పెంపుడు జంతువులు
అడవులలో గుంపులుగా నివసించిన ఆదిమానవుల స్థితి నుండి నేటి ఆధునిక మానవుల స్థాయి వరకు ఎదిగే పరిణామ క్రమంలో తమ అభివృద్దికి, అవసరాలకు ఉపయోగపడే జంతువులను మచ్చిక చేసుకోవడం, తమతో పాటే పెంచుకోవడం అలవాటు చేసుకున్నారు.
మనకు ఉపయోగపడే జంతువులను మనం మచ్చిక చేసుకొని పెంచుకుంటాము. అలా ఎంపిక చేసుకున్న జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పెంపుడు జంతువులు మనుషులతో కలిసి జీవించగలవు మరియు హానిచేయనివి. పెంపుడు జంతువులకు ఉదాహరణగా కుక్క, పిల్లి, కోడి, ఆవు, ఎనుము, మేక, గొర్రె, చిలుక, పావురం మొదలైనవి చెప్పవచ్చును.
మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. అధ్యయనాల ప్రకారం, పెంపుడు జంతువులను పెంచుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెంపుడు జంతువుల సహవాసం వల్ల మానసిక ఒత్తిడి, రక్తపోటు తగ్గుతాయి. మంచి అనుభూతిని కలిగించే ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే పెంపుడు జంతువులను సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే, అనుసరించాల్సిన కొన్ని కీలకమైన సూచనలు పాటించవలసి ఉంటుంది.
ఆహారం, పరిశుభ్రమైన నీరు, స్వచ్చమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఆశ్రయం, స్థలం, భద్రత, కుటుంబం మరియు గౌరవం అనేవి జీవిస్తున్న ప్రతి ప్రాణికీ ప్రాథమిక అవసరాలు. అడవిలో ప్రకృతి ఆవాసంగా నివసించే జంతువులలో వాటిని చూసుకోవడానికి మనుషులు అవసరం లేదు. మానవ సమాజంలో పెంపుడు జంతువులకు ఈ అవసరాల లభ్యతకు మానవ జోక్యం అవసరం. ఏ జంతువులు పెంపుడు జంతువులుగా ఎంచుకోవాలని గుర్తించగలగడం చాలా అవసరం.
ప్రతీ పెంపుడు జంతువుకీ కొంత సమయం కేటాయించాలి. ఇంట్లో పెంపుడు జంతువుందంటే చిన్న పిల్లలున్నట్లే. సహనంతో ఉండి వాటికి తగిన సమయం కేటాయిస్తూ మీ బాధ్యతలని కూడా నిర్వహించగలరో లేదో చూసుకోవాలి. పెంపుడు జంతువులకు మూత్ర, మల విసర్జనలకి ఓపికగా, తగినంత సమయం వెచ్చించి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. వీటన్నింటికీ మీ దగ్గర తగిన సమయం ఉందంటేనే పెంపుడు జంతువుని ఇంటికి ఆహ్వానించండి.
మీరు ఒక పెంపుడు జంతువుని ఇంటికి తెచ్చీ తేగానే అది మీకు ప్రేమతో మచ్చికైపోతుందని ఊహించుకోవద్దు. దానికి కాస్త సమయం పడుతుంది.ఒక్కోసారి మీ ఇంటికి వచ్చీ రాగానే మీ పెంపుడు జంతువు మిమ్మల్ని నీడలా అంటి పెట్టుకుని ఉండవచ్చు. ఆలా అయితే దానితో ఆడుకుని, మరింత సమయం వెచ్చించి దాని గురించి మరింత తెలుసుకోండి. అపుడు ఆ పెంపుడు జంతువు మరింత బాగా మచ్చిక అవుతుంది.
వ్యక్తులకు నిరంతర ప్రాతిపదికన వ్యాయామాలు చేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లాంటివి సాధన చేయాల్సిన అవసరం ఉన్నట్లుగానే వారు పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
చాలా మందికి పెంపుడు జంతువులు కూడా వారి కుటుంబంలో భాగమే. తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. వాటికి కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలి. పెంపుడు జంతువులకు ఒకసారి మంచి జీవనశైలిని అలవాటు చేస్తే వాటంతటవే ప్రతిరోజూ అనుసరిస్తాయి. పెంపుడు జంతువులకు తప్పనిసరిగా కొన్ని ప్రాథమిక శిక్షణలు ఇవ్వాలి. ఇవి వాటి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: పెంపుడు జంతువులు ఏది పడితే అది తినకుండా పరిమితులు విధించాలి. పెంపుడు జంతువులకు మనుషులు తినే ఆహారాలు ఇవ్వకూడదు. పశువైద్యుడు సూచించిన పెంపుడు జంతువుల ఆహారాన్ని మాత్రమే అందించాలి. వాటికి కూడా సరైన డైట్ చార్ట్ (ఆహార ప్రణాళిక) ఉండాలి. అప్పుడే ఎలాంటి రోగాలబారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
దూకుడు తగ్గించాలి: కొన్ని పెంపుడు జంతువులు ప్రత్యేకంగా కుక్కలు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారిపైకి దూకే ధోరణిని కలిగి ఉంటాయి. ఇది కొన్నిసార్లు వ్యక్తులపై ప్రేమను చూపించే సంకేతం అయినప్పటికీ, అలాంటి ప్రవర్తన నచ్చకపోవచ్చు. అలాగే మరి కొన్ని చెంగుచెంగున దూకుతూ ఇంట్లో విలువైన వస్తువులను ధ్వంసం చేస్తాయి. పెంపుడు జంతువులకు అలాంటి ప్రవర్తనను నియంత్రించడానికి శిక్షణ ఇవ్వాలి.
స్నేహపూర్వకమైన శిక్షణ: చాలా సందర్భాలలో కొన్ని పెంపుడు జంతువులు ఇతర పెంపుడు జంతువులతో కలిసి ఉండలేవు. వాటి రాకను ఆహ్వానించవు. కొన్ని సార్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి వాటిని అన్నింటితో కలిసిపోయేలా శిక్షణ ఇవ్వాలి. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కాబట్టి ఓపికగా శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది. కొంత సమయం పడుతుంది.
విశ్రాంతి సమయం: ఏ జీవికైనా నిర్ణీత సమయం పాటు నిద్ర, విశ్రాంతి ఉండాలి. పెంపుడు జంతువులు సాధారణంగా రోజంతా చురుకుగా ఉంటాయి. ఇది అలసటకు దారితీస్తుంది. చివరికి వాటి పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి వాటికంటూ విశ్రాంతి సమయం కేటాయించాలి. ఆ సమయంలో ఎలాంటి కార్యకలాపాలు ఇవ్వకూడదు. సమయం ప్రకారం నిద్రను అలవాటు చేయాలి.
శారీరక శ్రమ: ఏ పెంపుడు జంతువుకు అయినా శారీరక శ్రమ లేకపోతే బద్ధకంగా తయారవుతాయి. ప్రతిరోజూ వాటికి నడక కల్పించాలి. కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అలవాటు చేయాలి. లేకపోతే వాటి మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపి విచిత్రంగా ప్రవర్తిస్తాయి.
వైద్యుల పర్యవేక్షణ : పెంపుడు జంతువులు ఆరోగ్యంగా కనపడుతున్నప్పటికీ వాటికి సమయానికి తగినట్లుగా వేయవలసిన వ్యాధి నిరోధక టీకాలు వేయించి అప్రమత్తంగా ఉండాలి. పశు వైద్య నిపుణుల సలహా అనుసరించి తగిన సమయంలో అంతర పరాన్నజీవుల నుండి రక్షణ కొరకు డీ వార్మింగ్ (నులి పురుగుల మందు త్రాగించడం) మరియు బాహ్య పరాన్నజీవుల నుండి రక్షణ కొరకు డీ టిక్కింగ్ (జంతువులకు శరీరంపై పేన్లు, పిడుదులు మరియు ఫ్లైస్ [flies] నుండి రక్షణ కోసం) వంటి ప్రాధమిక వైద్యం అందించడంలో మాత్రం ఏమారుపాటు లేకుండా చూసుకోవాలి.
పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకోవాలి. ప్రేమను పంచాలి. వాటిపై కఠిన వైఖరి చూపకూడదు. స్నేహపూర్వకంగా మెలిగేలా శిక్షణ ఇవ్వాలి.