కీర్తిశేషులు వఝల రాధాక్రిష్ణ శాస్త్రి గారు.(1899-1982) వేములవాడ క్షేత్రం లో, వఝల నరసయ్య ,రాజేశ్వరి దంపతుల రెండవ కుమారుడుగా జన్మించినారు.వారి వంశమునకు చెందిన వఝల బాయమ్మ,మృత్యుంజయం దంపతులకు సంతతి లేకపోవుటచే వారికి దత్తపుత్రునిగా వెళ్ళడం జరిగింది. శ్రీమతి కిష్టబాయమ్మ గారు వారి ధర్మపత్ని. వఝల రాధాకృష్ణ శాస్త్ర్రి గారు సంస్కృత, వేద శాస్త్ర్రములను ,పురాణములను అభ్యసించి పాండిత్యమును సంపాదించినారు.వేములవాడ క్షేత్రంలో దైవ సంబంధ ఉత్సవ నిర్ణయములలో నిర్వహణలలో సాధికార ధర్మనిర్ణయ కర్తగా ముఖ్యపాత్ర వహించేవారు. పర్వదిన,ముహూర్త నిర్ణయములలో ధర్మశాస్త్ర్రబద్దమైన ఆచరణ తెలుపుటకు వారినే సంప్రదించేవారు.క్షేత్రంలో తొలిసారి శివకళ్యాణోత్సవ నిర్వహణకు ,విధాన నిర్ణయంలో వారి పాత్ర మరిచిపోలేనిది. ఆలయ ఉత్సవ సందర్భాలలో పురాణప్రవచనములు, శ్రీరాజరాజేశ్వర స్వామివారి చతుష్కాల పూజలు ప్రత్యేక ఉత్సవాలలో విశేష కర్తృత్వము నిర్వహించి స్వామివారి కృపకు పాత్రమైనారు. ఆలయంలో మహన్యాస పారాయణములు, ఉపనిషత్ పారాయణములు, ఆయన నిరంతర బాధ్యతలు. తొలినాళ్ళనుంచి ఆలయంలో శివకళ్యాణోత్సవ కర్తృత్వాన్ని చేపట్టి నాలుగు దశాబ్దాలు తనకుగల రాజరాజేశ్వరస్వామివారి పై భక్తిని చాటుకున్నారు ప్రధాన మహామంటప పునర్నిర్మాణ సమయంలో స్వామివారి పురాతన గర్భాలయ పరిరక్షణకై ఉద్యమించి గర్భాలయమునకు ఎలాంటి హాని కలుగకుండా తీవ్రంగా వాదించి,పుష్పగిరి పీఠాధిపతులను ఒప్పించి కాపాడినారు. జగద్గురువులు శృంగేరీ,పుష్పగిరి,కంచి పరమాచార్యులచే విశిష్డ శాస్త్రపండితులుగా సత్కరింపబడినారు. వేద శాస్త్ర్రముల ప్రతులను ముందుతరాలకోసం భద్రపరచడానికి అహర్నిశలు రాయటం వలన యాభై ఐదు సంవత్సరాల వయసులోనే దృష్టిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ వారి ధర్మపత్ని శ్రీమతి కిష్టబాయమ్మ గారి సహాయంతో చరమాంకం వరకు శ్రీరాజరాజేశ్వరస్వామివారి నిశీపూజలో భక్తిప్రపత్తులతో పాల్గొని కృతార్థులైనారు. క్షేత్రంలోని పండితులచే శిష్టజనులచే శాస్త్రులవారూ! అని సహ వేద పండితులచే భీష్మపితామహా అని ఆత్మీయంగా పిలిపించుకునేవారు. కీర్తిశేషులు రాధాకృష్ణ శాస్త్ర్రి గారు ,,శ్రీమతి కిష్టబాయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. 1 వఝల సాంబశివశర్మ, మృత్యుంజయం అను పెర్లు గల ఇద్దరు కుమారులు, శ్రీమతి వసంత అని పేరుగల కుమార్తె . వారి పెద్ద కుమారుడు వఝల సాంబశివశర్మ కుమారుడు రాధాకృష్ణ శాస్త్ర్రి గారి మనవడు వఝల శివకుమార్ చూపు కోల్పోయినప్పటినుంచి తన భుజాన్ని ఆసరాగా అందిస్తూ దైనందిన వ్యవహారాలలో సేవచేసేవాడు. అంతేకాక వారివద్ద స్మార్త పూజా విధులను కూడా అభ్యసించాడు. వారి స్మారకంగా 2010 నుండి 2015 వరకు ప్రతి జ్యేష్ట శుద్ధ ఏకాదశి రోజున వారి పౌత్రుడు వఝల శివకుమార్, అత్యంత శ్రద్ధా భక్తులతో, తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధులైన వేదపండితులు సలక్షణ ఘనాపాటి శ్రీమాన్ కొడిచెర్ల పాండు రంగాచార్యుల వారికి, వేదమూర్తులు శ్రీ చిట్టి హనుమచ్ఛాస్త్రి ( భద్రాద్రి దేవస్థానం)గారికి, వేద స్వరూపులు, బ్రహ్మశ్రీ దుద్దిల్ల మనోహర శర్మ అవధాని గారికి, వేదగాయత్రి, వేద సరస్వతీ స్వరూపులు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారికి, వేదవిద్యాసాధకులు బోధకులు ఉపాసకులు బ్రహ్మశ్రీ కేదారనాథ శాస్త్రి గారి వంటి మరెందరో వేదవిద్వన్మణులకు సగౌరవంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ కళా మండపంలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ రాధా కృష్ణ శాస్త్రి స్మారక విశిష్ట వేదపండిత సత్కార కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేదవిదుల సమక్షంలో వఝల వారి వంశ పురోహితులు బ్రహ్మశ్రీ చంద్రగిరి శరత్ శర్మ గారి పర్యవేక్షణలో వ్యాఖ్యాన నిర్వహణలో నిర్వహిస్తూ బ్రహ్మశ్రీ వఝల రాధాకృష్ణ శాస్త్రి గారి మహదాశయాలకు సార్థకతను కూర్చుతున్నారు. వారి మార్గంలోనే శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి సేవలో కృతార్థులవుతున్నారు.
మన ఆలయంలో శివ కళ్యాణాన్ని ప్రవేశపెట్టి ఏర్పాటు చేసి రూపకల్పన చేసి శివ కళ్యాణం నిర్వహించే సంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన పెద్దలలో ముఖ్యుడు మా తాత వఝల రాధాకృష్ణ శాస్త్రి.. మొదటి శివ కళ్యాణం నుంచి ప్రధాన నిర్వాహకులుగా మా తాత నాయనమ్మ రాధాకృష్ణ శాస్త్రి కిష్టవాయమ్మ గారలే కూర్చుండేవాళ్ళు.. ఒక 20 సంవత్సరాలు వాళ్ళని నిర్వహణలో శివ కళ్యాణం జరిగింది. తర్వాత ఓల్డ్ ఏజ్ వల్ల మా తాత గారికి దృష్టి సమస్య ఏర్పడ్డాక వేరే భార్యాభర్తలు కూర్చోవడం ఇప్పటికి నడుస్తుంది. మన ఆలయానికి వచ్చే యాక్ట్పులకు దేవుడి లగ్గం అంటే రామనవమి మాత్రమే అనుకునేవాళ్లు. అందుకే ఈ పార్వతులు శివపార్వతులు రామనవమి రోజు వేములవాడలో తలంబ్రాలు పోసుకునేవాళ్ళు. క్రమంగా శివ కళ్యాణం ప్రత్యేకతను శివుడి కళ్యాణ విశేషాన్ని పామర జనానికి ప్రజలందరికీ తెలుపుతూ అవగాహన పెంచి అందరూ శివకళ్యాణానికి వచ్చేట్టుగా ఆలయ నిర్వాహకులు చేశారు. దాని ప్రభావంతో ఇప్పటికీ శివ కళ్యాణం రోజూ పార్వతులు శివపార్వతులు వచ్చి తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు.