Yaksha Questions I యక్ష ప్రశ్నలు
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
Yaksha Questions I యక్ష ప్రశ్నలు
1. వేదవ్యాసుడు
మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు (చిక్కు ప్రశ్నలు). యక్షుడు అడిగిన ప్రశ్నలు తత్వజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి చెందినవి. యక్షుడు కొంగ రూపంలో చిక్కు ప్రశ్నలు ధర్మరాజును అడిగినాడు. ధర్మరాజు ఆ యక్ష ప్రశ్నలుకు జవాబులు నిచ్చి యమరాజును (యక్షుని) మెప్పించాడు.
మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. మహాభారతం సంస్కృతం భాషలో రచించబడినది. 18 పర్వములతో నిండిన మహాభారతం, ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) కవులు తెలుగు లోకి అనువదించారు. ఎఱ్ఱాప్రగడ అనువాదం అరణ్యపర్వంలో యక్షప్రశ్నలు ఘట్టం ఉంది. పిలాక గణపతి శాస్త్రీ గారు వచన సాహిత్యంగా యక్షప్రశ్నలు వ్రాసినారు. గరికపాటి నరసింహారావు గారి యక్షప్రశ్నలు (ప్రవచనం), 1901 సంవత్సరంలో రామానుజాచార్యులు గారు, 1956 సంవత్సరంలో చందమామ మాస పత్రికలో కథలుగా వచ్చాయి. దేవరకొండ శేషగిరిరావు, కప్పగంతు వెంకట రమణమూర్తి, నాగునేని లీల ప్రసాద్, శమంత రమణి మొదలుగు వారు యక్షప్రశ్నలు పుస్తక రూపంలో తెచ్చారు. మహాభారతం లోని యక్షప్రశ్నలు ను Yatra-Telugu లో మీకు అందించు చున్నాను.
2. పాండవులు అరణ్య వాసం
శకుని మాయ జూదంలో ఓడిపోయి పాండవులు అడవికి బయులుదేరినారు. పాండవులు తన వెంట వచ్చిన బ్రాహ్మణుల సమేతంగా వనం చేరుకొంటారు. ధర్మరాజు కోరిక మన్నించిన బ్రాహ్మణులు తమ తమ ఇల్లుకు వెళ్లిపోయారు. ద్వైతవనం నందు పవిత్ర జలంతో నిండిన సరోవరం నకు సమీపంలో పాండవులు ఆశ్రమాలు నిర్మించుకున్నారు. పాండవులు వచ్చినప్పటి నుండి ద్వైతవనం బ్రాహ్మణులతో నిండిపోయింది. మునులు యజ్ఞాయాగదులు నిర్వహించేవారు.
అరణ్యవాసం ముగింపు సమయం ఆసన్నమైంది. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఇట్లు పలెకును. " రాజా! నా అరణిని (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య) మథించే కాష్ఠానికి ఒక హరిణం (లేడి) దురదతో తన కొమ్మును గోకుకొంది. దైవయోగం వలన ఆ కాష్ఠం దాని కొమ్ములలో చిక్కుకు పోయింది. ఆ మృగం దూకుతూ పరుగెత్తింది. ఆ లేడి గిట్టగుర్తులను బట్టి చూస్తూ దానిని పట్టుకోండి. నా రాపిడి కర్రను తెచ్చి ఇవ్వండి" అని ప్రార్ధించాడు. నా అగ్నిహోత్ర కార్యానికి ఆటకం కలుగకుండా చూడగలరు.
ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగల లేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది. పాండవులు అలసి పోయి ఒక మర్రి చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు.
అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి " అన్నయ్యా ! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి? " అని అడిగాడు. ధర్మరాజు నవ్వి " నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు " అన్నాడు.
2. పాండవులు అరణ్య వాసం
పాండవులు దాహార్తులై కొలను అన్వేషన ధర్మరాజు " ఓ నకులుడ! నీ సోదరులందరూ దాహంతో అలిసిపోయి ఉన్నారు. సమీపంలో ఎక్కడైన నీరు గాని, నీటి దగ్గర పెరిగే చెట్లు గాని ఉన్నాయేమో చూడు" అని ఆదేశించాడు. పిమ్మట నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు " నకులా! నీవు పోయి నీరు త్రాగి, మా కోసం కొంత నీరు దొన్నెలలో నింపి తీసుకురా " అన్నాడు. అన్న గారు ఆజ్ఞాపించగానే నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. సారస పక్షులతో నిండిన స్వచ్ఛమైన కొలను చూసి నకులుడు నీటిని త్రాగడానికి కొంత వంగుతాడు. నీళ్ళు త్రాగబోయే సమయంలో ఆకాశవాణి ఇట్లు పలికెను. "నాయనా నకులా! తొందరపడక. ఈ తటాకము నాది. నాకొక్క నియమం కలదు. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి " అన్న మాటలు అదౄష్యవాణి నుంచి వినిపించాయి. నకులుడు
ఆ మాటలను పట్టించు కోకుండా చల్లని నీరు త్రాగాడు. యక్షని మాట మన్నించక పోవడంతో కొలను బయటకు వచ్చిన నకులుడు నేల మీద పడిపోయాడు.
నకులుడు అలస్యం చేయడం వలన ధర్మరాజు సహదేవుని చూసి "సహదేవా! నీ అన్నయ్య నకులుడు వెళ్లి చాలసేపు అయింది. నీవు పోయి చూసి రా!" అని చెప్పి పంపించాడు. సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్లాడు. కొలన వద్ద నకులుడు నేల మీద పడి ఉన్నాడు. అన్న గారిని చూసి దుఖించాడు. ఒక పక్క సహదేవునికి దాహం కూడ చాల పీడిస్తోంది. అతడు కొలను దగ్గరకు వెళ్లాడు. ఆదే సమయంలో ఆకాశవాణి " ఓ మహానుభావా! తొందరపడక. నేను ఒక యక్షడుని, ఈ తటాకము నా ఆధీనంలో ఉంది. నాకొక్క నియమం కలదు. నా ప్రశ్నలకు సమాధానమివ్వు, తరువాత నీరు త్రాగు. ఆ సమయంలో సహదేవునికి దాహం అధికమైంది. అతడు యక్షని మాటలను లక్ష్యపెట్టలేదు. నీటిని త్రాగగానే సహదేవుడు కూడ నేల పై ఒరిగినాడు.
4. అర్జునుడు కొలను వద్దకు చేరుట
ధర్మరాజు అర్జునిని చూసి "ఓ అర్జునా! నీ తమ్ముళ్లు నకులసహదేవులు నీటి కోసం ఇద్దరూ వెళ్లారు. వారు ఎంతవరకు తిరిగి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. నీవు వెళ్లి వారిని వెంటపపట్టుకునిరా!" అని చెప్పాడు. అర్జునుడు ధనుర్ధరుడై సరోవరం దగ్గరుకు చేరాడు.
సరోవరం వద్ద తమ్ములిద్దరూ నేల పై పడియున్నారు. దాని చూసిన అర్జునికి దుఖం వచ్చింది. అతడు నలుప్రక్కలకు తేరిపారి చూడసాగాడు. కాని అతనికి ఏ ప్రాణీ కనపడలేదు. ఆదే సమయంలో దాహం కలిగింది. నీటి కోనేరు వైపుకు వెళ్లాడు. అప్పుడు యక్షడు అదృశ్య రూపం లో అర్జుడుని హెచ్చిరించాడు. "ఓ కుంతీనందనా! నీవు కొలనులో నీటిని త్రాగలేవు. నీవు నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చితే నీటిని త్రాగగలవు" అని అదృశ్య యక్షడు అడ్డగించుతాడు. అర్జునుడు "ఓరీ మాయావి! నీవు ఎదుటకు వచ్చి అడ్డగించు. అప్పుడు నిన్ను సంహరిస్తాను " అంటూ శబ్ధవేది బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు యక్షడు "అర్జునా! ఈ వర్ధప్రయత్నం వలన ఏం జరుగుతుంది? నీవు నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాకనే నీటిని త్రాగగలవు.
అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. అర్జునుడు కూడా నేల మీద పడి పోయాడు. ధర్మరాజు భీముని చూసి "నీటి కోసం వెళ్ళిన మన ముగ్గురూ తమ్ముళ్లు ఎంతవరకు తిరిగి రాలేదు. అక్కడ ఏమి జరిగిందో చూసిరా " అని భీముని పంపాడు. భీముడు కొలను సమీపించగానే ముగ్గురూ తమ్ములను చూసి మిక్కిలి బాధ పడినాడు. అతడు తనలో ఈ పని యాక్షరాక్షసులదై ఉంటుంది అని భావించి, వారితో యుద్ధం చేయుటకు నిర్ణయించుకుంటాడు. ముందుగా తన దాహం తీర్చుకొనుటకు కొలను చేరుకుంటాడు. ఇంతలో యక్షడు అదృశ్య రూపంలో " ఓ భీమసేనా! తొందర పడక. ముందు నీవు నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాకనే నీటిని త్రాగగలవు" అన్నాడు. భీముడు యక్షని మాటలకు పట్టిచుకోకుండ, కొలను లోని నీటిని త్రాగినాడు. భీముడు నీరు త్రాగుతూనే నేలకు ఒరిగిపోయాడు.
5. ధర్మరాజు కొలను వద్దకు చేరుట
ధర్మరాజు తమ్ముళ్లు గురించి ఎదురుచూసి సహనం కోల్పోయినాడు. అతని మనుసు శోకవేగంతో తపించిపోతోంది. తాను స్వయంగా వెళ్లడానికి లేచాడు. జలాశయం వద్దకు వెళ్లి చూసేసరికి తన తమ్ముళ్లు నలుగురు చనిపోయి పడి ఉండడం కనిపించింది. వారిని చూసిన ధర్మరాజుకు దుఖం కలిగింది. తమ్ముళ్లు శరీరాల మీద ఎట్టువంటి ఆయుధాల దెబ్బల గుర్తులు కనిపించడం లేదు. వారిని చంపిన ప్రాణి గుర్తులు కూడ కనిపించుట లేదు, వారి మరణం నకు కారణం వెదకుతాను అని ధర్మరాజు మనుస్సులో బాధ పడిసాగెను. దాహం తీర్చుకోవడానికి కొనేరు లోని నీటి త్రాగే ప్రయత్నం చేస్తాడు.
ఆ సమయంలో అతనికి ఆకాశవాణి నుంచి సందేశం వినిపించింది. "ఓ ధర్మరాజ ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నాకు ఒక నియమం కలదు. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వారికి మాత్రమే నీటిని త్రాగుటకు అనుమతి ఇస్తాను" అని కొంగ రూపం ఉన్న యక్షుడు పలుకుతాడు. నీ తమ్ముళ్లు నా మాటలు గౌరవించక నీటిని త్రాగి, నా శిక్ష పొంది మరణించారు. కాబటి నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, నీటిని స్వీకరించు అని కొంగ పలికెను.
ధర్మరాజు మనుస్సులో ఈ పక్షి వలన నా తమ్ముళ్లు మరణించి ఉండారు. " ఓ పక్షి రాజా! మీర ఎవరు?" అని ధర్మరాజు ప్రశ్నించాడు. అప్పుడు ఆ కొంగ " ఓ ధర్మరాజా! నేను వట్టి జలచరమైన పక్షిని కాను. నేను ఒక యక్షుడను" అని పలుకుతాడు. " ఓ రాజా! నీ తమ్ముళ్లును నేను పదేపదే వద్దుని అడ్డగించాను. అయినా నీ తమ్ముళ్లు నీళ్లు స్వీకరించారు" అందుకే వారికి శిక్ష విధించాను అని యక్షుడు పలుకుతాడు. "ఓ యక్ష రాజా! నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన పిమ్మట నీ అనుమతితో ఈ సరస్సు లోని నీటిని స్వీకరించుతాను" అని ధర్మరాజు పలుకుతాడు.
6. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(1) ■ యక్షుడు:- సూర్యని ఎవరు ఉదయింపు చేస్తున్నారు? అతనికి నాలుగు వైపుల ఎవరు నడుస్తున్నారు? అతనికి ఎవరు అస్తమింప చేస్తున్నారు? అతడు దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు?
● ధర్మరాజు:- సూర్యుని బ్రహ్మ ఉదయింపు చేస్తున్నాడు. దేవతలు అతనికి నాలుగు వైపుల నడుస్తున్నారు. ధర్మం అతనిని అస్తమింప చేస్తోంది. అతడు సత్యము నందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు.
(2) ■ యక్షుడు:- దేని చేత మనుష్యుడు శ్రోత్రియుడు అవుతాడు? దేని వలన మహత్పదాన్ని పొందుతాడు? దేని వలన అతడు ద్వితీయుడు అవుతాడు? దేని వలన బుద్ధిమంతుడవుతాడు?
● ధర్మరాజు:- శ్రుతి (వేదము) వలన మనుష్యుడు
శ్రోత్రియుడవుతాడు (ఆచార్యుడు). తపస్సు వలన మహత్పదం పొందుతాడు. ధృతి (దైర్యము) వలన ద్వితీయుడు (బ్రహ్మ రూపుడు) అవుతాడు. పెద్దలను సేవించడం వలన బుద్ధిమంతు డవుతాడు.
(3) ■యక్షుడు:- బ్రాహ్మణులలో దైవత్వం ఎట్టిది? వారిలో సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటి? మనుష్యత్వం ఎట్టిది? అసత్పురుషులు చేసేది ఏమిటి?
● ధర్మరాజు:- వేదాధ్యయనమే బ్రాహ్మణులకు దైవత్వం. తపస్సు సత్పురుషుల యొక్క ధర్మం. మరణించడమే మనుష్య ధర్మం. నిందించడం అసత్పురుషులు చేసే పని.
(4) ■ యక్షుడు:- క్షత్రియులలో దైవత్వం ఏది? వారిలో సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటి? మనుష్యత్వం ఏది? అసత్పురుషులు ఆచరణ ఏది?
● ధర్మరాజు:- బాణవిద్య క్షత్రియులకు దైవత్వం. యజ్ఞం చేయడం వారిలో సత్పురుషుల ధర్మం. భయం మానవీయ భావం. దీనులను రక్షించకపోవడం అసత్పురుషులు యొక్క ఆచరణ.
(5) ■యక్షుడు:- యజ్ఞానికి సంబంధించిన సామం (ఉపాయం) ఏది? యజ్ఞానికి యజువు ఏది? యజ్ఞానికి వరణం (ఎన్నిక) ఏది? యజ్ఞానికి అతిక్రమణం (మీరుట) చేయనిదేది?
● ధర్మరాజు:- ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన సామం. మనస్సే యజ్ఞీయమైన యజువు. ఏకమాత్ర అయిన ఋకే యజ్ఞవరణం చేస్తుంది. ఋకే యొక్క ఏకమాత్రమే యజ్ఞాతిక్రమణం చేయదు.
(6) ■ యక్షుడు:- ఆవపనం (దేవతర్పనం) చేసేవారికి శ్రేష్ఠమైన వస్తువు ఏది? నివపనం (పితృతర్పనం)
చేసేవారికి శ్రేష్ఠ వస్తువు ఏది? ప్రతిష్ఠ కోరుకునే వారికి ఏ వస్తువు శ్రేష్ఠమైనది? సంతానం కోరుకునే వారికి శ్రేష్ఠమైనది?
● ధర్మరాజు:- ఆవపనం చేసేవారికి వర్షం శ్రేష్ఠ ఫలం. నివపనం (పితృతర్పనం) చేసేవారికి బీజం (ధన - ధాన్యాది సంపత్తి) శ్రేష్ఠం. ప్రతిష్ఠ కోరుకునే వారికి గోవు శ్రేష్ఠం. సంతానం కోరుకునే వారికి పుత్రుడు శ్రేష్ఠం.
7. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(7) ■ యక్షుడు:- ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ, శ్వాసిస్తూ, బుద్ధిమంతుడై ఉండి, లోకంలో గౌరవింపబడుతూ, అందరికీ మాననీయుడై ఉండి కూడ వాస్తవానికి జీవించి ఉండని వాడెవడు?
● ధర్మరాజు:- దైవం, అతిధి, సేవకుడు, తల్లి, తండ్రి అను అయిదుగురిని పోషించని వాడు, శ్వాసిస్తూ కూడ బ్రతుకని వాడే. (వాస్తవానికి జీవించి ఉండడు)
( ■ యక్షుడు:- భూమి కంటె బరువైన దేది? ఆకాశం కంటె ఉన్నతమైనది ఏది? వాయువు కంటె వేగంగా వేళ్లేది ఏది? గడ్డిపరకల కంటె సంఖ్యలో అధికమైనదేది?
● ధర్మరాజు:- తల్లి భూమి కంటె బరువైనది (గొప్పది). తండ్రి ఆకాశం కంటె ఉన్నతుడు. మనుస్సు వాయువు కంటె వేగంగా వేళ్తుంది. చింత (తలపు/ ఆలోచన) గడ్డి పరకల కంటె అధికం.
(9) ■యక్షుడు:- నిద్రపోయినా రెప్పమూయనిది ఏది? పుట్టాక కూడా కదిలక లేనిది ఏది? దేనిలో హృదయముండదు? వేగంతో వృద్ధి పొందేది ఏది?
● ధర్మరాజు:- చేప నిద్రించినా రెప్ప మూయదు. పుట్టినా చలనం లేనిది గ్రుడ్డు. రాతిలో హృదయం ఉండదు. నది వేగంతో వృద్ధి పొందుతుంది.
(10) ■ యక్షుడు:- విదేశాలకు వెళ్లేవానికి మిత్రుడెవరు? ఇంటిలో ఉండేవానికి మిత్రుడెవరు? రోగికి మిత్రుడెవరు? మరణం సమిపించిని వానికి మిత్రుడెవరు?
● ధర్మరాజు:- విదేశాలకు వెళ్లేవానికి తోటి ప్రయాణీకుడే మిత్రుడు. ఇంటిలో ఉండేవానికి భార్య మిత్రురాలు. వైద్యుడు రోగికి మిత్రుడు. దానం మరణించే వానికి మిత్రుడు.
(11) ■యక్షుడు:- ప్రాణులందరికీ అతిథి ఎవరు? ఏది సునాత ధర్మం? ఏది అమృతం? ఈ జగత్తు అంతా ఏమిటి?
● ధర్మరాజు:- అగ్ని సమాస్త ప్రాణులకు అతిథి. నాశనం లేని నిత్య ధర్మమే ధర్మం. ఆవు పాలు అమృతం. వాయువే ఈ జగత్తు.
(12) ■యక్షుడు:- ఒంటరిగా తిరిగేది ఎవరు? ఒకసారి పుట్టి కూడా మళీ పుట్టేది ఎవరు? చలికి మందు ఏమిటి? మహా ఆవపనం (క్షేత్రం) ఏది?
● ధర్మరాజు:- సూర్యడు ఒంటరిగా తిరుగుతాడు. చంద్రుడు ఒకసారి పుట్టి కూడా మళీ జన్మిస్తాడు. చలికి ఔషధం (మందు) అగ్ని. భూమి అతి గొప్ప ఆవపనం.
8. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(13) ■ యక్షుడు:- ధర్మానికి ముఖ్య స్ధానం ఏది? కీర్తికి ముఖ్య స్ధానం ఏది? స్వర్గానికి ముఖ్య స్ధానం ఏది? సుఖానికి ముఖ్య స్ధానం ఏది?
● ధర్మరాజు:- ధర్మానికి ముఖ్య స్ధానం దక్షత (నేర్పు/సామర్ధం) యశస్సుకు ముఖ్య స్ధానం దానం. స్వర్గానికి ముఖ్య స్ధానం సత్యం. సుఖానికి ముఖ్య స్ధానం శీలం (మంచి నడత).
(14) ■ యక్షుడు:- మనుష్యునికి ఆత్మ ఏది? అతనికి దైవం ఏర్పరచిన స్నేహితుడెవరు? ఉప జీవనం (జీవనాధారం) ఏమిటి? అతనికి పరమాశ్రయమైనదేది?
● ధర్మరాజు:- పుత్రుడు మనుష్యునికి ఆత్మ. భార్య అతనికి దైవం ఇచ్చిన స్నేహితుడు. మేఘం ఉప జీవనం (జీవనాధారం). దానం పరమాశ్రయం.
(15) ■యక్షుడు:- ధన్యవాదాలకు యోగ్యులైన పురుషులలో ఉత్తమ గుణం ఏమిటి? ధనాలలో ఉత్తమ ధనం ఏది? లాభాలలో ప్రధాన లాభాం ఏది? సుఖాలలో శ్రేష్టమైన సుఖం ఏమిటి ?
● ధర్మరాజు:- ధన్య పురుషులలో దక్షతయే ఉత్తమ గుణం. ధనాలలో శాస్త్ర జ్ఞానం ప్రధానమైనది. లాభాలలో ఆరోగ్యం ప్రధానం. సుఖాలలో సంతోషం శ్రేష్టమైన సుఖం.
దక్షత (నైపుణ్యం, తెలివి, సామర్థ్యం)
(16) ■ యక్షుడు:- లోకంలో శ్రేష్ఠ ధర్మం ఏది? నిత్యమూ ఫలించే ధర్మం ఏది? దేనిని వశపరుచుకొంటే శోకం ఉండదు? ఎవరితో చేసిన సంధి నశించదు?
● ధర్మరాజు:- లోకంలో దయ శ్రేష్ఠ ధర్మం. వేదోక్త ధర్మం నిత్యమూ ఫలించేది. మనుస్సును వశపరుచుకుంటే శోకం ఉండదు. సత్పురుషులతో చేసికొన్న సంధి నశించదు.
(17) ■యక్షుడు:- దేనిని విడిచి మనుష్యుడు ఇష్టుడు అవుతాడు? దేనిని విడిచి శోకించడు? దేనిని విడిచి అర్ధవంతుడవుతాడు? దేనిని విడిచి సుఖి అవుతాడు?
● ధర్మరాజు:- గర్వాన్ని విడిచి మనుష్యుడు ఇష్టుడు అవుతాడు. క్రోధాన్ని విడిచి శోకించడు. కామాన్ని విడిచి అర్ధవంతుడవుతాడు. లోభాన్ని విడిచి సుఖవంతుడవుతాడు.
అర్ధవంతుడు(ద్రవ్యము సంపాదించువాడు)
(18) ■యక్షుడు:- బ్రాహ్మణునకు దానం ఎందుకు ఇస్తారు? నటనర్తకులకు దానం ఎందుకు ఇస్తారు? సేవకులకు దానమివ్వడంలో ప్రయోజనం ఏమిటి? రాజు గారికి ఎందుకు దానం ఇవ్వాలి?
● ధర్మరాజు:- ధర్మం కోసం బ్రాహ్మణునకు దానమిస్తారు. నటనర్తకులకు కీర్తి కోసం దానం (ఈనాము/బహుమతి) ఇస్తారు. సేవకులకు వారి పోషణ రక్షణల కోసం దానం ఇస్తారు. రాజు గారికి భయం వలన దానం (పన్ను రూపాంలో) ఇస్తారు
9. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(19) ■ యక్షుడు:- జగత్తు దేని చేత ఆవరింపబడి ఉంది? ఎందువలన అది ప్రకాశించడం లేదు? మనుష్యుడు మిత్రులను ఎందుకు వదిలి పెడుతున్నాడు? స్వర్గానికి ఏ కారణంగా వెళ్లడం లేదు?
● ధర్మరాజు:- జగత్తు ఆజ్ఞానం చేత కప్పబడి ఉంది. తమోగుణం వలన అది ప్రకాశించడం లేదు. లోభం కారణంగా మనుష్యుడు మిత్రులను వదిలి వేస్తున్నాడు. ఆసక్తి చేత (తగుల్కొని ఉండడంచేత) స్వర్గానికి వెళ్లడం లేదు.
తమోగుణం (అజ్ఞానం, జడత్వము, నిర్లక్ష్యము, మోహము),
లోభం (పిసినారితనం, అత్యాశ), ఆసక్తి (ఆపేక్ష, అనుబంధం)
(20) ■ యక్షుడు:- ఎటువంటి పురుషుని చనిపోయిన వానిగా భావిస్తారు? ఏ విధమైన దేశాన్ని మరణించినదిగా చెప్తారు? శ్రాద్ధం ఏ విధముగా మృతుమైనదవుతుంది? యజ్ఞం ఎలా మృతుమదవుతుంది?
● ధర్మరాజు:- దరిద్రుని చనిపోయిన వానిగా భావిస్తారు. రాజు లేని రాజ్యం మృతుమైనది. శ్రోత్రియ బ్రాహ్మణుడు లేని శ్రాద్ధం మృతుమైనట్లు గా భావిస్తారు. దక్షిణ లేని యజ్ఞం మృతుమైనది?
దరిద్రుడు (దిక్కుమాలివాడు), శ్రోత్రియ (వేదము తెలిసినవాడు)
(21) ■యక్షుడు:- లోకానికి దిక్కు ఏది? జలం ఏది? అన్నం ఏది? విషం ఏది? శ్రాద్ధ సమయం ఏది?
● ధర్మరాజు:- లోకానికి సత్పురుషులు దిక్కు. ఆకాశం జలం. గోవు అన్నం. ప్రార్ధన (కామం) విషం. బ్రాహ్మణుడే శ్రాద్ధ సమయం.
గోవు (సొమ్ము), ప్రార్ధన (కామం/కోరిక)
(22) ■ యక్షుడు:- ఉత్తమైన క్షమ ఏది? దేనిని లజ్జ అంటారు? తపస్సు యొక్క లక్షణం ఏమిటి? దమమని దేనిని అంటారు?
● ధర్మరాజు:- ద్వంద్వాలను సహించడమే క్షమ. చేయకూడని పనులకు దూరంగా ఉండడమే లజ్జ. తన ధర్మంలో నిలవడమే తపస్సు. మనుషును అదపులో ఉంచుకోవడమే దమమని అంటారు.
క్షమ (ఓర్పు, మన్నింపు)
ద్వంద్వాలు (సుఖం, దుఖం, లాభం, నష్టం, వేడి, చలి, జయం, అపజయం మొదలగునవి)
లజ్జ (సిగ్గు, బిడియం)
దమం (ఇంద్రియ నిగ్రహం, అణచుట)
(23) ■యక్షుడు:- రాజా! జ్ఞానం అని దేనిని అంటారు? దేనిని శమమని అంటారు? దయ దేనికి పేరు? ఆర్జవం (సరళత్వం) అని దేనిని అంటారు?
● ధర్మరాజు:- వాస్తవిక వస్తువును సరిగ్గా తెలుసుకోవడమే జ్ఞానం. చిత్త శాంతి శమము, అందరి సుఖాన్ని కోరుకోవడం దయ. సమచిత్తం కలిగి ఉండడం ఆర్జవం (సరళత్వం) అని అంటారు.
వాస్తవిక (యథార్ధం), చిత్త శాంతి (మనశ్శాంతి)
శమము (ప్రశాంతం), సమచిత్తం (సమతౌల్య)
(24) ■యక్షుడు:- మనుష్యునకు దుర్జయుడైన శత్రువు ఎవరు? అంతులేని వ్యాధి ఏది? సాధువుగా ఎవరిని అంగీకరిస్తారు? అసాధువని ఎవరిని అంటారు?
● ధర్మరాజు:- కోధమే (కోపం) దుర్జయుడైన శత్రువు. లోభయే అంతులేని వ్యాధి. సమస్త ప్రాణులకు మేలు చేసేవాడు సాధువు. నిర్ధయుడు అసాధువు.
10. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
నిర్ధయుడు (దయాగుణము లేని వాడు)
(25) ■ యక్షుడు:- రాజా! దేనిని మోహం అంటారు? మానమని దేనిని చెప్తారు? దేనిని అలస్యం అనుకోవాలి? శోకమని దేనిని అంటారు?
● ధర్మరాజు:- ధర్మ మూఢత్వమే (అవివేకము) మోహం. ఆత్మాభిమానమే మానం. ధర్మం చేయకపోవడమే అలస్యం. ఆజ్ఞానమే శోకమం
(26) ■ యక్షుడు:- ఋషులు స్ధిరత్వమని దేనిని అంటారు? దైర్యం అని దేనిని అంటారు? దేనిని స్నానం అంటారు? దేని పేరు దానం?
● ధర్మరాజు:- తన ధర్మంలో స్ధిరంగా ఉండడమే స్ధిరత్వం. ఇంద్రియ నిగ్రహమే దైర్యం. మానసిక మాలిన్యాన్ని విడవడమే స్నానం. ప్రాణులను రక్షించడమే దానం.
(27) ■యక్షుడు:- ఎవరిని పండితుడని అనుకోవాలి? నాస్తికుడని ఎవరిని అనవచ్చును? మూర్ఖుడెవరు? కామం అంటే ఏమిటి? ఏది మత్సరం?
● ధర్మరాజు:- ధర్మజ్ఞని పండితునిగా తెలుసుకోవాలి. మూర్ఖుడు నాస్తికుడని చెప్పబడతాడు. నాస్తికుడే మూర్ఖుడు. జనన మరణ రూపమైన సంసారానికి కారణమైన వాసనయే కామం. హృదయ తాపమే మత్సరం.
