బాల కాండ
1.13.1.
అనుష్టుప్.
పునః ప్రాప్తే వసంతే తు
పూర్ణః సంవత్సరోఽ భవత్ ।
ప్రసవార్థం గతో యష్టుం
హయమేధేన వీర్యవాన్ ॥
టీక:-
పునః = మరల; ప్రాప్తే = వచ్చిన వేళ; వసంతే = వసంత ఋతువు; పూర్ణ = పూర్ణము; సంవత్సరః = సంవత్సరము; అభవత్ = అయ్యి; ప్రసవ = పుత్రులు పుట్టుట; అర్థం = కోసము; గతః = వెడలెను; యష్టుమ్ = యాగము చేయుటకొఱకు; హయమేధేన = అశ్వమేధ యాగమునకు; వీర్యవాన్ = వీరుడైన దశరథుడు
భావము:-
సంవత్సరము నిండి మరల వసంతము రాగా రాజు దశరథుడు పుత్రులను కోరి చేయు అశ్వమేథము నిర్వహణకై యాగశాల చేరెను
1.13.2.
అనుష్టుప్.
అభివాద్య వసిష్ఠం చ
న్యాయతః ప్రతిపూజ్య చ ।
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం
ప్రసవార్థం ద్విజోత్తమమ్ ॥
టీక:-
అభివాద్య = నమస్కరించి; వసిష్ఠంచ = వసిష్ఠునకు; న్యాయతః = శాస్త్ర ప్రకారము; పరిపూజ్య = పూజించి; చ; అబ్రవీత్ = పలికెను; ప్రశ్రితమ్ = వినయముగా; వాక్యమ్ = పలుకులు; ప్రసవార్థమ్ = పుత్రుల కొఱకు; ద్విజోత్తమమ్ = బ్రాహ్మణులలో ఉత్తముడైనవశిష్ఠునితో
భావము:-
బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠునకు నమస్కరించి, తగు రీతిన పూజించి, పుత్రుల కొఱకు చేయు పూజకై వినయముతో ఇట్లు పలికెను.
1.13.3.
అనుష్టుప్.
"యజ్ఞో మే క్రియతాం విప్ర
యథోక్తం మునిపుంగవ!।
యథా న విఘ్నః క్రియతే
యజ్ఞాంగేషు విధీయతామ్ ॥
టీక:-
యజ్ఞః = యాగము; మే = నా; క్రియతామ్ = చేయబడునది; బ్రహ్మన్ = బ్రాహ్మణా; యథోక్తమ్ = శాస్త్రాను గుణముగా; మునిపుంగవ = ఓ మునివర్యా; యథా = రీతిగా: న = లేక; విఘ్నః = అడ్డంకులు; క్రియతే = చేయవలెను; యజ్ఞ = యాగముయొక్క; అంగేం = విభాగములు; ఇషు = అన్నియు; విధీయతామ్ = విధిప్రకారమై ఉండాలి.
భావము:-
ఓ ముని పుంగవా! బ్రహ్మణ్యా! శాస్తోక్తముగా, ఏ విధమైన అడ్డంకులు రాని విధముగా యజ్ఞమును, యజ్ఞాంగములు అన్నింటిని నిర్వహించ వలెను.
1.13.4.
అనుష్టుప్.
భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం
గురుశ్చ పరమో మహాన్ ।
వోఢవ్యో భవతా చైవ
భారో యజ్ఞస్య చోద్యతః" ॥
టీక:-
భవాన్ = మీరు; స్నిగ్ధః = ఆత్మీయులు; సుహృత్ = స్నేహితులు; మహ్యమ్ = మాకు; గురుః = గురువులు; చ; పరమః = గొప్పవారు; మహాన్ = మహాత్ములు ఐన; ఓఢవ్యః = వహించ వలెను; భవతః = మీరు; చ; ఏవ = మాత్రమే; భారః = భాధ్యత; యజ్ఞః = యజ్ఞము; అస్య = యొక్క; చోద్యతః = నడిపించుట / నిర్వహించుట
భావము:-
మీరు మాకు ఆత్మీయులు, సన్నిహితులు, మహాత్ములైన ఆధ్యాత్మిక గురువులు! యాగము నిర్వహించు భారమంతా మీరే వహించవలెను”.
1.13.5.
అనుష్టుప్.
తథేతి చ స రాజానం
అబ్రవీద్ద్విజసత్తమః ।
“కరిష్యే సర్వమేవైతత్
భవతా యత్సమర్థితమ్" ॥
టీక:-
తత్ = అటులనే; ఇతి = అగుగాక; చ; సః = ఆయన వసిష్ఠుడు; రాజానామ్ = రాజునకు; అబ్రవీత్ = చెప్పెను; ద్విజసత్తమః = బ్రాహ్మణాగ్రజుడు; కరిష్యే = చేయబడును; సర్వమ్ = అంతయు; ఏవ = అటులనే; ఏతత్ = అది; భవతా = మీచేత; యత్ = ఏదైతే; సమర్థితమ్ = నిర్ణయించినట్లే;
భావము:-
అటులనే అని, బ్రాహ్మణోత్తముడైన వసిష్ఠులవారు దశరథునితో, "అంతయు మీరు చెప్పినట్లు జరుగును” అని చెప్పెను.
1.13.6.
అనుష్టుప్.
తతోఽ బ్రవీద్ద్విజాన్ వృద్ధాన్
యజ్ఞకర్మసు నిష్ఠితాన్ ।
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ
వృద్ధాన్ పరమధార్మికాన్ ॥
టీక:-
తతః = ఆ తర్వాత; అబ్రవీత్ = పలికెను; ద్విజాన్ = బ్రాహ్మణులను; వృద్ధాన్ = అనుభవజ్ఞులను యజ్ఞ కర్మసు = యజ్ఞ కర్మల యందు; నిష్ఠితాన్ = నిష్ణాతులైన; స్థాపత్యే = భవన నిర్మాతలలో; నిష్ఠితాః = నైపుణ్యము కల వారిని; చైవ = కూడ; వృద్ధాన్ = అనుభవజ్ఢులను; పరమ = మిక్కిలి; ధార్మికాన్ = ధర్మశీలురను.
భావము:-
అంతట ఆ వసిష్ఠుడు మిక్కిలి ధర్మశీలురలు అయిన అనుభవజ్ఞులు మఱియు యజ్ఞ కర్మలు నిర్వహించుటలో నిష్ణాతులు ఐన బ్రాహ్మణులను, మఱియు భవనాలు నిర్మించుటలో మంచి అనుభంకలిగిన నిపుణులను. . .
1.13.7.
అనుష్టుప్.
కర్మాంతికాన్ శిల్పకరాన్
వర్దకీన్ ఖనకానపి ।
గణకాన్ శిల్పినశ్చైవ
తథైవ నటనర్తకాన్ ॥
టీక:-
కర్మాంతికాన్ = కార్మికులను; శిల్పకరాన్ = ఇటుక పనివారిని; వర్ధకీన్ = వడ్రంగులను; ఖనకాన్ = మట్టిని త్రవ్వువారిని; అపి = ఇంకా; గణకాన్ = గణాంకులను; శిల్పినః = శిల్పులను; చ; ఏవ = అందరిని; తథైవ = మఱియు; నట = నటులను; నర్తకాన్ = నాట్యమాడువారిని.
భావము:-
కార్మికులను, ఇటుకలు తయారు చేయువారిని, వడ్రంగులను, మట్టిని త్రవ్వు వారిని, గణాంకులను, శిల్పులను, నటులను మఱియు నాట్యమాడువారిని.
1.13.8.
అనుష్టుప్.
తథా శుచీన్ శాస్త్రవిదః
పురుషాన్ సుబహుశ్రుతాన్ ।
యజ్ఞకర్మ సమీహంతాం
భవన్తో రాజశాసనాత్ ॥
టీక:-
తథా = మఱియు; శుచీన్ = ఆచారవంతులు; శాస్త్ర = శాస్త్రము లందు; విదః = కోవిదులైన; పురుషాన్ = మనుషులను; సుబహు = అనేకమైనవి; శ్రుతాన్ = వినిన వానిని; యజ్ఞ = యాగముయొక్క; కర్మ = కార్యక్రమములు; సమీహంతామ్ = నిర్వర్తింతురుగాక; భవన్తాః = మీరందఱు; రాజ శాసనాత్ = రాజు ఆజ్ఞ ప్రకారము
భావము:-
మఱియు ఆచారపరులు, శాస్త్రము తెలిసినవారు, అనేక గ్రంథములు వినినవారు, మీరందరు రాజు ఆజ్ఞ ప్రకారము యాగ విధులను చక్కగా నిర్వర్తించుడు.
1.13.9.
అనుష్టుప్.
ఇష్టకా బహుసాహస్రీః
శీఘ్రమానీయతామితి ।
ఔపకార్యాః క్రియంతాం చ
రాజ్ఞాం బహుగుణాన్వితాః ॥
టీక:-
ఇష్టకా = ఇటుకలు; బహు = పలు; సాహస్రాః = వేలకొలది; శీఘ్రమ్ = తొందరగా; అనీయతామ్ = తీసుకురండు; ఔపకార్యాః = తాత్కాలిక నివాస భవనములను; క్రియంతామ్ = నిర్మింపుడు; రాజ్ఞామ్ = రాజులకు; బహు = పలు; గుణాన్వితాః = సౌకర్యాలు సమకూర్చబడిన
భావము:-
ఇటుకలు వేల సంఖ్యలో తొందరగా తెప్పించుడు, అతిథులుగా వచ్చు రాజులకొఱకు తాత్కాలిక నివాస భవనములను సకలసౌకర్యములతో నిర్మింపుడు.
1.13.10.
అనుష్టుప్.
బ్రాహ్మణావసథాశ్చైవ
కర్తవ్యాః శతశః శుభాః ।
భక్ష్యాన్నపానైర్బహుభిః
సముపేతాః సునిష్ఠితాః ॥
టీక:-
బ్రాహ్మణాః = బ్రాహ్మణులకు; వసథాః = వసతులు; చైవ = కొఱకు; కర్తవ్యాః = సిద్ధము చేయుడు; శతశః = వందలలో; శుభాః = శుభకరములైన; భక్ష్యాన్నః = భోజనములు: పానైః = త్రాగు పానీయములు; బహూభిః = పలువిధములైన; సముపేతాః = సమకూర్చుడు; సునిష్ఠితాః = చక్కగా నెలకొల్పబడినవి;
భావము:-
బ్రాహ్మణులకు యోగ్యమైన నివాసములు వందలకొలది ఏర్పరుచుడు, పలు విధములైన భక్ష్య పానీయములకు అన్ని ఏర్పాట్లు సమకూర్చుడు.
1.13.11.
అనుష్టుప్.
తథా పౌరజనస్యాపి
కర్తవ్యా బహువిస్తరాః ।
ఆవాసా బహుభక్ష్యా వై
సర్వకామైరుపస్థితాః ॥
టీక:-
తథా = అదే విధముగా; పౌరజనః = నగరవాసులు; అస్య = కొఱకు; అపి = కూడ; కర్తవ్యా = చేయుడు; బహు = చాలా; విస్తరాః = విశాలమైన; ఆవాసా = నివాస గృహములు; బహు = పలువిధములైన; భక్ష్యా = భోజన పదార్థములు; వై = సహితము; సర్వ = సకల; కామైః = అవసరాలు; ఉపఃస్థితా = ఏర్పాటుచేయుడు.
భావము:-
అలాగే పౌరులకు కూడ అనేక విళాలమైన వసతి గృహములు, పలు విధములైన రుచికరమైన భోజన పదార్థములు మఱియు అవసరపడునవి అన్ని అందించవలెను.
1.13.12.
అనుష్టుప్.
తథా జానపదస్యాపి
జనస్య బహు శోభనమ్ ।
దాతవ్యమన్నం విధివత్
సత్కృత్య న తు లీలతా ॥
టీక:-
తథా = అదే రీతిన; జానపదస్య = గ్రామీణ ప్రాంతాలకు; అస్య = చెందిన; అపి = కూడ; జన = ప్రజల; అస్య = కోసము; బహు = మిక్కిలి; శోభనమ్ = అందముగా, మంగళకరంగా; దాతవ్యమ్ = ఇవ్వ దగినది; అన్నమ్ = ఆహారము; విధివత్ = ఆచారము ప్రకారము; సత్కృత్య = గౌరవముగా; న = కాదు; తు; లీలయా = నిర్లక్ష్యముగా
భావము:-
అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి విచ్చేయు ప్రజలకు భోజన సదుపాయములు నిర్లక్ష్యముగా కాక, ఎంతో మర్యాదగా మంగళకరంగా ఏర్పాటు చేయవలెను.
1.13.13.
అనుష్టుప్.
సర్వవర్ణా యథా పూజాం
ప్రాప్నువంతి సుసత్కృతాః ।
న చావజ్ఞా ప్రయోక్తవ్యా
కామక్రోధవశాదపి ॥
టీక:-
సర్వే = అన్ని; వర్ణాః = వర్ణముల వారును; పూజామ్ = గౌరవములను; ప్రాప్నువంతి = పొందెదరు; సుసత్కృతాః = బాగుగా సత్కరించి; న = కాదు; చ; అవజ్ఞా = అవమానములను; ప్రయోక్తవ్యా = ప్రయోగించుట; కామ క్రోధః = కామము, ఆగ్రహములకు; వశాత్ = లోబడినవి; అపి = ఐనైసరే.
భావము:-
అన్ని వర్ణముల వారికి తగిన సత్కారములు గౌరవముగా అందించవలెను. వారిని కామ క్రోధములకు వశపడి కూడ అవమానింపరాదు.
1.13.14.
అనుష్టుప్.
యజ్ఞకర్మణి యే వ్యగ్రాః
పురుషాః శిల్పినస్తథా ।
తేషామపి విశేషేణ
పూజా కార్యా యథాక్రమమ్ ॥
టీక:-
యజ్ఞ = యజ్ఞపు; కర్మసు = పనులలో; యే = ఏ; వ్యగ్రాః = నిమగ్నులగు; పురుషాః = పురుషులును; శిల్పినాః = శిల్పులను; తథా = అటులనే; తేషామ్ = వారిని; అపి = కూడా; విశేషణ = విశేషమైన; పూజా = సత్కారములను; కార్యా = చేయుడు; యథా క్రమామ్ = తగిన రీతిగా
భావము:-
యజ్ఞసంబంధ మయిన పనులు చేయు పురుషులను, శిల్పులను తగు రీతిలో బాగుగా సత్కరించవలెను.
1.13.15.
అనుష్టుప్.
తే చ స్యుః సమ్భృతాః సర్వే
వసుభిర్భోజనేన చ ।
యథా సర్వం సువిహితం
న కించిత్ పరిహీయతే ॥
టీక:-
తే = వారు; చ = తో; స్యుః = ౘక్కగా; సమ్భృతాః = సంతుష్ఠు లైన వారు; సర్వే = అన్నియు; వసుభిః = ధనముతో; భోజనేన = ఆహార పదార్థమ్ములతో; యథా = ఉన్నది ఉన్నట్లుగా; సర్వమ్ = అన్నియు; సువిహితం = బాగుగా శాస్త్రములలో చెప్పినట్లు; న = కాదు; కించిత్ = కొద్దిగాను; పరిహీయతే = లోటుతో
భావము:-
వారందఱికి కావలిసిన భోజన పదార్థములు , ధనము ఏ లోటు లేకుండ సమకూర్చవలెను.
1.13.16.
అనుష్టుప్.
తథా భవంత కుర్వంతు
ప్రీతిస్నిగ్ధేన చేతసా" ।
తతః సర్వే సమాగమ్య
వసిష్ఠమిదమబ్రువన్ ॥
టీక:-
తథా = ఆ విధముగా; భవంత = మీరు; కుర్వంతు = చేయుదురు గాక; ప్రీతి = ప్రీతి కరముగా; స్నిగ్ధేన = ఆత్మీయముగా; చేతసా = చిత్తముతో; తతః = పిమ్మట; సర్వే = అందఱు; సమాగమ్య = వచ్చి; వసిష్ఠమ్ = వసిష్ఠునకు; ఇదం = ఈ మాటలను; అబ్రువన్ = పలికిరి;
భావము:-
ఆ విధముగా మీరు అంతా స్నేహపూర్వకముగా ప్రీతితో కూడిన మనస్కులై అన్నియు సవ్యముగా చేయవలెను” అని వసిష్ఠు డనెను. అపుడు వారందఱు చేరి వసిష్ఠునతో ఇట్లు పలికిరి.
1.13.17.
అనుష్టుప్.
యథోక్తం తత్సువిహితం
న కించిత్ పరిహీయతే ।
యథోక్తం తత్కరిష్యామో
న కించిత్ పరిహీయతే" ॥
టీక:-
యథా = ఎట్లు; ఉక్తమ్ = ఎట్లు చెప్పబడినదో; తత్ = అట్లు; సు = చక్కగా; విహితం = ఏర్పఱుచబడును; న = కాదు; కించిత్ = కొంచెము; పరిహీయతే = లోటుతో; యథా = ఎట్లు; ఉక్తమ్ = తగినదో; తత్ = అట్లు; కరిష్యామః = చేయుదము; న = కాదు; కించిత్ = కొద్దిగా; పరిహీయతే = లోపముతో.
భావము:-
”ఆజ్ఞాపించిన ప్రకారం అన్నిపనులు ఎట్టి లోటులు, లోపములు లేకుండా తగిన విధముగా చేయుదుము.”
1.13.18.
అనుష్టుప్.
తతః సుమంత్రమానీయ
వసిష్ఠో వాక్యమబ్రవీత్ ।
నిమంత్రయస్వ నృపతీన్
పృథివ్యాం యే చ ధార్మికాః ॥
టీక:-
తతః = అప్పుడు; సుమంత్రమ్ = సుమంతుని; అనీయ = పిలిపించి; వసిష్ఠః = వసిష్ఠుడు; వాక్యమ్ = విషయము; అబ్రవీత్ = పలికెను; నిమంత్రయస్వ = ఆహ్వానించండి; నృపతీన్ = రాజులను; పృథివ్యాం = ధరిత్రిపై; యే = వారిని; చ; ధార్మికాః = ధార్మికులను
భావము:-
అప్పుడు వసిష్ఠుడు సుమంత్రునికి ఇలా చెప్పెను “ధరిత్రిపై ఉన్న పరమ ధార్మికులైన రాజులందఱిని ఆహ్వానించుడు.
1.13.19.
అనుష్టుప్.
బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్
శూద్రాంశ్చైవ సహస్రశః ।
సమానయస్వ సత్కృత్య
సర్వదేశేషు మానవాన్ ॥
టీక:-
బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; క్షత్రియాన్ = క్షత్రియులను; వైశ్యాన్ = వైశ్యులను; శూద్రాన్ = శూద్రులను; చైవః = అందఱిని; సహస్ర శః = వేలల్లో; సమానయస్వ = తీసుకురావలెను; సత్కృత్య = గౌరవపూర్వకంగా; సర్వ = అన్ని; దేశేషు = దేశములందు; మానవాన్ = జనులను
భావము:-
అన్ని దేశములందునృ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను జనులు అందరినీ సగౌరవముగా ఆహ్వానించి రప్పించుడు.
1.13.20.
అనుష్టుప్.
మిథిలాధిపతిం శూరం
జనకం సత్యవిక్రమమ్ ।
నిష్ఠితం సర్వశాస్త్రేషు
తథా వేదేషు నిష్ఠితమ్ ॥
టీక:-
మిథిలా = మిథిలా నగరము; అధిపతిం = రాజును; శూరం = శూరుని; జనకం = జనకుని; సత్య = నిజమైన; విక్రమమ్ = పరాక్రమము గల వానిని; నిష్ఠితమ్ = నిష్ణాతులైన; సర్వ = అన్ని; శాస్త్రేషు = శాస్త్రములలో; తథా = మఱియు; వేదేషు = వేదములందు; నిష్ఠితమ్ = నిష్ణాతులైన
భావము:-
మిథిలాధిపతి, శూరుడు, సత్యమగు పరాక్రమము కలిగిన వాడు, అన్ని శాస్త్రములలో, అన్ని వేదములలో నిష్ణాతుడును అయిన జనకుడిని
1.13.21.
అనుష్టుప్.
తమానయ మహాభాగం
స్వయమేవ సుసత్కృతమ్ ।
పూర్వసమ్బంధినం జ్ఞాత్వా
తతః పూర్వం బ్రవీమి తే ॥
టీక:-
తమ్ = వారిని, ఆ జనకుడినీ; ఆనయ = తోడ్కొని రావలయును; మహాభాగం = మహాభాగ్యవంతుడును; స్వయమ్ = మీరు స్వయంగా; ఏవ = మాత్రమే; సు = ౘక్కగా; సత్కృతమ్ = గౌరవముతో; పూర్వ = ముందఱ; సమ్బంధినం = సాన్నిహిత్యము; జ్ఞాత్వా = గుర్తుచేసుకుని; తతః = ఆ కారణం చేత; పూర్వమ్ = ముందుగా; బ్రవీమి = తెలియ చేయుచుంటిని; తే = మీకు
భావము:-
ఆ జనకుడిని మీరే స్వయముగా వెళ్ళి గౌరవ మర్యాదలతో ఇచటకు తోడ్కొని రావాలెను. వారు మనకు పూర్వము నుంచిసన్నిహిత పరిచితులు కనుక మీకు ముందుగా తెలియ జేయుచుంటిని.
1.13.22.
అనుష్టుప్.
తథా కాశీపతిం స్నిగ్ధం
సతతం ప్రియవాదినమ్ ।
వయస్యం రాజసింహస్య
స్వయమేవానయస్వ హ ॥
టీక:-
తథా = ఆ తర్వాత; కాశీపతిం = కాశీ రాజును; స్నిగ్ధం = ఆప్యాయముగా ఉండు; సతతం = ఎల్లప్పుడును; ప్రియః = ప్రియముగా; వాదినమ్ = మాట్లాడువారిని; వయస్యమ్ = మిత్రుడును; రాజసింహ = రాజులలో శ్రేష్ఠుడైన దశరథుని; అస్య = కూడ; స్వయమ్ = స్వయముగా; ఏవ = మాత్రమే; అనయస్వహ = తీసుకురావలయును;
భావము:-
అటులనే దశరథులవారికి ఆత్మీయ మిత్రుడు, ప్రియముగా మాట్లాడువాడు, రాజులందఱిలో సింహమువంటి వాడు అయిన కాశీ రాజుని మీరే స్వయముగా తోడ్కొని రావలయును
1.13.23.
అనుష్టుప్.
తథా కేకయరాజానం
వృద్ధం పరమధార్మికమ్ ।
శ్వశురం రాజసింహస్య
సపుత్రం త్వమిహానయ ॥
టీక:-
తథా = మఱియు; కేకయ = కేకయ దేశపు; రాజానాం = రాజును; వృద్ధం = వృద్ధుడును; పరమ = గొప్ప; ధార్మికమ్ = ధార్మికులైన; శ్వశురం = మామగారిని; రాజసింహ = రాజులలో శ్రేష్ఠుడైన దశరథుని; అస్య = యొక్క; స = సమేతంగా; పుత్రం = పుత్రులు; త్వమ్ = మీరు; ఇహ = ఇౘటకు; ఆనయ = తోడ్కొని రావలయును;
భావము:-
అటు పిమ్మట కేకయ దేశపు రాజును, వృద్ధుడును, పరమ ధార్మికుడును అయిన దశరథ మహారాజు గారి మామగారిని పుత్ర సమేతముగా ఇచ్చటకు తోడ్కొని రావలయును
1.13.24.
అనుష్టుప్.
అంగేశ్వరం మహాభాగం
రోమపాదం సుసత్కృతమ్ ।
వయస్యం రాజసింహస్య
సమానయ యశస్వినమ్ ॥
టీక:-
అంగ = అంగ రాజ్యపు; ఈశ్వరమ్ = రాజు అయిన; మహాభాగమ్ = వర్థిల్లుతున్న; రోమపాదం = రోమపాదుని; సుసత్కృతమ్ = గౌరవముతో; వయస్యం = మిత్రుని; రాజసింహ = రాజులలో శ్రేష్ఠుడైన దశరథుని; అస్య = యొక్క; సమానయ = తోడ్కొని రావలిసినది; యశస్వినమ్ = కీర్తిమంతులైన.
భావము:-
అంగదేశపు రాజు, యశస్సుతో వర్థిలు మన దశరథ రాజు మిత్రుడైన రోమపాదుని గౌరవముతో తోడ్కొని రావలిసినది.
1.13.25.
అనుష్టుప్.
ప్రాచీనాన్ సింధుసౌవీరాన్
సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ ।
దాక్షిణాత్యాన్నరేన్ద్రాంశ్చ
సమస్తానానయస్వ హ ॥
టీక:-
ప్రాచీనాన్ = తూర్పు దేశపు; సింధు = సింధు దేశపు; సౌవీరాన్ = సౌవీర దేశపు; సౌరాష్ట్రేయాన్ = సౌరాష్ట్ర దేశపు; పార్థివాన్ = రాజులను; దాక్షిణాత్యాన్ = దక్షిణ దేశపు; నరేన్ద్రాంశ్చ = నృపులను; సమస్తాన్ = అందఱిని; ఆనయస్వ = ఆహ్వానింపుడు; హ = వారిని
భావము:-
తూర్పు దేశాల, సింధు, సౌవీర, సౌరాష్ట్ర, దక్షిణ దేశాల సమస్త పాలకులను ఆహ్వానింపుడు.
1.13.26.
అనుష్టుప్.
సంతి స్నిగ్ధాశ్చ యే చాన్యే
రాజానః పృథివీతలే ।
తానానయ యథాక్షిప్రం
సానుగాన్ సహ బాంధవాన్" ॥
టీక:-
సంతి = ఉన్నటువంటి; స్నిగ్ధాః = మిత్రులు; యే చ = ఎవరు; అన్యే = ఇతర; రాజానః = రాజులను; పృథివీ = భువి; తలే = పైన; తాన్ = వారిని; ఆనయ = తీసుకుని రావలెను; యథాః = అలా; క్షిప్రమ్ = వేగముగా; స = సమేతముగా; అనుగాన్ = సపరివారులు; సహ = సహితముగ; బాంధవాన్ = బంధువులు.
భావము:-
ఈ పృథివీతలముపై నున్న ఇతర మిత్ర రాజులందఱిని వారి కుటుంబ బంధు మిత్ర పరివార సమేతముగా అత్యంత శీఘ్రమే రమ్మని ఆహ్వానించవలెను.”
1.13.27.
అనుష్టుప్.
వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా
సుమంత్రస్త్వరితస్తదా ।
వ్యాదిశత్పురుషాంస్తత్ర
రాజ్ఞామానయనే శుభాన్ ॥
టీక:-
వసిష్ఠ = వసిష్ఠ ముని; వాక్యమ్ = పలుకులు; తత్ = ఆ; శ్రుత్వా = విని; సుమన్త్రః = మంత్రి సుమంత్రుడు; త్వరితః = వేగముగా; తదా = అపుడు; వ్యాదిశత్ = ఆజ్ఞాపించెను; పురుషామ్ = పురుషులను; తత్ర = అక్కడ; రాజ్ఞామ్ = రాజులను; ఆనయనే = తీసుకుని రావలిసినదిగా; శుభాన్ = మంగళప్రదులైన
భావము:-
వసిష్ఠుని ఆజ్ఞను విన్న సుమంత్రుడు మంగళప్రదులు,, కార్య సాధకులు అయిన పురుషులను, అందఱు రాజులను తీసుకుని వచ్చుటకు పంపెను.
1.13.28.
అనుష్టుప్.
స్వయమేవ హి ధర్మాత్మా
ప్రయయౌ మునిశాసనాత్ ।
సుమంత్రస్త్వరితో భూత్వా
సమానేతుం మహీక్షితః ॥
టీక:-
స్వయమ్ = తనకు; ఏవ = తానుగా; హి = కూడా; ధర్మాత్మా = ధర్మవర్తనులను; ప్రయయౌ = వెడలెను; ముని = ముని యొక్క; శాసనాత్ = శాసనమును; సుమన్త్రః = మంత్రి సుమంత్రుడు; త్వరితః = వేగము; భూత్వా = కలవాడై; సమానేతుం = తీసుకొని వచ్చుటకు; మహీక్షితః = రాజులను
భావము:-
వసిష్ఠుని ఆజ్ఞను అనుసరించి, మంత్రి సుమంత్రుడు తనకు తానే స్వయముగా, వేగముగా, ధర్మాత్ములైన జనకుడు మొదలగు రాజులను తోడ్కొని వచ్చుటకు బయలుదేరెను.
1.13.29.
అనుష్టుప్.
తే చ కర్మాంతికాః సర్వే
వసిష్ఠాయ చ ధీమతే ।
సర్వం నివేదయంతి స్మ
యజ్ఞే యదుపకల్పితమ్ ॥
టీక:-
తే = వారు; కర్మాంతికః = కర్మకారులు; సర్వే = అందఱును; వసిష్ఠాయ చ = వసిష్ఠ మహామునికి; ధీమతే = సుమతి యైన; సర్వం = అంతా; నివేదయంతి స్మ = వివరించిరి; యజ్ఞే = యజ్ఞమునకు; యత్ = ఏది; ఉపకల్పితమ్ = చేయబడినదో;
భావము:-
పనివారందఱు ధీమంతుడైన వసిష్ఠునితో, యాగ నిర్వహణమునకై తాము చేసిన ఏర్పాట్లను తెలిపారు.
1.13.30.
అనుష్టుప్.
* తతః ప్రీతో ద్విజశ్రేష్ఠః
తాన్ సర్వాన్ పునరబ్రవీత్ ।
“అవజ్ఞయా న దాతవ్యం
కస్యచిల్లీలయాపి వా ॥
టీక:-
తతః = అప్పుడు; ప్రీతః = సంతసించిన; ద్విజ = బ్రాహ్మణ; శ్రేష్ఠః = శ్రేష్ఠుడైన; తాన్ = ఆ; సర్వాన్ = అందఱికి; ఇదమ్ = ఈ పలుకులు; అబ్రవీత్ = పలికెను; అవజ్ఞయా = అగౌరవమ్ముతో; న = వలదు; దాతవ్యం = ఇచ్చుట; కస్య చిత్ = ఎవ్వఱి కైనను; లీలయ అపి వా = అశ్రద్ధతో కాని;
భావము:-
అప్పుడు సంతసించిన ద్విజశ్రేష్ఠుడు వసిష్ఠుడు ఇట్లు పలికెను; ఎవ్వఱి కైనను అనాదరముతో కాని, అశ్రద్ధతో కాని, ఏమీ దానము చేయకూడదు.
1.13.31.
అనుష్టుప్.
* అవజ్ఞయా కృతం హన్యాత్
దాతారం నాత్ర సంశయః" ।
తతః కైశ్చిదహోరాత్రైః
ఉపయాతా మహీక్షితః ॥
టీక:-
అవజ్ఞయా = అగౌరవముతో; కృతం = చేయబడినది; హన్యాత్ = నశింప జేయును; దాతారం = దాత యొక్క; ఆత్ర = ఈ విషయములో; న = వలదు; సంశయః = శంక; తతః = ఆ తర్వాత; కైశ్చిత్ = కొన్ని; అహోరాత్రైః = దినములలో; ఉపయాతాః = వచ్చిరి; మహీక్షితః = రాజులు
భావము:-
వసిష్ఠుడు వారితో ఇట్లు చెప్పెను, అనాదరముతో చేసిన దానము దాతను నశింపజేస్తుంది. ఇందులో సందేహము లేదు. అంత కొన్ని దినములకు దశరథ మహారాజునకు కొన్ని రత్నములు తీసుకొనివచ్చి నానా దేశముల రాజులు వచ్చిరి.
1.13.32.
అనుష్టుప్.
బహూని రత్నాన్యాదాయ
రాజ్ఞో దశరథస్య హి ।
తతో వసిష్ఠః సుప్రీతో
రాజానమిదమబ్రవీత్ ॥
టీక:-
బహూని = అనేక; రత్నాన్ = రత్నములను; ఆదాయ = సమీకరించి; రాజ్ఞః = రాజు; దశరథస్య = దశరథునకు; తతః = తర్వాత; వసిష్ఠః = వసిష్ఠుడు; సుప్రీతః = ప్రసన్నుడై; రాజానమ్ = రాజుతో; ఇదమ్ = ఈ పలుకులు; అబ్రవీత్ = పలికెను
భావము:-
ఆ తర్వాత వివిధ దేశముల రాజులు దశరథునకు చాలా రత్నములను బహుమతిగా అందించారు; అప్పుడు ప్రసన్నుడై వసిష్ఠుడు దశరథునితో ఇట్లు పలికెను
1.13.33.
అనుష్టుప్.
ఉపయాతా నరవ్యాఘ్ర!
రాజానస్తవ శాసనాత్ ।
మయాఽ పి సత్కృతాః సర్వే
యథార్హం రాజసత్తమాః ॥
టీక:-
ఉపయాతాః = వచ్చిరి; నరవ్యాఘ్ర = నరోత్తమా! రాజానః = వివిధ దేశముల రాజులు; తవ = మీ యొక్క; శాసనాత్ = శాసనము వలన; మయా అపి = నా చేత; సత్కృతాః = సత్కరించబడిరి; సర్వే = అందఱును; యథార్హమ్ = వారి వారి; అర్హతలను అనుసరించి; రాజ సత్తమాః = రాజోత్తములు;
భావము:-
ఆ పై సంతసించిన వసిష్ఠుడు, దశరథుని ఉద్దేశించి, ఇట్లు పలికెను: ఓ నృపోత్తమా! మీ ఆజ్ఞ ననుసరించి వచ్చిన ,రాజులందఱకు వారి వారి అర్హతలను అనుసరించి గౌరవ మర్యాదలు చేసితిని.
1.13.34.
అనుష్టుప్.
యజ్ఞియం చ కృతం రాజన్"
పురుషైః సుసమాహితైః ।
నిర్యాతు చ భవాన్ యష్టుం
యజ్ఞాయతన మంతికాత్ ॥
టీక:-
యజ్ఞీయం = యజ్ఞమునకు అవసరమగు పనులు; కృతమ్ = నిర్వహించబడినవి; రాజన్ = ఓ రాజా; పురుషైః = పురుషులచే; సు = ౘక్కని; సమాహితైః = బుద్ధిమంతులైన; నిర్యాతు = వెళ్ళుటకు; భవాన్ = మీరు; యష్టుం = యజ్ఞము చేయుటకు; యజ్ఞాయతనమ్ = యజ్ఞస్థలమునకు; అంతికాత్ = చెంతను ఉన్న
భావము:-
ఓ రాజా! సుమతులైన వారందఱు యజ్ఞమునకు కావలసిన అన్ని ఏర్పాటులు చేసారు. ఇక మీరు యాగము చేయుటకు యజ్ఞ స్థలమునకు బయలుదేరుడు.
1.13.35.
అనుష్టుప్.
“సర్వకామై రుపహృతైః
ఉపేతం వై సమంతతః ।
ద్రష్టుమర్హసి రాజేంద్ర
మనసేవ వినిర్మితమ్" ॥
టీక:-
సర్వ = అన్ని; కామైః = కావలసిన వినోద పరికరములు; ఉప హృతైః = ఏర్పాటు చేయబడి; ఉపేతమ్ = కూడియున్నది; సమంతతః = అన్ని చోట్లలో; ద్రష్టమ్ = చూచుటకు; అర్హసి = అర్హుడవై ఉంటివి. రాజేంద్ర = ఓ రాజశ్రేష్ఠుడా; మనసా = మనసుచే; ఇవ = ఈ విధముగా; వినిర్మితమ్ = నిర్మింౘ బడినది.
భావము:-
ఓ రాజేంద్రా! ఊహా జనితమైన తలపులతో నిర్మించినట్లున్న, భోగ్యవస్తువుల ఏర్పాట్లతో కూడిఉన్న ఈ యాగశాలను మీరు చూడవలయును
1.13.36.
అనుష్టుప్.
తథా వసిష్ఠవచనాత్
ఋశ్యశృంగస్య చోభయోః ।
శుభే దివసనక్షత్రే
నిర్యాతో జగతీపతిః ॥
టీక:-
తథా = అపుడు; వసిష్ఠ = వసిష్ఠుని; వచనాత్ = వాక్కులతోను; ఋశ్యశృంగస్య చ = ఋష్యశృంగుని పలుకులు తోను; ఉభయోః = వాఱిరువుఱి; శుభే = ఓ శుభప్రదమైన; దివస = దినమునను; నక్షత్రే = నక్షత్రసమయమందును; నిర్యాతః = తరలెను; జగతీపతిః = జగతికి భర్తైన రాజు
భావము:-
అపుడు వసిష్ఠుని, మఱియు ఋష్యశృంగుని పలుకులు విని పృథివీపతి, దశరథుడు ఒక శుభదినమున, శుభనక్షత్రములో యజ్ఞస్థలిలో ప్రవేశించుటకు బయలుదేరెను.
1.13.37.
అనుష్టుప్.
తతో వసిష్ఠప్రముఖాః
సర్వ ఏవ ద్విజోత్తమాః ।
ఋశ్యశృంగం పురస్కృత్య
యజ్ఞకర్మారభంస్తదా ॥
టీక:-
తతః = అపుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; ప్రముఖాః = ముఖ్యులు; సర్వ ఏవ = అందఱు; ద్విజ = బ్రాహ్మణ; ఉత్తమాః = ఉత్తములు; ఋష్యశృంగమ్ = ఋష్యశృంగుని; పురస్కృత్య = సారథ్యములో; యజ్ఞకర్మ = యజ్ఞకర్మను; ఆరభన్ = ఆరంభించిరి; తదా = అపుడు.
భావము:-
అపుడు వసిష్ఠుడు మొదలగు ప్రముఖులు, ద్విజోత్తములు, ఋష్యశృఙ్గుని నేతృత్వములో, దశరథుని యజ్ఞస్థలికి వేంచేసి శాస్త్రరీతుల ననుసరించి యజ్ఞమును ఆరంభించిరి.
1.13.38.
అనుష్టుప్.
యజ్ఞవాటగతాః సర్వే
యథాశాస్త్రం యథావిధి।
శ్రీమాంశ్చ సహపత్నీ భీ
రీజా దీక్షా ముపావిశత్॥
టీక:-
యజ్ఞ = యజ్ఞ; వాట = వాటికకు; గతాః = వెళ్ళి; సర్వే = అంతా; యథాశాస్త్రమ్ = శాస్త్రప్రకారము; యథావిధి = విధిప్రకారము; శ్రీమ న్ = శ్రీమంతుడైన కర్త; సహ = కూడాఉన్న; పత్నీః = భార్యలు కలవాడు; భీః = కూడ; ఇజా = అర్హతకోసం; దీక్షాః = దీక్షను; ఉపాశిత్ = చేపట్టిరి.
భావము:-
అందరు యథావిధిగా పద్ధతిప్రకారం యజ్ఞశాలప్రవేశించిరి. యజమాని దశరథుడు, భార్యలతో కలిసి యాగదీక్ష తీసుకున్నారు.
1.13.39.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రయోదశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రయోదశః [13] = పదమూడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [13] పదమూడవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.14.1.
అనుష్టుప్.
అథ సంవత్సరే పూర్ణే
తస్మిన్ ప్రాప్తే తురంగమే ।
సరయ్వాశ్చోత్తరే తీరే
రాజ్ఞో యజ్ఞోఽ భ్యవర్తత ॥
టీక:-
అథ = తరువాత; సంవత్సరే = సంవత్సరము; పూర్ణే = పూర్తి యగుచుండగా; తస్మిన్ = ఆ; ప్రాప్తే = వచ్చిన పిమ్మట; తురంగమే = గుఱ్ఱము; సరయ్వాః = సరయూ నది; చ = యొక్క; ఉత్తరే = ఉత్తరపు; తీరే = తీరమునందు; రాజ్ఞః = రాజు యొక్క; యజ్ఞః = యాగము; అభ్యవర్తత = ప్రారంభమయ్యెను.
భావము:-
సంవత్సరము పూర్తి అగుచుండగా యాగాశ్వము తిరిగి వచ్చినది. అప్పుడు సరయూనది యొక్క ఉత్తరతీరము నందు దశరథుడు యజ్ఞమును ప్రారంభించెను.
1.14.2.
అనుష్టుప్.
ఋశ్యశృంగం పురస్కృత్య
కర్మ చక్రుర్ద్విజర్షభాః ।
అశ్వమేధే మహాయజ్ఞే
రాజ్ఞోఽ స్య సుమహాత్మనః ॥
టీక:-
ఋశ్యశృంగమ్ = ఋశ్యశృంగుని; పురస్కృత్య = అనుసరించి / ముందు ఉంచుకొని; కర్మ = కార్యక్రమమును; చక్రుః = చేసిరి; ద్విజః = బ్రాహ్మణులలో; ఋషభాః = ఉత్తములు; అశ్వమేధే = అశ్వమేధమను; మహా = గొప్ప; యజ్ఞే = యాగమునందు; రాజ్ఞః = రాజు యొక్క; అస్య = ఆ; సుమహాత్మనః = పూజనీయుడైన.
భావము:-
పూజనీయుడైన ఆ దశరథుని అశ్వమేధ యాగమునందు; బ్రాహ్మణోత్తములు ఋశ్యశృంగుని అనుసరించి యజ్ఞ కార్యక్రమములు నిర్వహించిరి.
1.14.3.
అనుష్టుప్.
కర్మ కుర్వంతి విధివత్
యాజకా వేదపారగాః ।
యథావిధి యథాన్యాయం
పరిక్రామంతి శాస్త్రతః ॥
టీక:-
కర్మ = యజ్ఞకర్మలను; కుర్వంతి = నిర్వహించిరి; విధివత్ = శాస్త్ర విధిగా; యాజకాః = ఋత్విక్కులు; వేదపారగాః = వేదపండితులు; యథావిధి = వేదములో చెప్పబడినట్లుగా; యథా న్యాయమ్ = న్యాయబద్ధముగా; పరిక్రామంతి = నడిపించిరి; శాస్త్రతః = శాస్త్రప్రకారము.
భావము:-
వేదపండితులైన ఋత్విక్కులు; యజ్ఞ సంబంధమైన కర్మలన్నియు శాస్త్ర యుక్తముగా నిర్వహించిరి. వేదములో చెప్పబడినట్లు న్యాయముగా నడిపించిరి.
1.14.4.
అనుష్టుప్.
ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా
తథైవోపసదం ద్విజాః ।
చక్రుశ్చ విధివత్సర్వమ్
అధికం కర్మ శాస్త్రతః ॥
టీక:-
ప్రవర్గ్యమ్ = ప్రవర్గ్యమును శాస్త్రతః = శాస్త్రానుసారము; కృత్వా = చేసి; తథైవ = అంతేకాక; ఉపసదమ్ = ఉపసదమును కూడ; ద్విజాః = బ్రాహ్మణులు; చక్రుః చ = చేసిరి; చ; విధివత్ = పద్దతిప్రకారముగా; సర్వమ్ = అంతయు; అధికమ్ = తదితర; కర్మ = కర్మలను; శాస్త్రతః = శాస్త్రప్రకారము.
భావము:-
బ్రాహ్మణులు అశ్వమేధయాగములోని ప్రవర్గ్యము అను యాగకర్మలను, ఉపసదము అను ఇష్టి కార్యములను మఱియు తదితర యజ్ఞకర్మలను అన్నింటిని పద్ధతిప్రకారముగా శాస్త్ర ప్రకారముగా నిర్వర్తించిరి.
1.14.5.
అనుష్టుప్.
అభిపూజ్య తతో హృష్టాః
సర్వే చక్రుర్యథావిధి ।
ప్రాతఃసవనపూర్వాణి
కర్మాణి మునిపుంగవాః ॥
టీక:-
అభిపూజ్య = దేవతలను పూజించి; తతః = తరువాత; హృష్టాః = సంతోషించి; సర్వే = అందరును; చక్రుః = చేసిరి; యథావిధిః = శాస్త్ర విధిగా; ప్రాతః సవన = ఉదయము చేయు యజ్ఞమునకు సంబంధించినవి; పూర్వాణి = మొదలగు; కర్మాణి = కర్మలను; మునిపుంగవాః = మునిశ్రేష్ఠులు.
భావము:-
ఆ మునిశ్రేష్ఠులందరును సంతోషించి, ఆయా కర్మాధిష్ఠాన దేవతలను పూజించిరి. యజ్ఞకర్మలు మున్నగు వానిని యథావిధిగా చేసిరి.
1.14.6.
అనుష్టుప్.
ఐంద్రశ్చ విధివద్దత్తో
రాజా చాఽ భిషుతోఽ నఘః ।
మాధ్యందినం చ సవనం
ప్రావర్తత యథాక్రమమ్ ॥
టీక:-
ఐన్ద్రః = ఇంద్రునకు; చ = చెందినది; విధివత్ = యథాశాస్త్రముగా హవిర్భగములు; దత్తః = ఇవ్వబడినని; రాజా = రాజు; చ = మఱియు; అభిషుతః = సోమలతనుండి రసము తీసెను; అనఘః = దోషరహితమైనది; మాధ్యందినం = మధ్యాహ్న; చ = కూడ; సవనం = యజ్ఞకర్మలను; ప్రావర్తత = జరిగెను; యథాక్రమం = యథావిధిగా.
భావము:-
రాజా దశరథులవారు ఇంద్రునికి యతావిధిగా హవిస్సులు అర్పించిరి. దోషరహితమైన సోమరసము పిండిరి. పిమ్మట మధ్యాహ్నము చేయవలసిన యజ్ఞ కార్యములు యథావిధిగా ఆచరించిరి.
1.14.7.
అనుష్టుప్.
తృతీయసవనం చైవ
రాజ్ఞోఽ స్య సుమహాత్మనః ।
చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా
తథా బ్రాహ్మణపుంగవాః ॥
టీక:-
తృతీయ సవనం చైవ = సాయం సంధ్యా సమయంలో చేసే యజ్ఞ కర్మలను కూడ; రాజ్ఞః = రాజు; అస్య = యొక్క; సుమహాత్మనః = మహాత్ముడైన; చక్రుస్తే = వారు చేసిరి; శాస్త్రతః = శాస్త్రము ననుసరించి; దృష్ట్వా = చూసి; తథా = అదే విధముగనే; బ్రాహ్మణ పుంగవాః = బ్రాహ్మణ శ్రేష్ఠులు.
భావము:-
బ్రాహ్మణోత్తములు సాయం సంధ్యా సమయములో చేయు యజ్ఞకార్యములను కూడా శాస్త్ర సమ్మతముగా నిర్వహించిరి.
1.14.8.
అనుష్టుప్.
న చాహుతమభూత్తత్ర
స్ఖలితం వాపి కించన ।
దృశ్యతే బ్రహ్మవత్సర్వం
క్షేమయుక్తం హి చక్రిరే ॥
టీక:-
న చ = జరుగలేదు; చ; ఆహుతమ్ = హవిస్సులు వ్రేల్చుటలలో; అభూత్ = లోపములు; తత్ర = అక్కడ; స్ఖలితమ్ = పొరపాటున; వా = ఐనా; అపి = కూడ; కించిన = కొంచెము కూడ లేదు; దృశ్యతే = కనబడుచున్నది; బ్రహ్మవత్ = మంత్రయుక్తముగా; సర్వం = అంతయును; క్షేమయుక్తమ్ = శుభకరముగా; హి = మాత్రమే; చక్రిరే = చేసిరి కదా.
భావము:-
ఆ యజ్ఞములో హవిస్సులను వేల్చుటలోనూ, యజ్ఞ సంబంధమైన మరి ఏ ఇతర విధములైన కర్మలలోనూ లోపములుగాని పొరపాట్లుగాని ఏమాత్రం జరుగలేదు. ఆ కార్యమంతయు మంత్ర పూర్వకముగా శుభకరముగా ఉండునట్లు చేసిరి.
1.14.9.
అనుష్టుప్.
న తేష్వహస్సు శ్రాన్తో వా
క్షుధితో వాపి దృశ్యతే ।
నావిద్వాన్ బ్రాహ్మణస్తత్ర
నాశతానుచరస్తథా ॥
టీక:-
న = లేదు; తేషు = ఆ; అహస్సు = దినములలో; శ్రాంత = అలసిన వాడు; క్షుధితః = ఆకలితో ఉన్నవాడు; వా = అయినా; అపి = కూడ; దృశ్యతే = కనబడుట; న = లేడు; అవిద్వాన్ = విద్వాంసుడు కాని; బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; తత్ర = అక్కడ; అశతానుచరః = కనీసము నూరుగురు అనుచరులైనను లేని వాడు; తథా = అట్లే.
భావము:-
యజ్ఞము చేసిన ఆ దినములలో అలసినవాడు కాని, ఆకలితో ఉన్నవాడు గాని కవబడుటలేదు. విద్వత్తు లేని వాడు గాని, అట్లే కనీసము నూరుగురు శిష్యులైన లేని బ్రాహ్మణుడు గాని కనబడరు.
1.14.10.
అనుష్టుప్.
బ్రాహ్మణా భుంజతే నిత్యం
నాథవంతశ్చ భుంజతే ।
తాపసా భుంజతే చాపి
శ్రమణా భుంజతే తథా ॥
టీక:-
బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; భుఞ్జతే = భోజనములు చేయుచుండిరి; నిత్యమ్ = ప్రతి దినము; నాథవంత = దాస దాసీ జనము; చ = కూడ; తాపసా = తపసులు; భుఞ్జతే = భోజనములు చేయుచుండిరి; చాపి = కూడ; శ్రమణా = సన్యాసులును; భుఞ్జతే = భోజనములు చేయుచుండిరి; తథా = అలాగే.
భావము:-
ఆ యజ్ఞము చేయుచున్నన్ని దినములు బ్రాహ్మణులు, దాస దాసీ జనము, మునులు మఱియు సన్యాసులు అందరు నిత్యము భోజనములు చేయుచుండిరి.
1.14.11.
అనుష్టుప్.
వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ
స్త్రియో బాలాస్తథైవ చ ।
అనిశం భుంజమానానాం
న తృప్తిరుపలభ్యతే ॥
టీక:-
వృద్ధాః = వృద్ధులు; వ్యాధితాశ్చైవ = రోగులు; స్త్రియః = స్త్రీలు; బాలాః = చిన్నపిల్లలు; తథైవచ = మఱియు; అనిశమ్ = నిత్యము; భుఞ్జమానానామ్ = భోజనము చేయువారికి; న తృప్తిః ఉపలభ్యతే = తృప్తి కలుగుట లేదు.
భావము:-
వృద్ధులు, రోగులు, స్త్రీలు, బాలురు భోజనము ఎల్లపుడు చేయుచున్నను భోజనము చాలా మధురముగా ఉన్నందున ఎంత తిన్నను తృప్తి కలుగక మరింత తినవలెనని అభిలాష వారికి కలుగుచుండెను.
1.14.12.
అనుష్టుప్.
దీయతాం దీయతామన్నం
వాసాంసి వివిధాని చ" ।
ఇతి సంచోదితాస్తత్ర
తథా చక్రురనేకశః ॥
టీక:-
దీయతాం దీయతామ్ = ఇవ్వబడుగాక; అన్నమ్ = అన్నము; వాసాంసి = వస్త్రములు; వివిధాని చ = అనేక రకములైన; చ = కూడ; ఇతి = ఈ విధముగా; సంచోదితాః = ప్రేరేరింపబడిన వారై; తత్ర = అక్కడ; తథా = అట్లు; చక్రుః = చేసిరి; అనేకశః = అనేక విధములుగ .
భావము:-
"భోజనము బాగా వడ్డించండి, రకరకముల వస్త్రములను పంచి పెట్టండి" అని ఆ యాగశాల యందు దశరథుడును, మంత్రులును చెప్పుచుండగా వారు అట్లే చేసిరి.
1.14.13.
అనుష్టుప్.
అన్నకూటాశ్చ బహవో
దృశ్యంతే పర్వతోపమాః ।
దివసే దివసే తత్ర
సిద్ధస్య విధివత్తదా ॥
టీక:-
అన్న = భోజనపదార్థాల; కూటః = రాశులు; చ; బహవః = అనేకములైన; దృశ్యంతే = కనబడుచుండెను; పర్వతః = పర్వతములు; ఉపమాః = వలె; దివసే దివసే = ప్రతి దినము; తత్ర = అక్కడ; సిద్ధః = సిద్ధముగా; అస్య = కూడ ఉన్నాయి; విధివత్ = తగు విధముగా; తదా = అప్పుడు.
భావము:-
అక్కడ ప్రతిదినము తగువిధముగా వండిన అన్నము మఱియు భోజన పదార్థముల రాశులు పర్వతముల వలె సిద్ధముగా ఉండెను.
1.14.14.
అనుష్టుప్.
నానాదేశాదనుప్రాప్తాః
పురుషాః స్త్రీగణాస్తథా ।
అన్నపానైః సువిహితాః
తస్మిన్ యజ్ఞే మహాత్మనః ॥
టీక:-
నానా = అనేకానేక; దేశాత్ = దేశములనుండి; అనుప్రాప్తాః = వచ్చిన; పురుషాః = పురుషులు; స్త్రీః = స్త్రీలు; గణాః = సమూహములుగ; తథా = నిశ్చయంగా; అన్నపానైః = అన్నపానములచే; సువిహితాః = బాగుగా తృప్తి చెందిరి; తస్మిన్ = ఆ; యజ్ఞే = యజ్ఞమునందు; మహాత్మనః = మహాత్ముని యొక్క.
భావము:-
మహాత్ముడైన దశరథ మహారాజు చేసిన యజ్ఞమునకు అనేక దేశముల నుండి వచ్చిన స్త్రీ పురుషు లందరును అన్నపానాదులతో తృప్తి నొందిరి.
1.14.15.
అనుష్టుప్.
