37 - సప్తత్రింశఃసర్గః - 48- అష్టచత్వారింశస్సర్గః 

సప్తత్రింశఃసర్గః॥

[37 కుమారస్వామి జన్మము]

1.37.1.అనుష్టుప్.

తప్యమానే తదా దేవే
దేవాః సర్షిగణాః పురా ।
సేనాపతిమభీప్సన్తః
పితామహముపాగమన్ ॥

తాత్పర్యము :- పూర్వము పరమేశ్వరుడు తపస్సు చేసుకొనుచుండెను. అప్పుడు దేవతలు ఋషులు తమకు సేనాపతి కావలెనను కోరికతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి.

ప్రతిపదార్థము :- తప్యమానే = తపస్సు చేస్తూండగా; తదా = అప్పుడు; దేవే = పరమేశ్వరుడు; దేవాః = దేవతలు; స = కలిసి ఉన్న; ఋషి = ఋషుల; గణాః = మసూహముతో; పురా = పూర్వము; సేనాపతిమ్ = సేనాపతిని; అభీప్సన్తః = కోరికతో; పితామహమ్ = బ్రహ్మదేవుని; ఉపాగమన్ = చేరిరి.

1.37.2.అనుష్టుప్.

తతోఽ బ్రువన్ సురాః సర్వే
భగవన్తం పితామహమ్ ।
ప్రణిపత్య శుభం వాక్యం
సేన్ద్రాః సాగ్నిపురోగమాః ॥

తాత్పర్యము :- ఇంద్రుని అగ్నిదేవుని ముందు నిలుపుకొని దేవతలు అందరు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ప్రణామములు చేసి బ్రహ్మతో మంచి మాటలతో ఇట్లనిరి.

ప్రతిపదార్థము :- తతః = తరువాత; ఆబ్రువన్ = పలికిరి; సురాః = దేవతలు; సర్వే = అందరూ; భగవన్తమ్ = భగవంతుడైన; పితామహమ్ = బ్రహ్మదేవుని గురించి; ప్రణిపత్య = ప్రణామము చేసి; శుభం = శుభకరమైన; వాక్యం = మాటలను; స ఇన్ద్రాః = ఇంద్రునితో; స = సహిత; అగ్ని = అగ్నిదేవునితో; పురోగమా = ముందుంచుకుని.

 *గమనిక :- *- ప్రణిపత్య పదం తరువాత సురా సర్వే అని కొన్ని పాఠ్యములలోను, సురా రామ అని కొన్నింటిలోను ఉంది. శుభం వాక్యం అని చతుర్వేది వారి (సా.శ. 1927) హిందీ రామాయణంలో ఉన్న పాఠ్యం గ్రహించడమైనది.

1.37.3.అనుష్టుప్.

యో నః సేనాపతిర్దేవ
దత్తో భగవతా పురా ।
తపః పరమమాస్థాయ
తప్యతే స్మ సహోమయా ॥

తాత్పర్యము :- “భగవంతుడా! ఓ బ్రహ్మదేవా! పూర్వము నువ్వు మాకు సేనాపతిగా ఇచ్చిన, ఆ పరమశివుడు ఉమాదేవితో కలసి అతి నియమముగా తపస్సు చేయుచున్నాడు.

ప్రతిపదార్థము :- యః = ఎవరినైతే; నః = మాకు; సేనాపతిః = సేనాపతి; దేవ = దేవా; దత్తః = ఇచ్చినావో; భగవతా = భగవంతుడా; పురా = పూర్వము; తపః = తపస్సు; పరమమ్ = బహుమిక్కిలిగా; ఆస్థాయ = పాటించి; తప్యతే = తపస్సు చేయుచున్నాడు; స్మ = చూడుము ( సుమా ); సహ = కలసి; ఉమయా = ఉమతో.

1.37.4.అనుష్టుప్.

యదత్రానన్తరం కార్యం
లోకానాం హితకామ్యయా ।
సంవిధత్స్వ విధానజ్ఞ
త్వం హి నః పరమా గతిః" ॥

తాత్పర్యము :- లోక హితము కొరకు ఈ విషయములో ఇప్పుడు ఏమి చేయవలెనో అది నీవే చేయుము. దీనికి తగిన పరిష్కారము నీకే తెలియును. నీవే మాకు గొప్ప దిక్కు. ”

ప్రతిపదార్థము :- యత్ = ఏది; అత్ర = ఈ విషయంలో; అనన్తరమ్ = తరువాత; కార్యమ్ = చేయ వలసినదో; లోకానామ్ = లోకముల యొక్క; హిత = మేలు; కామ్యయా = కోరిక కొరకు; సంవిధత్స్వ = చేయుము; విధానజ్ఞ = పరిష్కారము తెలిసిన; త్వమ్ = నీవు; హి = మాత్రమే; నః = మాకు; పరమా = గొప్ప; గతిః = దిక్కు.

1.37.5.అనుష్టుప్.

దేవతానాం వచః శ్రుత్వా
సర్వలోకపితామహః ।
సాన్త్వయన్ మధురైర్వాక్యైః
త్రిదశానిదమబ్రవీత్ ॥

తాత్పర్యము :- దేవతల మొఱ విని; శాంత పరచు విధముగా బ్రహ్మ వారితో అనునయంగా మధురంగా ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- దేవతానామ్ = దేవతలయొక్క; వచః = మాటలు; శ్రుత్వా = విని; సర్వలోక పితామహః = బ్రహ్మదేవుడు, సమస్త లోకములకు పితామహుడు; సాన్త్వయన్ = శాంత పరచు; మధురై = మధురమైన; వాక్యైః = మాటలతో; త్రిదశాన్ = దేవతలను; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను.

1.37.6.అనుష్టుప్.

శైలపుత్ర్యా యదుక్తం తత్
న ప్రజాః సన్తు పత్నిషు ।
తస్యా వచనమక్లిష్టం
సత్యమేతన్న సంశయః ॥

తాత్పర్యము :- ఉమాదేవి ఎలాగైనా మీకు మీ భార్యల యందు సంతానం కలుగదు అని ఏమాత్రం క్లిష్టంకాని పదాలలో శాపం ఇచ్చెను. దానికి తిరుగులేదన్నది నిస్సందేహంగా సత్యమే.

ప్రతిపదార్థము :- శైలపుత్ర్యా = పర్వత పుత్రి ఉమాదేవి చేత; యది = ఎలాగైనా; ఉక్తమ్ = చెప్పబడినదో; తత్ = ఆ; న = వీలుకాదు; ప్రజాసన్తు = మీరు సంతానము కనుట; పత్నిషు = భార్యల యందు; తస్యాః = ఆమె యొక్క; వచనమ్ = మాట; అక్లిష్టమ్ = వైరుధ్యము లేనిది; సత్యమ్ = సత్యము; ఏతత్ = ఈవిషయంలో; న = లేదు; సంశయః = సంశయము.

1.37.7.అనుష్టుప్.

ఇయమాకాశగా గంగా
యస్యాం పుత్రం హుతాశనః ।
జనయిష్యతి దేవానాం
సేనాపతిమరిన్దమమ్ ॥

తాత్పర్యము :- ఆకాశములో ప్రవహించు ఈ గంగామాత యందు అగ్నిదేవుడు, దేవతలకు సేనాపతియై శత్రు సంహరము చేయగల కుమారునికి పుట్టించగలడు.

ప్రతిపదార్థము :- ఇయం = ఈ; ఆకాశగా = ఆకాశములో ప్రవహించు; గంగా = గంగ; యస్యామ్ = ఎలాంటి; పుత్రమ్ = కుమారుని; హుతాశనః = అగ్నిదేవుడు; జనయిష్యతి = పుట్టించగలడంటే; దేవానామ్ = దేవతల యొక్క; సేనాపతిమ్ = సేనాపతి; అరిన్దమమ్ = శత్రు సంహారము చేయగల.

1.37.8.అనుష్టుప్.

జ్యేష్ఠా శైలేన్ద్రదుహితా
మానయిష్యతి తత్సుతమ్ ।
ఉమాయాస్తద్బహుమతం
భవిష్యతి న సంశయః" ॥

తాత్పర్యము :- హిమవంతుని పెద్ద కుమార్తె ఐన గంగ అగ్నిదేవుని వలన ఆ కుమారుని కనుటకు అంగీకరించును. ఈ ఘటన ఉమాదేవికి కూడా యిష్టమగును. ఇందులో సందేహము లేదు.”

ప్రతిపదార్థము :- జ్యేష్ఠా = పెద్దదైన; శైలేన్ద్రదుహితా = పర్వతరాజు హిమవంతుని కూతురు, గంగ; మానయిష్యతి = అంగీకరింప గలదు; తత్ = ఆ; సుతమ్ = కుమారుని; ఉమాయాః = ఉమకు; తత్ = అది; బహుమతమ్ = చాల ఇష్టమైనది; భవిష్యతి = కా గలదు; న = లేదు; సంశయః = సందేహము.

1.37.9.అనుష్టుప్.

తచ్ఛ్రుత్వా వచనం తస్య
కృతార్థా రఘునన్దన! ।
ప్రణిపత్య సురాః సర్వే
పితామహమపూజయన్ ॥

తాత్పర్యము :- ఓ రామా! దేవతలందరూ బ్రహ్మదేవుని మాటలను విని; తమ కోరిక నెరవేరబోవుచున్నందుకు బ్రహ్మదేవునికి నమస్కరించి ఆయనను పూజించిరి.

ప్రతిపదార్థము :- తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = మాట; తస్య = అతనికి; కృతార్థా = కృతార్థులై; రఘునందన = రఘుం వంశంలో పుట్టిన వాడా, రామా; ప్రణిపత్య = నమస్కరించి; సురాః = దేవతలు; సర్వే = అందరూ; పితామహమ్ = బ్రహ్మదేవుని; ఆపూజయన్ = పూజించిరి.

1.37.10.అనుష్టుప్.

తే గత్వా పర్వతం రామ
కైలాసం ధాతుమణ్డితమ్ ।
అగ్నిం నియోజయామాసుః
పుత్రార్థం సర్వదైవతాః ॥

తాత్పర్యము :- దేవతలందరు ధాతువులతో అలంకరింపబడి ఉన్న కైలాసపర్వతమునకు వెళ్ళి, కుమారుని కనవలెనని అగ్నిదేవుని ఆజ్ఞాపించిరి.

ప్రతిపదార్థము :- తే = ఆ; గత్వా = వెళ్ళి; పర్వతమ్ = పర్వతము; రామ = రామా; కైలాసమ్ = కైలాసము గూర్చి; ధాతు మణ్డితమ్ = ధాతువులతో అలంకరింపబడిన; అగ్నిమ్ = అగ్నిదేవుని; నియోజయామాసుః = ఆజ్ఞాపించిరి; పుత్రార్థం = కుమారుని కొరకు; సర్వ దేవతాః = దేవతలందరూ.

1.37.11.అనుష్టుప్.

దేవకార్యమిదం దేవ!
సంవిధత్స్వ హుతాశన! ।
శైలపుత్ర్యాం మహాతేజో
గంగాయాం తేజ ఉత్సృజ" ॥

తాత్పర్యము :- “ఓ అగ్నిదేవా! ఈ దైవకార్యము చేయుము. నీ యందున్న శివ తేజస్సును హిమవంతుని కుమార్తెయగు గంగాదేవి యందు విడువుము.”

ప్రతిపదార్థము :- దేవకార్యమ్ = దైవకార్యము; ఇదమ్ = ఈ; దేవ = దేవా; సంవిధత్స్వ = చేయుము; హుతాశన = అగ్ని; శైలపుత్ర్యామ్ = పర్వతరాజైన హిమవంతుని కుమార్తె; మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా; గంగాయామ్ = గంగ యందు; తేజః = తేజస్సు; ఉత్సృజ = విడువుము.

1.37.12.అనుష్టుప్.

దేవతానాం ప్రతిజ్ఞాయ
గంగామభ్యేత్య పావకః ।
గర్భం ధారయ వై దేవి!
దేవతానామిదం ప్రియమ్" ॥

తాత్పర్యము :- అగ్నిదేవుడు "అట్లే చేయుదు" నని దేవతలకు మాట ఇచ్చి, గంగాదేవిని సమీపించి "శివ తేజస్సుతో నీవు గర్భము దాల్చుము. ఇది దేవతలకు ప్రియమైన కార్యము" అని పలికెను.

ప్రతిపదార్థము :- దేవతానామ్ = దేవతలకు; ప్రతిజ్ఞాయ = ప్రమాణము చేసి; గంగామ్ = గంగను; అభ్యేత్య = చేరి; పావకః = అగ్నిదేవుడు; గర్భమ్ = గర్భమును; ధారయ వై = ధరింపుము; దేవి = దేవీ, గంగ; దేవతానామ్ = దేవతలకు; ఇదమ్ = ఇది; ప్రియమ్ = ఇష్టమైనది.

1.37.13.అనుష్టుప్.

తస్య తద్వచనం శ్రుత్వా
దివ్యం రూపమధారయత్ ।
దృష్ట్వా తన్మహిమానం స
సమన్తాదవకీర్యత ॥

తాత్పర్యము :- గంగాదేవి అగ్నిదేవుని మాటను విని, దివ్యమైన రూపమును ధరించెను. ఆ మహిమాన్వితమైన రూపము చూసి అగ్నిదేవుడు ఆమె శరీరమంతటను వ్యాపించెను.

ప్రతిపదార్థము :- తస్య = ఆ యొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; దివ్యమ్ = దివ్యమైన; రూపమ్ = రూపమును; అధారయత్ = ధరించెను; దృష్ట్వా = చూసి; తత్ = ఆ; మహిమానమ్ = మహిమను; సః = అతడు; సమన్తాత్ = అంతటను; అవకీర్యత = వ్యాపించెను.

1.37.14.అనుష్టుప్.

సమన్తతస్తదా దేవీం
అభ్యషించత పావకః ।
సర్వస్రోతాంసి పూర్ణాని
గంగాయా రఘునన్దన! ॥

తాత్పర్యము :- రామా! తరువాత అగ్నిదేవుడు తనలోనున్న శివ వీర్యమును గంగాదేవి యందు విడిచెను. దానితో గంగ సర్వావయవములు నిండిపోయెను.

ప్రతిపదార్థము :- సమన్తతః = అంతటా; తదా = తరువాత; దేవీమ్ = దేవిని; అభ్యషించత = తడిపెను; పావకః = అగ్నిదేవుడు; సర్వ = సకల; స్రోతాంసి = అవయవములను; పూర్ణాని = నిండిపొయెను; గంగాయా = గంగ యొక్క; రఘునన్దన = రామా.

1.37.15.అనుష్టుప్.

తమువాచ తతో గంగా
సర్వదేవపురోహితమ్ ।
అశక్తా ధారణే దేవ
తవ తేజః సముద్ధతమ్" ॥

తాత్పర్యము :- తరువాత దేవతలందరికి ముందుగా ఎంచదగ్గవాడైన అగ్నిదేవునితో గంగాదేవి "ఓ అగ్నిదేవా! నా శరీరమంతటా నిండిన ఈ శివ తేజస్సును నేను భరించలేను.”

ప్రతిపదార్థము :- తమ్ = ఆ; ఉవాచ = పలికెను; తతః = తరువాత; గంగా = గంగ; సర్వదేవపురోహితమ్ = సర్వదేవపురోహితమ్ - సమస్త దేవతలకు అగ్రస్థుడు , అగ్నిదేవుని గురించి; అశక్తా = శక్తిలేని; ధారణే = ధరించుటకు; దేవ = దేవా, అగ్ని; తవ = నీ యొక్క; తేజః = తేజస్సు; సముద్ధతమ్ = విజృంభించిన.

1.37.16.అనుష్టుప్.

దహ్యమానాగ్నినా తేన
సమ్ప్రవ్యథితచేతనా ।
అథాబ్రవీదిదం గంగాం
సర్వదేవహుతాశనః ॥

తాత్పర్యము :- అలా అగ్నిచేత దహింప బడుతూ, స్పృహకోల్పోబోవుచున్న గంగాదేవితో అగ్నిదేవుడు ఇలా అనెను.

ప్రతిపదార్థము :- దహ్యమానా = దహింపబడుతున్న; అగ్నినా = అగ్నిచేత; తేన = ఆ; సంప్రవ్యథిత చేతనా = మిక్కిలి క్షోభించబడిన చైతన్యము (స్పృహ) కలామెతో; అథ = తరువాత; అబ్రవీత్ = అనెను; ఇదమ్ = దీనిని; గంగామ్ = గంగను గురించి; సర్వదేవ హుతాశనః = అగ్ని దేవుడు {సర్వదేవ హుతాశనుడు- దేవతలు అందఱి కొఱకు యజ్ఞములలో వేయు హవిస్సును గ్రహించు వాడు, అగ్నిదేవుడు}.

1.37.17.అనుష్టుప్.

ఇహ హైమవతే పాదే
గర్భోఽ యం సన్నివేశ్యతామ్” ।
శ్రుత్వా త్వగ్నివచో గంగా
తం గర్భమతిభాస్వరమ్ ॥

తాత్పర్యము :- "ఈ గర్భమును హిమవత్పర్వత పాదముల దగ్గర విడువుము" అని అనెను. అగ్నిదేవుడు సూచించినట్లు అప్పుడు గంగాదేవి, బహు మిక్కిలిగా ప్రకాశించుచున్న ఆ గర్భమును హిమవంతుని పాదముల దగ్గర దిగవిడిచెను.

ప్రతిపదార్థము :- ఇహ = ఇక్కడ; హైమవతే = హిమవంతునికి సంబంధించిన, హిమవత్పర్వత; పాదే = పాదముల దగ్గర; గర్భః = గర్భము; అయమ్ = ఈ; సంనివేశ్యతామ్ = ఉంచబడుగాక; శ్రుత్వా = విని; అగ్ని = అగ్నిదేవుని; వచః = మాట; గంగా = గంగాదేవి; తమ్ = ఆ; గర్భమ్ = గర్భము; అతి = బహుమిక్కిలిగా; భాస్వరమ్ = గొప్పగా ప్రకాశిస్తున్నదానిని;

1.37.18.అనుష్టుప్.

ఉత్ససర్జ మహాతేజః
స్రోతోభ్యో హి తదాఽ నఘ! ।
యదస్యా నిర్గతం తస్మాత్
తప్తజామ్బూనదప్రభమ్ ॥

తాత్పర్యము :- ఆ గంగాదేవి పుటంపెట్టిన బంగారపు కాంతితో కూడిన శివతేజస్సును భూమిపై విడిచిపెట్టెను.

ప్రతిపదార్థము :- ఉత్ససర్జ = విడిచెను; మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా; స్రోతోభ్యః = అవయవముల నుండి; తదా = అప్పుడు; అనఘ = పాప రహితుడ; యత్ = ఆ; అస్యాః = ఏది; నిర్గతమ్ = బయలుపడిన; తస్మాత్ = దాని నుండి; తప్తజామ్బూనాదప్రభమ్ = పుటంపెట్టిన బంగారపు కాంతితో.

1.37.19.అనుష్టుప్.

కాంచనం ధరణీం ప్రాప్తం
హిరణ్యమమలం శుభమ్ ।
తామ్రం కార్ష్ణాయసం చైవ
తైక్ష్ణ్యాదేవాభ్యజాయత ॥

తాత్పర్యము :- భూమి పై పడిన ఆ శివతేజస్సు యొక్క తీక్ష్ణత వలన (పుటంపెట్టిన బంగారపు కాంతితో ) బంగారము, పరిశుద్ధమైన మంగళకరమైన వెండి, రాగి మరియు ఇనుము పుట్టెను

ప్రతిపదార్థము :- కాంచనమ్ = బంగారము; ధరణీమ్ = భూమిని; ప్రాప్తమ్ = పొందినదో; హిరణ్యమ్ = వెండియును (ఆంధ్రశబ్ధరత్నాకరము); అమలమ్ = పరిశుద్ధమైన; శుభమ్ = మంగళకరమైన; తామ్రం = రాగి; కార్ష్ణాయసమ్ = ఇనుము; చైవ = ఇవి కూడ; తైక్ష్ణాత్ = తీక్షణత్వము నుండి; అభ్యజాయత = పుట్టెను.

1.37.20.అనుష్టుప్.

మలం తస్యాభవత్తత్ర
త్రపు సీసకమేవ చ ।
తదేతద్ధరణీం ప్రాప్య
నానాధాతురవర్దత ॥

తాత్పర్యము :- ఆ శివ రేతస్సులోని మలము వలన అక్కడ తగరము, సీసము, మొదలగు నానా విధములైన లోహములు పుట్టినవి.

ప్రతిపదార్థము :- మలమ్ = అశుద్ధము; తస్య = ఆ యొక్క; ఆభవత్ = అయ్యెను; తత్ర = అక్కడ; త్రపు = తగరము; సీసకమ్ ఏవచ = సీసము; తత్ ఏతత్ = ఆ; ధరణీమ్ = భూమిని; ప్రాప్య = పొంది; నానా = వివిధములైన; ధాతుః = లోహములు; అవర్ధత = వృద్ధి చెందినవి.

1.37.21.అనుష్టుప్.

నిక్షిప్తమాత్రే గర్భే తు
తేజోభిరభిరంజితమ్ ।
సర్వం పర్వతసన్నద్ధం
సౌవర్ణమభవద్వనమ్ ॥

తాత్పర్యము :- గంగాదేవి గర్భమును ఆ పర్వతము వద్ద విడిచి పెట్టగానే, అక్కడ ఆ పర్వతము మీద మొలకెత్తిన రెల్లుగడ్డి అంతా బంగారుమయమైనది.

ప్రతిపదార్థము :- నిక్షిప్తమాత్రే = ఉంచబడుట వలననే; గర్భే = గర్భము; తేజోభిః = తేజస్సు వలన; అభిరంజితమ్ = రంజింపబడినదై; సర్వమ్ = మొత్తము; పర్వత = పర్వతముపై; సన్నద్ధమ్ = మొలకెత్తిన; సౌవర్ణమ్ = బంగారు మయముగా; అభవత్ = అయ్యెను; వనమ్ = శరవణము, రెల్లుగడ్డి.

1.37.22.అనుష్టుప్.

జాతరూపమితి ఖ్యాతం
తదాప్రభృతి రాఘవ! ।
సువర్ణం పురుషవ్యాఘ్ర!
హుతాశనసమప్రభమ్ ।
తృణవృక్షలతాగుల్మం
సర్వం భవతి కాంచనమ్ ॥

తాత్పర్యము :- పురుష వ్యాఘ్రమా! రామా! అప్పడినుండి అగ్ని అంత కాంతి గల బంగారము జాతరూపముగా (ప్రశస్త రూపమున పుట్టినదిగా ) ప్రసిద్ధి చెందినది. గడ్డి, చెట్లు, లతలు, పొదలు అన్నియు బంగారము అయినవి.

ప్రతిపదార్థము :- జాతరూపమ్ = బంగారము; ఇతి = అని; ఖ్యాతమ్ = ప్రసిద్ధమైనది; తదా = అప్పటి; ప్రభృతి = మొదలు, నుండి; రాఘవ = రామా; సువర్ణమ్ = బంగారము; పురుషవ్యాఘ్ర = పురుషులలో శ్రేష్ఠుడా; హుతాశన = అగ్ని; సమప్రభమ్ = సమానమైన కాంతిగలది; తృణ = గడ్డి; వృక్ష = వృక్షములు; లతా = తీగలు; గుల్మమ్ = పొదలు; సర్వం = అన్నీ; భవతి = ఐనవి; కాంచనమ్ = బంగారము.

1.37.23.అనుష్టుప్.

తం కుమారం తతో జాతం
సేన్ద్రాః సహ మరుద్గణాః ।
క్షీరసమ్భావనార్థాయ
కృత్తికాః సమయోజయన్ ॥

తాత్పర్యము :- ఇంకా కుమారస్వామి అలా పుట్టాడు. ఇంద్రుడు, మరుద్గణాలు కుమారస్వామికి పాలు ఇచ్చుటకు కృత్తికలను ఏర్పాటు చేసిరి.

ప్రతిపదార్థము :- తమ్ = ఆ; కుమారమ్ = కుమారస్వామి; తతః = తరువాత; జాతమ్ = పుట్టిన; స = కూడిన; ఇన్ద్రాః = ఇంద్రుడు; సహ = సహితము; మరుద్గణాః = మరుత్తులు అను దేవగణములు; క్షీరమ్ = పాలు; సంభావనార్థాయ = ఇచ్చి పోషించుటకొరకు; కృత్తికాః = కృత్తికలను; సమయోజయన్ = ఏర్పాటు చేసిరి.

 *గమనిక :- *- 1. మరుత్తులు- 49 మంది కశ్యపునకు దితి యందు పుట్టినవారు, ఇంద్రునితో స్నేహంగా ఉండే దేవగణం. 2. కృత్తికలు- ఆరుగురు, వీరు కుమారస్వామిని కుమారునిగా స్వీకరించుటచే కార్తికేయుడు, ఈ ఆరుగురు వద్ద ఆరు ముఖములతో ఒకేమారు శిశువుగా స్తన్యం తాగినవాడు కనుక షణ్ముఖుడు.

1.37.24.అనుష్టుప్.

తాః క్షీరం జాతమాత్రస్య
కృత్వా సమయముత్తమమ్ ।
దదుః పుత్రోఽ యమస్మాకం
సర్వాసామితి నిశ్చితాః ॥

తాత్పర్యము :- అప్పుడే జన్మించిన బాలునకు పాలు ఇచ్చు ఉదారమైన కట్టుబాటును చేసిరి. కృత్తిక లందరు కుమారస్వామికి పాలు ఇస్తూ; "ఈ పుత్రుడు మా అందరికి కుమారుడు. ఇది నిశ్చయము" అని పలికిరి.

ప్రతిపదార్థము :- తాః = ఆ; క్షీరమ్ = పాలు; జాత మాత్రస్య = అప్పుడే జన్మించిన ఆ బాలునికి; కృత్వా = చేసి; సమయమ్ = కట్టుబాటును; ఉత్తమమ్ = గొప్పదైన; దదుః = ఇచ్చిరి; పుత్రః = పుత్రుడు; అయమ్ = ఈ; అస్మాకమ్ = మాకు; సర్వాసామ్ = అందరికీ; ఇతి = ఇది; నిశ్చితాః = నిశ్చయము.

1.37.25.అనుష్టుప్.

తతస్తు” దేవతాః సర్వాః
కార్తికేయ ఇతి బ్రువన్ ।
పుత్రస్త్రైలోక్యవిఖ్యాతో
భవిష్యతి న సంశయః ॥

తాత్పర్యము :- దేవతలంతా; ‘అవును గాక! ఇతడు కార్తికేయుడు‘ అని పలికిరి. ఠఈ కుమారుడు నిస్సందేహముగా ముల్లోకములలోను 'కార్తికేయుడు' (కృత్తికల కుమారుడు) గా ప్రసిద్ధి పొందును.”

ప్రతిపదార్థము :- తతః = అప్పుడు; అస్తు = అటులనే గాక; దేవతాః = దేవతలు; సర్వాః = అందరు; కార్తికేయ = కృత్తికల పుత్రుడు; ఇతి = అని; బ్రువన్ = పలికిరి; పుత్రైః = పుత్రుడు; త్రైలోక్య = ముల్లోకములలోను; విఖ్యాతః = ప్రసిద్ధి; భవిష్యతి = కాగలడు; న = లేదు; సంశయః = సందేహము.

1.37.26.అనుష్టుప్.

తేషాం తద్వచనం శ్రుత్వా
స్కన్నం గర్భపరిస్రవే ।
స్నాపయన్ పరయా లక్ష్మ్యా
దీప్యమానం యథాఽ నలమ్ ॥

తాత్పర్యము :- అని దేవతలు పలికిరి. ఆ వచనములు విని గర్భస్రావము నుండి జారిపడిన వానికి చాలా అందముగా అగ్నివలె ప్రకాశిస్తున్న కార్తికేయునికి కృత్తికలు స్నానము చేయించిరి.

ప్రతిపదార్థము :- తేషామ్ = ఆ యొక్క; తద్వచనమ్ = ఆ మాటను; శ్రుత్వా = విని; స్కన్నమ్ = జారిపడిన; గర్భ పరిస్రవే = గర్భస్రావమునందు; స్నాపయన్ = స్నానము చేయించిరి; పరయా = గొప్ప; లక్ష్మ్యా = అందముతో; దీప్యమానమ్ = ప్రకాశిస్తున్న; యథా = వలె; అనలమ్ = అగ్ని.

1.37.27.అనుష్టుప్.

స్కన్ద ఇత్యబ్రువన్ దేవాః
స్కన్నం గర్భపరిస్రవాత్ ।
కార్తికేయం మహాభాగం
కాకుత్స్థ! జ్వలనోపమమ్ ॥

తాత్పర్యము :- ఓ కాకుత్స్థ రామ! దేవతలు ఇలా పలికిరి “గర్భస్రావము నుండి జారిపడిన వాడు కనుక స్కంధుడు. కృత్తికల తనయుడు, కార్తికేయుడు గొప్ప భాగ్యవంతుడు. అగ్నితో సమాన తేజశ్శాలి.

ప్రతిపదార్థము :- స్కన్దః = స్కందుడు; ఇతి = అని; అబ్రువన్ = అనిరి; దేవాః = దేవతలు; స్కన్నమ్ = జారిపడిన; గర్భపరిస్రవాత్ = గర్భస్రావము వలన; కార్తికేయమ్ = కార్తికేయుడు; మహాభాగమ్ = గొప్ప భాగ్యవంతుడు; కాకుత్స్థ = కాకుత్స్థ వంశీయుడవైన (రామా); జ్వలన్ = అగ్నితో; ఉపమమ్ = సమానము.

1.37.28.అనుష్టుప్.

ప్రాదుర్భూతం తతః క్షీరం
కృత్తికానామనుత్తమమ్ ।
షణ్ణాం షడాననో భూత్వా
జగ్రాహ స్తనజం పయః ॥

తాత్పర్యము :- కృత్తికలకు అపుడు ఉద్భవించిన పాలు మిగుల శ్రేష్ఠమైనవి. కార్తికేయుడు; ఆరుగురి కృత్తికల స్తనములలో పుట్టిన పాలు ఆరు ముఖములతో త్రాగెను.

ప్రతిపదార్థము :- ప్రాదుర్భూతమ్ = ఉద్భవించిన; తతః = తరువాత; క్షీరమ్ = పాలు; కృత్తికానామ్ = కృత్తికలకు; అనుత్తమమ్ = చాలా ఉత్తమమైనవి; షణ్డామ్ = ఆరుగురి యొక్క; షడాననః = ఆరు ముఖములు గల వాడు; భూత్వా = అయి; జగ్రాహ = గ్రహించెను; స్తనజమ్ = స్తనములందు పుట్టిన; పయః = పాలు.

 *గమనిక :- *- ఆరు ముఖములు కలవాడు అగుటచే షణ్ముఖుడు / షడానననుడు అని కూడ ప్రసిద్ఝుడాయెను

1.37.29.అనుష్టుప్.

గృహీత్వా క్షీరమేకాహ్నా
సుకుమారవపుస్తదా ।
అజయత్స్వేన వీర్యేణ
దైత్యసైన్యగణాన్ విభుః ॥

తాత్పర్యము :- అలా ఒక్క దినము మాత్రమే పాలుత్రాగి సుకుమార దేహము కలవాడయ్యెను (చక్కటి కుమారస్వామి రూపం ధరించెను). అపుడు ఆ ప్రభువు షణ్ముఖుడు తన బల పరాక్రమములతో రాక్షస సేనను జయించెను.

ప్రతిపదార్థము :- గృహీత్వా = గ్రహించి; క్షీరమ్ = పాలు; ఏక = ఒక; ఆహ్న = దినము; సుకుమారః = సుకుమార, సు (మంచి) కుమార (కుమారస్వామి అను); వపుః = దేహము కలవాడు; తదా = అప్పుడు; అజయత్ = జయించెను; స్వేన = తన యొక్క; వీర్యేణ = బల పరాక్రమముతో; దైత్యసేనాగణాన్ = రాక్షస సేనను; విభుః = ప్రభువు

1.37.30.అనుష్టుప్.

సురసేనాగణపతిమ్
తతస్తమతులద్యుతిమ్ ।
అభ్యషించన్ సురగణాః
సమేత్యాగ్నిపురోగమాః ॥

తాత్పర్యము :- తరువాత, అసమాన తేజోవంతుడైన ఆతనిని దేవతల సైన్యాధిపతిగా అగ్నిదేవుని ముందు ఉంచుకుని దేవతలు అందరు కలిసి పట్టాభిషేకము చేసిరి.

ప్రతిపదార్థము :- సుర = దేవతల; సేనా = సేనలయొక్క; గణ = సమూహములకు; సుపతిమ్ = అధిపతిగా; తతః = తరువాత; తమ్ = అతనిని; అతుల = అసమానమైన; ద్యుతిమ్ = ప్రకాశము గల; అభ్యషించన్ = పట్టాభిషేకము చేసిరి; సుర = దేవతల; గణాః = సమూహములు; సమేత్ = కలసి; అగ్నిః = అగ్నిని; పురోగమాః = ముందు ఉంచుకొని.

1.37.31.అనుష్టుప్.

ఏష తే రామ గంగాయా
విస్తరోఽ భిహితో మయా ।
కుమారసమ్భవశ్చైవ
ధన్యః పుణ్యస్తథైవ చ ॥

తాత్పర్యము :- రామా! గంగను గురించి కథావివరణము నీకు తెలియజేసితిని. ధన్యత్వమును కలిగించునది మఱియు పుణ్యవంతమును ఐన కుమారస్వామి సంభవ వృత్తాంతమును చెప్పితిని.

ప్రతిపదార్థము :- ఏష = ఈ; తే = నీకు; రామ = రామా; గంగాయా = గంగయొక్క; విస్తరః = వివరణము; అభిహితః = చెప్ప బడినది; మయా = నా చేత; కుమార సంభవః = ఈ కుమారస్వామి యొక్క జననము; చై; ధన్యః = ధన్యత్వమును కలిగించునది; పుణ్యః = పుణ్యమును కలిగించునది; తథైవ = అలగే; చ.

1.37.32.అనుష్టుప్.

భక్తశ్చ యః కార్తికేయే
కాకుత్స్థ భువి మానవః ।
ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ
స్కన్దసాలోక్యతాం వ్రజేత్" ॥

తాత్పర్యము :- కాకుత్స్థ రామ! భూలోకము నందలి కుమారస్వామి యందు భక్తి కల మానవుడు, దీర్ఘాయుష్మంతుడును, పుత్రపౌత్రాది సౌఖ్యము లనుభవించువాడును అగును. పిమ్మట కుమారస్వామితో సాలోక్య ముక్తిని పొందును.

ప్రతిపదార్థము :- భక్తః చ = భక్తుడు; యః = ఏ; కార్తికేయే = కుమారస్వామి యందు; కాకుత్స్థ = కకుత్స్థుని వంశజుడా; భువి = భూలోకములో; మానవః = మానవుడు; ఆయుష్మాన్ = ఆయుష్యవంతుడు; పుత్రః = కొడుకులు కలవాడును; పౌత్రైః = మనుమలు కలవాడును; చ = కూడా; స్కన్ద = కుమారస్వామితో; సాలోక్యతామ్ = సాలోక్యమును స్కందునిలోకమున ఉండుట; వ్రజేత్ = పొందును

1.37.33.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
సప్తత్రింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [37] ముపైఏడవ సర్గ.

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; సప్తత్రింశః [37] = ముప్పై ఏడవ; సర్గః = సర్గ.

అష్టత్రింస సర్గః

[38 - సగరునికి పుత్రప్రాప్తి]

1.38.1.అనుష్టుప్.

తాం కథాం కౌశికో రామే
నివేద్య కుశికాత్మజః ।
పునరేవాపరం వాక్యం
కాకుత్స్థమిదమబ్రవీత్ ॥

తాత్పర్యము :- ఆ కథను గాథి కుమారుడైన విశ్వామిత్రుడు శ్రీరామునికి తెలియపరచి మరల కాకుత్స్థునితో విశేషమైన ఈ మాటలను పలికెను.

ప్రతిపదార్థము :- తాం కథామ్ = ఆ కథను; కౌశికః = విశ్వామిత్రుడు; రామే = రామునికి; నివేద్య = తెలియపరిచి; కుశికాత్మజః = కుశరాజైన గాథి కుమారుడు; పునః = మరల; యేవ =; అపారమ్ = విశేషమైన; వాక్యమ్ = మాటలను; కాకుత్స్థమ్ = కాకుత్స్థు డైన రామునితో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.

1.38.2.అనుష్టుప్.

అయోధ్యాధిపతిః శూరః
పూర్వమాసీన్నరాధిపః ।
సగరో నామ ధర్మాత్మా
ప్రజాకామః స చాప్రజః ॥

తాత్పర్యము :- పూర్వము మహాయోధుడైన అయోధ్యకు రాజు ఉండెడివాడు. ధర్మాత్ముడైన సగరుడను పేరుగల ఆ చక్రవర్తి సంతానహీనుడై సంతాము కావలెనని కోరుచుండెను.

ప్రతిపదార్థము :- అయోధ్యాః = అయోధ్యకు; అధిపతిః = రాజును; శూరః = మహాయోధుడును; పూర్వమ్ = గతములో; ఆసీత్ = ఉండెను; నరాః = జనులకు; అధిపః = పాలించువాడు; సగరః = సగరుడు అను; నామ = పేరుగల; ధర్మాత్మా = ధార్మికుడు; ప్రజాకామః = సంతానమును వాంఛించుచు; స = అతడు; అప్రజః = బిడ్డలు లేని వాడై.

1.38.3.అనుష్టుప్.

వైదర్భదుహితా రామ!
కేశినీ నామ నామతః ।
జ్యేష్ఠా సగరపత్నీ సా
ధర్మిష్ఠా సత్యవాదినీ ॥

తాత్పర్యము :- ఓ రామా! విదర్భ రాజు యొక్క కుమార్తె కేశినియను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆమె సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్టాపరురాలు; సత్యసంధురాలు.

ప్రతిపదార్థము :- వైదర్భ = విదర్భ రాజు యొక్క; దుహితా = కుమార్తె; రామ = ఓ రామా!; కేశినీ నామ = కేశిని అను పేరుతో; నామతః = ప్రసిద్ధిచెందిన; జ్యేష్టా = పెద్ద; సగర = సగరుని; పత్నీ = భార్య; సా = ఆమె; ధర్మిష్టా = ధర్మవర్తన గలది; సత్యవాదినీ = సత్యమునే పలుకునది.

1.38.4.అనుష్టుప్.

అరిష్టనేమిదుహితా
రూపేణాప్రతిమా భువి ।
ద్వితీయా సగరస్యాసీత్
పత్నీ సుమతిసంజ్ఞితా ॥

తాత్పర్యము :- అరిష్టనేమి యొక్క కుమార్తె రూపలావణ్యములలో భూలోకము నందు అసమానమైనది; సుమతి అను పేరుగలామె సగరునియొక్క రెండవ భార్య.

ప్రతిపదార్థము :- అరిష్టనేమేః = అరిష్టనేమి యొక్క; దుహితా = కుమార్తె; రూపేణ = సౌందర్యములో; అప్రతిమా = సాటిలేనిది; భువి = భూలోకమందు; ద్వితీయా = రెండవ; సగరస్య = సగరునియొక్క; ఆసీత్ = అయిఉన్నది; పత్నీ = భార్య; సుమతి = సుమతి; సంజ్ఞితా = అనుపేరు కలది.

1.38.5.అనుష్టుప్.

తాభ్యాం సహ తథా రాజా
పత్నీభ్యాం తప్తవాంస్తపః ।
హిమవన్తం సమాసాద్య
భృగుప్రస్రవణే గిరౌ ॥

తాత్పర్యము :- ఆ సగరమహారాజు తన భార్యలతో కూడి హిమవత్పర్వతమును చేరి భృగుప్రస్రవణమను కొండపై తపస్సు చేసెను.

ప్రతిపదార్థము :- తాభ్యాం = తనయొక్క; సహ = కూడా; మహారాజా = సగరమహారాజు; పత్నీభ్యామ్ = భార్యలతో; తప్తవామ్ తపః = తపస్సుచేసెను; హిమవన్తమ్ = హిమవత్పర్వతమును; సమాసాద్య = చేరి; భృగుప్రస్రవణే = భృగుప్రస్రవణమను; గిరౌ = కొండయందు.

 *గమనిక :- *- భృగు- ఒక ఋషి, చదునుగా ఉన్న కొండ శిఖరము, ప్రస్రవణము- సెలయూట, కొండలలో నీరు ఊరు తావు, చెమట

1.38.6.అనుష్టుప్.

అథ వర్షశతే పూర్ణే
తపసాఽఽ రాధితో మునిః ।
సగరాయ వరం ప్రాదాత్
భృగుః సత్యవతాం వరః ॥

తాత్పర్యము :- సత్యవంతులలో శ్రేష్ఠుడైన భృగు మహర్షి తపస్సుచేత సేవింపబడి నూరుసంవత్సరములు పూర్తి ఆయెను. అప్పుడు భృగుమహర్షి సగరునికి వరమును ప్రసాదించెను.

ప్రతిపదార్థము :- అథ = అప్పుడు; వర్ష = సంవత్సరములు; శతే = నూరు; పూర్ణే = నిండగ; తపసా = తపస్సుచేత; ఆరాధితః = సేవించగా; మునిః = మహర్షి; సగరాయ = సగరునికి; వరమ్ = వరమును; ప్రాదాత్ = ప్రసాదించెను; భృగుః = భృగువు ముని; సత్యవతామ్ = సత్యవంతులలో; వరః = శ్రేష్ఠుడైన.

1.38.7.అనుష్టుప్.

అపత్యలాభః సుమహాన్
భవిష్యతి తవానఘ! ।
కీర్తిం చాప్రతిమాం లోకే
ప్రాప్స్యసే పురుషర్షభ! ॥

తాత్పర్యము :- పాపములు లేనివాడా! పురుష శ్రేష్ఠుడా! సగరా! నీకు చాలా గొప్పదైన సంతానప్రాప్తి కలుగును. లోకమునందు సాటిలేని కీర్తి కూడ లభించును.

ప్రతిపదార్థము :- అపత్యః = సంతానము; లాభః = ప్రాప్తించుట; సు = మిక్కిలి; మహాన్ = గొప్పదైన; భవిష్యతి = కలుగగలదు; తవ = నీకు; అనఘ = పాపము లేనివాడా; కీర్తిం = యశస్సు; చ = కూడా; అప్రతిమామ్ = సాటిలేనిదై; లోకే = జగత్తునందు; ప్రాప్స్యసే = సంప్రాప్తించగలదు; పురు = పురుషలలో; ఋషభః = శ్రేష్ఠుడా.

1.38.8.అనుష్టుప్.

ఏకా జనయితా తాత!
పుత్రం వంశకరం తవ ।
షష్టిం పుత్రసహస్రాణి
అపరా జనయిష్యతి" ॥

తాత్పర్యము :- ఓ రాజా! నీభార్యలలో ఒకామె వంశోద్ధారకుడైన పుత్రునికి జన్మనివ్వగలదు. మరియొకామె అరువది వేల కుమారులను కనగలదు.”

ప్రతిపదార్థము :- ఏకా = ఒకామె; జనయితా = జన్మనివ్వగలదు; తాత = నాయనా; పుత్రమ్ = కుమారుని; వంశకరమ్ = వంశము నిలుపువానికి; తవ = నీయొక్క; షష్టిం = అరువది; పుత్ర = పుత్ర; సహస్రాణి = వేలమంది; అపరాః = మరియొక భార్య; జనయిష్యతి = కనగలదు.

1.38.9.అనుష్టుప్.

భాషమాణం మహాత్మానం
రాజపుత్ర్యౌ ప్రసాద్య తమ్ ।
ఊచతుః పరమప్రీతే
కృతాంజలిపుటే తదా ॥

తాత్పర్యము :- అప్పుడు ఆ విధముగా మాట్లాడుచున్న మహాత్ముడు భృగుమహర్షి అనుగ్రహము పొందిన రాజకుమార్తెలు చాలా సంతోషపడి ముకుళిత హస్తులై అతనిని గూర్చి పలికిరి.

ప్రతిపదార్థము :- భాషమాణమ్ = ఆవిధముగా మాట్లాడుచున్న; మహాత్మానమ్ = మహాత్ముడైన భృగుమహర్షి; రాజపుత్ర్యౌ = రాజకుమార్తెలు; ప్రసాద్య = అనుగ్రహమునుపొంది; తమ్ = అతనిని గురించి; ఊచతుః = పలికిరి; పరమ = మిక్కిలి; ప్రీతే = సంతసించి; కృతాంజలిపుటే = ముకుళిత హస్తులై; తదా = అప్పుడు.

1.38.10.అనుష్టుప్.

ఏకః కస్యాస్సుతో బ్రహ్మన్!
కా బహూన్ జనయిష్యతి?
శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్!
సత్యమస్తు వచస్తవ" ॥

తాత్పర్యము :- “ఓ బ్రాహ్మణోత్తమా! ఒక పుత్రుడు ఎవరికి? ఎవరు ఎక్కువమంది సుతులు ఎవరికి? కలిగెదరో చెప్పుము. బ్రాహ్మణశ్రేష్ఠుడా! మీ పలుకులు నిజమగుగాక!”

ప్రతిపదార్థము :- ఏకః = ఒక్కరు (పుత్రుడు); కస్యాః = ఎవరికి; సుతః = కుమారుడు; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; కా = ఎవరు; బహూన్ = ఎక్కువమందిని (కుమారులను); జనయిష్యతి = కనును; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛావహే = కుతూహలపడుచున్నాము; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; సత్యమ్ = నిజము; అస్తు = అగుగాక; వచఃతవ = నీ పలుకులు

1.38.11.అనుష్టుప్.

తయోస్తద్వచనం శ్రుత్వా
భృగుః పరమధార్మికః ।
ఉవాచ పరమాం వాణీం
స్వచ్ఛన్దోఽ త్ర విధీయతామ్ ॥

తాత్పర్యము :- వారియొక్క ఆ మాటలను విని పరమధర్మాత్ముడైన భృగుమహర్షి “ఈ విషయమును మీ ఇష్టప్రకారం మీలోమీరు నిర్ణయయించుకొను” డని చక్కటి మాటలలో చెప్పెను.

ప్రతిపదార్థము :- తయోః = వారియొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; భృగుః = భృగుమహర్షి; పరమ = మిక్కిలి; ధార్మికః = ధర్మాత్ముడు; ఉవాచ = పలికెను; పరమామ్ = ఉత్తమమైన; వాణీమ్ = వాక్కును; “స్వచ్ఛందః = మీలోమీ ఇష్ట ప్రకారం; అత్ర = ఈవిషయమును; విధీయతామ్ = నిర్ణయించుకొనుడు

1.38.12.అనుష్టుప్.

ఏకో వంశకరో వాఽ స్తు
బహవో వా మహాబలాః ।
కీర్తిమన్తో మహోత్సాహాః
కా వా కం వరమిచ్ఛతి?"

తాత్పర్యము :- వంశమును నిలుపు ఒక్క పుత్రుడు కావలెనా? మహాబలవంతులు; కీర్తివంతులు; అత్యుత్సాహులు అయిన ఎక్కువమంది కుమారులు కావలెనా? మీలో ఎవరు ఏ వరమును కోరెదరు?

ప్రతిపదార్థము :- ఏకః = ఒక్కడు; వంశకరః = వంశమునిలుపువాడు; వా అస్తు = కలుగవలెనా; బహవో = ఎక్కువమంది; వా = కావలెనా; మహాబలాః = అతిబలవంతులు; కీర్తిమంతః = కీర్తినొందువారు; మహోత్సాహాః = అత్యుత్సాహులు; కా వా = మీలో ఎవరు; కమ్ = ఏ; వరమ్ = వరమును; ఇచ్ఛతి = కోరెదరు?

1.38.13.అనుష్టుప్.

మునేస్తు వచనం శ్రుత్వా
కేశినీ రఘునన్దన! ।
పుత్రం వంశకరం రామ!
జగ్రాహ నృపసన్నిధౌ ॥

తాత్పర్యము :- రఘునందనా! ఓ రామా! మునియొక్క వచనములను విని సగరుని పెద్దభార్య, విదర్భదేశ రాకుమారి అయిన కేశిని వంశమును నిలుపు పుత్రుని ఆ మహారాజు సన్నిధిలో కోరెను.

ప్రతిపదార్థము :- మునేస్తు = మునియొక్క; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; కేశినీ = కేశిని( సగరుని పెద్దభార్య); రఘునందన = ఓ రఘువంశీయులకు ఆనందము కలిగించువాడా; పుత్రమ్ = కుమారుడు; వంశకరమ్ = వంశమును నిలుపువాడు, రాముడు; రామ = ఓ రామా; జగ్రాహ = గ్రహించెను; నృప = మహారాజు సగర; సన్నిధౌ = వద్ద.

1.38.14.అనుష్టుప్.

షష్టిం పుత్రసహస్రాణి
సుపర్ణభగినీ తదా ।
మహోత్సాహాన్ కీర్తిమతో
జగ్రాహ సుమతిః సుతాన్ ॥

తాత్పర్యము :- మహోత్సాహులును యశస్వులును అగు అరువదివేలమంది పుత్రులను సగరుని భార్యయును, గరుత్మంతుని సోదరియును అగు సుమతి కోరెను.

ప్రతిపదార్థము :- షష్టిం పుత్ర సహస్రాణి = అరువదివేల పుత్రులను; సుపర్ణ భగినీ = గరుత్మంతుని సోదరి; తదా = అప్పుడు; మహోత్సాహాన్ = అతి ఉత్సాహవంతులను; కీర్తిమతః = యశస్వులను; జగ్రాహ = గ్రహించెను; సుమతిః = సుమతి సగరుని మరొక భార్య; సుతాన్ = తన కుమారులుగా.

1.38.15.అనుష్టుప్.

ప్రదక్షిణమృషిం కృత్వా
శిరసాభిప్రణమ్య చ ।
జగామ స్వపురం రాజా
సభార్యో రఘునన్దన ॥

తాత్పర్యము :- రఘునందనా! ఋషికి ప్రదక్షిణమాచరించి, శిరస్సువంచి నమస్కరించి సగరచక్రవర్తి భార్యలతో తన పట్టణమునకు వెళ్ళెను.

ప్రతిపదార్థము :- ప్రదక్షిణమ్ = ప్రదక్షిణను; ఋషిమ్ = ఋషికి; కృత్వా = చేసి; శిరసా = శిరస్సుతో; అభిప్రణమ్య = నమస్కారముచేసియు; చ = కూడ; జగామ = వెళ్ళెను; స్వ = తన; పురం = పట్టణమునకు; రాజా = రాజు; స = కూడా ఉన్న; భార్యః = భార్యలు కలవాడై; రఘునన్దన = రఘురామా.

1.38.16.అనుష్టుప్.

అథ కాలే గతే తస్మిన్
జ్యేష్ఠా పుత్రం వ్యజాయత ।
అసమంజ ఇతి ఖ్యాతం
కేశినీ సగరాత్మజమ్ ॥

తాత్పర్యము :- అప్పుడు కొంత కాలము గడచిన పిమ్మట సగరుని పెద్దభార్య కేశిని అసమంజసుడు అని ప్రసిద్ధుడైన సగరుని కుమారునికి జన్మనిచ్చినది.

ప్రతిపదార్థము :- అథ = అప్పుడు; కాలే = కాలము; గతే = గడిచెను; తస్మిన్ = అంతట; జ్యేష్టా = పెద్దామె; పుత్రమ్ = కుమారునికి; వ్యజాయత = జన్మనిచ్చెను; అసమంజ = అసమంజసుడు (ఔచిత్యము లేని వాడు, చెడ్డవాడు); ఇతి = అని; ఖ్యాతమ్ = పేరుపొందిన; కేశినీ = కేశిని; సగరః = సగరుని; ఆత్మజమ్ = కుమారుని.

1.38.17.అనుష్టుప్.

సుమతిస్తు నరవ్యాఘ్ర!
గర్భతుమ్బం వ్యజాయత ।
షష్టిః పుత్రాః సహస్రాణి
తుమ్బభేదాద్వినిఃసృతాః ॥

తాత్పర్యము :- నరోత్తమా! ఓ రామా! సగరుని రెండవ భార్య ఐన సుమతి అనునామె ఆనపకాయవంటి పిండమును ప్రసవించినది. ఆ పిండము పగిలి అందుండి అరువది వేలమంది పుత్రులు బయల్పడిరి.

ప్రతిపదార్థము :- సుమతిస్తు = సుమతి అనునామె (సగరుని రెండవ భార్య); నరవ్యాఘ్ర = నరోత్తమా, రామా; గర్భః = పిండమును; తుమ్బమ్ = సొరకాయ / ఆనుగుకాయ వంటిదానిని; వ్యజాయత = ప్రసవించినది; షష్టిః = అరువది మంది; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేలమంది; తుమ్బ = సొరకాయ (వంటి పిండము) పగిలి; భేదాత్ = పగిలి; వినిఃసృతాః = బయల్పడిరి.

1.38.18.అనుష్టుప్.

ఘృతపూర్ణేషు కుమ్భేషు
ధాత్ర్యస్తాన్ సమవర్దయన్ ।
కాలేన మహతా సర్వే
యౌవనం ప్రతిపేదిరే ॥

తాత్పర్యము :- ఆ పిల్లలను సంరక్షకులైన తల్లులు నెయ్యినింపిన పాత్రలలో ఉంచి వృద్ధిచెందించిరి. సుదీర్ఘ కాలము తరువాత వారందరు యౌవనవంతులైరి.

ప్రతిపదార్థము :- ఘృత = నేతితో; పూర్ణేషు = నిండిఉన్న; కుమ్భేషు = పాత్రలలో; ధాత్ర్యః = పాలిచ్చుస్త్రీలు, దాదీమాతలు; తాన్ = వారిని (పిల్లలను); సమవర్ధయన్ = వృద్ధిచెందించిరి; కాలేన = కాలములో; మహతా = సుదీర్ఘమునకు; సర్వే = వారందరు; యౌవనమ్ = యౌవనమును; ప్రతిపేదిరే = పొందిరి.

1.38.19.అనుష్టుప్.

అథ దీర్ఘేణ కాలేన
రూపయౌవనశాలినః ।
షష్టిః పుత్రసహస్రాణి
సగరస్యాభవంస్తదా ॥

తాత్పర్యము :- చాలా కాలము జరిగిన పిమ్మట సగరునియొక్క అరువదివేలమంది కుమారులు మంచి రూపవంతులుగా; యౌవనవంతులుగా అయిరి.

ప్రతిపదార్థము :- అథ = పిమ్మట; దీర్ఘేణ = అధికమైన; కాలేన = కాలమునకు; రూప = మంచి రూపమును; యౌవన = యౌవనమును; శాలినః = కలవారు అయిన; షష్టిః = అరవై; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేలమంది; సగరస్య = సగరునియొక్క; అభవన్ = అయిరి; తదా = అప్పుడు.

1.38.20.అనుష్టుప్.

స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః
సగరస్యాత్మసమ్భవః ।
బాలాన్ గృహీత్వా తు జలే
సరయ్వా రఘునన్దన! ।
ప్రక్షిప్య ప్రహసన్నిత్యం
మజ్జతస్తాన్ సమీక్ష్యవై॥

తాత్పర్యము :- నరశ్రేష్ఠా! రఘునందనా! ఓ రామా! సగరుని పెద్ద కుమారుడైన అసమంజుడు అనుదినము చిన్న పిల్లలను సరయూ నదీజలములలో పడవైచి వారు మునిగిపోవుచుండ చూచి నవ్వుచు ఆనందించెడివాడు.

ప్రతిపదార్థము :- స చ = ఆ యొక్క; జ్యేష్టః = పెద్దవాడైన; నరశ్రేష్ఠ = నరోత్తమా! ; సగరస్యాత్మసంభవః = సగరుని కుమారుడు అసమంజుడు; బాలాన్ = చిన్నపిల్లలను; గృహీత్వా = పట్టుకొని; తు = పట్టుకొని; జలే = నీటిలో; సరయ్వా = సరయూనది; రఘునన్దన = రఘునందనా; ఓ రామా! ; ప్రక్షిప్య = పడవేసి; ప్రహసత్ = నవ్వుచుండెడివాడు; నిత్యమ్ = ప్రతిదినము; మజ్జతః = మునిగిపోవుచున్న; తాన్ = వారిని; సమీక్ష్యవై = చూచి.

1.38.21.అనుష్టుప్.

ఏవం పాపసమాచారః
సజ్జనప్రతిబాధకః ।
పౌరాణామహితే యుక్తః
పుత్రో నిర్వాసితః పురాత్ ॥

తాత్పర్యము :- ఇట్లు పాప ప్రవృత్తి గలవాడును, మంచివారిని బాధించువాడును, పౌరులకు హానికారకమైన వాడును అయిన సగరుని కుమారుడు అసమంజసుడు పురమునుండి వెడలగొట్టబడెను.

ప్రతిపదార్థము :- ఏవం = ఈవిధముగా; పాప = పాపపు; సమాచారః = ప్రవృత్తి గలవాడును; సజ్జనః = మంచివారిని; ప్రతిబాధకః = బాధించువాడును; పౌరాణాం = పురజనులకు; అహితే = హితముకానివాటితో, హానికరమైనవాటితో; యుక్తః = కూడియుంవాడును; పుత్రః = కుమారుడు; నిర్వాసితః = వెడలగొట్టబడెను; పురాత్ = పురమునుండి.

1.38.22.అనుష్టుప్.

తస్య పుత్రోంఽ శుమాన్నామ
అసమంజస్య వీర్యవాన్ ।
సమ్మతః సర్వలోకస్య
సర్వస్యాపి ప్రియంవదః ॥

తాత్పర్యము :- ఆ అసమంజుని కుమారుడు అంశుమంతుడనువాడు మిక్కిలి పరాక్రమవంతుడు. జనులు అందరికీ ఇష్టుడు. అందరితోనూ ప్రేమగా మాట్లాడుతాడు.

ప్రతిపదార్థము :- తస్య = అతని; పుత్రః = కుమారుడు; అంశుమాన్ = అంశుమంతు డను; నామ = పేరు గలవాడు; అసమంంజస్య = అసమంజునియొక్క; వీర్యవాన్ = పరాక్రమవంతుడు; సమ్మతః = ఇష్టుడు; సర్వ = సకల; లోకస్య = జనులకు; సర్వస్య = అందరికి; అపి = కూడ; ప్రియం = ప్రేమగ; వదః = మాట్లాడువాడు.

1.38.23.అనుష్టుప్.

తతః కాలేన మహతా
మతిః సమభిజాయత ।
సగరస్య నరశ్రేష్ఠ!
యజేయమితి నిశ్చితా ॥

తాత్పర్యము :- పురుషోత్తమా! ఓ రామా! అటుపిమ్మట చాలాకాలమునకు సగరునికి యాగము చేయవలెనను సంకల్పం బాగా దృఢంగా కలిగినది.

ప్రతిపదార్థము :- తతః = అటుపిమ్మట; కాలేన = కాలమునకు; మహతా = అధికమైనది; మతిః = బుద్ధి, సంకల్పం; సమ = బాగా; అభిజాయత = కలిగినది; సగరస్య = సగరునకు; నరశ్రేష్ఠ = పురుషోత్తమా రామా; యజేయమ్ = యజ్ఞము చేయుదును; ఇతి = అని; నిశ్చితా = దృఢమైన.

1.38.24.అనుష్టుప్.

స కృత్వా నిశ్చయం రామ!
సోపాధ్యాయగణస్తదా ।
యజ్ఞకర్మణి వేదజ్ఞో
యష్టుం సముపచక్రమే!" ॥

తాత్పర్యము :- శ్రీరామా! ఆ సగరుడు యజ్ఞ కార్యములు చేయుట తెలిసిన వాడగుటచే ఉపాధ్యాయులతో గురువులతో కూడి యాగము చేయుటకు నిశ్చయించి యాగము ప్రారంభము చేసెను.

ప్రతిపదార్థము :- స = అతడు; కృత్వా = చేసి; నిశ్చయమ్ = నిర్ణయమును; రామ = శ్రీరామా; స = కూడా ఉన్న; ఉపాధ్యాయః = వేదము చెప్పువారి, గురువుల; గణః = సమూహములతో; తదా = అప్పుడు; యజ్ఞ = యజ్ఞములు యొక్క; కర్మణి = కార్యములను; వేదజ్ఞః = ఎరిగినవాడు; యష్టుమ్ = యాగముచేయుటకు; సముపచక్రమే = ప్రారంభించెను.

1.38.25.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
అష్టత్రింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [38] ముప్పై ఎనిమిదవ సర్గ సుసంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; అష్టత్రింశః [38] = ముప్పై ఎనిమిదవ; సర్గః = సర్గ.

ఏకోనచత్వారింశఃసర్గః

(39 - సగరుని యజ్ఞాశ్వము వెదకుట)

1.39.1.అనుష్టుప్.

విశ్వామిత్రవచః శ్రుత్వా
కథాన్తే రఘునన్దనః ।
ఉవాచ పరమప్రీతో
మునిం దీప్తమివానలమ్ ॥

తాత్పర్యము :- విశ్వామిత్రుని కథనమును విని మిక్కిలి ప్రీతినొందినవాడై రఘురాముడు జ్వలించుచున్న అగ్నివలె నున్న మునితో ఈ విధముగా అడిగెను.

ప్రతిపదార్థము :- విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; వచః = చెప్పినవి; శ్రుత్వా = విని; కథ = చివరన; అన్తే = చివరన; రఘునన్దనః = రఘువంశ కుమారుడైన రాముడు; ఉవాచ = పలికెను; పరమ- మిక్కిలి; ప్రీతః = ఇష్టముతో; మునిమ్ = మునిని గురించి; దీప్తమ్ = మండుచున్న; ఇవ = వలె; అనలమ్ = అగ్ని;

1.39.2.అనుష్టుప్.

శ్రోతుమిచ్ఛామి భద్రం తే
విస్తరేణ కథామిమామ్ ।
పూర్వకో మే కథం బ్రహ్మన్!
యజ్ఞం వై సముపాహరత్" ॥

తాత్పర్యము :- "ఓ బ్రాహ్మణోత్తమా! నీకు మంగళమగుగాక! ఈ కథను సవిస్తారం వినగోరుచున్నాను. మా పూర్వీకుడైన సగరుడు ఈ యాగము నెట్లుచేసెనో ఆ కథను సవిస్తరముగా వినగోరు చున్నాను."

ప్రతిపదార్థము :- శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; భద్రమ్ = శుభమగు గాక; తే = నీకు; విస్తరేణ = విశదముగ; కథామ్ = కథను; ఇమామ్ = దీనిని; పూర్వకః = పూర్వీకుడు; మే = నాయొక్క; కథమ్ = ఎట్లు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా; యజ్ఞమ్ = యాగమును; సముపాహరత్ = సిద్ధపరిచిరి;

1.39.3.అనుష్టుప్.

విశ్వామిత్రస్తు కాకుత్స్థమ్
ఉవాచ ప్రహసన్నివ ।
శ్రూయతాం విస్తరో రామ!
సగరస్య మహాత్మనః ॥

తాత్పర్యము :- అప్పుడు కాకుత్స్థుడైన రామునకు విశ్వామిత్రుడు దరహాసముతో “రామా! మహాత్ముడైన సగరుని గురించి సవిస్తరముగా వినెదవుగాక” అనెను.

ప్రతిపదార్థము :- విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడు; కాకుత్స్థమ్ = కకుత్స్థవంశస్తుడైన శ్రీరామునిగూర్చి; ఉవాచ = పలికెను; ప్రహసన్ = పెద్దగా నవ్వుచు; ఇవ = చల్లగా; శ్రూయతామ్ = వినబడు గాక; విస్తరః = వివరము; రామ = రామా; సగరస్య = సగరునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన;

1.39.4.అనుష్టుప్.

శంకరశ్వశురో నామ
హిమవానచలోత్తమః ।
విన్ధ్యపర్వతమాసాద్య
నిరీక్షేతే పరస్పరమ్ ॥

తాత్పర్యము :- ఈశ్వరుని మామగారైన హిమవంతుడను పర్వతరాజము, వింధ్యపర్వతము ఒకదాని నొకటి పొంది చూచుకొనుటకు అనుకూలముగా నున్నవి.

ప్రతిపదార్థము :- శంకరః - ఈశ్వరుని; శ్వశురః- మామగారు; నామ = పేరు; హిమవాన్ = హిమవంతుడను; అచల = పర్వత; ఉత్తమః = శ్రేష్ఠుడును; వింధ్యపర్వతమ్ = వింధ్యపర్వతమును; ఆసాద్య = పొందదగినవై; నిరీక్షేతే = చూచుకొనుచున్నవి; పరస్పరమ్ = ఒకదానినొకటి.

1.39.5.అనుష్టుప్.

తయోర్మధ్యే ప్రవృత్తోఽ భూత్
యజ్ఞః స పురుషోత్తమ! ।
స హి దేశో నరవ్యాఘ్ర!
ప్రశస్తో యజ్ఞకర్మణి ॥

తాత్పర్యము :- ఓ పురుషోత్తమా! ఆ యాగ నిర్వహణ ఆ పర్వతముల మధ్య ప్రదేశములో జరిగినది. ఆ ప్రదేశము యజ్ఞకర్మలకు చాలా ప్రశస్తమైనది కదా!

ప్రతిపదార్థము :- తయోః = ఆ రెండు పర్వతముల; మధ్యే = నడుమ; ప్రవృత్తః = చేయుట; అభూత్ = జరిగెను; యజ్ఞః = యజ్ఞము; స = ఆ; పురుషోత్తమ = నరశ్రేష్ఠుడా!; స = అది; హి = కదా; దేశః = ప్రదేశము; నరవ్యాఘ్ర = నరులలో బెబ్బులి వంటి శ్రేష్ఠుడా; ప్రశస్తః = ప్రశస్తమైనది; యజ్ఞకర్మణి = యజ్ఞకర్మలయందు;

1.39.6.అనుష్టుప్.

తస్యాశ్వచర్యాం కాకుత్స్థ!
దృఢధన్వా మహారథః ।
అంశుమానకరోత్తాత
సగరస్య మతే స్థితః ॥

తాత్పర్యము :- నాయనా కాకుత్స్థా! దృఢమైన ధనువుగలవాడును, మహారథుడును అయిన అంశుమంతుడు సగరుని అనుజ్ఞానుసారము యాగాశ్వమును అనుసరించు బాధ్యత చేపట్టెను.

ప్రతిపదార్థము :- తస్య = దాని; అశ్వచర్యామ్ = గుఱ్ఱమును(యాగాశ్వమును) అనుసరించుట; కాకుత్థ్స = కకుత్స్థవంశీయుడవైన రామా!; దృఢ = దృఢమైన; ధన్వా = ధనువు కలవాడును; మహారథః = మహారథుడును; ( పదకొండువేలమందిరథికులతో పోరాడగలవాడు); అంశుమాన్ = అంశుమంతుడు; అకరోత్ = చేసెను; తాత = నాయనా; సగరస్య; మతే = అనుజ్ఞయందు; స్థితః = ఉన్నవాడు;

1.39.7.అనుష్టుప్.

తస్య పర్వణి తం యజ్ఞం
యజమానస్య వాసవః ।
రాక్షసీం తనుమాస్థాయ
యజ్ఞీయాశ్వమపాహరత్ ॥

తాత్పర్యము :- యజమాను డగు సగరుని యాగ ఉత్సవము నందు ఇంద్రుడు రాక్షస రూపధారియై యాగాశ్వమును అపహరించెను.

ప్రతిపదార్థము :- తస్య = సగరుని యొక్క; పర్వణి = ఉచ్సవమునందు; తమ్ = ఆ; యజ్ఞమ్ = యజ్ఞము యొక్క; యజమానస్య = యజమానుని; వాసవః = ఇంద్రుడు; రాక్షసీమ్ = రాక్షస సంబంధమైన; తనుమ్ = దేహమును; ఆస్థాయ = గ్రహించి; యజ్ఞీయాశ్వమ్ = యాగాశ్వమును; అపాహరత్ = అపహరించెను;

1.39.8. అనుష్టుప్.

హ్రియమాణే తు కాకుత్స్థ!
తస్మిన్నశ్వే మహాత్మనః ।
ఉపాధ్యాయగణాస్సర్వే
యజమానమథాబ్రువన్ ॥

తాత్పర్యము :- రామా! ఆ మహాత్ముడి యాగాశ్వము అపహరించబడు చుండగా ఋత్విక్కుల గణముల వారందరు యజమానుడైన సగరునితో ఇట్లు

ప్రతిపదార్థము :- హ్రియమాణే = అపహరించుచుండగా; తు; కాకుత్స్థః = రామా; తస్మిన్ = ఆ గుఱ్ఱము; అశ్వే = గుఱ్ఱము; మహాత్మనః = మహాత్ములైన; ఉపాధ్యాయ = ఋత్విక్కుల; గణాః = సమూహములు; సర్వే = అందరు; యజమానమ్ = యజమానుడగు సగరుని గూర్చి; అథా = అప్పుడు; అబ్రువన్ = పలికిరి;

1.39.9.అనుష్టుప్.

అయం పర్వణి వేగేన
యజ్ఞీయాశ్వోఽ పనీయతే ।
హర్తారం జహి కాకుత్స్థ
హయశ్చైవోపనీయతామ్ ॥

తాత్పర్యము :- “ఓ సగరచక్రవర్తీ! ఈ ఉత్సవసంద్రభంలో యాగాశ్వము అపహరించి తీసుకుని పోవుచున్నారు. వానిని సంహరించి అశ్వమును తెప్పింతువు గాక.

ప్రతిపదార్థము :- అయమ్ = ఈ; పర్వణి = ఉత్సవమునందు (యాగ పర్వము); వేగేన = వేగముచేత; యజ్ఞియాశ్వః = యాగాశ్వము; అపనీయతే = అపహరింపబడుచున్నది; హర్తారమ్ = అపహరించు వానిని; జహి = చంపుము; కాకుత్స్థ = కకుత్స్థ వంశీయుడవైన సగర చక్రవర్తీ; హయః = అశ్వము; ; ఉపనీయతామ్ = తిరిగి తీసుకొని రాబడును గాక.

1.39.10.అనుష్టుప్.

యజ్ఞచ్ఛిద్రం భవత్యేతత్
సర్వేషామశివాయ నః ।
తత్తథా క్రియతాం రాజన్
యథాఽ చ్ఛిద్రః క్రతుర్భవేత్ఠ ॥

తాత్పర్యము :- ఓ సగరచక్రవర్తీ!యాగములో ఈ అపహరణ యజ్ఞాపరాథము అందరకు అమంగళకరమైనది. అందువలన రాజా! యాగ నిర్వహణ దోషరహితమగునట్లు తగిన చర్యలు తీసుకొనుడు."

ప్రతిపదార్థము :- యజ్ఞత్ = యజ్ఞసంబంధమైన; ఛిద్రమ్ = అపరాధము; భవతి = అగును; ఏతత్ = దానివలన; సర్వేషామ్ = అందరికిని; అశివాయ = అమంగళము; నః = అగును; తత్ = అందువలన; తథా = ఆ విధముగ; క్రియతాం = చేయబడునుగాక; రాజన్ = రాజా; యథా = ఎట్లు; అచ్ఛిద్రః = అపరాధరహితము; క్రతుః = యాగ కార్యములు; భవేత్ = అగును.

1.39.11.అనుష్టుప్.

ఉపాధ్యాయవచః శ్రుత్వా
తస్మిన్ సదసి పార్థివః ।
షష్టిం పుత్రసహస్రాణి
వాక్యమేతదువాచ హ ॥

తాత్పర్యము :- యజ్ఞ సదస్సులో యాజ్ఞికుల మాటలు విని సగరమహారాజు తన అరువది వేలమంది కుమారులకు ఇట్లు ఆజ్ఞాపించెను.

ప్రతిపదార్థము :- ఉపాధ్యాయ = ఋత్విక్కుల; వచః = సూచనలను; శ్రుత్వా = విని; తస్మిన్ = ఆ; సదసి = సదస్సులో, సభలో; పార్థివః = రాజు; షష్టిమ్ = అరువదివేల; పుత్రః = పుత్రులు; సహస్రాణి = వేలమందికి; వాక్యమ్ = ఆజ్ఞ; ఏతత్ = ఈ; ఉవాచః = పలికెను;

1.39.12.అనుష్టుప్.

"గతిం పుత్రా న పశ్యామి
రక్షసాం పురుషర్షభాః ।
మన్త్రపూతైర్మహాభాగైః
ఆస్థితో హి మహాక్రతుః ॥

తాత్పర్యము :- "పురుషశ్రేష్ఠులైన కుమారులారా! ఈ యజ్ఞ ప్రదేశము మంత్రములచే పునీతులైన మహానుభావులచే అధిష్టింపబడి యున్నందున రాక్షసులు రాలేరని తలచెదను.

ప్రతిపదార్థము :- గతిమ్ = ఇక్కడకు ప్రవేశించుటను; పుత్రాః = పుత్రులారా; న పశ్యామి = చూడను; రక్షసామ్ = రాక్షసులకు; పురుషర్షభాః = పురుష శ్రేష్ఠులారా; మన్త్రపూతైః = మన్త్రములచే పునీతులైన; మహాభాగైః = మహానుభావులచే; అస్థితః = అధిష్టింపబడినది; హి = ఏలననగా; మహక్రతుః = మహాయాగము;

1.39.13.అనుష్టుప్.

తద్గచ్ఛత విచిన్వధ్వం
పుత్రకా! భద్రమస్తు వః ।
సముద్రమాలినీం సర్వాం
పృథివీమనుగచ్ఛత ॥

తాత్పర్యము :- అందువలన పుత్రులారా! అశ్వమును, చోరుని కనుగొనుటకు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలమును వెదకుడు. మీకు శుభమగుగాక!

ప్రతిపదార్థము :- తత్ = అందువలన; గచ్ఛత = వెళ్ళవచ్చును; విచిన్వ = వెదకుడు; అధ్వమ్ = మార్గములను; పుత్రకాః = పుత్రులారా; భద్రమ్ = శుభము; అస్తు = అగుగాక; వః = మీకు; సముద్ర = సాగరము; మాలినీమ్ = మేఖలముగా గల; సర్వామ్ = సమస్త; పృధివీమ్ = భూమిని; అనుగచ్ఛత = అనుసరించుడు ( వెదకుడు);

1.39.14.అనుష్టుప్.

ఏకైకం యోజనం పుత్రా!
విస్తారమభిగచ్ఛత ।
యావత్తురగసన్దర్శః
తావత్ ఖనత మేదినీమ్ ।

తాత్పర్యము :- మార్గమాణా మమాజ్ఞయా ॥

ప్రతిపదార్థము :- తం చైవ హయహర్తారం

1.39.15.అనుష్టుప్.

దీక్షితః పౌత్రసహితః
సోపాధ్యాయగణో హ్యహమ్ ।
ఇహ స్థాస్యామి భద్రం వో
యావత్తురగదర్శనమ్" ॥

తాత్పర్యము :- దీక్ష చేపట్టిన నేను మనుమడు అంశుమంతునితో, ఋత్విజు లతో ఇక్కడే అశ్వము కనబడువరకు ఉండగలను. మీకు శుభమగుగాక!

ప్రతిపదార్థము :- దీక్షితః = దీక్షవహించిన వాడను; పౌత్రః = మనుమడు; సహితః = తో కలిసి; స = కూడి; ఉపాధ్యాయ = ఋత్విక్కుల; గణః = సమూహములతో; అహమ్ = నేను; ఇహ = ఇక్కడే; స్థాస్యామి = ఉండగలను; భద్రమ్ = శుభము; వః = మీకు; యావత్ = వరకు; తురగః = అశ్వము; దర్శనమ్ = కనబడు.

1.39.16.అనుష్టుప్.

తే సర్వే హృష్టమనసో
రాజ పుత్రా మహాబలాః ।
జగ్ముర్మహీతలం రామ
పితుర్వచనయంత్రితాః ॥

తాత్పర్యము :- ఆ మహా బలవంతులైన రాకుమారులు సంతోషమానసులై తండ్రి సగరుని ఆజ్ఞాబద్దులై భూమండలము అంతా వెతుకుటకు బయలుదేరిరి.

ప్రతిపదార్థము :- తే = వారు; సర్వే = అందరును; హృష్టః = సంతోషము నొందిన; మనసః = మనసు కలవారై; రాజపుత్రా = రాజకుమారులు; మహా = మిక్కిలి; బలాః = బలశాలులు; జగ్ముః = వెళ్ళిరి; మహీతలమ్ = భూమండలము; రామ = రామా!; పితుః = తండ్రియొక్క; వచన = ఆజ్ఞచే; యంత్రితా = బద్దులై.

1.39.17.అనుష్టుప్.

యోజనాయామవిస్తారమ్
ఏకైకో ధరణీతలమ్ ।
బిభిదుః పురుషవ్యాఘ్ర!
వజ్రస్పర్శసమైర్నఖైః ॥

తాత్పర్యము :- ఓ నరశార్దూలా! (రామా) ఒక్కొక్క చదరపుయోజనము స్థలమును తీసుకుని నేలను వజ్రమువంటి తమ గట్టి గోళ్ళతో బ్రద్దలు కొట్టిరి.

ప్రతిపదార్థము :- యోజన = ఒక యోజనము యొక్క; ఆయామ = పొడవు; విస్తారమ్ = వెడల్పులు గల; ఏక ఏకః = ఒక్కొక్క; ధరణీతలమ్ = భూ ప్రదేశమును; బిభిదుః = బ్రద్దలు కొట్టిరి; పురుషవ్యాఘ్ర = నరశార్దూలా; వజ్ర = వజ్రము యొక్క; స్పర్శ = తాకుడుతో; సమైః = సమానమైన; నఖైః = గోళ్ళతో;

 *గమనిక :- *- యోజన ఆయామ విస్తారమ్- ఒక చదరపు యోజనము

1.39.18.అనుష్టుప్.

శూలైరశనికల్పైశ్చ
హలైశ్చాపి సుదారుణైః ।
భిద్యమానా వసుమతీ
ననాద రఘునన్దన! ॥

తాత్పర్యము :- రఘురామా! వజ్రాయుధముతో సమానమైన శూలముల తోడను, మహాభయంకరమైన నాగళ్ళ తోడను త్రవ్వుచుండగా భూమి దద్దరిల్లినది.

ప్రతిపదార్థము :- శూలైః = శూలములతోడను; అశని = వజ్రాయుధముతో; కల్పైః = సమమైనట్టి వగు; ; హలైః = నాగళ్ళతోడను; ; అపి = కూడ; సుదారుణైః = మహా భయంకరమైన; భిద్యమానా = భేదింపబడుచున్న; వసుమతీ = భూమి; ననాద = ధ్వనించెను; రఘునన్దన = రఘువంశ కుమారుడవైన రామా!;

1.39.19.అనుష్టుప్.

నాగానాం వధ్యమానానాం
అసురాణాం చ రాఘవ! ।
రాక్షసానాం చ దుర్దర్షః
సత్త్వానాం నినదోఽ భవత్ ॥

తాత్పర్యము :- రఘువంశ సంభవా! భూమిని త్రవ్వుచున్నప్పుడు నలగకొట్ట బడుతున్న నాగుల, అసురుల, రాక్షసుల, ఇతర ప్రాణుల దుర్భరమైన ఆర్త ధ్వనులు వినవచ్చెను.

ప్రతిపదార్థము :- నాగానాం = సర్పములయొక్క; మథ్యమానానామ్ = నలగగొట్ట బడుచున్న; అసురాణామ్ = దైత్యులయొక్కయు; ; రాఘవ! = రామా!; రాక్షసానాం = రాక్షసులయొక్కయు; ; దుర్ధర్షః = సహింపరాని; సత్వానామ్ = ఇతర ప్రాణులయొక్కయు; నినదః = అరుపులు; అభవత్ = ఏర్పడెను;

1.39.20.అనుష్టుప్.

యోజనానాం సహస్రాణి
షష్టిం తు రఘునన్దన! ।
బిభిదుర్ధరణీం వీరా!
రసాతలమనుత్తమమ్ ॥

తాత్పర్యము :- రఘునందనా రామా! ఆ వీరులు అరవై వేల యోజనముల భూమిని రసాతలము వరకు త్రవ్విరి.

ప్రతిపదార్థము :- యోజనానామ్ = యోజనములు; సహస్రాణి = వేలు; షష్టిమ్ తు = అరువది; తు; రఘునందన = రామా; బిభిదుః = త్రవ్విరి; ధరణీమ్ = భూమిని; వీరాః = వీరులు; రసాతలమ్ = రసాతలము వరకు ( పాతాళలోకము ); అనుత్తమమ్ = గొప్పదైన;

1.39.21.అనుష్టుప్.

ఏవం పర్వతసమ్బాధం
జమ్బూద్వీపం నృపాత్మజాః ।
ఖనన్తో నృపశార్దూల!
సర్వతః పరిచక్రముః ॥

తాత్పర్యము :- ఓ రామచంద్రా! ఈ విధముగా పర్వతములతో ఇరుకైన జంబూద్వీపమును రాజకుమారులు త్రవ్వుచు భూమి యంతట సంచరించిరి.

ప్రతిపదార్థము :- ఏవమ్ = ఈ విధముగా; పర్వత = పర్వతములచే; సమ్బాధమ్ = ఇరుకైన; జంబూద్వీపమ్ = జంబూద్వీపమును; నృపాత్మజాః = రాజకుమారులు; ఖనన్తః = త్రవ్వుచున్న వారై; నృపశార్దూల = రాజశ్రేష్ఠుడా!; సర్వతః = అంతట; పరిచక్రముః = సంచరించిరి.

1.39.22.అనుష్టుప్.

తతో దేవాః సగన్ధర్వాః
సాసురాస్సహపన్నగాః ।
సమ్భ్రాన్తమనసః సర్వే
పితామహముపాగమన్ ॥

తాత్పర్యము :- అప్పుడు దేవతలు కలత చెందిన మనసులు కలవారై గంధర్వులతో, అసురులతో, నాగులతో కలసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి.

ప్రతిపదార్థము :- తతః = తరువాత; దేవాః = దేవతలు; స = సహితముగ; గంధర్వాః = గంధర్వులతో; స = సహితముగ; అసురాః = అసురులతో; సహ = సహితముగ; పన్నగాః = నాగులతో; సమ్భ్రాన్త = కలత చెందిన; మనసః = మనస్కులై; సర్వే = అందరూ; పితామహమ్ = బ్రహ్మదేవుని; ఉపాగమన్ = చేరిరి.

1.39.23.అనుష్టుప్.

తే ప్రసాద్య మహాత్మానం
విషణ్ణవదనాస్తదా ।
ఊచుః పరమసన్త్రస్తాః
పితామహమిదం వచః ॥

తాత్పర్యము :- అప్పుడు విపరీతమైన భయముతో విషణ్ణ వదనులైన దేవతలు మహాత్ముడైన బ్రహ్మదేవుని ప్రసన్నుని చేసికొని ఇట్లనిరి.

ప్రతిపదార్థము :- తే = ఆ దేవతలు; ప్రసాద్య = ప్రసన్నుని చేసికొని; మహాత్మానమ్ = మహాత్ముని; విషణ్ణః = దిగులు పడిన; వదనాః = ముఖములు కలవారును; తదా = అప్పుడు; ఊచుః = పలికిరి; పరమ = మిక్కిలి; సన్త్రస్తాః = భయపడినవారును; పితామహమ్ = బ్రహ్మదేవుని; ఇదమ్ = ఈ; వచః = వాక్యమును.

1.39.24.అనుష్టుప్.

భగవన్! పృథివీ సర్వా
ఖన్యతే సగరాత్మజైః ।
బహవశ్చ మహాత్మానో
హన్యన్తే తలవాసినః ॥

తాత్పర్యము :- "ఓ బ్రహ్మదేవా! సగరపుత్రులచే భూమి యంతయు త్రవ్వ బడుచున్నది. రసాతలములో నివసించు మహాత్ములు చాలామంది చంపబడుచున్నారు.

ప్రతిపదార్థము :- భగవన్ = ఓ బ్రహ్మదేవా; పృథివీ = భూమండలము; సర్వా = మొత్తము; ఖన్యతే = త్రవ్వబడుచున్నది; సగరాత్మజైః = సగరపుత్రులచే; బహవః = చాలమంది; ; మహాత్మానః = మహాత్ములు; హన్యన్తే = చంపబడుచున్నారు; తల = పాతాళలోకములో; వాసినః = నివసించువారు.

1.39.25.అనుష్టుప్.

అయం యజ్ఞహరోఽ స్మాకం
అనేనాశ్వోఽ పనీయతే ।
ఇతి తే సర్వభూతాని
నిఘ్నన్తి సగరాత్మజాః" ॥

తాత్పర్యము :- వీడే మన యాగమును ధ్వంసము చేసినవాడు. వీడే మన యాగాశ్వమును అపహరించినవాడు అని సగరపుత్రులు సమస్త ప్రాణులను వధించుచున్నారు."

ప్రతిపదార్థము :- అయమ్ = వీడు; యజ్ఞ = యాగమును; హరః = ధ్వంసము చేసినవాడు; అస్మాకమ్ = మన; అనేన = వీని వలన; అశ్వః = గుఱ్ఱము; అపనీయతే = అపహరింపబడినది; ఇతి = అనుచు; తే = వారు; సర్వ = సమస్తమైన; భూతాని = సప్రాణులను; నిఘ్నన్తి = వధించు చున్నారు; సగరాత్మజాః = సగర పుత్రులు;

1.39.26.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
ఏకోనచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ముప్పైతొమ్మిదవ [39] సర్గ సంపూర్ణము.

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; ఏకోనచత్వారింశః [39] = ముప్పైతొమ్మిదవ; సర్గః = సర్గ.

చత్వారంశఃసర్గః॥ 

[40 సగరపుత్రుల దహనం]

1.40.1.అనుష్టుప్

దేవతానాం వచః శ్రుత్వా
భగవాన్ వై పితామహః ।
ప్రత్యువాచ సుసన్త్రస్తాన్
కృతాన్తబలమోహితాన్ ॥

తాత్పర్యము :- వారి విన్నపాలు విని, బ్రహ్మదేవుడు ఆ విపత్తువలన మిక్కిలి కలతచెంది, బాగా బెదిరిపోయిన ఆ దేవతలతో ఇట్లనెను.

ప్రతిపదార్థము :- దేవతానాం = దేవతల యొక్క; వచః = మాటలను; శ్రుత్వా = విని; భగవాన్ = భగవంతుడు; వై = ఐన; పితామహః = బ్రహ్మదేవుడు; ప్రత్యువాచ = బదులు పలికెను; సు = మిక్కిలి; సన్త్రస్తాన్ = సంత్రస్తులైన, బెదిరిపోయిన; కృతాన్తః = దూర్త, అశనిపాత, విపత్తు చేత; బల = మిక్కిలి; మోహితాన్ = కలత చెందినవారి గుఱించి.

1.40.2.అనుష్టుప్

"యస్యేయం వసుధా కృత్స్నా
వాసుదేవస్య ధీమతః ।
కాపిలం రూపమాస్థాయ
ధారయత్యనిశం ధరామ్ ॥

తాత్పర్యము :- “ఈ భూమండలమంతయు ఏ వాసుదేవునకు చెందినదో ఆ వాసుదేవుడు, కపిల మహర్షిగా అవతరించి ఈ భూమిని నిత్యము స్థిరుడై ధరించుచున్నాడు.

ప్రతిపదార్థము :- యస్య = ఏదైతే; ఇయం = ఈ; వసుధా = భూమి; కృత్స్నా = సమస్తమైన; వాసుదేవస్య = వాసుదేవునికి చెందిన; ధీమతః = ధీమంతుడైన; కాపిలం = కపిలుని; రూపమ్ = రూపమును; ఆస్థాయ = స్థిరముగా నుండువాడై; ధారయతి = ధరించుచున్నాడు; అనిశం = నిత్యము; ధరామ్ = భూమిని.

1.40.3.అనుష్టుప్

తస్య కోపాగ్నినా దగ్ధా
భవిష్యన్తి నృపాత్మజాః ।
పృథివ్యాశ్చాపి నిర్భేదో
దృష్ట ఏవ సనాతనః ॥

తాత్పర్యము :- భూమి సగర కుమారులచే త్రవ్వబడుననియు, కపిల మహర్షి క్రోధాగ్నిచే సగర రాకు మారులు భస్మము అగుదురనియు పూర్వమే వాసుదేవునిచే నిర్ణయింపబడినది.

ప్రతిపదార్థము :- తస్య = అతని యొక్క; కోపాగ్నినా = కోపాగ్ని వలన; దగ్ధా = దహింపబడినవారు; భవిష్యన్తి = కాగలరు; నృపాత్మజాః = రాకుమారులు; పృథివ్యాః = భూమియొక్క; ; అపి = కూడ; నిర్భేదః = తవ్వకము; దృష్ట = చూడబడెను; ఏవ = నిశ్చయముగ; సనాతనః = పూర్వమే.

1.40.4.అనుష్టుప్

సగరస్య చ పుత్రాణామ్
వినాశోఽదీర్ఘజీవినామ్" ।
పితామహవచః శ్రుత్వా
త్రయస్త్రింశదరిన్దమ ॥

తాత్పర్యము :- శత్రువులను సంహరించు ఓ రామా ! అష్టవసువులు; ఏకాదశ రుద్రులు; ద్వాదశాదిత్యులు; అశ్వినీద్వయము కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు "సగర పుత్రులు అల్పాయుష్కులై నశించెదరు" అని బ్రహ్మదేవుడు పలుకగా విని.

ప్రతిపదార్థము :- సగరస్య = సగరుని; ; పుత్రాణాం = పుత్రులు; వినాశః = నశించెదరు; అదీర్ఘ జీవినామ్ = అల్పాయుష్కులు; పితామహ = బ్రహ్మదేవుని; వచః = అభయపు మాటలు; శ్రుత్వా = విని; త్రయస్త్రింశత్ = ముప్పది ముగ్గురు, దేవతలు; అరిం = శత్రువులను; దమ = సంహరించువాడా.

 *గమనిక :- *- త్రయస్త్రింశద్దేవతలు- అష్టవసువులు (8 మంది), ఏకాదశ రుద్రులు (11 మంది), ద్వాదశాదిత్యులు (12 మంది), అశ్వినీద్వయము (2 ద్దరు) కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు.

1.40.5.అనుష్టుప్

దేవాః పరమసంహృష్టాః
పునర్జగ్ముర్యథాగతమ్ ।
సగరస్య చ పుత్రాణామ్
ప్రాదురాసీన్మహాత్మనామ్ ॥

తాత్పర్యము :- బ్రహ్మదేవుని మాటలకు దేవతలు చాల సంతోషించి వచ్చిన త్రోవలో వెళ్ళిపోయిరి. మహాత్ములైన సగర కుమారుల గునపముమొనల నుండి, పుట్టి.

ప్రతిపదార్థము :- దేవాః = దేవతలు; పరమ సంహృష్టాః = చాలా సంతోషించి; పునః జగ్ముః = మరలి వెళ్ళిరి; యథా గతమ్ = వచ్చిన విధముగా; సగరస్య = సగరుని; ; పుత్రాణామ్ = కుమారులకు; ప్రాదుః = గునపము మొన నుండి; ఆసీత్ = కలిగినది (వినిపించెను) మహాత్మానామ్ = మహాత్ములైన.

1.40.6.అనుష్టుప్

పృథివ్యాం భిద్యమానాయామ్
నిర్ఘాతసమనిఃస్వనః ।
తతో భిత్త్వా మహీం సర్వే
కృత్వా చాపి ప్రదక్షిణమ్ ॥

తాత్పర్యము :- సగరకుమారులకు ఆ ధ్వని పిడుగుపాటు వలె వినిపించెను. అంతట వారు భూమిని త్రవ్వి జల్లెడపట్టినట్లు వెతుకుతు ఒక పర్యాయము భూప్రదక్షిణము చేసిరి.

ప్రతిపదార్థము :- పృథివ్యాం = భూమి; భిధ్యమానాయాం = త్రవ్వబడుచుండగా; నిర్ఘాత = పిడుగు పాటు; సమ = వంటి; నిస్వనః = ధ్వని; తతః = తరువాత; భిత్త్వా = త్రవ్వి, విభాగముచేయుట; మహీం = భూమిని; సర్వే = అందరును; కృత్వా = చేసి; అభిప్రదక్షిణమ్ = ప్రదక్షిణము.

1.40.7.అనుష్టుప్

సహితాః సగరాః సర్వే
పితరం వాక్యమబ్రువన్।
"పరిక్రాన్తా మహీ సర్వా
సత్త్వవన్తశ్చ సూదితాః ॥

తాత్పర్యము :- ఆ సగర కుమారులందరు కలసి వెళ్ళి తమ తండ్రితో "భూమండల మంతయు తిరిగితిమి. బలాఢ్యులైన వీరిని పరిమార్చితిమి.

ప్రతిపదార్థము :- సహితాః = కలసి; సగరాః = సగర కుమారులు; సర్వే = అందరును; పితరం = తండ్రిని గుఱించి; వాక్యమ్ = మాటను; అబ్రువన్ = పలికిరి; పరిక్రాన్తా = చుట్టబడినది; మహీ = భూ మండలము; సర్వా = అంతయు; సత్త్వవన్తః = బలాఢ్యులైనవారు; చ = ఇంకా; సూదితాః = చంపబడినారు.

1.40.8.అనుష్టుప్

దేవదానవరక్షాంసి
పిశాచోరగకిన్నరాః ।
న చ పశ్యామహేఽశ్వం తం
అశ్వహర్తారమేవ చ ॥

తాత్పర్యము :- దేవతలను, దానవులను, రాక్షసులను, పిశాచములను, సర్పములను, కిన్నరులను పరిమార్చినాము. అశ్వము గాని, అశ్వమును దొంగిలించిన వారు గాని కనుగొనలేకపోతిమి.

ప్రతిపదార్థము :- దేవః = దేవతలు; దానవః = దానవులు; రక్షాంసి = రాక్షసులు; పిశాచః = పిశాచములు; ఉరగః = సర్పములు; కిన్నరాః = కిన్నరులు; న = లేదు; చ = కూడ; పశ్యామహే = చూడగలుగుట; అశ్వం = గుఱ్ఱము; అశ్వ = గుఱ్ఱమును; హర్తారమ్ = దొంగిలించిన వానిని; ఏవ = అయినను; చ = కూడ; .

1.40.9.అనుష్టుప్

కిం కరిష్యామ భద్రం తే
బుద్ధిరత్ర విచార్యతామ్" ।
తేషాం తద్వచనం శ్రుత్వా
పుత్రాణాం రాజసత్తమః! ॥

తాత్పర్యము :- ఈ విషయమున బుద్ధిపూర్వకముగా ఆలోచన చేసి ఇపుడేమి చేయ వలయునో తెలియజేయుము. నీకు క్షేమమగుగాక” అనిరి. ఆ సగర మహారాజు పుత్రుల ఆ మాటలను వినినవాడై. . .

ప్రతిపదార్థము :- కిం = ఏమి; కరిష్యామ = చేయుదము; భద్రం = క్షేమ మగు గాక; తే = నీకు; బుద్ధిః = తెలివితో; అత్ర = ఈ విషయమున; విచార్యతామ్ = ఆలోచన చేయవలెను; తేషాం = వారి; తద్వచనం = ఆ మాటను; శ్రుత్వా = విని; పుత్రాణాం = పుత్రుల యొక్క; రాజసత్తమః = రాజశ్రేష్ఠుడైన.

1.40.10.అనుష్టుప్

సమన్యురబ్రవీద్వాక్యమ్
సగరో రఘునన్దన! ।
"భూయః ఖనత భద్రం వో
నిర్భిద్య వసుధాతలమ్ ॥

తాత్పర్యము :- రామా! సగరుడు పుత్రుల మాటలు విని; కోపోద్రిక్తుడై; "భూమండలము మొత్తం తిరిగి త్రవ్వి సకలం విడదీసి వెదకుడు. మీకు శుభమగుగాక.

ప్రతిపదార్థము :- సమన్యుః = కోపోద్రిక్తుడై; అబ్రవీత్ = పలికెను; వాక్యం = మాటను; సగరః = సగరుడు; రఘునన్దన = రామా; భూయః = మరల; ఖనత = త్రవ్విపోసి వెదకుడు; భద్రం = శుభమగుగాక; వః = మీకు; నిర్భిద్య = భేదించి, విడదీసి; వసుధాతలమ్ = భూతలమును.

1.40.11.అనుష్టుప్

అశ్వహర్తారమాసాద్య
కృతార్థాశ్చ నివర్తథ" ।
పితుర్వచనమాసాద్య
సగరస్య మహాత్మనః ॥

తాత్పర్యము :- “ తప్పక గుఱ్ఱము దొంగిలించిన వానిని పట్టుకొని కార్యమును సాధించిన వారై మాత్రమే తిరిగి రండు" అనెను. మహాత్ముడైన సగరుని మాటను వారు విని.

ప్రతిపదార్థము :- అశ్వహర్తారమ్ = గుఱ్ఱము దొంగిలించిన వానిని; ఆసాద్య = పట్టుకొని; కృతార్థాః = కార్యమును సాధించిన వారై; చ = తప్పక; నివర్తథ = తిరిగి రండు; పితుర్వచనమ్ = తండ్రి మాటను; ఆసాద్య = గైకొని; సగరస్య = సగరుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన.

1.40.12.అనుష్టుప్

షష్టిః పుత్రసహస్రాణి
రసాతలమభిద్రవన్ ।
ఖన్యమానే తతస్తస్మిన్
దదృశుః పర్వతోపమమ్ ॥

తాత్పర్యము :- ఆ అరువదివేల మంది సగరకుమారులు వేగముగా పాతాళమునకు త్రవ్వుచూ పోయిరి. అక్కడ వారు పర్వతమంత పెద్ద దానిని చూసిరి.

ప్రతిపదార్థము :- షష్టిః = అరవై; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేల మంది; రసాతలమ్ = పాతాళము గూర్చి; అభిద్రవన్ = వేగముగ వెళ్ళి; ఖన్యమానే = త్రవ్వబడుచుండగా; తతః = తరువాత; తస్మిన్ = ఆ ప్రదేశము; దదృశుః = చూసిరి; పర్వతోపమమ్ = పర్వతము వలె యున్న.

1.40.13.అనుష్టుప్

దిశాగజం విరూపాక్షమ్
ధారయన్తం మహీతలమ్ ।
సపర్వతవనాం కృత్స్నామ్
పృథివీం రఘునన్దన ॥

తాత్పర్యము :- ఓ రామా ! అది నాలుగు దిక్కులలో ఒక దిక్కున పర్వతములతోను వనములతోను నిండియున్న భూమిని మ్రోయు చున్న విరూపాక్ష అను పేరు గల ఏనుగు.

ప్రతిపదార్థము :- దిశాగజం = దిగ్గజమును; విరూపాక్షం = విరూపాక్షము అను పేరు గలది; ధారయన్తం = ధరించుచున్నది; మహీతలమ్ = ధరణీతలమును; స = కలిగి యున్న; పర్వతః = పర్వతములు; వనాం = వనములు కల దానిని; కృత్స్నాం = సమస్తమైన; పృథివీం = భూమిని; రఘునన్దన = రామా.

 *గమనిక :- *- వాల్మీకం 1.40.13. అనుష్టుప్. నుండి 1.40.22.అనుష్టుప్ వరకు శ్లోకములు ప్రకారం దిగ్గజములు- నాలుగుదిక్కుల నుండి భూమిని మ్రోయు ఏనుగులు ఉంటాయి. వాటి పేర్లు తూర్పు దిగ్గజము విరూపాక్షము, దక్షిణ మహాపద్మము, పడమర సౌమననము, ఉత్తర భద్రము. పాఠ్యంతరము- పోతన తెలుగు భాగవతములోని 5.2-73-, బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు;

1.40.14.అనుష్టుప్

శిరసా ధారయామాస
విరూపాక్షో మహాగజః ।
యదా పర్వణి కాకుత్స్థ!
విశ్రమార్థం మహాగజః ॥

తాత్పర్యము :- రామా! “విరూపాక్షము” అను ఆ పెద్ద ఏనుగు తన శిరస్సుతో ఒక దిక్కున భూమిని మ్రోయుచుండెను. పర్వకాలములందు విశ్రాంతి కొరకై తన తలను విదుల్చుకొనును.

ప్రతిపదార్థము :- శిరసా = శిరస్సుతో; ధారయామాస = ధరించెను; విరూపాక్షః = విరూపాక్షము; మహా = మిక్కిలి పెద్ద; గజః = ఏనుగు; యదా = ఎప్పుడు; పర్వణి = పర్వకాలము నందు; కాకుత్స్థ = రామా; విశ్రమార్థం = అలసట తీర్చుకొనుటకై; మహాగజః = పెద్ద ఏనుగు.

1.40.15.అనుష్టుప్

ఖేదాచ్చాలయతే శీర్షమ్
భూమికమ్పస్తదా భవేత్ ।
తం తే ప్రదక్షిణం కృత్వా
దిశాపాలం మహాగజమ్ ॥

తాత్పర్యము :- అలసట తీర్చుకొనుటకొఱకు దిగ్గజము తన తలను విదుల్చునప్పుడు భూకంపము సంభవించును. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసిరి.

ప్రతిపదార్థము :- ఖేదాత్ = అలసట వలన; చాలయతే = విదుల్చునో; శీర్షమ్ = శిరస్సును; భూమికమ్పః = భూకంపము; తదా = అప్పుడు; భవేత్ = అగును; తం = ఆ; తే = వారు; ప్రదక్షిణం = ప్రదక్షిణము; కృత్వా = చేసి; దిశాః = ఆ దిక్కును; పాలం = పాలించు; మహా = మిక్కిలి పెద్ద; గజః = ఏనుగు; .

1.40.16.అనుష్టుప్

మానయన్తో హి తే రామ!
జగ్ముర్భిత్త్వా రసాతలమ్ ।
తతః పూర్వాం దిశం భిత్త్వా
దక్షిణాం బిభిదుః పునః ॥

తాత్పర్యము :- రామా! వారు ఆ దిగ్గజమును పూజించి, భూమిని త్రవ్వి పాతాళమునకు వెళ్ళిరి. ముందుగా తూర్పు దిక్కును త్రవ్వి తరువాత దక్షిణ దిక్కులో భూమిని త్రవ్విరి.

ప్రతిపదార్థము :- మానయన్తః = పూజించుచు; తే = వారు; రామ = రామా; జగ్ముః = వెళ్ళిరి; భిత్వా = త్రవ్వుచు; రసాతలమ్ = పాతాళముగూర్చి; తతః = తరువాత; పూర్వాం దిశం = తూర్పు దిక్కును; భిత్వా = త్రవ్వి; దక్షిణాం = దక్షిణ దిక్కును; బిభిదుః = త్రవ్విరి; పునః = మరల.

1.40.17.అనుష్టుప్

దక్షిణస్యామపి దిశి
దదృశుస్తే మహాగజమ్ ।
మహాపద్మం మహాత్మానమ్
సుమహత్పర్వతోపమమ్ ॥

తాత్పర్యము :- దక్షిణ దిక్కునందు కూడ వారు పెద్ద పర్వతమును బోలు అత్యుత్తమైన “మహాపద్మము” అను పేరు గల మహా గజమును చూసిరి.

ప్రతిపదార్థము :- దక్షిణస్యామ్ = దక్షిణవైపు; అపి = కూడ; దిశి = దిశ యందు; దదృశుః = చూసిరి; తే = వారు; మహా = మిక్కిలి పెద్ద; గజః = ఏనుగు; మహాపద్మం = మహాపద్మము అను పేరు గలదానిని; మహాత్మానమ్ = ఇత్తమమైనది; సు = మిక్కిలి; మహత్ = పెద్ద; పర్వతః = పర్వతములతో; ఉపమమ్ = సరిపోల్చదగ్గది.

1.40.18.అనుష్టుప్

శిరసా ధారయన్తం తే
విస్మయం జగ్మురుత్తమమ్ ।
తతః ప్రదక్షిణం కృత్వా
సగరస్య మహాత్మనః ॥

తాత్పర్యము :- ఆ దిగ్గజము కూడ తన శిరస్సుపై భూమిని మ్రోయుచుండుట చూసి; సగర కుమారులు చాలా ఆశ్చర్యము నొంది, దానికి ప్రదక్షిణము చేసిరి.

ప్రతిపదార్థము :- శిరసా = శిరస్సున; ధారయన్తం = ధరించుచున్నది; తే = వారు; విస్మయం = ఆశ్చర్యమును; జగ్ముః = పొందిరి; ఉత్తమమ్ = గొప్ప; తతః = తరువాత; ప్రదక్షిణం = ప్రదక్షిణము; కృత్వా = చేసి; సగరస్య = సగరుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన.

1.40.19.అనుష్టుప్

షష్టిః పుత్రసహస్రాణి
పశ్చిమాం బిభిదుర్దిశమ్ ।
పశ్చిమాయామపి దిశి
మహాన్తమచలోపమమ్ ॥

తాత్పర్యము :- సగరుని అరువది వేల మంది కుమారులు; పశ్చిమ దిక్కున భూమిని నిశితంగా వెదకి. ఆ దిశ యందు కూడ వారు గొప్ప పర్వతము వంటి ఒక దానిని చూసిరి.

ప్రతిపదార్థము :- షష్టిః = అరువది; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేల మంది; పశ్చిమాం = పడమర; బిభిదుః = త్రవ్వి నిశితంగా వెదకిరి; దిశమ్ = దిక్కును; పశ్చిమాయాం = పశ్చిమవైపు; అపి = కూడ; దిశి = దిక్కున; మహాన్తమ్ = గొప్పదైన; అచలః = పర్వతముతో; ఉపమమ్ = పోల్చదగ్గది.

1.40.20.అనుష్టుప్

దిశాగజం సౌమనసమ్
దదృశుస్తే మహాబలాః! ।
తం తే ప్రదక్షిణం కృత్వా
పృష్ట్వా చాపి నిరామయమ్ ॥

తాత్పర్యము :- పశ్చిమమున “సౌమనసము” అను పేరు గల పెద్ద పర్వతము వంటి మహాగజమును చూసిరి. దానికి కూడ ప్రదక్షిణముచేసి దాని కుశలప్రశ్నలు వేసిరి.

ప్రతిపదార్థము :- దిశాగజం = దిగ్గజమును; సౌమనసమ్ = సౌమనసు అను పేరు గల; దదృశుః = చూసిరి; తే = వారు; మహా = గొప్ప; బలాః = బలమైన; తం = దానిని; తే = వారు; ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము; కృత్వా = చేసి; పృష్ట్వా = అడిగి; నిరామయమ్ = కుశలము

1.40.21.అనుష్టుప్

ఖనన్తః సముపక్రాన్తా
దిశం హైమవతీం తతః ।
ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ!
దదృశుర్హిమపాణ్డరమ్ ॥

తాత్పర్యము :- రామా! అక్కడనుండి వారు హిమవత్పర్వతము వైపునకు ఉత్తర దిశగా వెళ్ళిరి. అక్కడ మంచువలె తెల్లనైన ఒక దానిని చూసిరి.

ప్రతిపదార్థము :- ఖనన్తః = వెదకుచు, త్రవ్వుచు; సముపక్రాన్తా = వెళ్ళిరి; దిశం = దిక్కుగూర్చి; హైమవతీం = హిమవత్పర్వతము వైపునకు; తతః = తరువాత; ఉత్తరస్యాం = ఉత్తర దిక్కునందు; రఘుశ్రేష్ఠ = రామా; దదృశుః = చూసిరి; హిమ = మంచు వలె; పాణ్డురమ్ = తెల్లగా.

1.40.22.అనుష్టుప్

భద్రం భద్రేణ వపుషా
ధారయన్తం మహీమిమామ్ ।
సమాలభ్య తతః సర్వే
కృత్వా చైనం ప్రదక్షిణమ్ ॥

తాత్పర్యము :- ఆ చక్కని రూపుతోనున్న శుభప్రదమైన ”భద్రము” అను పేరు గల దిగ్గజమును తాకి ప్రదక్షిణము చేసిరి.

ప్రతిపదార్థము :- భద్రం = భద్రమను పేరు గల; భద్రేణ = శుభప్రదమైన; వపుషా = చక్కని రూపము కలిగి యున్న; ధారయన్తం = ధరించుచున్నది; మహీమ్ = భూమిని; ఇమామ్ = ఈ; సమాలభ్య = ముట్టుకొని; తతః = తరువాత; సర్వే = సమస్తమైన; కృత్వా = చేసి; ఏనం = దీనిని; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము.

1.40.23.అనుష్టుప్

షష్టిః పుత్రసహస్రాణి
బిభిదుర్వసుధాతలమ్ ।
తతః ప్రాగుత్తరాం గత్వా
సాగరాః ప్రథితాం దిశమ్ ॥

తాత్పర్యము :- తరువాత సగరుని అరువది వేల మంది కుమారులు భూమిని దీర్ఘంగా వెదకుచు త్రవ్వుచు, ప్రసిద్ధమైన ఈశాన్యంవైపు దిక్కునకు వెళ్ళిరి.

ప్రతిపదార్థము :- షష్టిః = అరువది; పుత్రః = పుత్రులు; సహస్రాణి = వేల మంది; బిభిదుః = సూక్ష్మగా వెదకుటకు త్రవ్విరి; వసుధాతలమ్ = భూమిని; తతః = తరువాత; ప్రాక్ +ఉత్తరాం = ఈశాన్య వైపు; గత్వా = వెళ్ళి; సాగరాః = సగరుని కుమారులు; ప్రథితాం = ప్రసిద్ధమైన; దిశమ్ = దిక్కును గూర్చి.

1.40.24.అనుష్టుప్

రోషాదభ్యఖనన్ సర్వే
పృథివీం సగరాత్మజాః ।
తే తు సర్వే మహాత్మానో
భీమవేగా మహాబలాః ॥

తాత్పర్యము :- మహాత్ములు; గొప్ప బలాఢ్యులు ఐన సగర కుమారు లందరు కృతకృత్యులు కాలేకపోతున్న కినుకతో, మహా వేగముగా భూమిని త్రవ్వసాగిరి.

ప్రతిపదార్థము :- రోషాత్ = కినుకతో; అభ్య ఖనన్ = త్రవ్విరి; సర్వే పృథివీం = భూమి నంతటిని; సగరాత్మజాః = సగరుని కుమారులు; తే = వారు; తు; సర్వే = అందరును; మహాత్మనః = మహాత్ములైన; భీమ = భయంకరమైన; వేగాః = వేగము గల వారు; మహా = గొప్ప; బలాః = బలాఢ్యులు.

1.40.25.అనుష్టుప్

దదృశుః కపిలం తత్ర
వాసుదేవం సనాతనమ్ ।
హయం చ తస్య దేవస్య
చరన్తమవిదూరతః ॥

తాత్పర్యము :- అక్కడ కపిలుని అవతారములో నున్న వాసుదేవుని, మఱియు ఆ సమీపమున తిరుగుచున్న గుఱ్ఱమును చూసిరి.

ప్రతిపదార్థము :- దదృశుః = చూసిరి; కపిలం = కపిలావతారములో నున్న; తత్ర = అక్కడ; వాసుదేవం = వాసుదేవుని; సనాతనమ్ = పురాణపురుషుడైన; హయం = గుఱ్ఱమును; చ = కూడ; తస్య = ఆ; దేవస్య = దేవునకు; చరన్తమ్ = తిరుగుచున్న; అవిదూరతః = దగ్గరలో.

1.40.26.అనుష్టుప్

ప్రహర్షమతులం ప్రాప్తాః
సర్వే తే రఘునన్దన! ।
తే తం హయహరం జ్ఞాత్వా
క్రోధపర్యాకులేక్షణాః ॥

తాత్పర్యము :- శ్రేష్ఠమైన ఆ గుఱ్ఱమును చూసి వారు సాటిలేని ఆనందము పొందిరి. ఓ రామా ! ఆ గుఱ్ఱమును గుర్తించిన పిదప వారి కన్నులు క్రోధముతో కలత చెందినవి..

ప్రతిపదార్థము :- ప్రహర్షమ్ = సంతోషమును; అతులం = సాటిలేని; ప్రాప్తాః = పొందిరి; సర్వే = అందరును; తే = వారు; రఘునన్దన = రామా; తే = ఆ; తం = వారు; హయవరం = శ్రేష్ఠాశ్వమును; జ్ఞాత్వా = గుర్తించి; క్రోధః = క్రోధముచే; పరి = మిక్కిలి; వ్యాకులః = కలత చెందిన; ఈక్షణాః = కన్నులు కలవారై.

1.40.27.అనుష్టుప్

ఖనిత్రలాంగలధరా
నానావృక్షశిలాధరాః ।
అభ్యధావన్త సఙ్క్రుద్ధాః
తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్ ॥

తాత్పర్యము :- వారందరు గునపములు, నాగళ్ళు, చెట్లు, రాళ్ళు ధరించి, ఆ కపిలమహామునిపై "ఆగుము ఆగుము" అనుచు మీదకు దూకిరి.

ప్రతిపదార్థము :- ఖనిత్రః = గునపములను; లాంగలః = నాగళ్ళను; ధరాః = ధరించిన వారై; నానా = అనేకమైన; వృక్షః = చెట్లను; శిలాః = రాళ్ళను; ధరాః = పట్టినవారై; అభ్యదావన్త = అతని మీదకు పరుగుపెట్టిరి; సంకృద్ధాః = కోపోద్రిక్తులై; తిష్ఠ తిష్ఠ = ఆగుము ఆగుము; ఇతి = అని; చ = కూడ; ఆబ్రువన్ = పలికిరి కూడ.

1.40.28.అనుష్టుప్

"అస్మాకం త్వం హి తురగమ్
యజ్ఞీయం హృతవానసి ।
దుర్మేధస్త్వం హి సమ్ప్రాప్తాన్
విద్ధి నః సగరాత్మజాన్" ॥

తాత్పర్యము :- దుష్టబుద్ధీ! నీవు మా యజ్ఞాశ్వమును దొంగిలించినావు. ఇచట దొరికిపోతివి. మమ్ము సగరకుమారులుగా తెలుసుకొనుము.

ప్రతిపదార్థము :- అస్మాకం = మా యొక్క; త్వం = నీవు; హి = మాత్రమే కదా; తురగం = గుఱ్ఱమును; యజ్ఞీయం = యజ్ఞమునకు సంబంధించిన; హృతవాన్ = దొంగిలించిన; అసి = అల్పుడవు; దుర్మేధః = దుష్ట బుద్ది గల; త్వం = నీవు; సంప్రాప్తాన్ = ఇక్కడ దొరికిపోతివి; విద్ధి = తెలుసుకొనుము; నః = మమ్ములను; సగరాత్మజాన్ = సగరుని కుమారులుగా.

1.40.29.అనుష్టుప్

శ్రుత్వా తు వచనం తేషామ్
కపిలో రఘునన్దన! ।
రోషేణ మహతాఽఽవిష్టో
హుంకారమకరోత్తదా ॥

తాత్పర్యము :- రామా! కపిల మహాముని వారి మాటలు విని, మిక్కిలి కోపోద్రిక్తుడై హుంకరించెను.

ప్రతిపదార్థము :- శ్రుత్వా = విని; వచనం = మాటను; తేషాం = వారి యొక్క; కపిలః = కపిల మహాముని; రఘునన్దన = రామా; రోషేణ = కోపముతో; మహతా = గొప్ప; ఆవిష్టః = కూడిన; హుంకారమ్ = హుంకారమును; అకరోత్ = చేసెను; తదా = అప్పుడు.

1.40.30.అనుష్టుప్

తతస్తేనాప్రమేయేన
కపిలేన మహాత్మనా ।
భస్మరాశీకృతాః సర్వే
కాకుత్స్థ! సగరాత్మజాః" ॥

తాత్పర్యము :- రామా! అపరిమిత ప్రభావము గల ఆ కపిల మహాముని హుంకరించిన వెనువెంటనే సగరకుమారులందరు కాలి భస్మరాశులుగా అయిపోయిరి.

ప్రతిపదార్థము :- తతః = తరువాత; తేన = ఆ; అప్రమేయేన = అపరిమితుడైన; కపిలేన = కపిల మహాముని చేత; మహాత్మనా = మహాత్ముడైన; భస్మరాశీః = బూడిదకుప్పలుగా; కృతాః = చేయబడినారు; సర్వే = అందరు; కాకుత్స్థ = రామా; సగరాత్మజాః = సగరుని కుమారులు.

1.40.31-గద్య.

ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
చత్వారింశః సర్గః॥

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [40] నలభైయ వ సర్గ.

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; చత్వారింశః [40] = నలభైయవ; సర్గః = సర్గ-

।।ఏకచత్వారింశస్సర్గః।।

[41 అంశుమంతుడు యజ్ఞాశ్వము తెచ్చుట]

1.41.1.అనుష్టుప్.

పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా
సగరో రఘునన్దన! ।
నప్తారమబ్రవీద్రాజా
దీప్యమానం స్వతేజసా ॥

తాత్పర్యము :- రఘునందనా; ఓ రామా ! తన కుమారులు వెళ్లి చాలా కాలమైనదని గుర్తించిన సగర చక్రవర్తి; దీపమువలె తేజస్సుతో ప్రకాశించుచున్న మనుమడు అంశుమంతునితో ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- పుత్రాన్ = పుత్రులను; చిరగతాన్ = చాలా కాలము క్రితము వెళ్లినవారినిగా; జ్ఞాత్వా = తెలుసుకొని; సగరః = సగరుడు; రఘునన్దన = రఘువంశజుడవైన ఓ రామా; నప్తారమ్ = పౌత్రుని (తన మనుమడిని) తో; అబ్రవీత్ = పలికెను; రాజా = రాజు దీప్యమానమ్ = దీపములా ప్రకాశించుచున్న; స్వ = సొంత; తేజసా = తేజస్సుతో.

1.41.2.అనుష్టుప్.

శూరశ్చ కృతవిద్యశ్చ
పూర్వైస్తుల్యోఽ సి తేజసా ।
పితౄణాం గతిమన్విచ్ఛ
యేన చాశ్వోఽ పవాహితః ॥

తాత్పర్యము :- నీవు శూరుడవు; వివిధ విద్యలను అభ్యసించినవాడవు; మీ పూర్వికులతో సమానమైన తేజస్సుగల వాడివి. నీ పిన తండ్రుల జాడను, అశ్వము దొంగిలించిన వానిని తెలుసుకొని రమ్ము.

ప్రతిపదార్థము :- శూరః = శూరుడవును; చ = ఇంకను; కృత = నేర్చిన; విద్య = విద్యలు కలవాడవును; ; పూర్వైః = మీ పూర్వీకులతో; తుల్యః = సమానుడవుగా; ఆసి = అయి ఉన్నావు; తేజసా = తేజస్సుచేత; పిత్రూణామ్ = తండ్రులు; గతిమ్ = త్రోవను; అన్విచ్ఛ = వెదుకుము; యేన = ఎవరైతే; ; అశ్వ = అశ్వమును; అపవాహితః = దొంగిలించిరో

1.41.3.అనుష్టుప్.

అన్తర్భౌమాని సత్త్వాని
వీర్యవన్తి మహాన్తి చ ।
తేషాం త్వం ప్రతిఘాతార్థం
సాసిం గృహ్ణీష్వ కార్ముకమ్ ॥

తాత్పర్యము :- భూమి ఉపరితలమే కాదు, క్రింద లోతుల్లో కూడ చాల పరాక్రముగల గొప్ప ప్రాణులు ఉంటాయి. వాటి సంహారమునకై, అస్త్రములతో కూడిన ధనస్సును గ్రహింపుము.

ప్రతిపదార్థము :- అన్తరౌః = లోపల, క్రింద; భూమాని = భూమికి; సత్త్వాని = ప్రాణులు; వీర్యవన్తి = పరాక్రమము కలవి; మహాన్తి = చాలా గొప్పవి; చ = కూడ; తేషాం = వాటియొక్క; త్వం = నీవు; ప్రతిఘాత = సంహారము; అర్థం = కొఱకు; స = కలిగి ఉన్న; అస్త్రం = అస్త్రములను; గృహ్ణీష్వ = గ్రహింపుము; కార్ముకమ్ = ధనస్సును

1.41.4.అనుష్టుప్.

అభివాద్యాభివాద్యాంస్త్వం
హత్వా విఘ్నకరానపి ।
సిద్ధార్థః స్సన్నివర్తస్వ
మమ యజ్ఞస్య పారగః" ॥

తాత్పర్యము :- నీవు నమస్కరింప తగిన వారికి నమస్కరించుము. విఘ్నము కలిగించు వారిని సంహరించుము. చేపట్టినపని నెరవేర్చినవాడవై వెనుకకు తిరిగి రమ్ము. నా యజ్ఞము సమాప్తి కానిమ్ము.”

ప్రతిపదార్థము :- అభివాద్యా = నమస్కరింప తగినవారిని; అభివాద్యామ్ = నమస్కరించి; త్వమ్ = నీవు; హత్వా = చంపి; విఘ్నః = విఘ్నములు; కరాన్ = కలుగ చేయువారు; అపి = ఐతే; సిద్ధార్థః = కృతార్థుడవై; సన్నివర్తస్వ = వెనుకకు తిరిగి రమ్ము; మమ = నాయొక్క; యజ్ఞస్య = యజ్ఞమును; పారగః = - పూర్తి అగునట్లు

1.41.5.అనుష్టుప్.

ఏవముక్తోంఽశుమాన్ సమ్యక్
సగరేణ మహాత్మనా ।
ధనురాదాయ ఖడ్గం చ
జగా మలఘువిక్రమః ॥

తాత్పర్యము :- మహాత్ముడైన సగర చక్రవర్తి చెప్పిన విధముగా, అంశుమంతుడు చక్కగా ధనుస్సు ఖడ్గము మొదలగు అస్త్రశస్త్రములను తీసుకుని బహు శీఘ్రముగా బయలుదేరెను.

ప్రతిపదార్థము :- ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడినవాడై; అంశుమాన్ = అంశుమంతుడు; సమ్యక్ = బాగుగా; సగరేణ = సగరునిచేత; మహాత్మనా = మహాత్ముడైన; ధను: = ధనస్సును; ఆదాయ = ధరించి; ఖడ్గం = ఖడ్గమును; చ = కూడ; జగామ = వెళ్ళెను; అలఘు = అధికమైన; విక్రమః = అడుగులు (వేగము) కలవాడై.

1.41.6.అనుష్టుప్.

స ఖాతం పితృభిర్మార్గం
అన్తర్భౌమం మహాత్మభిః ।
ప్రాపద్యత నరశ్రేష్ఠః!
తేన రాజ్ఞాఽ భిచోదితః ॥

తాత్పర్యము :- సగరుని ఆజ్ఞచే ప్రేరేపింపబడినవాడై మానవులలో శ్రేష్ఠుడైన అంశుమంతుడు తండ్రులచే భూమి క్రిందకు తవ్వబడిన మార్గమును అనుసరించెను.

ప్రతిపదార్థము :- సః - అతను; ఖాతమ్ = తవ్వబడిన; పితృభి: = తండ్రులచేత; మార్గమ్ = మార్గమును; అన్తర్ = లోపల; భూమమ్ = భూమికి; మహాత్మభిః = మహాత్ములైన; ప్రాపద్యత = పొందెను; నరశ్రేష్ఠ = మానవులలో శ్రేష్ఠుడైన; రాజ్ఞా = రాజుచేత; అభిచోదిత: = ప్రేరేపింపబడినవాడై.

1.41.7.అనుష్టుప్.

దైత్యదానవరక్షోభిః
పిశాచపతగోరగైః ।
పూజ్యమానం మహాతేజా
దిశాగజమపశ్యత ॥

తాత్పర్యము :- దేవ దానవ రాక్షస పిశాచ పక్షి మరియు సర్ప గణములచే పూజించబడుచున్న దిగ్గజమును మహాతేజశ్శాలి అయిన అంశుమంతుడు చూచెను.

ప్రతిపదార్థము :- దైత్యః = దైత్యులచేత; దానవః = దానవులచేత; రక్షోభిః = రాక్షసులచేత; పిశాచః = పిశాచములచేత; పతగః = పక్షులచేత; ఉరగైః = సర్పములచేత; పూజ్యమానం = పూజించబడుచున్న; మహాతేజా = గొప్ప తేజస్సుగలవాడు, అంశుమంతుడు; దిశాగజమ్ = దిగ్గజమును; అపశ్యత = చూచెను

1.41.8.అనుష్టుప్.

స తం ప్రదక్షిణం కృత్వా
పృష్ట్వా చైవ నిరామయమ్ ।
పితౄన్ స పరిపప్రచ్ఛ
వాజిహర్తారమేవ చ ॥

తాత్పర్యము :- అతడు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ నమస్కారము చేసి, కుశలములు, తన తండ్రుల గురించి మఱియు అశ్వమును అపహరించిన వానిని గురించి విచారించెను.

ప్రతిపదార్థము :- సః = అతడు; తం = దానికి; ప్రదక్షిణం = ప్రదక్షిణము; కృత్వా = చేసి; పృష్ట్వా = విచారించి; ; అపి = కూడ; నిరామయమ్ = కుశలములు; పితఽన్ = తండ్రులగురించి; సః = అతడు; పరిపప్రచ్ఛ = ప్రశ్నించెను; వాజి = అశ్వమును; హర్తారమ్ = అపహరించినవాని; ఏవ = గురించి; చ = కూడ.

1.41.9.అనుష్టుప్.

దిశాగజస్తు తచ్ఛ్రుత్వా
ప్రత్యాహాంశుమతో వచః ।
ఆసమంజ కృతార్థస్త్వం
సహాశ్వః శీఘ్రమేష్యసి" ॥

తాత్పర్యము :- అంశుమంతుని పలుకులు విని దిగ్గజము -”అసమంజుని పుత్రుడా! అంశుమంతుడా ! నీవు శీఘ్రమే అశ్వము సాధించుటతో సహా కార్యసాధకుడవు కాగలవు” అని పలికెను.

ప్రతిపదార్థము :- దిశాగజః = దిగ్గజము; తు = ఆ; తత్ = ఆ; శ్రుత్వా = విని; ప్రత్యాహ- ప్రతి+ ఉవాచ = తిరిగి బదులు చెప్పెను; అంశుమత; = అంశుమంతునితో; వచః = పలుకులకు; ఆసమంజ = అసమంజుని పుత్రుడా; కృతార్థః = కృతార్థుడవై; త్వం = నీవు; సహ = సహా; అశ్వః = అశ్వముతో; శీఘ్రమ్ = త్వరగా; ఏష్యసి = కాగలవు (ఆంధ్రవాచస్పతము).

1.41.10.అనుష్టుప్.

తస్య తద్వచనం శ్రుత్వా
సర్వానేవ దిశాగజాన్ ।
యథాక్రమం యథాన్యాయం
ప్రష్టుం సముపచక్రమే ॥

తాత్పర్యము :- అంశుమంతుడు ఆ దిగ్గజము మాట విని, మిగిలిన దిగ్గజములను ఒక్కొక్క దానిని న్యాయానుసారముగా ప్రశ్నించుట ప్రారంభించెను.

ప్రతిపదార్థము :- తస్య = దానియొక్క; తత్ = ఆ; వచనం = పలుకును; శ్రుత్వా = విని; సర్వానేవ = సమస్తమైన; దిశాగజాన్ = దిగ్గజములను; యథాక్రమం = క్రమానుసారముగా; యథాన్యాయం = న్యాయానుసారముగా; ప్రష్టుం = అడుగుటకు; సముపచక్రమే = ఉపక్రమించెను

1.41.11.అనుష్టుప్.

తైశ్చ సర్వైర్దిశాపాలైః
వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః ।
పూజితః "సహయశ్చైవ
గన్తాఽసీత్యభిచోదితః" ॥

తాత్పర్యము :- ఆ దిగ్గజములన్నియు మాటల సారమును గ్రహింపగలిగి, మాట్లాడుట యందు బాగా నేర్పుకలవి. ఆ దిగ్గజములు అతనిని ఆదరించి; “అశ్వముతో తిరిగి వెళ్ళెదవు” అని ఆశీర్వదించి ప్రోత్సహించెను.

ప్రతిపదార్థము :- తైః = ఆ; ; సర్వైః = సమస్తమైన; దిశాపాలైః = దిగ్గజముల చేత; వాక్యః = మాట్లాడు విధము; జ్ఞః = ఎరిగిన; వాక్యః = మాట్లాడు టందు; కోవిదైః = నేర్పుకలవి; పూజితః = పూజింపబడినవాడై; సహ = సహితముగ; హయః = అశ్వముతో; గన్తాఽసీ = వెళ్లగలవు; ఇతి = అని; అభిచోదితః = ప్రేరేపింపబడెను, ప్రోత్సాహింపబడెను.

1.41.12.అనుష్టుప్.

తేషాం తద్వచనం శ్రుత్వా
జగామలఘువిక్రమః ।
భస్మరాశీకృతా యత్ర
పితరస్తస్య సాగరాః ॥

తాత్పర్యము :- ఆ దిగ్గజములయొక్కఆశీస్సులు గ్రహించి ఎక్కడైతే తన పినతండ్రులైన సగరకుమారులు బూడిదకుప్పలై పడిఉన్నారో అచ్చటకు వేగముగా వెళ్లెను.

ప్రతిపదార్థము :- తేషాం = వాటియొక్క; తత్ = ఆ; వచనం = ఆశీస్సులను; శ్రుత్వా = విని; జగామ = వెళ్ళెను; లఘువిక్రమః = శీఘ్రమైన గమనము కలవాడై; భస్మరాశీకృతా = బూడిదకుప్పలు చెయ్యబడిన; యత్ర = ఎక్కడ; పితరః = తండ్రులు యొక్క; తస్య = తన; సాగరాః = సగరకుమారులు.

1.41.13.అనుష్టుప్.

స దుఃఖవశమాపన్నః
స్త్వసమంజసుతస్తదా ।
చుక్రోశ పరమార్తస్తు
వధాత్తేషాం సుదుఃఖితః ॥

తాత్పర్యము :- అప్పుడా అసమంజసుని కొడుకు అంశుమంతుడు దుఃఖపరవశుడై, తన పినతండ్రుల మరణమునకు మిక్కిలి దుఃఖముతో బాధపడుచు ఏడ్చెను.

ప్రతిపదార్థము :- సః = ఆ; దుఃఖ = దుఃఖమునకు; వశమ్ = లోనగుట; ఆపన్నః = పొందినవాడై; తు; అసమంజసుత = అసమంజసుని కుమారుడు, అంశుమంతుడు; తదా = అప్పుడు; చుక్రోశ = ఏడ్చెను; పరమార్తః = చాలా పీడితుడై; వధాత్ = వధ వలన; తేషాం = వారియొక్క; సుదుఃఖితః = చాల దుఃఖితుడై.

1.41.14.అనుష్టుప్.

యజ్ఞీయం చ హయం తత్ర
చరన్తమవిదూరతః ।
దదర్శ పురుషవ్యాఘ్రో
దుఃఖశోకసమన్వితః ॥

తాత్పర్యము :- దుఃఖముతో ఏడ్చుచుచున్న ఆ అంశుమంతుడు అచట దగ్గరలోనే మేయుచు తిరుగుచున్న యాగాశ్వమును చూచెను.

ప్రతిపదార్థము :- యజ్ఞీయం = యజ్ఞము యొక్క; ; హయం = అశ్వమును; తత్ర = అక్కడ; చరన్తమ్ = తిరుగుచున్న; అవిదూరతః = సమీపమునందు; దదర్శ = చూచెను; పురుష = పురుషులలో; వ్యాఘ్రః = శ్రేష్ఠుడు; దుఃఖః = దుఃఖముతో; శోకః = ఏడుపుతో; సమన్వితః = కూడిన.

1.41.15.అనుష్టుప్.

స తేషాం రాజపుత్రాణాం
కర్తుకామో జలక్రియామ్ ।
సలిలార్థీ మహాతేజా
న చాపశ్యజ్జలాశయమ్ ॥

తాత్పర్యము :- ఆ అంశుమంతుడు సగరపుత్రులకు జలతర్పణము ఇవ్వవలెనని తలచెను. కాని జలము కొఱకు అన్వేషించగా అక్కడ జలాశయములు ఏవియు కనబడలేదు.

ప్రతిపదార్థము :- సః = అతడు; తేషాం = ఆ; రాజపుత్రాణాం = రాకుమారులకు; కర్తుః = చేయవలెనని; కామః = కోరిక గలవాడై; జలక్రియామ్ = జలతర్పణములు; సలిలాః = ఉదకమును; అర్థీ = కోరుచు; మహా = గొప్ప; తేజాః = తేజస్సు గలవాడు; న = లేదు; ; అపశ్యత్ = కనబడుట; జలాశయమ్ = చెరువును.

1.41.16.అనుష్టుప్.

విసార్య నిపుణాం దృష్టిం
తతోఽ పశ్యత్ ఖగాధిపమ్ ।
పితౄణాం మాతులం రామ!
సుపర్ణమనిలోపమమ్ ॥

తాత్పర్యము :- పిమ్మట అతడు తన ప్రయత్న పూర్వక చూపుతో పరికించి చూడగా, పినతండ్రుల మేనమామయు వాయుసమానుడును పక్షిరాజును అగు గరుత్మంతుడిని చూచెను.

ప్రతిపదార్థము :- విసార్య = ప్రసరించి; నిపుణాం = సమర్థమైన, నైపుణ్యమైన; దృష్టిం = దృష్టిని; తతః = పిమ్మట; అపశ్యత్ = చూచెను; ఖగాధిపమ్ = గరుత్మంతుని; పితఽణాం = పినతండ్రులయొక్క; మాతులం = మేనమామను; రామ = రామా; సుపర్ణమ్ = గరుత్మంతుడు; అనిలః = వాయుదేవునితో; ఉపమమ్ = సమానుడు.

 *గమనిక :- *- 1. నీటి జాడ వెతుకు వాడు ముందు నేలపై చూస్తాడు. కనబడకపోతే, నీరున్న చోట పక్షులు ఉంటాయి కనుక, నీటి జాడకై పక్షుల కోసం పైకి చూస్తాడు. గరుత్మంతుడు ఎంతో ఎత్తులో అమిత వేగంతో ఎగురుతుంటాడు. ఎంతో దీర్ఘంగా చూస్తేనే గరుత్మండు కనబడతాడు. అందుకని చూడడంలోని సమర్థత అంతటితో అంశుమంతుడు చూసాడు అన్నమాట. సగరుని పెద్ద భార్య “కేశిని” యందు కలిగిన పెద్ద కొడుకు “అసమంజసుడు”, మఱియు రెండవ భార్య “అరిష్టనేమి” అను పేరుగల “కశ్యపుని” కూతురును, అలా “గరుత్మంతుని” సోదరియును ఐన “సుమతి” యందు అరవైవేలమంది పుత్రులు. కనుక వీరికి గరుత్మంతుడు మేనమామ. అసమంజసునికి ఈ అరవైవేలమంది సవితి సోదరులు. అసమంజసుని కొడుకు అంశుమంతునికి చిన్నాన్నలు. 2. ఖగాధిపతి- ఖగాః (పక్షులకు) అధిపతి (ప్రభువు), గరుత్మంతుడు. 3. సుపర్ణుడు- మంచి రెక్కలు గలవాడు, గరుత్మంతుడు.

1.41.17.అనుష్టుప్.

స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥

తాత్పర్యము :- ఆ గరుత్మంతుడు అతనితో ఇట్లు పలికెను; “ ఓ మహాబలుడా! దుఃఖింపకుము. మీ పినతండ్రుల మరణము లోకులందరు హర్షించెదరు.

ప్రతిపదార్థము :- స = ఆ; ఏవమ్ = అతని గూర్చి; అబ్రవీత్ = పలికెను; వాక్యమ్ = వాక్యమును; వైనతేయః = గరుత్మంతుడు; మహా = మిక్కిలి; బలః = బలశాలి; మా = వద్దు; శుచః = దుఃఖము; పురుషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడా; వధః = ఆ సంహరించబడుట; లోక = లోకులకు; సమ్మతః = ఇష్టమైనదే.

1.41.18.అనుష్టుప్.

కపిలేనాప్రమేయేన
దగ్ధా హీమే మహాబలాః ।
సలిలం నార్హసి ప్రాజ్ఞ
దాతుమేషాం హి లౌకికమ్ ॥

తాత్పర్యము :- మహాబలవంతులైన మీ పినతండ్రులు అమిత ప్రభావశాలి యైన కపిల మహర్షి చేత కాల్చబడితిరి కదా. ఓ బుద్ధిమంతుడా! వారికి సాధారణమైన జలములు ఇచ్చుట సరికాదు.

ప్రతిపదార్థము :- కపిలేన = కపిలుని చేత; అప్రమేయేన = అమితమైన ప్రభావము గల; దగ్ధాహి = కాల్చబడినారుకదా; ఇమే = ఈ; మహా = గొప్ప; బలాః = బలశాలి; సలిలం = జలమును; న = కాదు; అర్హసి = తగినది; ప్రాజ్ఞ = ఓ బుద్ధిమంతుడా; దాతుమ్ = ఇచ్చుటకు; ఏషామ్ = వీరికి; హి; లౌకికమ్ = సాధారణమైన.

 *గమనిక :- *- వి. చండాలాదుదకాత్సర్వాద్వైద్యుతాద్బ్రాహ్మణదపి । దంష్ట్రిభృశ్చ పశపభయ్శ్త మరణం పాపకర్మాణమ్ । ఉదకం ఏణ దానం చ ఓతేభ్యో యద్విధీయతే । నోపతిష్ఠతి తత్సర్వమనురిక్షే వినశ్యతి ॥ భావము. పాపాత్ములకు చండాలుడు, ఉదకము, పిడుగు, బ్రాహ్మణుడు, కోరలు గల జంతువులు, పశువులు, నీటివలన మరణము కలుగును. వారికి చేసిన జలతర్పణలు పిండప్రదానాలు వారికి చెందవు. ఆకాశములో నశించును. అని ధర్మశాస్త్రము. సగరులు బ్రాహ్మణుని వలన మరణం పొందారు కనుక సాధారణ జలతర్పణ చాలదు, గంగనుతేవలె. గోవిందరాజులు- పుల్లెల రామాయణము.

1.41.19.అనుష్టుప్.

గంగా హిమవతో జ్యేష్ఠా
దుహితా పురుషర్షభ! ।
తస్యాం కురు మహాబాహో
పితౄణాం తు జలక్రియామ్ ॥

తాత్పర్యము :- ఓ పురుషశ్రేష్ఠా! హిమవంతునియొక్క పెద్ద కుమార్తె గంగ. ఆ గంగాజలంతో నీ పినతండ్రులకు జలతర్పణము చేయుము.

ప్రతిపదార్థము :- గంగా = గంగ; హిమవతః = హిమవంతునియొక్క; జ్యేష్ఠా = పెద్ద; దుహితా = కుమార్తె; పురుషర్షభ = పురుషులలో శ్రేష్ఠుడా; తస్యాం = దానియందు, గంగ యందు; కురు = చేయుము; మహా = గొప్ప; బాహో = భుజబలం కలవాడు; పితఽణాం = పినతండ్రులకు; తు; జలక్రియామ్ = జలతర్పణమును

1.41.20.అనుష్టుప్.

భస్మరాశీకృతానేతాన్
ప్లావయేల్లోకపావనీ ।
తయా క్లిన్నమిదం భస్మ
గంగయా లోకకాన్తయా ॥

తాత్పర్యము :- లోకములను పవిత్రము చేయు ఆ గంగ భస్మరాశులుగా ఉన్న వీరిపై ప్రవహింపజేయుము. అందరికీ ఇష్టురాలైన గంగచే అలా తడపబడిన ఈ భస్మము.

ప్రతిపదార్థము :- భస్మ = బూడిద; రాశీ = కుప్పలు; కృతాన్ = చెయ్యబడిన; ఏతాన్ = వీరిపై; ప్లావయేత్ = ప్రవహింప చేయుము; లోకపావనీ = గంగను; తయా = ఆ; క్లిన్నమ్ = తడపబడిన; ఇదమ్ = ఈ; భస్మ = బూడిద; గఙ్గయా = గంగచే; లోక = లోకామునకు; కాన్తయా = ఇష్టురాలు.

 *గమనిక :- *- లోకపావని- లోకములను పవిత్రము చేయునది, గంగానది.

1.41.21.అనుష్టుప్.

షష్టిం పుత్రసహస్రాణి
స్వర్గలోకం నయిష్యతి ।
గచ్ఛ చాశ్వం మహాభాగ!
తం గృహ్య పురుషర్షభ! ॥

తాత్పర్యము :- ఈ అరవైవేలమంది సగరపుత్రులను స్వర్గోలోకము పొందించ గలదు. ఓ మహాబలవంతుడా ! పురుషులలో శ్రేష్ఠుడా! ఈ అశ్వమును తీసుకొని వెళ్లుము.

ప్రతిపదార్థము :- షష్టిం పుత్రసహస్రాణి = అరవైవేలమంది పుత్రులను; స్వర్గలోకం = స్వర్గలోకమునకు; ; నయిష్యతి = పొందించగలదు; గచ్ఛ = వెళ్లుము; ; మహాభాగ = మహాత్ముడా; తం = నీవు; గృహ్య = తీసుకుని; పురుషర్షభ = శ్రేష్ఠుడా.

1.41.22.అనుష్టుప్.

యజ్ఞం పైతామహం వీర!
సంవర్తయితుమర్హసి" ।
సుపర్ణవచనం శ్రుత్వా
సోంఽ శుమానతివీర్యవాన్ ॥

తాత్పర్యము :- ఓ మహావీర! గుఱ్ఱమును తీసుకొని మీ పితామహులు, సగరుని యజ్ఞమును పూర్తి చేయించుము” అని గరుత్మంతుడు అంశుమంతునికి చెప్పెను. గరుత్మంతుని ఆ ఉపదేశము ఆలకించిన మహావీరుడైన అంశుమంతుడు.

