Spiritual - ఆధ్యాత్మికం

అత్యాశ్రమి

దక్షిణ కైలాసమను పుణ్యక్షేత్రమగు శ్రీకాళహస్తి వేదికగా సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం(సుబ్రమణ్యం) గారి దయా హృదయం నుండి వెలువడిన దివ్య పలుకులే ఈ జ్ఞాన ప్రసూనాలు . గత మూడు దశాబ్దాలుగా ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారంగా నిండిపోయిన సద్గురు సంపదను శ్రీ రమణ సత్సంగం , శ్రీకాళహస్తి ద్వారా శ్రీ టి.వి.ఎన్..బాబు జిజ్ఞాసులకు పంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు . అజ్ఞానాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయగల ఈ జ్ఞానామృతాన్ని ప్రతి ఒక్కరికి చేర్చాల్లన్న తపన నుండి వచ్చిందే ఈ "అత్యాశ్రమి " ప్రయత్నం.

                     ఈ జ్ఞాన సంపద భవిష్యత్ తరాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా PDF రూపంలో గ్రంధాలను ఈ website లో upload చేయడం జరిగింది. జ్ఞానార్తి కలిగిన జిజ్ఞాసులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు .




శ్రీ సుబ్రహ్మణ్య గురుదేవులవారు శ్రీకాళహస్తికి 5 మైళ్ళ దూరంలో ఉన్న కొణతనేరి అనే గ్రామంలో విజయలక్ష్మి - సిద్దయ్య అనే పుణ్య దంపతులకు 24-8-1942న జన్మించారు.రిది వ్యవసాయ కుటుంబము. 19 ఏట పద్మావతిగారితో వివాహం. శంభు, కృష్ణ,యుగంధర్ ముగ్గురు సంతానం. 1975న ఉద్యోగరీత్యా శ్రీకాళహస్తి కైకాలవీధియందు కాపురం పెట్టడం జరిగింది.

* * *

శ్రీ సద్గురు దేవులవారు తన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తూనే తత్త్వ సంబంధమైన వ్యాపకాలతోను, గురువులతోను కాలం గడిపేవారు. 1988లో నేను, నా స్నేహితుడు ఒబ్బు ప్రసాద్ ఇద్దరమూ సద్గురు సన్నిధికి చేరి ఆ దివ్యమైన సద్గురు సత్సంగానికి తొలి సభ్యులైనాము. ప్రతి ఏటా సత్సంగంలో శ్రీరమణ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తుండడం వలన, నేను స్వయంగా శ్రీరమణ ప్రేమికుడు కావడం వలన  ఆ సత్సంగానికి 'రమణ సత్సంగం' అని పేరు పెట్టడం జరిగింది.

* * *

శ్రీ సద్గురు దేవులవారికి తొలి ఆధ్యాత్మిక గురువు శ్రీవీరయ్యగారు. బ్రహ్మంగారి మనవరాలు అయిన ఈశ్వరమ్మగారి శిష్యుడైన శ్రీశంభుగురుస్వామి శిష్యుడే శ్రీవీరయ్యగారు. వీరయ్యగారు పిన్న వయసులో పశువుల కాపరి. ఊరి చివర్లోకి వాటిని తీసుకెళ్లి మేపేవాడు. అక్కడే ఉన్న శంభుగురుస్వామి సమాధి అరుగుపై విశ్రాంతి తీసుకునేవాడు. ఓ రాత్రి శంభుగురుస్వామి దివ్యతేజస్సుతో వెలిగిపోతూ దర్శనమిచ్చారు వీరయ్యగారికి. రా! నావెనుక అని ఆదేశించారు. మైకం కమ్మినవాడిలా అలా స్వామి వెనుకే నడచి వెళ్లి పోతున్నాడు. ఊరి చివర నీటి కొలను వద్దకు తీసుకెళ్లి మంత్రోపదేశం చేశారు వీరయ్యగారికి, అప్పట్నుంచి వీరయ్యగారికి కొన్ని దివ్యశక్తులు కలిగాయి. ఏ జాతక చక్రాలు వేయకనే మనిషిని అలా  చూడగానే వారి భవిష్యత్తు అంతా చెప్పేసేవారు. “నీకు ఈ శక్తులెలా కలిగాయి?” అని అడిగితే 'నా గురువు శంభుగురు స్వామి అనుగ్రహం' అనేవాడు. ఊళ్లో వాళ్లంతా నవ్వుకున్నారు.  కారణం శంభుగురుస్వామి 300 ఏళ్ల క్రితమే సమాధి అయ్యారు. ఇప్పుడెలా నీకు గురువవుతాడు? అని హేళన చేశారు. వీరయ్యకు ఓరోజు పౌరుషం వచ్చి సమాధి  తవ్వేశారు. ఊరి జనమంతా అక్కడకు చేరింది. శంభుగురుస్వామి శిరోభాగం కనబడింది. ఎగతాళి చేసిన వారంతా వీరయ్య పాదాలపై పడి క్షమాపణ కోరారు. వీరయ్య శాంతించారు. తిరిగి సమాధి మూసేసారు.

శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యులవారి సతీమణి పద్మావతమ్మగారి బావగారే ఈ వీరయ్యగారు. గురువుగారికి పెళ్లయిన క్రొత్తలోనే వీరయ్యగారి ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి వారి పాదాలకు  అంకితం అయిపోయారు. “నీకు మొదట మగసంతానం కలుగుతుంది. ఆ పిల్లాడికి మా గురుపు గారైన "శంభుగురు” పేరు పెట్టు. అని ఆశీర్వదించారు. వీరయ్యగారు అన్నట్టుగానే  గురువుగారికి మగ సంతానం కలిగింది. “శంభు ప్రసాద్” అని నామకరణం చేశారు. శ్రీవీరయ్యగారు శ్రీవిద్యోపాసకులు "శ్రీ పీఠం" ఇస్తాను తీసుకో అన్నారు. “మీ ఆశీర్వాదం ఒక్కటి  చాలు. ఏ పీఠమూ నా కొద్దు” అన్నారు గురువుగారు. “అది ఎప్పుడూ ఉంటుంది” అని ఆశీర్వదించారు వీరయ్యగారు. రెండవ ఆధ్యాత్మిక గురువు శ్రీ తాతగారు. హిమాలయ యోగి. గురువుగారికి తాతాగారు 1970లో పరిచయం అయ్యారు. తాతగారు 1916లో శ్రీషిరిడీసాయి బాబాను ప్రత్యక్షంగా దర్శించారు. బాబా మధ్వా బ్రాహ్మణుడని వారు అన్నారు. తాతగారు చాలా కోపిష్టి. అందర్నీ తెగ తిట్టేవారు. దేవతలను కూడా. జ్ఞానాంబ, సుబ్రహ్మణ్య స్వామి, వేమన ఈ ముగ్గురిని మాత్రం గౌరవంతో నమస్కరించుకునేవారు. గంజాయి,  సారాయి, బీడి, టీ, త్రాగేవారు. ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రం బిరియాని తెప్పించుకుని తినేవారు. వీరి సంరక్షణలో గురువుగారు 90 రోజులు ఉపవాస దీక్ష చేశారు. తాతగారు 18. 10. 1990న నిర్వాణం చెందారు. అప్పటికి తాతగారి వయస్సు 101.

* * *

గురువుగారి ప్రబోధ సారాన్ని ఒక్కముక్కలో చెప్పాలంటే- “నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది”

* * *

“నేను” ఒక్కటే సత్యము (ఉన్నది) నామరూపాలతో కూడిన నేను, ఈనేనుకు ముడిపడి ఉన్న జగత్తు మొత్తం కలిపి అసత్యమే (ఉన్నట్లున్నది) ఈ విషయం అర్ధమైతే ఇక తాను  ఏమిగా ఉన్నా తనకేమీ ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బంది లేని స్థితియే మోక్షము.

* * *

"శ్రీ సద్గురు బోధలను ప్రత్యక్షంగా విన్నవారు ధన్యులు” అన్నారు అన్నాజీరావుగారు. ఇది నిజం. వారి పాదాల వద్ద కూర్చొని ఆ దివ్యమైన ప్రబోధాలను వింటుంటే చెవి నుంచి హృదయానికి ఎడతెగని ఓ అమృతపుధార ప్రవహిస్తున్నట్టుండేది. విన్న బోధలను నేను తిరిగి వ్రాసుకునే వాడిని. అవే 'జ్ఞాన ప్రసూనాలు'గా ప్రచురింపబడ్డాయి. ఆ దివ్యబోధసలను తిరిగి వ్రాసుకోవడంలో ఆ మాధుర్యం తగ్గి ఉండేది. కారణం, అనుభవానికి మాత్రమే పరిమితమైన ఆ పరతత్త్వాన్ని పరిమితులు కలిగిన భాషలో ఇరికించాలని ప్రయత్నించడమే. సద్గురు సన్నిధిలో మౌనమే గొప్ప ఉపదేశంగా ఉండేది. ఆ మౌనాన్ని ఏ భాషలో ఎలా వ్రాసుకోగలం? కాబట్టి జ్ఞాన ప్రసూనాలు అనేవి సద్గురు యొక్క యధార్ధ స్వరూపం కానే కాదు.

