శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారి తిరునక్షత్రం

 
శేషో వా ? సైన్యనాథోవా ? శ్రీపతిర్వా ?

వైదిక సంప్రదాయంలో చాతుర్మాస్యాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆషాడ పూర్ణిమతో అంటే వ్యాసజయంతితో మొదలుకొని కార్తీక పూర్ణిమ వరకు భగవంతుణ్ణి చేరాలని భక్తులంతా ప్రార్థిస్తారు. మనం అందరం భగవంతుని కోసం వ్రతం చేస్తే, మనకు ఏంచేస్తే తన దరికి చేరుతారు అని భగవంతుడు తన దేవేరులతో కూడా మాట్లాడకుండా మన కోసం చింతించే సమయం ఈ చాతుర్మాస్యం. మనల్ని భాగుపరిచే ఉపాయంతో కార్తీక పూర్ణిమ నాడు యోగనిద్రలోంచి లేస్తాడు. అయితే పరమాత్మకు ఎందుకు చింత మన వాళ్ళని నేనే బాగుచేసుకుంటాలే అన్నట్లు పరమాత్మ లేచే రోజుకి పదిహేనురోజులముందే మన స్వామివారు ఉదయించారు. పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షంతో రామానుజుల వారి అంశగా కార్తీక పాడ్యమినాడే శ్రీ చిన్న జీయర్ స్వామివారు అవతరించారు. ఆరోజు నుండే కార్తీకమాసం ఆరంభం అవుతుంది, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. మనల్ని పరమాత్మ వద్దకి చేర్చేది ఆచార్యుడే, అట్లాంటి ఆచార్యుల సమక్షంలో మనం ఎన్నో కైంకర్యాలలో మనం పాలుపంచుకునే అవకాశం లభించడం మన అదృష్టం.
శ్రీరామాయణం, తిరుప్పావై, భగవద్గీత వంటి అనేక ప్రవచనాలతో మనల్ని ఉద్దరించుకున్నారు మన స్వామి వారు. గీతాజ్యోతి, కృష్ణంవందేజగద్గురుం వంటి కార్యక్రమాలలో మనల్ని పాలుగొనేట్లు చేసి బాగుపరిచారు. జగత్ రక్షణకై పరమాత్మ ఏడు కోండలపై వేంచేసి ఉన్నాడు విగ్రహ స్వరూపుడై. అట్లాంటి స్వామిని మనం చేరడానికి శ్రీవేంకటేశ్వర శరణాగతి దీక్షను మనకు ప్రసాదించి మనల్ని తరింపజేసారు మన జీయరు స్వామి వారు. భగవంతునికి ఏ అపచారం జరగినా తట్టుకోలేని మహానుభావులు భగవద్రామానుజుల వారు. భగవద్రామానుజుల వారి అంశయే మన శ్రీ చిన్న జీయరు స్వామి వారు అని జ్ఞానుల అభిప్రాయం. కానీ మన స్వామి వారి గురించి అలా చెప్పడం కూడా సమంజసం కాదేమో అని "శేషో వా ? సైన్యనాథోవా ? శ్రీపతిర్వా ?" అని రామానుజులవారికి మంగళాశాసనం చేసినట్లుగానే మన స్వామి వారిని చూసి ఎవరయ్యా నీవు?  ఇన్నిన్ని సంస్కారాలు చేస్తున్నావు! ఎవరు నీవు ? "శేషోవా ?" సాక్షాత్తు ఆదిశేషుడివా ? లేదు లేదు. బెత్తం పట్టుకొని అధికారులకి అటు దేవునికీ ఇటు మనకు సంస్కారాలు నేర్పుతున్నావంటే "సైన్యనాథోవా?" విష్వక్సేనుడివా? లేదు లేదు. ఇంత మందిని బాగుపరుస్తున్నావు అంటే "శ్రీపతిర్వా ?" సాక్షాత్తు నారాయణుడివా ? అని పెద్దలు, ప్రాజ్ఞులందరు మంగళాశాసనం చేస్తున్నారు. జ్ఞానుల అశిస్సులని అందుకోగలిగితే  అది నిజమైన జన్మ కదా! "తత్ శ్రేష్టం జన్మ" అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. శారీరక జన్మ మొదటి మెట్టు అయితే, దానికి కావల్సిన జ్ఞాన సౌరభాన్ని అందించగలిగే ఆచార్యుల కృప ఏనాడు లభిస్తే అది మనిషికి రెండవ జన్మ. అటువంటి ఆచార్యులకి మనం ఏం చేసినా ఎన్ని జన్మలు ఎత్తినా ఋణం తీర్చుకోలేం.

స్వామి వారి తిరునక్షత్రం నాడు వేద విద్యలో ఎంతో పరిశ్రమ చేసిన మహానుభావులని సన్మానం చేసుకోవడం మన స్వామివారి సంకల్పం. తిరునక్షత్రం అనగానే ఏదో పండగ చేసుకోవడం కంటే ఆచార ధారలని జ్ఞాన ధారలని సంరక్షణ చేస్తున్న మహనీయులని సత్కరించుకోగలిగినట్లయితే అది అసలు పండగ అని భావించి పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయవేదాంతపీట వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయరుస్వామి వారి సేవగా భావిస్తూ వేద పండితులకి జీయరు పురస్కారం అందించడం ముఖ్య విశేషం. మన రాష్టంలోనే కాక తమిళనాడు, మైసూరు వంటి ప్రాంతాలలో వేద విద్యలో విశేష కృషి చేసిన మహానుభావులని సత్కరించుకోగలగడం అసలైన పుట్టినరోజు అని మన స్వామివారి అభిమతం.