ఉగాది - పెరియ పెరుమాల్ తిరునక్షత్రం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
ఉగాది పర్వదినాన గడచిన  సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ "మన్మధనామ" సంవత్సరానికి స్వాగత సుమాంజలులు ఘటిద్దాం! శ్రియఃపతి అనంతమైన అవతారాలకు మూలకందమైన వ్యూహవాసుదేవుని రూపం ధరించాడు, సృష్టికి పూర్వమే. ఆయనే ఇక్ష్వాకు వంశం చేరి, ఆ వంశజుల పాలిటి వరాల మూటయై ఆరాధనలందుకున్నాడు. ఇక్ష్వాకుకులతిలకుడైన శ్రీరాముని ద్వారా విభీషణుని రాజ్యాన్నే చూస్తు భక్తులపాలిట వాత్సల్య మూర్తియై "శ్రీరంగనాథుడై" వేంచేసాడు. ఆదిలో ఆయన ఆవిర్భవించిన దినం నుండే యుగం ప్రారంభమైందని, కాలాగణన మొదలైందని పెద్దలంటారు. అందుకే ఆయన అవతారదినాన్ని ఆయన పుట్టినరోజుగ, తిరునక్షత్రోత్సవంగా పాటిస్తాం. ప్రకృతి ఇచ్చే వివిధరుచుల ప్రభావంలో పడి, మనకై వచ్చిన ఆ స్వామినే మరిచే స్థితి రావద్దని, షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని తింటూ జీవితం ఎన్ని ఒడిదుడుకులని ఎదుర్కున్నా చెదరని స్థితి కోసం ఆస్వామి యొక్క కృపాదృష్టిని స్మరించుకుంటాం. పూర్వమంటిన సంస్కారాలు శుద్ధమైనట్లు అభ్యంగన స్నానమాచరిస్తాం. ఎదురయ్యే కష్ట సుఖాలను దాటుకుంటూ సాగటానికి జ్ఞాన కవచంగా పంచాంగ శ్రవణం చేస్తాం. ఇలా అభ్యంగనం, పంచాంగ శ్రవణం, నింబకుసుమ భక్షణం చేయాలని పెద్దల నిర్ణయం.
ఉగాది యొక్క ప్రత్యేకత ఏమిటో మరింత వివరంగా తెలుసుకొనే ప్రయత్మం చేద్దాం! ఈ లోకంలో అవతరించిన మొదటి విగ్రహం రంగనాథుడు. ఆయనను అందుకే పెద్ద దేవుడు అంటారు, సంప్రదాయం తెలిసిన పెద్దలు పెరియ పెరుమాళ్ అని పిలుస్తారు. శ్రీరంగ క్షేత్రంలో ఆయన ఉంటారు. ఆయన చుట్టూ కావేరీ నది నిరంతరం చల్లటి గాలులు వీస్తూ ఆయనని జగత్ రక్షణ చేసే అలుపు తీరుస్తుంటుంది. వెనక ఒక చిన్న చరిత్ర ఉంది. భగవంతుడు ఈ జగత్తును సృజించాలని సంకల్పం చేసి, తన నాభిలోంచి ఒక కమలాన్ని అవిర్భవించి, అందులో నాలుగు ముఖాలు కల బ్రహ్మని సృజించాడు. అయితే బ్రహ్మ కి తాను ఎందుకు పుట్టాడో, ఎక్కడి నుండి పుట్టాడో తెలియలేదు. తానంతట తానే వచ్చాను అని అనుకొని తాను ఒక స్వయంభూ అని అనుకున్నాడు.అయితే తను ఎందుకు వచ్చాడో ఆలోచించడం ప్రారంభించాడు. ఆయనకు రెండు శబ్దాలు వినపడ్డాయి, అవి 'త' 'ప', వాటిని పదే పదే స్మరించి, తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంత కాలం అయ్యక పరమాత్మ అయనకు దర్శనం ఇచ్చి నిన్ను నేను సృష్టి కార్యం చేయటానికి తయారు చేసానని చెప్పాడు. నేనిచ్చే ఈ ముడి సరుకుతో సృష్టికార్యం చెయ్యటం ప్రారంభించు అని చెప్పాడు. ఎన్ని రకాలుగా ఈ జీవ జాతిని సృజించాలో చెప్పాడు. అట్లా చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభం చేసాడని మనకు శాస్త్రం చెబుతుంది. వేద వ్యాసాది మహర్షులు మనకు తెలియజేసారు. మన పంచాంగాల్లో నూట తొంభై అయిదు కోట్ల యాబై ఎనిమిది లక్షల సంవత్సరాల పై గా మనం ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి ఆరంభం అయ్యింది అని చెబుతూ ఉంటారు. కొందరు నవీన శాస్త్రజ్ఞులు ఈ మనవజాతి కొన్ని వందల సంవత్సరాల నుండి మొదలైందని అంటూ ఉంటారు కానీ మన ప్రామాణీకులు మనం చూస్తున్న ఈ సృష్టి ప్రారంభం అయ్యే నూట తోంబై అయిదున్నర కోట్ల సంవత్సరాలని చెబుతారు. సృష్టి చేసే విధానం తెలుసుకున్నాడు బ్రహ్మ, దాన్ని మరచి పోకుండా నాలుగు వేదాలను ఆ చతుర్ముఖుడికి ఒకే సారి స్మరించుకొనేలా ఉపదేశం చేసాడు పరమాత్మ. ఇక సృష్టి కార్యం చేయటానికి బ్రహ్మకు పరమాత్మను వదిలి ఎటు పక్కకు తిరగ బుద్ది కాలేదు. నాకు నిన్నే సేవించుకోవాలని ఉంది, నిన్ను వదిలి ఉండలేను అని పరమాత్మతో చెప్పాడు. ఇక సృష్టి కార్యం జరగటానికి ఇద్దరు ఒక సమన్వయానికి వచ్చారట, బ్రహ్మ తో నిరంతరం ఉండడానికి తానేరూపంలో బ్రహ్మకు దర్శనం ఇచ్చాడే, ఆనాడు పాల కడలిలో శయనించిన రూపంలోనే ఒక చిన్ని విగ్రహ రూపంలో చతుర్ముఖుడికి అందాడు పరమాత్మ. ఇక ఆ విగ్రహాన్ని ఆరాదిస్తూ బ్రహ్మ తన సృష్టి కార్యం ఆరంభించాడట. మంచి జీవిని తయారు చేయాలని అనుకున్నాడు, ఆ మంచి జీవిని తయారు చేయాలనే ప్రయత్నంలోనే ఇప్పుడు మనం ఈ విశ్వంలో చూసే ఇన్ని జీవరాశులు. ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రకాలు అంటుంటారు. బ్రహ్మ గారి లక్ష్యం మనిషిని తయారు చేయటం, ఆయన ప్రయోగాలలో తయారైనవి ఇన్ని జీవ వరాశులు. ఇలా సృష్టి కార్యం చేయడం ప్రారంభించాడు. అయన అర్చించుకోవడానికి ఏర్పడ్డ చిన్న రూపం కాబట్టి అర్చామూర్తి, అయితే అది ఆయన దృష్టి ఎంతగా ఆకర్శిస్తుండంటే చేసే ప్రతి పని వెనకాతల ఆయనను భావించే అదృష్టం కలుగు తుంది కనుక విగ్రహం అని పేరు పెట్టారు.

కొన్ని యుగాల కాలం గడిచాక ఇక్ష్వాకు అనే ఒక మహానుభావుడు, గొప్ప చక్రవర్తి, చతుర్ముఖ బ్రహ్మ మనస్సు రంజింపజేసి బ్రహ్మ వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని పొంది తన ఇలవేల్పుగా పెట్టుకున్నాడు. రామచంద్రుడు ఆ ఇక్ష్వాకు వంశంలో జన్మించేతవరకు వారి వంశ ఇలవేల్పు ఆ విగ్రహమే అని చరిత్ర చెబుతోంది. వాల్మీకి భగవానుడు ఈ విషయాన్ని స్పష్టం చేసాడు. 'సహ పత్న్యా విశాలాక్ష్య నారాయణ ఉపామగతో' అంటూ ఆయన సన్నిదానానికి రామచం
ద్రుడు వెళ్ళినట్ట్లు తెలుస్తుంది. అలాగ రామచంద్రుడి దాకా ఆరాద్యంగా ఉన్న మూర్తి ఆశ్చర్యంగా అక్కడి నుండి బయలుదేర వలసి వచ్చింది. రామ పట్టాభిషేకం తరువాత తన వద్దకు వచ్చిన వారందరికీ భహుమతులు ఇవ్వటం ప్రారంభించాడు రాముడు. విభీషణుడు రాముణ్ణి వెడిచి వెళ్ళలేను అని చెప్పాడు, ఎలాగైతే బ్రహ్మ ఒకనాడు పరమాత్మను విడిచి వెళ్ళలేనని చెప్పినట్లుగా. ఆయన భాద్యత నెరవేర్చేందుకు రాముడు తన ఆరాద్య దైవంగా ఉన్న విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చినట్లుగా రామాయణం తెలుపుతుంది.  "లబ్ద్వా కుల దనం రాజా లంకాం ప్రాయాతు విభీషణః" అప్పుడు విభీషణుడు సంతోషంతో లంకకు వెళ్ళడానికి ఉద్విక్తుడయ్యెను అని తెలుస్తోంది. అయితే లంకానగరం రక్త సిక్తమై ఉండటంచే అలాంటి మలినమైన ప్రాంతంలో పెట్టడం మనస్కరించలేదు. ఒక ఉత్తమ స్థానం కోసం అన్వేషిస్తూ, ఇరువైపులా కావేరీ నది ప్రవహిస్తూ పరిశుద్దమైన ఆ ఉభయ కావేరీ మధ్యంలో దింపాడు, ఇక తను ఉండే లంకా నగరం వైపు ముఖం ఉండేట్టు ప్రతిష్ట చేసాడు. వ్రణవాకారంలో ఉండే ఆ విమానంతో పాటు ఆ క్షేత్రాన్ని నిర్మించాడు.


అయితే ఆ స్థానాన్ని దర్శించిన పెద్ద పెద్ద మహనీయులంతా కూడా "ఇదంహీ రంగం", ఇదండీ అసలు స్థానం అంటే, ఈ భూలోకంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఏదైనా మనం చూడ తగినది నివసించ తగినది, మనల్ని తరింప చేసేది ఒక స్థానం ఉందీ అంటే అది ఇదే! మంచి రంగం, అన్ని శుభాలకి అన్ని సంపదలకి క్షేమాలకి అన్ని మంగళాలకి అన్ని శక్తులకి, ఉత్తమమైన రంగం. వాటన్నింటిని 'శ్రీ' అని అంటారుకదా, అందుకే శ్రీరంగం అని వ్యవహరిస్తారు. సంపదలు గూడు కట్టుకున్న స్థానం అది. తమిలనాటి ఉభయ కావేరీ మధ్యంలో శ్రీరంగనాథుడిగా పేరు సంపాదించించి, సేవలు అందుకుంటున్నాడు ఈనాటికీ కూడా.
ఈ లోకంలో మొట్టమొదటగా విగ్రహ రూపంలో దర్శన మిచ్చిన స్వామి రూపం అది. చతుర్ముఖ బ్రహ్మకు మూర్తి రూపంలో దర్శనమిచ్చిన రోజు, అతనికి దినం ఆరంభమైన రోజు. అతనికి కాలం ఆరంభమైన రోజు. అది అతనికి నూతన యుగాన్ని ఆరంభంచేసిన రోజు. ఈనాడు శ్రీరంగనాయకుడిగా కీర్తనలందుకుంటున్న స్వామి, తాను ఏనాడైతే విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడో ఆనాటినుండే కాలాన్ని లెక్కపెట్టుకోవడం ప్రారంభించాడు.  ఈనాడు మనం లెక్క పెట్టుకుంటున్న కాలం ఆ రంగనాథుడి ఆవిర్భావం నుండే మొదలైంది కనుక ఆయన దర్శనమిచ్చిన రోజు యుగాది అయింది. అదే మన తెలుగునాట ఉగాది అయింది. అందుకే ఈ ఉగాదినాడు రంగనాథుడి పుట్టిన రోజు. శ్రీరంగనాథుడు ఉన్నది తమిళనాట అయినా అక్కడి పంచాంగం ఈ రోజుతోనే మొదలవుతుంది. తెలుగు వారు ఏదైతే పంచాంగం ఇది మాది అని తీసుకున్నారో శ్రీరంగనాథుడు దాన్నే నిరంతరం శ్రవణం చేస్తాడు. భగవంతుడి ఆవిర్భావాన్ని గుర్తించి కాలాన్ని లెక్క చేసుకొనే పద్దతిని మన తెలుగు వారు తమది చేసుకోవడం అనేది తెలుగు వారి అదృష్టం. అనుభవాన్ని బట్టి ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంది. కాలం అనేది ఒక మరిణితి కలిపించేది, అది ఇచ్చే ఫలాన్ని బట్టి మనం అట్లాంటి పేరు పెట్టుకుంటాం. రాబోయే కాలం మనకు ఎట్లాంటి ఫలితాన్ని ఇచ్చినా భగవంతుడు మనకు ఇచ్చిన జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని మనం ముందుకు సాగుదాం.