Niels Bohr , నీల్స్‌బోర్

  


 పరమాణు రూపాన్ని చూపించినవాడు! ఏ పదార్థమైనా పరమాణువులతో నిర్మితమైనదే. మరి కంటికి కనిపించని ఆ పరమాణువు నిర్మాణం ఎలా ఉంటుంది? దాని లోపలి దృశ్యం ఎలా ఉంటుంది? ఈ విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన తొలి శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌. ఆయన పుట్టిన రోజు ఇవాళే!

పరమాణువు గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా జర్మనీ శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌ పేరు పొందాడు. పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఆర్బిట్లనే కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, బయటి ఆర్బిట్లలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. పరమాణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను పొందడం విశేషం.

జర్మనీలోని కోపెన్‌హగెన్‌లో 1885 అక్టోబర్‌ 7న పుట్టిన నీల్స్‌ హెన్రిక్‌ డేవిడ్‌ బోర్‌ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభను కనబరిచాడు. తండ్రి అక్కడి విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్‌. అక్కడే చదివిన నీల్స్‌బోర్‌ 22 ఏళ్ల వయసులో తలతన్యతపై చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని సాధించాడు. ఇరవై ఆరేళ్లకల్లా పీహెచ్‌డీ సంపాదించిన బోర్‌, ఆపై ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్‌ లేబరేటరీలో సర్‌ ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌తో కలిసి పనిచేశాడు. ఇరవై ఎనిమిదేళ్లకే పరమాణు నిర్మాణాన్ని ప్రకటించాడు. ఈ పరమాణు నమూనా రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికే కాకుండా పరమాణు శక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి దోహద పడింది.

పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి గల కక్ష్య నుంచి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దూకినప్పుడు కాంతి రూపంలో శక్తిని వికిరణం చేస్తాయని బోర్‌ తెలిపాడు. ఎలక్ట్రాన్‌ వెలువరించే ఈ శక్తి వికిరణం విడివిడిగా ప్యాకెట్ల రూపంలో వెలువడుతుంది. ఒక ప్యాకెట్‌ శక్తి లేదా క్వాంటమ్‌ను ఫోటాన్‌ అంటారు. క్వాంటమ్‌ అంటే జర్మన్‌ భాషలో చిన్న ప్యాకెట్‌ అని అర్థం.

అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు మూలకాలు వెదజల్లే కాంతిని గాజు పట్టకం ద్వారా ప్రసరింప చేస్తే వేర్వేరుగా వర్ణపటాలు వెలువరిస్తాయనివాటిని బట్టి ఆయా మూలకాలను గుర్తించవచ్చని ప్రకటించాడు. బోర్‌ పరిశోధనల ఆధారంగానే ఆవర్తన పట్టిక రూపకల్పన, కేంద్రక విచ్ఛిత్తిపై సమగ్ర అవగాహన సాధ్యమయ్యాయి. ఆయనకు లభించినన్ని బహుమతులు, పురస్కారాలు శాస్త్రలోకంలో మరే శాస్త్రవేత్తకూ లభించలేదు.

- ప్రొ..ఈ.వి. సుబ్బారావు
   

Comments