శ్రీరంగనాచియార్ తిరునక్షత్రం


ఈ రోజు అమ్మ లక్ష్మీదేవి పుట్టిన రోజు, అంటే దేవతలు అసురులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమ్మ ఆవిర్భవించిన రోజు. వారంతా ఆమెను పొందాలి అని ఆతృతతో చూసినా, ఆమె మాత్రం భగవంతుణ్ణే చేరింది, చేరి ఆయన వక్షస్థలాన్నే తన నిత్య నివాసంగా చేసుకుంది.

ఈ నాడు శ్రీరామచంద్రుని ఇలవేల్పు అయిన రంగనాథుడు వేంచేసి ఉన్న శ్రీరంగంలో అమ్మవారి వద్ద అద్భుతమైన పండగ జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ సంహితల ప్రకారం ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. అమ్మవారు మూడు స్థానాల్లో లయార్చ, భోగార్చ మరియూ ఆధికారార్చ అనే రూపాల్లో దర్శనమిస్తుంది. లయార్చ అంటే భగవంతుణి వక్షస్తలంపై ఉన్న రూపం. భోగార్చ అంటే భగవంతుణి ప్రక్కన ఉన్న రూపం. ఆధికారార్చ అంటే తన సన్నిధిలో ఒంటరిగా భగవంతుడు ప్రక్కన లేని రూపంలో దర్శనమిస్తుంది. స్వామిని దర్శించబోయే ముందే అమ్మను దర్శించడం నియమం. భగవంతుడు ప్రక్కన లేని రూపం అమ్మకు ఎందుకు ? అమ్మకు మరో పేరు "శ్రీ" అంటే "శృణోతి శ్రావయతి", మన మొరలను ఆలకిస్తుంది, మన మొరలను స్వామికి తెలియజేస్తుంది. అందుకే మొదట ఒంటరిగా మన మొరలను ఆలకించి, తిరిగి మనం స్వామి సన్నిధానానికి వెళ్ళే సరికి అక్కడ ఆయన వక్షస్థలంపై ఉండి మన తప్పులని కనపడకుండా చేసి, మనపై ఆయన అనుగ్రహం పడేట్టు చేస్తుంది అమ్మ. మనం ఎన్నో జన్మలుగా ఎన్ని దోషాలు చేస్తూ వస్తున్నామో కదా. ఆయన దండించగలడు, కానీ అమ్మ వల్ల ఆయనలోని దయపైకి ఉన్నప్పుడు వెళ్ళామా రక్షింప బడ్డామనే లెక్క. అందుకే ఈ క్రమంలో మన మొరలను ఆలకించేందుకే అమ్మ తన సన్నిధిలో ఒంటరిగా దర్శనమిస్తుంది. ఆస్థానాన్నే తాయార్ సన్నిధి అని పిలుస్తారు. సంవత్సరంలో ఒక్క రోజే రంగనాథుడు అమ్మ వద్దకు వెళ్తాడు. అది ఈ నాడు. అమ్మ పుట్టిన రోజు కనుక. దివ్య దంపతులను ఒక్క చోట ఉన్నప్పుడు సేవించుకొని రామానుజులవారు శరణాగతి గద్యాన్ని మరో రెంటితో పాటు సమర్పించారు. ఈ మూడింటిని కలిపి గద్యత్రయం అని అంటారు. ఆదివ్య దంపతుల కృప మనపై ఉండాలని కోరుకుంటూ అమ్మ గొప్పతనాన్ని కొంచం తెలుసుకుందాం.
 భగవంతుడు చేసే వివిధ కార్యక్రమాలకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కృష్ణావతారంలో ఒక్కో లీలను చూపడం దానితో ఒక బ్రహ్మ కృత్యాన్ని నిరూపించడం. బాలుడిగా కొన్ని చేసిన బాలలీలలు బ్రహ్మలీలలు అని తత్వం తెలిసిన పెద్దలు చెబుతారు. అట్లానే భగవంతుడు చేసిన వివిధ కృత్యాల్లో ఒక అధ్భుతమైనది సముద్రాన్ని మధించడం. మన ఆచార్యులు, ఆళ్వార్లు ఈ కృత్యాన్ని విస్తృతంగా వివరిస్తారు. భాగవతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. ఆ సందర్భంలో భగవంతుడు ఎత్తిన అవతారం కూర్మ అవతారం అని అందరికి తెలుసు. ఒకే అవతారం కాదు, ఒకే సారి ఎన్నో అవతారాలు ఎత్తిన స్థితి అని శ్రీరామాయణ గ్రంథంలో తెలుస్తుంది. విశ్వామిత్ర మహర్షి రామ చంద్రునికి ఈ వృత్తాంతాన్ని వివరించాడు.దేవతలు అసురులు పరస్పరం ఒకరిపై ఒకరు విజయం సాధించాలి, మరణం ఉండకూడదు అని అమృతాన్ని సాగరంలోంచి రప్పించాలి అని అనుకున్నారు. భగవంతుడు వారిద్దరిని కలిపి చేయమని చెప్పిన సలహా మేరకు మందర పర్వతాన్ని తెచ్చి, వాసుకిని చుట్టి వేలాది దేవ సంవత్సరాలు సముద్రాన్ని మధించారు. మొదట వచ్చిన విషాన్ని పరమశివుడు భగవంతుని ఆదేశంతో స్వీకరించాడు. ఆతర్వాత మందర పర్వతం నిలబడకపోయే సరికి దేవతలంతా విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు భగవంతుడు పర్వతానికి క్రింద కూర్మ రూపాన్ని ధరించాడు. అదే సందర్భంలో భగవంతుడు కేవలం క్రిందే కాకుండా ఇటు దేవతల్లో, అటు అసురుల్లో, పాము తలలో, పాము తోకలో, మధ్యభాగంలో, పర్వతం పైభాగంలో, పర్వతం ఇటూ అటూ ఊగకుండా చుట్టూ వాతావరణంలో ఎన్నెన్ని రూపాలు తానెత్తాడో ఈ సముద్రాన్ని చిలకడానికి.

సముద్రాన్ని చిలకడం దేనికోసం ? "కడల్ కడైందు అమృదంపొంద" అంటారు మన ఆళ్వార్లు, అంటే అమృతాన్ని దేవతలకు ఇవ్వడానికి అని ఆయన చేసిన మాయలు అని చెబుతారు. అందులో మాయేమిటి ? అక్కడే ఒక రహస్యం ఉంది. చిలకడం ద్వారా సముద్రంలోంచి ఎన్నో వచ్చాయి. అసలు చిలికించడం ఎందుకు ? అంటే, లక్ష్మీదేవి సముద్ర గర్భంలో ఉంది, ఎలాగో ఒకలాగ ఆమెను తెచ్చుకోవాలి, ఒక సందర్భం ఏర్పాటు చేసాడు భగవంతుడు. అసలు అమృతాన్ని ఆయన తీసుకున్నాడు అని ఆళ్వార్లు చెబుతారు. అసలు అమృతం లక్ష్మీదేవి, ఆవిడ బయటికి రావడమే ఆయన కాంక్ష. అంతకు ముందు వచ్చినవి వీరికి వారికి పంచాడు, చివరకు వచ్చిన ఆమెకు తన హృదయ సీమలో స్థానం కలిపించాడు. సారతమమేదో ఆయనే తీసుకున్నాడు. మిగతా సారన్ని అసారాన్ని దేవతలు ఇచ్చాడు స్వామి అని చెబుతారు. సముద్రసారం అనేది కేవలం ఉప్పు, లేకుంటే ఇది జరిగి ఎన్ని మన్వంతరాలో అయినా ఇంకా అది ఉంది అంటే అర్థం దాన్ని మల్లీ తీసుకోబుద్ధి కాదు అనేకదా! అని తమాషాగా చెబుతారు. అమృతం ఎట్లాంటిదో మనకు తెలియదు కానీ అది అసలు సారం కాదు, "సముద్ర తనయా" "క్షీరోద కన్యకా" అయిన అమ్మ లక్ష్మీదేవి అసలు సారం. ఆవిడ బయటికి రాగానే దేవతలంతా అవిడ నాకోసం అంటూ ఆవిడపై పడుతుంటే, ఆవిడ గాబరా పడిపోయిందట. ఆవిడ తండ్రి సముద్రుడు కొన్ని చెప్పి పంపాడట. తల్లీ నీవు "ఆయాస పడకు, తాపం వద్దు .." అని సాధారణ స్థితి చెబుతున్నట్టే చెబుతూ కొన్ని రహస్యాలు చెప్పాడట. అంటే అర్థం వాయువు జోలికి పోకు, అగ్ని జోలికి వద్దు అని. ఇలా ఒక్కోదేవతను వద్దూ అంటూ చెబుతూ చివరకు ఆమె భగవంతుణ్ణి చేరేట్టు సాగరుడు చేసాడు అని చెబుతారు. లక్ష్మీదేవి బయటికి రాగానే స్వామి యొక్క విశాలమైన వక్షస్థలాన్ని చేరింది.

నమ్మాళ్వార్ అమ్మ గురించి చెబుతూ "అగలగిల్లేన్ ఇఱయుమెన్ఱు అలర్ మేల్ మంగై ఉరైమార్గా", అసలు ఆయనకంటూ పేరు లేదు, ఆవిడ ఏవక్షస్థలంలో ఉంటుందో అది కల్గిన ఆయన అని పేరు. శ్రీయఃపతి అనే ఆయనకు పేరు. లక్ష్మీనాథుడనే ఆయన ప్రసిద్దుడు. "అగలగిల్లేన్ ఇఱయుమ్" అరక్షణం కూడా ఆమె ఆయనను విడిచి ఉండలేను అంటూ ఆమె ఆయనను చేరిందట ఆమె. ఎవరామే? "అలర్ మేల్ మంగై" మంగై అంటే ఒక యువతి. అలర్ అంటే వికసించేది, పుష్పం అని అర్థం. మేల్ అంటే ఆ వికసించే పుష్పం పైభాగంలో ఉన్న అని అర్థం. ఇదే పేరు అళివేలు మంగ అని వాడుక భాషగా అయ్యింది. అసలు అర్థం వికసించిన కమలంలో ఆసీనమైన అందమైన యువతి అని. "ఉరైమార్గా" అట్లాంటి ఆవిడ నిత్యనివాసం చేసే స్థానం కల్గి వికసించువాడు. భగవంతుడికి వికసించడం అంటూ ఉంటుందా ? భగవంతుడు "అవికారాయ శుద్దాయ నిత్యాయ సదా ఏకరూపాయ" అయిన స్వామి కూడా అమ్మ యొక్క సాన్నిధ్యంచే వికారము చెందును. అంటే మార్పు చెందును. ఆవిడ దయా స్వరూపిణి, కారుణ్య మూర్తి. అట్లాంటి ఆవిడ సాన్నిధ్యంచే ఆయన హృదయం వికసించక పోతే మనకు ఏమి లాభము ? కరుణారసానికి కరగని వాడు దేవుడెలా అవుతాడు ? అందుకే అమ్మ స్పర్శచేత ఆయనలో కూడా వికారం ఏర్పడును. వికారం అంటే మార్పు.మనకు ఏర్పడే వికారాలు దోషమైనవి, కర్మ వల్ల ఏర్పడ్డవి. కానీ ఆయనలో కృపవల్ల కలిగేవి. అది మనకు ఉపాసనీయము. అట్లా అమ్మ ఆయనను విడవక చేరి ఉంది. వేదాలు ఇదే విషయం చెప్పాయి.  వేదానికి శిరోభాగమని పిలవబడే పురుషసూక్తం చెబుతుంది ఈ విషయం. "సహస్ర శీర్షా పురుషః" అని ప్రారంభిచింది వేదం. ఈ జగత్తుకి కారణం ఒక పురుషుడు. ఆయనకు ఎన్ని శిరస్సులో తెలియదు. "సహస్రాక్షః" ఆయనకెన్ని నేత్రములో తెలియదు. "సహస్రపాత్" ఆయనకెన్ని పాదములో తెలియదు. అంటే ఆయన చూపు అంతటా ఉండును. ఆయన ఆలోచన అంతటికీ చెందినది. ఆయన స్థితి, గమనం అన్ని మూలలా నిండి ఉండును. అంతటా నిండిఉన్న ఆతత్వమే జగత్తుని నియమించేది అని ప్రారంభించి చెబుతూపోయింది. ఆయనలోంచే మనం చూసే పర్వతాలు, జీవజాతులు ఆన్నీ పుట్టాయి. విశ్వం అంతా ఆయనలోంచే వచ్చింది. ఆయన కోసం మనం ఏమైనా చేయాలి "యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః" అనుకుంటూ చుబుతూ, చివరికి ఆయనను ఎట్లా గుర్తించేది ? ఎదైనా ఒక గుర్తు కావాలికదా ? స్వరూప స్వభావాలు తెలియాలి "హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్-న్యౌ" అని చెప్పింది వేదం. "హ్రీ" భూదేవి "లక్ష్మీ" లక్ష్మీదేవి ఆయనకు నిరంతరం పత్నులై వేంచేసి ఉంటారు అనేది గుర్తు. లక్ష్మీ సంబంధం ఆయనని గుర్తింపజేసేది అని వేదం స్పష్టం చేసింది.

అందుకే పరాశరభట్టర్ అనే మన పూర్వ ఆచార్యులు అమ్మను గురించి రత్నకోశం అనే స్తోత్రాన్ని అందిస్తూ, "వేందాంతాః తత్వ చింతాం మురభిదురసి యత్పాదచిహ్నైహి పరంతి" అని చెప్పారు. పరతత్వమేది? మనం ఆశ్రయించతగినది, ఉపాస్యించతగిన తత్వం ఎవరు ? ఇలాంటి మీమాంస అనేది కల్గి,"తత్వ చింతాం" ఆలోచనా సాగరంలో పడినప్పుడు ఆవలిగట్టుకు చేరేది ఏలా? ఏదైనా ఓడ కావాలి, అది ఏది ? "మురభిదురసి" మురాసురుడిని సంహరించిన వాడి వక్షస్థలము నందు కనిపించే "యత్పాదచిహ్నైహి పరంతి" లక్ష్మీదేవి యొక్క పాదపు గుర్తులు చూసి, ఇదీ మనం ఉపాసించదగిన తత్వం అని గుర్తించాలి. అందుకే మనం రోజు స్వామికి మంగళం పాడేప్పుడు "లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే" అని పాడుతాం. అంటే లక్ష్మీదేవి పారాణి గుర్తులు చూసి ఆరాధించ తగ్గ తత్వమని జ్ఞానులైన వేదాంతులు గుర్తిస్తారు.అందుకే "తిరువిల్లాం దేవరై తేరేన్మిన్" లక్ష్మీసంబంధం లేని దేవతలను ఉపాసించము. ఇలా సముద్రంలోంచి లక్ష్మీదేవిని ఆవిర్భవింపజేయడం, తన సన్నిధానానికి చేర్చుకోవడం ప్రధాన లక్ష్యంగా స్వామి సాగర మధనాన్ని చేసాడు, అందులో భాగంగా దేవతలు కోరిన అమృతాన్ని వారికి ఇచ్చాడు, కానీ అది ప్రధానమైనది కాదు. దీన్నే మన ఆండాళ్ తల్లి గమనించి "వంగకడల్ కడైంద మాధవనై కేశవనై" అని చెప్పింది. పాల సముద్రాన్ని చిలికిన స్వామి కూర్మ రూపంతో పోల్చలేదు, మాధవ అంటే లక్ష్మీనాథుడు అని అసలు రహస్యాన్ని చెప్పింది. ఆ సముద్రాన్ని చిలికినప్పుడు స్వామి అమ్మకోసం పడ్డ శ్రమను ఆండాళ్ తల్లి గమణించి, అసలే కుటిలాలక సంయుక్తుడాయే, ఆయన జుట్టు రేగి పోయి, పురివిప్పిన నెమలివలె ఉంది ఆయన కేశాలు అందుకే "కేశవనై" అని చెప్పింది. ఇదీ రహస్యం. అట్లాంటి దివ్య ధంపతులు వారిరువురు. వారిని ఆశ్రయించామంటే రక్షింపబడ్డాం అని అర్థం.