Ivon Poplovశరీర, మానసిక ధర్మాలపై పట్టు -     మనసు, శరీర ధర్మాల సమన్వయం వల్ల మనలోని కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో సాధికారికంగా నిరూపించి, ఆ శాస్త్రాల అభివృద్ధికి దోహద పడిన వ్యక్తి ఇవాన్‌ పావ్‌లోవ్‌. ఆయన పుట్టిన రోజు ఇవాళే - 1849, సెప్టెంబర్‌ 14న.

మనం రోడ్డు వెంట నడుస్తుంటే పక్కనే హఠాత్తుగా ఏదో శబ్దం అయిందనుకోండి. ఏం చేస్తాం? తటాలున పక్కకు గెంతేస్తాం. ఆ శబ్దమేంటో, దాని వల్ల ప్రమాదముందో లేదో ఇలాంటి ఆలోచనలేవీ రాకుండానే చర్య జరిగిపోతుంది. గాలికి దుమ్ము రేగుతుండగానే వెంటనే కళ్లు ఆర్పుతాం. ఆలోచనలతో ప్రమేయం లేని ఇలాంటి చర్యలను ప్రతిక్రియలు (Reflexes) అంటారు. వీటి గురించి పరిశోధనలు జరిపి 'వ్యవస్థిత ప్రతిక్రియ' (Conditioned Reflex) అనే సిద్ధాంతాన్ని అందించిన వ్యక్తిగా రష్యాకు చెందిన ఇవాన్‌ పావ్‌లోవ్‌ పేరు పొందాడు. జీర్ణవ్యవస్థ ఏఏ దశల్లో, ఏ విధంగా జరుగుతుందో ప్రయోగాల ద్వారా నిరూపించి 1904లో నోబెల్‌ బహుమతిని పొందాడు కూడా.

సెంట్రల్‌ రష్యాలోని రయజాక్‌ గ్రామంలో 1849, సెప్టెంబర్‌ 14న పుట్టిన ఇవాన్‌ పావ్‌లోవ్‌ మొదట్లో మత సంబంధమైన పాఠశాలలో చేరినా, తర్వాత సైన్స్‌ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. సెయింట్‌ పీటర్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల్లో చదివిన 'ది రిఫ్లెక్సెస్‌ ఆఫ్‌ బ్రెయిన్‌' పుస్తకం ఎంతో ఆకట్టుకోవడంతో తర్వాత మిలిటరీ మెడికల్‌ అకాడమీలో వైద్యవిద్యను అభ్యసించాడు. సెయింట్‌ పీటర్‌బర్గ్‌లో ఒక పరిశోధనాలయాన్ని నెలకొల్పాడు. అక్కడే ఆయన జీర్ణవ్యవస్థ లోతుపాతుల్ని గ్రహించాడు. శరీరంలో జీర్ణవ్యవస్థకు (Digestive system), నాడీవ్యవస్థ (Nervous system)కు గల సంబంధాన్ని ప్రకటించాడు. అందుకోసం ఆయన కుక్కలపై ఎన్నో ప్రయోగాలు చేసి, వాటి జీర్ణాశయంలో ఏం జరుగుతోందో పరిశీలించి తెలుసుకున్నాడు.

ఆహారాన్ని చూడగానే నోరూరడం (లాలాజలం స్రవించడం) శరీర ధర్మమా? మానసిక ధర్మమా? ఈ విషయంపై ఆయన చేసిన ప్రయోగాలు ఆసక్తికరం. ఒక గదిలో కుక్కను ఉంచి ప్రతి రోజూ ఓ గంటను గణగణమని మోగించి ఆపై దానికి ఆహారం అందించడం అలవాటు చేశాడు. ఇలా కొన్నాళ్లయ్యేసరికి ఆహారాన్ని చూడకపోయినా, గంట శబ్దం వింటే చాలు కుక్క నోట్లో లాలాజలం స్రవించడాన్ని గమనించాడు. ఇలా అనేక ప్రయోగాలు చేసి 'నోరూరడం అనేది మెదడులో నిక్షిప్తమైన అనుభవాల వల్ల కలిగే మానసిక ధర్మమే'నని చాటి చెప్పాడు. ఇదే వ్యవస్థిత (షరతులకు లోబడిన, conditioned), ప్రతిక్రియ (Reflex).

పావ్‌లోవ్‌ పరిశోధనలు మానవుల ప్రవర్తనలను నియంత్రించడంలో, పిల్లల ప్రవర్తనలో మార్పు తెచ్చే ప్రక్రియల్లో ఇప్పటికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. రష్యా నేత లెనిన్‌ ఎంతో అభిమానించిన ఈ శాస్త్రవేత్త ఎన్నో బిరుదులు, అవార్డులు పొందాడు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు