శ్రీ పెద్ద జీయర్ స్వామి పరమపదమహోత్సవం


ఈ రోజు మన ఆచార్యులైన పెద్ద జీయర్ స్వామి యొక్క పరమ పదోత్సవం , మన ఆత్మకి ఆహారం ఇచ్చిన ఆచార్యుల స్మరణ చేసుకుందాం. సాధారణంగా ఆచార్యులకి మరణం ఉండదు, అందుకే పరమ పదోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వరు మన సంప్రదాయాంలో. ఎందుకంటే ఆచార్యులు శిష్యుల యొక్క ఆత్మలలో జీవించే ఉంటారు. వారికి అందించిన జ్ఞాన రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఒక తండ్రి తమ ప్రతిరూపమైన తనయులలో ఎట్లా అయితే జీవించే ఉంటాడో అట్లానే ఆచార్యుడు తమ శిష్యుల జ్ఞాన స్వరూపంలో ఎప్పుడూ జీవించే ఉంటారు. వారి స్వరూపాన్ని భావించడం మన స్వరూపం కనుక వారి పరమ పదోత్సవం జరుపుకుంటాం. శ్రీ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 1909 సం.లో  నిజ శ్రావణంలో ఉత్తరాభాద్ర నక్షత్రాన అవతరించారు. వారు వైకుంఠ ఏకాదశినాడు 1979వ సం.లో ద్వాదశి గడియలు ప్రారంభం అవుతుండగా తిరునాటికి నడిచి వెళ్ళారు. అంటే భగవంతుని నిత్య సాయిజ్యాన్ని మన కందరికి ప్రసాదించడం కోసం స్వామికి విన్నపించుకోవడానికి ఆలోకానికి వేంచేసారు. వారినే మనం పెద్ద జీయర్ స్వామి అని వ్యవహరిస్తూ అంటాం. అసలు జీయర్ అంటే ఆయననే, మన వైష్ణవ సంప్రదాయంలో చరమాశ్రమంలో ఉండే వారికి ఆ నామం ఉంటుంది కానీ జీయర్ అనే ఆ మూర్తి ఇట్లా ఉంటుంది, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు కాబోలు అని మన పెద్ద జీయర్ స్వామివారి ప్రచార కార్యక్రమాలు చూసాకే లోకం గుర్తించింది. దక్షిణ భారత దేశంలో ఎందరో జీయర్ స్వాములు ఉంటారు. మన పెద్ద స్వామి వారి కార్యక్రమాలు చూసాకే వారందరు "ఓహో! అసలు ఇట్లా కూడా చేయవచ్చునా" అని గుర్తించారు. దక్షిణ దేశంలో వానమామలై అనే పీఠం ఉంది, అక్కడ భగవద్రామానుజుల అపరావతారం అని భావించే మణవాళమామునులు 14వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన పీఠం. లోకంలో సంప్రదాయాన్ని ప్రచారంలో వారిదే ముందడుగు ఉండేది, క్రమేపి అక్కడి వారు కేవలం మఠాలకే, లేక అక్కడి దేవాలయాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. మన పెద్ద జీయర్ స్వామి వారు కార్యక్రమాలు ఆరంభం చేసాక, అలనాడు రామానుజుల వారు చేసిన కార్యక్రమాలు పునరుజ్జీవించాయి అని అందరూ అనుకున్నారు. అంతే కాక ఉత్తర దేశంవారు దక్షిణ దేశంవారు ఏకమయ్యారు. ఎన్నో అంతరాలు తొలగిపోయాయి. ఉత్తరదేశంవారూ, దక్షిణ దేశం వారూ అందరూ మన స్వామి వారిని ఆదరించారు. "వైష్ణవః వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణవేత్ భువి" అని చెబుతుంటారు, అంటే భక్తి కల మహనీయులని భగవంతునితో సమానంగా సేవించాలి అని నియమం. మనస్పూర్తిగా అట్లా స్వామిని సేవించేవారు. అట్లా స్వామి ప్రచారం అన్ని ప్రాంతాల్లో జరిపారు.

ఒక విషయం తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మొదట స్వామివారు సన్యాసాశ్రమం తీసుకుందాం అని వానమామలై పీఠంలో సుమారు పద్దెనిమిది రోజులు ఎదురు చూసారు, కానీ భవిష్యత్తులో మఠం యొక్క వారసత్వం కోరుతారేమో అని అక్కడి జీయంగారు ఒప్పుకోలేదు. నిరాశతో మన స్వామి వారు బయలుదేరి శ్రీవిల్లిపుత్తూర్ గుండా వస్తున్నారు. మొదట శ్రీపెరంబుదూర్ మఠంలో పీఠాదిపతిగా ఉండి, విశ్రాంతికోసం శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసిఉన్న జీయంగార్లు మన స్వామి నిరాశతో వెనుతిరుగుతున్నారు అని తెలుసుకొని, నేను ఏర్పాటు చేస్తాను అని వారే మన పెద్ద జీయర్ స్వామి వారికి చరమ ఆశ్రమాన్ని ప్రసాదించారు. మన స్వామి వారు కోరుకున్న వానమామలై పీఠంలోనే దండ కాశాయాల్ని అక్కడి పెరుమాల్ల వద్ద ఉంచి, మన స్వామి వారికి ప్రసాదించారు. అందుకే మన స్వామి వారి అశ్టోత్తరం రచించిన శ్రీ కవిరత్న గుదిమెల్ల రామానుజాచార్య స్వామివారు ఒక నామాన్ని "తోతాద్రి హరి సాన్నిధ్య లబ్ధ కాశాయ భూషితః" అని రచించారు. ఇలాగ స్వామి ఆశ్రమాన్ని స్వీకరించి, ఉత్తర దేశంలో బదరికాశ్రమానికి వెళ్ళి పదికోట్ల జపం, కోటి హవనం ఆపై వరుసగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఘనతను సాదించాక  ఏ వానమామలై జీయర్ స్వామివారు మీకు మేం ఆశ్రమం ఇవ్వం అని అన్నారో మన జీయర్ స్వామి ఆప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆయన పండు ముసలిగా ఉండేవారు, మంచంపైనుంచి లేచి మన స్వామి వారికి నమస్కారంచేసి "కూవికొల్లూం కాలం ఎన్నం కురువాదో" - శ్రీమన్నారాయణా నాకు మోక్షం ఎప్పుడిస్తావయా అని అగిగారు. అంటే వారు మన స్వామివారిని భగవత్ స్వరూపం క్రింద భావించారు అంటే మన స్వామి వారి వైభవం ఎంత గొప్పదో తెలుస్తుంది. అట్లాంటి పెద్ద జీయర్ స్వామి మన స్వామి కావడం మన సుకృతం.

ఈ నాడు మనం మంత్రాలు చదివేస్తున్నాం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివేస్తున్నాం, భగవద్గీత చదివేస్తున్నాం, శ్రీరామాయణం చదివేస్తున్నాం. కానీ సుమారు 1930 కాలాన్ని తీసుకుంటే వీటిని బ్రాహ్మణుడు కానివాడు చదివితే సమాజంలోంచి వెలివేసేవారు. సామూహిక పూజా కార్యక్రమాలు చేసేసుకుంటున్నాం ఈనాడు, కానీ 1930లో సామూహిక కార్యక్రమాలకు తావు ఉండేదేకాదు, కేవలం ఆలయాల్లోనే జరిపేవారు. మన స్వామి వారు గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ మహిళా మండలి ఎర్పాటుచేసి మన మన ఇల్లల్లో ప్రతిరోజు భగవంతుడు ఉండాలి అని బ్రాహ్మణ-అబ్రాహ్మణ తేడాలేకుండా, స్త్రీ-పురుష అనే తేడాలేకుండా అందరికీ పూజ చేసుకొనే సాంప్రదాయం అలవాటు చేయించారు. నిజానికి 11వ శతాబ్దంలో రామానుజులవారు అందరికీ మంత్రాన్ని ఇచ్చి అందరూ తరించే అవకాశం ఇచ్చారు, కానీ ఎందుకనో కాల గతిలో అది పోయింది. ఎన్నో అంతరాలు ఏర్పడ్డాయి. ఈ నాడు అనేక సంప్రదాయాల వారు ప్రచారం చేసుకోగలుగుతున్నారు అంటే కారణం మన స్వామివారు పూర్వాశ్రమ సమయంలో చేసిన కార్యక్రమాల వల్ల ఏర్పడ్డ పునాది. నాలుగు గోడల మద్య ఎవరి విశ్వాసాలు వారికి ఉన్నా, సమాజిక కార్యక్రమాల్లో అందరినీ ఒక వేదిక మీదికి రప్పించి బ్రాహ్మణ-అబ్రాహ్మణ తేడాలేకుండా, స్త్రీ-పురుష అనే తేడాలేకుండా, స్మార్త-వైష్ణవ తేడా లేకుండా ఒక స్పూర్తిని ఇచ్చారు. వేదాలకు ఎన్నో కట్టు బాట్లు, కనీసం మిగతా గ్రంథాలను అందరికీ అందుబాటులో తెచ్చిన వారు ఎవరైనా ఉన్నారో చరిత్ర చూడటం అలవాటు ఉండే వారు చరిత్ర తిరిగవేస్తే మన స్వామి వారే తప్ప మరొకరు కనిపించరు. తమ స్వంత స్థలంలో దేశంలోనే మొదటి హరిజన వాడను నిర్మింపజేసి ఇచ్చారు. ఇలాగా ఇటు సామాజిక విప్లవాన్ని అటు అందరినీ దైవ కార్యక్రమాల్లో పాలుగొనేట్టు చేసారు. పండితమహా సభలు ఏర్పాటు చేయించి, పండితులు తమ తమ విజ్ఞానాన్ని ఒకరికి చెప్పాలి అని వారిచే ఉపన్యాసాలు ఇచ్చేట్టు చైతన్యం చేసారు. కేవలం సామాజిక సృహ కాదు అది ఆధ్యాతిమిక పునాదిపై నిలబడాలి అనే స్పూర్తిని లోకంలో కలిగించిన మహనీయులు. ఇలా స్వామి వారి కార్యక్రమాలు ఎన్నో.

అయితే కాలం ఆశ్చర్యకరమైనది, మన ఎదుట సంచరించి మనకు ఎన్నోరకాలుగా ప్రేరేపణ చేసి సమాజంలో మనకు ఒక గుర్తింపు కలిగేట్టు చేసిన వ్యక్తి అయినా, ఆ వ్యక్తి కనుమరుగవ్వగానే మరిచిపోయే సమాజం ఇది. కానీ వ్యక్తి ఈ లోకంలో లేకున్నా వారి సంకల్పం మనల్ని ఇంకా మంచి మార్గంలో నడిపిస్తూనే ఉంది. వారు సంకల్పించినవి ఈనాడు జరిగుతున్నాయి అంటే వారి సంకల్పం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈనాడు మనం హాయిగా అనుభవించే సంప్రదాయం అనే ఇల్లు యొక్క పునాది వారు నిర్మించారు అనే విషయం మనం అనుక్షణం తలచుకోవడం మన స్వరూపం.