అన్నం హి విధివత్స్వాదు
ప్రశంసంతి ద్విజర్షభాః ।
అహో తృప్తాః స్మ భద్రం తే
ఇతి శుశ్రావ రాఘవః ॥
టీక:-
అన్నమ్ = ఆహారము; హి = నిస్సందేహంగా; విధివత్ = రీతిగ; స్వాదు = రుచికరమైనదని; ప్రశంసంతి = ప్రశంసించిరి; ద్విజః = బ్రాహ్మణులలో; ఋషభాః = ఉత్తములు; అహో = ఆహా; తృప్తాః = తృప్తిచెందాము; స్మః = మేము; భద్రం = శుభమగు గాక; తే = మీకు; ఇతి = ఈ విధమైన మాటలను; శుశ్రావ = వినెను; రాఘవః = రఘుకుల వంశీయుడైన దశరథుడు.
భావము:-
పద్ధతిగా వండి వడ్డించిన రుచికరమైన భోజనమును ఆరగించిన బ్రాహ్మణోత్తములు "మేము తృప్తి చెందినాము. నీకు మంగళమగు గాక" అని పలుకగా దశరథుడు వినెను.
1.14.16.
అనుష్టుప్.
స్వలంకృతాశ్చ పురుషా
బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ।
ఉపాసతే చ తానన్యే
సుమృష్టమణికుండలాః ॥
టీక:-
స్వలంకృతాః = బాగుగా అలంకరించుకొనిన; పురుషాః = పురుషులు; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులకు; పర్యవేషయన్ = వడ్డించిరి; ఉపాసతే = సేవించిరి; తాన్ = వారిని; అన్యే = మరి కొందరు; సు = బాగుగా; మృష్ట = మెరియుచున్న; మణికుండలాః = మణి కుండలములు గల వారు.
భావము:-
బాగుగా అలంకరించుకొనిన పురుషులు బ్రాహ్మణులకు వడ్డించుచుండిరి. శ్రేష్ఠమైన మణికుండలములు ధరించిన మరికొందరు వడ్డించెడివారికి సహాయము చేయుచుండిరి.
1.14.17.
అనుష్టుప్.
కర్మాంతరే తదా విప్రా
హేతువాదాన్ బహూనపి ।
ప్రాహుశ్చ వాగ్మినో ధీరాః
పరస్పరజిగీషయా ॥
టీక:-
కర్మాః = యజ్ఞకర్మల; అంతరే = విరామ సమయంలో; తదా = అప్పుడు; విప్రాః = బ్రాహ్మణులు; హేతువాదాన్ = తార్కిక వాదములను; బహూనః = అనేకమైనవి; అపి = కూడ; ప్రాహుః = పలికిరి; వాఙ్గ్మినః = వాక్చాతుర్యము గల; ధీరాః = యుక్తిపరులు; పరస్పర = ఒకరి నొకరు; జిగీషియా = జయించ వలెనను కోరిక కలవారు.
భావము:-
యజ్ఞకర్మల మధ్య ఉన్న విరామములో వాక్చతురులు యుక్తిపరులు అగు బ్రాహ్మణోత్తములు ఒకరినొకరు జయించ వలెనను ఉత్సాహముతో అనేకానేక శాస్త్ర సంబంధమైన చర్చలు చేయుచుండిరి.
1.14.18.
అనుష్టుప్.
దివసే దివసే తత్ర
సంస్తరే కుశలా ద్విజాః ।
సర్వకర్మాణి చక్రుస్తే
యథాశాస్త్రం ప్రచోదితాః ॥
టీక:-
దివసే దివసే = ప్రతిదినము; తత్ర = అక్కడ; సంస్తరే = యజ్ఞమునందు; కుశలాః = నేర్పరులైన; ద్విజాః = బ్రాహ్మణులు; సర్వ = అన్ని; కర్మాణి = విధులను; చక్రుః = చేసిరి; యథాశాస్త్రం = శాస్త్రసమ్మతముగా; ప్రచోదితాః = ప్రేరేపింపబడిన వారై.
భావము:-
అక్కడ యజ్ఞము చేయుటలో నిష్ణాతులైన బ్రాహ్మణులు, ప్రతిదినము; శాస్త్ర ప్రకారం ఆయా కర్మలను నిర్వహించిరి.
1.14.19.
అనుష్టుప్.
నాషడంగవిదత్రాసీత్
నావ్రతో నాబహుశ్రుతః ।
సదస్యాస్తస్య వై రాజ్ఞో
నావాదకుశలా ద్విజాః ॥
టీక:-
న = లేదు; న ఆషడంగవిత్ = వేదముల యొక్క ఆరు శాఖలు (వేదాంగములు) తెలియనివాడు; అత్ర = ఇక్కడ; ఆసీత్ = ఉండుట; న = లేడు; అవ్రతః = వ్రతనిష్ఠ లేనివాడు; న = లేడు; అబహుశ్రుతః = బహు శాస్త్రములతో పరిచయము లేనివాడు; సదస్యాః = సదస్యులు; తస్య = ఆ; న = లేకుండిరి; వై = నిశ్చయంగా; రాజ్ఞః = రాజు యొక్క; అవాదకుశలాః = శాస్త్రవాదము చేయలేనివారు; ద్విజాః = బ్రాహ్మణులు.
భావము:-
వేదాంగములు తెలియనివారు కాని, బహుశాస్త్ర కోవిదులు కానివారు కాని, శాస్త్ర విషయములయందు వాదన చేయలేనివారు కాని దశరథుని యజ్ఞవాటికలోని సదస్యులలో లేరు.
1.14.20.
అనుష్టుప్.
ప్రాప్తే యూపోచ్ఛ్రయే తస్మిన్
షడ్బైల్వాః ఖాదిరాస్తథా ।
తావన్తో బిల్వసహితాః
పర్ణినశ్చ తథాఽ పరే ॥
టీక:-
ప్రాప్తే = ప్రాప్తించినది; యూపః = యూప స్తంభములను; ఉచ్ఛ్రయే = ఎత్తవలసి వచ్చినపుడు; తస్మిన్ = ఆ యజ్ఞవాటిక యందు; షట్ = ఆరు; బైల్వాః = మారేడు కఱ్ఱతో చేయబడిన; ఖాదిరాః = చండ్ర కఱ్ఱతో చేసిన స్తంభములను; తావంత = అంతే సంఖ్య గల; బిల్వ సహితాఃపర్ణినః = మాఱేడును పోలిన ఆకులు గలది, మోదుగకఱ్ఱ తో చేయబడిన; చ; తథా = మఱియు; ఆపరే = మరి కొన్ని ఇతర స్తంభములు.
భావము:-
ఆ యజ్ఞవాటికలో యూపస్తంభములుగా ఆరు బిల్వ;, ఆరు చండ్ర, ఆరు మోదుగ ఇంకా మఱికొన్ని యూపస్తంభములను నాటిరి.
1.14.21.
అనుష్టుప్.
శ్లేష్మాతకమయస్త్వేకో
దేవదారుమయస్తథా ।
ద్వావేవ తత్ర విహితౌ
బాహువ్యస్తపరిగ్రహౌ ॥
టీక:-
శ్లేష్మాతకమయః = విరిగిచెట్టు కఱ్ఱతో చేసిన స్తంభము; దేవదారుమయ = దేవదారువు కఱ్ఱతో చేసిన స్తంభము; ద్వావేవ = రెండు స్తంభములు; విహితౌ = నిర్మింపబడినవి; తత్ర = అక్కడ; బాహువ్యస్తపరిగ్రహౌ = రెండు చేతులు చాపినంత దూరము, బార.
భావము:-
శ్లేష్మాతక అనగా విరిగి వృక్షము యొక్క కఱ్ఱతో చేయబడిన ఒక స్తంభము, దేవదారు చెక్కతో చేసిన రెండు స్తంభములు నాటిరి. ప్రతి రెండు స్తంభముల మధ్యన మధ్యన బారెడు దూరము ఉంచిరి.
1.14.22.
అనుష్టుప్.
కారితాః సర్వ ఏవైతే
శాస్త్రజ్ఞైర్యజ్ఞకోవిదైః ।
శోభార్థం తస్య యజ్ఞస్య
కాంచనాలంకృతాఽ భవన్ ॥
టీక:-
కారితాః = చేయించబడిన; సర్వ = అన్నియు; ఏవ = ఇవి; తే = వారిచే; శాస్త్రజ్ఞైః = శాస్త్రజ్ఞులు; యజ్ఞ కోవిదైః = యజ్ఞము చేయుటలో ప్రవీణులుచేత; శోభ = అలంకరణ; అర్థం = కొరకు; తస్య = ఆ; యజ్ఞః = యాగముల; అస్య = యొక్క; కాంచనాః = బంగారముతో; అలంకృతాః = అలంకరింప బడినవై; ఆభవన్ = ఐనవి.
భావము:-
శాస్త్రజ్ఞులు మఱియు యజ్ఞములు చేయుటలో ప్రవీణులైన వారు ఆ యూపస్తంభములను బంగారు తొడుగులతో అలంకరించిరి.
1.14.23.
అనుష్టుప్.
ఏకవింశతి యూపాస్తే
ఏకవింశత్యరత్నయః ।
వాసోభిరేకవింశద్భిః
ఏకైకం సమలంకృతాః ॥
టీక:-
ఏకవింశతి = ఇరవైయొక్క; యూపస్తే = యూపస్తంభములకు; ఏకవింశతి = ఇరవైయొక్క; అరత్నయః = మూరల; వాసోభిః = వస్త్రములచే; ఏకవింశద్భిః = ఇరవైయొక్కింటికి; ఏకైకమ్ = ఒకదానికి ఒకటి చొప్పున; సమ = చక్కగా; అలంకృతాః = అలంకరింప బడినవి.
భావము:-
ఇరవైయొక్క స్తంభములకు, ఇరవైయొక్క మూరల, ఇరవైయొక్క వస్త్రములు, ఒకదానికి ఒకటి చొప్పున చుట్టి అలంకరించిరి.
1.14.24.
అనుష్టుప్.
విన్యస్తా విధివత్సర్వే
శిల్పిభిః సుకృతా దృఢాః ।
అష్టాశ్రయః సర్వ ఏవ
శ్లక్ష్ణరూపసమన్వితాః ॥
టీక:-
విన్యస్తాః = నాట బడినవి; విధివత్ = యథాశాస్త్రముగా; సర్వే = అన్నియు; శిల్పిభిః = శిల్పులచే; సుకృతాః = చక్కగా చేయబడినవి; దృఢాః = దృఢముగా ఉన్నవి; అష్టాశ్రయః = ఎనిమిది అంచులు గలవి; సర్వ = అన్నియు; ఏవ = అవి; శ్లక్ష్ణ = నున్నటి; రూప = రూపము; సమన్వితాః = కలవి.
భావము:-
దృఢమైన ఆ యూపస్తంభములన్నియు ఎనిమిది పలకలగా చిత్రీ పట్టి నున్నగా చేయబడి, శాస్త్రానుసారముగా శిల్పులచే నిర్మించబడి స్థాపించబడినవి.
1.14.25.
అనుష్టుప్.
ఆచ్ఛాదితాస్తే వాసోభిః
పుష్పైర్గన్ధైశ్చ పూజితాః ।
సప్తర్షయో దీప్తిమన్తో
విరాజంతే యథా దివి ॥
టీక:-
ఆచ్ఛాదితాః = కప్పబడినవి; తే = అవి; వాసోభిః = వస్త్రములచే; పుష్పైః = పువ్వులతోను; గన్ధైశ్చ = గంధముతోను; పూజితాః = పూజింప బడినవి; సప్తర్షయః = సప్త ఋషులవలె; దీప్తిమంత = కాంతివంతమై; విరాజంతే = ప్రకాశించుచున్నవి; యథా దివి = ఆకాశమునందు వలె.
భావము:-
ఆ యూపస్తంభములు వస్త్రములు చుట్టి, పుష్పములు సుగంధములతో అలంకరించిరి. ఆకాశములోని సప్తఋషి మండలము వలె వెలుగుచున్నవి.
1.14.26.
అనుష్టుప్.
ఇష్టకాశ్చ యథాన్యాయం
కారితాశ్చ ప్రమాణతః ।
చితోఽ గ్నిర్బ్రాహ్మణైస్తత్ర
కుశలైః శుల్బకర్మణి ॥
టీక:-
ఇష్టకాః = ఇటుకలు; చ; యథా న్యాయం = శాస్త్ర ప్రకారముగా; కారితాః = చేయించబడినవి; చ; ప్రమాణతః = కొలతల ప్రకారము; చితోఽగ్నిః = ఇటుకలతో కట్టబడిన యజ్ఞగుండములు; బ్రాహ్మణైః = బ్రాహ్మణులచే; తత్ర = అక్కడ; కుశలైః = నిపుణులైన; శుల్బ కర్మణి = శుల్బ (ఒంటి పేట తాడు)తో కర్మణి (కొలతలు వేయు పనిలో).
భావము:-
యజ్ఞగుండములు వాస్తు కొలతలను నిర్దేశించు శుల్బశాస్త్ర ప్రకారము కొలతలు వేసి, నిర్మాణము చేయుటలో నిపుణులైన బ్రాహ్మణులు ఇటుకలతో నిర్మించిరి.
1.14.27.
అనుష్టుప్.
స చిత్యో రాజసింహస్య
సంచితః కుశలైర్ద్విజైః ।
గరుడో రుక్మపక్షో వై
త్రిగుణోఽ ష్టాదశాత్మకః ॥
టీక:-
స = సహితమైనది; చిత్యః = హోమాగ్ని; రాజసింహ = రాజులలో ఉత్తముడైన దశరథుడు; అస్య = యొక్క; సంచితః = అమర్చబడిన; కుశలైః = నిష్ణాతులు; ద్విజైః = బ్రాహ్మణులు; గరుడః = గరుడాకారమైన అగ్నివేదిక; రుక్మపక్షః = బంగారు రెక్కలు గల; త్రిగుణః = హొమగుండానికి వాడే ఆఱు వరుసలకు మూడు రెట్లు; అష్టాదశాత్మకః = పదునెనిమిది వరుసలుగా.
భావము:-
రాజశ్రేష్టుడైన దశరథునికొఱకు నిష్ణాతులైన బ్రాహ్మణులు హోమగుండమును బంగారు రెక్కులుగల గరుడాకారములో శోభిల్లునట్లు పదునెనిమిది వరుసలుగా ఇటుకలు పేర్చి నిర్మించిరి.
గమనిక:-
1. సాధారణంగా హోమగుండానికి ఆఱు వరుసల ఇటుకలు వాడుతారు. దానికి మూడు రెట్లు అనగా పద్దెనిమిది వరుసలు వాడారు. అశ్వమేధములో హోమగుండా నికి చుట్టూ గరుడాకారములో నిర్మింతురు. ఆ గరుత్మంతుడు తూర్పుముఖముగా ఉండును. రెక్కలు, పుచ్చము (తోక) పూర్తిగా విప్పుకుని తలవంచి క్రిందకు చూచుచున్నట్లు ఉండును. ఇట్లు ఇటుకలు పేర్చుటకు చయనము అని పేరు. అందు వరుసలు వేయుటను ప్రస్తారము అందురు. వాజసనేయ శాఖా శుక్ల యజుర్వేదాది ఇతర యజ్ఞములలో ఆరు ప్రస్తారములు వేయుదురు. అశ్వమేధములో దానికి ఆరు రెట్లు అనగా పద్దెనిమిది (18) ప్రస్తారములు వేయుదురు. చిత్య అనగా చయనము చేసిన గుండములోని అగ్ని. 2. గరుడుని బంగారు వర్ణం ఱెక్కలు వలె ఇవి శోభిల్లుతున్నాయి
1.14.28.
అనుష్టుప్.
నియుక్తాస్తత్ర పశవః
తత్తదుద్దిశ్య దైవతమ్ ।
ఉరగాః పక్షిణశ్చైవ
యథాశాస్త్రం ప్రచోదితాః ॥
టీక:-
నియుక్తాః = కట్టబడినవి; తత్ర = అక్కడ; పశవః = పశువులు; తత్తత్ = ఆ యా; ఉద్దిశ్య = ఉద్దేశించి; దైవతమ్ = దేవతలను; ఉరగాః = సర్పములు; పక్షిణః = పక్షులును; చైవ = ఇంకా; యథాశాస్త్రమ్ = శాస్త్ర ప్రకారముగా; ప్రచోదితః = విహితముగా.
భావము:-
శాస్త్రములో చెప్పబడినట్లు ఆ యా దేవతలకు తగిన పశువులను; పాములను; పక్షులను సిద్ధముగా ఉంచిరి.
1.14.29.
అనుష్టుప్.
శామిత్రే తు హయస్తత్ర
తథా జలచరాశ్చ యే ।
ఋత్విగ్భిః సర్వమేవైతత్
నియుక్తం శాస్త్రతస్తదా ॥
టీక:-
శామిత్రే = శాంతింపజేయు / బలిచ్చు; తు; హయః = గుఱ్ఱములను; తత్ర = అక్కడ; తథా = మఱియు; జలచరాః = తాబేలు వంటి జలరాలు; చయే = సమూహములను; ఋత్విగ్భిః = ఋత్విక్కులచే; సర్వమే = అన్నియు; వై = సిద్ధంగా; తత్ = వాటి; నియుక్తమ్ = బంధించబడెను; శాస్త్రతః = శాస్త్రానుసారముగా; తదా = అప్పుడు.
భావము:-
పశుబలి చేయవలసిన సమయము వచ్చినప్పుడు, ఋత్విక్కులు శాస్త్రానుసారము గుఱ్ఱములు, తాబేలు, చేపలు వంటి జలచరములు వంటి వాటిని అన్నింటిని యూపస్తంభములకు కట్టిరి.
1.14.30.
అనుష్టుప్.
పశూనాం త్రిశతం తత్ర
యూపేషు నియతం తదా ।
అశ్వరత్నోత్తమం తత్ర
రాజ్ఞో దశరథస్య చ ॥
టీక:-
పశూనామ్ = పశువులు; త్రిశతమ్ = మూడువందలు; తత్ర = అక్కడ; యూపేషు = యూపస్తంభములయందు; నియతమ్ = కట్టబడెను; తదా = అప్పుడు; అశ్వ = గుఱ్ఱములలో; రత్నః = రత్నంవంటిది; ఉత్తమమ్ = శ్రేష్ఠమైనది; తత్ర = అక్కడ; రాజ్ఞః = రాజుగారి యొక్క; దశరథ = దశరథులు; అస్య = యొక్క; చ.
భావము:-
అప్పుడు అలా మూడు వందల పశువులను; దశరథమహారాజువారి యొక్క ఉత్తమోత్తమమైన గుఱ్ఱమును అక్కడ బంధించిరి.
1.14.31.
అనుష్టుప్.
కౌసల్యా తం హయం తత్ర
పరిచర్య సమంతతః ।
కృపాణైర్విశశాసైనం
త్రిభిః పరమయా ముదా ॥
టీక:-
కౌసల్యా = కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురు; తమ్ = ఆ; హయమ్ = గుఱ్ఱమును; తత్ర = అక్కడ; పరిచర్య = పూజాది ఉపచారములు చేసి; సమంతతః = అంతటికి; కృపాణైః = బంగారు సూదులతో; విశశాసైనమ్ = బలిచేయుటకైన గుర్తులు పెట్టిరి; త్రిభిః = మూడు; పరమయా = పరమ; ముదా = సంతోషముతో.
భావము:-
యజమాని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురూ ఆ యజ్ఞాశ్వమునకు పూజాది ఉపచారములు ప్రదక్షిణలు చేసిరి. మిక్కిలి సంతోషముగా దానికి మూడుసూదులతో బలిచేయుటకైన గుర్తులు పెట్టిరి.
1.14.32.
అనుష్టుప్.
పతత్రిణా తదా సార్దం
సుస్థితేన చ చేతసా ।
అవసద్రజనీమేకాం
కౌసల్యా ధర్మకామ్యయా ॥
టీక:-
పతత్రిణా = గుఱ్ఱముతో; తదా = అప్పుడు; సార్థమ్ = కలసి; సుస్థితేన = స్థిరమైన; చేతసా = చిత్తముతో; అవసత్ = నివసించెను; రజనీమ్ = రాత్రి; ఏకామ్ = ఒక; కౌసల్యా = కౌసల్యాదేవి; ధర్మకామ్యయా = ధర్మబద్ధముగా.
భావము:-
ఆ విశశాసైనం పిమ్మట, ధర్మబద్ధముగా దృఢచిత్తముతో కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురూ ఒక రాత్రి ఆ యజ్ఞాశ్వముతో కలిసి నివసించిరి.
గమనిక:-
*- పతత్రిణ - పక్షివలె వడిగా పోవునది, గుఱ్ఱము
1.14.33.
అనుష్టుప్.
హోతాధ్వర్యుస్తథోద్గాతా
హస్తేన సమయోజయన్ ।
మహిష్యా పరివృత్త్యా చ
వావాతామపరాం తథా ॥
టీక:-
హోతా = ఋగ్వేద తంత్రము నడుపువాడు; అధ్వర్యుః = యజుర్వేద తంత్రము నడుపువాడు; తథా = మఱియు; ఉద్గాతా = సామవేద తంత్రము నడుపువాడు; హస్తేన = చేతితో; సమయోజయన్ = చక్కగా సంధానము చేసిరి, గ్రహించిరి; మహిష్యాః = పట్టపురాణులతో; పరివృత్యా = ఉపేక్షితల తోను; చ; వావాతాం = భోగినల తోను; ఆపరామ్ = ఇతరులను; తథా = అటులనే.
భావము:-
దశరథునిచే వివాహమాడిన భార్యలలో పట్టాభిషేకము పొందిన పట్టపురాణులను; వివాహమాడినను పట్టాభిషేకము పొందని భార్య ఉపేక్షితలను; (తన) ఉంపుడుకత్తె వావాతలను; అలాగా మఱి ఇతరస్త్రీలను యజ్ఞములో పాల్గొను హోత; అధ్వర్యుడు; ఉద్గాత ఋత్విక్కులు చేపట్టిరి అనగా స్వీకరించిరి.
గమనిక:-
మహిషిఅంటే రాజుతోపాటు పట్టాభిషేకము పొందిన భార్య, పరివృత్య అంటే ఉపేక్షింపబడిన భార్య, వావాత అంటే భోగినీ స్త్రీ / ఉంపుడుగత్తె, పాలాకలి అంటే పాత్ర అందించునది. (కృతాభిషేకా మహిషీ, పరివృత్యరుపేక్షితా, వావాతా భోగినీ, పాత్రాప్రదా పాలాకలీ - వైజయంతి). అశ్వమేధ యాగములో యజమాని ఈ నలుగురు స్త్రీలను నలుగురు స్త్రీలకు దక్షిణగా ఇవ్వవలె నట. వారు వాళ్ళను గ్రహించి, వారికి బదులుగా మరొక వస్తువు తీసుకుని, తిరిగి యజమానికి ఇచ్చివేయుదు రట. ఈ శ్లోకములో బ్రహ్మ అనే ఋత్విక్కును పాలాకలిని చెప్పకపోయినను చెప్పినట్లే గ్రహించవలయును అని గోవింజరాజులు వారు వ్రాసిరి. సౌజన్యము పుల్లెల శ్రీరామ చంద్రుడు వారి శ్రీమద్రామాయణము
1.14.34.
అనుష్టుప్.
పతత్రిణస్తస్య వపాం
ఉద్ధృత్య నియతేంద్రియః ।
ఋత్విక్ పరమసంపన్నః
శ్రపయామాస శాస్త్రతః ॥
టీక:-
పతత్త్రిణః = అశ్వము యొక్క; తస్య = ఆ; వపామ్ = వపను; ఉద్ధృత్య = తీసి; నియతేంద్రియః = ఇంద్రియ నిగ్రహము కలవాడు; ఋత్విక్ = ఋత్విక్కు; పరమసంపన్నః = శాస్త్రజ్ఞానము బాగుగా తెలిసియున్నవాడు; శ్రపయామాస = వండెను; శాస్త్రతః = శాస్త్రవిధముగా.
భావము:-
ఇంద్రియనిగ్రహము, శాస్త్రజ్ఞానము మెండుగా కలవాడు ఐన ఋత్విక్కు ఆ అశ్వము యొక్క వపను (బొడ్డుక్రింద ఉండు కొవ్వుపొరను) శాస్త్రప్రకారముగా తీసి వండెను.
1.14.35.
అనుష్టుప్.
ధూమగన్ధం వపాయాస్తు
జిఘ్రతి స్మ నరాధిపః ।
యథాకాలం యథాన్యాయం
నిర్ణుదన్ పాపమాత్మనః ॥
టీక:-
ధూమ = పొగ యొక్క; గంధమ్ = వాసన; వపాయాః = వప యొక్క; జిఘ్రతి = వాసన చూచుట; స్మ = చేసెను; నరాధిపః = రాజు; యథాకాలమ్ = కాలానుగుణముగా; యథాన్యాయమ్ = పద్ధతి ప్రకారము; నిర్ణుదన్ = తొలగించుకొనుచు; పాపమ్ = పాపమును; ఆత్మనః = తన యొక్క.
భావము:-
కాలానుగుణంగా, పద్ధతి ప్రకారము దశరథుడు తన పాపమును తొలగించుకొనుటకు వపను వండుచుండగా వచ్చెడు పొగను వాసన చూచెను.
1.14.36.
అనుష్టుప్.
హయస్య యాని చాంగాని
తాని సర్వాణి బ్రాహ్మణాః ।
అగ్నౌ ప్రాస్యంతి విధివత్
సమన్త్రాః షోడశర్త్విజః ॥
టీక:-
హయస్య = గుఱ్ఱము యొక్క; యాని = ఏ; అంగాని = అవయవములను; తాని = వాటిని; సర్వాణి = అన్నింటిని; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; అగ్నౌ = అగ్నియందు; ప్రాస్యంతి = హోమము చేసిరి; విధివత్ = యథావిధిగా; స = సహితముగా; మన్త్రాః = వేదమంత్రములతో; షోడశ = పదహారుగురు; ఋత్విజః = ఋత్విక్కులు / యజమాని నుండి ధనము పుచ్చుకుని యజ్ఞము చేయించువాడు.
భావము:-
ఋత్విక్కులైన పదహారుగురు యాజికులు; యజ్ఞాశ్వము యొక్క వివిధ అవయవములను; వేదమన్త్రోచ్చారణ చేయుచు అగ్నిలో వేసిరి.
గమనిక:-
1. బ్రహ్మ, సహాయకులు,2. బ్రాహ్మణాచ్ఛంసుడు, 3. పోతుడు, 4. అగ్నీధ్రుడు; 5. ఉద్గాత, సహాయకులు, 6. ప్రస్తోతుడు, 7. ప్రతిహర్తుడు, 8. సుబ్రహ్మణ్యుడు; 9. హోత రూపాంతరం హోత్రి సహాయకులు,10. మైత్రావరుడు, 11. అచ్చావాకుడు, 12. గ్రావస్తుడు; 13.అధర్వుడు, సహాయకులు, 14. ప్రతిప్రస్థాతుడ, 15. నేష్టుడు, 16. ఉన్నేత,.
1.14.37.
అనుష్టుప్.
ప్లక్షశాఖాసు యజ్ఞానాం
అన్యేషాం క్రియతే హవిః ।
అశ్వమేధస్య యజ్ఞస్య
వైతసో భాగ ఇష్యతే ॥
టీక:-
ప్లక్ష = జువ్వి చెట్టు యొక్క; శాఖాసు = కొమ్మలయందు; యజ్ఞానామ్ = యజ్ఞములయొక్క; అన్యేషామ్ = ఇతరములైన; క్రియతే హవిః = హవిస్సు ఉంచబడును; అశ్వమేధ = అశ్వమేధము; అస్య = అను; యజ్ఞ = యజ్ఞము; అస్య = నకు చెందిన; వైతసః = ప్రబ్బలి తీగలతో సంస్కరించబడునదిగ; భాగః = హవిర్భాగము; ఇష్యతే = విధింపబడుచున్నది.
భావము:-
అశ్వమేధ యజ్ఞమునందు మాత్రము హవిస్సును ప్రబ్బలి తీగలపై ఉంచి సంస్కరింపవలెను. ఇతర యజ్ఞములందు హవిస్సును జువ్వి కొమ్మలపై ఉంచి సంస్కరించవలెను.
1.14.38.
అనుష్టుప్.
త్ర్యహోఽ శ్వమేధః సంఖ్యాతః
కల్పసూత్రేణ బ్రాహ్మణైః ।
చతుష్టోమమహస్తస్య
ప్రథమం పరికల్పితమ్ ॥
టీక:-
త్రిః = మూడు; అహః = దినములు; అశ్వమేధః = అశ్వమేధ యజ్ఞము; సంఖ్యాతః = సూచింపబడినది; కల్పసూత్రేణ = కల్పసూత్రములందు; బ్రాహ్మణైః = వేదవిభాగులైన బ్రాహ్మణములలోని; చతుష్టోమః = చతుష్టోమము ; అహః = దినము; తస్య = దానియొక్క; ప్రథమమ్ = మొదటి; పరికల్పితమ్ = సమకూర్చబడినది.
భావము:-
వేదవిభాగమైన ‘బ్రాహ్మణములలోని కల్పసూత్రము’లందు ‘అశ్వమేధ యాగము’ మూడు దినములలో చేయ వలసినదిగ సూచింపబడినది. ‘మొదటి దినము’ చేయు క్రతువు ‘చతుష్టోమము’.
గమనిక:-
*- చతుష్టోమము, ఉక్థ్యము, అతిరాత్రము అను యాగములు : సోమయాగ విశేషములు.
1.14.39.
అనుష్టుప్.
ఉక్థ్యం ద్వితీయం సంఖ్యాతం
అతిరాత్రం తథోత్తరమ్ ।
కారితాస్తత్ర బహవో
విహితాః శాస్త్రదర్శనాత్ ॥
టీక:-
ఉక్థ్యమ్ = ఉక్థ్యమని పేరుగల యాగము; ద్వితీయమ్ = రెండవది; సఙ్ఖ్యాతమ్ = సూచింప బడినది; అతిరాత్రమ్ = అతిరాత్రమను యాగము; తత్ = దాని; ఉత్తరమ్ = తరువాతది; కారితాః = చేయింపబడినవి; తత్ర = అక్కడ; బహవః = అనేక క్రతువులు; విహితాః = విధింపబడిన విధముగ; శాస్త్ర = శాస్త్రములు; దర్శనాత్ = సూచింపబడిన.
భావము:-
రెండవ దినమున చేయునది “ఉక్థ్యము”, మూడవ దినమున చేయునది “అతిరాత్రము”. శాస్త్రములందు శాస్త పరిశీలన చేసి ఆయా క్రతువులకు సూచింపబడిన విధముగా అనేక ఇతర క్రతువులను కూడ దశరథుడు నిర్వహించెను.
1.14.40.
అనుష్టుప్.
జ్యోతిష్టోమాయుషీ చైవమ్
అతిరాత్రౌ వినిర్మితౌ ।
అభిజిద్విశ్వజిచ్చైవమ్
ఆప్తోర్యామో మహాక్రతుః ॥
టీక:-
జ్యోతిష్టోమః = జ్యోతిష్టోమ యాగము; ఆయుషీః : అయుష్ కర్మము; చ; ఏవమ్ = మఱియు; అతిరాత్రౌ = అతిరాత్ర యాగములను; వినిర్మితౌ = నిర్వహింపబడినవి; అభిజిత్ = అభిజిత్ అను యాగము; విశ్వజిత్ = విశ్వజిత్ అను యాగము; ఆప్తోర్యామః = ఆప్తోర్యామము అనబడు యాగము; మహాక్రతుః = మహాక్రతువులు.
భావము:-
జ్యోతిష్టోమ యాగము. ఆయుష్ హోమము, అతిరాత్ర యాగము, అభిజిత్, విశ్వజిత్ యాగములు, ఆప్తోర్యామ యాగము అను మహాక్రతువులు కూడా చేయబడినవి.
గమనిక:-
*-1) జ్యోతిష్టోమము - 1. స్వర్గ కాముడు చేయవలసిన ఒక యజ్ఞము, 2. సోమయాగము. వ్యుత్పత్తి. జ్యోతీస్ = త్రివృదాదయః - స్తోమాః అస్య - జ్యోతిస్ + స్తోమ - షత్వమ్ బ.వ్రీ.,విశే. జ్యోతిస్సులనగా సామవేదము నందలి స్తోత్రరూపములైన సామలు. అట్టి స్తోత్రములు విశేషముగా కలది కావున ఈ యజ్ఞమును జ్యోతిష్టోమము అని పేరు, ఆంధ్రశబ్దరత్నాకరము., ఇది 16 ఋత్విక్కులు వుండు యజ్ఞము. 2) ఆయుషీ - ఆయుర్వృద్ధి కరమగు హోమకార్యము, ఆంధ్రశబ్దరత్నాకరము. 3) అభిజిద్యాగము - సోమయాగ విశేషము. 4) విశ్వజిద్యాగము - సమస్త సంపదలను దక్షిణగా ఇచ్చే ఒక యాగం. (ఈ యాగానికి ఫలం స్వర్గం). 5) ఆప్తోర్యామి - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు.
1.14.41.
అనుష్టుప్.
ప్రాచీం హోత్రే దదౌ రాజా
దిశం స్వకులవర్దనః ।
అధ్వర్యవే ప్రతీచీం తు
బ్రహ్మణే దక్షిణాం దిశమ్ ॥
టీక:-
ప్రాచీమ్ = తూర్పు; హోత్రే = హోతకు; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; దిశమ్ = దిక్కును; స్వకుల వర్ధనః = తన వంశమునకు అభివృద్ధి కలుగుటకు; అధ్వర్యవే = అధ్వర్యునకు; ప్రతీచీం తు = పశ్చిమ దిక్కును; బ్రహ్మణే = బ్రహ్మకు; దక్షిణాం దిశమ్ = దక్షిణ దిక్కును.
భావము:-
తన వంశము అభివృద్ధి పొందుటకై దశరథ మహారాజు తూర్పుదేశమును హోతకు, పశ్చిమదేశమును అధ్వర్యునకు, దక్షిణ దేశమును బ్రహ్మకును దానము చేసెను.
1.14.42.
అనుష్టుప్.
ఉద్గాత్రే వై తథోదీచీం
దక్షిణైషా వినిర్మితా ।
హయమేధే మహాయజ్ఞే
స్వయమ్భూవిహితే పురా ॥
టీక:-
ఉద్గాత్రే = ఉద్గాతకు; వై = తప్పక; తథ్ = ఆ యొక్క; ఉదీచీమ్ = ఉత్తర దిక్కును; దక్షిణామ్ = దక్షిణగా; ఏషా = ఈ; వినిర్మితా = నిర్మింపబడినది; హయమేధే మహాయజ్ఞే = అశ్వమేధ మహాయజ్ఞమునందు; స్వయమ్భూవిహితే = బ్రహ్మచే నిర్ణయింపబడిన; పురా = పూర్వము.
భావము:-
ఉత్తరము వైపు దేశమును ఉద్గాతకు దానము చేసెను. పూర్వము అశ్వమేధ యాగములో ఈ విధముగా దక్షిణగా ఈయ వలెనని బ్రహ్మచే నిర్ణయింపబడెను.
1.14.43.
అనుష్టుప్.
క్రతుం సమాప్య తు తథా
న్యాయతః పురుషర్షభః ।
ఋత్విగ్భ్యో హి దదౌ రాజా
ధరాం తాం క్రతువర్దనః ॥
టీక:-
క్రతుమ్ = క్రతువును; సమాప్య = పూర్తి చేసి; తథా = ఆ విధముగా; న్యాయతః = శాస్త్రానుసారముగా; పురుషర్షభః = పురుషశ్రేష్టుడైన; ఋత్విగ్భ్యః = ఋత్విక్కులకు; దదౌ = దానము చేసెను; రాజా = రాజు; ధరాం = భూమిని; తాం = దానిని; క్రతువర్ధనః = క్రతువును పరిపూర్ణము చేయుటకు.
భావము:-
పురుషశ్రేష్ఠుడైన దశరథ మహారాజు ఆ అశ్వమేధయాగమును పూర్తి చేసి, దాని ఫలము పరిపూర్ణముగా లభించుటకు తన రాజ్యమునంతను ఋత్విక్కులకు దానము చేసెను.
1.14.44.
అనుష్టుప్.
ఋత్విజశ్చాబ్రువన్ సర్వే
రాజానం గతకల్మషమ్ ।
భవానేవ మహీం కృత్స్నామ్
ఏకో రక్షితుమర్హతి ॥
టీక:-
ఋత్విజః తు = ఋత్విక్కులైతే; తు; అబ్రువన్ = పలికిరి; సర్వే = అందరు; రాజానమ్ = రాజుతో; గతకల్మషమ్ = పాపరహితుడైన; భవాన్ = నీవు; ఏవ = మాత్రమే; మహీమ్ = భూమిని; కృత్స్నామ్ = సమస్తమైన; ఏకః = ఒక్కడివి; రక్షితుమ్ = రక్షించుటకు; అర్హతి = యోగ్యుడవు.
భావము:-
అంతట ఆ ఋత్విక్కులందరును పాపరహితుడైన దశరథునితో "ఈ భూమి నంతటినీ రక్షించుటకు నీవు మాత్రమే యోగ్యుడవు"అని పలికిరి.
1.14.45.
అనుష్టుప్.
న భూమ్యా కార్యమస్మాకం
న హి శక్తాః స్మ పాలనే ।
రతాః స్వాధ్యాయకరణే
వయం నిత్యం హి భూమిప ॥
టీక:-
న = లేదు; భూమ్యా = భూమిచే; కార్యమ్ = పని; అస్మాకమ్ = మాకు; న = కాము; హి = తప్పక; శక్తాఃస్మ = సమర్థులము; పాలనే = పాలించుటకు; రతాః = ఆసక్తులము; స్వాధ్యాయ = స్వాధ్యాయము; కరణే = చేయుటయందు; వయమ్ = మేము; నిత్యమ్ = ఎల్లవేళల; భూమిప = రాజా.
భావము:-
"ఓ దశరథ మహారాజా! మాకు ఈ భూమితో పనిలేదు. భూపాలన చేయుటలో మేము అశక్తులము. మేము నిత్యము స్వాధ్యాయము చేయుటయందు మాత్రమే ఆసక్తి కలవారము."
1.14.46.
అనుష్టుప్.
నిష్క్రయం కించిదేవేహ
ప్రయచ్ఛతు భవానితి ।
మణిరత్నం సువర్ణం వా
గావో యద్వా సముద్యతమ్ ॥
టీక:-
నిష్క్రయమ్ = మాఱు మూల్యము; కిఞ్చిత్ = ఇంచుక; ఏవ = మాత్రము; ఇహ = ఈ విషయమున; ప్రయచ్ఛతు = ఒసగుము; భవాన్ = నీవు; ఇతి = ఇది; మణిరత్నమ్ = శ్రేష్ఠమైన మణులు; సువర్ణమ్ = బంగారము; వా = గానీ; గావః = ఆవులు; యద్వా = ఏది; సముద్యతమ్ = సిద్ధముగా నున్నదో.
భావము:-
రాజా! నీవు మాకు దానము చేసిన ఈ భూమికి బదులుగా దీనికి సమానమైన జాతి రత్నములుగాని, మణులు గాని, బంగారముగాని, ఆవులుగాని సిద్ధముగా ఉన్నవి ఏవైనా ఇమ్ము.
1.14.47.
అనుష్టుప్.
తత్ప్రయచ్ఛ నరశ్రేష్ఠ
ధరణ్యా న ప్రయోజనమ్" ।
ఏవముక్తో నరపతిః
బ్రాహ్మణైర్వేదపారగైః ॥
టీక:-
తత్ = అది; ప్రయచ్ఛ = ఇమ్ము; నరశ్రేష్ఠ = మానవోత్తమా; ధరణ్యా = భూమితో; న = లేదు; ప్రయోజనమ్ = ప్రయోజనము; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తమ్ = పలికి; నరపతిః = రాజు; బ్రాహ్మణైః = బ్రాహ్మణులచే; వేదపారగైః = వేదపారంగతులైన.
భావము:-
"రాజా మాకు ఈ భూమితో ప్రయోజనము లేదు" అని వేదపారంగతులైన ఆ బ్రాహ్మణులు దశరథునితో పలికిరి.
1.14.48.
అనుష్టుప్.
గవాం శతసహస్రాణి
దశ తేభ్యో దదౌ నృపః ।
శతకోటీః సువర్ణస్య
రజతస్య చతుర్గుణమ్ ॥
టీక:-
గవామ్ = గోవులను; శతసహస్రాణి దశ = పది లక్షలు; తేభ్యః = వారికి; దదౌ = ఇచ్చెను; నృపః = రాజు; శతకోటిః = వంద కోట్లు; సువర్ణస్య = బంగారపు; రజతస్య = వెండివి; చతుర్గుణమ్ = నాలుగు రెట్లు.
భావము:-
వారి మాటలు విని పది లక్షల ఆవులను, వంద కోట్ల బంగారు నాణెములను, నాలుగు వందల కోట్ల వెండి నాణెములను, ఆ ఋత్విక్కులకు దశరథుడు ఇచ్చెను.
1.14.49.
అనుష్టుప్.
ఋత్విజస్తు తతః సర్వే
ప్రదదుః సహితా వసు ।
ఋశ్యశృంగాయ మునయే
వసిష్ఠాయ చ ధీమతే ॥
టీక:-
ఋత్విజః = ఋత్విక్కులును; తు; తతః = తరువాత; సర్వే = అందరును; ప్రదదుః = ఇచ్చిరి; సహితాః = కలిసి; వసు = ధనమును; ఋశ్యశృంగాయ = ఋశ్యశృంగ; మునయే = మునికి; వసిష్ఠాయ = వసిష్ఠునకు; చ; ధీమతే = బుద్ధిమంతుడైన.
భావము:-
ఆ ఋత్విక్కులందరు కలిసి దశరథుని నుండి స్వీకరించిన ఆ మొత్తము ధనమును ఋశ్యశృంగునికి, వసిష్ఠునికి ఇచ్చివేసిరి.
1.14.50.
అనుష్టుప్.
తతస్తే న్యాయతః కృత్వా
ప్రవిభాగం ద్విజోత్తమాః ।
సుప్రీతమనసస్సర్వే
ప్రత్యూచుర్ముదితా భృశమ్ ॥
టీక:-
తతః = తరువాత; తే = ఆ; న్యాయతః = న్యాయముగా; కృత్వా = చేసి; ప్రవిభాగమ్ = పంపకమును; ద్విజోత్తమాః = బ్రాహ్మణోత్తములు; సుప్రీత మనసః = సంతుష్టాంతరంగులై; సర్వే = అందరు; ప్రత్యూచుః = తిరిగి పలికిరి; ముదితాః = సంతోషించినాము; భృశమ్ = మిక్కిలి.
భావము:-
తరువాత సంతోషాంతరంగులైన ఆ బ్రాహ్మణోత్తము లందరును ఆ ధనమునంతటిని న్యాయముగా పంచుకొని "చాల ఆనందించినాము" అని పలికిరి.
1.14.51.
అనుష్టుప్.
తతః ప్రసర్పకేభ్యస్తు
హిరణ్యం సుసమాహితః ।
జామ్బూనదం కోటిసంఖ్యం
బ్రాహ్మణేభ్యో దదౌ తదా ॥
టీక:-
తతః = తరువాత; ప్రసర్పకేభ్యః = చూచుటకై వచ్చిన; హిరణ్యమ్ = బంగారము; సుసమాహితః = శ్రద్ధ; గౌరవములతో; జమ్బూనదమ్ = బంగారమును; కోటి సఙ్ఖ్యమ్ = కోటి సంఖ్య గల; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు; దదౌ = ఇచ్చెను; తదా = అప్పుడు.
భావము:-
తరువాత అశ్వమేధ యాగమును చూచుటకు వచ్చిన బ్రాహ్మణులకు దశరథుడు గౌరవమర్యాదలతో కోటి బంగారు నాణెములను దానము చేసెను.
1.14.52.
అనుష్టుప్.
దరిద్రాయ ద్విజాయాథ
హస్తాభరణముత్తమమ్ ।
కస్మైచిద్యాచమానాయ
దదౌ రాఘవనందనః ॥
టీక:-
దరిద్రాయ = బీదవాడైన; ద్విజాయ = బ్రాహ్మణునకు; అథ = ఆ తరువాత; హస్తాభరణమ్ = కంకణము; ఉత్తమమ్ = ఉత్తమమైన; కస్మై చిత్ = ఒకానొక; యాచమానాయ = యాచించుచున్న; దదౌ = ఇచ్చెను; రాఘవ నందనః = దశరథుడు.
భావము:-
తరువాత ఒక బ్రాహ్మణ యాచకుడు అక్కడికి రాగా దశరథుడు గొప్పదైన తన ముంజేతి కంకణము నొక దానిని దానము చేసెను.
1.14.53.
అనుష్టుప్.
తతః ప్రీతేషు నృపతిః
ద్విజేషు ద్విజవత్సలః ।
ప్రణామమకరోత్తేషామ్
హర్షపర్యాకులేక్షణః ॥
టీక:-
తతః = తరువాత; ప్రీతేషు = సంతోషించిన; నృపతిః = రాజు; ద్విజేషు = బ్రాహ్మణులను; ద్విజ = బ్రాహ్మణులయందు; వత్సలః = వాత్సల్యము గల; ప్రణామమ్ = నమస్కారము; అకరోత్ = చేసెను; తేషామ్ = వారికి; హర్ష = ఆనందముతో; పర్యాకుల = నిండిన; ఈక్షణః = చూపులతో.
భావము:-
బ్రాహ్మణులయందు దయాగుణము కలవాడైన దశరథుడు వారందరు సంతృప్తి చెందినారని తెలిసి, బ్రాహ్మణులను సంతోషకరముగా చూచుచు నమస్కరించెను.
1.14.54.
అనుష్టుప్.
తస్యాశిషోఽ థ విధివత్
బ్రాహ్మణైః సముదాహృతాః ।
ఉదారస్య నృవీరస్య
ధరణ్యాం ప్రణతస్య చ ॥
టీక:-
తస్య = అతనికి; ఆశిషః = ఆశీర్వచనములు; అథ = తరువాత; విధివత్ = యథాశాస్త్రముగా; బ్రాహ్మణైః = బ్రాహ్మణులచే; సముదాహృతాః = వచింపబడినవి; ఉదార = దానగుణశీలుడు; అస్య = ఐనవాడు; నృవీర = మానవవీరుడు; అస్య = ఐనవాడు; ధరణ్యామ్ = భూమిపై; ప్రణత = వంగి నమస్కారము చేసిన; అస్య = ఐనవాడు; చ.
భావము:-
దానగుణశీలుడు వీరుడు ఐన దశరథమహారాజు వారందరికీ సాష్టాంగ ప్రణామములు చేయుచుండగా వారు ఆ మహారాజును శాస్త్రానుసారముగా ఆశీర్వదించిరి.
1.14.55.
అనుష్టుప్.
తతః ప్రీతమనా రాజా
ప్రాప్య యజ్ఞమనుత్తమమ్ ।
పాపాపహం స్వర్నయనం
దుష్కరం పార్థివర్షభైః ॥
టీక:-
తతః = తరువాత; ప్రీతః = సంతోషించిన; మనాః = మనసు కలవాడై; రాజా = రాజు; ప్రాప్య = పొంది; యజ్ఞమ్ = యజ్ఞము; అనుత్తమమ్ = అసమానమైన; పాప = పాపములను; అపహమ్ = పోగొట్టునది; స్వర్గః = స్వర్గమును; నయనమ్ = పొందించునది; దుష్కరమ్ = సులభముగా పొందలేనిది; పార్థివర్షభైః = శ్రేష్ఠులైన రాజులచేత కూడ.
భావము:-
అశ్వమేధయాగము సకల పాపములను తొలగించును. స్వర్గప్రాప్తిని కలుగజేయును. గొప్ప రాజులుకూడ చేయలేనటువంటి అసమానమైన అశ్వమేధయాగమును దశరథుడు సంపూర్ణముగా నిర్వహించి సంతోషించెను.
1.14.56.
అనుష్టుప్.
తతోఽ బ్రవీదృశ్యశృంగం
రాజా దశరథస్తదా ।
కులస్య వర్దనం త్వం తు
కర్తుమర్హసి సువ్రత!" ॥
టీక:-
తతః = తరువాత; అబ్రవీత్ = పలికెను; ఋశ్యశృంగమ్ = ఋశ్యశృంగునితో; రాజా = రాజు; దశరథః = దశరథుడు; తదా = అప్పుడు; కులస్య = కులమును; వర్ధనమ్ = వృద్ధి చేయు కార్యమును; త్వమ్ = నీవు; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగిన వాడవు; సువ్రత = మంచి వ్రతములు చేసిన వాడా.
భావము:-
తరువాత; "ఓ మహామునీ! మా వంశాభివృద్ధికై తగిన కార్యము చేయగల సమర్థుడవు నీవు. కావున నీవు అట్టి కార్యమును చేయుము" అని ఋశ్యశృంగుని దశరథుడు వేడెను.
1.14.57.
అనుష్టుప్.
తథేతి చ స రాజానం
ఉవాచ ద్విజసత్తమః ।
భవిష్యంతి సుతా రాజన్!
చత్వారస్తే కులోద్వహాః" ॥
టీక:-
తథేతి = అటులనే అని; చ; రాజానమ్ = రాజు గురించి; ఉవాచ = పలికెను; ద్విజసత్తమః = బ్రాహ్మణోత్తముడు; భవిష్యంతి = పుట్టగలరు; సుతాః = కుమారులు; రాజన్ = రాజా; చత్వారః = నలుగురు; తే = నీకు; కులోద్వహాః = కులమును ఉద్ధరించు.
భావము:-
"ఓ దశరథ మహారాజా! అటులనే చేయించెదను. నీకు కులమును ఉద్ధరించు నలుగురు కుమారులు పుట్టగలరు" అని ఋశ్యశృంగుడు పలికెను.
1.14.58.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుర్దశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్దశః [14] = పదునాల్గవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [14] పద్నాలుగవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.15.1.
అనుష్టుప్.
మేధావీ తు తతో ధ్యాత్వా
స కించిదిదముత్తరమ్ ।
లబ్ధసంజ్ఞస్తతస్తం తు
వేదజ్ఞో నృపమబవ్రీత్ ॥
టీక:-
మేధావీ = మేధావి; తు; తతః = తరువాత; ధ్యాత్వా = ఆలోచించి; స = అతను; కించిత్ = కొంచెము; ఇదమ్ = ఈ విధమైన; ఉత్తరమ్ = సమాధానం; లబ్ధ = లభించిన; సంజ్ఞః = సంగతి; తతః = తరువాత; తమ్ = ఆ; తు; వేదజ్ఞః = వేదజ్ఞానము కలవాడు; నృపమ్ = రాజుతో; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ఋశ్యశృంగుడు మేధావీ, వేదజ్ఞుడు. తను సమాధానం గురించి కొంచెము ఆలోచించాడు. తగిన సమాధానము మనసునకు తట్టాకా, దశరథునితో ఇలా చెప్పెను.
1.15.2.
అనుష్టుప్.
ఇష్టిం తేఽ హం కరిష్యామి
పుత్రీయాం పుత్రకారణాత్ ।
అథర్వశిరసి ప్రోక్తైః
మన్త్రైః సిద్ధాం విధానతః" ॥
టీక:-
ఇష్టిమ్ = యాగమును; తే = నీకు; అహమ్ = నేను; కరిష్యామి = చేసెదను; పుత్రీయామ్ = పుత్రులను ప్రసాదించునదియు / పుత్రకామేష్ఠి; పుత్రకారణాత్ = పుత్రులను పొందుటకై; అథర్వశిరసి = అథర్వశిరస్సు అను వేద శాఖ యందు; ప్రోక్తైః = తెలుపబడిన; మన్త్రైః = మంత్రములచే; సిద్ధామ్ = చేయబడునది; విధానతః = శాస్త్రానుసారముగా.
భావము:-
"మీరు పుత్రులను పొందుటకై పుత్రకామేష్టి యాగమును నేను చేయించెదను. అథర్వశీర్షము అను వేదభాగములో తెలుపబడినట్లుగా మంత్ర యుక్తముగా చేయించెదను."
1.15.3.
అనుష్టుప్.
తతః ప్రారబ్ధవానిష్టిం
పుత్రీయాం పుత్రకారణాత్ ।
జుహావ చాగ్నౌ తేజస్వీ
మంత్రదృష్టేన కర్మణా ॥
టీక:-
తతః = తరువాత; ప్రాక్రమః = ప్రారంభించి; ఇష్ఠిమ్ = యజ్ఞమును; పుత్రీయామ్ = పుత్రకామేష్టి; పుత్రకారణాత్ = పుత్రులకొరకై; జుహావ = హోమము చేసెను; చ; అగ్నౌ = అగ్నియందు; తేజస్వీ = తేజోవంతుడు; మంత్రదృష్టేన = మంత్రోక్తముగా; కర్మణా = కర్మచేత.
భావము:-
బ్రహ్మతేజస్సుగల ఋశ్యశృంగుడు దశరథునకు పుత్రులు కలుగుటకై పుత్రకామేష్టిని ప్రారంభించెను. మంత్రోక్తవిధానముగా అగ్నియందు హవిస్సును ఆహుతి చేసెను.
1.15.4.
అనుష్టుప్.
తతో దేవాః సగంధర్వాః
సిద్ధాశ్చ పరమర్షయః ।
భాగప్రతిగ్రహార్థం వై
సమవేతా యథావిధి ॥
టీక:-
తతః = తరువాత; దేవాః = దేవతలు; స = సహితంగా; గంధర్వాః = గంధర్వులతో; సిద్ధాః = సిద్ధులును; చ; పరమ = గొప్ప; ఋషయః = గొప్ప ఋషులును; భాగ = హవిర్భాగములను; ప్రతిగ్రహ = స్వీకరించుట; అర్థం = కొరకు; వై = తప్పక; వై సమవేతాః = కలిసిరి; యథావిధి = యథాశాస్త్రముగా.
భావము:-
అంతట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహా ఋషులు శాస్త్ర క్రమములో వారి వారి హవిర్భాగములను స్వీకరించుటకు వచ్చిరి.
1.15.5.
అనుష్టుప్.
తాః సమేత్య యథాన్యాయం
తస్మిన్ సదసి దేవతాః ।
అబ్రువన్ లోకకర్తారం
బ్రహ్మాణం వచనం మహత్ ॥
టీక:-
తాః = ఆ; సమేత్య = కలిసి; యథా = ప్రకారం; న్యాయమ్ = న్యాయము; తస్మిన్ = ఆ; సదసి = సదస్సునందు; దేవతాః = దేవతలు; అబ్రువన్ = పలికిరి; లోక = లోకములను; కర్తారమ్ = సృష్టించు; బ్రహ్మాణం = బ్రహ్మదేవునితో; వచనం = వచనమును; మహత్ = పూజ్యమైన.
భావము:-
ఆ దేవతలందరును న్యాయసమ్మతముగా ఆ సదస్సులో చేరి, సకల లోకముల సృష్టికర్త యగు బ్రహ్మదేవునితో పూజ్యనీయమైన పలుకులతో ఇట్లు చెప్పసాగిరి.
1.15.6.
అనుష్టుప్.
భగవన్! త్వత్ప్రసాదేన
రావణో నామ రాక్షసః ।
సర్వాన్నో బాధతే వీర్యాత్
శాసితుం తం న శక్నుమః ॥
టీక:-
భగవన్ = భగవాన్; త్వత్ = నీ యొక్క; ప్రసాదేన = వరము వలన; రావణః = రావణుడు అను; నామ = పేరు గల; రాక్షసః = రాక్షసుడు; సర్వాన్ = అందరిని; నః = మమ్ములను; బాధతే = బాధించుచున్నాడు; వీర్యాత్ = పరాక్రమము వలన; శాసితుం = శిక్షించుటకు; తం = అతనిని; న = కాదు; శక్నుమః = చేతనైనవారము.
భావము:-
ఓ భగవంతుడా ! బ్రహ్మదేవా! రావణుడు అను రాక్షసుడు నీవొసగిన వర బలముతో మమ్ముల నందరినీ బాధించుండెను. అతనిని శిక్షించుటకు మేము అశక్తులము.
1.15.7.
అనుష్టుప్.
త్వయా తస్మై వరో దత్తః
ప్రీతేన భగవన్ పురా ।
మానయంతశ్చ తం నిత్యం
సర్వం తస్య క్షమామహే ॥
టీక:-
త్వయా = నీ చే; తస్మై = అతనికి; వరః = వరము; దత్తః = ఇవ్వబడినది; ప్రీతేన = మెచ్చి; భగవన్ = భగవంతుడా; పురా = పూర్వము; మానయంత = గౌరవించి; చ; తం = దానిని; నిత్యం = నిత్యము; సర్వం = అన్నిటిని; తస్య = అతని యొక్క; క్షమామహే = క్షమించుచున్నాము.
భావము:-
భగవంతుడా ! బ్రహ్మదేవా! పూర్వము రావణుని తపస్సునకు మెచ్చి నీవు అతనికి వరములిచ్చినావు. నీవిచ్చిన ఆ వరములపై మాకు గల గౌరవముతో అతడు చేయుచున్న దుష్కార్యములను అన్నిటిని క్షమించుచున్నాము.
గమనిక:-
*- రావణుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి అమరత్వం కోరుకొనెను. బ్రహ్మ నిరాకరించెను. బదులుగా తనను యక్షుల వలన కాని, గంధర్వుల వలన కాని, దేవతల వలన కాని, దానవుల వలన కాని, రాక్షసులు వలన కాని, సర్పములు వలన కాని, పిశాచముల వలన కాని మరణం లేకుండా వరాన్నికోరాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. కాని ఇలా అడుగుటలో మానవులు, వానరులు నుండి మరణం లేకపోవడం అడగలేదు.
1.15.8.
అనుష్టుప్.
ఉద్వేజయతి లోకాంస్త్రీన్
ఉచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః ।
శక్రం త్రిదశరాజానం
ప్రధర్షయితుమిచ్ఛతి ॥
టీక:-
ఉద్వేజయతి = పీడించుచున్నాడు; లోకామ్ = లోకములను; త్రీన్ = మూడింటిని; ఉచ్ఛ్రితాన్ = ఉన్నత పదవులలో ఉన్నవారిని; ద్వేష్టి = ద్వేషించుచున్నాడు; దుర్మతిః = దుష్ట బుద్ది గలవాడు; శక్రం = ఇంద్రుని; త్రిదశరాజానం = దేవతలకు రాజైన; ప్రధర్షయితుమ్ = అవమానించుటకు; ఇచ్ఛతి = ఇష్టపడుచున్నాడు.
భావము:-
దుర్బుద్ది గల రావణుడు ముల్లోకములను పీడించుచున్నాడు. ఉన్నత పదవులలో ఉన్నవారిని ద్వేషించుచున్నాడు. స్వర్గాధిప యైన దేవేంద్రుని సహితము అవమానింప దలచుచున్నాడు.
1.15.9.
అనుష్టుప్.
ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్
అసురాన్ బ్రాహ్మణాంస్తథా ।
అతిక్రామతి దుర్ధషో
వరదానేన మోహితః ॥
టీక:-
ఋషీన్ = ఋషులను; యక్షాన్ = యక్షులను; స = సహితంగా; గంధర్వాన్ = గంధర్వులను; అసురాన్ = అసురులను; బ్రాహ్మణాం = బ్రాహ్మణులను; తథా = మఱియు; అతిక్రామతి = అవమానించుచున్నాడు; దుర్ధర్షః = ఎదిరింప బడరాని; వరదానేన = వర బలముచే; మోహితః = గర్వముతో.
భావము:-
వరము వలన కలిగిన గర్వముతో, ఎదిరింప శక్యము కాని ఆ రావణుడు ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను మఱియు బ్రాహ్మణులను కూడ అవమానించుచున్నాడు.
1.15.10.
అనుష్టుప్.
* నైనం సూర్యః ప్రతపతి
పార్శ్వే వాతి న మారుతః ।
చలోర్మిమాలీ తం దృష్ట్వా
సముద్రోఽ పి న కంపతే ॥
టీక:-
న = లేదు; ఏనమ్ = ఇతనిని; సూర్యః = సూర్యుడు; ప్రతపతి = తపింపజేయుట; పార్శ్వే = ప్రక్కన; వాతి = వీచుట; న = లేదు; మారుతః = గాలి; చలత్ = కదలాడే; ఊర్మి = నీటి అలలు; మాలి = వరుసలు కల; తం = అతనిని; దృష్ట్వా = చూసి; సముద్రః = సముద్రుడు; అపి = కూడ; న = లేదు; కంపతే = కదులుట.
భావము:-
సూర్యుడు తన వేడిమితో రావణుని తపింప జేయజాలడు. వాయుదేవుడు ఇతని ప్రక్కన వీయజాలడు. సముద్రుడు కూడ ఇతనిని చూచిన వెంటనే తన అలలను స్తంభింప జేయును.
1.15.11.
అనుష్టుప్.
తన్మహన్నో భయం తస్మాత్
రాక్షసాద్ఘోరదర్శనాత్ ।
వధార్థం తస్య భగవన్
ఉపాయం కర్తుమర్హసి" ॥
టీక:-
తత్ = అందువలన; మహత్ = గొప్ప; నః = మాకు; భయం = భయము; తస్మాత్ = ఆ; రాక్షసాత్ = రాక్షసుని నుండి; ఘోర = ఘోరమైన; దర్శనాత్ = దర్శనము గల; వధార్థం = వధించుటకు; తస్య = అతనిని; భగవన్ = భగవంతుడా; ఉపాయం = ఉపాయము; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగినవాడవు.
భావము:-
అతని ఘోరదర్శనము మాకు చాలా భయము కలిగించును. భగవంతుడా! అతనిని వధించుటకు తగిన ఉపాయము చేయుము.
1.15.12.
అనుష్టుప్.
ఏవముక్తః సురైః సర్వైః
చింతయిత్వా తతోఽ బ్రవీత్ ।
హంతాఽ యం విదితస్తస్య
వధోపాయో దురాత్మనః ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = పలుకబడి; సురైః = దేవతలచే; సర్వైః = అందరు; చింతయిత్వా = ఆలోచన చేసి; తతః = అప్పుడు; అబ్రవీత్ = పలికెను; హంత = ఆహా; అయం = ఈ విధముగ; విదితః = తోచినది; తస్య = అతని; వధః = వధించుటకు; ఉపాయః = ఉపాయము; దురాత్మనః = దుష్టుని యొక్క.
భావము:-
దేవతల యొక్క ఆ మాటలు వినిన బ్రహ్మదేవుడు ఆలోచించి "ఆహా! ఆ దుష్టుని వధించుటకు నాకొక ఉపాయము తోచినది" అని పలికెను.
1.15.13.
అనుష్టుప్.
తేన గంధర్వయక్షాణాం
దేవదానవరక్షసామ్ ।
అవధ్యోఽ స్మీతి వాగుక్తా
తథేత్యుక్తం చ తన్మయా ॥
టీక:-
తేన = అతనిచే; గంధర్వః = గంధర్వులచేతను; యక్షాణాం = యక్షులచేతను; దేవ = దేవతలుచేతను; దానవ = దానవులులచేతను; క్షసామ్ = రాక్షసులచేతను; అవధ్యః = చంపబడని వానిని; అస్మి = అగుదును గాక; ఇతి = అని; వాక్ = వాక్కు; ఉక్తా = పలుకబడినది; తథా = అట్లే; ఇతి = అగుగాక అని; ఉక్తమ్ = చెప్పబడినది; చ; తత్ = అది; మయా = నా చేత.
భావము:-
యక్ష గంధర్వ దేవ దానవ రాక్షసులచే కూడ తాను వధింపబడనట్లు రావణుడు వరము కోరగా; నేను “అట్లే అగుగాక” అని పలికితిని.
1.15.14.
అనుష్టుప్.
నాకీర్తయదవజ్ఞానాత్
తద్రక్షో మానుషాంస్తదా ।
తస్మాత్స మానుషాద్వధ్యో
మృత్యుర్నాన్యోఽ స్య విద్యతే" ॥
టీక:-
న = లేదు; అకీర్తయత్ = పేర్కొను; అవజ్ఞానాత్ = చిన్నచూపు వలన; తత్ = ఆ; రక్షః = రాక్షసుడు; మానుషాం = మనుష్యులను; తదా = అప్పుడు; తస్మాత్ = ఆ కారణము వలన; సః = అతడు; మానుషాత్ = మనుష్యుని వలన; వధ్యః = చంపదగినవాడు; మృత్యుః = మరణము; న = లేదు; అన్యః = వేరొకదాని వలన; అస్య = అతనికి; విద్యతే = కనుగొనుటకు; కలుగుటకు.
భావము:-
రావణుడు మనుష్యులపై చిన్నచూపుతో వారిని పేర్కొనలేదు. కావున అతడు మనుష్యుని చేత వధింపబడుటకు అవకాశమున్నది. మరి యితరులవలన రావణమారణోపాయము తోచుటలేదు.”
1.15.15.
అనుష్టుప్.
ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం
బ్రహ్మణా సముదాహృతమ్ ।
సర్వే మహర్షయో దేవాః
ప్రహృష్టాస్తేఽ భవంస్తదా ॥
టీక:-
ఏతత్ = ఈ; శ్రుత్వా = విని; ప్రియం = ప్రియమైన; వాక్యం = మాటలను; బ్రహ్మణా = బ్రహ్మ చేత; సముత్ = జరిగినది; ఆహృతమ్ = పలుకుట; సర్వే = అందరును; మహర్షయః = మహర్షులును; దేవాః = దేవతలు; ప్రహృష్టాః = సంతోషించిన వారు; తే = వారు; అభవన్ = ఐరి; తదా = అప్పుడు.
భావము:-
బ్రహ్మదేవుడు పలికిన ఈ ప్రియమైన మాటను విని, మహర్షులు, దేవతలు అందరును అప్పుడు సంతోషించిరి.
1.15.16.
అనుష్టుప్.
ఏతస్మిన్నంతరే విష్ణుః
ఉపయాతో మహాద్యుతిః ।
శంఖచక్రగదాపాణిః
పీతవాసా జగత్పతిః ॥
టీక:-
ఏతస్మిన్నంతరే = ఈలోపున; విష్ణుః = విష్ణువు; ఉపయాతః = వచ్చెను; మహా = గొప్ప; ద్యుతిః = తేజోవంతుడు; శఙ్ఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గదను; పాణిః = చేతులయందు ధరించిన వాడును; పీతా = పసుపు పచ్చని; వాసా = వస్త్రము ధరించిన వాడును; జగత్పతిః = జగత్తునకు ప్రభువు.
భావము:-
ఇంతలో గొప్ప తేజోవంతుడు, శంఖ చక్ర గదలను చేబూనిన వాడును, పసుపు పచ్చని వస్త్రమును ధరించిన వాడును ఐన శ్రీమహావిష్ణువు అక్కడకు వచ్చెను.
1.15.17.
అనుష్టుప్.
బ్రహ్మణా చ సమాగమ్య
తత్ర తస్థౌ సమాహితః ।
తమబ్రువన్ సురాః సర్వే
సమభిష్టూయ సన్నతాః ॥
టీక:-
బ్రహ్మణా చ = బ్రహ్మతో; చ; సమాగమ్య = కలిసి; తత్ర = అక్కడ; తస్థౌ = ఉండెను; సమాహితః = సిద్ధముగా; తమ్ = అతనితో; అబ్రువన్ = పలికిరి; సురాః సర్వే = దేవతలందరును; సమభిష్టూయ = స్తుతించి; సన్నతః = నమస్కారము చేయుచు.
భావము:-
శ్రీమహావిష్ణువు బ్రహ్మతో కలిసి నిలబడి యుండగా దేవతలందరు ఆయనకు నమస్కారము చేయుచు స్తుతించుచు ఇట్లు పలికిరి.
1.15.18.
అనుష్టుప్.
త్వాం నియోక్ష్యామహే విష్ణో
లోకానాం హితకామ్యయా ।
రాజ్ఞో దశరథస్య త్వం
అయోధ్యాధిపతేర్విభోః ॥
టీక:-
త్వాం = నిన్ను; నియోక్ష్యామహే = నియోగించుచున్నాము; విష్ణోః = విష్ణుదేవా; లోకానామ్ = లోకములయొక్క; హితః = హితము; కామ్యయా = కోరి; రాజ్ఞః = మహారాజు; దశరథ = దశరథుని; తస్య = ఆ యొక్క; త్వమ్ = నీవు; అయోధ్యా = అయోధ్య దేశపు; అధిపతే = రాజైన; విభోః = ప్రభువా.
భావము:-
ప్రభూ! విష్ణుదేవా! లోకముల హితమును కోరి మేము నిన్ను అయోధ్యదేశపు రాజు పట్ల ఒక కార్యము చేయుమని కోరుతున్నాము.
1.15.19.
అనుష్టుప్.
ధర్మజ్ఞస్య వదాన్యస్య
మహర్షిసమతేజసః ।
తస్య భార్యాసు తిసృషు
హ్రీశ్రీకీర్త్యుపమాసు చ ॥
టీక:-
ధర్మజ్ఞ = ధర్మజ్ఞుడు; అస్య = ఐనవాడు; వదాన్య = గొప్ప దాత; అస్య = ఐనవాడు; మహర్షి = మహర్షులతో; సమ = సాటివచ్చు; తేజసః = తేజోవంతుడు; తస్య = అతని; భార్యాసు = భార్యల యందు; తిసృషు = ముగ్గురు; హ్రీ = హ్రీతోను; శ్రీ = శ్రీ; కీర్తితోను; కీర్త్యి = కీర్తితోను; ఉపమాసు = సరిపోలెడివారు.
భావము:-
ఓ విష్ణుదేవా! ధర్మజ్ఞుడు, గొప్పదాత, మహర్షి వంటి తేజస్సు కలవాడైన దశరథునకు హ్రీ; శ్రీ; కీర్తి యనబడు దక్షుని కుమార్తెలతో ససరిపోలెడి వారైన ముగ్గురు భార్యలు వారి యందు.
1.15.20.
అనుష్టుప్.
విష్ణో! పుత్రత్వమాగచ్ఛ
కృత్వాత్మానం చతుర్విధమ్ ।
తత్ర త్వం మానుషో భూత్వా
ప్రవృద్ధం లోకకణ్టకమ్ ॥
టీక:-
విష్ణోః = విష్ణుదేవా; పుత్రత్వమ్ = పుత్రునివలె; ఆగచ్ఛ = అవతరించుము; కృత్వా = చేసి; ఆత్మానం = తనను; చతుర్విధమ్ = నలుగురిగా; తత్ర = అక్కడ; త్వం = నీవు; మానుషః = మానవ రూపములో; భూత్వా = జన్మించి; ప్రవృద్ధం = పెరుగుచున్న; లోక కణ్టకమ్ = లోకమునకు కంటకునిగా.
భావము:-
నీవు ఆ ముగ్గురి యందు నలుగురిగా మానవ రూపములో జన్మించుము. రావణుడు లోకమునకు పెద్ద కంటకునిగా పెరుగుచున్నాడు.
1.15.21.
అనుష్టుప్.
అవధ్యం దైవతైర్విష్ణో!
సమరే జహి రావణమ్ ।
స హి దేవాన్ సగంధర్వాన్
సిద్ధాంశ్చ ఋషిసత్తమాన్ ॥
టీక:-
అవధ్యం = వధింపబడుటకు శక్యము కాని వాడు; దైవతైః = దేవతలచే; విష్ణోః = ఓ విష్ణు దేవా; సమరే = యుద్ధమునందు; జహి = వధింపుము; రావణమ్ = రావణుని; స = వారు; హి = తప్పక; దేవాన్ = దేవతలను; స = వారిని; గంధర్వాన్ = గంధర్వులను; సిద్ధాం = సిద్ధులను; చ = కూడ; ఋషి = మునులలో; సత్తమాన్ = పుంగవులను.
భావము:-
ఓ విష్ణు దేవా! దేవతలచే వధింపబడుటకు శక్యము కాని రావణుని యుద్ధములో నీవు వధింపుము. అతడు దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిపుంగవులను వేధించుచుండెను.
1.15.22.
అనుష్టుప్.
రాక్షసో రావణో మూర్ఖో
వీర్యోత్సేకేన బాధతే ।
ఋషయస్తు తతస్తేన
గంధర్వాప్సరసస్తథా ॥
టీక:-
రాక్షసః = రాక్షసుడైన; రావణః = రావణుడు; ముర్ఖః = మూర్ఖుడైన; వీర్యః = వీరత్వముచే; ఉత్సేకేన = గర్వముచే; బాధతే = బాధించుచున్నాడు; ఋషయః = ఋషులను; తు; తతః = దాని వలన; తేన = ఆ; గంధర్వః = గంధర్వులను; అప్సరసః = అప్సరసలను; తథా = అలాగే.
భావము:-
రాక్షసుడు మూర్ఖుడును ఐన ఆ రావణుడు వర గర్వముతో బాధించుచున్నాడు. అలాగే ఋషులును గంధర్వులును కూడ బాధించుచున్నాడు.
1.15.23.
అనుష్టుప్.
క్రీడన్తో నందనవనే
క్రూరేణ కిల హింసితాః ।
వధార్థం వయమాయాతాః
తస్య వై మునిభిః సహ ॥
టీక:-
క్రీడంత = క్రీడించుచున్న; నందనవనే = నందనవనము నందు; క్రూరేణ = క్రూరునిచే; కిల = కదా; హింసితాః = హింసింపబడినవారము; వధః = మరణము; అర్థమ్ = కొరకై; వయమ్ = మేము; ఆయాతాః = వచ్చియున్నాము; తస్య = అతని; మునిభిః = మునులతో; సహ = కూడ.
భావము:-
నందనవనములో విహరించుచున్న వారము ఆ క్రూరునిచే హింసింపబడుచు ఉన్నారము కదా. మేము మునులతో సహితంగా అతని మరణము కోరి నీ యొద్దకు వచ్చియున్నాము.
1.15.24.
అనుష్టుప్.
సిద్ధగంధర్వయక్షాశ్చ
తతస్త్వాం శరణం గతాః ।
త్వం గతిః పరమా! దేవ!
సర్వేషాం నః పరంతప! ॥
టీక:-
సిద్ధః = సిద్ధులు; గంధర్వః = గంధర్వులు; యక్షాః = యక్షులు; చ = కూడా; తతః = అందువలన; త్వామ్ = నిన్ను; శరణం గతాః = శరణు వేడినాము; త్వం = నీవే; గతిః = దిక్కు; పరమా = శ్రేష్ఠమైన; దేవా = దేవుడా; సర్వేషాం = అందరకును; నః = మాకు; పరంతపా = శత్రువులను తపింప చేయు వాడా.
భావము:-
సిద్ధులు గంధర్వులు యక్షులు కూడా అందరము కలిసి నిన్ను వేడుకొనుటకై వచ్చియున్నాము. శత్రువులను బాధింపగల సమర్థుడా! పరమాత్మా! దేవా! మాకందరకును నీవే దిక్కు.
1.15.25.
అనుష్టుప్.
వధాయ దేవశత్రూణాం
నృణాం లోకే మనః కురు" ।
ఏవముక్తస్తు దేవేశో
విష్ణుస్త్రిదశపుంగవః ॥
టీక:-
వధాయ = వధించుటకు; దేవ = దేవతలకు; శత్రూణామ్ = శత్రువులైన రాక్షసులను; నృణాం = మానవ; లోకే = లోకమునందు; మనః కురు = మనస్సున నిశ్చయించుకొనుము; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తస్తు = పలికిరి; దేవేశః = దేవతల ప్రభువు; విష్ణుః = విష్ణువును; త్రిదశ = దేవతలలో; పుంగవః = శ్రేష్ఠుడు.
భావము:-
రాక్షస సంహారము చేయుటకు నిశ్చయ మనస్కుడవగుము అని దేవతలలో శ్రేష్ఠుడైన శ్రీమహావిష్ణువును దేవతలు వేడుకొనిరి.
1.15.26.
అనుష్టుప్.
పితామహపురోగాంస్తాన్
సర్వలోకనమస్కృతః ।
అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్
సమేతాన్ ధర్మసంహితాన్ ॥
టీక:-
పితామహ = ఆ బ్రహ్మదేవుడు; పురోగాంస్తాన్ = మొదలగు; సర్వ = సకల; లోకః = లోకులచే; నమస్కృతః = నమస్కరింపబడినవాడు; అబ్రవీత్ = పలికెను; త్రిదశాన్ = దేవతలతో; సర్వాన్ = సమస్తమైన; సమేతాన్ = కలిసినవారును; ధర్మసంహితాన్ = ధర్మముతో కూడినవారును.
భావము:-
ధర్మాచరణ కలవారైన బ్రహ్మాది దేవతలు అందరితో, దేవతల ప్రభువు దేవతాశ్రేష్ఠుడు సకల లోకులచే నమస్కరింపబడువాడు ఐన శ్రీమహావిష్ణువు ఇట్లు పలికెను.
1.15.27.
అనుష్టుప్.
భయం త్యజత భద్రం వో
హితార్థం యుధి రావణమ్ ।
సపుత్రపౌత్రం సామాత్యం
సమిత్రజ్ఞాతిబాంధవమ్ ॥
టీక:-
భయం = భయమును; త్యజత = విడువుడు; భద్రం = క్షేమము అగుగాక; వః = మీ యొక్క; హితార్థం = హితము కొరకు; యుధి = యుద్ధములో; రావణమ్ = రావణుని; సః = అతని; పుత్రః = కొడుకులు; పౌత్రం = మనుమలు; స = అతని; ఆమాత్యం = మంత్రులు; స = అతని; మిత్ర = మిత్రులు; జ్ఞాతి = జ్ఞాతులు; బాంధవమ్ = బంధువులు.
భావము:-
భయము వీడండి. మీకు క్షేమము కలుగును. మీ హితము కొరకు నేను రావణుని, అతని కొడుకులను, మనుమలను, మంత్రులను, మిత్ర జ్ఞాత బాంధవులతో సహా యుద్ధములో వధించెదను.
1.15.28.
అనుష్టుప్.
హత్వా క్రూరం దురాత్మానం
దేవర్షీణాం భయావహమ్ ।
దశ వర్షసహస్రాణి
దశవర్షశతాని చ ।
వత్యామి మానుషేలోకే
పాలయన్ పృథివీమిమామ్ ॥
టీక:-
హత్వా = వధించి; క్రూరం = క్రూరుడు; దురాత్మానాం = దురాత్ముడు; దేవాః = దేవతలకును; ఋషీణాం = ఋషులకును; భయాః = భయమును; ఆవహమ్ = కలిగించువాడు; దశవర్ష సహస్రాణి = పదివేల సంవత్సరములు; దశవర్ష శతానిచ = పదివందల సంవత్సరములు; వత్స్యామి = నివసించెదను; మానుషే లోకే = మానవ లోకమునందు; పాలయన్ = పాలించుచు; పృథివీమ్ = భూమిని; ఇమామ్ = ఈ.
భావము:-
దేవతలకూ, ఋషులకు భీతిగొలిపే ఈ కూరుడైన రావణుని సంహరించెదను. పిమ్మట భూలోకములో పదకొండువేల సంవత్సరములు నివసించి, పాలించెదను
1.15.29.
అనుష్టుప్.
ఏవం దత్త్వా వరం దేవో
దేవానాం విష్ణురాత్మవాన్ ।
మానుషే చింతయామాస
జన్మభూమిమథాత్మనః ॥
టీక:-
ఏవం = ఈ విధముగా; దత్త్వా = ఇచ్చి; వరం = వరమును; దేవః = దేవుడు; దేవానాం = దేవతలకు; విష్ణుః = విష్ణువు; ఆత్మవాన్ = ఉత్తమ బుద్ధికలవాడు; మానుషే = మానవలోకమునందు; చింతయామాస = ఆలోచించెను; జన్మభూమిమ్ = అవతరించుటకు అనువైన స్థానమును గురించి; అథ = తరువాత; ఆత్మనః = తనకు.
భావము:-
శ్రీమహావిష్ణువు ఈవిధముగా వరమునిచ్చి; తాను జన్మించుటకు అనువైన స్థానమును గురించి ఆలోచించెను.
1.15.30.
అనుష్టుప్.
తతః పద్మపలాశాక్షః
కృత్వాత్మానం చతుర్విధమ్ ।
పితరం రోచయామాస
తదా దశరథం నృపమ్ ॥
టీక:-
తతః = తరువాత; పద్మ = తామరపూల; పలాశాః = రేకుల వంటి; అక్షః = కన్నులుగలవాడు; కృత్వా = చేసి; ఆత్మానం = తనను; చతుః = నాలుగు; విధమ్ = విధములుగా; పితరం = తండ్రిగా; రోచయామాస = ఇష్టపడెను; తదా = అప్పుడు; దశరథం = దశరథుడను; నృపమ్ = మహారాజును.
భావము:-
అప్పుడు తామరరేకుల వంటి కన్నులు గల ఆ శ్రీమహావిష్ణువు; తనను తాను నాలుగు విధములుగా చేసుకొని దశరథమహాజును తండ్రిగా గ్రహించ దలచెను.
1.15.31.
అనుష్టుప్.
తతో దేవర్షిగంధర్వాః
సరుద్రాః సాప్సరోగణాః ।
స్తుతిభిర్దివ్యరూపాభిః
తుష్టువుర్మధుసూదనమ్ ॥
టీక:-
తతః = అప్పుడు; దేవః = దేవతలు; ఋషీః = ఋషులు; గంధర్వాః = గంధర్వులు; స = వారు; రుద్రాః = రుద్రులు; స = వారు; అప్సరః = అప్సరసల; గణాః = సమూహములు; స్తుతిభిః = స్తోత్రములచే; దివ్యరూపాభిః = దివ్యమైన రూపముగల; తుష్టువుః = ప్రస్తుతించిరి; మధుసూదనమ్ = మధువు అను రాక్షసుని సంహరించిన శ్రీమహావిష్ణువును.
భావము:-
అంతట దేవతలు, ఋషులు, గంధర్వులు, రుద్రులు, అప్సరసలు స్తోత్రములతో దివ్యరూపము గల శ్రీమహావిష్ణువును ప్రార్థించిరి.
1.15.32.
జగతి.
తముద్ధతం రావణముగ్రతేజసం
ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషమ్ ।
విరావణం సాధుతపస్వికణ్టకం
తపస్వినాముద్ధర తం భయావహమ్ ॥
టీక:-
తమ్ = ఆ; ఉద్ధతమ్ = విజృంభించిన; రావణమ్ = రావణుని; ఉగ్రతేజసమ్ = భయంకరమైన పరాక్రమము గల; ప్రవృద్ధ దర్పమ్ = అధికమైన గర్వము గల; త్రిదశేశ్వరద్విషమ్ = దేవేంద్రుని ద్వేషించువాడు; విరావణం = లోకములను ఏడిపించువాడు; సాధుః = సాధువులకు; తపస్విః = తాపసులకు; కణ్టకం = కంటకుడైనవాడు; తపస్వినామ్ = మహర్షులకు; ఉద్ధర = ఉన్మీలించుము; తం = ఆ; భయావహమ్ = భయము కలిగించువాడు.
భావము:-
ఆ భయంకర పరాక్రమము విజృంభించినవాడును, అతిశయించిన గర్వము గలవాడును, దేవేంద్రుని ద్వేషించువాడును, లోకములను ఏడిపించువాడును, సాధువులకు తాపసులకు కంటకుడై తాపసులను భయపెట్టువాడును అగు ఆ రావణుని వధింపుము.
1.15.33.
జగతి.
తమేవ హత్వా సబలం సబాంధవం
విరావణం రావణముగ్రపౌరుషమ్ ।
స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం
సురేంద్రగుప్తం గతదోషకల్మషమ్" ॥
టీక:-
తమ్ = వారిని; ఏవ = అలాగ; హత్వా = వధించి; స = అతని; బలం = సైన్యమును; స = అతని; బాంధవం = బంధువులను; విరావణం = లోకములను ఏడిపించు; రావణమ్ = రావణుని; ఉగ్ర = భయంకరమైన; పౌరుషమ్ = పౌరుషము గలవానిని; స్వర్లోకమ్ = స్వర్గలోకమునకు; ఆగచ్ఛ = రమ్ము; గత = లేని; జ్వరః = బాధలుకలది; చిరం = చిరకాలము; సురేంద్ర = దేవేంద్రునిచే; గుప్తం = రక్షింపబడినది; గత = తొలగిన; దోష = దోషములు; కల్మషమ్ = పాపములు కలది.
భావము:-
భయంకర పౌరుషవంతుడై, లోకములను బాధించుచున్న రావణుని సైన్యముతో బాంధవులతో సహితముగ వధించి, ఎటువంటిబాధలు లేక కల్మషములు తొలగి దోషరహితమై దేవేంద్రునిచే రక్షింపబడుచున్న వైకుంఠమునకు వచ్చి చిరస్థాయిగా ఉండుము అని దేవతలు ఋషులు అందరూ ప్రార్థించిరి.
1.15.34.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచదశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచదశః [15] = పదిహేనవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [15] పదిహేనవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.16.1.
అనుష్టుప్.
తతో నారాయణో దేవః
నియుక్తః సురసత్తమైః ।
జానన్నపి సురానేవం
శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ॥
టీక:-
తతః = తరువాత; నారాయణః = నారాయణుడైన; దేవః = ఆ దేవుడు; నియుక్తః = అడుగ బడిన వాడై; సుర = దేవతా; సత్తమైః = శ్రేష్ఠుల చేత; జానన్ = తెలిసిన వాడే; అపి = అయినను; సురాన్ = ఆ దేవతలను ఉద్దేశించి; ఏవమ్ = ఈ విధముగా; శ్లక్ష్ణమ్ = మృదువైన; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
అలా బ్రహ్మాది దేవతల ప్రార్ధన ఆలకించిన పిమ్మట దేవదేవుడైన శ్రీ మన్నారాయణుడు తాను సర్వము తెలిసినవాడు అయినను వారిని ఉద్దేశించి మృదుస్వరముతో ఇట్లు పలికెను.
1.16.2.
అనుష్టుప్.
ఉపాయః కో వధే తస్య
రాక్షసాధిపతేస్సురాః ।
యమహం తం సమాస్థాయ
నిహన్యామృషికణ్టకమ్" ॥
టీక:-
ఉపాయః = ఉపాయము; కః = ఏమి; వధే = సంహరించుటకు; తస్య = ఆ; రాక్షసాధిపతేః = రావణుని; సురాః = దేవతలారా; యమ్ = దానిని; అహమ్ = నేను; తమ్ = వానిని; సమాస్థాయ = అవలంబించి; నిహన్యామ్ = చంపగలను; ఋషి = ఋషులకు; కణ్టకమ్ = హాని కలిగించువానిని.
భావము:-
“దేవతలారా! దుర్మార్గుడైన రావణుని వధించుటకు ఉపాయము ఏమిటి? ఋషులకు హాని కలిగించుచున్న వానిని, నేను ఆ ఉపాయమునుఅవలంబించి వధించగలను.” అని విష్ణువు ప్రశ్నించెను.
1.16.3.
అనుష్టుప్.
ఏవముక్తాః సురాః సర్వే
ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్ ।
మానుషీం తనుమాస్థాయ
రావణం జహి సంయుగే ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తాః = అడుగబడిన; సురాః = దేవతలు; సర్వే = అందరూ; ప్రత్యూచుః = సమాధానము చెప్పిరి; విష్ణుమ్ = విష్ణువుతో; అవ్యయమ్ = నాశనము లేని వాడైన; మానుషీమ్ = మానవ; తనుమ్ = దేహమును; అస్థాయ = అవలంబించి; రావణమ్ = రావణుని; జహి = వధింపుము; సంయుగే = రణమందు.
భావము:-
ఈ విధముగా అడిగిన నాశరహితుడైన శ్రీ మహావిష్ణువుతో “దేవతలు మానవ దేహమును ధరించి ఆ రావణుని రణమందు వధింపుము.
1.16.4.
అనుష్టుప్.
స హి తేపే తపస్తీవ్రం
దీర్ఘకాలమరిందమ ।
యేన తుష్టోఽ భవద్బ్రహ్మా
లోకకృల్లోకపూర్వజః ॥
టీక:-
సః = అతడు; తేపే = చేసెను; తపః = తపస్సును; తీవ్రమ్ = తీవ్రమైన దానిని; దీర్ఘకాలమ్ = చాలాకాలముపాటు; అరిందమ = శత్రువినాశకుడా; యేన = దాని చేత; తుష్టః = సంతుష్టుడైన వాడు; అభవత్ = ఆయినట్టి; బ్రహ్మా = బ్రహ్మ; లోకకృత్ = లోకములను సృష్టించిన వాడు; లోకపూర్వజః = లోకములకు ముందు పుట్టిన వాడు.
భావము:-
ఈ రావణుడు పూర్వము సుదీర్ఘ కాలము తీవ్రమైన తపస్సు చేసెను. ఆ తపస్సునకు లోకము కంటె పురాతనుడు, లోకసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సంతుష్టు డాయెను.
1.16.5.
అనుష్టుప్.
సంతుష్టః ప్రదదౌ తస్మై
రాక్షసాయ వరం ప్రభుః ।
నానావిధేభ్యో భూతేభ్యో
భయం నాన్యత్ర మానుషాత్" ॥
టీక:-
సంతుష్టః = సంతసించిన; ప్రదదౌ = ఇచ్చెను, ప్రసాదించెను; తస్మై = ఆ; రాక్షసాయ = రావణాసురునకు; వరమ్ = వరమును; ప్రభుః = ప్రభువు, బ్రహ్మదేవుడు; నానా విధేభ్యః = సకల విధము లైన; భూతేభ్యః = ప్రాణులవలన; భయమ్ = భయము; న = లేని; అన్యత్ర = తప్ప; మానుషాత్ = మనిషి వలన.
భావము:-
సంతసించిన ఆ బ్రహ్మదేవుడు ఆ రావణాసురునకు “మనుష్యుల వలన తప్ప మరి యే ఇతర ప్రాణుల వలనను మరణము లేకుండునట్లు” వరమును ప్రసాదించెను.
1.16.6.
అనుష్టుప్.
అవజ్ఞాతాః పురా తేన
వరదానే హి మానవాః ।
ఏవం పితామహాత్తస్మాత్
వరం ప్రాప్య స దర్పితః ॥
టీక:-
అవజ్ఞాతాః = అనాదరము చేయబడిరి, విడిచిపెట్టబడిరి; పురా = పూర్వము; తేన = వాని చేత; వరదానేహి = వరదాన సమయము నందు; మానవాః = మనుష్యులు; ఏవమ్ = ఈ విధముగా; పితామహాత్ = బ్రహ్మదేమునినుండి; తస్మాత్ = ఆ; వరమ్ = వరమును; ప్రాప్య = పొంది; స = అతడు; దర్పితః = గర్వితుడై.
భావము:-
పూర్వము ఆ రావణుడు వరదాన సమయమున ‘మానవుల నుండి’ అని అడుగలేదు. ఈ విధముగా పితామహుడైన బ్రహ్మ నుండి వరమును పొంది గర్వితుడైన ఆ రావణుడు.
1.16.7.
అనుష్టుప్.
ఉత్సాదయతి లోకాంస్త్రీన్
స్త్రియశ్చాప్యపకర్షతి ।
తస్మాత్తస్య వధో దృష్టో
మానుషేభ్యః పరంతప" ॥
టీక:-
ఉత్పాదయతి = పీడించుచున్నాడు; లోకాన్ = లోకములను; త్రీన్ = మూడింటినీ; స్త్రియః = స్త్రీలను; చ అపి = కూడా; అపకర్షతి = వంచించుచున్నాడు; తస్మాత్ = అందువలన; తస్య = అతని యొక్క; వధః = చావు; దృష్టః = చూడబడినది; మానుషేభ్యః = మనుష్యులచేతనే; పరంతప = శత్రుసంహారకుడా.
భావము:-
అతడు ముల్లోకములను పీడించుచున్నాడు. స్త్రీలను వంచించుచున్నాడు. ఓ శ్రీహరీ! బ్రహ్మదేవుని వరము వలన అతని వధ మానవుల వలన మాత్రమే జరుగవలెను.”
1.16.8.
అనుష్టుప్.
ఇత్యేతద్వచనం శ్రుత్వా
సురాణాం విష్ణురాత్మవాన్ ।
పితరం రోచయామాస
తదా దశరథం నృపమ్ ॥
టీక:-
ఇతి = ఈ విధముగ; ఏతత్ =; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; సురాణాం = దేవతల యొక్క; విష్ణుః = విష్ణువు; ఆత్మవాన్ = మహాబుద్ధి సమన్వితుడు; పితరం = తండ్రిగా; రోచయామాస = ఇష్ట పడెను; తదా = అప్పుడు; దశరథం = దశరథుదు అనెడి; నృపమ్ = రాజును.
భావము:-
ఆ దేవతల మాటలను ఆలకించిన మహాబుద్ధి సమన్వితుడైన శ్రీమహావిష్ణువు దశరథ మహారాజును తనకు (ఎత్తబోవు మానవరూప అవతారమునకు) తండ్రిగా ఎన్నుకొనెను.
1.16.9.
అనుష్టుప్.
స చాప్యపుత్రో నృపతిః
తస్మిన్ కాలే మహాద్యుతిః ।
అయజత్పుత్రియామిష్టిం
పుత్రేప్సురరిసూదనః ॥
టీక:-
స = ఆ; చ = మఱియు; అపి = కూడా; అపుత్రః = పుత్రులు లేని; నృపతిః = రాజు; తస్మిన్ = ఆ యొక్క; కాలే = సమయ మందు; మహా ద్యుతిః = గొప్ప తేజస్సు కల వాడు; అయజత్ = యజించెను; పుత్రియామ్ = పుత్రులను కలిగించు; ఇష్టిమ్ = యాగమును; పుత్రేప్సుః = పుత్రులను పొందగోరి; అరిసూదనః = శత్రువులను సహరించు వాడు.
భావము:-
ఆ సమయములో గొప్ప తేజోవంతుడు, శత్రువులను సంహరించువాడును అయిన ఆ దశరథ మహారాజు పుత్రులు లేకపోవుటచే, పుత్రులను పొందజేయు ఒక యాగమును చేయుచుండెను.
1.16.10.
అనుష్టుప్.
స కృత్వా నిశ్చయం విష్ణుః
ఆమంత్ర్య చ పితామహమ్ ।
అంతర్ధానం గతో దేవైః
పూజ్యమానో మహర్షిభిః ॥
టీక:-
సః = ఆ; కృత్వా = చేసి; నిశ్చయమ్ = నిశ్చయము; విష్ణుః = విష్ణువు; ఆమంత్ర్య = వీడ్కోలుగొని; చ = తో; పితామహమ్ = బ్రహ్మ దేముని వద్ద నుండి; అంతర్ధానమ్ = అంతర్ధానము; గతః = పొందెను; దేవైః = దేవతల చేతను; పూజ్యమానః = పూజింపబడుచున్న వాడై; మహర్షిభిః = మహర్షుల చేతను
భావము:-
అంతట శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని నుండి వీడ్కోలు గొని, దేవతలచేత, మహర్షులచేత కీర్తింపబడుచు అంతర్ధానమయ్యెను.
1.16.11.
అనుష్టుప్.
తతో వై యజమానస్య
పావకాదతులప్రభమ్ ।
ప్రాదుర్భూతం మహద్భూతం
మహావీర్యం మహాబలమ్ ॥
టీక:-
తతః = అటు; వై = పిమ్మట; యజమానస్య = యజ్ఞము చేయుచున్న దశరథుని యొక్క; పావకాత్ = అగ్ని నుండి; అతుల = సాటిలేని; ప్రభమ్ = కాంతితో; ప్రాదుర్భూతమ్ = ఆవిర్భవించెను; మహద్భూతమ్ = గొప్ప భూతము అనగా దివ్య యజ్ఞ పురుషుడు; మహావీర్యమ్ = గొప్ప వీర్యము కలిగియున్న; మహాబలమ్ = గొప్ప బలము కలిగియున్న.
భావము:-
అంతట ఆ యజ్ఞకర్త యొక్క యజ్ఞకుండము నుండి సాటిలేని గొప్పతేజస్సుతో మహావీర్యవంతుడు, మహాబలవంతుడు అయిన గొప్ప దివ్యశక్తిమంతుడు అయిన యజ్ఞ పురుషుడు ఆవిర్భవించెను.
1.16.12.
అనుష్టుప్.
కృష్ణరక్తామ్బరధరం
రక్తాస్యాం దున్దుభిస్వనమ్ ।
స్నిగ్ధ హర్యక్షతనుజః -
శ్మశ్రుప్రవర మూర్ధజమ్ ॥
టీక:-
కృష్ణ = నల్లని; రక్త = ఎఱ్ఱని; అమ్బర = వస్త్రములు; ధరమ్ = ధరించినది; రక్త = ఎఱ్ఱని; ఆస్యమ్ = నోరు కలది; దున్దుభి = దుందుభి వంటి; స్వనమ్ = కంఠస్వరము కలది; స్నిగ్ధ = మృదువైన; హర్యక్ష = సింహపు; తనుజ = రోమముల వంటి; శ్మశ్రు = మీసములు; ప్రవర = శ్రేష్ఠమైనవి; మూర్ధజమ్ = కేశములు కలది.
భావము:-
ఆ యజ్ఞ పురుషుడు నలుపు, ఎరుపు వస్త్రములు ధరించి ఉండెను. ఎఱ్ఱని నోరు, దుందుభి ధ్వని వంటి కంఠస్వరము. సింహపు మెత్తని రోమములను పోలిన రోమములు, మీసములు, సింహపు జూలును పోలిన కేశములు కలిగి ఉండెను.
1.16.13.
అనుష్టుప్.
శుభలక్షణ సంపన్నం
దివ్యాభరణ భూషితమ్ ।
శైలశృంగ సముత్సేధం
దృప్తశార్దూలవిక్రమమ్ ॥
టీక:-
శుభ = శుభకరమైన; లక్షణ = లక్షణములు; సంపన్నమ్ = సమృద్దిగా కలది; దివ్య = దివ్యమైన; ఆభరణ = ఆభరణములతో; భూషితమ్ = అలకరించినది; శైలశృంగ = పర్వతశిఖరము వలె; సమ = మిక్కిలి; ఉత్సేధం = ఎత్తైనది; దృప్త = మదించించిన; శార్దూల = పెద్దపులి వంటి; విక్రమమ్ = శౌర్యము కలిగినది.
భావము:-
ఆ దివ్య పురుషు శుభలక్షణ సంపన్నము దివ్యాభరణములతో అలంకరించబడినది, పర్వత శిఖర మంతటి ఎత్తు కలిగినది, మదించిన పెద్దపులి శౌర్యము కల స్వరూపము తో తేజరిల్లుచుండెను. ఇంతను.
1.16.14.
అనుష్టుప్.
దివాకరసమాకారం
దీప్తానలశిఖోపమమ్ ।
తప్తజామ్బూనదమయీం
రాజతాంతపరిచ్ఛదామ్ ॥
టీక:-
దివాకర = సూర్యునితో; సమాకారమ్ = సమానమైన తేజస్సుకల స్వరూపము కలది; దీప్త = ప్రజ్వలించుచున్న; అనలశిఖ = అగ్నిశిఖ; ఉపమమ్ = వంటిది; తప్త = అగ్నిశుద్ధిచేసిన; జామ్బూనద = బంగారముతో; మయీమ్ = చేసినది; రాజత = వెండితో చేయబడిన; అంతపరిచ్ఛదామ్ = మూత గలది.
భావము:-
సూర్యుని తేజస్సు కలిగి, ప్రజ్వలించుచున్న అగ్నిశిఖవంటిది, కరిగించిన బంగారముతో చేయబడిన, వెండి మూత గల ఐన పాత్ర ధరించి ఉండెను..
1.16.15.
అనుష్టుప్.
దివ్యపాయససంపూర్ణాం
పాత్రీం పత్నీమివ ప్రియామ్ ।
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం
స్వయం మాయామయీమివ ॥
టీక:-
దివ్య = దివ్యమైన; పాయస = పాయసముతో; సంపూర్ణామ్ = నిండుగాఉన్నది; పాత్రీమ్ = పాత్ర; పత్నీమ్ ఇవ = భార్య వలె; ప్రియామ్ = ప్రియమైనదానిని; ప్రగృహ్య = గ్రహించి; విపులామ్ = పెద్దవైన; దోర్భ్యామ్ = రెండు చేతులతో; స్వయమ్ = స్వయముగా; మాయామయీమ్ = మాయా నిర్మితమా; ఇవ = అన్నట్లు.
భావము:-
ఆ పాత్ర దివ్య మైన పాయసము నిండుగా కలిగి, తన భార్య వలె మిక్కిలి ప్రియమైనటువంటి, మాయచే నిర్మించినట్లుండెను. ఆ దివ్య పురుషుడు పెద్దవైన తన రెండు చేతుల యందు ఆ దివ్యపాత్రను స్వయముగా పట్టుకుని వచ్చెను.
1.16.16.
అనుష్టుప్.
సమవేక్ష్యాబ్రవీద్వాక్యం
ఇదం దశరథం నృపమ్ ।
ప్రాజాపత్యం నరం విద్ధి
మామిహాభ్యాగతం నృప!" ॥
టీక:-
సమవేక్ష్య = పరికించి; అబ్రవీత్ = పలికెను; వాక్యమ్ = వాక్యమును; ఇదమ్ = ఈ; దశరథమ్ = దశరథుడు అను; నృపమ్ = రాజును; ప్రాజాపత్యమ్ = ప్రజాపతికి సంబంధించిన; నరమ్ = నరునిగా; విద్ధి = తెలుసుకొనుము; మామ్ = నన్ను; ఇహ = ఇచ్చటకు; అభ్యాగతం = వచ్చినవానిని; నృప = రాజా.
భావము:-
ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజును పరికించి ఈ విధముగా పలికెను. “ఓ రాజా! నేను ప్రజాపతి పంపగా వచ్చిన వాడను అని తెలుసుకొనుము.”
1.16.17.
అనుష్టుప్.
తతః పరం తదా రాజా
ప్రత్యువాచ కృతాంజలిః ।
భగవన్! స్వాగతం తేఽ స్తు
కిమహం కరవాణి తే" ॥
టీక:-
తతఃపరమ్ = అటుపిమ్మట; తదా = ఆ; రాజా = రాజు దశరథుడు; ప్రత్యువాచ = మారుపలికెను; కృతాంజలిః = అంజలి ఘటిస్తూ; భగవాన్ = ఓ భగవంతుడా; స్వాగతం = స్వాగతము; తే = నీకు; అస్తు = అగు గాక; కిమ్ = ఏమి; అహమ్ = నేను; కరవాణి = చేయగలవాడను; తే = నీకు
భావము:-
అటు పిమ్మట దశరథ మహారాజు చేతులు జోడించి ఆ దివ్యపురుషుని ఉద్దేశించి దివ్యపురుషునికి సమాధానముగా "ఓ పూజ్యుడా! మీకు స్వాగతము. మీ కొరకు నేను ఏమి చేయగలవాడను." అని అడిగెను.
1.16.18.
అనుష్టుప్.
అథో పునరిదం వాక్యం
ప్రాజాపత్యో నరోఽ బ్రవీత్ ।
రాజ! న్నర్చయతా దేవాన్
అద్య ప్రాప్తమిదం త్వయా ॥
టీక:-
అథః = అప్పుడు; పునః = మరల; ఇదమ్ = ఈ; వాక్యమ్ = వాక్యమును; ప్రాజాపత్యః = ప్రజాపతి కి సంబంధించిన; నరః = నరుడు; అబ్రవీత్ = పలికెను; రాజన్ = ఓ రాజా; అర్చయతా = అర్చించుచున్న; దేవాన్ = దేవతలచే; అద్య = ఈ దినము; ప్రాప్తమ్ = ప్రాప్తించబడినది; ఇదమ్ = ఇది; త్వయా = నీచేత;
భావము:-
అప్పుడు మరల ఆ ప్రజాపతిచే పంపబడిన ఆ దివ్యపురుషుడు ఇట్లు పలికెను " ఓ రాజా! నీవు అర్చించుచున్నదేవతల వలన ఈ దినము ఈ పాయసము నీకు లభించినది.
1.16.19.
అనుష్టుప్.
ఇదం తు నరశార్దూల!
పాయసం దేవనిర్మితమ్ ।
ప్రజాకరం గృహాణ త్వం
ధన్యమారోగ్యవర్దనమ్ ॥
టీక:-
ఇదం = ఈ; తు = యొక్క; నర = మానవులలో; శార్దూల = శ్రేష్ఠుడా; పాయసమ్ = పాయసము; దేవనిర్మితమ్ = దేవతల చేత చేయబడినది; ప్రజాకరమ్ = సంతానమును కలిగించెడిది; గృహాణ = స్వీకరింపుము; త్వమ్ = నీవు; ధన్యమ్ = సంపదలను, ధన్యత్వమును; ఆరోగ్య = ఆరోగ్యమును; వర్ధనమ్ = పెంపొందింపజేయునది.
భావము:-
మానవోత్తముడా! ఈ పాయసము దేవతలచే తయారు చేయబడినది. సంతానము కలిగించునది, సంపదలను పెంచునది, ఆరోగ్యవృద్ధికరము అయిన దీనిని నీవు స్వీకరించి ధన్యుడవు కమ్ము.
1.16.20.
అనుష్టుప్.
భార్యాణామనురూపాణాం
“అశ్నీతేతి” ప్రయచ్ఛ వై ।
తాసు త్వం లప్స్యసే పుత్రాన్
యదర్థం యజసే నృప!" ॥
టీక:-
భార్యాణామ్ = భార్యలకు; అనురూపాణామ్ = అనుకూలవతులైన; అశ్నీత = భుజింపుడు; ఇతి = అని; ప్రయచ్ఛ వై = ఇమ్ము; తాసు = వారి యందు; త్వమ్ = నీవు; లప్స్యసే = పొందగలవు; పుత్రాన్ = పుత్రులను; యత్ = దేని; అర్థమ్ = కొరకు; యజసే = యజ్ఞము చేసావో; నృప = ఓ రాజా
భావము:-
ఓ రాజా! ‘భుజింపుడు’ అని చెప్పి ఈ పాయసమును అర్హులైన నీ భార్యలకు ఇమ్ము. యజ్ఞము చేసిన ఉద్దేశ్యము నెరవేరి ఆ భార్యల యందు నీవు పుత్రులను పొందెదవు."
1.16.21.
అనుష్టుప్.
తథేతి నృపతిః ప్రీతః
శిరసా ప్రతిగృహ్యతామ్ ।
పాత్రీం దేవాన్నసంపూర్ణాం
దేవదత్తాం హిరణ్మయీమ్ ॥
టీక:-
తథా = ఆవిధమైన; ఇతి = కారణముచేత; నృపతిః = రాజు; ప్రీతః = సంతోషించెను; శిరసా = శిరస్సువంచి; ప్రతిగృహ్యతామ్ = స్వీకరించెను; పాత్రీమ్ = పాత్రను; దేవాన్న = దివ్యమైన అన్నముతో, పరవాన్నముతో; సంపూర్ణామ్ = నిండినది అయిన; దేవదత్తామ్ = దేవతలచే ఈయబడినది అగు; హిరణ్మయీమ్ = బంగారముతో చేయబడినదానిని.
భావము:-
దానితో దశరథ మహారాజు సంతోషించెను. తన శిరస్సు వంచి దేవతలు చేసిన దివ్యపాయసముతో నిండిఉన్న ఆ బంగారు పాత్రను స్వీకరించెను.
1.16.22.
అనుష్టుప్.
అభివాద్య చ తద్భూతం
అద్భుతం ప్రియదర్శనమ్ ।
ముదా పరమయా యుక్తః
చకారాభిప్రదక్షిణమ్ ॥
టీక:-
అభివాద్య = నమస్కరించి; చ = కూడా; తత్ = ఆ; భూతమ్ = భూతమును, ఆ దివ్యస్వరూపమును; అద్భుతమ్ = ఆశ్చర్యకరమైనది; ప్రియ దర్శనమ్ = సంతోషకరమైనది; ముదా = సంతోషముతో; పరమయా = గొప్పదైన; యుక్తః = కూడిన వాడై; చకార = చేసెను; అభి ప్రదక్షిణమ్ = ప్రదక్షిణమును
భావము:-
మిక్కిలి సంతోషించిన వాడై దశరథుడు చూచెడివారలకు ఆశ్చర్యము, అమితానందము కలిగించుచున్న ఆ దివ్య పురుషునకు ప్రదక్షిణ నమస్కారములు చేసెను.
1.16.23.
అనుష్టుప్.
తతో దశరథః ప్రాప్య
పాయసం దేవనిర్మితమ్ ।
బభూవ పరమప్రీతః
ప్రాప్య విత్తమివాధనః ॥
టీక:-
తతః = అంతట; దశరథః = దశరథుడు; ప్రాప్య = పొందినవాడై; పాయసమ్ = పాయసమును; దేవనిర్మితమ్ = దేవతలచే చేయబడినదానిని; బభూవ = ఆయెను; పరమ = మిక్కిలి; ప్రీతః = సంతోషించిన వాడు; ప్రాప్య = లభించిన; విత్తమ్ = ధనమును; ఇవా = వలె; అధనః = ధనహీనుడు
భావము:-
దేవతలు తయారుచేసిన ఆ పాయసము పొందిన దశరథుడు, ధనము లభించిన ధనహీనుని వలె మిక్కిలి సంతోషము పొందెను.
1.16.24.
అనుష్టుప్.
తతస్త దద్భుతప్రఖ్యం
భూతం పరమభాస్వరమ్ ।
సంవర్తయిత్వా తత్కర్మ
తత్రై వాంతరధీయత ॥
టీక:-
తతః = అంతట; తత్ = ఆ; అద్భుత = అద్భుత; ప్రఖ్యమ్ = స్వరూపము కలది; భూతమ్ = ఆ దివ్య స్వరూపము; పరమ = మిక్కిలి; భాస్వరమ్ = ప్రకాశించునదియై; సమ్ = చక్కగా; వర్త = నడచినది; ఇత్వా = అగునట్లుచేసి; తత్ = ఆ; కర్మ = పనిని; తత్ర ఏవ = అచటనే; అంతరధీయతా = అంతర్ధానమాయెను.
భావము:-
తాను వచ్చిన కార్యమును చక్కగా నిర్వర్తించిన పిమ్మట ప్రకాశవంతమైన ఆ అద్భుత స్వరూపుడు వెంటనే అంతర్ధాన మాయెను.
1.16.25.
అనుష్టుప్.
హర్షరశ్మిభి రుద్యోతమ్
తస్యా ంతపురమాబభౌ ।
శారద స్యాభిరామస్య
చంద్రస్యేవ నభోంఽ శుభిః ॥
టీక:-
హర్ష = ఆనందపు; రశ్మిభిః = కిరణముల చేత; ఉద్ద్యోతమ్ = వెలుగుతున్న; తస్య = అతని యొక్క; అంతఃపురమ్ = అంతఃపురము; అబభౌ = ప్రకాశించెను; శారదస్య = శరత్కాలపు; అభిరామస్య = మనోహరమైన; చంద్రస్య = చంద్రుని; ఇవ = వలె; నభః = ఆకాశము; అంశుభిః = కిరణముల చేత
భావము:-
దశరథుని ఆనందపు కాంతులతో ధగధగలాడుతున్న అంతఃపురము మనోహరముగా శరత్కాలపు చంద్రుని కాంతులచే ప్రకాశించు ఆకాశము వలె ప్రకాశించెను-
1.16.26.
అనుష్టుప్.
సోఽ ంతపురం ప్రవిశ్యైవ
కౌసల్యా మిదమబ్రవీత్ ।
పాయసం ప్రతిగృహ్ణీష్వ
పుత్రీయం త్విదమాత్మనః" ॥
టీక:-
సః = అతడు; అంతఃపురమ్ = అంతఃపురమును; ప్రవిశ్యైవ = ప్రవేశించి; కౌసల్యామ్ = కౌసల్యాదులతో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను; పాయసమ్ = పాయసమును; ప్రతిగృహ్ణీష్వ = స్వీకరింపుము; పుత్రీయమ్ తు = పుత్రులను కలుగజేయు; ఇదమ్ = ఈ; ఆత్మనః = మనకు.
భావము:-
అతడు అంతఃపురము ప్రవేశించి కౌసల్య,సుమిత్ర కైకేయిలతో “పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుడు” అని చెప్పెను.
1.16.27.
అనుష్టుప్.
కౌసల్యాయై నరపతిః
పాయసార్ధం దదౌ తదా ।
అర్ధాదర్ధం దదౌ చాపి
సుమిత్రాయై నరాధిపః ॥
టీక:-
కౌసల్యాయై = కౌసల్య కు; నరపతిః = రాజు దశరథుడు; పాయసా = పాయసములో; అర్ధమ్ = అర్ధ భాగమును; దదౌ = ఇచ్చెను; తదా = మఱియు; అర్ధాత్ = మిగిలిన సగము నందు; అర్ధమ్ = సగభాగమును; దదౌ = ఇచ్చెను; చ అపి = కూడా; సుమిత్రాయై = సుమిత్రకు; నరాధిపః = రాజు.
భావము:-
దశరథుడు కౌసల్యకు పాయసములో సగభాగము ఇచ్చెను.పిదప మిగిలిన సగభాగములో సగమును అనగా పావు వంతును సుమిత్రకు ఇచ్చెను.
1.16.28.
అనుష్టుప్.
కైకేయ్యై చావశిష్టార్ధమ్
దదౌ పుత్రార్థకారణాత్ ।
ప్రదదౌ చావశిష్టార్ధమ్
పాయస స్యామృతోపమమ్ ॥
టీక:-
కైకేయ్యై = కైకేయికి; చ = కూడా; అవశిష్ట = మిగిలిన దానిలో; అర్ధమ్ = సగమును; దదౌ = ఇచ్చెను; పుత్రార్థ = పుత్రుని పొందగోరు; కారణాత్ = కారణము వలన; ప్రదదౌ = ఇచ్చెను; చ = కూడా; అవశిష్టార్ధమ్ = మిగిలిన సగభాగమును; పాయసస్య = పాయసము యొక్క; అమృత = అమృతముతో; ఉపమమ్ = సమానమైనదానిని.
భావము:-
మిగిలిన సగభాగములో సగమును పుత్రుని పొందగోరుకోరిక కల కైకేయికి కూడా ఇచ్చెను. (అనగా ఎనిమిదవ వంతు -1/8 వంతు పాయసమును కైకేయికి ఇచ్చెను)
1.16.29.
అనుష్టుప్.
అనుచిన్త్య సుమిత్రాయై
పునరేవ మహీపతిః ।
ఏవం తాసాం దదౌ రాజా
భార్యాణాం పాయసం పృథక్ ॥
టీక:-
అనుచిన్త్య = ఆలోచించి; సుమిత్రాయై = సుమిత్రకు; పునః = మరల; ఇవ = ఆ; మహీపతిః = రాజు; ఏవమ్ = ఆ విధముగా; తాసామ్ = వారలకు; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; భార్యాణామ్ = భార్యలకు; పాయసమ్ = పాయసమును; పృథక్ = వేరు వేరుగా
భావము:-
అప్పుడు రాజు మరల ఆలోచించి మిగిలిన (8 వ వంతు) భాగమును సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై దశరథుడు ఆ పాయసమును తన భార్యలకు వేరు వేరుగా పంచి ఇచ్చెను.
1.16.30.
అనుష్టుప్.
తాస్త్వేత త్పాయసం ప్రాప్య
నరేంద్రస్యోత్తమాః స్త్రియః ।
సమ్మానం మేనిరే సర్వాః
ప్రహర్షోదిత చేతసః ॥
టీక:-
తాః = వారు; ఏతత్ = ఆ; పాయసమ్ = పాయసమును; ప్రాప్య = పొంది; నరేంద్రస్య = రాజు యొక్క; ఉత్తమాః = ఉత్తములైన; స్త్రియః = భార్యలు; సమ్మానమ్ = గౌరవ సత్కారముగా; మేనిరే = భావించిరి; సర్వాః = అందరూ; ప్రహర్ష = హర్షము; ఉదిత = జనించిన; చేతసః = మనములతో.
భావము:-
సద్గుణసంపన్నులైన దశరథుని భార్యలు ఆ పాయసము పొంది మిక్కిలి హర్షము చెందిన మనములతో దానిని తమకు లభించిన గౌరవ సత్కారముగా భావించిరి.
1.16.31.
జగతి.
తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో
మహీపతే రుత్తమపాయసం పృథక్ ।
హుతాశ నాదిత్య సమానతేజసః
చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా ॥
టీక:-
తతస్తు = అటుపిమ్మట; తాః = వారు; ప్రాశ్య = భుజించి; తత్ = ఆ; ఉత్తమ = ఉత్తములైన; స్త్రియః = స్త్రీలు; మహీపతేః = రాజు యొక్క; ఉత్తమ = శ్రేష్ఠమైన; పాయసమ్ = పాయసమును; పృథక్ = పొంది; హుతాశన ఆదిత్య సమాన తేజసః = అగ్ని వంటి, సూర్యుని వంటి తేజోవంతులై; చిరేణ = చాలా కాలమునకు; గర్భాన్ = గర్భములను; ప్రతిపేదిరే = తాల్చిరి; తదా = అప్పుడు.
భావము:-
పిమ్మట ఉత్తమ గుణవతులయిన ఆ రాజు భార్యలు ముగ్గురును శ్రేష్ఠమైన పాయసమును భుజించి అగ్నివంటి, సూర్యుని వంటి తేజస్సు పొంది చాలా కాలము పిమ్మట గర్భములు దాల్చిరి.
1.16.32.
జగతి.
తతస్తు రాజా ప్రతివీక్ష్య తాః స్త్రియః
ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః ।
బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః
సురేంద్ర సిద్ధర్షి గణాభిపూజితః ॥
టీక:-
తతః తు = అటుపిమ్మట; రాజా = రాజు; ప్రతివీక్ష్య = వీక్షించి; తాః = ఆ; స్త్రియః = స్త్రీలను; ప్రరూఢ = నిశ్చయించబడిన; గర్భాః = గర్భములు ధరించినవారిని; ప్రతిలబ్ధ = సంతుష్టిచెందిన; మానసః = మనస్థితిని; బభూవ = పొందెను; హృష్టః = సంతసించిన వాడు; త్రిదివే = స్వర్గము నందు; యథా = వలె; హరిః = విష్ణువు; సురేంద్ర = దేవేంద్రుడు; సిద్ధ = సిద్ధులు; ఋషి = ఋషుల; గణ = గణముల చేత; అభిపూజితః = పూజింపబడిన వాడు.
భావము:-
దశరథుడు తన భార్యలను గర్భములు నిలబడుట రూఢి చేసుకుని సంతుష్టచిత్తుడు ఆయెను. దేవేంద్రుడు, సిద్ధులు, ఋషి గణములచే స్వర్గములో పూజింపబడిన శ్రీ మహావిష్ణువు వలె సంతసించెను.
1.16.33.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
షోడశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షోడశః [16] = పదహారవ; సర్గః = తెలుగు వారి;
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము బాలకాండలోని [16] పదహారవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.17.1.
అనుష్టుప్.
పుత్రత్వం తు గతే విష్ణౌ
రాజ్ఞస్తస్య మహాత్మనః ।
ఉవాచ దేవతాః సర్వాః
స్వయమ్భూ ర్భగవానిదమ్ ॥
టీక:-
పుత్రత్వం = పుత్రుడగుట; తు = వెంటనే; గతే = పొందగానే; విష్ణౌ = విష్ణువు; రాజ్ఞః = రాజునకు; తస్య = అతనికి; మహాత్మనః = మహాత్ముడైన; ఉవాచ = పలికెను; దేవతాః = దేవతలు; సర్వాః = అందరితోను; స్వయంభూః = బ్రహ్మదేవుడు; భగవాన్ = భగవానుడైన; ఇదమ్ = ఇట్లు.
భావము:-
మహాత్ముడైన దశరథ మహారాజునకు విష్ణువు పుత్రుడిగా పుట్టబోతుండగా, భగవంతుడు స్వయంభువ బ్రహ్మదేవుడు దేవతలు అందరితో ఇలా ఆజ్ఞాపించెను.
1.17.2.
అనుష్టుప్.
సత్యసంధస్య వీరస్య
సర్వేషాం నో హితైషిణః ।
విష్ణోః సహాయాన్ బలినః
సృజధ్వం కామరూపిణః ॥
టీక:-
సత్య = సత్యమైన; సంధస్య = ప్రతిజ్ఞ కలవాడును; వీరస్య = వీరుడును; సర్వేషాం = అందరి; నః = మన; హితః = మేలు; ఈషిణః = కోరువాడగు; విష్ణోః = విష్ణువునకు; సహాయాన్ = సహాయకులను; బలినః = బలవంతులైన వారిని; సృజధ్వం = సృష్టించండి; కామరూపిణః = కోరిన రూపుమును ధరించగల వారిని.
భావము:-
సత్యమైన ప్రతిజ్ఞ కలవాడును, మహావీరుడును, మన అందరి మేలు కోరువాడును నగు విష్ణువునకు బలవంతులును, కామరూపులును అగు సహాయకులను పుట్టించుడు.
1.17.3.
అనుష్టుప్.
మాయావిదశ్చ శూరాంశ్చ
వాయువేగసమాన్ జవే ।
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్
విష్ణుతుల్య పరాక్రమాన్ ॥
టీక:-
మాయాః = మాయలను; విదః = ఎరిగిన వారును; చ; శూరాన్ = శూరులను; చ; వాయువేగః = వాయువు వీచు వేగముతో; సమాన్ = సమానమైన; జవే = వేగముకలవారు; నయ = నీతి, న్యాయము; జ్ఞాన్ = తెలిసినవారును; బుద్ధి = సద్బుద్ధి; సంపన్నాన్ = సమృద్దిగా కల వారును; విష్ణు = విష్ణువుతో; తుల్య = సమానమైన, సరిపోలు; పరాక్రమాన్ = పరాక్రమము కలవారును.
భావము:-
మాయల నెరిగినవారును, శూరులును, వాయువేగముతో సమానమైన వేగము కలవారును, నీతిమంతులను, బుద్ధిమంతులును, పరాక్రమములో విష్ణువుతో సరియైన వారును.
1.17.4.
అనుష్టుప్.
అసంహా ర్యానుపాయజ్ఞాన్
సింహసంహన నాన్వితాన్ ।
సర్వాస్త్రగుణ సంపన్నాన్
అమృతప్రాశనా నివ ॥
టీక:-
అసంహార్యాన్ = చంపుటకు నలవికాని వారును; ఉపాయజ్ఞాన్ = ఉపాయము, సమయస్ఫూర్తి; జ్ఞాన్ = తెలిసినవారును; దివ్య = దివ్యమైన, ప్రకాశవంతమైన; సంహననః = శరీరముతో; అన్వితాన్ = కూడిన వారును; సర్వాః = అన్ని రకముల; అస్త్ర = అస్త్రములు వాడు; గుణ = నేర్పు; సంపన్నాన్ = సమృద్దిగా గలవారును; అమృతః = అమృతమును; ప్రాశనాన్ = భుజించువారి; ఇవ = వంటివారు.
భావము:-
చంపశక్యము కానివారును, సమయస్ఫూర్తి / ఉపాయము కలవారును, దివ్యమైన శరీరములు కలవారును, సకల అస్త్రములను సంధించు మంచి నేర్పరితనము గలవారును, అమృతము భుజించినవారి వంటి వారును.
1.17.5.
అనుష్టుప్.
అప్సరస్సు చ ముఖ్యాసు
గంధర్వీణాం తనూషు చ ।
యక్ష పన్నగ కన్యాసు
ఋక్షవిద్యాధరీషుచ ॥
టీక:-
అప్సరస్సు = అప్సరసల యందును; చ; ముఖ్యాసు = ముఖ్యులగు; గంధర్వీణాం = గంధర్వ స్త్రీల; తనూషు = శరీరముల యందును; చ = మఱియు; యక్ష = యక్షిణీ; పన్నగ = నాగ; కన్యాసు = కన్యలయందును, నాగకన్యల యందును; ఋక్ష = ఆడ భల్లూకముల యందును; విద్యాధరీషుచ = విద్యాధర స్త్రీలయందు; చ = మఱియు.
భావము:-
ముఖ్యులైన అప్సరస, గంధర్వ, యక్షిణీ, నాగ, భల్లూక, విద్యాధర స్త్రీల యందును మఱియు.
గమనిక:-
*- 1. గంధర్వులు- దేవయోనిలో ఒక తెగ. అందంగా ఉంటూ చక్కగా పాడెడి వారు, 2. యక్షులు- దేవయోనిలో ఒక తెగ. ధనాధిపతి కుబేరుని అనుచరులు. 3. విద్యాధరులు- దేవయోనిలో ఒక తెగ.సం. వివరణ. గాంధర్వవిద్యా సంపన్నులు.
1.17.6.
అనుష్టుప్.
కిన్నరీణాంచ గాత్రేషు
వానరీణాం తనూషుచ ।
సృజధ్వం హరిరూపేణ
పుత్రాం స్తుల్యపరాక్రమాన్ ॥
టీక:-
కిన్నరీణాం = కిన్నర స్తీలయందును; చ; గాత్రేషు = శరీరముల యందును; వానారీణాం = వానర స్త్రీల; తనూషు = యందును; చ; సృజధ్వం = సృష్టింపుడు; హరి = వానర; రూపేణ = రూపములలో; పుత్రాన్ = పుత్రులను; తుల్య = మీతో సమానమైన; పరాక్రమాన్ = పరాక్రమము కలవారిని.
భావము:-
కిన్నర, వానర స్త్రీల యందు మీతో సమానమైన పరాక్రమము గల వానర రూపులను సృష్టించండి అని బ్రహ్మగారు దేవతలను ఆదేశించారు.
గమనిక:-
- (1) పార్వతి శాప కారణంగా దేవతలు పిల్లలను కనలేరు. అందువలన అప్సరస- గంధర్వాదుల ద్వారా అని చెప్పబడింది. (2) నందికేశ్వరుడు రావణుని “వానరుల వలన నీకు భయం కలుగు గాక” యని శపించెను. కావున వానర రూపములో కొడుకులను కనమని చెప్పబడింది. (3) కిన్నరులు- దేవయోనులలో ఒక తెగ, అశ్వ ముఖము నరశరీరము కలవారు. (వావిళ్ళ వారి సంస్కృత-తెలుగు నిఘంటువు)
1.17.7.
అనుష్టుప్.
పూర్వమేవ మయా సృష్టో
జామ్బవా నృక్షపుంగవః ।
జృంభమాణస్య సహసా
మమ వక్త్రాదజాయత" ॥
టీక:-
పూర్వమేవ = చాలా కాలం ముందే (కృత యుగములో); మయా = నాచేత; సృష్టః = సృష్టింపబడినాడు; జామ్బవాన్ = జాంబవంతు డనెడి వాడు; ఋక్షపుంగవః = ఎలుగుబంట్లలో శ్రేష్ఠుడు; జ్రుంభమాణస్య = ఆవులించినపుడు; సహస = హఠాత్తుగా; మమ = నేను; వక్త్రాత్ = ముఖంనుండి; అజాయత = పుట్టెను.
భావము:-
బ్రహ్మగారు, జాంబవంతుడిని చాలా కాలము ముందే (కృత యూగములోనే) సృష్టించానని, వారు ఆవులించినపుడు, హఠాతుగ్గా వారి ముఖమునుండి ఈ ఎలుగుబంట్లోత్తముడు ఆవిర్భవించాడని దేవతలకు తెలిపారు.
1.17.8.
అనుష్టుప్.
తే తథోక్తా భగవతా
తత్ ప్రతిశ్రుత్య శాసనమ్ ।
జనయామాసు రేవం తే
పుత్రాన్ వానరరూపిణః ॥
టీక:-
తే = వారు; తథా = ఆ విధముగా; ఉక్తాః = చెప్పబడిన; తత్ = ఆ దానిని; ప్రతిశ్రుత్య = అంగీకరించి; శాసనమ్ = ఆజ్ఞను; జనయామాసుః = పుట్టించిరి; ఏవం = ఈ విధముగా; తే = వారు; పుత్రాన్ = కొడుకులను, పుత్రులను; వానరరూపిణః = వానర రూపములుగలవారిని.
భావము:-
దేవతలందరూ బ్రహ్మదేవుడు చెప్పినదానిని అంగీకరించి ఆ ఆజ్ఞానుసారం, వానరరూపులైన పుత్రులను పైన చెప్పిన విధముగా పుట్టించారు.
1.17.9.
అనుష్టుప్.
ఋషయశ్చ మహాత్మానః
సిద్ధ విద్యాధ రోరగాః ।
చారణాశ్చ సుతాన్వీరాన్
ససృజు ర్వనచారిణః ॥
టీక:-
ఋషయః = ఋషులును; చ = మఱియును; మహాత్మనః = మహాత్ములను; సిద్ధ = సిద్ధులు (సిద్దులు-దేవయోనిలో ఒక తెగ.అష్ట సిద్దులు పొందినవారు); విద్యాధరః = విద్యాధరులు; ఉరగాః = నాగలోకమునకు చెందినవారు; చారణాః = చారణులు; వీరాన్ = వీరులుగా; వనచారిణః = వానరరూపులగు; సుతాన్ = కొడుకులుగా; ససృజుః = సృజించిరి.
భావము:-
మహావీర్యవంతులగు ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగలోకవాసులు, చారణులు కూడా వీరులైన వానరరూపు లైన కొడుకులను సృజించిరి.
గమనిక:-
*- చారణులు- నానా దేశ సంచారము చేయువారు, ఖేచరులు.
1.17.10.
అనుష్టుప్.
వానరేంద్రం మహేన్ద్రాభమ్
ఇంద్రో వాలినమూర్జితమ్ ।
సుగ్రీవం జనయామాస
తపన స్తపతాం వరః ॥
టీక:-
వానరః = వానరులలో; మహంద్ర = మహేంద్రపర్వతముతో; అభమ్ = సమానుని; ఇన్ద్రః = దేవేంద్రుడు; వాలినమ్ = వాలిని; ఊర్జితమ్ = గట్టి శరీరము కలవాడగు; సుగ్రీవం = సుగ్రీవుని; జనయామాస = పుట్టించెను; తపనః = సూర్యుడు; తపతామ్ = వేడి కలిగించు వారిలో; వరః = శ్రేష్ఠుడైనవాడు.
భావము:-
ఇంద్రుడు మహేంద్రపర్వతము వంటి శరీరము కల మహానబలవంతుడగు "వాలి" అను వానరేంద్రుని పుట్టించగా, తేజశ్శాలులలో గొప్పవాడగు సూర్యుడు "సుగ్రీవుడు" అను వానరేంద్రుని పుట్టించెను.
1.17.11.
అనుష్టుప్.
బృహస్పతిస్త్వ జనయత్
తారం నామ మహాహరిమ్ ।
సర్వవానర ముఖ్యానాం
బుద్ధిమంత మనుత్తమమ్ ॥
టీక:-
బృహస్పతిస్తః = బృహస్పతియైతే; అజనయత్ = పుట్టించెను; తారం = తారుడని; నామ = పేరుగలవానిని; మహా = గొప్ప; హరిమ్ = వానరుని; సర్వ = సమస్త; వానర = వానరులలో; ముఖ్యానామ్ = శ్రేష్ఠుని; బుద్ధిమంతం = బుద్ధిమమంతుడైనవానిని; అనుత్తమమ్ = తనకు మించినవారు లేనివానిని.
భావము:-
దేవగురువు బృహస్పతి మిక్కిలి బుద్ధిశాలి, వానర కులమున ముఖ్యుడు ఐన "తారుడు" అను పేరుగల గొప్ప వానరుని పుట్టించెను. తారుని కుమార్తె తార.
1.17.12.
అనుష్టుప్.
ధనదస్య సుతః శ్రీమాన్
వానరో గంధమాదనః ।
విశ్వకర్మా త్వజనయన్
నలం నామ మహాహరిమ్ ॥
టీక:-
ధనదస్య = కుబేరుని; సుతః = కుమారుడు; శ్రీమాన్ = తేజోవంతుడు; వానరః = వానరుడు; గంధమాదనః = గంధమాదనుడు; విశ్వకర్మ = విశ్వకర్మ; తు = ఐతే; అజానాయత్ = పుట్టించెను; నలం నామ = నలుడు అను పేరుగల; మహాహరిమ్ = గొప్ప వానరమును.
భావము:-
కుబేరుని కుమారుడు తేజోవంతుడైన "గంధమాదనుడు" అను వానరుడు. విశ్వకర్మ "నలుడు" అను పేరుగల గొప్ప వానరుని పుట్టించెను.
1.17.13.
అనుష్టుప్.
పావకస్య సుతః శ్రీమాన్
నీలోఽ గ్నిసదృశప్రభః ।
తేజసా యశసా వీర్యాత్
అత్యరిచ్యత వానరాన్ ॥
టీక:-
పావకస్య = అగ్నియొక్క; సుతః = కొడుకు; శ్రీమాన్ = గొప్పవాడైన; అగ్ని సదృశ ప్రభః = అగ్నితో సమానమైన తేజశ్సాలి; నీలః = నీలుడు; తేజసా = తేజముతోను; యశసా = కీర్తిచేతను; వీర్యాత్ = పరాక్రమము వలనను; అత్యరిచ్యత = అతిశయించినవాడు; వానరాన్ = వానరులలో.
భావము:-
అగ్నికుమారుడు శ్రీమంతుడును, అగ్ని సమాన తేజశ్శాలి, తేజో పరాక్రమ, వీరత్వములతో వానరసమూహములో గొప్పవాడు అన "నీలుడు".
1.17.14.
అనుష్టుప్.
రూపద్రవిణసంపన్నౌ
అశ్వినౌ రూపసమ్మతౌ ।
మైన్దం చ ద్వివిదం చైవ
జనయామాసతుః స్వయమ్ ॥
టీక:-
రూప = రూపమనే; ద్రవిణ = ధనము; సంపన్నౌ = సమృద్ధిగాకలవారు; అశ్వనౌ = అశ్వనీ దేవతలు ఇద్దరు; ద్వివిధం = ద్వివిదుని; చైవ; జనయామాసతుః = పుట్టించిరి; స్వయం = తాము.
భావము:-
మిక్కిలి అందమైన వారగు అశ్వనీదేవతలు, చాలా అందంగా కనిపించే "మైందుడిని", "ద్వివిదుడిని" పుట్టించారు.
గమనిక:-
*(1) అశ్వనీదేవతలు- అశ్వనీదేవతలు, ఆసత్యుడు, ద్రస్యుడు వీరు ఇద్దరు, సూర్యునికి బడబ రూపంలో ఉన్న భార్య సంధ్యయందు పుట్టిన అమరులు, బహుమిక్కిలి రూపవంతులు అని ప్రసిద్ధి, వీరు దేవవైద్యులు (పురాణనామ చంద్రిక)}. (2) ద్వాపర యుగములో ద్వివిదుడు, నరకాసురుని చెలికాడై, శ్రీకృష్ణుడు తన సఖుని సంహరించె నని పగగొని, తన కోతి చేష్టలతో జనులను చీకాకు పెట్టి బలరాముని చేతులో మరణించెను
1.17.15.
అనుష్టుప్.
వరుణో జనయామాస
సుషేణం నామ వానరమ్ ।
శరభం జనయామాస
పర్జన్యస్తు మహాబలమ్ ॥
టీక:-
వరుణ = వరుణుడు; జనయామాస = పుట్టించెను; సుషేణం = సుషేణుడనే; వానర = వానర; ఋషభమ్ = శ్రేష్ఠుని; శరభమ్ = శరభుని; జనయామాస = పుట్టించెను; పర్జన్యస్తు = పర్జన్యుడు (వర్షాధిదేవత, ఇంద్రుడు); మహాబలమ్ = మహాబలశాలియైన.
భావము:-
వరుణుడు "సుషేణుడ"నే వానరశ్రేష్ఠుని పుట్టించగా, పర్జన్యుడు మహాబలశాలియైన "శరభుని" పుట్టించెను.
1.17.16.
అనుష్టుప్.
* మారుతస్యాత్మజః శ్రీమాన్
హనుమాన్నామ వానరః ।
వజ్రసంహననోపేతో
వైనతేయసమో జవే ॥
టీక:-
మారుతస్య = వాయుదేవుని; ఆత్మజః = కుమారుడు; శ్రీమాన్ = శ్రీమంతుడును; హనుమాన్ = హనుమంతుడను; నామ = పేరుగల; వానరః = వానరుడు; వీర్యవాన్ = పరాక్రమశాలియు; వజ్రః = వజ్రము వంటి; సంహనన = శరీరము; ఉపేత = కలవాడును; వైనతేయ = గరుత్మంతునికి; సమః = సమానుడు; జవే = వేగమున.
భావము:-
శ్రీమంతుడు. మహాపరాక్రమశాలి, వజ్రమువంటి శరీరము కలవాడు; గరుత్మంతునితో సమామైన వేగము కలవాడు, హనుమంతుడనే పేరుకల వానరవీరుడిని వాయుదేవుడు పుట్టించెను.
1.17.17.
అనుష్టుప్.
తే సృష్టా బహుసాహస్రా
దశగ్రీవవధే రతాః ।
అప్రమేయబలా వీరా
విక్రాన్తాః కామరూపిణః ॥
టీక:-
తే = వారు; సృష్టాః = పుట్టించబడిరి; బహుసాహస్రా = అనేక వేల మంది; దశగ్రీవ = రావణుని; వధే = చంపుట యందు; రతాః = ఆసక్తి కలవారును; అప్రమేయ = అపరిమితమైన; బలా = బలము కలవారును; వీరాః = వీరులును; విక్రాంతా = పరాక్రమవంతులును; కామరూపిణ = కోరిన రూపములు ధరించగలవారును.
భావము:-
రావణుని వధను కోరువారును, అపరిమిత బలశాలులును, మహావీరులును, పరాక్రమ వంతులును, కోరిన రూపములు ధరింపగల వారును అగు అనేక వేలమంది పుట్టించబడిరి.
1.17.18.
అనుష్టుప్.
మేరుమందరసంకాశా
వపుష్మన్తో మహాబలాః ।
ఋక్షవానరగోపుచ్ఛాః
క్షిప్రమేవాభిజజ్ఞిరే ॥
టీక:-
మేరు = మేరు పర్వతము; మందర = మందర పర్వతములతో; సంకాశాః = సమానమైన వారును; వపుష్మంతః = వపువు (చక్కని రూపు, హింసించబడ రానివారు, ఆంధ్ర వాచస్పతము) కలవారును; మహా = గొప్ప. బలాః = బలశాలులగు; ఋక్షః = ఎలుగు బంట్లును; వానర = వానరాలును; గోపుచ్ఛాః = కొండముచ్చులును; క్షిప్రమేవ = త్వరగా; అభిజజ్ణిరే = పుట్టిరి.
భావము:-
అలా పుట్టిన వారందరు, మేరుమందర పర్వతములతో సమానులు, మంచి శరీర బలములు కకలవారు ఐన ఎలుగుబంట్లుగను, వానరములుగను, కొండముచ్చులుగను త్వరత్వరగా పుట్టిరి.
1.17.19.
అనుష్టుప్.
యస్య దేవస్య యద్రూపం
వేషో యశ్చ పరాక్రమః ।
అజాయత సమస్తేన
తస్య తస్య సుతః పృథక్ ॥
టీక:-
యస్య = ఏ; దేవస్య = దేవునకు; యత్ = ఏ; రూపం = రూపము; వేషః = వేషము; పరాక్రమః = పరాక్రమము; యః = ఏదో; తస్య తస్య = ఆయా దేవుని; సుతః = కుమారుడు; పృథక్ = వేరుగా; తేన = ఆ దేవునితో; సమః = సమానుడై; అజాయత = పుట్టెను.
భావము:-
ఆలా వివిధ దేవతల వలన పుట్టిన కుమారులు అందరు, ఆయా దేవతల రూప, వేష, పరాక్రమాలతో పుట్టిరి.
1.17.20.
అనుష్టుప్.
గోలాంగూలీషు చోత్పన్నాః
కేచిత్సమ్మతవిక్రమాః ।
ఋక్షీషు చ తథా జాతా
వానరాః కిన్నరీషు చ ॥
టీక:-
గోలాంగూలీషు = ఆడ కొండముచ్చులయందు; చ; ఉత్పన్నాః = పుట్టిరి; కేచిత్ = కొందరు; సమ్మత = ప్రసిద్ధ మైన; విక్రమాః = పరాక్రమవంతులు; ఋక్షీషు = ఆడ భల్లూకముల యందును; చ = మఱియు; తథా = అట్లే; జాతాః = పుట్టినారు; వానరాః = వానరులు; కిన్నరీషు = కిన్నర స్త్రీలయందును; చ.
భావము:-
ప్రసిద్దపరాక్రమవంతులైన కొందరు, ఆడ కొండముచ్చుల యందు పుట్టిరి, మరికొందరు ఆడ ఎలుగుబంట్లకు, మరికొందరు ఆడ వానరుల యందు ఇంకా కొందరు కిన్నర స్త్రీలకు కలిగిరి.
1.17.21.
అనుష్టుప్.
దేవా మహర్షిగంధర్వాః
తార్క్ష్యా యక్షా యశస్వినః ।
నాగాః కిమ్పురుషాశ్చైవ
సిద్ధవిద్యాధరోరగాః ॥
టీక:-
దేవా = దేవతలు; మహర్షిః = మహర్షులు; గంధర్వాః = గంధ్వరులు; తార్క్ష్యాః = గరుడులు; యక్షాః = యక్షులు; యశస్వినః = కీర్తిగల; నాగాః = నాగులు; కిమ్పురూషాః = కింపురుషులును; చైవ; సిద్ధః = సిద్ధులును; విద్యాధరః = విద్యాధరులును; ఉరగాః = నాగులును;
భావము:-
ఆ సమయమున దేవ, మహర్షి, గంధర్వ, తార్ఖ్య, యక్ష, నాగ, కింపురుష, సిద్ధ, విద్యాధర, ఉరగులు.
1.17.22.
అనుష్టుప్.
బహవో జనయామాసుః
హృష్టాస్తత్ర సహస్రశః ।
వానరాన్ సుమహాకాయాన్
సర్వాన్ వై వనచారిణః ॥
టీక:-
బహవః = అనేకులు; జనయామాసు = పుట్టించిరి; హృష్టాః = సంతసించి; తత్ర = ఆ సమయమున; సహస్రశః = వేలకొలది; వానరాన్ = వానరులను; సుమహాకాయాన్ = బాగా పెద్ద దేహముకలవారును; సర్వాన్ = అందరు; వై; వనచారిణః = అడవులందు సంచరించువారును.
భావము:-
ఇంకా అనేకులు ఆ సమయంలో మాహాకాయులైన, వనములలో తిరిగెడి వేలకొలది వానరులను పుట్టించిరి
1.17.23.
అనుష్టుప్.
అప్సరస్సు చ ముఖ్యాసు
తథా విద్యాధరీషు చ ।
నాగకన్యాసు చ తథా
గంధర్వీణాం తనూషు చ ॥
టీక:-
అప్సరస్సు = అప్సరసలయందును; చ; ముఖ్యేసు = ప్రధానం; తథా = అటులనే; విద్యాధరీషు = విద్యాధరస్తీలయందు; చ = మఱియు; నాగకన్యాసు = నాగకన్యలయందు; తథా = అలాగే; గంధర్వీణామ్ = గాంధర్వ స్త్రీల; తనూషు = శరీరములయందును; చ = కూడ.
భావము:-
ముఖ్యంగా అప్సరసలు, విద్యాధర, నాగ, గంధర్వ స్త్రీల శరీరములందు(వానర యోధులను పుట్టించారు.
1.17.24.
అనుష్టుప్.
కామరూపబలోపేతా
యథాకామం విచారిణః ।
సింహశార్దూలసదృశా
దర్పేణ చ బలేన చ ॥
టీక:-
కామరూపః = కోరిన రూపం పొందగలుగుట; బలః = మిక్కిలి శక్తిసామర్థ్యములు; ఉపేతాః = కలవారు; యథాకామమ్ = యథేచ్చగా; విచారిణః = మసలువారు; దర్పేణ = ఉద్దతిను చేతను; చ = మఱియు; బలేన = శక్తి సామర్థ్యముల చేతను; చ = కూడ; సింహః = సింహముల తోను; శార్దూలః = పులులతో; సదృశాః = సమానులు
భావము:-
ఈ వానరులందరూ కామరూపులు, స్వేచ్ఛవిహారులు, మహాబలశాలులు, సింహ శార్దూలము లంత దర్ప బలములు కలవారు.
1.17.25.
అనుష్టుప్.
* శిలాప్రహరణాః సర్వే
సర్వే పాదపయోధినః ।
నఖదంష్ట్రాయుధాః సర్వే
సర్వే సర్వాస్త్రకోవిదాః ॥
టీక:-
శిలాః = పెద్ద రాళ్లతో; ప్రహరణాః = కొట్టగల కలవారు; సర్వే = అందరును; సర్వే = అందరును; పాదప = చెట్లతో; యోధినః = యుద్ధముచేయ సమర్థులు; నఖ = గోళ్ళను; దంష్ట్రా = దంతములను; ఆయుధాః = ఆయుధములుగా వాడువారు; సర్వే = అందరును; సర్వే = అందరును; సర్వ = అన్ని రకముల; అస్త్ర = అస్త్రములను; కోవిదాః = ప్రయోగించుటలో సమర్థులు.
భావము:-
ఆ వానరులందరూ శిలలు, చెట్లు, గోళ్ళు, దంతాలు ఆయుధములుగా యుద్ధము చేయ వారు. వీరు అన్ని రకముల అస్త్రములను ఆయా మంత్రాదులతో ప్రయోగించు సమర్థులు.
గమనిక:-
*- అస్త్రములు- మంత్రతంత్రాదులతో ప్రయోగించు ఆయుధములు, బ్రహ్మాస్త్రాదులు, శస్త్రములు- మంత్రాదులు అవసరము లేని ఆయుధములు, కత్తి మొదలైనవి.
1.17.26.
అనుష్టుప్.
విచాలయేయుః శైలేన్ద్రాన్
భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ ।
క్షోభయేయుశ్చ వేగేన
సముద్రం సరితాం పతిమ్ ॥
టీక:-
విచాలయేయుః = కుదుపేయగలరు; శైలాః = పర్వతములలో; ఇంన్ద్రాన్ = పెద్దవాటిని; భేదయేయుః = విరగ్గొట్టగలరు; స్థిరాన్ = స్థిరగా నాటుకున్న; ద్రుమాన్ = పెద్ద పెద్ద చెట్లను; క్షోభయేయుః = కలతపెట్టగలరు; వేగేన = వేగముతో; సముద్రమ్ = సముద్రమును; సరితాంపతిమ్ = సముద్రములను
భావము:-
ఆ వానరులందరూ ఎంతటి పర్వతములనైనను కదిలించ గలరు. బలంగా నాటుకున్న పెద్ద చెట్లనైనా సరే కూల్చగలరు. తమ వేగముతో అన్ని నదులకు గమ్యస్థాన మైన సముద్రమును కూడా కలిచివేయగలరు.
గమనిక:-
*- సరితాంపతిమ్ = సముద్రుము (సరితామ్ (నదులు) సముద్రంలో కలుస్తాయి కనుక నదులకు పతి సముద్రుడు.
1.17.27.
అనుష్టుప్.
దారయేయుః క్షితిం పద్భ్యాం
ఆప్లవేయుర్మహార్ణవమ్ ।
నభఃస్థలం విశేయుశ్చ
గృహ్ణీయురపి తోయదాన్ ॥
టీక:-
దారయేయుః = చీల్చగలరు; క్షితిమ్ = భూమిని; పద్భ్యామ్ = కాళ్ళతో; ఆప్లవేయుః = దూకి దాటగలరు; మహార్ణవమ్ = మహా సముద్రమును; నభఃస్థలమ్ = ఆకాశమున; విశేయుశ్చ = ప్రవేశించి; గృహ్ణీయుః = నిలువరింపగలరు; అపి = కూడా; తోయదాన్ = మేఘములను.
భావము:-
ఈ వానరులు వారి కాళ్ళతో భూమిని చీల్చ గలరు. మహాసముద్రపు ఆవలి ఒడ్డుకు దూకగలరు. ఎగిరి మేఘాలను అడ్డుకొనగలరు.
1.17.28.
అనుష్టుప్.
గృహ్ణీయురపి మాతంగాన్
మత్తాన్ ప్రవ్రజతో వనే ।
నర్దమానాశ్చ నాదేన
పాతయేయుర్విహంగమాన్ ॥
టీక:-
గృహ్ణీయుః = పట్టుకొనగలరు; అపి = సైతం; మాతంగాన్ = ఏనుగులను; మత్తాన్ = మదించిన; ప్రవ్రజతః = తిరుగుచున్న; వనే = అరణ్యమందు; నర్దమానాః = గర్జనలు చేయుచున్నవారై; బభూవుః = అయి; నాదేన = ధ్వనిచేత; పాతయేయుః = పడవేయగలరు; విహంగమాన్ = పక్షులను.
భావము:-
వీరు అడవిలో తిరుగుతున్న మదించిన ఏనుగులను ఐనా సరే బంధించగలరు. గర్జనల శబ్ధాలతో పక్షులను నేలకు కూల్చగలరు.
1.17.29.
అనుష్టుప్.
ఈదృశానాం ప్రసూతాని
హరీణాం కామరూపిణామ్ ।
శతం శతసహస్రాణి
యూథపానాం మహాత్మనామ్ ॥
టీక:-
ఈదృశానామ్ = ఇలా; ప్రసూతాని = పుట్టియింప బడిన; హరీణామ్ = వానరుల యొక్క; కామరూపిణామ్ = కోరిన రూపమును ధరించగల వారును; శతమ్ శత సహస్రాణి = కోట్లమంది, నూరు నూరుల వేల మంది; యూథపానామ్ = మహాయోధులను; మహాత్మనామ్ = మంచి స్వభావము గలవారును.
భావము:-
ఈవిధంగా కోరిన రూపము ధరించగలవారు, మహా యోధులు, మహాత్ములు ఐన వానరులు ఒక కోట్ల కొలది పుట్టింపబడిరి.
1.17.30.
అనుష్టుప్.
తే ప్రధానేషు యూథేషు
హరీణాం హరియూథపాః ।
బభూవుర్యూథపశ్రేష్ఠా
వీరాంశ్చాజనయన్ హరీన్ ॥
టీక:-
తే = వారు; ప్రధానేషు = ప్రధానములైన; యూథేషు = సమూహము లందు; హరీణామ్ = వానరులయొక్క; హరి = వానర; యూథపాః = నాయకులు; బభూవుః = అయి; యూథపశ్రేష్ఠాః = నాయక శ్రేష్ఠులు, సేనానాయకులుగా; వీరాన్ = వీరులైన; చ; అజనయన్ = పుట్టించిరి హరీన్ = వానరులను.
భావము:-
వారు ప్రధానమైన వానర సమూహములకు, వానర నాయకులైరి. వీరులైన నాయకశ్రేష్ఠులు వానరులను పుట్టించిరి.
1.17.31.
అనుష్టుప్.
అన్యే ఋక్షవతః ప్రస్థాన్
ఉపతస్థుః సహస్రశః ।
అన్యే నానావిధాన్ శైలాన్
కాననాని చ భేజిరే ॥
టీక:-
అన్యే = కొంతమంది (వానరులు); సహస్రశః = వేలకొలది; ఋక్షవతః = ఋక్షవత్పర్వతముల; ప్రస్థాన్ = వెళ్ళి; అవతస్థుః = నివసించిరి; అన్యే = మరి కొందరు; నానావిధాన్ = అనేక విధములైన; శైలాన్ = పర్వతములలో; కాననాని = అడవులలో; చ = కూడా; భేజిరే = చేరిరి.
భావము:-
వేలకొలది వానరులు ఋక్ష పర్వతానికి వెళ్ళి నివసించగా, మరి కొందరు అనేక విధములైన పర్వతములయందు, అడవులందును నివసించిరి.
1.17.32.
అనుష్టుప్.
సూర్యపుత్రం చ సుగ్రీవం
శక్రపుత్రం చ వాలినమ్ ।
భ్రాతరావుపతస్థుస్తే
సర్వ ఏవ హరీశ్వరాః ।
నలం నీలం హనూమంతం
అన్యాంశ్చ హరియూథపాన్ ॥
టీక:-
సూర్య = సూరుని; పుత్రమ్ = పుత్రుడగు; చ; సుగ్రీవమ్ = సుగ్రీవుని; శక్ర = ఇంద్రుని; పుత్రమ్ = పుత్రుడగు; చ; వాలినం = వాలిని; భ్రాతరౌ = సోదరులను ఇద్దరిని; ఉపతస్థుః = సేవించిరి; తే = వారు; సర్వ = అందరను; ఏవ = అలాగే; హరీశ్వరాః = వానర నాయకులను; నలమ్ = నలుని; నీలమ్ = నీలుని; హనూమంతమ్ = హనుమంతుని; అన్యాః = ఇతరులైన; చ; హరి = వానరసేనా; యూథపాన్ = నాయకులను.
భావము:-
వారు ఇంద్రసుతుడైన వాలిని, సూర్య సుతుడైన సుగ్రీవుని సేవించారు. అటులనే నలుని, నీలుని, హనుమంతాది ఇతర వానర సేనానాయకులను అందరిని సేవించిరి.
1.17.33.
అనుష్టుప్.
తే తార్క్ష్యబలసంపన్నాః
సర్వే యుద్ధవిశారదాః ।
విచరన్తోఽ ర్దయన్ దర్పాత్
సింహవ్యాఘ్రమహోరగాన్ ॥
టీక:-
తే = వారు; తార్క్ష్య = గరుత్మంతునివలె; బల = బలము; సంపన్నాః = సమృద్ధిగా గలవారును; సర్వే = వారందరూ; యుద్ధ = యుద్ధవిద్యలో; విశారదాః = ఆరితేరినవారు; సర్వే = అందరూ; విచరంత = తిరుగుచూ; దర్పాత్ = ఉద్ధతితో; సింహవ్యాఘ్రమహోరగాన్ = సింహములను; పులులను; సర్పములను; అర్దయన్ = పీడించిరి.
భావము:-
గరుత్మంతుని వంటి బలము కలవారై, యుద్ధకళలో ఆరితేరినవారైన వానరులందరూ దర్పముగా తిరుగుచూ అరణ్యములోని సింహములు, పులులు, సర్పాదులను పీడించిరి.
1.17.34.
అనుష్టుప్.
తాంశ్చ సర్వాన్ మహాబాహుః
వాలీ విపులవిక్రమః ।
జుగోప భుజవీర్యేణ
ఋక్షగోపుచ్ఛవానరాన్ ॥
టీక:-
తః = వారు; సర్వాన్ = అందరిని; మహాబాహుః = గొప్ప భుజబలశాలి; వాలీ = వాలి; విపుల = విస్తారమైన; విక్రమః = పరాక్రమవంతుడైన; జుగోప = రక్షించెను; భుజవీర్యేణ = భుజబలము చేత; ఋక్ష = భల్లూకములను; గోపుచ్ఛ = కొండముచ్చులను; వానరాన్ = వానరులను.
భావము:-
అత్యంత బాహుబలపరాక్రమశాలి యైన వాలి తన భుజబలము చేత ఎలుగుబంట్లను, కొండముచ్చులను, వానరులు అగు వారు అందరినీ రక్షించెను.
1.17.35.
అనుష్టుప్.
తైరియం పృథివీ శూరైః
సపర్వతవనార్ణవా ।
కీర్ణా వివిధసంస్థానైః
నానావ్యంజనలక్షణైః ॥
టీక:-
తైః = వారిచేత; ఇయం = ఈ; పృథివీ = భూమి; శూరైః = శూరులచే; స = తోకలిసిన; పర్వతః = అ పర్వతములు; వనః = అరణ్యములు; ఆర్ణవా = సముద్రములు; కీర్ణా = ఆవరించిరి; వివిధ = అనేక రకములైన; సంస్థానైః = ఆకృతులు; నానా = నానా రకములైన; వ్యంజన = ఆంగికములు, అభినయములు; లక్షణైః = స్వభావములు కలవారు (ఆంధ్ర శబ్ధరత్నాకరము).
భావము:-
అనేకరకములైన ఆకృతులు, ఆంగికములు, స్వభావములు కల ఆ (వానర) శూరులు అడవులు, సముద్రాలు, పర్వతాలమయమైన ఈ భూమి అంతటా ఆవరించిరి.
గమనిక:-
*- (అభిధాది శబ్దవృత్తులు- ప్రత్యేకతలు చూచించునవి వృత్తులు అభిధ (పదములోని సంకేతార్థము తెలుపునది), లక్షణ (ముఖ్యార్థము పొసగనిచోట గౌణమైన (అముఖ్య) అర్థము బోధించునది), వ్యంజన (వాచ్యలక్ష్యార్థము కన్న విలక్షమైన అర్థమును బోధించునది, ఇది వ్యంగ్యము, ధ్వని అని 2 రకాలు).
1.17.36.
త్రిష్టుప్.
తైర్మేఘబృందాచలకూటకల్పైః
మహాబలైర్వానరయూథపాలైః ।
బభూవ భూర్భీమశరీరరూపైః
సమావృతా రామసహాయహేతోః ॥
టీక:-
తైః = వారిచే; మేఘ = మేఘముల; బృందేః = గుంపులతోడను; అచల = పర్వత; కూట = శిఖరములతోడను; కల్పైః = సరిపోలెడి; మహా = మిక్కిలి; బలైః = బలశాలులు; భీమ = భయంకర; శరీర = శరీర; రూపైః = ఆకారులు; వానర = వానర; యూథపాలైః = యోధులచేత; భూః = భూమండలము; రామ = శ్రీరామునికి; సహాయ = సహాయముచేయు; హేతోః = కొఱకై; సమావృతా = ఆవరింపబడినది; బభూవ = అయ్యెను.
భావము:-
మేఘాలగుంపులతోను. పర్వతశిఖరాలతోను సరిపోలెడి, మిక్కిలి బలశాలులు, భయంకర ఆకారులు, శ్రీరామునికి సహాయము చేయుట కొఱకు అవతరింపబడిన ఆ వానర సేనానాయకులచే ఈ భూమండలము అంతయు ఆవరింపబడెను.
1.17.36.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
సప్తదశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తదశ [17] = పదిహేడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [17] పదిహేడవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.18.1.
అనుష్టుప్.
నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్
హయమేధే మహాత్మనః ।
ప్రతిగృహ్య సురా భాగాన్
ప్రతిజగ్ము ర్యథాగతమ్ ॥
టీక:-
నివృత్తే = పూర్తి అయిన తరువాత; తు; క్రతౌ = యాగములు రెండును; తస్మిన్ = ఆ; హయమేధే = అశ్వమేధము అను; మహాత్మనః = మహాత్ముని; ప్రతిగృహ్య = స్వీకరించి; సురాః = దేవతలు; భాగాన్ = భాగములను; ప్రతిజగ్ముః = తిరిగి వెళ్ళిరి; యథాగతమ్ = వచ్చినట్లుగానే.
భావము:-
మహాత్ముడు దశరథ మహారాజు చేసిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగములు పూర్తి అయినవి. దేవతలు హవిర్భాగములను స్వీకరించి తమ తమ నెలవులకు మరలిపోయిరి.
1.18.2.
అనుష్టుప్.
సమాప్తదీక్షా నియమః
పత్నీగణ సమన్వితః ।
ప్రవివేశ పురీం రాజా
సభృత్య బలవాహనః ॥
టీక:-
సమాప్త = పూర్తి చేసుకొనిన; దీక్షా = యాగదీక్ష; నియమః = నియమములు కలవాడు; పత్నీ = భార్యలు; గణ = అందరితో; సమన్వితః = కలిసి ఉన్నవాడై; ప్రవివేశ = ప్రవేశించెను; పురీం = పట్టణమును; రాజా = రాజు; స = కూడి ఉన్న; భృత్య = సేవకులు; బల = సైన్యము; వాహనః = వాహనములు కలవాడు.
భావము:-
దశరథమహారాజు యాగ దీక్షానియమములు పూర్తి చేసుకొని, తన భార్యలతోను, సేవకులు, సైన్యము, వాహనములతోను పురములోనికి ప్రవేశించెను.
1.18.3.
అనుష్టుప్.
యథార్హం పూజితాస్తేన
రాజ్ఞా వై పృథివీశ్వరాః ।
ముదితాః ప్రయయుర్దేశాన్
ప్రణమ్య మునిపుంగవమ్ ॥
టీక:-
యథా = తగినట్లు; అర్హం = అర్హతకు; పూజితాః = పూజింపబడినవారై; తేన = ఆ; రాజ్ఞా = రాజుచే; పృథివీశ్వరాః = రాజులు; ముదితాః = సంతోషించినవారై; ప్రయయుః = వెళ్ళిరి; దేశాన్ = దేశములకు; ప్రణమ్య = నమస్కరించి; మునిపుంగవమ్ = మునిశ్రేష్ఠుని
భావము:-
యాగమునకు వచ్చిన వివిధ దేశముల రాజులు వారికి తగునట్లు దశరథునిచే సత్కరింపబడి, సంతసించినవారై, మునిశ్రేష్ఠుడు వసిష్ఠునకు నమస్కరించి తమ తమ దేశములకు తిరిగి వెళ్ళిరి.
