J. Robert Oppenheimer- రోబర్ట్ ఓపెన్ హీమర్

   
 
 
 
 
 
 
ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు చదువే లోకంగా ఎదిగాడు. పదకొండేళ్లకే శాస్త్రవేత్తల సభలో ప్రసంగించాడు. ఇరవై నాలుగేళ్లకల్లా 7 భాషల్లో పాండిత్యం సంపాదించాడు. అతడే అణుబాంబు రూపకర్త రాబర్ట్‌ ఓపెన్‌హీమర్‌. ఆయన పుట్టిన రోజు ఇవాళే!-ఏప్రిల్‌ 22న.

'ఒకేసారి వేయి సూర్యుల కాంతి ఆకాశంలో ప్రసరిస్తే, ఆ కిరణ తీవ్రతతో సమానం దేదీప్యమానమైన నా తేజస్సు. అప్పుడు నేను లోకవినాశకమైన మృత్యువునవుతాను'

- భగవద్గీతలో ఈ అర్థాన్నిచ్చే సంస్కృత శ్లోకాన్ని ఓ అమెరికా శాస్త్రవేత్త అప్రయత్నంగా చదివాడు. ఎప్పుడో తెలుసా? 1945 జులై 16న తొలి అణుబాంబును పరీక్షించిన సందర్భంలో. అతడే ఆ బాంబు రూపకర్త రాబర్ట్‌ ఓపెన్‌ హీమర్‌.

న్యూయార్క్‌లో 1904 ఏప్రిల్‌ 22న పుట్టిన ఓపెన్‌హీమర్‌ చిన్నప్పటి నుంచీ చురుకే. అయిదేళ్ల వయసులోనే తాతగారు ఇచ్చిన రంగురాళ్లతో ఆడుకుంటూ భూమి గురించి ప్రశ్నలు వేసేవాడు. తన ఈడు పిల్లలందరూ ఆడుకునే సమయంలో మైక్రోస్కోప్‌లో నీటి బిందువుల్ని, సూక్ష్మజీవుల్ని గమనిస్తూ కాలం గడిపేవాడు. స్కూలుకెళ్లే వయసులోనే గ్రీకు, ఫ్రెంచి, స్పానిష్‌, ఇటాలియన్‌ భాషలతో పాటు గ్రీకు తత్వవేత్తల గ్రంథాలు చదివేశాడు. భూగర్భ శాస్త్రంపై అధ్యయనం చేస్తూ అమెరికాలోని శాస్త్రవేత్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. దస్తూరిని బట్టి బాలుడిగా పోల్చుకుంటారనే ఉద్దేశంతో టైప్‌ చేసిన ఉత్తరాలు పంపేవాడు. వాటిని బట్టి ఆ శాస్త్రవేత్తలు 'న్యూయార్క్‌ మినరలాజికల్‌ క్లబ్‌' సభ్యునిగా అతడిని ఎన్నుకుని ఓ సభకు ఆహ్వానించారు. అప్పటికి ఓపెన్‌హీమర్‌ వయసు 11 ఏళ్లు. అతడిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయినా సభలో అతడి ఉపన్యాసం విని అభినందించారు.

ఆపై ఓపెన్‌హీమర్‌ భౌతికశాస్త్రంలో అత్యధిక మార్కులతో పట్టభద్రుడయ్యాడు. అక్కడి ప్రొఫెసర్‌ ఇతడి ప్రతిభను గమనించి 'ఈ కుర్రాడు ఏదో ఒక రోజు ఫిజిక్స్‌నైనా, ఈ లోకాన్నైనా ఒక వూపు వూపుతాడు' అన్నారు. ఓపెన్‌హీమర్‌ రెండింటిలోనూ ప్రకంపనాలు సృష్టించాడు.

ఇంగ్లండ్‌, జర్మనీ విశ్వవిద్యాలయాల్లో పరశోధనలు జరిపి పీహెచ్‌డీ పొందిన ఓపెన్‌హీమర్‌, అమెరికా వచ్చి కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమవడంతో జర్మన్‌ నియంత హిట్లర్‌ అణుబాంబును తయారు చేస్తాడేమోననే అనుమానంతో అమెరికా ప్రభుత్వం దాన్ని ముందుగానే రూపొందించాలని తలపెట్టింది. అందుకోసం ఏర్పడిన 'మన్‌హటన్‌ ప్రాజక్ట్‌'కు డైరెక్టర్‌గా ఓపెన్‌ హీమర్‌ను ఎంచుకుంది. ఆయన పర్యవేక్షణలో 4,500 మంది నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి రూపొందించిన అణుబాంబును న్యూమెక్సికో ఎడారిలో పరీక్షించి చూశారు. ఆపై అమెరికన్లు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబును ప్రయోగించినప్పుడు జరిగిన ప్రాణనష్టానికి చలించిపోయిన ఆయన ఆపై అణ్వస్త్రాల నిషేధంపై కృషి చేశారు. కేన్సర్‌ వ్యాధితో 63 ఏళ్ల వయసులో చనిపోయారు.

 

Comments