Following is the text of the valedictory anugraha bhasana by Pujya Guruvugaru on the occasion of completion of Jagadguru batch 2021.
ఋషిపీఠం గీతా పాఠాలు "జగద్గురు" అనబడే సెమిస్టరు పూజ్య గురువుల ఆశీర్వాదంతో పూర్తి చేసుకున్న సందర్భంగా గురువుల సమక్షంలో వారు ఇప్పటివరకు అధ్యయనం, అభ్యాసం చేసినటువంటి సాంఖ్య, భక్తి, పురుషోత్తమ ప్రాప్తి, దైవాసుర సంపద్విభాగ యోగములు పారాయణ చేసారు. అనంతరం పూజ్య గురువులు అనుగ్రహభాషణం ప్రసాదించారు. అందులోని ముఖ్యాంశములు.
ముందుగా చక్కగా పఠించిన విద్యార్థులను, వారికి నేర్పించిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఎవరూ కూడా అక్షరదోషం లేకుండా చక్కగా చదివారని అభినందించారు.
భగవద్గీత చాలా సంస్థలు నేర్పిస్తున్నారు కానీ ఋషిపీఠం తరపున నేర్పుతున్నటువంటి దానిలో అర్థస్ఫూరణ కూడా ఉండడం ప్రత్యేకత. పిల్లలు మొదలు పెద్దలవరకూ అందరూ ఒకే పద్ధతిలో నేర్చుకోవాలి అని పెట్టడంలో ఉద్దేశము ఏమిటంటే విద్య నేర్చుకోడానికి వయస్సు పరిమితి కాదు.
పెద్దవాళ్ళం అయ్యాము ఇప్పుడేమి నేర్చుకుంటాంలే అనే భావం ఉండకూడదు. భగవంతుడు ఇంకా మనకు ఒక్కరోజు ఆయుష్షు ఇచ్చాడు అంటే నేర్చుకోవడానికి ఒక రోజు అవకాశం ఇచ్చాడని అర్థం. అందుకే బ్రతికి ఉన్నంతకాలం నేర్చుకుంటూ ఉంటే ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. నేర్చుకోవడం ఆపేస్తే వృద్ధాప్యం వస్తుంది. నేర్చుకుంటున్నంత కాలం నిండు యవ్వనంలో ఉన్నట్లే, చక్కని జీవితాన్ని గడుపుతున్నట్లే!
విశేషించి నేర్చుకోవలసిన శాస్త్రాల్లో గొప్పది ఏది అంటే భగవానుడే చెప్పాడు విభూతి యోగంలో "ఆధ్యాత్మ విద్యా విద్యానాం" అని! విద్యలన్నింటిలో గొప్పది ఆధ్యాత్మ విద్య. అది నేర్చుకోవడం ఇహానికి, పరానికి కూడా సార్ధకత కలిగిస్తుంది. కొందరు అనుకుంటూ ఉంటారు భగవద్గీత, ఆధ్యాత్మ విద్య ఇవన్నీ పరానికి సంబంధించినవి అని, కానీ అది కాదు! ఇహంలో గొప్పగా ఎవరు జీవించగలడో వాడు పరమాత్మని ఇహంలోనే పొందగలడు. మరణాంతరం పొందేది కాదు పరమార్థం.
వయోపరిమితి లేదు! బుద్ధి వికసించినప్పటినుండి ఎవడు ప్రయత్నిస్తాడో వాడు ధన్యుడవుతాడు. పురాణాల్లో చూస్తే కనపడతారు గమనిస్తే ప్రహ్లాదుడు, ధ్రువుడు, శుకమహర్షి వీరంతా యువకులే! చరిత్రలో చూసినట్లైతే ఆదిశంకరులు, స్వామి వివేకానంద వీరంతా కూడా యువకులుగా ఉన్నప్పుడే పరిపూర్ణ జ్ఞానులు అయ్యారు. అందుకు పిల్లలకి ఏమి తెలియాలి అంటే "నా జీవితానికి ముఖ్యమైన విద్యను నేర్చుకుంటున్నాను" అనే భావం కలగాలి. '
పెద్దలకి కూడా అనుక్షణం ఆ ఆధ్యాత్మ విజ్ఞానం తమ హృదయంలో ముద్రించుకోవడానికి అధ్యయనం చేయాలి అనే భావం కలగాలి. పైగా పెద్దలని చూసి పిల్లలకి ఆదర్శం, స్ఫూర్తి వస్తుంది, పిల్లలను చూస్తూ పెద్దలు నేర్చుకుంటే ఆ పెద్దలకి ఒక తృప్తి కలుగుతుంది. తర్వాత తరాలకు కూడా ఈ జ్ఞానం వెళుతున్నది కదా అని ఆనందం కలుగుతుంది. అందుకు విశేషించి అన్నీ వయసుల వారు ఇందులో ఉన్నారు.
జగద్గురు అనబడే సెమిస్టర్లో ఎంచుకున్న అధ్యాయాల ప్రత్యేకత ఏమిటి?
ఒక్కొక విభాగం కింద అధ్యయనం చేస్తున్నాము, ఏ విభాగానికి ఆ విభాగమే పరిపూర్ణం కావాలనే ఉద్దేశంతో అధ్యాయాలని ఎంపిక చేయడం జరిగింది. తోచినట్లు ఎంపిక చేయడం కాకుండా ఒక ఆలోచనతోనే ఎంపిక చేయడం జరిగింది.
సాంఖ్య యోగం: భగవద్గీత యొక్క అసలు స్వరూపమే ఇదే! కృష్ణపరమాత్మ చెప్పదలంచుకున్నదంతా సాంఖ్య యోగంలో చెప్పేసారు. సాంఖ్య యోగం బాగా తెలుసుకుంటే భగవద్గీత తెలుసుకున్నట్లే!
ఆదర్శము, లక్ష్యము అయిన స్థితప్రజ్ఞ స్థితి ప్రతీవారు సాధించాలి. దానికి ఎలా ఉండాలి? ఆలోచన, ఆచరణ మొత్తం సాంఖ్య యోగంలో చెప్పారు. ప్రతీవారు కూడా స్థితప్రజ్ఞుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఈ అధ్యాయంలో చెప్పబడినవి దృష్టిలో పెట్టుకుంటే, ముందర చక్కగా జీవించడం చేతనవుతుంది. తర్వాత స్థితప్రజ్ఞత వస్తుంది. సాంఖ్య యోగం బీజయోగం, ఇది విన్నాక అర్జునుడు వేసిన ప్రశ్నలే మిగిలిన అధ్యాయాలు.
భక్తి యోగం: కర్మని, జ్ఞానాన్ని కూడా భక్తితో కలుపుకోవాలి. భక్తి లేనప్పుడు రెండూ వ్యర్థాలు. భక్తిలేని కర్మ జడము, భక్తిలేని జ్ఞానం శుష్కం, అందుచేత భక్తి చాలా అవసరం కావున భక్తి యోగం చెప్పుకున్నాం.
పురుషోత్తమ ప్రాప్తి యోగం: ఈ అధ్యాయాన్ని కలశాధ్యాయం అంటారు. పురుషోత్తమ ప్రాప్తియే కదా లక్ష్యం, ఆ పురుషోత్తముడి తత్త్వం, పొందే విధానమూ కూడా పదిహేనవ అధ్యాయంలో కనపడుతుంది. ఇది ముఖ్యమైన అధ్యాయం అని వ్యాఖ్యాతలు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకునే ఆ విధంగా అధ్యాయాలను ఎంపిక చేసుకున్నాం. విభూతి, విశ్వరూప సందర్శన యోగాల సారం పురుషోత్తమ ప్రాప్తిలో కనపడుతుంది. అందుకే ఇది అనేక అధ్యాయాల సారము, లక్ష్య శుద్ధి కలిగిస్తుంది, అందుచేత దీన్ని ఎంచుకున్నాం.
