శ్రావణ శుక్రవారం

 
ధర్మాన్ని సంప్రదాయాన్ని ఈ నాటికి మనం చూస్తున్నామంటే మహిళల యొక్క చల్లటి హృదయంలో ఉండే సౌకుమార్యమే కారణం. వారు పాటించాలి అని అనుకోబట్టే తమ పిల్లల్ని, భర్తని మరియూ తమ గృహానికి సంబంధించిన బంధువర్గాన్ని అందరిని క్రమబద్దం చేసి శాసించే శక్తి కలిగిన వారు మహిళలే. సాధారణంగా మగవారికి నియమాలని తగ్గించుకొనే లక్షణాలు ఉంటాయి. కానీ మహిళలది సంప్రదాయ విషయాల్లో ఏమాత్రం మినహాయింపు లేకుండా ఇలా చేయాలి అని శాసించే హృదయం కలిగినవారు. ఇది వరకు ఈ వైదిక ధర్మానికి ఎన్నో ఉపద్రవాలు ఏర్పాడ్డాయి, కానీ ఈ నాటికి మనం సంప్రదాయాన్ని చూడగలిగేది స్త్రీలలోనే ఎక్కువ. చక్కగా బొట్టు పెట్టుకొని అలంకరించుకొని, దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఇండ్లల్లో ఆచారం చూడగల్గుతున్నాం అంటే అది వారిలోనే శ్రద్దే కదా కారణం. అట్లాంటి మహిళలు బాగున్నంతవరకు జాతి బాగుంటుంది. మహిళలో శ్రద్ద తగ్గితే జాతికి నామ రూపాలు ఉండవు. శ్రద్దలేని మహిళల కుటుంభాలలో ప్రశాంతత అనేది ఉండదు అనేది మనం గమనించవచ్చు. భౌతికమైన వికాసం ఎంత కలిగినా, మనిషి అంటే మనసున్న వాడు కనుక మానసిక ఉల్లాసమే కనక లేక పోతే భౌతికమైన సుఖాలను అనుభవించలేడు. ఆ మనసుకి ప్రశాంతత ఏర్పడితే భౌతిక జీవితం ఎట్లా ఉన్నా సర్దుకొని బ్రతికే అవకాశం ఉంటుంది. మన ఆచారాలు, మన అలవాట్లు మనసుకి ఒక రకమైన ప్రశాంతతని, సున్నితత్వాన్ని ఇస్తాయి. మనసుని అట్లా ప్రశాంతంగా ఉంచుకోవడం చేత శరీరాన్ని కూడా క్రమబద్దం చేసుకోవచ్చును. ఇట్లాంటి సంప్రదాయాన్నే మనకు మనకు మన పెద్దలు ఆచరించి మనవరకు అందించారు. అసలు సంప్రదాయం అంటేనే అర్థం అది, చెదరక, పాడు కాకుండా అందిన చక్కటి ఆచారం. ఒక పరంపరగా వచ్చిన ఆచార ధార. ఈ మానసిక ఉల్లాసామే సంపద. అట్లాంటి సంపదకే 'శ్రీ' అని పేరు. 
 
ఒక్కో సారి ధనం వస్తుంది, పోతుంది. లేక అది ఉన్నా మనం ఉండకపోవచ్చు. అది ఎట్లా ఉన్నా మనం నిరంతరం మన స్థితిలో నిలబడే యోగ్యత ఏర్పడాలి. అలాంటి 'శ్రీ' అసలైన సంపద అని అంటారు. అది కేవలం భగవంతుని దయ వల్ల కలగాల్సిందే. అందుకే అట్లాంటి సంపద కోసం భగవంతుని దయనే ప్రార్థన చేస్తాం. భగవంతునిలోని దయనే మనం లక్ష్మీ అని అంటాం. ఆ దయకే శ్రీ అని పేరు. భగవంతుని హృదయ మందిరంలో నిండుగా ఉంటుంది 'శ్రీ'. దయ అనేది స్త్రీ స్వభావం కనుకనే స్త్రీ రూపంలో చూస్తాం. ఈ జగత్తుని శాసించే సర్వ జగత్తు యొక్క నియంతని తండ్రి అని అనుకుంటే, ఆ భగవంతునిలో ఉండే దయని ఆమ్మ అని భావిస్తే, ఆ అమ్మ ద్వారా వెళ్తే మనం భగవంతుడిని అశ్రయించడం సులభం. మన తప్పులను కనపడకుండా చేసి భగవంతుని అనుగ్రహాన్ని ప్రసరింపజేసేది అమ్మ. అమ్మ మన పాలిటి వర ప్రదాత. అందుకే వరలక్ష్మి అని ఆమెకు పేరు. వరలక్ష్మి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అసలు లక్ష్మీ అంటేనే నిరంతరం వరములని అందించేది. అయినా చెబితే తప్ప మనకు తృప్తి ఉండదు. స్వామి సన్నిధిలో ఆమె ఎప్పుడూ ఉండి మనకు కావల్సినవేవో వాటిని చేయిస్తుంటుంది. ఆయన హృదయాన్ని విడిచి వెళ్ళే సందర్భం ఉండనే ఉండదు.

రూపు దాల్చిన దయ అమ్మ లక్ష్మీ దేవి. అమ్మని భగవంతుణ్ణి చూపే గుర్తుగా భావిస్తాం. సాధారణంగా తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రివద్ద ఉండదు. తల్లి వద్ద మనకు కావల్సిన వాటిని చెప్పడంలో ఆలోచించము. అట్లానే ఈ జగత్తును కాపాడే భగవంతుని విషయంలో కూడా మనం భగవంతుణ్ణి చేరడానికి ఒంటరిగా ఒక సమయాన్ని మనకే అందుబాటులో మన మాటలే వినడానికి అమ్మ స్వీకరించిన సమయమే శ్రావణమాసం. పూర్ణిమ శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది. శ్రవణ నక్షత్రం మన మాటలని అమ్మను వినేట్టు చేస్తుంది. శ్రవణ సంబంధమైనది కనుక శ్రావణం అని పేరు. ఈ మాసం మొత్తం అమ్మ మనకు అందుబాటులో ఉంటుంది కనుక అమ్మ అనుగ్రహం పొందేట్టు ప్రవర్తించాలి.


మాసానికున్న గొప్పతనం అది. అయితే శ్రావణ మాస ప్రతి శుక్రవారానికి మరింత ప్రాధన్యత ఉంది. అమ్మ పేరు భార్గవి, అంటే భృగు వంశానికి చెందినది. భృగు గ్రహమే అంటే శుక్ర గ్రహం. అందుకే ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఉండే రోజు శుక్రవారం. ఆనాడు ఆరాధన చేస్తే మరింత మంచిది. అట్లా ప్రతి శుక్రవారానికి అట్లాంటి ప్రత్యేకత ఉంటుంది, కానీ దానికి తోడు శ్రావణ మాసం అయ్యే సరికి లక్ష్మీ దేవిని ఆరాధన చేసుకోవడం, ఆ తల్లి నామాన్ని, తల్లి గురించి నోరారా పలికితే ఎంతో శ్రేయోదాయకం.  అందుకే వైదిక ధర్మంలో మహిళలకు ఈ మాసం ప్రాధాన్యం ఇస్తారు. వారు చేసుకొనే ధార్మిక కార్యక్రమాలకి పూర్తి స్వాతంత్రం ఇస్తారు. తమ సఖీ వర్గంతో కలిసి భగవదారాధన, వేడుకలు చేసుకుంటారు.