tanu anantham

Instagram writings

రాజ్యాలు గెలిచినా తనని గెలవలేం,

తళుక్కుమనే కోటలు కట్టినా తను మురవదు,

తన ఆనందానికి ప్రకృతి పులకరించిపోతుంది..


అలాంటి తను.. ఇప్పుడు దుఃఖాన్ని దుప్పటిగా 

కప్పుకొని.. ఆనందం పిడికిళ్ళల్లో, 

కన్నీరు కళ్ళల్లో పెట్టుకొని ఉంది.


తను అడగని ఆ ప్రపంచంలో ..

ఆకాశం మెరవదు.. విత్తనం మొలకెత్తదు,

సూర్యుడు ఉదయించడు.. వెన్నెల పూయదు,

కన్నీటి సముద్రాలే.. రోజూ అమావాస్యే.

#తను 🍁



అచ్చులు అంతమౌతున్న ఆకాశంలో                   

హల్లులతో కూడిన హరివిల్లు తను.                                    

#తను 🍁



    తనకి తోడుగా ఎవరూ లేరని.. భూమి తిరగటం ఆగిపోయిందా, 

                     సూర్యుడు మండటం ఆగిపోయిందా!


      నీరు ఉప్పగా ఉందని, సముద్రం తనని తాను తిట్టుకుంటూ, 

                       తన ఉనికిని చంపుకుందా చెప్పు!

                        

   ఈ రోజు, నీకు ఎవరూ తోడుగా లేరని, కోరుకున్న జీవితం లేదని,    

  రోజూ చీకట్లేనని, అసలు వెన్నెలే లేదని తిట్టుకుంటూ కూర్చోవద్దు.

 

           నీ శరీరంలో ప్రవహించే రక్తానికి చెప్పు.. రేపటిరోజున 

         రవి అస్తమించాక వచ్చే పౌర్ణమి వెన్నెల నీ కోసమే అని! 

        

                                       #తను 🍁



- పద్దెనిమిది అక్షౌహినుల సైన్యంతో జరిగిన కురుక్షేత్రం ముగిసింది..

- విరిగిన విల్లులు, రథాలు.. ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు          మధ్యన..

- మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్న..

భర్తల తల ఒక చోట, మొండెం ఒక చోట చూసి మూర్ఛ పోయిన భార్యలు కొందరు, తలలు బాదుకుంటున్న భార్యలు కొందరు..

- చీల్చి పడి ఉన్న గుండెలు.. ముక్కలైన శరీరాలను.. ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడుస్తున్న భార్యలు కొందరు..

- శిరస్సు దొరికి మొండెం దొరకక, మొండెం దొరికి శిరస్సు దొరకక

వెతుకుంటున్న భార్యలు కొందరు..

- ఘాఢ నిద్రలో  ఉన్నాడో!  చనిపోయి ఉన్నాడో!  తెలియక   అయోమయం లో ఉన్న భార్యలు కొందరు..

- చితి పేర్చటానికి కట్టెలు చాలక.. అగ్ని కార్యం చెయ్యలేక శోకిస్తున్న భార్యలు కొందరు..

- కవచ కుండలాలుతో పుట్టిన కర్ణుడి గుండెల మీద వాలిన గద్దలు..

- కడుపునిండిన  నక్కలు..

- ఊపిరి అందక.. ప్రాణాలు వదలలేక.. రక్తమోడుతూ పడి ఉన్న వీరులు..

- పాలరాతి భవనాల్లో తిరిగే పాదాలు.. ఈ రోజు కటిక నేల మీద పడి పొర్లి పొర్లి గుండెలు అదిరేలా రోదిస్తున్నా.. చరిత్రకి వినిపించలేదు ఆ ఏడుపు..

- 76కోట్ల,40వేల వీరులని తెగటార్చిన.. ఈ రక్తపు మహాభారాతాన్ని అడ్డుపెట్టి శ్రీకృష్ణుడు ఏమి చెప్పాలి అనుకున్నాడు?

- ఈ ఇతిహాసాన్ని తెరిచిచూసిన వాళ్లు ఎందరు?

- ఈ మహాభారతాన్ని  పెద్దగా బాగుంది అని తలకి దిండుగా       పెట్టుకోకుండా..  తలకి పట్టించి చూడు..

- నీ కోసం ఏమి దాచాడో ఎవరికి ఎరుక?

- తెలుసుకున్నావో నువ్వూ ఓ కృషుడివే..

- తెలియలేదా నువ్వూ ఓ అర్జునిడిలా ప్రశించు..

  ఈ రక్తపు కురుక్షేత్ర మహాభారతం ఎందుకు అని..


#తను 🍁




లక్ష్మణుడు ఊర్మిలని విడిచి రాముడి వెంట వెళ్ళటం.

ఈ ప్రశ్నకి జవాబు చెప్పే అంత అర్హత నాకు లేదు. 


కానీ, ఒక్కటి చెప్పగలను.. అర్ధం చేసుకునే భార్య/భర్త ఉన్నపుడు .. ఎక్కడ ఉన్నా ఒక్కటే. 


అన్నకి కష్టం వచ్చింది.. అందుకే అన్నకి తోడుగా వెళ్ళాడు. 

అంతే కానీ.. ఊర్మిళని కష్టాల్లోకి నెట్టలేదు. 

***

ఆ మహాత్ముల బుద్ది కూడా మనలానే ఉంటే.. లక్ష్మణుడు రాముడి వెంట వెళ్తానన్న మరు క్షణమే.. ఊర్మిలమ్మ వేరే దారి చేసుకొనే వారు. 


#తను 🍁




               మేఘం అడ్డువచ్చి ఆకాశం కనిపించకపోతే, 

                    ఆకాశం లేనట్లు కాదు కదా! అలానే, 

       రాధ పక్కన లేనంత మాత్రాన కృష్ణుడు ఒంటరా చెప్పు.

       

                        తను లేనిదే ఆ కృష్ణుడు లేడు. 


                    పదహరు వేల మేఘాలు అడ్డువచ్చి,

  ఆత్మలతో కలిసిన ఆ ఇద్దరు లోకానికి కనిపించకపోయినా సరే..

                         

               కృష్ణుడి గుండెల్లో తను ఎప్పుడూ పదిలమే.

                

                                     #తను 🍁




            తను పక్కన ఉంటే వచ్చే ధైర్యం ఎలా ఉంటుందంటే,


                        అస్తమిస్తున్న సూర్యుడుని చూసి.. హ!

             పొద్దున్న మళ్ళీ ఉదయిస్తాడు కదా అనేలా చేస్తుంది.


                              అదే తను పక్కన లేనప్పుడు,

         పొద్దున్న వచ్చిన సూర్యుడు ఇక శాశ్వతంగా అస్తమిస్తాడు. 

          ఆ వెలుగు లేని ప్రపంచంలో.. నవ్వే చిరునవ్వు కనిపించదు,

                            ఆకాశంలో ఎగిరే పక్షి కనపడదు.


        స్వేచ్ఛా స్వర్గం కూడా నరకమై, చిమ్మ చికట్లే కొత్త వెలుగుగా..

  అంధకారంలో కనిపించని ప్రపంచమే.. నూతన ప్రపంచమైపోతుంది.

 

                                            #తను 🍁




చచ్చాక గుర్తొచ్చే ప్రేమ తాజ్‌మహల్ వంటి

అందమైన సమాధులను కట్టించొచ్చేమో!

                        

బ్రతికుండగా గుర్తించే ప్రేమ, బాధ్యత

రామసేతువు లాంటి వారధిని నిర్మిస్తుంది. 

                       

#తను 🍁




అగ్నికి కూడా చలి పుట్టించే..

తన నిశబ్దాన్ని వింటూ, చీమ నవ్వింది అంట.

                 

#తను 🍁




కాకి అరిస్తే అరుపు అంటాం,

అదే కోయిల అరిస్తే గానం అంటాం.

గుడ్డుని పొదిగి కోయిలని పుట్టించిన కాకి..

తల్లిని మించి ఎదిగిందని మురిసిపోతుందేమో! 

 

#తను 🍁




నువ్వు పుట్టాక.. నీ రూపం/ఆలోచనలన వలన 

నిన్ను ఇష్టపడేది, ప్రేమించేది భార్య/భర్త ఐతే!

                           

నీకు పుట్టుక, రూపం లేనప్పటి నుంచే 

ప్రేమించేది అమ్మ.


మొదటిది స్వార్థంతో కూడిన ప్రేమయితే, 

రెండవది నిస్వార్థ ప్రేమ. 

                                                                                                                                

#తను 🍁





రాణి అనిపించుకోవాలి అంటే.. 

రాజు పక్కన నిల్చోవలసిన అవసరం లేదు. 

                     

కోట లేకున్నా తను రాణియే!


  #తను 🍁




వయస్సులో ఉన్న రాముడు ఎప్పుడూ 

సీతాదేవియే కావాలని పట్టుకు కూర్చోలేదు!

                                   

కానీ సీత, రాముడు ఒక్కటి అయ్యాక 

సీతను కాదని వేరొక చేయి పట్టుకోలేదు.

                       

ఇంతేరా రామాయణం!

#తను 🍁





ఎంత ఎదురు చూసినా..

                                 

భూమి, ఆకాశం ఎప్పటికీ ఎలా కలవలేవో..

 సముద్రం నీరు తియ్యగా ఎలా అవ్వలేదో..

చేప గాలిలో ఎలా ఎగరలేదో.. 

అమావాస్య చంద్రుడి అందాల్ని ఎలా చూడలేమో..

            

 అలానే..

అరవని ఉరుమై, లోలోపల ప్రతీ కణం ఓ మండే 

అగ్ని గోళమైన.. తన పక్కన నిల్చోవటం కూడా అంతే కష్టం. 

       

#తను 🍁




నక్షత్రాలు అన్నీ కన్నీటి చుక్కలైనా సరే.. 

తన కన్నీటి ముందు తక్కువే.

                           

 #తను 🍁




ఐదుగురు వీరులు, ఇద్దరు యోధులు, 

వంద మంది కౌరవులు, ఒక కర్ణుడు..

వీళ్ళందరి మధ్యలో.. నిల్చొన్న ఏకవస్త్ర ఐన స్త్రీ.


ఇంతలో ఓ స్వరం.. 

"ఐదుగురు భర్తలుతో ఉన్నప్పుడు, నీ శరీరం మీద బట్ట ఉన్నా,      

 లేకపోయినా ఒక్కటే కదా! అన్న కర్ణుడు."                        

"జూదంలో భార్యను ఓడి పోని వాడిని భర్తగా ఎంచుకో.. రా నా 

తొడ మీద కూర్చో! అని తోడ మీది వస్త్రాన్ని పైకెత్తిన దుర్యోధనుడు."


అడిగింది నేను దాసినా? ధర్మ విజితనా? అని.

ఐదు గుణాలున్న వాడిని భర్తగా కోరగా.. 

ఐదుగురు భర్తలని ఇచ్చిన శివుడుది తప్పా?


గుణాలని చూసిందే కానీ.. ఐదు వేరు వేరు శరీరాలను కాదు.

శరీరాలను కామించే లోకానికి.. ద్రౌపది ఎప్పుడూ చులకనే!


                                               #తను 🍁





పద్దెనిమిది అక్షౌహిణల మహాసైన్యం.. 

అందులో ఆయుధం పట్టకుండా, ధైర్యంగా 

కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిల్చొన్నది శ్రీకృష్ణుడు ఒక్కడే. 


బ్రతుకు మీద ఆశ లేదో!

చావు అంటే భయం లేదో!  శ్రీకృష్ణుడికే తెలియాలి.

                         

యుద్ధం గెలిచాడు కాబట్టి దేవుడని అన్నాం..  

ఓడిపోయి ఉంటే "మహారథి" అయ్యి కూడా ఆయుధం పట్టని

వెర్రివాడు అని ముద్ర వేసేది ఏమో ఈ లోకం! 

                    

                                              #తను 🍁




వేశ్య కోసం పరుగు తీసే వాడు ఉంటాడు కానీ,

ఏ వేశ్య కూడా ఒకరి కోసం ఆరాటపడదు. 

పొట్టకూటి కోసం చేసే వృత్తిలో న్యాయం, 

ధర్మం ఉంటుంది.  ఇది తప్పు ఐతే..


ఏ అమ్మాయినైనా, కామంతో చూసే నువ్వు కూడా     

వేశ్యతో సమానం అందామా? అంతకన్నా ఎక్కువే ఏమో! 


                                 #తను 🍁




సృష్టిలో బ్రతుకు తెరువుకి ఎన్నో విద్యలున్నాయి, కళలున్నాయి.

కానీ ఒక్కోసారి ఏ విద్య అబ్బదు, ఏ కళా కానరాదు. 

అప్పుడు, ఏ ఆయుధం దొరకనప్పుడు, దధీచి తన శరీరాన్నే ఆయుధంగా మలిచినట్లు, శరీరమే సమాధానంగా కనిపిస్తూంటుంది.

అదే మనం ఎప్పుడూ గొంతెత్తి పలకటానికి కూడా ఆలోచించే ఆ రెండు అక్షరాల కథే.. ఈ కథ! ఓ వేశ్య కథ. 


ఏ కన్నీటి చుక్క నడిగినా.. తన కథ చెప్తది.

మృగాళ్ల చూపుల్లో సమాధి అయిపోయిన తనువుని..

ప్రతిరోజు చిరిగిన దేహాన్ని కుట్టుకుంటూ... రేపటి బతుకు వెలుగు కోసం, ఈ రోజు చీకటి ప్రపంచంలో వికసించే కలువ.


ఒకరి బ్రతుకికి సుఖం కావాలి.. ఇంకొకరి బ్రతుకు నడవాలి. 

తీరని కోర్కెల దాహం ఒకరిది.. ఆకలి తీరని కడుపు ఒకరిది.

వేసవిలో వచ్చే వర్షపు భోగం ఒకరిది.. జీవితపు సునామీలో సర్వం కోల్పోయిన కన్నీరు ఒకరిది.


నిదురించిన ప్రపంచంలో.. కూడు కోసం అరువిచ్చిన తనువుని, నలుగుతున్న దేహంలో రేపటి బ్రతుకుని చూసుకుంటూ.. 

నూరు వెక్కిరింపు నాలుకల మధ్య జీవనం సాగిస్తున్న తన గాధని..

దధీచిని గుర్తుపెట్టుకున్నట్లు చరిత్ర గుర్తుపెట్టుకుంటుందో లేదో!

-తను





కొందరిని చూస్తే.. సముద్రపు ఒడ్డున కూర్చొని అలలు

చూస్తున్నప్పుడు కలిగినంత హాయి..


మరికొందరిని చూస్తే.. నీటి మీద నడవలేని ఆ సముద్రపు

మధ్యలో నిల్చొని.. చలనం ఉన్న నీరు, భూమి, ఆకాశం

తన కోసం ఆగిపోయాయా! అన్న అనుభూతి కలుగుతుంది..


ఇంకొందరితో కలిసి నడిస్తే.. లక్షల ఏళ్ల నుంచి నిశీధి వెలుగులో

ఉన్న సముద్ర సంపద, అందాలన్నీ తనవే అన్న తన్మయత్వంతో తేలుతుంటారు..


ఈ మూడింటిలో..

మొదటిదానికి.. అభినందించే లక్షణం ఉండాలి,

రెండవదానికి.. ఆస్వాదించే గుణం ఉండాలి,

మూడవదానికి.. రమించే గుణం ఉండాలి.


ఇవి ఉన్నప్పుడు సముద్రము వంటి తనని.. చూసినా, మాట్లాడినా, కలిసి నడిచినా.. నీలో నువ్వు తరిస్తూనే ఉంటావు.


అమ్మ అంటే.. అర్ధం ఏమిటని GOOGLE లో వెతికేవాళ్ళకి.. తను అజ్ఞాన సముద్రమై.. ఉప్పు నీటి వలె కనిపిస్తూ ఉంటుంది.

- తను




"అ, ఆ"లు దిద్దే 4 ఏళ్ళ వయసులో ప్రపంచాన్ని ఏలే శక్తి తనది. 

8 ఏళ్ళ వయసులో పాఠం చెప్పే గురువే తనని ఏమి చేస్తున్నాడో

తెలియని అమాయకం తనది. ఏడ్చింది, చిరునవ్వు చెరిగింది.

12 ఏళ్ళకి చెయ్యని తప్పుకి కుటుంబం ముందు చులకన అయిపోయింది, ఆశల్ని చంపుకుంది.


18 ఏళ్ళప్పుడు, అన్నీ తన చుట్టూ ఉన్నా ఏమీ లేని ఒంటరితనం. 

22వ ఏట, సముద్రంలో వచ్చే సునామీ, తన జీవితంలో వచ్చింది. 

ఎదురు వెళ్లలేకపోయింది, కానీ మనలా పారిపోలేదు, నిల్చుంది.

తన రాతని తానే దిద్దుకుందాం అనుకుంది, కానీ ఈ చీకటి ప్రపంచం తనని బ్రతికి ఉండగా చంపేలా చేసింది. 


కానీ, ఈ ప్రపంచానికి తెలియంది ఏమిటంటే, తను ఓ విత్తనం అని.

పెను వృక్షాన్ని పుట్టించే విత్తనాన్ని మనం ఎండలో పెట్టి చంపుతాం. 

కానీ అది మట్టిలోంచి ఉబికి ఉబికి బయటికి ఓ వృక్షమై వస్తుంది.

తను కూడా అంతే భూమి లాంటి కుటుంబానికే అందాన్ని ఇచ్చే వృక్షమైంది. 

 - తను 




లోకంలో జాలి, దయ కొంచెం కూడా లేని వాడు ఎవరైనా ఉంటే అది దేవుడు ఒక్కడే. 

రోడ్డుమీద వెళ్తున్నప్పుడు, ఎవరికైనా, ఏమైనా జరిగితే అయ్యో అనుకుంటాం, వీలైతే సాయం చేస్తాం.


అదే దేవుడైతే.. ఇది నీ కర్మల ఫలితం అనుభవించని వెళ్ళిపోతాడు. 

అందుకే తనని నమ్మే ముందు, నిన్ను నువ్వు నమ్ముకోమంటాడు. 

- తను




పరువు గొప్ప, కూతురు గొప్ప అని అంటే.. 

పరువు పోతే తిరిగి రాదు, అదే కూతురు పోతే 

ఇంకో కూతురిని కనొచ్చాన్నాడు అంట ఓ నాన్న. 


పరువు చుట్టుపక్కల వాళ్ళ నుంచి పుట్టుంది. 

కూతురు తనకి పుట్టింది అని మరిచిపోయారేమో. 

- తను




నీతో ఉన్నప్పుడు తనకి నువ్వు తప్ప ఏమీ గుర్తురాకూడదు అనేది కోరిక. 

అదే నీతో ఉన్నప్పుడు తను ఈ లోకాన్ని, నిన్ను మరిచిపోయి.. 

తను స్వేచ్ఛా జీవిలా, ఆశల ఆకాశంలో ఆనందపు హరివిల్లు చూసి మురిసిపోతుంటే..  అదే ప్రేమ.

- తను



ఎదుటి వాడితో చేసే యుద్ధంలో.. తల తెగి పడిపోవటమో,

శత్రువు తల తను తీసుకువెళ్ళటమో జరుగుతుంది.

అదే తనతో తాను చేసే యుద్ధం ఎలా ఉంటుంది అంటే..

చల్లటి మంచు కూడా అగ్ని అయ్యి.. దట్టమైన అడవికి కార్చిచ్చు అంటుకుంటుంటే.. ఆ మధ్యలో నిల్చొని చూసేలా చేస్తుంది.

సూర్యుడు మీద చెప్పులు లేకుండ నడిపిస్తుంది.

మల్లె పువ్వు లాంటి పున్నమి వెన్నెల కూడా.. కారు మబ్బు కమ్ముకున్న ఆశమైపోతుంది.

గాలి కూడా ఊపిరి ఆడక కొట్టిమిట్లాడేట్లు చేస్తుంది.

సముద్రపు సుడిగుండంలో చిక్కుకున్న చేపపిల్లలా ఉంటుంది.

తన రాజ్యంలో తానే ముసుగు కప్పి నడిచేలా చేస్తుంది.

ఇద్దరు చేసే యుద్ధంలో గెలుపు ఓటమి ఉంటాయి. నెత్తుటి చుక్క, చెమట చుక్క కనిపిస్తాయి.

తనతో తాను చేసే యుద్ధంలో గెలుపు, ఓటమి ఉండవు..

కన్నీటి చుక్కలు మధ్య తనని తాను వెతుక్కోవటమే ఉంటుంది.

- తను




తల్లి తప్పు చేస్తే వంశాలే నాశనం అయిపోతాయి.


కుంతీ దేవికి, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో.. కర్ణుడు తన కొడుకే అని తెలిసినా నిజం చెప్పలేదు.  తన కొడుకు మరణాన్ని తానే రాసింది. 


గాంధారి తన కొడుకులు కౌరవులు చేస్తున్న దురాచారాలుని కళ్ళు ఉన్నా చూడలేదు. సరైన దారిలో పెట్టి ఉంటే  కొడుకుల రక్తపు చుక్క కూడా నేల రాలకుండా ఉండేది.


ఒకరు నిజాన్ని దాచారు,  ఒకరు తప్పుని దిద్దలేదు. కొడుకుల మరణానికి కారణం అయ్యారు.


తల్లి  ప్రేమ గొప్పది అంటాం.. కానీ అది ఉన్నతమైనదై ఉండాలి. వినాశనానికి దారి తీసేదిగా ఉండకూడదు.

Happy mother's day.

- తను




దేశంలో ఉన్న ప్రతి అమ్మాయి నోరువిప్పి మాట్లాడటం మొదలు

పెడితే, కోర్టులు చాలావు, జైలు గోడలు సరిపోవు ఏమో. 

అందుకేనేమో ఏ ఆడపిల్ల మాట్లాడదు.


ఆ నవ్వు వెనుక

                        బద్దలవ్వని అగ్ని పర్వతాలెన్నో

                        ఆగిపోయిన యుద్ధాలెన్నో

                        చెరిగిపోయిన ఆశలెన్నో

                        చంపుకున్న కోరికలెన్నో

                        కన్నీరుకి కరిగిన కాటుకలెన్నో.


రెక్కలు విరిగిన పక్షిలా, రాగం లేని కోకిలలా, కాళ్లు విరిగిన చీమలా..

చెయ్యని యుద్దంలో తన ముందు తానే ఓడిపోయింది.


వాళ్ళ జీవితం, చెప్పలేని మహాభారతం, రాయలేని రామాయణం.

- తను





రోజు గాలి పీలుస్తాం.. కానీ స్వేచ్ఛగా గాలి పీల్చిన రోజు ఏది?


ఎవరో ఒకరు నిన్ను ప్రేమిస్తారు అని చూస్తాం, కానీ నిన్ను నువ్వు ప్రేమించిన రోజు ఏది?


ఎవరి కోసమో మొహం మీద చిరునవ్వు ఉంచుతాం.. కానీ నిన్ను చూసి నువ్వు సంతోషించిన రోజు ఏది?


కళ్ళతో ప్రపంచంలో జరిగేవి అన్ని చూస్తాం.. కానీ నీకు నువ్వు తారసపడ్డ  రోజు ఏది?


పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి రోజు నడక సాగిస్తాం.. కానీ నీకోసం నువ్వు నడిచిన రోజు ఏది?


అంతర్జాలంలో ఎవరు లైక్ కొడతారో అని చూస్తాం, కానీ నిన్ను చూసి నువ్వు ఇష్టపడ్డ రోజు ఏది?


రోజు తింటాం, కానీ నీతో నువ్వు ఉండి తృప్తిగా ఆనందంగా తిన్న రోజు ఏది ?


పార్టీలు, బర్త్డేలు అని  స్నేహితులితో  గడుపుతాం, కానీ నీతో నువ్వు గడిపిన రోజు ఏది ?


లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాట్లాడుతూనే ఉంటాము, కానీ నీతో నువ్వు మాట్లాడిన రోజు ఏది?


అందమైన సూర్యోదయాలు సూర్యాస్తమయాలు.. పొద్దున్న పూసే తెల్లటి చీకట్లు, చల్లని సాయంకాలాలు వీటి  అన్నింటికి దూరంగా ..

