జితమైన నా తపః ఫలము కొంచెము ఉన్నది.
1.60.15.
అనుష్టుప్.
“రాజన్ స్వతేజసా తస్య
సశరీరో దివం వ్రజ” ।
ఉక్తవాక్యే మునౌ తస్మిన్
సశరీరో నరేశ్వరః ॥
టీక:-
రాజన్ = రాజా; స్వ = నా; తేజసా = తేజస్సుతో; తస్య = దాని యొక్క; సశరీరః = సశరీరముతో; దివమ్ = స్వర్గమునకు; వ్రజ = వెళ్ళుము; ఉక్త = చెప్ప బడిన; వాక్యే = మాటను; మునౌ = మునిచే; తస్మిన్ = ఆ యొక్క; సశరీరః = శరీరముతో; నరేశ్వరః = రాజు.
భావము:-
"రాజా! నా స్వార్జిత తపశ్శక్తిచే నీవు సశరీరుడవై స్వర్గమునకు వెళ్ళుము" అని త్రిశంకువుతో విశ్వామిత్రుడు పలికెను. ఆ పలుకులతో త్రిశంకు మహారాజు తన శరీరముతో
1.60.16.
అనుష్టుప్.
దివం జగామ కాకుత్స్థ!
మునీనాం పశ్యతాం తదా ।
దేవలోకగతం దృష్ట్వా
త్రిశంకుం పాకశాసనః ॥
టీక:-
దివమ్ = స్వర్గమునకు; జగామ = వెళ్ళెను; కాకుత్స్థ = రామ చంద్ర; మునీనామ్ = మునులందరు; పశ్యతామ్ = చూచుచుండగా; తదా = అప్పుడు; దేవలోక = స్వర్గలోకమునకు; గతమ్ = చేరవచ్చిన; దృష్ట్వా = చూసి; త్రిశంకమ్ = త్రిశంకువును; పాకశాసనః = దేవేంద్రుడు.
భావము:-
రామా! అప్పుడు త్రిశంకువు మునులందరు చూచుచుండగా తన శరీరముతో స్వర్గమునకు వెళ్ళెను. అట్లు స్వర్గమునకు వచ్చిన త్రిశంకువును చూసి దేవేంద్రుడు.
గమనిక:-
పాక అను రాక్షసుణ్ణి శాసించువాడు, చంపువాడు. ఇంద్రుడు
1.60.17.
అనుష్టుప్.
సహ సర్వైః సురగణైః
ఇదం వచనమబ్రవీత్ ।
“త్రిశంకో గచ్ఛ భూయస్త్వమ్
నాసి స్వర్గకృతాలయః ॥
టీక:-
సహ = కూడ ఉన్న; సర్వై = అందరు; సుర = దేవతల; గణైః = సమూహములతో; ఇదమ్ = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికిరి; త్రిశంకః = ఓ త్రిశంకా; గచ్ఛ = వెళ్ళుము; భూయః = మరల; త్వమ్ = నీవు; న = ఉండలేదు; అసి = అయి; స్వర్గ = స్వర్గలోకమును; కృత = చేపట్టిన; ఆలయః = నివాసముగా కలవాడివి.
భావము:-
దేవతలతో అందరితోపాటు ఉన్న దేవేంద్రుడు, సశరీరముతో స్వర్గమునకు వచ్చిన త్రిశంకువుతో, "నీవు స్వర్గవాసమునకు అనర్హుడవు. తిరిగి వెడలిపొమ్ము.
1.60.18.
అనుష్టుప్.
గురుశాపహతో మూఢ
పత భూమిమవాక్ఛిరాః" ।
ఏవముక్తో మహేంద్రేణ
త్రిశంకు రపతత్పునః ॥
టీక:-
గురు = గురువు యొక్క; శాప = శాపమునకు; హతః = గురియైన; మూఢ = మూర్ఖుడవు; పత = పడుము; భూమిమ్ = భూలోకమున; అవాక్ఛిరాః = తలక్రిందలుగా; ఏవమ్ = ఇట్లు; ఉక్తః = పలుకబడిన; మహేంద్రేణ = మహేన్ద్రునిచే; త్రిశంకః = త్రిశంకువు; అపతత్ = పడసాగెను; పునః = మరల.
భావము:-
గురుశాప హతుడవైన మూర్ఖుడా! నీవు తిరిగి భూమిపై తలక్రిందలుగా పడిపొమ్ము." అని మహేంద్రుడు అనడంతో. త్రిశంకువు మరల పడిపోసాగెను.
1.60.19.
అనుష్టుప్.
విక్రోశమాన “స్త్రాహీతి”
విశ్వామిత్రం తపోధనమ్ ।
తచ్ఛ్రుత్వా వచనం తస్య
క్రోశమానస్య కౌశికః ॥
టీక:-
విక్రోశమానః = రోదించుచు; త్రాహి ఇతి = రక్షింపుమని; విశ్వామిత్రం = విశ్వామిత్రుడు గూర్చి; తపోధనమ్ = తపోధనుడైన; తత్ = అది; శ్రుత్వా = విని; వచనమ్ = మాటను; తస్య = అతని; క్రోశ మానస్య = అరుచుచున్న; కౌశికః = విశ్వామిత్రుడు.
భావము:-
"రక్షింపుము రక్షింపు" మని రోదించుచు దివి నుండి భువికి త్రిశంకువు పడిపోవుచుండెను. అలా రోదిస్తూ వేడుటను విని విశ్వామిత్రుడు.
1.60.20.
అనుష్టుప్.
రోషమాహారయ త్తీవ్రమ్
”తిష్ఠ తిష్ఠేతి” చాబ్రవీత్ ।
ఋషిమధ్యే స తేజస్వీ
ప్రజాపతి రివాపరః ॥
టీక:-
రోషమ్ = కోపమును; ఆహారయత్ = తెచ్చుకొనెను; తీవ్రమ్ = తీవ్రమైన; తిష్ఠ తిష్ఠ ఇతి = ఆగుము ఆగుము అని; అబ్రవీత్ = పలికెను; ఋషిః = ఋషుల; మధ్యే = నడుమ ఉన్న; స = ఆ; తేజస్వీ = తేజశ్శాలి; ప్రజాపతిః = ప్రజాపతి; ఇవ = వలె; ఆపరః = మఱియొక.
భావము:-
పడిపోవుచున్న త్రిశంకువు యొక్క ఆర్తనాదము విని, తీవ్రమైన కోపముతో ఋషుల నడుమ మరియొక ప్రజాపతి వలె ఉన్న తేజశ్శాలి ఐన విశ్వామిత్రుడు "ఆగుము! ఆగుము!" అని ఆజ్ఞాపించెను.
1.60.21.
అనుష్టుప్.
సృజన్ దక్షిణమార్గస్థాన్
సప్తర్షీనపరాన్ పునః ।
నక్షత్రమాలా మపరాం
అసృజత్ క్రోధమూర్చ్ఛితః ॥
టీక:-
సృజన్ = సృష్టించుచు; దక్షిణమార్గః = దక్షిణాచారము: ఆస్థాన్ = ఆదారముగ; సప్తర్షీన్ = సప్త ఋషిమండలమును; అపరాన్ = మరొకదానిని; పునః = మరల; నక్షత్రమాలామ్ = పాలపుంతను; అపరామ్ = మరియొక దానిని; అసృజత్ = సృష్టించెను; క్రోధః = కోపోద్రిక్తముతో; మూర్ఛితః = బుద్ధివైపరీత్యముతో.
భావము:-
కోపోద్రిక్తుడై వివశుడైన విశ్వామిత్రుడు దక్షిణచారామున ఇంకొక క్రొత్త సప్తర్షి మండలమును మరల మరొక పాలపుంతను సృష్టించెను.
గమనిక:-
*- దక్షిణ మార్గము, ఆచారము- పిత్రుదేవతలు పోవుమార్గము, వేదవిహితమైన వామ, దక్షిణ ఆచారములలోనిది, వసిష్ఠ, శుక, సనక, సనందన, సనత్కుమారాలనే ఐదు తంత్రాలు దక్షిణా చారాన్ని తెలియజేస్తాయి, సమయాచారము అనిననూ, ఋషి సంప్రదాయము అనిననూ ఇదియే. దక్షిణాచారంలో నైవేద్యానికి బెల్లం, మధుర పదార్థాలూ, పాలూ, పండ్లూ విని యోగిస్తారు. (ఆ) వామాచారంలో పంచ ‘మ’కారాలు అంటే- మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే అటుకులు, గోధుమలు, శెనగలు అని అర్థం. మిగతావి తెలిసినవే. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్య భావం అనే దశలు ఉన్నాయి. సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్థాయిని క్రమంగా దాటి, ‘‘సోహం’’ భావన దశ చేరుకొంటాడని ఆంతర్యం. సాధనలో ఈ పశుభావములో నుండు దైహిక సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామా చారాన్ని ఖండిస్తాయి. పారమార్థిక పదకోశం నుండి గ్రహించబడినది
1.60.22.
అనుష్టుప్.
దక్షిణాం దిశమాస్థాయ
మునిమధ్యే మహాయశాః! ।
సృష్ట్వా నక్షత్రవంశం చ
క్రోధేన కలుషీకృతః ॥
టీక:-
దక్షిణాం = దక్షిణదిక్కు; దిశమ్ = వైపునకు; ఆస్థాయ = నెలకొను నట్లు; ముని = మునుల; మధ్యే = మధ్య నిలబడి; మహాయశాః = గొప్ప యశస్సు కలిగిన, విశ్వామిత్రుడు; సృష్ట్వా = సృష్టించి; నక్షత్ర = నక్షత్రముల; వంశం = సమూహము, అన్నింటిని; చ = కూడ; క్రోధేన = క్రోధము వలన; కలుషీకృతః = కలుషితుడై.
భావము:-
ఋషుల మధ్య నుండి కోపోద్దీప్తుడై కలుషితుడైన ఆ విశ్వామిత్రుడు దక్షిణదిక్కు వైపున మొత్తం నక్షత్ర మండలమును కూడ సృజించెను.
1.60.23.
అనుష్టుప్.
"అన్యమింద్రం కరిష్యామి
లోకో వా స్యాదనింద్రకః ।
దైవతాన్యపి" స క్రోధాత్
స్రష్టుం సముపచక్రమే ॥
టీక:-
అన్యమ్ = మరియొక; ఇంద్రమ్ = ఇంద్రుని; కరిష్యామి = చేసెదను; లోకః = లోకము; వా = ఐనను; స్యాత్ = అగుగాక; అనింద్రకః = ఇంద్రుడులేనిది; దైవతాః = దేవతలను; అపి = కూడ; సః = అతడు; క్రోధాత్ = క్రోధముతో; స్రష్టుమ్ = సృష్టించుటకు; సముపచక్రమే = సిద్ధమయ్యెను.
భావము:-
"వేరొక ఇంద్రుని ఐనను సృష్టించెదను, లేక ఇంద్రుడే లేని లోకము సృష్టించెదను. అలాగే దేవతలను కూడా సృష్టించెదను" అని క్రోధముతో విశ్వామిత్రుడు సృష్టి చేయ సిద్దమయ్యెను.
1.60.24.
అనుష్టుప్.
తతః పరమసమ్భ్రాన్తాః
సర్షిసంఘాః సురాసురాః ।
విశ్వామిత్రం మహాత్మానమ్
ఊచుః సానునయం వచః ॥
టీక:-
తతః = పిమ్మట; పరమ = మిక్కిలి; సంభ్రాన్తాః = కళవళ పడిన వారై, కలతచెందిన వారై; స = సహితముగ; ఋషిః = ఋషుల; సంఘాః = సమూహములతో; సురాః = దేవతలు; అసురాః = రాక్షసులు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; మహాత్మనమ్ = మహాత్ముడైన; ఊచుః = పలికిరి; స = కూడి ఉన్న; అనునయమ్ = స్వాంతన; వచః = మాటలను.
భావము:-
పిమ్మట, దేవతలు దానవులు ఋషులతో సహితంగా చాల కలతచెందిన వారై మహాత్ముడైన విశ్వామిత్రునితో ఇట్లు స్వాంత వచనములు పలికిరి.
1.60.25.
అనుష్టుప్.
“అయం రాజా మహాభాగ!
గురుశాపపరిక్షతః ।
సశరీరో దివం యాతుమ్
నార్హత్యేహ తపోధన!" ॥
టీక:-
అయం = ఈ; రాజా = రాజు; మహాభాగ = ఓ పూజ్యుడా; గురు = గురువు; శాపః = శాపముచే; పరిక్షతః = గాయపడినవాడు, ఆంధ్రశబ్ధరత్నాకరము; సశరీరో = శరీరముతో; దివమ్ = స్వర్గమునకు; యాతుమ్ = వెళ్ళుటకు; న = కాడు; అర్హతః = అర్హుడు; ఇహ = ఇక్కడ, ఈ పరిస్తితిలో; తపోధన = మహర్షీ.
భావము:-
"ఓ తపశ్శాలీ! మహర్షీ! ఈ రాజు గురుశాపహతుడు. కనుక, బొందితో స్వర్గమునకు వెళ్ళుటకు అర్హుడు కాడు" అని పలికిరి.
1.60.26.
అనుష్టుప్.
తేషాం తద్వచనం శ్రుత్వా
దేవానాం మునిపుంగవః ।
అబ్రవీత్ సుమహద్వాక్యమ్
కౌశికః సర్వదేవతాః ॥
టీక:-
తేషామ్ = వారి; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; దేవానామ్ = దేవతల యొక్క; మునిపుంగవః = ముని శ్రేష్ఠుడు; అబ్రవీత్ = పలికెను; సు = మంచి; మహత్ = గొప్ప; వాక్యమ్ = మాటను; కౌశికః = విశ్వామిత్రుడు; సర్వ = సకల; దేవతాః = దేవతలతోను.
భావము:-
ఈ దేవతల మాటలను విని, విశ్వామిత్రుడు మెచ్చుకొన దగిన మాటను దేవత లందరితో చెప్పెను.
1.60.27.
అనుష్టుప్.
“సశరీరస్య భద్రం వః
త్రిశంకోరస్య భూపతేః ।
ఆరోహణం ప్రతిజ్ఞాయ
నానృతం కర్తుముత్సహే ॥
టీక:-
స = సహితముగ; శరీరః = శరీరముతో; అస్య = ఈ; భద్రమ్ = శుభమగు గాక; వః = మీకు; త్రిశంకుః = త్రిశంకువు అను; అస్య = ఈ; భూపతేః = రాజుvg; ఆరోహణమ్ = స్వర్గారోహణము చేయుటకు; ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞను; నానృతమ్ = సత్యముకానిది; కర్తుమ్ = చేయుటకు; ఉత్సహే = ఇష్టపడను.
భావము:-
“దేవతలారా! మీకు శుభమగుగాక. త్రిశంకువను ఈ రాజును ఈ శరీరముతో స్వర్గమునకు పంపెదనని చేసిన ప్రతిజ్ఞ అబద్ధ మగుటకు నేను ఇష్టపడను.
1.60.28.
అనుష్టుప్.
స్వర్గోఽ స్తు సశరీరస్య
త్రిశంకోరస్య శాశ్వతః ।
నక్షత్రాణి చ సర్వాణి
మామకాని ధ్రువాణ్యథ ॥
టీక:-
స్వర్గః = అభ్రము; అస్తు = ఉండు గాక; సశరీరః = శరీరముతోనే; అస్య = ఈ; త్రిశంకోః = త్రిశంకువు; అస్య = ఈ; శాశ్వతః = శాశ్వతముగ; నక్షత్రాణిచ = నక్షత్రములు; చ; సర్వాణి = సమస్తము; మామకాని = నావి; ధ్రువాణి = నిశ్చయముగ; అథ = మఱియు.
భావము:-
ఈ శరీరముతో ఈ త్రిశంకువు మఱియు నాచే సృష్టించబడిన ఈ నక్షత్రము లన్నియు కూడ తప్పక ఆకాశమునందు శాశ్వతముగా ఉండుగాక.
1.60.29.
అనుష్టుప్.
యావల్లోకా ధరిష్యంతి
తిష్ఠన్త్వేతాని సర్వశః ।
మత్కృతాని సురాః సర్వే
తదనుజ్ఞాతు మర్హథ” ॥
టీక:-
యావత్ = ఎంతవరకైతే; లోకాః = లోకములు; ధరిష్యంతి = ఉండునో; తిష్ఠంతి = ఉండుగాక; ఏతాని = ఇవి; సర్వశః = అన్నియును; మత్ = నాచే; కృతాని = సృష్టింపబడినవి; సురాః = దేవతలు; సర్వే = అందరును; తత్ = దానిని; అనుజ్ఞాతుమ్ = అనుమతించుటకు; అర్హథ = తగి యున్నారు.
భావము:-
ఓ దేవతలారా! నాచే సృష్టింపబడిన ఇవన్నియను సకల లోకములు ఉండునంత వరకు ఉండునట్లు మీరందరును అనుమతింపుడు.”
1.60.30.
అనుష్టుప్.
ఏవముక్తాః సురాః సర్వే
ప్రత్యూచు ర్మునిపుంగవమ్ ।
“ఏవం భవతు భద్రం తే
తిష్ఠన్త్వేతాని సర్వశః ॥
టీక:-
ఏవమ్ = ఇట్లు; ఉక్తాః = పలుక బడగా; సర్వే = సమస్త; సురాః = దేవతలు; ప్రత్యూచుః = బదులు పలికిరి; మునిపుంగవమ్ = మునిశ్రేష్ఠునితో; ఏవమ్ = అట్లే; భవతు = అగుగాక; భద్రమ్ తే = నీకు శుభము; తిష్ఠంతు = ఉండుగాక; ఏతాని = ఇవి; సర్వశః = అన్నియును.
భావము:-
మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని మాటలు విని దేవతలందరు అతనితో "మునిశ్రేష్ఠా! నీకు శుభమగు గాక. అవి అన్నియు అట్లే ఉండు గాక" అని బదులు పలికిరి.
1.60.31.
అనుష్టుప్.
గగనే తాన్యనేకాని
వైశ్వానర పథాద్బహిః ।
నక్షత్రాణి మునిశ్రేష్ఠ
తేషు జ్యోతిష్షు జాజ్వలన్ ।
అవాక్ఛి రాస్త్రిశంకుశ్చ
తిష్ఠ త్వమరసన్నిభః ॥
టీక:-
గగనే = ఆకాశము నందు; తాని = అవి; అనేకాని = అనేకమైన; వైశ్వానరః = సాధారణమైన, సూర్యరాయాంధ్ర నిఘంటువు; పథాత్ = మార్గమునకు; బహిః = వెలుపల; నక్షత్రాణి = నక్షత్రములు; మునిశ్రేష్ఠ = ముని శ్రేష్ఠుడా!; తేషు = ఆ; జ్యోతిష్షు = నక్షత్రముల మధ్య; జాజ్వలన్ = ప్రకాశించుచు; అవాక్ఛిరాః = తలక్రిందలుగా; త్రిశంకుశ్చ = త్రిశంకువు కూడ; తిష్ఠతు = ఉండుగాక; అమరసన్నిభః = దేవతలతో సమానుడై.
భావము:-
ప్రతిపదార్థము :- గగనే = ఆకాశము నందు; తాని = అవి; అనేకాని = అనేకమైన; వైశ్వానరః = సాధారణమైన, సూర్యరాయాంధ్ర నిఘంటువు; పథాత్ = మార్గమునకు; బహిః = వెలుపల; నక్షత్రాణి = నక్షత్రములు; మునిశ్రేష్ఠ = ముని శ్రేష్ఠుడా!; తేషు = ఆ; జ్యోతిష్షు = నక్షత్రముల మధ్య; జాజ్వలన్ = ప్రకాశించుచు; అవాక్ఛిరాః = తలక్రిందలుగా; త్రిశంకుశ్చ = త్రిశంకువు కూడ; తిష్ఠతు = ఉండుగాక; అమరసన్నిభః = దేవతలతో సమానుడై.
1.60.32.
అనుష్టుప్.
అనుయాస్యంతి చైతాని
జ్యోతీంషి నృపసత్తమమ్ ।
కృతార్థం కీర్తిమంతంచ
స్వర్గలోకగతం తథా" ॥
టీక:-
అనుయాస్యంతి = అనుసరించ గలవు; ఏతాని = ఈ; జ్యోతీంషి = నక్షత్రములు; నృపసత్తమమ్ = రాజశ్రేష్ఠుని; కృతార్థమ్ = తలచిన పని ఐన వాడు; కీర్తి మంతమ్ చ = కీర్తి మంతుడు; చ; స్వర్గలోకః = స్వర్గలోకములో; గతం = ఉన్న వారి; తథా = వలె.
భావము:-
"ఈ నక్షత్రము లన్నియు స్వర్గము నందున్న వారినివలె; ఈ రాజశ్రేష్ఠుని అనుసరించ గలవు".
1.60.33.
అనుష్టుప్.
విశ్వామిత్రస్తు ధర్మాత్మా
సర్వదేవై రభిష్టుతః ।
ఋషిభిశ్చ మహాతేజా
బాఢమిత్యాహ దేవతాః ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; తు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; సర్వ = సకల; దేవైః = దేవతల చేతను; అభిష్టుతః = స్తుతింప బడిన; ఋషిభిః = ఋషుల చేతను; చ; మహాతేజాః = గొప్ప తేజస్సు గల; బాఢమ్ = అంగీకారము, సరే; ఇతి = అని; అహ = పలికెను; దేవతాః = దేవతలతో.
భావము:-
ఈ విధముగా సమస్త దేవతలతోను ఋషులతోను కొనియాడ బడిన విశ్వామిత్రుడు "సరే" యని దేవతలకు తన అంగీకారము తెలిపెను.
1.60.34.
అనుష్టుప్.
తతో దేవా మహాత్మానో
మునయశ్చ తపోధనాః ।
జగ్ముర్యథాగతం సర్వే
యజ్ఞస్యాంతే నరోత్తమ ॥
టీక:-
తతః = తరువాత; దేవాః = దేవతలును; మహాత్మనః = మహాత్ములైన; మునయః = మునులును; చ; తపోధనాః = తపోధనులు; జగ్ముః = వెళ్ళిరి; యథాగతమ్ = వచ్చినట్లు; సర్వే = అందరు; యజ్ఞః = యజ్ఞము; అస్య = యొక్క; ఆంతే = అయినాక; నరోత్తమ = మానవులలో ఉత్తముడా !
భావము:-
మానవోత్తమా రామా! యజ్ఞము పూర్తి ఐన తరువాత దేవతలు, మునులు తమ తమ యథాస్థానములకు వెళ్ళిపోయిరి.
1.60.35.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
షష్టితమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షష్టితమః [60] = అరవైయవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవైయవ [60] సర్గ సంపూర్ణము.