ధర్మజ్ఞడు (వేదాంతవేత్త), తాపమే (తాపత్రయము), మత్సరం (ఈర్ష్య)
(28) ■ యక్షుడు:- ఏది అహంకారం? దంభం అని దేనిని అంటారు? పరం దైవం ఏది? పైశున్యం అంటే ఏది?
● ధర్మరాజు:- గొప్ప అజ్ఞానమే అహంకారం. తను అసత్యంగా గొప్ప ధర్మాత్ముడని ప్రసిద్ధి కల్పించుకోవడమే దంభం. దానం యొక్క ఫలమే దైవం అని చెప్పబడుతుంది. ఇతరుల యొక్క దోషాలు ఎంచడమే పైశున్యం (చాడీలు చెప్పడం)
దంభం (కపటము, గర్వము)
(29) ■యక్షుడు:- ధర్మార్ధకామాలు పరస్పర విరోధాలు, ఈ నిత్య విరోద్ధలు అయినవానిని ఒకే చోట ఎలా కూర్చగలుగుతాం?
● ధర్మరాజు:- ధర్మం, భార్య పరస్పర వశవర్తులయితే ధర్మార్ధ కామాలు మూడింటికి సంయోగం కలుగుతుంది.
(30) ■యక్షుడు:- భరతశ్రేష్ఠా! (ధర్మరాజా!) అక్షయనరకం ఏ మానవునికి ప్రాప్తిస్తుంది?
● ధర్మరాజు:- బిచ్చమెత్తుకునే ఏ దరిద్ర బ్రాహ్మణుని అయినా స్వయంగా పిలిచి, తరువాత మనుషు మార్చుకుని అతనికి ఇవ్వనివాడు అక్షయ నరకాన్ని పొందుతాడు.
వేదములు ధర్మశాస్రాలు, బ్రహ్మణులు, దేవతులు, పితృ ధర్మాల యందు మిథ్యాబుద్ధి కలవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు.
తన వద్ద ధనాన్ని ఉంచుకొని కూడ లోభంతో దానం చేయకుండా, అనుభవించకుండా, పైగా వెనుక నుండి " నా దగ్గర ఏమి లేదు' అనే వాడు అక్షయ నరకాన్కి పొందుతాడు.
అక్షయ నరకం (నాశనరహితమైన నరకం), మిథ్యాబుద్ధి (వంచన బుద్ధి)
11. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(31) ■ యక్షుడు:- రాజా! కులం , ఆచారం, స్వాధ్యాయం, శాస్త్ర శ్రవణం - వీటిలో దేని వలన బ్రహ్మణత్వం సిద్ధిస్తుంది?
● ధర్మరాజు:- ఓ యక్షుడా! కులం , స్వాధ్యాయం, శాస్త్ర శ్రవణం - వీనిలో ఏదీ బ్రహ్మణత్వం సిద్ధించడానికి కారణం కాదు. నిస్సందేహంగా ఆచారమే బ్రహ్మణత్వ సిద్ధికి కారణం. కాబట్టి ప్రయత్న పూర్వకంగా సదాచారాన్ని రక్షించుకోవాలి. బ్రాహ్మణునికి దీనిపై విశేషంగా దృట్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవని సదాచారాలు అక్షుణ్ణంగా (అనభ్యస్తంగా) ఉంటాయో అతని బ్రహ్మణత్వం కల్పితమే.
ఎవరి ఆచారం నష్టమవుతుందో అతడు స్వయంగానే నాశనం అవుతాడు. చదివేవాడు, చదివించేవాడు, శాస్త్ర చర్చ చేసేవాడు - వీరందరూ వ్యసనులు, ముర్ఖులూ మాత్రమే.
తన కర్తవ్యాన్ని పాటించేవాడు మాత్రమే పండితుడు. నాలుగు వేదాలు చదివినా, దుష్టమైన ఆచారణ కలవాడు అయితే అతడు ఏ విధముగానూ శూద్రుని కంటే ఎక్కువ కాడు. నిజానికి అగ్నిహోత్రతత్పరుడు, జితేంద్రియుడు అయిన వాడు మాత్రమే బ్రహ్మణుడు అనిపించుకొంటాడు.
స్వాధ్యాయం (వేదాధ్యయనము), శాస్త్ర శ్రవణం (హితమును ఉపదేశించు గ్రంథం వినుట)
(32) ■ యక్షుడు:- రాజా! మధురంగా మాట్లాడే వానికి ఏమి లభిస్తుంది? ఆలోచించి పనులు చేసేవాడు ఏమి పొందకలుగుతాడు? ఎక్కువ మంది మిత్రులను సంపాదించిన వానికి ఏమి లాభం చేకూరుతుంది? ధర్మ నిష్ఠుడైన వానికి ఏమి లభిస్తుంది?
● ధర్మరాజు:- మధురంగా మాట్లాడే వాడు అందరికీ ఇష్టుడు అవుతాడు. ఆలోచించి చేసివానికి అధికతరమైన సాఫల్యం లభిస్తుంది. ఎక్కువ మిత్రులు కలవాడు సుఖంగా జీవిస్తాడు. ధర్మనిష్ఠుడు సద్గతిని పొందుతాడు.
సాఫల్యం ( సఫలత), సద్గతి (ఆనందము)
(33) ■ యక్షుడు:- సుఖి ఎవరు? ఆశ్చర్యం ఏమిటి? మార్గం ఏమిటి? వార్త ఏమిటి? ఓ యధిష్ఠిడా! ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
● ధర్మరాజు:- ఓ యక్షుడా! ఋణం లేని వాడు, పరదేశంలో లేని వాడు, రోజలో అయిదవ వంతు గాని ఆరవ వంతు గాని సమయం ఇంటిలోనే ఉంటూ, ఏ కూరో నారో వండుకొని తినేవాడు మాత్రమే సుఖి అవుతాడు.
ఆశ్చర్యం: ప్రతి దినం ప్రాణులు యముని ఇంటికి వెళ్తూనే ఉంటారు. ఇది జీవన సత్యం , కాని ప్రాణులు తాము ఎల్లప్పుడూ జీవించాలనే కోరుకుంటారు. ఇంతకు మించిన ఆశ్చర్యం వేరొకటి ఏమి ఉంది.
మార్గం: తర్కానికి ఎక్కడ ఉనికి లేదు. శుత్రులు భిన్నభిన్నంగా ఉన్నాయి. పలుకులు ప్రమాణంగా విశ్వసించదగిన ఒకే ఋషి లేడు. ధర్మతత్త్వం గుహలలో నిక్షిప్తమైపోయింది. అంటే చాలా గూఢంగా ఉందని తాత్పర్యం. కాబట్టి మహాపురుషులు నడిచేది మార్గం.
వార్త: ఈ మహామోహ రూపమైన పెద్ద బాణలిలో కాలమనే భగవానుడు సమస్త ప్రాణులను మాసాలు, ఋతువులు అనే గరిటతో పైకి క్రిందకి తిప్పుతూ సూర్య రూపమైన అగ్ని, రాత్రింబవళ్లు అనే ఇంధనాల ద్వారా వేపుతూ ఉంటాడు. ఇదే వార్త.
తర్కాం (చర్చ, వాదం, విమర్శ), మహామోహ (గొప్ప భ్రాంతి, అవివేకము)
12. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(34) ■ యక్షుడు:- రాజా! నీవు నా ప్రశ్నలన్నింటికీ సరిగా సమాధానాలు ఇచ్చావు. పురుషుడంటే ఎవడో కూడ వ్యాఖ్యానించి చెప్పు.
● ధర్మరాజు:- ఎవని పుణ్యకర్మల యొక్క కీర్తికి సంబంధించిన ధ్వనులు స్వర్గాన్ని, భూమిని ఎంతవరకు తాకుతాయో, అంతవరకు అతడు పురుషుడే. ఎవరి దృష్టికి ప్రియం - అప్రియం; సుఖం - దుఖం;
భూతం - భవిష్యత - అను ఈ జంటలు సమానమో అతడే అందరి కంటె ధనవంతుడు.
(35) ■ యక్షుడు:- రాజా! అందరి కంటే ధనవంతుడైన వానిని గూర్చి నీవు సరిగా వ్యాఖ్యానించి చెప్పావు. అందుకని నీ తమ్ముళ్లలో ఒకరిని నీవు కోరుకో, అతడు జీవస్తాడు.
● ధర్మరాజు:- ఓ యక్షుడా! శ్యామవర్ణం కలవాడు, అరుణనయనుడు, సువిశాల సాల వృక్షంలా ఎత్తుయినవాడు, వెడల్పయిన రొమ్ము కలవాడు, మహాబాహువు అయిన నకులుడు జీవించాలి.
36) ■ యక్షుడు:- రాజా! పదివేల ఏనుగుల బలం కల భీముని విడిచి, నీవు నకులుని ఎందుకు బ్రతికించాలని కోరుకొంటున్నావు? అలాగే ఎవరి బహుబలం మిద పాండవులందరికీ సంపూర్ణ విశ్వాసం ఉందో ఆర్జునుని కూడ విడిచిపెట్టి, నీకు నకులుని బ్రతికించాలనే కోరిక ఎందుకు?
● ధర్మరాజు:- ధర్మాన్ని నాశానం చేస్తే, ఆ నష్టమైన ధర్మం, కర్తను కూడా నాశానం చేస్తుంది. దానిని (ధర్మాన్ని) రక్షిస్తే, అదే కర్తను కూడా రక్షిస్తుంది. అందుకనే నేను ధర్మాని విడిచి పెట్టను. అందరి పట్ల సమాన భావం ఉండడం పరమ ధర్మమని నా ఉద్దేశ్యం.
ఓ యక్షుడా! లోకులు నన్ను ధర్మాత్ముడనే అనుకొంటారు. నా తండ్రికి కుంతి మరియు మాద్రి అను ఇద్ధరు భార్యలుండేవారు. వారిద్దరూ పుత్రులు కలిగి ఉండాలని నా ఆలోచన. నేను ఇద్దరు తల్లుల పట్ల సమాన భావమే ఉండాలని కోరుకొంటాను. మాద్రి పుత్రుడు నకులుడు. కాబట్టి నకులుడే జీవించాలి.
(37) ■ యక్షుడు:- భరత శ్రేష్ఠా! నీవు అర్ధకామాలతో కూడ సమానత్వాన్ని విశేషంగా ఆదరించావు. కాబట్టి నీ తమ్ముళ్లందరూ బ్రతుకుతారు. అప్పుడు వెంటనే పాండవులందరూ జీవించారు. ఆ క్షణంలో వారి ఆకలిదప్పులన్నీ తీరిపోయాయి.
● ధర్మరాజు:- యక్షుడా! మీరు ఏ దేవ శ్రేష్టలు? మీరు యక్షలే అని నాకు అనిపించడం లేదు. మీరు వసువులలో గాని, రుద్రులలో గాని, మరుత్తులో గాని ఒకరు కారుకదా! లేదా స్వయంగా దేవేంద్రులా?
నా తమ్ముళ్లయితే వందలు, వేలు వీరులతో యుద్ధాలు చేసేవారు. వీరందరినీ యుద్ధభూమిలో పడగొట్టగలిగిన యోధుని ఇప్పటి వరకు నేను చూడనే లేదు. ఇప్పుడే బ్రతికినప్పటికీ కూడ వీరి ఇంద్రియాలన్నీ సుఖంగా నిద్రపోయి లేచిన వారికి వలె ఆరోగ్యంగా కనపడుతున్నాయి. కనుక మీరు మాకు ఎవరైన స్నేహితులా? లేకా తండ్రియా? అని అడిగాడు.
వసువులు (గణాధిదేవతలు)
రుద్రులు (బ్రహ్మమానసపుత్రులు)
మరుత్తులు (ఆవహుడు, వివహుడు, సంవహుడు, అతివహుడు, అనువహుడు, పరీవాహుడు, వాహుడు)
13. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
(38) ■ యక్షుడు:- భరత శ్రేష్ఠా! నేను నీ తండ్రి యమ ధర్మరాజును. నిన్ను చూడం కోసమే ఇక్కడికి వచ్చాను. కీర్తి, సత్యం, దమం, శౌచం, మృదుత్వం, లజ్జ, అచంచలత్వం,దానం, తపస్సు, బ్రహ్మచర్యం ఇవన్నీ నాకు శరీరం. అహింస, సమత్వం, శాంతి, తపస్సు, శౌచం, నిర్మత్సరం అనునవి నా మార్గాలని తెలుసుకో!
నీవు నాకు ఎప్పుడూ ఇష్టుడవే. శమం, దమం, ఉపరతి, తితిక్ష, సమాధానం అను అయిదు సాధనాల పట్ల నీకు ప్రీతి ఉంది. ఇది చాల సంతోషించ దగిన విషయం. ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామృత్యువులు అను ఆరు దోషాలు నీవు జయించావు. ఇందలో మొదటి రెండు దోషాలు (ఆకలి-దప్పులు)
ఆరంభం నుండీ ఉంటాయి. మధ్యలోని రెండు దోషాలు (శోక-మోహాలు) యౌవనం వచ్చాక కలుగుతాయి. చివరి రెండు దోషాలు (జరా-మృత్యువులు) అతిమ సమయంలో వస్తాయి.
నీకు శుభం కలుగుతుంది. నేను ధర్ముడను. నీమీవ్యవహారం తెలుసుకోవాలనే కోరికతోనే ఇక్కడికి వచ్చాను. అనుఘుడా! నీ సమదృష్టికి సంతోషించాను. అభీష్టవరం కోరుకో, నా భక్తుడు ఎన్నటికీ దుర్గతి పొందడు.
దమం (ఇంద్రియ నిగ్రహం), శౌచం (శుచిత్వము), అచంచలత్వం (స్థిరమైన),
నిర్మత్సరం (అసూయ లేనివాడు), శమం (కామక్రోధాదులులేక), ఉపరతి (పురుషాయితము),
తితిక్ష (క్షమ, ఓర్పు), జరామృత్యువులు (ముసలితనము & మరణం), అనుఘుడు (పునీతుడు)
● ధర్మరాజు:- దేవా! బ్రహ్మణుని అరణిని రాపిడికట్టెతో పాటు మృగం తీసుకొని పారిపోయింది. అతనికి ( బ్రహ్మణుడు) అగ్నిహోత్ర లోపం కలుగకూడదు. ఇదే నేను కోరుకునే మొదటి వరం.
□ యక్షుడు (యమరాజు) :- రాజా! ఆ బ్రాహ్మణుని అరణి సహితమైన మంథన కాష్ఠాన్ని మిమ్మల్ని పరీక్షించడానికి నేను మృగరూపాం ధరించి తీసుకొని పరిగెత్తాను. ఆ అరణిని నేను మీకు ఇస్తాను. నీవు ఇంకొక వరం ఏదైనా కోరుకో అని యమరాజు పలికెను.
○ ధర్మరాజు:- మేము పన్నెండేళ్లు అరణ్యాలలో ఉన్నాము. ఇప్పుడు పదమూడవ సంవత్సరం రాబోతోంది. కాబట్టి మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండే వరం ఇవ్వండి అని ధర్మరాజు ప్రార్ధించాడు.
14. యక్ష ధర్మరాజు సంవాదము (ప్రశ్నోత్తర రూపమగు సంభాషణ)
■ యమరాజు:- రాజా! "నేను నీకు ఈ వరం ఇస్తున్నాను. నీవు భూమిపై ఏ రూపాంలోనే తిరిగినా ఎవరు నిన్ను గుర్తించలేరు. మీరు ఏఏ రూపాలు కోరుకుంటారో ఆయా రూపాలు ధరించగలుగుతారు. నాయనా! ఇంకొక వరం కూడ కోరుకో. ఓ ధర్మరాజా! నీవు నా పుత్రుడివి. విదురుడు* కూడ నా అంశతోనే జన్మించాడు. కాబట్టి నా దృష్టిలో మీ ఇద్దరూ సమానులే" అన్నాడు.
●విదురుడి జననం: కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబికని అంబాలికని దేవరన్యాయం
ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని మళ్లీ కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.
■ ధర్మరాజు:- దేవా! మీరు సనాతనులైన దేవాధిదేవులు, నేడు నాకు సాక్షాత్తుగా మీ దర్శనం అయింది. ఇక నాకు దుర్లభమేముంది? అయినా! మీరు నాకు ఇవ్వబోయే వరాన్ని తలదాల్చి కన్నులకు అద్దుకుంటాను. నేను లోభమోహాలను, క్రోధాన్ని జయించగలగాలి. నా మనస్సు ఎప్పుడూ దానం, తపస్సు, సత్యం అను వాటిలో పవృత్తమై ఉండాలి. నాకు ఇటువంటి వరం ఇవ్వండి అని ధర్మరాజు అడిగాడు.
■ యమరాజు:- " ఓ పాండుపుత్రా! ఈ సుగుణాలు నీకు మొదట నుండీ స్వతహాగానే ఉన్నాయి. ఇంక ముందు కూడా నీవు కోరినట్లుగా నీలో ఈ ధర్మాలనీ ఉంటాయి" అని దీవించాడు. పిమ్మట ధర్ముడు (యమరాజు) అంతర్ధానమయ్యాడు.
పాండవులందరూ కలిసి తమ ఆశ్రమానికి తిరుగి వచ్చారు. ఆశ్రమములో పాండవులు అరణిని ఆ బ్రాహ్మణునికి ఇచ్చారు.
దుర్లభం (పొందశక్యము కానిది)
మంగళమ్