1.18.4.
అనుష్టుప్.
శ్రీమతాం గచ్ఛతాం తేషామ్
స్వపురాణి పురాత్తతః ।
బలాని రాజ్ఞాం శుభ్రాణి
ప్రహృష్టాని చకాశిరే ॥
టీక:-
శ్రీమతాం = శ్రీమంతులైన; గచ్ఛతాం = వెళ్ళుచున్న; తేషాం = ఆ; స్వ = స్వంత; పురాణి = పురముల గూర్చి; పురాత్ = గరము; తతః = దాని నుండి; బలాని = సేనాబలములు; రాజ్ఞాం = రాజులయొక్క; శుభ్రాణి = విమలముగా నున్న; ప్రహృష్టాని = చాలా సంతోషించిన; చకాశిరే = ప్రకాశించినవి.
భావము:-
అయోధ్యా నగరము నుండి తమ పురములకు బయలుదేరిన శ్రీమంతులైన ఆ రాజుల సైన్యములు విమలములై (దశరథుడు ఒసగిన దుస్తులతో) మిక్కిలి సంతోషముతో ప్రకాశించినవి.
1.18.5.
అనుష్టుప్.
గతేషు పృథివీశేషు
రాజా దశరథస్తదా ।
ప్రవివేశ పురీం శ్రీమాన్
పురస్కృత్య ద్విజోత్తమాన్ ॥
టీక:-
గతేషు = తిరిగి వెళ్ళిపోవుచుండ; పృథివీశేషు = రాజులు; రాజా దశరథః = దశరథమహారాజు; తదా = అప్పుడు; ప్రవివేశ = ప్రవేశించెను; పురీం = నగరమును; శ్రీమాన్ = శ్రీమంతుడైన; పురస్కృత్య = ముందు నిలుపుకొని; ద్విజోత్తమాన్ = బ్రాహ్మణోత్తములను.
భావము:-
రాజులందరు వెళ్ళిపోయిన తరువాత, బ్రాహ్మణోత్తములు ముందు నడచుచుండగా, వారిని అనుసరించుచు శ్రీమంతుడైన ఆ దశరథమహారాజు తన నగరములోనికి ప్రవేశించెను.
1.18.6.
అనుష్టుప్.
శాంతయా ప్రయయౌ సార్ధమ్
ఋశ్యశృంగః సుపూజితః ।
అన్వీయమానో రాజ్ఞాఽ థ
సానుయాత్రేణ ధీమతా ॥
టీక:-
శాంతయా = శాంతతో; ప్రయయౌ = ప్రయాణమయ్యెను; సార్ధమ్ = కలిసి; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; సుపూజితః = బాగుగా పూజింపబడినవాడై; అన్వీయమానః = అనుసరింపబడుచున్నవాడై; రాజ్ఞా = రాజుచే; అథ = అంతట; సానుయాత్రేణ = అనుచరులతో కలిసి; ధీమతా = బుద్ధిమంతుడైన.
భావము:-
దశరథునిచే ఘనముగా పూజింపబడి, అనుచర సమేతముగా రోమపాదుడు తనను అనుసరించుచుండగా, ధీమంతుడైన ఋశ్యశృంగుడు తన భార్య శాంతతో సపరివారముగ తిరుగు ప్రయాణమయ్యెను.
1.18.7.
అనుష్టుప్.
ఏవం విసృజ్య తాన్ సర్వాన్
రాజా సంపూర్ణమానసః ।
ఉవాస సుఖితస్తత్ర
పుత్రోత్పత్తిం విచింతయన్ ॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; విసృజ్య = పంపివేసి; తాన్ = వారిని; సర్వాన్ = అందరిని; రాజా = రాజు; సంపూర్ణ = నిండు; మానసః = మనసుతో; ఉవాస = నివసించెను; సుఖితః = సుఖముగా; తత్రః = అక్కడ; పుత్రోత్పత్తిం = పుత్రులు కలుగు విషయమై; విచింతయన్ = ఆలోచించుచు.
భావము:-
ఈ విధముగా దశరథుడు అందరినీ నిండుమనసుతో పంపించి, తన పురమున తనకు పుత్రులు కలుగు విషయమై ఆలోచించుచు సుఖముగా నుండెను.
1.18.8.
అనుష్టుప్.
తతో యజ్ఞే సమాప్తే తు
ఋతూనాం షట్ సమత్యయుః ।
తతశ్చ ద్వాదశే మాసే
చైత్రే నావమికే తిథౌ ॥
టీక:-
తతః = తరువాత; యజ్ఞే = యజ్ఞము; సమాప్తే = పూర్తయిన తరువాత; తు; ఋతూనాం = ఋతువుల యొక్క; షట్ = ఆరు; సమత్యయుః = గడచినవి; తతః చ = తరువాత; ద్వాదశే = పన్నెండవ; మాసే = మాసమునందు; చైత్రే = చైత్ర మాసమునందు; నావమికే తిథౌ = నవమి తిథియందు.
భావము:-
యజ్ఞము పూర్తయిన ఒక సంవత్సరము తరువాత వచ్చిన పన్నెండవ మాసము చైత్రలో నవమి తిథినాడు.
1.18.9.
అనుష్టుప్.
నక్షత్రేఽ దితిదైవత్యే
స్వోచ్చ సంస్థేషు పంచసు ।
గ్రహేషు కర్కటే లగ్నే
వాక్పతా నిన్దునా సహ ॥
టీక:-
నక్షత్రే = నక్షత్రము నందు; అదితి = అదితి; దైవత్యే = అదితి దేవతగా ఉన్నది; స్వః = తమ తమ; ఉచ్చ = ఉన్నత; సంస్థేషు = స్థానములందు ఉండగా; పంచసు = ఐదు; గ్రహేషు = గ్రహములు; కర్కటే లగ్నే = కర్కాటక లగ్నమునందు; వాక్పతౌ = బృహస్పతి; ఇన్దునా సహ = చంద్రునితో కూడి.
భావము:-
అదితి దేవతగా కల పునర్వసు నక్షత్రము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ స్థానములగు మేష, మకర, కర్కాటక, మీన, తుల రాసులందు ఉండగా, బృహస్పతి/ గురుడు చంద్రునితో కలిసి కర్కాటక లగ్నమునందు ఉండగా శ్రీరాముడు జన్మించాడు,
1.18.10.
అనుష్టుప్.
ప్రోద్యమానే జగన్నాథం
సర్వలోక నమస్కృతమ్ ।
కౌసల్యాజనయ ద్రామం
సర్వలక్షణ సంయుతమ్ ॥
టీక:-
ప్రోద్యమానే = ఉదయించుచున్నపుడు; జగన్నాథం = జగన్నాథుడును; సర్వలోక నమస్కృతమ్ = సకల లోకములచే నమస్కరింపబడువానిని; కౌసల్యా = కౌసల్య; ఆజనయత్ = కనెను; రామమ్ = రాముని; సర్వలక్షణ సంయుతమ్ = సకల శుభలక్షణములు కూడియున్నవానిని.
భావము:-
కౌసల్య యందుసర్వలోకములకు ప్రభువు, సకల లోకనమస్కృతుడు, సకల సుగుణోపేతుడు ఐన ఆ జగన్నాథుడిని రాముని రూపములో పుత్రునిగా అవతరించు నప్పుడు గ్రహనక్షత్రాలు అలా ఉన్నవి.
*గమనిక:-
(1) రామః-పు. రమతే ఇతి, రమ్ + ణః, రమయేతె నెనెతి, రమ్+ ఘఙ్ వా, మనోఙ్ఞః, ఇతి శబ్దకల్పధృమః. సితః, అసితః, ఇతి మోదిని. రమ్ కర్తరి ఘఙ్, ణ వా, దశరథ ఔర్ కౌసల్యకా పుత్ర రామచంద్ర, ఒప్పిదమైనవాడు, తెల్లని వాడు, నల్లనివాడు, సకల కళాన్వితుడు. రమ్ + ఘఞ్, రమయతి ప్రజాః, ప్రజలను ఆనందింపజేయువాడు, రాముడు. (2) భరత- వ్యుత్పత్తి, భృ+ అచ్, భరతి పుష్ణాతి అసా, పోషించువాడు, భరతుడు. భృ + ఇఞ్, భరతస్య భరతవంశరాజస్య అపత్యమ్, భరత వంశములో పుట్టినవాడు, భరత వంశపు రాజు, భరతుడు.సంస్కృత-ఆంధ్ర నిఘంటువు. నటః, రామానుజః, దోషాంతిః, ఇతి మోదినీ. (3) లక్ష్మణ- సక్రుత్యాలంకృతాం కన్యాం యో దదాతి కూకృదః. లక్ష్మీవాన్లక్ష్మణః శ్రీలః శ్రీమాన్- స్నిగ్ధస్తు వత్సలః. ఇతి అమరః. లక్ష్మ + అచ్, లక్షణం అస్తే అస్య, మంచి ఆకారము గలవాడు, లక్ష్మణుడు. లక్ష్మ- చిహ్నమ్, ప్రధానమ్, అంకె. (4) శత్రుఘ్నుడు- శత్రు+హన్+క, శత్రూన్ హంతి, శత్రువులను చంపువాడు. దశరథుని కుమారుడు, శత్రుఘ్నుడు. సంస్కృత-ఆంధ్ర నిఘంటువు, వ్యు శత్రు + హన్+ క, కృ.ప్ర. పగతురను నాశము చేయువాడు, ఆంధ్రశబ్దరత్నాకరము.
1.18.11.
అనుష్టుప్.
విష్ణోరర్ధం మహాభాగం
పుత్ర మైక్ష్వాకు వర్ధనమ్ ।
కౌసల్యా శుశుభే తేన
పుత్రే ణామితతేజసా ॥
టీక:-
విష్ణః = విష్ణువు యొక్క; అర్థం = అంశలో సగమువంతుతో జన్మించినవాడును; మహాభాగమ్ = గొప్ప భాగ్యవంతుడును; పుత్రమ్ = పుత్రునిగా; ఐక్ష్వాక = ఇక్ష్వాకు వంశమును; వర్ధనమ్ = ఉద్ధరించువాడు; కౌసల్యా = కౌసల్య; శుశుభే = వెలుగొందెను; తేన = ఆ; పుత్రేణా = పుత్రుని వలన; అమిత = గొప్ప; తేజసా = తేజోవంతుడు.
భావము:-
విష్ణువు అంశలో సగభాగమైనవానిని, గొప్ప భాగ్యశాలిని, ఇక్ష్వాకు వంశమును ఉద్ధరించువానిని, అమిత తేజోవంతుడును ఐన శ్రీరాముని కని కౌసల్య వెలుగొందెను.
1.18.12.
అనుష్టుప్.
యథా వరేణ దేవానాం
అదితి ర్వజ్రపాణినా ।
భరతో నామ కైకేయ్యాం
జజ్ఞే సత్యపరాక్రమః ॥
టీక:-
యథా = వలె; వరేణ = శ్రేష్ఠుడైన; దేవానామ్ = దేవతల యందు; అదితిః = అదితి; వజ్రపాణేన = దేవేంద్రుని వలన; భరతః = భరతుడు అను; నామః = పేరు గల; కైకేయ్యామ్ = కైకేయికి; జజ్ఞే = జన్మించెను; సత్యపరాక్రమః = సత్య పరాక్రమవంతుడు.
భావము:-
దేవేంద్రుని వలన అతని తల్లి అదితి ప్రకాశించునట్లు, రాముని వలన కౌసల్య వెలుగొందెను. సత్యపరాక్రమవంతుడైనభరతుడు కైకేయికి జన్మించెను.
1.18.13.
అనుష్టుప్.
సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః
సర్వైః సముదితో గుణైః ।
అథ లక్ష్మణశత్రుఘ్నౌ
సుమిత్రాజనయత్సుతౌ ॥
టీక:-
సాక్షాత్ = స్వయంగా; విష్ణోః = శ్రీమహావిష్ణువు యొక్క; చతుర్భాగః = నాల్గవవంతుభాగమైనవాడు; సర్వైః = సమస్తమయిన; స = కూడి ఉన్న; సముదితః = మిక్కిలి ఆనందకర; సగుణైః = గుణములు కలవాడును; అథ = తరువాత; లక్ష్మణ శత్రుఘ్నౌ = లక్ష్మణ శత్రుఘ్నులు అను నామములతో; సుమిత్రా = సుమిత్ర; ఆజనయత్ = కనెను; సుతౌ = ఇద్దరు కుమారులను.
భావము:-
సాక్షాత్తు విష్ణువుయొక్క నాల్గవవంతు అంశము, సకల సద్గుణయుతుడైన భరతుడిగా కైకేయి యందు జన్మించెను. తరువాత మిగతా నాలుగవ వంతు అంశతో సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కనెను.
1.18.14.
అనుష్టుప్.
సర్వాస్త్రకుశలౌ వీరౌ
విష్ణోరర్ధసమన్వితౌ ।
పుష్యే జాతస్తు భరతో
మీనలగ్నే ప్రసన్నధీః ॥
టీక:-
సర్వ = సకల; అస్త్ర = అస్త్రములందు; కుశలౌ = నిపుణులును; వీరౌ = వీరులును; విష్ణోః = విష్ణువుని; అర్థ = అంశలతో; సమన్వితౌ = కూడినవారును; పుష్యే = పుష్యమి నక్షత్రము నందు; జాతః = జన్మించినవాడు; తు =; భరతః = భరతుడు; మీన లగ్నే = మీన లగ్నములో; ప్రసన్న ధీః = ప్రసన్నమైన జ్ఞానము కలవాడు.
భావము:-
లక్ష్మణ శత్రుఘ్నులు విష్ణువు అంశలు, వీరులు, సకల శాస్త్ర నిపుణులు. ప్రసన్నధీశాలి ఐన భరతుడు పుష్యమీ నక్షత్రమునందు మీనలగ్నమునందు పుట్టెను
1.18.15.
అనుష్టుప్.
సార్పే జాతౌ చ సౌమిత్రీ
కులీరేఽ భ్యుదితే రవౌ ।
రాజ్ఞః పుత్రా మహాత్మానః
చత్వారో జజ్ఞిరే పృథక్ ॥
టీక:-
సార్పే = సర్పము దేవతగా గల ఆశ్లేషా నక్షత్రము నందు; జాతౌ చ = జన్మించిరి; సౌమిత్రీ = సుమిత్ర కుమారులు; కులీరే = కర్కాటక లగ్నమునందు; అభ్యుదితే = మర్నాడు ఉదయించుచుండగా; రవౌ = సూర్యుడు; రాజ్ఞః = రాజు యొక్క; పుత్రాః = పుత్రులు; మహాత్మనః = మహాత్ములైన; చత్వారః = నలుగురు; జజ్ఞిరే = జన్మించిరి; పృథక్ = వేరు వేరుగా.
భావము:-
పిదప సూర్యోదయ సమయములో సుమిత్రా నందనులైన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమునందు జనియించిరి. ఈ విధముగ దశరథ మహారాజునకు మహాత్ములైన నలుగురు కుమారులు వేరు వేరుగా జన్మించిరి.
గమనిక:-
*- రాముడు- ఆనందింపజేయువాడు, భరతుడు- వనవాశ కాలమున రాజ్యభారము వహించిన వాడు. లక్ష్మణుడు- రాముని సేవించుటను గొప్పసంపద కలవాడు, శతృఘ్నుడు- శత్రువులను హతమొనర్చువాడు.
1.18.16.
అనుష్టుప్.
గుణవన్తోఽ నురూపాశ్చ
రుచ్యా ప్రోష్ఠపదోపమాః ।
జగుః కలం చ గంధర్వా
ననృతుశ్చాప్సరోగణాః ॥
టీక:-
గుణవంత = గుణవంతులు; అనురూపాః = తగిన వారు; చ; రుచ్యా = కాంతిచే; ప్రోష్ఠపద్ = పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల; ఉపమాః = వంటి; జగుః = గానము చేసిరి; కలమ్ = మధురముగా; గంధర్వాః = గంధర్వులు; ననృతుః = నాట్యము చేసిరి; చ; అప్సరోగణాః = అప్సరస బృందములు.
భావము:-
గుణవంతులు, దశరథునికి తగిన వారు, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల వంటి తేజోవంతులైననలుగురు పుత్రులు జన్మించిరి. ఆ పుత్రోదయ సందర్భములో గంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరస బృందములు నాట్యము చేసిరి.
1.18.17.
అనుష్టుప్.
దేవదున్దుభయో నేదుః
పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా ।
ఉత్సవశ్చ మహానాసీత్
అయోధ్యాయాం జనాకులః ॥
టీక:-
దేవ దున్దుభయః = దేవతలయొక్క (ఢంకా వంటివి) దుందుభులు అను సంగీత వాద్య పరికరములు; నేదుః = మ్రోగినవి; పుష్పవృష్టిః చ = పూల వర్షము కూడ; ఖాత్ = ఆకాశము నుండి; చ్యుతా = పడినది; ఉత్సవః చ = గొప్ప సంబరము కూడ; మహాన్ = గొప్ప; ఆసీత్ = జరిగెను; అయోధ్యాయాం = అయోధ్యలో; జనాకులః = జన సమూహముచే వ్యాకులమైనది.
భావము:-
శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అవతరించిన శుభ సందర్భములో దేవదుందుభులు మ్రోగినవి. ఆకాశము నుండి పూలు వర్షించినవి. అయోధ్యా నగరమంతటా జనులు గొప్ప సంబరములు చేసుకొనిరి.
1.18.18.
అనుష్టుప్.
రథ్యాశ్చ జనసమ్బాధా
నటనర్తకసంకులాః ।
గాయనైశ్చ విరావిణ్యో
వాదనైశ్చ తథాఽ పరైః ॥
టీక:-
రథ్యాః = వీధులు; చ; జనః = జనులచే; సంబాధా = ఇఱుకైనవిగాను; నటః = నటులు; నర్తక = నర్తకులచోడను; సంకులాః = కూడి ఉన్నది గాను; గాయనైః = గాయకులతోను; చ; విరావిణ్యః = మారు మ్రోగినవి; వాదనైః = సంగీత వాద్య బృందములచేతను; చ; తథా = మఱియు; అపరైః = తదితర వంది మాగధులు మొదలైన వారిచేతను.
భావము:-
జన సమూహములతోను, నటీనట నర్తకుల తోడను వీధులు కిక్కిరిసిపోయెను. గాయకుల నాదములు, వాద్య బృందముల రవళులు, వంది మాగధులు తదితరుల ఘోషణములతో వీధులన్నియు మారు మ్రోగినవి.
1.18.19.
అనుష్టుప్.
ప్రదేయాంశ్చ దదౌ రాజా
సూతమాగధవందినామ్ ।
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం
గోధనాని సహస్రశః ॥
టీక:-
ప్రదేయాన్ = పారితోషికములు; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; సూత = పౌరాణికులకు; మాగధ = వంశావళి చదువు వారికి; వందినామ్ = వంశమును పొగిడే వారికి; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకొరకు; విత్తమ్ = ధనమును; గోధనాని = ఆవుల సంపదను; సహస్రశః = వేలకొలది.
భావము:-
దశరథ మహారాజు పురాణములు చెప్పెడి వారికి, వంది మాగధులకు తగిన పారితోషికముల నిచ్చెను. బ్రాహ్మణులకు ధనమును మఱియు వేలకొలది గోసంపదను దానము చేసెను.
1.18.20.
అనుష్టుప్.
అతీత్యైకాదశాహం తు
నామకర్మ తథాఽ కరోత్ ।
జ్యేష్ఠం రామం మహాత్మానం
భరతం కైకయీసుతమ్ ॥
టీక:-
అతీత్య = అనంతరం; ఏకాదశాహమ్ = పదకొండు రోజులు; నామ కర్మ = నామ కరణమును; తథా = అట్లు; ఆకరోత్ = చేసెను; జ్యేష్ఠం = పెద్దవానిని; రామం = రాముని గాను; మహాత్మానమ్ = మహాత్ముడైన; భరతం = భరతునిగా; కైకేయీ సుతమ్ = కైకేయి కుమారుని.
భావము:-
పదకొండుదినముల అనంతరము నామకరణములు జరిగినవి. మహాత్ముడైన జ్యేష్ఠ కుమారునకు రాముడు అని, కైకేయి కుమారునకు భరతుడు అని నామములు.
1.18.21.
అనుష్టుప్.
సౌమిత్రిం లక్ష్మణ ఇతి
శత్రుఘ్నమపరం తథా ।
వసిష్ఠః పరమప్రీతో
నామాని కృతవాంస్తదా ॥
టీక:-
సౌమిత్రిం = సుమిత్ర కుమారునకు; లక్ష్మణ = లక్ష్మణుడు అని; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుడు అని; అపరం = తరువాత కుమారునకు; తథా = మఱియు; వసిష్ఠః = వసిష్ఠుడు; పరమప్రీతః = చాల సంతోషముగా; కృతవాన్ = చేసెను; తదా = అప్పుడు.
భావము:-
వసిష్ఠ మహాముని సంతోషముగా, సుమిత్ర యొక్క పెద్ద కుమారునకు లక్ష్మణుడు అనియు, ఆమె రెండవ కుమారునకు శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేసెను.
గమనిక:-
- (1) 'రమంతే సర్వే జనాః గుణైః అస్మిన్ ఇతి రామః' - సకల జనులు ఎవరి సద్గుణముల వలన ఆనందింతురో అతడు రాముడు. (2) 'లక్ష్మీః అస్య అస్తీతి లక్ష్మణః' - సంపన్నుడు మఱియు ప్రకాశవంతుడు కావున లక్ష్మణుడు. (3) 'బిభర్తీతి భరతః' - రాజ్యాధికారమును తప్పనిసరియై భరించినందున భరతుడు. (4) 'శత్రూన్ హన్తీతి శత్రుఘ్నః' - శత్రువులను నిర్మూలించ గలిగిన నేర్పరి శత్రుఘ్నుడు.
1.18.22.
అనుష్టుప్.
బ్రాహ్మణాన్ భోజయామాస
పౌరాం జానపదానపి ।
అదదద్బ్రాహ్మణానాం చ
రత్నౌఘమమితం బహు ॥
టీక:-
బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; భోజయామాస = భుజింపజేసెను; పౌరాన్ = పౌరులను; జానపదాన్ = గ్రామవాసులను; అపి = గ్రామవాసులను కూడ; అదదాత్ = దానము చేసెను; బ్రాహ్మణానామ్ = బ్రాహ్మణులకు; రత్నౌఘమ్ = రత్నః+ఓఘమ్, రత్నాలరాశులను; అమితమ్ = లెక్కకుమించినవి; బహు = చాలా.
భావము:-
దశరథుడు బ్రాహ్మణులకు,పౌరులకును, గ్రామవాసులకును, భోజన సంతర్పణ చేసెను. బ్రాహ్మణులకు చాలా రత్నరాశులను దానము చేసెను.
1.18.23.
అనుష్టుప్.
తేషాం జన్మక్రియాదీని
సర్వకర్మాణ్యకారయత్ ।
తేషాం కేతురివ జ్యేష్ఠో
రామో రతికరః పితుః ॥
టీక:-
తేషాం = వారికి; జన్మ క్రియాదీని = జాతకర్మలను; సర్వకర్మాణి = తదితర సకల కర్మలను; అకారయత్ = చేయించెను; తేషాం = వారిలో; కేతురివ = ధ్వజము వలె; జ్యేష్టః = పెద్దవాడైన; రామః = రాముడు; రతికరః = ఆనందకరుడు; పితుః = తండ్రికి.
భావము:-
దశరథుడు తన నలుగురు కుమారులకు జాతకర్మ, నామకరణము, చౌలకర్మ, ఇత్యాది కర్మలను జరిపించెను. జ్యేష్ఠ కుమారుడైన రాముడు తండ్రికి ఉన్నతుడుగా కనిపించుచు అమితానందమును కలుగ జేసెను.
1.18.24.
అనుష్టుప్.
బభూవ భూయో భూతానాం
స్వయమ్భూరివ సమ్మతః ।
సర్వే వేదవిదః శూరాః
సర్వే లోకహితే రతాః ॥
టీక:-
బభూవ = అయ్యెను; భూయః = ఎక్కువ; భూతానామ్ = సకల జీవులకును; స్వయంభూః = బ్రహ్మదేవుడి; ఇవ = వలె; సమ్మతః = ఆదరణీయుడు; సర్వే = అందరును; వేదవిదః = వేదకోవిదులు; శూరాః = శూరులు; లోకహితే = లోకక్షేమములో; రతాః = ఆసక్తి కలవారు.
భావము:-
బ్రహ్మదేవుని వలె రాముడు సకలజీవుల గౌరవాదరములను చూరగొనెను. వారు నలుగురు వేద కోవిదులు,శూరులును, లోక క్షేమమును కోరువారును.
1.18.25.
అనుష్టుప్.
సర్వే జ్ఞానోపపన్నాశ్చ
సర్వే సముదితా గుణైః ।
తేషామపి మహాతేజా
రామః సత్యపరాక్రమః ॥
టీక:-
సర్వే = వారందరు; జ్ఞానోపసంపన్నాః చ = జ్ఞాననిధులును; చ = కూడ; సర్వే = అందరును; సముదితా = కలవారు; గుణైః = సద్గుణములు; తేషామ్ = వారిలో; అపి = సహితం; మహా = గొప్ప; తేజః = తేజశ్శాలి; రామః = రాముడు; సత్యపరాక్రమః = సత్యపరాక్రమవంతుడు.
భావము:-
వారు నలుగురు జ్ఞాననిధులు, సద్గుణ సంపన్నులు. వారిలో కూడ రాముడు గొప్ప తేజోవంతుడు,సత్యపరాక్రమవంతుడు.
1.18.26.
అనుష్టుప్.
ఇష్టః సర్వస్య లోకస్య
శశాంక ఇవ నిర్మలః ।
గజస్కంధేఽ శ్వపృష్ఠే చ
రథచర్యాసు సమ్మతః ॥
టీక:-
ఇష్టః = ఇష్టమైన వాడు; సర్వస్య = అందరికి; లోకస్య = లోకములోనివారు; శశాంక = చంద్రుని; ఇవ = వలె; నిర్మలః = దోషము లేనివాడు; గజస్కంధే = ఏనుగు ఆసనము (గజము మూపును ఆసనము అందురు) అందును; అశ్వ = గుఱ్ఱము; పృష్ఠే = వీపునందును; చ = కూడ; రథః = రథము నందు; చర్యాసు = విహరించుటలో; సమ్మతః = సమర్థుడని మెప్పు పొందినవాడు.
భావము:-
రాముడు ఎటువంటి దోషము లేని నిర్మలస్వభావముతో చంద్రుని వలె లోకమంతటికిని ఇష్టుడు ఐనాడు. ఏనుగుమూపుమీద, గుఱ్ఱము వీపుమీద, రథము నందు నధిరోహించి విహరించుట యందు మంచి సమర్థుడు.
1.18.27.
అనుష్టుప్.
ధనుర్వేదే చ నిరతః
పితుః శుశ్రూషణే రతః ।
బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో
లక్ష్మణో లక్ష్మివర్దనః ॥
టీక:-
ధనుర్వేదే = ధనుర్వేదము నందు; చ = కూడ; నిరతః = ఆసక్తి గలవాడు; పితుః = తల్లిదండ్రులకు; శుశ్రూషేణ = సేవ చేయుటయందు; రతః = ఆసక్తి కలవాడు; బాల్యాత్ ప్రభృతి = చిన్నతనము నుండియు; సుస్నిగ్ధః = చక్కటి స్నేహముగా కూడి ఉండుట కలవాడు; లక్ష్మణః = లక్ష్మణుడు; లక్ష్మి= శోభను; వర్ధనః = వృద్ధిపొందించువాడు.
భావము:-
రాముడు ధనుర్విద్య యందు ఆసక్తి కలవాడు. మాతాపితరులకు సేవ చేయుట యందు అనురక్తి కలవాడు. సంపదలను శోభను పెంచువాడగు లక్ష్మణునకు చిన్నప్పటినుండియు రామునికి చక్కటి స్నేహపూర్వక సహచరుడు.
1.18.28.
అనుష్టుప్.
రామస్య లోకరామస్య
భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః ।
సర్వప్రియకరస్తస్య
రామస్యాపి శరీరతః ॥
టీక:-
రామస్య = రామునకు; లోకః = లోకమునకు; రామస్య = ఆనందము కలిగించునవాడు; భ్రాతుర్జ్యేష్ఠస్య = అన్నకు; నిత్యశః = నిత్యము; సర్వ = పూర్తి; ప్రియ = ఇష్టమును; కరః = చేయువాడు; తస్య = ఆ; రామస్య = రామునకు; అపి = సహితము; శరీరతః = శరీరమును కూడ త్యాగము చేయును.
భావము:-
లక్ష్మణుడుతన అన్నగారు లోకప్రియుడు ఐన రామునకు సమస్త ఇష్టమైన కార్యములను నిత్యము చేయును. రామునితో సశరీరముగ
1.18.29.
అనుష్టుప్.
లక్ష్మణో లక్ష్మిసంపన్నో
బహిః ప్రాణ ఇవాపరః ।
న చ తేన వినా నిద్రాం
లభతే పురుషోత్తమః ॥
టీక:-
లక్ష్మణః = లక్ష్మణుడు; లక్ష్మి సంపన్నః = ప్రకాశవంతుడైన; బహిః ప్రాణ ఇవ = బైట తిరిగెడు ప్రాణము వలె; అపరః = మరియొక; న = లేదు; తేన వినా = అతడు (లక్ష్మణుడు) లేకుండ; నిద్రామ్ = నిద్రను; లభతే = పొందుట; పురుషోత్తమః = పురుషులలో ఉత్తముడు.
భావము:-
శోభోద్దారకుడగు లక్ష్మణుడు రామునికి బహిఃప్రాణము వంటివాడు. లక్ష్మణుని విడిచి పురుషోత్తముడైన రాముడు నిద్రపోయెడి వాడు కాదు.
1.18.30.
అనుష్టుప్.
మృష్టమన్నముపానీతం
అశ్నాతి న హి తం వినా ।
యదా హి హయమారూఢో
మృగయాం యాతి రాఘవః ॥
టీక:-
మృష్టమన్నమ్ = మంచి ఆహారము; ఉపానీతమ్ = తీసుకు రాబడిన; అశ్నాతి = భుజించువాడు; న = కాదు; హి = తప్పక; తం = అతడు; వినా = లేకుండగ; యదా = ఎల్లప్పుడు; హి = తప్పక; హయమ్ = గుఱ్రమును; ఆరూఢః = ఎక్కి; మృగయామ్ = మృగములను వేటాడుటకై; యాతి = వెళ్ళినను; రాఘవః = రాముడు.
భావము:-
రాముడు లక్ష్మణుడు లేకుండ ఎంత ఇష్టమైన భోజన పదార్థములు ఐననూ భుజింపడు. రాముడు గుఱ్ఱమునెక్కి వేటాడుటకు వెళ్ళినపుడల్లా.
1.18.31.
అనుష్టుప్.
తదైనం పృష్ఠతోఽ భ్యేతి
సధనుః పరిపాలయన్ ।
భరతస్యాపి శత్రుఘ్నో
లక్ష్మణావరజో హి సః ॥
టీక:-
తదా = అప్పుడు; ఏనమ్ = ఈ రాముని; పృష్ఠతః = వెనుకనే; అభ్యేతి = అనుసరించును; సః = అతను; ధనుః = ధనుస్సును; పరిపాలయన్ = రక్షణగా; భరతస్యాపి = భరతునకు; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; లక్ష్మణః = లక్ష్మణుని; అవరజః = లనుడుడైన, తమ్ముడైన; హి = తప్పక; సః = ఆ.`
భావము:-
రామునికి తోడుగా లక్ష్మణుడు ధనుస్సును చేబూని రక్షణగా వెళ్ళెడివాడు. అట్లే, లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతునకు తోడుగా ఉండెడివాడు.
1.18.32.
అనుష్టుప్.
ప్రాణైః ప్రియతరో నిత్యం
తస్య చాసీత్తథా ప్రియః ।
స చతుర్భిర్మహాభాగైః
పుత్రైర్దశరథః ప్రియైః ॥
టీక:-
ప్రాణైః = ప్రాణముల కన్న; ప్రియతరః = అత్యంత ప్రియమైన {ప్రియ-ప్రియతర- ప్రియతమము}; నిత్యమ్ = నిత్యము; తస్య = అతనికి; చ; ఆసీత్ = అయ్యెను; తథా = అట్లు; ప్రియః = ప్రియమైనవాడు; సః = అతడు (భరతుడు); చతుర్భిః = నలుగురు; మహాభాగైః = గొప్ప భాగ్యవంతులైన; పుత్రైః = కుమారులతో; దశరథః = దశరథుడు; ప్రియైః = ప్రియముగా.
భావము:-
భరతునకు శత్రుఘ్నుడు ప్రాణములకంటె ఎక్కువ ప్రియమైనవాడు ఆయెను. ఆ విధముగ మహాభాగ్యశాసలులైన దశరథపుత్రులు నలుగురు ప్రేమానురాగములతో మెలగేవారు,
1.18.33.
అనుష్టుప్.
బభూవ పరమప్రీతో
దేవైరివ పితామహః ।
తే యదా జ్ఞానసంపన్నాః
సర్వే సముదితా గుణైః ॥
టీక:-
బభూవ = అయ్యెను; పరమ = బహుమిక్కిలి; ప్రీతః = సంతోషించినవాడు; దేవైః = దేవతలతో; ఇవ = వలె; పితామహః = బ్రహ్మదేవుడు; తే = వారు; యదా = ఎల్లప్పుడును; జ్ఞానసంపన్నాః = జ్ఞానసంపన్నులు; సర్వైః = సమస్తమైన; సముదితా = మిక్కిలి సంతుష్టులు; గుణైః = గుణములతో.
భావము:-
దేవతలతో బ్రహ్మదేవుడు సంతోషముగా ఉండునట్లు దశరథుడు తన కుమారులతో ఆనందముగా నుండెను. ఆ నలుగురును సంతుష్టులైన జ్ఞానసంపన్నులు, సకలగుణ సంపన్నులుగాను వర్ధిల్లిరి.
1.18.34.
అనుష్టుప్.
హ్రీమంత కీర్తిమంతశ్చ
సర్వజ్ఞా దీర్ఘదర్శినః ।
తేషామేవంప్రభావానాం
సర్వేషాం దీప్తతేజసామ్ ॥
టీక:-
హ్రీమంత = సిగ్గుపడెడివారు; కీర్తిమంత = కీర్తిమంతులు; చ; సర్వజ్ఞాః = అన్ని విషయముల నెరిగిన వారు; దీర్ఘదర్శినః = దూరపు ఆలోచన చేయువారు; తేషామ్ = వారు; ఏవమ్ = అటువంటి; ప్రభావానామ్ = ప్రభావము గల; సర్వేషామ్ = అందరి విషయములను; దీప్త తేజసామ్ = ప్రకాశించుచున్నతేజస్సు గలవారు.
భావము:-
ఆ నలుగురును తప్పు చేయుటకు సిగ్గుపడెడి వారు. కీర్తిమంతులు. అన్ని విషయములు తెలిసినవారు. దూరపు ఆలోచన చేయువారు. అందరిని అదేవిధముగా ప్రభావితము చేయగలిగిన తేజోవంతులు.
1.18.35.
అనుష్టుప్.
పితా దశరథో హృష్టో
బ్రహ్మా లోకాధిపో యథా ।
తే చాపి మనుజవ్యాఘ్రా
వైదికాధ్యయనే రతాః ॥
టీక:-
పితా దశరథః = తండ్రియైన దశరథుడు; హృష్టః = ఆనందించెను; బ్రహ్మా = బ్రహ్మ; లోకాధిపః = లోకాధిపతి; యథా = వలె; తే = ఆ; అపి = కూడ; మనుజవ్యాఘ్రాః = మానవశ్రేష్ఠులు; వైదిక = వేదములను; అధ్యయనే = అధ్యయించుట యందు; రతాః = ఆసక్తి కలవారు.
భావము:-
తన కుమారుల వలన దశరథుడు లోకాధిపతి బ్రహ్మవలె సంతోషముగా నుండెను. మానవశ్రేష్ఠులైన ఆ నలుగురు వేదములను తెలుసుకొనుట యందు శ్రద్ధాసక్తులు కలవారై యుండిరి.
1.18.36.
అనుష్టుప్.
పితృశుశ్రూషణరతా
ధనుర్వేదే చ నిష్ఠితాః ।
అథ రాజా దశరథః
తేషాం దారక్రియాం ప్రతి ॥
టీక:-
పితృ శుశ్రూషణ = తల్లితండ్రులకు సేవ చేయుట యందు; రతాః = ఆసక్తి కలవారై; ధనుర్వేదే = ధనుశ్శాస్త్రమునందు; చ; నిష్ఠితాః = నిష్ణాతులై; అథ = తరువాత; రాజా దశరథః = దశరథమహారాజు; తేషామ్ = ఆ కుమారుల యొక్క; దారక్రియాం = వివాహమును; ప్రతి = గురించి.
భావము:-
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తల్లితండ్రులకు సేవ చేయుట యందు శ్రద్ధాసక్తులు కలవారు. ధనుశ్శాస్త్రమునందు నిష్ణాతులు. వారి వివాహ విషయమై దశరథుడు ఆలోచన చేయసాగెను.
1.18.37.
అనుష్టుప్.
చింతయామాస ధర్మాత్మా
సోపాధ్యాయః సబాంధవః ।
తస్య చింతయమానస్య
మంత్రిమధ్యే మహాత్మనః ॥
టీక:-
చింతయామాస = ఆలోచించెను; ధర్మాత్మా = ధర్మాత్ముడు; స ఉపాధ్యాయః = పురోహితులతో కూడి; సబాంధవః = బంధువులతో కూడినవాడై; తస్య = అతడు; చింతయామానస్య = ఆలోచించుచుండగా; మంత్రిమధ్యే = మంత్రుల మధ్య; మహాత్మనః = మహాత్ముడు.
భావము:-
ధర్మాత్ముడైన దశరథుడు పురోహితులతోను, బంధువులతోను ఆలోచన చేయసాగెను.ఆ మహాత్ముడు మంత్రుల మధ్య ఆలోచించుచుండగా.
1.18.38.
అనుష్టుప్.
అభ్యాగచ్ఛన్మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ।
స రాజ్ఞో దర్శనాకాంక్షీ
ద్వారాధ్యక్షానువాచ హ ॥
టీక:-
అభ్యాగచ్ఛత్ = వచ్చెను; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; విశ్వామిత్రః = విశ్వామిత్రుడను; మహామునిః = మహాముని; సః = అతడు; రాజ్ఞః = రాజుయొక్క; దర్శనాః = దర్శనమును; ఆకాంక్షీ = కోరువాడై; ద్వారాధ్యక్షాన్ = ద్వారపాలకులగూర్చి; ఉవాచ హ = పలికెను.
భావము:-
అప్పుడు గొప్ప తేజశ్శాలి యగు విశ్వామిత్ర మహాముని వచ్చి, దశరథుని దర్శనము కోరుచు ద్వారపాలకులతో ఇట్లు పలికెను.
1.18.39.
అనుష్టుప్.
శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం
కౌశికం గాధినందనమ్" ।
తచ్ఛ్రుత్వా వచనం తస్య
రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః ॥
టీక:-
శీఘ్రమ్ = వెనువెంటనే; ఆఖ్యాత = తెలియజెప్పుడు; మామ్ = నన్ను; ప్రాప్తమ్ = వచ్చినవానిగా; కౌశికమ్ = కౌశిక వంశీయుడను; గాధి నందనమ్ = గాధి కుమారుడను; తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = మాటను; త్రాసాత్ = భయపడి; రాజ్ఞః = రాజు యొక్క; వేశ్మ = గృహము గూర్చి; ప్రదుద్రువుః = పరుగులిడిరి.
భావము:-
"కౌశికవంశీయుడును, గాధి పుత్రుడును ఐన విశ్వామిత్రుడు వచ్చినాడని దశరథునికి తెలియజేయుడు" అని చెప్పెను. ఆ మాటలు వినిన ద్వారపాలకులు భయముతో రాజమందిరమునకు పరుగులిడిరి.
1.18.40.
అనుష్టుప్.
సమ్భ్రాంతమనసః సర్వే
తేన వాక్యేన చోదితాః ।
తే గత్వా రాజభవనం
విశ్వామిత్రమృషిం తదా ॥
టీక:-
సమ్భ్రమాంత = కలతచెందిన; మనసః = మనస్సు కలవారై; సర్వే = అందరును; తేన = ఆ; వాక్యేన = మాటచే; చోదితః = ప్రేరింపబడినవారై; తే = వారు; గత్వా = వెళ్ళి; రాజభవనమ్ = రాజమందిరమునకు; విశ్వామిత్రమ్ ఋషిమ్ = విశ్వామిత్ర మహర్షిని; తదా = అప్పుడు.
భావము:-
కలతచెందిన మనస్సులతో ద్వారపాలకులందరు విశ్వామిత్రుని మాటలచే ప్రేరేపించబడిన రాజ గృహమునకు పరుగెత్తుకొని వెళ్ళి విశ్వామిత్రుడు వచ్చినాడని తెలియజేసిరి.
1.18.41.
అనుష్టుప్.
ప్రాప్తమావేదయామాసుః
నృపాయైక్ష్వాకవే తదా ।
తేషాం తద్వచనం శ్రుత్వా
సపురోధాః సమాహితః ॥
టీక:-
ప్రాప్తమ్ = వచ్చినవానిగా; ఆవేదయామాసుః = తెలిపిరి; నృపాయ = రాజునకు; ఐక్ష్వాకవే = ఇక్ష్వాకు వంశజుడైన; తదా = అప్పుడు; తేషామ్ = వారి యొక్క; తద్వచనమ్ = ఆ మాటను; శ్రుత్వా = విని; సపురోధాః = పురోహితులతో కూడినవాడై; సమాహితః = సావధానముగా.
భావము:-
ఇక్ష్వాకువంశజుడైన దశరథునకు ద్వారపాలకులు విశ్వామిత్రుని ఆగమనము గురించి తెలియజేసిరి. అది విని దశరథుడు పురోహితులతో కూడి సావధానచిత్తుడై.
1.18.42.
అనుష్టుప్.
ప్రత్యుజ్జగామ తం హృష్టో
బ్రహ్మాణమివ వాసవః ।
తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా
తాపసం సంశితవ్రతమ్ ॥
టీక:-
ప్రత్యుజ్జగామ = ఎదురేగెను; తమ్ = అతనిని; హృష్టః = సంతోషముగా; బ్రహ్మాణమ్ = బ్రహ్మదేవుని; ఇవ = లె; వాసవః = ఇంద్రుడు; తమ్ = అతనిని; దృష్ట్వా = చూసి; జ్వలితమ్ = ప్రకాశించుచున్న; దీప్త్యా = వెలుగుచున్న; తాపసమ్ = తపస్సుచే; సంశితవ్రతమ్ = పరమ నిష్ఠాగరిష్ఠుని.
భావము:-
దశరథుడు విశ్వామిత్రునికి ఎదురేగి బ్రహ్మను చూసిన ఇంద్రుని వలె ఆనందించెను. తపస్సంపన్నుడు, పరమనిష్ఠాగరిష్ఠుడైన విశ్వామిత్రుని దశరథుడు చూసెను.
1.18.43.
అనుష్టుప్.
ప్రహృష్టవదనో రాజా
తతోఽ ర్ఘ్యముపహారయత్ ।
స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం
శాస్త్రదృష్టేన కర్మణా ॥
టీక:-
ప్రహృష్ట = ఆనందించిన; వదనః = ముఖము కలవాడు; రాజః = రాజు; తతః = తరువాత; అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; ఉపహారయత్ = ఇచ్చెను; సః = అతడు; రాజ్ఞః = రాజునుండి; ప్రతిగృహ్య = తీసుకొనెను; అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; శాస్త్రదృష్టేన = శాస్త్రము నందు సూచించిన; కర్మణా = విధముగా.
భావము:-
సంతోషముతో వికసించిన ముఖము గల దశరథమహారాజు విశ్వామిత్రునకు అర్ఘ్యము నిచ్చెను. దశరథుడు ఇచ్చిన అర్ఘ్యమును విశ్వామిత్రుడు శాస్త్రోక్తముగా స్వీకరించెను.
1.18.44.
అనుష్టుప్.
"కుశలం చావ్యయం చైవ
పర్యపృచ్ఛన్నరాధిపమ్! ।
పురే కోశే జనపదే
బాంధవేషు సుహృత్సు చ" ॥
టీక:-
కుశలమ్ చ = క్షేమమును; అవ్యయమ్ = లోటు లేమిని గురించి; పర్యపృచ్ఛత్ = ప్రశ్నించెను; నరాధిపమ్ = రాజును; పురే = పట్టణమునందు; కోశే = ధనాగారమునందు; జనపదే = గ్రామములందును; బాంధవేషు = బంధువులందును; సుహృత్సు చ = స్నేహితులందును
భావము:-
తరువాత విశ్వామిత్ర మహాముని దశరథుని ఇట్లు ప్రశ్నించెను. రాజా! కుశలమేకదా, పట్టణమునందు, ధనాగారమునందు, గ్రామములందు, బంధువులకు మఱియు స్నేహితులకు ఏ లోటు లేదుకద
1.18.45.
అనుష్టుప్.
కుశలం కౌశికో రాజ్ఞః
పర్యపృచ్ఛత్సుధార్మికః ।
అపి తే సన్నతాః సర్వే
సామంతా రిపవో జితాః ॥
టీక:-
కుశలమ్ = క్షేమమును; కౌశికః = విశ్వామిత్రుడు; రాజ్ఞః = రాజు యొక్క; పర్యపృచ్ఛత్ = ప్రశ్నించెను; సుధార్మికః = మంచి ధర్మ ప్రవర్తన గలిగిన; అపి = కూడ; తే = నీకు; సన్నతాః = అణకువగా వంగి ఉన్నారా ? సర్వే = అందరు; సామన్తాః = సామంత రాజులు; రిపవః = శత్రువులు; జితాః = జయింపబడినారా.
భావము:-
గొప్ప ధర్మవర్తనుడైన విశ్వామిత్రుడు "దశరథా! మీరందరు క్షేమమేనా? సామంత రాజులందరు నీకు అణకువగా వంగి ఉన్నారా? శత్రువులందరు నీచే జయింపబడినారా?" అని ప్రశ్నించెను.
1.18.46.
అనుష్టుప్.
దైవం చ మానుషం చాపి
కర్మ తే సాధ్వనుష్ఠితమ్" ।
వసిష్ఠం చ సమాగమ్య
కుశలం మునిపుంగవః ॥
టీక:-
దైవం చ = దైవానుగ్రహము; చ = కొరకు; మానుషం = మనుషుల; చాపి = గురించి; కర్మ = కర్మ; తే = నీ యొక్క; సాధ్వనుష్ఠితమ్ = బాగుగా చేయబడినదా?; వసిష్ఠం = వసిష్ఠుని; చ = వసిష్ఠుని;సమాగమ్య = సమీపించి; కుశలమ్ = క్షేమమును; మునిపుంగవః = మునిశ్రేష్ఠుడు.
భావము:-
"దైవానుగ్రహమును పొందుటకు యజ్ఞాది దైవకార్యములను, ప్రజలు నీకు అనుకూలురుగా నుండుడుటకు సామ దాన భేద దండోపాయ కర్మలను ఆచరించుచున్నావా?" అని విశ్వామిత్రుడు దశరథుని అడిగెను. మునివరుడు వసిష్ఠుని వద్దకు వచ్చి ఆయన క్షేమమునుఅడిగి తెలుసుకొనెను.
1.18.47.
అనుష్టుప్.
ఋషీంశ్చాన్యాన్ యథాన్యాయం
మహాభాగానువాచ హ ।
తే సర్వే హృష్టమనసః
తస్య రాజ్ఞో నివేశనమ్ ॥
టీక:-
ఋషీః = ఋషులను; చ; తాన్ = ఆ; యథా న్యాయమ్ = న్యాయానుసారముగా; మహాభాగాన్ = మహానుభావులైన; ఉవాచ = పలికెను; తే సర్వే = వారందరును; హృష్ట మనసః = సంతోషించిన మనసు గలవారై; తస్య = ఆ; రాజ్ఞః = రాజు యొక్క; నివేశనమ్ = గృహమును.
భావము:-
విశ్వామిత్రుడు అక్కడ ఉన్న మహానుభావులైన ఋషులందరి క్షేమము గూర్చి అడిగెను. తరువాత వారందరును రాజమందిరమును
1.18.48.
అనుష్టుప్.
వివిశుః పూజితాస్తత్ర
నిషేదుశ్చ యథార్హతః ।
అథ హృష్టమనా రాజా
విశ్వామిత్రం మహామునిమ్ ॥
టీక:-
వివిశుః = ప్రవేశించిరి; పూజితాః = పూజింపబడి; తత్ర = అక్కడ; నిషేదుశ్చ = కూర్చుండిరి; యథార్హతః = అర్హతకు తగినట్లుగా; అథ = తరువాత; హృష్టమనాః = సంతోషము నిండిన మనసు కలవాడై; రాజా = రాజు; విశ్వామిత్రం మహామునిమ్ = మహామునియైన విశ్వామిత్రుని.
భావము:-
మహానుభావులైన ఆ ఋషులందరును రాజ మందిరములోనికి ప్రవేశించిరి. వారి వారి యోగ్యతానుసారముగా పూజింపబడి ఆసీనులైరి. మిగుల సంతసించిన దశరథమహారాజు విశ్వామిత్ర మహామునిని
1.18.49.
అనుష్టుప్.
ఉవాచ పరమోదారో
హృష్టస్తమభిపూజయన్ ।
యథాఽ మృతస్య సమ్ప్రాప్తిః
యథా వర్షమనూదకే ॥
టీక:-
ఉవాచ = పలికెను; పరమోదారః = గొప్ప ఔదార్యవంతుడు; హృష్టః = సంతోషించి; తమ్ = ఆ; అభిపూజయన్ = పూజించి; యథా = ఎట్లయితే; అమృతస్య = అమృతముయొక్క; సమ్ప్రాప్తిః = లభించుట; వర్షమ్ = వర్షము; అనూదకే = నీరులేని చోట.
భావము:-
గొప్ప ఔదార్యవంతుడైన దశరథుడు, విశ్వామిత్రుని రాకచే సంతోషించి, ఆ మహామునిని పూజించి "మహామునీ ! నీ రాక మాకు అమృత లభ్యము వంటిది. నీరు లేని చోట వర్షము కురియుట వంటిది.
1.18.50.
అనుష్టుప్.
యథా సదృశదారేషు
పుత్రజన్మాప్రజస్య చ ।
ప్రణష్టస్య యథా లాభో
యథా హర్షో మహోదయే ॥
టీక:-
యథా = ఏ విధముగా; సదృశ = అనుకూలవతియైన; దారేషు = భార్య యందు; పుత్రజన్మ = పుత్రులు కలుగుట; అప్రజస్య = సంతానము లేనివారికి; ప్రణష్టస్య = పోగొట్టుకొనిన వస్తువుయొక్క; లాభః = లాభము; యథా = ఎట్లో; హర్షః = సంతోషము; మహోదయే = విశేష అభివృద్ధి కలిగినపుడు.
భావము:-
"మీ రాక మాకు, సంతానహీనునకు అనుకూలవతియైన భార్యయందు పుత్రుడు జన్మించినట్లును, పోగొట్టుకొనిన వస్తువు తిరిగి లభ్యమయినట్లుగాను, గొప్ప అభివృద్ధివలన సంతోషము కలిగినట్లుగాను, ఆనందము కలిగించుచున్నది" అని దశరథుడు విశ్వామిత్రునితో పలికెను.
1.18.51.
అనుష్టుప్.
తథైవాగమనం మన్యే
స్వాగతం తే మహామునే! ।
కం చ తే పరమం కామం
కరోమి కిము హర్షితః ॥
టీక:-
తథా ఏవ = అట్లే అని; ఆగమనమ్ = రాక; మన్యే = తలంచుచున్నాను; స్వాగతమ్ = స్వాగతము; తే = నీకు; మహామునే = ఓ మహామునీ; కం = ఏ; తే = నీకు; పరమమ్ = గొప్ప; కామమ్ = కోరికను; కరోమి = చేయుదును; కిము = ఏ విధముగా; హర్షితః = సంతోషించిన.
భావము:-
మీ రాక మాకు సంతోషదాయకముగా తలచుచున్నాను. ఓ మహామునీ! మీకు స్వాగతము. మీ కోరిక ఏమి? దానిని నేను సంతోషముతో ఎట్లు నెరవేర్చగలను?
1.18.52.
అనుష్టుప్.
పాత్రభూతోఽ సి మే బ్రహ్మన్!
దిష్ట్యా ప్రాప్తోఽ సి ధార్మిక ।
అద్య మే సఫలం జన్మ
జీవితం చ సుజీవితమ్ ॥
టీక:-
పాత్రభూతః = గొప్ప గుణములు గలవాడివి; అసి = అయి ఉన్నావు; మే = నాకు; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; దిష్ట్యా = దైవానుగ్రహము వలన; ప్రాప్తోఽసి = వచ్చితివి; ధార్మిక = ధర్మాత్ముడా; అద్య = నేడు; మే = నా యొక్క; సఫలమ్ = సఫలమైనది; జన్మ = జన్మ; జీవితం చ = జీవితము కూడ; సుజీవితమ్ = మంచి జీవితము.
భావము:-
ఓ బ్రాహ్మణోత్తమా ! నీవు సద్గుణములు కలవాడివి, దైవానుగ్రహము వలన వచ్చినావు. ఓ ధర్మాత్మా! నేడు నా జన్మసార్థకమైనది. నా జీవితము సుజీవితమైనది.
1.18.53.
అనుష్టుప్.