దైవాసుర సంపద్విభాగ యోగం: ఇది సాధనకు అత్యంత ప్రధానం. ఎందుకంటే ఒక ఘర్షణ మనలో ఉంటూ ఉంటుంది. ఆసురీ, దైవీ గుణాల మధ్య, ఆ ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. మన ప్రయత్నమంతా కూడా ఆసురీ సంపదలను నిగ్రహించుకుంటూ, క్రమంగా నిర్మూలించి, దైవీ సంపద పెంచుకుంటూ ఉండాలి. ఒకటి అయ్యాక ఒకటి అని కాకుండా, ఆసురీని తగ్గించుకుంటూ, దైవీ గుణములను పెంచుకుంటూ పోవాలి. ఎందుకు పెంచుకోవాలి? అంటే మోక్షం కావాలని ఉంటే దైవీ సంపద పెంచుకోవాలి.
ఆ నాలుగు కలిపితే, ఈ సెగ్మెంట్ అంతా మనకి పరిపూర్ణమైన భగవద్గీత సారము వస్తుంది కనుక అలా ఎంచుకోవడం జరిగింది.
గీతాచార్య సెమిస్టర్లో ఏ అధ్యయాలు నేర్పిస్తారు?
కర్మయోగం (3), కర్మసన్యాస (4), విశ్వరూపసందర్శనయోగం (11), క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (13), శ్రద్ధాత్రయ విభాగ యోగం (17).
ఇవి ఎందుకు ఎంచుకున్నాం అని ముందు ముందు నేర్చుకునేవారికి అర్థం అవుతుంది.
కర్మయోగం (3), కర్మసన్యాస (4) -> కర్మ యొక్క విశేషాలు తెలుసుకోవడానికి
విశ్వరూపసందర్శనయోగం (11) -> విశ్వాన్ని విష్ణుస్వరూపంగా చూడడం
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (13) -> ఇది ముఖ్యమైన అధ్యాయం కింద ఎంపిక చేయడం జరిగింది. శరీరం క్షేత్రం, జీవుడు క్షేత్రజ్ఞుడు, ఆ జీవుడు శరీరంతో ముడిపడడం కాకుండా, అతీతంగా చూడగలిగితే ఈశ్వరునితో ఐక్యం అవుతాడు అనేటువంటి ఉపనిషత్ సారం ఉంది కనుక దాన్ని ఎంచుకున్నాం.
శ్రద్ధాత్రయ విభాగ యోగం (17) -> ఇందులో ప్రధానంగా సత్వరజస్తమో గుణాల గురించి చర్చ జరుగుతుంది. మన మునుపు సెమిస్టర్లో దైవాసురసంపద్విభాగ యోగంతో ముగింపు ఎలాంటిదో, శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇక్కడికి ముగింపు అలాంటిది.
ఈ మూడు శ్రద్ధలను జాగ్రత్తగా తెలుసుకుని సాత్త్విక శ్రద్ధను అలవరచుకుంటే ముక్తిని పొందగలము అనేది సాధనాపరమైన అంశం.
ఇంకో క్రమంలో నేర్చుకోకూడదు అని కాదు కానీ ఇలా ఎంచుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. దేనికి అదే పరిపూర్ణం అనే ఉద్దేశంతో అధ్యాయాలను ఇలా ఎంచుకోవడం జరిగింది.
నేర్చుకున్నదానికి ప్రయోజనం ఏమిటి?
ఇప్పుడు నేర్చుకున్నవారందరూ అర్థస్పృహతో నేర్చుకున్నారు కనుక, వారి జీవితంలో సరి అయిన సమయంలో వారిప్పుడు నేర్చుకున్న గీతాజ్ఞానం స్ఫూరణకి వస్తుంది. విద్య నేర్చుకున్నాక అది మననం చేసి కంఠస్థం, హృదయస్థం చేస్తే, ఆ విద్య ఒక దేవతా స్వరూపం కనుక, సరి అయిన సమయంలో అది బుద్ధికి స్ఫురణగా వచ్చి దారి చూపిస్తుంది. అందుకు భగవద్గీత ఇప్పుడు నేర్చుకున్నవారందరి జీవితం కూడా చాలా ఆనందకరంగా, అభ్యుదయ నిశ్రేయసకరంగా కూడా ఉంటుంది.
