శ్రీరామానుజాచార్య స్వామి తిరునక్షత్రం

యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
 
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
 
అస్మద్గురో ర్భగవతో2స్య దయైక సింధోః
 
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

నేను భగవంతుడిని అని చెప్పేవాళ్ళని మనం సేవించటం లేదు. మహానుభావులైనటువంటి పరంపరాగత జ్ఞానలబ్దులైనటువంటి ఆచార్యుడు చూపిన తత్వాన్ని మనం భగవత్ తత్వంగా గుర్తిస్తాం. ఇక ఆచార్యుడిని గుర్తించేది ఎట్లా అంటే ఒక పరంపరాగత జ్ఞానం కల్గి ఉండి భగవంతుని చేతకూడా అంగీకారం పోందబడి స్వీకృతులవుతారో అలాంటి మహానుభావులని మనం ఆచార్యుడుగా అంగీకరిస్తాం. రామానుజులని భగవంతుడూ స్వీకరించాడు, రామానుజులవారూ అట్లాంటి తత్వాన్నే చెప్పారు.
రామాయణంలో రామచంద్రుడు లక్ష్మణస్వామిని అంగీకరించాడు. లక్ష్మణ స్వామి రామచంద్రుడిని అనేక సార్లు అనేక మందితో సేవ్యునిగా దర్శింపజేసాడు. గుహుడి దగ్గర, సుగ్రీవుడి దగ్గర ఇక విభీషణాదుల దగ్గర ఇలా ఎన్నో సార్లు రామచంద్రుడిని సేవించుకొనేప్పుడు లక్ష్మణ స్వామి మధ్యవర్తిగా ఉండి రాముడి అనుగ్రహం పొందగల్గేట్టు చేసాడు. ఆయన కూడా వీరిని లక్ష్మణుడి ద్వారా స్వీకరించాడు. అలా మనం ఆ రామానుజుడిని మనం స్వీకరిస్తున్నాం. అట్లానే ఆ లక్ష్మణాగ్రజుడిని మనం స్వీకరిస్తున్నాం. భగవంతుడు చూపించాడు కనుక గురువుని ఇక గురువు చూపించాడు కనుక భగవంతుడిని మనం స్వీకరిస్తున్నాం. అయితే లక్ష్మణుడు ఒక్కడే కాదు రాముడి అనుజుడు, భరతుడు ఉన్నాడు, శత్రజ్ఞుడు ఉన్నాడు. అయితే ఒక్కోక్కరు రామానుజుడి ఒక్కో అంశని ప్రకటిస్తారు.


ఇక వీరే కాక విభీషణుడినీ రాముడు తన అనుజుడిగా స్వీకరించాడు. వీరి అందరికీ ఒకే రకమైన లక్షణం కనిపిస్తుంది.
విభీషణుడు శరణాగతి చేసాక రాముడికి అనిపించిందట ఈయనకు కూడా ఆ లక్షణం ఎక్కడైనా వస్తుందేమో నని. రాముడు రావణుడిని చంపి విభీషణుడికి పట్టాభిషేకం చేసాక "విజ్వరహ ప్రముమోద హా" రాముడికి జ్వరం తొలగి పోయిందట అని వాల్మీకి వర్ణించాడు.రాముడు ఆశ్చర్య పడాల్సినది ఏముంది ఇక్కడ. తను విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేసాడు. మరి రాముడికి తన బలం పై నమ్మకం లేకనా. లంకానగరాన్ని ఓడిపోయినట్లయితే తన కంటూ ఒక రాజ్యం ఉందికదా దాన్నే ఇచ్చేవాడు. అది లేకుంటే పరమపదాన్ని ఇచ్చేవాడు. మరి ఆయనకు అట్లాంటి సందేహం లేనే లేదు. మరి ఏమి కారణం. అయనకు తన అనుజుల లక్షణం తెలుసు. అది అందరి రామానుజుల లక్షణం. తనని తప్ప వేరే ఏదైనా ఇస్తే వారికి అది "తృణాయమేనే" గడ్డి పరకతో సమానం. "యోనిత్యం అచ్యుత పద అంబుజ యుగ్మ ఋక్మ వ్యామోహ తత్ ఇతరాని తృణాయమేనే" ఎల్లప్పటికీ అన్ని కాలాల్లో ఎప్పటికీ వీడని అచ్యుతుడి పద్మములవంటి విలువైన పాదములు రెంటిపై వ్యామోహంచే, ఇక ఇతరత్రమైనవి గడ్డిపరకతో సమానం. ఇదీ వైష్ణవుడి లక్షణం. రాముడు లక్ష్మణుడి తో నేను వనవాసం వెళ్ళి నప్పుడు, భరతుడు వచ్చే వరకు రాజ్యాన్ని చూసుకోవయ్యా అంటే, "న దేవలోక ఆక్రమణం న అమరత్వం అహంఋణే" దేవలోకమే అవసరంలేదు అని అంటే, ఈ లోకానికి రాజుగా కూర్చోమ్మని అంటావా అని అంటాడు లక్ష్మణ స్వామి. వనవాసం పూర్తయ్యాక లక్ష్మణుడికి కొంత రాజ్యం ఇస్తానంటే అక్కరలేదు, ఇదిగో నా వద్ద ఉన్న రెండు రాజ్యాలు అని రామచంద్రుడి రెండు పాదుకలని చూపించాడు. ఇక భరతుడు అట్లానే, రామచంద్రుడిని తిరిగి తీసుకువెళ్ళడానికి వస్తే, రాజ్యాన్ని ఏలవయ్యా అని రామచంద్రుడు అడిగితే విల విలా ఏడిచాడు. భరద్వాజుడు ఎన్నో సంపదలు కల్గిన నగరాన్ని సృష్టించి రాజసింహాసనం పై కూర్చొమ్మంటే, ఆ సింహాసనం పై రాముడు ఉన్నట్టు భావించి  వింజామరం విసురుతు పక్కన ఉన్న సింహాసనం పై కూర్చున్నాడు. ఇక శత్రజ్ఞుడిని చూస్తే ఆయన ఇవన్నీ ఏమీ వద్దు నాకు భగవత్ భక్తుడైన భరతుడి సేవయే ముఖ్యం అనే వారు. ఇలాంటి లక్షణం విభీషణుడికీ వస్తుందేమో, లంకానగరాన్ని స్వీకరిస్తాడో లేదో అని రాముడికి జ్వరం వచ్చిందట. ఆయన రాజ్యాన్ని స్వీకరించగానే ఆ జ్వరం కాస్త తగ్గిందట. ఇదీ రాముడికి కల్గిన ఆశ్చర్యం. అయితే ఇదికూడా అంతో కాలం నిలవలేదు. రామ పట్టాభిషేకం తర్వాత విభీషణుడు నిన్ను విడిచి వెల్ల బుద్ది కావడం లేదు అని చెబితే, అప్పుడు కులధనం అయిన శ్రీరంగనాథుడిని ఇచ్చి పంపాల్సి వచ్చింది.

ఇదీ రామానుజుల లక్షణం. ఆ రామానుజుల ప్రవృత్తిని చూసి తరించాలి. ఇక ద్వాపర యుగంలో పరమాత్మనే (బల)రాముడి అనుజుడిగా శ్రీకృష్ణుడై వచ్చి లోకానికి తత్వాన్ని సాక్షాత్కరించాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటారు. లోకానికి గురువు అయ్యాడు. ఇక కలియుగంలో ఈజీవరాశిని ఉద్దరించగల శక్తి సంపన్నులు వీరే అని మనకు అందిన మహనీయులు మన రామానుజాచార్యులు. ఈయననే ఎంబెరుమానార్ అని లోకం కీర్తించింది. వారే మనకి మంత్రార్థ జ్ఞానం కలిగించి అటు భగవంతుడికి శంఖ చక్ర క్రియాది కార్యాలను ఆచరించి ఇక ఇద్దరికి మధ్యవర్తిగా వ్యవహరించి మనల్ని ఉద్దరించిన ఆచార్య శ్రీచరణులు మన భగవత్ రామానుజాచార్య స్వామి. అటువంటి మహనీయులు తప్ప మనల్ని ఉద్దరించే వారు లేరు. అటువంటి వారివల్ల తప్ప ఏ ఇతరులవల్ల ఉద్దరించబడుట అనేది ఉండనే ఉండదు. అట్లాంటి రామానుజ అనుగ్రహాన్ని పొందటానికి మనం సిద్దంగా ఉందాం.