నీ దేహంలోనే నువ్వు ఉన్నా కానీ.. నీకు నీకు మధ్య అనంత దూరంలో ఉండిపోయావా??

- తను





అగ్ని కోసం నిరీక్షించే మంచుల,

గాలికి కూడా ఊపిరి ఆడని క్షణాలులా,


అమావాస్య చంద్రుడిని వెతుకుతున్న నక్షత్రాలులా,

తిండి కోసం పరుగుతీసే చీమల,

చల్లని గాలి కోసం ఎదురుచూసే వెచ్చని సాయంత్రంలా,


వర్షపు చుక్క కోసం నిరీక్షించే బీడు భూమిల..

వసంతం కోసం నిరీక్షించే కోకిలల,


ఆకాశం ఏడుస్తూ, భూమి మీద పడ్డ వర్షంలా..

తన కోసం నిరీక్షిస్తున్న తను.

- తను





వెలుతురు ఇవ్వని సూర్యుడిని,

వెన్నెల వెదజల్లని చంద్రుడిని , 

ప్రాణం పోయని గాలిని, 

దాహం తీర్చని నీరుని, 

అన్నం పెట్టని భూమిని,

ఇసం తాగని శివుడిని,

భార్య కోసం సముద్రం దాటని రాముడిని,   

భగవద్గీత చెప్పని శ్రీకృష్ణుడుని,

సాయం చెయ్యని మనిషిని,

ఎవరు గుర్తు పెట్టుకుంటారు, ఎవరు ఆరాధిస్తారు?


స్వార్ధం లేకుండా ఒకరికి ఉపయోగపడేది ఏ చిన్నది ఎవరు చేసినా దేవుడే. అందుకే  వాళ్ళకి ఒక గుడి కడతాం, 

వాళ్ళలా మనం కూడా  ఉండాలి అని పూజిస్తాం.  

అదే మన సంస్కృతి.

-తను





ఇంటికి దీపం రామాయణం అయితే 

ఊరికి దీపం మహాభారతం.


రాముడు కృష్ణుడు దేవుళ్ళా కాదా? అని తలకొట్టుకోకు..

పొట్టకూటి కోసం డిగ్రీలు సంపాదించి ఉద్యోగం చేస్తావు, సంపాదిస్తావు.. 

డబ్బుతో అనుభవించేది సుఖం.. అది ఆనందం కాదు .

 

సుఖం శరీరానికి సంబంధించింది.  ఆనందం మనుసుకి సంబంధించింది.

రావణుడు సీత పక్కన సుఖం కోసం చూసాడు, పది తలలు తెగి పడిపోయాడు..( Western happiness).

అదే అన్నీ మండోదరి లోనే చూసుకొని ఉంటే.. ఆనందంగా ఉండేవాడు.


నీ  ఇల్లు ఎలా ఉండాలి, నువ్వు వాళ్ళతో ఎలా ఉండాలి అనేది తెలుసుకో.. రేపు నీతో జీవితాంతం నడవటానికి ఒకరు వస్తారు.. 


వచ్చే వాళ్ళు సుఖం చూస్తే, నీ ఉద్యోగం సరిపోతుంది . 

అదే  ఆనందం కోసం వెతికితే,  ఏం చేస్తావు ?


అందుకే తాను నీ ఇంటి గడప తొక్కే ముందు.. ఒక్కసారి అయిన చదువు రామాయణం . 

తనువు చాలించే  ముందు చదివినా ఏమి ప్రయోజనం ?


ఈ రెండు ఇతిహాసాలు.. కుటుంబంలో, సమాజంలో నువ్వు ఎలా నడవాలో అని చెప్తుంది.

పాఠశాలలో వినిపించాల్సిన ఈ ఇతిహాసాలను.. పోయేముందు వినిపిస్తారు. ఎందుకో మరి ..

 

పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అని వేమన అన్నట్లు ..

మనం పుడుతున్నాం,  సుఖమే ఆనందం అనుకోని బ్రతికేస్తున్నాం, చచ్చిపోతున్నాం..

-తను





పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే పురిటిలోనే చంపేస్తాం..

పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే .. నేను ఏం పాపం చేశాను దేవుడా ఆడపిల్లని ఇచ్చావు అని ఏడుస్తాం!!

అదే వయసులో ఉన్న అమ్మాయి కనిపిస్తే వెంటపడతాం..

పుట్టింది ఆడపిల్ల అని తెలిసి.. అప్పుడే పుట్టిన ఆ పాపని ఎముకలు కొరికే చలిలో వదిలేస్తే.. చలికి తట్టుకోలేక చనిపోయింది చూసాం!!

పుట్టినప్పుడే లెక్కలు వేస్తాం.. ఎంత ఖర్చు ఇప్పటి నుంచి పెళ్లి చేసి పంపించే వరకు అని!!

ఇంట్లో మాటకి విలువ ఉండదు, తను ఏమి చేసినా తప్పు కనిపిస్తుంది.. ఇలా చెయ్యు అని వెన్ను తట్టేవాళ్ళు ఉండరు..

నాన్న అడగడు, అమ్మ పెట్టదు.. అన్నీ కొడుకు కోసమే..

తాను కూడా ఒకప్పుడు ఆడపిల్లనే అని మరిచిపోతుంది అమ్మ..

మాటలు వచ్చే సమయానికే.. తన మాటకి విలువలేదు అని తెలిసిపోతుంది..

ఇంట్లో ఒక్కసారి కూడా నాకు ఇది కావాలి అని అడగదు..

తనకి కావాలి అనుకుంటే, తన ఊహల ప్రపంచంలోకి వెళ్లి తెచ్చుకుంటుంది..

మనసులో దేవుడు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు..

కానీ మొహం మీద చిరు నవ్వు విడిచిపెట్టదు..

దీపావళికి సాక్షాత్తు లక్ష్మిదేవే ఇంటికి వస్తుంది అంటూనే, ఇంట్లో లక్ష్మిదేవి స్వరూపం అయిన కన్న కూతురిని పట్టించుకోము!!

ఆడపిల్ల పుట్టకూడదు అని ఆ అమ్మవారికే పొర్లుదండాలు పెట్టి మరీ మొక్కుతాం!!

నీ ఇంట్లో ఆడపిల్ల పుట్టకూడదు, కానీ నీకు పుట్టే కొడుకుకి భార్యగా, నీకు కోడలిగా నీ ఇంటి తలుపు తట్టాలి..

ఆరోగ్యం సరిగ్గాలేని రోజుల్లో కూడా పరుగుల ప్రపంచంలో నేను పోటీకి సిద్దం అని బడికి వెళ్తుంది, చదివి / సాధించి.. తిట్టిన అమ్మ, కూతురు వద్దు అనుకున్న నాన్నతోనే.. "నా కూతురు" అనిపించేలా చేస్తుంది..

ప్రతీ అమ్మాయికి అమ్మ నాన్న దొరకరు..

కన్నాము అని పెంచిన వాళ్ళే తప్ప!!

- తను




కొంతమంది చేతి వేళ్ళు పట్టుకొని ఎంత దూరం అయిన ప్రయాణం చేసేయొచ్చు.. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడగవలిసిన అవసరం ఉండదు..


అలంటి వాళ్ళు ఒక్కరు దొరికినా చాలు.. జీవితం, వర్షం పడ్డాక వచ్చే హరివిల్లు అవుతుంది..


మనం.. ఎండ కాసిన, వర్షం పడిన చెట్టు కిందకి పరిగెడతాం.. కానీ ఆ చెట్టు వర్షంలో తడుస్తుంది.. ఎండని తట్టుకొని.. ఎప్పుడూ పచ్చగా నవ్వుతూ ఉంటుంది.. వాళ్ళు కూడా అలంటి వల్లే.. 


రావణుడు కూడా రాముడిలా మారిపోతాడు అలాంటివాళ్ళు ఉంటే..  

రావణుడికి దొరకలేదు అందుకే రాముడి చేతిలో చచ్చాడు.. 


నీకు దొరికారా.. తన వెనుక నడుచుకుంటూ వెళ్ళిపో.. చంటి పిల్లాడు అమ్మ వెనుక ఎలా పరుగులుపెడతాడో అలా..


- తను 





వణుకు పుట్టించే చలిలో కూడా గంగతో అభిషేకాలు..

బట్ట కప్పేవాడు కరువయ్యాడు ఆ కాశీవిశ్వనాథుడుకి.

చలి వెయ్యద, జలుబు చెయ్యద..

దర్శనంకి వచ్చిన ప్రతి ఒక్కడు ఒక కోరిక, ఒక అభిషేకం, ఒక నైవేద్యం.

నువ్వు భక్తి తో పెట్టే నైవేద్యం కోసం ఉంటున్నాడో లేక నీ కోరిక తీర్చటానికి ఉంటున్నాడో ఆ చలిలో.

ఆ విశ్వనాథుడి బాధని ఆలకించే నాథుడు కరువాయే..

 - తను




తను తను  అంటున్నాను.. 

ఆ తను ఎవరు అంటే..

తను..   రాయని కావ్యం..

              పఠించని పద్యం..              

              రంగస్థలం ఆడని నాటకం..              

              రాని ప్రళయం..                  

              గీయని చిత్రం..            

              దొరకని వజ్రం..              

              చెప్పని చరిత్ర..                          

              చెయ్యని యుద్ధం..

              చెరగని కస్తూరం..

              తరగని పరిమళం..

అన్ని కలిపి చెప్పాల్సి వస్తే..              

పూర్ణం, రమణీయం, కమణీయం..

 - తను




పరీక్షల్లో ఫెయిల్ అయ్యావని నాన్న తిట్టాడు అనో..

పుట్టిన రోజుకి బట్టలు కొనలేదు అనో..

డబ్బులు అడిగితే ఇవ్వలేదు అనో..

ఫోన్ కొనలేదు అనో..  బండి కొనలేదు అనో..

గుర్రం ఎక్కించమంటే, జాతరలో కీలు గుర్రం ఎక్కించాడు అనో..

నాన్న కొట్టాడు అనో, అమ్మ తిట్టింది అనో కోపంతో..

- కూలి చేసి  కూడు తెస్తే, నువ్వు కంచాన్ని విసిరేసి..

వూరు మీదకి ఏగి.. బీరు తాగి ఫ్రండ్ రూంలో పడుకుంటావు.

- వాళ్ళు పస్తులుండి పెట్టిన కూడుని నేలకేసి కొట్టావు.. 

అప్పటికే ఆకలి సగం చచ్చినోళ్ళు ఏమి అయిపోవాలి?

- తినటానికి రెండు మెతుకులు సంపాదించుకుంటావు అని నిన్ను బడికి పంపిస్తే..

- నువ్వు ఏమో బాహుబలి సినిమా ఫస్ట్ షో చూడాలి..

- అమ్మాయి కావాలి అని బడి మానేసి ఊరి మీద పడతావు.

- నాన్న ఖాళీ జేబులు.. నువ్వు ఏమైపోతావు అని అమ్మ పడే ఆవేదన ఇంతేరా జీవితం..

- ఎప్పుడు ఏం చెయ్యాలి అనుకున్న ఈ రెండు గుర్తు తెచ్చుకో..

- రాముడు ఎలా నడిచాడు?

గీత లో కృష్ణుడు ఎం చెప్పాడు? అని పుస్తకాలు తిరగవెయ్యక్కర్లేదు.

- కూలికి వెళ్లి.. ఆ రోజు పని దొరకకపోయిన తినటానికి నాన్న తెచ్చిన ఆ మూడు ముద్దలు ఎలా వచ్చాయో ఆలోచించు..

- తాను ఒక పూట తిని.. నీకు మూడు పూట్ల పెట్టే అమ్మని గుర్తుకు తెచ్చుకో చాలు.,

- నువ్వు వాళ్ళకి గుడి కట్టాల్సిన అవసరం లేదు..

నువ్వు ఏమైపోతావో అనే బాధని వాళ్ళకి ఇవ్వకు చాలు..


- బీర్ తాగి ఊరిని గెలవటం కాదు..  నిన్ను నువ్వు గెలువు..

ఇదే మీ అమ్మ నాన్నకి కావలిసింది..

వాళ్ళు పడ్డ కష్టం అంత మరిచిపోతారు.. నిన్ను నువ్వు గెలిచిన రోజు.


ఊరి చివర ఎన్ని బీర్ షాపులు ఉన్నాయి అని తెలిసిన నీకు..

అమ్మ ఎన్ని రోజులు పస్తులు ఉంది అని తెలిస్తే.. వేరేలా ఉండేది ఏమో..

 - తను





అమ్మాయి దుకాణంలో వస్తువు కాదు తూకం వేసి ఎంత పలికింది అని చూసుకొని తెచ్చుకోవటానికి,

అమ్మాయి ఎంత ఐశ్వర్యవంతురాలో అనేది చూడు..

ఐశ్వర్యం అంటే సంపద కాదురోయ్..

ఎంత ఉంది, ఎంత సంపాదిస్తుంది అనేది సంపద.

ఐశ్వర్యం ఉన్నోడు అంటే.. తనని తనలో చూసుకుంటూ వృద్ధి చెందేవాడు.

సంపద ఉన్నోడు అంటే.. తనని పక్కవాడిలో చూసుకుంటూ వృద్ధి చెందేవాడు.

శివుడికి ఐశ్వర్యం ఉంది, కుబేరుడికి సంపద ఉంది. అదే తేడా..

బెంజ్ కారులో కూర్చుని ఏడుస్తావో, బస్సులో కూర్చొని నీవాళ్ళతో ఆనందంగా వెళ్తావో.. ఆలోచించుకో.

అది నరకం, ఇది స్వర్గం.

venkatesh tentu





ఒక చంటి పిల్లాడిని ఒక దగ్గర కుర్చోపెట్టటం ఎంత కష్టమో,

అలాంటి ఒక మాట చెప్పినా వినని ఈతరం యువతని ఒక దగ్గర కూర్చోపెట్టి..

కోపంగా కాని, కవ్వింపు లేని, అందరికి అర్ధం అయ్యే భాషలో అతను చెప్పే మాటలతో మనల్ని మనకి గుర్తు చేసి ఒక సద్దిఅన్నం మూటల మనతోపాటు తీసుకొని వెళ్లేలా చేసి,

సినిమాకి వినోదం కోసం వెళ్తున్నామా లేదా ఒక మాట ఐన నేర్చుకోవచ్చు అనేలా చేసి,

ఒంటి కాలుతో తన బ్రతుకుని ఈడ్చుతున్న తెలుగు భాషకి, తన మాటలతో, అక్షరాలతో తెలుగు ఎంత కమ్మగా ఉంటుందో చెప్పి నన్ను కదిలించిన త్రివిక్రమ్‌కి 👏 

venkatesh tentu




© venkatesh tentu, 2023