కె.జి.కె. లిమిటెడ్ వారిచే స్థాపించబడిన ఎకైక తెలుగు వ్యాకరణ వెబ్సైట్
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' గా వ్యవహరించారు. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది.
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
క్రీస్తు శకం 1100–1400 మధ్య ప్రాచీన కన్నడ భాషనుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయాని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయని అనే సిద్ధాంతం ఉంది .
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది.
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం "నాగబు". చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)
పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం: అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
ప్రధాన వ్యాసము: మాండలికాలు
తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
సాగరాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
రాయలసీమ భాష: చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.
ప్రధాన వ్యాసము తెలుగు లిపి
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ లిపియైన 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది.
తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.
తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలము నుండి రాయల యుగము దాకా
తెలుగు లిపి చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్) మరియు "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ, చదవడానికీ, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.
తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.