సద్గురు స్వరూపాన్ని ఊహించి బాబు గీసుకున్న ఊహా చిత్రమే ఈ జ్ఞాన ప్రసూనాలు. సద్గురు సన్నిధికి చేర్చడానికి ఉపయోగపడే చిరునామా మాత్రమే ఈ జ్ఞాన ప్రసూనాలు.

* * *

మబ్బు నుండి మేడపై పడిన వర్షపు నీరు సింహపు బొమ్మ నోటి నుండి జాలువారినట్లు విశ్వచైతన్యానికి అధిష్టాన దేవత అయిన జ్ఞాన ప్రసూనాంబ తన దయా హృదయం నుండి వెలువడిన ఆ దివ్యవాణిని జిజ్ఞాసువులైన తన శిశువులకు అందించడానికి ఉపయోగించుకున్న ఉపకరణమే శ్రీ సద్గురు సుబ్రహ్మణ్య గురుదేవులవారు. వారి బోధల్లో ఏదైనా కొత్త విషయం ఒకటి దొర్లినప్పుడు - “నేను కూడా మీతో పాటు ఇప్పుడే విన్నాను”.... “నాక్కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది.” అనడం కద్దు. తన ప్రబోధాలకు తానే మొదట శ్రోతగా ఉంటారు. నేను చెప్పాను అన్న అహం వారికి ఏ కోశానా ఉండేది కాదు. నిత్యవ్యవహారాల్లో సైతం 'కీ' ఇచ్చిన బొమ్మలా తటస్తంగా ఉండి తన పనిని తాను అలా చేసుకుంటూ వెళ్లిపోతారు. ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా వారి ముఖంలో చిరునవ్వు చెరిగేది కాదు.

*

ప్రపంచానికి హృదయం అరుణాచలం జ్ఞానానికి హృదయం అనిలాచలం. అరుణాచలంలో సుబ్రహ్మణ్యుడు రమణుడుగా ఉన్నాడు. అనిలాచలంలో రమణుడు సుబ్రహ్మణ్యుడుగా  ఉన్నాడు.

*

అరుణాచల రమణుని తత్త్వ వైభవానికి కొనసాగింపే శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యులు. రమణ సన్నిధిలో ఉన్నంత శాంతి, కాంతి శ్రీ సద్గురు సన్నిధిలోనూ నిండి ఉంటుంది. ఇంట్లో ఓ మూల ఉన్న పూలకుండీ నుండి వెలువడిన పరిమళం ఆ గదంతా నిండిపోయినట్లు ప్రపంచంలో ఏ మూల ఏ మహనీయుడు గుట్టుగా జీవిస్తున్నా వారి ఉనికి లోకానికంతా  శ్రేయస్కరం అవుతుంది. వారి అనుగ్రహం ప్రతి జీవికి సమంగా పంచబడుతుంది. అందుకే వేలమంది సంస్కర్తలు చేయలేని పనిని గుహలో కూర్చునే ఓ ఋషి నిశ్శబ్దంగా పూర్తి చేయగలడు. సద్గురు ఉనికే లోకానికి ఆశీర్వాదం.

* * *


Atyasrami - (Athyashrami)

These are the divine sayings emanating from the heart of Sadguru Sri Subrahmanyam (Sadhguru Sri Subramanyam)as the stage of Srikalahasti. Shri Ramana Satsangam,Srikalahasti have been trying to share the wealth of the sadguru which has been a repository of spiritual knowledge for the past three decades. This "greedy" endeavor comes from the quest to include everyone in this enlightenment that can ignite ignorance.

Books in PDF format have been uploaded on this website so that this wealth of knowledge will be available to future generations as well. Curious people with knowledge can take advantage of this opportunity.