శ్రీరామనవమి-శ్రీరామ కళ్యాణం

తెలుగునాట శ్రీరామ నవమి ఉత్సవాలు జరిగేంత వైభవంగా మరే ఉత్సవాలు జరగవన్నది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సంవత్సర ప్రారంభ దినాలలో రామాయణ అనుసంధానంతో వసంత నవరాత్రులు, సీతారామ కళ్యాణం జరుపుకోవడం మన చిర మర్యాద.

వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే |
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా||

వేదవేద్యుడు, పరమ పురుషుడు దశరథరాజ నందనుడుగా అవతరించడంతో వేదం వాల్మీకినోట రామాయణంగా వెలువడింది. రామాయణం సాక్షాత్తు వేదం. వేదంలోని విషయాలను మనకు కనిపించేట్టు చేసేదే రామాయణం.  రక్షణ అంటే ఏమి ? భగవంతుడిలోని దయ మనల్ని ఎట్లా కాపాడుతుంది ? ఎట్లా రక్షిస్తాడు ? రక్షించడానికి ఏమేమి పరికరాలు కావాలి ? రక్షణ పొందడానికి మనం ఎం చేయాలి ? దీన్ని తెలుపడానికే రామావతారం.

ప్రపంచంయొక్క సృష్టి, స్థితి, ప్రళయము కార్యాలను భగవంతుడు దయతో చేస్తాడు అని శాస్త్రం చెబుతుంది. సృష్టి, స్థితి అంటే దయతో చేసేవి, ప్రళయం కూడా దయతో చేస్తాడా అనేది ఒక సందేహం. పద్మ పురాణం చెప్పిన విషయం. 'ప్రళయం కూడా దయా కార్యమే'. ఎన్నో జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ సంస్కారాలని మోసుకు తిరుగుతూ  మనల్ని మనం మరచి ప్రవర్తించే అల్పులైన జీవుల్ల దుస్థితిని చూసి జాలి పడి, ఆయన దయా సాగరుడు కనుక ఉపకారం చేయాలని అనుకుంటాడు. కర్మ తొలగించుకొని తనంత ఆనంద స్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని ఇస్తాడు. శరీరానికి ఏర్పడ్డ అవసరాలని ఇస్తూ రక్షణ చేస్తాడు. అవసరం అయ్యాక శరీరాన్ని తీసేయాల్సి వస్తుంది, మనం ధరించే వస్త్రం మాసిపోతే మరొకటి ధరించినట్లుగానే. ఇది కూడా దయతో చేసేది.

మనకు కావాల్సిన విషయాలను మన చుట్టూ ఉన్నవారితో చెప్పిస్తాడు, లేకుంటే గురువుల ద్వారా చెప్పిస్తాడు. అది వీలు పడనప్పుడు తానే ఈ లోకంలో అవతరిస్తాడు. నరసింహుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు ఆయా సందర్భాన్ని బట్టి ఉపకారం చెయ్యడానికి వీలయ్యే అవతారంలో వస్తాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాడు, ఆ కాలం నియమం ప్రకారం నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు, అంతకు ముందు త్రేతాయుగంలో రాముడిగా వచ్చినప్పుడు పదకొండు వేల సంవత్సరాల కాలం ఉన్నాడు. లోకంలో తాను వచ్చి, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలె నడచి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పడే సుఖదుఃఖాలు తానూ అనుభవిస్తే తప్ప మనకు చెప్పలేడు కనుక తానూ అట్లా అనుభవించాడు. భగవంతుడు ఊరికె చెబితే ఎదుటి వారికి నచ్చదు, మన వలె తానూ అనుభవించి చెప్పాలని మన వద్దకి రాముడిగా వచ్చాడు. నరసింహ అవతారం ఆయన ఒక్కసారిగా స్థంభంలోంచి వచ్చాడు, కానీ రామావతారంకోసం ఆయన నిజంగా పుట్టాడు. ఒక సంవత్సర కాలం గర్భవాసం చేసాడు. నిజంగా పెరిగాడు, నిజంగా తిరిగాడు, నిజంగా  గురువులని అనువర్తించాడు. అందుకే మన ఆళ్వార్లు భగవంతుణ్ణి అవతరించాడు అని చెప్పరు, ఆయన పుట్టాడు అని చెబుతారు. ఆయన మన సాటివాడిగా కావాలని మనవలె గర్భవాసం చేసి మన వద్దకు కష్టపడి అంత ఆర్తితో వస్తే, అవతరించాడు అని చెబితే అది ఆయన గొప్పతనాన్ని తగ్గించినట్లు అవుతుందే తప్ప పెంచినట్లు కాదు అని.

అట్లా ఈ లోకంలోకి వచ్చినప్పుడు లౌకికమైన ప్రభావాలు ఆయనపై పడకుండా కాపాడగల్గిన తేజస్వరూపిణి అమ్మ. ఆయన హడావిడిలో నేరుగా వస్తాడు, వచ్చి పూర్తిగా మనిషిగా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె వెనకాతల ఏమేమి కావాలో అన్ని పరికరాలతో జాగ్రత్తగా వస్తుంది. రామావతారంలో భగవంతుడు గర్భవాసం చేసి వచ్చాడు, కానీ అమ్మ నేరుగా భూమిలోనే లభించింది. గోదాదేవి అట్లానే వచ్చింది. భగవంతుడు అప్పుడప్పుడు చేయాల్సినవి మరచిపోతుంటే, ఆయనకు చెప్పడానికి ఆమె అన్నీ తెలుసుకొని వస్తుంది. రక్షణ జరిగేది ఆయన వెంట అమ్మ ఉన్నప్పుడే. ఒంటరిగా ఎప్పుడూ రక్షణ చేయడు, ఆయన వెంట శక్తి, యుక్తి, దయ, సౌలబ్యం, సౌశీల్యం ఇలా ఎన్నో ఉండాలి. ఈ కళ్యాణ గుణాలు పైకి రప్పించే అమ్మ ప్రక్కన ఉండాలి. భగవంతుడు రాముడిగా వచ్చినా, ఆయనలో దయని పైకి తేవడానికి అమ్మ సీతగా వచ్చింది. భగవంతుడిని ఆశ్రయించడానికి అమ్మ ప్రక్కన ఉంటే మనలోని లోపాలని చూడ కుండా చేసి ఆయనలోన అణిగి ఉండే ప్రేమ, వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చి మనల్ని అనుగ్రహించేట్టు చెప్పగల్గుతుంది. రక్షణ చేయాలంటే ఆమె సాన్నిద్యం ఆయనకి కూడా అవసరం. అమ్మ తన వెంట లేక పోయినట్లయితే, స్వామీ! నీవే కనుక అమ్మను స్వీకరించకపోయినట్లయితే, అమ్మ వెంట లేక నీవు అడవిలో సంచరించినట్లయితే "అసరస మభవిశ్యన్" అని అంటారు పరాశరబట్టర్ వారు. తాను అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అమ్మను తన వెంట రావద్దు అని చెప్పాడు స్వామి. కానీ 'నేను వెంట లేకుంటే నీవు చేయాల్సిన లోకరక్షణ జరగదయా' అని వెంట వచ్చింది అమ్మ. అట్లా రక్షణ కోసం చేసే కార్యాల్లో ప్రధానమైనది సీతమ్మను వివాహ మాడటం.


శ్రీరామచంద్రుడు ధనుర్భగం చేసి సీతమ్మను వివాహమాడే సన్నివేశం మనకు ఎంతో స్పృహణీయం. ఆత్మ ఏ తత్వానిపై నిలపదగును. శాస్త్రాల్లో ధనస్సు అంటే  ఓంకారం లేక ప్రణవం అని అంటారు. "ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతలక్ష్యముచ్చతే" అని ఉపనిషత్ చెబుతుంది. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికి వంగుతుందో వాడికి ఆత్మను అర్పించ దగును. ఎందరో ప్రయత్నించారు కానీ ఆ ధనస్సుని వంచలేక పోయారు. లోకంలో ఎందరో ఎన్నో దైవాలను చూపిస్తుంటారు, అట్లా ఎవరికో ఒకరికి అని మన ఆత్మని అర్పించవచ్చా ? దానికి సమాధానం ఓంకారం ఎవరిని చెబుతుందో వారికి అర్పించతగును. ధనస్సు వంగింది రాముడికొక్కడికే.  ఓంకారం వంగేది రాముడికి మాత్రమే. రాముడు ఎవరు ? "ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాతః మహా ద్యుతిః" అని దశరథుడికి సంతానంగా అవతరించింది విష్ణువే కదా. ఓంకారం ఎవరిని చెబుతుంది అని శాస్త్రానికి ప్రశ్న వేస్తే ఓంకారం కారణ దశలో వెళ్ళి చేరేది అకారంలో. "అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం" అకారం నారాయణుడి యొక్క మొదటి పేరు. ప్రణవం వంగేది నారాయణుడికి. ఆయన ఆత్మను పాలించగల వ్యక్తి, క్షేమం కలిగించగల వ్యక్తి అని శాస్త్రం చెబుతోంది. అందుకే జనకుడు ధనస్సును పెట్టి, ఆధనస్సుని వంచినవాడికి సీతను అర్పించాడు. మనం చెందేది నారాయణునికి మాత్రమే. అట్లా మన ఆత్మని అర్పించదగినవాడు నారాయణుడు మాత్రమే. 
 
 
శ్రీరామ చంద్రుడు ఒక్క సారిగా ఆధనస్సును ఎత్తాడు . దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్క సారిగా ధనస్సు రెండు ముక్కలైంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరామ చంద్రుడి చేతిలో ఉంది, రెండో భాగం ఆ నారి ద్వారా వ్రేలాడుతోంది. ఇది అప్పటి దృష్యం.  ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింప జేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించాడు. ఓంకారానికి తాత్పర్యమేమి ? ఆ తాత్పర్యాన్ని చూపించడమే ఆయన లక్ష్యం. ఓంకారం అంటే 'అ' అనే అక్షరం, 'మ' అనే అక్షరం మద్యన 'ఉ' అనే అక్షరం ఉంది. 'అ' అనేది భగవంతుడి మొదటి నామం. అక్షరానాం అకారోస్మి. ఇది నేను అని చెప్పడానికి ధనస్సుని విరిచి ఒక ఖండాన్ని పట్టుకుని ఇది నేను అని చూపాడు. రెండో ఖండం 'అ' తో కలిసి ఉండే జీవుడు, అంటే మనం. 'మ' అనేది 'మన్ జ్ఞానే మన్ అవభోదనే' జ్ఞానం అనేదే ఆకృతిగా, గుణంగా కలవాడు. అ కి మ కి మధ్యన ఉన్న ఉకారమే ధనస్సు యొక్క రెండు కండాల మధ్య ఉన్న నారి. ఉకారం భగవంతుడికి జీవుడికీ మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది.  జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తీసేస్తే పోదు. సూర్యుడికి కిరణాలకి ఉన్న సంబంధం లాంటిది. అట్లా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం విడరానిది. మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అది అని పరిమితం కాదు అన్ని సంబంధాలు ఉంటాయి. ఇది చెప్పడానికే "నీవే తల్లివి తండ్రివి ..." అనే పద్యం. 'త్వమేవ సర్వం మన దేవ దేవ' ఇది భగవంతుడి ఒక్కడితోనే ఇట్లాంటి సంబంధం. ఇది తరగదు, నశించదు, చెదరదు. ఆ సంబంధాన్ని మనం మరిచాం కానీ ఆయన ఎప్పుడు మరవడు. ఇది చూపడానికే ధనస్సు యొక్క రెండు ఖండాలు, దాని మధ్యన విలక్షణమైన సంబంధమే ఆ నారి. అందులో ఒక దాన్ని పట్టుకొని "ఓంకార ప్రతిపాద్య దైవం నేను సుమా! ఓంకారం చెప్పేది నన్ను సుమా! జీవుడు నాకు సంబంధించినవాడే కానీ స్వతంత్రుడు కాదు" అనేది చూపించాడు. ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి తత్వమతడు,రెండోది ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నిత్యం, మూడోది మనం వానికే చెందే వారిమి. ఇది నిరూపించడం కోసమే ఆనాడు రామచంద్రుడు ధనుర్భంగం చేసి చూపాడు.అమ్మను వేరుగా స్వామిని వేరుగా సేవించుకునే సంప్రదాయం కాదు మనది, అందుకే వారిరువురిని ఒక చోట చేర్చి సేవించుకొనేందుకు 'సీతారామ కళ్యాణం'.


 
 
Sakrude:va prapannaya tavasmitha cha yachathe: |
abhayam sarva bhuutebhyo dadaami etad vratham mama
||
(Sri Valmiki Ramayana 6-18-33)
 
 He who seeks refuge in me just once, telling that 'I am yours',  I shall give him assurance of safety against all types of beings. This is My solemn pledge.