SRISRISRI DHANVATARI VENKATESHWARA SWAMY DEVASTHANAMS REGULAR UPDATES
SRISRISRI DHANVATARI VENKATESHWARA SWAMY DEVASTHANAMS REGULAR UPDATES
సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంటమోగుతుంది.
మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు.
ధన్వంతరి జయంతి - DHANVANTARI JAYANTI
ఆదివారం (Dec 10) ధన్వంతరి జయంతి పురస్కరించుకొని అయిజ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి
పూజానంతరం... ప్రత్యేకముగా అలంకరించిన స్వామి వారి పల్లకిలో శ్రీ దేవి భూదేవి సమేతంగా ఆశీనులైన వెంకటేశుడు... మాడ వీధుల్లో విహారిస్తూ... భక్తజనులకు దర్శనమిచ్చారు...
The auspicious occasion of Dhanvantari Jayanti... Special Alankar for Sri Sri Sri Sridevi Bhudevi Sametha Dhanvantari Venkateswara Swamy vaaru
Sri Sridevi Bhudevi Sametha Dhanvantari Venkateswara Swamy in all His resplendence took out a majestic ride atop the mighty Special Alankar Pallaki seva and paraded along the four mada streets to bless His devotees.
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది...
శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సకలకోటి భక్తజనమండలి ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ
మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
భోగి శుభాకాంక్షలు!
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండుగ తొలి రోజు వచ్చేదే ‘భోగి’. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి, భూమికి దూరంగా జరుగుతుంది. దీంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు అప్పట్లో అంతా చలిమంటలు వేసుకునేవారు. అదే సమయంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి మంటలు వెనుక పురాణం కథనం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.... భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగానే భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదేనంటారు.
శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది.ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు...!
పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం ( 06.01.2023 )
అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో మూల విగ్రహానికి, ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించి కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
- శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఉత్తనూరు
అందరూ ఆహ్వానితులే
......ఆహ్వానం......
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం అనగా 02-01-2023వ తేదీన తెల్లవారు జామున 04.30 ని॥లకు బ్రాహ్మ ముహూర్తమున వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా ఉత్తనూరు క్షేత్రము నందు ఉత్తర ద్వార దర్శన భాగ్యము, శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం జరుగును
''వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ ''.... అంటే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. ఏడాదిలో ఉండే 12 నెలల్లో 11 వది పుష్యమాసం . ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి మోక్షదాయకమే అని వేదవాక్కు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా....
• ఉత్తర వైకుంఠ ద్వార ప్రవేశం మరియు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఉత్తరద్వార పూజ, కూష్మాణ్ణబలి, కవాటోద్ఘాటనం, ప్రవేశం బిందే సేవ పంచామృత అభిషేకం, వస్త్ర సమర్పణ, పుష్పాలంకార సేవ, సేవాకాలం, ఆలయ బలిహరణ విశ్వరూపం సందర్శన నివేదన తీర్థ ప్రసాద వితరణ
• మధ్యాహ్నం 12-00 గం॥లకు శ్రీమతి & శ్రీ గోగుల ప్రకాష్ రెడ్డి, శిరీష దంపతులచే శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ దేవస్థాన కమిటీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది....
• రాత్రి 10.00 గంటలకు మంగళ హారతి సమర్పించి ఉత్తర ద్వార బంధనం వేయడం జరుగుతుంది
అందరూ ఆహ్వానితులే...
ఓం నమో వేంకటేశాయ ... ఓం నమో శ్రీనివాసాయ... ఓం నమో ధన్వంతరీ వేంకటేశ్వరాయ నమః
దత్తాత్రేయ జయంతి విశిష్టత
దత్తాత్రేయ నామ విశిష్టత
దత్తాత్రేయడ్ని బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది.
ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ కూడా పిలుస్తుంటారు. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా భావిస్తుంటారు.
వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకున్న దత్తాత్రేయుడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ ఆధ్యాత్మిక చింతనలో గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు.
1. దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం
నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది.
ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి, తమకు భోజనం పెట్టమని అడిగారు.
ఆమె అందుకు అంగీకరించగానే, ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు.
అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది.
అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది.
అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు. కోరిన విధంగా భోజనం వడ్డించింది.
ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా, ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు, ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయనుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో పుత్రునిగా జన్మించమని అడిగింది.ఆ విధంగా ఆ మహా పతివ్రత దత్తునికి తల్లి అయ్యింది.
ఉదయం సుప్రభాతసేవతో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. సాయంత్రం సకలజనుల సమక్షంలో పండితుల వేదమంత్రాల నడుమ ప్రారంభమై రాత్రి వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారిని పుష్పపల్లకిని అధిరోహించారు. పల్లకిపై తిరు మాడవీధుల్లో స్వామి ఊరేగుతూ భక్తులను కనువిందు చేసారు స్వామివారు. పాల్గొన్న వేల మంది భక్తులు, గ్రామస్థులు
(21.11.2022)
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో గల అర్జునుడి మనవడు జనమేజయుడు మహారాజు ప్రతిష్టిత ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి జయంతి కలదని దేవస్థాన కమిటీ, అర్చకులు తెలియజేశారు .
నేడు స్వామివారిని పూజించిన, అర్చించిన, దర్శించిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని, కావున శ్రీవారిని దర్శించి పులకించాలనీ కోరుతున్నాము.
నేటి సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ కలదని ఉత్తనూరు శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ పేర్కొన్నారు..
భక్తుల గోవిందనామస్మరణల మధ్య, మంగళ వాాయిధ్యాల నడుమ... శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం రమణీయంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు భాగములో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పులకుర్తి తిరుమల్ రెడ్డి గారి అధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పచ్చని తోరణాలు. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి కల్యాణం కమణీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రామంలో కొలువైన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ( ఫిబ్రవరి 04) తెల్లవారుజామున 12.45 గంటలకు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవిలకు మాంగళ్యధారణ చేశారు.
అంతకుముందు వేద పండితులు కల్యాణ తంతును వైభవంగా నిర్వహించారు. కల్యాణం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. ఎప్పుడు లేని విధంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. పులకుర్తి మనీష్ రెడ్డి, సుప్రజ దంపతులు శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామిలకు తోడు కూర్చోగా వేద పండితులు కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కల్యాణం జరుగుతున్నంత సేపు భక్తులు కనులారా తిలకించారు. అనంతరం దేవస్థాన కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పులకుర్తి తిరుమల్ రెడ్డి గారు, వ్యాపారవేత్త పులకుర్తి శ్రీనాథ్ రెడ్డి గారు, దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తనూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయానికి తరిలివచ్చిన భక్తులు... ఈ పర్వదిన సందర్భంగా శ్రీవారు ఉత్తరద్వారం గుండ భక్తులకు దర్శనమిచ్చారు......
ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది...
ఆలయ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పులకుర్తి తిరుమల్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన కల్యాణంలో వ్యాపార కొత్తకోట జయన్న దంపతులు ఉత్సవమూర్తి కి తొడుగ కూర్చోగా గోవిందనామస్మరణల మధ్య కనులపండువగా కల్యాణం జరిగింది.