Hermann von Helmholtz , హెర్మన్‌ లుడ్విగ్‌ ఫెర్డినాండ్‌ వాన్‌ హెల్మ్‌హోజ్‌

  


పలు శాస్త్రాలపై పట్టు ...     ఏడు భాషల్లో ప్రావీణ్యత... సంగీత, చిత్రకళల్లో ప్రవేశం... అన్నింటినీ మించి అనేక శాస్త్రాలపై పట్టు... ఇవన్నీ ఓ శాస్త్రవేత్త పరిచయ వాక్యాలే. ఆయన పుట్టిన రోజు ఇవాళే!-1821 ఆగస్టు 31న.

కంటిలోపల ఏముందో పరిశీలించగలిగే ఆప్తాల్మోస్కోప్‌, కంటిలోని కటకం వక్రతను నిర్ణయించే ఆప్తాల్మోమీటర్‌ పరికరాలు ఇప్పటికీ వైద్య రంగంలో ఉపయోగపడుతున్నాయి. వాటిని రూపొందించిన శాస్త్రవేత్త హెల్మ్‌హోజ్‌ (Helmholtz) అందుకు మాత్రమే పసిద్ధుడు కాదు. ఆధునిక శాస్త్రవిభాగాల్లోని అనేక అంశాల్లో సైద్ధాంతిక, పరిశోధనాత్మక కృషి చేసిన వాడు. భౌతిక, శరీర, మానసిక, కాంతి, ధ్వని తదితర శాస్త్ర విభాగాల్లో గొప్ప సేవలు అందించిన వాడు.

జర్మనీలోని బెర్లిన్‌ దగ్గరి పాట్స్‌డామ్‌లో 1821 ఆగస్టు 31న పుట్టిన హెర్మన్‌ లుడ్విగ్‌ ఫెర్డినాండ్‌ వాన్‌ హెల్మ్‌హోజ్‌ చిన్నప్పటి నుంచే తండ్రి వద్ద లాటిన్‌, గ్రీకు, హిబ్రూ, ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌, అరబిక్‌, ఇటాలియన్‌ భాషలను అభ్యసించాడు. ఇటు సంగీత చిత్రకళలు, అటు వేదాంత ధోరణులను వంటపట్టించుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల విశ్వవిద్యాలయంలో చదవలేకపోయినా, అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్నాళ్లు సైన్యంలో పనిచేస్తే ఉచితంగా వైద్యవిద్యను అభ్యసించవచ్చనే షరతును చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆపై మెడికల్‌ కాలేజీలో చేరి జంతువుల నాడీవ్యవస్థపై పరిశోధన చేసి ఎమ్‌డీ పట్టా సాధించాడు. వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా వ్యవహరించిన ఆయన భూమి వయస్సు, సూర్యుడు, గ్రహాల ఆవిర్భావం గురించి సాధికారికమైన వ్యాసాలు రాశాడు. ఆపై బెర్లిన్‌లో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అక్కడ ఆయన విద్యుదయస్కాంత సిద్ధాంతాలపై చేసిన పరిశోధన ఫలితం 'హెల్మ్‌హెజ్‌ సమీకరణం'గా ఇప్పటికీ ఉపయోగపడుతోంది. ఆయన కాంతిశక్తిపై పరిశోధన చేసి ఆప్తాల్మోస్కోప్‌, ఆప్తాల్మోమీటర్‌ రూపొందిండమే కాకుండా కంటి చూపునకు సంబంధించిన ఎన్నో లోపాలను, వాటి పరిష్కారాలను సూచించాడు. అలాగే ధ్వని శాస్త్రంపై పరిశోధనలు చేసి వివిధ పౌనఃపున్యాలుండే శబ్దాలకు చెవిలోని కర్ణభేరి స్పందనలు, అనునాదం (resonance) అంశాలపై పరిశోధనలు చేశాడు. అలాగే సంగీతానికి అనుగుణంగా స్వరాల అన్వయమవుతున్న తీరు, స్వరంలో నాడీ ప్రేరణల వేగం కనుగొన్నాడు. స్వరధ్వనుల తీవ్రతను తెలిపే రెసొనేటర్‌ పరికరాన్ని రూపొందించాడు.

ఆయన చేసిన మరో ముఖ్య పరిశోధన 'శక్తి నిత్యత్వ సూత్ర ప్రతిపాదన'ప్రాణుల్లోని ఉష్ణం, కండరాల కదలికలకు మూలం శరీరంలో జరిగే భౌతిక, రసాయనిక చర్యలేనని నిరూపించాడు. కండరాల కదలికల వల్ల దేహం శక్తిని ఏమాత్రం కోల్పోదని నిర్ధరించాడు. ఉష్ణం ఒక శక్తి స్వరూపమని నిర్వచించే ఈ సూత్రం ఉష్ణగతిక శాస్త్రం (థర్మో డైనమిక్స్‌) మొదటి నియమం. ఆ తర్వాత ఎలక్ట్రో డైనమిక్స్‌పై చేసిన పరిశోధనల వల్ల యాంత్రిక, ఉష్ణ, కాంతి, విద్యుత్‌ అయస్కాంత శక్తులు ఒకే శక్తి యొక్క వేర్వేరు రూపాలని ప్రతిపాదించి 'ఐక్య క్షేత్ర సిద్ధాంతా'నికి పునాదులు వేశాడు.
Comments