ప్రతిపదార్థము :- యజ్ఞం = యజ్ఞమును; పైతామహం = మీ పితామహుని, సగరుని సంబంధమైన; వీర = వీరుడా; సంవర్తయితుమ్ = జరిపించుటకు; అర్హసి = తగియున్నావు; సుపర్ణ = గరుత్మంతుని; వచనం = ఉపదేశము; శ్రుత్వా = విని; సః = ఆ; అంశుమాన్ = అంశుమంతుడు; అతివీర్యవాన్ = మహా వీరుడు.

1.41.23.అనుష్టుప్.

త్వరితం హయమాదాయ
పునరాయాన్మహాయశాః ।
తతో రాజానమాసాద్య
దీక్షితం రఘునన్దన!" ॥

తాత్పర్యము :- రామా! మహాయశశ్శాలి అంశుమంతుడు అతిశీఘ్రముగా అశ్వమును తీసుకొని వచ్చి అయోధ్యలో దీక్షవహించి ఉన్న సగరచక్రవర్తి దగ్గరకు వచ్చెను.

ప్రతిపదార్థము :- త్వరితం = శీఘ్రముగా; హయమ్ = గుఱ్ఱమును; ఆదాయ = గ్రహించి, తీసుకుని; పునః = తిరిగి; ఆయత్ = వచ్చెను. మహాయశాః = గొప్ప కీర్తిగల; తతః = పిమ్మట; రాజానమ్ = రాజును; అసాధ్య = పొంది; దీక్షితం = దీక్షవహించి ఉన్న; రఘునన్దన! = ఓ రామా!

1.41.24.అనుష్టుప్.

న్యవేదయద్యథావృత్తం
సుపర్ణవచనం తథా ।
తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం
వాక్యమంశుమతో నృపః ॥

తాత్పర్యము :- అంశుమంతుడు గరుత్మంతుడు చెప్పిన విషయములను సగరమహారాజునకు జరిగినది జరిగినట్లు నివేదించెను. అంశుమంతుడు చెప్పిన ఘోరమైన వార్త సగరచక్రవర్తి వినెను.

ప్రతిపదార్థము :- న్యవేదయత్ = నివేదించెను, తెలిపెను; యథా = ఎట్లు; ఆవృత్తం = జరిగినదో; సుపర్ణ = గరుత్మంతుని; వచనం = ఉపదేశమును; తథా = అట్లు; తత్ = దానిని; శ్రుత్వా = విని; ఘోరసంకాశం = ఘోరమైన, సమీపించిన ఘోరం వంటి; వాక్యమ్ = వార్తను; అంశుమంతః = అంశుమంతునియొక్క; నృపః = రాజు.

1.41.25.అనుష్టుప్.

యజ్ఞం నిర్వర్తయామాస
యథాకల్పం యథావిధి ।
స్వపురం చాగమచ్ఛ్రీమాన్
ఇష్టయజ్ఞో మహీపతిః ॥

తాత్పర్యము :- సగరచక్రవర్తి యజ్ఞమును శాస్త్రప్రకారము, చెయ్యవలసిన పద్దతిలో పూర్తి చేసి, నగరములో ప్రవేశించెను.

ప్రతిపదార్థము :- యజ్ఞం = యజ్ఞమును; నివర్తయామాస = జరిపించెను; యథాకల్పం = పద్ధతికారముగా; యథావిధి = శాస్త్రప్రకారముగా; స్వపురం చ = తన పురమును; ఆగమత్ = చేరెను; శ్రీమాన్ = శ్రీమంతుడైన; ఇష్టయజ్ఞః = యజింవడిన యాగము కలవాడై; మహీపతిః = రాజు.

1.41.26.అనుష్టుప్.

గంగాయాశ్చాగమే రాజా
నిశ్చయం నాధ్యగచ్ఛత ।
అకృత్వా నిశ్చయం రాజా
కాలేన మహతా మహాన్।
త్రింశద్వర్షసహస్రాణి
రాజ్యం కృత్వా దివం గతః ॥

తాత్పర్యము :- గంగను తీసుకొనివచ్చే ఉపాయమేదియు అతడు కనుగొనలేకపోయెను. మహనీయుడైన ఆ రాజు చాలాకాలమునకు కూడా గంగను తీసుకువచ్చే ఉపాయము కనుగొనలేక, ముప్పదివేల సంవత్సరములు రాజ్యము చేసి స్వర్గలోకమునకు వెళ్లెను.

ప్రతిపదార్థము :- గంగయాః = గంగయొక్క; ఆగమే = రాక విషయములో; రాజా = రాజు; నిశ్చయమ్ = నిర్ణయమునకు; న అధిగచ్ఛత = పొందలేదు; అకృత్వా = చేయకయే; నిశ్చయం = నిశ్చయమును; రాజా = రాజు; మహతా కాలేన = చాలా కాలముచేత; మహాన్ = గొప్పవాడైన; త్రింశత్ = ముప్పది; వర్షసహస్రాణి = వేల సంవత్సరములు; రాజ్యం = రాజ్యము; కృత్వా = చేసి; దివమ్ = స్వర్గమును గూర్చి; గతః = వెళ్ళెను.

1.41.27.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
ఏకచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [21] నలభైఒకటవ సర్గ సుసంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; ఏకిచత్వారింశ [41] = నలభై ఒకటవ; సర్గః = సర్గ.

 ద్విచత్వారింశఃసర్గః

(42 - భగీరథ యత్నము)

1.42.1.అనుష్టుప్.

కాలధర్మం గతే రామ!
సగరే ప్రకృతీజనాః ।
రాజానం రోచయామాసుః
అంశుమన్తం సుధార్మికమ్ ॥

తాత్పర్యము :- ఓ రామా! సగరుడు కాలగర్భములో కలసిపోగా, మంత్రివర్యులు, ప్రజలు చాలా ధర్మాత్ముడైన అంశుమంతుని రాజుగా చేయుటకు అంగీకరించిరి.

ప్రతిపదార్థము :- కాలధర్మమ్ = మరణించి, చచ్చి, ఆంధ్రశబ్ధరత్నాకరము; గతే = పోగా; రామ = ఓ రామా; సగరే = సగరుడు; ప్రకృతీః = మంత్రులు; జనాః = ప్రజలు; రాజానమ్ = రాజుగా; రోచయామాసుః = అంగీకరించిరి; అంశుమంతమ్ = అంశుమంతుని; సుధార్మికమ్ = మిక్కిలి ధర్మాత్ముడైన

1.42.2.అనుష్టుప్.

స రాజా సుమహానసీత్
అంశుమాన్ రఘునన్దన! ।
తస్య పుత్రో మహానాసీత్
దిలీప ఇతి విశ్రుతః ॥

తాత్పర్యము :- అంశుమంతుడు చాలా గొప్ప ప్రభువై ప్రజలను పరిపాలించెను. అతనికి దిలీపుడు అని పేరుపొందిన మహనీయుడైన కుమారుడు జన్మించెను.

ప్రతిపదార్థము :- స = ఆ; రాజా = రాజు; సుమహాన్ = చాలా గొప్పవాడు; ఆసీత్ = అయెను; అంశుమాన్ = అంశుమంతుడు; రఘునందన = రామా; తస్య = అతనికి; పుత్రః = కుమారుడు; మహాన్ = మహనీయుడు; ఆసీత్ = కలిగెను; దిలీప = దిలీపుడు; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధుడైన

1.42.3.అనుష్టుప్.

తస్మిన్ రాజ్యం సమావేశ్య
దిలీపే రఘునన్దన ।
హిమవచ్ఛిఖరే పుణ్యే
తపస్తేపే సుదారుణమ్ ॥

తాత్పర్యము :- ఓ రాఘవా! అంశుమంతుడు దిలీపునిపై రాజ్యభారమును నిలిపి పుణ్య హిమవత్పర్వత శిఖర ప్రదేశములో చాలా తీవ్రమైన తపస్సు చేసెను.

ప్రతిపదార్థము :- తస్మిన్ = ఆ; రాజ్యమ్ = రాజ్యమును; సమావేశ్య = నిలిపి; దిలీపే = దిలీపునిపై; రఘునందన = ఓ రామా!; హిమవత్ = హిమాలయ పర్వత; శిఖరే = శిఖరమునందు; పుణ్యే = పుణ్యమైన; తపః = తపస్సు; తేపే = ఒనరించెను; సుదారుణమ్ = చాలా భయంకరమైన

1.42.4.అనుష్టుప్.

ద్వాత్రింశచ్చ సహస్రాణి
వర్షాణి సుమహాయశాః ।
తపోవనం గతో రామ!
స్వర్గం లేభే తపోధనః ॥

తాత్పర్యము :- ఓ రామా! ఆ గొప్పకీర్తిశాలి అంశుమంతుడు ముప్పదిరెండువేల సంవత్సరములు తపోవనములో ఉండి తపసంపన్నుడై స్వర్గలోకమునకు వెళ్ళెను.

ప్రతిపదార్థము :- ద్వా త్రింశత్ = ముప్పదిరెండు; ; సహస్రాణి = వేల; వర్షాణి = సంవత్సరములు; సు = మిక్కిలి; మహా = గొప్ప; యశాః = కీర్తివంతుడు; తపోవనమ్ = తపోవనమును; గతః = పొందినవాడై; రామ = ఓ రామా; స్వర్గం = సురలోకమును; లేభే = పొందెను; తపోధనః = తపము సొమ్ముగా కలవాడు

1.42.5.అనుష్టుప్.

దిలీపస్తు మహాతేజాః
శ్రుత్వా పైతామహం వధమ్ ।
దుఃఖోపహతయా బుద్ధ్యా
నిశ్చయం నాధ్యగచ్ఛత ॥

తాత్పర్యము :- మహాతేజోవంతుడైన దిలీపుడు తన పితామహుల మరణ వృత్తాంతము విని శోకచిత్తుడై గంగను తెచ్చి వారికి స్వర్గప్రాప్తి కలిగించుటకై ఒక నిర్ణయమునకు రాలేకపోయెను.

ప్రతిపదార్థము :- దిలీపః = దిలీపుడు; అస్తు = అయితే; మహా = గొప్ప; తేజః = తేజస్సు కల; శ్రుత్వా = విని; పైతామహమ్ = పితామహుల యొక్క; వధమ్ = మరణమును; దుఃఖ = శోకముతో; ఉపహతాయ = పీడించబడిన; బుద్ధ్యా = చిత్తముతో; నిశ్చయమ్ = నిర్ణయమును; న = లేదు; అధ్యగచ్ఛత = చేరగలుగుట

1.42.6.అనుష్టుప్.

కథం గంగావతరణమ్?
కథం తేషాం జలక్రియా?
తారయేయం కథం చైనాన్?’
ఇతి చిన్తాపరోఽ భవత్ ॥

తాత్పర్యము :- దిలీపుడు ‘ఎటుల గంగను క్రిందికి తేవల? ఎటుల వీరికి జలతర్పణలు చేయవలె? ఎటుల వీరిని తరింపచేయవలె?’ అని చింతాపరుడై ఉండెను.

ప్రతిపదార్థము :- కథమ్ = ఎట్లు; గంగ = గంగానదిని; అవతరణమ్ = క్రిందకు దించుట; కథమ్ = ఎట్లు; తేషామ్ = వారి; జలక్రియా = జలతర్పణము చేయుట; తారయేయమ్ = తరింపచేయుదును; కథమ్ చ = ఎట్లు; ; ఏతాన్ = వీరిని; ఇతి = ఇట్లు; చింతాపరః = విచారముతో నిండినవాడు; అభవత్ = అయ్యెను.

1.42.7.అనుష్టుప్.

తస్య చిన్తయతో నిత్యం
ధర్మేణ విదితాత్మనః ।
పుత్రో భగీరథో నామ
జజ్ఞే పరమధార్మికః ॥

తాత్పర్యము :- గంగను క్రిందకు తెచ్చు ధర్మమునకై నిత్యమూ యోచించు ఆ జ్ఞాని దిలీపునకు ధర్మబుద్ధితో మసలే సుతుడు భగీరథుడు అనే పేరుతో జన్మించెను.

ప్రతిపదార్థము :- తస్య = అతనికి; చింతయతః = విచారముతో ఉన్న; నిత్యమ్ = ఎల్లవేళల; ధర్మేణ = ధర్మముతో; విదిత ఆత్మనః = తెలిసిన చిత్తము కలవాడు; పుత్రః = కుమారుడు; భగీరథః నామ = భగీరథుడు అను పేరుతో; జజ్ఞే = పుట్టెను; పరమ ధార్మికః = చాలా ధర్మయుక్తముగా మసలేవాడు

 *గమనిక :- *- భగీరథుడు- భగము అనగా శ్రీ, ఇచ్చ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మహాత్మ్యము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము. రథము దేహమునకు ప్రతీక. రథి/ రథుడు దేహమునందుండు జీవి, సారథి బుద్ధి. భగము లక్షణముగా కలిగిన దేహము కలవాడు భదీరథుడు.

1.42.8.అనుష్టుప్.

దిలీపస్తు మహాతేజా
యజ్ఞైర్బహుభిరిష్టవాన్ ।
త్రింశద్వర్షసహస్రాణి
రాజా రాజ్యమకారయత్ ॥

తాత్పర్యము :- గొప్ప తేజస్సు కల దిలీపుడు అనేక యజ్ఞములను ప్రీతిపూర్వకముగా చేసి ముప్పదివేల సంవత్సరములు రాజ్యపాలన చేసెను.

ప్రతిపదార్థము :- దిలీపస్తు = దిలీపుడు; మహాతేజా = గొప్ప తేజస్సు కలవాడు; యజ్ఞైః = యజ్ఞములలో; బహుభిః = అనేకమైన; ఇష్టవాన్ = ప్రీతి కలవాడు; త్రింశత్ వర్ష సహస్రాణి = ముప్పదివేల సంవత్సరాలు; రాజా = రాజు; రాజ్యమ్ = రాజ్యమును; అశాసయత్ = శాసించెను.

1.42.9.అనుష్టుప్.

అగత్వా నిశ్చయం రాజా!
తేషాముద్ధరణం ప్రతి ।
వ్యాధినా నరశార్దూల!
కాలధర్మముపేయివాన్ ॥

తాత్పర్యము :- పురుషపుంగవుడా! ఓ రామా! దిలీపమహారాజు తన పితామహులైన సగరపుత్రులకు ఊర్ధ్వలోకములు కలిగించు మార్గము నిర్ణయించలేక ఆ మనోవ్యథతో మరణించెను.

ప్రతిపదార్థము :- అగత్వా = చేరలేక; నిశ్చయమ్ = నిర్ణయమును; రాజా = రాజు; తేషామ్ = వారిని; ఉద్ధరణమ్ ప్రతి = ఉద్ధరించుట కొఱకు; వ్యాధినా = రోగముతో; నరశార్దూల = పురుషశ్రేష్ఠుడా; కాలధర్మమ్ = మరణమును; ఉపేయివాన్ = పొందెను

1.42.10.అనుష్టుప్.

ఇన్ద్రలోకం గతో రాజా
స్వార్జితేనైవ కర్మణా ।
రాజ్యే భగీరథం పుత్రం
అభిషిచ్య నరర్షభః ॥

తాత్పర్యము :- నరులలో ఉత్తముడైన దిలీపుడు భగీరథునికి రాజ్యాభిషేకము చేసి తన కర్మలచే సంపాదించిన ఫలముల వలన స్వర్గమునకు వెళ్ళెను.

ప్రతిపదార్థము :- ఇంద్రలోకమ్ = స్వర్గలోకము గూర్చి; గతః = వెళ్ళెను; రాజా = రాజు; స్వార్జితేన = తను సంపాదించినది; ఏవ = అటువంటి; కర్మణా = కర్మచేత; రాజ్యే = రాజ్యమునందు; భగీరథమ్ = భగీరథుని; పుత్రమ్ = కొడుకును; అభిషిచ్య = అభిషేకించి; నరర్షభః ( నర+ ఋషభః ) = నరులలో శ్రేష్ఠుడు

1.42.11.అనుష్టుప్.

భగీరథస్తు రాజర్షిః
ధార్మికో రఘునన్దన! ।
అనపత్యో మహాతేజాః
ప్రజాకామః స చాప్రజః ॥

తాత్పర్యము :- ఓ రామా! భగీరథుడు రాజర్షి, చాలా తేజశ్శాలి, ధర్మమూర్తి . అతనికి సంతానము కావలెనని కోరిక ఉన్నా సంతానము కలుగలేదు.

ప్రతిపదార్థము :- భగీరథః = భగీరథుడును; తు; రాజర్షి = రాజ్యమేలుతూ ఋషిగా నుండువాడు; ధార్మికః = ధర్మమును అనుసరించువాడు; రఘునందన = రామా!; అనపత్యః = సంతానము లేనివాడు; మహాతేజాః = మిక్కిలి తేజోవంతుడు; ప్రజాకామః = సంతానము కోరినవాడు; సః = అతడు; ; అప్రజాః = సంతానములేనివాడు

1.42.12.అనుష్టుప్.

మన్త్రిష్వాధాయ తద్రాజ్యం
గంగావతరణే రతః ।
స తపో దీర్ఘమాతిష్ఠత్
గోకర్ణే రఘునన్దన! ॥

తాత్పర్యము :- ఓ రామా! ఆ భగీరథ మహారాజు తన రాజ్యపరిపాలనను మంత్రులకు అప్పగించి, గంగను భువికి దింపుటలో అభిలాష కలవాడై గోకర్ణము అను క్షేత్రములో దీర్ఘతపస్సు ఒనరించెను.

ప్రతిపదార్థము :- మంత్రిషు = మంత్రులలో; ఆధాయ = పెట్టి; తత్ = ఆ; రాజ్యమ్ = రాజ్యమును; గంగావతరణే = గంగను దించుటలో; రతః = అభిలాష కలవాడై; స = అతడు; తపః = తపమును; దీర్ఘమ్ = దీర్ఘమైనది; ఆతిష్ఠత్ = చేసెను; గోకర్ణే = గోకర్ణములో; రఘునందన = ఓ రామా!

1.42.13.అనుష్టుప్.

ఊర్ధ్వబాహుః పంచతపా
మాసాహారో జితేన్ద్రియః ।
తస్య వర్షసహస్రాణి
ఘోరే తపసి తిష్ఠతః ॥

తాత్పర్యము :- చేతులు పైకి చాచి, పంచాగ్నుల మధ్య, నెలకొక పర్యాయమే భుజించుచు, ఇంద్రియములను జయించినవాడై, వేయి సంవత్సరములు తీవ్రమైన తపస్సులో నిమగ్నుడయ్యెను.

ప్రతిపదార్థము :- ఊర్ధ్వబాహుః = చేతులు పైకి చాచి; పంచతపా = ఐదు అగ్నుల మధ్య; మాసాహారః = నెలకొకసారి ఆహారము తీసుకొనుచు; జితేంద్రియః = జయించబడిన ఇంద్రియములు కలవాడై; తస్య = అతను; వర్ష సహస్రాణి = వేయి సంవత్సరములు; ఘోరే = భయంకరమైన; తపసి = తపస్సులో; తిష్ఠతః = ఉండెను.

1.42.14.అనుష్టుప్.

అతీతాని మహాబాహో
తస్య రాజ్ఞో మహాత్మనః ।
సుప్రీతో భగవాన్ బ్రహ్మా
ప్రజానాం పతిరీశ్వరః ॥

తాత్పర్యము :- గొప్ప బాహువులు కల ఓ రామా! భగీరథుడు తపము చేయుచుండ వేల సంవత్సరములు కడచిపోయినవి. ప్రజాపతియు, ప్రభువును, సర్వాంతర్యామియును అగు బ్రహ్మదేవుడు ఆ రాజు యెడ సంతసించినవాడై

ప్రతిపదార్థము :- అతీతాని = కడచిపోయెను; మహాబాహః = గొప్ప భుజములు కలవాడా!; తస్య = ఆ; రాజ్ఞః = రాజునకు; మహాత్మనః = మహాత్మునకు; సుప్రీతః = చాలా సంతసించిన; భగవాన్ = భగవంతుడైన; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; ప్రజానామ్ = ప్రజలకు; పతిః = ప్రభువు; ఈశ్వరః = సర్వత్రా వ్యాపించినవాడు

1.42.15.అనుష్టుప్.

తతస్సురగుణైస్సార్థ
ముపాగమ్య పితామహః ।
భగీరథం మహాత్మానం
తప్యమానమథాబ్రవీత్ ॥

తాత్పర్యము :- పిదప బ్రహ్మ సకల దేవతలతో కలసి వచ్చి తపము చేయుచున్న మహాత్ముడైన భగీరథునితో ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- తతః = పిమ్మట; సుర = దేవతా; గణైః = గణముల; సార్థమ్ = సమూహముతో; ఉపాగమ్య = ఎదుటకువచ్చి; పితామహః = బ్రహ్మదేవుడు; భగీరథమ్ = భగీరథుని గూర్చి; మహాత్మానమ్ = మహాత్మునిని; తప్యమానమ్ = తపము ఒనరించుచున్నవానిని; అథా = ఇట్లు; అబ్రవీత్ = పలికెను

1.42.16.అనుష్టుప్.

భగీరథ మహాభాగ!
ప్రీతస్తేఽ హం జనేశ్వర! ।
తపసా చ సుతప్తేన
వరం వరయ సువ్రత!" ॥

తాత్పర్యము :- "గొప్ప అజృష్టవంతుడవైన భగీరథ మహారాజా! నీ గొప్ప తపస్సునకు సంతోషించితిని. ఓ సువ్రతుడా! వరము కోరుకొనుము, ఇచ్చెదను."

ప్రతిపదార్థము :- భగీరథ = ఓ భగీరథా! ఓ రాజా!; మహాభాగ = గొప్ప అజృష్టవంతుడ వైన; ప్రీతః = సంతసించితిని; తే = నీ యొక్క; అహమ్ = నేను; జనేశ్వర = రాజా; తపసా చ = తపస్సు చేత; సుతప్తేన = బాగా ఆచరించిన తపముచేత; వరమ్ = వరమును; వరయ = కోరుకొనుము; సువ్రత = మంచివ్రతము కలవాడా

1.42.17.అనుష్టుప్.

తమువాచ మహాతేజాః
సర్వలోకపితామహమ్ ।
భగీరథో మహాభాగః
కృతాంజలిరుపస్థితః ॥

తాత్పర్యము :- గొప్ప తేజస్సు గలవాడును, మహా భాగ్యవంతుడును అగు భగీరథుడు సకల జగత్తునకు పితామహుడైన బ్రహ్మను సమీపించి చేతులు రెండు జోడించి నమస్కరించి అతనితో ఇట్లు పలికెను..

ప్రతిపదార్థము :- తమ్ = ఆ; ఉవాచ = పలికెను; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; సర్వలోక పితామహమ్ = సకల జగత్తునకు పితామహుడైన; భగీరథః = భగీరథుడు; మహాభాగః = గొప్ప భాగ్యవంతుడు; కృతాంజలిః = చేతులు రెండు జోడించినవాడై; ఉపస్థితః = చేరువకు వెళ్ళి

1.42.18.అనుష్టుప్.

యది మే భగవన్! ప్రీతో
యద్యస్తి తపసః ఫలమ్ ।
సగరస్యాత్మజాస్సర్వే
మత్తస్సలిలమాప్నుయుః ॥

తాత్పర్యము :- "భగవంతుడా! నాపై నీకు అనుగ్రహము కలిగినయెడల, నా తపస్సునకు సత్ఫలము ఉన్నయెడల సగరుని కుమారు లందఱికి నా నుండి ఉదకములు ప్రాప్తించుగాక!

ప్రతిపదార్థము :- యది = అయితే; మే = నాకు; భగవన్ = భగవంతుడా; ప్రీతః = సంతసించిన; యద్యస్తి = ఉన్నట్లయితే; తపసః = తపస్సునకు; ఫలమ్ = ఫలము; సగరస్య = సగరుని యొక్క; ఆత్మజాః = కుమారులు; సర్వే = అందఱును; మత్తః = నా నుండి; సలిలమ్ = నీటిని; ఆప్నుయుః = పొందెదరు గాక

1.42.19.అనుష్టుప్.

గంగాయాస్సలిలక్లిన్నే
భస్మన్యేషాం మహాత్మనామ్ ।
స్వర్గం గచ్ఛేయురత్యన్తం
సర్వే మే ప్రపితామహాః ॥

తాత్పర్యము :- గంగాజలములచే వారి భస్మము తడుపబడి మహాత్ములైన నా ముత్తాతలు స్వర్గలోకమునకు శాశ్వత నివాసమునకై వెళ్ళెదరు గాక!

ప్రతిపదార్థము :- గంగాయాః = గంగానది యొక్క; సలిలః = జలములచే; క్లిన్నే = తడుపబడుచుండ; భస్మని = బూడిద; ఏషామ్ = ఈ; మహాత్మనామ్ = మహాత్ముల యొక్క; స్వర్గమ్ = సురలోకము గురించి; గచ్ఛేయుః = వెళ్ళెదరు గాక; అత్యంతమ్ = శాశ్వతముగా; సర్వే = అందఱు; మే = నా యొక్క; ప్రపితామహాః = ముత్తాతలు

1.42.20.అనుష్టుప్.

దేయా చ సన్తతిర్దేవ
నావసీదేత్కులం చ నః ।
ఇక్ష్వాకూణాం కులే దేవ
ఏష మేఽ స్తు వరః పరః" ॥

తాత్పర్యము :- ఓ దేవా! మా ఇక్ష్వాకు కులములో సంతతి కలుగవలెను. ఇక్ష్వాకుకులము అంతరించక ఉండు గాక! ఇది నా మరొక కోరిక."

ప్రతిపదార్థము :- దేయా చ = ఇవ్వదగినది; ; సన్తతిః = సంతానము; దేవ = ఓ దేవా; న అవసీదేత్ = నశింపకుండునుగాక; కులం = కులమును; ; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకువంశజుల యొక్క; కులే = కులములో; దేవ = భగవంతుడా; ఏష = ఇది; మే = నా; అస్తు = అగు గాక; వరః = వరము; పరః = ఇతరము

1.42.21.అనుష్టుప్.

ఉక్తవాక్యం తు రాజానం
సర్వలోకపితామహః ।
ప్రత్యువాచ శుభాం వాణీం
మధురాం మధురాక్షరామ్ ॥

తాత్పర్యము :- భగీరథుని పలుకులు విని ఆ రాజుతో సకలజగతికి పితామహుడైన బ్రహ్మ మంగళకరమైన కంఠశ్వరముతో మధుర పలుకుబడితో ఇట్లు బదులు చెప్పెను.

ప్రతిపదార్థము :- ఉక్తృ = చెప్పబడిన; వాక్యమ్ = పలుకులు గల; తు; రాజానం = రాజు గూర్చి; సర్వలోక = సమస్తలోకమునకు; పితామహః = తాత; ప్రతి ఉవాచ = బదులు చెప్పెను; శుభామ్ = మంగళకరమైన; వాణీమ్ = శబ్దముతో; మధురామ్ = మధురమైనది; మధురాక్షరామ్ = మధురమైన అక్షరములు కలది

1.42.22.అనుష్టుప్.

మనోరథో మహానేష
భగీరథ మహారథ! ।
ఏవం భవతు భద్రం తే
ఇక్ష్వాకుకులవర్దన! ॥

తాత్పర్యము :- “ఓ మహారథుడవైన భగీరథా! నీ కోరిక గొప్పకోరిక. అది నెరవేరుగాక! ఇక్ష్వాకుకులమును వర్ధింపజేయువాడా! నీకు మంగళము.

ప్రతిపదార్థము :- మనోరథః = కోరిక; మహాన్ = గొప్పది; ఏష = ఈ; భగీరథ = భగీరథుడా; మహారథ = మహారథుడా; ఏవమ్ = ఇట్లు; భవతు = అగుగాక; భద్రమ్ = మంగళము; తే = నీకు; ఇక్ష్వాకు కులవర్ధన = ఇక్ష్వాకు కులమును పెంపొందించువాడా

1.42.23.అనుష్టుప్.

ఇయం హైమవతీ గంగా
జ్యేష్ఠా హిమవతస్సుతా ।
తాం వై ధారయితుం శక్తో
హరస్తత్ర నియుజ్యతామ్ ॥

తాత్పర్యము :- హిమవంతుని జ్యేష్ఠపుత్రికయైన ఈ గంగను ధరించుటకు శక్తివంతుడు ఈశ్వరుడు మాత్రమే. అతడు ఈ కార్యములో నియోగించబడవలెను.

ప్రతిపదార్థము :- ఇయం = ఈ; హైమవతీ = హిమవంతునికి పుట్టినది; గంగా = గంగ; జ్యేష్ఠా = పెద్దది; హిమవత్ సుతా = హిమవంతుని కుమార్తెలలో; తామ్ = ఆమెను; ధారయితుమ్ = ధరించుటకు; శక్తః = సమర్థుడు; హరః = ఈశ్వరుడు; తత్ర = అచట; నియుజ్యతామ్ = నియమింపబడుగాక!

1.42.24.అనుష్టుప్.

గంగాయాః పతనం రాజన్!
పృథివీ న సహిష్యతి ।
తాం వై ధారయితుం వీర!
నాన్యం పశ్యామి శూలినః" ॥

తాత్పర్యము :- ఓ వీరుడా! క్రిందకు ఉరుకుచున్న గంగను భూమి వహించలేదు. దానిని ధరించుటకు ఈశ్వరుడు తప్ప వేఱొక సమర్థవంతుడు కనిపించడు."

ప్రతిపదార్థము :- గంగాయాః = గంగయొక్క; పతనమ్ = పడుటను; రాజన్ = ఓ రాజా!; పృథివీ = భూమి; న సహిష్యతి = సహింపజాలదు; తామ్ = అమెను; ధారయితుమ్ = వహించుటకు; వీర = పరాక్రమవంతుడా; న అన్యమ్ = ఇంకెవరిని; పశ్యామి = కనను; శూలినః = ఈశ్వరుని కంటె

1.42.25.అనుష్టుప్.

తమేవముక్త్వా రాజానం
గంగాం చాభాష్య లోకకృత్ ।
జగామ త్రిదివం దేవః
సహ దేవైర్మరుద్గణైః ॥

తాత్పర్యము :- సృష్టికర్త బ్రహ్మదేవుడు భగీరథునితో అట్లు గంగను గురించి తెలిపి, పిమ్మట దేవతలతోడను, మరుద్గణములతోడను స్వర్గమునకు వెడలెను.

ప్రతిపదార్థము :- తమ్ = ఆ; ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; రాజానమ్ = రాజును గూర్చి; గంగామ్ చ = గంగను గురించి కూడా; చ = కూడా; ఆభాష్య = ఉద్దేశించి మాటలాడి; లోకకృత్ = లోకమును సృష్టించు బ్రహ్మ; జగామ = వెళ్ళెను; త్రిదివమ్ = స్వర్గమును గూర్చి; దేవః = భగవంతుడు; సహ = సహితంగా; దేవైః = దేవతలతో; మరుద్గణైః = మరుద్గణములతో.

1.42.26.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
ద్విచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభైరెండవ [42] సర్గ సంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; ద్విచత్వారింశ [42] = ముప్పై ఒకటవ; సర్గః = సర్గ.

త్రిచత్వారింశః సర్గః

(43 - గంగావతరణము)

1.43.1.అనుష్టుప్.

దేవదేవే గతే తస్మిన్
సోంఽగుష్ఠాగ్రనిపీడితామ్ ।
కృత్వా వసుమతీం రామ!
సంవత్సరముపాసత ॥

తాత్పర్యము :- ఓ రామా! అట్లు బ్రహ్మదేవుడు వెళ్ళినపిదప, భూలోకములో భగీరథుడు ఏడాది పాటు కాలి బొటకనవేలు చివరను నొక్కిపెట్టి నిలుచుని తపస్సు చేసెను.

ప్రతిపదార్థము :- దేవదేవః = బ్రహ్మదేవుడు {దేవదేవుడు- దేవ దేవతలు అందరకు పతి}; గతే = వెళ్ళిన పిదప; తస్మిన్ = ఆ; సః = అతడు, భగీరథుడు; అంగుష్ఠా = బొటకనవేలు; అగ్రన్ = కొనను; నిపీడితామ్ = నొక్కిపెట్టిన దానిని; కృత్వా = చేసి; వసుమతీ = భూమండలమున; రామ = రాముడా; సంవత్సరమ్ = ఏడాదిపాటు; ఉపాసత = ఉపాసించెను.

1.43.2.అనుష్టుప్.

అథ సంవత్సరే పూర్ణే
సర్వలోకనమస్కృతః ।
ఉమాపతిః పశుపతీ
రాజానమిద మబ్రవీత్ ॥

తాత్పర్యము :- అట్లు ఏడాది గడచిన పిమ్మట, సకలలోకములచేత గౌరవింపబడెడి వాడు, ఉమాదేవి భర్త, సకల జీవజాలమునకు దిక్కు ఐన పరమశివుడు ఆ రాజు భగీరథునితో ఇట్లనెను.

ప్రతిపదార్థము :- అథ = పిమ్మట; సంవత్సరే = ఏడాదికాలము; పూర్ణే = నిండిన పిదప; సర్వలోకనమస్కృతః = శివుడు; ఉమాపతిః = శివుడు; పశుపతీ = శివుడు; రాజాన్ = రాజుగురించి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను.

 *గమనిక :- *- 1. సర్వలోకనమస్కృతుడు- సకల లోకములచేత నమస్కరింప బడువాడు, శివుడు, 2. ఉమాపతి- ఉమా(పార్వతీ) దేవి భర్త, శివుడు. 3. పశుపతి- వ్యుత్పత్తి. పశూనాం (స్థావర జంగమానాం) పతిః (దిక్కు}, స్థావర జంగమ జీవజాలము సమస్తమునకు శరణ్యుడు, శివుడు.

1.43.3.అనుష్టుప్.

ప్రీతఃస్తేఽ హం నరశ్రేష్ఠ!
కరిష్యామి తవ ప్రియమ్ ।
శిరసా ధారయిష్యామి
శైలరాజసుతా మహమ్॥

తాత్పర్యము :- “ఓ రాజా భగీరథ! నేను నీ తపస్సునకు మెచ్చితిని. నీ కోరిక తీర్చెదను. గంగను నా శిరస్సుమీద ధరించెదను” అని పరమేశ్వరుడు అనుగ్రహించెను.

ప్రతిపదార్థము :- ప్రీతః = సంతసించితిని; తే = నీఎడల; అహం = నేను; నరశ్రేష్ఠ = రాజా; కరిష్యామి = చేయగలను; తవ = నీకు; ప్రియమ్ = ఇష్టమైనది; శిరసా = తలపైన; ధారయిష్యామి = ధరించెదను; శైలరాజసుతామ్ = గంగను; అహమ్ = నేను. ”

 *గమనిక :- *- 1. నరశ్రేష్ఠుడు- మానవులలో అత్యున్నతుడు, రాజు. 2. శైలరాజసుత- శైలరాజ (హిమవంతుని) సుత (కుమార్తె), గంగ

1.43.4.అనుష్టుప్.

తతో హైమవతీ జ్యేష్ఠా
సర్వలోక నమస్కృతా ।
తదా సాఽ తిమహద్రూపం
కృత్వా వేగం చ దుస్సహమ్ ॥

తాత్పర్యము :- అటుపిమ్మట. మేనకా హిమవంతుల పెద్ద కుమార్తైన గంగాదేవి సర్వలోకములకు పూజనీయురాలు. అట్టి గంగ మిక్కిలి పెద్ద ధారయై పెనురూపము ధరించి ఆకాశమునుండి సహింపరాని మహావేగముతో భూమి మీదకు దుముకసాగెను.

ప్రతిపదార్థము :- తతః = పిమ్మట; హైమవతీజ్యేష్ఠా = గంగ; సర్వ = సకల; లోకః = లోకములయందు; నమస్కృతః = పూజింపబడునది; తదా = అప్పుడు; సా = తన; అతిమహత్ = చాలాగొప్పదైన; రూపం = రూపమును; కృత్వా = చేసి; వేగం = వేగమును; చ = మఱియు; దుస్సహమ్ = సహింపరానిది.

 *గమనిక :- *- హైమవతీజ్యేష్ఠ - హిమవంతుని కుమార్తెలలో పెద్దామె గంగాదేవి, రెండవ యామె పార్వతీదేవి.

1.43.5.అనుష్టుప్.

ఆకాశాదపత ద్రామ
శివే శివశిరస్యుత ।
అచిన్తయచ్చ సా దేవీ
గంగా పరమదుర్ధరా ॥

తాత్పర్యము :- శ్రీరామ! ఆకాశమునుండి వచ్చి పడుచున్న గంగ మహాపవిత్రమైన పరమేశ్వరుని మహామస్తకముపైన పడుచుండెను. తన విస్తార వేగమును భరించుట మిక్కిలి కష్టమని, ఆ మహాతల్లి గంగాదేవి, ఇట్లు తలచుచుండెను.

ప్రతిపదార్థము :- ఆకాశాత్ = ఆకాశమునుండి; అపతత్ = పడుచు, దూకుచు; రామ = రాముడా; శివే = పవిత్రమైన; శివశిరసి = పరమేశ్వరుని తలపైన; ఉత = పడెను; అచిన్తయన్ = ఆలోచించుకొనుచు; చ = మఱియు; సా = ఆ; దేవీగంగా = గంగాదేవి; పరమ = మిక్కిలి; దుర్ధరః = ధరించుటకు కష్టమైనది.

1.43.6.అనుష్టుప్.

విశామ్యహం హి పాతాళం
స్రోతసా గృహ్య శంకరమ్” ।
తస్యా వలేపనం జ్ఞాత్వా
క్రుద్ధస్తు భగవాన్ హరః ॥

తాత్పర్యము :- “నా ప్రవాహవేగముతో పరమేశ్వరుని కూడ పాతాళలోకమునకు తీసుకుపోయెదను”. ఇట్లు అనుకునుచున్న ఆ గంగాదేవి ఆలోచనాసరళి గ్రహించి, శంకరుడు కోపించెను.

ప్రతిపదార్థము :- విశామి = ప్రవేశించెదను; అహం = నేను; హి = తప్పక; పాతాళం = పాతాళలోకమునకు; స్రోతసా = నా ప్రవాహముచేత; గృహ్య = గ్రహించి; శంకరమ్ = పరమ శివుని; తస్యాః = ఆమెయొక్క; అవలేపనం = గర్వము; జ్ఞాత్వా = తెలిసి; క్రుద్ధః = కోపించెను; తు = మఱియు; భగవాన్ = భగవంతుడైన; హరః = శంకరుడు.

 *గమనిక :- *- భగవంతుడు- సంభర్తృత్వము, భర్తృత్వము, నేతృత్వము, గమయతృత్వము, స్రష్టృత్వము, సర్వశరీరత్వము, సర్వభూతాంతరాత్మత్వము, నిరస్త నిఖిలదోషత్వము, షాడ్గుణ్యపూర్ణత్వము మొదలుగా కల గుణములు కలవాఁడు భగవంతుఁడు., శ్రీ, వీర్యము, ఇచ్ఛ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మాహాత్మ్యము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము అను గుణములు సంపూర్ణంగా కలవాడు.

1.43.7.అనుష్టుప్.

తిరోభావయితుం బుద్ధిం
చక్రే త్రిణయనస్తదా ।
సా తస్మిన్ పతితా పుణ్యా
పుణ్యే రుద్రస్య మూర్ధని ॥

తాత్పర్యము :- ఆ త్రినేత్రుడు గర్విస్తున్న గంగను కనబడనీయక దాచివేయుదునని నిర్ణయించుకొనెను. అప్పుడు, పవిత్రురాలైన మహాతల్లి గంగాదేవి మహాపుణ్యాత్ముడైన పరమశివుని నడినెత్తిపైకి దూకెను.

ప్రతిపదార్థము :- తిరోభావయితుం = కనబడకుండ చేసెదనని; బుద్ధిం = మనసులో; చక్రే = చేసెను; త్రిణయనః = త్రినేత్రుడు; తదా = అప్పుడు; సా = ఆ; తస్మిన్ = ఆమె; పతితా = పడెను; పుణ్యా = పవిత్రురాలు; పుణ్యే = పుణ్యాత్ముడైన; రుద్రస్య = శివునియొక్క; మూర్ధని = నడినెత్తిపైన.

1.43.8.అనుష్టుప్.

హిమవత్ప్రతిమే రామ!
జటామణ్డలగహ్వరే ।
సా కథంచిన్మహీం గన్తుం
నాశక్నోద్యత్నమాస్థితా ॥

తాత్పర్యము :- నాయనా రామా! అట్లు పైనుండి దూకిన ఆకాశగంగ సరాసరి వచ్చివచ్చి, హిమవత్పర్వతములవలె ఉన్న ఆ మహారుద్రుని కొప్పు ముడి అనే గుహలో పడెను. అంతే, ఇంక ఎంత ప్రయత్నించినను ఆ కొప్పు నుండి బయటబడి భూమిని చేరుటకు ఏ దారియు దొరకని అశక్తురాలైనది.

ప్రతిపదార్థము :- హిమవత్ = హిమవత్పర్వతాలను; ప్రతిమే = సరిపోలెడి; రామ = రాముడా; జటామణ్డలః = కొప్పుముడి; గహ్వరే = మధ్యగుహలో; సా = ఆ గంగ; కథంచిత్ = ఏవిధముగను; మహీం = భూమిని; గన్తుమ్ = చేరుట; న = కాలేదు; అశక్నోత్ = సమర్థురాలు; యత్నమ్ = ప్రయత్నములను; ఆస్థితా = అవలంబించినను.

1.43.9.అనుష్టుప్.

నైవ నిర్గమనం లేభే
జటామణ్డలమోహితా ।
తత్రైవాబమ్భ్రమద్దేవీ
సంవత్సరగణాన్ బహూన్ ॥

తాత్పర్యము :- జుట్టుముడి వెంట్రుకల మెలికలమధ్య మోహితురాలై బయటకు పోవుదారి ఏదియు కూడ దొరకలేదు. అనేక ఏళ్ళూపూళ్ళూ గడిచిపోయినా ఆ గంగాదేవి అక్కడికక్కడే తిరుగుచుండెను.

ప్రతిపదార్థము :- న = లేదు; ఇవ = ఐనా; నిర్గమనం = బయటకుదారి; లేభే = లభించుట; జటామణ్డల = జుట్టుముడి వెంట్రుకల మెలికలమధ్య; మోహితా = మోహితురాలై; తత్రైవా = ఆక్కడికక్కడే; బమ్భ్రమత్ = మిక్కిలి తిరిగినది ఆయెను; దేవీ = గంగాదేవి; సంవత్సర = ఏళ్ళు; గణాన్ = సమూహాలు; బహూన్ = అనేకము.

1.43.10.అనుష్టుప్.

తామపశ్యన్ పునస్తత్ర
తపః పరమమాస్థితః ।
అనేన తోషితశ్చాభూత్
అత్యర్థం రఘునన్దన! ॥

తాత్పర్యము :- రఘురాముడా! గంగాదేవి కనబడకపోవుటచే భగీరథుడు మరల అక్కడ గొప్ప తపస్సు ఆరంభించెను. ఆ శంకరదేవుడు దానికి మిక్కిలి సంతోషించెను.

ప్రతిపదార్థము :- తామ్ = తను గంగా; అపశ్యన్ = కనబడకపోవుటచే; పునః = మరల; తత్ర = అక్కడ; తపః = తపస్సు; పరమమ్ = గొప్పదైన; ఆస్థితః = అవలంబించెను (భగీరథుడు); అనేన = దానికి (ఆ తపస్సునకు); తోషితః = సంతోషించినవాడు; ; ఆభూత్ = ఆయెను; అత్యర్థం = అధికమైన విధముగ; రఘునన్దన = రాముడా, రఘురామ.

1.43.11.అనుష్టుప్.

విససర్జ తతో గంగాం
హరో బిన్దుసరః ప్రతి ।
తస్యాం విసృజ్యమానాయాం
సప్త స్రోతాంసి జజ్ఞిరే ॥

తాత్పర్యము :- అటుపిమ్మట, పరమశివుడు గంగను బిందుసరోవరము దిక్కుగా వదిలెను. అట్లు శివుని జటాజూటము నుండి సన్నగా విడువబడిన గంగ ఏడు పాయలుగా వెలువడెను.

ప్రతిపదార్థము :- విససర్జ = విడిచెను; తతః = పిమ్మట; గంగామ్ = గంగను; హరః = హరుడు; బిన్దుసరః = బిందుసరోవరము; ప్రతి = వైపు; తస్యాం = ఆమె; విసృజ్యమానాయాం = విడువబడుతుండగా; సప్త = ఏడు; స్రోతాంసి = పాయలుగా; జజ్ఞిరే = వెలువడెను.

1.43.12.అనుష్టుప్.

హ్లాదినీ పావనీ చైవ
నళినీ చ తథాఽ పరా ।
తిస్రః ప్రాచీం దిశం జగ్ముః
గంగాశ్శివజలాశ్శుభాః ॥

తాత్పర్యము :- అట్లు శివజటాజూటమునుండి మూడు పాయలు హ్లాదిని, పావని, నళిని మఱి నాలుగు కలిసి ఏడు పాయలుగా బయటబడినవి. ఆ మూడు పాయలు మంగళప్రదములు, శుభకరములు ఐన గంగలు తూర్పుదిక్కు వైపు ప్రవహించినవి.

ప్రతిపదార్థము :- హ్లాదినీ = హ్లాదినియు; పావనీ = పావనియు; చైవ = ఇంకను; నళినీ = నళినియు; చ = మఱియు; తథాః = వాటికంటె; అపరా = ఇతరులు; తిస్రః = మూడును (ఆ నాలుగులోను); ప్రాచీమ్ = తూర్పు; దిశమ్ = దిక్కువైపు గురించి; జగ్ముః = వెళ్ళినవి; గంగాః = గంగలు; శివ = మంగళప్రదమైన; జలాః = జలములు, ప్రవాహములు; శుభాః = శుభకరమైనవి.

1.43.13.అనుష్టుప్.

సుచక్షుశ్చైవ సీతా చ
సిన్ధుశ్చైవ మహానదీ ।
తిస్రస్త్వేతా దిశం జగ్ముః
ప్రతీచీం తు శుభోదకాః ॥

తాత్పర్యము :- సుచక్షువు, సీత, సింధు అను ఈ మూడు నదులు పశ్చిమ దిక్కువైపు ప్రవహించినవి.

ప్రతిపదార్థము :- సుచక్షుః = సుక్షువు; చైవ = ఇంకను; సీతాః = సీతయు; చ = మఱియు; సిన్ధుః = సింధు; చైవ; మహానదీ = మహానదులుగ; తిస్రః = మూడును; ఏతా = ఈ; దిశం = దిక్కువైపునకు; జగ్ముః = వెళ్ళినవి; ప్రతీచీం = పడమర; తు; శుభః = శుభకరమైన; ఉదకాః = జలములతో.

1.43.14.అనుష్టుప్.

సప్తమీ చాన్వగాత్తాసాం
భగీరథమథో నృపమ్ ।
భగీరథోఽ పి రాజర్షిః
దివ్యం స్యన్దనమాస్థితః ॥

తాత్పర్యము :- మిగిలిన ఏడవ గంగా ప్రవాహము / నది భగీరథమహారాజును అనురించెను. రాజర్షి ఐన భగీరథుడు గొప్ప రథమును ఎక్కి వెళ్ళుచుండగ గంగ అతనిని అనుసరించెను.

ప్రతిపదార్థము :- సప్తమీ = ఏడవది; ; అన్వగాత్ = అనుసరించెను; తాసాం = వాటిలో; భగీరథమ్ = భగీరథుని; అథో = మఱియు; నృపమ్ = రాజ; భగీరథః = భగీరథుడు; అపి = కూడా; రాజర్షిః = రాజ ఋషి; దివ్యం = భవ్యమైనది; స్యన్దనమ్ = రథమును; ఆస్థితః = ఎక్కినవాడు.

1.43.15.అనుష్టుప్.

ప్రాయాదగ్రే మహాతేజా
గంగా తం చాప్యనువ్రజత్ ।
గగనాచ్ఛంకరశిరః
తతో ధరణిమాశ్రితా ॥

తాత్పర్యము :- ముందు మహాతేజశ్శాలి ఐన భగీరథుడు వెడలుచుండ, ఆయనను గంగాప్రవాహము అనుసరించుచుండెను. మొదట, ఆకాశమునుండి శివుని శిరస్సు చేరినది. అక్కడనుండి భూలోకములో నేలమీదకు చేరినది.

ప్రతిపదార్థము :- ప్రాయాత్ = వెళ్లెను; అగ్రే = ముందుగా; మహాతేజా = గొప్పతేజశ్శాలి; గంగా = గంగా ప్రవాహము; తం = అతనిని; చాపి = కూడా; అనువ్రజత్ = అనుసరించెను; గగనాత్ = ఆకాశమునుండి; శంకర = పరమశివుని; శిరః = శిపస్సు; తతః = అచటనుండి; ధరణిమ్ = నేలను; ఆశ్రితా = చేరినది.

1.43.16.అనుష్టుప్.

వ్యసర్పత జలం తత్ర
తీవ్రశబ్దపురస్కృతమ్ ।
మత్స్యకచ్ఛపసంఘైశ్చ
శింశుమారగణైస్తదా
పతద్భిః పతితైశ్చాన్యైః
వ్యరోచత వసున్ధరా ॥

తాత్పర్యము :- అక్కడ, పెద్ద పెద్ద చప్పుడులు చేయుచు ఆ గంగనీరు వ్యాపించసాగెను. అప్పుడు అనేకమైన గుంపులు గుంపుల చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు ఇంకను అనేకమైనవి ఆ గంగనీటితో పాటు నేలమీద పడెను. ఆ కాంతులతో భూమండలము మెఱిసిపోవుచుండెను,

ప్రతిపదార్థము :- వ్యసర్పత = వ్యాపించెను; జలం = నీటిప్రవాహము; తత్ర = అక్కడ; తీవ్ర = గట్టిగా వినబడు; శబ్దః = ధ్వని; పురస్కృతమ్ = కూడిఉన్నది; మత్స్య = చేపలు కచ్ఛప = తాబేళ్ళు; సంఘాః = సమూహములు; చ = ఇంకను; శింశుమార = మొసళ్ళ; గణాః = సమూహములు; తదా = అప్పుడు; పతద్భిః = పడుచుండెను; పతితైః = పడెను; చ = ఇంకను; అన్యైః = ఇతరములు; వ్యరోచత = మిక్కిలి ప్రకాశించెను; వసున్ధరా = భూమండలము; .

1.43.17.అనుష్టుప్.

తతో దేవర్షిగన్ధర్వా
యక్షాస్సిద్ధగణాస్తదా ।
వ్యలోకయన్త తే తత్ర
గగనాద్గాం గతాం తథా ॥

తాత్పర్యము :- అప్పుడు అక్కడ, ఎందరో దేవర్షులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు గుంపులు కట్టి వచ్చిరి. అప్పుడు, వారందరు అట్లు ఆకాశమునుండి భూమిమీద పడుచున్న ఆ గంగను ఆశ్చర్యపోవుచు వీక్షించసాగిరి.

ప్రతిపదార్థము :- తతః = అక్కడ; దేవర్షి = దేవర్షుల; గన్ధర్వా = గంధర్వుల; యక్షా = యక్షుల; సిద్ధ = సిద్దుల; గణాః = సమూహములు; తదా = అప్పుడు; వ్యలోకయన్త = ఆశ్చర్యముగ చూచిరి; తే = వారు; తత్ర = అక్కడ; గగనాత్ = ఆకాశమునుండి; గామ్ = భూమిని; గతామ్ = పొందినదానిని; తథా = అప్పుడు.

1.43.18.అనుష్టుప్.

విమానైర్నగరాకారైః
హయైర్గజవరైస్తదా ।
పారిప్లవగతైశ్చాపి
దేవతాస్తత్ర విష్ఠితాః ॥

తాత్పర్యము :- అప్పుడు, నగరములంత పెద్ద విమానములెక్కి, శ్రేష్ఠమైన గుఱ్ఱములు, ఏనుగులు ఎక్కి వచ్చిన దేవతలందరు వేగిరిపాటుతో అక్కడ నిలబడి చూచుచున్నారు..

ప్రతిపదార్థము :- విమానై = విమానములతోను; నగర = నగరముల; ఆకారైః = వంటి ఆకారములు కలవి; హయైః = గుఱ్ఱములతోను; గజ = ఏనుగులతోను; వరైః = శ్రేష్ఠమైన; తదా = అఫ్పుడు; పారిప్లవ = వేగిరిపాటు; గతైః = చెందినవారై; చాపి = మఱియు; దేవతాః = దేవతలు; తత్ర = అక్కడ; విష్ఠితాః = నిలిచిరి.

1.43.19.అనుష్టుప్.

తదద్భుతతమం లోకే
గంగాపతనముత్తమమ్ ।
దిదృక్షవో దేవగణాః
సమీయురమితౌజసః ॥

తాత్పర్యము :- సకలలోకములలోను పరమాద్భుతమైనయట్టిది ఆ గొప్ప గంగాపతనము. అమితమైన శోభావికాసముల తేజస్సుగల ఆ దేవతాగణములు గంగాపతరణము దర్శించుటకు విచ్చేసిరి.

ప్రతిపదార్థము :- తత్ = ఆయొక్క; అద్భుతతమం = పరమాద్భుతము; లోకే = సకలలోకములలోను; గంగా = గంగ; పతనమ్ = పడుటను; ఉత్తమమ్ = ఉత్తమమైన; దిదృక్షవః = చూడగోరువారై; దేవ = దేవతా; గణాః = సమూహములు; సమీయుః = సమీపించిరి; అమితః = మిక్కిలి; ఓజసః = తేజస్సుగల.

 *గమనిక :- *- అద్భుతము- అద్భుతతరము- అద్భుతతమము.

1.43.20.అనుష్టుప్.

సమ్పతద్భిస్సురగణైః
తేషాం చాభరణౌజసా ।
శతాదిత్యమివాభాతి
గగనం గతతోయదమ్ ॥

తాత్పర్యము :- అట్లు విచ్చేయుచున్న దేవతలు అందరు గుంపులుకట్టి వచ్చుచుండ, వారు ధరించిన ఆభరణముల ప్రకాశములు మేఘములు లేని స్వచ్ఛమైన ఆకాశములో వందమంది సూర్యుల వలె మెఱయుచుండెను.

ప్రతిపదార్థము :- సమ్పతద్భిః = వేగముగ వచ్చుచున్న; సుర = దేవతల; గణైః = గుంపులు; తేషామ్ = ఆ యొక్క; ; ఆభరణః = ఆభరణముల; ఓజసా = ప్రకాశముచేతను; శతః = వందమంది; ఆదిత్యమ్ = సూర్యుల; ఇవ = వలె; ఆభాతి = ప్రకాశించుచున్నది; గగనం = ఆకాశము; గత = తొలగిన; తోయదమ్ = మేఘములు కలది.

1.43.21.అనుష్టుప్.

శింశుమారోరగగణైః
మీనైరపి చ చంచలైః ।
విద్యుద్భిరివ విక్షిప్తం
ఆకాశమభవత్తదా॥

తాత్పర్యము :- ఆ జలములలో గుంపులు గుంపులుగా చంచలముగా మెసలు మొసళ్ళు సర్పములు చేపలు మొదలగు జలచరములతో ఆకాశమంతయు మెఱుపులు వ్యాపించినట్లు కనబడుచుండెను.

ప్రతిపదార్థము :- శింశుమారః = మొసళ్ళ; ఉరగ = సర్పముల; గణైః = గుంపులు; మీనైః = చేపల; అపి = వలె; చ = కూడా; చంచలైః = చంచలములైన; విద్యుద్భిః = మెఱుపులచే; ఇవ = వలె; విక్షిప్తమ్ = వ్యాప్తమైనది; ఆకాశమ్ = గగనము; అభవత్ = ఆయెను; తదా = అప్పుడు.

1.43.22.అనుష్టుప్.

పాణ్డరైస్సలిలోత్పీడైః
కీర్యమాణైః సహస్రధా ।
శారదాభ్రైరివాకీర్ణం
గగనం హంససమ్ప్లవైః ॥

తాత్పర్యము :- వేలవేల విధములుగ చిమ్మబడుచున్న తెల్లని నీటితుంపరలతో, ఆకాశము శరత్కాలపు మేఘములు కమ్మినట్లు, ఎగురుచున్న హంసలు గుంపులు గుంపులుగా వ్యాపించినట్లు ఆయెను.

ప్రతిపదార్థము :- పాణ్డరైః = తెల్లని; సలిలోత్పీడైః = నీటిబిందువులతో; కీర్యమాణైః = చిమ్మబడుచున్న; సహస్రధా = వేలవిధముగ; శారదాః = శరత్కాలపు; అభ్రైః = మేఘముల; ఇవ = వలె; ఆకీర్ణం = వ్యాపించి ఉండెను; గగనమ్ = ఆకాశము; హంస = హంసలచే; సమ్ప్లవైః = సంపత్కరమైన.

1.43.23.అనుష్టుప్.

క్వచిద్ద్రుతతరం యాతి
కుటిలం క్వచిదాయతమ్ ।
వినతం క్వచిదుద్భూతం
క్వచిద్యాతి శనైశ్శనైః ॥

తాత్పర్యము :- ఇంకను ఆ గంగాప్రవాహము కొన్ని చోట్ల వేగముగా ప్రవహించుచుండెను. కొన్నిచోట్ల సుళ్ళుతిరుగుచుండెను. అట్లు ప్రవాహము ముందుకు సాగుచుండెను. ఒక్కొకచోట ఒక్కోరకముగ వంకర దారిలో పోవుట, ఉబుకుతున్నట్లు కనబడుట, నీరు మెల్లమెల్లగా జారుచున్నట్లు చూపట్టుచు ప్రవహించుచుండెను.

ప్రతిపదార్థము :- క్వచిత్ = కొన్నిచోట్ల; ధ్రుతతరమ్ = బహుశీఘ్రముగ; యాతి = ప్రవహించిచున్నది; కుటిలమ్ = వంకర్లు తిరుగుచు; క్వచిత్ = కొన్నిచోట్ల; ఆయతమ్ = దీర్ఘముగా; వినతం = వంగి; క్వచిత్ = కొన్నిచోట్ల; ఉద్భూతమ్ = ఉబుకుచు; క్వచిత్ = కొన్నిచోట్ల; యాతి = వెళ్ళుచున్నది; శనైః శనైః = మెల్లమెల్లగా.

1.43.24.అనుష్టుప్.

సలిలేనైవ సలిలం
క్వచిదభ్యాహతం పునః ।
ముహురూర్ధ్వముఖం గత్వా
పపాత వసుధాతలమ్ ॥

తాత్పర్యము :- వేఱు వేఱు ప్రవాహములు ఒకదానినొకటి గుద్దుకునుచు, మఱల మీదకు పోవుచు, క్రిందికి నేలపైకి దుముకుచుండెను.

ప్రతిపదార్థము :- సలిలేన = నీటిచేత; ఇవ = మాత్రమే; సలిలం = నీరు; క్వచిత్ = కొన్నిమార్లు; అభ్యాహతం = కొట్టబడినదై; పునః = మరల; ముహుర్ = మాటిమాటికి; ఊర్ధ్వముఖం = పైకి; గత్వా = పోయి, చిమ్మి; పపాత = పడుచుండెను; వసుధాతలమ్ = నేలమీదను.

1.43.25.అనుష్టుప్.

తచ్ఛంకరశిరోభ్రష్టం
భ్రష్టం భూమితలే పునః ।
వ్యరోచత తదా తోయం
నిర్మలం గతకల్మషమ్ ॥

తాత్పర్యము :- అట్లు ఆ మహేశ్వరుని జటాజూటమునుండి జారి నేలపై పడు ఆ జలములు, కాలుష్యములు ఏమియు లేని శుభ్రమైనవి.ముఱికి మడ్డి ఏమాత్రము లేని నిర్మలమైనవి. (పైగా శివజటాజూటనిర్గతమైనది) అయిన ఆ జలము అప్పుడు బాగా మెఱిసిపోవుచున్నది.

ప్రతిపదార్థము :- తత్ = ఆ; శంకర = పరమశివుని; శిరః = శిరస్సునుండి; భ్రష్టమ్ = జారిపడినది; భ్రష్టమ్ = పడిపోవుచున్నది; భూమితలే = నేలమీదకు; పునః = మఱల; వ్యరోచత = మిక్కిలి మెఱిసిపోవుచున్నది; తదా = అప్పుడు; తోయమ్ = నీరు; నిర్మలమ్ = నిర్మలమైనది; గతకల్మషమ్ = కాలుష్యరహితమైనది.

 *గమనిక :- *- 1. నిర్మలము- మలము- ముఱికి, మడ్డి నిర్ లేనిది, స్వచ్ఛమైన జలము. 2. గతకల్మషము- కల్మషము- అనారోగ్య పదార్థముల వలన రంగు, రూపము, వాసనలలో మార్పుకు లోనైనది గత పోయినది/ లేనిది, శుభ్రమైన జలము}

1.43.26.అనుష్టుప్.

తత్ర దేవర్షిగన్ధర్వా
వసుధాతలవాసినః।
భవాంగపతితం తోయం
పవిత్రమితి పస్పృశుః ॥

తాత్పర్యము :- దేవతలు, ఋషులు, భూలోకవాసులు అనగా , మానవులు చరాచరులసహితముగ అక్కడకు చేరి, ఆ విధముగా శివదేహస్పర్శచే పవిత్రమైన గంగను స్పృశించిరి.

ప్రతిపదార్థము :- తత్ర = అక్కడ; దేవ = దేవతలు; ఋషి = ఋషులు; గన్ధర్వాః = గంధర్వులు; వసుధాతలవాసినః = భూలోకవాసులు; భవః = శివుని; అంగ = దేహస్పర్శతో; పతితమ్ = పడిన; తోయమ్ = నీరు; పవిత్రమ్ = పవిత్రమైనది; ఇతి = ఇది; పస్పృశుః = స్పృశించిరి.

1.43.27.అనుష్టుప్.

శాపాత్ప్రపతితా యే చ
గగనాద్వసుధాతలమ్ ।
కృత్వా తత్రాభిషేకం తే
బభూవుర్గతకల్మషాః ॥

తాత్పర్యము :- ఎటువంటి శాపములకు లోనైన వారైనను ఆకాశమునుండి భువికి పడివచ్చినచో వారు ఆ గంగలో స్నానములు చేసినయెడల, వారి కల్మషములన్ని తొలగి పరిశుద్దులు అగుదురు.

ప్రతిపదార్థము :- శాపాత్ = శాపమువలన; ప్రపతితాః = పడినవారు; యేచ = ఎవరైతోవారు; గగనాత్ = ఆకాశమునుండి; వసుధాతలమ్ = నేలను; కృత్వా = చేసి; తత్ర = అక్కడ; అభిషేకమ్ = స్నానములు; తే = వారు; బభూవుః = అగుదురు; గతకల్మషాః = కల్మములు పోయినవారు, పరిశుద్దులు.

1.43.28.అనుష్టుప్.

ధూతపాపాః పునస్తేన
తోయేనాథ సుభాస్వతా ।
పునరాకాశమావిశ్య
స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే ॥

తాత్పర్యము :- అందుచేత ఆ జలములచే పాపములన్నియు తొలగిపోయి పుణ్యాత్ములై చక్కగా ప్రకాశించిరి. అంతేకాక వారు మఱల ఆకాశమునకు చేరి తమ తమ లోకములను పొందిరి.

ప్రతిపదార్థము :- ధూతపాపాః = పోయినపాపములు కలవారు, పుణ్యాత్ములు; పునః = మరల; తేన = అందుచేత; తోయేః = నీరువలన; అథ = పిమ్మట; సుభాస్వతా = చక్కగా ప్రకాశించిరి; పునః = మఱల; ఆకాశమ్ = స్వర్గలోకములను; ఆవిశ్య = ప్రవేశించి; స్వాన్ = తమతమ; లోకాన్ = లోకములను; ప్రతిపేదిరే = పొందిరి.

1.43.29.అనుష్టుప్.

ముముదే ముదితో లోకః
తేన తోయేన భాస్వతా ।
కృతాభిషేకో గంగాయాం
బభూవ విగతక్లమః ॥

తాత్పర్యము :- హర్షకారకమైన ఆ ప్రకాశవంతమైన జలములందు స్నానమాచరించి జనులందరు సంతసించిరి. ఆ గంగానదిలో స్నానములు చేయుటచే, వారి శ్రమలు తొలగిపోయెను.

ప్రతిపదార్థము :- ముముదే = హర్షకారకమైన; ముదితః = హర్షించిరి; లోకః = జనులందరు; తేన = వారు; తోయేన = జలములచే; భాస్వతా = ప్రకాశించుచున్న; కృతాః = చేసినవారై; అభిషేకః = స్నానములు; గంగాయామ్ = గంగానదిలో; బభూవ = ఐరి; విగత = తొలగిన; క్లమః = శ్రమకలవారు.

1.43.30.అనుష్టుప్.

భగీరథోఽ పి రాజర్షిః
దివ్యం స్యన్దనమాస్థితః ।
ప్రాయాదగ్రే మహాతేజాః
తం గంగా పృష్టతోఽ న్వగాత్ ॥

తాత్పర్యము :- మహాశ్రేష్ఠమైన రథమెక్కి భగీరథ రాజర్షి ముందునకు ప్రయాణము కొనసాగించుచుండెను. వారిని వెన్నంటి గంగాప్రవాహము అనుసరించసాగెను.

ప్రతిపదార్థము :- భగీరథః= భగీరథులవారు; అపి= ఇంకను; రాజర్షిః= రాజర్షి; దివ్యమ్= గొప్ప; స్యన్దనమ్= రథమును; ఆస్థితః= ఆసీనులై; ప్రాయాత్= వెళ్ళుచుండెను; అగ్రే= ముందు ; మహాతేజాః = గొప్పతేజశ్శాలి, భగీరుథుడు; తం = వారిని; గంగా= గంగాప్రవాహము; పృష్టతః= వెనుకనే; అన్వగాత్= అనుసరించెను.

 *గమనిక :- - 1) రాజర్షి- వ్యుత్పత్తి. రాజ+ఋషి, రాజా ఋషిః ఇవ శ్రేష్ఠత్వాత్ సంయతత్వాత్, ఋషివలె సంయమనం కలిగిన రాజు, తపస్సు చేయుటచేసిన రాజు, రాజర్షి., 2) శ్లోకము1.43.14. మూడు నాలుగు పాదాలు మఱియు శ్లోకము1.43.15. మొదటి రెండవ పాదములకు ప్రతిరూపమువలె ఇందు 1.43.30. లో అందించబడినది. అందు “తం చ అప్యనువ్రజత్” అన్నారు. ఇక్కడ 1.43.30లో “పృష్టతో అన్వగాత్“ అన్నారు. రెండు భావాలకు సామ్యం ఉంది. ఇది ప్రవాహము బహుళ దూరములు సాగి ఇంకను కొనసాగుచున్నటుల వత్తి చెప్పుట సూచించుచున్నది.

1.43.31.అనుష్టుప్.

దేవాస్సర్షిగణాస్సర్వే
దైత్యదానవరాక్షసా ।
గన్ధర్వయక్షప్రవరాః
సకిన్నరమహోరగాః ॥

తాత్పర్యము :- దేవతలు ఋషుల సంఘములు అన్నిటితో సహితముగ; దైత్యుల, దానవుల, గంధర్వుల, యక్షుల, కిన్నర, నాగశ్రేష్ఠుల సహితముగ;

ప్రతిపదార్థము :- దేవాః = దేవతలు; స = సహితముగ; ఋషి = ఋషుల; గణాః = సమూహముల; సర్వే = అందరిని; దైత్య = దైత్యుల; దానవ = దానవుల; రాక్షసా = రాక్షసుల; గన్ధర్వ = గంధర్వుల; యక్ష = యక్షుల; ప్రవరాః = వంశస్థులవారు; స = సహితముగ; కిన్నర = కిన్నరలు; మహోరగాః = గొప్పనాగములు.

1.43.32.అనుష్టుప్.

సర్వాశ్చాప్సరసో రామ!
భగీరథరథానుగామ్ ।
గంగామన్వగమన్ ప్రీతాః
సర్వే జలచరాశ్చ యే ॥

తాత్పర్యము :- ఓ రామా! ఇంకను అప్సరసలు అందరు, సకల జలచరములు కూడ భగీరథుని రథమును, గంగాప్రవాహముతో (ఇంకను బహుళ దూరము పాటు) అనుసరించసాగెను.

ప్రతిపదార్థము :- సర్వాః = అందరు; చ = ఇంకను; అప్సరసః = అప్సరసలు; రామ = రాముడా; భగీరథః = భగీరథుని; రథాః = రథమును; అనుగామ్ = అనుసరించెను; గంగామ్ = గంగాప్రవాహము; అన్వగమన్ = అనుసరించెను; ప్రీతాః = సంతోషించినవారై; సర్వే = సకల; జలచరాః = జలచరమలు; చ = కూడ; యే = ఏ.

1.43.33.అనుష్టుప్.

యతో భగీరథో రాజా
తతో గంగా యశస్వినీ ।
జగామ సరితాం శ్రేష్ఠా
సర్వపాపవినాశినీ ॥

తాత్పర్యము :- భగీరథుడు ఎటు వెళ్ళిన అటు యశోమయి, నదులలో ఉత్తమురాలు, సమస్తపాపములను దుంపనాశనము చేయునది యైన గంగా ప్రవహము వెడలసాగెను.

ప్రతిపదార్థము :- యతః = ఎటు; భగీరథః = భగీరథుడు; రాజా = రాజు; తతః = అక్కడ; గంగా = గంగానది; యశస్వినీ = ప్రసిద్దురాలు; జగామ = వెళ్ళెను; సరితాం = నదులలో; శ్రేష్ఠా = ఉత్తమమైనది; సర్వ = సమస్తమైన; పాప = పాపములను; వినాశినీ = పూర్తిగా నశింపజేయునది.

1.43.34.అనుష్టుప్.

తతో హి యజమానస్య
జహ్నోరద్భుతకర్మణః ।
గంగా సమ్ప్లావయామాస
యజ్ఞవాటం మహాత్మనః ॥

తాత్పర్యము :- అటు పిమ్మట, యజ్ఞము చేయుచున్న, కర్మలు అద్భుతముగ ఆచరించువాడు, మహాత్ముడు ఐన జహ్నుమహర్షి యొక్క యాగవేదికకు, వెళ్ళి వెళ్ళి తన జలములతో దానిని ముంచివేసెను.

ప్రతిపదార్థము :- తతః = పిమ్మట; హి; యజమానస్య = యజ్ఞముచేయుచున్న; జహ్నోః = జహ్నుమహర్షియొక్క; అద్భుతకర్మణః = అద్భుతమైన కర్మలు చేయువాడు; గంగా = గంగాప్రవాహము; సమ్ప్లావయామాస = ముంచివేసెను; యజ్ఞవాటం = యజ్ఞవేదికను; మహాత్మనః = మహాత్ముని యొక్క.

1.43.35.అనుష్టుప్.

తస్యా వలేపనం జ్ఞాత్వా
క్రుద్ధో జహ్నుశ్చ రాఘవ! ।
అపిబచ్చ జలం సర్వం
గంగాయాః పరమాద్భుతమ్ ॥

తాత్పర్యము :- ఓరఘురామా! గంగ దర్పముతో తన ఆశ్రమమును ముంచివేయుట కనుగొనిన మహర్షి జహ్నువు కోపగించి, గంగాప్రవాహములో వచ్చుచున్న నీటిని అంతయు తాగివేసెను.

ప్రతిపదార్థము :- తస్య = ఆమెయొక్క; అవలేపనం = గర్వము; జ్ఞాత్వా = తెలిసి; క్రుద్ధో = కొపించిన; జహ్నుః = జహ్నువు; చ = నిశ్చయవాచకము; రాఘవ = రఘురాముడా; అపిబత్ = తాగివేసెను; జలం = నీరును; సర్వం = అంతటిని; గంగాయాః = గంగాప్రవాహపు; పరమాద్భుతమ్ = పరమ అద్భుతముగా.

1.43.36.అనుష్టుప్.

తతో దేవాస్సగన్ధర్వా
ఋషయశ్చ సువిస్మితాః ।
పూజయన్తి మహాత్మానం
జహ్నుం పురుషసత్తమమ్ ॥

తాత్పర్యము :- అంతట, దేవతలు గంధర్వులు, ఋషులతో సహితముగ మిక్కిలి అబ్బురపడిరి. మహాసమర్థుడు, మహాత్ముడు ఐన మహర్షి జహ్నువును పూజించిరి.

ప్రతిపదార్థము :- తతః = పిమ్మట; దేవా = దేవతలు; స = సహితముగ; గన్ధర్వా = గంధర్వులు; ఋషః = ఋషులు; చ = కూడ; సు = బాగుగ; విస్మితాః = ఆశ్చర్యపడినవారై; పూజయన్తి = పూజించిరి; మహాత్మానం = మహాత్ముని; జహ్నుమ్ = జహ్నువును; పురుషసత్తమమ్ = సమర్థుడైనవాని.

1.43.37.అనుష్టుప్.

గంగాం చాపి నయన్తి స్మ
దుహితృత్వే మహాత్మనః ।
తతస్తుష్టో మహాతేజాః
శ్రోత్రాభ్యామసృజత్ పునః ॥

తాత్పర్యము :- దేవతలు గంగను ఆ మహాత్ముడైన మహర్షి జహ్నువునకు కూతురుగా తలచి అట్లు నిశ్చయించిరి. దానితో మహాతేజశ్శాలి జహ్నువు తృప్తిచెంది, తన చెవుల ద్వారా గంగాజలములను మరల బయటకు వెలువరించెను.

ప్రతిపదార్థము :- గంగామ్ = గంగను; చ = కూడ; అపి = తప్పక; నయన్తి = పొందించిరి; స్మ = తలచి; దుహితృ = కుమార్తెనుగ; త్వే = అగుటను; మహాత్మనః = మహాత్ముని; తతః = అంతట; తుష్టోః = = తృప్తిచెందిన; మహాతేజాః = గొప్పతేజస్సు గలవాడు; శ్రోత్రాభ్యామ్ = చెవులనుండి; సృజత్ = పుట్టించెను; పునః = మరల.

1.43.38.అనుష్టుప్.

తస్మాజ్జహ్నుసుతా గంగా
ప్రోచ్యతే జాహ్నవీతి చ ।
జగామ చ పునర్గంగా
భగీరథ రథానుగా ॥

తాత్పర్యము :- అందుచేత గంగను జహ్నుసుత అనియు, జాహ్నవి అనియును పిలిచెదరు. అంత గంగాప్రవాహము మరల భగీరథుని రథమును అనుసరించసాగెను.

ప్రతిపదార్థము :- తస్మాత్ = అందుచేత; జహ్ను సుతా = జహ్నుసుత అని; గంగా = గంగానది; ప్రోచ్యతే = చెప్పబడుచున్నది; జాహ్నవి = జాహ్నవి; ఇతి = అని; చ = కూడ; జగామ = వెళ్ళెను; చ = కూడ; పునః = మరల; గంగా = గంగాప్రవాహము; భగీరథ = భగీరథుని; రథః = రథమును; అనుగా = అనుసరించి.

1.43.39.అనుష్టుప్.

సాగరం చాపి సమ్ప్రాప్తా
సా సరిత్ప్రవరా తదా ।
రసాతల ముపాగచ్ఛత్
సిద్ధ్యర్థం తస్య కర్మణః ॥

తాత్పర్యము :- భగీరథుని వెంట వెళ్ళిన ఆ నదులలో శ్రేష్ఠమైన గంగానది అంతట సముద్రమును చేరెను. అట్లు సగరపుత్రులను తరింపజేయుట అను పని సాధించుటకొఱకు గంగ పాతాళలోకమును చేరెను.

ప్రతిపదార్థము :- సాగరమ్ = సముద్రమును; , అపి = ఇంక; సమ్ప్రాప్తా = పొందెను, చేరెను; సా = ఆ; సరిత్+ప్రవరా = నదులలో శ్రేష్ఠమైనది; తదా = కూడ; రసాతలమ్ = పాతాళమును; ఉపాగచ్ఛత్ = పొందెను; సిద్ధ్యర్థం = సఫలమగుటకు; తస్య = ఆ; కర్మణః = పనియొక్క.

1.43.40.అనుష్టుప్.

భగీరథోఽ పి రాజర్షిః
గంగామాదాయ యత్నతః ।
పితామహాన్ భస్మకృతాన్
అపశ్యద్దీనచేతనః ॥

తాత్పర్యము :- రాజర్షి ఐన భగీరథుడు మిగుల కష్టపడి గంగను తోడ్కొనివచ్చి బుడిదరాసులై పడి ఉన్న తన తాతలను చూచి దుఃఖితుడు ఆయెను.

ప్రతిపదార్థము :- భగీరథః = భగీరథుడు; అపి = ఐన; రాజర్షిః = రాజర్షి; గంగామ్ = గంగను; ఆదాయ = తీసుకువచ్చి; యత్నతః = ప్రయత్నముచే; పితామహాన్ = తాతలను; భస్మకృతాన్ = బూడిదగ చేయబడినవారిని; అపశ్యత్ = చూచెను; దీన = దీనమైన; చేతనః = మనసు కలవాడు.

1.43.41.అనుష్టుప్.

అథ తద్భస్మనాం రాశిం
గంగాసలిలముత్తమమ్ ।
ప్లావయద్ధూతపాప్మానః
స్వర్గం ప్రాప్తా రఘూత్తమ! ॥

తాత్పర్యము :- రామా! రఘువంశోత్తమ రామా! ఆతరువాత, శ్రేష్ఠమైన ఆ గంగాజలములు ఆ సగర పుత్రుల భస్మముల రాశులను ముంచి, తడిపి, వారి సకల పాపములను కడిగివేసి, వారిని పుణ్యాత్ములుగా చేసెను. దానితో వారు స్వర్గలోకమునకు వెళ్ళిరి.

ప్రతిపదార్థము :- అథ = పిమ్మట; తత్ = ఆ; భస్మనామ్ = బూడిదల; రాశిమ్ = రాశులను; గంగాసలిలమ్ = గంగాజలములు; ఉత్తమమ్ = శ్రేష్ఠమైనవి; ప్లావయత్ = తడిపి, ముంచి; ధూత = కడిగిన; పాప్మానః = పాపములుకలవారై; స్వర్గం = స్వర్గలోకమును; ప్రాప్తా = పొందిరి; రఘూత్తమ = రఘువంశోత్తముడా.

1.43.42.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
త్రిచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తము, మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి విరచితము ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [43] నలభైమూడవ సర్గ సమాప్తము.

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; త్రయాచత్వారింశ [43] = నలభై మూడవ; సర్గః = సర్గ.

।।చతుశ్చత్వారింశస్సర్గః।।

[44 సగరపుత్రుల పుణ్యలోక ప్రాప్తి]

1.44.1.అనుష్టుప్.

స గత్వా సాగరం రాజా
గంగయాఽ నుగతస్తదా ।
ప్రవివేశ తలం భూమేః
యత్ర తే భస్మసాత్కృతాః ॥

తాత్పర్యము :- గంగానది తనను అనుసరించి వస్తుండగా, భగీరథుడు సముద్ర తీరమునకు వెళ్ళెను. సగరకుమారులు భస్మీపటలమై పడిఉన్న ప్రదేశమునకు చేరెను.

ప్రతిపదార్థము :- సః = ఆ; గత్వా = వెళ్ళి; సాగరమ్ = సముద్రమునకు; రాజా = రాజా భగీరథ; గంగాయా = గంగచే; అనుగతః = అనుసరించబడి; తదా = అప్పుడు; ప్రవేవిశ = ప్రవేశించెను; తలమ్ = ప్రదేశమును; భూమేః = భూమి యొక్క; యత్ర = ఎక్కడ; తే = వారు; భస్మసాత్ = భస్మముగా; కృతాః = చేయబడియున్నారో.

1.44.2.అనుష్టుప్.

భస్మన్యథాఽఽ ప్లుతే రామ!
గంగాయాస్సలిలేన వై ।
సర్వలోకప్రభుర్బ్రహ్మా
రాజానమిదమబ్రవీత్ ॥

తాత్పర్యము :- సగరుల భస్మము రాశులు గంగాదేవి నీటితో పూర్తిగా తడిసినవి. బ్రహ్మదేవుడు భగీరథునితో ఇట్లు చెప్పెను.

ప్రతిపదార్థము :- భస్మని = ఆబూడిదలు; అథ = తరువాత; ఆప్లుతే = తడపబడగా; రామ = రామా; గంగాయాః = గంగ యొక్క; సలిలేనవై = నీటిచే; సర్వ = సమస్తమైన; లోకః = లోకములకు; ప్రభుః = ప్భువు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; రాజానమ్ = రాజా భగీరథునితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = అనెను.

1.44.3.అనుష్టుప్.

తారితా నరశార్దూల!
దివం యాతాశ్చ దేవవత్ ।
షష్టిః పుత్రసహస్రాణి
సగరస్య మహాత్మనః ॥

తాత్పర్యము :- గంగాజలముతో తడిసిన, మహాత్ముడైన సగరుని అరువదివేలమంది కుమారులు తరించి దేవతలవలె స్వర్గమునకు వెళ్ళిరి.

ప్రతిపదార్థము :- తారితాః = తరింప చేయబడిరి; నరశార్దూల = పురుషశ్రేష్ఠుడా; దివమ్ = స్వర్గమునకు; యాతాః = వెళ్ళిరి; చ = కూడ; దేవవత్ = దేవతల వలె; షష్ఠిః = అరవై; పుత్రః = కుమారులు; సహస్రాణి = వేల మంది; సగరస్య = సగరుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన.

1.44.4.అనుష్టుప్.

సాగరస్య జలం లోకే
యావత్ స్థాస్యతి పార్థివ ।
సగరస్యాత్మజాస్తావత్
స్వర్గే స్థాస్యన్తి దేవవత్ ॥

తాత్పర్యము :- రాజా భగీరథా! లోకములో సముద్రజలము ఉండునంతవరకు సగరకుమారులు దేవతలవలె స్వర్గములో ఉండెదరు.

ప్రతిపదార్థము :- సాగరస్య = సముద్రము యొక్క; జలమ్ = నీరు; లోకే = లోకములో; యావత్ = ఎప్పటి వరకు; స్థాస్యతి = ఉంటుందో; పార్థివ = రాజా; సగరస్యః = సగరుని; ఆత్మజాః = కుమారులు; తావత్ = అప్పటి వరకు; స్వర్గే = స్వర్గములో; స్థాస్యన్తి = ఉండెదరు; దేవవత్ = దేవతలవలె.

1.44.5.అనుష్టుప్.

ఇయం హి దుహితా జ్యేష్ఠా
తవ గంగా భవిష్యతి ।
త్వత్కృతేన చ నామ్నాఽ థ
లోకే స్థాస్యతి విశ్రుతా ॥

తాత్పర్యము :- భగీరథా! ఇకపై, ఈ గంగ నీ పెద్ద కుమార్తెగా ఉంటుంది. నీ పేరుతో 'భాగీరథి'గా ప్రసిద్ధిగాంచును.

ప్రతిపదార్థము :- ఇయమ్ = ఈ; దుహితా = కుమార్తెగా; జ్యేష్ఠా = పెద్ద; తవ = నీ యొక్క; గఙ్గా = గంగాదేవి; భవిష్యతి = ఉండును; త్వత్ = నీయొక్క; కృతేన = ఏర్పరచబడిన; ; నామ్నా = పేరుతో; అథ = ఇకపై; స్థాస్యతి = ఉండును; విశ్రుతా = ప్రసిద్ధి పొంది.

1.44.6.అనుష్టుప్.

గంగా త్రిపథగా రాజన్
దివ్యా భాగీరథీతి చ ।
త్రీన్ పథో భావయన్తీతి
తతస్త్రిపథగా స్మృతా ॥

తాత్పర్యము :- భగీరథ మహారాజా! గంగ స్వర్గ; భూ; పాతాళ లోకముల మార్గముల ద్వారా ప్రవహించి ఆ లోకములను పవిత్రవంతము చేయుచున్నది కనుక త్రిపథగ అనియు; నీ పేరున భాగీరథి అనియు పిలువబడును.

ప్రతిపదార్థము :- గఙ్గా = గంగానది; త్రిపథగా = త్రిపథగ / ముత్రోవద్రిమ్మరి అనే పేరుతో; రాజన్ = రాజా; దివ్యా = స్వర్గలోకము; భాగీరథీ చ = భాగీరథి అని; ; త్రీన్ = మూడు; పథః = మార్గములను; భావయన్తి = పవిత్రము చేయుచు ప్రవహించుచున్నది; ఇతి = అని; తతః = అందువలన; త్రిపథగా = త్రిపథగ అని; స్మృతా = స్మరింపబడును.

1.44.7.అనుష్టుప్.

పితామహానాం సర్వేషాం
త్వమత్ర మనుజాధిప! ।
కురుష్వ సలిలం రాజన్!
ప్రతిజ్ఞామపవర్జయ ॥

తాత్పర్యము :- ఓ భగీరథ మహారాజా! నీవు రాజశ్రేష్ఠులైన నీ పితామహులు అందరికీ ఈ గంగా జలముతో జలతర్పణములు చేసి నీ ప్రతిజ్ఞను పూర్తి చేసుకొనుము.

ప్రతిపదార్థము :- పితామహానామ్ = పితామహులకు; సర్వేషామ్ = అందరకు; త్వమ్ = నీవు; అత్ర = ఇక్కడ; మనుజేశ్వర = మానవులకు ప్రభువులైన; కురుష్వ = చేసి; సలిలమ్ = నీరును; రాజన్ = రాజా; ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను; అపవర్జయ = పూర్తిచేసుకొనుము.

1.44.8.అనుష్టుప్.

పూర్వకేణ హి తే రాజన్!
తేనాతియశసా తదా ।
ధర్మిణాం ప్రవరేణాపి
నైష ప్రాప్తో మనోరథః ॥

తాత్పర్యము :- రాజా! ఘనమైన కీర్తి కలవాడును; గొప్ప ధర్మాత్ముడును; నీ పూర్వీకుడయిన సగర చక్రవర్తి కూడా; ఈ కోరిక నెరవేర్చుకొనలేక పోయెను.

ప్రతిపదార్థము :- పూర్వకేణ = పాతతరము వాడును; హి; తే = నీ యొక్క; రాజన్ = రాజా; అతియశసా = ఘనమైన కీర్తి కలవాడును; తదా = అప్పుడు; ధర్మిణామ్ = ధర్మాత్ములలో; ప్రవరేణ = శ్రేష్టుడు; అపి = ఐనను; న = లేదు; ఏషః = ఈ; ప్రాప్తః = పొందబడుట; మనోరథః = కోరిక.

1.44.9.అనుష్టుప్.

తథైవాంశుమతా తాత!
లోకేఽ ప్రతిమతేజసా ।
గంగాం ప్రార్థయతా నేతుం
ప్రతిజ్ఞా నాపవర్జితా ॥

తాత్పర్యము :- లోకములో అసమానమైన తేజస్సు గల అంశుమంతుడు కూడా గంగను తీసుకొని రావలెనను ప్రతిజ్ఞను నెరవేర్చుకొనలేకపోయెను.

ప్రతిపదార్థము :- తథైవ = అట్లే; అంశుమతా = అంశుమంతుని చేత కూడా; తాత = తండ్రి; లోకే = లోకములో; అప్రతిమ = అసమాన; తేజసా = తేజస్సు కలవాడు; గంగామ్ = గంగను; ప్రార్థయతా = కోరుచున్నవాడై; ఆనేతుమ్ = తీసుకొనివచ్చుటకు; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; న = లేదు; అపవర్జితా = నెఱవేర్చుకొనుట.

1.44.10.అనుష్టుప్.

రాజర్షిణా గుణవతా
మహర్షిసమతేజసా ।
మత్తుల్యతపసా చైవ
క్షత్రధర్మస్థితేన చ ॥

తాత్పర్యము :- రాజా! నీ తండ్రి రాజర్షియు, గుణవంతుడును, మహర్షులతో సమానమైన తేజస్సు కలవాడును, నా వంటి తపస్సంపన్నుడును, క్షత్రియ ధర్మమును పాటించువాడును.

ప్రతిపదార్థము :- రాజర్షిణా = రాజర్షియు; గుణవతా = గుణవంతుడు; మహర్షిః = మహర్షులతో; సమ = సమానమైన; తేజసా = తేజస్సు కలవాడు; మత్ = నాతో; తుల్య = సాటివచ్చు; తపసా = తపస్వియున; క్షత్ర = క్షత్రియ; ధర్మ = ధర్మము నందు; స్థితేన = లగ్మమైన వాడునునైన; చ.

1.44.11.అనుష్టుప్.

దిలీపేన మహాభాగ
తవ పిత్రాతితేజసా ।
పునర్న శంకితా నేతుం
గంగాం ప్రార్థయతాఽ నఘ ॥

తాత్పర్యము :- ఓ పుణ్యాత్ముడా! మహాధార్మికుడు, తేజోవంతుడు అయిన నీ తండ్రి దిలీపుడు కూడా గంగను తీసుకొని రావలెనని తలచెను, కాని తీసుకొనిరాలేక పోయెను.

ప్రతిపదార్థము :- దిలీపేన = దిలీపుడు కూడా; మహాభాగ = మిక్కిలి ధార్మికుడు; తవ = నీ; పిత్రా = తండ్రి; అతి = బహుమిక్కిలి; తేజసా = తేజశ్శాలి; పునః = అయినను; న = కాలేదు; శంకితా = శక్యము; అనేతుమ్ = తీసుకొనివచ్చుట; గంగామ్ = గంగను; ప్రార్థయతా = కోరినవాడు; అనఘా = పాపములు లేనివాడా.

1.44.12.అనుష్టుప్.

సా త్వయా సమతిక్రాన్తా
ప్రతిజ్ఞా పురుషర్షభ ।
ప్రాప్తోఽ సి పరమం లోకే
యశః పరమసమ్మతమ్ ॥

తాత్పర్యము :- ఓ పురుష శ్రేష్ఠుడా! భగీరథా! నీవు ఎంతోకాలంగా తీరని ప్రతిజ్ఞను నెరవేర్చితివి. ఉభయలోకములలో గొప్ప యశస్సును మెప్పును పొందితివి.

ప్రతిపదార్థము :- సా = ఆ; త్వయా = నీచే; సమ = మిక్కిలి; అతిక్రాన్తా = దాచబడిన, తీరని; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; పురుషఋషభ = పురుషశ్రేష్ఠుడా, భగీరథ; ప్రాప్తః = పొందిన వాడవు; అసి = ఐతివి; పరమమ్ = మహనీయమైన; లోకే = సకల లోకములలో; యశః = యశస్సు; పరమ = గొప్పగా; సమ్మతమ్ = ఆమోదించబడినది.

1.44.13.అనుష్టుప్.

యచ్చ గంగావతరణం
త్వయా కృతమరిన్దమ ।
అనేన చ భవాన్ ప్రాప్తో
ధర్మస్యాయతనం మహత్ ॥

తాత్పర్యము :- భగీరథా! నీవు గంగను స్వర్గము నుండి క్రిందకు అవతరింపజేయుట వలన గొప్ప ధర్మప్రతిష్ఠను నిలిపిన వాడవైతివి.

ప్రతిపదార్థము :- యత్ = ఏ; గంగావతరణమ్ = గంగావతరణము; త్వయా = నీచే; కృతరిన్దమ = శత్రువులను జయించినవాడా, భగీరథ; అనేన = దీనిచే; ; భవాన్ = నీవు; ప్రాప్తః = పొందితివి; ధర్మస్య = ధర్మము యొక్క; ఆయతనమ్ = ప్రతిష్ఠను; మహత్ = గొప్ప.

1.44.14.అనుష్టుప్.

ప్లావయస్వ త్వమాత్మానం
నరోత్తమ సదోచితే ।
సలిలే పురుషవ్యాఘ్ర!
శుచిః పుణ్యఫలో భవ ॥

తాత్పర్యము :- ఓ మానవ శ్రేష్ఠుడా! ఉత్తమమైన ఈ గంగాజలములలో నీవు నిత్యము మునిగి స్నానము చేయుచు పవిత్రత నొంది పుణ్యాత్ముడవు అగుము.

ప్రతిపదార్థము :- ప్లావయస్వ = మునిగి, స్నానము చేసి; త్వమ్ = నీవు; ఆత్మానామ్ = నిన్ను; నరోత్తమా = మానవ శ్రేష్ఠుడా; సదా = నిత్యము; ఉచితే = తగిన; సలిలే = గంగాజలము నందు; పురుషవ్యాఘ్ర = పురుష శార్దూలమా; శుచిః = పవిత్రుడవై; పుణ్యఫలః = పుణ్యఫలము కలవాడవు; భవ = అగుము.

1.44.15.అనుష్టుప్.

పితామహానాం సర్వేషాం
కురుష్వ సలిలక్రియామ్ ।
స్వస్తి తేఽ స్తు గమిష్యామి
స్వం లోకం గమ్యతాం నృప!" ॥

తాత్పర్యము :- రాజాభగీరథ! నీ పితృదేవత లందరికీ జలతర్పణము చేయుము. నీకు శుభమగును. నేను బయలుదేరెదను. నీవు కూడ నీ లోకమునకు వెళ్ళుము.

ప్రతిపదార్థము :- పితామహానామ్ = పితృదేవతలకు; సర్వేషామ్ = అందరికి; కురుష్వ = చేయుము; సలిలక్రియామ్ = జలతర్పణము; స్వస్తి = శుభము; తే = నీకు; అస్తు = అగుగాక; గమిష్యామి = వెళ్ళెదను; స్వం = స్వంత; లోకమ్ = లోకమునకు; గమ్యతామ్ = వెళ్ళుము; నృప = రాజా, భగీరథ.

1.44.16.అనుష్టుప్.

ఇత్యేవముక్త్వా దేవేశః
సర్వలోకపితామహః ।
యథాగతం తథాగచ్ఛత్
దేవలోకం మహాయశాః ॥

తాత్పర్యము :- దేవతలుకు ప్రభువును, సర్వలోక సృష్టికర్తయునునైన బ్రహ్మదేవుడు ఈ విధముగా భగీరథునితో పలికి వచ్చినవిధముగా తన లోకమునకు తిరిగి వెళ్ళెను.

ప్రతిపదార్థము :- ఇతి ఏవమ్ = ఈవిధముగ; ఉక్త్వా = పలికి; దేవేశః = బ్రహ్మదేవుడు; సర్వలోక పితామహః = బ్రహ్మదేవుడు; యథా = ఏ విధముగా; గతమ్ = వచ్చెనో; తథా = ఆ విధముగా; అగచ్ఛత్ = వెళ్ళెను; దేవలోకమ్ = దేవలోకమునకు; మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.

 *గమనిక :- *- 1. దేవేశుడు- దేవతలకు ప్రభువు, బ్రహ్మదేవుడు,. 2. సర్వలోక పితామహుడు- సర్వ లోకములకు సృష్టించుటచే తండ్రి, బ్రహ్మదేవుడు.

1.44.17.అనుష్టుప్.

భగీరథోఽ పి రాజర్షిః
కృత్వా సలిలముత్తమమ్ ।
యథాక్రమం యథాన్యాయం
సాగరాణాం మహాయశాః ॥

తాత్పర్యము :- గొప్ప కీర్తివంతుడైన భగీరథుడు తన పితాహులైన సగరకుమారులకు శాస్త్రములో చెప్పిన విధముగ పద్దతిప్రకారము జలతర్పణము కావించెను.

ప్రతిపదార్థము :- భగీరథః = భగీరథుడు; అపి = కూడా; రాజర్షిః = రాజర్షి యైన; కృత్వా = చేసి; సలిలమ్ = జలమును; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన; యథాక్రమమ్ = పద్దతి ప్రకారం; యథా న్యాయం = న్యాయ విధముగా, వేదార్థ నిర్ణయక సాధన మగునది, సూర్యనారాయాంధ్రం; సాగరాణామ్ = సగర పుత్రులకు; మహాయశః = గొప్ప యశస్సు కలవాడు.

1.44.18.అనుష్టుప్.

కృతోదక శ్శుచీ రాజా
స్వపురం ప్రవివేశ హ ।
సమృద్ధార్థో నరశ్రేష్ఠ!
స్వరాజ్యం ప్రశశాస హ ॥

తాత్పర్యము :- తన పితామహులకు గంగాజలముతో జలతర్పణము చేసి పవిత్రుడైన భగీరథుడు తన నగరమునకు చేరి రాజ్య పరిపాలన చేసెను.

ప్రతిపదార్థము :- కృతోదకః = జల తర్పణము చేసిన వాడై; శుచీ = పవిత్రుడై; రాజా = రాజు; స్వ = తన; పురమ్ = నగరములో; ప్రవివేశ హ = ప్రవేశించెను; ; సమృద్ధార్థః = కోరిక నెరవేరినవాడై; రఘుశ్రేష్ఠ = రామా; స్వ = తన; రాజ్యమ్ = రాజ్యమును; ప్రశశాస = పరిపాలించెను; హ.

1.44.19.అనుష్టుప్.

ప్రముమోద చ లోకస్తం
నృపమాసాద్య రాఘవ! ।
నష్టశోక స్సమృద్ధార్థో
బభూవ విగతజ్వరః ॥

తాత్పర్యము :- రామా! భగీరథుడు రాజుగా ఉండుట వలన లోకము అంతా సంతోషముగా ఉండెను. భగీరథుడు కూడ తన కోరిక సఫలమగుటచే, శోక మనస్తాపములు తొలగి సంతోషముగా నుండెను.

ప్రతిపదార్థము :- ప్రముమోద = సంతోషించెను; లోకః = లోకము; తమ్ = అతనిని; నృపమ్ = రాజుగా; ఆసాద్య = పొంది; రాఘవ = రామ; నష్ట = పోయినవాడు; శోకః = శోకము; సమృద్ధార్థః = కోరిక తీరినవాడై; బభూవ = అయ్యెను; విగత = తొలగిన; జ్వరః = మనస్తాపము కలవాడై.

1.44.20.అనుష్టుప్.

ఏష తే రామ! గంగాయా
విస్తరోఽ భిహితో మయా ।
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే
సన్ధ్యాకాలోఽ తివర్తతే ॥

తాత్పర్యము :- రామా! గంగను గురించి సవిస్తరముగా నీకు తెలియ జేసితిని. ఇది వినినందున నీకు శుభమగుగాక. సంధ్యా సమయము దాటిపోవు చున్నది. ఇక సంధ్యావందనము చేయుదము.

ప్రతిపదార్థము :- ఏషః = ఈ; తే = నీకు; రామ = రామా; గంగాయాః = గంగ యొక్క; విస్తరః = కథా వివరణ; అభిహితః = తెలియజేయబడినది; మయా = నాచే; స్వస్తి = శుభము; ప్రాప్నుహి = పొందుము; భద్రమ్ = క్షేమమగు గాక; తే = నీకు; సన్ధ్యా కాలః = సంధ్యా సమయము; అతివర్తతే = దాటిపోవుచున్నది.

1.44.21.అనుష్టుప్.

ధన్యం యశస్యమాయుష్యం
పుత్ర్యం స్వర్గ్యమతీవ చ ।
యశ్శ్రావయతి విప్రేషు
క్షత్రియే ష్వితరేషు చ ॥

తాత్పర్యము :- ఈ గంగావతరణ చరితము బ్రాహ్మణులుకాని, క్షత్రియులుకాని ఇతరులుకాని వినిపించుట వలన పుణ్యము, కీర్తి, దీర్ఘాయువు, పుత్రసంతానము, స్వర్గప్రాప్తి కలుగును.

ప్రతిపదార్థము :- ధన్యమ్ = పుణ్య ప్రదము; యశస్యమ్ = యశస్సునిచ్చు నది; ఆయుష్యమ్ = దీర్ఘాయువును ప్రసాదించునది; పుత్ర్యమ్ = పుత్రుల నొసగునది; స్వర్గ్యమ్ = స్వర్గ ప్రాప్తి కలిగించునది; యః = ఎవరు; శ్రావయతి = వినిపించునో; విప్రేషు = బ్రాహ్మణులకు; క్షత్రియేషు = క్షత్రియులకు; ఇతరేషు = ఇతరులకును; చ = కూడ.

1.44.22.అనుష్టుప్.

ప్రీయన్తే పితరస్తస్య
ప్రీయన్తే దైవతాని చ ।
ఇదమాఖ్యాన మవ్యగ్రో
గంగావతరణం శుభమ్ ॥

తాత్పర్యము :- ఈ గంగావతరణ వృత్తాంతము వలన దేవతలు పితృ దేవతలు సంతోషించెదరు. దీనిని శ్రద్ధగా వినుట వలన శుభము చేకూరును.

ప్రతిపదార్థము :- ప్రీయన్తే = సంతోషమును పొందెదరు; పితరః = పితృదేవతలు; తస్య = అతని యొక్క; ప్రీయన్తే = సంతోషించెదరు; దైవతాని = దేవతలు; చ = కూడ;ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = చరితము; అవ్యగ్రః = శాంతపూరితము; గఙ్గావతరణమ్ = గంగావతరణమును; శుభమ్ = శుభప్రదము.

1.44.23.అనుష్టుప్.

యశ్శృణోతి చ కాకుత్స్థ!
సర్వాన్ కామానవాప్నుయాత్ ।
సర్వే పాపాః ప్రణశ్యన్తి
ఆయుః కీర్తిశ్చ వర్దతే" ॥

తాత్పర్యము :- రామా! ఎవరైతే పవిత్రమైన ఈ గంగావతరణ కథను వినెదరో అట్టి వారి కోరికలు తీరును. వారి సకల పాపములు నశించును.వారికి దీర్ఘాయువు కలిగి; గొప్ప కీర్తి లభించును.

ప్రతిపదార్థము :- యః = ఎవరైతే; శృణోతి = వినెదరో; చ = కూడ; కాకుత్స్థ = రామా; సర్వాన్ = సకల; కామాన్ = కోరికలను; అవాప్నుయాత్ = పొందెదరు; సర్వే = అన్ని; పాపాః = పాపములు; ప్రణశ్యన్తి = నశించును; ఆయుః = ఆయువు; కీర్తిః = కీర్తి; చ = కూడా; వర్ధతే = వృద్ధి చెందును.

1.44.24.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
చతుశ్చత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [44] నలభైనాలుగవ సర్గ సుసంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; ద్విచత్వారింశ [42] = ముప్పై ఒకటవ; సర్గః = సర్గ.

।।పంచచత్వారింశస్సర్గః।।

[45 క్షీరసాగర మథనము]

1.45.1.అనుష్టుప్.

విశ్వామిత్ర వచశ్శ్రుత్వా
రాఘవ స్సహలక్ష్మణః ।
విస్మయం పరమం గత్వా
విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥

తాత్పర్యము :- రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు చెప్పినది విని ఆశ్చర్యమున మునిగిరి. పిమట, రాముడు విశ్వామిత్రునితో ఇట్లనెను

ప్రతిపదార్థము :- విశ్వామిత్ర = విశ్వామిత్రుని; వచః = వచనమును; శ్రుత్వా = విని; రాఘవః = రాఘవుడు (శ్రీరాముడు); సహలక్ష్మణః = లక్ష్మణునితో కలసి; విస్మయమ్ = ఆశ్చర్యము; పరమమ్ = మిక్కిలి; గత్వా = పొంది; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గురించి; అథ = అప్పుడు; అబ్రవీత్ = ఇట్లు పలికెను;

1.45.2.అనుష్టుప్.

అత్యద్భుతమిదం బ్రహ్మన్!
కథితం పరమం త్వయా ।
గంగావతరణం పుణ్యం
సాగరస్యాపి పూరణమ్" ॥

తాత్పర్యము :- ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నీచేత చెప్పబడిన మహత్వపూర్ణమైన గంగావతరణము, సముద్రము నింపుటయును కూడ మిక్కిలి ఆశ్చర్యకరమైనవి

ప్రతిపదార్థము :- అత్యద్భుతమ్ = మిక్కిలి ఆశ్చర్యకరమైనది; ఇదమ్ = ఇది; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమ; కథితమ్ = చెప్పబడిన; పరమమ్ = గొప్పదైన; త్వయా = నీచేత; గంగావతరణమ్ = గంగావతరణము; పుణ్యమ్ = పుణ్యప్రదమైన; సాగరస్య = సాగరము యొక్క; అపి = కూడ; పూరణమ్ = నింపుటయును

1.45.3.అనుష్టుప్.

తస్య సా శర్వరీ సర్వా
సహ సౌమిత్రిణా తదా ।
జగామ చిన్తయానస్య
విశ్వామిత్రకథాం శుభామ్ ॥

తాత్పర్యము :- రామలక్ష్మణులు ఆ రాత్రియంతయు విశ్వామిత్రుడు చెప్పిన శుభకరమైన కథ గురించి ముచ్చటించుకొనుచు గడపిరి.

ప్రతిపదార్థము :- తస్య = ఆ రాముడు; సా = ఆ; శర్వరీ = రాత్రి; సర్వా = అంతయు; సహ,సౌమిత్రిణా = లక్ష్మణునితో; తదా = అప్పుడు; జగామ = కడచెను; చిన్తయాన్ = ఆలోచించుచు; అస్య; విశ్వామిత్రకథామ్ = విశ్వామిత్రుని కథను; శుభామ్ = శుభకరమైన.

1.45.4.అనుష్టుప్.

తతః ప్రభాతే విమలే
విశ్వామిత్రం మహామునిమ్ ।
ఉవాచ రాఘవో వాక్యం
కృతాహ్నిక మరిన్దమః ॥

తాత్పర్యము :- పిమ్మట శత్రుసంహారకుడు శ్రీరాముడు ఉదయమున సంధ్యావంద నాది కార్యక్రమముల అనంతరము మహాముని విశ్వామిత్రునితో ఇట్లనెను

ప్రతిపదార్థము :- తతః = తరువాత; ప్రభాతే = ఉదయమున; విమలే = స్వచ్ఛమైన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహామునిమ్ = మహామునిని; ఉవాచ = పలికెను; రాఘవః = రాఘవుడు; వాక్యమ్ = మాటను; కృతాహ్నిక = నిత్యనైమిత్తిక కర్మల అనంతరము; అరిన్దమః = శత్రుసంహారకుడు

1.45.5.అనుష్టుప్.

గతా భగవతీ రాత్రిః
శ్రోతవ్యం పరమం శ్రుతమ్ ।
క్షణభూతేవ నౌ రాత్రి
స్సమ్వృత్తేయం మహాతపః ॥

తాత్పర్యము :- “మహాతపస్వీ! పుజనీయమైన గత రాత్రి విలువైన గొప్ప ఉపాఖ్యానమును వింటిమి. మా ఇద్దరికీ రాత్రంతా క్షణము వలె గడచినది.

ప్రతిపదార్థము :- గతా = గడచిన; భగవతీ = పూజనీయమైన; రాత్రిః = రాత్రి; శ్రోతవ్యమ్ = వినదగినది; పరమమ్ = గొప్పదైన; శ్రుతమ్ = వినబడినది; క్షణ భూతేవ = క్షణమువలె; నౌ = మా ఇరువురికి; రాత్రిః = రాత్రి; సమ్వృత్తః = గడచినది; ఇయమ్ = ఈ; మహాతపః = మహాతపస్వీ.

1.45.6.అనుష్టుప్.

ఇమాం చిన్తయత స్సర్వాం
నిఖిలేన కథాం తవ ।
తరామ సరితాం శ్రేష్ఠాం
పుణ్యాం త్రిపథగాం నదీమ్ ॥

తాత్పర్యము :- తమరు చెప్పిన అన్నివృత్తాంతములు గురించి అంతా ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇక, నదులలో ఉత్తమతమమును, పుణ్య ప్రదమును అగు గంగానదిని దాటుదము.

ప్రతిపదార్థము :- ఇమామ్ = దీనిని; చిన్తయన్తః = ఆలోచించుకున్నాము; సర్వామ్ = అంతయు; నిఖిలేన = అన్నింటిని; కథామ్ = వృత్తాంతములను; తవ = తమరు చెప్పినవి; తరామ = దాటుదము; సరితామ్ = నదిని; శ్రోష్ఠామ్ = అత్యుత్తమమైనది; పుణ్యా = పుణ్యప్రదమైనది; త్రిపథగాం = ముత్తోవద్రిమ్మరి, గంగా; నదీమ్ = నదిని.

1.45.7.అనుష్టుప్.

నౌరేషా హి సుఖాస్తీర్ణా
ఋషీణాం పుణ్యకర్మణామ్ ।
భగవన్తమిహ ప్రాప్తమ్
జ్ఞాత్వా త్వరితమాగతా" ॥

తాత్పర్యము :- పుణ్యాత్ములైన ఋషీశ్వరులు సౌఖ్యవంతముగా (ఆసనములు) పఱుపబడిన నావను సిద్ధము చేసిరి. పూజ్యుడవైన నీరాక గ్రహించి, ఆ నావ శీఘ్రముగ ఇక్కడకు తీసికొని రాబడినది.”

ప్రతిపదార్థము :- నౌః = పడవ; ఏషా = ఈ; హి = నిశ్చయముగ; సుఖ = సౌఖ్యవంతముగా; ఆస్తీర్ణ = పఱపబడిన (వాచస్పతము); ఋషీణామ్ = ఋషులయొక్క; పుణ్యకర్మణామ్ = పుణ్యకర్మలుగల; భగవన్ = పూజ్యుడవైన; తమ్ = నిన్ను; ఇహ = ఇచ్చటకు; ప్రాప్తమ్ = వచ్చినవానిగా; జ్ఞాత్వా = తెలిసికొని; త్వరితమ్ = శీఘ్రముగ; ఆగత = తీసుకురాబడినది.

1.45.8.అనుష్టుప్.

తస్య తద్వచనం శ్రుత్వా
రాఘవస్య మహాత్మనః ।
సన్తారం కారయామాస
సర్షిసంఘ స్సరాఘవః ॥

తాత్పర్యము :- శ్రీరాముని మాటలు విని విశ్వామిత్రుడు ఋషిసంఘముల తోను రామలక్ష్మణులతోను కూడినవాడై నదిని దాటు ఏర్పాటు చేసెను

ప్రతిపదార్థము :- తస్య = ఆతని; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; రాఘవస్య = రాఘవునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన; సన్తారమ్ = దాటుటను; కారయామాస = ఏర్పరచెను; స = కూడిఉన్న; ఋషిః = మునుల; సంఘః = సమూహము కలవాడై; స = కూడా ఉన్న; రాఘవః = రఘువంశీయులైన రామలక్ష్మణు లిరువురును

1.45.9.అనుష్టుప్.

ఉత్తరం తీరమాసాద్య
సమ్పూ జ్యర్షిగణం తదా ।
గంగాకూలే నివిష్టాస్తే
విశాలాం దదృశుః పురీమ్ ॥

తాత్పర్యము :- ఉత్తరపు ఒడ్డుకు చేరి రామలక్ష్మణులు తమను నావతో దాటించిన మునిపుంగవులను పూజించి అక్కడ విడిది చేసి విశాల (ఉజ్జయిని) యను పురమును చూసిరి

ప్రతిపదార్థము :- ఉత్తరమ్ = ఉత్తరము వైపుననున్న; తీరమ్ = ఒడ్డును; ఆసాద్య = పొంది (చేరి); సంపూజ్య = పూజించి; ఋషిగణమ్ = ముని గణములను; తదా = అప్పుడు; గంగాకూలే = గంగాతీరమున; నివిష్టాః = విడిది చేసియున్న; తే = వారు; విశాలామ్ = విశాల అను పేరుగల; దదృశుః = చూచిరి; పురీమ్ = పురమును.

 *గమనిక :- *- విశాల- ఉజ్జయిని, శబ్దరత్నాకరము.

1.45.10.అనుష్టుప్.

తతో మునివరస్తూర్ణమ్
జగామ సహరాఘవః ।
విశాలాం నగరీం రమ్యామ్
దివ్యాం స్వర్గోపమాం తదా ॥

తాత్పర్యము :- పిమ్మట మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు స్వర్గతుల్యమైన, సుందరమైన, దివ్యమైన, ఆ విశాలనగరమునకు రామలక్ష్మణులతో శీఘ్రముగ వెళ్ళెను.

ప్రతిపదార్థము :- తతః = పిమ్మట; మునివరః = మునిపుంగవుడైన విశ్వామిత్రుడు; తూర్ణమ్ = శీఘ్రముగ; జగామ = వెళ్ళెను; సహ = తో; రాఘవః = రాఘవులిరువురు (రామలక్ష్మణులు); విశాలామ్ = విశాల నామముగల; నగరీమ్ = పురమును; రమ్యామ్ = సుందరమైనది; దివ్యామ్ = దివ్యమైనది; స్వర్గః = స్వర్గముతో; ఉపమామ్ = సరిపోల్చ దగునదినది; తదా = అప్పుడు

1.45.11.అనుష్టుప్.

అథ రామో మహాప్రాజ్ఞో
విశ్వామిత్రం మహామునిమ్ ।
పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా
విశాలాముత్తమాం పురీమ్ ॥

తాత్పర్యము :- పిమ్మట మిక్కిలి సమర్థుడైన రాముడు దోసిలియొగ్గినవాడై మహాముని విశ్వామిత్రుని ఉత్తమమైన విశాల పురము గురించి తెలుపమనికోరెను.

ప్రతిపదార్థము :- అథ = పిమ్మట; రామః = రాముడు; మహా = గొప్ప; ప్రాజ్ఞః = సమర్థుడు (శబ్దరత్నాకరము)); విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహామునిమ్ = మహాముని; పప్రచ్ఛ = విచారించెను; ప్రాంజలిః = దోసిలియొగ్గుటను; భూత్వా = చేసి; విశాలామ్ = విశాల; ఉత్తమామ్ = ఉత్తమమైన; పురీమ్ = పురమును గురించి

1.45.12.అనుష్టుప్.

కతరో రాజవంశోఽ యం
విశాలాయాం? మహామునే! ।
శ్రోతుమిచ్ఛామి భద్రం తే
పరం కౌతూహలం హి మే" ॥

తాత్పర్యము :- “ఈ విశాల నగరము ఏ రాజవంశము వారిదో తెలుసుకొనవలె నని మిగుల ఆసక్తి కలదు. కావున తెలుసుకొనగోరుచున్నాను మీకు మంగళమగు గాక!”

ప్రతిపదార్థము :- కతరః = ఏది; రాజవంశః = రాజవంశము; అయమ్ = ఈ; విశాలాయామ్ = విశాలనగరములో; మహామునే = మహామునీ; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; భద్రమ్ = శుభమగుగాక; తే = నీకు; పరమ్ = మిగుల; కౌతూహలమ్ = ఆసక్తి; హి = కలదుకదా; మే = నాకు

1.45.13.అనుష్టుప్.

తస్య తద్వచనం శ్రుత్వా
రామస్య మునిపుంగవః ।
ఆఖ్యాతుం తత్సమారేభే
విశాలస్య పురాతనమ్ ॥

తాత్పర్యము :- రామునియొక్క మాటలు విని పురాతనమైన విశాలనగరము గురించి చెప్పుట ప్రారంభించెను.

ప్రతిపదార్థము :- తస్య = ఆ; తద్వచనం = ఆ వచనము; శ్రుత్వా = విని; రామస్య = రాముని యొక్క; మునిపుఙ్గవః = మునివరుడు; ఆఖ్యాతుమ్ = చెప్పుటకు; తత్ = ఆ విషయమును; సమారేభే = ప్రారంభించెను; విశాలస్య = విశాలనగరము యొక్క; పురాతనమ్ = ప్రాచీనమైన

1.45.14.అనుష్టుప్.

శ్రూయతాం రామ శక్రస్య
కథాం కథయతశ్శుభామ్ ।
అస్మిన్ దేశే తు యద్వృత్తమ్
తదపి శృణు రాఘవ ॥

తాత్పర్యము :- “రామా! శుభకరమైన ఇంద్రుని కథను వినుము రాఘవా! ఈ దేశమున పూర్వము ఏమి జరిగినదో కూడ వినుము.

ప్రతిపదార్థము :- శ్రూయతామ్ = వినబడుగాక; రామ = రామా; శక్రస్య = ఇంద్రునియొక్క; కథామ్ = కథను; కథయతః = నాచే చెప్పబడుచున్న; శుభామ్ = శుభకరము; అస్మిన్ = ఈ; దేశేతు = దేశమునందు; యత్ = ఏది; వృత్తమ్ = జరిగినదో; తదపి = అది కూడ; శ్రుణు = వినుము; రాఘవ = రాఘవా!

1.45.15.అనుష్టుప్.

పూర్వం కృతయుగే రామ!
దితేః పుత్రా మహాబలాః ।
అదితేశ్చ మహాభాగ!
వీర్యవన్తస్సుధార్మికాః ॥

తాత్పర్యము :- పుణ్యశీలివైన రామా! పూర్వము కృతయుగములో దితి పుత్రులు మహాబలవంతులు. అదితి పుత్రులు పరాక్రమవంతులు మరియు ధర్మపరులు

ప్రతిపదార్థము :- పూర్వమ్ = పూర్వము; కృతయుగే = కృతయుగమునందు; రామ = రామా; దితేః = దితి యొక్క; పుత్రాః = పుత్రులును; మహాబలాః = మహా బలవంతులు; అదితేః = అదితియొక్క; ; మహాభాగ = పుణ్యశీలి; వీర్యవన్తః = పరాక్రమవంతులు; సుధార్మికాః = ధర్మపరులు

1.45.16.అనుష్టుప్.

తతస్తేషాం నరశ్రేష్ఠ!
బుద్ధిరాసీ న్మహాత్మనామ్ ।
అమరా అజరాశ్చైవ
కథం స్యామ నిరామయాః ॥

తాత్పర్యము :- పురుషోత్తమా! పిమ్మట వారికి ‘మరణము, ముసలితనము, రోగములులేని వారము ఎట్లగుదు’ మను ఆలోచన కలిగెను

ప్రతిపదార్థము :- తతః = పిమ్మట; తేషామ్ = వారికి; నరశ్రేష్ఠ = పురుషోత్తమా; బుద్ధిః = ఆలోచన; ఆసీత్ = కలిగెను; మహాత్మనామ్ = మహాత్ములగు; అమరా = మరణము లేనివారు; అజరాః = ముసలి తనము లేనివారు; చైవ = కూడ; కథమ్ = ఎట్లు; స్యామ = అగుదుము; నిరామయాః = రోగములు లేనివారము

1.45.17.అనుష్టుప్.

తేషాం చిన్తయతాం రామ!
బుద్ధిరాసీ న్మహాత్మనామ్ ।
క్షీరోదమథనం కృత్వా!
రసం ప్రాప్స్యామ తత్ర వై ॥

తాత్పర్యము :- ఈ విధముగా ఆలోచించుచున్న మహాత్ములకు ‘క్షీరసముద్రమును మథించి అమృతము పొందుదము’ అను బుద్ధి కలిగెను

ప్రతిపదార్థము :- తేషామ్ = వారికి; చిన్తయతామ్ = ఈ విధముగా ఆలోచించుచున్న; రామ = రామా; బుద్ధిః = బుద్ధి; ఆసీత్ = కలిగెను; మహాత్మానామ్ = మహాత్ములకు; క్షీరోదమథనమ్ = క్షీరసాగర మథనమును; కృత్వా = చేసి; రసమ్ = అమృతమును, శబ్దరత్నాకరము; ప్రాప్స్యామ = పొందెదము; తత్రవై = దానియందు.

1.45.18.అనుష్టుప్.

తతో నిశ్చిత్య మథనం
యోక్త్రం కృత్వా చ వాసుకిమ్ ।
మన్థానం మన్దరం కృత్వా
మమన్థు రమితౌజసః ॥

తాత్పర్యము :- అప్పుడు మిక్కిలి తేజస్సు గల దేవాసురులు క్షీరసముద్రమును చిలుకుటకు నిర్ణయించుకొని వాసుకిని త్రాడుగా, మందర పర్వతమును కవ్వముగా చేసుకొని చిలుక సాగిరి

ప్రతిపదార్థము :- తతః = అప్పుడు; నిశ్చిత్య = నిశ్చయించుకొని; మథనమ్ = చిలుకుటకు; యోక్త్రమ్ = కవ్వపు త్రాటిగ; కృత్వా చ = చేసి; ; వాసుకిమ్ = వాసుకిని; మమన్థుః = మథించసాగిరి; మన్థానమ్ = కవ్వముగ; మన్దరమ్ = మందర పర్వతమును; అమిత = మిక్కిలి; ఓజసః = అమిత తేజముగల

1.45.19.అనుష్టుప్.

అథ వర్షసహస్రేణ
యోక్త్ర సర్పశిరాంసి చ ।
వమన్త్యతి విషం తత్ర
దదంశు ర్దశనైశ్శిలాః ॥

తాత్పర్యము :- పిమ్మట వేయి సంవత్సరములకు త్రాడుగా నున్న వాసుకి శిరస్సులు మహావిషము కక్కుచు కోఱలతో అచట ఉన్న రాళ్ళను కరవసాగాయి

ప్రతిపదార్థము :- అథ = అప్పుడు; వర్ష = సంవత్సరములు; సహస్రేణ = వేయింటికి; యోక్త్ర = త్రాడుగా ఉన్న; సర్పః = సర్పము యొక్క; శిరాంసి = శిరస్సులు; వమన్తి = కక్కుచున్నవి; అతి = అధికమైన, మించిన; విషమ్ = విషమును; తత్ర = అచ్చట; దదంశుః = కరచినవి; దశనైః = దంతములచేత, కోఱలతో; శిలాః = శిలలను

1.45.20.అనుష్టుప్.

ఉత్పపా తాగ్ని సంకాశం
హాలాహల మహావిషమ్ ।
తేన దగ్ధం జగత్సర్వమ్
సదేవాసుర మానుషమ్ ॥

తాత్పర్యము :- అగ్నితో సమానమైన హాలాహలము అను విషము బయలుదేరెను. దానిచే దేవదానవ మానవులతో కూడిన ప్రపంచమంతయు దహింపబడినది

ప్రతిపదార్థము :- ఉత్పపాత = బయలుదేరెను; అగ్నిః = అగ్నితో; సంకాశమ్ = సమానమైన; హాలాహల = హాలాహలమను; మహావిషమ్ = మహావిషము; తేన = దానిచేత; దగ్ధమ్ = కాల్చబడినది; జగత్ = ప్రపంచము; సర్వమ్ = అంతయు; స = సహితముగా; దేవః = దేవతలతో; అసురః = అసురులతో; మానుషమ్ = మానవులతో.

1.45.21.అనుష్టుప్.

అథ దేవా మహాదేవమ్
శంకరం! శరణార్థినః ।
జగ్ముః పశుపతిం రుద్రమ్
 ‘త్రాహి త్రాహీతి’ తుష్టువుః" ॥

తాత్పర్యము :- పిమ్మట దేవతలు మహాదేవుడు, శుభకరుడు, పశుపతియు అయిన రుద్రుని శరణువేడుచు ‘కాపాడుము కాపాడుము’అనుచు స్తుతించిరి

ప్రతిపదార్థము :- అథ = పిమ్మట; దేవా = దేవతలు; మహాదేవమ్ = మహాదేవుడును; శంకరమ్ = శుభమును కలిగించువాడును; శరణార్థినః = శరణుకోరుచు; జగ్ముః = వెళ్ళిరి; పశుపతిమ్ = జీవులకు ప్రభువైన; రుద్రమ్ = రుద్రుని గూర్చి; త్రాహిత్రాహి = రక్షిపుము రక్షింపుము; ఇతి = అని; తుష్టువుః = స్తుతించిరి

1.45.22.అనుష్టుప్.

ఏవముక్తస్తతో దేవైః
దేవదేవేశ్వరః ప్రభుః ।
ప్రాదురాసీ త్తతోఽ త్రైవ
శంఖచక్రధరో హరిః ॥

తాత్పర్యము :- అప్పుడు దేవతలచేత ఈవిధముగ ప్రార్థింపబడుచుండగా పరమేశ్వరుడు మఱియు శంఖచక్రధరుడైన హరి ప్రత్యక్షము అయిరి.

ప్రతిపదార్థము :- ఏవమ్ = ఈ విధముగ; ఉక్తః = పలికిరి; తతః = అప్పుడు; దేవైః = దేవతలచేత; దేవదేవేశ్వరః = దేవదేవేశ్వరుడు, శివుడు; ప్రభుః = ప్రభువు; ప్రాదుః = ప్రత్యక్షము; ఆసీత్ = ఆయెను; తతః = అప్పుడు; అత్ర = అక్కడు; ఏవ = అటులనే; శంఖచక్రధరః = శంఖచక్రములను ధరించిన వాడు; హరిః = హరి

1.45.23.అనుష్టుప్.

ఉవాచైనం స్మితం కృత్వా
రుద్రం శూలభృతం హరిః ।
దైవతైర్మథ్యమానే తు
యత్పూర్వం సముపస్థితమ్ ॥

తాత్పర్యము :- విష్ణుమూర్తి దరహాసముచేసి శూలపాణి రుద్రునితో “దేవతలచే క్షీరసముద్రము చిలుకబడు చుండగా ఏది ముందుగా వచ్చినదో

ప్రతిపదార్థము :- ఉవాచ = పలికెను; ఏనమ్ = ఈ; స్మితమ్ = దరహాసము; కృత్వా = చేసి; రుద్రమ్ = రుద్రునితో; శూలభృతమ్ = శూలపాణి; హరిః = విష్ణుమూర్తి; దైవతైః = దేవతలచేత; మథ్యమానే = చిలుకబడుచుండగా; యత్పూర్వమ్ = ఏదిముందుగ; సముపస్థితమ్ = వచ్చినదో

1.45.24.అనుష్టుప్.

త్వదీయంహి సురశ్రేష్ఠ!
సురాణామగ్రజోఽ సి యత్ ।
అగ్రపూజామిమాం మత్వా
గృహాణేదం విషం ప్రభో" ॥

తాత్పర్యము :- అది నీదికదా! దేవతలలో శ్రేష్ఠుడవైన మహాదేవా! దేవతలలో ముందు పుట్టినవాడివి అయినందున అగ్రపూజగా ఈ విషమును గ్రహింపుము ప్రభూ!”

ప్రతిపదార్థము :- త్వదీయం = నీది; హి = కదా; సురశ్రేష్ఠ = దేవాదిదేవా; సురాణామ్ = దేవతలలో; అగ్రజః = ముందుపుట్టిన వాడిగ; అసి = అయితివో; యత్ = ఏది; అగ్ర పూజామ్ = అగ్ర పూజగా; ఇమామ్ = దీనిని; మత్వా = తలచి; గృహాణ = గ్రహింపుము; ఇదమ్ = ఈ; విషమ్ = విషమును; ప్రభో! = ప్రభూ!

1.45.25.అనుష్టుప్.

ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠః!
తత్రై వాన్తరధీయత ।
దేవతానాం భయం దృష్ట్వా!
శ్రుత్వా వాక్యం తు శార్ఙ్గిణః ।

తాత్పర్యము :- స జగ్రా హామృతోపమమ్ ॥

ప్రతిపదార్థము :- హాలాహలవిషం ఘోరమ్

1.45.26.అనుష్టుప్.

దేవా న్విసృజ్య దేవేశో
జగామ భగవాన్ హరః ।
తతో దేవాసురాస్సర్వే
మమన్థూ రఘునన్దన! ॥

తాత్పర్యము :- రఘురామా! భగవానుడైన శివుడు దేవతలను విడిచి వెళ్ళిన తరువాత దేవాసురులందరు మరల పాలసముద్రాన్ని చిలుకుట కొనసాగించిరి

ప్రతిపదార్థము :- దేవాన్ = దేవతలను; విసృజ్య = వదిలి; దేవ = దేవతల; ఈశః = అధిపతి; జగామ = వెడలెను; భగవాన్ = భగవంతుడైన; హరః = శివుడు; తతః = అప్పుడు; దేవాః = దేవతలు; అసురాః = రాక్షసులు; సర్వే = అందరు; మమన్థుః = చిలికిరి; రఘునన్దన = రఘురామా!

1.45.27.అనుష్టుప్.

ప్రవివేశాథ పాతాళం
మన్థానః పర్వతోఽ నఘ ।
తతో దేవాస్సగన్ధర్వాః
తుష్టువు ర్మధుసూదనమ్ ॥

తాత్పర్యము :- పాపరహితుడవైన రామా! అప్పుడు మంథరగిరి పాతాళము నకు పడెను. దేవగంధర్వులు అప్పుడు మధుసూదనుడైన హరిని స్తుతించిరి

ప్రతిపదార్థము :- ప్రవివేశ = ప్రవేశించెను; అథ = అప్పుడు; పాతాళమ్ = పాతాళము; మన్థానః = మంథర; పర్వతః = గిరి; అనఘ = పాపరహితుడా!; తతః = పిమ్మట; దేవాః = దేవతలు; స = కూడి; గన్ధర్వాః = గంధర్వులతో; తుష్టువుః = స్తుతించిరి; మధుసూదనమ్ = మధుసూదనుడైన హరిని

1.45.28.అనుష్టుప్.

త్వం గతిః సర్వభూతానామ్
విశేషేణ దివౌకసామ్ ।
పాలయాస్మా న్మహాబాహో
గిరిముద్ధర్తు మర్హసి" ॥

తాత్పర్యము :- “మహాభుజుడా! సర్వభూతములకు, ముఖ్యముగా దేవతలకు నీవే గతివి. పర్వతమును పైకెత్తి మమ్ము పాలింపుము.”

ప్రతిపదార్థము :- త్వమ్ = నీవు; గతిః = గతివి; సర్వ = అఖిల; భూతానామ్ = భూతములకు; విశేషేణ = ముఖ్యముగా; దివౌకః = దివ్యులకు; సామ్ = గతివి; పాలయ = పాలించుము; అస్మాన్ = మమ్ములను; మహాబాహో = మహాభుజుడా!; ఉద్థర్తుమ్ = ఎత్తుటకు; అర్హసి = తగియున్నావు

1.45.29.అనుష్టుప్.

ఇతి శ్రుత్వా హృషీకేశః
కామఠం రూపమాస్థితః ।
పర్వతం పృష్ఠతః కృత్వా
శిశ్యే తత్రోదధౌ హరిః ॥

తాత్పర్యము :- ఇది విని ఇంద్రియములు వశపరుచుకున్నవాడైన హరి తాబేలు రూపమును దాల్చి తన వీపుపై పర్వతమును ధరించి సముద్రములో పవళించెను.

ప్రతిపదార్థము :- ఇతి = ఇది; శ్రుత్వా = విని; హృషీకేశః = హృషీకములు అధీనములో గల విష్ణువు; కామఠమ్ = తాబేలుయొక్క; రూపమ్ = రూపమును; ఆస్థితః = పొంది; పర్వతమ్ = పర్వతమును; పృష్ఠతః = వీపుపై; కృత్వా = నిలిపి; శిశ్యే = శయనించెను; తత్రః = అప్పుడు; ఉదధౌ = సముద్రమున; హరిః = హరి

 *గమనిక :- *- హృషీకేశ- హృషీకము (ఇంద్రియము)లకు ఈశ (ప్రభువైనవాడు), హరి).

1.45.30.అనుష్టుప్.

పర్వతాగ్రే తు లోకాత్మా
హస్తేనాక్రమ్య కేశవః ।
దేవానాం మధ్యతః స్థిత్వా
మమన్థ పురుషోత్తమః ॥

తాత్పర్యము :- లోకాత్ముడు, పురుషోత్తముడు అయిన కేశవుడు దేవతల మధ్య చేరి మంథర పర్వతము శిఖరభాగమును చేతితో పట్టుకొని తానుకూడ.

ప్రతిపదార్థము :- పర్వతః = పర్వతము; అగ్రే = పైభాగమును; లోకాత్మా = లోకములే ఆత్మగా గలవాడగు హరి; హస్తేన = చేతులతో; ఆక్రమ్య = ఆక్రమించి; కేశవః = కేశవుడు ( కేశిని సంహారించిన హరి); దేవానామ్ = దేవతల; మధ్యతః = మధ్యన; స్థిత్వా = ఉండి; మమన్థ = మథించెను; పురుషోత్తమః = పురుషోత్తముడు విష్ణువు

1.45.31.అనుష్టుప్.

అథ వర్షసహస్రేణ
సదణ్డ స్సకమణ్డలుః ।
పూర్వం ధన్వన్తరిర్నామ
అప్సరాశ్చ సువర్చసః ॥

తాత్పర్యము :- తరువాత వేయిసంవత్సరముల పిమ్మట, ముందుగా దండ కమండలములతో సహా ఆయుర్వేద మూలపురుషుడు ధన్వంతరి అనువాడును, చక్కని తేజస్సు కల అప్సరసలును (జనించిరి)

ప్రతిపదార్థము :- అథ = పిమ్మట; వర్ష = సంవత్సరములు; సహస్రేణ = వేయికి; సదండః = దండముతో; స = సహా; కమణ్డలుః = కమండలముతో; పూర్వమ్ = ముందుగా; ధన్వతరిః = ధన్వంతరి; నామ = పేరు గల; అప్సరాః చ = అప్సరసలును; చ = ఇంకను; సువర్ఛసః = చక్కని తేజస్సు గల వారు.

 *గమనిక :- *- 1. ధన్వంతరి- ధనో. తన్నిమిత్త శిల్పస్య అంతంమే ఋచ్చత- ధను+అంత+ఋ+ఇన్- కిచ్చ- పృషో, కృ,ప్ర., శరీరసామర్థ్యమునకు సంబంధించిన శిల్పమగు వైద్యమున పారందతుడు, ఆంధ్రశబ్దరత్నాకరము. ధన్వతరము- నాలుగు మూరల పొడవు, ఆంధ్రశబ్దరత్నాకరము. మానవుడు తన మూరతో నాలుగు మూరల పొడవుండును.

1.45.32.అనుష్టుప్.

అప్సు నిర్మథనాదేవ
రసాస్తస్మా ద్వరస్త్రియః ।
ఉత్పేతు ర్మనుజశ్రేష్ఠ!
తస్మా దప్సరసోఽ భవన్ ॥

తాత్పర్యము :- పురుషోత్తముడవైన రామా! నీటిని మధించగా ఆ రసము / సారము నుండి బయల్వెడలుట వలన ఆ శ్రేష్ఠురాండ్రైన స్త్రీలు అప్సరసలు అనబడిరి.

ప్రతిపదార్థము :- అప్సు = నీటిని; నిర్మథనాత్ = మథించిన; ఏవ = నుండే; రసా = రసము; తస్మాత్ = ఆ; వర = శ్రేష్ఠురాండ్రైన; స్త్రియః = స్త్రీలు; ఉత్పేతుః = బయల్వెడలుటచే; మనుజశ్రేష్ఠ = పురుషోత్తమా!; తస్మాత్ = ఆ; అప్సరసః = అప్సరసలు; అభవన్ = అయిరి

 *గమనిక :- *- అప్సరస- వ్యు. అద్భ్యః సరతి- అప్+ సృ + అసున్, ఔణా. నీటి నుండి వెలువడినది, అప్సరస.

1.45.33.అనుష్టుప్.

షష్టిః కోట్యోఽ భవంస్తాసాం
అప్సరాణాం సువర్చసామ్ ।
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ!
యాస్తాసాం పరిచారికాః ॥

తాత్పర్యము :- ఓ రామా! అలా పుట్టిన అరువది కోట్లమంది అప్సరసలకు అసంఖ్యాకులైన పరిచారికలు ఉండిరి.

ప్రతిపదార్థము :- షష్టిః = అరువది; కోట్యః = కోట్ల; అభవన్ = అయిరి; తాసామ్ = ఆ యొక్క; అప్సరాణామ్ = అప్సరసస్త్రీలు; సువర్చసామ్ = మంచి వర్చస్సుగలవారు; అసఖ్యేయాః = అసంఖ్యాకమైన; అస్తు = కలరు; కాకుత్స = రామా; యాః = ఏ; తాసామ్ = వారి; పరిచారికాః = పరిచారికలు.

1.45.34.అనుష్టుప్.

న తాస్స్మ ప్రతిగృహ్ణన్తి
సర్వే తే దేవదానవాః ।
అప్రతిగ్రహణా దేవ
తేన సాధారణాస్స్మృతాః ॥

తాత్పర్యము :- ఆ అప్సరస స్త్రీలను దేవదానవులలో ఎవరూ చేపట్టదలప రైరి. అందువలన వారందరు అందరికీ చెందిన వారుగా చెప్పబడిరి.

ప్రతిపదార్థము :- న = లేదు; తాః = ఆ అప్సర స్త్రీలను; స్మ = తలచుట; పరిగృహ్ణన్తి = వివాహమాడుటను; సర్వః = అందరు; తే = ఆ; దేవః = దేవతలును; దానవాః = దానవులును, అప్రతిగ్రహణాత్ = చేపట్టక పోవుట; ఏవ = వలననే; తాః = వారిని; సర్వాః = అందరు; సాధారణాః = అందరికీ చెందిన వారిగా, సాధారణస్త్రీలుగ, వేశ్యలుగ (ఆంధ్రశబ్దరత్నాకరము); స్మృతాః = చెప్పబడిరి

1.45.35.అనుష్టుప్.

వరుణస్య తతః కన్యా
వారుణీ రఘునన్దన ।
ఉత్పపాత మహాభాగా
మార్గమాణా పరిగ్రహమ్ ॥

తాత్పర్యము :- రామా! తదనంతరము మహాభాగ్యము వంటిదైన వరుణుని కన్య మదిర దేవత తనను స్వీకరించు వారిని వెదకుచు (సముద్రమునుండి) వెలువడెను.

ప్రతిపదార్థము :- వరుణస్య = వరుణునియొక్క; తతః = పిమ్మట; కన్యా = కుమార్తె; వారుణీ = మదిర; రఘునన్దన = రామా!; ఉత్పపాత = బయటకు వచ్చెను; మహాభాగా = మహాభాగ్యవంతుడా; మార్గమాణా = అన్వేషించుచు; పరిగ్రహమ్ = స్వీకరించుటను.

1.45.36.అనుష్టుప్.

దితేః పుత్రా న తాం రామ!
జగృహు ర్వరుణాత్మజామ్ ।
అదితేస్తు సుతా వీర
జగృహుస్తా మనిన్దితామ్ ॥

తాత్పర్యము :- వీరుడవైన రామా! దితి పుత్రులు దైత్యులు వారుణిని స్వీకరింపలేదు, అదితి సుతులు అనింద్యయగు ఆమెను స్వీకరించిరి

ప్రతిపదార్థము :- దితేః = దితియొక్క; పుత్రాః = పుత్రులు; న = చేయలేదు; తామ్ = దానిని; రామ = రామా; జగృహుః = స్వీకరించుట; వరుణః = వరుణుని; ఆత్మజామ్ = కుమార్తెను; అదితేః = అదితియొక్క; సుతాః = కుమారులు; తు = అయితే; వీర = వీరుడవైన రామా!; జగృహుః = గ్రహించిరి; తామ్ = ఆమెను; అనిన్దితామ్ = దోషరహితయైన

1.45.37.అనుష్టుప్.

అసురాస్తేన దైతేయాః
సురాస్తేనాదితే స్సుతాః ।
హృష్టాః ప్రముదితాశ్చాసన్
వారుణీ గ్రహణాత్సురాః ॥

తాత్పర్యము :- సురను గ్రహింపక పోవుటచే దితి పుత్రులు అసురులు, సురను గ్రహించి అదితి పుత్రులు సురలు అయిరి వారుణిని గ్రహించి దేవతలు ప్రీతిని, అభీష్ట సిద్ధిని పొందిరి.

ప్రతిపదార్థము :- అసురాః = అసురులు; తేన = దానివలన; దైతేయాః = దితిపుత్రులు; సురాః = సురలు; తేన = దానివలన; అదితేః = అదితియొక్క; సుతాః = కుమారులు; హృష్టాః = ప్రీతినొందినవారు; ప్రముదితాఃచ ఆసన్ = కోరిక తీరి సంతోషము గలవారిగను; వారుణీ = వారుణిని; గ్రహణాత్ = గ్రహించుటచే; సురాః = సురను

1.45.38.అనుష్టుప్.

ఉచ్చైశ్శ్రవా హయశ్రేష్ఠో
మణిరత్నం చ కౌస్తుభమ్ ।
ఉదతిష్ఠ న్నరశ్రేష్ఠ!
తథైవామృత ముత్తమమ్ ॥

తాత్పర్యము :- పురుషోత్తమా! రామా! ఉచ్చైశ్రవము అను శ్రేష్ఠమైన అశ్వము, మణిరత్నమైన కౌస్తుభము, ఉత్తమమైన అమృతము జనించినవి.

ప్రతిపదార్థము :- ఉచ్చైశ్రవాః = ఉచ్చైశ్రవమను; హయశ్రేష్ఠః = అశ్వరాజము; మణిరత్నంచ = మణిరత్నము; కౌస్తుభమ్ = కౌస్తుభము; ఉదతిష్ఠన్ = బయటకు వచ్చినవి; నరశ్రేష్ఠ = పురుషోత్తముడవైన రామా!; తథైవ = మరియు; అమృతమ్ = అమృతము; ఉత్తమమ్ = ఉత్తమమైన.

1.45.39.అనుష్టుప్.

అథ తస్య కృతే రామ!
మహానాసీ త్కులక్షయః ।
అదితేస్తు తతః పుత్రా
దితేః పుత్రానసూదయన్ ॥

తాత్పర్యము :- రామా! అప్పుడా అమృతముకొఱకు గొప్ప కులక్షయము జరిగినది అదితి కుమారులైన దేవతలు, దితికుమారులైన దైత్యులను మట్టుపెట్టిరి

ప్రతిపదార్థము :- అథ = అప్పుడు; తస్య = దాని, అమృతము; కృతే = కొఱకు; రామ = రామా; మహాన్ = గొప్ప; ఆసీత్ = అయినది; కులక్షయః = కులవినాశనము; అదితేః = అదితియొక్క; అస్తు = చేసిరి; తతః = పిమ్మట; పుత్రాః = కుమారులు; దితేః = దితి; పుత్రాన్ = కుమారులను; అసూదయన్ = చంపిరి;

1.45.40.అనుష్టుప్.

ఏకతోఽ భ్యాగమన్ సర్వే
హ్యసురా రాక్షసైస్సహ ।
యుద్ధమాసీ న్మహాఘోరమ్
వీర త్రైలోక్యమోహనమ్ ॥

తాత్పర్యము :- దైత్యులందరు రాక్షసులతో కూడి ఒకవైపు చేరిరి. వీరుడవైన రామా! అప్పుడు ముల్లోకములకు విభ్రాంతి కలిగించు ఘోరసంగ్రామము జరిగినది

ప్రతిపదార్థము :- ఏకతః = ఒకవైపు; అభ్యాగమన్ = చేరిరి; సర్వేః = అందరును; అసురాః = అసురులు (దైత్యులు); రాక్షసైః = రాక్షసులతో; సహ = కూడి; యుద్ధమ్ = యుద్ధము; ఆసీత్ = జరిగెను; మహాఘోరమ్ = మహాఘోరమైన; వీర = వీరుడవైన రామా!; త్రైలోక్య = ముల్లోకములకు; మోహనమ్ = విభ్రమము కలిగించు.

1.45.41.అనుష్టుప్.

యదా క్షయం గతం సర్వమ్
తదా విష్ణుర్మహాబలః ।
అమృతం సోఽ హరత్తూర్ణమ్
మాయామాస్థాయ మోహినీమ్ ॥

తాత్పర్యము :- సర్వము ఎప్పుడు నశించిపోయినదో అప్పుడు మహాబలశాలి యైన నారాయణుడు శీఘ్రముగ మోహినీ రూపములో మాయను అవలంబించి అమృతమును తస్కరించెను

ప్రతిపదార్థము :- యదా = ఎప్పుడు; క్షయమ్ = నశించి; గతమ్ = అయిపోయినదో; సర్వమ్ = సమస్తము; తదా = అప్పుడు; విష్ణుః = నారాయణుడు; మహా = గొప్ప; బలః = బలశాలి; అమృతమ్ = అమృతము; సః = ఆ; అహరత్ = అపహరించెను; తూర్ణమ్ = శీఘ్రముగ; మాయామ్ = మాయను; అస్థాయ = అవలంబించి; మోహినీమ్ = మోహినీ రూపమున

1.45.42.అనుష్టుప్.

యే గతాభిముఖం విష్ణుం
అక్షయం పురుషోత్తమమ్ ।
సమ్పిష్టాస్తే తదా యుద్ధే
విష్ణునా ప్రభవిష్ణునా ॥

తాత్పర్యము :- నాశరహితుడు,పురుషోత్తముడు, సర్వసమర్థుడు అయిన విష్ణువునకు ఎదురు నిలిచి యుద్ధము చేసిన దైత్యులు ఆతనిచే నలిపివేయబడిరి.

ప్రతిపదార్థము :- యే = ఏ దైత్యులు; గతాః = వెళ్ళిరో; అభిముఖమ్ = ఎదురుగా; విష్ణుమ్ = విష్ణువు గురించి; అక్షయమ్ = నశించనివాడు; పురుషోత్తమమ్ = పురుషోత్తముడు; సమ్పిష్టాః = నలిపి వేయబడిరి; తే = వారు; తదా = ఆ; యుద్ధే = యుద్ధములో; విష్ణునా = విష్ణువుచేత; ప్రభవిష్ణునా = సమర్థుడైన

1.45.43.అనుష్టుప్.

అదితేరాత్మజా వీరా!
దితేః పుత్రాన్నిజఘ్నిరే ।
తస్మిన్ యుద్ధే మహాఘోరే
దైతేయాదిత్యయో ర్భృశమ్ ॥

తాత్పర్యము :- అదితి పుత్రులైన దేవతలకును, దితి పుత్రులైన దైత్యులకును జరిగినభయంకరమైన యుద్ధములో దేవతలు దైత్యులను అతిశయించి చంపివేసిరి

ప్రతిపదార్థము :- అదితేః = అదితియొక్క; ఆత్మజాః = సుతులు; వీరా = వీరుడవైన రామా; దితేః = దితియొక్క; పుత్రాన్ = పుత్రులను; నిజఘ్నిరే = చంపిరి; తస్మిన్ = ఆ; ఘోరే = భయంకరమైన; మహా = గొప్ప; యుద్ధే = యుద్ధమునందు; దైతేయ = దైత్యుల యొక్క; ఆదిత్యయోః = దేవతల యొక్క; భృశమ్ = అతిశయముగ

1.45.44.అనుష్టుప్.

నిహత్య దితిపుత్రాంశ్చ
రాజ్యం ప్రాప్య పురన్దరః ।
శశాస ముదితో లోకాన్
సర్షిసంఘాన్ సచారణాన్ ॥

తాత్పర్యము :- ఇంద్రుడు దితికుమారులైన దైత్యులను చంపి సంతోషము పొంది ఋషిసంఘములతో, చారణులతో సహా లోకములను అన్నింటిని పాలించెను

ప్రతిపదార్థము :- నిహత్య = చంపి; దితిపుత్రామ్ = దైత్యులను; రాజ్యమ్ = రాజ్యమును; ప్రాప్య = పొంది; పురన్దరః = ఇంద్రుడు; శశాస = పరిపాలించెను; ముదితః = సంతోషించినవాడై; లోకాన్ = లోకములు అన్నింటిని; స = సహా; ఋషిః = ఋషులు; సంఘాన్ = సమూహములతో; స = కూడి ఉన్న; చారణాన్ = చారణులతో.

1.45.45.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
పంచచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలబైఐదవ [45] సర్గ సంపూర్ణం

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; పంచచత్వారింశ [45] = ముప్పై ఐదవ; సర్గః = సర్గ.

।।షట్చత్వారింశస్సర్గః।।

[46 - దితి తపస్సు, గర్భస్థ శిశువులు]

1.46.1.అనుష్టుప్.

హతేషు తేషు పుత్రేషు
దితిః పరమదుఃఖితా ।
మారీచం కాశ్యపం రామ!
భర్త్తార మిదమబ్రవీత్ ॥

తాత్పర్యము :- “ఓ రామా ! తన పుత్రులు వధింపబడగా మిక్కిలి దుఃఖముతో దితి తన భర్త, మరీచి కుమారుడు ఐన, కశ్యపునితో ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- హతేషు = చంపబడిన; తేషు = ఆ; పుత్రేషు = పుత్రుల యందు; దితిః = దితి; పరమ = మిక్కిలి; దుఖితా = దుఃఖించినది; మారీచమ్ = మరీచి పుత్రుని; కాశ్యపమ్ = కశ్యపునితో; రామ = ఓ రామా; భర్తారమ్ = భర్తను గుఱించి; ఇదమ్ = ఇది; అబ్రవీత్ = పలికెను.

 *గమనిక :- *- కశ్యపుడు ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు- 1. దితికి - దైత్యులు, 2. అదితికి - ఆదిత్యులు, 3. దనువుకు - దానవులు, 4. అనాయువు / అనుగనకు - సిద్ధులు, 5. ప్రాధకి -గంధర్వులు, 6. మునికి - అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు, 7. సురసకు - యక్షులు, రాక్షసులు, 8. ఇలకు - వృక్ష లతా తృణ జాతులు, 9. క్రోధవశకి - పిశితాశనములైన సింహ వ్యాఘ్రాది సర్వ మృగములు, 10. తామ్రకి - శ్యేన గృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు, 11. కపిల / సురభి - గోగణము, 12. వినతకి - అనూరుఁడు-గరుడుఁడు, 13. కద్రువకు - నాగులు. మఱియు వైశ్వానరుని కుమార్తెలు 14. కాలకి కాలకేయులును, 15. పులోమకి పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు 1. పర్వతుఁడు అను దేవ ఋషి, 2. విభండకుఁడు అను బ్రహ్మ ఋషి పుట్టిరి. పురాణనామ చంద్రిక. పోతన తెలుగు భాగవతము మున్నగు గ్రంథములందు పాఠ్యంతరములు కలవు

1.46.2.అనుష్టుప్.

హతపుత్రాఽస్మి భగవన్
తవ పుత్రైర్మహాబలైః ।
శక్రహన్తార మిచ్ఛామి
పుత్రం దీర్ఘతపోర్జితమ్ ॥

తాత్పర్యము :- “ ఓ భగవంతుడా ! మహాబలవంతులైన నీ కుమారులు, ఇంద్రాది దేవతలు నా పుత్రులను చంపివేసిరి.దేవేంద్రుని చంపగల మహాబలవంతుడైన పుత్రుని నాకు నా దీర్ఘతపమువలన ప్రసాదించుము.”

ప్రతిపదార్థము :- హత = చంపబడిన; పుత్రా = కొడుకులు కలదానిని; అస్మి = అయితిని; భగవన్ = పూజ్యనీయుడా; తవ = నీ యొక్క; పుత్రైః = నీ కుమారులచేత; మహాబలైః = చాలా బలవంతులచేత; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; ఇచ్ఛామి = కోరుచున్నాను; పుత్రమ్ = కుమారుని; దీర్ఘ = మిక్కిలి; తప = తపముచే; ఊర్జితమ్ = బలము గలవానిని

1.46.3.అనుష్టుప్.

సాహం తపశ్చరిష్యామి
గర్భం మే దాతుమర్హసి ।
ఈశ్వరం శక్రహన్తారమ్
త్వమనుజ్ఞాతు మర్హసి" ॥

తాత్పర్యము :- నేను దీర్ఘతపస్సును ఆచరించెదను. లోకాధిపతి, ఇంద్రుని హతమార్చువాడు అగు కుమారుని నాకు ప్రసాదించుము. ”

ప్రతిపదార్థము :- సా = అట్టి; అహమ్ = నేను; తపః = తపము; చరిష్యామి = ఆచరించెదను; గర్భమ్ = గర్భమును; మే = నాకు; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = యోగ్యుడవై ఉన్నావు; ఈశ్వరమ్ = విభువును; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; త్వమ్ = నీవు; అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు; అర్హసి = తగి యుంటివి.

1.46.4.అనుష్టుప్.

తస్యాస్తద్వచనం శ్రుత్వా
మారీచః కాశ్యపస్తదా ।
ప్రత్యువాచ మహాతేజా!
దితిం పరమదుఃఖితామ్ ॥

తాత్పర్యము :- “మిక్కిలి శోకములో ఉన్న దితి పలుకులు విని మహాతేజశ్శాలియు, మరీచి కుమారుడును అగు కశ్యపుడు ఆమె కిట్లు బదులు చెప్పెను.

ప్రతిపదార్థము :- తస్యాః = ఆమెయొక్క; తత్ = ఆ; వచనమ్ = పలుకును; శ్రుత్వా = విని; మారీచః = మరీచి కుమారుడు; కాశ్యపః = కశ్యపుడు; తదా = అప్పుడు; ప్రతి = బదులు; ఉవాచ = చెప్పెను; మహాతేజా = గొప్ప తేజస్సు గలవాడ; దితిమ్ = దితిని గుఱించి; పరమ దుఃఖితామ్ = మిక్కిలి శోకించుచున్న

1.46.5.అనుష్టుప్.

ఏవం భవతు భద్రం తే
శుచిర్భవ తపోధనే ।
జనయిష్యసి పుత్రం త్వమ్
శక్రహన్తార మాహవే ॥

తాత్పర్యము :- “అట్లే అగుగాక! నీకు శుభము అగుగాక! పవిత్రురాలువై తపము చేయుము. తపోధనము వలన యుద్ధములో ఇంద్రుని చంపెడి సుతుడును కనగలవు.

ప్రతిపదార్థము :- ఏవమ్ = అట్లు; భవతు = అగుగాక; భద్రమ్ = శుభము; తే = నీకు; శుచిః = పవిత్రురాలివి; భవ = అగుము; తపః = తపము; ధనే = సంపదచే; జనయిష్యసి = కనగలవు; పుత్రమ్ = కొడుకును; త్వమ్ = నీవు; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = సంహరించు వానిని; ఆహవే = యుద్ధములో

1.46.6.అనుష్టుప్.

పూర్ణే వర్షసహస్రే తు
శుచిర్యది భవిష్యసి ।
పుత్రం త్రైలోక్యభర్తారమ్
మత్తస్త్వం జనయిష్యసి" ॥

తాత్పర్యము :- వేయి సంవత్సరములు పవిత్రురాలువై యుండి తప మాచరించిన యెడల, నీవు నా వలన ముల్లోకములకు ప్రభువగు కుమారుని కనగలవు.”

ప్రతిపదార్థము :- పూర్ణే = నిండగ; వర్ష = సంవత్సరములు; సహస్రః = వేయి; తు; శుచిః = పవిత్రురాలువు; యది = అయితే; భవిష్యసి = పొందగలవు; పుత్రమ్ = కొడుకును; త్రైలోక్య = ముల్లోకములకు; భర్తారమ్ = ప్రభువైన; మత్తః = నా నుంచి; త్వమ్ = నీవు; జనయిష్యసి = కనగలవు

1.46.7.అనుష్టుప్.

ఏవముక్త్వా మహాతేజాః
పాణినా స మమార్జ తామ్ ।
సమాలభ్య తతస్స్వస్తీ -
త్యుక్త్వా స తపసే యయౌ ॥

తాత్పర్యము :- అట్లు పలికి మిక్కిలి తేజోవంతుడైన కశ్యపుడు చేతితో దితిని నిమురుచు, స్పృశించి ఆమెకు స్వస్తి వచనములు పలికి తపము చేసుకొనుటకు వెడలిపోయెను.

ప్రతిపదార్థము :- ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; మహాతేజాః = మిక్కిలి తేజోవంతుడు; పాణినా = చేతితో; స = అతడు; మమార్జ = నిమురుచు; తామ్ = ఆమెను; సమాలభ్య = స్పృశించి; తతః = పిమ్మట; స్వస్తి = మంగళము; ఇతి = అని; ఉక్త్వా = పలికి; స = అతడు; తపసే = తపస్సు కొఱకు; యయౌ = వెడలెను

1.46.8.అనుష్టుప్.

గతే తస్మిన్నరశ్రేష్ఠ!
దితిః పరమహర్షితా ।
కుశప్లవన మాసాద్య
తపస్తేపే సుదారుణమ్ ॥

తాత్పర్యము :- ఓ పురుషశ్రేష్ఠుడా రామా! కశ్యపుడు అట్లు పలికి తపమునకు వెళ్ళగా దితి మిక్కిలి సంతోషముతో “కుశప్లవనము” అనెడు క్షేత్రములో తీవ్రమైన తపమును ఆచరించెను.

ప్రతిపదార్థము :- గతే = వెళ్ళగా; తస్మిన్ = అపుడు; నరశ్రేష్ఠ = మానవులలో ఉత్తముడా; దితిః = దితి; పరమ హర్షితా = మిక్కిలి సంతోషించినది; కుశప్లవనమ్ = కుశప్లవనము అనెడు క్షేత్రమును; ఆసాద్య = పొంది; తపః = తపము; తేపే = చేసెను; సుదారుణమ్ = భయంకరమైన

1.46.9.అనుష్టుప్.

తపస్తస్యాం హి కుర్వన్త్యామ్
పరిచర్యాం చకార హ ।
సహస్రాక్షో నరశ్రేష్ఠ!
పరయా గుణసమ్పదా ॥

తాత్పర్యము :- పురుషోత్తమా ! దితి తన తపము చేయుచున్నంత కాలము వేయికన్నుల దేవేంద్రుడు చక్కటి సద్గుణములు కలిగి ఆమెకు పరిచర్యలు చేసెను.

ప్రతిపదార్థము :- తపః = తపము; తస్యామ్ = తన యొక్క; కుర్వంత్యామ్ = చేయుచున్న అంత కాలము; పరిచర్యాం = సేవలను; చకార హ = చేసెను; ; సహస్రాక్షః = ఇంద్రుడు, సహస్రాక్షుడు- వేగంటి; నరశ్రేష్ఠ = పురుషోత్తమ; పరయా = గొప్ప; గుణసంపదా = సద్గుణసంపదతో

 *గమనిక :- *- గౌతముని శాపంవలన ఇంద్రుడు వేయి కన్నులు కలవాడు ఆయెను, ఇంద్రుడు.

1.46.10.అనుష్టుప్.

అగ్నిం కుశాన్ కాష్ఠమపః
ఫలం మూలం తథైవ చ ।
న్యవేదయత్ సహస్రాక్షో
యచ్చాన్యదపి కాంక్షితమ్ ॥

తాత్పర్యము :- దేవేంద్రుడు దితికి అగ్నిని, దర్భలను, సమిధలను, జలములను, ఫలములను, దుంపలను, కోరిన ఇతర వస్తువులను సమకూర్చుచు సేవలు చేయుచుండెను.

ప్రతిపదార్థము :- అగ్నిమ్ = అగ్నిని; కుశాన్ = దర్భలను; కాష్ఠమ్ = కట్టెలను; అపః = నీటిని; ఫలమ్ = పళ్ళను; మూలమ్ = దుంపలను; తథైవచ = అటులనే; న్యవేదయత్ = సమకూర్చుచుండెను; సహస్రాక్షః = ఇంద్రుడు; యచ్ఛ = ఏదైనా; అన్యత్ అపి = ఇతరములైన; కాంక్షితమ్ = కోరబడిన దానిని

1.46.11.అనుష్టుప్.

గాత్రసంవహ నైశ్చైవ
శ్రమాపనయ నైస్తథా ।
శక్రస్సర్వేషు కాలేషు
దితిం పరిచచార హ ॥

తాత్పర్యము :- దేవేంద్రుడు దితికి ఒళ్ళుపట్టుట, శ్రమతీర్చుట, మొదలగుని అన్ని వేళల చేయుచు శుశ్రూషలు చేసెను.

ప్రతిపదార్థము :- గాత్ర = శరీరమును; సంవహనః = పట్టుట; ; ఏవ = చేత; శ్రమః = శ్రమను; అపనయనైః = తొలగించుట చేతను; తథా = మరియు; శక్రః = దేవేంద్రుడు; సర్వేషు కాలేషు = ఎల్లవేళలందు; దితిమ్ = దితిని; పరిచచార = సేవలు చేసెను; హ.

1.46.12.అనుష్టుప్.

అథ వర్షసహస్రే తు
దశోనే రఘునన్దన ।
దితిః పరమసమ్ప్రీతా
సహస్రాక్షమ థాబ్రవీత్ ॥

తాత్పర్యము :- ఓ రఘునందనా! దితి తొమ్మిద వందలతొంబై (పది తక్కువ వెయ్యి) సంవత్సరములు తపము ఆచరించి ఇంద్రుని పరిచర్యలకు మిక్కిలి సంతృప్తి చెందినదై అతనితో ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- అథ = పిదప; వర్షః = సంవత్సరములు; సహస్రే = వేయింటికి; తు; దశ = పది; ఊనే = తక్కువ ఉండగా; రఘునందన = రామా!; దితిః = దితి; పరమ = మిక్కిలి; సంప్రీతా = సంతోషించినదై; సహస్రాక్షమ్ = ఇంద్రునకు; అథ = పిమ్మట; అబ్రవీత్ = పలికెను.

1.46.13.అనుష్టుప్.

యాచితేన సురశ్రేష్ఠ!
పిత్రా తవ మహాత్మనా ।
వరో వర్షసహస్రాన్తే
మమ దత్తస్సుతం ప్రతి ॥

తాత్పర్యము :- “సురలలో శ్రేష్ఠుడా! ఇంద్రుడా! మహాత్ముడైన నీ తండ్రిని యాచించగా వేయి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత నాకు పుత్రుడు జన్మించును అని వరము ఇచ్చిరి.

ప్రతిపదార్థము :- యాచితేన = అడుగబడిన; సురశ్రేష్ఠ = దేవతలలో శ్రేష్ఠుడా, ఇంద్రా; తవ = నీ; పిత్రా = తండ్రిచే; మహాత్మనా = మహాత్మునిచే: వరః = వరము; వర్షః = సంవత్సరములు; సహస్రః = వేయి; అంతే = పూర్తయినపుడు; దత్తః = ఇవ్వబడినది; మమ = నా యొక్క; సుతం = పుత్రుడు; ప్రతి = గుఱించి.

1.46.14.అనుష్టుప్.

తపశ్చరన్త్యా వర్షాణి
దశ వీర్యవతాం వర ।
అవశిష్టాని భద్రం తే
భ్రాతరం ద్రక్ష్యసే తతః ॥

తాత్పర్యము :- శూరులలో శ్రేష్ఠుడా! నీకు మంగళమగు గాక! నా తపము పూర్తి అగుటకు మరొక పది సంవత్సరములు మిగిలి ఉన్నవి. ఆ తరువాత నీవు తమ్ముడిని చూచెదవు.

ప్రతిపదార్థము :- తపః = తపము; చరః = ఆచరించించుట; అంత్యా = పూర్తిఅగుటకు; వర్షాణి = సంవత్సరములు; దశ = పది; వీర్యవతామ్ = శూరులలో; వర = శ్రేష్ఠుడా; అవశిష్టాని = మిగిలినవి; భద్రమ్ = మంగళము; తే = నీకు; భ్రాతరమ్ = సోదరుడిని; ద్రక్షసే = చూచెదవు; తతః = పిమ్మట

1.46.15.అనుష్టుప్.

తమహం త్వత్కృతే పుత్ర
సమాధాస్యే జయోత్సుకమ్ ।
త్రైలోక్యవిజయం పుత్ర
సహ భోక్ష్యసి విజ్వరః" ॥

తాత్పర్యము :- కుమారా ! నేను నా సుతుడిని నీ విజయములో ఆసక్తి గలవానిగ ఒప్పించగలను. నీవు భయాందోళనలు లేక వానితో కలసి ముల్లోకముల విజయమును అనుభవింపగలవు.”

ప్రతిపదార్థము :- తమ్ = అతనిని; అహమ్ = నేను; త్వత్కృతే = నీ కొఱకు; పుత్ర = కుమారా; సమాధాస్యే = చేయగలను; జయః = జయములో; ఉత్సుకమ్ = ఉద్యోగించినవానిగ; త్రైలోక్యః = ముల్లోకముల; విజయమ్ = విజయమును; పుత్ర = కుమారా; సహ = కలసి; భోక్ష్యసి = అనుభవింపగలవు; విజ్వరః = భయము ఆందోళన లేక.

1.46.16.అనుష్టుప్.

ఏవముక్త్వా దితిః శక్రమ్
ప్రాప్తే మధ్యం దివాకరే ।
నిద్రయాపహృతా దేవీ
పాదౌ కృత్వాఽ థ శీర్షతః ॥

తాత్పర్యము :- దితి దేవేంద్రుడుతో అట్లు పలికి, మిట్ట మధ్యహ్నము తలాపిదిక్కు రెండు పాదములు ఉంచుకొని నిద్రకు వశమయ్యెను.

ప్రతిపదార్థము :- ఏవమ్ = అట్లు; ఉక్త్వా = పలికి; దితిః = దితి; శక్రమ్ = ఇంద్రుని కొఱకు; ప్రాప్తే = పొందుచుండగా; మధ్యమ్ = నడిమిని; దివాకరే = సూర్యుడు; నిద్రయా = నిద్ర కొఱకు; అపహృతా = అపహరించబడినది; దేవీ = దేవి; పాదౌ = రెండు పాదములు; కృత్వా = చేసి; అథ = పిమ్మట; శీర్షతః = తలవైపు

1.46.17.అనుష్టుప్.

దృష్ట్వా తామశుచిం శక్రః
పాదతః కృతమూర్దజామ్ ।
శిరస్స్థానే కృతౌ పాదౌ
జహాస చ ముమోద చ ॥

తాత్పర్యము :- అపవిత్రురాలుగ నుండి, తలాపిదిక్కు పాదములును, పాదములపై శిరోజములును పడుతుండగా ముడుచుకుని పరుండి నిదురించుచున్న దితిని చూచి ఇంద్రుడు ఆనందముతో నవ్వుకొనెను.

ప్రతిపదార్థము :- దృష్వా = చూచి; తామ్ = ఆమెను; అశుచిమ్ = అపవిత్రురాలుని; శక్రః = ఇంద్రుడు; పాదతః = పాదములపై; కృత = ఉంచబడిన; మూర్ధజామ్ = శిరోజములు కలిగి; శిరః = తలపెట్టుకొను; స్థానే = చోటున; కృతౌ = ఉంచబడిన; పాదౌ = పాదములు రెండును కలిగి; జహాస = నవ్వెను; చ = మరియు; ముమోద = చాలా ఆనందించెను; చ = కూడ.

1.46.18.అనుష్టుప్.

తస్యాశ్శరీర వివరమ్
వివేశ చ పురన్దరః ।
గర్భం చ సప్తధా రామ
బిభేద పరమాత్మవాన్ ॥

తాత్పర్యము :- రామా! మిక్కిలి ధృతిమంతుడైన దేవేంద్రుడు అపుడు ఆమె శరీరరంధ్రము ద్వారా గర్భము లోనికి ప్రవేశించి అందలి శిశువును ఏడు ముక్కలుగా నరికెను.

ప్రతిపదార్థము :- తస్యాః = ఆమె యొక్క; శరీరవివరమ్ = శరీర రంధ్రము ద్వారా; వివేశ = ప్రవేశించి; ; పురందరః = ఇంద్రుడు; గర్భమ్ = గర్భస్థ పిండము / శిశువు; ; సప్తధా = ఏడు విధములుగా; రామ = ఓ రామా!; బిభేద = ముక్కలు చేసెను; పరమ్ = శ్రేష్ఠమైన; ఆత్మవాన్ = బుద్ధి కలవాడు.

 *గమనిక :- *- పురందరుడు- వైవస్వత మన్వంతరంలో ఇంద్రుని పేరు (పోతన తెలుగు భాగవతము), వ్యుత్పత్తి. పూర్+ దౄ+ఖచ్- మమ్- నిపా, కృ.ప్ర., శత్రువులను నశింపజేయువాడు, ఇంద్రుడు, ఆంధ్రశబ్దరత్నాకరము.

1.46.19.అనుష్టుప్.

భిద్యమానస్తతో గర్భో
వజ్రేణ శతపర్వణా ।
రురోద సుస్వరం రామ
తతో దితిరబుధ్యత ॥

తాత్పర్యము :- ఓ!రామా! నూరు అంచులు గల వజ్రాయుధముచే ఖండించబడుచున్న గర్భము బిగ్గరగా ఏడ్చెను. దితి నిద్రనుంచి మేల్కొనెను.

ప్రతిపదార్థము :- భిద్యమానః = ఛేదించబడుచున్న; తతః = అప్పుడు; గర్భః = గర్భము; వజ్రేణ = వజ్రాయుధముచే; శతపర్వణా = నూరుఅంచులుగల; రురోద = ఏడ్చెను; సుస్వరమ్ = పెద్దగొంతుతో; రామ = ఓ రామా!; తతః = పిమ్మట; దితిః = దితి; అబుధ్యత = నిదుర లేచెను

1.46.20.అనుష్టుప్.

మారుదో మా రుద”శ్చేతి
గర్భం శక్రోఽ భ్యభాషత ।
బిభేద చ మహాతేజా
రుదన్తమపి వాసవః ॥

తాత్పర్యము :- మహాతేజస్సు గల ఇంద్రుడు గర్భస్థునితో “ఏడవకు, ఏడవకు”, అని పలుకుచు వానిని ముక్కలు చేసెను.

ప్రతిపదార్థము :- మా రుదః = ఏడవకుము; మా రుదః = ఏడవకుము; ; ఇతి = అని; గర్భమ్ = గర్భస్థుని; శక్రః = ఇంద్రుడు; అభ్యభాషత = పలికెను; బిభేద = ముక్కలు చేసెను; చ = కూడా; మహాతేజా = గొప్ప తేజస్సు కల; రుదన్తమ్ అపి = ఏడ్చుచున్నను; వాసవః = ఇంద్రుడు

1.46.21.అనుష్టుప్.

న హన్తవ్యో న హన్తవ్య”
ఇత్యేవం దితి రబ్రవీత్ ।
నిష్పపాత తతశ్శక్రో
మాతు ర్వచన గౌరవాత్ ॥

తాత్పర్యము :- దితి “చంపవలదు,చంపవలదు” అనగా, దేవేంద్రుడు తల్లిమాటపై గౌరవముతో బయటకు వచ్చెను.

ప్రతిపదార్థము :- న హంతవ్యః = చంపదగదు; న హంతవ్య = చంపదగదు; ఇతి ఏవమ్ = ఇట్లని; దితిః = దితి; అబ్రవీత్ = పలికెను; నిష్పపాత = బయటకు వచ్చెను; తతః = పిమ్మట; శక్రః = ఇంద్రుడు; మాతుః = తల్లి యొక్క; వచన = మాటపై; గౌరవాత్ = గౌరవముతో.

1.46.22.అనుష్టుప్.

ప్రాంజలిర్వజ్రసహితో
దితిం శక్రోఽ భ్యభాషత ।
అశుచిర్దేవి సుప్తాఽ సి
పాదయోః కృతమూర్దజా ॥

తాత్పర్యము :- వజ్రధారియై ఇంద్రుడు దోసిలితో దితికి నమస్కరించి “ ఓ దేవీ! పాదములందు శిరోజములను ఉంచి నిదురించి అపవిత్రురాల వైతివి” అని పలికెను.

ప్రతిపదార్థము :- ప్రాంజలిః = దోసిలితో నమస్కరించి; వజ్రః = వజ్రాయుధముతో; సహితః = కలిగి ఉండి; దితిమ్ = దితి గుఱించి; శక్రః = ఇంద్రుడు; అభ్యభాషత = పలికెను; అశుచిః = అపవిత్రురాలవై; దేవి = ఓ దేవీ! సుప్తా అసి = నిద్రపోయితివి; పాదయోః = రెండు పాదముల మీద; కృతమూర్ధజ = ఉంచబడిన కేశములు కలదానవై

1.46.23.అనుష్టుప్.

తదన్తరమహం లబ్ధ్వా
శక్రహన్తార మాహవే ।
అభిదం సప్తధా దేవి
తన్మే త్వం క్షన్తుమర్హసి" ॥

తాత్పర్యము :- “ నేనలా దొరికిన అవకాశమును ఉపయోగించుకొని యుద్ధములో నన్ను సంహరింపనున్న వానిని ఏడు ముక్కలుగా చేసితిని. ఓ దేవీ! నన్ను క్షమించుము”.

ప్రతిపదార్థము :- తత్ = ఆ; అంతరమ్ = సందు, అవకాశము; అహమ్ = నేను; లబ్ధ్వా = పొంది; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; ఆహవే = యుద్ధములో; అభిదమ్ = ఛేదించితిని; సప్తధా = ఏడు భాగములుగా; దేవి = ఓ దేవి; తత్ = దానిని (ఆ చర్యను); మే = నా యొక్క; త్వమ్ = నీవు; క్షంతుమ్ = క్షమించుటకు; అర్హసి = తగియున్నావు

1.46.24.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
షట్చత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [46] నలభైఆరవ సర్గ సుసంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; షట్చత్వారింశ [46] = నలభై ఆరవ; సర్గః = సర్గ.

సప్తచత్వారింశఃసర్గః॥

[47 విశ్వామిత్ర విశాలనగర ప్రవేశము]

1.47.1.అనుష్టుప్.

సప్తధా తు కృతే గర్భే
దితిః పరమదుఃఖితా ।
సహస్రాక్షం దురాధర్షమ్
వాక్యం సానునయాబ్రవీత్ ॥

తాత్పర్యము :- ఇట్లు తన గర్భపిండము ఏడు ముక్కలుగా ఖండించబడి నందుకు దుఃఖించుచు దితి, ఎదిరింప శక్యము కాని దేవేంద్రునితో అనునయపూర్వకముగా ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- సప్తధా = ఏడు ముక్కలుగా; తు; కృతే = చేయబడుచుండగా; గర్భే = గర్భపిండము; దితిః = దితి; పరమ = మిక్కిలి; దుఃఖితా = దుఃఖించినదై; సహస్రాక్షమ్ = దేవేంద్రుని గురించి; దురాధర్షమ్ = ఎదిరింపశక్యము కాని; వాక్యమ్ = వాక్యమును; స = సహితమైన; అనునయా = అనునయము కలదై; అబ్రవీత్ = పలికెను;

 *గమనిక :- *- దితి- దైత్యులమాత, నఱకుట, ఖండనము, ఆంధ్రశబ్దరత్నాకరము.

1.47.2.అనుష్టుప్.

మమాపరాధాద్ గర్భోఽ యమ్
సప్తధా విఫలీకృతః ।
నాపరాధోఽ స్తి దేవేశ!
తవాత్ర బలసూదన! ॥

తాత్పర్యము :- “బలాసూదన! ఓ దేవేంద్రా! నా అపరాధము వలన నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థమైనది, ఇందు నీ అపరాధ మన్నది లేదు.

ప్రతిపదార్థము :- మమ = నాయొక్క; అపరాధాత్ = అపరాధము వలన; గర్భః = గర్భము; అయమ్ = ఇది; సప్తధా = ఏడు భాగములుగా; విఫలీ = వ్యర్థమైనదిగా; కృతః = చేయబడినది; న = లేదు; అపరాధః = అపరాధము; అస్తి = కలుగుట; దేవేశ = దేవేంద్రా!; తవ = నీయొక్క; అత్ర = ఈ విషయమున; బలసూదన = బలాసురుని సంహరించిన ఇంద్రా!.

1.47.3.అనుష్టుప్.

ప్రియం తు కర్తుమిచ్ఛామి
మమ గర్భవిపర్యయే ।
మరుతాం సప్త సప్తానామ్
స్థానపాలా భవన్త్విమే ॥

తాత్పర్యము :- నా గర్భమునకు వాటిల్లిన ఈ ఆపద గురించి నాకు ఇష్టమగునట్లు ఒక పని చేయమని కోరుచున్నాను. ఈ గర్భ ఖండములు ఏడును స్థితి భేదముల ప్రకారము ఏడు వాయువులకు పాలకులను చేయుము.

ప్రతిపదార్థము :- ప్రియమ్ = ఇష్టము కలుగునట్లు; తు; కర్తుమ్ = చేయుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; మమ = నాకు; గర్భ = గర్భమునకు కలిగిన; విపర్యయే = ఈ ఆపద విషయమున; మరుతామ్ = వాయువుల; సప్త = ఏడు ఖండములు; సప్తానామ్ = ఏడుగురైన; స్థాన = స్థితి; పాలాః = పాలకులుగా; భవన్తు = చేయుము; ఇమే = ఈ.

 *గమనిక :- *- మరుత్తః వాతస్కంధః ఆకాశస్య భాగవిశేషః (యత్ర వాయుర్వహతి). 1. భూమి నుండీ మేఘాల వరకూ తిరిగే వాయువు - "ఆవహము". 2. మేఘాలనుండీ సూర్యుని వరకూ - "ప్రవహము". 3. సూర్యుని నుండీ చంద్రుని వరకూ - "సంవహము". 4. చంద్రుడు నుంచీ నక్షత్రాల వరకు - "ఉద్వహము". 5. నక్షత్రాల నుండీ గ్రహ మండలం వరకూ - "వివహము". 6. గ్రహ మండలం నుండీ సప్తర్షుల వరకూ - "పరి వహము". 7. సప్తర్షి మందలం నుంచీ ధ్రువ మండలం వరకు - "పరావహము". అను పేర్లు గల సప్త మరుత్తులు. వీటిని "వాతస్కంధములు" అంటారు. ఈ క్రమముననే ఆంధ్రమహా భాగవతము నందు పోతనామాత్యుల వారు ఇట్లు పేర్కొనిరి. 8-622-శా. ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై। నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై। నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై। నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై॥

1.47.4.అనుష్టుప్.

వాతస్కన్ధా ఇమే సప్త
చరన్తు దివి పుత్రక ।
మారుతా ఇతి విఖ్యాతా
దివ్యరూపా మమాత్మజాః ॥

తాత్పర్యము :- కుమారా! ఈ ఏడుగురు సప్త వాయు స్కంధములు / సప్త వాయువులుగా ఆకాసమునందు సంచరించెదరు గాక. నా కుమారులు దివ్య రూపములు గలవారై మరుత్తులను పేరుతో పిలువబడుదరు గాక.

ప్రతిపదార్థము :- వాత = వాయు; స్కన్ధాః = విభాగములు (పొరలు, స్థానములు); ఇమే = ఈ; సప్త = ఏడుగురు; దివిః = ఆకసమున (అంతరిక్షమునందు); చరన్తు = సంచరించెదరు గాక; పుత్రక = పుత్రా; మారుతాః = మరుత్తులు; ఇతి = అని పిలవబడుచు; విఖ్యాతాః = ప్రసిద్ధులగుదురు; దివ్య = దివ్యమైన; రూపాః = రూపము గలవారు; మమ = నాయొక్క; ఆత్మజాః = కుమారులు.

1.47.5.అనుష్టుప్.

బ్రహ్మలోకం చరత్వేక
ఇన్ద్రలోకం తథాపరః ।
దివి వాయురితి ఖ్యాతః
తృతీయోఽ పి మహాయశాః ॥

తాత్పర్యము :- దేవేంద్రా! వారిలో నొకడు బ్రహ్మలోకమునందు, మరొకడు ఇంద్రలోకమునందు, మూడవవాడు ఆకసము నందు ప్రసరించెదరు అని ప్రసిద్ధి.

ప్రతిపదార్థము :- బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకము; చరతు = చరించును; ఏకః = ఒకడు; ఇన్ద్రలోకమ్ = ఇంద్రలోకమును; తథా = అటులనే; అపరః = మరొకడును; దివి = ఆకసమునందు; వాయుః = వాయువు; ఇతి = అని; ఖ్యాతః = ప్రసిద్ధుడు; తృతీయః = మూడవవాడు; అపి = కూడ; మహాయశాః = గొప్పకీర్తి కలవాడా, ఇంద్రా.

 *గమనిక :- *- ఆకాశమునందు ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, వివహ, పరివహ, వరావహములనే ఏడు వాయు ప్రకారముల (స్థానములు) ఉన్నవి; {1; ఆహవ వాయువు: మేఘ మండలానికి; భూమండలానికి మధ్య ప్రసరించునది, ఇది ఆకాసము; 2; ప్రవహ వాయువు: సూర్య మండలానికి; మేఘ మండలానికి మధ్య ప్రసరించునది, ఇది ఇంద్రలోకము; 3; అనువహ వాయువు: చంద్ర మండలానికి; సూర్య మండలానికి మధ్య ప్రసరించునది; 4; సంవహ వాయువు: నక్షత్ర మండలానికి; చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది; 5; వివహ వాయువు: గ్రహ్ర మండలానికి; నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది; 6; పరావహ వాయువు: సప్తర్షి మండలానికి; గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది; 7; పరివహ వాయువు: ధ్రువ మండలానికి; సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది. ఇది బ్రహ్మలోకము}

1.47.6.అనుష్టుప్.

చత్వారస్తు సురశ్రేష్ఠ!
దిశో వై తవ శాసనాత్ ।
సంచరిష్యన్తు భద్రం తే
దేవభూతా మమాత్మజాః ॥

తాత్పర్యము :- మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞ ప్రకారం దేవతలై దిక్కులందు సంచరిచెదరు గాక. నీకు జయమగు గాక.

ప్రతిపదార్థము :- చత్వారః = మిగిలిన నలుగురు; తు; సురశ్రేష్ఠః = దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రా!; దిశః = దిశలు (దిక్కులు); వై = అందు; తవ = నీయొక్క; శాసనాత్ = ఆదేశముచే; సంచరిష్యన్తు = సంచరించెదరు గాక; భద్రమ్ = జయమగుగాక; తే = నీకు; దేవ = దేవతలుగా; భూతాః = ఐ; మమః = నా; ఆత్మజాః = కుమారులు; .

1.47.7.అనుష్టుప్.

త్వత్కృతేనైవ నామ్నా చ
మారుతా ఇతి విశ్రుతాః" ।
తస్యా స్తద్వచనం శ్రుత్వా
సహస్రాక్షః! పురన్దరః! ॥

తాత్పర్యము :- వీరిని ఖండించు సమయమున నీవు వీరిని మా రుదః (ఏడ్వకుము) అని పిలిచితివి. ఆవిధముగనే వీరు అలా మారుతులు అను పేరుతో లోకములో ప్రసిద్ధి పొందెదరు గాక.” దితి యొక్క ఆ కోరిక వినిన వెంటనే , సహస్రాక్షుడు, పురందరుడు అయిన ఇంద్రుడు. .

ప్రతిపదార్థము :- త్వత్ = నీవు; కృతేన = చేసిన కార్యము చేతనే; ఏవ = మాత్రమే; నామ్నా = పేరుతో; ; మారుతాః = మారుతులు; ఇతి = అని; విశ్రుతాః = ప్రసిద్ధి పొందెదరు; తస్యాః = ఆమె (దితి) యొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = వినిన వెంటనే; సహస్రాక్షః = వేయి కన్నులు కలవాడు; పురన్దరః = ఇంద్రుడు;

1.47.8.అనుష్టుప్.

ఉవాచ ప్రాంజలిర్వాక్యమ్
దితిం బలనిషూదనః ।
సర్వమేత ద్యథోక్తం తే
భవిష్యతి న సంశయః ॥

తాత్పర్యము :- దితి మాటలు విని చేతులు జోడించి ఆమెతో ఇట్లు చెప్పెను. “నిస్సందేహముగా నీవు చెప్పినట్లుగనే సమస్తము జరుగును.

ప్రతిపదార్థము :- టీకః:- ఉవాచ = పలికెను; ప్రాంజలిః = చేతులు జోడించి; వాక్యమ్ = పలుకులు; దితిమ్ = దితిగురించి; బలనిషూదనః = బల అనే రాక్షసుడిని చంపిన వాడు, ఇంద్రుడు; సర్వమ్ = సమస్తము; ఏతత్ = ఏదైతే; యథా = అదే విధముగానే; ఉక్తమ్ = చెప్పినట్టి; తే = నీవు; భవిష్యతి = జరుగు గాక; న = లేనేలేదు; సంశయః = సందేహము.

1.47.9.అనుష్టుప్.

విచరిష్యన్తి భద్రం తే
దేవరూపా స్తవాత్మజాః” ।
ఏవం తౌ నిశ్చయం కృత్వా
మాతాపుత్రౌ తపోవనే ॥

తాత్పర్యము :- నీ ఏడుగురు కుమారులు దేవతా రూపములతోనే సంచరించెదరు గాక. నీకు జయము అగుగాక.” పిమ్మట ఆ తల్లీకొడుకులు దితి, ఇంద్రుడ ఇద్దరూ తపోవనమునందు ఈ విధముగా నిశ్చయము చేసికొని..

ప్రతిపదార్థము :- విచరిష్యన్తి = సంచరించెదరు; భద్రం = జయమగుగాక; తే = నీకు; దేవః = దేవతల; రూపాః = రూపములతో; తవ = నీ; ఆత్మజాః = (49 మంది) కుమారులు; ఏవమ్ = ఈ విధముగా; తౌ = వారిరువురు (ఇంద్రుడు, దితి); నిశ్చయం = నిశ్చయము; కృత్వా = చేసుకుని; మాతా పుత్రౌ = తల్లీ కొడుకులు ఇరువురూ; తపోవనే = తపోవనమునందు.

1.47.10.అనుష్టుప్.

జగ్మతు స్త్రిదివం రామ!
కృతార్థావితి నః శ్రుతమ్ ।
ఏష దేశస్స కాకుత్స్థ!
మహేన్ద్రాధ్యుషితః పురా ॥

తాత్పర్యము :- శ్రీరామా! కృతార్థులై స్వర్గమునకు వెళ్లిరి అని వింటిమి. ఓ రామా! ఇది పూర్వము మహేంద్రుడు అధిష్టించిన దేశము.

ప్రతిపదార్థము :- జగ్మతుః = వెళ్లిరి; త్రిదివమ్ = స్వర్గమునకు; రామ = రామా!; కృతార్ధౌ = కృతార్థులై; ఇతి = అని; నః = మాకు; శ్రుతమ్ = వినబడినది (తెలిసినది); ఏష = ఇది; దేశః = దేశము; స = ఆ; కాకుత్స్థ = రామా!; మహేన్ద్ర = మహేంద్రుడు; అధ్యుషితః = అధిష్టించిన; పురా = పూర్వము.

1.47.11.అనుష్టుప్.

దితిం యత్ర తపస్సిద్ధామ్
ఏవం పరిచచార సః ।
ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర!
పుత్రః పరమధార్మికః ॥

తాత్పర్యము :- ఇచటనే దితి తపస్సు చేయుచుండ ఆమెకు మహేంద్రుడు ఉపచారములు చేసెను. రామా! ఇక్ష్వాకునకు జనించిన పరమధార్మికుడైన కుమారుడు. .

ప్రతిపదార్థము :- దితిమ్ = దితి; యత్ర = ఎక్కడైతే; తపః = తపస్సు చేయుటకు; సిద్ధామ్ = సిద్ధపడెనో; ఏవమ్ = ఈ విధముగా; పరిచచార = ఉపచారములు చేసెను; సః = అతడు; ఇక్ష్వాకః = ఇక్ష్వాకునకు; అస్తు = కలిగెనో, ఉండెనో; నరవ్యాఘ్ర = పురుష శ్రేష్ఠుడవైన రామా; పుత్రః = కుమారుడు; పరమధార్మికః = మిక్కిలి ధార్మికుడు

1.47.12.అనుష్టుప్.

అలమ్బుసాయా ముత్పన్నో
విశాల ఇతి విశ్రుతః ।
తేన చాసీదిహ స్థానే
విశాలేతి పురీ కృతా ॥

తాత్పర్యము :- అలంబుస యందు ఇక్ష్వాకునకు విశాలుడనే పేరుతో ప్రసిద్ధి పొందినవాడు పుట్టెను. విశాల అనే ఈ పట్టణమును విశాలుడు నిర్మించెను.

ప్రతిపదార్థము :- అలంబుసాయామ్ = అలంబుస నందు; ఉత్పన్నః = పుట్టిన; విశాల = విశాలుడు; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధి పొందిన; తేన = అతనిచే; ; ఆసీత్ = ఉండెను; ఇహ = ఈ; స్థానే = స్థానమునందు; విశాల = విశాల; ఇతి = అను; పురీ = పట్టణమును; కృతా = చేయబడెను (నిర్మించబడెను)

1.47.13.అనుష్టుప్.

విశాలస్య సుతో రామ!
హేమచన్ద్రో మహాబలః ।
సుచన్ద్ర ఇతి విఖ్యాతో
హేమచన్ద్రా దనన్తరః ॥

తాత్పర్యము :- రామా! విశాలుని కుమారుడు మహా బలవంతు డైన హేమచంద్రుడు. అతను తరువాత సుచంద్రుడు అనుపేర ప్రసిద్ధిగాంచెను.

ప్రతిపదార్థము :- విశాలస్య = విశాలుని యొక్క; సుతః = కుమారుడు; రామ = రామా!; హేమచన్ద్రః = హేమచంద్రుడు; మహా = మిక్కిలి; బలః = బలవంతుడు; సుచన్ద్ర = సుచంద్రుడు; ఇతి = అను పేరుతో; విఖ్యాతః = ప్రసిద్ధుడయ్యెను; హేమచన్ద్రాత్ = హేమచంద్రుని; అనన్తరః = తరువాతివాడు.

1.47.14.అనుష్టుప్.

సుచన్ద్రతనయో రామ!
ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః ।
ధూమ్రాశ్వ తనయశ్చాపి
సృంజయః సమపద్యత ॥

తాత్పర్యము :- రామా! సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడుగా ప్రసిద్ధి గాంచెను, అతని కుమారుడు సృంజయుడు.

ప్రతిపదార్థము :- సుచన్ద్రః = సుచంద్రుని; తనయః = కుమారుడు; రామ = రామ!; ధూమ్రాశ్వ = ధూమ్రాశ్వడు; ఇతి = అని; విశ్రుతః = పేరుపొందెను; ధూమ్రాశ్వః = ధూమ్రాశ్వుని; తనయః = కుమారుడు; ; అపి; సృంజయః = సృంజయుడు; సమపద్యత = జన్మించెను

1.47.15.అనుష్టుప్.

సృంజయస్య సుతః శ్రీమాన్!
సహదేవః ప్రతాపవాన్ ।
కుశాశ్వః సహదేవస్య
పుత్రః పరమధార్మికః ॥

తాత్పర్యము :- రామ! సృంజయుని కుమారుడు సహదేవుడు ప్రతాపవంతుడు. అతని కుమారుడు పరమధార్మికుడైన కుశాశ్వుడు.

ప్రతిపదార్థము :- సృంజయస్య = సృంజయుని యొక్క; సుతః = కుమారుడు; శ్రీమాన్ = పురుషుల బిరుదు, రామ!; సహదేవః = సహదేవుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు అయిన; కుశాశ్వః = కుశాశ్వుడు; సహదేవస్య = సహదేవుని యొక్క; పుత్రః = కుమారుడు; పరమ = మిక్కిలి; ధార్మికః = ధార్మికుడైన;

1.47.16.అనుష్టుప్.

కుశాశ్వస్య మహాతేజా
సోమదత్తః ప్రతాపవాన్ ।
సోమదత్తస్య పుత్రస్తు
కాకుత్స్థ! ఇతి విశ్రుతః ॥

తాత్పర్యము :- కుశాశ్వుని కుమారుడు మహాతేజశ్శాలి, ప్రతాపవంతుడు ఐన సోమదత్తుడు. ఆతని కుమారుడు కాకుత్స్థుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచెను.

ప్రతిపదార్థము :- కుశాశ్వస్య = కుశాశ్వుని యొక్క (పుత్రుడు); మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; ప్రతాపవాన్ = సోమదత్తః = సోమదత్తుడు; ప్రతాపవంతుడు; సోమదత్తస్య = సోమదత్తునియొక్క; పుత్రస్తు = కుమారుడు; కాకుత్స్థః = కాకుత్స్థుడు; ఇతి = అని; విశ్రుతః = ప్రఖ్యాతి గాంచెను;

1.47.17.అనుష్టుప్.

తస్య పుత్రో మహాతేజాః
సమ్ప్రత్యేష పురీమిమామ్ ।
ఆవసత్య మరప్రఖ్యః
సుమతిర్నామ దుర్జయః ॥

తాత్పర్యము :- గొప్ప తేజస్సు కల కాకుత్స్థుని కుమారుడు ప్రస్తుతము ఈ పట్టణములోనే ఉన్నాడు. అతను సుమతి అను పేరుతో దేవతా సమానుడు, జయింప శక్యము కానివాడు ఇక్కడ నివసిస్తున్నాడు.

ప్రతిపదార్థము :- తస్య = అతని (కాకుత్స్థుని); పుత్రః = కుమారుడు; మహా = గొప్ప; తేజాః = మహాతేజోవంతుడు; సమ్ప్రతి = ప్రస్తుతము; ఏష = ప్రస్థితుడై; పురీమ్ = నగరము; ఇమామ్ = దీనియందు; ఆవసతిః = నివసించుచున్నాడు; అమరః = దేవతలను; ప్రఖ్యః = పోలువాడు; సుమతిః = సుమతి అను; నామ = పేరుకలవాడు; దుర్జయః = జయింపశక్యము కానివాడు.

1.47.18.అనుష్టుప్.

ఇక్ష్వాకోస్తు ప్రసాదేన
సర్వే వైశాలికా నృపాః ।
దీర్ఘాయుషో మహాత్మానో
వీర్యవన్తః సుధార్మికాః ॥

తాత్పర్యము :- ఈ వంశ మూలపుషుడైన ఇక్ష్వాకు మహారాజు అనుగ్రహంచేత, విశాల నగరపు రాజులందరు కూడ దీర్ఘ ఆయుష్మంతులు, మహాత్ములు, పరాక్రమవంతులు, మంచి ధర్మనిష్ఠ కలవారు.

ప్రతిపదార్థము :- ఇక్ష్వాకోః = ఇక్ష్వాకుని యొక్క; తు; ప్రసాదేన = అనుగ్రహముతో; సర్వే = అందరును; వైశాలికాః = విశాల నగరపు; నృపాః = రాజులు; దీర్ఘాయుషః = దీర్ఘ ఆయుష్షు గలవారు; మహాత్మానః = మహాత్ములు; వీర్యవన్తః = పరాక్రమవంతులు; సుధార్మికాః = మంచి ధర్మనిష్ఠ కలవారు;

 *గమనిక :- *- ఇక్ష్వాకునికి అప్సరస అలంబుస యందు కొడుకు విశాల నగర నిర్మాత 1) విశాలుడు.విశాలుని కొడుకు 2) హేయచంద్రుడు అతని తరువాత 3)సుచంద్రుడు, అతని కొడుకు 4) ధూమ్రాశ్వుడు, అతని కొడుకు 5) సృంజయుడు, అతని కొడుకు 6) సహదేవుడు, అతని కొడుకు 7) కుశాశ్వుడు, అతని కొడుకు. 8) సోమదత్తుడు, అతని కొడుకు 9) కాకుత్స్థుడు, అతని కొడుకు 10) సుమతి. వీరిని వైశాలులు అందురు.

1.47.19.అనుష్టుప్.

ఇహాద్య రజనీం రామ!
సుఖం వస్త్యమహే వయమ్ ।
శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ!
జనకం ద్రష్టుమర్హసి ॥

తాత్పర్యము :- రామా! ఈ రాత్రి మనము ఇచటనే వసించెదము. రేపు సూర్యోదయము మనము జనక మహారాజును చూచెదము.

ప్రతిపదార్థము :- ఇహ = ఇచటనే; అద్య = నేడు; రజనీమ్ = రాత్రి; రామ = రామా!; సుఖమ్ = సుఖముగా; వస్త్యామహే = నివసించెదము; వయమ్ = మనము; శ్వః = రేపు; ప్రభాతే = ఉదయమున; నరశ్రేష్ఠః = ఓ నరశ్రేష్ఠుడా, రామ; జనకమ్ = జనక మహారాజును; ద్రష్టుమర్హసి = చూడవచ్చును.

1.47.20.అనుష్టుప్.

సుమతిస్తు మహాతేజా
విశ్వామిత్ర ముపాగతమ్ ।
శ్రుత్వా నరవరశ్రేష్ఠః
ప్రత్యుద్గచ్ఛ న్మహాయశాః ॥

తాత్పర్యము :- మహాతేజోవంతుడు, మహాయశస్వి, రాజశ్రేష్ఠుడు అయిన సుమతి విశ్వామిత్రుని ఆగమన వార్త విని స్వాగతము చెప్పుటకు ఎదురువెళ్లెను.

ప్రతిపదార్థము :- సుమతిః = సుమతి; తు = కూడా; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కల; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; ఉపాగతమ్ = ఆగమనమును; శ్రుత్వా = విని; నరవరశ్రేష్ఠః = రాజులలో శ్రేష్ఠుడు; ప్రత్యుత్ గచ్ఛత్ = స్వాగతము చెప్పుటకు ఎదురుగా వెళ్లెను; మహాయశాః = గొప్పకీర్తిమంతుడు.

 *గమనిక :- *- నరవర- నర(మానవులకు) వరుడు(ఱేడు, శ్రేష్ఠుడు), రాజు.

1.47.21.అనుష్టుప్.

పూజాం చ పరమాం కృత్వా
సోపాధ్యాయః సబాన్ధవః ।
ప్రాంజలిః కుశలం పృష్ట్వా
విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥

తాత్పర్యము :- ఆచార్యులతోడను బంధుమిత్ర పరివారముతోడను కూడి గొప్పగా గౌరవమర్యాదలు చేసి, దోసిలి ఒగ్గి కుశల ప్రశ్నలు అడిగి విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

ప్రతిపదార్థము :- పూజామ్ = గౌరవమర్యాదలు; ; పరమామ్ = గొప్పగా; కృత్వా = చేసి; స = సహితముగ; ఉపాధ్యాయః = ఆచార్యులు; స = సహితముగ; బాన్ధవః = బంధు మిత్ర పరివారముతోను; ప్రాంజలిః = దొసిలొగ్గి; కుశలమ్ = క్షేమసమాచారాములు; పృష్ట్వా = అడిగి; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; అథ = తరువాత; అబ్రవీత్ = ఇట్లు పలికెను;

 *గమనిక :- *- ప్రాంజలి- చేమోడ్పు, వివరణ. మోడ్చిన కేలు గలవాడు, వ్యుత్పత్తి. ప్రబద్దః అంజలి యేన, బ.వ్రీ., అంజలి- బొటనవ్రేలు వంచి చూపుడువ్రేలు మొదట కూర్చి తక్కిన వ్రేళ్ళు చాచిన రెండుచేతులను కూర్చి పట్టినది, గౌరవసూచకము.

1.47.22.అనుష్టుప్.

ధన్యోఽ స్మ్యనుగృహీతోఽ స్మి
యస్య మే విషయం మునిః ।
సమ్ప్రాప్తో దర్శనం చైవ
నాస్తి ధన్యతరో మయా ॥

తాత్పర్యము :- మునీంద్రా! నీవు మా దేశమునకు విచ్చేసి, దర్శనభాగ్యము కలిగించినందున నేను ధన్యుడనయితిని. అనుగ్రహింపబడిన వాడినయితిని. నాకంటె గొప్ప ధన్యులు వేరొకరు లేరు.

ప్రతిపదార్థము :- ధన్యః = ధన్యుడనైతిని; అస్మి = నేను; అనుగృహీతః = అనుగ్రహింపబడిన వాడనయితిని; అస్మి = నేను; యస్య = ఏ; మే = నాయొక్క; విషయమ్ = దేశమునకు; మునిః = మునీంద్రా!; సంప్రాప్తః = వచ్చితివో; దర్శనమ్ = దర్శనము కలుగుట; ; ఏవ = కూడా; నాస్తి = లేడు; ధన్యతరః = మిక్కిలి ధన్యుడు; మయా = నాకంటె.

 *గమనిక :- *- ధన్యము- ధన్యతరము, ధన్యతమము.

1.47.23.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
సప్తచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభై ఏడవ సర్గ [47] సంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; సప్తచత్వారింశ [47] = ముప్పై ఏడవ; సర్గః = సర్గ.

అష్టచత్వారింశఃసర్గః॥

[48 అహల్యాశాప వృత్తాంతము]

1.48.1.అనుష్టుప్.

పృష్ట్వా తు కుశలం తత్ర
పరస్పరసమాగమే ।
కథాన్తే సుమతిర్వాక్యమ్
వ్యాజహార మహామునిమ్ ॥

తాత్పర్యము :- వారు అక్కడ ఒకరినొకరు కలసినపుడు క్షేమ సమాచారములు తెలుసుకుని కొంత ముచ్చటించుకొనిన పిమ్మట సుమతి మిశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు అడిగెను.

ప్రతిపదార్థము :- పృష్ట్వా = అడిగి; తు; కుశలమ్ = క్షేమమును; తత్ర = అక్కడ; పరస్పర = ఒకరి నొకరు; సమాగమే = కలయుట; కథః = ముచ్చటలు; అన్తే = చివర; సుమతిః = సుమతి; వాక్యమ్ = మాటను; వ్యాజహార = అనెను; మహామునిమ్ = మహామునితో;

1.48.2.అనుష్టుప్.

ఇమౌ కుమారౌ భద్రం తే
దేవతుల్య పరాక్రమౌ ।
గజసింహగతీ వీరౌ
శార్దూలవృష భోపమౌ ॥

తాత్పర్యము :- ఈ కుమారులు దేవతలతో సరితూగు పరాక్రమవంతులు. ఏనుగు సింహముల వంటి నడక కలిగిన వారుగను, పులి వృషభముల వంటి వీరుల వలెను ఉన్నారు.

ప్రతిపదార్థము :- ఇమౌ = ఈ; కుమారౌ = ఇరువురు కుమారులు; భద్రమ్ = క్షేమము; తే = నీకు; దేవ = దేవతలతో; తుల్య = సరితూగు; పరాక్రమౌ = పరాక్రమము కలవారు; గజ = ఏనుగుల వంటి; సింహ = సింహముల వంటి; గతీ = నడక గల వారు; వీరౌ = ఇద్దరు వీరులు; శార్దూలః = పులులతో; వృషభః = ఎద్దులతోను; ఉపమౌ = సరిపోలువారు.

1.48.3.అనుష్టుప్.

పద్మపత్ర విశాలాక్షౌ
ఖడ్గతూణీ ధనుర్ధరౌ ।
అశ్వినావివ రూపేణ
సముపస్థిత యౌవనౌ ॥

తాత్పర్యము :- ఇక్కడకు వచ్చిని వీరిరువురు తామర పూరేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు, ఖడ్గధనుర్బాణములను ధరించారు, అశ్వినీ దేవతలంత అందముగా ఉన్నారు. నవయౌవనులు.

ప్రతిపదార్థము :- పద్మపత్రః = తామర పూరేకుల వంటి; విశాల = విశాలమైన; అక్షౌ = కన్నులు కలవారు; ఖడ్డః = ఖడ్గములను; తూణీ = బాణములను; ధనుః = విల్లులను; ధరౌ = ధరించినవారు; అశ్వినా = అశ్వినీ దేవతలు (వీరుకూడ ఇద్దరే); ఇవ = వలె; రూపేణ = అందమైన రూపముతో; సముపస్థిత = సమీపించిన; యౌవనౌ = యువకులు.

1.48.4.అనుష్టుప్.

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ
దేవలోకా దివామరౌ ।
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ?
కిమర్థం? కస్య? వా మునే! ॥

తాత్పర్యము :- ఓ విశ్వామిత్రామునీ! దివి నుండి భువికి స్వేచ్ఛగా దిగివచ్చిన దేవతలవలె నున్న వీరిద్దరు ఎవరి కుమారులు? కాలి నడకన ప్రయాణము చేసినట్లున్నారు; ఇక్కడకు వచ్చిన కారణమేమి?

ప్రతిపదార్థము :- యదృచ్ఛయైవ = ఇష్టానుసారముగనే; గామ్ = భూమిని; ప్రాప్తౌ = పొందిన; దేవలోకాత్ = స్వర్గము నుండి; ఇవ = వలె; అమరౌ = ఇద్దరు దేవతల; కథమ్ = ఎట్లు; పద్భ్యామ్ = కాలి నడకన; ఇహ = ఇచటకు; ప్రాప్తౌ = పొందిన; కిమర్థమ్ = ఎందువలన; కస్య = ఎవరికి; వా = సంబంధించిన వారు; మునే = మునీ;

1.48.5.అనుష్టుప్.

భూషయన్తావిమం దేశమ్
చన్ద్రసూర్యా వివామ్బరమ్ ।
పరస్పరస్య సదృశౌ
ప్రమాణేంగిత చేష్టితైః ॥

తాత్పర్యము :- ఈ ప్రదేశమును వీరు ఆకాశమును సూర్యచంద్రులు అలంకరించినట్లు నలంకరించుచున్నారు. వీరిరువురి హావభావ చేష్టలు ఒకేవిధ ప్రమాణముగా నున్నవి.

ప్రతిపదార్థము :- భూషయన్తౌ = అలంకరించుచున్న వారిరువురు; ఇమమ్ = ఈ; దేశమ్ = దేశమును; చన్ద్ర = చంద్రుడు; సూర్యౌ = సూర్యులు ఇద్దరు; ఇవ = వలె; అమ్బరమ్ = ఆకాశమును; పరస్పరస్య = ఒకరికొకరు; సదృశౌ = సమానులు; ప్రమాణేంగిత = ప్రమాణములతో; చేష్టితైః = హావభావచేష్టల.

1.48.6.అనుష్టుప్.

కిమర్థం చ నరశ్రేష్ఠౌ!
సమ్ప్రాప్తౌ దుర్గమే పథి?
వరాయుధధరౌ వీరౌ
శ్రోతుమిచ్ఛామి తత్త్వతః" ॥

తాత్పర్యము :- ఓ మునిశ్రేష్ఠా! విశేషమైన గొప్ప ఆయుధములు ధరించి యున్న ఈ వీరులు ఇద్దరు దుర్గమమైన మార్గములో కాలి నడకన ప్రయాణము చేసి ఎందుకు వచ్చినారో తెలియ గోరుచున్నాను.”

ప్రతిపదార్థము :- కిమర్థమ్ = దేనికై; మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠా; సంప్రాప్తౌ = వచ్చిరి; దుర్గమే = నడచుటకు కష్టమైన; పథి = మార్గము నందు; వరః = గొప్ప విశేషమైన; ఆయుధ = ఆయుధములను; ధరౌ = ధరించిన వారు; వీరౌ = ఇద్దరు వీరులు; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; తత్వతః = యథార్థముగా.

1.48.7.అనుష్టుప్.

తస్య తద్వచనం శ్రుత్వా
యథావృత్తం న్యవేదయత్ ।
సిద్ధాశ్రమ నివాసం చ
రాక్షసానాం వధం తథా ॥

తాత్పర్యము :- రాజు మాటలు విశ్వామిత్రుడు విని, సిద్ధాశ్రమ నివాసము, రాక్షసవధ ఇత్యాది వృత్తాంతములను యథాతథముగా వివరించెను.

ప్రతిపదార్థము :- తస్య = అతనియొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లు; న్యవేదయత్ = తెలిపెను; సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమము నందు; నివాసంచ = నివాసమును; రాక్షసానామ్ = రాక్షసులయొక్క; వధమ్ = వధించుటను; తథా = మరియు;

1.48.8.అనుష్టుప్.

విశ్వామిత్రవచః శ్రుత్వా
రాజా పరమహర్షితః ।
అతిథీ పరమౌ ప్రాప్తౌ
పుత్రౌ దశరథస్య తౌ ॥

తాత్పర్యము :- విశ్వామిత్రుని మాటలు విని, రాజు చాల సంతోషించి, అతిథులుగా వచ్చిన ఆ దశరథ కుమారులను సత్కరించెను.

ప్రతిపదార్థము :- విశ్వామిత్రః = విశ్వామిత్రుని; వచః = మాటలను; శ్రుత్వా = విని; రాజా = రాజు; పరమ = మిక్కిలి; హర్షితః = సంతోషించి; అతిథీ = అతిథులుగా; పరమౌ = గొప్ప; ప్రాప్తౌ = వచ్చిన వారును; దశరథస్య = దశరథుని; పుత్రౌ = ఇద్దరు కుమారులును; తౌ = వారిద్దరిని.

1.48.9.అనుష్టుప్.

పూజయామాస విధివత్
సత్కారార్హౌ మహాబలౌ ।
తతః పరమసత్కారమ్
సుమతేః ప్రాప్య రాఘవౌ ॥

తాత్పర్యము :- శాస్త్రబద్ధమైన సత్కారమునకు అర్హులు, మహాబలశాలు లైన రామ లక్ష్మణులను రాజు సుమతి చేసిన ఆ సత్కారములు గైకొనిరి.

ప్రతిపదార్థము :- పూజయామాస = పూజించెను; విధివత్ = శాస్త్రబద్ధముగా; సత్కారార్హౌ = సత్కారమునకు తగినవారును; మహాబలౌ = మహాబలవంతులయిన; తతః = ఆ; పరమ = గొప్ప; సత్కారమ్ = సత్కారమును; సుమతేః = సుమతి నుండి; ప్రాప్యః = పొందిరి; రాఘవౌ = రామలక్ష్మణులు.

1.48.10.అనుష్టుప్.

ఉష్య తత్ర నిశామేకామ్
జగ్మతుర్మిథిలాం తతః ।
తాన్ దృష్ట్వా మునయః సర్వే
జనకస్య పురీం శుభామ్ ॥

తాత్పర్యము :- విశ్వామిత్రాది మునులు రామ లక్ష్మణులు అక్కడ ఒక రాత్రి విశ్రమించి జనకమహారాజు మిథిలానగరమునకు పయనమైరి. ఆనగరమును వీక్షించిరి.

ప్రతిపదార్థము :- ఉష్య = ఉండి; తత్ర = అక్కడ; నిశామ్ = రాత్రి; ఏకామ్ = ఒకటి; జగ్మతుః = వెళ్ళిరి; మిథిలామ్ = మిథిలా నగరమునకు; తతః = తరువాత; తామ్ = ఆ; దృష్ట్వా = చూసి; మునయః = మునులు; సర్వే = సకలురు; జనకస్య = జనక మహారాజు యొక్క; పురీమ్ = పట్టణమును; శుభామ్ = శుభమైన.

1.48.11.అనుష్టుప్.

సాధు సాధ్వి”తి శంసన్తో
మిథిలాం సమపూజయన్ ।
మిథిలోపవనే తత్ర
ఆశ్రమం దృశ్య రాఘవః ॥

తాత్పర్యము :- మునులు రామలక్ష్మణులు మిథిలానగరమును చాల బాగున్నది అని మెచ్చుకొని. ఆ నగరమును పొగిడిరి. తరువాత ఆ నగర సమీపమున నున్న వనమందు ఎవరూ లేని ఒక ఆశ్రమమును చూసిరి.

ప్రతిపదార్థము :- సాధు సాధు = బాగున్నది బాగున్నది; ఇతి = అని; శంసన్తః = ప్రశంసించుచు; మిథిలామ్ = మిథిలా నగరమును; సమపూజయన్ = గౌరవించిరి; మిథిలః = మిథిలానగరమునకు; ఉపవనే = సమీపమున ఉన్న వనమునందు; శూన్యమ్ = ఎవరూలేని, ఖాళీగా ఉన్న; మాశ్రమమ్ = ఆశ్రమమును; దృశ్య = చూసి; రాఘవః = రాముడు.

1.48.12.అనుష్టుప్.

పురాణం నిర్జనం రమ్యమ్”
పప్రచ్ఛ మునిపుంగవమ్ ।
శ్రీమదాశ్రమ సంకాశమ్
కిం న్విదం? మునివర్జ్జితమ్ ॥

తాత్పర్యము :- రాముడు విశ్వామిత్రుని ఆ ఆశ్రమము గురించి ఇలా అడిగెను. “ఈ అందమైన, పాతకాలపు, గొప్ప ఆశ్రమము వలె కనిపించుచున్నది. ఐనను మునులు ఎందుకు దీనిని ఇలా విడిచిపెట్టేసారు?”

ప్రతిపదార్థము :- పురాణమ్ = పాతకాలపు; నిర్జనమ్ = ఎవరూ లేనిది; రమ్యమ్ = అందమైనది; పప్రచ్ఛ = అడిగెను; మునిపుంగవమ్ = మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని; శ్రీమత్ = గొప్పదైన; ఆశ్రమ = ఆశ్రమము; సంకాశమ్ = వంటిది; కిం ను = ఏమి; ఇదమ్ = ఇది; మునిః = మునులు; వర్జితమ్ = విడిచిపెట్టినది.

1.48.13.అనుష్టుప్.

శ్రోతుమిచ్ఛామి భగవన్!
కస్యాయం పూర్వ ఆశ్రమః?"
తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తమ్
వాక్యం వాక్యవిశారదః ॥

తాత్పర్యము :- రాముడు ఆ ప్రాచీనమైనటువంటి ఆశ్రమము ఎవరిది తెలుసుకొన గోరుతున్నానని" చక్కగా నేర్పుగా అడిగిన వినిన రాముని విన్నపము వాక్యవిశారదుడైన విశ్వామిత్రుడు ఆలకించెను..

ప్రతిపదార్థము :- జ్ఞాతుమిచ్ఛామి = తెలుసుకొన గోరుచున్నాను; భగవన్ = పూజ్యుడా; కస్య = ఎవరి; ఆయమ్ = ఈ; పూర్వమ్ = ప్రాచీనమైన; ఆశ్రమః = ఆశ్రమము; తత్ = అది; శ్రుత్వా = విని; రాఘవేణ = రామునిచేత; ఉక్తమ్ = పలకబడిన; వాక్యమ్ = మాట; వాక్యవిశారదః = మాటలాడుట యందు నేర్పరి;

1.48.14.అనుష్టుప్.

ప్రత్యువాచ మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ।
హన్త తే కథయిష్యామి
శృణు తత్త్వేన రాఘవ! ॥

తాత్పర్యము :- విశ్వామిత్రమహర్షి ఇట్లు బదులు చెప్పెను “రామా! చాలా సంతోషము ఈ ఆశ్రమము గురించి వివరించెదను వినుము.

ప్రతిపదార్థము :- ప్రత్యువాచ = బదులు పలికెను; మహాతేజాః = గొప్ప తేజస్సు గల; విశ్వామిత్రః = విశ్వామిత్రుడను; మహామునిః = మహాముని; హన్త = సంతోషము; తే = నీకు; కథ యిష్యామి = వినిపించెదను; శృణు = వినుము; తత్త్వేన = యథార్థముగా; రాఘవ = రామా;

1.48.15.అనుష్టుప్.

యస్యైత దాశ్రమపదమ్
శప్తం కోపాన్మహాత్మనా ।
గౌతమస్య నరశ్రేష్ఠ!
పూర్వమాసీ న్మహాత్మనః ॥

తాత్పర్యము :- మానవోత్తమా రామా! ఈ ఆశ్రమము ఎవరి శాప వశమున ఇట్లున్నదో చెప్పెదను వినుము. పూర్వము ఈ ఆశ్రమము గౌతమ మహామునిది.

ప్రతిపదార్థము :- యస్య = ఎవరిదో; ఇదమ్ = ఈ; ఆశ్రమ పదమ్ = ఆశ్రమ స్థానము; శప్తమ్ = శపింపబడినది; కోపాత్ = కోపము వలన; మహాత్మనా = మహాత్ముని వలన; గౌతమస్య = గౌతమమునిదిగా; నరశ్రేష్ఠా = మానవోత్తమా; పూర్వమ్ = పూర్వము; ఆసీత్ = ఉండెను; మహాత్మనః = మహాత్ముడైన;

1.48.16.అనుష్టుప్.

ఆశ్రమో దివ్యసంకాశః
సురైరపి సుపూజితః ।
స చేహ తప ఆతిష్ఠత్
అహల్యాసహితః పూరా ॥

తాత్పర్యము :- దేవ లోకముతో సమానమైన ఈ ఆశ్రమము దేవతలచేత కూడ గౌరవింప బడినది. గౌతముడు అహల్యాదేవితో సమేతుడై ఇక్కడ తపము నాచరించెను;

ప్రతిపదార్థము :- ఆశ్రమః = ఆశ్రమము; దివ్య = దేవ లోకముతో; సంకాశః = సమానమైనది; సురః = దేవతలచేత; అపి = కూడ; సుపూజితః = గొప్పగా గౌరవింపబడెడిది; సః = అతడు; ఇహ = ఇక్కడ; తపః = తపము; ఆతిష్ఠత్ = ఆచరించెను; అహల్యా సహితః = అహల్యతో కూడి; పురా = పూర్వము.

1.48.17.అనుష్టుప్.

వర్షపూగా ననేకాంశ్చ
రాజపుత్ర మహాయశః ।
తస్యాన్తరం విదిత్వా తు
సహస్రాక్షః శచీపతిః ॥

తాత్పర్యము :- రాకుమారా రామా! ఈ ఆశ్రమములో గౌతమముని అనేక సంవత్వరముల పాటు తపస్సు చేసుకొనుచుండెను. అతను ఆశ్రమము బయటకు వెళ్ళిన సమయం ఎఱిగి వేయికన్నులు కల శచీదేవి భర్త దేవేంద్రుడు.

ప్రతిపదార్థము :- వర్షః = సంవత్సరములు; పూగాన్ = సమూహములు; అనేకాన్ = అనేక; ; రాజపుత్ర = రాకుమారా; మహా = గొప్ప; యశః = కీర్తి గల; తస్య = అతనియొక్క; అంతరమ్ = వెలుపల ఉన్న విషయము; విదిత్వా = తెలిసికొని, ఎఱిగి; సహస్రాక్షః = వేయి కన్నులు వాడు; శచీపతిః = శచీదేవి భర్త.

1.48.18.అనుష్టుప్.

మునివేషధరోఽ హల్యామ్
ఇదం వచనమబ్రవీత్ ।
ఋతుకాలం ప్రతీక్షన్తే
నార్థినః సుసమాహితే॥

తాత్పర్యము :- గౌతమముని వేషము ధరించిన ఇంద్రుడు గౌతముని భార్య అహల్యతో ఇటుల అనెను "ఓ బహుచక్కని అహల్యా! సుఖ భోగమును కోరువారు ఋతుసమయమునకు ఎదురు చూడరు.

ప్రతిపదార్థము :- మునిః = ముని గౌతముని; వేషమ్ = వేషము / రూపము; ధరః = ధరించినవాడై; అహల్యామ్ = అహల్యతో; ఇదమ్ = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; ఋతుకాలమ్ = ఋతుకాలమును; ప్రతీక్షన్తే = ఎదురు చూచుట; న = ఉండదు; అర్థినః = భోగమును కోరువారు; సు = మంచి, మిక్కిలి; సమాహితే = చక్కగా సృష్టింపబడినదానా.

1.48.19.అనుష్టుప్.

సంగమం త్వహమిచ్ఛామి
త్వయా సహ సుమధ్యమే “ ।
మునివేషం సహస్రాక్షమ్
విజ్ఞాయ రఘునన్దన! ॥

తాత్పర్యము :- "సుందరమైన నడుము కల అహల్యా! నీతో సంగమము కోరుచున్నాను" అని ఇంద్రుడు పలికెను. రఘురామా! ఇంద్రుడే మునివేషమున వచ్చెనని అహల్య గ్రహించినది;

ప్రతిపదార్థము :- సంగమమ్ = సంభోగమును; తు; అహమ్ = నేను; ఇచ్ఛామి = కోరుతున్నాను; త్వయా = నీతో; సహ = కూడి; సుమధ్యమే = సుందరీ, సమధ్యమ- చక్కని నడుము కలది, సుందరి; మునివేషమ్ = ముని వేషధారి; సహస్రాక్షమ్ = ఇంద్రుడని; విజ్ఞాయ = తెలిసి; రఘునన్దన = రామా;

1.48.20.అనుష్టుప్.

మతిం చకార దుర్మేధా
దేవరాజ కుతూహలాత్ ।
అథాబ్రవీ త్సురశ్రేష్ఠమ్
కృతార్థే నాన్తరాత్మనా ॥

తాత్పర్యము :- రామా! అతను ఇంద్రుడని తెలిసి కూడ ఇంద్రుని యందు ఆసక్తి గల దుర్బుద్ధితో అతనితో సంగమించి; కోరిక తీరిన పిమ్మట ఇట్లు పలికెను;

ప్రతిపదార్థము :- మతిం = మనసున; చకార = అంగీకరించినది; దుర్మేధాః = దుర్బుద్ధితో; దేవరాజ = ఇంద్రుని యందు; కుతూహలాత్ = కోరిక కల; అథ = తరువాత; అబ్రవీత్ = పలికెను; నరశ్రేష్ఠ = మానవోత్తమా; కృతార్థేన = కోరిక తీరినదై; అన్తరాత్మనా = అంతఃకరణముతో.

1.48.21.అనుష్టుప్.

కృతార్థాస్మి సురశ్రేష్ఠ!
గచ్ఛ శీఘ్రమితః ప్రభో! ।
ఆత్మానం మాం చ దేవేశ!
సర్వదా రక్ష గౌతమాత్ ॥

తాత్పర్యము :- దేవేంద్రా! కృతార్థురాలనైతిని. ఇచటి నుండి త్వరగా వెళ్ళుము. గౌతముని నుండి నిన్ను నన్ను కూడ అన్ని విధముల రక్షింపుము.

ప్రతిపదార్థము :- “కృతార్థా = కృతార్థురాలను; అస్మి = ఐతిని; సురశ్రేష్ఠ = దేవేంద్రా; గచ్ఛ = వెళ్ళుము; శీఘ్రమ్ = త్వరగా; ఇతః = ఇక్కడి నుండి; ప్రభో = ప్రభూ; ఆత్మానమ్ = నిన్ను; మాం చ = నన్ను; చ = కూడ; దేవేశ = దేవేంద్ర; సర్వదా = అన్ని విధముల; రక్షః = రక్షింపుము; గౌతమాత్ = గౌతమముని నుండి;

 *గమనిక :- *- సురశ్రేష్ఠుడు- దేవతలలో శ్రేష్ఠుడు, ఇంద్రుడు

1.48.22.అనుష్టుప్.

ఇన్ద్రస్తు ప్రహసన్ వాక్యం
అహల్యామిదమబ్రవీత్ ।
సుశ్రోణి పరితుష్టోఽ స్మి
గమిష్యామి యథాగతమ్ ॥

తాత్పర్యము :- అహల్య మాట వినిన ఇంద్రుడు నవ్వి "ఓ సుందరీ సంతోషించితిని. వచ్చినట్లే వెళ్ళెదను" అని బదులు పలికెను.

ప్రతిపదార్థము :- ఇన్ద్రస్తు = ఇంద్రుడు; ప్రహసన్ = నవ్వుచు; వాక్యమ్ = మాట; అహల్యామ్ = అహల్యతో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను; సుశ్రోణి = అందమైన పిరుదులు గలదానా; పరితుష్టః = సంతోషించిన వానిని; అస్మి = ఐతిని; గమిష్యామి = వెళ్ళగలను; యథాగతమ్ = వచ్చిన విధముగా.

1.48.23.అనుష్టుప్.

ఏవం సంగమ్య తు తయా
నిశ్చక్రామోటజాత్తతః ।
స సమ్భ్రమాత్త్వరన్ రామ!
శంకితో గౌతమం ప్రతి ॥

తాత్పర్యము :- రామా! ఇంద్రుడు ఆ విధముగా అహల్యతో సంగమించి. గౌతముడు వచ్చునేమో యని శంకించుచు భయమువలన తొందర పడుచు. పర్ణశాలనుండి బయలువెడలెను.

ప్రతిపదార్థము :- ఏవమ్ = ఈవిధముగా; సంగమ్య తు = సంగమము చేసి; తు; తయా = ఆమెతో; నిశ్చక్రామ = బయలుదేరెను; ఉటజాత్ = పర్ణశాల నుండి; సః = అతడు; సంభ్రమాత్ = భయము వలన; త్వరన్ = త్వరపడుచు; రామ = రామా; శంకితః = శంకించుచు; గౌతమం = గౌతముని; ప్రతి = గురించి.

 *గమనిక :- *- ఉటజము- వ్యు. ఉటః- తృణపర్ణాదిః- ఉటేభ్యో జాయతో- ఉట+ జా+ డః, కృ.ప్ర., ఆకులతో ఏర్పడునది, పర్ణశాల, ఆకుటిల్లు, గుడిస, పాక. ఆంధ్రశబ్దరత్నాకరము.

1.48.24.అనుష్టుప్.

గౌతమం స దదర్శాథ
ప్రవిశన్తం మహామునిమ్ ।
దేవదానవ దుర్దర్షమ్
తపోబల సమన్వితమ్ ॥

తాత్పర్యము :- ఇంద్రుడు ప్రవేశిస్తున్న గౌతమ మహా మునిని చూసెను. ఆ గౌతమముని దేవ దానవుల చేత కూడ ఎదిరింప వీలుకాని మహా తపోబల సంపన్నుడు

ప్రతిపదార్థము :- గౌతమమ్ = గౌతముని; స = అతను; దదర్శ = చూసెను; అథ = తరువాత; ప్రవిశన్తమ్ = ప్రవేశించుచుండగా; మహా = గొప్ప; మునిమ్ = మునిని; దేవః = దేవతల చేతగాని; దానవః = రాక్షసుల చేతగాని; దుర్ధర్షమ్ = ఎదిరింప వీలు కాని వాడు; తపఃబల = తపశ్శక్తి; సమన్వితమ్ = కలవాడు.

1.48.25.అనుష్టుప్.

తీర్థోదక పరిక్లిన్నమ్
దీప్యమాన మివానలమ్ ।
గృహీతసమిధం తత్ర
సకుశం మునిపుంగవమ్ ॥

తాత్పర్యము :- గౌతమమునిశ్రేష్ఠుడు, తీర్థోదకములతో తడిసి, గొప్ప తేజస్సుతో, ప్రకాశవంతంగా మండుచున్న అగ్నివలె వెలుగుచున్నాడు. చేతియందు దర్భలు, సమిధలు ఉన్నాయి.

ప్రతిపదార్థము :- తీర్థః = పుణ్యతీర్థముల; ఉదక = నీటితో; పరిక్లిన్నమ్ = బాగ తడిసి యున్నవాడు; దీప్యమాన = కాంతివంతమైన; ఇవ = వలె; అనలమ్ = అగ్ని; గృహీత = పట్టుకొనిన; సమిధమ్ = సమిధలు; తత్ర = అక్కడ; సః = సహితముగా; కుశమ్ = దర్భలుతో; ముని = మునులలో.

 *గమనిక :- *- సమిధలు- హోమము నందు వేయ బడు కర్ర పుల్లలు) కలవాడు

1.48.26.అనుష్టుప్.

దృష్ట్వా సురపతిస్త్రస్తో
వివర్ణవదనోఽ భవత్ ।
అథ దృష్ట్వా సహస్రాక్షమ్
మునివేషధరం మునిః ॥

తాత్పర్యము :- గౌతమ మునిని చూసిన దేవేంద్రుని ముఖము భయముతో తెల్లబోయెను. మునివేషమును ధరించిన దేవేంద్రుని కూడ గౌతముడు చూసెను.

ప్రతిపదార్థము :- దృష్ట్వా = చూసి; సురపతిః = దేవేంద్రుడు; త్రస్తః = భయము చెంది; వివర్ణ = తెల్లబోయిన; వదనః = మోము కలవాడు; అభవత్ = అయ్యెను; అథ = తరువాత; దృష్ట్వా = చూసి; సహస్రాక్షమ్ = దేవేంద్రుని; మునిః = ముని గౌతమ యొక్క; వేషః = వేషము; ధరమ్ = ధరించినవానిని; మునిః = ముని గౌతముల వారు.

 *గమనిక :- *- 1. సురపతి- సుర (దేవతలకు) పతి (ప్రభువు), ఇంద్రుడు. 2. సహస్రాక్షుడు- సహస్ర (అనేకమైన} అక్షుడు (కన్నులు కలవాడు), ఇంద్రుడు

1.48.27.అనుష్టుప్.

దుర్వృత్తం వృత్తసమ్పన్నో
రోషా ద్వచన మబ్రవీత్ ।
మమ రూపం సమాస్థాయ
కృతవానసి దుర్మతే ॥

తాత్పర్యము :- చెడు నడవడి కల ఇంద్రుని చూసి; ఉత్తమ నడవడి గల ఆ మహాముని కోపముతో ఇలా అనెను "నా రూపములో వేషము ధరించి దుష్కార్యము చేసినావు.

ప్రతిపదార్థము :- దుర్వృత్తమ్ = చెడు నడవడి కలవాడు, ఇంద్రుడు; వృత్త సంపన్నః = మంచి నడవడి కలవాడు, గౌతమ మహర్షి; రోషాత్ = కోపముచే; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; మమ = నాయొక్క; రూపమ్ = రూపము; సమాస్థాయ = అనుకరించి; కృతవాన్ అసి = చేసినావు; దుర్మతే = దుర్బుద్ధి కలవాడా;

1.48.28.అనుష్టుప్.

అకర్తవ్యమిదం తస్మాత్
అఫలస్త్వం భవిష్యసి“।
గౌతమేనైవముక్తస్య
సరోషేణ మహాత్మనా ॥

తాత్పర్యము :- చేయ కూడని దుష్కార్యము చేసి నందున నీవు వృషణములు లేని వాడవయ్యెదవు" అని మహాత్ముడైన గౌతముడు కోపముతో శపించెను.

ప్రతిపదార్థము :- అకర్తవ్యమ్ = చేయకూడని; ఇదమ్ = ఈ; తస్మాత్ = అందు వలన; విఫలః = వృషణములు లేని వాడవు; త్వమ్ = నీవు; భవిష్యసి = అయ్యెదవు; గౌతమేన = గౌతమమునిచే; ఇవమ్ = ఇట్లు; ఉక్తస్య = పలుకబడిన; సరోషేణ = కోపముతో; మహాత్మనా = మహాత్ముడైన;

1.48.29.అనుష్టుప్.

పేతతుర్వృషణౌ భూమౌ
సహస్రాక్షస్య తత్క్షణాత్ ।
తథా శప్త్వా స వై శక్రం
అహల్యామపి శప్తవాన్ ॥

తాత్పర్యము :- గౌతమముని అట్లు ఇంద్రుని శపించిన తోడనే అతని వృషణములు భూమిపై పడిపోయినవి. అటుపిమ్మట గౌతముడు అహల్యను కూడ శపించెను.

ప్రతిపదార్థము :- పేతతుః = పడిపోయినవి; వృషణౌ = వృషణములు; భూమౌ = భూమిపై; సహస్రాక్షస్య = వేయి కన్నులు కల ఇంద్రునువి; తత్ క్షణాత్ = ఆ క్షణముననే; తథా = అట్లు; శప్త్వా = శపించి; సః = అతడు; శక్రమ్ = దేవేంద్రుని; అహల్యామపి = అహల్యను కూడ; శప్తవాన్ = శపించెను;

1.48.30.అనుష్టుప్.

ఇహ వర్షసహస్రాణి
బహూని త్వం నివత్స్యసి ।
వాయుభక్షా నిరాహారా
తప్యన్తీ భస్మశాయినీ ॥

తాత్పర్యము :- అహల్యా! నీవు అనేక వేల సంవత్సరములు ఏ ఆహారము లేక కేవలము వాయువును భక్షించుచు భస్మములో నిదురించుచు ఈ ఆశ్రమములో నివసించుము;

ప్రతిపదార్థము :- ఇహ = ఇక్కడ; వర్ష = సంవత్సరములు; సహస్రాణి = వేల కొలది; బహూని = అనేక; త్వమ్ = నీవు; నివత్స్యసి = నివసించెదవు; వాయుభక్షా = వాయువును భక్షించుచు; నిరాహారా = ఆహారము లేకుండగ; తప్యన్తీ = తపస్సు చేసుకొనుచు; భస్మ శాయినీ = భస్మము నందు నిదురించుదానవై.

1.48.31.అనుష్టుప్.

అదృశ్యా సర్వభూతానామ్
ఆశ్రమేఽ స్మిన్నివత్స్యసి ।
యదా చైతద్వనం ఘోరమ్
రామో దశరథాత్మజః ॥

తాత్పర్యము :- ఈ ఆశ్రమమునందు ఎవరికినీ కనుపించకుండ నివసించుము. దశరథుని కుమారుడైన రాముడు ఈ భయంకర అరణ్యమునకు వచ్చును.

ప్రతిపదార్థము :- అదృశ్యా = ఎవరికినీ కనుపించకుండగ; సర్వ = సకల; భూతానామ్ = జీవులకును; ఆశ్రమే = ఆశ్రమమునందు; అస్మిన్ = ఈ; నివత్స్యసి = నివసించుము; యదా = ఎల్ల వేళల; చ = కూడ; ఏతత్ = ఈ; వనమ్ = వనమునకు; ఘోరమ్ = భయంకరమైన; రామః = రాముడు; దశరాథాత్మజః = దశరథుని కుమారుడు;

1.48.32.అనుష్టుప్.

ఆగమిష్యతి దుర్దర్షః
తదా పూతా భవిష్యసి ।
తస్యాతిథ్యేన దుర్వృత్తే!
లోభమోహ వివర్జితా ॥

తాత్పర్యము :- ఆ అజేయుడైన, రాముడు ఇక్కడకు రాగలడు. అతని రాకతో, అహల్యా! నీవు పునీతురాలవు అగుదువు. చెడు ప్రవర్తన గల నీవు రామునికి ఆతిథ్య మొసగుటచే లోభమోహాది దుర్గుణములు తొలగిపోయి పవిత్రత నొందెదవు.

ప్రతిపదార్థము :- ఆగమిష్యతి = వచ్చునో; దుర్ధర్షః = ఎవరి చేతను ఎదురింప బడని వాడు; తదా = అప్పుడు; పూతా = పవిత్రురాలవు; భవిష్యసి = కాగలవు; తస్య = అతనికి; ఆతిథ్యేన = ఆతిథ్యము ఇచ్చుటచే; దుర్వృత్తే = చెడు ప్రవర్తన కలదాన; లోభ = లోభము; మోహ = మోహములు; వివర్జితా = తొలగిపోయిన దానవై.

1.48.33.అనుష్టుప్.

మత్సకాశే ముదా యుక్తా
స్వం వపుర్ధారయిష్యసి ।
ఏవముక్త్వా మహాతేజా
గౌతమో దుష్టచారిణీమ్ ॥

తాత్పర్యము :- తరువాత నీ స్వరూపమును పొంది నా చెంతనే సంతోషముగా ఉండెదవు"; అని చెడుగా వర్తించిన అహల్యతో మహాతేజశ్శాలి గౌతముడు పలికి.

ప్రతిపదార్థము :- మత్ = నా; సకాశే = చెంతన; ముదా = సంతోషము; యుక్తా = కలిగి; స్వమ్ = స్వీయ; వపుః = దేహమును; ధారయిష్యసి = పొందగలవు; ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహాతేజాః = గొప్ప తేజస్సు కల; గౌతమః = గౌతముడు; దుష్ట చారిణీమ్ = చెడు ప్రవర్తన గలామెను

1.48.34.అనుష్టుప్.

ఇమ మాశ్రమ ముత్సృజ్య
సిద్ధచారణ సేవితే ।
హిమవచ్ఛిఖరే రమ్యే
తపస్తేపే మహాతపాః ॥

తాత్పర్యము :- ఈ ఆశ్రమమును విడిచి, సిద్ధచారణలచే సేవింపబడు హిమవత్పర్వత శిఖరమునకు వెడలి అచ్చట గౌతమమహర్షి పుణ్యప్రదమైన తపస్సు నాచరించుచుండెను;

ప్రతిపదార్థము :- ఇమమ్ = ఈ; ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఉత్సృజ్య = విడిచి; సిద్ధ = సిద్ధులచే; చారణ = చారణలచే; సేవితే = సేవింపబడు; హిమవత్ = హిమవత్పర్వత; శిఖరే = శిఖరమునందు; పుణ్యే = పుణ్యప్రదమైన; తపః = తపస్సును; తేపే = చేసెను; మహాతపాః = గొప్ప తపస్సంపన్నుడు, గౌతముడు.

1.48.35.గద్యం.

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాణ్డే
అష్టచత్వారింశః సర్గః

తాత్పర్యము :- ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభై ఎనిమిదవ [48] సర్గ సంపూర్ణము

ప్రతిపదార్థము :- ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాణ్డే = బాలకాండ లోని; అష్టచత్వారింశ [48] = ముప్పై ఎనిమిదవ; సర్గః = సర్గ.