Georges Lemaitre-జార్జెస్‌ లెమైటర్‌.

మహా విస్ఫోటం వూహ తెలిపిన వాడు! బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం గురించి మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తే జార్జెస్‌ లెమైటర్‌. ఆయన పుట్టిన రోజు ఇవాళే!విశ్వం ఎలా పుట్టింది? ఈ ప్రశ్న మానవుడికి ఊహ తెలిసిన దగ్గర్నుంచి వేధిస్తూనే ఉంది. వేదాంతులు, శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ 'విశ్వం పుట్టలేదు. అది అనాదిగా ఆద్యంతాలు లేకుండా అలాగే ఉంది' అన్నాడు. దీన్ని బలపరుస్తూ 20వ శతాబ్దంలో బ్రిటిష్‌ ఖగోళ శాస్త్రవేత్త హెర్మన్‌ బాండి 'స్థిరస్థితి సిద్ధాంతం' (Steady state Theory) ప్రతిపాదించాడు. దీని ప్రకారం 'నక్షత్రమండలాలు, నక్షత్రాలు, గ్రహాలు, పరమాణువులకు పుట్టుక ఉంటుంది కానీ, విశ్వానికి కాదు. విశ్వం చలనం లేకుండా స్థిరంగా ఉంటుంది. దాని లోని ద్రవ్యం (matter) పుడుతూనే ఉంటుంది. విశ్వం ఏ మాత్రం మార్పు చెందడం లేదు'.ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దీన్ని నమ్మే రోజుల్లో 1927లో ఒక వ్యక్తి ఓ కొత్త సిద్ధాంతంతో సంచలనం సృష్టించాడు. అదే 'బిగ్‌బ్యాంగ్‌' (మహా విస్ఫోటం) సిద్ధాంతం. దీన్ని అందించిన వ్యక్తే జార్జెస్‌ లెమైటర్‌ (Georges Lemaitre). అతడి సిద్ధాంతం ప్రకారం 'అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రతలతో ఉండే ఓ సూక్ష్మమైన బిందువు పేలిపోవడం వల్లనే విశ్వం ఏర్పడింది. ఈ బిందువే ప్రథమ పరమాణువు. అప్పటి నుంచి విశ్వం విస్తరిస్తూనే ఉంది'.బెల్జియంలోని చార్లెరోయ్‌లో 1894 జులై 17న పుట్టిన లెమైటర్‌ తన జీవితంలో రెండు లక్ష్యాలను పెట్టుకున్నాడు. ఒకటి గణితంలో పీహెచ్‌డీ సాధించడమైతే, రెండోది మతగురువు కావడం. రెండూ సాధించిన తర్వాత అతడు తన దృష్టిని ఖగోళ ప్రదర్శనల వైపు మళ్లించాడు. అప్పటికే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ తన సామాన్య సాపేక్ష సిద్ధాంతం (General Theory of Relativity) ప్రతిపాదనలో విశ్వం విస్తరిస్తుందనే విషయాన్ని గమనించాడు. అయితే అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న స్థిరస్థితి సిద్ధాంతానికి మద్దతిస్తూ 'విశ్వస్థిరాంకం' (Cosmological Constant) అనే గణిత భావనను ప్రవేశపెట్టి విశ్వం స్థిరంగా ఉంటుందని ప్రవచించాడు.ఐన్‌స్టీన్‌ సిద్ధాంతంలోని అంశాలను లెమైటర్‌ అధ్యయనం చేస్తూ విశ్వం నిరంతరం వ్యాపనం చెందుతూనే ఉంటుందనే నిర్దారణకు వచ్చి, బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతాన్ని ప్రకటించాడు. మొదట్లో దీన్నెవరూ పట్టించుకోకపోయినా, రెండేళ్ల తర్వాత మరో శాస్త్రవేత్త ఎడ్విన్‌ హబుల్‌ తాను నిర్మించిన టెలిస్కోపుతో చేసిన పరిశీలనలతో విశ్వ వ్యాపనాన్ని నిర్దరించడంతో ఎంతో ప్రాచుర్యం లభించింది. ఐన్‌స్టీన్‌ కూడా తన సిద్ధాంతంలో విశ్వ స్థిరాంకాన్ని ప్రవేశపెట్టడం పెద్ద తప్పిదమని అంగీకరించాడు.మహావిస్ఫోటం జరిగినప్పుడు వెలువడిన సూక్ష్మతరంగాలను, అప్పటి ధ్వని తరంగాలను శాస్త్రవేత్తలు ఆ తర్వాత కనుగొనడంతో దానికి ఎంతో మద్దతు లభిస్తోంది. అయితే ఒకప్పటి సూక్ష్మబిందువు ఎందువల్ల విస్ఫోటానికి గురై, కాంతి వేగం కన్నా అధికమైన వేగంతో విస్తరిస్తోందో ఇప్పటికీ అంతుపట్టని విషయమే!- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు -- (Courtesy Eenadu news paper)