అధ్యాపకుల అధ్యయనం/గురుభ్యోనమః
దీన్ని నేర్పించే అధ్యాపకులని అభినందించాలి. వారు శ్లోకాలు నేర్పడమే కాదు, ఎంతో అధ్యయనం చేసారు. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే "గురుభ్యోనమః" బృందం కొన్ని సంవత్సరాలుగా చేసిన అధ్యయనం సామాన్యం కాదు. ముఖ్యంగా డెబ్బై రెండు గంటల పాటు చెప్పిన నా భగవద్గీత ఉపన్యాసాలు వారు శ్రద్ధగా విని, దాన్ని పాతాల క్రింద అధ్యయనం చేసిన వారు ఇందులో అధ్యాపకులుగా ఉన్నారు.
అటు తర్వాత నలభై రెండు రోజుల భాగవతం కూడా అధ్యయనం చేసి వారు నేర్చుకున్న దాన్ని పత్రాలుగా సమర్పణ చేసారు. అదే విధంగా శివపురాణం నేర్చుకున్నారు, లలితాసహస్రనామ స్తోత్రం నేర్చుకున్నారు, ఒకటేమిటి చాలా విషయాలు నేర్చుకున్నారు.
వీటి అన్నిట్లో అంతఃసూత్రంగా ఉన్న విజ్ఞానమే భగవద్గీతలో ఉంది కనుక "గురుభ్యోనమః" వారు ఇందులో అధ్యాపకులుగా ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం.
సందేహనివృత్తి
1) మన బృందంలో ప్రణవం ఎందుకు అనిపించడంలేదు? "తత్సదితి" అని మాత్రమే ఎందుకు అంటున్నాము?
కొంత ప్రాచీన సంప్రదాయాన్ని గౌరవించడం!
ప్రణవం ఉచ్చరించడానికి కొన్ని రకాల సంస్కారములు అవసరం! మనం అధ్యయన దశలో ఉన్నాము కనుక ప్రణవం అవసరం లేదు, అది జపమూ మొదలైనవి వచ్చినప్పుడు ఆలోచించవలసినది.
2) స్థితప్రజ్ఞుడు మరలా జన్మిస్తాడా?
స్థితప్రజ్ఞుడు మరి జన్మించడు. ఎందుకంటే స్థితప్రజ్ఞ స్థితికి వెళ్లడం అంటే పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలగడం. అది కలిగినవాడికి ఇదివరకటి పాపపుణ్య కర్మలు ఉన్నప్పటికీ అవి వాసనలుగా ఉండవు, అతడు అనుభవించేటప్పుడు ప్రారబ్దాన్ని అనుభవిస్తాడు కానీ వాడికి అవి అంటవు. అందుకే ఇహంలోనే అతడు జీవన్ముక్తుడు కాగలడు.
ఈ స్థితప్రజ్ఞుడినే గుణత్రయవిభాగం చెప్పేటప్పుడు గుణాతీతుడు అన్నారు. అలాగే భక్తి పరంగా పరాభక్తికి చెందినవాడు.
3) పరమాత్మ అన్నిటికి కారణం అయినప్పుడు పాపాలు, పుణ్యాలు మరలా ఎందుకు వచ్చాయి?
పరమాత్మ అన్నిటికి కారణమే, కానీ పాపపుణ్యాలకు కారణం కాడు!
ఇది ఎలాంటిది అంటే, వర్షం కురిసినప్పుడు అంతవరకూ మట్టిగా కనపడుతున్న నేల నుండి అనేక వృక్షాలు వస్తాయి, కొన్ని ముళ్లచెట్లు , కొన్ని పూల చెట్లు, కొన్ని తీపి పండ్ల చెట్లు, కొన్ని చేదుపండ్ల చెట్లు! ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? అయితే భూమి లేదా వర్షం! ఈ రెండూ ఇన్ని చెట్లకు కారణం అయినప్పుడు, ఇన్ని రకాల చెట్లు ఎందుకు ఇవ్వాలి? అంటే ఆ భూమి, నీరు ఎలాంటి కారణాలు అంటే ఆ మట్టిలోని బీజములు వృక్షములుగా రావడానికి ఈ నేల, వర్షం కారణాలు అంతేకాని ఆ పువ్వులకు, ముళ్ళకి, తీపికి, చేదుకు కారణాలు కావు!
అదే విధంగా జీవుల కర్మఫలాలని అనుసరించి, వారి వాసనలను అనుసరించి పుణ్యపాపాలు ఉంటాయి. పుణ్యపాపములను అనుసరించి సుఖదుఃఖ అనుభవాలు ఉంటాయి. ఈశ్వరుడు కేవలం కర్మఫలప్రధాతయే కానీ ఆయన పాపపుణ్యాలకు కారణం కాడు!
ఉపమానం2# దీపంలో ఒకడు పేక ఆడుతున్నాడు, ఒకడు భగవద్గీత చదువుతున్నాడు. దీపం ఉంటేనే రెండూ పనులు జరుగుతున్నాయి, కానీ పేకాట ఆడిన పాపం కానీ, భగవద్గీత చదివిన పుణ్యం కానీ దీపానికి రావు. దీపం భగవద్గీతను వీడికి, పేకముక్కను వాడికి ఇవ్వలేడు! ఈశ్వరుడు దీపం వంటివాడు! అయన ఇచ్చిన శక్తిని ఎలా వినియోగించుకుంటున్నాం అని తెలుసుకోవాలి.
4) మాసికములు, తద్దినములు చేస్తున్నప్పుడు, ఒకవేళ ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో ఆ జీవుడు ఇంకో చోట పుట్టి ఉంటే ఆ సమయంలో వస్తాడా స్వీకరించడానికి?
జీవుడు వాడి కర్మను బట్టి ఏ శరీరం పొందినప్పటికీ కూడా వాడిని ఉద్దేశించి చేసే పితృ కర్మల వల్ల, వాడికి అప్పటికి తగ్గ ఆహారాన్ని పితృదేవతల వ్యవస్థ అందిస్తుంది. ఒకవేళ జంతువుగా పుట్టి ఉంటే ఆ జంతువుకు తగ్గ ఆహారంగానూ, ఒకవేళ దేవలోకంలో ఉంటే అమృతంగానూ మర్చి ఇవ్వగల శక్తి పితృదేవతల వ్యవస్థకు ఉన్నది.
ఉపమానం# అమెరికాలోని వాడు వాడి తల్లితండ్రులకు డాలర్స్ పంపితే భారత్ లో వారికి రూపాయల్లో వస్తాయి. డాలర్లని రూపాయలుగా మార్చే ఆర్ధిక వ్యవస్థ ఉన్నట్లే, ఇక్కడ పెట్టే అన్నాన్ని ఆ శరీరానికి తగ్గట్లు మార్చే వ్యవస్థ ఉంది, అదే పితృ దేవతా వ్యవస్థ. ఈ వ్యవస్థలోని దేవతలు (వసురుద్రఆదిత్య గణాలు వేరు, పితరులు వేరు.
ఎక్కడున్నప్పటికీ కూడా నా పితరులు (ఉదా: తండ్రి, తాత, ముత్తాతలు) బాగుండాలి అనే ఉద్దేశంతో వీడు చేసే సత్సంకల్పం, ఆ సత్కర్మ ఉన్నదే అది ఆ చేసినవాడికి సద్గతిని ఇస్తుంది. ఒకవేళ వాడి పితరులు ముక్తులు అయితే అసలు వీడి ఆహారం వారికి అవసరంలేదు కానీ ఆ సత్కర్మ వీడికి సద్గతిని ఇస్తుంది.
ఆశీర్వాదం
తర్వాత అధ్యయాలు కూడా చక్కగా అధ్యయనము చేయండి!
ముఖ్యంగా మన గురుభ్యోనమః మొదటి నుంచీ ఏది అధ్యయనం చేసినా కొన్ని నియమాలు, ప్రవర్తనా సరళి పెట్టుకున్నాము. ఎందుకంటే నియమాలు లేనిదే ఏ విద్యా కూడా శోభించదు. క్రమశిక్షణ ఉండాలి, నియమం ఉండాలి!
పెద్దవారైనా, చిన్నవారైనా చదువుకునేటప్పుడు క్రమశిక్షణ ఉండాలి, అప్పుడే ఆ విద్య భాసిస్తుంది!
నన్ను సంప్రదించగా నేను సూచించిన నియమాలనే ఇందులో పెట్టారు. అవి పాటిస్తూనే అందరూ అధ్యయనం చేస్తున్నారు.
ఎక్కువమంది చేస్తున్నారా లేదా అని అనుకోవక్కర్లేదు. కొద్దిమంది అధ్యయనం చేసినప్పటికీ అది బలమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ బలమైన జ్ఞానం ఇంకెందరికో స్ఫూర్తిని ఇస్తుంది.
గీత నేర్చుకునేటప్పుడు దృష్టి ఎలా ఉండాలి?
ఈ నేర్చుకుంటున్న మన పద్ధతి గీతా జ్ఞానాన్ని గ్రహించడానికి! అంతేకాని గీతలోని 700 శ్లోకాలని కంఠోపాఠం చేశామని తృప్తి పడిపోవడం మాత్రమే కాదు! అందుచేత ఈ గీతా జ్ఞానాన్నిఇలా విభాగాలుగా చేసుకుంటున్నాం. ఏ విధంగా విభాగం చేస్తున్నామని తెలుస్తున్నది కదా! అందుచేత మొదట సెమిస్టరు లో చెప్పిన జ్ఞానం పట్టుకోగలిగి ఒక్కసారి మననం చేసుకుంటే, అది ఏ విధంగా జీవితంలో అప్లై అవుతుంది, ఆలోచలని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలు మీరే ప్రత్యేక వ్యాసాలు కూడా తయారు చేయవచ్చు. తర్వాత ఆ పని కూడా చేయండి ఇందులో!
ఇప్పటివరకు చేస్తున్న చక్కని కృషికి నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇంతవరకు నేర్చుకున్నవన్నీ కూడా పద్ధతిగా నేర్చుకున్నారు గురుభ్యోనమః బృందం వారు. అదే విధంగా ఇందులో పిల్లలు, పెద్దలు కూడా ఉండడానికి కారణం ఏమిటో ఇందాక చెప్పుకున్నాం. సంఖ్య పెరగాలి కూడా! గీత జీవితకాలం అధ్యయనం చేయవలసిన గ్రంథం కనుక, అన్నీ అవస్థల వారు విద్యార్థులుగా ఉండాలి. అందుకే ఇవాళ మనం విద్యార్థుల్లో బాలురు, కౌమారావస్థలోని వారు, యువతీయువకులు, వృద్ధులు, అందరిని చూసాము! అందరూ విద్యార్థులై జగద్గురువును కొలుచుకుంటూ ఉన్నారు. ఆ జగద్గురువు శ్రీకృష్ణపరమాత్మ మన బుద్ధికి సరి అయినటువంటి స్ఫూరణని ప్రేరేపించి, వారివారి సంస్కారాన్ని అనుసరించి కొందరిని ఉపాసనా మార్గంలో, కొందరిని కర్మ మార్గంలోనూ, కొందరిని జ్ఞానమార్గంలోనూ, మూడింటినీ సమన్వయించే భక్తిమార్గంలో నడుపు గాక అని ప్రార్థిస్తూ, అందరికి కూడా జగద్గురువు యొక్క ఆశీస్సులను అర్థిస్తున్నాను. అధ్యాపకులకు అధ్యాపన శక్తి పెంచుగాక అని కోరుకుంటున్నాను.
- పూజ్య గురువుల అనుగ్రహభాషణం
సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు