Oersted , అయిర్‌స్టెడ్

శక్తితత్వాన్ని తెలిపినవాడు! ఓప్రొఫెసర్‌ విద్యార్థులకు ఓ మామూలు ప్రయోగాన్ని చేసి చూపిస్తున్నారు. అలా చేస్తూ ఆయన గమనించిన అంశం ఒక పరిశోధనకు నాంది పలికింది. ఆ పరిశోధన శాస్త్ర రంగంలో సంచలనం సృష్టించింది. కొత్త శాస్త్రం ఆవిర్భావానికి కారణమైంది. ఎన్నో ఆధునిక పరికరాల ఆవిష్కరణకు బాట వేసింది. అలాంటి సునిశిత పరిశీలన కలిగిన శాస్త్రవేత్తే అయిర్‌స్టెడ్‌. ఆయన కనుగొన్న అంశమే 'విద్యుదయస్కాంతత్వం' (Electro Magnetism). ఆయన కాలానికి విద్యుత్‌, అయస్కాంతత్వం అనేవి వేర్వేరు శక్తులు. అయిర్‌స్టెడ్‌ పరిశోధనల వల్ల అవి రెండూ ఒకే శక్తికి సంబంధించిన వేర్వేరు అంశాలని తేలింది.

డెన్మార్క్‌లో 1777 ఆగస్టు 14న పుట్టిన హన్స్‌ క్రిస్టియన్‌ అయిర్‌స్టెడ్‌కి చిన్నప్పటి నుంచే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. తండ్రికున్న మందుల కంపెనీ పనుల్లో సాయపడ్డమే అందుకు కారణం. తొలి చదువులను ఇంటి వద్దనే పూర్తిచేసిన ఇతడు కొపెన్‌హెగన్‌ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొంది, ఆపై 22 ఏళ్లకే పీహెచ్‌డీ సాధించాడు. ట్రావెల్‌ స్కాలర్‌షిప్‌పై యూరప్‌ దేశాల్లో పర్యటించిన ఇతడు 29 ఏళ్లకల్లా ప్రొఫెసర్‌ అయ్యాడు.

ఓసారి 1821లో విద్యార్థులకు ఓ ప్రయోగాన్ని వివరిస్తూ బ్యాటరీ విద్యుత్‌ను ఓ రాగి తీగ ద్వారా ప్రవహించేలా చేశాడు. అనుకోకుండా ఆ పక్కనే ఉన్న అయస్కాంత సూచి (కంపాస్‌ నీడిల్‌) చటుక్కున కదలడం గమనించాడు. రాగి తీగలో విద్యుత్‌ ప్రవాహానికి, కంపాస్‌ ముల్లు కదలడానికి సంబంధం ఏమిటా అనే ఆలోచన అతడిలో కలిగింది. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఆ దిశలో అనేక ప్రయోగాలు చేశాక, 'ఒక తీగలో ప్రవహించే విద్యుత్‌, ఆ తీగ చుట్టూ వృత్తాకారంలో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది' అని సాధికారికంగా చెప్పగలిగాడు. విద్యుత్‌ శక్తిని అయస్కాంత శక్తిగా మార్చవచ్చనే అతడి ప్రతిపాదన ఆధారంగానే 'ఎలక్ట్రో డైనమిక్స్‌' అనే కొత్త పరిశోధన రంగం ప్రారంభమైంది. ఆ ఫలితాల వల్లనే విద్యుదయస్కాంతత్వం అనే కొత్త అధ్యాయం ఏర్పడింది.

తర్వాతి కాలంలో మైకేల్‌ ఫారడే అనే శాస్త్రవేత్త అయస్కాంత శక్తిని, విద్యుత్‌ శక్తిగా మార్చవచ్చంటూ చెప్పిన సిద్ధాంతానికి స్ఫూర్తి అయిర్‌స్టెడ్‌ ప్రయోగమే. తద్వారా 'ఆల్టర్‌నేటింగ్‌ కరెంటు' (ఎ.సి.) ఉత్పాదన సాధ్యమైంది. సాంకేతిక పారిశ్రామిక రంగాలు దూసుకుపోడానికి కారణమైన జనరేటర్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌లాంటి అనేక పరికరాల రూపకల్పన వీలైంది. టీవీ, టేప్‌రికార్డర్‌, డీవీడీ ప్లేయర్‌, కంప్యూటర్‌లాంటి ఆధునిక పరికరాల్లో సైతం విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రమేయం ఉంది.

అలాగే అయిర్‌స్టెడ్‌ తొలిసారిగా అల్యూమినియం మూలకాన్ని 1825లో ప్రయోగశాలలో ఉత్పత్తి చేయగలిగాడు. డెన్మార్క్‌ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహానికి ఆయన పేరే పెట్టారు. ఆయన పేరిట ఇప్పటికీ ప్రతిభావంతులకు బంగారు పతకాలను ఇస్తున్నారు. ఆయన రాసిన 'ది సోల్‌ ఆఫ్‌ నేచర్‌' పుస్తకం ప్రతి ఒక్కరూ చదవదగినది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు