John Archibald Wheeler - జాన్‌ ఆర్చిబాల్డ్‌ వీలర్

    






లైబ్రేరియన్‌ అయిన తండ్రి ఇంటికి తెచ్చే ప్రతి పుస్తకాన్నీ చదవడమే ఓ కుర్రాడిలో ఉత్సుకతను రేపింది. అదే అతడిని ప్రపంచం మర్చిపోలేని శాస్త్రవేత్తను చేసింది. ఆయన పుట్టిన రోజు ఇవాళే! 1911 జులై 9న

ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేయడమే కాదు, ఆయన సాపేక్ష సిద్ధాంతానికి ప్రాచుర్యాన్ని తెచ్చే అంశాలను అన్వయించిన వ్యక్తి జాన్‌ ఆర్చిబాల్డ్‌ వీలర్‌. ఒక అధ్యాపకుడిగా ఈయన కొందరు విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం విశేషం. సైద్ధాంతిక శాస్త్రవేత్తగా పేరొందిన జాన్‌వీలర్‌ బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం), వర్మ్‌హోల్‌ (కీటకబిలం) లాంటి శాస్త్రీయ పదాల సృష్టితో విశ్వంపై అవగాహన పెంచే సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కేంద్రక విచ్ఛిత్తి (Nuclear fission) సిద్ధాంతం, ఆటంబాంబుల నిర్మాణంలో వీలర్‌ పాత్ర కీలకమైనది.

అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విలాలో 1911 జులై 9న పుట్టిన జాన్‌వీలర్‌ నలుగురి సంతానంలో పెద్దవాడు. గ్రంథాలయంలో ఉద్యోగి అయిన తండ్రి ఇంటికి తెచ్చే పుస్తకాలను వదలకుండా చదవడమే చిన్నప్పుడు అతడి వ్యాపకం. ఆ అలవాటే అతడి ఆలోచనలకు పదునుపెట్టింది. ఏవేవో ప్రయోగాలు చేస్తూ కొయ్యతో తాళాలు, పిస్తోలు, కూడికలు చేసే యంత్రం, స్ఫటికాలతో పనిచేసే రేడియో, టెలిఫోన్‌ నమూనాలు చేస్తూ కాలం గడిపేవాడు.

ఫ్లోరిడాలో పట్టభద్రుడై, జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసిన వీలర్‌ జర్మనీ వెళ్లి ప్రముఖ శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌ పర్యవేక్షణలో పరిశోధనలు చేశాడు. ఆపై అమెరికాలోని నార్త్‌ కెరోలినా, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయాల్లో బోధనావృత్తిలో దాదాపు నాలుగు దశాబ్దాలు కొనసాగారు. ఐన్‌స్టన్‌ సాహచర్యంలో ఆయన చేసిన పరిశోధనలు ముఖ్యమైనవి. ఐన్‌స్టీన్‌ సామాన్య సాపేక్ష సిద్ధాంతంలో ప్రయోగాల ప్రసక్తి లేకపోవడంతో అది కొన్నేళ్లపాటు నిరాదరణకు గురైంది. ఆ దశలో వీలర్‌ ఆ సిద్ధాంతాన్ని విశ్వవ్యాపనం (expanding universe) అనే అంశానికి అన్వయించి దానికి ప్రాచుర్యం తెచ్చారు.

అలాగే కణభౌతిక శాస్త్రం (Paricle Physics)లో ప్రముఖ పాత్ర వహించే 'ఎస్‌-మ్యాట్రిక్స్‌' సిద్ధాంతాన్ని సమకూర్చింది ఈయనే. నీల్స్‌బోర్‌తో కలిసి ఆయన ప్రతిపాదించిన ద్రవబిందు నమూనా (Liquid drop model)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబుల రూపకల్పన ప్రాజెక్ట్‌లలో కీలక పాత్ర వహించారు. ఆయన కృషికి గుర్తింపుగా అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఎన్నో అవార్డులు పొందిన వీలర్‌ తన 97వ ఏట 2008లో మరణించారు. వీలర్‌ ఆత్మకథ 'ఎట్‌ హోమ్‌ ఇన్‌ ద యూనివర్స్‌' అందరూ చదవదగిన గ్రంథం.

- ఈ.వి. సుబ్బారావు(courtesy : Eenadu telugu daily)

Comments