పూర్వం రాజర్షిశబ్దేన
తపసా ద్యోతితప్రభః ।
బ్రహ్మర్షిత్వ మనుప్రాప్తః
పూజ్యోఽ సి బహుధా మయా ॥
టీక:-
పూర్వం = పూర్వము; రాజర్షి శబ్దేన = రాజర్షి అను బిరుదుచే; తపసా = తపస్సు వలన; ద్యోతిత ప్రభః = ప్రకాశితమైన కాంతివంతుడవు; బ్రహ్మర్షిత్వమ్ = బ్రహ్మర్షిత్వమును; అనుప్రాప్తః = తరువాత పొందినావు; పూజ్యః = పూజింపదగినవాడవు; అసి = అయి ఉన్నావు; బహుధా = పలు విధములుగా; మయా = నాచే.
భావము:-
తొలుత రాజర్షి అను శబ్దముచే నీ ప్రభ ప్రకాశితమైనది. తరువాత తపము నాచరించి నీవు బ్రహ్మర్షివైనావు. నీవు నాకు అనేక విధములుగా పూజనీయుడవు.
1.18.54.
అనుష్టుప్.
తదద్భుతమిదం బ్రహ్మన్!
పవిత్రం పరమం మమ ।
శుభక్షేత్ర గత శ్చాహం
తవ సందర్శనాత్ప్రభో ॥
టీక:-
తత్ = అందువలన; అద్భుతమ్ = ఆశ్చర్యకరమైనది; ఇదం = ఇది; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; పవిత్రం = పవిత్రమైనది; పరమం = గొప్ప; మమ = నాకు; శుభక్షేత్ర గతః చ = పుణ్యక్షేత్రమునకు వెళ్ళినట్లుగా; అహమ్ = నేను; తవ = నీ యొక్క; సందర్శనాత్ = సందర్శనము వలన; ప్రభో = ప్రభూ.
భావము:-
నీ రాక మాకు చాలా ఆశ్చర్యము కలిగించుచున్నది. అది నాకు ఎంతో పవిత్రతను కలిగించుచున్నది. నీ దర్శనము వలన నేను పుణ్యక్షేత్రములో నివసించుచున్నట్లున్నది.
1.18.55.
అనుష్టుప్.
బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం
కార్యమాగమనం ప్రతి ।
ఇచ్ఛా మ్యనుగృహీతోఽ హం
త్వదర్థపరివృద్ధయే ॥
టీక:-
బ్రూహి = చెప్పుము; యత్ = ఏదైతే; ప్రార్థితం = కోరబడినది; తుభ్యం = నీకు; కార్యమ్ = కార్యము; ఆగమనం ప్రతి = రాక గురించి; ఇచ్ఛామి = కోరుచున్నాను; అనుగృహీతః = అనుగ్రహింపబడినవాడనై; అహం = నేను; త్వదర్థ = నీ కార్యము; పరివృద్ధయే = అభివృద్ధి చెందుటకు.
భావము:-
నీవు ఏ కార్యమును కోరి ఇచటకు వచ్చితివో తెలియజేయుము. దానిని నీ అనుగ్రహముతో సంపూర్ణముగా నెరవేర్చెదను.
1.18.56.
అనుష్టుప్.
కార్యస్య న విమర్శం చ
గంతుమర్హసి కౌశిక! ।
కర్తా చాహమశేషేణ
దైవతం హి భవాన్ మమ ॥
టీక:-
కార్యస్య = కార్య విషయమై; న = వలదు; విమర్శం = ఆలోచించుట; చ; గంతుమ్ = పొందుటకు; అర్హసి = అర్హత కలిగియున్నావు; కౌశిక = విశ్వామిత్రా; కర్తా చ = కార్యమునుచేయగలను; అహమ్ = నేను; అశేషేణ = పూర్తిగా; దైవతం హి = దేవతవు కదా; భవాన్ = నీవు; మమ = నాకు.
భావము:-
విశ్వామిత్రా! నీవు వచ్చిన కార్యవిషయములో సందేహము వలదు. నేను ఆ కార్యమును పూర్తిగా నెరవేర్చగలను. నీవు నాకు దేవుడవు కదా !
1.18.57.
అనుష్టుప్.
మమ చాయమనుప్రాప్తో
మహానభ్యుదయో ద్విజ! ।
తవాగమనజః కృత్స్నో
ధర్మశ్చానుత్తమో మమ" ॥
టీక:-
మమ = నాకు; చ; అయమ్ = ఈ; అనుప్రాప్తః = ప్రాప్తించినది; మహాన్ = గొప్ప; అభ్యుదయః = అభివృద్ధి; ద్విజ = బ్రాహ్మణా; తవ = నీ యొక్క; ఆగమనజః = రాక వలన కలిగిన; కృత్స్నః = సమస్తమైన; ధర్మః చ = ధర్మము; అనుత్తమః = మిక్కిలి శ్రేష్ఠమైనది; మమ = నాకు.
భావము:-
ఓ బ్రాహ్మణోత్తమా! నాకు గొప్ప అభివృద్ధి సంప్రాప్తమైనది. నీ రాక వలన నాకు మిక్కిలి శ్రేష్ఠమైన ధర్మము లభించినది.
1.18.58.
జగతి.
ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ ।
ప్రథితగుణయశా గుణైర్విశిష్టః
పరమఋషిః పరమం జగామ హర్షమ్ ॥
టీక:-
ఇతి = ఈ విధముగా; హృదయసుఖం = హృదయమునకు సుఖకరము; నిశమ్య = విని; వాక్యం = వాక్యమును; శ్రుతి సుఖమ్ = చెవులకు సుఖకరము; ఆత్మవతా = బుద్ధిమంతునిచే; వినీతమ్ = వినయముగా; ఉక్తమ్ = పలుకబడిన; ప్రథితగుణయశాః = ప్రశస్తమైన గుణములును కీర్తియు కలవాడు; గుణైః = గుణములచే; విశిష్టః = శ్రేష్ఠుడు; పరమఋషిః = గొప్పఋషి; పరమం = గొప్ప; జగామ = పొందెను; హర్షమ్ = ఆనందమును.
భావము:-
ధీమంతుడైన దశరథుడు, వినయపూర్వకముగా పలికినవి, హృదయమునకు సుఖకరమైనవి, చెవులకు ఇంపైనవి అగు పలుకులు విని ప్రసిద్ధ గుణ యశ సంపన్నుడు, సద్గుణశ్రేష్ఠుడు నగు విశ్వామిత్రుడు మిక్కిలి ఆనందించెను.
1.18.59.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
అష్టాదశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టాదశః [18] = పద్దెనిమిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [18] పద్దెనిమిదవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.19.1.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా రాజసింహస్య
వాక్యమద్భుతవిస్తరమ్ ।
హృష్టరోమా మహాతేజా
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీక:-
తత్ = ఆ; శ్రుత్వా = విని; రాజసింహస్య = రాజశ్రేష్టుని; వాక్యమ్ = మాటను; అద్భుత = ఆశ్చర్యకరము; విస్తరం = విస్తారమైన: హృష్ట = గగుర్పాటు పొందిన; రోమాః = పొందిన రోమములు గలవాడుఅగు; మహా = గొప్ప; తేజా = తేజస్సుకలవాడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభ్యభాషత = పలికెను.
భావము:-
దశరథుని అద్భుతమైన వినయ పూరిత మైన మాటలను విని తేజోమూర్తియైన విశ్వామిత్రుడు సంతోషము చేత రోమాంచితమైన శరీరము కలవాడై దశరథునితో యిట్లు పలికెను.
1.19.2.
అనుష్టుప్.
“సదృశం రాజశార్దూల!
తవైతద్భువి నాన్యథా ।
మహాకులప్రసూతస్య
వసిష్ఠవ్యపదేశినః ॥
టీక:-
సదృశమ్ = తగియున్నది; రాజశార్దూల! = రాజశ్రేష్ఠా; తవ = నీకు; ఏతత్ = ఇది; భువి = భూమియందు; న = కాదు; అన్యధా = మరి ఏవిధముగాను; మహా = గొప్ప; వంశ = వంశమునందు; ప్రసూతస్య = జన్మించిన వాడును; వశిష్ఠః = వశిష్ఠునియొక్క; ఉపదేశినః = ఉపదేశములను పొందిన వాడును అగు.
భావము:-
“ఓ రాజేంద్రా! ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు వంశమున జనించిన వాడవు. వశిష్ఠుని ఉపదేశములను వినినవాడవు. అట్టి నీవు ఈ రీతిగా పలుకుట యుక్తమైనదే.
1.19.3.
అనుష్టుప్.
యత్తు మే హృద్గతం వాక్యం
తస్య కార్యస్య నిశ్చయమ్ ।
కురుష్వ రాజశార్దూల!
భవ సత్యప్రతిశ్రవః ॥
టీక:-
యత్ = ఏపని; తు; మే = నాయొక్క; హృద్గతం = మనసు నందున్న; వాక్యమ్ = మాటను; తస్య = ఆ; కార్యస్య = ఆపనిని; నిశ్చయమ్ = నిశ్చయముగ; కురుష్వ = చేయుము; రాజశార్దూల = రాజశ్రేష్ఠా; భవ = అగుము. సత్యప్రతిశ్రవాః = సత్యప్రతిజ్ఞ కలవాడవు.
భావము:-
నాయొక్క మనసులోని మాటను, నేను సంకల్పించిన కార్యమును చెప్పెదను. దానిని నీవు చేయుము. నీవు ఆడిన మాటను ఆచరించువాడవు అగుము.
1.19.4.
అనుష్టుప్.
అహం నియమమాతిష్ఠే
సిద్ధ్యర్థం పురుషర్షభ! ।
తస్య విఘ్నకరౌ ద్వౌ తు
రాక్షసౌ కామరూపిణౌ ॥
టీక:-
అహమ్ = నేను; నియమమ్ = నియమమును; ఆతిష్ఠె = ఆచరించుచున్నాను; సిధ్యర్ధం = ఒక సిధ్ధికొరకు; పురుషర్షభ = పురుషశ్రేష్ఠా; తస్య = ఆ కార్యమును; విఘ్నః = విఘ్నములు; కరౌ = కలిగిస్తున్నారు; ద్వౌ = ఇరువురు; తు = కాని; రాక్షసౌ = రాక్షసులు; కామరూపిణౌ = కోరినరూపమును పొందగలవారు.
భావము:-
రాజశ్రేష్ఠా! ఒక లక్ష్యసిద్ధికై యజ్ఞ దీక్షను చేపట్టితిని.కోరిన రూపములను ధరించగల యిద్దరు రాక్షసులు ఆ యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్నారు.
1.19.5.
అనుష్టుప్.
వ్రతే మే బహుశశ్చీర్ణే
సమాప్త్యాం రాక్షసావిమౌ ।
మారీచశ్చ సుబాహుశ్చ
వీర్యవన్తౌ సుశిక్షితౌ ।
సమాంస రుధిరౌఘేణ
వేదిం తామభ్యవర్షతామ్ ॥
టీక:-
వ్రతమ్ = వ్రతము; మే = నాయొక్క; బహుశ: = ఇంచుమించుగ పూర్తి; చీర్ణే = అగుచుండగ; సమాప్త్యాం = పూర్తి అగుట; రాక్షసావిమౌ = రాక్షసులు; మారీచః = మారీచుడును; చ; సుబాహుః = సుబాహువును; చ; వీర్యవంతౌ = పరాక్రమవంతులును; సుశిక్షితౌ = మంచి నేర్పరులును; స = కలగలిసిన; మాంసః = మాంసము; రుధిరః = రక్తము; ఓఘేణ = సమూహములు, కుప్పలు; వేదిమ్ = వేదికను; తామ్ = వారు; అభ్యవర్షతామ్ = కురిపిస్తున్నారు.
భావము:-
నాయొక్క యజ్ఞం పూర్తి అగుచుండగా మంచి నేర్పరులు పరాక్రమవంతులు ఐన మారీచుడు సుబాహువు అను యిద్దరు రాక్షసులు మాంస ఖండములు రక్తము కుప్పలు తెప్పలు యజ్ఞ వేదికపై కురిపిస్తున్నారు.
1.19.6.
అనుష్టుప్.
అవధూతే తథాభూతే
తస్మిన్నియమనిశ్చయే ।
కృతశ్రమో నిరుత్సాహః
తస్మాద్దేశాదపాక్రమే ॥
టీక:-
అవధూతే = విఘ్నము చేయబడినది; తధా = ఆ; భూతే = విధముగా కాగా; తస్మిన్ = ఆ, నియమ = దీక్షా, నిశ్చయే = సంకల్పము; కృత = వృథాఐన; శ్రమః = పడ్డ కష్టం; నిరుత్సాహః = నిరుత్సాహ పొందిన వాడనై; తస్మా త్ = ఆ; దేశాత్ = ప్రదేశము నుండి; అపాక్రమే = తొలగిపోతిని.
భావము:-
నియమ నిష్ఠలతో నేను ఆచరించుచున్న యజ్ఞం ఆవిధముగా విఘ్నములకు గురియై నాశ్రమ యంతయు వ్యర్థం అగుచున్నది. అందుచేత నేను నిరుత్సాహముతో ఆశ్రమము వీడితిని.
1.19.7.
అనుష్టుప్.
న చ మే క్రోధముత్స్రష్టుం
బుద్ధిర్భవతి పార్థివ! ।
తథాభూతా హి సా చర్యా
న శాపస్తత్ర ముచ్యతే ॥
టీక:-
న = లేదు; చ = కూడ; మే = నాకు; క్రోధమ్ = కోపమును; ఉత్సృష్టుమ్ = బాగా చూపుటకు; బుద్దిః = బుద్ది; భవతి = కలుగుట; పార్ధివ = రాజ; తధాభూతా = అటువంటిది; హి = కదా; సా = ఆ; చర్యా = వ్రతవిధానం; న = లేదు; శాపః = శాపమును; తత్రః = అక్కడ; ముచ్యతే = వేయుటకు.
భావము:-
ఓమహారాజ! వారు అట్లు విఘ్నములు కలిగించుచున్నను, నేను యజ్ఞదీక్షలో నుంటిని కనుక, వారిపై కోపమును ప్రదర్శించుటగాని , శపించుటగాని నాకు యుక్తముకాదు.
1.19.8.
అనుష్టుప్.
స్వపుత్రం రాజశార్దూల!
రామం సత్యపరాక్రమమ్ ।
కాకపక్షధరం శూరం
జ్యేష్ఠం మే దాతుమర్హసి ॥
టీక:-
స్వ = నీస్వంత; పుత్రమ్ = కుమారుని; రాజశార్దూల = రాజ శ్రేష్ఠా; రామమ్ = శ్రీ రాముని; సత్య = సత్యము; పరాక్రమమ్ = పరాక్రమం కలవాడును; కాకపక్షధరమ్ బాలుని, జులపాలను ధరించినవాడును; శూరమ్ = పరాక్రమవంతుడును; జ్యేష్ఠమ్ = పెద్ద కుమారుడును; మే = నాకు; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = తగియున్నావు.
భావము:-
ఓరాజ శ్రేష్ఠా దశరథా! సత్యపరాక్రమవంతుడు, జులపాల జుట్టుకల బాలుడు, పరాక్రమవంతుడు, నీ కుమారులలో పెద్దవాడు అయిన శ్రీ రాముని నాతో పంపించుము.
1.19.9.
అనుష్టుప్.
శక్తో హ్యేష మయా గుప్తో
దివ్యేన స్వేన తేజసా ।
రాక్షసా యే వికర్తారః
తేషామపి వినాశనే ॥
టీక:-
శక్తః = సమర్థుడు; హి = అవశ్యం; ఏషః = ఈతడు; మయా = నాచేత; గుప్తః = రక్షింపబడు; దివ్యేన = దివ్యమైన; స్వేన = తన; తేజసా = తేజస్సుచే; రాక్షసా = రాక్షసులను; యే = ఏ; వికర్తార: = ఆటంకపరచు; తేషాం = వారిని; అపి = యొక్క; వినాశనే = నాశనము చేయుటలో.
భావము:-
రాముడు తన దివ్యమైన తేజో ప్రభావమున, నా అండదండ లతో యజ్ఞమునకు విఘ్న కారకులైన ఆ రాక్షసులను పరిమార్చుటకు సమర్ధుడు.
1.19.10.
అనుష్టుప్.
శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి
బహురూపం న సంశయః ।
త్రయాణామపి లోకానాం
యేన ఖ్యాతిం గమిష్యతి ॥
టీక:-
శ్రేయః = శుభములను; చ = తం; అస్మై = ఈ రామునికి; ప్రదాస్యామి = ఇవ్వగలను; బహురూపమ్ = అనేకవిధములైనవి; న = లేదు; సంశయః = సందేహము; త్రయాణామపి = మూడు అయిన; లోకానామ్ = లోకముల లోను; యేన = దేనిచేత; ఖ్యాతిన్ = కీర్తిని; గమిష్యతి = పొందగలడో;
భావము:-
నాతోపాటు వచ్చి రాక్షస సంహారం చేయుట వలన రామునకు అనేక విధములగు శ్రేయస్సులు సమకూరును. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ముల్లోకముల యందు రాముని ఖ్యాతి వ్యాపించును.
1.19.11.
అనుష్టుప్.
న చ తౌ రామమాసాద్య
శక్తౌ స్థాతుం కథంచన ।
న చ తౌ రాఘవాదన్యో
హంతుముత్సహతే పుమాన్ ॥
టీక:-
న = కారు; చ = కూడ; తౌ = ఆ రాక్షసులు ఇద్దరు; రామమ్ = రాముని; ఆసాద్య = చేరుటకు; శక్తౌ = సమర్ధులు; స్థాతుమ్ = నిలుచుటకు; కథంచన = ఏవిధముగను; న = కారు; చ = కూడ; రాఘవాత్ = రామునికంటే; అన్యః = వేరొకడు; హంతుమ్ = చంపుటకు; ఉత్సహాత్ = సమర్ధుడు కాడు; పుమాన్ = పురుషుడు.
భావము:-
ఆ రాక్షసులు ఇరువురు రాముని ఎదుర్కొని నిలువజాలరు. వారిని శ్రీ రాముడు తప్ప సంహరింప గల మగవాడు మరియొక లేడు.
1.19.12.
అనుష్టుప్.
వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ
కాలపాశవశం గతౌ ।
రామస్య రాజశార్దూల!
న పర్యాప్తౌ మహాత్మనః ॥
టీక:-
వీర్యః = పరాక్రమము చేత; ఉత్సిక్తౌ = గర్వించినవారు; హి = ఐన; తౌ = ఆ రాక్షసులు; పాపౌ = ఆ పాపాత్ములు; కాలపాశవశమ్ = యమపాశవశమును; గతౌ = పొందినారు; రామస్య = రాముని; అస్య = తో; రాజశార్దూల = ఓరాజశ్రేష్టా; న = కారు; పర్యాప్తౌ = శక్తిసంపన్నులు; మహాత్మనః = పరమాత్ముడు.
భావము:-
మహారాజ! ఆ రాక్షసులు ఇద్దరు బల గర్వం చేత అనేక పాప కార్యములు ఆచరించినారు. వారిద్దరు యమపాశమునకు బందీలు కావలసినదే. మహాత్ముడైన రామునితో వారిద్దరు సరితూగలేరు.
1.19.13.
అనుష్టుప్.
న చ పుత్రకృత స్నేహం
కర్తుమర్హతి పార్థివ! ।
అహం తే ప్రతిజానామి
హతౌ తౌ విద్ధి రాక్షసౌ ॥
టీక:-
న = కాదు; చ = కూడ; పుత్ర = పుత్రునియందు; కృతః = చేసిన; స్నేహమ్ = స్నేహమును; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగినది; పార్ధివ = రాజా; తౌ = ఆ ఇద్దరు; రాక్షసౌ = మారీచసుబాహువులు; హతౌ = మరణింతురని; విధ్ధి = తెలుసుకొనుము.అహమ్ = నేను; తే = నీకు; ప్రతిజానామి = ప్రతిజ్ఞ చేయుచున్నాను.
భావము:-
ఓరాజా! పుత్ర వాత్సల్యము చేత రాముని శక్తి సామర్ధ్యాలను తక్కువగా భావించవలదు. నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆ మారీచ సుబాహువులు యిద్దరు రాముని చేతిలో మరణింతురని తెలిసికొనుము.
1.19.14.
అనుష్టుప్.
అహం వేద్మి మహాత్మానం
రామం సత్యపరాక్రమమ్ ।
వసిష్ఠోఽ పి మహాతేజా
యే చేమే తపసి స్థితాః ॥
టీక:-
అహమ్ = నేను; వేద్మి = ఎరుగుదును; మహాత్మానమ్ = మహాత్ముడు; రామమ్ = రాముని గూర్చి; సత్య = సత్యము; పరాక్రమమ్ = పరాక్రమము కలవాడు; వశిష్టః = వశిష్టుడు; అపి = కూడా; మహాతేజాః = గొప్ప తేజోమూర్తియైనవాడు; యే = ఏ; చ = కూడ; ఇమే = ఇక్కడున్న వీరు; తపసి = తాపస్లు; స్థితాః = ఉన్నవారు. (తెలియుదురు)
భావము:-
మహాత్ముడైన రాముడు సాటిలేని సత్యము, మేటి పరాక్రమము కలవాడు. ఆ విషయము నేను ఎరుగుదును. నేనే కాదు మీ కుల పురోహితుడు మహా తేజస్వి అయిన వశిష్ట మహర్షియు ఎరుగును. ఇక్కడ ఉన్న తాపసులు అందరు ఎరుగుదురు.
1.19.15.
అనుష్టుప్.
యది తే ధర్మలాభం చ
యశశ్చ పరమం భువి ।
స్థితమిచ్ఛసి రాజేంద్ర!
రామం మే దాతుమర్హసి ॥
టీక:-
యది = ఒకవేళ; తే = నీకు; ధర్మః = ధర్మమును; లాభమ్ = కోరుతుంటే; చ = మఱియు; యశః = కీర్తి; చ; పరమం = మిక్కిలి గొప్పవి; భువి = భూలోకమందు; స్థితమ్ = ఉండుటను; ఇచ్ఛసి = కోరుచున్నచో; రాజేంద్ర = మహారాజా; రామమ్ = రాముని; మే = నాకు = దాతుమ్ = ఇచ్చుటకు అర్హసి = తగియున్నావు.
భావము:-
రాజేంద్ర! నీవు ధర్మమును, భూమిపై స్థిర కీర్తిని కోరుకొన్నచో శ్రీ రాముని నావెంట పంపవలసినది.
1.19.16.
అనుష్టుప్.
యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ!
దదతే తవ మంత్రిణః ।
వసిష్ఠప్రముఖాః సర్వే
రాఘవం మే విసర్జయ ॥
టీక:-
యదిః = ఒకవేళ; అనుజ్ఞామ్ = అనుమతిని; కాకుత్స్థ = కాకుత్స్థ వంశమున జన్మించిన రాజా; దధతే = ఇచ్చినట్లు అయితే; తవ = నీయొక్క; మంత్రిణః = మంత్రులు; వశిష్ట = వశిష్టుడు; ప్రముఖాః = మొదలైన ఋషులు; సర్వే = అందరు; రామమ్ = రాముని; విసర్జయ = విడిచి పెట్టుము.
భావము:-
కాకుత్స్థవంశ సంజాతా! మహారాజా! నీ మంత్రులు వశిష్ఠుడు మొదలైన ముని శ్రేష్ఠులు అందరు సమ్మతించినచో రాముని నాతోపాటు పంపించుము.
1.19.17.
అనుష్టుప్.
అభిప్రేతమసంసక్తమ్
ఆత్మజం దాతుమర్హసి ।
దశరాత్రం హి యజ్ఞస్య
రామం రాజీవలోచనమ్ ॥
టీక:-
అభిప్రేతమ్ = నీకు ఇష్టుడైన; అసంసక్తమ్ = ఆలస్యము లేకుండా; ఆత్మజమ్ = నీ పుత్రుని; దాతుమ్ = యిచ్చుటకు; అర్హసి = తగియున్నావు; దశ = పది; రాత్రమ్ = రాత్రులు పట్టు; యజ్ఞః = యజ్ఞమునకు; అస్య = కొఱకు; రామమ్ = రాముని; రాజీవ = పద్మములవంటి; లోచనమ్ = కన్నులు కలవానిని.
భావము:-
నీకు పరమప్రీతిపాత్రుడు, పద్మలోచనుడు ఐన శ్రీరాముని పది దినముల పట్టు యాగరక్షణార్థమై నాకు ఆలస్యము చేయక ఇమ్ము.
1.19.18.
అనుష్టుప్.
నాత్యేతి కాలో యజ్ఞస్య
యథాఽ యం మమ రాఘవ! ।
తథా కురుష్వ భద్రం తే
మా చ శోకే మనః కృథాః!" ॥
టీక:-
నాత్యేతి = దాటకుండ; కాలః = సమయము; యజ్ఞః = యజ్ఞము; అస్య = యొక్క; యథా = ఎట్లు; అయమ్ = ఈ; మమ = నా యొక్క; రాఘవ = రఘువంశ రాజా; తథా = అట్లు; కురుష్వ = చేయుము; భద్రం = భద్రం అగుగాక; తే = నీకు; మా = వద్దు; చ; శోకే = దుఃఖములో; మనః = మనస్సును; కృథాః = చేయుట.
భావము:-
రఘువంశ సంజాతా! దశరథమహారాజా! నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము.నీకు శుభమగుగాక. మనసున కలత చెందకుము.”
1.19.19.
అనుష్టుప్.
ఇత్యేవముక్త్వా ధర్మాత్మా
ధర్మార్థసహితం వచః ।
విరరామ మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ॥
టీక:-
ఇతి = ఈ; ఏవమ్ = విధముగా; ఉక్త్వా = పలికి; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ధర్మ = ధర్మము; అర్ధ = అర్థములతో; సహితమ్ = కూడినది; వచః = మాటలను; విరరామ = విరమించెను; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మునిశ్రేష్టుడు.
భావము:-
ఇట్లు ధర్మాత్ముడు, మహాతేజోశాలి యైన విశ్వామిత్రమహర్షి ధర్మ అర్ధ సహిత విధముగా అలా పలికెను.
1.19.20.
అనుష్టుప్.
స తన్నిశమ్య రాజేంద్రో
విశ్వామిత్రవచః శుభమ్ ।
శోకమభ్యగమత్తీవ్రం
వ్యషీదత భయాన్వితః ॥
టీక:-
సః = ఆయన; తత్ = వాటిని; నిశమ్య = విని; రాజేంద్రః = మహారాజు; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; వచః = మాటలను; శుభమ్ = శుభమును కల్గించు; శోకమ్ = బాధను; అభ్యగమ్ = పాందెను; అతి = మిక్కిలి; తీవ్రమ్ = తీవ్రమైనది; వ్యషీదత = కృంగిపోయెను; భయాన్వితః = భయముతో కూడినవాడై.
భావము:-
రాజేంద్రుడైన దశరథ మహారాజు శుభకరమైన విశ్వామిత్రుని పలుకులను విని, మిక్కిలి తీవ్రమైన శోకమునకు గురయ్యను. భయముతో కృంగిపోయెను.
1.19.21.
జగతి.
ఇతి హృదయమనోవిదారణం
మునివచనం తదతీవ శుశ్రువాన్ ।
నరపతిరభవన్మహాంస్తదా
వ్యథితమనాః ప్రచచాల చాసనాత్ ॥
టీక:-
ఇతి = ఇట్లు; హృదయ = హృదయమును; మనః = మనసును; విదారణమ్ = చీల్చునట్టి; ముని = విశ్వామిత్ర ముని; వచనమ్ = మాటలను; తత్ = ఆ; అతీవ = మిక్కిలి; శుశ్రువాన్ = వినెను; నరపతిః = రాజు; అభవత్ = అయ్యెను; మహాన్ = గొప్పవాడైన; తదా = అప్పుడు; వ్యధిత = బాధ పడిన; మనాః = మనసు కలవాడు; ప్రచచాల = మిక్కిలి చలించెను; చ; ఆసనాత్ = ఆసనమునందు.
భావము:-
ఈవిధముగా వినిన విశ్వామిత్రుని మాటలు దశరథుని మనసును కలచివేసెను. అప్పుడు అతడు అంతులేని మనస్తాపమునకు లోనై మిగుల చలించి పోయెను.
1.19.22.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనవింశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనవింశః [19] = పందొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [19] పందొమ్మిదవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.20.1.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా రాజశార్దూలో
విశ్వామిత్రస్య భాషితమ్ ।
ముహూర్తమివ నిస్సంజ్ఞః
సంజ్ఞావానిదమబ్రవీత్ ॥
టీక:-
తత్ = ఆ; శ్రుత్వా = విని; రాజశార్దూలః = రాజశ్రేష్ఠుడు; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని; భాషితమ్ = మాటలను; ముహూర్తమ్ = ముహూర్తకాలము; ఇవ = పాటు; నిఃసంజ్ఞ = నిశ్చేష్టుడయ్యెను; సంజ్ఞావాన్ = స్పృహను పొంది; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = నుడివెను.
భావము:-
విశ్వామిత్రుని మాటలు విన్న రాజశ్రేష్ఠుడైన దశరథమహారాజు క్షణకాలము నిశ్చేష్టుడాయెను, మరల స్పృహను పొంది ఇట్లు నుడివెను.
1.20.2.
అనుష్టుప్.
ఊనషోడశవర్షో మే
రామో రాజీవలోచనః ।
న యుద్ధయోగ్యతామస్య
పశ్యామి సహ రాక్షసైః ॥
టీక:-
ఊన = కంటె తక్కువ; షోడశ = పదహారు; వర్షః = సంవత్సరములు వయసు వాడు; మే = నా యొక్క; రామః = శ్రీరామాచంద్రమూర్తి; రాజీవలోచనః = పద్మములు వంటి కన్నులు గలవాడు; న = లేదు; యుద్ధ = యుద్ధము చేయుటకు; యోగ్యతామ్ = అర్హతలు; అస్య = ఇతనికి; పశ్యామి = చూచుట; సహ = కూడి; రాక్షసైః = రాక్షసులతో;
భావము:-
రాజీవలోచనుడైన చంద్రునికి ఇంకా పదహారు ఏళ్ళైనా నిండలేదు. రాక్షసులతో యుద్ధము చేయటకు అర్హత లేదు.
గమనిక:-
యుద్దంలో పాల్గొనుటకు పదహారేండ్లు నిండవలె.
1.20.3.
అనుష్టుప్.
ఇయమక్షౌహిణీ పూర్ణా
యస్యాహం పతిరీశ్వరః ।
అనయా సంవృతో గత్వా
యోద్ధాఽ హం తైర్నిశాచరైః ॥
టీక:-
ఇయమ్ = ఈ; అక్షౌహిణీ = అక్షౌహిణి సైన్యము; పూర్ణా = పూర్తిగా; యస్య = దేనికి; అహం = నేను; పతిః = అధిపతినో; ఈశ్వరః = నియమించువాడనో; అనయా = ఈ సైన్యముతో; సంవృతః = కూడినవాడినై; గత్వా = వెళ్ళి; యోద్ధా = యుద్ధము చేసెదను; అహం = నేను; తైః = ఆ; నిశాచరైః = నిశాచరులతో;
భావము:-
పూర్తి అక్షౌహిణి సైన్యమునకు అధిపతిని, ప్రభువును ఐన నేను, స్వయముగా సైన్యంతోపాటు వచ్చి ఆ రాక్షసులతో పోరాడెదను.
1.20.4.
అనుష్టుప్.
* ఇమే శూరాశ్చ విక్రాంతా
భృత్యా మేఽ స్త్రవిశారదాః ।
యోగ్యా రక్షోగణైర్యోద్ధుం
న రామం నేతుమర్హసి ॥
టీక:-
ఇమే = ఈ (సైనికులు); శూరాః = శూరులు; చ = మఱియు; విక్రాన్తాః = పరాక్రమశాలురు; భృత్యాః = భృత్యులైన; మే = నా యొక్క; అస్త్రః= అస్త్రవిద్యయందు; విశారదాః = నేర్పరులు; యోగ్యాః = యోగ్యులు; రక్షః = రాక్షస; గణైః = గణములతో; యోద్ధుమ్ = యుద్ధము చేయుటకు; న = కాదు; రామం = శ్రీరాముని; నేతుమ్ = తీసుకువెళ్ళుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
నా భృత్యులైన ఈ సైనికులు శూరులు, పరాక్రమశాలురు, అస్త్రవిద్యా నేర్పరులు. వీరు ఆ క్రూరరాక్షసులతో యుద్ధము చేయుటకు తగినవారు. నా శ్రీరాముడిని తీసుకునివెళ్ళవలదు.
1.20.5.
అనుష్టుప్.
అహమేవ ధనుష్పాణిః
గోప్తా సమరమూర్దని ।
యావత్ప్రాణాన్ ధరిష్యామి
తావద్యోత్స్యే నిశాచరైః ॥
టీక:-
అహమేవ = నేనే; ధనుష్= ధనుర్బాణములను; పాణిః = చేతబూనిన వాడినై; గోప్తా = రక్షించెదను; సమర = యుద్ధరంగములో; మూర్ధని = ముందుండి; యావత్ = ఎంతవరకు; ప్రాణాన్ = ప్రాణములు; ధరిష్యామి = పొంది ఉండెదనో; తావత్ = అంతవరకు; యోత్స్యే = యుద్ధము చేసెదను; నిశాచరైః = నిశాచరులతో;
భావము:-
నేనే స్వయముగా ధనుర్బాణములు చేతబూని యాగమును రక్షించెదను. నేను ఎంతవరకు ప్రాణములతో ఉండెదనో అంతవరకు రాక్షసులతో యుద్ధము చేసెదను.
1.20.6.
అనుష్టుప్.
* నిర్విఘ్నా వ్రతచర్యా సా
భవిష్యతి సురక్షితా ।
అహం తత్ర గమిష్యామి
న రామం నేతుమర్హసి ॥
టీక:-
నిర్విఘ్నా = విఘ్నములు లేకుండ; వ్రతచర్యా = యాగవ్రత దీక్ష; సా = ఆ; భవిష్యతి = కాగలదు; సురక్షితా = బాగుగా రక్షింపబడినదై; అహం = నేను; తత్ర = అక్కడకు; ఆగమిష్యామి = వచ్చెదను; న = కాదు; రామం = శ్రీరాముని; నేతుమ్ = తీసుకువెళ్ళుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
నేను అచటకు వచ్చి మీ యజ్ఞవ్రతదీక్ష సురక్షితముగా, నిర్విఘ్నముగా జరుగునట్లు చేసెదను. మీరు నా శ్రీరాముడిని తీసుకునివెళ్ళుట తగదు.
1.20.7.
అనుష్టుప్.
బాలోహ్యకృత విద్యశ్చ
న చ వేత్తి బలాబలమ్ ।
న చాస్త్రబలసంయుక్తో
న చ యుద్ధవిశారదః ।
న చాసౌ రక్షసాం యోగ్యః
కూటయుద్ధా హి తే భృశమ్ ॥
టీక:-
బాలః = బాలుడు; హి = ఏలననగా; అకృత = పూర్తిగా నేర్వని; విద్యః = విద్య కలవాడు; చ; న = కాడు; చ; వేత్తి = తెలిసినవాడు; బలాబలమ్ = బలాబలములు; న = కాడు; చ; అస్త్రబల = అస్త్రబలముతో; సంయుక్తః = కూడినవాడు; న = కాడు; చ; యుద్ధ = యుద్ధమునందు; విశారదః = కౌశలము కలవాడు; న = కాడు; చ; అసౌ = ఇతడు; రక్షసాం = రాక్షసులకు; యోగ్యః = తగినవాడు; కూట = కపట; యుద్ధాః = యుద్ధము చేయువారు; హి; తే = వారు; ధ్రువమ్ = మిక్కిలి.
భావము:-
శ్రీరాముడు బాలుడు, ఇంకా పూర్తిగా విద్యలు నేర్వనివాడు. శత్రువుల బలాబలములు గుర్తింపజాలడు. అస్త్రబలము బాగుగా లేనివాడు. యుద్ధములో నేర్పరి కాడు. బాగా కపటయుద్ధము చేయు ఆ రాక్షసులతో యుద్ధము చేయుటకు ఈతడు సమర్థుడు కాడు అనునది నిశ్చయము.
1.20.8.
అనుష్టుప్.
* విప్రయుక్తో హి రామేణ
ముహూర్తమపి నోత్సహే ।
జీవితుం మునిశార్దూల!
న రామం నేతుమర్హసి ॥
టీక:-
విప్రయుక్తః+హి = వేఱుచేయబడినవాడినై; రామేణ = శ్రీరామునితో; ముహూర్తమ్ = క్షణకాలము; అపి = కూడా; న = లేదు; ఉత్సహే = ఉత్సాహము; జీవితుం = జీవించుటకు; మునిశార్దూల = మునిశ్రేష్ఠా; న = కాదు; రామం = శ్రీరాముని; నేతుమ్ = తీసుకువెళ్ళుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
ఓ మునీశ్వర! శ్రీరాముని విడిచి నేను క్షణకాలముకూడ జీవించి ఉండజాలను. నా శ్రీరాముడిని తీసుకునివెళ్ళుట తగదు.
1.20.9.
అనుష్టుప్.
యది వా రాఘవం బ్రహ్మన్!
నేతుమిచ్ఛసి సువ్రత ।
చతురంగ సమాయుక్తం
మయా చ సహితం నయ ॥
టీక:-
యది = అయినచో; వా = లేక; రాఘవం = శ్రీరాముని; బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షి; నేతుమ్ = తీసుకుని వెళ్ళుటకు; ఇచ్ఛసి = ఇచ్చ కలిగినవాడవైన; సువ్రత = మంచి వ్రతముకలిగినవాడ; చతురంగ = చతురంగ బలములతో; సమాయుక్తమ్ = కూడిన; మయా = నాతో; చ; సహితం = సహితముగా; నయ = తీసుకుని వెళ్ళుము;
భావము:-
వ్రతదీక్షలోనున్న ఓ బ్రహ్మర్షి, నీవు కనుక శ్రీరాముని తీసుకు వెళ్ళదలిచినచో, వానితోపాటు చతురంగ బలగములతో కూడిన నన్నుకూడ తీసుకొనివెళ్ళుము.
1.20.10.
అనుష్టుప్.
* షష్టిర్వర్షసహస్రాణి
జాతస్య మమ కౌశిక ।
దుఃఖేనోత్పాదితశ్చాయం
న రామం నేతుమర్హసి ॥
టీక:-
షష్టిర్వర్షసహస్రాణి = షష్టిః+వర్ష+సహస్రాణి, అఱువదివేల సంవత్సరములు; జాతస్య = పుట్టిన; మమ = నాకు; కౌశిక = విశ్వామిత్ర; దుఃఖేన = ఎంతో శ్రమతో; ఉత్పాదితః = పుట్టినవాడు; చ; అయమ్ = ఈతడు; న = కాదు; రామం = శ్రీరాముని; నేతుమ్ = తీసుకువెళ్ళుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
ఓ విశ్వామిత్ర మహర్షి! అఱువదివేల సంవత్సరముల తరువాత అశ్వమేధ, పుత్రకామేష్టి వంటి యజ్ఞశ్రమ వలన ఈ శ్రీ రామచంద్రుడు నాకు జన్మించినాడు, నా శ్రీరాముడిని తీసుకుని వెళ్ళుట తగదు.
1.20.11.
అనుష్టుప్.
* చతుర్ణామాత్మజానాం హి
ప్రీతిః పరమికా మమ ।
జ్యేష్ఠం ధర్మప్రధానం చ
న రామం నేతుమర్హసి॥
టీక:-
చతుర్ణామ్ = నలుగురు; ఆత్మజానాం = పుత్రులలో; హి = మాత్రమే; ప్రీతిః = ప్రీతిపాత్రుడు; పరమికా = మిక్కిలి; మమ = నాకు; జ్యేష్ఠం = పెద్దవాడు; ధర్మప్రధానం = ధర్మవిషయములో ముఖ్యుడు; చ = కూడ; న = కాదు; రామం = శ్రీరాముని; నేతుమ్ = తీసుకువెళ్ళుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
నాకు కలిగిన నలుగురు కుమారులలో శ్రీరాముడనినే నాకు మిక్కిలి ప్రీతి. జ్యేష్ఠుడు ధర్మపరముగా ముఖ్యుడు అయిన నా శ్రీరాముడిని తీసుకుని వెళ్ళుట తగదు.
1.20.12.
అనుష్టుప్.
కింవీర్యా రాక్షసాస్తే చ
కస్య పుత్రాశ్చ కే చ తే ।
కథంప్రమాణాః కే చైతాన్
రక్షంతి మునిపుంగవ! ॥
టీక:-
కిం = ఏట్టి; వీర్యాః = పరాక్రమము కలవారు?; రాక్షసా = రాక్షసులు; తే = వారు; చ = ఇంకను; కస్య = ఎవని; పుత్రాః = పుత్రులు; చ = ఇంకా; కే = ఎవరు?; చ; తే = వారు; కథమ్ = ఎంత?; ప్రమాణాః = స్థాయి; కే = ఎవరు; చ = ఇంకా; ఏతాన్ = వీరిని; రక్షంతి = రక్షించుచున్నవారు; మునిపుంగవ = ఓ మునిశ్రేష్ఠ;
భావము:-
ఓ మునీశ్వరా! ఆ రాక్షసులు ఎవరు? వారి పరాక్రమము ఎట్టిది? వారు ఎవరి పుత్రులు? వారి స్థాయిఎంత? వారిని రక్షించు వారెవరు?
1.20.13.
అనుష్టుప్.
కథం చ ప్రతికర్తవ్యం
తేషాం రామేణ రక్షసామ్ ।
మామకైర్వా బలైర్బ్రహ్మన్!
మయా వా కూటయోధినామ్ ॥
టీక:-
కథం = ఏవిధముగా; చ; ప్రతికర్తవ్యమ్ = ఎదుర్కొనవలయును; తేషాం = వారిని; రామేణ = శ్రీరామునిచే; రక్షసామ్ = రాక్షసులను; మామకైః = నాయొక్క; వా = లేక; బలైః = బలగముల చేత; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా; మయా = నాచే; వా = లేక; కూటయోధినామ్ = కపటయుద్ధముచేయువారిని.
భావము:-
ఓ విశ్వామిత్ర మహర్షి! కపట యుద్ధము చేయుటలో ఆరితేరిన ఆ రాక్షసులను శ్రీరాముడు లేక, నేను, లేక, నా సైన్యముగాని ఎట్లు ఎదుర్కొనవలెను?
1.20.14.
అనుష్టుప్.
సర్వం మే శంస భగవన్!
కథం తేషాం మయా రణే ।
స్థాతవ్యం దుష్టభావానాం
వీర్యోత్సిక్తా హి రాక్షసా" ॥
టీక:-
సర్వం = ఈ విషయము నంతయు; మే = నాకు; శంస = వివరించుము; భగవన్! = ఓ పూజ్యనీయుడా; కథం = ఏవిధముగా; తేషాం = వారిని; మయా = నాచే; రణే = రణమునందు; స్థాతవ్యం = ఉండదగినది; దుష్టభావానామ్ = దుష్టస్వభావము కలిగిన వారి; వీర్యః = బలపరాక్రమముచే; ఉత్సిక్తాః = విఱ్ఱవీగుచున్న వారు; హి = ఐన; రాక్షసా = రాక్షసులను.
భావము:-
ఓ పూజ్య మునీశ్వరా! బలపరాక్రమముచే విఱ్ఱవీగుచు, దుష్టస్వభావము కలిగిన ఆ రాక్షసులతో నేను ఏవిధముగా నడచుకొనవలెను? ఈ విషయములన్నియు నాకు వివరింపుము.
1.20.15.
అనుష్టుప్.
తస్య తద్వచనం శ్రుత్వా
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీక:-
తస్య = అతనియొక్క; తత్+వచనం = ఆ పలుకులను; శ్రుత్వా = విని; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభ్యభాషత = ఇట్లు పలికెను;
భావము:-
దశరథమహారాజు మాటలను విన్న విశ్వామిత్ర మహర్షి ఇట్లు నుడివెను.
1.20.16.
అనుష్టుప్.
“పౌలస్త్యవంశప్రభవో
రావణో నామ రాక్షసః ।
స బ్రహ్మణా దత్తవరః
త్రైలోక్యం బాధతే భృశమ్ ॥
టీక:-
పౌలస్త్య = పౌలస్త్యుని; వంశ = వంశములో; ప్రభవః = జన్మించినవాడు; రావణః = రావణుడు; నామ = పేరుగల; రాక్షసః = రాక్షసుడు; సః = అతడు; బ్రహ్మణా = బ్రహ్మదేవునిచే; దత్తవరః = వరములు పొందినవాడు; త్రైలోక్యం = ముల్లోకములను; బాధతే = బాధించుచున్నాడు; భృశమ్ = చాలా.
భావము:-
“పౌలస్త్యవంశమునందు జన్మించిన రావణుడు అను పేరు గల రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరములు పొంది ముల్లోకములను బాధించుచున్నాడు.
1.20.17.
అనుష్టుప్.
మహాబలో మహావీర్యో
రాక్షసైర్బహుభిర్వృతః ।
శ్రూయతే హి మహావీర్యో
రావణో రాక్షసాధిపః ॥
టీక:-
మహాబలః = గొప్ప బలవంతుడు; మహావీర్యః = మిక్కిలి పరాక్రమవంతుడు; రాక్షసైః = రాక్షసులు; బహుభిః = అనేకులతో; వృతః = కూడినవాడు; శ్రూయతే = వినబడుచున్నాడు; హి; మహావీర్యః = మిక్కిలి పరాక్రమవంతుడుగా; రావణః = రావణుడు; రాక్షసాధిపః = రాక్షసాధిపతి;
భావము:-
రావణుడు గొప్పబలవంతుడు, మిక్కిలి వీర్యవంతుడు. అనేకమంది రాక్షసులతో కూడి రాక్షాసాధిపతి అయిన ఆ రావణుడు మిక్కిలి పరాక్రమవంతుడుగా లోకములలోను ప్రసిద్దుడు.
1.20.18.
అనుష్టుప్.
సాక్షాద్వైశ్రవణభ్రాతా
పుత్రో విశ్రవసో మునేః ।
యదా స్వయం న యజ్ఞస్య
విఘ్నకర్తా మహాబలః ॥
టీక:-
సాక్షాత్ = సాక్షాత్తుగా; వైశ్రవణ = కుబేరుని; భ్రాతా = సోదరుడు; పుత్రః = పుత్రుడు; విశ్రవసః = విశ్రవసుడు; మునేః = మునియొక్క; యదా = ఎప్పుడు; స్వయం = స్వయముగా; న = కాడు; యజ్ఞస్య = యజ్ఞమునకు; విఘ్నకర్తా = విఘ్నము చేయువాడు; మహాబలః = గొప్ప బలవంతుడు;
భావము:-
రావణుడు సాక్షాత్తుగా కుబేరుని సోదరుడు, విశ్రవసుముని పుత్రుడు. ఎన్నడు స్వయముగా యజ్ఞమునకు విఘ్నము చేయడు.
1.20.19.
అనుష్టుప్.
తేన సంచోదితౌ ద్వౌ తు
రాక్షసౌ వై మహాబలౌ ।
మారీచశ్చ సుబాహుశ్చ
యజ్ఞవిఘ్నం కరిష్యతః" ॥
టీక:-
తేన = వానిచేత; సంచోదితౌ = ప్రేరీపింపబడిన; ద్వౌ = ఇరువురు; తు; రాక్షసౌ = రాక్షసులు; వై; మహాబలౌ = మిక్కిలి బలముగల; మారీచః = మారీచుడు; చ; సుబాహుః = సుబాహువు; చ; యజ్ఞ = యజ్ఞమునకు; విఘ్నమ్ = విఘ్నములు; కరిష్యతః = చేయుదురు.
భావము:-
ఆ రావణునిచే ప్రేరెపించబడి మారీచుడు, సుబాహువు అనెడు మిక్కిలి బలవంతులైన ఇరువురు రాక్షసులు యజ్ఞములకు విఘ్నములు కలిగించుచున్నారు".
1.20.20.
అనుష్టుప్.
ఇత్యుక్తో మునినా తేన
రాజోవాచ మునిం తదా ।
“న హి శక్తోఽ స్మి సంగ్రామే
స్థాతుం తస్య దురాత్మనః ॥
టీక:-
ఇతి = ఈ విధముగ; ఉక్తః = పలుకబడిన; మునినా = మునిచే; తేన = ఆ; రాజ = దశరథ మహారాజు; ఉవాచ = పలికెను; మునిం = మునితో; తదా = అప్పుడు; న = కాను; హి = తప్పక; శక్తః = సమర్థుడను; అస్మి = నేను; సమగ్రామే = సంగ్రామమునందు; స్థాతుం = నిలుచుటకు; తస్య = ఆ; దురాత్మనః = దురాత్మునకు.
భావము:-
విశ్వామిత్రుని మాటలు విన్న దశరథ మహారాజు ఆ మునితో ఇట్లనెను. "నేను సంగ్రామములో ఆ దురాత్ముని యెదుట నిలువజాలను, అశక్తుడను.
1.20.21.
అనుష్టుప్.
స త్వం ప్రసాదం ధర్మజ్ఞ
కురుష్వ మమ పుత్రకే ।
మమ చైవాల్పభాగ్యస్య
దైవతం హి భవాన్ గురుః ॥
టీక:-
సః = ఆ; త్వం = నీవు; ప్రసాదం = అనుగ్రహమును; ధర్మజ్ఞ = ధర్మములు తెలిసిన; కురుష్వ = చేయుము; మమ = నాయొక్క; పుత్రకే = పుత్రునియందు; మమ = నా యందును; చ; ఏవ = ఈ; అల్పభాగ్యస్య = అల్పభాగ్యుని; దైవతం = దైవము; హి = కదా; భవాన్ = నీవు; గురుః = గురువైన;
భావము:-
సకల ధర్మములు ఎఱిగిన ఓ మునీంద్రా! నీవు నా పుత్రుని, (మీ అజ్ఞ పాటించలేని) అల్పభాగ్యుడినైన నన్ను అనుగ్రహింపుము. గురువువైన నీవు నాపాలిటి దైవము కదా!
1.20.22.
అనుష్టుప్.
దేవదానవగంధర్వా
యక్షాః పతగ పన్నగాః ।
న శక్తా రావణం సోఢుం
కిం పునర్మానవా యుధి ॥
టీక:-
దేవః = దేవతలు; దానవః = దానవులు; గంధర్వా = గంధర్వులు; యక్షాః = యక్షులు; పతగః = పక్షులు,; పన్నగాః = పక్షులు, సర్పములు; న శక్తా = అశక్తులు; రావణం = రావణుని; సోఢుమ్ = సహించుటకు (ఎదిరించుటకు); కిం = ఏల?; పునః = మఱల చెప్పట; మానవాః = మానవులు; యుధి = సమరమునందు;
భావము:-
దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, పక్షులు, పాములు యుద్ధమునందు రావణుని ఎదిరించి నిలుచుటకు సమర్థులు కారు. ఇక మానవుల సంగతి చెప్పనేల?
1.20.23.
అనుష్టుప్.
స హి వీర్యవతాం వీర్యమ్
ఆదత్తే యుధి రాక్షసః ।
తేన చాహం న శక్నోమి
సంయోద్ధుం తస్య వా బలైః ।
సబలో వా మునిశ్రేష్ఠ!
సహితో వా మమాత్మజైః ॥
టీక:-
సః = అతడు; హి; వీర్యవతాం = వీరుల; వీర్యమ్ = పరాక్రమమును; ఆదత్తే = గ్రహించి; యుధి = యుద్ధములో; రాక్షసః = రాక్షసుడు; తేన = వానితో కాని; చ; అహం = నేను; న = కాదు; శక్తః = సమర్థుడను; అస్మి = నేను; సంయోద్ధుం = యుద్ధము చేయుటకు; తస్య = అతనియొక్క; వా = కాని; బలైః = బలగములతో; స = సహితముగా నున్న; బలః = సైన్యము కలవాడను; వా = ఐనను; మునిశ్రేష్ఠ! = మునులలో గొప్పవాడా; సహితః = కూడినవాడను; వా = ఐనను; మమ = నాయొక్క; ఆత్మజైః = పుత్రులతో.
భావము:-
మునులలో గొప్పవాడివైన ఓ విశ్వామిత్రా! ఆ రాక్షసుడు యుద్ధములో ప్రతిపక్షవీరుల పరాక్రమము తెలుసుకుని యుద్ధము చేయును. అతనితో గాని, అతని సైన్యముతో కాని నేను స్వయముగా గాని, నా బలగము, సైన్యములతో కూడిగాని, నా పుత్రులతో కూడిగాని యుద్ధము చేయజాలను.
1.20.24.
అనుష్టుప్.
కథమప్యమరప్రఖ్యం
సంగ్రామాణామకోవిదమ్ ।
బాలం మే తనయం బ్రహ్మన్!
నైవ దాస్యామి పుత్రకమ్ ॥
టీక:-
కథమ్ = ఏ విధముగ; అపి = ఐనను; అమర = సురలతో; ప్రఖ్యమ్ = సమానుడును; సంగ్రామాణామ్ = యుద్ధములందు; అకోవిదమ్ = పరిపూర్ణుడు కాని; బాలం = బాలుని; మే = నా; తనయం = తనయుని; బ్రహ్మన్! = ఓ బ్రాహ్మణోత్తమ; న = చేయలేను; ఏవ = ఏమాత్రము; దాస్యామి = ఇచ్చుట; పుత్రకమ్ = సుతుని.
భావము:-
ఓ బ్రాహ్మణోత్తమ! సురలతో సమానుడు, యుద్ధవిద్యలలో ఇంకను ఆఱితేరని వాడు అయిన నా కుమారుని మీకు ఇవ్వజాలను.
1.20.25.
అనుష్టుప్.
అథ కాలోపమౌ యుద్ధే
సుతౌ సున్దోపసుందయోః ।
యజ్ఞవిఘ్నకరౌ తౌ తే
నైవ దాస్యామి పుత్రకమ్ ॥
టీక:-
అథ = మఱియును; కాలః = యమునితో; ఉపమౌ = సమానులు; యుద్ధే = యుద్ధమందు; సుతౌ = పుత్రులు; సున్దోపసుందయోః = సుందుడు, ఉపసుందుల; యజ్ఞః = యజ్ఞమునకు; విఘ్నమ్ = ఆటంకము; కరౌ = కల్పించువారు; తౌ = వారిద్దరు; తే = నీ యొక్క; న = చేయలేను; ఏవ = ఏమాత్రము; దాస్యామి = ఇచ్చుట; పుత్రకమ్ = నా పుత్రుని.
భావము:-
ఓ విశ్వామిత్రా! నీ యజ్ఞమునకు ఆటంకములు కలిగించుచున్న మారీచ సుబాహువులు సుందోపసుందుల పుత్రులు. వారు యుద్ధములో యముడితో సమానులు. అందుచే నా పుత్రుని నీకు ఇవ్వజాలను.
1.20.26.
అనుష్టుప్.
మారీచశ్చ సుబాహుశ్చ
వీర్యవన్తౌ సుశిక్షితౌ ।
తయోరన్యతరేణాహం
యోద్ధా స్యాం ససుహృద్గణః" ॥
టీక:-
మారీచః = మారీచుడును; చ; సుబాహుః = సుబాహువును; చ; వీర్యవన్తౌ = వీర్యవంతులు; సుశిక్షితౌ = మంచి శిక్షణ పొందినవారు; తయోః = వారిలో; అన్యతరేణ = ఒకరితో; అహమ్ = నేను; యోద్ధా = యుద్ధము చేయువాడను; స్యామ్ = అగుదును; ససుహృద్గణః = నా మిత్రసముదాయములతో కూడి;
భావము:-
మారీచ, సుబాహువులు వీర్యవంతులు మఱియు మంచి శిక్షణ పొందినవారు. నేను నా మిత్రబలగములతో కూడి, వారిరువురిలో ఒకనితో మాత్రము తలపడగలను.
1.20.27.
జగతి.
ఇతి నరపతిజల్పనాద్ద్విజేంద్రం
కుశికసుతం సుమహాన్ వివేశ మన్యుః ।
సుహుత ఇవ సమిద్భిరాజ్యసిక్తః
సమభవదుజ్జ్వలితో మహర్షివహ్నిః ॥
టీక:-
ఇతి = ఈ విధముగా; నరపతి = మహారాజు; జల్పనాత్ = వ్యర్థప్రసంగము వలన; ద్విజేంద్రం = ద్విజులలో శ్రేష్ఠుడైన; కుశికసుతం = కుశికపుత్రుడు విశ్వామిత్రుని; సుమహాన్ = చాలా గొప్పదైన; వివేశ = ఆవహించెను; మన్యుః = క్రోధము; సుహుతః = చక్కని హోమములో; ఇవ = వలె; సమిద్భిః = సమిధ; ఆజ్యసిక్తః = నేతిలో తడుపబడిన; సమభవత్ = అయ్యెను; ఉజ్జ్వలితః = ప్రజ్వలించినది; మహర్షి = మహర్షి; వహ్నిః = అగ్ని;
భావము:-
ఈ విధమైన దశరథ మహారాజు వ్యర్థప్రలాపములు వినిన ద్విజశ్రేష్ఠుడు విశ్వామిత్ర మహర్షి చాలా కోపముతో వివశుడయ్యెను. మంచిహోమాగ్నిలో నేతిలో తడిపిన సమిధ ప్రజ్వలించునట్లు విశ్వామిత్రమహర్షి అను అగ్ని ప్రజ్వలించెను.
1.20.28.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
వింశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; వింశః [20] = ఇరవైయవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [20] ఇరవైయవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.21.1.
అనుష్టుప్.
తచ్ఛ్రుత్వా వచనం తస్య
స్నేహపర్యాకులాక్షరమ్ ।
సమన్యుః కౌశికో వాక్యం
ప్రత్యువాచ మహీపతిమ్ ॥
టీక:-
తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనం = మాటను; తస్య = అతని యొక్క; స్నేహ = వాత్సల్యము వలన; పర్యాకులాః = తడబడుచున్న; అక్షరమ్ = పలుకులు కల; సమన్యుః = కోపముతో కూడిన; కౌశికః = విశ్వామిత్రుడు; వాక్యమ్ = మాటను; ప్రత్యువాచ = బదులు పలికెను; మహీపతిమ్ = రాజుతో.
భావము:-
పుత్రవాత్సల్యముచే తడబడుచున్న దశరథుని మాటలను విని, విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై, అతనితో ఇట్లు బదులు పలికెను,
1.21.2.
అనుష్టుప్.
"పూర్వమర్థం ప్రతిశ్రుత్య
ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి ।
రాఘవాణామయుక్తోఽ యం
కులస్యాస్య విపర్యయః ॥
టీక:-
పూర్వమ్ = ముందుగా; అర్థం = కార్యమును; ప్రతిశ్రుత్య = పలుకబడిన; ప్రతిజ్ఞాం = ప్రతిజ్ఞను; హాతుమ్ = వీడుచుటకు; ఇచ్ఛసి = కోరుతున్నావు; రాఘవాణామ్ = రఘువంశజులకు; అయుక్తః = తగనిది; అయం = ఈ; కులస్య = కులమునకు; విపర్యయః = వ్యతిక్రమము.
భావము:-
అడిగిన కార్యము చేసెదనని ముందుగా వాగ్దానము చేసి తరువాత వాగ్ధానభంగం చేయ తలుస్తున్నావు. ఇట్టి ప్రతిజ్ఞాభంగము రఘువంశజులకు తగినది కాదు.
1.21.3.
అనుష్టుప్.
యదీదం తే క్షమం రాజన్
గమిష్యామి యథాగతమ్ ।
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్స్థ!
సుఖీ భవ సబాంధవః" ॥
టీక:-
యది = ఒకవేళ; ఇదం = ఇది; తే = నీకు; క్షమం = తగినదైతే / యుక్తమైతే; రాజన్ = రాజా; గమిష్యామి = వెళ్ళెదను; యథాగతమ్ = వచ్చినట్లే; మిథ్యా = అబద్ధపు; ప్రతిజ్ఞః = ప్రమాణము గల; కాకుత్స్థ = కాకుత్స్థ వంశజుడా; సుఖీ = సుఖముగా; భవ = ఉండుము; సబాంధవః = బంధువులతో కూడి.
భావము:-
దశరథా! నీకు ఇది తగినది అని అనిపించినచో; నేను వెనుదిరిగి వెళ్ళెదను; ఇచ్చిన మాట తప్పే ఓ కాకుత్స్థ వంశజుడా ! నీవు నీ బంధువులతో కూడి సుఖముగా నుండుము.
గమనిక:-
*- కాకుత్స్థ వంశస్థులు సత్యంసధులు, ఆ వంశంలో పుట్టిన నువ్వు అసత్య మార్గంలో (మిథ్యాప్రతిజ్ఞ) ఉంటానంటే అంటున్నాడు విశ్వామిత్రుడు.
1.21.4.
అనుష్టుప్.
తస్య రోషపరీతస్య
విశ్వామిత్రస్య ధీమతః ।
చచాల వసుధా కృత్స్నా
వివేశ చ భయం సురాన్ ॥
టీక:-
తస్య = అతని; రోష = కోపము; పరీతస్య = ఆవహించిన; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని; ధీమతః = ధీమంతుడైన; చచాల = కంపించెను; వసుధా = భూమి; కృత్స్నా = అంతయు; వివేశ = ప్రవేశించెను; భయం = భయము; సురాన్ = దేవతలను.
భావము:-
ధీమంతుడైన విశ్వామిత్రుని కోపము ఆవహించగా, భూమి సమస్తము కంపించెను, దేవతలకు భయము కలిగెను.
1.21.5.
అనుష్టుప్.
త్రస్తరూపం స విజ్ఞాయ
జగత్సర్వం మహానృషిః ।
నృపతిం సువ్రతో ధీరో
వసిష్ఠో వాక్యమబ్రవీత్ ॥
టీక:-
త్రస్త = భయంకంపితమైన; రూపం = స్వరూపం; స = దానిని; విజ్ఞాయ = ఎరిగి; జగత్ = లోకము; సర్వం = అంతయు; మహాన్ = గొప్ప; ఋషిః = ఋర్షి; నృపతిం = రాజుగారితో; సువ్రతః = చక్కటివ్రతములు ఆచరించు వాడు; ధీరః = ధీరుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను;
భావము:-
లోకమంతయు భయకంపితమగుట గ్రహించి; చక్కటి వ్రతములు ఆచరించు వాడును, ధీరుడును అయిన వసిష్ఠుడు దశరథునితో ఇలా చెప్పెను.
1.21.6.
అనుష్టుప్.
"ఇక్ష్వాకూణాం కులే జాతః
సాక్షాద్ధర్మ ఇవాపరః ।
ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్
న ధర్మం హాతుమర్హసి ॥
టీక:-
ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకులకు చెందిన; కులే = వంశమునందు; జాతః = జన్మించినావు; సాక్షాత్ = సాక్షాత్తుగా; ధర్మ = ధర్మము; ఇవ = వంటి; అపరః = రెండవ; ధృతిమాన్ = నిశ్చలచిత్తుడువు; సువ్రతః = మంచి వ్రతసంపన్నుడవు; శ్రీమాన్ = శ్రీమంతుడవు; న = కాదు; ధర్మం = ధర్మమును; హాతుమ్ = విడుచుటకు; అర్హసి = అర్హుడవు;
భావము:-
రాజా దశరథా! నీవు ఇక్ష్వాకుల వంశములో జన్మించినవాడవు, సాక్షాత్తుగా ధర్మదేవత ప్రతిరూపం వాడవు, నిశ్చలచిత్తుడువు, ఉత్తమవ్రత సంపన్నుడవు, శ్రీమంతుడవు. ధర్మము విడుచుట నీకు తగదు.
1.21.7.
అనుష్టుప్.
త్రిషు లోకేషు విఖ్యాతో
ధర్మాత్మా ఇతి రాఘవః! ।
స్వధర్మం ప్రతిపద్యస్వ
నాధర్మం వోఢుమర్హసి ॥
టీక:-
త్రిషు = మూడు; లోకేషు = లోకములందును; విఖ్యాతః = ఖ్యాతి నొందిన వాడవు; ధర్మాత్మః = ధర్మాత్ముడవు; ఇతి = అని; రాఘవ = దశరథా; స్వధర్మం = స్వధర్మమును; ప్రతిపద్యస్వ = పొందుము; న = కాదు; అధర్మం = అధర్మమును; వోఢుమ్ = వహించుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
దశరథా! ముల్లోకములందును నీవు ధర్మాత్ముడని ప్రసిద్ధి నొంది యున్నావు, స్వధర్మమును ఆచరించుము, అధర్మము నాచరించుట నీకు తగదు.
1.21.8.
అనుష్టుప్.
సంశ్రుత్యైవం కరిష్యామీ -
త్యకుర్వాణస్య రాఘవ! ।
ఇష్టాపూర్తవధో భూయాత్
తస్మాద్రామం విసర్జయ ॥
టీక:-
సంశ్రుత్య = మాట ఇచ్చి; ఏవం = ఇట్లు; కరిష్యామి = చేసెదను; ఇతి = అని; అకుర్వాణస్య = చేయని వానికి; రాఘవ = దశరథా; ఇష్టాపూర్త = పంచమహాయిష్టులు మఱియు షడ్విధపూర్తములు ఆచరించుట చేయుట వలన కలిగిన పుణ్యఫలము; వధాః = వినాశము; భూయాత్ = అగును; తస్మాత్ = అందువలన; రామమ్ = రాముని; విసర్జయ = పంపుము;
భావము:-
దశరథా! ముందుగా చేసెదనని వాగ్దానము చేసి అట్లు చేయని వానికి, ఇష్టాపూర్తముల చేయుట వలన కలిగిన పుణ్యము నశించును, కావున విశ్వామిత్రునితో రాముని పంపుము.
గమనిక:-
*- ఇష్టాపూర్తము- 1. బ్రహ్మయజ్ఞము (అధ్యాపనము), 2. పితృయజ్ఞము (తర్పణము), 3. దేవయజ్ఞము (హోమము), 4. భూతయజ్ఞము (బలి), 5. నృయజ్ఞము (అతిథిపూజ) అను ఈ ఐదు ఇష్టము. వాపీ (కోనేరు) కూప (నుయ్యి, బావి) తటాక (చెరువు) ఆరామ (ఉపవనము) దేవాలయ (గుడి) నిర్మాణ (నిర్మించుట) మఱియు అన్నదానము అను ఈ అయిదు పూర్తము.
1.21.9.
అనుష్టుప్.
కృతాస్త్రమకృతాస్త్రం వా
నైనం శక్ష్యంతి రాక్షసా ।
గుప్తం కుశికపుత్రేణ
జ్వలనే నామృతం యథా ॥
టీక:-
కృతాస్త్రమ్ = అస్త్రవిద్య నేర్చినవాడు; అకృతాస్త్రం = అస్త్రవిద్య నేర్వనివాడు = అయినను; న = కారు; ఏనం = ఇతనిని; శక్ష్యంతి = ఏమైన చేయుటకు సమర్థులు; రాక్షసా = రాక్షసులు; గుప్తం = రక్షింపబడిన; కుశికపుత్రేణ = విశ్వామిత్రునిచే; జ్వలనేన = అగ్నిచే; అమృతం = అమృతము; యథా = వలె;
భావము:-
రాముడు అస్త్రవిద్య నేర్చినవాడైన సరే నేర్వనివాడైన సరే అగ్నిచే అమృతము రక్షింపబడునట్లు, విశ్వామిత్రుని రక్షణలో ఉన్న ఇతనిని, రాక్షసులు ఏమియు చేయజాలరు.
1.21.10.
అనుష్టుప్.
ఏష విగ్రహవాన్ ధర్మ
ఏష వీర్యవతాం వరః ।
ఏష బుద్ధ్యాధికో లోకే
తపసశ్చ పరాయణమ్ ॥
టీక:-
ఏషః = ఈతడు, విశ్వామిత్రుడు; విగ్రహవాన్ = మూర్తీభవించిన; ధర్మః = ధర్మము ఐనవాడు; ఏషః = ఈతడు; వీర్యవతాం = వీరత్వం కలిగినవారిలో, వీరులలో; వరః = అగ్రగణ్యుడు; ఏషః = ఈతడు; బుద్ధ్యా = బుద్ధిచే; అధికః = అధికుడు; లోకే = లోకములో; తపసః = తపస్సుకు; చ; పరాయణమ్ = లగ్నమైన వాడు.
భావము:-
ఈ విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మస్వరూపము, వీర్యవంతులలో శ్రేష్ఠుడు, మిక్కిలి బుద్ధిశాలి, గొప్ప తపోనిష్ఠుడు.
1.21.11.
అనుష్టుప్.
ఏషోఽ స్త్రాన్ వివిధాన్ వేత్తి
త్రైలోక్యే సచరాచరే ।
నైనమన్యః పుమాన్ వేత్తి
న చ వేత్స్యంతి కేచన ॥
టీక:-
ఏషః = ఈతడు; అస్త్రాన్ = అస్త్రములను; వివిధాన్ = రకరకము లైన; వేత్తి = కోవిదుడు; త్రైలోక్యే = ముల్లోకములందును; సచరాచరే = చరములు అచరములలో; న = కాడు; ఏనమ్ = దీనిని; అన్యః = ఇతర; పుమాన్ = మనిషి; వేత్తి = జ్ఞాని; న = వీలుకాదు; చ = కూడ; వేత్స్యంతి = కనుగొనుటకు; కేచన = ఎవరును.
భావము:-
ఈ విశ్వామిత్రుడు అనేక విధములైన అస్త్రవిద్యలు తెలిసినవాడు. చరాచర జగత్తులందు అస్త్రవిద్యలను ఇతనివలె మరెవరును ఎరిగినవారు లేరు. భవిష్యత్తులో కూడ ఎవరును తెలుసుకొన జాలరు;
1.21.12.
అనుష్టుప్.
న దేవా ఋషయః కేచిత్
నాసురా న చ రాక్షసా ।
గంధర్వ యక్ష ప్రవరాః
న కిన్నరమహోరగాః ॥
టీక:-
న = కారు; దేవా = దేవతలు; ఋషయః = ఋషులు; కేచిత్ = ఎవరును; న = కారు; అసురాః = అసురులు; న = కారు; రాక్షసా = రాక్షసులు; గంధర్వ = గంధర్వులలో; యక్ష = యక్షులలో; ప్రవరాః = ఉత్తములు; స = కారు; కిన్నరః = కిన్నరలును; మహోరగాః = మహానాగులును.
భావము:-
ఈ విశ్వామిత్రునికి తెలిసినన్ని అస్త్రవిద్యలను దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నర, మహానాగులతో సహా ఎవరును తెలుసుకొనజాలరు.
1.21.13.
అనుష్టుప్.
సర్వాస్త్రాణి భృశాశ్వస్య
పుత్రాః పరమధార్మికాః ।
కౌశికాయ పురా దత్తా
యదా రాజ్యం ప్రశాసతి ॥
టీక:-
సర్వ = అన్ని; అస్త్రాణి = అస్త్రములు; భృశాశ్వస్య = భృశాశ్వుని; పుత్రాః = కుమారులు, సృష్టించినవి; పరమ = అత్యంత; ధార్మికాః = ధర్మాత్ములైన; కౌశికాయ = విశ్వామిత్రునకు; పురా = పూర్వము; దత్తాః = ఇవ్వబడినవి; యదా = ఆ సమయంలో; రాజ్యం = రాజ్యమును; ప్రశాసతి = పాలించుచుండెనో.
భావము:-
అస్త్రములన్నియు భృశాశ్వుని సృజింప బడినవి. పరమ ధర్మాత్ము లైనవి. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యపాలన చేయుచున్నప్పుడు ఆ అస్త్రములు ఆతనికి ఇయ్యబడినవి;
1.21.14.
అనుష్టుప్.
తేఽ పి పుత్రా భృశాశ్వస్య
ప్రజాపతిసుతా సుతాః ।
నైకరూపా మహావీర్యా
దీప్తిమన్తో జయావహాః ॥
టీక:-
తేః = ఆ అస్త్రములు; అపి = కూడ; పుత్రాః = పుత్రులైన; భృశాశ్వస్య = భృశాశ్వమహర్షినికి; ప్రజాపతిసుతాసుతాః = దక్షప్రజాపతి యొక్క కుమార్తెలు (జయ, సుప్రభ యందు చెరొక యాభై); సుతాః = పుత్రులు / అస్త్రములు; నైక = అనేక; రూపాః = రూపములు కలవి; మహావీర్యాః = గొప్ప పరాక్రమము గలవి; దీప్తిమంత = ప్రకాశవంతమైనవి; జయావహః = జయము చేకూర్చెడివి;
భావము:-
భృశాశ్వునకును దక్షప్రజాపతి కుమార్తెలకును పుత్రులుగా జన్మించిన ఆ అస్త్రములు అనేక రూపములు గలవి, గొప్ప పరాక్రమవంతమైనవి, మిక్కిలి ప్రకాశవంతమైనవి, జయమును ప్రసాదించునవి.
1.21.15.
అనుష్టుప్.
జయా చ సుప్రభా చైవ
దక్షకన్యే సుమధ్యమే ।
తే సువాతేఽ స్త్రశస్త్రాణి
శతం పరమభాస్వరమ్ ॥
టీక:-
జయా = జయము; చ = మఱియు; సుప్రభా = సుప్రభ అను; చ; ఇవ = అలాగే; దక్ష = దక్షుని; దక్ష కన్యః = కుమార్తెలు; సుమధ్యమే = మంచినడుములు గల; తే = వారు; సువాతే = కనిరి; అస్త్ర = అస్త్ర; శస్త్రాణి = శస్త్రములను; శతం = వంద; పరమ = చాల; భాస్వరమ్ = ప్రకాశవంతమైన;
భావము:-
దక్షప్రజాపతి యొక్క కుమార్తెలు జయ సుప్రభ అను వారు చాల అందగత్తెలు. వారిరువురును మిక్కిలి ప్రకాశవంతమైన నూరు (100) అస్త్రశస్త్రములను ప్రసవించిరి;
1.21.16.
అనుష్టుప్.
పంచాశతం సుతాంల్లేభే
జయా నామ పరాన్ పురా ।
వధాయాసురసైన్యానాం
అమేయాన్ కామరూపిణః ॥
టీక:-
పంచాశతం = ఏబది; సుతాం = కుమారులను; లేభే = పొందెను; జయా = జయ అను; నామ = పేరు గల; వరాన్ = శ్రేష్ఠులైన; పురా = పూర్వము; వధాయ = వధించుటకొరకు; అసుర = రాక్షస; సైన్యానాం = సైన్యములను; అమేయాన్ = అమితమైన; కామరూపిణః = కోరిన రూపము పొందెడివి;
భావము:-
అందు జయ అను ఆమె పూర్వము రాకాసి మూకలను హతమార్చుటకై ఏభైమంది (50) పుత్రులను (అస్త్రములను) కనెను. వారు అమిత పరాక్రమవంతులును, కామరూపులును.
1.21.17.
అనుష్టుప్.
సుప్రభాజనయచ్చాపి
సుతాన్ పంచాశతం పునః ।
సంహారాన్నామ దుర్దర్షాన్
దురాక్రమాన్ బలీయసః ॥
టీక:-
సుప్రభ = సుప్రభ అను ఆమె; అజనయత్ = కనెను; అపి = కూడ; సుతాన్ = పుత్రులు; పంచాశతం = ఏబదిమందిని; పునః = ఇంకను; సంహారః = సంహారులు అను; నామ = పేరు గల; దుర్ధర్షాన్ = ఎదిరింప సాధ్యముకాని; దురాక్రమాన్ = ఆక్రమింప సాధ్యము కాని; బలీయసః = అత్యంత పరాక్రమవంతములు;
భావము:-
సుప్రభ కూడ సంహారులు అను పేరు గల ఏబదిమంది పుత్రులను (అస్త్రములను) కనెను; వారు ఎదిరింపనూ జయింపనూ శక్యము కాని అమిత పరాక్రమవంతములు;
1.21.18.
అనుష్టుప్.
తాని చాస్త్రాణి వేత్త్యేష
యథావత్ కుశికాత్మజః ।
అపూర్వాణాం చ జననే
శక్తో భూయః స ధర్మవిత్ ॥
టీక:-
తాని = ఆ; అస్త్రాణి = అస్త్రములను; వేత్తి = తెలియును; ఏషః = ఈ; యథావత్ = చక్కగా; కుశికాత్మజః = విశ్వామిత్రుడు; అపూర్వాణాం = అపూర్వమైనవి; జననే = సృష్టించుటకు; శక్తః = సమర్థుడు; భూయః = ఇంకను; సః = అతడు; ధర్మవిత్ = సకల ధర్మములెరిగినవాడు;
భావము:-
ఆ అస్త్రశస్త్ర విషయములు విశ్వామిత్రునకు చక్కగా తెలియును; ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు నూతన అస్త్రశస్త్రములను సృష్టించగల సమర్థుడు;
1.21.19.
అనుష్టుప్.
ఏవంవీర్యో మహాతేజా
విశ్వామిత్రో మహాయశాః ।
న రామగమనే రాజన్!
సంశయం గంతుమర్హసి ॥
టీక:-
ఏవం = ఇటువంటి; వీర్యః = వీర్యవంతుడు; మహా = అత్యంత; తేజః = తేజోవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహా = గొప్ప; యశః = కీర్తిమంతుడు; న = కావు; రామ = రాముడు; గమనే = పంపుటలో; రాజన్ = రాజా; సంశయం = సందేహము; గంతుమ్ = పొందుటకు; అర్హసి = అర్హుడవు;
భావము:-
దశరథ మహారాజా! ఈ విశ్వామిత్రుడు మహావీరుడు, అమిత తేజోవంతుడు మఱియు గొప్ప కీర్తిశాలి. అందువలన ఇతనితో రాముని పంపుటకు సందేహించుట తగదు.
1.21.20.
అనుష్టుప్.
తేషాం నిగ్రహణే శక్తః
స్వయం చ కుశికాత్మజః ।
తవ పుత్రహితార్థాయ
త్వా ముపేత్యాభియాచతే" ॥
టీక:-
తేషాం = వారిని; నిగ్రహణే = కట్టడిచేయుటయందు; శక్తః = సమర్థుడు; స్వయం = స్వయముగానే; చ = కూడ; కుశికాత్మజః = విశ్వామిత్రుడు; తవ = నీ యొక్క; పుత్రః = పుత్రులకు; హితః = మేలు; అర్థాయ = కొఱకు; త్వామ్ = నిన్ను; ఉపేత్య = చేరి; అభియాచ్యతే = అడుగుచున్నాడు;
భావము:-
విశ్వామిత్రుడు ఆ రాక్షసులను తానే స్వయముగా నిలువరించ గలిగినను. నీ పుత్రులకు మేలు చేయవలెనని నీ వద్దకు వచ్చి అడుగుచున్నాడు.”
1.21.21.
జగతి.
ఇతి మునివచనాత్ ప్రసన్నచిత్తో
రఘువృషభశ్చ ముమోద భాస్వరాంగః ।
గమన మభిరురోచ రాఘవస్య
ప్రథితయశాః కుశికాత్మజాయ బుద్ధ్యా ॥
టీక:-
ఇతి = అటుల; ముని = ముని వసిష్ఠుని; వచనాత్ = మాటల వలన; ప్రసన్న = శాంతించిన; చిత్తః = మనస్సు కలవాడై; రఘువృషభః = రఘువంశములో గొప్పవాడు, దశరథుడు; చ; ముమోద = సంతోషించెను; భాస్వర = ప్రకాశవంతమైన; అంగః = కలవాని; గమనమ్ = ప్రయాణమును; అభిరురోచ = అంగీకరించెను; రాఘవస్య = రాముని యొక్క; ప్రథిత = ప్రసిద్ధమైన; యశాః = కీర్తి గలవాడు; కుశికాత్మజాయ = విశ్వామిత్రుని కొరకు; బుద్ధ్యాః = బుద్ధి పూర్వకముగా;
భావము:-
ప్రసిద్ధమైన కీర్తిమంతుడు తేజోవంతుడైన దశరథుడు వసిష్ఠుని మాటలచే ప్రసన్నుడై సంతోషించి, విశ్వామిత్రునితో రాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను;
1.21.22.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకవింశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకవింశః [21] = ఇరవైఒకటవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [21] ఇరవై ఒకటవ సర్గ సుసంపూర్ణము
బాల కాండ
1.22.1.
అనుష్టుప్.
తథా వసిష్ఠే బ్రువతి
రాజా దశరథః స్వయమ్ ।
ప్రహృష్టవదనో రామం
ఆజుహావ సలక్ష్మణమ్ ॥
టీక:-
తథా = ఆ విధముగా; వసిష్ఠే = వసిష్ఠుడు; బ్రువతి = చెప్పగా; రాజా = రాజు; దశరథః = దశరథుడు; స్వయమ్ = స్వయముగా; ప్రహృష్ట = సంతోషముతో వికసించిన; వదనః = ముఖము కలవాడు; రామమ్ = రాముని; ఆజుహావ = పిలిపించెను; స = సహితంగా; లక్ష్మణమ్ = లక్ష్మణునితో.
భావము:-
వసిష్ఠుడు అట్లు పలుకగా, దశరథ మహారాజు సంతోషముతో వికసించిన ముఖము కలవాడై, స్వయముగా తన పుత్రుడు రాముడిని లక్ష్మణ సమేతముగా పిలుచుకువచ్చెను.
1.22.2.
అనుష్టుప్.
కృతస్వస్త్యయనం మాత్రా
పిత్రా దశరథేన చ ।
పురోధసా వసిష్ఠేన
మంగళైరభిమంత్రితమ్ ॥
టీక:-
కృత = చేసిన; స్వస్త్యయనం = స్వస్తివచనములు పలుకుట; మాత్రా = తల్లి చేత; పిత్రా = తండ్రియైన; దశరథేన చ = దశరథునిచేతను; పురోధసా = పురోహితుడైన; వసిష్ఠేన = వసిష్ఠుని చేత; మంగలైః = మంగళకరములగు మంత్రములుతో; అభిమంత్రితమ్ = అభిమంత్రించబడినవాడై.
భావము:-
కౌసల్యా దశరథులు రామునకు స్వస్తివచనములు పలుకులు పలికిరి. పురోహితుడు వసిష్ఠుడు మంగళకరములైన మంత్రములతో రాముని అభిమంత్రించెను.
గమనిక:-
*- స్వస్త్యనము- శుభము కలుగుటకై చేయు వేదవిహితమైన గ్రహయోగాది కర్మ, ఆశీర్వచనము, వ్యుత్పత్తి. స్వస్తి+ఆయనమ్ (లాభః) - అస్మాత్, బ.వ్రీ., ఆంద్రశబ్దరత్నాకరము
1.22.3.
అనుష్టుప్.
స పుత్రం మూర్ధ్న్యుపాఘ్రాయ
రాజా దశరథః ప్రియమ్ ।
దదౌ కుశికపుత్రాయ
సుప్రీతేనాంతరాత్మనా ॥
టీక:-
స = ఆ; పుత్రం = పుత్రుని; మూర్ధ్ని = శిరస్సుపై; ఉపాఘ్రాయ = వాసన చూచి; రాజా = మహారాజు; దశరథః = దశరథుడు; ప్రియమ్ = ప్రేమతో; దదౌ = ఇచ్చెను; కుశికపుత్రాయ = కుశికపుత్రుడైన విశ్వమిత్రుని కొరకు; సుప్రీతేన = చాలా సంతోషించిన; ఆంతరాత్మనా = హృదయముతో.
భావము:-
దశరథుడు తన పుత్రుడు రాముడిని ప్రేమతో శిరస్సుపై వాసన చూచి, చాలా సంతోషించిన హృదయముతో విశ్వమిత్రునకు ఇచ్చెను.
1.22.4.
అనుష్టుప్.
తతో వాయుః సుఖస్పర్శో
నీరజస్కో వవౌ తదా ।
విశ్వామిత్రగతం రామం
దృష్ట్వా రాజీవలోచనమ్ ॥
టీక:-
తతః = పిమ్మట; వాయుః = గాలి; సుఖస్పర్శః = సుఖకరమైన స్పర్శగలదై; నీరజస్కః = పరాగములేనిదై; వవౌ = వీచెను; తదా = అప్పుడు; విశ్వామిత్రగతం = విశ్వామిత్రుని అనుసరించినవానినిగా; రామమ్ = రాముని; దృష్ట్వా = చూచి; రాజీవలోచనమ్ = పద్మములవంటి నేత్రములుగల.
భావము:-
పద్మములవంటి నేత్రములు గల రాముడు విశ్వామిత్రుని అనుసరించి వెళ్ళుట కని గాలి పరాగములేక, సుఖమునిచ్చు స్పర్శగలదై వీచెను.
1.22.5.
అనుష్టుప్.
పుష్పవృష్టిర్మహత్యాసీత్
దేవదున్దుభి నిస్స్వనైః ।
శంఖదున్దుభినిర్ఘోషః
ప్రయాతే తు మహాత్మని ॥
టీక:-
పుష్పవృష్టిః = పూలవానమ; మహతి = గొప్ప; ఆసీత్ = ఆయెను; దేవదున్దుభి = దేవదుందుభుల; నిఃస్వనైః = ధ్వనులతో; శంఖః = శంఖములయొక్కయు; దున్దుభిః = శంఖములయొక్కయు; నిర్ఘోషః = ధ్వానములతో; ప్రయాతే = బయలుదేరగనే; తు; మహాత్మని = మహాత్ముడైన విశ్వమిత్రుడు.
భావము:-
మహాత్ముడైన విశ్వమిత్రుడు బయలుదేరిన వెంటనే గొప్ప పుష్పవృష్టి కురిసెను. దేవతలు దుందుభులు మ్రోగించిరి. దశరథుని ప్రాసాదములో శంఖదుందుభి ధ్వానములు మారుమ్రోగెను.
1.22.6.
అనుష్టుప్.
విశ్వామిత్రో యయావగ్రే
తతో రామో మహాయశాః ।
కాకపక్షధరో ధన్వీ
తం చ సౌమిత్రిరన్వగాత్ ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; యయౌ = నడచెను; ఆగ్రే = ముందు; తతః = అతని వెనుక; రామః = రాముడు; మహాయశః = గొప్ప కీర్తిమంతుడు; కాకపక్షధరః = జులపములను ధరించినవాడు, యువకుడు; ధన్వీ = ధనుస్సు గలవాడు; తమ్ = ఆతనిని; చ; సౌమిత్రిః = లక్ష్మణుడు; అన్వగాత్ = అనుసరించసాగెను.
భావము:-
విశ్వమిత్రుడు ముందు నడచుచుండ, అతని వెనుక మహాకీర్తిమంతుడు, పిల్లజుట్టు నవయువకుడు, ధనుర్ధరుడును అగు రాముడు నడచుచుండ, ఆ రాముని లక్ష్మణుడు అనుసరించెను.
1.22.7.
అనుష్టుప్.
కలాపినౌ ధనుష్పాణీ
శోభయానౌ దిశో దశ ।
విశ్వామిత్రం మహాత్మానం
త్రిశీర్షావివ పన్నగౌ ॥
టీక:-
కలాపినౌ = రెండు అంబులపొదులను ధరించినవారు; ధనుష్పాణీ = ధనుస్సులు హస్తములందు కలగి; శోభయానౌ = ప్రకాశింపచేయున్నవారు; దిశః = దిక్కులను; దశః = పది; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; మహాత్మానమ్ = మహాత్ముని; త్రిశీర్షౌ = మూడు శిరస్సులు గల; ఇవ = వలె; పన్నగౌ = సర్పములు.
భావము:-
రెండేసి అమ్ములపొదులను మూడు తలలు గల సర్పములవలె కలిగి, ధనుస్సును ధరించి పది దిక్కులను ప్రకాశింపజేయుచున్న రామలక్ష్మణులు మహాత్ముడైన విశ్వామిత్రుని వెంట.
1.22.8.
అనుష్టుప్.
అనుజగ్మతు రక్షుద్రౌ
పితామహ మివాశ్వినౌ ।
తదా కుశికపుత్రం తు
ధనుష్పాణి స్వలంకృతౌ ॥
టీక:-
అనుజగ్మతుః = అనుసరించి వెళ్లిరి; అక్షుద్రౌ = అల్పులు కానివారు, మహనీయులు; పితామహామ్ = బ్రహ్మదేవుని; ఇవ = వలె; అశ్వినౌ = అశ్వినీ దేవతలు; తదా = అప్పుడు; కుశికపుత్రమ్ తు = విశ్వామిత్రుడిని; తు; ధనుష్పాణి = ధనుస్సులు హస్తములందు ధరించినవారు; స్వలంకృతౌ = స్వయంగా అలంకరించుకున్న వారు.
భావము:-
విశ్వామిత్రుని వెంట, ధనుస్సులు ధరించి, స్వయముగా అలంకరించుకున్న మహనీయులైన ఆ రామలక్ష్మణులు, అశ్వినీదేవతలు బ్రహ్మదేవుని అనుసరించినట్లు, అనుసరించిరి.
1.22.9.
అనుష్టుప్.
బద్ధగోధాంగుళి త్రాణౌ
ఖడ్గవన్తౌ మహాద్యుతీ ।
కుమారౌ చారువపుషౌ
భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥
టీక:-
బద్ధ = కట్టబడిన; గోధః = ఉడుముతోలుతో చేసిన; అంగళి = వ్రేళ్ళ; త్రాణౌ = తొడుగుల కవచములు కలవారు; ఖడ్గవన్తౌ = ఖడ్గములు కలవారు; మహా = గొప్ప; ద్యుతీ = కాంతిమంతులు; కుమారౌ = బాలురు; చారు = అందమైన; వపుషౌ = దేహములు కలవారు; భ్రాతరౌ = అన్నదమ్ములు; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు.
భావము:-
సోదరులైన రామలక్ష్మణులు ఉడుము తోలుతో చేసిన వేళ్ళతొడుగులు కవచములుగా (gloves) ధరించి, ఖడ్గములను పూని, మహాకాంతిమంతులై, అపురూప సుందరులై ఉండిరి.
1.22.10.
అనుష్టుప్.
అనుయాతౌ శ్రియా దీప్తౌ
శోభయేతామనిందితౌ ।
స్థాణుం దేవమివాచిన్త్యమ్
కుమారావివ పావకీ ॥
టీక:-
అనుయాతౌ = అనుసరించి వెళ్లుచున్నవారై; శ్రియా = శోభతో; దీప్తౌ = ప్రకాశించుచున్నవారు; శోభయేతామ్ = ప్రకాశింప చేసిరి; అనిందితౌ = దోషములు లేనివారు; స్థాణుం = ఈశ్వరుని; దేవమ్ = దేవుని; ఇవ = దేవుని; అచిన్త్యమ్ = ఊహింపరాని; కుమారౌ = స్కంద, విశాఖులు; ఇవ = వలె; పావకీ = అగ్నివలన జన్మించిన.
భావము:-
అగ్నినుండి జన్మించిన స్కంద, విశాఖులు అచింత్య ప్రభావుడైన ఈశ్వరుని ప్రకాశింపచేసినట్లు, నిష్కళంకులైన రామలక్ష్మణులు శోభతో ప్రకాశించుచు విశ్వామిత్రుని అనుసరించి పోవుచు ప్రకాశింపచేసిరి.
గమనిక:-
*- శ్లో. “తతోఽభవచ్ఛతుర్మూర్తిః, క్షణేన భగవాన్ ప్రభు। స్కంధో విశాఖశ్చ శాకశ్చ, నైగమేషశ్చ పృష్ఠతః॥“, అంత భగవంతుడగు కుమారస్వామి స్కంధుడు, విశాఖుడు, శాకుడు, నైగమేషుడు అను నాలుగు రూపములు ధరించెను. అని భారతములో చెప్పబడెను. అందలి స్కంధుడు, విశాఖులను కుమారౌ అని చెప్పబడెనని గోవిందరాజులు వారి వ్యాఖ్యానము.
1.22.11.
అనుష్టుప్.
అధ్యర్దయోజనం గత్వా
సరయ్వా దక్షిణే తటే ।
రామేతి మధురాం వాణీమ్
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీక:-
అధ్యర్ద = ఒకటిన్నర; యోజనం = యోజనముల దూరము; గత్వా = వెళ్లి; సరయ్వా = సరయూనదియొక్క; దక్షిణే = దక్షిణ; తటే = తీరమునందు; రామ = ఓ రాముడా; ఇతి = అని; మధురాం = మధురమైన; వాణీమ్ = వాక్కును; విశ్వమిత్రః = విశ్వమిత్రుడు; అభ్యభాషత = పలికెను.
భావము:-
ఒకటిన్నర యోజనముల దూరము నడచి సరయూనది దక్షిణతీరము చేరిన పిదప విశ్వమిత్రుడు “ఓ రామా!” అని సుమధురముగా పిలిచెను,
1.22.12.
అనుష్టుప్.
“గృహాణ వత్స! సలిలమ్
మాభూత్ కాలస్య పర్యయః ।
మంత్రగ్రామం గృహాణ త్వమ్
బలామతిబలాం తథా ॥
టీక:-
గృహాణ = గ్రహించుము; వత్స = ఓ బాలకా; సలిలమ్ = ఉదకమును; మాభూత్ = కావలదు; కాలస్య = కాలము యొక్క; పర్యయః = తప్పిపోకుండ; మంత్ర = మంత్రముల; గ్రామం = సముదాయమును; గృహాణ = గ్రహింపుము; త్వమ్ = నీవు; బలామ్ = బలను; అతిబలామ్ = అతి బలను; తథా = మఱియు.
భావము:-
”వత్సా! ఉదకము గైకొని తొందరగా ఆచమనము చేయుము. మంచి కాలము దాటిపోనీకుము. “బల”, “అతిబల” అనెడు విద్యల మంత్ర సముదాయములను ఇచ్చెదను, గ్రహింపుము.
1.22.13.
అనుష్టుప్.
న శ్రమో న జ్వరో వా తే
న రూపస్య విపర్యయః ।
న చ సుప్తం ప్రమత్తం వా
ధర్షయిష్యంతి నైఋతాః ॥
టీక:-
న = కలుగదు; శ్రమః = శ్రమ; న = కలుగదు; జ్వరః = రోగతాపము కూడా; వా = లేదా; తే = నీకు; న = కలుగదు; రూపస్య = రూపముయొక్క; విపర్యయః = హాని; న = వీలుకాదు; చ = మఱియును; సుప్తం = నిద్రపోవుచున్నను; ప్రమత్తం = ఏమరుపాటుతో ఉన్నవాడవు; వా = ఐనను; ధర్షయిష్యంతి = బాధించుట; నైఋతాః = రాక్షసులు.
భావము:-
ఈ విద్యలు గ్రహించినచో, నీకు శ్రమ లేదా రోగతాపము లేదా రూపహాని కాని కలుగవు. నిద్రపోవుచున్నను, ఏమరుపాటుగా ఉన్నను, రాక్షసులు నిన్ను బాధింపజాలరు.
1.22.14.
అనుష్టుప్.
న బాహ్వోః సదృశో వీర్యే
పృథివ్యామస్తి కశ్చన ।
త్రిషు లోకేషు వై రామ!
న భవేత్ సదృశస్తవ ॥
టీక:-
న = లేడు; బాహ్వోః = బాహువులలో (భుజాలు); సదృశః = నీతో సమానమైన వాడు; వీర్యే = పరాక్రమమునందు; పృథివ్యామ్ = భూమిలో; అస్తి = ఉండు; కః = అవకాశము; చ = కాడ; న = లేదు; త్రిషు = మూడు; లోకేషు = లోకములందు; రామ = ఓ రామా; న భవేత్ = ఉండడు; భవేత్ = భవిష్యత్తులోను; సదృశః = సమానుడు; తవ = నీకు.
భావము:-
ఓ రామా, బాహుబలములో , పరాక్రమమునందు నీకు సమానుడు ఈ భూలోకములో ఎవ్వడును లేడు. నీకు సమానుడు ముల్లోకములలోనూ భవిష్యత్తులోనూ కూడా ఉండబోడు.
1.22.15.
అనుష్టుప్.
న సౌభాగ్యే న దాక్షిణ్యే
న జ్ఞానే బుద్ధినిశ్చయే ।
నోత్తరే ప్రతివక్తవ్యే
సమో లోకే తవానఘ ॥
టీక:-
న = ఉండడు; సౌభాగ్యే = సౌభాగ్యములో; దాక్షిణ్యే = దక్షత్వము నందు, కృపలోను; జ్ఞానే = జ్ఞానమునందు; బుద్ధినిశ్చయే = నిర్ణయము తీసుకొనుట లోను; ఉత్తరే = ప్రత్యుత్తరము; ప్రతివక్తవ్యే = చెప్పుటలో; సమః = సమానుడు; లోకే = లోకమునందు; తవ = నీకు; అనఘ = ఓ పాపరహితుడా
భావము:-
ఓ పుణ్యాత్ముడా ! ఓ రామా! సౌభాగ్యమునందు, సామర్థ్యమునందు కృపలోను, జ్ఞానమునందు, నిర్ణ యములు తీసుకొనుటలోను, ప్రశ్నకు సమాధానము చెప్పుటలోను, నీకు సరివచ్చువాడు ఈ లోకములో ఉండడు.
1.22.16.
అనుష్టుప్.
ఏతద్విద్యాద్వయే లబ్ధే
భవితా నాస్తి తే సమః ।
బలా చాతిబలా చైవ
సర్వజ్ఞానస్య మాతరౌ ॥
టీక:-
ఏతత్ = ఈ; విద్యాః = విద్యలు; ద్వయే = రెండు; లబ్ధే = పొందబడగా; భవితా = కలుగుట; నాస్తి = ఉండదు; తే = నీకు; సమః = సమానుడు; బలాః = బలయను విద్య; చ = చేతను; అతిబలాః = అతిబల యను విద్య; చ = చేతను; ఏవ = నిశ్చయముగ; సర్వ = సమస్త; జ్ఞాన = జ్ఞానమున (విద్యల) కును; అస్య; మాతరౌ = తల్లులు.
భావము:-
ఈ రెండు విద్యలు పొందినచో నీకు సమానుడు ఉండడు. ఈ “బల”, “అతిబల” విద్యలు నిశ్చయముగ సకల విద్యలకును మాత్రుకలు.
1.22.17.
అనుష్టుప్.
క్షుత్పిపాసే న తే రామ!
భవిష్యేతే నరోత్తమ! ।
బలామతిబలాం చైవ
పఠతః పథి రాఘవ! ॥
టీక:-
క్షుత్ = ఆకలి; పిపాసే = దప్పికలు; న = ఉండవు తే = నీకు; రామ = ఓ రామా; భవిష్యేతే = కలుగుట; నరోత్తమ = నరులలో ఉత్తముడా; బలామ్ = బల విద్య; అతిబలామే = అతిబల విద్య; చ; ఏవ = నిశ్చయముగా; పఠతః = చదువుచున్న; పథి = త్రోవలో; రాఘవ = రఘువంశజుడా
భావము:-
ఓ నరోత్తమా! రాఘవరామా! ఈ బలాతిబలలను జపించు మార్గములలో నీకు ఆకలిదప్పికలు కలుగవు.
1.22.18.
అనుష్టుప్.
విద్యాద్వయమధీయానే
యశశ్చాప్యతులం త్వయి ।
పితామహసుతే హ్యేతే
విద్యే తేజః సమన్వితే ।
ప్రదాతుం తవ కాకుత్స్థ!
సదృశస్త్వం హి ధార్మిక ॥
టీక:-
విద్యా = విద్యలను; ద్వయమ్ = రెంటిని; అధీయానే = అధ్యయనము చేసినచో; యశః = కీర్తి; చ; అపి = కూడ; అతులం = సాటిలేనిది; త్వయి = నీయందు; పితామహ = బ్రహ్మదేవుని; సుతే = పుత్రికలు; హి = ఐన; ఏతే = విద్యలు; విద్యే = విద్యలు; తేజః = తేజస్సుతో; సమన్వితే = కూడినవి; ప్రదాతుం = ఇచ్చుటకు; తవ = నీకు; కాకుత్స్థ = కాకుత్స్థవంశమునందు పుట్టినవాడా; సదృశః = తగినవాడు; త్వమ్ = నీవు; హి = మాత్రమే; ధార్మికః = ధార్మికుడ.
భావము:-
ఈ బల అతిబల విద్యాద్వయము జపించినచో నీకు సాటిలేని కీర్తి కూడ లభించును. ఓ రామా! తేజోమయములైన ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు. ఓ కాకుత్స్థ ! ధార్మికా ! వీటిని ఇచ్చుటకు నీవే అర్హుడవు.
1.22.19.
అనుష్టుప్.
కామం బహుగుణాః సర్వే
త్వయ్యేతే నాత్ర సంశయః ।
తపసా సమ్భృతే చైతే
బహురూపే భవిష్యతః" ॥
టీక:-
కామం = ఇచ్చాపూర్వకంగా; బహు = అనేక; గుణాః = సుగుణములు; సర్వే = అన్నియు; త్వయి = నీయందున్నవి; ఏతే = ఈ; న = లేదు; అత్ర = ఇక్కడ; సంశయః = సందేహము; తపసా = తపస్సుచే; సమ్భృతే = పోషింపబడినవై; చ; ఏతే = ఇవి; బహు = అనేక; రూపే = రూపములుగా; భవిష్యతః = కాగలవు.
భావము:-
నీయందు సుగుణములన్నియు ఉన్నవి. ఇందులో సందేహము లేదు. ఈ విద్యలను తపస్సుచే పోషించినచో అనేక రూపములుగా పరిణామము చెందగలవు.
1.22.20.
అనుష్టుప్.
తతో రామో జలం స్పృష్ట్వా
ప్రహృష్టవదనః శుచిః ।
ప్రతిజగ్రాహ తే విద్యే
మహర్షేర్భావితాత్మనః ॥
టీక:-
తతః = పిమ్మట; రామః = రాముడు; జలం = నీటిని; స్పృష్ట్వా = స్పృశించి; ప్రహృష్ట = సంతోషముతో వికసించిన; వదనః = ముఖము కలవాడై; శుచిః = పవిత్రుడై; ప్రతిజగ్రాహ = స్వీకరించెను; తే = ఆ; విద్యే = విద్యలను; మహర్షేః = మహర్షినుండి; భావితాత్మనః = పరిశుద్ధమైన మనస్సుగల.
భావము:-
రాముడు నీటిని స్పృశించి, ఆచమనము చేసి, శుచియై, ఆనందముతో వికసించిన ముఖముకలవాడై, పరిశుద్ధమనస్కు డైన విశ్వామిత్రమహర్షి నుండి బల అతిబల విద్యలు స్వీకరించెను.
1.22.21.
అనుష్టుప్.
విద్యాసముదితో రామః
శుశుభే భూరివిక్రమః ।
సహస్రరశ్మిర్భగవాన్
శరదీవ దివాకరః ॥
టీక:-
విద్యాసముదితః = విద్యలతో; సముదితః = సంతోషించిన వాడై; రామః = రాముడు; శుశుభే = బాగుగా ప్రకాశించెను; భూరివిక్రమః = గొప్ప పరాక్రమవంతుడు; సహస్రరశ్మిః = వేయి కిరణములు గలవాడు; భగవాన్ = భగవంతుడు; శరత్ = శరత్కాలమునందు; ఇవ = వలె; దివాకరః = సూర్యుడు
భావము:-
మహా పరాక్రమవంతుడైన రాముడు బల అతిబల విద్యలు పొంది, శరత్కాలములో వేయికిరణముల దైవముసూర్యభగవానుడి వలె ప్రకాశించెను.
1.22.22.
అనుష్టుప్.
గురుకార్యాణి సర్వాణి
నియుజ్య కుశికాత్మజే ।
ఊషుస్తాం రజనీం తత్ర
సరయ్వాం సుసుఖః త్రయః ॥
టీక:-
గురు = గురువుగార్కి; కార్యాణి = చేయవలసిన కార్యములను; సర్వాణి = అన్నియును; నియుజ్య = చేసి; కుశికాత్మజే = విశ్వామిత్రుని విషయములో; ఊషుః = ఉండిరి; తాం = ఆ; రజనీం = రాత్రి; తత్ర = అచట; సరయ్వాం = సరయూ తీరమునందు; సుసుఖః = చాలా సుఖముగా; త్రయః = ముగ్గురును.
భావము:-
రాముడు, విశ్వామిత్రుని విషయములో మంత్రాచార్యుని విషయములో ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించి అన్నిబాధ్యతలను నిర్వర్తించెను. వారు ముగ్గురు సరయూ తీరమునందు ఆ రాత్రి సుఖముగా గడిపిరి.
1.22.23.
జగతి.
దశరథనృపసూనుసత్తమాభ్యాం
తృణశయనేఽ నుచితే సహోషితాభ్యామ్ ।
కుశికసుతవచోఽ నులాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ॥
టీక:-
దశరథ = దశరథుడను; నృప = మహారాజ; సూను = పుత్ర; సత్తమాభ్యాం = శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులకు; తృణ = గడ్డిపై; శయనే = పరుండుట; అనుచితే = అలవాటులేనిది; సహ = కలిసి; ఉషితాభ్యామ్ = వసించుట (నిదురించుట); కుశికసుత = కుశికపుత్రుడైన విశ్వామిత్రుని; వచః = పలుకులతో; అనులాలితాభ్యాం = బుజ్జగింపబడుటచే; సుఖమ్ = సుఖము; ఇవ = వలెనే; సా = ఆ; విబభౌ = తోచినది; విభావరీ = రాత్రి; చ = కూడా.
భావము:-
రామలక్ష్మణులు పూర్వము అలవాటు లేనటువంటి గడ్డిపరుపులపై కలసి పరుండినను, విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలవలన వారికి ఆ రాత్రి కూడా సుఖముగనే తోచెను.
1.22.24.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్వావింశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్వావింశః [22] = ఇరవైరెండవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [22] ఇరవై రెండవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.23.1.
అనుష్టుప్.
ప్రభాతాయాం తు శర్వర్యాం
విశ్వామిత్రో మహామునిః ।
అభ్యభాషత కాకుత్స్థౌ
శయానౌ పర్ణసంస్తరే ॥
టీక:-
ప్రభాతాయామ్ తు = తెల్లవారుతుండగా; తు; శర్వర్యామ్ = రాత్రి గడచి; విశ్వామిత్రః = విశ్వామిత్ర; మహామునిః = మహర్షి; అభ్యభాషత = పలికెను; కాకుత్స్థౌ = రామలక్ష్మణులతో; శయానం = పడుకొని ఉన్న; పర్ణసంస్తరే = ఆకుల పడకపై;
భావము:-
రాత్రి గడచి తెల్లవారుతున్న సమయములో విశ్వామిత్ర మహాముని ఆకులపడకపై నిదురించుచున్న రామ లక్ష్మణులను చూచిఇట్లు పలికెను.
1.23.2.
అనుష్టుప్.
* “కౌసల్యా సుప్రజా రామ!
పూర్వా సన్ధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల!
కర్త్తవ్యం దైవమాహ్నికమ్" ॥
టీక:-
కౌసల్యా సుప్రజా రామ = కౌసల్యయొక్క ఉత్తమ కుమారుడా!; పూర్వాసంధ్యా = తొలి సంధ్య; ప్రవర్తతే = అగుచున్నది; ఉత్తిష్ఠ = లెమ్ము; నరశార్దూల = పురుషశ్రేష్ఠుడా; కర్తవ్యమ్ = ఆచరించవలెను; దైవమ్ = దేవతారాధన రూపమగు; ఆహ్నికమ్ = పగలుచెయవలసిన కర్మలను.
భావము:-
కౌసల్య సుపుత్రుడా! మేలుకొనుము. ఓ పురుష శ్రేష్ఠుడా! రామా! తొలి సంధ్యా సమయము ఆసన్నము అయినది.దేవతా ప్రీతికరమగు ఆహ్నిక కర్మలను ఆచరింపవలెను. మేలుకొనుము.
1.23.3.
అనుష్టుప్.
తస్యర్షేః పరమోదారం
వచః శ్రుత్వా నరోత్తమౌ ।
స్నాత్వా కృతోదకౌ వీరౌ
జేపతుః పరమం జపమ్ ॥
టీక:-
తస్యృ = ఆ; ఋషేః = ఋషి యొక్క; పరమ = మిక్కిలి; ఉదారమ్ = సౌమ్య, మృదువైన; వచః = మాటలు; శ్రుత్వా = విని; నృపాత్మజౌ = రాజకుమారులు; స్నాత్వా = స్నానాదులు చేసిన వారై; కృత = చేసిన వారై; ఉదకౌ = అర్ఘ్య ప్రదానములు; వీరౌ = వీరులు; జేపతుః = చేసిరి; పరమమ్ = గొప్పదైన; జపమ్ = జపమును
భావము:-
వీరులైన ఆ రామలక్ష్మణులు ఆ ఋషి యొక్క మృదుమధురమైన మాటలు విని స్నానాదులు ఆచరించి సూర్యునికి అర్ఘ్య ప్రదానము, గాయత్రీ జపము, ఆచరించారు.
1.23.4.
అనుష్టుప్.
కృతాహ్నికౌ మహావీర్యౌ
విశ్వామిత్రం తపోధనమ్ ।
అభివాద్యాభిసంహృష్టౌ
గమనాయాభితస్థతుః ॥
టీక:-
కృత = చెయ్యబడిన; ఆహ్నికౌ = ఆహ్నికకర్మలు కలవారై; మహావీర్యౌ = గొప్ప పరాక్రము గల వారు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; తపోధనమ్ = తపస్సు ధనముగా కలవానిని; అభివాద్య = నమస్కరించి; అభిసంహృష్టౌ = ఉత్సాహవంతులై; గమనాయ = ప్రయాణమునకు; అభితస్థతుః = సిద్ధపడిరి
భావము:-
వీరులైన ఆ రామలక్ష్మణులు కలసి, ఆహ్నికకర్మలను పూర్తి చేసుకొని, మహాముని విశ్వామిత్రునికి నమస్కరించి, ఉత్సాహముగా ప్రయాణమునకు సిద్ధపడిరి.
1.23.5.
అనుష్టుప్.
తౌ ప్రయాతౌ మహావీర్యౌ
దివ్యాం త్రిపథగాం నదీమ్ ।
దదృశాతే తతస్తత్ర
సరయ్వాః సంగమే శుభే ॥
టీక:-
తౌ = వారిరువురు; ప్రయాతౌ = కొంత దూరము వెళ్లిన వారై; మహావీర్యౌ = మహావీరులు; దివ్యామ్ = స్వర్గము నుండి పుట్టిన; త్రిపథగామ్ = గంగా; నదీమ్ = నదిని; దదృశాతే = చూచిరి; తతః = పిమ్మట; తత్ర = అక్కడ; సరయ్వాః = సరయూనదియొక్క; సంగమే = సంగమము; శుభే = పవిత్రమైన;
భావము:-
కొంత దూరము ప్రయాణించిన తర్వాత మహావీరులైన రామలక్ష్మణులు పవిత్రమైన గంగానది మఱియు సరయూ నదుల సంగమమును దర్శించిరి.
గమనిక:-
*- త్రిపథగ- త్రిస్రో తస్సు, స్వర్గ మర్త్య పాతాళ లోకములలో ప్రవహించునది, వ్యు. త్రిపథేన గచ్ఛతి- త్రిపథ+ గమ్ + టాప్, కృ.ప్ర., గంగానది.
1.23.6.
అనుష్టుప్.
తత్రాశ్రమపదం పుణ్యం
ఋషీణాముగ్రతేజసామ్ ।
బహువర్షసహస్రాణి
తప్యతాం పరమం తపః ॥
టీక:-
తత్ర = అక్కడ; ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానమును; పుణ్యమ్ = పవిత్రమైన; ఋషీణామ్ = ఋషీశ్వరుల; ఉగ్రతేజసామ్ = గొప్ప తేజస్సు గల; బహు వర్ష సహస్రాణి = ఎన్నో వేల సంవత్సరాలు; తప్యతాం = తపము చేయుచున్న; పరమమ్ = గొప్ప; తపః = తపస్సును
భావము:-
అక్కడ అనేక వేల సంవత్సరములుగా గొప్ప తపస్సుచేయుచున్న తీవ్ర తేజోవంతులైన ఋషుల ఆశ్రమమును చూచిరి .
1.23.7.
అనుష్టుప్.
తం దృష్ట్వా పరమప్రీతౌ
రాఘవౌ పుణ్యమాశ్రమమ్ ।
ఊచతుస్తం మహాత్మానం
విశ్వామిత్రమిదం వచః ॥
టీక:-
తమ్ = ఆ; దృష్ట్వా = చూచి; పరమప్రీతౌ = చాలా సంతోషించిన; రాఘవౌ = రామలక్ష్మణులు; పుణ్యమ్ = పవిత్రమైన; ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఊచతుః = పలికిరి; తమ్ = ఆ; మహాత్మానమ్ = మహాత్ముడైన; విశ్వామిత్రమ్ = ఆ విశ్వామిత్రుని; ఇదం = ఈ; వచః = వాక్కును
భావము:-
ఆ పుణ్యాశ్రమమునుచూచి సంతోషించిన రామలక్ష్మణులు, విశ్వామిత్రునితోఇట్లు పలికిరి.
1.23.8.
అనుష్టుప్.
“కస్యాయమాశ్రమః పుణ్యః
కో న్వస్మిన్ వసతే పుమాన్? ।
భగవన్! శ్రోతుమిచ్ఛావః
పరం కౌతూహలం హి నౌ" ॥
టీక:-
కస్య = ఎవరిది?; అయమ్ = ఈ; ఆశ్రమః = ఆశ్రమము; పుణ్యః = పవిత్రమైన; కః ను = ఎవరు; అస్మిన్ = దీనియందు; వసతే = నివసించుచున్నాడు?; పుమాన్ = పురుషుడు; భగవన్ = ఓ పూజ్యుడా; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛావః = ఇష్ట పడుచున్నాము; పరమ్ = గొప్ప; కౌతూహలం = వేడుక ఉన్నది; హి; నౌ = మాకు
భావము:-
ఓ పూజ్యుడా! పవిత్రమైన ఈ ఆశ్రమము ఎవరిది? దీనిలో ఇప్పుడు ఎవరు నివసించుచున్నారు? మాకు వినవలెనని కుతూహలముగా ఉన్నది.
1.23.9.
అనుష్టుప్.
తయోస్తద్వచనం శ్రుత్వా
ప్రహస్య మునిపుంగవః ।
అబ్రవీ "చ్ఛ్రూయతాం రామ!
యస్యాయం పూర్వ ఆశ్రమః ॥
టీక:-
తయోః = వారియొక్క; తత్ వచనమ్ = ఆ మాటను; శ్రుత్వా = విని; ప్రహస్య = నవ్వి; మునిపుంగవః = మునిశ్రేష్ఠుడు; అబ్రవీత్ = పలికెను; శ్రూయతామ్ = వినుడు; రామ = ఓ రామా యస్య = ఎవరిదో; అయమ్ = ఈ; పూర్వ = పూర్వకాలములో; ఆశ్రమః = ఆశ్రమము
భావము:-
వారి ముచ్చట విని, విశ్వామిత్రుడు నవ్వి, ‘పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో చెప్పెదను, వినుడు’ అని పలికెను
1.23.10.
అనుష్టుప్.
కందర్పో మూర్తిమానాసీత్
కామ ఇత్యుచ్యతే బుధైః ।
తపస్యంతమిహ స్థాణుం
నియమేన సమాహితమ్ ॥
టీక:-
కందర్పః = మన్మధుడు; మూర్తిమాన్ = దేహము కలవాడై; ఆసీత్ = ఉండెను; కామః = కాముడు; ఇతి = అని; ఉచ్యతే = చెప్పబడెడివాడు. బుధైః = పండితులచేత; తపస్యంతమ్ = తపస్సు చేయుచున్నవాడును; ఇహ = ఇక్కడ; స్థాణుమ్ = పరమ శివుని; నియమేన = నియమములతో; సమాహితమ్ = స్థిరమైన మనస్సు కలవాడును
భావము:-
మన్మథుడు శరీరము కలిగి ఉండెడివాడు. పండితులు అతనిని కాముడు అని పిలిచేవారు. ఇచట స్థిరమైన మనస్సుతో, నియమములతో తపస్సు చేయుచున్న పరమేశ్వరుని
1.23.11.
అనుష్టుప్.
కృతోద్వాహం తు దేవేశం
గచ్ఛంతం సమరుద్గణమ్ ।
ధర్షయామాస దుర్మేధా
హుంకృతశ్చ మహాత్మనా ॥
టీక:-
కృతః = చేయబడినవానిని; ఉద్వాహమ్ = పెళ్లి; తు; దేవేశమ్ = దేవతల ప్రభువును; గచ్ఛంతమ్ = వెడలుచున్నవానిని; సమరుద్గణమ్ = దేవతా గణములతో; ధర్షయామాస = ఎదిరించెను; దుర్మేధా = దుర్బుద్ధి కలవాడు; హుంకృతః చ = హుంకరించబడెను; చ; మహాత్మనా = మహాత్ముని చేత
భావము:-
వివాహము చేసుకొని, దేవత గణములతో వెళుచున్న, దేవతల ప్రభువును, పరమశివుని దుష్టబుద్ధి గల మన్మథుడు ఎదిరించెను. అపుడు మహాత్ముడైన పరమ శివుడు ఆతనిపై ఆగ్రహించెను.
1.23.12.
అనుష్టుప్.
అవదగ్ధస్య రౌద్రేణ
చక్షుషా రఘునందన! ।
వ్యశీర్యంత శరీరాత్ స్వాత్
సర్వగాత్రాణి దుర్మతేః ॥
టీక:-
అవదగ్ధస్య = కాల్చివేయవబడిన; రౌద్రేణ = రుద్రునికి సంబంధించిన; చక్షుషా = నేత్రముచే; రఘునందన = ఓ రామా!; వ్యశీర్యంత = రాలిపోయినవి; శరీరాత్ = శరీరమునుండి; స్వాత్ = ఆతని; సర్వ = అన్ని; గాత్రాణి = అన్ని అవయవములు; దుర్మతేః = దుష్టబుద్ధి కలవాని
భావము:-
శివుని నేత్రముచే కాల్చివేయబడిన ఆ దుర్బుద్ధి మన్మథుని శరీరభాగములు అన్నియు రాలిపోయెను.
1.23.13.
అనుష్టుప్.
తస్య గాత్రం హతం తత్ర
నిర్దగ్ధస్య మహాత్మనా ।
అశరీరః కృతః కామః
క్రోధా ద్దేవేశ్వరేణ హి ॥
టీక:-
తస్య = అతనియొక్క; గాత్రమ్ = శరీరము; హతమ్ = కాలిపోయినది; తత్ర = అక్కడ; నిర్దగ్ధస్య = కాల్చివేయబడిన. మహాత్మనా = మహాత్మునిచే; అశరీరః = శరీరము లేనివాడుగా; కృతః = చేయబడెను; కామః = మన్మథుడు; క్రోధాత్ = కోపము వలన; దేవేశ్వరేణ = ఆ దేవతాధీశుని; హి = చేత
భావము:-
శివునిచే కాల్చివేయబడి మన్మథుని శరీరము నశించెను. ఈ విధముగా శివుడు కోపించి మన్మథుని శరీరము బూడిదచేసెను.
1.23.14.
అనుష్టుప్.
అనంగ ఇతి విఖ్యాతః
తదాప్రభృతి రాఘవ! ।
స చాంగవిషయః శ్రీమాన్
యత్రాంగం ప్రముమోచ హ ॥
టీక:-
అనంగ = శరీరములేనివాడు; ఇతి = అని; విఖ్యాతః = ప్రసిద్దుడు అయ్యెను; తదా ప్రభృతి = అది మొదలు; రాఘవ = ఓ రామా!; స చ = అదియును; అంగవిషయః = అంగదేశము అని; శ్రీమాన్ = శ్రీయుతమైన; యత్ర = ఎచట; అంగమ్ = శరీరమును; ప్రముమోచ = విడిచెనో; హ.
భావము:-
అది మొదలు మన్మథునికి అనంగుడని (శరీరములేనివాడని) పేరు వచ్చెను. అతడు దేహమును విడిచిన శ్రీయుతమైన ప్రదేశమునకు అంగదేశము అని పేరు వచ్చెను.
1.23.15.
అనుష్టుప్.
తస్యాయమాశ్రమః పుణ్యః
తస్యేమే మునయః పురా ।
శిష్యా ధర్మపరా నిత్యం
తేషాం పాపం న విద్యతే ॥
టీక:-
తస్య = అతని; అయం = ఇది; ఆశ్రమః = ఆశ్రమము; పుణ్యః = పుణ్యమైన; తస్య = ఆతని; ఇమే = ఈ; మునయః = మునులు; పురా = పూర్వము; శిష్యా = శిష్యులైన; ధర్మపరా = ధర్మపరాయణులు; నిత్యమ్ = ఎల్లప్పుడు; తేషామ్ = వారికి; పాపం = పాపము; న = లేదు; విద్యతే = ఉండుట.
భావము:-
ఇది శివుడు తపస్సు చేసిన పుణ్యాశ్రమము. ఈ మునులందరూ పూర్వము శివుని శిష్యులు. నిత్యము ధర్మమును పాటించే వారు. వీరికి పాపము అనునది ఉండదు.
1.23.16.
అనుష్టుప్.
ఇహాద్య రజనీం రామ!
వసేమ శుభదర్శన ।
పుణ్యయోః సరితోర్మధ్యే
శ్వస్తరిష్యామహే వయమ్ ॥
టీక:-
ఇహ = ఇక్కడ; అద్య = ఈనాడు; రజనీమ్ = రాత్రి; రామ = రాముడా!; వసేమ = నివసించెదము; శుభదర్శన = మంగళకరమైన దర్శనము గల; పుణ్యయోః = పవిత్రమైన; సరితోః = నదులయొక్క; మధ్యే = మధ్యలో; శ్వః = రేపు; తరిష్యమహే = దాటెదము; వయమ్ = మనము
భావము:-
శుభదర్శనుడవైన ఓ రామా! ఈ రాత్రికి పవిత్రమైన గంగా-సరయూనదుల మధ్య ఇచట ఉండి, రేపు గంగానది దాటెదము.
1.23.17.
అనుష్టుప్.
అభిగచ్ఛామహే సర్వే
శుచయః పుణ్యమాశ్రమమ్ ।
స్నాతాశ్చ కృతజప్యాశ్చ
హుతహవ్యా నరోత్తమ!" ॥
టీక:-
అభిగచ్ఛామహే = వెళ్ళెదము; సర్వే = మనమంతా; శుచయః = పవిత్రులమై; పుణ్యమ్ = పవిత్రమైన; ఆశ్రమమ్ = ఆశ్రమములోనికి; స్నాతాః = స్నానము చేసినవారమై; చ; కృత= చేసినవారమై; జప్యాః = జపమును; చ; హుత = వ్రేల్చినవారమై; హవ్యాః = హవ్యములు; నరోత్తమా = ఓ నరులలో ఉత్తముడా.
భావము:-
ఓ పురుషోత్తముడా! శ్రీరామచంద్రా!, స్నానము, జపము హోమము పూర్తి చేసుకొని, పవిత్రులమై ఆశ్రమము లోనికి వెళ్ళెదము.
1.23.18.
అనుష్టుప్.
తేషాం సంవదతాం తత్ర
తపోదీర్ఘేణ చక్షుషా ।
విజ్ఞాయ పరమప్రీతా
మునయో హర్షమాగమన్ ॥
టీక:-
తేషామ్ = వారు; సంవదతామ్ = మాటలాడుకొనుచుండ; తత్ర = అక్కడ; తపః = తపశ్శక్తిచే; దీర్ఘేణ = దీర్ఘమయిన; చక్షుషా = కన్నులతో; విజ్ఞాయ = వారిని గుర్తించి; పరమప్రీతా = చాలా సంతోషించినవారై; మునయః = మహామునులు; హర్షమ్ = ఆనందమును; ఆగమన్ = పొందిరి.
భావము:-
రామ, లక్ష్మణులు విశ్వామిత్రుల వారితో మాట్లాడుచుండగా, వారిని అచట ఉన్న మహామునులు వారి తపశ్శక్తితో కూడిన దీర్ఘ దృష్టితో చూసి, చాలా సంతోషించినవారై, ఆనందము పొందిరి.
1.23.19.
అనుష్టుప్.
అర్ఘ్యం పాద్యం తథాఽ తిథ్యం
నివేద్య కుశికాత్మజే ।
రామలక్ష్మణయోః పశ్చాత్
అకుర్వన్నతిథిక్రియామ్ ॥
టీక:-
అర్ఘ్యమ్ = పూజకు తగిన ద్రవ్యములు; పాద్యమ్ = కాళ్లు కడుగుకొనుటకు నీరు; తథా = మఱియు; ఆతిథ్యమ్ = అతిథి సత్కారమును; నివేద్య = సమర్పించి; కుశికాత్మజే = విశ్వామిత్రునియందు; రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు; పశ్చాత్ = ఆ తరువాత; అకుర్వన్ = చేసారు; అతిథిక్రియామ్ = అతిథి సత్కారములను .
భావము:-
ఆ మహామునులు ముందుగా విశ్వామిత్రునికి కాళ్ళు కడిగి, పూజాద్రవ్యములు, ఆతిథ్యము సమర్పించి, తరువాత రామలక్ష్మణులకు అతిథి సత్కారములను సమర్పించారు.
1.23.20.
అనుష్టుప్.
సత్కారం సమనుప్రాప్య
కథాభిరభిరంజయన్ ।
యథార్హమజపన్ సన్ధ్యాం
ఋషయస్తే సమాహితాః ॥
టీక:-
సత్కారమ్ = సత్కారమును; సమనుప్రాప్య = పొంది; కథాభి: కథల చేత; అభిరంజయన్ = ఆనందింపచేసిరి; యథార్హమ్ = తగిన విధముగా; అజపన్ = జపించిరి; సంధ్యామ్ = సంధ్యలో; ఋషయః = ఋషులు; తే = ఆ; సమాహితాః = సావధాన చిత్తము కలవారై .
భావము:-
సత్కారములు పొందిన తరువాత, రామ లక్ష్మణ విశ్వామిత్రులు కథలతో ఆ ఋషులను ఆనందింప చేసిరి. సాయంకాల సంధ్యా సమయమున ఏకగ్రత కల చిత్తముతో తగు విధముగా జపము చేసిరి.
1.23.21.
అనుష్టుప్.
తత్ర వాసిభిరానీతా
మునిభిః సువ్రతైః సహ ।
న్యవసన్ సుసుఖం తత్ర
కామాశ్రమపదే తదా ॥
టీక:-
తత్ర = అక్కడ; వాసిభిః = నివసించు; ఆనీతా = తీసుకొని వెళ్లి; మునిభిః = మునులచే; సువ్రతైః = ఉత్తమ వ్రతము గల; సహ = వారితో; న్యవసన్ = నివసించిరి; సుసుఖమ్ = సుఖముగా; తత్ర = అక్కడ; కామాశ్రమపదే = కామాశ్రమములో; తదా = అప్పుడు.
భావము:-
అక్కడ కామాశ్రమములో నివసించు ఉత్తమ మునులు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆశ్రమము లోనికి తీసుకొని వెళ్లిరి. అచట వారు సుఖముగా నివసించిరి.
1.23.22.
అనుష్టుప్.
కథాభిరభిరామాభిః
అభిరామౌ నృపాత్మజౌ ।
రమయామాస ధర్మాత్మా
కౌశికో మునిపుంగవః ॥
టీక:-
కదాభిః = కథలు; అభిరామాభిః = మనసును అలరించు; అభిరామౌ = మనోహరులైన; నృపాత్మజౌ = రాజకుమారులను; రమయామాస = ఆనందింపచేసెను; ధర్మాత్మా = ధర్మాత్ముడగు; కౌశికః = విశ్వామిత్రుడు; మునిపుంగవః = మహర్షి (మునులలో శ్రేష్ఠుడు)
భావము:-
ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహర్షి మనసును అలరించుకథలు చెప్పి మనోహరులైన రాజకుమారులను ఆనందింపచేసెను.
1.23.23.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రయోవింశః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రయోవింశః [23] = ఇరవైమూడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [23] ఇరవై మూడవ సర్గ సుసంపూర్ణము.
బాల కాండ
1.24.1.
అనుష్టుప్.
తతః ప్రభాతే విమలే
కృత్వాహ్నికమరిందమౌ ।
విశ్వామిత్రం పురస్కృత్య
నద్యాస్తీర ముపాగతౌ ॥
టీక:-
తతః = తరువాత; ప్రభాతే = తెల్లవారగట్ల సమయములో; విమలే = స్వచ్ఛమైన; కృతః = చేయబడిన; ఆహ్నికమ్ = కాలకృత్యములు కలవారై; అరిందమౌ = శత్రు సంహారకులు; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్య = ఎదుట ఉంచుకొని; నద్యాః = నది యొక్క; తీరమ్ = తీరమును; ఉపాగతౌ = చేరుకొనిరి.
భావము:-
శత్రువులను దునుమాడెడి రామలక్ష్మణులు ప్రాతః సమయమున చేయవలసిన స్నానాది కాలకృత్యములను ముగించుకొని, విశ్వామిత్ర మహర్షి ముందు నడచుచుండగా గంగానదీ తీరమునకు చేరుకొనిరి.
1.24.2.
అనుష్టుప్.
తే చ సర్వే మహాత్మానో
మునయః సంశితవ్రతాః ।
ఉపస్థాప్య శుభాం నావం
విశ్వామిత్ర మథాబ్రువన్ ॥
టీక:-
తే = ఆ; చ = మఱియు; సర్వే = అందరు; మహాత్మానః = మహాత్ములు; మునయః = మునులు; సంశితవ్రతాః = వ్రతములు సరిగా పూర్తిచేసినవారు, శబ్ధరత్నాకరము; ఉపస్థాప్య = తీసుకొని వచ్చి; శుభాం = శుభప్రదమైన; నావం = నావను; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి; అథ = తరువాత; అబ్రువన్ = పలికిరి.
భావము:-
సంశ్రితవ్రతులును, మహాత్ములును ఐన ఆ మునులందరును మంగళకరమైన పడవను తీసుకొనివచ్చి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.
1.24.3.
అనుష్టుప్.
“ఆరోహతు భవాన్నావం
రాజపుత్ర పురస్కృతః ।
అరిష్టం గచ్ఛ పన్థానం
మాభూత్కాలవిపర్యయః"
టీక:-
ఆరోహతు = ఎక్కెదవు గాక; భవాన్ = నీవు; నావం = నావను; రాజపుత్ర = రాకుమారులను; పురస్కృతః = ముందు ఉన్నవాడు; అరిష్టం = కీడు; గచ్ఛ = బయలుదేరు; పన్థానం = మార్గము నందు; మా భూత్ = జరుగకుండు గాక; కాలః = కాలములో; విపర్యయః = ప్రతికూల్యతలు .
భావము:-
“నీవురామలక్ష్మణ రాకుమారులను వెంటనిడుకొని, పడవ నెక్కుము. వెళ్ళేదారిలో ఏ కీడు, కాలప్రతికూల్యతలు కలుగకుండు గాక.”
1.24.4.
అనుష్టుప్.
విశ్వామిత్రస్తథేత్యుక్త్వా
తానృషీనభిపూజ్య చ ।
తతార సహితస్తాభ్యామ్
సరితం సాగరంగమామ్ ॥
టీక:-
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; తథ = "సరే"; ఇతి = అని; ఉక్త్వా = పలికి; తాన్ = ఆ; ఋషీన్ = ఋషులను; అభిపూజ్య = పూజించి; చ = పిమ్మట; తతార = దాటెను; సహితః = కూడి; తాభ్యామ్ = వారితో; సరితం = నదిని; సాగరం = సముద్రము లోనికి; గమామ్ = ప్రవహించునది.
భావము:-
విశ్వామిత్రుడు "అట్లే అగు గాక" అని పలికి; ఆ ఋషిపుంగవులను పూజించి; రామలక్ష్మణులను వెంటబెట్టుకొని; సముద్రమువైపునకు ప్రవహించు గంగానదిని దాటిరి.
గమనిక:-
*-సరయూ సంగమం పటము చూడుడు. ఇందు అయోధ్య, సరయు, గంగ, గంగాసరయుసంగమం, శోణ, మిథిల లను గమనించగలరు.
1.24.5.
అనుష్టుప్.
తతః శుశ్రావ వై శబ్దం
అతిసంరంభవర్ధితమ్ ।
మధ్యమాగమ్య తోయస్య
సహ రామః కనీయసా ॥
టీక:-
తతః = తరువాత; శుశ్రావ = వినెను; శబ్దమ్ = శబ్దమును; అతి = ఎక్కువగా; సంరంభవర్ధితమ్ = వేగము వలన ఎక్కువయినది; మధ్యమ్ = మధ్యమున; ఆగమ్య = వచ్చిన; తోయస్య = నీటి యొక్క; సహ = కూడి; రామః = రాముడు; కనీయసా = తమ్ముడితో కూడి
భావము:-
నది మధ్యలో నుండగా, రామలక్ష్మణులు జలప్రవాహముయొక్క అధిక వేగమువలన కలిగిన బిగ్గరగా వినబడుచున్న శబ్దము వినిరి.
1.24.6.
అనుష్టుప్.
అథ రామః సరిన్మధ్యే
పప్రచ్ఛ మునిపుంగవమ్ ।
వారిణో భిద్యమానస్య
కిమయం తుములో ధ్వనిః?" ॥
టీక:-
అథ = తరువాత; రామః = రాముడు; సరిత్ = నది; మధ్యే = మధ్యయందు; పప్రచ్ఛ = ప్రశ్నించెను; మునిపుంగవమ్ = మునిపుంగవుని; వారిణః = నీటిని; భిద్యమానస్య = భేదించుచున్నట్లు; కిమ్ = ఏమిటి; అయం = ఈ; తుములః = కలకలమైన; ధ్వనిః = ధ్వని.
భావము:-
నది మధ్యలో రాముడు "నీళ్ళు విరిగిపడుతున్నట్లు వినవచ్చుచున్న ఈ గంభీరమైన ధ్వని ఏమి?" అని విశ్వామిత్రుని ప్రశ్నించెను.
గమనిక:-
*- నది మధ్యలో అధిక శబ్దం- జలపాతము వద్ద పడుచున్న జలములు లేదా సముద్ర అలలు విరిగి పడుచున్న అలల శబ్దం ఎక్కువ. నదీ ప్రవాహంలో అంత శబ్దం వినబడదు కదా ఇక్కడ ఎందుకు అంత శబ్దం వినబడుతున్నది అని రామలక్ష్మణులు ప్రశ్నిస్తున్నారు. విశ్వామిత్రులవారు హిమాలయాలలోనుండి వస్తున్న సరయూనది, గంగానదిలో ఇక్కడ కలుస్తున్నది కదా అందుకని అంత శబ్దం అని వివరిస్తున్నారు
1.24.7.
అనుష్టుప్.
రాఘవస్య వచః శ్రుత్వా
కౌతూహలసమన్వితః ।
కథయామాస ధర్మాత్మా
తస్య శబ్దస్య నిశ్చయమ్ ॥
టీక:-
రాఘవస్య = రాముని యొక్క; వచః = మాటను; శ్రుత్వా = విని; కౌతూహల సమన్వితః = కుతూహలము కలిగియున్న; కథయామాస = చెప్పెను; ధర్మాత్మా = ధర్మాత్ముడు; తస్య = ఆ యొక్క; శబ్దస్య = శబ్దము యొక్క; నిశ్చయమ్ = నిర్ణయము.
భావము:-
రాముడు కుతూహలముగా అడిగిన ప్రశ్న విని; విశ్వామిత్రుడు ఆ నీటి శబ్దమునకు కారణమును నిర్ణయము చేసెను.
1.24.8.
అనుష్టుప్.
“కైలాసపర్వతే రామ
మనసా నిర్మితం సరః ।
బ్రహ్మణా నరశార్దూల
తేనేదం మానసం సరః ॥
టీక:-
కైలాసపర్వతే = కైలాసపర్వతమునందు; రామ = రామా; మనసా = మనస్సుచే; నిర్మితం = నిర్మించబడినది; సరః = సరస్సు; బ్రహ్మణా = బ్రహ్మదేవునిచే; నరశార్దూల = మానవోత్తమా; తేన = అందు వలన; ఇదం = ఈ; సరః = సరస్సు.
భావము:-
“నరోత్తమా! రామా! బ్రహ్మదేవుడు తన మనస్సులో కలిగిన ఆలోచనచే, కైలాసపర్వతముపై ఒక సరస్సును నిర్మించెను. అందువలన దీనికి మానస సరోవరము అని పేరు వచ్చెను.
1.24.9.
అనుష్టుప్.
తస్మాత్సుస్రావ సరసః
సాఽ యోధ్యాముపగూహతే ।
సరఃప్రవృత్తా "సరయూః"
పుణ్యా బ్రహ్మసరశ్చ్యుతా ॥
టీక:-
తస్మాత్ = ఆ; సుస్రావ = ప్రవహించుచున్న; సరసః = సరస్సు నుండి; సా = అది; అయోధ్యామ్ = అయోధ్యాపట్టణమును; ఉపగూహతే = చుట్టుకొనియున్నది; సరః = సరస్సు నుండి; ప్రవృత్తా = ప్రవహించుటచే; సరయూః = సరయూ; పుణ్యా = పుణ్యప్రదమైనది; బ్రహ్మ సరః = బ్రహ్మ సరోవరము నుండి; చ్యుతా = ప్రవహించుట వలన.
భావము:-
బ్రహ్మచే సృష్టించబడిన మానససరోవరము నుండి పుట్టుటచే దీనికి 'సరయు' అను పేరుగలిగినది. ఈ పుణ్యనది అయోధ్యా నగరమును చుట్టి ప్రవహించుచున్నది. బ్కహ్మదేవుడు సృజించిన సరోవరం నుండి పుట్టుటచేత ఈ సరయూ నది పవిత్రమైనది.
1.24.10.
అనుష్టుప్.
తస్యాయమతులః శబ్దో
జాహ్నవీమభివర్తతే ।
వారిసంక్షోభజో రామ
ప్రణామం నియతః కురు" ॥
టీక:-
తస్యాత్ = దాని యొక్క; అయమ్ = ఈ; అతులః = అసమానమైన; శబ్దః = శబ్దము; జాహ్నవీమ్ = గంగా నదిని; అభివర్తతే = ప్రవేశించుచున్నది; వారిః = నీటి యొక్క; సంక్షోభజః = సంక్షోభము వలన పుట్టినది; రామ = రామా; ప్రణామం = నమస్కారము; నియతః = భక్తితో; కురు = చేయుము.
భావము:-
రామా! ఆ సరయూ నది గంగానదిలోనికి ప్రవేశించు సంక్షోభమువలన గంభీరమైన ఆ శబ్దము కలుగుచున్నది. భక్తితో, ఈ రెండు పుణ్య నదుల సంగమమునకు నమస్కారము చేయుము.”
1.24.11.
అనుష్టుప్.
తాభ్యాం తు తావుభౌ కృత్వా
ప్రణామమతిధార్మికౌ ।
తీరం దక్షిణమాసాద్య
జగ్మతుర్లఘువిక్రమౌ ॥
టీక:-
తాభ్యాం = ఆ నదులకు; తా వుభౌ = వారిరువురును; కృత్వా = చేసి; ప్రణామమ్ = నమస్కారమును; అతిధార్మికౌ = చాలా ధర్మాత్ములైన; తీరం = తీరమును; దక్షిణమ్ = దక్షిణ దిక్కును; ఆసాద్య = పొంది; జగ్మతుః = వెళ్ళిరి; లఘువిక్రమౌ = శీఘ్రముగా.
భావము:-
ధర్మాత్ములైన రామలక్ష్మణులు ఆ రెండు పుణ్యనదులకు నమస్కారము చేసి, ఆ నది దక్షిణతీరమును చేరి వేగముగా నడచుచుండిరి.
1.24.12.
అనుష్టుప్.
స వనం ఘోరసంకాశం
దృష్ట్వా నృపవరాత్మజః ।
అవిప్రహతమైక్ష్వాకః
పప్రచ్ఛ మునిపుంగవమ్ ॥
టీక:-
సః = అతడు; వనం = అరణ్యమును; ఘోరసంకాశం = ఘోరమైన; దృష్ట్వా = చూసి; నృపవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడు; అవిప్రహతమ్ = త్రొక్కబడని; ఇక్ష్వాకః = ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన; పప్రచ్ఛ = ప్రశ్నించెను; మునిపుంగవమ్ = మునిశ్రేష్ఠుని.
భావము:-
ఇక్ష్వాకువంశములో జన్మించిన రాజవరుని కుమారుడైన రాముడు, ఎవ్వరును యింతకు మున్ను ప్రవేశింపని ఆ ఘోరారణ్యమును చూసి, మునిపుంగవుడైన విశ్వామిత్రుని ఇట్లు ప్రశ్నించెను.
1.24.13.
అనుష్టుప్.
“అహో వనమిదం దుర్గం
ఝిల్లికాగణనాదితమ్ ।
భైరవైః శ్వాపదైః పూర్ణం
శకున్తైర్దారుణారుతైః ॥
టీక:-
అహా = ఆహా; వనమ్ = అరణ్యము; ఇదం = ఈ; దుర్గం = ప్రవేశించుటకు కష్టముగా ఉన్న; ఝల్లికా = ఈలపురుగుల, చిమ్మటల; గణ = సమూహముల; నాదితమ్ = రొద తోడను; భైరవైః = భయంకరములైన; శ్వాపదైః = క్రూర మృగముల తోడను; పూర్ణమ్ = నిండి యున్నది; శకున్తైః = భానపక్షుల యొక్క; దారుణా = భీకరమైన; రుతైః = కూతలతోడను.
భావము:-
ఆహా! ఈ అరణ్యము ప్రవేశించుటకు చాల దుర్గమమైనది. ఈలపురుగుల రొద తోడను, క్రూర మృగముల అరుపులతోడను, భానపక్షుల భయంకరమైన కూతల తోడను నిండి యున్నది.
1.24.14.
అనుష్టుప్.
నానాప్రకారైః శకునైః
వాశ్యద్భిర్భైరవైః స్వనైః ।
సింహవ్యాఘ్రవరాహైశ్చ
వారణైశ్చోపశోభితమ్ ॥
టీక:-
నానా = అనేక; ప్రకారైః = రకములైన; శకునైః = పక్షులచేతను; వాశ్యద్భిః = కూయుచున్న; భైరవ = భయంకరమైన; స్వనైః = ధ్వనులచేతను; సింహః = సింహములు; వ్యాఘ్రః = పులులు; వరాహైః = అడవిపందుల చేతను; చ = మఱియు; వారణైః = ఏనుగుల చేతను; చ = మఱియు; ఉపశోభితమ్ = ప్రకాశింపబడినది
భావము:-
అనేక రకములైన పక్షుల కూతలతోను. సింహములు. పులులు, అడవిపందులు, ఏనుగుల వంటి మృగముల భయంకరమైన అరుపులతోను నిండి ఈ అరణ్యము కనబడుచున్నది.
1.24.15.
అనుష్టుప్.
ధవాశ్వకర్ణకకుభైః
బిల్వతిన్దుకపాటలైః ।
సంకీర్ణం బదరీభిశ్చ
కిం న్వేతద్దారుణం వనమ్?" ॥
టీక:-
ధవ = చండ్ర; అశ్వకర్ణ = ఇనుమద్ది; కకుభైః = ఏరుమద్ది వృక్షములతోను; బిల్వ = మారేడు; తిన్దుక = నల్ల తుమికి; పాటలైః = కలిగొట్టుచెట్లతోను; సంకీర్ణం = వ్యాకులమైయున్న; బదరీభిః = రేగు చెట్లతోను; చ = కూడ; కిం ను = ఎందుకు; ఏతత్ = ఈ; దారుణం = భయంకరమైనది; వనమ్ = అరణ్యము.
భావము:-
చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, నల్లతుమికి, కలిగొట్టు, రేగు మొదలైన వృక్షములతో దట్టముగా నిండి ఇంత భయంకరముగా నున్న దేమిఈ భీకరమైన అరణ్యము?”
1.24.16.
అనుష్టుప్.
తమువాచ మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ।
"శ్రూయతాం వత్స! కాకుత్స్థ!
యస్యైతద్దారుణం వనమ్ ॥
టీక:-
తమ్ = అతని గూర్చి; ఉవాచ = పలికెను; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి ఐన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహా = గొప్ప; మునిః = ముని; శ్రూయతాం = వినబడుదువు గాక; వత్స = కుమారా; కాకుత్స్థ = రామా; యస్య = ఎవరిదో; ఏతత్ = ఈ; దారుణం = భయంకరమైన; వనమ్ = అరణ్యము.
భావము:-
గొప్ప తేజశ్శాలి ఐన విశ్వామిత్ర మహాముని రామునితో "వత్సా! రామా! వినుము. ఈ భయంకరమైన అరణ్యము ఎవరిదో తెలిపెదను.
1.24.17.
అనుష్టుప్.
ఏతౌ జనపదౌ స్ఫీతౌ
పూర్వమాస్తాం నరోత్తమ ।
మలదాశ్చ కరూశాశ్చ
దేవనిర్మాణనిర్మితౌ ॥
టీక:-
ఏతౌ = ఈ; జనపదౌ = ప్రజలు వసించే దేశములు; స్ఫీతౌ = విశాలమైనవి; పూర్వమ్ = పూర్వము; ఆస్తాం = ఉండెడివి; నరోత్తమ = మానవోత్తమా; మలదాః = మలదము; కరూశాః = కరూశము; దేవనిర్మాణ నిర్మితౌ = దేవతల నిర్మాణముచే నిర్మింపబడినవి.
భావము:-
మానవశ్రేష్ఠుడా! రామా! పూర్వము, దేవతలు నిర్మించిన మలదము, కరూశము అను రెండు విశాలమైన దేశములు ఇక్కడ ఉండెడివి.
1.24.18.
అనుష్టుప్.
పురా వృత్రవధే రామ
మలేన సమభిప్లుతమ్ ।
క్షుధా చైవ సహస్రాక్షం
బ్రహ్మహత్యా సమావిశత్ ॥
టీక:-
పురా = పూర్వము; వృత్ర = వృత్రాసురుని; వధే = వధించి నపుడు; రామ = రామా; మలేన = మలినము తోను; సమభిప్లుతమ్ = నిండిన; క్షుధా = ఆకలిచేతను; చ = కూడ; ఇవ = అలా; సహస్రాక్షమ్ = ఇంద్రుడిని సహస్రాక్షుడు- వేయికన్నులు కల వాడు, ఇంద్రుడు; బ్రహ్మహత్య = బ్రహ్మహత్యా పాతకము; సమావిశత్ = ఆవహించెను.
భావము:-
రామా! పూర్వము వృత్రాసురుని వధించినందున ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనెను. అందువలన అతని శరీరము అశుచి తోడను ఆకలి తోడను నిండి పీడింపబడసాగెను.
1.24.19.
అనుష్టుప్.
తమింద్రం స్నాపయన్ దేవా
ఋషయశ్చ తపోధనాః ।
కలశైః స్నాపయామాసుః
మలం చాస్య ప్రమోచయన్ ॥
టీక:-
తమ్ = ఆతని; ఇంద్రం = ఇంద్రుని; స్నాపయన్ = స్నానము చేయించిరి; దేవాః = దేవతలు; ఋషయః = ఋషులు; చ = మఱియు; తపోధనాః = తపోధనులు; కలశైః = కలశములతో; స్నాపయామాసుః = స్నానము చేయించిరి; మలం = అశుచి; చ = మఱియు; అస్య = ఇతని యొక్క; ప్రమోచయన్ = తొలగింపచేసిరి.
భావము:-
దేవతలు, తపోధనులైన ఋషులును ఆ ఇంద్రుని కలశములతో జలాభిషేకము చేయించి, అతనికి కలిగిన అశుచిని ఆకలిని పోగొట్టిరి.
1.24.20.
అనుష్టుప్.
ఇహ భూమ్యాం మలం దత్త్వా
దత్త్వా కారూశమేవ చ ।
శరీరజం మహేంద్రస్య
తతో హర్షం ప్రపేదిరే ॥
టీక:-
ఇహ = ఈ; భూమ్యాం = భూమి యందు; మలం = అశుచిని; దత్వా = ఇచ్చి; దత్వా = ఇచ్చి; కారూశమ్ = ఆకలిని; ఏవ చ = కూడా; శరీరజం = శరీరమునుండి పుట్టిన; మహేంద్రశ్య = ఇంద్రుని యొక్క; తతః = తరువాత; హర్షం = సంతోషమును; ప్రపేదిరే = పొందిరి.
భావము:-
ఇంద్రుని శరీరము నందున్న అశుచిని, ఆకలిని అతని నుండి తొలగింపజేసి దేవతలును ఋషులును సంతోషించిరి. ఆ అశుచిని, ఆకలిని ఈ ప్రదేశములకు ఇచ్చిరి.
1.24.21.
అనుష్టుప్.
నిర్మలో నిష్కరూశశ్చ
శుచిరింద్రో యదాఽ భవత్ ।
దదౌ దేశస్య సుప్రీతో
వరం ప్రభురనుత్తమమ్ ॥
టీక:-
నిర్మలః = అశుచిత్వము తొలగి పోయిన వాడు; నిష్కరూశః = ఆకలి తొలగి పోయిన వాడు; చ = మఱియు శుచిః = పవిత్రుడు; ఇన్ద్రః = ఇంద్రుడు; యదా = ఎప్పుడు; అభవత్ = అయ్యెనో; దదౌ = ఇచ్చెను; దేశస్య = దేశమునకు; సుప్రీతః = చాల సంతోషించినవాడై; వరం = వరమును; ప్రభుః = ప్రభువు; అనుత్తమమ్ = చాలా ఉత్తమమైన.
భావము:-
అశుచి; ఆకలి తొలగిపోవుటచే; శుచి ఐన ఇంద్రుడు; చాల సంతోషించి; ఈ ప్రదేశములకు గొప్ప వరము నిచ్చెను.
1.24.22.
అనుష్టుప్.
ఇమౌ జనపదౌ స్ఫీతౌ
ఖ్యాతిం లోకే గమిష్యతః ।
మలదాశ్చ కరూశాశ్చ
మమాంగమలధారిణౌ ॥
టీక:-
ఇమౌ = ఈ రెండు; జనపదౌ = దేశములు; స్ఫీతౌ = సమృద్ధములై; ఖ్యాతిం = ఖ్యాతిని; లోకే = లోకములో; గమిష్యతః = పొందగలవు; మలదాః = మలదము; చ = మఱియు; కరూశాః = కరూశము; చ = మఱియు; మమ = నా యొక్క; అంగ = శరీరము యొక్క; మల = అశుచిని; ధారిణౌ = ధరించినవి.
భావము:-
నా శరీరము లోని అశుచిని ఆకలిని ఈ ప్రదేశములు ధరించినవి ఐనందున మలదము, కరూశము అను పేర్లతో ఈ ప్రాంతములు సర్వసమృద్ధిగా నుండి విశేష ఖ్యాతి పొందగలవు.
1.24.23.
అనుష్టుప్.
సాధు సాధ్వితి తం దేవాః
పాకశాసనమబ్రువన్ ।
దేశస్య పూజాం తాం దృష్ట్వా
కృతాం శక్రేణ ధీమతా ॥
టీక:-
సాధు సాధు = బాగు బాగు; ఇతి = ఇది; తం = ఆ; దేవాః = దేవతలు; పాకశాసనమ్ = ఇంద్రుడిని; అబ్రువన్ = పలికిరి; దేశస్య = దేశము యొక్క; పూజాం = గౌరవమును; తాం = తాము; దృష్ట్వా = చూసి; కృతాం = చేయబడిన; శక్రేణ = ఇంద్రునిచే; ధీమతా = బుద్ధిమంతుడైన.
భావము:-
బుద్ధిశాలి ఐన దేవేంద్రుడు ఆ దేశములకు చేసిన గౌరవమును ఇచ్చిన వరములను చూసి; దేవతలు "బాగున్నది; బాగున్నది" అని పలికిరి.
గమనిక:-
*- పాకశాసనుడు- పాక అను రాక్షసుని శాసించిన వాడు, చంపువాడు, ఇంద్రుడు
1.24.24.
అనుష్టుప్.
ఏతౌ జనపదౌ స్ఫీతౌ
దీర్ఘకాలమరిందమ! ।
మలదాశ్చ కరూశాశ్చ
ముదితౌ ధనధాన్యతః ॥
టీక:-
ఏతౌ = ఈ; జనపదౌ = దేశములు; స్ఫీతౌ = విశాలములైన; దీర్ఘకాలమ్ = చాలా కాలము; అరిందమ = శత్రువులను సంహరించువాడా; మలదాః = మలదము; చ = మఱియు; కరూశాః = కరూశము; చ = మఱియు; ముదితౌ = సంతోషించినవి; ధనధాన్యతః = ధనధాన్యములచే.
భావము:-
శత్రువులను సంహరించు ఓ రామా! సువిశాలమైన ఈ మలద, కరూశ దేశములు చాలా కాలము ధనధాన్య సమృద్ధములై ఉండెడివి.
1.24.25.
అనుష్టుప్.
కస్యచిత్త్వథ కాలస్య
యక్షీ వై కామరూపిణీ ।
బలం నాగసహస్రస్య
ధారయన్తీ తదా హ్యభూత్ ॥
టీక:-
కస్య = ఎవరి; చిత్ = కొంచెము; అథ = తరువాత; కాలస్య = కాలమునకు; యక్షీ = యక్షిణి; కామరూపిణి = కోరిన రూపము పొంద గలిగెడిది; బలం = బలమును; నాగ = ఏనుగుల; సహస్రస్య = వేయింటి యొక్క; ధారయన్తీ = ధరియించుచున్నదో; తదా = అప్పుడు; అభూత్ = ఉండెను.
భావము:-
కొంత కాలము తరువాత, కామరూపి ఐన ఒక యక్షిణీ స్త్రీ పుట్టెను. ఆమె వేయి ఏనుగుల బలము కలది.
1.24.26.
అనుష్టుప్.
తాటకా నామ భద్రం తే
భార్యా సుందస్య ధీమతః ।
మారీచో రాక్షసః పుత్రో
యస్యాః శక్రపరాక్రమః ॥
టీక:-
తాటకా నామ = తాటకి అనే పేరు గల; భద్రం = క్షేమమగు గాక; తే = నీకు; భార్యా = భార్యయు; సుందస్య = సుందుని యొక్క; ధీమతః = బుద్దిమంతుడు; మారీచః = మారీచుడు; రాక్షసః = రాక్షసుడు; పుత్రః = పుత్రుడు; యస్యాః = ఎవరి యొక్క; శక్రపరాక్రమః = దేవేంద్రుని వంటి పరాక్రమము గలవాడు.
భావము:-
తాటకి అను పేరు గల ఆమె బుద్ధిమంతుడైన సుందుని యొక్క భార్య. దేవేంద్రుని వంటి పరాక్రమము గల మారీచుడు వారి కుమారుడు. నీకు క్షేమమగు గాక.
1.24.27.
అనుష్టుప్.
వృత్తబాహుర్మహావీర్యో
విపులాస్యతనుర్మహాన్ ।
రాక్షసో భైరవాకారో
నిత్యం త్రాసయతే ప్రజాః ॥
టీక:-
వృత్త బాహుః = బాగా గుండ్రంగా కండలు తిరిగిన బాహువులు కలవాడు; మహా = గొప్ప; వీర్యః = వీరుడు; విపులః = విశాలమైన; ఆస్య = ముఖము; తనుః = శరీరము కలవాడు; మహాన్ = పెద్ద; రాక్షసః = రాక్షసుడు; భైరవ = భీకరమైన; ఆకారః = ఆకారము కలవాడు; నిత్యం = ఎల్లప్పుడును; త్రాసయితే = భయపెట్టు చున్నాడు; ప్రజాః = ప్రజలను.
భావము:-
మారీచుడు చాలా బలమైన బాహువులు కలవాడు. గొప్ప పరాక్రమవంతుడు. విశాలమైన ముఖము. చాలా పెద్ద శరీరము గలవాడు. భీకరాకారుడు. అతను ఎల్లప్పుడును ప్రజలను భయపెట్టుచున్నాడు.
1.24.28.
అనుష్టుప్.
ఇమౌ జనపదౌ నిత్యం
వినాశయతి రాఘవ! ।
మలదాంశ్చ కరూశాంశ్చ
తాటకా దుష్టచారిణీ ॥
టీక:-
ఇమౌ = ఈ రెండు; జనపదౌ = దేశములను; నిత్యమ్ = ఎల్లప్పుడును; వినాశయతి = నాశనము చేయుచున్నది; రాఘవ = రామా; మలదాం = మలదము; చ; కరూశాం = కరూశము; చ; తాటకా = తాటకి; దుష్ట = చెడు; చారిణీ = ప్రవర్తన కలది.
భావము:-
రామా! చెడ్డ ప్రవర్తన గల తాటకి మలద, కరూశములు అను ఈ దేశములను నిత్యమూ నాశనము చేయుచున్నది.
1.24.29.
అనుష్టుప్.
సేయం పన్థానమావార్య
వసత్యత్యర్ధయోజనే ।
అత ఏవ చ గంతవ్యం
తాటకాయా వనం యతః ॥
టీక:-
సా = అటువంటి; ఇయమ్ = ఈ; పన్థానమ్ = మార్గమును; ఆవార్య = అడ్డగించి; వసతి = నివసించుచున్నది; అత్యర్ధ = ఒకటిన్నర; యోజనే = ఆమడల దూరములో; అత ఏవ = అందువలననె; న = వీలుగా కాదు; గంతవ్యం = వెళ్ళుటకు; తాటకాయాః = తాటకి యొక్క; వనం = వనము; యతః = అందుచే.
భావము:-
అటువంటి తాటకి దారిని అడ్డగించి, ఇచట నుండి ఒకటిన్నర ఆమడల దూరములో నివసించుచున్నది. అందువలన తాటకి వసించు వనములోనికి ఎవ్వరును ప్రవేశించుటకు వీలు కాదు.
1.24.30.
అనుష్టుప్.
* స్వబాహుబలమాశ్రిత్య
జహీమాం దుష్టచారిణీమ్ ।
మన్నియోగాదిమం దేశం
కురు నిష్కణ్టకం పునః ॥
టీక:-
స్వ = స్వీయ; బాహు = భుజముల; బలమ్ = బలమును; ఆశ్రిత్య = ఉపయోగించి; జహి = వధింపుము; ఇమామ్ = ఈ; దుష్టచారిణీమ్ = దుర్మార్గురాలిని; మత్ = నా; నియోగాత్ = ఆదేశమువలన; ఇమం = ఈ; దేశమ్ = దేశమును; కురు = చేయుము; నిష్కణ్టకం = ఏ కష్టములు లేని దానిగా; పునః = మరల.
భావము:-
నీ భుజబలము ప్రయోగించి; దుష్టురాలైన ఈ తాటకిని వధియింపుము. నా ఆదేశానుసారము ఈ దేశమును ఎటువంటి కష్టములు లేని యటుల మరల చేయుము.
1.24.31.
అనుష్టుప్.
న హి కశ్చిదిమం దేశం
శక్నోత్యాగంతుమీదృశమ్ ।
యక్షిణ్యా ఘోరయా రామ
ఉత్సాదితమసహ్యయా ॥
టీక:-
న హి = కాడు; కశ్చిత్ = ఎవ్వడును; ఇమం = ఈ; దేశమ్ = దేశమును; శక్నోతి = సమర్థుడు; ఆగంతుమ్ = వచ్చుటకు; ఈదృశమ్ = ఇటువంటి; యక్షిణ్య = యక్షిణిచే; ఘోరయా = ఘోరమైన; రామ = రామా; ఉత్సాదితమ్ = నశింపజేయబడిన; అసహ్యయా = సహింపరానిది.
భావము:-
రామా! ఎవ్వరును ఎదిరింపలేనటువంటి భయంకర యక్షిణి తాటకి ఈ వనము నంతయు నాశనము చేసినది. అందువలన ఎవరును ఇట్టి దేశమును చొరజాలరు.
1.24.32.
అనుష్టుప్.
ఏతత్తే సర్వమాఖ్యాతం
యథైతద్దారుణం వనమ్ ।
యక్ష్యా చోత్సాదితం సర్వం
అద్యాపి న నివర్తతే" ॥
టీక:-
ఏతత్ = ఈ; తే = నీకు; సర్వమ్ = అంతయు; ఆఖ్యాతమ్ = చెప్పబడినది; యథా = ఏ విధముగా; ఏతత్ = ఈ; దారుణం = భయంకరముగా; వనమ్ = వనము; యక్ష్యా = యక్షిణిచే; చ = మఱియు; ఉత్సాదితం = ధ్వంసము చేయబడినదో; సర్వమ్ = అంతయును; అద్యాపి = ఇప్పటి వరకు; న = లేదు; నివర్తతే = మరలిపోవుట.
భావము:-
తాటకి ఈ వనము నంతయు ఎంత భయంకరముగ ధ్వంసము చేసినదో, ఈ వనమును ఇంకను విడువకుండ ఎట్లున్నదో ఆ విషయము నంతయు నీకు చెప్పితిని.
1.24.33.
గద్యం.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుర్వింశతిః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్వింశతి [24] = ఇరవైనాలుగు; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని చతుర్వింశతిః సర్గః [24]