Francis Crick

జన్యు రహస్యాలు గ్రహించినవాడు!-- ఒకటి జీవ రహస్యం... మరొకటి మనసు మర్మం... రెంటిలోనూ ముద్ర వేసిన శాస్త్రవేత్త.. నోబెల్‌ బహుమతి గ్రహీత... ఆయన పుట్టిన రోజు ఇవాళే!

జీవశాస్త్రం గురించి ఏమాత్రం తెలిసినా డీఎన్‌ఏ ప్రాముఖ్యత ఎంతటిదో అర్థం అవుతుంది. జీవకణాల్లో భాగమైన డీఎన్‌ఏ (Deoxyribo Nucleic Acid) నిర్మాణాన్ని ఆవిష్కరించిన పరిశోధనలో కీలక పాత్ర వహించి మరో ఇద్దరితో కలిసి నోబెల్‌ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్తే ఫ్రాన్సిస్‌ హ్యారీ కాంప్టన్‌ క్రిక్‌. డీఎన్‌ఏలోనే జీవనిర్మాణాన్ని నిర్దేశించే 'జెనిటిక్‌ కోడ్‌' నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రం అభివృద్ధికి తోడ్పడింది. జీవ, భౌతిక, రసాయన శాస్త్రాల కలయికతో 'మాలిక్యులర్‌ బయాలజీ' ఏర్పడడానికి దోహదం చేసింది. ఆపై క్రిక్‌ 'న్యూరో బయోలజీ' (నాడీ సంబంధిత జీవశాస్త్రం)పై కూడా పరిశోధనలు చేసి మెదడులోని సచేతనత్వం (consciousness)పై సిద్ధాంతాలను ప్రతిపాదించాడు.

ఇంగ్లండ్‌లోని నార్తమ్‌టన్‌ పట్టణంలో 1916 జూన్‌ 8న పుట్టిన క్రిక్‌కి చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. బూట్ల ఫ్యాక్టరీ నిర్వహించే తండ్రికి నష్టాలు రావడం వల్ల కుటుంబంతో పాటు లండన్‌ వలసవెళ్లిన క్రిక్‌ అక్కడే డిగ్రీ వరకూ చదివాడు. ఆపై పరిశోధన చేపట్టినా రెండో ప్రపంచ యుద్ధం వల్ల అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో ధ్వని, అయస్కాంత సంబంధిత మైన్‌లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు. యుద్ధం తర్వాత జీవ రహస్యం (మిస్టరీ ఆఫ్‌ లైఫ్‌), సచేతనత్వ రహస్యం (మిస్టరీ ఆప్‌ కాన్షస్‌నెస్‌) రంగాల్లో అధ్యయనం చేశాడు. ఎక్స్‌రేల వివర్తణ (x-ray diffraction) ద్వారా ప్రొటీన్ల నిర్మాణాన్ని పరిశీలించాడు. ఈ పరిశోధన వల్లనే డాక్టరేట్‌ డిగ్రీ సాధించాడు.

అప్పటికే శాస్త్రవేత్తలు వంశపారంపర్యంగా సంక్రమించే జీవధర్మాలను నిర్థారించే డీఎన్‌ఏ గుణాలను కనిపెట్టారు. డీఎన్‌ఏ ప్రమేయం కన్నా దాని అణు నిర్మాణాన్ని కనుగొనే ఆవశ్యకతను గుర్తించిన జేమ్స్‌వాట్సన్‌ అనే యువ శాస్త్రవేత్తతో క్రిక్‌ జతకట్టాడు. ఎక్స్‌రే వివర్తనంలో తన అనుభవాన్ని జోడించడంతో డీఎన్‌ఏ నిర్మాణాన్ని డబుల్‌ హెలిక్స్‌ రూపంలో ఆవిష్కరించగలిగారు. ఫలితంగా 1962లో నోబెల్‌ లభించింది.

ఆ తర్వాత క్రిక్‌ పరిశోధనలు జెనిటిక్‌కోడ్‌ను అర్థం చేసుకోడానికి, జన్యుపరమైన వ్యాధులకు కారణాలు తెలుసుకోడానికి ఉపకరించాయి. ఆపై సచేతనత్వంపై దృష్టి సారించాడు. 'వ్యక్తి సుఖదుఖాలు, జ్ఞాపకాలు, కోర్కెలు సంకల్పాలు నరాల్లోని కణాలు చేసే అద్భుతాలే' లాంటి నిర్వచనాలతో 'ది ఎస్టానిషింగ్‌ హైపోథిసిస్‌' గ్రంథం రచించాడు. క్రిక్‌ ఆత్మకథ 'వాట్‌ మ్యాడ్‌ పర్స్యూట్‌' అందరూ చదవాల్సిన పుస్తకం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు-courtesy Eenadu telugu daily.